Reviews
-
ఓటీటీలో మలయాళ హిట్ మూవీ సూక్ష్మదర్శిని.. ఎలా ఉందంటే?
ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉంది అంటే అది రహస్యమే. కాని మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాలసిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందని వాళ్ళు బయటపెట్టితేనే పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపొరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే సూక్ష్మదర్శిని. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. సూక్ష్మదర్శిని ఓ మళయాళ సినిమా. హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా వస్తాడు. మాన్యుల్ ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. మాన్యుల్ తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది. మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలను మాత్రం సూక్ష్మదర్శినిలో చూస్తే తెలిసిపోతుంది.సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి.జతిన్. ప్రముఖ మళయాళ నటులు నజరియా, బసిల్ జోసెఫ్ వంటి వారు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలలో నటించడం ప్రత్యేక ఆకర్షణ. ఆఖరుగా ఒక్కమాట ఇరుగు పొరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్ ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్.- ఇంటూరు హరికృష్ణ. -
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘సంక్రాంతికి వస్తున్నాం’నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్, వీటీ గణేష్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్, దిల్ రాజుదర్శకత్వం: అనిల్ రావిపూడిసంగీతం: భీమ్స్ సిసిరిలియోసినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 14, 2025ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Review). రిలీజ్ విషయంలో చివరిది అయినా.. ప్రమోషన్స్‌లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్ మరే సినిమాకు చేయలేదు. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ అదిరిపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ’ అనిపించుకున్న వెంకటేశ్ ఖాతాలో మరో ‘ ఫ్యామిలీ విక్టరీ’ పడిందా రివ్యూలో చూద్దాం.కథేంటేంటే.. డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు. ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని కథలు మన ఊహకందేలా సింపుల్‌గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతీది అంచనాకు తగ్గట్టే ఉంటాయి. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ, రొటీన్ సీన్లే అయినప్పటికీ ఎంటర్టైన్ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సింపుల్ పాయింట్‌ని తీసుకొని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. టైటిల్ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది.(Sankranthiki Vasthunam Review)అనిల్ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్ ముందే సినిమా కథంతా చెప్పేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. ట్రైలర్లోనే కథంతా చెప్పేశాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్స్‌లోనే చెప్పేశాడు. స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం.. ఈ కథ మెయిన్ పాయింట్. భార్య, భర్త, ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. వాళ్ల మధ్య వచ్చే ప్రతీ సీన్ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అలాంటి పాయింట్ పట్టుకోవడమే అనిల్ రావిపూడి సక్సెస్. ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్ యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. ఆకెళ్ల కిడ్నాప్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్ సీన్‌ని కూడా ఎంటర్టైనింగ్గానే తీర్చిదిద్ది.. కథనం మొత్తం ఫుల్ కామెడీ వేలో సాగుతుందనే ముందే చెప్పేశాడు దర్శకుడు. ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది. వైడీ రాజు కొడుకు బుల్లిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు. వైడీ రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్ డబుల్ అవుతుంది. ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలుతో హీరో పడే బాధ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఆహ్లాదకరమైన పాటలు... పొట్టచెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. జైలర్ జార్జ్ ఆంటోనీ(ఉపేంద్ర లిమాయే)తో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆస్పత్రి సీన్ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ‘ఆవకాయ’ సీన్‌కు అయితే పడిపడి నవ్వుతారు. క్లైమాక్స్‌ని పకడ్బందీగా రాసుకున్నాడు. క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది. అక్కడ వెంకటేశ్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా.. మగవాళ్లకు మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఆ డైలాగ్స్ ఉంటాయి. ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడాల్సిన మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పాత్రను వెంకటేశ్(Venkatesh) చేస్తే ఎలా ఉంటుందో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు. మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే యాదగిరి దామోదర రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు. యాక్షన్‌తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరి అమ్మాయి, రాజు భార్య భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్ తనదైన నటనతో ఆకట్టుకుంది.రాజు మాజీ ప్రియురాలు, ఐపీఎస్ అధికారి మీనాక్షిగా మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. తొలిసారి ఇందులో యాక్షన్ సీన్ కూడా చేసింది. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా మట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లి రాజు. ఈ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఒదిగిపోయాడు. ఇంత మంది స్టార్స్ ఉన్నప్పటికీ.. తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగాడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పలగబడి నవ్వారు. నరేశ్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ‘గోదారి గట్టు మీద...’పాటతో పాటు ప్రతి పాట తెరపై చూసినప్పుడు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
టైటిల్: డాకు మహారాజ్నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సత్య తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: బాబీ కొల్లిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్విడుదల తేది: జనవరి 12, 2025కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..బాలయ్య చేసే మాస్ యాక్షన్ సినిమాల నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటుంది. విలన్ చెడు పనులు చేస్తూ జనాలను హింసించడం.. దాన్ని హీరో అడ్డుకోవడం. అన్ని కథలు ఇలానే ఉంటాయి. డాకు మహారాజ్(Daaku Maharaaj Review) కూడా అలాంటి కథే. అయితే పాత కథను కూడా కొత్తగా చెప్పడం కూడా ఓ కళ. అందులో దర్శకుడు బాబీ ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాడు. రొటీన్ కథనే అయినా హీరో ఫ్యాన్స్‌కి నచ్చేలా తెరకెక్కిస్తాడు.బాలయ్య తాలుకు ఇమేజ్‌ని దృష్టిలో ఫక్తు కమర్షియల్ ఫార్మెట్లో డాకు మహారాజ్ కథనాన్ని సాగించాడు. ప్రతి పది నిమిషాలకొక యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ యాక్షన్ సీన్లు కూడా కొత్తగా ఉంటాయి. గత సినిమాల మాదిరి బాలయ్య ఇందులో గట్టిగా అరవడం.. ఒంటి చేత్తో వందమందిని నరకడం లాంటివి ఉండవు. డీసెంట్ యాక్షన్ సీన్లతో బాలయ్యను కొత్తగా చూపించాడు. అయితే కథనం ఊహకందేలా సాగడం.. పాతకాలం నాటి సమస్యనే మళ్లీ తెరపై చూపించడం అంతగా ఆకట్టుకోదు. అలాగే మెయిన్ విలన్ని సెకండాఫ్ వరకు దాచడంతో హీరో, విలన్ల మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా సాగలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఎత్తుగడ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ప్రారంభంలోనే చూపించి కథనంపై ఆసక్తిని పెంచేశారు. మొదటి పావుగంట కృష్ణమూర్తి ఫ్యామిలీ, ఎమ్మెల్యే త్రిమూర్తుల చుట్టూనే తిరుగుతుంది. నానాజీగా బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. చిన్నారితో బాలయ్యకు ఏదో సంబంధం ఉంటుందని ఊహించినా.. అదేంటి అనేది సెకండాఫ్ వరకు దాచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. సివిల్ ఇంజనీర్ సీతారాం, డాకు మహారాజ్ కథంతా ద్వితియార్థంలోనే వస్తుంది. చంబల్ ప్రజలకు ఉన్న ఓ ప్రధాన సమస్యను తీర్చేందుకు సీతారాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఊచకోత ఉంటుంది. అది బాలయ్య అభిమానులను అలరిస్తుంది. ఎమోషన్ కోసం చిన్న పిల్లల పాత్రలను మరింత హింసాత్మకంగా తీర్చిదిద్దారు. అయితే ద్వితియార్థం ప్రారంభమైన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుందని ఊహించొచ్చు. క్లైమాక్స్‌ని ఇంకాస్త షార్ఫ్ గా కట్ చేస్తే బాగుండేదేమో. బాలయ్య అభిమానులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. బాలయ్యకు యాక్షన్ సినిమాలు కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాల్లో మరింత దూకుడుగా నటిస్తాడు. డాకు మహారాజ్లో కూడా అదే స్థాయితో నటించాడు. నానాజీగా, సీతారాంగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి, ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించాడు. యాక్షన్ సీన్లలో ఎప్పటి మాదిరే అదరగొట్టేశాడు. ఇందులో గత సినిమాల మాదిరి పెద్ద పెద్ద డైలాగ్స్, అరవడాలు ఉండవు. బాలయ్య చెప్పే డైలాగ్ తీరు కొత్తగా ఉంటుంది. బల్వంత్ ఠాకూర్‌గా బాబీ డియోల్ తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూనే డిఫరెంట్ విలనిజాన్ని చూపించాడు. ప్రగ్యా జైస్వాల్‌తో పోలిస్తే శ్రధ్ధా శ్రీనాథ్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. అయితే తెరపై మాత్ర ప్రగ్యానే ఎక్కువసేపు కనిపిస్తుంది. ఎమ్మెల్యే త్రిమూర్తులుగా రవికిషన్ చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో ఆయన విలనిజం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ ఆకట్టుకుంటుంది. ఊర్వశీ రౌతేలా పాటకే దబిడిదిబిడి పాటతో ఆకట్టుకోవడమే కాకుండా.. గ్లామర్‌తో యూత్‌ని అలరించింది. సచిన్ ఖేడ్కర్, చాందీనీ చౌదరితో పాటు వైష్ణవి పాత్ర పోషించిన చిన్నారి కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య సినిమా అంటే తమన్ రెచ్చిపోతాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా అదరిపోయే బీజీఎం అందించాడు. కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తాయి. పాటలు పర్వాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బాలయ్యతో కొత్త స్టంట్స్ చేయించారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ
టైటిల్ : గేమ్ ఛేంజర్‌నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, నాజర్ తదితరులునిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్కథ: కార్తీక్ సుబ్బరాజ్‌దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: ఎస్. శంకర్‌సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: తిరువిడుదల: జనవరి 10, 2025సంక్రాంతి టాలీవుడ్‌కి చాలా పెద్ద పండగ. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా పండక్కి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’(Game Chnager Review) నేడు(జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గేమ్ ఛేంజర్’పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శంకర్, చరణ్ ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..శంకర్(Shankar) అద్భుతమైన ఫిల్మ్ డైరెక్టర్. అందులో డౌటే లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం ఇచ్చేలా ఆయన సినిమాలు ఉంటాయి. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, అపరిచితుడు, రోబో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను అందించాడు. అయితే భారతీయుడు 2 రిలీజ్ తర్వాత శంకర్ మేకింగ్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. బలమైన కథలు రాసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్(Game Changer Review)పై కూడా పడింది. కానీ మెగా ఫ్యాన్స్‌తో పాటు శంకర్ అభిమానులు కూడా ఈ చిత్రం ఆయనకు కమ్‌బ్యాక్ అవుతుందని ఆశ పడ్డారు. కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన రొటీన్ కథను అంతే రొటీన్‌గా తెరపై చూపించాడు. ఈ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ఐఏఎస్ అధికారికి మధ్య జరిగే ఘర్షణ అని ట్రైలర్లోనే చూపించారు. అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. శంకర్ గత సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగుతుంది. అలా అని బోర్ కొట్టదు. మదర్ సెంటిమెంట్, తండ్రి ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి.ఎలాంటి సాగదీతలు లేకుండా కథను చాలా సింపుల్‌గా ప్రారంభించాడు. హీరో పరిచయానికి మంచి సీన్ రాసుకున్నాడు. ఇక హీరో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరోయిన్‌తో వచ్చే లవ్‌ట్రాక్ ఆకట్టుకోకపోగా.. కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్ వర్కౌట్ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌కి ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడంతో ఆ సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. కలెక్టర్, మంత్రి మోపిదేవి మధ్య సాగే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి వేసే రాజకీయ ఎత్తులను ఐఏఎస్ అధికారిగా తనకున్న అధికారాలతో హీరో చెక్ పెట్టడం ఆకట్టుకుంటుంది.ఇంటర్వెల్ సీన్ మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విరామం ముందు వచ్చే ఓ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే అప్పన్న ఎపిసోడ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథనం మళ్లీ ఊహకందేలా రొటీన్‌గా సాగుతుంది. మోపిదేవి, రామ్ నందన్ మధ్య సాగే టామ్ అండ్ జెర్రీ వార్ బాగానే ఉన్నా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్. ఎన్నికల అధికారి తనకున్న పవర్స్‌ని నిజాయితీగా వాడితే ఎలా ఉంటుందనేది తెరపై చక్కగా చూపించారు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ఎన్నికల వ్యవస్థకు, రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లకు దర్శకుడు ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది. అయితే ఆ సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బలంగా చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు.ఎవరెలా చేశారంటే..రామ్ చరణ్(Ram Charan) నటన ఏంటో ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరోసారి ఆ రేంజ్ నటనతో ఆకట్టుకున్నాడు. అప్పన్న, రామ్ నందన్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన చరణ్.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్ అద్భుతంగా నటించేశాడు. యాక్షన్, ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. చరణ్ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర ఎస్జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పొలిటిషీయన్ బొబ్బిలి మోపిదేవిగా సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్యకు, చరణ్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అప్పన్న భార్య పార్వతిగా అంజలి అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ భావోధ్వేగానికి గురి చేస్తుంది. రామ్ నందన్ ప్రియురాలు దీపికగా కియరా అద్వానీ మెప్పించింది. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్, సైడ్ సత్యంగా సునీల్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే సునీల్‌తో పాటు వెన్నెల కిశోర్‌ల కామెడీ మాత్రం సరిగ్గా పండలేదు. బ్రహ్మానందం ఒక్క సీన్లో కనిపిస్తారు. జయరాం, నవీన్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు వినడం కంటే తెరపై చూస్తే ఇంకా బాగా ఆకట్టుకుంటాయి. శంకర్ మార్క్ గ్రాండ్‌నెస్ ప్రతి పాటలోనూ కనిపించింది. సినిమాటోగ్రఫీ పని తీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్ తెరపై చాలా అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో దిల్ రాజు ఎక్కడా వెనకడుగు వేయలేదని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘మార్కో’ మూవీ రివ్యూ: వయొలెన్స్.. వయొలెన్స్.. వైల్డ్ వయొలెన్స్!
టైటిల్: 'మార్కో'నటీనటులు: ఉన్ని ముకుందన్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్నిర్మాణ సంస్థ: క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్నిర్మాత: షరీఫ్ ముహమ్మద్రచన-దర్శకత్వం: హనీఫ్ అదేనిసంగీతం: రవి బస్రూర్సినిమాటోగ్రఫీ: చంద్రు సెల్వరాజ్ఎడిటర్: షమీర్ మహమ్మద్విడుదల తేది: జనవరి 1, 2025‘మార్కో’.. ఈ ఏడాది చివరిలో(డిసెంబర్ 20) వచ్చిన ఈ మలయాళ చిత్రం అక్కడ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.100 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. మోస్ట్ వయలెంట్ చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. న్యూ ఇయర్ సందర్భంగా నేడు(జనవరి 1) ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అయింది. కేరళ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ‘మార్కో’ తెలుగు వాళ్లను మెప్పించాడా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్‌గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్‌ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్‌ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..?ఈ మధ్యకాలంలో యాక్షన్ సినిమాల్లో హింస మితిమీరిపోతుంది. అవసరానికి మించి వయొలెన్స్‌ని చూపిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ‘యానిమల్’, ఇటీవల వచ్చిన ‘కిల్’ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ దారుణంగా ఉన్నాయి. వాటిని యాక్షన్ ప్రియులు ఎంజాయ్ చేసినా.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చూడలేకపోయారు. కానీ యాక్షన్ ప్రియులే భయపడిపోయి.. ‘ఈ హింసను చూడలేకపోతున్నాం.. ఆపండ్రాబాబూ..’ అనుకునే సినిమా ‘మార్కో’. సెన్సార్ బోర్డ్ ఎలా ఓకే చేసిందో తెలియదు కానీ..కొన్ని సన్నివేశాలు తెరపై చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. అవసరానికి మించిన హింస.. జుగుప్సాకరమైన సన్నివేశాలతో ఈ సినిమా కథనం సాగుతుంది.వాస్తవానికి ఇదొక రోటీన్ రివైంజ్ డ్రామా చిత్రం. తన సోదరుడిని చంపినవాళ్లపై హీరో ఎలా పగతీర్చుకున్నాడనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగులోనూ చాలా వచ్చాయి. కానీ రివైంజ్ డ్రామాని ఫుల్ యాక్షన్ డ్రామాగా మలచడమే ‘మార్కో’ స్పెషల్. సినిమా ప్రారంభంలోనే హంతకులు ఎవరనేది ఆడియన్స్‌కు తెలిసిపోతుంది. కానీ హీరో వారిని కనిపెట్టి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది ఆసక్తికరం. ప్రతి యాక్షన్ సీన్లోనూ రక్తం ఏరులైపారుతుంది. ఇంటర్వెల్ సీన్లో వయొలెన్స్ మరీ ఎక్కువైపోతుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ చూస్తే యాక్షన్ ప్రియులే తట్టుకోలేరు. తలలు ఎగిరిపడడం.. కాళ్లు, చేతులు తెగిపడడం.. పొట్టలోని పేగులు బయటకు రావడం.. ఒకెత్తు అయితే.. యాసిడ్‌తో చంపడం.. గర్భిణీ స్త్రీ నోట్ల ఆయుధం దింపడం.. చిన్న పిల్లాడిని గ్యాస్ సిలిండెర్‌తో మోది చంపడం.. గుండెకాయను కోసి బయటకు తీయడం.. మరో ఎత్తు. ఆ సన్నివేశాలను తెరపై చూడాలంటే గుండె రాయి చేసుకోవాల్సిందే. ఒకనొక దశలో ఇంత వయొలెన్స్ అవసరమా? అనిపిస్తుంది. కథ మొత్తం ప్యామిలీ చుట్టే తిరిగినా.. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిన్న పిల్లలు, గుండెజబ్బు ఉన్నవారు ఈ సినిమాకు దూరంగా ఉంటే బెటర్. తెరపై హింసను ఆస్వాదించేవాళ్లు.. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు మాత్రం ‘మార్కో’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఉన్ని ముకుందన్ కేరళ నటుడైనా తెలుగు ఆడియన్స్‌కి సుపరిచితుడే. ‘యశోద’, ‘జనతా గ్యారేజ్’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. మాలీవుడ్‌లో అతనికి మాస్ హీరో అనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌ని పెంచే చిత్రం ‘మార్కో’. టైటిల్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. మార్కో పాత్ర కోసం ఆయన శరీరాకృతిని మార్చుకున్నాడు. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ తగ్గట్లుగా ఉన్ని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సిద్ధిఖీ, కబీర్ దుహాస్ సింగ్‌ల పాత్రకు కూడా బాగా పేలాయి. వారి పాత్రల పరిచయం..యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. దర్శకుడు హనీఫ్ అదేని తన రాసుకున్న పాత్రలకు తగ్గట్లుగా క్యాస్టింగ్‌ను ఎంచుకున్నాడు. ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా అదిరిపోయింది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. తనదైన బీజీఎంతో మూవీ స్థాయిని పెంచేశాడు. హీరోతో పాటు విలన్ పాత్రలకు సంబంధించిన ఎలివేషన్ సీన్లకు ఆయన అందించిన బీజీఎం నెక్ట్స్ లెవన్. పాటలు గుర్తుండవు. యాక్షన్ కొరియోగ్రాఫర్ల పనితీరు అద్భుతం. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘డ్రింకర్ సాయి’ మూవీ రివ్యూ
టైటిల్: డ్రింకర్ సాయి (బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్)నటీనటులు: ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, స్ఎస్ కాంచి, కిర్రాక్ సీత, రీతు చౌదరి,తదితరులునిర్మాణ సంస్థలు: ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్రచన, దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టిసంగీతం: శ్రీవసంత్లిరిక్స్: చంద్రబోస్ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్విడుదల తేది: డిసెంబర్ 27, 2024ఈ మధ్యకాలంలో ట్రైలర్‌తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బూతు డైలాగ్స్‌తో పాటు మంచి ఎమోషన్‌తో కూడా ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేలా చేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘డ్రింకర్ సాయి’పై బజ్ క్రియేట్ అయింది. ఈ ఏడాది చివరిలో(డిసెంబర్ 27) వచ్చిన ఈ చిన్న చిత్రం ఎలా ఉంది? ‘డ్రింకర్ సాయి’దెబ్బకు టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మత్తు ఎక్కిందా లేదా? రివ్యూలో చూద్దాంకథేంటంటే.. సాయి అలియాస్ డ్రింకర్ సాయి(ధర్మ) బాగా ధనవంతుడు. పెరెంట్స్ చనిపోవడంతో తాగుడుకు బానిసవుతాడు. నిత్యం తాగుతూ అందరితో గొడవలు పడడం..అరెస్ట్ అయితే అతని అంకుల్(శ్రీకాంత్ అయ్యంగార్) బెయిల్‌పై విడిపించడం..ఇదే తంతుగా మారుతుంది. ఓసారి బాగా తాగిఉన్న సాయిని మెడికల్ స్టూడెంట్ బాగీ(ఐశ్వర్య శర్మ) తన బైక్‌తో ఢీకొట్టి పారిపోతుంది. ఆ మరుసటి రోజు తనకు యాక్సిడెంట్ చేసింది బాగీనే అని తెలుసుకుంటాడు. అమెతో గొడవపడేందుకు వెళ్లి.. ప్రేమలో పడిపోతాడు. బాగీకి మాత్రం సాయి అంటే అసలు ఇష్టం ఉండదు. ఈ విషయం సాయికి చెబితే ఎక్కడ గొడవ చేస్తాడోనని ప్రేమించినట్లు నటిస్తుంది. బాగీ ప్రేమను పొందేందుకు సాయి చేసిన ప్రయత్నాలు ఏంటి? బాగీ తనను ప్రేమించట్లేదని తెలిసిన తర్వాత సాయి ఏం చేశాడు? తనకు ఉన్న తాగుడు అలవాటు ఎక్కడకు దారి తీసింది? చివరకు సాయి బాగీ ప్రేమను పొందాడా లేదా? అనేదే మితగా కథ. ఎలా ఉందంటే.. హీరో తాగుతూ జులాయిగా తిరగడం.. ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడడం..ఓ మంచి పని చేసి చివరకు ఆమె ప్రేమ పొందడం..ఇలాంటి ప్రేమ కథలు తెలుగు తెరపై చాలా వచ్చాయి. డ్రింకర్ సాయి కూడా అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన లవ్‌స్టోరీనే. తాగుడుకు బానిసైన హీరో.. తనలాంటి వాడిని చూస్తేనే చిరాకు పడే హీరోయిన్ని ఎలా ప్రేమలో పడేశాడనేది ఈ సినిమా కథ. చివరిలో ఓ సోషల్ మెసేజ్ ఇవ్వడం ఈ ప్రేమకథను ప్లస్ పాయింట్. అయితే ట్రైలర్ చూస్తే మాత్రం ఇదొక బోల్డ్ మూవీ, అసభ్యకర సన్నివేశాలు చాలానే ఉంటాయని అనుకుంటారు. కానీ తెరపై సినిమా చూస్తే మాత్రం అలాంటి ఫీలింగ్ కలగదు. ఒకటి రెండు చోట్ల అలాంటి డైలాగ్స్ ఉన్నా..ఇప్పుడు వస్తున్న సినిమాలతో పోలిస్తే తక్కువే అనిపిస్తాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, చివరిలో ఇచ్చిన మెసేజ్ బాగుంది. కానీ ఆ పాయింట్ చెప్పడానికి అల్లుకున్న కథ, రాసుకున్న స్క్రీన్‌ప్లే అంతగా ఆకట్టుకోలేదు. హీరో హీరోయిన్ వెంబడి పడడం.. ఆమె ఛీకొట్టడం.. చివరి వరకు ఇదే ఉంటుంది. లవ్‌స్టోరీలో కూడా కొత్తదనం ఉండదు. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఫన్‌గా సాగుతుంది. అయితే వంతెన (భద్రం) పాత్ర వచ్చిన ప్రతిసారి కామెడీ పండకపోగా.. సాఫీగా సాగుతున్న లవ్‌స్టోరీకి ఇరికించినట్లుగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో వచ్చే పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీన్ రొటీన్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్ ఎక్కువ భాగం వంతెన ఆశ్రమంలో కథనం సాగుతుంది. ఓ పిల్లోడితో చేయించే కామెడీ ఇరికించినట్లుగా ఉంటుంది. చివరి అరగంట ఎమోషనల్ సాగుతుంది. టెక్నికల్‌గా బాగున్నప్పటికీ.. కథ, కథనం మాత్రం దర్శకుడు ఆకట్టుకునే విధంగా రాసుకోలేకపోయాడు. చివరిలో ఇచ్చిన సందేశం బాగుంటుంది. కథ, కథనం మరింత బలంగా రాసుకొని ఉంటే డ్రింకర్ సాయి బాక్సాఫీస్‌ని ఊగించేవాడు. ఎవరెలా చేశారంటే.. ధర్మకి ఇది రెండో సినిమా. అంతకు ముందు సింధూరం అనే సినిమాలో నటించాడు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే డ్రింకర్ సాయిలో మాత్రం రెచ్చిపోయి నటించాడు. రెండో సినిమానే అయినా.. కెమెరా ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఐశ్వర్య శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమాకే మంచి పాత్ర లభించింది. బాగీ పాత్రలో ఆమె జీవించేసింది. వంతెనగా భద్రం నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. శ్రీకాంత్ అయ్యంగార్, కిర్రాక్ సీత, రీతూ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీవసంత్ సంగీతం సినిమా స్థాయి పెంచేసింది. పాటలు బాగున్నాయి. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీ సీన్ తెరపై రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
కిచ్చా సుదీప్ ‘మాక్స్’ మూవీ రివ్యూ
టైటిల్ : మాక్స్ నటీనటులు: కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులునిర్మాత: కలైపులి ఎస్. థానుదర్శకత్వం: విజయ్ కార్తికేయసంగీతం: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ - శేఖర్ చంద్రఎడిటింగ్ : ఎస్ఆర్ గణేష్ బాబువిడుదల తేది: డిసెంబర్ 27, 2024కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మ్యాక్స్'. వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో తెలుగులోనూ మాక్స్‌పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయితే.. అలాంటి కాన్సెప్ట్‌తో మరిన్ని సినిమాలు వస్తుంటాయి. అయితే వాటితో ఏదో ఒక పాయింట్ కొత్తగా ఉంటే మాత్రం ఆడియన్స్ ఆ సినిమాను ఆదరిస్తారు. కేజీయఫ్ తర్వాత ఆ తరహా చిత్రాలు చాలా వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే విజయం సాధించాయి. కారణం.. ఆ సినిమాను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు కానీ...ఆ సినిమాలో ఉన్నదే మళ్లీ తెరపై చూపించలేదు.మాక్స్ కూడా కార్తి సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. ఈ మూవీ కథంతా ఒక్క రోజు రాత్రిలో జరిగిపోతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఖైదీ సినిమాను గుర్తు చేస్తూనే ఉంటుంది. అలాగే కమల్ హాసన్ ‘విక్రమ్’ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. అలా అని సినిమా బోర్ కొట్టదు. రేసీ స్క్రీన్‌ప్లే, భారీ యాక్షన్ సీన్లతో సినిమాను పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఈ సినిమాలో కథ ఏమి ఉండదు. ఒక చిన్న పాయింట్ చుట్టు దర్శకుడు అల్లుకున్న కథనం, స్క్రీన్‌ప్లేనే సినిమాను కాపాడింది.సీఐగా బాధ్యతలు చేపట్టేందుకు హీరో బయలు దేరడం..అంతకు ముందే ఆయన గురించి ఓ కానిస్టేబుల్ భారీ ఎలివేషన్ ఇస్తూ డైలాగ్ చెప్పడంతో ముందు నుంచే కథపై హైప్ క్రియేట్ అవుతుంది. ఇక మంత్రుల కొడుకులను అరెస్ట్ చేయడం.. ఆ విషయం బయటకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ విలన్లకు పోలీసులు ఎలివేషన్ ఇస్తూ చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆ ఎలివేషన్ మాదిరి తెరపై ఒక్క సీన్ కూడా లేకపోవడం మైనస్. విలన్లు చేసిన క్రూరమైన పని ఒక్కటి కూడా తెరపై చూపించపోవడంతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. పోలీసు స్టేషన్..దాని చుట్టు రౌడీలు తిరగడం..వారి కంట్లో పడకుండా పోలీసులు జాగ్రత్త పడడం.. ఫస్టాఫ్ మొత్తం ఇలానే సాగుతుంది. ఒకటి రెండు యాక్షన్ సీన్ ఆకట్టుకుంటాయే తప్పా ఫస్టాఫ్ యావరేజ్‌గానే సాగుతుంది. కానీ సెకండాఫ్ మాత్రం కథనం పరుగులు పెడుతుంది. టైమ్ కౌంట్ చేస్తూ వచ్చే సీన్లు, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయి. అయితే కథకు కీలకమైన 15 ఏళ్ల అమ్మాయి కథను సరిగా ఎలివేట్ చేయలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపు కూడా హడావుడిగా ఉన్నట్లు అనిస్తుంది. అయితే ఇతర చిత్రాలతో పోల్చడం పక్కకు పెట్టి..మాస్, యాక్షన్ ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం నచ్చుతుంది. సుదీప్ ఫ్యాన్స్‌కు అయితే దర్శకుడు ఫుల్ మీల్స్ పెట్టాడు. ఎవరెలా చేశారంటే.. కన్నడలో సుదీప్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన యాక్షన్, మాస్ చిత్రాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. నెగెటిష్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన ఎలా నటిస్తాడో తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రే పోషించాడు. సీఐ అర్జున్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న క్రైమ్ ఇన్స్పెక్టర్ రూపగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే ఆమె పాత్రకు ఇచ్చిన ఎలివేషన్.. తెరపై చూపించిన తీరుకు చాలా తేడా ఉంది. రవణగా ఇళవరసు పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. ఆయన ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. విలన్ గనిగా సునీల్ రొటీన్ పాత్రలో కనిపించాడు. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. క్లైమాక్స్ ఆయన అందించిన నేపథ్య సంగీతం అదిరిపోతుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపించింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ రివ్యూ
టైటిల్: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేష్, మచ్చ రవి తదితరులునిర్మాణ సంస్థ: శ్రీగణపతి సినిమాస్నిర్మాత: వెన్నపూస రమణారెడ్డిదర్శకత్వం: రైటర్ మోహన్సంగీతం: సునీల్ కశ్యప్సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ ఎన్ఎడిటర్: అవినాష్ గుర్లింక్విడుదల తేది: డిసెంబర్ 25, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1991లో సాగుతుంది. రాజీవ్ గాంధీ హత్య(1991 మే 21)జరిగిన రోజు శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి కూడా దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీఐ భాస్కర్(అనీష్ కురివెళ్ల) సీరియస్‌గా తీసుకుంటాడు. వారం రోజుల్లో హంతకులను పట్టుకుంటానని, లేదంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా శపథం చేస్తాడు. అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు విషయంలో ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ భాస్కర్ స్టేషన్లోనే ఉండాల్సి వస్తోంది. వారంలో హంతకుడిని పట్టుకోకపోతే పరువు పోతుందని.. ఈ కేసు విచారణను ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్(వెన్నెల కిశోర్)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనుక మేరి స్నేహితురాలు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు డిటెక్టివ్ షెర్లాక్ అనుమానిస్తాడు. వీరందరిని పిలిపించి తనదైన శైలీలో విచారణ ప్రారంభిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతారు. వీరిలో మేరిని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? అసలు డిటెక్టివ్ షెర్లాక్ నేపథ్యం ఏంటి? అతను డిటెక్టివ్ వృత్తినే ఎందుకు ఎంచుకున్నాడు? మేరి హత్య కేసుతో షెర్లాక్‌కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..డిటెక్టివ్ కథలు టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. చిరంజీవి ‘చంటబ్బాయ్’ మొదలు నవీన్ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వరకు చాలా సినిమాలు ఈ కాన్సెప్ట్‌తో వచ్చాయి. కొన్ని కథలు సీరియస్‌గా సాగితే..మరికొన్ని కామెడీగా సాగుతూనే థ్రిల్లింగ్ గురి చేస్తాయి. కానీ అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన వచ్చిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ చిత్రం మాత్రం అటు కామెడీ పండించలేదు..ఇటు థ్రిల్లింగ్‌కు గురి చేయలేదు. హాలీవుడ్ రేంజ్ టైటిల్..దానికి జస్టిఫికేషన్ ఇచ్చే కథ ఎంచుకున్న దర్శకుడు మోహన్.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడం మాత్రం విఫలం అయ్యాడు. డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ మొదలు.. హత్య జరిగిన తీరు వరకు ఏది ఆసక్తికరంగా ఉండదు. రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజే ఈ హత్య జరిగినట్లు చూపించడానికి సరైన కారణం కూడా ఉండదు. సీఐ భాస్కర్ బిజీ కావడంతోనే ఈ కేసును ప్రైవేట్ డిటెక్టివ్‌కి ఇచ్చినట్లుగా మొదట్లో చూపిస్తారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు సీఐ భాస్కర్ ఇంత ఖాలీగా ఉన్నాడేంటి అనిపిస్తుంది. ఇక డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా లేకపోయినా.. కనీసం నవ్వుకునే విధంగా కూడా ఉండదు. మధ్యలో వచ్చే ఉప కథలు కూడా చాలా రొటీన్‌గా ఉంటాయి. రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసి శ్రీకాకుళం సీఐ అలర్ట్ అవ్వడంతో సినిమా ప్రారంభం అవుతుంది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా అర్థరాత్రంతా పోలీసులు పెట్రోలింగ్ చేయడం, ఘర్షనకు దిగిన ఇద్దరిని అరెస్ట్ చేయడం.. పోలీసులను చూసి ఓ కారు వెనక్కి వెళ్లడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక హత్య జరగడం.. విచారణ కోసం డిటెక్టివ్ షేర్లక్ రంగంలోకి దిగడం వరకు కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత విచారణ భాగంగా వచ్చే ఉప కథలు బోరింగ్‌గా సాగుతాయి. ఒక్కోక్కరు చెప్పే స్టోరీ.. తెరపై చూడడం భారంగా ఉంటుంది. అలాగే ఝాన్సీ అనే పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే హంతకులు ఎవరనే విషయం చివరి వరకు ప్రేక్షకుడు కనిపెట్టకుండా చేయడం దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. మేరిని ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది. షెర్లాక్ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే అప్పటికే విసిగిపోయిన ప్రేక్షకుడు.. ఆ ఎమోషనల్ సీన్‌కి కూడా అంతగా కనెక్ట్ కాలేకపోతాడు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ పాత్రకు వెన్నెల కిశోర్ కొంతవరకు న్యాయం చేశాడు. అయితే శ్రీకాకుళం యాసలో ఆయన పలికే సంభాషణలలో సహజత్వం కలిపించదు. కామెడీ కూడా అంతగా పండించలేకపోయాడు. అనన్య నాగళ్లకు ఓ మంచి పాత్ర లభించింది. భ్రమరాంభ పాత్రలో ఆమె చక్కగా నటించింది. ఆ పాత్రలోని వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టునే తిరుగుతుంది. అనీష్ కురివెళ్ల పాత్రకి వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించడం ఆ క్యారెక్టర్ స్థాయిని తగ్గించింది. రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, నాగ్ మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ అవినాష్ గుర్లింక్ తన కత్తెరకు ఇకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ
స్వతహాగా మలయాళీ హీరో అయిన్ మోహన్ లాల్ (Mohanlal).. 'దృశ్యం' సినిమాలతో మంచి పాపులరిటీ సొంతం చేసుకున్నారు. తెలుగులో 'జనతా గ్యారేజ్' మూవీలోనూ చేశారు. అలా తెలుగు ప్రేక్షకులకు ఈయన సుపరిచితుడే. 400కి సినిమాల్లో నటించిన ఈయన తొలిసారి 'బరోజ్' (Barroz Movie) అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఇందులో ఈయనే హీరోగానూ నటించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? మోహన్ లాల్ డైరెక్టర్‌గా హిట్ కొట్టారా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా డి గామా వంశంలోని 13వ జనరేషన్‌కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్‌ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?మనలో చాలామంది చిన్నప్పుడు చందమామ కథలు చదివే ఉంటారు. హాలీవుడ్ కార్టూన్ డబ్బింగ్ మూవీస్ కూడా చూసే ఉంటారు. అయితే అవి డబ్బింగ్ మూవీస్ కాబట్టి ఆ మైండ్ సెట్‌తోనే చూస్తాం. అర్థం కాకపోయినా సరే ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి సినిమానే మన దగ్గర తీస్తే.. మనకు రిలేట్ అవుతుందా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేస్తాం. కానీ 'బరోజ్' మాత్రం పేరుకే మలయాళ మూవీ కానీ.. ఏదో ఇంగ్లీష్ మూవీ చూస్తున్నామా అనిపిస్తుంది. రెండున్నర గంటల నిడివి అయినప్పటికీ నాలుగు గంటల మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది.మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో 'బరోజ్' మొదలవుతుంది. ఫాదో గీతంతో ఈ మూవీని ప్రారంభిద్దామని అంటారు. అసలు ఫాదో గీతం అంటే ఏంటి అనుకునేలోపు.. సడన్‌గా పోర్చుగీస్ పాట ప్లే అవుతుంది. దీని మీనింగ్ ఏంటో అర్థం కాదు. ఇదొక్కటే కాదు మూవీ అంతా దాదాపు ఇదే కన్ఫ్యూజన్. నిధిని కాపాడే భూతంగా బరోజ్ ఎంట్రీ.. అసలు ఈ నిధి సంగతేంటి? దెయ్యంగా ఎందుకు మారాడు? ఈ నిధిని ఎవరికి అప్పగించాలి అనే అంశాలే సినిమా కథ.నిధికి కాపలాగా భూతం ఉండటం.. 400 ఏళ్లుగా ఒకే గదిలో ఈ భూతం ఉండిపోవడం.. లైన్ చూస్తుంటే మంచి హాస్యం పుట్టించొచ్చు. నిధిని ఎవరైనా కొట్టేయడానికి వస్తే ఆ సీన్లని అడ్వెంరెస్గా తీయొచ్చు. కానీ 'బరోజ్'లో అలాంటి సన్నివేశాలే ఉండవు. హీరోగా నటించి దర్శకత్వం వహించింది మోహన్ లాల్ కదా. అంతా ఆయన కనిపిస్తాడనుకుంటే.. అడపాదడపా కనిపిస్తాడు. ఈయన పాత్ర భూతం కదా. జీనీలా అద్భుతాలు చేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందో అనే ఆత్రుతని కలిగించొచ్చు. కానీ మోహన్ లాల్ అలా చేయలేకపోయారు. సినిమా ప్రారంభం నుంచి ఈయన మార్క్ చూపించే, అరె భలే ఉందే అనిపించే సీన్ ఒక్కటీ ఉండదు. మోహన్ లాల్ కాకుండా మిగిలిన సీన్లలో మనకు ఏ మాత్రం పరిచయం లేని విదేశీ నటులు వచ్చిపోతుంటారు. ఒకరు తెలుగులో మాట్లాడితే మరొకరు పోర్చుగీస్‌లో మాట్లాడుతుంటారు. ఇది ఇబ్బందిగా అనిపించింది.హాలీవుడ్ సినిమాలని చూసిన మోహన్ లాల్.. వాటి స్ఫూర్తితో సినిమా చేద్దామని ఫిక్సయ్యారు. కానీ ప్రాంతీయ ప్రేక్షకులని ఆకట్టుకునేలా తీయలేకపోయారు. నేటివిటీ లేక ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయ్యారు. ఇలాంటి పాయింట్ కోసం పోర్చుగీస్ కథల వరకే వెళ్లాల్సిన అవసరం లేదు. మన జానపదాలు వెతికితే ఎన్నో అద్భుతమైన కథలు కనిపిస్తాయి. ఆ దిశగా మోహన్ లాల్ ఆలోచించి ఉంటే లోకల్ ఆడియెన్స్‌కి సినిమా ఇంకా నచ్చి ఉండేది. దర్శకుడిగా త్రీడీ మూవీ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని తపించిన మోహన్ లాల్.. కంటెంట్‌పై సరిగా దృష్టి పెట్టలేదు. దీంతో మూవీ అటోఇటో అన్నట్లు సాగుతూ వెళ్తుంది.ఎవరెలా చేశారు?బరోజ్గా టైటిల్ రోల్ చేసిన మోహన్ లాల్.. పాత్రలో సరిగ్గా సరిపోయారు. హీరో కమ్ డైరెక్టర్ నేనే కదా అని అనవసర ఎలివేషన్ల జోలికి పోలేదు. పాత్రకు ఎంత కావాలో అంత ఇచ్చారు. కానీ ఇంకాస్త థ్రిల్లింగ్, ఎంటర్టైనింగ్గా బరోజ్ పాత్రని రాసుకుని ఉంటే బాగుండేది. ఇషా పాత్ర చేసిన మాయారావు చూడటానికి బాగుంది. యాక్టింగ్ ఓకే ఓకే. మిగిలిన విదేశీ నటీనటులు బాగానే చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫీ బాగుంది. అండర్ వాటర్ త్రీడీ విజువల్స్ ఔట్పుట్ మాత్రం అనుకున్నంతగా రాలేదు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలే గుర్తొస్తాయి. నిర్మాణ విలువల మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. ఖర్చు విషయంలో అసలు వెనుకాడలేదు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ బాగుంది.ఓవరాల్‌గా చెప్పుకొంటే మోహన్ లాల్ 'బరోజ్'తో కష్టపడ్డారు గానీ కంటెంట్ పరంగా తడబడ్డారు. దీంతో సగటు ప్రేక్షకుడు.. ఇది మా కోసం తీశారా? పోర్చుగీసు వాళ్ల కోసం తీశారా అని సందేహపడటం గ్యారంటీ.-చందు డొంకాన -
‘ బచ్చల మల్లి’ మూవీ రివ్యూ
టైటిల్: బచ్చల మల్లినటీనటులు: అల్లరి నరేష్, అమృతా అయ్యర్, అంకిత్ కోయ, హరితేజ, రావు రమేష్, కోట జయరాం, ధన్‌రాజ్, హర్ష చెముడు, అచ్యుత్ కుమార్ తదితరులునిర్మాతలు: రాజేశ్ దండా, బాలాజీ గుట్టదర్శకత్వం: సుబ్బు మంగాదేవిసంగీతం: విశాల్ చంద్రశేఖర్సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం నాథన్విడుదల తేది: డిసెంబర్ 20, 2024కథేంటంటే.. ఈ సినిమా కథ 1985-2005 మధ్య కాలంలో సాగుతుంది. తుని మండలం సురవరానికి మల్లి అలియాస్ బచ్చల మల్లి (అల్లరి నరేశ్) చాలా తెలివైన వాడు. పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచి తండ్రి(బలగం జయరామ్) గర్వపడేలా చేస్తాడు. మల్లికి తండ్రి అంటే ప్రాణం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మల్లి మనసును గాయపరుస్తుంది. అప్పటి నుంచి తండ్రిపై అసహ్యం పెంచుకుంటాడు. అప్పటి వరకు మంచి బాలుడిగా ఉన్న మల్లి.. చెడ్డవాడిగా మారుతాడు. చదువు మానేసి ట్రాక్టర్ నడుపుతూ మద్యానికి బానిసవుతాడు. నిత్యం తాగుతూ ఊర్లో వారితో గొడవ పడుతూ మూర్ఖుడిగా తయారవుతాడు. అదే సమయంలో మల్లీ లైఫ్‌లోకి కావేరి(అమృతా అయ్యర్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత మల్లి లైఫ్‌లో వచ్చిన మార్పులు ఏంటి? మల్లి తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి? మంచి వ్యక్తిగా ఉన్న మల్లి మూర్ఖుడిలా మారడానికి గల కారణం ఏంటి? కావేరితో ప్రేమాయణం ఎలా సాగింది? గోనె సంచుల వ్యాపారి గణపతి రాజు(అచ్యుత్ కుమార్), మల్లికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మల్లి కోల్పోయిందేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్ బ్యాగ్రౌండ్, హీరో పాత్రకి నెగెటివ్ షేడ్స్ , రా అండ్ రస్టిక్ వాతావరణం.. ఈ నేపథ్యంతో కూడిన కథలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. బచ్చల మల్లి కూడా అలాంటి చిత్రమే. దర్శకుడు ఎంచుకుంది ట్రెండింగ్ సబ్జెక్ట్ అయినా తెరపై ఆకట్టుకునేలా కథనాన్ని నడిపించడంలో మాత్రం విఫలం అయ్యాడు. పాత్రలను తిర్చిదిద్దిన విధానంపై పెట్టిన శ్రద్ధ.. కథనంపై పెట్టలేదు. హీరోకి విలనిజం లక్షణాలు ఉన్నా.. ప్రేక్షకులు ఆ పాత్రలో కనెక్ట్ కావాలి. అప్పుడే కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ బచ్చల మల్లి విషయంలో అది మిస్ అయింది. హీరో పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేదు. అసలు హీరోకి ఎందుకు కోపం వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అనేది అర్థం కాదు. యాక్షన్ సీన్స్ కూడా బలవంతంగా ఇరికించినట్లే ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా అంతే. అప్పటి వరకు మూర్ఖంగా ఉన్న హీరో.. తల్లి ఒక మాట చెప్పగానే మారిపోవడం, హీరోయిన్ తండ్రితో చివరిలో ఓ ఎమోషనల్ డైలాగ్ చెప్పించడం..ఇవన్నీ సినిమాటిక్‌గానే అనిపిస్తాయి తప్ప.. ఎక్కడ కూడా ఎమోషనల్‌గా టచ్ చేయవు. ఇక హీరో జీవితంలో జరిగే సంఘటనలు కూడా చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది తప్ప ఎక్కడా కొత్తదనం కనిపించదు. కథ ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో పాత్ర పరిచయం, అతను మూర్ఖుడిగా మారడానికి గల కారణాలు కన్విన్సింగ్‌గా అనిపిస్తాయి. హీరో మూర్ఖుడిగా మారిన తర్వాత కథనం రొటీన్‌గా సాగుతుంది. ఓ కొత్త పాత్ర ఎంట్రీతో వచ్చే ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ కొత్త పాత్ర నేపథ్యం తెలిసిన తర్వాత సెకండాఫ్ కూడా రొటీన్ సీన్లతో నీరసంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. మూర్ఖత్వంతో సరిదిద్దుకోని తప్పులు చేయ్యొద్దని దర్శకుడు ఇచ్చిన సందేశం బాగుంది. ఎవరెలా చేశారంటే.. బచ్చల మల్లి పాత్రలో నరేశ్ ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు . డైలాగు డెలివరీ బాగుంది. హనుమాన్ ఫేం అమృతా అయ్యర్, కావేరి పాత్రకు న్యాయం చేసింది. తెరపై అందంగా కనిపించింది. హీరో తండ్రిగా బలగం జయరాం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అచ్యుత్ కుమార్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. అయితే ప్రధాన కథకి ఆ పాత్రతో సంబంధమే ఉండదు. హరితేజ, ప్రవీణ్, రావు రమేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు పర్వా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఉపేంద్ర 'యూఐ' సినిమా రివ్యూ
హీరో ఉపేంద్ర స్వతహాగా కన్నడ హీరో. కానీ తెలుగులో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈయన సినిమాలు అలా ఉంటాయి మరి! 25 ఏళ్ల క్రితమే 'ఏ', 'ఉపేంద్ర' లాంటి విచిత్రమైన మూవీస్ తీశారు. అప్పట్లో ఇవి జనాలకు అర్థం కాలేదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సూపర్ బంపర్ అని తెగ పొగిడేస్తున్నారు. అలాంటి ఉపేంద్ర చాన్నాళ్ల తర్వాత ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అయ్యారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం!(ఇదీ చదవండి: Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ)కథేంటి?ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే?సినిమా అంటే హీరోహీరోయిన్, పాటలు, ఫైట్స్, ట్విస్టులు, టర్న్‌లు.. ఇలా ఆయా జానర్ బట్టి ఓ ఫార్మాట్ ఉంటుంది. కానీ అలాంటివేం లేకుండా ఎవరైనా మూవీ తీస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఉపేంద్ర అదే ఆలోచించాడు. 'యూఐ' చూస్తున్నంతసేపు అబ్బురపరిచే విజువల్స్, డిఫరెంట్ యాక్టింగ్, వింత వింత గెటప్స్.. ఇలా కొందరికి నచ్చే బోలెడన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాణెనికి మరోవైపు అన్నట్లు మరికొందరికి సహనానికి రెండున్నర గంటల పాటు పరీక్ష పెడుతుంది.సినిమా మొదలవడమే వింత టైటిల్ కార్డ్ పడుతుంది. 'మీరు తెలివైనవాళ్లు అయితే థియేటర్ నుంచి వెళ్లిపోండి. మూర్ఖులైతేనే చూడండి' అని ఉంటుంది. దీనిబట్టే మూవీ ఎలా ఉండబోతుందనేది హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా 'యూఐ' సినిమానే ఉంటుంది. దీన్ని చూసి ప్రతి ఒక్కరూ మెంటల్ అయిపోతుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ తరణ్ ఆదర్శ్‌ని గుర్తుచేసేలా కిరణ్ ఆదర్శ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతడు 'యూఐ' సినిమాని చూసి రివ్యూ రాయలేకపోతుంటాడు. అసలు ఈ సినిమా గురించి మరింత లోతుగా తెలుసుకుందామని.. నేరుగా ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ అతడి రాసి, మంటల్లో పడేసిన మరో స్టోరీ దొరుకుతుంది. అయితే అది అప్పటికే సగం కాలిపోయిన పేపర్లలో ఉంటుంది. కిరణ్ ఆదర్శ్ అది చదవడంతో అసలు కథ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)అక్కడ నుంచి సత్య పాత్ర, ప్రపంచంలోని అన్ని మతాల వాళ్లు ఒకేచోట ఉండటం, దేవుడిని నమ్మకపోవడం.. ఇలా విచిత్రమైన సీన్స్ వస్తుంటాయి. సాధారణంగా హీరో ఇంట్రో అనగానే విలన్స్‌ని అతడు చితక్కొట్టేయడం చూస్తుంటాం. కానీ ఇందులో హీరో పరిచయ సన్నివేశంలో విలన్లు ఇతడిని రక్తలొచ్చేలా కొడతారు. అక్కడి నుంచి సినిమా తీరుతెన్ను లేకుండా ఎటెటో పోతూ ఉంటుంది. మధ్యమధ్యలో జనాలు ప్రస్తుతం చేస్తున్న కొన్ని పనుల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయోనని మెసేజులు ఇస్తూ పోతుంటారు.భూమ్మీద తొలి జంట ఆడమ్-ఈవ్ దగ్గర నుంచి మొదలుపెట్టి.. భూమిని మనుషులు దోచుకోవడం.. జాతి, ధర్మం పేరు చెప్పి మనుషులతో నాయకులు చేసే రాజకీయం.. ఇలా ఒకటేమిటి చాలానే వస్తుంటాయి. అక్కడక్కడ కాస్త నవ్వు తెప్పించే సీన్స్ ఉన్నప్పటికీ.. ప్రారంభంలోనే చెప్పినట్లు చాలా ఓపిగ్గా చూస్తే తప్పితే ఈ మూవీ అర్థం కాదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా మీరు అనుకున్న టైమ్‌కి రావు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఊహించడం కష్టం. 'మీ కామం వల్ల పుట్టాడు. కానీ మీ కొడుక్కి కామం తప్పు అని చెబుతారా?' లాంటి సెటైరికల్ సీన్స్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి.ఎవరెలా చేశారు?ఉపేంద్ర అంటేనే కాస్త డిఫరెంట్. ఇందులో నటుడిగా ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా ఆకట్టుకున్నాడా అంటే సందేహమే! హీరోయిన్ పాత్ర అసలెందుకో కూడా తెలీదు. మూడు నాలుగు సీన్లు ఉంటాయంతే! ఇతర పాత్రల్లో రవిశంకర్, అచ్యుత్, సాధు కోకిల లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. ఒక్కర్ని కూడా సరిగా ఉపయోగించుకోలేదు. మిగిలిన యాక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.టెక్నికల్ విషయాలకొస్తే రైటర్ అండ్ డైరెక్టర్ ఉపేంద్ర గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలపై సెటైరికల్‌గా ఓ మూవీ తీద్దామనుకున్నాడు. దాన్ని సైకలాజికల్ కాన్సెప్ట్‌కి ముడిపెట్టి.. వైవిధ్యంగా ప్రేక్షకులకు చూపిద్దామనుకున్నాడు. తీసి చూపించాడు కూడా. కాకపోతే అది జనాలకు నచ్చుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్!బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది. అసలు ఎప్పుడు చూడని ఓ వింత ప్రపంచాన్ని సృష్టించారు. టైటిల్స్ పడిన దగ్గర నుంచి చివరివరకు సినిమాటోగ్రఫీ వైవిధ్యంగా ఉంది. గ్రాఫిక్స్ మాత్రం అక్కడక్కడ తేలిపోయింది. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా కొంచెం కొత్తగా.. కొంచెం వింతగా ఉంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ ప్లాన్ మారిందా?) -
Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ
మనం చూసే ప్రతి సినిమాలో నిజ జీవిత పాత్రలు మనలోనివారు కొంతమంది తెర మీద పోషించి మనల్ని మెప్పించడం సహజమే. కాని మనలోని భావావేశాలను జంతువులచే డిజిటల్ రూపంలో పలికించి మన మనస్సులను కదిలించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో హాలీవుడ్‌ను నిజంగా అభినందించాలి. కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ 40 ఏళ్ళ క్రితమే అంటే డిజిటల్ సాంకేతికత మనకు పరిచయమవ్వని రోజుల్లోనే ఇటువంటి కోవలో మనకు ఓ సినిమా పరిచయం చేసింది. దాని పేరే మాకూ స్వాతంత్రం కావాలి. ఇక్కడ టాలీవుడ్, హాలీవుడ్ చేసిందా అన్నది కాదు, మనుషులకు జంతువులతో కూడా భావావేశాలు పలికించవచ్చన్నదే విషయం. ముఫాసా సినిమా 2019వ సంవత్సరంలో 'ది లయన్ కింగ్' సినిమా సిరీస్‌లో వచ్చిన రెండవ భాగం. ముఫాసా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రతి భాషలో విడుదలైంది. ముఫాసా సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో ప్రముఖ నటులు మహేశ్‌బాబు, బ్రహ్మానందం, అలీ తదితరులు వాయిస్ ఇచ్చారు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు మన నేటివిటీ ఎక్కడా తగ్గదు ఒక్క పేర్లలో తప్ప.ఈ సినిమాకి దర్శకుడు బారీ జెర్కిన్స్. కథాపరంగా లయన్ కింగ్‌కు కొనసాగింపైన ఈ ముఫాసాలో సింబా - నాలా సింహాలకు కియారా అనే ఆడ సింహం పుడుతుంది. ఆ తర్వాత సింబ- నాలా జంట టిమన్, పంబ దగ్గర కియారాను వదిలేసి ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి సెరేన్ ఒయాసిస్కు బయలుదేరతాయి. అప్పుడు రఫీకి అనే కోతి కియారాకు తాను సింబ వయస్సులో ఉన్నపుడు జరిగిన ముఫాసా కథ గురించి చెప్తుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ సి యం రాజు ఈ కోతికి గాత్రదానం చేశారు. కథంతా ఈ రఫీకీయే చెప్తాడు. ముఫాసా అనే పిల్ల సింహం ఓ తుఫానులో చిక్కుకుని తన తల్లిదండ్రుల నుంచి విడిపోతుంది. అలా నీళ్లలో ముఫాసా కొట్టుకుపోతూ టాకా అనే మరో సింహం పిల్లను కలుస్తుంది. టాకా తల్లిదండ్రులు ఒబాసీ, ఇషా. వీళ్ళిద్దరూ వారి ప్రాంతంలో రాజు, రాణి. టాకాని యువరాజును చేయాలనుకుంటారు. ఇంతలో తెల్ల సింహాల గుంపు వీరి రాజ్యం మీద దాడి చేస్తుంది. వాటి నుండి ముఫాసా, టాకా తప్పించుకుంటారు. ముఫాసా తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ మిలేలే అనే ప్రాంతానికి వెళ్లాలనుకుంటాడు. తరువాత సినిమా అంతా ముఫాసా తన తల్లిదండ్రులను చేరుకుంటాడా లేదా అన్నదే. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా స్క్రీన్ ప్లే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలానే పెద్దల మనసును సైతం కదిలిస్తుంది. ఎక్కడా గ్రాఫిక్స్ అన్నదే తెలియకుండా నిజజీవితంలో జంతువుల కథను దగ్గరగా చూసినట్టుంది. వర్త్‌ఫుల్ మూవీ ఫర్ ఫ్యామిలీ.- హరికృష్ణ ఇంటూరు -
టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఫియర్ మూవీ ఆడియన్స్‌ను భయపెట్టిందా?
టైటిల్: ఫియర్నటీనటులు: వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులునిర్మాణ సంస్థ: దత్తాత్రేయ మీడియానిర్మాత: డా. వంకీ పెంచలయ్య, ఏఆర్ అభిరచన, ఎడిటింగ్, దర్శకత్వం : డా. హరిత గోగినేనిసంగీతం: అనూప్ రూబెన్స్సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూవిడుదల తేది: డిసెంబర్ 14, 2024వేదిక, అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫియర్. డా. హరిత గోగినేని డైరెక్షన్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం డిసెంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విడుదలకు ముందే ఈ మూవీ పలు అవార్డులు దక్కించుకుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సింధు(వేదిక) అనే అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతూ ఉంటోంది. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు తాను ప్రాణంగా ప్రేమించే అరవింద్ కృష్ణ(సంపత్) దూరం కావడంతో మరింత మనోవేదనకు గురి అవుతుంది. అంతేకాకుండా తన చెల్లి ఇందుతో గొడవ పడటం, పేరేంట్స్‌కు దూరంగా ఉండటం లాంటి సింధును మరింత కుంగదీస్తాయి. అసలు సింధు తన చెల్లితో ఎందుకు గొడవ పడింది? తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆమె ప్రియుడు సంపత్ తిరిగొచ్చాడా? అనేది తెలియాలంటే ఫియర్ చూడాల్సిందే.కథ ఎలా ఉందంటే..గతంలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ మాత్రం చాలా అరుదుగానే ఉంటాయి. మొదటిసారి తల్లిదండ్రులను ఆలోచింపజేసేలా ఉంది ఈ ఫియర్ స్టోరీ. ఈ కథ మొత్తం సింధు చుట్టూనే తిరుగుతుంది. ఆమె ప్రియుడు సంపత్ దూరం కావడంతో మానసికంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎక్కడికెళ్లినా ఎవరో తనను వెంబడిస్తున్నారనే భ్రమలో ఉంటూ భయానికి గురవుతుంది. కొన్ని సీన్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌లో కన్ఫ్యూజన్కు గురి చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్న క్యూరియాసిటీని మిస్ అవ్వకుండా డైరెక్టర్ జాగ్రత్తపడ్డారు.సెకండాఫ్ వచ్చేసరికి అసలు సింధుకు అలా మారడానికి దారితీసిన పరిస్థితులు ఆడియన్స్‌ను ఆలోచించేలా చేస్తాయి. అసలు సింధుకు నిజంగానే సైకాలాజికల్ డిజార్డర్ ఉందా? ఎవరికీ కనిపించని వ్యక్తులు.. ఆమెకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? సింధుకు కనిపిస్తున్నవారంతా ఆమె జీవితంలో ఉన్నారా? లేదంటే కావాలనే తాను అలా ప్రవర్తిస్తోందా? అనే క్యూరియాసిటీ ఉండేలా కథను మలిచాడు డైరెక్టర్. కథ మొదలైనప్పటి నుంచి సినిమా క్లైమాక్స్ వరకు ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. అయితే డైరెక్టర్ తాను అనుకున్న కథను తెరపై చక్కగా ఆవిష్కరించారు. స్లో నేరేషన్ అక్కడక్కడా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మరింత ఫోకస్ చేయాల్సింది. కొన్ని సీన్స్‌లో కథలో కనెక్షన్ మిస్సయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు తల్లిదండ్రులకు మంచి మేసేజ్ ఇచ్చేలా ఉంది ఫియర్ మూవీ.ఎవరెలా చేశారంటే..లీడ్‌రోల్ పోషించిన వేదిక ద్విపాత్రాభినయంతో అభిమానులను కట్టిపడేసింది. సంపత్ పాత్రలో అరవింద్ కృష్ణ మెప్పించాడు. పవిత్రా లోకేశ్, షాయాజీ షిండే, జయప్రకాశ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికత విషయానికొస్తే ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ బీజీఎం ఈ సినిమాకు కాస్తా ప్లస్ అనే చెప్పొచ్చు. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.రేటింగ్ : 2.75/5 -
Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ
టైటిల్: పుష్ప 2: ది రూల్నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ పాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనంజయ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్ తదితరులునిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్నిర్మాతలు: నవీన్ కుమార్, రవిశంకర్రచన-దర్శకత్వం: సుకుమార్సంగీతం: దేవీశ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్ఎడిటింగ్: నవీన్ నూలివిడుదల తేది: డిసెంబర్ 5, 2024అల్లు అర్జున్ అభిమానుల మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేల పుష్ప 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత ఆ స్థాయిలో యావత్ సినీలోకం ఎదురు చూస్తున్న తెలుగు సినిమా పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్ ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించడంతో దేశం మొత్తం ‘పుష్ప 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.‘పుష్ప 2’ కథేంటంటే..?ఒక సాధారణ కూలీగా జీవీతం మొదలు పెట్టిన పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది ‘పుష్ప పార్ట్-1’లో చూపించారు. పుష్పరాజ్ సిండికేట్ లీడర్ కావడంతో ‘పుష్ప : ది రైజ్’ కథ ముగుస్తుంది. పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule Movie Telugu Review) సినిమా కథ అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. శ్రీవల్లి(రష్మిక)ని పెళ్లి చేసుకొని అటు వ్యక్తిగతం జీవితాన్ని హాయిగా గడుపుతూనే.. మరోవైపు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ని దేశం మొత్తం విస్తరిస్తాడు పుష్పరాజ్. ఎంపీ సిద్దప్ప(రావు రమేశ్) అండతో తన వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు. ఓ సారి చిత్తూరుకి వచ్చిన ముఖ్యమంత్రి నరసింహరెడ్డిని కలిసేందుకు పుష్పరాజ్ వెళ్తాడు. భార్య శ్రీవల్లి కోరిక మేరకు అతనితో ఫోటో దిగేందుకు ప్రయత్నించగా..‘స్మగ్లర్‌తో ఫోటో దిగలేను’ అంటూ సీఎం నిరాకరిస్తాడు. అంతేకాదు శ్రీవల్లిని అవమానించేలా మాట్లాడతాడు. దీంతో ఆ సీఎంనే మార్చాలని పుష్పరాజ్ డిసైడ్ అవుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దప్పను చేయాలనుకుంటాడు. దాని కోసం పుష్పరాజ్ ఏం చేశాడు? తనను అవమానించిన పుష్పరాజ్‌ని ఎలాగైన పట్టుకోవాలని చూస్తున్న ఎస్పీ షెకావత్(ఫాహద్ ఫాజిల్) ప్రయత్నం ఫలించిందా? షెకావత్‌కి పుష్పరాజ్ విసిరిన సవాల్ ఏంటి? కేంద్రమంత్రి ప్రతాప్‌రెడ్డి(జగపతి బాబు), పుష్పరాజ్ మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ప్రతాప్‌రెడ్డి తమ్ముడు కొడుకు (తారక్ పొన్నప్ప) పుష్పరాజ్‌పై పగ పెంచుకోవడానికి గల కారణం ఏంటి? తనను తప్పించి సిండికేట్ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్‌ను అణచివేసేందుకు మంగళం శ్రీను(సునీల్), దాక్షాయణి(అనసూయ)వేసిన ఎత్తుగడలు ఏంటి? చివరకు పుష్పరాజ్ అనుకున్నట్లుగా సిద్దప్పను సీఎం చేశాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని సినిమాలకు కథ అవసరం లేదు. స్టార్ హీరో.. ఆయన స్థాయికి తగ్గట్లు ఎలివేషన్స్..భారీ యాక్షన్ సీన్స్.. మాంచి పాటలు ..ఇవి ఉంటే చాలు బొమ్మ హిట్టైపోతుంది. పుష్ప 2లో డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే ఫార్ములాను అప్లై చేశాడు. పుష్ప : ది రైజ్ సినిమాతో పుష్పరాజ్ పాత్రను డ్రగ్‌లా ఎక్కించిన సుక్కు.. పార్ట్ 2లో ఆ మత్తును అలానే కంటిన్యూ చేసేశాడు. కథపై కాకుండా ఎలివేషన్స్.. యాక్షన్ సీన్స్‌పై ఎక్కువ ఫోకస్ చేశాడు. పార్ట్ 1లో ఉన్నంత కథ కూడా ఈ సీక్వెల్లో లేదు. హై ఇవ్వడమే లక్ష్యంగా కొన్ని సీన్లను అల్లుకుంటూ పోయాడు అంతే. ప్రతి పది నిమిషాలకొకసారి హై ఇచ్చే సీన్ ఉండేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. కథనం నీరసంగా సాగుతుందన్న ఫీలింగ్ ఆడియన్స్‌కి వచ్చేలోగా.. ఓ భారీ యాక్షన్ సీన్ పడుతుంది. అందులో బన్నీ నటవిశ్వరూపం చూసి గూస్బంప్స్ తెచ్చుకోవడమే తప్ప.. మరో ఆలోచన రాదు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందనే పాయింట్‌ని ఈ స్మగ్లింగ్ కథతో ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. పుష్పరాజ్ క్యారెక్టర్, అతని ప్రపంచం గురించి అల్రేడీ తెలుసు కనుక.. స్టార్టింగ్ నుంచే హీరోకి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫహాద్ పాత్ర ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఫస్టాఫ్ అంతా షెకావత్-పుష్పరాజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్‌లా కథనం సాగుతుంది. ఎర్రచందనం పట్టుకునేందుకు షెకావత్ ప్రయత్నించడం.. పుష్పరాజ్ అతన్ని బురిడీ కొట్టించి దాన్ని తరలించడం .. ఫస్టాఫ్ మొత్తం ఇదే తంతు నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే స్విమింగ్ఫూల్ సీన్ అదిరిపోతుంది. ఇద్దరి జరిగే సవాల్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అలాగే శ్రీవల్లీ, పుష్పరాజ్‌ల మధ్య వచ్చే ‘ఫీలింగ్స్’ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఇక ద్వితియార్థంలో ఎమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతర ఎపిసోడ్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ అయితే పూనకాలు తెప్పిస్తుంది. ఆ సీన్లో బన్నీ మాస్ తాండవం చేశాడు. క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదు. పార్ట్ 3కి ఇచ్చిన లీడ్ అంతగా కిక్ ఇవ్వలేదు. సినిమా నిడివి (దాదాపు 3 గంటల 20 నిమిషాలు) ఎక్కువగా ఉండడం సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి. లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాకుంటే అంత మంచిది. అయితే మాస్ ఆడియన్స్‌కి ఇవేవి అవసరం లేదు. వారిని ఎంటర్టైన్ చేస్తే చాలు. అలాంటి వారికి పుష్ప 2 విపరీతంగా నచ్చుతుంది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అయితే సుకుమార్ ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే..పుష్ప: ది రూల్’ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనంతా తన భుజాన వేసుకొని నడిపించాడు. మాస్ లుక్‌లోనే కాదు నటనలోనూ బన్నీ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్‌లో అయితే ‘తగ్గేదేలే’ అన్నట్లుగా తన నట విశ్వరూపం చూపించాడు. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్లో బన్నీ ఫెర్మార్మెన్స్ నెక్ట్స్ లెవన్‌లో ఉంది. చిత్తూర యాసలో ఆయన పలికిన సంభాషణలు అలరిస్తాయి.ఇక శ్రీవల్లీగా డీగ్లామర్ పాత్రలో రష్మిక జీవించేసింది. పార్ట్ 1తో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. జాతర ఎపిసోడ్లో ఆమె చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. డీఎస్పీ షెకావత్‌గా ఫహద్ పాజిల్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంపీ సిద్దప్పగా రావు రమేశ్ మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. తారక్ పొన్నప్పకు మంచి పాత్ర లభించింది. బన్నీకి ఆయన మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల అదరగొట్టేసింది. బన్నీతో పోటీ పడి మరి డ్యాన్స్ చేసింది. మంగళం శ్రీను పాత్రలో నటించిన సునీల్‌కి పెద్దగా గుర్తుంచుకునే సీన్లేవి పడలేదు. దాక్షయణిగా నటించిన అనసూయ పరిస్థితి కూడా అంతే. ఒకటి రెండు చోట్ల ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక కేంద్రమంత్రి ప్రతాప్ రెడ్డిగా జగపతి బాబు ఉన్నంత చక్కగా నటించాడు. పార్ట్ 3లో ఆయన నిడివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జగదీశ్, ధనుంజయ, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. దేవీశ్రీ ప్రసాద్, శ్యామ్ సీఎస్ల నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ‘సూసేకీ..’, కిస్సిక్’, ‘ఫీలింగ్స్’ పాటలు తెరపై అలరించాయి. సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి సీన్ చాలా రిచ్‌గా, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెపాల్సింది. నిడివిని కొంచెం తగ్గిస్తే బాగుండేవి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా ‘తగ్గేదేలే’ అన్నట్లుగా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ)
థియేటర్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు.. ఓటీటీ అంటే థ్రిల్లర్ మూవీస్ అనేది ప్రస్తుతం ట్రెండ్. అందుకు తగ్గట్లే డిఫరెంట్ కథలతో తీస్తున్న థ్రిల్లర్స్.. భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అలా కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 'బ్లాక్'. అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)కథేంటి?వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. వీకెండ్ సరదాగా గడుపుదామని బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలోకి వెళ్తారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా పూర్తిగా పనులు జరగకపోవడం వల్ల వీళ్లు తప్పితే మరెవరు అక్కడ ఉండరు. పగలంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ప్రయత్నించినా.. తిరిగి తిరిగి అక్కడికి వస్తుంటారు. మరోవైపు తమ ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్లు తమలాంటి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఇంతకీ వాళ్లెవరు? ఇలా జరగడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే మూవీస్ చూద్దామనుకునే వాళ్లకు 'బ్లాక్' నచ్చేస్తుంది. 1964లో సినిమా ఓపెన్ అవుతుంది. తన ఫ్రెండ్, అతడి ప్రేయసికి మనోహర్ (వివేక్ ప్రసన్న).. బీచ్ దగ్గర్లోని తన విల్లాలో ఉంచి, తర్వాతి రోజు ఉదయం పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ అనుకోని కొన్ని సంఘటనల వల్ల వాళ్లిద్దరినీ ఎవరో చంపేస్తారు. కట్ చేస్తే స్టోరీ 60 ఏళ్ల తర్వాత అంటే ప్రస్తుతానికి వస్తుంది.వసంత్, ఆరణ్య.. వాళ్లిద్దరి ప్రవర్తన, మనస్తత్వాలు ఇలా సీన్స్ వెళ్తుంటాయి. కాకపోతే ఇవి రొటీన్‌గా ఉంటాయి. ఎప్పుడైతే వీళ్లిద్దరూ విల్లాలోకి అడుగుపెడతారో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. తమలాంటి ఇద్దరు వ్యకులు వీళ్లకు కనిపించడంతో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. అలా హారర్, సూపర్ నేచురల్ ఎలిమెంట్ ఏదో ఉందనే ఉత్కంఠ కలుగుతుంది. చీకటి ప్రదేశం కారణంగా ప్రతిసారీ తాము వివిధ కాలాల్లోకి (టైమ్ లైన్) ముందుకు వెనక్కి వెళుతున్నామని వసంత్ తెలుసుకోవడం, చీకటి ప్రదేశం కారణంగానే వసంత్-ఆర్యం ఒకరికొకరు దూరమవడం.. చివరకు ఎలా కలుసుకున్నారనేది సినిమా.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)సినిమా చూస్తున్నంతసేపు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కాకపోతే అలా జరగడానికి వెనకున్న కారణాన్ని బయటపెట్టే సీన్ మాత్రం పేలవంగా ఉంటుంది. ఏదో ఫిజిక్స్ క్లాస్ చెబుతున్నట్లు వేగంగా చూపించేశారు. దీంతో సగటు ప్రేక్షకుడికి సరిగా అర్థం కాదు. క్లైమాక్స్ కూడా ఏదో హడావుడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా రెండు గంటల్లోపే ఉండటం ప్లస్ పాయింట్.ఎవరెలా చేశారు?సినిమాలో జీవా, ప్రియా భవానీ శంకర్ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. వీళ్లిద్దరూ ఆయా పాత్రల్లో ఆకట్టుకున్నారు. వాస్తవానికి, ఊహలకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా జీవా వేరియషన్స్ చూపించాడు. వివేక్ ప్రసన్నతో పాటు మిగిలిన వాళ్లది అతిథి పాత్రలే. టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ కేజీ సుబ్రమణి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. కాకపోతే స్క్రిప్ట్‌లో లాజిక్స్ సరిగా ఎష్టాబ్లిష్ చేసుంటే బాగుండేది అనిపించింది. శామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్. కొన్ని సీన్లను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. మిగిలిన డిపార్ట్మెంట్స్ తమ వంతు న్యాయం చేశారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఓటీటీలో థ్రిల్లర్ మూవీ ఏదైనా చూద్దామనుకుంటే 'బ్లాక్' ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి తమిళ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ ఉన్నాయి.-చందు డొంకాన(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేనంటూ కన్నీళ్లతో బయటకొచ్చిన శోభా శెట్టి) -
Vikkatakavi Review: ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: వికటకవి (ఆరు ఎపిసోడ్లు)నటీనటులు: నరేశ్అగస్త్య, మేఘా ఆకాశ్, షైజు, అమిత్ తివారీ, తారక్ పొన్నప్ప, రఘుకుంచె, నిమ్మల రవితేజ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామ్ తాళ్లూరిదర్శకత్వం: ప్రదీప్ మద్దాలిఓటీటీ: జీ5 (నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది)‘వికటకవి’ కథేంటంటే..ఈ సినిమా కథ 1940-70ల మధ్యకాలంలో సాగుతుంది. రామకృష్ణ(నరేశ్ అగస్త్య) డిటెక్లివ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ.. డబ్బు కోసం డిటెక్టివ్‌గా మారతాడు. పోలీసులకు సైతం అంతుచిక్కని కొన్ని కేసులను తన తెలివితేటలతో పరిష్కరిస్తాడు. అతని గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్.. రామకృష్ణను అమరగిరి ప్రాంతానికి పంపిస్తాడు. అమరగిరిలో ఓ వింత ఘటన జరుగుతుంటుంది. రాత్రివేళలో అక్కడి దేవతల గుట్టకు వెళ్లిన జనాలు గతాన్ని మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం కారణంగానే ఇలా జరుగుతుందని ఆ ఊరి జనాలు భావిస్తారు. అందులో నిజమెంత ఉందని తెలుసుకునేందుకు రామకృష్ణ దేవతల గుట్టకు వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అందరి మాదిరే రామకృష్ణ కూడా గతాన్ని మర్చిపోయాడా? దేవతల గుట్టకు వెళ్లిన రామకృష్ణకు తెలిసిన నిజమేంటి? అతనితో పాటు అమరగిరి సంస్థాన రాజు రాజా నరసింహా (షిజు అబ్దుల్ రషీద్) మనవరాలు లక్ష్మి (మేఘా ఆకాష్) కూడా దేవతల గుట్టకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజా నరసింహ కొడుకు మహాదేవ్ (తారక్ పొన్నప్ప), కోడలు గౌరీ (రమ్య దుర్గా కృష్ణన్) వల్ల అమరగిరికి వచ్చిన శాపం ఏమిటి? అమరగిరి ప్రాంతానికి రామకృష్ణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే..?డిటెక్టివ్ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ మాత్రం ‘వికటకవి’ అనే చెప్పాలి. కథ 1970 నుంచి 40కి వెళ్లడం..అక్కడ నుంచి మళ్లీ 90లోకి రావడంతో ఓ డిఫరెంట్ వెబ్ సీరీస్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సిరీస్ ప్రారంభమైన కాసేపటికే దేవతలగుట్ట సమస్య వెనుక ఎవరో ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. కానీ అది ఎవరు అనేది చివరి వరకు తెలియజేకుండా కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు ప్రదీప్ మద్దాలి సఫలం అయ్యాడు. కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్నా... ఎంగేజ్ చేసేలా కథనాన్ని నడిపించాడు. రచయిత తేజ దేశరాజ్ ఈ కథను సాధారణ డిటెక్టివ్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా అనేక క్లిష్టమైన ఉపకథలను, చారిత్రక సంఘటనలను చక్కగా మిళితం చేసి ఓ డిఫరెంట్ స్టోరీని క్రియేట్ చేశాడు. ఆ స్టోరీని అంతే డిఫరెంట్‌గా తెరపై చూపించడాడు దర్శకుడు. ఓ భారీ కథను పరిమితమైన ఓటీటీ బడ్జెట్‌తో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు దర్శకుడు ప్రదీప్‌ను అభినందించాల్సిందే. తొలి ఎపిసోడ్‌లోనే ఒకవైపు అమరగిరి ఊరి సమస్యను పరిచయం చేసి, మరోవైపు రామకృష్ణ తెలివితేటలను చూపించి అసలు కథను ప్రారంభించాడు. ఇక హీరో అమరగిరికి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. దేవతల గుట్టపై ఉన్న అంతుచిక్కని రహస్యాన్ని చేధించేందుకు రామకృష్ణ చేసే ప్రయత్నం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోగా.. కథనం నెమ్మదిగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపులో ఈ సిరీస్‌కి కొనసాగింపుగా ‘వికటకవి 2’ ఉంటుందని ప్రకటించి షాకిచ్చారు మేకర్స్. ‘వికటకవి 2’ చూడాలంటే.. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. లాజిక్స్‌ని పట్టించుకోకుండా చూస్తే ఈ సిరీస్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేశ్ అగస్త్య ఒదిగిపోయాడు. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ చూస్తే..నిజమైన డిటెక్టివ్‌ని స్క్రీన్ మీద చూసినట్లే అనిపిస్తుంది. మేఘా ఆకాశ్‌కు ఓ మంచి పాత్ర లభించింది. తెరపై ఆమె చాలా హుందాగా కనిపించింది. అమిత్ తివారీ, షైజు, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సిరీస్ చాలా బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్‌కి మరో ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1940-70నాటి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Roti Kapada Romance: ‘రోటి కపడా రొమాన్స్’ మూవీ రివ్యూ
టైటిల్: రోటి కపడా రొమాన్స్నటీనటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులునిర్మాణ సంస్థ: లక్కీ మీడియానిర్మాత: బెక్కెం వేణుగోపాల్దర్శకత్వం: విక్రమ్ రెడ్డివిడుదల తేది: నవంబర్ 28, 2024కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో వరుసగా చిన్న సినిమాలు వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. పబ్లిసిటీ సరిగా చేయకపోవడంతో కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన విషయం కూడా తెలియడం లేదు. చాలా రోజుల తర్వాత మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రమే ‘రోటి కపడా రొమాన్స్’(Roti Kapada Romance Movie Telugu Review). వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 22నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎట్టకేలకు నేడు(నవంబర్ 28) రిలీజైంది. ఈ నేపథ్యంలో మీడియా కోసం ప్రివ్యూ వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘రోటి కపడా రొమాన్స్’ కథేంటంటే..?ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష(హర్ష నర్రా), సాఫ్ట్వేర్ రాహుల్(సందీప్ సరోజ్), ఆర్జే సూర్య(తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) నలుగురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి ఓకే గదిలో ఉంటారు. విక్కీ ఏ పని చేయకుండా స్నేహితులు సంపాదిస్తున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. ఫ్యాన్ అంటూ ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష), ఒక్కరోజు బాయ్‌ప్రెండ్‌గా ఉండి ఫిజికల్‌గా హెల్ప్ చేయమని కోరుతూ హర్షతో సోనియా(కుష్బూ చౌదరి), ఉద్యోగం ఇప్పించండి అంటూ విక్కీతో శ్వేత(మేఘలేఖ) పరిచయం చేసుకుంటారు. ఇక రాహుల్‌ది మరో విచిత్రం. తన ఆఫీస్‌లో పని చేసే ప్రియ(ఠాకూర్)ని ఇష్టపడతాడు. కానీ పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకొని తిరుగుతాడు. ఈ నలుగురి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? ప్రేమలో పడి మళ్లీ ఎందుకు విడిపోయారు? లవ్ బ్రేకప్ తరువాత వాళ్ల రియలైజేషన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. నలుగురు కుర్రాళ్లు.. స్నేహం.. లవ్, బ్రేకప్..ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. రోటి కపడా రొమాన్స్ కూడా ఆ కోవకు చెందిన కథే. నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇది అందరికి తెలిసిన కథే.. చాలా సినిమాల్లో చూసిన కథే. కానీ దర్శకుడు విక్రమ్ రెడ్డి చాలా కొత్తగా తెరపై చూపించాడు. ఎలాంటి గజిబిజి లేకుండా నాలుగు డిఫరెంట్ లవ్స్టోరీస్ని ఒకే కథలో చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రతి లవ్‌స్టోరీని చాలా కన్విన్సింగ్‌గా చూపిస్తూ.. ప్రస్తుతం యూత్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెచ్యూరిటీ లేక తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా జరిగే నష్టాలు, అపార్థాలు, లవ్‌తో వచ్చే ప్రాబ్లమ్స్, పెళ్లి విషయంలో యువతీయువకుల ఆలోచన ఎలా ఉంటుంది?.. ఇవన్నీ నాలుగు లవ్‌స్టోరీలతో చెప్పేశాడు. దర్శకుడు ట్రెండ్‌కు తగ్గ కథను ఎంచుకోవడంతో పాటు అంతే ట్రెండీగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్‌లో రొమాన్స్ కాస్త ఎక్కువే ఉన్నా.. సెకండాఫ్ వచ్చేసరికి అంతా సెట్ అయిపోతుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.గోవా ట్రిప్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కరి లవ్ స్టోరీ రివీల్ అవుతుంటే కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్జే సూర్య- దివ్య, హర్ష- సోనియాల లవ్‌స్టోరీలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుంది. రాహుల్-ప్రియల లవ్‌స్టోరీలో ఓ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక విక్కీ- శ్వేతల లవ్‌స్టోరీ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. విక్కీ క్యారెక్టర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం నలుగురు లవ్‌స్టోరీ చెప్పి.. సెకండాఫ్‌లో బ్రేకప్ స్టోరీలను చెప్పాడు. ద్వితియార్థంలో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించినవారంతా దాదాపు కొత్తవాళ్లే అయినా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ.. తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విక్కీ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. నటీనటుల నుంచి మంచి ఫెర్పార్మెన్స్ తీసుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ అందించిన నేపథ్య సంగీతం నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 2.75/5 -
'జీబ్రా' సినిమా రివ్యూ
యంగ్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. 'పుష్ప'లో జాలిరెడ్డిగా చేసిన ధనంజయ, 'బాహుబలి' సత్యరాజ్, సత్య, సునీల్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్‌తోనే ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా (నవంబర్ 22) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?షేర్ మార్కెట్, స్కామ్ అనగానే చాలామందికి 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ గుర్తొస్తుంది. లేదంటే మొన్నీమధ్యనే తెలుగులో వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా గుర్తొస్తుంది. పనిచేస్తున్న బ్యాంకులోనే డబ్బు కొట్టేసి, దొరక్కుండా ఎలా తప్పించుకున్నాడు అనే కాన్సెప్ట్‌తో తీసిన 'లక్కీ భాస్కర్' అద్భుతమైన హిట్. మరీ ఒకేలా అని చెప్పలేం గానీ అలాంటి ఓ పాయింట్‌తోనే తీసిన మూవీ 'జీబ్రా'. అందులో డబ్బు కొట్టేసి హీరో ఎవరికీ దొరకడు. ఇందులో మాత్రం హీరో ఓ తప్పు చేశాడు. కానీ ఎవరో చేసిన మరో తప్పు వల్ల విలన్‌కి దొరికిపోతాడు.హీరో సూర్య చేతిలో ఓ గిఫ్ట్ బాక్స్ చూపించే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే కథ ఆరు రోజులు వెనక్కి వెళ్తుంది. సూర్య, అతడి తల్లి, అతడి ప్రేయసి స్వాతి.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ కథలోకి వెళ్లిపోతాం. కాసేపటికే తనకో సమస్య వచ్చిందని స్వాతి.. హీరో సాయం కోరుతుంది. మనోడుతో చాలా తెలివితో బ్యాంకులో లూప్ హోల్స్ ఉపయోగించి ఆ సమస్య తీరుస్తాడు. కానీ ఇక్కడే ఊహించని సమస్య మరొకటి వస్తుంది. రూ.4 లక్షలతో స్కామ్ చేస్తే రూ.5 కోట్ల కనిపించకుండా పోవడం అనేది సూర్య మెడకి చుట్టుకుంటుంది. ఇక్కడ కథలో మరో కీలక పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అదే ఆదిత్య దేవరాజ్ అలియాస్ డాలీ.. పెద్ద పెద్ద గుండాలనే శాసించే ఇతడికి రూ.5 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. కానీ ఆ డబ్బు కోసం హీరోని ఎందుకు 4 రోజులు పాటు పరిగెత్తించాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.కథ పరంగా ఇది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే బ్యాంక్ అంటే చాలామందికి డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ బ్యాంక్ సిస్టమ్‌లోనూ ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయనేది ఈ మూవీలో క్లియర్‌గా చూపించారు. సంస్థలో పనిచేసే హీరోనే డబ్బు కొట్టేయడం, దానికి తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తుల సాయం తీసుకోవడం ఇవన్నీ కూడా భలే థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు సూర్యకి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఒక్కో దాన్ని నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం కూడా కన్విన్సింగ్‌గా ఉంది.చెస్‌లో మంత్రి, గుర్రం, ఏనుగు, భటులు ఇలా చాలా ఉంటాయి. ఈ సినిమాలో చెస్ గేమ్‌లా అనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన మెటాఫర్స్, డ్రస్సు కలర్స్ మీరు సినిమాలో చూడొచ్చు. అన్నీ ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత డాలీ తన కొడుక్కి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఇది కాస్త ల్యాగ్, రొటీన్ అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్‌ని కావాలనే ఇరికించినట్లు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?సూర్య పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఎమోషన్స్ ఇతడి రోల్లో కనిపిస్తాయి. డాలీ అలియాస్ ఆదిత్య దేవరాజ్‌గా చేసిన ధనంజయ పాత్రకు మంచి ఎలివేషన్లు పడ్డాయి. ఒకానొక దశలో హీరో సత్యదేవ్ కంటే ఇతడి పాత్ర బాగుందనిపిస్తుంది. సత్య సిట్చుయేషనల్ కామెడీ సూపర్. డాలీని ఇరిటేట్ చేసే మదన్ గుప్తాగా సునీల్ కనిపిస్తాడు. రోల్ బాగుంది కానీ మెయిన్ లీడ్స్ వల్ల ఇతడి పాత్ర డౌన్ అయినట్లు అనిపిస్తుంది. బాబాగా చేసిన సత్యదేవ్, స్వాతిగా చేసిన ప్రియా భవానీ శంకర్.. ఎవరికి వాళ్లు పూర్తి న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే రైటింగ్‌కి నూటికి 90 మార్కులు వేసేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకు ఇది నచ్చదు. డిఫరెంట్ థ్రిల్లర్స్, అందులోనూ బ్యాంక్ స్కామ్ తరహా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు 'జీబ్రా' నచ్చేస్తుంది. అంతా బాగానే ఉంది కానీ 'లక్కీ భాస్కర్' రిలీజైన కొన్నిరోజుల తర్వాత థియేటర్లలోకి రావడం దీనికి ఓ రకంగా మైనస్.రేటింగ్: 2.75/5- చందు డొంకాన(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌పై బన్నీ) -
‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ
టైటిల్: మెకానిక్ రాకీనటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది తదితరులునిర్మాణ సంస్థ: ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్నిర్మాత : రామ్ తాళ్లూరిదర్శకత్వం: రవితేజ ముళ్లపూడిసంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: మనోజన్ రెడ్డి కాటసానిఎడిటింగ్: అన్వర్ అలీవిడుదల తేది: నవంబర్ 22, 2024జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే ఈ ఏడాదిలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షలను అలరించిన విశ్వక్.. ఇప్పుడు మెకానిక్ రాకీ అంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు విశ్వక్ తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేయడంతో ‘మెకానిక్ రాకీ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు (నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రాకేష్ అలియాస్ రాకీ(విశ్వక్ సేన్) బీటెక్ మధ్యలో ఆపేసి తండ్రి రామకృష్ణ(నరేశ్ వీకే)నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా జాయిన్ అవుతాడు. కార్లను రిపేర్ చేస్తూ.. మరోవైపు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఆ గ్యారేజీపై రంకిరెడ్డి (సునీల్) కన్ను పడుతుంది. వారసత్వంగా వస్తున్న ఆ గ్యారేజీని కాపాడుకోవడం కోసం రాకీ ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయ(శ్రద్ధా శ్రీనాథ్) వస్తుంది. తాను ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నానంటూ రాకీతో పరిచయం చేసుకుంటుంది. రాకీ సమస్య తెలిసి మాయ ఎలాంటి సహాయం చేసింది? గ్యారేజీని కాపాడుకోవడం కోసం రాకీ ఏం చేశాడు? కాలేజీలో ప్రేమించి అమ్మాయి ప్రియ(మీనాక్షి చౌదరి) గురించి రాకీకి తెలిసి షాకింగ్ విషయాలు ఏంటి? ప్రియ కోసం రాకీ ఏం చేశాడు? ప్రియ, రాకీల జీవితాల్లోకి మాయ వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమా కథ ప్రారంభ సన్నివేశాలను చూడగానే ఇదొక సాదాసీదా ప్రేమ కథ అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్, కామెడీ సీన్లన్ని రొటీన్‌గా సాగుతాయి. ఒకనొక దశలో ఇది కామెడీ లవ్‌స్టోరీ అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో సినిమా జానరే మారిపోతుంది. అప్పటి వరకు కథపై ఉన్న ఓపీనియన్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని తెలిసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే థ్రిల్లింగ్‌గా అపిపిస్తుంది. ప్రతి పాత్రకు ఒక్కో మలుపు ఉంటుంది. ఆ మలుపు సీన్లను మరింత థ్రిల్లింగ్‌గా చూపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. కొన్ని ట్విస్టులను ముందే ఊహించొచ్చు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే.. నేటి తరం యువత చేస్తున్న ఓ పెద్ద తప్పిదాన్ని చూపించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల అవసరాన్ని, ఆశని ఆసరాగా తీసుకొని కొంతమంది చేస్తున్న ఆన్లైన్ మోసాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. దాని చుట్టు అల్లుకున్న కథే రొటీన్‌గా ఉంది. భావోద్వేగాలను పండించడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. మోతాదుకు మించి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కథనం వాస్తవికానికి దూరంగా సాగితున్నందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ కథని మరింత బలంగా రాసుకొని, స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రాకీ అలియాస్ మెకానిక్ రాకీ పాత్రలో విశ్వక్ సేన్ చక్కగా నటించాడు. అయితే ఈ తరహా పాత్రలు విశ్వక్ చాలానే చేశాడు. అందుకే తెరపై కొత్తదనం కనిపించలేదు. మాయగా శ్రద్ధా శ్రీనాథ్ అదరగొట్టేసింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. మీనాక్షి చౌదరికి చాలా బలమైన పాత్ర దొరికింది. మిడిల్ క్లాస్ యువతి ప్రియగా ఆమె చక్కగా నటించింది. తెరపై శ్రద్ధా, మీనాక్షి ఇద్దరూ అందంగా కనిపించారు. హీరో తండ్రిగా నరేశ్ తనకు అలవాటైన పాత్రలో జీవించేశాడు. సునీల్, హర్షవర్ధన్, రఘు, వైవా హర్షతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)
రీసెంట్ టైంలో మలయాళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ 'కిష్కింద కాండం'. రూ.7 కోట్ల ఖర్చు పెట్టి థియేటర్లలో రిలీజ్ చేస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అప్పు పిళ్లై (విజయ రాఘవన్) ఆర్మీ మాజీ అధికారి. అడవిని ఆనుకుని ఉండే పెద్ద ఇంట్లో ఉంటాడు. ఓరోజు ఈయన గన్ మిస్ అవుతుంది. ఎన్నికల టైం కావడంతో తుపాకీని స్టేషన్లో అప్పగించాలని నోటీసులు ఇస్తారు. కట్ చేస్తే ఓ కోతి చేతిలో గన్ కనిపిస్తుంది. అది తనదేనని అప్పు పిళ్లై కన్ఫర్మ్ చేస్తాడు. ఇతడికి అజయ్ చంద్రన్ (ఆసిఫ్ అలీ) అనే కొడుకు. అజయ్ తొలి భార్య చనిపోవడం, కొడుకు కనిపించకుండా పోవడంతో అపర్ణ (అపర్ణా బాలమురళి)ని రెండో పెళ్లి చేసుకుంటాడు. అజయ్ చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది? మిస్ అయిన కొడుకు ఏమయ్యాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!)ఎలా ఉందంటే?మిస్టరీ థ్రిల్లర్ అనగానే దాదాపు ఒకే ఫార్మాట్లో స్టోరీ ఉంటుంది. ఓ హత్య, దాని చుట్టూ సాగే దర్యాప్తు. హంతకుడిని పోలీసులు పట్టుకోవడం ఇదే కాన్సెప్ట్ కనిపిస్తుంది. కానీ 'కిష్కింద కాండం' పూర్తిగా డిఫరెంట్. పాట, ఫైట్ లాంటివి ఏం ఉండవు. ఎప్పుడూ చూసే మిస్టరీ థ్రిల్లర్ లాంటి సినిమానే కానీ నేపథ్యమే వేరు. దానిని చూపించిన విధానం చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కథ కూడా ఎక్కువ పాత్రలు లేకుండా చాలా సింపుల్‌గా తేల్చేశారు.మతిమరపు వ్యక్తి, కనపడకుండా పోయిన తుపాకీ, బుల్లెట్ గాయంతో చనిపోయిన కోతి, తప్పి పోయిన పిల్లాడు ఇవే ఈ కథ లోని ముఖ్యమైన అంశాలు. ఇంతకీ మించి చెబితే సినిమాలోని థ్రిల్‌ని మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే చిన్న స్టోరీ లైన్ మీద ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో.. చూస్తున్న ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోబెట్టడం అంటే అంత ఈజీ కాదు. కానీ 'కిష్కింద కాండం' అది చేసి చూపించింది. రైటింగ్ పరంగా ఇది టాప్ క్లాస్ వర్క్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కథ, మాటలు అందించిన బాహుల్ రమేశ్.. సినిమాటోగ్రఫీ కూడా చేశారు. కథ రాసుకున్న వాడే కెమెరా పడితే ఆ విజువల్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మూవీ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. చెప్పాలంటే తొలి అరగంట జరిగే సీన్లు చూస్తే బోర్ కొట్టేస్తుంది. కానీ ఆ తర్వాత ఉల్లిపాయ ఒక్కో పొర విప్పినట్లు కథలో ఒక్కో లేయర్ రివీల్ అవుతూ ఉంటుంది. అప్పటివరకు సస్పెన్స్, థ్రిల్లింగ్‌గా సాగే ఈ చిత్రం.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఓ రకమైన సంతృప్తితో పాటు ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.'జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం', 'ఎవరికీ ఉపయోగపడని నిజాలు తెలుసుకుని ఏం చేస్తాం'.. సినిమా చూసిన తర్వాత ఈ రెండు డైలాగ్స్ మీకు తెగ నచ్చేస్తాయి. అలానే తండ్రి గజిని, కొడుకు కమల్ హాసన్ అని మీకు కచ్చితంగా అనిపిస్తుంది. కమర్షియల్ మూవీస్ అంటే ఇష్టపడేవాళ్లు, స్లోగా సాగే సినిమాలంటే ఇష్టం లేనివాళ్లకు ఇది నచ్చకపోవచ్చు. కాబట్టి దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోండి. రెండు గంటల నిడివితో తీసిన మిస్టరీ థ్రిల్లర్.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' సిరీస్ రివ్యూ
భారతదేశ స్వాతంత్య్రం కోసం సాగిన బహుముఖ పోరాటాన్ని వివరిస్తూ చరిత్ర, నాటకం యాక్షన్లను మిళితం చేస్తూ నిఖిల్ అద్వానీ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' అందించారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ సిరీస్‌లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ (సిద్ధాంత్ గుప్తా), సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజేంద్ర చావ్లా), మహాత్మా గాంధీ (చిరాగ్ వోహ్రా), లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్ (ల్యూక్ మెక్‌గిబ్నీ) పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. రాజకీయ కుట్రల సూక్ష్మమైన విశ్లేషణ, వ్యక్తిగత త్యాగాలు, భావోద్వేగ తిరుగుబాట్లు ఆసక్తికరంగా సాగుతాయి.నెహ్రూ, పటేల్, గాంధీల విభిన్న భావజాలంతో కూడిన సన్నివేశాలతో ఈ సిరీస్ వైవిధ్యభరిత అనుభూతిని అందిస్తుంది. స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన ఈ ముగ్గురివీ.. వేటికవే విభిన్న థృక్కోణాలైనా సమర్థనీయమైనవిగా అనిపిస్తాయి. ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. దేశ నిర్మాణం ఆచరణాత్మక డిమాండ్ల మధ్య చిక్కుకున్న నాయకుడి అంతర్గత సంఘర్షణ నెహ్రూ పాత్ర చిత్రణలో తెలుస్తుంది. ముహమ్మద్ అలీ జిన్నాలోని అహం, ఆశయం, తెలివిని నటుడు ఆరిఫ్ జకారియా చక్కగా చూపించాడు. సర్దార్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా, లియాఖత్ అలీ ఖాన్‌గా రాజేష్ కుమార్, లార్డ్ లేడీ మౌంట్‌బాటన్‌గా కార్డెలియా బుగేజా మెరుస్తారు. మలిష్కా మెండోన్సా సరోజినీ నాయుడుగా కనిపిస్తారు.ఈ సిరీస్ 1940ల నాటి భారతదేశానికి అద్దం పట్టింది. పునర్నిర్మించిన వైస్రాయ్ హౌస్ లేదా కాంగ్రెస్ కార్యాలయాలు..ఇలా ప్రతి ఫ్రేమ్ సమగ్ర పరిశోధనను ప్రతిబింబిస్తుంది. కథ, కథనాలను భావోద్వేగభరితంగా అందించటంలో అద్వానీ దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుటుంది. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఇతర చిత్రీకరణల మాదిరిగా కాకుండా, ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ 1944 - 1947 మధ్య కీలకమైన సంవత్సరాలకు దాని పరిధిని కుదించింది. ఇది గాంధీ–జిన్నా చర్చలు విభజనకు దారితీసిన వంటి సంఘటనలపైనే దృష్టి పెట్టింది. రాజకీయ కుతంత్రాలు, సైద్ధాంతిక వైరుధ్యాలు, తెరవెనుక చర్చలను చక్కగా చూపించారు.చదవండి: దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్' -
OTT: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ ఎలా ఉందంటే?
నయనతార జీవిత ఆధారంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన డ్యాక్యుమెంటరీ సిరీస్‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నేటి(నవంబర్ 18) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక గంట ఇరవైరెండు నిమిషాల నిడివిగల ఈ డ్యాక్యుమెంటరీ సిరీస్ ఎలా ఉంది? అందులో ఏం చూపించారు?🔸నయనతార జీవితం మొత్తాన్ని ఓ బ్యూటిఫుల్ స్టోరీగా మలిచి తెరపై అందంగా చూపించే ప్రయత్నం చేసింది నెట్‌ఫ్లిక్స్🔸నయనతార చిన్నప్పటి ఫోటోలను చూపుతూ..ఆమె స్కూల్ డేస్ సీన్‌తో ఈ డ్యాక్యుమెంటరీ ప్రారంభం అవుతుంది.🔸ఆమెకు సినిమా చాన్స్ ఎలా వచ్చింది? మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఎలా ఎంట్రీ ఇచ్చిందనేది ఆయాన డైరెక్టర్లతో చెప్పించారు.🔸కెరీర్ తొలినాళ్లతో నయనతార పడిన ఇబ్బందులను, బాడీ షేమింగ్ చేసినప్పుడు తను పడిన మానసిక క్షోభను పంచుకున్నారు.🔸తన పర్సనల్ లైఫ్‌పై వచ్చిన కొన్ని విమర్శల కారణంగా సినిమా చాన్స్‌లు కోల్పోయినా.. తిరిగి ఎలా ట్రాక్‌లోకి వచ్చారనేది ఆసక్తికరంగా తెలియజేశారు.🔸శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రకు నయనతారను తీసుకున్నప్పడు వచ్చిన విమర్శలను చూసి ఆమె ఎంత బాధపడిందనే విషయాలను ఆయా దర్శక నిర్మాతలతో చెప్పించారు.🔸తనపై వచ్చిన విమర్శలన్నింటిని పక్కన పడేసి.. ‘లేడీ సూపర్ స్టార్’గా ఎలా ఎదిగారనేది ఆసక్తికరంగా చూపించారు.🔸ఫస్టాఫ్ మొత్తం నయనతార బాల్యం, సినీ కెరీర్‌ని చూపించి..సెకండాఫ్‌లో విఘ్నేశ్‌తో ప్రేమాయణం ఎలా మొదలైంది? వివాహ జీవితం ఎలా ఉందనేది చూపించారు.🔸‘నానుమ్ రౌడీ దాన్’సమయంలో వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి? విఘ్నేశ్‌కి నయన్ ఎలాంటి సపోర్ట్‌ని అందించింది? ఎలా ప్రేమలో పడిపోయారనేది చక్కగా చూపించారు.🔸పెళ్లికి ముందు వీరిద్దరి రిలేషన్షిప్ ఎలా కొనసాగిందో అనేది వారి మాటల్లోనే చూపించారు. ప్రేమలో ఉన్నప్పడు వారిపై వచ్చిన మీమ్స్ గురించి కూడా సరదాగా పంచుకున్నారు.🔸గ్లాస్ హౌస్‌లోనే నయనతార ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? పెళ్లి రోజు వీరిద్దరు ధరించిన దుస్తుల వెనున ఉన్న కథ, వాటిని తయారు చేయడానికి డిజైనర్లు పడిన కష్టాలను చూపించారు.🔸ఇక ఈ డ్యాక్యుమెంటరీ చివరల్లో నయనతార-విఘ్నేశ్‌ల కవల పిల్లలను చూపిస్తూ.. ఆహ్లాదకరమైన ముగింపును ఇచ్చారు.🔸మొత్తంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ సిరీస్ సరదాగా సాగుతూ.. నయనతార లైఫ్‌లో చోటు చేసుకున్న కొన్ని వివాదాలు.. విమర్శలను చూపిస్తూనే..వాటిని ఎదుర్కొని ఎలా ‘లేడీ సూపర్‌స్టార్’గా ఎదిగారనేది చూపించారు. -
మనుషులను తినే వైరస్.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
టైటిల్: అపోకాలిప్స్ జెడ్: ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్డైరెక్టర్: కార్లెస్ టోరెన్స్విడుదల తే:దీ 05 అక్టోబర్ 2024ఓటీటీ: అమెజాన్ ప్రైమ్నిడివి: 119 నిమిషాలుఇప్పుడంతా ఓటీటీల హవానే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తెరెకెక్కించిన చిత్రాలు సైతం మన ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నాం. ఈ డిజిటల్ యుగంలో మనకు నచ్చిన సినిమాను వీలైన టైమ్‌లో చూసే అవకాశం ఉంది. కంటెంట్ భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసేస్తున్నారు. ఓటీటీలో అన్ని రకాల జోనర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన భయపెట్టే జాంబీ యాక్షన్ థ్రిల్లర్ అపోకలిప్స్ జెడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. స్పానిష్‌లో తెరకెక్కించిన మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.స్పానిష్ ప్రజలు ఓ మహమ్మారి వైరస్ బారిన పడతారు. ప్రశాంతంగా ఉన్న ఆ దేశంలో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. దీంతో ప్రజలంతా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లను, నగరాలను వదిలిపారిపోతారు. ఇంతకీ ఆ వైరస్ ఏంటి? అలా తప్పిపోయిన తన ఫ్యామిలీని కలుసుకోవడానికి ఓ వ్యక్తి చేసిన సాహసమే అసలు కథ.ఇలాంటి జాంబీ యాక్షన్ చిత్రాలు గతంలోనూ చాలా వచ్చాయి. కాకపోతే ఈ మూవీ కాస్తా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలాంటి హడావుడి లేకుండా కథనం సాగుతుంది. అంతుచిక్కని వైరస్ బారిన పడినవారు.. కనపడిన ప్రతి ఒక్కరిని తినేస్తుంటారు. దీంతో ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీ సైతం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి హెచ్చరికలు జారీచేస్తుంది. అలా వాటిని పట్టించుకోకుండా బయటికెళ్లిన వ్యక్తి వారి నుంచి తప్పించుకోవడానికి చేసే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇందులో అతనితో పాటు పిల్లి కూడా ఉంటుంది. ఇందులో ఆ వ్యక్తి ప్రాణాలు దక్కించుకోవడానికి చేసే యాక్షన్ సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అయితే కథ నెమ్మదిగా సాగడం కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. హారర్, యాక్షన్ జోనర్ ఇష్టపడేవాళ్లు ఈ మూవీ ట్రై చేయొచ్చు. కాకపోతే కేవలం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్‌తో చూసేయాల్సిందే. -
‘మట్కా’ మూవీ రివ్యూ
టైటిల్: మట్కానటీనటులు: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులునిర్మాణ సంస్థ: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరిదర్శకత్వం: కరుణ కుమార్సంగీతం: జీవీ ప్రకాశ్సినిమాటోగ్రఫీ: ఎ కిశోర్ కుమార్ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: నవంబర్ 14, 2024కథేంటంటే..బర్మా నుంచి వైజాగ్ వచ్చిన వాసు దేవ్ అలియాస్ వాసు(వరుణ్ తేజ్)..చిన్నప్పుడే అనుకోకుండా ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్తాడు. అక్కడ జైలు వార్డెన్ నారాయణ మూర్తి(రవిశంకర్)తో మంచి పరిచయం ఏర్పడుతుంది. వాసుని తన సొంత పనులకు వాడుకుంటూ మంచి ఫైటర్‌లా తయారు చేస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన వాసు.. కొప్పరికాయల వ్యాపారి అప్పల రెడ్డి(అజయ్ ఘోష్) దగ్గర పనిలో చేరతాడు. ఓ సారి ఆ ఏరియా రౌడీ కేబీఆర్ గ్యాంగ్‌ని చితక్కోట్టి..అతని ప్రత్యర్థి నానిబాబు(కిశోర్)కి దగ్గరవుతాడు. అతని అండదండలతో పూర్ణ మార్కెట్ నాయకుడిగా ఎదుగుతాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. చివరకు మాట్కా ఆటను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వాసు జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? మట్కా కింగ్‌గా ఆయన ఎలా ఎదిగాడు? సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్ ని ఎలా పంపించాడు? వాసు కోసం సీబీఐ ఎందుకు రంగంలోకి దిగింది? సుజాత(మీనాక్షి చౌదరి) వాసు జీవితంలోకి ఎలా వచ్చింది? ఈ కథలో సోఫియా(నోరా ఫతేహి), సాహు(నవీన్ చంద్ర) పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘మట్కా కింగ్’ రతన్ లాల్ ఖత్రీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మట్కా’. గ్యాoబ్లింగ్ వరల్డ్ లో రతన్ ఖత్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 1962లో ముంబైలో కేంద్రంగా మట్కా గ్యాంబ్లింగ్ లో దేశం మొత్తం పెద్ద నెట్‌వర్క్‌ను సృష్టించాడు. ఖత్రీ క్యారెక్టర్ స్ఫూర్తితో వాసు క్యారెక్టర్ ని డిజైన్ చేసి మట్కా చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కరుణ కుమార్. కథగా చూస్తే ఇది కేజీయఫ్, పుష్ప లాంటి అండర్ డాగ్ స్టోరీ. చేతిలో చిల్లిగవ్వ లేని హీరో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి..ప్రభుత్వాలనే శాసించే స్థితికి రావడం.. గ్యాంగ్‌స్టర్ కథలన్నీ ఇలానే ఉంటాయి. మట్కా కథనం కూడా ఇలానే సాగుతుంది. అయితే ఓ ఆటను అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తి దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశాడనేది కొత్త పాయింట్. కథకు ఇదే మెయిన్ పాయింట్ కూడా. కానీ తెరపై మాత్రం దాన్ని అంతే బలంగా చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఎలాంటి ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకుండా చాలా రొటీన్‌గా కథనాన్ని నడిపించాడు. హీరో మట్కా కింగ్‌గా ఎదిగిన క్రమం కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది కానీ ఎక్కడా సహజంగా కనిపించదు. ఇక కథకి కీలకమైన మట్కా ఆట కూడా ఇంటర్వెల్ వరకు మొదలు కాదు. సెకండాఫ్‌లో అయినా ఆ ఆటని హైలెట్ చేశారా? అంటే అదీ లేదు. కథనం మొత్తం రొటీన్‌గా సాగుతుంది. హీరో పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదు. ఫస్టాఫ్ మొత్తం హీరో బాల్యం, అతను ఎదిగిన క్రమం చూపిస్తూ.. మట్కా ఆటలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారనే చూపించారు. ఇక సెకండాఫ్‌లో మట్కా ఆటతో వాసు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశాడు? అతన్ని పట్టుకునేందుకు సీబీఐ రంగంలోకి దిగడం..మరోవైపు ప్రత్యర్థులు అతన్ని చంపేందుకు కుట్ర చేయడం.. వాటిని హీరో ఎలా తిప్పికొట్డానేది చూపించారు. అయితే ఈ సన్నివేశాలేవి ఆకట్టుకునేలా ఉండవు. చివరల్లో దావూద్ పాత్రని పరిచయం చేసి.. క్రికెట్ బెట్టింగ్తో సీక్వెల్ ఉంటుందని పరోక్షంగా ప్రకటించారు. ఎవరెలా చేశారంటే.. వాసు పాత్రకి వరుణ్ తేజ్ న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. వాసు భార్య సుజాతగా మీనాక్షి చౌదరి తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు. సోఫియాగా నోరా ఫతేహి తెరపై అందంగా కనిపించింది. కిషోర్, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవీ ప్రకాశ్ సంగీతం సినిమాకి ప్రధాన బలం. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.-రేటింగ్: 2.25/5 -
Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ
టైటిల్: కంగువానటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులునిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్దర్శకత్వం: శివసంగీతం: దేవీవ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామిఎడిటర్: నిశాద్ యూసుఫ్విడుదల తేది: నవంబర్ 14, 2024కథేంటి అంటే?కంగువ కథ 1070 - 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్‌గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్‌ను వారు పట్టుకుంటూ ఉంటారు. గోవాకు చేరుకున్న జీటాని ఫ్రాన్సిస్ అదుపులోకి తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒక నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని హత్య చేస్తాడు. ఈ హత్యను జీటా చూస్తాడు. అంతేకాదు ఫ్రాన్సిస్‌ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. హత్య విషయాన్ని బయట చెప్పకుండా ఉండేందుకు జీటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు. ఇదే క్రమంలో జీటాను పట్టుకునేందుకు ల్యాబ్ నుంచి కొంతమంది వస్తారు. వారినుంచి జీటానీ కాపాడేందుకు ఫ్రాన్సిస్ ప్రయత్నిస్తుండగా కథ 1070లోకి వెళ్తుతుంది. అసలు జీటా ఎవరు..? అతనిపై చేసిన ప్రయోగం ఏంటి..? ఫ్రాన్సిస్, జీటా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? 1070కి చెందిన కంగువా(సూర్య) ఎవరు..? కపాల కోన నాయకుడు రుధిర ( బాబీ డియోల్)తో కంగువకి ఉన్న వైరం ఏంటి..? పులోమ ఎవరు? కంగువపై అతనికి ఎందుకు కోపం? భారత దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు రోమానియా సైన్యం వేసిన ప్లాన్ ఏంటి..? ప్రణవాది కోన ప్రజలను కాపాడుకోవడం కోసం కంగువ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఎంత గొప్ప కథ అయినా సరే ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్తేనే ఆ సినిమాని ఆదరిస్తారు. ముఖ్యంగా కథ చెప్పడంలో విసిగించకుండా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు.. కథ చెప్పాలి. లేకపోతే ఎంత మంచి కథ అయినా...అంతే సంగతి. దర్శకుడు శివ రాసుకున్న కథ చాలా గొప్పది. కానీ అంతే గొప్పగా తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యారు. సినిమా చూస్తున్నంతసేపు సూర్య పాత్ర మాత్రమే ప్రధానంగా ఉంటుంది. అయితే, స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్లు అన్నీ ఆడియెన్స్‌ను విసిగిస్తూనే ఉంటాయి. యోగిబాబు, రెడిన్ కింగ్స్లే కామెడీతో విసింగేచేశారనే ఫీల్ అందరిలోనూ కలుగుతుంది.సినిమా ప్రారంభమైన సుమారు 30 నిమిషాల తర్వాత అసలు కథలోకి దర్శకుడు శివ వెళ్తాడు. అప్పటి వరకు ఆడియన్స్‌ను దర్శకుడు విషింగించారనే చెప్పవచ్చు. ఎప్పుడైతే పీరియాడిక్ పోర్షన్ మొదలౌతుందో అక్కడి నుంచి కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా కథ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. అప్పుడు వచ్చే వార్ ఎపిసోడ్లు అందరినీ మెప్పించడమే కాకుండా గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఫస్టాఫ్‌ను దర్శకుడు ఇంకాస్త బాగా తీసింటే కంగువా మరింత గొప్ప సినిమాగా ఉండేది. ఫస్టాఫ్‌లో సూర్య, దిశా పటానీ లవ్ స్టోరీ అంతగా కనెక్ట్ కాలేదు.విలన్‌గా బాబీ డియోల్ లుక్ బాగున్నప్పటికీ ఆయన పాత్రను చూపించడంలో ఆ క్రూరత్వం కనిపించదు. ఇక్కడ కూడా డైరెక్టర్ శివ కాస్త నిరుత్సాహపరిచారు. అయితే, భారీ ఎమోషనల్ బ్యాంగ్‌తో సినిమాను ఎండ్ చేస్తారు. క్లైమ్యాక్స్ తర్వాత మాత్రం రెండు ట్విస్టులు ఇచ్చిన దర్శకుడు శివ.. సీక్వెల్‌కు మంచి లీడ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఎవరెలా చేశారంటే.. సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు. ఈ చిత్రం కోసం ఆయన ప్రాణం పెట్టి నటించారు. కంగువా, ఫ్రాన్సిస్ అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన సూర్య.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా వెయ్యేళ్ల కిందట వీరుడు కంగువాగా ఆయన నటనతో మెప్పించి సినిమాకే హైలెట్‌గా నిలిచారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఉదిరన్ పాత్రకు బాబీ డియోల్ పూర్తి న్యాయం చేశారు. ఏంజెలీనాగా దిశాపటానీ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో అనేక షేడ్స్ ఉంటాయి. సినిమాకు ఆమె స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.యోగి బాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం పర్వాలేదు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అదే సమయంలో కొన్ని చోట్ల మోతాదుకు మించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. పాటలు పర్వాలేదు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా, రియాల్టీకీ దగ్గరగా ఉంటుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు చాలా రిచ్‌గా ఉన్నాయి.