Visakhapatnam
-
విశాఖలో అలజడిగా మారిన సముద్రం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో సముద్రం అలజడిగా మారింది. ఆర్కే బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇందిరా గాంధీ చిల్డ్రన్స్ పార్క్ రిటైనింగ్ వాల్‌ను కెరటాలు తాకుతున్నాయి. గతంలో వర్షాలకు రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో తీరం భారీగా కోతకు గురవుతోంది. ఫెంగల్ తుపాను సమయంలో సబ్ మెరైన్ వద్ద తీరం కోతకు గురైంది. రాత్రి వేళలో అలలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం ఉంది. తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. -
249 రోజుల్లోనే మైలురాయి
● 55 ఎంఎంటీ సరకు నిర్వహణతో రికార్డు ● పోర్టు చైర్పర్సన్ ఎం.అంగముత్తు వెల్లడి విశాఖ సిటీ: విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) 2024–25 ఆర్థిక సంవత్సరానికి 90 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) సరకు నిర్వహణ లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తూ.. 249 రోజుల్లోనే 55 ఎంఎంటీ నిర్వహించి గత చరిత్రను తిరగరాసినట్లు వీపీఏ చైర్పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు వెల్లడించారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్లో భాగస్వాముల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది పోర్ట్ అత్యధికంగా 81.09 ఎంఎంటీ సరకు నిర్వహణ చేసి పాత రికార్డులను తిరగరాసిందని తెలిపారు. ఆ రికార్డును చెరిపేసి ఈ ఏడాది నూతన మైలురాయిని సాధించేందుకు భాగస్వాముల సహకారం అవసరమన్నారు. రాష్ట్ర, జిల్లా అధికారులు, రైల్వే, కస్టమ్స్, ఎన్హెచ్ఏఐ వంటి పీఎస్‌యూల సహకారాన్ని ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలకు అనుకూలంగా మారీటైమ్ ఇండియా విజన్ 2047, ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా పోర్ట్ ఆధారిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు వివరించారు. ఫిబ్రవరి 2025 నాటికి పూర్తయ్యే మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వాముల సూచనలను ఆహ్వానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్‌లు విశాఖలో పచ్చదనం, నగర సుందరీకరణకు పోర్ట్ చైర్పర్సన్, వారి బృందం చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో హెచ్ఎస్ఎల్ సీఎండీ హేమంత్ కత్రి, కస్టమ్స్, జీఎస్టీ ప్రధాన కమిషనర్ నరసింహ శ్రీధర్, ఐటీ చీఫ్ కమీషనర్ జి.కె.ధాల్ పాల్గొన్నారు. -
14న జాతీయ లోక్ అదాలత్
విశాఖ–లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాల్లో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారం, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కేసులు, బ్యాంకు, మనీ రికవరీ, భూఆక్రమణ, కార్మిక, కుటుంబ తగాదాలు(విడాకులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారానికి ఈ అదాలత్‌లో చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవా సదన్ 0891–2560414, 2575046 ఫోన్ నెంబర్లు, vskpdlsa@yahoo.com, dlsa.vsp @gmail.com, మండల న్యాయ సేవా సంఘాలలో సంప్రదించాల్సిందిగా సూచించారు. -
రోడ్డుపై రోడ్డు.. దోపిడీకేదీ అడ్డు
● పెందుర్తి పరిసర ప్రాంతాల్లో బాగున్న రోడ్లపై రోడ్లు వేస్తున్న జీవీఎంసీ ● స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడితో రూ.50 లక్షల ప్రజాధనం దుర్వినియోగం ● వార్డులో చాలా కాలనీలకు రోడ్ల సదుపాయం లేక ప్రజల అవస్థలు ● 96వ వార్డులో ‘కూటమి’ భక్తి చాటుకుంటున్న అధికారులు పెందుర్తి : జీవీఎంసీ అధికారులు అభివృద్ధికి వింత భాష్యం చెబుతున్నారు. కాలనీల్లో బాగున్న రోడ్లపై రోడ్లు వేసి ఇదే అభివృద్ధి అని చూపుతున్నారు. రూ.లక్షల్లో ప్రజాధనాన్ని ఓ కూటమి ప్రజాప్రతినిధి ఇలాకాలో ‘రోడ్డు పాలు’ చేస్తున్నారు. అలా ఎలా అనుకుంటున్నారా..అయితే ఇలా జీవీఎంసీ 96వ వార్డును ఓ సారి చూద్దాం రండి..పెందుర్తి పాతూరు, పెందుర్తి రాచ్చెరువు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిస్థాయిలో ఉన్నాయి. ఏదో ఒకటి అరా తప్పా అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇటీవల జీవీఎంసీ నుంచి విడుదలైన దాదాపు రూ.50 లక్షల నిధులు ఆయా ప్రాంతాల్లోనే గుమ్మరించారు. పెందుర్తి పాతూరులో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం రూ.34 లక్షలు, రాచ్చెరువు ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం మిగిలిన సొమ్మును ధారపోశారు. అదే సమయంలో ఆయా ప్రాంతాలకు కూత వేటు దూరంలో ఉన్న పలు కాలనీలకు రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారులకు పట్టకపోవడం విడ్డూరం. స్వామి భక్తి చాటుకున్నారా.. జీవీఎంసీ 96వ వార్డులో పదుల సంఖ్యలో ప్రధాన, చిన్నచితకా కాలనీలకు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కాలనీల వాసులు తమ ప్రాంతంలో రోడ్లు, కాలువలు నిర్మించాలని కోరుతూ అనేకసార్లు జీవీఎంసీ అధికారులకు మొర పెట్టుకున్నారు. కానీ అధికారులకు అది పట్టలేదు. కానీ ఇదే ప్రాంతంలో నివసిస్తున్న కూటమికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి మాటను అధికారులు ‘పట్టించుకున్నారు’. అవసరం లేకపోయినా పెందుర్తి పాతూరు, పెందుర్తి రాచ్చెరువు ప్రాంతాల్లో మాత్రం ఉన్న రోడ్ల మీద రోడ్లు వేసి స్వామి భక్తి చాటుకున్నారన్న విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులకు కమీషన్లు కట్టబెట్టేందుకే ఈ వ్యవహారం నడుస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
భూములు
తెగనమ్మాల్సిందే..భోగాపురం విమానాశ్రయానికి రహదారుల నిర్మాణ బాధ్యత వీఎంఆర్డీఏదే.. పైసా కూడా నిధులివ్వని కూటమి ప్రభుత్వం బుధవారం శ్రీ 11 శ్రీ డిసెంబర్ శ్రీ 2024విశాఖ సిటీ: రాష్ట్రానికి విశాఖే ఆర్థిక రాజధాని అని గొప్పలు చెప్పే కూటమి ప్రభుత్వం.. నగరాభివృద్ధికి మాత్రం రాష్ట్ర ఖజానా నుంచి పైసా కూడా విదిల్చడం లేదు. అమరావతి నిర్మాణానికి రూ.వేల కోట్లు సమీకరణకు ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు సర్కార్.. విశాఖపై మాత్రం కనీసం సవతి ప్రేమ కూడా చూపించడం లేదు. భోగాపురంలో భారీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి భోగాపురం విమాశ్రయానికి కనెక్టివిటీని పెంచేందుకు బృహత్తర ప్రణాళికలో 15 రహదారులను ప్రతిపాదించారు. ఇప్పుడా రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పైసా కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఆ భారాన్ని వీఎంఆర్డీఏపైనే మోపింది. అసలే రాబడి లేక నిర్వహణ భారంతో సతమతమవుతున్న సంస్థకు పైసా ఇవ్వకుండా ఈ రహదారుల నిర్మాణ భారం మోపడం విశాఖ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అప్పుడు యాగీ చేసి.. ఇప్పుడు భారం మోపి.. గత వెఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నవరత్నాల పథకంలో భాగంగా ఒక సెంటు భూములను అభివృద్ధి చేశారు. జిల్లాలో 83 ప్రాంతాల్లో 4,828 ఎకరాల్లో సెంటు భూముల లేఅవుట్లు చేశారు. ఇందులో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలను వీఎంఆర్డీఏకు గత ప్రభుత్వం అందించింది. దీంతో సదరు సంస్థ రూ.175 కోట్ల అంచనా వ్యయంతో ఆయా లేఅవుట్లలో రహదారులు, బోర్లు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. వీఎంఆర్డీఏ ఖర్చు చేసే ఈ నిధులకు గాను.. ప్రత్యామ్నాయంగా బల్క్ ల్యాండ్స్ ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఆ భూముల నుంచి నిధులు సమకూర్చడం ద్వారా వీఎంఆర్డీఏపై భారం మోపకుండా చర్యలు తీసుకుంది. అయినప్పటికీ అప్పట్లో కూటమి నేతలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. పేదల లేఅవుట్ల అభివృద్ధి భారం వీఎంఆర్డీఏపై మోపిందని నానా యాగీ చేశారు. కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆదాయం చూపించకుండా రహదారుల నిర్మాణ భారం మోపడం గమనార్హం. చినముషిడివాడ, తుమ్మపాల ప్రాంతాల్లో భూముల అమ్మకాలకు నిర్ణయం ఆ నిధులతోనే ఎయిర్‌పోర్టుకు 15 రహదారుల అభివృద్ధి వీఎంఆర్డీఏ బోర్డు సమావేశంలో ఆమోదంపలు ప్రాజెక్టులకు ఆమోదం వీఎంఆర్డీఏ బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులు వీఎంఆర్డీఏ పరిధిలో కొత్తగా విలీనమైన 13 మండలాలకు బృహత్తర ప్రణాళిక రూపకల్పన. యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు, నెల్లిమర్ల గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు (రహదారులు, కాలువల), ఇతర అభివృద్ధి పనులకు రూ.9 కోట్లు కేటాయింపు. రూ 200 కోట్ల వ్యయంతో కేంద్రం, వీఎంఆర్డీఏ 90ః10 నిష్పత్తిలో తీరం కోత నియంత్రణ ప్రాజెక్టు. మధురవాడలో ఒలింపిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా 2.7 ఎకరాల్లో క్రీడా సముదాయ నిర్మాణం. రుషికొండలో పీపీపీ విధానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హ్యాబిటేట్ సెంటర్ నిర్మాణం. రుషికొండ, గంభీరాల వద్ద వాటర్ స్పోర్ట్స్ ప్రాజెక్టు. ఫార్మా సిటీలో ప్రమాదాలు జరిగిన సమయంలో చికిత్స అందించేందుకు, అనకాపల్లి ప్రజల వైద్య సదుపాయాల కోసం అనకాపల్లి దగ్గర 7.68 ఎకరాల్లో హెల్త్ సిటీ నిర్మాణం. అనకాపల్లి జిల్లా తుమ్మపాలలో రూ.2.68 కోట్లతో వాణిజ్య, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం. రీసైకిల్ (వెస్ట్ ప్లాస్టిక్ ) వినియోగించి ప్రయోగాత్మకంగా రహదారుల నిర్మాణం. దీని ద్వారా నిర్మాణ వ్యయం 5–8 శాతం ఆదా అవుతుందని అంచనా. విశాఖ సెంట్రల్ పార్క్‌లో ప్రస్తుతమున్న మ్యూజికల్ ఫౌంటేన్‌ను 40 నెలల నిర్వహణ నిమిత్తం రూ 1.84 కోట్లతో అంచనాలు. 2021–2022 , 2022–2023, 2023–2024 ఆర్థిక సంవత్సరాల పద్దులు ఆమోదం. రహదారుల నిర్మాణాలకు భూముల అమ్మకాలు భోగాపురం విమానాశ్రయానికి రహదారులను అభివృద్ధి చేసేందుకు వీఎంఆర్డీఏ వద్ద నిధులు లేవు. ఈ బృహత్తర ప్రణాళిక రహదారులను నిర్మించాలంటే సంస్థకు చెందిన భూములు అమ్మాల్సిందే. దీంతో ఆ దిశగా కసరత్తు కూడా ప్రారంభమైపోయింది. వీఎంఆర్డీఏ బోర్డు సమావేశంలో భూముల అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చినముషిడివాడ, తుమ్మపాల ప్రాంతాల్లో ఉన్న భూములను విక్రయించి నిధులు సేకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఆ నిధులతో భోగాపురం విమానాశ్రయానికి బృహత్తర ప్రణాళికలో ప్రతిపాధించిన 15 రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. -
నిధుల దుర్వినియోగం సహించబోం
ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయంటే ఎవరూ అడ్డు చెప్పరు. కానీ ప్రజాధనం దుర్వినియోగమైతే మాత్రం సహించబోం. వార్డులో దాదాపు 50 కాలనీలు ఉండగా పలు చోట్ల రోడ్లు లేవు. కానీ స్థానిక కార్పొరేటర్ ఒత్తిడితో జీవీఎంసీ అధికారులు ఇప్పటికే ఉన్న రోడ్లపై రోడ్లు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిధులు మంజూరు చేసేటప్పుడు ఉన్నతాధికారులు కూడా క్షేత్ర పరిశీలన చేయాలి. ఇప్పటికే రోడ్లు ఉన్న చోట రోడ్లు వేస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. ప్రజలకు అవసరం ఉన్న చోట అభివృద్ధి చేయాలి. – శరగడం చినఅప్పలనాయుడు, మాజీ కార్పొరేటర్ -
తేలిపొమ్మన్నది..
సింగపూర్ విమానానికి 76.28%ఆక్యుపెన్సీ మేఘాలలోవిశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి గణనీయంగా పెరుగుతోంది. ఆర్థిక, పర్యాటక రాజధానిగా ఎదుగుతున్న నగరం నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఊపందుకుంటోంది. ప్రధానంగా గత నెల రోజుల్లోనే విశాఖ నుంచి ముంబై, బెంగళూరు ఆక్యుపెన్సీ 90 శాతానికి పైగా నమోదైంది. ప్రతి రోజు విశాఖ విమానాశ్రయం నుంచి 32 సర్వీసులు రాకపోకలు సాగిస్తుండగా.. అన్ని కూడా 76 శాతానికి పైగానే ఆక్యుపెన్సీ ఉంటుండడం విశేషం. కోవిడ్ తరువాత ఆ స్థాయిలో ఆక్యుపెన్సీ వృద్ధి ఇదే కావడం గమనార్హం. – విశాఖ సిటీ90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ జోరుగా విమానయానం టాప్‌లో ముంబై, బెంగళూరు దేశ విమాన సర్వీసుల్లో ముంబై, బెంగళూరులు టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ సాధిస్తున్నాయి. ముంబైకు అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్‌లో 11.36 శాతం అధికంగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అక్టోబర్‌లో 8,877(79.95 శాతం) మంది ప్రయాణించగా.. నవంబర్‌లో 10,793(91.31 శాతం) మందికి పెరిగారు. అలాగే బెంగళూరు అక్టోబర్ కంటే నవంబర్‌లో 18 శాతం మేర ఆక్యుపెన్సీ వృద్ధిని సాధించింది. అయితే బెంగళూరుకు సర్వీసులు తగ్గడంతో సీట్ల సామర్థ్యం కూడా తగ్గింది. దీంతో 94.7 శాతం ఆక్యుపెన్సీలో బెంగళూరు సర్వీసులు నడిచాయి. పెరిగిన సీట్ల సామర్థ్యం ఆక్యుపెన్సీ వృద్ధి చెందుతుండడంతో విమాన సర్వీసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇందుకు నెల రోజుల్లో సీట్ల సంఖ్య పెరుగుదలే నిదర్శనం. ముంబైకి సంబంధించి అక్టోబర్‌లో 11,102 సీట్ల సామర్థ్యం ఉండగా.. నవంబర్‌లో 11,820కి పెరిగింది. అలాగే అంతర్జాతీయ సర్వీస్ సింగపూర్‌కు అక్టోబర్‌లో 3,165 సీట్లు కాగా.. నవంబర్‌లో 3,331కి పెరిగాయి. హైదరాబాద్, చైన్నెలకు పెరుగుదల హైదరాబాద్, చైన్నె నగరాలకు కూడా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌కు అక్టోబర్‌లో 40,632(80.64 శాతం) మంది ప్రయాణించగా.. నవంబర్‌లో 42,658(86.8 శాతం) మంది రాకపోకలు సాగించారు. అలాగే చైన్నెకు అక్టోబర్‌లో 11,791((70.53 శాతం) మంది, నవంబర్‌లో 12,649(78.50 శాతం) మంది ప్రయాణించారు. అయితే ఢిల్లీకి మాత్రం నెల రోజుల్లో 4 శాతం మేర ఆక్యుపెన్సీ తగ్గింది. అయినప్పటికీ.. 80 శాతానికి పైగా ప్రయాణికులతో నిత్యం సర్వీసులు నడుస్తున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీస్ సింగపూర్‌కు కూడా నెల రోజుల్లో స్వల్పంగా ప్రయాణికుల సంఖ్య పెరిగారు. అక్టోబర్‌లో 2,381 మంది ప్రయాణించగా.. నవంబర్‌లో 2,541 మందికి పెరిగారు. ఇది కూడా దేశీయ సర్వీసులకు తీసిపోకుండా 75 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తోంది. -
నేడు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ కౌన్సిల్ సాధారణ సమావేశం మేయర్ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన బుధవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం కోసం 46 అంశాలతో ప్రధాన అజెండా మరో 21 అంశాలతో అనుబంధ అజెండాను సభ్యులకు అందజేశారు. అక్టోబర్ 4, 18 తేదీల్లో జరిగిన స్థాయీ సంఘ సమావేశాల్లో చేసిన తీర్మానాలు, నవంబర్ 8, 29 తేదీల్లో జరిగిన స్థాయీ సంఘ సమావేశాల్లో చేసిన తీర్మానాల వివరాలు కూడా సభ్యుల ముందుకు రానున్నాయి. 6వ వార్డు పీఎం పాలెం చివరి బస్టాప్ బాబా కళాశాల సమీపంలో గల శ్మశాన వాటికకు రూ.62 లక్షలతో ప్రహరీ నిర్మాణం, 9వ వార్డు విశాలాక్షీనగర్ రామాలయం వీధి కొండవాలు ప్రాంతం వద్ద రూ.68.60 లక్షలతో రక్షణ గోడ, కాలువలు, సీసీ రోడ్డు నిర్మాణం, 96వ వార్డు పెందుర్తి బ్రిడ్జి నుంచి గొర్లి వారి కల్లాలు వరకు రూ.కోటి 23 లక్షల ఇరవై నాలుగు వేలతో హాట్‌మిక్స్ పద్ధతిపై బీటీ రోడ్డు, 22వ వార్డు పిఠాపురం కాలనీలో పాత శిథిలావస్థలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ స్థానంలో రూ.కోటి 89 లక్షల 30వేలతో జీ+1 తరహాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పరిపాలన ఆమోదానికి చర్చకు రానుంది. అన్ని జోన్లకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు చర్చకు రానున్నాయి. అలాగే జీవీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న క్రీడా ప్రాంగణం (స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్(ఆర్కే బీచ్), ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, రాజీవ్ ఇండోర్ జిమ్నాజియం(ఎంవీపీ కాలనీ), రాజీవ్ క్రీడా ప్రాంగణం(గాజువాక), శ్రీరాజరాజేశ్వరి కళాక్షేత్రం(గాజువాక), కోరమండల్ గేట్ ఎదురుగా క్రీడా ప్రాంగణం(మల్కాపురం), లాన్ టెన్నిస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్(త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దరి), మున్సిపల్ ఇండోర్ స్టేడియం(భీమిలి), జీవీఎంసీ బీచ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎన్టీఆర్ స్టేడియం(అనకాపల్లి), రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంల్లో సభ్యత్వ రుసుం, అద్దెలు, ఇతర రుసుంలు సవరించే ప్రతిపాదన ఆమోదానికి చర్చకు రానుంది. -
అన్నదాతను నట్టేట ముంచిన కూటమి
● రైతుల తరుఫున పోరాడేందుకు 13న ‘అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’ ● పోస్టర్ ఆవిష్కరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఎంవీపీకాలనీ : అన్నదాతను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. రైతన్నల తరఫున పోరాడేందుకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ నెల 13వ తేదీన అన్నదాతకు అండగా అనే కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. ర్యాలీ నిర్వహించడంతో పాటు, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నామని తెలిపారు. కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను లాసన్స్ బే కాలనీలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అందించిన రైతు భరోసా కంటే ఎక్కువ ఇస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఆ ఊసే లేదన్నారు. ఖరీఫ్ ముగిసి రబీ ప్రారంభమైనప్పటికి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదన్నారు. పెట్టుబడి సాయం కోసం బడ్జెట్లో రూ.10,700 కోట్లు కేటాయించాల్సి ఉండగా కనీస ప్రస్తావన చేయలేదన్నారు. ఈ నెల 13న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గోనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అదీప్‌రాజు, జిల్లా పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, పార్టీ నాయకులు గొలగాని శ్రీనివాస్, పేర్ల విజయచందర్, మొల్లి అప్పారావు, నడింపల్లి కృష్ణంరాజు, బోని శివరామకృష్ణ, పీతల గోవింద్, సుబ్రహ్మణ్యం, ఉమామహేశ్వరరావు, రవికుమార్, రామన్నపాత్రుడు, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. -
పలు రైళ్ల రద్దు
తాటిచెట్లపాలెం: విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న భద్రతా పనుల నిమిత్తం పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు.దిగువ రైళ్లు ఆయా తేదీల్లో రెగ్యులర్ మార్గంలో కాకుండా మళ్లించిన మార్గంలో వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా నడుస్తాయి. హౌరా–ఎస్ఎంవీబీ బెంగళూరు (12863)ఎక్స్‌ప్రెస్ 11,13,14,16,17,20, 21,23, 24వ తేదీల్లో, ధన్‌బాద్–అలెప్పీ(13351) బొకారో ఎక్స్‌ప్రెస్ ఈ నెల 16,17,20,21,23,24వ తేదీల్లో, హతియా–ఎర్నాకులం(22837) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 16,23వ తేదీల్లో, హతియా–ఎస్ఎంవీ బెంగళూరు (12835) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 17,24వ తేదీలలో, టాటానగర్–ఎస్ఎంవీ బెంగళూరు (12889) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20వ తేదీన, హతియా–ఎస్ఎంవీ బెంగళూరు(18637) ఎక్స్‌ప్రెస్ ఈ నెల21న, ముంబయి సీఎస్‌టీఎం–భువనేశ్వర్ (11019)కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 13,14,25,27,28,30వ తేదీల్లో, గుంటూరు–విశాఖ(17239) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 26,28,29,31వ తేదీల్లో మళ్లించిన మార్గంలో నడుస్తాయి. పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లు మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. కొచ్చువేలి(త్రివేండ్రం నార్త్)–షాలిమర్–కొచ్చువేలి స్పెషల్, తిరునల్వేలి– షాలిమర్–తిరునల్వేలి స్పెషల్, పొదనూర్–బరౌని–పొదనూర్ స్పెషల్ , తాంబరం – సంత్రగచ్చి –తాంబరం స్పెషల్స్ జనవరి 24వ తేదీ వరకు పొడిగించారు. -
అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై కలెక్టర్ సమీక్ష
నేడు, రేపు కలెక్టర్ల సదస్సు నేపథ్యంలో అధికారులతో భేటీ మహారాణిపేట: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ మంగళవారం సమీక్షించారు. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న కలెక్టర్ల సదస్సు నేపథ్యంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులతో కలెక్టరేట్ మీటింగు హాలులో ఈ మేరకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్వర్ణాంధ్ర విజన్–2047, విశాఖపట్నం విజన్–2029 ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటి వరకు మొదలు పెట్టిన పనులు, వాటి తాజా స్థితి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు, దీపం పథకం–2, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, గృహ నిర్మాణాలు తదితర పథకాలపై ఆయా శాఖలవారీగా అధికారులను ఆరా తీశారు. సంబంధిత అంశాల తాజా పరిస్థితిపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, సీపీవో శ్రీనివాసరావు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
జమీమా కేసునులోతుగా విచారించండి
అల్లిపురం: జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులో రోజు రోజుకీ రకరకాల ట్విస్టులు బయట పడుతున్నాయి. తాజాగా ఎన్ఆర్ఐ బాధితుని తల్లి మీడియా ముందుకొచ్చింది. ఆమె బాధితులు చాలా మంది ఉన్నారని, సమగ్ర విచారణ జరపాలని నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చిని వేడుకున్నారు. ఈమేరకు బాధితుడు తల్లి వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తన కుమారుడ్ని బిజినెస్‌లో ప్రమోట్ చేస్తానని జాయ్ జమీమా పరిచయం చేసుకుందన్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా అమెరికా నుంచి విశాఖకు రప్పించుకుందని, నా కుమారుడికి జ్యూస్‌లో మత్తుమందు ఇచ్చి నిత్యం మత్తులో దించేదని వివరించారు. హైదరాబాద్, ఢిల్లీ వంటి అనేక ప్రాంతాల్లో తిప్పి అనేక ఇబ్బందులకు గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పెట్టే ఇబ్బందులను వాయిస్ మెసేజ్ ద్వారా తనకు తెలియజేశాడని, ఈ విషయం నగర పోలీస్ కమిషనర్ బాగ్చి తమకు చాలా సహాయం చేశారన్నారు. ఆమె బాధితులు చాలా మంది ఉన్నారన్నారు. పరువు పోతుందని ఎవరు బయటకు రావడం లేదని తెలిపారు. ఈ కేసును లోతుగా విచారించాలని ఆమె పోలీసులను కోరారు. -
రింగ్ వలలతో వేట నిషేధం
మహారాణిపేట: రింగ్ వలలతో సముద్రంలో వేటకు వెళ్లేందుకు అనుమతులు లేవని, హైకోర్టు ఉత్తర్వులు అందరూ పాటించాలని ఇన్చార్జి ఆర్డీవో హెచ్వీ జయరామ్ అన్నారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో మత్స్యకార ప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు, పోలీసు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రింగ్ నెట్‌తో ఫిషింగ్ నిలుపుదల చేయాలని కోరారు. ద్వారకా ఇన్చార్జీ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు మాట్లాడుతూ మత్స్యకారులంతా సంయమనం పాటించాలని కోరారు. కార్యక్రమంలో మత్స్యకారులు పెదజాలారిపేట, జాలారి ఎండాడ, వాసవానిపాలెం తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు పాల్గొన్నారు. హార్బర్ అభివృద్ధిపై సమీక్ష ఫిషింగ్ హార్బర్ అభివృద్ధిపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు ఆధ్వర్యంలో సమావేశంలో పోర్టు అధికారులు, మరపడవల సంఘం నాయకులు, వివిధ మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు. హార్బ ర్లో బోట్ల మరమ్మతుల కోసం క్రేన్ ఏర్పాటు చేయా లని మత్స్యకార సంఘాల నాయకులు కోరారు. అలాగే హార్బర్లో లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏపీ మరపడవల సంఘం అధ్యక్షుడు డి.లక్ష్మయ్య కోరారు. రెండు చేపల రవాణా వాహానాలు ఏర్పాటు చేయాలని తిమ్మాపురానికి చెందిన మహిళా మత్స్యకార సంఘం నాయకులు కోరారు. కార్యక్రమంలో మత్స్య కార సంఘాల నాయకులు సీహెచ్ వీర్రాజు, బి.కొండలరావు, ఆనంద్, అమర్నాథ్, పోర్టు ఈఈ అరుణ్‌కుమార్, మత్స్యశాఖ ఏడీ విజయకృష్ణ పాల్గొన్నారు. -
పెందుర్తిలో దోపిడీ దొంగల బీభత్సం
● జీవీఎంసీ పంప్ ఆపరేటర్‌పై కత్తులతో దాడి ● నగదు అపహరణ ● కరకవానిపాలెం సమీపంలో ఘటన పెందుర్తి: నగర శివారు పెందుర్తిలో మరోసారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై కరకవానిపాలెం సమీపంలో మంగళవారం తెల్లవారు జామున ముగ్గురు దుండగులు ఓ యువకుడ్ని అడ్డగించి కత్తులతో దాడి చేశారు. అతడి వద్ద ఉన్న రూ.10 వేలు అపహరించుకుపోయారు. వివరాలివి..పెందుర్తి మండలం గవరపాలెనికి చెందిన మళ్ల జనార్దన్ జీవీఎంసీ 96వ వార్డు నీటి సరఫరా విభాగంలో పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులకు హాజరయ్యేందుకు తన ఆటోలో ఇంటి నుంచి పెందుర్తి బయలుదేరాడు. కరకవానిపాలెం రోడ్డు నుంచి జాతీయ రహదారి పైకి వస్తున్న సమయంలో ముగ్గురు దుండగులు మంకీ క్యాప్‌లు ధరించి, చేతికి గ్లౌజ్‌లు వేసుకుని కత్తులతో ఆటోను అడ్డగించారు. ఇద్దరు దుండగులు జనార్దన్‌కు చెరోవైపు కూర్చొని నగదు కోసం వెతికారు. అయితే జనార్దన్ ప్రతిఘటించడంతో క్షణాల్లో దుండగులు కత్తులతో రెండు చేతులపై దాడి చేశారు. జేబులో ఉన్న రూ.10 వేలు లాక్కున్నారు. అదే సమయంలో వెనుక కూర్చున్న వ్యక్తి జనార్దన్ వీపుపై గాయపరిచారు. ఆ తరువాత జాతీయ రహదారి మీదుగా సరిపల్లి వైపు పారిపోయారు. దాడి సమయంలో దుండుగులు పూటుగా మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. దాడి నుంచి కోలుకున్న బాధితుడు వెంటనే గ్రామపెద్దలకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పెందుర్తి క్రైం విభాగం పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. గాయపడిన జనార్దన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. దుండగుల కోసం నాలుగు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నట్లు క్రైం విభాగం సబ్ ఇన్స్పెక్టర్ సూరిబాబు తెలిపారు. వరుస ఘటనలతో వణుకు సరిగ్గా వారం రోజుల క్రితం పెందుర్తి మండలం పినగాడిలో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇంటికి బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు ఓ మహిళను బెదిరించి రూ.5 లక్షలు, 8 తులాల బంగారం దోచుకుపోయిన సంగతి తెలిసిందే. సరిగ్గా అదే తరహాలో దారి కాసిన దుండగులు జనార్దన్‌పై దాడి చేసి దోపిడీ చేసిన తీరు క్రైం సినిమాను తలపించింది. మరోవైపు వరుసగా ఇంటి దొంగతనాలు కూడా జరుగుతుండడంతో పెందుర్తి పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బాబోయ్ దోమలు
జగజ్జేతగా పేరు తెచ్చుకున్న అలెగ్జాండర్ క్రీ.పూ. 323లో దోమకాటుకు గురై మలేరియా సోకడంతో చనిపోయారు. చివరకు వీటికి భయపడి చెంఘిజ్ ఖాన్ పశ్చిమ ఐరోపాపై దండయాత్రను విరమించుకున్నారు. నగర ప్రజలకై తే వీటితో కంటి నిండా నిద్ర కరవైంది. దోమకాటుతో పిల్లల నుంచి పెద్దలు వివిధ రకాల జ్వరాల బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా నగరంలోని ఆస్పత్రులు జ్వర బాధితులతో నిండిపోతున్నాయి. కాలువలు, మురుగునీటి గుంతల్లో దోమలు, కీటకాల బెడదతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాల్సిన జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం నిద్దరోతోంది. ● దోమల దండయాత్రలోనగరజీవి విలవిల ● తూతూ మంత్రంగా ఫాగింగ్ ● ఫలితమివ్వని చర్యలు దోమల ప్రభావిత ప్రాంతాలు పాత నగరంలోని ఫెర్రీరోడ్డు, థామ్సన్ స్ట్రీట్, కోటవీధి, చాగంటి వారివీధి, చిలకపేట, పద్మానగర్, రామకృష్ణానగర్, వుడ్యార్డ్ స్ట్రీట్, వెలంపేట, ప్రసాద్‌గార్డెన్స్, పండావీధి, అల్లిపురం, రెల్లివీధి, చెంగల్రావుపేట, జబ్బరతోట, జాలారిపేట, పెయిందొరపేట, కోడిపందాలవీధి, తాడివీధి, దిబ్బలపాలెం, శ్రీరంగపురం, వేంకటేశ్వరనగర్, రామజోగిపేట, ప్రకాశరావుపేట, డాబాగార్డెన్స్, చాకలిపేట, సింగ్ హోటల్ జంక్షన్, ఆశీల్‌మెట్ట, రామాటాకీస్తో పాటు అక్కయ్యపాలెం, లలితానగర్, రైల్వే న్యూకాలనీ, అబిద్‌నగర్, కేఆర్ఎం కాలనీ, సీతమ్మధార, నక్కవానిపాలెం, రేసపువానిపాలెం, సీతంపేట, పెదజాలారిపేట, శివాజీపాలెం, పెదవాల్తేర్, చినవాల్తేర్, కొత్త జాలారిపేట, మంగాపురం కాలనీ, అమర్‌నగర్, మద్దిలపాలెం, కంచరపాలెం, ఐటీఐ, కరాస, ఎన్ఏడీ. కోటిన్నర ఖర్చు చేస్తున్నా... జీవీఎంసీ దోమల నియంత్రణకు రూ.కోటిన్నరకు వరకు ఖర్చు చేస్తున్నట్లు చెబుతోంది. దోమల నుంచి తప్పించుకునేందుకు దోమల బిళ్లలు, ఆలౌట్ లిక్విడ్ల కోసం ఒక్కో కుటుంబానికి నెలకు రూ.250 చొప్పున ఖర్చు చేస్తున్నట్లు లెక్కల్లో చూపిస్తోంది. దోమల నివారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ప్రజారోగ్య విభాగం అధికారులు చెబుతున్నా దోమలను అదుపు చేయలేకపోతున్నారు. ఫలితంగా నగరంలో డెంగ్యు, మలేరియా తదితర జ్వరాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. డాబాగార్డెన్స్: నగరంలో సాయంత్రం 6 గంటలు దాటితే ఇక ప్రజలపై దోమల దండయాత్రే ప్రారంభమవుతుంది. ఆయా వార్డులో డ్రైనేజీ కాలువలు, ఖాళీ స్థలాల్లోని మురుగునీటి గుంతల నుంచి దోమలు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, వైరల్ తదితర విషజ్వరాలకు కారణమయ్యే దోమల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో నీటి నిల్వలు పేరుకుపోయాయి. దీంతో దోమలకు ఆవాసాలుగా ఆ ప్రాంతాలు మారిపోయాయి. పారిశుధ్య నిర్వహణ అంతంత మాత్రంగా ఉండడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో తప్పితే.. వార్డులో చాలా ప్రాంతాల్లో పారిశుధ్యం తాండవిస్తోంది. కాలువల్లో మురుగు పారడం లేదు. దీంతో దోమల సమస్య ఎక్కువైంది. మొక్కుబడిగా ఫాగింగ్ దోమల నియంత్రణకు జీవీఎంసీ నిత్యం ఫాగింగ్ చేయాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోంది. గ్రేటర్ పరిధిలో కేవలం 45 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఫాగింగ్ చేస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారంలో ఒకసారైనా ఫాగింగ్ చేయాలి. చాలా ప్రాంతాల్లో ఈ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఇళ్లల్లోనూ ఫాగింగ్ చేయాల్సిన అసవరం ఉంది. కానీ ఏటా 30 శాతంలోపే ఈ పని చేస్తున్నారంటే ప్రజారోగ్య విభాగం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది. తమ ప్రాంతాల్లో నెలల తరబడి పాగింగ్ చేయడం లేదంటూ ఆయా కాలనీల వాసులే చెబుతున్నారు. దోమల ఉత్పత్తి ఎక్కువగా ఉండే మురుగునీటి గుంతల్లో నూనె బంతులు విసరడం, మలాథియాన్ పిచికారీ సక్రమంగా సాగడం లేదు. ముందు లార్వాల పనిపట్టండి దోమల నివారణకు ఇంతలా ఖర్చు చేస్తున్న ప్రజారోగ్య విభాగం దోమల ఉత్పత్తి నిర్మూలనను విస్మరిస్తోంది. దీంతో లార్వా వృద్ధి చెందుతూ దోమలు మరింతగా వ్యాప్తి చెందుతున్నాయి. లార్వా దశ నుంచి ప్యూపా దశకు వచ్చేలోపు నాశనం చెయ్యాలి. ఈ దశ దాటిన తర్వాత దోమలుగా మారిపోతాయి. లార్వాల నాశనం కోసం గంబూషియా చేపలు కాలువల్లో విడిచిపెడుతుంటారు. కానీ ఈ తరహా చర్యలు అతి తక్కువగా జరుగుతున్నాయి. ఆడ దోమే వ్యాధులకు మూలంఅన్ని రకాల వ్యాధుల వ్యాప్తికి ఆడ దోమలే కారణం అవుతున్నాయి. ఆడ అనాఫిలస్ దోమ మలేరియాను, ఆడ క్యూలెక్స్ దోమ పైలేరియా, మెదడువాపు, ఏడీస్ ఈజిప్టు దోమ ఎల్లో పీవర్, డెంగీ జ్వరం, చికున్ గన్యాను వ్యాపిస్తున్నాయి. మానవుల రక్తం తాగుతూ అంటు వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వీటి తొండం పొడవుగా ఉండటంతో మనుషులు, జంతువుల రక్తాన్ని సునాయాసంగా పీల్చివేస్తుంటాయి. ఆడ దోమ 3–100 రోజులు బతికితే మగదోమ 10–20 రోజులు మాత్రమే బతుకుతుంది. మగ దోమలు మానవుల రక్తం తాగడానికి వాటి తొండం సహకరించదు. తక్షణ చర్యలు చేపడుతున్నాం.. జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్, ప్రధాన వైధ్యాధికారి డాక్టర్ నరేష్కుమార్ నేతృత్వంలో దోమల నియంత్రణకు పెద్ద ఎత్తున చర్యలు చేపడతున్నాం. జీవీఎంసీ అంతటా ఫాగింగ్ చేయిస్తున్నాం. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మలేరియా, డెంగు కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చర్యలు చేపడుతున్నాం. ఇప్పుడున్న దోమలు వల్ల న్యూసెన్స్ తప్పా.. మలేరియా, డెంగ్యు వంటి జ్వరాలు ప్రబలే అవకాశం లేదు. జీవీఎంసీ మలేరియా విభాగం నుంచి పర్మినెంట్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది 300 వరకు ఉంటే.. 2023 ఆగస్టు నుంచి మరో 406 మందిని తాత్కాలిక ప్రాదిపదికన తీసుకుని పనులు చేయిస్తున్నాం. –సాంబమూర్తి, బయాలజిస్ట్, జీవీఎంసీ -
కేజీహెచ్‌లో మహిళకు అరుదైన చికిత్స
మహారాణిపేట: కేజీహెచ్‌లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. బాధిత మహిళ కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యులను సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ అభినందించారు. ఒడిశాకు చెందిన లబ్బూరు గ్రామ నివాసి సంధ్యకు 19 ఏళ్లగా పొట్టలో గడ్డ ఉంది. నిత్యం కడుపు నొప్పితో బాధపడేది. గత నెల 20న కేజీహెచ్ గైనిక్ ఓపీలో వైద్యులకు చూపించారు. వైద్యులు స్కాన్ చేయగా పొట్టలో కణితి ఉందని నిర్థారించారు. దీంతో గైనిక్ విభాగంలో శస్త్ర చికిత్స నిర్వహించారు. పెద్ద అండాశయ కణంలో ఆపరేషన్ చేసిన రెండు రోజుల తర్వాత రోగికి జ్వరం వచ్చి బీపీ డౌన్ అయింది. వెంటనే ఐసీయూకి తరలించారు. అక్కడ డాక్టర్ల బృందం పరీక్షించారు. ఐసీయూలో నాలుగు రోజుల పాటు ఆమెకు వైద్య సేవలు అందించి తర్వాత గైనిక్ వార్డుకు తరలించారు. బాధిత మహిళ ఆరోగ్యంగా ఉండడంతో సోమవారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. క్లిష్టమైన శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్య బృందాన్ని, ఐసీయూ బృందాన్ని డాక్టర్ శివానంద్ అభినందించారు. ఈ శస్త్ర చికిత్సలో ప్రొఫెసర్ డాక్టర్ ఐ.వాణి, వైద్యులు సుధా పద్మశ్రీ, కవిత, దేవి, కళ్యాణి, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ వి.రవి, డీసీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ జి. మెహర్ కుమార్ పాల్గొన్నారు. -
ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు
డాబాగార్డెన్స్: ఉమ్మడి విశాఖ జిల్లాలో సర్వీసులో ఉంటూ మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యు లకు రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు మంగళవారం తన చాంబర్ కారుణ్య నియామకాలను నిర్వహించారు. 17 మందికి కండక్టర్లగా, ఇద్దరికి అసిస్టెంట్ మెకానిక్‌లు నియామక ఆర్డర్లు అందజేశారు. 29న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం మహారాణిపేట: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ విశాఖ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఈనెల 29న నిర్వహించనున్నారు. కనీసం 10 మంది సభ్యులతో కూడిన జిల్లా బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ, చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారిలను ఎన్నుకుంటారని పేర్కొన్నారు. జిల్లా సహకార అధికారి ఎన్నికలను నిర్వహించనున్నారని తెలిపారు. -
వైకల్యాన్ని జయించి.. విజేతలుగా నిలిచి
విశాఖ స్పోర్ట్స్: సంకల్ప బలం ముందు కష్టాలన్నీ అల్పమేనని నిరూపించారు..సాధించాలన్న తపన, పట్టుదల ఉంటే అంగవైకల్యం విజయానికి అడ్డుకాదని స్పష్టం చేశారు. వైకల్యం శరీరానికే గానీ..మనసుకు కాదని చాటి చెప్పారు. ఒకరికొకరు పోటీ పడుతూ స్ఫూర్తి చాటుకున్నారు విభిన్న ప్రతిభావంతులు. పోలీసు బారెక్స్ గ్రౌండ్స్‌లో విభిన్నప్రతిభావంతులకు పోటీలు నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్ధ ఆదేశాల మేరకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో డిజేబుల్ వెల్ఫేర్ శాఖ సహకారంతో పోటీలు నిర్వహించారు. దాదాపు 15 కేటగిరీల్లో మానసిక, శారీరక విభిన్న ప్రతిభావంతులు పోటీపడ్డారు. టీ 11,12,13 కేటగిరీల్లో త్రో అంశాల్లో పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఫీల్డ్‌లో సైతం పలు కేటగిరీలుగా నిర్వహించిన పోటీల్లోనూ సత్తాచాటారు. అథ్లెటిక్స్‌తో పాటు చదరంగం పోటీలను నిర్వహించారు. మెన్, వుమెన్‌కు వంద మీటర్ల పరుగు, డిస్కస్, షాట్‌ఫుట్ త్రోలోనూ పోటీలను నిర్వహించారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిజేబుల్ వెల్ఫేర్ శాఖ ఏడీ మాధవి, సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారిణి శ్రీవాణి పాల్గొనగా డీఎస్డీవో జాన్ గాలియట్, అథ్లెటిక్ కోచ్ వైకుంఠం, డీఎస్ఏ కోచ్‌లు సహాకారం అందించారు. సందడిగా విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు -
విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
సాక్షి, విశాఖపట్నం: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. పెళ్లయిన 40 రోజులకే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 వేల రూపాయలు కోసం మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగారు. స్నేహితులు, బంధువులకు లోన్ యాప్ నిర్వాహకులు మార్పింగ్ ఫోటోలను పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇదేం మేత
కోళ్ల వ్యర్థాలతో కాసుల వేటఅధికారుల తీరుపై అనుమానాలు గడువు ముగిసినప్పటికీ కొత్త టెండర్లను పిలిచి మరీ తెరవకుండా పాత వారినే కొనసాగించడంపై జీవీఎంసీ అధికారుల వ్యవహారశైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రెండేళ్ల క్రితం ఆన్లైన్ టెండర్లు కాకుండా బాక్సు టెండర్లను ఆహ్వానించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆన్లైన్ టెండర్లను ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారానే చేపడుతున్నారు. జీవీఎంసీలో మాత్రం బాక్సులను వదలడం లేదు. అందులోనూ ప్రజారోగ్య విభాగంలోనే అధికంగా బాక్సు టెండర్లను ఆశ్రయిస్తుండటం గమనార్హం. తాజాగా పిలిచిన టెండర్లు కూడా బాక్సు టెండర్లేనని తెలుస్తోంది. టెండర్లు తెరవకుండా పాత వారితోనే పనులు వాస్తవానికి ప్రస్తుతం చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న ఏజెన్సీల టెండరు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్తగా టెండర్లను ప్రజారోగ్య విభాగం అధికారులు పిలిచారు. కానీ నెలలు గడుస్తున్నా వీటిని మాత్రం తెరవడం లేదు. ఈ టెండర్లను దక్కించుకునేందుకు కూటమి నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తుండటంతో టెండర్లు తెరవకుండా పాత వారితోనే పనులు కానిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం నడుపుతున్న వారితోనూ జీవీఎంసీలోని అధికార పార్టీకి చెందిన నేతలు మామూళ్లకు అలవాటు పడటంతో వీరి ఆటలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. -
ఎందుకు ఈ వ్యర్థాలను వాడుతున్నారంటే..
కోళ్ల వ్యర్థాలను తినడం వల్ల చేపలు త్వరగా బరువు పెరగడంతోపాటు మేత ఖర్చు కూడా తగ్గుతుంది. సాధారణంగా చేపలకు ఆహారంగా తవుడు, సోయాబీన్ వంటి వాటితో ఉత్పత్తి చేసిన మేతను వాడతారు. ఈ మేత మార్కెట్లో కిలో రూ.30 వరకు ఉంటుంది. కిలో చేపను పెంచడానికి సుమారు రూ.50కిపైగా ఖర్చవుతుంది. కానీ ఆరోగ్యవంతమైన చేపలు ఈ ఆహారంతో అందుబాటులోకి వస్తాయి. అదే కోళ్ల వ్యర్థాలతో కిలో చేపను పెంచేందుకు రూ.30లోపే ఖర్చవుతుండటం, త్వరగా చేపలు బరువు పెరుగతుండటంతో వీటిపైనే కొందరు పెంపకందారులు దృష్టిసారిస్తున్నారు. అయితే ఈ చేపలను తినేవారు అనేక వ్యాధుల బారినపడతారనే విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. -
హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థుల పరారీ
అల్లిపురం: మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధి, ఆంథోని బోర్డింగ్ హోమ్ నుంచి నలుగురు విద్యార్థులు పరారైనట్లు హోమ్ ఇన్చార్జ్ కచ్చా వేళంగిణి సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు. సోమవారం ఉదయం రోజువారి ప్రార్థనలకు చర్చికి వెళ్లిన గుడాల రఘు, బెడపాటి చరణ్, నక్కాన కిరణ్‌కుమార్, పచ్చిపాల కార్తీక్ సాయంత్రం 6.30 గంటలైనా కనిపించలేదు. సీసీ కెమెరాలను పరిశీలించగా గోడదూకి పారిపోయినట్లు గుర్తించారు. విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. వారంతా కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ఆర్కేబీచ్ తదితర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. వీరి ఆచూకీ తెలిసిన వారు 9182065772, 9440796010 నంబర్లలో తెలియజేయాల్సిందిగా పోలీసులు కోరారు. -
● సహకరిస్తున్న జీవీఎంసీ, మత్స్యశాఖ, పోలీసు విభాగాలు ● చికెన్ వ్యర్థాల తరలింపునకు టెండర్లు పిలిచిన ప్రజారోగ్య విభాగం ● తమ వారికే టెండర్లు కావాలంటూ కూటమి నేతల ఒత్తిళ్లు ● నెలలు గడుస్తున్నా టెండర్లు తెరవకుండా తాత్సారం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఎక్కువ లాభాలు ఆర్జించాలన్న దురాశతో చేపలకు మేతగా కోళ్ల వ్యర్థాలను భారీ స్థాయిలో తరలిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అధికారులు కూడా సహకరించడంతో ఈ దందా యథేచ్ఛగా సాగిపోతోంది. జీవీఎంసీ పరిధిలోని చికెన్, మటన్ షాపుల్లో వ్యర్థాలను కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకు తరలించేందుకు రెండేళ్ల క్రితం కొందరు కాంట్రాక్టర్లు టెండర్లు పొందారు. అయితే ఈ కోళ్ల వ్యర్థాలను అక్రమంగా చేపల చెరువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యవహారం జరుగుతున్నప్పటికీ.. ఇటు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు గానీ, అటు మత్స్యశాఖ, పోలీసుశాఖ అధికారులు గానీ కన్నెత్తి చూడటం లేదు. కాపులుప్పాడలో నిర్ణీత మొత్తంలో సేకరించిన మేరకు చికెన్ వ్యర్థాలు వస్తున్నాయా? లేదా అని పరిశీలించాల్సిన అధికారులు కూడా ఇందులో భాగస్వామ్యమై తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా మాడుగుల నియోజకవర్గంలోని దేవరాపల్లి వద్ద చికెన్ వ్యర్థాలతో వచ్చిన వాహనాన్ని ప్రజలు ఫిర్యాదు చేసి పట్టించారు. ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉండడంతో ఈ వ్యవహారాన్ని అక్కడికక్కడే తొక్కేశారు. -
ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ ఆందోళనలు
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 13 నుంచి జనవరి 3వ తేదీ వరకు వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేపట్టనున్నట్లు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వైఫల్యాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కార్యాచరణను ప్రకటించిందన్నారు. ఈ నెల 13న ధాన్యం సేకరణపైన, 27వ తేదీన పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా, జనవరి 3వ తేదీన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరావు, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ జి.మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, రమణమూర్తిరాజు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయ్‌కుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, చెంగల వెంకటరావు, శోభా హైమావతి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, జెడ్పీ వైస్ చైర్మన్ గిరిబాబు, బి.సత్యవతి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, కొర్పొరేషన్ల మాజీ చైర్మన్లు జాన్ వెస్లీ, పివిఎస్ఎన్ రవి, శోభాస్వాతి రాణి , చొక్కాకుల వెంకటరావు, పేర్ల విజయ్‌చందర్, పోతిన శ్రీనివాసరావు, సుజాత సత్యనారాయణ, బొడ్డేడ ప్రసాద్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, గొలగాని శ్రీనివాసరావు పాల్గొన్నారు. 13న ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాల అందజేత 27న పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా నిరసన జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఆందోళన వైఎస్సార్సీపీ శ్రేణులతో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స -
ఎల్ఐసీని నిర్వీర్యం చేసే కుట్రను తిప్పికొట్టాలి
డాబాగార్డెన్స్: ఎల్ఐసీలో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ సోమవారం ఎల్ఐసీ ఏవోఐ ఆధ్వర్యంలో ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టారు. ఏవోఐ డివిజన్ అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో అఖిల భారత వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో ఐపీవో ద్వారా షేర్లు విక్రయించి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. ఈ విధానాల వల్ల 14 లక్షల మంది ఏజెంట్ల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. డిమాండ్ల సాధనకు బ్రాంచ్‌ల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి కోటి సంతకాలతో పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాలు ఇవ్వాలని ఏజెంట్లకు సూచించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న లక్షలాది మందితో చలో పార్లమెంట్ కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. ధర్నాలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికిశోర్, డివిజన్ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎన్.రవీంద్రనాథ్ ఠాగూర్, యూనియన్ గౌరవ అధ్యక్షుడు, సిటూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, కె.త్రిమూర్తులు, ఆంజనేయులు, అబ్దుల్ సత్తార్, శ్రీరాములు, ధనుంజయ్, శ్రీనివాసరావు, నారాయణరావు, రామారావు, రమణబాబు, ఈశ్వరరావు, కావ్య, మాధవి పెద్ద ఎత్తున ఏజెంట్లు పాల్గొన్నారు.