Funday
-
యువ కథ: సిల్లు పడ్డ సీర
‘వురెయ్ బామ్మర్ది ఇయ్యాలేటో వొల్లంత పచ్చి పుండు నాగుందిరా’ అప్పుడే నిద్రలేచొస్తూ అన్నాడు ఆదిబాబు. గుమ్మంలో తాపీగా చుట్ట కాల్చుకుంటున్న వీరయ్య ‘ఆ.. నిన్నంతా పనుల్తోటి అలిసిపోయినావు కద బావా. మరామాతరం సలుపులుంటాయినే’ అన్నాడు. ‘ఆ.. అంతేలాగుందిరా బాబూ. ఒలే! బూలచ్చిమి.. బూలచ్చిమీ..’ ఆమె పలికే వరకూ పిలుస్తూనే వున్నాడు ఆదిబాబు. ‘ఆ’ అరిచినట్టే పలికింది భూలక్ష్మి. ‘యేడి నీలెట్టే సానం సేత్తాను’ అని ఒక కేక పెట్టాడు. ‘నానంత కాలీగేటి నేను. నువ్వేల్లెట్టుకో’ లోపల నుంచి విసురుగా సమాధానం వచ్చింది. ‘ఆ.. యేటి దీని తల పొగరూ’అనుకుంటూ పక్కనే వున్న వీరయ్య వైపు చూసి ‘అదేట్రా మీయప్ప తెల్లారికే అలాగరత్తంది. లెగిసాకా కూడా సుసేను.. యేటో సెత్రువుని సూసినట్టు సూసింది. యేతంతావు కారనవు?’ అడిగాడు. వీరయ్య సన్నగా నవ్వుతూ ‘యేటి బావ నిన్న వొచ్చినోలు దెగ్గర యెతేన నాగేవేటి పేకాట్ల’ అని రహస్యంగా అడిగాడు. అడ్డంగా తలాడిస్తూ ‘మీయప్ప వల్ల సుకం నేదు నాకు. ఆగు ఇప్పుడే వత్తాను’ అంటూ లుంగీ ఎత్తి పట్టి నడుముకి చుట్టుకుంటూ పక్కనున్న సందు వైపు నడిచాడు ఆదిబాబు. అక్కడ ప్లాస్టిక్ బకెట్‌లోని నీళ్లని మొహం మీద జల్లుకుని, పుక్కిలించి ఉమ్మి, గూట్లో వున్న వేపపుల్లని నమిలి పిప్పిచేసి వదిలాడు. దండెం మీద తువ్వాలు కోసం వెదుకుతూ ఆ దండెం మీదే ఆరేసున్న చీరని పరిశీలనగా చూస్తూ నిలబడిపోయాడు. ‘బావా.. ఇగో తువ్వాలు’ పిల్చాడు వీరయ్య. ఆ పిలుపు వినబడనట్టే ఉండిపోయాడు ఆదిబాబు. అతని బుర్రలో వేల ప్రశ్నలు. ‘యేటలగ కొయ్యలాగ కదలడు’ అనుకుంటూ ఆదిబాబు దగ్గరకు వెళ్ళాడు వీరయ్య. ‘అలగ వుండిపోనవు యేటైంది బావ’ అడిగాడు. ‘యేటి నేదురా.. ఈ సీరేటి ఇక్కడుందని సూత్తన్ను. ఇది మాయమ్మ సిర.. దీన్ని ఇక్కడెవులు యేసేరూ?’ తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు అన్నాడు. వీరి అదో పెద్ద విషయమే కాదన్నట్టు మొహం పెట్టి ‘నిన్నే కదేటి బావా! మీయమ్మ సవస్రికవైంది. యేదో అవస్రానికి తీసుంతారు’ అన్నాడు. ‘ఎంత అవసరం వుంతే మాత్రం పెట్టెలున్న అడుగు సీరే తియ్యల? ఇగో సూడు ఈ సీరకి పెద్ద సిల్లు కూడా పడింది. ఒలే బూలచ్చిమీ.. బూలచ్చిమీ’ భార్యని ఏకధాటిగా పిలవడం మొదలుపెట్టాడు. వెంటనే వీరయ్య కంగారుగా ‘ఇప్పుడు దాన్నేల పిలత్తన్నవు బావా పల్లకో’ అన్నాడు. ‘మాయమ్మకి ఇట్టవైన సీరరా ఇది. దాని గేపకంగా దాసుకున్నాను. దాన్నిప్పుడు బైటకి నాగే అవసరం యేటొచ్చింది. దానిక్తోడు ఈ సిల్లోటి. ఇంత నిర్లక్సం యేటి దానికి’ అంటూనే కోపం ఆపుకోలేక మళ్ళీ పిలిచాడు ‘ఓలి బూలచ్చిమీ! ఇనబడట్నేదేటే’ ఈసారి అతని కఠం ఖంగుమంది.ఆ అరుపులని ఆదిబాబు గోలని గమనిస్తున్న భూలక్ష్మి నిదానంగా వచ్చి గుమ్మంలో నిలబడింది. ఆమె ఎప్పట్లా లేదనిపించింది అతనికి. బెదురు చూపులకి బదులు తెగింపు ఆమె కళ్ళలో. అలా తనని చూడగానే అడగడానికి లక్ష ప్రశ్నలున్నా వాటన్నింటినీ మర్చిపోయాడు ఆదిబాబు. భూలక్ష్మి కాసేపు అతన్నే తేరిపార చూసి, నిదానంగా అడిగింది ‘యేటి నీ కాకి గోల?’ ఆ మాటకి ఆదిబాబు కోపం నషాలానికెక్కింది.‘ఈ సీర బైటకెలగొచ్చింది?’ భూలక్ష్మి మొఖం చిట్లిస్తూ ‘ఏమో నాకేటి తెలుసు?’ అంది. ‘ఏటే ఆ సమాదానము.. ఈ ఇంట్ల యెంతమంది వున్నారు వచ్చి తీసీడానికి. వున్నదే మనిద్దరం. తీత్తే నువ్వు తియ్యాలి లేదంటే నాను తియ్యాలి. సక్కగ సెప్పు యెలా తీసేవో’‘ఏటి యకసెక్కాల గుందా? నాకు తెలీదని సెప్తున్ను కదా! నిన్న ఇల్లంతా సుట్టాలే! ఎవులు తీసేరో? యానికి తీసేరో?’ అంది. ‘యెంత నిర్లక్సమే నీకు. మాయమ్మ సీర, దానికి ఇట్టవైన సీర.. దాని గేపకార్దం నాను దాసుకుంటే దాన్ని బైటికి నాగిందే కాకంట దానికి సిల్లు కూడ యెట్టారు. ఇది ఎవులు ఎందుకోసం సేసేరో నాకు తెలిసీవరకు నేనొగ్గను’ తెగించినట్టే అన్నాడు ఆదిబాబు.భూలక్ష్మి చీర కొంగును బొడ్డులో దోపుకుంటూ ఇంటి గుమ్మం దాటి బైటకొచ్చింది. ‘యేటేటి.. మల్లి సెప్పు. ఈ సీరంటే నీకిట్టవా.. దీన్ని మీయమ్మ గేపకంగా దాసుకున్నవా.. ఓలమ్మొ ఓలమ్మో నాను ఎంత గుడ్డిదాన్ని.. నా మొగిడి గొప్ప హుదయం సూడలేకపోన్ను. ఎప్పుడూ తాగుబోతు నా కొడుకని తిట్టుకునీదాన్ని గానీ ఇంత గొప్పోడని తెలిత్తే దండేసి దండవెట్టీకపోనా’ అంది నాటకీయంగా చేతులు తిప్పుతూ. ఆమె ఉద్దేశం అర్థమైన ఆదిబాబు ‘నంగనాసిదానా నాటకాలాపే నీయమ్మ.. ఒల్లెలగుందే’ అన్నాడు ఆమె పైపై కెళ్తూ.‘నేకపోతే ఏట్రా సెత్తనాకొడకా... పెపంచకంలో నీదే గొప్ప పేమ అన్నట్టు హెచ్చులు పోతన్నవు. నువ్వడిగేవి దిక్కుమాలిన పెస్నలు. మల్లీ దానికో సమధానం కూడా సెప్పాలా..థూ’ ఆవేశంతో వూగిపోయింది. ‘అవునే సెప్పాలి. నువ్వు మగా ఇల్లాలివని నీ పీలింగ్ కదా.. ఇందల సూపించే నీ ఇల్లాలితనం. ఇంట్ల యేటి జరుగుతందో ఎవరేటి తీస్తన్రో తెలీకుండా బతకతంది.. ఇదొక ఇల్లాలు... దీనికో సపోర్టు’ఆ మాటకి భూలక్ష్మి నవ్వీ ‘పోనీ నానైతే మగా ఇల్లాలిని కానులే. నువ్వయితే గొప్ప ఈరుడివి కదా.. మరి నువ్వు కానుకోలేకపోనవా ఆ సీర ఎవులు తీసేరని. నీకు ఈ సీర మీదున్న ఇట్టానికి అలగ దాని ముందే కూకోలేకపోనవా? దాన్ని నీ బుర్రమీదెట్టుకొని వూరేగలేకపోనవా?’ అంది భూలక్ష్మి. ఆదిబాబుకి రోషం పొడుచుకొచ్చింది. ‘ఒలే నన్ను రెచ్చగొడితే మనిసిని కాను..’ చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. ‘నువ్వెలగు మనిసివి కాదన్న ఇసయం నాకు తెలుసులే ఇంక పల్లకో. మీయమ్మ బతికున్నప్పుడు సక్కగ సూసుకోడం సేతగానేదు గనీ ఇప్పుడేదో పేమ కారిపోతన్నట్టు గుండైపోతండు’ అందామె గుమ్మంలో వున్న అరగుపైన కూర్చుంటూ. ‘మగాడి పేమలన్నీ బైటికి అగుపిత్తాయేటే.. మనసులుంటయి గనీ’ ఆమెకు దగ్గరగా వెళ్తూ అన్నాడు ఆదిబాబు. ‘ఆ.. పేమొకటే దాసుకున్నవా.. యేరే రగస్యాలు కుడా దాసినావా ఆ మనసలా’ ఆమె గొంతులో వెటకారం ధ్వనించింది. ఆదిబాబూ ఆవేశంగా ముందుకు ఊరికాడు. ‘లక్స తొంబై దాసుకుంతానే నీకెందుకు? ముందీ సీర ఇసయం తేల్సు’ అంటూ ఆమె దగ్గరకి వెళ్ళబోతుంటే వీరి అడ్డుపడ్డాడు. ‘యేట్రా నీ గోల. ఆడోలు సీర్లు ఎందుకు తీత్తారు కట్టుకోడానికి తీత్తరు. అదెంత పాత సీరో కట్టుకోబోతే పుసుక్కున సిరిగుంటది. ఇంత సిన్న ఇసియానికా యానికలగ రంకె లేత్తన్నవు’ చిరాకుగా మొఖం పెడుతూ అంది.ఆమె చిరాకు అతడికి ధిక్కారంలా తోచింది. అవమానంతో గుండె భగ్గున మండింది. ఏం మాట్లాడాలో అర్థంకాక మౌనంగా వున్నాడు. కాసేపటి తర్వాత ‘యేవి ఈ ఆడోలికి సీర్లే కరువైపోనాయా. మాయమ్మ సీరే కావల్సొస్సిందా?’ అని అనగలిగాడు. అది కూడా వీరయ్య వైపు చూస్తూ. ‘యేటి రా నాయన. మీ యమ్మ సీరలోనున్న మగత్యవు. ఏటి దాసిస్సేవేటి ఈ సీరల ఇలగ గింజీసికుంతన్నవు’ భూలక్ష్మీ తగ్గలేదు. ఆదిబాబు నీళ్ళు నమిలాడు. అతనేం చెప్తాడా అన్నట్టు ఎదురు చూశాడు వీరయ్య. భూలక్ష్మి భర్తలో మారే రంగులను చూస్తూ ‘యేటాది బాబు.. పలకవు సెప్పు..’ రెట్టించింది.ఆదిబాబు తెగించాడు. ‘యేటి సెప్పాలే. నిజం తెలిసిపోనాక ఇంకేటి సెప్పాలి. నువ్వే ఆ సీర తీసేవ్. యానికో కూడా నాకు తెలుసు’ అని ఆగి, ‘దీనికి ఇసయం తెలుసని అరదమైపోనాది. మరి నేనెలా సెప్పాలి? దాన్నె ఇరకాటంల యెట్టి సెప్పిత్తాను’ అనుకుని, ‘మా యమ్మ మీద కోపంతో నువ్వే ఆ సీర సింపీసినావు. యేరు దాటాక తెప్ప తగలేసే రకవే నువ్వు. అది తెలక ఆ ముసిల్ది నీకు సపోర్టు సేసింది’ కసిగా అన్నాడు. అతను విషయాన్ని ఎలా నరుక్కొస్తున్నాడో అర్థమైంది భూలక్ష్మికి. అతని నోటి నుంచి నిజం రాదని గ్రహించి, తన వ్యూహాన్ని రచించింది. ‘మీయమ్మతో ఏ నాడైన పేమగ మాటాడేవా నువు? అదే సేసుంటే నాకెలా సపోర్టు సేస్తది మీ యమ్మ?’ ‘ఎదో మందెట్టుంటావు’ టక్కున అన్నాడు. ‘ఓలమ్మ నాను మందెట్టీసినానట. ఈలమ్మని పొట్టనెట్టుకుంది ఈడు.. సుట్టు తిరిగి నన్నంతండు’ అంది భూలక్ష్మి అతడి అహాన్ని దెబ్బకొడుతూ. అది చీర విషయంగా రేగిన గొడవలా ఇంకెంతమాత్రం అనిపించలేదు వీరయ్యకి. చుట్టూ జనం గుమిగూడారు. పొద్దున్నే భార్యభర్తల గొడవ భలే రంజుగా వుంది వాళ్ళకి. మాటలు కరువైన ఆదిబాబు ‘ఇదో బూలచ్చిమి.. పోన్లే కదని వూరుకంటంటే పెట్రేగిపోతనవు. మాయమ్మని నేను పొట్టనెట్టుకోడవేటే?’ అన్నాడు. ‘సిక్కింది సేప’ అనుకుంది భూలక్ష్మి. ‘నేనండవేటి వూరు వూరే అంతంతే.. కాలంటే ఇలందరి నుండి సాచ్చకం తీసుకొత్తాను’ అంది. ‘నీ సాచ్చకాలేటి నాకక్కర్నేదు. అది నా తల్లే. నేనేటైన సేసుకుంతాను నా ఇట్టం. నీకేటి మజ్జిల’ ఆవేశంతో అతని గొంతు వణికింది. ‘ఇంత తెగించీసినోడివి మరి నీకేల ఈ సీర ఇసయం. అది సిరిగిపోతే నీకేవి అరిగిపోతే నీకేవి’ మళ్ళీ తిరిగి విషయాన్ని అక్కడికే తీసుకొచ్చింది భూలక్ష్మి. ‘నీయమ్మ ఎంత పొగరే నీకు’ అంటూ పైపై కొచ్చాడు ఆదిబాబు. ‘యేటి కొడతావా? కొట్టు. నువ్వేనేటి నేనూ సెయ్యగలనా పని’ అంటూ భూలక్ష్మి ఓ మూలనున్న రోకలి తీసుకొని వచ్చింది. అదంతా చూస్తున్న వీరయ్య కంగారుగా వాళ్ళ మధ్యలో దూరి ‘సుకంగుండడం సేతకాదేటి మీకు? సిన్న సీరముక్క కోసం గొడవలు పడుతన్రు’ అన్నాడు. ఆదిబాబు కోపంతో బుసలు కొడుతున్నాడు. ‘ఇసయం సీర కాదురా ఈరీ.. ఆడి గొడవ సీర కోసం అంతకన్నా కాదు. ఆ సీరలో దాసిపెట్టిన ఆత్తి పత్రాలేవి అని అడగలేక ఈ బాద’ అంది భూలక్ష్మి. అందరూ ఆశ్చర్యపోయారు. ‘ఏటవుతుంది బావా ఇక్కడా.. ఆత్తి పత్రాలేటి దాన్ని దాసిపెడ్డం యేటి.. ఈ గోలేటి?’ అడిగాడు వీరి. దానికి సమాధానం ఎం చెప్పాలో తెలియక ఉక్రోషం ఆపుకోలేక భూలక్ష్మిని కొట్టడానికి వురికాడు ఆదిబాబు. ‘ఇద ఈ పాపిట్టిదాన్వల్లే నా బతుకిలగ అయ్యింది. నా ఆత్తి మీద నాకు అక్కు లేకుండ సేస్సేవు కదే దొంగ ముండా’ అంటూ ఆమె చెంపల మీద ఆపకుండా కొట్టాడు. చుట్టూ వున్న వాళ్ళు బలవంతంగా అతన్ని వెనక్కి లాగి ఆమె దగ్గరకు వెళ్ళకుండా శక్తి కొలది పట్టుకున్నారు. భూలక్ష్మి వాచిన చెంపలను తడుముకోకుండా రేగిన జుట్టును సర్దుకోకుండా అలాగే ఆదిబాబును చూస్తూ వుంది. ‘అప్ప ఇద.. ఈ నీలు తాగు’ అని నీళ్ళందించాడు వీరయ్య. వెంటనే అతడి చేతిలో వున్న గ్లాసుని విసురుగా తీసుకొని బలంగా నేలకేసి కొట్టింది. ‘నా మీద నీ పెతాపం సుపిత్తే యేడుసుకొని మూల కూకున్న రోజులు పోనాయి. నువ్వేటో వూడబొడుత్తవని లక్సలు పోసి కట్టబెట్టారు మాయమ్మోల్లు. నువ్వా పైసాకి పనికి రానోడివి. నా కట్టం తిని నన్నే తన్నెవోడివి. మీయమ్మ సచ్చిపోయాక కనీసం దాని సావుకి కారనం కూడ అడక్కండా డవిరెక్టుగ ఆత్తి ఇవరాలు అడిగినోడివి. తూ నీ బతుకు! ఇదో అందరినండి. యేదో ఆలమ్మ మీద పేమ కారిపోతున్నట్టు అంతెత్తున ఎగిరి పడతన్డు గనీ ఆయమ్మ బతికున్నపుడు ఒక్కరోజు కూడా ఈడు పేమగా సూసింది లేదు. దాని ఆస్పెత్రి కర్సులకి దాసుకున్న డబ్బులు కూడా తీస్కెలి తాగిన తాగుబోతోడీడు. దాని శవం కాడికి కూడ తాగేసొచ్చిన యదవ. ఇంత కాత్ర లేనోడికి ఆయమ్మ ఆత్తెలా రాత్తది? అందికే పోయే ముందే పెద్దోల్నెట్టి ఆయమ్మ కూతురు పేర్న నా పేర్న దానికున్నదంతా ఇచ్చీమని యీలునామా రాయింసింది. ఆ యీలునామాని సింపిసినాడీ బాడుకోవు. ఇప్పుడీ ఆత్తి పత్రాలు దాసీసి ఆత్తికి అక్కుదారుడైపోదమని ఈడి ఆలోసన. ఆడముండలం మాకు ఆత్తంత వచ్చీసినాదని ఈడీ యేడుపు. ఇప్పుడు సెప్పండర్రా ఆ పత్రాలని ఈడికి తెలకుండా తీసీడం తప్పా’ అంటూ బలంగా ఊపిరి పీల్చుకుంది భూలక్ష్మి. ఎటు పోయి ఎటొస్తుందోనని జనం మెల్లగా జారుకున్నారు. వీరయ్య ఆ మొగుడూ పెళ్లాలను చూస్తూ నిలుచున్నాడు. ఏవేవో ఆలోచనలు బుర్రలో సుడులు తిరుగుతుండగా ఆదిబాబు ‘మీకు సాచ్చకాలే లేవు. సింపీసిన ఈలునామ వొట్టుకొని యే కోరుటుకెల్తారు. ఒకేల యెల్లినా గెలిసేది నాయవేనే. అది నా కాడుంది గుర్తెట్టుకో’ అన్నాడు. ‘ఏటా నాయం.. తాగీసొచ్చి ఒల్లు పై తెలీకండా తల్లిని, ఆలిని సితకబాదడవా? ఆడోల కట్టం మీద తిని తొంగోడవా?’ సూటిగా చూస్తూ అడిగింది భూలక్ష్మి.‘ఇయ్యనిటి కన్న పెద్ద అర్గత.. నాను మగాడ్నవ్వడవేనే..’ ఆదిబాబు స్వరంలో గర్వం. అతడి వైపు అసహ్యంగా చూసి ‘తూ! మగాడివైపోతేటిరా ఆరతట్టాలా? నువ్వు మాలాటి మడిసివే గుర్తెట్టుకో. అయినా పుట్టకలో మగాడివైపోతే సరిపొద్దేటి. గునంలో నవ్వక్కర్నేదా?’ అందామె. బుసలు కొడుతూ ఆదిబాబు జారిపోతున్న లుంగీని బిగించి కట్టుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. ఏ అఘాయిత్యం చేస్తాడోనన్న భయంతో వీరయ్య అక్క దగ్గరకొచ్చి ‘ఓలే బావా యెలిపోతున్నాడే’ అన్నాడు కంగారుగా. ‘యెల్లని ఆడేటి సెయ్యినేడు.. తాగి తొంగుంటే ఆడి ముడ్డి, మూతి కడిగి పెతిరోజు జెబ్బలరిగిపోయినట్టు పనిసేసేది నానైతే యేటి సెయ్యనోడికి ఆత్తేటి. మల్లి ఇదే నాయవని ఆడు ఇర్రీగడవేటి. ఆడాలికి ఆత్తి ఎందుకొద్దు. అది ఆల్ల అక్కు కాదా? అక్కులు ఎవరియ్యరట. మావే పోరాడి లాక్కోలట. ఇప్పుడు అదే కదా సేశాను. ఇక పైన కూడ అదే సెయ్యాలి. సేత్తను..’ అంది భూలక్ష్మి స్థిరంగా. వింటున్న వీరయ్యకి ఏదో సత్యం బోధపడ్డట్టు కళ్ళు విశాలమయ్యాయి. -
రావణుడి పరాజయం
కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతులు ఉండేవి. అందువల్ల అతడు సహస్రబాహు అర్జునుడిగా ప్రసిద్ధి పొందాడు. పదితలలు గల రావణుడు దశకంఠుడని ప్రసిద్ధి పొందాడు. అప్పటికే దేవతలను జయించిన విజయగర్వంతో ఉన్న రావణుడు కార్తవీర్యార్జునుణ్ణి జయించాలని తలచి, సైన్యాన్ని వెంటబెట్టుకుని, కార్తవీర్యార్జునుడి రాజధాని అయిన మహిష్మతీపురానికి బయలుదేరాడు.మహిష్మతీ నగరానికి చేరువలో, నర్మదా నది ఒడ్డున రావణుడి సైన్యం విడిది చేసింది. ఎదుట నర్మదా నది కనిపించడంతో నదీస్నానం చేసి, శివార్చన చేయడానికి రావణుడు సమాయత్తమయ్యాడు. నది ఒడ్డున ఇసుకలో బంగారు శివలింగాన్ని ఉంచి, స్తోత్రాలు పాడుతూ, నర్తిస్తూ శివార్చన చేయసాగాడు. ఇంతలో నర్మదా నది ఉప్పొంగి, నదీజలాలు ఎదుటికి ప్రవహించసాగాయి. నెమ్మదిగా శివలింగాన్ని ముంచెత్తడం ప్రారంభించాయి. ఈ పరిణామానికి రావణుడు చకితుడయ్యాడు.‘వానా వరదా లేకున్నా, నది ఉప్పొంగి నీరు ఎందుకు ఎదుటికి ప్రవహిస్తోంది? నదిలో ఏం జరుగుతోంది? చూసి, తెలుసుకుని రండి’ అంటూ రావణుడు తన భటులను పంపాడు.నదిలో కార్తవీర్యార్జునుడు తన భార్యలతో కలసి జలక్రీడలాడుతున్నాడు. అతడు తన వెయ్యి చేతులతో నది ప్రవాహాన్ని అడ్డుకోవడంతో నది ఉప్పొంగి ఎదుటికి ప్రవహిస్తోంది. రావణుడి అనుచరులు ఈ దృశ్యాన్ని చూసి, రావణుడికి చెప్పారు.రావణుడు సైన్యాన్ని సిద్ధం చేసుకుని, నర్మదా నది ఒడ్డుకు వెళ్లాడు. అక్కడ కాపలాగా కార్తవీర్యార్జునుడి మంత్రులు కనిపించారు. ‘రణరంగ శూరుడైన రావణుడు యుద్ధానికి వచ్చాడని మీ రాజుకు చెప్పండి’ అని వాళ్లతో అన్నాడు.‘యుద్ధానికి మంచి సమయాన్నే ఎంచుకున్నావే! రాజు జలక్రీడలాడుతుండగా, ఎవరైనా యుద్ధానికి పిలుస్తారా? నీ చేతులకు అంత తీటగా ఉంటే, రేపు యుద్ధానికి వచ్చి నీ ప్రతాపం చూపించు. ప్రస్తుతానికి దయచెయ్యి’ అని వాళ్లు ఎకసెక్కంగా బదులిచ్చారు.‘ధైర్యం ఉంటే మీ రాజును ఇప్పటికిప్పుడే యుద్ధానికి రమ్మనండి. లేకపోతే, పారిపోవడానికే రేపటి వరకు గడువు కోరుతున్నారనుకుంటా’ అన్నాడు.వీడు మరీ మొండిఘటంలా ఉన్నాడనుకున్న మంత్రులు, కార్యవీర్యార్జునుడికి రావణుడు యుద్ధానికి వచ్చిన సంగతి చెప్పారు. ఇప్పటికిప్పుడే యుద్ధం కావాలని మొండికేస్తున్నాడని కూడా చెప్పారు.కార్తవీర్యార్జునుడు జలక్రీడలను చాలించి, వెనువెంటనే యుద్ధానికి సమాయత్తమయ్యాడు. భయపడవద్దని భార్యలకు చెప్పి, యుద్ధానికి బయలుదేరాడు. తన ఐదువందల చేతులతో వివిధ ఆయుధాలను ధరించాడు. మిగిలిన ఐదువందల చేతులతో ఒక భారీ గదను పైకెత్తుకుని, దానిని గిరగిరా తిప్పుతూ రణరంగంలోకి అడుగుపెట్టాడు. రావణుడి సేనాధిపతి ప్రహస్తుడు అతడికి ఎదురు వెళ్లి, ఒక ముసలాన్ని విసిరాడు. కార్తవీర్యార్జునుడు తన గదతో ఆ ముసలాన్ని గాల్లో ఉండగానే తుక్కుకింద ముక్కలు చేసి, గదతో చాచిపెట్టి ప్రహస్తుణ్ణి కొట్టాడు. ప్రహస్తుడు ఆ దెబ్బకు మూర్ఛపోయాడు. ఇది చూసి పక్కనే ఉన్న రావణుడి మంత్రులు మారీచ సుబాహ ధూమ్రాక్షులు కాలికి బుద్ధి చెప్పి, వెనక్కు పరుగు తీశారు.ప్రహస్తుడు పడిపోవడం, మంత్రులు పలాయనం చిత్తగించడం గమనించిన రావణుడు తానే నేరుగా కార్తవీర్యార్జునుడి ఎదుటికి వచ్చాడు. ఒక భారీ గద పట్టుకుని అతడితో తలపడ్డాడు. ఇద్దరూ గదలతో ఒకరినొకరు మోదుకున్నారు. ఇద్దరిలోనూ ఒక్కరూ వెనక్కు తగ్గలేదు. గదాఘాతాలతో ఇద్దరి ఒళ్లూ రక్తసిక్తంగా మారినా, కొండల్లా చలించకుండా నిలిచి గంటల తరబడి పోరాటం సాగించారు. వాళ్ల గదా ఘాతాల ధ్వనులకు, వారి పదఘట్టనలకు చుట్టుపక్కల భూమి కంపించసాగింది. కార్తవీర్యార్జునుడు అదను చూసుకుని, రావణుడి ఛాతీపై గదతో బలంగా మోదాడు. ఆ దెబ్బకు రావణుడి గద చేతి నుంచి జారిపోయింది. రావణుడు నేల కూలిపోయాడు. కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి తాళ్లతో కట్టేసి, బందీగా తన నగరానికి తీసుకుపోయాడు.రావణుడు బందీగా పట్టుబడిపోవడంతో ధైర్యం సడలిన అతడి మంత్రులు, సేనానులు, సైనికులు అక్కడి నుంచి పారిపోయారు. వారు నేరుగా రావణుడి తాత పులస్త్యబ్రహ్మ వద్దకు వెళ్లి విషయం చెప్పారు.పులస్త్యుడు మహిష్మతీ నగరానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు ఎదురేగి పులస్త్యుడికి ఘనస్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులతో అతిథి సత్కారాలు చేశాడు. ఉచితాసనంపై కూర్చుండబెట్టి, క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. తన మనవడైన రావణుడికి బుద్ధి చెప్పినందుకు కార్తవీర్యార్జునుణ్ణి మెచ్చుకున్నాడు పులస్త్యుడు. ‘నీ దెబ్బకు నా మనవడి గర్వం అడుగంటింది. ఇక వాడిని విడిచిపెట్టు’ అని కోరాడు. పులస్త్యుడి మీద గౌరవంతో కార్తవీర్యార్జునుడు రావణుడిని చెర నుంచి విడుదల చేశాడు. పులస్త్యుడు అక్కడికక్కడే అగ్నిసాక్షిగా వారిద్దరి మధ్య సంధి చేశాడు.∙సాంఖ్యాయన -
బంగ్లా హెర్క్యులస్ రేపిస్టుల పాలిటి యముడు
బంగ్లాదేశ్ ఆశూలియా జిల్లా 2019 జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనతో ఉలిక్కిపడింది. ఆశూలియాలోని ఒక దుస్తుల కర్మాగారంలో పనిచేసే పద్దెనిమిదేళ్ల యువతిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడి, ఆమెను దారుణంగా హత్య చేశారు. ఇరుగు పొరుగులు ఇంట్లో ఆమె మృతదేహం పడి ఉండటం గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనపై అశూలియా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పోలీసులపై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. మృతురాలితో పాటు అదే దుస్తుల కర్మాగారంలో పనిచేసే రిపొన్, అతడి ఇద్దరు సహచరులను పోలీసులు అనుమానితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్లో విచారణ జరిపారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో విడిచిపెట్టారు.ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పైగా మరో మలుపు తీసుకుంది. జనవరి 17న అనుమానితుల్లో కీలక వ్యక్తి అయిన రిపొన్ దారుణంగా హత్యకు గురయ్యాడు. అశూలియాకు చేరువలోని ఒక పొలంలో అతడి మృతదేహం పడి ఉండటాన్ని గమనించి, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహం మెడకు తగిలించిన నోట్‌ను చూసి, దానిని బయటకు తీసి పరిశీలించారు. ఆ నోట్లో ఇలా ఉంది: ‘నా పేరు రిపొన్. నేను (బాధితురాలి పేరు)పై అత్యాచారం చేశాను. నేను రేపిస్టును. నా నేరానికి ఇదే తగిన శిక్ష. నాతో కలసి ఈ నేరానికి ఒడిగట్టిన నా సహచరులకు కూడా ఇదే గతి పడుతుంది. జాగ్రత్త!’– హెర్క్యులస్ అని బెంగాలీలో రాసి ఉంది. పోలీసులు ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.పట్టుమని పదిరోజులైనా కాలేదు. మరో సంఘటన కలకలం రేపింది. జనవరి 26న అశూలియా జిల్లా బోల్తలా గ్రామంలోని వరి చేనులో ఒక మృతదేహం పడి ఉండటం చూసి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామ పంచాయతీ చైర్మన్‌కు కూడా సంగతి చెప్పారు. అందరూ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి మెడలో నోట్ వేలాడదీసి ఉంది. ఇది కూడా హెర్క్యులస్ పేరుతోనే ఉంది. ఈ సంఘటనలో మృతుడి పేరు సాజల్, న్యాయశాస్త్ర విద్యార్థి. ఇతడు కూడా జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనలో పట్టుబడిన అనుమానితుల్లో ఒకడు. ఒకే హత్యాచారం కేసులో అనుమానితులైన ఇద్దరు వరుసగా హత్యకు గురికావడం, పైగా వారి మృతదేహాలపై ‘హెర్క్యులస్’ పేరుతో హెచ్చరిక నోట్ దొరకడం బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్తంగా కలకలంగా మారింది. పోలీసులకు ఈ హత్యలు సవాలుగా మారాయి. పోలీసులు చేయలేని పనిని ఒక అజ్ఞాతవ్యక్తి చేయడం పట్ల జనాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవడం తగదని కొందరు మర్యాదస్తులు అభిప్రాయపడితే, న్యాయం చేయడంలో పోలీసులు చేతగాని వాళ్లయినప్పుడు, అజ్ఞాత వ్యక్తి ఎవరో ఇలాంటి న్యాయం చేయడమే సరైన పని అని వ్యాఖ్యానించసాగారు. మరోవైపు పోలీసుల అసమర్థతను దుమ్మెత్తిపోస్తూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అజ్ఞాత ‘హెర్క్యులస్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తుండగా, ఫిబ్రవరి 1న మరో సంఘటన జరిగింది. ఈసారి అశూలియా పొరుగు జిల్లా అయిన రాజాపూర్‌లోని జలాకఠి శివార్లలోని పొలాల్లో మరో మృతదేహం పడి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు, మృతదేహం మెడలో ‘హెర్క్యులస్’ పేరుతో ఉన్న హెచ్చరిక నోట్ దొరికింది. ఈ సంఘటనలో మృతుడి పేరు రకీబ్ ముల్లా. ‘ఈ హెర్క్యులస్. ఎవడోగాని, పోలీసుల కంటే వీడే నయంగా ఉన్నాడు. రేపిస్టులందరినీ ఏరి పారేస్తున్నాడు’ అని అక్కడ మూగిన జనాలు పోలీసుల ముందే అనుకోవడం మొదలుపెట్టారు. తమ సమక్షంలోనే జనాలు అలా మాట్లాడటంతో పోలీసులకు తలకొట్టేసినట్లయింది. వరుస సంఘటనలు జరిగినా, జిల్లా పోలీసులు ఎలాంటి ఆధారాలూ సేకరించలేకపోవడంతో చివరకు బంగ్లాదేశ్ జాతీయ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దేశవ్యాప్తంగా హెర్క్యులస్ కోసం గాలింపు ప్రారంభించాయి. ఊహాచిత్రాలతో ఊరూరా పోస్టర్లు వేయించాయి. అయినా, ఎలాంటి ఫలితమూ దక్కలేదు. ఇప్పటికి ఆరేళ్లు గడచిపోయినా, బంగ్లా పోలీసులకు హెర్క్యులస్ ఆచూకీ దొరకలేదు. ఇదే విషయమై, హెర్క్యులస్ కేసుపై మొట్టమొదట దర్యాప్తు జరిపిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, అశూలియా పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ జహీదుల్ ఇస్లామ్‌ను ప్రశ్నిస్తే, ‘మేం కేసును మొదటి నుంచి దర్యాప్తు చేశాం. సంఘటనలు జరిగిన ప్రతిచోటా అణువణువూ గాలించాం. మృతుల మెడల్లో హెచ్చరిక సందేశాలు తప్ప మాకు ఎక్కడా ఎలాంటి ఆధారాలూ దొరకలేదు’ అని చెప్పారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ షోహెల్ రాణా కూడా దాదాపు ఇలాగే చెప్పారు. ‘అప్పటి వరుస హత్యల వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటి వరకు తేలలేదు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. అయినా, హత్యలకు కారకులు ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు. పోలీసులు ఇలాంటి పసలేని ప్రకటనలు చేస్తుంటే, బంగ్లా జనాల్లో చాలామంది హెర్క్యులస్ను హీరోగా పరిగణిస్తుండటం విశేషం. -
ఈ డివైజ్ ఇట్టే వయసుని దాచేస్తుంది..!
వయసును దాచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వయసును దాచుకోవడం కుదరక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారి కోసం అందుబాటులోకి వచ్చింది ఈ హోమ్ స్కిన్‌కేర్ టూల్. దీని పేరు లక్సేన్ బ్యూటీ ఫర్మాగ్లో బాడీ మైక్రోడెర్మాబ్రేషన్ డివైస్. ఇది ఇట్టే వయసును దాచేస్తుంది. యాంటీ ఏజింగ్, స్కిన్ టైటెనింగ్ వంటి ప్రయోజనాలను అందించే ఈ పరికరం శరీరంలోని ప్రతిభాగాన్నీ యవ్వనం తొణికిసలాడేలా తీర్చిదిద్దుతుంది. ఇది కాళ్లు, చేతులు, తొడలు, నడుము, వీపు, పొట్ట తదితర భాగాలకు చక్కని మర్దన అందిస్తుంది.అరచేతి పరిమాణంలో ఉండే ఈ పరికరం చర్మాన్ని తేలికగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. చర్మం బిగిని పునరుద్ధరిస్తుంది. మృతకణాలను తొలగించి, కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. ఈ పరికరం ముఖం సహా శరీర భాగాల్లోని చర్మం పైపొరను సున్నితంగా తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. చర్మంపై ముడతలు, వయసుతో వచ్చే మచ్చలు సహా చిన్నచిన్న సౌందర్య సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి స్క్రబర్‌లా, బ్రష్‌లా పనిచేసి చర్మానికి కొత్త మెరుపునిస్తుంది.ఇది మన్నికైన, సరసమైన, సులభమైన మాన్యువల్ సాధనం కావడంతో దీనికి మార్కెట్లో డిమాండ్ ఉంది. వారానికి ఐదే ఐదు నిమిషాలు కేటాయించి.. పైనుంచి కింద వరకూ ఆయిల్ లేదా క్రీమ్ ఏదైనా అప్లై చేసుకుని, దీనిని రబ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని చాలా తేలికగా హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుని ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్లొచ్చు. ఈ పరికరాన్ని శుభ్రం చేసుకోవడం చాలా తేలిక. దీని ధర 149 డాలర్లు. అంటే 12,810 రూపాయలు. (చదవండి: షాదీ అంటే విధ్వంసం..! బారాత్ అటే బాంబ్!) -
షాదీ అంటే విధ్వంసం..! బారాత్ అటే బాంబ్!
దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్‌కు కర్ణాటకలోని భత్కల్ వాసి సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీ అలియాస్ డాక్టర్ సాబ్ కీలకంగా వ్యవహరించారు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్ పేలుళ్లు సహా దేశ వ్యాప్తంగా జరిగిన ఐదు విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాన్ని ఇతడే సరఫరా చేశాడు. పాకిస్తాన్లో తలదాచుకున్న ఐఎమ్ చీఫ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు అతడి సోదరుడు యాసీన్ భత్కల్‌తో కలిసి పనిచేసిన డాక్టర్ సాబ్తో పాటు అతడి ముఠాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2015 జనవరి 8న అరెస్టు చేసింది. 2024, డిసెంబర్ 16న బెంగళూరులోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. రియాజ్–అఫాఖీ మధ్య సంప్రదింపులు జరిగిన విధానంతో పాటు వాళ్లు వినియోగించిన కోడ్ వర్డ్స్‌ను నిఘా వర్గాలు గుర్తించాయి. హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌లో 2007లో జరిగిన విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ భత్కల్ 2008లో పాకిస్తాన్‌కు పారిపోయాడు. కరాచీలో ఉన్న డిఫెన్స్ ఏరియాలో తలదాచుకుని డాక్టర్ సాబ్‌ను ఉగ్రవాద బాటపట్టించాడు. భత్కల్ ప్రాంతానికే చెందిన సద్దాం హుస్సేన్, అబ్దుల్ సుబూర్లతో ముఠాను ఏర్పాటు చేయించాడు. హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్‌గా చేసుకోవాలని రియాజ్ భత్కల్ 2012లో నిర్ణయించుకున్నాడు. దీనిపై తన సోదరుడు యాసీన్ భత్కల్‌తో పాటు ఆజామ్ఘడ్కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, అతడితో ఉంటున్న పాకిస్తానీ జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌లతో సంప్రదింపులు జరిపాడు. యాసీన్ మినహా మిగిలిన ఇద్దరినీ మంగుళూరుకు పంపాడు. ఈ సంప్రదింపులు, సమాచారమార్పిడి కోసం ఫోన్లపై ఆధారపడితే నిఘా వర్గాలకు చిక్కే ప్రమాదం ఉంటుందని భావించిన రియాజ్ వాటికి పూర్తి దూరంగా ఉండటంతో పాటు అనుచరుల్నీ అలానే ఉంచాడు. కేవలం ఈ–మెయిల్‌తో పాటు నింబస్, పాల్‌టాక్ వంటి సోషల్ మీడియాలను వినియోగించాలని సూచించాడు. వీటి ద్వారా చాటింగ్ చేయడానికి అవసరమైన ఐడీలను సృష్టించడంలోనూ అతగాడు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అప్పటికే వాంటెడ్ లిస్టులో ఉన్న తమ పేర్లను వినియోగించి వీటిని సృష్టించుకుంటే వాటిపై నిఘా వర్గాల కన్ను పడే ప్రమాదం ఉందని భావించాడు. అలాగని ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చినట్లు ఐడీలు ఏర్పాటు చేసుకుంటే అవి మిగతా వారికి తెలిసే అవకాశం లేక సమాచార మార్పిడికి అవాంతరాలు ఏర్పడతాయనే ఉద్దేశంతో రియాజ్ భత్కల్ ఓ కొత్త ఆలోచన చేశాడు. పాకిస్తాన్లో ఉన్న రియాజ్ భత్కల్ 2012 సెప్టెంబర్‌లో తాను వినియోగిస్తున్న మెయిల్ ఐడీ నుంచి మిగిలిన వారికి ఓ మెయిల్ పంపాడు. అందులో పీడీఎఫ్ ఫార్మాట్లో ఉన్న ‘స్టఫ్ మై స్టాకింగ్’ అనే పుస్తకాన్ని జతచేసి, అందులోని ప్రతి పది పేజీలను ఒక్కో సభ్యుడికి కేటాయిస్తున్నట్లు సమాచారమిచ్చాడు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన వాటిలో మొదటి పేజీలోని మొదటి పదం వినియోగించి ఐడీని సృష్టించుకునేలా చేశాడు. అవసరమనుకుంటే ఆ పదం పక్కన పేజీ నంబర్ లేదా ఏదైనా సంఖ్యను వాడుకోవచ్చని సూచించాడు. ప్రతి నెల రోజులకు కచ్చితంగా ఐడీని మార్చేస్తూ వారికి కేటాయించిన పేజీల్లో రెండో పేజీలో ఉన్న మొదటి పదంతో మరో ఐడీ సృష్టించుకోవాలని స్పష్టం చేశాడు. ఈ పుస్తకం పీడీఎఫ్ కాపీ అందరి దగ్గరా ఉండటంతో ఎవరి ఐడీ ఏంటనేది మిగతా వారికి తేలిగ్గా తెలిసేది. ఈ రకంగా నిఘా వర్గాలకు ఏ మాత్రం అనుమానం రాకుండా కమ్యూనికేషన్ సాగించారు. రియాజ్ భత్కల్ 2013 ఫిబ్రవరి మొదటివారంలో చాటింగ్ ద్వారా హడ్డీకి కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఈసారి హైదరాబాద్‌ను టార్గెట్ చేశామని చెప్పి వఖాస్, బిహార్‌లోని దర్భంగా వాసి తెహసీన్ అక్తర్ అలియాస్ మోనుతో కలిసి ఈ ఆపరేషన్ పూర్తిచేయాలని నిర్దేశించాడు. ఈ విధ్వంసానికి పేలుడు పదార్థాలను ఇచ్చే బాధ్యతల్ని బెంగళూరులో ఉన్న డాక్టర్ సాబ్‌కు అప్పగించాడు. అతడినీ ఈ–మెయిల్ ద్వారానే సంప్రదించిన రియాజ్.. ‘హైదరాబాద్ మే షాదీ హై.. బారాత్ హోనా’ (హైదరాబాద్‌లో పెళ్లి ఉంది. దాని కోసం ఊరేగింపు కావాలి) అంటూ సందేశం ఇచ్చాడు. మరోపక్క మోను, వఖాస్ హైదరాబాద్ చేరుకుని, అబ్దుల్లాపూర్‌మెట్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. పేలుడు పదార్థాల కోసం మంగుళూరులోనే వేచి ఉన్న హడ్డీకి రియాజ్ భత్కల్ నుంచి ఆ ఏడాది ఫిబ్రవరి 4న కీలక ఆదేశాలు వచ్చాయి.మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ వ్యక్తి పేలుడు పదార్థాలు అందిస్తాడని చెప్పడంతో హడ్డీ అక్కడకు వెళ్లాడు. రియాజ్ సూచించిన ప్రకారం అఫాఖీ 25 కేజీల పేలుడు పదార్థం (అమోనియం నైట్రేట్), 30 డిటొనేటర్లు సమీకరించి, వాటిని బంగారు రంగులో ఉన్న ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి తన అనుచరుడు సద్దాం హుస్సేన్ ద్వారా యూనిటీ హెల్త్ సెంటర్ వద్దకు పంపాడు. అక్కడకు వెళ్లిన హడ్డీ అవి తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. దిల్సుఖ్నగర్ పేలుళ్లలో పాలు పంచుకున్న యాసీన్ భత్కల్ (నేపాల్ నుంచి సహకరించాడు), తెహసీన్ అక్తర్ (ఏ–1 మిర్చి సెంటర్ దగ్గర బాంబు పెట్టాడు), వఖాస్ (107 బస్టాప్ దగ్గర బాంబు పెట్టాడు), హడ్డీలకు (నగదు, పేలుడు పదార్థాలు చేరవేశాడు).. ఎజాజ్ షేక్ (నిధులు అందించాడు), డాక్టర్ సాబ్ (పేలుడు పదార్థాలు సరఫరా) వివరాలు తెలియకుండా రియాజ్ భత్కల్ జాగ్రత్తలు తీసుకున్నాడు. వీరిలో ఎవరు చిక్కినా మిగిలిన వారి విషయం బయటపడకుండా ఇలా కుట్ర పన్నాడు. డాక్టర్ సాబ్ మాడ్యుల్‌కు బెంగళూరు ఎన్ఐఏ కోర్టు త్వరలో శిక్ష ఖరారు చేయనుంది. (చదవండి: షాదీ అంటే విధ్వంసం..! బారాత్ అటే బాంబ్!) -
Automobile: భారత్‌లో ఆటోమొబైల్స్ పరుగులు
ఒకరికి బతుకు బండి.. మరొకరికి హోదా.. ఇంకొందరికి వ్యాపారం.. మరి కొద్దిమందికి విహారం.. టూవీలర్, ఆటో, కారు, ట్రాక్టర్, వ్యాన్ , ట్రక్, బస్.. పేరు ఏదైనా, వాడకం ఏదైనా బండి చక్రాలు పరుగెడుతూనే ఉండాలి. ఆ పరుగే అన్నం పెడుతోంది. ఆ పరుగే వృద్ధి ‘ఇంజన్ ’ అవతారంలో భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమై దూసుకెళుతోంది. ఆటోమొబైల్ రంగంలో అత్యంత కీలకమైన మార్కెట్‌గా రూ.22 లక్షల కోట్లతో మూడవ స్థానంలో నిలిచి ప్రపంచ దిగ్గజ సంస్థలను భారత్ ఊరిస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత గల భారతావనిలో ఎన్ని బండ్లు రోడ్డెక్కుతున్నాయో తెలుసా? నిమిషానికి 49.53 యూనిట్లు. 2024లో 2,61,07,679 యూనిట్ల వాహనాలు వినియోగదారుల చేతుల్లోకి వెళ్లాయి. 2023లో ఈ సంఖ్య 2,39,28,293 యూనిట్లు. గత ఏడాది కొత్త వాహనాల రాక 9.11 శాతం పెరిగిందని ‘వాహన్ ’ గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న అవసరాలు..ఉద్యోగం, వ్యాపారం, షాపింగ్, ప్రయాణాలు, విహార యాత్రలు, డెలివరీ సేవలు.. అవసరం ఏదైనా చేతిలో బండి ఉండాల్సిందే! గడియారంలోని సెకన్ల ముల్లుతో పోటీపడుతూ పరుగు తీయాలంటే బండి రోడ్డెక్కాల్సిందే! అంతలా దైనందిన జీవితంలో వాహనం భాగమైపోయింది. అందుకే వాహనాల అమ్మకాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇక 2030 నాటికి మెగా సిటీల సంఖ్య 87కు చేరనుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఒక్కో మెగా సిటీలో జనాభా 10 లక్షల పైచిలుకు ఉంటుందన్నమాట! ఇంతమందికి సేవలు అందించడానికి ప్రజా రవాణా వ్యవస్థ సరిపోదు. వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సిందే! అలాగే ఆరేళ్లలో వర్కింగ్ ఏజ్ గ్రూప్‌లో 100 కోట్ల మంది చేరతారని అంచనా. అంటే ఆ సమయానికి మొత్తం జనాభాలో వీరి వాటా 60 శాతం ఉంటుంది. ఈ అంశం కూడా వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేయనుంది. మారుతున్న ధోరణులుభారత మార్కెట్లో ధర అత్యంత సున్నిత అంశం. డబ్బుకు తగ్గ విలువ చూసే కస్టమర్లే అధికం. మైలేజీ ఒక్కటే సరిపోదు. డిజైన్ సైతం ఆకట్టుకోవాలి. అటు భద్రతకు పెద్దపీట వేయాలి. ఎక్కువ ఫీచర్లు ఉండాలి. మారుతున్న వినియోగదార్ల అభిరుచులకు తగ్గట్టుగా మోడళ్లకు రూపకల్పన చేసేందుకు వందల కోట్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి కంపెనీలు కసరత్తు చేస్తుంటాయి. సరికొత్త మోడళ్లే కాదు సక్సెస్ అయిన మోడల్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లను, అప్‌గ్రేడ్స్‌ను ప్రవేశపెట్టాల్సిందే. హైబ్రిడ్స్, ఈవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కొత్త ట్రెండ్ ఏమంటే ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ప్రస్తుతం ఎస్యూవీ, యూవీల హవా నడుస్తోంది. మొత్తం పీవీల విక్రయాల్లో వీటి వాటా 60 శాతం దాటిందంటే మారుతున్న ధోరణులకు అద్దం పడుతోంది. కార్ల అమ్మకాల్లో 2,02,031 యూనిట్లతో టాప్ సెల్లింగ్ మోడల్‌గా కాంపాక్ట్ ఎస్యూవీ టాటా పంచ్ నిలిచింది. మరోవైపు చిన్న కారు చిన్నబోతోంది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ చిన్న కార్ల వాటా 2 శాతం కంటే తక్కువగా ఉంది. అమ్ముడవుతున్న రెండు త్రిచక్ర వాహనాల్లో ఒకటి ఈ–త్రీవీలర్ ఉంటోంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) విభాగాన్ని ఏలుతున్న దిగ్గజ కంపెనీలే ఈవీ సెగ్మెంట్నూ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాయి. 350 సీసీ, అంత కంటే అధిక సామర్థ్యంగల ఇంజన్ ్స విభాగంలో రాయల్ ఎన్ ఫీల్డ్ దూసుకెళుతోంది. ఈ కంపెనీ గత ఏడాది 4.26 శాతం వృద్ధితో 8,57,378 యూనిట్లను విక్రయించి రాయల్‌గా నిలిచింది. కొత్త వ్యాపారాల రాకతో..వ్యక్తిగత అవసరాలకే కాదు.. కొత్త వ్యాపారాల రాక కూడా వాహనాల అమ్మకాలకు ఆజ్యం పోస్తోంది. ఊబర్, ఓలా, రాపిడో వంటి అగ్రిగేటర్లు, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ–కామర్స్ సంస్థలు, స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, బిగ్‌బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, డంజో తదితర క్విక్ కామర్స్ కంపెనీలు.. ఇలా ఒకటేమిటి. ఉత్పత్తుల తయారీ, డెలివరీ సేవల కంపెనీలు వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. అటు సులభ వాయిదాల్లో వాహనం కొనుగోలుకు రుణ లభ్యత పెరిగింది. ఇంకేముంది వాయిదాలు చెల్లించగలిగే స్తోమత ఉంటే చాలు, స్థాయికి మించిన విలువైన వాహనం కొనేందుకూ కస్టమర్లు వెనుకంజ వేయడం లేదు. లగ్జరీ.. తగ్గేదేలే!దేశంలో లగ్జరీ కార్ల దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రూ.50 లక్షలకుపైగా ఖరీదు చేసే లగ్జరీ కార్లు 2024లో గంటకు దాదాపు ఆరు (5.83 యూనిట్లు) అమ్ముడయ్యాయి. అయిదేళ్ల క్రితం గంటకు రెండు లగ్జరీ కార్లే రోడ్డెక్కాయంటే ప్రస్తుత భారత మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. 2024లో మొత్తం 51,200 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 50 వేల మార్కును చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది రెండు డజన్లకుపైగా నూతన మోడళ్లు కొలువుదీరనున్నాయి. ఊరిస్తున్న కొత్త మోడళ్లు, సంపన్నులు పెరుగుతుండడంతో 2025లో ఈ సెగ్మెంట్లో 54,000లకుపైగా యూనిట్లు అమ్ముడవుతాయని పరిశ్రమ ధీమాగా ఉంది. 2030 నాటికి లగ్జరీ కార్ల అమ్మకాలు ఏటా 1,00,000 దాటుతుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో లగ్జరీ వాటా 1 శాతంపైగా ఉంది. 2020లో 20,500 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్లు్య, ఆడి, వోల్వో, మినీ, జేఎల్ఆర్, లెక్సస్ టాప్ బ్రాండ్స్‌గా ఉన్నాయి. సూపర్ ప్రీమియం లంబోర్గీని, పోర్ష్ కార్లకూ డిమాండ్ ఉంది. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024 ప్రకారం దేశంలో అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య 2028 నాటికి 19,908కి చేరనుంది. 2023లో ఈ సంఖ్య 13,263 ఉంది. ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్యలో భారత్ భారీ పెరుగుదలను నమోదు చేస్తుందని నివేదిక అంచనా వేసింది. ఈవీతో పోటీగా సీఎన్ జీ.. ఆశ్చర్యకర విషయం ఏమంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ) ఆధారిత వాహనాల డిమాండ్ ఊహకు అందడం లేదు. ఈ విభాగంలో గత ఏడాది 7,15,213 కార్లు అమ్ముడయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి ఏకంగా 35 శాతం నమోదు కావడం విశేషం. మారుతీ సుజుకీ ఇండియా అత్యధికంగా 2024లో ఈ విభాగంలో 5,12,155 యూనిట్లతో 71.60 శాతం వాటా దక్కించుకుంది. సీఎన్జీ వాటా ప్యాసింజర్ వెహికిల్స్‌లో 18 శాతం, త్రీవీలర్స్ అమ్మకాల్లో 28 శాతం ఉంది. బజాజ్ ఆటో ఒక అడుగు ముందుకేసి దేశంలో తొలిసారిగా సీఎన్ జీ బైక్ ‘ఫ్రీడమ్’ను పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా 5,500లకు పైగా సీఎన్ జీ ఫిల్లింగ్ స్టేషన్ ్స ఉన్నాయి. 2026 నాటికి ఈ సంఖ్య 8,000 దాటనుంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే సీఎన్ జీ వ్యయం తక్కువ కావడంతో కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు. వాహన విడిభాగాలు ఇలా..2023–24లో వాహన విడిభాగాల పరిశ్రమ 9.8 శాతం వృద్ధితో 74.1 బిలియన్ డాలర్ల వ్యాపారం నమోదు చేసింది. 2017–18లో ఇది 51 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ప్రపంచంలో తయారవుతున్న వాహన విడిభాగాల్లో భారత్ వాటా 3.5 శాతం. భారత జీడీపీలో ఈ రంగం వాటా 3.5 శాతం. తయారీ జీడీపీలో ఈ విభాగం 25 శాతం సమకూర్చింది. 50 లక్షల మందికిపైగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. విడిభాగాల ఎగుమతులతో అయిదేళ్లలో 88 బిలియన్ డాలర్ల విదేశీ మారకం సమకూరింది. ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) ప్రకారం భారత వాహన విడిభాగాల పరిశ్రమ 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఎగుమతులు 21 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని ఏసీఎంఏ ధీమాగా ఉంది. ఐదేళ్లలో తొలి స్థానం..!భారత ఆటోమోటివ్ పరిశ్రమ విలువ రూ.22 లక్షల కోట్లు. దేశ జీడీపీకి ఈ రంగం 7 శాతం సమకూరుస్తోంది. మొత్తం వసూలు అవుతున్న జీఎస్టీలో 14–15 శాతం ఆటోమొబైల్ రంగం అందిస్తోందంటే ఆశ్చర్యం వేయకమానదు. వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానానికి చేరుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి భారతీయ వాహన పరిశ్రమ రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు దూసుకెళ్లిందని చెప్పారు. ‘రూ.78 లక్షల కోట్లతో తొలి స్థానంలో యూఎస్ఏ, రూ.47 లక్షల కోట్లతో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా చైనా నిలిచింది. ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్–1గా మార్చాలనుకుంటున్నాం. ప్రఖ్యాత అంతర్జాతీయ ఆటోమొబైల్ బ్రాండ్స్ భారత్‌లో ఉండడం దేశ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది’ అని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఏం చేస్తోందంటే..సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) నుంచి ఈవీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి నూతన సాంకేతికతలవైపు వాహన పరిశ్రమ మళ్లేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్స్ రంగానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. అడ్వాన్ ్సడ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ రంగానికి రూ.18,100 కోట్లు, పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్‌కు రూ.10,900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈవీ రంగంలో విదేశీ సంస్థలను ఆకట్టుకోవడానికి ఆటోమేటిక్ రూట్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు ప్రభుత్వం తివాచీ పరిచింది. కనీసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రాలు నెలకొల్పే సంస్థలు పూర్తిగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుంటే పన్ను 70–100 శాతం నుంచి కొత్త ఈవీ పాలసీలో 15 శాతానికి కుదించారు. లిథియం అయాన్ బ్యాటరీలపై పన్నును 21 నుంచి 13 శాతానికి చేర్చారు. 2030 నాటికి ఈవీ, చార్జింగ్ మౌలిక వసతులు, బ్యాటరీస్ విభాగంలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ఆరేళ్లలో ఈవీ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానంలో నిలుస్తుందని అంచనా. పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు స్క్రాప్ పాలసీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల భద్రత, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యత, సేఫ్టీ ప్రమాణాలను నిర్దేశిస్తూ, తప్పనిసరి చేస్తోంది. గ్లోబల్ ఎన్ సీఏపీకి దీటుగా భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ సీఏపీ) పరిచయం చేసింది. 2030 నాటికి కొత్తగా అమ్ముడయ్యే వాహనాల్లో ఈవీల వాటా 30 శాతం ఉండాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.మీకు తెలుసా? వాహనాల తయారీ, విక్రయాల పరంగా భారత్ పేరిట పలు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. రూ.22 లక్షల కోట్లతో భారత మార్కెట్ ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచింది. 7 శాతం వార్షిక వృద్ధితో 2022–23లో 33.2 బిలియన్ డాలర్ల విలువైన 47.6 లక్షల యూనిట్ల వాహనాలు భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 45 లక్షల యూనిట్లు దాటింది. రెండు దశాబ్దాల్లో 25 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వెల్లువెత్తాయి. ఒక్క ఈవీ రంగంలోనే 2022–23లో 3.6 బిలియన్ డాలర్ల ఫండింగ్ వచ్చి చేరింది. వోల్వో, దైమ్లర్ వంటి 60కిపైగా దిగ్గజాలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) నెలకొల్పాయి. ట్రాక్టర్ల తయారీలో మహీంద్రా, త్రీవీలర్ల ఉత్పత్తిలో బజాజ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచాయి.ఆటోమోటివ్ రంగం పరిశ్రమను కొత్తపుంతలు తొక్కించే దిశగా వెళుతోంది. వృద్ధిలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూనే గ్రీన్ మొబిలిటీకి మారడం సవాలే. ఈవీలు, హైబ్రిడ్స్, హైడ్రోజన్ లేదా ఇతర ఇంధన విభాగాలైనా సరైన సాంకేతికతను అవలంబించడం కూడా సవాలుగానే ఉంటుంది. వృద్ధిని నిర్ధారిస్తూనే ఆటోమోటివ్ కంపెనీలు మారుతున్న పరివర్తనను ఎలా నిర్వహిస్తాయో అన్న అంశాన్ని ఈ రెండేళ్లు పరిశీలించాల్సి ఉంటుంది.∙వి.రిషి కుమార్, ఆటో ఎక్స్పర్ట్. ప్యాసింజర్ వాహన పరిశ్రమలో 60 శాతంపైగా వాటాతో ఎస్‌యూవీలు రూల్ చేస్తున్నాయి. రియల్ సూపర్ స్టార్‌గా సీఎన్ జీ నిలిచింది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ కార్ల వాటా ప్రస్తుతం 2 శాతంలోపు వచ్చి చేరింది. ∙అరుణ్ మల్హోత్రా, మాజీ ఎండీ, నిస్సాన్ ఇండియామార్కెట్ రికవరీ, తయారీ సంస్థల నుంచి వ్యూహాత్మక మద్దతు, విధాన స్థాయి స్పష్టత.. వెరసి ఆటోమోటివ్ రిటైల్ పరిశ్రమ 2025లో మెరుగ్గా ఉంటుంది. ఈ ఏడాది వృద్ధి ఉంటుందని 66.41 శాతం డీలర్లు అంచనా వేస్తున్నారు. స్థిరంగా ఉంటుందని 26.72 శాతం, తిరోగమన వృద్ధి నమోదవుతుందని 6.87 శాతం మంది డీలర్లు అభిప్రాయపడ్డారు.∙సి.ఎస్. విఘ్నేశ్వర్,,ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ్స (ఎఫ్ఏడీఏ) -
‘అంకుల్ ప్రైజ్’: అతడేం పనిచేస్తాడో తెలుసా..!
పొగడ్తలను ఇష్టపడని వారు చాలా అరుదు. పూర్వం రాజులు కూడా కేవలం తమని పొగడటానికి ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకునేవారు. తాజాగా ఇదే తరహాలో జపాన్(Japan)లోని ఒక వ్యక్తి ‘అంకుల్ ప్రైజ్(Uncle Praise)’ పేరుతో తన సొంత స్ట్రీట్ జాబ్‌ను ప్రారంభించాడు. ప్రతిరోజూ టోక్యో నగర వీథుల్లో నిల్చొని, అతని దగ్గరకు వచ్చిన అపరిచితులను పొగుడుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఒకానొక సమయంలో జూదానికి బానిసగా మారి, తన ఉద్యోగం, కుటుంబం రెండింటినీ కోల్పోయి, చాలాకాలం పాటు ఖాళీగా ఉండేవాడు. ఆ సమయంలో తిరిగి ఎవరూ తనని పనిలో చేర్చుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. అప్పుడే కొంతమంది స్ట్రీట్ ఆర్టిస్ట్‌లను చూసి, ‘అంకుల్ ప్రైౖజ్’ పేరుతో సొంత ఆలోచనతో ఇతరులను పొగిడే పనిని ప్రారంభించాడు. ఇతని కథనాన్ని ఈ మధ్యనే ఒక టీవీ షో ప్రసారం చేయటంతో ఫేమస్ అయ్యాడు. రోజుకు దాదాపు 150 యెన్ల నుంచి 10 వేల యెన్ల వరకు (రూ.82 నుంచి రూ. 5,500 వరకు) సంపాదించేవాడు. టీవీ షో ద్వారా ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు, విస్తృతంగా వ్యాపార పర్యటనలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. (చదవండి: సర్వ ఆహార సమ్మేళనం -
వయసును దాచేస్తుంది
వయసును దాచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వయసును దాచుకోవడం కుదరక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారి కోసం అందుబాటులోకి వచ్చింది ఈ హోమ్ స్కిన్‌కేర్ టూల్. దీని పేరు లక్సేన్ బ్యూటీ ఫర్మాగ్లో బాడీ మైక్రోడెర్మాబ్రేషన్ డివైస్. ఇది ఇట్టే వయసును దాచేస్తుంది. యాంటీ ఏజింగ్, స్కిన్ టైటెనింగ్ వంటి ప్రయోజనాలను అందించే ఈ పరికరం శరీరంలోని ప్రతిభాగాన్నీ యవ్వనం తొణికిసలాడేలా తీర్చిదిద్దుతుంది. ఇది కాళ్లు, చేతులు, తొడలు, నడుము, వీపు, పొట్ట తదితర భాగాలకు చక్కని మర్దన అందిస్తుంది.అరచేతి పరిమాణంలో ఉండే ఈ పరికరం చర్మాన్ని తేలికగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. చర్మం బిగిని పునరుద్ధరిస్తుంది. మృతకణాలను తొలగించి, కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. ఈ పరికరం ముఖం సహా శరీర భాగాల్లోని చర్మం పైపొరను సున్నితంగా తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. చర్మంపై ముడతలు, వయసుతో వచ్చే మచ్చలు సహా చిన్నచిన్న సౌందర్య సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి స్క్రబర్‌లా, బ్రష్‌లా పనిచేసి చర్మానికి కొత్త మెరుపునిస్తుంది.ఇది మన్నికైన, సరసమైన, సులభమైన మాన్యువల్ సాధనం కావడంతో దీనికి మార్కెట్లో డిమాండ్ ఉంది. వారానికి ఐదే ఐదు నిమిషాలు కేటాయించి.. పైనుంచి కింద వరకూ ఆయిల్ లేదా క్రీమ్ ఏదైనా అప్లై చేసుకుని, దీనిని రబ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని చాలా తేలికగా హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుని ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్లొచ్చు. ఈ పరికరాన్ని శుభ్రం చేసుకోవడం చాలా తేలిక. దీని ధర 149 డాలర్లు. అంటే 12,810 రూపాయలు. -
మొసలి అస్వస్థత
వేసవికాలం.. సుందరవనం అనే అడవిలో ఒక జింక పిల్ల అమ్మకు చెప్పకుండా బయలుదేరింది. దానికి దాహమై నీరు తాగడానికి ఒక మడుగులోకి దిగింది. ఆ మడుగులో ఒక మొసలి ఉందన్న సంగతి ఆ జింకపిల్లకు తెలియదు. అది నీటిలోకి దిగిన వెంటనే ఆ మొసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది. అప్పుడది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది. తర్వాత లేని ధైర్యం తెచ్చుకొని మొసలితో ‘ఓ మొసలి మామా! నీకు అస్వస్థతగా ఉన్నట్లు తెలుస్తోంది. దానికో మందు చెబుతాను. నన్ను వదిలిపెట్టు అంది. ఆ మొసలి నిజంగానే అస్వస్థతతో బాధపడుతున్నది. అది జింకపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి ‘నీకు నా అస్వస్థత సంగతి ఎలా తెలుసు?’ అని అడిగింది. ‘నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే తెలిసింది’ అని చెప్పిందా జింకపిల్ల తెలివిగా. అప్పుడే అక్కడికి ఒక బుజ్జి నక్క రావడాన్ని గమనించింది జింకపిల్ల. వెంటనే అది ‘అదిగో! ఆ నక్కను తింటే నీ అస్వస్థత మాయమౌతుంది. దాన్ని పట్టుకో!’అంటూ ఆ బుజ్జి నక్కను చూపించింది. సరేనంటూ ఆ జింకపిల్లను వదిలిపెట్టింది మొసలి. ఒడ్డుకు చేరిన జింక పిల్ల ‘బతుకు జీవుడా’ అనుకుంటూ ఎదురుగా ఉన్న బుజ్జి నక్క ఆగమన్నా ఆగకుండా పరుగెత్తింది. బుజ్జి నక్కకూ ఆ మడుగులో మొసలి ఉన్న సంగతి తెలియదు. అది కూడా అమ్మకు చెప్పకుండానే వచ్చింది. ఆ జింకపిల్ల వలె అదీ నీళ్లు తాగడానికి మడుగులోకి దిగింది. అప్పుడా మొసలి బుజ్జి నక్క కాలును పట్టుకొని ‘నా అస్వస్థతకు నీ మాంసమే మందని ఆ జింకపిల్ల చెప్పింది. నిన్ను తిని నా అస్వస్థతను పోగొట్టుకుంటాను’ అన్నది. వెంటనే బుజ్జి నక్క తెలివిగా ‘అయ్యో.. నేను వింత వ్యాధితో బాధపడుతున్నాను. నన్ను తిన్నవారిక్కూడా వ్యాధి సోకుతుంది. కావాలంటే అదిగో ఆ ఒడ్డు మీదున్న తోడేలు పిల్లనడుగు’ అంది. అప్పుడు మొసలి ‘ఈ నక్క చెప్పింది నిజమేనా’ అంటూ తోడేలును అడిగింది. ‘ఔను నిజమే’ అంది తోడేలు పిల్ల. అప్పుడు నక్క ‘నీ అస్వస్థతకు సరైన మందును వైద్యుడైన ఎలుగుబంటి చెబుతుంది దాన్నడుగు’ అన్నది. దాంతో బుజ్జి నక్కను వదిలేసింది మొసలి. వెంటనే తోడేలుతో కలిసి నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలోకే ఎలుగుబంటి వచ్చిందక్కడికి. మొసలి తన అస్వస్థతకు దాన్ని మందు అడిగింది. మొసలి ఆ మడుగులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు గనుక అది నీటిలోకి దిగకుండానే ఒడ్డు మీదే ఉండి, కొన్ని ఆకులను దానిపై విసిరేసి వాటిని తినమని చెప్పింది. ఆ ఆకులను ఆరగించింది మొసలి. తర్వాత ‘ఎలుగు మామా! ఆ బుజ్జి నక్కకు వింత వ్యాధి ఉందట.. నిజమేనా!’అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఎలుగుబంటి నవ్వి ‘దానికా వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చేది. ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు లేరు కదా’ అంది. ‘మరి తోడేలు కూడా అది నిజమని చెప్పిందే’ అంది మొసలి. ‘దానికది ఊతపదం. ఏం మాట్లాడినా అది ఔను! నిజమే అంటుంది. ఆ జింక పిల్ల,బుజ్జి నక్క తెలివిగలవి. ఆపదలో ఎలా తప్పించుకోవాలో చేసి చూపెట్టాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడటమేంటీ? రేప్పొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులు కూడా కదా! చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని, వాటి జోలికి వెళ్లొద్దని మృగరాజు సింహం జంతువులన్నిటినీ ఆదేశించింది. అది నీకు తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం చెడింది. ఈ సంగతి సింహానికి తెలిస్తే ఊరుకోదు. ఇకనుంచైనా వాటి జోలికి వెళ్లకు. అదిగో! ఆ చెట్టు పండ్లను తిని కడుపు నింపుకో! అవి ఆరోగ్యాన్నిస్తాయి’ అంది ఎలుగుబంటి. ‘ఈ అడవిలో ఉన్న ఈ ఒక్క మడుగు వల్ల పాపం చిన్న జంతువులన్నీ ఈ మొసలికి చిక్కుతున్నాయి. మరికొన్ని కొలనులు తవ్వించి, జంతువుల దాహార్తి తీర్చమని సింహానికి చెప్పాలి’ అనుకుంటూ అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
హిమపర్వం ఆగడం బగడం
మంచు కురిసే శీతకాలం ఎంత సరదాగా ఉంటుందో ప్రపంచానికి చూపించడంలో అమెరికావాసులు ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగానే మిన్నెసోటా రాష్ట్రం, సెయింట్ పాల్ నగరంలో ప్రతి ఏడాది పది రోజుల పాటు ఈ ‘వింటర్ కార్నివాల్ ఉత్సవాలు’ జరుగుతాయి. ఇవి అత్యంత పురాతనమైన సంబరాలు.సెయింట్ పాల్‌ను 1885లో సందర్శించిన న్యూయార్క్ విలేఖరులు ‘ఈ సెయింట్ పాల్ నగరం మరో సైబీరియా లాంటిది. శీతకాలంలో మానవ నివాసానికి పనికిరాదు’ అని పత్రికల్లో రాశారు. ఆ రాతలకు సెయింట్ పాల్ వాసులు మనస్తాపం చెందారు. తమ ప్రాంతం గొప్పదనాన్ని ప్రపంచానికి వెల్లడించడానికి, ప్రపంచంలో తమదైన ప్రత్యేకతను నిలుపుకోవడానికి ఈ వినూత్న సంబరాలను మార్గంగా ఎన్నుకున్నారు. అప్పటికే కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఈ కార్నివాల్ ఉత్సవాలు జరుగుతుండేవి. వాటిని ప్రేరణగా తీసుకుని, 1886లో ఈ ఉత్సవాలకు నమూనాలు రూపొందించారు. ఇవి ప్రారంభమైన నాటి నుంచి కేవలం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తప్ప, ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఈ ఏడాది జనవరి 25 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు ఫిబ్రవరి 3తో ముగుస్తాయి. ఈ వేడుకలకు బోరియాస్ పురాణాన్ని ప్రామాణికంగా చెబుతారు. ఇక్కడి ప్రజలు శీతకాలపు దేవుడుగా బోరియాస్ను కొలుస్తారు. కళ్లు చెదిరేలా జరిగే ఈ వేడుకల్లో ఐస్ పాలస్, మంచు శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.ఈ వేడుకల్లో గడ్డాల పోటీలు, హాట్ డిష్ పోటీలు, ఐస్ రన్ పోటీలు ఇలా చాలానే నిర్వహిస్తుంటారు. కనువిందు చేసే ఈ మంచు వేడుకను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు. వివిధ దేశాల రాచ కుటుంబీకులు, ప్రముఖులు, అధికారులు ఇలా చాలామంది ఈ వేడుకకు ప్రత్యేకంగా హాజరవుతుంటారు. -
ఐదున్నర దశాబ్దాల శ్రమ
భారత్‌కు స్వాతంత్య్రం తథ్యమని రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులు తేల్చేశాయి. స్వాతంత్య్ర సమరం మాదిరిగానే రాజ్యాంగ నిర్మాణం కూడా ఒక సుదీర్ఘ ప్రయాణం. అది ఉత్తేజకరమైనది కూడా. స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 18న చట్టం చేయడానికి చాలాముందే రాజ్యాంగ రచన నిర్ణయం జరిగింది. 1946లో వచ్చిన కేబినెట్ మిషన్ సిఫారసుల మేరకు రాజ్యాంగ రచన ఆరంభమయింది.భారత్‌కు రాజ్యాంగం ఇవ్వాలన్న ఆలోచన 1895 నాటి ‘రాజ్యాంగ బిల్లు’లో కనిపిస్తుంది. ఆపై ఐదున్నర దశాబ్దాల తరువాతే భారత్‌కు రాజ్యాంగం అవతరించింది. దేశం గణతంత్ర రాజ్యమైంది. కాబట్టి మన రాజ్యాంగ రచనకు 130 ఏళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. దీనినే ‘స్వరాజ్ బిల్’ అని అంటారు. బ్రిటిష్ ఇండియాలో జాతీయవాదం పదునెక్కుతున్న తరుణంలో ఇలాంటి ప్రయత్నం జరిగింది. ఇంతకీ భారత రాజ్యాంగ బిల్లు 1895 రూపకర్తలు ఎవరో తెలియదు. అనీబిసెంట్ అంచనా ప్రకారం ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన బాలగంగాధర తిలక్ కావచ్చు. అయితే, బ్రిటిష్ ఇండియా మనకు రాజ్యాంగం ఇవ్వలేదు. స్వతంత్ర భారతంలోనే అది సాధ్యమైంది. అనీబిసెంట్ 1925లో, సైమన్ కమిషన్ 1928లో వచ్చి వెళ్లిన తరువాత మోతీలాల్, జవహర్లాల్, తేజ్‌బహదూర్ సప్రూ సంఘం రాజ్యాంగం అందించేందుకు (నెహ్రూ నివేదిక) ప్రయత్నించింది.1919 భారత ప్రభుత్వ చట్టం ఫలితాలను పరిశీలించి, రాజ్యాంగ సంస్కరణలను తీసుకురావడానికి నియమించినదే సైమన్ కమిషన్ (1928). ఇది భారతీయులను దారుణంగా పరిహాసం చేసింది. భారతదేశ రాజ్యాంగ సంస్కరణలపై సిఫారసులు చేయడానికి ఏడుగురు సభ్యులను ఇంగ్లండ్ నియమించింది. ఇందులో ఒక్క భారతీయుడు లేరు. ఫలితమే ‘సైమన్ ! గో బ్యాక్’ ఉద్యమం. తరువాత బ్రిటిష్ ప్రభుత్వ సవాలు మేరకు మోతీలాల్ నాయకత్వంలో అధినివేశ ప్రతిపత్తిని కోరుతూ (కామన్వెల్త్లో ఉంటూనే కొంత స్వయం అధికారం ఉండడం), రాజ్యాంగాన్ని కోరుతూ ఒక వినతిపత్రం తయారు చేశారు. 1909, 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు రాజ్యాంగ నిర్మాణానికి సోపానాలుగా ఉపకరించాయి. 1895 రాజ్యాంగ బిల్లు తరువాత దాదాపు నలభయ్యేళ్లకు 1934లో ఎం.ఎన్ . రాయ్ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఈ ఆలోచనను 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించినా, ఆరేళ్ల తరువాతే అది కార్యరూపం దాల్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 18న చట్టం చేయడానికి చాలాముందే ఈ పరిణామం జరిగింది. 1946లో వచ్చిన కేబినెట్ మిషన్ సిఫారసుల మేరకు భారత రాజ్యాంగ రచనకు ప్రయత్నం ఆరంభమయింది. ఫలితంగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌లో ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు. మొదట 389 మంది సభ్యులు పరిషత్‌లో ఉన్నారు. అఖండ భారత్ పరిధితో జరిగే రాజ్యాంగ రచనను ముస్లింలకు ప్రత్యేక దేశం కోరుకున్న ముస్లింలీగ్ వ్యతిరేకించింది. ఆ సంస్థ సభ్యులు పరిషత్‌ను బహిష్కరించారు. తరువాత దేశ విభజన జరిగింది. ఫలితంగా పరిషత్ సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. వీరిలో 229 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికయ్యారు. 70 మంది స్వదేశీ సంస్థానాలు నియమించిన వారు ఉన్నారు. మొదట పరిషత్ తాత్కాలిక చైర్మన్ గా సచ్చిదానంద సిన్హా ఎన్నికయ్యారు. తరువాత డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా హరీంద్రకుమార్ ముఖర్జీ, ముసాయిదా సంఘం అధ్యక్షుడిగా డా. బి.ఆర్. అంబేడ్కర్, రాజ్యాంగ వ్యవహారాల సలహాదారుగా బెనెగళ్ నరసింగరావు ఎన్నికయ్యారు.1946 డిసెంబర్ 9న పరిషత్ మొదటి సమావేశం జరిగింది. రెండేళ్ల పదకొండు నెలల పదిహేడు రోజులు పరిషత్ పని చేసింది. మొత్తం సమావేశాలు 11. ఇందుకైన ఖర్చు రూ. 64 లక్షలు. 22 అధ్యాయాలతో, 395 అధికరణలతో రాజ్యాంగం ఆవిర్భవించింది. 1950 జనవరి 24న ‘జనగణ మన’ను జాతీయ గీతంగా స్వీకరించారు. 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం వెనుక అక్షరాలా ఐదున్నర దశాబ్దాల చరిత్ర ఉంది.1946 డిసెంబర్ 13న పరిషత్ తొలిసారిగా సమావేశమైంది. రాజ్యాంగ రచనకు లాంఛనంగా ఉపక్రమించింది. పరిషత్ లక్ష్యాలను నిర్దేశించే తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. రాజ్యాంగం ప్రధాన ధ్యేయం భారత్‌ను సర్వసత్తాక స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించడం. 1947 జనవరి 22న రాజ్యాంగ పరిషత్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. మొదటి సమావేశం తరువాత రాజ్యాంగంలో ఏయే అంశాలు ఉండాలో పరిశీలించడానికి కొన్ని సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక హక్కులు, మైనారిటీల వ్యవహారాల సలహా సంఘం, కేంద్ర అధికారాల నిర్ణాయక సంఘం వంటివి! అవన్నీ వాటి నివేదికలను 1947 ఏప్రిల్, ఆగస్ట్ నెలల మధ్య సమర్పించాయి. అన్ని అంశాల మీద 1947 ఆగస్ట్ 30న చర్చ ముగిసింది. ఈ సంఘాలు ఇచ్చిన నివేదికలు, వాటిపై జరిగిన చర్చల సారాంశం అధారంగా రాజ్యాంగ పరిషత్ సలహాదారు బి.ఎన్ .రావ్ ఒక ముసాయిదాను తయారు చేశారు. 1947 అక్టోబర్‌లో ఈ పని పూర్తి చేసి, రాజ్యాంగ ముసాయిదా సంఘానికి సమర్పించారు. దీనిపై ముసాయిదా సంఘం నెలల తరబడి చర్చించి, తుది ముసాయిదాను రూపొందించి, 1948 ఫిబ్రవరి 21 నాటికి రాజ్యాంగ పరిషత్ చైర్మన్‌కు సమర్పించింది.తరువాత తుది ముసాయిదాను అచ్చు వేయించి ప్రజలకు, మేధావులకు అందుబాటులో ఉంచారు. చాలా వ్యాఖ్యలు, విమర్శలు, సలహాలు, సూచనలు వచ్చాయి. వీటన్నింటినీ కేంద్ర, ప్రాంత రాజ్యాంగ కమిటీలు పరిశీలించాయి. వీటి మీద 1948 అక్టోబర్ 23, 24, 27 తేదీలలో పరిషత్ చర్చలు జరిపింది. తరువాత 1948 అక్టోబర్ 26న ముసాయిదాను మరోసారి ముద్రించారు. ముసాయిదా మీద రెండోసారి కూడా 1949 అక్టోబర్ 17 వరకు చర్చ జరిగింది. ఈ దశలోనే రాజ్యాంగ సవరణకు చాలా సూచనలు వచ్చాయి. కానీ వాటిలో ఎక్కువ సవరణలను పరిషత్ తిరస్కరించింది. స్వీకరించిన కొన్ని సూచనలు, సవరణల కోసం మళ్లీ చర్చలు జరిపారు. సవరించిన కొత్త రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 3న రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడికి అందించారు. అంతిమంగా 1949 నవంబర్ 14న రాజ్యాంగ పరిషత్ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. తరువాత 1949 నవంబర్ 26న మూడోసారి కూడా చదవడం, చర్చించడం పూర్తి చేశారు. అంతకు ముందే రాజ్యాంగ ఆమోదం కోసం డాక్టర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పరిషత్ ఆమోదించింది. ఆమోదం పొందిన రాజ్యాంగం మీద 1950 జనవరి 24న సభ్యులంతా సంతకాలు చేశారు. రెండు రోజుల తరువాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.అయితే, భారత రాజ్యాంగం సుదీర్ఘం, న్యాయవాదుల స్వర్గం అంటూ ప్రతికూల వ్యాఖ్య వచ్చింది. ఆ వ్యాఖ్య చేసినవాడు ఐవర్ జెన్నింగ్స్. ఏడుగురు సభ్యులతో 1947 ఆగస్ట్ 29న ముసాయిదా సంఘాన్ని ఎన్నుకున్నారు. వారిలో అంబేడ్కర్ ఒకరు. కానీ సంఘం అధ్యక్షునిగా నెహ్రూ జెన్నింగ్స్‌ను ప్రతిపాదించారు. చివరికి గాంధీజీ అభిప్రాయం మేరకు అంబేడ్కర్ చైర్మన్ అయ్యారు. ఒకటి వాస్తవం. భిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్న భారత్ ఐక్యంగా పురోగమించడానికి అంతస్సూత్రంగా పనిచేస్తున్నది భారత రాజ్యాంగమే!-డాక్టర్ గోపరాజు నారాయణరావు -
బాధ్యతల్లో బ్యాలెన్స్ లేకుంటే కాపురం కష్టమే!
రేఖది పల్లెటూరి నేపథ్యం. తండ్రిది వ్యవసాయం. తల్లి గృహిణి. పిల్లల పెంపకం బాధ్యత కూడా ఆమె మీదనే ఉండేది. అలాంటి వాతావరణంలో పుట్టి, పెరిగిన రేఖకు భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తయ్యాక ఆమెకు ఆనంద్‌తో పెళ్లయింది. ఆనంద్ ప్రభుత్వోద్యోగి. గృహిణిగా రేఖ సంతోషంగా బాధ్యతలను స్వీకరించింది. ఒక బిడ్డ పుట్టాక కూడా రేఖ తన పనులను హ్యాపీగా మేనేజ్ చేసుకునేది. రెండో బిడ్డ పుట్టాక కష్టమైంది. ఉదయాన్నే లేచి ఆనంద్‌కు బ్రేక్ఫస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల పనులు చూసుకోవడంతో చాలా అలసిపోయేది. ఆనంద్ తన పని ఒత్తిడిలో ఉండి ఇంటి పనుల్లో పెద్దగా సాయం చేసేవాడు కాదు. కనిపించని దూరం..భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ సమకూర్చే క్రమంలో రేఖ తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. ఎప్పుడైనా తన అవసరాల గురించి ఆమె మాట్లాడగానే ఆనంద్ వాటిని పట్టించుకునేవాడు కాదు. లేదంటే తన ఆఫీసు ఒత్తిడి గురించి చెప్పుకునేవాడు. దీంతో తన కష్టాన్ని ఆనంద్ గుర్తించడం లేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించసాగింది. క్రమేపీ వారిద్దరి మధ్య మానసికంగా దూరం పెరిగింది. ఇలాంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో కనిపిస్తుంది. బ్యాలెన్సింగ్ ప్రిన్సిపుల్స్..కుటుంబ జీవితం అనేది ఆటోమేటిక్‌గా సాఫీగా సాగిపోయే విషయం కాదు. క్రమం తప్పకుండా పరస్పర సహకారం, ఓపిక, కమ్యూనికేషన్ అవసరం. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా బలమైన బంధాన్ని కాపాడు కోవడం కోసం పాటించాల్సిన సూత్రాలివే. 1. స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం⇒ పరిస్థితి ఎంత క్లిష్టమైనదైనా, భావాలను వ్యక్తపరచడంలో ఓపెన్‌గా ఉండాలి⇒ ఐ–సెంటెన్సెస్ వాడకం అంటే ‘నాకు ఇలా అనిపిస్తోంది’, ‘నేను ఇలా ఫీలవుతున్నాను’ అని చెబుతూ, దూషణలకు లేదా నిందలకు తావు లేకుండా కమ్యూనికేషన్ చేయండి. మీ ఆలోచనలను ఈ విధంగా పంచుకోవడం ద్వారా సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.2.బాధ్యతలను పంచుకోండి⇒ గృహభారాలు ఒక్కరిపై మాత్రమే ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ఏమి చేయాలో కూర్చుని మాట్లాడి నిర్ణయించు కోవాలి. చిన్న విషయాల్లో కూడా భాగస్వామ్యం ఉంటే, ఎదుటి వాళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది⇒ వారానికి ఒకసారి ఆ వారం ఎవరేం పనులు చేయాలనేది చర్చించుకోవడం ద్వారా బ్యాలెన్స్‌ను సాధించవచ్చు.3.తమ శ్రమను గుర్తించండి⇒ కుటుంబంలో ఎవరి శ్రమకైనా విలువ ఇవ్వడం అవసరం ⇒ భర్త తన పని ఒత్తిడిని, భార్య తన ఇంటి పనుల కష్టాన్ని పంచుకుంటే పరస్పర అవగాహన పెరుగుతుంది.⇒ వారానికి ఒకసారి ఓపెన్‌గా అభినందనలు లేదా కృతజ్ఞత వ్యక్తం చేయడం బంధాన్ని బలపరుస్తుంది.4. ప్రత్యేక సమయాన్ని కేటాయించండి⇒ పనుల మధ్య ఎప్పుడు తనతో మాట్లాడతాడో అన్న నిరీక్షణ భార్య/భర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది · వారానికి ఒకరోజు ప్రశాంతంగా కూర్చుని ఒకరి కష్టాన్ని మరొకరు వినండి · మనసు పంచుకునే ఈ చర్చలు బంధం బలపడటానికి దోహదపడతాయి. 5. ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేయడం నేర్చుకోండి⇒ గృహిణిగా స్త్రీ, పనిలో పురుషుడు ఇద్దరూ ఒత్తిడితో ఉంటారు ⇒ దీర్ఘ శ్వాస, ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ వంటి పద్ధతులు ఆందోళన తగ్గించడంలో సహాయపడతాయి ⇒ అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.6. సామాజిక ప్రమాణాలను పునఃపరిశీలించండి⇒ భార్యాభర్తలు తప్పనిసరిగా వారి వారి పాత్రల్లోనే ఉండాలి అనే ఆలోచనను మార్చుకోండి ⇒ ఇంటి పనులు లేదా పిల్లల సంరక్షణ విషయంలో భర్త సహాయాన్ని సగర్వంగా కోరండి ⇒ గృహిణి కష్టం కూడా సమాన గౌరవానికి అర్హమైనది.7. సానుకూల దృక్పథం ఏర్పరచుకోండి⇒ ఇతరులను తప్పు పట్టడం కంటే, కలిసి పనిచేయడం ద్వారా సమస్యలపై దృష్టి పెట్టండి⇒ ఒకరి కొకరు సహాయం చేసుకోవడం, ప్రశంసలు అందించుకోవడమనేది ప్రేమానుబంధాన్ని పెంచుతుంది. 8. స్వీయపరామర్శ⇒ తన బాధ్యతల్ని సరైన పద్ధతిలో నిర్వర్తించలేకపోతున్నానని భావించడంలో తప్పు లేదు. కానీ ఆలోచనను సానుకూలంగా మలచుకోవాలి ⇒ ‘నేను కుటుంబం కోసం ఇలా చేయగలిగాను’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి⇒ అవసరమైతే విశ్రాంతి తీసుకోండి. దానివల్ల మానసిక శక్తి పెరుగుతుంది. -
ఈ వారం కథ.. వైతరిణికి ఈవల
నేను చనిపోయాను రాత్రి రెండుగంటలప్పుడు నీళ్లు తాగటానికని లేచి, తాగి పడుకున్నాను. సరిగ్గా అరగంట తర్వాత నేను చనిపోయాను. నేనేమీ ముసలోణ్ణి కాదు ఆయుష్షు తీరిపోవటానికి. యాభై ఐదు మొన్ననే దాటింది. అయినా అదికాదు నేనాలోచించేది. నేను మందు ముట్టను. సిగరెట్టు తాగను. మాంసం పెద్దగా తినను. పేకాట ఆడను. ప్రతిరోజు వాకింగ్, యోగా చేస్తాను. సంవత్సరంలో దాదాపు మూడొందల రోజులు ఆరోగ్యం కోసం నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ ఎందుకిలా జరిగింది? ఏమో తెలీదు. ప్రస్తుతానికి నన్నెవరూ చూడలేదు కాబట్టి కారణం తెలీదు. శరీరం మాత్రం ఇంకా మంచం మీదే వుంది నా భార్య ఉదయం కాస్త లేటుగా నిద్ర లేస్తుంది. అప్పటివరకూ నేను చనిపోయానన్న విషయం ఎవరికీ తెలీకపోవచ్చు. ఒక మనిషి పుట్టుక అతడి తలరాతని బట్టి వుంటుందట. మరణం మాత్రం అతడి పాపపుణ్యాలని బట్టి వుంటుందట. ఇప్పటి వరకూ నేను ప్రశాంతంగానే వున్నాను. అంటే నేను పుణ్యకార్యాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చెయ్యలేదా? ఒకవేళ చేసినా అవన్నీ చిన్నవా? లేక అనుభవించాల్సింది ఇంకా ముందు ముందు మిగులుందా?మందు, విందు లాంటి బయటికి కనపడేవే చెడ్డ అలవాట్లు, పాపాలుగా పరిగణిస్తే .. నేను అవి చేసి వుండకపోవచ్చు. మరి అవతలి వాళ్ళను పరోక్షంగా బాధపెట్టటం, అసూయగా ఆలోచించటం, ఒంటరిగా వున్నప్పుడు మనసులో కలిగే చీకటి ఆలోచనలు/ అలవాట్లు పాపాలు కాదా? తెలిసో తెలియకో నేను ఎగ్గొట్టిన డబ్బులు, నా వల్ల బాధపడిన మనుషులు, నేను ఈర్ష్యపడేట్టు చేసిన నా స్నేహితులు (పదప్రయోగానికి క్షమించాలి.. బంధువుల, స్నేహితుల ఉన్నతికి నేను పడిన ఈర్ష్య అసూయలు) మరి ఇవన్నీ తప్పులు కావా? అసలు తప్పులకి, పాపాలకి సంబంధం ఉందా? ఉదాహరణకి నేనో పామునో, కప్పనో చంపితే అది చెడ్డ పనా? తప్పు పనా? దాన్ని తప్పుగా భావించి దేవుడు నాకు శిక్ష వేస్తాడా? లేక, పోయిన జన్మలోనో, వచ్చే జన్మలోనో.. దానికీ నాకూ ఉన్న సంబంధాన్ని బట్టి అది అలా జరగాలని రాసి వుంటుందా? మరైతే ఒకపని చేసేటప్పుడు అది ఇప్పటిదా లేక పోయిన జన్మలో చేసిన దాని పర్యవసానమా అనేది ఎలా తెలుస్తుంది?అన్నట్టు పాపం అంటే గుర్తొచ్చింది. నా కొడుకు విడాకులనాడు మా వియ్యంకురాలు నన్ను తిట్టిన తిట్లమాటేమిటి? తన కూతురికి అన్యాయం చేసినందుకు ఆ పాపం ఊరికే పోదనీ, నాకు నా కుటుంబానికి ఆ పాపం తగులుతుందని, దాని వల్ల నా కుటుంబం సర్వనాశనం అవుతుందని శాపం కూడా పెట్టింది. మరి నా కొడుకు చేసిన పనిలో/ పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుందా? ఒకరి పాపపుణ్యాల్లో మరొకరికి వాటా ఉంటుందా? అసలలా జరిగే వీలుంటుందా? ఏమో.. ఈసారి స్వర్గంలోనో, నరకంలోనో.. ఎవరైనా ప్రవచనకర్త కనిపిస్తే అడగాలి.సమయం కొంత గడిచి, ఉదయం ఐదున్నర అయింది. నా భార్య నిద్రలేచింది. కళ్ళు మూసుకునే దేవుడికి దణ్ణం పెట్టి తర్వాత తాళి కళ్ళకద్దుకుంది. మా పెళ్ళైనప్పటినించీ నిద్ర లేచాక ఆమె చేసే మొదటి పని అదే. పక్కనే ఉన్న నన్ను ఆశ్చర్యంగా చూసింది. రోజూ ఐదింటికల్లా వాకింగ్‌కి వెళ్లే నేను ఈ రోజు ఇంకా నిద్ర కూడా లేవకపోవటం చూసి పడిన ఆశ్చర్యం అది. చిన్నగా తట్టి ‘ఏమండీ..’ అంది. శరీరం అటు ఇటు కాస్త కదిలిందే తప్ప చలనం లేదు. దగ్గరకొచ్చి ‘ఏమండీ..’ అని తోసినట్టు గట్టిగా కుదిపింది. ఉలుకు లేదు పలుకు లేదు. మొదటిసారి ఆమెకు అనుమానం వచ్చింది. రెండో నిమిషంలో అది రూఢి అయింది. ఇంకో గంటకి.. అక్కడ వందమంది దాక గుమికూడారు. వాళ్ళందరూ నేనెంత మంచివాణ్ణో(?) మాట్లాడుకుంటున్నారు. చిత్రమేమిటంటే.. అక్కడున్న వాళ్ళల్లో చాలామంది వాళ్లెవరో కూడా నాకు తెలీదు.ఒక మహానుభావుడు చెప్పినట్టు ‘నువ్వు హాస్పిటల్లో వున్నప్పుడు, కనీసం వందమంది నిన్ను పరామర్శించాలని నువ్వు భావిస్తే, ఆ వందమందికి బాలేనప్పుడు నువ్వెళ్ళి పరామర్శించి ఉండాలి’. కానీ, నేనా బాపతు కాదు. ఎవరినైనా పరామర్శించాల్సి వస్తే నేను వెళతాను కానీ, వాళ్లొచ్చి మళ్ళీ నా దగ్గిర అటెండె¯Œ ్స వేయించుకోవాలి అని నేనెప్పుడూ ఎదురుచూడను. చూడలేదు. అసలలాంటి ఆలోచన నేనెప్పుడూ చెయ్యను కూడా. అంతదాకా వస్తే నేనెప్పుడూ ఎవరితో ఎక్కువగా మాట్లాడింది లేదు. అవతలి వాళ్ళతో రాసుకు పూసుకు తిరిగింది లేదు. తిరగాలన్న కోరిక కూడా నాకెప్పుడూ ఉండేది కాదు. అలా తిరగటం తప్పని నా ఉద్దేశం కాదు. ఎవరి జీవన విధానం వాళ్ళది. ఎవరి ఆలోచనలు, పద్ధతులు వాళ్ళవి. నా ఆలోచనలన్నీ నా సెల్ఫ్ సెంటర్డ్గా ఉండేవే తప్ప.. ఇతరులు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవాలన్న కుతూహలం నాకెప్పుడూ లేదు. జీవితం పట్ల నా దృక్పథం వేరు. నా ఆలోచన, జీవన విధానమే వేరు. ఇలా ప్రతి ఒక్కరూ నేను వేరు అనుకుంటారేమో.. నాకు తెలీదు.ఇంకో అరగంటకి.. పూలమాలలు తెచ్చారు. బాడీని మంచం మీద నించి ఒక చిన్న బల్ల మీదకు మార్చారు. తర్వాత ఏం చెయ్యాలో, ఎలా చెయ్యలో దాని కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికి తోచిన సలహాలు వాళ్లిస్తున్నారు. ‘పిల్లలకి ఫోన్ చేశారా?’ అని ఎవరో అడుగుతుంటే, ‘చేశాం. రాత్రికల్లా వస్తాం అన్నారు’ అంటున్నారు మరెవరో.అన్నట్టు చెప్పటం మరిచా. నాకు ఒక కొడుకు, కూతురు. కొడుకు బెంగళూరులో, కూతురు పుణెలో వుంటారు. నా పిల్లల్ని నేను కాలు కదపనీయకుండా.. అడుగు కింద పెట్టనీయకుండా.. లాంటివి కాదు కానీ ఉన్నంతలో బాగానే పెంచాను. వాళ్ళు అడిగినవి, అవసరమైనవి కొనివ్వగలిగాను. ఒక తండ్రిగా ఎంత చెయ్యాలో అంతా చేశాను. అలాని వాళ్ళకెప్పుడూ నేను ఆదర్శాలు వల్లించలేదు. నీతి సూక్తులు చెప్పలేదు. ధర్మం తప్పకుండా జీవించమని ఉద్బోధించనూ లేదు. పిల్లలు మనం చెప్పేదానికంటే, చేసేది చూసి నేర్చుకుంటారని చాలామంది మనస్తత్వ శాస్త్రవేత్తలు, కౌన్సెలర్లు చెప్పగా విని, పాటించాను. ఒక అనుభవం.. అది మంచైనా, చెడైనా వాళ్ళు దాన్నించి నేర్చుకోవాలనేది నా సంకల్పం. ఉదయం ఎనిమిదిన్నర కావస్తూంది. అప్పటివరకూ మూగి వున్న జనం నిదానంగా పలుచబడటం మొదలయ్యింది. నా దగ్గరి స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు.నిజం చెప్పొద్దూ ఆమెను చూస్తే నాకు జాలేసింది. ఏమీ చెప్పకుండా సడన్‌గా నేనిలా వచ్చేస్తే.. తను ఎలా బతుకుద్ది? ఆ భారం తను మోయగలదా? ఆస్తులంటే ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు కానీ, ఏ బ్యాంకులో ఎంత డబ్బుంది, ఎవరికి ఎంత అప్పుంది.. లాంటి డబ్బు సంబంధమైన విషయాలు నేనెప్పుడూ తనతో కనీసం చర్చించింది కూడా లేదే. మరిప్పుడెలా?పెళ్ళైనప్పటినించీ నేనే లోకంగా బతికింది. తను నన్ను ఎప్పుడూ ఏమీ కోరలేదు. ఒక్క మా అబ్బాయి పెళ్లి మాత్రం తనిష్టప్రకారం తనకు తెలిసిన వాళ్ళ అమ్మాయితో జరిపించాలంది. తెలిసిన వాళ్ళైతే సర్దుకుపోతారనేది తన ఆలోచన. ఆ ప్రకారమే తనూ మావాడూ ఇద్దరూ ఇష్టపడ్డ అమ్మాయితోనే మావాడి పెళ్ళిచేసింది. ఆ సంసారం నాలుగైదేళ్లు సజావుగా సాగింది. ఏమైందో ఏమో గాని మనస్పర్థలు మొదలయ్యాయి. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో కేవలం భగవంతుడికే తెలుసు. అటువైపు నించీ, మా వైపు నించీ చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి అది విడాకుల దాకా వెళ్ళింది. విడాకులు మంజూరైన రోజు.. మా వియ్యపురాలు నన్నూ, నా కుటుంబాన్నీ తిట్టని తిట్టులేదు. తెలిసిన వాళ్ళని పిల్లనిస్తే ఇంత అన్యాయం చేస్తారా అంది. నడిరోడ్డు మధ్యలో అలా వదిలేసి వెళితే తమ పరిస్థితేంటని నిలదీసింది. అభం శుభం తెలియని ఆడపిల్లని ఇలా అర్ధాంతరంగా బయటికి గెంటేస్తే .. ఆ పాపం ఊరికే పోదనీ, దాని ఉసురు కచ్చితంగా తగులుతుందని శపించింది. చివరగా.. నీక్కూడా ఒక కూతురుందనీ దానికి కూడా ఇలాంటిది జరిగితే అప్పుడు తండ్రిగా ఆ బాధేమిటో తెలుస్తుందని దుమ్మెత్తి పోసింది. ఐతే అదృష్టవశాత్తూ అలాంటివేం జరగలేదు. కానీ, ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. జీవితంలో అంత వేదన అనుభవించటం అది రెండోసారి (మొదటిసారి.. శ్రుతిలయతో నేను విడిపోయినప్పుడు జరిగింది). చేయని తప్పుకి శిక్ష అనుభవించాలా? అయినా తప్పెవరిదో కూడా నిర్ణయించే పరిస్థితి లేనప్పుడు కేవలం నా కుటుంబాన్ని ఆడిపోసుకోవడం న్యాయమా? ఏదైతేనేం.. జరగకూడనిది జరిగిపోయింది. పచ్చని సంసారం పెటాకులైపోయింది. ఎదో దిగులు. మానసిక వ్యథ. కాస్తో కూస్తో పరువుగా బతుకుతున్న వాళ్ళం. ఎందుకిలా జరిగింది? సమాజం మారిందనటానికి ఇవన్నీ రుజువులేమో. కావొచ్చు కానీ ఎక్కడో జరిగితే మనం దానిమీద చర్చించొచ్చు, సులభంగా తీర్మానం చెయ్యొచ్చు. కానీ అది మనింట్లోనే జరిగితే..? మనసు ఏ పని మీదా లగ్నం కావటం లేదు. నిద్ర రాదు. ఆకలి వేయదు. ఒకటే అంతర్మథనం. దాదాపు మూడు నెలలు. మానసికంగా కుంగిపోయాను. ఆలోచించే కొద్దీ ఎవరో రెండు అరచేతుల మధ్యకి నా గుండెని తీసుకుని ఒత్తిన ఫీలింగ్. కాలమే అన్ని గాయాల్ని మాన్పుతుందన్నట్టు కొన్నాళ్ళకు నేను తేరుకున్నాను.. తేరుకుని చూస్తే.. మా ఆవిడ తమ్ముడు ఫ్రీజర్ బాక్స్ తెచ్చి సర్దుతున్నాడు. నా మనసెందుకో కీడు శంకించింది. ఇప్పటివరకూ లేని ఒక చిన్న జలదరింపు. నేనూహించినట్టుగానే నలుగురైదుగురు కలిసి ఆ బాడీని ఎత్తి ఫ్రీజర్‌లో పెడుతున్నారు. మొట్టమొదటిసారిగా ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యింది. శరీరం ఆ చల్లటి వాతావరణానికి అలవాటు పడుతుంది. కానీ నేనే బయట ఉండలేకపోతున్నా. అప్పటివరకూ అది నేనే, ఆ శరీరం నాదే అన్న ఆలోచన నన్ను ఏమీ ఆలోచించనీయలేదు కానీ ఇప్పుడు తొలిసారిగా నన్నూ, నా శరీరాన్నీ విడదీస్తున్నారన్న భావన. పావుగంటలో ఆ బాడీని లోపల సర్దేసి అందరూ చుట్టూ కూర్చున్నారు. నేను బయట బిక్కుబిక్కుమంటూ బిగుసుకుపోయాను. ‘మనిషి శరీరాన్ని వీడిన తర్వాత ఆత్మ అక్కడక్కడే తచ్చట్లాడుతుంటుంది. తిరిగి తన శరీరంలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ ఒకసారి శరీరాన్ని వీడాక మళ్ళీ అందులోకి వెళ్ళటం అన్నది సృష్టి విరుద్ధం కాబట్టి అక్కడక్కడే తిరుగుతూ కర్మలన్నీ ముగిశాక ఇక ఏ దారీ లేక అక్కణ్ణించి నిష్క్రమిస్తుంది’ నా స్నేహితుడు రవి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మరి.. ఇప్పుడు నా పరిస్థితేంటి? మొదటిసారిగా నాకు భయం వేసింది. ఫ్రీజర్ బాక్స్ చుట్టూ చేరి అందరూ మాట్లాడుకుంటున్నారు. నాతో వాళ్లకున్న జ్ఞాపకాలు, అనుభవాలను నెమరు వేసుకుంటున్నారు. అవన్నీ నా చెవికెక్కడం లేదు. నాకు తిరిగి ఆ బాడీలోకే వెళ్లాలని వుంది. కానీ దాన్ని ఫ్రీజర్‌లో పెట్టి ఆ చల్లదనం బయటికి పోకుండా చుట్టూ గ్లాసులతో బిగించేశారు. లోపలికి వెళ్లే మార్గమే కనపడటం లేదు. నా గుండె బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నాకోసమైనా నాకు బాధగా వుంది. నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేక పోతున్నాను. అయినా ఇదేమిటీ నాకోసం మరొకరు బాధపడటం, ఏడవటం నాకు నచ్చదు కదా?ఉదయం ఎనిమిదిన్నర కావస్తూంది. అప్పటివరకూ మూగి వున్న జనం నిదానంగా పలుచబడటం మొదలయ్యింది. నా దగ్గరి స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు. అప్పడు.. మొదటిసారిగా నాకు అనుమానం కలిగింది. ఇకమీదట నేను తిరిగి ఆ శరీరంలోకి చేరలేనేమో! తిరిగి నేను మనిషిని కాలేనేమో! ఒక్కసారిగా భయం వేసింది. ఏదైనా ప్రయత్నం చెయ్యాలని వుంది. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియటం లేదు. ‘ఆ శరీరం నాది. నన్ను అందులోకి వెళ్లనివ్వండి’ అని గొంతెత్తి అరవాలనుంది. కానీ మాట పెగలటం లేదు. శబ్దం బయటికి రావటం లేదు. నాకేమీ పాలుపోవటం లేదు. ఇక ఇంతేనా? నేను నా శరీరంతో వేరైపోయానా? ఇక మీదట నాకు ఆ శరీరంతో ఏ సంబంధమూ లేదా? ఇలా నాకొక్కడికేనా? సృష్టిలో ప్రతి ఒక్కరికీ ఇలానే జరుగుతుందా? మరైతే రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు.. వీళ్లందరినీ ప్రజల సందర్శనార్థం కోసం అలానే గంటల తరబడి ఉంచుతారే? వీలయితే రోజుల తరబడి కూడా ఉంచుతారే మరి వాళ్ళ ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఎంతగా క్షోభించి ఉంటుంది? నా ఈ మానసిక క్షోభకి కారణం నేను చేసిన పాపాలేనా? మరణం మాత్రం అతడి పాపపుణ్యాలని బట్టి వుంటుందట. ఇప్పటి వరకూ నేను ప్రశాంతంగానే వున్నాను. అంటే నేను పుణ్యకార్యాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చెయ్యలేదా?పాపం అనగానే నాకు శ్రుతిలయ గుర్తొచ్చింది.శ్రుతిలయ నా కాలేజ్‌మేట్. మనిషి అందంగా ఉండేది. ఇష్టానికి, ప్రేమకు అందమే తొలిమెట్టు ఐతే.. నేనామెను ఇష్టపడ్డా. విజాతి ధ్రువాలు ఆకర్షించుకున్నట్టు ఆమె కూడా నన్నిష్టపడింది. ఎన్నో ఉత్తరాలు.. ఎన్నెన్నో కబుర్లు.. సమయం తెలిసేది కాదు. మొదటి సంవత్సరంలో మొదలైన మా పరిచయం చివరి సంవత్సరానికొచ్చింది. పెళ్లి ప్రాతిపదికగా మేమెప్పుడూ ఒకరొకర్ని ఇష్టపడలేదు. అందువల్ల ఆ టాపిక్ ఎప్పుడూ మా మధ్య రాలేదు. కేవలం అభిప్రాయాలు, ఆలోచనలు కలవటం వల్లనే మా మధ్య బంధం మొదలైంది. ఆ బంధాన్ని ఒక అనుభూతిగా, తీయని జ్ఞాపకంగా, మధురస్మృతిగా వుంచుకోవాలనుకున్నామే తప్ప కలిసి జీవించాలని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా ఇష్టంలో, బంధంలో, ప్రేమలో ఉన్న అందం పెళ్ళిలో రాదేమో! అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. చివరిరోజు ఇద్దరం కాలేజీ గ్రౌండ్లో.. ఒకరికొకరం రాసుకున్న ఉత్తరాలను వెనక్కి ఇచ్చేసుకున్నాం. డైరీలు చింపేసుకున్నాం. అనుభూతులు, అనుభవాలు చెరిపేసుకున్నాం. చెరిపేసుకోవడానికి ఇక ఏమీ మిగిలి లేవనుకున్నాం. కాని, జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఆ జ్ఞాపకాలను తలుచుకున్నప్పుడల్లా గుండెల్లో గాయమైనట్టు ఒకటే బాధ. ఎర్రగా కాల్చిన కర్రుతో గుండెల్లో ఎవరో కెలుకుతున్న భావన. చెరుకు మిషన్‌లో గుండెను పెట్టి తిప్పినంత నొప్పి. అంత మానసిక క్షోభ అనుభవించటం అదే మొట్టమొదటిసారి నాకు ( రెండోసారి మా వాడి విడాకులప్పుడు). కొన్నాళ్ళు అలా గడిచాయి. ఆ తర్వాత తను ఏమైందో, ఎక్కడుందో కూడా ఆచూకీ లేదు. ఆ విధంగా ఆ ప్రేమకథ ముగిసింది. కాని, అప్పుడప్పుడూ తెరలు తెరలుగా వచ్చే జ్ఞాపకాలు నన్ను నిలువెల్లా దహించి వేస్తుంటాయి సరిగ్గా ఇప్పుడీ బాధలాగానే. ఇంత బాధలోనూ నాకు శ్రుతిలయ గుర్తొచ్చిందంటే మా బంధం ఏపాటిదో మీకు అర్థమయ్యేవుంటుంది. జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి చూస్తే చీకటిపడి ఎంతసేపయ్యిందో. తల దగ్గర దీపం వెలుగుతోంది. నిశ్శబ్దం అక్కడ రాజ్యమేలుతుంది. కాసేపటికి మా పిల్లలు వచ్చారు. మా మనవళ్లు, మనవరాళ్లు వాళ్లతో వున్నారు. నా భార్య వాళ్ళని దగ్గరకు తీసుకుంది. నా కూతురి కళ్ళు ఉబ్బి వున్నాయి. ఎంతగా ఏడ్చివుంటుందో. రాగానే నా శరీరం మీదపడి వెక్కివెక్కి ఏడుస్తున్నారు. నా గుండె బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నాకోసమైనా నాకు బాధగా వుంది. నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేకపోతున్నాను. అయినా ఇదేమిటీ నాకోసం మరొకరు బాధపడటం, ఏడవటం నాకు నచ్చదు కదా? నేనేమంత గొప్ప పని చేశానని.. నా కోసం ఈ ఏడుపులు? చరిత్ర గతిని మార్చిన గొప్పగొప్ప వాళ్ళు తమ ఆనవాలు వదిలివెళతారు. వాళ్ళకోసం వుంచుకోమ్మా నీ కన్నీళ్లు. అల్పుడినైన నా కోసం ఎందుకు వృథా చేసుకుంటావు? అని నా కూతుర్ని, కొడుకుని బుజ్జగించాలని వుంది. కానీ, వీలవడం లేదు.దేవుడా! ఎందుకయ్యా నాకీ కష్టాలు? ఓ దేవా.. మనుషుల మధ్య ఈ బంధాలు, పాశాలను ఎందుకు సృష్టించావు? ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయం అన్నట్టు.. మనుషుల మధ్య ఈ బంధాలన్నీ పూర్వజన్మలో తీరని ఋణం వల్ల ఏర్పడేట్లు చేస్తావు. అప్పు తీర్చకపోతే వడ్డీ పెరిగిపోయినట్లు ఈ అనుబంధం అనే అప్పు తీర్చకపోతే మనిషికి మోక్షం రాదు. తన తర్వాత తన పిల్లలు ఏమైపోతారో అన్న ఆలోచన మనిషిని నిలవనీయదు. వేకువలో వెన్నెల, కరిగే కర్పూరం, జారిపడే జాబిల్లి, ఆశల హారతి, కరిగే మబ్బు.. వీటన్నిటినీ జీవితం అనే అస్థిరానికి అద్ది చివరికి తెగిన వీణలా బంధాలన్నిటినీ తెంచుకుని శరీరం మూగబోతుంది. ఓ ఈశ్వరా! నీ సృష్టి ఎంత విచిత్రం? నువ్వే సృష్టిస్తావు. జ్ఞానమో, అజ్ఞానమో అన్నీ నువ్వే పంచుతావు. చివరికి ఏదీ శాశ్వతం కానట్టు, నువ్వే తీసుకెళతావు. ఓ ప్రభూ .. మనుషులుగా జన్మించినందుకు మాకిది తప్పదా? ప్రతి మనిషీ ఈ చట్రంలో బిగుసుకోవాల్సిందేనా? ఈ బంధాలనించీ, పునరావృతమయ్యే నీ లీలలనించీ ఎప్పుడయ్యా మాకు విముక్తి?మనసు ధారాపాతంగా రోదిస్తూనే వుంది. తర్వాతరోజు ఉదయం పది గంటల వేళ.. శరీరం అగ్నిలో దహనమయ్యింది. బంధాల్ని తెంచుకుని ఆత్మ ఊర్ధ్వముఖంగా శూన్యంలోకి పయనమయ్యింది. నడ్డా సుబ్బారెడ్డి(మిత్రుడు వైవీకే రవి చెప్పిన మాటల సౌజన్యంతో ) -
ఇహలోక అద్భుతం మహానంది
దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన మహానంది ఒకటి. ఆరవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే! ఇక్కడ మహానందీశ్వరుడితో పాటు కోదండరాముల వారూ కొలువై ఉండటంతో ఇది శివకేశవుల నిలయంగానూ మారింది. ఇక్కడ మహానందీశ్వరుడు పుట్టలోంచి స్వయంభువుగా వెలిశాడు. శివలింగం పుట్ట ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా స్వయంభువైన శ్రీ మహానందీశ్వరుడిని స్పృశిస్తూ వచ్చే జలం.. శైలధార, దివోదుని ధార, నరసింహధార, నంది తీర్థం, కైలాస తీర్థమనే ఐదు ధారలుగా ఇక్కడున్న రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లోకి పడుతూ ఎల్లప్పుడూ ఒకే నీటి మట్టాన్ని ఉంచుతోంది.చిన్న గుండు సూది వేసినా పైకి కనపడేంత స్వచ్ఛంగా ఉంటుందా జలం. మహానందీశ్వరస్వామి ఆలయానికి వస్తే.. గర్భగుడి చాళుక్యుల కాలంనాటి కళింగ ఆర్కిటెక్చర్ తరహాలో శిల్పాకళా వైభవాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మహానందీశ్వరస్వామే స్వయంగా రససిద్ధుడనే శిల్పితో నిర్మించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గర్భగుడి గోపురం చుట్టూ ఉండే నంది విగ్రహాల్లో ఓ నందికి రెండు తలలు ఉండటం మరో ప్రత్యేకత. వేసవిలో చల్లగా.. శీతకాలంలో వెచ్చగా.. మహానంది కోనేటి నీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఈ నీటిలో తొమ్మిది రకాల ఖనిజాలు ఉన్నాయని సమాచారం. బోరుబావుల్లో లభించే నీటిలో పలు రకాల రసాయనాలు వేసి అధునాతన యంత్రపరికరాల ద్వారా వడపోస్తే కానీ సాధారణ పీహెచ్ స్థాయి రాదు. అలాంటిది మహానందీశ్వరుడి చెంత ప్రవహించే నీటిలో సహజంగానే పీహెచ్ స్థాయి 7.1 ఉండటం విశేషం. అంతేకాదు ఇక్కడి కోనేరుల్లోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. శీతకాలంలో వెచ్చగా మారుతుంది. తెల్లవారుజామున చూస్తే కోనేరులు పొగలు గక్కుతున్నట్లు కనిపిస్తాయి. స్ఫటికమంత స్వచ్ఛంగా ఉన్న ఈ నీటిలో ఆలయ గోపురాలు ప్రతిబింబిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. వేలాది ఎకరాలకు సాగునీరుగా.. మహానందీశ్వరస్వామి దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉండే పొలాలకూ ఈ కోనేటి నీటినే వినియోగిస్తున్నారు. కోనేరుల్లోంచి నీరు రెండు పాయల ద్వారా బయటికి ప్రవహిస్తూ పొలాల మీదుగా వెళ్లి తెలుగుగంగ కాలువలో కలుస్తోంది. మహానంది ఆలయ పరిధిలోని 53.41 ఎకరాల్లో ఎక్కడైనా సరే రెండు అడుగుల లోతు గుంత తీస్తే చాలు నీరు ఉబికి వస్తుంది.ఓ అద్భుత దివ్యక్షేత్రంఏ ఆలయంలో అయినా ఒక విశేషం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దేనికి అదే ఓ విశేషం. ఇక్కడి రుద్రగుండం కోనేరును నంది తీర్థంగా పురాణాల్లో వర్ణించారు. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడ స్నానమాచరిస్తూ భక్తుల పాపాలను పోగొడుతుందని శివపురాణంలో వర్ణించారు. ఇక్కడ స్నానమాచరిస్తే శరీర రుగ్మతలు తొలగిపోతాయని ఎంతోమంది అనుభవపూర్వకంగా చెప్పడమే కాదు శాస్త్రీయంగానూ నిరూపితమైంది. – బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, మహానంది దేవస్థానం వేద పండితులు -
Clout అపూర్వ ముఖీజా
ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్. ద రెబల్ కిడ్‌గా పాపులర్. కామిక్ వీడియోస్, లైఫ్ స్టయిల్, ట్రావెల్ వ్లోగ్స్కి ప్రసిద్ధి. టిక్‌టాక్‌లో లిప్ సింక్ వీడియోస్‌తో సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేసింది. మన దేశంలో టిక్‌టాక్ బ్యాన్ అవడంతో ఇన్‌స్టాలో కామిక్ వీడియోస్‌కి స్విచ్ ఓవర్ అయింది. ముంబైలో పుట్టి పెరిగింది. మణిపాల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేసింది. కొన్నాళ్లు డెల్లో పని చేసింది. వెబ్‌స్టార్‌గా నేమ్ అండ్ ఫేమ్ రావడంతో వెబ్ దునియానే ఫుల్‌టైమ్ వర్క్ ప్లాట్‌ఫామ్‌గా మలచుకుంది. యాక్టింగ్ ఫీల్డ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది.. 'Who is your gynac' అనే సిరీస్‌తో! ‘నా చుట్టూ ఉన్నవాళ్లను నవ్వించడం నాకు సరదా! అదే నా స్కిల్ అని లేట్‌గా అర్థమైంది. దాన్నే కెరీర్‌గా మార్చుకున్నాను. నిజానికి నేనో స్టోరీ టెల్లర్‌ని’ అంటుంది అపూర్వ ముఖీజా. -
అమెరికాలోనూ కోడిపందేలు
సంక్రాంతి అంటేనే కోడిపందేలకు పెట్టింది పేరు. అందులోనూ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల కోలాహలమే కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంబరాల పేరిట కోడిపందేలను ప్రభుత్వం నిషేధించినా, ‘తగ్గేదే లే’ అంటూ ఈ పందేలు ఏటా జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు ఈ కోడిపందేల కోలాహలం అమెరికాకూ వ్యాపించింది. తాజాగా అమెరికాలో ఇద్దరు కోడిపందెం రాయుళ్లను కెంటకీ స్టేట్ పోలీసులు అరెస్టు చేశారు.వారి దగ్గర ఉన్న కోళ్లను స్వాధీనం చేసుకుని, రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. మన దేశంలో జరిగే కోడిపందేల్లాగానే అమెరికాలోనూ కోడిపందేలు జరుగుతుంటాయి. బరిలోకి దించే పుంజులపై పందెం రాయుళ్లు, అలాగే పుంజుల పెంపకందారులు భారీగా పందేలు కాస్తుంటారు. పందేల కోసం పుంజులను సుమారు ఏడాది పాటు పుష్టిగా పెంచుతారు. పందెంకోళ్లకు పెట్టే ఆహారానికి, వాటి ఆరోగ్యానికి భారీగా ఖర్చు చేస్తుంటారు. ఏది ఏమైనా కత్తులతో కుత్తుకలు తెగేలా సాగే పుంజుల పోరాటాలు ఏ దేశంలో జరిగినా, చూడటానికి వచ్చే వారి సంఖ్య మాత్రం తగ్గటం లేదు. -
సిల్వర్ స్క్రీన్ శిల్పం
‘ఒక్క చాన్స్..ఒకే ఒక్క చాన్స్’ కొందరిని స్టార్‌గా నిలబెడుతుంది. మరికొందరిని అడ్రస్ లేకుండా చేస్తుంది. అలా ఒక్క చాన్స్‌తో మెరిసి.. అపజయాలతో తడబడి.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన నటే శిల్పా మంజునాథ్. ఆ వివరాలే ఇక్కడ..⇒ శిల్పా మంజునాథ్.. బెంగళూరులో పుట్టిపెరిగింది. నటన మీదున్న ఆసక్తితో చదువు పూర్తయిన వెంటనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే, మరోవైపు ఆడిషన్స్ ఇచ్చేది.⇒ విజయ్ ఆంటోని నటించిన ‘కాళీ’ తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఇదే సినిమా అదే పేరుతో తెలుగులోనూ డబ్ అయింది. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడి, వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. ఒకేసారి కన్నడ చిత్రం ‘మగ 2’, మలయాళ చిత్రం ‘రోసాపూ’లలో నటించింది.⇒ ఇలా ఒకే ఏడాది తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ సినీ ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయింది. కాని, వరుస అపజయాలతో తడబడింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుంది.⇒ ‘హైడ్ అండ్ సీక్’ అనే థ్రిల్లర్ చిత్రంతో విజయం సాధించి, తిరిగి ఫామ్‌లోకి వచ్చింది శిల్పా. త్వరలోనే ఈ చిత్రం ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది.ఏ క్యారెక్టర్‌నైనా సులభంగా ఆకళింపు చేసుకోగలను. అదే నా బలం. పాత్రను డైరెక్టర్ నరేట్ చేస్తున్నప్పుడే, నేను ఆ క్యారెక్టర్ మూడ్‌లోకి వెళ్లిపోతా. అలా తీసుకెళ్లగలిగే స్క్రిప్ట్‌లనే సెలెక్ట్ చేసుకుంటా. – శిల్పా మంజునాథ్. -
బాల ఏసు పండుగ
ప్రపంచంలోని చాలా చోట్ల శిలువ మీద ఉన్న జీసస్‌ను ఆరాధిస్తారు. ఫిలిప్పీన్స్‌లో మాత్రం బాల ఏసును ఆరాధిస్తూ పండుగ జరుపుకొంటారు. ‘అతి అతిహన్’ పేరుతో ఈ పండుగ చేసుకుంటారు. దీన్నే ‘కలిబో శాంటో నినో ఫెస్టివల్’ అని కూడా పిలుస్తారు. ఇది ఫిలిప్పీన్స్ అక్లాన్ ప్రావిన్స్ లోని పలు పట్టణాలలో ఘనంగా జరుగుతుంది. ‘హోలీ చైల్డ్’ లేదా ‘బేబీ జీసస్’ను గౌరవించుకుంటూ మత పెద్దలు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ పండుగలో బాల ఏసును ప్రత్యేకంగా కొలుస్తారు.ప్రతి ఏడాది జనవరి నెలలోని మూడవ ఆదివారం రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ ఏడాది జనవరి 19న ఈ వేడుక జరుగుతోంది. ఫిలిప్పీన్స్ పండుగల్లో ప్రత్యేకంగా జరిగే ‘దినాగ్యాంగ్ ఆఫ్ ఇలోయిలో’, ‘సినలోగ్ ఆఫ్ సిబూ’ వంటి పండుగలకు కూడా ఈ ‘అతి అతిహన్’ పండుగే మూలమట! అందుకే ఈ పండుగను అక్కడివారు మదర్ ఫెస్టివల్ లేదా పెద్ద పండుగ అని పిలుచుకుంటారు. ఈ పండుగలో మతపరమైన ఊరేగింపులు, వీధి కవాతులు అద్భుతంగా జరుగుతాయి. రంగురంగుల దుస్తులు ధరించి నృత్యబృందాలు, కవాతు బ్యాండ్లు దుమ్ము లేపుతుంటాయి. ప్రజలంతా ముఖానికి, శరీరానికి రంగులు పూసుకుని, నృత్యం చేస్తూ ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ ‘అతి అతిహన్’ వేడుక మూలాలు ఇప్పటివి కావు, క్రీస్తుశకం 1212 నాటివి. ఇండోనేషియా, మలేషియా, బ్రూనై దేశాల మధ్యనున్న బోర్నియో ద్వీపం నుంచి పారిపోయిన ‘డాటస్’ అనే పదిమంది మలయ్ అధిపతులు ఫిలిప్పీన్స్ లోని పనాయ్ ద్వీపంలో స్థిరపడ్డారు. ఆ పదిమంది బృందానికి పెద్ద అయిన ‘దాతు పుటి’ స్థానిక ‘అతి’ తెగ ప్రజలతో వ్యాపారం చేసేవాడు. ఒకసారి స్థానికంగా కరవు పీడిస్తుంటే, అక్కడి ప్రజలకు తినడానికి తిండి ఇచ్చి ఆదుకున్నాడు. దానికి కృతజ్ఞతగా ఆనాడే ఈ వేడుక మొదలైందని చెబుతారు. 1960ల నాటికి, ఫిలిప్పీన్స్ పర్యాటక శాఖ స్థానిక పండుగలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించడంతో ఈ పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. 1972 నాటికి ఈ పండుగలో వాడే వస్త్రాల్లో కూడా చాలా మార్పు మొదలైంది. ఆఫ్రికా, పాపువా న్యూ గినీ తదితర దేశాలతో పాటు భారతీయ గిరిజన సంప్రదాయ వస్త్రధారణ కూడా ఈ వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తుంది. 2012 నాటికి ఈ పండుగ యునెస్కో సాంస్కృతిక వారసత్వ వేడుకల జాబితాలో చోటు పొందింది. ఈ వేడుకను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ వేడుకలను చూడటానికి ఏడాది ముందు నుంచే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకుంటారంటే, ఇది ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవాల్సిందే! -
యమ రావణ యుద్ధం
రావణుడు తన అన్న కుబేరుడిని తరిమికొట్టి, లంకను వశపరచుకున్నాడు. అతడి పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు సహా దిక్పాలకులను జయించాడు. నవగ్రహాలను తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకున్నాడు. తనకిక తిరుగులేదనే గర్వంతో లంకను పాలిస్తూ, నానా విలాసాలను అనుభవించసాగాడు.ఒకనాడు రావణుడి సభకు నారదుడు వచ్చాడు. రావణుడు నారదుడికి అతిథి మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు వేశాడు. నారదుడు రావణుడి ఘనతను ప్రశంసిస్తూ, ఇలా అన్నాడు: ‘రావణా! నువ్వు ఇంద్రాది దేవతలను జయించావు. భూలోకంలోని మానవమాత్రులెవరూ నీకు సాటిరారు. భూలోకవాసుల మీద నీ ప్రతాపం చూపించడం శోభస్కరం కాదు. నరకాధిపతి యముడిని కూడా జయించావంటే, నీకు ఇంకెక్కడా ఎదురుండదు, మృత్యుభయం కూడా ఉండదు’ అన్నాడు.రావణుడు నారదుడిని సాగనంపిన తర్వాత, మంత్రులతో చర్చించి, సైన్యాన్ని సిద్ధం చేసుకుని నరకంపై యుద్ధానికి బయలుదేరాడు. నరకానికి చేరుకున్న రావణుడు అక్కడ యమభటుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న పాపుల కష్టాలు చూశాడు. యమభటుల చేతిలో హింసలు అనుభవిస్తున్న పాపులు ఆ బాధలకు ఆర్తనాదాలు చేస్తున్నారు. వారు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. రావణుడికి వారిపై జాలి కలిగింది. యమభటుల చెర నుంచి వారిని విడిపించడం ప్రారంభించాడు. రావణుడు చేస్తున్న పనిని గమనించిన యమభటులు అతడిపైకి ఆయుధాలతో దూసుకొచ్చారు.వారిని చూసి, రావణుడు వెంటనే పుష్పక విమానంలోకి చేరుకున్నాడు. పుష్పకవిమానం పైకెగిరింది. యమభటులు శూలాలు, గదలు, తోమరాలు, పరిఘలు వంటి నానా ఆయుధాలను పుష్పక విమానం మీదకు విసిరారు. ఆ ఆయుధాల తాకిడికి పుష్పక విమానంలోని ఆసనాలు, వేదికలు, స్తంభాలు ధ్వంసం అయిపోయినా, క్షణాల్లోనే మళ్లీ అవి యథాతథ స్థితికి వచ్చాయి. అక్షయమైన పుష్పక విమానం మహిమకు యమభటులు నివ్వెరపోయారు.రావణుడికి, యమభటులకు మధ్య ఈ రభస కొనసాగుతుండగా, నారదుడు నేరుగా యుముడి వద్దకు చేరుకున్నాడు. ‘యమధర్మరాజా! లంకాధిపతి రావణుడు నీ మీదకు యుద్ధానికి వస్తున్నాడు. నీ కాలదండం ఏం కానుందో!’ అన్నాడు. యుముడితో నారదుడు మాట్లాడుతుండగానే, దూరాన ఆకాశంలో ధగధగలాడుతూ ఎగురుతున్న పుష్పక విమానం కనిపించింది. యమభటులతో కొంతసేపు యుద్ధం సాగించిన రావణుడు, వారి ధాటి శ్రుతి మించుతుండటంతో వారిపై పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అగ్నిజ్వాలలను చిమ్ముతూ దూసుకొచ్చిన పాశుపతాస్త్రం యమభటులను మిడతల్లా మాడ్చేసింది. నరకంలోని చెట్లను, పొదలను బూడిద చేసింది. యమభటులు అంతం కావడంతో రావణుడు, అతడి మంత్రులు పెద్దపెట్టున సింహనాదాలు చేశారు. వాటిని విన్న యముడు యుద్ధంలో రావణుడు గెలిచాడని అర్థం చేసుకున్నాడు.ఇక తానే రంగంలోకి దూకాలని నిశ్చయించుకుని, తన సారథిని పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. క్షణాల్లో రథం సిద్ధమైంది. యముడు తన యమపాశాన్ని, కాలదండాన్ని, ముద్గరాన్ని తీసుకుని రథాన్ని అధిరోహించాడు. రథం పుష్పక విమానం దిశగా ముందుకు ఉరికింది. యముడు యుద్ధానికి స్వయంగా బయలుదేరడంతో ముల్లోకాలూ కంపించాయి. యముడి రథం వాయువేగ మనోవేగాలతో నేరుగా రావణుడి పుష్పక విమానం ఎదుట నిలిచింది. యముడి రథాన్ని చూడగానే రావణుడి మంత్రులు భయభ్రాంతులయ్యారు. యుద్ధరంగంలో నిలిచేందుకు ధైర్యం చాలక వారు తలో దిక్కు పారిపోయారు. రావణుడు మాత్రం భయపడకుండా, యముడికి ఎదురు నిలిచాడు. ఇద్దరికీ ఏడు పగళ్లు, ఏడు రాత్రులు ఏకధాటిగా యుద్ధం జరిగింది. యముడు అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించి, రావణుడిని తీవ్రంగా గాయపరచాడు.రెచ్చిపోయిన రావణుడు కూడా యముడి మీదకు శరపరంపర కురిపించి, గాయపరచాడు. యముడి సారథిని కూడా తీవ్రంగా బాధించాడు. యమ రావణుల యుద్ధాన్ని గమనిస్తూ వచ్చిన మృత్యుదేవత యముడి ముందుకు వచ్చి నిలిచింది. ‘యమధర్మరాజా! నువ్వెందుకు శ్రమించడం? వీడితో యుద్ధానికి నన్ను ఆదేశించు! క్షణాల్లో వీడిని చంపేస్తాను’ అంది. ‘నువ్వు ఊరికే చూస్తూ ఉండు. వీణ్ణి నేనే చంపేస్తాను’ అంటూ యముడు తన కాలదండాన్ని పైకెత్తాడు. కాలదండం నిప్పులు చిమ్ముతూ భయంకరంగా ఉంది. యముడు కాలదండాన్ని రావణుడి మీదకు విసరబోతుండగా, బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ‘యమధర్మరాజా! కాలదండాన్ని ప్రయోగించకు. నీ కాలదండంతో వీడు మరణిస్తే, నేను వీడికిచ్చిన వరం వ్యర్థమవుతుంది’ అన్నాడు. బ్రహ్మదేవుడి మాట మన్నించిన యముడు తన కాలదండాన్ని ఉపసంహరించుకున్నాడు. రావణుణ్ణి చంపడానికి అవకాశం లేకపోవడంతో యుద్ధరంగంలో ఏం చేయాలో తోచక రథంతో సహా అదృశ్యమై, బ్రహ్మదేవుడి వెంట సత్యలోకానికి వెళ్లిపోయాడు.యముడు అదృశ్యం కావడంతో రావణుడు తాను నరకాన్ని జయించినట్లు ప్రకటించుకున్నాడు. అక్కడి నుంచి పుష్పక విమానంలో బయలుదేరి లంకకు చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: నల్లకోడి-తెల్లదెయ్యం
‘ఓబ్బీ! లేయ్ నాయన.. నా తండ్రివి గదూ! నా రత్నం గాదూ! మన ఇంటికి రాక రాక ఇన్ని దినాలకు అబ్బొచ్చినాడు. పాపం.. మనం బాగా మర్యాద జేసి పంపొల కదా? కోడ్‌ని అలల జేయించుకుని రావాల, మీ నాయన జూస్తే టైంకి ఊర్లో లేకపాయ. కిస్టపాడు పోవాలా.. లెయ్ నాయనా.’మాయమ్మ చెవిలో జోరీగ మాదిరి నస పెట్టేది వింటా తట్టుకోలేక దుప్పటి కాళ్ళ కిందునుంటి ఇరికిచ్చి తలవెనక్కి బిర్రుగా తోసి ముదరజుట్టుకుని పడుకున్నా.అహా! అసలుకి ఈ రగ్గు మా నాయన నెల్లూరు పోయినపుడు తెచ్చివుండాడు. నాతో అబద్ధం జెప్పి వుంటాడు. మా ఇటుకల బట్టి అంటించినాక ఆకాశంకేసి పై పైకి లేస్తాపోయే పొగతోబాటు గాల్లోకి ఎగిరి అట్టనేబోయ్ మబ్బులు తెంపి ఇట్టా తెచ్చినట్టు ఎంత హాయిగా, ఎంత మెత్తగా వుంటాదో ఈ దుప్పటి.దీన్ని తెచ్చిన పొద్దు జూడాల మాయమ్మ బేసిన భరతనాటికం, ఈ లేత నీలం రంగు చూసి మా నాయన మీదకి పూనకమొచ్చిన మాదిరి వూగింది. ఈ రంగు బేన్నే మాసిపోద్దనీ, ఇంత లావు రగ్గుని ఉతికేటాలకు నడుము, చేతులు పడి పోతాయని వాపసు ఇచ్చి రమ్మనింది. నేనే నాకు నచ్చిందని మాయమ్మని కాళ్ళా, వేళ్ళా పడి బతిమాలి వున్నించుకున్నా. ఉతికేతపుడు నేను సాయంగూడా జేస్తానన్నా. అట్టా దీన్ని దక్కించుకున్న.ఇది కప్పుకుంటే పానం గాల్లో తేలుతాపోతాన్నెట్టు ఉంటాది.కాకుంటే ఒకటే .. మా అమ్మ నా తాలాపు దిక్కున మంచంకోడుకు ఆనుకుని కుచ్చిని నన్ను లేపుతావుంటే సూసే అమ్మలక్కలు తోడై, రాగాలు పెడతారేమోనన్న ఆలోచన మనసులోకి రాంగానే భయమేసి గబుక్కుని లేస్తి.‘మా! ఏంది మా? సంకురాత్రి సెలవులిచ్చినాక, ఈ మాద్దిరి ఎండపొద్దు దాకా పొండుకోవాలని కలలుగంటి. తలాపున కుచ్చోని ఈమైన ‘ఓ..’ అని రాగాలు పెడతావుండావు. ఏం? కిట్టపాడు దాకా ఏంటికి? నాలుగీదులవుతలనే ‘ఈసోబు’ మామ వుండ్లా్య. ఎప్పుడూ ఆయనే సేసిస్తాడుగదా అలల’ అంటి విసుగ్గా. ‘ఏంటికి నాయన ఇంత చిరాకు నీకు? పొద్దున్నే పాలకోసం ఈసోబు మామ చిన్న బిడ్డవుండ్లా? అదే ఆయమ్మి గౌసియా వచ్చింటే నేను ముందే ఎచ్చరిస్తి. మీ నాయన వుండాడా అమ్ములు? కోడిని తెస్తా అలల జేపిచ్చాడేమో’ అని అడిగితి. దానికి ఆయమ్మి..‘లేడత్తోవ్! నిన్ననే మా మున్ని అక్కను అత్తగారింటి నుండి మనింటికి కాన్పు కోసమని తోడకరావాలని ఊరికి పోయినాడు’ అని చెప్పింది రా’ అంది మాయమ్మ.‘గౌసియా వచ్చిందా?’ అంటి టక్కున ఆత్రం ఆపుకోలేక. మళ్ళా మాయమ్మ ఏమనుకుంటుందో అని ఉత్తుత్తి ఆవలింతలు దీస్తా మెరిసిన ఆనందపు కళ్లను నులుపుకుంటానట్లు అరచేతులను అడ్డుబెట్టుకుని ‘చా! భలే ఛాన్సు పాయ’ అని మనసులో అనుకున్నా. ఆయమ్మి నాదిక్కు జూసినపుడు నవ్వే నవ్వంటే నాకు శానా శానా ఇష్టం. కానీ ఆయమ్మి ఇంత పొద్దన్నే వచ్చుద్దని అసలు అనుకోలా నేను.‘బిరాన పోయిరాపో నాయనా! నెను పప్పు నానబెట్టిన, నువ్వచ్చేలోపు గారెల పిండి రుబ్బేసి. తెల్లబాయలు వొలిసి మసాలా నూరి పెడతా! నువ్వొచ్చినాక కోడి కూర పులుసుజేసి వేడి వేడిగా నాలుగు గారెలు జేసిపెడతాను. మా నాయన కదూ! పోయ్రాపో బంగారూ’ అంటా మాటలతో ఊరిచ్చే మాయమ్మ.సరేని ఉదరాబదరా పండ్లు తోమి, మాయమ్మ ఇచ్చిన పెద్ద గలసానిండాకు ఉడుకుడుకు పాలు తాగినాక.. నేను, మాయమ్మ ఇద్దరం కలిసి కోళ్ల గూటిలో తారాడి తారాడీ గుడ్లకు వచ్చిన నల్ల కోడిని ఒకదాన్ని చూసి ఒడుపుగా పట్టుకుంటిమి. మాయమ్మ దాని కాళ్ళు రెండు పురికొసతో ముడేసిస్తే చెయ్ సంచిలో కుక్కి, జేబులో రూపాయి పెట్టుకొని దావ పట్టిన.మా ఊరికి కిస్టపాడు రెండు కిలోమీటర్ల దూరం. బస్సులు ఎపుడో ఒకటి తప్ప రావు. అందుకే అందరూ సైకిళ్ల మీదనో, నడుచుకునో పొయ్యేవాళ్లు. పొయ్యేటపుడు డబుల్స్ లేని సైకిల్ జూసి చెయ్ చాపి ఎక్కి, సరాసరి మా నాయన దగ్గర పనిజేసే మస్తానోళ్ళ ఇంటికి బోతి. ఈడకు ఎప్పుడు వచ్చినా యజమాని కొడుకు హోదా ఇస్తారు వీళ్లు. ఒకదిక్కు మస్తాన్ మామ కోడిని అలాల్ జేసేదానికి తీసుకొనిబోతే, నేను ఆయప్ప భార్య ఇచ్చిన కారం చుట్టలు తింటా కూసున్న.‘నాయన లేడు కదా అబ్బయ్యా! నేనే కోడిని కాల్చి కొట్టిస్తాగానీ రోసేపు అట్ట మంచంలోనే కూకో’ అనే. సరే అని కుచ్చుంటి నేను. అంతలోనే ఆయమ్మ లోటాతో బానలోని చల్లటి నీళ్లు తెచ్చిచ్చే. తాగి చొక్కాతో మూతి తుడుచుకుని లేచేతరికి, ముక్కలుగా కొట్టిన కోడి మాంసంను స్టీల్ టిఫను డబ్బాలో బెట్టిస్తా ‘టిపను డబ్బా రేప్పొద్దున వచ్చినప్పుడు తెచ్చుకుంటాలే గానీ నువ్ భద్రంగా పోయిరా చిన్నోడ’ అనే.నేను టిఫను డబ్బా పట్టుకుని ఊపుకుంటా, గారెల రుచి ఊహించుకుంటా పాటలు పాడుకుంటా, ఎవురన్న సైకిల్ మీద వస్తాండారేమో అని యనకమాలకి తిరిగి తిరిగి సూసుకుంటా నడుస్తావుండా. మా ఊరినింటి కిష్టపాడు మధ్యలో ఒక లోతువంక దారి ఉంటాది. వంకకు ఒక పక్క చింతమానుల కిందున్న సమాధులు నన్ను ఎప్పుడూ భయపెట్టేదానికే జూస్తాయి. పొయ్యేతపుడు సైకిల్ మీద ఆ దిక్కు తిరిగి కూర్చుని పోయినా కాబట్టి కనపడలేదేమో గాని ఈ మధ్య కొత్తగా కట్టినట్టువుండారు ఓ సమాధిని. కట్టింది చాలదని దాని మీద సిమెంట్‌తో ఒక మనిషి ఆకారం కూర్చున్నట్టుగా కూడా చెక్కినారు. ఎర్రంచు పంచా, తెల్లటి చొక్కా, నల్లంగా గుబురు మీసాలు, చేతికర్రా.. అచ్చం మనిషి కూర్చున్నట్టే వుంది. నాకు గుండె దడ దడ మనే. అంతలో ఎవరో నా పేరు పిలిచినట్టు అనిపించింది. ఇంగ నా భయం జూడాల. అప్పటిదంకా పాడిన శిరంజీవి పాట ఆపేసి ‘అనుమంతుడి’ దండకం ఎత్తుకుంటి నేను. అయినా కూడా గుండెలో దడకేమో ఎండ ఎక్కువ లేకున్నా చెమటపడతానే వుంది. పొద్దున తాగిన పాలు ఆవిరైపాయ, తిన్న కారం సుట్టలు అరిగిపాయ, గబ గబా నడిసి వంకపైకి వచ్చేసి ఊపిరి తీసుకున్నాను. ఎదురుమల్లె దూరంగా మా ఊరు కనపడి హమ్మయ్య అని ఇంగ ధైర్యం తెచ్చుకుంటి. రోన్ని నీళ్లు తాగితే బాగుండు అని నాలిక పిడసగట్టినట్టు అనిపిస్తంది.అంతలో ‘ఓఓ..బ్బీ’ అని ఎవరో పిలిసిన పిలుపు మళ్ళా వినపడి యనక్కి తిరిగి జూస్తి. వంక లోతట్టులో తెల్లగుడ్డ కదులుతున్నట్టు, నడుస్తాన్నట్టు కనపడి వెన్నులో పదురు లేసింది. ‘ఓఓబ్బీ.. నువ్ రత్నం గాదూ.. ఆడనే వుండు నే వస్తన్న’ అంటా మల్లోసారి కేకేసింది ఆ ఆకారం. ఆమెను ఇంతకు ముందు చూసిన గాపకం లేదు. అసలు తలంతా తెల్ల గుడ్డలాంటిది చుట్టుకుంది మొహం కానరాకుండా. దానికి తోడు తెల్ల చీర కట్టుకుంది.నాకు కాళ్ళల్లో వణుకు మొదలయ్యింది. ‘ఒరా! దయ్యాలకు మన గురించి తెలుసుకోవడం శానా వీజీ అంటరా. అవిగాన తలచుకుంటే మన పేరే గాదు, తరగతిలో మనం యా సెక్షనో గూడా తెలిసిపోతాయంటరా. వాటికీ.. తెల్లచీరలన్నా, నల్ల కోళ్లన్నా, చింత మానులన్నా శానా ఇష్టమంటా మా అబ్బ జెప్పినాడ’ని కళ్ళు గోళికాయలంత జేసుకుని చెప్పిన మా రమణగాడు గుర్తొచ్చాడు.అంతలో ఆ ఆకారం నవ్వుతా ‘ఏందో టిపన్ డబ్బాలో కొండబోతండవే. సియ్యలేనా? అయితే బువ్వదినేకి నేనూ వస్తా వుండు నీతోబాటు మీ ఇంటికి’ అని తుపుక్కున నేల మీద ఉమ్మింది తార్రోడ్డు మీద ఎర్రగా నెత్తురు మాదిరి.. ‘ఉండబ్బీ’ అంటా తలెత్తి నా దిక్కు జూస్తా ముందుకు నడుస్తా వస్తంది. నాకు ఏం జేయాలో తెలియక చేతులు, కాళ్ళు ఆడట్లేదు. ఆమె ఆగి నెత్తిమీద నుండి∙జారిపోతున్న తెల్లగుడ్డ సరి జేసుకుంటా ఉంటే, నేను ఇదే ఛాన్సని ఇంగ దొమ్మల నిండాకు ఊపిరి దీసుకొని పరుగు అందుకున్నా.అట్టా పరిగెత్తిన నాకు వాకిట్లో వాల్చిన నులకమంచంలో బడి మా యమ్మను వాటేసుకున్నది మాత్రమే గ్యాపకం. ఇంగ ఆ పడుకోడం పడుకోడమే పట్టుకుంది అల్లుజ్వరం. వారమయినా తగ్గలేదు.ఓనాడు నేను పొద్దున్నే పాలు, బన్ను తిని జొరం మాత్తరేసుకుని ముదరజుట్టుకుని ముడుసుకుని పడుకునివున్నా. మా అమ్మ నా ఎదురుగా కుచ్చుని రాగులు ఇసురుకుంటా వున్నపుడు వచ్చింది గౌసియా వాళ్ళమ్మ.‘వదినా సేమిరికి రొంత పెరుగు కావాలా’ అంటా అడుగుతా మంచంలో పొడుకున్న నన్ను జుసిందేమో ‘ఏం పిల్లకాయ వదినా! మీ రత్నమయ్య? ఆ మధ్య ఊరినింటి మా అమ్మ వస్తా వుంటే ఈ యబ్బి కనపడినాడంటా. ఎదో మాట్లాడతా తోడుగా పోవచ్చులే అని పిలిస్తే ఉలుకూపలుకూ లేదంటా, ఆకేసుకుంటా నిలబడి ‘ఏంది టిపనులో సియ్యలా నేనూ వస్తా’ అని నవ్వాతా అనిందో లేదో ఆ మయిన ఒకటే పరుగులెత్తి పోయినాడంట. నిజంగానే సియ్యలు లాక్కుంటాదనుకున్నాడా ఏమి?’ ఒకటేమయిన నవ్వుతా వుంది.మాయమ్మ నా దిక్కుజూస్తా ‘లేదులే వదినా! శానాళ్ళయ్యింది కదా మీ అమ్మ మనూరు రాక, అత్తని వాడు గుర్తుపట్టి వుండడులే, ల్యాకుంటే మర్యాదకైనా ఎచ్చరిచ్చే పిలకాయేగాదు మావాడు? వాడి గురించి నీకు తెలీదా!’ అంటా నన్ను ఎనకేసుకోస్తా వున్నింది. ఇద్దరూ అట్లా మాట్లాడతానే నిలబడుకోనుండారు.అన్నీ ఒక్కోటిగా గుర్తు తెచ్చుకుంటి. ఆమె దయ్యం కాదనీ, ఉమ్మింది రక్తం కాదనీ.. గౌసియా వాళ్ల అవ్వకోసం ఆకులు, వక్కలు కొనక్కపోయేదీ, ఆ జేజి ఎప్పుడూ ఆకొక్క నములతాంటాదని అప్పటికి జ్ఞాపకం వచ్చింది. తెల్ల గుడ్డ కప్పుకుంటే మట్టికీ అందరూ దయ్యం కాదని అర్థమై లోలోపల నవ్వుకుంటి నేను.గౌసియా వాళ్లమ్మ రోసేపు మాటాడి పోతా పోతా నా మనసులోని భయం కూడా తీసుకొని వెళ్ళిపోయింది. ఆ పొద్దు గట్టిగా అనుకుంటి. ఇంగెప్పుడూ భయం అన్న మాట లేకుండా తిరగాలని.మా కానుగచెట్టు నుండి చల్లని గాలి నా మొహాన్ని తాకుతా వుంది. మా అమ్మ నుదురు మీద అరచెయ్యేసి జూసి ‘హమ్మయ్య! చెమట పోస్తంది లే. ఇంగ జ్వరం ఇడిసినట్టే రత్నమా’ అంది ప్రేమగా నా నుదురు ముద్దాడి. -
బౌండరీ దాటితే ఔటే!
కవిత, కుమార్‌లకు మూడేళ్ల కిందట వివాహమైంది. మొదట్లో చిలకాగోరింకల్లా ఉండేవారు. కాలం గడిచేకొద్దీ వారి వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. కవిత వస్త్రధారణ నుంచి ఆమె స్నేహితుల వరకు అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు కుమార్. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇది కవితకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు కుమార్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఏం చేయాలో అర్థంకాక కవిత కౌన్సెలింగ్‌కు వెళ్లింది. కాలంతో పాటు మారని మనుషులు..మన దేశంలో భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే సాగాలనే భావజాలంలోనే ఉంటున్నారు. కుమార్దీ అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కవిత తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్‌కు వెళ్లింది. ఆమె చెప్పినదాన్ని బట్టి వారికి ‘హెల్దీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని తెలిసింది. సరిహద్దులు అవసరం..భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలని, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలని అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్‌ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు. అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతి జంటకూ హెల్దీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం. ⇒ ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం. ⇒ ‘నువ్వలా చేస్తున్నావు’, ‘నువ్విలా అంటున్నావు’ అని కాకుండా.. ‘నేనిలా అనుకుంటున్నాను’, ‘నేనిలా ఫీలవుతున్నాను’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ⇒ ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. ⇒ సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతౌల్యం సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది. ⇒సరిహద్దులను సెట్ చేయడం సవాలే. భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి. ⇒హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి. వీటిని కవిత, కుమార్‌లకు మూడు సెషన్లలో వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్సైజ్లు చేయించారు. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా ఉంటున్నారు. రకరకాల హద్దులు..శరీరానికి, గోప్యతకు సంబంధించినవి ఫిజికల్ బౌండరీస్. బహిరంగ స్థలాల్లో ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ఇష్టం లేకపోతే ఆ నిర్ణయాన్ని భాగస్వామి గౌరవించాలి. మీ సమయాన్ని ఎలా నిర్వహించుకుంటారనేది మీ టైమ్ బౌండరీస్పై ఆధారపడి ఉంటుంది. గడపాల్సిన సమయానికి పరిమితులు పెట్టడం, మీకోసం సమయం కేటాయించుకోవడం అందులో భాగం. భావాలు, భావోద్వేగాలకు సంబంధించినవి ఎమోషనల్ బౌండరీస్. ఇతరుల భావోద్వేగాలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడం ఇందులో భాగం. ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి ఫైనాన్షియల్ బౌండరీస్. మీ ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం ఇందులో భాగం.శృంగారంలోనూ సరిహద్దులుండాలి. అసౌకర్యంగా అనిపించే వాటికి నో చెప్పాలి. మానసిక శక్తి తగ్గించే చర్చలు నిరాకరించే హక్కును, నెగటివిటీ లేదా గ్యాస్‌లైటింగ్ నుంచి మీ మనస్సును కాపాడుకోవడమే మానసిక సరిహద్దు.మీ ఆన్లైన్ వ్యవహారాలు ఎలా ఉండాలో నిర్ణయించేది డిజిటల్ బౌండరీసే! -
యువ కథ: చందమామ రావే!
రోజులాగే ఆ రోజూ సెల్లో అలారం మోగింది, కాకపోతే గంట ముందుగా. ఠక్కున లేచి అలారం ఆఫ్ చేశాడు అనంత మూర్తి. ‘అప్పుడే తెల్లారిందా’ మెల్లగా కళ్ళు తెరవకుండానే అడిగింది భార్య నీరసంగా.‘ఈరోజు త్వరగా వెళ్లాలని చెప్పానుగా. రాత్రి టెంపరేచర్ ఏమీ లేదుగా నీకు’ అడిగాడు.‘ఊహూ’తాకి చూడాలనిపించింది. కాని టైమ్ లేదు. లైట్ వేసి ముందురోజే తీసి వుంచుకున్న టవల్, షేవింగ్ కిట్ తీసుకుని బాత్రూమ్లోకి వెళ్ళాడు. ఇంకా పేపర్ కూడా రాలేదు. ముందు రోజు సండే బుక్ తీసుకుని తిరగేస్తూ కూర్చున్నాడు. ‘ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇన్నాళ్లు పడిన కష్టానికి ఫలితం వచ్చే రోజు. వెళ్ళగానే ఆఫీస్ మొత్తం ఒక రౌండ్ వేయాలి. ఆ మహీధర్ని నమ్మలేం. ఏదీ సక్రమంగా చేయడు. ఎంట్రన్స్‌లో కుండీలన్నీ సరిగ్గా పెట్టించాడో లేదో. అసలే మబ్బు గాడు’ మనసులోనే అనుకుంటున్నాడు. చూపు పుస్తకం మీద ఉందే కానీ ఆలోచనలు మొత్తం ఆఫీస్‌లోనే ఉన్నాయి. టైమ్ అయిపోతోంది ఇంక లాభం లేదు అనుకుని కడుపు ఖాళీ అవ్వకపోయినా లేచి స్నానం ముగించుకుని బయటికి వచ్చాడు. అనంతమూర్తి మొదటి నుండి పని రాక్షసుడే. తన నిరంతర కృషే ఈరోజు తనకి జనరల్ మేనేజర్‌గా గుర్తింపు తెచ్చిందని పూర్తిగా నమ్ముతాడు. అందుకే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు దాని పూర్తి బాధ్యత మూర్తి చేతిలో పెట్టింది కంపెనీ. ఈరోజు అది అన్ని బ్రాంచీల్లో కెల్లా అతి తక్కువ కాలంలో ఉన్నతమైన ఫలితాలను సాధించింది. తనని అభినందించడానికి సాక్షాత్తు కంపెనీ íసీఈవో రాబోతున్నారు.డ్రైవాష్ నుండి తెప్పించుకున్న సూట్‌కి ఉన్న ట్యాగ్ కట్ చేస్తూ భార్యకి చెప్తున్నాడు– ‘సాయంత్రం నాకు రావడానికి లేట్ అవ్వచ్చు, ఆఫీస్ వాళ్ళతో బయటకి వెళ్తాను. డిన్నర్‌కి రాను. నువ్ మందులేసుకుని పడుకో. రఘు, సుమ లేచాక చెప్పు రేపు వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్తా అని!’ కార్ తీసుకుని ఆఫీస్ బ్యాగ్‌తో బయటకువెళ్తుంటే ఎదురైంది సుభద్ర.. ‘అమ్మగారు లేచారాండయ్య? జ్వరం తగ్గిందా?’‘ఆ..!’ అంటూ గడియారంలో టైమ్ చూసుకుంటూ కార్ ఎక్కి ఆఫీస్‌కి బయల్దేరాడు. దారిలోనే మహీధర్కి కాల్ చేశాడు. పూర్తిగా రింగ్ అయినా ఫోన్ ఎత్తలేదు. ‘ఇంత నిర్లక్ష్యం ఏంటో ఈ యువతకి. వీళ్ళు ఎలా పైకి వస్తారు. ఐదు రోజుల కష్టాన్ని రెండు రోజుల్లో తగలేస్తారు’ అనుకుంటూ అభిరామ్‌కి డయల్ చేశాడు. ‘హాలో.. ఆయన స్నానం చేస్తున్నారు. ఏదైనా ముఖ్యమైన విషయమాండి?’ అభిరామ్ భార్య ‘20 మినిట్స్‌లో ఆఫీస్‌లో ఉండాలని చెప్పండి’‘ఒక్కరిక్కూడా శ్రద్ధ లేదు. వాళ్ళ వయసులో నేను ఎంత పోటీ పడేవాడ్నో, ఏదో ఒక అవకాశం దొరకక పోతుందా ప్రూవ్ చేసుకోడానికని..’ పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఆఫీస్ చేరుకున్నాడు. మూర్తి లోపలికి వెళ్తుండగానే అటెండర్ రవి రావడం చూసి కొత్తగా తెప్పించిన కుండీలను ఎక్కడెక్కడ పెట్టాలో స్వయంగా చూపించాడు. అవన్నీ కూడా హరిశ్చంద్రగారు ఖాళీ సమయాల్లో గార్డెనింగ్ చేస్తానని ఇంటర్వ్యూలో చెప్పడం వల్లే.. విజిట్ గురించి తెలిశాక అప్పటికప్పుడు ఆర్డర్ చేసి రకరకాల బోన్సాయ్ మొక్కలు తెప్పించాడు. కార్పెట్ క్లీనింగ్ సరిగ్గా చేశారా లేదా అని చెక్ చేశాడు. కారిడార్ మొత్తం తిరిగి అన్ని విండోస్ ఓపెన్ చేసి చూశాడు. ఇంతలో అభిరామ్, మహీధర్ వచ్చారు. ‘పాత ఫైల్స్ అన్నీ సెపరేట్ షెల్ఫ్‌లోకి షిఫ్ట్ చేయించావా?’ ‘లాస్ట్ వర్కింగ్ డేనే చేశాం సర్’ మహీధర్ వెనకే నడుస్తూ చెప్పాడు. ‘అప్ కమింగ్ ప్రాజెక్ట్ డీటేల్స్?’ ‘డేటా రెడీగా ఉంది సర్’ అభిరామ్ వైపు ప్రశ్నార్థకంగా చూసి తలాడిస్తూ చెప్పాడు మహీ. స్టాఫ్ అందరూ ఒక్కొక్కరూ రావడం గమనించి మూర్తి వారినుద్దేశించి చెప్పసాగాడు. ‘ఈరోజు మనకు ముఖ్యమైన రోజు. ఇంత వరకు మీరందరూ నాకు సహకరించినందుకు ఫలితం కొద్దిసేపట్లో మనం చూడబోతున్నాం’మాటల మధ్యలో అభిరామ్ ఫోన్లో మాట్లాడుతూ బయటకి లోపలికి తిరుగుతూనే ఉన్నాడు. అది కనిపెట్టిన మహీధర్ ‘అభి, ఎందుకలా తిరుగుతున్నావ్, ఎవరి కోసం చూస్తున్నావ్?’ అడిగాడు. ‘ఈ రవిగాడు అనుకున్నంత పని చేశాడు’‘రవి బొకే తేవడానికి వెళ్ళాడుగా?’‘ఔను, అలాగే ప్లంబర్ని కూడా తీసుకు రమ్మని నేనే పంపాను’‘వార్నీ, నువ్వింకా ఆ ట్యాప్ ఫిక్స్ చేయించలేదా.. బాస్ ఇంకా చెక్ చేయాల్సింది వాష్‌రూమ్స్ మాత్రమే. ఆయన కంట పడిందో.. చిన్న పని కూడా చేతకాదు అని నెలంతా వాయించేస్తాడు. అయినా నీకు చెప్పాను చూడూ’ మహీధర్ తలపట్టుకున్నాడు. ‘నేను ఆరోజే రవికి చెప్పాను. వాడు చిన్న పనే అయిపోతుంది అన్నాడు. ఇందాకే నాతో చెప్పాడు ప్లంబర్ రాలేదని, ఏదేమైనా 10 నిమిషాల్లో తీసుకొస్తా అన్నాడు. అదే ఫోన్ చేస్తున్నా, తీయట్లేదు’ ఏం చేయాలో తెలీక నీళ్లు నములుతూ చెప్పాడు అభి.రవి వెళ్లి అరగంట దాటింది. టైమ్ 10 అయింది. సీఈవో గారు ఎప్పుడైనా రావచ్చు, ఇంకా ఈ ట్యాప్ ఫిక్సింగ్ ఇప్పుడు కాదు అనుకుని అభిరామ్.. మహీధర్ దగ్గరకి వచ్చి అదే చెప్పాడు. ‘నీకేం? నువ్ ఎన్నైనా చెప్తావ్, బాస్ చెప్పింది నీకు కాదు కదా. అసలు ఆరోజే నేను ఆ పని అయ్యాక వెళ్లాల్సింది. ఫ్రైడే ఈవెనింగ్ అని నీ హెల్ప్ అడిగాను చూడూ నా చెప్పుతో నేను కొట్టుకోవాలి’ కోపంగా మహీ లోపలికెళ్లి నెమ్మదిగా స్టాఫ్ వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు.ఫ్రైడే రోజు–‘నేను మీ కంటికి పిచ్చి వెధవలా కనిపిస్తున్నానా?’ సడన్‌గా ఫ్లోర్ మీద ప్రత్యక్షమయ్యాడు మూర్తి. అప్పటి వరకూ గుసగుసగా మాట్లాడుకుంటున్న స్టాఫ్ మొత్తం ఆగి ఎవరికి మూడిందా అని చూస్తున్నారు.. ఫ్లోర్ మొత్తం గుండు సూది పడినా వినిపించేంత సైలెంట్‌గా ఉంది. ‘టప్..!’ ఒక శబ్దం ‘ఏదో ఒకటి పెరికేసి నా మొఖాన కొడితే తప్పులన్నీ వెతికి పట్టుకునే డ్యూటీ నేను చేయాలా?’ పూనకం వచ్చినట్టు ఊగి పోతున్నాడు మూర్తి మహీధర్ మీద. మహీధర్ టీమ్‌లోని సంజన రాసిన ప్రోగ్రామ్‌లో మిస్టేక్స్ రిపీట్ ఔతున్నాయి. ఆడపిల్లలను మందలించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ముందే వాళ్ళ టీమ్ లీడ్ మీద విరుచుకుపడటం మూర్తికి అలవాటే! ‘టప్! టప్!’ ‘ఏంటా శబ్దం?’ పక్కనే ఉన్న స్టాఫ్ వాష్‌రూమ్ వైపు అసహనంగా చూస్తూ అడిగాడు మూర్తి. వెంటనే తేరుకుని ‘వాష్‌రూమ్ నుండే వస్తున్నట్టుంది సర్’ మహీ నెమ్మదిగా చెప్పాడు. మూర్తి ఏదో అందుకునే లోపే ‘టప్..!’ మళ్లీ వచ్చింది. ‘అదేంటో చూడు..’ ఆదేశించాడు మూర్తి. వాష్ బేసిన్ అవుట్ లెట్ నుండి ఒక్కో చుక్క కారి సరిగ్గా కింద వాటర్ పోవడానికి ఉండే మెటల్ ప్లేట్ మీద పడుతున్నాయి. మెటల్ ప్లేట్ కింద ఖాళీ ఉండటం చేతనేమో ఆ శబ్దం స్పష్టంగా వినబడుతోంది. ‘వాటర్ లీక్ ఔతుంది సర్’ డోర్ తీసి మెల్లగా చెప్పాడు మహీధర్. అది చూస్తున్న మూర్తి ఇంకా ఏం మాట్లాడకముందే ‘రవికి చెప్పి క్లియర్ చేయిస్తాను సర్’ అన్నాడు మహీధర్. ఈ రకంగా అయినా ప్రోగ్రామింగ్ విషయం వదిలేస్తాడన్న ఆశతో. మూర్తి సూటిగా మహీధర్ కళ్ళలోకి చూసి, ‘ఒక్క చుక్కే కదా అని వదిలేస్తే నాలుగు రోజుల్లో ట్యాంక్ ఖాళీ ఔతుంది. చిన్న తప్పైనా వెంటనే కట్టడి చేయాలి’ అని సంజన గురించి కూడా మందలించినట్టు చెప్పి వెళ్ళిపోయాడు. ‘హమ్మయ్య.. ఈవాళ్టికి గండం గడిచింది’ అని మనసులోనే అనుకుంటూ సంజనకి వివరంగా చెప్పాడు. అటెండర్ రవి ఆరోజు కొన్ని అరెంజ్మెంట్స్కి బయటికి వెళ్లడంతో వచ్చాక ట్యాప్ విషయం చెప్పమని అభిరామ్‌కి చెప్పి వీకెండ్ పార్టీ ఉందని ఆఫీస్ టైమ్ అవ్వకముందే బాస్ వెళ్ళగానే బయల్దేరాడు మహీధర్. ఈరోజు– మూర్తి స్టాఫ్ అందరినీ ఎవరి పనులు వాళ్ళని చూసుకోమని మహీని మాత్రం తన రూమ్‌కి పిలిచాడు. వాష్‌రూమ్ వైపు చూస్తూ మూర్తి వెనకాలే నడుస్తున్నాడు. శబ్దం అయితే రావట్లేదు. ‘బహుశా నిన్నంతా సండే.. ఎవరూ వాడకపోవడం వలన వాటర్ లీక్ అవడం లేదేమో. ఏదైతే ఏం ఈ ఒక్క రోజూ గడిస్తే చాలు’ అనుకున్నాడు.సీఈవోగారు ఒప్పుకుంటే లంచ్‌కి తీసుకెళ్లడానికి ఎక్కడ బావుంటుందో చూడమని అడిగాడు మూర్తి. టార్గెట్ ప్రమోషన్. జోనల్ వైజ్‌గా బ్రాంచెస్ టేక్ కేర్ చేయాలని. అది చెప్పడానికే సీఈవో డైరెక్ట్‌గా వస్తున్నారని మూర్తి ఎక్స్పెక్టేషన్. తను అనుకున్నదే జరిగితే సాయంత్రం స్టాఫ్ అందరికీ డిన్నర్ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకు ఒక ప్లేస్ కూడా సెలెక్ట్ చేయమన్నాడు. ఈలోగా ప్లంబర్‌ను వెంటపెట్టుకొచ్చిన రవిని అభి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి సైలెంట్‌గా వాష్‌రూమ్‌లోకి పంపించాడు. ప్లంబర్‌కి అక్కడ ఏం చేయాలో చూపించి.. బయటికి చప్పుడు రాకుండా త్వరగా చేయమని, తను చెప్పేవరకూ బయటికి రావద్దని జాగ్రత్తలు చెప్పి, బొకేలు ఇవ్వడానికి బాస్ రూమ్‌కి వెళ్ళాడు రవి. అతను వెళ్లేసరికి ఫోన్లో మాట్లాడుతున్నాడు మూర్తి. ఫోన్ పెట్టేసి, బొకే టేబుల్ మీద పెడుతున్న రవికి చెప్తున్నాడు– ‘అవసరంలేదు బయటకే తీసుకురా. సర్, ఆల్రెడీ ఆన్ ద వే. ప్రయర్గా ఫినిష్ చేసుకుని వెళ్లాలని ముందే బయల్దేరారట. ఎనీ మినిట్ రీచ్ ఔతారు. నువ్వెళ్ళి మన స్టాఫ్ అందరికీ ఇన్ఫార్మ్ చెయ్. మహీ, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీతింగ్’ అంటూ రవితో పాటే బయటికి నడిచారు ఇద్దరూ. రవికి ఏం చేయాలో తెలీలేదు. అభి వంక బేలగా చూస్తూ వస్తున్నాడు. ఆల్రెడీ ఇందాక తిట్టిన తిట్లకే రవి మొఖం వాచిపోయింది. పెద్దసార్ వచ్చేస్తున్నారని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అందర్నీ చూస్తూ చెప్పి అభిని చూసి తల కిందకేసుకున్నాడు. నోరు తెరుద్దామనుకున్న అభి, వెనకే వస్తున్న మూర్తి, మహీధర్‌లను చూసి ఆగిపోయాడు. మూర్తి.. అభిని పిలిచి రిసీవ్ చేసుకోడానికి కొంతమంది స్టాఫ్‌తో బయటే ఉండమన్నాడు. చేసేదిలేక బయటికి నడిచాడు అభి. సీఈవో హరిశ్చంద్ర గారు వచ్చేశారు. కార్ దిగడంతోనే అందరూ దండలూ బొకేలతో విష్ చేసి లోపలికి తీసుకొచ్చారు. ప్రమిసెస్ చాలా బావుందని మెచ్చుకున్నారు. అందరూ ఆ క్రెడిట్ మూర్తిగారిదే అని ముక్తకంఠంతో చెప్పారు. మూర్తి చాలా పొంగిపోయాడు. సీఈవో ఒక్కొక్కరిని పలకరిస్తూ అభినందించారు. ఆ సంవత్సరం సంస్థ సాధించిన విజయాలు గర్వంగా చెప్తూ అందులో అధిక భాగం మీకే చెందుతుందని ఎంప్లాయీ‹స్ని ఉద్దేశించి చాలాసేపు మాట్లాడారు. అందరికీ బోనస్‌లు ప్రకటించారు. ‘అతితక్కువ కాలంలో మంచి ఫలితాలు తెచ్చినందుకు మీ అందరి కృషిని స్వయంగా అభినందించాలని వచ్చాను. ఈ విజయం వెనుక ఉన్న విజనరీ మైండ్ మూర్తి గారిని’ అని ముగించేలోపు ‘కెవ్వ్’ అనే కేక ఒకటి అప్పుడే వినిపించి అందరూ అవాక్కయ్యారు. అది వాష్‌రూమ్ నుండి వచ్చిందని తెలిసి రవి, అభి తర్వాత మహీ గతుక్కుమన్నారు. మూర్తికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏదో విందామనుకుంటే ఇంకేదో వినాల్సివచ్చింది. వాష్‌రూమ్ నుండి బయటకొచ్చిన స్టాఫ్ మెంబర్ అనురాధ ఏడ్వలేక నవ్వుతూ ‘సారీ సర్.. సడన్‌గా లోపల మనిషిని చూసేసరికి’‘మనిషా, ఎవరు?’ హరిశ్చంద్రగారే అడిగారు. భయపడేంతగా ఎవర్ని చూసి ఉంటుందా అని మూర్తి కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అభిరామ్‌కి విషయం అర్థమై ఏం జరగబోతోందో ఊహించలేకపోతున్నాడు. ఒకచేతిలో పెద్ద ఇనుప రెంచితో మరోచేతిలో నల్లటి బ్యాగ్‌తో సన్నగా ఉన్న ఒక మనిషి బయటకొచ్చాడు. చిన్న చెక్స్ ఉన్న వైట్ హాఫ్ హ్యాండ్స్ షర్ట్, కాస్త పొట్టి ప్యాంట్‌తో మనిషి నీట్‌గానే ఉన్నాడు. ‘ఎవరు నువ్వు.. లోపలేం చేస్తున్నావ్?’ సూటిగా అతన్నే చూస్తూ అడిగారు హరిశ్చంద్ర గారు. మూర్తికి సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు పడినట్టు అయింది. సమాధానం చెప్తే తెలుసుకుందామని మూర్తి కూడా ఎదురు చూస్తున్నాడు. ‘నా పేరు రాజు, ట్యాప్ రిపేర్ చేయనీకి ఒచ్చిన సార్‘‘రిపేర్ అయిందా?’‘అయింది సార్’‘ఎంతసేపటి నుండి చేస్తున్నావ్?’‘రొండు గంటలైంది’‘వాట్?’‘అది మొదటి 20 నిమిషాల్లోనే అయిపోయింది సార్’‘మరి లోపల ఎందుకున్నావ్ ?’రవి వంక చూసి మౌనంగా ఉండిపోయాడు రాజు. ‘రవీ, ఏంటిదంతా?’ మూర్తి కలగచేకున్నాడు. ‘సారీ సర్.. మీకు తెలియకుండా చేయించాలనుకోడం నా తప్పే’ రవి.. మూర్తికి దణ్ణంపెట్టి హరిశ్చంద్ర గారికి వివరించడం మొదలెట్టాడు. ‘సర్, నేను ఈపని శనివారమే చేయించాల్సింది. ఆరోజు నుండి ఎవరూ దొరక్కపోవడంతో నా స్నేహితుడ్ని బతిమాలి తీసుకొచ్చే సరికి ఉదయం లేట్ అయ్యింది. విషయం తెలిస్తే జీఎం సర్ కోప్పడతారని తెలియకుండా చేపించాలనుకున్నాను. ఇంతలో..’‘అంటే ఇతను ప్లంబర్ కాదా?’ ‘ఔనని చెప్పలేం సర్, కానీ ఇతనికి ప్లంబింగ్ పని బాగానే వచ్చు. ఇతను ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనులూ చేస్తుంటాడు సర్. ఒక ఆటో ఉంది. కానీ రోజూ తిప్పడు. ఇలాగే చిన్న చిన్న రిపేర్లు, కరెంటు పని మెకానిక్ పని అన్నీ వచ్చు’‘ఓహో! అల్రౌండర్ అన్నమాట. కానీ అరగంటలో అయ్యే పనికి రెండు గంటలు ఎందుకు లోపలే ఉన్నావ్?’ రాజునే గమనిస్తూ అడిగారు హరిశ్చంద్ర గారు. ‘ఈ సారు కంగారుగా నాకాడికొచ్చి చిన్న పనుందని వెంటపెట్టుకుని వచ్చే. ఏదో అవసరం మీద వచ్చిన. నావల్ల ఏ ఇబ్బంది అయినా ఆయన పని పాడు చేసినటై్టతదని లోపల్నే ఉన్న.’ ‘నువ్వేమో ఫ్రెండ్ అంటున్నావ్, అతను సారంటున్నాడు?’ రవిని ప్రశ్నించారు హరిశ్చంద్ర గారు. ‘సర్’ ఎలా చెప్పాలా అని మౌనంగానే ఉన్నాడు రవి. ‘ఇంకేదైనా దాస్తున్నారా మీ ఇద్దరూ కలిసి?’ అని హరిశ్చంద్ర అడగడంతో రవికి చెమటలు పట్టేశాయి. మూర్తికి చాలా ఇబ్బందిగా అనిపించింది. తన ముందే సీఈవో తన అటెండర్ని ప్రశ్నించడం ఒక ఫెయిల్యూర్‌లా ఫీలయ్యాడు. ‘అయ్యో సర్, ఇంతవరకు ఎలాంటి తప్పు జరగలేదు సర్. జీఎంగారు ఏ విషయంలో అయినా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు’ అని రాజుతో పరిచయం నుండి చెప్పడం మొదలుపెట్టాడు రవి. ‘నిజానికి ఇతన్ని నేను ఎప్పటి నుండో చూస్తున్నాను కానీ ఈరోజే కలిశాను. పోయిన వారం వినాయక నిమజ్జనానికి మా వీధిలో డాన్స్ వేస్తుంటే చూశా. ఆ రోజే మాట్లాడాలనుకున్నా కానీ హడావిడిలో కుదరలేదు. మళ్ళా ఒకరోజు తెల్లవారు ఝామున మా అత్తమ్మోళ్లని బస్టాండ్ నుండి తీస్కొస్తుంటే కాలవొడ్డు దగ్గర చిన్న పార్క్‌లో నలుగురు పిల్లలతో కలిసి యోగా చేస్తూ కనిపించాడు. ఆరోజు గుర్తు పట్టా. చిన్న పనికి ఆదివారం ఎవరూ రావట్లేదని నిన్నంతా ఫోన్లు చేస్తుంటే విని మా చంటోడు చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి పంపులు బిగించడం వచ్చు అని. ఈరోజు వేరే దారిలేక అనుమానంగానే ఇల్లు వెతుక్కుని వెళ్లాను. అడగ్గానే నాతో వచ్చాడు’మూర్తికి ఇదంతా అనవసరంగా తోచినా అనుమానించాల్సిన అవసరంలేదని మాత్రం ఇద్దరికీ స్పష్టమైంది. హరిశ్చంద్రగారికి రాజు ఓపిక నచ్చింది. ఇన్ని పనులొచ్చినా ఏ పనిలోనూ ఎందుకు కుదరలేదో తెలుసుకోవాలనిపించింది. ‘నువ్వు యోగా టీచరా?’ రాజునే అడిగారు హరిశ్చంద్ర గారు. ‘కాదు సార్. ఆయన చూసిన నలుగురు నా పిల్లలే. దాదాపు ప్రతిరోజూ పొద్దున్నే నా భార్యతో పార్క్‌కి పోయి కాసేపు ఆసనాలు ఏసి ఎండకి తిరిగి ఇంటికొస్తాము. అందుకే ఆటో కొన్నాను. మేం ఎక్కడికైనా అందులోనే ఎల్లేది. ఎప్పుడైనా పని లేకుంటే నాలుగు రౌండ్లు వేసొస్తా’‘ఈ రోజుల్లో నలుగురు పిల్లలను పెంచడం భారం అనిపించలేదా?’‘అదేంది సర్.. నేను పెంచేడిదేముంది? ప్రకృతిలో పుట్టింది ఏదైనా పెరిగేటిదే కదా. వాళ్ళకి ఇంతబుద్ధి నియ్యాలె. ఇంత ముద్ద పెట్టాలె. ఆకాడికి ఐతే కష్టం చేయగలను. నా ఇంటిది పోరు పెట్టేటిది కాదు. మా ఇంట్లనే కాయకూరలు కుండీల్లో పాదు పెట్టింది. మేం తినగా పక్కనోళ్లు కొంచపోయి తోచింది ఇస్తరు. పైసా పైసా దాపెట్టి అపదకొస్తదంటది. నా పెద్ద కూతురు పలుకు బంగారం. ఈ ఏడు ఆరో తరగతికొచ్చింది. హనుమంతుడి గుళ్లో శ్లోకాలు పాడతది. ఆడికొచ్చే ఒక ముసలావిడ గొంతు కలిపింది. ఇప్పుడు ఆమెతోని తోల్కపోయి స్టేజీల మీద పాడిస్తది. మన ప్రయత్నం సుబ్రంగుంటే దారి కూడా సుగమంగుంటది కదా సార్’ చెప్తూనే వాళ్ళమ్మాయి గొంతు విన్నట్టు మైమరచి పోతున్నాడు రాజు. హరిశ్చంద్రతో పాటు మూర్తి, మిగిలిన స్టాఫ్ అందరూ కూడా ప్రశాంతంగా వింటున్నారు. ‘మీ ఆవిడ సరే, మీ పిల్లలైనా అది కావాలి ఇది కావాలి అని అడుగుతారుగా?’ గురువు దగ్గర హితబోధ కోసం ఎదురుచూస్తున్నట్టు అడిగారు హరిశ్చంద్ర గారు. ‘అడుగుతారు సార్. చిన్నప్పుడు చందమామ కావాలని అడుగుతాము. అలాగని అడిగినోళ్ళని కొడతామా.. చందమామని కొంటామా! గిది అంతే. మొన్న మూడోవాడు పెద్ద టీవీ కావాలనీ, రోజూ ఎన్నో సినిమాలు చూడొచ్చని అడిగిండు. వాని కోరిక సమంగాదని ఎట్లా తెలియాలె. మర్నాడే బడి నుంచి వచ్చినాక ఆరుగురిమి శ్రీనివాస థియేటర్‌కి పోయి మహేష్ బాబు సినిమా చూపిచ్చి ఇంటర్వెల్లో అందరం కేకులు తిని మస్తు ఖుషీ అయి వచ్చినం. ఆ రేత్తిరి నా కొడుకును అడిగిన.. ఎట్లుంది నాయిన సినిమా? అని. ‘చానా బాగుంది నానోయ్.. మస్తుగుంది అన్నడు. నేనన్నా ‘మరి ఇంట్లో టీవీ కొని రోజూ చూస్తే ఆ మజా వస్తదా? నువ్ రోజూ బడి నించి వచ్చినాక చెల్లితోని ఆడుకోవాలే.. లెక్కలూ, పాఠాలు చదవాలే.. అమ్మతోని కథలు చెప్పించుకుంటా బువ్వ తినాలే.. డాబా మీద చుక్కలు చూస్తా పండుకోవాలే. మల్ల మనందరం థియేటర్‌కి పోయి సినిమా జూడాలే.. అని.’ అందరూ అప్రయత్నంగా చప్పట్లు కొట్టారు అభి, మహీతో సహా. హరిశ్చంద్ర గట్టిగా నవ్వుకున్నారు. మూర్తీ నవ్వక తప్పలేదు. అందర్నీ చూస్తూ రాజూ నవ్వడం మొదలుపెట్టాడు. హరిశ్చంద్రకి తన ప్రశ్నకి జవాబు దొరికిందనిపించింది. స్టాఫ్ అందరికీ సీఈవో స్పీచ్ కంటే రాజు స్పీచ్ బావుందనిపించింది. మూర్తికి ఎక్కడో కలుక్కుమనింది. గత వారం రోజులుగా జ్వరంతో నీరసపడిన భార్య, ఐదు నిమిషాలు కూడా తనతో నవ్వుతూ మాట్లాడలేని పిల్లలు జ్ఞాపకమొచ్చారు. ఆరోజు రాజుని కలవడం తనకెంతో ఆనందంగా ఉందని, తనని తీసుకొచ్చిన రవికి థాంక్స్ చెప్పి, ఆ అవకాశం మూర్తి వల్లనే వచ్చిందని అభినందించారు హరిశ్చంద్ర. మూర్తి ప్రమోషన్ గురించి చెప్పి, ఆయనే అందరినీ లంచ్‌కి తీసుకెళ్లాడు రాజుతో సహా! రాజు జీవితంలోనూ ఏదో ప్రమోషన్ ఉందనిపించింది. దాని కోసం ఇంట్లో కూడా కష్టపడాలని నిశ్చయించుకున్నాకే లంచ్‌లో అతడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.మరిచిన రుచులను గుర్తుచేసే సందర్భాలు రావడమూ అదృష్టమే.ఆల్రెడీ ఇందాక తిట్టిన తిట్లకే రవి మొఖం వాచిపోయింది. పెద్దసార్ వచ్చేస్తున్నారని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అందర్నీ చూస్తూ చెప్పి అభిని చూసి తల కిందకేసుకున్నాడు. -
అవకాశానికే అవకాశం ఇచ్చింది
కొంతమంది గురించి చెప్పడానికి మాటలు అక్కర్లేదు. వాళ్ల పని చూస్తే చాలు! అలాంటి ప్రతిభావంతురాలే థెమిస్ వెనెస్సా! అవకాశాలను ఆమె వెదుక్కోలేదు.. అవకాశాలే థెమిస్ని వెదుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన ప్రతి అవకాశంతో మరో చాన్స్‌ని క్రియేట్ చేసింది ఆమె విలక్షణమైన స్టయిలింగ్!థెమిస్ స్వస్థలం చెన్నై. చిన్నప్పుడే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్‌కి వెళ్లే వయసులోనే నిశ్చయించుకుంది పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని! అనుకున్నట్టుగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక బెంగళూరులోని ఓ ఫ్యాషన్ మేగజీన్‌లో చేరింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయిన అర్చా మెహతాను కలిసింది. ఆమె దగ్గర ఇంటర్న్‌గా చేరింది. తర్వాత తమిళ చిత్రం ‘రెమో’తో ఫ్రీలాన్స్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా సినీ ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె విలక్షణ శైలికి సినీ ఇండస్ట్రీ ముచ్చటపడి అవకాశాలను అందిచ్చింది. వాటిల్లో ‘ద రోడ్’, ‘మారా’, ‘వేలైక్కారన్’, ‘పొన్నియిన్ సెల్వన్ ’ వంటి సినిమాలున్నాయి. వాటికి ఆమె అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా చేసింది. ఎన్నో ఫొటో షూట్స్, యాడ్స్‌కూ పనిచేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ ప్రాజెక్ట్ వచ్చినా.. పర్సనాలిటీని హైలైట్ చేసే స్టయిలింగ్‌తో వారిని గ్లోబల్ స్టార్స్‌లా చూపింది. ఆ సిగ్నేచర్ స్టయిల్ ఎంతోమంది స్టార్స్‌కి నచ్చింది. శ్రీనిధి, త్రిష, శోభితా ధూళిపాళ, శ్రద్ధా శ్రీకాంత్, చిన్మయిలతో పాటు శివ కార్తికేయన్, విజయ్, జయం రవిలాంటి మేల్ సెలబ్రిటీలకూ స్టయిలింగ్ చేసింది థెమిస్. -
అచ్చం రాజమౌళి మూవీ 'ఈగ' లాంటి చీమ..!
రాజమౌళి ‘ఈగ’కు ఎన్ని శక్తులు ఉన్నాయో, అన్ని శక్తులూ ఉన్నాయి ఫొటోలోని ఈ చీమకు. కందిరీగ జాతికి చెందిన దీని పేరు ‘ట్రామాటోముటిల్లా బైఫర్కా’. మృదువైన వెంట్రుకల కారణంగా దీనిని బ్రెజిలియన్ వెల్వెట్ చీమ అని కూడా అంటారు. లక్షన్నర జాతుల చీమలు, కందిరీగలు, ఈగలు, తేనెటీగల కంటే కారునలుపులో ఉంటుందిది. ఇది ప్రపంచంలోనే అత్యంత కారునలుపు చీమ, అత్యంత తీవ్రమైన నొప్పి పుట్టించే చీమ కూడా ఇదే! ఈ మధ్యనే దీని బాహ్య నిర్మాణాన్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు మరిన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ‘బీల్స్టెయిన్ జర్నల్ ఆఫ్ నానోటెక్నాలజీ’ అధ్యయనం ప్రకారం ఈ చీమకు మెలనిన్తోపాటు, సూపర్ డార్క్ కలరింగ్ ప్లేట్లెట్లు ఎక్కువ. వీటి కారణంగానే దాని శరీరం ఉపరితలంపై పడిన కాంతితో 0.5 శాతం కంటే తక్కువ పరావర్తనం చెందుతుంది. ఈ చీమకు అతినీలలోహిత కాంతిని కూడా గ్రహించే శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వంటగది ఇంటీరియర్ డిజైన్..!) -
బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వంటగది ఇంటీరియర్ డిజైన్..!
రోజులో సగకాలం గడిచేది వంటింట్లోనే! అది ఎంత శుచిగా.. ఆహ్లాదంగా ఉంటే వంటలు అంత రుచిగా చవులూరిస్తూంటాయి. అలాంటి వంటల్లో.. ఆ వంటగది ఇంటీరియర్‌లో ఇండియన్ స్టయిలే వేరు! ఆ అలంకరణను మీ కిచెన్‌లో సెట్చేసుకోవడానికి లక్షలు ఖర్చుపెట్టాలేమో అనుకునేరు.. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఆ గ్రేస్‌ను తీసుకురావచ్చు!కుండలు, టెర్రకోట వస్తువులు, బుట్టలు, ఇత్తడి పాత్రలతో కిచెన్‌కు సంప్రదాయ, ఆధునికతల ఫ్యూజన్‌ను అద్దవచ్చు. మన ఇళ్లల్లోని తరతరాల పాత్రల వైభవాన్నీ కొలువుదీర్చవచ్చు.ఉపయోగంలో లేని పాత్రలకు పెయింట్ వేసి వాటిల్లో మొక్కల తొట్లను పెట్టి.. వంటిగదికి ప్రకృతి శోభతో గార్నిష్ చేయవచ్చు.కిచెన్‌లోనూ, డైనింగ్ టేబుల్‌పైనా చక్కటి డిజైన్ల హ్యాండ్లూమ్ క్లాత్స్‌ను పరచి కొత్త కళతో మెరిపించవచ్చు. సంప్రదాయ మండల డిజైన్లు, ప్రకృతి దృశ్యాల కళాకృతులతో డెకరేట్ చేయవచ్చు.గాజు జాడీలతో ఉన్న ఓపెన్ షెల్ఫ్‌లు అందంగానే కాదు.. వంటకు కావల్సిన దినుసులు అందుకోవడానికీ అనువుగా ఉంటాయి.– ఎన్.ఆర్ (చదవండి: అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!)