Tamil Nadu
-
తమిళనాడు: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పలువురు మృతి
చెన్నై: తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా చిన్నారి సహా ఏడుగురు మృతిచెందగా.. మరో 20 మంది అస్వస్థతకు గురైనట్టు సమాచారం. అయితే, షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. తమిళనాడులోని దిండిగుల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా మొదట ఆసుపత్రి భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అనంతరం, భవనం మొత్తానికి వ్యాపించాయి. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ టెండర్స్ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా రెండు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రి భవనం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. దీంతో, ఆసుపత్రిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అగ్నిప్రమాదం కారణంగా ఏడుగురు మృతిచెందగా.. మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 30 మంది రోగులు ఉన్నట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన, అస్వస్థతకు గురైన రోగులను 50 అంబులెన్స్‌ల సాయంతో ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.#TamilNadu : #HospitalFireAt least 6 people, including a child and 3 women died and 6 others were injured, after a #fire broke out at a four-story private Hospital in #Dindigul on Thursday night.Reportedly the victims succumbed to suffocation caused by the thick #smoke that… pic.twitter.com/2Iac9Qt5Gh— Surya Reddy (@jsuryareddy) December 12, 2024 -
క్రయోజనిక్ ఇంజిన్ 20 పరీక్ష సక్సెస్
సూళ్లూరుపేట: సీఈ20 క్రయోజనిక్ ఇంజన్లో సంక్లిష్టమైన ప్రక్రియను దాటడం ద్వారా మళ్లీ స్టార్ చేయడానికి వీలుండే వ్యవస్థల అభివృద్ధిలో మరో ముందడుగు వేశామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గురువారం ప్రకటించింది. భవిష్యత్తు ప్రయోగాలకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని ఇస్రో పేర్కొంది. నాజిల్ ఏరియా నిష్పత్తి 100 శాతం ఉండేలా సముద్ర ఉపరితల స్థాయిలో హాట్ టెస్ట్‌లో సీఈ20 క్రయోజనిక్ ఇంజన్‌ను నవంబర్ 29న విజయవంతంగా పరీక్షించామని ఇస్రో గురువారం వెల్లడించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో వారి ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఈ పరీక్షకు వేదికైంది. ఎల్వీఎం మార్క్–3 రకం రాకెట్లో పైభాగానికి తగు శక్తిని అందివ్వడంలో సీఈ20 ఇంజన్ సాయపడుతుంది. 19 టన్నుల థ్రస్ట్‌ను అందించే పరీక్షలో ఈ ఇంజన్ నెగ్గింది. ఇప్పటికే ఎల్వీఎం2 ఆరు ప్రయోగాల్లో ఈ ఇంజన్ అద్భుతంగా పనిచేసింది. ‘‘గగన్‌యాన్ మిషన్‌కు కావాల్సిన 20 టన్నుల థ్రస్ట్ స్థాయిని అందించేందకు ఈ ఇంజన్ అర్హత సాధించింది. భవిష్యత్తులో సీ32 స్టేజ్‌లో పేలోడ్ పరిమాణాన్ని పెంచేందుకు ఉపయోగపడే 22 టన్నుల థ్రస్ట్‌ను అందించే కార్యక్రమాల్లోనూ ఈ ఇంజన్‌ను ప్రయోగాత్మకంగా వాడొచ్చు’’అని ఇస్రో పేర్కొంది. మళ్లీ ఇంజన్‌ను రీస్టార్ చేసేందుకు అవసరమయ్యే బహుళధాతు ఇగ్నైటర్ సామర్థ్యాన్నీ విజయవంతంగా పరీక్షించారు. ‘‘సముద్రమట్టం స్థాయిలో సీ20 ఇంజన్‌కు సవాళ్లు ఎదురవుతాయి. నాజిల్ పెద్దదిగా ఉండటంతో 50 ఎంబార్ స్థాయిలో విపరీతమైన శక్తి బయటకు వెలువడుతుంది. దీంతో ఇంజన్ సమీపంలో అత్యంత ఉష్ణం జనించడంతోపాటు పెద్దస్థాయిలో కంపనాలు మొదలై ఆ నాజిల్ దెబ్బతినే ప్రమాదముంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్న ‘నాజిల్ ప్రొటెక్షన్ సిస్టమ్’ను ఉపయోగించాం’’అని ఇస్రో పేర్కొంది. -
సీనియారిటీ మేరకు పదోన్నతులు కల్పించాలి
వేలూరు: ప్రభుత్వ టీచర్లకు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని తమిళనాడు ఒకేషనల్ టీచర్స్ అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేనా జనార్దన్ అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్కూల్ టీచర్స్ వేలూరు కార్యవర్గ సమావేశం జిల్లా కో–ఆర్డినేటర్ జోసెఫ్ అన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలను నెరవేర్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 15న మదురైలో టీచర్ల డిమాండ్ సాధనకు సదస్సు నిర్వహించనున్నామని ఇందులో టీచర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆర్డినెన్స్ నంబర్ 243ను రద్దు చేయాలని కోరారు. అనంతరం సమావేశంలో తీర్మానాలను తీర్మానించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తమిళనాడు హయ్యర్ సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయప్రకాష్, జిల్లా అధ్యక్షులు సెల్వకుమార్, కార్యదర్శి గుణశేఖరన్, కోశాధికారి సపిత, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెల్వం, దినేష్ ఆబ్రహం, ఆంథోని తదితరులు పాల్గొన్నారు. -
రోగుల నుంచి డబ్బు వసూలు
● రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు ఉద్యోగుల అరెస్టు కొరుక్కుపేట: చైన్నె రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలోని పరిపాలన కార్యాలయంలో రోగుల నుంచి డబ్బులు దండుకున్న ఘటన కలకలం రేపింది. వసూళ్ల కు పాల్పడిన ఇద్దరు ఉద్యోగుల పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నెలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో 10 వేల మందికి పైగా ఔట్ పేషెంట్లు, 5 వేల మందికి పైగా ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. తమిళనాడులోని పలు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వైద్యం కోసం వస్తుంటారు. సంక్లిష్టమైన దీర్ఘకాలిక సమస్యలకు వైద్యపరంగా అన్ని పరీక్షలు , చికిత్స పొందుతారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు ఫీజుల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. బీమా పథకాలు అందక ఇబ్బందులు పడుతుండడంతో తక్కువ ఖర్చుతో చికిత్స పొందుతున్నారు. ఈ దశలో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్ విభాగంలో గుమస్తాలుగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న పెరుంగుళంకు చెందిన కుబేరన్ (50), అవడికి చెందిన కలైమగన్ (42) ఆస్పత్రి రిజిస్టర్లో నకిలీ ఖాతాలు రాసి నగదు లావాదేవీలు జరుపుతున్నట్లు గుర్తించారు. గత మే నెలలో, ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చికిత్స తర్వాత ఇంటికి వెళ్లే ముందు అడ్మిషన్ కౌంటర్లో చెల్లించాలి. ఇద్దరూ డబ్బును తారుమారు చేసి నకిలీ పత్రాలు సిద్ధం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి రూ.20 వేలకు పైగా వసూలు చేసినట్లు తేలింది. డీన్ ధరనీరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి కుబేరన్, కలైమగన్ను అరెస్ట్ చేశారు. -
తూత్తుకుడి, కన్యాకుమారిలో హైబ్రిడ్ పవర్ ప్లాంట్లు
కొరుక్కుపేట: రాష్ట్రంలో మొదటి సారిగా తూత్తుకుడి , కన్యాకుమారి జిల్లాల్లో 12 హైబ్రిడ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. పవన, సౌరశక్తి ఉపయోగించి 100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కంపెనీ అధికారులు పేర్కోంటూ రాష్ట్రంలో ప్రస్తుతం థర్మల్ పవర్ ప్లాంట్లు, అణు విద్యుత్ ప్లాంట్లు సౌరశక్తి, పవన శక్తి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందన్నారు. ఈ పరిస్థితిలో తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ పవన , సోలార్ కంబైన్డ్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ హైబ్రిడ్ పవర్ ప్లాంట్లను ముందుగా తమిళనాడులోని తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి తక్కువ స్థాయిలో ఉందని, అదే సమయంలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరిగిందన్నారు. అలాగే పవన, సోలార్ ఉపయోగించి హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి సాధ్యాసాధ్యాలను అధ్యాయనం చేయా లని నేషనల్ విండ్ ఎనర్జీ కార్పొరేషన్‌ను అభ్యరించామని, ఈ పథకం ఆచరణ సాధ్యమేనన్నారు. అందుకు ఈప్రాజెక్టును రాష్ట్రంలో అమలు చేయా లని నిర్ణయించామని వివరించారు. -
చైన్నె వేదికగా అధునాతన విజన్ కేర్ సెంటర్
సాక్షి, చైన్నె: చైన్నె వేదికగా అధునాతన ఇమేజ్ ఆప్టికల్ సహకారంతో జెడ్ఈఐఎస్ఎస్ విజన్ కేర్ టెక్నాలజీ, లగ్జరీ ప్రీమియం లెన్స్ సెంటర్ గురువారం ఏర్పాటైంది. ఆప్టిక్స్ , ఆప్టోఎలక్ట్రానిక్స్లో సైన్స్‌కు 175 ఏళ్లుగా మార్గదర్శకంగా ఉన్న ఇమేజ్ ఆప్టికల్ సహకారంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తమిళనాడులో ఫీనిక్స్ మార్కెట్ సిటీలో తొలి విజన్ సెంటర్‌గా దీనిని తీర్చిదిద్దారు. కంటి సంరక్షణ పరిష్కారాలతో, విజన్బ్రాండెడ్ కళ్లద్దాలతో విస్తృత సేవల దిశగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఇమేజ్ ఆప్టికల్ కో వ్యవస్థాపకుడు అబ్దుల్ హసన్, డైరెక్టర్ ఫాహెత్ హసన్, ఆసీఫ్, విజన్ కేర్ రోహన్ పాల్ తదితరులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
ప్రభుత్వ బస్సు బోల్తా ● ప్రయాణికులకు స్వల్ప గాయాలు తిరువళ్లూరు: పొన్నేరి సమీపంలో ప్రభుత్వ బస్సు బోల్తా కొట్టిన సంఘటనలో అదృష్టవశాత్తు ప్రయాణికులు స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నుంచి సానాపుత్తూరుకు ప్రభుత్వ బస్సు గురువారం ఉదయం 16 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు అరసూరు–కాట్టవూరు మలుపు వద్ద బస్సు అదుపుతప్పి బస్సు సమీపంలోని వ్యవసాయ భూమిలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాధంలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ వారిని పొన్నేరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించేశారు. పొన్నేరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుచ్చిలో స్కౌట్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు ● రూ.39 కోట్ల కేటాయింపు తిరువొత్తియూరు: తిరుచ్చిలో జనవరిలో నిర్వహించనున్న స్కౌట్ జాతీయ వజ్రోత్సవాలకు రూ.39 కోట్లు కేటాయిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి మధుమతి విడుదల చేసిన ప్రకటనలో తమిళనాడు ప్రభుత్వం 2025 జనవరిలో తిరుచ్చి జిల్లా మనపరైలో భారత్ స్కౌట్ డైమండ్ జూబ్లీని నిర్వహించనుంది. ఈ ఉత్సవాలు 7 రోజుల పాటు జరుగుతుందని, ఇందులో బ్యాండ్ గ్రూప్, కలర్ ఫుల్ టీమ్ ఫిజికల్ స్కిల్స్ డెమోన్స్ట్రేషన్, ఫోక్ డ్యాన్స్, ఫుడ్ ఫెస్టివల్, సాహస విన్యాసాలు వంటి వివిధ కార్యక్రమాలు ఇందులో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో 25 వేల మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొననున్నారు. వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతుందని విద్యా శాఖ కార్యదర్శి తెలిపారు. సీసింగ్ రాజా ఆస్తుల వివరాల పరిశీలన కొరుక్కుపేట: పోలీసుల ఎన్కౌంటర్లో కాల్చి చంపబడిన సీసింగ్ రాజాకు సంబంధించి వండలూరు, కీలంబాక్కం, తాంబరం వద్ద ఉన్న ఆస్తులను నలుగురు ఇన్స్పెక్టర్ల నేతృత్వంలోని బృందం గురువారం పరిశీలించింది. ఈమేరకు త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరణంలోనూ వీడని బంధం ● భర్త మృతి..మనస్తాపంతో భార్య అన్నానగర్: ఉసిలంబట్టి సమీపంలో గురువారం భర్త మృతిచెందడంతో మనస్తాపంతో భార్య కూడా మరణిచండంతో విషాదం నెలకొంది. మదురై జిల్లా ఉసిలంబట్టి సమీపంలోని కవనం పట్టికి చెందిన సుబ్రమణ్యం, పాండియమ్మాల్ దంపతులు. సుబ్రమణ్యం భవన నిర్మాణ కార్మికుడు. పెళ్లయి 36 ఏళ్లుగా వారికి సంతానం లేదు. ఈక్రమంలో 7న సుబ్రమణికి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. భర్త చనిపోయిన క్షణం నుంచి కోలుకోలేని దుఃఖంతో ఉన్న పాండియమ్మాల్, భర్త అంత్యక్రియలకు వెళుతుండగా ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే పాండియమ్మాల్ను బంధువులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. షాక్‌కు గురైన బంధువులు పాండియమ్మాళ్ ను శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. అక్కడ సుబ్రమణియన్, పాండియమ్మాల్ మృతదేహాలను కలిసి కాల్చారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో..! ● ఇద్దరు ఆడపిల్లలను బావిలో పడేసి చంపిన తల్లి అన్నానగర్: శివగంగై జిల్లా మదగుపట్టి సమీపంలోని తిరుమన్ పట్టీకి చెందిన చంద్రన్ భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పని చేస్తున్నాడు. ఇతనికి తిరుమల గ్రామానికి చెందిన రంజితతో 6 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు కీర్తి (5), సంగీత (3) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొన్ని నెలలుగా భర్త,భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా చంద్రన్ అప్పుడప్పుడూ పని నిమిత్తం విదేశాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం దంపతుల మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయి. తర్వాత చంద్రన్ పనికి వెళ్లాడు. కాగా రంజిత చాలా సేపుగా తిరుమలై గ్రామంలో తిరుగుతోంది. ఇది చూసిన చంద్రన్ బంధువులకు అనుమానం వచ్చి సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే చంద్రన్ భార్యను సెల్ఫోన్లో సంప్రదించాడు. పిల్లలు ఎక్కడున్నారని ఆరా తీస్తే కీళపూంగుడి ప్రాంతంలోని అయ్యనార్ ఆలయ సమీపంలోని బావిలో తోసేసి చంపి ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పింది. అయితే తనకు ఈత తెలియడంతో తప్పింటుకున్నట్లు పేర్కొంది. దీంతో చంద్రన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో తేలియాడుతున్న చిన్నారుల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం శివగంగై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తర్వాత తల్లి రంజితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. -
అరణియార్ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
నాగలాపురం: పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టు నిండిపోవడంతో అధికారులు గురువారం ప్రాజెక్టుకు ఉన్న రెండు గేట్లను ఎత్తి, నీటిని బయటకు విడుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం కారణంగా బుధవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పిచ్చాటూరు మండలంలో 40.01 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో పిచ్చాటూరులోని అరణియార్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ఈ క్రమంలో గురువారం 11 గంటలకు ఇరిగేషన్ డీఈ రామచంద్ర ఆధ్వర్యంలో రెండు స్పిల్‌వే గేట్లను తెరిచి నీటిని బయటకు విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అరణియార్ ప్రాజెక్టులో 281 అడుగులు మేరకు 1.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 280.5 అడుగుల నీరు చేరిందన్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 6 వేల క్యూసెక్కు నీరు వచ్చి చేరుతుందని చెప్పారు. దీంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. అరణియార్ పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
పూండి నుంచి నీరు విడుదల
తిరువళ్లూరు: చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే పూండి రిజర్వాయర్ నీటి మట్టం పూర్తిస్థాయికి చేరిన క్రమంలో ఐదు వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్ పూండి సత్యమూర్తి సాగర్. ఆంధ్ర నుంచి వచ్చే కృష్ణాజలాలు, వర్షపు నీటిని నిల్వ వుంచి అక్కడి నుంచి వేర్వేరు రిజర్వాయర్లకు నీటిని తరలించి అక్కడ శుద్ధీకరణ చేసిన తరువాత చైన్నె ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. రిజర్వాయర్ మొత్తం నీటి సామర్థ్యం 35 అడుగులు కాగా ఇక్కడ మూడున్నర టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. బుధవారం నాటికి 33 అడుగుల చేరిన నీటి మట్టం గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కావడంతో ఇన్‌ఫ్లో పెరిగి పూర్థిస్థాయి నీటి మట్టానికి చేరింది. పూండి రిజర్వాయర్ పూర్థిగా నిండిన క్రమంలో నాలుగు గేట్ల ద్వారా 5,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కుశస్థలీ వరద ప్రవాహం పెరిగింది. కాగా రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో 3,500 క్యూసెక్కులు వస్తున్న క్రమంలో రాత్రికి మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు అంచనా వేశారు. దీంతో రాత్రికి రిజర్వాయర్ నుంచి మరింత నీటిని దిగువకు విడుదల చేస్తామని పీడబ్ల్యూడీ అధికారులు ప్రకటించారు. 25 గ్రామాలకు ముంపు హెచ్చరిక పూండి రిజర్వాయర్ నుంచి గురువారం సాయంత్రం నాలుగు గేట్ల ద్వారా 5,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన క్రమంలో రాత్రికి అదనంగా నీటిని విడుదల చేసే అవకాశం వున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో కుశస్థలిలో వరద ప్రవాహం పెరగనుంది. దీంతో కుశస్థలి 25 గ్రామాలకు ముంపు హెచ్చరిక జారీ చేసిన కలెక్టర్ ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. -
కృష్ణాపురం నుంచి మిగులు జలాల విడుదల
పళ్లిపట్టు: కృష్ణాపురం జలాశయం నుంచి 2వేల క్యూసెక్కుల మిగులు జలాల విడుదలతో కుశస్థలి నదిలో వరద ప్రవాహం పోటెత్తింది. పళ్లిపట్టు సమీప ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షంతో కృష్ణాపురం జలాశయానికి వర్షపునీటి రాక ఎక్కువవడంతో జలాశయం నిండడంతో మిగులు జలాలను బుధవారం అర్ధరాత్రి విడుదల చేశారు. జలాశయం నుంచి మిగులు జలాలు విడుదలతో పళ్లిపట్టు ప్రాంతంలోని కుశస్థలి నదిలో వరద ప్రవాహం పోటెత్తింది. జలాశయం నుంచి నీరు విడుదలతో నదీతీర ప్రాంతాల్లో ప్రజలను తిరువళ్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేశారు. తీర ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తు జాగ్రత్తగా శిబిరాలకు తరలించారు. వరద ప్రవాహంతో నదిలోని నెడియం, సామంతవాడ ప్రాంతాల్లో నేలమట్ట వంతెనలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు ఆగాయి. -
3 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు
● యువకుడికి జీవిత ఖైదు అన్నానగర్: కాంచీపురం జిల్లాకు చెందిన విజయకుమార్ (37). ఇతను గత 2018లో, తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న 3 ఏళ్ల బాలికను తన ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత చిన్నారి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చిందని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల సమయంలో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఆ అనంతరం జరిగిన ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు కాంచీపురం ఆల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఇంటి వద్ద విచారణ చేపట్టారు. ఇందులో విజయ్ కుమార్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించి నిందితుడు విజయకుమార్ ను అరెస్టు చేసి జైలులో ఉంచారు. దీనికి సంబంధించిన కేసు చెంగల్పట్టు పోక్సో కోర్టులో కొనసాగింది. ఈ స్థితిలో గురువారం తుది విచారణకు వచ్చింది. కేసును విచారించిన న్యాయమూర్తి నజీమా భాను.. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో విజయకుమార్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. రూ.2 లక్షల జరిమానా విధించారు. బాధిత చిన్నారికి ప్రభుత్వం రూ. 3 లక్షలు పరిహారంగా అందించాలని సూచించారు. -
వైభవంగా మహాకుంభాభిషేకం
కొరుక్కుపేట: పొల్లాచ్చి సమీపం ఆనైమలై మసానియమ్మన్ ఆలయ మహాకుంభాభిషేకం మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు రాష్ట్ర దేవదాయశాఖామంత్రి పీకే శేఖర్‌బాబు, విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజి పాల్గొన్ని కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించారు. ఈనెల 6న కుంభాభిషేక పూజలు ప్రారంభమయ్యాయి. ఇందులోభాగంగా గురువారం విశేష పూజలు అనంతరం ఆలయ రాజగోపురంలోని కలశాలకు పవిత్ర జలాలు పోసి కుంభాభిషేకం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులపై పవిత్ర జలాలు చల్లడంతో పులకించిపోయారు. 14 ఏళ్ల తరువాత కుంభాభిషేకం మహోత్సవం జరగడం గమనార్హం. -
తిరుత్తణిలో కుండపోత వర్షం
●అత్యధికంగా 19 సెంమీ వర్షం ●జలదిగ్బంధంలో ఇళ్లు ●వరద ప్రవాహంతో స్తంభించిన రాకపోకలు నీట మునిగిన వాహనాలు తిరుత్తణి శర్మనగర్‌లో ఇళ్లను చుట్టిముట్టిన వరద నీరుతిరుత్తణి–అరక్కోణం రోడ్డులో వరద ప్రవాహం తిరుత్తణి: తిరుత్తణిలో కురిసిన కుండపోత వర్షానికి పట్టణం జలమయమైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు 15 గంటల వ్యవధిలో 19 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో వరద ప్రవాహం ఉప్పొంగింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో తిరుత్తణి, పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా 15 గంటల పాటు కుండపోత వర్షం కుమ్మరించింది. దీంతో పట్టణంలో పలు ప్రాంతాలు వరద ప్రవాహం చోటుచేసుకుంది. తిరుత్తణి నుంచి అరక్కోణం మార్గంలో వరద ప్రవాహం రోడ్డును ముంచెత్తింది. వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. తిరుత్తణి మున్సిపాలిటీ పరిధిలోని శర్మనగర్ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో వరదపోటుకు వాహనాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో సబ్‌వేలు నీట మునిగాయి. గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముందస్తు జాగ్రత్తగా తీర ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. ఆవడిలో 18.7 సెంమీ తిరువళ్ళూరు : జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్యవస్థంగా మారింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఆవడిలో 18.7 సెంమీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా పొన్నేరిలో 3సెంమీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా గురువారం కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించింది. బస్సులు, రైళ్లు యథావిధిగా నడిచాయి. పాఠశాలకు మాత్రం సెలవులు ప్రకటించారు కూవం, కుశస్థలిలో వరద ప్రవాహం ఏర్పడింది. ఆవడి, తిరువేర్కాడు, పూందమల్లి, పట్రపెరంబదూరు, వేపంబట్టు, తిరునిండ్రవూర్, పొన్నేరి ప్రాంతాల్లోని నివాసాలకు భారీగా వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆవడిలోని ఎంటీ హెచ్ రోడ్డులో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపి వేయగా ఆరు గంటల తరువాత పునరుద్ధరించారు. -
విద్యార్థిపై కత్తితో దాడి
● యువకుడి అరెస్ట్ తిరువొత్తియూరు: తరమణి ప్రాంతంలో కళాశాల విద్యార్థిపై కత్తితో దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి కత్తి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైన్నెలోని కందన్ చావడిలోని అన్నా హైరోడ్డు ప్రాంతంలో నివసిస్తున్న తస్లీమ్ షరీఫ్ (19). పల్లావరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో 9వ తేదీ సాయంత్రం కందన్ చావడి పిల్లియార్ కోయిల్ వీధిలోని ప్రొవిజన్ దుకాణం వద్ద తస్లీమ్ షరీఫ్ నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై అక్కడికి వచ్చిన ఆ ప్రాంతానికి చెందిన శరత్ కుమార్ తస్లీమ్‌ను ద్విచక్ర వాహనంపై ఎక్కించు కందన్ చావడిలో వున్న తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం శరత్‌కుమార్ తాను దాచుకున్న కత్తితో దాడి చేశాడు. ఇరుగుపొరుగు వారు రావడంతో శరత్‌కుమార్ ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. రక్తస్రావమై తస్లీమ్ తరమణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కళాశాల విద్యార్థినిపై దాడి చేసిన శరత్‌కు మార్ (27)ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా శరత్‌కుమార్ ఇప్పటికే ఒక గంజాయి కేసుతో పాటు 2 క్రిమినల్ కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. శ్రీవారిని దర్శించుకున్న రాధిక తిరుమల: సినీ నటి రాధిక, అల్లుఅర్జున్ సతీమణి స్నేహారెడ్డి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 65,887 మంది స్వామి వారిని దర్శించుకోగా 25,725 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.88 కోట్లు సమర్పించారు. టైం స్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
● 20 జిల్లాల్లో విస్తారంగా వానలు ● జల దిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు ● చైన్నె రోడ్లపై పోటెత్తిన వరద నీరు ● నేడు మూడు జిల్లాలకు వరుణగండం
తీవ్ర అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 20 జిల్లాలపై ఈ ద్రోణి ప్రభావం తీవ్రంగా ఉండడంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చైన్నె రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది. ఇక గురువారం 3 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండడంతో వాతావరణశాఖ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. సాక్షి, చైన్నె : బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా బుధవారం రాత్రి నుంచి చైన్నె, శివారు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తూ వస్తున్నాయి. కొన్ని చోట్ల మోస్తరుగా, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడటంతో పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. చైన్నె శివారు ప్రాంతాలలో వాన జోరు క్రమంగా పెరగడంతో విమాన సేవలకు సైతం ఆటంకం నెలకొంది. సుమారు 15 విమానాల సేవలను రద్దు చేశారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా టేకాఫ్, ల్యాండింగ్ తీసుకున్నాయి. చైన్నెలోని విమానాశ్రయ మార్గం, కోయంబేడు మార్గం, ఉత్తర చైన్నె పరిఽధిలోని పలు మార్గాలలో రోడ్లపై వరదలు పోటెత్తాయి. యుద్ధ ప్రాతిపదికన నీటిని తొలగించే పనిలో కార్పొరేషన్ సిబ్బంది నిమగ్నమయ్యారు. లోతట్టు ప్రాంతాలలో మొకాలి లోతుకు నీళ్లు చేరడంతో ముందస్తుగా సిద్ధం చేసిన మోటారు పంపు సెట్ల ద్వారా నీటిని తొలగిస్తున్నారు. గురువారం కూడా చైన్నె శివారులో వర్షాలు కొనసాగనున్నాయి. చైన్నె శివారులలోని అనేక ప్రాంతాలు, మార్గాలలో వర్షపు నీరు చేరడంతో వాహన దారులకు ఇబ్బందులు తప్పలేదు. చైన్నెలో అత్యధికంగా అంబత్తూరు, మాధవరం, పెరంబూరు, అయపాక్కం, తిరువొత్తియూరు పరిసరాలలో భారీ వర్షం పడింది. కాగా, చైన్నెలో తాజా వర్షాలకు తాగునీరు అందించే రిజర్వాయర్లలోకి నీటి రాక పెరిగింది. చెంబరంబాక్కం రిజర్వాయర్ నిండుకుండగామారింది. దీంతో ఉబరి నీటి విడుదల మీద అధికారులు దృష్టి పెట్టారు. అడయార్ నదీ తీరంలోని చైన్నె నగర పరిసర వాసులకు అలర్ట్ ప్రకటించారు. శివారులలో కురుస్తున్న వర్షాలతో చెంబరంబాక్కంలోకి నీటి రాక పెరిగింది. డెల్టా విలవిల ఇప్పటికే డెల్టా జిల్లాల్లో సాధారణ స్థాయికి మించి వర్షం కురిసింది. తాజాగా నాగపట్నం నుంచి వర్షాలు ముంచెత్తాయి. తిరువారూర్, తంజావూరు, మైలాడుతురైలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నం జిల్లా కోడికకరైలో 18 సెం.మీ, వేలాంకన్నిలో 15 సెం.మీ వర్షం కురిసింది. ఇటీవల ఫెంగల్ తుపాన్‌తో తల్లడిల్లిన విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలైలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. పుదుకోట్టై, రామానాథపురం, దిండుగల్ తదితర 20 జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఈ జిల్లాలో నాలుగు చోట్ల అతిభారీ వర్షం , 72 చోట్ల భారీ వర్షాలు కురిశాయని చైన్నె వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర అల్పపీడనం గురువారం మన్నార్ వలై గూడా వద్ద కేంద్రీకృతమైంది. ఇది శుక్రవారం మరింత బలహీనపడి వాయువ్య దిశలో పయనించనుంది. ఈ ప్రభావంతో శుక్రవారం తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు అధికంగా ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత ఏడాది ఈ మూడు జిల్లాలు పెను వరద ముంపును ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తిరుచ్చి, తిరువణ్ణామలై, రాణిపేట, పెరంబలూరు, కళ్లకురిచ్చి , తిరుప్పూర్లోనూ వర్షాలు పడుతున్నాయి. తెన్పైన్నె, కుశస్థలి, పాలారూలలో వరద ఉధృతి పెరుగుతుండడంతో తీర వాసులను అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మూడవ రోజుగా జాలర్లు వేటకు దూరంగా ఉండడంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి. తండయారుపేట మార్గంలో వాహనదారుల అవస్థలునలుగురి మృతి.. వర్షాల కారణంగా నలుగురు మరణించారు. నాగపట్నం జిల్లా వేలాంకన్ని సమీపంలోని సెంబియంమహాదీవి ప్రాంతానికి చెందిన మురుగదాస్ ఇంటి గోడ కూలడంతో ఆయన కమారుడు కవి(13) మరణించాడు. రాణిపేటలోపిడుగు పడడంతో అయ్యప్ప భక్తుడు సురేష్ (23) మృతి చెందాడు. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ సమీపంలో కాట్టూరు గ్రామంలో ఇద్దరు యువకులు వ్యవసాయ పొలంలో విద్యుదాఘాతానికి గురై మరణించారు. వీరిద్దరి 30 ఏళ్ల వయస్సు ఉంటాయి. వీరి చిరునామా కోసం ఆరా తీస్తున్నారు. కళ్లకురిచ్చి జిల్లా తెన్పైన్నె నదీ తీరంలో తాత్కాలిక మోటార్లు ఏర్పాటు చేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు నీటి ఉధృతికి కొట్టుకెళ్లారు. ముగ్గురు గల్లంతు కాగా వీరిలో ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు. దిలీప్‌కుమార్ జాడ తెలియరాలేదు. -
ఆధిపత్య రహిత సమాజ స్థాపనే లక్ష్యం
● వైకం ఉద్యమ స్ఫూర్తితో విజయం వైపుగా అడుగులు ●కేరళలో తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్య ●కొట్టాయం వేదికగా పెరియార్ శత జయంతి స్మారక గ్రంథాలయం సాక్షి, చైన్నె: వైకం ఉద్యమ స్ఫూర్తితో అన్ని రంగాలలో విజయం వైపుగా అడుగులు వేయడమే కాదు, ఆధిపత్య రహిత సమ సమాజ స్థాపనే లక్ష్యంగా ముందుకెళ్దామని సీఎం స్టాలిన్ పిలుపు నిచ్చారు. కేరళ రాష్ట్రం కొట్టాయంలో రూపుదిద్దుకున్న ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ శత జయంతి స్మారక గ్రంథాలయంను ఆ రాష్ట్ర సీఎం పినరాయ్ విజయన్‌తో పాటుగా స్టాలిన్ గురువారం ప్రారంభించారు. వివరాలు.. 1924లో కేరళ రాష్ట్ర కొట్టాయంలో అట్టడుగు వర్గాలపై అణిచి వేత దాడులకు నిరసనగా ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ గళం విప్పడమే కాదు, ఆయన రాసిన ఓ లేఖ వైకం ఉద్యమానికి నాంది పలికింది. ఇది జరిగి శతాబ్ధ కాలమైంది. ఈ ఉద్యమంతో పాటు పెరియార్ శత జయంతి స్మారకంగా ద్రవిడ కళగం నేత కె వీరమణి అధ్యక్షతన కొట్టాయం జిల్లా వైకంలో గురువారం బ్రహ్మాండ వేడుక జరిగింది. ఇక్కడి పెరియార్ స్మారకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించింది. రూ. 8.14 కోట్లతో చేపట్టిన పనులు ప్రస్తుతం ముగిశాయి. ఇక్కడ బ్రహ్మాండ భవనంలో గ్రంథాలయం సైతం శత జయంతి స్మారకంగా రూపుదిద్దుకుంది. వీటిని కేరళ సీఎం పినరాయ్ విజయన్‌తో కలిసి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించారు. తమిళరసు ముద్రణ ద్వారా సిద్ధం చేసిన వైకం పోరాటం శతాబ్ధి ఉత్సవాల సావనీరును స్టాలిన్ ఆవిష్కరించగా పినరాయ్ విజయన్ అందుకున్నారు. అలాగే కేరళ ప్రభుత్వం ద్వారా సిద్ధం చేసిన శ్రీపెరియారుం – వైకం ఉగ్థరుమ్ఙ్ పుస్తకంను పినరాయ్ విజయన్ ఆవిష్కరించగా స్టాలిన్ అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ప్రచా పనుల శాఖ పనురుద్ధరించిన ఫొటో ఎగ్జిబిషన్, ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను ప్రారంభించారు. 2024 సంవత్సరానికి గాను వైకం అవార్డు కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాకు చెందినది రచయిత, సామాజిక కార్యకర్త దేవనూర మహాదేవకు ఈ సందర్భంగా ప్రదానం చేశారు. రూ. 5 లక్షల చెక్కును ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురై మురుగన్, ఏవి వేలు, రఘుపతి, ముత్తుస్వామి, స్వామినాథన్, కోవి చెలియన్, కయల్వెలి సెల్వరాజ్, కేరళ మంత్రులు షాజి చెరియన్,వీఎన్ వాసవన్, ఎంపీలు ఫ్రాన్సిస్ , తిరుమావళవన్, అందియూరు సెల్వరాజ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో లిఖించ దగిన రోజు.. సామాజిక న్యాయ చరిత్రలో శతాబ్ధి వేడుకలు చరిత్రలో లఖించ దగిన రోజు అని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు, కేరళ ప్రభుత్వాల తరపున ఈ గొప్ప స్మారకం ఏర్పాటు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వైకం పోరాటం, ఉద్యమ విజయం గురించి వివరించారు. ఆ నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ వ్యాఖ్య లు చేశారు. పెరియార్‌ను వైకం యోధుడు అని పిలిచేవారు అని గుర్తు చేశారు. వైకం పోరాటం కేవలం కేరళ పోరాటం మాత్రమే కాదు అని పేర్కొంటూ, భారతదేశంలో మొదలైన వివిధ సామాజిక న్యాయ పోరాటాలకు నాంది అని వివరించారు. పెరియార్, అంబేడ్కర్, తదితరుల ఆలోచనలను గుర్తు చేస్తూ, అందరికీ అన్నీ అనే విధానంతో తమిళనాట ద్రావిడ మోడల్ పాలన సాగుతోందన్నారు. తమిళనాడులాగే కేరళలోనూ అనేక మంది యోధులు ఉన్నారని పేర్కొంటూ, పోరాటయోధులను స్మరిస్తూ, ఈ ఉద్యమ స్ఫూర్తితో అన్ని రంగాలలో విజయం వైపుగా అడుగులు వేద్దామన్నారు. వైకం వ్యక్తిగత విజయం కాదని.. ఇది కొనసాగింపు.. విజయాలకు నాంది అని వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాల్లో నిరంతర విజయాన్ని సాధించాలని సంకల్పించామని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఛేదించేందుకు సిద్ధం అని ధీమా వ్యక్తం చేశారు. ఆధిపత్యం లేని సమ సమాజాన్ని నిర్మిద్దాం, పెరియార్ కీర్తి చిరకాలం వర్ధిల్లే రీతిలో ముందడుగు వేద్దామని సీఎం పిలుపు నిచ్చారు. -
రజనీకి సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు
సాక్షి, చైన్నె: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు సీఎం స్టాలిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం రజనీకాంత్ 74వ జన్మదినం. ఈసందర్భాన్ని పురస్కరించుకుని సీఎం స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణ స్వామి,తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్, మక్కల్‌నీదిమయ్యం నేత కమలహాసన్, పీఎంకే నేత అన్బుమణి రాందాసు, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, తమిళమానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, సినీ నటిరాధికా, అభిరామి, తదితరులు సామాజిక మాధ్యమాలు, ప్రకటనల రూపంలో శుభాకాంక్షలు తెలియజేశారు. శశికళ కేసును త్వరగా ముగించండి సాక్షి, చైన్నె: శశికళకు వ్యతిరేకంగా విచారణలో ఉన్న మనీ లాండరింగ్ కేసు త్వరితగతిన ముగించాలని కింది కోర్టును మద్రాసు హైకోర్టు ఆదేశించింది. గతంలో జేజే టీవీ ఛానల్ ఉపకరణ కొనుగోలులో పెద్ద ఎత్తున నగదు బదిలీలు విదేశాలకు జరిగినట్టుగా గుర్తించిన ఈడీ వర్గాలు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇందులో ఆ టీవీ ఛానల్ యాజమాన్యంతో పాటూ దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళతోపాటు పలువురి పేర్లను ఇందులో చేర్చారు. ఈ కేసు ఏళ్ల తరబడి ఎగ్మూర్ కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసు విషయంగా దాఖలైన పిటిషన్ విచారణ సమయంలో త్వరితగతిన విచారణను ముగించాలని కింది కోర్టును మద్రాసు హైకోర్టు ఆదేశించింది. కేవైఎన్ విజేతలకు అవార్డుల ప్రదానం సాక్షి, చైన్నె: కేవైఎన్ కార్పొరేట్ ఎంగేజ్ మెంట్ ప్రోగ్రామ్‌ల గ్రాండ్ ఫినాలే చైన్నెలో జరిగింది. ఇందులో సినీ నటి నటి యాషికా ఆనంద్ , నృత్య దర్శకుడు శ్రీధర్,గాయకులు దేవన్ ఏకాంబరం, రోషిణి, ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ కరుణ్ రామన్, కేపీ ఫేమ్ నవీన్, యోగి తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కేవైఎన్ (నో యువర్ నైబర్‌హుడ్) పేరిట కనెక్టివిటీ యాప్ ద్వారా ప్రతిభావంతులను గుర్తించి ఈ సందర్భంగా అవార్డులతో సత్కరించారు. విజేతలకు నగదు ప్రోత్సాహంతో పాటు బహుమతులను అందజేశారు. అలాగే 40 మంది ఫైనలిస్టులకు పతకాలను అందజేశారు. ఫ్యాషన్ విభాగంలో ఓవరాల్ విజేతగా నిలిచిన అరుణ్‌కు సుజుకీ బైక్, సింగింగ్, డ్యాన్సింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన తెండ్రాల్, మెగానాకు ఐఫోన్లను అందజేశారు. పేద మహిళకు విజయ్ టీకొట్టు సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని ముడిచ్చూర్కు చెందిన లక్ష్మీ అనే పేద మహిళలకు విజయ్ తమిళగ వెట్రి కళగం తరపున టీ కొట్టు ఏర్పాటు చేయించారు. దీనిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ గురువారం ప్రారంభించారు. తనకు జీవనోపాది కల్పించాలని లక్ష్మీ విన్నవించుకోవడంతో విజయ్ పార్టీకి చెందిన నాయకకులు దయా, రిజ్వాన్, పుష్ప రాజ్ స్పందించారు. ఆమెకు టీ దుకాణం పెట్టించారు. దీనిని బుస్సీ ఆనంద్ ప్రారంభించడమే కాకుండా స్వయంగా టీ తయారు చేసి అందరికీ అందజేశారు. కోలీవుడ్‌లో మరో జంట విడాకులు తమిళసినిమా: కోలీవుడ్‌లో సెలబ్రిటీల విడాకుల పరంపర కొనసాగుతోంది. ఆ మ ధ్య సంగీత దర్శకుడు జయప్రకాష్ కుమార్ గాయని సైంధవిలో జంట మనఃస్పర్థల కారణంగా విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత నటుడు జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైరాభాను జంట కూడా తమ వివాహ బంధం ముగిసినట్లు ప్రకటించారు. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు శీను రామస్వామి తన భార్య దర్శన నుంచి విడిపోతున్నట్లు అధికారిక పూర్వకంగా వెల్లడించారు. కూడల్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన శీను రామస్వామి ఆ తర్వాత తెన్ మేర్కు పరువకాట్రు, నీర్పరవై,ఽ దర్మదురై, మామనిదన్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు శీను రామస్వామి. ఆయన తమ 17 ఏళ్ల దాంపత్య జీవితం ముగిసినట్లు గురువారం అధికారిక ప్రకటన చేశారు. ఇది తామిద్దరం పరస్పర అవగాహనతో తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని కోరుకుంటున్నాననని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ విషయం సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేసింది. -
ధర్మయుద్ధం వైపు.. పీఎం మోదీ పయనం
● గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యాఖ్యసాక్షి,చైన్నె: ధర్మయుద్దం వైపుగా ప్రధాని నరేంద్ర మోదీ అందరినీ నడిపిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యాఖ్యానించారు. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ తామరై కులంలో గురువారం పడి అయ్యావారి కేంద్రంలో అకిల తీరట్టు అమ్మన్ ఉదయ దినం వేడుకలు జరిగింది. ఇందులో గవర్నర్ ఆర్ఎన్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన పూజలకు తలపాగా , పట్టు వస్త్రాలను ధరించి హాజరయ్యారు. పలు పనులకు శంకుస్థాపన చేశారు. అమ్మన్ చరిత్రను చాటే అకిల తీరట్టు అమ్మన్ వేద గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, సనాతనం, సమానత్వం గురించి వ్యాఖ్య లు చేశారు. సమానత్వ ప్రమాణాలు, ధర్మం, సంస్కారాలు, విష్ణుమూర్తి అవతారాలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ తన ప్రసంగం కొనసాగించారు. తిరుక్కురల్‌లోని అంశాలను గుర్తు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ధర్మయుద్ధానికి నాయకత్వం వహిస్తున్నారన్నారు. ధర్మయుద్ధం వైపుగా సాగుతున్న ప్రయాణానికి యావత్ ప్రజానీకం మద్దతుగా నిలవాలని పిలుపు నిచ్చారు. -
సేవాదళ్ వర్గాలకు వైఎస్ జగన్ అభినందన
సాక్షి, చైన్నె: తమిళనాడు వైఎస్ఆర్ సేవాదళ్ వర్గాలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన ఆశీస్సులను అందజేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలో తనను కలిసిన సేవాదళ్ బృందం సేవలను తెలుసుకుని అభినందించారు. ఈ వివరాలను తమిళనాడు వైఎస్ఆర్ సేవాదళ్ అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్ తెలిపారు. తమిళనాడులో పలు ప్రాంతాలలో వైఎస్ఆర్ సేవాదళ్ వేదికగా దివంగత మహానేత వైఎస్ఆర్, ఆయన వారసుడు, పార్టీ అధ్యక్షులు,మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి మద్దతుగా విస్తృత సేవలలో మద్దతుదారులు, అభిమానులు నిమగ్నమై ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడు సేవాదళ్ అధ్యక్షుడు జహీర్‌హుస్సేన్ నేతృత్వంలో కార్యవర్గం విస్తృత సేవలు అందిస్తోంది. ఈ పరిస్థితుల్లో తమ అధినేతను కలిసేందుకు చైన్నె నుంచి సేవాదళ్ బృందం ఏపీలోని తాడేపల్లికి వెళ్లింది. జహీర్ హుస్సేన్, పార్టీ నేతలు శరవణన్, శరత్‌కుమార్‌రెడ్డి, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, అధికార ప్రతినిధి కృత్రిక, ఇతర నాయకులు లోకేష్‌రెడ్డి, భాను, నరేంద్రరెడ్డి, సంపత్‌కుమార్, ప్రకాష్, భాస్కర్‌రెడ్డి, నరేన్‌రెడ్డి, రెడ్డి శేఖర్ తదితర 35 మంది తాడేపల్లిలో తమ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. ఈసందర్భంగా సేవాదళ్ సేవలను తెలుసుకుని పార్టీ అధ్యక్షులు అభినందనలు, ఆశీస్సులు తెలియజేశారని జహీర్ హుస్సేన్ వెల్లడించారు. అలాగే తమకు పలు సూచనలు చేశారని పేర్కొన్నారు. -
నేడు తెరపైకి.. తెన్చైన్నె
తమిళసినిమా: ఇంతకుముందు నాకు చైన్నె పేరుతో ధనుష్ కథానాయకుడి నటించిన చిత్రం వచ్చిన విషయం తెలిసిందే తాజాగా తెన్చైన్నె ( దక్షిణ చైన్నె) పేరుతో నూతన చిత్రం రూపొందింది రంగ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విజువల్ రంగ కథా, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించి కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. నటి రియా, నితిన్ మెహతా, ఇళంగో కమరన్, దిలీపన్ కుమార్, వత్సన్ నటరాజన్, ఆరు బాల, సుమా, రామ్, విశాల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత, కథానాయకుడిగా రంగా మాట్లాడుతూ తనకు సినిమా అంటే చాలా ఇష్టం అన్నారు. దీంతో కరోనా కాలంలో కథను రాసుకుని తెన్ చైన్నె పేరుతో చిత్రం చేసినట్లు చెప్పారు. ఇది కొత్త కోణంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. నష్టాల్లో ఉన్న హోటల్ ను కాపాడుకోవడం ఒక యువకుడు ఏం చేశాడన్నదే తెన్ చైన్నె చిత్ర కథ అని చెప్పారు. చిత్రంలో ప్రముఖ నటులలో ఒకరిని హీరోగా నటింపజేయాలని భావించామని, అయితే తాను నూతన దర్శకుడిని కావడంతో తన దర్శకత్వంలో నటించడానికి ఆ నటులు సంకోశించాన్నారు.. దాంతో తానే హీరోగా నటించాలని నిర్మించుకున్నానని, తనను నమ్మి ఈ చిత్రంలో నటించిన సహా నటీనటులు, సాంకేతిక వర్గానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు అన్నారు. అందరూ ఎంతగానో సహకరించారన్నారు. చిత్రాన్ని తమిళనాడులో 50 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
మడిపాక్కం సరస్సును పరిరక్షించాలి
● చైన్నె కార్పొరేషన్‌కు స్థానికుల వినతి కొరుక్కుపేట: మడిపాకం సరస్సు పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. దక్షిణ చైన్నె ప్రాంతంలోని ప్రధాన సరస్సులలో ఒకటైన మడిపాక్కం సరస్సు 62 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ సరస్సు చివరిసారిగా 2017లో ఆక్రమణకు గురైంది. అలాగే సరస్సులో చెత్త వేయడం వల్ల సరస్సు విస్తీర్ణం తగ్గిపోయింది. తదనంతరం, వివిధ సంస్థల కృషితో సరస్సు పునరుద్ధరించబడింది. తదనంతరం చైన్నె మున్సిపల్ కార్పొరేషన్ 2018లో మడిపాక్కం సరస్సు పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది. రూ.2 కోట్లతో పేవ్ మెంట్లు, మహిళా వ్యాయామశాల, ఓపెన్ ఎయిర్ వ్యాయామశాల, లైటింగ్ నిర్మించారు. అలాగే రూ.42 లక్షల నిధులతో కంచె రోడ్డును నిర్మించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.1.5 కోట్లతో 2 కి.మీ పొడవున సరస్సు లోతు, విస్తరణ పనులు చేపట్టారు. ఈ సరస్సు మడిపాక్కం అయ్యప్పన్ నగర్, కార్తికేయపురం, రామ్ నగర్, రాజాజీ నగర్ తదితర చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించే లక్ష మంది ప్రజలకు పరీవాహక ప్రాంతంగా ఉంది. ఈ సరస్సు ఒడ్డున ఉన్న ప్రజలు 1,000 మొక్కలు నాటారు. ఈ పరిస్థితిలో మడిపాక్కం సరస్సు ప్లాస్టిక్ వ్యర్థాలను డంపింగ్ చేయడం , విస్తారంగా పెరుగుతున్న కలుపు మొక్కల కారణంగా మళ్లీ కలుషితమైంది. ఈ విషయమై ఆ విభాగానికి చెందిన సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వరదలను నిరోధించే ఏకైక ప్రధాన వనరు మడిపాక్కం సరస్సు. దీన్ని సంరక్షించడానికి చైన్నె కార్పొరేషన్ కొన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ, సెక్యూరిటీ గార్డులు, తోటమాలి లేరు. ఇప్పటికైనా సరస్సును పరిరక్షించి పునరుద్ధరణ పనులు చేపట్టాలి.. అని కోరారు. -
సర్వం సిద్ధం
కార్తీక దీపోత్సవానికి వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో ఈనెల 4వ తేదీ నుంచి కార్తీక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 10వ రోజైన శుక్రవారం ఉదయం ఆలయం ఎదుటనున్న మూలవర్ సన్నిధిలో భరణిదీపం వెలిగిస్తారు. సాయంత్రం 6 గంటలకు అర్ధనారేశ్వరుడు ఏడాదికి ఒకసారి ప్రత్యేక వాహనంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇదే సమయంలో అరుణాచలేశ్వరాలయం వెనుకనున్న 2,668 అడుగుల ఎత్తుగల కొండపై మహా దీపాన్ని వెలిగించనున్నారు. మహాదీపం వెలిగించే సమయంలో ఆలయం వద్దనున్న భక్తులు అరుణాచలేశ్వరునికి హరోంహరా.. అంటూ నామస్మరణాలు చేసుకుంటారు. ఈ మహా దీపోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా సుమారు 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ప్రత్యేక బస్సులు దీపోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు కలెక్టర్ భాస్కర పాండియన్ తెలిపారు. ఈ సంవత్సరం పుదుచ్చేరి, చైన్నె, తిరిచ్చి, బెంగుళూరు, సేలం, విల్లుపురం, కాట్పాడి తదితర ప్రాంతాల నుంచి ఈనెల 12,13, 14వ తేదీల్లో మూడు వేల ప్రత్యేక బస్సులను నడిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇప్పటికే బస్సులు, కార్లు, ద్విచక్ర వాహణాలు పట్టణంలోనికి రాకుండా ముందుస్తుగా 24 తాత్కాలిక బస్టాండ్లు, అక్కడక్కడ కారు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఐదు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో మహా దీపం కొండపైకి భక్తులు ఎక్కిందుకు అనుమతి నిరాకరించారు. కొండపైకి వెల్లే మొత్తం 12 దారులను మూసి వేసి అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహా దీపం వెలిగించే ఆలయ అర్చకులు, పారంపర్య వంసస్థలు, ఆలయ సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందని వారు కూడా సంరక్షణా పరికరాలతో కొండపైకి ఎక్కిందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. పటిష్ట బందోబస్తు మహా దీపోత్సవానికి ఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఆలయం లోపల, వెలుపల సీసీ కెమెరాలను ఉంచి ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో 54 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు 39 ప్రాంతాల్లో తాత్కాలిక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటితో పాటు మానవ రహిత విమానంతో కూడా ప్రత్యేక నిఘా ఉంచి ఎటువంటి చోరీలు జరగకుండా చూస్తామన్నారు. 40 మందికి పైగా కమెండో వీరులు, 200 ప్రత్యేక పోలీస్ వీరులతో నిఘా ఉంచామన్నారు. ఉదయం భరణి దీపం వెలిగించే సమయంలో అనుమతి ఇచ్చిన భక్తులు, మహా దీపం వెలిగించే సమయంలో 2,500 మందిని మాత్రమే ఆలయంలోనికి అనుమతిస్తామన్నారు. అదేవిధంగా తిరువణ్ణామలైలో ట్రాఫిక్‌ను మూడు రోజులకు మార్పు చేసినట్లు తెలిపారు. 35 కిలో మీటర్లు కనిపించే మహాదీపం ఉత్సవాల్లో పదో రోజు వేకువన 4 గంటలకు ఆలయం ముందు భరణి దీపాన్ని గర్భగుడిలో ప్రజ్వలింప జేయడం ఆనవాయితీ. అదేరోజు సాయంత్రం 6 గంటలకు 2,668 అడుగుల ఎత్తుగల శివునిగా భావించే కొండపైనా మహా దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం 35 కిలో మీటర్ల దూరం నుంచి చూసినా ఈ దీప కాంతి సృష్టంగా కనిపించడం విశేషం. ఈ దీపం పది రోజుల పాటు వెలుగుతూనే భక్తులకు దర్శనమివ్వనుంది. కాగా తిరువణ్ణామలై జిల్లాలో వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తులు వాటిని లెక్క చేయకుండా స్వామి వారి ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. కై లాస వాహనంలో ఊరేగిన అరుణాచలేశ్వరుడు ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి వారు కై లాస వాహనంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 9 గంటలకు మూషిక వాహనంలో వినాయకుడు, హంస వాహనంలో వళ్లి దైవాని సమేద మురుగన్, కై లాస వాహణంలో ఉన్నామలై సమేద అన్నామలైయార్, కామదేను వాహనంలో పరాశక్తి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం మూషిక వాహనంలో వినాయకుడు, పురుష ముని వాహనంలో చంద్రశేఖరుడు మాడ వీధుల్లో విహరించారు. నేడు 2,668 అడుగుల ఎత్తయిన కొండపై మహాదీపం వెలిగింపు భారీ పోలీస్ బందోబస్తు లక్షలాదిగా తరలిరానున్న భక్తులు -
వ్యాపార సంఘాల నిరసన
కొరుక్కుపేట: వాణిజ్య దుకాణాల అద్దైపె 18 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ తమిళనాడు మర్చంట్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో వ్యాపారులు గురువారం నిరసన చేపట్టారు. ఫెడరేషన్ ఆఫ్ తమిళనాడు మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొలత్తూరు రవి ఆధ్వర్యంలో ఎగ్మూరు రాజారత్నం స్టేడియం దగ్గర వందలాది మంది ప్రదర్శనలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ ఆహార ఉత్పత్తులకు జిఎస్టీ పన్ను రద్దు చేయాలని కోరారు. జీఎస్టీని సరళీకృతం చేయడానికి, తయారీ ప్రదేశంలో వస్తువులను సేకరించే విధానాన్ని ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం వ్యాపార లైసెనన్స్ ఫీజులు, వ్యాపార పన్నులు మొదలైన వాటిపై పలుమార్లు పెంపుదలని ఉపసంహరించుకోవాలని సహా పలు డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న వ్యాపారులు, సంఘాల బాధ్యులు వ్యాపారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అన్యాయమైన పన్నులను ఖండిస్తూ ఆ పన్నులను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సువై రాజా, ప్రధాన కార్యాలయ కార్యదర్శి కె.కులందివేల్, అధికార ప్రతినిధి ఎం.పి. రమేష్, చైన్నె జోనల్ హెడ్ ఎస్. అరుణాచలమూర్తి, సెల్వనాయకం, ఉత్తర చైన్నె జిల్లా అధ్యక్షుడు ఎ.జయరామన్ పాల్గొన్నారు. -
క్లుప్తంగా
ముగ్గురి ఆత్మహత్యా యత్నం అన్నానగర్: కోవిల్పట్టి గాంధీనగర్ ప్రాంతానికి చెందిన కార్తీక్ మురుగన్ చిన్న కుమారుడు కరుప్పస్వామి స్థానికంగా 5వ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి పక్క ఇంటి డాబాపై కొద్దిరోజుల క్రితం శవమై కనిపించాడు. బాలుడు తప్పిపోయిన సమయంలో ధరించిన ఒకటిన్నర తులాల నగలు మాయమయ్యాయి. నగల కోసమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ స్థితిలో గురువారం ఉదయం బాలుడి తండ్రి కార్తీక్ మురుగన్, తల్లి బాలసుందరి, తాత పాండి విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఇది చూసిన చుట్టుపక్కల వారు, పోలీసులు వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. పూందమల్లి జైలులో 5 సెల్ఫోన్లు, గంజాయి సీజ్ తిరువొత్తియూరు: పూందమల్లి శాఖ జైలులో ఖైదీల వద్ద 5 సెల్ఫోన్లు, గంజాయి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ జైలర్ సహా ఐదుగురిని సస్పెండ్ చేస్తూ జైలు శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వివరాలు.. పూందమల్లి సమీపంలోని కారయాన్ కళ్ చావడిలో స్పెషల్ జైలు ఉంది. ఇందులో బీఎస్పీ నేత ఆమ్‌స్ట్రాంగ్ హత్య కేసులో సంబంధం ఉన్న వారు, ఇతర ఖైదీలు ఉన్నారు. ఈ క్రమంలో గురువారం పూందమల్లి ప్రత్యేక శాఖ జైలులో ఖైదీలను నిర్బంధించి ఉన్న గదిలో జైలు వార్డెన్లు, పోలీసులు హఠాత్తుగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఖైదీలు ఉన్న గదులలో 5 సెల్ఫోన్లు, గంజాయి, ఎక్కువ మొత్తంలో నగదు పట్టుబడింది. దీంతో ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న జైలు వార్డెన్లు, జైలర్, సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పూందమల్లి ప్రత్యేక శాఖ జైలు డిప్యూటీ జైలర్ సెల్వరాజ్, సహాయ జైలర్ జేమ్స్ బ్రిడో హెడ్ కానిస్టేబుల్ ఉదయ కుమార్ పరమ సెల్వం సహా ఐదుగురుని అధికారులు విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. 1500 మత్తు మాత్రలు స్వాధీనం ● యువకుడి అరెస్టు తిరువొత్తియూరు: చైన్నె ఓటేరీ ప్రాంతంలో అనధికారికంగా పెయిన్ కిల్లర్ మాత్రలు విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె ఓటేరి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ప్రాంతంలో పెయిన్ కిల్లర్ మాత్రలు విక్రయిస్తున్నట్లుగా ఇన్స్పెక్టర్ రమేష్‌కు ముందస్తు సమాచారం అందింది. దీంతో గురువారం ఓటేరి స్టీఫెన్సన్ రోడ్డు ప్రాంతంలో ఉన్న చంగై శివమ్ వంతెన వద్ద ఒకరు ఒకరిని ప్రత్యేక బృందం సహాయ ఇన్స్పెక్టర్ కరుప్పయ్య నేతృత్వంలో పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా ఆ సమయంలో 1500 పెయిన్ కిల్లర్ మాత్రలు, కత్తి, రూ. 4000 నగదు ఉండడంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేశారు. దర్యాప్తులో నిందితుడు చైన్నె వినాయకపురం తిరుమల్ తిరుమల్ శ్రీనివాసన్ నగర్ ప్రాంతానికి చెందిన డ్రైవర్ శివ (29) అని తేలింది. దీంతో అతడిని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. నగలు చోరీ కేసులో పెయింటర్ అరెస్ట్ తిరువొత్తియూరు: పనిచేస్తున్న సమయంలో ఇంటిలో నగలు, నగదు చోరీ చేసిన పెయింటర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె ఓటేరి కోసపేట, సచ్చిదానందం వీధికి చెందినవారు భాస్కరన్ 60. ఇతను చూలై ప్రాంతంలో పంచర్ దుకాణం నడుపుతున్నాడు. గత 6 తేదీ ఇతని భార్య మడిపాకంలో ఉన్న ఆమె అక్క ఇంటికి వెళ్లారు. దీని తర్వాత భాస్కరన్ దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో అతని ఇంటిలో, పెయింటింగ్ పని జరుగుతోంది. మంగళవారం మడిపాకం నుంచి భాస్కరన్ భార్య ఇంటికి వచ్చారు. ఆ సమయంలో బీరువాలో వుంచిన 400 గ్రాముల బంగారు గొలుసు, 2 గ్రాముల కమ్మలు రూ. 80 వేలు నగదు చోరీ అయ్యాయి. దిగ్భ్రాంతి చెందిన భాస్కరన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఓటేరి క్రైం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. విచారణలో ఇంటిలో పెయింట్ కొడుతున్న పులియం తోపు కన్యకాపురం హౌసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన శివకుమార్ 46 నగలు, నగదు చోరీ చేసినట్లు తెలిసింది. దీంతో శివకుమార్‌ని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతన్ని కోర్టులో హాజరపరిచి రిమాండ్‌కు తరలించారు. శ్రీరంగంలో కై శిక ఏకాదశి ఉత్సవంతిరువొత్తియూరు: తిరుచ్చి, శ్రీరంగంలోని రంగనాథర్ ఆలయంలో కార్తీక మాసంలో కై శిక ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీటీడీ నుంచి స్వామి వారికి పట్టు వస్త్రాలను అందజేశారు. బుధవారం ఊరేగింపుగా నమ్ పెరుమాళ్ మూలస్థానం నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు అర్జున మండపంలో కొలువు చేశారు. అక్కడ 365 వస్త్రాలు, 365 తాంబూలాలు, 365 కర్పూర హారతి సేవతో నంపెరుమాళ్కు సమర్పించారు. అనంతరం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2 గంటల వరకు భక్తులు నంపెరుమాళ్ సమక్షంలో కై శిక పురాణంగా పిలిచే భక్తుడు నంపాడువాన్ కథను భక్తిశ్రద్ధలతో పఠించారు. అనంతరం ఉదయం 5.15 గంటలకు నంపెరుమాళ్ అర్జున మండపం నుంచి బయలుదేరి 2వ ప్రాకారంలో 5.45 గంటలకు మేళపడి మీదుగా రాతి కర్పూరహారతి సేవకు ఉదయం 6 గంటలకు మూలస్థానానికి చేరుకున్నారు. భక్తులు నంపెరుమాళ్ మూలస్థానం వద్దకు రాగానే పచ్చకర్పూరం చల్లి నంపెరుమాళ్ను దర్శనం చేసుకున్నారు. -
మావీరన్ చిత్ర దర్శకుడితో..
తమిళసినిమా: చియాన్ విక్రమ్ చిత్రం అంటేనే సమ్ థింగ్ స్పెషల్‌గా ఉంటుందని చెప్పవచ్చు. ఆ చిత్రాల్లో ఆయన పాత్రలు గాని, వాటి కోసం ఆయన మేకోవర్ అయ్యే విధం గానీ చాలా కొత్తగా ఉంటాయి. అలా విక్రమ్ ప్రతి చిత్రం కోసం పరిమితి మరీ శ్రమిస్తుంటారు. ఇటీవల తంగలాన్ చిత్రం కోసం ఆయన మేకోవర్ అయిన విధం అందరినీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం అరుణ్ కుమార్ దర్శకత్వంలో విరి ధీర సూరన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం తనను తాను మరో కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. హెచ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ పండుగ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా తదుపరి విక్రమ్ నటించే చిత్రం గురించి అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మడోనా అశ్విన్ దర్శకత్వంలో నటుడు విక్రమ్ నటించడానికి సిద్ధం అవుతున్నారన్నదే ఆ ప్రచారం.మడోనా అశ్విన్ ఇంతకు ముందు మండేలా, మావీరన్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా మావీరన్ చిత్రాన్ని నిర్మించిన శాంతి టాకీస్ సంస్థనే ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు విక్రమ్ పార్కింగ్ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ బాలకష్ణన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. దీంతో ఈ రెండు చిత్రాల్లో విక్రమ్ ముందు ఏ చిత్రం చేస్తారన్నది తెలియాల్సి ఉంది.