
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా ఇంకా సీఎం ఎవరు అనే దానిపై సస్సెన్స్ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ సీఎం((Delhi Next CM))పై తర్జన భర్జనలు పడుతున్న బీజేపీ.. ఇంకొంత సమయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దీనిపై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సెటైర్లు వేస్తోంది. ఢిల్లీ సీఎం జాప్యంపై ఆప్ నేత గోపాల్ రాయ్ ఎద్దేవా చేశారు. బీజేపీ సీఎంను ప్రకటించడాన్ని అటుంచితే, ఈ ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను ఢిల్లీ చూడాల్సి వస్తోందంటూ జోస్యం చెప్పారు. గతంలో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే జరిగిందంటూ గతాన్ని తోడే యత్నం చేశారు.
బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి((Delhi Assembly Elections)) వచ్చి 10 రోజులైనా ఇప్పటివరకూ సీఎంను ప్రకటించ లేదంటి వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. తమకు ప్రజలు ఏదైతే ప్రతిపక్షం ఉండమనే మ్యాండేట్ ఇచ్చారో దాన్ని తప్పకుండా పాటిస్తామన్నారు గోపాల్ రాయ్. ఢిల్లీలో ఇప్పటికే కరెంట్ కష్టాలు మొదలయ్యాయని, సీఎం ఎవరైనా ఆ కష్టాలను ఎదుర్కోక తప్పదన్నారు.
కాగా, ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేఎల్పీ భేటీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోపు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ భేటీని వాయిదా వేస్తూ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.
ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ(BJLP) సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ. ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట ఘటనకు సంఘీభావంగానే సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించింది. తిరిగి.. ఫిబ్రవరి 19న ఈ భేటీని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే అదే తేదీన సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపైనా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు రేపు మరోసారి సీఎం అభ్యర్థిపై అధిష్టానం సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం.
బీజేపీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేఎల్పీ జరగనుంది. ఆ భేటీలో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సరాసరి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్తారు. బీజేఎల్పీ నేత, కేబినెట్ పేర్లు ఉన్న వివరాలు అందజేసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఎల్జీని కోరనున్నారు.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత ఢిల్లీ పీఠం కమలం కైవసం చేసుకుంది. అయితే..
సీఎం ఎంపికలో ఆచీచూతీ వ్యవహారించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జేపీ నడ్డా నాయకత్వంలో అంతర్గత సంప్రదింపులు సైతం జరిపింది. అదే సమయంలో.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎంపిక ఆలస్యమైంది. ఈలోపు ఢిల్లీ విషాదంతో.. మరోసారి ఆ భేటీ వాయిదా పడింది. ఇక 19వ తేదీన జరగబోయే బీజేఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ప్రతిపాదనను అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment