Siddipet
-
అర్జీల సత్వర పరిష్కారంపై దృష్టి
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందించిన అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మొత్తం వివిధ సమస్యలపై 36 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ‘ప్రజావాణి’కి 36 దరఖాస్తులు ప్రభుత్వ భూమిని కాపాడండి నాపేరు మాతంగి నాగరాజు. చిన్నకోడూ రు మండల కేంద్రం. మండల పరిధిలోని అల్లీపూర్, చౌడారం రెవెన్యూ గ్రామాలకు చెందిన అటవీ, ప్రభుత్వ భూములను స్థానిక నాయకులు అధికారుల అండదండలతో కబ్జా చేశారు. వందల ఎకరాల్లో భూమిని కబ్జా చేసి విక్రయిస్తున్నారు. ఈ విషయంపై రెవెన్యూ, అటవి శాఖల అధికారులు స్పందించి వెంటనే సర్వే చేయించాలి. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – నాగరాజు -
పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు తెలపండి
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి అభ్యంతరాలున్నా తెలియజేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 491 గ్రామ పంచాయతీల్లో 4,350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అభ్యంతరాలున్నా తెలియజేయాలని తద్వారా అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. -
వెంకన్న ఆలయం నిర్మించండి
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు వద్ద టీటీడీ వారి వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. మంగళవారం తిరుపతి వెళ్లిన ఎమ్మెల్యే హరీశ్‌రావు మర్యాదపూర్వకంగా టీటీడీ బోర్డు నూతన చైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో కోమటిచెరువు ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని కోరినట్లు ఫోన్ ద్వారా ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకు ఐదెకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించినట్లు వివరించామన్నారు. గతంలోనే టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, స్థపతి పర్యటించి ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించినట్టు చైర్మన్‌కు వివరించారన్నారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి అంటే ప్రజలు ఇష్ట దైవంగా.. ఇలవేల్పుగా కొలుస్తారని, అలాంటి ఆలయం సిద్దిపేటలో నిర్మించడం గొప్ప అదృష్టమని హరీశ్‌రావు అన్నారు. వచ్చే టీటీడీ బోర్డు మీటింగ్‌లో సిద్దిపేటలో వెంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి ఆమోదం తెలిపి, మీరే ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా బీఆర్ నాయుడిని కోరినట్లు, అందుకు చైర్మన్ బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారన్నారు. వెంటనే చీఫ్ ఇంజనీర్ అధికారి, సంబంధిత అధికారులను పిలిచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారన్నారు. -
సీఎం కప్ క్రీడలను సక్సెస్ చేద్దాం
సిద్దిపేటరూరల్: జిల్లాలో జరుగుతున్న సీఎం కప్ క్రీడలను క్రీడాశాఖ, జిల్లా అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో క్రీడాశాఖ, జిల్లా అధికారులతో సీఎం కప్ క్రీడలపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి 12 వరకు మండల స్థాయిలో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 17, 18, 19 తేదీలలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, స్పోర్ట్స్ స్టేడియంలో జిల్లా స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలతో పాటు ఫుట్ బాల్, హ్యాండ్ బాల్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, యోగ, బాక్సింగ్, సైక్లింగ్, జూడో, చెస్, బేస్‌బాల్, రేజ్లింగ్, నెట్‌బాల్ తదితర క్రీడాకారుల ఎంపిక జరుగుతాయన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులను రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అదనపు డీసీపీ మల్లారెడ్డి, డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ, డీపీఓ తదితరులు పాల్గొన్నారు. -
‘గౌరవెల్లి’ని పూర్తి చేసి తీరుతా
● హుస్నాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా ● బొమ్మ వెంకన్న ఆదర్శనీయుడు ● మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌రూరల్: అభివృద్ధిలో హుస్నాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్తు తెస్తానని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇందుర్తి మాజీ శాసనసభ్యుడు బొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ బొమ్మ వెంకన్న అందరికీ ఆదర్శ నీయుడన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకే ప్రభుత్వం రూ.430 కోట్లు కేటాయించిందన్నారు. విద్య, వైద్యంలో హుస్నాబాద్‌కు ప్రాధాన్యత ఇస్తానన్నారు. కార్యక్రమంలో బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు అపార్
ఆధార్ కార్డు తరహాలో విద్యార్థి గుర్తింపు కార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డు ఇవ్వనున్నారు. వన్ నేషన్.. వన్ స్టూడెంట్ పేరిట అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) అందజేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వివరాలను యూడైస్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,050 మంది విద్యార్థుల వివరాలను అపార్‌లో నమోదు చేశారు. త్వరలో కార్డులను జారీ చేయనున్నారు.సాక్షి, సిద్దిపేట: ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు అపార్ కోసం ఏ వివరాలు సేకరించాలి, ఎలా నమోదు చేయాలి అనే దానిపై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఆయా పాఠశాలల హెచ్ఎంల ఆధ్వర్యంలో ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, మోడల్, రెసిడెన్షియల్, కేజీబీవీలు, ప్రైవేట్ స్కూల్లలో మొత్తంగా 1,84,700 మంది విద్యార్థులకు గాను 10,050 మంది విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు.ఆధార్‌లోనూ ఒకే విధంగా ఉండాలిపాఠశాలలో చేర్పించే సమయంలో విద్యార్థుల వివరాలు, ఆధార్ కార్డులోని వివరాలు ఒకే విధంగా ఉంటేనే అపార్ నంబర్ వస్తుంది. ఒకే విధంగా లేని వారికి సమస్య వస్తోంది. పాఠశాలల్లోని వివరాలు మార్చేందుకు వీలుండదు. అయితే ఆధార్‌లో వివరాలు మార్పునకు ఆధార్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. పేరు పూర్తిగా లేకపోవడం, పుట్టిన తేదీల్లో మార్పులు ఉండటంతో అపార్ నమోదులో సమస్యలు వస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పేరు, పుట్టిన తేదీ మార్పు కోసం చాలా మంది విద్యార్థులు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.విద్యాసంస్థ విద్యార్థుల నమోదైన వారు సంఖ్యప్రాథమిక 70,221 6,487ప్రైవేట్ 71,598 2,632కేజీబీవీలు 4,986- 474ఉన్నత పాఠశాలలు 13,012- 132మోడల్ స్కూల్స్ 8,520 262రెసిడెన్షియల్ 16,363 6331లోగా పూర్తి చేయాలిఈ నెల 31వ తేదీ లోగా అపార్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. విద్యార్థుల అడ్మిషన్ రికార్డు, ఆధార్ కార్డులోని వివరాలన్నీ ఒకే విధంగా ఉంటేనే అపార్ జనరేట్‌కు అర్హులు అవుతారు. వివరాలు అందించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలి.–వై నర్సింహులు, ఏఎస్ఓ, విద్యాశాఖవివరాలు నిక్షిప్తంఅపార్ గుర్తింపు కార్డు కోసం విద్యార్థుల వివరాలు తీసుకుంటున్నందున ఆ విద్యార్థి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేశారు. అపార్ కార్డు ద్వారా విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫొటో, క్యూ ఆర్ కోడ్, 12 అంకెలతో కూడిన గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఈ కార్డుపై ఉన్న నంబర్ కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖల వెబ్సైట్లో నమోదు చేస్తారు. దీంతో ఎల్కేజీ నుంచి పీజీ వరకూ ఎక్కడ చదివారన్న వివరాలు ఇట్టే ప్రత్యక్షమవుతాయి. అపార్ గుర్తింపు వల్ల డిజిటల్ లాకర్‌కు అనుసంధానం అవుతారు. దీంతో అన్ని ధ్రువీకరణ పత్రాలను విద్యార్థి సురక్షితంగా భద్రపర్చుకోవచ్చు. పాఠశాల మారినా ఇబ్బంది ఉండదు. విద్యార్థులు పొందుతున్న ఉపకార వేతనాలు, ఇతర ప్రయోజనాలు, వివిధ విద్యాసంస్థల్లో చేరికలు, మార్పులు, ఉద్యోగాల భర్తీ సమయంలో, ఇతర అంశాల్లో అపార్ కార్డు ఆధారంగా సమాచారం తీసుకుంటారు. -
సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
● తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు తగదు ● ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ● సిద్దిపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ● రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మహిళలు సిద్దిపేటకమాన్: తెలంగాణ తల్లి అందరికీ దేవత అని.. కానీ విగ్రహం నుంచి బతుకమ్మను తొలగించడం తగదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. పాత బస్టాండ్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి మహిళలు నిరసన తెలిపారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేం చేశారు. బతుకమ్మ ఆట, పాటలతో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు నినదించారు. ఈ సందర్భంగా దేశపతి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లిని అవమానపర్చిన సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. బతుకమ్మను తొలగించడంతో చరిత్ర క్షమించదన్నారు. ఇరవై ఏళ్ల కిందటే కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి విగ్రహం అని అన్నారు. చేతిలో జొన్న కర్ర పెట్టగానే సరిపోదన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ నాయకులు నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. బతుకమ్మ రాష్ట్రానికే పరిమితం కాదని, ప్రపంచంలోని అని దేశాల్లో బతుకమ్మ ఆడుతున్నారని అందుకు గర్వంగా ఉందన్నారు. బతుకమ్మకు రెండు చీరలు ఇస్తానన్న సీఎం హామీలు ఎమయ్యాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ రోజశర్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మాజీ ఎంపీపీ శ్రీదేవి, పట్టణ కౌన్సిలర్లు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్ 2 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
సిద్దిపేటరూరల్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–2 పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తెలిపారు. ఈనెల 15, 16 తేదీల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో గ్రూప్–2 పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, విభాగం అధికారి, రూట్ ఆఫీసర్లు, తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 37 సెంటర్లలో 13,714 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారన్నారు. పరీక్ష కేంద్రం చుట్టూ 144సెక్షన్ అమలు చేస్తూ బందోబస్తు చేపట్టాలన్నారు. -
అందరికీ సమాన హక్కులు
సిద్దిపేటకమాన్: భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ కుల, మత తేడా లేకుండా సమాన హక్కులు కల్పించిందని లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి న్యాయమూర్తులు, న్యాయ వాదులు మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. న్యాయమూర్తి స్వాతిరెడ్డితో కలిసి ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరికి అన్యాయం జరిగినా కోర్టు రక్షణగా ఉంటుందన్నారు. ఉచిత న్యాయం కావాలనుకునేవారు లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించాలన్నారు. హక్కులను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. హక్కులకు భంగం కలిగితే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు చందన, శ్రావణి యాదవ్, తరణి, మహిళ పోలీసు స్టేషన్ సీఐ దుర్గ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, సెక్రటరీ మంతూరి సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సిద్దిపేటలో అవగాహన ర్యాలీ -
క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి
హుస్నాబాద్‌రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మినీ స్టేడియంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధృఢత్వాన్ని కలిగిస్తాయన్నారు. గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీయడం కోసమే ప్రభుత్వం సీఎం కప్ పేరిట క్రీడా పోటీలు నిర్వహిస్తున్నదన్నారు. తెలంగాణ యువత ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందన్నారు. హుస్నాబాద్ ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు స్పోర్ట్స్ యూనివర్సిటీలోకి వెళ్లేందుకు పీఈటీ, పీడీలు కృషి చేయాలని చెప్పారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ఆడిన క్రీడాకారులకు రూ.లక్ష, రాష్ట్ర స్థాయిలో ఆడిన వారికి రూ.50వేలు ప్రోత్సాహకాలను అందిస్తానని ప్రకటించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం హుస్నాబాద్, పోతారం(ఎస్) కబడ్డీ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలు పట్టని సర్కార్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర కోశాధికారి భాస్కర్‌దేశ్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రజాపాలన అంటే ప్రజలలో ఉద్యోగ, ఉపాధ్యాయులు భాగస్వాములు కాదా అని ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం వారి సమస్యల పట్ల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయడం లేదన్నారు. జీవో 317 సమస్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా, పూర్తిగా నిరాశపర్చారన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 17న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొని మద్దతును తెలపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళీధర్, రాష్ట్ర బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. 317జీఓపై ప్రభుత్వం స్పందించాలి తపస్ రాష్ట్ర కోశాధికారి భాస్కర్‌దేశ్ -
కనీస వేతనాలు అమలు చేయాల్సిందే
సిద్దిపేటఅర్బన్: కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాల్సిందేనని, ఇందుకు తక్షణం జీఓను విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేటికి ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు, స్కీం వర్కర్లకు జీతాలు పెంచి వారిని ఆదుకోవాలన్నారు. దానికి సంబంధించిన కనీస వేతనాల చట్టాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని అన్నారు. స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. కార్మికుల కష్టంతో వచ్చిన సెస్ డబ్బులను కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలని అన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, జిల్లా కోశాధికారి భాస్కర్, సహాయ కార్యదర్శి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు బాలనర్సయ్య, రంగారెడ్డి, భాస్కర్, షఫిఅహ్మద్, ఎల్లయ్య, భాస్కర్, రాజు, కొమురయ్య, లక్ష్మి, విజయ, రమ పాల్గొన్నారు. తక్షణం జీఓ విడుదల చేయాలి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ -
భాష, భావం ఉన్న రచనలే నిలుస్తాయి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): భాష, భావం కల్గిన రచనలే ప్రజల మనసుల్లో ఎల్లకాలం నిలిచిపోతాయని జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐత చంద్రయ్య అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు రచించిన ‘దృశ్యభాష’ కవితా సంపుటీని ఆదివారం సిద్దిపేటలో జరిగిన జాతీయ సాహిత్య పరిషత్ కార్యవర్గ సమావేశంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కవులు, రచయితలు సంప్రదాయ రచనలతో ముందుకు సాగాలన్నారు. యువత సాహిత్యంవైపు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జాసాప అధ్యక్షుడు ఎన్నవెళ్ళి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం, కోణం పరశురాములు, బస్వరాజ్ కుమార్, చీకోటి రాములు పాల్గొన్నారు.జాతీయ సాహిత్య పరిషత్ నేత చంద్రయ్య -
‘గ్యారంటీ’లతో మభ్యపెడుతున్న కాంగ్రెస్
దుబ్బాకటౌన్: కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గారడీతో ప్రజలను మభ్యపెడుతోందని బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి భూరెడ్డిగారి విభూషణ్ రెడ్డి విమర్శించారు. రాయపోల్‌లో ఆదివారం పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో బూత్ కమిటీలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన అబద్ధాల హామీలతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులను మోసంచేసి విజయోత్సవ సభలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాజాగారి రాజాగౌడ్, మంకిడి స్వామి, నీల స్వామి, సుఖేందర్‌రెడ్డి తదితరులున్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విభూషణ్ రెడ్డి -
రాజ్యాధికారమే లక్ష్యం కావాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు ముందుకు సాగాలని, బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్కండేయ స్వామి భవన్లో నిర్వహించిన బీసీ రాజ్యాధికార సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న దాసు సురేష్, బహుజన ముక్తి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దాసు రామ్ నాయక్, బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రానున్న కాలంలో బీసీలే ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అధిక సంఖ్యలో పోటీ చేసి గెలవాలన్నారు. బీసీలకు మద్దతుగా ప్రచారం చేసి గెలుపు లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వాలు అవలంబించే విధానాలతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేక విధాలుగా నష్టపోతున్నారన్నారు.ఈడబ్ల్యూఎస్‌తో తీరని నష్టం.. బీసీలందరూ కదలాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్నూతనంగా తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బహుజనులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. బీసీ మహిళలకు సబ్‌కోటా లేని మహిళా రిజర్వేషన్లు మాకెందుకు అని ప్రశ్నించారు. బీసీలు ఓటుకు నోటును కట్టడి చేయాలన్నారు. ఇంటికొకరు ఉద్యమిస్తే రాజ్యాధికారాన్ని బీసీలకు బహుమతిగా ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు తరహాలో రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలును రద్దు చేయాలని కోరారు. బీసీలలోని మహిళలు, యువత భారీగా రాజకీయాల్లోకి రావాలన్నారు. కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ ముదిగొండ శ్రీనివాస్, మాజీ సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, ప్రొఫెసర్ కృష్ణ దయాసాగర్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, రాములు, గుండు రవితేజ, వెంకటేశం, శ్రీనివాస్, శంకర్, మార్క శ్రీనివాస్ గౌడ్, కనకయ్య, తోట్ల పరశురాములు, శ్రీశైలం, వివిధ బీసీ కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
రూ.233 కోట్లతో నిర్మాణం
మాజీ సీఎం కేసీఆర్ చొరవ ఫలితంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రింగు రోడ్డు మంజూరైంది. తొలుత రూ.220కోట్ల వ్యయంతో 22కిలోమీటర్ల మేర పనులు 2015లో పనులు మొదలయ్యాయి. 16కిలోమీటర్ల పనులు పూర్తయ్యాక వివిధ కారణాలతో పనులు నిలిచిపోయాయి. రూ.220కోట్ల నిధుల్లో సుమారు 50శాతం వరకు నిధులను ఖర్చు చేసిన కాంట్రాక్టర్ ఆ తర్వాత పనుల నుంచి తప్పుకున్నారు. 2018 డిసెంబర్ 2021 డిసెంబర్లో ఈ పనులను రూ.118కోట్లతో రీ–టెండర్ చేయించి 2022 జనవరిలో పనులను పునఃప్రారంభించింది. ముందుగా చేపట్టిన పనుల వ్యయంతో రింగు రోడ్డు వ్యయం రూ.233కోట్లకు చేరింది. ఈ రింగు రోడ్డు రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దారు. ఒక పట్టణ అవసరాలకు రింగు రోడ్డు నిర్మించడం ఇదే తొలిసారి.గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి కంఠహారంగా నిర్మించిన రింగు రోడ్డుకు ఆటంకాలు తొలుగుతున్నాయి. ధర్మారెడ్డిపల్లి–జాలిగామ గ్రామాల మధ్య పెండింగ్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జి, 1.6 కిలోమీటర్ల రోడ్డు, అప్రోచ్ రోడ్డు పనులు ఎట్టకేలకు కొనసాగుతున్నాయి. సంగాపూర్ రోడ్డు వైపున మరో 200మీటర్ల అనుసంధానం పూర్తి చేయడానికి చొరవ తీసుకోగలిగితే రోడ్డు పూర్తిస్థాయి అనుసంధానం అందుబాటులోకి రానుంది. -
అనుసంధానం.. ఇక వేగిరం
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రింగు రోడ్డు ఇదేరింగు రోడ్డుకు తొలుగుతున్న ఆటంకాలు ● రైల్వే బ్రిడ్జి పనులకు మోక్షం ● 1.6కిలోమీటర్ల మేర సాగుతున్న పనులు ● మరో 200మీటర్ల పెండింగ్‌ను సైతం పూర్తి చేస్తేనే అందుబాటులోకిగజ్వేల్: ఏడాదిక్రితం గజ్వేల్ రింగ్‌రోడ్డు అధికారి కంగా ప్రారంభమైనా.. పూర్తిస్థాయి అనుసంధానం పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఈ రోడ్డు జాలిగామ–ధర్మారెడ్డిపల్లి గ్రామాల మధ్య రైల్వే బ్రిడ్డి పెండింగ్‌లో ఉన్న కారణంగా 1.6కిలోమీటర్లు అనుసంధానం ఆగిపోయింది. బ్రిడ్జితోపాటు అప్రోచ్, సర్వీసు రోడ్లను పూర్తి చేయడానికి రైల్వేశాఖ ఇటీవలే పనులు చేపట్టింది. ఎన్నో ఏళ్లుగా రింగు రోడ్డు పూర్తిస్థాయిలో వినియోగానికి రాకుండా అడ్డంకిగా మారిన రైల్వే బ్రిడ్జి పనులు సాగుతుండటం కీలక అడుగుగా భావించవచ్చు. ఈ అంశంపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించడం అధికారుల్లో చలనం తెప్పించింది. ఇకపోతే సంగాపూర్ రోడ్డు గజ్వేల్ పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద 200 మీటర్ల మేర అనుసంధానం కూడా ఇంకా పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ పనులను సైతం పూర్తిచేయడానికి చొరవ చూపగలిగితేనే పూర్తి స్థాయి అనుసంధానం జరగనున్నది. ఈ దిశగా అధికార యంత్రాంగం కృషి చేయాల్సి ఉన్నది. అంతర్జాతీయ ప్రమాణాలు.. ఈ రోడ్డుకు అంతర్జాతీయ ప్రమాణాలద్దారు. రింగు రోడ్డుకు అనుసంధానంగా మరో నాలుగు రేడియల్ రోడ్లు 12.5కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. మరెన్నో ప్రత్యేకతలను ఈ రోడ్డు సొంతం చేసుకున్నది. మొత్తం 12 సర్కిళ్లతో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. రింగు రోడ్డు నిర్మాణం వల్ల గజ్వేల్–ప్రజ్ఞాపూర్ పట్టణం చుట్టూ ఉన్న రోడ్డుకు వెలుపలు, బయట భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఈ రోడ్డును ఆనుకొని విల్లాలు, అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రోడ్డు అనుసంధానం వందశాతం పూర్తయితే మున్సిపాలిటీ మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి బాటలు పడనున్నాయి. -
సింగర్ శంకర్‌బాబుకు సన్మానం
హుస్నాబాద్: పుష్ప 2 సినిమాలో పాట పాడిన సింగర్ బత్తుల శంకర్‌బాబును జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి ఘనంగా సన్మానించారు. ఆదివారం రాత్రి పట్టణంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన శంకర్ బాబు వందలాది జానపద పాటలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమాలోనూ ‘పీలింగ్స్’ అనే పాట పాడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సన్మానం సందర్భంగా కేడం లింగమూర్తి మాట్లాడుతూ పాటే ప్రాణంగా ఎన్నో పాటలు పాడిన శంకర్‌బాబు ఎంతోమంది అభిమానులను పొందారని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చిత్తారి పద్మ, మాజీ ఎంపీటీసీ ఎండీ హస్సేన్, న్యాయవాది చిత్తారి రవీందర్, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కళాకారులు పాల్గొన్నారు. కార్యకర్తల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిగజ్వేల్: కార్యకర్తల సంక్షేమంపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించిందని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. వారం రోజుల క్రితం పట్టణంలోని పదో వార్డుకు చెందిన చిక్కుడు కిరణ్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆదివారం బాధిత కుటుంబీకులకు పార్టీ తరపున రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును ప్రతాప్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా నిలుస్తోందని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో 97,500 పార్టీ సభ్యత్వాలు కలిగిన పార్టీ ఇప్పటివరకు 380 మృతుల కుటుంబాలకు రూ.7.6కోట్ల ప్రమాద బీమా చెక్కులను అందజేసిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య పారాయణం.. భక్తిపారవశ్యం వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం అర్చనలు, పారాయణాలతో అలరారింది. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఆలయ మండపంలో వేదపండితులు నిర్వహించిన ఆదిత్య హృదయ పారాయణం, సామూహిక కుంకుమార్చనలో భాగస్వాములయ్యారు. ఈఓ అన్నపూర్ణ పర్యవేక్షణలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. పర్యాటక కేంద్రంగా ‘సింగూరు’ మంత్రి దామోదర రాజనర్సింహ పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రం (టూరిజం హబ్)గా మారుస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం ప్రాజెక్టును ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా అక్కడి స్థలాలను పరిశీలించారు. ప్రాజెక్టు నీటి మధ్య భాగంలో ఉన్న పడకంటి గడ్డపై టూరిజం అభివృద్ధి చేయడానికి అనుకూలంగా ఉంటుందా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం మత్స్యకారుల సమస్యలపై ఆరా తీశారు. అయితే సింగూరు కాలువలు పూర్తయి దశాబ్దం గడిచినా వాటికి సిమెంట్ లైనింగ్ చేయలేదు. మంత్రి దామోదర చొరవతో కాలువలకు సిమెంట్ లైనింగ్ చేయడానికి రూ.160 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులను శంకుస్థాపన చేయడానికి స్థలాన్ని పరిశీలించారు. వచ్చే ప్రజలకు వసతుల కల్పనపై నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. -
ముంచెత్తిన వాన
● జిల్లాలో భారీ వర్షం ● కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం ● పలు చోట్ల నేలవాలిన పంటలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. శనివారం అర్ధరాత్రి, ఆదివారం ఉదయం, సాయంత్రం వేళ కురిసిన వర్షానికి అపార నష్టం వాటిల్లింది. దుబ్బాక నియోజకవర్గంలోని కొనుగోళ్ల కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం రాశులు తడిసిముద్దయ్యాయి. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటం వల్లే ఈ తిప్పలు అంటూ వాపోయారు. కోహెడ మండల కేంద్రంలో మొక్కజొన్న పంట నేలవాలింది. సుమారు 25 ఎకరాలలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. అక్కన్నపేటలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందళనకు దిగారు. టార్పాలిన్లు సరఫరా చేయకపోవడం, కొనుగోలు సకాలంలో జరగకపోవడంతో ధాన్యం తడిసి తీరని నష్టం జరిగిందని తెలిపారు. – దుబ్బాక/అక్కన్నపేట, కోహెడ(హుస్నాబాద్): -
మల్లన్నకు పట్నాలు.. భక్తుల మొక్కులు
రాజగోపురం ఎదుట భక్తుల సందడికొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గంగిరేణు చెట్టు వద్ద ముడుపులు కట్టారు. పట్నాలు వేసి మొక్కులు చెల్లించారు. కొంతమంది భక్తులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్ల దుర్మరణం
గజ్వేల్‌రూరల్: మారథాన్ పోటీలో పాల్గొనేందుకు వెళుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకుంది. హిట్ అండ్ రన్ ఘటనతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద విషాదకర వాతావరణం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన వర్కల్ పరంధాములు(46) రాయపోల్ ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, గాడిచర్లపల్లికి చెందిన పూసల వెంకటేశ్(38) దౌల్తాబాద్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు హైదరాబాద్‌లోని ఈసీఎల్ ప్రాంతంలో మారథాన్(రన్) కార్యక్రమం ఉండడంతో వీరు ఆదివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.ఈ క్రమంలో పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు మార్గంలో రాంగ్రూట్లో వెళుతుండగా, ఇదే సమయంలో గజ్వేల్ నుంచి దౌల్తాబాద్ వైపు వెళుతున్న బొలెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు హెల్మెట్లు ధరించినా, తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మరణవార్త తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విచారకరమని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణంలోనూ వీడని స్నేహం: మరణంలోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ మృతుల కుటుంబసభ్యులు చెప్పారు. పరంధాములుది 2004 బ్యాచ్ కాగా, వెంకటేష్ 2007 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఎక్కడ మారథాన్ పోటీలు జరిగినా పోలీస్‌శాఖ తరపున వెళ్లి పాల్గొనే వారని తోటి పోలీసు సిబ్బంది పేర్కొన్నారు. పోలీస్‌శాఖలో మారథాన్ పోటీల్లో పాల్గొనేవారు ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో సభ్యులుగా ఉన్న వెంకటే‹Ù, పరంధాముల మధ్య స్నేహం ఏర్పడింది. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌తోపాటు ముంబయి, న్యూఢిల్లీలో సైతం జరిగిన మారథాన్ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందారని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
అసెంబ్లీలో రేవంత్ సర్కార్‌ను నిలదీస్తాం: కేటీఆర్
సాక్షి, సిద్ధిపేట: రైతుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గురుకులాల్లో ఉన్న దుర్భర పరిస్థితులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ రిపోర్ట్ ఇచ్చామన్నారు. రైతులపై దాడి చేస్తూ భూములు లాక్కుంటూ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.‘‘మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అత్యంత మూర్ఖంగా, అనాలోచితంగా చరిత్ర గురించి తెలియకుండా ఏర్పాటు చేస్తున్న విగ్రహం గురించి పోట్లాడతాం. మోసాలు, అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై నిలదీస్తాం. రాష్ట్ర ప్రజల గొంతుకై తెలంగాణ సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం. అరకొరగా రుణమాఫీ చేశారు. కొనుగోలు కేంద్రాలు సరిగా నడపలేని పరిస్థితి. విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మరోసారి మోసం చేస్తోంది ’’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.రేపటి నుంచి (సోమవారం) నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ శాసనసభా పక్ష భేటీ జరిగింది. ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుమారు వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు సోమవారం బీఏసీ సమావేశంలో ప్రతిపాదించే ఎజెండా ఆధారంగా తమ వ్యూహానికి పదును పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. -
TG: హిట్ అండ్ రన్.. ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి
సాక్షి, గజ్వేల్: తెలంగాణలో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందారు. మృతిచెందిన కానిస్టేబుళ్లను పరందాములు, వెంకటేశ్‌గా గుర్తించారు.వివరాల ప్రకారం.. సిద్దిపేట-జాలిగామ బైపాస్‌లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుళ్లను పరందాములు, వెంకటేశ్‌గా గుర్తించారు. వీరిలో పరందాములు రాయపోలు పీఎస్‌లో, వెంకటేశ్ దౌల్తాబాద్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, వీరిద్దరూ మారధాన్ కోసం వెళ్తున్నట్టు తెలిసింది. -
No Headline
కాంగ్రెస్ పాలనలో పడకేసిన ప్రగతి ● 6 గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం.. ● 365 రోజులు దాటినా అమలుకాని హామీలు ● కొత్తవి ఇవ్వకపోగా.. పాతవి రద్దు ● నిలిచిపోయిన రూ.875 కోట్ల పనులు ● సిద్దిపేట వెటర్నరీ కొడంగల్‌కు తరలింపు ● ఏడాది ప్రజాపాలనపై ‘సాక్షి’తో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు -
కారుణ్య నియామకాల కోసం వినతి
గజ్వేల్‌రూరల్: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) వ్యవస్థలో 61 ఏళ్లు పైబడిన వారి వారసుల కారుణ్య నియామకాలు చేపట్టి ఆదుకోవాలని పలువురు వీఆర్ఏలు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గజ్వేల్‌లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి విద్యార్హతను బట్టి వివిధ శాఖలకు కేటాయించిందని గుర్తుచేశారు. 61 ఏళ్లు పైబడిన వారసుల నియామకాలు జరపకపోవడంతో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంకా 3,797 మంది వీఆర్ఏలకు ఎలాంటి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొన్నారు. అందులో 265 మంది మృతి చెందారని తెలిపారు.దీక్షలో వీఆర్ఏల సంఘం నాయకులు నీరుడి నర్సయ్య, వెంకటయ్య, ఐలయ్య, భిక్షపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన సిద్దిపేటరూరల్: తమను రెగ్యులర్ చేసి పేస్కేలు వర్తింపజేయాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద శనివారం నిరసన దీక్ష చేపట్టారు. తమను విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిషన్ డిమాండ్ చేశారు. ప్రతీ ఉద్యోగికి జీవిత బీమా రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా రూ.10లక్షల సౌకర్యం కల్పించాలన్నారు. పదవీ విరమణ చేస్తే రూ. 10లక్షలు ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. అట్రాసిటీ కేసుల్లో 41 సీఆర్పీసీని వర్తింపజేయుద్దు గజ్వేల్: అట్రాసిటీ కేసుల్లో 41 సీఆర్పీసీని వర్తింపజేయొద్దని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) విజ్ఞప్తి చేసింది. శనివారం న్యూఢిల్లీలో కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యాను వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, జాతీయ కార్యదర్శి పి.శంకర్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు ఒకవైపు పెచ్చరిల్లుతుండగా, స్టేషన్ బెయిల్ తీసుకునే అవకాశం లభించడంతో నిందితుల ప్రవర్తనలో మార్పు ఉండటం లేదన్నారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీయవద్దని కోరారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం: సీపీ సిద్దిపేటకమాన్: డ్రగ్స్ రహిత జిల్లా గురించి ప్రతిఒక్కరూ సహకరించాలని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో పోలీసు కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రికవరీ చేసిన ప్రాపర్టీ కేసులు, ప్రజలకు అందించిన సేవల గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 1500మంది విద్యార్థులు పలు రకాల ఆయుధాలు, సీసీ కెమెరాలు, స్పీడ్ లేజర్ గన్ పనితీరు, ట్రాఫిక్ రూల్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్, డాగ్ స్క్వాడ్, సైబర్ క్రైమ్ తదితర స్టాల్స్‌ను ఏర్పాటు చేసి పోలీసు సిబ్బంది అవగాహన కల్పించారు. విద్యార్థులకు, మహిళల రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించామని సీపీ అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి డయల్ 100, సైబర్ నేరం జరగగానే 1930 టోల్ ప్రీ నంబర్ల గురించి అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాశ్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ మధు, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌గౌడ్, టూటౌన్ సీఐ ఉపేందర్, త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.