Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Nara Lokesh Plans to complete control over TDP1
టీడీపీలో సీనియర్లకు పొగ!

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీపై పూర్తి పట్టు సాధించేందుకు చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ పార్టీలోని సీనియర్లకు పొగ పెడు­తు­న్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీలోని సీనియర్లను బయటకు పంపేసి, పూర్తిగా తన మనుషులతో నింపేందుకు లోకేశ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు పార్టీ అధినేత చంద్రబాబు కూడా తలొగ్గడంతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్‌ నేతలకు గడ్డుకాలం వచ్చింది. సీనియర్ల వల్ల ఎటువంటి ఉపయోగంలేదని, పార్టీకి భారమన్న ముద్ర వేసి వారిని బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల్లో ఉన్న పలువురు సీనియర్‌ నేతలకు త్వరలోనే ఉద్వాసన పలుకుతారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్‌ (చిన్ని), గంటి హరీష్‌ మాధుర్, దీపక్‌రెడ్డి వంటి వారికి లోకేశ్‌ టీంగా పార్టీలో కీలక పదవులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.పార్టీపై లోకేశ్‌ పట్టు బిగిస్తుండటంతో చాలా కాలం నుంచి సీనియర్ల హవా తగ్గిపోయింది. లోకేశ్‌ అండదండలున్న నేతలు, ఆయనకు నచ్చిన వారికే పార్టీలో అవకాశాలు దక్కుతున్నాయి. చంద్రబాబు కూడా కుమారుడి మాట కాదనలేని పరిస్థితులు ఏర్పడ్డాయని సీనియర్‌ నాయకులు ఎప్పటి నుంచో అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సీట్ల కేటాయింపు కూడా చాలావరకు లోకేశ్‌ అభీష్టం మేరకే జరిగినట్లు నేతలు చెబుతున్నారు. కాసులిచ్చిన వారికే సీట్లు దక్కాయని అప్పట్లో అనేక మంది నేతలు గగ్గోలు పెట్టారు. ఆ తర్వాత కూటమి ఆధ్వర్యంలో ఏర్పడిన మంత్రివర్గంలోనూ లోకేశ్‌ చెప్పిన వారికే చోటు దక్కింది. మంత్రి పదవులు ఖాయమనుకున్న అనేక మంది సీనియర్లను పక్కన పెట్టి తనకు నచ్చిన వారికి, తనతో లావాదేవీలు జరిపిన వారికే లోకేశ్‌ మంత్రి పదవులు ఇప్పించారనే ఆరోపణలు వచ్చాయి. లోకేశ్‌ చేతిలోకి పొలిట్‌బ్యూరో!ఇప్పుడు పార్టీలోనూ అదే తరహా నియామకాలకు రంగం సిద్ధౖమైనట్లు తెలుస్తోంది. పార్టీలో అత్యంత కీలకమైన పొలిట్‌బ్యూరోను చేతుల్లోకి తీసుకోవడానికి లోకేశ్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పొలిట్‌బ్యూరో మొత్తాన్ని తన మనుషులతో నింపాలని ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పొలిట్‌బ్యూరోలో సీనియర్‌ నాయకులైన యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి అత్యంత సీనియర్లు ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో వీరెవరికీ సరైన ప్రాధాన్యం దక్కలేదు. చంద్రబాబు తర్వాత ఆ స్థాయి నేతగా ఉన్న యనమల రామకృష్ణుడికి ఇటీవల పార్టీలో చెప్పుకోలేని అవమానాలు ఎదురయ్యాయి. కళా వెంకట్రావుకి ఎమ్మెల్యే సీటు నిరాకరించి, చివరికి వేరే చోట సర్దుబాటు చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి వారిని పక్కన పెట్టేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కింజరాపు అచ్చెన్నాయుడికి ఇప్పుడు పార్టీలో సరైన స్థానం లేదు. పేరుకి మంత్రిగా ఉన్నా ఆయనకున్న ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందే. అన్ని జిల్లాల్లోనూ సీనియర్‌ నాయకులను కాదని కొత్తగా లోకేశ్‌కు దగ్గరైన వారికే పెత్తనం అప్పగించారు. గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, నిమ్మకాయల చినరాజప్ప వంటి వారిని సైతం నియోజకవర్గాలకే పరిమితం చేశారు. వీరంతా గతంలో పార్టీలో చక్రం తిప్పినవారే. అలాంటి వారందరినీ పూర్తిగా పక్కకు తప్పించి పొలిట్‌బ్యూరోలో, ఇతర కమిటీల్లోనూ తనకు అనుకూలంగా ఉండే వారిని నియమించుకోవడానికి లోకేశ్‌ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. చంద్రబాబు కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.ఒకటే పదవి ఉండేలా..ఈ క్రమంలోనే ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ ఒక చోటే బాధ్యత ఉండేలా చూసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ పదవులు ఉన్న వారికి ప్రభుత్వ పదవులు ఉండవని, ప్రభుత్వ పదవులు ఉన్న వారికి పార్టీలో పదవులు ఉండకుండా చూసే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇచ్చిన పదవులను కూడా రెండేళ్లకు మాత్రమే పరిమితం చేయాలని చూస్తున్నారు. ఇదంతా పార్టీపై లోకేశ్‌ పూర్తిగా పట్టు సాధించేందుకు వేస్తున్న ఎత్తుగడలేనని సీనియర్లు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సీనియర్లు, ముఖ్య నాయకులకు ఇక మీదట ఇబ్బందులు తప్పవని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి.

16 Maoists Dead In Major encounter on Chhattisgarh Odisha border2
'దండకారణ్యం' నెత్తురోడింది

చర్ల/ మల్కన్‌గిరి/ సాక్షి, పాడేరు: వరుస ఎన్‌కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్‌ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది మృతి చెంది వారం తిరగకముందే.. ఛత్తీస్‌గఢ్‌– ఒడిశా సరిహద్దుల్లో గరియాబంద్‌ జిల్లా కులారీఘాట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మరణించారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు చలపతి కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే మృతుల సంఖ్య 25 నుంచి 30 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి తర్వాత కూడా ఎదురుకాల్పులు, కూంబింగ్‌ కొనసాగుతూ ఉండటంతో బుధవారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 19వ తేదీ నుంచే కూంబింగ్‌.. దండకారణ్యంలోని కులారీఘాట్‌ అటవీ ప్రాంతంలో 60 మందికిపైగా మావోయిస్టులు సమావేశం అయ్యారన్న నిఘా వర్గాల సమాచారంతో బలగాలు రంగంలోకి దిగాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డి్రస్టిక్ట్‌ ఫోర్స్, ఒడిశాకు చెందిన ఎస్‌ఓజీ (స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌) బలగాలు ఈ నెల 19 నుంచి సరిహద్దుల్లో కూంబింగ్‌ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో 20వ తేదీన ఉదయం పోలీసు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్‌ మొదలైంది. తొలిరోజు ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను రంగంలోకి దింపి.. సోమవారం మధ్యాహ్నం నుంచి కూంబింగ్‌ ఆపరేషన్‌ ముమ్మరం చేశారు. మంగళవారం తెల్లవారుజామున మళ్లీ మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కొన్ని గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 14 మంది మృతి చెందారు. రెండు రోజుల్లో కలిపి మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 16కు పెరిగింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా– ఒడిశా బోర్డర్‌ (ఏఓబీ) స్పెషల్‌ జోనల్‌ కమిటీ మిలిటరీ కమిషన్‌ చీఫ్‌ చలపతి అలియాస్‌ ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్‌ జయరాం ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటించారు. ఆయనతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా మృతుల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే చలపతి మృతిపై స్పష్టత ఇచ్చిన పోలీసులు మిగతా వారి వివరాలను వెల్లడించలేదు. మృతుల సంఖ్య 25 – 30 మంది వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. 1,500 మంది.. 15 కిలోమీటర్ల సర్కిల్‌గా.. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన సుమారు 1,500 మంది పోలీసు బలగాలు కులారీఘాట్‌ అడవిని చుట్టుముట్టాయి. సుమారు 15–20 కిలోమీటర్ల సర్కిల్‌గా ఏర్పడి... కూంబింగ్‌ చేపడుతూ దగ్గరికి వచ్చాయి. సుమారు ఐదు కిలోమీటర్ల సర్కిల్‌లోకి రాగానే మావోయిస్టులు తారసపడినట్టు తెలిసింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన చలపతి సెంట్రల్‌ కమిటీ సభ్యుడు కావడంతో ఆయనకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ముందు వరుసలో సెంట్రీలు కాపలాగా ఉంటే చివరి వరుసలో ఫీల్డ్‌ పెట్రోలింగ్‌ టీమ్‌ రక్షణగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య బాంబులు అమర్చి ఉంటాయి. అయితే అగ్రనేతలు ఉన్నారనే పక్కా సమాచారంతోనే భద్రతా వలయాన్ని ఛేదించుకుని బలగాలు దాడి చేసినట్టు తెలిసింది. ఘటనాస్థలంలో ఇప్పటివరకు పది వరకు ఐఈడీలను గుర్తించి తొలగించినట్టు సమాచారం. సరిహద్దుల్లో హైఅలర్ట్‌! కులారీఘాట్‌ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటన జరిగిన ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉన్న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీస్‌ స్టేషన్లు, ఔట్‌పోస్టుల పరిధిలో రెడ్‌ అలర్ట్‌ అమలు చేస్తున్నారు. సరిహద్దుల్లో అదనపు బలగాలను రంగంలోకి దింపి కూంబింగ్‌ చేపడుతున్నారు. డ్రోన్‌ కెమెరాలతోనూ నిఘా పెట్టారు.

Daily Horoscope On 22 January 2025 In Telugu3
ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి.. ఆస్తులు కొంటారు.

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.అష్టమి ప.1.24 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: స్వాతి రా.1.08 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.52 నుండి 12.40 వరకు,అమృతఘడియలు: ప.3.14 నుండి 5.01 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.45. మేషం...పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. ఆస్తులు కొంటారు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.వృషభం...పరపతి పెరుగుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.మిథునం...ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలోఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.కర్కాటకం...మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.సింహం....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.కన్య....మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరటనిస్తుంది. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవచింతన.తుల....శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు.వృశ్చికం...సోదరులతో వివాదాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు...వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. వస్తు, వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొంత ఊరట.మకరం....వ్యవహారాలలో పురోగతి. ఆస్తుల వివాదాలు పరిష్కారం. శుభకార్యాలపై చర్చలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.కుంభం...సన్నిహితులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు.మీనం..పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత.

PM Narendra Modi likely to visit Maha Kumbh Mela on February 54
5న కుంభమేళాలో మోదీ పుణ్యస్నానం

న్యూఢిల్లీ: అశేష భక్త జనవాహిని తరలివస్తోన్న ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొనబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి ఐదో తేదీన ప్రధాని మోదీ త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానం ఆచరిస్తారని ఆయా వర్గాలు మంగళవారం తెలిపాయి. మరోవైపు ఈనెల 27వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించనున్నారు. గంగా హారతి కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అధికారులతో భేటీ కానున్నారు. అమిత్‌ షా వారంరోజుల్లో వస్తుండటంతో కుంభమేళాలో భద్రతను మరోసారి సమీక్షించారు. ప్రధాన కూడళ్ల వద్ద మరోసారి తనిఖీలుచేశారు.ఫిబ్రవరి ఒకటో తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారు. నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దట్టంగా పొగమంచు కమ్ముకున్నాసరే భక్తులు మంగళవారం సైతం భారీస్థాయిలో పుణ్యాస్నానాలు ఆచరించారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన పూర్తికానుంది. మౌని అమావాస్య (రెండో షాహీ స్నానం) వచ్చే జనవరి 29న , ఫిబ్రవరి మూడో తేదీన వసంత పంచమి రోజు (మూడో షాహీ స్నానం), ఫిబ్రవరి 12న (మాఘ పూర్ణిమ) అధిక సంఖ్యలో జనం రావచ్చు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర గణాంకాల ప్రకారం జనవరి 20నాటికి 8.81 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు.

US President Donald Trump signed series of executive orders5
జన్మతః పౌరసత్వం రద్దు

వాషింగ్టన్‌: తాత్కాలిక వీసాలపైనైనా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని, తద్వారా వారికి అమెరికా పౌరసత్వం దక్కాలని కోరుకొనే భారతీయులతోపాటు ప్రపంచ దేశాల పౌరులకు, అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద షాక్‌ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి మంగళం పాడేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్‌ సంచలన నిర్ణయాలకు తెరతీశారు. అంతా ఊహించినట్లుగానే తనకున్న అసాధారణ అధికారాలు ఉపయోగించుకొని పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు జారీ చేశారు.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తన కార్యాచరణ ప్రారంభించడం గమనార్హం. గంటల వ్యవధిలోనే పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. తొలుత క్యాపిటల్‌ వన్‌ ఎరీనాలో మద్దతుదారుల సమక్షంలో, అనంతరం శ్వేతసౌధం ఓవల్‌ ఆఫీసులో ఆయన సంతకాలు చేయడం, మరోవైపు ఉత్తర్వులు వెలువడడం వెనువెంటనే జరిగిపోయాయి. వలసలు, వాతావరణ మార్పులు, క్షమాభిక్షలు, జన్మతః పౌరసత్వం రద్దు వంటి కీలక అంశాలపై ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు జారీ అయ్యాయి. పత్రాలపై తన సంతకాన్ని ట్రంప్‌ బహిరంగంగా ప్రజలకు చూపించారు. ఆ పెన్నులను ఉత్సాహంగా జనంపైకి విసిరేశారు. చరిత్రలోనే అత్యంత అధ్వాన పరిపాలన గత ప్రభుత్వ హయాంలో జరిగిందని ట్రంప్‌ ఆరోపించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 78 విధ్వంసకర విధానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ట్రంప్‌ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయులతోపాటు ప్రపంచదేశాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయగల నిర్ణయాలు సైతం ఉన్నాయి. కానీ, ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లకు చట్టపరమైన రక్షణ కొంతవరకే ఉంటుందని, ఆయన తర్వాత పగ్గాలు చేపట్టబోయే అధ్యక్షులు గానీ, కోర్టులు గానీ వాటిని తిరగదోడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్‌ నిర్ణయాలకు కోర్టుల్లో సవాళ్లు ఎదురుకావడం ఖాయమని అంటున్నారు. నూతన అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు ఏమిటంటే... జన్మతః పౌరసత్వం లేనట్లే అమెరికాలో నివసిస్తున్న అక్రమవలసదార్లకు, వలస వచ్చినవారికి, తాత్కాలిక వీసాలపై ఉంటున్నవారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే.. ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఈ మేరకు వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్‌ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.ప్రధానంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు జన్మించే సంతానానికి ఇక్కడి పౌరసత్వం దక్కడం కష్టమే. అయితే, ఈ విషయంలో ట్రంప్‌ నిర్ణయాన్ని కొందరు ఫెడరల్‌ కోర్టులో సవాలు చేసినట్లు తెలిసింది. చట్టపరంగా ఇది చెల్లదని అంటున్నారు. ట్రంప్‌ జారీ చేసిన ఆర్డర్‌ ప్రకారం.. అమెరికా గడ్డపై పుట్టినవారికి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులై ఉండాలి. లేదా చట్టపరమైన శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు హోల్డర్‌) ఉండాలి. ఒకవేళ వలసదార్లు అమెరికా సైన్యంలో పని చేస్తూ ఉంటే వారికి జన్మించే పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తోంది. అక్రమ వలసదారులంతా వెనక్కే మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘రిమెయిన్‌ ఇన్‌ మెక్సికో విధానాన్ని ట్రంప్‌ పునరుద్ధరించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో వేచిచూస్తున్న 70 వేల మంది నాన్‌–మెక్సికన్‌ శరణార్థులను వెనక్కి పంపించబోతున్నారు. ‘క్యాచ్‌ అండ్‌ రిలీజ్‌’కు శుభంకార్డు వేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి వెనక్కి పంపబోతున్నారు. శరణార్థులుగా గుర్తించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వదిలిపెట్టరు. అక్రమ వలసదార్లంతా అమెరికాను విడచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. లేకపోతే బలవంతంగానైనా వెళ్లగొడతారు. ఈ విషయంలో ట్రంప్‌ నిర్ణయానికి చట్టపరమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితి అమెరికా సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని ట్రంప్‌ ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకే మెక్సికో సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో మెక్సికో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, గోడ నిర్మాణానికి స్వేచ్ఛగా నిధులు వాడుకొనే అవకాశం ట్రంప్‌కు లభించింది. డ్రగ్స్‌ గ్యాంగ్‌లపై ఉగ్రవాద ముద్ర అమెరికాలో చెలరేగిపోతున్న మాదక ద్రవ్య ముఠాలు, అంతర్జాతీయ డ్రగ్స్‌ గ్యాంగ్‌లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తూ ట్రంప్‌ ఉత్తర్వు జారీ చేశారు. ఇస్లామిక్‌ స్టేట్‌(ఐసిస్‌) వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలున్న జాబితాలో ఇవి చేరబోతున్నాయి. అంటే డ్రగ్స్‌ గ్యాంగ్‌లపై ఇక కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఇంధన అత్యవసర పరిస్థితి ట్రంప్‌ జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చమురు నిల్వలు పెంచాలని ఆదేశించారు. శిలాజ ఇంధనాల ఉత్పత్తిని భారీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాస్కా నుంచి చమురు, గ్యాస్, ఇతర సహజ వనరులను భారీగా సమీకరించాలని పేర్కొంటూ ఉత్తర్వుపై సంతకం చేశారు. హరిత ఉద్యోగాల(గ్రీన్‌ జాబ్స్‌) కల్పనకు జో బైడెన్‌ తీసుకొచ్చిన గ్రీన్‌ న్యూ డీల్‌ను నిలిపివేశారు. టిక్‌టాక్‌ మరో 75 రోజులు అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ తీసుకొచ్చిన చట్టం అమలును ట్రంప్‌ 75 రోజులపాటు వాయిదా వేశారు. చైనాకు చెందిన టిక్‌టాక్‌కు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. టిక్‌టాక్‌ను తొలుత వ్యతిరేకించిన ట్రంప్‌ తర్వాత సానుకూలంగా మారిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఈ మాధ్యమాన్ని చక్కగా వాడుకున్నారు. కొత్త నియామకాలకు చెల్లు! అమెరికా సైన్యంతోపాటు కొన్ని ఇతర విభాగాల్లో తప్ప ప్రభుత్వంలో కొత్త నియామకాలు చేపట్టవద్దని ట్రంప్‌ తేలి్చచెప్పారు. ప్రభుత్వంపై ట్రంప్‌ పూర్తి పట్టుసాధించేదాకా నియామకాలు ఉండవు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులంతా ఆఫీసులకు కచ్చితంగా హాజరై విధులు నిర్వర్తించాల్సిందేనని, ఇంటి నుంచి పనిచేసే వెలుసుబాటు ఎవరికీ ఉండదని ట్రంప్‌ స్పష్టంచేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పునరుద్ధరణ దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పునరుద్ధరిస్తూ, ప్రభుత్వ సెన్సార్‌íÙప్‌ను నియంత్రిస్తూ ఉత్తర్వుపై ట్రంప్‌ సంతకం చేశారు. జో బైడెన్‌ హయాంలో డిపార్టుమెంట్‌ ఆఫ్‌ జస్టిస్, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్, ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ వంటి సంస్థల సాగించిన కార్యకలాపాలపై విచారణ జరపాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించారు. విదేశాలకు సాయం నిలిపివేత విదేశాలకు ఆర్థిక సాయం తాత్కాలికంగా నిలిపివేస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు సహాయం అందించే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని తెలిపారు. ‘అమెరికా ఫస్ట్‌’ విదేశాంగ విధానంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వెనెజ్‌వెలాపై ఆంక్షలు పునరుద్ధరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల జాబితాలో క్యూబాను మళ్లీ చేర్చారు. పౌరుల జీవన వ్యయం తగ్గింపు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పౌరుల జీవన వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లు, ఆరోగ్య సంరక్షణ, గృహోపకరణాలు, నిత్యావసరాలు, ఇంధనం ధరలు తగ్గించాలన్నారు. దీనిపై వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని చెప్పారు. జీవన వ్యయం ఏ మేరకు తగ్గిందో 30 రోజుల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఇకపై గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మార్చాలని ట్రంప్‌ స్పష్టంచేశారు. అలాస్కాలోని మౌంట్‌ డెనాలీ పేరును మౌంట్‌ మెక్‌కిన్లీగా మార్చాలన్నారు. వాస్తవానికి మౌంట్‌ మెక్‌కిన్లీ పేరును బరాక్‌ ఒబామా హయాంలో మౌంట్‌ డెనాలీగా మార్చారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై పన్నుల మోత కెనడా, మెక్సికో నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పన్ను లు పెంచాలని ట్రంప్‌ ఆదేశించారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలతో వాణిజ్య సంబంధాల్లో అనైతిక పద్ధతులపై సమీక్ష నిర్వహించాలన్నారు. ట్రాన్స్‌జెండర్లకు చేదు వార్త లింగ మార్పిడి చేయించుకున్నవారికి ట్రంప్‌ చేదువార్త చెప్పారు. అమెరికాలో ఇకపై పురుష, మహిళ అనే రెండు లింగాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, మూడో లింగాన్ని గుర్తించడం లేదని స్పష్టంచేశారు. మహిళలు గానీ, పురుషులు గానీ లింగ మార్పిడి చేయించుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ఇక్కట్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మద్దతుదారులకు క్షమాభిక్ష 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్‌ భవనంపై దాడి కేసులో నిందితులైన తన మద్దతుదారులకు ట్రంప్‌ క్షమాభిక్ష ప్రసాదించేశారు. దోషులుగా తేలినవారికి విముక్తి కల్పించారు. జైలుశిక్షలు సైతం రద్దు చేశారు. మొత్తానికి ట్రంప్‌ దాతృత్వం వల్ల 1,500 మందికిపైగా నిందితులు/దోషులు కేసుల నుంచి బయటపడ్డారు. పోలీసులతో ఘర్షణకు దిగి బీభత్సం సృష్టించినవారందరిపై ట్రంప్‌ కరుణ చూపారు. వారిపై నమోదైన కేసులన్నీ ఒక్క కలంపోటుతో రద్ద య్యాయి. ఇప్పటికే జైలుపాలైన వారంతా ఇక బయటకు రాబోతున్నారు.వలస నేరగాళ్లకు మరణ శిక్ష ఉద్యోగం, ఉపాధి కోసం అమెరికాకు వలస వచ్చి నేరాలకు పాల్పడివారికి మరణశిక్ష విధించబోతున్నారు. అమెరికాలో ఇటీవల మరణశిక్షలు విధించలేదు. ట్రంప్‌ వాటిని పునరుద్ధరిస్తున్నా రు. హత్యలు చేసినవారికి మరణశిక్ష విధి స్తారు. అలాగే యూఎస్‌ శరణార్థి సెటిల్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను ట్రంప్‌ రద్దు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుడ్‌బైప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు ట్రంప్‌ గుడ్‌బై చెప్పేశారు. డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అమెరికా తప్పుకొనే ప్రక్రియ ప్రారంభమైనట్లే. ఇది చాలా పెద్ద నిర్ణయమని ఆయన అభివర్ణించారు. 2020లో కోవిడ్‌–19 మహమ్మారి ఉధృతి సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ వ్యవహార శైలి పట్ల ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా పట్ల ఆ సంస్థ స్పందన సక్రమంగా లేదని విమర్శించారు. చైనా పట్ల పక్షపాతం చూపుతోందని మండిపడ్డారు. ట్రంప్‌ తాజా నిర్ణయంపై డబ్ల్యూహెచ్‌ఓ విచారం వ్యక్తంచేసింది.పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి వెనక్కిచరిత్రాత్మక పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటోంది. తద్వారా వాతావరణ మార్పులను నియంత్రించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషికి భారీ విఘాతం కలగబోతోంది. పారిస్‌ క్లైమేట్‌ అగ్రిమెంట్‌ నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్‌ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. 2017లో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ, మళ్లీ ఆ ఒప్పందంలో భాగస్వామిగా చేరారు. భారతీయుల్లో భయం భయం అమెరికాలో ప్రస్తుతం 1.40 కోట్ల మంది చట్టవిరుద్ధమైన వలసదార్లు ఉన్నట్లు అంచనా. వీరిలో 7.25 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ట్రంప్‌ తాజా నిర్ణయంతో వీరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. అక్రమ వలసదార్లను బయటకు పంపించాలని ట్రంప్‌ కంకణం కట్టుకున్నారు. ఈమేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. వలసదార్లను ఏరివేసే కార్యక్రమంలో త్వరలో ప్రారంభం కానుంది. 2024లో జో బైడెన్‌ ప్రభుత్వం 1,529 మంది భారతీయులను వెనక్కి పంపించింది. ఇండియా సహా మొత్తం 192 దేశాలకు చెందిన 2.70 లక్షల మంది వెనక్కి వెళ్లిపోయారు.2014 తర్వాత ఈ స్థాయిలో అక్రమ వలసదార్లను వెనక్కి పంపడం ఇదే మొదటిసారి. అక్రమంగా వలసవచ్చినవారు ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లో ఉంటున్నారు. చిన్నాచితక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తక్కువ వేతనానికే కూలీలు లభిస్తుండడంతో గత ప్రభుత్వాలు వీరిని చూసీచూడనట్లు వదిలేశాయి. ట్రంప్‌ మాత్రం వీరిని బయటకు నెట్టేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అమెరికాలో 2.50 కోట్ల మంది అక్రమ వలసదార్లు ఉంటారని ట్రంప్‌ చెబుతున్నారు. నేర చరిత్ర ఉన్న 6.55 లక్షల మందితోపాటు 10.4 లక్షల మందికి ఇప్పటికే డిపోర్టేషన్‌ ఉత్తర్వులు అందాయి. త్వరలో వీరంతా వెనక్కి వెళ్లిపోవాల్సిందే. ట్రంప్‌ బారి నుంచి చట్టపరమైన రక్షణ కోసం అక్రమ వలసదార్లు ప్రయత్నిస్తున్నారు. న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.ఏమిటీ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌? అమెరికా ప్రభుత్వాన్ని శీఘ్రగతిన సంస్కరించడానికి, పరిపాలనను పరుగులు పెట్టించడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ ఎంచుకున్న మార్గం ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌. కాంగ్రెస్‌ అనుమతి లేకుండానే అధ్యక్షుడు కొన్ని నిర్ణయాలు తీసుకొనే అధికారం ఇలాంటి ఉత్తర్వుల ద్వారా లభిస్తుంది. అయితే, కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రభుత్వం ఎలా వ్యవహరించాలని అధ్యక్షుడు కోరుకుంటాడో ఆ మేరకు కొన్ని స్టేట్‌మెంట్లపై సంతకాలు చేస్తాడు. ఆ స్టేట్‌మెంట్లను ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు ఉంటారు. ఇలాంటి ఆర్డర్లు ఒక రకంగా సలహాలు, విజ్ఞప్తుల్లాంటివే. కొన్ని ఆర్డర్లను సవాలు చేయడానికి వీల్లేదు. కొన్నింటిని కోర్టుల్లో సవాలు చేయొచ్చు. కాంగ్రెస్‌ లేదా కోర్టులు ఇలాంటి ఉత్తర్వులను నిలిపివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Sakshi Editorial On America new president Donald Trump6
భవిష్యత్తు బంగారమేనా?

అనుకున్నదే అయింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూనే డొనాల్డ్‌ ట్రంప్‌ తన మాటలు, చేతలు, చేష్టల ద్వారా సంచలనాలు సృష్టించారు. గతంలో దేశానికి 45వ అధ్యక్షుడిగా పనిచేసి, తాజాగా 47వ అధ్యక్షుడిగా సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్‌ తన తొలి ప్రసంగంలోనే ‘ఇక నుంచి అమెరికాకు స్వర్ణయుగం’ అంటూ అమెరికన్లలో ఆశలు, ఆకాంక్షలు పెంచారు. అయితే, ‘అమెరికాను మళ్ళీ ఘనమైన దేశంగా తీర్చిదిద్దాల’ని (మాగా) నినదిస్తూ ఆయన ప్రకటించిన కొన్ని చర్యలు ఆధిపత్య, విస్తరణవాదానికి ప్రతీకగానూ ప్రతిధ్వనించాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని మార్చివేసే పలు చర్యలకు నడుం బిగి స్తున్న తీరు, అలాగే కోవిడ్, చైనాలను సాకుగా చూపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, అలాగే పర్యావరణ రక్షణపై ప్యారిస్‌ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ట్రంప్‌ పదవీ ప్రమాణ స్వీకారం పైకి సాదాసీదా అధికార మార్పిడిగా అనిపించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులు సైతం చిరునవ్వులు చిందిస్తూ సౌహార్దం చూపుకుంటున్నట్టు కనిపించవచ్చు. అంతమాత్రాన అంతా మామూలే అనుకొంటే పొరపాటు. పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో దర్శనమిచ్చిన ఐక్యతకు భిన్నంగా ప్రత్యర్థులపై తుపాకులు ఎక్కుపెట్టిన తీరు ఆయన ప్రసంగంలో స్పష్టంగా వినిపించింది. కునారిల్లిన దేశాన్ని తాను మాత్రమే మళ్ళీ పునరుత్తేజితం చేయగలనన్న భావన కలిగించడంతో పాటు ఆయన ఒకటికి రెండు జాతీయ ఎమర్జెన్సీలు ప్రకటించడం పెను పర్యవసానమే. అలాగే, చైనా నుంచి పనామా కాలువను వెనక్కి తీసుకోవాలని పిలుపునివ్వడమూ వివాదాస్పదమే. బలప్రయోగం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అలాంటి పనుల ప్రస్తావన నిప్పుతో చెలగాటానికి సిద్ధమని స్పష్టం చేయడమే. ఇక, గద్దెనెక్కిన తొలిరోజునే ‘గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో’ను ‘గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా’గా ట్రంప్‌ ప్రకటించడంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా మరెన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్విగ్నత నెలకొంది. పదవి చేపడుతూనే ట్రంప్‌ చకచకా సంతకాలు చేసిన పదుల సంఖ్యలోని కార్యనిర్వాహక ఆదేశాలు ఆసక్తికరం. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేయడం, జన్మహక్కుగా సంక్రమించే పౌర సత్వంపై అమెరికా రాజ్యాంగాన్ని సైతం తోసిపుచ్చడం లాంటివి ఇట్టే మింగుడుపడే అంశాలు కావు. జాతీయతతో సంబంధం లేకుండా దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి పుట్టినబిడ్డలకు సైతం 150 ఏళ్ళ పైచిలుకుగా అమెరికా పౌరసత్వం దక్కుతూ వచ్చింది. కానీ, నెల రోజుల్లో అమలులోకి రానున్న తాజా ఆదేశం ఫలితంగా ఇప్పుడిక అలాంటి పిల్లలకు పౌరసత్వ పత్రాలివ్వరు. అదేమంటే, 1868లో చేసిన 14వ సవరణ కింద అమెరికా గడ్డపై పుడితేచాలు ఆ పిల్లలకు మారుమాట లేకుండా పౌరసత్వమివ్వాలనేమీ లేదనీ, సవరణను తప్పుగా వ్యాఖ్యానించారనీ ట్రంప్‌ వాదన. తాత్కాలిక వీసాలతో అమెరికాలో నివసిస్తూ, ఉద్యోగాధారిత గ్రీన్‌కార్డ్‌కై దీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న 10 లక్షల పైచిలుకు మంది భారతీయులకు ఈ కొత్త నిర్ణయం అశనిపాతమే. ఇప్పటికే కొన్నిచోట్ల ఇమ్మిగ్రేషన్‌ లాయర్లు కోర్టుకెక్కిన ఈ ఆదేశం గనక అమలైతే, తాత్కాలిక వర్క్‌ వీసాలు, టూరిస్ట్‌ వీసాలపై అగ్రరాజ్యంలో ఉంటున్నవారి సంతానానికి అక్కడి పౌరసత్వ ఆశలు అడుగంటినట్లే. 2022 నాటి అమెరికా జనాభా లెక్కలపై ప్యూ రిసెర్చ్‌ విశ్లేషణ ప్రకారం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లుంటే, వారిలో మూడింట రెండొంతుల మంది వలసజీవులే. కేవలం 34 శాతం, మరో మాటలో 16 లక్షల మంది మాత్రం అగ్రరాజ్యంలోనే పుట్టారు. ఇక, చట్టవిరుద్ధమైన వలసల్ని అడ్డుకుంటాననీ, సరైన పత్రాలు లేని లక్షలాది వలస జీవుల్ని దేశం నుంచి పంపివేస్తాననీ ట్రంప్‌ చేసిన గర్జన కూడా లక్షలమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ జాబితాలో మెక్సికో (40 లక్షలు), ఎల్‌ సాల్వడార్‌ (7.5 లక్షలు) తర్వాత 7.25 లక్షల మంది భారతీయులదే మూడో స్థానం. ఫలితంగా, ట్రంప్‌ ప్రతి మాట, ప్రతి అడుగు మనవాళ్ళలో ఆదుర్దా పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ కొత్త ఏలుబడిలో భారత్‌తో బంధం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. మరోపక్క డెమోక్రాట్లను జనం బాధలు పట్టని కులీనులుగా చిత్రించి, సామాన్య పౌరుల సంరక్ష కుడిగా ఎన్నికల్లో తనను తాను చూపుకొన్న ట్రంప్‌ను అతిగా నమ్మి మోసపోయామనే భావన రేకెత్తడం సహజమే. చేతిలోని నియంత్రణ నిర్ణయాలే అండగా ఇటీవలే ఓ బ్రాండెడ్‌ క్రిప్టో టోకెన్‌ ద్వారా ఆయన వందల కోట్ల డాలర్ల లబ్ధి పొందాడనే విమర్శలూ గుప్పుమంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ళ తర్వాత కీలక సమయంలో పగ్గాలు చేపట్టిన ట్రంప్‌ తన మద్దతుదారులకై ఏమైనా చేసేలా ఉన్నారు. 2021లో అమెరికా అధ్యక్ష భవనంపై దాడి చేసిన దాదాపు 1500 మంది దుండగులకూ ఆయన తక్షణం సామూహిక క్షమాభిక్ష ప్రసాదించడమే అందుకు తార్కాణం. నాలుగేళ్ళు విచారించి, శిక్షలు వేసిన న్యాయవ్యవస్థను అలా నూతన అధ్యక్షుడు పరిహసించినట్టయింది. ఆశ్రితులు, ఆర్థిక దాతలు, బంధు మిత్రులకై క్షమాభిక్ష వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో నిన్నటి బైడెన్‌ నుంచి నేటి ట్రంప్‌ దాకా అందరూ ఒకే తాను గుడ్డలన్న మాట. కాలు మోపిననాడే కాపురం చేసే లక్షణం తెలిసిందన్నట్టు ట్రంప్‌ 2.0 హయాం ఆరంభమవు తూనే రోజులు ఎలా ఉండనున్నాయో తేటతెల్లమైంది. బహుళ ధ్రువ ప్రపంచం వైపు అంతర్జాతీయ అధికార క్రమం అడుగులేస్తున్న కాలంలో ‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో సామాజిక, ఆర్థిక రంగాల్లో ట్రంప్‌ ఆధిపత్యభావ నిర్ణయాలు రానున్న నాలుగేళ్ళలో ప్రపంచాన్ని కుదిపేయడం ఖాయం.

Megha Engineering three key agreements with Telangana Govt7
రూ.15 వేల కోట్ల పెట్టుబడులు

సాక్షి, హైదరాబాద్‌: మేఘా ఇంజనీరింగ్‌ ఇండస్ట్రీస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాల కల్పనకు సంబంధించి మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో జరుగుతున్న సమావేశాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. రూ.11 వేల కోట్లతో 2160 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టును తెలంగాణలో మేఘా సంస్థ ఏర్పాటు చేయనుంది. తద్వారా నిర్మాణ దశలో వేయి, నిర్వహణ దశలో 250 ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులనూ ఈ సంస్థ స్థాపిస్తుంది. తద్వారా పునరుత్పాదక ఇంధనం, సుస్థిర అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానం చేరేందుకు తోడ్పడుతుంది. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక ప్రదేశాల్లో రూ.3 వేల కోట్లతో వేయి మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ వ్యవస్థను స్థాపిస్తుంది. తద్వారా వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా వేయి, పరోక్షంగా మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసేలా వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూ.వేయికోట్లతో వెల్నెస్‌ రిసార్ట్‌ను మేఘా సంస్థ నెలకొల్పుతుంది. తద్వారా నిర్మాణ దశలో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. మేఘాతో ఒప్పందాలపై మంత్రి శ్రీధర్‌ బాబు హర్షం వ్యక్తంచేశారు. ‘స్కై రూట్‌’ పెట్టుబడులు రూ.500 కోట్లు హైదరాబాద్‌ను త్వరలోనే ప్రైవేటు రంగంలో అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ప్రైవేటు రంగంలో రూ.500 కోట్లతో రాకెట్‌ తయారీ, ఇంటిగ్రేషన్‌ టెస్టింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు స్కై రూట్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ ఆధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడంతోపాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడాన్ని అభినందించారు. స్కైరూట్‌ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెబుతుందని సీఎం అన్నారు. తెలంగాణ, హైదరాబాద్‌ రైజింగ్‌ లక్ష్యసాధనలో తాము భాగస్వామ్యం వహిస్తామని స్కై రూట్‌ కో ఫౌండర్‌ పవన్‌ కుమార్‌ చందన అన్నారు. యూనీలివర్‌తో ఒప్పందం దావోస్‌ పర్యటనలో భాగంగా దిగ్గజ కంపెనీ యూనిలీవర్‌ సంస్థ సీఈఓ హీన్‌ షూమేకర్, చీఫ్‌ సప్లై ఆఫీసర్‌ విల్లెమ్‌ ఉయిజెన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు బృందం చర్చలు జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, సీఎంఓ ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రమోషన్‌ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణలో వ్యాపారం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన యూనీలివర్‌ బృందానికి రేవంత్‌ వివరించారు. తెలంగాణలో వినియోగ వస్తువులకు భారీ మార్కెట్‌ ఉందని, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వాణిజ్య విధానాలు వ్యాపారాలకు అనువుగా ఉంటాయన్నారు. చర్చలు ఫలప్రదం కావడంతో తెలంగాణలో పెట్టుబడులకు యూనిలీవర్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్‌ తయారీ యూనిట్‌తోపాటు రాష్ట్రంలో బాటిల్‌ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ యూనిట్‌ ఏర్పాటుతో ఇతర ప్రాంతాల నుంచి బాటిల్‌ క్యాప్‌ల దిగుమతి చేసుకుంటుండగా ఇకపై స్థానికంగా తయారవుతాయి. కాగా, కామారెడ్డిలో అవసరమైన భూమిని కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వివిధ సంస్థలతో సంప్రదింపులు కాలిఫోర్నియాలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఏఐ హార్డ్‌వేర్, ఏఐ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌లో పేరొందిన ‘సాంబనోవా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ’చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌ సూలేతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు బృందం చర్చించింది. తెలంగాణలో సెమీకండక్టర్‌ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివరించింది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో శ్రీధర్‌ బాబు లాజిస్టిక్స్‌ కంపెనీల్లో పేరొందిన ఎజిలిటీ సంస్థ చైర్మన్‌ తారెక్‌ సుల్తాన్‌ను కలిశారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్‌ బాబు వివరించారు. ఇండస్ట్రీస్‌ ఇన్‌ ఇంటెలిజెంట్‌ ఏజ్‌ దావోస్‌ వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సమావేశాలు ‘ఇండస్ట్రీస్‌ ఇన్‌ ఇంటెలిజెంట్‌ ఏజ్‌’అనే థీమ్‌తో ప్రారంభమయ్యాయి. శాస్త్ర సాంకేతిక అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులతోపాటు ఆయా రంగాలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేలమంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. దావోస్‌ పర్యటనలో భాగంగా అమెజాన్, సిఫీ టెక్నాలజీస్‌ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు జరపనుంది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) సారథ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌ భేటీ అవుతారు.

Sensex crashes 1235 points to 7 month low8
ట్రంప్‌ టారిఫ్‌ టెర్రర్‌

ముంబై: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ వాణిజ్య టారిఫ్‌ పెంపు భయాలకు తోడు అధిక వెయిటేజీ షేర్ల పతనంతో స్టాక్‌ సూచీలు మంగళవారం ఒకటిన్నరశాతానికి పైగా కుప్పకూలాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మరింత ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్‌ 1,235 పాయింట్లు పతనమై 75,838 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 320 పాయింట్లు నష్టపోయి 23,025 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది ఏడు నెలల కనిష్టం. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 1,432 పాయింట్లు క్షీణించి 75,642 వద్ద, నిఫ్టీ 369 పాయింట్లు పతనమై 22,976 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి విలువ 13 పైసలు బలహీనపడి 86.58 వద్ద స్థిరపడింది.⇒ అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. రియల్టీ ఇండెక్స్‌ 4.2% క్షీణించింది. కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 4%, సర్విసెస్, విద్యుత్, టెలికం, యుటిలిటీ ఇండెక్సులు 2.5% పడ్డాయి.నష్టాలకు 4 కారణాలు⇒ ‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతోట్రంప్‌ మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపునకు సిద్ధమయ్యారు. భారత్‌తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదని గతంలో వ్యాఖ్యానించారు. ట్రంప్‌ టారిఫ్‌ ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు.⇒ దేశీయ కార్పొరేట్‌ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్‌ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్‌ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్‌ (ఎర్కింగ్స్‌ పర్‌ షేర్‌) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్‌బర్గ్‌ అంచనా వేసింది.⇒ జొమాటో (–11%)తో సహా అధిక వెయిటేజీ షేర్లు ఐసీఐసీఐ బ్యాంకు (–3%), ఎస్‌బీఐ (–2.57%), రిలయన్స్‌ (–2.50%), ఎంఅండ్‌ఎం (–2.25%) షేర్లు భారీగా క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్‌ మొత్తం పతనంలో ఈ షేర్ల వాటాయే 640 పాయింట్లు. కాగా ఒక్క జొమాటో షేరు వాటా 150 పాయింట్లు కావడం గమనార్హం.⇒ విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దలాల్‌ స్ట్రీట్‌పై మరింత ఒత్తిడి పెంచాయి. ఈ కొత్త ఏడాది జనవరి 20 నాటికి ఎఫ్‌ఐఐలు మొత్తం రూ.48,023 కోట్ల విలువైన భారత ఈక్విటీలు అమ్మేశారు. 7.5 లక్షల కోట్లు ఆవిరిమార్కెట్‌ భారీ పతనంతో సోమవారం ఒక్కరోజే రూ.7.52 లక్షల కోట్లు హరించుకుపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.424 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో అల్ట్రాటెక్‌(0.39%), హెచ్‌సీఎల్‌ టెక్‌(0.33%) మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.

Sakshi Guest Column On woman working hours9
పనిగంటల్లో మహిళను మరిచారా?

వారంలో ఎన్ని గంటలు పనిచేయాలి? ఈ మధ్య కాలంలో దేశం మొత్తమ్మీద విపరీతమైన చర్చ లేవనెత్తిన ప్రశ్న ఇది. ఏడాది క్రితం ‘ఇన్ఫోసిస్‌’ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశం కోసం వారంలో 70 గంటలు పనిచేయాలని సూచించడంతో మొదలైందీ చర్చ. ఇది సద్దుమణిగేలోపు, ‘లార్సెన్‌ అండ్‌ టూబ్రో’ (ఎల్‌ అండ్‌ టీ) ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌. సుబ్రహ్మణ్యన్‌ వారంలో 90 గంటలు పని చేయాలని ఇచ్చిన సలహా మళ్లీ దుమారం రేకెత్తించింది. ‘ఆదివారాలు ఎంత సేపని మీ భార్యల ముఖాలు చూస్తూ కూర్చుంటారు, ఆఫీసులకు వచ్చి పనిచేయండి’ అని కూడా ఆయన చతుర్లు ఆడారు. ఈ సరదా వ్యాఖ్య కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. లక్షల జోకులు, మీమ్స్‌ పుట్టుకొచ్చాయి. నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్‌ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు యథాలాపంగా చేసిన వ్యాఖ్యలను బట్టి వారిని జడ్జ్‌ చేయడం మంచిది కాదు. కానీ సుదీర్ఘ పనిగంటలను వారు సీరియస్‌గానే ప్రతిపాదిస్తున్నట్టు కనిపిస్తోంది.వ్యాపార రంగంలో వారిద్దరి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసు కుని చూస్తే ఆ వ్యాఖ్యలకు మనం విలువ ఇవ్వాలి. దేశంలో ఇన్ఫర్మే షన్‌ టెక్నాలజీ విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీని నిలబెట్టిన వ్యక్తి నారాయణమూర్తి. ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ కూడా ఆషామాషీ వ్యక్తి కాదు. 5,690 కోట్ల డాలర్ల విలువైన, ఫోర్బ్స్‌ జాబితాలో నమోదైన కంపెనీని నడిపిస్తున్నారు. కాబట్టి వీరి దృష్టి కోణాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇంటి పని మాటేమిటి?నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో కనిపించే ఒక అంశం ఏమిటంటే... వీరిరువురి భార్యలకు సొంతంగా ఉద్యోగాలేమీ లేకపోవడం. దీనివల్ల మన సంరక్షణ బాధ్యతలు చూసుకునే వ్యక్తులు మన అభివృద్ధిలో ఎంత మేరకు భాగస్వాములో తెలియకుండా పోతుంది. వీరిద్దరు చెప్పినట్లు వారానికి 70 లేదా 90 గంటలు పనిచేశామనుకోండి... మహిళలు ఉద్యోగాలు చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు అంత ఎక్కువ పెరిగిపోతాయి కాబట్టి!ఉద్యోగాలు చేసే వారి పిల్లల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటి వరకూ ఎలాంటి ఏర్పాట్లూ లేవు. ఇలా ఉండి ఉంటే తల్లులు కూడా ఎక్కువ సమయం ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో గడిపేందుకు అవకాశం ఏర్పడేది. వారంలో 70 లేదా 90 గంటలు పనిచేయాలన్న ఆలోచన వెనక ఆ ఉద్యోగి జీవిత భాగస్వామికి ఉద్యోగం ఏదీ లేదన్న నిర్ధారణ ఉండి ఉండాలి. పితృస్వామిక భావజాలం ఎక్కువగా ఉండే భారతదేశ నేపథ్యాన్ని లెక్కలోకి తీసుకుంటే... ఆ జీవిత భాగస్వామి మహిళే అయి ఉంటుంది. ఈ వ్యవహారంలో భార్య ప్రస్తావన వచ్చేందుకు ఇంకోటి కూడా కారణం. భార్యలు ఇంటిపట్టున తీరికగా ఉన్నారు అన్న అంచనా. ఇంకోలా చెప్పాలంటే... ఇంట్లో పని మొత్తం అంటే ఇల్లూడ్చడం, వంట, పిల్లల మంచిచెడ్డలు, వయసు మళ్లిన వారి బాగోగులన్నీ ఇతరులు ఎవరో చూసుకుంటున్నారన్నమాట. వాస్తవం ఏమిటంటే... ఇలా పనులు చేసిపెట్టే వారు ఏమీ అంత చౌకగా అందుబాటులో ఉండరు.ఈ దృష్ట్యా చూస్తే... ఈ ఇద్దరు ప్రముఖులు పని అంటే కేవలం ఇంటి బయట చేసేది మాత్రమే అన్న అంచనాతో మాట్లాడటం సమంజసం కాదు. ఇంటి పని కూడా చాలా శ్రమతో కూడుకున్నది, సమయం తీసుకునేదని వీళ్లు గుర్తించి ఉండాల్సింది. పైగా ఇంటి పనులు సాధారణంగా ఆడవారే చేస్తూంటారు. ప్రపంచవ్యాప్తంగా, ఇంకా ముఖ్యంగా భారతదేశంలో ఇదే ధోరణి కనిపిస్తుంది. ఇంట్లో ఆడవాళ్లు చేసే శ్రమ విలువ ఎంతో అర్థం చేసుకోవాలంటే ఆ మధ్య వచ్చిన మలయాళ సినిమా ‘ద గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ ఒకసారి చూడాలి. మహిళ శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత?ఈ నేపథ్యంలో దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత అన్న ప్రశ్నకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. అంతర్జాతీయంగా మహిళల భాగస్వామ్యం సగటున 51 శాతం ఉంటే భారత్‌లో గణనీయంగా తక్కువ ఉండేందుకు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. అయితే, ఇటీవలి కాలంలో ఈ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే ప్రకారం, మహిళల భాగస్వామ్యం 2017–18లో 23.3 శాతం మాత్రమే ఉంటే, 2023–24లో 41.7 శాతానికి పెరిగింది. పురుషుల భాగస్వామ్యం సుమారుగా 78.8 శాతం ఉండటం గమనార్హం. ఆర్థికవేత్తలు శమికా రవి, ముదిత్‌ కపూర్‌లు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, దేశంలో శ్రమశక్తిలో పెళ్లయిన మగవారి భాగస్వామ్యం చాలా ఎక్కువ. అదే సమయంలో పెళ్లయిన మహిళల సంఖ్య చాలా తక్కువ. తల్లి లేదా తండ్రి ఉద్యోగస్తుడైతే ఆ యా కుటుంబాల్లో పిల్లలపై ప్రభావాన్ని కూడా పరిశీలించారు. తండ్రి ఉద్యోగస్తు డైతే ఆ ప్రభావం దాదాపు లేకపోయింది. మహిళల విషయానికి వస్తే పిల్లలున్న కుటుంబాల్లోని మహిళలు శ్రామిక శక్తిలో భాగం కావడం కేరళ వంటి రాష్ట్రాల్లో బాగా తగ్గిపోయింది. బిహార్, పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాల్లో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వరుసగా తక్కువగా నమోదవుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. అసంఘటిత రంగం మాటేమిటి?పని గంటలు పెంచాలన్న అంశంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఏమాత్రం నియంత్రణ లేని అసంఘటిత రంగం పరి స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పని గంటలను అసాధారణంగా పెంచి చిన్న వ్యాపారులు ఉద్యోగుల శ్రమను దోపిడి చేసే అవకాశం ఉంది. నగర ప్రాంతాల్లో గిగ్‌ ఆర్థిక వ్యవస్థ చాలా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరికి పనివేళలు నిర్దిష్టంగా ఉంటాయి కానీ టార్గెట్లు ఎక్కువ ఇవ్వడం ద్వారా అధిక శ్రమకు గురి చేస్తూంటారు. ఇంటి పని చేసే వారి విషయంలోనూ పనివేళలు, వేత నాలపై ఎలాంటి నియంత్రణ లేదు. పనిగంటలపై మొదలైన చర్చ ఏయే రంగాల్లో నియంత్రణ వ్యవస్థల అవసరం ఉందన్నది గుర్తించేందుకు ఉపయోగపడవచ్చు. అయితే అసంఘటిత రంగంలో ఉన్న వారు తమంతట తామే పనివేళలను నిర్ధారించుకునే అవకాశం ప్రస్తుతానికైతే లేదన్నది విధాన నిర్ణేతలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం వారంలో ఎన్ని గంటలు పనిచేయాలన్న విష యంపై మొదలైన చర్చ కొన్ని సానుకూల అంశాలను తెరపైకి తెచ్చింది. పని చేసే సమయం ముఖ్యమా? చేసిన పని తాలూకూ నాణ్యత ముఖ్యమా అన్నది వీటిల్లో ఒకటి. అదృష్టవశాత్తూ చాలా మంది కార్పొరేట్‌ బాసులు సమయం కంటే నాణ్యతకే ఓటు వేశారు. ఒక్కటైతే నిజం... నారాయణ మూర్తి, సుబ్రహ్మణ్యన్‌ వంటి తొలి తరం వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలపై ఏకాగ్ర చిత్తంతో పని చేయడం వల్లనే ఇప్పుడీ స్థితికి ఎదిగారు. అయితే విజయానికి మార్గాలు అనేకం. రతన్‌ టాటా వంటి వారు పారిశ్రామికంగా ఎదుగుతూనే ఇతర వ్యాపకాలను కూడా చూసుకోగలిగారు. అభివృద్ధి పథంలో మన సంరక్షకుల పాత్రను కూడా విస్మరించలేము. మొత్త మ్మీద చూస్తే ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలేమిటన్నది సంకుచిత దృష్టితో కాకుండా సమగ్రంగా చూడటం మేలు!సుష్మా రామచంద్రన్‌ వ్యాసకర్త సీనియర్‌ ఫైనాన్షియల్‌ జర్నలిస్ట్‌(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

India and England T20 series starts today10
పరుగుల వరదకు సై

ఒకరిని మించి మరొకరు ధాటిగా ఆడే బ్యాటర్లు... భారీ స్కోర్లకు వేదికలైన చిన్న మైదానాలు... మంచు ప్రభావంతో బౌలర్లకు తిప్పలు... రాబోయే పక్షం రోజుల్లో టి20ల్లో క్రికెట్‌లో ఎన్ని కొత్త రికార్డులు నమోదు కానున్నాయో! వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత తొలుత బ్యాటింగ్‌ చేసిన 11 మ్యాచ్‌లలో 7 సార్లు 200 స్కోరు దాటించిన టీమిండియా తమ దూకుడును ప్రదర్శించగా... విధ్వంసానికి మారుపేరువంటి మెకల్లమ్‌ కోచింగ్‌లో ఇంగ్లండ్‌ కూడా ఓవర్‌కు పదికి పైగా రన్‌రేట్‌తో వరుసగా లక్ష్యాలను ఛేదిస్తూ తామూ తక్కువ కాదని నిరూపించింది. ఈ నేపథ్యంలో రాబోయే ఐదు టి20 సమరాలు అభిమానులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించనున్నాయి. గత వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో భారత్‌ చేతిలో ఇంగ్లండ్‌ చిత్తయిన తర్వాత ఇరు జట్లు ఇప్పుడే తొలిసారి తలపడనుండగా... చివరకు పైచేయి ఎవరు సాధిస్తారనేది ఆసక్తికరం.కోల్‌కతా: ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ ముగిసిన రెండు వారాల తర్వాత భారత క్రికెట్‌ జట్టు మళ్లీ మైదానంలోకి దిగుతోంది. టెస్టులతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన జట్టుతో ఇప్పుడు టీమిండియా టి20 ఫార్మాట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 పోరులో విశ్వ విజేత జట్టు తలపడుతుంది. ఇందులో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో నేడు మొదటి మ్యాచ్‌ జరుగుతుంది. బలాబలాల దృష్ట్యా చూస్తే రెండు టీమ్‌లు దాదాపు సమానంగా కనిపిస్తున్నాయి. టి20 కోచ్‌గానూ పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న మెకల్లమ్‌ తనదైన శైలిలో కొత్తగా ఇంగ్లండ్‌ జట్టును సిద్ధం చేశాడు. షమీపై అందరి దృష్టి... గాయం నుంచి కోలుకొని దాదాపు 14 నెలల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ ఫిట్‌నెస్‌కు ఈ మ్యాచ్‌ పరీక్ష కానుంది. ఇప్పటికే చాంపియన్స్‌ ట్రోఫీ టీమ్‌లోకి కూడా ఎంపికైన షమీ టి20 ఫార్మాట్‌ ద్వారా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. రెండు నెలల క్రితం భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై మెరుపు ప్రదర్శన కనబర్చి 3–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ చివరి మ్యాచ్‌తో పోలిస్తే దాదాపు అదే జట్టు బరిలోకి దిగవచ్చు. ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన సంజు సామ్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో తన జోరును ప్రదర్శించాలని భావిస్తుండగా, రెండో ఓపెనర్‌గా అభిషేక్‌ రాణించాల్సి ఉంది. వరుసగా రెండు అంతర్జాతీయ టి20 సెంచరీలు సాధించిన హైదరాబాదీ తిలక్‌ వర్మ కూడా అదే ఉత్సాహంతో సిద్ధం కాగా... మిడిలార్డర్‌లో సూర్యకుమార్, హార్దిక్, రింకూ సింగ్‌ భారీ స్కోరును అందించగలరు. నితీశ్‌ కుమార్‌ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. కీపర్‌గా సాల్ట్‌... తొలి టి20 కోసం ఇంగ్లండ్‌ తుది జట్టును ముందు రోజే ప్రకటించింది. తొలిసారి వైస్‌ కెప్టెన్‌గా నియమితుడైన హ్యారీ బ్రూక్‌ మెరుపు బ్యాటింగ్‌తో సత్తా చాటగలడు. సాల్ట్‌ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. చివరి స్థానం వరకు ఆటగాళ్లంతా బ్యాటింగ్‌ చేయగల సమర్థులు కావడం ఇంగ్లండ్‌ బలం. పిచ్, వాతావరణం ఈడెన్‌ మైదానం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. కాబట్టి భారీ స్కోర్లు ఖాయం. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు. వర్ష సూచన లేదు. తుది జట్ల వివరాలు భారత్‌ (అంచనా): సూర్యకుమార్‌ (కెప్టెన్‌), సామ్సన్, అభిషేక్, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్‌, షమీ, అర్‌‡్షదీప్, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌/సుందర్‌. ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), సాల్ట్, డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, బెతెల్, ఒవర్టన్, అట్కిన్‌సన్, జోఫ్రా ఆర్చర్, రషీద్, మార్క్‌ వుడ్‌.24 భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇప్పటి వరకు 24 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచ్‌ల్లో భారత్‌ నెగ్గగా... 11 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. భారత్‌ వేదికగా రెండు జట్లు 11 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 6 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందగా... 5 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు విజయం దక్కింది. 7 ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో భారత్‌ ఆడిన టి20 మ్యాచ్‌లు. ఇందులో ఆరింటిలో భారత్‌ నెగ్గగా... ఎదురైన ఒక పరాజయం ఇంగ్లండ్‌ చేతిలోనే (2011లో) కావడం గమనార్హం. హార్దిక్‌ పాండ్యాతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. అతను మా నాయకత్వ బృందంలో కీలక భాగమే. భారత జట్టును ఎలా నడిపించాలో మాకందరికీ బాగా తెలుసు. మైదానంలోకి దిగాక జట్టు కోసం అందరం చర్చించే నిర్ణయం తీసుకుంటాం. సరిగ్గా చెప్పాలంటే మా టీమ్‌లో ఒకరికంటే ఎక్కువ మంది కెప్టెన్లు ఉన్నారు. కోచ్‌ గంభీర్‌తో కూడా గతంలో కలిసి పని చేశాను. ఆయన ఆటగాళ్లకు మంచి స్వేచ్ఛనిస్తారు. కోచ్‌ పర్యవేక్షణలో ప్రస్తుతం మా జట్టు సరైన దిశలోనే వెళుతోంది. కీపర్‌గా సామ్సన్‌ బాగా ఆడుతున్నాడు కాబట్టి మరో ప్లేయర్‌ గురించి ఆలోచన లేదు. టి20 వరల్డ్‌ కప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ఆలోగా దాదాపు ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడి టీమ్‌ను సిద్ధం చేయడం ముఖ్యం. చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడం కంటే నేను వన్డేల్లో బాగా ఆడలేకపోవడమే నన్ను ఎక్కువ నిరాశకు గురి చేస్తోంది. నా ప్రదర్శన బాగా లేక ఎంపిక కాలేదు కాబట్టి సమస్య లేదు. –సూర్యకుమార్‌ యాదవ్, భారత కెప్టెన్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీట్ అండ్ గ్రీట్’

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో జనవరి 18న ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం జరిగింది.

title
డుం.. డుం.. డుం..

ప్రేమ‌కు స‌రిహ‌ద్దులు లేవ‌ని నిరూపించింది త‌మిళ‌నాడుకు చెందిన ఓ యువ‌తి.

title
ట్రంప్‌, జేడీ వాన్స్‌ ప్రమాణం.. ప్రత్యేక ఆకర్షణగా ఉషా చిలుకూరి

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప

title
డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడు.. అంతలోనే ఇలా..

దిల్‌సుఖ్‌నగర్‌ (హైదరాబాద్‌)/చౌటుప్పల్‌ రూరల్‌: ఉన్నత చదువు

title
ట్రంప్‌ ఇచ్చిన బాధ్యతల నుంచి వైదొలగిన వివేక్‌ రామస్వామి.. కారణం?

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Tr

Advertisement
Advertisement