Karnataka
-
రాయచూరు.. కుక్కల హోరు
రాయచూరు రూరల్: జిల్లా కేంద్రమైన రాయచూరులో కుక్కల బెడద తప్పేనా అని ప్రజలు తలపట్టుకుంటున్నారు. ఏ వీధిలో చూసినా ఏమున్నది గర్వకారణం.. కుక్కల గందరగోళం తప్ప అని చింతించాల్సి వస్తోంది. వీధి శునకాలు స్వైర విహారం చేస్తూ పిల్లలను కరుస్తున్నాయి. దీంతో రేబీస్ ముప్పు పొంచి ఉంది. రాత్రి సమయాలలో ప్రజలు బయటకు వస్తే దాడికి దిగుతున్నాయి. తప్పించుకోవడానికి పరిగెత్తి కిందపడి గాయాలైన ఉదంతాలున్నాయి. మరోవైపు పెంపుడు శునకాల గోల సైతం అదే మాదిరి ఉంటోంది. యజమానులు తమకేమీ పట్టనట్లు ఉండడంపై ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో దాదాపు 900కు పైబడి వీధి కుక్కలున్నట్లు అంచనా. పగలూ రాత్రి రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వారం రోజుల్లో 100 మందికి కుక్కలు కరవడంతో ఆస్పత్రికి పరుగులు తీశారు. సకాలంలో టీకాలు వేసుకోకుంటే ప్రాణాలే పోయే ప్రమాదముంది. రేబీస్‌కు గురై పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతున్న మద్దిపేట యువతి కోమాలోకి జారుకుంది. ఆమె బుధవారం మరణించడంతో కుటుంబం తల్లడిల్లింది. రేబీస్‌తో యువతి మృతి -
ఇదో రకం ప్రచారం
బనశంకరి: వ్యాపారాల గురించి వీధుల్లో కరపత్రాలను పంచడం, మైకులో ప్రచారం చేయడం చూసి ఉంటారు. కానీ కొందరు ఓ యాప్ ప్రచారానికి వినూత్న పంథా అనుసరించారు. ఆహార వితరణ అప్లికేషన్ పేరున్న బిల్ బోర్డులను వీపునకు తగిలించుకుని నగర రోడ్లపై నడిచారు. రోషన్ అనే వ్యాపారి ఈ ఫోటోను ఎక్స్‌లో పోస్టు చేయగా వైరల్ అయ్యింది. దీనిపై కొందరు ఆవేదన వ్యక్తంచేశారు. ఆ కూలీలను మనుషులుగా కూడా చూడరా? అని ప్రశ్నించారు. మనుషులను ఇలా వాడుకోవడం దారుణమైన విషయమని, అమానుషంగా కనిపిస్తోందని వాపోయారు. ఐఏఎస్‌పై ఫర్నీచర్ కేసు రద్దు మైసూరు: ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి గతంలో మైసూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వ అతిథి గృహంలో అదృశ్యమైన సామగ్రికి అయ్యే ఖర్చును అప్పటి అతిథిగృహం మేనేజర్ విశ్వాస్ తాజాగా చెల్లించారు. దీంతో రోహిణి సింధూరిపై ఉన్న సామగ్రి అదృశ్యం కేసు రద్దయింది. పాలన శిక్షణా సంస్థ అతిథిగృహంలో కనిపించకుండా పోయిన ఫర్నీచర్‌కు సంబంధించిన మొత్తాన్ని ఆమె వేతనంలో నుంచి మినహాయించి తమకు ఇవ్వాలని మైసూరు నగర పాలన శిక్షణ సంస్థ ఏటీఐ కార్యదర్శికి లేఖ రాసింది. ఇంతలో మేనేజర్ అయిన విశ్వాస్ రూ.77,296 జమ చేయడంతో కేసు మూతపడింది. దళితులపై అగ్రవర్ణాల దాడి మైసూరు: కులాంతర వివాహం నేపథ్యంలో ముగ్గురు దళిత యువకులపై అగ్రవర్ణాల వారు దాడి చేసిన ఘటన జిల్లాలోని నంజనగూడు తాలూకా గీకళ్లి గ్రామంలో జరిగింది. గ్రామ నివాసులు ఆకాశ్, నితిన్, సంతోష్‌లు గాయపడి ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజుల క్రితం గీకళ్లిలో కులాంతర వివాహం జరిగింది. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అగ్ర కులానికి చెందిన ముగ్గురు యువకులు దళిత యువకులపై దాడి చేశారు. కాగా, నిందితులను బంధించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత నియోజకవర్గంలోనే దళితులకు భద్రత కరువైందని, రక్షణ కల్పించకపోతే ఉగ్రపోరాటం చేపడతామని హెచ్చరించారు. దొంగ పట్టివేత మైసూరు: ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగని సీసీబీ పోలీసులు అరెస్టు చేసి రూ.18 లక్షల విలువ చేసే 217 గ్రాముల బంగారు ఆభరణాలు, 15 కేజీల వెండి వస్తువులను, ఒక బైక్‌ని స్వాధీనపరచుకున్నారు. సీసీబీ పోలీసులు గస్తీలో ఉండగా నగరంలోని మండి మొహల్లా ఈద్గా మైదానం వద్ద ఓ యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని ప్రశ్నించారు. అతను నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఏడు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఒక బైక్‌ను కూడా చోరీ చేసినట్లు వెల్లడించాడు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి యశవంతపుర: దూర ప్రాంతం నుంచి కూలీ పనుల కోసం వస్తే కడుపుకోతే మిగిలింది. కాఫీ తోటలోని బావి వద్ద ఇద్దరు చిన్నారులు ఆటలాడుతూ బావిలోకి పడడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిక్కమగలూరు జిల్లా కొప్ప తాలూకా అమ్మడి గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. మధ్యప్రదేశ్ నజీరాబాదుకు చెందిన సునీతాబాయి, అర్జున్‌సింగ్ అనే వలస కూలీ దంపతులు అమ్మడి గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరు కాఫీ తోటల్లో కూలి పనికి వెళ్తుంటారు. వీరి పిల్లలు సీమా (6), రాధిక (2) ఆడుకుటూ బావిలో పడిపోయారు. పనుల నుంచి వచ్చాక తల్లిదండ్రులకు పిల్లలు కనపడలేదు. దీంతో గాలించగా ఇంటి పక్కనే ఉన్న బావిలో చిన్నారుల మృతదేహాలు బయట పడ్డాయి. కొప్ప గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేశారు. మరాఠాల ధర్నా యశవంతపుర: కర్ణాటక మాజీ మంత్రి ప్రభు చవాన్‌కి మహారాష్ట్రలో చేదు అనుభవం ఎదురైంది. కొల్హాపూర్‌లో మహాలక్ష్మీ దేవస్థానానికి వెళుతున్న ఆయనను శివసేన కార్యకర్తలు అడ్డగించారు. బెళగావిలో మరాఠాలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి, బెళగావిలో మహా మేళావ్ జరపడానికి అనుమతించలేదంటూ నినాదాలు చేశారు. చవాన్‌ను కదలకుండా ఘెరావ్ చేశారు. ఆయన వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి ఆలయానికి వెళ్లారు. -
అల్పపీడనం.. నేడు వర్ష ఆగమనం!
శివాజీనగర: బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఉద్భవించగా రాష్ట్రంలో గురువారం వర్షం కురిసే అవకాశముంది. దక్షిణ ఒళనాడులోని 10 జిల్లాలైన బెంగళూరు నగర– రూరల్, చామరాజనగర, చిత్రదుర్గ, కొడగు, కోలారు, మండ్య, మైసూరు, రామనగర, తుమకూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీచేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. బెంగళూరు నగరం, చుట్టుపక్కల 48 గంటలపాటు మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్లలో ఉరుములతో కూడిన వర్షానికి ఆస్కారముంది. బెంగళూరు వాతావరణ కేంద్రం ప్రాంతీయ డైరెక్టర్ సీ.ఎస్.పాటిల్ మాట్లాడుతూ నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం నెలకొంది. తమిళనాడు, శ్రీలంక వైపు సాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గురువారం రాష్ట్రంలో వర్షం కురవవచ్చని తెలిపారు. -
అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలి
తుమకూరు: గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాళ్లను కేటగిరి–3, 4 ఉద్యోగులుగా పరిగణించి, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర అంగన్వాడీ ఉద్యోగుల సంఘం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.వరలక్ష్మి డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని వీరసౌధలో అంగన్వాడీల జిల్లా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వారి హక్కుల గురించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. రిటైర్మెంటు లబ్ధి, గ్రాట్యుటీ తదితరాలను అమలు చేయాలని కోరారు. పెద్దసంఖ్యలో సిబ్బంది, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
విశిష్ట నేతకు కన్నీటి వీడ్కోలు
శివాజీనగర: మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర దేశ రాజకీయాలలో విశిష్ట నేత ఎస్.ఎం.కృష్ణకు కుటుంబం, అశేష అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. మండ్య జిల్లాలో సొంతూరిలో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. 92 ఏళ్ల ఎస్ఎం కృష్ణ మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర నివాసంలో మరణించడం తెలిసిందే. బుధవారం ఉదయం ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో బెంగళూరు నుంచి మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలో సొంతూరు సోమనహళ్ళికి బృహత్ ఊరేగింపుగా తీసుకెళ్లారు. దారి పొడవునా వేలాది మంది ప్రజలు సంతాపం తెలిపారు. సొంత తోటలో అంతిమ యాత్రకు ముందు ఆదిచుంచనగిరి మఠం నిర్మలానందనాథ స్వామి, ఎస్.ఎం.కృష్ణ సతీమణి ప్రేమ, ఆయన కుమార్తెలు, మనవళ్లు, ఆయన సమీప బంధువు ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌లు పార్థివ దేహానికి పూజలు చేశారు. ఆ తరువాత ఊరేగింపు ప్రారంభమై బెంగళూరులోని టౌన్‌హాల్, మైసూరు బ్యాంక్ సర్కిల్, రాజరాజేశ్వరి గేట్, కెంగేరి, బిడది, రామనగర, చెన్నపట్టణ మీదుగా బయల్దేరింది. సోమనహళ్లిలో సొంత కాఫీ డే తోటలో అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు భారీఎత్తున ఏర్పాట్లు జరిగాయి. సోదరుడు, ఆయన కొడుకు కృష్ణ చితికి నిప్పంటించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సీఎం సిద్దరామయ్య, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, అధికారులు, అలాగే కేంద్రమంత్రి కుమారస్వామి, మాజీ సీఎం యడియూరప్ప పాల్గొని నివాళులర్పించారు. మండ్య జిల్లాలోని స్వగ్రామంలో ఎస్ఎం కృష్ణ అంత్యక్రియలు బెంగళూరు నుంచి అంతిమయాత్ర దారిపొడవునా జన నివాళి -
మురుడేశ్వర బీచ్‌లో మృత్యుఘోష
శివాజీనగర: కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా కొత్తనూరులోని మొరార్జీ దేశాయి రెసిడెన్సియల్ పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులు కలిసి విద్యా విహార యాత్రకు ఉత్తర కన్నడ జిల్లాకు వెళ్లారు. సుమారు 50 మంది విద్యార్థినీ విద్యార్థులు, 7 మంది ఉపాధ్యాయులు టూర్‌కు బస్సు వేసుకుని వచ్చారు. మంగళవారం సాయంత్రం మురుడేశ్వరలో అరేబియా సముద్ర తీరంలో పిల్లలు ఆడుకుంటూ ఉండగా, ఉవ్వెత్తున లేచిన అలల ఉధృతిలో చిక్కుకొని 7 మంది విద్యార్థినులు కొట్టుకుపోయారు. వారిలో ముగ్గురిని అక్కడి లైఫ్ గార్డ్ సిబ్బంది రక్షించారు. మిగతావారి ఆచూకీ దొరకలేదు. కొంతసేపటికి నలుగురు బాలికల్లో ఒకరి మృతదేహం తీరానికి కొట్టుకువచ్చింది. అప్పటినుంచి స్థానిక పోలీసులు, కరావళి కాపలా దళంతో పాటు స్థానిక ఈతగాళ్లు ముమ్మరంగా గాలింపు జరిపారు. బుధవారం మిగతా ముగ్గురు కూడా శవాలై కనిపించారు. మృతులు దీక్ష, లావణ్య, వందన, స్రవంతిగా గుర్తించారు. వీరందరూ 15 ఏళ్ల వయసువారే. 9వ తరగతి చదువుతున్నారు. మరో ముగ్గురు బాలికలు నీట మునగడంతో అస్వస్థతకు గురికాగా వారిని సమీప ఆస్పత్రిలో చేర్పించారు. టీచర్లపై కేసు ఈ సంఘటనలో సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలితో పాటుగా 6 మందిపై సుమోటోగా కేసు నమోదైంది. ప్రధానోపాధ్యాయురాలు శశికళ (40) ఉపాధ్యాయ సిబ్బంది సునీల్ (33), చౌడప్ప (34) ఎస్.విశ్వనాథ్ (27) సీఎన్ శారదమ్మ (37), కే.నరేశ (30) తదితరులపై మురుడేశ్వర పోలీసులు కేస్ నమోదు చేశారు. వీరి నిర్లక్ష్యం వల్లనే ఈ ఘోరం జరిగిందని పేర్కొన్నారు. బీచ్ మూసివేత ఈ దారుణం తరువాత జిల్లా అధికారులు పర్యాటకుల భద్రతరీత్యా మురుడేశ్వర బీచ్‌ను తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు తెలిపారు. బీచ్‌లోని వారందరినీ బయటకు పంపించేశారు. మంగళవారం అక్కడక్కడ బ్యారికేడ్లు పెట్టి అదనపు పోలీస్ సిబ్బందిని నియమించారు. రూ. 5 లక్షల పరిహారం: సీఎం మృతి చెందిన బాలికల కుటుంబానికి సీఎం సిద్దరామయ్య రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటన చాలా విషాదకరమని, పిల్లల ఆత్మకు శాంతి కలగాలని ఆయన సంతాపం తెలిపారు. త్వరగా మృతదేహాలను సొంతూళ్లకు చేర్చే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పర్యటనల సమయంలో ఉపాధ్యాయులు పిల్లల గురించి చాలా జాగ్రత్తలు ఉండాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కారాదని పేర్కొన్నారు. స్రవంతి న్యూస్‌రీల్ అరేబియా సముద్రంలో నలుగురు బాలికల జలసమాధి కోలారు జిల్లా నుంచి స్టడీ టూర్‌కు వెళ్లిన విద్యార్థులు కన్నవారికి తీరని శోకం హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు, కేసు ఈ బీచ్ ఎందుకు డేంజర్కొత్త ప్రాంతాలను చూడాలనే ఉత్సాహంతో కేరింతలు కొడుతూ బస్సులో బయల్దేరారు. ఎప్పుడూ చూడని సముద్రాన్ని చూసి సంతోషంతో ఉప్పొంగారు. కానీ అదే చివరి మజిలీ అవుతుందని అనుకోలేదు. సముద్రంలో అలల ధాటికి నీటిలోకి కొట్టుకుపోయి నలుగురు బాలికలు విగతజీవులయ్యారు. విహారయాత్ర కాస్తా శోకసంద్రంగా మారిపోయింది. కన్నవారి ఆవేదన వర్ణనాతీతం. ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని వారు విలపించారు. ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే మురుడేశ్వర సముద్ర తీరం అంతే ప్రమాదకరమైనది కూడా. ఇది స్థానికులకు తెలుసు కానీ, బయటి నుంచి వచ్చే పర్యాటకులకు కాదు. టూరిస్టులు అందమైన తీరాన్ని చూడగానే మైమరచిపోయి అందులో లోపలికి వెళ్తుంటారు. కానీ ఆకస్మికంగా అలలు పోటెత్తుతాయి. సుడిగుండాల వంటి ప్రవాహాలు కూడా సంభవిస్తుంటాయి. ఇవి ఎవరినైనా సముద్రంలోకి లాక్కుపోతాయి. అదే రీతిలో ఈ దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. అదీ కాక బీచ్ చాలా లోతుగా ఉంటుంది. అందుకే అధికారులు అక్కడక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు. కానీ ఉత్సాహంగా ఉండే టూరిస్టులకు వాటిని పట్టించుకునే తీరిక ఉండదు. జూన్ నుంచి రుతు పవనాల రాకతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. అప్పటి నుంచి ముప్పు మరింత పెరుగుతుంది. ఈ బీచ్‌లో ప్రతి నెలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో అధికారులు సుశిక్షితులైన గజ ఈతగాళ్లను అక్కడ నియమించారు. మునిగిపోయేవారిని గుర్తించి వీరు కాపాడుతుంటారు. లేదంటే ప్రాణనష్టం మరింత ఎక్కువుగా ఉంటుంది. -
యదువీర్ చిన్న కొడుక్కి ఉయ్యాల సేవ
మైసూరు: మైసూరు రాజవంశస్తుడు, మైసూరు–కొడగు ఎంపీ యదువీర్ కృష్ణదత్త ఒడెయర్, త్రిషికా దంపతుల చిన్న కొడుక్కి బుధవారం నగరంలోని చాముండి కొండలో ఊయల శాస్త్రం నెరవేర్చారు. మైసూరు దసరా సమయంలో వారికి రెండో కుమారుడు జన్మించడం తెలిసిందే. ఇప్పుడు కులదేవత చాముండేశ్వరి ఆలయ ఆవరణలో ప్రధాన పురోహితులచే ఊయల శాస్త్రం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంపంగి చెట్టుకు ఉయ్యాల కట్టి పూజలు చేశారు. ఊయల శాస్త్రం ద్వారా యదువంశపు మరొక వంశాంకురాన్ని పరిచయం చేశారు. యదువీర్, త్రిషికా దంపతులకు పెద్ద కుమారుడు ఆద్యవీర్ 2017 డిసెంబర్లో జన్మించాడు. రాజవంశీకురాలు ప్రమోదాదేవి పాల్గొన్నారు. బైక్‌ను ఢీకొన్న లారీ.. దంపతులు బలి హొసపేటె: కూలీ పనుల కోసం బైక్‌లో గంగావతికి వెళ్తున్న దంపతులు లారీ ఢీకొని దుర్మరణం చెందారు. బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు... మరకుంబి గ్రామానికి చెందిన మంజునాథ్ పరసప్ప నాయక్ (38), భార్య నేత్రావతి (33), బంధువుల పిల్లవాడు మంజునాథ్ (9) కూలీ పని కని గ్రామం నుంచి గంగావతికి బయలుదేరారు. మార్గమధ్యంలో హేరూర్ – కేసరహట్టి మధ్య ఉన్న పెట్రోల్ బంకులో ఇంధనం నింపారు. బంక్ నుంచి రోడ్డు పైకి రాగానే, ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ వెనుక కూర్చున్న బాలుడు మంజునాథ్ దూరంగా ఎగిరి ముళ్ల పొదల్లోకి పడిపోయాడు. బైక్ లారీ కింద చిక్కుకుపోయింది. ఘటనాస్థలి బీభత్సంగా మారిపోయింది. వెంటనే స్థానికులు మృతదేహాలను బయటకు తీశారు. బాలున్ని ఆస్పత్రికి తరలించారు. లారీని డ్రైవర్ వదిలేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. -
నకిలీ నోట్ల చెలామణి కలకలం
● సిరవారలో ఆందోళనలో ప్రజలు రాయచూరు రూరల్: జిల్లాలో వివిధ రకాలైన సైబర్ నేరాలు జరుగుతుండగా మరో వైపు అంతరాష్ట్ర దొంగల ముఠాల బీభత్సం చోటు చేసుకుంది. రాయచూరు జిల్లాలో ఏడాది క్రితం రూ.200 నకిలీ నోట్లు చెలామణి జరిగిన విషయం విదితమే. అందులో భాగంగా బుధవారం సిరవార ప్రాంతంలో రూ.500 నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి అవుతున్నట్లు సమాచారం అందింది. సిరవార, హిరేహణిగి, హట్టి, లింగసూగూరు, కోఠా, ముదుగల్, ఇతర ప్రాంతాల్లో దుకాణాలు, మద్యం అంగళ్లలో చెలామణి అవుతున్నట్లు పోలీసులు వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు. -
సమయస్ఫూర్తికి చెన్నమ్మ శౌర్యప్రశస్తి
హుబ్లీ: కుందానగరి బెళగావికి చెందిన విద్యార్థిని స్ఫూర్తికి రాష్ట్ర ప్రభుత్వం సాహసబాలలకు అందించే కేళది చెన్నమ్మ ప్రశస్తిని ప్రదానం చేసి సత్కరించారు. బెళగావిలోని హిందీ బాలికల విద్యాలయంలో చదువుతున్న స్ఫూర్తి రైల్వే ట్రాక్ వద్ద వెళుతుండగా ఓ ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలనే నిర్ణయంతో ఎదురుగా వస్తున్న రైలు కింద పడి చనిపోవాలని ప్రయత్నించారు. అటుగా వెళుతున్న స్ఫూర్తి తక్షణమే ప్రమాదాన్ని పసిగట్టి గట్టిగా కేకలు పెట్టి అక్కడ ఉన్న ఇరుగుపొరుగు వారిని ఒక్క చోటకు చేర్చి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఆ ముగ్గురిని సంయమనం, స్ఫూర్తితో రక్షించినందుకు గాను స్ఫూర్తి విశ్వనాథ్‌కు ఇటీవల బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో చెన్నమ్మ శౌర్య అవార్డును రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖమంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ ప్రదానం చేశారు. ఏఐతో ప్రతిభా పాటవాలు వృద్ధి ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించడం వల్ల కమ్యూనికేషన్ సిల్క్స్, పాలన నైపుణ్యం తదితర ప్రతిభా పాటవాలు పెంపొంది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాగా వివిధ ఘటనల్లో సాహసాలతో పలువురి ప్రాణాలను కాపాడిన బాలబాలికలకు ఆమె ఈ అవార్డులను ప్రదానం చేశారు. బాలలకు శౌర్య ప్రశస్తి పేరున, బాలికలకు కేళది చెన్నమ్మ శౌర్య ప్రశస్తి పేరున అవార్డులను ప్రతి ఏటా ప్రభుత్వం సాహసబాలలకు ప్రదానం చేస్తుంది. కాగా బెళగావి విద్యార్థిని స్ఫూర్తి అవార్డును సాధించినందుకు గాను బాలికల విద్యాలయ అధ్యాపక బృందం, తోటి స్నేహితులు, బంధువులు, హితులు స్ఫూర్తిని అభినందించారు. -
నమ్మించి.. వంచించి..
హుబ్లీ: నగరంలో ఆన్లైన్ కేటుగాళ్ల బాధితులు నానాటికీ పెరిగి పోతున్నారు. తాజాగా ఈ కేటుగాళ్లు నగరానికి చెందిన ముగ్గురిని వేర్వేరుగా సుమారు రూ.42 లక్షలకు పైగా వంచించారు. వివరాలు.. వాట్సాప్ గ్రూప్‌లో పంపించిన హోటళ్లకు రివ్యూ చేసి ఇంట్లోనే కూర్చొని ఎక్కువ లాభాలు గడించవచ్చని నమ్మించి రాజధాని కాలనీ నివాసి కేడీ గురుప్రసాద్ హెబ్బార్ అనే వ్యక్తి నుంచి రూ.12.59 లక్షలను తమ ఖాతాల్లోకి బదలాయించుకొని వంచించారు. బాధితుడి మొబైల్ నెంబర్‌ను ఓమి దారా నెట్వర్క్ ఇండియా అడ్వైజరీ కంపెనీ వాట్సాప్ గ్రూపులో చేర్పించి హోటళ్లకు రివ్యూ చేసిన డబ్బులు సంపాదించవచ్చని నమ్మబలికారు. అనంతరం టెలిగ్రామ్ ఖాతాకు ఆయన్ను చేర్పించి ఆ ఖాతాలో ప్రీపెయిడ్ టాస్క్ కొనుగోలు చేసి వాటిని పూర్తి చేస్తే డబ్బులు గడించవచ్చని మభ్య పెట్టారు. ఆ మేరకు గురుప్రసాద్‌కు చెందిన వివిధ బ్యాంక్ ఖాతాల నుంచి దశల వారీగా రూ.12.59 లక్షలను బదలాయించుకొని వంచించినట్లు బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలంటూ.. మరో ఘటనలో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఫేస్బుక్లో నమ్మించి నగరానికి చెందిన మజఫర్ గడిబాన అనే వ్యక్తి నుంచి రూ.23.45 లక్షలను బదలాయించుకొని వంచించారు. ముజఫర్ ఫేస్బుక్ వీక్షిస్తుండగా డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు అంటూ ఓ వాణిజ్య ప్రకటనను గమనించి సదరు లింక్‌ను తెరిచారు. ఈ క్రమంలో అక్కడి వాట్సాప్ లింక్ తీసుకొని గ్రూప్‌లోకి చేర్పించారు. డబ్బులు పెట్టుబడి పెట్టాలని ప్రేరేపించి దశల వారీగా రూ.23.45 లక్షలను కేటుగాళ్లు తమ ఖాతాలోకి బదలాయించుకున్నారు. బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మరో ఘటన స్థానిక బాబురావ్ చౌదరికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి మీరు బహుమానం గెలుచుకున్నారు. దీన్ని పొందాలంటే చార్జి అవుతుందని చెప్పి నమ్మించి ఆయన బ్యాంక్ ఖాతాల నుంచి రూ.6.46 లక్షల బదలాయించుకొని వంచించినట్లు బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ బంగారు ఆభరణాలు చోరీ కాగా నగరంలో ఓ చోరీ ఘటనలో మహిళ బంగారు ఆభరణాలు తస్కరించారు. స్థానిక కేశ్వాపుర నివాసి కమలాగౌడర్ అనే ఆమె సిటీ బస్సులో ప్రయాణిస్తున్న వేళ దొంగలు ఆమె బ్యాగ్‌లోని 10 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ.46 వేల విలువ చేసే వస్తువులను చోరీ చేశారు. స్థానిక హొసూరు బస్టాండ్ నుంచి నీలిజన్ రోడ్డు వరకు సాగిన బస్సు ప్రయాణంలో ఆమె ఈ వీటిని పోగొట్టుకున్నారు. చోరీ చేసిన అనంతరం నిందితులు పరారయ్యారని ఆమె ఉపనగర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వేర్వేరుగా ముగ్గురికి రూ.42 లక్షలకు పైగా వంచన నానాటికీ పెరుగుతున్న ఆన్లైన్ కేటుగాళ్ల బాధితులు -
వైభవంగా హనుమాన్ రథోత్సవం
రాయచూరు రూరల్: నగరంలోని రాంపూర్‌లో ఆంజనేయ స్వామి జాతర, రథోత్సవాలు వైభవంగా జరిగాయి. మంగళవారం రాత్రి రథోత్సవాన్ని వందలాది మంది భక్తులు, కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు, జాగటకల్ బెట్టదయ్యప్ప స్వామి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. బాల మందిరానికి క్రీడాపరికరాల పంపిణీ●పెద్ద మనస్సు చాటిన జెడ్పీ సీఈఓ హుబ్లీ: చిత్రదుర్గ ప్రభుత్వ బాల మందిరం పిల్లలకు ఆ జిల్లా జెడ్పీ సీఈఓ ఎస్జీ సోమశేఖర్ తన సొంత డబ్బులతో క్రీడా పరికరాలను అందజేశారు. ఇటీవల ఆయన సదరు బాల మందిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలు తమకు వివిధ ఆటల పరికరాల అవసరం ఉందని తెలిపారు. స్పందించిన ఆయన తమ కార్యాలయంలో సంబంధిత బాల మందిర సిబ్బందికి ఈ ఆట పరికరాలను అందజేశారు. ఆ జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ భారతి ఆర్.బనకర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీ సవితా, జెడ్పీ ఉప కార్యదర్శి కే.తిమ్మప్ప, డీఎస్పీ సీకే దినకర్, ఆ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జగదీశ్ హెబ్బళ్లి, బాల మందిరం సూపరింటెండెంట్ జీవీ సంతోష్ జ్యోతి, కావేరమ్మ తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం సేవలు మరవలేనివి హొసపేటె: హంపీ కన్నడ యూనివర్సిటీలో మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీసీ డాక్టర్ పరమశివమూర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్.ఎం.కృష్ణ ప్రముఖ రాజకీయవేత్తగా పేరు పొందారన్నారు. కన్నడ నాట తాను ఎప్పుడూ సహనం కోల్పోలేదని, సవాళ్లను నిర్భయంగా ఎదుర్కొన్నారన్నారు. దివంగత ఎస్.ఎం.కృష్ణ కర్ణాటక 10వ ముఖ్యమంత్రిగా, 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారన్నారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పని చేశారని, పద్మవిభూషణ్ అవార్డు కూడా దక్కిందని తెలిపారు. లోక్‌సభ సభ్యులుగా, ఎంఎల్సీగా సేవలు అందించారన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో వాల్మీకి అధ్యయన పీఠానికి రూ.15 లక్షలు కేటాయించి పీఠాన్ని ప్రారంభించారన్నారు. విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నేత్రపర్వంగా శరణబసవేశ్వర రథోత్సవం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కానామడుగు గ్రామంలో శరణ బసవేశ్వర రథోత్సవం మంగళవారం సాయంత్రం లక్షలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. శరణబసవేశ్వర రథోత్సవం సందర్భంగా రాష్ట్ర, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులు శరణబవేశ్వర మహారాజ్ కీ జై అంటూ రథాన్ని ముందుకు లాగారు. అగరవొత్తులు, అరటిపండ్లు, మిరియాల ముక్కలను భక్తితో సమర్పించారు. విజయనగర, చిత్రదుర్గ, దావణగెరె, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు రథోత్సవం పాల్గొన్నారు. కూడ్లిగి డీఎస్పీ మల్లేశప్ప మల్లాపూర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజలింగప్ప సేవలు అజరామరం రాయచూరు రూరల్: నగరంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నిజలింగప్ప 122వ జయంతిని ఆచరించారు. నగరంలోని నిజలింగప్ప కాలనీలో వెలసిన విగ్రహానికి సీనియర్ సిటిజన్ వీరనగౌడ పూలమాల వేసి జయంతిని నిర్వహించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన నిజలింగప్ప సేవలను కొనియాడారు. జయంతి కార్యక్రమంలో నారాయణరెడ్డి, సిద్దారెడ్డి, భీమరెడ్డి, అమరేగౌడలున్నారు. -
రైతన్నకు బ్లేడ్ బ్యాచ్ కన్నం
● రూ.1.10 లక్షలు దోచుకున్న దొంగలు హొసపేటె: బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేసి తీసుకొని వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు వెంబడించి బ్యాగుకు బ్లేడుతో కన్నం వేసి రూ.1.10 లక్షల నగదును అపహరించిన సంఘటన గంగావతిలో బుధవారం జరిగింది. బసాపట్న గ్రామానికి చెందిన సురేంద్రబాబు అనే రైతు ఏపీఎంసీ మార్కెట్ ఆవరణలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ అభివృద్ధి శాఖలో తన పొదుపు ఖాతా నుంచి రూ.1.30 లక్షలు విత్‌డ్రా చేసి డబ్బులు బ్యాగ్‌లో పెట్టుకున్నారు. భద్రత కోసం బ్యాగ్‌ను భుజం మీద వేసుకొన్నారు. అనంతరం దురుగమ్మ ఆలయ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్‌కు వచ్చి పాస్‌బుక్‌లో నగదును నమోదు చేశాడు. బయటకు వచ్చి తన ఊరికి బయల్దేరబోతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సురేంద్రకు తెలియకుండా బ్యాగ్‌కు బ్లేడు వేసి కట్ చేసి రూ.500 రూపాయల రెండు కట్టలు, 100 రూపాయల విలువ చేసే ఒక కట్టను తొలగించారు. కొద్ది నిమిషాల తర్వాత సురేంద్ర తన బ్యాగ్‌ని తనిఖీ చేయగా నగదు చోరీకి గురైనట్లు గమనించారు. వెంటనే అక్కడే ఉన్న కొందరు 112 ఎమర్జెన్సీ సర్వీస్ వాహనానికి ఫోన్ చేశారు. ఈ మేరకు గంగావతి నగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తోటలో నవజాత శిశువు లభ్యం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా సరిహద్దు గ్రామమైన ఆలూరు వడ్డరహట్టి సమీపంలోని తోటలో జన్మించిన మూడు రోజుల నవజాత శిశువును బుధవారం కనుగొన్నారు. పొలంలో ఎవరో ప్రపసవించిన విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అంగన్వాడీ కార్యకర్తకు సమాచారం అందించారు. అనంతరం తాలూకా శిశు అభివృద్ధి అధికారుల బృందం ఆలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ చిరంజీవి, సిబ్బందితో కలిసి నవజాత శిశువును తీసుకొచ్చారు. తగిన సంరక్షణతో పాటు శిశువుకు ఆరోగ్య పరీక్ష, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ డెవలప్మెంట్ శాఖ అధికారులతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. తోటలో అప్పుడే పుట్టిన బిడ్డకు ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యుడు శిశువును చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల కస్టడీకి అప్పగించారు. రైతు సమస్యలు తీర్చండి రాయచూరు రూరల్: జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలని కర్ణాటక రైతు సంఘం జిల్లా సంచాలకురాలు ఉమాదేవి డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆమె మాట్లాడారు. కంది, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఫసల్ బీమా పథకం పరిహారం, గత ఏడాది కరువు, ఈ ఏడాది అతివృష్టి వల్ల నష్టపోయిన పంటల రైతులకు పరిహారం అందించాలన్నారు. నారాయణపుర కాలువ, రాంపూర్ ఎత్తిపోతల పపథకాల్లో రైతులకు భూ పరిహారం అందించాలని, రైతుల పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలన్నారు. విద్యార్థులకు పట్టాల ప్రదానం రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కళ్యాణ కర్ణాటక భాగంలోని విద్యార్థులు విద్యా రంగంలో బిహార్ రాష్ట్ర విద్యార్థులను అధిగమించాలని స్థానిక కన్నడ పత్రిక సంపాదకుడు బాబూరావ్ యడ్రామి పిలుపునిచ్చారు. కలబుర్గి హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థ వీరమ్మ గంగ సిరి మహిళా కళాశాలలో పాత్రికేయుల కోర్సుల ఘటికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలకు బిహార్ అభ్యర్థులు వస్తున్న నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జే) ప్రకారం రిజర్వేషన్ల్లతో ముందుండాలని అభ్యర్థించారు. తల్లిదండ్రుల ఆశలకు, ఆశయాలకు నీళ్లు వదలకుండా పేరు ప్రఖ్యాతులు తెచ్చేవిధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామలింగ, మండలి సభ్యుడు నాగన్న, ప్రిన్సిపాల్ రాజేంద్ర, మోహన్‌రాజ్, రవీంద్ర, మహేష్, జ్యోతి, సుభాష్, శివలీల, దానమ్మ, ప్రమోద్, కవిత, సుష్మా, ఆశాలున్నారు. విద్యార్థులకు పుస్తకాల వితరణ రాయచూరు రూరల్ : సాంఘీక సంక్షేమ శాఖ ఆధీనంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీఎం, మైనార్టీ హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు. మంగళవారం నగరంలోని దేవర కాలనీ హాస్టల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ ప్రసంగిస్తూ పేదరికంలో పుట్టిన విద్యార్థులు విద్యనభ్యసించి క్రియాశీలురుగా చదివి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉత్తమ సేవలందించాలన్నారు. కార్యక్రమంలో రంగప్ప నాయక్, చంద్రశేఖర్ రెడ్డి, రాఘవేంద్ర, హనుమంతరాయ, భీమేష్, మంజుల, రావుత్‌రావ్, ప్రసన్నలున్నారు. -
బ్రిటిష్ పాలన తరహాలో పోలీసు లాఠీఛార్జి
సాక్షి,బళ్లారి: తమ హక్కుల సాధన కోసం వీరశైవ లింగాయత్ పంచమశాలి సమాజాన్ని 2ఎ కేటగిరిలో చేర్చాలనే ఉద్దేశంతో శాంతియుతంగా ఉద్యమం చేపడుతున్న ఆందోళనకారులపై పోలీసులు విక్షణారహితంగా దాడులు చేయడం బాధాకరమని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బెళగావిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వద్ద పంచమశాలి సమాజం పెద్దలు, స్వామీజీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న సమయంలో ముఖ్యమంత్రి స్వయానా వెళ్లి పరామర్శించి వారికి అండగా ఉండాల్సింది పోయి, పోలీసు అధికారులతో ప్రత్యేకంగా చర్చించి దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు లాఠీఛార్జి చేసిన తీరు చూస్తుంటే యావత్ సమాజం తలదించుకునేలా ఉందన్నారు. బ్రిటిష్ కాలంలో తరహాలో పోలీసులు ప్రవర్తించి ఆందోళనకారులపై దాడులు చేసి గాయపరిచారన్నారు. ఎక్కబడితే అక్కడ కొట్టారని, ఆందోళనకారులు ఏమైనా తీవ్రవాదులా లేక ఉగ్రవాదులా? అంటూ ప్రశ్నించారు. ఆందోళనకారుల అరెస్టు దారుణం ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి గాయపరచడంతో పాటు జయమృత్యుంజయ స్వామిని, ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్‌ను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పునకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడీజీ హితేంద్ర శాడిస్ట్ తరహాలో వ్యవహరించి పోలీసులను ఆదేశించి 50 మందికి పైగా ఆందోళనకారులను గాయపరిచి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం సిద్దరామయ్య జోక్యం చేసుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. సీఎం క్షమాపణ చెప్పడంతో పాటు బాధితులను పరామర్శించి సాంత్వన పలకాలన్నారు. వీరశైవ పంచమశాలిని 2ఎ కేటగిరిలో చేర్చాలని చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఉందన్నారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రి సమగ్రాభివృద్ధికి గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంజనాద్రి అభివృద్ధి కోసం రూ.240 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రెండేళ్లలో అంజనాద్రికి కొత్త రూపురేఖలు గతంలో బీజేపీ సర్కార్‌లో అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మై అంజనాద్రి అభివృద్ధికి రూ.100 కోట్లు విడుదల చేశారన్నారు. అందులో రూ.32 కోట్లతో రెండు యాత్రి నివాస్‌లను, ఒక్కొక్క దాంట్లో దాదాపు 500 మందికి పైగా బస చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. అంజనాద్రి అభివృద్ధి కోసం చుట్టుపక్కల దాదాపు 70 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. 10 వేల మంది ఒకేసారి కూర్చొని భోజనాలు చేసేవిధంగా ప్రసాద నిలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతి తరహాలో అంజనాద్రి కొండకు వచ్చి వెళ్లేందుకు మెట్లను తీర్చిదిద్దుతామన్నారు. వచ్చే రెండేళ్లలో అంజనాద్రి రూపురేఖలు మారిపోతాయన్నారు.రూ.1350 కోట్లతో రెండేళ్లలో అంజనాద్రిలో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. హనుమాన్ మాల ధరించి అంజనాద్రికి వచ్చి వెళ్లే భక్తులకు అక్కడ అన్నదాన వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 13న గంగావతిలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపడుతున్నామన్నారు. దాదాపు 30 వేల మందికి పైగా జనం పాల్గొంటున్నారన్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. బాలింతల మృతికి సంబంధించి బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్, బీజేపీ నాయకులు డాక్టర్ బీ.కే.సుందర్ తదితరులు పాల్గొన్నారు. పంచమశాలి రిజర్వేషన్ల కోసం ఎగసిన ఉద్యమం ప్రభుత్వం ఆందోళకారులకు క్షమాపణ చెప్పాలి రూ.240 కోట్లుతో అంజనాద్రి కొండ అభివృద్ధి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి వెల్లడి -
జిల్లాతో విడదీయరాని అనుబంధం
● బిసి ఊట, సీ్త్ర శక్తి పథకాలకు జిల్లా నుంచే మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ శ్రీకారం రాయచూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బిసి ఊట, మధ్యాహ్న భోజనం, మహిళలకు సీ్త్ర శక్తి పథకాలను మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ ప్రారంభం చేశారు. 2001లో అప్పట్లో దేవదుర్గ తాలూకా అరకెర గ్రామంలో 1999–2004 మధ్య కాలంలో ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ సర్కార్‌లో విద్యా శాఖా మంత్రి హెచ్.విశ్వనాథ్, సీ్త్ర శక్తి పథకాన్ని నగరంలోని మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో ప్రారంభించారు. ఒపెక్ ఆస్పత్రి, ఆర్టీపీఎస్ ఏడో యూనిట్‌ను ప్రారంభించారు. అప్పట్లో ప్రజా పనుల శాఖా మంత్రి ధరంసింగ్, జైళ్ల శాఖ మంత్రి మాజీ ఎంపీ రాజా అమరేశ్వర నాయక్, మాజీ ఎంపీ వెంకటేష్ నాయక్, దేవదుర్గ మాజీ శాసనసభ్యు డు యల్లప్ప అక్కరికి, సయ్యద్ యాసిన్, ప్రస్తుత చిన్న నీటిపారుదల శాఖా మంత్రి బోసురాజు మాన్వి శాసన సభ్యుడిగా, ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు అప్పటి జిల్లాధికారిగా కుమార నాయక్‌లున్నారు. -
గుట్టలా పెరుగుతున్న చెత్తకు ఇక విముక్తి
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ జంట నగరాల్లో సేకరణ అయ్యే సుమారు 4.8 లక్షల టన్నుల చెత్తను బయోమైనింగ్ ద్వారా సంస్కరించే ప్రక్రియకు కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. వివరాలు.. జంట నగరాల్లో పెరుగుతున్న వ్యర్థాలతో నిత్యం చెత్త దిబ్బలు పెరిగి పోతున్నాయి. గత 50 ఏళ్ల నుంచి సేకరించి నిలువ చేస్తున్న చెత్త దిబ్బలు పర్వతాల్లా పేరుకుపోయాయి. స్థానిక కార్వార రోడ్డులో 19 ఎకరాల ప్రాంతంలో, అలాగే ధార్వాడ హొసయల్లాపురలో 16 ఎకరాల ప్రాంతంలో ఈ చెత్త గుట్టలు పేరుకు పోయాయి. దీంతో ఈ చెత్త రాశులను కరిగించే ప్రక్రియకు కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. ప్రతి రోజు చెత్త రాశులకు నిప్పుపెట్టడం మామూలే. దాంతో ఆకాశం ఎత్తు వరకు వ్యాపించే పొగలు, కుళ్లిన కుక్కలు, పందులు, పశువుల కళేబరాలతో దుర్గంధాన్ని స్థానికులు భరించలేక పోయారు. పర్యావరణం పూర్తిగా దెబ్బతిని చుట్టు పక్కల రెండు మూడు కిలో మీటర్ల వరకు దుర్గంధం వ్యాపించేది. అనుమతి ఆలస్యంతో పనులు జాప్యం ఇది వ్యాధులకు కూడా కారకం అయ్యేదని, ఈ చెత్త రాశులను కరిగించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2017లోనే సూచించింది. ఆ మేరకు 2021లో డీపీఆర్‌ను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేషన్ పంపింది. అయితే అనుమతి లభించింది మాత్రం 2023లోనే. టెండర్ ప్రక్రియ ముగిసింది ఈ ఏడాది ఏప్రిల్‌లో. వర్షాకాలం కావడంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో గత అక్టోబర్ 15 నుంచి ప్రక్రియ ప్రారంభం అయింది. బయోమైనింగ్ ద్వారా చెత్తరాశులను స్ట్రాబేజ్ చేస్తున్నారు. ఆ తర్వాత అందులోని బయోఅర్త్ లేక బయోసాయిల్ను గార్డెన్తో పాటు వివిధ చోట్ల ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ఆర్డీఎఫ్ అట్టలు, రద్దీ కాగితాలు, చెప్పులు, టైర్లు తదితర వస్తువులను వేరు చేసి వచ్చిన రాశిని సిమెంట్ ఫ్యాక్టరీ తదితర చోట్ల ఉపయోగించవచ్చు. ఇందులో వచ్చే ఇనార్ట్ దేనికీ పనికి రాని వస్తువు. దీన్ని కేవలం క్వారీ తదితర గోతులు, గుంతలను నింపడానికి ఉపయోగించవచ్చు. చెత్తసంస్కరణకు రూ.30 కోట్లు కాగా ఈ విషయమై జంట నగరాల కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ ఈశ్వర్ ఉళ్లాగడ్డి మాట్లాడుతూ హుబ్లీ ధార్వాడలో సేకరించిన చెత్త 4.8 లక్షల టన్నులు ఉంది. హుబ్లీలో 3.6 లక్షల టన్నులు, ధార్వాడలో 1.2 లక్షల టన్నుల చెత్తను సంస్కరించడానికి ప్రభుత్వం నుంచి రూ.30 కోట్లు కేటాయించారు. సంస్కరించడానికి టెండర్ ఇచ్చాం. శాసీ్త్రయంగా ప్రతి రోజు 1100 టన్నులను సంస్కరిస్తున్నాం. వమూడు విభాగాల్లో విభజిస్తున్నాం. హుబ్లీ– కార్వార రోడ్డులో 19 ఎకరాలు, ధార్వాడ– హొసయల్లాపుర రోడ్డులో 16 ఎకరాల్లో చెత్తను బయోమైనింగ్ చేయడానికి 18 నెలల గడువు ఇచ్చాం. బయోమైనింగ్ అంటే సాధారణంగా మిశ్రమ చెత్తను శాసీ్త్రయంగా విభజించడమే. చెత్తను డంప్యార్డ్లోకి పోస్తారు. యంత్రాల సహాయంతో చెత్తరాశులను కరిగిస్తారు. ఈ తర్వాత బయోజీవులు, నైసర్గిక అంశాలైన గాలి, సూర్యుడి వెలుగుతో సంస్కరించడం ద్వారా చెత్తలోని బయోవిభజన అంశాలు కాలానంతరం విడిపోతాయి. దీన్ని బయోరెమిడియేషన్ ద్వారా స్థిరపరుస్తారు. కాగా సూరత్‌కు చెందిన బీహెచ్ పటేల్ అనే ఏజెన్సీ ఈ చెత్త నిర్వహణ భారాన్ని వహించింది. 2025లోగా ఈ చెత్తరాశులన్ని కరిగి ఉపయోగపడే ఫారాలుగా మారనున్నాయి. బయోమైనింగ్ ద్వారా చెత్త నిర్వహణ ప్రక్రియ షురూ నగరవాసులకు భారీ పొగ, దుర్గంధం త్వరలో దూరం -
Justiceisdue: సోషల్ మీడియాను కదిలించిన ఓ భర్త గాథ
#JusticeForAtulSubhash.. #Justiceisdue ఎక్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన అంశం. భార్య పెట్టిన వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడిన ఓ భర్తకు మద్దతుగా సోషల్ మీడియాలో నడుస్తున్న క్యాంపెయిన్ ఇది. మేధావులు, న్యాయ నిపుణులు, పేరు మోసిన జర్నలిస్టులు ఈ క్యాంపెయిన్‌లో భాగం అవుతున్నారు. అయితే ఇలాంటి కేసులు కొత్తేం కాదు కదా!. మరి దీనినే ఎందుకు అంతలా హైలైట్ చేయడం?. ఎందుకంటే.. అతుల్ కేసులో తీవ్రత అంతలా ఉంది కాబట్టి.‘‘ఒకవేళ నాకు న్యాయం జరిగితే.. నా అస్తికలను పవిత్రంగా గంగలో నిమజ్జనం చేయండి. లేకుంటే కోర్టు బయట మురికి కాలువలో కలిపేయండి’’ అంటూ.. చివరి కోరికలతో సహా సుదీర్ఘమైన సూసైడ్ నోట్ రాశారు 34 ఏళ్ల అతుల్ సుభాష్. అది సుప్రీం కోర్టు దాకా చేరాలని ఆయన చేసిన విన్నపం, చనిపోవడానికి ముందు ఆయన చేసుకున్న ఏర్పాట్లు.. తన నాలుగేళ్ల కొడుకు కోసం ఇచ్చిన గిఫ్ట్.. ఇవన్నీ పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. భార్య, ఆమె కుటుంబం డబ్బు కోసం ఎలా హింసించింది.. ఆఖరికి న్యాయమేంటో చెప్పాల్సిన జడ్జి కూడా తనకు అన్యాయం చేశారంటూ.. ఆ వీడియోలో వివరించి చెప్పారు.👉ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్‌కు 2019లో నిఖితా సింగ్‌తో వివాహమైంది. ఈ జంటకు ఒక బాబు. బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో మంచి పొజిషన్లో పని చేశారాయన. భార్య నిఖితా సింగ్ కూడా టెక్కీనే. మారతహళ్లిలోని మంజునాథ లేఅవుట్లో ఈ కుటుంబం నివసించేది. అయితే.. కొంతకాలంగా భార్య నిఖితా సింగ్ కుటుంబంతో ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె యూపీలోని తన సొంతూరుకు వెళ్లిపోయింది. ఆపై అతుల్‌పై కేసులు పెట్టింది. ఆపై విడాలకు కోసం కోర్టును ఆశ్రయించిందామె.👉ఈ కేసు విషయమై బెంగళూరు నుంచి యూపీకి 40సార్లు తిరిగాడాయన. వెళ్లిన ప్రతీసారి ఓ కొత్త కేసు కోర్టు ముందుకు వచ్చింది. తీవ్ర మానసిక వేదనకు గురైన ఆయన.. డిసెంబర్ 8వ తేదీన బెంగళూరులోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు.. తన సోదరుడికి ఓ మెయిల్ పెట్టాడు. అలాగే తన వైవాహిక జీవితంలో తాను ఎంతలా నరకం అనుభవించింది గంటన్నర పాటు వీడియోగా చిత్రీకరించారు.సంబంధిత వార్త: భార్య కేసు పెట్టిందని.. డెత్‌నోట్ రాసి! आत्महत्या से पहले का #AtulSubhash का 63 मिनट का ये पूरा वीडियो सुनकर निःशब्द और विचलित हूं। उफ़ ! #JusticeForAtulSubhash pic.twitter.com/lFDQZFLEBV— Vinod Kapri (@vinodkapri) December 10, 2024👉నిఖిత, అతుల్‌ను విడిచి వెళ్లి 8 నెలలపైనే అవుతోంది. యూపీ జౌన్పూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందామె. విడాకులకు కారణాలుగా.. అతుల్ మీద గృహ హింస, అసహజ శృంగారం లాంటి అభియోగాలతో తొమ్మిది కేసులు నమోదు చేయించింది. అంతేకాదు అతుల్‌పై కేసులు వెనక్కి తీసుకోవాలంటే.. రూ.3 కోట్ల రూపాయల డబ్బు ఇప్పించాలంటూ కోర్టు బయట బేరసారాలకు దిగింది. ఒకవైపు మానసికంగా.. మరోవైపు కోర్టు చుట్టూ తిరిగి శారీరకంగా అలసిపోయాడు. చివరకు.. తనకు ఎదురైన వేదనను భరించలేక బలవనర్మణానికి పాల్పడ్డారు.న్యాయమూర్తే అపహాస్యం చేస్తే..న్యాయవ్యవస్థ.. నేర వ్యవస్థగా మారితే ఎలా ఉంటుంది?.. ఆ వ్యవస్థలో అవినీతి ఏస్థాయిలో పేరుకుపోయిందో చెబుతూ.. సుభాష్ తన సూసైడ్ నోట్లో ఆవేదన వెల్లగక్కారు. ఈ క్రమంలో జౌన్పూర్ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఒకరు.. తనను ఎంతగా హింసించింది పేర్కొన్నారు. తన కేసును విచారించిన ఓ మహిళా జడ్జి.. తను నుంచి భారీగా లంచం డిమాండ్ చేశారనే విషయాన్ని ప్రస్తావించారాయన. కోర్టులో విచారణకు వెళ్లినప్పుడల్లా.. నిఖిత తనపై కొత్త ఆరోపణలు చేసేదని.. ఒకానొక టైంలో సదరు జడ్జి తనను అపహాస్యం చేస్తూ నవ్వేవారని చెప్పారాయన. అంతేకాదు.. తనకు అనుకూలంగా తీర్పు కోసం ఇవ్వడం కోసం లక్షల సొమ్మును డిమాండ్ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. విచారణ తేదీలను షెడ్యూల్ చేయడానికి కూడా లంచం అడిగారని, ఇవ్వకపోవడంతో గతంలో తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు ఈ ఆరోపణల సంగతి చూడాలంటూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన కోరారు. 👉ప్రతీ చట్టం ఆడవాళ్ల కోసమేనా?. మగవాళ్ల కోసం ఏమీ ఉండదా? అని అతుల్ సోదరుడు బికాస్ వేసిన ప్రశ్న.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన భార్య కోసం తన సోదరుడు చేయగలిగిదంతా చేశాడని.. అయినా ఇలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మహిళల రక్షణ కోసం మన దేశంలో చట్టాల్లో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. అందునా.. వివాహితల కోసం వైవాహిక చట్టాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ, ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తే.. ఏం చేయాలనే దానిపైనే న్యాయవ్యవస్థకు స్పష్టత కొరవడింది. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానమే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడం కోసం.. చట్టాన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు కొందరు.సరైన ఆధారాలు లేకుండా.. అడ్డగోలు ఆరోపణలతో నిందితులుగా చట్టం ముందు నిలబెడుతున్నారు. ఇలాంటి కేసుల వల్ల కోర్టుకు పనిభారం పెరిగిపోతోంది.కొన్ని కేసుల్లో.. అతిశయోక్తితో కూడిన ఆరోపణల వల్ల బంధువులు సైతం చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆ న్యాయస్థానాలు కచ్చితంగా న్యాయ పరిశీలనలు జరపాలనే అభిపప్రాయం వ్యక్తమవుతోంది.అన్నింటికి మించి..ఇలాంటి తప్పుడు కేసులు సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. బాధితులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే అతుల్ లాంటివాళ్లెందరో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ‘‘నా కేసులో ఎలాంటి వివరాలు దాచకండి. ప్రతీ విషయం అందరికీ తెలియాలి. అప్పుడే మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత భయానకంగా ఉందో, చట్టాల దుర్వినియోగం ఎంత ఘోరంగా జరుగుతుందో తెలుస్తుంది’’ అంటూ అతుల్ తన చివరి నోట్లో రాశారు. అతుల్ నోట్ ఆధారంగా నిఖిత, ఆమె కుటుంబ సభ్యులపై బెంగళూరులో కేసు నమోదైంది. మరోపక్క అతుల్ సూసైడ్ నోట్లో ప్రస్తావించినట్లే.. తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని.. ఈ కేసు వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కొందరు తెలియజేస్తున్నారు. ఎలాగైనా బాధితుడికి న్యాయం జరగాలని కోరుకుంటూ చిన్నపాటి ఉద్యమాన్నే నడిపిస్తున్నారు. -
బాలింతల మృత్యుఘోష
శివాజీనగర: నవమాసాలు మోసి కాన్పు అయ్యాక ప్రాణాలు కోల్పోతున్న తల్లుల ఉదంతాలు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు సాగుతున్నాయి. ఇలా ఉంటే గత ఐదు సంవత్సరాల్లో కర్ణాటకలో 3,364 మంది బాలింతలు చనిపోయినట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. 2019–20 నుంచి 2024–25 వరకు రాష్ట్రంలో ఈ మేరకు బాలింతలు మరణించారు. బెళగావి జిల్లాలోనే సుమారు 300కు పైగా బాలింతలు అకాల మరణం చెందారని ఆరోపణలు వచ్చాయి. బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్, రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ఇటీవల బళ్లారిలోనూ బాలింతల కుటుంబాలను పరామర్శించారు. ఆరోగ్యమంత్రి దినేశ్ గుండూరావు కూడా వచ్చి ఓదార్చారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో పరిస్థితి ఏమిటి అనేది చెప్పేందుకు సర్కారు ఈ సమాచారాన్ని విడుదల చేసింది. ఏ ఏడాది ఎంతమంది? 2019–20లో రాష్ట్రంలో 662 మంది, 2020–21లో 714 మంది, 2021–22లో 595 మంది, 2022–23లో 527 మంది, 2023–24లో 518 మంది, 2024–25లో నవంబర్ ఆఖరి వరకు 348 మంది బాలింతలు మరణించారని ఇందులో పేర్కొన్నారు. ఫలితంగా వేలాది మంది శిశువులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. మరణాలకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఐదేళ్లలో 3,364 మంది మృతి తల్లి ప్రేమకు పసిగుడ్లు దూరం -
నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు
బనశంకరి: ఎస్ఎం.కృష్ణ పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో స్వగ్రామమైన మండ్య జిల్లా సోమనహళ్లిలో బుధవారం మద్యాహ్నం 3 గంటలకు జరుపుతామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. సోమనహళ్లిలో అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. బుధవారం ఉదయం 8 గంటల తరువాత ప్రత్యేక వాహనంలో సోమనహళ్లికి తరలిస్తామని, మార్గమధ్యలో కెంగేరి, బిడది, రామనగర, చెన్నపట్టణ ఒక్కో చోట ఐదు నిమిషాలు ప్రజల కోసం నిలుపుతామని తెలిపారు. ఒక్కలిగ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలను పూర్తి చేస్తామన్నారు. సీఎం సిద్దరామయ్య, మంత్రులు పాల్గొంటారని, బుధవారం రాష్ట్రమంతటా ప్రభుత్వ సెలవు అని తెలిపారు. -
కన్నకొడుకునే అమ్మేసింది
● రామనగరలో ఓ మహిళ నిర్వాకం బనశంకరి: డబ్బు ఆశలో పడిన ఓ తల్లి.. పేగు తెంచుకుని పుట్టిన పసికందును విక్రయించిన ఘటన రామనగరలో చోటుచేసుకుంది. వివరాలు... రామనగర యారబ్నగర నివాసి సద్దాంపాషా, నస్రీన్తాజ్కు 6 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కవలు పిల్లలతో పాటు మొత్తం 4 పిల్లలున్నారు. కూలి పనులతో జీవించేవారు. నెల కిందట మగబిడ్డ పుట్టాడు. అప్పులు తీర్చడానికి బిడ్డను విక్రయించాలని నస్రీన్తాజ్, భర్తను ఒత్తిడి చేయగా, అతడు తిరస్కరించాడు. ఈ నెల 5వ తేదీన భర్త కూలి పనులకు వెళ్లగా, నస్రీన్తాజ్ , స్థానికులు అస్లాం, ఫాహిమాతో కలిసి బెంగళూరు నివాసి తర్నమ్ సుల్తాన్ అనే మహిళకు మగబిడ్డను రూ.1.5 లక్షలకు విక్రయించింది. భర్త ఇంటికి వచ్చి చూడగా వ్యవహారం బయటపడింది. భార్యను నిలయదీయడంతో పోట్లాట జరిగి సద్దాంపాషా తలకు గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొంది 7వ తేదీ రామనగర టౌన్ పోలీస్‌స్టేషన్‌లో భార్యపై ఫిర్యాదు చేశాడు. వారు విచారణ జరిపి పసికందును కాపాడారు. తల్లితో పాటు నలుగురిని మంగళవారం అరెస్ట్ చేశారు. -
అక్రమ ఇసుకపై దాడులు
గౌరిబిదనూరు: మంచేనహళ్ళి తాలూకా బిసలహళ్ళి గ్రామం నుంచి అలకాపురం రస్తాలో పొలాల మధ్య రోడ్డు వేసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న తిమ్మారెడ్డి, డ్రైవర్ రవికుమార్ లను అరెస్టు చేసి రూ.55 లక్షల విలువైన టిప్పర్, జేసీబీలను చిక్కబళ్ళాపురం సైబర్ క్రైం పోలీసులు సీజ్ చేశారు. సమాచారం రావడంతో మంగళవారం తెల్లవారుజామున దాడులు చేశారు. పోలీసులు రవికుమార్, సూర్యప్రకాశ్, శరత్ కుమార్, సుబ్రమణి పాల్గొన్నారు. హైకోర్టులో ముడా కేసు వాయిదా బనశంకరి: ముడా ఇళ్ల స్థలాల కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వేసిన పిటిషన్ విచారణను హైకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. మంగళవారం విచారణ సాగింది, భూమి మూల యజమాని దేవరాజు తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలనే ఆదేశాలను అప్పీల్ చేశారని, విచారణ దశలో ఉందని, సంబంధం లేకపోయినా విచారణను ఎదుర్కోవలసి వస్తుందని, విచారణను వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వ వకీలు శశికిరణ్ శెట్టి వాదిస్తూ కొందరు ప్రతివాదులకు నోటీసులు జారీకాలేదని, దీంతో సమయం ఇవ్వాలని కోరడంతో జడ్జి ఆ మేరకు వాయిదా వేశారు. పలు జిల్లాలకు వర్షసూచన యశవంతపుర: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని బెంగళూరులోని వాతావారణ కేంద్రం తెలిపింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, బెంగళూరు నగర, గ్రామాంతర, చిక్కబళ్లాపుర, చిక్కమగళూరు, చిత్రదుర్గ, కొడగు, కోలారు, రామనగర, శివమొగ్గ, తుమకూరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడవచ్చని తెలిపారు. బొలెరో డ్రైవర్ దుర్మరణం పావగడ: స్థానిక తుమకూరు రోడ్డులోని ఎస్ఆర్ఎస్ పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో బొలెరో వాహన డ్రైవర్ గిరీష్ (21) దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం ఉదయం పావగడ వైపుగా పెయింట్ల డబ్బాలతో వస్తున్న బొలెరో వాహనం పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. వాహనంలోనే చిక్కుకుని డ్రైవర్ గిరీష్ దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదానికి కారణమైన లారీ ఎదురుగా వస్తున్న ఒమినీ వాహనాన్ని తప్పించబోయి ఉన్నఫళంగా తన మార్చాన్ని మార్చుకోవడంతో ఆ వెనుకనే ఉన్న బొలెరో ఢీకొన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడు మండ్య జిల్లా మద్దూరు తాలూకా సోమనహళ్లికి కి చెందిన పుట్టస్వామి కుమారుడు గిరీష్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ సురేష్, ఎస్ఐ గురునాథ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
రైతు సంఘం పదాధికారుల ధర్నా
శ్రీనివాసపురం: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేష్‌కుమార్ అభిమానులు, రైతు సంఘం పదాధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి పరస్పరం చేయి చేసుకునేదాకా వెళ్లింది. మాజీ ఎమ్మెల్యే కెఆర్ రమేష్‌కుమార్ అటవీ భూముల ఆక్రమణలపై అటవీశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం పదాధికారులు తహసీల్దార్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే కెఆర్ రమేష్‌కుమార్ ఫొటోతో అర్ధనగ్నంగా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న రమేష్‌కుమార్ అభిమానులు రమేష్‌కుమార్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ రైతు సంఘం పదాధికారులతో ఘర్షణకు దిగారు. ధర్నాలో రమేష్‌కుమార్ ఫొటో ఎందుకు పెట్టుకున్నారని వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగి, రైతు సంఘం పదాధికారులపై దాడికి యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నారాయణగౌడ మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్ వర్గీయులు దాడికి దిగారు. వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నా నిర్వహించడానికి ముందుగా అనుమతులు తీసుకున్న తమపై అకారణంగా రమేష్‌కుమార్ అనుచరులు దాడులకు దిగారన్నారు. అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే మద్దతుదారులు -
ఉద్యమించిన పంచమసాలి
సాక్షి, బళ్లారి: బెళగావి అసెంబ్లీ వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని పంచమశాలి స్వామీజీలు, ఆ వర్గీయులు భారీ సంఖ్యలో సువర్ణసౌధ వద్ద జాతీయ రహదారిపై ఆందోళనలు చేపట్టారు. తమను బీసీ 2ఏలో చేర్చాలని నినాదాలు చేశారు. తక్షణం సీఎం సిద్ధరామయ్య రావాలని పట్టుబట్టారు. మఠాధీశులు బసవజయ, మృత్యుంజయస్వామి పాల్గొన్నారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరినా పట్టించుకోలేదు, దీంతో లాఠీచార్జ్ జరపడంతో జనం కకావికలమయ్యారు. దీనిని ఖండిస్తూ స్వామిజీలు, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాళ్ ధర్నా చేపట్టారు. హైవేలో వాహనాలు ఎక్కడి అక్కడే ఆగిపోయాయి. మంత్రుల రాక ఇంతలో మంత్రులు మహదేవప్ప, వెంకటేష్, లక్ష్మీహెబ్బాల్కర్ తదితరులు అక్కడకు వచ్చి సీఎం తరఫున మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈనేపథ్యంలో జనం పెద్ద ఎత్తున కేకలు వేస్తూ సీఎం రావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన శృతి మించడంతో స్వాములను, యత్నాళ్‌ను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. నిరసన పరిణామాలు బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర పేర్కొన్నారు. ఆయన కూడా ఆందోళన వద్దకు వచ్చి పాల్గొన్నారు. అనేకమందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. 2ఏ రిజర్వేషన్ల కోసం బెళగావిలో అసెంబ్లీ ముందు ధర్నా ముఖ్యమంత్రి రావాలని పట్టు చెదరగొట్టిన పోలీసులు -
ధృవనక్షత్రం రాలిపోయింది
●● ఎస్ఎం మరణంపై డీసీఎం బనశంకరి: ఎస్ఎం కృష్ణ కు వెల్లువలా నివాళులు అర్పించారు. నగరంలో సదాశివనగరలోని ఆయన ఇంటికి తరలివచ్చారు. అజాత శత్రువు, దూరదృష్టి కలిగిన నేత ఎస్ఎం కృష్ణ మృతి రాష్ట్రానికి తీరనిలోటు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. తన రాజకీయ మార్గదర్శకుడు అని, కర్ణాటక రాజకీయ రంగంలో ధృవ నక్షత్రం రాలిపోయిందన్నారు. కెంపేగౌడ నిర్మించిన బెంగళూరు నగరాన్ని ప్రపంచమే చూసేలా తీర్చిదిద్డడంలో ఎస్ఎం.కృష్ణ పాత్ర ఎనలేనిదన్నారు. మాజీ ఎంపీ, నటి రమ్యా.. ప్రస్తుతం నేను మాట్లాడే పరిస్థితుల్లోలేనని ఆవేదన చెందారు. ● కృష్ణ మరణం రాష్ట్రానికి తీరనిలోటు అని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అన్నారు. ఆయన తమ కుటుంబ సభ్యునిగా ఉండేవారని, తనకు చాలా ప్రోత్సాహం అందించారని కర్ణాటక, బెంగళూరుకు అందించిన సేవలు అపారమన్నారు. ● కృష్ణ హుందాగా నడుచుకునే రాజకీయనేత, బెంగళూరు నెంబర్‌వన్ కావడానికి ఆయనే కారణం అని మాజీ ఎంపీ సుమలత తెలిపారు. నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ మండ్య గర్వించే సుపుత్రుడుగా ఉన్నారని, ఇకపై ఇలాంటి రాజకీయ నేతను చూడటం సాధ్యం కాదన్నారు. మా కుటుంబానికి అండ: శివు శివాజీనగర: ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ నివాళులర్పించి అనుబంధాన్ని స్మరించుకొన్నారు. నాన్న రాజ్‌కుమార్‌ని వీరప్పన్ కిడ్నాప్ చేసిన సమయంలో ఎస్.ఎం.కృష్ణ తమ కుటుంబానికి అండగా నిలిచారు. సీఎం ఎలా ఉండాలంటే కృష్ణ మాదిరిగా ఉండాలి. క్రమశిక్షణతో పనిచేస్తారు. ఆయన కుటుంబంతోనూ సత్సంబంధం ఉందన్నారు. లేరనేది తలచుకుంటే దుఃఖం వస్తుందని, ఆయన కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని అన్నారు. -
లంచగొండ్లు గజగజ
యశవంతపుర: రాష్ట్రంలో మరోసారి లోకాయుక్త పంజా విసిరింది. ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను పీడిస్తూ సొమ్ము చేసుకునే అక్రమార్కులకు వణుకు పుట్టించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలతో తొమ్మిది మంది ప్రభుత్వ అధికారులపై లోకాయుక్త పోలీసులు మంగళవార ఉదయం దాడి చేశారు. పెద్దమొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నగర, రూరల్, కలబురగి, రాయచూరు, గదగ, కొప్పళ, చిత్రదుర్గలో దాడులు జరిగాయి. ఎక్కడెక్కడ.. ఎవరెవరిపై బెస్కాం ఇంజినీర్ లోకేశ్ బాబు, రెవెన్యూ శాఖ ఇన్స్పెక్టర్ సురేశ్‌బాబు, బీబీఎంపీ యలహంక ఆదాయ ఇన్స్పెక్టర్ కృష్ణప్ప, బెంగళూరు రూరల్ ఆరోగ్యాధికారి ఎంసీ సునీల్‌కుమార్, చెన్నపట్టణ పోలీసు శిక్షణ పాఠశాల డిఎస్పి నంజుడయ్య, కలబురగి మహానగర పాలికె ఉప కమిషనర్ రామప్ప, రాయచూరు అబ్కారీ సీఐ రమేశ్, చిత్రదుర్గ సహయక అటవీ సంరక్షణాధికారి సురేశ్, గదగ్ ఎస్డిఎ లక్ష్మణ్ కర్ణి ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. బెంగళూరులో ఐదుచోట్ల దాడులు సాగాయి. చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరెలో అటవీ అధికారి సురేశ్ నివాసంలో అధిక మొత్తంలో ఆస్తిపత్రాలు దొరికాయి. వారి బ్యాంకు ఖాతాలు, లాకర్లను ఇంకా తనిఖీ చేయాల్సి ఉంది. 9 మంది అధికారులపై లోకాయుక్త దాడులు -
మైనారిటీ పథకాల పట్ల జాగృతి చేయండి
కోలారు: మైనారిటీ సముదాయాలలో వివిధ శాఖల సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన, జాగృతి కలిగించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అక్రం పాషా తెలిపారు. మంగళవారం ఆర్డీవో కార్యలయంలో ప్రధాన మంత్రి 15 అంశాల కార్యక్రమాల అమలుపై నిర్వహించిన త్రైమాసిక అవధి ప్రగతి పరిశీలన సమావేశంలో మాట్లాడారు. ప్రధాన మంత్రి నూతన 15 అంశాల కార్యక్రమం అమలులో జిల్లాలో ఉత్తమ ప్రగతి సాధించింది. దీనిపై మైనారిటీ సముదాయాలలో తగిన జాగృతి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతినెలా వచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను ప్రభుత్వం నిర్ణయించిన నియమాలకు అనుగుణంగా మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా రిజర్వు చేసి ఉంచాలన్నారు. అధికారులు తమ శాఖల పరిధిలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్దిదారులకు సకాలంలో సక్రమంగా అందించాలన్నారు. అల్పసంఖ్యాత వసతి నిలయాలలో, విద్యార్థి నిలయాలలో ఉత్తమ సౌలభ్యాలను కల్పిచండానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి సమితి సభ్యుల నుంచి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ బి నిఖిల్, కేజీఎఫ్ డీఎస్పీ పాండురంగ, జిల్లా పంచాయతీ యోజనాధికారి సుమా, జిల్లా అల్పసంఖ్యాత సంక్షేమ అధికారి మైలారప్ప తదితరులు పాల్గొన్నారు.