Guest Columns
-
ప్రభుత్వ ప్రాయోజిత మత పక్షపాతం
కొత్త వక్ఫ్ చట్టాన్ని ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక తప్పుడు సంకే తాన్ని ఇస్తున్నాయి. ముస్లిం ధర్మాదాయ దేవాదాయ వ్యవహారాలను వక్ఫ్అంటారు. 1995 నాటి వక్ఫ్ చట్టం ఇప్పటి వరకు అమలులో వుంది. ఇప్పుడు దీన్ని ‘యునైటెడ్ వక్ఫ్ మేనే జ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్–2025 (యూడబ్ల్యూఎమ్ఈఈడీఏ)గా మార్చారు. వక్ఫ్ సవరణ బిల్లు ఏప్రిల్ 3న లోక్‌సభలో 288 – 232 ఓట్ల తేడాతో గెలిచింది. రాజ్యసభలో ఏప్రిల్ 4న 128 – 95 ఓట్ల తేడాతో గెలిచింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయింది. ఇక్కడ ఒక విశేషం ఉంది. 543 మంది సభ్యు లున్న లోక్ సభలో ముస్లింలు 24 మంది మాత్రమే. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.అంటే 208 మంది ముస్లిమే తర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. అలాగే 245 మంది సభ్యులున్న రాజ్య సభలో ముస్లింలు 15గురు మాత్రమే. 95 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 80 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. రెండు సభల్లోనూ కలిపి ముస్లింల సంఖ్య 39 మాత్రమే. వాళ్ల పక్షాన నిలిచిన ముస్లిమేతరులు 288 మంది. కొత్త చట్టం రాజ్యాంగ ఆదర్శాలకు, హామీలకు విరుద్ధంగా ఉందనీ, దాన్ని పునఃసమీక్షించాలని కొన్ని సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు సుప్రీంకోర్టులో 70కు పైగా పిటీషన్లు వేశాయి. ఈ విషయంలోనూ ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ముస్లిమేతరుల సంఖ్య చాలా ఎక్కువ. మన దేశంలో వర్ధిల్లుతున్న మతసామరస్యానికి ఇది తాజా ఉదాహరణ. దీనికి విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టానికి మద్దతు ప్రకటించాయి. ఒక బిల్లు ఉభయ సభల్లో మెజారిటీ సాధించి రాష్ట్రపతి ఆమోద ముద్రపడి చట్టంగా మారాక కూడ సుప్రీం కోర్టుకు చేరడం విశేషం. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 16న ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. కొత్త చట్టంలో వివాదాంశాలు అనేకం ఉన్నాయి. ఇందులో నాలుగు అంశాలు మరింత తీవ్రమైనవి. వక్ఫ్ బోర్డులో, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కొత్తగా ముస్లిమేతరులను అనుమతించడం తీవ్రమైన వివాదంగా మారింది. వక్ఫ్ భూముల్లో ‘వక్ఫ్ బై యూజర్’ సౌలభ్యాన్ని తొలగించి అది వక్ఫ్‌గా కొనసాగాలంటే రిజిస్ట్రేషన్ దస్తావేజులు చూపాలనడం ఇంకో వివాదాంశం. వక్ఫ్ ఆస్తి అవునో కాదో తేల్చడానికి జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించడం, కనీసం ఐదేళ్ళుగా ఇస్లామిక్ ధార్మిక ఆచరణను కొనసాగిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ దానం చేయడానికి అర్హులు అనడం కూడా వివాదంగా మారింది. వక్ఫ్ భూములకు దస్తావేజులు చూపడం అసాధ్యమైన విషయం. 19వ శతాబ్దం ఆరంభం వరకు మన దేశంలో అసలు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ల సంప్రదాయమే లేదు. లార్డ్ కార్న్ వాలిస్ 1793లో తొలిసారిగా శాశ్వత భూమిపన్ను విధానాన్ని తెచ్చాడు. అది కూడా ఇప్పటి బెంగాల్, బిహార్, ఒడిశాప్రాంతంలో మాత్రమే. ఆ తరువాత థామస్ మన్రో మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో రైత్వారీ విధానాలను తెచ్చాడు. భారత దేశంలో 8వ శతాబ్దం నాటికే ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం ప్రవేశించిన వెయ్యేళ్ళ తరువాత మనకు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ విధానాలు వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం సరిగ్గా ఈ అంశాన్నే పట్టించుకుంది. ‘మనం చరిత్రను తిరగరాయలేం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు గుర్తుచేశారు. వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకతను ప్రదర్శించడమేగాక, రెండు మత సమూహాల సహవాసాన్ని కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని, ముస్లింల గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నదని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. ఇలా రెండు మతసమూహాల కలయిక ఒక ఆదర్శం అని కేంద్ర ప్రభుత్వం నిజంగానే నమ్ముతోందా? నమ్మితే హిందూ ధర్మాదాయ కమిటీల్లోనూ హిందూయేతరులకు స్థానం కల్పించాలిగా? సరిగ్గా ఈ ప్రశ్ననే భారత ప్రధాన న్యాయమూర్తి వేశారు. తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు వక్ఫ్ భూములు వేటినీ డీ–నోటిఫై చేయరాదని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించడానికి ఒక వారం రోజులు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. ఇందులో ఒక కిటుకు ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా మరో మూడు వారాల్లో, మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఎలాగోలా ఈ సమయాన్ని సాగదీస్తే అనుకూ లమైన తీర్పు తెచ్చుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.- వ్యాసకర్త సమాజ విశ్లేషకులు ‘ 90107 57776'- డానీ -
Dr B R Ambedkarవీళ్ళే ఇలా రాస్తే ఎలా?!
అంబేడ్కర్ జయంతికి కేంద్ర మంత్రులు అంబేడ్కర్‌పై పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఒకరు దీన్ని కాంగ్రెస్ విమర్శకు వాడుకుంటే, మరొకరు అంబేడ్కర్ నోట అబద్ధాలు కుక్కారు. వీటిని ఆదర్శాల పేరుతో భావితరాలకు బోధిస్తారట. ఆర్య దండ యాత్ర సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తప్పు పట్టారనీ, సంస్కృతాన్ని అధికార భాషగా ఆమోదించడానికి మద్దతుగా రాజ్యాంగ సభలో సవరణను ప్రవేశపెట్టారనీ. హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి అని ప్రకటించారనీ ఇలా ఎన్నో అవాస్తవాలను రాశారు వారు. ‘‘ఇండో–ఆర్యులు ఇండియాకు వలస వచ్చి స్వదేశీయులను తరిమేశారు. వలస వాద, బ్రాహ్మణవాద కథనాలు కులాధిపత్య సమర్థనలు. ఆర్యులు సాంస్కృతిక భాషా సమూహం, ప్రత్యేక జాతి కాదు. రుగ్వేదం వంటి ప్రాచీన గ్రంథాల్లోని విభేదాలు సామాజిక అంత ర్గత పోరాటాల ప్రతిబింబాలు. ఆర్య దండయాత్ర సూత్రం ఆర్యేతర శూద్రుల, దళితుల అణచివేత సాధనం.’’ అని రాశారు అంబేడ్కర్. ఆర్య సూత్ర జాతి సంస్కృతుల ఊహలను సవాలు చేశారు. యజుర్, అధర్వణ వేదాల రుషులు శూద్రు లకు తగిన ప్రాధాన్యమిచ్చినట్లు అంబేడ్కర్ అనలేదు. ‘‘శూద్రులు ముందు ఆర్య క్షత్రియుల్లో భాగం. జనశ్రుతి (శూద్రుడు) వైదికజ్ఞాన అభ్యాసం, కవశ ఐలూశ (శూద్రుడు) శ్లోకాల రచన సంగతులు ఈ వేదాల్లో ఉన్నాయి. వేదాలు శూద్రుల జాతి, సామాజిక హీనతను సమర్థించ లేదు. మనుస్మృతి ఆ పని చేసింది. బ్రాహ్మణ, ప్రత్యేకించి ఉపనయన, ఆచారాల విభేదాలతో వారిని నాల్గవ వర్ణానికి దిగజార్చారు. శూద్రుల ఉన్నత స్థాయి తగ్గింపునకు వేదకాలం తర్వాతి బ్రాహ్మణ నీతి ఇది’’ అని అన్నారు. అంబేడ్కర్ శూద్రులతో పోల్చి ఆర్యులను పొగడలేదు. ఆర్య ఉన్నత జాతి సూత్రీ కరణను తిరస్కరించారు. ద్రవిడ, నాగ, దాస తెగలు అనార్యుల్లో భాగమని, వారు ఆర్యు లకు ఏ విధంగానూ తక్కువ కారని అంబేడ్కర్ అభిప్రాయం. అంబేడ్కర్ అధి కార భాషగా సంస్కృతానికి మద్దతివ్వలేదు. సంస్కృతాన్ని ప్రజలు అతి తక్కువగా వాడు తారని, పాలనకు, ప్రజలు ఒకరితోనొకరు మాట్లాడుకోవడానికి సంస్కృతం ఆచరణీయం కాదనేది ఆయన అభిప్రాయం. హిందీని రుద్దడం హిందీయేతర భాషా ప్రాంతాల అణచివేతకుదారి తీయగల అపాయాన్ని జాగ్రత్తగా పరిగణించాలన్నారు. ఆంగ్లంతో పాటు హిందీ భారత ప్రజల లంకె భాషగా ఉండాలని అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో వాదించారు. మరిఅంబేడ్కర్ ఆదర్శాలను సంఘ్ సర్కారు ఆచరిస్తుందా? – సంగిరెడ్డి హనుమంత రెడ్డి,ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
50 years of Aryabhata ఆర్యభట్ట స్ఫూర్తితో...
విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సతీష్ ధావన్ నాయకత్వంలో 1975 ఏప్రిల్ 19న రష్యాలో కపుస్టిన్ యార్ కేంద్రం నుండి సోవియట్ కాస్మోస్–3 రాకెట్ ద్వారా ప్రసిద్ధ భారతీయ ఖగోళ – గణిత శాస్త్రవేత్త పేరుతో తయారుచేసిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట‘ (aryabhata satellite) ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది మన అంతరిక్ష సంస్థ ఇస్రో. ‘ఇండియా ఎంటర్స్ స్పేస్ ఏజ్’ అంటూ ప్రపంచ మీడియా మన ప్రయత్నాన్ని పెద్ద అక్షరాలతో కీర్తించింది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యి 50 వసంతాలైన సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఆర్యభట్ట గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఇస్రో, ఇండియా స్పేస్ ల్యాబ్ వంటి కొన్ని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.360 కిలోగ్రాముల బరువు వుండి సౌర ఫలకాల ఆధారంగా పనిచేసే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 96.46 నిమిషాల ప్రదక్షిణ కాలం పట్టే కక్ష్యలో, 611 కిలోమీటర్ల అపోజీ, 568 కిలోమీటర్ల పెరిజీ ఎత్తులో, 50.6 డిగ్రీల ఏటవాలులో ఉండే కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఎక్స్–రే ఖగోళ శాస్త్రం, వ్యవసాయశాస్త్రం, సోలార్ ఫిజిక్స్‌లో ప్రయో గాలు చేయడానికి, సూర్యుడి నుంచి వచ్చే న్యూట్రాన్లు, గామా కిరణాలను కొలవడానికి, భూమి ఐనోస్పియర్‌లోని పరిస్థితులను అన్వేషించడం తదితర లక్ష్యాలతో ఈ ప్రయోగాన్నిఇస్రో సోవియట్ యూనియన్ సహకారంతో చేపట్టింది. 50 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సమస్యలను సవాళ్లను అధిగమించాం. కొన్ని ఎగతాళి శబ్దాల మధ్య మౌనంగానే శత కోటి గుండెల సాక్షిగా చంద్రుని దక్షిణ ధ్రువపు ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సాయంతో గర్వంగా మన జాతీయ జెండాను నిలిపాం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంగారకుడిపై పరిశోధనల కోసం అన్వేషణ ఆరంభించి నవ చరిత్ర సృష్టించాం. సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం కోసం ఆదిత్య–ఎల్1 మిషన్‌ను ప్రయోగించాం. On this day in 1975, India launched its first satellite, Aryabhata, laying the foundation of India’s satellite programme.Today, India stands among the world’s leading spacefaring nations.#Aryabhata #IndianSpaceProgramme #ISRO@IndiaDST @isro @DrJitendraSingh @AshwiniVaishnaw… pic.twitter.com/YZMRazZfpD— Ministry of Information and Broadcasting (@MIB_India) April 19, 2025 నేడు ఆసియా – పసిఫిక్ప్రాంతంలోనే అతిపెద్ద ఉపగ్రహ సమాచార వ్యవస్థను కలిగి ఉన్నాం. డాకింగ్, అన్‌డాకింగ్ వంటి శాస్త్రీయ సామర్థ్యాలు కలిగిన నాలుగో దేశంగా అద్భుతాలు సాధించాం. గగన్‌యాన్ వంటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలతో పాటు 2030 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. కేవలం ఐదు దశాబ్దాల కాలంలో ఒకే ప్రయోగంలో 100కు పైగా ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగే స్థాయికి ఎదిగాం. ముందు ముందు మరిన్ని అద్భుత విజయాలు మన పరం అవుతాయనడంలో సందేహం లేదు.– పి. అరుణ్ కుమార్, ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్, పాలమూరు యూనివర్సిటీ(నేడు ఆర్యభట్ట ఉపగ్రహానికి గోల్డెన్ జూబ్లీ వేడుకలు) -
పటేల్‌కూ, నెహ్రూకూ పడదంటారా?
ఇండియా ఈ ఏడాది అక్టోబర్ 31నసర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంత్యుత్సవం జరుపుకోబోతోంది. జనం మర్చి పోయిన పటేల్ గుణగణాలు కొన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తన సహోదరు లను ఆయన ఎంతో జాగ్రత్తగా చూసుకు న్నాడు. వల్లభ్‌కు నలుగురు సోదరులు. వారిలో ముగ్గురు తన కంటే పెద్ద వారు. ఆయన ఏకైక సోదరి దహిబా అందరికంటే చిన్నది. సంతానంలో మధ్యవాడు కాబట్టి వల్లభాయికి చిన్నతనంలో తగినంత మన్నన, ఆప్యాయత లభించలేదు. ఈ అనాదరణే ఆయనను ఒక వాస్తవవాదిగా, యోధుడిగా మార్చింది. తండ్రి ఝవేర్ భాయ్ ఎప్పుడూ ధనికుడు కాదు. పైగా కాలక్రమంలో ఉన్నది కూడా కరిగిపోయింది. వల్లభ్ తెలివైన వాడు, విశాల హృదయుడు. కాబట్టే, తోడబుట్టిన అయిదుగురి బాగోగులు, డబ్బు అవసరాలు తనే చూసుకున్నాడు.వల్లభ్ దయాగుణం నుంచి ఆయన చిన్నన్న విఠల్ భాయ్ అత్యధికంగా ప్రయోజనం పొందాడు. మన స్వాతంత్య్రోద్యమ హీరో కూడా అయిన విఠల్ 1933లో యూరప్‌లో అనారోగ్యంతో చనిపోయాడు. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆయనకు సుశ్రూషలు చేశాడు. విఠల్ భాయ్ 1925–30 కాలంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా వ్యవహరించాడు. ఈ ఇద్దరు సోదరులూ బొర్సాద్ (గుజరాత్) టౌనులో లాయర్లు. ఆ సమయంలో, వల్లభ్ లండన్ వెళ్లి బారిష్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బు పొదుపు చేసుకుని పాస్ పోర్టు, టికెట్ సంపాదించాడు. అయితే వీజే పటేల్, ప్లీడర్, బొర్సాద్ పేరిట ఆయనకు వచ్చిన కవరును పోస్ట్‌మన్ అదే పేరుతో నమోదై ఉన్న సోదరుడు విఠల్ ఇంటికి బట్వాడా చేస్తాడు. దీంతో విఠల్‌కు తానూ ఇంగ్లాండు వెళ్లి బారిష్టరు కావాలన్న ఆలోచన వచ్చింది. ముందు నువ్వు వెళ్తే నీకంటే పెద్దవాడినైన నేను ఆ తర్వాత వెళ్లలేను. నీ పాస్ పోర్టు, టికెట్‌తో నేను లండన్ వెళ్తాను అని తమ్ముడిని కోరతాడు. వల్లభ్ సరే అనడమే కాకుండా విఠల్ లండన్ చదువుకు డబ్బు కూడా సమకూర్చాడు. ఆయన కుటుంబ భారాన్నీ మోశాడు. నాలుగేళ్ల తర్వాత 1910లో తనూ లండన్ వెళ్లి అద్భుత ప్రతిభ కనబరచి, 1912లో బారిష్టర్ పట్టాతో ఇండియా తిరిగి వస్తాడు. జైల్లో ఉండి కూడా సర్దార్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తన సాటి సమర యోధులను ఎందరినో ఆర్థికంగా ఆదుకునేవాడని, వారి వైద్య ఖర్చులకు సాయం చేసేవాడని... పటేల్ జీవిత చరిత్ర కోసం 1987 ఏప్రిల్‌లో నేను ముంబాయిలో ఇంటర్వ్యూ చేసినప్పుడు మురార్జీ దేశాయ్ చెప్పారు. సాటి సమర యోధుల ఇక్కట్లను చూసి మన ఉక్కుమనిషి హృదయం ఇట్టే కరిగిపోయేది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జీవితంలో ఆయన ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవి నేడు ఎంతమందికి తెలుసు? 1927 జులైలో పెను తుపాను రావడంతో గుజరాత్ విలవిల్లాడి పోయింది. ఆ సమయంలో బాధితులను ఆదుకునేందుకు అహ్మదా బాద్, పరిసర ప్రాంతాల్లోని ఎందరో ఆయన స్ఫూర్తితో ముందు కొచ్చారు. అప్పట్లో పటేల్ గుజరాత్ కాంగ్రెస్ కమిటీ, అహ్మదాబాద్ మునిసిపల్ కౌన్సిల్ రెంటికీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో కనబరచిన దక్షతను గుర్తించి బ్రిటిష్ రాజ్ అధికారులు ఆయనకు తగిన బిరుదు ఇవ్వజూపారు. సమాధానంగా ఆయన బిగ్గరగా ఒక నవ్వు నవ్వారు. ‘సర్ వల్లభ్ భాయ్’ అని పిలిపించుకుంటే చాలామందికి అప్పుడు ఇప్పుడు సంబరంగా ఉండేదేమో. కాని, ఖేదా జిల్లా వాసులైన ఝవేరీభాయ్, లద్భా దంపతుల ఈ బిడ్డ ఎంతో గట్టి మనిషిగా, ఎన్నో కీలక పర్యవసానాలకు కారకుడిగా భారత దేశ భావితరాలకు తన ముద్రను మిగిల్చి వెళ్లేవాడా?దాదాపు ఒక శతాబ్దం క్రితం 1920లలో మునిసిపల్ కౌన్సిల్ సారథిగా పటేల్ అహ్మదాబాద్‌ను ‘నడిపించాడు’. అలాగే జవహర్ లాల్ నెహ్రూ అలహాబాద్ ను ‘నడిపిస్తున్నాడు’. 1920–22 సహాయ నిరాకరణ ఉద్యమానికి 1930–33 శాసనోల్లంఘన ఉద్యమానికి మధ్య కాలమది. దేశం ఇతర ప్రాంతాల్లో, కోల్‌కతా మునిసిపాలిటీకి చిత్తరంజన్ దాస్, పాట్నా టౌన్ కౌన్సిల్‌కు రాజేంద్ర ప్రసాద్, ముంబాయి మునిసిపాలిటీకి విఠల్ భాయ్ పటేల్ సారథులుగా ఉన్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పుడు నేర్చుకున్న పాఠాలు ఎంతగానో ఉపకరించాయి. 1948లో, వల్లభ్ భాయ్ పటేల్ నగర పాలక పాత్రకు ముగింపు పలికి రెండు దశాబ్దాలు ముగిసిన సందర్భంగా, ముంబాయిలో ఆయనకు పుర ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర భారత ఉప ప్రధాని ఆ సభలో మాట్లాడుతూ, ‘‘ మీరు ఎన్నో విజయాలు ప్రస్తావించారు. వాటిలో కొన్ని నేను సాధించినవి. కొన్ని నేను సాధించనివి. కాని అభ్యంతరం లేకుండా నేను అంగీకరించే ఒక విషయం: అహ్మదాబాద్ మునిసిపాలిటీకి నా శక్తివంచన లేకుండా సేవ చేశాను. స్వచ్ఛమైన ఆనందం పొందాను... నగరంలోని మురికిపై పోరాడితే మీకు రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు మీకు రాత్రి కూడా ప్రశాంతత ఉండదు’’ అని వ్యాఖ్యానించారు.నగర బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత పటేల్ అసాధారణ నాయకత్వ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 1928లో గుజరాత్‌లోని బార్డోలీ ప్రాంత రైతాంగం మీద బ్రిటిష్ పాలకులు విధించిన పన్నులకు వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆయన విజయవంతంగా నిర్వహించారు. అప్పుడే అక్కడి ప్రజలు పటేల్‌కు ‘సర్దార్’ బిరుదు ఇచ్చారు.1916 నుంచీ వల్లభ్ భాయ్ పటేల్– నెహ్రూలు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఉన్నారు. అయితే, 1937లో ఇద్దరూ కలిసి గుజరాత్లో ఒక వారం రోజులు పర్యటించినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.ఇద్దరూ జట్టుగా పనిచేశారు. పటేల్‌కు మహాత్మా గాంధీ ఒక లేఖ రాస్తూ, ‘‘ మీరిద్దరూ కలిసినప్పుడు, మీలో ఎవరు గట్టివారో చెప్పడం కష్టం’’ అని వ్యాఖ్యానించారు. తర్వాతి సంవత్సరాల్లో పటేల్– నెహ్రూల నడుమ ఉద్రిక్తతలు, అపోహలు, అప్పుడప్పుడు పరుష భాషణలు తలెత్తాయి. ఏమైనప్పటికీ, స్నేహం, ఒకరి మీద మరొకరికి ప్రశంసా భావన, పరస్పర విధేయత, గాంధీ పట్ల ఉభయుల విధేయత, స్వాతంత్య్ర పోరాటం పెంచిన బంధం... వాటికంటే బలమైనవి.ఆ తర్వాత స్వాతంత్య్రం వచ్చింది. సంబరాలు తెచ్చింది. వాటితో పాటే విభజన విషాదాలు ప్రజలు చవిచూశారు. తాము ఉభయులం ఒకరికొకరుగా ఉండటం ఎంత అదృష్టమో వల్లభ్ భాయ్ పటేల్– నెహ్రూలు గుర్తించారు. 1950 జనవరిలో గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి స్వతంత్ర భారత తొలి దేశాధిపతి పదవీకాలం ముగిసిన అనంతరం దేశానికి తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ వీరిరువురినీ ప్రస్తావిస్తూ, ‘‘ప్రధాన మంత్రి, ఆయన తొలి సహచరుడైన ఉప ప్రధాన మంత్రి కలిసి దేశాన్ని అన్ని విధాలాసుసంపన్నం చేసే గొప్ప ఆస్తి అయ్యారు. మొదటి వారు సార్వజనీన ప్రేమను, రెండో వారు సార్వజనీన విశ్వాసాన్ని చూరగొన్నారు’’ అని చెప్పారు. కాలం మారుతుంది. గడచిన దశాబ్దాలు మర్చిపోతారు. ఎడతెగని తప్పుడు ప్రచారం జరుగుతుంది. అది ఎంత హాని చెయ్యాలో అంత హాని చేస్తుంది. నెహ్రూ అవమానం పాలయ్యాడు. పటేల్ విగ్రహం ఆకాశాన్ని తాకుతోంది... కానీ, ఆయన జీవితానికి, ఆలోచనకు, ఆయన చేసిన కృషికి సంబంధించిన వాస్తవాలు పాతాళంలోకి వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 1940లు, 1950లు ఇంకా గుర్తున్న, పటేల్– నెహ్రూలు ఉభయులనూ కలిసిన, పటేల్ జీవితాన్ని పరిశోధించి ఆయన జీవిత చరిత్ర రాసిన నాలాంటి వాడు తనకు తెలిసిన వాస్తవాలు ఏమిటో చెప్పితీరాలి.కాబట్టి, వారిద్దరి మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి కొన్ని వాక్యాలు ఉటంకించి ఈ వ్యాసం ముగిస్తాను. 1948 ఫిబ్రవరి 3న సర్దార్ పటేల్‌కు నెహ్రూ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఒకరికొకరం సన్నిహితంగా ఉంటూ, ఎన్నో తుపానులనూ, ఇక్కట్లనూ కలసి కట్టుగా ఎదుర్కొని పావు శతాబ్దం గడచిపోయింది. ఈ కాలంలో మీ పట్ల నా గౌరవాభిమానాలు పెరిగాయని పూర్తి నిజాయితీతో చెప్పగలను...’’1948 ఫిబ్రవరి 5న నెహ్రూకు సర్దార్ పటేల్ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఇద్దరం ఒక ఉమ్మడి లక్ష్య సాధనలో జీవితకాల మిత్రులు (కామ్రేడ్స్)గా ఉంటున్నాం. దృక్పథాలు స్వభావాలు విభేదించినా, మన దేశ అత్యున్నత ప్రయోజనాలు, మనకు ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమాభిమానాలు వాటిని అధిగమించేలా చేస్తూ మనల్ని కలిపి ఉంచుతున్నాయి.’’-వ్యాసకర్త సంపాదకుడు, ప్రముఖ రచయిత, ‘పటేల్ – ఎ లైఫ్’ గ్రంథకర్త-రాజ్‌మోహన్ గాంధీ -
నేపాల్ పరిణామాలకు బాధ్యులెవరు?
మహారాజు జ్ఞానేంద్రకు మద్దతుగా నేపాల్‌లో ఏదో ఒక ప్రాంతంలోఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఇవి నేపాల్‌లో ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్చ్ 28వ తేదీన ఇవి ఘర్షణ స్థాయికి చేరి ఇద్దరు వ్యక్తులు మరణించగా అనేకమంది గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. ఇందుకు మహారాజు, ఆయన మద్దతుదారులు బాధ్యులని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు రాజు 8 లక్షల రూపాయల జరి మానా చెల్లించాలని కూడా ఆదేశించింది. దీన్ని ప్యాలెస్ఖండించింది. మరోవైపు ప్రభువు మద్దతుదారులంతా నిధులు సేకరించి సొమ్ము చెల్లించటానికి సిద్ధమవుతున్నారు.ఒకప్పుడు రాచరికాన్ని కాదనుకున్న నేపాలీ సమాజం ఇప్పుడు రాజుకు ఎందుకు మద్దతు పలుకుతోంది? ఇందుకు నేపాల్ పాలకుల తీరే కారణం. 2008లో నేపాల్‌లో రాచరికం రద్దయిన తర్వాత 17 ఏళ్ల కాలంలో 18 ప్రభుత్వాలు నేపాల్‌ను పాలించాయి. ఏ ఒక్క ప్రభుత్వం కూడా సజావుగా పాలించిన రికార్డు లేదు. అవసరార్థం సర్దుబాట్లు చేసుకుని సంకీర్ణ ప్రభుత్వాలను నడిపారు. ఇప్పటి కేపీ ఓలి, షేర్ కుమార్ దుబా, ప్రచండ... ఇలా ప్రధానులంతా తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న వారే. రాజకీయ అస్థిరత ఒకవైపు, అవినీతి మరోవైపు నేపాల్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఉపాధి అవకాశాలు తగ్గి పోయాయి. యువత దేశాన్ని వదిలి ఉపాధి కోసం బయట దేశాలకు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజు మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. రాచరికాన్నిరద్దు చేయటం వల్ల నేపాల్ సార్వభౌమాత్వానికి దెబ్బ తగిలిందనీ, తిరిగి రాజు అధికారం చేపడితే ప్రపంచ దేశాల్లో నేపాల్ గుర్తింపు సంపాదిస్తుందని భావిస్తున్న వాళ్లు కొందరు ఉన్నారు. మరొక అంశం ‘హిందూత్వ’. నేపాల్‌ను హిందూ స్టేట్‌గా మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇందుకోసం తెరవెనక ప్రయత్నాలు సాగుతున్నాయి. మహరాజు జ్ఞానేంద్ర ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ కావటం, ఆయన ఫొటోలు నేపాల్ వీధుల్లో దర్శనం ఇవ్వటం వంటి ఇటీవల పరిణామాలు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. అల్లర్ల వెనక భారత్ ఉందని నేపాల్ ప్రభుత్వం ఆరోపించటానికి ఇది కూడా ఒక కారణమని మనం భావించవచ్చు. ఇప్పుడు చెలరేగుతున్న ఆందోళనలు రానున్న రోజుల్లో ఎటు దారితీస్తాయో తెలి యదు. నేపాల్‌లో ఆందో ళనలకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నాయకత్వం వహిస్తున్నా, ఇందులో అసాంఘిక శక్తులతో పాటు చైనా పాత్రను కొట్టేయలేం. చాలా కాలంగా చైనా ఆధ్వ ర్యంలో నేపాల్‌లో భారత్ వ్యతిరేక కార్యక్రమాలు సాగుతున్నాయి. దీనికి కమ్యూనిస్టు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. సరిహద్దులో ఆగడాలను చూసీ చూడకుండా వదిలేస్తోంది. భారత్‌తో సంబంధాలు దెబ్బ తిన్నప్పుడు రాజు జ్ఞానేంద్ర చైనాతో స్నేహంగా మసిలిన మాట నిజమే. అలాగని ఆయనకు ఇప్పుడుచైనా మద్దతుగా ఉంటుందని భావించలేం. నేపాల్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని యూఎస్, యూకే, ఇండి యాలు గుర్తిస్తున్నాయి. ప్రజాపాలన నుంచి రాచరికంలోకి మారినంత మాత్రాన నేపాల్ అభివృద్ధి ఫలాలను అందుకుంటుందని చెప్పలేం. రాజు అధికారంలోకి వస్తే అన్నీ సర్దుకుంటాయన్న భావన తార్కికంగా సమంజసంగా లేదు. మార్పు మంచిదే. అదీ అభివృద్ధికి తోవ చూపించినప్పుడే కదా? డా.పార్థసారథి చిరువోలు సీనియర్ జర్నలిస్ట్ -
పెరుగుతున్న మత సమ్మతి
దేశంలో మతతత్వం పెరిగిపోతోంది. కొన్నే ళ్లుగా ఈ ధోరణి మరీ ఎక్కువైంది. అడు గడుక్కీ గుళ్లు, మసీదులు వెలుస్తున్నాయి. నేనీ మధ్య తెలంగాణ వెళ్లాను. చిన్న పల్లె టూళ్లలో సైతం రెండు మూడు దేవాలయాలు ఉన్నాయి. హిందువులకు దేవుళ్లు చాలామంది, కాబట్టి గుళ్ళు కూడా ఎక్కువ గానే ఉంటాయి అనుకోవడం పొరపాటు. హిందూ సమాజం కులాలు, గోత్రాలు, జాతులు,వంశాలుగా చీలిపోయి ఉంది. గుళ్లు గోపురాలు అసంఖ్యాకంగా పుట్టుకురావడానికి ఈ భిన్నవర్గాల సమాజం ఒక ప్రధాన కారణం.జనంలో పెరుగుతున్న వ్యాపార దృష్టి ఇందుకు మరొక ముఖ్య కారణం అనిపిస్తోంది. పౌర సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తు న్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ ఏజెంట్లకు, బళ్లపై పళ్లు అమ్ముకునే వారికి, అనేకానేక చిల్లర పనులకు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ‘లైసెన్స్’లు ఇచ్చి డబ్బు పోగేసు కోవడం మనకు తెలుసు. గ్రామాల్లో సైతం ఈ తరహా సంస్కృతి విస్తరించింది. గ్రామ కమిటీలు అంటూ తయారయ్యాయి. ఇవీ ఇదే మాదిరిగా కొత్త ఆదాయ మార్గాలు కనిపెట్టాయి. ఇసుక మైనింగు, అక్రమ మద్యం అమ్మకాల వంటి కార్యకలాపాలను ఈ కమిటీలు నియంత్రిస్తున్నాయి. ఆ డబ్బును ప్రజల రోజువారీ జీవితాలను బాగు పరచేందుకు వాడతారా అంటే అదీ లేదు. బహుశా ఇక్కడికంటే పరలోకపు జీవితాలకు గిరాకీ ఎక్కువలా ఉంది. అందుకే, ఇలా ఆర్జించిన డబ్బును గుళ్లు కట్టడానికి వాడుతున్నారు.పెరుగుతున్న భక్తిమతం ఇప్పుడు రాజకీయాల్లో కంటే ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పర్యాటక ఆదాయం వాటా 9.6 శాతం. ఇందులో దేశీయ పర్యాటకం 88శాతం. గతేడాది ఇండియా సందర్శించిన విదేశీ పర్యాటకులు కేవలం 90 లక్షలు కాగా, స్థానిక యాత్రికుల సంఖ్య కళ్లు చెదిరేలా 14 కోట్లను దాటింది. కేంద్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ–ఆగ్రా–జైపూర్ ‘స్వర్ణ త్రిభుజం’ మీద అధిక శ్రద్ధ పెడుతుంటాయి. వాస్తవానికి తమిళనాడు సందర్శించేవారు అత్యధికంగా 20 శాతం ఉన్నారు. ఢిల్లీ పర్యాటకులు వారిలో సగం ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలు దేశవిదేశాల టూరిస్టులను ఆకర్షించడంలో ముందు వర సలో నిలుస్తాయి. కారణం – మతపరంగా ప్రముఖమైన తిరుపతి, మదురై వంటి ప్రదేశాలు వీటిలో ఎక్కువగా ఉండటమే. తిరుపతి వల్ల ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అతిపెద్ద దేశీయ పర్యాటక ప్రదేశంగా రూపొందింది. రెలిజియస్ టూరిజం ఇప్పుడు అతిపెద్ద వ్యాపారం. గడచిన నాలుగైదు ఏళ్లలో గతంలో కంటే అధికంగా మతం మీద మమకారం పెంచుకున్న భారతీయులు 25 శాతం పైగానే ఉన్నారని ‘ప్యూ’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ యాటిట్యూడ్’ సర్వే తేల్చింది. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. అన్ని మతాల్లోనూ ఈ ధోరణి కనబడింది. మతం ఎంతో ముఖ్యమైందని భావిస్తున్న వారు 2007–15 మధ్య ఏకంగా 80 శాతానికి పెరిగారు. 11 శాతం పెరుగుదల! ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్) నివేదిక ప్రకారం, మత ప్రదేశాల సందర్శనలపై చేసిన సగటు వ్యయం ఇదే కాలంలో రెట్టింపు కంటే ఎక్కువైంది. మత వ్యాపారానికి ఆకాశమే హద్దు (ఇందులో శ్లేష లేదు). ఇది ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. సంతోషమే! మరి మత భావన పెరుగుతూ పోవడం వల్ల తలెత్తే ఇతర పరిణామాల మాటేమిటి? సమాజంలో మూఢనమ్మకాలు, అంధభక్తి, మతపిచ్చి పెచ్చరిల్లుతాయి. ఒక ఆధునిక సమాజంగా ఇండియా ఆవిర్భవించకుండా ఇవి అడ్డుపడే ప్రమాదం ఉంది. లాభదాయక వ్యాపారంగుళ్లు లేదా మసీదులు నిర్మించడం లాభదాయక వ్యాపారం.అందుకే, ప్రార్థనా మందిరాల పేరిట నీతి లేని మనుషులు బహిరంగ ప్రదేశాలను కబ్జా చేయడం రివాజుగా మారుతోంది. ఒకసారి దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్ఠిస్తే, ఇక వాటిని ఎవరూ తొలగించలేరు. నగరాల్లో ట్రాఫిక్ చిక్కులకు ఈ నిర్మాణాలే చాలావరకు కారణాలు.సంత్ కబీర్ దాసు ఎంతో సరళంగా చెప్పిన కవితను ఈ సంద ర్భంగా నేను ప్రస్తావిస్తాను: ‘రాతిని పూజించడం వల్ల దేవుడు లభిస్తే, నేను పర్వతాన్ని పూజిస్తాను. కానీ ఈ చక్కీ (తిరగలి రాయి)మంచిది, ఎందుకంటే ఇది ప్రపంచాన్ని పోషిస్తుంది’. చేదు నిజం ఏమిటంటే, రాతి విగ్రహం తిరగలి రాయి కంటే మంచి ప్రతిఫలం ఇస్తోంది. మతభావన, మతపిచ్చి వ్యాపారంగా మారబట్టే, ప్రభు త్వాలు సైతం ‘రెలిజియస్ టూరిజం’కు పెద్దపీట వేస్తున్నాయి.వాస్తవానికి, ‘మీ విగ్రహం కంటే మా విగ్రహం మంచిది’ అనే రీతిలో ఒక కనిపించని పోటీకి దారి తీస్తోంది. తిరుమల ఆలయం ఇండియాలోనే అతి పెద్ద ‘మనీ స్పిన్నర్’. ఈ వైష్ణవ ఆలయాన్ని ఏటా 4 కోట్ల మంది దర్శించుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్టను పెద్ద మత పర్యాటక కేంద్రంగా ప్రమోట్ చేస్తోంది. సీపీఎం కమ్యూనిస్టు ప్రభుత్వ హయాంలో కేరళ దేవాలయ బోర్డులు విగ్రహాల ‘మహిమల’ గురించి ప్రచారం చేస్తున్నాయి. దేవుడు మానవుడి ఊహాకల్పన అంటూ మనల్ని హేతుబద్ధంగా ఆలోచింప జేయాల్సిన సిద్ధాంతం ఆ ప్రభుత్వానిది. కానీ మాస్కో రెడ్ స్క్వేర్ , చైనా తియనాన్మెన్లలో మమ్మీలుగా మారిన శవాల నుంచి స్ఫూర్తి పొందే సిద్ధాంతం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?బహిరంగ సమర్థనా?మన తొలి ప్రధాన మంత్రి, నవ భారత వ్యవస్థాపక పితా మహుడు జవహర్లాల్ నెహ్రూ దేశం శాస్త్రీయ దృక్పథంతోముందుకు సాగాలని తలచారు. ఇప్పుడేం జరుగుతోంది? పిడివాదం, అంధవిశ్వాసం మనల్ని నడిపిస్తున్నాయి. మతం, మూఢభక్తి దేశానికి ప్రమాదకరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సమాజంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నెహ్రూ ఎప్పుడూ ప్రార్థనా స్థలాలు సందర్శించలేదు. విశ్వాసి అయినప్పటికీ ఇందిరా గాంధీ సైతం ఆలయాలకు దూరంగానే ఉండే వారు. అయితే ఆమె మనవడు రాహుల్ గాంధీ బొట్టు పెట్టుకుని గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. జంధ్యం కూడా ధరిస్తానని ప్రకటించారు. తాను శివభక్తుడిననీ చెప్పుకొంటారు. అమిత్ షా కూడా అదే చేస్తారు. ఇద్దరికీ కావల్సింది ఓట్లు! రేపిస్టుగా రుజువైన రామ్ రహీం సింగ్‌ను నరేంద్ర మోదీ ప్రశంసించడం అతడి నుంచి రాజకీయ మద్దతు ఆశించే కదా? రాజ్యాంగ పరిరక్షకులు, ప్రముఖ వ్యక్తులు ఆర్భాటంగా మత స్థలాలు సందర్శించడం పెరిగింది. గతేడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల ఆల యంలో ప్రార్థనలు చేయడం మనకు తెలుసు. అంతకు ముందు ఏడాది మోదీ కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలు దర్శించారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ తిరుమల ఆలయంలో బాహాటంగా పూజలు నిర్వహించారు. పూరీ జగన్నాథాలయంలో ఆయన అవమానం పాలైనట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని కేదార్నాథ్ లేదా అయోధ్య సందర్శించినా, మరొకరు అజ్మీర్ షరీఫ్ వెళ్లినా అది వాటిని ఆమోదించడమే అవుతుంది. అలా వెళ్లడం... షారుఖ్ ఖాన్ కోక్ బ్రాండ్‌కు ప్రచారం చేయడం కంటే భిన్నమైనమీ కాదు.- వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత- mohanguru@gmail.com -
Doon School మార్పు మంచిదే... ఆత్మనే మార్చకూడదు కదా!
‘డూన్’ స్కూల్లో బాలబాలికలు కలిసి చదువుకోవడాన్ని (కో–ఎడ్యుకే షన్) ప్రవేశపెట్టాలా? ఇది కొత్త ప్రశ్నేం కాదు. 2010లో చివరిసారి దీనిపై చర్చ జరిగింది. అప్పటి రాష్ట్ర పతి ప్రతిభా పాటిల్ స్కూల్ 75వ ఫౌండర్స్ డే కార్యక్రమంలో ఈ అంశం ప్రస్తావించారు. ఆమె ప్రతిపా దన విని మగపిల్లలు ముసిముసిగా నవ్వుకున్నారు. ఈ ఆలోచన వారి గుండెల్లో వెచ్చదనం నింపి వుంటుంది. పెద్దవారికి మాత్రం ఇదేం రుచించలేదు. కేవలం మగపిల్లల కోసం నెలకొల్పిన డూన్ స్కూల్ ఇండియాలోనే ప్రతిష్ఠాత్మక ఆశ్రమ పాఠశాల (బోర్డింగ్ స్కూలు) అని యాజమాన్యం భావిస్తుంది. సమాజంలో లింగ సమానత్వం ఉండాలన్న భావనతో ప్రతిభా పాటిల్ ఈ వ్యాఖ్య చేసి ఉంటారని ఆహూతులు భావించారు. ‘వెల్హామ్ గరల్స్’ లేదా ‘మహారాణి గాయత్రీ దేవి’ లేదా ఇండియాలో ఉన్న అనేక ‘లొరాటో కాన్వెంట్స్’ స్కూళ్లు ‘గరల్స్ ఓన్లీ (బాలికల) పాఠశాలలుగానే కొనసాగు తున్నాయి. అందుకు లేని అభ్యంతరం డూన్ స్కూల్ విషయంలో ఎందుకు? తొలుత ఎలా ప్రారంభమయ్యాయో అలాగే కొనసాగే హక్కు స్కూళ్లకు ఉండాలి. ఇది కో–ఎడ్యుకేషన్‌కు వ్యతిరేక వాదన అని పొరబడకండి. స్కూళ్ల హక్కుకు సంబంధించిన సమర్థన మాత్రమే. వాస్తవానికి, మనకు కో–ఎడ్యుకేషన్ విద్యాసంస్థలు ఉండి తీరాల్సిందే. ఇందులో ఎలాంటి సందే హం లేదు. అదే విధంగా, కేవలం బాలురకు, అలాగే కేవలం బాలికలకు మాత్రమే ఉద్దేశించిన పాఠశాలలూ ఉండాలి.15 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రశ్న మీద చర్చ మొదలైంది. 2010లో మాదిరిగా ఏదో యథాలాపంగా కాకుండా, ఈఅంశం మీద ఇప్పుడు పకడ్బందీగా చర్చ జరుగుతోంది. ప్రపంచం మారుతోంది. సమతుల్యం, సమ్మిళితం, వైవిధ్యం... వీటితో కూడిన విద్యాభ్యాస వాతావరణాన్ని కో– ఎడ్యుకేషన్ అందిస్తుంది. బాయ్స్ ఓన్లీ స్కూళ్లలో సాంప్ర దాయిక పురుషత్వ భావనలతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుంది. సహవిద్యే దీనికి విరుగుడు. పరస్పరం ఎలా గౌరవించుకోవాలో, ఒకరి నుంచి మరొకరు ఎలా నేర్చు కోవాలో బాల బాలికలు ఉభయులకూ కో–ఎడ్యుకేషన్ వ్యవస్థ నేర్పిస్తుంది. ఇదీ ప్రస్తుతం డూన్ స్కూల్ సహవిద్యకు అనుకూలంగా సాగుతున్న వాదన. వీరు లేవనెత్తుతున్న ఈ అంశాలతో ఎలాంటి పేచీ లేదు. ఇవి మంచి వాదనలు. అయితే, వీటిని తోసిపుచ్చేందుకూ ఇంతే బలమైన, ముఖ్య మైన ఇతర కారణాలు ఉన్నాయి.డూన్ స్కూల్‌కు ఒక గుర్తింపు ఉంది. అది దాదాపువందేళ్ల పురాతనమైంది. ఎవరెన్ని చెప్పినా, సంప్రదాయం ముఖ్యమైంది. ‘మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి’ అంటూ సంప్రదాయాన్ని గాలికి వదిలేయ కూడదు. సహవిద్యా విధానం అనేది డూన్ స్కూల్ అస్తిత్వాన్నీ, వ్యవస్థాపకుడి ఆశయాన్నీ మౌలికంగా మార్చివేస్తుంది. కాబట్టే, ఇంగ్లండులో అనేక వందల ఏళ్ల సుప్రసిద్ధ చరిత్ర కలిగిన ఈటన్ కాలేజీ, హ్యారో పాఠశాలలు మారలేదు.స్కూల్ సంస్కృతినీ ఈ సందర్భంగా మనం పరిగణన లోకి తీసుకోవాలి. దాదాపు శతాబ్ద కాలం నుంచీ డూన్ కొన్ని విలువల ప్రాతిపదికగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అక్కడ విద్యార్థుల ఆలనాపాలన; గురువులతో, పాత విద్యార్థులతో విద్యార్థుల స్నేహపూర్వక సాన్నిహిత్యం ఎన్నదగినవి. కో-ఎడ్యుకేషన్ అయినా, కాకున్నా కొన్ని ఇతర ప్రముఖ పాఠశా లలకూ ఇలాంటి ఔన్నత్యం ఉంటుంది. కాదనడం లేదు. మరో ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే, కో–ఎడ్యుకేషన్ విద్యాసంస్థగా అవతరించడానికీ, అందుకు అవసరమైన వస తులు కల్పించడానికీ, ఇతర మార్పులు చేయడానికీ డూన్ క్యాంపస్ ఎంతమాత్రం సరిపోదు. అయినా సరే బాలికలకు ప్రవేశం కల్పించాలీ అంటే బాలుర సంఖ్యను కుదించాల్సి వస్తుంది. నిజంగా ఇది అవసరమా? మేయో కాలేజీని సహవిద్యాభ్యాస సంస్థగా మార్చక పోవడానికి బహుశా ఇదే కారణమై ఉంటుంది. బదులుగా, ‘మేయో గరల్స్ స్కూల్’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డూన్ స్కూలుకు కూడా ఈ అవకాశం ఉంది. నిజానికి, ఇలా చేయడం మరింత అర్థవంతంగా ఉంటుంది.డూన్ స్కూల్ విషయంలో ఈ చర్చ కంటే ముఖ్యమైంది... స్కూలు పనితీరు విద్యాపరంగా మెరుగుపడాలి. క్రీడా సదుపాయాలు పెరగాలి. అలాగే ఇతర మౌలిక సదు పాయాలు పెంచాలి. ఇవన్నీ సమకూర్చుకోవడమే స్కూలు ప్రథమ ప్రాధాన్యం! కో–ఎడ్యుకేషన్ కాదు!!డాస్కోస్ (డూన్ స్కూల్ బాయ్స్ తమకు తాము పెట్టుకున్న పేరు)కు అమ్మాయిల ప్రపంచం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎవరూ కాదనరు. దగ్గర్లోనే ఉన్న వెల్హామ్ వంటి గరల్స్ స్కూల్స్‌తో డూన్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. వెల్హామ్లో డాస్కోస్ అక్కలు, చెల్లెళ్లు, కజి¯Œ ్స చాలామంది చదువుతుంటారు. ఉభయులూ కలిసి అనేక విద్యా, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి చేపట్టడం సాధ్యమే. కో–ఎడ్యుకేషన్ కంటే ఇది సరైనది. అర్థవంతంగానూ ఉంటుంది. మార్పు అనేది ఇతర సంస్థలకే పరిమితం కాదు. డూన్ స్కూల్ కూడా ఎప్పటికప్పుడు మార్పును అందిపుచ్చు కోవాలి. అంటే దాని మౌలిక స్వరూపమే మారాలని కాదు. మార్పును స్వాగతించడం నిర్మాణాత్మకమైనది. పరిపూర్ణత్వం కోసం పొరపాటు లక్ష్యాన్ని నిర్ణయించి, ఏదో మంచి జరుగు తుందనే నమ్మకంతో అసలు ఆత్మనే మార్చాలనుకోవడం విధ్వంసాత్మకం. అమూల్యమైన, గౌరవనీయమైన ఒక బాయ్స్ స్కూల్‌గా కొనసాగే హక్కును డూన్ స్కూల్ ఇప్పటికే సాధించింది. అలా కొనసాగనిద్దాం.-కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ -
గనులకై యుద్ధం
మధ్యభారత అరణ్యాలలో ఆదివాసుల మీద, ఆదివాసుల జల్, జంగల్, జమీన్, ఇజ్జత్ పోరాటానికి మద్దతు ఇస్తున్న మావోయిస్టుల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి గట్టడం, ఆ ప్రాంతంలోని అపారమైన, సంపన్నమైన ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే వ్యూహంలో భాగమే అని దాదాపు ఇరవై సంవత్సరాలుగా పరిశీలకులు, విమర్శకులు ఎందరో రాస్తున్నారు. సల్వా జుడుం పేరుతో 2005లో పాలకులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిన ఆదివాసుల మధ్య అంతర్యుద్ధం నుంచి, ఇప్పుడు 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్టు రహిత ఛత్తీస్‌గఢ్ తయారు చేస్తామని ముహూర్తం నిర్ణయించి మరీ సాగిస్తున్న ఆపరేషన్ కగార్ దాకా మధ్య భారత అరణ్యాలలో చాలా నెత్తురు ప్రవహించింది. చివరి యుద్ధం అని చెప్పుకొంటున్న ప్రస్తుత దశ మొదలైన 2024 జనవరి 1 నుంచి గడచిన పద హారు నెలల్లో 400 మందికి పైగా ఆదివాసులను, మావోయిస్టులను భద్రతా బలగాలు చంపివేశాయి.ఖనిజ వనరుల కోసమే!ఈ మారణకాండ అంతా ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేసి, స్వస్థలాల నుంచి వారిని నిర్వాసితులను చేసి, వారి కాళ్లకింది నేలలో నిక్షిప్తమైన సంపన్న ఖనిజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడానికే అని విమర్శకులు చేస్తున్న అభియోగం నిజమేనని చూపే పరిణామాలు జరుగు తున్నాయి. కార్పొరేట్ సంస్థల రక్షణ కోసం లెక్కలేనన్ని భద్రతా బలగాల క్యాంపులు నిర్మాణమవుతున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర్ సీమా బల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి సరిహద్దులను రక్షించవలసిన బలగాలు ఇప్పుడు మధ్య భారతంలో ఉన్నాయి. ఆ బలగాలను తీసుకుపోవడానికీ, తవ్విన ఖనిజాన్ని బైటికి తీసుకురావడానికీ నాలుగు లైన్ల, ఆరు లైన్ల రహదారుల నిర్మాణం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేగంగా జరిగిపోతున్నది. ఈ ‘అభివృద్ధి’ కార్యక్ర మానికి అడ్డు వస్తారనే అనుమానం ఉన్నవాళ్ల మీదికి డ్రోన్లతో నిఘా, వైమానిక బాంబు దాడులు, వేలాది కాల్బలాలతో జల్లెడ పట్టి, చుట్టుముట్టి, ఎటువంటి ప్రతిఘటన లేకపోయినా కాల్చి చంపి ఎదురుకాల్పుల కథనాలు విడుదల చేయడం జరుగు తున్నది.ఆ వరుసలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న అత్యుత్తమ స్థాయి ఇనుప ఖనిజం (హెమటైట్) గనులను వేలం వేయడానికి శరవేగంతో ప్రయత్నిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖనిజ వనరుల శాఖ 2025 జనవరి 15న సరిగ్గా ఈ హత్యాకాండల వార్తలు వస్తున్న దంతెవాడ, కాంకేర్ జిల్లాలలోని ఇనుప ఖనిజం గనుల బ్లాకులు నాలుగింటిని వేలం వేసే ప్రక్రియ ప్రారంభించింది. వీటిలో బైలదిల్లా గనులుగా ప్రఖ్యాతమైన ఖనిజ వనరుల కొండలు దంతెవాడ జిల్లా కిరండుల్ నుంచి బీజాపూర్ జిల్లా గంగలూరు దాకా వ్యాపించి ఉన్నాయి. బైలదిల్లా డిపాజిట్ 1ఎ, 1బి, 1సి, కాంకేర్ జిల్లాలోని హాహాలొద్ది అనే ఈ నాలుగు బ్లాకుల వేలం ప్రక్రియ ఫిబ్రవరి 28 దాకా సాగి, 58 ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడ్డాయి. చివరికి మూడు గనులను ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా, ఒక గనిని రూంగ్టా స్టీల్ దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా ప్రభుత్వ వేలంపాటలో ప్రతిపాదించిన కనీస ధర కన్నా 154 శాతం, 160 శాతం ఎక్కువకు పాడు కున్నాయంటే, అక్కడ వారికి ఎంత లాభం చేకూరే అవకాశం ఉందో ఊహించవచ్చు. ఈ గనుల లీజు యాభై సంవత్సరాల పాటు ఉంటుంది గనుక ఇది రేపో మాపో వట్టిపోయే ఆవు కూడా కాదు, కామధేనువు! ఇప్పటివరకూ బైలదిల్లా గనుల్లోకి ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) తప్ప ప్రైవేటు కంపెనీలు ప్రవేశించలేదు. ఇప్పటివరకూ ఆర్సెలార్ మిత్తల్ తనకు అవసరమైన ఖనిజాన్ని ఎన్ఎండీసీ నుంచి తీసుకుని పైప్ లైన్ ద్వారా విశాఖపట్నం పంపుతుండేది. ఇప్పుడీ వేలంతో ఆ కంపెనీకి సొంత గనులు వచ్చాయి. వీటిలో బైలదిల్లా 1ఎ, 1బి ఒక్కొక్కటీ 2,100 ఎకరాలు, 1సి 1,976 ఎకరాలు, హాహాలొద్ది 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ నాలుగు బ్లాకులతోనే దట్టమైన దండకారణ్యంలో దాదాపు ఏడు వేల ఎకరాల అడవి నేలమట్టమైపోయి ‘అభివృద్ధి’ జరగబోతున్నది. ఈ నాలుగు బ్లాకులూ కలిసి దాదాపు ముపై్ఫ కోట్ల టన్నుల ఉత్తమశ్రేణి ఖనిజం తవ్వబోతున్నారు. ఇటువంటి లెక్కలలో తాము కాగితాల మీద పొందినదానికన్న ఎక్కువ విస్తీర్ణపు గనులు తవ్వి, మరింత ఎక్కువ ఖనిజాన్ని దోచుకుపోవడం అందరికీ తెలిసిందే. వేలం ప్రక్రియలో చెప్పిన మేరకే తవ్వుతారని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమే ఈ నాలుగు గనుల ఖనిజం విలువ ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు. కాగా, ప్రభుత్వానికి దక్కే ఆదాయం ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే! ఈ రాష్ట్రంలో ఇంతకుముందే ఎన్ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వ ఛత్తీస్‌గఢ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సీఎండీసీ)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పరచి, గనులకు పర్యావరణ అనుమతులు సంపాదించి, ఆ గనులను తవ్వకం, ఖనిజాభివృద్ధి కార్యకలాపాలకు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు ఇచ్చింది. ఖనిజ సంపన్నమైన ఈ రాష్ట్రంలో ఇప్పటికే అంబుజా, బిర్లా, ఎస్సార్, జిందాల్, జె కె లక్ష్మి, లఫార్జ్, ఎల్ అండ్ టి, వేదాంత వంటి కార్పొరేట్ దిగ్గజాలన్నీ ఉన్నాయి. ఇది పలు రకాల సమస్యఇది ఆదివాసులకో, మావోయిస్టులకో సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది ముహూర్తాలు నిర్ణయించి మనుషులను చంపవచ్చునా అనే మానవతా సమస్య, నాగరికతా సమస్య. పర్యావరణ సమస్య, దేశ సంపద ఎవరికి చెందాలనే సమస్య, అటవీ హక్కుల చట్టం, పంచాయత్ రాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం వంటి చట్టాల ఉల్లంఘన సమస్య. రాజ్యాంగ ఆదర్శాలు, ప్రజల హక్కులు అమలవుతున్నాయా అనే సమస్య. మనందరి సమస్య!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘శాంతము లేక సౌఖ్యము లేదు...’!
‘శాంతము లేక సౌఖ్యము లేదు...’ అన్న త్యాగరాజ కీర్తన సంగీత కచేరీలలో ఎక్కువగా కనిపించదు. పాత రోజులలో నాగయ్య, భాను మతి వంటివారు సినిమాలలో ఈ పాట పాడటం వల్ల, ఆ పాటకూ, మాటకూ బాగా ప్రాచుర్యం ఉండేది.ఎవరికయినా అకస్మాత్తుగా కోపం బుస్సుమని పొంగివస్తే, చను వున్న సన్నిహితులు, ‘నాయనా! కోపం తగ్గించు. శాంతము లేక సౌఖ్యము లేదు!’ అని త్యాగరాజు గారి పల్లవిని సామెతగా, సుభాషితంగా వాడటం శిష్ట సమాజంలో ఇప్పటికీ అప్పుడప్పుడూ వినిపిస్తుంది.‘తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష!’ అన్న విషయం అందరికీ అనుభవవైక వేద్యమే. కోపాన్ని దూరంగా ఉంచేవాడికి, సుఖ సంతోషాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి, దార, సుతులు, ధన, ధాన్యములుండిన, / సారెకు జప, తప సంపదలుండిన, / ఆగమ, శాస్త్రములన్నియు చదివిన,.../ భాగవతు లనుచు బాగుగ పేరైన, / శాంతము లేక సౌఖ్యము లేదు! అన్న అయ్య వారి మాట వరహాల మూటే. అయితే, ఇక్కడ ‘శాంతం’ అంటే, క్రోధ రాహిత్యమనీ, కోపం లేకుండా వ్యవహరించటమనీ మాత్రమే అర్థం చెప్తే, అదీ మంచి మాటే! కానీ అది కొంచెం పరిమితమైన అర్థం. వాస్తవానికి, చివరి దాకా చూస్తే, త్యాగయ్య గారంటున్నది, ‘... త్యాగ రాజ నుత! సాధురక్షిత! తనకు ‘ఉప/శాంతము’ లేక సౌఖ్యము లేదు!’ అని. ఉపశాంతం అంటే ఉపశమనం, శమింపజేయటం, నియంత్రించటం! కామ క్రోధ లోభాది ఆరు అంతశ్శత్రువులనూ అదుపులో ఉంచటం. క్షణికోద్రేకం కట్టలు తెగకుండా చూడటం. ఇంద్రియ కాంక్షల విజృంభణను నిగ్రహించటం. ఒత్తిళ్ళ వల్ల ఓర్పు కోల్పోకుండా,సంయమనంతో స్పందించటం. అటు లౌకిక విషయాలలో గానీ, ఇటు ఆధ్యాత్మిక సాధనలలో గానీ పురోగతి కోరేవాడికి, ఇది అత్యావశ్యకమైన గుణం అనడంలో సందేహానికి ఆస్కారం లేదు!– మారుతి శాస్త్రి -
Phule movie ‘ఫూలే’ సినిమాపై అభ్యంతరాలా?
మూడు వేల ఏళ్ల కులవ్యవస్థ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మానవతావాది మహాత్మా ఫూలే. ఆయనపై అనంత్ మహాదేవన్ దర్శకత్వంలో ప్రముఖ నటులు ప్రతీక్ గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రలలో... ‘ఫూలే’ సినిమా తయారయింది. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపిస్తుందనీ... కులవాదాన్ని ప్రోత్సహిస్తుందనీ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్య క్షుడు ఆనంద్ దవేతో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు ఆరోపించడంతో సినిమా విడుదల వాయిదా పడింది. వారి అభ్యంత రాల కారణంగా... సెన్సార్ బోర్డు కూడా కుల సంబంధిత పదా లను తొలగించాలని సూచించింది. అయితే స్వయంగా బ్రాహ్మ ణుడైన ఈ చిత్ర దర్శకుడు అనంత్ మహాదేవన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, సినిమా చారిత్రక వాస్తవాల ఆధారంగా రూపొందిందనీ, ఎటు వంటి అజెండా లేదనీ చెప్పారు. మూడు వేల ఏళ్ల పాటు ఈ దేశంలోని మెజారిటీ వర్గాల ప్రజలకు క్షుద్రులు, శూద్రులు, మ్లేచ్ఛులు, ఛండాలురు అనే పేర్లు తగిలించి... బానిసలుగా చూసిన అమా నుష కులవ్యవస్థ ఈ దేశంలో రాజ్యమేలింది. తమ స్వార్థం కోసం మతాన్ని, సమా జాన్ని భ్రష్టు పట్టించిన ఆ మనువాదుల దౌర్జన్యాలను ఒంటరిగా ఎదిరించిన ధీశాలి ఫూలే. ‘మనుషులందరినీ పుట్టించినవాడు దేవుడే అయినప్పుడు... ఒక తండ్రి తన బిడ్డలలో కొందరు ఎక్కువ కొందరు తక్కువ... కొందరు ద్విజులు, కొందరు పంచ ములు అంటూ ఎలా శాసిస్తాడు? ఇవన్నీ మీరు రాసిన అబద్ధపు రాతలు! ఇక ఈ అకృత్యాలను కట్టిపెట్టండి!’ అంటూ గర్జించి, స్వార్థపర వర్గాల దౌర్జన్యాలపై సమర శంఖం పూరించాడు మహాత్మా ఫూలే.శూద్ర బిడ్డలకూ, స్త్రీలకూ చదువు చెప్పడానికి పుణే వీధుల్లో సావిత్రిబాయి ఫూలే వెళుతుంటే... అగ్రవర్ణాలు రాళ్లు వేసే దృశ్యాన్ని తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఫూలే జీవిత చరిత్రలో ఆయన ఎదుర్కొన్న అవరోధాల ప్రస్తావన ఉండకపోతే... మరేమి ఉంటుంది? జరిగిన చరిత్రను చూపెడితే... మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ బుకాయిస్తే ఎలా?– ఆర్. రాజేశమ్సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ -
Biruduraju Ramaraju తెలుగు సంస్కృతీరాజం రామరాజీయం
ఆచార్య బిరుదురాజు రామరాజు గురించిన ఆలోచన రాగానే సంస్కృతి, సంప్రదాయం, సాధన, విద్వత్తు మూర్తీభవించిన వ్యక్తిని మనోనేత్రంతో చూస్తాం. 55 ఏళ్ళనాడు పరిచయమైన రామ రాజుగారు కీర్తిశేషులయ్యే వరకు నా మీద చూపిన వాత్సల్యం ఎప్పటికీ గుర్తుంటుంది. వయసులో చిన్నవాళ్ళయినా ప్రేమతోబాటు గౌరవం చూపే సౌజన్యం ఆయనది. దీన్ని ఎన్నో సందర్భాలలో నేను చవిచూచాను. 24 సంవత్సరాల వయస్సులోనే నన్ను ఉస్మా నియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు పిలిపించి తెలుగు ఎం.ఎ. విద్యార్థులకు జానపద సాహిత్యం మీద ఉప న్యాసం ఇప్పించారాయన. 26 ఏళ్ళ వయస్సులోనే పిహెచ్.డి. పరీక్షకునిగా చేశారు. 27 ఏళ్ళ వయసులో ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్తు ప్రాదుర్భావ సందర్భంగా నాచేత ప్రధానోపన్యాసం ఇప్పించారు. ‘గుణాః పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః’ అనే వాక్యానికి నిలువెత్తు ఉదాహరణ రామరాజుగారు. హైదరాబాదుకు ఎప్పుడైనా వెళ్ళానంటే చిక్కడ పల్లిలో రామరాజుగారి నివాసానికి వెళ్ళి గంటల తరబడి మాట్లాడవలసిందే. జానపద విజ్ఞానంలో జరుగుతున్న కొత్త పరిశోధనలను గురించి అడిగి తెలుసుకొనే ఆయన ఆసక్తి ఆశ్చర్య పరిచేది. ‘నేను చెప్పిందే చివరి వాక్యం. చేసేదేదో చేసేశాను. ఇక చేయవల సింది ఏదీ లేదు’ అనే మనస్తత్వం కాదు రామరాజుగారిది. ఆయన చేసిన పరి శోధన, జానపద సాహిత్యంలో ఆయన కృషి తక్కువదేమీ కాదు. ‘జానపద సాహిత్యంలో పరిశోధన చేయడానికి ఏముంది?’ అని భావించే రోజుల్లో పట్టుబట్టి జానపదగేయ సాహిత్యాన్ని పరిశోధనాంశంగా తీసు కున్న సందర్భం తెలుగులో జానపద పరిశోధనకు నాందీ వాక్యం పలికింది. తెలుగులో విస్తృతంగా జానపద విజ్ఞాన పరిశోధన జరగడానికి మూలకారణం రామరాజుగారే. జానపద సాహిత్య సేకరణ, వర్గీకరణ, వివేచన విషయంలో ఆయనదే ఒరవడి.సంస్కృతి, సంప్రదాయాలు అంటే రామరాజుగారికి విపరీతమైన అభిమానం. అందువల్లనే మనకు తరతరాల వారసత్వంగా సంక్రమించిన జానపద సాహిత్యాన్ని ఆయన అంతగా అభిమానించారు. కాని అభిమా నించడంతో ఆగిపోలేదాయన. జానపద సాహిత్య పరిశోధనపైన దృష్టి సారించారు. పరిశోధనతో ఆగిపోక పోవడం ఆయన ముందుచూపునకు నిదర్శనం. ఆయన పరిశోధన గ్రంథాన్ని రెండోసారి ప్రచురించేటప్పుడు 1976లో నేను ప్రచురించిన ‘జానప సాహిత్య స్వరూపం’ పుస్తకాన్ని చూచినట్లుగా అందులో ఉటంకించారు. ఇది వారి హృదయ వైశాల్యాన్ని తెలుపుతుంది. జానపద విజ్ఞాన అధ్యయనాన్ని గురించి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఈ విషయంలో ఆయన ఆసక్తిని తెలుపుతుంది.బిరుదురాజు రామరాజుగారు జానపద సాహిత్య పరిశోధనతోనే ఆగిపోలేదు. వారి సమకాలికులైన దిగ్దంతులవంటి పండితులతో సమానంగా వ్యవహరించాలని సంస్కృతంలో కూడా ఎం.ఎ. చేశారు. ప్రాచీన తెలుగు కావ్యాలవైపు దృష్టి సారించారు. ప్రాచీన రచనలను పరి చయం చేయడమే కాకుండా ‘చరిత్రకెక్కని చరితార్థులు’ పేరుతో విస్మృత కవులను గురించి ప్రచురించారు. ప్రాచీన తెలుగు కావ్యాలనే కాకుండా కొన్ని సంస్కృత గ్రంథాల్ని సేకరించి ప్రచురించారు. తెలుగు, సంస్కృతం మాత్రమే కాక ఆంగ్లంలో కూడా రామరాజు గారు ప్రావీణ్యం గడించారు. ఆంగ్ల గ్రంథాలను తెలుగులోకి అనువదించడమే కాకుండా ‘ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ‘జానపద సాహిత్య బ్రహ్మ’ అనిపించుకోవడమే కాకుండా ప్రాచీన సాహిత్య పరిశోధన, నిఘంటు రచన, చారిత్రక నవలారచన, అముద్రిత గ్రంథాల పరిష్కరణ వంటి రంగా లలో కృషి చేసిన బిరుదురాజు రామరాజుగారు చిరస్మరణీయులు. -ఆర్వీయస్ సుందరం వ్యాసకర్త సాహితీ విమర్శకులు(నేడు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంఎన్టీఆర్ కళామందిరంలో బిరుదురాజు రామరాజు శత జయంతి సదస్సు) -
కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!
డిజిటల్ ప్రపంచంలో మరో కొత్త అంశం చక్కర్లు కొడుతోంది. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు కాస్తా ప్రఖ్యాత జపనీస్ యానిమేటర్ హయావో మియజాకీ శైలిలో గీసిన ఫ్యామిలీ, వ్యక్తిగత చిత్రాలతో నిండిపోతున్నాయి. గిబ్లీ ఆర్ట్ పేరు పెట్టుకున్న ఈ చిత్రాల ధోరణి నాలుగు దశాబ్దాల పాటు యానిమేషన్ రంగంలో ఎన్నో ప్రఖ్యాత క్యారెక్టర్లను సృష్టించిన గిబ్లీ స్టూడియో నకలు అన్నది మీకు తెలిసే ఉంటుంది. తేలిక పాటి పేస్టల్ షేడ్స్‌లో క్యారెక్టర్ల చిత్రీకరణ దీని హైలైట్. ప్రస్తుతానికి ఈ గిబ్లీ ఆర్ట్ అన్నది ఏఐ ప్లాట్‌ఫామ్స్ కొన్నింటిలో ఉచితంగా లభి స్తోంది. కొన్ని క్లిక్‌ల సాయంతో ఏ చిత్రాన్నైనా గిబ్లీ ఆర్ట్‌గా మార్చేయ వచ్చు. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఫ్యాషన్ , స్పోర్ట్స్ ఇన్‌ఫ్లుయెన్స ర్లతో పాటు కొన్ని కోట్ల మంది ఇప్పటికే ఈ గిబ్లీ ఆర్ట్‌ను వాడేశారు.సరదాగా కనబడుతున్నా...కంటెంట్‌ను సృష్టించేందుకు ఉపయోగించే జనరేటివ్ ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చి కొంత కాలం అయినప్పటికీ, ‘ఓపెన్ ఏఐ’ అభివృద్ధి చేసిన సరికొత్త ఏఐ టూల్ ఈ గిబ్లీ ఆర్ట్ ట్రెండ్‌కు కారణమైంది. ఛాట్‌జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు మనం అందించే సమాచారం (టెక్ట్స్) ఆధారంగా మనకు కావాల్సిన సమ చారాన్ని వివిధ రూపాల్లో (ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్టులు వంటివి) తయారు చేస్తాయి. అదే గిబ్లీ ఆర్ట్ వంటివి మల్టీమీడియా జనరేటివ్ ఏఐ టూల్స్! టెక్ట్స్‌తో పాటు వీడియోలు, వాయిస్, ఫొటోలు, మ్యూజిక్ వంటి వాటినన్నింటినీ అది తీసుకోగలదు. ‘మిడ్ జర్నీ’, ‘స్టేబుల్ డిఫ్యూషన్ ’, ‘డాల్–ఈ’ వంటివి టెక్ట్స్‌ను తీసుకుని ఇమేజెస్ ఇవ్వగలవన్నది తెలిసిందే. డాల్–ఈతో ఢిల్లీ వీధుల చిత్రాలను ఎం.ఎఫ్.హుస్సేన్ లేదా జామినీ రాయ్ శైలిలో కొన్ని సెకన్ల సమయంలోనే తయారు చేయవచ్చు. ఇక ‘లెన్సా’ వంటివి ఇచ్చిన ఇమేజ్‌కు ప్రత్యామ్నాయాలను సృష్టిస్తాయి. వీటితో పోలిస్తే గిబ్లీ ఆర్ట్‌కు ఎక్కువ ఆదరణ ఎందుకు లభించిందంటే... ఇవి ముద్దుగా, హాస్యస్ఫోరకంగా ఉండటమని చెప్పాలి. చూసేందుకు హాస్యస్ఫోరకంగానే ఉండవచ్చు కానీ, దీని వెనుక ఒక సీరియస్ సమస్య ఉంది. ఏదైనా ఏఐ వ్యవస్థ వాస్తవ ప్రపంచం నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే పనిచేస్తుంది. ఈ సమాచారం ద్వారా ఏఐ వ్యవస్థలకు శిక్షణ అందుతుంది. రకరకాల మార్గాల ద్వారా ఏఐ వ్యవస్థలకు డేటా (టెక్ట్స్, ఇమేజెస్, సంగీతం) అందు తూంటుంది. రస్కిన్ బాండ్ లేదా అమితవ్ ఘోష్ శైలిలో ఒక చిన్న కథ రాయమని మనం ఏదైనా లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను అడిగా మనుకోండి... వీరిద్దరి రచనల తాలూకూ సమాచారం మొత్తాన్ని వెతికేస్తుంది ఏఐ! చివరకు కాపీరైట్ హక్కులున్న సమాచారం కూడా. కానీ ఏఐ కంపెనీలు ఈ కాపీరైట్ హక్కులు పొందకపోవడం గమ నార్హం. గిబ్లీ ఆర్ట్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏ కంపెనీ కూడా గిబ్లీ స్టూడియో తాలూకూ చిత్రా లను వాడుకునే హక్కులు తీసుకోలేదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్నే తాము వాడుకుంటున్నట్లు ఏఐ కంపెనీలు చెబుతున్నా... రచయితలు, కళా కారుల స్పందన వేరుగా ఉంది. కాపీరైట్ చట్టాల్లోని ‘ఫెయిర్ యూజ్’ సిద్ధాంతం గురించి ఏఐ కంపెనీలు చదివితే మేలని వీరు అంటు న్నారు. అప్పుడే అమెరికా, యూరప్‌లలో న్యాయపోరాటాలైతే మొద లయ్యాయి. సృజనకారులకు దక్కేదేమిటి?గిబ్లీ ఆర్ట్ వంటి ఏఐ టూల్స్ అసలు సృజనాత్మకత అన్న అంశంపైనే సవాళ్లను లేవనెత్తుతున్నాయి. ఓ అందమైన పెయింటింగ్, కార్టూన్ క్యారెక్టర్, సంగీతం... ఇవన్నీ మనిషి సృజనకు మచ్చుతున కలు. ఇవన్నీ ఆ యా వ్యక్తుల సొంత అనుభవాలు, సందర్భాల నుంచి పుట్టుకొచ్చినవి. గిబ్లీ ఆర్ట్‌నే ఉదాహరణకు తీసుకుందాం. జపాన్ సమాజం, సంస్కృతులకు అది అద్దం పడుతుంది, అమెరికన్ సంస్కృతికి వాల్ట్ డిస్నీ స్టూడియో అద్దం పట్టినట్లు!ఇలాంటి సృజనాత్మక కళాకృతులను యంత్ర సృష్టిగా మార్చడం లేదా ఒక ఏఐ సిస్టమ్ మానవ సృజనాత్మకత, అభినివేశాలకు విరు ద్ధంగా వెళ్లడం మేలైన ఆలోచనైతే కాదు. ఒక పెయింటింగ్‌ను పూర్తి చేసేందుకు కళాకారుడికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. అలాగే పుస్తకం రాయడానికి ఏళ్లు పడుతుంది. ఒక కార్టూన్ లేదా యానిమేషన్ స్ట్రిప్ తయారు చేసేందుకు ఆర్టిస్టులు వందల గంటలు కష్టపడాల్సి రావచ్చు. వీటన్నింటి ఆధారంగా పనిచేసే ఏఐ సృష్టించే ఆర్ట్‌కు పేరు, డబ్బు... రెండూ అసలు కళాకారులకే దక్కాలి. అందుకే ఏఐ కంపె నీలు డేటా లాండరింగ్‌కు పాల్పడుతున్నాయనీ, కళాకారులకు దక్కా ల్సిన డబ్బు, క్రెడిట్ రెండింటినీ ఎగ్గొడుతున్నాయనీ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని లక్షల మంది కళాకారులపై ఆధారపడి అభివృద్ధి అవుతున్న ప్రతి ఏఐ జనరేటివ్ మోడల్ కంపెనీ విలువ వందల కోట్ల డాలర్లుగా ఉండటం ప్రస్తావనార్హం. ఇవి వినియోగ దారుల నుంచి వేల డాలర్ల రుసుము వసూలు చేస్తూంటాయి. అయితే, అసలు కళాకారులకు ఇందులోంచి ఏమీ దక్కడం లేదు. ఇమేజ్ జనరేటర్లు కళాకారులు కాదు కానీ... కళాకారులకు సవాలు విసురుతున్నాయి. జనరేటివ్ ఏఐ మోడళ్లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సృజనాత్మకత కలిగిన వారి జీవనోపాధిని దెబ్బ తీస్తున్నాయి. యానిమేషన్ రంగంలోని కళాకారులు, ఇల్లస్ట్రేటర్లు, డిజైనర్లపై ప్రభావం ఎక్కువే ఉంది. పైగా మానవ కళాకారులతో పోలిస్తే ఏఐ తయారు చేసే బొమ్మల్లో డెప్త్, భావ ప్రకటన తక్కువ. ఏఐ ఆకృతులు ఓ మోస్తరువి మాత్రమే! ఒప్పందాలు మేలా?ఇప్పుడు డిజిటల్ ప్రపంచం మొత్తం గిబ్లీ వంటి ఉచిత ఏఐ టూల్స్ ఉత్పత్తులతో నిండిపోయింది. సినిమా స్టుడియోలు, నెట్ వర్క్‌లు ఇప్పటికే ఈ ఏఐ టూల్స్‌ను శ్రమ, ఖర్చులు రెండూ తగ్గించేవిగా చూస్తున్నాయి. పదుల కొలదీ యానిమేటర్ల బృందాలను నియమించుకునే బదులు, కొందరు ఏఐ టెక్నికల్ డైరెక్టర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ధోరణి మనదేశంలో ఆందోళనకు కారణం అవుతోంది. వేల మంది భారతీయ టెకీలు హాలీవుడ్ స్టూడియోలు ఔట్‌సోర్స్ చేసే యానిమేషన్ వర్క్‌పై ఆధారపడి ఉన్నారు. వాళ్లు కంప్యూటర్ గ్రాఫిక్స్, ఇతర టూల్స్‌ను వాడుతున్నారు. కానీ ఏఐ టూల్స్‌తో ఆటోమేషన్ మరో స్థాయికి వెళ్తుంది.ఈ సమస్యకు సులభ పరిష్కారం లేదు. కాపీరైట్ల విషయంలో న్యాయ స్థానాలకు వెళ్లడం ఒక మార్గం. డేటా ప్రొటెక్షన్ చట్టాలు, ఏఐ నియంత్రణలు ఇప్పుడిప్పుడే ఏఐ టూల్స్ తాలూకూ సైడ్ ఎఫెక్ట్స్్పై దృష్టి పెడుతున్నాయి. కొంతమంది పబ్లిషర్లు, పుస్తక, సంగీత కంపె నీలు ఆదాయాన్ని పంచుకునే విషయంలో ఏఐ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తద్వారా తమ పుస్తకాలు, సంగీతం లేదా ఇతర కళలను ఏఐల శిక్షణకు ఉపయోగించుకునే వీలు ఏర్పడుతోంది. డేటా ట్రెయినింగ్ కోసం ఎటూ టెక్ కంపెనీలు తమ కళను వాడుకుంటున్నట్లు వీరు భావిస్తున్నారు. బదులుగా ఒప్పందం కుదుర్చుకో వడం మేలని వీరి ఆలోచన. అనుమతులు తీసుకుని కళలు, సమా చారాన్ని ఏఐ ట్రెయినింగ్ కోసం వాడుకోవడం ఇంకొక మార్గం. సోషల్ మీడియా వేదికలు కూడా ఏఐ ఆధారిత ఇమేజెస్, వీడి యోలు, యానిమేషన్లను అనుమతించే విషయంలో ఆచితూచి వ్యవ హరించాలి. ప్రస్తుత గిబ్లీ ఆర్ట్ ట్రెండ్ ముప్పు లేదని అనిపించవచ్చు. కానీ... వాస్తవానికి ఇది మనకు మేలుకొలుపు లాంటిది!దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత పెద్ద నగరం కట్టడానికి ఆ భూమి ఏమూలకూ చాలదు. ఇంకా 44 వేల ఎకరాలను సేకరించి మహా రాజధాని కడతాం అని.. చంద్రబాబునాయుడు ఈ కొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేశారు. కొత్తగా 44 వేల ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆయన సొంత వర్గానికి చెందిన అమరావతి ప్రాంత రైతులే ఈ ఆలోచన మీద ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. తా దూరను కంత లేదు.. మెడకో డోలు అన్నట్టుగా.. ఆల్రెడీ రాజధానిగా నోటిఫై చేసిన భూముల్లో ఏడాదిగా ఒక్క పని మొదలుపెట్టలేకపోయారు గానీ.. ఇప్పుడు ఇంకో 44 వేల ఎకరాలు అంటున్నారు. తమ వద్ద నుంచి సేకరించిన భూములలో తమకు హామీ ఇచ్చిన రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదాకా, నగర విస్తరణ పేరిట కొత్త భూసేకరణ/ పూలింగ్ ప్రయత్నాలను నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ.. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అమరావతి రాజధానిని ఇప్పుడు చంద్రబాబునాయుడే వంచించడానికి పూనుకున్నారు. అమరావతి ని రాజధానిగా పూర్తిగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతంలో.. భూములు ఇచ్చిన రైతులకు దామాషా ప్రకారంగా భూములకంటె విలువైన స్థలాలుగా మార్చి ఇస్తాం అని చంద్రబాబునాయుడు లాండ్ పూలింగ్ సందర్భంగా చాలా చాలా మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా దానిని నమ్మారు. నమ్మి ఇచ్చిన వారు కొందరైతే.. బెదిరించి ప్రలోభ పెట్టి బలవంతంగా మరికొందరితో కూడా భూములు లాక్కున్నారు. మొత్తానికి 54 వేల ఎకరాల వరకు సమీకరించారు. తొలి అయిదేళ్ల పాలనలో కేవలం డిజైన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు తగలేసి.. బొమ్మ చూపించి మాయచేస్తూ వచ్చారు. ప్రజలు నమ్మకం లేక ఓడించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. మంచి పాలనలో అధికారవికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆలోచన చేసి, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు తప్ప.. దానిని వ్యతిరేకించలేదు. అయితే.. చంద్రబాబునాయుడు అమరావతి రైతులను రెచ్చగొట్టి వారితో హైకోర్టులో కేసులు వేయించి.. అసలు ఏ పనీ ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ ప్రాంత క్లీనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ పనులు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అప్పుడే మరో 44 వేల ఎకరాలు రాజధాని విస్తరణకు సేకరిస్తాం అంటూ మరో పాట అందుకోవడంపై అమరావతి రైతులు రగిలిపోతున్నారు. ముందు మాకు మాట ఇచ్చిన విధంగా ఈ 54 వేల ఎకరాల రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసి.. మాకు కేటాయించిన స్థలాలు మాకు అప్పగించిన తర్వాతే.. మరో పూలింగ్ కు వెళ్లాలని వారు మొండికేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమను పక్కన పెట్టేసి, ఇంకో నగరం మాయతో తిరగకుండా అడ్డుకోవడానికి అమరావతి రైతులు తమ స్వబుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి డిమాండు సహేతుకమైనదే గనుక.. కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 44 వేల ఎకరాలంటూ చంద్రబాబు ఎంచుకున్న కొత్త డ్రామాకు ఆదిలోనే బ్రేకులు పడేప్రమాదం కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. తమ పట్ల చంద్రబాబు తలపెడుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక అమరావతి రైతులు కోర్టు గడప తొక్కడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది...ఎం. రాజేశ్వరి -
ట్రంప్ చర్యలతో అమెరికాకు అతి పెద్ద నష్టం ఇదే!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలవల్ల ఆ దేశానికి జరుగుతున్న అతి పెద్ద నష్టం ఏమిటి? స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోవటమా? బాండ్స్ మార్కెట్ దెబ్బ తినటమా? డాలర్ విలువ తగ్గుతుండటమా? ఇవేవీ కావు. అన్నింటికన్న ముఖ్యమైనది విశ్వసనీయతకు కలుగుతున్న నష్టం. స్టాక్స్‌ను, బాండ్లను, కరెన్సీ విలువను దిద్దుబాటు చర్యలతో పునరుద్ధరించుకోవచ్చు. కానీ విశ్వసనీయత (credibility) మౌలికమైనది. అది ఒకసారి దెబ్బతినటం మొదలైతే కోలుకునేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అమెరికాకు ఇది అన్నింటికి మించిన నష్టమవుతున్నది. మరొకవైపు బహుళ ధ్రువ ప్రపంచ బలోపేతానికి దోహదపడుతున్నది. ఇది అమెరికా (America) కోరుకోని ఫలితం.డాలర్ బాండ్ల సంక్షోభందీనంతటికీ ఆరంభం దిగుమతి సుంకాలను ఒకేసారి 184 దేశాలపై హెచ్చించటమన్నది తెలిసిందే. సుంకాల చెల్లింపులు గతంలోనూ ఉన్నవే. అమెరికాయే గాక ఇతరులూ అప్పుడప్పుడు చేస్తుండినవే. ట్రంప్ ఒక కొత్త పద్ధతిని అనుసరిస్తూ ఒకేసారి అందరిపై ఒకే విధంగా అన్ని సరకులపై 10 శాతం పెంచి, కొద్ది రోజుల తర్వాత ఆ యా దేశాలతో వాణిజ్య లోటు అనే మొత్తాలపై 50 శాతం పెంచారు. కానీ బాండ్ల మార్కెట్‌కు, డాలర్ విలువకు నష్టాలు మొదలు కావటం జరిగింది. ఆ మాట ఆయన బహిరంగంగానే అంగీకరిస్తూ, 50 శాతం సుంకాల హెచ్చింపును అమలుకు తెచ్చిన కొద్ది గంటలలోనే ఆ చర్యను 90 రోజులపాటు వాయిదా వేయవలసి వచ్చింది.ఇందులో బాండ్ల మార్కెట్ నష్టాలు అతి తీవ్ర మైనవి కావటం ఎందుకంటే, అమెరికన్ డాలర్ విలువ అతి సుస్థిరమైనదనీ, డాలర్ బాండ్లు కొన్న ట్లయితే తమ డబ్బుకు లభించే వడ్డీ ఆదాయం, దీర్ఘకాలిక భద్రత సురక్షితమనీ నమ్మేవారు ప్రపంచం అంతటి నుంచీ డాలర్ బాండ్లలో మదుపు చేస్తారు. ఆ విధంగా చైనా సైతం ఒక ట్రిలియన్ డాలర్లకుపైగా బాండ్లు ఖరీదు చేసిందంటే పరిస్థితిని ఊహించవచ్చు. ఎన్నడూ లేని విధంగా ఇపుడు ట్రంప్ ధోరణితో డాలర్ పట్ల, అమెరికా పట్ల విశ్వాసం దెబ్బతింటుండటంతో సామాన్య ప్రజల నుంచి ఆయా దేశాల వరకు ఆ బాండ్లను అమ్మడం మొదలైంది. అమెరికాకు అతి సన్నిహితమైన జపాన్ (Japan) ప్రభుత్వం సైతం వందలాది బిలియన్ల బాండ్లు సత్వరంగా విక్రయించిందంటే సమస్య తీవ్రతను గమనించవచ్చు. మరొకవైపు కొత్త బాండ్ల అమ్మకాలు ఆగిపోయాయి. ఈ ధోరణి కొనసాగితే, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది. దీనికితోడు డాలర్ విలువ (Dollar Value) తగ్గుదల సరేసరి. ఈ పరిణామాల కారణంగానే సుంకాలను 90 రోజులు వాయిదా వేయక తప్పలేదు. అంత చేసినా విశ్వసనీయతకు నష్టం జరగనే జరిగింది.లొంగని చైనా సుంకాలకు బెదిరి అమెరికాతో చర్చలకు కొన్ని దేశాలు సిద్ధపడటం నిజమే అయినా – కెనడా, యూరప్, చైనా (China) వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు అందుకు నిరాకరిస్తూ ఎదురు సుంకాలు విధించటం, అమెరికాకు అవసరమైన కీలకమైన ముడిసరకుల రవాణాను నిలిపివేయటం మొదలుపెట్టాయి. ఇది కూడా అమెరికన్ స్టాక్స్‌ను, బాండ్ల మార్కెట్‌ను, డాలర్ విలువను, ప్రజల నిత్యావసర సరకుల ధరలను ప్రభావితం చేయటం మొదలైంది.తమకు అన్నివిధాలా సవాలుగా మారిన చైనాను ఆర్థికంగా, ఇతరత్రా కూడా కట్టడి చేసేందుకు రిపబ్లికన్, డెమోక్రటిక్ ప్రభుత్వాలు రెండూ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. ఆ విధానాలు ఇప్పుడు ట్రంప్ రెండవ హయాంలో పరాకాష్ఠకు చేరుతున్నాయి. దీనంతటి నిజమైన ఉద్దేశం అమెరికా ఆర్థిక ప్రయోజనాల కన్నా తమను దీర్ఘకాలం పాటు దెబ్బతీయటమే అని భావిస్తున్న చైనా, ఎన్ని నష్టాలనైనా భరిస్తాముగానీ ఎటువంటి ఒత్తిడికైనా లొంగబోమని, చివరికంటా పోరాడుతామని ఒకటికి నాలుగు సార్లు స్పష్టం చేసింది.పేరు మోసిన ఆర్థిక నిపుణులంతా ట్రంప్ బృందానికి ఆర్థిక విషయాలపై అవగాహన లేదని వ్యాఖ్యానిస్తుండటం కూడా అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఆసక్తికరమైన దౌత్యనీతి ఛాయలు కనిపించటం మొదలైంది. అమెరికన్ మీడియా (American Media) వెల్లడించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి: ట్రంప్ అధికారులు చైనా అధికారులకు ఫోన్ చేసి, తాము పెంచిన సుంకాలకు పోటీగా చైనా ఇక పెంచవద్దనీ, అది చైనాకే నష్టదాయకమనీ కోరారు. కానీ చైనా ఆ మాటను లెక్కచేయక మరిన్ని సుంకాలు పెంచింది. ఆ వెనుక ట్రంప్ అధికారులు మరొకసారి చైనా అధికారులకు ఫోన్ చేసి, ఒకసారి జిన్‌పింగ్ (Xi Jinping) చేత ట్రంప్‌తో మాట్లాడించమని కోరారు. అందుకు చైనా అధ్యక్షుడు నిరాకరించారు. మరొకవైపు అమెరికా నష్టాలు కొనసాగటం, సుంకాలను 90 రోజులు వాయిదా వేసినా మార్కెట్లకు నమ్మకం ఏర్పడక ఒక రోజు విరామం తర్వాత తిరిగి పతనమవుతుండటం, బాండ్ల సమస్య, ఉత్పత్తులకు కొరతలు, ధరల పెరుగుదలలు కొనసాగటంతో పరిస్థితి అర్థమైంది. దానితో, సుంకాలు పెంచిన ఈ నెల 2వ తేదీ నుంచి సరిగా 10 రోజులు గడిచి 12వ తేదీ వచ్చేసరికి, చైనా నుంచిదిగుమతి అయ్యే సెల్ఫోన్లు, పలు ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సామగ్రిపై సుంకాల పెరుగుదలను ట్రంప్ నిలిపి వేశారు.చదవండి: ట్రంప్ సుంకాల సంక్షోభం.. అనూహ్య పరిణామాలుఇదిట్లుండగా, తన కొత్త విధానాల వల్ల అమెరికన్, తదితర పరిశ్రమలు అమెరికాకు తరలి రాగలవనే ట్రంప్ ఆశాభావానికి ఎవరి నుంచీ సుముఖత కనిపించటం లేదు. చట్టబద్ధత లేని వలస కార్మికులను పారదోలటంతో వ్యవసాయం, హోటళ్ల వంటి రంగాలు దెబ్బ తింటుండటంతో, వారి కొనసాగుదలకు యజమానులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నది ఇదే 12వ తేదీ నాటి మరో ఉత్తర్వు. పోతే, విద్యా వైద్య రంగాలలో కుదింపులు, విదేశీ సహాయాల (యూఎస్ ఎయిడ్ ద్వారా) రద్దు పేద దేశాలల్లో కలిగిస్తున్న హాని, ఆగని గాజా మారణకాండ వంటి ఇతర అనేక చర్యలు కూడా ట్రంప్ పట్ల, అమెరికా పట్ల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇది వారికి ఆర్థికానికి మించిన దీర్ఘకాలిక నష్టం.- టంకశాల అశోక్ సీనియర్ సంపాదకుడు -
అరకు ఆర్గానిక్ కాఫీ.. అలా విదేశాలకు ఎగిరింది!
ఈ తరానికి ‘ఫ్యాన్సీ’గా అనిపించే వైజాగ్–అరకు ‘గ్లాస్ రైల్’కు ‘అరకు కాఫీ’కి ఒక దగ్గర పోలిక ఉంది. కొండలు, లోయలు, గుహలు దాటుకుంటూ ఆ రైలు పట్టాలు వేసింది ‘డీబీకే’ రైల్వే లైన్ (దండకారణ్య–బోలానగిర్ – కిరుబురి) కోసం. ముడి ఇనుమును విశాఖపట్టణం పోర్టు నుంచి జపాన్ ఎగుమతి కోసం 1960లో దీన్ని వేశారు. తొలితరం గిరిజన జాతుల జీవితంలోకి ఈ ‘ప్రాజెక్టు’ తెచ్చిన మార్పులో ఆ తర్వాత కాలంలో కాఫీ కూడా భాగమైంది. తూర్పు కనుమల్లో ఒక్క విశాఖ మన్యసీమ మాత్రమే ఎందుకు ‘కాఫీ’కి నెలవయింది అంటే, ఇది సముద్ర మట్టానికి 900–1100 అడుగుల ఎత్తున ఉంది. వర్షపాతం 1000–1200 మి.మీ. ఉండి, కాఫీ మొక్క వేళ్ళకు తడి తగిలితే చాలు కనుక ఇక్కడి కొండవాలులు వీటి పెంప కానికి అనువు అయ్యాయి. ఎండ నేరుగా ఈ మొక్కలకు తగలకూడదు కనుక, నీడ కోసం పెంచే సిల్వర్ వోక్స్ చెట్లు (Silver Oak Trees) కూడా ఈ నేలలో బాగా పెరగడంతో అంతర పంటగా పెంచే మిరియాల పాదులు ఈ చెట్ల మధ్య పెంచుతారు. గిరిజనులకు అదొక అదనపు ఆదాయం.అటవీ శాఖ 1960లో అరకు, అనంతగిరి, చింతపల్లి, పాడేరు రిజర్వ్ ఫారెస్ట్‌లో కాఫీ తోటల (Coffee Plantation) పెంపకం మొదలు పెట్టింది. దాంతో సాగులో మెలకువలు, సాంకేతిక అంశాలు చూడడానికి కాఫీ బోర్డ్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం కూడా ఏజెన్సీకి వచ్చింది. అలా అటవీ శాఖ పెంచిన తోటలు 1985లో ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్‌కు అప్పగించే నాటికి వాటి విస్తీర్ణం 10,100 ఎకరాలు. ఇక ఎనభైల్లో పాడేరు ఐటీడీఏ (ITDA) వచ్చాక, విశాఖ ఏజెన్సీకి ఊరట కోసం వారాంతపు యాత్రలకు వచ్చే కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ‘వీఐపీ’లకు ఐటీడీఏ అధికారులు చూపించే ఒక టూరిస్ట్ స్పాట్‌గా మన్యసీమలో ఈ కాఫీ తోటలు మారాయి.అయితే వీటి విస్తీర్ణం 2002–03 నాటికి అరవై వేల ఎకరాలకు చేరినా, ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ప్రధాని అయ్యాక మాత్రమే, ‘గిరిజన్ కాఫీ’కి వాణిజ్యపరమైన విలువ పెరిగింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది ‘డవున్–టు–ఎర్త్’ ధోరణి కనుక, ముందు ‘భూమి’ – ‘మనిషి’, ఆ తర్వాతే కాఫీ అయినా దాని రుచి అయినా... అన్నట్టుగా మన్యం ‘కాఫీ’ గురించి ఆయన ఆలోచించారు. ప్రభుత్వం పెంచిన కాఫీ తోటలపై స్థానిక గిరిజనులకు యాజమాన్య హక్కులు ఇచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి రెండు ఎకరాలు ఇచ్చి వాళ్ళ తోటల్లో వాళ్ళు తమ పని చేసుకుంటుంటే, దాన్ని– ‘నెరేగా’ ఉపాధి హామీ క్రిందికి వైఎస్ తెచ్చారు. గిరిజనుల పట్ల ఆయన ధోరణి ఇటువంటిది కనుకనే, నక్సలైట్లను – ‘అయినా మీరు ఇంకా అడవుల్లో ఎందుకు బయటకు రండి’ అని చర్చలకు పిలిచారు.అరకు కాఫీ (Araku Coffee) తోటల పచ్చని భూముల కింది పొరల్లో బాక్సైట్ ఖనిజముంది. దాన్ని అల్యూమినియంగా మార్చి వ్యాపారం చేసుకోవడానికి కంపెనీలు 2009 నాటికే మన్యం ముఖద్వారం వద్ద ఫ్యాక్టరీలు పెట్టుకుని మరీ కనిపెట్టడం మొదలెట్టాయి. సరిగ్గా అప్పుడే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయిన డాక్టర్ జైరాం రమేష్ (Jairam Ramesh) కేంద్ర మంత్రి అయితే, ఆయన చేసిన అటవీ–వాణిజ్య శాఖల సేవలను వైఎస్ గిరిజనుల కాఫీ తోటల కోసం పూర్తి స్థాయిలో వాడుకున్నారు. కేంద్ర ‘ఉపాధి హామీ’ నిధులు 2009–10, మళ్ళీ 2015–16 మధ్య ఇలా రెండుసార్లు రూ. 287 కోట్లు, కాఫీ బోర్డు నిధులు రూ. 62 కోట్లతో 1.04 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు, మరొక లక్ష ఎకరాల్లో కాఫీ మొక్కలకు నీడ కోసం ‘షేడ్ ప్లాంటేషన్’ మొక్కలు ఆ కాలంలో నాటారు.చదవండి: ప్రైవేటు ఎత్తులకు చిత్తవ్వాల్సిందేనా?అయితే మన ‘కాఫీ కథ’ ఆ తోటల్లోనే ఆగిపోలేదు. కేంద్ర పరిశ్రమలు–వాణిజ్య సహాయ మంత్రిగా 2009 ఆగస్టు 13న ‘ఆసియాన్’ 49 దేశాలతో మన దేశం చేసు కున్న స్వేచ్ఛా వాణిజ్య ఒడంబడిక (ఎఫ్‌టీఏ) రూప కల్పనలో మంత్రి జైరాం రమేష్‌ది కీలక పాత్ర అయింది. ఆ ఒప్పందం 2010 జనవరి 1 నుండి అమలులోకి వచ్చేది. కానీ, వైఎస్ ఒత్తిడితో సీఎంఓ డిల్లీతో చేసిన నిరంతర ‘లాబీయింగ్’తో మన దేశం ఎగుమతి చేసే 489 వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో మన ‘గిరిజన్ కాఫీ’కి చోటు దొరికింది. ఒప్పందం ముగిసిన నెలకు ఆయన లేరు. ఇది జరిగిన మూడు నెలలకు మన గిరిజన్ కాఫీ ‘అరకు ఆర్గానిక్ కాఫీ’ బ్రాండ్‌తో రెక్కలు కట్టుకుని మరీ విదేశాలకు ఎగిరింది.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
వైరల్ : తప్పుడు వార్తలు ఎలా వ్యాపిస్తుంటాయంటే..
నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా చుట్టివచ్చేస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి సంగతే ఇది.‘‘మధ్యప్రదేశ్ లో నలుగురు వ్యక్తులు కలిసి, ఒక మేకను దేవుడికి బలి ఇవ్వడానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వారి వాహనానికి యాక్సిడెంటు అయింది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వంతెన మీద నుంచి సోమావతి నదిలోకి పడిపోయింది. మేకను బలి ఇవ్వడానికి తీసుకువెళుతున్న ఆ నలుగురు వ్యక్తులూ, ఆ ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కానీ దైవికంగా సంభవించిన చిత్రమేమిటంటే.. ఆ మేక మాత్రం క్షేమంగా బతికి బయటపడింది.’’ ఇలాంటి వార్త ఇక్కడ చూపిస్తున్న ఫోటోతో సహా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మనకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.‘దేవుడి మహిమ అంటే అదీ’ అని వాదించేవాళ్లు..‘వాళ్లు మేకను బలి ఇవ్వాలనుకున్నారు. దేవుడు వాళ్లనే బలి తీసుకున్నాడు’ అనే వాళ్లూ..‘దేవుడు కరుణమాయుడు.. తాగుబోతులను కాకుండా మూగజీవిని కాపాడాడు’ అని సూత్రీకరించేవాళ్లూ.. బోలెడు మంది తయారవుతారు.ఫోటోలో ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇది తప్పుడు వార్త! మరి ఫోటో ఎలా? అని సందేహించకండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారైన ఫోటో కావొచ్చు. వాహనం తలకిందులుగా పడి ఉంటే.. దాని నెంబర్ ప్లేట్ మాత్రం.. స్ట్రెయిట్ గానే కనిపిస్తుండడం ఈ ఫోటో ఫాబ్రికేషన్ లో ఒక లోపం.తత్వ ఇండియా (#thetatvaindia) అనే బ్లూటిక్ ఉన్న అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ పోస్టు పబ్లిష్ అయింది. 23 గంటలు కూడా గడవక ముందే.. ఈ పోస్టును కోటి మంది వీక్షించారు. దాదాపు 600 మంది తమ కామెంట్లను పంచుకున్నారు. దాదాపు మూడువేల మంది ఈ పోస్టును షేర్ చేశారు. దాదాపు 30 వేల మంది దీనిని లైక్ చేశారు. 1300 మంది వరకు బుక్ మార్క్ చేశారు. అంతగొప్పగా వైరల్ అయిన ఈ విషయాన్ని కాస్త లోతుగా గమనిస్తే.. అది కాస్తా తప్పుడు వార్త అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన మాట నిజం. కానీ ఈ పోస్టు మాత్రం తప్పు!వాస్తవాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని భేడాఘాట్ చౌకీతాళ్ కు చెందిన ఆరుగురు వ్యక్తులు.. నర్సింగ్‌పూర్ జిల్లాలోని దుల్హా దేవ్ మహరాజ్ ఆలయంలో బలి ఇవ్వడానికి మేకను తీసుకుని వెళ్లారు. ఆ ఆలయంలో ప్రతీకాత్మకంగా మాత్రమే బలి జరుగుతుంది. బలి ఇచ్చినట్టు గుర్తుగా మేక చెవులను మాత్రం కత్తిరిస్తారు. వీళ్లు ఆ బలి మొక్కుబడిని తీర్చుకుని గోటగావ్ నుంచి జబల్పూర్ కు తిరిగి బయల్దేరారు. చెవులు కత్తిరించిన మేక కూడా అదే వాహనంలో ఉంది. డ్రైవ్ చేస్తూనే బాగా మద్యం సేవించారు. జబల్పూర్ సమీపంలో ఛర్గావాన్ ప్రాంతానికి వచ్చిన తర్వాత.. అదుపు తప్పి వంతెన మీదనుంచి సోమవతి నదిలో పడిపోయింది. ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. మేకమాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన అసలు ఫోటో ఇది (తెల్ల స్కార్పియో ఉన్నది). వాహనంలో ఉన్న వాళ్లు మద్యం సేవించి నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.సంఘటన నిజంగానే జరిగింది. కానీ దానిని.. తమకు కావాల్సిన రీతిలో వక్రీకరించి సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు. ఏ రకంగా వక్రీకరించి ప్రచారంలో పెడితే.. వ్యూస్ ఎక్కువగా వస్తాయో.. ఇలాంటి తప్పుడు వ్యక్తులకు బాగా తెలుస్తుంది. అంత తెలివైన వాళ్లు కాబట్టే.. ఒక్కరోజు కూడా గడవకముందే కోటి వ్యూస్ సంపాదించుకున్నారు. దీనిని బట్టి నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే.. సోషల్ మీడియాలో ఏది కనిపిస్తే అది నిజం అని నమ్మకూడదు. కంటికి కనిపించేవి.. చెవులకు వినిపించేవి అన్నీ నిజం కాదు. బ్లూ టిక్ ఉన్నంత మాత్రాన ఆ సోషల్ మీడియా అకౌంట్లు నిజాలు చెప్పే నిజాయితీ ఉన్నవి అనుకోవడానికి కూడా వీల్లేదు. సోషల్ మీడియాలో ఏ సంగతి కనిపించినా.. ముందు దానిని అపనమ్మకంతో చూడాలి. ఇంకాస్త అనుమానం కలిగితే.. ఏదో ఒక రకంగా క్రాస్ చేసుకోవాలి. లేకపోతే.. ఈ తప్పుడు ట్వీట్ ను షేర్ చేస్తూ వెళ్లిన మూడు వేల మంది అమాయకుల్లో ఒకరుగా మనం కూడా మారిపోతాం...ఎం.రాజేశ్వరి -
తాత్కాలిక అధ్యాపకులకు భరోసా ఏది?
వివిధ కారణాలతో ఒక దశాబ్దానికి పైగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బంది నియా మకాలు చేపట్టకపోవటం వలన ఆ యా విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోనే యూజీసీ మార్గదర్శ కాల మేరకు అర్హత కలిగిన వారిని కాంట్రాక్ట్, అకడమిక్ కన్సల్టెంట్, పార్ట్ టైం ప్రాతిపదికన బోధనా సిబ్బందిగా నియమించుకుంటున్నాయి. రాష్ట్రంలోని 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో బడ్జెట్ ఆమోదం పొంది ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులలో దరిదాపు 900 మందికి పైగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన, 600 మందికి పైగా పార్ట్ టైం ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయా లలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని వివిధ వర్గాల నుండి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో 15 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయటానికి జీవో నెంబర్ 21 ద్వారా నియామకపు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో తాత్కాలిక అధ్యాపకులు ఆందోళన చెందుతూ ఉద్యమ బాట పట్టారు.దాదాపు 15 ఏళ్లుగా కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాప కులు తక్కువ వేతనాలతో విశ్వవిద్యాలయాలలోని పని భారాన్ని మోస్తున్నారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు రోస్టర్ పాయింట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటిస్తూ అర్హతగల వారిని కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాప కులుగా ఎంపిక చేసి ఆ యా విశ్వవిద్యాలయాలు వారి సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని మూడు విభాగాలలో... ముఖ్యంగా మొదటి విభాగంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంపిక కోసం వారి సామర్థ్యాన్ని పరిశీలించటానికి మార్గదర్శకాలు రూపొందించినట్లుగా కనపడుతుంది. కానీ విశ్వవిద్యాలయం లాంటి ఒక అత్యు న్నత విద్యాసంస్థ తరగతి గదిలో పాఠాలు బోధించటానికి అర్హత ప్రమాణాలు రూపొందించినట్లుగా కనిపించటం లేదు. అధ్యాపక నియామకాలకు కొత్తగా అర్హత ప్రమా ణాలు రూపొందించటాన్ని తప్పు పట్టలేము కానీ ఆ అర్హత ప్రమాణాలు యూజీసీ మార్గదర్శకాల మేరకు సమర్థంగా పాఠాలు బోధించే సామర్థ్యం కలవారిని, అనుభవం కలవారిని ఎంపిక చేసే విధంగా ఉండాలి. పీహెచ్డీలాంటి అత్యున్నత విద్యార్హతకు జాతీయ క్వాలిఫయింగ్ టెస్ట్ జేఆర్ఎఫ్కి సమానంగా మార్కులు కేటాయించటం ఏమిటి? అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామ కానికి ప్రధాన అర్హత పోస్టు గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ మార్కులకు వెయిటేజ్ ఇవ్వటం ఏమిటి? పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసెస్‌ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి పాఠాలు బోధించటానికి అత్యంత సమర్థత కలవారిని ఎంపిక చేయటానికి జీవో నెం. 21 మార్గదర్శకాలలో మార్పులు చేయవలసిన అవసరం కూడా ఉంది.తెలంగాణ రాష్ట్రంలోని 12 రాష్ట్ర విశ్వవిద్యాలయా లలో కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించకుండా, నియామకాలలో ప్రాధాన్యం ఇవ్వకుండా నియామకాలు చేపట్టటం అంటే దశాబ్దాలుగా విశ్వవిద్యా లయాలలో శ్రమ దోపిడీకి గురవుతూ తక్కువ వేతనాలతో పని చేస్తున్న వారికి అన్యాయం చేసినట్లుగానే భావించాలి. ‘పనికి మాత్రమే పనికొస్తామా! అవకాశాల కోసం పనికిరామా! మాకు ఉద్యోగ భద్రత కల్పించకుండా, మా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం విశ్వవిద్యాల యాలలో నియామకాలకు సిద్ధపడటం ఎంతవరకు సమంజసం’ అనే ప్రశ్నలు అధ్యాపక వర్గాల నుండి వçస్తున్నాయి. 2022లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలలో; పాలి టెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 8,000 మందికి పైగా అధ్యాపకుల క్రమబద్ధీకరణకు వ్యతి రేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భవి ష్యత్తులో విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల సేవలను క్రమబద్ధీకరించే అవ కాశాలు లేవు కాబట్టి తమకు టైం స్కేల్‌తో ఉద్యోగ భద్రత కల్పించి నియామకాలలో ప్రాధాన్యమిచ్చి, తదనంతర చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.డా. తిరుణహరి శేషు వ్యాసకర్త రాష్ట్ర పార్ట్ టైం అధ్యాపకుల సంఘం సలహాదారు -
వన్ వే రూటు
రుణపత్రాల విపణిలో ఉత్పన్నమైన అనూహ్య పరిణామాలు అమెరికా అధ్యక్షుడికి గుబులు పుట్టించాయి. అమెరికా బాండ్స్‌కు గిరాకీ పెరిగినట్లే పెరిగి వెంటనే తగ్గిపోయింది. డాలర్ ఇండెక్స్ విలువ కూడా క్షీణిస్తోంది. దీంతో కొత్త సుంకాల విధింపు అమలును 90 రోజుల పాటు నిలిపివేశారు. ఇతర ప్రపంచ దేశాల విషయంలో తాత్కాలికంగానే అయినా ఒక మెట్టు దిగిన ట్రంప్ చైనా విషయంలో మాత్రం చాలావరకు బెట్టుగానే ఉన్నారు. ఏమైనా, అమెరికా సృష్టించిన ఈ అల్లకల్లోలం రోడ్డు మ్యాపు లేని వన్ వే రూటు! ట్రంప్ సుంకాల సంక్షోభం మధ్యకాలిక అనిశ్చితిని పెంచుతుంది. ఆర్థిక కార్యకలాపాలు అంచనాల మీద ఆధారపడి ఉంటాయి. అనిశ్చితి అనేది అంచ నాలను మార్చేస్తుంది. వ్యాపార సంస్థలు, కుటుంబాలు నిర్ణయాలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తాయి. ట్రంప్ 90 రోజుల ఊరట నిజానికి ఈ అనిశ్చితి వ్యవధిని పెంచుతుందే తప్ప, అనిశ్చితికి ముగింపు పలకదు. ఆర్థిక కార్యకాలపాల్లో తెగింపు, నిర్ణయ శక్తి కొరవడతాయి. ప్రభుత్వాలు ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ, ప్రపంచ వ్యాప్త ఆర్థిక మందగమనం తప్పదు. సుంకాల వెనుక రెండు లక్ష్యాలువిచ్ఛిన్నకర సుంకాల ద్వారా రెండు లక్ష్యాలు సాధించాలని ట్రంప్ అనుకుంటున్నారు. అమెరికా వస్తూత్పత్తుల తయారీ వ్యవస్థ ఏనాడో కుప్పకూలింది. దీన్ని పునరుద్ధరించడం మొదటిది. తద్వారా దిగువ స్థాయి ఫ్యాక్టరీ ఉద్యోగాలు విశేషంగా సృష్టి అవుతాయి. ఇక రెండోది, చైనాను శిక్షించడం. ప్రపంచ వాణిజ్య విధానాన్ని అడ్డు పెట్టుకుని అది అనుచిత ప్రయోజనం పొందుతోంది. పాతికేళ్ల క్రితమే అమెరికాలో పాగా వేయ గలిగింది. ఈ రెండో లక్ష్యం కంటే, మొదటిదే ట్రంప్ రాజకీయ మద్దతుదారులకు మరింత ముఖ్య విషయం. దేశీయంగా పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కల్పించలేనప్పుడు, ధరలు పెరిగిపోతున్నప్పడు, చైనాను శిక్షించడం వల్ల అమెరికన్లకు ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ ఒక సమస్య ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి మొదటి లక్ష్యాన్ని సాధించడమే... చైనాను దెబ్బ తీయడమనే రెండో లక్ష్యం కంటే కష్టమైన విషయం. చైనా భౌగోళిక ఆర్థిక విస్తరణను అదుపు చేసే వ్యూహాలు ఇప్పటికిప్పుడు రూపొందినవి కాదు. గడచిన రెండు దశాబ్దాలుగా అమెరికాలో వీటి గురించి పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు, పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. ఇవి ఎలా ఉండబోతున్నాయో, వీటిని ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధం కావాలో చైనా ప్రభుత్వానికి మంచి అవగాహనే ఉంది. మరి, ట్రేడ్ వార్ పర్యవసానాలు ఎదుర్కొనేందుకు అమెరికా ఎంతవరకు సన్నద్ధంగా ఉందనేది ప్రశ్న. కర్మాగారాల స్థాపనకు కనీసం రెండేళ్లు పడుతుంది. ట్రంప్ నిరుద్యోగ మద్దతుదారులు అందాకా ఓర్పుతో ఉండగలరా? స్వల్పకాలంలో కష్టాలు, దీర్ఘకాలంలో లాభాలు అనే సూత్రం రాజకీయంగా కుదిరేది కాదు. ట్రంప్ స్వదేశంలోనే మద్దతు కోల్పేతే ఆయన విధానాలకు అంతర్జాతీయంగా స్పందన ఎలా ఉంటుంది?దేశాల స్పందనట్యారిఫ్ సంక్షోభం అనంతర కాలంలో ప్రపంచ దేశాలు అమెరికా మీద విశ్వాసం కోల్పోతాయి. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు తన విధానాలు, (వివాదాస్పద) మాటలు వెనక్కు తీసుకున్నా, ఆయన ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాధిపతులు విశ్వాసంలోకి తీసుకోరు! కెనడా, మెక్సికో, డెన్మార్క్, దక్షిణా ఫ్రికాలను ట్రంప్ బాహాటంగానే టార్గెట్ చేసి మాట్లాడారు. బ్రెజిల్, కొలంబియా, జర్మనీ, ఫ్రాన్స్,సింగపూర్, నమీబియా, ఆస్ట్రేలియా వంటి దేశాల అధినేతలు యూఎస్ అధ్యక్షుడిపై బహిరంగ విమర్శలకు వెనుకాడటం లేదు. యూరోపియన్ యూనియన్ ఈ విషయంలో ఒక్కతాటి మీద లేకున్నా, మెజారిటీ సభ్యదేశాలు అమెరికాను నమ్మే స్థితిలో లేవు. ఈయూ అటు చైనాతోనూ, ఇటు ఇండియా తోనూ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తుంది. బలహీన ప్రధాని నేతృత్వంలోని జపాన్ మాత్రం అమెరికాను ప్రాధేయపడుతున్నట్లు వ్యవహరిస్తోంది. ఏమైనా, అది కూడా చైనాతో వాణిజ్య సంబంధాలు స్థిరీకరించుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇండియా మౌనం వెనుక...ఇక ఇండియా నాయకత్వం అమెరికా ట్రేడ్ పాలసీ పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది. చైనాతో అమీతుమీకి ట్రంప్ సిద్ధపడటం ఇండియాకు ఆనందంగా ఉంది. మరోవంక, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందానికి చర్చలు జరుపుతోంది. అమెరికా నుంచి రక్షణ సామగ్రి, ఇతరత్రా దిగుమతులు పెంచు కునేందుకు సిద్ధపడుతోంది. అయినా కూడా, ట్రంప్ మొదటి విడత పదవీకాలంలో ఆయనతో వ్యవహరించినంత సంతోషంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దఫా ఉన్నారా? ట్రంప్ ఆయనకు చురకలు వేస్తూ మాట్లాడుతున్నారు. అంతగా స్నేహపూర్వకం కాని ధోరణిలో ఇండియా పేరు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎంతో సెల్ఫ్ ఇమేజ్, ఇగో ఉన్న మోదీ ఈ అవమానాలకు లోలోపల కుమిలిపోయే ఉంటారు!ఉభయ దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుస్థిరపరచుకోవాలని ఇండియా భావిస్తోంది. అయినా సరే, ఏ భారతీయ నాయకుడూ జపాన్, ఇటలీ మాదిరిగా ట్రంప్ ముందు సాగిలపడేందుకు సిద్ధంగా లేరు. బహుశా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్న నేపథ్యంలో మోదీ మౌనం పాటిస్తూ ఉండొచ్చు. దీంతో, గ్లోబల్ సౌత్ (పేద దేశాలు) తరఫున మాట్లాడేందుకు ఇతరులకు అవకాశం లభించింది. ట్రేడ్ ట్యారిఫ్లను వ్యతిరేకిస్తూ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు చైనా సంఘీభావం ప్రకటిస్తోంది. ఇండియా కూడా కలిసి రావాలని ఆహ్వానిస్తోంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా నాయకులు కూడా ఇతర వర్ధమాన దేశాలకు సంఘీభావం ప్రకటించాయి. ‘గ్లోబల్ సౌత్’ ఇండియా ‘వాయిస్’ కోసం ఎదురు చూస్తోంది.సంజయ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వైరుద్ధ్య భారతంలో జాతీయవాదమా?
బాబా సాహెబ్ అంబే డ్కర్ ఒక సందర్భంలో గాంధీజీతో జరిపిన సంభా షణలో ‘నాకు మాతృ దేశం లేదు’ అంటారు.అందుకు గాంధీజీ ‘లేదు, మీకు మాతృ దేశం వుంది’ అని బదులిస్తే... ‘మమ్మల్ని కుక్కలు, పందు లకంటే హీనంగా చూసే దేశాన్ని చూసి ఏ అంట రానివాడైనా ఈ దేశం నాది అని ఎలా అనుకో గలడు?’ అని అంబేడ్కర్ పేర్కొనడం విశేషం. భారత్‌లో ఇటీవలి కాలంలో జాతీయవాదం లేదా దేశభక్తి అనే భావనలు తరచూ వివాదాస్పద చర్చలకు దారితీస్తున్న క్రమంలో అంబేడ్కర్ జాతీ యవాదంపై వెలిబుచ్చిన అభిప్రాయాలను చర్చించడం అవసరం. ఒకవైపు బ్రిటీష్ వలసవాదం అంతమై దేశానికి పాలనాధికారాలు బదిలీ అవుతున్న సందర్భంలో ఆయన జాతీయవాదంపై వ్యక్తపరి చిన అభిప్రాయాలు ఎంతో కీలకమైనవి. బ్రిటిష్ పాలన అంతమొందడంతోనే ఇక్కడి సమస్యలన్నీ సద్దుమణిగిపోతాయని అంబేడ్కర్‌తో పాటు అణ గారిన కులాలు భావించకపోవడం గమనార్హం.బ్రిటిష్ వారికంటే ఇక్కడ ప్రత్యక్షంగా తమపై కుల దాష్టీకాన్ని ప్రదర్శించే నల్ల దొరలే తమ ప్రధాన శత్రువులు అనే అవగాహన అణగారిన వర్గాల్లో దేశ వ్యాప్తంగా పెంపొందింది. ఉత్తరాదిన పంజాబ్‌లో ‘ఆదిధర్మి’ ఉద్యమం, ఒరిస్సాలో ‘మహిమ ధర్మం’, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ రాష్ట్రాలలో ‘ఆది హిందూ’, దక్షిణాదిలో ‘ఆది ద్రావిడ’, ‘ఆది ఆంధ్ర’, ‘ఆది కన్నడ’ వంటి ఉద్య మాలు దళితులు ఈ దేశ మూలవాసులనే ఆత్మ గౌరవ ప్రకటనలు వెలువడుతున్న కాలమది. ఆధి పత్య కులాలకు చెందిన కవి గరిమెళ్ళ సత్యన్నా రాయణ బ్రిటిష్ వలస పాలనను వ్యతిరేకిస్తూ ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అనే గేయాన్ని రాస్తే... కుసుమ ధర్మన్న అనే దళిత కవి ‘మాకొద్దీ నల్ల దొరతనం’ అనే గేయాన్ని రాసి స్వరాజ్యం, స్వతంత్రం అనే అంశాలలో దళితుల ఆకాంక్షలను వ్యక్తీక రించడం గమనార్హం. తమిళనాట పండిత అయోతీ దాస్, పెరియార్ల నాయకత్వంలో జరిగిన ఆది ద్రావిడ ఉద్యమం కూడా ఆధిపత్య కులాల జాతీ యోద్యమంలో భాగస్వామి కాకుండా తమదైన స్వతంత్ర ఆకాంక్షలను వ్యక్తపరచడం చూస్తాం.ప్రాంతీయంగా వ్యక్తమవుతున్న అణగారిన కులాల స్వతంత్ర ఆకాంక్షలకు అంబేడ్కర్ జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తూ పెద్ద కాన్వాసు మీద తమ జాతీయవాదం ఏమిటో నిర్మొహ మాటంగా చెబుతూ బ్రాహ్మణ బనియాల జాతీయవాద లొసుగులను దుయ్యబట్టాడు. అనేక కులాలు, మతాలు, భాషలు, ప్రాంతీయ అస్తి త్వాలు, వాటిమధ్య వైరుద్ధ్యాలు గల భారతదేశం ఒక జాతిగా ఉండే అవకాశం లేదని చెబుతూ ఇక్కడ జాతీయతా భావన ఇంకా సాధించాల్సిన ఆదర్శమేనని పేర్కొన్నారు. ఈ ‘దేశభక్తులు’ ఎంత సేపటికీ తమకూ, తమ వర్గానికీ అధికారం దక్కా లని తాపత్రయ పడుతుంటారని అన్నారు. తన జాతీయవాదం అన్ని రకాల గుత్తాధిపత్యాలనూ తిరస్కరిస్తుందని అన్నాడు.అంబేడ్కర్ జాతీయవాదంపై వెలిబుచ్చిన భావాలకు నేటికీ ప్రాసంగికత ఉంది. ఆయన ఒక సందర్భంలో తన కాలపు దేశ భక్తులను ఉద్దేశించి వీరికి తమ పూర్వీకులు అణగారిన ప్రజలపై సాగించిన దారుణాలపై ఎటువంటి ప్రాయశ్చిత్త ధోరణీ లేకపోగా రాబోయే కాలంలో తమ వారు గతంలో సాగించిన ధోరణినే తిరిగి ప్రదర్శించడానికి వెన కాడబోరు అని పేర్కొన్నారు. అది ఈనాటి దేశ భక్తుల విషయంలో అక్షర సత్యమని తెలుస్తుంది. ఇప్పుడు అణ గారిన కులాలు, ఆది వాసులు, స్త్రీలు, మైనారిటీల పట్ల పెత్తందారీ కులాల వారు సాగించే హత్యలు, అత్యా చారాలు సమస్తమైన దౌర్జన్యాలకు వారు దేశభక్తినీ, దైవ భావ ననూ అడ్డు పెట్టుకోవడం కళ్ళారా చూస్తున్నాం. కుహనా జాతీయవాదుల రెండు నాల్కల ధోర ణిని ఆయన సరిగ్గానే అంచనా వేయడం గమ నార్హం. ఆయన చూపించిన వెలుగు దారిలో సమ కాలీన ప్రజా వ్యతిరేక శక్తుల ఆట కట్టించి సామా జిక, రాజకీయ వైరుద్ధ్యాలను పరిష్కరించుకోవడం మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. ప్రొ. చల్లపల్లి స్వరూపరాణి వ్యాసకర్త ప్రముఖ దళిత కవి, రచయిత్రి -
ఏదీ ఎండాకాలం ఎక్కడొచ్చింది.. ఆ రోజులెక్కడున్నాయి
ఏదీ ఎండాకాలం వచ్చిందన్నారు.. నాకేం కనిపించలేదేం... తెల్లారితే మొదలయ్యే కోయిల కూతలు ఎక్కడా లేవేం.. రెండు నెలలపాటు పెరట్లోని మామిడి చెట్టుమీద కూర్చుని పొద్దల్లా కచేరీ చేసే కోయిలల గుంపు లేనేలేదేం.. ఒకటి గొంతు ఆపగానే ఇంకోటి కూ.. కూ.. అంటూ అందుకునే రాగాలు కనిపించవేం..ఒంటిపూట బడులు ఇచ్చాక స్కూలు వదిలిపెట్టగానే నేరుగా ఇంటికి రాకుండా మామిడితోటలు.. జీడీ తోటల్లో తిరుగుతూ పచ్చిమామిడి కాయలన్నీ ఏరుకుని పుస్తకాల సంచుల్లో వేసుకుని ఎవరెక్కువ కాయలు ఏరుకుంటే వాడే హీరో అని చెప్పుకునే పిల్లలేరీ... ఆ పిల్లగ్యాంగులు ఎక్కడా కనిపించవేం..ఒరేయ్ ఎండల్లో ఎక్కడికి తిరక్కండి.. పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగలు తిరుగుతున్నారు.. వాళ్లకు కానీ దొరికితే మిమ్మల్ని మాయచేసి పిల్లులు.. కుక్కపిల్లల్లా మార్చేసి తీసుకెళ్ళిపోతారు అని తల్లిదండ్రులు చెప్పి మరీ ఎండాకాలం కాసేపు నిద్ర పుచ్చడానికి తాపత్రయపడిన సందర్భాలేవీ.. తల్లిదండ్రులు అలా నడుం వాల్చగానే పిల్లిలా అడుగులో అడుగువేసుకుంటూ బయటకు పారిపోయి చెట్లకిందమామిడి తోటల్లో చెట్లకింద జీడిపిక్కలు.. మామిడి టెంకలతో ఆటలాడుతున్న పిల్లలు ఏరీ.. ఏమైపోయారు వాళ్లంతా చెరువులు ఎండిపోయే కాలం. బురదలో దిగి నిక్కర్ ఎగేసుకుని చేపలు పట్టి ఇళ్లకు తీసుకెళ్తే ఎండల్లో మీకు ఇదేం పనిరా.. ఆ బురదలో పురుగుపుట్రా ఉంటే ఎంత ప్రమాదం అని నాన్న టెంకి జెల్లలు తగిలించిన సన్నివేశాలు ఊళ్లలో లేవేంది..స్కూళ్లకు సెలవులు ఇస్తున్నాను పట్నంలోని మామయ్య ఇంటికి వెళ్ళాలి అంటూ నాలుగురోజులు ముందే నిక్కర్లు .. చొక్కాలు సంచిలో సర్దుకుని అమ్మను కంగారు పెట్టె పిల్లకాయలు లేనేలేరేం... వాళ్ళంటా ఏమైపోయారు.. అసలు ఎండాకాలం అంటేనే గోళీకాయలు ఆట.. రౌండ్ గా ఒక వృత్తం గీసి మధ్యలో గోళీలు పెట్టి వృత్తం అవతలికి ఎగిరిపడేలా గోళీకాయలను కొట్టే ఛాంపియన్లు ఎక్కడికెళ్ళిపోయారు..రూపాయి తీసుకుని గంటకు అర్ధరూపాయి చొప్పున సైకిల్ అద్దెకు తీసుకుని గరుకు మెరకల్లో తొక్కడం నేర్చుకునే క్రమంలో మోకాలి చిప్పలు గీక్కుపోయిన పిల్లలూ లేరేం.. అసలు అద్దె సైకిళ్ళు ఇచ్చేవాళ్లంతా ఏమైపోయారు...ఒరేయ్ జాగ్రత్తగా దించండి.. ముంజెలు మాత్రం నాకు రెండు ఎక్కువ ఇవ్వాలి అంటూ. వాంతులు వేసుకుని మరీ తాటిముంచెలు పంచుకుని తినే పిల్లలెక్కడున్నారు...ఊళ్లలో ఐదారు ఇళ్లల్లోని ఆడాళ్ళంతా ఒక చోట చేరి చింతపండు పిక్కలు తీస్తూ కబుర్లు చెబుతూ.. సినిమా పాటలు పాడుకుంటూ గడిపే సన్నివేశాలు ఈ ఊళ్లోనూ లేవేంది..సెలవులకు పిన్ని.. బాబాయ్.. మేనత్తలు ఇళ్లకు వెళ్లి వచ్చేటపుడు వాళ్ళిచ్చే చిల్లర డబులు జేబులో ఉంచుకుని స్కూళ్ళు తెరిచాక వాటిని ఇంటర్వెల్లో ఐస్ క్రీములు.. చేరుకుముక్కలు కొనుక్కునేందుకు వాడుకునే పొదుపరి పిల్లలు కనిపించరేం..రానున్నది వానాకాలం .. ఈలోపే ఇల్లు నేయించాలి.. పాత రెల్లుగడ్డి తీసేసి కొత్త గడ్డి వేయించాలి అనే బాధ్యత.. బెంగతో గెడ్డలు.. వాగులు వంకలవద్ద రెల్లుగడ్డి కోసే ఇంటి పెద్ద లేనేలేడు అటు ఎండ కాస్తుండగా ఇటు చినుకులు రాల్తుంటే ఎండ వాన కుక్కలకు నక్కలకు పెళ్లి.. పెళ్లి అంటూ వీధుల్లో ఎగిరే చిన్నారుల సందడి ఎక్కడుంది...ఎండాకాలంలో ఒకేసారి పెద్దగా గాలివీయగానే మామిడి తోటలకు పరుగెత్తి రాలిన కాయలు ఏరుకొచ్చే పిల్లలూ.. పెద్దలూ ఎక్కడున్నారో...స్కూళ్లకు సెలవులిచ్చేశారు.. ఎండాకాలంలో మేము తిరప్తి వెళ్తాం.. సింహాచలం వెళ్తాము.. యాత్రలు తీర్థాలకు వెళ్లొస్తాం తెలుసా అంటూ తోటి పిల్లలతో గొప్పలు చెప్పుకునే గడుగ్గాయిలు కూడా లేరు.. ఇవేం లేకుండా వేసవికాలం ఎలా ఉంటుంది.. ఎలా వస్తుంది.. ఏమో కలం మారింది. వాటన్నిటినీ మింగేసిన వేసవికాలం మాత్రం వచ్చింది.. వేడిని తెచ్చింది.. ఇంట్లో ఏసీలు లేకుండా బతకలేని పరిస్థితిని తెచ్చింది. ఒకళ్ళ ఇళ్లకు ఇంకొకరు వెళ్లకుండా ఎవరిళ్ళలో వాళ్ళే ఉండేలా గిరిగీసేసిన అసూయలు .. తెచ్చింది...- సిమ్మాదిరప్పన్న -
అంబేడ్కరుని పాత్రికేయ ప్రమాణాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటే గుర్తొచ్చేవి రాజ్యాంగ రచన, అంటరానితనం, కులనిర్మూలన పోరాటాలు, పోరాడి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా దక్కాలన్న భావన, సమాలోచనలు. అయితే అంబేడ్కర్ గొప్ప పాత్రికేయులనీ, పాత్రికేయ ప్రమాణాలు, నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చేవారనీ, వాటిని కాపాడేందుకు స్వయంగా తానే పత్రికలు స్థాపించి అక్షర పోరాటం చేశారనీ చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన ‘మూక్ నాయక్’ (1920), ‘బహిష్కృత భారత్’ (1027), ‘సమత’ (1928), ‘జనత’ (1930) ‘ప్రబుద్ధ భారత్’ (1956) పత్రికలు స్థాపించి పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టారు. ప్రతి అక్షరాన్ని నిటారుగా నిలిపి, పాత్రికేయ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన ఏ పత్రిక ప్రారంభించినా, దానికి ఒక ప్రత్యేక అజెండా ఉండేది. ఆరంభ సంచికలోనే తానెందుకు, ఎవరి కోసం సదరు పత్రిక ప్రారంభించారో తెలియచేసేవారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కులవివక్ష, అంటరానితనం తనని ఎక్కువగా ప్రభావితం చేశాయని ‘బహిష్కృత భారత్’ పత్రిక లక్ష్యాన్ని వివరిస్తూ తొలిసంచికలో ‘సంతకపు సంపాదకీయం’(సైన్డ్ ఎడిటోరియల్) రాశారు. చైతన్య పరచడం ద్వారానే ప్రజల్లో కదలిక తీసుకురావడం సాధ్యమవుతుందనీ, దాన్ని సాధించడం కోసం ‘ప్రబుద్ధ భారత్’ పత్రిక ప్రారంభించాననీ ఆరంభ సంచికలో సంపాదకీయం ద్వారా పత్రిక అజెండాను చెప్పారు.అంబేడ్కర్ స్థాపించిన పత్రికల్లో అగ్రస్థానం ‘మూక్ నాయక్’దే! నూరేళ్ళ చరిత్రకు సాక్ష్యంగా నిలచి, ఈ మధ్యనే అక్షర సంబరాలు జరుపుకొన్న ఈ పత్రిక జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిందనే చెప్పాలి. నిర్భీతిగా, నిజంవైపు నిలబడడం, పాత్రికేయ విలువలు తు.చ. తప్పక పాటించడం, రాతల్లో అపోహలకు, అసత్యాలకు తావివ్వక పోవడం; కుల రాజకీయాలకు, వివక్షకు దూరంగా రచనలు చెయ్యడం వంటి సూత్రాలను కడదాకా పాటించారాయన. చాలా మటుకు భారతీయ పత్రికలు ఏకపక్షంగా రాస్తున్నాయనీ, కేవలం ఒక వర్గం తాలూకు అభీష్టానికి అనుగుణంగానే రాస్తున్నాయనీ, కొన్నిసార్లు ఊహాజనిత వార్తల్ని వండి వార్చుతున్నాయనీ దుయ్యబట్టారు. రాజ్యాంగ రూపశిల్పిగా, కేంద్ర మంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పేరు పొందిన తనపైనే అవాకులు, చవాకులు పేలడం తనను కలచివేసిందని, అందు వల్లనే తానీ పత్రిక ప్రారంభించడానికి సంకల్పించినట్లు తన సంపాదకీయంలో పేర్కొన్నారు. పెద్దలకు అనుకూలంగాను, పేదలు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగానూ పత్రికలు కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పెను ప్రమాదమని హెచ్చ రించారు. వెనుకబాటు తనానికి ఆర్థిక అంశాలు ద్వితీయ స్థానంలో ఉండగా, సామాజికాంశాలే ప్రథమ స్థానంలో ఉన్నా యనేది అంబేడ్కర్ నిశ్చితాభిప్రాయం. తద నుగుణంగానే రాజ్యాంగ రూపకల్పనలో సామాజిక రిజర్వేషన్లకు ప్రాధాన్యమిచ్చినట్లు తన రచనల్లో స్పష్టం చేశారు. పేదరికం, నిస్సహాయత, ఆత్మ న్యూనత, వెనుక బాటుతనం దాడి చేస్తుండడం వల్లనే అణగారిన వర్గాలు అభివృద్ధి ఫలాలను అందుకోలేక పోతున్నాయని, ఈ రుగ్మతల నుంచి మెజారిటీ జనాలను ‘విముక్తుల్ని’ చేయడమే తన ముందున్న లక్ష్య మని తన పత్రికల్లో పదే పదే ప్రస్తావించారు.మిగతా వృత్తుల కంటే జర్నలిజం ‘పవిత్ర’మై నదని, జనజాగృతికి, దిశానిర్దేశం చేయడానికి దీన్ని మించిన ‘వజ్రాయుధం’ మరోటి లేదన్నది అంబే డ్కర్ దృఢమైన అభిప్రాయం. సంచలనాల కోసం, తానెప్పుడూ తప్పుడు రాతలు రాయబోనని ప్రతిన బూనారు. పాత్రికేయునికి నైతికబాధ్యత ఆయుధమై ఉండాలన్నారు. జర్నలిజం వృత్తిని గౌరవించేవారు కనీసం ఆయన ప్రమాణాల్లో కొన్ని పాటించినా ఆ మహనీయునికి ఘననివాళి అర్పించినట్లే!ప్రొ‘‘ పీటా బాబీ వర్ధన్ వ్యాసకర్త మీడియా విశ్లేషకులుమొబైల్: 93931 00566 -
దూరదృష్టి గల సంస్కర్త
భారతదేశపు గొప్ప దార్శనికులలో ఒకరైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి ఈ రోజు. ఆయన వారసత్వాన్ని తక్కువ చేసి చూపించడానికి ఉద్దేశపూర్వకంగా అవాంఛ నీయ ప్రయత్నాలెన్నో జరిగాయి. శతాబ్దం గడచిన తర్వాత కూడా, అంబేడ్కర్ అంటే కేవలం ఒక దళిత నాయకుడిగా పరిగణించడం శోచనీయం. ఆయనను దళితులు, అణ గారిన వర్గాల ప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఆధునిక భారత దేశపు అగ్రశ్రేణి మేధావుల్లో ఒకరిగా పరిగణించాలన్నది అత్యావశ్యం. చదువుకునే రోజుల్లో పిల్లలంతా తాగే సాధారణ కుళాయి నుంచి నీళ్లు తాగడానికి కూడా ఆయనను అనుమతించేవారు కాదు. ఒకసారి మండు వేసవిలో దాహం తట్టుకోలేక దగ్గర్లో ఉన్న కుళాయి నుంచి నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తే... కట్టుబాట్లు ఉల్లంఘించారనే కారణంతో ఆయన మీద దాడికి తెగబడ్డారు. ఆ సంఘటన తరువాత చాలామంది తమ రాత ఇంతే అని సరిపెట్టుకుని ఉండేవారు. మరి కొందరైతే హింసా మార్గాన్ని ఎంచుకుని ఉండేవారు. కానీ, ఆయన అలా చేయలేదు. తనలోని బాధను గుండెల్లోనే అదిమిపెట్టుకుని జీవితాన్ని చదవడం నేర్చుకున్నారు. కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీలతో సహా ఎంఏ, ఎంఎస్సీ, పీహెచ్డీ, డీఎస్సీ, డీలిట్, బార్–ఎట్–లా పూర్తి చేశారు. ఏ పాఠశాలల్లో అయితే తనను చదువుకోవడానికి అనుమతించలేదో... అంతకు మించిన స్థాయిలో విదేశాల్లో విద్యను పూర్తి చేసి తానేమిటో సమాజానికి చూపించారు. అయినా తన మాతృభూమి, కర్మభూమి అయిన భారతదేశానికి తిరిగి వచ్చే విషయంలో స్పష్టమైన వైఖరితో ఉండేవారు.పేరెన్నికగన్న సంస్థల ఏర్పాటులో అంబేడ్కర్ పాత్ర విస్మరించలేనిది. ఆధునిక భారతదేశంలో ఆర్బీఐ, సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి అనేక సంస్థలు బాబాసాహెబ్ దూరదృష్టితో పురుడు పోసు కున్నవే. ఆర్థికశాస్త్రం, ఆర్థిక చరిత్రపై తన ప్రావీణ్యంతో భారత్ ఎదుర్కొంటున్న ద్రవ్య సమస్యలను ఆధారాలతో సహా ‘రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్’కు విశ్లేషణాత్మకంగా వివరించారు. ఫలితంగా ఒక సెంట్రల్ బ్యాంక్‌గా విధులను నిర్వర్తించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు పునాది పడింది.గట్టి ప్రజాస్వామ్యవాదిఅంబేడ్కర్ దృఢమైన ప్రజాస్వామ్యవాది. భారత దేశపు భవి ష్యత్తు, దాని ప్రజాస్వామ్యం, కష్టపడి సంపాదించిన స్వాతంత్య్రం గురించే ఆయన ఎక్కువగా ఆలోచించేవారు. రాజ్యాంగ సభలో ఆయన చివరి ప్రసంగంలో ఈ భయాందోళనలు సుస్పష్టంగా వ్యక్తమ య్యాయి. ఆయన హెచ్చరికలే భారతదేశాన్ని దాదాపు ఎనిమిది దశా బ్దాలుగా ప్రజాస్వామ్య మార్గంలో నడిపిస్తున్నాయి. అయితే నేడు కులం, మతం, జాతి, భాష మొదలైన సామాజిక విభేదాలతో భారతీ యుల మధ్య సోదరభావాన్ని తగ్గించే ప్రయత్నాలను చూస్తున్నాం.ఆర్య–ద్రావిడ విభజన నుంచి ఎక్కువ ప్రయోజనం పొందగలిగే సమయంలో కూడా ఆర్య దండయాత్ర సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తప్పు పట్టారు. ‘ఒక తెగ లేదా కుటుంబం జాతిపరంగా ఆర్యులా లేదా ద్రావిడులా అనేది విదేశీ వ్యక్తులొచ్చి విభజన రేఖ గీసేవరకు భారత ప్రజల మదిలో ఇలాంటి ఆలోచనలు తలెత్తలే’దని 1918లో ప్రచురించిన ఒక పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. పైగా యజుర్వేద, అధర్వణ వేదాల్లోని రుషులు శూద్రులకు తగిన ప్రాధాన్యమిచ్చిన అనేక సందర్భాలను ఉదాహరించారు. ఆర్యులు, ద్రవిడుల కంటే అంటరానివారు జాతిపరంగా భిన్నమైనవారనే సిద్ధాంతాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు.తమ సంకుచిత, మతపరమైన ప్రయోజనాల కోసం భాషా సమస్యలను సాకుగా చూపించేవారు దేశ ఐక్యత విషయంలో అంబే డ్కర్ అభిప్రాయాలను తెలుసుకుంటే ఎంతో ప్రయోజనం పొందుతారు.తాను ప్రావీణ్యం సంపాదించిన తొమ్మిది భాషలలో ఒకటైన సంస్కృతాన్ని అధికారిక భాషగా ఆమోదించడానికి మద్దతుగా 1949 సెప్టెంబరు 10న ఆయన రాజ్యాంగ సభలో ఒక సవరణను ప్రవేశ పెట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై తన ఆలోచనలు వెల్లడిస్తూ... ‘హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి’ అని ప్రకటించారు. హిందీ మాట్లాడే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాక పోయినప్పటికీ, దేశ ప్రాధాన్యాలకు ప్రథమ స్థానమిచ్చా రన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఆయన దార్శనికతకు అనుగుణంగా...’ప్రజాస్వామ్యం విజయవంతంగా సాగడానికి అనుసరించా ల్సిన పద్ధతుల’పై 1952 డిసెంబర్ 22న ఒక ప్రసంగమిస్తూ... ప్రజా స్వామ్యం రూపం, ఉద్దేశం కాలక్రమేణా మారుతాయనీ, ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే ఆధునిక ప్రజాస్వామ్యపు లక్ష్యమనీ పేర్కొ న్నారు. ఈ దార్శనికతతోనే మా ప్రభుత్వం గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో విజయం సాధించింది. 16 కోట్ల గృహాలకు కుళాయి నీటిని అందించడానికి కృషి చేశాం. పేద కుటుంబాల కోసం 5 కోట్ల ఇళ్లను నిర్మించాం. 2023లో ‘జన్ మన్ అభియాన్’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ ప్రారంభించారు. బలహీన గిరిజన వర్గాల (పీవీటీజీ) సామాజిక– ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, పీవీటీజీ గృహాలు–ఆవాసా లకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం దీని లక్ష్యం. ప్రధాన మంత్రి 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇది బాబాసాహెబ్ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాదు, బాబాసాహెబ్ వారసత్వం, రచనల గురించి భవిష్యత్ తరాలకు మరింతగా తెలియజెప్పడానికి, మా ప్రభుత్వం పంచతీర్థాన్ని అభివృద్ధి చేసింది. అంబేడ్కర్‌తో ముడిపడిన మహూ (మధ్యప్రదేశ్); నాగపూర్ (మహారాష్ట్ర) లోని దీక్షా భూమి; లండన్ లోని డాక్టర్ అంబేడ్కర్ మెమోరియల్ హోమ్; అలీపూర్ రోడ్ (ఢిల్లీ) లోని మహాపరినిర్వాణ భూమి, మరియు ముంబయి (మహారాష్ట్ర) లోని చైత్య భూమిలే ఆ పంచ తీర్థాలు.గత నెలలో ప్రధాని దీక్షాభూమిని సందర్శించినప్పుడు, బాబా సాహెబ్ ఊహించిన భారతదేశాన్ని సాకారం చేయడానికి మరింత కష్టించి పనిచేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అంబేడ్కర్ ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకుంటామంటూ ప్రతిజ్ఞ చేసే అవకాశాన్ని ఆయన జయంతి కల్పిస్తోంది. జాతి, మత, ప్రాంత, కులాలకు అతీతంగా మనమంతా ‘భారతీయులు’గా సాగిపోదాం. ఆయన్ని ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడిగా చేసే ప్రయత్నాలను అడ్డు కోవాలి. ఒక సందర్భంలో సైమన్ కమిషన్ ఆధా రాల గురించి అడిగితే... ప్రాంతీయ దురభిమానమూ, సమూహ భావనలకూ లోనయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తూ, ‘మనమె ప్పుడూ భారతీయులమే’ అన్న చైతన్యాన్ని ప్రజల్లో కలిగించడం అత్యవశ్యమని చెప్పారు. బాబాసాహెబ్... భారతదేశానికి దేవుడి చ్చిన వరం. ప్రపంచానికి భారతదేశమిచ్చిన బహుమతి. అప్పటి బ్రిటిష్ ఇండియా గానీ, నవ స్వతంత్ర భారతం గానీ ఇవ్వని గౌరవ పీఠాన్ని మనం ఆయనకిద్దాం.రాజ్‌నాథ్ సింగ్‌వ్యాసకర్త భారత రక్షణ మంత్రి -
మహువా మొయిత్రా (ఎంపీ) రాయని డైరీ
పురుషుడితో గొడవ పడిన స్త్రీ పూర్తిగా అతడిని పట్టించుకోవటం మానేస్తుంది. స్త్రీతో గొడవ పడిన పురుషుడు మరింతగా ఆమెను పట్టించు కోవటం మొదలు పెడతాడు! నిజానికది పట్టించుకోవటం కాదు, ఆమె తనని పట్టించు కోక పోవటాన్ని పట్టించుకోవటం! కానీ ఎంపీలు కూడా ఇలా స్త్రీ, పురుషులుగా గొడవ పడాల్సిందేనా? ఏ నాగరికతా, ఏ పదవీ బాధ్యతా... స్త్రీని స్త్రీగా, పురుషుడిని పురుషుడిగా కాక, పరిణతి చెందిన ఒక మనిషిగా ఉంచలేవా? కల్యాణ్ బెనర్జీ, నేనూ లోక్‌సభ ఎంపీలం. కానీ మా మధ్య ఘర్షణను ఇద్దరు ఎంపీల మధ్య ఘర్షణలా అతడు ఉండనివ్వటం లేదు!లోక్‌సభలో అతడు పార్టీ చీఫ్ విప్. సభలో తృణమూల్ ఎంపీలు ఎవరు మాట్లాడాలన్నది అతడిదే నిర్ణయం. ఎవరు మాట్లాడకూడదన్నదీ అతడి నిర్ణయమే. లోక్‌సభలో మొత్తం 28 మంది తృణమూల్ ఎంపీలం ఉన్నాం. అందర్నీ మాట్లాడనిచ్చేవారు కల్యాణ్ బెనర్జీ. నా దగ్గరికి వచ్చేసరికి ‘నో’ చెప్పేవారు! ‘‘నేను మాట్లాడతాను’’ –‘‘నో’’‘‘నాకు అవకాశం ఇవ్వండి’’ – ‘‘నో’’‘‘రెండే రెండు నిమిషాలు...’’ –‘‘నో’’‘‘నన్ను చెప్పనివ్వండి ప్లీజ్..’’ – ‘‘నో’’కల్యాణ్ బెనర్జీ నాకన్నా 18 ఏళ్లు పెద్దవారు. 16 ఏళ్లుగా ఎంపీగా ఉంటున్నవారు. నిన్న మొన్న, ఆరేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన నాతో ఈయనకు ఏంటి ప్రాబ్లం?! ‘‘ఎందుకు మీరు నన్ను మాట్లాడనీయటం లేదు మిస్టర్ బెనర్జీ?’’ అని లాస్ట్ సెషన్లో మళ్లీ అడిగాను. కళ్లింత చేశారు! ‘‘ఫస్ట్ మీరు మీ చీఫ్ విప్‌తో మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఆ తర్వాత మీకు సభలో మాట్లాడే అవకాశం వస్తుంది. మిస్టర్ బెనర్జీ ఏంటి... మిస్టర్ బెనర్జీ? మన చైర్‌పర్సన్‌ని కూడా ఇలాగే ‘మిస్ బెనర్జీ’ అనేసేలా ఉన్నారు?’’ అన్నారు! మధ్యలోకి దీదీజీని ఎందుకు తెచ్చినట్లు!ఏప్రిల్ 4న తృణమూల్ ఎంపీలం అందరం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్‌కి వెళ్లాం. డూప్లికేట్ ఓటర్ ఐడీ నంబర్లు తొలగించాలని డిమాండ్ లెటర్ తయారు చేసి, అందులోఅందరి సంతకాలూ తీసుకున్నారు కల్యాణ్ బెనర్జీ... ఒక్క నా సంతకం తప్ప!‘‘ఏమిటిది మిస్టర్ బెనర్జీ! ఎందుకిలా చేస్తున్నారు?’’ అని అడిగాను.ఆ మాటకు అక్కడ సమాధానం చెప్పకుండా తృణమూల్ ఎంపీల వాట్సాప్ గ్రూప్‌లో నాపై పోస్టులు పెట్టారు. ‘‘ఇంగ్లిష్‌లో మాట్లాడగలనని అహంకారం... ఆఇంటర్నేషనల్ లేడీకి...’’ అని నా పేరెత్తకుండా అన్నారు! నవ్వొచ్చింది నాకు. సమాధానం లేనప్పుడు... ‘పెద్ద మగాళ్లం’ అనుకునే మగాళ్లు కూడా ఇలాగే చిన్నపిల్లల్లా మాట్లాడతారు! గ్రూప్‌లోంచి బయటికి వచ్చేశాను. వెంటనే నన్ను వెతుక్కుంటూ వచ్చారు సాగరికా ఘోష్! సాగరిక రాజ్యసభ ఎంపీ. ‘‘ఏప్రిల్ 4న జరిగిన దానికి దీదీజీ చాలా కోపంగా ఉన్నారు మొయిత్రా. కల్యాణ్ బెనర్జీతో తగాదా మానేయమంటున్నారు. సోమవారం లోపే ఇదంతా ముగిసిపోవాలని దీదీజీ కోరుకుంటున్నారు...’’ అన్నారు సాగరిక. ఆ విషయాన్ని దీదీజీనే నేరుగా నాతో ఎందుకు చెప్పలేకపోయారు!‘‘అంబేడ్కర్‌ని ఓన్ చేసుకోటానికి రేపు ఏప్రిల్ 14న బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని దీదీజీ అంటున్నారు మొయిత్రా. మహిళలకు రాజకీయాల్లో గౌరవం దక్కాలని అంబేడ్కర్ ఆకాంక్షిస్తే, తృణమూల్ పార్టీలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్న మాటను రానీయకూడదని మీకు చెప్పమన్నారు... ’’ అన్నారు సాగరిక. ‘‘అంటే, కల్యాణ్ బెనర్జీకి నన్ను అపాలజీ చెప్పమని అంటున్నారా?’’ అని అడిగాను. ‘‘లేదు. మిమ్మల్ని వెంటనే ఎంపీల వాట్సాప్ గ్రూప్‌లోకి తిరిగి వచ్చేయమంటున్నారు...’’ అన్నారు సాగరిక!!రెండూ ఒకటే కదా! కాదా?! - మాధవ్ శింగరాజు -
రామయ్య నిష్క్రమించే ... వనమల్లా విలపించే
నాడు శ్రీరాముడు అయోధ్యను వీడి సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళినపుడు అయోధ్యాపురం కంటికిమింటికి రోధించిందట.. నేడు.. ఆ వనమాలి .. వనజీవి రామయ్య భూలోకాన్ని వీడి దివికేగిన తరుణంలో వనాలు విలపించావా.. తమను ఇన్నాళ్లూ సాదుకుని ఆదుకుని నిలబెట్టిన రామయ్య తానే కాలం ఒడిలో ఒదిగిపోతే మొక్కలు.. మానులు.. తీగలు లతలు అల్లాడిపోవా.. తలవంచి విలపించవా..ఎక్కడెక్కడో.. ఏ రోడ్డుమీద ఏ లారీకింద పది నలిగిపోవాల్సిన గింజలను ఏరుకొచ్చి ఒడిలో వేసుకుని భద్రంగా తీసుకెళ్లి అడవిలో ఓ చిన్న గొయ్యి తీసి.. వాటిని నాటి.. పెరిగేవరకూ కంటికి రెప్పలా చూసుకునేవారు. అవి పెరిగిపెద్దవవుతుంటే తన బిడ్డలే ఎదుగుతున్న భావన. గాలికి ఒరిగిపోకుండా వాటికి తన చిటికెనవేలు మాదిరి ఓ కట్టెపుల్లను దాన్నుగా ఉంచి పెంచాడు. అవి పెద్దవై పూలు.. పళ్ళు.. కాయలు ఇస్తుంటే పసిపిల్లాడి లెక్క కేరింతలు కొట్టేవాడు. ఎక్కడైనా మొక్కలు చెట్లు చనిపోయేలా ఉంటే తన చేత్తో తీసుకెళ్లి నీళ్ళుపోసి వాటి ప్రాణం నిలబెట్టేవారు. ఒకటా రెండా.. దశాబ్దాలుగా లక్షలాది మొక్కలపాలిట దేవుడాయన .. దేవుడంటారో.. బిడ్డల్ని పెంచిన తండ్రి అంటారోగానీ వనజీవి రామయ్య కన్నుమూత సమాచారం వనానికి అందింది.. .. మొక్కలను చేరింది.. తీగలకు తెలిసింది ... మానులకు చెవినపడింది..క్షణాల్లో వార్త అడవంతా వ్యాపించింది.. మొక్కలు చెట్లు తీగలు లతలు అంతా ఏకమై తమ ప్రాణాలను ఎవరో తీసుకుపోయారన్నంతగా రోదించాయి.. వేపమాను విలవిల్లాడింది ..రేపట్నుంచి తమ విత్తనాలు ఎవరు సేకరిస్తారు..ఎవరు ఏరుకెళ్ళి వేరే ప్రాంతంలో తమ శాఖను జాతిని విస్తరిస్తారు అంటూ కుమిలిపోయింది. జామచెట్టు జవగారింది.. తన పెద్దవేరును ఎవరో గొడ్డలితో నరికినంత పనైందని కుమిలిపోయింది. మల్లెతీగ మ్రాన్పడిపోయింది .. మందారం బాధతో ముడుచుకుపోయింది. చింత మాను చిన్నబోగా మద్ది చెట్టు మూలకుచేరి వెక్కివెక్కి ఏడ్చింది. బంతిమొక్క బావురుమనగా సన్నజాజి చిన్నబోయింది.ఒకటా రెండా.. వేలాది ముక్కలు తమకు జీవాన్ని జీవితాన్ని ఇచ్చిన రామయ్యకు సద్గతులు కలగాలని మొక్కాయి..మొక్కుకున్నాయి.. మున్ముందు కూడా ఇలాంటి రామయ్యలు భూమ్మీద జన్మించాలని.. వారి ద్వారానే వనాలు..తద్వారా జనాలు సైతం సుభిక్షంగా జీవిస్తారని ఆశించాయి. వనాల మారిన బతికే జీవాలు.. కూడా రామయ్య వంటి వాళ్ళు యుగానికొక్కరైనా పుట్టి దేశాన్ని సస్యశ్యామలం చేయాలని కోరుకున్నాయి..(వనజీవి రామయ్యకు సంతాపం తెలిపేందుకు ఈ కథనం)-సిమ్మాదిరప్పన్న -
గాడి తప్పిన గవర్నర్లకు పెద్ద గుణపాఠం
సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు గాడి తప్పిన గవర్నర్లకు పెద్ద గుణపాఠం. రాజ్యాంగ నిపుణులైన న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, ఆర్. మహ దేవన్లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వం తమ గవర్నర్ బాధ్యతా రాహిత్యంపై దాఖలు చేసిన పిటిషనన్‌పై చిర కాలం నిలిచిపోయే తీర్పు ఇచ్చింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఏ నిర్ణయమూ తీసుకోకుండా తన దగ్గరే ఉంచుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) తలుపు తట్టింది. బిల్లులను తొక్కిపట్టడం రాజ్యాంగ నేరం అని దూషించకపోయినా, అది రాజ్యాంగ పరమైన నైతిక చర్య కాదని పెద్ద పదాలు వాడుతూ తమిళనాడు గవర్నర్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఒక్క తమిళనాడు గవర్నర్ (Tamil Nadu Governor) మాత్రమే కాదు. కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒక్కటేమిటి... చాలా రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగాన్ని అనేకసార్లు అతిక్రమించారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ మాత్రం కొనసాగుతూనే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200... ‘వీలైనంత తొందరగా’ (యాజ్ సూన్ యాజ్ పాజిబుల్) తన దగ్గరకు వచ్చిన శాసనసభ (Assembly) ఆమోదించిన బిల్లులపై సంతకం పెట్టాలని పేర్కొంటోంది. కానీ తమిళ నాడు గవర్నర్ రవి తన దగ్గరకు వచ్చిన బిల్లులపై నెలల తరబడి అసలు ఏ నిర్ణయమూ తీసుకోకుండా తొక్కిపట్టారు. ప్రతిదానికీ కాలపరిమితనేది ఒకటి ఉంటుంది. రాజ్యాంగంలో అక్షరబద్ధం కాలేదనే వంకతో ఇష్టమొచ్చినంత కాలం బిల్లులకు ఆమోదం తెలపకపోతే పాలన ఎలా జరుగుతుంది?ఆర్టికల్ 200 ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత గవర్నర్లపై ఉంది. ఒక బిల్లుపై సమ్మతిని ఆపాలన్నా, లేదా అభ్యంతరాలు ఉండి రాష్ట్రపతికి నివేదించాలన్నా నెల రోజుల్లోగా గవర్నర్లు ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందనే కనీస విజ్ఞత ఉండదా? పది బిల్లులను ఏ నిర్ణయం తీసుకోకుండా ఎలా ఆపుతారు? అందుకే ఈ తీర్పులో ‘బిల్లుపై తమ అభ్యంతరాలను తెలియచేస్తూ గవర్నర్లు 3 నెలల్లోగా అసెంబ్లీకి వాపసు చేయాల్సి ఉంటుంది. బిల్లుపై తన అభ్యంతరాలను రాష్ట్రపతికి తెలియచేయాలనుకుంటే గరిష్ఠంగా మూడు నెలల్లో ఆ పని చేయాల్సిఉంటుంది. అసెంబ్లీలో రెండోసారి ఆమోదం పొంది వచ్చిన బిల్లుకు నెల రోజుల్లోగా గవర్నర్లు తమ సమ్మతిని తెలియచేయాల్సి ఉంటుంది.గవర్నర్లు సత్వరంగా చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం ఆశిస్తున్నది. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం ప్రజాస్వామ్య పాలన స్ఫూర్తిని ఉల్లంఘించడమే’ అని స్పష్టంగా చెప్పవలసి వచ్చింది. రాజ్యాంగ పరంగా అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి చర్యల కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఈ మార్గదర్శకాలు అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు మిగతా గవర్నర్లకూ మార్గదర్శకాలు అవుతాయి. బిల్లులపై సమ్మతి తెలియజేయకుండా శాశ్వతంగా పెండింగ్‌లో ఉంచే అధికారం గవర్నర్లకు లేదని ఉన్నత న్యాయస్థానం మరీ మరీ చెప్పింది. గవర్నర్లకు మూడు అవకాశాలు మాత్రమే ఉంటాయని, ఒకటి బిల్లుకు సమ్మతి తెలియచేయడం, రెండు అభ్యంతరాలతో అసెంబ్లీకి బిల్లును తిప్పి పంపడం, మూడు రాష్ట్రపతికి నివేదించడమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వివరించింది.వాటిలో ముఖ్యమైన మార్గదర్శకం ఇది: ‘ఏదైనా బిల్లును పునఃపరిశీలనకు పంపాక అసెంబ్లీ మళ్లీ దాన్ని ఆమోదించి రెండవసారి గవర్నర్‌కు పంపించిన పక్షంలో అటువంటి బిల్లును గవర్నర్ రాష్ట్రపతికి నివేదించడానికి వీల్లేదు. అలా చేయడం చట్టవిరుద్ధం. ఒకవేళ రాష్ట్రపతికి నివేదించదలిస్తే నెలరోజుల్లోగా దానిపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతికి నివేదించాల్సిన అవసరం లేదని భావించిన పక్షంలో మూడు నెలల్లోగా బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి’.చదవండి: కాలంతో కాలు కదిపితేనే.. కాంగ్రెస్‌కు మళ్లీ పాత రోజులుజవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) కాలంలోనే కాదు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రధానుల కాలంలోనూ దారుణంగా గవర్నర్లు ప్రజాస్వామ్యంతో ఆట లాడుకున్నారు. గతంలో కర్ణాటక, బిహార్, ఆంధ్రప్రదేశ్, కేరళల్లో గవర్నర్లు హద్దులు మీరారు. ఎన్టీఆర్ (NTR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ రామ్‌లాల్ ఆయన ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇదే దారిలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలున్న కాలంలోనూ గవర్నర్లు వ్యవహరించారు, వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య కాలంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ వ్యవహారశైలి కూడా వార్తలకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా సరైన తీర్పు ఇచ్చిందనే భావించాలి.- మాడభూషి శ్రీధర్ మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
ఇది కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు!
కాంగ్రెస్ పునర్వైభవం, కాంగ్రెస్ కన్నా దేశానికి ఎక్కువ అవసరమనే ప్రజల ఆకాంక్షని పార్టీ నాయకత్వం గ్రహించినట్టుంది. కానీ, అదెలా జరగాలనే విషయంలో దానికొక స్పష్టత లేదని ఏఐసీసీ 86వ జాతీయ సమావేశాన్ని చూస్తే అర్థమవుతుంది. పాత విషయాల వల్లెవేతే తప్ప... జాతికి నూతన ఆశలు కల్పించే, మిత్రపక్షాలకు కొత్త నమ్మిక ఏర్పరిచే, పార్టీ శ్రేణులకు తాజా ప్రేరణనిచ్చే అంశా లేవీ తీర్మానాల్లోకి రాలేదు. కాలం చెల్లిన అంశాలను వల్లెవేయడం కాకుండా కాలంతో కాలు కదిపితేనే కాంగ్రెస్‌కు మళ్లీ పాత రోజులు వస్తాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు బలంగా నమ్ము తున్నారు. ఆ దిశలో నాయకత్వమే చొరవ చూపటం లేదు. జాతిపిత గాంధీజీ ఆశ్రమం నెలకొల్పిన సబర్మతి నదీ తీరంలో జరిగిన రెండు రోజుల కాంగ్రెస్ జాతీయ సదస్సు (Congress National Convention) ‘మరో భేటీ’ లాగ, సాదాసీదాగానే ముగిసింది. కాంగ్రెస్ మహామహుల పుట్టిల్లయి ఉండీ, మూడు దశాబ్దాలుగా అధికారానికి పార్టీ దూరమైన గుజరాత్ (Gujarat) నేల నుంచి గట్టి సందేశం ఇచ్చి ఉండాల్సిందనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. సదస్సు చప్పగా సాగిందని పార్టీ ముఖ్యనేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.కాంగ్రెస్ లేని భారత్ (కాంగ్రెస్ ముక్త్ భారత్) నెలకొల్పాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముమ్మరంగా ప్రచారం చేస్తూ, పార్టీ ప్రభుత్వాలను కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితం చేసిన తరుణంలో... ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ మిశ్రమ ఫలితాలు సాధించిన 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్టీ నాయకత్వాన్ని కుంగదీసింది. ముఖ్యంగా హరియాణా, మహారాష్ట్రల్లో గెలిచే పరిస్థితులుండీ బీజేపీ నేతృత్వపు ఎన్డీయే కూటమి చేతిలో ఓటమి తప్పలేదు. జమ్మూ–కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విపక్ష ‘ఇండియా కూటమి’ నెగ్గినా అక్కడ కాంగ్రెస్ ప్రభావ రహితమైన మైనర్ పార్ట్‌నర్‌గానే ఉంది. కొన్ని చోట్ల జాతీయ పార్టీని, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తుల్ని, మరికొన్ని చోట్ల జతకట్టిన మతతత్వ శక్తుల్నీ... ఇలా ఆ యా రాష్ట్రాల్లో భిన్నమైన ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్‌కుంది. అందుకే, ప్రస్తుత భేటీ కాంగ్రెస్‌కు ముఖ్యమైనదిగా పార్టీ శ్రేణులు పరిగణించాయి.యువతరాన్ని ఆకట్టుకోవాల్సిందే!ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్‌ను ఎవరు సొంతం చేసుకుంటున్నారు అన్నది ఇవాళ్టి యువతకు పట్టే అంశం కానేకాదు. పటేల్, నెహ్రూల మధ్య, లేని అంతరాల్ని ఎగదోస్తూ ప్రత్యర్థులు రాజేసే రాజకీయ కుంపటి చుట్టూ కాంగ్రెస్ తిరగాల్సిన అవసరమే లేదన్నది సగటు కాంగ్రెస్ కార్యకర్త మనోభావన! భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందనే కాంగ్రెస్ ఘాటైన విమర్శకు 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే ‘పొలిటికల్ డివిడెండ్స్’ లభించాయి. ‘ఇండియా కూటమి’కి 150 స్థానాలు మించి రావని దేశంలోని 16 ప్రముఖ సర్వే సంస్థలు వేసిన అంచనాల్ని తలకిందులు చేస్తూ, 235 స్థానాలు గెలుచుకోవడం ఈ ప్రచార ప్రభావమే! 400 స్థానాలు ఆశించిన బీజేపీ సొంతంగా 240, కూటమికి 293 స్థానాలతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. మళ్లీ అదే నినాదాన్ని ఎంత బిగ్గరగా వినిపించినా.... తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయలేదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, అభివృద్ధి లేమి వంటి సమస్యలు ప్రజల నిత్య ఆలోచనల్లో ఉన్నాయి. ఆయా అంశాల్లో ప్రభుత్వం ఎంతగా విఫలమైందో ఎండగట్టే విపక్ష ఎత్తుగడలు యువతను ఆకట్టుకోవడానికి పనికొస్తాయి.‘కులగణన’ ఒక స్థాయి వరకు సానుకూల ఫలితాలిచ్చినా, తదుపరి ప్రతికూలించే ప్రమాదముందనే అభిప్రాయాన్ని పార్టీలోని ఒక వర్గం వ్యక్తం చేస్తోంది. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలనే ప్రజాభిప్రాయం స్వాగతించదగిందనీ, లేకుంటే ప్రాంతీయ శక్తుల ప్రాబల్యం పెరుగుతుందనే భావనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ కూడా జరిగిన జాతీయ సదస్సు ఈ విషయంలో ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోయిందనే భావన శ్రేణుల్లో ఉంది.ఆశ, ఆకాంక్ష అయితేనే...పార్టీ కీలక తీర్మానానికి మద్దతు పలుకుతూ, సదస్సులో ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఒక మాటన్నారు: ‘కాంగ్రెస్ అంటే పగ. ప్రతీకారం కాకుండా ప్రజలకు ఒక ఆశ, ఆకాంక్ష అవ్వాలి. కాంగ్రెస్ అంటే కేవలం గత వైభవమే కాకుండా, సానుకూల దృక్పథం కలిగిన ఒక ఆశావహ భవిష్యత్ కావాలి. వ్యతిరేకిస్తూ చేసే విమర్శ మాత్రమే కాకుండా సద్యోచన, నిర్మాణాత్మక సహకారం అందించే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండాలి.’సదస్సు రెండో రోజు సాంఘిక శాస్త్ర పాఠంలా సాగిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగంలో ప్రధానంగా కాంగ్రెస్ కృషిని, త్యాగాలను ప్రశంసించడంతో పాటు బీజేపీ, ఆరెస్సెస్‌ది విపరీత భావజాలమంటూ విమర్శలు గుప్పించారు. ‘రాహుల్ ఇలా మాట్లాడాలి. కానీ, మాట్లాడరు’ అంటూ సంపాదకుడు హరీశ్ ఖరే ఒక రోజు ముందుగా ‘ద వైర్’ వేదికగా వెలువరించిన ప్రసంగ(వ్యాస)ంలోని ముఖ్యాంశాలను రాహుల్ నిజంగానే ప్రస్తావించలేదు. ‘..మతఛాందసం, వేర్పాటువాదం, నియంతృత్వాలకు వ్యతిరేకంగా నా శక్తి మొత్తాన్ని వెచ్చించి కడదాకా పోరాడుతానని విస్పష్టంగా ప్రకటిస్తున్నాను..’ అనే మాటలతో మొదలై, ‘.. గాంధీ, నెహ్రూ కుటుంబానికి చెందిన వాడినైనందున, మా తండ్రి, నాయనమ్మ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినందున... సహజంగానే నేను ప్రధానమంత్రి పదవికి అర్హుడనైతానని మీలో కొందరు భావిస్తుండవచ్చు. కానీ, నాకా ఆలోచన లేదు. నేను గానీ, మా కుటుంబంలో మరెవరైనా గానీ, ఆ పదవిని ఆశించడం లేదు’ అనే మాటలతో హరీశ్ వ్యాసం సాగుతుంది. ఆయన రాసినట్టుగానే ఇవేవీ రాహుల్ మాట్లాడలేదు.ఈ పద్ధతి సరికాదు!పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తామంటూనే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పార్టీ బలహీనపడే పరిస్థితులను అధినాయకత్వం ఉపేక్షించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. కొన్నిసార్లు పరోక్షంగా అధిష్ఠానమే ప్రోత్సహిస్తోంది. ఇందుకు తెలంగాణ, కర్ణాటకలో ప్రత్యక్ష ఉదంతాలున్నాయి. తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి మీనాక్షీ నటరాజన్ నేరుగా సచివాలయానికి వెళ్లి, మంత్రివర్గ ఉపసంఘంతో, అధికారులతో భేటీ అయి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) భూవివాదాంశాన్ని సమీక్షించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. పార్టీ కార్యాలయమైన గాంధీభవన్‌లో కాకుండా నేరుగా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థి ప్రతినిధులు, పౌర సంఘాల వారితో ఆమె ముచ్చటించారు. మళ్లీ వచ్చి, ఆ అంశాలను మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ, ఆయా ప్రతినిధులు, వర్గాల వారితో అది చర్చిస్తుందన్న ముఖ్యమంత్రి మాటలు అమలు కాకముందే, ఆమె ఈ ‘హడావిడి’ చర్యలకు పూనుకున్నారు. ఆమె ఏ హోదాతో సచివాలయంలో ఉపసంఘంతో, అధికారులతో భేటీ అయ్యారనే ప్రశ్న సహజంగానే తలెత్తింది. ఇది సదరు మంత్రివర్గాన్ని, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన పరిస్థితి. ప్రత్యర్థి పార్టీల విమర్శలకూ, సొంత పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికీ కారణమైంది. అంతకు ముందు ఇన్చార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షీపై ఒక రకం ఆరోపణలుంటే, గాంధేయవాది, ప్రజాస్వామ్య ప్రేమికురాలు, నిరాడంబరనేత అని పేరున్న మీనాక్షి చొరవను, ఒక అతి చేష్టగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.చదవండి: కన్నీరు కార్చడమే దేశద్రోహమా?ఢిల్లీలో బీసీ ధర్నా రోజు, అప్పటివరకు స్పందించకుండా ఉండి, ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత రాహుల్, సోనియాలు బీసీ నాయకుల్ని కలవటం కూడా తప్పుడు సంకేతాలనిచ్చిందనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. ఇది పార్టీకి అంత మంచిది కాదు.- దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, పీపుల్స్ పల్స్ -
ఇలాగేనా పేదరిక నిర్మూలన?
‘ఉగాది’ రోజున ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడికి ఎవరికీ రాని విచిత్రమైన ఆలోచన వచ్చింది. పేదరికం గురించి తీవ్ర మనోవేదన చెందుతూ, పేదరికాన్ని నిర్మూ లించేందుకు కొత్త విధానాన్ని కనుక్కున్నారు. అదే ‘పీ4’ విధానం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 2047 నాటికి పూర్తిగా పేదరికాన్ని నిర్మూలిస్తాననీ, ఇందుకు దాతృత్వమేఅత్యంత కీలకమనీ పేర్కొన్నారు. పేదలకు సహాయం చేసేలా సంపన్నుల్లో స్ఫూర్తి నింపటం పీ4 లక్ష్యమని అన్నారు. ఇది ఆచరణ సాధ్యమేనా? ప్రపంచంలో ఇటువంటి విధానంతో పేదరిక నిర్మూలన చేసిన ఉదాహరణలు ఏవైనా ఉన్నాయా?‘పబ్లిక్, ప్రైవేట్ – పీపుల్ – పార్టనర్షిప్’ (పీ4) విధానంలో ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు, ప్రజలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అంటున్నారు. 1995లో ప్రపంచ బ్యాంకు అమలు చేసిన సంస్కరణల్లో భాగంగా ‘పీ3’ పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ విధానాన్ని అమలు చేసి అద్భుతాలు సాధించాననీ, ఆ స్పూర్తితోనే íపీ4 రూపొందించాననీ అంటున్నారు. ఆ ‘అద్భుతాలు’ ఏమిటో మాత్రం చెప్పలేదు. ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయటంలో మాత్రం ముందు ఉన్నారు. 1995లోని పీ3లో లేని ప్రజలను అదనంగా పీ4లోఎందుకు చేర్చారో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వలేదు. బడా పారిశ్రామిక వేత్తల పరిశ్రమలకు భూములు కావాలి. భూ సేకరణ చట్టం ప్రకారం భూములకు పరిహారం ఇవ్వటం పరిశ్రమాధిపతులకు ఇష్టంలేదు. పీ4లో పేదలను చేర్చటం ద్వారా వారి భూములను పారిశ్రామిక వేత్తలకు ఇచ్చేలా చేయటం కోసమే వారిని ఇందులో చేర్చారు.తమ పేదరికానికి కారణాలైన వాటికి వ్యతిరేకంగా పేదలు తిరుగుబాటు చేయకుండా బడా సంపన్న వర్గాలను కాపాడటం కోసం గతంలోనూ ఇలాంటి అభిప్రాయాలు ముందుకు వచ్చాయి. ఫ్యాక్టరీ యజమానులు సంపాదించుకున్న సొమ్ము నుండి కార్మికులకు దానధర్మాలు చేయాలని మహాత్మాగాంధీ ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని దెబ్బతీయటానికి 1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని పోచంపల్లిలో వినోబా భావే ప్రారంభించిన ‘భూదానో ద్యమం’ భూస్వాముల ప్రయోజనాలు కాపాడటం కోసమే! ఆచరణలో భూస్వాములు భూములు దానం చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే తరహాలో పీ4 విధానాన్ని ప్రకటించారు. దేశంలోని 10% ఉన్న బడా సంపన్న వర్గాలు, అట్టడుగులో ఉన్న 20% పేదలను దత్తత తీసుకుంటే పేదరికం నిర్మూలించబడుతుందని చెప్పటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. పేదరికాన్ని రూపుమాపటం పాలక ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యత నుంచి చంద్రబాబు తప్పుకొంటున్నారు. పేదలు, బడా సంపన్న వర్గం, వర్గ సంబంధాల రీత్యా శత్రు వర్గాలే గాని మిత్ర వర్గాలు కాదు. బడా పెట్టుబడిదారులు, భూస్వాములు... కార్మికుల, గ్రామీణ పేదల శ్రమశక్తిని దోపిడీ చేసి సంపదలను కూడబెట్టారే గానీ కష్టపడి ఒక్క రూపాయి కూడాసంపాదించ లేదు. వారు అనుభవిస్తున్న సంపద అంతా వాస్తవంగా కార్మికుల, గ్రామీణ పేదలదే! అందువల్ల బడా సంపన్నులు, భూస్వాములు పేదలను దత్తత తీసుకోమని చెప్పటం ఏమిటి! వారి దాన ధర్మాలపై ఎందుకు ఆధారపడాలి? వారు సృష్టించిన సంపద మొత్తం వారికే చెందాలి. అది వారి హక్కు. ఈ హక్కును పక్కన పెట్టటమే చంద్రబాబు పీ4 విధానం. ఒక సమావేశ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘ఒకప్పుడు నాతో పాటు ఇక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది పేదరికం నుంచి వచ్చిన వారే. మేమందరం గ్రామాల్లోని మామూలు కుటుంబాల నుంచి వచ్చి పేదరికాన్ని జయించి ఈ స్థాయికి వచ్చా’మని చెప్పారు. గ్రామీణ పేద కుటుంబాలు అప్పుడు, ఇప్పుడు నిత్యం కష్టపడుతున్నప్పుడు, ఆ కుటుంబాలు పేదరికాన్ని జయించాలి గదా! ఎందువల్ల జయించలేక పోయాయి?నిత్యం పేదరికంలోనే ఎందుకు ఉంటున్నాయి? పేదరికం నుంచి బయటపడాలంటే, అందుకు అనుగుణమైన సామాజిక మార్పు విప్లవాత్మకంగా జరగాలి. ఆ మార్పును అడ్డుకోవటమే పీ4 విధానం. ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం తగ్గక పోగా పెరుగుతూ ఉంది. చిన్న, సన్న కారు రైతులు భూములు కోల్పోవటం, గ్రామీణ ఉపాధి తరిగిపోవటం కార ణాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో శ్రామిక శక్తి 2022– 2023లో 45 శాతం ఉండగా 2023–24 నాటికి 46.1 శాతానికి పెరిగింది. గ్రామీణ పేదరికానికి, భూమికి విడదీయరాని సంబంధం ఉంది. సేద్యానికి భూమి ప్రధానం. ఆ భూమి పరాన్నభుక్కులైన కొద్ది మంది భూ కామందుల వద్ద బంధించబడి ఉంది. తమ శ్రమశక్తితో వివిధ పంటలు పండించే గ్రామీణ పేదలకు ఆ పంటలపై ఎటువంటి హక్కూ ఉండదు. ఎటువంటి శ్రమ చేయని భూ కామందులు ఆపంటలను తరలించుకుపోయి సంపదలను పెంచుకుంటున్నారు. పేదలు తీవ్రమైన దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామీణ పేదలకు భూమిపై హక్కు లభించినప్పుడే పేదరికం నుంచి బయటపడతారు.పట్టణ ప్రాంతంలోని కార్మికులు, పేదలు ఉపాధికి దూరమవుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరగక పోవటం, ఉత్పత్తులు సృష్టించే కార్మికులకు పరిశ్రమల్లో భాగస్వామ్యం లేక పోవటం, పాలక ప్రభుత్వాల విధానాల వల్ల పరిశ్రమలు మూతపడి కార్మికులు నిరుద్యోగులుగా మారటం, ఫలితంగా పరిశ్రమలపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారు కూడా ఉపాధి కోల్పోవడం వల్ల పట్టణ పేదరికం పెరుగుతూ ఉంది. తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని చంద్రబాబు చెబుతున్నారు కాబట్టి పేదరికానికి కారణాలు ఆయనకు తెలుసు. ఆ కారణాల పరిష్కారం గురించి నేడు ఆలోచించటం లేదు. నేడు చంద్ర బాబు బడా సంపన్న వర్గాల జాబితాలో ఉండటమే కాకుండా, ఆ వర్గాల ప్రతినిధిగా ఉన్నారు. నేటి వ్యవస్థను కాపాడే ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అందుకు భిన్నంగా చంద్రబాబు విధానాలు ఉండవు. పీ4 విధానం అనేది పేదరిక నిర్మూలనకు కాక... నేటి వ్యవస్థనూ, అందులో భాగమైన బడా పెట్టుబడిదారుల, భూస్వా ముల ప్రయోజనాలనూ కాపాడుతుంది. సమాజ పరిణామక్రమంలో దోపిడీ వర్గాలు పేదలు సృష్టించిన సంపదలను దోచు కోవటమే కాకుండా, అణచివేతకు గురి చేశాయి. అంతే తప్ప వారి గురించి ఆలోచించలేదు, ఆలోచించరు కూడా! అది వారి వర్గలక్షణం. పీ4 విధానం పేదలను పేదలుగా ఉంచటం, వారి పేదరికా నికి కారణాలపై పోరాటం చేయకుండా చేయటం, బడా సంపన్న వర్గాల దానధర్మాల కోసం ఎదురు చూసేలా చేయటమే!గ్రామీణ ప్రాంతంలో భూ సంస్కరణల ద్వారా పేదలకు భూముల పంపిణీ జరగాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి, తద్వారా గ్రామీణ ఉపాధిని పెంచాలి. పట్టణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణమైన పరిశ్రమలు నిర్మించి అందులో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. పరిశ్రమల అనుబంధంగా పట్టణ పేదలకు ఉపాధి ఏర్పడినప్పుడే దేశంలో, రాష్ట్రంలో పేదరికం పోతుంది. కానీ చంద్రబాబు పేదలకు భూములపంపిణీకి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యతిరేకం. రాష్ట్ర ప్రజలే పోరాటాల ద్వారా సాధించుకోవాలి. -వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526-బొల్లిముంతసాంబశివరావు -
కన్నీరు కార్చడమే దేశద్రోహమా?
ఉత్తరాది రాష్ట్రాలు ఆశ్చర్యకరమైన వార్తలకు జన్మనిస్తాయి. ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగి సాఖిబ్ ఖాన్ (35)ను ఉద్యోగం నుంచి తొలగించారనేది అటువంటి తాజా వార్త. సాఖిబ్ ఖాన్ సహారన్పూర్ జిల్లా కైలాష్పురిలో విద్యుత్ సంస్థకు చెందిన సబ్ స్టేషన్లో కాంట్రాక్టు మీద లైన్ మన్‌గా పని చేస్తున్నాడు. మార్చి 31న ఈద్ నమాజ్ అయి పోయిన తర్వాత పాలస్తీనా జెండా పట్టుకుని ఫొటో దిగి, ఆ ఫొటోను సోషల్ మీడియా మీద పంచుకున్నాడు. ఆ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆయనను పిలిచి రెండు గంటల పాటు ప్రశ్నించి ఏ నేరారోపణలూ, కేసూ లేకుండా వదిలివేశారు. ఆయన మీద ఏ చర్యా తీసుకోకపోతే నిరసన ప్రదర్శనలు చేస్తామని స్థానిక సంఘ్ పరివార్ (Sangh Parivar) సంస్థలు పోలీసులను హెచ్చరించాయి. ఈలోగా ఈ విషయం విద్యుత్ శాఖ దృష్టికి వచ్చి, ఆ చర్యను దేశద్రోహ కర చర్యగా పరిగణించి, తక్షణమే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అదే సమయంలో సహారన్పూర్లో అంబాలా రోడ్ ఈద్గాలో నమాజ్ ముగిసిన తర్వాత పాలస్తీనా (Palestine) జెండాను ప్రదర్శించిన కొందరు యువకుల వీడియో తమ దృష్టికి వచ్చిందని, వారిలో ఎనిమిది మందిని గుర్తించి దేశద్రోహ నేరానికి విచారణ జరపనున్నామని నగర పోలీస్ సూపరింటెండెంట్ వ్యోమ్ బిందాల్ వార్తాసంస్థలకు తెలిపాడు. ఈ యువకులు చేసిన నేరం ఏమిటి? చనిపోయిన వారికి కన్నీరు కార్చడం! గత ముప్పై నెలలుగా గాజా మీద ఇజ్రాయెల్ బాంబు దాడులు సాగిస్తున్నది. యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకం చేసిన తర్వాత కూడా మారణహోమం కొనసాగిస్తున్నది. కళ్ళముందర ఘోరకలి సాగిపోతుంటే ఇంకేమీ చేయలేకపోయినా, ‘మీ దుఃఖం పంచు కుంటున్నాము’ అని పాలస్తీనీయుల పతాకను ప్రదర్శించడం అత్యంత మానవీయమైన, ప్రతీకాత్మక చర్య. సానుభూతి ఈ దేశంలో నేరమైపోయిన పాడు కాలానికి చేరాం. నిజానికి పాలస్తీనా జెండా ప్రదర్శించడం, ఆ మాట కొస్తే స్నేహ సంబంధాలున్న ఏ దేశపు జెండానైనా ప్రదర్శించడం భారత చట్టాల ప్రకారం, ప్రత్యేకించి ‘ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002’ ప్రకారం నేరం కాదు. దేశద్రోహం కాదు. కానీ గత రెండు సంవత్సరాలుగా, ముఖ్యంగా గాజా మారణకాండ ప్రారంభమైనప్పటి నుంచీ పాలస్తీనా బాధితుల పట్ల సంఘీభావం వ్యక్తం చేస్తూ ముహర్రం ఊరేగింపులోనో, ప్రార్థనల తర్వాతనో పాలస్తీనా పతాకం ప్రదర్శించిన వందల మంది మీద ఉత్తరాది రాష్ట్రాల పోలీసులు కేసులు బనాయిస్తున్నారు. కొందరి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కేసులు కూడా పెట్టారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఇజ్రాయెల్ జెండా ప్రదర్శిస్తూ ప్రదర్శనలు జరిపినవారి మీద ఎటువంటి కేసులూ లేవు. దేశంగా పాలస్తీనాతో, పాలస్తీనా ప్రజల ఆకాంక్షలతో, చివరికి సాయుధ పోరాటం చేస్తుండిన పాలస్తీనా విమోచన సంస్థతో, దాని నాయకుడు యాసర్ అరాఫాత్తో భారత ప్రభుత్వానికీ, భారత దేశానికీ ఉండిన సంబంధాల నేపథ్యంలో చూస్తే ఈ కొత్త ‘దేశద్రోహకర నేరం’ ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం బాల్ఫోర్ డిక్లరేషన్ ద్వారా పాలస్తీనాలో యూదులను స్థిరపరచడానికి ప్రయత్నాలు ప్రారంభించిన నాటి నుంచీ భారత వలస వ్యతిరేక జాతీయోద్యమ నాయకులందరూ బ్రిటిష్ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ, పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించడం ప్రారంభించారు. 1938లోనే ఒక వ్యాసంలో గాంధీ ‘ఇంగ్లండ్ ఇంగ్లిష్ వాళ్లకూ, ఫ్రాన్స్ ఫ్రెంచి వాళ్లకూ ఎలా చెందుతుందో, అదే విధంగా పాలస్తీనా కూడా అరబ్బులకు చెందుతుంది. అరబ్బుల మీదికి యూదులను రుద్దడం తప్పు, అమానుషం’ అన్నారు. పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్ (Israel) ఏర్పాటు చేయాలనే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి 1947 లోనే భారతదేశం వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇజ్రాయెల్ ఏర్పాటును 1950లో ఆమోదించినప్పటికీ, 1992 దాకా దౌత్య సంబంధాలు నెలకొల్పలేదు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ... ‘పాలస్తీనా పాలస్తీనీయులదే’ అని అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానాలను సమర్థిస్తూ వచ్చింది భారతదేశం. ఇజ్రాయెల్ మీద సాయుధ పోరాటం ప్రారంభించిన పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్ఓ)ను ‘పాలస్తీనా ప్రజల ఏకైక, సాధికార ప్రతినిధి’గా గుర్తించి, 1974లోనే ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. 1980 నాటికి పీఎల్ఓతో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నది. 1988 నవంబర్ స్వాతంత్య్ర ప్రకటనతో ఏర్పాటైన పాలస్తీనాను గుర్తించిన తొలి అరబేతర దేశం భారతదేశమే! గాజాలో 1996లోనే భారత ప్రభుత్వ ప్రతినిధి కార్యాలయం స్థాపించింది. అదే సమయంలో 1990ల నుంచే ఇజ్రాయెల్‌తో కూడా భారత ప్రభుత్వం వాణిజ్య సంబంధాలు ప్రారంభించింది. దీంతో పాలస్తీనా నాయకులలో వ్యక్తమైన అనుమానాలను కూడా భారత నాయకులు కొట్టివేస్తూ వచ్చారు. పీఎల్ఓ అధ్యక్షుడు యాసర్ అరాఫాత్ 1997 నవంబర్‌లో భారత పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నో వాణిజ్య, పారిశ్రామిక సహకార, సాంస్కృతిక సంబంధాల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయి. అప్పుడే అరాఫాత్ హైదరాబాద్‌కు కూడా వచ్చి ఇండో–అరబ్ భవన సముదాయానికి పునాది వేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University)) నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. ఈ సుహృద్భావాన్నీ, సంఘీభావాన్నీ తోసివేస్తూ, 2014 తర్వాత భారత ప్రభుత్వం అధికారికంగా తన వైఖరి మార్చుకోకుండానే, అనధికారికంగా పాలస్తీనాకు దూరంగా, ఇజ్రాయెల్‌కు దగ్గరగా జరుగుతూ వచ్చింది. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ ప్రధానిగా నరేంద్ర మోదీ 2017 జూలైలో ఇజ్రాయెల్ వెళ్లి బెంజమిన్ నెతన్యాహూను కౌగిలించుకుని సాన్నిహిత్యాన్ని ప్రకటించారు. చదవండి: కఠిన వాస్తవాలను దాచేస్తారా?అక్కడి నుంచి ఆ సంబంధాలు మరింత బలపడుతూ, 2023 అక్టోబర్ 27న, మారణహోమం మొదలైన ఇరవై రోజుల తర్వాత ఇజ్రాయెల్ దాడిని ఆపి, శాంతి ఒప్పందానికి రావాలని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత ప్రభుత్వం ఓటు వేయకుండా ఉండి పోయింది. మరి, అరవై వేల మరణాలకు కన్నీరు కార్చడం, సానుభూతి ప్రకటించడం దేశద్రోహకర నేరమవుతుందా?ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ధ్వంసరచన
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూసిన వాణిజ్య సుంకాల కత్తి పోట్లకు ఇండియా సహా ప్రపంచ స్టాక్ మార్కెట్స్ నెత్తురోడాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అకస్మాత్తుగా అనిశ్చితి ఊబిలో కూరుకుపోయింది. చైనా, కెనడా వెంటవెంటనే తొలివిడత ప్రతీకార సుంకాలను ప్రకటించాయి. దీంతో ట్రేడ్ వార్ అనివార్యం అనిపిస్తోంది. ఈ యుద్ధరంగంలో దూకేందుకు తామూ సిద్ధమేనంటూ యూరోపియన్ యూనియన్ హెచ్చరిక జారీ చేసింది. ఇతర దేశాలు అమెరికా నూతన విధానం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ఈ వాణిజ్య ఉద్రిక్తతల తక్షణ ప్రభావంతో నాస్డాక్ ఇండెక్స్ కుప్పకూలింది. ఇతర ఏషియన్ సూచీలూ పతనమయ్యాయి. చమురు ధర బ్యారెల్ 64 డాలర్లకు దిగివచ్చింది.ఆభరణాలకు దెబ్బ – వస్త్రాలకు మేలుఇండియా ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. దీనిక్కారణం, ఇప్పటికే ద్వైపా క్షిక వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు ప్రారంభమై ఉండటమే. గతంలో ప్రపంచ వాణిజ్యసంస్థ (డబ్ల్యూటీవో) వేదికపై ధనిక దేశాల ఒత్తి ళ్లను అధిగమించి ఇండియా వ్యవసాయ రంగం కోసం రాయితీలను సాధించింది. ఇప్పుడూ అమె రికాతో విజయవంతంగా ఒప్పందం కుదురుతుందని నిపుణుల అంచనా. అలాగే, ఇక్కడ తయారు కాని వస్తువులపై విధించే నిర్హేతుకమైన అధిక సుంకాలకు ఒప్పందంలో అంగీకరించవచ్చు. బదులుగా, ప్రాసెస్డ్ ఫుడ్స్, సాగర ఉత్పత్తుల ఎగు మతిపై నాన్–ట్యారిఫ్ ఆంక్షలు సరళీకరించాలని కోరుతుంది. స్థానిక సర్వర్లలో డేటా నిల్వ (డేటా లోకలైజేషన్), మేధాసంపత్తి హక్కులు వంటి అంశాలు అంత తేలిగ్గా పరిష్కారం కావు. రాజీ ఫార్ములాలే శరణ్యం అవుతాయి. ఇండియా వాణిజ్యపరంగా తన పరిశ్రమ లను, వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు స్వీయ రక్షణ విధానాలను అవలంబిస్తోందని ట్రంప్ పదే పదే విమర్శిస్తున్నప్పటికీ, ఆయన హయాంలో ఉభయ దేశాల నడుమ వ్యూహాత్మక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. రక్షణ బంధం బలపరచుకోడానికి రెండు దేశాలూ సిద్ధంగా ఉన్నాయి. ఏమైనప్పటికీ, కొత్త సుంకాలు కొన్ని భారతీయ పరిశ్రమలకు స్వల్ప కాలంలో అశని పాతంగా పరిణమిస్తాయి. వజ్రాలు – ఆభ రణాల పరిశ్రమనే తీసుకుందాం. ఇది 2023–24 ఆర్థిక సంవత్సరంలో 33 బిలియన్ డాలర్ల ఎగు మతులు చేయగా, అందులో మూడో వంతు ఒక్క అమెరికాకే సరఫరా అయ్యాయి. ఈ పరిశ్రమ ప్రధానంగా చిన్న, మధ్య తరహా సంస్థలతో కూడుకుని ఉంది. దాదాపు 50 లక్షల మంది (పూర్తి నైపుణ్యం ఉన్న, ఒకమాదిరి నైపుణ్యం ఉన్న) కార్మి కులు జీవనోపాధి కోసం వీటిపై ఆధారపడు తున్నారు. కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన సంక్షోభ కాలంలో వీరు ఉపాధి కోల్పోయి గ్రామా లకు తరలి పోయారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఆర్డర్లు తగ్గిపోయి అలాంటి దుఃస్థితి పునరావృతం అవుతుందన్న భయాలు వ్యాపిస్తున్నాయి.అయితే, అమెరికా వాణిజ్య సుంకాల పెంపు వల్ల ఇండియాకు అంతా ప్రతికూలమే అనుకో నక్కర్లేదు. మారిన పరిస్థితుల్లో ఇండియా దుస్తుల ఎగుమతి ధరలు పోటీ దేశాల్లో కంటే తక్కువగా ఉంటాయని వస్త్ర ఉత్పత్తుల కేంద్రమైన తిరుప్పూరు (తమిళనాడు) నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో కొనుగోలు దారులు ఇప్పటికే ఇండియా మీద దృష్టి సారించారు. కాబట్టి, భారతీయ వస్త్ర ఉత్పత్తులకు ఆర్డర్లు భారీగా పెరిగే వీలుంది. అమెరికాకే నష్టంసుంకాల పెంపు సంక్షోభం ఫలితంగా ఇతర ప్రపంచ దేశాల కంటే యూఎస్ ఆర్థిక వ్యవస్థే అధికంగా నష్టపోతుంది. అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన తీరు రానున్న దుర్భర స్థితికి సంకేతం. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని ఇంతకు ముందునుంచే అంటున్నారు. సుంకాల పెంపు వల్ల ఈ రిస్కు అనూహ్యంగా పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. జేపీ మోర్గాన్ ప్రకారం, ‘అమెరికా విచ్ఛిన్నకర రాజకీయాల’ ఫలితంగా అక్కడ ఆర్థిక మాంద్యం రిస్కు 40 నుంచి 60 శాతానికి పెరిగింది. కొత్త సుంకాల వల్ల యూఎస్ ఆర్థిక వ్యవస్థపై 700 బిలియన్ డాలర్ల భారం పడుతుంది. ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ లెక్కలు చైనా 34 శాతం ప్రతీకార సుంకాలు విధించక ముందు వేసినవి! ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోతే అది ఇండియా సహా అన్ని దేశా లకూ దుర్వార్తే! దీంతో, దేశం గడచిన సంవత్సరాల్లో సాధించిన వృద్ధి తగ్గిపోతుంది. 2025–26కి ఇండియా వృద్ధిరేటు 6.3 నుంచి 6.1కి క్షీణిస్తుందని ‘గోల్డ్‌మన్ సాక్స్’ ఇప్పటికే అంచనాలు సవరించింది.అంతర్జాతీయంగా వాణిజ్య సుంకాలను హేతుబద్ధీకరించడానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసి నప్పటి నుంచీ ప్రయత్నాలు మొదలై, దశాబ్దాల పాటు సంప్రతింపులు, చర్చలు జరిగి ఎట్టకేలకు ఒక బహుళ పక్ష వేదిక ఏర్పడింది. ఈ ప్రపంచ ఆర్థిక పాలనలో పేద దేశాల మాటకు విలువ కల్పించిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఇప్పుడు విధ్వంసమైపోతోంది. ట్రేడ్ వార్ ప్రభావం ఇండియాపై అనుకున్న దానికంటే తీవ్రంగానే ఉంటుంది. మరి దీనికి పరి ష్కారం ఏమిటి? యూరోపియన్ యూనియన్ వంటి బడా వాణిజ్య భాగస్వాములతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అదే సమయంలో, ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఏ దేశాలు ఎగుమతులకు అనువైనవో గుర్తించాలి. ఈ ప్రపంచ వాణిజ్య యుద్ధాల్లో అంతిమంగా ఇండియా నష్టపోతుందా, ప్రయోజనం పొందుతుందా అనేది ఇప్పుడప్పుడే తేలదు. రానున్న రోజుల్లో ఈ గొడవ సద్దుమణిగిన తర్వాతే వాస్తవిక అంచనా సాధ్యమవుతుంది.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ ‘ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మూర్ఖత్వం
1. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ మద్దతుదారులలో చాలామంది, బహుశా ట్రంప్ కూడా, అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలే అధిక సుంకాలను చెల్లిస్తాయని నమ్ముతున్నట్లుంది. వాస్తవం ఏమిటంటే, సుంకాలను దిగుమతి దారులు చెల్లిస్తారు. వారు ఆ ఖర్చును వినియోగదారులకు, ఈ సందర్భంలో, అమెరికన్ ప్రజలకు బదిలీ చేస్తారు.2. సుంకాల విధింపు అనేది చర్చల వ్యూహంలో భాగమా? ట్రంప్ మొదటి పదవీకాలం విషయంలో అది నిజమే కావచ్చు. ఇప్పుడు అలా చేయడం కష్ట తరమైన ఆలోచన. కొన్ని దేశాలు తమ సుంకాలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా దేశాలు ప్రతీకార సుంకాలను విధిస్తున్నాయి. తన మద్దతుదారులకు తాను బలంగా కనిపించాలని ట్రంప్ అనుకుంటున్నట్లుగానే, ఇతర దేశాల నాయకులు కూడా బలహీనంగా కనిపించడానికి ఇష్టపడకపోవచ్చు.3. ట్రంప్ మాంద్యాన్ని పెంచి పోషించడానికీ, తద్వారా అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ను వడ్డీ రేట్లను తగ్గించమని బలవంతం చేయడానికీ ప్రయత్నిస్తు న్నారని కూడా చెబుతున్నారు. తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వృద్ధిని నడిపిస్తాయి. అలాగే 2026 మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి సహాయపడ తాయి. అయితే, ఆర్థిక వ్యవస్థ కారు లాంటిది కాదు. కారు వేగాన్ని యాక్సిలరేటర్తోనూ, బ్రేక్ తోనూ సులభంగా నియంత్రించవచ్చు. ఇది సంక్లి ష్టమైన వ్యవస్థ. అమెరికా సుంకాలు అలాగే ఉంటే, అక్కడ రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వడ్డీ రేటు కోత అవకాశాలను తగ్గిస్తుంది. ఇంకొకటి: ప్రజలు పేదరికాన్ని అనుభూతి చెందుతూ సాధా రణంగా వారు చేసే దానికంటే తక్కువ ఖర్చు చేయడం వల్ల, వినియోగదారుల వ్యయం, ఆర్థిక వృద్ధి మందగిస్తాయి.4. దేశాలేవీ గతంలో సుంకాలను వేయలేదని దీని అర్థం కాదు. అవి వాటిని అస్త్రాలుగా వాడాయి. కానీ సార్వత్రిక సుంకాలు సాధారణంగా బలహీనంగా ఉండే ఆర్థిక ఫలితాలకు దారితీస్తాయి. 1930 జూన్‌లో అమెరికా ఆమోదించిన ట్యారిఫ్ చట్టం (లేదా స్మూట్–హాలీ చట్టం), 1929లో ప్రారంభ మైన మహా మాంద్యం తర్వాత దాని ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ఉద్దేశించబడింది. రక్షణ వాద ప్రభంజన కాలంలో ఈ చట్టం 20,000 పారి శ్రామిక, వ్యవసాయ వస్తువులపై సుంకాలను రికార్డు స్థాయికి పెంచింది. ఇతర దేశాలు తమ సొంత సుంకాలతో స్పందించాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసి, మాంద్యాన్ని పొడిగించింది. దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ఖర్చులతో సిద్ధమై, పోరాడటం ప్రారంభించిన తర్వాత పరిస్థితి మారింది. నాటి ఈ పాఠాన్ని అమెరికా పాలనాయంత్రాంగం మరచిపోయింది. 5. పరస్పర సుంకాల రేట్లను చాలా మోటు సూత్రాన్ని ఉపయోగించి నిర్ణయించినట్లు అనిపి స్తుంది. భారతదేశం విషయంలో, ఈ సుంకం 26 శాతం వేశారు. 2024లో, అమెరికా భారతదేశంతో 45.7 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య లోటును కలిగి ఉంది. అంటే భారతదేశం నుండి అమెరికా వస్తువుల దిగుమతులు భారతదేశానికి దాని వస్తువుల ఎగుమతుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఇది సూచిస్తుంది. భారతదేశం నుండి అమెరికా సరుకుల దిగుమతులు 87.4 బిలియన్ డాలర్లు. ఈ 87.4 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతుల్లో 45.7 బిలియన్ డాలర్ల అమెరికా లోటు 52 శాతానికి వస్తుంది. ఈ రేటును సగానికి తగ్గించినప్పుడు, 26 శాతం అవుతుంది.ఇక్కడ బహుళ సమస్యలు ఉన్నాయి. సేవల వాణిజ్యాన్ని పరిగణించలేదు. కరెన్సీ తారుమారు, వాణిజ్యేతర అడ్డంకులను పరిగణనలోకి తీసుకోలేదు. ఒక దేశం దాని సుంకాలను తగ్గించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ దేశంతో అమెరికా వాణిజ్య లోటు తగ్గకపోవచ్చు. ఎందుకంటే ఆ దేశానికి అమెరికా మరిన్ని ఎగుమతి చేయవలసి ఉంటుంది. మరిన్ని ఎగుమతి చేయడం అంటే తక్కువ సుంకాల రేటు గురించి మాత్రమే కాదు. అమెరికా ముందుగా వస్తువులను ఉత్పత్తి చేయాలి. అది కూడా ఇతర దేశాలకు ఆసక్తి కలిగించే ధరకు ఉత్పత్తి చేయాలి.తనకు తెలియదని తెలియదు!6. ట్రంప్ ఇలా సుంకాలు వేస్తున్నారంటే, తాను దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించే ఉంటారని నమ్మే ఒక ఆలోచనా విధానం కూడా ఉంది. ఇది మన ముందున్న అతిపెద్ద ప్రమాదాన్ని వెల్లడిస్తుంది: ట్రంప్‌కు తనకు తెలియనిది తెలియదని తెలీకపోవచ్చు. ఆయన అందరి దృష్టీ తన వైపు ఉండటాన్ని ఇష్టపడు తున్నట్లు, తనను తాను నిర్ణయాత్మక వ్యక్తిగా చూపించుకుంటున్నట్లు అనిపిస్తుంది.7. విధించిన ఈ సుంకాలు దేశీయ మార్కెట్ కోసం అమెరికాలోనే ఉత్పత్తి చేయమని కంపెనీలపై ఒత్తిడి తెస్తాయనే నమ్మకాన్ని ట్రంప్ మాటలు సూచిస్తున్నాయి. కానీ అది అంత సులభం కాదు.ఎందుకంటే అమెరికాలో ఉత్పత్తి చేయడం ఖరీదైన ప్రతిపాదన కావచ్చు. అసలు అందుకే కంపెనీలు మొదటగా బయటకు వెళ్లాయి. ఇప్పుడు కంపెనీల సరఫరా గొలుసులు చాలా పరిణామం చెందాయి. ఒక ఉత్పత్తి దాని తయారీ ప్రక్రియలో అనేకసార్లు అమెరికా సరిహద్దులను దాటవచ్చు. అందుకే కంపె నీలు ట్రంప్ రెండవ పదవీ కాలం ముగిసేదాకా వేచి ఉండాలని నిర్ణయించుకునే అవకాశం కూడా ఉంది.8. ట్రంప్ ఈ సుంకాల విధింపు వ్యూహాన్ని ద్విగిణీకృతం చేసినట్లయితే, అది దేశాలను అమెరికా నుండి మరింత దూరం చేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్ డాలర్ కేంద్రంగా ఉద్భవించిన ప్రపంచ క్రమాన్ని అది చెదరగొడుతుంది.ఇప్పుడు దానికి మరొక వివరణాత్మక వ్యాసం అవసరం. కానీ ఒకే వాక్యంలో చెప్పాలంటే, గ్రాహమ్ గ్రీన్ 1978లో ప్రచురించిన ‘ది హ్యూమన్ ఫ్యాక్టర్’ నవలలో ఇలా రాశాడు: ‘మనకు చైనీయులు అవసరమయ్యే రోజు రావచ్చు’.వ్యాసకర్త ఆర్థిక అంశాల వ్యాఖ్యత, రచయిత ‘ (‘ద మింట్’ సౌజన్యంతో) -
తెలంగాణ పంటల విధానం మారాలి!
బియ్యం ఎగుమతులకు తెలంగాణ రాష్ట్రం శ్రీకారం చుట్టింది. ఫిలిప్పీన్స్‌కు తొలివిడత సరఫరా కూడా పూర్తయ్యింది. రాష్ట్ర వ్యవసాయ పురోభివృద్ధిలో ఇదొక మైలురాయి అంటూ ప్రశంసలు కూడా వినవచ్చాయి. నిజంగా ఇదంత సంబరపడాల్సిన పరిణామమేనా? తెలంగాణకు పది కాలాల పాటు లబ్ధి చేకూర్చేదేనా? బియ్యం ఎగుమతుల ద్వారా లభించే తక్షణ లాభాలు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వవచ్చు. కాని, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ స్వస్థత, ఆహార భద్రత, పర్యావరణ సుస్థిరత దీర్ఘకాలంలో ప్రమాదంలో పడతాయి. ఫిలిప్పీన్స్ (Philippines) ఇందుకు సరైన నిదర్శనం. అక్కడి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని విశ్లేషణ చేసినట్లయితే, ఇదెంత ప్రమాదకర పరిణామమో విశదమవుతుంది.వైవిధ్యంతో కూడిన వ్యవసాయ–వాతావరణ పరిస్థితులు తెలంగాణ (Telangana) సొంతం. కాబట్టే, ఈ రాష్ట్రం అనాదిగా పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వంటి ఉద్యాన పంటలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చింది. క్రమేణా పరిస్థితి మారింది. విధానాల ఊతంతో వరి సాగు విస్తరించింది. ముఖ్యంగా ధాన్య సేకరణ, సాగునీటి ప్రోత్సాహకాలు రాష్ట్రంలో పంటల సరళిని నాటకీయంగా మార్చేశాయి. తెలంగాణలో వరి సాగు నీటి వనరుల కల్పన మీద విపరీతంగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం (Kaleswaram) ఎత్తిపోతల ప్రాజెక్టు కమాండ్ ఏరియాల్లో మనం దీన్ని గమనించవచ్చు. ఇప్పటికే భూగర్భ జలాలు క్షీణించిపోతున్న తెలంగాణలో ఇది సుస్థిర సేద్యం కానేకాదు. రాష్ట్రంలో 70 శాతం పైగా జిల్లాల్లో భూగర్భ జలాల వాడకం మితిమీరి ప్రమాదకర స్థాయికి చేరిందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు తాజా నివేదికలు సూచిస్తున్నాయి.నానాటికీ వరి సాగు (Paddy Cultivation) విస్తరిస్తోంది. 2014–15లో 41 లక్షల ఎకరాల్లో వరి పండించగా, 2023–24లో ఈ విస్తీర్ణం దాదాపు 50 శాతం పెరిగి 56 లక్షల ఎకరాలకు చేరింది. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారానే ఈ వృద్ధి సాధ్యపడింది. అయినప్పటికీ, భూగర్భ జలాలు తరిగి పోతున్నాయి. తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ ప్రకటించిన 2024 అధ్యయనం ప్రకారం, వరి పండిస్తున్న జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు ఏడాదికి 1.2 మీటర్ల వంతున పడిపోతున్నాయి.ఎగుమతులను ప్రధాన వ్యూహంగా చేసుకుని వాటి మీద ఆధారపడటం శ్రేయస్కరం కాదు. ధరల పతనం, వాణిజ్య ఆంక్షల రిస్కులకు తెలంగాణ రైతాంగాన్నీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనూ గురి చేయడం ఎంత వరకు సబబు? ఎగుమతి బియ్యం సేకరణ ధర (టన్నుకు రూ 36,000) ఇప్పుడు లాభసాటిగానే కన బడుతుంది. అంతర్జాతీయంగా గిరాకీ అటూఇటూ అయితే, అమ్ముడుబోని బియ్యం రాష్ట్రంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతాయి. దేశీయంగా ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇండియా 2023లో బాస్మతి యేతర బియ్యం ఎగుమతులపై ఆంక్ష విధించిన విషయం గుర్తు చేసుకోవాలి.ఫిలిప్పీన్స్ పాఠాలుఫిలిప్పీన్స్ అనుభవం మనకు ఒక హెచ్చరిక లాంటిది. ఆ దేశం ఒకప్పుడు బియ్యం ఎగుమతిదారు. తర్వాత్తర్వాత స్వయంసమృద్ధి మీద సకలశక్తులూ ఒడ్డాల్సి వచ్చింది. పలురకాల పంటల సాగుకు స్వస్తి పలికి అన్ని వనరులనూ వరి సేద్యానికి మళ్లించింది. 2018 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా మారింది. దేశీయ గిరాకీని తట్టుకునేందుకు 31 లక్షల టన్నుల బియ్యం (Rice) కొనుగోలు చేసింది. ఆహారభద్రతా సంక్షోభంలో కూరుకుపోయి 2023లో దేశంలో రైస్ ఎమర్జెన్సీ విధించింది. వాతావరణ ప్రతికూలతలు, వాణిజ్య ఆంక్షలు, ధరల హెచ్చుతగ్గులు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఇదంతా వరి పంట మీదే అతిగా ఆధారపడటం వల్ల సంభవించిన బాధాకర పర్యవసానం. ఎగుమతి మార్కెట్లు కుప్పకూలినా, స్థానిక సరఫరాలో కొరత ఏర్పడి ఎగుమతులపై ఆంక్షలు విధించినా... తెలంగాణలోనూ ఇదే పునరావృతం అవుతుంది.మామిడి, నిమ్మజాతి పండ్ల తోటలకు, పసుపు పంటకు, ఔషధ మెక్కల సాగుకు అనువైన భూములు, వాతావరణ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. వీటితో ఉద్యాన పంటలకు ప్రముఖ కేంద్రంగా అవతరించగల సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. నేషనల్ హార్టికల్చర్ బోర్డు గణాంకాల ప్రకారం, ఇండియా (India) సాగుభూమిలో కేవలం 15 శాతమే ఉండే ఉద్యాన పంటలు వ్యవసాయ జీడీపీలో 40 శాతం ఆక్రమి స్తున్నాయి. 2023–24లో తెలంగాణ హార్టికల్చర్ ఉత్పత్తి 120 లక్షల టన్నులు. ఈ పంటల కోసం ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి విలువైన తయారీ ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగితే ఎంతో ఆదాయం లభిస్తుంది. కాబట్టి, అధిక విలువ కలిగిన హార్టికల్చర్ (Horticulture) ఎగుమతుల మీద దృష్టి సారించాలి. తద్వారా వ్యవసాయం సుస్థిర మవుతుంది. అన్నింటి కంటే ముఖ్యమైన మరో అంశం, ఉద్యాన పంటలకు మళ్లడం ద్వారా విలువైన నీటి వనరులను నేల సారాన్ని కాపాడుకోగలం. చదవండి: వ్యవసాయం సుంకాల కాపట్యంతెలంగాణ తన వ్యవసాయ విధానంపై పున రాలోచన చేయాలి. భూగోళ వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో వాటిని తట్టుకుని దీర్ఘకాలిక సౌభాగ్యానికి బాటలు వేసే సుస్థిరమైన హై వ్యాల్యూ హార్టికల్చర్, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమల దిశగా దృష్టి మళ్లించాలి.- డాక్టర్ షేక్ ఎన్. మీరా వ్యవసాయ శాస్త్రవేత్త – డైరెక్టర్, ఐసిఎఆర్ – వ్యవసాయ సాంకేతిక అనువర్తన పరిశోధన సంస్థ -
రాయలసీమకు అన్యాయం చేయద్దు!
కడప కేంద్రంగా 2006లో రాయలసీమ, అనంత, పినాకిని గ్రామీణ బ్యాంకుల విలీనంతో ‘ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు’ (ఏపీజీబీ) ప్రారంభమైంది. గత 18 ఏళ్లలో, స్థానిక అవసరాలకు అనుగుణంగా, కొత్త సాంకేతిక తను స్వీకరిస్తూ, మంచి వ్యాపార ఫలితాలతో 10 జిల్లాల పరిధిలో పనిచేస్తున్నది. రాజకీయ అనిశ్చితులు, మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, తన పరిధిలో వెనకబడిన ప్రాంతాల స్థానిక అభివృద్ధికి ఆసరాగా నిలిచింది. ఈ రోజు, దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ బ్యాంకుగా పేరు తెచ్చుకుంది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ‘వన్ స్టేట్, వన్ రూరల్ బ్యాంక్’ విధానంతో రాష్ట్ర స్థాయిలో ఒకే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో... ఏపీజీబీ భవి ష్యత్తు ఏమిటి? దాని ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగితే ఈ ప్రాంతానికి ఎంత మేలు జరుగుతుంది? అమరావతికి తరలిపోతే రూరల్ బ్యాంకింగ్ లక్ష్యాలకు, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎంత నష్టం వాటిల్లుతుంది అన్న ప్రశ్నలపై లోతైన చర్చ అవసరం.గతంలో పినాకిని (నెల్లూరు), అనంత (అనంత పురం), రాయలసీమ (కడప) గ్రామీణ బ్యాంకులు విలీనమైనప్పుడు, రాయలసీమ బ్యాంకు అతిపెద్దది కావడంతో ప్రధాన కార్యాలయం కడపలో ఏర్పాటైంది. ఈ సంప్రదాయం ఇప్పుడూ కొనసాగాలి. ప్రస్తుతం, ఏపీజీబీలో చిత్తూరు కేంద్రంగా ఉన్న సప్తగిరి,గుంటూరు కేంద్రంగా ఉన్న చైతన్య గోదావరి, వరంగల్ కేంద్రంగా ఉన్న ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులు విలీనం కానున్నాయి. వ్యాపారం, ప్రత్యేకతలు, సామర్థ్యం... ఇలా ఏ కోణంలో చూసినా ఈ నాలుగు గ్రామీణ బ్యాంకులలో ఏపీజీబీ అగ్రగామి. అందుకే, కొత్త రాష్ట్రస్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యా లయం కడపలోనే ఉండాలి.2024 నవంబర్ 4న కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్.ఆర్.బి. విభాగం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, విలీనం తర్వాత ప్రధాన కార్యాలయం అతిపెద్ద బ్యాంకు యొక్క కేంద్రంలోనే ఉండాలి. ఈ మార్గదర్శకాన్ని గౌరవించాలి.అమరావతి వాదన ఎవరి కోసం?రాష్ట్ర రాజధానిలో ప్రధాన కార్యాలయం ఉండా లన్న వాదన ప్రజల మనోభావం కాదు – ఇది స్పాన్సర్ బ్యాంకుల రాజకీయం, పాలకవర్గాల స్వార్థం. అమరా వతిని ముందుకు తెచ్చే ఈ ప్రయత్నం వెనుక రాష్ట్ర ప్రభుత్వ కేంద్రీకృత అభివృద్ధికి ప్రాతినిధ్యం వహించే సిఫారసులు, కేంద్రం యొక్క విభజన హామీల నిర్లక్ష్యం ఉన్నాయి. ఇది రాజకీయ ఒత్తిడికి లోనైన నిర్ణయమే అవుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని చాలా గ్రామీణ బ్యాంకులు రాజధానుల్లో కానీ, రాష్ట్రం నడిబొడ్డున కానీ లేకుండానే విజయవంతంగా నడుస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ (నహర్లగున్), కేరళ (మళప్పురం), మహారాష్ట్ర (ఔరంగాబాద్), పంజాబ్ (కపుర్తలా) గ్రామీణ బ్యాంకులు ఇందుకు ఉదా హరణలు. ఈ వాస్తవాన్ని విస్మరించరాదు. రాయల సీమకు రాష్ట్రావతరణ నుంచీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ బ్యాంకును అమరావతికి తరలించి మరో అన్యాయానికి ప్రభుత్వం పాల్పడ కూడదు.ఏపీజీబీ దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ బ్యాంకు. రాష్ట్ర గ్రామీణ బ్యాంకుల వ్యాపారంలో 43 శాతం (రూ. 56,056 కోట్లు) దీనిదే. 25.65 శాతం మూలధన సామర్థ్యం, 86.75 లక్షల కస్టమర్లు, 551 శాఖలు,రూ. 1,400 కోట్ల రిజర్వులు– ఇవన్నీ ఏపీజీబీ ఔన్న త్యాన్ని చాటుతాయి. కిసాన్ కార్డులు, ఎమ్ఎస్ఎమ్ ఈలకు రూ. 50 లక్షల రుణాలు, 2,934 ఆర్థిక సాక్షరతా శిబిరాల ఏర్పాటు వంటి సేవలను 2,775 గ్రామాలకు అందించడం ద్వారా... మొత్తం రాయలసీమలోనే కాక, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సైతం ప్రజల జీవనోపాధి పెరగడానికి కారణమయ్యింది. అటువంటి బ్యాంకు అమరావతికి తరలితే, ఈ రూరల్ ఎకోసిస్టమ్ కుప్ప కూలుతుంది.రూరల్ బ్యాంకింగ్ లక్ష్యం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి. కడప ప్రధాన కేంద్రంగా ఏపీజీబీ ఈ లక్ష్యాన్ని నెరవేర్చింది. ‘అమరావతి’ రాజకీయ కేంద్రీ కరణకు ప్రతీక అయితే, ‘కడప’ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆలంబన. ఇక్కడి పౌర సమాజం, రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాలు అందరూ అమరావతికి ఏపీజీబీ తరలింపును వ్యతిరేకిస్తున్నారు. అధికార పక్షా నికి కడప పట్ల సానుకూలత ఉన్నా, నాయకుడిని కాదని బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి. వైసీపీ ఎంపీలు అమరావతికి వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తారు, కేంద్రానికి లేఖలు రాశారు. కాబట్టి కడపకు అనుకూలంగా ఉన్న ఈ ఏకాభిప్రాయాన్ని కాదనడం అన్యాయం. అవసరమైతే, అమరావతిలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయవచ్చు. ఒకవేళ కడపలో కేంద్ర కార్యాలయం ఉంచడం సాధ్యం కాకపోతే ఏపీజీబీ, సప్తగిరి బ్యాంకులను రాష్ట్ర స్థాయి విలీన ప్రక్రియ నుంచి మినహాయించాలి. ఆ రెండు బ్యాంకులను మాత్రమే విలీనం చేసి కడప కేంద్రంగా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి నడపాలి. ఏపీజీబీ 18 ఏళ్ల అనుభవం, నెట్వర్క్,సాంకేతికత రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఆధారం. అందువల్ల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలి. రాయలసీమ ఆర్థిక భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలి!రఘునాథరెడ్డి అలవలపాటి వ్యాసకర్త రాయలసీమ ఆకాంక్షల పౌరవేదిక కోఆర్డినేటర్ ‘ 85238 41285 -
ప్రాసంగికత కోల్పోతున్న యూరప్?
డోనాల్డ్ ట్రంప్, జె.డి. వాన్స్ కలిసి వైట్ హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఎలా వేధించారో ప్రపంచం అంతా చూసింది. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆయన పట్ల పాశవికంగా ప్రవర్తించి గుడ్ బై సైతం చెప్పకుండా తరిమేశారు. ‘రష్యాను ధిక్కరించండి, మీకు మేము అండగా ఉన్నాం...’ అంటూ ఉక్రెయిన్ అధినేతకు బాసటగా నిలిచి ఎంతగా ప్రోత్సహించాలో అంతగా ప్రోత్సహించిన యూరప్ ఈ ఘట్టాన్ని చేష్టలుడిగి చూసింది. యూరప్ ప్రభావం పలుచబడిపోతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?తగ్గుతున్న జనాభాయూరోపియన్ యూనియన్ (ఈయూ)కు బలమైన నాయ కత్వం లేదు. ఎవరి దౌత్య విధానం వారిదే. ‘యూరప్‌తో మాట్లాడా లనుకుంటే, నేను ఎవరికి ఫోన్ చేయాలి?’ అంటూ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ ఒక సందర్భంలో చేసిన సుప్రసిద్ధ వ్యాఖ్య ఇందుకు అద్దం పడుతుంది. యూరప్ దేశాలకు కాలం కూడా కలిసిరావడం లేదు. ఆ దేశాల్లో జననాల రేట్లు తగ్గుతున్నాయి.వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా, యువకులు తగ్గిపోతున్నారు. 2050 నాటికి యూరప్ సగటు వయసు 48 ఏళ్లకు పెరుగుతుంది. 60 ఏళ్లు దాటినవారు జనాభాలో 40 శాతం ఉంటారు. వందేళ్ల క్రితం ప్రపంచ జనాభాలో 25 శాతం యూరప్ దేశాల ప్రజలే ఉండేవారు. 2050 నాటికి, వీరి వాటా కేవలం 7 శాతానికి పరిమితం అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.యుద్ధరంగానికి దళాలు సమకూర్చుకోవడం కూడా ఈ దేశాలకు సమస్యగా మారుతోంది. రష్యా ఇప్పటికే ఉత్తర కొరియా దళాలను రెగ్యులర్ ప్రాతిపదికన తన సైన్యంలో నియమించుకోవలసి వచ్చింది. పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతున్నా సరే... యూరప్ కాలం చెల్లిన తన పాత ఇమ్మిగ్రేషన్ విధానాలనే పట్టుకు వేలాడుతోంది. ఇది శ్రమశక్తి సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఉక్రెయిన్ శ్వేతజాతి శరణార్థుల పుణ్యమా అని పనిచేసే వారి సంఖ్య పెరిగినా ఇది తాత్కాలికమే! ఎదుగుదల లేని ఆర్థిక వ్యవస్థపరిపాలన సరిగా ఉండదు, ఆర్థికంగా పురోగమనం లేదు, వయసు మళ్లుతున్న జనం పెరుగుతున్నారు, వృత్తిపరమైన అవకా శాలూ అంతంత మాత్రమే. ఇలాంటి యూరప్ ఇండియాను ఎలా ఆకట్టుకుంటుంది? అమెరికాలో ఒంటి రంగును బట్టి కాకుండా, సత్తాను బట్టి మనుషుల్ని అంచనా వేస్తారు. ఆ మాదిరిగా మార్పు చెందటంలో యూరప్ సమాజం విఫలమైంది. నత్తనడకగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు, పెరుగుతున్న సామాజిక భద్రతా వ్యయాలు, నడ్డి విరుస్తున్న రుణభారం... ఇవన్నీ ఆ ఖండం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. అమెరికా పాత్రికేయుడు ఫరీద్ జకారియా చెప్పినట్లు, యూరప్ దుఃస్థితికి మూల కారణం ఆర్థిక వృద్ధి లోపం. ఉదాహర ణకు ఇటలీ ఆర్థిక వ్యవస్థలో ఏకంగా ఒక దశాబ్దంగా ఎలాంటి పెరుగుదల లేదు.ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాల్లోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు బలం పుంజుకుంటూ దూసుకు వస్తున్నాయి. గ్లోబల్ గవర్నెన్స్‌లో తమకు అధిక పాత్ర ఉండాలని ఈ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, జీ–7, నాటో వంటి ప్రపంచ అధికార సంస్థలు ఇప్పటికీ యూరప్ చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. కానీ ఆర్థిక వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం అయిదు యూరప్ దేశాలు (జర్మనీ, యూకే, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ) ప్రపంచ టాప్–10 ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నాయి. 2050 నాటికి ఈ అయిదింటిలో కేవలం జర్మనీ, యూకే రెండే టాప్–10 జాబితాలో మిగిలి ఉంటాయి. ఆ పదిలో వాటికి దక్కే ర్యాంకులు చిట్టచివరి తొమ్మిది, పది! ఇందుకు భిన్నంగా, వాటి కంటే ముందుండే ఇండియా, బ్రెజిల్, ఇంకా ఇతర వర్ధమాన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో తమకు గణనీయ పాత్ర ఉండాలని ఒత్తిడి చేస్తాయి. ఇప్పటి ప్రపంచ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణను ఎంతో కాలం అడ్డుకోలేరు.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్మాణం ఇప్పటికే కాలం చెల్లిపోయింది. దీన్ని ఎలా పునర్ వ్యవస్థీకరించాలనే అంశంపై పరిశీలన జరుగుతోంది. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు ప్రస్తుత సభ్యత్వాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఒత్తిడి తెస్తున్నాయి.ఇండియా జీడీపీలో మూడోవంతు కంటే తక్కువ, జపాన్ జీడీపీలో దాదాపు సగం ఉండే యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు శాశ్వత సభ్యు లుగా ఉండటం... ఇండియా, జపాన్ వెలుపల ఉండటం ఎలా సమంజసమనీ, వాటి మీద ఈ రెండు యూరప్ దేశాలు ఎలా పెత్తనం చలా యిస్తాయనీ గట్టి వాదన వినబడుతోంది. భద్రతా మండలి, జీ–7 లను సభ్యత్వ పరంగా విస్తరించడం మీద చర్చలు నడుస్తున్నాయి. ప్రపంచ పాలన సంస్థల పునర్ వ్యవస్థీకరణ జరగాలన్నది కాదనలేని అంశం. తిరుగులేని అమెరికా?శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా మున్ముందు కూడా ప్రబలమైన ప్రపంచ శక్తిగా కొనసాగుతుంది. చైనా, ఇండియా వంటి దేశాలు దాన్ని వెన్నంటి ఉంటాయి. ఒకవేళ అధిగమించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఏమైనా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు గడిచే లోపే అప్పటి విజేతల్లో ఒక్క అమెరికా మినహా మిగిలినవన్నీ టాప్–10 జాబితా నుంచి కను మరుగవుతాయి.అమెరికా లోలోపల పలు మార్పులు చెందుతోంది. జనాభా వర్గాల్లో పరివర్తన ఫలితంగా రాజకీయంగానూ మార్పులు సంభవి స్తున్నాయి. నల్ల జాతీయుడిని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆఫ్రో–ఇండి యన్ మహిళ ఉపాధ్యక్ష పదవిని చేపట్టగలిగింది. భారతీయ అమెరికన్లు ప్రభుత్వంలో, విద్యా పారిశ్రామిక రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎగబాకారు. గుజ్జూభాయి కశ్యప్ పటేల్ ఎఫ్‌బీఐ పగ్గాలు చేపడతాడని ఎప్పుడైనా అనుకున్నామా? వివిధ దేశాల సంతతులకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ, ఇతర రంగాల్లో ప్రముఖ స్థానాలు పొందడం వల్ల ఆ యా దేశాలు అమెరికాతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాయి. విదేశీయులకు ప్రవేశం కల్పించడం వల్ల అమెరికా ప్రతిభ ఇనుమడించింది. యూరప్ ఈ విషయంలో విఫలమైంది. వర్ధమాన దేశాలు 21వ శతాబ్దపు నూతన వ్యవస్థకు రూపు దిద్దబోతున్నందున... ప్రపంచ వ్యవహారాల్లో యూరప్ పాత్ర క్రమేపీ క్షీణించిపోతుంది. యూరప్ గనుక జనాభా సంబంధిత (డెమో గ్రాఫిక్) నూతన విధానాలు రూపొందించకపోతే, ఆర్థిక పరమైన సంస్కరణలు చేపట్టకపోతే అది ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో గుర్తింపు లేని ఖండంగా మిగిలిపోతుంది.రానున్న రోజుల్లో ఆసియానే ప్రపంచ అధికార కేంద్రంగా ఆవి ర్భవిస్తుంది. 2020లో ఈ ఒక్క ఖండమే ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 60 శాతం వాటా కైవసం చేసుకుంది. ఇదే ట్రెండ్ ఇక మీదటా కొనసాగబోతోంది. చైనా, ఇండియా ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమ పలుకుబడి పెంచుకుంటూ పోయి, ప్రపంచ పాలన (గ్లోబల్ గవర్నెన్స్)లో మార్పుల కోసం పట్టుబడతాయి. అయితే, అమెరికాతో విరోధం కారణంగా చైనా, యురోపియన్ యూనియన్ (ఈయూ)కు చేరువయ్యే అవకాశం ఉంది. ఇక చైనాతో సంబంధాలు బెడిసినందువల్ల ఇండియా, అమెరికాకు బహుశా మరింత దగ్గర అవుతుంది.మోహన్ గురుస్వామి వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com -
ఊడల మర్రికి వేలాడిన వీరుడు రాంజీ గోండ్
పాలకుల అకృత్యాలను ఎదిరించడంలో మొదటి నుంచీ గిరిజనులు ముందే ఉన్నారు. భారత దేశాన్ని మొదటగా ఏకం చేసిన మొఘల్ కాలంలోనే కాదు, ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్వాళ్లపైనా ఆదివాసీలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అయితే వీళ్ల తిరుగుబాటుల గురించి అంతగా ప్రచారం జరగకపోవడం శోచనీయం. ముఖ్యంగా మన తెలంగాణలో రాంజీ గోండ్ చేసిన తిరుగుబాటు నిజాం నవాబుకు, ఆయన పాలనకు రక్షణగా నిలిచిన బ్రిటిష్ వాళ్లకూ పెద్ద గుణపాఠాన్ని నేర్పింది. గోండ్వానా ప్రాంతాన్ని పాలించిన గోండు రాజులను మరాఠాలు జయించిన తర్వాత... ఆ ప్రాంతం నిజాంకు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లకు వశమయ్యింది. వారి నిరంకుశత్వం గోండులను తిరుగుబాటుకు పురిగొల్పింది. ఆదిలాబాద్ జిల్లాలోని గోండుల్లో ధైర్యశాలిగా పేరున్న మార్సికోల్లరాంజీగోండ్ 1838–1880 మధ్యకాలంలో నాటి జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా బ్రిటిష్ సైన్యాలను దీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు. తెలంగాణలో హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి, తదితర కార్యక్రమాల్లో పాల్గొన్న రోహిల్లాల పోరాటం రాంజీ గోండ్ నాయకత్వంలో తీవ్రరూపం దాల్చింది. రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా ఆసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనులుండే ప్రాంతం. 1880 మార్చి, ఏప్రిల్ నెలల్లో బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా తుదిపోరాటం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం గోండుల తిరుగుబాటును అణచివేసే బాధ్యతను కల్నల్ రాబర్ట్‌కు అప్పజెప్పింది. తెల్లదొరల నిర్బంధాన్ని వ్యతిరేకించడం, వెట్టికి ప్రతిఫలం ఆశించడాన్ని తెల్లదొరలు సహించలేకపోయారు. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, లక్సెట్టిపేట, ఉట్నూర్, జాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యంతో అల్లకల్లోలంగా మారాయి. రాంజీ నాయకత్వంలో వెయ్యి మంది రోహిల్లాలు, గోండులు కలిసి నిర్మల్ సమీప కొండలను కేంద్రంగా చేసుకొని పోరాటం చేశారు. వారిపై నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు దాడులు చేశాయి.అడవంతా తుపాకుల మోతతో మారుమోగింది. సాంప్రదాయిక ఆయుధాలతో పోరాటానికి దిగిన ఆదివాసులు ఆధునిక ఆయుధాలు, తుపాకుల ముందు నిలువలేక పోయారు. తెగించి పోరాడుతున్న ఆదివాసులను కాల్చిచంపారు. కడదాకా పోరాడిన రాంజీ గోండు సహా 1000 మందిని పట్టుకొని నిర్మల్ నడిబొడ్డున ఉన్న ‘ఊడల మర్రి’ చెట్టుకు 1880 ఏప్రిల్ 9న ఉరితీశారు. ఆ మర్రిచెట్టు ఇప్పుడు ‘వెయ్యి ఉరిల మర్రిచెట్టు’గా ప్రసిద్ధి! – గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక(నేడు రాంజీ గోండ్ వర్ధంతి) -
వారికి భారతరత్న ఎందుకివ్వాలంటే...
మహారాష్ట్ర అసెంబ్లీ మార్చి 22న ఫూలే దంపతులు: మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలకు ‘భారతరత్న’ ఇవ్వాలని అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ గౌరవా నికి ఫూలే దంపతులు తప్ప భారతదేశ చరిత్రలో మరో జంట దొరకదు. అసలు ప్రపంచంలోనే రెండు శరీరాలు ఒకే మనస్సుతో జీవితాంతమూ మానవ మార్పునకు కృషి చేసిన జంట మరోటి లేదు. అది ఒక్క ఫూలే జంట మాత్రమే. కేంద్రం వారికి భారతరత్న ఇచ్చి వారిపట్ల తమ గౌరవాన్ని చాటుకోవాలి.మహాత్మా ఫూలే 1827 ఏప్రిల్ 11న పుడితే, 1831 జనవరి 3న సావిత్రి పుట్టింది. వారు జీవించి ఉన్న కాలానికి కాస్త ఇటు అటు ఈ దేశంలో సంఘ సంస్క ర్తలు ఎదిగారు. వారిలో కొంతమంది స్త్రీల జీవితాలను మార్చాలని ప్రయత్నించారు. ఉదాహరణకు మహారాష్ట్ర లోనే గోవింద రణడే, బెంగాల్లో ఈశ్వర చంద్ర విద్యా సాగర్, ఆంధ్రలో కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారిని తీసుకుందాం. వీరంతా బ్రాహ్మణ కులంలో పుట్టారు. బ్రాహ్మణ కుటుంబాల్లోని ఆడపిల్లలకు విద్య నేర్పించాలని, వితంతు వివాహాలు చేయించాలని మాట్లాడారు, రాశారు. కానీ వారి భార్యల స్థితి తమ కుటుంబాల్లోనే ఎలా ఉండేదో మనకు తెలియదు.వారి గొప్పతనం గురించి ఎన్నో రచనలు వచ్చాయి. స్కూలు పాఠాల్లో సంఘ సంస్కర్తగా వారి గురించే పాఠాలు చెప్పేవారు. వారు అంటరానితనం గురించి, శూద్ర దళిత స్త్రీల గురించి మాట్లాడిన దాఖలాలే లేవు. కానీ ఫూలేల గురించి ఏ పాఠ్య పుస్తకాల్లో చెప్పేవారు కాదు. వారి గురించి తెలిసిన అగ్ర కుల ఉపాధ్యాయులు వారి గురించి చెడుగా చెప్పే వారు. బెంగాల్లో కొద్దిపాటిగా ఉన్న భద్రలోక్ స్త్రీల సంస్కరణ కోసం కృషి చేసిన ఈశ్వరచంద్ర గురించి నేను స్కూల్లో ఉండగానే చదివాను. కందుకూరి గురించి సరేసరి. కానీ ఫూలే గురించి నాకు తెలిసింది 1986–87 ప్రాంతంలో! ఆయన గురించి కాస్తా వివరంగా చదవడానికి ఒక్క పుస్తకం కూడా లేదు. వెతగ్గా, వెతగ్గా కోఠి ఫుట్‌పాత్ పాత పుస్తకాల్లో ధనుంజయకర్ ఆయన మీద రాసిన బయోగ్రఫీ దొరికింది. అది చదివాక నా తల తిరిగి పోయింది. అందులో సావిత్రి బాయి గురించి కొద్దిగానే ఉంది. ఇంత గొప్ప సాంఘిక సంస్కరణకు పాటుపడిన జంటను ఈ దేశ మేధావులు ఎందుకు పక్కకు పెట్టారు? కులం వల్ల!ఇప్పుడు ఒక ఆరెస్సెస్/బీజేపీ ప్రభుత్వం, అదీ ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆ జంటకు భారతరత్న ఇవ్వాలని రిజల్యూషన్ ఎందుకు పాస్ చేసింది? ఈ జంట అనుయాయుడైన అంబేడ్కర్ వాళ్ళు ప్రారంభించిన శూద్ర–దళిత విద్యా పోరాటం నుండి ఎదిగి ఒక రాజ్యాంగం రాశారు. దానివల్ల శూద్రులకు, దళితులకు ఓటుహక్కు వచ్చింది కనుక! వారి సంఖ్యా బలం, వారి ఆత్మగౌరవ చైతన్యం ఆరె స్సెస్ ప్రభుత్వాన్ని ఈ స్థితికి నెట్టింది. శూద్రుడైన శివాజీని దేశం ముందు పెట్టింది ఫూలేనే!ఆరెస్సెస్ మాత్రమే కాదు, అగ్రకుల కమ్యూనిస్టు, ముఖ్యంగా బెంగాలీ కమ్యూనిస్టులు, దేశంలోని ఉదార వాదులు ఊహించని పరిణామం ఇది. బెంగాల్ మేధా వులు ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్లను దేశం మొత్తం విద్యా రంగంలోకి చొప్పించారు. కానీ మహాత్మా ఫూలేను, సావిత్రిబాయిని, అంబేడ్కర్‌ను తమ రాష్ట్ర పరిధిలోకి రానివ్వలేదు. మండల్ కమిషన్ పోరాట చరిత్రను కూడా వాళ్ళు గుర్తించలేదు. ఈ సంవత్సరం ఫూలే దంపతులకు భారతరత్న వస్తే శూద్ర–దళిత ఆదివాసీ స్త్రీల చరిత్ర మార్చే చర్చ ఏ రాష్ట్రమూ పక్కకు పెట్టలేనంత ఎదుగుతుంది. ఫూలే జంట కేవలం భారత దేశానికే కాదు మొత్తం భూ ప్రపంచానికే ఏం పాఠం నేర్పారో తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ భూమి మీద పెద్ద పెద్ద మతాలను స్థాపించిన బుద్ధుడు, జీసస్, మహమ్మద్ వంటి వారు నడిచారు. అందులో బుద్ధుడు, మహమ్మద్ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. జీసెస్ శిలువేసి చంపబడ్డారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో జ్యోతి రావు ఫూలే, సావిత్రిబాయిని పెళ్ళి చేసుకొని పెళ్ళి అర్థాన్నే మార్చారు. అందుకు దీటుగా ఆమె భార్య అనే అర్థాన్నే మార్చారు.వాళ్ళు 19వ శతాబ్దంలో ఎటువంటి భార్యా భర్తలుగా ఈ భూమి మీద నడిచారో కొన్ని ఉదా హరణలతో చూద్దాం. సావిత్రీబాయికి 9వ ఏట, ఫూలేకు 13వ ఏట పెండ్లి అయింది. అది బాల్య వివాహమే. అయితే ఫూలే ఏం చేశారు? ఆమెతో పడక గదిలో భర్తగా జీవించలేదు. ఆమెకు టీచరై అక్కడ చదువు చెప్పారు. అంత గొప్ప పనిచేస్తే పూనా పండితులు తిలక్ నేతృత్వంలో ఆయన తండ్రిని బెదిరించి, బట్టలు బయట పడవేయించి ఇంటి నుండి తరిమేయించారు. ఆ యువ దంప తులు దళిత వాడల్లో మకాం పెట్టి అక్కడే ఒక దళిత మిత్రుడి ఇంట్లో ఆడవాళ్ళకు స్కూలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే తన దగ్గర పాఠాలు నేర్చుకున్న సావిత్రిని ఒక టీచర్ని చేశారు ఫూలే.అంతేగాక కుటుంబాల నుండి బయటికి నెట్టబడ్డ వితంతువుల కోసం ఒక నివాస కేంద్రాన్ని ప్రారంభించారు. ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు – యశ్వంతరావుని పెంచుకున్నారు. అంతకు ముందు వాళ్ళి ద్దరూ 30 ఏండ్ల వయస్సులో ఉండగా సావిత్రి తండ్రి,ఖండోజీ పాటిల్ వచ్చి ఫూలేతో... ‘నేను సావిత్రిని ఒప్పించాను, మీకు పిల్లలు కావాలి కనుక మరో పెళ్ళి చేసుకో’ అని కోరాడు. దానికి ఫూలే... ‘లోపం సావి త్రిలో లేదు, నాలో ఉంది. ఆమెకు మరో పెండ్లి చేద్దాం. ముగ్గురం కలిసి పిల్లల్ని పెంచుతాం’ అని బదులు చెప్పారు. ఇటువంటి భర్త ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా!ఫూలే 1890లో పక్షవాతంతో చనిపోయారు. ఆయన బంధువులు సాదుకున్న కొడుకు తలగోరు (తలకొరివి) పెట్టడానికి వీలులేదు అని గొడవ చేశారు. ఫూలే బంధువులలో ఒక పురుషుడు తలగోరు పెడ తానని వాదించాడు. సావిత్రి వారిని ధిక్కరించి ‘నేనే నా భర్తకు తలగోరు పెడతాన’ని చెప్పి ఆ కార్యం నిర్వర్తించారు. ఈ పని చేసిన మొదటి భారత స్త్రీ ఆమె. 1898లో బుబానిక్ ప్లేగు వ్యాపించిన సమయంలో సావిత్రీబాయి, డా‘‘ యశ్వంతరావు ప్రజలకు వైద్యం చేస్తూ అదే రోగానికి బలై చనిపోయారు.ఈ జంటను మహారాష్ట్ర అగ్రకుల మేధావులు చాలా కాలం వెలుగులోకి రానివ్వలేదు. ఇప్పుడు ఆరె స్సెస్ ప్రభుత్వం వారికి భారతరత్నను ప్రతిపాదించింది. ఇది కాంగ్రెస్‌కు మరో సవాలు కానుంది. శూద్ర బీసీలను ఆకట్టుకోవడంలో ఇది ఆరెస్సెస్‌కు పెద్ద ఆయుధమౌతుంది. అంబేడ్కర్‌కు భారతరత్న వీపీ సింగ్ ప్రభుత్వం ఇచ్చినా ఆరెస్సెస్–బీజేపీలు దాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. కాంగ్రెస్‌ను కుటుంబ పార్టీ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఇప్పుడు ఫూలేలకు భారతరత్నను తమ ప్రభుత్వమే స్వయంగా ఇచ్చిందని పెద్ద ప్రచారం ప్రారంభిస్తాయి. ఈ స్థితిలో తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఫూలే లను దీటుగా ఓన్ చేసుకోకపోతే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి చాలా పెద్ద సమస్య అవుతుంది.కనీసం ఈ రెండు ప్రభుత్వాల వాళ్ళు అటువంటి తీర్మానాలే అసెంబ్లీలలో పాస్ చేసి కేంద్రానికి పంపడం, ఫూలేలకు శూద్ర బీసీ జీవితాలను ప్రతిబింబించే మ్యూజియవ్‌ులను కట్టించడం చెయ్యాలి. ఈ రాష్ట్రాల్లో అగ్రకులాలు తమ చదువులకు పునాదులు వేసిన జంటగా ఫూలేలను చూడటం లేదు. వారి నుండి ఒక్క మేధావి కూడా వారి గురించి రాయడం, మాట్లాడటం చెయ్యడం మనకు కనిపించదు. వారిని గుర్తించి గౌరవించడం అన్ని కులాల ఆత్మగౌరవానికీ నిదర్శనం.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు(ఏప్రిల్ 11న మహాత్మా ఫూలే జయంతి) -
వ్యవసాయ సుంకాల కాపట్యం
అధిక సబ్సిడీలతో కూడిన అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు భారతదేశం తన మార్కెట్‌ను తెరవాలని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చాలా ప్రత్యేకంగా కోరిన ట్లుగా నేను ఇటీవల చదివాను. అది చదివిన ప్పుడు, ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త నికోలస్ స్టెర్న్, తన భారతదేశ పర్యటనల సమయంలో క్లుప్తంగా చెప్పింది గుర్తొచ్చింది. ‘అమెరికా రైతులకు అలాంటి సబ్సిడీలను అందించడం తప్పేనని నేను అంగీకరిస్తున్నాను. కానీ అమెరికా ఉత్పత్తులకు భారతదేశం తన తలుపులు తెరవకపోతే అది విపత్తుకు దారితీస్తుంది.’జార్జ్ బుష్ జూనియర్ హయాంలో 2001 నుండి 2005 వరకు పదవిలో ఉన్న యాన్ వెనెమన్ మొదలుకుని, అమెరికా వ్యవసాయ మంత్రులందరూ ఇదే విధమైన కపటత్వాన్ని పదే పదే ప్రదర్శించారు. కొంతకాలం తర్వాత వాషింగ్టన్ డీసీలోని ‘ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (ఐఎఫ్పీఆర్ఐ)లో మాట్లాడుతూ, భారత వ్యవసాయాన్ని బలవంతంగా తెరవాలన్న ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త వాదనను ఆమె ఎంత నిస్సిగ్గుగా సమర్థించిందో నాకు గుర్తుంది.అమెరికాలోని కనీసం 14 వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి గ్రూపులు, భారతదేశ ఉత్పత్తి నిర్దిష్ట కనీస మద్దతు ధరపై పరిమితిని కోరుతూ అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌కు లేఖలు రాశాయి. అప్పుడే ఇండియాకు అమెరికా ఎగుమతులు చేయడానికి వీలుంటుంది మరి.చైనా నిలబడిన తీరుఅందువల్ల, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన అవాంఛ నీయ వాణిజ్య యుద్ధం పట్ల నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలను లొంగదీసుకోవడానికి ట్రంప్ చుట్టూ ఉన్న బిలియనీర్లు ఆయనకు తప్పుడు సలహా ఇస్తున్నారు.అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అమెరికా పట్ల ధిక్కార వైఖరితో నిలబడటం ప్రారంభించాయి. కాబట్టి భారతదేశాన్ని కాస్త వంగమని మాత్రమే అడిగినప్పుడు, అది సాష్టాంగపడటానికి సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను.ఇక్కడ మరొక కథ చెబుతాను. కొన్నేళ్ల క్రితం, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ‘చెడ్డ’ మానవ హక్కుల రికార్డు కారణంగా చైనాతో అమెరికా వ్యాపారం చేయదని వ్యాఖ్యానించారు. మరుసటి రోజు, నేను ‘బీబీసీ’ టీవీ ఛానెల్‌ని చూస్తున్నాను. ఒక జర్నలిస్ట్ అప్పటి చైనా అధ్యక్షుడిని అడుగుతున్నారు: ‘చైనాతో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు చేసిన బెదిరింపునకు మీరు ఎలా స్పందిస్తారు?’ ఆయన సమాధానం కూడా అంతే చిన్నది: ‘యూఎస్‌తో వ్యాపారం చేయడమా? మేము నాలుగు వేల ఏళ్లకు పైగా అమెరికాతో వ్యాపారం చేయలేదు. కాబట్టి అది అంత ముఖ్యమైనదా?’ఈ ప్రకటన తర్వాత, చైనాతో వాణిజ్యాన్ని నిలిపివేయాలని తమ సొంత అధ్యక్షుడు ఇచ్చిన పిలుపును వ్యతిరేకిస్తూ అమెరికా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు తిరగబడ్డాయి. బిల్ క్లింటన్ చివరికి దేశీయ పరిశ్రమ ముందు తల వంచి, మళ్ళీ ఎప్పుడూ ఆ సమస్యను లేవనెత్తలేదు.సుంకాల వాణిజ్య సూత్రాలుకొత్త సుంకాల యుద్ధానికి తిరిగి వస్తే, అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ప్రవేశాన్ని పరిమితం చేసే విషయంలో ట్రంప్ భారత దేశాన్ని ‘సుంకాల రాజు’ అని విమర్శించవచ్చు. ఎందుకంటే, అమె రికా 5 శాతం సుంకాలను విధిస్తుంటే, భారత్ సగటున 39 శాతం సుంకాలను విధిస్తోంది. అయితే, భారత్ విధించే సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. దేశ అభివృద్ధి స్థాయి, వాణిజ్య పుస్తకాలలో పేర్కొన్న ‘ప్రత్యేక, భేదాత్మక వ్యవ హారం’ ఆధారంగా వీటిని విధించారు. భారత్ ఏ దశలోనూ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించలేదని తెలియజేయాలి. భారత్ సాపేక్షంగా విధిస్తున్న అధిక సుంకాలు, అప్పటికే రూపొందించి ఉన్న వాణిజ్య సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. పైగా ఒక వ్యక్తి ఇష్టానిష్టాల ద్వారా వాటిని నియంత్రించడం ఉండదు.మరోవైపు, వ్యవసాయానికి అమెరికా అందించే భారీ సబ్సిడీలే వాస్తవానికి సమస్య. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలు తాము మరిన్ని అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ అమెరికా వ్యవసాయ సబ్సిడీలను కాదు’ అని అప్పటి యూరోపియన్ ట్రేడ్ కమిషనర్ పీటర్ మాండెల్సన్ పేర్కొన్న విషయాన్ని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ (2006 జూలై 21) స్పష్టంగా రాసింది. ‘అమెరికా రైతులతో పోటీ పడటానికి మాకు అభ్యంతరం లేదు, కానీ మేము అమెరికా ఖజానాను ఎదుర్కోలేము’ అని అప్పటి భారత వాణిజ్య మంత్రి కమల్‌నాథ్ చెప్పింది ఆయన ఉటంకించారు.రైతులకు ఎంత ఇస్తున్నారు?గత కొన్ని సంవత్సరాలుగా, అమెరికా తన అధిక సబ్సిడీ వ్యవసాయం చుట్టూ నిర్మించిన రక్షణ కోటను మరింత బలోపేతం చేసుకుంది. అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన ఆర్థిక పరిశోధన సేవ నివేదిక ప్రకారం, రైతులు, పశువుల పెంపకందారులకు ప్రత్యక్ష ప్రభుత్వ వ్యవసాయ కార్యక్రమం కింద చెల్లింపులు 2025 నాటికి 42.4 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని అంచనా. నిజానికి 2024 నాటికి 9.3 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని అంచనా వేశారు.అంటే ఒక్కో రైతుకు అమెరికా ప్రభుత్వం సాలీనా రూ. 26.8 లక్షలను చెల్లిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చలలో వివాదాస్పద అంశంగా మిగిలిపోయిన పత్తిని ఉదాహరణగా తీసుకుందాం. 2021 నాటికి 624.7 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్న కేవలం 8,103 మంది రైతులకు అమెరికా భారీ సబ్సిడీలను అందిస్తోంది (ఇండియాలో 98.01 లక్షల మంది రైతులు పత్తి సాగులో నిమగ్నమై ఉన్నారు). న్యూఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ డబ్ల్యూటీఓ స్టడీస్’ లెక్కల ప్రకారం, 2021లో అమెరికా పత్తి రైతుకు లభించిన వార్షిక మద్దతు 1,17,494 డాలర్లు కాగా, భారత్ విషయంలో అది కేవలం 27 డాలర్లు.2006లో యూరోపియన్ యూనియన్ పత్తికి 139 శాతం సబ్సిడీ మద్దతును అందించింది. 2001లో అభివృద్ధి చెందిన దేశాల పరిమితి కంటే అమెరికా పత్తికి 74 శాతం అధిక మద్దతును అందించింది. వ్యవసాయ దిగుమతులకు తక్కువ సుంకాలు అని అమెరికా అనడం అంటే, తమ వ్యవసాయం బహిరంగ మార్కెట్ అని చూపించడం కోసమే! కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే, దిగుమతులను నియంత్రించడానికి అమెరికా 9,000 కంటే ఎక్కువ పన్నేతర అడ్డంకులు (ఎన్టీబీలు) విధించింది. దీంతో పోలిస్తే ఇండియా విధించిన ఎన్టీబీలు కేవలం 600. సుంకాలతోనే సుంకాలను అమెరికా సమం చేస్తుందని ట్రంప్ చెబుతున్నారు. భారత్ కూడా తన సొంత వ్యవసా యాన్ని కాపాడుకోవడానికి సరిపోలే పన్నేతర అడ్డంకులని ఉపయో గించడానికి తగినంత అవకాశం ఉంది. భారతపై ట్రంప్ వేసిన తాజా అదనపు 27 శాతం ప్రతిచర్య సుంకాలతో మన రొయ్యలు, బాస్మతేతర బియ్యం, గోదుమల ఎగుమతికి దెబ్బే. అమెరికాతో భారత వాణిజ్యంలో అవే దాదాపు 46 శాతం ఉంటాయి. ఏమైనా, భారత్ తన ఇంటిని క్రమబద్ధీకరించు కోవాలని అమెరికా కోరుకునే బదులు, అమెరికాయే వ్యవసాయరంగం ద్వారాలు తెరవాలని భారత్ అడగాల్సిన అవసరం ఉంది. అమెరికా వ్యవసాయం చుట్టూ ఉన్న అధిక సబ్సిడీ కోటను ముందుగా కూల్చి వేయాలని అడిగితేనే ఇది సాధ్యమవుతుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ, ఆహార నిపుణులు -
బెయిల్ నియమం! జైలు మినహాయింపు!!
తీవ్రత లేని కేసుల్లో కూడా బెయిల్‌ని ట్రయల్ కోర్టు తిరస్కరించే ధోరణి పెరుగుతున్నందుకు సుప్రీంకోర్టు ఈమధ్య తీవ్ర ఆందోళన వ్యక్తపరిచింది. ప్రజాస్వామ్య రాజ్యం పోలీసు రాజ్యంగా మార కూడదని న్యాయమూర్తులు అభయ్ ఎస్. ఓకా, ఉజ్జల్ భూయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ దరఖాస్తులను ట్రయల్ కోర్టులు అనవసరంగా తిరస్కరించడం వల్ల సుప్రీంకోర్టు మీద అనవసర భారం పడుతోందని, ట్రయల్ కోర్టు స్థాయిలో పరిష్కరించాల్సిన కేసులకు సంబంధించిన బెయిల్ పిటీషన్లను సుప్రీంకోర్టు పరిష్కరించవలసి రావడం మీద జస్టిస్ ఓకా దిగ్భ్రాంతిని వ్యక్త పరిచారు. దర్యాప్తు పూర్తి అయిపోయి చార్జిషీట్ దాఖలైన కేసుల్లో ముద్దాయి రెండు సంవత్సరాలకు పైగా నిర్బంధంలో ఉన్నప్పటికీ ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. అది ఓ చీటింగ్ కేసు. ఆ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. 20 సంవత్స రాల క్రితం ఇలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టులకు కూడా చేరేవి కావనీ, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అలాంటి పిటీషన్లతో నిండి పోతోందనీ అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం పేర్కొంది.ప్రజాస్వామ్య దేశంలో దర్యాప్తు సంస్థలు అనవసరంగా అరెస్టు చేయడానికి వీల్లేదనీ, పోలీసు రాజ్యంగా మార్చకూడదనీ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర పదజాలంతో తన ఉత్తర్వులలో పేర్కొంది. కస్టడీ అవసరం లేని కేసుల్లో వ్యక్తులను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు 2022లో జారీ చేసిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం గుర్తు చేసింది. ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. అందుకని బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టులు ఉదారంగా ఉండాలి.‘బెయిల్ అనేది నియమం. జైలు అనేది దానికి మినహాయింపు’. ఈ ప్రాథమిక చట్టపరమైన సూత్రాన్ని కోర్టులు పదేపదే విస్మరిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఈ కేసుని పేర్కొనవచ్చు. ఈ కేసులో ముద్దాయి మోసం కేసులో నిందితుడు. రెండు సంవత్సరాలకు పైబడి కస్టడీలో ఉన్నాడు. పోలీసులు తమ దర్యాప్తును పూర్తి చేశారు. చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు. అయినప్పటికీ అతని బెయిల్ పిటీషన్‌ను ట్రయల్ కోర్టు – గుజరాత్ హైకోర్టులు తిరస్కరించాయి. చివరికి అతనికి బెయిల్‌ని సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వచ్చింది.బెయిల్ మంజూరు చేయడం గతంలో సరళంగా ఉండేది. ఇప్పుడు సంక్లిష్టంగా మారిపోయింది. జవాబు, రిజాయిండర్ (ప్రతి జవాబు); సర్రిజాయిండర్ లాంటి సంస్కృతి పెరిగిపోతోంది. ఎన్.డి. పి.ఎస్., మనీలాండ రింగ్ లాంటి చట్టాలు నిరూపణా భారాన్ని ముద్దాయిపైనే మోపుతున్నాయి. దీనివల్ల రెగ్యులర్ బెయిల్ దరఖాస్తులు వెనకబడి పోతున్నాయి.క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 437(4) ప్రకారం, అదే విధంగా భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 480(4) ప్రకారం... బెయిల్ మంజూరు చేసినప్పుడు తగు కారణాలను రాయాల్సి ఉంటుంది. బెయిల్ తిరస్కరించినప్పుడు ఎలాంటి కార ణాలూ రాయాలని చట్టం నిర్దేశించలేదు. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం తగు కారణాలు మాత్రమే కాదు, ఎందుకు బెయిల్ మంజూరు చేయాల్సి వస్తుందో కూడా వివరంగా రాయాల్సి ఉంటుంది. ఇది రాయడం కొంత కష్టమైన పని. తగు సమయం అవసర మవుతుంది. ఐ.పి.సి. కేసుల్లో అంత వివరమైన కారణాలు అవసరం లేదు. అయినా కోర్టులు బెయిళ్లను తిరస్కరించ డానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. బెయిల్ అనేది నియమం– జైలు అనేది మినహాయింపు అనే సూత్రాన్నే కోర్టులు పాటించాలి. మనీ లాండరింగ్, ‘ఉపా’ లాంటి కేసుల్లో ఈ సూత్రాన్ని కొన్ని మార్పులతో వర్తింప చేయాల్సి ఉంటుంది.గత సంవత్సరం ప్రతి సుప్రీంకోర్టు బెంచ్ ప్రతిరోజూ కనీసం 15 నుంచి 20 బెయిల్ దరఖాస్తులను విచారిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ అన్నారు. సుప్రీంకోర్టు గత నాలుగైదు సంవత్సరాల నుంచి బెయిల్ దర ఖాస్తుల పరిష్కారానికే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. దీనివల్ల రాజ్యాంగపరమైన వివాదాలను పరిష్కరించాల్సిన సమయాన్ని సుప్రీంకోర్టు ఈ కేసుల వివాదాలను పరిష్కరించడానికి వినియోగించాల్సి వస్తోంది. చాలా బెయిల్ దరఖాస్తులను జిల్లా న్యాయ వ్యవస్థ పరిష్కరించవచ్చు. బెయిల్ అనేది ఒక నియమం అన్న విషయం జిల్లా న్యాయవ్యవస్థకు తెలియని విషయం కాదు. కానీ వారు రకరకాల కారణాల వల్ల బెయిల్స్‌ను మంజూరు చేయడానికి వెనకాడుతున్నారు. అందులో ముఖ్యమైనది – బెయిల్ మంజూరు చేస్తే మోటివ్స్ని న్యాయమూర్తులకు అంటగడుతారనీ, అదే విధంగా హైకోర్టు పాలనాపరమైన చర్యలు తీసుకుంటుందన్న భయం కూడా న్యాయమూర్తులను వెంటాడుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా బెయిల్స్ విషయంలో రకరకాలైన అభిప్రాయాలు, ఉత్తర్వులను జారీ చేశాయి. అది కూడా మరో కారణం. అందుచేత ఈ మధ్యన బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు నిలకడగా ఉన్నాయి. ‘బెయిల్ అనేది నియమం. తిరస్కరించడమ నేది మినహాయింపు’ అనే సూత్రానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయి. జిల్లా న్యాయ వ్యవస్థ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని బెయిల్స్‌ను ఉదారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రేరేపిత కేసుల సంఖ్య పెరుగుతున్న కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టులపై పని భారం పెంచకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా న్యాయ వ్యవస్థపై ఉంది.డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు -
రెండు ఉపయోగకర పర్యటనలు
ప్రధాని మోదీ ఈ నెల మొదటి వారంలో రెండు ఉపయోగకరమైన విదేశీ పర్యటనలు జరిపారు. మొదటిది – 4వ తేదీన థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ‘బిమ్ స్టెక్’ శిఖరాగ్ర సమావేశం కోసం. రెండవది – ఆ మరునాడు శ్రీలంకకు! ఈ రెండూ దేశ ప్రయోజనాలకు అవసరమైనవి కాగా, అద నంగా మరొకటి చెప్పుకోవాలి. బ్యాంకాక్‌లో ఆయన బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహా దారు మహమ్మద్ యూనుస్‌తో విడిగా సమావేశం కావటం.లుక్ ఈస్ట్ – యాక్ట్ ఈస్ట్వివిధ దేశాల మధ్య పరస్పర సహకారాలే కాకుండా ఒక ప్రాంతానికి చెందిన దేశాల మధ్య అందుకోసం ప్రాంతీయ సంస్థలు ఏర్పడటం ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలం తర్వాత నుంచి ఉండగా, ఆ క్రమంలో ఇండియాకు సంబంధించి 1997లో వచ్చిందే ‘బిమ్స్టెక్’. ఇటువంటివి సార్క్, హిందూ మహాసముద్ర తీర దేశాల సంస్థల పేరిట కూడా ఏర్పడ్డాయి గానీ, కారణాలు ఏవైనా అవి సంతృప్తికరంగా పనిచేయలేదు. ఆగ్నేయాసియాకు సంబంధించి 1967 నుంచి గత 57 ఏళ్లుగా విజయవంతంగా పనిచేస్తున్నది ‘ఆసి యాన్’ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్) ఒక్కటే. ‘ఆసియాన్’ దేశాలన్నీ భారత్ కన్నా చాలా చిన్నవి. వాటి ఆర్థిక వ్యవస్థలు కూడా చిన్నవే. ఆ పరిస్థితితో పోల్చినప్పుడు భారత్ కేంద్రంగా ఒక బలమైన ఆర్థిక సహకార వ్యవస్థ ఎప్పుడో ఏర్పడి బల పడ వలసింది. కానీ, విధానపరమైన లోపాల వల్ల ప్రభుత్వాలు కొంత కాలం అప్పటి సోవియట్ వైపు, తర్వాత పాశ్చాత్య ప్రపంచంవైపు చూశాయి గానీ చుట్టూ గల ఆసియా దేశాలను నిర్లక్ష్యం చేశాయి. ఈ వెనుకటి విధానాలకు భిన్నంగా మొదటిసారిగా ‘లుక్ ఈస్ట్’ పేరిట కొత్త విధానాన్ని ముందుకు తెచ్చింది, 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు. ఆ విధంగా కొత్త దృష్టి అయితే ఏర్పడింది గానీ, ఆయనే అమలుకు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, వాటి అవసరాలను బట్టి అయినా తూర్పు దేశాలతో ఆర్థిక సంబంధాలు తగినంత అభివృద్ధి చెందలేదు. పీవీ ఐదేళ్ల పాలన తర్వాత రాజకీయ అస్థిరతలు ఏర్పడటం అందుకొక ముఖ్య కారణం. అప్పటికీ, విదేశాంగ వ్యవహారాలలో నిపుణుడైన గుజ్రాల్ నేషనల్ ఫ్రంట్, యునై టెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల కాలంలో విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా పని చేసినపుడు 1997లో ‘బిమ్స్టెక్’ కోసం చొరవ తీసుకున్నారు.‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ– సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో ఆపరేషన్’ పేరిట ఏర్పడిన ఆ సంస్థలో మొదట ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్ సభ్య దేశాలు కాగా, తర్వాత నేపాల్, భూటాన్, మయన్మార్ చేరాయి. మోదీ ప్రధాని అయిన తర్వాత ‘లుక్ ఈస్ట్’ను ‘యాక్ట్ ఈస్ట్’గా మార్చి కొంత చురుకుదనం తెచ్చారు.సుదీర్ఘ అశ్రద్ధఇతర ఆసియా దేశాలతో కన్నా ‘బిమ్స్టెక్’ మధ్య సంబంధాలు మందకొడిగానే ఉన్నాయి. సంస్థ ఆర్థిక, రక్షణ సహకార విషయాలు అధికారుల స్థాయికి పరిమితం కాగా, ఈ నెల నాల్గవ తేదీ నాటి శిఖరాగ్ర సమావేశం ఏడేళ్ల తర్వాత జరగటం గమనించదగ్గది. ఏడు సభ్య దేశాలలో నేపాల్, భూటాన్ చిన్నవి, సముద్ర తీరం లేనివి అను కున్నా, తక్కిన అయిదు కూడా ముఖ్యమైనవి, సముద్ర తీరం గలవి. సముద్ర మార్గ రవాణాలు, రక్షణలకు కీలకమైన ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ రెండు అంశాలను ‘బిమ్స్టెక్’ లక్ష్యాలలో ప్రముఖంగా పేర్కొ న్నారు కూడా! అయినప్పటికీ ఇంతకాలం కనిపించిన అలసత్వ వైఖరులు వాటికవే సరైనవి కాదు. ఈ పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్‌లతో చైనా సన్నిహితమయ్యింది. అనగా, ఇండియాకు భౌగోళికంగా దగ్గరగా ఉండి, బంగాళాఖాత తీర ప్రాంతానివి అయి కూడా భారత్ వాటిని ‘బిమ్ స్టెక్’ ఏర్పాటు తర్వాత సైతం దగ్గర చేసుకోలేక, చైనాతో పోటీపడాల్సి వస్తున్న దన్నమాట. సంస్థలోని తక్కిన దేశాలకన్న భారత ప్రయోజనాలు విస్తృతమైనవి కావటం, బంగాళాఖాతం కీలక ప్రాంతంలో, అందులోనూ హిందూ మహాసముద్రానికి అనుసంధానమై ఉండ టాన్ని బట్టి అటువంటి చొరవలు ఇండియాకే ఎక్కువ అవసరం. అయినా సుదీర్ఘ కాలం అశ్రద్ధలన్నవి ఎంత పొరపాటో చెప్పనక్కర లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తిరిగి శిఖరాగ్ర సమావేశం జరగటం మంచి పని. ట్రంప్ సుంకాల హెచ్చింపు చర్యలు సృష్టిస్తున్న ఒత్తిడుల మధ్య జరగటం మరింత మంచిదవు తున్నది. సమావేశంలో చర్చించిన ఆర్థిక సహకారం, అభివృద్ధి, శాస్త్ర–సాంకేతిక రంగాలు, రక్షణ వంటి అంశాలు షరా మామూలువే అయినా, ‘ప్రపంచంలో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా పరస్పర అభివృద్ధిపై దృష్టి పెట్టడం’ అన్నది ప్రత్యేకంగా గమనించ వలసిన ప్రకటన. బంగ్లా, లంకలతో సంబంధాలుపోతే, ఇదే సంస్థలోని పొరుగు దేశమైన బంగ్లా నాయకునితో మోదీ సమావేశం, సంబంధాల పునరుద్ధరణకు దారితీసినట్లయితే ఉభయులకూ మేలు చేస్తుంది. ఇండియా జోక్యంతో 1971లో ఏర్ప డిన ఆ దేశంతో సంబంధాలు ఈ 55 ఏళ్ళలో తరచూ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధాని షేక్ హసీనా పతనం నుంచి కొద్ది నెలలుగా తిరిగి అదే పరిస్థితి తలెత్తింది. ఈ నాయకులిద్దరూ బ్యాంకాక్‌లో అసలు విడిగా సమావేశమవుతారా అనే సందేహాలుండేవి. కానీ, భారత ప్రధానికి అందజేసేందుకు బంగ్లా నాయకుడు జ్ఞాపక చిహ్నంగా ఒక పాత చిత్రాన్ని వెంట తీసుకువచ్చారంటేనే సామరస్య వైఖరి కనిపిస్తున్నది. బంగ్లాలో త్వరలో జరుగనున్న ఎన్నికలలో ఎవరు అధికారానికి రాగలదీ తెలియదు. ఇండియా మిత్ర పక్షమ నుకునే షేక్ హసీనా ‘అవామీ లీగ్’కు మాత్రం అవకాశాలు కన్పించటం లేదు. ఇండియాలో అనధికార శరణార్థి రూపంలో ఉన్న ఆమెను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని బ్యాంకాక్‌లో మోదీని బంగ్లా నాయకుడు మరొకమారు కోరారు. ఇరు దేశాల సంబంధాలలో ఇదొక చిక్కు ప్రశ్న. అక్కడ హిందువులపై దాడుల సమస్య అట్లానే ఉంది. వీటన్నింటినీ అధిగమిస్తూ ‘బిమ్స్టెక్’ లక్ష్యాల వైపు కదలటం రెండు దేశాలకూ పెద్ద పరీక్షే. కానీ ఉత్తీర్ణత సాధించక తప్పని పరీక్ష. శ్రీలంక విషయానికి వస్తే, భౌగోళికతలు, ఆర్థిక, రక్షణ అవస రాలు, పరస్పర సహకారాలు, విభేదాలు అన్నింటి విషయాలలోనూ ఇండియా సంబంధాలు బంగ్లాదేశ్‌ను పోలి ఉండటం యాదృచ్ఛికమే కావచ్చు. అక్కడ సరికొత్త శక్తులు పూర్తి మెజారిటీలతో గెలిచి అధికారానికి రావటంతో పరిస్థితులు మారాయి. కొత్త అధ్యక్షుడు దిస్సనాయకే, దేశంలో నెలకొని ఉన్న సమస్యలు, వాటి నుంచి బయటపడి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనే పట్టుదల వల్ల, భారతదేశంతో గతంలో ఉండిన విభేదాలను మరచిపోయి పరస్పర సహకారం కోసం ప్రయత్నిస్తున్నారు. చైనాకు ఎంత సన్నిహితమైనా, తమ విధానం సంతులనమని కొత్తలోనే ప్రకటించటం, చైనా కన్న భారత్‌ను మొదట సందర్శించటం దిస్సనాయకే దౌత్యనీతికి రుజువులు. మోదీ సందర్శన సందర్భంగా ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద స్వాగతం చెప్పిన అసాధారణ చర్య, ఆయనకు ‘మిత్ర విభూషణ’ పురస్కారం, తమ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించనివ్వబోమన్న హామీ ఇదే కోవలోకి వస్తాయి. వివిధ ఆర్థిక, రక్షణ ఒప్పందాలు రెండు వైపుల నుంచి సజావుగా అమలైతే, ట్రంప్ ఆవిష్కరిస్తున్న కొత్త ప్రపంచపు సాధక బాధకాలను సమష్టిగా ఎదుర్కొన వీలవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మావోయిస్టులపై మారణకాండ : చర్చలు జరపాలి
ప్రభుత్వం మావోయిస్టులపై జరుపుతున్న యుద్ధాన్ని, మారణకాండను చర్చల ఆధారంగా ముగించాల్సిన సమయం ఆసన్నమైంది! వచ్చే ఏడాది ప్రారంభం నాటికి మావోయిస్టు ముప్పును నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తోంది. ప్రస్తుతం 400 మంది సాయుధ కేడర్ మాత్రమే మిగిలి ఉన్నారని, ఎక్కువ భాగం ఆయుధాలు మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్నామని కూడా చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే మావోయిస్టుల వలన ప్రభుత్వానికి వచ్చే నష్టం, శాంతి భద్రతల సమస్య ఏమీ లేదు. అయినా ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కాల్పుల విరమణ సంభాషణకు సీపీఐ (మావోయిస్ట్) సంసిద్ధత వ్యక్తం చేయటం ప్రాముఖ్యాన్ని సంత రించుకుంది. దాన్ని సులభతరం చేయడానికి, చర్చల కాలంలో యుద్ధాన్ని నిలిపివేయాలని మావోయిస్టులు కోరారు. అయితే, మావోయిస్టులు ఎటువంటి షరతులు ముందుకు తేక పోతేనే బీజేపీ నేతృత్వంలోని ప్రభు త్వం చర్చలకు వెళుతుందని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి అన్నారు. చర్చలలో మావోయిస్టు సమస్యకు తగిన పరి ష్కారం చూపి అమాయక ఆదివాసీల జీవనం సాఫీ అయ్యేలా ప్రభుత్వం వ్యవహరించాలి.– మన్నవ హరిప్రసాద్ సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్, పొలిట్ బ్యూరో సభ్యుడు -
ఏఐలో మనం మేటి కావాలంటే...
కొత్త సంవత్సరం మొదలై మూడు నెలలే అయింది కానీ... కృత్రిమ మేధ రంగంలో ఈ స్వల్ప అవధిలోనే పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. జనవరిలో విడుదలైన డీప్‌సీక్ ఆర్–1 ఒకటైతే... ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇంకోటి. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్‌లు సంయుక్తంగా అధ్యక్షత వహించిన ఈ సదస్సులోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏఐ తీసుకురాగల రాజకీయ, భద్రతాపరమైన సవాళ్లను ప్రపంచం ముందుంచారు. చివరగా మోదీ తాజా అమెరికా పర్యటనలో ఇరు దేశాల మధ్య ఏఐ వంటి కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. ఏఐ రంగం నేతృత్వాన్ని ఆశిస్తున్న భారత్‌పై ఈ పరిణామాల ప్రభావం ఏమిటి?డీప్‌సీక్ ఆర్–1 సంచలనం తరువాత భారత్‌లో నడుస్తున్న చర్చ ఏమిటీ అంటే... మనదైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఒకటి తయారు చేసుకోవాలని. ఇందుకు అవసరమైన ఏఐ చిప్స్ అందు బాటులో ఉండేలా చూసుకోవాలని! మరోవైపు ప్రభుత్వం కూడా సొంత ఎల్ఎల్ఎం అభివృద్ధిపై ప్రకటన చేసింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పింది. నేషనల్ ఏఐ మిషన్ స్టార్టప్‌లు, పరిశోధకుల కోసం పది వేల జీపీయూలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. అంతేకాకుండా... ఎల్‌ఎల్‌ఎంలతోపాటు స్మాల్ లాంగ్వేజ్ మోడళ్లు, ప్రాథమికమైన ఏఐ మోడళ్ల తయారీకి పిలుపునిచ్చింది.ఈ చర్యలన్నీ ఆహ్వానించదగ్గవే అయినప్పటికీ... ఇవి మాత్రమే సరిపోవు. డీప్‌సీక్ విజయవంతమైన నేపథ్యంలో చేపట్టాల్సిన పనుల ప్రాథమ్యాల్లోనూ ఇవి లేవనే చెప్పాలి. అతి తక్కువ ఖర్చు, శిక్షణలతోనే అద్భుతమైన ఎల్ఎల్ఎంను రూపొందించవచ్చునని డీప్‌సీక్ ఇప్పటికే రుజువు చేసింది. చౌక ఆవిష్కరణలకు పేరుపొందిన భారత్‌కు ఇది ఎంతో సంతోషించదగ్గ సమాచారం. అయితే దీనర్థం సొంత ఎల్ఎల్ఎం అభివృద్ధే ఏఐ ఆధిపత్యానికి తొలి అడుగు అని కాదు. అమెరికా, ఇతర దేశాల ఎల్ఎల్ఎంలకు, డీప్‌సీక్‌కు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే... శిక్షణకు సంబంధించి భిన్నవైఖరి తీసుకోవడం! ఈ వైఖరి కారణంగానే దాని శిక్షణకు అయిన ఖర్చు చాలా తక్కువగా ఉంది. భారత్‌లోని టెక్నాలజీ నిపుణులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు స్థూలంగా మూడు. ఏఐలో సృజనను పెంచే అన్ని ప్రాథమిక అంశాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇందుకు ఏఐలో అత్యున్నత నైపుణ్యం కలిగిన వారు అవసరం. అలాగే మనదైన డేటా సెట్లు, రేపటి తరం రీసెర్చ్ అండ్ డెవలప్మంట్ దృష్టికోణం కావాల్సి వస్తాయి. ప్రస్తుతం భారత్‌లో అత్యున్నత స్థాయి ఏఐ నైపుణ్యం లేదు. భారతీయ మూలాలున్న ఏఐ నిపుణులు దురదృష్టవశాత్తూ సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్నారు. పెర్ప్లెక్సిటీ ఏఐ సృష్టికర్త అరవింద్ శ్రీనివాస్ భారత్‌లో చేపట్టే ఏఐ కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు సిద్ధమని అంటున్నాడే కానీ... ఇక్కడకు వచ్చేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. అమెరికాలో పెర్ప్లెక్సిటీ ఏఐ బాగా పాపులర్ కాబట్టి ఈ నిర్ణయం సరైందే అనిపిస్తుంది. కానీ ఏఐ విషయంలో భారత్ నుంచి మేధా వలసను అరికట్టేందుకు ఏదైనా చేయాల్సిన అవసరాన్ని కూడా చెబుతోంది ఇది. దేశంలోని టెక్నాలజీ రంగాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు తగిన వ్యూహం కూడా కావాలిప్పుడు! యూపీఐ లాంటి వ్యవస్థల ద్వారా భారత్‌కు సంబంధించిన డేటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నా వీటి ఆధారంగా డేటాసెట్లను ఇప్పటివరకూ ఏఐ స్టార్టప్‌లు తయారు చేయలేకపోయాయి. ఇలాంటివే అనేక డేటాసెట్లు వేర్వేరు చోట్ల పడి మూలుగుతున్నాయి. వీటన్నింటినీ ఉపయోగించడం ఎలాగో చూడాలి. అలాగే భారతీయ ఆర్ అండ్ డీ (పరిశోధన–అభివృద్ధి) రంగానికి కూడా భారీ ప్రోత్సాహకం అవసరం. మోదీ ఆ మధ్య అమె రికా పర్యటనకు వెళ్లినప్పుడు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ , అమెరికాకు చెందిన నేషనల్ సైన్ ్స ఫౌండేషన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అలాగే ఏఐలో పరిశోధనలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వంతోపాటు, ప్రైవేట్ రంగం కూడా పెట్టుబడులు పెట్టేలా చేయాలి. ఇవన్నీ చేయడం ద్వారా మాత్రమే సుశిక్షితమైన ఎల్ఎల్ఎం లేదా ఇంకో వినూత్న ఏఐ ఉత్పత్తి ఆవిష్కృతమవుతుంది. ఇలా చేయడం ద్వారా భారత్ ప్రపంచస్థాయిలో తనదైన గుర్తింపు పొందగలుగుతుంది. రెండో విషయం... ఏఐలో వినూత్న ఆవిష్కరణల కోసం ఓపెన్ సోర్స్ పద్ధతిని అవలంబించడం మేలు. డీప్‌సీక్–ఆర్1, మిస్ట్రల్ వంటివి అన్నీ ఓపెన్ సోర్స్ పద్ధతిలో అభివృద్ధి చేసినవే. ఇలాంటివి మేలా? ఛాట్ జీపీటీ వంటి క్లోజ్డ్ సోర్స్ ఎల్ఎల్ఎంలు మేలా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఫ్రాన్ ్సకు చెందిన మిస్ట్రల్, యూఎస్ కంపెనీ మెటా, చైనా కంపెనీ డీప్ సీక్‌లు ఓపెన్ సోర్స్ బాట పట్టాయి. భారత్ కూడా ఇదే పద్ధతిని ఎంచుకోవాలి. ఓపెన్ సోర్స్ ద్వారా భారతీయ స్టార్టప్ కంపెనీలు, పరిశోధకులు మెరుగ్గా పోటీపడగలరు. అదే క్లోజ్డ్ సోర్స్ అనుకోండి... విదేశీ ఏఐలపై ఆధారపడటం మరింత ఎక్కువ అవుతుంది. ఓపెన్ సోర్స్ బాట పట్టేందుకు యూరప్‌తో పాటు దక్షిణ దేశాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి భారత్ అందరికీ మేలు చేసేలా ఆ యా దేశాలతో ఏర్పాటు చేసుకోవడం మంచిది.మూడో అంశం... ఏఐలో పోటీతత్వాన్ని పెంచేందుకు భారత్ తక్షణం ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ నుంచి రక్షణ ఎలా అన్న అంశంపై ప్రస్తుతానికి అంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ప్యారిస్ సదస్సులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏఐపై అమెరికా వైఖరి ఏమిటన్నది సుస్పష్టంగా చెప్పారు. ఈ రంగంలో చైనా పైస్థాయిలో ఉంది కాబట్టి... అమెరికా కూడా ఎలాగైనా ఈ రేసులో తనది పైచేయి అనిపించుకోవాలని చూస్తోంది. ఈ పోటీలో భారత్ కూడా తనదైన ప్రత్యేకతను నిరూపించుకోవాలి. ఎప్పటికప్పుడు మారిపోతున్న ఈ పోటీ తీరుతెన్నులను ఒడిసిపట్టుకోకపోతే కష్టమే.అందుకే ఏఐ నైపుణ్యాలను పెంచేందుకు, ఏఐ ఆర్ అండ్ డీకి సంబంధించి ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీల వాడకానికి తగిన వ్యూహం రూపొందించాలి. యూపీఐ వంటి భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన డేటా సాయంతో ఏఐ రంగంలో సృజనకు వీలుకల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రపంచం ఏఐ ఆటలో మనల్ని గుర్తించగలదు.అనిరుధ్ సూరి వ్యాసకర్త ఇండియా ఇంటర్నెట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ -
కఠిన వాస్తవాలను దాచేస్తారా?
ఆమె పేరు సూచిస్తున్నట్టుగానే సంధ్యా సూరి భారత సంతతికి చెందిన ఫిల్మ్ మేకర్. ఆమె దర్శకత్వం వహించిన ‘సంతోష్’ సినిమా గత ఏడాది యూకే తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్స్‌కు వెళ్లింది. కాన్ (ఫ్రాన్స్) చిత్రోత్సవంలో విశేష మన్ననలు అందుకుంది. ‘బాఫ్టా’ (బిఏఎఫ్‌టీఏ– ద బ్రిటిష్ అకాడెమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్)కు నామినేట్ అయ్యింది. ఇందులో నటించిన షహానా గోస్వామి ఏసియన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఇంత ఖ్యాతి గడించినప్పటికీ, కోట్లాది మంది భారతీయులు మాత్రం ఈ సినిమాను ఎప్పటికీ చూడలేరు. సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ– సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) దీనికి దారుణమైన కత్తెరలు వేసింది. వాటికి అంగీకరిస్తేనే భారత్‌లో ప్రదర్శనకు అనుమతి ఇస్తామని చెప్పడంతో, సంధ్యా సూరి సహజంగానే అందుకు నిరాకరించారు.పూర్తిగా భారత్‌లోనే నిర్మించిన, భారతీయ నటీనటులతోనే చిత్రీకరించిన, అదీ హిందీలో తీసిన చిత్రం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి భారతీయ చిత్రం. కానీ భారతీయులమైన మనం దీన్ని వీక్షించలేక పోవడం మన దౌర్భాగ్యం. ఎందుకంటే, మనం కాదనలేని ఒక సత్యాన్ని ఇది ఆవిష్కరించింది. దాన్ని మనకు తెలియకుండా దాచి ఉంచగలనని సెన్సార్ బోర్డు అనుకుంటోంది. నేను ప్రస్తావిస్తున్న ఈ సత్యం పోలీసుల కర్కశత్వం, వారు పెట్టే చిత్రహింసల గురించి!ఈ సినిమా నేను చూశాను. ఇది అంతులేని బాధ కలిగిస్తుంది. మనసును విపరీతంగా కలవరపెడుతుంది. ఉత్తర భారత గ్రామీణ ప్రాంతాల్లో సాగే పోలీసుల దాష్టీకానికి ఇది వాస్తవ చిత్రీకరణ. అమాయక ప్రజలను పోలీసులు ఎలా టార్చర్ పెట్టగలరో, దళితులు, ముస్లింలు వారి చేతిలో ఎన్ని దుర్మార్గాలకు గురవుతున్నారో, మానభంగాలను ఏ విధంగా వారు వెనకేసుకొస్తారో, సాధారణ ప్రజానీకాన్ని ఎంతగా భయభ్రాంతులకు గురిచేస్తారో ఈ సినిమా కళ్లకు కడుతుంది. పుట్టుక, సంపద, పలుకుబడి... ఈ మూడింటిలో ఏ బలమూ లేకుండా పోలీసులతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ ఇది సత్యమని, ఇదే వాస్తవమని తెలుసు. ఈ య«థార్థం వారికి ఆశ్యర్యం కలిగించదు, వారిని దిగ్భ్రాంతికి అసలు గురి చేయదు. ఎందుకంటే వారికి పోలీసుల వైఖరి నిత్యజీవిత అనుభవం. కానీ సెన్సార్ బోర్డు దీన్ని సమ్మతించడానికి ఇష్టపడటం లేదు. గుర్తించడానికి అంగీకరించడం లేదు. పోలీసుల హింస, జవాబుదారీతనం లేకపోవడం గురించి ‘పోలీస్ టార్చర్ అండ్ (అన్) అకౌంటబిలిటీ’ పేరుతో ‘కామన్ కాజ్’, ‘లోక్‌నీతి సీఎస్డీఎస్’లు ఇటీవలే సంయుక్తంగా ప్రచురించిన ఒక నివేదిక ఈ సినిమా వాస్తవికతను ధ్రువీకరిస్తోంది. 17 రాష్ట్రాల్లో 8,000 మందికి పైగా పోలీసులను ఈ సంస్థలు సర్వే చేశాయి. వారిలో రమారమి 30 శాతం మంది చిత్రహింసలను సమర్థించారు. ప్రమాదకరమైన నేరగాళ్లను విచారణ ముగిసే వరకూ వేచిచూడకుండా చంపేయడమే మెరుగు అని దరిదాపు 25 శాతం మంది తేల్చి చెప్పారు. ప్రజల్లో భయం ఉండాలంటే కఠిన పద్ధతులు అవలంబించాల్సిందే అంటూ 20 శాతం మంది వెల్లడించారు. ముస్లింలు నేరప్రవృత్తికి లోనయ్యే అవకాశం ఉందని 50 శాతం మంది చెప్పడం ఆశ్చర్యకరం. ఇక, ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్’ (ఎస్ఓపీ)ను పాటించడం ఎప్పుడో తప్ప జరగదని 40 శాతం కంటే ఎక్కువ మందే అంగీకరించారు. అందుకే కాబోలు... కేవలం 33 శాతం మంది భారతీయులే పోలీసులను విశ్వసిస్తారని ‘ఇప్సాస్’ సర్వే (యూకే) నిర్ధారించింది. వీటిలో ఏదీ మనకు ఆశ్యర్యం కలిగించదు. ఎవరూ చెప్పనవసరం లేకుండానే ఇవన్నీ నిజాలేనని మనకు సహజంగానే తెలుసు. పోలీసుల దాష్టీకాన్ని వెల్లడించే అధ్యయనాలకు కొరత లేదు. ‘నేషనల్ క్యాంపేన్ ఎగైనెస్ట్ టార్చర్’ వార్షిక నివేదిక (2019) ప్రకారం, ఆ ఏడాది 1,723 కస్టడీ చావులు వెలుగు చూశాయి. అంటే పోలీసు కస్టడీలో రోజుకు అయిదుగురు ప్రాణాలు విడిచారు. ఈ అధ్యయ నాలు బట్టబయలు చేసిన వాస్తవాలకే ‘సంతోష్’ సినిమా కర్కశ, వాస్తవిక దృశ్యరూపం ఇచ్చింది. అయినా సరే, భారతీయలు ఈ సినిమా ఎప్పటికీ చూడలేరు. ఏదైనా అద్భుతం జరిగి సెన్సార్ బోర్డు మనసు మారితే తప్ప!ముచ్చటైన విషయం ఏమిటటే, ఇండియాలో చిత్రీకరణ కోసం అనుమతి కోరుతూ సంధ్యా సూరి తన సినిమా స్క్రిప్టును అధికా రులకు సమర్పించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాలేదు. ‘గార్డియన్’ వార్తాపత్రికకు ఆమె ఇదే చెప్పారు. ‘ఇప్పుడు చాంతాడు పొడవన్ని కట్స్ జాబితా ఇచ్చారు. ఈ సెన్సార్ కోత లన్నీ కలిపి పేజీలకు పేజీలు ఉన్నాయి’. వాటికి అంగీకరించడం ‘అసాధ్యం’. ఎందుకంటే, సినిమా ‘విజన్’ పూర్తిగా దెబ్బతింటుందని ఆమె వాపోయారు.నేను ఈ సినిమా చూసిన ప్రభావంతో చెబుతున్నాను. ఇది తప్పనిసరిగా చూడాల్సినది. బాలీవుడ్ సినిమాల్లో కూడా పోలీసు జులుం తరచూ కనబడుతూనే ఉంటుంది. అయితే, అది మృదువుగా, ప్రభావ శూన్యంగా ఉంటుంది. సానుకూల కోణం కూడా సమాంతరంగా నడుస్తుంది. కానీ ‘సంతోష్’ అలాకాదు.అందులో ఎలాంటి చక్కెర పూతా ఉండదు. కర్కశమైన, ఉపశమన రహితమైన వాస్తవికతను చూపిస్తుంది. చూడటం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వాస్తవాన్ని చూడకుండా మనం ఎలా కళ్లు మూసు కుంటాం? అది తగిన పని కాదు. అయినా మనం సత్యాన్ని తిరస్కరిస్తూనే పోతున్నాం. ‘సంతోష్’ అలాంటి తిరస్కారాల జాబితాలో తాజాగా చేరింది. చిత్రహింసలకు వ్యతిరేకంగా రూపొందించిన ఐక్యరాజ్య సమితి ఒప్పందం (యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఎగైనెస్ట్ టార్చర్)పై సంతకం చేయని అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటి. అలా ఆమోదించకపోవడానికి... కస్టడీ హింసను నిరోధించే సొంత చట్టం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. నిజానికి ఇవి మనం ఎప్పుడూ చర్చించని యథార్థాలు. ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినా, ఆ వెంటనే మర్చిపోతాం. ఒకవేళ ‘సంతోష్’ను మనం చూడడం జరిగితే... ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించే అవకాశం అది ఇస్తుంది. ఈ దారుణాలు ఎందుకు అనుమతిస్తున్నారు? ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? అని నిలదీస్తాం. బహుశా అందుకే సెన్సార్ బోర్డు మనం ఎప్పటికీ ఈ సినిమా చూడకుండా జాగ్రత్త పడింది. సత్యమేవ జయతే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పీయూష్ గోయల్ (కేంద్ర మంత్రి) రాయని డైరీ
ఇండియాలో ఎందుకు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు?! తింటూ మాట్లాడుతుం టారు?! తింటూనే కాన్ఫరెన్సులు, తింటూనే ‘డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్’లు, తింటూనే చాట్ జీపీటీలు, ్రగ్రోక్లు, జిబ్లీలు... ఆఖరికి నిద్రలోకి జారుకోవటం కూడా తింటూనేనా! మనిషి లోపల గుండె కొట్టుకుంటూ ఉన్నట్లు మనుషుల నోట్లో తిండెందుకు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటుంది?! ‘స్టార్టప్ మహాకుంభ్’లో కూడా తిండి... తిండి... తిండి! మహాకుంభ్‌కు మూడువేల స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. అన్నీ ఇండియన్ల తిండీతిప్పల కంపెనీలే. వెయ్యి మంది ఇన్వెస్టర్లు వచ్చారు. అంతా తిండి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటానికి వచ్చిన ఇండియన్లే! ఏప్రిల్ 3 నుంచి 5 వరకు ప్రగతి మైదాన్‌లోని ‘భారత మండపం’లో ఒకటే తిండి గోల.విజిటర్స్కైతే అదొక తిండి మహా సముద్రం. మనుషులు తిండిలో ఓలలాడి,తిండిలో మైమరచి, తిండిలో స్పృహ తప్పటం స్టార్టప్ మహాకుంభ్ ప్రాంగణంలోని ‘ఆహార్ కుంభ్’లో కళ్లారా చూశాన్నేను!‘రెక్టిజా అండ్ కో’ స్టార్టప్ కంపెనీవారు అక్కడ స్టాల్ పెట్టుకుని పిజ్జాలు అమ్ము తున్నారు. పిజ్జాను రౌండ్‌గా కాకుండా రెక్టాంగిల్లో చేసివ్వటం రెక్టిజా అండ్ కో ప్రత్యేకత. జనం వాటి కోసం ఎగబడుతున్నారు! ఇంకోచోట, ‘సంప్రదాయ భారతీయ ఆహారపు ప్రామాణిక రుచులు మా ప్రత్యేకత’ అని ‘శాండీ ఫుడ్స్’ స్టార్టప్ వాళ్లు బోర్డు పెట్టారు. టేబుల్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి! అవి ఖాళీ అయితే కూర్చోటానికి ఆ టేబుల్స్‌కి నాలుగు వైపులా జనం! ఆ పక్కనే ‘ఫార్చూన్ ఫుడ్స్’ స్టార్టప్ వారి ‘ఇంటి తరహా భోజనం’! అక్కడా నిలువుకాళ్ల గుంపులే. ఇంట్లో భోజనం చేసుకోకుండా ‘ఇంటి తరహా భోజనం’ కోసం ఇంటిల్లిపాదీ ఇలా ఆహార కుంభాలకు రావటం ఏమిటి? ఇందు కేనా ఇండియాలో కొత్త కొత్త తిండి యాప్‌లు, తిండి స్టార్టప్‌లు వచ్చేస్తున్నాయి!కామర్స్ మినిస్టర్‌గా నేనీ చెత్తంతా మాట్లాడకూడదు. మనిషి తింటేనే దేశానికి పుష్టి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్‌గా కూడా పని చేశాను కనుక ఇలా అసలే మాట్లాడకూడదు. మనుషులందరికీ తిండి చేరితేనే దేశానికి ముందుకు నడిచే శక్తి అందుతుంది.నిజానికి ఇండియా కంటే చైనాలోనే తిండి ధ్యాస ఎక్కువ. కానీ వాళ్ల స్టార్టప్‌లు... ఈవీలు, ఏఐలు, సెమీ కండక్టర్లు, రోబోటిక్స్, గ్లోబల్ లాజిస్టిక్స్, ట్రేడ్, డీప్ టెక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఎక్కువగా పని చేస్తున్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ అన్నారు. అటల్ బిహారి వాజ్‌పేయి ఆ నినాదానికి ‘జై విజ్ఞాన్’ను జోడించారు. మోదీజీ ‘జై అనుసంధాన్’ అనే మాటను చేర్చి... ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ అన్నారు. సిపాయి ఎంతో, రైతు ఎంతో, విజ్ఞానం ఎంతో, పరిశోధన అంత ముఖ్యం దేశ భవిష్యత్తుకు!‘‘మీరు డెలివరీ బాయ్స్‌ని, డెలివరీ గర్ల్స్‌ని సృష్టించటంతోనే ఆగిపోతారా?’’ అని... స్టార్టప్ మహాకుంభ్‌కు వచ్చిన ఇండియన్ ‘స్టెమ్’ గ్రాడ్యుయేట్లను నేను అడిగాను. అది కేవలం అడగటం మాత్రమే కాదు... థామస్ ఆల్వా ఎడిసన్‌లా శాస్త్ర విజ్ఞానాన్ని, వ్యాపారాన్ని కలిపి డెలివరీ చెయ్యమని చెప్పటం కూడా! స్టార్టప్ మహాకుంభ్ ముగిశాక భారత మండపం నుంచి బయటికి వచ్చేస్తూ, ‘‘ఏమైనా తిన్నారా?’’ అని ఆ యంగ్ గ్రాడ్యుయేట్లను అడిగాను. అడగాలని అడగలేదు. అనుకోకుండా అలా అడిగేశాను. ఇంటికి రాగానే సీమ కూడా నన్ను అదే మాట అడిగింది... ‘‘ఏమైనా తిన్నారా?’’ అని!! ఇండియాలోని విశేషం.. తింటూ మాట్లాడటం, తింటూ పని చేయటం మాత్రమే కాదా? ‘‘తిన్నావా?’’ అని అడగటం కూడానా!!గొప్ప టెక్నాలజీని కనిపెట్టటం మాత్రమే కాదు, సాటి మనిషిని ‘‘తిన్నారా?’’ అని అడిగి కనుక్కోవటం కూడా ఎప్పటికప్పుడు ఒక గొప్ప ఇన్వెన్షనే అనిపిస్తోంది నాకిప్పుడు! - మాధవ్ శింగరాజు -
ఈ సుంకాలతో లాభనష్టాలు
భారత్ ఎగుమతులపై అమెరికా 26 శాతం దిగుమతి సుంకాన్ని విధించడం ఆర్థిక ఆందో ళనలకు దారి తీసింది. భారత్‌తో పోల్చిన ప్పుడు అధికంగా చైనాపై 40–60 శాతం (కొన్ని ఉత్పత్తులపై 100 శాతం వరకు), వియత్నాంపై 30–45 శాతం, థాయ్‌లాండ్‌పై 35–50 శాతం దిగుమతి సుంకాలను అమె రికా విధించింది. భారత్‌కన్నా తక్కువగా యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం, జపాన్‌పై 24 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం దిగుమతి సుంకాలను అమెరికా విధించింది.అమెరికా వాదన2024లో అమెరికాకు సంబంధించి భారత్ ఎగుమతుల విలువ 91.23 బిలియన్ డాలర్లు. భారత్ మొత్తం ఎగుమతుల విలువలో అమెరికా వాటా 18 శాతం. ఇదే సంవత్సరం అమెరికా ఉత్పత్తుల దిగుమతులలో భారత్ వాటా 2.6 శాతం. మొత్తంగా భారత్‌తో వాణి జ్యానికి సంబంధించి అమెరికా వాణిజ్య లోటు 2023–24లో 45.7 బిలియన్ డాలర్లు కాగా, 2024–25 (జనవరి వరకు) 22.9 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అమెరికాకు సంబంధించిన పాసింజర్ వాహనాలపై 70 శాతం, యాపిల్స్‌పై 50 శాతం, ఆల్కహాల్‌పై 100 –150 శాతం దిగుమతి సుంకాలను భారత్ విధిస్తున్నప్పుడు, ప్రస్తుతం భారత్‌పై అమెరికా విధించిన 26 శాతం దిగుమతి సుంకం సమంజసమేనని అమెరికా వాదిస్తున్నది. ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య నియమావళికి విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తున్నదని అమెరికా భావిస్తున్నది.దిగుమతి సుంకాల పెంపు కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50తో పాటు చైనా, థాయ్‌లాండ్‌కు సంబంధించిన ముఖ్య సూచీల లోనూ క్షీణత ఏర్పడింది. 2023–24లో అమెరికాతో వాణిజ్యంలో చైనా మార్కెట్ వాటా 21.6 శాతం కాగా, వియత్నాం వాటా 19.3 శాతంగా, భారత్ వాటా 6 శాతంగా నిలిచింది. వివిధ దేశాలపై అమె రికా దిగుమతి సుంకాల పెంపు కారణంగా చైనా, వియత్నాంలతో పోల్చినప్పుడు భారత్ ఎగుమతులలో పోటీతత్వం పెరుగుతుందని భావించవచ్చు.సగటు అమెరికా దిగుమతి సుంకాల కారణంగా– భారత్‌లో రొయ్యలు, వస్త్రాలు, స్టీల్ రంగాలపై; చైనాలో సోలార్ పానల్స్, సెమీ కండక్టర్, స్టీల్, ఎలక్ట్రిక్ వాహనాలపై; వియత్నాంలో ఫుట్‌వేర్, ఎల క్ట్రానిక్స్, ఫర్నీచర్‌పై; థాయ్‌లాండ్‌లో ఆటో పరికరాలు, రబ్బరు ఉత్పత్తులపై ప్రభావం ఉంటుందని అంచనా.భారత్‌పై ప్రభావంప్రాథమిక కేటగిరీకి సంబంధించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరిక రాలు, ఫార్మా ఉత్పత్తులు, విలువైన రాళ్ళు భారత్ నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మార్చి 2025లో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకొనే చర్యలో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై భారత్ దిగుమతి సుంకాన్ని తగ్గించడం వలన రెండు దేశాలకు పరస్పర ప్రయోజనం చేకూరుతుంది. ఆసియా ఖండంలోని ఇతర దేశాలతో పోల్చినప్పుడు సౌరవిద్యుత్, ఫార్మాసూటికల్స్, టెక్స్టైల్స్ – అప్పారెల్ రంగాలలో భారత్‌కు అధిక ప్రయోజనం ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా టెక్స్టైల్ – అప్పారెల్ రంగాలకు సంబంధించి పోటీ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత దిగు మతి సుంకాల నిర్ణయం కారణంగా అమెరికా మార్కెట్లో ఆ యా ఉత్పత్తులకు సంబంధించి భారత్‌కు పోటీ తగ్గుతుంది. చైనాకుసంబంధించిన సౌర ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం కారణంగా చైనా సౌర ఉత్పత్తుల ధరలు పెరగడం వలన భారత్‌కు ప్రయోజనం చేకూరుతుంది. చైనాపై అమెరికా అధికంగా ఆధార పడటం తగ్గి భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత పటిష్ఠమయ్యే అవకాశం ఉంది.భారత్ నుండి రొయ్యల ఎగుమతుల విలువ రూ. 22,000 కోట్లు కాగా, ఈ మొత్తంలో అమెరికా వాటా 44 శాతంగా ఉంది. ప్రస్తుతం అధిక సుంకాల కారణంగా భారత్ నుండి అమెరికా రొయ్యల ఎగుమతుల విలువలో తగ్గుదల ఏర్పడవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు సంబంధించి అమెరికాలో భారత్ మార్కెట్ వాటా తగ్గుతుంది. వజ్రాలు, ఆభరణాల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. భారత్‌లో అనేక సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు హ్యాండిక్రాఫ్ట్ గార్మెంట్స్ ఎగుమ తులపై అధికంగా ఆధారపడ్డాయి. అధిక సుంకాల నేపథ్యంలోఎం.ఎస్.ఎం.ఇ. సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. తద్వారా ఆ యా సంస్థలలో లే ఆఫ్ కారణంగా ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది.సిద్ధించే ప్రయోజనాలుఅమెరికా దిగుమతి సుంకాలను ముఖ్యంగా వస్తువులపై విధించినందువలన భారత్‌లో పటిష్ఠంగా ఉన్న ఐటీ, సేవల రంగంపై ఈ ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. భారత్ నుండి సాఫ్ట్వేర్ సర్వీ సులు, ఫైనాన్షియల్ టెక్నాలజీ, బిజినెస్ అవుట్ సోర్సింగ్‌కు సంబంధించి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ వస్తువులకు సంబంధించి భారత్‌తో పోల్చినప్పుడు చైనా, యూరప్లపై అధిక సుంకాలు విధించిన కారణంగా అమెరికా కొనుగోలుదారులు భారత్ ఇంజినీరింగ్ ఉత్పత్తులపై దృష్టి సారించే వీలుంది. దానివల్ల భారత్ ఎగుమతులలో పెరుగుదల ఏర్పడుతుంది.చైనా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాల కారణంగా బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తిని భారత్‌లో చేపట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే అవ కాశం ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే అమలులో ఉన్న ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్టివ్ స్కీమ్’ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం) కారణంగా ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, సెమీ కండక్టర్లకు సంబంధించిన సంస్థలు భారత్‌లో అధికంగా ఏర్పాటవుతాయి. తద్వారా భార త్లో పెట్టుబడులు, ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతుల విలువలో పెరుగు దల కనబడుతుంది. అది స్థూల దేశీయోత్పత్తిలో కూడా పెరుగు దలగా ప్రతిఫలిస్తుంది.అమెరికా దిగుమతి సుంకాల కారణంగా ఇతర దేశాల వ్యవ సాయ ఉత్పత్తుల ధరలలో పెరుగుదల ఏర్పడుతుంది. తద్వారా భారత్ నుండి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌కు అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరగడంతోపాటు భారత్ ఎగుమతుల విలువలో పెరుగుదల ఏర్పడుతుంది. ఎగుమతుల పరంగా ఇబ్బంది ఎదుర్కొనే నేపథ్యంలో (కొన్ని ఉత్పత్తులకు సంబంధించి) భారత్ లోని ఉత్పత్తి స్వదేశీ డిమాండ్‌ను తీర్చడానికి ఉపకరిస్తుంది. ఈ స్థితి దేశంలో కొన్ని ఉత్పత్తుల కొరతను నివారించడం ద్వారా సాధారణ ధరల స్థాయి తగ్గుదలకు దారితీస్తుంది.చేయాల్సిందిఅయితే, అమెరికా ఆటో పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే ఒత్తిడిని భారత్ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే అమెరికాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించు కోవాలి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలతో భారత్ నూతన వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి.-వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐ.ఎఫ్.హెచ్.ఇ., హైదరాబాద్- డా‘‘ తమ్మా కోటిరెడ్డి -
కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల ‘కంచ గచ్చి బౌలి’ భూమిని, రేవంత్ రెడ్డి సర్కార్ వేలానికి పెట్టింది. వేలం వద్దని విద్యార్థులు జేఏసీగా ఏర్పడి కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఉగాది పండగ రోజున ఆ ప్రాంతపు చెట్లను తొలగించి, మట్టిని చదును చేయడానికై 50 భారీ బుల్డోజర్లు, పొక్లైన్లతో, వందలాది మంది పోలీసులు ఆ భూమిలోకి వెళ్లారు. వాటిని అడ్డుకోవడానికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. జుట్టు పట్టి ఈడ్చి వాహనాల్లో పడేశారు. 200 మందిని, 4 పోలీస్ స్టేషన్లకు తరలించారు. చివరికి ఈ వ్యవహారం దేశ అత్యు న్నత న్యాయస్థానానికి చేరడంతో జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే ఆదేశాలు జారీ చేసింది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను 100 కోట్లకు ఎకరం అమ్మింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మకానికి పూనుకున్న కంచ గచ్చి బౌలి భూమి ఎకరాకు 100 కోట్ల పైమాటే. 400 ఎకరాలను వేలం వేస్తే 40 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం దృఢంగా భావించింది.అందుకే ఆందోళన చేస్తున్న విద్యార్థులపై తీవ్ర హింసకు పూనుకుంది. తద్వారా ఎన్నికల ప్రణాళి కలో ఇచ్చిన 7వ హామీ ‘ప్రజాస్వామ్య హక్కుల రక్షణను పాతిపెట్టినట్లే’!‘ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం అనేది మొత్తం బడా సంపన్నుల సమష్టి వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ మాత్రమే’ అని ఒక జర్మన్ తత్వ వేత్త అంటారు. అంటే సామాన్య మెజారిటీ ప్రజలు కేంద్రంగా ప్రభుత్వాలు పనిచేయవని ఉద్దేశం. హెచ్‌సీయూ భూములను అమ్ముతున్న తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ రంగ పరిశ్రమ లను అమ్ముతున్న మోదీ ప్రభుత్వ విధానాలకు పైవాక్యం సరిగ్గా సరిపోతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ లను కారు చౌకగా బడా పెట్టుబడిదారులకు అమ్ముతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూములను బడా కార్పొరేట్లకు అమ్మకానికి పూనుకుంది. ఇది ఈ దేశ విద్యార్థుల వైజ్ఞానిక భవిష్యత్తుకు విద్రోహం తలపెట్టడమే! ఉన్న ప్రభుత్వ వనరులను తెగనమ్మడానికి బదులు.... ప్రత్యామ్నాయంగా మోదీ–రేవంత్ బడా సంపన్నులపై ‘ప్రగతిశీల పన్ను’ ఎందుకు వేయకూడదు? అవినీతి సొమ్మును, లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రజల ప్రయోజనం కొరకు వెలికి తీసి, ఎందుకు వినియోగించకూడదు?పాలకులు ప్రజల ఆస్తులు అమ్మడమే ఏకైక పనిగా సాగుతున్నారు. దశాబ్దాలుగా పథకం ప్రకారం విశ్వవిద్యాలయం భూములకు కోత విధిస్తున్నారు. కేసీఆర్... ప్రభుత్వ భూములను అమ్మితే దునుమాడిన రేవంత్ రెడ్డి... అదే పనికి ఇప్పుడు పూనుకున్నారు. ఈ చర్య అక్కడి జీవా వరణ – పర్యావరణ స్థితిని నాశనం చేస్తుంది. హెచ్‌సీయూ వెల్లడించిన సమాచారం ప్రకారం 734 రకాల పూల మొక్కలు, 10 క్షీరద జాతులు, 15 రకాల సరీసృపాలు, నెమళ్లు లాంటి 220 రకాల పక్షులు, రెండు చెరువులు ఇక్కడ ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పోలి ఉండే ప్రకృతి సిద్ధమైన భారీ బండరాళ్ల అమరికలు ఈ 400 ఎకరాలలో ఉన్నాయి. ఈ ప్రకృతి వైవిధ్యాన్నీ, దేశ భవిష్యత్తునూ ప్రభుత్వం విధ్వంసం చేయతల పెట్టింది. విశ్వవిద్యాలయ భూమిలో ప్రపంచ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని బుకాయిస్తోంది. ఇటీవలే చైనాలో మన హెచ్‌సీయూ లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థులే ‘డీప్ సీక్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ను, అతి చౌకగా ఆవిష్కరించారు. అమెరికా టెక్ ఆధిపత్యాన్ని కూల్చారు. భూములను అమ్మడం కంటే, ప్రపంచ ప్రమాణా లతో కూడిన, ఆధునిక మానవ అవసరాలను నెరవేర్చే చదు వులు మరింత భారీ డబ్బును సమీకరిస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల్లో నెలకొల్పుదామనే ప్రపంచ కంపెనీలు, ఈ విశ్వ విద్యాలయాల్లో చదివిన విద్యా ర్థులు సృష్టించే సంపద కంటే గొప్పవేం కాదు. ‘అక్కడ పులులు జింకలు లేవు. కొన్ని నక్కలు మాత్రమే అభివృద్ధిని అడ్డుకోవడానికి చూస్తున్నాయి. ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చ గొడుతున్నాయ’ని ముఖ్య మంత్రి మాట్లాడడం అత్యంత దురదృష్టకరం. గురువారం (ఏప్రిల్ 3వ తేదీ) సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వం అసలు అది అటవీ భూమికాద’ని బుకాయించడమూ తెలిసిందే. ప్రభుత్వ విలువైన భూములను, సహజ వనరులను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు ధారా దత్తం చేయకూడదని 2012 సెప్టెంబర్ 14న విడుదలైన జీఓఎమ్ఎస్ నం. 571 స్పష్టంగా చెబుతోంది. వనరుల సమీకరణ కొరకు ప్రభుత్వ భూములను అమ్మడం, వేలం వేయడం వల్ల భూమి తీవ్రంగా తగ్గిపోయి అన్యాక్రాంతమవు తుంది. దీనివల్ల సమాజ భవిష్యత్తు, ప్రజా ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఈ జీవో పేర్కొంటున్నది. ప్రభుత్వ భూముల వినియోగం, అత్యంత శాస్త్రీయంగా న్యాయబద్ధంగా ఉండాలని ఈ జీఓ చెబుతోంది. ప్రజల ప్రయోజనం కొరకే భూములను కేటాయించాలి. ఆ భూమి వల్ల వచ్చే భవిష్యత్ ప్రయోజనాలన్నీ ప్రజలకే చెందాలి. ప్రజా ప్రయోజనాలకు ఇవ్వ వలసి వస్తే బంజరు భూములను, డ్రై ల్యాండ్స్‌ను మాత్రమే కేటాయించాలి. రెండు పంటలకు సాగు నీటి వసతి గల భూములను అసలు కేటాయించడానికి వీలు లేదు. పర్యావరణపరంగా సున్నితమైన భూములను, ట్యాంక్ బెడ్స్‌ను, రివర్ బెడ్స్‌ను, కొండలను, అడవులను ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయకూడదు. ప్రభుత్వ భూము లను, నిధుల సమీకరణ కొరకు, ఎట్టి పరిస్థితులలో వేలం వేయరా దని ఈ జీఓ స్పష్టం చేస్తోంది.హెచ్‌సీయూ భూమి పర్యావరణపరంగా సున్నితమైంది. హైదరాబాద్ మహానగరానికి ఊపిరితిత్తి లాంటిది. నీరు ఇంకడానికి భూగర్భ నీటిమట్టాన్ని పెంచడానికి ఇతోధికంగా తోడ్పడుతోంది. ఇంత విలువైన భూములను, ప్రైవేట్ బడా కంపెనీలకు ధారాదత్తం చేయడం భావ్యమా? ఈ సంగతులన్నింటినీ గ్రహించింది కాబట్టే సుప్రీం కోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ఈ భూముల్లో ప్రభుత్వం ఎటువంటి కార్యకలాపాలనూ నిర్వహించకుండా స్టే విధించింది. ఈ నెల 16న తిరిగి ఈ కేసుపై వాదనలు వింటామనీ, అప్పటికి ఈ భూములపై సమగ్ర నివేదికను తయారుచేసి తమకు సమర్పించాలనీ ఆదేశించింది. ఈ ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని వేరే చెప్పనవసరం లేదు కదా!నైనాల గోవర్ధన్ వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ ‘ 97013 81799 -
దాడి కోసం సాకుల వెతుకులాట
ఇరాన్ అణు కార్యక్రమం గురించి మార్చి 25న ఆసక్తికరమైన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. బయట అంతగా ప్రచారంలోకి రాని ఆ నివేదిక, అమెరికాకు చెందిన 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కలిసి రూపొందించింది. వాటిలో సీఐఏ, పెంటగాన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్, అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటివి ఉండటం గమనించదగ్గది. ఆ నివేదికను బట్టి, ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేయడం లేదు, చేయాలని కూడా అనుకోవటం లేదు.ఇది ఇరాన్ నాయకత్వం స్వయంగా చెప్తున్న విషయమే!్డ అయి నప్పటికీ అమెరికా నాయకత్వం, ఇజ్రాయెల్‌తో పాటు, అమెరికా ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తుందా అనిపించే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుశక్తి పర్యవేక్షణ సంస్థ ఇందుకు విరుద్ధమైన వాదనలు చేస్తూ వస్తున్నాయి. అణ్వస్త్రాల ఉత్పత్తికి వీలు లేదని అమెరికా హెచ్చరిస్తుండగా, అసలు శాంతియుత ఉపయోగానికా లేక ఆయుధాల కోసమా అనే దానితో నిమిత్తం లేకుండా అణు పరిశోధనలనే సహించబోమని ఇజ్రాయెల్ వాదిస్తున్నది. చర్చలకు సిద్ధం అంటున్నప్పటికీ...వాస్తవానికి ఇరాన్ అణు పరిశోధనా కేంద్రాలన్నీ ఐక్యరాజ్య సమితి అణుసంస్థ పర్యవేక్షణలో ఎప్పటి నుంచో ఉన్నాయి. తమ పరిశోధనలు, వాటి నియంత్రణల విషయమై పాశ్చాత్య దేశాలతో చర్చలకు సిద్ధమని గతంలోనూ ప్రకటించిన ఇరాన్ నాయకత్వం, నిరుడు ఇజ్రాయెల్‌తో క్షిపణుల రూపంలో ప్రతి దాడుల తర్వాత మరొకమారు స్పష్టం చేసింది. అటువంటి అంగీకార పత్రం ‘జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీఓఏ) పేరిట 2015 నుంచి ఉండేది కూడా! కానీ ట్రంప్ పోయినమారు అధ్యక్షునిగా ఉన్నప్పుడు అమెరికా దాని నుంచి ఏకపక్షంగా ఉపసంహరించుకున్నది. ఇపుడు తిరిగి ఆ విషయమై చర్చలకు యూరోపియన్ దేశాలు సుముఖంగా ఉన్నా ఇజ్రాయెల్ అంగీకరించటం లేదు. అమెరికా ఒకవైపు చర్చలంటూ, మరొకవైపు బాంబింగ్ అని బెదిరిస్తున్నది. అయితే చర్చలు మధ్యవర్తుల ద్వారా తప్ప ప్రత్యక్షంగా జరిపే ప్రసక్తి లేదని ఇరాన్ స్పష్టం చేస్తున్నది.దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటి? అమెరికా, ఇజ్రాయెల్‌లకు కావలసింది ఇరాన్ శాంతియుత వినియోగానికైనా సరే అణు పరిశో ధనలు జరుపుకొనేందుకు వీలు లేదు. ఇరాన్ నుంచి అమెరికాకు మధ్య సుమారు 7,000 మైళ్లు, యూరప్‌తో సుమారు 1,500 మైళ్ల దూరం ఉంది. ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయనుకున్నా వాటి నుంచి ముప్పు ఉండేది మొదట యూరప్‌కు. అయినప్పటికీ ఇరాన్ ప్రతిపాదించిన ప్రకారం చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారు. ఇరాన్ అణ్వస్త్ర ప్రయోగం అమెరికాపై చేయాలంటే వాటిని అంతదూరం మోసుకుపోగల దీర్ఘశ్రేణి క్షిపణులు, బాంబర్లు అవసరం. ఇరాన్ వద్ద ఇటు అణ్వస్త్రాలుగానీ, అటు క్షిపణులూ బాంబర్లుగానీ లేవని అమె రికాకు తెలుసు. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల వద్ద అవన్నీ వేలాదిగా ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకీ వైఖరి? ఇక్కడ అర్థమవుతుంది రహస్యం. ఇరాన్ భౌగోళికంగా పశ్చిమాసియాలో భాగం. ఆ ప్రాంతం యావత్తూ పాశ్చాత్య శక్తులకు రెండు కారణాల వల్ల ముఖ్యమైనది. ఒకటి – తమ సామ్రాజ్యవాద భౌగోళిక వ్యూహాల దృష్ట్యా. రెండు, ఇరాన్ సహా ఆ ప్రాంతపు దేశాలన్నింటా గల అపారమైన చమురు నిక్షేపాలు. గాజా యుద్ధం ముమ్మరంగా సాగుతుండిన రోజుల్లో ఇజ్రాయెల్ తాము గాజాతో ఆగబోమని, మొత్తం పశ్చిమాసియా చిత్రాన్నే మార్చివేయగలమని ప్రకటించింది. ఆ మార్పులో భాగంగా ఇరాన్ ప్రస్తుత నాయకత్వాన్ని లేకుండా చేయగలమని బాహాటంగా హెచ్చరించింది. ఇరాన్లో ప్రస్తుత నాయకత్వం పట్ల ప్రజలలో కొంత అసంతృప్తి ఉన్న మాట నిజం. కానీ ఆ స్థాయి ఎక్కడైనా మామూ లుగా ఉండేదేగానీ తీవ్రమైనది కాదు. అటువంటిది ఉంటే ప్రజాగ్రహంతో ఇరాన్ షా 1979లో పతనమైనట్లు జరిగేది. లేదా యూరప్‌లోని జార్జియా, ఉక్రెయిన్, కిర్గిజ్‌స్థాన్, యుగోస్లావియా వంటి దేశాలలో సీఐఏ ప్రోత్సాహంతో ‘కలర్ రివల్యూషన్స్’ పేరిట ప్రభుత్వాలను కూలదోయటం, దేశాలనే చీల్చటం చేసినట్లు జరిగి ఉండేది. కానీ అవేవీ సాధ్యం కాగల పరిస్థితులు ఇరాన్లో లేవు.నేను ఒకసారి వారం రోజులపాటు ఇరాన్లో ఉండటం తటస్థించింది. అంతకు ముందు మొహమ్మద్ రజా పహ్లవీ చివరి నియంతగా ఉండిన కాలంలో, ఇండియాలోని పలు నగరాలలో చదువుతుండిన ఇరానియన్ విద్యార్థులు మా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి వచ్చి కొద్ది రోజుల చొప్పున హాస్టళ్లలో బస చేసి, షా పాలన పట్ల నిరసనలు ప్రకటించి వెళుతుండేవారు. అలాగే పాశ్చాత్య దేశాల పన్నుగడల పట్ల ఆ ప్రజల వ్యతిరేకతలు ఎంతటివో కూడా వారి ద్వారా తెలుస్తుండేవి. షా ప్రభుత్వంతోపాటు పహ్లవీ వంశ రాచరికం కూలిన దశాబ్దాల అనంతరం సైతం పాశ్చాత్య శక్తుల పట్ల వ్యతిరేకతలు ఎంతమాత్రం మారలేదని నేనక్కడ ఉన్న రోజులలో అర్థమైంది. అందుకు కారణం తమ పట్ల అమెరికా కూటమి విధానాలుగానీ, ఇజ్రాయెల్ కేంద్రిత వ్యూహాలుగానీ మారక పోవటమే!ఇరానే ఎందుకు లక్ష్యం?పాలస్తీనా సమస్యపై అరబ్ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మధ్య యుద్ధాలలో ఇజ్రాయెల్ గెలవటం, ఈజిప్టు నేత గమాల్ అబ్దుల్ నాసర్ మృతితో పాన్ అరబిజం బలహీన పడటంతో అరబ్ రాజ్యా లకు ఇజ్రాయెల్ పట్ల రాజీ వైఖరి, అమెరికా కూటమి పట్ల సఖ్యత మొదలయ్యాయి. ఇజ్రాయెల్‌ను గుర్తించి దౌత్య సంబంధాలు నెల కొల్పుకోసాగాయి. పాలస్తీనాను నెమ్మదిగా మరచిపోయాయి. పాలస్తీనా నాయకుడు అరాఫత్ 2004లో మృతి చెందిన తర్వాత కొత్తగా అధికారానికి వచ్చినవారు అమెరికా, ఇజ్రాయెల్‌లకు పూర్తిగా మచ్చిక అయిపోయారు. హమాస్ కారణంగా ఇటీవలి యుద్ధం తలెత్తకపోయి ఉంటే బహుశా పాలస్తీనా విషయం అన్నదే క్రమంగా మరుగున పడేది. అరబ్ రాజ్యాలన్నీ పాలస్తీనాను ఇంచుమించు వదిలివేయగా, బలమైన మద్దతుగా నిలిచిన దేశం ఇరాన్. ఆసక్తికరం ఏమంటే, సున్నీ ముస్లిం దేశమైన పాలస్తీనాను సున్నీ అరబ్ రాజ్యాలు వదలివేయగా, షియా రాజ్యమైన ఇరాన్ వారి వెంట నిలిచింది. వారికి ఇరాన్ కనీసం పొరుగు దేశమైనా కాదు. పాలస్తీనా సమస్యతో తనకేమి సంబంధం అని భావిస్తే అడిగేవారు లేరు. అయినా ఇటువంటి వైఖరి తీసుకోవటం ఇజ్రాయెల్, అమెరికాలకు ఎంత మాత్రం సరిపడనిది అయింది. ఇరాన్‌తో అరబ్ దేశాలకూ సున్నీ–షియా భిన్నత్వం కారణంగా అరకొర సంబంధాలు మాత్రమే ఉన్నాయి.ఈ మొత్తం పరిస్థితుల మధ్య పశ్చిమాసియాలో ఇరాన్ ఒక్కటే ఇజ్రాయెల్, అమెరికాలకు ఏకైక శత్రు దేశంగా మిగిలింది. లెబనాన్, సిరియా, హిజ్బుల్లా, హౌతీలను ఏదో ఒక విధంగా దారికి తెచ్చు కోవచ్చు. కానీ ఇరాన్ సాధారణమైన శక్తి కాదు. అది గాక దాని వెంట రష్యా, చైనా ఉన్నాయి. పైపెచ్చు ఇటీవల ఉమ్మడి సైనిక విన్యాసాలు జరిపాయి. అణు రంగం విషయమై కూడా త్రైపాక్షిక చర్చలు నిర్వహించాయి. అణు ఇంధనం ఇరాన్ రియాక్టర్లలో ప్రస్తుతం 60 శాతం మేరకు శుద్ధి అయి ఉంది. శాంతియుత వినియోగానికి అది అవసరం. అణ్వస్త్రాల కోసం 90 శాతం శుద్ధి కావాలి. ఆ స్థాయికి వెళ్లగల సాంకేతిక శక్తి ఇరాన్‌కు ఉంది. కానీ అటువంటి ఆయుధాల తయారీ ఇస్లాంకు వ్యతిరేకమంటూ పాతికేళ్ల క్రితం ప్రకటించిన అధినాయకుడు అలీ ఖమేనీ ఇప్పటికీ అందుకు కట్టుబడి ఉన్నారు. అయినప్పటికీ ఇజ్రాయెల్, అమెరికాలు యుద్ధం చేయదలచిన వారికి సాకులు కరవా అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఆపరేషన్ కగార్.. అంటే?
దండకారణ్యంలోని ఛత్తీస్‌గఢ్‌లో నరమేధం జరుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అంతిమ యుద్ధం ప్రకటించింది. మూడు శాతం ఆదివాసీ ప్రజలు జీవించే అబూఝ్మడ్, దంతెవాడ, కాలేకర్, కిష్టారం ప్రాంతాలున్న కీకారణ్యాన్ని 70 వేల మంది మిలిటరీ బలగాలతో చుట్టుముట్టింది. 630కి పైగా పోలీస్ క్యాంపులను ఏర్పాటు చేసింది. అటు గడ్చిరోలి నుంచి ఇటు ఒరిస్సా మల్కాన్‌గిరి (Malkangiri) దాకా వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలను సమన్వయం చేసుకుంటూ సెర్చింగ్, వేట కొనసాగిస్తున్నది. 2026 మార్చ్ నాటికి మావోయిస్టు రహిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పదే పదే ప్రకటిస్తున్నారు. అందుకోసం మాజీలనూ, కోవర్టులనూ ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆరు నెలల కాలంలోనే దాదాపు 350 మందిని ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారు.అంతిమ యుద్ధం?బస్తర్ ప్రాంతాన్ని, అందులో ముఖ్యంగా అబూఝ్మాడ్ను కేంద్రంగా చేసుకొని నాటి పీపుల్స్‌వార్ పార్టీ, అదే నేటి మావోయిస్టు పార్టీ సాయుధ దళాల కేంద్రంగా ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నది. దళాల సంఖ్య పెంచుకోవడమేగాక, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (పీజీఎల్ఏ)ని ఏర్పాటు చేశామని ప్రకటించింది. ఈ ప్రాంతంలో జనతన్ సర్కార్ ఏర్పడిందని ప్రకటించింది. వ్యవసాయం, స్కూళ్ళు, ఆర్థిక విధానం తామే నియంత్రిస్తున్నామని చెప్పుకొన్నది. అరుంధతీ రాయ్ (Arundhati Roy) నుంచి అంతర్జాతీయ మేధావుల దాకా, జర్నలిస్టుల నుంచి రచయితల దాకా జనతన్ సర్కార్ ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజా గెరిల్లాలు ప్రభుత్వ బలగాలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.4 వేల చదరపు కిలోమీటర్లకు పైగా వైశాల్యం, 233 ఆదివాసీ గ్రామాలు, 25 వేల ఆదివాసీ జనాభా గల, కొండలు, గుట్టలు, దట్టమైన అడవి ప్రాంతమది. క్లెమోర్‌మైన్స్‌తో అనేక మిలిటరీ బలగాల వాహనాలను పేల్చి, వందల సంఖ్యలో మిలిటరీ వారిని హతమార్చారు. ప్రజా కోర్టులు నిర్వహించి శిక్షలు వేశారు.వందలాది మంది చైతన్య స్ఫూర్తితో ఆ ప్రాంతానికి తరలి వెళ్ళి విప్లవ జీవితం గడపటం అసాధారణ విషయమే. త్యాగాలకు సిద్ధపడటం గొప్ప విషయం. ఆ మేరకు వారి అంకిత భావాన్ని గౌరవించాలి. అణచివేతకు వ్యతిరేకంగా, మిలిటరీ క్యాంపులకు వ్యతిరేకంగా, రోడ్లను, టెలిఫోన్ తీగలను మావోయిస్టులు ధ్వంసం చేశారు. తమ విముక్తి జోన్ లోకి రాజ్యం జొరబడొద్దని ఈ చర్యలు చేపట్టారు. ఇది ప్రభుత్వానికి సవాల్‌గా, అవకాశంగా కూడా మారింది. దానితో ఒక దశలో పాలకులు సల్వాజుడుంను నెలకొల్పి, ఆదివాసీ తెగల మధ్య వైషమ్యాలు సృష్టించి బీభత్సకాండ కొనసాగించారు. వివిధ డెడ్లైన్లతో వివిధ ఆపరేషన్లు చేపట్టారు. మావోయిస్టు చర్యలను పెద్ద ఎత్తున ప్రచారం చేసి, వారి తరఫున మాట్లాడే సమూహాలకు మాట్లాడలేని పరిస్థితిని కల్పించారు. ఆ తరువాత అధునాతన ఆయుధాలు, టెక్నాలజీతో జాయింట్ ఆపరేషన్లకు తెరలేపారు. అదే ఆపరేషన్ కగార్. అంటే అంతిమ యుద్ధం!మారాల్సిన పంథామూడు దశాబ్దాలుగా అబూఝ్మాడ్ (Abujhmarh) మావోయిస్టు ఉద్యమానికి బలమైన స్థావరంగా నిలబడింది. ఆదివాసులు ఉద్యమాలలో, గెరిల్లా దళాలలో భాగమయ్యారు. 1969–70లలో వరంగల్, ఖమ్మం, గోదావరి జిల్లాలలో కమ్యూనిస్టు విప్లవకారులు పని చేసిన నాటి పరిస్థితి నేడు ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. మావోయిస్టు పార్టీ అఫెన్సివ్ మిలిటరీ ఎత్తుగడల వలన సాయుధ శక్తిని సమకూర్చుకున్నది. ఆయుధాలు సేకరించడం, తయారు చేయడం, ప్రెషర్ బాంబులు, మందు పాతర్లతో పోలీసులు అడవికి రావాలంటేనే భయపడే రోజులు నడిచాయి. ఆదివాసులు తమ నిత్య జీవన సమరంలో మావోల హీరోయిక్ చైతన్యానికి ఆకర్షితులయ్యారు. కానీ ఒకవైపు పోలీసుల నిర్బంధం, మరోవైపు మావోయిస్టుల ప్రతి విధ్వంసాల మధ్య చాలామంది వలస పోయారు.ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో వర్గ పోరాటం ఎవరి మీద చేయాలి? అక్కడ భూస్వాములు లేరు. అరా కొరా ధనిక రైతులు ఉన్నారు. మిగిలిన వారంతా పేద రైతులు, ఆదివాసీ జనాభా. కాబట్టి భూస్వామ్య వ్యతిరేక పోరాటంతో వర్గ వైరుద్ధ్యం తీవ్రమయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వ బలగాల మీద, యంత్రాంగం మీద, వారు కొమ్ముకాస్తున్న, ఖనిజాల కోసం కోరలు చాస్తున్న కార్పొరేట్ కంపెనీల మీదనే పోరాటం చేయాలి. ప్రజాస్వామిక స్పందనలు నామమాత్రంగా ఉన్న ఈ కాలంలో, ఒక చిన్న మారుమూల చోట, ఆదివాసీ కొండ ప్రాంతాల్లో జనతన సర్కార్ ఏర్పడటం, నిలవడం అసాధ్యమైన విషయం.ఈ ప్రాంత ప్రజలు ఎన్నికలలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. ప్రభుత్వ విద్యాలయాల కోసం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు గెలవడం గమనార్హం. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ ప్రజా ప్రభుత్వ విముక్తి ప్రాంతం సాధ్యమా? పాత అతివాదపు అఫెన్సివ్ ఎత్తుగడలతో కాకుండా, ప్రస్తుత స్థితికి తగిన విధంగా విధానాలను రూపొందించుకోవడం మావోయిస్టు (Maoist) ఉద్యమానికి అవసరం. యుద్ధం చేస్తున్నామనే భావనలో నుంచి మావోయిస్టు పార్టీ బయటపడి, తగిన ప్రజా ఉద్యమక్షేత్రాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.చదవండి: మావోయిస్టులపై మోదీ సర్కారు ద్విముఖ పోరుఅలాగే, నెత్తురుటేర్లతో విప్లవోద్యమాలను నిర్మూలించలేరు. ఆ భావజాలం మళ్ళీ మళ్ళీ పురుడు పోసుకుంటూనే ఉంటుంది. వ్యవస్థ మారేంత వరకు ఈ పోరాటపు నెగళ్ళు సమాజం నిండా అలుముకుంటూనే ఉంటాయి. వీటిని నిర్బంధం ద్వారా దెబ్బతీయవచ్చేమో కానీ, ఆ వర్గ పోరాటం అనివార్యంగా జరగాల్సిందే! ప్రభుత్వ దమననీతిపై పోరాటం చేస్తూనే, భౌతిక పరిస్థితులకు అనుగుణంగా పోరాటాలను ఎంచుకోవడం విప్లవశక్తుల కర్తవ్యం.- పోటు రంగారావు సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) కార్యదర్శి -
ద్విముఖ పోరు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఇటీవలి ఎన్కౌంటర్లో ఒక లేఖ బయటపడింది. మహిళా కమాండర్ మన్ కీకి నక్సల్ నేత మోటూ రాసిన ఆ లేఖను చూస్తే మునుపు ఎన్నడూ లేని విధంగా నక్సలైట్లలో నిస్పృహ ఆవరించి ఉన్నట్లు అనిపిస్తుంది. బోడ్కా నుంచి గామ్‌పూర్ వరకూ, దోడితుమ్నార్ నుంచి తోడ్కా వరకూ నక్సలైట్లకు సురక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు. భద్రతా దళాల నిరంతర నిఘా, దాడులు ఈ పరిస్థితిని తెచ్చాయి. నక్సలైట్లను 2026 మార్చ్ 31లోగా ఛత్తీస్‌గఢ్‌లో లేకుండా చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటన నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. బస్తర్, అబూర్nుమాడ్ అడవుల నుంచి గరియాబంద్ వరకూ భద్రతాదళాలు నిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏడాది కాలంలో సుమారు 300 మంది నక్సలైట్లు మరణించగా, మరెందరో అరెస్ట్ అయ్యారు. లేదా లొంగిపోయారు. భారత అంతర్గత భద్రతకు వామపక్ష తీవ్రవాదం చాలాకాలంగా సవాలు విసురుతున్నది. రాజ్యాంగానికి సమాంతరంగా వ్యవస్థలు ఏర్పాటు చేసిన నక్సలైట్లను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్థంగా అణచివేయగలిగింది. ఇందుకోసం ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అనుసరించింది. ఒకవైపు అభివృద్ధి కార్యకలాపాలకు పెద్దపీట వేస్తూనే, ఇంకోవైపు భద్రతా దళాల కార్య కలాపాలనూ ముమ్మరం చేసింది. నక్సలైట్ల రాజ్యంలోకి...సామాజిక, ఆర్థిక వెనుకబాటు, దశాబ్దాల నిర్లక్ష్యం కారణంగా దేశంలో నక్సలిజం పెరిగిపోయింది. ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు. వివక్షకు గురైన ప్రజలు, ప్రాంతాలు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచు కోలేదు. ఫలితంగా అక్కడ తిరుగుబాటు పుట్టుకొచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం అభివృద్ధి విషయంలోని లోటుపాట్లను సరిచేయడంతోపాటు, దేశాద్యంతం రాజ్యాంగ పరిధిలోనే పనిచేసేలా ద్విముఖ వ్యూహం అనుసరించింది. పట్టు కోల్పోయిన ప్రాంతాలను భద్రతా దళాలు మళ్లీ తమ స్వాధీనంలోకి తీసుకోగలిగాయి. ఒకప్పటి నక్సలైట్ల రాజ్యంలో ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేయగలిగాయి.అయితే ఈ మార్పు ఒక్కరోజులో జరిగిందేమీ కాదు. కచ్చితమైన ప్రణాళికతో అమలు చేసిన ఈ వ్యూహం నక్సలైట్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించింది. వ్యూహా త్మక మోహరింపులు, నిఘా వర్గాలను బలోపేతం చేయడం, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ వంటి భద్రతాదళాల సాయంతో అతివాదుల అడ్డాలను నిర్వీర్యం చేయగలిగారు. అననుకూల పరిస్థి తుల్లో పనిచేసే ఈ భద్రతా దళాలు అత్యాధునిక డ్రోన్లు, నిఘా పరికరాలు, కృత్రిమ మేధ, ఉపగ్రహ ఛాయా చిత్రాల వంటి వాటి సాయంతో నక్సలైట్ల ఆట కట్టిస్తున్నాయి. తీవ్రవాద సంస్థల ఆర్థిక వనరులపై ఉక్కుపాదం మోపడం కూడా కీలకమైంది. ఎన్ఐఏ, ఈడీ వంటి సంస్థలు కొన్ని కోట్ల రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకుని నక్సలైట్ల వెన్నువిరిచాయి. పీఎంఎల్ఏ చట్టాలతో కఠిన చర్యలు తీసుకోవడంతో నక్సలైట్లకు ఆర్థిక దన్నుగా నిలిచిన వారినీ కట్టడి చేయగలిగారు. ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ పని చేయడం నక్సలైట్ల సమస్య గణనీయంగా తగ్గేందుకు ఒక కారణంగా నిలిచింది. మౌలిక సదుపాయాల్లో వృద్ధి కూడా నక్సలిజం అణచివేతకు సాయపడింది. 2014–2024 మధ్యకాలంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 11,503 కిలోమీటర్ల హైవేలు, 20 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మించారు. ఫలితంగా అక్కడి ప్రజలు ఆర్థికంగా స్థిరపడేందుకు అవకాశాలు వచ్చాయి. వేలాదిగా ఏర్పాటు చేసిన మొబైల్ టవర్ల కారణంగా సమాచార వినిమయం సులువైంది. వెయ్యికి పైగా బ్యాంక్ శాఖలు, 937 ఏటీఎంల ఏర్పాటుతో ఈ ప్రాంతాలు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యాయి. నక్సలైట్ల ఆధ్వర్యంలో నడిచే ఆర్థిక వ్యవస్థ ప్రభావం తగ్గింది.తగ్గిన ప్రభావంఈ చర్యల ఫలితం సుస్పష్టం. 2004–2014 దశతో పోలిస్తే ఇప్పుడు హింసాత్మక ఘటనలు 53 శాతం, భద్రతా దళాల మరణాలు 73 శాతం తగ్గాయి. సాధారణ ప్రజల మరణాలు కూడా 70 శాతం మేరకు తగ్గడం గమనార్హం. ఏడాది కాలంలో ఛత్తీస్‌గఢ్‌లోనే 380 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పో యారు. 1,194 మంది అరెస్ట్ అయ్యారు. 1,045 మంది లొంగిపోయారు. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య దేశవ్యాప్తంగా 2014 నాటి 126 నుంచి 12కు చేరుకోవడం విశేషం. నక్సలిజానికి ముగింపు పలికే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతాదళ సిబ్బంది కుటుంబాలను ఆదుకునే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. ఆయుష్మాన్ భారత్‌లో వీరిని భాగస్వాములను చేసింది. ఆరోగ్య సేవలను దగ్గరకు చేర్చింది. సుమారు లక్ష మందికి ఈ–హౌసింగ్ పోర్టల్ ద్వారా ఖాళీగా ఉన్న ఇళ్లలో ఆవాసం లభించింది. సెంట్రల్ పోలీస్ వెల్ఫేర్ ఫండ్‌కు తీసుకొచ్చిన మార్పుల కారణంగా ఎక్స్‌గ్రేషియా మొత్తం పెరిగింది. ‘భారత్ కే వీర్’ వంటి కార్య క్రమాలు వీరమరణం పొందిన వారి కుటుంబాలకు ఆధారంగా నిలుస్తున్నాయి.నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టడం చేయడంతోపాటు ఈ ప్రాంతాలకు బడ్జెట్ కేటాయింపులు కూడా మూడు రెట్లు పెరగడం విశేషం. నైపుణ్యాభివృద్ధి, గిరిజన యువతను భద్రతా దళాల్లో చేర్చుకోవడం, సామాజిక సేవా కార్యక్రమాలు ముమ్మరం చేయడం ద్వారా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలందరూ జన జీవన స్రవంతిలో భాగమయ్యేలా జాగ్రత్త తీసుకున్నారు.నక్సలిజానికి చరమగీతం పాడే ఈ దశలో ఇప్పటివరకూ సాధించిన విజయాలన్నీ అభివృద్ధి, భద్రత అన్న రెండు అంశాల మేళవింపునకు నిదర్శనంగా నిలుస్తాయి. కృతనిశ్చయం, విధానపరంగా స్థిరత్వం మాత్రమే నక్సలిజం అంతానికి పరిష్కార మార్గాలని రుజువు చేశాయి.- డాక్టర్ సువ్రోకమల్ దత్తా వ్యాసకర్త కన్జర్వేటివ్ పొలిటికల్, ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్ -
ఎంత ‘నిర్మల’మైన న్యాయం?!
ఇంట్లో గోనె సంచుల్లో నోట్ల కట్టలు తగులబడిన జస్టిస్ యశ్వంత్ వర్మ కథ ఇంకా మరిచిపోక ముందే, దాని అడుగుజాడల్లోనే, థ్రిల్లర్ సినిమాను మైమరపింపజేసే మరొక న్యాయమూర్తి రసవత్తరమైన కథ గురించి చెప్పుకోవ లసి వస్తున్నది. ‘తీగలాగితే డొంక కదిలింది’ అనే సామెతను అక్షరాలా నిజం చేసే వాస్తవ కథనం ఇది. సినిమా కథలు తిరిగినన్ని మలుపులు, అనూహ్య సంఘ టనలు, తారుమారు పరిణామాలు ఎన్నో ఉన్న ఈ అవినీతి కథ ఒక తారుమారు తమాషాతో మొదలయింది. పంజాబ్– హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ 2008 జూలై 10న పదవి స్వీకరించారు. తర్వాత నెల రోజు లకు, 2008 ఆగస్ట్ 13న ఆమె ఇంటికి ఒక వ్యక్తి వచ్చి ‘నిర్మల్ జీకి ఇమ్మని ఢిల్లీ నుంచి ఈ పార్సెల్ వచ్చింది’ అని ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చాడు. అమ్రిక్ సింగ్ అనే వాచ్‌మన్ ఆ పార్సెల్ లోపలికి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు విప్పితే, అందులో నుంచి అక్షరాలా పదిహేను లక్షల రూపాయలు బైటపడ్డాయి. ఆ పార్సెల్ తెచ్చిన ప్రకాష్ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విషయం తెలియజేశారు. పోలీసులు ప్రకాష్‌ను ప్రశ్నించగా, అతను పంజాబ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్‌గా ఉన్న సంజీవ్ బన్సాల్ దగ్గర గుమాస్తా అని తేలింది. పోలీసులు బన్సాల్‌ను ప్రశ్నించగా, అవి తన డబ్బులు కావని, ఢిల్లీకి చెందిన హోటల్ యజమాని రవీందర్ సింగ్ తనకు పంపి, జస్టిస్ నిర్మల్ యాదవ్‌కు అంద జేయమని చెప్పాడని, తన గుమాస్తాకు ‘జస్టిస్ నిర్మల్ జీకి ఇవ్వు’ అని పంపిస్తే, పొరపాటున జస్టిస్ నిర్మల్జిత్ జీకి ఇచ్చా డని చెప్పాడు. అంటే ఆ సొమ్ము వాస్తవంగా చేరవలసింది జస్టిస్ నిర్మల్ యాదవ్ అనే మరొక న్యాయమూర్తికన్నమాట. గుమాస్తా చేసిన చిన్న పొరపాటువల్ల, ఇద్దరు న్యాయమూర్తుల పేర్లలో నిర్మల్ ఉండడం వల్ల ఈ అవినీతి బయటపడింది. జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఇచ్చిన ఫిర్యాదుతో, రెడ్ హ్యాండెడ్‌గా పదిహేను లక్షల రూపాయలు, అది పట్టుకొచ్చి ఇచ్చిన వారు, పంపించినవారు దొరికారు గనుక పోలీసు కేసు నమోదయింది. కాని, న్యాయమూర్తి, అడ్వకేట్ జనరల్‌లకు ఇందులో భాగం ఉంది గనుక పది రోజుల్లో ఈ కేసును పోలీ సుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. తర్వాత సీబీఐ చేసిన దర్యాప్తులో సంజీవ్ బన్సాల్, రాజీవ్ గుప్తా కలిసి హరియాణా లోని పంచ్ కులాలో కొన్న ఒక భూమి కేసులో, జస్టిస్ నిర్మల్ యాదవ్ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అందుకు ప్రతిఫలంగా ఈ లంచం పంపించారని తేలింది. అది మాత్రమే కాక, జస్టిస్ నిర్మల్ యాదవ్ విదేశీ ప్రయాణపు టికెట్లు, విదే శాలలో ఆమె వాడిన మొబైల్ ఫోన్ కార్డ్ కూడా సంజీవ్ బన్సాల్ కొనిపెట్టాడని సీబీఐ సాక్ష్యాధారాలు సేకరించింది. నిందితులకు, న్యాయమూర్తికి మధ్య జరిగిన సంభాషణల ఫోన్ రికార్డులను కూడా సీబీఐ సేకరించింది. చివరికి అవినీతి నిరోధక చట్టం కింద, భారత శిక్షా స్మృతి కింద జస్టిస్ నిర్మల్ యాదవ్ మీద, మిగిలిన నిందితుల మీద కేసు పెట్టవచ్చునని సీబీఐ నిర్ధారించింది. ఇక్కడిదాకా సాఫీగా సాగిన కథ తర్వాత ఎన్నో ఉత్కంఠ భరితమైన మలుపులు తిరిగింది. న్యాయమూర్తి మీద ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇమ్మని కోరుతూ సీబీఐ స్థానిక అధికా రులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఆ నివేదికకు జవాబిస్తూ సీబీఐ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ నిందితుల మీద కేసు నడపడానికి తగిన ఆధారాలు లేవని అన్నారు. కాని ఆ సమయంలో సీబీఐకి డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఇది తప్పకుండా ప్రాసిక్యూట్ చేయవలసిన అవినీతి నేరమే అన్నారు. సీబీఐ ఉన్నతాధికారులిద్దరు ఇలా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, మూడో అభిప్రాయం కోసం అప్పటి అటార్నీ జనర ల్కు పంపారు. అదే ప్రతిని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు కూడా పంపారు. అటార్నీ జనరల్ కూడా ఈ కేసులో పస లేదు అన్నారు. ఈ వ్యవహారం బయటకు పొక్కి, ‘హైకోర్టు న్యాయమూర్తి మీద కేసు నడపడానికి తిరస్కరించిన సీబీఐ’ అని హిందుస్థాన్ టైమ్స్ 2009 జూన్ 6న ఒక వార్త రాసింది. అది చూసిన అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఇంత తీవ్రమైన వ్యవహారంలో కేసు నడపకపోవడం తప్పు అనీ, అలా చేస్తే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందనీ తీవ్ర పదజాలంతో న్యాయశాఖ కార్యదర్శికి నోట్ పెట్టి, దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మన్నారు. అప్పుడు సీబీఐ మళ్లీ కొత్తగా వచ్చిన అటార్నీ జనరల్ సలహా కోసం వెళ్లింది. కొత్త అటార్నీ జనరల్ కూడా కేసు అవసరం లేదు అంటూ పాత అటార్నీ జనరల్ అభిప్రాయాన్నే ప్రకటించారు. దానితో తర్వాత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేసును ఉపసంహరించుకుంటున్నానని (క్లోజర్ రిపోర్ట్) సీబీఐ తెలిపింది. ఇక్కడ కథ మరొక మలుపు తిరిగి, సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి క్లోజర్ రిపోర్ట్‌ను తిరస్కరించి, కేసు నడపవల సిందే అన్నారు. అప్పుడు సీబీఐ మరొకసారి అనుమతి కోసం దరఖాస్తు... పైకి పంపించింది. దాన్ని పరిశీలించిన న్యాయ శాఖ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించగా, రాష్ట్రపతి 2011 మార్చ్‌లో అనుమతి ఇచ్చారు. అంటే రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి పట్టు బడినా కేసు ప్రారంభించడానికే మూడు సంవత్సరాలు పట్టిందన్న మాట. అప్పుడు సీబీఐ చార్జిషీట్ వేసింది. అప్పటికే ఈ కేసు నడపడానికి వీలులేదని ఎన్నో పిటిషన్లు దాఖలు చేసిన జస్టిస్ నిర్మల్ యాదవ్ ఇప్పుడు ఈ అనుమతి చెల్లదని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు అనుమతి చెల్లుతుందని తేల్చి చెప్పింది. ఆ తీర్పును నిర్మల్ యాదవ్ సుప్రీం కోర్టులో సవాలు చేయగా, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురయింది. కేసును తాత్సారం చేయడానికి ఆమె వేసిన మరెన్నో పిటిషన్లు కూడా గడిచిన తర్వాత, చివరికి 2013 మేలో నెల లోపు దర్యాప్తు, చార్జెస్ ఫ్రేమ్ ప్రక్రియలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలా అవినీతి సొమ్ము దొరికిన ఐదు సంవత్సరాల తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు మొదలయింది. ఏడున్నర సంవ త్సరాల తర్వాత చార్జెస్ ఫ్రేమ్ అయి విచారణ మొదలయింది. ఈలోగా జస్టిస్ నిర్మల్ యాదవ్ పదవీ విరమణ జరిగింది. సంజీవ్ బన్సాల్ మరణించాడు. డబ్బు పట్టుకొచ్చిన గుమాస్తా మరణించాడు. నలుగురు కీలక సాక్షులు అడ్డం తిరిగారు. న్యాయస్థానం దాదాపు 70 మంది సాక్షులను విచారించింది. ఇలా ఎన్నెన్నో అవరోధాలు దాటి, ఘటన జరిగిన 17 సంవత్సరాల తర్వాత, కేసు మొదలైన 14 సంవత్సరాల తర్వాత... ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అల్కా మాలిక్ సరిపోయినన్ని సాక్ష్యాధారాలు లేవని, సాక్షుల వాఙ్మూలాల్లో వైరుద్ధ్యాలున్నాయని కేసు కొట్టేశారు. ఎంత నిర్మలమైన న్యాయం!!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
తప్పులను సరిదిద్దుకోకపోతే సంకటమే!
ఎంతో చారిత్రక నేపథ్యంతో పాటు బోధన, పరిశోధనల్లో దేశంలోనే పేరెన్నికగన్నది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ). ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఆ యూనివర్సిటీలో అలజడికి కారణమవ్వడం చర్చనీయాంశమయ్యింది. ‘ఆరు సూత్రాల పథకం’లో భాగంగా 2,300 ఎకరాల విస్తీర్ణంలో 1974లో ఈ విశ్వవిద్యాలయం ప్రారంభమయ్యింది. ఈ కేంద్ర విశ్వవిద్యాలయం రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల విద్యార్థులకు వైవిధ్యమైన, ఉన్నతమైన విద్యా జీవితాన్ని అందిస్తున్నది. 2015లో ఉత్తమ కేంద్ర విశ్వవిద్యాలయంగా భారత రాష్ట్రపతి ‘విజిటర్స్’ అవార్డును సహితం పొందింది. 2020లో ‘ఇండియా టుడే’ ప్రకటించిన ర్యాంకింగ్‌లో దేశంలోని మొత్తం ఉత్తమ ప్రభుత్వ వర్సిటీలలో రెండో స్థానంలో నిలిచింది. అకడమిక్ సంబంధిత అంశాల్లోనే కాకుండా సామాజిక మార్పు దిశగా దేశంలో జరుగుతున్న ప్రతి ప్రయత్నంతోనూ అనుబంధాన్ని కొనసాగిస్తూ, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వామిగా ఉంటూ, విశ్వవిద్యాలయానికి ఉండవలిసిన మానవీయ చలనశీల స్వాభా వికతను కూడా హెచ్‌సీయూ కాపాడుకుంటూనే ఉన్నది. విద్యార్థులలో ప్రజల కోసం అమరులైన వీరస్వామి లాంటి వాళ్ళు, వివక్ష సమాజంపై సిరా దండోరా మోగించిన నాగప్పగారి సుందర్ రాజు లాంటి కీర్తిశేషులైన అధ్యాపకులు, అలాగే సమాజంతో మేధాపరమైన సంబంధాన్ని నిత్యం ఉనికి లోనే ఉంచుకొని వృత్తి జీవితాన్ని మరింత చైత న్యవంతంగా కొనసాగించిన రత్నం, హర గోపాల్ వంటి ఎందరో మేధావులకు చిరునామా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం.జాతీయ, అంతర్జాతీయ అంశాలపై లోతైన అధ్యయనాలు, అర్థవంతమైన చర్చలు, ఆరోగ్యవంతమైన భావజాల సంఘర్షణలకు హెచ్‌సీయూ కేంద్రం. 2016లో జరిగిన రోహిత్ వేముల బాధాకర ఉదంతం, సెంట్రల్ వర్సిటీలలో కొన సాగుతున్న అవలక్షణాలను సహితం దేశ వ్యాప్తంగా చర్చకు పెట్టి పెద్ద పోరాటానికి దారితీసింది. ఆ సందర్భంలోనే హెచ్‌సీయూ గేట్ ముందు రాహుల్ గాంధీ కూడా ధర్నాలో కూర్చొని విద్యావ్యవస్థలో వివక్షకు వ్యతిరేకంగా, పాలకుల వైఖరిని ఎండగడుతూ ప్రసంగించారు. రెండు సార్లు భిన్న సందర్భాల్లో హెచ్సీయూకు వచ్చిన రాహుల్ గాంధీకి ఈ వర్సిటీతో స్నేహ పూర్వక సంబంధమే కాదు... దానిపై సంపూ ర్ణమైన అవగాహనే ఉండి ఉంటుంది. అలాంటి వర్సిటీలో సొంత పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అనా లోచితంగా, ఉగాది పండుగనాడు ప్రదర్శించిన పోలీస్ జులుం దేశవ్యాప్తంగా చర్చగా మారిన తర్వాత కూడా రాహుల్ కనీసం స్పందించక పోవడం బాధాకరం. విద్యార్థుల ఉద్యమానికి కుట్రకోణం ఆపాదించేందుకు అరెస్ట్ చేసిన ఇద్దరు విద్యార్థులను అసలు వారు వర్సిటీ విద్యా ర్థులే కాదని పోలీస్ అధికారితో ప్రకటింపజేసి... రిమాండ్ రిపోర్టులో మాత్రం వర్సిటీ విద్యార్థు లుగా పేర్కొని ప్రభుత్వం అభాసుపాలైంది.వివాదానికి కారణంగా చెబుతున్న 400 ఎక రాలు సర్కార్‌వేనని హెచ్‌సీయూ అంగీకరించిందని అబద్ధాలు వల్లించింది రాష్ట్ర సర్కార్. తీరా అసలు రెవెన్యూ సిబ్బంది సర్వేనే నిర్వహించ లేదనీ, హద్దులే నిర్ణయించలేదనీ వర్సిటీ రిజిస్ట్రార్ అధికారికంగా ప్రకటించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధం బట్టబయలైపోయింది. అసలు 2004 ఎన్నికలకు ముందు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం చివరిరోజుల్లో అనుమానాస్పదంగా బిల్లీరావు అనే అతనికి చెందిన ‘ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు అప్పనంగా 400 ఎకరాల విలువైన ఈ భూమిని కేటాయించడమే అతి పెద్ద రాజ కీయ వివాదమైంది. క్రీడల అభివృద్ధి పేరిట జరిగిన భూ పందేరాన్ని 2006లో వైఎస్సార్ ప్రభుత్వం పరిశీలించి, పనులే ప్రారంభించని కారణంగా రద్దు చేసింది. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల వైఎస్సార్ సర్కార్ రద్దు చేసినా, సుప్రీం కోర్ట్ దాకా తర్వాతి ప్రభుత్వాలు న్యాయపరమైన భూపోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అనాడు సర్కార్ దిగి పోయే ముందు అన్యాయమైన విధానంలో స్వాధీనం చేసుకొని, పందేరం చేసిన విలువైన వర్సిటీ భూములను తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ స్వాధీనం చేసుకొని, వేలం వేసేందుకు ఉవ్విళ్లూరుతుండటమే విద్యార్థిలోకానికి ఆవేదన కలిగిస్తున్నది. ఎడాపెడా వాగ్దానం చేసిన పథ కాల అమలుకు కావలసిన నిధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూముల వేలానికి దిగజారడం అన్యాయం.ఇప్పటికైనా హెచ్‌సీయూ విజ్ఞప్తిని సానుకూలంగా అర్థం చేసుకొని, భూములను దానికే అప్పగించాలి. చేసిన తప్పులకు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే తగిన రాజకీయ మూల్యాన్ని కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవలసి వస్తుంది.డా‘‘ ఆంజనేయ గౌడ్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ‘ 98853 52242 -
వక్ఫ్ బిల్లుపై వ్యతిరేకత ఎందుకంటే...
కేంద్ర ప్రభుత్వం బుధ వారం (నేడు) పార్లమెంట్లో ‘వక్ఫ్ సవరణ బిల్లు’ను ప్రవేశపెడుతోంది. ఈ చర్చను ముస్లింల సంక్షేమ కార్యకలాపాలకు ఇచ్చిన ఆస్తులను కబళించే ప్రణాళికలో భాగంగా ముస్లిం సమాజం భావిస్తోంది. అలాగే ఇది లౌకికస్ఫూర్తి, మత స్వేచ్ఛ, సమానత్వం అనే రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కుతోంది. అందుకే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమ వుతోంది. ముస్లిం సమాజం ఈ బిల్లును వ్యతిరేకించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. వక్ఫ్‌కి ఆదాయం ఎలా తేవాలి? ఆదాయాన్ని ఎలా వినియోగించాలి అనేదానిపై సర్వహక్కులు వక్ఫ్ బోర్డ్‌కి ఉంటాయి. కానీ ఈ సవరణ బిల్లులోని సెక్షన్ 32, సబ్ సెక్షన్ 2 క్లాజ్ (ఇ)ను సవరించడం ద్వారా ఈ ఆదాయ సముపార్జన, వినియోగాలపై వక్ఫ్ బోర్డుకున్న అధికారాలు పరిమితం చేయ బడ్డాయి. ఇప్పటికే వక్ఫ్ భూముల్లో 50% అన్యాక్రాంతమయ్యాయి. ‘ఢిల్లీ డెవలెప్మెంట్ అథారిటీ’ అనే ప్రభుత్వ సంస్థ ఢిల్లీలోని 30% వక్ప్ భూములను ఆక్రమించుకుంది. ఇప్పుడు ప్రతిపాదిత బిల్లు గనక చట్టం అయితే ఉన్న భూములను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సరైన పత్రాలు లేని భూములు వక్ఫ్ అధీనంలో ఉంటే అది (వక్ఫ్ బై యూజర్ ) వక్ఫ్ ప్రాపర్టీగానే భావించబడుతుంది. ఇçప్పుడు దీన్ని తొలగించనున్నారు. అదే జరిగితే డాక్యుమెంట్స్ లేని వక్ఫ్ ఆస్తులు ఆరునెలల్లోగా రిజిస్టర్ కాక పోతే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. మత నియమాల ప్రకారం ఒకసారి సంక్షేమ కార్యక్రమాలకు దానం చేసిన ఆస్తిని ఇతర కార్య కలాపాలకు వాడకూడదు. ఈ బిల్లుతో దాన్ని తుంగలో తొక్కి పెద్ద స్థాయిలో వక్ఫ్ భూములను కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం ఆక్రమించుకోవచ్చు. లేదా కార్పొరేట్లకు కట్టబెడుతుంది.అలాగే, సెక్షన్ 104 ఓనర్ షిప్కి సంబంధించినది. చట్టం ప్రకారం ముస్లిమేతరులు కూడా వక్ఫ్ చేయవచ్చు. కానీ కొత్త సవరణ ప్రకారం ముస్లింలే డొనేట్ చేయాలి. దానధర్మాల కోసం ఇచ్చేదానిలో మతాలను చొప్పించడం సరికాదు. మరోవైపు ముస్లింలు మాత్రం ఇతర మత సంస్థలకు డొనేట్ చేయడాన్ని నిషేధించలేదు. ఇది ద్వంద్వ వైఖరి మాత్రమే కాక వక్ఫ్‌ను బలహీనపరిచే చర్య కూడా!చాలా రాష్ట్రాల్లో హిందువేతరులు కూడా హిందూ దేవాలయాలకు దానం చేయవచ్చు అనే నిబంధన ఉంది. ఇదే నిబంధన వక్ఫ్ విషయంలోఎందుకు పాటించడం లేదు అనేది కీలకప్రశ్న. గతంలో వక్ఫ్ కౌన్సిల్లో ముస్లింలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు తలపెట్టిన సవరణ ద్వారా కౌన్సిల్లో ముస్లింల సంఖ్యను సగానికి తగ్గించి, మిగిలిన సగాన్ని ముస్లిమేతరులతో భర్తీ చేస్తుంది. మరి ఎండోమెంట్ బోర్డుల లాంటి వాటిలో ముస్లింలకు స్థానం ఎందుకు కల్పించరు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం జవాబిస్తారు? సెక్షన్ 9 ప్రకారం వక్ఫ్ కౌన్సిల్ లోనూ, సెక్షన్ 14 ప్రకారం వక్ఫ్ బోర్డులోనూ ఇద్దరేసి ముస్లిమేతరులు సభ్యులుగా ఉంటారు. ఇది ముస్లింల రాజ్యాంగ హక్కులకు విఘాతమే!గతంలో వక్ఫ్ సీఈఓ ముస్లిం అయి ఉండాలి అనే నిబంధన ఉంది. ప్రస్తుతం దానిని తొలగించి ముస్లిమేతరులు కూడా సీఈఓ కావచ్చని మార్చ బోతున్నారు. ఇది ముస్లింల హక్కులకు గొడ్డలి పెట్టు.ఇప్పటివరకు వక్ఫ్‌కి డొనేట్ చెయ్యాలంటే ఇస్లామ్ మతావలంబి అయి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రస్తుత ప్రతిపాదిత సవరణ ద్వారా ఐదేళ్ళుగా ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉన్నవారు మాత్రమే డొనేట్ చేయాలనడం దారుణం మాత్రమే కాదు... వక్ఫ్‌ను బలహీన పరచడం! అదే ఎండో మెంట్ వారి విషయానికి వచ్చేటప్పటికి ప్రాక్టీసింగ్ హిందువే దానం చేయాలనే నిబంధన లేదు.సెక్షన్ 5 ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్‌కు ఉన్న అధికారాలను పరిమితం చేయడం జరిగింది. సెక్షన్ 3ఇ ప్రకారం కలెక్టర్లను వక్ఫ్ భూవివాదాల విచారణ, పరిష్కారాల కోసం నియమించడం సరికాదు. ఎందుకంటే కలెక్టర్ రెవిన్యూ రికార్డ్‌లకు అధిపతి కనుక అతను ప్రభుత్వ పక్షపాతి అవుతాడు. వివాదంలో ఉన్న ఏ వక్ఫ్ ఆస్తినైనా ప్రభుత్వ ఆస్తిగా మార్చేస్తాడు. ఒకసారి వక్ఫ్ అయితే అది ఎప్పటికీ వక్ఫే అన్న మతనియమానికి ఇది విరుద్ధం. అంతే కాక, అధికారుల పక్షపాతంతో, అధికార దుర్విని యోగంతో కొన్ని రోజుల్లోనే మొత్తం వక్ఫ్ ఆస్తులను ముస్లిం సమాజం కోల్పోయే ముప్పుంది.ఈ బిల్లు ద్వారా వక్ఫ్ భూములకు లిమిటేషన్ చట్టాన్ని వర్తింపచేస్తున్నారు. ఇదే జరిగితే వక్ఫ్ బోర్డులు శాశ్వతంగా ఆక్రమణలో ఉన్న వక్ఫ్ భూములను తిరిగిపొందే హక్కును... అనగా రైట్ ఆఫ్ రికవరీని కోల్పోతాయి. అంటే కోల్పోయిన వక్ఫ్ భూములు ఎప్పటికీ రికవర్ అయ్యే అవకాశం లేదు. ఈ అన్ని కారణాల రీత్యా ఈ బిల్లును ప్రజా స్వామ్య వాదులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో ‘రైతు ఉద్యమ’ స్ఫూర్తితో ముస్లింలు ఉద్యమబాట పట్టబోతున్నారు. సంయుక్త పార్లమెంటరీ సంఘం చెప్పిన అభ్యంతరాల్ని కాదని ప్రభుత్వం బిల్లు తేవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.ముహమ్మద్ షరీఫ్ వ్యాసకర్త ‘జమాఅతె ఇస్లామీ హింద్’ఏపీ రాష్ట్ర కార్యదర్శి ‘ 99483 15926 -
అవివేక మార్గంలో అగ్రరాజ్యం
1990లలో, న్యూయార్క్‌లోని బ్రాడ్వేలో పర్యటిస్తున్న చైనా ప్రతినిధి బృందం గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక నివేదికను ప్రచురించింది. ఇతిహాసాల రంగస్థల, సంగీత, వినోద ప్రదర్శన క్షేత్రాల కూడలిగా ప్రసిద్ధి చెందిన ‘బ్రాడ్వే’ అభివృద్ధి, నిర్వహణల గురించి అధ్యయనం చేసి షాంఘై లేదా బీజింగ్‌లో సరిగ్గా అటువంటి సాంస్కృతిక బహుళస్థలిని ఎలా వృద్ధి చేయవచ్చో తెలుసు కోవడమే ఆ సందర్శకుల లక్ష్యం. అమెరికా శక్తి... దాని సైన్యంలో మాత్రమే కాదు, దాని శక్తిమంతమైన సంస్కృతిలో కూడా ఉందని చైనీయులు బాగా అర్థం చేసుకున్నారు. ఒక దేశ ‘శక్తి’కి ప్రామాణికమైన లక్షణం ఏమిటంటే, ఇతర దేశాలు తనను అనుకరించేలా స్వీయ విధానాలను రూపొందించు కోగలిగిన సామర్థ్యమే. అది సైనిక శక్తి కావచ్చు, ఆర్థికపరమైన దృఢ శక్తి కావచ్చు. సంస్కృతి, విలువలు, భావజాలంతో ఆ దేశం ప్రతిఫలించే సమ్మోహన శక్తి ద్వారా ఆ అనుకరణ మరింత సులభంగా జరుగుతుంది.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నాలుగేళ్లపాటు, అమెరికా అణ్వాయుధాలపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. అదే సమయంలో యూరప్ పునరుజ్జీవనానికి ‘మార్షల్ ప్లాన్ ’ను ప్రారంభించింది. పైగా తన ప్రపంచ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి నాటో సైనిక కూటమిని సృష్టించింది. అదే మార్షల్ ప్లాన్... ఆర్థిక, ఆరోగ్య, వాణిజ్య రంగాలలో ప్రజోపయోగ వస్తుసేవలను అందుబాటులోకి తెచ్చి ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించటానికి వీలుగా ఐక్య రాజ్యసమితిని, ప్రపంచ బ్యాంకును, అంతర్జాతీయ ద్రవ్య నిధిసంస్థను, ప్రపంచ ఆరోగ్య సంస్థను, వాణిజ్య సుంకాలపై సాధారణ ఒప్పందాన్ని(గాట్) నెలకొల్పేందుకు కూడా అమెరికాకు తోడ్పడింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా సాంస్కృతిక ఆకర్షణ విస్తృతం అవుతున్న కొద్దీ ఈ అంతర్జాతీయ సంస్థలు అమెరికా శక్తికి మరింత బలం చేకూర్చే సాధనాలుగా మారాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెరికా తన ప్రధాన దాతృత్వ సంస్థ అయిన ‘యుఎస్ ఎయిడ్’ని మూసి వేయడం ద్వారా, ఇప్పటివరకు తన శక్తిని వినియోగించుకుని అభివృద్ధి చేసుకున్న ఆధిపత్యాన్ని తానే దెబ్బతీసుకోబోతున్నట్లు కనిపిస్తోంది. ‘యుఎస్ ఎయిడ్’ ప్రపంచంలోనే అభివృద్ధి సహాయానికి సంబంధించి అతి పెద్ద దాతృత్వ సంస్థ. ఆ సంస్థ ఏటా అందించే 70 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్, జోర్డాన్, పాలస్తీనా వంటి వ్యూహా త్మక ప్రయోజనాలు కలిగిన దేశాలకు, అలాగే తను మానవతా సహాయం అందించిన (సూడాన్, యెమెన్, దక్షిణ సూడాన్, ఆఫ్ఘనిస్తాన్) దేశాలకు అమెరికా పంపిణీ చేసింది.ఆధిక్యశక్తి (హార్డ్ పవర్) స్థానంలో ఔదార్య శక్తి (సాఫ్ట్ పవర్)ని ప్రయోగించటం అమెరికా స్థిరమైన వ్యూహం. ఈ విధానాన్ని భారత్‌తో సహా ఇతర దేశాలు అనుసరించడానికి ప్రయత్నించాయి. 1950లు, 60లలో ఆరోగ్య, వ్యవసాయ, ఆహార, విద్యారంగాలలో భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో యుఎస్ ఎయిడ్ ముఖ్య పాత్ర పోషించింది. అదే సమయంలో పాక్‌ను ఆయుధీకరించే తన విధానం నుండి ఉత్పన్నమయ్యే భారతీయ అసంతృప్తిని మళ్లించ టానికి యుఎస్ ఎయిడ్‌ను అమెరికా తెలివైన మార్గంగా చేసుకుంది. అమెరికా తన సాఫ్ట్ పవర్‌ను విదేశీ సహాయ నగదు నిధుల ద్వారా మాత్రమే కాక, నాలుగు ప్రధాన అంశాల ద్వారా కూడా ప్రయోగించింది. మొదటిది – వినోదం, మీడియా, పరిశ్రమలు, విద్యా వ్యవస్థ. రెండవది – ప్రజాస్వామ్యం, సమానత్వం, మానవ హక్కుల పట్ల, అలాగే శక్తివంతమైన పౌర సమాజం పట్ల తన నిబద్ధత. మూడవది – ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకులు మొద లైనవి. నాల్గవది – తన చురుకైన వినియోగదారీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. వీటన్నిటితో కూడిన ‘సాఫ్ట్ పవర్’తో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా తన హోదాను నిలుపుకొంది. విద్యార్థులు, పరిశోధకులు, అవకాశాల కోసం చూస్తున్న వ్యాపారవేత్తలు, కళాకారులు, ప్రదర్శకులు; అలాగే చట్టబద్ధమైన లేదా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా పెద్ద సంఖ్యలో అమెరికాకు తరలివచ్చిన కార్మికులలో అమెరికాకు ఉన్న ఈ ‘సాఫ్ట్ పవర్’ ఎంతో ఆకర్షణను కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా, అమెరికా ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థగా, సంక్షేమ రాజ్యంగా, సాంకేతిక విజ్ఞానంలో లీడర్‌గా ప్రశంసలు అందుకుంది. తద్వారా అమెరికా సంస్కృతికి, ఫ్యాషన్లకు విస్తృతంగా అనుకరణలు ప్రారంభం అయ్యాయి. ఈ కారణంగా ఇతర అగ్ర రాజ్యాల విధానాలలో లేని పరోపకార ధోరణి అమెరికా విధానాలలో ఉందనే అభిప్రాయం కూడా ఏర్పడింది.కానీ నేడు ఇవన్నీ తిరగబడుతున్నాయి. ట్రంప్ పాలనలోని ‘అమెరికా ఫస్ట్’ విధానం అమెరికా ప్రయోజనాలనే అన్నింటికంటే ముందు ఉంచడానికి ప్రయత్నిస్తుంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తీర్పును రద్దు చేయడానికి లేదా కళంకం లేని న్యాయ వ్యవస్థపై దాడి చేయడానికి అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నం ప్రజా స్వామ్యంలోని ముఖ్యమైన వ్యవస్థలను దుర్బలం చేసింది. అమెరికాలో విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా తోపాటు చర్చిలు కూడా నేడు దాడికి గురవుతున్నాయి. ఇవన్నీ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) ఉద్యమం డిమాండ్లకు అనుగుణంగా ఉండాలన్న సంకేతాలను ఆయన పంపుతున్నారు. వైట్ హౌస్ ఆదేశాల ఉల్లంఘనలకు గాను విశ్వవిద్యాలయాలు డబ్బును తిరిగి చెల్లించాలని ట్రంప్ బెదిరించడం అమెరికన్ సంస్కృతిని వర్ణించే మేధా పరమైన స్వేచ్ఛను దెబ్బతీస్తుంది. నిజంగా ఉన్నాయో, లేవో తెలియని గ్రహాంతరవాసుల మాదిరిగా ట్రంప్ పరిపాలన విదేశీయులు, వీసా హోల్డర్లు, పర్యాటకులు, శాశ్వత నివాసితులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ల జీవితాన్ని కష్టతరం చేస్తోంది. ఈ చర్యలు అమెరికన్ ‘సాఫ్ట్ పవర్’ గుండెకాయపైనే దాడి చేస్తాయి.అమెరికా సాఫ్ట్ పవర్‌ను చూసి ప్రపంచం అసూయ చెందేది. కానీ నేడు, షాంఘై, బీజింగ్‌లు కూడా ‘బ్రాడ్వే’ తరహా సాంస్కృతిక కేంద్రాలను కలిగి ఉన్నాయి. సంస్కృతితో పాటు కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్లు, స్కాలర్‌షిప్‌ల ద్వారా చైనీస్ భాషను ప్రోత్సహించ డానికి విద్యార్థులను చైనా ఆకర్షిస్తోంది. ఇది సాఫ్ట్ పవర్ మరొక లక్షణం. భారతదేశం సంక్లిష్టమైన విదేశాంగ విధాన సవాళ్లను అధిగ మించడానికి సాఫ్ట్, హార్డ్ పవర్ మిశ్రమాన్ని ఉపయోగిస్తోంది.దాంతో భారత్ విదేశీ విద్యార్థులకు ప్రధాన గమ్యస్థానం అయింది.ఈ హైపర్–రియలిస్ట్ యుగంలో సాఫ్ట్ పవర్ ఏమంత ముఖ్యం కాదని చెప్పడం సులభమే. కానీ వాస్తవం ఏమిటంటే, హార్డ్ పవర్ దానికదిగా... సాఫ్ట్, హార్డ్‌లు కలిసిన ‘స్మార్ట్ పవర్‘ సాధించగల సామర్థ్యాన్ని పొందలేదు. లేకుంటే, చైనా లేదా రష్యా... ప్రపంచంలో అత్యంత వాంఛనీయమైన దేశాలుగా పరిగణన పొందేవి. నిజానికి ధనిక దేశాలకు, లేదా మధ్య ఆదాయ దేశాలకు, అమెరికా ఇష్టమైన ఎంపిక! ఎందుకంటే తమ జీవితాలను మెరుగుపరచుకోవాలని కోరుకునే లక్షలాది వలసదారులకు అమెరికానే అనువుగా ఉంది. ట్రంప్ అధికారంలో ఉన్నప్పటికీ సినిమాలు, సంగీతం, సాంకేతికత ద్వారా అమెరికా ప్రపంచవ్యాప్తంగా తన ప్రాధాన్యాన్ని నిలుపుకొనే అవకాశం ఉంది. కానీ మిత్రదేశాల విశ్వాసాన్ని తక్కువగా అంచనా వేయడం అగ్రరాజ్యానికే దెబ్బ. అలాగే, అమెరికా విలువలు, లక్ష్యాల పట్ల ప్రపంచానికి ఉన్న అభిప్రాయాన్ని మార్చడం కూడా ఆ దేశానికే నష్టదాయకం. వీటన్నిటి వల్ల ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ విధానం ప్రపంచంలో అమెరికాకు ఉన్న ఇమేజ్ను దెబ్బతీస్తుంది. దాని దీర్ఘకాలిక ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.మనోజ్ జోషీ వ్యాసకర్త డిస్టింగ్విష్డ్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ -
మీకు దండం పెడతా ఆ ఫొటోలు ఆపండ్రా బాబు
మార్కెట్లోకి ఏ కొత్త ప్రాడక్ట్ వచ్చినా జనం ఊరుకోరు.. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వచ్చే అప్డేట్స్.. మార్పులు.. కొత్తకొత్త ఆవిష్కరణలు వంటివి జనాన్ని మరింతగా ఆకట్టుకుంటాయి. ఎంతలా అంటే కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చిన కంపెనీకి సైతం నిద్రపట్టని స్థాయిలో మనోళ్లు వాడకం ఉంటుంది. ఐ ఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు తిండి నిద్రమానేసి దానికోసం లైన్లో నిలబడి చివరకు దాన్ని దక్కించుకునేవరకూ ఊపిరిసలపని వాళ్ళు కొందరు. దానికోసం ఏకంగా కిడ్నీలు అమ్ముకునేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఫోన్ కొనకపోతే ఉరేసుకుంటాను అని తల్లిదండ్రులను బెదిరించిన కేసులూ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా చాట్‌జీపీటీలో వచ్చిన కొత్త ఆవిష్కరణ జిబ్లీ స్టూడియో ఫోటోలు.. అంటే మనం ఏదైనా ఫోటోను దానిలోకి అప్లోడ్ చేస్తే అది కార్టూన్ మాదిరి మార్చేసి మనకు తిరిగి ఇస్తుందన్నమాట. అంటే ఒక చిత్రకారుడు పెన్సిల్.. కుంచెతో వేసినట్లు ఆ ఫోటోలు ఉంటాయి.ఈ కొత్త ఫీచర్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం ఐంది. ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఫోటోలు అప్లోడ్ చేసేసి వాటిని జిబ్లీ స్టూడియో ఫొటోలుగా మార్చేసుకుని ఫేసుబుక్ ట్విట్టర్.. ఇన్‌స్టాలో పోస్టు చేసుకుంటున్నారు. మనిషికి తనని తాను చూసుకోవడం ప్రతిసారీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందేమో..అద్దంలో ఒకసారి ఫోటోలో ఒకసారి.. బొమ్మ గీయించుకొని ఒకసారి..చూసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా కార్టూన్ లో ఎలా ఉంటానో అనే కుతూహలంతో.. చాట్‌జీపీటీలో అందరూ స్టూడియో గిబ్లీ ఆర్ట్ స్టైల్ లో తమ ఫొటోలు మారుస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ ఫోటోల పిచ్చి ఏకంగా ఆ చాట్‌జిపిటి సంస్థను సైతం కుదిపేసింది.మనం అప్లోడ్ చేసిన మన మామూలు ఫోటోలను ఏకంగా జపానీస్ యానిమేషన్ స్టూడియో డైరెక్టర్లు హయావో మిజజాకి, ఇసావో టకహట రూపొందించిన పాపులర్ సినిమాలు స్పిరిటెడ్ అవే , ప్రిన్సెస్ మోనోనొకే వంటి సినిమా క్యారెక్టర్లను పోలి ఉండేలా మార్చేసి మనకు అందిస్తోంది. . ఈ కార్టూన్ చిత్రాలు మంచి జనాదరణ పొందడంతో కోట్లకొద్దీ ఫోటోలు చాట్‌జీపీటీలోకి వచ్చి పడుతున్నాయి. దీంతో అక్కడి సిబ్బందికి తిండి నిద్ర కూడా లేదంట. దీంతో ఈ ట్రేండింగ్ ను చూసి విసుగెత్తిపోయిన చాట్ జిపిటి వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మాన్ బాబూ కాస్త గ్యాప్ ఇవ్వండి.. మా సిబ్బంది కూడా కాస్త నిద్రపోవాలి కదా అని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అంటే కొత్త ట్రెండ్ మొదలైతే జనం ఎంతలా వేలం వెర్రిలా ఉంటారన్నదానికి ఇదో ఉదాహరణ అన్నమాట.- సిమ్మాదిరప్పన్న -
Fake Hospitals ఆస్పత్రులపై నియంత్రణేదీ?
ఉభయ తెలుగు కాష్ట్రాల్లో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల తీరు రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతోంది. అధిక ఫీజులు, నకిలీ డాక్టర్లు, అనుమతులు లేని ఆస్పత్రులు - ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వ్యాపార లాభాలను కాపాడుకోవడమే ధ్యేయంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో, 2,367 ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 276 ఆస్పత్రులు ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్నాయంటే, పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అనుమతులు లేని ఆస్ప త్రుల్లో అనుభవం లేని వైద్యులు చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఇటీవల రోగులు మృత్యువాత పడుతున్న ఘటనలు అధికంగా నమోదవుతున్నాయి. ఇటీవల (మార్చి 29న) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక ఆస్పత్రిని సీజ్ చేయడం, ఐదుగురు నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేయడం ఈ సమస్య లోతును సూచిస్తోంది. ఏపీ నుంచే కాక ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా హైదరాబాదుకు వైద్యం కోసం ఎందరో వస్తూ ఉండటం ఈ సందర్భంగా గమనార్హం.ప్రజల ఆరోగ్యం వ్యాపార సరుకుగా మారిన ఈ పరిస్థితిలో, ప్రభుత్వ ఆస్పత్రుల దుఃస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల రద్దీకి తగ్గట్లు బెడ్లు, సిబ్బంది లేకపోవడంతో సేవలు అందించడం సవాల్‌గా మారింది. దీనికితోడు, వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు రిఫర్ చేయడంతో పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం కోసం తెలంగాణ ఎమ్మెల్సీ కోదండరాం ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ, దానికోసం సమర్థవంతమైన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇది స్వాగతించదగిన ప్రతిపాదన. అయితే, ఈ చర్యలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, నిరంతర పర్యవేక్షణ, కఠిన చర్యలతో అమలు జరగాలి. – ముద్దం నరసింహ స్వామి, సీనియర్ జర్నలిస్ట్ -
సన్న బువ్వ సంబురం
ఉగాది పండగ పూట, పేదల ఆకలి తీర్చాలని ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాతి అని మరోసారి రుజువు చేసుకుంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నుండి ప్రజా పంపిణీ విధానంలో ఇకనుండి పేద ప్రజలందరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందించే చరిత్రాత్మక పథకానికి స్వీకారం చుట్టింది ప్రభుత్వం. తెలంగాణ మొత్తం జనాభాలో 3.10 కోట్ల (84%) మంది ప్రజలకు, శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని ఉచితంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలనే సంక ల్పానికి యావత్ తెలంగాణ హర్షం వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు పేదలకు రూ. 1.90 లకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభిస్తే, తెలంగాణ ఏర్పాటైన 11 ఏళ్లకు రేవంత్ రెడ్డి సీఎంగా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు సన్నబియ్యం అందించే బృహత్తర కార్యక్రమం అమలు చేస్తోంది. గతంలో దొడ్డు – నాసిరకం బియ్యం పంపిణీ చేయడంతో పేదవాడి ఆకలి తీర్చాలనే ప్రజాపంపిణీ వ్యవస్థ లక్ష్యం నీరుగారింది. నెలకురూ. 10,600 కోట్లు ఈ బియ్యం పంపిణీపై ఖర్చు చేసినా ఫలితం పేదలకు అందలేదు. రైసు మిల్లర్లకు, దళారులకు, అవినీతి పరులకు మంచి ఆదాయ వనరుగా రేషన్ బియ్యం మారి పోయాయి. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, తిరిగి ప్రభుత్వానికి లాభకరమైన ధరకు అమ్మి మిల్లర్లు గత ప్రభుత్వ కాలంలో దోపిడీకి పాల్పడి నట్లు ఆధారాలు బయటపడ్డాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కేసీఆర్ 10ఏళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సంకల్పించింది. వెంటనే అందుకు సంబంధించిన కార్యా చరణ మొదలుపెట్టింది. రాష్ట్రంలో సన్న వడ్ల సాగును ప్రోత్సహించి, సన్న వాటిని సాగుచేసిన రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్‌గా అందించింది. తద్వారా, సన్న బియ్యాన్ని సమీకరించి తెలుగువారి నూతన సంవత్సరం (ఉగాది పండుగ) పర్వదినాన అశేష ప్రజానీకం సాక్షిగా తెలంగాణ ప్రజలందరికీ సన్న బియ్యం అందించే బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టినం. ఇప్పుడున్న 90.42 లక్షల రేషన్ కార్డులకు అదనంగా పది లక్షల రేషన్ కార్డులు కొత్తగా జారీ చేస్తూ లబ్ధిదారులందరికీ సన్న బియ్యం అందేలా పక్కా ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ మంచి పని చేస్తే మమ్మల్ని అభినందించాల్సింది పోయి, బీజేపీ కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం మొదలుపెట్టింది. పండుగ రోజు కూడా పచ్చి అబద్ధాలతో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి ఒకరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించారు. రేషన్ షాపులలో మోదీ ఫోటో పెట్టాలని ఆయన వితండవాదం చేస్తున్నారు. బీజేపీ భాగస్వామిగా ఉన్న పక్క రాష్ట్రంలోనూ కేవలం ముఖ్యమంత్రి ఫొటో మాత్రమే ఉంది కాని ప్రధాని మోదీది లేదనే విషయం తెలియనిది కాదు. మరి తెలంగాణలో మోదీ ఫోటో ఎందుకు పెట్టాలో వారే చెప్పాలి. కాంగ్రెస్ తన పథకాల ద్వారా ప్రజలకు మరింత చేరువ అయితే తమ పార్టీని ప్రజలు దూరంగా పెడతారని బీజేపీవారు భావించడం వల్లనే ఇటువంటి అర్థం పర్థం లేని డిమాండ్లతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: మనిషిని మార్చే సాన్నిధ్యంఎవరు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణలో ఉన్న ప్రతి పేద ఇంటికీ నెల నెలా సన్నబియ్యం అందించే యజ్ఞానికి సబ్బండ వర్గాలు సహక రిస్తాయి. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలను ప్రజలే తిప్పికొడతారు. సమాజంలోని మేధా వులు, కవులు, కళాకారులు ప్రజా సంక్షేమం కొరకు చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తూ అండగా నిలబడాలని కోరుతున్నాం.-డా. కొనగాల మహేష్ (కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి) -
వైఫల్యాల వెనుక వ్యవస్థ లోపాలు!
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద మొత్తంలో అక్రమ నగదు కనిపించినట్లు గత వారం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ బయట పెట్టింది. అంతకు మునుపు, జస్టిస్ శేఖర్ యాదవ్ న్యాయవ్యవస్థ గౌరవప్రతిష్ఠలకు భంగం కలిగిస్తూ మాట్లాడారు. భారతదేశం మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తోందని జస్టిస్ శేఖర్ యాదవ్ గత డిసెంబరులో ఒక ప్రైవేటు కార్యక్రమంలో అనడం వివాదాస్పదమయింది. అప్పుడు ఆయనపై సరైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడీ రెండో కేసులో అంతటా నిరసన పెల్లుబుకటంతో ఆలస్యంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. న్యాయవ్యవస్థ స్పందనలు అర్థవంతంగా, బాధ్యతాయుతంగా ఉంటున్నాయా? లేవని సమా ధానం చెప్పుకునేటట్లయితే, జ్యుడీషియరీ జవాబుదారీతనం కోసం పనిచేయాల్సిన అంతర్గత విచారణ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? ఇక న్యాయమూర్తుల ఎంపిక విధానం ఈ పరిస్థితికి దారి తీసిన రెండో సమస్య. హైకోర్టు స్థాయిలో జరిగే నియామకాల తీరు మరీ ఆందోళన కలిగిస్తోంది.న్యాయవ్యవస్థ జవాబుదారీతనాన్ని కాపాడవలసిన అంతర్గత యంత్రాంగం (ఇన్–హౌస్ మెకానిజం) గుణదోషాల్ని జస్టిస్ అజిత్ ప్రకాష్ షా ‘రోసలిండ్ విల్సన్ స్మారక ఉపన్యాసం’లో తీవ్రాతి తీవ్రంగా విమర్శించారు. ఇది 2019 నాటిదైనా నేటి సందర్భానికి అతికినట్లు సరిపోతుంది. మొట్టమొదటగా అంతర్గత వ్యవస్థ స్వభావం మీద ఆయన అస్త్రం ఎక్కుపెట్టారు. అది అనుసరించే పద్ధతులు ఎప్పటికప్పుడు తాత్కాలికంగా, ఇష్టాగోష్ఠిలా ఉంటాయి. ‘‘ఈ ప్రొసీజర్‌కు ఎలాంటి చట్టబద్ధ ప్రాతిపదిక లేదు’’. ‘‘ న్యాయ వ్యవస్థ లోపల దానికి ఉన్న మన్నన పరిమితం’’. ‘‘ఇందుకు నిదర్శనం – కమిటీ నివేదిక వ్యతి రేకంగా వచ్చిందని చెప్పి రాజీనామాకు సిద్ధపడిన న్యాయమూర్తి ఒక్క రంటే ఒక్కరూ లేకపోవటం...’’ అని ఆయన అంటారు. ‘‘న్యాయవ్యవస్థ దానికదే ఒక చట్టం, ఒక ప్రపంచం’’ అన్నట్లు అంతర్గత యంత్రాంగం పరిగణిస్తుందని జస్టిస్ షా మరీ ముఖ్యంగా ప్రస్తావించారు. వారిని వారే నియమించుకుంటారు. తమ ప్రవర్త నను నియంత్రించే విధివిధానాలను వారే అంతర్గతంగా రూపొందించుకుంటారు. ఇది ‘‘ఒక తరహా స్వీయపాలన’’ అంటూ, ‘‘ఏలాగైతే ఉండాలో కచ్చితంగా అందుకు భిన్నంగా ఉంది..’’ అని విమర్శించారు. అంతర్గత యంత్రాంగం వాస్తవ పనితీరు ఎలా ఉంటుందో తెలిపేందుకు పలు విమర్శలు ఉన్నాయి. న్యాయమూర్తుల నడత గురించి బహిరంగంగా చెప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నా, వారిపై ఇన్–హౌస్ విచారణలు ఏనాడూ జరగలేదు. అలాగే, జడ్జీల మీద నిర్దిష్ట ఆరోపణలు చేసిన కేసుల్లోనూ అంతర్గత విచారణకు ఆదేశాలు లేవు. న్యాయవ్యవస్థ జవాబుదారీతనం కోసం తటస్థమైన, అధికా రికమైన, చట్టబద్ధ యంత్రాంగం ఒకటి ఎందుకు ఉండాలో జస్టిస్ షా తీవ్ర పదజాలంతో వివరించారు. ‘‘న్యాయపీఠం మీద కూర్చున్న క్షణం నుంచీ వారి ప్రవర్తన ఎలా ఉండాలో నిర్దేశించే నైతిక వర్తన నియమావళి న్యాయమూర్తులకు మనసుల్లో పాతుకుపోయి ఉండాలి. కాని అలా ఉండదు. కచ్చితంగా చెప్పాలంటే, వారు తమ ముందుండే లాయర్లు, వాదులు, ప్రతివాదులు, నేరస్థులు, సాక్షులు, పోలీసుల మాదిరిగానే ఫక్తు సాధారణ మానవులు. వారు నిర్వహించే పదవుల స్వభావాన్ని బట్టి వారికి నైతికతను ఆపాదిస్తే అది మోసం, ప్రమాదకరం...’’ అన్నారు.న్యాయమూర్తుల నడత, ప్రవర్తన గురించి మాట్లాడుకుంటు న్నాం కాబట్టి, వారి ఎంపిక విధానం గురించిన ప్రశ్న తలెత్తక మానదు. కొలీజియం వ్యవస్థ పరిపూర్ణంగా పనిచేయడం లేదన డంలో సందేహం లేదు. మనకు వేరొక విధానం కావాలి. దాని గురించి మాట్లాడుకునే ముందు, ప్రస్తుత కొలీజియం వ్యవస్థ ఎక్కడ విఫలమైందో చూద్దాం.జస్టిస్ షాతో నేను ఈ విషయం మాట్లాడినప్పుడు, ఆయన పలు అంశాలు చెప్పారు. మొదటిది – జడ్జీలను ఎంపిక చేయడానికి ఇవీ అంటూ చెప్పగలిగిన ఆమోదిత ప్రమాణాలేవీ లేవు. అంతా ‘‘అడ్ హాక్’’గా ఉన్నట్లు ఉంటుంది. నోటిమాట చెల్లుబాటు అవుతుంది. తరచూ ఇష్టులకే పెద్దపీట వేస్తారు.ఎంపికల్లో అత్యుత్తములను నిర్లక్ష్యం చేయడం కూడా పరిపాటి. ఇది మరీ ఆందోళనకరం. కొట్టొచ్చినట్లు కనబడే రెండు ఉదాహ రణలు జస్టిస్ షా చెప్పారు. జస్టిస్ అకిల్ ఖురేషీ, జస్టిస్ మురళీధర్‌లు సుప్రీం కోర్టులో స్థానం పొందలేకపోయారని, సుప్రీంలో ప్రవేశించ డానికి వారు పూర్తిగా అర్హులని ఆయన విశ్వసిస్తారు. ఎంపిక ప్రక్రియ నుంచి ప్రభుత్వాన్ని దూరం పెట్టడానికి కొలీజియం వ్యవస్థ రూపొందింది. అయినప్పటికీ ప్రభుత్వం తాను చేయగలిగినంతా చేయగలదు. పార్లమెంటులో మంచి మెజారిటీ ఉన్న ప్రభుత్వం కొలీజియం సిఫారసులను తొక్కిపట్టగలదు. అంటే ఏదైతే జరగకూడదన్న భావనతో కొలీజియం ఏర్పడిందో దొడ్డిదారిన అదే జరుగుతోంది. ఏమైనప్పటికీ, హైకోర్టు జడ్జీల నియామక స్థాయిలో కొలీజియం వ్యవస్థ అత్యంత బలహీనమైనదని భావించాలి. ఇది ఆందోళనకర పరిస్థితి. ఎందుకంటే, సుప్రీంకోర్టులో బహుశా 95 శాతం మంది న్యాయమూర్తులు హైకోర్టు జ్యుడీషియరీ నుంచే ఎంపిక అవుతారు. హైకోర్టు జడ్జీల నియామకాలు లోపభూయిష్ఠంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం సుప్రీం కోర్టు మీదా పడుతుంది. చివరగా, మనం చర్చించిన రెండు సమస్యలూ... అంతర్గత యంత్రాంగం, నియామక విధానం... ఏమాత్రం అలక్ష్యం చేయదగి నవి కావు. ఈ అలక్ష్యం మన న్యాయవ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. వాస్తవానికి వీటికి దేనికదిగా కాకుండా, రెంటికీ కలిపి పరిష్కారం ఆలోచించాలి. పాలక, న్యాయ వ్యవస్థల పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. మరి ఇందుకు అవి సిద్ధంగా ఉన్నాయా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చక్రవర్తులందరూ పన్నులను వడ్డించినవారే!
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ క్రూరుడూ, హిందూ వ్యతిరేకీ కాబట్టి, మహారాష్ట్రలో ఉన్న అతని సమాధిని తవ్వి తీసిపారెయ్యాలని డిమాండ్ చేస్తూ, నాగపూర్‌లో, వారం కిందట, కొన్ని హిందూ సంస్థలు సభలూ, నిరసన ప్రదర్శనలూ జరిపాయి. ఔరంగజేబు సమాధిని తీసెయ్యనక్కరలేదనీ, అతను అంతిమంగా మరాఠా ప్రజల చేతుల్లో ఓడిపోయాడు గనక, అతని సమాధి, మరాఠా ప్రజల వీరత్వానికి గుర్తుగా ఉంటుందని చీలిన శివసేనలోని ఒక పక్షం వాదన. తీసేస్తే తీసెయ్యండి, కానీ మహారాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి– అని కూడా ఒక విమర్శ. ఇటీవల వచ్చిన, హిందీ సినిమా ‘ఛావా’లో చూపించినట్టు... ఔరంగజేబు క్రూరుడు కాదనీ, ఎన్నో మంచిపనులు కూడా చేశాడనీ, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒక ముస్లిం సభ్యుడు అన్నాడు. వివాదం పెరిగి పెద్దదై, నాగపూర్‌లో చిన్న స్థాయి మతకలహాల వంటివి జరిగి షాపులూ, ఇళ్ళూ, వాహనాలూ ధ్వంసం అయ్యాయి. 50మందికి గాయాలయ్యాయట! ఇంగ్లీషూ, హిందీ టీవీ చానళ్ళలో ఈ వివాదంపై చర్చలు చూపించారు. ఇదే సమయంలో ఛత్రపతి శివాజీ ఎంత గొప్ప ప్రజానుకూల చక్రవర్తో వాదించిన వారున్నారు. ఔరంగ జేబ్ సైన్యంలో కీలకమైన పదవుల్లో హిందూ సైనికాధి కారులున్నారని వాళ్ళ జాబితా ఇచ్చిన వారున్నారు. అలాగే, శివాజీ సైన్యంలో కూడా, అతనికి ఎంతో నమ్మకస్తులైన ముస్లిం ఉన్నత సైనికాధికారులున్నారని వాళ్ళ పేర్లు చెప్పారు. ఈ చర్చల్లో ముస్లిం చక్రవర్తుల్ని ప్రజా వ్యతిరేకులుగానూ, హిందూ చక్రవర్తుల్ని ప్రజలకు అనుకూలురుగానూ వాదించు కోవడమే ఎక్కువగా కనిపించింది. పత్రికల్లోగానీ, టీవీ డిబేట్లలో గానీ, అసలు ప్రపంచ చరిత్రలో చక్రవర్తులనేవారు, వాళ్ళు ఏ మతస్థులైనా, పాలకవర్గ ప్రతినిధులనీ, పాలకవర్గం ఎప్పుడూ ప్రజలకు అనుకూలంగా ఉండజాలదనీ వివరించే వర్గ సిద్ధాంత దృష్టితో ఒక్క మాటంటే ఒక్క మాట చెప్పిన వారు లేరు. ఆ దృష్టికోణాన్ని పట్టించుకోకపోతే, సత్యానికి కళ్ళు మూసినట్టవుతుంది. చక్రవర్తులంటే, అనేక చిన్నా పెద్దా భూభాగాల మీద పరిపాలన చేసే వాళ్ళు గదా? ఉదాహరణకి, ఔరంగజేబ్ (1618–1707) అయినా, శివాజీ (1630–1680) అయినా, చక్రవర్తులుగా విశాలమైన భూభాగాలను వారి కాలంలో పాలించారు. వారు ఎవరితో కలిసి ఎవరిని ఓడించారో, ఎన్నెన్ని ప్రాంతాలను ఆక్రమించారో, ‘ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ, కైఫియతులూ’ ఇక్కడ చెప్పు కోలేము. అదంతా రకరకాల చరిత్ర పుస్తకాలలో దొరుకుతుంది. వారి ప్రభుత్వాలలో కూడా ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, సైనిక శాఖ, ఇతర అనేక రకాల శాఖలూ ఉన్నాయి. ఏకాలంలో అయినా, ఏ ప్రభుత్వమైనా పరిపాలన చెయ్యాలంటే, తప్పనిసరిగా కావలిసినవి పన్నులే. చరిత్రనించీ, మార్క్స్ గ్రహించి చెప్పినది ఇదే: ‘అధికార గణానికీ, సైన్యానికీ, మత గురువులకూ, కోర్టులకూ, క్లుప్తంగా చెప్పాలంటే, మొత్తం కార్యనిర్వాహక అధికార యంత్రాంగపు మనుగడకీ ఆధారం... రాజ్యానికి అందే పన్నులే! పన్నులు అంటే, ప్రభుత్వపు యంత్రాంగపు ఆర్థిక పునాది తప్ప, మరేమీ కాదు’. అయితే, పన్నులు ఏ పేర్లతో వచ్చినా, ఏ రూపంలో చెల్లించినా, వాటి మూలం ఎక్కడుంది? ఏ కాలం గురించి మనం మాట్లాడుతున్నామో, ఆ కాలానికి చెందిన శ్రామిక జనాల శ్రమలోనే ఉంది! అదెలాగో చూద్దాం. ఔరంగజేబు ప్రభుత్వమైనా, శివాజీ ప్రభుత్వమైనా ఆ కాలంలో రకరకాల పద్ధతుల్లో పన్నులు వసూలు చేసేవి. వసూళ్ళకు ఒక యంత్రాంగం ఉండడం తప్పనిసరి. మనం మాట్లాడుకుంటున్న ఇద్దరు చక్రవర్తులూ పన్నులు ఎవరి దగ్గర్నించి ప్రధానంగా వసూలు చేశారు? వ్యవసాయ రంగం నించీ. అలాగే, ఆనాటి పరిమితుల్లో ఉండిన పరిశ్రమలనించీ, సరుకులతో వ్యాపారం జరిపే వర్తకుల నించీ! అసలు, ఒక రాజ్యంలో ఉండే భూములు ఎవరి అధీనంలో ఉంటాయి? వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎవరు? పంటలు పండించేది ఎవరు? (1) జమీందారులనీ, మిరాసీదారులనీ, రకరకాల పేర్లతో ఉండే పెద్ద భూస్వాములు. వీళ్ళసలు ఒళ్ళు వంచరు. అంతా కౌలు రైతులు ఇచ్చే కౌలు మీదే ఆధారపడతారు. ఏ శ్రమా చెయ్యకుండా, కౌలు రైతులనించి గుంజిన కౌలులో నించే, చక్రవర్తికి శిస్తుగానీ, కప్పం గానీ, రకరకాల పన్నులు గానీ కడతారు. (2) సొంత శ్రమల మీదే, ప్రధానంగా ఇంటిల్లిపాదీ, కష్టపడి జీవించే ‘స్వతంత్ర రైతులు’. వీళ్ళు కట్టే శిస్తులు గానీ, పన్నులు గానీ అన్నీ వీళ్ళ సొంత శ్రమ వల్లనే కడతారు. (3) సొంత శ్రమ మీదే కాక, కొంత ఇతరుల శ్రమల మీద కూడా ఆధార పడి జీవించే రైతులు వీళ్ళు. వీళ్ళు కట్టే పన్నులు కూడా, వీరి సొంత శ్రమలో నించీ కొంతా, ఇతరుల నించీ వచ్చిన అదనపు శ్రమ నించీ కొంతా. (4) వ్యవసాయ శ్రామికులు. వీళ్ళు లేకుండా వ్యవసాయంలో ఏ దశలోనూ, ఏ పనీ జరగదు. వీళ్ళని పనిలో పెట్టుకునే వారు, వారు పేద రైతులైనా, కొంత మెరుగైన స్థితిలో ఉన్న వారైనా, కౌలు రైతులైనా, ఈ కూలీల శ్రమ మీద ఆధారపడే వారే! వీళ్ళకి ‘కూలి’ అనేది డబ్బు రూపంలో ఇచ్చినా, ధాన్యం రూపంలో ఇచ్చినా, వాళ్ళకి అందేది వాళ్ళ శ్రమ శక్తి విలువే. మొత్తం శ్రమ విలువ కాదు. శ్రమ శక్తి విలువ అంటే, మర్నాడు వచ్చి పని చెయ్యడానికి శ్రామికులకి కావలిసిన జీవితావసరాలకు తగ్గ జీతం అన్నమాట. శ్రమ విలువ అంటే, తాము జీతం రూపంలో తీసుకునే విలువా, యజమాని లాభంగా మిగుల్చు కునే అదనపు విలువా కూడా కలిసినదే. వ్యవసాయ రంగం నించీ వచ్చే పన్నులు ఎక్కువ భాగం ఈ అదనపు విలువలో నించీ తీసి ఇచ్చేవే!ఆ కాలపు రెవెన్యూ చరిత్ర ప్రకారం, ఈ ఇద్దరు చక్రవర్తులకీ ప్రధానమైన ఆదాయం వ్యవసాయ రంగం నించే వచ్చేది. వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. ‘శిస్తు’ అనీ, ‘చౌత్’ అనీ, ‘జప్త్’ అనీ, ‘సర్దేశ్ ముఖీ’ అనీ, ఇంకేవో పేర్లు. అవన్నీ మనకి అనవసరం. భూమి వైశాల్యాన్ని బట్టో, సారాన్ని బట్టో, వచ్చిన పంట మొత్తాన్ని బట్టో కొంత భాగం పన్ను కట్టాలి. వీటిని చెల్లించే వారిని రైతులనీ, జమీందారులనీ, మిరాశీ దారులనీ, కౌల్దారులనీ... ఏ పేరుతో మనకి చెప్పినా, అసలు సంగతి కాయకష్టం చేసే రైతుల శ్రమని దోచడమే! ఈ ఆర్థిక సత్యాన్ని పట్టించుకోకుండా, ఈ చక్రవర్తి గొప్పా, ఆ చక్రవర్తి గొప్పా అనే తగువు అర్థం లేనిది. వ్యక్తిగత స్వభావాల్లో కొన్ని తేడాల వల్ల, కొందరు చక్రవర్తులు కొంత గంభీరంగానూ, కొందరు కొంత సాత్వికంగానూ, కొందరు కటువు గానూ, మరికొందరు కర్కశంగానూ, క్రూరంగానూ ఉంటారు. ‘ఏ రాయి అయితేనేమీ పళ్ళూడగొట్టుకోవడానికి?’ అనే నానుడిలో ఉన్న గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటే... చక్రవర్తులందరూ శ్రమ దోపిడీదారులే! మనం మాట్లాడుకునే చక్రవర్తుల కాలంలో చిన్న స్థాయిలో అయినా రకరకాల పరిశ్రమలు ఉండేవి. వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడిగానీ, ఇతరత్రా గానీ సరుకులు తయారయ్యేవి. ఉప్పూ, దూదీ, దారం, నేతా, నూనెలూ, చర్మంతో తయారు చేసే వస్తువులూ, నివాసాల సామగ్రీ... ఇలా ఎన్నో రకాల పరిశ్రమలూ, వర్తకాలూ ఉండేవి. పరిశ్రమల యజమానులైనా, వర్తకులైనా, కట్టే పన్నులు, వాళ్ళ దగ్గిర పనిచేసే శ్రామికులు ఇచ్చే అదనపు విలువలోనించే తీసి కడతారు. అంటే, మళ్ళీ శ్రమ దోపిడీ ద్వారానే! ఈ విషయాలు ప్రజలు గమనంలో ఉంచుకుంటే మత ఘర్షణలు తలెత్తవు. ప్రజల అనైక్యత నుంచి ఎన్నికల ప్రయో జనం పొందాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం గమనార్హం.బి.ఆర్. బాపూజీ వ్యాసకర్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవిశ్రాంత ఆచార్యులు -
జాతి పునర్నిర్మాణంలో... 'ఆర్ఎస్ఎస్'@100
దేశమాత సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నూరు వసంతాలను పూర్తిచేసుకుంటున్న తరుణంలో, ఈ మైలు రాయిని సంఘ్ ఏ విధంగా పరిగణిస్తుందో అనే విషయంలో ఒక స్పష్టమైన జిజ్ఞాస ఉంటుంది. ఇలాంటి సందర్భాలు... ఉత్సవాల కోసం కావని, ఆత్మపరిశీలన చేసుకుని, లక్ష్యసాధనకు పునరంకితం కావడానికి వీటిని అవకాశంగా తీసుకోవాలన్నది సంఘ్ స్థాపించినప్పటి నుండి సుస్పష్టమైన విషయం. అదే సమయంలో, ఈ మహోద్యమానికి మార్గదర్శకులైన మహనీయ సద్గురువులు, నిస్వార్థంగా ఈ మార్గంలోకి ప్రవేశించిన స్వయంసేవకులు, వారి కుటుంబాల స్వచ్ఛంద సహకారాన్ని స్మరించుకునేందుకు ఇదొక అవకాశం. ప్రత్యేకించి, సంఘ్ స్థాపకులైన డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ జయంతి సుదినమే హిందూ కాలదర్శినిలో మొదటి రోజైన వర్ష ప్రతిపద కూడా అయిన తరుణంలో... ఈ నూరు సంవత్సరాల ప్రయాణాన్ని పునర్దర్శనం చేసుకునేందుకు, సమరసతతో కూడిన సమైక్య భారతావని దిశగా సంకల్పం చేసుకునేందుకు ఇంతకు మించిన అనువైన సందర్భం మరేముంటుంది? దేశం కోసం జీవించేలా...డాక్టర్ హెడ్గేవార్‌లో భారతదేశం పట్ల అహంకార రహితమైన ప్రేమ, అఖండమైన అంకితభావం చిన్నతనం నుంచే కనపడింది. కోల్‌కతాలో తన వైద్య విద్యను పూర్తిచేసేనాటికే, సాయుధ విప్లవం నుంచి సత్యాగ్రహం వరకూ భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తిని కలిగించేందుకు చేపట్టిన అన్ని రకాల ప్రయత్నాలతోనూ ఆయనకు అనుభవం ఉంది. అదే సమయంలో దైనందిన జీవితంలో దేశభక్తి లేకపోవడం, సంకుచిత ప్రాంతీయ విభేదాలకు దారితీసేలా ఉమ్మడి జాతీయ వ్యక్తిత్వం పతనం కావడం, సామాజిక జీవితంలో క్రమశిక్షణరాహిత్యం వల్ల భారతదేశంలో బయటివారి దురాక్రమణ సంభవించి వీరి స్థానం సులభతరమైందని ఆయన గ్రహించారు. ఎడతెగని దురాక్రమణలతో మన ఘనచరిత్రకు సంబంధించిన సామాజిక జ్ఞాపకాలను ప్రజలు మరచిపోయారని ఆయనకు అనుభ వానికి వచ్చింది. ఫలితంగా మన సంస్కృతి, జ్ఞాన సంబంధమైన సంప్రదాయం పట్ల నైరాశ్యభావం, ఆత్మన్యూనతాభావం చోటు చేసు కున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరో కొద్దిమంది నాయకుల నేతృత్వంలో జరిగే రాజకీయ కార్యకలాపాలు మన ప్రాచీన దేశపు సమస్య లను పరిష్కరించలేవన్న నిశ్చయానికి వచ్చారు. అందుకే, దేశం కోసం జీవించేలా ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు నిరంతర ప్రయత్నా లతో కూడిన ఒక పద్ధతిని రూపొందించాలని నిర్ణయించారు. రాజ కీయ పోరాటానికి అతీతంగా దార్శనిక దృష్టికోణంతో ఆయన చేసిన ఆలోచన ఫలితమే శాఖా పద్ధతి ఆధారంగా వినూత్నమైన పద్ధతిలో నడిచే సంఘం ఆవిర్భావం.ఈ ఉద్యమం, సిద్ధాంతాల క్రమబద్ధమైన పురోగతి ఒక అద్భు తానికి ఎంతమాత్రం తక్కువ కాదు. హెడ్గేవార్ ఈ భావజాలాన్ని సిద్ధాంతంగా రూపొందించలేదు, కానీ ఆయన ఒక కార్యాచరణ ప్రణాళికను విత్తన రూపంగా ఇచ్చారు, అది ఈ ప్రయాణంలో చోదక శక్తిగా నిలిచింది. ఆయన జీవితకాలంలో, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకూ సంఘ కార్యం విస్తరించింది.శాఖోపశాఖలుగా ‘శాఖ’మనం స్వాతంత్య్రాన్ని పొందినప్పుడు, అదే సమయంలో భారతమాతను మతం ఆధారంగా విచ్ఛిన్నం చేసినప్పుడు, పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ జనాభాను రక్షించి వారికి గౌరవ, మర్యాద లతో కూడిన పునరావాసాన్ని కల్పించడంలో సంఘ్ స్వయంసేవ కులు తమ అంకితభావాన్ని కనబరిచారు. సమాజం కోసం బాధ్యత, కర్తవ్యభావాలతో ముడిపడిన స్వయంసేవక్ అనే భావన విద్య, కార్మిక రంగం, రాజకీయరంగాల వంటి చోట తన శక్తిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. రెండవ సర్సంఘ్చాలక్ అయిన శ్రీ గురూజీ (మాధవ సదాశివ గోల్వాల్కర్) మార్గదర్శక శక్తిగా ఉన్న ఈ దశలో ప్రతి విషయం జాతీయ సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని పునర్వ్యవస్థీ కరించబడాలి! దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాజ్యాంగంపై క్రూర దాడి జరిగిన కాలంలో ప్రజాస్వామ్య పునరు ద్ధరణకు జరిగిన శాంతియుతపోరులో సంఘ్ స్వయంసేవకులు కీలక పాత్ర పోషించారు. రామజన్మభూమి విముక్తి వంటి ఉద్యమాలు సాంస్కృతిక విమోచనం కోసం భారతదేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలను అనుసంధానించాయి. జాతీయ భద్రత నుంచి సరిహద్దుల నిర్వహణ వరకు, పాలనా భాగస్వామ్య వ్యవస్థ నుంచి గ్రామీణాభి వృద్ధి వరకు, సంఘ్ స్వయంసేవకులు స్పృశించని అంశం లేదు. ప్రతి విషయాన్నీ రాజకీయ దృష్టికోణంతో చూసే ధోరణి ఉన్నప్పటికీ, సంఘ్ ఇప్పటికీ సమాజపు సాంస్కృతిక జాగరణపైన, సరైన ఆలోచనలు గల వ్యక్తులు – సంస్థలతో బలమైన అనుసంధాన వ్యవస్థను సృష్టించడంపైన దృష్టి పెట్టింది. సామాజిక పరివర్తనలో మహిళల భాగస్వామ్యం, కుటుంబ వ్యవస్థ పవిత్రతను పునరుద్ధరించడంపై గత కొన్ని సంవత్సరాలుగా సంఘ్ దృష్టి సారించింది. లోక మాత అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా సంఘ్ పిలుపుతో దేశమంతటా 27 లక్షల మందికి పైగా వ్యక్తులతో సుమారు 10 వేల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మన దేశ నాయకుల విషయంలో మనమంతా కలిసి ఎలా వేడుక చేసుకుంటున్నామో ఇది సూచిస్తుంది. సంఘ్ తన నూరవ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు బ్లాక్, గ్రామ స్థాయి వరకూ జాతి నిర్మాణం కోసం వ్యక్తి నిర్మాణ కార్యాన్ని కీలకంగా చేపట్టాలని సంఘ్ నిర్ణయించింది. గత ఏడాది కాలంలో పటిష్ఠమైన ప్రణాళికతో మరో పది వేల శాఖలను జోడించేలా కార్యాచరణ చేయడమన్నది అంకితభావానికి, అంగీకారానికి చిహ్నం. అయితే, ప్రతి గ్రామానికి, బస్తీకి చేరుకోవడ మనే లక్ష్యం ఇంకా ఒక అసంపూర్ణంగా ఉంది. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాబోయే సంవత్సరాలలో పరివర్తనకు ఉద్దేశించిన పంచ్ పరివర్తన్ అనే ఐదంశాల కార్యక్రమం ప్రధానంగా కొనసాగుతుంది. శాఖ నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలో పౌరవిధులు, పర్యా వరణహితమైన జీవనశైలి, సామాజిక సమరసతా వర్తన, కుటుంబ విలువలు, స్వీయత్వ స్పృహపై ఆధారపడిన దైహికమార్పుపై దృష్టిని ఉంచింది. తద్వారా ప్రతి ఒక్కరూ ‘పరం వైభవం నేతు మేతత్ స్వరాష్ట్రం’ – మన దేశాన్ని మహావైభవ స్థితికి తీసుకువెళ్లే బృహత్ ప్రయోజనం కోసం తమ వంతు కృషి చేస్తారు.గత వంద సంవత్సరాలలో, సంఘ్ ఒక జాతీయ పునర్నిర్మాణ ఉద్యమంగా ప్రయాణించింది. ఎవ్వరినైనా వ్యతిరేకించడం పట్ల సంఘ్‌కి నమ్మకం లేదు. అలాగే, ఈ రోజున సంఘ్ పనిని వ్యతిరే కిస్తున్నవారు కూడా సంఘ్‌లో భాగమవుతారనే విశ్వాసాన్ని కలిగి ఉంది. ప్రపంచం పర్యావరణ మార్పుల నుంచి హింసాత్మక ఘర్షణల వరకు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో సత్వర పరిష్కా రాలను అందించే సామర్థ్యాన్ని భారతదేశపు ప్రాచీన, అనుభవ ఆధారిత జ్ఞానం కలిగివుంది. ఈ అతి పెద్దయిన, అనివార్యమైన కార్యం ఎప్పుడు సాధ్యమవుతుందంటే, భారతమాత పుత్రులందరూ తమ పాత్రను అర్థం చేసుకుని, ఇతరులు సైతం అనుసరించేలా ప్రేరేపించే దేశీయ నమూనాను నిర్మించడంలో తమ వంతు కృషి చేసినప్పుడే! ఇందుకోసం సజ్జన శక్తి నాయకత్వంలో సమరసతతో కూడిన సంఘటిత భారతీయ సమాజంలో ఆదర్శవంతులమై నిలిచే సంకల్పంతో ఏకమవుదాం!దత్తాత్రేయ హోసబాళె వ్యాసకర్త ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ (జాతీయ ప్రధాన కార్యదర్శి) -
స్వయంసేవా మార్గ నిర్మాత
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 1925లో విజయ దశమి పర్వదినాన నాగపూర్‌లో స్థాపితమయ్యింది. నేడు శత వసంతాలు జరుపుకొంటున్న ఈ సంస్థను డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ (Keshav Baliram Hedgewar) నాగపూర్‌లో స్థాపించారు. ఇదే నగరంలో ఆయన 1889 ఉగాది రోజున జన్మించారు. ప్లేగ్ వ్యాధి వల్ల చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయి వీధిన పడ్డారు. అయినా కష్టపడి చదివారు. నాగపూర్‌లోని నీల్ సిటీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు ఒక బ్రిటిష్ అధికారి స్కూల్ పర్యవేక్షణకు వచ్చినప్పుడు చిన్నారి కేశవుడు ‘వందేమాతరం’ అని నినదించాడు. దీంతో కేశవుని స్కూల్ నుంచి బహిష్కరించారు. తర్వాత యవత్మాల్లోని రాష్ట్రీయ విద్యా లయంలో చేరి పాఠశాల విద్యను పూర్తి చేశారు.మాతృభూమిని విదేశీయుల కబంధ హస్తాల నుంచి తొలగించడానికి కలకత్తాలోని సాయుధ విప్లవకారులతో కలిసి పని చేయాలని భావించి 1910లో కలకత్తా (Kolkata) మెడికల్ కళాశాలలో చేరారు. విప్లవకారులైన శ్యామ్ సుందర చక్రవర్తి, మోతీలాల్ ఘోష్ వంటి వారితో కలిసి ‘అనుశీలన సమితి’ ద్వారా దేశ స్వాతంత్య్రానికి కృషి చేశారు. 1914లో మెడికల్ విద్యను పూర్తి చేసిన తర్వాత బ్యాంకాక్‌లో మంచి ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే జీవితాన్ని దేశ సేవకే అంకితం చేయాలని అప్పటికే నిర్ణయించుకున్నందు వలన ఆ ఉద్యోగాన్ని తిరస్కరించారు.నాగపూర్‌కు తిరిగి వచ్చిన తర్వాత లోకమాన్య తిలక్ స్థాపించిన ‘రాష్ట్ర సేవ మండల్’లో చేరి శివాజీ జయంతి, గణేష్ ఉత్సవం, శాస్త్ర పూజ, సంక్రాంతి మహోత్సవం వంటి కార్యక్రమాలను ఉత్సాహంతో నిర్వహించేవారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమాల్లో ఆయన చేసిన ప్రసంగాలకు ఆంగ్ల ప్రభుత్వం రాజద్రోహాన్ని మోపి ఒక సంవత్సరం కారాగార శిక్ష విధించింది. అదేవిధంగా 1930లో మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన సత్యాగ్రహానికి మద్దతుగా పాల్గొని తొమ్మిది నెలల జైలు జీవితాన్ని గడిపారు. మహాత్మా గాంధీ, మదన్ మోహన్ మాలవీయ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అప్పాజీ జోషీ వంటి నాయకులను కలిసి సంఘ కార్యం ఆవశ్యకతను వారికి తెలియజేశారు. ‘సంఘ’ శాఖను వీక్షించిన మహాత్మా గాంధీ (Mahatma Gandhi) డాక్టర్జీతో ‘మీరు నిజంగానే ఒక అద్భుతమైన సంస్థను నిర్మించారు. నేను స్వయంగా చేద్దామనుకుంటున్న పనిని మీరు నిశ్శబ్దంగానే చేసేశారు’ అని పేర్కొన్నారు. కాళ్లకు స్థానికంగా కుట్టిన చెప్పులు, ఒంటిపై సాధారణమైన ధోవతి, చొక్కా, కాలర్ ఉన్న కోటు, నెత్తి మీద ఎత్తుగా ఉండే టోపీ ఆయన వేషధారణ. తాను స్వీకరించిన మహాకార్యానికి సంపూర్ణంగా జీవితాన్ని అంకితం చేసేందుకు ఆయన ఆజన్మ బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. ఆసేతు హిమాచలం సంఘ కార్యాన్ని విస్తరింప చేయడానికి ప్రయాణం చేసేవారు. ఈ విధంగా చేస్తూ ఆయన అనారోగ్యం బారిన పడి 1940 జూన్ 21వ తేదీన యాభై ఒక్క సంవత్సరాల వయసులోనే అంతిమ శ్వాస విడిచారు. చదవండి: ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు?ఆయన స్థాపించిన ఆర్ఎస్ఎస్ (RSS) నేడు దేశ విదేశాలలో విస్తరించింది. ఎటువంటి సభ్యత్వ నమోదూ లేకుండా దాదాపు కోటి మంది స్వయం సేవకులను, నలభై అయిదు లక్షల సంఘ శాఖలను, యాభై అనుబంధ సంఘాలను, ఐదు వేల మంది పూర్తి సమయ స్వయం సేవకులను (ప్రచారకులు) ఆర్ఎస్ఎస్ కలిగి ఉంది. భారతదేశంలోనే కాక అమెరికా, ఇంగ్లండ్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దాదాపు 50 దేశాలలో వివిధ రకాల పేర్లతో సేవా కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తోంది.- ప్రొఫెసర్ వై.వి. రామిరెడ్డి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్(మార్చి 30న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ జయంతి) -
పళనిస్వామి (ఏఐఎడీఎంకే) రాయని డైరీ
ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్న అమిత్‌షా నివాసానికి వెళ్లి, ఆయన్ని కలిసి బయటికి రాగానే... ఆ చీకట్లో మీడియా వాళ్లు నిలబడి మిణుగురుల్లా మెరుస్తూ ఉన్నారు!‘‘సర్! వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోతు న్నారట కదా? పొత్తు కుదుర్చుకోవటం కోసమే మీరు అమిత్‌షాను కలిసేందుకు వచ్చారా?’’ – ఆరంభ ప్రశ్న.‘‘లేదు లేదు, ఢిల్లీలో మా పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం పని మీద వచ్చాం...’’ అన్నాను. ‘‘సర్! మీ ఢిల్లీ ఆఫీస్‌ని మీరు ఫిబ్రవరి 10 నే వర్చువల్‌గా చెన్నై నుంచి ప్రారంభించారు కదా, మళ్లీ ఇప్పుడేమిటి! అమిత్షాతోగంటన్నరకు పైగా మాట్లాడారు. ఏడాదిన్నర క్రితం బీజేపీకి బ్రేకప్ చెప్పాక, తిరిగి ఇన్నాళ్లకు ఇప్పుడే కదా మీరు అమిత్‌షాను కలవటం!ఇంతసేపూ ఆయనతో ఏం మాట్లాడారు సర్ మీరు?’’ – ఆరాలు తీస్తున్న ప్రశ్న. ‘‘అలా ఏం లేదు. అమిత్జీని అనుకోకుండా కలిశాం...’’ అన్నాను.‘‘కానీ సర్, చెన్నై నుంచి ఉదయాన్నే మీరు ఢిల్లీ వచ్చారు. మధ్యాహ్నానికి మీ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేపీ మునుస్వామి, సీనియర్ లీడర్ వేలుమణి మీ వెనుకే ఢిల్లీకి రీచ్ అయ్యారు. సాయంత్రానికి ఢిల్లీలోనే ఉంటున్న మరో ఇద్దరు సీనియర్ లీడర్లు తంబిదొరై,సీవీ షణ్ముగం మీతో జాయిన్ అయ్యారు.అంతా కలిసి చీకటి పడ్డాక అమిత్‌షా నివాసానికి వెళ్లారు. అమిత్‌షాను కలవాలని అందరూ అనుకునే కలిశాక, అదెలా సర్ అమిత్‌షాను అనుకోకుండా కలవటం అవుతుంది?’’ – ఆధారాలు సేకరించిన ప్రశ్న!‘‘మీరనుకుంటున్నట్లు మేమేమీ చీకటి పడ్డాక అమిత్జీని కలవలేదు. అమిత్జీని కలిసేటప్పటికే చీకటి పడినట్లుంది. వెళ్లి కలిశాం, శాలువా కప్పాం, కాసేపు మాట్లాడాం. వచ్చేశాం...’’ అని నవ్వుతూ చెప్పాను.‘‘మరి, బీజేపీ వాళ్లు ఇంకోలా చెబుతు న్నారు కదా సర్?’’ – చీకట్లో విసిరిన ప్రశ్న!‘‘మేము లోపలికి వెళ్లినప్పుడు లోపల ఉన్నది మీరంటున్న బీజేపీ వాళ్లలో అమిత్జీ ఒక్కరే. ఆయనే మీకు చెప్పారంటారా,ఇంకోలా?’’ అని అడిగాను. ‘‘లేదు సర్, ‘కలిసి పోటీ చేద్దాం’ అని మీరు అమిత్‌షాను అడిగినప్పుడు, అందుకాయన ‘మీరు 117 సీట్లలో, మేము 117 సీట్లలో సగం సగం పోటీ చేయటానికి ఒప్పుకుంటేనే మీతో కలుస్తాం...’ అని మీకు కండిషన్ పెట్టారట కదా?! – ఊహించి వేసిన ప్రశ్న.‘‘ఇంకా?!’’ అన్నాను.‘‘పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్‌ని, శశికళను, పన్నీర్‌సెల్వంను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని కూడా అమిత్‌షా మీకు కండి షన్ పెట్టారట కదా సర్...’’ – ఇదైతే కచ్చితంగా బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై వేయించిన ప్రశ్న!పొత్తు కోసం నేను అమిత్జీ దగ్గరకు వెళ్లకుండా, అమిత్జీనే పొత్తు కోసం నా దగ్గరకు వచ్చి ఉంటే, ముందు ఆ అన్నామలైని మార్చి, వేరెవరినైనా బీజేపీ ఛీప్‌గా పెట్టమని నేనే కండిషన్ పెట్టి ఉండేవాడిని.‘‘చెప్పండి సర్! బీజేపీతో పొత్తు కోసం కాదా మీరు అమిత్‌షాను కలిసింది?’’ – తిరిగి మళ్లీ అదే ఆరంభ ప్రశ్న. ‘‘తమిళనాడులో డ్యామ్‌ల సమస్య ఉంది. స్కామ్‌ల సమస్య ఉంది. లాంగ్వేజీల సమస్య ఉంది. డీ–లిమిటేషన్ సమస్య ఉంది. డీఎంకే సమస్య ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మేము వాటి గురించి మాట్లాడి ఉండొచ్చని మీరెందుకు అనుకోరు?’’ అని అడిగాను. ‘‘బీజేపీతో పొత్తు కోసం మీరిక్కడికి వస్తే, అక్కడ చెన్నైలో అన్నామలై మీరంటే పడని వాళ్లందరితో పొత్తు పెట్టుకుంటున్నారు. దీనికేమంటారు సర్?’’ – ఇంకేదో రాబట్టే ప్రశ్న. నేనేమీ అనలేదు. డ్యామ్‌లు, స్కామ్‌లు, లాంగ్వేజీలు, డీ–లిమిటేషన్, డీఎంకే... వీటన్నిటికన్నా తమిళనాడుకు అతి పెద్ద సమస్య అన్నామలై... అని నాతో చెప్పించటానికే ఈ మిణుగురులు ఇక్కడికి చేరినట్లు నాకర్థమైంది! -
భాషా రాజకీయాల ఆట
తమిళనాడు తన బడ్జెట్ ప్రమోషనల్ లోగోలో భారత కరెన్సీ సింబల్‌కు బదులుగా తమిళ అక్షరం ‘రూ’ వాడి దేశవ్యాప్తంగా దుమారం లేవనెత్తింది. ఈ చర్య కేవలంసింబల్ వివాదం కాదనీ, ఇది భారత సమైక్యతను బలహీనపరుస్తుందనీ, ప్రాంతీయ అభిమానం మాటున వేర్పాటువాద సెంటిమెంటును రెచ్చగొడుతుందనీ విమ ర్శిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే మాజీ చట్టసభ్యుడి తనయుడు, గువాహటి ఐఐటీలో డిజైనర్ అయిన ఒక తమిళ వ్యక్తి రూపకల్పన చేసిన సింబల్‌ను తిరస్కరించడం డీఎంకే ‘మందబుద్ధి’ని బయటపెడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అభివర్ణించారు. తమిళంలో రూపాయి గుర్తుకు తమిళ అక్షరం ‘రూ’ వాడటం సహజమే. మూడు భాషలను ప్రతిపాదించిన ఎన్ఈపీ 2020 పట్ల అసమ్మతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే బడ్జెట్ పత్రాల్లో రూపాయి సింబల్‌కు బదులుగా తమిళ ‘రూ’ అక్షరం వాడటం వెనుక డీఎంకే ఉద్దేశం. ఏడాదిలో రాష్ట్ర ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి స్టాలిన్ భాషాదురహంకారాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. తమిళ సెంటిమెంట్ ఆందోళనహిందూ అహంకారం పతాకస్థాయికి చేరిన తరుణంలో అస్తిత్వ పోరుకు నడుం బిగించిన రాజకీయ నాయకుడు నిజానికి డీఎంకే అధినేత ఒక్కరే కాదు. అయితే ఒక్క డీఎంకే మీద మాత్రమే బీజేపీ నేతలు శ్రుతి మించిన ఆగ్రహావేశాలు ప్రదర్శించడం చూస్తే, ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని అనుకోవాలి. మతం ప్రాతిపదికగా వ్యక్తులను అవమానించడం, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం దేశ సమైక్యతకు ముప్పుగా భావించే రోజు ఎప్పుడు వస్తుంది? రెండోసారి అధికారం చేజిక్కించుకోవడానికి స్టాలిన్ సన్నద్ధం అవుతున్నారు, వాస్తవమే! ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం తమిళనాడు అలవాటు. ఈ సింగిల్ టర్మ్ ఆనవాయితీని భగ్నంచేసింది జయలలిత ఒక్కరే! 2016లో ఆమె ఏఐఏడీఎంకేను రెండో టర్మ్ అధికారంలోకి తెచ్చారు. ఈ సెంటిమెంటుతో పాటు నటుడు విజయ్ నాయకత్వంలో ఏర్పడిన తమిళగ వెట్రి కళగం పార్టీ సైతం డీఎంకేకు ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ లేదా మరో ఇతర పార్టీ రానున్న ఎన్నికలకు అజెండా సెట్ చేసేవరకూ డీఎంకే వేచి చూడదలచుకోలేదు. భాష, నియోజకవర్గాల పునర్విభజన అస్త్రాలను బయటకు తీసింది. రాష్ట్రంలో ఏ మూలైనా ఈ అంశాల మీదే మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, విజయ్‌లు... ఈ రెండు అంశాల మీద డీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రహస్థితులు అనుకూలిస్తే, రానున్న ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ కూటమి కట్టే అవకాశాలున్న ఏఐఏడీఎంకే ఇప్పుడు పులుసులో పడింది. 2020లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఈపీకి వ్యతిరేకంగా తొలి శంఖం పూరించిన పార్టీ ఇదే. హిందీని నిర్దేశించకపోయినా...హిందీ వ్యతిరేక రాజకీయాల్లో తమిళనాడుకు వందేళ్ల చరిత్రఉంది. మూడు భాషల సూత్రానికి అంగీకరిస్తేనే రాష్ట్రానికి కేంద్ర విద్యానిధులు విడుదల చేస్తామని ప్రకటించి, నిద్రాణంగా పడి ఉన్న ఒక జటిల సమస్యకు బీజేపీ ఎందుకు తిరిగి ప్రాణం పోసింది? ఇది అంతుచిక్కని విషయం. ‘హిందీకరణ’ ఇండియా పట్ల తన మక్కు వను వెల్లడిస్తూ ఆ పార్టీ సంకేతాలపై సంకేతాలు ఇస్తోంది. వలసవాద అవశేషాలు తుడిచిపెట్టాలన్న మిషతో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పేర్లను హిందీలోకి మార్చడం ఇందుకు ఉదాహరణ. ఇంతా చేసి ఇప్పుడు వెనకడుగు వేస్తే రాజకీయ బలహీ నత అవుతుందేమో అన్నది బీజేపీ డైలమా. మూడో భాష హిందీయే అవ్వాలని ఎన్ఈపీ ఆంక్ష పెట్టని మాట నిజమే. ఆచరణలో మాత్రం మూడో భాష హిందీనే అవుతుంది. లెక్కలేనన్ని మూడో భాషలను బోధించే టీచర్లను నియమించడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా తలకు మించిన భారం. పైగా ఎక్కడెక్కడి నుంచో వారిని తీసుకురావడం మరీ కష్టం. స్కూళ్లలో హిందీ బోధించడం తప్ప గత్యంతరం లేదు. ఇదో దుఃస్థితి. తమిళనాడులో కూడా మలయాళం, కన్నడం, తెలుగు టీచర్ల కంటే హిందీ బోధించేవారిని నియమించుకోవడం సులభం.సరికొత్త ప్రచారకర్తఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘వాళ్లు ఆర్థిక లాభాలు ఆశించి ఎందుకు తమిళ చిత్రాలను హిందీలోకి డబ్ చేస్తు న్నారు?’ అంటూ ఒక తప్పు ప్రశ్న వేస్తున్నారు. దక్షిణాదిన హిందీకి, హిందుత్వకు సరికొత్త ప్రచారకర్తగా మారిన ఈయన డీఎంకేది ‘హిపో క్రసీ’ అని కూడా నిందిస్తున్నారు. ఒక్కమాటలో ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పవచ్చు. తమిళనాడు హిందీకి వ్యతిరేకం కాదు. దాని వ్యతిరేకత అంతా హిందీని బలవంతంగా రుద్దడం మీదేఆశ్చర్యం ఏమిటంటే, తమిళనాడులో లక్షల మంది స్వచ్ఛందంగా హిందీ నేర్చుకుంటారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడూ వారిని అడ్డుకోడు. హిందీ తప్ప మరో భాష మాట్లాడని లక్షల మంది ఉత్తర భారతీయలు ఉపాధి కోసం తమిళనాడు రావడం నాణానికి రెండో పార్శ్వం. ఉత్తరప్రదేశ్ లేదా బిహార్ స్కూళ్లలో తమిళం నేర్చుకోరు. తమిళనాడులో ఉపాధి కోసం తమిళం నేర్చుకోవాలని వారిని ఎవరూ ఒత్తిడి చేయరు. హిందీ మాట్లాడటానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆంక్షా లేదు. అందరూ వారికి అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చీరాని హిందీలో ప్రయత్నించి సహకరిస్తారు.చెన్నైలో ఏ రెస్టారెంటుకి వెళ్లినా మీకో దృశ్యం కనబడుతుంది. ఉత్తరాది వెయిటర్, తమిళ కస్టమర్ పరస్పరం ఎదుటి వారి భాషలో మాట్లాడుతారు. ఆ సంభాషణ ఎలా ఉన్నా ఆర్డర్ చేసిన ఆహారం రాకుండా పోదు. అదే తరహాలో హిందీ, తమిళ సినిమా పరిశ్రమల నడుమ విలసిల్లుతున్న చిరకాల సహకారం పవన్ పేర్కొంటున్నట్లు హిపోక్రసీ కాదు. ఆర్థికం కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు... ప్రజలు స్వచ్ఛందంగా చేరువ అవుతారనడానికి ఇదో ఉదాహరణ.దొడ్డిదారినో మరో అడ్డదారినో ఒక భాషను బలవంతంగా రుద్దడం ఎప్పుడూ, ఎక్కడా సుఖాంతం కాలేదు. తమిళనాడు హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఈ విషయంలో తగినంత గుణపాఠం నేర్ప లేదు. పొరుగు దేశాల పరిణామాలు దీన్ని రుజువు చేస్తాయి. ఒకే భాష ద్వారా జాతీయ సమైక్యత సాధించాలన్న రాజకీయాలు చావు దెబ్బ తిన్నాయి. పాకిస్తాన్ ఇందుకు చక్కటి ఉదాహరణ. 1947లో ఏర్పాటై సంబరాలు జరుపుకొన్న కొద్ది నెలల్లోనే ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది. ఆనాడే వాస్తవంగా ఆ దేశం తన తూర్పు ప్రాంతాన్ని కోల్పోయింది. ఉర్దూకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం 1971లో, ఇండియా తోడ్పాటు లభించి, దేశవిభజనతో సమసింది. ‘సింహళ ఒక్కటే’ శాసనంతో... సింహళీయులకు తమిళు లకు నడుమ ఉన్న విభేదాలు ఒక్కసారిగా పతాకస్థాయికి చేరాయి. అదే 30 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీసింది. డీఎంకే అన్ని అంశాల్లోనూ, ఎన్ఈపీతో సహా, కేంద్రంతో సంప్ర దింపుల ధోరణితోనే వ్యవహరిస్తోంది. ‘రూ’ తమిళ అక్షరం వాడిందన్న సాకుతో ఆ పార్టీని ‘వేర్పాటువాది’గా అభివర్ణించడంతో బీజేపీ నైజం వెల్లడైంది. సర్వం కేంద్రం అధీనంలోకి తెచ్చుకోవాలన్న వీరావేశం, తనను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల పట్ల దాని వైఖరి బట్టబయలు అయ్యాయి. చరిత్ర పట్ల ఆ పార్టీ నిర్లక్ష్య భావం కూడా బయటపడింది. ఇదే అన్నిటి కంటే ప్రమాదకరం.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-నిరుపమా సుబ్రమణియన్ -
చంద్రబాబు హైటెక్ తెలివిలో డొల్లతనం బయటపడిందిలా?
ఓలా, ఊబర్ ట్యాక్సీల తరహాలో ‘సహకార్ ట్యాక్సీ’ అనే విధానాన్ని తీసుకురావడం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్ సభలో ప్రకటించారు. ప్రజలకు స్థానిక ప్రయాణ అవసరాలను తీర్చడంలో ఇలాంటి యాప్ ల నిర్వాహకులు ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఎంతో విస్తృతంగా ఇవి సేవలందిస్తున్నాయి. అదే సమయంలో.. ఈ సంస్థలు వాహన డ్రైవర్లనుంచి భారీగా కమిషన్లు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి దోపిడీకి విరుగుడు అన్నట్టుగా.. అమిత్ షా ఈ విధానాన్ని ప్రకటించారు. దీనిప్రకారం స్థానికంగా సహకార సంస్థల వద్ద వాహనాల వారు రిజిస్టరు చేసుకోవాలి. నిర్వహణ మొత్తం ఆ సహకార సంస్థలే చూస్తుంటాయి. ఇది పారదర్శకంగా నడిచే అవకాశం ఉంది. ఇదే సమయంలో చంద్రబాబునాయుడు మాటల్లోని కపటత్వం, ఆయన హైటెక్ తెలివితేటల్లోని డొల్లతనం కూడా బయటపడుతున్నాయి. ఇటీవల చంద్రబాబునాయుడు.. ర్యాపిడో అనే అగ్రిగేటర్ సంస్థతో ఒప్పందం చేసుకుని.. మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపిస్తూ ర్యాపిడో డ్రైవర్లుగా మార్చేస్తానని వారికి ఈ బైక్ లు, ఈ ఆటోలు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వం ఈ వాహనాల కొనుగోలులో ఎన్ని దందాలకు పాల్పడుతుందో తెలియదు గానీ.. మొత్తానికి ర్యాపిడో వ్యాపారాన్ని విస్తరించడానికి చంద్రబాబు తన వంతు కృషి చేయడం తప్ప కొత్తగా ఇందులో కనిపిస్తున్న సంగతేం లేదు. నిజంగా మహిళలకే మేలు చేయదలచుకుంటే.. వారికి ఈ బైకులు, ఈ ఆటోలు కొనుగోలు చేసుకోవడానికి వడ్డీలేని రుణ సదుపాయం ప్రభుత్వం కల్పించవచ్చు. వారు ర్యాపిడోకు డ్రైవర్లుగా పనిచేస్తారో మరో సంస్థకు పనిచేస్తారో వారి ఇష్టానికి వదిలేస్తే బాగుండేది. ఒక సంస్థ దోపిడీకి ప్రభుత్వం సహకరిస్తున్నదనే ఆరోపణలు లేకుండా ఉండేవి. చంద్రబాబు అలా చేయలేదు. పైగా అమిత్ షా ప్రకటన తర్వాత.. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో అమల్లో ఉన్న కొన్ని యాప్ ల గురించి కూడా కొత్త వివరాలు తెలుస్తున్నాయి. వారు నిజంగా.. దోపిడీని అడ్డుకునే యాప్ లను తయారు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అక్కడి మమతా దీదీ ప్రభుత్వం యాత్రీ సాథీ పేరుతో ఒక యాప్ తీసుకువచ్చింది. ఇందులో కమిషన్ల రూపేణా డ్రైవర్లను దోచుకోవడం, టైమింగులను బట్టి, మొబైల్ లో చార్జింగును బట్టి ప్రయాణికులను దోచుకోవడం వంటి వక్రమార్గాలు ఉండవు. యాత్రీ సాథీ యాప్ లో రిజిస్టరు చేసుకున్న క్యాబ్ డ్రైవర్లు ఒక రోజులో తొలి పది రైడ్ లకు ఒక్కోదానికి రూ.10 వంతున చెల్లించాలి. ఒక రోజులో ఒక రైడ్ మాత్రమే వెళితే.. 10 చెల్లిస్తే చాలు. పది రైడ్లకు రూ100 చెల్లించిన తర్వాత ఎన్ని రైడ్లు చేసుకున్నా ఆరోజుకు ఇక ఏం చెల్లించక్కర్లేదు. అలాంటి మంచి విధానం మమత ప్రభుత్వం తెచ్చింది. ఓలా, ఊబర్ దోపిడీలతో విసిగిపోయిన కర్ణాటకలోని ఆటో డ్రైవర్లు తామే స్వయంగా ఒక సాఫ్ట్ వేర్ సంస్థను ఆశ్రయించి ఒక యాప్ డిజైన్ చేయించుకున్నారు. ‘నమ్మ యాత్రి’ పేరుతో ఉండే ఆ యాప్ లో కూడా ఇదే మాదిరిగా రైడ్ లను బట్టి చెల్లిస్తే సరిపోతుంది. నిజం చెప్పాలంటే.. టెక్నాలజీ మీద అవగాహన ఉండే పాలకులైతే ఇలాంటి కొత్త విధానాలు తీసుకురావడం ద్వారా.. అటు వాహన డ్రైవర్లు, ఇటు ప్రయాణికులు అగ్రిగేటర్ సంస్థల దోపిడీకి గురికాకుండా చూసుకోవాలి. కానీ చంద్రబాబు తనను తాను హైటెక్ ముఖ్యమంత్రి అని చాటుకుంటూ ఉంటారు. కంప్యూటరును నేనే కనిపెట్టానని చెప్పుకుంటూ ఉంటారు. ఏఐను తానే కనుగొని ప్రపంచానికి పరిచయం చేస్తున్నానని కూడా చెప్పుకోగలరు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి.. తిరిగి అగ్రిగేర్ సంస్థకు దోచిపెట్టే ఒప్పందమే చేసుకుంటున్నారు. ఆయన చెప్పుకునే హైటెక్ తెలివితేటల్లో డొల్లతనం బయటపడుతోందే తప్ప.. మంచి నాణ్యమైన ఆలోచన చేయలేకపోతున్నారనే విమర్శలు ప్రజల్లో వినవస్తున్నాయి...ఎం. రాజేశ్వరి -
కేంద్రంతో దక్షిణాది రాష్ట్రాలు అమీ తుమీ!
జనసంఖ్య ప్రాతిపదికగా నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరుగుతుందనే ప్రకటనపై పార్లమెంట్‌లోనూ, బయటా దక్షిణాది రాష్ట్రాల వారు ప్రకంపనలు పుట్టిస్తున్నారు. ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నియోజకవర్గాలు లభించే అవకాశం ఉండడంతో పార్లమెంట్లో తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోతుంది. అదే సమయంలో జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఇందువల్ల అధికారం, పరిపాలన, అభివృద్ధి వంటి అంశాల్లో దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందనీ, ఫలితంగా దక్షిణాదిలో అస్తిత్వ సంక్షోభం రాజుకుంటుందనేది నిపుణుల మాట.కుటుంబ నియంత్రణ నిక్కచ్చిగా పాటించడం వలన దక్షిణ భారత జనాభా ఉత్తర భారత జనాభా కంటే బాగా తగ్గిన సంగతి తెలిసిందే. నిజానికి దక్షిణ భారతం (South India) ప్రకృతి వనరులూ, మానవ వనరుల పరంగా ఉత్తరాదికన్నా శక్తిమంతంగా ఉంది. దీని అంతటికీ కారణం శతాబ్దాలుగా బౌద్ధ జీవన సాంస్కృతిక వికాసమేనని చెప్పక తప్పదు. ఉత్తర భారతంతో పోల్చినప్పుడు, దక్షిణ భారతం అహింసాత్మకంగా ఉంది. శాంతియుతంగా వుంది. విద్యాపరంగా బలంగా ఉంది. అక్షరాస్యతలో ముందు ఉంది. స్త్రీ విద్యలో ముందు ఉంది. చరిత్ర, సంస్కృతులను పరిశీలించినా దక్షిణాదికి ప్రత్యేక స్థానం ఉన్నట్లు స్పష్టమవుతుంది. రక్తపాత రహిత కుల నిర్మూలన ఉద్యమం కొనసాగుతోందిక్కడ. అతి ప్రాచీన భాషలు మాట్లాడే ఆదివాసీలు ఎందరో ఇక్కడ ఉన్నారు. శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, చోళులు, విజయనగరరాజులు... ఇలా ఎందరో రాజులు, చక్రవర్తులు ఈ నేల సుభిక్షం కావడానికి తమ యుద్ధనైపుణ్యాన్నీ, పాలనా చాతుర్యాన్నీ ప్రదర్శించారు.ఈ రోజు ఢిల్లీ వాయు కాలుష్యంతో ఆక్సిజన్ లేక జీవన సంక్షోభంలో వుంది. దానికి ప్రత్యామ్నాయ రాజధాని వంటి హైదరాబాద్ దక్షిణాది నగరమే కదా. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ (BR Ambedkar) ఆనాడే హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేసుకోమని చెప్పారు. హైదరాబాద్ ఇటు దక్షిణాది వారికి, అటు ఉత్తరాది వారికి, పశ్చిమ భారతానికీ సెంటర్‌గా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. విద్య, సాంకేతిక రంగాల్లో దక్షిణ భారతదేశం ఇప్పటికే ముందు ఉంది. ఐటీ, సాఫ్ట్వేర్, సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతుల్లో దక్షిణాది రాష్ట్రాలే ముందున్నాయి. అలాగే ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థల్లో మన తెలుగువారితోపాటు మిగతా దాక్షిణాత్యులే ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్న సంగతీ తెలిసిందే. అరకొరగా ఉన్న వనరుల నుంచే ఈ స్థాయికి చేరారు మనవారు.ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యపై కేంద్ర పెత్తనాన్ని పెంచే ప్రతిపాదన ముందుకు వచ్చింది. వర్సిటీలు, కళాశాలల్లో అధ్యాపకులు, బోధనా సిబ్బంది నియామకం, పదోన్నతికి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు ‘మార్గదర్శకాలు–2025’ పేరిట విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) ఇటీవల ఒక ముసాయిదాను విడుదల చేసింది. అందులోని అంశాలు బాగా వివాదాస్పదమవు తున్నాయి. ఇప్పటిదాకా విశ్వవిద్యాలయాల అధిపతులైన ఉప కులపతుల నియామకం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంది. నూతన ముసాయిదా ప్రకారం ఆ అధికారం ఛాన్స్లర్లుగా ఉన్న గవర్నర్ల చేతుల్లోకి వెళ్తుంది. ఈ మార్పును బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. తమిళనాడు (Tamil Nadu), కేరళ వంటివి నూతన ముసాయిదాను వ్యతిరేకిస్తూ చట్ట సభల్లో తీర్మానం కూడా చేశాయి. వైస్ ఛాన్స్లర్ల నియామక ప్రక్రియను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవడాన్ని అవి వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర చర్యలతో ఉన్నత విద్యపై తమ పట్టును పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ఆయా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర– రాష్ట్ర సంబంధాలు బలహీనమవ్వడం గమనార్హం.చదవండి: ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు? ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ అంశం ముందుకు రావడంతో దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin) నిరసన గళాన్ని వినిపించడంలో ముందున్నారు. ఆయన చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశానికి దక్షిణ భారతానికి చెందిన బీజేపీయేతర పార్టీలు చాలావరకూ హాజరయ్యాయి. ఈ విషయంలో అన్నీ ఒకే విధమైన నిరసనను వ్యక్తం చేయడం స్వాగతించవలసిన విషయం. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి ఎటువంటి నష్టం రాదని కేంద్ర పాలకులు అంటున్నా... అది ఎలాగో ఇంతవరకూ వివరించలేదు. కేంద్రం సముచితంగా వ్యవహరించకపోతే దేశంలో అశాంతి రేగే ప్రమాదాన్ని చెన్నై (Chennai) సమావేశ ధోరణి చూస్తే అర్థమవుతుంది.- డాక్టర్ కత్తి పద్మారావు దళితోద్యమ నాయకులు -
ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు?
ఢిల్లీ హైకోర్టు ‘న్యాయమూర్తి’ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగగా, ఆ మంటలను చల్లార్చడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఒక గదిలో తగలబడిపోయిన నోట్ల కట్టల బస్తాలు కనిపించాయి. ఆ సమయానికి న్యాయ మూర్తి, ఆయన భార్య ఇంట్లో లేరు. వారి కూతురు, న్యాయమూర్తి తల్లి మాత్రమే ఉన్నారు. విషయం ఢిల్లీ పోలీసులకు చేరింది. ఢిల్లీ పోలీసు కమిషనర్ ఆ వీడియోలను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపారు. కొన్ని రోజులు ఆలస్యంగానైనా ఆ ఉదంతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాకా చేరి, మరొక రకం అగ్నిమాపక చర్యలు ప్రారంభమయ్యాయి. కొలీజియం (Collegium) సూచనపై వివాదాస్పద న్యాయమూర్తిని వెంటనే అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఈ బదిలీని తాము వ్యతిరేకిస్తున్నామని, అవినీతిపరులకు ఆశ్రయం కలిగించడానికి మా హైకోర్టు చెత్తబుట్ట కాదని తీవ్రమైన పదజాలంతో స్పందించింది. కొలీజియం నిర్ణయానికి వ్యతిరేకంగా నిరవధిక సమ్మె ప్రారంభించింది.ఈలోగా సుప్రీంకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మతో (Justice Yashwant Varma) ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, ఆ ఉత్తరాలు, వీడి యోలు, ఫొటోలు అన్నీ తన వెబ్ సైట్ మీద బహిరంగంగా పెట్టింది. ఆ డబ్బు 15 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని వదంతులున్నాయి. కార్పొరేట్ కంపెనీల ఆదాయపు పన్ను, జీఎస్టీ వగైరా కేసులను విచారించే కీలకమైన బాధ్యతలలో ఉన్నారు గనుక అది ఆ కంపెనీల నుంచి అందిన అవినీతి సొమ్ము కావచ్చుననే అనుమానాలున్నాయి. కొన్ని వేల రూపాయలో, లక్షల రూపాయలో లెక్క చూపని ధనం ఉన్నందుకే ముప్పు తిప్పలు పెట్టే ఐటీ, ఈడీ, సీబీఐ (CBI) వంటి సంస్థలున్న చోట ఇంత పెద్ద మొత్తం డబ్బు గురించి కఠినమైన శిక్షలకు దారి తీసే విచారణ జరగవలసే ఉంటుంది.తొలగింపు ‘సాధ్యమే’నా?భారత రాజ్యాంగం అధికరణాలు 124, 218, న్యాయమూర్తుల విచారణ చట్టం, 1968 ప్రకారం ఒక న్యాయమూర్తి మీద విచారణ జరపడం, తొల గించడం అసాధ్యం కాదు గాని కష్టసాధ్యం. ఆరో పణలు (చట్టం ‘దుష్ప్రవర్తన, అసమర్థత’లను మాత్రమే గుర్తించింది, అవినీతి అనే మాటే లేదు!) ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని తొలగించాలని 100 మంది లోక్‌సభ సభ్యులు గాని, 50 మంది రాజ్యసభ సభ్యులు గాని పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానాన్ని అనుమతిస్తే ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ ఆ ఆరోపణలు నిజమని తేల్చితే తొలగింపు తీర్మానం ముందుకు కదులుతుంది. సభలోని మొత్తం సభ్యులలో సగం కన్న ఎక్కువ మంది, లేదా హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆమోదిస్తేనే ఆ తీర్మానం నెగ్గి, రాష్ట్రపతి దగ్గరికి వెళుతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయ మూర్తులను తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది.ఈ ప్రక్రియ అంతా చూస్తే, సాధారణ పౌరులకు వర్తించే నిబంధనలు న్యాయమూర్తులకు వర్తించవని తేలుతుంది. భారత పౌరులమైన మనందరమూ రాజ్యాంగం ఎదుట సమానులమే గాని, న్యాయమూర్తులు మాత్రం ఎక్కువ సమానం! ఒకే రకమైన నేరం చేసినా కులాన్ని బట్టి శిక్ష లేక పోవడమో, తీవ్రమైన శిక్ష ఉండటమో నిర్దేశించిన మనుస్మృతి (Manusmriti) లాగానే, భారత న్యాయమూర్తులకు కూడా మినహాయింపులు ఉన్నాయి! భావజాలాల మీద చర్చ వద్దా?ఈ దొరికిపోయిన అవినీతి వ్యవహారం మీదనైనా కాస్త చర్చ మొదలయింది గాని, న్యాయమూర్తులలో ఉన్న తప్పుడు భావజాలాల మీద, అందువల్ల వెలువడుతున్న తీర్పుల మీద చర్చ కూడా లేదు. ఇటీవల అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఒక మతతత్త్వ సంస్థ సభకు హాజరై ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేష ఉపన్యాసం చేశారు. న్యాయవ్యవస్థలోని ఉన్నతాధికార పీఠం అయిన కొలీజియం సంజాయిషీ అడిగితే, తన ఉపన్యాసానికి కట్టుబడి ఉన్నానని నొక్కి చెప్పారు. మరొక అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా తన ముందుకు ఒక మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసు వస్తే, దుండగులు ఆ బాలిక రొమ్ములను పిసికారని, ఆ బాలిక పైజామా బొందు తెంచివేశారని ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలు చూపినప్పటికీ, దాన్ని అత్యాచారయత్న నేరంగా చూడలేమని ప్రకటించారు. ఆ అన్యాయమైన తీర్పు మీద సమీక్ష జరపాలని దాఖలైన పిటి షన్ను వినడానికే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదీ సోమవారం నాడు నిరాకరించారు. ఆ అనుచిత ప్రవర్తనను, సుప్రీంకోర్టే మంగళవారం నాడు సవరించుకుంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సమీక్షించాలని సుమోటో నిర్ణయం తీసుకుని, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ ఎ.జి.మసీహ్ ధర్మాసనానికి అప్పగించింది.చదవండి: న్యాయమూర్తులకు భిన్న న్యాయమా?శాసన నిర్మాణ వ్యవస్థ, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనే మూడు అంగాలలో న్యాయవ్యవస్థ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర అధికారంతో మిగిలిన రెండు అంగాల పనితీరును కూడా సమీక్షించే ఉన్నతాధికారం కలిగి ఉంటుందని రాజనీతిశాస్త్రం పాఠాలు చెపుతుంది. రాజ్యాంగాన్ని, చట్టాలను వివరించే, వ్యాఖ్యానించే, సవరించే విస్తృతాధికారం ఉన్న న్యాయ వ్యవస్థకు సమాజం మొత్తం మీద, ప్రత్యే కించి శాసన నిర్మాణ, అధికార వ్యవస్థల మీద అదుపు ఉండటం సదుద్దేశంతోనే కావచ్చు. కాని కంచే చేను మేసినట్టు, ఆ న్యాయ వ్యవస్థే అన్యాయ, అవినీతి వ్యవస్థగా మారిపోతే, దాన్ని అదుపులో పెట్టేదెవరు? సమీక్షకులను సమీక్షించే వారెవరు? రాజ్యాంగమూ, చట్టమూ ఇచ్చిన ప్రత్యేక రక్షణలు, సబ్ జుడిస్ (న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా ఆ వ్యాజ్యం మీద మాట్లాడగూడదు), కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ (న్యాయస్థానం పట్ల ధిక్కార భావన) వంటి అవరోధాలతో, న్యాయస్థానాల మీద నోరెత్తడానికి ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు? న్యాయస్థానాలను మించినది సమాజం. న్యాయవ్యవస్థ తప్పులను నిలదీయ వలసిందీ, న్యాయ వ్యవస్థను కూడా సాధారణ పౌరుల లాగే ప్రజాక్షేత్రంలో చర్చకూ విచారణకూ గురిచేసి, జవాబుదారీ తనాన్ని స్థాపించవలసిందీ సమాజమే!- ఎన్. వేణుగోపాల్సీనియర్ జర్నలిస్ట్ -
న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు.. కదిలిన డొంక
తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా ఒక న్యాయమూర్తి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు మొత్తం న్యాయవ్యవస్థను కుదిపేస్తున్నవి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న్యాయమూర్తి ఇంటికి పరుగున వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి దగ్ధమవుతున్నవి భిన్నంగా కనిపించాయి. తమ బాధ్యతగా మంటలు ఆపి పై అధికారులకు ఎటువంటి సమాచారం ఇచ్చారో తెలియదు! కానీ మూడు రోజుల తర్వాత గానీ మీడియాలో ఈ వార్త రాలేదు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయ దగ్గరకు చేరిన వీడియోలు సుప్రీంకోర్టు వెబ్ సైట్లో అప్లోడ్ కాకపోయి వుంటే కరెన్సీ తగలబడటం అనేది బయటకు వచ్చేది కాదు. తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా... జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలు ప్రకటించారు. అయితే ఆ చర్యలే ఇప్పుడు ప్రశ్నలు ఎదుర్కొంటున్నాయి. న్యాయమూర్తులకు భిన్న న్యాయమా?ఒక సాదాసీదా ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో లక్ష కరెన్సీ దొరికితే ఆ వివరాలను మీడియాకి ఇచ్చి, ఆ ఉద్యోగి ఫొటోలు విడుదల చేసే పోలీసులు జస్టిస్ యశ్వంత్ వర్మ పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహ రించారు? దాదాపు 15 కోట్ల విలువ ఉన్న కరెన్సీ ఒక న్యాయమూర్తి ఇంట్లో లభిస్తే న్యాయవ్యవస్థ తీసుకున్న చర్య ఆ న్యాయమూర్తిని మరో హైకోర్టుకు బదిలీ చేయడమా? ఒక కేసులో విచారణ సక్రమంగా జరగదని న్యాయస్థానాలు భావించినప్పుడు నిష్పక్ష విచారణకు సీబీఐకి కేసును బదిలీ చేస్తాయి కదా. మరి ఆ కరెన్సీ విషయం నిగ్గు తేల్చమని సీబీఐని ఎందుకు ఆదేశించలేదు? కరెన్సీతో కూడిన కేసు కాబట్టి ఈడీను ఆ కేసు తీసుకోమని ఎందుకు అడగలేదు? స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో దర్యాప్తు చేస్తే గాని నిజాలు బయటకు రావని పలు సందర్భాలలో వ్యాఖ్యానించిన న్యాయవ్యవస్థ ఈ విషయంలో అంతర్గత విచారణకు ఆదేశించడం ఏమిటి? ఒక న్యాయమూర్తి మీద ఆరోపణలు వస్తే మరో ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ వేయడం సబబా? ఆ న్యాయమూర్తి మీడియా ముందుకు వచ్చి ‘ఆ కరెన్సీ నోట్లు నావి కావు, అక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు’ అనీ నోట్ల కట్టలను చూపుతుంటే ఆయన మీద ఆంక్ష విధించలేదు. కేసు గురించి బహిరంగంగా మాట్లాడటానికి వీలు లేదనే నిబంధన సామాన్య నిందితుడి మీద విధించడం న్యాయస్థానాలు చేస్తుంటాయి. కానీ అది ఢిల్లీ న్యాయమూర్తికి వర్తింప చేయలేదు. ‘నా పరువుకు భంగం కలిగించే కుట్రలో భాగంగా ఎవరో ఆ కరెన్సీ నోట్లు (Currency Notes) తెచ్చి నా ఇంట్లో పెట్టారు’ అని సదరు న్యాయమూర్తి అంటున్నారు.మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఇటీవల చెన్నైలో చేసిన ప్రసంగంలో ‘న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సడలుతోంది’ అన్నారు. మరో సమావేశంలో మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కూడా ‘న్యాయవ్యవస్థలో అంతా సక్రమంగా ఉందనలేం’ అన్నారు. ఆ ఇద్దరు న్యాయమూర్తుల నోటి వెంట వచ్చిన మరో పదం భారతీయ న్యాయ వ్యవస్థలో ‘అంకుల్ జడ్జి సిండ్రోమ్’ నెలకొన్నది అనేది. న్యాయవ్యవస్థలో బంధుప్రీతి పెరిగిందని, వారసులు జడ్జిలు అవుతున్నారనే విషయం ముంబైకి చెందిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపర సాక్ష్యాలతో సహా ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఆయన పరిశోధనలో హైకోర్టు స్థాయిలో 50 శాతం న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు స్థాయిలో 33 శాతం న్యాయమూర్తులు గతంలో న్యాయమూర్తులుగా పనిచేసిన వారికి దగ్గర బంధువులు. కొలీజియం ఉండటం సబబా?న్యాయవ్యవస్థలో బంధు ప్రీతి పెరగడానికి కారణం ప్రపంచంలో మరే దేశంలో లేనటువంటి కొలీజియం వ్యవస్థ. ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో న్యాయమూర్తులు నియామకం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చేస్తాయి. మనదేశంలో కూడా రాజ్యాంగం ఆ విధానాన్ని అనుసరించింది. అయితే మధ్యలో న్యాయమూర్తులు ఆ విధానాన్ని హైజాక్ చేశారు. కొలీజియం వ్యవస్థను స్థాపించారు. ఈ కొలీజీయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మరో నలుగురు న్యాయమూర్తులు సభ్యులు. హైకోర్టు స్థాయిలోనూ అటువంటి కొలీజియం ఉంటుంది. ఈ కొలీజియం న్యాయమూర్తుల నియామకాలను చేపడుతుంది. వారు సిఫార్సు చేసిన వారిని కేంద్ర ప్రభుత్వం నియమించాలి.ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ సంస్కరణ కోసం రాజ్యాంగాన్ని సవరించి ‘నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్’ (ఎన్‌జేఏసీ) చట్టం చేసింది. దీని ద్వారా న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వం ద్వారా జరిగేందుకు వీలు కల్పించింది. అయితే ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి, కొలీజియం (Collegium) ద్వారానే నియామకాల విధానం కొనసాగిస్తామన్నది. న్యాయమూర్తులు న్యాయమూర్తులను నియమించే విధానం మరెక్కడా లేదు. ఆ హక్కును ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు కోర్టు ఇస్తుందా? ప్రతి వ్యవస్థలో సీనియర్స్ తమ తర్వాతి స్థానాల వారిని నియమించడం సబబా! న్యాయస్థానాల మీద నోరెత్తడానికి ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు?గతంలో కొలీజియం వ్యవస్థను సవాలు చేసిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపర. ఆయన తన పిటీషన్లో వేసిన ప్రశ్నలు – ఇంతవరకు ఆ కరెన్సీని ఎందుకు భద్రపరచి, తగలబడిన వస్తువుల జాబితా తయారు చేయలేదు? ఎవరిని అరెస్టు ఎందుకు చేయలేదు? క్రిమినల్ చట్టాలను ఎందుకు అమలు చేయడం లేదు? ఈ కేసు వివరాలను ఎందుకు బయటకు రానివ్వడం లేదు? ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కడ్ ఎన్‌జేఏసీ చట్టాన్ని తిరిగి తీసుకురావాల్సిన అవసరం గురించి ప్రతిపక్ష నేతలతో చర్చించారు. ఇకముందైనా కొలీజియం వ్యవస్థలోని లోపాలను సుప్రీంకోర్టు వదులుకుంటుందా? పారదర్శకత, జవాబుదారీతనం న్యాయవ్యవస్థ ప్రదర్శిస్తుందా?- పి. వేణుగోపాల్ రెడ్డి ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు pvg2020@gmail.com -
ఏం జరుగనున్నది సామీ?
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికారిక నివాస ప్రాంగణంలోని ఔట్ హౌస్‌లో డబ్బుల బస్తాలు కాలిన విషయంపై అన్ని వర్గాలవారూ అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాథ్యూస్ జె నెడుంపరాతో పాటు మిగతా వారూ బుధవారం (మార్చి 26) సుప్రీం కోర్టులో ఈ విషయమై ఫిర్యాదును నమోదు చేసి, దర్యాప్తును చేపట్టమని ఢిల్లీ పోలీసులను వెంటనే ఆదే శించాలని వాదించారు. అయితే అందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది.మార్చి14 నాడు న్యాయమూర్తి వర్మ నివాస ప్రాంగణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిన నోట్ల వ్యవహారం బయటపడినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం, ఈ సంఘటనపై పోలీసు అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడిన మాటల మధ్య పొంతనలేక పోవడం వంటి కారణాలతో న్యాయవ్యవస్థపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం మార్చి 24 సోమవారం జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే కొలీజియం ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఈ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు చేయడానికి నియమించింది. అయితే ఈ కమిటీకి దర్యాప్తు చేయడానికి ఎటువంటి అధికారమూ లేదని నెడుంపారా వాదించారు. భారీగా నగదు నోట్లు కాలిపోయాయి కాబట్టి ఇది భారతీయ న్యాయ సంహిత ప్రకారం కాగ్నిజన్ ్స నేరం కిందకు వస్తుందనేది ఆయన వాదన. నిజానికి ఇది ప్రతి ఒక్కరి వాదన కూడా. కొలీజియం ఆ కమిటీకి విచారణ అధికారాన్ని ఇవ్వడం చెల్లదన్న వాదనా సరైనదే. పార్లమెంట్ లేదా రాజ్యాంగం స్వయంగా ఆ అధికారం కల్పించకపోతే, కొలీజియం తనంతట తానే విచారణ చేయించుకునే అధి కారం కల్పించుకోలేదు. జస్టిస్ వర్మ తన నివాస ప్రాంగణంలో కాలిపోయిన డబ్బు తనది కాదనీ, దీనివెనుక ఏదో కుట్ర ఉందనీ అంటున్న మాటలనూ అనుమానించవలసి వస్తోంది. ఆ డబ్బు తనది కాకపోతే ఆయన వెంటనే పోలీసు లకు ఫిర్యాదు చేసి, తనపై తప్పుగా కుట్ర పన్నేందుకు యత్నించిన వారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని ఎందుకు కోరలేదన్న నెడుంపరాతో అందరూ ఏకీభవిస్తున్నారు.జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసప్రాంగణంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద వీడియోలను సుప్రీంకోర్టు వెబ్ సైట్లో పెట్టారు. దేశ అత్యున్నత కోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఏదీ దాచకుండా దొరికిన అన్ని దృశ్యాలకు సంబంధించిన వీడియోలను అందరికీ కనబడే పని చేశారు. ఇదే న్యాయ సమాచార హక్కు.అనుమానాలివీ!మూటలలో డబ్బునోట్ల కట్టలు ‘దొరికాయి’. కష్టపడి సంపాదించిన సొమ్ము పోగొట్టుకుంటారా?’ అని ఢిల్లీ పోలీసు కమిషనర్ అన్న మాటలను అర్థం చేసుకోవాలి. ఢిల్లీ అగ్నిమాపక శాఖ ముఖ్య అధికారి అతుల్ గార్గ్ కాలిన నోట్లేమీ లేవని ముందు అన్నారు. ఆ తర్వాత తాను అలా అనలేదని మాట మార్చారు. మొత్తానికి అగ్నిమాపక శాఖ ఇచ్చిన రిపోర్టు ‘హిందీ’ భాషలో ఉంది. ఆ గదిలో మంటలు రేగినట్లు, మంటలు ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులో సగం కాలిన నోట్లు ఉన్నాయని అందులో ఉంది. పోలీసులు ప్రమాదం స్థలానికి చేరిన సమ యంలో ఆ కాలిన నోట్లు కనపడ్డాయి. అప్పుడు దొరికిన నోట్లను అక్కడే ఎందుకు ఉంచలేదు? జడ్జిగారి అధికారిక ఇంట్లోనే లెక్క చూపని డబ్బు దొరికినపుడు అది కాగ్నిజబుల్ నేరం అవు తుంది కదా. పోలీసులు నేరస్థలంలో ఉన్న పరి స్థితిని ఆదే విధంగా ఉంచాలి, దాన్ని మార్చడానికి వీల్లేదు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలంలో స్టోర్ రూంను లాక్ చేసి ఉంచాలని డాక్యుమెంట్ చెబుతున్నది. లాక్ చేసి ఉంచాం అని సీఆర్పీఎఫ్ గార్డ్ రూం రిపోర్ట్ అంటున్నది. మరి తాళం వేసి ఉంటే జస్టిస్ వర్మ అంటున్నట్లు పనివాళ్లు ఆ రూమ్‌ను ఎప్పుడు పడితే అప్పుడు ఎలా వాడుకోగలుగుతారు? నియమాల ప్రకారం, ఏదైనా అక్రమ సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లయితే, దాన్ని పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి, తర్వాత కోర్టుకు సమర్పించాలి. అదే విధంగా నేర సంఘటన జరిగినట్లయితే, పంచనామా కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పాటించారా లేదా అనేది తెలియడం లేదు.సీజేఐ చర్యలు అద్భుతంగా ఉన్నాయని ఉప రాష్ట్రపతి మెచ్చుకుంటున్నారని అంటున్నారు. అదే సందర్భంలో మన దేశం 2010లో ప్రవేశపెట్టిన ‘న్యాయ ప్రమాణాలు–జవాబు దారీ బిల్లు‘ (జుడీషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్–2010)ను మళ్లీ చట్టంగా తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అంటున్నారు. సుప్రీంకోర్టును కూడా ఇదేవిధంగా ఆదేశించమని కూడా కోరారు. ఇది న్యాయవ్యవస్థలో అవినీతిని తగ్గించడానికి కీలకంగా ఉపయోగపడుతుందని న్యాయవాది నెడుంపరా వివరించారు. ఇదైనా విని న్యాయం చెబుతారని నమ్మకతప్పదు. ఏం జరగబోతున్నది? ఈ దెబ్బతో 2010 బిల్లు తెచ్చి న్యాయ వ్యవస్థను సైతం కేంద్రం చేతిలోకి తీసుకునే కుట్ర ఏదో నడు స్తున్నదని అనుమానాలు వస్తున్నాయి. ఏం జరుగనున్నది సామీ?మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
సత్తా ఉన్న విధానమే కానీ...
దేశ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) 2020 లక్ష్యం. ఈ నూతన విధానం గడచిన అయిదేళ్లలో అనేక విమర్శలు, ప్రతిఘటనలు ఎదుర్కొంది. బీజేపీ పాలిత ప్రాంతాలు అక్కున చేర్చుకుని అమలు చేస్తుండగా, తమిళనాడు వంటి ప్రతిపక్ష రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయి. స్వయంప్రతిపత్తి, సాంస్కృతిక అస్తిత్వం ప్రమాదంలో పడతాయని భావిస్తూ ఎన్ఈపీని తిరస్కరిస్తున్నాయి. ఎన్ఈపీ విజన్ పక్కాగా ఉన్నప్పటికీ, అమలులో దక్షత కొరవడింది. నిధులు, మౌలిక వసతులు, సమాఖ్య ఏకాభిప్రాయం వంటి అంశాల్లో పలు సమస్యలు ఎదుర్కొంటోంది.ఇప్పుడున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 మోడల్ ప్రవేశపెట్టడం ఎన్ఈపీ 2020 తెచ్చిన కీలక సంస్కరణ. చిన్నారుల ఆరంభ విద్యకు ఇది ప్రాధాన్యం ఇచ్చింది. అలాగే, ఉపాధికి ఉపకరించేలా 6వ తరగతి నుంచే వృత్తివిద్యను ప్రవేశపెట్టడం ముఖ్యమైన మార్పు. కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధన ఉండాలన్నది మరో ముందాలోచన. బహుళ విద్యా విభాగాల ద్వారా ఉన్నత విద్య అభ్యసించే వీలు ఈ నూతన విధానం కల్పిస్తోంది. ఇది చెప్పుకోదగిన మార్పు. ఉన్నత విద్యను అంతర్జాతీయకరించే దిశగా విదేశీ విశ్వవిద్యాలయాలు దేశంలో ప్రవేశించడానికి మార్గం సుగమం చేసింది. డిజిటల్ డివైడ్‌ను అధిగమించే ధ్యేయంతో ‘నేషనల్ ఎడ్యు కేషనల్ టెక్నాలజీ ఫోరం’ (ఎన్ఈటీఎఫ్) ఏర్పాటు వంటి చర్యలు ప్రతిపాదించింది. డిజిటల్ క్లాస్ రూములు, ఆన్లైన్ వనరుల వాడకం వంటి ఆధునిక పద్ధతులను కర్ణాటక, మహారాష్ట్ర అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. దేశీ విద్యలో అంతర్జాతీయ ట్రెండ్ ప్రతిబింబించేందుకు ఇవన్నీ దోహదపడతాయి. లోటుపాట్లు– ఎన్ఈపీ విజన్ ఎంతో స్పష్టంగా ఉన్నప్పటికీ అమలులో గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. 2025 నాటికి సార్వత్రిక అక్షరాస్యత సాధించాలన్నది విధాన లక్ష్యం. విద్యారంగంలో మౌలిక వసతుల కోసం చాలినన్ని నిధులు కేటాయించకుండా, తగినంత మంది ఉపాధ్యాయులు లేకుండా ఇదెలా సాధ్యం? – మూడు భాషల ఫార్ములా కాగితం మీద బాగానే ఉందని పిస్తుంది. వాస్తవంలో ఇది ఎంత రాజకీయ రగడ సృష్టిస్తోందో చూస్తూనే ఉన్నాం. అమలు చేస్తున్న రాష్ట్రాల్లోనూ అస్పష్టత నెలకొని ఉంది. రెండు భాషల్లోనే ప్రావీణ్యం సాధించలేని విద్యార్థులు మూడు భాషలు ఎలా అభ్యసిస్తారో వాటికి అర్థం కావడం లేదు. పరభాషలు బోధించే సుశిక్షిత ఉపాధ్యాయుల లభ్యత గురించి ఎన్ఈపీ 2020 ప్రస్తావించలేదు.– పాఠశాలల డిజిటలీకరణ కూడా ఇలాంటిదే. దీని వల్ల పట్టణ విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. అయితే గ్రామాల మాటే మిటి? ఇప్పటికీ 60 శాతం మంది గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఇంటర్నెట్ సదుపాయం లేదు. దీన్ని పూడ్చేలా గట్టి పెట్టుబడులు పెట్టకపోతే డిజిటల్ అంతరం మరింత పెరుగుతుంది. – అలాంటిదే వృత్తి విద్య. దీంతో ఎన్ని లాభాలున్నప్పటికీ ఆచరణలో దుర్వినియోగం అయ్యే ముప్పు ఉంది. ఇంటర్న్షిప్స్ మాటున పరిశ్రమలు ఇంటర్న్‌లను దోపిడీ చేసి లేబర్ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రభుత్వం ఆశించినట్లు అర్థవంతమైన నైపుణ్యాభివృద్ధి జరగకపోవచ్చు. – బహుశా నిధుల సమస్య ఎన్ఈపీ 2020 లోటుపాట్లలో అగ్రభాగాన నిలుస్తుంది. జీడీపీలో 6 శాతం విద్య మీద పెట్టుబడి పెడతామన్న ప్రభుత్వ వాగ్దానం శుష్కంగానే మిగిలిపోతోంది. ఇప్పటికీ ఇది 4–4.5 శాతం మించడం లేదు. రాష్ట్రాలకు సమగ్ర శిక్ష స్కీము కింద విడుదల చేసే కేటాయింపులను ఎన్ఈపీ అమలుతో ముడిపెట్టారు. కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య మీద ప్రాంతీయ స్థాయి నిర్ణయాధికారాన్ని లక్ష్యపెట్టకుండా తీసుకున్న నిర్ణయం ఇది. దీనికి అనుగుణంగా తమిళనాడుకు రూ. 2,150 కోట్లను తొక్కిపట్టడంతో సమాఖ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఏకాభిప్రాయమే శరణ్యంబీజేపీ పాలిత రాష్ట్రాలు వీరావేశంతో ఎన్ఈపీని అమలు చేస్తుండగా, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తృణీక రిస్తున్నాయి. తాము అమలు చేస్తున్న రెండు భాషల ఫార్ములాకే కట్టుబడి ఉన్నామని తమిళనాడు తెగేసి చెప్పింది. స్కూళ్లలో చేరే పిల్లల స్థూల జాతీయ సగటు (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో– జీఈఆర్) 27.1 శాతం ఉండగా, తమ రాష్ట్రంలో అది అత్యధికంగా 51.4 శాతంగా నమోదైందనీ, తమ విధానం విజయవంతమైందని చెప్పడానికి ఇది నిదర్శనమనీ అంటోంది.సీయూఈటీ వంటి కేంద్రీకృత ప్రవేశ పరీక్షలను ప్రవేశపెట్టడం రాష్ట్రాలకు మింగుడుపడని మరో ప్రధానాంశం. రాష్ట్ర బోర్డుల ద్వారా వచ్చే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఈ జాతీయ ప్రవేశ పరీక్షల్లో సీబీఎస్ఈ స్టూడెంట్స్ అధికంగా స్కోరు చేస్తారు. విద్యలో అసమానతలు పెరుగుతాయి. అందుకే కేరళ ఈ విధానాన్ని వ్యతిరేకించింది. అయితే ఎన్ఈపీ 2020 ఒక సఫల విధానమని కానీ లేదా ఫెయిల్యూర్ స్టోరీ అని కానీ చెప్పలేం. ఇది ఇంకా నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టు లాంటిది. నూతన విద్యావిధానం విజయవంతం కావాలంటే, అది వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చు కోగలగాలి. ఏకాభిప్రాయమే శరణ్యమని గుర్తించి అందుకు అవస రమైన చర్చలు జరపాలి. బలవంతంగా రుద్దాలని చూస్తే కుదరదు. భిన్న సంస్కృతుల సమాహారమైన భారత్ వంటి దేశంలో ఈ వైఖరి అసలే పనికి రాదు. రాష్ట్రాలకు వాటి సొంత మోడల్స్ విడిచిపెట్టకుండానే జాతీయ విధానంలోని ప్రధాన అంశాలు అమలు చేసే వెసులు బాటు ఉండాలి. తమిళనాడునే తీసుకుందాం. భాషల ఫార్ములా జోలికి పోకుండా వొకేషనల్ ట్రెయినింగ్, డిజిటల్ లెర్నింగ్ పద్ధతు లను అది అమలుచేయొచ్చు.విద్యావ్యవస్థను మార్చగలిగే సత్తాఅదే సమయంలో, కేంద్రప్రభుత్వం ఎన్ఈపీ అమలుకు అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం తక్షణ అవసరం. 5+3+3+4 మోడల్‌కు మారుతున్నందున బోధనపరంగా కొత్త మార్పులు అవసరమవుతాయి. పెద్దపెట్టున శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనట్లయితే, నూతన విధానం సిద్ధాంతానికే పరిమితమవుతుంది. చిట్టచివరిగా, సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను భాగస్వాములుగా అంగీకరించి వాటితో కలిసి పనిచేయాలి. విరోధ భావన విడనాడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతల ప్రమేయంతో జాతీయ స్థాయిలో చర్చ జరగాలి.ఎన్ఈపీ 2020 సరైన దిశలో రూపొందించిన ఒక ఆశావహమైన విధానం. అయితే, విద్యాసంస్కరణలను హడావిడిగా బలవంతంగా తీసుకురాలేమన్నది ఈ అయిదేళ్లలో మనం నేర్చుకున్న పెద్ద పాఠం. వీటి అమలుకు ఎంతో సహనం, పరస్పర సహకారం అవసరం. ఎన్ఈపీ 2020కి దేశ విద్యావ్యవస్థను మార్చే సత్తా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎటొచ్చీ రాజకీయాలకు అతీతంగా కార్య దక్షతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. అందాకా ఇది భారత విద్యాసంస్కరణల చరిత్రలో ఒక అసంపూర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది.ప్రొ‘‘ వి. రామ్‌గోపాల్ రావువ్యాసకర్త బిట్స్ పిలానీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్వైస్ చాన్స్‌లర్, ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ -
ఇంతకన్నా అవమానం ఉపాధ్యాయ లోకానికి ఏమన్నా ఉంటుందా?
ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ఉపాధ్యాయుల ప్రవర్తన మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని తలదించు కునేలా చేసింది. ఈ ఎన్నికల్లో డబ్బు తీసుకుని కొందరు ఉపాధ్యాయులు ఓటు వేయడం ద్వారా పవిత్రమైన వృత్తినే కాక ప్రజాస్వామ్యాన్ని కూడా పరిహాసం చేశారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఉపాధ్యాయ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఒక జాతీయ రాజకీయ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థి ఓటుకు 5 వేల చొప్పున ఒక్కొక్క టీచర్‌కు పంచారనే ఆరోపణ బలంగా వ్యాప్తి చెందింది.నిజంగా ఈ డబ్బు తీసుకుని ఉపాధ్యాయులు (Teachers) ఓటు వేసి ఉంటే వారిలో ఏ స్థాయిలో నైతిక విలువలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టీచర్లు రేపటి భావిసమాజాన్ని ఎలా తయారు చేస్తారు? డబ్బులు ఇస్తే తీసుకోవడమే తలవంపులైతే... ఏకంగా ‘మాకు ఐదు వేలు కావాలి, రెండు వేలైతే ఓటు వెయ్యం’ అని బేరసారాలకు టీచర్లు దిగారంటూ వార్తలు వచ్చాయి. ఇంతకన్నా అవమానం ఉపాధ్యాయ లోకానికి ఏమన్నా ఉంటుందా?గత దశాబ్ద కాలంగా తెలంగాణ (Telangana)లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఉన్నవారు కూడా కొందరు రాజకీయ నాయకుల్లాగానే డబ్బులు వసూలు చేయడం, పైరవీలు చేయడం లాంటి పనులతో కోట్లకు పడగెత్తారనే ఆరోపణలూ ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర శాసన మండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎంతో హుందాతో, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసేవారన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.భారత సమాజంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో ఉన్నత మైనదీ, గౌరవప్రదమైనదీ! జ్యోతిబా ఫూలే – సావిత్రీబాయి ఫూలే దంపతులు సమాజంలోని మూఢ నమ్మకాలను పారదోలి వెలుగును నింపడానికి ఉపాధ్యాయ వృత్తినే ఆయుధంగా చేసుకున్నారు. కందు కూరి వీరేశలింగం పంతులు వంటివారు సంఘసంస్కర్తగా, విద్యావ్యాపకునిగా చేసిన సేవ ఉపాధ్యాయుని విలువను తెలియచేస్తోంది. సమాజాన్ని మార్చే అద్భుత అవకాశం ఉన్న విద్యారంగంలో నాటి విలువలు అడుగంటాయి. దీనికి కారణం ఒక విధంగా కార్పొరేట్ శక్తులు విద్యారంగంలోకి ప్రవేశించడమే కావచ్చు. విద్యావ్యాపారంలో కోట్లు సంపాదించినవారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేసి డబ్బును వెదజల్లి గెలవడం ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం.గత సంవత్సరం జరిగిన హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసిన ఓ వ్యక్తి కోట్లు ఖర్చుపెట్టి, టీచర్లను ఆర్థిక ప్రలోభాలకు గురిచేశారనే ప్రచారం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే!చదవండి: సమ సమాజమా? సంక్షేమ రాజ్యామా?ఈ పరిస్థితులను గమనిస్తుంటే రానున్న కాలాన్ని ఊహించడానికే భయమేస్తోంది. మేధా సంపత్తి, సేవా గుణం, వాక్చాతుర్యం ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలకు బదులు ఇక డబ్బున్న కార్పొరేట్ విద్యాలయాల మేనేజ్మెంట్లకు చెందినవారే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలుస్తారు కాబోలు! అలా వీరు గెలవకుండా ఉండాలంటే లక్షల రూపాయలు జీతంగా పొందే టీచర్లు... ఐదు, పదివేలకు కక్కుర్తిపడి ఓటును అమ్ముకోకుండా ఓటు వేయడమే మార్గం.– డాక్టర్ కొండి సుధాకర్ రెడ్డి, రిటైర్డ్ సీనియర్ లెక్చరర్ -
ప్రైవేటు జిత్తులకు చిత్తవ్వాల్సిందేనా?
ముప్పై ఏళ్ల ఆర్థిక సంస్కర ణల తర్వాత పరిధులు దాటి ప్రభుత్వంలోకి చొరబడు తున్న ప్రైవేటీకరణ వల్ల కొన్ని కొన్ని రంగాల్లో ‘రాజ్యం’ ఉనికే ప్రశ్నార్థకం అవుతు న్నది. పైగా విషయం సున్నిత మైన జ్ఞాన రంగానికి మూల మైన ఉన్నత విద్యకు సంబంధించింది కావడం వల్ల ‘ఎలీట్’ అనబడే ఎగువ మధ్యతరగతి ఆలోచనాపరుల చురుకైన జోక్యం అవసరం అవుతుంది. ప్రభుత్వ పరిధిలోకి ‘ప్రైవేట్’ చొచ్చుకు రావడం వల్ల నిర్వీర్యమవుతున్న విద్యా ప్రమాణాలు కారణంగా తెలుగు సమాజానికి మిగిలే నామర్దాపై లోతైన సమీక్ష అవసరమైన దశకు మనం చేరాం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004–2014 మధ్య పలు స్టేట్ యూనివర్సిటీలు రావడం, ప్రభుత్వం అందించిన ‘ఫీజు రీయింబర్స మెంట్’ దన్నుతో ఆర్థిక–సామాజిక బలహీన వర్గాలు కొంతమేర ప్రయోజనం పొందడం జరిగాయి. కొద్దిపాటి ప్రయత్నంతో విదేశాల్లో విద్యా–ఉపాధి అవకాశాలు పెరిగిన కాలం అది. అయితే ‘జాతీయ విద్యా విధానం–2020’ పేరుతో దేశమంతా ‘స్టేట్ యూనివర్సిటీ’లలో సంస్కరణలు అమలును ‘నీతి ఆయోగ్’ తప్పనిసరి చేసింది. సంపన్నులు తమ పిల్లల్ని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంత ఖర్చుకైనా వెరవకుండా చదివిస్తారు. కానీ దిగువ మధ్యతర గతి పరిస్థితి అదికాదు. వాళ్లకు నాణ్యమైన విద్య అందడం కల కాకూడదు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలుగా మొదలై ఆర్థిక సంస్కరణల కాలంలో ‘డీమ్డ్ యూనివర్సిటీలు’గా చలామణీ అవుతూ, ఉన్నత విద్యా వ్యాపారం చేస్తున్న చోట... ఉన్న ప్రమాణాలు గురించిన చర్చ ఇది. యాజమాన్యాలకు తమ వాణిజ్య ప్రయోజనాలు ప్రధానం అవుతుంటే, వాటి ప్రమాణాలు వడకట్టి మరీ వర్గీకరించే సమీక్ష బాధ్యతలు చూసే ‘న్యాక్’ (నేషనల్ ఎసెస్మెంట్ అండ్ ఎక్రిడిటేషన్ కౌన్సిల్) పరపతి పలచబడిన సందర్భం ఇది.ఇటీవల నీతి ఆయోగ్ 2011–2021 మధ్య చేసిన మదింపులో ‘తెలుగునాట యూనివర్సిటీల ప్రమాణాలు ఏ మాత్రం బాగాలేవు’ అని తేలింది. మూడు అంశాలను అది పరిశీలించింది. 1. విద్యా ర్థుల స్థూల నమోదు, 2. విద్యార్థి– టీచర్ నిష్పత్తి,3. లింగ సమానత్వ సూచిక. ఈ మూడు అంశాల్లో దేనిలోనూ మొదటి పది స్థానాల్లో మనం లేము. ప్రభుత్వం కంటే ప్రైవేట్ క్వాలిటీ బాగుంటుంది అనేది మన నమ్మకం. గడచిన ముప్పై ఏళ్లలో డిగ్రీతో మొదలై పీజీ, పీహెచ్డీ వరకు ఎదిగిన మన యూని వర్సిటీ చదువుల్లోకి భారీ పెట్టుబడులతో ప్రైవేట్ రంగం ప్రవేశించినా, నీతి ఆయోగ్ మదింపు అలా ఉందంటే, మన ప్రమాణాలు అనుమానమేగా! రాష్ట్ర విభజన తర్వాత పక్క రాష్ట్రాల నుంచి కూడా కొత్త యూనివర్సిటీలు వస్తుంటే అమరావతి చుట్టూ భూములు ఇవ్వడం, వాళ్ళు భారీ భవనాలు కట్టడం... ఇలా మన దృష్టి అంతా ‘షోకేసింగ్’ మీదే సరిపోయింది.ఈ యాజమాన్యాల రాజకీయ రంగ ప్రవేశంతో విద్యా వ్యవస్థలో ప్రభుత్వ– ప్రైవేట్ ప్రయోజనాలు ఒక్కటయ్యాయని పిస్తున్నది. అమరావతి సమీపాన ఉన్న ఒక డీమ్డ్ యూనివర్సిటీలో జరిగిన ఉదంతం వెనుక పైన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి అంటే విషయం సులువుగా బోధపడుతుంది. సీబీఐ అరెస్ట్ చేసిన పదిమంది ముఖ్యుల్లో ఒక వైస్– ఛాన్స్లర్ ఉండడం దేశాన్ని ఉలిక్కి పడేట్టుగా చేసింది. తమ యూనివర్సిటీకి ‘ఏ ప్లస్ ప్లస్’ ర్యాంకింగ్ రాబట్టడం కోసం న్యాక్ నుంచి తనిఖీకి వచ్చే ‘పీర్ రివ్యూ వర్స్’కు ముందే నగదు, విలువైన బహుమతులతో యాజమాన్యం వారిని ప్రలోభపరిచింది అనేది సీబీఐ అభియోగం. నింది తులు ఉన్నత విద్యారంగంలో పలు విభాగాలలోని ప్రమాణాలను సమీక్షించడంలో నిపుణులు. అరెస్ట్ వార్త వెలుగులోకి వచ్చిన మూడు వారాల్లో సుమారు 900 మంది పీర్ రివ్యూవర్స్‌ను శాశ్వతంగా న్యాక్ బాధ్యతల నుంచి తొలగించింది. ఒక ఆంగ్లపత్రిక ప్రతినిధికి న్యాక్ డైరెక్టర్ గణేశన్ కన్నాభిరాన్ జరిగింది ఏమిటో చెబుతూ– ‘మా వద్ద పీర్ రివ్యూవర్స్ జాబితాలో 5,000 మంది ఉన్నారు. వీరి పనిని సమీక్షించే కసరత్తు గత 18 నెలలుగా మా వద్ద సాగుతున్నది కనుకనే, ఈ విషయం తెలిసిన వెంటనే వారిపై వేటు సాధ్యమయింది. ఇకముందు మా వడపోత ‘హైబ్రీడ్ మోడల్’లో ఉంటుంది’ అన్నారు. జరిగిన దానిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొ‘‘ ఎం. జగదీశ్ కుమార్ స్పందిస్తూ – ‘యూజీసీ పరిధిలో పనిచేసే స్వయం ప్రతి పత్తి కలిగిన న్యాక్‌లో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాల తర్వాత ర్యాంకింగ్ ఇచ్చే విషయంలో పారదర్శకత, చిత్తశుద్ధి పెంచే విధంగా న్యాక్ సమూల సంస్కరణలను అమలులోకి తెచ్చింది. ఎక్రిడిటేషన్ జారీ విషయంలో న్యాక్ దృఢ చిత్తంతో అనుసరిస్తున్న పరిపాలనా విధానాన్ని, నిర్దేశించిన రూల్స్ అమలుచేయడానికి తీసుకుంటున్న చొరవను యూజీసీ అభినందిస్తున్నది’ అన్నారు.వారం తర్వాత విశాఖపట్టణంలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగిన ఓ ప్రైవేట్ పుస్తక ఆవిష్కరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి ఇద్దరూ ఒకే వేదికపైన ఉన్నారు. అక్కడున్న ‘ప్రభుత్వ భూమి–కేంపస్ గోడ’ వివా దాన్ని దృష్టిలో ఉంచుకుని, తన ప్రసంగంలో సీఎం ‘...ఇటువంటి యూనివర్సిటీని మీరు కూల్చివేయా లని అనుకుంటారా’ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆలో చించాల్సిన ప్రశ్న అది. జ్ఞానరంగానికి మూలమైన ఉన్నత విద్య ప్రమాణాలు ‘ప్రైవేట్’ వల్ల ప్రమాదంలో పడినప్పుడు, ‘రాజ్యం’తో పాటు పౌర సమాజమూ అప్రమత్తం కావాలి.వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
విభజన కుట్ర
‘స్టాలిన్ దున్నపోతు ఈనిందని అందరికీ ఆహ్వానాలు పంపితే దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీల నేతలు ఆ దూడను కట్టేయడానికి చెన్నైకి పరుగులు పెట్టారు.’ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరిగిపోతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశం అచ్చంగా ఇలాగే జరిగింది. అన్యాయం జరిగిపోతోందని బీజేపీని గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు ఆ సమావేశానికి వెళ్లాయి. చెన్నైలో ఓ స్టార్ హోటల్లో కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన సమావేశంలో ఒక్కరంటే ఒక్కరైనా ఎలా అన్యాయం జరుగుతుందో చర్చించారా? జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరుగుతుందనీ, దక్షిణాదిలో జనాభా తగ్గి పోయారనీ, ఉత్తరాదిలో పెరిగిపోయారనీ, అందుకే దక్షిణాదికి సీట్లు తగ్గుతాయనీ వీరంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. నిజానికి ఈ ప్రక్రియలో ఇంతవరకూ ఒక్క అడుగు కూడా పడలేదు. ముందుగా జనాభా లెక్కలు పూర్తి చేయాలి. అప్పుడే ఉత్తరాదిలో ఎంత పెరిగారు, దక్షిణాదిలో పెరిగారా, తగ్గారా అన్న స్పష్టత వస్తుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటవుతుంది. జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేస్తారన్నది కూడా అపోహే! అలా అయితే ఈశాన్య రాష్ట్రాలకు 25 లోక్‌సభ సీట్లు ఉండేవా? ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పదే పదే చెబుతున్న ప్రధాని, కేంద్ర హోంమంత్రి... ఏ రాష్ట్రానికీ ఒక్క సీటు కూడా తగ్గదని వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. 2023లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ డీలిమిటేషన్ ప్రక్రియను 2026 తర్వాత జనగణన డేటా ఆధారంగా చేపట్టాలని ప్రభుత్వం యోచి స్తోందని ప్రకటించారు. ప్రతి ఓటరుకూ సమాన ప్రాతి నిధ్యం లభించేలా చేస్తామన్నారు. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడేలా డీలిమిటేషన్ ఉంటుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్థానిక జనాభా వైవిధ్యం, గిరిజన సముదాయాల ప్రాతినిధ్యాన్ని కాపాడేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘డీలిమిటేషన్ అనేది కేవలం స్థానాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం కాదు, ప్రజాస్వామ్యంలో సమానత్వాన్ని స్థాపించే ప్రక్రియ’ అని స్పష్టం చేశారురాజకీయ అలజడి కోసమే...అయినా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కాకి లెక్కలను ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు 42 లోక్‌సభ స్థానాలుంటే, పునర్విభజన తరు వాత 34 అవుతాయని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 స్థానాలుంటే వీటి సంఖ్య 103కు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజ స్థాన్, బిహార్ రాష్ట్రాలలోని స్థానాల సంఖ్య 174 నుంచి 204 స్థానాలకు చేరుకుంటుందని అంటున్నారు. నిజానికి ఈ లెక్కలు ఇచ్చింది ఓ విదేశీ సంస్థ. ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ అనే సంస్థ ‘ఇండియాస్ ఎమర్జింగ్ క్రైసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్’ అనే నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక తప్ప, డీలిమిటేషన్ సీట్లపై మరో రిపోర్టు లేదు.కేంద్రం నుంచి అసలు లేదు. అయినా ఓ విదేశీ సంస్థ రిపోర్టును పట్టుకుని దేశంలో రాజకీయ అలజడి రేపడానికి డీఎంకే ప్రయత్నిస్తూంటే, ఆ పార్టీ ట్రాప్‌లో ఇతర పార్టీలు పడుతున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదనీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసు కోలేదనీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. లోకసభ నియోజకవర్గాల పునర్విభజన గతంలో 2002లో ప్రారంభమైంది. 2008లో అమలులోకి వచ్చింది. ఈ ప్రక్రియ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం జరిగింది. 2002లో డీలిమిటేషన్ చట్టం ఆమోదించిన తర్వాత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో ఎన్నికల కమిషన్ సభ్యులు, రాష్ట్రాల నుండి ప్రతినిధులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను సమన్వయం చేశారు. దీని ప్రకారం, జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులు సవరించారు. మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య మాత్రం మారలేదు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, పౌరుల నుండి సూచనలు స్వీకరించింది. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని, సరిహద్దులను ఖరారు చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇంకా విస్తృత సంప్రతింపులకు కమిటీలు వేస్తారు.పరుష వ్యాఖ్యలు ఎందుకు?ఉత్తరాదివాళ్ళు పందుల్ని కన్నట్లుగా పిల్లల్ని కంటున్నారనీ, అక్కడ బహుభర్తృత్వం ఉంటుందనీ డీఎంకేకు చెందిన మంత్రి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాదివారిని కించపరిచి తమిళనాడు డీఎంకే నేతలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఉత్తరాది వారిలో దక్షిణాదిపై ఏకపక్షంగా వ్యతిరేకత పెంచే కుట్రలో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు. తమిళనాడు డీఎంకే పాలన నాలుగేళ్లు నిండ కుండానే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. అందుకే ఉత్తరాదిపై విషం చిమ్మి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో దక్షిణాది సెంటిమెంటుతో గెలవాలనుకుంటున్నారు.హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ప్రాంతాల వారీగా భావోద్వేగాలు కలిగి ఉండే సమస్యల పట్ల పోరాడేటప్పుడు, విభజనవాదం చెలరేగే ప్రమాదం ఉంది. ప్రత్యేక ద్రవిడ దేశం కావాలని గతంలో కొంత మంది తమిళ నేతలు ప్రకటనలు కూడా చేశారు. ఇలాంటి విభ జనవాదుల మధ్య దేశాన్ని సమైక్యంగా ఉంచుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. ప్రత్యేక దేశం అనే మాట వినిపించిందంటే, అది విభజన వాదమే! దీన్ని ఏ మాత్రం ప్రోత్సహించకుండా,దక్షిణాది తన ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తే అది మంచి ప్రజాస్వామ్య విధానం అవుతుంది.ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు -
వైవిధ్య వైరుద్ధ్యాలు
ఒక కుటుంబం నుంచి, సమాజం నుంచి, ఒక దేశం వరకు వైవిధ్యాలు అనేకం ఉంటాయి. వాటిని వైరుద్ధ్యాలుగా మారకుండా చూసుకోవటంలోనే విజ్ఞత ఉంటుంది. ఆ విధంగా చూసినపుడు, లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభ జనపై తలెత్తిన వివాదం ఒక వైవిధ్య స్థితి నుంచి వైరుద్ధ్య స్థాయికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఈ నెల 22న చెన్నైలో జరిగిన సమావేశం దేశానికంతా ఒక హెచ్చరిక వంటిదని చెప్పాలి. నియోజక వర్గాల పునర్విభజనతో ముడిపడి మరొక రెండు అంశాలు కూడా ఉన్నాయన్నది గుర్తించవలసిన విషయం. ఒకటి – హిందీ భాషను హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారనే ఫిర్యాదు. ఈ విషయం చెన్నైలో చర్చకు రాలేదు. కానీ ఎప్పటినుంచో ఉన్నదే. రెండవది – దక్షిణ–ఉత్తర భారతాల మధ్య సాధారణ రూపంలోనే ఉన్నాయనే విభేదాలు. ఈ భావన నియోజక వర్గాల పునర్విభజనకు, హిందీ భాషకు పరిమితమైనది కాదు. ఇటువంటి భావనలకు గల చరిత్ర మూడు దశలలో కనిపిస్తుంది. ఒకటి– ఉత్తరాది వారికి దక్షిణాది వారిపట్ల ఎప్పుడూ చిన్నచూపేనన్నది. రెండు – దాక్షిణాత్యుల రంగురూపులు, భాషా సంస్కృతులు, ఆహార విహారాల పట్ల స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్నదనే ఈసడింపు దృష్టి. మూడవది–ఈ రెండింటికన్నా ప్రమాదకరమైనది, ప్రాచీనమైనది. అది ఆర్య–ద్రవిడ వాదనలు. వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా...మరే దేశంలోనూ లేనంతటి వైవి«ధ్యాలు ఇక్కడ ఉన్నాయి. సాంస్కృతికంగా, విశ్వాసాలపరంగా ఒక ఏక రూపత, కనీసం స్థూలమైన విధంగా, అనాదిగా ఉండిన ప్పటికీ, బ్రిటిష్ వలస పాలన ముగిసినాక చరిత్రలో మొదటిసారిగా మొత్తం నాలుగు చెరగులకూ కలిపి భౌగోళికంగా, రాజకీయంగా దేశానికి ఏకరూపత సిద్ధించింది. వైవిధ్యాలను సరిహద్దులు చెరిపివేసి ఒకటి చేసే ప్రయత్నాలు 1885లో కాంగ్రెస్ వ్యవస్థాపన కాలం నుంచి మొదలై, 1947లో స్వాతంత్య్ర సాధన, 1950 నుంచి రాజ్యాంగం అమలు, 1951–52లో మొదటి సార్వత్రిక ఎన్నికలతో ఒక రూపానికి వచ్చాయి. వైవిధ్యాలు వైరు ద్ధ్యాలుగా మారగల అవకాశాలకు ఆ విధంగా ముగింపు పలికినట్లయింది. కనీసం అందుకు ఒక బలమైన ప్రాతిప దిక సూత్రరీత్యా ఏర్పడింది. దానిని అదే ప్రకారం స్థిర పరచి మరింత పటిష్ఠం చేయవలసిన బాధ్యతను చరిత్ర పాలకులకు అప్పగించింది. అందుకు పునాదుల స్థాయిలో భంగపాట్లు జరిగాయని అనలేముగానీ, వేర్వేరు సాయుల్లో జరుగుతూ వస్తున్న దాని పర్యవసానమే ప్రస్తుత వివాదాలు.ఇటువంటి వివాదాలకు కేంద్ర ప్రభుత్వం ఆస్కార మివ్వనట్లయితే చెన్నై సమావేశపు అవసరమే ఉండేది కాదు. ఆ సమావేశం దరిమిలా కేంద్ర హోంమంత్రిఅమిత్ షా ఏమీ స్పందించలేదుగానీ, దక్షిణాదికి చెందిన ముగ్గురు బీజేపీ మంత్రులు మాట్లాడుతూ, విభజనకు సంబంధించి ఇంకా నిర్ణయం జరగలేదు, విధివిధానాలు రూపొందలేదు, ప్రకటనేమీ వెలువడలేదు, అటువంటపుడు ఈ సమావేశాలు, విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. విధివిధానాల రూపకల్పన, ప్రకటన జరగక పోవచ్చు. కానీ నష్టపోతా మనుకునే రాష్ట్రాలకు స్థూలమైన అభిప్రాయాలు కలగకుండా ఎట్లా ఉంటాయి? వారు ఆ విషయమై మాట్లాడకుండా ఎట్లా ఉంటారు?ఇటువంటి విషయాలలో చర్చలు ఒక ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ముందునుంచే జరుగుతాయి తప్ప, అంతా ముగిసిపోయే వరకు ఆగవు. విషయం వివాదాస్పదమవుతున్న సూచనలు కనిపించినప్పుడు చర్చలు మరింత అవసరం. కానీ అమిత్ షా అదేమీ చేయకుండా, దక్షిణాదికి ఎటువంటి నష్టం ఉండ దనీ, అక్కడి స్థానాలు ఇప్పటికన్నా పెరుగుతాయనటం మొదలుపెట్టారు. ఇందులో ఒక చాతుర్యం ఉంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు రెండింటికీ స్థానాలు ఇప్పటికన్న పెరిగినా, దక్షిణాదికన్న ఉత్తరాదికి పెరిగేవి చాలా ఎక్కువని, ఆ విధంగా రెండు ప్రాంతాల మధ్య గల ప్రస్తుత వ్యత్యాసం బాగా ఎక్కువవుతుందని అంచనా. అమిత్‌షా ఈ కోణాన్ని దాచిపెడుతున్నారు. అట్లాగాక ఏ వ్యత్యాసమూ, నష్టమూ ఉండదనుకుంటే ఆయన ఆ మాటను దక్షిణ రాష్ట్రాలను సమావేశపరచి వివరించాలి.సమావేశం అవసరం!చెన్నైలో జరిగిన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశానికి పార్టీ తేడాలు లేకుండా పలువురు హాజరయారంటేనే, విభజన ప్రతిపాదనలు ఎటువంటి అనుమానాలను కలిగిస్తున్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనటం. ఎందుకంటే, దేశమంతటాగల ఆ పార్టీ ఇటువంటి వైఖరి తీసుకుంటే వారికి ఉత్తరాదిన వ్యతిరేకత రాగలదనీ, ఆ భయంతో వారు హాజరు కాకపోవచ్చుననీ బీజేపీ అంచనా వేసింది. కానీ విభజనకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ముందుగానే మాట్లాడారు.ఇందులో రెండవవైపున చూస్తే, విభజనకు అనుకూలించటం వల్ల బీజేపీ దక్షిణాదిన నష్టపోగలదనే అభిప్రాయం ఉన్నా, ఆ పార్టీ అదే వైఖరికి కట్టుబడి ఉంటున్నది. దీనిని బట్టి ఇరువురూ, ఆయా ప్రాంతాలలో ప్రజాభిప్రాయాలు ఎట్లున్నా తమ వైఖరులను మార్చుకోదలచలేదని అర్థమవుతున్నది. దాని పర్యవసానాలు ఏమిటన్నది తర్వాతి విషయం. అది సూత్రబద్ధమైన వైఖరి అనుకుంటే మాత్రం ఆ మేరకు వారిని మెచ్చుకోవాలి.ఈ వైవిధ్యాలన్నీ వైరుద్ధ్యాలుగా మారి తీవ్ర స్థాయికి వెళ్ళకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలను సమావేశపరచాలి. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని ఒక తీర్మానంగా ఆమోదించిన చెన్నై సమావేశం, ఆ తీర్మాన ప్రతిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల కాలంలోనే ప్రధాని మోదీకి అందజేయగలమని ప్రకటించింది. ఆయన ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం మంచిదవుతుంది. చెన్నైలో తీర్మానించినట్లు విభజనను 25 సంవత్సరాల వరకు గాక, దక్షిణాదికి ఆమోదయోగ్యమయే ప్రత్యామ్నాయాన్ని కనుగొనే వరకు నిరవధికంగా వాయిదా వేయటం మంచిది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మరిన్ని ప్రయోగాలకు మార్గదర్శనం!
తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి మళ్లీ భూమ్మీదకు చేరారు. చాలామంది సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లో ఇరుక్కుపోయారని అన్నారు. ఈ వర్ణన అంత సరైంది కాదు. ఐఎస్ఎస్లో దీర్ఘకాలం ఉండటం ఇదే మొదటిసారి కాదు. సుమారు పాతికేళ్లుగా మనుగడలో ఉన్న ఐఎస్ఎస్లో నిత్యం యూఎస్, రష్యా, యూరప్, జపాన్ వ్యోమగాములు ఉంటూనే ఉన్నారు. ఒక్కొక్కరి కాలావధి వేర్వేరుగా ఉండవచ్చు. కనీసం 4 నుంచి 8 మంది వ్యోమగాములు జీవశాస్త్ర, బయోమెడికల్, మొక్కలకు సంబంధించిన ప్రయోగాలు చేస్తూ వచ్చారు. గత వారం కొద్ది కాలమైనా సరే... దాదాపు 11 మంది వ్యోమగాములు ఐఎస్ఎస్లో గడిపారు. పరిశోధనలు చేయడంతోపాటు ఉపగ్రహాలను ప్రయోగించడం, ఐఎస్ఎస్ నిర్వహణ పనులు చేశారు వీరందరూ! స్పేస్ వాక్స్ ద్వారా ఐఎస్ఎస్ వెలుపల ఉండే రోబో చేతుల మర మ్మతులు కూడా ఉన్నాయి ఈ పనుల్లో! వ్యోమగాములు నిత్యం ఐఎస్ఎస్లో ఉంటారు కాబట్టి వారికి ఆహారం, ఇతర సరుకుల రవాణా ఎప్పటికప్పుడు జరిగింది. అంతరిక్ష కేంద్రంలో సునీత, విల్మోర్లు 286 రోజుల పాటు ఉండటం చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ... కొత్త కాదు. ఫ్రాంక్ రూబియో విషయాన్నే తీసుకుంటే... 2023 సెప్టెంబరులో ఆయన 371 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి రికార్డు సష్టించారు. ఈ క్రమంలో ఆయన 2022లో మార్క్ వెండే హే 355 రోజుల రికార్డును బద్దలు కొట్టారు. అయినప్పటికీ సోవియట్ యూనియన్ కాస్మోనాట్ల రికార్డులతో పోలిస్తే ఇవి తక్కువ. సోవియట్ యూనియన్ ప్రయోగించిన ‘మిర్’ అంతరిక్ష కేంద్రమే... కాలక్రమంలో ఇతర దేశాల భాగస్వామ్యంతో ఐఎస్‌ఎస్‌గా రూపాంతరం చెందిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. భౌతిక శాస్త్రవేత్త, కాస్మోనాట్... వలేరీ పోల్యాకోవ్ 1994–95లో ఎకాయెకిన సుమారు 437 రోజులపాటు మిర్ స్టేషన్లో గడిపారు. ప్రస్తుతం చైనా సిద్ధం చేసిన అంతరిక్ష కేంద్రం టియాన్ గాంగ్‌లో ముగ్గురు వ్యోమగాములు 139 రోజులుగా ఉంటు న్నారు. వీరిలో కాయ్ షూజీకి అంతరిక్షంలో 320 రోజులు గడిపిన అనుభవం ఉంది. లక్ష్యాల్లో ఒకటి అదే...అంతరిక్ష కేంద్రం ఏర్పాటు లక్ష్యాల్లో ఒకటి– దీర్ఘకాలం అంతరిక్షంలో గడపడం. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ సమయం గడిపితే మనకేం అవుతుందన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇలా ఎక్కువ కాలం అక్కడ గడిపినప్పుడు ఎముకలు, కండరాలు బలహీనపడతాయన్న విషయం మాత్రం ఆందోళన కలిగించే వ్యవహారమే. 1970లలో శాల్యూట్, స్కైల్యాబ్లతో ప్రయోగాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ అంశాలకు సంబంధించి బోలెడంత సమాచారం సేకరించారు. బయో మెడికల్ సమాచా రాన్ని సేకరించడమే లక్ష్యంగా పలు పరిశోధనలు జరిగాయి. ఉదాహరణకు ప్రస్తుత అంతరిక్ష యాత్రలో విల్మోర్ సైక్లింగ్, రోయింగ్, రెసిస్టెన్స్ వ్యాయామాలను కలిపి చేయగల ఒక పరికరాన్ని ఐఎస్ఎస్లో ఏర్పాటు చేయడానికి సాయ పడ్డారు. ఎక్కువ సమయం ఇక్కడ గడపాల్సిన వ్యోమ గాములు ఈ పరికరం ద్వారా వ్యాయామాలు చేస్తే కండ రాలు, ఎముకలు మరీ గుల్లబారకుండా ఉంటాయి. గుండెకూ మేలవుతుంది. గుండె కొట్టుకునే వేగం, శ్వాస, రక్త పోటు వంటి... గుండె–రక్తనాళాలకు సంబంధించిన డేటాను సేకరించడానికీ, ఉష్ణోగ్రతలను వ్యోమగాములు వేసుకునే దుస్తుల్లో ఉంచిన సెన్సార్ల ద్వారా రాబట్టేందుకూ ఉద్దేశించిన ప్రయోగం కూడా జరిగింది. భవిష్యత్తులో మనిషి జాబిల్లిపై, అంగారకుడిపై నివసించాల్సి వస్తే... ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వారి పరమావధిగా ఉండనుంది. 1970, 1980లలో సోవియట్ యూనియన్ , అమెరికన్ల అంతరిక్ష కేంద్రాల అనుభవం తరువాత ఇది చాలా ఖరీదైన వ్యవహారమని వారికి అర్థమైంది. ఈ కారణంగానే ఐఎస్ఎస్ నిర్మాణం, నిర్వహణ రెండింటినీ అంతర్జాతీయ స్థాయికి చేర్చి పలు దేశాలు పాల్గొనేలా చేశారు. నాసా, కెనడా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ ఏజెన్సీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లొరేషన్ ఏజెన్సీ, రాస్కోమాస్లు ఐఎస్ఎస్ నిర్వహణ బాధ్యతలు చేపట్టాయి. ఆయా ఏజెన్సీలు అందించిన పరిక రాల నిర్వహణ బాధ్యత వారిదే. 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ అరవై ప్రయోగాల ద్వారా ఐఎస్ ఎస్‌ను 21 దేశాలకు చెందిన 260 మంది వ్యోమగాములు సందర్శించారు. భారత్ వ్యోమగామి శుభాంశు శుక్లా కూడా త్వరలోనే ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. ఐఎస్ఎస్ 2030 వరకూ పని చేయనుంది. చైనా ఇప్పటికే ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోగా... 2035 నాటికి ఒక కేంద్ర నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మొదలైన అంతరిక్ష కేంద్రం ఏర్పాటు ఆలోచన ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు! అంతరిక్ష ప్రయోగాల విషయంలో అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలోనే ప్రయోగాలు జరగనున్నాయి. స్పేస్ ఎక్స్, బోయింగ్ వంటివి సరుకు రవాణా కోసం ప్రత్యే కమైన నౌకలను సిద్ధం చేయనున్నాయి. నాసాతో కలిసి పని చేస్తున్న ఈ రెండు సంస్థలూ ఐఎస్ఎస్ నిర్వహణతోపాటు జాబిల్లి, అంగారకుడిపైకి చేరే ప్రయత్నాలు చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా మారిన నేపథ్యంలో బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మాన్ నాసా అధ్యక్షుడు అయ్యే పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష ప్రయోగాల్లో మరింత ఎక్కు వగా పాల్గొనే అవకాశాలున్నాయి. వీరందరూ సునీత, విల్మోర్ల అనుభవం నుంచి లబ్ధి పొందనున్నారు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఫలిస్తున్న ప్రజాభాగస్వామ్య పోరాటం
క్షయవ్యాధి (టీబీ)పై పోరులో భారత్ స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతోంది. ఇటీవల విస్తృత స్థాయిలో 100 రోజులపాటు నిర్వహించిన ‘టీబీ–ముక్త్ భారత్ అభి యాన్’... వినూత్న విధానాలను ప్రవేశ పెట్ట డమే కాక, జన బాహుళ్యాన్ని మమేకం చేయడం కూడా అంతే కీలకమని స్పష్టం చేస్తోంది. టీబీ కేసులను గుర్తించడాన్ని వేగవంతం చేయడం, మరణాలను తగ్గించడం, కొత్త కేసులను నివారించడం వంటి లక్ష్యాలతో 2024 డిసెంబర్ 7న ఈ ప్రచారం ప్రారంభమైంది.ఈ ప్రచారం ద్వారా టీబీ లక్షణాలు లేనివారే కాదు, ఆ లక్షణాలు గుర్తించని వారిని సైతం తొలిదశలోనే పసిగట్టి చికిత్స అందించింది. డయాబెటిస్ ఉన్నవారు, ధూమపానం చేసేవారు, మద్యపానం సేవించేవారు, హెచ్ఐవీ రోగులు, వృద్ధులు, తక్కువ ‘బీఎమ్ఐ’ ఉన్నవారు, టీబీ రోగులతో మసిలే కుటుంబ సభ్యులు... ఇలా అధిక రిస్కున్న వ్యక్తుల చెంతకు పోర్టబుల్ ఎక్స్–రే యంత్రాలను నేరుగా తీసుకెళ్ళి చికిత్స అందించడం జరిగింది. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఎక్స్–రేల ద్వారా అక్కడికక్కడే అనుమానిత టీబీ కేసులను గుర్తించారు. ప్రామాణికమైన ‘న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్’ (ఎన్ఏఏటీ) ఉపయోగించి రోగ నిర్ధారణ కూడా జరిగింది. ఈ ప్రయత్నాలు అంటువ్యాధులను గుర్తించి త్వరగా చికిత్స చేయడానికీ, అవి వ్యాప్తి చెందకుండా అరికట్టడానికీ, ప్రాణాలను కాపాడటానికీ దోహదపడ్డాయి. దేశం నలుమూలలా చేపట్టిన ఈ ప్రచార కార్య క్రమంతో టీబీ బారిన పడటానికి అవకాశమున్న దాదాపు 12.97 కోట్ల మందికి పరీక్షలు జరిగాయి. తద్వారా సుమారు 7.19 లక్షల టీబీ రోగులను గుర్తించారు. ఇది కేవలం ఒక మైలురాయి అంటే సరిపోదు, ఒక మలుపు అనే చెప్పాలి.భాగస్వామ్య ఉద్యమంచెప్పాలంటే... నిజమైన గేమ్ ఛేంజర్ కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు– జనాలను సమీకరించడం (కమ్యూనిటీల సమీకరణ). టీబీ నిర్మూలన అనేది ఇప్పుడు ‘జన్ భాగీదారీ’ (ప్రజల భాగస్వామ్యం) ద్వారా నడిచే ఒక ప్రజా ఉద్యమంగా మారింది. దేశమంతటా 13.46 లక్షలకు పైగా ‘ని–క్షయ్’ శిబిరాలు జరిగాయి. ఇందులో గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఆర్లు, యూఎల్బీల ప్రతినిధులతో సహా 30,000 మందికి పైగా ఎన్నికైన ప్రతినిధులు ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’కు మద్దతు అందించారు. కార్పొరేట్ భాగస్వాములు, సాధారణ పౌరులు సైతం ఈ ప్రచారంలో పాల్గొన్నారు. టీబీ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, సామూహిక లక్ష్యం అనే ఆలోచనను వీరు బలోపేతం చేశారు. ఈ మిషన్‌లో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల భాగ స్వామ్యం ఉండటం విశేషం. టీబీపై అవగాహన, న్యూట్రిషన్ కిట్ పంపిణీ, టీబీ రహిత భారత్ కోసం ప్రతిజ్ఞ చేయడం వంటి 35,000కి పైగా కార్య కలాపాలను 22 వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు చేపట్టాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, వాణిజ్య సంఘాలు, వ్యాపార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు 21,000కి పైగా కార్యకలాపాలను చేపట్టగా... 78,000 విద్యా సంస్థలలో 7.7 లక్షలకు పైగా విద్యార్థులు క్షయవ్యాధి అవగాహన కార్యకలాపాలలో పాల్గొన్నారు. జైళ్లు, గనులు, తేయాకు తోటలు, నిర్మాణ ప్రదేశాలు, పని ప్రదేశాల వంటి సామూహిక ప్రాంతాల్లో టీబీ బారిన పడటానికి అవకాశమున్న 4.17 లక్షలకు పైగా జనాలకు పరీక్షలు నిర్వహించారు. ‘జన్ భాగీదారీ’కి పునాది వేసిన మన ప్రధాని దార్శనికత సమాజంపై విస్తృత ప్రభావాన్ని చూపింది. ఫలితంగా రోగులకు తగిన పోషకాహారాన్ని అందించడం కోసమే కాక, వారి మానసిక – సామాజిక స్థితిగతుల్లో తోడ్పాటుకు ఎంతోమంది ముందుకొచ్చారు. టీబీ రోగుల బాగోగులు ఇప్పుడు ఆసుపత్రులకు మాత్రమే పరి మితం కాలేదు. ఇది ఇంటింటికీ, గ్రామ గ్రామానికీ, పని ప్రదే శాలకూ వ్యాపించాయి. ‘నిక్షయ్ మిత్ర’ ద్వారా వ్యక్తులు, సంస్థలు ఇప్పటికే వేలాది ఆహార బుట్టలను పంపిణీ చేసి, టీబీ బాధిత కుటుంబాలకు పోషక సహాయాన్ని అందిస్తున్నాయి. కేవలం 100 రోజుల కార్యక్రమంలో 1,05,181 కొత్త నిక్షయ్ మిత్రులు నమోదయ్యారు. పోషకాహారం అందించడం, క్షయవ్యాధి నుంచి రోగులు కోలుకునేలా చేయడం మధ్య కీలక సంబంధాన్ని గుర్తిస్తూ... ప్రభుత్వం ‘నిక్షయ్ పోషణ్ యోజన’ కింద ఆర్థిక సహాయాన్ని నెలకు 800 నుంచి 1,000 రూపాయలకు పెంచింది. తద్వారా ఏ క్షయవ్యాధి రోగీ ఒంటరి పోరాటం చేయకుండా చూడటమే ప్రభుత్వ ఉద్దేశం.ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా విభిన్న రీతిలో టీబీ కేర్ ప్రోగ్రాం కింద రోగులకు అవసరమైన చర్యలు తీసుకోవడమే కాదు, రోగిని బట్టి శ్రద్ధ తీసుంటూ చికిత్సను అంది స్తోంది. ఉదాహరణకు, ఒక టీబీ రోగి తక్కువ బరువుతో ఉన్నట్లు తేలితే (18.5 కంటే తక్కువ బీఎమ్ఐ), వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు తగిన పోషకాహారం, చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. చికిత్స సమయంలో నెల నెలా వారి పురోగతిని పర్యవేక్షిస్తారు.100 రోజుల పురోగతిక్షయ వ్యాధి పై అవగాహన కల్పించడం, రోజువారీ జీవితంలో సేవలను అందించే విషయంలో 22 మంత్రిత్వ శాఖలు చేతులు కలిపి ముందుకు సాగాయి. గోవా కార్నివాల్ పరేడ్లలో టీబీపై అవగాహన ఒక ప్రధానాంశంగా నిలిచింది. తమ కార్యాలయాలను సందర్శించే వేలాది మందికి ఉచిత టీబీ స్క్రీనింగ్‌లను చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ విభిన్న చర్యలు అపోహలను తొలగించే ప్రయత్నాలు చేశాయి. క్షయ నిర్మూలనలో ప్రజా చైతన్యానికి బాటలు పరిచాయి.100 రోజుల ప్రచారం అనేది కేవలం ప్రారంభం మాత్రమే!ప్రతి పౌరుడు... వారు ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఆధునిక పద్ధతుల్లో రోగనిర్ధారణ, నాణ్యమైన చికిత్స అందించడం, అన్ని వర్గాల వారినీ భాగస్వాములను చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఈ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. కోవిడ్–19 పరీక్షల విషయంలో ప్రభుత్వం ఎంత చురుగ్గా స్పందించిందో... అదే మాదిరి మరింత వేగవంతమైన, కచ్చితమైన అత్యాధునిక టీబీ పరీక్షలను అన్ని ప్రాంతాలకూ, అన్ని వర్గాలకూ అందుబాటులోకి తేవడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.స్వచ్ఛ భారత్ మిషన్ కావొచ్చు, పోలియో నిర్మూలన కార్య క్రమాలు కావొచ్చు... యావత్ సమాజం కదలి వస్తే ఎటువంటి ప్రయోజనాలు ఒనగూరుతాయో స్పష్టంగా రుజువు చేశాయి. ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కూడా ఇప్పుడు ప్రజల నేతృత్వంలో మరో ఉద్యమంగా మారుతోంది. భారత్ ఇప్పుడు కేవలం క్షయవ్యాధితో పోరాడటం మాత్రమే కాదు– దాన్ని ఓడిస్తోంది కూడా!జేపీ నడ్డా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి(మార్చి 24న ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం) -
పిల్లలకు పాఠశాల కంటే వీడియో గేమ్స్ అంటే ఎందుకు ఇష్టం?
“మా బాబుకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వకపోతే అరుపులు, కేకలు. ఇల్లంతా రచ్చరచ్చ చేసేస్తాడు. కానీ పుస్తకాలు తీస్తే బోలెడంత బద్ధకం. చదువంటే ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే. కానీ అదే వీడియో గేమ్ ఆడేటప్పుడు ఏమీ తినకుండా, తల ఊపకుండా గంటల తరబడి కూర్చుంటాడు!”ఇలాంటి మాటల్ని మీరు రోజూ వింటూనే అంటారు.దానికి మీరేం సలహా ఇస్తారు? “ఈ తరం పిల్లలు స్క్రీన్కు బానిసలైపోయారు.” “వీడియో గేమ్స్ బ్రెయిన్‌ను వదిలిపెట్టకుండా హైపర్ యాక్టివ్ చేస్తాయి.” “ఇది డిజిటల్ డెమెజ్.”"పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదు."కానీ, అసలు మర్మం ఎక్కడ ఉంది తెలుసా?వీడియో గేమ్స్ అనేవి సైకాలజీని వాడి డిజైన్ చేసిన అద్భుత ఇంజినీరింగ్.మొబైల్ గేమ్స్ ఆడే పిల్లవాడిని ఒకసారి గమనించండి… "ఈ లెవెల్‌ను కంప్లీట్ చేయాలి", "ఈ శత్రువును ఓడించాలి", "ఈ స్కోరు సాధించాలి" అని అతనికి స్పష్టమైన లక్ష్యం ఉంటుంది.అతను ప్రయత్నం చేస్తాడు. ఓడిపోతాడు. మళ్లీ ట్రై చేస్తాడు. మళ్లీ ఓడతాడు. చివరికి గెలుస్తాడు.విజయం పొందిన వెంటనే స్క్రీన్ మీద – "Congratulations!", "You’re a winner!", "Unlocked new powers!" అంటూ మెసేజ్ వస్తుంది.ఈ ఫీడ్‌బ్యాక్ అతని మెదడులో డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ కోసమే, అది ఇచ్చే హ్యాపీనెస్ కోసమే అతను మళ్ళీ మళ్ళీ మొబైల్ గేమ్స్ ఆడుతూనే ఉంటాడు.ఇప్పుడు చదువును పరిశీలిద్దాం. ఓ ఏడో తరగతి పిల్లాడు, మొఘలుల వంశవృక్షం చదవాల్సి ఉంది. అతనికి పాఠం ఎంత పెద్దదో తెలియదు. ఎక్కడ మొదలుపెట్టాలో కూడా స్పష్టత లేదు. పుస్తకంలోని ప్రశ్నల్లో ఏది పరీక్షల్లో వస్తుందో, ఏది గుర్తుంచుకోవాలో తెలియక కంగారు.పరీక్షలో సరైన సమాధానం రాసినా – ఫలితం ఎప్పుడు వస్తుందో తెలీదు. పరీక్షలు వస్తున్నాయంటే "నువ్వేమైనా చదువుతున్నావా?" అంటూ తల్లి, తండ్రి, టీచర్లు ఒత్తిడి పెడతారు. ఆ ఒత్తిడి అతని మెదడులో కోర్టిసాల్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇదే అసలు తేడా. వీడియో గేమ్ మోటివేట్ చేస్తుంది. చదువు భయం, ఒత్తిడితో నడుస్తుంది.మా Genius Matrix వర్క్‌షాప్‌లో పాల్గొన్న 8వ తరగతి విద్యార్థిని మిహిర ఏం చెప్పిందో తెలుసా? “సర్, నేను Minecraft ఆడేటప్పుడు ఎంత creative అవుతానో తెలుసా? నా మీద నాకే ఆశ్చర్యం. కానీ అదే స్కూల్లో డ్రాయింగ్ competition ఉంటే, ఒక్కసారిగా భయమేస్తుంది. గెలవకపోతే నన్ను తక్కువగా చూస్తారని.”ఇంకొక తండ్రి తన కొడుకును గురించి ఇలా చెప్పాడు... “డాక్టర్ గారు, మా వాడి PUBG స్టాటిస్టిక్స్ మామూలుగా ఉండవు. ప్లానింగ్, లీడర్షిప్, టీమ్ వర్క్ – అన్నీ బాగా చూస్తాడు. కానీ అదే క్లాస్‌లో ప్రాజెక్ట్ వచ్చిందంటే మౌనంగా పడుకుంటాడు. ఎందుకంటే అక్కడ creativityతో పని లేదు, కేవలం marks కోసం పని చేయాలి.”వీడియో గేమ్‌లో చిన్న ప్రయత్నానికే పెద్ద గుర్తింపు వస్తుంది. చదువులో మంచి ప్రయత్నం చేసినా మార్కులు రాకపోతే ఎవరూ పట్టించుకోరు. వీడియో గేమ్‌లో స్వాతంత్య్రం ఉంటుంది. చదువులో నిబంధనలు, డెడ్లైన్లు, ఫలితాలపై భయం ఉంటుంది.ఒకసారి నేను ఓ క్లాస్‌లో పిల్లల్ని అడిగాను: “మీరు ఎక్కువ టైం ఏమి చేస్తారు?” ఒకటి: “గేమ్స్ ఆడతాను.” రెండు: “యూట్యూబ్ చూస్తాను.” మూడు: “కంప్యూటర్ మీద క్రియేట్ చేస్తాను.” చదువు ఎప్పుడూ నాల్గవ ఆప్షన్లా ఉంటుంది.మనం ఏమి చేయాలి? వీడియో గేమ్‌లు నిషేధించడం సమస్యకు పరిష్కారం కాదు. స్మార్ట్‌ఫోన్ తీసేయడం వల్ల కూడా సమస్య తీరిపోదు. “నీకు concentration లేదు” అని తిట్టడం వల్ల అస్సలు ఉపయోగం ఉండదు.మరేం చేయాలంటారా?పిల్లలు ఏది concentrationతో చేస్తారో గమనించాలి. మన పాఠశాల, మన ఇంటి వాతావరణం కూడా వీడియో గేమ్‌లా మారాలి.🔹చిన్న లక్ష్యాలు ఇవ్వండి – చిన్న విజయం పొందిన ఆనందాన్ని అనుభవించాలి.🔹ప్రయత్నాన్ని గుర్తించండి – “శబాష్, నువ్వు మంచి ట్రై చేశావు” అనే మాట ఎంతో విలువైనది.🔹విఫలమైనా మళ్లీ ప్రయత్నించేందుకు అవకాశం ఇవ్వండి – శిక్షలు కాదు, శక్తినివ్వండి.🔹విజయం చూపించండి – మార్కులు కాకపోయినా, మెరుగుదల కనబడాలి.🔹పిల్లల మనసును మెప్పించే చదువు… అలాగే వాళ్లే కోరుకునే అభ్యాసం కావాలి.🔹మనం పిల్లల మీద ఒత్తిడి పెట్టడం తగ్గించాలి. వాళ్లలో ఉత్తేజాన్ని పెంచాలి. 🔹వీడియో గేమ్‌ల మాదిరిగానే – విద్య కూడా ఒక అడ్వెంచర్ అనిపించాలి.చదువు ఒక బాధగా, భారంగా కాదు… ఒక ప్రయాణంగా మారితే – పిల్లలు కూడా చదువును “ఆటలా” ఆస్వాదిస్తారు.మొత్తానికి సమస్య స్క్రీన్ కాదు. చదువులో ఆనందాన్ని మేళవించడమే సమాధానం.-సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
Manabendra Nath Roy మానవవాద విప్లవకారుడు
ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారగలడో తెలుసు కోవాలంటే ఎం.ఎన్. రాయ్ జీవితాన్ని అధ్యయనం చేయాలి. భారతీయుడైన రాయ్, మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాప కుడు (1917) కావడమేమిటీ? ఆయనలోని నిరంతర భావజాల సంఘర్షణ ఆయనను ఏదో ఒక ఆలోచనా ధోరణికి కట్టుబడి ఉండ నివ్వలేదు. ర్యాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాప నతో పాటు భారత రాజ్యాంగ చిత్తుప్రతిని తయారు చేసి ప్రచురించారు. భారత దేశానికి స్వాతంత్య్రం లభించిన సమయానికే ఆయన ‘నూతన మానవ వాదానికి మేనిఫెస్టో’ని (న్యూ హ్యూమనిస్ట్ మేనిఫెస్టో) రూపొందించి విడుదల చేశారు. తను స్థాపించిన ఇండియన్ రినైజాన్స్ ఇనిస్టిట్యూట్ ద్వారా దేశాన్నే కదిలించారు. డెహ్రాడూన్‌లో ఆయన నివాసమున్న చోటు నుండే ఆ సంస్థను నిర్వ హించారు. అది ఆ కాలంలో ‘హ్యూమనిస్ట్ హౌస్’గా పేరు పొందింది. ఉత్తర భారత దేశం నుండే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా ఆయన అనుచరులు, అభిమా నులు అక్కడికి తరలి వెళ్ళారు. మతతత్వ భావనకు వ్యతిరేకంగా పనిచేయడమే తన సంస్థ ప్రథమ కర్తవ్యమ న్నారు రాయ్. అందుకే ‘ఎడ్యుకేట్ ద ఎడ్యు కేటెడ్’ – విజ్ఞానవంతుల్ని వివేకవంతుల్ని చేద్దామన్న ఆలోచనని వ్యాప్తి చేశారు. 1887 మార్చ్ 21న పశ్చిమ బెంగాల్లో రాయ్ పుట్టినప్పుడు పెట్టిన పేరు నరేంద్ర నాథ్ భట్టాచార్య. క్యాలిఫోర్నియాలో ఉండగా అక్కడి నిఘా విభాగాల దృష్టి మరల్చడానికి మానవేంద్ర నాథ్ రాయ్‌గా పేరు మార్చుకున్నారు. 14వ ఏటే అనుశీలన్ సమితిలో చేరారు. అది రహస్యంగా పని చేసే ఒక విప్లవ సంఘం. కొద్ది కాలానికే ఆ సంఘం నిషేధానికి గురయ్యింది. ఆ తర్వాత జతిన్ ముఖర్జీ నిర్వహణలో నడిచే జుగాంతర్ గ్రూపులో చేరారు. ‘జతిన్ ముఖర్జీని కలవడమే తన జీవితంలో ఒక గొప్ప మలుపు’ అని తన గ్రంథం (చైనాలో నా అనుభావాలు)లో రాసుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జుగాంతర్ సభ్యులు ఎన్నో కార్య క్రమాలు చేస్తుండేవారు. ఆ కాలంలో రాయ్ జర్మన్ల సహాయంతో ఇండోనేషియాకు వెళ్ళి వస్తుండేవారు. ఆయుధాలు సమకూర్చు కుని, బ్రిటిష్ పాలకుల్ని తరిమి కొట్టాలన్నది ఆయన ఉద్దేశం.రహస్యంగా అమెరికాలో ఉన్నప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని ఎవిలిన్ ట్రెంట్‌తో స్నేహం పెరిగి పెండ్లి చేసుకున్నారు. తప్పనిసరై అక్కడి నుండి మెక్సికో చేరుకున్నారు. అక్కడ ఆయనకు తగిన భద్రత, గుర్తింపు లభించాయి. అందుకే ఆయన ‘జ్ఞాపకాల పుస్తకం’లో – మెక్సికో తనకు కొత్త జన్మ నిచ్చిందని రాసుకున్నారు. అక్కడ ఉన్న రోజుల్లోనే మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత మూడేళ్ళకు 1920లో మరో ఆరుగురు నాయకులతో కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించగలిగారు.మానవేంద్ర నాథ్ రాయ్ తర్వాత కాలంలో వ్లాదిమిర్ లెనిన్, జోసెఫ్ స్టాలిన్‌ను కలిసి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్‌లో భాగస్వాము లయ్యారు. 1926లో దాని విధి విధానాల రూపకల్పనలో పాలు పంచుకున్నారు. ఆ విధి విధానాల్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అవలంబించేట్లు ఒప్పించ డానికి రాయ్ 1927లో చైనా వెళ్ళారు. కానీ, ఆ ప్రయత్నం విఫలమైంది. రాయ్ ఒప్పించ లేక పోయారని కాబోలు, 1929లో ఆయ నను కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నుండి బహి ష్కరించారు. 1930లో రాయ్ భారత్‌కు తిరిగి రాగానే, ఆయన కోసం గాలిస్తున్న బ్రిటిషు ప్రభుత్వం 1924 నాటి కాన్పూర్ బోల్షివిక్ కుట్ర కేసుతో అరెస్ట్ చేసి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు నుండి విడుదలై వచ్చాక రాయ్ నాలుగేళ్ళ పాటు ఇండి యన్ నేషనల్ కాంగ్రెస్‌లో సభ్యుడిగా ఉండి బయటపడ్డారు. 1946లో డెహ్రాడూన్‌లో భారతీయ సాంస్కృతిక పునర్వికాస కేంద్రాన్ని స్థాపించారు. ఆ సంస్థ ఆధునిక భౌతిక దృక్కోణంలో మానవవాదాన్ని ప్రచారం చేసింది. చార్వాక, లోకాయత, బౌద్ధ దర్శనాల అధ్యయనానికి వేదిక అయ్యింది. రాయ్ జీవితం నుండి, ఆయన ప్రతిపాదించిన ర్యాడికల్ హ్యూమనిజం నుండి దేశంలోని సోషలిస్ట్లు, కమ్యూనిస్ట్‌లు,కాంగ్రెస్ వాదులు, పార్టీరహిత కార్యకర్తలు ఎంతోమంది ప్రేరణ పొందారు. 1954 జనవరి 25న తన 67వ ఏట గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ‘ఉత్పత్తి చేస్తున్న వారికి ఆర్థిక స్వాతంత్య్ర సాధన’ అన్నది రాయ్ ఆశయాలలో ఒకటి. -వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతడా. దేవరాజు మహారాజు -
సమ సమాజమా? సంక్షేమ రాజ్యమా?
సామ్యవాద సమాజాన్ని నిర్మించడానికి ఇండియా కమ్యూనిస్టు పార్టీలు రెండు మార్గాలను ఎంచుకున్నాయి. మొదటిది– సాయుధ పోరాటం. రెండోది– పార్లమెంటరీ ఎన్నికలు. ఆయా పార్టీల నాయకులు అభిమానులు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోనూవచ్చు గానీ, అవి ఎంచుకున్న రెండు మార్గాలూ ఇప్పుడు దాదాపు మూసుకునిపోయాయి. ‘‘దేశాలు స్వాతంత్య్రాన్ని, జాతులు విముక్తిని, ప్రజలు విప్లవాన్ని కోరుకుంటున్నారు’’ అంటూ కమ్యూనిస్టు పార్టీలు ఓ యాభై ఏళ్ళ క్రితం చాలా గట్టిగా మాట్లా డేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉద్యమాల్లో పాతవాళ్ళు తగ్గిపోతున్నారు; కొత్తవాళ్ళు రావడం లేదు. ఇది నేటి వాస్తవ స్థితి. దీనికి కారణం ఆ యా పార్టీలు అనుసరించిన విధానాలా? మరొకటా? అనే చర్చల వల్ల ఇప్పుడు ప్రయో జనం లేదు. చరిత్రలో జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిందేమిటీ? అనేదే చర్చనీయాంశం కావాలి. ప్రత్యామ్నాయ మార్గాలుసోషలిస్టు కలను సాకారం చేసుకోవడానికి అభిమా నులు వందేళ్ళు ఎదురుచూడటమే మహత్తర విషయం. దీర్ఘకాల పోరాటం కనుక ఇంకో వందేళ్ళు ఆగాలి అని ఎవరయినా చెప్పవచ్చు. వందేళ్ళు గడిచిపోయాయి కనుక సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. సమ సమాజం కుదరకపోతే దానికి దగ్గరి ప్రత్యామ్నాయాలు ఏమిటీ? అనేది. దానికి వెంటనే స్ఫురించే సమాధానం సంక్షేమ రాజ్యం. నార్డిక్ దేశాలయిన స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ సంక్షేమ దేశాలని చాలామందికి తెలుసు. పశ్చిమ యూరప్‌లో జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, స్విట్జర్లాండ్ కూడా తమవైన పద్ధతుల్లో సంక్షేమ రాజ్యాలని బయటికి అంత తెలీదు. వీటిల్లో జర్మనీ రాజకీ యార్థిక పరిణామాలతో ఇండియాకు పోలికలున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1919 నుండి 1933 వరకు జర్మనీలో కొనసాగిన ‘వైమర్ రిపబ్లిక్’ను స్థూలంగా ప్రజాస్వామ్యయుత పాలన అనవచ్చు. 1933 నుండి 1945 వరకు అడాల్ఫ్ హిట్లర్ ‘నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ’ పేరిట ‘నాజీ’ పాలన సాగించాడు. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వానికి గరిష్ఠ రూపం... నాజీజం. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓడిపోయిన తరువాత జర్మనీ ‘మిత్రరాజ్యాల’ అధీనంలో వలస దేశంగా మారిపోయింది. ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేసి యూకే, ఫ్రాన్స్, అమెరికా, రష్యాలు తలో భాగాన్ని తమ అధీనంలోనికి తీసుకున్నాయి. ఓ నాలుగేళ్ళు ప్రత్యక్ష వలస పాలన సాగాక జర్మనీ రెండుగా విడిపోయింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ల ప్రాబ ల్యంలోని పశ్చిమ ప్రాంతం 1949 మే 23న ‘ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ’ (ఎఫ్ఆర్జీ)గా అవతరించింది. అదే ఏడాది అక్టోబరు 7న రష్యా ప్రాబల్యంలోని తూర్పు ప్రాంతం ‘జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్’గా ఏర్పడింది. అప్పట్లో పశ్చిమ జర్మనీని పెట్టుబడిదారీ దేశంగానూ, తూర్పు జర్మనీని సోషలిస్టు దేశంగానూ చెప్పు కునేవారు. కారణాలు ఏమైనాగానీ, తూర్పు జర్మనీవాళ్ళకు పశ్చిమ జర్మనీ మీద గొప్ప మోజు వుండేది. వాళ్ళు పెద్ద ఎత్తున పశ్చిమ జర్మనీకి వలస పోయేవారు. దీనిని అరికట్టడానికి బెర్లిన్ నగరాన్ని రెండు ముక్కలు చేసి 1961 ఆగస్టు నెలలో అడ్డంగా భారీ గోడ కట్టింది తూర్పు జర్మనీ. దీనికి ‘ఫాసిస్టు వ్యతిరేక రక్షణ గోడ’ అని గొప్ప పేరు పెట్టారు. అయినా జీడీఆర్ నుండి వలసలు ఆగలేదు.హంగేరీ, జకోస్లోవేకియాల మీదుగా పశ్చిమ జర్మనీకి చేరు కోవడం మొదలెట్టారు. 1980ల చివర్లో తూర్పు జర్మనీతో పాటు పోలాండ్, హంగేరి, చెకోస్లావియా, రొమేనియా, బల్గేరియా తదితర తూర్పు యూరోప్ దేశాల్లోనూ సోష లిస్టు పాలకులకు వ్యతిరేకంగా నిరసనలు మొదల య్యాయి. ఇవి ముదిరి 1989 నవంబరు 9న బెర్లిన్ గోడను కూల్చేశారు. ఆ తరువాత ఆరు దేశాలు సంయుక్తంగా చర్చించి 1990 అక్టోబరు 3న తూర్పు జర్మనీని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీలో విలీనం చేశాయి. జర్మనీ, ఇండియాల సామ్యం...రెండు జర్మనీల విలీనం అంటే విధానపరంగా పెట్టుబడిదారీ, సోషలిస్టు సమాజాల సంకీర్ణం అని అర్థం. ఇప్పటి జర్మనీలో ఈ రెండు ధోరణులేగాక ఉదారవాదం, మతవాదం తదితర అనేక ధోరణులు కనిపిస్తాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మితవాదులు పుంజుకున్న ప్పటికీ మధ్యేవాదులకు అధికారం దక్కింది. మనలాగే ప్రజాస్వామిక, నాజీయిస్టు, వలస, సోషలిస్టు, పెట్టుబడి దారీ దశలన్నింటినీ చవిచూసిన జర్మనీ ఇప్పుడు పశ్చిమ యూరప్‌లో ఒక మెరుగయిన సంక్షేమ రాజ్యంగా కొనసాగుతోంది. ఇండియా, జర్మనీ స్థూల జాతీయోత్ప త్తులు కూడా దాదాపు సమానం. ఇప్పటి ఇండియా ప్రభుత్వ స్వభావం మీద ఫాసిస్టా? కొత్త ఫాసిస్టా? సగం ఫాసిస్టా? అంటూ చర్చ సాగుతోంది. మన దేశంలో కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం కొన సాగుతోందనే అభిప్రాయం బలపడుతోంది. దేశంలోని సహజ వనరుల్ని, మౌలికరంగాలను ఎలాగూ కార్పొరేట్ల పరం చేసేస్తారు. మనం గతంలో ఎన్నడూ ఊహించనంతటి భీకర విస్తాపన సాగుతుంది. దానిని ఇప్పట్లో ఎవరూ ఆపలేరు. సోషలిజం సాధించగల సత్తాగల పార్టీ ఒక్కటీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆచరణాత్మకంగా ఒక సంక్షేమ రాజ్యాన్ని ఆశించడం ఒక్కటే సమంజసంగా ఉంటుంది. మనం ఆ దిశగా ఆలోచించాలి. దానికోసం ప్రయత్నించాలి.డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు ‘ 90107 57776 -
ఉత్తర – దక్షిణ సంకటం
ఊహించినట్లే జరుగుతోంది. ‘డీలిమిటేషన్’ భూతం మనల్ని వెంటాడుతోంది. జనాభా లెక్కలు దగ్గర పడిన కొద్దీ అది మనకు ఇంకా చేరువ అవుతోంది. అయినా మోదీ ప్రభుత్వం ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటోంది. కానీ ‘నియోజక వర్గాల పునర్విభజన’ భయాలు అలా కొట్టేయదగినవి కావు. ఎందుకని? కారణం వెరీ సింపుల్. ఇందులో బుర్ర బద్దలు కొట్టుకోవల్సిందేమీ లేదు. నియోజక వర్గాలు జనాభాపరంగా సైజులో సమానంగా ఉండాలి. ఇప్పుడలా లేవు. కాబట్టి దేశవ్యాప్తంగా నియోజక వర్గాలు ఒకే సైజులో ఉండేట్లు వాటిని పునర్ విభజించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో, జనసంఖ్య వేగంగా పెరిగిన రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కంటే ఎక్కువ నియోజక వర్గాలు ఏర్పడతాయి. మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 వద్దే స్థిరంగా ఉంచేట్లయితే, జనాభా నియంత్రణ పటిష్ఠంగా అమలు చేసిన రాష్ట్రాల్లో సహజంగానే నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుంది. ఆ మేరకు ఇతర రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. ఒకరి నష్టం మరొకరికి లాభం అవుతుంది. సంఖ్య పెరిగినా ఒరిగేదేంటి?మిలన్ వైష్ణవ్, జేమీ హింట్సన్‌ల అధ్యయనం సూచించిందిదే! అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ పార్లమెంటు నియోజకవర్గాలు తగ్గు తాయి. ఉదాహరణకు కేరళ, తమిళనాడు చెరో 8 సీట్లు కోల్పోతాయి. ఆంధ్ర, తెలంగాణలు రెంటికీ కలిపి చూస్తే అవీ ఇన్ని స్థానాలు నష్ట పోతాయి. కర్ణాటక నుంచి 2 స్థానాలు ఎగిరిపోతాయి. జనాభాను నియంత్రించిన ఇతర రాష్ట్రాలూ ఇలాగే దెబ్బతింటాయి. పశ్చిమ బెంగాల్ నాలుగు, ఒడిషా మూడు, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమా చల్ ప్రదేశ్ ఒక్కో నియోజకవర్గం పోగొట్టుకుంటాయి. ఇక అనేక ఉత్తరాది రాష్ట్రాల స్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ జాబితాకు 11 స్థానాలు అదనంగా కలుస్తాయి. బిహార్ 10, రాజస్థాన్ 6, మధ్యప్రదేశ్ 4 సీట్లు పెంచుకుంటాయి. ఫలితంగా, 543లో 226 సీట్లతో ఇప్పటికే ఆధిపత్యం చలాయిస్తున్న ‘హిందీ హార్ట్‌ల్యాండ్’ డీలిమిటేషన్ అనంతరం తన ప్రాబల్యాన్ని విశేషంగా 259కి పెంచుకుంటుందని యోగేంద్ర యాదవ్ తేల్చారు. దక్షిణాది రాష్ట్రాలు అన్నిటికీ కలిపి ప్రస్తుతం 129 సీట్లు ఉన్నాయి. పునర్విభ జన అనంతరం ఇవి 26 సీట్లు కోల్పోతాయని యోగేంద్ర యాదవ్ లెక్క గట్టారు. దీంతో పార్లమెంటులో వాటి ప్రాతినిధ్యం, పలుకుబడి గణనీయంగా క్షీణిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు.డీలిమిటేషన్ సమయంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని లోక్ సభ సీట్ల సంఖ్య పెంచే వీలుందని అంటున్నారు. ఇది కొంచెం నయం. కానీ అలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుందా? మొత్తం స్థానాల సంఖ్య పెంచినా, ప్రతి రాష్ట్ర నియోజకవర్గాలూ అదే నిష్పత్తిలో పెరుగుతాయి. అదీ ఉత్తరాదికే అనుకూలిస్తుంది. ఉత్తరాది–దక్షిణాది నిష్పత్తి ప్రకారం చూస్తే, దక్షిణాది రాష్ట్రాలకు ఒరిగేదే ఉండదు. వాటి సీట్ల సంఖ్య పెరిగినా ప్రయోజనం ఉండదు. వాటి ప్రాతినిధ్యం, పలుకు బడి పూర్వస్థితికి అంటే ఇప్పటి స్థాయికి చేరుకోవు. కాబట్టి, ఈ చర్య కూడా దక్షిణాది భయాలను తొలగించేది కాదు. పరిస్థితి ఏమీ మారదు. ఆ మధ్య ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ లెక్క వేసింది. సమస్యను ఈ గణాంక విశ్లేషణ తేటతెల్లం చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఐదు దక్షి ణాది రాష్ట్రాలకు కలిపి మొత్తం 543లో 129 సీట్లు ఉన్నాయి. అంటే 24 శాతం. ప్రస్తుత లోక్ సభ సీట్ల సంఖ్యను 790కి పెంచారే అనుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాల నియోజకవర్గాలు 152కి పెరుగుతాయి. నిజమే. కానీ మొత్తంలో వాటి వాటా కేవలం 19 శాతానికి కుదించుకు పోతుంది. తమిళనాడు విషయం చూస్తే, దాని వాటా ఇప్పుడున్న 7.2 నుంచి 5.4 శాతానికి పడిపోతుంది.ఏ విధంగా చూసినా దక్షిణాది రాష్ట్రాల క్షోభ అర్థం చేసుకో దగినదే!ఉత్తరాది బాధకానీ రెండో వైపు నుంచి చూస్తే, ఉత్తరాదిదీ సంకట స్థితే! ఆర్. జగన్నాథన్ గణాంక విశ్లేషణ ప్రకారం, మారిన జనాభా నేపథ్యంలో కేరళ పార్లమెంటు సభ్యుడు సగటున 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదే రాజస్థాన్ ఎంపీ సగటున 33 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ రకంగా చూసుకుంటే తమకు ఉండవలసిన వారి కంటే చాలా తక్కువ మంది ఎంపీలు ఉన్నారని, ఇది అన్యాయమని హిందీ బెల్టు కూడా వాదించగలదని జగన్నాథన్ అభిప్రాయపడుతున్నారు. ఇది నిజంగా భారత ప్రజాస్వామ్యానికే డైలమా! అసలు సమస్య ఇది: నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఉత్తరాది ఆందోళన పరిష్కారం అవుతుంది. అయితే, ఈ చర్య దక్షిణా దికి క్షోభ కలిగిస్తుంది. యోగేంద్ర యాదవ్ వాదిస్తున్నట్లు డీలిమి టేషన్‌ను వాయిదా వేయడం – లేదా శాశ్వతంగా రద్దు చేయడం ద్వారా యథాతథ స్థితి కొనసాగించవచ్చు. దక్షిణాది భయాలు తొలగి పోతాయి. మరి ఉత్తరాది వారు తమకు జరుగుతుందని భావిస్తున్న అన్యాయం మాటేమిటి? అది అలాగే మిగిలిపోతుంది. కాబట్టి, ఎలా చేసినా ఏదో ఒక పక్షం నష్టపోవడం తప్పదు.మరి దీనికి పరిష్కారం లేదా? ఇది చిటికేసినంత సులభంగా పరిష్కరించే సమస్య అయితే కాదు. నిజం చెప్పాలంటే, మన ప్రజా స్వామ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో కచ్చితంగా ఇదొకటి. వాస్తవానికి వ్యవస్థలో పెను ఉపద్రవానికి దారి తీయగల ఒక నిర్మాణలోపం ఇది. దీన్ని తేలిగ్గా తీసిపారేయడమో, దాటవేయడమో సరైన వైఖరి కాదు. సవాలును సవాలుగా స్వీకరించి అమీతుమీ తేల్చుకోవాల్సిందే. ఇదంత సులభం కాకపోవచ్చు. పోనీ మరొక ప్రత్యామ్నాయం ఉందా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
విలువే లేకుండా పోయింది.. ఎందుకీ ఊడిగం!
కూటమి విజయానికి మనమే కారణం అయ్యాం... మనం లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా.. ఆయన సీఎం అయ్యేనా.. కాపులంతా గంపగుత్తగా ఓట్లేయకపోతే కూటమికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది.. ఇన్ని సీట్లు ఎలా వస్తాయి..ఈ కూటమి ప్రభుత్వ రథానికి మనమే చక్రాలం..మనమే ఇరుసు..మనమే ఇంధనం కానీ ఇప్పుడు మనం కరివేపాకులం అయిపోయాం. పులుసులో ముక్కలం అయిపోయాం .. మనకు ఎక్కడ విలువ గౌరవం దక్కడం లేదు.దేనికోసం ఇంత త్యాగాలు చేయాలి అంటూ జనసేన ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి.. అందులో 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ ముగ్గురికి క్యాబినెట్లో స్థానం దక్కింది.. మిగతా 18 మంది వట్టి ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని జనసేన బాధపడుతుంది.జనసేన ఎమ్మెల్యే కన్నా టిడిపి ఇంచార్జీ మిన్నతాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీని ఆ నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిలకే అధికారులు గౌరవిస్తున్నారని వారి మాట వింటున్నారని తమకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతూ కాసేపటి క్రితం విజయవాడలోని హోటల్లో సమావేశం అయ్యారు. దీనికి నాదెండ్ల మనోహర్ కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మనోహర్ తో ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని మొరపెట్టుకున్నట్లు తెలిసింది. స్థానికంగా తమ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీని తమ మాటను పోలీసులు రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవరూ వినడం లేదని తెలుగుదేశం వారు చెబితేనే అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని మనోహర్ ఎదుట వాపోయారు.మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురికి నియోజకవర్గంలో కాస్త గౌరవం ఉన్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి ఇండిపెండెంట్‌గా పని చేసే అవకాశం దక్కడం లేదు. నియోజకవర్గాల పెద్ద పని ఏదైనా ఉంటే ఆ జిల్లా మంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుంది. పైగా ఆ మంత్రి కూడా లోకేష్ కంట్రోల్లో పనిచేస్తున్నారు. లోకేష్ కూడా జనసేన ను పెద్దగా పట్టించుకోకుండా జిల్లాల తన సొంత టీం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. దీంతో అనివార్యంగా జనసేన నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. పలుచోట్ల వ్యాపారాల్లోనూ అక్రమ ఆదాయం తెలుగుదేశం జనసేన మధ్య పోటీ నెలకొన్న తరుణంలో తెలుగుదేశం వారు పలువురు జనసేన కార్యకర్తలను వెంటాడి కొట్టిన ఘటనలు ఉన్నాయి.ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు తెలుగుదేశానికి ఊడిగించేయడం కోసమే తమ పార్టీ ఉందా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం ఇన్చార్జిలకు అధికారులు గౌరవం ఇవ్వడం దానికి ఎంత అవమానం అన్నది ఈ సమావేశంలో వారంతా నాదెండ్ల మనోహర్ కు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పెద్దలతో మాట్లాడి సెటిల్ చేస్తే జిల్లాలో తమ గౌరవం నిలబడుతుందని అంతిమంగా పార్టీ కూడా బలపడే అవకాశం ఉంటుందని వారు చెప్పుకున్నారు.కానీ జనసేన బలపడాలని తెలుగుదేశం ఏ కోశానా కోరుకోదు. జనసేన బలం తమకు బలం కావాలని తెలుగుదేశం భావిస్తుంది తప్పితే జనసేన సొంతంగా తన కాళ్లపై తన నిలబడి పోటీ చేసే పరిస్థితి వస్తే తెలుగుదేశానికి ఎంత ఇబ్బంది అన్నది చంద్రబాబు లోకేష్ లకు తెలుసు. అందుకే ఎక్కడికి అక్కడ జనసేన నాయకులను కార్యకర్తలను తమ కాళ్ళ కింద పెట్టి ఉంచుతూ ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం క్యాడర్‌ను మాత్రమే గుర్తిస్తూ పనులు పథకాలు పైరవీలు అని వాళ్ల ద్వారా జరిగేలా చూస్తున్నారు.నియోజకవర్గాల్లో పనులు అంటూ జరిగితే తెలుగుదేశం వారి ద్వారానే జరగాలి లేదంటే లేదు. అంతేతప్ప జనసేన నాయకుడికి ఎక్కడా మర్యాద దక్కకూడదు అనే సింగల్ పాయింట్ ఏజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇదంతా తమకు అవమానంగా భావిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు తమ గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ మనోహర్ మీద ఒత్తిడి తెచ్చారు. మరోవైపు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ శాఖను సైతం హైజాక్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా జనసేన మనుగడకు.. భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని వారు కలవరపడుతూ దిద్దుబాటు చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏ స్థాయి ఫలితాలు ఇస్తుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న -
Bhagat Singh: ఉరికొయ్యను ముద్దాడిన ఉత్తేజం
‘‘ఇంక్విలాబ్ జిందాబాద్’’ అని నిన దిస్తూ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ చేసిన తిరుగుబాటు ఆనాడు యావద్దేశాన్ని వారి వైపు తలతిప్పి చూసేలా చేసింది. భారతమాత విముక్తి కోసం ఆ యువకులు ముగ్గురూ ఉరికొయ్యల్ని ముద్దాడారు. జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగినప్పుడు భగత్‌సింగ్ వయస్సు సరిగ్గా పన్నెండేళ్లు. భారతీ యుల నెత్తురుతో తడిసిన ఆ నేలను చూసి చలించిపోయాడు. చిన్న వయసులోనే దేశం పట్ల, ప్రజల పట్ల మక్కువ పెంచుకున్నాడు. గాంధీ ఇచ్చిన సహాయ నిరాకరణ పిలుపును అందుకుని ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నాడు. ఒక బ్రిటిష్ పోలీస్ అధికారిని కాల్చి చంపిన కేసులో భగత్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ఉరి శిక్ష పడింది.విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం, మనుషులంతా ఒక్కటే అనే భావన కోసం నిలబడినవాడు భగత్‌సింగ్. వాస్తవానికి భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరి తీయాల్సింది మార్చి 24న (1931). కానీ ఒక రోజు ముందే, అది కూడా సంప్రదాయానికి భిన్నంగా సూర్యాస్తమయం తర్వాత లాహోర్ సెంట్రల్ జైలులో ఉరి తీశారు. వారి మృతదేహాలు ప్రజల కంటపడకుండా బ్రిటిష్ ప్రభుత్వం జాగ్రత్త పడింది. బతికున్న భగత్‌సింగ్ (Bhagat Singh) కంటే చనిపోయిన భగత్‌సింగ్ మరింత ప్రమాదకారి అని వారు భావించటమే అందుకు కారణం. ‘‘నా విప్లవ భావాలు ఈ సుందరమైన మాతృభూమి అంతటా వ్యాపించి యువతకు మత్తెక్కిచ్చి స్వాతంత్య్రం కోసం, సమానత్వం కోసం, స్వేచ్ఛ (Freedom) కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొడతాయి’’ అంటూ బ్రిటిష్ పాలకులను హెచ్చరించినవాడు భగత్‌సింగ్.చదవండి: పేరు ఏదైతేనేం.. అంతా అణచివేతే!అంతరాలు లేని సమాజం సోషలిజమే అని నమ్మి, దాని ఆచరణకు శ్రీకారం చుట్టిన మేధావి, మొదటితరం మార్క్సిస్టు భగత్ సింగ్. తండ్రి కిషన్ సింగ్ (Kishan Singh) తనను ఉరిశిక్ష నుంచి తప్పించటం కోసం స్పెషల్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ పెట్టుకున్నట్లు తెలుసుకున్న భగత్ సింగ్ తన తండ్రికి లేఖ రాస్తూ... ‘‘నా జీవితం కన్నా దేశమే గొప్పది. ప్రతి యువకుడూ తన జన్మభూమి రుణం తీర్చుకోవటానికి... అవసరమైతే తన ప్రాణాలను సైతం అర్పించుకోవాలని నేను నమ్ముతాను’’ అని తండ్రినే ఊరడించాడు. ‘‘విప్లవ పోరాటంతో కూడిన ఈ కొద్దిపాటి జీవితం ఒక్కటే నాకు గొప్ప బహుమానం’’ అని చాటిన భగత్ సింగ్‌ను ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి.– జి. రామన్న, డీవైఎఫ్ఐ ఏపీ కార్యదర్శి(మార్చి 23న భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వర్ధంతి) -
అమిత్ షా (హోం మినిస్టర్) రాయని డైరీ
‘‘నన్ను దీవించండి మోదీజీ’’ అన్నాను తలను కాస్త వంచి, చేతులు జోడించి. మోదీజీ నన్ను వెంటనే దీవించలేదు.‘‘ముఖంలో ఏమిటా అలసట, నుదుటిపై ఏమిటా చెమట?’’ అని అడిగారు!‘‘బస్తర్ నుంచి వస్తున్నాను మోదీజీ. నన్ను దీవించండి’’ అన్నాను. ‘‘తొందరేమొచ్చింది అమిత్ జీ? చేతులు, ముఖం కడుక్కుని, బట్టలు మార్చుకున్నాకే రావలసింది కదా’’ అన్నారు.ఇంకా వగరుస్తూనే ఉన్నాన్నేను.‘‘ఈసారి 30 మోదీజీ. జనవరిలో 48, ఫిబ్రవరిలో 40. మొత్తం కలిపి ఈ 80 రోజుల్లో 120. బస్తర్ నుంచి ఇంటికి వెళ్లకుండా నేరుగా మీ దగ్గరకే వచ్చేశాను. నన్ను దీవించండి మోదీజీ’’ అన్నాను.మోదీజీ నన్ను దీవించలేదు!‘‘30+48+40 = 118 కదా అమిత్ జీ, 120 ఏమిటి? రౌండ్ ఫిగర్ కోసం రెండు కలిపారా?’’ అన్నారు.‘‘లేదు మోదీజీ, రౌండ్ ఫిగర్ కోసం కలపలేదు. ఏమంత పెద్ద ఫిగర్ కాదు కదా అని కలపలేదు. 30కి 48కి మధ్యలోనో, 48కి 40కి మధ్యలోనో ఆ 2 ఎక్కడో ఉండి ఉంటుంది. చూసి చెబుతాను’’ అన్నాను.‘‘చూసి చెప్పటం కాదు అమిత్ జీ. చూశాకే చెప్పాలి. లేకుంటే ‘గ్రోక్’కి, మనకు తేడా ఉండదు. గ్రోక్ బుర్ర పెట్టి చెప్పదు. బుర్రలో పెట్టిన దాన్ని బట్టి చెబుతుంది’’ అన్నారు మోదీజీ.ఆయన ‘గ్రోక్’ని అంటున్నారా, నన్ను అంటున్నారా అర్థం కాలేదు. బహుశా ఇద్దర్నీ కలిపి కావచ్చు. ‘‘నిజమే మోదీజీ. గ్రోక్ బుర్ర పెట్టి చెప్పదు. బుర్రలో ఏది పెడితే అది చెబుతుంది’’ అన్నాను. అందుకు ఆయనేమీ సంతోషించలేదు. ‘‘బుర్రలో ఏం పెట్టారన్నది కాదు అమిత్జీ, బుర్రలో ఎవరు పెట్టారన్నది పాయింట్’’ అన్నారు.ఆయన ఆవేదనలో అర్థం ఉంది.మోదీజీ గురించి గ్రోక్ ఒక్క మంచి విషయం కూడా చెప్పటం లేదు. ఆయన్ని మతవాది అంటోంది. ఆయనవన్నీ మత వ్యూహాలు అంటోంది. ‘‘గ్రోక్లో ఒకటి గమనించారా అమిత్జీ?’’ అని అడిగారు మోదీజీ.‘‘గమనించాను మోదీజీ! మీ గురించి ఏం చెబితే విమ్మల్ని ద్వేషించేవారు సంతోష పడ తారో అది మాత్రమే చెప్పి గ్రోక్ వారిని సంతోష పెడుతోంది. అలాగే, మీ గురించి ఏం అడిగితే తమను సంతోషపెట్టే సమాధానాలను గ్రోక్ చెబుతుందో ఆ ప్రశ్నల్నే గ్రోక్‌ను వాళ్లు అడుగుతున్నారు’’ అన్నాను.‘‘మీరు కొట్టి చూశారా గ్రోక్లో నా గురించి?’’ అని హఠాత్తుగా అడిగారు మోదీజీ.‘‘చూశాను మోదీజీ. మీ గురించి గొప్పగా చెప్పింది. ‘స్ట్రాంగ్ లీడర్షిప్, విజన్ ఫర్ డెవలప్మెంట్, కమిట్మెంట్ టు నేషనలిజం’’ అని చాలా చాలా చెప్పింది’’ అన్నాను.‘‘అదెలా అమిత్ జీ! గ్రోక్‌కి ఇచ్చిన ఫీడ్ ఒకటే అయినప్పుడు వాళ్లకు ఒకలా, మీకు మరొకలా గ్రోక్ నా గురించి చెప్పటం ఏమిటి?’’ అని అడిగారు మోదీజీ.‘‘నమ్మించటం కోసం ఫీడ్‌లో రెండూ ఉంచుతారు మోదీజీ. ‘గ్రోక్’ ఎలాన్ మస్క్‌ది కదా! అయినా సరే, అమెరికాలో అత్యంత దుష్టుడైన మానవుడు ఎవరో గ్రోక్‌ని అడిగి చూడండి. ఎలాన్ మస్క్ అని చెబుతుంది. అదెలా ఉంటుందంటే... బస్తర్‌లో రెండో వైపు కూడా ఒకటో రెండో ఉంటాయి కదా, అలాగ’’ అన్నాను.బస్తర్ అనగానే మోదీజీ మళ్లీ మూడ్ ఆఫ్ లోకి వెళ్లిపోయారు. ‘‘బుర్రల్ని పాడుచేసేవారు బస్తర్ లోపల మాత్రమే ఉంటారని నేను అనుకోను అమిత్ భాయ్’’ అన్నారు.ఎంతో లోన్లీగా ఫీల్ అయితే తప్ప మోదీజీ అలా నన్ను అమిత్ ‘భాయ్’ అనరు. ‘‘చేస్తాను మోదీజీ, అదంతా సెట్ చేస్తాను. నన్ను దీవించండి’’ అన్నాను తలను కాస్త వంచి, చేతులు జోడిస్తూ. -
న్యాయవ్యవస్థలో అవినీతికి అడ్డుకట్ట ఎలా?
హోళీ ముందురోజు హోళీ కా దహన్ ఉంటుంది. హోళికా అన్న రాక్షసిని చంపడాన్ని భారత ప్రజలు పండు గగా జరుపు కొంటారు. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని చంపే ప్రయత్నం చేసిన రాక్షసి హోళికా. చెడు మీద మంచి గెలుపునకు ప్రతీకాత్మకంగా హోళీ దహ నాన్ని చూస్తారు.చెడు పెరిగి పోతున్నప్పుడు ప్రకృతి తన చర్యలని చేపడుతుందని అంటూ ఉంటారు. కొన్నిసార్లు ఇది నిజమేనని అనిపిస్తుంది. నిప్పు కూడా ప్రకృతిలో భాగమే. అది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి మీద తన ప్రతాపాన్ని ఈ నెల 14వ తేదీన చూపించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో చెలరేగిన మంటల వల్ల ఆయన ఇంట్లో భారీ నగదు ఉన్నట్టుగా పోలీసు, అగ్నిమాపక అధికారులు కను గొన్నారు. ఆ మంటలు దేశంలోని న్యాయ వ్యవస్థని మండించాయి.మంటలు చెలరేగినప్పుడు జస్టిస్ వర్మ ఇంట్లో లేరు. ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. మంటలు ఆర్పుతున్నప్పుడు ఒక గదిలో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదుని అధికారులు కనుగొన్నారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని సీనియర్ అధికారులకి తెలియజేశారు. ఫలితంగా విషయం సుప్రీంకోర్టు దాకా చేరింది. ఈ అంశాన్ని చర్చించడానికి భారత ప్రధాన న్యాయ మూర్తి సంజీవ్ ఖన్నా అత్యవసరంగా కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మను తిరిగి అలహాబాద్‌కు బదిలీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియంలోని సభ్యులు ఈ నేరానికి అంత ర్గత విచారణ అవసరమని అభిప్రాయపడినారని వార్తలు. కేవలం బదిలీతో ఆయనను వదిలేస్తే న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం పూర్తిగా పోతుందని కొంతమంది న్యాయమూర్తులు భావించినారు.న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసం నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్న తరువాత సుప్రీంకోర్టు శుక్రవారం అంతర్గత విచారణను ప్రారంభించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నుంచి కూడా సుప్రీంకోర్టు నివేదికను కోరింది. శుక్రవారం ఉదయం జరిగిన న్యాయమూర్తుల ఫుల్ కోర్టు సమావేశంలో శిక్షాత్మక బదిలీ సరిపోదని, న్యాయమూర్తిపై కొంత నిర్దిష్ట చర్య తీసుకోవాలని అభిప్రాయపడినట్టుగా చెబుతున్నారు. అంతర్గత విచారణకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంగీకరిస్తూ బదిలీని మొదటి అడుగుగా భావించినారు. బదిలీ ప్రక్రియ తక్షణమే అమల్లోకి రాదు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం తాజాగా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారు.జస్టిస్ వర్మ 1969 జనవరి 6న అలహాబాద్‌లో జన్మించి నారు. 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైనారు. 2016 ఫిబ్రవరి 1న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తరువాత 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టుకి బదిలీ అయ్యారు. న్యాయ వాద వృత్తిలో ఉన్నప్పుడు జస్టిస్ వర్మ రాజ్యాంగ, కార్మిక పారిశ్రామిక చట్టాలలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశారు. అలహాబాద్ హైకోర్టుకి న్యాయవాదిగా 2006 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకు పని చేశారు.హైకోర్టు న్యాయమూర్తిని ఎలా తొలగిస్తారు?న్యాయమూర్తులపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, న్యాయమూర్తులపై ఫిర్యాదు అందిన తరువాత ప్రధాన న్యాయమూర్తి ఆ సంబంధిత న్యాయమూర్తి నుంచి వివరణ అడుగుతారు. ఆ వివరణకు ప్రధాన న్యాయమూర్తి సంతృప్తి చెందనప్పుడు, లేదా ఆ విషయంపట్ల మరింత దర్యాప్తు అవసర మని భావించినప్పుడు అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తారు.ఆ కమిటీ తన నివేదికను సమర్పించిన తరువాత సంబంధిత న్యాయమూర్తి చేసిన దుష్ప్రవర్తన తీవ్రమైనదని, అతన్ని తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి భావిస్తే రాజీనామా చేయమని ఆ న్యాయమూర్తిని అడుగు తారు. ఆ న్యాయమూర్తి అందుకు నిరాకరిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం పార్లమెంట్ ద్వారా ఆయన తొలగింపునకు చర్యలు ప్రారంభించాలని ప్రధాన న్యాయమూర్తి ప్రభు త్వానికి లేఖ రాస్తారు.జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసం నుండి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్న తరువాత సుప్రీంకోర్టు కొలీజియమ్ ఆయన్ని అలహాబాద్‌కి బదిలీ చేయాలని సిఫారస్ చేయాలని వార్తలు వచ్చాయి. ఈ సిఫారస్పై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘అలహాబాద్ హైకోర్టు చెత్తబుట్ట కాదు. అతణ్ణి ఇక్కడికి పంపించడానికి వీల్లేదు. అవినీతిపరులను మేం అంగీకరించం. అవస రమైతే కోర్టు పనిని మానివేస్తాం’ అని అలహాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ అన్నారు. జస్టిస్ వర్మ ఇంటి నుండి 15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు బార్ అసోసియేషన్ తన ప్రెస్ నోట్లో పేర్కొంది.కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ శుక్రవారం ఉదయం రాజ్యసభలో జస్టిస్ వర్మ అంశాన్ని లేవనెత్తారు. ఈ షాకింగ్ కేసుతో దేశం మేల్కొందని ఆయన అన్నారు. ఈ సంద ర్భాన్ని పురస్కరించుకుని జైరాం రమేష్... ప్రయాగరాజ్‌లో విశ్వహిందూ పరిషత్ కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా గత డిసెంబర్లో 50 మంది పార్లమెంట్ సభ్యులు ఛైర్మన్‌కి పంపిన అభిశంసన నోటీసుని గుర్తు చేశారు. న్యాయమూర్తుల నియామకంలో న్యాయపరమైన జవాబుదారీతనం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంతో చర్చించాలని ఛైర్మన్‌ని కోరారు.సుప్రీంకోర్టు ఏం చేయాలి?సుప్రీంకోర్టు కోరిన తరువాత కూడా ఆరోపణలు ఎదు ర్కొంటున్న న్యాయమూర్తి రాజీనామా చేయనపుడు, ఇతర హైకోర్టులు బార్ అసోసియేషన్లు అతని బదిలీని అంగీకరించ నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలి? ఇదీ ప్రశ్న.అభిశంసన అనేది కార్యరూపం దాల్చ డానికి చాలా సమయం పడుతుంది. అందు కని ఆ న్యాయమూర్తికి ఎలాంటి పని అప్ప గించకుండా చర్యలు తీసుకోవాలి. ఆ అవ మాన భారంతో ఆ న్యాయమూర్తి రాజీ నామా చేసే అవకాశం ఉంది.ఇది ఇలా ఉంటే సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే అధికారం తమకు ఉందని లోక్‌పాల్ అభిప్రా యపడింది. ఇది చాలా కలవరపెట్టే విషయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడి ఆ ఉత్తర్వులని స్టే చేసింది. అది సుప్రీంకోర్టు ముందుకు త్వరలో రానున్నది. సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూడాలి.న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎవరూ సహించరు. ఇది చాలా తీవ్రమైన విషయం. న్యాయ వ్యవస్థలోనే కాకుండా సమాజంలో అవినీతి అనేది ఒక పెద్ద సమస్యగా మిగిలిపోయింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు తన దృష్టిని సారించా ల్సిన సమయం ఆసన్నమైంది.డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు -
కొంటే... కొరివి దయ్యమే!
‘‘భారత్ ఒక సరికొత్త ప్రపంచానికి అలవాటు పడాల్సిన అవసరం ఉంది’’ – ట్రంప్‌ను ఉద్దేశించి విదేశీ వ్యవహా రాల మాజీ కార్యదర్శి ఒకరు అన్న మాట. ఈ కొత్త ప్రపంచం కేవలం ఒప్పందాలు, వ్యాపారాలకు మాత్రమే పరిమితమనీ; మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరనీ కూడా ఆయన అన్నారు. ఒక దౌత్యవేత్త ఈ అంచనాకు వచ్చారంటే కచ్చితంగా అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అనూహ్యమైన వ్యక్తిత్వమే కారణమై ఉంటుంది.తేలిగ్గా చెప్పాలంటే... ఈ రోజుల్లో పరిస్థితి నాటకీయంగా మారిపోయింది. కొత్త సంవత్సరంలో యూఎస్ఏ తన లావా దేవీలను వేగంగా మొదలు పెట్టేసింది. ఈ ఏకపక్ష ధోరణితో అమెరికా మిత్రులు, శత్రువులు కూడా తమని తాము కాపాడు కునేందుకు దాక్కుండిపోతున్నారు. లేదంటే వ్యక్తిగతంగా ట్రంప్ ముందు ప్రత్యక్షమై ఆయన శీతకన్ను పడకుండా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండింటి వల్ల కూడా ఏదో అర్థవంతమైన పని జరుగుతుందని ఎవరూ ఆశించడం లేదు.ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ట్రంప్ ఇప్పుడు అమెరికన్ కంపెనీ ‘లాక్‌హీడ్ మార్టిన్ ’ తయారు చేసిన ఎఫ్–35 యుద్ధ విమానాలు కొనమని భారత్‌కు చెబుతున్నారు. భారత్‌తో ఉన్న సుమారు 3,500 కోట్ల డాలర్ల వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు అన్నమాట. అయితే ఏ అంత ర్జాతీయ ఒప్పందం, వ్యాపారమైనా కేవలం అమ్ముతామంటే సరిపోదు. కొంటున్నామని అవతలి వారు చెప్పాలి. భారత్దృష్టి కోణం నుంచి చూస్తే – అమెరికా అమ్ముతానూ అంది, మరి కొనదలుచుకుంటే ఆ ఎఫ్–35 యుద్ధ విమానాలు ఎలాంటివో పరిశీలించాలి కదా?తడిసి మోపెడు ఖర్చురవాణా, గాల్లోంచి సామగ్రి పడవేసే ‘డగ్లస్ డీసీ–3 డకోటా’, ‘ఫెయిర్ ఛైల్డ్ ప్యాకెట్ సీ119 జీ’ మినహా మరే ఇతర అమెరికా విమానాన్నీ భారతీయ వైమానిక దళం ఇంతవరకు వాడలేదు. 1947 నుంచి చూసినా అమెరికా యుద్ధ విమానం మన వద్ద ఎప్పుడూ లేదు. కాబట్టి అకస్మాత్తుగా ఎఫ్–35లను కొనుగోలు చేయడం అంటే, అది కూడా ట్రంప్ మాటపై ఆధారపడి అంటే... కొంచెం అనుమానంగా చూడాల్సిన వ్యవహారమే! అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు, చరిత్ర లను పరిగణనలోకి తీసుకుంటే ఇలా చూడటం మరీ ముఖ్య మవుతుంది. ఒక విషయమైతే స్పష్టం. భారత్ వంటి అతిపెద్ద దేశంలో వైమానిక దళం ఒక్క రోజులో సిద్ధం కాదు. వైమానిక దళాన్ని నిర్మించడం అంత తేలికైన వ్యవహారమూ కాదు. భారీ పెట్టు బడులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, రిస్క్ తీసుకో గలిగిన తెగువ, సుశిక్షితులైన సిబ్బంది అవసరం. ‘జేన్ ్స ఆల్ ద వరల్డ్స్ ఎయిర్ క్రాఫ్ట్’ మ్యాగజైన్∙ప్రకారం... ఎఫ్–35 యుద్ధ విమానాలకు (ఐదో తరం, బహుళార్థక, స్టెల్త్ రకం) ఆర్డర్ పెట్టిన తరువాత మొదటి విమానం అందేందుకు 15 ఏళ్లు పడుతుంది! ఇంకో విషయం – భారత్ ఏ రోజు కూడా లాక్ హీడ్ తయారు చేసే యుద్ధ విమానపు కొనుగోలుదారుగా కానీ, అమెరికా పారిశ్రామిక భాగస్వామిగా కానీ లేదు. నిజానికి ఎఫ్–35 యుద్ధ విమానాలు హైటెక్ పాశ్చాత్య దేశాల కోసం, అమెరికా రక్షణకు, సెక్యూరిటీ భాగస్వాములైన ఇతర దేశాల కోసం ఉద్దేశించినవి. 1996లో ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇజ్రాయెల్, సింగపూర్, స్పెయిన్ , స్వీడన్ లకు ఈ కార్యక్రమం గురించి వివరించారు. ఎఫ్–35లు ఖరీదైనవని అప్పుడే అర్థమైపోయింది (ట్రంప్ సుంకాల తీరుతో తాజాగా నాటో దేశాలు కూడా వీటి కొనుగోలు గురించి పునరాలోచనలో పడ్డాయి).ముందుగా యూకేతో కలిసి పనిచేయాలని, పది శాతం ఖర్చులు ఆ దేశం భరించాలని యూఎస్‌తో ఒప్పందం జరిగింది. ఇటలీ, నెదర్లాండ్స్ చెరి ఐదు శాతం ఖర్చులు భరించేలా ఒప్పందాలు కుదిరాయి. మూడో దశలో డెన్మార్క్, నార్వే... 1–2 శాతం ఖర్చులు భరించేలా భాగస్వాములైనాయి. అనంతరం, ఆస్ట్రేలియా, కెనడా, టర్కీ తమ ఖర్చు తామే భరించేలా చేరాయి. 2012–13 నాటి ‘జేన్ ్స ఆల్ ద వరల్డ్స్ ఎయిర్‌క్రాఫ్ట్’ పత్రికను చూస్తే ఒక్కో ఎఫ్–35ఎ యుద్ధ విమానం ఖరీదు సుమారు 3.73 కోట్ల డాలర్లు. 2017 నాటికి ఇది 9.43 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు సుమారు పది కోట్ల డాలర్ల పైమాటే (రూ.860 కోట్లు). మారకం విలువలు, రూపాయి బలహీనపడటం వంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎఫ్–35ల కొనుగోలు భారత్ ఖజానాకు భారీగా కన్నమేసేదే! ఇంత భారీ ఖర్చు కచ్చితంగా రాజకీయంగానూ సంచలనంసృష్టిస్తుంది.దీంతోపాటే ఎఫ్–35 యుద్ధ విమానాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞాన సంబంధిత సమస్యలు చాలానే ఉన్నాయి. అమెరికాలోనూ దీని గురించి వివాదాలు ఉన్నాయి. సమస్యలు ఒకవైపు, ఎప్పటికప్పుడు పెరిగిపోయే ఖర్చులు ఇంకోవైపు ఈ యుద్ధ విమానపు కొనుగోలుపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఆర్థికాంశాలు, సాంకేతిక పరిజ్ఞాన అంశాలూ కాసేపు పక్కన పెడదాం. యుద్ధ విమానం భద్రత కూడా ఇక్కడ ప్రశ్నా ర్థకమే. 2010 అక్టోబరులో ఇలాంటి ఒక సమస్యను గుర్తించారు. విమానం ఎగురుతూండగానే ఎలాంటి ఆదేశాలూ లేకుండానే ఇంజిన్ ఆఫ్ అయ్యేందుకు వీలు కల్పించే ఓ సాఫ్ట్ వేర్ సమస్య తలెత్తింది. అప్పట్లో ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఈ విమానాలను కొంత సమయం పాటు నిలిపివేశారు కూడా! పదిహేనేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ ఈ యుద్ధ విమానం ప్రయాణిస్తూండగా సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. 2014 జూన్ , జూలైల్లో ఎగ్లిన్ ఎయిర్‌ఫోర్స్ స్థావరం వద్ద కొన్నింటిలో ఇంజిన్ వైఫల్యం చోటు చేసుకుంది. ఈ ఘటన తరువాత వాటి వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కనుక అలాంటి విమానాలను కొని, కొరివితో తలగోక్కునే పరిస్థితిని భారత్ తెచ్చు కోదనే ఆశిద్దాం! అభిజిత్ భట్టాచార్యవ్యాసకర్త ‘ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ శాశ్వత సభ్యులు -
దక్షిణ భారతంతో హిందీ తగువు
దక్షిణ భారతదేశానికి (తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ) ఉత్తర భారతదేశానికి ప్రధానంగా కనబడే వైరుద్ధ్యం భాషతో ముడిపడి ఉంది. లిపిలోగానీ, పద ప్రయోగంలో గానీ, ఉత్పత్తి సంబంధితఅవగాహనలోగానీ దక్షిణ భారత భాషలు ఉత్తర భారత భాషలకంటే భిన్నమైనవి.లిపి రూపంలో దక్షిణ భారత భాషలకు ప్రాకృత పాళీ భాషతో సంబంధమున్నా అవిక్రమంగా భిన్నమైన అక్షర రూపం తీసుకున్నాయి. బహుశా దక్షిణ భారత భాషలైన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం – సంస్కృతం ఈ దేశంలో కాలిడక ముందున్న హరప్పన్ భాషతో ముడిపడిఉండవచ్చు. ఈ సంబంధం మీద తమిళనాడులో ఈ మధ్యనే కొంత లోతైన పరిశోధన మొదలైంది.హిందీ, మరాఠీ, గుజరాతి, రాజస్థానీ పూర్తిగా సంస్కృత ఆధా రిత భాషలు. అక్షర రూపంగానీ, పదకోశంగానీ, అవి బోధించిన జీవన విధానంగానీ సంస్కృత భాష సంస్కృతి నుండి రూపొందించ బడ్డాయి. బెంగాలీ, ఒరియా ఈ భాషా విధానాలకు కాస్త భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తాయి. అవి పదకోశంలో హిందీతో మైత్రిలో ఉన్నట్టు కనిపిస్తాయి. లిపి భిన్నమైందే. అయితే అవి కూడా మాగధి, ప్రాకృతి నుండే ఎదిగాయని వాళ్ళు భావిస్తారు. సంస్కృతం ఇండో–యూరో పియన్ భాష అని, బెంగాలీ పూర్తిగా భారతీయ భాష అనీ బెంగాలీలు కూడా భావిస్తారు. అయితే తమిళం లాగా బెంగాలీకి అతి ప్రాచీన చరిత్ర ఉన్నట్టు కనిపించదు. సంగమ సాహిత్యం లాంటి ప్రాచీన ఉనికి ఆధారాలు బెంగాలీకి లేవనే చెప్పాలి.ఆంగ్లాన్ని అక్కున చేర్చుకున్న దక్షిణాదిదక్షిణ భారత భాషలు అభివృద్ధి చెందిన ఐదు రాష్ట్రాల ఆర్థిక స్థితి ఆ భాషల వ్యవసాయక మైత్రి వల్ల బాగా మారింది. ఈ ఐదు రాష్ట్రాలు సమతుల్యంగా వ్యవసాయ అభివృద్ధిలో, విద్యాభివృద్ధిలో, ఇంగ్లిష్ భాషను కూడా త్వరగా తమలో లీనం చేసుకోవడంలో ఒకే లక్షణాలను కలిగి ఉన్నాయి. వీటి మీద హిందీ భాషను రుద్దినప్పుడు ఒక్క తమిళనాడులోనే పెరియార్ రామసామి ఉద్యమం ద్వారా బల మైన వ్యతిరేకత వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో అటువంటి నాయకత్వం లేక హిందీని మోస్తూ వచ్చాయి.1960 దశకంలో నేను చిన్న గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు తెలుగు అక్షరాల తరువాత హిందీ అక్షరాలు నేర్పారు. ఆ తరువాత చాలా దూరపు గ్రామంలో ఉన్న మిడిల్ స్కూల్లో చేరాక ఇంగ్లిష్ అక్షరాలు నేర్పడం ప్రారంభమైంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ అక్షర జ్ఞానంలో హిందీ నేర్చుకోవడం కష్టతరంగా ఉండింది. ఇంగ్లిష్ అక్షరాలు నేర్చుకోవడం అన్నింటికంటే సులభంగా ఉండింది. పదకొండో తరగతి వరకూ హిందీ ఒక సబ్జెక్టుగా చదివినా అది నాకు జీవితంలో ఎటువంటి పనిలో, నేర్పులో ఉపయోగపడ లేదు. నా జ్ఞానాన్ని విస్తృతపర్చలేదు. ఇంగ్లిష్‌లో, తెలుగులో ఎక్కువ జ్ఞానం సంపాదించడానికి నిజానికి హిందీ అడ్డుపడింది. పరీక్షా సమ యాల్లో 25 మార్కులు సంపాదించి పాస్ కావడం ఒక టార్చర్‌గా మారేది. నాతో చదువుకున్న మెజారిటీ విద్యార్థుల అనుభవం అదే. తమిళనాడు హిందీని స్కూళ్లలో బోధించ నిరాకరించి ఇంగ్లిష్, తమిళ భాషలపై మాత్రమే దృష్టి పెట్టినందున తమిళ బ్రాహ్మణులతో పాటు, తమిళులందరూ లాభపడ్డారు. బహుశా అందులో ఇప్పుడు పెరియార్‌ను దూషణలాడే నిర్మలా సీతారామన్, ఇంగ్లిష్ బాగా నేర్చు కున్నందువల్లే విదేశీ మంత్రి అయిన జయశంకర్ కూడా ఉన్నారు. పెరియార్ తమిళ భాషను బార్బారిక్ (ఆటవిక) భాష అన్నారని నిర్మలా సీతారామన్ కొత్త సిద్ధాంతం చెబుతున్నారు.వాళ్లెందుకు ఇక్కడిది నేర్చుకోలేదు?నేను మూడు భాషల చదువుతో ఆంధ్రప్రదేశ్‌లో కుస్తీ పడుతున్న రోజుల్లో ఉత్తరాది హిందీ రాష్ట్రాల విద్యార్థులు మాత్రం ద్విభాషా విద్యా విధానంలో చదువుకున్నారు. వాళ్లకు ఏ దక్షిణ భారత భాషనూ మూడో భాషగా నేర్చుకునే అవసరం లేకుండింది. ఇప్పటికీ దాదాపు అదే పరిస్థితి. ఈ మధ్యనే ఉత్తరాదిలో నామమాత్రంగా ఏదో ఒక మూడో భాష పాఠశాల స్థాయిలో ఉండాలని నిర్ణయిస్తే హరియాణా మూడవ భాషగా పంజాబీని చేర్చుకుంది.ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఏ మూడో భాషను త్రిభాషా విధానాల్లో చేర్చారో తెలియదు. అది ఏదైనా అదే సంస్కృత–హిందీ లిపి, పద కోశం ఉన్నవాటిని మూడో భాషగా నామమాత్రంగా పెట్టుకుంటారు. హిందీని దేశ భాషగా అందరి మీదా రుద్దే హిందీవాదుల మాయా వాదం ఇది. ఇది స్వాతంత్య్రం వచ్చిన మొదటి దశకంలో కూడా జరిగింది. ఇప్పుడు ఆరెస్సెస్/బీజేపీ హయాంలో మళ్ళీ మొదలైంది. ఇంకా పెరుగుతుంది. ‘ఏక జాతి, ఏక భాష’ సిద్ధాంతంలో ఇదంతా భాగం.దక్షిణాది రాష్ట్రాలు చాలా రంగాల్లో ఉత్తరాది రాష్ట్రాల కంటేముందున్నాయనే విషయం తెలుసు. బొంబాయి, గుజరాత్, ఇతర ఉత్తరాది పెట్టుబడిదారులు తమ పిల్లల్ని పూర్తిగా ఇంగ్లిష్ బోధించే ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తూ పాలకులుగా మాత్రం తాము హిందీ వాదులమనే డ్రామా ఆడుతున్నారు. త్రిభాషా నాటకమంతా దక్షి ణాది అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆడుతున్నది.అభివృద్ధి ప్రధానంగా ఆధునిక స్కూలు విద్యతో ముడివడి ఉన్నది. ఆ స్కూలు విద్య దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంకంటే మెరుగ్గా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్కూలు విద్యను పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుకున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలు స్కూళ్లలో ఇంగ్లిష్/ప్రాంతీయ భాషల సెక్షన్లను సమాంతరంగా నడుపుతున్నాయి. ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం విద్య నుండి శ్రమజీవుల కుటుంబాలను, కులాలను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం విద్య దక్షిణాదికంతా పాకింది. ఈ విద్యను హిందీ ఆధి పత్యవాదం అడ్డుకోజూస్తోంది. అందులో భాగంగానే తమిళనాడులో మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యను తమిళ భాషలో బోధించాలని దేశ హోంమంత్రి అమిత్ షా కొత్త వాదన ప్రారంభించారు. అది ఆ రాష్ట్రం నిర్ణయించుకుంటుంది. అమిత్ షా ఎలా బలవంతం చేస్తారు? నిర్మలా సీతారామన్ పెరియార్‌పై కూడా దాడి చేస్తున్నారు.హిందీ మీద అంత ప్రేమ ఉన్న నిర్మలా సీతారామన్ తన కూతుర్ని హిందీ మీడియంలో ఎందుకు చదివించలేదు? పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో చదివించి, బ్రిటన్ చదువులకు ఎందుకు పంపారు? ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని అధికారం నిలబెట్టుకోవడానికి వాడుకుంటే అది ఆమె ఇష్టం. కానీ మొత్తం దక్షిణ భారతదేశాన్ని దెబ్బతీసే ఆ సిద్ధాంతాలను ఆమె కూడా రోజువారీ వల్లించడం బాగాలేదు.అన్నింటికీ తలూపుతున్న బాబు!హిందీ భాష, దక్షిణాది పార్లమెంట్ సీట్లను తగ్గించే డీలిమిటేషన్ పాలసీలకు వ్యతిరేకంగా దక్షిణాది ఐదు రాష్ట్రాలూ ఐక్యంగా పోరాడ వలసి ఉంది. అయితే చంద్రబాబు మద్దతుపై ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఆధారపడి ఉన్నప్పటికీ ఆయన వారు ఏమి చేసినా మద్దతు ఇస్తున్నారు. ఒకప్పుడు ‘నేనే కింగ్ మేకర్ని’ అన్న బాబు ఇప్పుడు మోదీ, అమిత్ షా చెప్పింది బడి పిల్లాడిలా పాటిస్తున్నారు. ఆయన ఎంపీలు కూడా ఆయన చేతిలో ఉన్నట్టు కనిపించడం లేదు. సొంత మెజారిటీ లేని బీజేపీ... ఆరెస్సెస్ ఎజెండాను అమలు చేసి దక్షిణ భారతాన్ని దెబ్బతీస్తే అందుకు పూర్తి బాధ్యత చంద్రబాబుదే అవుతుంది.హిందీ వ్యవహారం గానీ, డీలిమిటేషన్ గానీ ప్రమాదకరమైనవి. పవన్ కల్యాణ్ ఆరెస్సెస్‌ను మించిన రామభక్తుడై మోదీ, మోహన్ భాగవత్ సైతం అసహ్యించుకునే వేషాలు వేస్తున్నారు. వారి హిందీ, డీలిమిటేషన్ వాదనలు తమ వాదనలైనట్టు నటిస్తున్నారు.స్టాలిన్ మొదలెట్టిన పోరాటానికి ఒక్క ఏపీ తప్ప మిగతా అన్ని రాష్ట్రాలూ మద్దతిస్తున్నాయి. ఇది ముదిరితే ఈ పోరులో చంద్రబాబు ముందుగా మునిగిపోతారు. దక్షిణ భారతదేశం ఆయన్ని ఒక ద్రోహిగా నిలబెడుతుంది.» అభివృద్ధి ప్రధానంగా ఆధునిక స్కూలు విద్యతో ముడి పడి ఉంది. ఉత్తరాది పెట్టుబడిదారులు తమ పిల్లల్నిఇంగ్లిష్ ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తూ పాలకులుగా మాత్రం తాము హిందీవాదులమనే డ్రామా ఆడుతున్నారు.» హిందీ భాష, దక్షిణాది పార్లమెంట్ సీట్లను తగ్గించే డీలిమిటేషన్ పాలసీలకు వ్యతిరేకంగా దక్షిణాది ఐదు రాష్ట్రాలూ ఐక్యంగా పోరాడవలసి ఉంది. కానీ, ఒకప్పుడు ‘నేనే కింగ్ మేకర్ని’ అన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి అన్నింటికీ తలాడిస్తున్నారు.-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు-ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
దక్షిణాది హక్కుల శంఖారావం
కేంద్రానికీ, దక్షిణాది రాష్ట్రాలకూ మధ్య ఏకీ భావ, సానుకూల వాతావరణం రోజురోజుకీ చెదిరి పోతున్నది. ఈ నేపథ్యంలో – తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ నెల 22న చెన్నైలో దక్షిణాది ముఖ్యమంత్రుల సమావే శాన్ని ఏర్పాటు చేయటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజా స్వామిక కూటమి (ఎన్డీయే)లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా దేశంలోని తక్కిన దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ ఆహ్వాన పత్రాలు పంపారు. నూతన విద్యా విధానం పేరుతో హిందీ బోధనను తప్పనిసరి చేయాలని చూడటం, నియోజకవర్గాల పునర్విభ జనకు రంగం సిద్ధం చెయ్యటం వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోవటం కోసం మద్దతును సమీకరించుకునేందుకు స్టాలిన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. సమావేశానికి పశ్చిమ బెంగాల్, పంజాబ్ ముఖ్య మంత్రులనూ, ఇతర రాష్ట్రాల పార్టీ నాయకులనూ స్టాలిన్ ఆహ్వానించారు. 2056 వరకు వాయిదా వేయాలి!నియోజకవర్గాల పునర్విభజన విషయాని కొస్తే, లోక్ సభలో ప్రస్తుతమున్న 543 స్థానాల సంఖ్యను 1973లో ఏర్పాటైన మూడవ డీలిమిటే షన్ కమిషన్ 1971 జనగణన ప్రకారం నిర్ణయించింది. కుటుంబ నియంత్రణ అన్ని రాష్ట్రాల్లో పక డ్బందీగా అమలయ్యేలా చూడటం కోసం ఇంది రాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను 2001 జనాభా లెక్కల నాటి వరకు స్తంభింపజేసింది. జనాభాను తగ్గించుకుంటే దేశ ప్రజలు పరిమిత వనరులతో సుఖంగా బతకగలరనే ఉద్దేశంతో ఉత్తరాదిలో కూడా దానిని సాధించేవరకు పార్లమెంటరీ నియో జకవర్గాల పునర్విభజనను వాయిదా వేయాలని నిర్ణయించారు. కానీ, 2001 లెక్కల తర్వాత కూడా ఉత్తరాది పరిస్థితిలో మార్పు కనిపించక పోవడంతో అప్పటి వాజపేయి ప్రభుత్వం ఈ ప్రక్రియను 2026 వరకు స్తంభింపజేసింది. ఇప్ప టికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఇక ఇప్పుడు నియోజక వర్గాల విభజనను చేపడితే దక్షిణాది రాష్ట్రాలు 20 స్థానాలకు పైగా కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. పునర్విభజన వల్ల ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమే అదనంగా 60 స్థానాలు పొందుతుందని అంచనా. అంతేకాదు, లోక్‌సభ స్థానాల్లో దక్షిణాది వాటా 19 శాతం తగ్గిపోయి, హిందీ మాట్లాడే రాష్ట్రాల వాటా 60 శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ అన్యాయాన్ని తొలగించడం కోసం నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియను 2056 వరకు వాయిదా వేయాలని స్టాలిన్ కోరుతున్నారు. అందుకే ఈ ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ సమావేశం. ఇప్పటికే కేంద్రం నుంచి అందుతున్న నిధుల వాటాలో దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతుండటం స్పష్టంగానే కనిపిస్తోంది. తమిళ నాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి 2024లో ప్రత్యక్ష పన్నుల ద్వారా 25 శాతం, సెంట్రల్ జీఎస్టీ ద్వారా 27 శాతం నిధులు కేంద్రానికి అందగా, వాటి నుంచి ఈ రాష్ట్రాలకు 15 శాతం నిధులే వచ్చాయి. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రం నుంచి 36 శాతం నిధులు పొందాయి. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వమే ఇటీవల పార్లమెంటులో తెలియజేసింది. ఆంగ్లమే కొనసాగుతుందన్న హామీ!ఇక తమిళనాడు పాటిస్తున్న ద్విభాషా విధా నానికి చాలా చరిత్రే ఉంది. 1937లో, 1968లో త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆ రాష్ట్రం దానిని వదిలించుకుంది. 1937లో, అంటే బ్రిటిష్ హయాంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీని పాలించిన సి.రాజగోపాలాచారి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల్లో హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిని పెరియార్ రామస్వామి సహా పలువురు పెద్దలు, ప్రతిపక్ష జస్టిస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడంతో మూడేళ్ల పాటు తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమం సాగింది. దానితో హిందీ తప్పనిసరి అనే ఉత్తర్వును ఉపసంహరించుకున్నారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అధికార భాషపై రాజ్యాంగ సభలో వాడి, వేడి చర్చ జరిగింది. ఫలితంగా 1950 (రాజ్యాంగ అవతరణ సంవత్సరం) నుంచి 15 ఏళ్ల కాలం హిందీని అధి కార భాషగా, ఆంగ్లాన్ని అసోసియేట్ అధికార భాషగా కొనసాగించాలని నిర్ణయం తీసుకు న్నారు. దాంతో 1965 తర్వాత దేశానికి హిందీ ఏకైక అధికార భాష కాబోవడాన్ని హిందీయేతర రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఆ కారణంగా 1965 తర్వాత సైతం ఆంగ్లాన్ని కొనసాగించడానికి నిర్ణ యిస్తూ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1963లో అధికార భాషా చట్టాన్ని తెచ్చారు. అయినా దక్షి ణాదికి హిందీ భయం వదల్లేదు. 1965 దగ్గరపడ టంతో మద్రాస్ రాష్ట్రంలో హిందీ వ్యతిరేక ఉద్యమం తిరిగి పుంజుకున్నది. 70 మంది ఆందో ళనకారులు ప్రాణాలర్పించారు. దానితో హిందీ యేతర రాష్ట్రాలు కోరుకున్నంత కాలం ఆంగ్లం అధికార భాషగా కొనసాగుతుందని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హామీ ఇచ్చి పరిస్థితిని సద్దుమణిగించారు. ఆధునిక తమిళనాడు రూపశిల్పి సి.ఎన్. అన్నా దురై 1963లో పార్లమెంటులో అధికార భాషల బిల్లుపై చర్చలో మాట్లాడారు. 42 శాతం భారత ప్రజలు మాట్లాడుతున్న భాష గనుక హిందీని జాతీయభాషగా చేయాలనే డిమాండ్‌ను తన సహేతుక వాదనతో తిప్పికొట్టారు. హిందీ మాట్లాడే ప్రజలంతా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఒకే చోట కేంద్రీకృతమయ్యారని, దేశమంతటా విస్తరించి లేరని, అందుచేత హిందీ జాతీయభాష కాజాలదని స్పష్టం చేశారు. ఈ వాదన ఇప్పటికీ వర్తిస్తుంది. దక్షిణాది ప్రయోజనాలు పట్టని టీడీపీవెనుక ఇంత చరిత్ర ఉండగా, ఎన్నికల్లో లబ్ధి కోసం స్టాలిన్ ఈ సమావేశం పెడుతున్నారనటం రాజకీయమే అవుతుంది. కేంద్రం అవలంబిస్తున్న ఫెడరల్ వ్యతిరేక విధానాలపై రాష్ట్రాలను సమై క్యం, సంఘటితం చేయడానికే స్టాలిన్ సారథ్య పాత్ర వహిస్తున్నారు. ‘తెలుగుదేశం’ మూల పురు షుడు ఎన్టీ రామారావు ఏనాడో ‘కేంద్రం మిథ్య’ అన్నారు. రాష్ట్రాల స్వేచ్ఛకు, స్వతంత్ర మను గడకు ప్రాధాన్యమిచ్చే ఫెడరల్ వ్యవస్థను ఆయన గౌరవించారు. ఈ విషయంలో కేంద్రాన్ని సైతం ఢీకొన్నారు. కానీ ఇప్పటి ఆ పార్టీ నేతలు హిందీని జాతీయ భాషగా అంగీకరించని రాష్ట్రాల హక్కును, ఆ యా భాషల స్వతంత్రాన్ని హరించే ప్రయత్నాలకు అడ్డుచెప్పకపోగా అదే భారతీయత అనే పోకడలను అనుసరిస్తున్నారు. కూటమి భాగస్వాములుగా ఉంటున్నారే తప్ప, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల గురించి ఆలోచించటం లేదు. గార శ్రీరామమూర్తి వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సిరియాను కుదుటపడనివ్వరా?
అరవై సంవత్సరాలపాటు అస్సాద్ వంశ నియంతృత్వంలో మగ్గి గత డిసెంబర్లో విముక్తి చెందిన సిరియా ప్రజలు కుదుట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అందుకు రెండు శక్తుల నుంచి సవాళ్లు ఎదురవుతు న్నాయి. ప్రజల తిరుగుబాటుతో దేశం విడిచి పారిపోయిన బషార్ అల్– అస్సాద్, ఇజ్రాయెల్! అస్సాద్ సవాలు కనీసం పరోక్షమై నది, ఇజ్రాయెల్‌ది ప్రత్యక్షమైనది. డిసెంబర్ మొదటి వారంలో అస్సాద్ పతనం తర్వాత సిరియాను మరిచిపోయిన ప్రపంచం, పది రోజుల క్రితం అకస్మాత్తుగా పెద్ద ఎత్తున సాయుధ ఘర్షణ వార్తలు రావటంతో ఉలిక్కిపడింది. ఆ విధంగా దృష్టి ఉక్రెయిన్ యుద్ధం నుంచి కొద్ది రోజులపాటు ఇటు మళ్లింది. వారం రోజులపాటు ఆ ఘటనలలో సుమారు 1,500 మంది చనిపోయినట్లు అంచనా. అస్సాద్ పతనానికి ముందు పది రోజులపాటు సాగిన తిరుగుబాటులోనూ అంతమంది చనిపోలేదు.తిరగబడిన అలావైట్ తెగఈ ఘర్షణలకు కారణం, అస్సాద్‌కు చెందిన మైనారిటీ అలావైట్ తెగవారు తిరగబడటం! వారు ప్రధానంగా సిరియాలోని పశ్చిమ ప్రాంతాన మధ్యధరా సముద్ర తీరం వెంట నివసిస్తారు. వారు తెగను బట్టి మైనారిటీ మాత్రమేగాక, మతం రీత్యానూ మైనారిటీ. దేశంలో సున్నీలది మెజారిటీ కాగా వీరు షియాలు. షియా రాజ్యమైన ఇరాన్, అస్సాద్‌ను బలపరచటానికి గల కారణాలలో ఇది కూడా ఒకటి. తిరుగుబాటు విజయవంతమైనప్పటి నుంచి అలావైట్లలో సహజంగానే భయం ఏర్పడింది. వారు లెబనాన్‌కు తరలి పోవటం మొదలైంది. తిరుగుబాటు నాయకుడు అహమద్ అల్–షరారా, అటు వంటి ఆందోళనలు అక్కర లేదనీ, దేశంలోని అన్ని తెగలు, మతాలు, వర్గాలను ఏకం చేసి దేశాన్ని ముందుకు తీసుకుపోవటం తన లక్ష్యమనీ మొదటి రోజునే ప్రకటించారు.కానీ అలావైట్ షియాలకు, సున్నీలకు మధ్య స్థానికంగా కొన్ని కలహాలు జరగగా, ఉన్నట్లుండి అలావైట్ల పక్షాన సాయుధులు రంగంలోకి దిగారు. అనివార్యంగా ప్రభుత్వ సేనలు మోహరించగా ఘర్షణలు తీవ్ర రూపం తీసుకున్నాయి. వారం రోజులలో 1,500 మంది చనిపోయినట్లు అనధికార అంచనా కాగా, ప్రభుత్వం చేసిన ప్రకటనను బట్టి వారిలో సుమారు 200 మంది సైనికులున్నారు. మిగిలిన 1,300 మందిలో అలావైట్ పౌరులు ఎందరో, సాయుధ దళాల వారెందరో తెలియదు. అస్సాద్ సైన్యంలోని ఒక దళం తిరిగి ఒకచోట చేరి దాడులు ఆరంభించింది. అది స్థానికంగా జరిగిన పరిణామమా, లేక ప్రస్తుతం రష్యాలో తలదాచుకున్న అస్సాద్ ప్రమేయ ముందా అనేది తెలియదు. అందుకు అవకాశాలు తక్కువన్నది ఒక అభిప్రాయం. ఆయనకు రష్యా మొదటి నుంచి మద్దతునివ్వటం, ప్రస్తుతం ఆశ్రయాన్నివ్వటం నిజమే అయినా, సిరియా కొత్త ప్రభు త్వంతో సత్సంబంధాలకు ప్రయత్నిస్తున్నది. మధ్యధరా సముద్రపు తూర్పు తీరాన భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో గల సిరియాలో రష్యాకు ఒక నౌకా స్థావరం, ఒక వైమానిక స్థావరం ఉన్నాయి. యూరప్‌ను ఎదుర్కొనేందుకు అవి చాలా అవసరం. అందువల్ల సిరియా కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాల ద్వారా ఆ స్థావరాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యా ఇంతకాలం అస్సాద్‌కు పూర్తి మద్దతుగా ఉండినప్పటికీ, తమ కొత్త పరిస్థితులలో రష్యా సహాయం అనేక విధాలుగా అవసరం గనుక, అల్–షరారా కూడా అందుకు సుముఖత చూపుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో అస్సాద్‌ను సిరియాలో తన పాత సైనిక దళాల ద్వారా ఘర్షణలకు రష్యా అనుమతించటం జరిగేది కాదు. పరోక్షంగానైనా అస్సాద్ ప్రోత్సాహం లేక ఇది జరిగేది కాదనే అభిప్రాయమూ ఉంది.అందరినీ ఏకం చేసే దిశగా...ఈ తర్కాన్ని బట్టి చూసినపుడు, ఘర్షణలకు కారణం అస్సాద్ సైన్యానికి చెందిన స్థానికమైన ఒక సైనిక దళమని భావించవలసి ఉంటుంది. అల్–షరారా ప్రకటించింది కూడా అదే. ఆ ఒక్క దళాన్ని చివరకు తుడిచి పెట్టామన్నారాయన. అయితే, ఇటువంటి పరిస్థితి తిరిగి తలెత్తబోదనే హామీ ఏమైనా ఉందా? దేశ నిర్మాణంలో అలావైట్లు కూడా భాగస్వాములని, వివిధ వర్గాల మధ్య ఎటువంటి తారతమ్యాలు ఉండబోవని తమ తిరుగుబాటు విజయవంతమైన మొదటిరోజునే స్పష్టం చేసిన తాత్కాలిక అధ్యక్షుడు అల్–షరారా, గమనార్హమైన పని ఒకటి చేశారు. అది – ఘర్షణలపై నియమించిన విచారణ కమిటీలో అలావైట్లను కూడా చేర్చటం! ఘర్షణలలో తమ వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపైనా చర్యలుంటాయని ప్రత్యే కంగా చెప్పారు. ఈ వైఖరిలో రాజకీయమైన, పరిపాలనాపరమైన వివేకం కన్పిస్తాయి. సున్నీలు, షియాలు, క్రైస్తవులు, కుర్దులు, ద్రూజ్లు మొదలైన తెగలతోపాటు ప్రాంతాల వారీగా కూడా చీలి పోయి ఉన్న దేశాన్ని ఏకం చేయటం, ఒకటిగా ముందుకు నడిపించటం తేలిక కాదు. అగ్రస్థానాన గల నాయకుడు, తన పార్టీ, ప్రభుత్వం, సైన్యం అందరూ దార్శనికతతో ఏకోన్ముఖంగా పనిచేస్తే తప్ప ఆ లక్ష్యం ముందుకు సాగదు.అటువంటి పరిణతిని అల్–షరారా మొదటినుంచి చూపుతుండటం విశేషం. తిరుగుబాటు ఇంకా విజయ వంతం కాక ముందు నుంచే ఈ అవసరాలు ఆయనకు అర్థమైనాయనుకోవాలి. అందు వల్లనే ఇస్లామిక్ స్టేట్ సంస్థతో సంబంధాలను కొన్ని సంవత్సరాల ముందే తెంచి వేసుకున్నారు. అధికారానికి వచ్చిన మొదటి రోజునే తన పోరాట కాలపు అజ్ఞాతనామం అబూ మొహమ్మద్ జొలానీని, అసలు పేరు అహమద్ అల్–షరారాకు మార్చుకున్నారు. పౌర హక్కులు, మహిళల హక్కుల పరిరక్షణ చేయగలమన్నారు. అస్సాద్ కాలపు ఖైదీలందరినీ వెంటనే విడుదల చేశారు. ఆర్థికాభివృద్ధి, దేశాభివృద్ధి మొదటి ప్రాధాన్యాలని ప్రకటించారు.ఈ ప్రకటనలన్నీ మొదటి 24 గంటలలోనే వెలువడ్డాయి. అసద్‌పై వేర్వేరు ప్రాంతాలలో తిరుగుబాట్లు చేస్తుండిన వర్గాలు ముందుకు వచ్చి తమ దళాలను ప్రభుత్వ సైన్యంలో విలీనం చేయాలన్న విజ్ఞప్తికి కుర్దులు మొదలైన కొందరు సానుకూలంగా నిర్ణయించారు. షరారాను తీవ్రవాదిగా, తన సంస్థ హయాత్ తహరీర్ అల్–షామ్‌ను ఇస్లామిస్టు తీవ్రవాద సంస్థగా ప్రకటించిన వివిధ దేశాలు ఆ ముద్రను తొలగించటం, డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయాలను తిరిగి తెరవటం, షరారాతో సమావేశానికి ప్రతి నిధులను పంపటం వంటి ప్రక్రియలు మొదలయ్యాయి. ఇక ప్రధా నంగా మిగిలింది అమెరికా. వారి ప్రతినిధులు కూడా కలిసి సాను కూలంగా స్పందించటం, ఆంక్షలు ఎత్తివేయగలమనటం చేశారు గానీ, ట్రంప్ అధికారానికి రావటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.ఇజ్రాయెల్ ముప్పుఇదిట్లుండగా షరారా ఈ నెల 13న చాలా ముఖ్యమైన చర్య ఒకటి తీసుకున్నారు. అది – దేశానికి కొత్త రాజ్యాంగ రచన కోసం ఒక కమిటీని నియమిస్తూ, తాత్కాలిక రాజ్యాంగం ఒకటి ప్రకటించటం! అందులోని అంశాలలో తను మొదట పేర్కొన్న అన్ని విధాలైన హక్కులు ఉన్నాయి. అయితే, సిరియన్ తిరుగుబాటు విజయవంతమైన రోజునే సిరియాకు చెందిన గోలన్ కనుమలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. అక్కడి నుంచి ఖాళీ చేయబోమని, అక్కడ ఇజ్రా యెలీల సెటిల్మెంట్లు పెంచగలమని ప్రకటించింది. సిరియా దక్షిణ ప్రాంతం యావత్తును నిస్సైనిక మండలంగా మార్చగలమని హెచ్చ రించింది. పాశ్చాత్య దేశాలతోపాటు, ఐక్యరాజ్యసమితి ఖండించినా వెనుకకు తగ్గటం లేదు. సిరియాకు ఈ ముప్పు ఎట్లా పరిణమించ వచ్చునన్నది పెద్ద ప్రశ్న అవుతున్నది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పేరు ఏదైతేనేం... అంతా అణచివేతే!
దేశంలో, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో, ఉన్న పాలన స్వభావాన్ని ఎలా నిర్వచించాలి, దాన్ని ‘ఫాసిజం’ అనాలా, ‘నయా ఫాసిజం’ అనాలా, ‘నయా ఫాసిజం లక్షణాలు’ అనాలా అని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నదని ప్రచార సాధనాలలో వార్తలూ, వ్యాఖ్యలూ వస్తున్నాయి. ఆ పార్టీకే చెందిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం తన విధానాల ద్వారా, ఆచరణ ద్వారా, బహుశా మౌనం ద్వారా కూడా ఆ చర్చను మరొక స్థాయికి తీసుకు పోదలచుకున్నట్టున్నారు. కార్పొరేట్ ప్రయోజనాల పరిరక్షణ, ప్రజల సామూహిక ఆందో ళనల అణచివేత, వ్యక్తిగత ఆందోళనల పట్ల మౌనం అనే మూడు విషయాలలో ఆయన ప్రభుత్వం, ఏ పేరు పెట్టినా, కేంద్ర ప్రభుత్వం చేయదలచిన, చేస్తున్న పనులనే చేసి చూపిస్తున్నది.కేరళలోని వియ్యూర్ సెంట్రల్ జైలులో టి. ఆర్. రూపేష్ అనే మావోయిస్టు ఖైదీ ఉన్నారు. కేరళ మావోయిస్టు పార్టీ నాయకులలో ఒకరైన ఆయనను, ఆయన సహచరి షైనా, మరొక ముగ్గురు అనుచరులతో సహా 2015 మేలో తమిళనాడులోని కోయంబత్తూరులో అరెస్టు చేశారు. అంతకు ముందువీ, ఈ పదకొండేళ్లలో పెట్టినవీ కలిసి ఆయన మీద మొత్తం 43 కేసులున్నాయి. అందులో ఒక కేసు విచారణ జరిగి, ఆయన నిర్దోషిగా తీర్పు వెలువడింది. పదమూడు కేసులు డిశ్చార్జి అయ్యాయి.ఒక కేసులో శిక్ష పడి, శిక్షాకాలం ముగిసిపోతుండగా, విడుదల కాకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం పదకొండేళ్ల కిందటి కేసు తవ్వి తీసింది. జైలు అధికారులు ఇవ్వవలసిన రెమిషన్ ఇవ్వకుండా ఉండిపోయారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ మహత్కార్యమే గాని ఇప్పుడిక్కడ చర్చ అది కాదు. రూపేష్ జైలుకు వెళ్లక ముందే కవిగా, రచ యితగా గుర్తింపు పొందారు. అజ్ఞాతవాసంలో ఉండగానే, 2013లో వెలువడిన ఆయన మొదటి నవల ‘వసంత్తిలె పూమరంగళ్’ (వసంతకాలపు పూలచెట్లు) మలయాళ సాహిత్య లోకంలో విస్తృత చర్చకు దారి తీసింది. అంతకు ముందు న్యాయ శాస్త్ర పట్టభద్రుడైన రూపేష్ గత పదేళ్ల జైలు జీవితంలో చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, తత్వశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. జైలు రేడియో నడుపుతున్నారు. బాడ్మింటన్ క్రీడా కారుడిగా పేరు తెచ్చుకున్నారు. వీటితో పాటే, జైలులో ఆయన తన రెండో నవల రాశారు. ‘బంధితారుడె ఒర్మక్కురిప్పుగళ్’ (ఖైదీల జ్ఞాపకాలు) అనే ఈ నవల ప్రచురణను అనుమతించమని జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 130 పేజీలు గల ఈ నవల ఇతివృత్తం ఒక కవి–రాజకీయ కార్యకర్త జైలు జీవితం. జైళ్ల నిర్వహణ రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశంగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఒక ఖైదీకి ఉన్న ఈ రాజ్యాంగ బద్ధ హక్కును గౌరవించి అనుమతి ఇచ్చే అధికారం ఉంది. జైలులో ఉన్న ఖైదీకి తన రచనను ప్రచురించుకునే హక్కు ఉందని సుప్రీం కోర్టు ఇచ్చిన ఎన్నో తీర్పులు చెబుతున్నాయి. కాని రూపేష్ లిఖితపూర్వక దరఖాస్తుకు వియ్యూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నెల గడిచినా అధికారిక జవాబు ఇవ్వలేదు. దరఖాస్తును పై అధికారులకు పంపామని, జవాబు కోసం వేచి చూస్తున్నామని తాత్సారం చేశాడు. నవలలో జైలుకు, యూఏపీఏ, కోర్టు ప్రస్తావనలు ఉన్నాయి గనుక అనుమతి ఇవ్వబోమని నోటిమాటగా చెప్పాడు. తన నవల ప్రచురణకు అనుమతించకపోతే, ఎమర్జెన్సీలో క్యాలికట్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి రాజన్ హత్య చేయబడిన మార్చ్ 2న ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభిస్తానని రూపేష్ అధికారులకు తెలియజేశారు. మిత్రుల సలహా మేరకు దాన్ని ఒక్కరోజు నిరాహారదీక్షగా మార్చారు. అప్పటికే నవల డీటీపీ ప్రతి చదివిన కె. సచ్చిదానందన్, అశోకన్ చారువిల్,ఎన్. ఇ. సుధీర్ వంటి మలయాళ సాహిత్య ప్రముఖులెందరో ఆ నవల కళాత్మక విలువను ప్రశంసిస్తూ, ప్రచురణను అడ్డుకోవడం లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి తగదని ప్రకటించారు. ‘సృజనాత్మకత నేరం కాదు’ అనే శీర్షికతో సామాజిక మాధ్యమాలలో, ఇతర ప్రచార సాధనాలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది. ముఖ్య మంత్రికి బహిరంగ లేఖలు వెలువడుతున్నాయి. ఒక ఖైదీ రచన ప్రచురణను ఫాసిస్టు, నయా ఫాసిస్టు, నయా ఫాసిస్టు లక్షణాలు గల ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోవడం సులభమే. కాని ఆ పని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రభుత్వం చేయడమే ఆశ్చర్యకరం, విషాద కరం. అదే ప్రభుత్వపు మరి రెండు విధానాలు కూడా ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైనవి. కేరళలోని ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ – ఏఎస్హెచ్ఏ) సిబ్బందిలో అత్యధికులు ఈ సోమవారానికి ముప్పై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తున్నప్పటికీ తమను ఉద్యోగులుగా కాక వాలంటీర్లుగా గుర్తించడం మానేయాలని, అధికారపక్షం ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినట్టు గౌరవ వేతనాన్ని రూ. 7,000 నుంచి రూ. 21,000కు పెంచాలని, ఉద్యోగ విరమణానంతర సౌకర్యాలు కల్పించాలని ప్రధాన డిమాండ్లతో, మరెన్నో డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతున్నది. అనేక రాష్ట్రాలలో ఇవే డిమాండ్ల మీద సీపీఎం కార్మిక సంఘం సీఐటీయూ ఆందోళనలు నిర్వ హిస్తున్నది. కాని కేరళలో సీఐటీయూ కాక మరొక సంఘం ఈ ఆందోళనను నిర్వహిస్తున్నందువల్లనేమో ప్రభుత్వం ఆందోళన కారులతో చర్చలకు కూడా సిద్ధపడడం లేదు. గౌతమ్ అదానీ కంపెనీల మీద విదేశాలలోనూ, దేశంలోనూ లెక్కలేనన్ని విమర్శలు వస్తుండగా, కేరళ ముఖ్యమంత్రి మాత్రం అదానీ మీద పొగడ్తలు కుమ్మరించడంలో దేశ ప్రధానితో పోటీ పడుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా అన్నట్టు, కొద్ది వారాల కిందనే కొచ్చిలో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్‌లో కరణ్ అదానీ అదే స్థాయిలో నరేంద్ర మోదీ, పినరయి విజయన్లు ఇద్దరినీ ఒకే ఊపులో పొగడ్తల్లో ముంచెత్తాడు. ఏది ఫాసిజం? ఏది నయా ఫాసిజం? ఏవి నయా ఫాసిస్టు లక్షణాలు? ఓ మహాత్మా! ఓ మహర్షీ!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అరుదైన మిలిటరీ థ్రిల్లర్!
ఒక సైనిక ప్రధానాధికారి నవల రాయటం అన్నది ప్రతిరోజూ జరిగేది కాదు. నిజానికి, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ 77 ఏళ్లలో ఇలా ఒకసారి మాత్రమే సంభవించింది. జనరల్ ముకుంద్ మనోజ్ నరవణే రాసిన పుస్తకాన్ని అరుదైన వాటిలో ఒకటిగా, ప్రత్యేకమైనదిగా చేస్తున్నది ఇదే. నేను ఈ పుస్తకం గురించి రాస్తున్నది కూడా దానికున్న ఈ ప్రత్యేకత కారణంగానే! నరవణే రాసిన ఈ నవల పేరు ‘ద కంటోన్మెంట్ కాన్స్పిరసీ’. టైటిల్ కింద ఉన్న ఉపశీర్షికను బట్టి ఇదొక మిలిటరీ థ్రిల్లర్. ఇది ‘లూ కరే’ (గూఢచారి నవలలకు ప్రసిద్ధి చెందిన స్వర్గీయ బ్రిటిష్ రచయిత డేవిడ్ జాన్ కార్న్వెల్ కలం పేరు) ఒరవడిని కలిగి ఉన్నటువంటిది కాకున్నా... వేగంగా చదివిస్తూ, ముందుకు నడిపించేలా ఉంటుంది. నేనైతే, తెరిచిన పుస్తకం ముగిసే వరకు కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. పేజీలు వాటంతటవే తిరిగిపోతున్నట్లుగా అనిపించింది. ఈ కథ, కొత్తగా ఆర్మీలో చేరిన ఇద్దరు యువ అధికారుల చుట్టూ తిరుగుతుంది. ఒకరు లెఫ్ట్‌నెంట్ రోహిత్ వర్మ. ఇంకొకరు లెఫ్ట్‌నెంట్ రేణుకా ఖత్రీ. రోహిత్ మూడో తరం అధికారి. రేణుక పదాతిదళం రెజిమెంట్‌లో నియామకం పొందిన తొలి మహిళ. రోహిత్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తాయి. చాలామంది అతడు దోషి అని భావిస్తుంటారు. రోహిత్, రేణుకలలో రేణుకే అత్యంత శక్తిమంతమైన వ్యక్తిత్వం కల ఆఫీసర్. ఒక్క దుముకుతో రోహిత్ వెనుక అండగా నిలబడి ఈ కథను ముందుకు నడిపిస్తుంది రేణుక పాత్ర. కథాంశంలో ఒక్కో ముడీ విడివడుతున్నప్పుడు రెండు హత్యలు జరుగుతాయి. ఆ హత్యలు చేసిన వ్యక్తి మొదట మీరు అనుమానించిన వ్యక్తి కాదు. ఇంతకుమించి నేను మీకు చెప్పను. అలా చెప్తే కథ తెలిసి పోతుంది. కథా నేపథ్యం భవిష్యత్ కాలం. ఇదంతా కూడా 2026 జూన్ తర్వాత జరుగుతుంది. ఫతేపురిలోని సిఖ్ రైఫిల్స్ రెజిమెంటల్ సెంటర్లో కథ మొదలవుతుంది. రోహిత్, రేణుక ఓరియెంటేషన్ ట్రైనింగ్ కోసం అక్కడ ఉంటారు. కొత్తను పోగొట్టి, దిశా నిర్దేశం చేసే శిక్షణ కార్యక్రమం అది. జనరల్ నరవణే సొంత రెజిమెంట్ కూడా ‘7వ సిఖ్ లైట్ ఇన్ఫాంట్రీ’ కనుక ఆయన స్వీయానుభవాలు, ప్రత్యక్ష పరిశీలన ద్వారా గ్రహించిన విషయాలు ఈ నవల రాసేందుకు తోడ్ప డ్డాయని స్పష్టంగా తెలుస్తోంది. ఏమైనా, థ్రిల్లర్ కథలు రాయటం అంత తేలికేమీ కాదు. మొదట కథాంశం అన్నది ఉండాలి. అది ఆసక్తికరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా – చదువుతున్న కొద్దీ అది మనల్ని లోలోతుల్లోకి లాక్కెళు తుండాలి. తర్వాత ప్రధానమైనది కథన వేగం. అది మనల్ని ముగింపు వైపు పరుగులెత్తించాలి. మహోగ్రమైనదిగా కూడా ఆ ముగింపు ఉండాలి. చివరిగా భాష. అది కుదింపుగా, ఉద్వేగభరి తంగా ఉండాలి. సుదీర్ఘమైన తాత్విక ప్రసంగాల్లా కాకుండా, వాక్యాలు చిన్న చిన్నవిగా ఉండాలి. వీటి ద్వారా ప్రధాన పాత్రలు ఎటువంటి స్వభావం కలిగినవో మనకొక స్పష్టమైన అవగాహనను కలిగించటం అవసరం. ఇక రచయిత ఆ పాత్రల వ్యక్తిత్వాన్ని సూటిగా, పదునుగా శిల్పీకరించాలి. అంతేనా, ఏది తప్పో ఏది ఒప్పో చెప్ప గలిగేలా ఉండాలి. థ్రిల్లర్ పుస్తకాలు సాధారణంగా నీతి కథలుగా ముగుస్తాయి.ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. నిజానికైతే, ఇది మనం ఆర్మీ జనరల్స్ నుంచి ఆశించేది కాదు. ఈ పుస్తకంలోని వివిధ వర్ణాల ఛాయలు, వివరాల్లోని సూక్ష్మత్వం ఆహ్లాదకరమైన అబ్బురపాటును కలిగించేలా ఉన్నాయని నేను చెప్పగలను. నేను ఎంతో మంది ఆర్మీ చీఫ్‌లను కలిశాను కానీ – మీరు నమ్మండి – ఈ విధమైన సాహితీ నైపుణ్యాలను కలిగి ఉన్న ఆర్మీ చీఫ్‌ను నేనెప్పుడూ కలవలేదు. కథలో బ్రిగేడియర్ అశోక్ మీనన్‌ది కేవలం పైపైన పాత్రే అయినప్పటికీ, ఆ రెజిమెంటల్ సెంటర్ కమాండెంట్ ఇంగ్లిషు నన్ను పడేసింది. మీనన్ మాట్లాడేటప్పుడు ‘బ్లింప్’ అనే ఒక ఇంగ్లిష్ కల్నల్ (కార్టూన్ క్యారక్టర్) గుర్తొచ్చారు నాకు. ‘What the deuce?' (ఆశ్చర్యాన్ని, గందరగోళాన్ని లేదా చికాకును వ్యక్తపరిచే యాస), ‘darn’ (డామిట్) వంటి పదాలు ఆయన నోటి నుండి వచ్చేవి. ఆయన ప్రసంగమంతా కూడా ruddy, blighter, bugger అనే పదాల చిలకరింపుతో ఉంటుంది. అవన్నీ తిట్లు. జనరల్ నరవణే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన తన పాత్ర మాట్లాడే భాషతో ఆ పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించారు. కొన్నిసార్లు ఇది నాకు ఆర్థర్ కానన్ డోయల్ (రచయిత), షెర్లాక్ హోమ్స్(కానన్ డోయల్ సృష్టించిన పాత్ర)ను కూడా గుర్తుకు తెచ్చేది. అయితే ఆర్మీ బ్రిగేడియర్లు నిజంగా అలా ఉంటారా? లేదా, అలా ఉండాలని పాఠకులు ఆశిస్తా రని ఈ రచయిత నమ్ముతున్నారా? ఏదైనా సరే, అది పని చేస్తుంది. అయితే, సునిశితమైన శ్రద్ధతో సాగిన పాత్రల చిత్రీకరణ, సైనిక జీవిత స్ఫూర్తి, స్వభావాల సంగ్రహణలతో ఈ థ్రిల్లర్ పుస్తకం దోష రహితంగా ఉన్నప్పటికీ, ఇందులో నాకొక వింత లోపం మార్మికంగా అనిపించింది. బ్రిగేడియర్ మీనన్, రోహిత్‌తో మాట్లాడే సందర్భంలో రచయిత ఇలా రాశారు: ‘‘గోడవైపు చూపిస్తూ ఆయన అంటారు, ‘గురునానక్ చెప్పిన ఆ మాట నీకు తెలుసా? చెడు విజయం సాధించటానికి కావలసిన ఒకే ఒకటి, మంచి మనుషులు ఏమీ చేయకపోవ టమే’’ అని. నాకు తెలిసినంత వరకు ఈ మాటను 18వ శతాబ్దం నాటి బ్రిటిష్ కన్జర్వేటివ్ నాయకుడు ఎడ్మండ్ బర్క్ అన్నారని చెబు తుంటారు. అయితే ఈ మాటను అన్నది బర్క్ కాదు అని ఇటీవలి కాలంలో కొన్ని పండిత వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గురు నానక్ నిజంగా అలా చెప్పారా? చెబితే ఎప్పుడు చెప్పారు? ఎక్కడ చెప్పారు?ఈ చిన్న విషయాన్ని పక్కన పెడితే జనరల్ నరవణే తర్వాతి థ్రిల్లర్ కోసం నేను కుతూహలంతో వేచి చూస్తున్నాను. ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తే, హత్యల గురించి లెఫ్ట్‌నెంట్ రేణుకా ఖత్రి చెప్పే రహస్యాలు వరుసగా వెలువడతాయని ఆయన నాతో అన్నారు. ఎవరికి తెలుసు? ఆమె మన సొంత ‘మిస్ మార్పుల్’ (ఆంగ్ల రచ యిత్రి అగాథా క్రిస్టీ డిటెక్టివ్ నవలల్లోని కల్పిత పాత్ర) కావచ్చు. అలా జరిగితే కనుక జనరల్ నరవణే కొత్త అగాథా క్రిస్టీ అవుతారు!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఏం అమ్మి తీరస్తారు సామీ.. అప్పులన్నీ..?
సెంద్రబాబునాయుడు ఓ పక్కన కుర్సీ యెక్కిన కాణ్నించీ యెడాపెడా అప్పులు జేస్తానే వుండారు గదా..! అప్పు పుట్టించడాన్ని గూడా ఏదో యెవరెస్టు యెక్కిన మాదిర్తో టముకు యేసుకుంటా.. పోటోలకు పోజులిస్తావుంటారు గదా..! కానీ ‘యేంది సామీ.. రాజదాని కడతండావు సరే.. ఇన్నేసి డబ్బులు గుమ్మరిస్తండావేంది’ అని అడిగినామే అనుకో.. ‘ఓరి పిచ్చోడా యిది సెల్ఫ సస్టయినబుల్ ప్రోజెక్టురా.. అంటా వుంటాడు. అదేందో పలకడానికే నాకు నోరు తిరగడం లేదుగానీ.. ‘అంటే యేందిరా సామీ’ అని యింకో సావాసగాణ్ని అడిగినా. యేం జెప్పినాడో తెలుసునా...‘‘వోరి యెర్రోడా.. మన యెసుట్లోకి మనమే బియ్యం సంపాయించాల.. మన డప్పు మనమే గొట్టుకోవాల.. యిట్టాగానే.. ఆ అమరావతి గూడా దాన్ని కట్టడానికి కావాల్సిన డబ్బులంతా అదే సంపాదించుకుంటాదంట’’ అని జెప్పినాడు.యేడరా సామీ.. యాబయి వేల కోట్ల రూపాయలు ఇప్పుటికే అప్పులు తెస్తిరి.. తీరా జూడబోతే యిప్పుడు కట్టబొయ్యే కతలన్నీ కలిపి నలబై వేల కోట్ల కూడా లేకపాయె.. కొండంత అప్పులు దెచ్చినారు గదా.. యెట్టా తీర్చబోతారు అని కలవరం పుట్టింది నాకు. మా మినిస్టరు నారాయణ మాటలు యింటే మాత్రం సమ్మగా అనిపిస్తండాయి.. కలవరం మొత్తం మాయమైపోతాందంటే నమ్మాల! యింతకీ ఆయనేం అంటండారో తెలుసునా?యీ అప్పులతో ఇప్పునడు మొదులు బెడుతున్న బిల్డింగులు అన్నీ కట్టేయంగా యింకా నాలుగువేల యెకరాలు మిగల్తాయంట.. సిటీ మొత్తం దూందాంగా అయిపోయుంటాది గాబట్టి.. అప్పుడు బూముల రేట్లు ఆకాసెంలో వుంటాయంట. ఆ యేళకి గవుర్మెంటు కాడ నాలుగువేల యెకరాల బూమి వుంటాదంట.. దాన్నంతా అమ్మితే.. ఈ అప్పులు యేపాటివి.. వుఫ్ మని వూది పారేస్తాను గదా.. అంటాండారు. మాట యిన్నప్పుడు సమ్మగానే వుంటంది గానీ.. తలుసుకున్నప్పుడు మాత్రం గుబులు గుబులుగానే వుంటాండాది సామీ.. యిన్నేసి అప్పులు తెచ్చి గుప్పెడు బిల్డింగులు గట్టంగానే అమరావతి సిటీ మొత్తం పూర్తయిపోయినట్టేనా? ఇల్లలికితే పండగ అయిపోతందా? యిదిగూడా అట్నే గదా అని నా బయ్యిం.తీరా ఈ యాబైవేల కోట్లు తగలేసి ఏదో ఓ కాడికి పనులు అయినాయని అనుకున్నాక.. యిప్పుటిదాకా అయిందంతా.. కాయితం మీద గుర్రం బొమ్మ గీసినట్టే.. ఈ బొమ్మ పెకారం మంచి గ్రానైటు రాయిని దెచ్చి బొమ్మని చెక్కాల అని.. బొమ్మను చెక్కినాక, అయ్యో బొమ్మ నల్లగా ఉండాది గదా.. దీనికి బంగారం తాపడం జేయిస్తే బెమ్మాండంగా వుంటాది అనీ.. యిట్టా రకరకాల మాటలు జెప్తా.. అరలచ్చ కోట్లు నగరానికి యింకో లచ్చన్నర కోట్లు తగలెయ్యాల్సిందే.. అని కొత్త పాటలు పాడకుండానే వుంటారా? అనేది అనుమానంగా వుండాది సామీ..!యినుకుంటా వుండారా? ఒక్కో రోడ్డు యెయ్యాలంటే కిలోమీటరుకి యాబై మూడు కోట్ల రూపాయిలా..? నోట్లేమయినా అచ్చేస్తండామా సామీ..! ఈ దేసెంలో ఎంత పెద్ద రాచబాట యేసినా.. సెంట్రలు గవుర్మెంటోల్లు కిలోమీటరుకి 20 కోట్ల దుడ్లు పెడితే చానా జాస్తి అంటాండారే.. మనోళ్లేమైనా కొండల్ని పగలదీసి యేస్తండారా.. ఆకాసానికి అద్దాల నిచ్చెనేసి ఆ పైన రోడ్డేస్తండారా.. యేం జేస్తండారని.. కిలోమీటరుకి అన్నేసి కోట్లు తగలేస్తండారో వొక యితరణ వుండాల గదా? యిట్టా తగలేస్తే యింకో అరలచ్చ కోట్లు అప్పులు దెచ్చినా ఆరతి కర్పూరం అయిపోకుండా వుంటాయా అని నాకు బయం సామీ!యెనకటికి ఇద్దరు సావాసగాళ్లు వున్నారంట. వొకడు ‘తిందాం తిందాం’ అంటే.. ‘ఏం చేసి తిందాం’ అని రెండోవాడు అన్నాట్ట. ‘అప్పుజేసి తిందాం’ అంటే.. ‘అప్పెట్ట తీర్చాల’ అన్నాట్ట. ‘అప్పుజేద్దాం.. వూరొదిలి పారిపోదాం’ అన్నాట్ట మొదటి పెద్దమనిషి. ఆ మాదిర్తో జనం గుండెల మీద బండరాయి పడకుండా వుండాలంటే ఈ అప్పులకి యీడ పుల్ స్టాపు పెడతాండాం అని ఓ మాట జెప్పండి సామీ. లేపోతే అయ్యన్నీ తీర్చడానికి అమరావతిలోనూ అడుగు బూమీ మిగలదు.. మా బోటోళ్ల బతుకులన్నింటినీ వుడ్డగా అమ్మేస్తే తప్ప ఆ అప్పు తీరదు. కొంచిం దయపెట్టండి... ఎం.రాజేశ్వరి -
మానవ సంకల్ప విజయానికి ప్రతీక!
సైన్స్ చరిత్రను తిరగేస్తే యాదృచ్ఛికంగా జరిగిన ఆవిష్కరణలు కోకొల్లలు కనిపిస్తాయి. ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలం అక్కడే గడపడమూ ఈ కోవకే చెందుతుంది. ఎందుకంటే... మనిషి యుగాలుగా ఆశిస్తున్న, ఆకాంక్షిస్తున్న గ్రహాంతరయానమనే స్వప్నాన్ని ఈ యాత్ర మరికొంత దగ్గర చేసింది మరి!సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తిరిగి భూమిని చేరిన రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. అంత రిక్ష ప్రయోగాల్లో ఇదో చరిత్రాత్మక ఘట్టంగానే చూడాలి. బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు రావడం, సకాలంలో వాటిని సరిదిద్దే అవకాశం లేకపోవడంతో ఈ ఇద్దరు వ్యోమగా ములు మునుపెవ్వరూ గడపనంత అత్యధిక సమయాన్ని ఐఎస్ఎస్లో గడపాల్సి వచ్చింది. భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూండే ఐఎస్ఎస్లో ఉండటం అంత ఆషా మాషీ వ్యవహారం కానేకాదు. అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుందిక్కడ. దీనివల్ల శరీరంలోని ద్రవాలన్నీ ఉండాల్సిన చోట కాకుండా... శరీరం పైభాగంలోకి చేరుతూంటాయి. ఇరవై నాలుగు గంటలకు ఒకసారి సూర్యోదయ, సుర్యాస్తమయాలను చూసే మనిషి... ఐఎస్ఎస్లో వీటిని పదహారు సార్లు చూడాల్సి వస్తుంది. ఇది కాస్తా వ్యోమగాముల నిద్రపై ప్రభావం చూపుతుంది. కంటినిండా కునుకు లేక... కుటుంబానికి దూరంగా... ఇరుకైన చిన్న గదిలో నెలలపాటు గడపడం ఎంత కష్టమో మనం ఊహించనైనా ఊహించ లేము. ఊపిరి తీసుకోవడం మొదలుకొని కాలకృత్యాలు తీర్చుకోవడం వరకూ ప్రతి ఒక్కటి మానసికంగానూ, భౌతికంగానూ సవాలే! ఇంతటి శ్రమకోర్చి మరీ వీరు భూమికి తిరిగి వస్తూండటమే ఈ అంతరిక్ష ప్రయో గాన్ని మిగిలిన వాటికంటే ప్రత్యేకమైందిగా మారుస్తోంది.తొమ్మిది నెలలు చేసిందేమిటి?గత ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్లు ఇద్దరూ ఐఎస్ఎస్కు ప్రయాణమైనప్పుడు వారి వద్ద ఎనిమిది రోజు లకు సరిపడా ప్రణాళికలైతే సిద్ధంగానే ఉన్నాయి. ఏ ఏ ప్రయోగాలు చేపట్టాలి. ఐఎస్ఎస్ నిర్వహణ తాలూకూ పనులు ఏమిటి? అన్నది వీరికి తెలుసు. కానీ అనూహ్యంగా వారి తిరుగు ప్రయాణం నిరవధికంగా వాయిదా పడింది. దీంతో వారికి ఎదురైన సరికొత్త సవాలు అంతకాలం ఏం చేయాలి? అన్నది. నాసా పరిశోధకుల సలహా సూచనల మేరకు వీరు ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు 150 వరకూ పరిశోధనలు చేపట్టారు. జీవ వ్యవస్థలపై సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం, అంతరిక్షంలో మొక్కల పెంపకం, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు అంతరిక్షంలో ఎలా ప్రవర్తిస్తాయి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు... భవిష్యత్తులో మనిషి సుదీర్ఘకాలం పాటు అంతరిక్ష ప్రయాణాలు చేపట్టాల్సి వస్తే... అంతరిక్ష నౌకల్లో అగ్ని ప్రమాదాల్లాంటివి జరక్కుండా ఉండేందుకు... మంటలు ఎలా వ్యాపిస్తాయి? అన్న విషయంపై పరిశోధనలు నిర్వహించారు కూడా! దీంతో పాటే గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల శరీరంలోని కండరాలకు జరిగే నష్టాన్ని నివారించేందుకు యూరో పియన్ ఎన్ హాన్్సడ్ ఎక్స్‌ప్లోరేషన్ ఎక్సర్సైజ్ డివైజ్(ఈ4డీ)ని పరీక్షించారు. ఈ పరికరం సైక్లింగ్, రోయింగ్లతోపాటు రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ల ద్వారా వ్యోమగాముల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అలాగే గ్రహాంతర ప్రయాణాలకు కీలకమైన నీటి పునర్వినియోగం, ప్రత్యేకమైన సూక్ష్మజీవుల ద్వారా మనిషికి అవసరమైన పోషకాల ఉత్పత్తి వంటి అంశాలపై కూడా ప్రయోగాలు చేశారు. సౌర కుటుంబం మొత్తమ్మీద మనిషి జీవించేందుకు జాబిల్లి తరువాత కొద్దోగొప్పో అనుకూలతలున్న గ్రహం అంగారకుడు. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఇంకొన్నేళ్లలోనే మనిషిని అంగారకుడిపైకి చేరుస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్లో సునీతా, విల్మోర్లు గత తొమ్మిది నెలలుగా చేసిన ప్రయోగాలకు, పరిశోధనలకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో ఉండటం భౌతికంగా, మానసికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ తొమ్మిది నెలల ప్రయాణం తరువాత శాస్త్రవేత్తలకు కొంత స్పష్టత ఏర్పడి ఉంటుంది. దీని ఆధారంగా భవిష్యత్తులో అంగారక ప్రయాణం జరిగే అవకాశాలు లేకపోలేదు. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మన ఎముకలు పెళుసుబారుతాయి. కండరాలు, దృష్టి బలహీనపడతాయి. అలాంటప్పుడు ఏ రకమైన వ్యాయామాల ద్వారా నష్టాన్ని పరిమితం చేయవచ్చునన్నది సునీత, విల్మోర్ల పరిశోధనల ద్వారా తెలిసింది. అంతరిక్షంలో ఉండే విపరీతమైన రేడియోధార్మికత నుంచి వ్యోమ గాములను రక్షించుకునేందుకు కూడా వీరి ప్రయోగాలు సాయపడతాయి.వ్యోమగాముల త్యాగాల గురుతులు...ఎట్టకేలకు సునీత, విల్మోర్లు భూమిని చేరనున్నార న్నది అందరికీ సంతోషం కలిగించే వార్తే. కాకపోతే ఆ ఇద్దరు వ్యోమగాములు ఇప్పటివరకూ ఉన్న సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి వాతావరణం నుంచి సాధారణ పరిస్థితులకు ఎలా అడ్జెస్ట్ అవుతారన్నది ఒక ప్రశ్న. ఇది మరోసారి వారి సహనాన్ని, దృఢ చిత్తాన్ని పరీక్షించనుంది. వ్యోమగాముల శ్రమ, వేదన లను గమనిస్తే మానవ కల్యాణం కోసం వారు ఇంత త్యాగం చేస్తున్నారా? అనిపించకమానదు. సునీత, విల్మోర్లు ఇద్దరూ 300కుపైగా రోజులు అంతరిక్షంలో గడపడం ఒక రికార్డే. అయితే ఇది వారి వ్యక్తిగత మైంది కాదు. మానవ సంకల్పానికి లభించిన విజయమని చెప్పాలి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా), స్పేస్–ఎక్స్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భాగస్వా ములైన సుమారు 15 దేశాల శాస్త్రవేత్తలు అందరి ఉమ్మడి విజయం. ‘చందమామ రావే... జాబిల్లి రావే’ అంటూ పాట లకే పరిమితమైన ఒక తరం మాదిరిగా కాకుండా... ‘గ్రహ రాశులను అధిగమించి, ఘనతారల పథము నుంచి... గగ నాంతర రోదసిలో గంధర్వ గోళగతులు దాటి’ అంటూ సాగే నవతరానికి స్ఫూర్తి కూడా!– గిళియార్ గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ జర్నలిస్ట్ -
ఆంధ్రా తీరంలో అణు కుంపట్లా?
‘అణువు గుండెను చీల్చిఅమిత శక్తిని పేల్చినరుడు తన్నును బాల్చిఓ కూనలమ్మా’ అన్నాడు ప్రముఖ కవి ఆరుద్ర.1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్ మీద అమెరికా జరిపిన అణుదాడుల్లో లక్షలాది మంది మరణించారు. అప్పటి నుంచి అణు శక్తికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. 1979లో అమెరికాలోని త్రీమైల్ ఐలాండ్, 1986లో ఆనాటి సోవియట్ యూనియన్‌లోని చెర్నోబిల్, 2011లో జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రాల్లో జరిగిన దుర్ఘటనల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు బాగా తగ్గిపోయింది. చెర్నోబిల్ అణు దుర్ఘటన జరిగిన రోజున మరణించిన వారి సంఖ్య తక్కువే అయినా, ఆ రియాక్టర్ నుంచి విడుదలైన ప్రమాదకర రేడియేషన్ కారణంగా తర్వాతి కాలంలో లక్ష మంది మృత్యువాత పడ్డారు. యూరప్‌లోని 40 శాతం భూభాగం అణు దుష్ఫలితాల ప్రభావానికి గురైంది. ఈ ఉదంతం తర్వాత 22 దేశాల్లో 108 అణువిద్యుత్ ప్రాజెక్టులను నిలిపివేశారు.అందరూ వద్దనుకుంటుంటే...ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది ఒకదారి అన్నట్టు – ప్రపంచమంతా అణు విద్యుత్ కేంద్రాలపై ఆధారపడటం తగ్గించి వేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి పాలకులు మాత్రం ఇంకా అణు విద్యుత్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు తిరస్కరించిన అణు విద్యుత్ కేంద్రాలను మన రాష్ట్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పట్లో ఆంధ్రా తీరంలోని శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో నిర్మించాలనుకున్న 12 భారీ అణు విద్యుత్ కేంద్రాల కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆగమేఘాల మీద వేలాది ఎక రాలు రైతుల నుంచి సేకరించింది. ఆ భూములు అలానే నిరుపయో గంగా ఉండగా, తాజాగా అనకాపల్లి జిల్లాలో ఎన్.టి.పి.సి. ఆధ్వ ర్యాన 2,800 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రానికి సుమారు రెండు వేల ఎకరాల భూమి సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. అంతే కాకుండా భూసేకరణ బాధ్యతను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి మోదీ సర్కార్ అప్పగించింది. మోదీ మోజులో ఉన్న కూటమి పెద్దలు ఇకపై అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే సేకరించిన భూమి గురించి మాట్లా డరు, కానీ అనకాపల్లిలో మరో రెండు వేల ఎకరాల సేకరణకు త్వర లోనే నడుం బిగిస్తారు. కొన్ని ఇతర దేశాలతో పాటు మన దేశంలోని గుజరాత్, తమిళ నాడు, పశ్చిమ బెంగాల్, మహరాష్ట్ర ప్రజలు తిరస్కరించిన ఈ అణు విద్యుత్ కేంద్రాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే సామాజిక, పర్యా వరణ సమస్యలతో పాటు తీర ప్రాంతంలో భద్రతా పరమైన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది.ఆంధ్రా తీరప్రాంత జిల్లాల్లో నిర్మించాలనుకుంటున్న అణు విద్యుత్ కేంద్రాలపై అంతర్జాతీయ సంస్థలైన మెక్ ఆర్థర్ ఫౌండేషన్, ఎన్.ఆర్.డి.సి. (నేషనల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్) గతంలో పలు అనుమానాలను వ్యక్తం చేశాయి. ఈ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ‘ద వరల్డ్ న్యూక్లియర్ ఇండస్ట్రీ స్టేటస్ రిపోర్ట్’లో ఆంధ్రాలో ఏర్పాటు చేయాలనుకుంటున్న అణు విద్యుత్ కేంద్రాల గురించి ప్రముఖంగా ప్రస్తావించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలను కుంటున్న అణువిద్యుత్ కేంద్రాల వ్యయం సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు వ్యయం కన్నా 10 నుంచి 12 రెట్లు ఎక్కువగా ఉంటుందనీ, యూనిట్ విద్యుత్ ధర సుమారు 12 నుంచి15 రూపాయల వరకూ ఉంటుంది కాబట్టి ఇవి ఆర్థికంగా ఏ మాత్రం లాభసాటి కాదనీ ఆ నివేదికలో పేర్కొన్నారు.భద్రతా సమస్యలుఇప్పటికే మనకు పాకిస్తాన్, చైనాలతో సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడం భద్రతా పరంగా కూడా ప్రమాదకరమే. 1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన పి.ఎన్.ఎస్. ఘాజీ అనే జలాంతర్గామి దాడి చేయడానికి విశాఖ తీరం వరకూ వచ్చిందన్న విషయం విస్మరించకూడదు. తీరానికి దగ్గరగా ఏర్పాటు చేసే ఈ అణు విద్యుత్ కేంద్రాలపై శత్రుదేశాలు దాడి చేస్తే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. అణు కేంద్రాలపై దాడి అనంతరం విడుదలయ్యే రేడియో ధార్మిక శక్తి కారణంగా అపార జన నష్టం సంభవిస్తుంది. దీనికి తోడు ఆంధ్ర తీర ప్రాంత జిల్లాలు తరచుగా తుపానులకు గురవుతున్నాయి. ఇటువంటి ప్రదేశాల్లో భారీ అణు రియాక్టర్లను ఏర్పాటు చేయాలనుకోవడం ప్రమాదకరమైన నిర్ణయ మవుతుంది.సాంకేతిక సమస్యలు1996లో ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ వాటా 17 శాతం ఉండగా, అది 2022వ సంవత్సరంలో 10 శాతానికి పడిపోయింది. తాజా గణాంకాల ప్రకారం, దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యం గల 22 అణు రియాక్టర్లు ఉంటే, వాటిలో తారాపూర్‌లో రెండు, కైగాలో రెండు, నరోరాలో రెండు, రాజస్థాన్‌లో ఒకటి, మద్రాస్‌లో ఒక యూనిట్ పూర్తిగానో, పాక్షికంగానో మూత పడ్డాయి. మన దేశ అణు రియాక్టర్లు నిత్యం సాంకేతిక లోపాలు ఎదుర్కొంటూ ఏనాడూ పూర్తి ఉత్పాదక సామర్థ్యంతో పనిచేయలేదు. మన దేశంలో థర్మల్ పవర్ ప్లాంట్లు 90 నుంచి 95 శాతం ఉత్పాదక సామర్థ్యంతో పని చేస్తుండగా అణు విద్యుత్ కేంద్రాలు తమ ఉత్పాదక సామర్థ్యంలో 40 శాతం మాత్రమే పని చేస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించింది. అందువల్ల ఈ అణు విద్యుత్ కేంద్రాలను తీరప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రానికి ఒనగూరే పెద్ద ప్రయో జనాలేమీ ఉండకపోగా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడమే మేలు!వి.వి.ఆర్.కృష్ణంరాజు వ్యాసకర్త ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుమొబైల్: 89859 41411 -
పవన్ గొంతు చించుకున్నారు.. మరి అది ఇప్పుడేమైంది?
సాధారణంగా శాసనసభలో లేని వ్యక్తుల గురించి ఏవైనా ఆరోపణలు,విమర్శలు చేయడం సమంజసం కాదన్నది సంప్రదాయం. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా అలా మాట్లాడితే స్పీకర్ స్థానంలో ఉన్నవారు వారిస్తుంటారు. కాని స్వయంగా ముఖ్యమంత్రే అలా మాట్లాడితే ఏమి చేస్తారు! ఎపి శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ గురించి చేస్తున్న విమర్శలు అసంబద్దంగా ,అసందర్భంగా ఉంటున్నాయి. కారణం ఏమైనా సభలో జగన్ లేనప్పుడు ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి చంద్రబాబు సభా సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తుంది. తాము ఎన్నికల సమయంలో చేసిన సూపర్ సిక్స్ తో పాటు మరో 143 హామీల అమలు గురించి కన్నా జగన్ పైనే ఆరోపణలు చేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. మహిళా సాధికారిత గురించి ఆయన సభలో ప్రసంగం చేసినప్పుడు ఏ అంశాల గురించి చెప్పాలి? తాము ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల గురించి కదా!వాటిని పక్కనబెట్టి కొత్త హామీలు ఇస్తూ కధ నడిపడమే కాకుండా ,జగన్ ఆడబిడ్డల ద్రోహానికి పాల్పడ్డారని ,అదో కేస్ స్టడీ అని చెబుతున్నారంటే ప్రజలు విస్తుపోవడం తప్ప చేయగలిగింది ఏముంది?చంద్రబాబు నాయుడు మహిళలకు ఏఏ హామీలు ఇచ్చారు? వాటిలో ఎన్నిటిని అమలు చేశారో అంశాలవారిగా లెక్కలు చెబితే అది ఆడబిడ్డలకు మేలు చేసినట్లు అవుతుంది .అలాకాకుండా అసలు ఆ అంశాలనే ప్రస్తావించకుండా జగన్ పైనో, మరొకరిపైనో ఆరోపణలు చేస్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది. అది చంద్రబాబు ప్రభుత్వం ఆడబిడ్డలకు ద్రోహం చేసినట్లు కాదా!ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తకుండా ఎగవేయడం ద్రోహం అవుతుందా? కాదా?కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంతమంది మహిళలు అఘాయిత్యాలకు గురయ్యారో వివరించి, వాటిని అరికట్టడానికి ఏమి చర్య తీసుకుంటున్నారో చెప్పాలి కదా?అవన్ని ఎందుకు !ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో సుగాలి ప్రీతి అంటూ గొంతు చించుకుని మాట్లాడేవారు కదా! ఆ కేసు గురించి ఎన్నడైనా చంద్రబాబు మాట్లాడారా? పవన్ మాట నిలబెట్టుకున్నారా?దానిని ద్రోహం అంటారా?అనరా?ప్రతి ముఖ్యమైన పండగకు మహిళలకు కానుకలు ఇస్తామని ప్రకటించారు కదా?ఈ ఏడాది కాలంలో పండగలు రాలేదా!అయినా ఏ ఒక్క మహిళకైనా కానుకలు అందాయా?పెళ్లికానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారే!మహిళలు ఎవరికైనా అందచేశారా?వలంటీర్లకు పదివేల వేతనం ఇస్తామని చెప్పి,అసలుకే ఎసరు పెట్టారు కదా!ఆ వలంటీర్లలో లక్షమందికి పైగా మహిళలుఉన్నారు కదా!వారికి ఇచ్చిన సాధికారిత ఇదేనా!ఆర్డిసి బస్ లలో ఉచిత ప్రయాణం హామీ ఇచ్చారు కదా!దానికి బడ్జెట్ లో ఒక్క రూపాయి అయినా పెట్టారా?తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి 15వేలు ఇచ్చే వాగ్దానం ఒక ఏడాదిపాటు అతీగతీ లేదే!వచ్చే ఏడాది ఏ మేరకు ఇస్తారో తెలియదు.ఆ తల్లికి ఆ డబ్బు ద్వారా సాధికారిత వచ్చేది కదా!జగన్ తాను మహిళలకు ఇచ్చిన హామీలన్ని దాదాపు అమలు చేశారే.అన్ని స్కీమ్ లు మహిళల పేరిటే ఇచ్చారు కదా!అమ్మ ఒడి, 31 లక్షల ఇళ్ల పట్టాలు, చేయూత,ఆసరా,కాపు నేస్తం , ఆర్ధికంగా బలహీనవర్గాల నేస్తం..ఇలా ఆయా స్కీములలో డబ్బులు ఇచ్చారే.చేయూత కింద మహిళలకు 18500 రూపాయల చొప్పున ఆర్దిక సాయం చేసి,వారితో వ్యాపారాలు పెట్టించి, రిలయన్స్, ఐటిసి తదితర ప్రముఖ సంస్థలతో టై అప్ చేశారే.మహిళల భద్రతకు దిశ యాప్ తెచ్చారే.ఇప్పుడు అదే యాప్ ను పేరు మార్చి చంద్రబాబు వాడుతున్నారా?లేదా?ఇన్ని చేసిన జగన్ ఆడబిడ్డల ద్రోహి అవుతారా?లేక చేసిన బాసలకు మంగళం పలుకుతున్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు ద్రోహి అవుతారా అన్న ప్రశ్న వస్తే ఏమి జవాబు ఇస్తాం. ఇవన్ని వదలివేసి జగన్ కుటుంబంలో ఏదో జరిగిందని,తల్లికి ,చెల్లికి న్యాయం చేయలేదంటూ అసత్య ఆరపణలు చేయడం ఎంతమేర సమంజసం.చెల్లికి 200 కోట్ల మేర డివిడెండ్ల రూపంలో చెల్లించిన జగన్ ద్రోహం చేసినట్లు ఎలా అవుతుందో చంద్రబాబే చెప్పాలి. పోనీ తన తోబుట్టువులకు చంద్రబాబు ఏ విధంగా సాయం చేసింది చెప్పి ఉంటే బాగుండేది కదా!చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రతిగా వైఎస్సార్సీపీ స్పందిస్తూ పలు ప్రశ్నలు వేసింది.హైదరాబాద్ లో ఇతర చోట్ల చంద్రబాబు కుటుంబానికి ఉన్న వందల కోట్ల ఆస్తులలో తన తోబుట్టువులకు ఎంత ఇచ్చారని అడిగింది.తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుటుంబానికి ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించింది. తనతల్లి పేరు మీద ఉన్న మదీనగూడ భూమిలో వారికి వాటా ఇవ్వకుండా లోకేష్ ఒక్కరి పేరు మీదే ఎందుకు మార్పించింది వాస్తవం కాదా అని అప్రశ్నించింది.ముందుగా తన ఇంటిలో సమన్యాయం పాటించకుండా ఇంకొకరి ఇంటి వ్యవహారాన్ని ప్రస్తావించడం అన్యాయం కాదా అని వైఎస్సార్సీపీవ్యాఖ్యానించింది. డ్వాక్రా మహిళలకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటనలు కూడా ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియదు. కొద్ది రోజుల క్రితం ఏడాదికి లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని అన్నారు.తాజాగా ఆ సంఖ్యను లక్షా డెబ్బైఐదువేలకు పెంచారు. డ్వాక్రా మహిళలకు 65వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని,అందులో సగం పెట్టుబడి తీసుకురాగలిగితే ఆరువేల కోట్ల లాభాలు వచ్చేస్తాయని కూడా ఆయన ఊరించారు. డీ లిమిటేషన్ జరిగితే భవిష్యత్తులో శాసనసభలో 75 మంది మహిళలకు అవకాశం రావచ్చని ఆయన అన్నారు. డి లిమిటేషన్ లో ఎపికి కూడా నష్టం జరుగుతుంందని అంతా వాపోతుంటే, దాని గురించి మాట్లాడకుండా మహిళలకు సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనండని ఆయన ప్రచారం చేస్తున్నారు.కాని తద్వారా ఎదురయ్యే సమస్యల గురించి వివరించి, వాటిని అధిగమించడానికి ఏమి చేయాలో చెప్పరు. మహిళలకు తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చి తద్వారా సాధికారిత తెచ్చామని చెబితే ఎవరైనా నమ్ముతారు కాని, ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేసి అంతా అయిపోయినట్లు భ్రమలో పెట్టాలని అనుకుంటే ఏమి ప్రయోజనం ?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మహారాష్ట్ర రాజకీయ చదరంగం
రాజకీయాల్లో ఇవాళ్టి మిత్రుడు రేపు కాబోయే శత్రువు; అదే విధంగా నేటి శత్రువే రేపటి మిత్రుడు అనే నానుడికి చక్కని ఉదాహరణ మహారాష్ట్ర ప్రస్తుత రాజకీయాలు. 2024 నవంబరులో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు గాను మహాయుతి కూటమి ప్రధాన భాగస్వామ్య పక్షాలైన భారతీయ జనతా పార్టీ 105, ఏక్నాథ్ షిండే శివసేన 57 స్థానాలు కైవసం చేసున్నాయి. దీంతో ఆ కూటమి తిరిగి అధికారం చేజిక్కించుకుని పాలిస్తోంది. అయితే కూటమి రెండోసారి పాలనకు 100 రోజులు నిండేలోపే మొత్తం మరాఠా రాజకీయ చిత్రం రసవత్తరంగా తయారయ్యింది. ఎన్నికల ఫలితాల రోజు సాయంత్రమే (2024 నవంబర్ 23) దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ వెళ్ళి ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో; ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి ముఖ్యమంత్రి పీఠం కోసం తన బాటను సుగమం చేసుకొన్నారు. చివరి వరకు ఏక్ నాథ్ షిండే సీఎం కుర్చీ వదలటానికి సుముఖంగా లేనప్పటికీ మోదీ–షాల బుజ్జగింపుతో, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. తను కోరుకున్న హోం శాఖ కూడా దేవా భావు (ఫడ్న వీస్)కే దక్కింది. ఇక అప్పటి నుండి అలక పాన్పు పట్టారు షిండే. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన ఈ వంద రోజుల్లో (మార్చి 15 నాటికి) కొన్ని గమ్మత్తయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి షిండే గతంలో చేపట్టిన పలు ప్రాజెక్టులను ‘తనిఖీ’ చేయవలసిందిగా ముఖ్య మంత్రిగా అధికార పగ్గాలు చేపట్టగానే ఫడ్నవీస్ అధి కారులకు హుకుమ్ జారీ చేశారు. మరో వైపు భాజ పాతో దోస్తీ వదలుకున్న శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, సీఎం ఛాంబర్ చేరుకుని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవటం షిండే వర్గీయులను ఆశ్చర్య పరచింది. ఆ తర్వాత ఫిబ్రవరి 21న కొత్త ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఎన్సీపీ నేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనంలో ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేని అవార్డుతో సత్కరించటం ఇక్కడ ఉద్ధవ్ వర్గీయులను ఆశ్చర్య పరచింది. పవార్ లాంటి సీనియర్ నేత తమ పార్టీ ద్రోహిని, ‘రాష్ట్రీయ గౌరవ్ పురస్కారం’తో సత్కరించటం మింగుడు పడలేదు వారికి. (శరద్ పవార్ పాచిక ప్రభావంతో 2019లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని, కాంగ్రెస్–ఎన్సీపీ కూటమికి చేరింది అవి భక్త శివసేన). ఇది చాలదన్నట్టు ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి పవార్ ఆహ్వానించటంలోని రాజకీయం ఏమిటో ఎన్సీపీ కార్యకర్తలకు కూడా బోధ పడలేదు. ప్రస్తుత పరిస్థితు లను నిశితంగా గమనిస్తే ఎవరు ఎవరి అనుయా యులో, ఎవరు ఎవరి శత్రువులో తేల్చుకోలేని పరిస్థితి! మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి చవిచూసిన ఉద్ధవ్ ఠాక్రేను మరింత గాయపరచాలని, ఆయన 20 మంది ఎమ్మెల్యేలలో కొందరిని తన వైపు లాక్కొని, ఉద్ధవ్ రాజకీయ భవిషత్తునే మట్టిలో కల పాలని షిండే వ్యూహం. ఇది ఇలా ఉంటే... శివసేన పార్టీకి కంచుకోటగా ఉన్న కొంకణ్ ప్రాంతంలోనిషిండే సన్నిహితుడు, కేబినెట్ మంత్రి, ఉదయ్ సామంత్‌ను లోబరచుకుని, ఆయన ద్వారా షిండే వర్గాన్ని రెండుగా విభజించి పార్టీ చీఫ్ బలాన్ని తగ్గించే యోచనలో బీజేపీ ఉందనేది ఒక చర్చ. అది గ్రహించిన వెంటనే ఉదయ్ సామంత్ ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ, తనే అసలైన టీం కెప్టెన్ అని షిండే తేల్చే శారు. ఇదే సమయంలో ఇక షిండే ‘బాలే ఖిల్లా’గా చెప్పుకునే, ముంబై నగర శివారులోని థానేలో బీజేపీ పాగా వేసి ఆయనను ఇరుకున పెట్టాలని బీజేపీ వర్గీయులు అక్కడ తరచుగా క్యాంపులు నిర్వహి స్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొ రేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా ఫడ్నవీస్ పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. దానికి అనుగుణంగానే క్షేత్ర స్థాయిలో కమలనాథులు పావులు కదుపుతున్నారు.227 కార్పొరేటర్లతో గ్రేటర్ ముంబయ్ మున్సి పల్ కార్పొరేషన్ ఆసియాలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ కాలం నాటి ఈ కార్పొరేషన్ గత నాలుగు దశాబ్దాల (1985) నుండి ‘మరాఠీ అస్మిత’(ఆత్మ గౌరవం) నినాదంతో శివసేన అధీనంలోనే ఉంది. ప్రస్తుతం రెండుగా చీలిన ఈ ప్రాంతీయ పార్టీని తిరిగి ఇక్కడ పూర్వ వైభవం వరిస్తుందా అనేది ఒక ప్రశ్న. మొన్న జరిగిన విధాన సభ ఎన్నికల్లో 36 ముంబై సిటీ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉద్ధవ్ శివసేన కేవలం 10 సీట్లు గెలవటంతో పార్టీ కేడర్ కొంత వరకు జవసత్వాలు కోల్పోయింది. దీనికి తోడు చీలిపోయిన శివసేన (షిండే) పార్టీ, అటు బీజేపీలు ఉద్ధవ్ పార్టీలోని క్రియాశీల కార్యకర్తలను, కార్పొరేటర్లను తమ తమ వైపు ఆకర్షించుకోవటం మొదలుపెట్టాయి. ఇక ఎన్సీపీ నేత, కింగ్ మేకర్ శరద్ పవార్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో; షిండే సీఎం పదవికి ఎసరుపెట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ)కి ఉద్ధవ్ ఠాక్రే దగ్గర అవుతున్న వైనాన్ని గమనిస్తే మహారాష్ట్రలో రాబోయే నగర పాలక సంస్థల ఎన్నికలు ఎంత రసవత్తరంగా మార నున్నాయో అంచనా వేయొచ్చు. జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబయ్మొబైల్: 98190 96949 -
భస్మాసుర హస్తంగా... ట్రంప్!
సమస్యలను పరిష్కరించగలిగే అధికారం కలిగినవారే కొత్త సమస్యలను, సవాళ్లను కొనితెస్తే ఎలా ఉంటుంది? అచ్చు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారంలా ఉండదూ! ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ఎన్నికలలో మళ్లీ గెలిచి 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ట్రంప్ పట్ట పగ్గాలు లేనివిధంగా తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ సమాజం ఆర్థికంగా అల్లకల్లోలంగా మారుతున్నది. ట్రంప్ దేశాధ్యక్షుడు అయిన వెంటనే అమెరికాకు సంబంధించి పలు రక్షణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా పౌరసత్వంపై ఆంక్షలు, విదేశాలకు అందించే సహాయ నిధులలో కోత, అక్రమ వలసదారులపై వేటు, అమెరికన్ ప్రభుత్వ ఉద్యోగుల కుదింపునకు, దుబారా నివారణకు ఎలాన్ మస్క్ నేతృత్వంలో ‘డోజ్’ ఏర్పాటు తదితర నిర్ణయాలకు చాలావరకు సానుకూల స్పందన వచ్చింది. కానీ వివిధ దేశాలతో జరిపే ఎగుమతులు, దిగుమతులలో సమాన స్థాయిలో సుంకాలు విధిస్తామనీ, టారిఫ్‌ల విషయంలో ఎవ్వరికీ మినహాయింపులు ఉండవనీ తెగేసి చెప్పడంతో అంతర్జాతీయ వాణి జ్యంలో అనిశ్చితి ఏర్పడింది. ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అనే ఓ ముతక సామెతను గుర్తు తెచ్చే విధంగా ట్రంప్ ఒకవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత దేశ ప్రజల పట్ల తనకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని చెబుతూనే భారత్ నుంచి దిగుమ తయ్యే సరుకులపై అధిక సుంకాలు వేస్తామని తేల్చేశారు.పరస్పర సుంకాల విధానం అంటే, ఏదైనా ఒక దేశం అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై ఎంత మొత్తాన్నైతే దిగుమతి సుంకంగా విధిస్తుందో, అమెరికా కూడా సదరు దేశ ఉత్పత్తులపై అంతే సుంకం విధిస్తుందంటూ ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించేశారు. కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకొనే ఉత్పత్తులపై 25%; చైనా ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అలాగే, భారత్ వద్ద చాలా సంపద ఉందనీ, అమె రికా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోంది కనుక... ఆ మేరకు మేమూ సిద్ధమేనంటూ ట్రంప్ సాక్షాత్తూ మోదీ సమక్షంలోనే కుండబద్దలు కొట్టారు.సుంకాలకు శ్రీకారం చుట్టింది అమెరికాయే!ప్రపంచం మొత్తం ఓ అంతర్జాతీయ గ్రామంగా మారాలనీ, స్వేచ్ఛా ప్రపంచ వాణిజ్యం వల్ల అన్ని దేశాలూ లాభపడతాయంటూ తొలుత విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 1929 నుంచి ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది అమెరికాయే. దాంతో, అంత ర్జాతీయ వాణిజ్యంలో క్రమంగా అన్ని దేశాలూ పాల్గొనడం మొదలైంది. వాణిజ్య సుంకాలకు సంబంధించి అంతర్జాతీయ నిబంధనలు ఏర్పరచడం తప్పనిసరి అని అన్ని దేశాలూ అంగీకారానికొచ్చిన నేపథ్యంలోనే 1948లో ‘గాట్’ (జనరల్ అగ్రిమెంట్ ఫర్ ట్రేడ్ అండ్ టారిఫ్) ఒప్పందం మొదలైంది. దాంతో ‘అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య సమాజం’ ఆవిర్భవించింది. 1994లో 117 దేశాలు గాట్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అందులో భారత్ కూడా ఉంది. ‘వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్’ (ప్రపంచ వాణిజ్య సంస్థ)లోని సభ్య దేశాల నడుమ వాణిజ్య ఒప్పందాలు జరగడం; సుంకాల విధింపునకు సంబంధించి పలు దఫాలు చర్చలు జరిగి ఆయా దేశాలపై విధించిన ఆంక్షల విషయంలో సడలింపులు చోటు చేసుకొన్నాయి. భారతీయ జౌళి ఉత్పత్తుల దిగు మతులపై అప్పటివరకు ఉన్న ఆంక్షల్ని చాలా దేశాలు ఎత్తి వేశాయి. ఇదంతా చరిత్ర!ఎవరికి నష్టం?‘అమెరికన్లను రక్షించేందుకు ఈ సుంకాలు అవసరం’ అనిట్రంప్ తన నిర్ణయాలను సమర్థించుకొంటున్నారు. పైగా, దీనికోసం అమెరికా అధ్యక్షుడిగా తనకున్న అసాధారణ అధికారాలను ఉపయో గించుకొని ‘అంతర్జాతీయ ఆత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ (ఐఈ ఈపీఏ)ను ఉపయోగించుకొంటున్నారు. దీనివల్ల అమెరికా న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవడానికీ, ట్రంప్ నిర్ణయాలను సమీక్షించ డానికీ అవకాశం లేకుండా పోయింది. ప్రజల స్పందన ఎలా ఉన్నా, అమెరికా దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. రోజుల వ్యవధిలోనే లక్షల డాలర్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. చమురు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. చౌకగా లభించే శ్రామిక శక్తి దూరమైంది. ఈ విపరిమా ణాలతో అమెరికా ద్రవ్యోల్బణ రేటు ప్రస్తుతం ఉన్న 2.9 శాతం నుంచి 3.3 శాతానికి చేరుకొంటుందని అక్కడి ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. అమెరికాలోని భారతీ యులు కూడా ఆ మేరకు నష్టపోతారు.ట్రంప్ దూకుడును నియంత్రించే శక్తి ఎవరికి ఉంది? రష్యా– ఉక్రెయిన్ యుద్ధంపై బైడెన్ అనుసరించిన వైఖరికి భిన్నంగా ట్రంప్ రష్యాకు అనుకూలంగా మారిపోవడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అనివార్యంగా ట్రంప్‌ను సమర్థిస్తున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా సభ్య దేశాలుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఒక దశలో డాలరు చెల్లింపుల వ్యవçస్థ నుంచి వైదొలగాలని భావించినప్పటికీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను విరమించుకొనే అవకాశం ఉంది.‘అమెరికా హితం ప్రపంచ హితం, అమెరికా శోకం ప్రపంచ విషాదం’ అనే ఓ వ్యంగ్య నానుడి ఉంది. అంటే అమెరికా ఏది చేసినా ప్రపంచానికి మంచి చేస్తుంది కనుక అన్ని దేశాలూ గొర్రెల్లా తలలు ఊపాల్సిందే. కానీ ట్రంప్ తీసుకొంటున్న సమాన టారిఫ్ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యాన్ని చావుదెబ్బ తీసే పరిస్థితులు కనిపిస్తున్న నేప థ్యంలో మిగతా దేశాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరం.భారత రైతాంగానికి రక్షణ అవసరంనిజానికి, అభివృద్ధిలో వెనుకబడిన దేశాలు తమ దేశీయ ఉత్పత్తులను రక్షించుకోవడానికి అధిక సుంకాలు విధించడం సహజం. ఉదాహరణకు మన దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడే వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించనట్లయితే... దేశ రైతాంగానికి పండించే పంటలకు కనీస మద్దతు ధరలు లభించక వారి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఒకవేళ భారత ప్రభుత్వం కనుక ట్రంప్ హెచ్చరికలకు తలొగ్గి, అమెరికా వ్యవసాయ దిగుమతులపై ప్రస్తుతం విధిస్తున్న సుంకాలను తగ్గించినట్లయితే... భారతీయ మార్కెట్లను అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు ముంచెత్తుతాయి. ఫలితంగా భారతీయ రైతాంగం మరింతగా కష్టాల ఊబిలోకి కూరుకుపోతుంది.కాగా, అమెరికాకు భారత్ చేస్తున్న ఎగుమతులలో వస్త్రాలు, ఔషధాలు, ఐటీ ఆధారిత సేవలు, అల్యూమినియం, ఉక్కు, ఇంకా కొన్ని రకాల వ్యవసాయ ఉత్పతులు ప్రధానంగా ఉన్నాయి. వీటిపై అమెరికా అధిక సుంకాలు వేస్తే మన దేశంలోని పరిశ్రమలు నష్ట పోతాయి. నష్టాన్ని నివారించాలంటే కొత్త మార్కెట్లను అన్వేషించాలి. అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల... దేశ పారిశ్రామిక రంగాన్ని ‘ట్రంప్’ సవాళ్ల నుంచి రక్షించుకోవడం కేంద్ర ప్రభుత్వానికి తలకు మించిన భారమే. ట్రంప్ ఏకపక్షంగా పెంచిన సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో)కు ఫిర్యాదు చేసింది. భారత్ కూడా అమెరికా మీద ఒత్తిడి తేవడానికీ, తన ప్రయోజనాలను కాపాడుకోవడానికీ దృఢంగా వ్యవహరించాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి -
నెగ్గేదెలా?
లోక్‌సభలో ఐదు దక్షిణాది రాష్ట్రాల దామాషా ప్రాతినిధ్యానికి ముప్పు వాటిల్లబోతోంది. వాటి మెడపై డీలిమిటేషన్ కత్తి వేలాడుతోంది. ఈ ఉపద్రవం తప్పాలంటే కేంద్రం మెడ వంచాలి. దీనికోసం దక్షిణాది తరఫున తమిళనాడు ముందుండి కేంద్రంపై పోరాటం చేస్తోంది. భారత సమాఖ్య పట్ల ఏకీభావం ప్రతిష్టంభనలో పడింది. ఈ నేపథ్యంలో, డీలిమిటేషన్ మరో 30 ఏళ్లు వాయిదా వేయాలని తమిళనాడు అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ , ‘వన్ నేషనిజం’ అంటూ బీజేపీ సమస్యను జటిలం చేస్తోంది. భాషావివాదం మీద పార్లమెంటులో మాట్లాడుతూ, తమిళనాడుకు నిజాయితీ లేదని, అనాగరిక రాష్ట్రమని నిందిస్తూ ఆ రాష్ట్రానికి విద్యానిధులు తొక్కిపట్టింది. సమాఖ్య విషయంలో కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత కొరవడింది. కాబట్టే బీజేపీ కూటమి యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తమిళనాడు నేతృత్వంలో కేంద్రంపై ధ్వజమెత్తుతున్నాయి. డీలిమిటేషన్ చిక్కుముడికి పరిష్కారాలు లేకపోలేదు. రాజ్యసభ స్వరూపం మార్చడం వీటిలో ఒకటి. రాష్ట్రాల సరైన ప్రాతినిధ్యానికి వేదికగా దాన్ని రూపొందించాలి. అలాగే సంఖ్యాపరంగా లోక్‌సభ సైజు పెంచడం ద్వారా, పెద్ద రాష్ట్రాలు అదనపు స్థానాలు పొందినా, ఇతరత్రా ఏ రాష్ట్రం నష్టపోకుండా చూడవచ్చు. అధిక జనాభా ఉన్న యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల సరిహద్దులు మార్చడం మరో మార్గం. ఆర్థిక వృద్ధి అనివార్యతలు, రాష్ట్రాల నడుమ నెలకొన్న సామాజిక ఆర్థిక అంతరాలు సమాఖ్య స్ఫూర్తి పునాదులను బలహీన పరుస్తున్నాయి. రాష్ట్రాల పునర్ విభజన చట్టంతో భాషా సమస్య పరిష్కారమైన పిదప, సమాఖ్య ఏకీభావతకు ఎదురవుతున్న తొలి సవాలు ఇదే. దీన్ని ఎదుర్కొనేందుకు ఇప్పుడు కావల్సింది సమాఖ్య సూత్రానికి అన్ని వైపుల నుంచీ బలమైన మద్దతు.విశ్వాసం కల్పించాల్సింది కేంద్రమే!చరిత్ర చూసినట్లయితే, పాలనలోనూ, నిధుల పరంగానూ కేంద్రీకృత విధానాలే ఉన్నాయి. సంకీర్ణ రాజకీయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సైతం ప్రాంతీయ పార్టీలు పాత వ్యవస్థను సవాలు చేయలేదు. దీంతో సమాఖ్య సూత్రం గట్టిగా వేళ్ళూన లేదు. ద్రవ్యపరంగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణ తగ్గలేదు. పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు పంచాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ రాష్ట్రాల తరఫున కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయితే ఇది రాజకీయ పటా టోపంగానే మిగిలి పోయింది. ఆ రోజుల్లో యథా తథ స్థితిని అనుసరించడమే రాజకీయ సంస్కృతిగాఉండేది. పేద రాష్ట్రాలకు జాతీయ పన్నుల్లో అధిక వాటా లభించడం తరహా సమన్యాయ సూత్రానికి రాష్ట్రాలన్నీ ఇష్టపూర్వకంగానే తలలూ పాయి. ప్రాతినిధ్య అసమానతను అంగీకరించాయి.సమాఖ్య ఏకాభిప్రాయం మీద ఆర్థిక వృద్ధి ప్రభావం పడుతోంది. పన్నుల హేతుబద్ధీకరణ, నియంత్రిత మార్కెట్లు, రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించే సేవలు వంటి అవసరాలకు కేంద్రీకృత వ్యవస్థ ఎన్నో రకాలుగా ఉపయుక్తం అవుతుంది. ఇలా జరగడం వల్ల రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కూడా అంతే స్థాయిలో తగ్గుతుంది. నిధుల పంపిణీ పరంగా కొత్త వివాదాలు ఉత్పన్నమవుతాయి.ఈ వివాదాలను విశ్వసనీయంగా పరిష్కరించే శక్తి కేంద్రానికి మునుపటి కంటే ఎక్కువ అవసరమవుతుంది.వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం లోకి మారడం వల్ల ఉత్పన్నమైన వివాదాలు ఇందుకు నిదర్శనం. రాష్ట్రాలు తమ పన్ను విధింపు హక్కును వదులుకోవడంతో, పన్ను ఆదాయంలో తమ వాటా ఎంత అన్నది ప్రధానంగా మారింది. రాష్ట్రాల నడుమ ఆర్థిక అంతరం హెచ్చింది. ఆర్థికంగా బలమైన దక్షిణాది రాష్ట్రాలు సమన్యాయాన్ని సవాలు చేయసాగాయి. 16వ ఫైనాన్స్ కమిషన్ ఎదుట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేవనెత్తిన అంశం ప్రస్తావనార్హం: ‘కర్ణాటక సమకూర్చే ప్రతి రూపాయిలో ప్రస్తుత ఫార్ములా ప్రకారం తిరిగి వెనక్కు వచ్చేది కేవలం 15 పైసలు’ అని ఆయన వాపోయారు. తమిళ నాడు కూడా ఇదే వాదన చేసింది. డీలిమిటేషన్ మీద ఆందోళనలు సైతం అదే మాదిరివి.భిన్న ప్రాంతాల నడుమ ఆర్థిక అసమానతలు పెరిగిపోవడమే లక్షణంగా మారిన ఈ దేశంలో ఈ సమదృష్టి సూత్రం ఎంతవరకు ఆచరణ సాధ్యం? కానప్పుడు, పన్ను ఆదాయాల పంపిణీ ఫార్ములాను సంతులన పరచుకుంటూ అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలకూ కలిపి ఒక ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయడం వంటి వేరే మార్గాలు కేంద్రానికి లేవా? అలాగే సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామన్న విశ్వస నీయ సంకేతం ఇవ్వాల్సిన, కొత్త ఏకాభిప్రాయాన్ని తీసుకురావల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉంటుంది. సమాఖ్య విధానం పట్ల బీజేపీ ఒంటబట్టించుకున్న అసహనం సమస్య పరిష్కారాన్ని జటిలం చేస్తోంది. స్వయంప్రతిపత్తి గల జమ్ము – కశ్మీర్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు గుంజుకుని, వాటిని కేంద్రం పెత్తనం కిందకు తెచ్చుకోవడం వల్ల ఏర్పడిన పరిణామాలు, రాష్ట్రాలకు పన్నుల్లో దక్కాల్సిన వాటాను తనకు మాత్రమే దఖలు పడే సెస్సులు, సర్ చార్జీల విధింపు ద్వారా కుదించివేయడం, అలాగే కేంద్రం సేవలో ఉండేలా కొత్త పాలనా సంస్కృతిని ప్రోత్సహించడం... ఇవన్నీ సమాఖ్య పట్ల కేంద్ర అసహనానికి నిదర్శనాలు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు కేంద్రంపై రాజకీయంగా ధ్వజమెత్తడం, రాజీలేని వైఖరి ప్రదర్శించడం మినహా మరేం చేయగలవు? సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు తమ హక్కుల కోసం బేరసారాలు జరిపే హక్కు ఎన్ని పరిమితులకు లోబడి ఉందో ప్రస్తుత డీలిమిటేషన్ చిక్కుముడి వెల్లడిస్తోంది. డీలిమిటేషన్‌ను ఎంతకాలం వీలైతే అంతకాలం వాయిదా పడేలా చేయాలన్న స్టాలిన్ ఆలోచన ఫలితమే ప్రస్తుత ప్రతిష్టంభన! ఎంతో కష్టపడి సాధించుకున్న అమూల్యమైన భారత సమాఖ్య ఈ క్రమంలోమరింత బలహీన పడుతుంది.యామినీ అయ్యర్ వ్యాసకర్త బ్రౌన్ యూనివర్సిటీలో విజిటింగ్ సీనియర్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
జన్యు నిధుల అనుసంధానం కీలకం!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025–26 ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండవ ‘నేషనల్ జీన్ బ్యాంక్’ ఏర్పాటును ప్రక టించారు. ఇది ఒక మిలియన్ జన్యు పదార్థాల శ్రేణులతో నిండి, భవిష్యత్తులో ఆహారం– పోషకాల భద్రత కోసం ఏర్పాటు చేయబోయే నిర్మాణంగా చెప్పుకొచ్చారు. జన్యు వైవిధ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికీ, వైవిధ్యాన్ని పరిరక్షించే లక్ష్యం కోసం... పబ్లిక్, ప్రైవేట్ రంగాలూ, కమ్యూ నిటీలూ (వ్యక్తుల సమూహాలు, సంఘాలు, సంప్ర దాయ జాతులు) కలిసికట్టుగా ప్రయత్నిచవలసిన అవసరం ఉంది. అందువల్ల నిపుణులు ఈ నిర్ణ యాన్ని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. నూతనంగా ఏర్పడ నున్న రెండవ జీన్ బ్యాంకుతో కమ్యూనిటీ విత్తన బ్యాంకుల అనుసంధానం ద్వారా పారిశ్రామిక రంగంతో సహా సంబంధిత వ్యక్తులు, సంస్థలు (షేర్ హోల్డర్లు) అందరూ అంతర్జాతీయ ఒప్పందం (కన్వెన్షన్ ఆన్ బయోలా జికల్ డైవర్సిటీ–సీబీడీ 1993), జాతీయ జీవ వైవిధ్య చట్టం–2002 (ఎన్బీఏ–2002)లో పొందుపరిచిన మూడు సూత్రాలకు (పరిరక్షణ, స్థిరమైన వినియోగం, న్యాయమైన – సమానమైన లాభాల పంపిణీ) కట్టుబడి ఉండగలరన్న ఆశా భావం వ్యక్తం అవుతోది.జాతీయ జన్యు బ్యాంక్ అనేది భవిష్యత్ తరాలకు వివిధ పంటలు, అడవి జాతులు, అనేక రకాల చెట్ల జన్యువులను నిల్వచేసే సదుపాయం. కమ్యూనిటీ విత్తన బ్యాంకులు పంటల అభివృద్ధి, ఆహార భద్రత, స్థిరమైన సమాజ అభివృద్ధికి బిల్డింగ్ బ్లాక్‌లుగా ఉపయోగపడే స్థానిక ప్రత్యామ్నాయ జన్యు వనరులుగా గుర్తించబడ్డాయి. జన్యు వనరుల సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవి దశాబ్దాల నుండి అనధికార వ్యవ స్థలుగా కొనసాగుతూనే ప్రాంతీయ కమ్యూనిటీలకు సంప్రదాయ విత్తన కోశాగారాలుగా పని చేస్తున్నాయి. అందులో ఉన్న వైవిధ్యభరిత జన్యు పదార్థాలను ఒక వ్యవస్థలో ఏకీకృతం చేయగలిగే కమ్యూనిటీ నిధులుగా ప్రస్తుతం సంఘటిత పడుతూ, అక్కడి వెనుకబడిన ఆదివాసీ కమ్యూ నిటీ వర్గాలకు సేవలు అందిస్తున్నాయి. ఈ కమ్యూనిటీ విత్తన బ్యాంకులు స్థానికంగా నిర్వహించబడే సంస్థలు. ఇవి విత్తనాలను సేకరించడం, నిల్వ చేయడం, కమ్యూనిటీ విత్తన అవసరా లను తీర్చడం వంటి సేవలు అందిస్తున్నాయి. అవి దేశంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద–చిన్న పంటలు, ఔషధ మొక్కలు, అలాగే నిర్లక్ష్యం చేయబడి తక్కువ ఉపయోగంలో ఉన్న మొక్కల జాతులను తమ పరిధిలో అంతరించి పోకుండా రక్షణ కలిగిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇవి సరైన నిల్వ, మౌలిక సదుపాయాలు, విత్తన శుద్ధి పరికరాలు, నిర్వహణ సిబ్బందికి శిక్షణ లేమి, ఆర్థిక మద్దతు లోటుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయి. ఈ సమస్యలను పరిష్కరించవలసి ఉంది.భారత్ తన మొదటి జాతీయ జన్యు నిధిని 1996లో జాతీయ జాతీయ జన్యు వనరుల బ్యూరో న్యూ ఢిల్లీలో ఏర్పాటు చే సింది. మొట్ట మొదటి జన్యు నిధికి ఉన్న 0.47 మిలియన్ల నమూనాల పరి రక్షణ సామర్థ్యాన్ని అధిగమించి, రెండో జాతీయ జన్యు నిధికి నిల్వ సామర్థ్యాన్ని ఒక మిలియన్ దాకా పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, దేశంలోని అధిక జీవవైవిధ్య సాంద్రత ఉన్న ప్రాంతాలలోని స్థానిక పరిరక్షకుల సంఘాలతో కమ్యూనిటీ విత్తన నిధులను జాతీయ జీన్ బ్యాంకుతో అనుసంధాన పరచడం ఒక ప్రగతిశీల ఆచరణయోగ్య కార్యక్రమం. భారత దేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఈశాన్య, అండమాన్–నికోబార్ దీవులు వంటి అనేక జీవవైవిధ్య సాంద్రత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. కనుక, ప్రస్తుత, భావితరాల ఆహార మరియు పోషకాల భద్రతా లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ రెండవ జాతీయ జన్యు బ్యాంకు ఏర్పాటు చొరవలో స్థానిక పరిరక్షకులు తప్పనిసరిగా భాగస్వాములు కావాలి.బలిజేపల్లి శరత్ బాబువ్యాసకర్త భారత వ్యవసాయ మండలి విశ్రాంత శాస్త్రవేత్త -
తగ్గేదేలే!
మతం, కులం, భూమి... ఇండియాలో ఇవి ఉద్రిక్తమైన అంశాలు. భాష కూడా ఇలాంటిదే. కేవలం రాజకీయ ప్రసంగాలకు చర్చలకు పరిమితమై ఉండి నట్లయితే, పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ అది స్వాతంత్య్రా నికి పూర్వం, ఆ తర్వాత కూడా ఉద్యమాలను లేవదీసింది. భౌగోళిక సరి హద్దులను మార్చేసింది. ప్రాంతీయ అధినేతల తలరాతలు మార్చేసింది. ఉదాహరణకు సి రాజగోపాలాచారిని మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన మంత్రి పీఠం నుంచి పడదోసింది.భాషతో ఆడుకునే ఉన్మాదులకు తమిళనాడు పురిటిగడ్డగా మారింది. ఒకప్పుడు వేర్పాటువాదానికి ఊపిరిపోసింది. ఇప్పుడు అధికారం కాపాడుకోవడానికి సాధనంగా మార్చుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాదే ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్... మోదీ ప్రభుత్వ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ–2020)ని తెర మీదకు తెచ్చారు. కేంద్రం నుంచి సమగ్ర శిక్షా స్కీము కింద వచ్చే రూ 2,152 కోట్ల నిధులను వదులుకోడానికి సిద్ధపడి మరీ ఆయన ఎన్ఈపీని తిరస్కరించారు. రాష్ట్రంలోని 14,500 మోడల్ స్కూళ్లను అప్ గ్రేడ్ చేయడం... ఈ కేంద్ర ప్రాయోజిత పథకం ఉద్దేశం. కేంద్రం ఎన్ఈపీని శిలాశాసనంలా రూపుదిద్దింది. పథకంలో గొప్పగా పొందుపరచిన ‘ఆశయాలు’ డీఎంకేకి మోసపూరితాలుగా కనబడుతున్నాయి. 1968 ఎన్ఈపీలోని త్రిభాషా సూత్రాన్నే ఎన్ఈపీ– 2020 ద్వారా తిరిగి ప్రవేశపెడుతున్నామని ఢిల్లీ పెద్దలు చెబుతున్నారు. అయితే, హిందీని రాష్ట్రాలపై రుద్దే దురుద్దేశపూర్వక ప్రయత్నంగా డీఎంకే దాన్ని పరిగణిస్తోంది. నిజానికి ఎన్ఈపీ– 2020 పాతదానితో పోల్చితే చాలా వరకు వెసులు బాటు కల్పిస్తోంది. ఏ రాష్ట్రం మీదా ఏ భాషనూ రుద్దే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. పిల్లలు నేర్చు కోవలసిన మూడు భాషలు ఏవన్నదీ ఆ యా రాష్ట్రాల, ప్రాంతాల, పిల్లల ఇష్టానికే విడిచి పెట్టింది. కాకుంటే, ఈ మూడింటిలో రెండు మాత్రం దేశంలోని ‘నేటివ్‘ భాషలు అయ్యుండాలి. అంటే రాష్ట్ర భాషకు అదనంగా మరొక భారతీయ భాషను నేర్వవలసి ఉంటుంది. అది హిందీయే కానవసరం లేదు. రాజకీయ పెనం మీద హిందీనిజానికి డీఎంకే, కేంద్రం మధ్య ఘర్షణకు మూలం ఇది కాదు. తమిళనాడు రాజకీయ పెనం మీద హిందీ ఎప్పుడూ చిటపటలాడుతూనే ఉంటుంది. అయినా, స్టాలిన్ సహజంగానే ఎన్ఈపీని తోసిపుచ్చినప్పుడు కేంద్రం ఆయనతో చర్చలు జరిపి ఉండాలి. అలా కాకుండా రెచ్చగొట్టే విధానం అవలంబించడమే ప్రస్తుత పరిస్థితికి దారి తీసింది. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ముందు నిలిచి కయ్యానికి కాలు దువ్వారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భాషా ప్రాతిపదికగా రాష్ట్రాల పునర్ విభజన జరగాలన్న ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆయన స్వరాష్ట్రం ఒడిశా ముందుండి నడిపిన విషయం ఆయనకు గుర్తు లేకపోవడం నిందార్హం. ఏ రాష్ట్రం కూడా రాజ్యాంగం కంటే ఎక్కువ కాదని హెచ్చరిస్తూ, డీఎంకే ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని హితవు పలికారు. ఇది జరిగి నెల గడవక ముందే, మార్చి 11న పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో ‘నిజాయితీ లేని’, ‘మోసకారి’ పార్టీ అని డీఎంకేని నిందించారు. దీనికి స్పందనగా, మంత్రి ‘పొగరుబోతు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రధాన్ ఆ తర్వాత తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్నారు. అయినా ఫలితం లేదు. అప్పటికే ఇరు పక్షాలూ బరిలోకి దిగాయి. తమిళనాడు ప్రతిపక్ష నేత పళనిస్వామి ఈ పోరులో డీఎంకేకు మద్దతు పలికారు. ఎప్పుడో 1937 లోనే అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన మంత్రి రాజగోపాలాచారి (రాజాజీ) సెకండరీ స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేయడంతో జస్టిస్ పార్టీ మండిపడింది. తలముత్తు, నటరాజన్ అనే ఇద్దరు యువ ఉద్యమకారులు పోలీసుల ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు. భాష కోసం ప్రాణా లొడ్డిన అమరులుగా వారు నివాళులు అందుకున్నారు. తర్వాత రాజాజీ రాజీనామా చేశారు. బ్రిటిష్ పాలకులు నాటి హిందీ నిర్బంధం ఉత్తర్వును ఉపసంహరించారు. 1965కి వద్దాం. హిందీని అధికార భాషగా అమలు చేసేందుకు కేంద్రం పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడింది. మరోసారి తమిళనాడు భగ్గుమంది. రాష్ట్రం అంతటా హింస చెలరేగింది. 70 మంది అసువులు బాశారు. 1967లో అధికార భాషల (సవరణ) చట్టాన్ని, 1968లో అధికార భాషల తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించిన సందర్భంలోనూ ఉద్యమం తిరిగి ప్రాణం పోసుకుంది. హిందీకి అదనంగా ఇంగ్లీష్‌ను కూడా కమ్యూనికేషన్ భాషగా కొనసాగించేందుకు, హిందీ ఒక్కటే అధికారిక లింకు భాషగా ప్రకటించిన తొలి విధానాన్ని వాయిదా వేసేందుకు ఈ చట్టం వీలు కల్పించింది. మూడు భాషల ఫార్ములాను తిరస్కరిస్తూ అప్పటి డీఎంకే ముఖ్యమంత్రి అన్నాదురై నాయకత్వంలో 1968 జనవరి 26న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. తమిళాన్ని, ఇతర భాషలను అధికార భాషలుగా క్లాసిఫై చేసేవరకు ఇంగ్లీషు ఒక్కటే ఏకైక అధికార భాషగా కొనసాగితీరాలని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని నాటి రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. అయితే ఒక మాట. గతంలోకీ ఇప్పటికీ తమిళుల స్పందనలో మార్పు కనబడుతోంది. అప్పట్లో హిందీ–తమిళ్ జగడం తమిళ ఓటర్లను భావోద్వేగంతో కదిలించేది. నేడు మరొక కోణం తెర మీదకు వచ్చింది. అది ఆర్థికం. తమిళనాడు ఆర్థిక సంస్కరణల నుంచి పూర్తి ప్రయోజనం పొందింది. ప్రముఖ ఉత్పత్తి కేంద్రంగా ఆవిర్భవించింది. రాజకీయ పోరాటాలు స్థానికులు, వలసదారుల మద్య సామాజిక సంబంధాలను ప్రభావితం చేయలేక పోవడం ఒక సానుకూల పరిణామం. ‘మరాఠీ మనూస్’ (మరాఠీ మాట్లాడే మనుషుల) తరహా యుద్ధోన్మాదం లేదు. అయినప్పటికీ, భాష ఒక సెన్సిటివ్ ఇష్యూనే!రాధికా రామశేషన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సునీతా విలియమ్స్ రాయని డైరీ
మై హ్యాపీ ప్లేస్! అంతరిక్షం!!తొమ్మిది నెలలుగా ఇక్కడ రోజుకు పదహారు సూర్యోదయాలు, పదహారు సూర్యాస్తమయాలు! ‘‘ఇంకెంత... కొన్ని గంటలే... ’’ అని నవ్వారు బుచ్ విల్మోర్ (butch wilmore). ఆయన నవ్వు నక్షత్రంలా ప్రకాశిస్తోంది.‘‘గంటల్ని మీరు ఏ ఖగోళ కొలమానంతో లెక్కిస్తున్నారు మిస్టర్ విల్మోర్?’’ అన్నాను నేను నవ్వుతూ.‘‘ఖగోళం కాదు మిస్ విలియమ్స్, భూగోళంలో నా కూతుళ్ల ఎదురు చూపులతో కాలాన్ని కొలుస్తున్నాను... ’’ అన్నారు విల్మోర్!విల్మోర్ కూతుళ్లిద్దరూ కింద ఆయన కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. పెద్ద కూతురు డ్యారిన్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్టు అంతరిక్షం (Space) వరకు వచ్చేసింది. ‘‘నాన్నా! మీరిక్కడ చాలా మిస్ అయ్యారు. క్రిస్మస్ని మిస్ అయ్యారు. మీ థర్టీయత్ వెడ్డింగ్ యానివర్సరీని మిస్ అయ్యారు. చెల్లి స్కూల్ ఫైనల్ దాటేసింది. మీరది చూడలేదు. కాలేజ్ ప్లే లో నేను యాక్ట్ చేశాను. అదీ మీరు చూడలేదు. మీరు కిందికి రాగానే, మీ మెడ చుట్టూ చేతులు వేసి మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది నాన్నా...’’ అని డ్యారిన్ అంటోన్న ఆ వీడియోను మళ్లీ మళ్లీ చూసుకుంటూ... ‘‘మిస్ విలియమ్స్! భూమి పైన మీకు ప్రియమైన వారు ఎవరు?!’’ అని నన్ను అడిగారు విల్మోర్!‘‘ఇండియా’’ అని చెప్పాను. ‘‘ఇంకా?’’ అన్నారు. ‘‘భగవద్గీత’’ అని చెప్పాను. ‘‘ఇంకా?’’ అన్నారు. ‘‘ఉపనిషత్తులు’’ అన్నాను. ‘‘ఇంకా?’’ అన్నారు! ‘‘సబర్మతి ఆశ్రమం’’ అన్నాను.నేను నా హజ్బెండ్ పేరు చెప్పేవరకు ఆయన ఇంకా... ఇంకా... ఇంకా... అని అంటూనే ఉంటారని నాకర్థమైంది. కానీ నేను మైఖేల్ పేరు చెప్పలేదు. గోర్బీ, గన్నర్, బైలీ, రోటర్ల పేర్లు చెప్పాను. అవి మా పెట్స్. ‘‘ఐయామ్ సారీ...’’ అన్నారు విల్మోర్.పెట్స్ పేర్లు చెప్పగానే మాకు పిల్లలు లేరన్న సంగతి ఆయనకు గుర్తొచ్చి ఉండొచ్చు. ‘‘ఇట్స్ ఓకే...’’ అన్నాను నవ్వుతూ. విల్మోర్ నా పట్ల గమనింపుతో ఉంటారు.‘‘మనమేమీ ఇక్కడ ఒంటరిగా లేము...’’ అంటారు. ‘‘మనల్నెవరూ ఇక్కడ వదిలేసి వెళ్లలేదు’’ అంటారు. నేనెప్పుడైనా దీర్ఘాలోచనలో ఉంటే, ‘‘అంతరిక్షంలో నివసించటం గొప్ప అనుభూతి కదా...’’ అని నవ్వించే ప్రయత్నం చేస్తారు.‘‘మిస్టర్ విల్మోర్! మీరేమీ నాకు ధైర్యం చెప్పక్కర్లేదు. కావాలంటే నా ధైర్యంలోంచి మీక్కొంచెం ఇస్తాను...’’ అన్నానొకసారి. ఈదురుగాలొచ్చి ఒక్క తోపు తోసినట్లుగా నవ్వారాయన! ఆ నవ్వుకు మేమున్న అంతరిక్ష కేంద్రం గతి తప్పుతుందా అనిపించింది! ‘స్పేస్ఎక్స్ క్యాప్యూల్’ మా కోసం బయల్దేరి వస్తోందని తెలియగానే'.... ‘‘మిస్ విలియమ్స్! అంతరిక్షంలో మీతో పాటుగా నేనూ ఉన్నానన్న సంగతిని భూమ్మీద అందరూ మర్చిపోయినట్లు న్నారు...’’ అన్నారు విల్మోర్ నవ్వుతూ. ఆ మాటకు నవ్వాన్నేను.‘‘చిక్కి సగమైన సునీతా విలియమ్స్’, ‘సునీతా విలియమ్స్ (sunita williams) రాక మరింత ఆలస్యం’, ‘నేడో రేపో భూమి పైకి సునీతా విలియమ్స్’... భూగోళం మొత్తం మీ గురించే రాస్తోంది, మీ కోసమే ఎదురు చూస్తోంది మిస్ విలియమ్స్...’’ అన్నారు విల్మోర్.నన్ను ఆహ్లాదపరచటం అది. ‘‘ఆశ్చర్యం ఏముంది మిస్టర్ విల్మోర్! భూగోళం ఒక వైపుకు మొగ్గి ఉంటుందని తెలియకుండానే డ్యారిన్ వాళ్ల నాన్న గారు ఆస్ట్రోనాట్ అయ్యారా?’’ అని నవ్వాను. దూరాన్నుంచి, చుక్క ఒకటి మా వైపుకు మెల్లిగా కదిలి వస్తూ ఉండటం కనిపించింది!చదవండి: మణిశంకర్ అయ్యర్ (కాంగ్రెస్) రాయని డైరీఆ చుక్క... తన బిడ్డల్ని గుండెల్లోకి పొదువుకోవటానికి వస్తున్న తల్లిలా ఉంది. భుజాలపైకి ఎక్కించుకొని తిప్పటానికి వస్తున్న తండ్రిలానూ ఉంది. ‘‘స్పేస్ఎక్స్ క్యాప్య్సూల్ వస్తున్నట్లుంది...’’ అన్నారు విల్మోర్, ఆ చుక్క వైపు చూస్తూ!- మాధవ్ శింగరాజు -
ప్రభుత్వం చేయాల్సింది కొండంత!
ప్రధాని మోదీ ఆ మధ్య తన ‘మన్ కీ బాత్’ ప్రసారంలో ఒక ప్రధానమైన ప్రజారోగ్య సవాలు గురించి నొక్కి చెప్పారు. అదేమిటంటే... అధిక బరువు లేదా ఊబకాయం సమస్య. ఒక వ్యక్తి నుండి మరొకరికి నేరుగా సంక్రమించని మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు (ఎన్సీడీలు) పెరగడా నికి దారితీసే కారకాల్లో ఊబకాయం ఒకటి. వంట నూనె వినియోగాన్ని తగ్గించడం వంటి చిన్న ప్రయత్నాలతో దేశం ఊబకాయం సవాలును పరిష్కరించగలదని ప్రధాని అన్నారు. ‘ప్రతి నెలా 10 శాతం తక్కువ నూనె వాడితే సరి. అది ఊబ కాయాన్ని తగ్గించే ముందడుగు అవుతుంది’ అన్నారాయన.ఆహారంలో తక్కువ నూనె వాడటం, ఊబకాయాన్ని ఎదు ర్కోవడం కుటుంబం పట్ల బాధ్యత కూడా అని ప్రధాని అన్నారు. ప్రధాని ఇచ్చిన ప్రజారోగ్య సందేశం ముఖ్యమైనదే. కానీ అది మొత్తం కథలో ఒక భాగం మాత్రమే. కొవ్వుల అధిక వినియోగం, ప్రధానంగా ఆహారంలో ఉండే ఒక రకమైన ట్రాన్స్ ఫ్యాట్స్ లేదా అసంతృప్త కొవ్వు (ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్) లేదా అనేది ఎన్సీడీ వ్యాధులకు కారణమయ్యే వాటిల్లో ఒకటి మాత్రమే. అసంతృప్త కొవ్వు మూలాలలో పాల ఉత్పత్తులు, నెయ్యి, మాంసం, వనస్పతి ఉన్నాయి. ఇతర కొవ్వులను ఎక్కువగా తీసుకోవడం కూడా హానికరం. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ జారీ చేసిన ఆహార మార్గదర్శకాల ప్రకారం... కొబ్బరి నూనె, నెయ్యి, పామోలిన్ నూనెలో సంతృప్త కొవ్వుల నిష్పత్తి అత్యధికంగా ఉంటుంది. ప్రధాని సూచించినట్లుగా, వంట చేసేటప్పుడు లేదా డ్రెస్సింగ్ చేసేట ప్పుడు ఆహారానికి జోడించే కొవ్వుల వినియోగాన్ని తగ్గించడం అనేది మనం వేసే ముందడుగులో సగం మాత్రమే. ప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్, వేయించిన స్నాక్స్, కుకీలు వంటి వాటిద్వారా మనం అసంతృప్త కొవ్వులను తీసుకుంటాం.సంతృప్త, అసంతృప్త కొవ్వుల వనరులు కూడా మారుతూ ఉంటాయి. అలాగే వంట నూనెలూ ఉంటాయి. ప్రజారోగ్యంపై ఆరోగ్యకర ప్రభావం కోసం... నూనెలు మాత్రమే కాక నెయ్యి, వనస్పతి అలాగే అల్ట్రా–ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్, పాల ఉత్పత్తులు తీసుకోవడాన్ని తగ్గించడం అవసరం. అనారోగ్యకరమైన ఆహారం, కూర్చుని పనిచేసే జీవనశైలికి వ్యతిరేకంగా కూడా ఊబకాయంపై జాతీయ ప్రచారాన్ని విస్తరించాలి.వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని కోరడం ద్వారా ఊబకాయ మహమ్మారిని ఎదుర్కోవాల్సిన బాధ్యతను వ్యక్తులపై పెట్టారు ప్రధాని. ఆరోగ్యకర ఆహారపుట లవాట్లను అవలంబించడం అనేది వ్యక్తుల బాధ్యతతోపాటు, సామాజిక బాధ్యత కూడా అంటూ దశాబ్దాలుగా సాగించిన ప్రచారానికి ఇది విరుద్ధం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలు తినడానికి వీలు కల్పించే, ప్రోత్సహించే వాతావరణ పరికల్పనకు తగిన విధానాలను రూపొందించడం ప్రభుత్వ విధి. ఊబకాయాన్ని పరిష్కరించడానికి వ్యక్తిగతమైన చర్యలతో పాటు ఇతర చర్యలూ అవసరం. ఉదాహరణకు, భారతదేశం వంటనూనె దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. పైగా ప్రభుత్వ విధానాలు పామాయిల్ దిగుమతిని ప్రోత్సహిస్తాయి. దిగుమతి చేసుకున్న అన్ని నూనెలలో ఇది దాదాపు 60 శాతం ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ పరిశ్రమకు పామాయిల్ చాలా ఇష్టమై నది. అయినా అనేక అధ్యయనాలు పామాయిల్ వినియోగంతో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపాయి. వంట నూనెల ఉత్పత్తినీ, దిగుమతినీ నియంత్రించే ప్రభుత్వ విధానాలను ప్రజలకు తక్కువ హానికరమైన వంట నూనెలను అందించే విధంగా రూపొందించాలి.గత కొన్ని దశాబ్దాలుగా... పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ, ఆహార ఉత్పత్తుల ప్రపంచీకరణ పెరగడంతో దేశంలో ఆహారపుటలవాట్లు మారాయి. ఫలితంగా ఉప్పు, చక్కెర, కొవ్వులు అధికంగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు ప్రజాదరణ పొందాయి. ఈ ఉత్పత్తులు ఆహార పర్యావరణాన్ని మార్చాయి. ప్రతి చోటా జంక్ ఫుడ్ అందుబాటులో ఉంది. ఈ మార్పుకు ప్రభుత్వ విధానాలు పెద్ద ఎత్తున దోహదపడ్డాయి. ప్రభుత్వాలు చిప్స్, కోలాస్, కుకీలు, నమ్కీన్ వంటి వాటిని తయారు చేసే, ప్రాసెస్ చేసే ఫుడ్ కంపెనీలకు సబ్సిడీలను అందిస్తాయి. ఆరోగ్యకరమైన ఎంపిక కాబట్టి తాజా పండ్లు, కూరగా యలు అందుబాటులో ఉండేలా ప్రోత్సహించాలి. కానీ మన విధానాలు పండ్లు, కూరగాయలను ప్రాసెస్ చేసే కంపెనీలను ప్రోత్సహిస్తాయి. మరోవైపు, జంక్ ఫుడ్‌ను నియంత్రించే ఏ చర్య నైనా ఆహార నియంత్రణ సంస్థలు, పరిశ్రమ ఆదేశం మేరకు నిలిపివేస్తున్నాయి. హాస్యాస్పదం ఏమిటంటే, ఆహార భద్రతా రెగ్యులేటర్, సుప్రసిద్ధ జంక్ ఫుడ్ కంపెనీల భాగస్వామ్యంతో కొన్ని సంవత్సరాలుగా ’ఈట్ రైట్’ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. జంక్ ఫుడ్‌పై కఠిన నియంత్రణకు మద్దతు పొందే బదులుగా, ఆహార భద్రతా నియంత్రణ సంస్థ అది నియంత్రించాల్సిన వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2022 నాటికి ఆహార గొలుసు నుండి పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన అసంతృప్త కొవ్వులను తొలగించడానికి ‘ఇండియా:75: ఫ్రీడమ్ ఫ్రమ్ ట్రాన్స్ ఫ్యాట్స్’ కార్యక్రమాన్ని ఆహార నియంత్రణ సంస్థ 2019లో ప్రారంభించింది. కానీ జంక్ ఫుడ్ పరిశ్రమ నుండి తీవ్ర వ్యతిరేకత వల్ల ఈ లక్ష్యసాధన సాధ్యం కాలేదు.‘కూర్చుని పనిచేసే’ జీవనశైలి, అసలు వ్యాయామం చేసే అవకాశం లేనిస్థితులు కూడా గమనార్హం. శారీరకంగా చురుకుగా ఉండటం, వ్యాయామం చేయడం వ్యక్తిగత ఎంపికే అయినా, సమాజ స్థాయిలో శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించే చురుకైన వాతావరణాన్ని సృష్టించడంలో ప్రభుత్వ విధానాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు, నడక, వ్యాయామానికి అనుకూల మైన బహిరంగ ప్రదేశాలను అందించడం; ప్రజా రవాణా, పాద చారులకు ప్రత్యేక కాలిబాటలు, సైక్లింగ్ మార్గాలు ఏర్పాటు ప్రజారోగ్యాన్ని కాపాడడంలో కీలకం. వంటనూనె వినియోగాన్ని తగ్గించడం వంటి వ్యక్తిగత చర్యలు ఊబకాయపు చక్రంలో ఒక చిన్న భాగం మాత్రమే. ప్రభుత్వాలు చేయాల్సింది చాలా ఉంది.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ఇండియా’ కూటమి లేనట్టేనా?
సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్ కరత్ ఈ నెల 9వ తేదీన గమనా ర్హమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణం తర్వాత ఇంకా ఎవరూ ఆ స్థానంలోకి రాలేదు. కరత్ పాలిట్ బ్యూరో సమన్వయ కర్తగా నియమితులయ్యారు. అది ప్రస్తుతా నికి ప్రధాన కార్యదర్శి వంటి హోదా. పైగా ఆయన స్వయంగా లోగడ ఆ హోదాలో పని చేశారు. అందువల్ల తన మాటలకు తగినంత ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు. కరత్‌కు మార్క్సిస్ట్ సిద్ధాంతాలలో నిష్ణాతుడనే పేరు పార్టీలో, బయటా కూడా ఉన్నది. హరికిషన్ సింగ్ సూర్జిత్ ప్రధాన కార్యదర్శిగా ఉండినపుడు, సీపీఎంతో పాటు మొత్తం వామపక్షాలను మధ్యే మార్గ పార్టీలతో మైత్రి వైపు మళ్లించారు. సీతారాం అందుకు అనుకూలురు కాగా, కరత్ వ్యతిరేకి. కరత్ మాట్లాడిన సందర్భం సీపీఎం కేరళ శాఖ సభలు కొల్లామ్ పట్టణంలో జరగటం. ఆ సభలు ఒక రాష్ట్రానికి సంబంధించినవి. ఆయన మాటలు నేరుగా తన ప్రసంగంలో అన్నవి గాక, విడిగా ఒక పత్రికా ప్రతినిధితో చెప్పినవి. అందువల్ల వాటికి తగిన ప్రచారం రాలేదు. కానీ అవి మొదట అనుకున్నట్లు గమనార్హమైనవి: ‘ఇండి యన్ నేషనల్ డెవలప్మెంటల్, ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధా నాలు, సిద్ధాంతాలు, నాయకులు ఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. ఒక సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఇతర పార్టీలు ప్రయత్నించాయి గానీ అది ఆచరణలో పని చేయగలది కాదన్నాము. దానితో, నాయకులు మాత్రం కలుస్తుండేవారు. కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు గానీ అవేవీ పని చేయ లేదు. సీట్ల సర్దుబాటుపై జాతీయ స్థాయి చర్చలు వీలయేవి కాదు గనుక ఆ పని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా జరగాలన్నాము మేము. ఉదాహరణకు మా పార్టీ బెంగాల్లో, కేరళలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయదు. మొత్తానికి ఆ పద్ధతి పనిచేసి బీజేపీ సొంత మెజారిటీ కోల్పోయి 240 స్థానాలకు తగ్గింది. అందువల్ల, ఇండియా కూటమి అన్న ఆలోచనే లోక్‌సభ ఎన్నికలకు పరిమితమైనటువంటిది... లోక్ సభ ఎన్నికల అనంతరం తమకు అసలు ఒక ఉమ్మడి వేదిక అవస రమా? అయితే ఏ విధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. ఒక వేళ వేదిక ఎన్నికల కోసమే అయితే, ఇపుడు చేయవలసింది ఏమీఉండదు’ అన్నారు సీపీఎం సమన్వయకర్త.కూటమి భవిష్యత్తు?కరత్ వెల్లడించిన అభిప్రాయాలలో ఇండియా కూటమి ఏవిధంగా వ్యవహరించిందన్న గత పరిస్థితులకే పరిమితమయ్యారనే భావన కలగవచ్చు. కానీ అందులో అంతర్లీనంగా, ప్రతిపక్షాలు మౌలి కంగా ఎట్లా పనిచేస్తున్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా పని చేయా లనే కోణాలు కూడా కనిపిస్తాయి. చెప్పాలంటే ఈ ప్రశ్నలు ప్రతి పక్షాలకు 1977 నాటి జనతా పార్టీ నుంచి మొదలుకొని తర్వాత కాలంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ల కాలంలో, ఇంకా తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడిన యూపీఏ హయాంలోనూ కొనసాగినవే. ఇండియా కూటమి బలహీనతలు, వైఫల్యాల వెనుక కూడా ఇదంతా ఉంది. కూటమికి వ్యవస్థాత్మక నిర్మాణాన్ని సీపీఎం వ్యతిరేకించటానికి కారణం అందులో పలు రకాల విధానాలు, సిద్ధాంతాలు గల పార్టీలు, నాయకులు ఉండటం. దీనికి సమాధానాలు కనుగొనలేకపోయినందువల్లనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కూటమికి భంగపాట్లు ఎదురు కావటం జరిగింది. అటువంటి భంగపాట్లు జనతా పార్టీ కాలం నుంచి గత 48 సంవత్సరాలుగా ప్రతిపక్షాలకు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకు ఒక కారణం వారి వైఫల్యాలు కాగా, మరొకటి భారతదేశపు మహా విస్తారమైన వైవిధ్యత.ఇన్నిన్ని ప్రాంతాలు, సైద్ధాంతిక, విధానపర, రాజకీయ వైవిధ్య తలు ఉన్నపుడు ఏకాభిప్రాయాలు, విభేదాలకు అవకాశం ఉండని సమష్టి నాయకత్వాలు తేలిక కాదు. కాంగ్రెస్, బీజేపీలవలె నిర్దిష్ట దీర్ఘకాలిక చరిత్రలు, నాయకత్వాలు, సిద్ధాంతాలు ఉన్నపుడు అది సాధ్యమవుతుంది. లేదా ఎమర్జెన్సీ వంటి అసాధారణ పరిస్థితి ఏర్పడి దేశాన్ని ఒకటి చేయటం వంటిది జరగాలి. వీటన్నింటి మధ్య స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి ఒక పాయగా సాగుతుండిన సోషలిస్టు రాజకీయం సరిగా కుదురుకొని ఉంటే ఏమి జరిగేదో గానీ పలు కారణాలవల్ల అది ఛిన్నాభిన్నమైంది. మరొకవైపు, కేవలం ఎమర్జెన్సీ పట్ల వ్యతిరేకతతో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఏర్పడిన జనతా పార్టీ, తర్వాత ‘యాంటీ కాంగ్రెసిజం’ ఆలోచనలతో ముందుకు వచ్చింది. తాము ఒకప్పటి కాంగ్రెస్ సంప్రదాయంలో వామపక్షపు మొగ్గు గల మధ్యే మార్గ ప్రత్యామ్నాయం కాగలమన్న ఫ్రంట్ కూటములు అదే దశలో చెదిరిపోయాయి.కనీస ఉమ్మడి కార్యక్రమం ఏమిటి?అయితే, ప్రకాశ్ కరత్ మాటలను పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే, 1977 నాటి జనతా పార్టీ కాదుగానీ, 1989లో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కొంత భిన్నంగా కనిపించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలతో అదే పార్టీకి చెందిన వీపీ సింగ్ వంటి ముఖ్య నేతలు బయటకు రావటం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నదనే ఫిర్యాదుతో పలు ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఎమర్జెన్సీ – జనతా పార్టీ దశలో ఒకటై తిరిగి చెదిరిపోయిన సోషలిస్టు వర్గాలు, ఉభయ కమ్యూ నిస్టులు, దేశవ్యాప్తంగా సమాజంలోని ప్రజాస్వామికవాదులు ఒకే వేదికపైకి వచ్చి చేరారు. అంతేగాక, వీపీ సింగ్, ఎన్టీఆర్‌ల నాయ కత్వాన బీజేపీని ఒక అడుగు దూరంలోనే ఉంచివేశారు. ఈ వైవిధ్య తల మధ్య అపుడు ప్రకాశ్ కరత్ ఉద్దేశిస్తున్నది ఒకటి జరిగింది. అది, ఎన్నికలకన్నా ముందే వివిధ పార్టీల మధ్య సుదీర్ఘ చర్చల ద్వారా ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ఒకటి రూపొందించటం. అది దేశ ప్రజానీకానికి ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించిన మాట నిజం. అయితే కొందరు సీనియర్ల అధికార కాంక్షలు, మందిర్–మండల్ వివాదాల మూలంగా ఆ ప్రయోగం భంగపడటం తెలిసిందే. అది జరగనట్ల యితే దేశ రాజకీయాలు మరొక విధంగా ఉండేవేమో.సీపీఎం సమన్వయ కర్త ప్రకాశ్ కరత్ అపుడంతా జాతీయ స్థాయిలో ఈ పరిణామాలను ప్రత్యక్షంగా గమనించిన వ్యక్తి. ప్రస్తుత ‘ఇండియా’ కూటమికి సంబంధించిన పరిణామాల వరకు తనకు తెలియనిది లేదు. అందువల్లనే ఆ కూటమి ఏర్పాటు తీరు, లక్ష్యాలు, పనితీరు, పరిమితులు, సాఫల్య వైఫల్యాల గురించి అంత స్పష్టంగా చెప్పగలిగారు. ఈ విషయాన్ని కొంత ముందుకు తీసుకువెళ్ళి నట్లయితే, ఆయన ఎత్తి చూపిన సైద్ధాంతిక, విధానపరమైన వైవిధ్యతలు, వైరుధ్యాల నుంచి, నాయకుల వ్యక్తిగత ధోరణులనుంచి బీజేపీ యేతర పార్టీలు బయటకు రాగలగటం, నేషనల్‌ఫ్రంట్ వలె కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకోవటం ఎంత వరకు సాధ్యమన్నది ప్రశ్న. అందుకు బీజేపీ వ్యతిరేకత అన్నదొక్కటే చాలదు. తమవైపు నుంచి ప్రజలకు చూపించే ప్రత్యామ్నాయ పాజిటివ్ ఆర్థిక, సామాజిక, అభివృద్ధి అజెండా తప్పనిసరి. ఎన్నికల తర్వాత ఏమిటన్న చర్చ ‘ఇండియా’ కూటమిలో ఎప్పుడూ జరగలేదని కరత్ ఎత్తిచూపింది ఈ విధమైన కొరతనే!‘ఇండియా’ పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధానాలు, సిద్ధాంతాలు, నాయకులుఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. లోక్‌సభ ఎన్నికల అనంతరంతమకుఅసలు ఒక ఉమ్మడి వేదిక అవసరమా? అయితే ఏవిధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. – ప్రకాశ్ కరత్, సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- టంకశాల అశోక్ -
కాలం చెల్లిన చైనా ‘చేప కథ’
ఏ శాస్త్రంలోని నూతన ఆవిష్కరణ అయినా సామాజిక శాస్త్ర పర్యావరణ గీటురాయి మీద దాని మానవీయ విలువను నిర్ధారించుకోక తప్పదు. 2004 డిసెంబర్లో ‘ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’ (ఐసీటీ) మన బడుల్లో పాఠంగా మొదలయింది. అది మొదలు గత రెండు దశాబ్దాలలో దానికి మొలకెత్తిన చిలవలు పలవలు... ఊడలు దిగిన మ్రానులైన పరిస్థితుల్లో, మన మానసిక వైఖరులు మన మానవీయ విలువలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? అన్నప్పుడు కొంచెం తేడాతో అందరం అందులో మునకలు వేయడం అయితే నిజం. మనకంటే ముందే ఈ అనుభవమున్న సంపన్న దేశాల్లో దీని పర్యవసానాలపై అధ్యయనం మొదలయింది కనుక ఈ ప్రపంచీకరణ కాలంలో ఆ కొలమానాలు మనమూ వాడుకోవచ్చు. గత పదేళ్ళలో పెరిగిన ‘సోషల్ మీడియా’ మన మీద పెంచుతున్న ఒత్తిడితో ఏర్పడిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’లో ఇప్పుడు మనం ఉన్నాం. అదొక నూతన పర్యావరణంగా మారి, మన ఆలోచనలు అభిప్రాయాలు అందుకు అనుగుణంగా మార్చుతూ, మూడు రంగాలలో మన జీవితాల్ని అది ప్రభావితం చేస్తున్న దని ఫిబ్రవరి 2023లో ఎవాన్ కుహెన్ ఒక వెబ్‌సైట్‌కు రాసిన ‘వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం?’ వ్యాసంలో అంటారు. గుర్తించిన ఆ మూడింటిలో ‘సివిల్ సొసైటీ’ (పౌరసమాజం) ఒకటి. ఈ పరిశీలన వెలుగులో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ‘పౌర సమాజం’ సంగతి ఏమిటి? మన పండితులు పామ రుల అభిప్రాయాలపై ఎటువంటి ‘సమాచార’ పర్యా వరణ ప్రభావం ఉంది. ప్రభావశీలురైన ముగ్గురు ప్రముఖులు 2025 ఫిబ్రవరిలో వెలుబుచ్చిన అభిప్రా యాలలో నుంచి వాటిపై ‘సమాచార పర్యావరణ’ ప్రభావం ఏ మేర ఉందో చూద్దాం. ఫిబ్రవరి మొదటివారంలో ప్రభుత్వ కార్యదర్శులతో ఏర్పాటుచేసిన ఒక సమీక్ష సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ – ‘‘మీరు ఫిర్యాదుల పరిష్కారం మొదటి ప్రాధాన్యతగా చూడాలి, రెవెన్యూశాఖ నుంచి భూ కబ్జాలు వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయి. డాక్యుమెంట్స్ ఫోర్జరీ ఎక్కువ అయిపోయింది... వీటిని మీరు ఎలా పరిష్కరిస్తారు అనేది మీకే వదిలి పెడుతున్నాను’’ అన్నారు. ఇది విన్నాక ఈ ధోరణి మూలాలు ఎక్కడ ఎందుకు మొదలయింది వెతికితే, రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడకు మారిన 2015 తర్వాత నుంచి రాజకీయం అంటేనే ‘భూమి విలువ’ అన్నట్టుగా మారింది. ‘‘అమరావతిలో అన్నీ పోను ఎనిమిది వేల ఎకరాలు మిగులుతాయి, ఎకరం 20 కోట్లు చొప్పున అమ్మితే 160 కోట్లు వస్తాయి...’’ తరహా మాటలు అధికార కేంద్రాల నుంచి వస్తే, ‘సోషల్ మీడియా’ దానికి విస్తృత ప్రచారం ఇచ్చింది. ఇప్పుడు తెనాలి ప్రాంతానికి చెందిన ఏ.పి. ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్’ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ కూడా విశాఖలో– ‘‘కొత్త రాష్ట్రానికి అమరావతి వంటి ‘గ్రీన్ ఫీల్డ్ కేపిటల్’ ఉండడం అవసరం’’ అంటూ పనిలో పనిగా –‘‘ఉచితాలు అనుచితం’’ అని కూడా అనేశారు. పోనీ అది నిజమనుకుందాం. మరి వారే ‘‘బాపట్ల సమీపాన 20 ఏళ్ళనాడు ఆగిపోయిన ‘వాన్ పిక్’ ఈ పదేళ్లలో పూర్తి అయివుంటే, ‘ఉచితాలు’ తీసుకునేవారు అవి మాని అక్కడే ఏదో ఒక ‘లేబర్’ పని చేసుకుని బతికేవారు’’ అని కూడా అనొచ్చు కదా? చివరికి ఏమైంది గత పదేళ్ళలో ‘రాజధాని’ చుట్టూ ‘సోషల్ మీడియా’ వ్యాప్తి చేసిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’ కింద నలిగి కేంద్ర హోంశాఖ నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ నిపుణుల అభిప్రాయాలు ఇటువంటి ప్రకట నల కింద సమాధి అయ్యాయి.రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బా రావు కూడా ఇదే విశాఖ నుంచి ఉచితాలు గురించి – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటూ ఎప్పుడో పాతదైన ‘చైనా వారి చేప’ కథ చెప్పారు. అది చైనాలో నిజమేమో. ఇక్కడ ‘చేపలు’ పట్టడం నేర్పడం కోసం పెట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ఏమైందో చూశాం. అయినా – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటే, ఈ ‘ఉచితాలు’ పొందే వారు కూడా ఏమంత సంతోషంగా ఏమీ లేరు. కారణం కళ్ళముందు సంపన్న వర్గాల వద్దకు చేరుతున్న సంపద, వారి విజయగాథలు, వైభవంగా జరిగే వారి పెళ్ళిళ్ళు, ఫ్యామిలీ ఫంక్షన్స్... వాటి గురించి ‘సోషల్ మీడియా’ కథలుగా చెబుతుంటే వింటూ, తమకు అందే అరకొరను వాళ్ళు తూకం వేస్తున్నారు. అధికార కేంద్రాలకు దగ్గరయితే, అక్రమ ఆదాయ వనరులు ఎలా పెరుగుతాయో ‘సోషల్ మీడియా’ వారికి నిత్యం కళ్ళకు కట్టిస్తున్నది.విషయం ఏమంటే, ప్రభుత్వ పరిపాలనలోకి ‘టెక్నాలజీ’ వచ్చాక, అవినీతికి చిల్లులున్న చీకటి మార్గాలు మూతపడి అదాయ వనరులకు గండి పడితే, ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి వనరుల్లో వెతు క్కుంటున్నారు. అభివృద్ధి మారుమూల గ్రామాలకు ప్రవేశిస్తుంటే, బయటకు వెళుతున్న మట్టి, కంకర చూస్తున్నదే. వాటి వివరాలు ‘సోషల్ మీడియా’ 24 గంటలూ జనానికి చూపిస్తున్నది. ఈ అక్రమ లావా దేవీల చిట్టా సామాన్యుడికి అరచేతిలో ‘ఫోన్’లో దొరుకుతుంటే, ప్రభుత్వం అరాకొరా ఉచితంగా ఇచ్చే రొట్టె ముక్కను ఇవ్వాలా వద్దా? అంటూ మళ్ళీ అదే పాత చర్చ అంటే, వారి వద్ద పాండిత్యం పరిహాసం అవుతుందేమో!జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
చేజారుతున్న విత్తన స్వాతంత్య్రం
వ్యవసాయంలో విత్తనాల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. హరిత విప్లవం పేరిట మొదలుపెట్టిన పరిణామం విత్తనాలతోనే మొదలైంది. అధిక దిగుబడి వంగడాల హామీతో ఇది మొదలై, క్రమంగా రైతులను విత్తనాలకు దూరం చేసింది. 1960వ దశకంలో మొదలు పెట్టిన ఈ మార్పు 2025 నాటికి తీవ్రరూపం దాల్చింది. ఆహార నాణ్యత దిగజారడానికి విత్తనాలలో వచ్చిన మార్పులే కారణం. దేశీ విత్తనాలను తులనాడి, భారత వ్యవసాయాన్ని హీనపరిచి తెచ్చిన హరిత అధిక దిగుబడి వంగడాలు క్రమంగా రైతుల విత్తన స్వావలంబనను హరించాయి. రసాయనాల దిగుబడివిదేశీయుల ప్రోత్సాహంతో ప్రవేశపెట్టిన వంగడాలు అధిక దిగుబడి ఇవ్వడానికి ప్రధాన కారణం రసాయన ఎరువులు. రసా యన ఎరువులు ఉపయోగించని పరిస్థితులలో ఈ వంగడాలు ఉప యోగపడలేదు, ఉపయోగపడవు. ఆ విధంగా మొదలుపెట్టిన రసా యన ఎరువుల వాడకం ఇప్పుడు విధిగా, అత్యధికంగా ఉపయోగించాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు ఎకరాకు ఒకటో రెండో ఎరువుల బస్తాల వాడకం నుంచి ఇప్పుడు 15 బస్తాలు వాడే దుఃస్థితికి రైతు చేరుకున్నాడు. పరిశోధన చేసి ప్రవేశపెట్టిన హైబ్రిడ్ లేదా అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, కీటకనాశక రసాయనాల ఉపయో గాన్ని కూడా పెంచాయి. ఈ రకం విత్తనాలు మొదట్లో అధిక దిగుబడి చూపినా క్రమంగా ఉత్పాదకత తగ్గింది. దిగుబడి పెరిగి తగ్గుతోందని గుర్తించి ఒక కొత్త వాదన ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. విత్తనాలు ఎప్పటికప్పుడు మార్చాలి. మార్చితేనే దిగుబడి! ఏ ఆధునిక విత్తనంలోనూ నూరు శాతం అంకురోత్పత్తి ఉండదు. దాంతో మభ్యపెట్టే సిఫారసు మొదలైంది. ఎకరాకు ఎన్ని గింజలు వెయ్యాలి? సాధారణంగా ఒక్కో పంటకు ఒక్క కొలమానం ఉంటుంది. ఆధునిక విత్తనాల్లో అంకురోత్పత్తి వంద శాతం ఎప్పుడూ ఉండదు కనుక ఈ కొలమానంలో మార్పులు తెచ్చి ఎకరాకు ఎక్కువ విత్తనాలు వాడే విధంగా సిఫారసు చేయడం మొదలు పెట్టారు. వరి పంటకు కొందరు రైతులు ఎకరాకు 18 నుంచి 20 కిలోలు వాడుతుంటే, పరిజ్ఞానం ఉన్న రైతులు కేవలం 250 గ్రాముల దేశీ వరి విత్తనాలు వాడుతున్నారు. ఎంత తేడా! మిర్చి, పత్తి, వరి, గోధుమ, టమాట వంటి పంటలలో నాసి రకం విత్తనాల వల్ల లాభపడు తున్నది ప్రైవేటు కంపెనీలు, నష్టపోతున్నది రైతులు. పోయిన జ్ఞానం, నమ్మకంఆధునిక విత్తనాల వల్ల సాగు ఖర్చు పెరిగింది. ఒకప్పుడు రైతు తన విత్తనాలు దాచుకుని వాడే రోజులలో విత్తనాల మీద సున్నా ఖర్చు ఉండేది. రైతుకు తన విత్తనాల మీద పరిజ్ఞానం ఉండేది. వేరే రైతు దగ్గర తెచ్చుకున్నా నమ్మకం ఉండేది. రైతు తన విత్తనాలు కోల్పోయి ఆధునిక విత్తనాలకు అలవాటు పడ్డ తరువాత విత్తనాల మీద జ్ఞానం, నమ్మకం పోయినాయి. ఆధునిక విత్తనాలకు చీడ పీడ బెడద పెరిగింది. దానికి పరిష్కారంగా కీటక నాశనిల వాడకం పెరి గింది. వాటి వల్ల ఖర్చు పెరిగింది. ప్రమాదకరమైన రసాయనాలు కాబట్టి వాటిని వాడే క్రమంలో రైతు ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ఫలితంగా వలసలు, ఆత్మహత్యలు. వ్యవసాయ కూలీ కుటుంబా లతో మొదలైన వలసలు రైతులను కూడా తాకాయి. ఇంకొక వైపు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయం మీద సలహాలు ఇచ్చే కంపెనీలు పెరిగాయి. వాటి వార్షికాదాయం యేటా పెరుగుతున్నది.బహుశా నార్మన్ బోర్లాగ్ కూడా ఈ పరిణామం ఊహించి ఉండక పోవచ్చు. బోర్లాగ్ ప్రవేశపెట్టిన ‘అధిక దిగుబడినిచ్చే’ విత్తనా లకు ఖరీదైన ఎరువులే కాక, ఎక్కువ నీరూ అవసరం. వ్యవసాయ ఉత్పత్తిలో అద్భుతాలు లేవు అని చెప్పిన ఈ వ్యక్తి, ప్రపంచానికి ఆహార భద్రత సాధించాలని మొదలు పెట్టిన ‘ఆధునిక విత్తనాల’ వ్యవసాయం జీవ వైవిధ్యాన్ని, జీవనోపాధులను నాశనం చేస్తున్న విషయం పట్ల స్పందించలేదు. ‘అధిక వంగడాల’ వల్ల దిగుబడి పెరుగుతుందనే ఏకైక సూత్రం మీద పని చేసిన ఆ మహానుభావుడు తద్వారా నిర్మాణమైన ‘దోపిడీ’ వ్యవస్థ గురించి ఆలోచించలేదు.పెద్ద కంపెనీల గుప్పిట్లో...ఇప్పుడు ‘ఆధునిక విత్తనాలు’ రైతుల చేతులలో లేవు. విత్తన, పెస్టిసైడ్ కంపెనీల గుప్పిట్లో ఉన్నాయి. ‘మేధో హక్కుల సంపత్తి’ పేరిట రక్షణ పొంది విత్తన మార్కెట్లను సురక్షితం చేసుకున్నాయి. ఎప్పటికప్పుడు దిగుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో యేటా కొత్త ‘విత్తనాలు’ మార్కెట్లో ప్రవేశపెట్టి అటు ప్రభుత్వాలనూ, ఇటు రైతులనూ మభ్యపెడుతూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. మన దేశంలో విత్తనాలు, ప్రకృతి వనరుల మీద మేధో సంపత్తి హక్కులు పొందే అవకాశం లేదు కనుక ఇతర మార్గాలలో తమ వ్యాపారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. పెద్ద కంపెనీలు సిండికేట్ అయ్యి చిన్న కంపెనీలను గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. మార్కెట్ ఒప్పందాలు చేసుకుని దేశీ, చిన్న కంపెనీలకు ‘బంధనాలు’ వేశారు. ప్రభుత్వం ఏదన్నా ‘చర్య’ చేపడితే కోర్టుకు వెళతారు. విత్తన కంపెనీలు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మీద వేసిన కేసులు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి.రైతులలో విత్తనాల విజ్ఞానం కొండలా పెరగాల్సిందిపోయి, ప్రైవేటు గుత్తాధిపత్యం వల్ల వారికి అందడం లేదు. రానురాను విత్తన విజ్ఞానాన్ని రహస్యంగా మార్చుతున్నాయి విత్తన కంపెనీలు. ఇక్రి సాట్, ఇర్రి వంటి అంతర్జాతీయ సంస్థలు విత్తన పరిశోధనల సాకుతో భారతీయ జన్యు సంపద తీసుకుని, క్రమంగా ప్రైవేటు పెట్టుబడి దారులకు అందజేస్తున్నాయి. 1966 తరువాత నిర్మాణమైన ప్రభుత్వ విత్తన వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఇప్పుడు ఉన్న సంస్థలు, కమి టీల పరిశోధనలు ఉత్సవ పాత్రకే పరిమితమై, పరోక్షంగా ప్రైవేటు కంపెనీల ప్రయోజనాలను కాపాడుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ఏదో జరుగుతున్న భ్రమ కల్పించటానికి ఉపయోగపడుతున్నాయి.వ్యాపార సరళీకరణ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యానికి, దేశాభివృద్ధికి మూలమైన విత్తన రంగాన్ని ప్రైవేటుపరం చేస్తూ, ఉన్న ఒకే ఒక చట్టాన్ని అమలు చేయడం లేదు. 1966లో ప్రభుత్వం రంగంలో చేసే విత్తనాల నాణ్యత, సరఫరా మీద శాస్త్రీయ నియంత్రణకు తెచ్చిన విత్తన చట్టం ప్రైవేటు విత్తనాలకు వర్తింప జేయడానికి సిద్ధంగా లేదు. 2004లో ఒక కొత్త చట్టం తెచ్చే ప్రయత్నం ప్రైవేటు విత్తన కంపెనీల వ్యాపార వెసులుబాటును సరళీకృతం చేయడానికే అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 20 యేళ్ల తరువాత కూడా అది రూపుదాల్చలేదు. ఇప్పటి వరకు ప్రతిపాదించిన 4, 5 ముసాయిదాలు రైతుల ప్రయోజనాలు కాపాడటానికీ, భారత దేశంలో ఉన్న అపర విత్తన సంపద స్వచ్ఛతను పరిరక్షణకూ ఉద్దేశించినవి కావు. రైతులు, కంపెనీల ప్రయోజనాల మధ్య కంపెనీల పక్షం వహిస్తున్న కేంద్రం కొత్త చట్టం తేవడానికి భయపడుతున్నది. విత్తనాల మీద స్వావలంబన అత్యంత మౌలికమైన అవసరం. రైతులకు విత్తన స్వాతంత్య్రం కోసం రాష్ట్రాలు చట్టాలు తేవాలి. రైతుల పరిజ్ఞానం పెంచే విధంగా విత్తన వ్యవస్థను నిర్మించాలి. విత్తన జన్యుసంపదను కలుషితం కాకుండా కాపాడాలి. పర్యావరణానికి, జన్యుసంపదకు హాని చేసే విత్తనాలను ప్రవేశపెట్టే కంపెనీలు,సంబంధిత వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. గ్రామీణ స్థాయి నుంచి విత్తనాలను రైతులు స్వేచ్ఛగా ఇచ్చి పుచ్చుకునే పద్ధతులను ప్రోత్సహించాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
హిందీ వ్యతిరేకత ఎందుకు?
మత, భాష, ప్రాంతీయ ఉన్మాదాలు భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు గొడ్డలి పెట్టు అనే విషయంలో దేశ హితాన్ని కోరే అందరి వ్యక్తుల అభిప్రాయం ఒకే విధంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందీ భాషపై అవాకులు చవాకులు పేలడం దేశంలో పెద్ద చర్చనీయాంశమైంది. ‘త్రిభాషా సూత్రం’ అమలులో భాగంగా హిందీనీ విద్యాలయాల్లో బోధించ డాన్ని వ్యతిరేకించడం తమిళ రాజకీయాలలో ఒక భాగమే.దేశంలో తెలివైన విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి, విద్యార్థుల్లో ‘ఈ దేశం నాది’ అనే భావనను నిర్మాణం చేయడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ‘నవోదయ’ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలలు తమిళనాడుకు అవసరం లేదని ద్రవిడ పార్టీల నాయకులు అడ్డు కున్నారు. ఆ పాఠశాలల్లో హిందీని ఒక భాషగా బోధించడమే ఇందుకు కారణం. ‘సర్వ శిక్షా అభియాన్’ నిధులను తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం విషయంలో కేంద్రానికి– రాష్ట్రానికి మధ్య చోటుచేసుకున్న వివాదం కారణంగా త్రిభాషా సూత్రం తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయడం వీలు కాదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ బహిరంగ ప్రకటన చేయడంతో త్రిభాషా సూత్రం అమలు విషయంపై రాద్ధాంతం మళ్లీ తెరపైకి వచ్చింది. దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ విషయంపై అభ్యంతరాలు లేవు. త్రిభాషా సూత్రం అమలులో భాగంగా దక్షిణాదిలో రాష్ట్ర భాష, ఇంగ్లీషు, హిందీ బోధించేటట్లు; ఉత్తరాదిలో హిందీ, ఇంగ్లీషు, ఏదైనా దక్షిణాది రాష్ట్రాల భాష (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఏదో ఒకటి) బోధించేటట్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఏకాభి ప్రాయంతో నాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే తమిళులు దీన్ని వ్యతిరేకించారు. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఈనాటిది కాదు. 1937లో ‘ద్రావిడార్ కళగం’ పేరుతో ఈవీ రామస్వామి తమిళ ప్రజలను రెచ్చగొట్టి, ‘ఉత్తరాది వారి భాష హిందీ మనకెందు’కంటూ, తమిళ ప్రజల్లో హిందీ భాషపై ద్వేషాన్ని నూరి పోశారు. తమిళనాడులోని జస్టిస్ పార్టీ కూడా ఈ హిందీ వ్యతిరేక ఉద్యమానికి అండగా నిలిచింది. అగ్నికి ఆజ్యం పోసింది. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో అప్పటి రాజ గోపాలాచారి నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం రాజీనామా చేయడంతో ఉద్యమం చల్లారింది. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఇంగ్లీషు స్థానంలో హిందీని జాతీయ భాషగా ప్రవేశపెట్టాలని ఆలోచించడంతో 1965లో ‘ద తమిళనాడు స్టూడెంట్స్ యాంటీ హిందీ యాజిటేషన్ కౌన్సిల్’ పేరుతో తమిళ నాయకులు పెద్ద ఎత్తున హింసాత్మక ఉద్యమాన్ని లేవదీశారు. ఉద్యమాన్ని అణచడానికి పారా మిలటరీ దళం రంగ ప్రవేశం చేయడంతో 500 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. నాటి ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి బలవంతంగా హిందీని తమిళ ప్రజలపై రుద్దే అవకాశం లేదని ప్రకటించడంతో ఉద్యమం ఆగి పోయింది.ఈ ఉద్యమ ప్రభావంతో 1967 ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. ఉత్తరాది ప్రజలు ఆర్య సంస్కృతికి చెందిన వారనీ, వారి భాష హిందీ అనీ, ఆ భాషను మాట్లాడటం తమిళుల ఆత్మగౌరవానికి భంగం అనే భావనను తమిళ ప్రజల మనసులో బాగా చొప్పించారు బ్రిటిష్ పాలకులు. పాశ్చాత్య కోణంలో హిందూ సంస్కృతిని దునుమాడడమే ధ్యేయంగా పెట్టుకున్న ఈవీ రామ స్వామి బ్రిటిష్ పాలకులకు ఒక పనిముట్టుగా దొరికారు. ఆయన ప్రియ శిష్యుడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శ్రీరామునిపై, రామాయణంపై దుర్వా్యఖ్యలు చేయడం, ఆయన మనుమడు ఉదయనిధి ఒక మంత్రి హోదాలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటిదని మాట్లాడటం బ్రిటిష్ వాళ్ళు నూరి పోసిన ఆర్య ద్రావిడ వాద ప్రభావమే! తమిళులే హిందీని వ్యతిరేకించడం వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే!ఉల్లి బాలరంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
మనోభావాల మందుపాతర?
ఒక కార్టూన్ ప్రకటించడం రాజ్యాంగబద్ధమైన భావప్రకటనా స్వేచ్ఛలో భాగం అవునా కాదా నిర్ధారించుకోవడానికి ఒక పత్రిక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన దుఃస్థితికి చేరింది మన సమాజం. ఇవాళ దేశంలో కార్టూన్ అనే అతి సాధారణ సృజ నాత్మక ప్రక్రియ మనోభావాల మందు పాతరగా మారిపోయింది. ఒక కార్టూన్ వల్ల భారత సార్వభౌమత్వానికీ, సమగ్రతకూ, పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకూ ముప్పు వాటిల్లుతున్నదనీ మద్రాసు హైకోర్టు ముందర కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నది. ఇంతకూ ఏమిటా కార్టూన్? అమెరికా ప్రభుత్వం తన దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారని, లేదా చట్టవిరుద్ధంగా ఉంటు న్నారని 300కు పైగా భారతీయ పౌరులను పట్టుకుని, ఫిబ్రవరిలో మూడు విడతలుగా వెనక్కి పంపించింది. ఆ దేశపు చట్టాల ప్రకారం అది సాధారణమే కావచ్చు. వారు తమ దేశంలో ప్రవేశించిన నేరం చేసినందుకు దేశం నుంచి వెళ్లగొట్టడం అనే శిక్ష వేశారు, సరిపోయింది. ఒకే నేరానికి రెండు, మూడు శిక్షలు వేయడం సహజ న్యాయానికి వ్యతిరేకం. కానీ వారికి రెండో శిక్షగా చేతులకూ కాళ్లకూ సంకెళ్లు వేశారు. మూడో శిక్షగా వారిని జంతువుల్లా, సరుకుల్లా చూసి యుద్ధవిమానాల్లో రవాణా చేశారు. ఇది తప్పనిసరిగా భారత ప్రజ లకు జరిగిన అవమానం, నేరాన్ని మించి శిక్ష విధించడం. భారత ప్రభుత్వంలో అత్యున్నతాధికారం నెరపుతున్న వ్యక్తిగా ప్రధాన మంత్రి తన సాటి పౌరులకు జరిగిన ఈ అవమానం గురించి, విపరీత శిక్షల గురించి ఆ శిక్షలు విధించిన దేశాధ్యక్షుడితో సమావేశంలో కనీసం మాట మాత్రం ప్రస్తావించకపోవడం, నిరసన తెలపకపోవడం ఎవరినైనా ఆలోచింపజేస్తుంది. అలా అవతలివైపు వ్యంగ్య ఆలోచనకు చిత్రరూపమైన కార్టూన్‌ను సుప్రసిద్ధ తమిళ పత్రిక ‘ఆనంద వికటన్’కు చెందిన వికటన్ ప్లస్ వెబ్సైట్ ఫిబ్రవరి 10 సంచిక ముఖచిత్రంగా ప్రచురించింది. అందులో అమెరికా అధ్య క్షుడి ముందు భారత ప్రధాని చేతులకూ కాళ్లకూ సంకెళ్లతో కూచుని ఉన్నట్టు చిత్రించారు. దాని మీద తమిళనాడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు, వెంటనే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆనంద వికటన్ వెబ్‌సైట్‌ను మూసివేసింది. తర్వాత ‘ఆనంద వికటన్’ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న మద్రాసు హైకోర్టు ఇప్పటికైతే, మధ్యంతర ఉత్తర్వులలో వెబ్‌సైట్‌ను మూసివేయగూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుదితీర్పు వచ్చే దాక కార్టూన్‌ను ఉపసంహరించాలని ఆనంద వికటన్‌కు సూచించింది. ఇట్టే పడే దృష్టి! ఏదైనా పత్రిక చూస్తున్నప్పుడు పాఠకుల దృష్టి సహజంగా కార్టూన్ మీదికి పోతుంది. మిగిలిన వార్తలన్నీ నిండా అలుక్కుపోయి ఉండగా, కార్టూన్ స్థలం సింగిల్ కాలం అయినా, రెండు కాలాలో మూడు కాలాలో అయినా, ఆ రేఖలూ, రేఖల మధ్య ఖాళీలూ,బాగా తెలిసిన ముఖాలే కాస్త వక్రంగా మారి ఉండటమూ, ఒకటో రెండో హాస్య, వ్యంగ్య, వెటకార పూరితమైన వాక్యాల వ్యాఖ్యలూ తప్పనిసరిగా పాఠకుల దృష్టిని ఆకర్షిస్తాయి. కార్టూన్ ప్రక్రియ ఎంతో ఆదరణ చూరగొన్నదీ, గౌరవనీయమైనదీ మాత్రమే కాక కనీసం రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది. పందొమ్మిదో శతాబ్దపు మధ్య భాగంలో ‘పంచ్’ పత్రికలో రాజకీయ కార్టూన్లు ప్రారంభమయ్యాయంటారు. రాజకీయ నాయకులే నిర్ణేతలుగా, ప్రముఖులుగా, అందరికీ తెలిసినవారుగా ఉన్న సమాజంలో వారే కార్టూన్‌కు ప్రధాన వస్తువు కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. అలాగే రాజకీయ ఘటనల ప్రభావం సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంటుంది గనుక, ఆ ఘటనల అవతలి కోణం మీద ప్రజలకు ఆసక్తి ఉంటుంది గనుక సహజంగానే వాటి మీద వ్యంగ్యపు, వెటకారపు వ్యాఖ్యానం బహుళ జనాదరణ పొందుతుంది. ఒక ప్రక్రియగా కార్టూన్ ఎంత విశాలమైనదీ, లోతైనదీ, ఆకర్షణీ యమైనదీ, ఆమోదయోగ్యమైనదీ అంటే ఆ కార్టూన్లో వెటకారానికి గురైన రాజకీయ నాయకులకు కూడా అది నవ్వు పుట్టిస్తుంది. అది తమను నొప్పించిందనో, వెటకరించిందనో, తమ మీద వ్యంగ్య వ్యాఖ్య చేసిందనో నొచ్చుకునే సందర్భంలో అయినా ఆ బాధిత వ్యక్తులు కూడా నవ్వుకునే గొప్ప కళ కార్టూన్. అసలు తనమీద వచ్చిన పరిహాసాన్ని ఆమోదించడం, తన పనిమీద వ్యంగ్య వ్యాఖ్యకు అవకాశం ఇవ్వడం ఆ వ్యక్తి విశాల హృదయానికి, సౌమనస్యానికి సంకేతాలు. వ్యంగ్యాన్ని స్వీకరించలేక...అందువల్లనే కార్టూన్ల, హాస్య, వ్యంగ్య రచనల వారపత్రికగా వెలువడుతుండిన ‘శంకర్స్ వీక్లీ’ని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆదరించాడు. అసలు శంకర్స్ వీక్లీ పుట్టుక కథే చిత్రమైనది. అప్పటికి ‘హిందుస్థాన్ టైమ్స్’లో కార్టూనిస్టుగా ఉండిన శంకర్ పిళ్లై అప్పటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి మీద విపరీతంగా కార్టూన్లు వేస్తుండగా అవి ఆపమని సంపాదకుడు దేవదాస్ గాంధీ ఆదేశించాడు. దానితో విభేదించి బైటికి వచ్చిన శంకర్ తన సొంత పత్రికగా 1948లో ‘శంకర్స్ వీక్లీ’ పెట్టాడు. ‘‘మౌలికంగా వ్యవస్థా (ప్రభుత్వ) వ్యతిరేక పత్రిక’’ అని శంకర్ చెప్పుకున్నప్పటికీ, పత్రికను ప్రధానమంత్రి నెహ్రూనే ఆవిష్కరించాడు. ఆ పత్రికలో తన మీద, తన మంత్రివర్గం మీద, తన ప్రభుత్వపు చర్యల మీద శంకర్, ఇతర కార్టూనిస్టులు వేసిన కార్టూన్ల లోని హాస్యాన్నీ వ్యంగ్యాన్నీ నెహ్రూ అభినందించాడు. ఇరవై ఏడు సంవత్సరాలు నిరాటంకంగా నడిచిన ‘శంకర్స్ వీక్లీ’ ఎమర్జెన్సీ విధించాక ఆరు వారాలకు ఆగిపోయింది. ఎమర్జెన్సీకీ పత్రిక ఆగిపోవడానికీ సంబంధం లేదని శంకర్ అన్నాడు. ఆ పత్రిక చూడటం తనకు చాలా అలవాటనీ, అది చూడకపోతే కొరతగా ఉంటుందనీ ఇందిరా గాంధీ కూడా అంది. కానీ మొత్తానికి పత్రిక ఆగిపోయింది. తర్వాతి కాలంలో శంకర్స్ వీక్లీలా పూర్తిగా కార్టూన్లకూ,హాస్య, వ్యంగ్య రచనలకూ అంకితమైన పత్రికే లేకుండా పోయింది. బహుశా మన సమాజంలో హాస్య చతురత, హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ ఆమోదించే విశాల హృదయాలు కుంచించుకుపోవడం మొదలయిందేమో!‘శంకర్స్ వీక్లీ’లోనే ప్రారంభమైన ఆర్.కె. లక్ష్మణ్, ఒ.వి. విజయన్, ఇ.పి.ఉన్ని, రాజిందర్ పూరీ, కుట్టి, బాల్ థాకరే, యేసుదాసన్ వంటి ఎందరో రాజకీయ కార్టూనిస్టులు నాలుగు దశాబ్దాలు భారత రాజకీయ కార్టూన్ రంగాన్ని వెలిగించారు. తెలుగులో కూడా ఎందరో రాజకీయ కార్టూనిస్టులు ఎందరెందరో నాయకుల మాటలనూ, హావభావాలనూ, పనులనూ తరతరాలు నవ్వుకునేంత హాస్య, వ్యంగ్య దృష్టితో చిత్రించారు. ఆ మహోజ్వల చరిత్ర గల కార్టూన్ కళకు ఇప్పుడు కాని కాలం దాపురించినట్టే ఉంది. పూర్తిగా కార్టూన్లకు, హాస్య, వ్యంగ్య రచనలకు అంకితమైన పత్రికలు లేవు. పత్రికల్లో ప్రతిరోజూ కార్టూన్ కనబడటం లేదు. సింగిల్ కాలం పాకెట్ కార్టూన్ మొక్కుబడి వ్యవహార మైపోయింది. కార్టూన్ స్ట్రిప్‌లు ఖాళీ నింపే ఆరో వేలు అయి పోయాయి. అన్నిటికన్నా ముఖ్యం రాజకీయ కార్టూన్ ఏ రాజకీయ నాయకుడి మనసు నొప్పిస్తుందో, ఏ నాయకుడి భక్తుల మనోభావాలను, ఏ మత, కుల, ప్రాంత, భాషా సమూహపు మనోభావాలను గాయపరుస్తుందో, ఆచితూచి అడుగువేయవలసిన మందుపాతరల క్షేత్రంగా మారిపోయింది. ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చెప్పిందేమిటి... చేసేదేమిటి?
అమరావతి దేవతల రాజధాని అంటారు. ఆ పేరుతో నిర్మించా లనుకుంటున్న రాజధాని నగరం మాత్రం శాపగ్రస్థ, వివాదాస్థ ప్రదేశంగా మారింది. విభజన చట్టం అమలు హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కేవలం రూ. 2,500 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజ్టెక్ట్ అని, దానిపై ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టక్కరలేదని చంద్రబాబు పదేపదే చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 9 వేల కోట్లు ఖర్చు చేసింది. మరో రూ. 6 వేల కోట్లు ఖర్చు చేయడానికి తాజా బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. ఇవి కాకుండా అంతర్జాతీయ సంస్థల నుంచి రూ. 31 వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుంటోంది.కేంద్రంలోని మోదీ సర్కార్ తమ మద్దతుతోనే మన గలుగుతోంది అంటూ, ఈ 31 వేల కోట్ల రూపాయల రుణంతో రాష్ట్రానికి సంబంధం లేదని కేంద్ర ప్రభు త్వమే ఆ భారాన్ని మోస్తుందని చంద్రబాబు అండ్ కో ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలను ఉద్యమం రూపంలో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ తాజాగా మార్చి 10వ తేదీన తమ అధికారిక ఎక్స్ ఎక్కౌంట్లో ‘రాజధాని అమరావతికి అప్పులు అంటూ, వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టింది. వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే రుణాలు ఏపీ అప్పుల పరిధిలోకి రావని స్పష్టం చేసింది’ అని పేర్కొంది. అబద్ధాలు చెప్పడంలో రాటు దేలిన ఆ పార్టీ ఈ రుణాల బాధ్యత తమది కాదు, కేంద్రానిదే అని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రుణాలపై వివరణ ఇస్తూ ‘మల్టీ లేటరల్ లోన్ అసిస్టెన్స్’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులను ఆ ప్రభుత్వమే చెల్లించాలని చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మార్చి 10వ తేదీన మాట్లాడుతూ,‘అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్ట్, మెజార్టీ నిధులను సీఆర్డీఏనే సమకూర్చుకునే విధంగా ప్రాజె క్టును డిజైన్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా సపోర్ట్ ఇస్తున్నాం అంతే. అది కూడా బయటి సంస్థల ద్వారా రుణాల రూపంలో నిధులను సమకూర్చి ఇస్తున్నాం. అమరావతి భూములు అమ్మేసి ఈ అప్పు లన్నీ కట్టేసే విధంగా డిజైన్ చేస్తున్నాం’ అంటూ వివరణ ఇచ్చారు. కేంద్రం అమరావతికి ఏ రూపంలోనూ నిధులు సమకూర్చడం లేదని, దానిపై కేంద్రానికి ప్రత్యేక శ్రద్ధ కూడా లేదనడానికి ఇదే నిదర్శనం.అమరావతి నిర్మాణం, చంద్రబాబు ప్రభుత్వ చిత్త శుద్ధిపైనా సామాన్యులకే కాదు... అమరావతి ప్రాంత రైతులకు కూడా సందేహాలున్నాయి. అందుకే వారు భూ సమీకరణకు సీఆర్డీఏకి సహకరించడం లేదు. 38,581 ఎకరాల్లో రాజధానిని నిర్మించేందుకు 2015 జనవరిలో సీఆర్డీఏ ప్రారభించిన భూ సమీకరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనిలో 33 వేల ఎకరాల భూమి సమీకరించాం అంటున్న సీఆర్డీఏ రైతులకు బదులుగా 65 వేల కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వాలి. అయితే ఇప్పటి వరకూ 45 వేల ప్లాట్లను మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో పాటు ఇతర కారణాల దృష్ట్యా ఇప్పటికి 20 వేల ప్లాట్లను రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ భూ సమీకరణ పూర్తి కానంత వరకూ రాజధాని విస్తీర్ణం నిర్ణయించడం సాధ్యం కాదు. సీర్డీఏ మరో ఐదు వేల ఎకరాలు రైతుల నుంచి సమీకరించడానికి ఎప్పటి నుంచో విఫలయత్నం చేస్తోంది. అయితే వారు తమ భూములను ఇవ్వడానికి ఏ మాత్రం అంగీకరించడం లేదు. 29 గ్రామాలతో కూడిన ప్రదేశంలో రాజ ధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దానిలో భాగస్వామ్యం కావడానికి రెండు గ్రామాల ప్రజలు ఇప్పటికీ నిరాకరిస్తున్నారు. అమరావతి భూము లపై ప్రస్తుతం వందలాది కోర్టు కేసులున్నాయి. ఇన్ని అడ్డంకులున్నా ప్రభుత్వం మాత్రం 47 సంçస్థలకు భూములు కేటాయించింది. ఇప్పటికే రూ. 9 వేల కోట్లు అమరావతి నిర్మాణాలపై ఖర్చు చేసి మరో రూ. 48 వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచింది. అమరావతిలో భూ సమీకరణ ఒక విఫల ప్రయోగం. భూ సమీకరణ పేరుతో అమాయక రైతులు ఎలా నష్టపోయారో బెంగళూరుకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ప్రొఫెసర్ కరోల్ ఉపాధ్యాయ తన ‘అసెంబ్లింగ్ అమరావతి: స్పెక్యు లేటివ్ ఎక్యుమిలేషన్ ఇన్ ఏ న్యూ ఇడియన్ సిటీ’ అధ్యయన గ్రంథంలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. జపాన్‌కు చెందిన మాకీ అసోసియేట్స్ సంస్థ ‘అమరావతి’ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అంతర్జాతీయ వేదికల్లో ప్రస్తావించింది. ‘హైటెక్ సిటీ’ పేరుతో హైదరాబాద్‌లో చంద్ర బాబు నాయుడు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఎలా పాల్పడ్డారో ప్యారిస్ యూనివర్సిటీకి చెందిన ‘దలేల్ బెన్‌బబాలి’ కళ్ళకు కట్టినట్లు వివరించారు. అదే ప్రయోగాన్ని చంద్ర బాబు నాయుడు అమరావతిలో కూడా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అమరావతిలో దళితులకు అన్యాయం, బలహీన వర్గాల జీవనోపాధికి భంగం కలుగుతుందన్న వాదనలు ఉన్నాయి. శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి అమరావతి అనువైన ప్రదేశం కాదని అభిప్రాయపడిది. ఆ తరుణంలో అమరావతిలో రాజధాని పెట్టాలని చంద్రబాబు నాయుడికి వెంకయ్యనాయుడు సలహా ఇచ్చారంటూ అప్పట్లో ‘ఈనాడు’ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ ప్రదేశానికి అమరావతి అని నామకరణం చేసిన వ్యక్తి చెరుకూరి రామోజీరావు. దీనిని అమలు చేస్తోంది చంద్రబాబు నాయుడు. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పు లతో నిర్మిస్తున్న అమరావతి అందరి రాజధానిగా ఉంటుందా? కొందరి రాజధానిగా ఉంటుందా? అన్న అనుమానాలు సామాన్యులకు రావడం సహజమే.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్మొబైల్: 89859 41411 -
ఆ గానానికి గమ్యం – శ్రీహరి సన్నిధే!
సంగీతం ఆపాతమధురం. భావుకతతో, సమసమాజ భావనలతో, ప్రకృతి వర్ణనలతో... ఇలా హరివిల్లులా సంగీత జగత్తు నాదమయం. అలాగే భక్తి, ప్రపత్తి, శరణాగతులతో గానం చేసిన వారి కీర్తి అజరామరం. మన సమకాలంలో గానం చేస్తున్న, చేసిన సంగీత విద్వాంసులలో తనదైన విలక్షణ గాత్రంతో వెలిగిన ధ్రువతార శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్.నాకు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌తో దశాబ్దాల అనుబంధం. సౌజన్యం, సంస్కారం, వినమ్రత – పరిచయమైన క్షణంలోనే సూదంటురాయిలా ఆకర్షించిన అంశాలు. శక్తి, భక్తి, రక్తి కలిగిన తిరుమల ఆలయ కవి అన్నమయ్య కీర్తనలు పాడి తరించిన సంకీర్తన మహతి.స్వామి పుష్కరిణీ తీరంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని గానం చేసిన భావ పుష్కరిణి అన్నమయ్య. ఆ కీర్తనలలోని రసాత్మ కతను దర్శించి, అనుభవించి స్వర పరచిన మహనీయులలో ఆరాధ్యుడు, అనవధ్యుడు శ్రీ గరిమెళ్ళ. ఒక వాగ్గేయకారుని సహస్ర కీర్తనలు స్వర పరిచి, పాడి, తన శిష్య ప్రశిష్యులతో పాడించిన కారణ జన్ముడు. స్వయంగా వాగ్గేయకారుడు. ‘ఆంజనేయ కృతి మణిమాల’, ‘నవగ్రహ కీర్తనలు’ వంటివి ఇందుకు మణిదర్పణం. లలిత సంగీత రచనల్లో 200 పాటల అందమైన బాలకృష్ణ భావలహరి అజరామరం.గాయకుడిగా, వాగ్గేయకారుడిగా, స్వరకర్తగా, శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దిన సంగీత కులపతి ఆయన. ఉద్యాన వనంలో ఆనేకమైన పూలకుండే పరిమళంలా, ప్రతి పాటకు తాను చేసిన స్వర రచనలో ఎంతో వైవిధ్యం, ఎంతో శాస్త్రీయత ఉట్టిపడుతాయి. అయితే, అంత కన్నా ఎంత ఆర్ద్రత నిండుగా ఉంటుందో స్మరిస్తే పులకించిపోతాం.సంగీత అక్షయ పుణ్యకోశమైన శ్రీ బాలకృష్ణ ప్రసాద్‌కు నాపై ఉండే ఆదరం నిరుపమానం. లెక్కకు మించిన సార్లు నా ఇంటికి వచ్చి నాకు నచ్చిన పాటలు వినిపించిన ఆత్మబంధువు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా నేను రూపకల్పన చేసిన ‘దళిత గోవిందం’, ‘కల్యాణమస్తు’, ఇంకా, దేశ విదేశాల్లో జరిగిన కల్యాణాల్లో, ఇతర ధార్మిక కార్యక్రమ ప్రస్థానంలో, ఆయన నా సహచరుడు. దళిత గోవిందం, శ్రీనివాస కల్యాణాల్లో – ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’, ‘ఇతడొక్కడే సర్వేశ్వరుడు’ వంటి కీర్తనలు ఆయన ఆలపించిన తీరు నాలో చెరగని ముద్ర వేశాయి. బాలకృష్ణ ప్రసాద్ ఛాందసుడు కాడు. మానవత్వం మొగ్గ తొడగాలని, సమాజంలో అన్ని వర్గాల మధ్య మమతా బంధాలు బలపడాలనే తాత్వికుడు. ఈ సత్యాన్ని తెలిపే వారి లలిత గీతాలు – ఆకాశవాణిలో ఎన్నో ప్రసారం అయ్యాయి. సామ్యవాదాన్ని, సౌమ్య వాదాన్ని మేళవించుకొన్న స్థితప్రజ్ఞడు.రాజకీయ నాయకుల్లో మాట తప్పని, మడమ తిప్పని మహ నీయుడు శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారితో చేయించిన సన్మానం తనకొక మధుర స్మృతిగా నాకు తరచూ చెప్పేవాడు. జన హృదయ నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆదేశిస్తే, తి.తి.దే. అధ్యక్షుడిగా ఆయనకు ‘పద్మశ్రీ’ ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాను. కేంద్ర సంగీత నాటక ఆకాడమీ సన్మానితుడిగా, తి.తి.దే. ఆస్థాన పండితుడిగా, బిరుదులకే గౌరవాన్ని తెచ్చిన, లేదా పెంచిన ప్రజ్ఞాశాలి ఆయన. లాలిపాటల నుండి జోల పాటల వరకు కులశేఖరపడి వద్ద పాడిన అపర అన్నమయ్య.శ్రీవారి సేవలో నాద విద్వాంసుడిగా జీవించిన పూర్ణకాముడు. ఆ గాత్రానికుండే ప్రత్యేకత ఆరు దశాబ్దాల కాలం, ఇలలో సౌగంధికా సౌరభాన్ని నింపింది. ఇక కోనేటి రాయుని కొలువులో నారద,తుంబురులతో గానం చేస్తాడు. అన్నమయ్య కీర్తనలను, తన కీర్తనలను కలిపి గానం చేస్తూ తాళ్ళపాక కవులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతాడు. పులుకు తేనెల తల్లి అమృత హస్తాలతో ఆనందామృతాన్ని గ్రోలుతాడు. ఆ మహనీయుని ధర్మపత్ని శ్రీమతి రాధ, వారి పుత్రులైన శ్రీ అనిల్ కుమార్, శ్రీ పవన్ కుమార్‌లకు – జాలి గుండెలవాడైన ఏడుకొండలస్వామి నిండైన అండదండగా ఉంటాడని విశ్వసిస్తున్నాను.భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త పూర్వ అధ్యక్షులు,తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి -
బెలూచిస్తాన్ ఎందుకు భగ్గుమంటోంది?
బెలూచిస్తాన్ (#balochistan) ఖైబర్ పక్తున్‌ఖ్వాల మీద పాకిస్తాన్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని ఫిబ్రవరి 18న అక్కడి మత, రాజకీయ నాయకుడు మౌలానా ఫజలుర్ రెహ్మాన్ ధ్వజ మెత్తారు. సాక్షాత్తు నేషనల్ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిస్థితికి ప్రభుత్వం,సైన్యంతో పాటు ఐఎస్ఐ కూడా కారణమేనని ఆయన అన్నారు. ఈ మాటలు వినిపించినరెండో రోజునే, ఫిబ్రవరి 20న బెలూచిస్తాన్ మరొకసారి భగ్గుమంది. కామిల్ షరీఫ్, ఇషాన్ సర్వార్ బలోచ్ అనే ఇద్దరు తర్బత్ న్యాయ కళాశాల విద్యార్థుల నిర్బంధాన్ని నిరసిస్తూ ఈ ప్రదర్శనలు జరిగాయి. ఆ రెండు రాష్ట్రాలలోనూ ఆందోళనలు కొత్త కాదు. కానీ జాతీయ అసెంబ్లీలో ఒక ప్రముఖ సభ్యుడు ఈ స్థాయిలో హెచ్చరించడం కొత్త అంశమే.‘పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం’ఇటీవలి కాలంలో బెలూచిస్తాన్ ఉద్యమం గొంతు పెరిగింది. కొద్దికాలం క్రితమే ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎదుట బెలూచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా దాని నాయకుడు రజాక్ బలోచ్ చెప్పిన మాటలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమనీ, అది బెలూచిస్తాన్సింధ్, ఆక్రమిత కశ్మీర్‌ల సంపదను అడ్డంగా దోపిడీ చేస్తూ బతుకీడుస్తున్నదనీ ఆరోపించారు. దీనికి చైనా తోడై పాక్ సైన్యానికి శిక్షణ ఇచ్చి, తన కనుసన్నలలో ఉంచుకున్నదని పెద్ద ఆరోపణే చేశారు. పాక్, చైనాలను బెలూచిస్తాన్ నుంచి తరిమేయడమే తమ లక్ష్యమని అన్నారు. స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్ మీద పోరాడుతున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ‘పకడ్బందీ’ దాడులు ఉధృతం చేసింది. 75 ఏళ్లుగా సాగుతున్న ప్రత్యేక దేశ పోరాటం మలుపు తిరిగిందని భావించే స్థాయిలో ఈ దాడులు ఉన్నాయి. బీఎల్ఏను పాకిస్తాన్ తో పాటు అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రాంతంతో పాటు ఇరాన్, అఫ్గాన్లలోని కొన్ని ప్రాంతాలు కలిపి బెలూచిస్తాన్అనే స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలని బీఎల్ఏ కోరుతున్నది. ఇవాళ్టి బెలూచిస్తాన్ అంటే దేశ విభజనకు ముందు ఉన్న కలాత్ సంస్థానమే. దీనికి కూడా పాకిస్తా¯Œ లో లేదా భారత్‌లో కలవడానికి, లేదంటే స్వతంత్రంగా మనుగడ సాగించే వెసు లుబాటు ఇచ్చారు. కానీ జిన్నా ఎత్తు లతో ఇది అంతిమంగా పాక్‌లో విలీనం కావలసివచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పడమంటే, భారత్, పాక్ రెండూ కూడా వలస పాలన ఇచ్చిన సమస్యలను నేటికీ ఎదుర్కొంటు న్నాయి. కశ్మీర్ సమస్యను పాక్ అనుకూలంగా మలుచుకోవాలను కుంటున్నది. కానీ బెలూచిస్తాన్ వ్యవహారాలకు భారత్ దూరంగా ఉంది. 1947 నుంచే వేర్పాటు బీజంనిజానికి 1947 నుంచే బెలూచిస్తాన్‌లో వేర్పాటువాదానికి బీజం పడింది. దీని రాజధాని క్వెట్టా. కోటీ యాభయ్ లక్షల జనాభా ఉన్న బెలూచిస్తాన్ ప్రకృతి సంపదల దృష్ట్యా కీలకమైనది. 1947 నుంచి పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలోచ్ గిరిజన తెగ ఐదు తిరుగుబాట్లు చేసింది. వీటిలో చివరిది 2000 సంవత్సరంలో మొదలయింది. తమ ప్రాంత వనరులలో స్థానికులకు సింహభాగం ఉండాలన్న డిమాండ్‌తో ఈ తిరుగుబాటు తలెత్తింది. కశ్మీర్ వేర్పాటువాద పోరాటానికి మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటించే పాక్ పాలకులు బెలూచీలను దారుణంగా అణచివేస్తున్నారు.బెలూచీల అశాంతి తీవ్రరూపం దాల్చేటట్టు చేసినది పాక్–చైనా ఆర్థిక నడవా. 62 బిలియన్ డాలర్లతో దీనిని నిర్మిస్తున్నట్టు దశాబ్దం క్రితం చైనాప్రకటించింది. బెలూచిస్తాన్‌కు బంగారు బాతు వంటి గ్వదర్ డీప్ సీ పోర్టు నిర్మాణం చైనా చేతిలో పెట్టడం కూడా వారి తిరుగుబాటును తీవ్రం చేసింది. హత్యలే కాకుండా కొన్ని పోలీస్ స్టేషన్లను కూడా బెలూచ్ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశాయి. రైల్వే లైన్లను పేల్చి వేశాయి. ‘బీఎల్ఏకు దాడులు చేసే సామర్థ్యం బాగా పెరిగిందని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. సున్నిత ప్రదేశాలతో పాటు, గహనమైన లక్ష్యాల మీద కూడా దాడి చేసే శక్తి అది సముపార్జించుకున్నది. వీటితో బీఎల్ఏకు విదేశీ సాయం ఉన్నదన్న అనుమానం పాకిస్తాన్ లో మరింత పెరిగింది’ అని పాకిస్తాన్ రాజకీయ, సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత ఆయేషా సిద్దిఖీ వ్యాఖ్యానించారు. సాధారణంగా బెలూచిస్తాన్ ఉగ్ర వాదుల దాడులను పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం ‘శత్రువుల’ పనిగా అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే భారత వైమానిక దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ ఉదంతం తరువాత, అంటే 2016 నుంచి బెలూచిస్తాన్ హింసలో భారత్ హస్తం ఉన్నదని కొత్త పల్లవి అందుకుంది. ఇప్పటికీ జాదవ్ పాకిస్తాన్ నిర్బంధంలోనే ఉన్నారు. ఇందుకే బెలూచిస్తాన్ లో హింసకు సంబంధించి భారత్ మీద పాక్ చేసే ఆరోపణలకు చైనా మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది.పశ్చిమ ప్రాంతంలోనే ‘తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ సంస్థ కూడా పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నది. చిరకాలంగా బెలూచిస్తాన్ ప్రజల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేత వైఖరినే అవలంబిస్తున్నది. అక్కడి పౌరులను అపహరించి మళ్లీ వారి జాడ లేకుండా చేయడం స్థానిక ప్రభుత్వ నిఘా సంస్థలు చేస్తున్న పనేనని 2023 నాటి ఒక నివే దిక పేర్కొన్నది. కనిపించకుండా పోయినవారి కోసం, రాజ్యాంగేతర హత్యలకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న ‘వాయిస్ ఆఫ్ బెలూచ్ మిసింగ్ పర్సన్స్’, ‘బెలూచ్ యాక్ జెహెతి కమిటీ’ సభ్యులను కూడా భద్రతా బలగాలు తీవ్రంగా హింసిస్తున్నాయి. బెలూచిస్తాన్‌లో ఎన్నికలు ప్రహసనంగానే జరుగుతాయి. పౌర ప్రభుత్వాలు, వ్యవస్థలు, సైన్యం ఆ ఎన్నికలను తమకు అనుకూలంగా జరుపుకొంటూ ఉంటాయి. లేదంటే బెలూచిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించే స్థానిక జాతీయ పార్టీ లను గెలిపిస్తూ ఉంటారు. బెలూచిస్తాన్‌లో ఉండే బెలూచీలు, పష్తూన్ ప్రజల మధ్య సదా విభేదాలు రాజేయడానికి సైన్యం తన వంతు పాత్రను పోషిస్తూ ఉంటుంది.బుగ్తీని చంపిన తప్పిదంబెలూచిస్తాన్ లిబరేషన్ఆర్మీ మొన్నటి ఆగస్ట్‌లో చేసిన దాడులకు మరొక ప్రాధాన్యం ఉంది. అది బుగ్తీ తెగ ప్రము ఖుడు అక్బర్ ఖాన్ బుగ్తీ 18వ వర్ధంతి. పర్వేజ్ ముషార్రఫ్ ఆదేశాల మేరకు ప్రయోగించిన క్షిపణి దాడిలో రహస్య స్థావరంలోనే బుగ్తీ మరణించాడు. నిజానికి ఆయన మొదట పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వంలో మంత్రి. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌కు గవర్నర్‌గా కూడా పని చేశాడు. తరువాత బెలూచీల సాయుధ తిరుగుబాటులో భాగస్వామి అయ్యాడు. జుల్ఫీకర్ అలీ భుట్టో ఉరితీత ఎంత తప్పిదమో, బుగ్తీని హతమార్చడం కూడా అంతే తప్పిదమని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. బుగ్తీని చంపడం బెలూచిస్తాన్ ఉద్యమానికి అమ రత్వాన్ని ఆపాదించింది. 1970లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆవిర్భవించినప్పటికీ, దూకుడు పెంచినది మాత్రం ఆయన మరణం తరువాతే.ఈ నేపథ్యంలో బెలూచిస్తాన్ ఉద్యమకారులు భారత్ వైపు ఆశగా చూడటం ఒక పరిణామం. వారి ప్రదర్శనలలో భారత్ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించడం సాధారణమైంది. పాక్ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ తుంటరి పిల్లాడికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత, హక్కు భారత్‌కు ఉన్నాయని లండన్ కేంద్రంగా పనిచేసే బెలూచిస్తాన్ విముక్తి పోరాట సంస్థ కార్యకర్త ఒకరు అభిప్రాయపడటం విశేషం. డా.గోపరాజు నారాయణరావు సీనియర్ జర్నలిస్ట్ -
నవ భారత ప్రణాళిక
ఒక సమాఖ్య దేశంగా భారత్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలోని భిన్నత్వాలన్నింటినీ కలిపి ఉంచే లక్ష్యంతో ఏర్పాటు చేసు కున్న రాజ్యాంగానికి పెను సవాలు ఎదురవు తోంది. భిన్న జాతులు, సంస్కృతులు, భాషల సమ్మేళనంతో కూడిన భిన్నత్వమే దీని ప్రత్యేకత. జనాభా కూర్పు కూడా ఈ దేశం హిందీ భాష, హిందుత్వ భావజాలంతోనిండి పోయేందుకు అవకాశం కల్పించదు.విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలి!ఈ దేశంలో ప్రతి రాష్ట్రమూ తనదైన రీతిలో ఒక ప్రత్యేక జాతి లాంటిది. అందుకే రాజకీయ, ఆర్థిక విషయాల్లో వీటి మధ్య సమ తౌల్యతను కాపాడాల్సిన అవసరముంది. 2026లో ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పార్లమెంటులో కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉంటుంది. జనాభా నియంత్రణ ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను ఇచ్చేందుకు ఆ రాష్ట్రాలు చేసిన కృషికి లభించనున్న ప్రతిఫలమా ఇది!జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించని రాష్ట్రాలకు మరిన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలను సృష్టించటం ద్వారా ప్రోత్సాహ కాలు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క విషయమైతే స్పష్టం చేయాలి. ఈ పునర్విభజన ప్రకియను తక్షణం నిలిపివేయాలి. ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.ఇది సాంకేతిక పరిజ్ఞాన యుగం. నాణ్యమైన విద్య ఉన్న వారే సామాజిక ఫలాలను నిర్ణయిస్తారు. నియంత్రణ మొత్తం కేంద్రం చేతుల్లో ఉన్నప్పటికీ ఉన్నత విద్యారంగం ఇప్పటివరకూ ఆశించిన ఫలితాలనైతే ఇవ్వలేదు. ఉన్నత విద్య నాణ్యత కూడా ఆశించిన ప్రమాణాల మేరకు లేదు. కాబట్టి విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబి తాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), యూజీసీ (యూనివర్సిటీగ్రాంట్స్ కమిషన్) వంటి సంస్థల పెత్తనానికి ఫుల్స్టాప్ పడాలి. దేశానికి నాణ్యమైన ఆధునిక వైద్య, న్యాయ, సామాజిక శాస్త్రాల విద్య అవసరం. నాణ్యమైన విద్యను అందించే విషయంలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడేలా చేయాలి కానీ, పరిపాలన పేరిటకేంద్రం పెత్తనం చలాయించ కూడదు.పన్నుల వాటా 66 శాతానికి చేరాలి!రాష్ట్రాలు ఆర్థికంగా స్వావలంబన, స్వతంత్రత సాధించినప్పుడే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుంది. ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్రాలకు మరిన్ని మార్గాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. పైగా ఇటీవలి కాలంలో కేంద్రం వద్దనే వనరులను కేంద్రీకరించే ధోరణి కనపడుతోంది. ఈ పరిస్థితి మారాలి. రాష్ట్రాలకు దక్కాల్సిన పన్నుల వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి. కేటాయింపులు కూడా జనాభా, తీసుకొచ్చిన ఆదాయం, సగటు కంటే ఎంత ఎక్కువ ఉంది అనే అంశాలతో కూడిన సూచీ ఆధారంగా జరగాలి. రాష్ట్రాలకు అందాల్సిన మొత్తాల విడుదలల్లోనూ అనవసరమైన జాప్యాన్ని చూస్తున్నాం. రాష్ట్రాల ఆదాయాలను కేంద్ర పథకాలకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రాలు తమ ప్రణాళికలు, హామీ లను నెరవేర్చుకునేందుకు వీలుగా ఆదాయం ఎక్కడికక్కడ పంపిణీ జరిగేలా ఒక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది. కేంద్రం ద్వారా నిధుల విడుదలల్లో ఆలస్యం జరిగితే ఆర్బీఐ ప్రైమ్ లెండింగ్ రేట్లతో రాష్ట్రాలకు వడ్డీ చేర్చి ఇవ్వాలి. దేశాద్యంతం చరిత్ర, సంస్కృతులు ఒక్క తీరున లేవు. ప్రతి ప్రాంతంలోనూ తనదైన ప్రత్యేకత కలిగిన చారిత్రక, సాంస్కృతికకేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వపు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) వీటి నిర్వహణ, సంరక్షణల్లో ఘోరంగా విఫల మైంది. ఆకతాయిలు పలు స్మారకాలను ధ్వంసం చేశారు. అన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోనూ ప్రత్యేకమైన సంస్కృతి, చరిత్ర ఉన్న నేపథ్యంలో వాటి సంరక్షణ, నిర్వహణ బాధ్యతలు ఆయా రాష్ట్రాలకే అప్పగించాలి. ఆయా వనరులపై కేంద్రం పెత్తనం చలాయించకుండా వెంటనే రాష్ట్రాలకు బదలాయించాలి. సంకుచిత సైద్ధాంతిక భావ జాలం కారణంగా ఏఎస్ఐ, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టే ధోరణి కనిపిస్తోంది. సహజ వనరులపై హక్కురైతుల నుంచి సేకరించే పంటలకు మద్దతు ధర ఇవ్వడం ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ సేకరణ ఒక రకమైన సబ్సిడీనే కాబట్టి... ఆయా నిధులను వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రాలకే కేటాయించాలి. దేశాద్యంతం పండే పంటల్లో ధాన్యమే ఎక్కువ కాబట్టి అన్ని రాష్ట్రాల్లోనూ ధాన్యం సేకరణకు కనీస మద్దతు ధర అందించాలి. ఒకవేళ అన్ని రాష్ట్రాలకూ ఈ పద్ధతి అనువుగా ఉండదనుకుంటే... ఆయా రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో నష్టపరిహారాన్నైనా అందించాలి.వాయు కాలుష్యంలో శిలాజ ఇంధనాల వాటా దాదాపు 20 శాతం. చౌక ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగం (ప్యాకేజింగ్, ఒకసారి వాడి పారేయడం) వల్ల జల వనరులకు తీవ్ర నష్టం జరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు వాడి పారేసే ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై సుంకాలు విధించాలి. విద్యుత్తుతో, హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్స్‌తో నడిచే వ్యక్తిగత, రవాణా వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలి. వీటిపై పన్నులు ఎత్తివేయడం, వాడుతున్నందుకు ప్రోత్సాహకాలు అందించడం చేయాలి. గంగా పరీవాహక ప్రాంతాన్ని మినహా మిగిలిన చోట్ల బొగ్గు, ఇనుము, అల్యూమినియం, రాగి,జింక్, నికెల్ వంటి ఖనిజ నిక్షేపాలు బోలెడున్నాయి. ఈ ప్రకృతి వనరులపై సహజంగానే ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలకు హక్కు ఉంటుంది. కాబట్టి ఖనిజాన్వేషణ, వెలికితీత హక్కులు, ఆదాయం కూడా ఆయా రాష్ట్రాలకే చెందాలి.ఆర్మీలో కొన్ని ప్రాంతాలకేనా అవకాశం?సాయుధ దళాలు, పారామిలిటరీ దళాల్లో నియామకాలు కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. దేశంలోనే అతి పురాతనమైన పదాతిదళ రెజిమెంట్... మద్రాస్ రెజిమెంట్. నీలగిరి కొండల్లోని వెల్లింగ్టన్లో దీని ప్రధాన కేంద్రం ఉంది. దీంట్లో మొత్తం 29 బెటా లియన్లు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు మొత్తం అంటే సుమారు 27 కోట్లు లేదా దేశ జనాభాలో 22 శాతం మంది దీని పరిధిలోకి వస్తారు. మరోవైపు సిఖ్ రెజిమెంట్‌కు నియామకాలు 80 లక్షల జనాభానుంచి జరుగుతూంటాయి. ఈ రెజిమెంట్‌లో 24 పదాతిదళ బెటాలి యన్లున్నాయి. పంజాబ్ కేంద్రంగా ఉండే అన్ని రెజిమెంట్స్‌ను కలుపు కొంటే మొత్తం 74 బెటాలియన్లు ఉన్నాయి. మూడు కోట్ల మందినుంచి ఈ నియామకాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం ఏర్పాటైన వ్యవస్థలో ఈ రకమైన ప్రాతినిధ్యం ఎంత వరకూ సబబు? గ్రామీణ ప్రాంత యువతకు మేలైన ఉద్యోగావకాశం కల్పించే మిలిటరీలో అన్ని ప్రాంతాలకూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. పెట్టుబడులు ఎక్కువ అవసరమయ్యే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ కేంద్రం నియంత్రణలోనే ఉండటంతో పాటు ఈ రంగంలోకి అడుగుపెట్టడం పెద్ద వ్యాపారవేత్తలకే సాధ్యమయ్యే పరిస్థితి. జనాభాలో ఎక్కువమందికి చేరువ కాగల అవకాశమున్న రేడియోపై కూడా పెత్తనం కేంద్రానిదే. ఇలా కాకుండా ఎఫ్‌ఎంబ్యాండ్లపై రేడియో ఛానళ్లు ఏర్పాటు చేసే అవకాశాన్ని స్థానికులకు కల్పించాలి. ప్రైవేట్, ప్రభుత్వ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు పని చేస్తున్నప్పుడు... సమాచారం కోసం అత్యధికులు ఆధారపడే రేడియో ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ వనరులతో ఎందుకు నడవకూడదు? భారతదేశ ఏకత్వం అందరికీ సముచిత గౌరవమన్న దానిపై ఆధారపడి ఉండాలి. రాజకీయ భేదాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రాల న్నిటినీ భారత రాజ్యాంగం ఒక్కటిగా ఉంచుతోంది. అందరూ తమ గొంతు వినిపించేందుకు అవకాశం లభిస్తోంది. ఒక కేంద్రీకృత వ్యవస్థగా, ఏకస్వామ్యంగా మార్చేందుకు చేసే ఏ ప్రయత్నమైనా... అసలు ఉద్దేశాన్ని, సమాఖ్యను ముక్కలు చేస్తుంది.» కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉన్న పునర్విభజన ప్రకియను నిలిపివేయాలి. ప్రస్తుత పార్లమెంటరీ నియోజక వర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.» ప్రస్తుతం రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. ఈ పరిస్థితి మారాలి. వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి.» విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబితాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల పెత్తనానికి ఫుల్స్టాప్ పడాలి.- వ్యాసకర్త ఫ్రీలాన్స్ కామెంటేటర్, రచయితmohanguru@gmail.com-మోహన్ గురుస్వామి -
అన్ని భాషలు సమానం... హిందీ మరింత సమానం!
దేశంలో ఇప్పుడు హిందీ వివాదం రగులుకుంది. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ దక్షణ భారతదేశంలో హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి నడుం బిగించారు. తమిళనాడులో పెరియార్ ఇవీ రామసామి నాయకర్ కాలం నుండే హిందీ వ్యతిరేకతకు చాలా చరిత్ర వుంది. స్టాలిన్ పిలుపు మీద దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పంది స్తాయో వేచి చూడాలి. మనకు జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీషు, రాష్ట్ర భాష తెలుగు (Telugu) అనే ఒక తప్పుడు అభిప్రాయం సామాన్యుల్లోనేగాక విద్యావంతుల్లోనూ కొనసాగుతోంది. ఏపీ తెలుగు, తెలంగాణ (Telangan) తెలుగు రెండూ వేరే భాషలు, ప్రజలు వేరే జాతులవారు అనే అభిప్రాయాన్ని కొన్నాళ్ళుగా కొందరు కొనసాగిస్తు న్నారు. అది ఆ యా సమూహాల ఉనికివాద కోరికలు కావచ్చు. ఇవిగాక ఈ రెండు రాష్ట్రాల్లోనూ చెరో పాతిక భాషలు మాట్లాడే సమూహాలున్నాయి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో గోండి, కోయ, కొంద, కువి, కోలామీ, పెన్గొ, మంద, యానాది, లంబాడ, సవర (Savara Language) తదితర చిన్న సమూహాలు ఓ పాతిక వరకు ఉంటాయి. అధికార భాషల ప్రాబల్యంలో చిన్న సమూహాలు చితికి పోతాయి; వాళ్ళ భాషలు అంతరించిపోతాయి. భాష కూడ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లాంటిది. తనకన్నా కింద ఉన్న కుల సమూహాన్ని అణిచివేసే సమూహాన్ని అంతకన్నా పైనున్న కుల సమూహం అణిచివేస్తుంటుంది. చిన్న సమూహాలు తమ మాతృభాషను వదులుకోవాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తారు. ఒక భాష అంతరించిపోవడం అంటే ఒక జాతి తన సంస్కృతీ సంప్రదాయాలనూ, తను సృష్టించినకళాసాహిత్యాలనూ కోల్పోవడమే అవుతుంది. అంటే ఆ జాతి ముందు జీవన్మృతిగా మారిపోతుంది. ఆ తరు వాత అంతరించిపోతుంది. బ్రిటిష్ ఇండియా మతప్రాతిపదిక మీద ఇండియా–పాకిస్తాన్‌గా చీలిపోయినట్టు మనకు తెలుసు. అయితే, ఒకేమత సమూహం అయినప్పటికీ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ భాషా ప్రాతిపదిక మీద విడిపోయిందని మనకు గుర్తు ఉండదు. మనుషులకు భాష ప్రాణమంత ముఖ్యమైనది. యూరోప్ దేశాలన్నింటిలోనూ క్రైస్తవ మతసమూహాల ఆధిక్యత ఎక్కువ. అయినప్పటికీ, అవి అన్ని దేశాలుగా విడి పోవడానికి ప్రధాన కారణం భాష. సంస్కృతాన్నిసంఘపరివారం దైవవాణిగా భావిస్తుంది. తాము నిర్మించ తలపెట్టిన ‘హిందూరాష్ట్ర’లో సంస్కృతం జాతీయ భాషగా ఉంటుందనేది ఆ సంస్థ అభిప్రాయం. అంతవరకు దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా కొనసాగించాలని వారి ఆలోచన. జాతీయ భాష మీద చర్చ రాజ్యాంగ సభలోనే జోరుగా సాగింది. మనకు అందుబాటులో ఉన్న భాషల్లో ఏదో ఒకదాన్ని జాతీయ భాషగా చేస్తే అది మిగిలిన భాషల్ని మింగేస్తుందని చాలా మంది తీవ్ర ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలు 22 భాషలకు గుర్తింపు ఇచ్చినప్పటికీ ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. అన్ని భాషలూ సమానమే. మనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న భాషలే తెలుసు. బోడో, డోగ్రీ, మైథిలి, సంథాలి తదితర భాషలకు కూడ రాజ్యాంగంలో స్థానంఉందని మనం తరచూ గుర్తించం. హిందీ జాతీయ భాష కాదు; అది కేంద్ర ప్రభుత్వానికి అధికార భాష మాత్రమే. హిందీ సరసన ఇంగ్లీషును కూడ అనుసంధాన భాషగా గుర్తిస్తున్నారు. జనాభాను బట్టి లోక్‌సభ స్థానాలు నిర్ణయం అవుతాయని మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచే సమయంలోనూ జనాభా, లోక్‌సభ సీట్లు తదితర అంశాలు ప్రాతిపదికగా మారుతాయి. అదీగాక, త్వరలో లోక్‌సభ నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగబోతోంది. ఉత్తరాది స్థానాలు మరింతగా పెరిగి దక్షిణాది స్థానాలు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్టు కొందరు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. అంచేత ఇది భాషా సమస్య మాత్రమే కాదు; రాజకీయార్థిక సమస్య. ఎవర్ని ఎవరు పాలించాలనే ప్రాణప్రదమైన అంశం ఇందులో ఉంది. 1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన... మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్ అంబేడ్కర్ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్ భయపడి నట్టే జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్‌లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది.‘యానిమల్ ఫార్మ్’ వ్యంగ్య నవలలో జార్జ్ ఆర్వెల్ ఒకచోట విరోధాభాసాలంకారం ప్రయోగిస్తాడు. ఫార్మ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న పందుల సామాజిక వర్గం ‘జంతువులన్నీ సమానం; కానీ, పందులు మరింత సమానం’ అంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి విరోధాభాసాలంకారాన్ని తరచూ ప్రయోగిస్తున్నది. రాష్ట్రాలన్నీ సమానం కానీ, హిందీ బెల్టు మరింత సమానం. ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా సమానం అంటున్నది. ఇప్పుడు ‘భాషలన్నీ సమానం; కానీ, హిందీ మరింత సమానం’ అంటూ కొత్త పాట మొదలెట్టింది.-డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
సజాతి ధ్రువాల వికర్షణ
శశి థరూర్‌కీ, కాంగ్రెస్ నాయకత్వానికీ మధ్య తలెత్తినట్లుగా కనిపిస్తున్న విభేదాలను ఆసక్తికరంగా మారుస్తున్నది ఏమిటంటే,ఇరు వర్గాల గురించి ఆ విభేదాలు బయటికి ఏం వెల్లడిస్తున్నాయన్నదే. విభేదాలున్నా యన్న సంగతిని వారు ఒప్పుకొని, అంగీకరించకున్నా... ఒకటైతే వాస్తవం. వారు ఒకరి కొకరు పూర్తిగా భిన్నమైనవారు. బహుశా సమస్యకు మూలం, ప్రధానంగా అదే అయి వుండాలి. శశి థరూర్ ఫక్తు రాజకీయ నాయకుడు కారు. ముఠాలను, రహస్య మంతనాలను ఆయన నడపరు. బదులుగా, ఆయన తన సొంత ప్రతిభ, నైపుణ్యాల మీద ఆధారపడినవారు. దీనర్థం – ఆయనకు దాపరికాలేం ఉండవని. రాజకీయంగా పైకి రావాలన్న ఆకాంక్ష, గుర్తింపు కోసం ఆరాటం మాత్రమే ఉన్నాయని. అంతేకాదు, తన వైపునకు దృష్టిని మళ్లించుకోవాలని కూడా ఆయన కోరుకుంటారని అర్థమౌతోంది. ముందుకు సాగేందుకు ఆయన విధానం అది. అందులో విజయం సాధించారు కూడా. ట్విట్టర్లో ఆయన్ని అనుస రించే అసంఖ్యాక అభిమానులు, ఆయనకు గల ‘గుర్తింపు యోగ్యత’ ... ఇందుకు సాక్ష్యం. కాంగ్రెస్ నాయకత్వం, కనీసం ఇందిరాగాంధీ హయాం నుంచి చూసినా కూడా – ముఖస్తుతులు చెల్లించే వారి ద్వారా వర్ధిల్లుతూనే వచ్చింది. వారంతా గాంధీల అనుచరులు. వారి నాయకులు గాంధీలు. వారు తమ రాజకీయ జీవితాన్నంతా గాంధీల సేవకే అంకితం చేసినవారు. రాహుల్ గాంధీని మించి తాము శోభిల్లకూడదనీ, సోనియా గాంధీకి ఎదురు చెప్పకూడదనీ నేర్చుకున్నవారు. ఇక ఇప్పుడైతే ప్రియాంకా గాంధీకి పల్లకి మోయటానికి తయారవు తున్నవారు. అంతేనా, ఈ తరహా కుటుంబ ఆరాధనను నియమ బద్ధం చేయటానికి... గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించలేదని తమను తాము నమ్మించుకుంటున్నవారు ఈ అనుచరులు. చిన్నపాటి పోలికలు శశి, రాహుల్‌ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేయిస్తాయి. శశి తన ప్రతిభ, తెలివితేటలతో కష్టపడి పైకొచ్చినవారు. రాహుల్ బలం ఆయన ఇంటిపేరు. రాహుల్ స్వయంగా సాధించిన రాజకీయ విజయాలు పరిమితమైనవి. లేదా, ఏమంతగా గుర్తింపులో లేనివి. తగని సమయాలలో విహార యాత్రలకు వెళ్లిపోవటం ఆయన అభిరుచి. శశి బలం... దీర్ఘమైన ఆయన ఆంగ్ల పదాడంబరత, ఆహ్లాద కరమైన ఆయన నడవడిక. రాహుల్ స్పష్టంగా మాట్లాడలేని వ్యక్తిగా కనిపిస్తారు. రాహుల్‌కు తనేం చెప్పాలనుకుంటున్నారో దానిని వ్యక్తపరిచే విషయంలో సమస్యలు ఉన్నాయని చాలామంది నమ్ము తారు. శశి రచయిత. ఇరవైకి పైగా పుస్తకాలు రాశారు. ఆకాంక్షలు గల యువతను ఆయన ఆకర్షిస్తారు. రాహుల్ ఎప్పుడూ కూడా పేదలను, ఆర్థికంగా లేదా సామాజికంగా అణచివేతకు గురవుతున్నవారిని ఉద్దేశించి మాట్లాడుతుంటారు. మొత్తానికి, వీళ్లిద్దరూ భిన్న ప్రపంచాలలో ప్రకాశిస్తున్నవారు. మాజీ దౌత్యవేత్తగా శశి తీరు వివేకవంతంగా, వినయపూర్వకంగా, తన ప్రత్యర్థులు సాధించిన విజయాలను సైతం అంగీకరించే విధంగా ఉంటుంది. అందుకే మోదీ అమెరికా పర్యటనను, లేదా కేరళలో సీపీఎం స్టార్టప్‌లను అభివృద్ధి పరచటాన్ని ఆయన ప్రశంసించకుండా ఉండలేకపోయారు. రాహుల్ శైలి ఇందుకు విరుద్ధంగా కఠినంగా, గాయపరిచేలా ఉంటుంది. మాటల బాక్సర్ అతడు. కమిలిపోయేలా గట్టి దెబ్బ కొడతారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ అతి సునాయాసంగా అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. పార్టీలో అతడిది ప్రశ్నించేవారే లేని, సర్వదా ఆమోదంపొందిన ఆరోహణ. ఇందుకు భిన్నమైనది శశి థరూర్ రాజకీయ జీవితం. అది వెలుగులను విరజిమ్మేదేమీ కాదు. ఆయన కొంతకాలం విదేశాంగ, మానవ వనరుల అభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. 2014 తర్వాత రెండు పార్లమెంటరీ సెలక్ట్ కమిటీలకు చైర్మన్‌గా ఉన్నారు. అంతకుమించి, కాంగ్రెస్‌లో అగ్రశ్రేణి నాయ కుడిగా ఎప్పుడూ లేరు. ఆయన తన గతం వల్ల లేదా తన సహాయక రాజకీయేతర క్రీయాశీలతల వల్ల మాత్రమే ప్రసిద్ధులు. ఆయన్ని తన భవిష్యత్ నేతగా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేకపోతోంది. ఇవన్నీ కూడా నాలో మూడు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అవి శశి థరూర్‌కు, ఆయన పార్టీ అయిన కాంగ్రెస్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాలకు సంబంధించినవని నేను నమ్ముతున్నాను. మొదటిది, గొప్ప గౌరవ మర్యాదలను పొందుతూ, రాహుల్‌కు ప్రత్యర్థులు కావచ్చునని పరిగణన పొందుతున్న ప్రతిభావంతులైన వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో కాంగ్రెస్ పార్టీకి తెలియటం లేదన్న విషయాన్ని ఈ విభేదాలు సూచిస్తున్నాయా?బయటి ప్రపంచానికి రాహుల్, శశి ఎలా కనిపిస్తారో ఒక్క క్షణం ఆలోచించండి. రాహుల్‌ను వారసత్వపు అర్హత గల రాజపుత్రుడిగా చూస్తారు. శశిని ప్రతిభకు, పనితీరుకు ప్రతీకగా చూస్తారు. కాంగ్రెస్ తన అధ్యక్ష వంశానికి విధేయతతో... ప్రతిభకు, పని తీరుకు మిగిల్చి ఉంచిన ఆ కాస్త చోటును కూడా పరిమితం చేసేసిందా?రెండవది... పార్లమెంటు లోపల గానీ, పార్లమెంటు బయట గానీ, పార్టీలో శశి థరూర్ పోషించవలసిన పాత్ర చాలా స్వల్ప మైనదిగా మాత్రమే ఉంది. ఆయన నేర్పును, నైపుణ్యాలను ఉపయో గించుకునే విషయంలో – అలాంటి అలవాటు లేకపోవటం కారణంగా – కాంగ్రెస్ జాగ్రత్త పడుతూ రావటమే కారణమా? ఒకప్పుడు విశాల గుడారమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నెరవేర్చదగిన ఆకాంక్షలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోయిందా?మూడవది, తానెప్పటికీ గెలవలేనని తెలుసు; తన ఆశయం, కనీసం తన ఉద్దేశం ఏమిటని ఆలోచించేవారిని అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందని తెలిసినా శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీ పడి తప్పు చేశారా? ఆ ఎన్నికలను ప్రజాస్వా మ్యబద్ధం చేయటానికే ఆయన పోటీలో నిలబడ్డారని నాకు తెలుసు. సాధారణంగానైతే ఆ చొరవను మెచ్చుకోవాలి. కానీ పోటీ లేకుండా అభ్యర్థిని గెలవనిచ్చే కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇదంతా జరిగినట్లయిందా?నాల్గవ ప్రశ్న కూడా ఉంది. సాధారణమైన ప్రశ్న. శశి థరూర్ కనుక కాంగ్రెస్ నుండి విడిపోతే అది ఆ పార్టీకి ఏపాటి ఎదురు దెబ్బ అవుతుంది? ఆయన విషయానికొస్తే కేరళలో ఆయన ఆశలు విఫలం కావచ్చు. ఒకటి మాత్రం చెప్పగలను. ఆయన కాంగ్రెస్‌ను వీడతారో లేదో గానీ, బీజేపీలో చేరతారంటే మాత్రం నేను నమ్మలేను.» కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాం నుంచి చూసినా కూడా – ముఖస్తుతులు చెల్లించే వారి ద్వారానే వర్ధిల్లుతూ వచ్చింది. వారంతా రాహుల్ గాంధీని మించి తాము శోభిల్లకూడదనీ, సోనియా గాంధీకి ఎదురు చెప్ప కూడదనీ నేర్చుకున్నవారు.» రాహుల్ గాంధీ అతి సునాయాసంగా అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారంటే అందులో ఆశ్చర్యం లేదు. పార్టీలో అతడిది ప్రశ్నించేవారే లేని ఆరోహణ. ఇందుకు భిన్నమైనది శశి థరూర్ రాజకీయ జీవితం.- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- కరణ్ థాపర్ -
మణిశంకర్ అయ్యర్ (కాంగ్రెస్) రాయని డైరీ
స్నేహంలో ఎదగాలి కానీ, స్నేహాలతో ఎదగకూడదు. ‘‘ఎదగటానికి కాకపోతే ఇంకెందుకు స్నేహాలు?!’’ అనే వాళ్లకు నేను ఒకటే చెబుతాను. స్నేహాన్ని నిచ్చెనగా చేసుకొని ఎదగటమంత పతనం వేరే ఇంకేదీ ఉండదు. రాజీవ్ నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించినప్పుడు మొదట నేను అదే ఆలో చించాను. ఇద్దరం డూన్ స్కూల్లో స్నేహితులం.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్నేహితులం. తను ఇంపీరియల్ కాలేజ్‌కి మారిపోయాక కూడా స్నేహితులమే. నేను ఇండియన్ ఫారిన్ సర్వీసులో చేరినప్పుడు; శ్రీమతి గాంధీ గవర్నమెంట్లో, ఆ తర్వాత రాజీవ్ ప్రభుత్వంలో జాయింట్ సెక్రెటరీగా ఉన్నప్పుడు కూడా రాజకీయాలు అంటని స్నేహం మాత్రమే మా మధ్య ఉంది. రాజీవ్ రమ్మంటున్నారు కదా అని వెళితే, స్నేహాన్ని నిచ్చెనగా వేసుకోవటమే అవుతుంది. ఆ మాటే రాజీవ్‌తో అన్నాను. ‘‘మీకు నిచ్చెన వేస్తానని అనటం లేదు మణీజీ. కేబినెట్‌కు మీరొక నిచ్చెన అయితే బాగుంటుందని మాత్రమే అడుగుతున్నాను’ అన్నారు రాజీవ్. రాజీవ్ అలా నాతో ఒక రాజనీతిజ్ఞుడిగా మాట్లాడటం అదే తొలిసారి!నాకనిపించిందీ, శ్రీమతి గాంధీ చనిపోయిన రోజు సాయంత్రం కాదు రాజీవ్ ఈ దేశానికి ప్రధాని అయింది, ఇదిగో ఇలా ఒడుపుగా మాట్లాడటం నేర్చుకున్నాకేనని!కేంబ్రిడ్జ్‌లో మార్క్సిస్ట్ సొసైటీ ఉండేది.అందులో నేను మెంబర్ని. నన్ను కలవటానికి రాజీవ్ అక్కడికి వస్తుండేవారు. తను నాకంటే రెండేళ్లు జూనియర్. స్టూడెంట్స్ యూనియన్‌కు నేను ప్రెసిడెంట్‌గా కంటెస్ట్ చేసినప్పుడు నాకు సపోర్ట్‌గా ఉన్నారు. ఆయన మాట... రాలు పూల తోటలా ఉండేది. కచ్చితంగా ఆయన వల్ల నాకు కొన్ని ఓట్లయితే పడి ఉంటాయి. బహుశా నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా గెలిచి ఉంటే ఆ హుషారుతో రాజీవ్ రాజకీయాల్లోకి ల్యాండ్ అయ్యేవారా?! లేదు. తల్లి మరణం ఆ పైలట్ తలపై పెట్టి వెళ్లిన కిరీటం ఈ రాజకీయం. కిరీటాన్ని దించకూడదు. కిరీటానికి తలవంపులూ తేకూడదు. ఆ సాయంత్రం – శ్రీమతి గాంధీ హత్యకు గురైన రోజు సాయంత్రం... కొత్త ప్రధానమంత్రిగా జాతిని ఉద్దేశించి రాజీవ్ మాట్లాడవలసి వచ్చింది. కెమెరాలు ఆయన ముందు గుమికూడాయి. పది మాటలకు పన్నెండుసార్లు తడబడ్డారు రాజీవ్!కానీ, కొద్దిరోజులే ఆ తడబాటు! రాజీవ్‌కు మాటలు, చేతలు వచ్చేశాయి! పడుతూ లేస్తూనే వెళ్లి దేశ ప్రజలకు దగ్గరయ్యారు. ఆఖరికి – శ్రీమతి గాంధీని నిరంతరం విమర్శిస్తూ ఉండటమే పనిగా పెట్టుకున్న అరుణ్ శౌరి కూడా రాజీవ్ మీద నుంచి చూపు మరల్చుకోలేక పోయారు!రాజీవ్ వెళ్లిపోయి 34 ఏళ్లు. నేను కాంగ్రెస్‌లోనే ఉండి పోయి 36 ఏళ్లు. ఈ 83 ఏళ్ల వయసులో నా స్నేహితుడు రాజీవ్ గురించి నేను ఏం చెబుతాను? రాజకీయ ధురంధరుడు అనా? అలా చెబితే అది జ్ఞాపకం అవుతుందా? ‘‘కాలేజ్‌లో రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు’’ అని చెప్పక పోతేనే మా స్నేహం అపురూపం అవుతుందా?చదవండి: మల్లికార్జున్ ఖర్గే (ఏఐసీసీ ప్రెసిడెంట్) రాయని డైరీ‘‘కాలేజ్‌లో రాజీవ్ గాంధీ బాగా చదివేవారు కాదన్న సంగతిని ఇప్పుడెందుకు చెప్పటం! అయ్యర్ కి పిచ్చి పట్టింది’’అంటున్నారు అశోక్ గెహ్లోత్, బీజేపీ వాళ్లు వైరల్ చేసిన నా జ్ఞాపకాల క్లిప్‌ను చూసి. స్నేహంలో ఎదిగినవారు కాదు గెహ్లోత్. స్నేహాల నిచ్చెనలతో ఎదిగినవారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను తీసుకుంటే, సీఎం పదవిని వదులుకోవలసి వస్తుందని సోనియాజీ ఆదేశాన్నే కాదన్న సకుటుంబ, సపరివార స్నేహశీలి ఆయన!ఇలాంటి వాళ్లకు పదవులే జ్ఞాపకాలు. జ్ఞాపకాలనే పదవులుగా మిగిల్చుకున్న నాలాంటి వాళ్లు పిచ్చివాళ్లు!!-మాధవ్ శింగరాజు -
నిలిచి గెలిచిన శాస్త్రవేత్తలు
మానవజాతి ఉనికికి, పురోగమనానికి మహిళ పాత్ర కీలకం. ఆ మాటకొస్తే ఏ జాతి ప్రగతికైనా స్త్రీ పురుషుల భాగ స్వామ్యం తప్పనిసరి. కానీ అనాదిగా స్త్రీ వివక్షను ఎదుర్కొంటూనే ఉంది. ఇది ఏ ఒక్క రంగానికో, ప్రాంతానికో, దేశానికో పరిమితం కాదు. అందుకు సైన్సు కూడా మినహాయింపు కాదు. అవధులు లేని అభివృద్ధిని సాధించామనుకుంటున్న నేటి పరిస్థితుల్లో కూడా మహిళ వివక్షను, ప్రతికూలతలను ఎదుర్కొంటూనే ఉంది. విజయాలందుకొంటూనే ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతిలో తనదైన ముద్రను కనబరుస్తూనే ఉంది.ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె లేని సమాజాన్నెలా ఊహించుకోలేమో, ఆమె చేయూత లేని సైన్సు అభివృద్ధి కూడా ఊహాతీతం. నూరేళ్ల చరిత్ర కలిగిన నోబెల్ బహుమతులకు మహిళా శాస్త్రవేత్తలను ఎంపిక చేయటంలో కూడా ఈ వివక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇన్నేళ్లయినా సైన్సులో నోబెల్ బహు మతి వచ్చిన మహిళలు రెండు పదులకు మించి లేరు. రెండు సార్లు నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరి సైతం ఈ ప్రతికూలతను ఎదుర్కొంది. 1903లో తొలుత పియరీ క్యూరీ, హెన్రీ బెక్రెల్ల పేర్లే ఎంపికయినాయి. పియరీ దాన్ని తిరస్కరించటంతో ఆ తర్వాత మేరీతో కలసి వారు నోబెల్ బహుమతిని అందుకున్నారు. నేటి శాస్త్ర రంగాన్ని అత్యంత గణనీయంగా ప్రభావితం చేసినది వాట్సన్, క్రిక్‌ల డీఎన్ఏ నిర్మాణ డిస్కవరీ. ఇంత గొప్ప ఆవిష్కరణలో కీలక పరిశోధన లు అందించిన మహిళ రోజాలిండ్ ఫ్రాంక్లిన్‌కు నోబెల్ బహుమతి దక్కలేదు. డీఎన్ఏ నిర్మాణాన్ని కళ్లకు కట్టి చూపిన ఆమె ఎక్స్‌రే ఫొటో (ఫొటో నం. 51)నే ఆధారమన్న సంగతి మరచి పోలేని నిష్ఠుర సత్యం.ఈ డిస్క వరీ అనేకానేక విజ్ఞాన శాస్త్ర రంగా లకు ప్రాణం పోసింది. నేడది డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని నిగ్గు తేల్చటమే కాకుండా, కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన శిలాజాల నుండి సంగ్రహించిన డీఎన్ఏ నమూనాలతో సరి కొత్త శిలాజ జీనోమిక్ శాస్త్ర విజ్ఞా నానికి నాంది పలికింది. ఆ పరిశో ధనలు చేసిన స్వాంటే పేబో వంటి శాస్త్ర జ్ఞులకు నోబెల్ బహుమతిని అందించింది కూడా.క్రోమోజోమ్‌లపై జన్యువులు ఒక స్థానం నుండి మరొక స్థానానికి దూకుతాయన్న ‘దూకుడు జన్యువుల’ డిస్కవరీ జన్యు శాస్త్రాన్ని గొప్ప మలుపు తిప్పింది. జెనెటిక్ ఇంజనీరింగ్‌లో కొత్త ప్రక్రియలకు పునాది వేసింది. దీనిని కనిపెట్టింది కూడా బార్బరా మెక్లింటాక్ అనే గొప్ప మహిళా శాస్త్రవేత్త. ఈ డిస్కవరీకి తానొక్కతే నోబెల్ బహుమతి మొత్తాన్ని గెలుచుకున్న తొలి మహిళ కూడా ఆమె. ఏ జన్యువు ఎప్పుడు పని చేయాలో, ఎక్కడ ఆగిపోవాలో అనేది పరిణామంలో ఒక పజిల్. ఈ డిస్కవరీలో పరిణామ జీవ శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. విద్యాధికులూ, శాస్త్రవేత్తలూ మాత్రమే గొప్ప ఆవిష్కరణలు చేస్తారని సాధా రణంగా అనుకుంటాం. ఇందుకు భిన్నంగా ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి చదువు కూడా పెద్దగా లేని మహిళ మేరీ యానింగ్ శిలాజ విజ్ఞాన శాస్త్ర వేత్తగా ఎదిగి జీవ పరిణామ సిద్ధాంతాన్ని పరిపుష్టం చేసింది. బ్రిటన్ లైమ్రెజిస్ ప్రాంతపు సముద్ర తీరంలో పర్యాటకులకు గవ్వలమ్ముకుని జీవించే సాదా సీదా అమ్మాయి యానింగ్. పన్నెండేళ్ల వయసులోనే ఇక్తియోసార్ పుర్రెను వెలికి తీయటంలోతండ్రికి తోడ్పడింది. ఒకప్పుడు నీళ్లలో నివసించిన సరీసృపాల జాతికి చెందిన శిలాజానికిది నిదర్శనం. ఆమె కృషి పట్టుదలతో వెలికి తీసిన అనేక శిలాజాలు జీవులు పరిణామం చెందు తాయన్న ఆలోచనలకు బలం చేకూర్చాయి. డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఆమె కనిపెట్టిన శిలాజాలు పరిపుష్టం చేశాయి. అందుకే ఆమె ప్రపంచంలో తొలి మహిళా శిలాజ శాస్త్రవేత్తగా ఖ్యాతి గడించింది. బ్రిటన్‌లో శాస్త్రవేత్తలకిచ్చే అత్యున్నత పురస్కారా లను సైతం ఈ సామాన్య యువతి అందుకుంది. అవాంతరాలు, ప్రతికూలతలు ఎన్ని ఉన్నా మహిళ సాధించలేనిది లేదని చెప్ప డానికివి మచ్చుకు ఒకటి రెండు ఉదాహరణలే. సైన్సు ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందాలంటే పురుషులతో సమా నంగా మహిళల భాగస్వామ్యాన్ని సాధించాలి.శాస్త్ర రంగంలో భారతదేశపు పరిస్థితి, మహిళల ప్రాతి నిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. 2005లోనే సైన్స్‌రంగంలో మహిళలపై భారత ప్రభుత్వ (డీఎస్టీ) నియమించిన నిపుణుల కమిటీ కూడా మహిళలు అత్యల్ప సంఖ్యలో ఉన్నారని తేల్చింది. డాక్టరేట్లు చేసిన మహిళలు శాస్త్ర సంస్థలు, యూనివర్సిటీ సిబ్బందిలో అతి తక్కువగా ఉన్నారు. మరీ ముఖ్యంగా విధాన నిర్ణ యాలు చేసే స్థాయిలో, సంస్థల డైరెక్టర్లు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్లు, ఇతర పాలనాపరమైన ముఖ్య స్థానాల్లో పరిమితంగా ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?మహిళలకు సైన్సులో మరింత ప్రోత్సాహం ఇవ్వాలనీ, ఉద్యోగ నియామకా లను క్రమబద్ధంగా జరపాలనీ ఆ కమిటీ సూచించింది. అయినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. శాస్త్ర రంగంలో మహిళలు ముందడుగు వేయటానికి నిపుణుల సూచనలు అమలు చేయటం ఒక అవసరమైతే, ప్రభుత్వాల దృష్టి కోణంలో మార్పు రావటం అత్యవసరం. -వ్యాసకర్త జన విజ్ఞాన వేదిక ఉమ్మడి ఏపీ మాజీ అధ్యక్షులు-ప్రొ‘‘ కట్టాసత్యప్రసాద్ -
ఎందరో మహానుభావులు
స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని కాంక్షిస్తున్న నేపథ్యంలో వివిధ రంగాలకు నిర్దిష్ట లక్ష్యాలు నిర్వచించుకున్నాం. ఈ లక్ష్యం నెరవేరడంలో సైన్స్ కీలకపాత్ర పోషించనుంది. అయితే, భారతీయ శాస్త్ర రంగం అక్కడక్కడ కొన్ని సంస్థల్లో కనిపించే అద్భుతంగా ఉండకూడదు. సామాజిక సమస్యల పరిష్కారానికి అన్నిచోట్లా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా మారాలి. ఇవన్నీ జరగాలంటే, ప్రాథమిక విద్య నుంచి స్నాతకోత్తరం వరకూ శాస్త్ర రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరగాలి. ప్రభావశీల పరిశోధనలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, బహుమతులు పెరగాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌రంగంతో ప్రభుత్వ భాగస్వామ్యం, సమాజంలోని అట్టడుగు వర్గాలు ముఖ్యంగా మహిళల ప్రాతినిధ్యం పెరగాలి.హేతుబద్ధమైన, ససాక్ష్యాలతో కూడిన పరిష్కారాలను చూపడం మొదలుపెడితే ప్రజాభిప్రాయం శాస్త్రవేత్తల నిర్ణయాలతో ఏకీభవిస్తుందని కోవిడ్ సమయంలో నిరూపితమైంది. మన అభివృద్ధిని అడ్డుకునే... పరిష్కారం లేని, రిస్క్ కారణంగా ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టని శాస్త్రపరమైన సమస్యలపై తక్షణం ప్రభుత్వం దృష్టి పెట్టాలి.బయో–ఈ3, నేషనల్ క్వాంటమ్ మిషన్ , డీప్ ఓషన్ మిషన్ వంటివి ఇలాంటి సమస్యల పరిష్కారం దిశగా శాస్త్రవేత్తల దృష్టిని కేంద్రీకరించేందుకు ప్రయత్నించాయి. ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలకు కేటాయింపులు రెట్టింపు కంటే పెరగడం.దేశంలోని శాస్త్ర పరిశోధనశాలల్లో మూలనపడ్డ అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ప్రోత్సాహకాల లేమితో ఇవి ముందుకు కదలడం లేదు. వాయు కాలుష్యం, నీటిలోని సీసం, ఆర్సెనిక్ విషాల ఏరివేత, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ కాలుష్యం, ముఖ్యంగా జలవనరులకు సంబంధించిన సమస్యలను శాస్త్ర పరిశోధన సంస్థలు కలిసికట్టుగా చేపట్టాలి. దేశ సమస్యలకు శాస్త్ర ఆధారిత పరిష్కారాలు కనుక్కునేందుకు అవసరమైన మౌలిక పరిశో ధనలకు కేంద్రం సంస్థాగత గ్రాంట్ల రూపంలో అధి కంగా సాయపడాలి. ఇదే సమయంలో అప్లికేషన్స్, వాటి వాణిజ్యీకరణ, పరిశోధనలను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లడం వంటివి భాగస్వామ్య ఏర్పా ట్లతో ప్రోత్సహించవచ్చు. దేశంలో శాస్త్ర పరిశోధన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపు తున్న సంస్థలు క్రమేపీ పెరుగుతున్నాయి. టాటా గ్రూపు లాంటివి వందేళ్లుగా ఈ పని చేస్తున్నాయి. ప్రభుత్వ నిధులకు ప్రైవేట్ పెట్టుబడులు, దేశీ దాతలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు తోడైతే సమాజానికి ఉపయోగపడే పరిశోధనలకు ఊతమివ్వవచ్చు. మహిళలకు సముచిత స్థానం...భారతీయ మహిళలు చాలా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. పురిటిబిడ్డను కోల్పోయిన బాధ ఆనందీబాయి జోషీని ఎన్నో అడ్డంకులు అధిగమించి వైద్యశాస్త్రం చదువుకునేలా చేసింది. అది కూడా అమెరికాలోని పెన్సిల్వేనియా మహిళా కళాశాలలో. 1886లోనే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వైద్యురాలు ఆమె. దురదృష్టవశాత్తూ ఆ మరుసటి ఏడాదే ఆమె క్షయ వ్యాధికి బలైనా... ఎంతో మంది మహిళలు వైద్యం, వైద్య పరిశోధనల రంగాలను ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలిచారు.ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కానీ... ‘స్టెమ్’ రంగాల్లో (సైన్ ్స, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మేథమేటిక్స్) భారతీయ మహిళల భాగస్వామ్యం తక్కువ. ఈ రంగాల్లో కోర్సులందిస్తున్నసంస్థలపై ఇటీవల ఒక అధ్యయనం జరిగింది. అక్కడి బోధన సిబ్బందిలో కేవలం 16.6 శాతం మంది మాత్రమే మహిళలు. నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ రీసెర్చ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ ఐఆర్ఎఫ్) జాబితాలోని టాప్ ఎనిమిది సంస్థల్లో ఇది 10 శాతానికి మించడం లేదు. ఈ మహిళల్లోనూ 26.2 శాతం మంది మాత్రమే సీనియర్ స్థానాల్లో ఉన్నారు. దీన్నిబట్టే మహిళల విషయంలో ఎన్ని అసమానతలు ఉన్నాయో అర్థమవుతుంది. మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉంటే సంస్థల సమర్థత పెరుగుతుందనీ, వ్యవహారాలు పారదర్శకంగా ఉంటాయనీ, పనులు సమతుల్యతతో సాగుతాయనీ దశాబ్దాల అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలోని శాస్త్ర, వైద్య సంస్థల్లోని ఈ అసమానతలను సరిదిద్దాలంటే మొత్తం వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంటుంది. వనరుల కేటాయింపు, టాలెంట్ మేనేజ్మెంట్, పదోన్నతులు, బదిలీల వంటిఅంశాలపై నిర్ణయాలు తీసుకునే వ్యవస్థల్లో మహిళలకు తగిన భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి. అన్ని స్థాయుల్లోనూ మహిళలకు ఉద్యోగాల విషయంలో తగిన సలహాలు ఇచ్చేందుకు, శిక్షణ వంటివి కల్పించేందుకు ఏర్పాట్లు ఉండాలి. శిశు సంరక్షణ, డే కేర్ సర్వీసులు, ప్రసూతి సెలవులు, పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేకమైన గదులు, పని వేళల్లో వెసలుబాటు, ఇంట్లోంచే పని చేసే అవకాశాలు అన్ని స్థాయుల్లోనూ కల్పించాలి. మహిళలు మళ్లీ ఉద్యోగాల్లో చేరేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి. వ్యవసాయం, ఆహార భద్రత, అంతరిక్ష ప్రయోగాలు, రక్షణ రంగ తయారీ, టీకాలు, వ్యాధి నిర్ధా రణ, ఫార్మా, ఐటీ వంటి అనేక రంగాల్లో భారతీయ శాస్త్రవేత్తల సామర్థ్యం, నాయకత్వం రెండింటికీ ఇప్పటికే ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈ విజయాల నుంచి స్ఫూర్తి పొందుదాం.-వ్యాసకర్త ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ చైర్పర్సన్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-డా‘‘ సౌమ్య స్వామినాథన్ఆమె కోసం అతనుసందర్భంస్త్రీలు– ఎవరి నొప్పికి వారే మందు వేసుకుంటూ, ఎవరి యుద్ధం వాళ్ళే చేస్తూ, ఆకాశంలో సగాలమని నినదిస్తూ, పడుతూ, రెట్టింపు బలంతో లేస్తూ– చలిచీమల కవాతుకి అర్ధ శతాబ్ది. కడచి వచ్చిన కాలాలను ఈ మహిళా దినోత్సవం రోజున పాఠకురాలిగా తిరిగి చూడటమంటే వెన్ను నిలబెట్టిన అక్షరాలని కావిలించుకోవడం. ఎన్నెన్ని కథలు, కవిత్వాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు మీకోసం మేమున్నామని భుజంమీద చేయివేసి కన్నీరు తుడిచాయి! అక్షరాలలో దట్టించిన ధైర్యం, విశ్వాసం, విజ్ఞానం, పోరాటం నలుగడలా కమ్ముకుని స్త్రీశక్తి విస్ఫోటనమై ఎన్నెన్ని కొత్త విలువలు బారులు తీరాయి! ఇప్పటి, మునుపటి తరాల ముందుచూపు కవులకి, రచయితలకివందనాలు. ఆడపిల్లలను అమ్ముకుంటున్న రోజుల్లో, అతిబాల్య, అతివృద్ధ వివాహాల మారకంలో స్త్రీ వస్తువైన రోజుల్లో– ‘మగడు వేల్పన పాతమాట, ప్రాణసఖుడ’ని చెప్పి, ‘ఆధునిక మహిళ చరిత్ర పునర్లిఖిస్తుంద’ని నమ్మిన క్రాంతదర్శికి కృతజ్ఞతలు. ఒకటీ అరా ఘటనలు పట్టుకుని స్త్రీలు ఎంత నేరస్థులో నిరూపించడానికి వర్తమాన మీడియా ప్రయత్నిస్తున్న కాలాన– ‘స్త్రీల మీద ప్రపంచానికి యింత అపనమ్మకం గనుకనూ స్త్రీని శీలం విషయమై damn చెయ్యడమూ, గాయం చెయ్యడమూ ఇంత సులభం గనుకనూ స్త్రీ శీలం తన సొమ్మని పురుషుడు అనుకోవడం వల్లనూ స్త్రీని శిక్షించే అధికారం ప్రతి పురుషునికీఉండటం వల్లనూ స్త్రీ ఇంత మోసగత్తె అబద్ధీకురాలు ఐ జీవితమంతా నటిస్తోంద’ని స్త్రీల చెడుగు వెనుక కారణాలను బట్టబయలు చేసిన స్వేచ్చా మూర్తిని స్మరించుకుంటూ ముంజేతిపై నాలుగు ముద్దులు. స్త్రీల నవ్వు, నడక, మాట దుస్తులబట్టి ఆమెలైంగిక వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్న ఈ మాయదారి కాలంలో– చెడిపోయిన మనుషులను, సవతి తల్లి, కొడుకుల ప్రేమబంధాన్ని ఒప్పించేలా రాసి, ‘మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారమూ సాధ్యమైనంత తక్కువ అపకారమూ జరిగేలా చూసు కోవడమే నీతి. తక్కిన బూటకపు నీతి నియమాలను నమ్మకండి’ అన్న భావ విప్లవకారునికి శాల్యూట్. ఉన్నదంతా కుటుంబానికి పెట్టి, అన్నిటికోసం చేయి సాచాల్సి వచ్చే స్త్రీలకి కొదవలేని మనదేశంలో– ‘అది నా ఇల్లు కాదా అని అడిగావు. అది నా ఇల్లు కాదు. ఒకప్పుడు నాదే అనుకున్నాను. ఆ ఇల్లు, మా ఆయన పెంచుకొంటున్న కుక్కదెట్లా కాదో, నాదీ అట్లానే కాదు. ఆయన కుక్కనీ అపేక్షగానే చూసుకొంటారు. నన్నూ ఆపేక్షగానే చూసుకొంటారు. అంతమాత్రాన ఆయనకులాగా మాకు ఇంటిమీద హక్కులుండవు. మేము మా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాము.అంతే!’ అని ధీమాగా చెప్పిన ఆమె కోసం ఒకఇంటిని దృఢంగా నిర్మించిన మంచి రచయితకు ధన్యవాదాలు.అరవై దాటితే ఇక జీవితం బోనస్ అంటూ స్త్రీలకి ప్రో ఏజింగ్ మెళకువలను తిరస్కరించే సమాజంలో – ‘చీకటిని చూసో, పరిసరాలలోని అపరిచితత్వాన్ని చూసో భయం వేసినప్పుడు, ఆకలితో బెంగతో జ్వరంతో జీవనలౌల్యాల తీరనిమంకుతనంతో అల్లాడినప్పుడు, ఒక్కసారి గుక్కపట్టి ఏడ్వాలనిపిస్తుంది. లాలన, రక్షణ ఇవ్వగలిగే ఒకే ఒక్క అమ్మని పిలవాలనిపిస్తుంద’ని తల్లి విలువని గుర్తించిన పసిబాలునికి కావిలింతలు. తన కుటుంబ స్త్రీలు తప్ప తక్కినవారంతా అవైలబుల్ వస్తువులుగా కనపడే మెజారిటీ మగ సమాజంలో– ‘బాగ్ ఒక మూలకి పడేసి, కుర్చీలోంచి నా కాళ్ళు తీసి అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని ‘యాభై వచ్చాయి.రెండునెలల నుంచి మెన్సెస్ రాలేదు. ఇప్పుడేమో రెండురోజుల నుంచి బ్లీడింగ్’ (I know that is not the complete story) ‘‘ఊ’’ అంటాను. ‘ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి పది అయ్యింది.బ్లూ ఫిలిమ్స్ చూస్తూ కూర్చున్నాడు. ఓపిక లేదన్నా వినలేదు, బ్లీడింగ్ అవుతుందని చెబుతున్నా...’ అనేక ఆమెలపై సాగే హింసలను ఒకచోట ముద్దచేసి కళ్లముందు పెట్టుకుని ఆ నెప్పినంతా తానే తీసేసు కోవాలన్నంతగా తపించే పువ్వులాంటి మనసున్న కవికి కరచాలనం. స్త్రీల విలువను గుర్తించేవారు...ఇతర మతాలు, ఆచారాలు, అలవాట్ల పట్ల వల్లమాలిన ద్వేషాన్ని నూరిపోస్తున్న మెజారిటీ మత రాజకీయ చదరంగంలో– ‘పువ్వులు రాల్చుకునీ రాల్చుకునీ/ నన్ను కాడగా మిగిల్చావు/ ఇంకా ఏం మిగిలిందని/ ఈ కంకాళంపై కారుమబ్బు కప్పి నడిపిస్తున్నావు/ నా ముఖానికి వేలాడేసిన నఖాబ్/ ఎత్తి చూశావా ఎన్నడైనా/ నా కళ్లు/ రెండు అమాస చంద్రుళ్లను మోస్తుంటాయ్’ అంటూ స్వజనులు చూపే వివక్షని నిలదీసిన సాహసికి సలాములు. స్త్రీలు, తాము ఎవరిని ఎపుడు పెళ్లి చేసుకోవాలో సొంతంగా నిర్ణయం తీసుకోగల హక్కుని నిరాకరించే కుటుంబాలున్న సామాజిక చట్రంలో– ‘మీ ఊరికి మా వాడకి మధ్య ఎద్దుతునకల దండెం కడదాం /కాస్త మీ ఇంట్లో ఉన్న జంధ్యం తీసుకు రారాదూ /కులం గీతలు దాటిన ప్రేమలు చంపబడుతున్న చోట /పారుతున్న నెత్తుటి ప్రవాహంలో నిలబడి అడుగుతున్నా/ రావే పిల్లా రా/ హద్దులన్నీ చెరిపేసి/ సరిహద్దులు లేని సమాజంలోకి నడుద్దా’మంటూ స్త్రీలు కులాలు దాటగలరని నమ్మి, చేయందించిన ప్రేమికునికి వందనం. కొందరుంటారు, తమ ఆధిపత్యాలకి తామే గండికొట్టుకుని చుట్టూ తనకలాడుతున్న ఆరాట పోరాటాలతో మమేకమయ్యేవారు. కొందరున్నారు తమ జీవితాల్లో మేలిమి భాగమైన స్త్రీల విలువని గుర్తించి అక్షరాలలో నిలబెట్టినవారు. వారందరి తపనని, ప్రేమని, అక్కరని, బాధ్యతని గుర్తు చేసుకుంటూ, అభినందిస్తూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.-వ్యాసకర్త ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com-కె.ఎన్. మల్లీశ్వరి -
వారిని సోషల్ మీడియాకు ఎడిక్ట్ చేయాలని..
అనాదిగా స్త్రీ ఒక ప్రకృతి శక్తిగా, ఉత్పత్తి పరికరాల సృష్టికర్తగా, చరిత్ర నిర్దేశకురాలుగా ఉంది. పితృస్వామ్య ఆధిపత్యం వచ్చేవరకూ ఆమెది విజయ గమనమే. మానవజాతి శైశవ దశలో తన సంతానాన్ని కాపాడుకోవటానికి కాయలు, దుంపలు, పళ్ల లాంటి ఆహార సేకరణలో తల్లే ప్రధాన పాత్ర వహించింది. ఇప్పటికీ ఆహార సేకరణ దశలో ఉన్న జాతుల్లో మాతృస్వామ్యం అమలులో ఉంది. నిప్పు ఉపయోగాన్ని తెలుసుకున్న కాలంలో, జలచరాలైన చేపలు, పీతలు, నత్తలు (Snails) తినే కాలంలో, నదీ తీర నాగరికతలను రూపొందించే కాలంలో స్త్రీ శ్రమయే కీలకం. వేటాడి తెచ్చిన మాంసాన్ని వండవలసిన అవసరాన్ని కూడా స్త్రీయే ముందుగా గమనించి ఉంటుంది. శరీరాన్ని కప్పుకోవాలనే ఆలోచన, కట్టుకోవటానికి చెట్టు బెరడును ఉపయోగించాలనే ఆలోచన స్త్రీకే వచ్చి ఉంటుంది. కుండను చేయడం ద్వారా నీటిని, ధాన్యాన్ని నిలవచేయడం, నేలలో విత్తునాటడం ద్వారా ఆహార సృష్టి... ఇలా నూత్న జీవన వ్యవస్థలను ఆమె సృష్టిస్తూ వెళ్ళింది.సింధు నాగరికతలో స్నాన వాటికలు ప్రసిద్ధంగా విలసిల్లాయి. వీటి ప్రభావం తరువాత ఆర్యుల సంస్కృతి మీదా కనిపిస్తుంది. ఆ తరువాత దేవాలయాలకు అనుబంధంగా ఉమ్మడి స్నానఘట్టాలు రూపొందాయి. వీటి వద్ద అప్సరసలు లేదా జల దేవతలు ఉంటారని ఆనాడు నమ్మేవారు. ఈ స్నానఘట్టాల నిర్మాణంలో స్త్రీ ప్రాధాన్యత, స్త్రీ ఉమ్మడి తత్వానికి సంబంధించిన సంస్కృతి దృగ్గోచరమవుతుంది. మాతృభావన వీరి మతపరిణామ క్రమంలో ఆనాటికే రూపుదిద్దుకొని వున్నదని చెప్పటానికి మొహంజెదారో, హరప్పా లలో దొరికిన ఫలకాలు బలమైన ఋజువు అని పురావస్తు శాస్త్రజ్ఞుడు సర్ జాన్ మార్షల్ పేర్కొన్నారు. ప్రాచీన భారతీయులు స్త్రీ మూర్తిని (ప్రకృతి మాతగా) ఆరాధించినట్టు సింధూ లోయలో దొరికిన విగ్రహాలను బట్టి తెలుస్తుంది. ఇటువంటి ప్రతిమలే మెసపటోమియా, పశ్చిమాసియా, ఆసియా మైనర్లోనూ లభించాయి. స్త్రీమూర్తి ఆరాధన సింధూ లోయ (Indus Valley) నుంచి నైలునది వరకు వ్యాపించి వున్నట్లు భావించవచ్చు.కానీ ఆ తరువాత అనేక పరిణామాలు భారతదేశంలో చోటు చేసుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా మనుస్మృతి భావజాలం వల్ల స్త్రీ అణచివేత బహుముఖంగా ప్రారంభమైంది. ధర్మ సూత్రాలు స్త్రీ వ్యక్తిత్వానికి సంకెళ్ళు వేశాయి. స్త్రీ విద్య నిరోధానికి గురైంది. మనుస్మృతి (Manusmriti) క్రీ.పూ. రెండవ శతాబ్దిలో రాయబడి ఉంటుందని అంబేడ్కర్ అన్నారు. బౌద్ధయుగం అంతరించి హిందూ రాజ్యాలు ఆవిర్భవించే క్రమంలో పుష్యమిత్ర దీన్ని బ్రాహ్మణ రాజ్య నిర్మాణానికి సాధనంగా వాడుకున్నారు. వర్ణవ్యవస్థ పునరుద్ధరణ, స్త్రీ అణచివేత ఇందులో ప్రధానమైన అంశాలుగా ముందుకు వచ్చాయి.కొనసాగాల్సిన పోరాటం వీటన్నింటిని ఎదుర్కొంటూ స్త్రీ యుగ యుగాల ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చింది. అనేక అవాంతరాలను అధిగమించి జీవన గమనంలో కొత్త పుంతలు తొక్కింది. ఆమెను అణగదొక్కడం పురుషుని వల్ల కాదు అని తెలుసుకోవడానికి చాలాకాలం పట్టింది. ఎందుకంటే ఆమె విద్యుల్లత. ఆమె ప్రకాశానికి తట్టుకోలేక పురుషుడు ఆమెకు సంకెళ్ళు బిగించాడు. ఆమె ఆ సంకెళ్ళను పటాపంచలు చేసి ముందుకు వెళుతోంది. స్త్రీకి శరీర సౌందర్యమే కాదు, మనో సౌందర్యమూ ఉంది. ఆమె మనస్సు వెన్నకంటే మెత్తనిది. ఆమె హృదయ వాది. ఆమె హృదయము లోతైనది. సూర్యగోళాలను, చంద్ర గోళాలను మనము పరిశీలించవచ్చు కాని స్త్రీ అంతరంగాన్ని అందుకోగలిగిన శక్తి ఇంకా పురుషుడికి రాలేదు. ఆ విషయంలో పురుషుడు అబలుడు. ఆమె అమ్మే కాదు, గొప్ప నాయకురాలు. భారత రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము త్రివిద దళాల సైనిక వందనాన్ని స్వీకరించారు. భారతదేశ కళాత్మక దృష్టి ఎంత గొప్పదో ద్రౌపదీ ముర్ము ఒక గిరిజన స్త్రీగా అత్యున్నత సింహాసనాన్ని అధిష్ఠించి నిరూపించారు.‘ఆడపిల్ల గడప దాటకూడదు’ అనే భావాలు పాతవైనాయి. ఆడపిల్లలు దేశాంతరాలకు వెళ్ళి చదువుకొంటున్నారు. పిల్లల్ని పెంచే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఈనాడు స్త్రీలలో వస్తున్న గుణాత్మకమైన మార్పు ‘నేను సంపాదిస్తూ బతకా’లనే అంశం. కేవలం గృహిణిగా ఇంట్లోనే ఉండటానికి స్త్రీ ఈనాడు ఇష్టపడటం లేదు. ఈ మార్పులన్నీ రావడానికి ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మహారాష్ట్రలో సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్ ఉద్యమాలు; బ్రహ్మసమాజం, ఆర్య సమాజాలు చేసిన పోరాటాలు, తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయకర్ చేసిన పోరాటం, కేరళలో నారాయణ గురు చేసిన విద్యా పోరాటం... ఇవన్నీ స్త్రీల అభ్యున్నతికి మార్గం వేశాయి. చదవండి: ఆకాశంలో సగమైనా.. వివక్షేనా?అయినప్పటికీ స్త్రీలు పితృస్వామ్య ఆధిపత్యానికి ఎదురీదుతూనే ఉన్నారు. వారిని వస్తు వ్యామోహితులుగా మార్చాలనీ, సోషల్ మీడియాకు ఎడిక్ట్ చేయాలనీ ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గృహహింస పెరుగుతోంది. బాల్య వివాహాలు ఆగడం లేదు. కొడుకుతో సమానంగా కూతురికి ఆస్తి ఇవ్వడం ఆచరణలో అమలు కావడం లేదు. రాజకీయాల్లో స్త్రీలను అవమానించే ధోరణులు పెరుగు తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పాలకవర్గాలు, పితృస్వామ్య ఆధిపత్యాలను కొనసాగిస్తున్నాయి. వీటన్నింటిని స్త్రీలు ఎదుర్కొనే క్రమంలో ఇంకా పోరాటాన్ని చేయాల్సి ఉంది. ఇది మహిళా సాధికారతా యుగం. ఈ యుగ స్ఫూర్తిలో భాగంగా మనమూ నడుద్దాం. తల్లిని, చెల్లిని, సహచరిణిని, తోటి స్త్రీని గౌరవిద్దాం. వారి చైతన్యానికి తోడు నిలబడదాం. అదే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి.- డాక్టర్ కత్తి పద్మారావు దళితోద్యమ నాయకులు -
ఆకాశంలో సగమైనా... వివక్షేనా?
కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా... అత్యాచారాలకు గురైన శవాలు. మనువాదం, ఫాసిజం, పితృస్వామ్యం దేశంలో నలుదిశలా ఊరేగు తున్నాయి.’ ‘ముళ్ళపొదల్లో ఓ ఆడ శిశువు... చెత్త కుండీలో మరో ఆడ శిశువు... ఇద్దరూ అప్పుడే భూమి మీద పడిన పసికూనలు.’ఇలాంటి వార్తలు నిత్యం వస్తుంటాయి. ఎన్నో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ మహిళల సామాజిక స్థితిగతుల్లో మార్పు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఆజాదీ ఎవరిది అన్న ప్రశ్న వస్తుంది. రోజురోజుకూ స్త్రీలపై హింస, వివక్ష రకరకాల రూపంలో పెరిగిపోతూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ముందు తరాల వారికి హింస లేని సమాజాన్ని అందించ లేమా? ఆకాశంలో సగమైన స్త్రీలు శ్రమ, ఉత్పత్తిలో సగానికి తక్కువ ఏమీ కాదు. కానీ తాను పూర్తిగా పరా ధీనగా జీవిస్తోంది భారత స్త్రీ.స్త్రీలు ఎప్పుడూ మగవాడి కను సన్నుల్లో జీవించాలి. చిన్నప్పుడు తండ్రి, పెళ్లి తర్వాత భర్త, ముసలితనంలో కొడుకుల అధీనంలో జీవించాలి. ఇలా స్త్రీలను బందీని చేయటం ఈ సమాజం మొదటి నేరం. ఇక ‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ’ అంటూ స్త్రీలను పురుషునికి సొంత ఆస్తిగా మలి చారు. ఇలా భూస్వామ్య, పితృ స్వామిక సంస్కృతిని వ్యవస్థీకృతం చేశారు. ఈ పరిస్థితి మారాలి. రాజ్యాంగంలోని 14, 15, 16 తదితర అధికరణాలు లింగ వివక్షకు వ్యతిరేకంగా రూపొందించబడ్డాయి. అలాగే అనేక చట్టాలు చేయబడ్డాయి. కానీ అమలుకు నోచుకోని కారణంగా స్త్రీలపై కుటుంబ, లైంగిక హింస రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం, స్వేచ్ఛ, స్వావలంబన లేకపోవడం (ఆర్థిక పరాధీనత) అసమానత, వివక్షలకు మూలం. దీనికి కారణం భూస్వామిక పితృస్వామ్యమే. ఇక పెట్టుబడిదారీ సంస్కృతి మహిళల శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చివేసింది. 1961లో వరకట్న నిషేధ చట్టం చేసినప్పటికీ, వరకట్నం గౌరవంగా అమలు చేయ బడుతోంది. ఆడ శిశువులను గర్భంలోనే చంపుతున్నారు. ఫలితంగా దేశంలో స్త్రీల జనాభా తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే తరం మూల్యం చెల్లించక తప్పదు. 1991 నుంచి దేశంలో ప్రపంచీకరణ దశ మొదలై పాశ్చాత్య విష సంస్కృతి పెచ్చరిల్లి స్త్రీ శరీరం సరుకుగా, అంగడి బొమ్మగా, విలాస వస్తువుగా మార్చబడింది. ఫలి తంగా స్త్రీలపై లైంగిక హింస పెరిగి పోయింది. ఈ విష సంస్కృతి కారణంగా మన దేశంలో ప్రతి గంటకు ఐదుగురిపై అత్యాచారాలు జరుగు తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.మహిళల సమస్యలు చర్చించుకొని, పరిష్కరించుకోవడానికి చట్ట సభలలో కనీసం స్త్రీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఏనాడూ పార్లమెంట్లో మహిళా ప్రతినిధులు 15 శాతానికి మించి లేరు. సామాజిక పరిణామంలో మొదట స్త్రీలకు మంచి గౌరవం ఉండేది. మాతృస్వామ్య వ్యవస్థే ఇందుకు ఉదాహరణ. ఆ తర్వాత వ్యక్తిగత ఆస్తి,వర్గ సమాజం ఏర్పడ్డాక స్త్రీలకు ఆస్తి హక్కు లేకుండా పోయింది.దీంతో స్త్రీలకు విలువ పోయి, వంటింటి కుందేలు అయిపోయింది. స్త్రీల దోపిడీకి, వివక్షకు మూలం పెట్టుబడిదారీ మార్కెట్ ఉత్పత్తి విధానం. తీవ్ర ఆర్థిక అసమానతలతో కూడిన ఈ విధానం నశించాలి. సోషలిజం రావాలి. ఇదే స్త్రీల విముక్తికీ, అన్ని సామాజిక సమస్యల పరిష్కారానికీ మార్గం.– ఎల్. గజేంద్రమ్మ, ఉపాధ్యాయురాలు ‘ 97054 93054 -
నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతూ...
‘మహిళల శక్తి సామర్థ్యాలు సమాజానికి సంపూర్ణంగా ఉపయోగపడితేనే అభివృద్ధి సాధ్యం’ అనే భావనను చాలామంది ప్రముఖులు వ్యక్తీకరిస్తుంటారు. ఈ అభిప్రాయం మంచి ఉద్దేశంతో చేసిందే కావచ్చు గానీ... మహిళల శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా సమాజానికి ఉపయోగపడటం లేదనే అర్థం స్ఫురిస్తుంది. అనాదిగా మహిళలు తమ సంపూర్ణ శక్తి సామర్థ్యాలను తమ కుటుంబానికి, తద్వారా సమాజానికి అందిస్తూనే ఉన్నారు. కాకపోతే, వారు చేసే సేవ లను కొలిచే కొలమానం ఉండదు. వారి సేవలు అనేక రూపాల్లో కారు చౌకగా దోపిడీకి గురవుతున్నాయి. ఉదాహరణకు చట్టాలు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో పురుష కూలీకి లభించే వేతనం మహిళా కూలీకి దక్కదు.మహిళల శక్తి సామర్థ్యాలను అన్ని రంగాలలో సమాన ప్రాతినిధ్యంలో ఉపయోగించుకోగలిగితేనే సమాజం మరింత అభివృద్ధి చెందగలుగుతుందన్నది ఓ కఠోర వాస్తవం. తదనుగుణమైన కార్యాచరణకు పూనుకోవాల్సింది ప్రభుత్వాలే. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కావాలని కలవరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరడం అన్ని రంగాలలో మహిళలను వినియోగించుకోవడం మీదనే ఆధారపడి ఉంది.భారతదేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలోని అనేక దేశాలలో శతాబ్దాలపాటు కొనసాగిన సాంఘిక దురాచారాలు, కట్టుబాట్లు మహిళల మనో వికాసాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని దెబ్బ తీశాయి. రాజ్యాంగంలోని 14, 15 అధికరణలు పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించి నప్పటికీ ఆచరణలో ఆమడ దూరంలోనే ఉన్నాయి. సామాజిక, రాజకీయ కారణాల వల్ల కొన్ని చట్టాల్ని అమలు చేయలేక ప్రభుత్వాలు నిస్సహాయంగా ఉండి పోతున్నాయి.అయితే, సానుకూల పరిస్థితులు క్రమేపీ నెల కొంటున్నాయి. ప్రపంచీకరణ మొదలై ప్రైవేటు రంగం ఆధిపత్యం, టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో పలు రంగాల్లో మహిళలు అగ్రభాగాన రాణిస్తున్నారు. ఉదాహరణకు చంద్రయాన్–3 ప్రాజెక్టులో వంద మందికిపైగా మహిళా శాస్త్రవేత్తలు పని చేశారు. 2018లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మహిళా శాస్త్రవేత్తల పథకం మంచి ఫలితాలు అందిస్తోంది. దాదాపు 2,000 మంది మహిళా శాస్త్ర వేత్తలు చేసే పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎస్టీ) చేస్తున్న కృషి కారణంగా, 2000– 01లో జరిగిన పరిశోధనలలో 13 శాతంగా ఉన్న మహిళల వాటా, ప్రస్తుతం 30 శాతం దాటింది.దాంతోపాటు, మహిళల ఆరోగ్యం, భద్రత లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ‘నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో’ వివరాల ప్రకారం, దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు ఏటా 8% మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత విషయంలో అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో భారతదేశం 5వ స్థానంలో నిలవడం సిగ్గుచేటు. మన దేశంలో పర్యటించే విదేశీ మహిళా టూరిస్టులకు ఆ యా దేశాలు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇది దేశ పర్యాటక రంగం అభివృద్ధికి అవరోధం. రాజకీయ భాగస్వామ్యం పెరగాలి!మహిళల శక్తి సామర్థ్యాలు మిగతా రంగాలలో కంటే రాజకీయ రంగంలో అతి తక్కువ స్థాయిలో వినియోగం అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖాగుప్తాను ఎంపిక చేసిన బీజేపీ... మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించుకొంది. అందుకు వారిని అభినందించాల్సిందే! కానీ, ఇది ఒక పార్శ్వం మాత్రమే. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఎంపికైన మహిళలు కేవలం ఐదుగురే. లోక్‌సభలో సైతం మహిళల ప్రాతినిధ్యం గరిష్ఠంగా 15 శాతం మించడం లేదు. 17వ లోక్‌సభలో మహిళా సభ్యుల శాతం 14.4 శాతం కాగా, ప్రస్తుత 18వ లోక్‌సభలో అది 13.6 శాతానికి తగ్గడం గమనార్హం!లోక్‌సభ, శాసనసభలలో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన బిల్లు 1996లో హెచ్.డి.దేవెగౌడ సారరథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రవేశ పెట్టినపుడు ఈ రచయిత కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కలిసిరాని రాజకీయ పార్టీల వైఖరి కారణంగా ఈ బిల్లు పలు పర్యాయాలు వాయిదాలు పడుతూ ఎట్టకేలకు 27 సంవత్సరాల తర్వాత మోదీ చొరవతో 2023లో పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా రూపొందింది. అయితే జనగణన, డీలిమిటేషన్ వంటి ప్రక్రియలను దాటాలి కనుక 2029 నుంచి మాత్రమే ఈ చట్టం అమలులోకి రాగలదు. కానీ చట్టం అమలయ్యే వరకు వేచి చూడకుండా, పార్టీల పరంగా 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించుకొంటే అందుకు జవాబు దొరకదు.అనేక దేశాలలో మహిళలకు లభించిన హక్కులు, స్వేచ్ఛ, ఇతర సామాజికపరమైన భద్రతలన్నీ ఉద్యమాలు, పోరాటాల కారణంగానే లభించాయి. మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ రాజకీయాల స్వరూపం మారుతుంది. బ్రిటన్‌కు చెందిన ‘వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్స్ రీసెర్చ్’... మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలలో ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉందనీ, అక్కడి ప్రజలు సైతం తమ ప్రజాప్రతినిధి పనితీరు పట్ల ఎక్కువ సంతృప్తికరంగా ఉన్నారనీ వెల్లడించింది. ‘ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం’ అంటూ మాటల్లో మాత్రమే మహిళలను అందలం ఎక్కించడం కాకుండా, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో వారికి సముచిత ప్రాతినిధ్యం అందించాలి. అప్పుడే సమాజం అభివృద్ధి పథంలో వడిగా ముందుకు సాగుతుంది. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
స్వజనులకు అక్షర భిక్ష : సిడాం మారూమాస్టారు గురించి తెలుసా?
తాను వెలుగుతూ చుట్టూరా కమ్మిన చీకట్లను తరిమేయడమే దీపం సుగుణం. అలాంటివారే మారూ మాస్టారు. ఆదివాసీలను అభివృద్ధి పథంలో నడిపించడానికి అవసరమైన చైతన్యాన్ని వారిలో నింపారు. 1925 ఫిబ్రవరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గడల్ పల్లి ఏజెన్సీ గూడెంలో జన్మించిన సిడాం మారూ 1962లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తొలి ఆదివాసీ. రాజ్ గోండ్ తెగకు చెందిన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తమ జాతిలో వెనుక బాటుతనాన్ని పోగొట్టాలంటే కనీస అక్షర జ్ఞానం నింపాలని భావించారు. దీనికి తోడు అప్పటి నైజాం ప్రభుత్వంలో గిరిజన జాతులపై పరిశ ధన చేస్తున్న ఆంత్రొపాలజిస్ట్ ప్రొ.హైమండార్ఫ్ ప్రోత్సహించడంతో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు. చదవండి: మొబైల్భూ వాస్తవాల విస్మరణే ప్రమాదానికి కారణం బాహ్య ప్రపంచమే తెలియని అదిమ తెగలైన రాజ్ గోండ్, పర్దాన్, నాయకపోడు, తోటి, కోయ గిరిజను లను చేరదీసి మాతృభాషలో బోధించేవారు. 1940లో నిజాం సాయుధ దళాలతో జరిగిన జోడె ఘాట్ పోరాటంలో క్షత గాత్రులైన తమ వారిని దాచిపెట్టి, అవసరమైన సపర్యలు చేసిన మానవీయుడు, దయా మయుడు. 1983లో ఉపాధ్యాయ వృత్తి నుండి పదవీ విరమణ పొందిన మారూ మాస్టారు వెనువెంటనే ఉట్నూరులోని సమగ్ర గిరిజనా భివృద్ధి సంస్థ (ఐటీడీఏ) తరఫున ఆదివాసీ అభివృద్ధి నిర్వాహకుడిగా నియమితులయ్యారు. ఐటీడీఏ ప్రవేశ పెట్టిన పలు పథకాలను, ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని గిరిజనులందరూ అభివృద్ధి చెందాలని చైతన్యం కలిగించిన ఘనత ఆయనకే దక్కుతుంది. గిరిజనులకు అండగా నిలబడి గిరిజనాభివృద్ధిలో ఆదివాసు లను భాగస్వాములుగా చేస్తూ హైమండార్ఫ్ స్థాపించిన ‘రాయ్ సెంటర్ల’ను పునఃప్రారంభించడానికి తగు కృషి చేశారు మారూ మాస్టారు. తుదకు 2000, మార్చి 6న ప్రకృతి ఒడిలోకి చేరారు. ఆదివాసీల మదిలో మారూ జ్ఞాపకం మరువ లేనిది. – గుమ్మడి లక్ష్మీనారాయణ, సామాజిక రచయిత (నేడు మారూ మాస్టారు వర్ధంతి) -
SLBC Tunnel: భూ వాస్తవాల విస్మరణే ప్రమాదానికి కారణం
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ సొరంగ కాలువ (ఎస్ఎల్బీసీ) నిర్మాణం పూర్తయితే... దేవరకొండ, నకిరేకల్, నల్లగొండ, నార్కెట్‌పల్లి మండలా ల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరొ స్తుంది. 500కు పైగా ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలకు తాగునీరు వస్తుంది.అందుకే ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చేపట్టాయి. అయితే గత నాలుగేళ్లకు పైగా ఎస్ఎల్బీసీ సొరంగంలో రూఫ్ (పై స్లాబ్) నుండి భారీ నీటి జలలు (ఊటలు) వస్తున్నాయి. ఈ జల ప్రవా హాన్ని శాస్త్రీయంగా అరికట్టడంలో జరిగిన తీవ్రమైన వైఫ ల్యమే ఈ ఘోర విపత్తుకు కారణం. ప్రమాదాన్ని అంచనా వేయడంలో రాబిన్సన్, జేపీకంపెనీలు; తెలంగాణ నీటిపారుదల శాఖ విఫల మయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ గత పదేళ్ల పాలనలో 11 కిలోమీటర్లు దాటి సొరంగం తవ్వలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సొరంగ నిర్మాణం కోసం భారీ ఎత్తున వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. కానీ పొంచి ఉన్న భారీ విపత్తును గుర్తించడంలో విఫలమైంది. సొరంగం పైకప్పు నిమిషానికి 5 నుండి 8 వేల లీటర్ల నీటినీ, బురదనూ కుమ్మరిస్తోంది. ప్రభుత్వానికి నీటి ఊటను శాశ్వతంగా పరిష్కరించే ఆలోచనే లేదు. ప్రకృతి నియమాలను అర్థం చేసుకోని, ప్రకృతి నియమాలకు అనుగుణంగా నిర్మించని నిర్మాణాలు ఎంత గొప్పవైనా... ప్రకృతి వాటిని ధ్వంసం చేస్తుంది. ఇందుకు ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసినందునే, అన్నారం– సుందిళ్ళ బ్యారేజీలలో భారీ లీకేజీ, సీపేజీలు కొనసాగుతున్నాయి. ప్రకృతి నియ మాలను అర్థం చేసుకొని నిర్మించిన నిర్మాణాలనే ప్రకృతి పరిరక్షిస్తుంది. తద్విరుద్ధమైన ఎంతటి అధునాతన నిర్మాణా న్నైనా ప్రకృతి ధ్వంసం చేస్తుంది. కాళేశ్వరం (మేడిగడ్డ) నిర్మించిన నాలుగేళ్లకే అది ఐదు అడుగుల మేర భూగర్భంలోకి ఎందుకు కుంగిపోయింది? ఎందుకు నిట్ట నిలువునా మూడున్నర అడుగుల వెడల్పుతో చెక్కలై, పునాది నుండి చీలిపోయింది? ఏడో బ్లాక్‌లోని 11 గేట్లు కూల్చి మళ్లీ నిర్మించాలని, ఇటీవలే విడుదలైన ఎన్డీఎస్ఏ తుది నివేదికఎందుకు పేర్కొంది? బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పునాదుల్లోంచి సిమెంట్, కెమికల్ గ్రౌటింగ్ చేసినా... భారీనీటి లీకేజీ, సీపేజీ ఎందుకు ఆగకుండా జరుగుతోంది? 14 పంపుల్లో సగం పంపులుఎందుకు బద్దలైపోయాయి? డైమండ్ డ్రిల్లింగ్‌తో, నియ మానుసారం భూగర్భ మట్టి పరీక్షలు ఎందుకు జరుపలేదు? బలహీన ఇసుక పునాదుల పైన బ్యారేజీలు ఎందుకు నిర్మించారు? డిజైన్, ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలకు చెందిన ఏ ప్రకృతి నియమాన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించు కోలేదు. ‘కేసీఆర్ మమ్మల్ని డమ్మీలు చేశార’ని ఇంజనీర్లు ముక్తకంఠంతో పీసీ ఘోష్ కమిషన్ ముందు సాక్ష్యమి చ్చారు. కాళేశ్వరం బ్యారేజీల విపత్తు తలెత్తిందే అందువల్ల. ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 లోపు పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఇంజినీర్లకు డెడ్ లైన్ విధించింది. ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం (మేడిగడ్డ) విపత్తులతో పోలవరం ప్రాజెక్టుకూ సారూప్యముంది. పోలవరంలో డెడ్ లైన్ల పేరుతో బడా రాజకీయ పెద్దల జోక్యం ఎక్కువైంది. నేటి విపత్తులకు కారణమైన కాళేశ్వరం, ఎస్ఎల్ బీసీలో ఏ తప్పులైతే చేశారో, పోలవరం స్పిల్‌వే (గేట్ల అడుగు భాగం) పునాది నిర్మాణంలో అవే తప్పులు Výæత చంద్ర బాబు ప్రభుత్వ హయాంలో జరిగాయి. అప్పట్లో ప్రతి సోమవారం పోలవరం అంటూ మీడియా ఎదుటహంగామా చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికీ, స్థిరత్వానికీ తగిన సమయం ఇవ్వడం కన్నా ఈ హడావిడే ఎక్కువ. ఫలితంగా భారీ వరద తాకిడికి, భూగర్భంలో 460 కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. ఎస్ఎల్బీసీ అత్యంత క్లిష్టమైన సొరంగంగా ఎందుకు మారింది? దేశంలో నిర్మించిన ఇతర రైల్వే, రోడ్డు తదితర సొరంగాలకు దీనికి మధ్య ఎలాంటి సారూప్యతలూఎందుకు లేవు? సొరంగంపై నుండి నాలుగేళ్లకు పైగా నీరు, బురద రావడం అతి సంక్లిష్టమైన వ్యవహారం. టీబీఎం తవ్వడం ప్రారంభించగానే, అప్పటికే నాలుగేళ్లుగా నిట్ట నిలువుగా కుమ్మరిస్తున్న భారీ నీటి ఊటతో షియర్ జోన్ భూ భౌగోళిక స్థితి... భారీ విపత్తుగా మారింది. అక్కడి మట్టి అంతా పూర్తిగా నీటిని నింపుకొని తేమగా మారి పెను విపత్తుకు దారితీసింది. ఏ చిన్న ఒత్తిడితో కూడిన కదలిక జరిగినా కుప్ప కూలడానికి సిద్ధమైంది. టీబీఎం మిషన్ పని ప్రారంభించడంతో, నీటి తాకిడికి గురవుతున్న ప్రాంతం భారీ కదలికలకు గురైంది. ఇది సొరంగం పైకప్పు కుప్పకూలడానికి తక్షణ ప్రేరకంగా పని చేసింది. ‘టన్నెల్ íసీస్మిక్ ప్రొడ క్షన్ సిస్టమ్’తో రాబోయే భారీ విపత్తులను గుర్తించడంలో విఫలమవ్వడం విపత్తుకు మరొక కారణం.నీటి ప్రవాహ తాకిడికి, నాలుగు వందల టన్నుల బరువున్న టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. విపత్తు జరిగి పది రోజులైనా నీటి నిల్వను, ఊటను, బురదను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. సొరంగం పైనుంచి కుమ్మరిస్తున్న ఊట నీరు, మరిన్ని భారీ విపత్తు లకు నెలవుగా మారింది. ఇది రెస్క్యూ బృందాల సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. కుప్పకూలిన పైకప్పు భూభౌతిక స్థితి... షియర్ జోన్ స్వభావానికి చెందినది. ఈ ప్రాంతంలోని భూమి భారీ నీటిని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. నీటి జలల ప్రవాహానికి ఇక్కడి మట్టి అత్యంత అనువుగా ఉంటుంది. సొరంగం కుప్పకూలిన ప్రాంతానికి ఎగువన ఉన్న భూమి ఉపరితలానికి, ఒక నిర్దిష్ట చదరపు ప్రాంతపు రిడ్జిని కలిగి ఉంటుంది. ఆ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షపు తీవ్రత బట్టి షియర్ జోన్లోకి చేరుకునే నీటి పరిమాణంలో హెచ్చు తగ్గులు ఆధారపడి ఉంటాయి. ఈ ప్రాంతంలోని మట్టి... వదులుగా, ఖాళీలు, సందులను కలిగి ఉంటుంది. మొత్తం మీద ఇక్కడి మట్టి తన గుండా వర్షపు తీవ్రతను బట్టి నీరు ప్రవహించడానికి అనువుగా ఉంటుంది. ఫిబ్రవరి చివర – మార్చి మొదటి వారం మధ్య... కుప్పకూలిన సొరంగ మార్గంపై నుండి నిమిషానికి 5 వేల నుండి 8 వేల లీటర్ల నీరు సొరంగంలోకి ప్రవహిస్తూ ఉంది. ఆ నీరే సొరంగంలో వివిధ ప్రాంతాల్లో 1.5 అడుగుల నుండి 2.5 అడుగుల లోతు వరకూ ఉంది. జూలై నుంచి అక్టోబర్ వరకూ భారీ వర్షాలు కురుస్తాయి. అప్పుడు నిమిషానికి సొరంగంలోకి 20 వేల నుండి లక్ష 50 వేల లీటర్ల వరకూ నీరు చేరవచ్చు. ఆ పైన భారీ నీరు నిట్ట నిలువునా సొరంగంలోకి జలపాతంలో దూకవచ్చు. ఇంత భారీ జల ప్రవాహాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ ఎలా అరికడు తుంది? వందల మీటర్ల ఎత్తు నుండి భూగర్భం గుండా మహాశక్తితో సొరంగం పైకప్పుపై విరుచుకుపడే జలపాత మది. ఇక, ఎస్ఎల్బీసీలో ఉత్తర భారతానికి చెందిన చౌక వలస కూలీలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందికీ తెలంగాణ ప్రభుత్వం 2–3 కోట్ల రూపాయల వరకూ పరిహారం ఇవ్వాలి. టీబీఎంతో సొరంగం తవ్వే ఉత్తర భారత కార్మి కులను... కాంట్రాక్టరు,్ల కంపెనీలు కడు హీనంగా చూస్తున్నా యని అక్కడ పనిచేస్తున్న వారి ఆవేదన వెల్లడించింది. ప్రాణ హాని ఉన్న ఈ పనికి రోజుకు 800 రూపాయల కూలీ మాత్రమే ఇస్తున్నారు. వారికి ఎలాంటి ప్రమాద బీమాలు లేవు. రక్షణలూ, చట్టబద్ధమైన పరిహారాలూ లేవు. అనేక మంది కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఇది అడ్డూ అదుపూ లేని దోపిడీ. అతి దుర్మార్గం. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టబద్ధమైన హక్కులన్నీ వారికి కల్పించాలి.-నైనాల గోవర్ధన్వ్యాసకర్త నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకులుమొబైల్ : 97013 81799 -
అమెరికా ఇక ఎందులో గొప్ప?
డోనాల్డ్ ట్రంప్ తీరు చూసి నోరు వెళ్లబెడు తున్నారా? బహుశా లెక్క పెట్టలేనన్ని సార్లు అయ్యుంటుంది. నాది మాత్రం అదే పరిస్థితి. మీరు అమెరికా అధ్యక్షుడి అభిమాని కావచ్చు, కాకపోవచ్చు; అది సమస్య కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉదారవాద రాజకీ యాలు సంక్షోభంలో పడిపోయాయి, ఉన్నత వర్గాల చర్మం మొద్దుబారింది, మితవాదం జనాదరణ పొందుతోంది... ఎందుకిలా జరుగుతుందో తేల్చడానికి చర్చోపచర్చలు నడుస్తున్నాయి. వాటినీ పక్కన పెడదాం. ట్రంప్ పదవిని అలంకరించి కొన్ని వారాలు గడచి పోయాయి. ఈ స్వల్ప సమయంలోనే అమెరికా బండారం బయట పడింది. అమెరికా అసామాన్యత (అమెరికన్ ఎక్సెప్షనలిజం) అనేది ఒక కట్టుకథ అని తేలిపోయింది. అమెరికన్ ఎక్సెప్షనలిజం అంటే? ‘ఎన్సైక్లోపీడియా బ్రిటానికా’ నిర్వచనం ప్రకారం, ‘చారిత్రక, సైద్ధాంతిక, మత కారణాల రీత్యా అమెరికా ప్రత్యేకమైనది, నైతికంగా ఒక ఉన్నతమైన దేశం అనే భావన.’అమెరికా ప్రతి చర్యలోనూ... కపటమైన సైనిక జోక్యాల్లో,అధికార పీఠాలను కూలదోసే కుట్రల్లో, ఆఖరికి పత్రికా వ్యాసా ల్లోనూ ఈ అహంభావపూరితమైన ఆధిక్యతా భావన కనబడుతుంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధ కాలంలో మాటిమాటికీ ‘విలువల ఆధారిత వ్యవస్థ’ అంటూ అరిగిపోయిన పదాలతో ఊదరగొట్టిన వారు, భారత్ దౌత్య విధానానికి వంక పెట్టిన వారు, ఆ తర్వాత ఏం చేశారు? అదే అమెరికా ఐక్యరాజ్య సమితి తీర్మానంపై ఊహకే అందని విధంగా రష్యాతో చేయి కలిపింది. ఉక్రెయిన్‌కు వ్యతి రేకంగా ఓటేసింది. యుద్ధ సమయంలోనూ ఆచితూచి వ్యవహరించినభారత్ ఓటింగ్‌కు హాజరు కాకుండా తటస్థ వైఖరి అవలం బించింది.హక్కుల గురించి మీరా మాట్లాడేది?విదేశీ దేశీ విధానాలను తలకిందులు చేస్తున్న ట్రంప్ విన్యాసాలు వినోదం కలిగిస్తున్నప్పటికీ, అవి ప్రమాదభరితమైనవి. ఏమైనా, అమెరికా విలువలు, అమెరికా ప్రజాస్వామ్యం, అమెరికా మీడియా, లేదంటే అమెరికా సంపన్నస్వామ్యం (అలిగార్కీ)... ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థల ప్రమేయం లేకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కంటే స్వేచ్ఛగా, ఆరోగ్యదాయకంగా ఉంటాయన్న కట్టుకథ తిరుగులేనివిధంగా పటాపంచలైంది. అమెరికా మేధావులు ఇకమీదట ఎప్పుడన్నా భారత ప్రజాస్వామ్యాన్ని శల్యపరీక్షకు పెడితే నేనేం చేస్తానో తెలుసా? పడిపడి కాకున్నా ముసిముసిగా నవ్వుకుంటాను! యూఎస్ ప్రభుత్వం భారత్‌లో మానవ హక్కుల మీద నివేదిక వెలువరించినా అంతే చేస్తా. భారతీయ అక్రమ వలసదారులను మీరెలా ట్రీట్ చేశారు? వారిని 40 గంటల పాటు ఉక్కు సంకెళ్లు వేసి స్వదేశానికి పంపించడమే కాకుండా ఆ మెటల్ శబ్దాల మ్యూజిక్‌తో వీడియోలు రూపొందిస్తారా? జన్మలో ఇక మీరు మానవ హక్కులంటూ భారతీయులకు ఉపన్యాసాలు ఇవ్వలేరు. ఈ క్షణాన యూఎస్ ప్రభుత్వాన్ని నడుపు తున్న టెస్లా, ఎక్స్ సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ సహా అమెరికా కార్పొరేట్ టైటాన్లు ట్రంప్ ప్రమాణస్వీకార ఉత్సవంలో బారులు తీరడం మేము చూడలేదనుకుంటున్నారా? ఇక మీదట మీరు ఏ ముఖం పెట్టుకుని భారత్ మీడియాకు, వ్యాపార సామ్రాజ్యాలకు మధ్య సంబంధాలు ఉన్నాయంటూ విమర్శిస్తారు? ట్రంప్ గెలుపు ఖాయం అనుకోక ముందు నుంచే మస్క్ ఆయన పక్షం నిలిచి ఉన్నారు. కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. మరి మెటా/ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ వాస్తవ నిర్ధారణ, రాజకీయాలు వంటి అంశాల మీద ఏళ్ల తరబడిగా అవలంబిస్తున్న విధానాలను వాషింగ్టన్ పెద్దలకు అనుకూల రీతిలో రాత్రికి రాత్రే రివర్స్ చేసుకున్నాడంటే ఏమనుకోవాలి? ఇన్ఫ్లుయెన్సర్లకు పీటఒకప్పుడు ఎంతో గౌరవప్రదమైన ‘ద వాషింగ్టన్ పోస్ట్’ సంగతేంటి? నేను కూడా చాలా సంవత్సరాల పాటు ఆ వార్తాపత్రికలో కాలమ్ రాశాను. ఆ పత్రికలో ఇప్పుడేం జరుగుతోందో చూడండి. సంక్షోభాల నడుమ కొట్టుమిట్టాడుతోంది. సంపాదకీయ నాయకత్వంలో వరసగా అనేక ఆకస్మిక మార్పులు చేశారు. యజమాని అయిన ‘అమెజాన్’ అధిపతి జెఫ్ బెజోస్ గందరగోళంగా ఆ పత్రిక దిశను మార్చడంతో అదిప్పుడు అనిశ్చితిలో పడింది. ‘ఒపీనియన్ పేజీ’ ఎడిటర్ డేవిడ్ షిప్లీ ఈ మార్పులకు నిరసనగా వైదొలిగారు. ‘స్వేచ్ఛా విపణులు, వ్యక్తిగత స్వాతంత్య్రం’ ఆదర్శాన్ని పత్రిక ఎలా అనుసరించాలో నిర్దేశిస్తూ బెజోస్ ‘ట్విట్టర్’ వేదికగా చేసిన ప్రకటన (బహుశా మస్క్, ట్రంప్‌ల అనుమతి కోసం) ప్రమోటర్‌కు, ఎడిటర్‌కు మధ్య ఒక గోడ ఉంటుందన్న భ్రమను ఈ ఆదేశం బద్దలు కొట్టింది.దీనికి తోడు, లబ్ధ ప్రతిష్ఠులైన జర్నలిస్టుల స్థానంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వైట్‌హౌస్ నియమిస్తోంది. వీరు పత్రికా సమావేశాల్లో ప్రభుత్వ అనుకూలురుగా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీడియా స్వేచ్ఛకు ఈ చర్య అశనిపాతం. అలిగార్క్లు చలాయించే అహంకారపూరిత అధికారం, పత్రికా స్వేచ్ఛకు సవాళ్లు, సమాచారం కోసం సంబంధిత సంస్థలను సంప్ర దించే వీలు తగ్గిపోతూ ఉండటం... ఇవన్నీ సీరియస్ అంశాలు. ప్రపంచంలోని ప్రతిచోటా ఉన్నట్లే భారత్ లోనూ ఈ సమస్యలు ఉంటాయి. కానీ అంత సమర్థంగా వీటిపై పోరాడలేక పోవచ్చు. అయితే, ఈసారి ఏదైనా అమెరికా వార్తాపత్రిక... మసకబారుతున్న ఇండియా మీడియా గురించి సంపాదకీయం రాసినప్పుడు మనం వారిని వేలెత్తి చూపించగలం. అత్యంత హేయమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘టేట్ బ్రదర్స్’ రొమేనియా నుంచి అమెరికాలో ప్రత్యక్షం కావడం ఈవారం కొసమెరుపు. ఆండ్రూ టేట్, ట్రిస్టాన్ టేట్ సోదరులు అత్యాచారం, సెక్సువల్ ట్రాఫికింగ్ కేసుల్లో ఇరుక్కున్నారు. మహిళలందరూ సెక్స్ వర్కర్లనీ, అత్యాచారాలకు వారే బాధ్యత వహించాలనీ... ఇంకా ఇలాంటి దుర్మార్గమైన, అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ఈ అన్న దమ్ములు ట్రంప్ ఫాన్స్! వీరు స్వదేశం తిరిగి వచ్చేందుకు అనుమతించాలంటూ ట్రంప్ ప్రభుత్వం రొమేనియాను సంప్రదించినట్లు ‘ద ఫైనాన్షియల్ టైమ్స్’ కథనం ప్రచురించింది. చివరకు, అతివాద రిపబ్లికన్ నేతలు సైతం వారిని ఏవగించుకుంటున్నారు. ట్రంప్ రాజకీయంగా మరింత బలపడవచ్చు. కానీ అమెరికా పతనమౌతోంది. ప్రభుత్వ గందరగోళ విధానాల నేపథ్యంలో అమెరికా అసామాన్యత (అసలు అలాంటిది ఎప్పుడూ లేదని నేనంటాను) చావుదెబ్బ తినబోతోంది!బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
క్రీడారంగంలో తెలుగు రాష్ట్రాలు ప్చ్..
శాస్త్ర, సాంకేతిక, ఐటీ లాంటి రంగాల్లో దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాలు (Telugu States), మొత్తంగా భారత్... క్రీడారంగంలో మాత్రం వెలవెల బోతున్నాయి. అంతర్జాతీయ క్రీడల్లో భారత్, జాతీయ క్రీడల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు అట్టడుగుకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకొన్న భారత్‌కు ఈ దుఃస్థితేమిటి?జనాభా పరంగా ప్రపంచంలోని రెండు అతి పెద్ద దేశాలలో ఒకటైన భారత్ (India) పరిస్థితి క్రీడారంగంలో ‘రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి’ అన్న చందంగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో 200కు పైగా దేశాలు పాల్గొంటే... పతకాల పట్టికలో భారత్ స్థానం 71 మాత్రమే. 2020 టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది భారత్.2024 ఒలింపిక్స్‌కు వచ్చేటప్పటికి 23 స్థానాలు దిగువకు పడిపోయింది. కనీసం ఒక్క బంగారు పతకమూ సాధించలేకపోయింది. వందకు పైగా అథ్లెట్ల బృందంతో 16 రకాల క్రీడల్లో పాల్గొన్న భారత్ ఒకే ఒక్క రజత పతకం, ఐదు కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ (Olympics) పతకాల పట్టికలో మన పొరుగు దేశం పాకిస్తాన్‌ది 62వ స్థానం కాగా మనకు దక్కింది 71వ స్థానం మాత్రమే. గత 128 సంవత్సరాలుగా ఒలింపిక్స్‌లో పాల్గొంటూ వచ్చిన భారత్ ఇప్పటి వరకూ సాధించినవి 41 పతకాలు మాత్రమే. వీటిలో పది మాత్రమే బంగారు పతకాలు. మొత్తం స్వర్ణాలలో హాకీజట్టు అందించి నవే ఎనిమిది ఉన్నాయి. ఆర్థికంగా, జనాభా పరంగా పాకిస్తాన్ కంటే ఎన్నోరెట్లు బలమైన భారత్ ఒలింపిక్స్ పతకాల సాధనలో వెనుకబడిపోతూనే ఉంది. పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రమే కాదు... 1960, 1968, 1972, 1976, 1984, 1992 ఒలింపిక్స్ పతకాల పట్టికలో సైతం పాకిస్తాన్‌ను భారత్ అధిగ మించలేకపోయింది.ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన అతిపెద్ద దేశం భారత వార్షిక బడ్జెట్ (2025–26) 50.65 లక్షల కోట్లలో క్రీడారంగానికి 3 వేల 800 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం చూస్తే క్రీడలకు మనం ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తున్నదీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత బడ్జెట్ వరకూ క్రీడలకు కేటాయించిన మొత్తం రూ. 800 కోట్లు మాత్రమే. ప్రపంచ పటంలో అంతగా కనిపించని అతిచిన్న దేశాలు బంగారు పతకాలతో పతకాల పట్టిక అగ్రభాగంలో నిలుస్తూ ఉంటే భారత్ మాత్రం రజత, కాంస్య పతకాలకే పరిమితం కావడం మన వెనుకబాటుతనానికి నిదర్శనం కాక మరేమిటి?మిగిలిన రంగాలతో పాటు క్రీడారంగంలోనూ ఉన్నతిని సాధించిన దేశాలను మాత్రమే సమగ్ర అభివృద్ధి సాధించిన దేశాలుగా ఐక్యరాజ్యసమితి (United Nations) పరిగణిస్తోంది. ఈ కోణం నుంచి చూస్తే భారత్ అభివృద్ధి ఏపాటిదో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.అంతర్జాతీయ క్రీడారంగంలో భారత్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో... జాతీయ క్రీడారంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పరిస్థితీ అంతే దారుణంగా తయారయ్యింది. ఉత్తరాఖండ్ వేదికగా ఈమధ్యనే ముగిసిన 38వ జాతీయ క్రీడల్లో 29 రాష్ట్రాల జట్లు పోటీపడితే... పతకాల పట్టికలో తెలుగు రాష్ట్రాలకు దక్కిన స్థానాలు చూస్తే (18వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 26వ స్థానంలో తెలంగాణ) ముక్కుమీద వేలువేసుకోవాల్సిందే! 2002 జాతీయ క్రీడలు నిర్వహించిన సమయంలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో 94 బంగారు పతకాలతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. అయితే... కేరళ వేదికగా ముగిసిన 2015 జాతీయ క్రీడల పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం, తెలంగాణ 33 పతకాలతో 12వ స్థానం సాధించాయి. రెండు రాష్ట్రాలుగా వేరు పడిన తరువాత మన రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారిపోతూ వచ్చింది. జనాభా, వైశాల్యం, క్రీడామౌలిక సదుపాయాల పరంగా తమకంటే ఎంతో దిగువన ఉన్న పలు (ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా) రాష్ట్రాలు పతకాల పట్టికలో మెరుగైన స్థానాలలో నిలిస్తే 5 కోట్లకు పైగా జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 7 స్వర్ణ, ఒకే ఒక్క రజత, 6 కాంస్యాలతో సహా మొత్తం 14 పతకాలతో 18వ స్థానం సంపాదించింది.చదవండి: వాడుకున్నవాళ్లకు వాడుకున్నంత.. దేశంలోనే అత్యాధునిక క్రీడా మౌలిక, శిక్షణ సదుపాయాలు కలిగిన రాష్ట్రంగా పేరుపొందిన తెలంగాణ పతకాల పట్టికలో 26వ స్థానానికి దిగ జారింది. 212 మంది క్రీడాకారుల బృందంతో 23 క్రీడాంశాలలో పోటీకి దిగిన తెలంగాణ చివరకు 3 స్వర్ణ, 3 రజత, 12 కాంస్యాలతో సహా మొత్తం 18 పతకాలతో గతంలో ఎన్నడూలేని విధంగా పతకాల పట్టిక అట్టడుగు నుంచి 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత జరిగిన జాతీయ (2022 గోవా, 2023 గుజరాత్) క్రీడల్లో 12, 15 స్థానాలు సాధించడం గమనార్హం.చదవండి: BSNLకి ఈ లాభం ఎలా వచ్చింది?దేశంగా భారత్, రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ – తెలంగాణలు క్రీడారంగంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నిర్లక్ష్యం చేస్తే యువశక్తి నిర్వీర్యం కావడమే కాక ‘సమగ్ర అభివృద్ధి’ అనే భావనే కొండెక్కి కూర్చుంటుంది!- చొప్పరపు కృష్ణారావు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు -
వాడుకున్నవాళ్లకు వాడుకున్నంత...
సాఫ్ట్వేర్ రంగంలో ప్రోగ్రామర్ల నుంచి పెద్ద కంపెనీల సీఈఓల దాకా మనవాళ్లదే ఆధి పత్యం. ప్రతీ ప్రఖ్యాత సంస్థ మన దేశంలో బ్రాంచీలు తెరవాల్సిందే. మన డాక్టర్లు వైద్య రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. పంటికైనా తుంటికైనా తక్కువ ఖర్చులో మన్నికైన చికిత్స కోసం మనదాకా రావలసిందే... ఐతే, ఇకపై ఈ పరిస్థితి మారిపోతుంది; సాఫ్ట్వేర్ నిపుణులకు ఉద్యోగాలుండవు; డాక్టర్లకు కొలువులుండవు; ఇది మరో యుగాంతానికి దారి తీస్తుంది... కృత్రిమ మేధపై వ్యక్తమవుతున్న భయాందోళనలివి!మార్పును ప్రతిఘటించడం మనిషి సహజ స్వభావం. పారిశ్రా మిక విప్లవంలో యంత్రాలు ప్రవేశించినప్పుడు అవి తమ కడుపు కొడతాయన్న ఆందోళనతో కార్మికోద్యమాలు జరిగాయి. కంప్యూటర్లు వచ్చినప్పుడు అవి తమ ఉద్యోగాలను హరించివేస్తాయనే భయంతో నిరసనలు వెల్లువెత్తాయి. ఏఐ విషయంలో కూడా అలాగే మానసిక ఆందోళనలు కనిపిస్తున్నాయి. గతంలో మార్పును వ్యతిరేకిస్తూ కొంతకాలం ప్రతిఘటించే అవకాశమైనా ఉండేది. కానీ ఈ ఏఐ ఎవరు కాదన్నా ఆగేది కాదు. కాబట్టి ఎవరికి వారు తమకు అవస రమైన మేరకు దీన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకోవాలో నేర్చు కోవడం మంచిది. చాట్ జీపీటీ, గూగుల్ జెమిని, కోపైలట్, గ్రోక్ వంటి ఏఐ టూల్స్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవడం మొదలుపెట్టాలి.ఇదొక వాస్తవంకృత్రిమ మేధ విభిన్నమైన, మరింత ఉన్నతమైన ఉద్యోగావ కాశాలు కల్పిస్తుంది. ఇది మనుషులకు ప్రత్యామ్నాయంగా వచ్చిన పరిజ్ఞానం కాదు, మనకు సహాయకారిగా ఉంటూ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు దోహదం చేస్తుంది. మనకు తెలియకుండానే మనమంతా ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. ఫోన్లో అలె క్సానో, గూగుల్‌నో ఉపయోగిస్తాం. ఏదేనా టైపు చేస్తున్నపుడు స్పెల్లింగ్ దోషాలుంటే సవరించి చూపే పరిజ్ఞానాన్ని వాడుతున్నాం. స్మార్ట్ టీవీలో మన అభిరుచికి తగిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు మనం అడగకుండానే కనిపిస్తుంటాయి. స్మార్ట్ వాచ్, ఫోన్ యాప్‌ల ద్వారా మన ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసు కునే వెసులుబాటు కలిగింది. సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవడానికి కూడా ఏఐ ఉపకరిస్తుంది. సాధారణంగా వాట్సాప్‌లో వచ్చే సందేశాలలో కొన్ని అనుమానాస్పదంగా ఉంటాయి. ఏదైనా మెసేజ్‌పై అనుమానం కలి గితే అది నిజమా, కాదా అని ఏఐ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రపంచం ఏఐతో ముందుకు సాగుతోంది, వద్దనుకుంటే మనం వెనుకబడి పోతాం. యువతకు ఏఐ మరింత ఉపయోగకరం, తప్పనిసరి కూడా. దీని ద్వారా సృజనాత్మకతను, వ్యూహరచనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. నిత్య విద్యార్థికి, మార్పును స్వాగతించే వారికి ఏఐ మంచి మార్గదర్శనం చేస్తుంది. అన్ని రంగాల్లో ఉపయోగంవిద్యాభ్యాసంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, కృత్రిమ మేధ సాయంతో వారిలో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించే కార్య క్రమాన్ని ఈమధ్య ఐదు తెలంగాణ జిల్లాల్లోని ముప్పై పాఠశాలల్లో ప్రారంభించారు. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నపుడు కొంద రికి వెంటనే అర్థమవుతుంది, మరికొందరు అర్థం చేసుకోలేక క్రమంగా వెనుకబడిపోతారు. ప్రాథమిక విద్యార్థులలో కొందరికి సరిగా చదవడం, రాయడం కూడా రాదు. చిన్నచిన్న కూడికలు, తీసి వేతలు కూడా చేయలేరు. అలాంటి వారిని గుర్తించి ఐదేళ్లలో ప్రధాన స్రవంతిలో కలపాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ’ పేరుతో ప్రారంభమైన కార్యక్రమం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఆ కార్యక్రమానికి తాజాగా కృత్రిమ మేధను జోడించి సత్ఫలితాలు సాధించే దిశగా వెళ్తున్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో, ప్రతి తరగతి నుంచి చదువులో వెనుక బడిన విద్యార్థులను ఎంపికచేసి వారికి ఏఐ పరిజ్ఞానంతో 40 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అవసరాన్ని బట్టి ప్రతిచోటా విద్యా లయాల్లో ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెడితే ఏఐ ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చు.జన్యుపరీక్షల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీ కరించి, భవిష్యత్తులో రాగల వ్యాధులను పసిగట్టే సామర్థం ఏఐకి ఉందని వైద్యులు చెబుతున్నారు. రోగి ఎక్స్–రేలో కంటికి కనిపించని సూక్ష్మమైన మచ్చలను కూడా విశ్లేషించి రోగనిర్ధారణ చేయడం ఏఐ వల్ల సాధ్యమవుతోందని వైద్యనిపుణులు అంటున్నారు. కృత్రిమ మేధపై అన్ని రంగాల్లో మాదిరిగానే వైద్యరంగంలో కూడా భయా లున్నాయి. ఐతే ఏఐ వల్ల వారి ప్రాధాన్యం తగ్గదనీ, అందులో ప్రావీణ్యం లేకపోతే వెనుకబడే అవకాశాలు మాత్రం ఉన్నాయనీ ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ నాగేశ్వర రెడ్డి చెప్పినట్లు ఈమధ్య చదివాను. ఇప్పటిదాకా కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా వచ్చిందంటే దాన్ని అందిపుచ్చుకునే ఆర్థిక స్థోమత అందరికీ ఉండేది కాదు. దానికి భిన్నంగా ఏఐ ఫలితాలను వైద్యరంగంలో అందరికీ అందించే అవకాశాలున్నాయనీ, పల్లెలోనైనా పట్నంలోనైనా అందరికీ సమానంగా వైద్యం అందుబాటులోకి వచ్చేరోజు ఎంతోదూరంలో లేదనీ నిపుణులు అంటున్నారు. కొత్త ఔషధాలను ఆవిష్కరించే పరిశోధన లలో కూడా ఏఐని ఉపయోగించి వేగవంతమైన ఫలితాలను సాధిస్తున్నారు.వ్యవసాయం సాధారణంగా శాస్త్ర సాంకేతిక పరిశోధనల ఫలితా లను అందుకోవడంలో చివరి వరుసలో ఉంటుంది. ఐతే, ఈమధ్య రైతులలో చైతన్యం, ప్రభుత్వాల చొరవ వలన ఈ రంగంలో సాంకేతి కత వినియోగం పెరుగుతోంది. మహారాష్ట్రలోని బారామతి జిల్లాలో ఉష్ణోగ్రతలు, భూసారానికి సంబంధించి ఏఐ అందించిన సమాచా రాన్ని ఉపయోగించుకున్న ఓ రైతు మంచి దిగుబడి సాధించాడు. వాతావరణానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం వల్ల ఎరు వుల ఖర్చు, నీటి వినియోగం గణనీయంగా తగ్గి, పంట దిగుబడి ఇరవై శాతం పెరిగిందని చెప్పే ఓ రైతు ప్రత్యక్ష అనుభవాన్ని మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవల పంచుకున్నారు. కరవు, నీటి ఎద్దడి కారణంగా వ్యవసాయం నష్టదాయకంగా మారిన బారామతి జిల్లాలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఐఏ ఆధారిత వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ఇలాంటి సహాయ సహకారాలు లభిస్తే వ్యవసాయం లాభదాయకం కావడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తుంది.మానవ మేధకూ పదును...కృత్రిమ మేధ ఒక ప్రాంతానికో, దేశానికో కాకుండా యావత్తు విశ్వాన్ని ప్రభావితం చేయగల విస్తృత సామర్థ్యం కలిగిన పరిజ్ఞానం కావడం వలన ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో కచ్చితమైన మార్గ దర్శకాలు, నియంత్రణలు ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంది. దీన్ని వికాసం కోసం వినియోగిస్తే మేలు జరుగుతుంది, విధ్వంసం కోసం వినియోగిస్తే కీడు జరుగుతుంది. కృత్రిమ మేధలో అతి ముఖ్యమైన అంశం మానవ మే«ధా సామర్థ్యం. మనం ఎంత సమర్థవంతంగా ప్రశ్న అడిగితే జవాబుఅంత కచ్చితంగా, సూటిగా వస్తుంది. మనం అడిగే ప్రశ్నను ప్రాంప్ట్ అంటారు. ఏఐ ద్వారా పనులు చేయించే ప్రాంప్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఏఐ టూల్స్ వినియోగించే టప్పుడు మనమంతా ప్రాంప్ట్ ఇంజినీర్లమే. ప్రతి పౌరుడూ, విద్యార్థీ, సాంకేతిక నిపుణుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి... కృత్రిమ మేధ నిన్నెప్పుడూ తప్పించలేదు,కృత్రిమ మేధ తెలిసినవాడు నిన్ను తప్పించగలడు. కాబట్టి, మానవ మేధకు పదును పెట్టుకుంటూ సమర్థంగా ముందుకు సాగుదాం!పి. వేణుగోపాల్ రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ఈ–మెయిల్: pvg@ekalavya.net -
లోక్‌పాల్ వర్సెస్ న్యాయమూర్తులు
ఉన్నత స్థాయిలోని అవినీతిని నిరోధించడానికి ‘లోక్‌పాల్’ను ఏర్పాటు చేశారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయ మూర్తులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే అధికారం తమకు ఉందని లోక్‌పాల్ అభిప్రాయపడింది. దీంతో లోక్‌పాల్ అధికారాల పరిధి, న్యాయ మూర్తులకు లభించే రక్షణల గురించిన ప్రశ్నలు చర్చనీయాంశాలయి నాయి. అంతేకాదు, న్యాయవ్యవస్థ స్వతంత్రత మీద నీలినీడలు ఏర్పడినాయి.2025 ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్యకాంత్, ఏఎస్ ఓకాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం లోక్‌పాల్ జారీ చేసిన ఎంక్వైరీ ఉత్తర్వుల మీద చర్చించడానికి ప్రత్యేకంగా సమావేశమయ్యింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల లోక్‌పాల్ బెంచ్... ‘హైకోర్టు న్యాయమూర్తులు లోక్‌పాల్, లోకాయుక్త చట్టం–2013’ పరిధిలోకి వస్తారని అభిప్రాయపడింది. పార్లమెంట్ తయారు చేసిన చట్టం ద్వారా ఏర్పాటైన హైకోర్టులలోని న్యాయ మూర్తులు కాబట్టి వారు ఈ చట్టాల పరిధిలోకి వస్తారని లోక్‌పాల్ బెంచ్ అభిప్రాయపడింది.‘ఇది చాలా కలవరపెట్టే విషయం’ అని జస్టిస్ గవాయ్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు రోజు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు తనకు తానుగా స్వీకరించి విచారణ చేపట్టింది. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు జరుగకుండా ఉండటానికి సుప్రీంకోర్టు తన అధి కారాన్ని వినియోగించుకొని ఈ విషయంలో జోక్యం చేసుకుంది. లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై స్టేని మంజూరు చేసింది.అంతేకాదు లోక్‌పాల్ విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తుల పేర్లు బహిర్గతం చేయకూడదని కూడా ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులపై విచారణ చేపట్టే ముందు లోక్‌పాల్ 1991వ సంవత్సరంలో న్యాయమూర్తి కె. వీరాస్వామి కేసుని కూడా ఉదహ రించింది. ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తిని పబ్లిక్ సర్వెంట్స్ నిర్వచనం నుండి మినహాయించలేరు. అందుకని హైకోర్టు న్యాయమూర్తుల మీద తాము విచారణని చేపట్టినామని లోక్‌పాల్ తన ఉత్తర్వులలో పేర్కొంది.1991వ సంవత్సరంలో ‘కె. వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం – న్యాయ మూర్తులందరూ ‘అవినీతి నిరోధక చట్టం–1988’ ప్రకారం పబ్లిక్ సర్వెంట్స్ అని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఫిర్యాదు దాఖలైనప్పుడు కేసు నమోదు చేయడానికన్నా ముందు భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు.న్యాయమూర్తులను – అవసరం లేని ప్రాసిక్యూషన్ నుంచి, అనవసర వేధింపుల నుండి రక్షించడానికి రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. ప్రధాన న్యాయమూర్తి తన ముందు ఉంచిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఆ విషయంలో సంతృప్తి చెందిన తరువాత సంబంధిత న్యాయ మూర్తిపై ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి లేదా ఎఫ్ఐఆర్ని విడుదల చేయడానికి రాష్ట్రపతికి తగు సలహాని ఇవ్వాలి. ఈ తీర్పుని ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, లోక్‌పాల్ ఖన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదులను భారత ప్రధాన న్యాయమూర్తి పరిశీలనకి పంపింది. 2013వ చట్టంలోని సెక్షన్ 20(4) ప్రకారం ఫిర్యాదును పరిష్కరించడానికి అవసరమైన కాలపరిమితిని దృష్టిలో పెట్టుకొని కేసుని నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని ఆదేశించింది.హైకోర్టు న్యాయమూర్తులు లోక్‌పాల్ అనుకున్నట్టు చట్ట బద్ధమైన అధికారులు మాత్రమే కాదని, వాళ్ళు రాజ్యాంగ బద్దమైన న్యాయమూర్తులని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్, జస్టిస్ ఏఎస్ ఓకా విచారణ సందర్భంలో అన్నారు. సుప్రీంకోర్టు వెలి బుచ్చిన ఆందోళనలో భారత సొలిసి టర్ జనరల్ తుషార్ మెహతా, న్యాయవాది కపిల్ సిబాల్ కూడా పాలుపంచుకున్నారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 14 పరిధిలోకి వస్తాయని లోక్‌పాల్ అభిప్రాయపడింది కానీ దాని యోగ్యతలను లోక్‌పాల్ ఇంకా పరిశీలించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే లోక్‌పాల్ అభిప్రాయం తప్పని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 214(1)ను లోక్‌పాల్ విస్మరించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ అధికరణం ప్రకారం హైకోర్టులను ఏర్పాటు చేస్తారు.రాజ్యాంగం కొన్ని వ్యవస్థలకు రక్షణలను కల్పించింది.అందులో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఎలక్షన్ కమిషనర్లు వస్తారు. వీళ్ళే కాదు హైకోర్టు న్యాయమూర్తులూ వస్తారు. లోక్‌పాల్ అభిప్రాయం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సవాలు విసురుతుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద నీలి నీడలు కమ్ముకుంటాయి. ఈ జోక్యం వల్ల అత్యున్నత న్యాయ వ్యవస్థ బలహీనపడుతుంది. న్యాయ వ్యవస్థలో పరోక్ష జోక్యాలు, ఒత్తిళ్లు పెరిగిపోతాయి. ప్రేరేపిత ఆరోపణల నుంచి రక్షణ లేకుండా పోతుంది. అయితే వారి మీద ఎలాంటి విచారణ లేకపోతే జవాబుదారీ తనం లేకుండా పోతుంది. హైకోర్టు న్యాయ మూర్తుల మీద వచ్చిన ఆరోపణలను విచారించడానికి, తగు చర్యలు తీసుకోవడానికి సరైన యంత్రాంగం లేదు. దీనివల్ల అవినీతికి స్థానం దొరికేలా ఉంటుంది. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం ఉన్న విధానం మెరుగు పడాల్సిన అవసరం ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం భావించింది. ఇటీవలి కాలంలో తమ పరిధికి మించి ఉత్తర్వులను, బెయిల్ షరతులను విధిస్తున్న హైకోర్టు న్యాయమూర్తులను చూస్తున్నాం. అదే విధంగా కేసు విచారణ సందర్భంలో, బయట సమావేశాల్లో రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. వారి పరిధి నుంచి కేసుల ఉపసంహరణ లాంటి చర్యలను కూడా సుప్రీంకోర్టు తీసుకోవడం లేదు. న్యాయవ్యవస్థ స్వతంత్రత ఎంత ముఖ్యమో... జవాబు దారీ తనం కూడా అంతే ముఖ్యం. లోక్‌పాల్ అభిప్రాయం సరైంది రాకపోవచ్చు. కానీ చాలా అంశాలు సుప్రీం తీర్పు ముందుకు వస్తున్నాయి. సుప్రీం కోర్టు ఏం చేస్తుందో చూడాలి మరి!మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు -
మన వృద్ధి నమూనా స్థిరమైనదేనా?
హైదరాబాద్ మురికివాడల్లో నివసిస్తున్న కార్మికులతో నా ఇంటర్వ్యూల సందర్భంగా, ఒక సాధారణ విషయం బయటపడింది: అదేమిటంటే వేతనాలు పెరగనందువల్ల రోజు వారీ ఖర్చులను తీర్చుకోవడం వారికి కష్టతరం అవుతోంది. జీవన ప్రమాణాలను మెరుగు పరచుకోవడం గురించి ఇక చెప్పనవసరం లేదు. అనధికారిక కార్మికులు అంటే వారు పెద్ద బహుళజాతి సంస్థలు లేదా మధ్య తరహా సంస్థలలో పనిచేసేవారు అయినా సరే... వారి వేతన పెరుగుదల చాలా తక్కువగా ఉంటోంది లేదా అసలు కనిపించడం లేదు. మరోవైపు జీవన వ్యయం పెరుగుతూనే ఉంది. ఆహార ద్రవ్యోల్బణం ఇప్పుడు 8 శాతం మించిపోవడంతో, ప్రాథమిక అవసరాలు తీర్చు కోవడం కూడా కష్టంగా మారుతోంది.ఈ పరిస్థితి విస్తృత స్థాయి ఆర్థిక సవాలును ప్రతిబింబిస్తుంది. వేతనాలు పెరగనప్పుడు, వృద్ధి నిలిచిపోతుంది. తక్కువ ఆదా యాలు కుటుంబంలో వినియోగాన్ని పరిమితం చేస్తాయి. ఇది తీవ్ర పరిణామాలను కలగజేస్తుంది. మొదటిది, ఇది ఆరోగ్యం, విద్య, పోషకాహారంపై అవసరమైన ఖర్చును ప్రభావితం చేస్తుంది. తద్వారా నేరుగా శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది. తక్కువ వేతన పెరుగుదల ఉన్న వినియోగదారులు తక్కువ ఖర్చు చేస్తారు, ఇది డిమాండ్ తగ్గడానికి దారితీస్తుంది. రెండవది, వినియోగదారుల వైపు నుంచి పడిపోయిన డిమాండ్, వ్యాపార సంస్థలు పెట్టుబడి పెట్టకుండా నిరుత్సాహపరుస్తుంది. మందగించిన ఆర్థిక కార్యకలాపాల చక్రాన్ని బలోపేతం చేస్తుంది. ఈ స్తబ్ధత ఒక క్లిష్టమైన ప్రశ్నను లేవ నెత్తుతుంది. అదేమిటంటే భారతదేశ ప్రస్తుత వృద్ధి నమూనా స్థిరమై నదా, లేదా దానిపై తీవ్రమైన పునరాలోచన అవసరమా?ప్రత్యామ్నాయం ఏమిటి?వేతనాల ఆధారంగా సాగే వృద్ధి వ్యూహం సరళమైనదే కానీ, అది శక్తిమంతమైన సూత్రంపై పనిచేస్తుంది. కార్మికులు ఎక్కువ సంపాదించినప్పుడు, వారు ఎక్కువ ఖర్చు చేస్తారు. డిమాండును, ఆర్థిక విస్తరణను నడిపిస్తారు. కార్పొరేట్ లాభాలు చివరికి కార్మికులకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయని భావించే ‘ట్రికిల్ డౌన్’ నమూ నాల మాదిరిగా కాకుండా, వేతన ఆధారిత వృద్ధి తక్షణ, విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తుంది.భారతదేశ ఆర్థిక పథం ఒక వైరుధ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఒకవైపు అధిక జీడీపీ వృద్ధి, మరోవైపు స్తబ్ధుగా ఉన్న నిజ వేతనాలు తీవ్రమైన ఆదాయ అసమానతకు దారితీస్తున్నాయి. ఇది ముఖ్యంగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, నిర్మాణం వంటి పరిశ్రమలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఉత్పాదకత పెరిగింది, అయినప్పటికీ వేతనాలు స్తబ్ధుగా ఉన్నాయి. బలమైన వేతన వృద్ధి లేకపోతే, దేశీయ డిమాండ్ బలహీ నంగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక ఆర్థిక పురోగతిని అడ్డుకుంటుంది.ఈ వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వ రంగ జోక్యమే కీలకమైన మార్గం. ఇటీవలి ఆర్థిక విధానాలు ప్రైవేట్ వ్యాపార సంస్థ లకు, వ్యక్తులకు క్రెడిట్ లీడ్ (రుణ ప్రాధాన్యతా) వ్యూహం రూపంలో మద్దతు ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. దీంట్లో రైతులు, వ్యాపా రస్తులు మొదలైన వివిధ రంగాలవారికి క్రెడిట్ కార్డుల రూపంలో సులభమైన రుణ కల్పన చేయడం జరుగుతోంది. కానీ డిమాండ్‌ను తక్షణమే పెంచడానికి ఏకైక ప్రత్యామ్నాయం ప్రభుత్వరంగ పెట్టుబడే. వేతన వృద్ధి కంటే ఖర్చు తగ్గింపునకు, ముఖ్యంగా చౌక శ్రమకు ప్రైవేట్ సంస్థలు ప్రాధాన్యమిస్తాయన్నది తెలిసిందే. దీనికి బదులుగా మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి కార్యక్రమా లలో ప్రభుత్వాలు పెట్టే పెట్టుబడులు నేరుగా ఆదాయాలను పెంచు తాయి; ఇవి ఉద్యోగాలను సృష్టిస్తాయి; దీర్ఘకాలిక ఆర్థిక స్థితిస్థాపక తను పెంచుతాయి.రెండవ ప్రపంచ యుద్ధానంతరం జర్మనీ తన పునర్నిర్మాణంలో గానీ లేదా దక్షిణ కొరియా తన అభివృద్ధి నమూనాలోగానీ వేతన ఆధారిత వ్యూహాలను విజయవంతంగా అవలంబించిన దేశాలు. ఇవి వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ పెట్టుబడిపై ఆధారపడ్డాయి. 2008 ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కూడా, ఆర్థిక విస్తరణను అనుసరించిన స్వీడన్ వంటి దేశాలు, పొదుపుకు ప్రాధాన్యత ఇచ్చిన వాటి కంటే వేగంగా కోలుకున్నాయి.భారతదేశం అమలుపర్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కూడా ఒక గొప్ప కేస్ స్టడీని అందిస్తుంది. సామాజిక సంక్షేమ కార్యక్రమం అయినప్పటికీ, ఇది గ్రామీణ గృహా లలో వేతనాలను ప్రవేశపెట్టింది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ అంతటా తీవ్ర ప్రభావాలను ప్రేరేపించింది. అధిక గ్రామీణ ఆదాయాలు వృద్ధికి కీలక చోదకాలైన వినియోగదారీ ఉత్పత్తులు, గృహనిర్మాణం, సేవలు వంటివాటికి డిమాండ్‌ను పెంచాయి. ఇలాంటి ఉపాధి కార్య క్రమాలను, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో విస్తరించడం, బలో పేతం చేయడం కూడా ఇదే విధమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.ముందుకు సాగే మార్గంవేతన ఆధారిత వృద్ధిని విమర్శించేవారు తరచుగా అధిక వేతనాలు ద్రవ్యోల్బణానికీ, ఆర్థిక ఒత్తిడికీ దారితీయవచ్చని వాది స్తారు. అయితే, ముఖ్యంగా పెరుగుతున్న ఉత్పాదకతతో పాటు జీతాల పెంపు ఉన్నప్పుడు, మితమైన వేతన పెరుగుదల తప్పని సరిగా ద్రవ్యోల్బణానికి కారణం కాదు. ఉదాహరణకు, జపాన్‌లో స్తబ్ధతతో కూడిన వేతనాలు ద్రవ్యోల్బణ ప్రమాదాల కంటే ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దోహదపడ్డాయి. అంతేకాకుండా, ఆర్థిక లోటుపై ఆందోళనలను వేతన ఆధారిత వ్యూహాల దీర్ఘకాలిక ప్రయోజనాలతో పోల్చి చూడాలి. ప్రభుత్వ రంగ వేతన వృద్ధికి నిధులను అధిక రుణాల ద్వారా కాకుండా, ప్రగతిశీల పన్నులు, మెరుగైన ఆదాయ సమీకరణ ద్వారా వ్యూహాత్మకంగా సమకూర్చుకోవచ్చు. మంచి లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పెట్టుబడి... ఆర్థిక బాధ్యత, ఆర్థిక విస్తరణ రెండింటికీ ఉపకరిస్తుంది.వేతన ఆధారిత వృద్ధిని వాస్తవం చేయడానికి, భారతదేశం తన పారిశ్రామిక, కార్మిక విధానాలను పునరాలోచించాలి. కార్మిక రక్షణ లను బలోపేతం చేయడం, అర్థవంతమైన కనీస వేతన సంస్కరణ లను అమలు చేయడం, సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడం ముఖ్యమైన చర్యలు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా న్యాయమైన వేతన ప్రమాణాలను నిర్దేశించాలి, తద్వారా ప్రైవేట్ రంగ యజ మానులు కూడా దీనిని అనుసరించేలా చేయాలి.ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక వ్యూహం ప్రధానంగా క్రెడిట్ విస్తరణ, ప్రైవేట్ ఖర్చులకు ప్రోత్సాహకాల ద్వారా వినియోగాన్ని ప్రేరేపించడం చుట్టూ తిరుగుతోంది. ఇది తాత్కాలికంగా డిమాండ్‌ను పెంచి నప్పటికీ, ఆదాయ స్తబ్ధతకు సంబంధించిన ప్రధాన సమస్యను పరిష్కరించదు. దీనికి విరుద్ధంగా, వేతన ఆధారిత వృద్ధి... కార్మికులు స్థిరమైన కొనుగోలు శక్తిని కలిగి ఉండేలా, స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థను సృష్టించేలా మరింత స్థిరమైన మార్గాన్ని అందిస్తుంది.భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా మారాలని కోరుకుంటున్నప్పుడు, విదేశీ పెట్టుబడులు లేదా కార్పొరేట్ ఆధారిత నమూనాలపై మాత్రమే ఆధారపడటం సరిపోదు. ప్రభుత్వ రంగ చొరవల ద్వారా బలోపేతమైన వేతన ఆధారిత వృద్ధి వ్యూహం, ఆర్థిక విస్తరణను వేగవంతం చేయడమే కాకుండా, దాన్ని సమానంగా, స్థిరంగా ఉండేలా చేస్తుంది. అసమానతలు పెరుగుతున్న ఈ కాలంలో, న్యాయమైన వేతనాలకు, బలమైన ప్రభుత్వ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది కేవలం ఆర్థిక అవసరం మాత్రమే కాదు, నైతిక ఆవశ్యకత కూడా!బొడ్డు సృజన వ్యాసకర్త ఆర్థిక శాస్త్ర బోధకురాలు,ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ -
పెళ్లి ముద్దు,పిల్లలొద్దు ఎందుకంటే..అక్కడి యువత
పిల్లలను కనకూడదని యుక్తవయసులోనే నిర్ణయించుకుంటున్నవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే కనిపిస్తోన్న ఈ పంధా... సింగపూర్‌లో ఓ రేంజ్లో విజృంభిస్తోంది. పిల్లలను కనే వయసు దాటిపోతున్నా అనేకమంది వివాహిత స్త్రీలు నిర్లిప్తంగా ఉంటూ చివరకు సంతానం లేకుండా మిగిలిపోతున్నారుగత 2024లో 40 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో 15 శాతం మందికి పిల్లలు లేరని సింగపూర్‌కి చెందిన స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ గత ఫిబ్రవరి 18న, గణాంకాలను విడుదల చేసింది. ఇది 2004లో 7.1 శాతం కంటే రెట్టింపు కాగా, అయితే ఇది 2014లో ఈ సంఖ్య 11.2 శాతంగా ఉంది. సింగపూర్‌లోని ఇన్సి్టట్యూట్ ఆఫ్ పాలసీ స్టడీస్ సీనియర్ రీసెర్చ్ ఫెలో టాన్ పోహ్ లిన్ మాట్లాడుతూ పిల్లలు లేని జంటల నిష్పత్తిలో పెరుగుదలను ‘చాలా వేగంగా‘ సంభవిస్తోందని అంటున్నారు.ఈ పరిస్థితిని పురస్కరించుకుని అక్కడి మీడియా స్థానికులను ఇంటర్వ్యూలు చేస్తూ కారణాలను అన్వేషిస్తోంది. పిల్లలు వద్దనుకునేందుకు సింగపూర్ వాసులను ప్రేరేపిస్తున్నవి ఏమిటి? అని ఆరాతీస్తోంది...జీవనశైలి ప్రాధాన్యతలు, ప్రతికూల బాల్య అనుభవాలు పిల్లలను పెంచే అపారమైన బాధ్యత గురించిన భయం వంటి ఇతర కారణాల వల్ల తాము పిల్లల్ని కనకూడదనే నిర్ణయం తీసుకున్నామని పలువురు ఆ ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.‘‘బిడ్డను కనడం చాలా పెద్ద బాధ్యత, పైగా వారు ఎలా మారతారో తెలీదు. నేను మరొక జీవితానికి నేను బాధ్యత వహించాలని అనుకోవడం లేదు’ అని ఓ యువతి చెప్పింది. ‘‘ పిల్లలు కాదు‘నేను నా స్వేచ్ఛను నా జీవితాన్ని నేను కోరుకున్న విధంగా జీవించగల సామర్థ్యాన్ని కూడా చాలా విలువైనదిగా భావిస్తున్నాను’’ అంటూ మరొకరు చెప్పారుు. తాము ప్రయాణాలు చేస్తూ ‘జీవితాన్ని అన్వేషించడం‘ తమ లక్ష్యాలుగా జంటలు వెల్లడిస్తున్నారు. పిల్లలను కలిగి ఉండటం వల్ల తాము చేయాలనుకున్న చాలా పనులను చేయలేమని, ఉద్యోగ సెలవులను కూడా తమ కోసం వినియోగించుకోలేమని చెబుతూన్నారు. సమాన అవకాశాలతో సాధికారత పొందడం, తమ విభిన్న ఆసక్తులను కొనసాగించడం కోసం సమయాన్ని వెచ్చించడానికి తాము ఇష్టపడుతున్నామని మహిళలు చెబుతున్నారు.పిల్లల చదువుల విషయంలో తమ స్నేహితులు ఎదుర్కొనే ఒత్తిళ్లను గమనించిన తర్వాత పిల్లల్ని కనదలచుకోలేదని, నేటి ప్రపంచంలో పిల్లలను పెంచడం మునుపటి కంటే చాలా క్లిష్టంగా ఉందని వీరు అంటున్నారు. ‘‘పిల్లలను కనడానికి కాదు...పెంపకంలో నాకు తెలియనిది చాలా ఎక్కువ. పిల్లవాడు బాగుంటాడా? నేను ఆల్ రైట్ పేరెంట్ అవుతానా?’’, అనే భయాలు తమని వెంటాడుతున్నాయని చెబుతున్నారు.ఇలా పెళ్లి ఓకే కానీ పిల్లల్ని వద్దనుకుంటున్న జంటల సంఖ్య వేగంగా పెరుగుతుండడంతో సింగపూర్ ప్రభుత్వం అనేక రకాల దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రోత్సహిస్తూ, సింగపూర్ వాసులు ఎక్కువ మంది పిల్లలను కనేలా చేయాలని, పెద్ద కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకుంది.గత ఫిబ్రవరి 18న తన బడ్జెట్ ప్రసంగంలో, ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్, కొత్త పెద్ద కుటుంబాల పథకంలో భాగంగా, ఫిబ్రవరి 18న లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి మూడవ తదుపరి సింగపూర్ బిడ్డకు కుటుంబాలు 16,000 డాలర్ల వరకు అదనపు మద్దతును అందిస్తామని ప్రకటించారు. Satyababu -
ఈ లాభం ఎలా వచ్చింది?
బీఎస్ఎన్ఎల్కి చివరగా 2009–2010 ఆర్థిక సంవత్సరంలో 581 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అది కూడా అప్పటికి దానికి ఉన్న డిపాజిట్ల మీద వచ్చిన వడ్డీ తప్ప వాణిజ్యపరమైన లాభాల వల్ల కాదు. వాణిజ్య పరంగా దానికి లాభాలు 2007–2008 ఆర్థిక సంవత్సరంలో చివరగా వచ్చాయి. భారత ప్రభుత్వం ‘సావరిన్ గ్యారెంటీ’తో రూ. 8,500 కోట్ల రుణం బాండ్ల రూపంలో తీసుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 2020 సెప్టెబర్ 28న బీఎస్ఎన్ఎల్ లిస్ట్ అయింది. దానితో ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ ఆర్థిక ఫలితాలను సెబీకి ఇవ్వవలసి ఉంటుంది. ఈ రకంగా ప్రతి మూడు నెలలకు ఆ సంస్థ తన ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తోంది. డిసెంబర్ 2024తో ముగిసిన మూడు నెలల కాలానికి బీఎస్ఎన్ఎల్కు నికరంగా 262 కోట్ల లాభం 17 ఏళ్ల తర్వాత వచ్చింది. ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలానికి మొత్తంగా చూస్తే ఇంకా నష్టాలలోనే ఉన్నా, ఒక త్రైమాసికంలో లాభాలు ఆర్జించడం దాదాపు 17 ఏళ్లలో ఇదే తొలిసారి. అయితే ఇది ఎలా సాధ్యం అనేది ఇప్పుడు చూద్దాం.రెవెన్యూ పరంగా చూస్తే కేవలం 131 కోట్లు మాత్రమే ఆదాయం పెరిగింది. సాధారణంగా మూడు, నాలుగు త్రైమాసికాల్లో టెలికం కంపెనీల ఆదాయాలు పెరుగు తాయి కనుక ఆ ఆదాయం పెరుగుదల లెక్కలోకి రాదు. కానీ ఇతర ఆదాయంలో 336 కోట్ల పెరుగుదల, ఉద్యో గుల జీతభత్యాల ఖర్చులో 336 కోట్లు తగ్గటం, డిప్రిసి యేషన్, ఋణమాఫీ వంటి అంశాలలో 766 కోట్లు తగ్గుదల వల్ల ఈ లాభం ఆర్జించడం సాధ్యమయింది. అంటే ఆర్థిక ఫలితాల లెక్కలు కట్టడంలో ఈ 2024–25 నుండి బీఎస్ఎన్ఎల్ చేసిన మార్పుల వల్ల ఇది సాధ్యం అయింది.లెక్కలు కట్టడంలో చేసిన మార్పులు ఏమిటి?ఉద్యోగుల జీతభత్యాలను ఆ యా ప్రాజెక్టుల వారీగా విడగొట్టి చూపడం వల్ల రూ. 337 కోట్లు ఖర్చు ఆదా అయింది. అలాగే డిప్రిసియేషన్, పారు బకాయిల రద్దు వంటి చర్యలను ఆ యా సర్కిళ్లకు ప్రత్యేకంగా లెక్క కట్టడం ద్వారా 766 కోట్లు తక్కువ చూపించగలిగారు. గతంలో ఈ మొత్తాలను సర్కిల్ వారీగా కాకుండా మొత్తం మీద చూపించేవారు. ఏతావతా స్పెక్ట్రం మీద కట్టే మొత్తం డబ్బులను విడగొట్టి ఆయా సర్కిళ్లలో చూపడం, తగ్గుదలను ప్రాజెక్టు వారీగా చూపడం వల్ల ఆదాయం గణనీయంగా పెరగక పోయినా ఈ త్రైమాసికంలో 262 కోట్ల లాభం వచ్చింది. నాల్గవ త్రైమాసికంలో ఏడాదికి కట్టే మొత్తాలు ఉండటం మూలంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.చదవండి: భావోద్వేగాల డిజిటల్ బందిఖానా!స్థూలంగా చూస్తే ప్రయివేటు టెలికాం కంపెనీలు రేట్లు పెంచితే కేవలం నాలుగు నెలల్లో 65 లక్షల మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కు వస్తే ఆ తరువాత నెలలో మళ్లీ 4 లక్షల మంది వినియోగదారులు వెళ్లిపోయారు. అంతకుముందు కేవలం ఏడాదిన్నరలో బీఎస్ఎన్ఎల్ రెండు కోట్ల మంది వినియోగదారులను కోల్పోయింది. ఇందుకు కారణం విశ్లేషిస్తే నెట్వర్క్ నాణ్యతా లోపం ప్రధాన కారణం. ప్రయివేటు టెలికాం కంపెనీలు 5జీ నెట్వర్క్ అందిస్తుంటే ఇంకా 3జీలోనే బీఎస్ఎన్ఎల్ (BSNL) ఉండటం, భారతీయ సాంకేతికతతో కూడిన 4జీ సేవలు అందుబాటులో రావడానికి గత నాలుగేళ్లుగా ఆలస్యం కావడం, ఇప్పుడిప్పుడే టవర్ల అప్‌గ్రెడేషన్ పూర్తి అవుతున్నా కొన్ని సాంకేతిక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండటం... వంటి కారణాల వల్ల బీఎస్ఎన్ఎల్ మార్కెట్ షేర్‌ను పెంచుకోలేక పోతోంది.4జీ సేవలు అందుబాటులోకి త్వరలో పూర్తి స్థాయిలో రాబోతున్నాయి. దానిని 5జీ లోకి మార్చుకునే అవకాశాలు ఉండటం, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు విదేశీ కంపెనీతో అనుసంధానం కానుండటంతోనైనా బీఎస్ఎన్ఎల్ తన ఆదాయాలు మరింత పెంచుకుని లాభాలు పూర్తి స్థాయిలో పొందాలని కోరుకుందాం.– తారానాథ్ మురాల టెలికామ్ రంగ విశ్లేషకులు -
భావోద్వేగాల డిజిటల్ బందిఖానా!
ఇటీవలి కాలంలో కౌమార దశ (టీనేజ్)లో ఉన్న పిల్లల ఆత్మహత్యలు పెరిగిపోతుండటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. 8, 9వ తరగతుల వరకు చదువే లోకంగా ఉన్న పిల్లలు... టెన్త్, ఇంటర్లలో చేరిన తర్వాత ఈ స్వీయ హన నానికి పాల్పడుతుండటాన్ని తేలికగా తీసుకోరాదు. సెలవులు, వారాంతాల్లో సోషల్ మీడియాలో గంటల తరబడి రీల్స్ చూస్తూ గడిపిన నవ యువత మళ్లీ స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని వారి మనస్తత్వాన్ని లోతుగా పరిశీలించినవారి మాట. చదువుల ఒత్తిడి కొత్తదేమీ కాకున్నా... ‘రీల్స్’ భూతం వారి మెదడుపై దుష్ప్రభావాలను చూపు తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలు వెల్లడి స్తున్నాయి. ఇంటి వద్ద రోజూ పదిగంటలకు పైగా స్క్రీన్ చూడటానికి బానిసలైన తర్వాత నియంత్రిత వ్యవస్థలో కళాశాల, పాఠశాల వాతావరణాలకు సర్దుకోలేక చిన్న మనసులు తీవ్ర క్షోభకు గురవుతున్నాయి. ఈ వయసు వారి మెదడు సహజంగా భావోద్వేగాలను నియంత్రించుకోగల శక్తి కలిగి ఉన్నా... స్మార్ట్‌ఫోన్ అధిక వాడకం ఈ సంతులనాన్ని దెబ్బ తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.కౌమార వయసులో మెదడు అభివృద్ధి చెందే దశలోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్లో రసాయన మార్పులు జరుగుతూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడం, ఉద్వేగాల నియంత్రణ ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ద్వారానే జరు గుతూ ఉంటాయి. ఇదే సమయంలో మన భావోద్వేగాల వ్యక్తీకరణకు ఉపకరించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది. మెదడు లోపలి ఈ వ్యవస్థలో అమిగ్దలా అనే భాగం... భయం, కోపం, ఆనందం వంటి అనుభూతులకు కారణమైతే; ఆకలి, దప్పిక, శరీర ఉష్ణోగ్రత, ఉద్వేగాలకు, స్పందన లకు హైపోథాలమస్ కారణం అవుతుంది. ఇవి మాత్రమే కాకుండా... లింబిక్ వ్యవస్థలో హిప్పోకాంపస్, థాలమస్, హైపోథాలమస్, సింగులేట్ గైరస్, బేసల్ గాంగ్లియా వంటి అనేక మెదడు భాగాలు ఉంటాయి. ఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థల మధ్య అసమతౌల్యం ఏర్పడినప్పుడు యువతీ యువకుల్లో భావోద్వేగాలస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. అదే సమయంలో మానసిక క్షోభను, కుంగుబాటును నియంత్రించుకోవడం అంతగా సాధ్యపడదు. అయితే సాధారణంగా ఈ లోటుపాట్లు ఉన్నా కౌమార వయస్కులు మానసిక క్షోభను సమర్థంగానే తట్టుకోగలరు. ప్రకృతిసిద్ధంగా ఉండే న్యూరో కెమికల్స్ వల్ల ఇది సాధ్య మవుతుంది. ఉల్లాసానికి కారణమయ్యే డోపమైన్ వంటి న్యూరో రసాయనాల కారణంగా వీరు ఆనందం, సంతృప్తిని వెతుక్కుంటూ ఉంటారు. అలాగే అభివృద్ధి చెందుతూ ఉండే హెచ్‌పీఏ (హైపోథాలమిక్–పిట్యూటరీ–ఎడ్రినల్యాక్సిస్) కూడా ఎక్కువ కాలం నిరాశ, నిçస్పృహలో ఉండకుండా చూస్తుంది.అంటే ఎంతో ప్రేమించే కుటుంబ సభ్యులు అకాల మరణం పాలైనా, తల్లితండ్రుల్లో ఎవరైనా రోజూ తీవ్రంగా హింసిస్తున్నా ఆ వయసు పిల్లల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే రాదు. పిల్లల్లో సహజంగా ఉండే ఈ రక్షణ వ్యవస్థ సుదీర్ఘ స్మార్ట్ఫోన్ల వినియోగంతో ముక్కచెక్కలవుతుంది. ఫలితంగా ఆందోళన, మానసిక ఉద్వేగాలతో అస్థిరతలు ఏర్పడతాయి. మృత్యుకుహరం ఈ డిజిటల్ వలవిద్యార్థులు సెలవు రోజుల్లో రోజుకు పది గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లను వాడుతున్నట్లు అంచనా. సామాజిక మాధ్యమాలను వాడినంత సేపూ మెదడులో ఆనందం కలిగించే డోపమైన్ (హ్యాపీ హార్మోన్) అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది కాస్తా కంపల్సివ్ బిహేవియర్ (వద్దని అనుకున్నా కొన్ని పనులు పదే పదే చేయాలనుకోవడం)కు దారి తీస్తుంది. విద్యార్థులు సెలవులు ముగించుకుని కాలేజీలు, పాఠ శాలల్లో అడుగుపెట్టగానే డోపమైన్ ఉపసంహరణ కారణంగా అసహనం పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకే ఆగ్రహం, అకారణ దిగులు ఆవహిస్తాయి. ఈ స్థితిలో ఆత్మహత్య వైపు వారి ఆలోచన మళ్లుతుంది. కాపాడుకోవడం మన చేతుల్లోనే...తల్లితండ్రులు, చదువు చెప్పేవారు, విధాన రూపకర్తలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం సాధించడం కష్టమేమీ కాదు. డిజిటల్ టెక్నాలజీ వాడకానికి సంబంధించి విద్యార్థులకు కొన్ని హద్దులు నిర్ధారించాలి. ఒక క్రమ పద్ధతిలో వారి స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ల వాడకాన్ని తగ్గించేలా ప్రోత్సహించాలి. అర్థవంతమైన కంటెంట్‌ను పరిచయం చేయాలి. సెలవుల తర్వాత స్కూళ్లు, కాలేజీలు తెరిచిన వెంటనే సీరియస్‌గా పాఠాల జోలికి పోకుండా మొదటి రెండు రోజులు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించాలి. పిల్లలు ఒక రోజు ఆగి కాలేజీకి వెళ్తామంటే వారిని నిందించడం, బెదిరించడం చేయకుండా తల్లిదండ్రులు తమ కాఠిన్యాన్ని తగ్గించు కోవాలి. పాఠశాలల్లో పరిమిత స్థాయిలో డిజిటల్ టెక్నాలజీలను వాడేలా చేయడం ద్వారా వారు సామాజిక మాధ్యమాల వల నుంచి నెమ్మదిగా బయటపడే అవకాశం ఏర్పడుతుంది. విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్ ఏర్పాట్లు ఉండాలి.ఆరోగ్యకరమైన హద్దులను నిర్ణయించడం, విద్యాపరంగా, సామాజికంగా అనుకూల వాతావరణాన్ని సృష్టించడం వంటి చర్యల ద్వారా కౌమార వయస్కులు... డిజిటల్ – వాస్తవ ప్రపంచాల మధ్య తేడా తెలుసుకుని సమతుల్యతను సాధించడానికి వీలు కలుగుతుంది. ఇది కేవలం తల్లితండ్రులు, విద్యావేత్తల బాధ్యత కాదు. సమాజం మొత్తానిది. అప్పుడు మాత్రమే యువత భావోద్వేగ సంక్షోభాన్ని నివారించగలం. యువతకు అందమైన భవిష్యత్తును కల్పించగలం!బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్మొబైల్: 90524 72424 -
ఇది కొత్త రాజకీయమా?
నా చిన్నతనంలో డోనాల్డ్ అనగానే డక్ గుర్తొచ్చేది. ఇప్పుడు ట్రంప్ ఆ స్థానం ఆక్రమించారు. వాల్ట్ డిస్నీ కంపెనీ రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాత కార్టూన్ క్యారెక్టర్ డోనాల్డ్ డక్ లేదా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... శక్తిమంతమైన అగ్రరాజ్యం అమెరికాకు ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రాతి నిధ్యం వహిస్తారు?మొదటి ప్రపంచ యుద్ధానికీ ముందూ, ఆ తర్వాతా ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా వ్వవహరించిన జార్జెస్ క్లెమెన్సో అమెరికా గురించి చేసిన ప్రఖ్యాత వ్యాఖ్యను ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఆయన అభిప్రాయం ప్రకారం, నాగరికత అనే మధ్య దశను అనుభవించకుండానే, అనాగరికత నుంచి అధోగతికి నేరుగా పురోగమించిన దేశం ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉంది... అది అమె రికా! ఆయన ఇప్పుడు జీవించి ఉంటే ట్రంప్ గురించి ఏమనేవారో?డోనాల్డ్ ట్రంప్, వ్లాదిమీర్ జెలెన్స్కీ మధ్య ఇటీవల తలెత్తిన కలహం అబ్బురపరిచేది, లేదంటే నమ్మశక్యం కానిది. ఈ పనికి మాలిన కలహం అమెరికా అధ్యక్షుడి నిజస్వరూపం ఎలాంటిదో తేట తెల్లం చేసింది. కానీ మొన్న శుక్రవారం ఏం జరిగిందో తెలియాలంటే, జనవరి నుంచి జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవాలి.జెలెన్స్కీ ఓ ‘నియంత’ అంటూ ట్రంప్ అభివర్ణించారు.ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. జెలెన్స్కీకి ఆ దేశ ప్రజల్లో 4 శాతం మాత్రమే మద్దతు ఉందని చెప్పారు. ఉక్రెయిన్ ఎన్నికల్లో ఆయనకు 57 శాతం మద్దతు లభించిన వాస్తవాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఆ ‘4 శాతం’ అనేది రష్యా ప్రాపగాండా అని జెలెన్స్కీ కొట్టిపారేశారు. ట్రంప్ అక్కడితో ఆగలేదు. ఉక్రెయిన్ అధినేతను ‘ఒక మోస్త రుగా సక్సెస్ అయిన కమెడియన్’ (అధ్యక్షుడు కాకమునుపు జెలెన్స్కీ ఒక నటుడు) అని కొట్టిపారేశారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి ఆయనే తెరతీశారనీ ఆరోపించారు. సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోనట్లయితే తన దేశాన్ని కోల్పోతారు అని ఒక అడుగు ముందుకువేసి మరీ హెచ్చరించారు.రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా ప్రభుత్వం జరుపుతున్న చర్చల నుంచి జెలెన్స్కీనీ, ఇతర యూరప్ దేశాల నేతలనూ ట్రంప్ దూరం పెట్టారు. రష్యా అధ్యక్షుడు శాంతి కోరుకుంటున్నారని పలు ఇంటర్వ్యూలలో ఆయన పుతిన్‌ను ప్రశంసించారు. తాను పుతిన్‌ను విశ్వసిస్తున్నానని విస్పష్టంగా ప్రకటించారు. రష్యాదే పై చేయి అని నమ్ముతున్నట్లు తేల్చి చెప్పారు. చర్చల్లో భాగస్వామిగా చేయాల్సినంత ముఖ్యుడు కాదని వ్యాఖ్యానించి జెలెన్స్కీని కించపరిచారు. ఎంత రెచ్చగొట్టినా సరే మౌనం పాటించాలని ఉక్రెయిన్ అధినేతకు సలహాలు అందివుంటాయి. అయినా జెలెన్స్కీ ఊరు కోలేదు. రష్యా ‘తప్పుడు ప్రచారపు బుడగ’లో ట్రంప్ జీవిస్తున్నారని దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌కు 500 బిలియన్ డాలర్ల సాయం అందించామన్న ట్రంప్ మాటలతో కూడా ఆయన విభేదించారు. అది ‘సీరియస్’గా చెబుతున్నమాట కాదని కొట్టేశారు. అమెరికా ఉపాధ్యక్షడు జె.డి.వాన్స్, జాతీయ భద్రతా సలహా దారు మైఖెల్ వాల్ట్స్‌ను రెచ్చగొట్టడానికి ఇంతకంటే ఇంకేం కావాలి! వారు వెంటనే స్పందించారు. ట్రంప్ మీద నోరు పారేసుకోవద్దని జెలెన్స్కీని ప్రసార మాధ్యమాల ద్వారా హెచ్చరించారు. నిజానికి నోరు పారేసుకున్నది ట్రంపే!ఇదంతా గమనిస్తుంటే, ఏమనిపిస్తోంది? సున్నిత హాస్యంతో సత్ప్రవర్తనకు మారుపేరుగా నిలిచిన ‘డోనాల్డ్ డక్’ ఈ వ్యవహారాన్ని సుతరామూ అంగీకరించలేదు. ఈసడించుకుని గగ్గోలు పెట్టేది. క్లెమెన్సో తన అభిప్రాయానికి తాజా పరిణామాలు రుజువు అనే వారు. దిగజారినవారు మాత్రమే ఇలా ప్రవరిస్తారు.నేను ఇప్పుడొక భిన్నమైన ప్రశ్న వేస్తాను. సాటి ప్రభుత్వ అధినేతను, అదీ తమ మిత్రపక్ష ప్రభుత్వ అధినాయకుడిని... శత్రు దేశం కొమ్ము కాస్తూ ఒక అమెరికా అధ్యక్షుడు ఇలా బహిరంగంగా చులకన చేసి మాట్లాడిన దృష్టాంతం మీరెప్పుడైనా విన్నారా? మీ ఊహకు అందని విరుద్ధ భావన కదా ఇది! ఈ చర్చ మరొక ప్రశ్నకు దారి తీస్తుంది. తాను అమెరికా అధ్యక్షుడు, శక్తిమంతుడు, విలక్షణ స్వభావి కనుక తానొక్కడికే ఎలా మాట్లాడినా చెల్లుబాటు అవుతుందా? లేదా ఇతర ప్రభుత్వాల అధి నేతలు సైతం ఆయన్ని అనుసరించే ప్రమాదం ఉందా? మరో విధంగా చెప్పాలంటే, ట్రంప్ ప్రవర్తన కొత్త తరహా రాజకీయాలకు ముందస్తు సూచనేమో! ఇతరులూ అలా మాట్లాడితే అదో కొత్త ఆన వాయితీ అవుతుంది.నా ఉద్దేశంలో కేవలం చిన్న దేశాల అధ్యక్షుల గురించి మాత్రమే శక్తిమంతమైన దేశాల అధినేతలు ఇలా లెక్క లేనట్లు మాట్లాడగలరు. స్కూల్లో అయితే దీన్ని బుల్లీయింగ్ అంటాం. ఇవ్వాళా రేపూ ఇదే వాస్తవ రాజకీయం. ఇంకా చెప్పాలంటే, నడుస్తున్న రాజనీతి!చివరకు ట్రంప్ ప్రవర్తన సమకాలీన అమెరికా గురించి ఆందో ళనకరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. జాత్యహంకారం, సామాజిక వివక్ష, అన్యాయాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న భావన వది లేసిన తర్వాత... ఇక ఏదైనా సరే ఎలా నిషిద్ధం అవుతుంది? అందుకే ఏం మాట్లాడినా, ఎలా విరుచుకుపడినా ఇప్పుడు సమ్మతమే అవుతుందా? అది అసత్యమైనా, అన్యాయమైనా, పూర్తిగా పక్షపాతమైనా సరే ఆమోదయోగ్యమేనా? ఈ తీరుతోనే అమెరికా మళ్లీ గొప్ప దేశం అవుతుందా? లేదా తనంతట తానే క్రమేణా క్షీణించి పోతుందా? తన ఔన్నత్యాన్ని మరీ మరీ దిగజార్చుకుంటుందా? తన నైతిక స్థితిని ఇంకా ఇంకా బలహీనపరుచుకుంటుందా? శుక్రవారం జరిగిన కలహం వల్ల ఉక్రెయిన్, యూరప్, ఆఖరికి అమెరికా కూడా తీవ్రమైన చిక్కులు ఎదుర్కోవచ్చు. దీన్నంతటినీ చూస్తూ నవ్వుకుంటున్నది ఒకే ఒక్కరు... రష్యా అధ్యక్షుడు! అయితే, తన దురుసుతనానికి త్వరలోనే ట్రంప్ పశ్చాత్తాపపడ్డా నేను ఆశ్చర్య పోను. కానీ అప్పటికే ఆలస్యమవుతుందా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆ కాలపు అరుదైన నటీమణి
నాకప్పుడు ఎనిమిదేళ్ళు. వేసవికని బెంగు ళూరులో ఉన్నాము. అక్కడి ‘మినర్వా’ సినిమా హాలులో హీరోయిన్ కృష్ణవేణి నటించిన ‘గొల్లభామ’ (1947) సినిమా చూశాను. ఒకటికి రెండు మార్లు! నాకు చిన్నతనం నుంచి గ్రామఫోన్ రికార్డులు వినడం అలవాటు. సినిమా చూడటానికి ముందే ఆ సినిమా రికార్డులు యింట్లో ఉన్నాయి. అందులో పాటలే కాక –– కె. రఘురామయ్యతో యుగళగీతం ‘చందమామ...’, కృష్ణవేణి సోలో ‘ఉన్నావా? లేవా...’–– ఒక పద్యం, సినిమాలోని పతాక సన్నివేశం లోనిది ‘భూపతి జంపితిన్’ ఉంది. అంతవరకు సినిమా పాటలే నా బుర్రకెక్కాయి. ఇదే మొదటి పద్యం. ఆ రాగ మాధుర్యం, నేపథ్య సంగీతం ఒరవడి అర్థమై కాదు... ఆ సులభమైన మాటలు, ఆ సన్నివేశానికి తగినట్లుగా బోధపడటం వలన!1947 మద్రాసులో మేము కొన్న యిల్లు ఉండేది పైక్రాఫ్ట్స్ గార్డెన్స్‌లో! ఆ వీధి చివరి యిల్లే కృష్ణవేణిది. ఆమె అమెరికా నుంచి దిగుమతి అయిన ఖరీదైన రెండు రంగుల ఇంపోర్టెడ్ కాడిలాక్ కారులో తిరిగేది. ఆమె భర్త మీర్జాపురం రాజా వారు చిన్న మోరీస్ మైనర్ కారులో వచ్చేవారు. అప్పట్లో సినీ రంగంలో సొంత లగ్జరీ లిమొజీన్ కారున్న తొలి వ్యక్తి కూడా కృష్ణవేణే!ఆమె కూతురు –– అప్పటి పేరు మేకా రాజ్యలక్ష్మి అనూరాధ. ‘ఎమ్.ఆర్.ఎ.’ ప్రొడక్షన్స్ అన్న కృష్ణవేణి సినిమా నిర్మాణసంస్థ యీమె పేరు తాలూకు పొడి అక్షరాలే! సాయంత్రం పూట తోపుడు బండిలో షికారు వస్తే మా అమ్మ ఆమెను ముద్దు చేసేది. నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా కృష్ణ వేణిది బహుముఖమైన ప్రస్థానం. కొన్ని సంగతులు ప్రత్యేకించి చెప్పుకోవాలి. చిన్న వయసులో ఆమె నటించిన ‘కచ దేవయాని’ (1938) దశాబ్దాల తరువాత పూనాలోని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్‌లో చూశాను. అందులో ‘‘కచా! కచా!!’ అంటూ ఆమె నాయకుడి వెంట బడటం గుర్తున్నది నాకు! అలాగే, కథానాయికగా విజయాలు సాధించిన తర్వాత ఆమె కెరీర్లో ఒకే ఒక సందర్భంలో... ‘తిరుగుబాటు’ (1950) చిత్రంలో... వ్యాంప్ పాత్ర ధరించడం మరో విశేషం. అయితే, అంతటి వ్యాంప్ పాత్రలోనూ ఆమె బాడీ ఎక్స్పోజర్ చేయకుండా నటించడం గమనార్హం. ఆ పాత్ర కోసం ఆమె ఫుల్ స్లీవ్డ్ బ్లౌజులు స్వయంగా డిజైన్ చేసుకొని, ధరించడం మరో చిత్రం.కృష్ణవేణి తాను నటించిన సినిమాలన్నిటిలో తన పాటలు తానే పాడుకున్న అరుదైన గాయని. అయితే, ‘దాంపత్యం’ (1957) చిత్రంలో మాత్రం తెరపై కృష్ణవేణి నటనకు రావు బాలసరస్వతి నేపథ్యగానం చేయడం అరుదైన సందర్భం. ఇక, తమ సంస్థ సొంత చిత్రం ‘కీలుగుర్రం’(1949)లో నటి అంజలీదేవికి కృష్ణవేణి ప్లేబ్యాక్ పాడడం మరో గమ్మత్తు. ఆమె పాడిన పాటల్లో దాదాపు 20 దాకా పాటలు 78 ఆర్పీఎం గ్రామఫోన్ రికార్డుల్లో ఉన్నాయి. ఎన్.టి. రామారావుని ‘మన దేశం’ (1949) పోలీసు యిన్స్పెక్టర్గా, అదే చిత్రంతో ఘంటసాలను సంగీత దర్శ కునిగా పరిచయం చేసింది ఆమె. రమేశ్ నాయుడికి స్వతంత్ర సంగీత దర్శ కుడిగా మొదటి అవకాశమూ ఆమె నిర్మించిన ‘దాంపత్యం’ ద్వారానే! ఆ ‘దాంపత్యం’ చిత్రం ద్వారానే విజయ్ కుమార్‌ను హీరోగానూ పరిచయం చేశారు. ఆ విజయ్‌కుమార్ తల్లి...అంతకు చాలాకాలం ముందే వచ్చిన తొలి తెలుగు సాంఘిక చిత్రం ‘ప్రేమ విజయం’ (1936)లో నటించారు. మద్రాసులో శోభనాచలా స్టూడియో నిర్వహణతో పాటు, నిర్మాతగా కృష్ణవేణి కన్నడంలో రాజ్‌కుమార్‌తో హిట్ చిత్రాలు నిర్మించడమూ మర్చిపోలేము. చివరి రోజుల్లో ఆమె తన జీవితచరిత్రను సీనియర్ జర్నలిస్ట్ ఎస్వీ రామారావు సహకారంతో రాయగా, ‘కృష్ణవేణీ తరంగాలు’ పేరిట కుమార్తె అనూరాధ ప్రచురించారు. నూటొక్క సంవత్సరాలు నిండిన చిత్తజల్లు కృష్ణవేణి గంధర్వ లోక గతురాలైందన్న విషయం తెలిసి యివన్నీ గుర్తుకు వచ్చాయి. అవన్నీ మరపురాని గుర్తులు... ఆమె పాడినవి మధుర గీతాలు!!-వి.ఏ.కె. రంగారావు , వ్యాసకర్త ప్రముఖ సినీ – సంగీత – నాట్య విమర్శకులు -
శశి థరూర్ (లోక్‌సభ ఎంపీ) రాయని డైరీ
పుస్తకాలు చదివితే జ్ఞానం లభిస్తుందా? ఆ జ్ఞానం... ఎవరినైనా, ఏ విధంగానైనా అర్థం చేసుకోవటానికి తోడ్పడుతుందా? లేదంటే, అర్థం చేసుకోవటాన్ని ఆ జ్ఞానం మరింతగా సంక్లిష్ట పరుస్తుందా? ఢిల్లీ నుండి రాహుల్ ఫోన్! ‘‘మనం ఒకర్నొకరం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది థరూర్‌జీ...’’ అంటారాయన! అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని గుర్తించ టానికి ఏదైనా పుస్తకం చదవటం వల్ల సంప్రాప్తించిన జ్ఞానం ఆయనకు దోహదపడి ఉంటుందా? ‘‘కొత్తగా ఏం చదువుతున్నారు రాహుల్జీ...’’ అని అడిగాను. ‘‘కొత్తగా ఏమీ చదవటం లేదు థరూర్‌జీ. కొత్తగా మీ ట్విట్టర్ అకౌంట్ మాత్రం చూస్తున్నాను. ఎవరిదో కోట్ పెట్టినట్లున్నారు... ‘అజ్ఞానం ఆనందదాయకం అయిన చోట, జ్ఞానవంతులుగా ఉండటం మూర్ఖత్వమని’!ఆ కోట్ చూశాకే మీకు ఫోన్ చేశాను... మనం ఒకర్నొకరం అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని...’’ అన్నారు రాహుల్! ‘‘రాహుల్జీ! మీరు గానీ ఆ కోట్లో... అర్థాలనేమైనా వెతుకుతున్నారా?’’ అన్నాను.‘‘అర్థాలను కాదు థరూర్‌జీ. మిమ్మల్ని వెతుకుతున్నాను. మీ ట్వీట్ చదివాక, మీ పాడ్‌కాస్ట్ విన్నాక, పీయూష్ గోయల్‌తో మీ సెల్ఫీ చూశాక నాకనిపిస్తోంది, కాంగ్రెస్‌లో ఉన్న కారణంగా మీరు మీ జ్ఞానాన్ని చాలా మిస్ అవుతున్నారని...’’ అన్నారు రాహుల్! రాహుల్ ఇంత జ్ఞానగర్భితంగా మాట్లాడటం మునుపెన్నడూ నేను వినలేదు. ‘‘కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వద్దనుకుంటే మీరేం చేస్తారు?’’ అని పాడ్‌కాస్టర్ నన్ను అడిగినప్పుడు – ‘‘నాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి’’ అని నేను చెప్పాను. వేరే ఆప్షన్స్ అంటే నా ఉద్దేశం పుస్తకాలు, ప్రసంగాలు. ఇక పీయూష్ గోయెల్‌తో నేను సెల్ఫీ దిగటమైతే ఎవరి దృష్టిలోనో పడటానికి చేసింది కాదు. గోయెల్ కామర్స్ మినిస్టర్. బ్రిటన్ కామర్స్ మినిస్టర్ ఆయన పక్కన ఉన్నారు. నాకూ కామర్స్‌లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ముగ్గురం కలిసి సెల్ఫీ తీసుకున్నాం. ‘‘నా ట్వీట్లో, పాడ్‌కాస్ట్‌లో, సెల్ఫీలో మీరు నన్ను వెతుకుతున్నట్లే, ‘కాంగ్రెస్ పార్టీలో నేనెక్కడ?!’ అని నేనూ నన్ను వెతుక్కుంటు న్నాను రాహుల్జీ...’’ అన్నాను. ‘‘థరూర్‌జీ! దేశానికెంతో చేస్తున్నారని మీరు మోదీజీని కీర్తిస్తున్నారు. కేరళకెంతో చేస్తున్నారని కమ్యూనిస్టులను ఆకాశానికెత్తేస్తు న్నారు. అలాంటప్పుడు మేము మిమ్మల్నిగానీ, మిమ్మల్ని మీరు గానీ కాంగ్రెస్‌లో ఎంత వెతికితే మాత్రం ఎలా మీరు కనిపిస్తారు?! ... ..అంతేకాదు థరూర్‌జీ! మీరు స్టెప్ బై స్టెప్ కింది నుంచి పైకి రాలేదు. ఒకేసారి పైనుండి ప్యారాచూట్లో కాంగ్రెస్‌లోకి వచ్చి పడ్డారు. ప్యారాచూట్ కిందికి దిగటానికే కానీ, పైకి ఎగరటానికి కాదు...’’ అన్నారు రాహుల్!! ‘ఒక జ్ఞానవంతుడి ఆత్మకథ’ అనే పుస్తకమేదో చదువుతున్నట్లుగా ఉంది నాకు, రాహుల్ అలా మాట్లాడుతుంటే వినటం!‘‘పార్టీలో నేనేమిటి?’ అని లోక్‌సభలో మీరు నాకు ఎదురుపడి అడిగినప్పుడే మీ మనసులో ఉన్నదేమిటో నాకు అర్థమైంది థరూర్‌జీ. కేరళకు సీఎం అయితేనే మీరేదైనా అయినట్లు కాదు. జ్ఞానం అన్నది ట్వీట్లకు, పాడ్‌కాస్ట్‌లకు, సెల్ఫీలకు మాత్రమే పనికొచ్చే ఒక మిత్. ఇదుగోండి, ఖర్గేజీ మీతో మాట్లాడతారట...’’ అని, ఆగారు రాహుల్!‘‘హ్యాపీ బర్త్‌డే థరూర్‌జీ...’’ అన్నారు ఖర్గేజీ లైన్లోకి రావటంతోనే!‘‘ఈ ఆదివారం కాదు ఖర్గేజీ... నా బర్త్‌డే. వచ్చే ఆదివారం...’’ అన్నాను నవ్వుతూ. ‘‘మీరు పార్టీలో ఉన్నప్పుడే బర్త్‌డే విషెస్ చెబితే మీకు సౌకర్యంగా ఉంటుంది కదా అని ముందే చెప్పేస్తున్నా థరూర్‌జీ...’’ అన్నారు ఖర్గే!! నేను మళ్లీ మళ్లీ చదువుతుండే మహాభారతాన్ని మళ్లొకసారి బయటికి తీశాను. భారతం జ్ఞానాన్ని ఇవ్వదు! జ్ఞానాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇస్తుంది! -
నా ఏజ్ ... గేజ్ చూడాలి కదా
నా ఏజ్ ఏంది.. .. నా గేజ్ ఏంది.. అన్నిటికి మించి నా రేంజ్ ఏంది.. అన్నీ తెలిసే నాకు ఈ పోస్ట్ ఇచ్చారా.. నా జూనియర్ల వద్ద నేను పని చేయాలా... వద్దు అంటూ మాజీ డిజి ఏబీ వెంకటేశ్వర రావు అలిగి కూర్చున్నారు. తనకు ఇచ్చిన పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో చేరకుండా ఊరుకున్నారు. తెలుగుదేశం హయాంలో ఇంటలిజెన్స్ డిజి హోదాలో పార్టీ కార్యకర్తకన్నా ఎక్కువగా పనిచేసారు.. ఆనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ దగ్గర్నుంచి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను బెదిరించిమరీ తెలుగుదేశంలో చేర్చడం వెనుక అయన కీలకంగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఆయన్ను సస్పెండ్ చేసింది.. దాదాపుగా వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అయన పోస్టింగ్ లేకుండా సస్పెన్షన్‌లో ఉంటూ కోర్టుల చుట్టూ తిరిగారు.. అయితే రిటైర్మెంట్ రోజే ఆయన్ను విధుల్లోకి చేర్చుకున్న ప్రభుత్వం అదేరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేశారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక తనకు చాలా కీలకమైన బాధ్యత ఇస్తారని ఆశించారు. అలాంటిదేం లేకపోయినా రెండేళ్ల సస్పెన్షన్ కాలాన్ని సర్వీసుగా గుర్తిస్తూ దానికి సంబంధించి జీతభత్యాలు చెల్లించేలా మాత్రం కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.ఇక ఆయనకు మంచి ప్రాధాన్యం ఉండే పోస్టింగ్ పోస్టింగ్ ఇస్తారు అని ఆశించినా పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ పోస్ట్ ఇచ్చి ఊరుకున్నా ప్రభుత్వం ఆయన్ను అక్కడికి పరిమితం చేసింది. అయితే అది తన స్థాయికి తగిన పదవి కాదని, తన జూనియర్లు.. తన కింద పని చేసినవాళ్లు కూడా ఇప్పుడు తనకన్నా పెద్ద పోస్టుల్లో ఉన్నారని.. ఇప్పుడు తాను వారివద్ద ఎలా పని చేస్తానని అంటూ ఫిబ్రవరి ఒకటిన ఉత్తర్వులు వచ్చినా నెలరోజులు గడిచినా ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారు అనుకుంటే కేవలం ఒక శాఖకు సంబంచించిన ఓ పోస్టులో పడేశారని.. అందులో పెద్దగా చేయడానికి కూడా ఏమీ ఉండదని అయన అంటున్నారు. ఎస్పీలు.. ఇతర ఉన్నతాధికారులతో నేరుగా సంబంధాలు ఉండవని.. వారిపై ఆధిపత్యం .. పవర్ చూపడానికి ఏమాత్రం అవకాశం లేని హోసింగ్ కార్పొరేషన్ పదవిలో ఎందుకు చేరాలని అయన మధనపడుతున్నారు. ఇటీవలనే రిటైర్ అయిన డీజీపీ ద్వారకాతిరుమల రావును ఆర్టీసీ ఎండీగా నియమించారని.. ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ ను కూడా సర్వీసు పొడిగించి మరీ కొనసాగిస్తున్నారని.. అలాంటిది తాను తెలుగుదేశానికి ఇంత సేవలు చేస్తే తనకు ఇచ్చేది ఓ నామమాత్రపు పోస్టింగా అంటూ పెదవి విరిచి ఆ పోస్టులో చేరకుండా అలకవహిస్తున్నట్లు తెలిసింది. మరి ప్రభుత్వ పెద్దలు ఆయన్ను బుజ్జగిస్తారో.. ఇచ్చిందే ఎక్కువ తీసుకుంటే తీసుకో.. అలిగితే అట్టూ లేదు.. ముక్కా లేదని మిన్నకుంటారో చూడాలి.-సిమ్మాదిరప్పన్న -
SLBC Tragedy : ప్రజల దశాబ్దాల ఆకాంక్ష ఎస్ఎల్బీసీ కథ ఇదీ!
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాగు – సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ‘శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్’ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనుల్లో జరిగిన ప్రమాదం అందరికీ బాధ కలిగిస్తోంది. చివరికి సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదాన్ని మిగిల్చింది. భద్రతా చర్యల్లో డొల్లతనానికి అద్దం పట్టింది.నల్లగొండ జిల్లా కరువు పీడిత ప్రాంతాలలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం రోజుకు అరటీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 43.93 కిలో మీటర్ల సొరంగం తవ్వి గ్రావిటీ ద్వారా అందించాల్సి ఉంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేసే లోపు, నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి పుట్టంగండి, అక్కంపెల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో నీళ్లు అందించేందుకు ‘ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్’ ప్రారంభించారు. కరెంట్ మోటార్లతో నీళ్లు ఎత్తి పోయడం వల్ల ఇది జిల్లా ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేదు. విద్యుత్ వినియోగం వల్ల అధిక వ్యయం అవుతుంది.అందువల్ల జిల్లా ప్రజల తాగు–సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎస్ఎల్బీసీ పూర్తి చేయడమే సరైన పరిష్కారం. ఈ ప్రాజెక్టును శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా అర కిలోమీటర్ లోతున సొరంగ తవ్వకం జరుగుతోంది. ఇది పూర్తి అయితేనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావితప్రాంతాల్లో తాగునీరు; సూర్యాపేట భువనగిరి ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుంది. దీని కోసం గత రెండున్నర దశాబ్దాల నుంచి వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయి. వామపక్ష పార్టీలు శాసనసభ లోపల, వెలుపల ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడిఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. ఈ క్రమంలో నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2005 ఆగస్టు 11న పరిపాలనా అనుమతులు పొంది, అదే నెల 28న ‘జేపీ అసోసియేట్స్’ సంస్థతో ఎస్ఎల్బీసీ ఒప్పందం చేసుకుంది. మొదటి అంచనా మేరకు రూ. 2,813 కోట్ల ఖర్చు. అయితే 2017 నాటికి 3,152 కోట్ల రూపా యలకు పెంచారు. ఇప్పుడు అది 4,636.75 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ ప్రాజెక్టు శ్రీశైలం రిజ ర్వాయర్ బ్యాక్ వాటర్స్ నుంచి ‘దోమల పెంట’ వద్ద ఇన్లెట్తో మొదలై... నాగర్ కర్నూలు జిల్లా ‘మన్నె వారి పల్లె’ వద్ద అవుట్లెట్తో... మొత్తం 49.93 కిలో మీటర్ల ప్రధాన సొరంగం ముగుస్తుంది. ఇప్పటి వరకు 34.71 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్త యింది. 7.13 కిలోమీటర్ల పొడవైన రెండవసొరంగం తవ్వకం బ్లాస్టింగ్ పద్ధతిలో మొత్తం పూర్తి చేశారు. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు పనులు 2010 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ గత పాలకులు ముఖ్యంగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు జరి గిన పనుల విలువ రూ. 2,689.47 కోట్లు. రెండు దశాబ్దాల్లో 34.37 కిలోమీటర్ల సొరంగం తవ్వారు. 9.56 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పనులు ఆగి పోయాయి. నాలుగైదు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు 20 ఏళ్లుగా కొనసాగడం వల్ల వ్యయ భారా నికీ, తాజా పరిణామాలకూ పాలకుల అలసత్వమే కారణం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తి చేయడానికి కొంత బడ్జెట్ కేటాయించి తిరిగి పనులకు శ్రీకారం చుట్టారు. సొరంగం లోపల పైకప్పు నుంచి నీరు, మట్టి పడుతున్నదనీ, పనులు చేయడంలో ఇబ్బంది కలుగుతున్నదనీ కార్మికులు సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీకి చెప్పినా, ఏమీ కాదని పని చేయాలని ఒత్తిడి చేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. భద్రతా ప్రమా ణాలు, ప్రభుత్వ అజమాయిషీ సరిగా లేక సాగునీటి ప్రాజె క్టుల్లో, పరిశ్రమల్లో తరచుగా ఇలాంటి ప్రమాదాలతో నష్టం జరుగుతోంది. ఆయా సంఘటనలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంది.టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించడానికి, టన్నెల్లో బురద నీరు, వ్యర్ధాలను తొలగించడానికి వివిధ విభాగాల ప్రభుత్వ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నప్పటికీ ఎలాంటి పురోగతీ కనిపించలేదు. ఈ ప్రమాదంపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథార్టీ (ఎన్డీఎస్ఏ) వారి నుంచి స్పందన రాలేదు. ఈ ప్రమాదం జరిగిన దోమల పెంట ప్రాంతాన్ని సీపీఎం బృందం ఫిబ్రవరి 23న సందర్శించింది. అక్కడ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో సహాయక చర్యల విషయం చర్చించింది. చివరికి ఆశలన్నీ గల్లంతై కార్మికుల ప్రాణలు గాల్లో కలిసిపోయాయి. భద్రతాపరంగా తగిన సాంకేతిక చర్యలు తీసుకొని ఇప్పటిౖకైనా పనుల్లో అలసత్వం లేకుండా త్వరిత గతిని పూర్తి చేయాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలి.-జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ -
అస్తిత్వాల పోరులో రాజ్యాంగ స్ఫూర్తి
భారతదేశంలో త్రిభాషా సూత్రంపై మరొక సారి విస్తృతమైన చర్చ జరుగుతోంది. దక్షిణ భారత రాష్ట్రాలు భాషా అస్తిత్వాలపరంగా తమ ఉనికిని చాటుకోవటానికి ఎప్పటినుండో పోరాటం చేస్తున్నాయి. ప్రపంచంలోనే దక్షిణ భారత భాషలకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళ భాషలకు మూలం ద్రావిడ భాషే. అయితే అవి 21 భాషలుగా అభివృద్ధిచెందాయి: బ్రాహుయీ, మాల్తో, కూడుఖ్, గోండి, కొండ, కూయి, మండ, పర్జి, గదబ, కోలామీ, పెంగో, నాయకీ, కువి, తెలుగు, తుళు, కన్నడం, కొడగు, టోడా, కోత, మలయాళం, తమిళం. మధ్య ద్రావిడ భాషల్లో తెలుగు ఉంది. దక్షిణ ద్రావిడ భాషల్లో తమిళం ఉంది. వాఙ్మయ దృష్టితో కాకుండా భాషా చారిత్రక దృష్టితో చూస్తే మధ్య ద్రావిడ భాషల్లో గోండి, కొండ, కూయి; దక్షిణ ద్రావిడ భాషల్లో తుళు, టోడా ప్రాచీనమైనవి. క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్స రాల నాడు మూల ద్రావిడ భాష నుంచి ఈ భాషలు ఒకటొకటి స్వతంత్రతను సంతరించుకున్నాయని భాషా చరిత్రకారులు చెబు తుంటారు. ఒకటొకటి స్వతంత్ర భాషగా రూపొందడానికివెయ్యేండ్లు పట్టింది. ఈ భాషల మూలాలు దక్షిణాది జీవన వ్యవస్థల నుండి ఆవిర్భవించాయి. అంబేడ్కర్ తన ‘రాష్ట్రాలు – అల్పసంఖ్యాక వర్గాలు’ పుస్తకంలో వీటి అస్తిత్వాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు.ఏ మూడు భాషలు?దేశ పాఠశాలల్లో బాలలకు మూడు భాషలు బోధించాలన్న విధానం అధికారికంగా త్రిభాషా సూత్రంగా ప్రసిద్ధమయింది. 1968లో ఈ సూత్రానికి సర్వజనామోదం లభించింది. ఈ ప్రకారం పాఠశాల బాలలకు, హిందీ భాషా రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లిష్, ఆధు నిక భారతీయ భాష (ఏదైనా ఒక దక్షిణాది భాష)ను బోధించాలి. హిందీయేతర రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషను బోధించాలి. దక్షిణ భారతావనిలో హిందీ వ్యతిరేక నిరసనలు వెల్లు వెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ త్రిభాషా సూత్రం ఆమోదం పొందింది. తొలుత రాధాకృష్ణన్ కమిషన్ (1948) ప్రతిపాదించిన ఈ త్రిభాషా సూత్రాన్ని విద్యావేత్త కొఠారి నేతృత్వంలోని తొలి విద్యా కమిషన్ అంగీకరించింది. దరిమిలా 1960లో, 1980ల్లో కేంద్రం రూపొందించిన ప్రథమ, ద్వితీయ జాతీయ విద్యా విధానాలలో ఈ సూత్రం భాగమైంది. అయితే నేర్పవలసిన త్రిభాషలు ఏవి అనేది ఆయా భాషా రాష్ట్రాల పాలకులు నిర్ణయించుకోవాల్సి వుంది.అందుకే హిందీని రెండవ భాషగానో, మూడవ భాషగానోఅంగీకరించకపోతే ‘సర్వ శిక్షా అభియాన్’ కింద పంపే నిధులు పంప మని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.కేంద్ర పాలకులు భాషా అస్తిత్వాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తు న్నారు. రాజ్యాంగంలో రాష్ట్రాల అస్తిత్వం గురించి ఇలా చెప్పారు: భారత రాష్ట్రాలు కలిసి శాసన, కార్యనిర్వాహక, పరిపాలనా అవస రాల కోసం భారత సంయుక్త రాష్ట్రాలు అనే పేరు మీద ఒక రాజకీయ రూపాన్ని తీసుకోవటానికి ఆదేశించుకుంటున్నాయి. ఈ స్ఫూర్తితో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళ నాడుపై హిందీని బలవంతంగా రుద్దకపోతే డీఎంకే దానిని వ్యతిరేకించదన్నారు. ‘డీఎంకే ఇప్పటికీ హిందీని ఎందుకు వ్యతిరేకిస్తుందని అడిగే వారికి, మీలో ఒకరిగా నా వినయపూర్వక సమాధానం ఏమి టంటే... మీరు రుద్దకపోతే మేము వ్యతిరేకించం. తమిళనాడులో హిందీ పదాలను నలుపు రంగులోకి మార్చం. ఆత్మగౌరవం అనేది తమిళుల ప్రత్యేక లక్షణం. ఎవరైనా దానితో ఆడుకోవడానికి మేము అనుమతించం’ అన్నారు. రాష్ట్రంలో భాషా వివాదం చెలరేగు తున్న నేపథ్యంలో ఈ మేరకు ఆయన డీఎంకే శ్రేణులకు లేఖ రాశారు. భాషల కోసం పోరాటంస్టాలిన్ వాదనలో ఒక సత్యం ఉంది. మాతృభాష ప్రతి రాష్ట్రంలోని విద్యార్థికి అత్యవసరం. దక్షిణాదిలో ఉన్న భాషా మూలాలను బట్టి వారికి రెండవ భాషగా దక్షిణాది భాష త్వరగా వస్తుంది. ప్రపంచీకరణలో భాగంగా ఇంగ్లిష్ అన్ని రాష్ట్రాల విద్యార్థులు నేర్చుకోవడం వల్ల ఏ దేశంలోనైనా ఉపాధిని సంపాదించుకోవచ్చు. తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయకర్ కాలంలోనే తమిళ భాషా అస్తిత్వం కోసం పోరాడిన చరిత్ర ఉంది. అలాగే తెలుగువారు కూడా తమ భాషా అస్తిత్వాల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. నిజానికిఆంధ్రులు అనేక భాషల వారితో బాధింపబడినా తమ అస్తిత్వ పోరా టాల్ని బలంగా చేశారు. శాతవాహనుల కాలం నుండి సంస్కృత భాషలో, ప్రాకృత భాషలో పాలకులు ఉన్నప్పుడు, తెలంగాణలో ఉర్దూ భాష పాలకులు ఉన్నప్పుడు కూడా తెలుగువారు తమ లిఖిత భాషా సంప్రదాయాన్ని కొనసాగించారు. తమిళనాడును ఎంతో కాలం పాలించిన కరుణానిధి ప్రెస్మీట్లో కూడా తమిళంలోనే మాట్లాడి దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత విలేఖరులకు ఉందని చెప్పడం ఒక ఆత్మాభిమాన ప్రకటన!క్రీ.శ.1901లో శ్రీ కృష్ణదేవరాయల ఆంధ్ర భాషా నిలయం కొమర్రాజు లక్ష్మణరావు పంతులు ప్రోత్సాహంతో స్థాపించబడిన తరువాత తెలుగులో భాషోద్యమంతో పాటు, గ్రంథాలయాల ప్రాధా న్యత పెరిగింది. 1906వ సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలి ప్రారంభంతో సాహిత్య ప్రచురణకు కూడా ఉత్సాహం వచ్చింది. తెలుగు భాషాభివృద్ధికి అన్ని ప్రాంతాల మేధావులు కృషి చేశారు. ఏ భాషోద్యమమైనా ఆ భాషా ప్రజల చరిత్రకు, పరిణామాలకు మూల శక్తి అవుతుంది. భాషను విస్మరించిన రాష్ట్రాలు తమ ఉనికిని కోల్పో తాయి. తెలుగు భాష గ్రంథస్తం కాకపోవడానికి వీరికి రాజ భాషగా సంస్కృత, ప్రాకృతాలు 900 యేండ్లు వ్యవహరించడం. అయినా తట్టుకొని నిలబడటమే గొప్ప అంటారు బి.ఎన్.శాస్త్రి. ‘‘ఆంధ్ర దేశ మున రాజభాషగా ప్రాకృతము క్రీ.పూ. 300 నుండి క్రీ.శ. 300 వరకు వర్ధిల్లినది. అటు పిమ్మట క్రీ.శ. 300–600 వరకు సంస్కృతము రాజ భాషయైనది.... గాథాసప్తశతి, బృహత్కథ, లీలావతి వంటి ప్రాకృత గ్రంథములందు అనేక తెలుగు పదములున్నవి. ప్రాకృత, సంస్కృత భాషల కన్న భిన్నమైన దేశభాష అనగా తెలుగు వాడుకలోనున్నట్లు శర్వవర్మ–గుణాఢ్యుల సంవాద గాథ తెలుపుచున్నది.’’ ఉత్తరాదివారూ నేర్చుకోవాలి!వాస్తవానికి మోదీ సర్కార్ జాతీయ విద్యా విధానంలో హిందీని ప్రస్తావించకపోవడం ద్వారా త్రిభాషా సూత్రాన్ని అస్పష్టపరిచింది. ఈ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం తాను ఎంపిక చేసిన ఏ మూడు భాషలనైనా బోధించవచ్చు. అయితే ఆ మూడు భాషలలో రెండు తప్పనిసరిగా దేశీయ భాషలు అయివుండాలి. ఈ దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం కోరుకుంటే, తమిళంతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో ఒకదాన్ని, ఆంగ్ల భాషను బోధించవచ్చు. నిజానికి ఉత్తరాదికి దక్షిణాదివారు, దక్షిణాదికి ఉత్తరాదివారు ప్రయాణం చేస్తున్న కాలం ఇది.దక్షిణాది భాషలు ఉత్తరాదిలో ఎగ తాళికి గురవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇంగ్లిష్‌ను ఎటూ ప్రపంచ భాషగా చదువుతున్నారు. ఉత్తరాది వారికి దక్షిణాది చరిత్ర, దక్షిణాది వారికి ఉత్తరాది చరిత్ర తెలియాలి. ఒకరి భాషా ఒకరికి, ఒకరి వస్తువుల పేర్లు మరొకరికి, ఒకరి తినుబండారాల పేర్లు మరొకరికి అర్థం కావాలంటే ఉత్తరాది వారు కూడా దక్షిణాది భాషల్లో ఒక భాషను నేర్చుకోవాలి. దీన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నీ భారతీయ భాషలే, అన్నింటికీ సమ ప్రాధాన్యత ఉండాలని నొక్కి చెప్పారు. ఫెడరల్ సూత్రాలను ఎలా విస్మరిస్తారని ప్రశ్నించారు. ఉత్తరాది సంప్రదాయశీలమైంది, దక్షి ణాది పురోగమన శీలమైంది. ప్రతి రాష్ట్రానికి ఇచ్చిన హక్కుల్ని కాపాడటం కేంద్ర ప్రభుత్వ విధి.» పాఠశాలల్లో బాలలకు మూడు భాషలు బోధించా లన్న విధానం అధికారికంగా త్రిభాషా సూత్రంగాప్రసిద్ధం. 1968లో దీనికి ఆమోదం లభించింది.» హిందీని బలవంతంగా రుద్దకపోతే దానిని వ్యతిరేకించం అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు.» త్రిభాషా సూత్రం ప్రకారం, హిందీ భాషా రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లిష్తో పాటు ఒక ఆధునిక భారతీయభాష (ఏదైనా దక్షిణాది భాష)ను బోధించాలి. కానీ ఇది విస్మరణకు గురైంది.-వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695-డా‘‘ కత్తి పద్మారావు -
ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదంటే ఏమనాలి?
ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా... నేటికీ వ్యవసాయ పనులు చేసుకుంటూ... ప్రజా సమస్యలపై పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నారు గుమ్మడి నరసయ్య (జీఎన్). అటువంటి నాయకుడు మూడుసార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని కలిసేందుకు ప్రయత్నించారు. అయినా అపాయింట్మెంట్ ఆయనకు దొరకలేదంటే ఏమనాలి?భూముల సమస్యను ప్రస్తావించేందుకు, చెక్‌డ్యామ్ అవసరాన్నీ, లిఫ్ట్ ఇరిగేషన్ (lift irrigation) పథకాల్లోని సమస్యలను సీఎంని కలిసి విన్నవించేందుకు జీఎన్ ప్రయత్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజరవర్గంలో పోడు భూములపై గిజనులకు హక్కులు కల్పించాలనీ, సీఎం ప్రకటించిన రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు ఖాతాల్లో పడలేదనీ, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావటం లేదనే విషయాలపై ఒక వినతి పత్రాన్ని ఇచ్చేందుకు తనకు పరిచయం ఉన్న అధి కారుల ద్వారా సీఎం అపాయింట్మెంట్ కోసం జీఎన్ ప్రయత్నించారు. ముందుగా సీఎం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉన్నట్టు తెలియటంతో అక్కడికి వెళ్లారు. మధ్యాహ్నం లేదా సాయంత్రంలోపు సీఎం కలిసే అవకాశం ఉందని సిబ్బంది చెప్పడంతో రోజంతా నిలబడి వేచిచూశారు. కానీ, సీఎం ఆయన్ను కలిసేందుకు అనుమతించలేదు.తర్వాత తనకు పరిచయం ఉన్న అధికారులతో సీఎం కార్యా లయానికి ఫోన్ చేయిస్తే... ఏ సమయంలోనైనా సీఎం పిలవ వచ్చనే సమాచారం తెలవడంతో ఆశతో రోజంతా సెక్రటేరియట్ గేట్ బయటే పడిగాపులు కాచారు. దినం గడిచింది కానీ, సీఎం నుంచి పిలుపు రాలేదు. ఆయన నిరాశతో వెనుదిరిగారు. మరోసారి సీఎం నివాసం జూబ్లీహిల్స్‌కు వెళ్లి ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. ఎండలో గంటల తరబడి బయట వేచిచూసినప్పటికీ నర్సయ్యను లోపలికి అనుమతించలేదు. సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్తున్న ముఖ్యమంత్రిని గమనించిన గుమ్మడి నర్సయ్య సీఎం కాన్వాయ్కి ఎదురెళ్లినా... చూసీచూడనట్టుగా వెళ్లటంతో తీవ్ర అవమానంతో ఆయన వెనుదిరిగారు.ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకుల గూడెం గ్రామానికి చెందిన గుమ్మడి నర్సయ్య (Gummadi Narsaiah) సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. సీపీఐ ఎంఎల్ పార్టీ విప్లవ రాజకీయాల్లో రాష్ట్ర నాయకుడిగా, ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసి ఐదు పర్యాయాలు (1983, 1985, 1989, 1999, 2004ల్లో) గెలిచారు. హంగు, ఆర్భాటాలకు తావు లేకుండా తన పదవీ కాలమంతా ప్రజల మధ్యే గడిపారు. ఇప్పటికీ సామాన్య జీవితం గడుపుతున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ప్రజలతోనే జీవిస్తున్నారు.ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలు ముఖ్య మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయనకు ఏ క్షణమైనా అపాయింట్మెంట్ దొరికేది. 2009లో వైఎస్ రాజ శేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమ్రంతి అయినప్పుడు ఇల్లెందులో గుమ్మడి నర్సయ్య ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డిని కలిసేందుకు వెళ్ళగా రాజశేఖరరెడ్డి లేచి నిలబడి ఎదురు వెళ్లి ‘నర్సన్నా... నీవు ఓడిపోవడం ఏందన్నా!’ అంటూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ‘మీలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండాలం’టూ రాజశేఖరరెడ్డి తన రాజకీయ హుందాతనాన్ని ప్రదర్శించారు. అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాత్రం దొరతనాన్ని ప్రదర్శిస్తున్నారు.చదవండి: బియ్యాల జనార్దన్ సార్ కృషికి గుర్తింపేదీ? కేసీఆర్ దర్శనం కోసం గద్దర్ పడిగాపులు కాసిన ఘటనను వివాదం చేసిన మేధావులు సీఎం నివాసం వద్ద ఫుట్ పాత్‌పై గుమ్మడి నర్సయ్య నిరీక్షిస్తున్న ఫోటోపై ఎందుకు నోరెత్తడం లేదు? ఇప్పటికైనా రేవంత్ తన పొరపాటు గ్రహించి జీఎన్ను పిలిపించుకుని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ఈ ఉదంతం ఎప్పటికీ ఆయన పాలనా కాలంపై చెరగని మచ్చలా మిగిలిపోతుంది.– వెంకటేష్, పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
National Science Day: ప్రజల చేతిలో ఆయుధం సైన్స్
మన దేశంలో ‘నేషనల్ సైన్స్ డే’ (ఎన్ఎస్డీ) 1987 ఫిబ్రవరి 28 నుంచి ప్రతి ఏడాదీ నిర్వహించుకుంటున్నాం. అదే రోజు మన భారత శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ తన పరిశోధనల్ని ‘రామన్ ఎఫెక్ట్’ పేరుతో 28 ఫిబ్రవరి 1928న ప్రతిపాదించారు. దీనికే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఇది భారత్‌కే కాదు మొత్తం ఆసియా ఖండానికే దక్కిన మొదటి నోబెల్ బహుమతి. సైన్స్ డే సందర్భంగా నిర్వహించు కోవాల్సిన కార్యక్రమాలు: 1. నిత్య జీవితంలో సైన్సు ప్రాముఖ్యతను గ్రహించే విధంగా కార్యక్రమాలు రూపొందించు కోవాలి. 2. మానవాభ్యు దయానికి ఉపయోగపడే వైజ్ఞా నిక పథకాలకు రూపకల్పన చేసుకోవాలి. 3. సమాజంలో వైజ్ఞానిక అవగాహన పెంచడా నికి కృషి చేసిన, చేస్తున్నవారి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. వాటికి ప్రాధాన్యత కల్పించాలి.సైన్స్ డే పాఠశాలలకు, కళాశాలలకు, విశ్వవిద్యాల యాలకు మాత్రమే పరిమితం కాదు. అన్ని పౌర సంఘాల్లో దీన్ని ఘనంగా జరుపు కోవాలి. దేశ పౌరుల్లో ముఖ్యంగా బాల బాలికల్లో సైన్సుపట్ల ఆసక్తిని పెంచడానికి దీన్ని ఉపయోగించాలి. సైన్స్ డే సందర్భంగా ఉప న్యాసాలు, ఊరేగింపులు, వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్ సంబంధిత పోటీలు నిర్వహించి జనంలో అవగాహనపెంచాలి.మన విద్యా విధానంలో ఉన్న ప్రధాన లోపమేమంటే, క్లాస్ రూంలో సైన్స్ సూత్రాలు మాత్రమే చెబుతారు. అంతేగానీ, ఒక శాస్త్రవేత్త ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ పరిశోధ నలు చేయగలిగాడన్నది మాత్రం సంక్షిప్తంగా నైనా చెప్పరు. ఈ ధోరణి మారాలి.ప్రపంచమంతా వైజ్ఞానికంగా ముందుకు దూసుకుపోతున్న తరుణంలో కొందరు మన దేశ పౌరులు మన ప్రభుత్వ పెద్దలు మూఢ నమ్మకాలకు పెద్ద పీట వేస్తున్నారు. దేశాన్ని మూడు వేల ఏళ్ళ నాటి అనాగరిక సమాజంలోకి లాక్కుపోతున్నారు. ఆ ప్రమాదంలోంచి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశ పౌరులంతా వివేకం ప్రదర్శించాలి. సైన్సును ఒక వెన్నెముకగా చేసుకుని ప్రగతి పథంలోకి నడవాలి.మూఢత్వాన్ని వదిలి, చేతనత్వం లోకి రావాలంటే – మనం మన రాజ్యాంగంలో రాసుకున్న 51ఏ (హెచ్) స్ఫూర్తిని నిలుపు కోవాలంటే, ప్రతి పౌరుడూ చిత్తశుద్ధితో పని చేయక తప్పదు. ఇప్పటి దేశ కాల పరిస్థితులను చూస్తుంటే, ఇక ఆ దిశలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించి ఆచరించాల్సిన అవ సరం వచ్చిందని అనిపిస్తోంది.ఇప్పుడు ప్రజల చేతిలో ఉన్న ఆయుధం – ప్రశ్న! ప్రశ్నలోంచి ఎదు గుతూ వచ్చిందే సైన్సు!! ఈ సైన్సు అంత ముఖ్యమైందిగా ఎందుకయ్యిందీ? అంటే చీకటిలోంచి వెలుగులోకి వెళ్ళాలంటే సైన్సే ఆసరా కాబట్టి. అనాగరికతనూ, మూర్ఖత్వాన్నీ వదిలి విశాల విశ్వంలో అత్యాధునిక మాన వులుగా నిల బడాలంటే సైన్సు తప్ప మరో మార్గం లేదు. అన్యాయాల్ని, అబద్ధాల్ని, దుర్మా ర్గాల్ని ఛేదించాలంటే తీసుకోక తప్పదు సైన్సు సహాయం. అలాగే ఇప్పుడు ప్రభుత్వాల మూఢత్వం బద్దలు కొట్టాలన్నా, మనకున్నది ఒక్కటే పదునైన ఆయుధం – అదే సైన్స్!– డా.దేవరాజు మహారాజు, సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ -
పాలనలో సమన్వయ లోపం
ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధి పతులు, మంత్రుల సమీక్షా సమావేశం 12 గంటల పాటు జరిగింది. గత అనుభవంతో సీబీఎన్ త్వరితంగా పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చుకోవలసి ఉండగా, ఇప్పటికీ మూడుసార్లు కలెక్టర్ల సమా వేశాలు నిర్వహించి, ఎనిమిది నెలలుగా నిత్యం ఏదో ఒక శాఖ సమీక్ష చేస్తున్నా... మళ్ళీ మరో సమన్వయ సమావేశం ఎందుకు నిర్వహించినట్లు? నిజానికి ఐదేళ్ళ వైసీపీ పాలన తర్వాత ‘బ్యురోక్రసీ’ వైఖరితో ‘కూటమి’ ప్రభుత్వం సమన్వయ సమస్య ఏదైనా ఎదుర్కొంటున్నదా? అనేది ఇక్కడ కీలకం. కొత్తగా 13 జిల్లాలు ఏర్పడిన 2022 ఉగాది నాడు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ మోహన్ రెడ్డి– ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ సాధించే దిశలో ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (ఎస్ఓపీ) పాటించి తీరాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ‘సరళీకరణ’ కాలంలో పొలిటికల్ ఎగ్జిక్యుటివ్ అధికా రులను ‘మార్గదర్శక నిబంధనలు దాట డానికి వీలులేదు’ అనే మాట పైకి అనడం చిన్న విషయం కాదు. ఈ మార్పుకు కారణం, గతంలో పాలన ‘పిరమిడ్’ తరహాలో పైన ఒక్కరిదే నిర్ణయమైతే, దిగువ పలు అంచెల్లో దాన్ని అమలుచేసే యంత్రాంగం ఉండేది. వైసీపీ ప్రభుత్వంలో పైన ఉండే నిర్ణయ శిఖరం ‘చతురస్రం’గా మారింది. విధాన నిర్ణయంలో సమష్టి బాధ్యత వచ్చింది. మండల గ్రామ సచివాలయ సిబ్బంది నిర్ణయాల అమలుకు దఖలు పడ్డారు. సీబీఎన్ శైలి దీనికి పూర్తిగా భిన్నమైంది.రాజకీయ నాయకుల నిర్ణయాల అమలుకు మాత్రమే ఐఏఎస్‌లను పరిమితం చేస్తే, తదుపరి పరిణామాలకు జడిసి కొందరు అధికారులు పోస్టులు మారుతున్నారు. సీఎం తనది ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ అని కలెక్టర్ల సమావేశంలో చెప్పడం అంటే, అది ‘నీతి ఆయోగ్’ అయినా, ప్రపంచ బ్యాంకు షరతులు అయినా మాకు వర్తించవు’ అని చెప్పడమే అవుతుంది. సీఎం కలెక్టర్లకు చెప్పిందే సెక్రటరీలకు వర్తిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో బహుశా వేగంగా కదలని ‘ఫైళ్ళు’ ఈ సమావేశ నిర్ణయానికి కారణం కావొచ్చు.అయితే, అధికారులు ఉన్నదే వారు తమ బాధ్యతలు తాము నిర్వర్తించడానికి కనుక... ఇక్కడ 2019 ఎన్నికల ముందు జరిగింది ఒకటి చెప్పాలి. ‘సొసైటి ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ’ (‘సెర్ప్’) సంస్థ 2019 ఫిబ్రవరి 16 నాటికి ‘ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్టు, సోషల్ మేనేజ్మెంట్ ఫ్రేం వర్క్’ పేరుతో ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఈ పనిలో ప్రపంచ బ్యాంక్ది ప్రధాన భూమిక.రాష్ట్ర విభజన జరిగిన నాలుగున్నర ఏళ్ల తర్వాత, ఎన్నికల ముందు పేదరిక నిర్మూలన కొరకు రూపొందించిన అధికారిక ‘డాక్యుమెంట్’ ఇది. ఇది జరిగిన నాలుగు నెలలకు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. మనకు ‘నెట్’లో అందుబాటులో ఉన్న ఈ పత్రం– ‘వైరుధ్య –ఆంధ్రప్రదేశ్’ అనే ముందుమాటతో మొదలవుతుంది. అందులో – ‘ఇక్కడ ఒకపక్క వృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నది. విద్యుత్తు, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమలు, ఐటీ వృద్ధికి పబ్లిక్–ప్రైవేట్ పెట్టుబడులు మెండుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో పేదరికం కూడా తగ్గుతున్నది. కానీ ఇక్కడి వ్యవసాయ రంగంలో రైతుల వెతలు అలాగే ఉన్నాయి. సామాజిక మానవీయ విలువల సూచీ అట్టడుగున ఉంది. ఇక్కడి మహిళా స్వయం సహాయ సంఘాల చొరవ గొప్ప మార్పుకు నాంది పలికినా అది ఎస్సీ, ఎస్టీల విషయంలో సామాజిక పెట్టుబడిగా రూపాంతరం చెందలేదు. దాంతో వారి ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్య వసతుల మెరుగు దలను అది ఏ మాత్రం ప్రభావితం చేయలేక మినిమవ్‌ు డెవలప్మెంట్ గోల్స్ (ఎండీజీ) వద్దకు వారిని చేర్చలేక పోయింది.’ ఇది చదివాక, మన కామన్ సెన్స్‌కు వచ్చే ప్రశ్నలు రెండు. ఈ పత్రంలోని అంశాలు తన ప్రభుత్వ కృషి ఫలితం అని సీబీఎన్...పైకి అనకపోవడానికి కారణం ఏమిటి? ఈ నివేదికలో గుర్తించిన వ్యత్యాసాలను అధిగమించేలా తదుపరి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తమ పథకాలను అమలు చేసింది. అయితే వాటిలో లోపాలు ఉంటే వాటిని చూపడం కాకుండా, ‘సంక్షేమమేనా... అభివృద్ధి ఏదీ?’అంటూ ముప్పేట దాడి చేయడం ఏమిటి? ఈ ‘పత్రం’ సీబీఎన్ ప్రాధాన్యాలలోని అంశం కాకపోవచ్చు. అలాగే పేదలకు మేలు చేసేది కనుక వైసీపీ దాన్ని తన మేనిఫెస్టోలో చేర్చి ఉంటుంది. ఇప్పుడు కూడా ‘కూటమి’ దాని ఊసు ఎత్తడం లేదంటే దాన్ని అమలుచేసే ఆలోచన లేక కావొచ్చు.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
కుల గణన చర్చలో పస ఎంత?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక, సామాజిక, విద్య, కులాల వారీగా తీసిన లెక్కల గురించి కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీజేపీ కేంద్ర మంత్రులు పెద్ద రాద్ధాంతం చేసే సమస్య... ముస్లిం ఓబీసీలు. ఇతరులు చర్చనీయాంశం చేసేది... ఓసీ కులాల సంఖ్య.56 ప్రశ్నలతో, వందలాది ఎనుమరేట ర్లతో 50 రోజులు చేయించిన సర్వే ఇది. 150 కుటుంబాలను ఒక బ్లాక్‌గా గుర్తించారు. అంటే ఒక్క ఎనుమరేటర్ ఆ బ్లాక్‌లో 50 రోజుల్లో ప్రశ్నావళిలో ఇచ్చిన కులాల పేర్ల ఆధారంగా 56 ప్రశ్నలకు సమాధానాలు తీసుకున్నారు. ప్రజల సంతకాలతో ప్రశ్నల చిన్న పుస్తకాన్ని కోడింగ్ సెంటర్లకు చేర్చారు. ఈ విధంగా తీసిన లెక్క లను, 4 ఫిబ్రవరి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ లెక్కలను, 2014లో అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రోజులో ఇంటింటి సర్వే పేరుతో జరిపిన తంతుతో పోల్చి కొందరు చర్చల యుద్ధం చేస్తున్నారు.ముస్లింలను విస్మరిస్తారా?అందులో మొదటిది ఆనాటి లెక్కల్లో ముస్లింలంతా ఓసీలే. ఇప్పుడు 10.08 శాతం బీసీలు ఎట్లా అయ్యారు? ముస్లింల బీసీ–ఈ కులాల పేర్ల జాబితాను వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తయారు చేసింది! అందులో బీసీ–ఈ ముస్లింలను 14 గ్రూపులుగా విభజించి వారి కులాల పేర్లను లిస్టులో పొందుపర్చారు. అందులో అచ్చుకట్టలవాండ్లు, అత్తర్ సాయబులు, ధోభి ముస్లిమ్, ఫకీర్, బుడ్‌బుడ్కి, గుర్రాలవాళ్ళు, గోసంగి ముస్లింలు, నజావ్, నాయిలబ్బి, కటిక్, షేక్, సిద్ది, జింక సాయిబులు, తుర్క కాష వరకు దాదాపు 60 కులాలు ఉన్నాయి. వీరంతా వివిధ దశల్లో, ముఖ్యంగా తెలంగాణలో నిజాం కాలంలో ముస్లింలుగా మారి బతుకుదెరువు వెతుక్కున్నవారు. ఇందులో చాలా కులాలు ఆరెస్సెస్/బీజేపీ వారు హిందువులుగా గుర్తించి, బీసీ కులాల్లాగా కులవృత్తులతో జీవించిన వారు. భిక్షాటన సంస్కృతితో జీవించే కులాలు కూడా ఇందులో ఉన్నాయి. గుడ్డేలుగులను ఆడించేవాళ్లు, ఊబిది పొగవేస్తూ ఇండ్లు తిరిగేవాళ్లు, దర్గాల దగ్గర పీర్సాయబులుగా బతికేవాళ్లు ఉన్నారు. అందులో అతిపెద్ద కులం దూదేకులవాళ్లు. వీళ్లలో పింజారీలు కూడా ఒక భాగం. ఆంధ్ర ప్రాంతంలో ప్రఖ్యాత బుర్రకథ యోధుడు నాజర్ ఈ కులానికి చెందిన సాంస్కృతిక సారథి. ఆయన జీవిత చరిత్ర ‘పింజారి’ చదివితే ఆయన ఎంత కిందిస్థాయి నుంచి ఎదిగాడో అర్థమౌతుంది. ఆయన తల్లి తిండిలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. బీజేపీ వాళ్లు రేపు ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేస్తే రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తయారు చేసిన ఈ ముస్లిం కులాల లిస్టును పక్కన పెట్టి మొత్తం వారిని ఓసీల్లో చూపిస్తారా? వారికిచ్చే 4 శాతం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని తెలంగాణలో మోదీ, అమిత్ షా ఎన్నికల సమయంలో గొంతు చించుకొని మాట్లాడారు. ఇప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి అదే అంశాన్ని పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో కూడా రచ్చ చేస్తారా? బతుకుదెరువు, విద్య లేని వారిని అభివృద్ధి చేయాల్సిన పథకాల్లో చేర్చకుండా వాళ్ళను ఆకలిచావులకు గురిచెయ్యాలా? మానవత్వ విలువలు కూడా ఈ దేశానికి లేకుండా చేద్దామా?ఈ జనగణనలో 2.48 శాతం ముస్లింలు ఓబీసీలుగా తమను తాము ఐడెంటిఫై చేసుకోలేదు. వీరిలో పఠానులు, మొగలులు, షేక్‌లు, సయ్యద్‌లు ఉంటారు. వీళ్లు నిజాం కాలం నుండి ఫ్యూడల్, రాజరిక లక్షణాలతో బతుకుతున్నవాళ్లు. మత సమానత్వం మాట్లాడుతున్నప్పటికీ కుల అణచివేత, దోపిడీ ముస్లింలలో చాలా ఉంది. బీసీ ముస్లింలు తిరుగుబాటు చెయ్యకుండా, వారికి ఇంగ్లిష్ విద్య రాకుండా మతం ముసుగుతో ఈనాటికీ అణచివేస్తూనే ఉన్నారు. రాజ్యం వారిని విముక్తుల్ని చేసేందుకు రిజర్వేషన్లు, ఇంగ్లిష్ మీడియం విద్యను అందించాలి. ముస్లిమేతర బీసీ మేధావులు కూడా వారి రిజర్వేషన్‌కు అండగా నిలబడాల్సిన అవసరముంది.ఓసీల జనాభా ఎందుకు పెరిగింది?ఇక రెండో చర్చనీయాంశం ముస్లిమేతర బీసీలు 46.25 శాతమే ఎలా ఉంటారు? తెలంగాణలో ఓసీలు 13.31 శాతం ఎందుకు ఉంటారు అనేది బీసీ మేధావులు అడిగే ప్రశ్న. 2014 లెక్కల్లో టీఆర్ఎస్ ఓసీలు 7 శాతమన్నది కదా, ఇప్పుడు 13.31 శాతం ఎలా పెరిగిందని అడుగుతున్నారు. అసలు 2014 లెక్క పెద్ద బోగస్. ఒక్కరోజులో లెక్కలు తీశామని చెప్పి, బయటికి పర్సెంటేజీలు కూడా అధికారికంగా చెప్పలేదు. మొత్తం ముస్లింలను ఓసీలలో చూపించిన లెక్కల్లో బీసీ–ఈ కులాలు ఏమైనట్లు? ఈ విధంగా చర్చించడం బీజేపీని బలపర్చడమే. ఆనాడు టీఆర్ఎస్ బీజేపీలా వ్యవహరించింది.తెలంగాణలో మొత్తం బీసీలు 46.25 శాతం మాత్రమే ఉంటారా అనేది ఎలా చూడాలి? 1931 జనాభా లెక్కల తరువాత తెలంగాణలో మొదటి కులగణన ఇది. 1931 నాటి లెక్కల అంచనా గానీ, టీఆర్ఎస్ 2014 లెక్కలు గానీ ఇప్పుడు చూడలేము. ఈ లెక్క తçప్పు అని చెప్ప డానికి ఆధారం ఏంది? కొన్ని దశాబ్దాలుగా కుల నాయకులు, మేధా వులు ఇష్టమొచ్చిన లెక్కలు చెప్పుకొంటున్నారు. తెలంగాణ కులాల లెక్కలు విడుదల అయ్యాక కూడా ‘మా కులం గింతేనా?’ అని వాదించడం ఉంటుంది. 1980 దశకంలో మండల్ కమిషన్ దేశంలోని అన్ని శూద్ర కులాలను... రెడ్డి, వెలమ, కమ్మ, కాపులతో సహా – 52 శాతం ఓబీసీలు అని అంచనా వేసింది. ఇప్పుడు రిజర్వేషన్ బయట ఉన్న ముస్లిమేతర ఓసీ కులాలు 13.31 శాతం. అయితే ఓసీలు 7 నుండి 13.31 శాతం ఎలా అయ్యారు అనేది కొందరి ప్రశ్న. అసలు సరిగ్గా వాళ్ళది 7 శాతమే ఉండింది అని పూర్తి సర్వే ఎవరు చేశారు? అదొక ఊహాజనిత సంఖ్య. టీఆర్ఎస్ సర్వే, సర్వే కాదు.ఇకపోతే 2014 నుండి 2025 నాటికి హైదరాబాద్‌కు బయట రాష్ట్రాల నుండి వలస వచ్చిన ఓసీ కులాల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ప్రశ్నపత్రంలోని 31వ పేజీలో అయ్యర్/అయ్యంగార్ నుండి మొదలుకొని వెలమల వరకు అక్షరక్రమంలో 18 కులాల పేర్ల ద్వారా ఎనుమరేషన్ జరిగింది. 2014 ఒక్క రోజు లెక్కల డ్రామాలో కులాల పేర్లు అడుగలేదు. ఎనుమరేటర్లకు కులాల పేర్ల లిస్టు ఇవ్వ లేదు. అలాంటిది ఒక జాతీయ పార్టీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసు కొని జనాభా లెక్కలు తీయిస్తే బీసీ మేధావులే ఇది బూటకపు లెక్క అని ప్రచారం చేస్తే ఎవ్వరికి మేలు జరుగుతుంది? అసలు 2021 నుండి ఇప్పటి వరకు దేశ జనాభా లెక్కలే చెయ్యని బీజేపీకి లాభం చెయ్యడానికే ఈ వాదనంతా పనికొస్తుంది. ఒకవేళ కోర్టుపై ఒత్తిడి తెచ్చి కులజనాభా లెక్కలు తీయిస్తే ఆ లెక్కలను, ఈ లెక్కలను పోల్చి చూడవచ్చు. ముందు తెలంగాణ కులగణన ఆధారంగా కేంద్రం మీద కదా ఒత్తిడి చేయాల్సింది! బీసీల కోసమే చేసిన ఈ కులగణనను తామే నిర్వీర్యం చెయ్యడం సరైంది కాదు.ఈ లెక్కల ఆధారంగా ఆర్థిక రంగంలో, కాంట్రాక్టుల్లో, నిధుల కేటాయింపుల్లో, లోకల్ బాడీల్లో వాటా కావాలి అని అడగటం సమంజసం. తెలంగాణ రాష్ట్ర కులగణన దేశంలోనే రాజ్యాంగ రక్షణ, సామాజిక న్యాయరేటును పెంచడం అనే సిద్ధాంత పోరాటంలో భాగంగా చేసింది. ఇది అన్నింటికంటే కీలకం!ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారనుకుంటే..
తెలుగు నేలపై పుట్టి మొత్తం దక్షిణాదిలో విద్యను వ్యాపారీకరించిన రెండు కార్పొరేట్ విద్యాసంస్థలు (corporate colleges) పిల్లలు, తల్లిదండ్రుల కలలపై వ్యాపారం చేస్తున్నాయి. ఇటువంటి సంస్థలు దేశవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఎందరో పిల్లల జీవితాలు ఇవి చేసే వ్యాపారంలో సమిథలవుతున్నాయి.నేడు భారతదేశంలో ఆత్మహత్యలు అనేది ఒక జాతీయ సామాజిక సమస్యగా మారిపోయింది. భారతదేశంలో ప్రతి 40 నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. సగటున ప్రతిరోజూ సుమారుగా 36 మంది విద్యార్థుల ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. మనదేశంలో ప్రతి సంవత్సరం ఆత్మ హత్యల ద్వారా సుమారుగా 7–8 శాతం వరకు విద్యార్థులు మరణి స్తున్నారు. గత 25 ఏళ్లుగా (1995 నుండి 2021 వరకు) దాదాపుగా 2 లక్షల మంది విద్యార్థులను భారత్ ఆత్మహత్యల ఫలితంగా కోల్పోయింది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా, వార్షిక ఐసీ–3 కాన్ఫరెన్స్– ఎక్స్పో– 2024 (ఆగస్టు 28)లో ‘విద్యార్థుల ఆత్మహత్యలు: ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా’ నివేదిక విడుదల చేయబడింది. మొత్తం ఆత్మహత్యల సంఖ్య ఏటా 2% పెరుగుతుండగా, విద్యార్థుల ఆత్మహత్యల కేసులు 4% పెరిగాయని ఈ నివేదిక ఎత్తి చూపింది. గత రెండు దశాబ్దాలుగా, విద్యార్థుల ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే రెట్టింపు స్థాయిలో వార్షికంగా 4% పెరిగాయి. 2022లో మొత్తం ఆత్మహత్యల్లో 53% మంది విద్యార్థులు ఉన్నారు. 2021, 2022 మధ్య విద్యార్థులలో మగపిల్లల ఆత్మహత్యలు 6% తగ్గగా, బాలికల ఆత్మహత్యలు 7% పెరిగాయి అని ఐసీ–3 ఇన్స్టిట్యూట్ రూపొందించిన నివేదిక పేర్కొంది.చాలా మంది దిగువ – మధ్యతరగతి నేపథ్యాల వారు కార్పొరేట్ కాలేజీల్లో చేరి ఇటు ఫీజులు కట్టలేక, అటు కాలేజీల్లో ఉన్న ఒత్తిడి వాతావరణాన్ని తట్టుకోలేక సతమతమవుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉండే అసహజ వాతావరణం తల్లిదండ్రులకు తెలిసినా... వాటిలో చేరితేనే తమ పిల్లలు మంచి ర్యాంకు పొంది డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారనే నమ్మకంతో వాటిల్లోనే చేరుస్తున్నారు. ప్రభుత్వాలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు విచారణా కమిటీలు నియమించి చేతులు దులుపుకొంటున్నాయి. తమ డబ్బు, పలుకుబడులతో అవి మేనేజ్ చేయగలుగుతున్నాయి.చదవండి: ఈ సైకోల నుంచి రక్షణ లేదా?ఆత్మహత్య చేసుకున్న వారిలో చాలామంది నిరాశా నిస్పృహలకు లోనైనవారే ఉంటారు. ఏ వైపు నుంచి కూడా ఎలాంటి సహాయం అందని పరిస్థితుల్లో మాత్రమే వారు ఈ చర్యకు పాల్పడతారు. చనిపోకముందే చాలా సార్లు మాటల ద్వారా, చేతల ద్వారా చనిపోవాలనే ఆలోచనను వ్యక్తపరుస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆ మాటలు – చేతల్లోని భావాన్ని అర్థం చేసుకుని జాగ్రత్త పడకపోవడం వల్ల ఎక్కువమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. అందుకనే విద్యాసంస్థలలో కచ్చితంగా ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులను గుర్తించి సహాయమందించే ఏర్పాట్లు చెయ్యాలి. భావిభారత యువతను కాపాడుకోవాలంటే కార్పొరేట్ కాలేజీలపై కన్నేసి ఉంచాల్సిందే.-డాక్టర్ బి. కేశవులు ఎండి. సైకియాట్రీ, తెలంగాణ ఆత్మహత్యల నిరోధక కమిటీ చైర్మన్ -
జనప్రియుడేడమ్మా... జనార్ధనేడమ్మా..
‘ఆదివాసుల ఆత్మాబంధువు యాడికెళ్ళెనే... అడవి బిడ్డల తోడు నీడ ఏమైపోయనే... జనప్రియుడేడమ్మా... జనార్ధనేడమ్మా... తన గుండెలాగిపోయినా... మన గుండె చప్పుడాయన!’ ఈ పాట ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ (biyyala janardhan rao) సార్ జీవనశైలినీ, ఆయన ఆదివాసీల కోసం తపించిన తీరునూ మన కళ్ళకు కడుతుంది.1955 అక్టోబర్ 12న మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు (Nellikuduru) మండలంలోని ముని గలవీడు గ్రామంలో జన్మించిన జనార్దన్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘గిరిజన భూముల పరాయీకరణ’ అనే అంశంపై పరిశోధన చేసి 1985లో పీహెచ్డీ పట్టాపొందారు. అటవీ సంపదంతా ఆదివాసీలకే దక్కాలని, అది పరాయీకరణ కాకుండా 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పోరాడారు. తెలంగాణ నీళ్ళు, నిధులు, వనరులు, ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకే దక్కాలనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ కోసం అనాడే పోరాటం చేయమన్నారు. తాను సైతం అందులో భాగమయ్యారు. అధ్యాపకుడిగా ఉంటూనే ఆదివాసీలపై అత్యంత మమకారాన్ని పెంచుకున్నారు. కాకతీయలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే మలిదశ తెలంగాణ ఉద్యమకారుడిగా, ఆదివాసీల భూసమస్యలు, స్వయంపాలన ఉద్యమాలపై పరిశోధన చేసి వారి సంక్షేమానికి కృషి చేశారు.మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) సార్‌తో కలిసి అమెరికాలో జరి గిన ‘తానా’ సభల్లో పాల్గొని ప్రత్యేక తెలంగాణ అవశ్యకతను వివరించారు. మేధావులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందుండాలని ఆ దిశగా ప్రయత్నం చేశారు. తెలంగాణపై వివక్ష, అణచివేతలపై అనేక రచనలు చేశారు. 1999లో కన్నబిరాన్, ఎస్.ఆర్. శంకరన్ తదితరులతో ప్రభుత్వం తరఫున నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని ఎజెండాను ముందుకు తెచ్చారు. చదవండి: ఈ సైకోల నుంచి రక్షణ లేదా?2001లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. చివరకు 2002 ఫిబ్రవరి 27న జనార్దన్ సార్ కన్నుమూశారు. ఆయనకు స్వరాష్ట్రంలో ఇప్పటివరకు సముచిత స్థానం దక్కలేదు. ఆయన స్మృత్యర్థం ప్రభుత్వం ఒక గ్రంథాలయాన్నో, విగ్రహాన్నో నెలకొల్పి, గౌరవించాలి.– కలువకొలను హరీష్‌రాజు, జర్నలిస్టు(ఫిబ్రవరి 27న ప్రొఫెసర్ బియ్యాల జనార్ధన్‌రావు వర్ధంతి) -
ఈ సైకోల నుంచి రక్షణ లేదా?
విజయవాడలో అశేష జనవాహిని నడుమ వేదికా రెడ్డి అనే చిన్నారి... మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోన్ రెడ్డిని కలవాలని ఏడ్చింది. అది చూసిన ఆయన చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయత పంచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అంతే... తెలుగుదేశం – జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల్లోని సైకోలు నిద్రలేచారు. బాలిక, ఆమె కుటుంబంపై దుష్ప్రచారానికి తెరతీశారు. ‘ఆమె కుటుంబ నేపథ్యం ఇదీ’ అంటూ తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. తాము స్పాన్సర్ చేస్తున్న సోషల్ మీడియా యాప్స్‌లో మీమ్స్, రీల్స్ (Reels) పెట్టి వ్యక్తిత్వ హనానికి పూనుకున్నారు. వీళ్లకు ఇలా చేయడం కొత్తేమీ కాదు. పాదయాత్ర సమయంలో, వివిధ కార్యక్రమాల్లో జగన్ చిన్నారులను దగ్గరకు తీసుకున్నప్పుడు ఎంతో దారుణంగా ట్రోల్స్ చేశారు.టీడీపీ మొదటి నుంచి సోషల్ మీడియా (Social Media) ద్వారా జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనికి జనసేన తోడైంది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండు పార్టీల సోషల్ మీడియా సభ్యులు రెచ్చిపోయి పోస్టులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బెండపూడి విద్యార్థులు అమెరికన్ శ్లాంగ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడారు. దీనిపై టీడీపీ– జనసేన నేతలు, కార్యకర్తలు చేసిన ట్రోల్స్ అంతా ఇంతా కాదు. టీడీపీకి అనుకూలమైన టీవీ, సినిమా సెలబ్రిటీస్ కూడా ఆ జాబితాలోకి ఎక్కారు. అలాగే నాడు జగన్ ప్రభుత్వం చేసిన మంచిని ఓ మహిళ సంతోషంగా చెప్పింది. ఇది ఆ పార్టీల్లోని సైకోలకు నచ్చలేదు. వెంటనే ఆమెపై ట్రోల్స్ (Trolls) మొదలుపెట్టి చివరికి ఆత్మహత్యకు కారణమయ్యారు. అయినా వారిలో మార్పు అనేది రాలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇటువంటి వికృత చేష్టలు మరింత పెరిగాయి. తాజాగా విజయవాడలో జగన్‌ను కలి సిన చిన్నారిపై చేసిన ట్రోల్స్ ఇందుకు నిదర్శనం.ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. టీడీపీ, జనసేనల సోషల్ మీడియా కార్యకర్తలు అనేక విషయాల్లో చెత్త పోస్టులు పెడుతుంటారు. రాజకీయ ప్రత్యర్థిని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేని ఆ పార్టీల అధిష్ఠానాలు సోషల్ మీడియాలో జగన్‌పై తప్పుడు ప్రచారం చేయడం కోసం... చాలామంది నిర్వహించే ఖాతాలను (పేజీలను), యూట్యూబ్ చానళ్లను స్పాన్సర్ చేస్తున్నాయి. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రెమ్లా జరుగుతుందనేది నిజం.డబ్బులు తీసుకుని తమ పేజీల్లో బెండపూడి విద్యార్థులు, గీతాంజలి అనే మహిళపై దారుణమైన మీమ్స్ చేసి పెట్టారు. నేడు ఓ చిన్నారిని ట్రోల్ చేస్తూ చైల్డ్ అబ్యూజ్‌కు పాల్పడుతున్నారు. వాస్త వానికి సోషల్ మీడియాలోని ఈ స్పాన్సర్డ్ పేజీలు పైకి వేరే ముసుగుల్లో కనిపిస్తాయి. సినిమా రిలీజ్లు, సమీక్షలు, నటుల ఫొటోలను పెడుతుంటాయి. నవ్వించే మీమ్స్ పోస్టు చేస్తుంటాయి. దీంతో ఫాలోయర్స్ సంఖ్య అధికంగానే ఉంటుంది. దీని వెనుక ఎత్తుగడ ఏంటంటే... మధ్య మధ్యలో వైఎస్సార్సీపీ, జగన్‌పై దారుణమైన పోస్టులు పెడుతూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేయడమే! ఇప్పటికే అబద్ధపు రాతలతో ఎల్లో పత్రికలు కొన్ని తరాల మెదళ్లను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఇప్పుడు టీడీపీ మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ పేజీల ద్వారా సమాజానికి హానికరమైన వ్యవస్థను నడుపుతోంది.చదవండి: మీరు చాలా మారాలి సార్!కూటమి ప్రభుత్వంలోని లోపాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇతర అంశాలను ట్రెండింగ్ లోకి తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో ట్రోల్ చేయడమనే విష సంస్కృతికి వారు బీజం వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియాలో చిన్న పిల్లలు, మహిళలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కానీ ఇప్పుడు జగన్‌ను కలిసిన చిన్నారిపై జుగుప్సాకర రీతిలో పోస్టులు పెట్టినవారిపై ఏ చర్యా తీసుకోకుండా మౌనం దాల్చారు. దీన్ని జనం ముమ్మాటికీ హర్షించరు. సమయం వచ్చినప్పుడు సరైన తీర్పు చెబుతారు.– వెంకట్ -
ఆయన అనుకున్నదంతా అయ్యేనా?
ఆయుధ బలం, ఆర్థిక బలంతో ఏదైనా సాగించవచ్చునన్నట్లు వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, అదంత తేలిక కాదని నెల రోజులు తిరిగేసరికి అర్థమవుతుండాలి! అమెరికన్లతోపాటు వారి అనుయాయ పశ్చిమ దేశాలను, మొత్తం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ సాగుతున్న ఆయన చర్య లను, అందుకు ఎదురవుతున్న ప్రతిఘటన లను బట్టి ఈ అభిప్రాయం కలుగుతున్నది.అధ్యక్షుని ప్రకటనలను, చర్యలను రెండు విధాలుగా విభజించాలి. అంతర్గతమైనవి, విదేశాంగపరమైనవి. అంతర్గతంగా అన్నీ ఇప్పటికి తను కోరుకున్న విధంగానే జరిగిపోతున్నాయి. కొన్ని చర్యల వల్ల తమ వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీస్ రంగాలపైన, గృహావస రాలపైన, సామాజిక సంబంధాలపైన ప్రభావాలు మొదలైనా, నిర సనలు మంద్ర స్థాయిలోనే ఉన్నాయి. ప్రతిపక్షమైన డెమోక్రాట్లలో చలనమే లేదు. ట్రంప్‌కు అడ్డుపడటమంటూ ఏమైనా జరిగితే అది కోర్టుల స్టే ఉత్తర్వుల వల్లనే. నష్టపోతున్న వారిలో ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా), ‘అమెరికా ఫస్ట్’ నినాదాలకు ఆకర్షితులై భారీగా ఓటు చేసిన తరగతుల వారు కూడా ఉన్నారనీ, వారికి ఇప్పటికే పనులూ, ఫెడరల్ ఉద్యోగాలు పోతుండటం, ధరల పెరుగు దల వంటి సమస్యలు ఎదురవుతున్నాయనీ వార్తలు చెప్తున్నాయి. ఆ వర్గాల నుంచి వ్యతిరేకత పెరిగితే తప్ప ట్రంప్ తన అంతర్గత విధా నాలను సవరించుకోకపోవచ్చు.బయటి నిరసనలుఅంతర్గతంగా ఎట్లున్నా, బయటి ప్రపంచానికి విదేశాంగ విధానాలే ప్రధానమవుతాయి. విదేశాంగ విధానాలకు మూలం ఆంతరంగిక పరిస్థితులు, ప్రయోజనాలతో ఉండటం నిజమే అయినా, బయటివారికి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేది ముఖ్యమవుతుంది. ఆ విధంగా చూసినపుడు ఈ 40 రోజులలో కనిపిస్తున్నది ఏమిటి?ట్రంప్ మొదట చేసిన భౌగోళిక సంబంధమైన ప్రకటనలు పనామా కాలువ స్వాధీనం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చటం, గ్రీన్‌ల్యాండ్ ఆక్రమణ, కెనడాను ఆర్థిక ఒత్తిడితో అమె రికాలో విలీనం చేసి 51వ రాష్ట్రంగా మార్చటం. ఈ అంశాలలో జరి గిందేమిటి? పనామా బలహీన దేశం. అయినా వారి కాలువను స్వాధీనపరచుకోలేక పోయారు. కానీ ఆ కాలువ ద్వారా ప్రయాణించే అమెరికన్ నౌకలపై సుంకాల రద్దుకు అంగీకరించారన్నది అమెరికా చేసిన ప్రకటన. అది నిజం కాదన్నది పనామా ప్రభుత్వ ఖండన. కాలువపై చైనా నియంత్రణ ఉందన్నది ట్రంప్ ఆరోపణ కాగా, అది నిజం కాదని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కాకపోతే అమెరికా ఒత్తిడిని తట్టుకోలేక చైనా నిర్వహిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి పనామా ఉపసంహరించుకున్నది. ఆ ప్రాజెక్టులో చేరిన మొట్ట మొదటి లాటిన్ అమెరికన్ దేశం పనామాయే.అదే ప్రాంతపు మెక్సికో, తమ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చటాన్ని బలంగా తిరస్కరించింది. ఐక్యరాజ్య సమితి గుర్తించింది కూడా పాత పేరునే. ఇపుడు ట్రంప్ కొత్త పేరు పెట్టి ఉత్తర్వులు జారీ చేసినా, యూరోపియన్ దేశాలు సైతం ఆమో దించటం లేదు. మెక్సికో ఆర్థికంగా అమెరికాపై ఎంత ఆధారపడినా ట్రంప్ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తున్నది. ఆయన ఏమీ చేయలేక మౌనం వహించారు. గ్రీన్‌ల్యాండ్ మరొక బలహీన దేశం. కానీ డెన్మార్క్ పరిధిలో స్వయంప్రతిపత్తి గలది. ట్రంప్‌కు కావలసింది అక్కడి విస్తారమైన వనరులు. ఆ ప్రాంతం కీలక ప్రదేశంలో ఉన్నందున తమ రక్షణ వ్యూహాలకు అవసరం. కానీ అమెరికాకు అమ్మకం అయేందుకు గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్ సమ్మతించలేదు. డెన్మార్క్ యూరప్ దేశమైనందున మొత్తం యూరప్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. గ్రీన్‌ల్యాండ్‌లో ఇప్పటికే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నందున వాటి విస్తర ణకు, సహజ వనరులపై ఒప్పందాలకు మాత్రం గ్రీన్‌ల్యాండ్ రాజీ పడుతున్న సూచనలున్నాయి. యూరప్ మద్దతు లేనట్లయితే ఆ చిన్న దేశంపై ట్రంప్‌దే రాజ్యమయ్యేది.అమెరికాకు సరిహద్దున ఉండటమేగాక అన్నివిధాలైన సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, ట్రంప్ అంటున్న 51వ రాష్ట్రపు మాటను కెనడా ఛీత్కరిస్తున్నది. 25 శాతం సుంకాలకు బెదరక అదే స్థాయిలో ఎదురు సుంకాలు ప్రకటించింది. ప్రజలలో జాతీయాభిమానం ఎగసి రాగా వారు అమెరికన్ ఉత్పత్తుల కొనుగోలును తగ్గించి వేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. బలమైన మద్దతుగల గ్రీన్‌ల్యాండ్ వలెనే, స్వయంగా బలమైన కెనడా విషయంలోనూ ట్రంప్ స్వేచ్ఛా ధోరణి నెరవేరటం లేదన్నమాట.బుల్డోజర్ పథకం సాగేనా?ఇంచుమించు ఇటువంటిదే గాజా విషయం. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు స్వతంత్ర దేశాలు కావాలన్న అమెరికా విధానంలో నిజాయితీ లేకున్నా నోటి మాటగా అంటూ వస్తూ, ఇపుడు తిరిగి అధికారానికి వచ్చినాక దానిని అకస్మాత్తుగా వదలివేసిన ట్రంప్, గాజాను తామే ఆక్రమించి బీచ్ రిసార్టుగా మారుస్తామన్నారు. ఆ రియల్ ఎస్టేట్ మాటను పాలస్తీనియన్లే గాక మొత్తం అరబ్ రాజ్యాలు, యూరోపియన్ యూనియన్, తక్కిన ప్రపంచం, ఐక్యరాజ్యసమితి వెంటనే కొట్టివేశాయి. అయినప్పటికీ తన పంతం వీడని ట్రంప్, తమపై బాగా ఆధారపడి ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లను ఒత్తిడి చేసి గాజా ప్రజలను, బహుశా తర్వాత వెస్ట్ బ్యాంక్ పాల స్తీనియన్లను కూడా ఆ దేశాలకు తరలించేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ ఆయన ఎంతో ఆశలు పెట్టుకున్న ఈజిప్ట్, జోర్డాన్‌ల సొంత ఆలోచనలు ఏవైనా అక్కడి ప్రజాభిప్రాయానికి, తక్కిన అరబ్ ప్రపంచం ఆగ్రహానికి భయపడి అందుకు అంగీకరించలేదు. కీలకమైన పాత్ర వహించే సౌదీ అరేబియా వెంటనే తిరస్కరించగా, ఆ తర్వాత అరబ్ విదేశాంగ మంత్రులు, గల్ఫ్ కో ఆర్డినేషన్ కౌన్సిల్ సమావేశమై అదే వైఖరి తీసుకున్నారు. దానితో, తాము చెప్పిన దానికన్న మెరుగైన ప్రతిపాదన ఉంటే సూచించాలని అరబ్ దేశాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇపుడు కోరు తున్నారు. గాజా ప్రజలు తమ మాతృభూమిలోనే నివసించే విధంగా పునర్నిర్మాణ పథకాన్ని, పాలస్తీనా స్వతంత్ర దేశ పథకాన్ని అరబ్ దేశాలు ఇంచుమించు రూపొందించాయి. ఆ విధంగా అమెరికా అధ్యక్షుని బుల్డోజర్ ఉధృతి అక్కడ సాగబోవటం లేదు. ఈ పరి ణామాల దరిమిలా, తాము, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌ను ధ్వంసం చేయటం, లొంగ దీసుకోవటం జరగవచ్చునా అన్నది వేచి చూడ వలసిన ప్రశ్న అవుతున్నది.ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ చేస్తున్నదేమిటో రోజూ వార్తలు వెలువడుతున్నాయి. తాము, యూరప్ కలిసి ఉక్రెయిన్ను మూడేళ్లుగా నిలబెట్టలేక పోవటంతో, వ్యక్తిగతంగా వ్యాపార ధోరణి గల ట్రంప్ ఇప్పుడు రెండువైపుల నుంచి ప్రయోజనాలు పొందే వ్యూహం వైపు మారారు. ఉక్రెయిన్ను, యూరప్‌ను దారికి తెచ్చుకుని ఉక్రెయిన్‌లోని లోహాలు, ఖనిజాలను సంపాదించటం; బలమైన రష్యాతో ఆర్థిక, ఇతర సంబంధాల మెరుగుదల. ఎటూ గెలవలేని యుద్ధంలో ఆ విధంగా ఉక్రెయిన్, యూరప్, తనను కాదని చేయగలిగింది కూడా లేని బలహీనులు కావటం వల్ల వారిని దారికి తేగలుగుతున్నారు. దీనినిబట్టి అర్థమయే దేమిటి? పనామా, కెనడా, గాజా, ఉక్రెయిన్, యూరప్ వంటివి వేర్వేరు విధాలైన కేసులు. మొత్తం మీద తన పాలన రెండవ నెలలో ప్రవేశించే సరికే అమెరికా అధ్యక్షుడు ఇన్నిన్ని అనుభవాలు గడించటం బహుశా మరెవరి విషయంలోనూ జరిగి ఉండదు. ఆయనతో ప్రపంచ అనుభవాలు కూడా అటువంటివే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇకనైనా ఈ నిషేధం ఎత్తివేయాలి!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్సిటీలలో, కళాశాలల్లో స్టూడెంట్ బాడీ ఎన్నికల నిర్వహణపై నిషేధం విధించి 36 ఏళ్ళు అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1988లో ఉస్మానియా విశ్వ విద్యాలయ (Osmania University) అనుబంధ నిజాం కళాశాలలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణలో ఓ విద్యార్థి హత్య గావించబడ్డాడనే నెపంతో అప్పటి పాలకులు విద్యార్థి సంఘం ఎన్నికలపై (Student Polls) నిషేధం విధించారు.ఎనభయ్యో దశకంలో విద్యార్థి సంఘం ఎన్నికలు విద్యార్థుల ఆలోచనలను మెరుగుపరిచి అభివృద్ధి వైపు నడిపించాయి. విద్యా సంస్థల్లో ఈ ఎన్నికల నుండి ప్రేరణ, చైతన్యం పొంది ప్రధాన స్రవంతి రాజకీయాలలోకి వచ్చిన అనేక మంది సాధారణ విద్యార్థులు నేడు భారత పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో తమ ప్రభావాన్ని చూపు తున్నారు. మరికొంత మంది విద్యా ర్థులు ప్రజల ఆకాంక్షలను సఫలం చేసేందుకు భారత విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. నాడు క్యాంపస్‌లలో స్టూడెంట్ బాడీ ఎన్ని కలలో ఎన్నికైన విద్యార్థులు విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి ముందు వరుసలో ఉండేవారు. విద్యార్థుల అకడమిక్ సమస్యలు, వసతి సమస్యలు పరిస్కారమయ్యేవి. దాంతో యూనివర్సిటీలు జ్ఞాన కేంద్రాలుగా, ఉద్యమ కేంద్రాలుగా సమాజంపై గొప్ప ప్రభావాన్ని వేశాయి. నేడు విద్యార్థి సంఘ ఎన్నికలు లేకపోవడంతో విద్యార్థుల డిమాండ్లను లేవనెత్తడం, ఆయా యాజమాన్యాలు, ప్రభుత్వాలను సంప్రదించి పరిష్కరించడం సవాలుగా మారింది.ఇటీవల కాలంలో విద్యార్థుల పోరాటాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైందనీ, విద్యార్థులు రాజకీయాలలోకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఒకవైపు విద్యార్థి సంఘాల ఎన్నికలపై గత పాలకులు విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ... మరోవైపు విద్యార్థులు రాజకీయాలలోకి రావాలని అనడం విద్యార్థులను మోసం చేయడమే అవుతుంది. ముఖ్యమంత్రి తక్షణమే విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలి. అందుకు గతంలో జేఎమ్ లింగ్డో కమిటీ (JM Lyngdoh Committee) సూచనలు పాటిస్తూ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆర్డరుతో 2005 డిసెంబర్ 2వ తేదీన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జేఎమ్ లింగ్డో అధ్యక్షతన ఐదుగురు సభ్యులు ఉన్న కమిటీని... యూనివవర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థి సంఘం ఎన్నికల నిర్వహణ అంశంపై అధ్యయనం చేసేందుకు నియమించింది. 2006 మే 26న కమిటీ తన నివేదికను సమర్పించింది.ఈ నివేదిక ముఖ్య ప్రతిపాదనలుదేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థుల ప్రాతినిధ్యతో స్టూడెంట్ బాడీ/యూనియన్ ఎన్నికలు జరపాలి. విద్యార్థి సంఘాలు ఎన్నికల నిర్వహణ కొరకు క్యాంపస్‌లలో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పాలి. నామి నేషన్ల స్వీకరణలో విద్యార్థుల అకడమిక్ ప్రతిభను పరిణనలోకి తీసుకోవాలి. ఐదేళ్లకు ఒకసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలను, ప్రెసిడెంట్ ఎన్నికలను నమూనా మోడల్‌గా తీసుకోవాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి విద్యార్థి సంఘం ఎన్నికలపై సమీక్ష జరగాలి. ఆఫీస్ బేరర్ల ఎన్నికలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ – ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ నమూనా పాటించాలి. విద్యార్థి సంఘం ఎన్నికలు (student union elections) రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలి. యూనివర్సిటీ ఎన్నికలలో పాల్గొనే విద్యార్థుల తరగతిగది హాజరు 70% ఉండాలి.చదవండి: చంపాల్సింది కులాన్ని... ప్రేమికుల్ని కాదు!ఈ నివేదికను అమలు చేస్తూ స్టూడెంట్ బాడీ ఎన్నికలు జరపాలని 2006 సెప్టెంబర్ 22న సుప్రీంకోర్టు మరో ఆర్డరు జారీచేసింది. దాంతో, యూనివర్సిటీ నిధుల సంఘం (యూజీసీ) 2007లో దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో ఎన్నికల నిర్వహణకై ఆదేశాలు జారీచేసింది. తదనుగుణంగా దేశంలో స్టూడెంట్ బాడీ ఎన్నికలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. కానీ ఎన్నికలపై విధించిన నిషేధం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగడం లేదు. విద్యార్థులు ఇందుకోసం ఉద్యమించాలి.– కోట ఆనంద్ విద్యార్థి నాయకుడు -
ఏఐపై నియంత్రణ ఎలా?
కృత్రిమ మేధ అభివృద్ధి వడివడిగా సాగుతోంది. రెండు మూడేళ్ల క్రితం మొదలైన ఛాట్ జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లకు డీప్‌సీక్ రూపంలో చైనా కంపెనీ సవాలు విసిరింది. ఇదే సమయంలో ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ ఎలా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ప్యారిస్‌లో ఇటీవలే ముగిసిన ఏఐ శిఖరాగ్ర సమావేశంలోనూ ఈ అంశం ప్రబలంగా వినిపించింది. దౌత్య వేత్తలు, రాజకీయనేతలు, టెక్ కంపెనీ సీఈవోలు పాల్గొన్న ఈ సమా వేశానికి భారత్, ఫ్రాన్స్ ఉమ్మడిగా అధ్యక్ష స్థానాన్ని వహించాయి. అయితే ఏఐ టెక్నాలజీల నియంత్రణ విషయంలో ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాకపోయింది సరికదా... అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత మారిన రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టేలా బోలెడన్ని విభేదాలు బయటపడ్డాయి. ప్రభావరీత్యా చూస్తే గతంలో మనం సాధించిన టెక్నాలజీ ఘనతల కంటే ఏఐ భిన్నమైనది. అందుకే ప్రధాని మోదీ ఏఐ నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో సమష్టి ప్రయత్నం జరగాలనీ, ప్రమాణాల నిర్ధారణతో పాటు, మానవీయ విలువల పతనం జర క్కుండా, ప్రమాదాలను నివారించేలా, నమ్మకం పెంచేలా చూడాలనీ పిలుపునిచ్చారు. పొంచివున్న ప్రమాదాలుఈ సమష్టి బాధ్యత కార్యాచరణలో తొలి అడుగుగా ఈ సమావేశం ‘ఇన్‌క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ ఏఐ’ అనే దౌత్యపరమైన ప్రక టనను చేర్చింది. అయితే ఏఐ రంగంలో అగ్రగాములుగా ఉన్న రెండు దేశాలు యూఎస్, యూకే ఈ డిక్లరేషన్‌పై సంతకాలకు నిరాకరించాయి. ఏఐలో వినూత్న, సృజనాత్మక ఆవిష్కరణలకు సాయం చేసే అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థ అవసరమనీ, ఏఐని గొంతు నొక్కేది కాదనీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్స ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు ఆ ప్రకటన జాతీయ భద్రతపై ఏఐ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని యూకే భావించింది. శిఖరాగ్ర సమావేశం ముగిసే సమయానికి ఏఐ భద్రత, నియంత్రణ విషయంలో ప్రపంచం రెండుగా విడిపోయింది!కృత్రిమ మేధ చాలా ఏళ్ల నుంచే మనకు పరిచయం. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు జనరల్ పర్పస్ ఏఐ అందు బాటులోకి వచ్చేలా చేసింది. ఈ జనరల్ పర్పస్ ఏఐ టూల్స్ రక రకాల పనులు చేయగలవు. ఏఐ ఏజెంట్లు స్వతంత్రంగా కంప్యూ టర్లను ఉపయోగించుకుని ప్రాజెక్టులు పూర్తి చేయగలవని ప్యారిస్ లోనే విడుదలైన ఒక నిపుణుల నివేదిక స్పష్టం చేయడం గమనించాల్సిన అంశం. ఈ సామర్థ్యం ఒకరకంగా వరం, ఇంకో రకంగా శాపం. భారత్, ఇతర దేశాలకు చెందిన స్వతంత్ర టెక్నాలజీ నిపు ణులు ఈ నివేదికను సిద్ధం చేశారు. ఏఐతో వచ్చే ప్రమాదాలు కొన్నింటి గురించి మనకు ఇప్పటికే తెలుసు. స్కాములకు ఉపయోగపడటం వీటిల్లో ఒకటి. అనుమతు ల్లేకుండా సున్నితమైన విషయాల ఫొటోలు తీయడం, కొంతమంది ప్రజలు, లేదా అభిప్రాయాలకు వ్యతిరేకంగా వివక్ష, వ్యక్తిగత గోప్య తకు భంగం, విశ్వసనీయత వంటివి ఏఐ తీసుకొచ్చే ప్రమాదాల్లో కొన్ని మాత్రమే. ఉద్యోగాల కోత, ఏఐ ఆధారిత హ్యాకింగ్, బయలా జికల్ దాడులు కూడా సాధ్యమని ప్యారిస్‌లో విడుదలైన ‘ఏఐ సేఫ్టీ రిపోర్టు’ స్పష్టం చేసింది. కొన్ని ఏఐ మోడళ్లను పరీక్షించే క్రమంలో అవి జీవ, రసాయన ఆయుధాలను పునరుత్పత్తి చేయగలవనీ, సరికొత్త విష పదార్థాలను డిజైన్ చేసేందుకు సాయపడగలవనీ తెలిసింది.ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ కావాలంటే... ముందుగా వాటితో వచ్చే ప్రమాదాలపై స్పష్టమైన అంచనా ఉండాలి. అలాగే ఆ ప్రమాదాలను అధిగమించేందుకు, పరిశీలించేందుకు ఉన్న మార్గాలూ తెలిసి ఉండాలి. ఇది చాలా పెద్ద పనే. ఈ వ్యవస్థలను అటు వైద్య పరికరాల్లో, ఇటు సాఫ్ట్వేర్ అభివృద్ధిలో, ఇంకోవైపు ఛాయాచిత్రాలను సృష్టించడంలో వాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏఐ డెవలపర్లకు గానీ, వినియోగదారులకు గానీ ఈ ఏఐ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఎలా వాడుకోవచ్చో తెలిసే అవకాశాలు తక్కువ. ఫలితంగా ఏఐ టెక్నాలజీల నియంత్రణ ఒక సవాలుగా మారుతుంది. జనరల్ పర్పస్ ఏఐలో మార్పులు ఊహించలేనంత వేగంగా జరిగిపోతున్న నేపథ్యంలో విధాన రూపకర్తలు, నియంత్రణ చేసేవారికి కూడా ఏఐ ప్రమాదాలకు సంబంధించిన సాక్ష్యాలు వెతుక్కోవడమూ కష్టమవుతుందని ఏఐ సేఫ్టీ రిపోర్టు తెలిపింది. ఏతావతా, ఏఐ నియంత్రణను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు. నియంత్రణా? సృజనా?ఏఐ ఇప్పుడు ఓ పాత చర్చను మళ్లీ లేవనెత్తింది. సృజన, నియంత్రణలో ఏది అవసరమన్న చర్చపై ప్యారిస్ సమావేశంలోనే అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. సృజనను అడ్డుకుంటుందంటే ఏ టెక్నా లజీ నియంత్రణనూ తాము అనుమతించబోమని తెలిపింది. ఏఐ విషయంలో పోటీ పడుతున్న టెక్ కంపెనీల వైఖరి కూడా ఇదే. భారత్ కూడా చిన్న మార్పుతో విషయాన్ని అంగీకరించింది. ప్రధాని మోదీ ‘పాలన అంటే కేవలం ప్రమాదాలను మేనేజ్ చేయడం కాదు. సృజనాత్మకతను ప్రోత్సహించడం, దాన్ని విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగించడం’ అని అనడంలో ఈ తేడా స్పష్టమవుతోంది. ట్రంప్ అధ్యక్షతన మళ్లీ శిలాజ ఇంధనాల వైపు మళ్లే ఆలోచన చేస్తున్న అమెరికా... ప్యారిస్ సమావేశం సిద్ధం చేసిన సస్టెయినబిలిటీ స్టేట్ మెంట్‌పై సంతకం చేయలేదు. ఎందుకంటే ఏఐ అభివృద్ధికి చాలా విద్యుత్తు అవసరమవుతుంది. ఏఐ వ్యవస్థలను పెద్ద స్థాయిలో ఉపయోగించడం మొదలుపెడితే శిలాజ ఇంధనాలకు దూరంగా వెళ్లేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు గండిపడినట్లే! వాతావరణ మార్పులకూ, ఏఐకీ మధ్య సంబంధం ఏమిటంటే... ఇదేనని చెప్పాలి. టెక్నాలజీకీ, నియంత్రణకూ మధ్య ఉన్న సంబంధం కూడా చాలా పాతదే. గతంలో చాలా టెక్నాలజీల విషయంలో నియంత్రణ అవసరమైంది. స్టెమ్ సెల్ పరిశోధన, క్లోనింగ్, జీనో ట్రాన్స్సప్లాంటేషన్ (జంతు అవయవాలను మనుషులకు అమర్చడం), ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి అనేక టెక్నాలజీలకు నియంత్రణ అవస రమైంది. అయితే ఏఐ వీటన్నింటి కంటే భిన్నమైంది. ఇది ఒక టెక్నాలజీ కాదు. వేర్వేరు టెక్నాలజీలు, అప్లికేషన్ల సమ్మేళనం. కాబట్టి వీటిల్లో దేన్ని నియంత్రించాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. రెండో కీలకమైన ప్రశ్న ఎవరిని నియంత్రించాలి అన్నది! టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థనా? టెక్నాలజీ సాయంతో అప్లికేషన్లు అభివృద్ధి చేసేవారినా? వాటిని వాడే వారినా? ఇవన్నీ అస్పష్టమైన అంశాలు. ఇంటర్నెట్ ఆధారిత కంటెంట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రశ్నలే ఏఐ విషయంలోనూ వస్తున్నాయి. మూడు సూత్రాలు1942లో ప్రసిద్ధ సైన్స్‌ఫిక్షన్ రచయిత ఐజాక్ అసిమోవ్ రోబోటిక్స్‌కు సంబంధించి మూడు సూత్రాలను ప్రతిపాదించారు. ‘మనిషిని రోబో గాయపరచకూడదు’ అన్నది తొలిసూత్రం. మనిషి ఇచ్చే ఆదేశాలను పాటించాల్సిందిగా రోబోలకు చెబుతూనే, తొలి సూత్రానికి విరుద్ధంగా ఉండే ఆదేశాలను పాటించవద్దని రెండో సూత్రం స్పష్టం చేస్తుంది. చివరిదైన మూడో సూత్రం ప్రకారం, ఒక రోబో తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి; ఎప్పటివరకూ అంటే, తొలి రెండు సూత్రాలకూ విరుద్ధం కానంత వరకు! ఈ మార్గదర్శక సూత్రాల ఆధారంగా ఏఐ టెక్నాలజీలకు వర్తించే కొన్ని విస్తృత సూత్రాలను నిర్ణయించడం, ఎప్పటికప్పుడు ఈ టెక్నా లజీ ద్వారా వచ్చే లాభాలు, ప్రమాదాలను బేరీజు వేస్తూండటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్స అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అనుమతించకపోవడం హక్కుల ఉల్లంఘనే!
‘ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మీడియాను సభా కార్యక్రమాలను కవర్ చేయడానికి అను మతించకపోవడం అప్రజాస్వామికం. అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలియజేయడంలో మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివిధ సమస్యలపై ప్రజల వాణిని ప్రదర్శిస్తుంది’.‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడం లేదా ప్రసారం చేయకుండా మీడియాను నిరోధించాలని గతంలో ప్రభుత్వాలు చేసిన ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. నేడు, అసెంబ్లీ దగ్గర మీడియా పాయింట్‌ని నిరోధించడం అత్యంత గర్హనీయం! ప్రభుత్వాన్ని, విధానాలను విమర్శించేందుకు, అవసరమైతే సూచనలు చేసేందుకు ప్రతిపక్షాలకు పూర్తి హక్కు ఉంది.’ ‘మీడియా మాత్రమే అధికార, ప్రతిపక్షాల వైఖరిని నిష్పక్షపాతంగా ప్రొజెక్ట్ చేయగలదు. మీడియా విధినిర్వహణకు అనుమతించకపోవడం అంటే హక్కుల ఉల్లంఘన’. ఈ మాటలు మాట్లాడింది ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి అనుకుంటారు. కానీ, ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడే అంటే కించిత్ ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ? అయితే ఈ మాటలు అన్నది ‘నిన్న!’ అదే తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అని చదువు కోవాలి. ఇప్పుడు మాత్రం ఆయన తెలుగు నాట నాలుగు ప్రముఖ టీవీ చానళ్ళ (సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ)ను అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయడానికి కూడా వీలు లేకుండా అనుమతి నిరాకరించారు.గతంలో అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌ని శీతకాల సమావేశాలలో దూరం జరిపినప్పుడు (అసెంబ్లీలో వార్తలు కవర్ చేసే వారికి అడ్డంకులు లేక పోయినా) అసలు అసెంబ్లీ కవరేజ్‌నే అనుమతించలేద న్నట్టు హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా సరిగ్గా అదే పని చేశారు. అంటే ‘అధికారంలో ఉంటే ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా’ అనే తన సహజ సిద్ధ శైలిని మీడియా మీద కూడా ప్రదర్శించారు.పాలనా వైఫల్యాలతో తీవ్ర అసహనంలో ఉన్న బాబు కూటమి తన అణచివేత ధోరణిని మీడియా మీద కూడా ప్రదర్శిస్తోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించింది. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల కార్యకలాపాలను నివేదించే హక్కు పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంటుంది. ఇది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లికేషన్) చట్టం ఇచ్చిన హక్కు. 1977లో కూడా మరొక సారి ఈ హక్కు స్పష్టమైంది. భారత నలభై నాల్గవ రాజ్యాంగ సవరణ తర్వాత మీడియా స్వేచ్ఛ హక్కును కాలరాస్తోంది బహుశా చంద్ర బాబు ప్రభుత్వమేనేమో?!మీడియాపై ఆంక్షలు అంటే, భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే! స్పీకర్ తనే సర్వాధికారి అన్నట్టు వ్యవహరించడం ఒంటెద్దు పోకడ తప్ప మరొకటి కాదు. ఈ తరహా శైలిపై భారత అత్యున్నత న్యాయస్థానం చాలా తీర్పులు ఇచ్చింది. భారతదేశంలో మీడియా హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ నుంచి ఉద్భవించాయి. పత్రికలకు ప్రచురించే హక్కు, సర్క్యులేట్ చేసే హక్కు, సమాచా రాన్ని స్వీకరించే హక్కు, ప్రకటన హక్కు, అసమ్మతి తెలిపే హక్కు వంటి అనేక రకాల హక్కులున్నాయి. మాస్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక విప్లవం పురోగతి మిలియన్ల మందికి రాతపూర్వక, మౌఖిక, దృశ్య మాధ్యమాల ద్వారా సమాచార వ్యాప్తిని సులభతరం చేసింది. ప్రెస్, మీడియా సమాచారాన్ని రాయడానికి, ప్రచు రించడానికి, ప్రసారం చేయడానికి ఏ వ్యక్తి కంటే ఎక్కువ లేదా తక్కువ కాదు. భారత రాజ్యాంగం, 1950లోని ఆర్టికల్ 19(1)(ఎ)లోని వాక్, భావప్రకటనా స్వేచ్ఛ హక్కు నుంచి పత్రికలూ, మీడియా ఈ హక్కును పొందాయి. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్, మర్యాద, నైతికత లేదా కోర్టు ధిక్కారానికి సంబంధించి, ఈ హక్కుపై రాజ్యాంగం కింద విధించే పరిమితులు మాత్రమే ఆర్టికల్ 19(2) ప్రకారం సహేతుకమైన పరిమితులను ఏర్పరుస్తాయి.‘రొమేశ్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్’ (1950)తో సహా అనేక కేసుల్లో ప్రసార స్వేచ్ఛ ఎంత అవసరమో, ప్రచురణ స్వేచ్ఛ కూడా అంతే అవసరమని కోర్టు చెప్పింది. ‘బెన్నెట్ కోల్మన్ అండ్ కో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1972) కేసులో సుప్రీం కోర్ట్ పేజీలను, సర్క్యులేషన్‌ను నిర్ణయించే అధికారాన్ని వార్తా పత్రికలకే వదిలి వేయాలని పేర్కొంది. వాక్, భావప్రకటనా స్వేచ్ఛ అనేది సర్క్యులేషన్ ద్వారా సమాచారాన్ని వ్యక్తీకరించడం, ప్రచురించడం, ప్రచారం చేయడం మాత్రమే కాకుండా సమాచారాన్ని స్వీకరించే హక్కును కలిగి ఉంటుంది. సమాచార హక్కు చట్టం–2005 ద్వారా ప్రభుత్వ సంస్థల నుండి సమా చారాన్ని అడిగే హక్కు పత్రికలతో సహా భారతీయ పౌరులకు ఉంది. కొసమెరుపు ఏమిటంటే... ఆత్యయిక స్థితి నాటి ఆంక్షలు ఎత్తి వేసి మీడియా స్వేచ్ఛ పునరుద్ధరించిన నాటి బీజేపీ నేడు ఈ అంక్షల ప్రభుత్వంలో భాగ స్వామి కావడం! మార్చి 21 వరకూ జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసి ప్రజలకు నివేదించే హక్కును పైన పేర్కొన్న నాలుగు టీవీ ప్రతినిధులకూ నిరాకరించడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే సుమా!పి. విజయబాబు వ్యాసకర్త సీనియర్ పత్రికా సంపాదకుడు -
అత్యవసరంగా నేర్చుకోవాల్సింది!
రాజకీయ నాయకుడి సత్తా ఏమిటో గుర్తించాలంటే వాళ్లు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో గమనించాలి. పార్టీ, కుటుంబం, లేదా వ్యక్తిగతమైన తప్పులను ఒప్పుకొంటారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు ఇది మరీ ముఖ్యమవుతుంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ... ఆ మాటకొస్తే ఆయన కుటుంబం, నాయనమ్మ కూడా బలహీనులనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం కార్నెల్ యూనివర్సిటీలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థికవేత్త కౌశిక్ బసు ఎమర్జెన్సీ గురించి రాహుల్ గాంధీని ఒక ప్రశ్న వేశారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ‘పొర బాటు’గా అభివర్ణించారనీ, ‘‘కాంగ్రెస్ పార్టీ ఏ దశలోనూ దేశంలోని వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం చేయలేదనీ’’ రాహుల్ వివరించారు. రెండు విషయాల్లోనూ రాహుల్ తప్పే చెప్పారు. ఎందుకంటే, అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు సుమారు లక్ష మందిని అరెస్ట్ చేసింది. పత్రికలపై నిషేధాజ్ఞలు విధించారు. న్యాయ, అధికార వ్యవస్థలను ఇష్టారీతిన వాడుకున్నారు. అత్యంత దారుణమైన రీతిలో రాజ్యాంగాన్ని మార్చేశారు. అçప్పుడు ఆయనకు ఐదేళ్లు అయినప్పటికీ, రాహుల్ గాంధీ ఇవన్నీ తెలుసుకొని ఉండాలి!వ్యూహాత్మక సమర్థనలుఅత్యవసర పరిస్థితిని ‘పొరబాటు’ అని ఇందిరా గాంధీ అన్నారనడం కూడా అబద్ధమే. ఆమె స్వయంగా దానికి బాధ్యత వహించారు. అందులో సందేహం లేదు. ఆ తరువాత జరిగిన ఎన్ని కల్లో ఘోరంగా ఓడిపోయారు. కానీ దాన్ని ‘పొరబాటు’ అన్నారనడం అవాస్తవం. ఎమర్జెన్సీ అకృత్యాలను సమర్థించుకునేందుకు ఇందిర రకరకాల ఎత్తులు పన్నారు. ఆమె మాటల్లో దానిపట్ల సమర్థింపే కనిపించేది. ఇందిరా గాంధీ అనుసరించిన వ్యూహాల్లో ఒకటి, అవసరానికి మించి జరిగిన ఘటనను అంగీకరించడం. 1978 జూలైలో మేరీ కరాస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘పత్రికలను అణచివేయడం మరీ గట్టి చర్య’’ అని వ్యాఖ్యానించారు. ఇంకోలా చెప్పాలంటే, కట్టడి చేసేందుకు ఇంకొంచెం తేలికైన పద్ధతి ఉంటే బాగుండేదని అర్థం.అంతేతప్ప, పత్రికలను నియంత్రించడం పొరబాటైతే కాదు.ఇంకో వ్యూహం ఉంది. ఇతరులు తప్పులు చేశారు... నేను మాత్రం వాటికి బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పడం. 1978 జనవరి 24న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఇందిరా గాంధీ యవ త్మాల్ (మహారాష్ట్ర)లో ఇచ్చిన ఒక ప్రసంగంపై కథనాన్ని ప్రచురించింది. ‘‘తప్పులు చేసిన ఇతరులు తమ అతిని ఒప్పుకొనేందుకు సిద్ధంగా లేరు. నేను మాత్రం జరిగిన తప్పులకు బాధ్యత తీసుకుంటున్నాను’ అని ఇందిరాగాంధీ చెప్పారు’’ అని ఉంది అందులో.ఇక మూడో వ్యూహం: ఏ రకమైన తప్పులు జరిగినా వాటిని చాలా చిన్నవిగా చూపించి ఒప్పుకోవడం. మేరీ కారస్ ఇంట ర్వ్యూలోనే ఇందిరా గాంధీ ‘‘రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకోవడం, పత్రికా స్వాతంత్య్రాన్ని హరించడం మినహా అసాధార ణమైనవి ఏవీ లేవు’’ అని వ్యాఖ్యానించారు. తుర్క్‌మాన్ గేట్ (ఢిల్లీ) వద్ద కొంతమంది మరణించిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు, ‘‘హింస జరగలేదు... అవి ఒకట్రెండు విడి ఘటనలు’’ అని తేల్చే శారు. దేశ ప్రజలందరినీ ఆందోళనకు గురి చేసిన బలవంతపు కుటుంబ నియంత్రణ కూడా పెద్దగా జరగలేదంటారు ఇందిర. ‘‘తప్పుడు ప్రచారమే మమ్మల్ని ఓడించింది. అలాగని మేమేమీ తప్పులు చేయలేదని అనడం లేదు. అయితే వాటిని కొండంత చేసి చూపించారు. బలవంతపు కుటుంబ నియంత్రణ విషయంలోనూ ఇదే జరిగింది. విషయాలను వాళ్లు ఎట్లా ప్రచారం చేస్తారంటే... చెప్పాలంటే నా దృష్టిలో అవి అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లే కాదు. ప్రచారం మాత్రమే. వారు చెప్పేంత స్థాయిలో జరగలేదు. కొన్ని కేసులున్నాయి కానీ... చాలా కేసుల గురించి వాకబు చేసిన ప్పుడు తప్పని తేలింది’’ అని ఇందిర 1978 మార్చి 26న పాల్ ఆర్ బ్రాస్‌తో జరిపిన సంభాషణలో స్పష్టం చేశారు. ఇప్పటివరకూ చెప్పుకొన్న ప్రతి అంశంలోనూ ఇందిరాగాంధీ కొన్ని నిర్దిష్ట అంశాల గురించి అంటే... నిషేధాజ్ఞలు, అరెస్టులు, తుర్క్‌మాన్ గేట్, బలవంతపు కుటుంబ నియంత్రణ వంటి వాటి గురించి మాట్లాడారే కానీ... అత్యవసర పరిస్థితి గురించి నేరుగా మాట్లాడలేదు. అత్యవసర పరిస్థితిలోంచి ఈ తప్పులను వేరుగా చూపే ప్రయత్నం చేశారు. దీన్నిబట్టే అత్యవసర పరిస్థితి విధింపుపై ఇందిరా గాంధీకి ఎలాంటి ఇబ్బందీ లేదన్నది ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. క్షమాపణ చెప్పలేదు!1978 జనవరి 24న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం, అత్యవసర పరిస్థితి సమయంలో ఇతరులు చేసిన తప్పులు, అక్రమాలకు ఇందిరా గాంధీ బాధ్యత వహిస్తూనే, ‘‘ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో దేశంలోని పరిస్థితి ఏమిటో ఆలోచించాలి’’ అని శ్రోతలను కోరారు. ‘‘అన్నివైపులా గందరగోళం నెలకొని ఉండింది. పరిస్థితి అలాగే కొనసాగి ఉంటే భారత్ పరిస్థితి బంగ్లా దేశ్లా అయ్యేదని వ్యాఖ్యానించారు.’’ ‘‘రోగానికి చికిత్స చేసేందుకు ఇచ్చిన ఔషధమే ఎమర్జెన్సీ’’ అని అన్నారు.ఎమర్జెన్సీకి సంబంధించి మీరేదైనా భిన్నంగా చేసేవారా? అని పాల్ బ్రాస్ అడిగినప్పుడు ఇందిర ఇచ్చిన సమాధానం ‘లేదు’ అని. సూటి ప్రశ్నకు వచ్చిన మొట్టమొదటి స్పందన అది. ఆ తరువాత... ఎమర్జెన్సీ కష్టాలను, బాధలను ‘వ్యక్తిగతంగా’ చూడలేకపోవడం తన తప్పు అని అన్నారు. ‘‘నా తప్పేమిటి అంటే... ఆ విషయాలను వ్యక్తిగతంగా చూడకపోవడం, చర్చించకపోవడం.’’ ఇవీ ఆమె మాటలు!కాబట్టి విషయమైతే స్పష్టం. ఎమర్జెన్సీ ఒక పొరబాటు అని ఇందిరా గాంధీ ఎప్పుడూ అనుకోలేదు. అందుకు క్షమాపణ కూడా చెప్పలేదనడం నిస్సందేహం. 1977 ఎన్నికల్లో ఓటమికి బాధ్యతను మాత్రం అంగీకరించారు. దానికి అతిపెద్ద కారణం ఎమర్జెన్సీ అన్నారే గానీ, అది తప్పు అని మాత్రం అనలేదు. నా పరిశోధనలో ఎంతో సాయం చేసిన, ఇందిరా గాంధీ ఆత్మకథ రాసిన సాగరికా ఘోష్ కూడా దీనితో ఏకీభవిస్తారు. ఎమర్జెన్సీ విధించడం తప్పు అని ఇందిరా గాంధీ అన్న దాఖలా నాకు ఎక్కడా కనిపించలేదు.మౌలికంగా భిన్నమా?ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థల్లో తనవాళ్లను ప్రవేశపెడుతోందని ఇప్పుడు ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ... ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రవర్తన మాత్రం ‘మౌలికంగా భిన్నం’ అంటారు. ఇది కూడా తప్పే. అప్పట్లో ఓ జూనియర్ న్యాయమూర్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా చేయడంతో హెచ్.ఆర్.ఖన్నా రాజీనామా చేయాల్సి వచ్చింది. హోంశాఖ కార్యదర్శి నిర్మల్ ముఖర్జీ వంటి నిబద్ధత కలిగిన అధికారులను పదవుల నుంచి తప్పించారు. రాహుల్ గాంధీ ఎక్కడ పప్పులో కాలేశారో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితినీ, ఎమర్జెన్సీ పరిస్థితినీ వేరుగా చూపాలని ఆయన భావించారు. తద్వారా ఇప్పటితో పోలిస్తే అప్పటి పరిస్థితి మెరుగు అన్న భావన కల్పించాలని అనుకున్నారు. అందుకే ‘‘కాంగ్రెస్ పార్టీ ఏ రోజూ వ్యవస్థలను వశపరచుకోవాలని అనుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు. ఇంకో అంశం... ఎమర్జెన్సీని నానమ్మ ‘పొరబాటు’ అన్నారని చెప్పడం ద్వారా ఆ అంశంపై మరిన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురు కాకుండా జాగ్రత్తపడ్డారు. చర్చను ముగించేందుకుగానూ, కొంత నష్టపోవడం అన్నమాట. అయితే రాహుల్ మాటలు అప్పట్లోనే వివాదాన్ని సృష్టించాయి. ఆయన జ్ఞానం, తీర్పరితనం, నిజాయితీ, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం... అన్నింటిపై సందేహాలు వచ్చాయి. ఈ విషయాలన్నింటిలోనూ ఆయన చాలా తేలికగా ఓడి పోయారేమో అనిపిస్తుంది. ఇదో గూగ్లీ అనుకుంటే రాహుల్ బౌల్డ్ అయ్యారు. దీన్ని ఒక పరీక్షగా అనుకుంటే రాహుల్ దీంట్లో పాస్ కాలేదు. జనాలను ఆకట్టుకోవాలన్నది రాహుల్ ఉద్దేశమైతే అది కూడా జరగలేదు. రాహుల్ ఈ దేశ ప్రధాని అయితే... ఇబ్బంది కరమైన పరిస్థితులను, మరీ ముఖ్యంగా తన కుటుంబ గత చరిత్ర గురించి ఎదుర్కోవడం ఎలాగో ఏదో ఒక రోజు కచ్చితంగా నేర్చు కోవాల్సి ఉంటుంది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Secunderabad Railway Station: జ్ఞాపకాల స్టేషన్
‘నూటా ఏభై ఏళ్ళ క్రితం, నిజాం రాజు మహబూబ్ అలీ ఖాన్ కట్టించిన సికింద్రాబాదు రైల్వే స్టేషన్ భవనం జమీన్ దోస్త్’. పేపర్లో ఈ వార్త చదివి, అనుకోకుండా అర శతాబ్దం వెనక్కెళ్ళాను నేను. ఎలాగా..? పాఠశాల విద్యార్థి దశ రోజులు. వేసవి సెలవులు ఊళ్ళో పూర్తి చేసుకుని బొంబాయికి తిరుగు పయనం ఆ రోజుల్లో సికింద్రాబాదు స్టేషన్ నుండే!మా ఊరు దాచారం. ఈ స్టేషన్‌కి 115 కి.మీ. దూరం. ఊరినుండి ఒకే ఒక ప్రైవేటు బస్సు ఉదయం 6 గంటలకు బయల్దేరి భువనగిరికీ, అటునుండి ప్యాసింజర్ రైలెక్కితే పగటి పూట ఏ ఒంటిగంటకో సికింద్రాబాదు స్టేషన్‌కూ చేరుకునే వాణ్ణి అమ్మా నాన్నలతో (ఒకో సారి బంధువులతో). రాత్రి 8 గంటలకు బాంబే ఎక్స్‌ప్రెస్. అప్పటి వరకు మా మకాం, ఇప్పుడు నేలమట్ట మవుతున్న ఈ విశాల ప్రాంగణంలోనే. 1వ నంబర్ ప్లాట్‌ఫారంకు ఆనుకుని ఉండే ఈ విశాల భవంతి మూడు ప్లాట్ ఫారాలకు ముఖ్య ద్వారం. వచ్చీ పోయే ప్రయాణికులతో అది హమేషా హడావుడి. హాలుకు కుడివైపు బుకింగ్ కౌంటర్లు, ఎడమ వైపు ఖాళీ స్థలం. ఆ ఖాళీ స్థలం మాలాంటి గరీబ్ బాటసారులకు విడిది.అక్కడే లగేజి దించి, వెంట తెచ్చుకున్న విస్తరిలోని చద్దన్నం తలా ఇంత తినేసి పెద్ద వాళ్ళు అలా లగేజికి ఆనుకుని నడుం వాల్చి పడుకుంటే, నేనేమో ఆ ప్రాంగణం అంతా, దానికి దగ్గరున్న మూడు ప్లాట్ ఫారమ్‌లు కలియ తిరుగుతూ... కనిపించే బుక్ స్టాల్‌లోని ‘విజయ చిత్ర’, ‘సినిమా రంగం’ లాంటి సినీ పత్రికలు తీసి ఓ రెండు మూడు నిమిషాలు తిరగేసి మళ్ళీ పెట్టేసేవాణ్ణి (డబ్బులు ఉండేవి కాదు మరి కొనటానికి). ప్లాట్ఫారం గుమ్మాలకు అతికించిన అలనాటి ‘అంతస్తులు’, ‘ధర్మదాత’, ‘కథానాయకుడు’, ‘అదృష్ట వంతులు’, ‘గూఢచారి 116’, ‘వీరాభి మన్యు’ లాంటి తెలుగు సినిమా పోస్టర్లను... వచ్చినప్పుడల్లా అలాగే చూస్తూ నిలుచోవటం ఇప్పటికీ గుర్తే (అవి ముంబాయి వీధుల్లో కనిపించేవి కాదు).ఇదీ చదవండి: ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీఇక అడపా దడపా తెలుగు ప్రాంతాల నుండి వచ్చే రైళ్ళలోని ప్రయాణికుల కోలాహలం, వారి కట్టూ–బొట్టు, మాటల యాస ఆసక్తితో గమనించే వాణ్ణి. అదో తీయని దృశ్యం. బంబయ్యా కా హిందీ లానే మన తెలుగునూ ఇక్కడ మనం మాట్లాడేది. కాని తెలుగునాట ఎన్ని యాసలో, ఆ స్టేషన్లోనే విన్నాను! ఆధునీకరణ పేరుతో ఇది ఇప్పుడు జమీన్ దోస్త్ అవుతున్నా... ఈ వయసులోనూ నా మనో ఫలకంపై భద్రంగానే ఉంది. – జిల్లా గోవర్ధన్, మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై -
Ukraine War ఈ యుద్ధంలో అంతిమ విజయం అమెరికాదే?
గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో అమెరికా ఆధ్యక్షుడు ట్రంప్ 90 నిమిషాలపాటు పుతిన్‌తో టెలీ ఫోనులో సంభాషించిన తర్వాత శాంతి చర్చల ప్రారంభానికి సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను ఎన్నుకొన్నారు. అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ నాయకత్వంలో ఫిబ్రవరి 18 తేదీన మంతనాలు జరిపి తొందరలోనే ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించాలనుకొన్నారు. ట్రంప్ మాత్రం ఈ సంప్రదింపులలో పాల్గొనవలసిందిగా అటు ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని గానీ, ఇటు యూరప్ దేశా లను కానీ ఆహ్వానించక పోవటంతో పారిస్‌లో పోటీగా శాంతిచర్చలకు యూరప్‌లోని ప్రధాన దేశాధినేతలు సమావేశమవ్వటంతో ఒక్కసారిగా నాటో దేశాల మధ్య ఆధిక్యత బయటపడింది. యుద్ధాన్ని ఆపితే ప్రతిఫలంగా కొన్ని తాయిలా లను ట్రంప్ రష్యాకు ఇస్తానన్నారని అనధికార వార్తలు వస్తున్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి ఉక్రెయిన్‌కు భవి ష్యత్తులో నాటో సభ్యత్వం ఇవ్వరు. అలాగే ఇప్పటి వరకూ యుద్ధంలో రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రె యిన్ ప్రాంతం, లోగడ తీసుకొన్న క్రిమియా భాగం రష్యా ఆధీనం కిందకు వస్తుంది. అమెరికా, ఉక్రెయిన్లు ఈ ప్రాంతాల్ని దౌత్యపరంగా గుర్తించాలి. రష్యా ఆధీనంలో ఉన్న భూభాగంలోని 50,000 కోట్ల డాలర్ల విలువ చేసే లిథియం, టైటానియం నిక్షేపాలను అమె రికా పొందుతుంది. పశ్చిమాసియాలో రష్యా అమెరి కాలు ఒకరికొకరు మద్దతునిచ్చుకొని అవసరమైతే చైనా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేయవచ్చు. పాలస్తీనియన్లను గాజా నుండి పారదోలటంలోనూ, ఇరాన్‌పై యుద్ధం చేస్తే రష్యా మద్దతును పొందడానికే ట్రంప్ ప్రయత్నం చేయవచ్చు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చి, ఉక్రెయిన్, అమెరికా వలసవాద దేశం కాజాలదన్నాడు. ట్రంప్ విధానాలు యూరప్‌పై దాడిగా ప్రముఖ యూరప్ పత్రికలు రాశాయి. ఈ విధానాలు ‘ట్రాన్స్ అట్లాంటిక్ కూటమి’ పతనానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించాయి. యూరప్ భద్రతా సవాళ్లను చర్చించి మిలిటరీ పరంగా యూర ప్ దేశాలు తమ జీడీపీ నుండి 3 నుండి 5 శాతం వరకూ ఖర్చు చేయాల్సి వస్తుందని దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే యూరపు ఆర్థికవ్యవస్థలు ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. ఇంకా మిలిటరీ ఖర్చు పెరిగితే ప్రజలపై అదనపు భారం పడే ప్రమాదముంది.ఉక్రెయిన్ ఆన్లైన్ పత్రిక ‘స్టార్నా’ ట్రంప్, పుతిన్‌ల శాంతి ఒప్పందాలను లీక్ చేసింది. దీన్ని అనుసరించి ఏప్రిల్ 20 నాటికి పరిపూర్ణ కాల్పుల విరమణ జరగా లని, ఉక్రెయిన్ ఆక్రమించిన రష్యా భూభాగం కుర్ స్క్‌ను తిరిగి రష్యాకు ఇవ్వాలని, తొందరలోనే పుతిన్, ట్రంప్‌లు మాస్కోలో, వాషింగ్టన్లో కల్సుకొంటారని, జెలెన్స్కీ, పుతిన్‌లు సౌదీ అరేబియాలో కలుసుకోవ చ్చని అభిప్రాయపడింది. అధికారికంగా ఈ షరతులన్నీ మే 9 నుండి అమలులోకి రావచ్చని తెలిపింది. అయితే ఇవేవీ జరుగలేదు. నిన్న శనివారం కూడా యుద్ధం కొనసాగింది. రష్యా కొత్తగా ఉక్రెయిన్ గ్రామాన్ని ఒక దాన్ని ఆక్రమించుకుంది.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిచైనాను ఎదుర్కొనే వ్యూహంతాను అమెరికా అధ్యక్షునిగా ఉండి ఉంటే అప్పట్లో యుద్ధాన్ని జరిపించే వాడిని కాదని ట్రంప్ ఇప్పటికే అనేకసార్లు చెప్పారు. 3 సంవత్సరాల యుద్ధంతో ఉక్రె యిన్ తీవ్ర నష్టాల పాలయ్యింది. సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఈ యూ దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలో కూరుకోవటం, తిరుగులేని అణుశక్తిగా, మిలిటరీశక్తిగా ఇప్పటికే రష్యా ఉండి, అపారమైన ఖనిజ సంపద కల్గి ఉండటంతో ట్రంప్ రష్యాపై మొగ్గు చూపు తున్నారు. భౌగోళికంగా వ్యూహాత్మకంగా రష్యా సహా యంతో చైనాను చుట్టు ముట్టటం తేలిక అనుకోవటం ట్రంప్ ఆలోచన కూడా కావచ్చు. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయాన్ని అందించటం కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారం కావటం మరొక కారణం కాగా, అమెరికా మార్కెట్లకు రష్యా కొత్తద్వారాలను తెరుస్తుందని ఆశ పడటం మరొక కారణం కావచ్చు. అసలు యుద్ధం ప్రారంభించటానికి ప్రధాన కారణం రష్యాను ముక్కలుగా చేసి, దాని అపార ఖనిజసంపదను దోచుకోవటానికే ననేది జగమెరిగిన సత్యం. శాంతి చర్చలతో రష్యా అధ్యక్షుడు పుతిన్ విజేతగా నిలువనున్నాడు. అమెరికా ఉక్రెయిన్‌కు మద్డతు పలికి ఓటమిపాలవుతూ ఇప్పుడు ట్రంప్ రూపంలో శాంతి ఒడంబడిక ద్వారా నెగ్గే ప్రయత్నం చేస్తోంది. రష్యాకి సంబంధించిన 30వేల కోట్ల డాలర్లను అమెరికా బ్యాంకుల్లో స్తంభింపజేసి, ఉక్రెయిన్‌లో ఖనిజ సంపదపై కన్నేసిన అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ నైజాన్ని ప్రపంచానికి తెలిపింది. తాజా వార్తలు అందే సమయానికి ట్రంప్ తన సహజధోరణిలో మాట మార్చి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిందని ప్రకటించారు. యుద్ధ పరిసమాప్తి గురించి వాషింగ్టన్...రష్యాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ తమతో ఖనిజ ఒప్పందాలను కుదుర్చుకుంటుందని ప్రకటించారు. మొత్తానికి ఈ యుద్ధం వల్ల అమెరికా ప్రయోజనాలు నెరవేరబోతున్నాయన్నమాట!నేటితో రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు2025 ఫిబ్రవరి 24 నాటికి రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడేళ్లవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో చోటు చేసుకున్న భయంకర యుద్ధం ఇదే. ఉక్రెయిన్‌లో 20 శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. ఈ యుద్ధం వల్ల 2024 నవంబర్ నాటికి ఉక్రెయిన్‌కు సంభవించిన మొత్తం ఆస్తి నష్టం 170 బిలియన్ డాలర్లు అని ‘కేఎస్ఈ ఇనిస్టిట్యూట్’ అంచనా. ఉక్రెయిన్ సైనికులు 80 వేల మంది చనిపోయినట్టు, 4 లక్షల మంది గాయపడినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ అంచనా. రష్యా పౌరులు కొద్దిమందే మరణించినా సైనికులను మాత్రం పెద్ద సంఖ్యలోనే కోల్పోయిందని వార్తలు. అందుకే అది కిరాయి సైనికులను రంగంలోకి దించింది. -బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969 -
న్యాయ వ్యవస్థకు తాడు మీద నడక
రణవీర్ అలహాబాదియా కేసు ఎంత సంక్లిష్టమో సుప్రీంకోర్టు దాన్ని డీల్ చేసిన తీరు తేటతెల్లం చేస్తోంది. ఈ విచారణ... నైతిక ఆగ్రహానికీ, రాజ్యాంగ ఔచిత్యానికీ నడుమ తాడు మీద చేసిన నడకను తలపిస్తోంది. వాదప్రతివాదాలు విన్న తర్వాత యూ ట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్‌కు ఊరట కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. రణవీర్ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ వ్యక్తి. ‘ఇండియా గాట్ లేటెంట్’ అనే వెబ్ టాలెంట్ షోలో అతను చేసిన వ్యాఖ్యలపై అనేక ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయి. ఆ వ్యాఖ్యలు సరదా కోసమే చేసినప్పటికీ వాటిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. మీడియా సంస్థలు, రాజకీయ నేతలు గగ్గోలు పెట్టడం అగ్నికి ఆజ్యం పోసి నట్లయింది. రణవీర్ భాష ఎంత అసహ్యకరంగా ఉంది అన్నది న్యాయపరంగా ప్రధాన ప్రశ్న కాదు, అది భారతీయ చట్టాల ప్రకారం నేరపూరిత అపరాధం అవుతుందా అవ్వదా అన్నదే ముఖ్యం. ఆయన న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ న్యాయస్థానంలో చేసిన ఈ వాదన ఎంతైనా సమంజసం. వారికీ రాజ్యాంగ రక్షణ అవసరంకానీ కోర్టు ఇలాంటి సూక్ష్మ అంశాలను పట్టించుకునే మూడ్‌లో లేదు. భాష ‘డర్టీ’గా, ‘పర్వర్టెడ్’గా ఉందంటూ విచారణ ఆసాంతం ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తన ఏహ్యభావం వ్యక్తం చేసింది. ఒక దశలో న్యాయమూర్తి కల్పించుకుని, ‘‘ఇలాంటి భాషను మీరు సమర్థిస్తున్నారా?’’ అని చంద్రచూడ్‌ను ప్రశ్నించారు. నిజానికి డిఫెన్స్ లాయర్ పాత్ర... అత్యంత తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్ననిందితుడికి సైతం న్యాయవ్యవస్థ ద్వారా చట్టపరమైన రక్షణ లభించేట్లు చూడటమే!సుప్రీంకోర్టు సమాజ నైతికతకు సంరక్షకురాలు కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి రాజ్యాంగ హక్కులను కాపాడటమే దాని ప్రాథమిక విధి. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం అంటే జనామోదం పొందిన భావప్రకటనను పరిరక్షించడం అనుకోకూడదు. అప్రియమైన, జనాదరణ లేని భావప్రకటన చేసి నప్పుడు అలాంటి వారికి రాజ్యాంగపరమైన రక్షణ అవసరం అవుతుంది.అభినవ్ చంద్రచూడ్ ఈ విచారణ సందర్భంగా న్యాయ సూత్రాల మీదకు కోర్టు దృష్టిని మరల్చారు. అపూర్వ అరోరా వెబ్ సిరీస్ (కాలేజ్ రొమాన్స్) కేసును ఉదహరిస్తూ, అసభ్యత మాత్రమే అశ్లీలత అవ్వదన్న సుప్రీం తీర్పును ఆయన ప్రస్తావించారు. ఒకరి భావప్రకటన ఇతరుల లైంగిక వాంఛలను ప్రేరేపించడానికి ఉద్దేశించి నదా, హద్దులు దాటి నేరపూరితమైన అశ్లీలతకు అది కారణమైందా అనే అంశాల ప్రాతిపదికగా దాన్ని పరీక్షకు పెట్టాలని ఈ తీర్పు చెబుతోంది. న్యాయస్థానం దీన్ని పట్టించుకున్నట్లు లేదు. ‘‘ఇది అశ్లీలత కాకుంటే, మరేది అశ్లీలత అవుతుంది?’’ అని ప్రశ్నించింది. కోర్టులు నైతిక శూన్యంలో పని చేయాలని అనడం లేదు. అలా అని వాటి నైతిక పరమైన ఏహ్యత... న్యాయ తర్కాన్ని కప్పివేయకూడదు. అరోరా కేసు ‘‘మీరు ఏదనుకుంటే అది మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా?’’ అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. తన వ్యక్తిగత మర్యాద భావన నుంచి వాక్ స్వాతంత్య్ర సంరక్షణను వేరు చేయడానికి కోర్టు విముఖంగా ఉన్నట్లు ఈ ప్రశ్న సంకేతాలు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో కేసు ఎదుర్కొంటున్న ‘యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్’ రణవీర్ అలహాబాదియా పితృస్వామ్య కథనంరణవీర్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆయన న్యాయవాది చంద్రచూడ్ కోర్టు దృష్టికి తీసుకురాగా, జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత హియరింగ్‌లో అత్యంత కలవరం కలిగించిన అంశం! ఈ తరహాలో చౌకబారు ప్రచారం పొందాలని మీరు ప్రయత్నించినట్లే, బెదిరింపుల ద్వరా చౌకబారు ప్రచారం సంపాదించాలని ప్రయత్నించే వారు కూడా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. రణవీర్ మాటలు ఎంత అభ్యంతర కరమైనవి అన్నది పక్కనపెడితే, చంపేస్తామనే బెదిరింపులు వాటికి పర్యవ సానం కారాదు. రణవీర్ వ్యాఖ్యలు తన తల్లిదండ్రులకు అవమానం కలిగించా యని విచారణలో కోర్టు పదేపదే ప్రస్తావించింది. భారతీయ సాంస్కృతిక నియమాలను ఈ పితృస్వామ్య నెరేటివ్ ప్రతిఫలిస్తుంది. రాజ్యాంగంలో దీనికి చోటు లేదు. న్యాయస్థానాలు నైతికతకు పున రావాస కేంద్రాలు కావు. రణవీర్ నేరం చేశాడా లేదా అన్నదానికి... అతడు తన కుటుంబాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాడన్నది సంబంధం లేని విషయం. సామాజిక తిరస్కారాన్ని చట్టపరమైన నేరారోపణతో ముడిపెట్టడం అనేది కోర్టులు దాటకూడని ప్రమాదకమైన రేఖ. కోర్టు చిట్టచివరకు రణవీర్‌కు మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది. ప్రతివాదులకు నోటీసు జారీచేసి వారి సమాధానం కోరింది. ఇది సరైన నిర్ణయం. రణవీర్ వ్యాఖ్యలకు అభ్యంతరకర స్వభావం ఉన్నప్పటికీ, వాటిని నేరంగా గుర్తించడానికి అది చాలదు.‘ఇండియా గాట్ లేటెంట్’ వెబ్ షో వివాదం, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఈ కార్యక్రమ స్వభావం సందర్భపరమైన ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తింది. రణవీర్ వ్యాఖ్యల క్లిప్ అసందర్భంగా లీక్ అయ్యింది. ఆ విషయం కోర్టుకూ తెలిసినట్లే ఉంది. అయినా విచారణలో ఈ ఎరుక ప్రభావం కనిపించలేదు. భావప్రకటన స్వేచ్ఛ కేసుల్లో సంద ర్భానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మూక ప్రేరేపిత నైతిక భయాందోళనల నుంచి కోర్టులు వాక్ స్వేచ్ఛను పరిరక్షించాలి. న్యాయస్థానాలు తమ విచారణలో ఎంత సంయమనం పాటించాల్సి ఉంటుందో గుర్తు చేసేందుకు రణవీర్ కేసు చక్కటి ఉదా హరణగా నిలుస్తుంది. న్యాయమూర్తులు కూడా మనుషులే. అందరి లానే వారికీ అసహ్యం, కోపం, అనైతికత పట్ల ఏహ్యభావం ఉంటాయి. కాని వారి వృత్తి... భావోద్వేగాలకు లోనై తీర్పులు చెప్పేది కాదు. రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా న్యాయాన్ని పరిరక్షించాలి. జనాభిప్రాయం వేరేలా ఉన్నప్పుడు ఈ విధి కష్టతరంగానే ఉంటుంది. కత్తి మీద సాములా వారు తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించాల్సి వస్తుంది. విచారణ జరగాల్సిన తీరువ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి రాజ్యాంగానికి లోబడి అంతిమంగా తాను ఏం చేయాలో అదే మన సర్వోన్నత న్యాయ స్థానం చేసింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ క్రమంలో అది వ్యవహరించిన తీరు ప్రజలకు అస్పష్ట సంకేతాలు పంపింది. న్యాయవ్యవస్థ నిన్ను కాపాడు తుంది... కానీ ఆ పని నిన్ను అవమానానికి గురి చేసిన తర్వాతే,అసంతృప్తితోనే నీ హక్కులను గౌరవిస్తున్నట్లు నీకు స్పష్టం చేసిన తర్వాతే, నీ మీద తన నైతిక ఆధిక్యతను రుజువు చేసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పకనే చెప్పింది. రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలు పని చేయాల్సిన తీరు ఇది కాదు. జనామోదం కొరవడిన వారికీ, అభ్యంతకరమైన వారికీ, ఆఖరుకు పెర్వర్ట్ అయిన వారికీ ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాపాడేందుకే సుప్రీం కోర్టు ఉన్నది. అసభ్యత నుంచి సమాజాన్ని శుద్ధి చేయడం తన బాధ్యత కాదనీ, తనకు దీపస్తంభంలా నిలవాల్సింది చట్టమే కాని నైతికత కానేకాదనీ న్యాయ స్థానం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకుంటూ ఈ కేసు విచా రణ కొనసాగిస్తుందని ఆశిద్దాం.సంజయ్ హెగ్డే వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మల్లికార్జున్ ఖర్గే (ఏఐసీసీ ప్రెసిడెంట్) రాయని డైరీ
ఇందిరా భవన్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉన్నాం అందరం. అంతా ఆలిండియా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీలు, స్టేట్ ఇంఛార్జిలు, కొత్త సీడబ్ల్యూసీ సభ్యులు, పార్టీలోని ఇతర మహామహులు. ‘చెప్పండి’ అన్నట్లు వారి వైపు చూశాను. ఎప్పటిలా, ‘మీరే చెప్పండి ఖర్గేజీ’ అన్నట్లేమీ వారునా వైపు చూడలేదు. ఎవరి వైపు వాళ్లు చూసుకుంటూ ఉన్నారు! బహుశా అది ఆత్మ పరిశీలనావస్థ కావచ్చు. పార్టీ లీడర్ రాహుల్, జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ నా పక్కనే ఇటొకరు, అటొకరు కూర్చొని ఉన్నారు. ‘‘ఎవరైనా హ్యాట్రిక్ కొట్టి హీరోలు అవుతారు. మనం ‘జీరో’లు కొట్టి హ్యాట్రిక్ సాధించాం!’’ అన్నాను అందర్నీ యాక్టివేషన్ మోడ్‌లోకి తీసుకొస్తూ. వెంటనే రాహుల్ స్పందించారు. ‘‘ఖర్గేజీ, ఐపీఎల్లో ఆర్సీబీ ఎంత గొప్పగా ఆడుతుందో మీకూ తెలుసు. కానీ ఒక్కసారైనా ఆ జట్టు గెలిచిందా?’’ అన్నారు మెల్లగా నా చెవిలో. ఆర్సీబీ జట్టుది కర్ణాటకే, కాంగ్రెస్ అధ్యక్షుడిదీ కర్ణాటకే అనే భావన నాలో కలిగించటం ద్వారా ఆయన నాకు ఊరటనివ్వ దలిచారా!‘‘గొప్పగా ఆడటం గెలుపౌతుందా రాహుల్ బాబు. గెలిస్తేనే కదా గొప్పగా ఆడినట్లౌతుంది’’ అన్నాను రాహుల్ చెవిలో. ఇలా చెవుల్లో మాట్లాడుకునే సంప్రదాయం కాంగ్రెస్‌లో గాంధీ, నెహ్రూ, పటేల్‌ల కాలం నుంచే ఉన్నా, నలుగురి ముందు చెవుల్లో చెవులు పెట్టటం నాకు ఇష్టం ఉండదు. రాహుల్ నా చెవిలో మాట్లాడారు కాబట్టి ఆయన్ని రెస్పెక్ట్ చెయ్యటం కోసం నేనూ ఆయన చెవిలో మాట్లాడానంతే. ‘‘అంకుల్...’’ అని చెయ్యి లేపారు ప్రియాంక. ‘‘చెప్పమ్మా ప్రియాంకా...’’ అన్నాను.‘‘అంకుల్... మనమూ కొట్టాం కదా హ్యాట్రిక్. షీలా దీక్షిత్ ఆంటీ వరుసగా మూడుసార్లు ఢిల్లీ సీఎంగా ఉండలేదా?’’ అన్నారు.‘కానీ సీఎంగా హ్యాట్రిక్ కొట్టటం వేరు, వరుసగా ఒక్క సీటైనా గెలవకుండా హ్యాట్రిక్ కొట్టటం వేరు కదా తల్లీ’ అని నేను ప్రియాంకతో అనలేదు. ఈలోపు – జైరాం రమేశ్ యాక్టివేట్ అయ్యారు!‘‘హ్యాట్రిక్‌గా మనం ఎందుకు ఓడిపోతూ వచ్చామో ఎంతగా అంతర్మథనం చేసుకున్నా అర్థం కావటం లేదు ఖర్గేజీ. ఢిల్లీకి షీలా దీక్షిత్ ఎన్నెన్ని చేశారు! అసలు ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అంతు చిక్కటం లేదు’’ అన్నారు జైరాం రమేశ్, సహనం కోల్పోయిన సాధువులా!‘‘అంతా బాగున్నా ఎందుకీ ప్రజలు మార్పు కోరుకుంటారో!’’ అన్నారు వేణుగోపాల్, తనూ ఆశ్చర్యపోతూ. ‘‘అంతా బాగుండబట్టే మార్పును కోరుకుంటారు వేణూజీ. అన్ని పార్టీలూ అన్నీ ఇస్తున్నప్పుడు అన్నీ ఇచ్చే అవకాశాన్ని ఎప్పుడూ ఒకే పార్టీకి ఎందుకివ్వాలి అని ప్రజలు అనుకుంటారు. ఢిల్లీ ప్రజలు 26 ఏళ్ల తర్వాత మళ్లీ బీజెపీని ఎన్ను కున్నారు. ఏమో, వచ్చే ఎన్నికల్లో బీజేపీని మార్చి మనల్ని గెలిపించినా గెలిపించవచ్చు’’ అని వెనుక సీట్లోలోంచి ఎవరో అన్నారు!‘‘ఎవరతను గోపాల్జీ... ఆశలు చిగురించేలా మాట్లాడాడు’’ అని అడిగాను... సాయంత్రం కాన్ఫరెన్స్ ముగిశాక వేణుగోపాల్‌తో పాటుగా ఇందిరా భవన్ నుంచి బయటికి నడుస్తూ. ‘‘కుర్రాడు కమిటీలోకి కొత్తగా వచ్చాడు ఖర్గేజీ. గ్రాస్రూట్స్ నుంచి తెచ్చాం’’ అన్నారు వేణుగోపాల్.ఒక్క క్షణం అలా నిలబడి పోయాను. ‘‘ఏంటి ఖర్గేజీ?’’ అని అడిగారు వేణుగోపాల్.‘‘ఏం లేదు గోపాల్జీ. మన లీడర్స్ అందరినీ వెంటనే ఏ ఫ్లయిట్ దొరికితే ఆ ఫ్లైట్‌లో గ్రాస్రూట్స్కి పంపించండి’’ అని చెప్పి, వచ్చేశాను. -
గుండెల్ని మండిస్తున్న మిర్చి ధర
గత కొన్ని వారాలుగా వివిధ రకాల మిరప ధరలు విపరీతంగా పడిపోవడంతో గుంటూరులోని మిర్చి రైతులు గుండెల్లో మిర్చి మంటతో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆక్రందనలు చేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ అయిన ‘గుంటూరు మిర్చి యార్డ్’ (Guntur Mirchi yard) ఏటా 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ రూ. 10,000 కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రప్రభుత్వానికి రూ. 100 కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. అయితే, అన్ని మిరప రకాల ధరలు ఇటీవలి వారాల్లో ఒక్కో బస్తాకు రూ. 1,000 నుండి రూ. 4,000 వరకు పడిపోయాయి. కర్నూలు, నంద్యాల, దాచేపల్లి, సత్తెనపల్లి (Sattenapalle) తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ నుంచి కూడా అధిక లాభాలు వస్తాయనే ఆశతో గుంటూరుకు వెళ్లిన రైతులు... ఇప్పుడు నష్టాల బారిన పడుతున్నారు.అధికారిక సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి సాగు 1.94 లక్షల హెక్టార్లలో ఉంది, ఈ సీజన్లో 11.29 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతం వరుస చీడపీడల వల్ల సాగు ఖర్చులు 30% పైగా పెరిగాయి. చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను లాభసాటి ధరలకు అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పల్నాడు జిల్లాలో ఎకరాకు రూ. 2.5 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేసిన అనేక మంది నష్ట భయంతో గజగజలాడుతున్నారు. ‘ప్రస్తుత మార్కెట్ ధర లతో, మా పెట్టుబడులను తిరిగి పొందేందుకు మార్గం కనబడడం లేద’ని రైతులు వాపోతున్నారు.అనూహ్యంగా గత కొన్ని వారాలుగా మిర్చి కొనుగోళ్ల పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారి పోయింది. ముఖ్యంగా చైనా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి కీలక మార్కెట్ల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం గణనీయంగా మందగించిందని మిర్చి యార్డ్‌లో కొందరు వ్యాపారస్తులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2023–24లో 0.179 మిలియన్ టన్నుల దిగుమతులతో చైనా భారతీయ ఎర్ర మిరప కాయల అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. ఇది పరిమాణంలో సుమారుగా 14 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఒలియోరెసిన్, పాక రంగాల నుండి పెరుగుతున్న డిమాండ్ కారణంగా చైనాకు ఎర్ర మిరప ఎగుమతులు పుంజుకున్నాయి. విలువ పరంగా రెండవ అతిపెద్ద కొనుగోలుదారు అయిన థాయ్‌లాండ్, దాని దిగుమతులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 10.6 శాతం పెరిగాయి. గడచిన కొంత కాలంలో భారత దేశం నుండి అమెరికాకు ఎర్ర మిర్చి ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. గత ఏడాది 29,173 టన్నుల నుంచి 2023–24లో ఎగుమతులు 25 శాతం పెరిగి 36,413 టన్నులకు చేరుకున్నాయి. అంటే ఎగుమతుల డిమాండ్ తగ్గిందన్నది దీనినిబట్టి చూస్తే అవాస్తవమే అన్నమాట!గిట్టుబాటు ధర లభించక మిర్చి రైతులు విలవిల్లాడి పోతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అన్ని విధాలా విఫలమైందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న తెలుదేశం పార్టీ అధి నేత తన అధికారులతో మంతనాలు, సమీక్షల తోనూ; కేంద్రంవైపు సహాయం కోసం చూసే చూపులతోనూ కాలం గడుపు తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాని, మిర్చి రైతులను ఆదుకోవడానికి నిర్దిష్టమైన చర్యలైతే తీసుకోవడం లేదు. నిజంగా రైతుకు మేలు చేయడమే సీఎం నైజం అయితే తమకు వెంటనే భరోసా ఇచ్చే చర్యలను చేపట్టాలని రైతాంగం కోరుకుంటోంది.చదవండి: రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాంరాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ వ్యాపారులు, విక్రయదారులు, ప్రభుత్వ అధికారులతో చర్చించారని చెబుతున్నారు. ఈ చర్చల్లో వ్యాపారులను కొనుగోలు కార్యకలా పాలను పెంచాలని డైరెక్టర్ కోరినా... మార్కెట్లో ఎటువంటి నిర్ణయాత్మక మార్పు కనబడడం లేదు. ఈ అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి నుండి రైతులను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోక తప్పదు. లక్షల్లో అప్పుచేసి మిరప సాగు చేసిన రైతులు కనీసం పెట్టుబడి కూడా రాబట్టుకోలేని దయనీయ స్థితిలో ఉండగా, వ్యాపారులు నిశ్శబ్దంగా అసంబద్ధ చర్యలకు పాల్పడుతున్నట్టుగా పలు అనుమానాలు కలుగుతున్నాయి. లేకుంటే అంతగా అభివృద్ధి చెందిన మిరపకు మార్కెట్ పడిపోవడం ఎలా సాధ్యం? చైనాతో సహా 20కి పైగా దేశాలు గుంటూరు మిర్చి వైపు చూస్తుండటం, గత సంవత్సర లాభసాటిగా మార్కెట్ ఉండటం చూస్తుంటే ఈ పతనం వెనుక ఉన్న కాణాలు అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెను నిద్దర వదిలి మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి.- బలిజేపల్లి శరత్ బాబు ప్లాంట్ ప్రొటెక్షన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త -
రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాం
బ్యాంకులు ప్రదర్శిస్తున్న ఈ అసమానత వింత గొలుపుతుంది. ఒక ఆర్టీఐ అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ, 2014 ఏప్రిల్ 1 నుండి కార్పొరేట్ ఇండియాకు సంబంధించి రూ. 16.61 లక్షల కోట్ల మొండి రుణాలనుబ్యాంకులు మాఫీ చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. మరుసటి రోజు రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ పార్లమెంటులో మాట్లాడుతూ, దేశంలో బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు ఇప్పుడు రూ. 32 లక్షల కోట్లు దాటాయని అన్నారు. 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ అని బేనీ వాల్ అన్నారు. రైతులకు వ్యవసాయ రుణ మాఫీ పథకం గురించి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు.కార్పొరేట్లకు రుణమాఫీదీనికి విరుద్ధంగా, గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్లు చేసిన మొత్తం రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) రద్దు చేశారు. గత ఐదేళ్లలో కార్పొరేట్లు చెల్లించని రుణా లలో రూ. 10.6 లక్షల కోట్లను రద్దు చేయడానికి భారతీయబ్యాంకులు ఏమాత్రం సందేహించలేదు. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలకు చెందినవని నివేదికలు చెబుతున్నాయి. అదే కర్ణాటక, శివమొగ్గలోని ఒక రైతు కేవలం తన రూ. 3.46 పైసల బకాయి చెల్లించేందుకు సాధారణ బస్సు సర్వీస్ లేకపోతే, 15 కిలో మీటర్లు నడిచివెళ్లాల్సినంతటి ఆత్రుతను బ్యాంక్ ప్రదర్శించింది.2023–24 ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులు రూ. 1.7 లక్షల కోట్లు మాఫీ చేశాయి. ఒక సంవత్సరం క్రితం, 2022–23లో రూ. 2.08 లక్షల కోట్లు మాఫీ చేశాయి. కానీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసే విషయానికి వస్తే, కేంద్రం రెండుసార్లు మాత్రమే ఆ పని చేసింది: 1990, 2008లో. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా వ్యవ సాయ రుణాల మాఫీ చేశాయి. కానీ మాఫీ చేసిన మొత్తాన్ని బ్యాంకు లకు రాష్ట్రాలు చెల్లిస్తున్నందున అది బ్యాంకులపై భారం కాదు. కార్పొ రేట్లు చెల్లించని బ్యాంకు రుణాలను అవి దేశ నిర్మాణానికి తోడ్ప డ్డాయనేంత జాగ్రత్తగా మాఫీ చేశారు. చిన్న రుణాలు మాఫీ చేయలేమా?పేద రైతులు, గ్రామీణ శ్రామికవర్గం చేసిన చిన్న చిన్న రుణా లను మాఫీ చేయడం అనేది జాతీయ బ్యాలెన్స్ షీట్‌ను కలవర పెట్టడానికి కారణంగా కనిపిస్తుంది. అదే ధనవంతులైన రుణమాఫీ దారులు సులభంగా తప్పించుకుంటారు. వీరిలో రూ.3.45 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను చెల్లించని 16,000 మందికి పైగా ఉద్దేశ పూర్వక రుణమాఫీదారులు ఉన్నారు. పైగా వారివద్ద డబ్బు ఉందని ఆర్బీఐ అంగీకరించినప్పటికీ వారు తిరిగి చెల్లించడానికి ఇష్టపడలేదు. కచ్చితంగా, వీరు సంపద సృష్టికర్తలు. దేశం వారిని అభినందించాలన్నమాట!ఇప్పుడు రాజస్థాన్‌లోని పీలీబంగాకు చెందిన ఒక రైతును చూడండి: ఆయన ఒక ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 2.70 లక్షల రుణం తీసుకొని రూ. 2.57 లక్షలను తిరిగి చెల్లించాడు (మహమ్మారి సమయంలో రాష్ట్రం నుండి అందుకున్న రూ. 57,000 మద్దతుతో సహా). మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఆయన ఒక రోజు ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తరువాత, ఆగ్రహించిన గ్రామస్థులు ఆ తాళం పగలగొట్టారు.ఈ దురదృష్టకర సంఘటనను మరొకదానితో పోల్చి చూద్దాం. ప్రముఖ మిశ్రమ లోహ, ఉక్కు తయారీదారు అయిన ‘ఆధునిక్ మెటాలిక్స్’... 2018 జూలైలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా శాఖ తన పరిష్కార ప్రణాళికను ఆమోదించిన తర్వాత, తమ బకాయిలు రూ. 5,370 కోట్లకుగానూ కేవలం రూ. 410 కోట్లు చెల్లించడానికి ఒప్పుకుంది. అంటే 92 శాతం రుణమాఫీ! స్పష్టంగా, ఇంత పెద్ద ‘రుణమాఫీ’ తర్వాత, కంపెనీ ప్రమోటర్లు అన్ని కార్యకలాపాలను పూర్తి చేయడానికీ, ప్రధానసంస్థను పునరుద్ధరించి తిరిగి పని చేయడం ప్రారంభించడానికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు పరివర్తనాత్మక పరిష్కార యంత్రాంగంగా ప్రశంసలందుకున్న దివాళా కోడ్ ఇప్పుడు ఒక వైఫల్యంగా మారిపోయింది.అయితే, పెద్ద ప్రశ్న మిగిలే ఉంది. పెండింగ్‌లో ఉన్న రూ. 20,000 మొత్తాన్ని తిరిగి పొందలేకపోయినందుకు రాజస్థాన్ రైతు ఇంటికి తాళం వేయగలిగినప్పుడు, పెండింగ్‌లో ఉన్న బకాయిలలో 92 శాతం మాఫీ చేసి రాజమార్గాన పంపడానికి బదులుగా, ఆధునిక్ మెటాలిక్స్ వంటి సంస్థల ప్రాంగణాన్ని ఎన్సీఎల్టీ ఎందుకు తాళం వేయలేకపోయింది? రైతుల వంటి వారే అయిన ఆ యజమానులను ఎందుకు కటకటాల వెనుక ఉంచలేకపోయింది?చట్టాల్లో ఎందుకు తేడా?ఒక పెద్ద కంపెనీకి ఇంత పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, రైతులు ఇలాంటి విధానంతో ప్రయోజనాన్ని, అది కూడా సాపేక్షంగా తక్కువ అయినాసరే ఎందుకు పొందకూడదు? వివిధ వర్గాల బ్యాంకు వినియోగదారులకు బ్యాంకింగ్ చట్టాలు ఎందుకు భిన్నంగాఉండాలి? గృహనిర్మాణం, కారు, ట్రాక్టర్ లేదా మోటార్ సైకిల్ రుణాలు తీసుకునే వారిని బ్యాంకులు ఎప్పుడైనా అదే రకమైన సున్ని తత్వంతో చూస్తాయా? ఆర్థిక వృద్ధి పేరుతో కంపెనీల మొండి బకాయిలను మాఫీ రూపంలో తమ సొంతం చేసుకోవాల్సిన అగత్యాన్ని బ్యాంకులు ఎంతకాలం సమర్థించుకోగలవు?పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో నిటారుగా నిలబడి ఉన్న తమ కాలీఫ్లవర్, క్యాబేజీ పంటలను తిరిగి దున్నడానికి ట్రాక్టర్లను నడుపుతున్న రైతుల బాధాకరమైన వీడియోలను; ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్లలో టమోటా ధరలు పతనమై రైతులు కుప్పగూలిపోవడాన్ని నేను సోషల్ మీడియాలో చూసినప్పుడు తీవ్రంగా బాధపడ్డాను. టమోటా, ఉల్లిపాయ, బంగాళాదుంపల ధరలను స్థిరీకరించడానికి రూ. 500 కోట్ల వ్యయంతో 2018–19 బడ్జెట్లో ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్స్ పథకం నాకు ఇలాంటి సందర్భాల్లో గుర్తుకువస్తుంది. కోల్డ్ చైన్స్ నెట్‌వర్క్‌తో సహా వ్యవసాయ మౌలిక సదుపా యాలలో తగినంత పెట్టుబడి పెట్టడం అనేది నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ వాస్తవికత ఏమిటంటే, కూరగాయల ధరలను స్థిరీకరించడంలో ఆపరేషన్ గ్రీన్స్ పథకం ఘోరంగా విఫలమైంది. తగిన నిధుల మద్దతు లేకపోవడం ఒక కారణం కావచ్చు.రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్సీఐఎల్) దివాళా తీసిన తీర్మానాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) 2023 డిసెంబర్లో ఆమోదించింది. ఈ సంస్థ క్లెయిమ్ చేసిన రుణంలో 99 శాతాన్ని మాఫీ చేయడం జరిగింది. చూడండి విచిత్రం: 2018–19లో ఆపరేషన్ గ్రీన్స్ కోసం కేటాయించిన రూ. 500 కోట్లతో పోలిస్తే, ఆర్సీఐఎల్ రూ. 47,251.34 కోట్ల క్లెయిమ్‌కు బదులుగా కేవలం రూ. 455.92 కోట్లు చెల్లించి బయటపడింది. మాఫీ చేసిన ఆ మొత్తాన్ని తిరిగి పొంది ఆపరేషన్ గ్రీన్స్ లో పెట్టుబడి పెడితే, పండ్లు, కూరగాయల ధరలను స్థిరీకరించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఆర్థిక వనరుల కొరత ఏమాత్రం ఉండేది కాదు.- దేశంలో 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ.- గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్ల రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) బ్యాంకులు రద్దు చేశాయి. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలవి.- ఒక పెద్ద కంపెనీకి పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, ఒక చిన్న రైతు అలాంటి ప్రయోజనం ఎందుకు పొంద కూడదు?- వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు , ఈ–మెయిల్: hunger55@gmail.com- దేవీందర్ శర్మ -
చంపాల్సింది కులాన్ని... ప్రేమికుల్ని కాదు!
భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘మనం రేపటి నుండి రాజకీయంగా ఓటు ద్వారా మనిషికి ఒకే విలువను సాధించుకున్నాం. కానీ సామాజికంగా సమానతను సాధించుకోవాల్సి ఉంది’ అన్నారు. కులమత అంతరాలు ఆర్థిక అసమానతలు, దోపిడీ పీడనలు లేని సమాజాన్ని కలగన్న ఆనాటి మహనీయుల కలలు ఇంకా నెరవేరనే లేదు. భారతదేశ చాతుర్వర్ణ కుల వ్యవస్థ భారత సమాజాన్ని నిలువునా చీల్చిందనీ, కుల నిర్మూలన జరగకుండా, అంధ విశ్వాసాలు తొలగి పోకుండా సమాజం పురోగమించదనీ, ఆ లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ స్ఫూర్తితో సమాజాన్ని పాలకులు ముందుకు నడపాలి. అయితే వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులాల దొంతరలలోని కులాలను స్థిరీకరిస్తూ, అంతరాలను పెంచి పోషిస్తున్నారు. కులం కట్టుబాట్లను అనుసరించి... తమ ఇష్టానిష్టాలకు భిన్నంగా ఆ యా కులాల్లోనే వివా హాలు చేసుకోవడం ఒకరకంగా దోపిడీకి గురికావడం లాంటిదే. రెండు వందల ఏళ్ల నాడే సావిత్రీబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలేలు ఈ కుల కట్టుబాట్లను తుదమట్టిస్తూ, కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్స హించారు. ప్రేమించి పెళ్లి చేసుకోవా లనుకునే జంటలకు కాని, కులమత అడ్డుకోటలను కూల్చాలనుకునే ప్రేమి కులకు కాని, కుల కట్టుబాట్లు, సంప్రదాయాలు, పెళ్లి తంతులు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లిళ్లు చేసుకొనేవారు అనేకమంది విడిపోతున్నారు. ఇవాళ కుటుంబంలో అమ్మాయి పుట్టిందంటే భయపడే పరిస్థితి ఎందుకుంది? ఆమె పెరిగి, పెద్దదై పెళ్లి చేసుకునేదాకా తల్లితండ్రులు భయాందోళనలకు గురికావలసి రావడానికి కారణం ఏమిటి? సమాజంలో పాతుకుపోయిన మనువాదమే కదా. ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హసి’ (ఏ స్త్రీ కూడా స్వేచ్ఛకు అర్హురాలు కాదు) అనే భావం నరనరాల్లో జీర్ఙించుకున్న సమాజం కదా మనది. స్త్రీని ఒక వస్తువుగా, ఆస్తిగా, కుటుంబ పరువును కాపాడవలసిన జీవిగా పురుషాధిక్య సమాజం చూడటం వల్లే... ఆమె కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే పరువు హత్యలకు పాల్పడుతున్నారు.రాజ్యాంగం మనిషికి స్వేచ్ఛగా బ్రతికే హక్కుని ప్రసాదించింది. ఇష్టమైనవారిని కులమతాల ప్రసక్తి లేకుండా వివాహమాడే స్వేచ్ఛను కల్పించింది. వరకట్నం చట్ట వ్యతిరేకమని తెలిసినా పట్టించుకుంటున్నది ఎంతమంది? కట్నాలు లేకుండా, కులపట్టింపులు లేకుండా తమకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటే వారి మీద కత్తులు నూరటం దుర్మార్గం. ఇవాళ్టి సామాజిక సందర్భంలో పిల్లలు ఒకరిని ఒకరు కలుసు కోవడం, తెలుసుకోవడం, భావి జీవితం గురించి కలలు కనటం అనేది చాలా సహజాతి సహజమైన పరిణామం. ఇందుకు తల్లిదండ్రులు, సమాజం ప్రోత్సహించాల్సిందిపోయి... వాళ్ళు ఏదో సమాజానికి కీడు చేస్తున్నట్టు నియంత్రించడం తగదు. కులం అనే ఒక కాగితపు పులిని చూసి మనిషి తన కన్న బిడ్డల్ని చంపుకొనే క్రూర జంతువుగా మారడం దారుణం. కుల పెద్దలుగా చలామణీ అయ్యేవారు, నాయకులు కులాంతర వివాహం చేసుకున్న జంటల్ని వెంటాడి వేధిస్తు న్నారు. సినిమాల్లో ప్రేమల్ని, ప్రేమికుల కష్టాల్ని చూసి కన్నీళ్లు కార్చే పెద్దలు, తమ కడుపున పుట్టిన బిడ్డలు తమకి ఇష్టం వచ్చిన అబ్బాయినో, అమ్మాయినో కోరుకుంటే... పరువు పోయిందని హత్యలకు తెగపడటం చూస్తూనే ఉన్నాం. సూర్యాపేటలో బంటినీ, మిర్యాలగూడలో ప్రణయ్ లాంటి ప్రేమికులనూ చంపడం ఇందుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వాళ్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవలసి ఉంది. ప్రేమ వివాహాలు, కులాంతర పెళ్లిళ్లు చేసుకునే పిల్లలకు చట్టం, సమాజం మద్దతుగా నిలవాలి.తమ ఇష్టాలకు అనుగుణంగా పెళ్లిళ్లు చేసుకునే పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడం ద్వారా నిజమైన ప్రేమికుల్ని కాపాడుకోవాల్సి ఉంది. అలాగే వాళ్లకు నచ్చకపోతే విడిపోయి స్వేచ్ఛగా బ్రతికే అవకాశాలను కూడా సమాజం ఇవ్వాలి. కులాంతర వివాహం... మానసిక, శారీరక వైకల్యం లేని క్రియాశీల భవిష్యత్ తరానికి బాటలు వేస్తుంది. కులాంతర వివాహాలు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహ కాలు పెంచాలి. ఈ జంటలపై దాడులు చేసేవారిని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే విచారణ చేసి శిక్షించాలి. – ప్రభాకర్ కస్తూరిసమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ‘ 94409 70454 -
దేశ పునర్నిర్మాణానికి మార్గం
భారతదేశం ఈనాడు సామాజిక, ఆర్థిక సంక్షోభంలో ఉంది. రూపాయి విలువ అంతకంతకూ పతనం కావడం దేశ ఆర్థిక వ్యవస్థ దుఃస్థితిని తెలియజేస్తుంది. యువత నైరాశ్యంలో, మత్తులో కునారిల్లుతోంది. స్త్రీలైతే నిరక్షరాస్యతలో, మత కర్మకాండల్లో, పనిలేని తనంతో ఉత్ప్రేరక రహిత జీవితం జీవిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థల్లో కులవివక్ష, అస్పృశ్యత ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని వర్గాల వారే సంపదలను స్వాధీనం చేసుకోవడం పెరుగుతోంది. కొన్ని కులాల వారే వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపార వ్యవస్థల మీద తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కులం పేరుతో సాంఘిక, ఆర్థిక సంస్థలు, విద్యా వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. కుల ఆర్థిక వ్యవస్థ బలీయమైనదిగా రూపొందుతున్నదని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. హర్షద్ మెహతా లాంటి ఒక సామాన్య వ్యక్తి ప్రభుత్వ ఆర్థిక సంస్థలను వినియోగించుకొని వేల కోట్ల సొమ్మును ఏమార్చాడు. అదే చిన్న పొరపాట్లకే ఎస్సీ, ఎస్టీ సివిల్ సర్వీసు ఉద్యోగులు శిక్షలను అనుభవిస్తున్నారు. నూతన ఆర్థిక విధానం, ఉన్నత కులాలకు తమ ఆర్థిక, సామాజిక అధికారాన్ని పటిష్ఠపరుచుకోడానికి కొత్త అవకాశాల్ని ఏర్పరచింది. ఇటీవల ఒక ఏజెన్సీ భారతదేశంలోని వంద మంది ధనవంతుల పేర్లని వెల్లడించింది. వారిలో ఒక్కడు కూడా దళితుడు లేడు. భారతదేశంలోని అస్పృశ్యతా భావం వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. కారణం భూమి పంప కాన్ని ప్రభుత్వాలు నిరాకరించడం! భూములను కార్పొరేట్లకే ధారా దత్తం చేస్తున్నారు కానీ, పేద ప్రజలకు పంచడం లేదు. ఇటీవల సీపీఎం మహాసభలు జరిగినా వారు అస్పృశ్యతా నివారణ మీద, దళితులకు సాగు భూమి పంచాలనే అంశం మీద, కులనిర్మూలనా అంశం మీద తీర్మానం చేయకపోవడం గమనించదగ్గ విషయం.పెరగని శాస్త్రీయ భావనలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 45 మంది ప్రాణాలు కోల్పోవటం విషాదకరం. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని విపరీత ప్రచారం జరగటంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి చేరారు. అంత మందికి అవసరమైన ఏర్పాట్లు చేయకపోవటం వల్లే ఈ ఘోరం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి.అదే రాష్ట్రంలో అంతకుముందు హత్రాస్‌లో జరిగిన ఒక అధ్యాత్మిక కార్యక్రమంలో బోలే బాబా పాద ధూళి కోసం జనం ఎగబడిన సందర్భంలో తొక్కిసలాట జరిగి, 121 మంది చని పోయారు. ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన భక్తుల తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం చెందారు. హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పో యిన సంఘటనలు ఉన్నాయి. ఈ ఆధునిక కాలంలోనూ శాస్త్రీయ భావనలు దేశంలో వెల్లివిరియడం లేదు. సాంకేతిక, వైజ్ఞానిక భావచైతన్యం పెరగడం లేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.అంబేడ్కర్ బాట అందరూ తమ రాజకీయ మేనిఫెస్టోల్లో దళిత వర్గాల స్త్రీల గురించే హమీలిస్తున్నారు. కానీ చివరకు శూన్య హస్తాలే చూపిస్తు న్నారు. ఈ విషయంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1951 అక్టోబర్ 28న తన ముంబయి ఎన్నికల ప్రచారంలో ఇలా విశ్లేషించారు: ‘ప్రతి రాజకీయ పార్టీ తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అని ప్రతి రాజకీయ పార్టీ వాగ్దానం చేస్తుంది. భారత్‌లో అసలు సమస్య పేదరికం. ప్రతి ఏటా కోట్లాది రూపాయిల విలువ గల ఆహార ధాన్యాలు దిగుమతి చేసు కోవాల్సి వస్తే ప్రజలు ఎలా నెట్టుకు రాగలుగుతారు? ఈ విషయా లన్నింటికీ ప్రభుత్వ ఆలోచనల్లో తావులేదు’ అన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు పాలక వర్గాల మనస్తత్వంలో ఏ విధమైన మార్పూ లేదు. దీన్ని ఎదిరించి నిలబడే దళిత బహు జనులకు స్వీయ రాజకీయ చైతన్యం కావాలని అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. రాజ్యాధికారమే ప్రధానమైన ‘కీ’ అని, దళిత బహుజన రాజ్యాన్ని నిర్మించినప్పుడే సంపద పంపిణీ అవుతుందని అన్నారు. లేదంటే పరిస్థితుల్లో మార్పులు రాకపోగా, మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘ఇవాళ దళితుల పరిస్థితి ఏమిటి? నాకు తెలిసినంత వరకూ ముందు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. అదే నిరంకుశత్వం, అదే అణచివేత. పరిపాలనలో అంతకుముందున్న వివక్షే కొనసాగుతోంది’ అన్నారు. అయినా వారికి ఉపశమనం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. అంబేడ్కర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఉద్దేశించి ఈ విశ్లేషణ చేశారు. అవి ఇప్పటికీ స్పష్టంగా అన్వయం అవుతున్నాయి. భారతీయుల బాధ్యతనిజానికి దేశంలో నిరుద్యోగం, పేదరికం, స్త్రీ అణచివేత ఇంకా కొనసాగుతున్నాయి. మరో పక్క ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. కానీ తయారీ రంగానికి అవస రమైన సమస్త యంత్రాలనూ దిగుమతి చేసుకుంటున్నాం. పరి శోధన, అభివృద్ధి రంగంలో మనం చేస్తున్న వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో 1 శాతం కంటే తక్కువ! పరిశోధన అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు సమకూర్చడం, నవకల్పనలను ఇతోధికంగా ప్రోత్సహించడం, కార్మిక శ్రేణుల నైపుణ్యాలను మెరుగుపరచడం అవసరమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలూ ఏవీ అమలు జరగడం లేదు. రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక సూత్రాలు విధ్వంసానికి గురి అవుతున్నాయి. సమాఖ్య భావన తగ్గడంతో రాష్ట్రాల అస్తిత్వాలు సంఘర్షణలో ఉన్నాయి. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గిస్తూ కేంద్రం ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునే క్రమం సాగుతోంది. మేలిమి చదువులు, తీరైన వసతులు, ఉపాధి అవకాశాల కల్పన, అసమా నతల నివారణ ద్వారా జనం బతుకుల్లో వెలుగులు నింపాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని ప్రలోభస్వామ్యంగా మారుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద శక్తులు ఏకం కావలసిన సమయం ఆసన్నమయింది. దేశంలో ఉత్పత్తిని పెంచు కొని, దేశ గౌరవాన్ని పెంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీ యుని మీద ఉంది. ఈ క్రమంలో అంబేడ్కర్ ఆలోచనలను స్వీకరించి అభివృద్ధి భారతానికి బాటలు వేయాలి.డా"కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులుమొబైల్: 98497 41695