
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇదే సమయంలో వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్టు తెలిపారు. అలాగే, కూటమి సర్కార్ పాలనపై సెటైర్లు వేశారు. ప్రభుత్వం గురించి ఎల్లో మీడియాలో గొప్పగా రాయడం తప్ప ఇంకేమీ లేదని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్సీ బొత్స(Botsa Satyanarayana) విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి పాలనలో సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో హామీలు అమలు కావడం లేదు. ప్రచారం చేసిన స్థాయిలో పనులు చేయడం లేదు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. కరెంట్ చార్జీలు విపరీతంగా పెరిగాయి. ఒకొక్క డిపార్ట్మెంట్లో వేల సంఖ్యలో ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు ప్రజా ప్రతినిధులు మధ్య సమన్వయం లేదు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదు. విద్యార్థులు తల్లిదండ్రులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై శాసన మండలిలో నిలదీస్తాం.
వైఎస్సార్సీపీ హయాంలో చిత్తశుద్ధితో హామీలు అమలు చేశాం. వైఎస్ జగన్ మాటలతో పరిపాలన చేయలేదు. చేతలతో పరిపాలన చేశారు. కరోనా సమయంలో సంక్షేమ పథకాలు అందించారు. ఇంకెన్ని రోజులు వైఎస్సార్సీపీ పేరు చెప్పి బతుకుతారు. కూటమి పాలనలో ఏ తప్పు జరిగినా వైఎస్సార్సీపీపై తోసేస్తున్నారు. ఇష్టారీతిన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. హైకోర్టు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వేసిన సీట్ నివేదికను విడుదల చేయాలి. ఫ్రీ హోల్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయన్న కూటమి నేతలు ఎప్పుడు వాటిని బయటపెడతారు. మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పి ధరలు పెంచుతున్నారు. కూటమి సర్కార్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు’ అంటూ కామెంట్స్ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment