బ్రిటిష్‌ కాలంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని సంస్థానాల్లో యువకులకు యుద్ధ విద్యలు నేర్పించేందుకు చెడీ తాలింఖానా మొదలైంది.

తరువాత కాలంలో స్వాతం్రత్యోద్యమ స్ఫూర్తికి.. సమరయోధుల మధ్య ఐక్యతకు ప్రతీకగా మారింది. నాటినుంచి నేటి వరకు దశాబ్దాల కాలంగా ఈ వీరుల విద్య కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమైంది

కోనసీమలో దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే చెడీ తాలింఖానా ప్రదర్శనకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.

ఏటా దసరా ఉత్సవాలలో కత్తులు, బళ్లేలు, బాణా కర్రలతో సాగే ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.

ఈ నెల 12న దసరా రోజున రాత్రి చెడీ తాలింఖానా ప్రదర్శనలు అమలాపురంలో వీధుల్లో రోమాంచితం కానున్నాయి.

చెడీ తాలింఖానా బర్మా (మయన్మార్‌)కు చెందిన విద్య. ఉమ్మడి గోదావరి జిల్లాలోని సంస్థానాల్లో పనిచేసే సైనికులకు, యువతకు యుద్ధ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అమలాపురం పట్టణానికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు (తొలి తరం వ్యక్తి) బర్మా వెళ్లి శిక్షణ పొంది వచ్చారు.

పిఠాపురం, పెద్దాపురం, మొగల్తూరు తదితర సంస్థానాల నుంచి, స్థానిక యువకులు ఆయన దగ్గర ఈ విద్య నేర్చుకునేవారు. స్వాతంత్రం పూర్వం బ్రిటిష్‌ సేనలతో పోరాడే భారతీయులలో ఐక్యత కోసం బాలగంగాధర్‌ తిలక్‌ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు.