Guntur
-
‘చలో విజయవాడ’పై ఉక్కుపాదం.. వాలంటీర్ల గృహ నిర్బంధం
సాక్షి, విజయవాడ: వాలంటీర్ల ‘చలో విజయవాడ’(Chalo Vijayawada) కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల(Volunteers)ను హౌస్ అరెస్ట్ చేశారు. కేబినెట్లో వాలంటీర్ల అంశంపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సెక్రటేరియట్‌కు వెళ్లి సీఎంను కలుస్తామన్న వాలంటీర్లపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. విజయవాడలోని దాసరి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.చలో విజయవాడను అడ్డుకోవడంపై వాలంటీర్లు మండిపడ్డారు. గత ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. వాలంటీర్లకు ఉద్యోగం కల్పించడంతో పాటు బకాయి పడ్డ ఎనిమిది నెలల వేతనం ఇవ్వాలి. పోలీసులతో అడ్డుకున్నంత మాత్రాన మా పోరాటం ఆగదు’’ అని గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయున్ బాషా అన్నారు.‘‘ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే వరకూ వదిలిపెట్టం. చంద్రబాబు అబద్ధాల ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నాడు. మమ్మల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడుపోతుందోనని వాలంటీర్లు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట తప్పి మహిళలను మోసం చేశారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని మంత్రి డోలా బాలవీరాంజనేయులు మాట్లాడటం సిగ్గుచేటు’’ అని షేక్ హుమాయున్ బాషా మండిపడ్డారు.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం -
మీటింగ్‌కు కమిషనర్ డుమ్మా.. గుంటూరు మేయర్ సంచలన వ్యాఖ్యలు
గుంటూరు, సాక్షి: మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు డుమ్మా కొట్టడంపై మేయర్ కావట్టి మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద సహాయం పేరుతో ఖర్చుపెట్టిన నిధులకు లెక్క చెప్పాల్సి వస్తుందని కారణంతోనే కమిషనర్ సమావేశాలకు రావట్లేదని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ..మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు(Puli Srinivasulu) ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. మేయర్ నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా సమావేశం నిర్వహించాల్సిందే. ఈనెల 4వ తేదీన జరిగిన సమావేశంలో విజయవాడ వరదల సహాయం కింద ఖర్చుపెట్టి అంశం మీద ప్రశ్న లేవనెత్తాం. ఆ సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అప్పటి నుంచి కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారు. నగర వరద బాధితుల సహాయం పేరుతో కార్పొరేషన్ సొమ్మును9 కోట్ల 24 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఎంతెంత సాయం చేశారన్నదానిపై మంత్రులు, ఎమ్మెల్యేలకే క్లారిటీ లేకుండా పోయింది. మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు 9 కోట్ల 24 లక్షలు దోచేశారు. పైగా ఖర్చులకు సంబంధించిన తప్పుడు నివేదిక అందించారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఖాతాలో కోటి రూపాయలు జమ చేశారు. కనీసం ఎవరెవరికి ఎంత చెల్లించారో కూడా కమిషనర్ చెప్పటం లేదు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ పై వెంటనే విచారణ చేయాలని ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి లేఖలు రాస్తా. మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner) కు ఓపిక, సహనం ఉండాలి. నేనొక ఐఏఎస్‌ని.. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే కుదరదు. ప్రజలకు ఆయన జవాబుదారిగా వ్యవహరించాలి. పది రోజుల క్రితం కౌన్సిల్ జరుగుతుండగా మధ్యలో అర్ధాంతరంగా కమీషనర్ పులి శ్రీనివాస్ వెళ్లిపోవడం మంచి పద్ధతి కాదు. పులి శ్రీనివాస్ కేవలం మేయర్‌ను, కార్పొరేటర్లను మాత్రమే కాదు.. 11 లక్షల మంది జనాల్ని అవమానించారు. ఆయన మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్న సిబ్బందిని కూడా ఏకపక్షంగా తొలగించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు.ఇవాళ కౌన్సిల్ సమావేశం నిర్వహించమని ఎనిమిదో తారీకు కమిషనర్ పులి శ్రీనివాసులుకు లెటర్ రాశాను. అయినా ఆయన రాలేదు. ఎక్కడ తాను చేసిన అవినీతి చెప్పాల్సి వస్తుందోనని కమిషనర్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల పేరుతో సమావేశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోలేరు.. అని మేయర్ కావట్టి మనోహర్ నాయుడు అన్నారాయన. -
కౌన్సిల్‌ను అభాసుపాలు చేయాలని చూస్తున్నారా?
కమిషనర్ వ్యవహారిస్తున్న తీరు కౌన్సిల్‌ను అభాసుపాలు చేయాలని చూస్తున్నట్టు ఉందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఇది ప్రజలను అవమానించడమేనని స్పష్టం చేశారు. కౌన్సిల్ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ తరుఫున అర్థవంతమైన చర్చ జరగాలని కోరుకుంటున్నామని వివరించారు. ఓ కమిషనర్, అధికారులు కౌన్సిల్ నుంచి వాకౌట్ చేయడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. దీని వెనుక అధికారపార్టీ నాయకుల కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు. వారి కుట్రలను తిప్పకొడతామని స్పష్టం చేశారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న నగర కమిషనర్
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కౌన్సిల్ సభ్యులను అవమానించడమే కాకుండా కౌన్సిల్ జరగకుండా అడ్డుపడుతున్న నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు ధ్వజమెత్తారు. పది రోజులుగా కమిషనర్ వ్యవహార శైలిపై నిరసన వ్యక్తం చేస్తున్న మేయర్ మనోహర్ గురువారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబుతో కలిసి బ్రాడీపేటలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ ఈ నెల 4న జరిగిన నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశంలో ఓ సభ్యుడు లేవనెత్తిన అంశంపై కమిషనర్ వాకౌట్ చేసి వెళ్లిపోవడం దురదృష్టమని పేర్కొన్నారు. తన తప్పులు బయటపడతాయనే భయంతోనే ఆయన బయటకు వెళ్లిపోయారని విమర్శించారు. ఓ అధికారి వాకౌట్ చేసి వెళ్లిపోవడం అంటే కౌన్సిల్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు. కౌన్సిల్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఆయన వెళ్లిపోయినా కౌన్సిల్ నిర్వహణకు సహకరించాలని తాను రెండుసార్లు ఫోన్ చేసినా కమిషనర్ స్పందించలేదని వివరించారు. వాయిదా పడిన కౌన్సిల్ సమావేశాన్ని ఈనెల 17న నిర్వహించాలని ఇప్పటికే రెండుసార్లు కమిషనర్‌కు లేఖ రాసినా స్పందన లేదని పేర్కొన్నారు. కమిషనర్ వ్యవహార శైలి సరిగా లేదని, ఏదేమైనా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్ సమావేశానికి తాము హాజరవుతామని మేయర్ కావటి స్పష్టం చేశారు. మేయర్ మనోహర్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి ధ్వజం -
పెట్టుబడి సాయం కోరుతూ నేడు బెజవాడలో రైతుల ధర్నా
ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకరరావు తెనాలి: ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేల చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం అమలుతో సహా పలు డిమాండ్లతో ఈనెల 17వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న ధర్నాలో రైతాంగం పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకరరావు కోరారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. 2024–25 ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ముగిసిందని, రబీ సీజను కూడా సగానికి పూర్తయినా పెట్టుబడి సాయం ఇవ్వకపోవటం అన్యాయమన్నారు. ఉచిత పంటల బీమా కొనసాగించాలని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. వాణిజ్య, ఉద్యాన సహా మిగిలిన అన్ని పంటలకు ధరలు పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అదనపు చార్జీలను రద్దుచేయాలని కోరారు. పాడి రైతులకు పొరుగు రాష్ట్రాల్లో ఇస్తున్న విధంగా లీటరుకు రూ.5 బోనస్ ఇవ్వాలని, కౌలురైతులకు బ్యాంక్ రుణాలు, సబ్సిడీలను అందించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధ నకు శుక్రవారం విజయవాడలోని అలంకార్ సెంట ర్లోని ధర్నాచౌక్‌కు తరలిరావాలని రైతులకు విజ్ఞప్తిచేశారు. వీరితోపాటు రైతు ప్రతినిధులు కన్నెగంటి భాస్కర్చంద్, పోతురాజు కోటేశ్వరరావు, జెట్టి బాలరాజు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు ఉన్నారు. -
అవినీతికి పాల్పడితే చట్టం చూస్తూ ఊరుకోదు
నగర కమిషనర్ పులి శ్రీనివాసులు చట్టానికి అతీతమైన వ్యక్తిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుడమేరు వరదల సమయంలో సాయం మాటున చేసిన అక్రమాలు, అవినీతికి కమిషనర్ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ‘‘మూడేళ్లలో తాను రిటైర్డ్ అవుతాను.. అప్పటి వరకు నేను ఏమి చేసిన ఏమీ కాదు’’ అని కమిషనర్ భావిస్తే ఎక్కడ ఉన్నా.. చట్టం లాక్కొస్తుందని అంబటి హెచ్చరించారు. సంక్రాంతి సంబరాల్లో మేయర్‌ను భాగస్వామ్యం చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. సమావేశంలో డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, కో–ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. -
పసుపు సౌభాగ్యం దక్కేనా!
భరోసా లేక రైతుల ఆందోళన తెనాలి/కొల్లిపర: ఏపుగా పెరిగి, పచ్చని పసిమితో కళ్ల ముందు కళకళలాడుతున్న పసుపు పైరు రైతుకు సంతృప్తినివ్వడం లేదు. భూమిలో దుంప చక్కగా ఊరుతుందన్న భరోసా లేదు. పంట దున్నేనాటికి ఆశించిన దిగుబడి రాదనే గుబులుతో రైతులు ఉన్నారు. ఖరీఫ్ సీజనులో అధిక వర్షాలు, అల్పపీడనాలు, ప్రతికూల వాతావరణంతో కొనసాగటమే పైరుకు చేటు తెచ్చింది. అక్కడక్కడా తెగుళ్లూ ఆశించాయి. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర ఉండటమే రైతులకు కొంచెం ఊరటనిచ్చే అంశం. పసుపు మార్కెట్‌కు వచ్చేవరకు ఇవే ధరలు ఉండాలని కోరుకుంటున్నారు. పెరిగిన సాగు విస్తీర్ణం తెనాలి నియోజకవర్గంలోని 2,300 ఎకరాల్లో రైతులు పసుపు సాగు చేశారు. ఇందులో అధికశాతం కొల్లిపర మండలంలోనే ఉంది. కృష్ణా నదికి వరదల కారణంగా లంక భూముల్లో దాదాపు 800 ఎకరాల వరకు పంట దెబ్బతింది. ప్రస్తుతం 1,500 ఎకరాలు మాత్రమే సాగులో ఉంది. ఖరీఫ్ సీజనులో నాటిన పసుపు జనవరి, ఫిబ్రవరి నెలల్లో చేతికొస్తుంది. వాస్తవానికి 2023లో పసుపుకు మార్కెట్ ధర పతనం కావడంతో ఆ ఏడాది కొందరు రైతులు సాగుకు విముఖత చూపారు. అయితే, 2024 సీజనులో అనూహ్యంగా ధర పెరిగింది. ప్రారంభంలో క్వింటాలు రూ.5వేలకు కాస్త అటూఇటూగా ఉన్న ధర పెరుగుతూ రూ.14,800 వరకు పలికింది. దీంతో 2024–25 ఖరీఫ్ సీజనులో సాగు విస్తీర్ణం కొంత పెరిగింది. పెట్టుబడి అధికం ఇతర పంటలతో పోలిస్తే పసుపుకు ఖర్చులు అధికం. గతేడాది మార్చిలో పెరిగిన మార్కెట్ ధరలతో విత్తనం ధర కూడా భారీగానే పెరిగింది. ఎకరాకు ఆరు పుట్ల చొప్పున నాటుతారు. ఒక్కో పుట్టి ధర రూ.10 వేలకు రైతులు కొనుగోలు చేశారు. విత్తనం నాటడం నుంచి ఎండు పసుపు చేతికొచ్చే సరికి ఒక్కో ఎకరాకు కనీసం రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. కౌలు రైతులకు రూ.50 వేలు అదనం. వెంటాడిన ప్రతికూల వాతావరణం భారీ పెట్టుబడితో సాగుచేస్తున్న పసుపు పైరును ఖరీఫ్ సీజనులో ఆది నుంచి ప్రతికూల వాతావరణమే వెంటాడింది. ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీవర్షాలతో పల్లపు చేలల్లో నీరు నిలిచింది. కృష్ణానది ఒడ్డున గల లంక చేలు వరదల్లో మునిగిపోయాయి. నీరు నిలిచిన చేలల్లో అక్కడక్కడా దుంపకుళ్లు, తాటాకు తెగులు సోకాయి. భూమిలో పసుపు దుంప ఊరే సమయంలో గత డిసెంబరులో అల్పపీడనం కారణంగా నెల మొత్తం ముసురు వాతావరణం నెలకొంది. సూర్యరశ్మి పెద్దగా లేకపోవడంతో ఈసారి ఎకరాకు కనీసం అయిదు క్వింటాళ్ల దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ధర ఆశాజనకం దిగుబడి తగ్గినప్పటికీ మార్కెట్ ధర నిలకడగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ధర ఆశాజనకంగానే ఉంది. దుగ్గిరాల యార్డులో క్వింటాలు రూ.11 వేల వరకు ధర పలుకుతోంది. పంట చేతికొచ్చేసరికి ఈ ధరలు పెరిగితే ఒడ్డున పడతారు. గతేడాది కల్లాల్లోనే రూ.12 వేల ధర పలికిందని రైతులు గుర్తు చేస్తున్నారు. దిగుబడి తగ్గుతుందని దిగులు అధిక వర్షాలు, ప్రతికూల వాతావరణమే కారణం సగటున ఎకరాకు ఐదు టన్నుల దిగుబడి తగ్గే అవకాశం మార్కెట్ ధరలపైనే ఆశలు -
నన్ను చాంపియన్‌గా నిలిపింది
ఇటువంటి టోర్నీల ద్వారా దేశ, విదేశాల క్రీకారులతో తలపడే అవకాశం లభించింది. ఈ నెల 8న నెల్లూరులో జరిగిన 29వ ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ విజేతగా నిలిపింది. క్రీడాకారులు అతి సులభంగా, ఖాళీ సమయాల్లో దీనిని సాధన చేస్తే సరిపోతుంది. ఖర్చు కూడా చాలా తక్కువ. ఇప్పుడు డబ్బులు కూడా వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు పొందే వీలుంటుంది. –సిహెచ్.జనార్దన్ రెడ్డి, భారత్ నంబర్ వన్ క్రీడాకారుడు ● -
క్యారమ్స్ క‘మనీ’యం
గుంటూరు వెస్ట్: క్యారమ్స్ అంటే అతి సాధారణ క్రీడగా కొందరు భావిస్తారు. అయితే రాణిస్తే ఇందులోనూ పేరు ప్రఖ్యాతులతోపాటు రూ.కోట్లు పొందవచ్చు. తమిళనాడుకు చెందిన ఎ.మరియ ఇరుదయంకు ఇదే క్రీడలో అర్జున అవార్డు(1996) లభించింది. గత ఏడాది అమెరికాలో జరిగిన 6వ ప్రపంచ కప్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ఖాజీమా మహిళా విభాగంలో ప్రపంచ విజేతగా నిలిచారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.కోటి బహుమతి ఇచ్చింది. డీపీసీఎల్ సిద్ధం క్యారమ్స్‌లోనూ ఐపీఎల్ తరహా టోర్నీ డెక్కన్ ప్రీమియర్ క్యారమ్స్ లీగ్(డీపీఎల్) 2022 నుంచి జరుగుతోంది. ఈ ఏడాది సీజన్–3 జరగనుంది. దేశంలోని అత్యుత్తమ ప్లేయర్స్‌ను ఒకే వేదికపైకి తెచ్చి వారి ప్రతిభకు చక్కని నజరానా అందించే టోర్నీ ఇది. సీజన్–3ని వజ్రా స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించనుంది. ప్రముఖ క్యారమ్స్ క్రీడాకారులను వేలంలో కొనుగోలు చేసి వారిని బృందాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తుంది. టోర్నీలో రూ.12 లక్షలకుపైగానే విజేతలకు బహుమతుల ద్వారా అందించనున్నారు. వీరికి ఆంధ్రా క్యారమ్స్ అసోసియేషన్ అన్ని విధాలుగా సహకరిస్తోంది. క్యారమ్స్కు అంతర్జాతీయ ఖ్యాతితోపాటు కార్పొరేట్ హోదా తీసుకొచ్చేందుకు నాలుగేళ్ల నుంచి ఆంధ్రా క్యారమ్స్ అసోసియేషన్ పెద్దలు కృషి చేస్తున్నారు. మూడోసారి పోటీలు.. ఈ మెగా టోర్నీని మూడోసారి నిర్వహిస్తున్నారు. తొలుత విశాఖలో 2022లో నిర్వహించగా అప్పుడు ప్రైజ్ మనీగా రూ.4 లక్షలు అందించారు. దీనిని హైదరాబాద్‌కు చెందిన గోల్కొండ వారియర్స్ గెలుచుకుంది. రెండోసారి 2023లో నిజామాబాద్‌లో రూ.7 లక్షల ప్రైజ్‌మనీతో ఏర్పాటు చేయగా టెకౌట్ డీజీ చాంప్స్ గెలుపొందింది. ఇప్పుడు మూడోసారి విశాఖలోని అత్యాధునిక ఎస్3 స్పోర్ట్స్ ఎరీనా స్టేడియంలో ఈ నెల 17 శుక్రవారం నుంచి నిర్వహించనున్నారు. జట్ల ప్రత్యేకతలు దేశంలోని ప్రఖ్యాత క్యారమ్స్ ప్లేయర్స్ పాల్గొనే ఈ సమరంలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఒక్కొక్క జట్టులో ఆరుగురు పురుషులు, ఒక మహిళతో సహా ఏడుగురు ప్లేయర్స్ ఉంటారు. ఇటీవల నిర్వహించిన వేలంలో వీరిలో కొందరికి రూ.లక్ష వరకు చెల్లించి జట్లు ఎంపిక చేసుకున్నాయి. గ్రీన్ కలర్ క్యారమ్ బోర్డుపై మిల్క్ వైట్ కాయిన్స్‌తో క్రీడాకారులు తలపడతారు. జట్టు ఎంట్రీ ఫీజు రూ.3 లక్షలు. రౌండ్ రాబిన్ లీగ్‌తో ప్రారంభమై టాప్ 4 జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఓటమి పొందే జట్లు టోర్నీ నుంచి తప్పుకుంటాయి. చివరకు విజేతను నిర్ణయిస్తారు. దీని కోసం ఆంధ్రా క్యారమ్స్ అసోసియేషన్ అంతర్జాతీయ రిఫరీలను నియమించింది. కొన్ని చానళ్లలో మ్యాచ్‌ల లైవ్‌కు ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్ తరహాలో డీపీసీఎల్ దేశంలోని అత్యుత్తమ ప్లేయర్స్ సమరం బహుమతుల విలువ రూ.12 లక్షలు పైమాటే నేటి నుంచి విశాఖలో టోర్నీ ప్రారంభం ప్రజలకు చేరువ చేసేందుకే క్యారమ్స్ క్రీడలో భారత్‌కు మంచి పేరుంది. దీనిని మరింత పెంచడంతోపాటు ప్రజలకు చేరువ చేసేందుకు ఇటువంటి మెగా టోర్నమెంట్ ఉపయోగపడుతుంది. టోర్నమెంట్ నిర్వహించేందుకు ముందుకు వచ్చిన వజ్రా స్పోర్ట్స్‌కు ధన్యవాదాలు. దేశంలోని ప్రముఖ, ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులు పాల్గొనడంతో ఔత్సాహికులకు నేర్చుకునేందుకు ఎంతో అవకాశం లభిస్తుంది. –డాక్టర్ నీరజ్ కుమార్ సంపతి, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రా క్యారమ్స్ అసోసియేషన్ -
జాతీయ భద్రతా మాసోత్సవాలు ప్రారంభం
నరసరావుపేట: జిల్లాలో గురువారం నుంచి జాతీయ భద్రతా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. పోలీసు, కలెక్టరేట్ కార్యాలయాల్లో ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గనోరే రోడ్డు భద్రతా బ్యానర్లు, బ్రోచర్లు ఆవిష్కరించి మాసోత్సవాలను ప్రారంభించారు. ఈ మాసోత్సవాలు ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్నామని జిల్లా రవాణాశాఖ అధికారి జి.సంజీవకుమార్ పేర్కొన్నారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 10 నుంచి 16 వరకు ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అధిక చార్జీలు వసూలు చేసినందుకు 38 బస్సులపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. మరికొన్ని వాహనాలపై 74 కేసులు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో మోటారు వాహన తనిఖీ అధికారి ఎన్.శివనాగేశ్వరరావు, సహాయ మోటారు తనిఖీ అధికారులు ఎం.మనీషా, ఎంఎల్.వంశీకృష్ణ, ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్సీసీ క్యాడెట్ల ట్రెక్కింగ్ శిబిరం గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు ఎన్సీసీ గ్రూప్, 10 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో తొలిసారిగా ట్రెక్కింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు గుంటూరు ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్.ఎం.చంద్రశేఖర్ తెలిపారు. అఖిల భారత మహిళా ట్రెక్కింగ్–3 పేరుతో గురువారం నుంచి ఈనెల 23 వరకు శిబిరంలో భాగంగా కొండవీడు, ఫిరంగిపురం కొండ, కోటప్పకొండలలో ఎన్సీసీ క్యాడెట్లు ట్రెక్కింగ్ నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఇందు కోసం ఆంధ్ర, తెలంగాణ పరిధిలోని తొమ్మిది ఎన్సీసీ గ్రూపులకు చెందిన దాదాపు 600 మంది విద్యార్థినులు గురువారం గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలకు చేరుకున్నారని చెప్పారు. ఉరుసు సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): ఈనెల 17 నుంచి 21 వరకు జరగనున్న హజరత్ కాలే మస్తాన్‌షా వలియా దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ మళ్లించినట్టు ట్రాఫిక్ డీఎస్పీ ఎం.రమేష్ తెలిపారు. చుట్టుగుంట వైపు నుంచి మున్సిపల్ ట్రావెల్స్ బంగ్లా (ఎంటీబీ) సెంటర్ వైపు వచ్చే కార్లు, అంతకంటే భారీ వాహనాలు ఐటీసీ కంపెనీ, నగరంపాలెం పోలీసు స్టేషన్, ఎస్బీఐ సెంటర్ మీదుగా ఎంటీబీ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. చుట్టుగుంట నుంచి వచ్చే ద్విచక్రవాహనాలు, ఆటోలు చక్కల బజారు, మూడు బొమ్మల సెంటర్ మీదుగా ఎంటీబీ సెంటర్‌కు వెళ్లాలని తెలిపారు. గుంటూరు నగరం నుంచి చుట్టుగుంట వైపు వెళ్లే వాహనాలు యథావిధిగా వెళ్లవచ్చని సూచించారు. 20 నుంచి ఇంటర్ ప్రీ–ఫైనల్స్ పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ప్రీ–ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలతో పాటు హైస్కూల్ ప్లస్‌లలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి ప్రశ్నపత్రాలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు ఆరు ఎయిడెడ్, ఐదు కాంపోజిట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రశ్నపత్రాలు సరఫరా చేయనున్నట్లు ఆర్ఐవో జీకే జుబేర్ తెలిపారు. ఇంటర్‌బోర్డు నిబంధల మేరకు ప్రీ–ఫైనల్స్ పరీక్షల నిర్వహణపై ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్పారు. అదే విధంగా ప్రైవేటు జూనియర్ కళాశాలల పరిధిలో ప్రీ–ఫైనల్ పరీక్షల నిర్వహణకు కళాశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 60,180 బస్తాల మిర్చి రాక కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 60,180 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 59,267 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.7,500 నుంచి రూ.15,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.7,500 నుంచి రూ.16,000 వరకు ధర లభించింది. -
క్రీడాకారులకు ప్రోత్సాహం
క్రీడాకారులకు ఒక అదృష్టమనే చెప్పాలి. కార్పొరేట్ వ్యక్తులు దీనిని ప్రమోట్ చేయడంతో క్రీడాకారులకు ప్రోత్సాహంతోపాటు కొంత ఆర్థ్ధిక వెసులుబాటు లభిస్తుంది. సాధారణ క్రీడాకారుడు ప్రపంచ నంబర్ వన్‌తో పోటీపడే అవకాశం లభిస్తుంది. మూడేళ్ల నుంచి రాష్ట్రంలో క్యారమ్స్ ఆట చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. –షేక్ అబ్దుల్ జలీల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రా క్యారమ్స్ అసోసియేషన్ -
వేడుకగా గణతంత్ర దినం నిర్వహిద్దాం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈనె 26న గణతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను అధికారులు సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ఎస్పీ సతీష్ కుమార్, జేసీ భార్గవ్ తేజతో కలిసి ఆమె సమీక్షించారు. అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖజావలి, డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, ఆర్డీఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, డ్వామా పీడీ శంకర్, హౌసింగ్ పీడీ ప్రసాద్, డీఈఓ రేణుక, డీఎస్ఓ కోమలి పద్మ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ కలెక్టరేట్లోని వీసీ హాల్లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల బ్రోచర్, కరపత్రాలు, బ్యానర్లను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జేసీ ఎ.భార్గవ్ తేజ, ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి గురువారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ప్రజలకు, పోలీస్ శాఖకు మధ్య వారధులు మహిళా పోలీసులు నగరంపాలెం(గుంటూరు వెస్ట్): క్షేత్రస్థాయిలో ప్రజలకు, పోలీసు శాఖకు మధ్య మహిళా పోలీసులు వారధులని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. జిల్లాలోని గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల (మహిళా పోలీసులు) జాబ్ చార్ట్ యాప్‌ను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లోని హాల్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాబ్ చార్ట్ యాప్‌తో జవాబుదారీతనం ఉంటుందని వివరించారు. ప్రజా సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయడంలో మహిళా పోలీసుల పాత్ర కీలకమని చెప్పారు. సమావేశంలో మహిళా పీఎస్ డీఎస్పీ సుబ్బారావు, ఐటీ విభాగం సీఐ నిస్సార్‌బాషా, హెచ్‌సీ కిషోర్, కానిస్టేబుళ్లు ఇమామ్‌సాహెబ్, మానస, యాసిన్ పాల్గొన్నారు. కలెక్టర్ నాగలక్ష్మి మహిళా పోలీసుల జాబ్ చార్ట్ యాప్ ఆవిష్కరణ -
డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభం
పట్నంబజారు: డ్రైవర్లు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ ఎం.రవికాంత్ చెప్పారు. గుంటూరు జిల్లా పరిధిలోని హెవీమోటారు వెహికల్ డ్రైవింగ్ స్కూల్ 18 బ్యాచ్‌కు శిక్షణ తరగతులు గురువారం బస్టాండ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. హెవీ డ్రైవింగ్ స్కూల్లో సీనియర్ డ్రైవర్ల చేత నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిపో –2 మేనేజర్, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్ షేక్ అబ్దుల్సలాం పాల్గొన్నారు. కంప్యూటర్, ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణ గుంటూరు ఎడ్యుకేషన్: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు బెంగుళూరులో కంప్యూటర్, ట్యాలీ నైపుణ్యంపై ఉచిత శిక్షణతో పాటు నూరు శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి హరిప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగుళూరులో 35 రోజుల పాటు ఉచిత భోజన, వసతితో కూడిన శిక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 90004 87423 ఫోను నంబర్లో సంప్రదించాలని సూచించారు. బైకును ఆటో ఢీకొని ఒకరు మృతి మేడికొండూరు: రోడ్డుపై వేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో బైకుపై వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మండలంలోని సత్తెనపల్లి రోడ్డులోని గుళ్ళపాలెం అడ్డరోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. కొరప్రాడు గ్రామానికి చెందిన పెరుగు నాగ వెంకట అనంత మోహన కుమార్, గోపి నీలం సుదర్శన్‌లు ద్విచక్ర వాహనంపై కొరప్రాడు నుంచి గుంటూరుకు బయలుదేరారు. గుళ్ళపాలెం అడ్డరోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో వీరి వాహనాన్ని ఢీకొట్టింది. పెరుగు నాగ వెంకట అనంత మోహన్ కుమార్(23) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. నీలం గోపి సుదర్శన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ పరారయ్యాడు. మేడికొండూరు పోలీసులు ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నీలం గోపి సుదర్శన్‌ను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య ప్రేమ వివాహమైన 6 నెలలకే విషాదం తాడికొండ: వివాహం జరిగిన 6 నెలలకే యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడికొండ మండలం ముక్కామల గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన షేక్ షన్ను(22)కు రావెల యశోదరావుతో గతేడాది మే నెలలో ప్రేమ వివాహం జరిగింది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ముక్కామలలోని ఇంటిలో ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ జీత్యా నాయక్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు. -
పురస్కారాలకు ఎంపికై న తెనాలి కవులు
తెనాలి: ప్రముఖ సాహితీ, సాంస్కతిక, సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఏటా బహూకరిస్తున్న తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారాలకు తెనాలి నుంచి నలుగురు సాహితీమూర్తులు ఎంపికయ్యారు. శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పొయెట్రీ అకాడమీ సంయుక్తంగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నాయి. ఈ నెల 21వ తేదీన విజయవాడలో సాహిత్య సభలో పురస్కారాలను అందజేస్తారు. శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఈ మేరకు సమాచారం పంపారు. పురస్కారాలను అందుకోనున్న వారిలో తెనాలికి చెందిన ప్రముఖ కవయిత్రి/తెలుగు ఉపాధ్యాయిని షేక్ అస్మతున్నీసా, రంగిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రంగిశెట్టి రమేష్ (గంగాశ్రీ), సాహితీబంధువు ఆళ్ల నాగేశ్వరరావు (కమలశ్రీ), ప్రముఖ పద్యకవి డాక్టర్ పాతూరి సుబ్రహ్మణ్యం ఉన్నారు. వీరిని పట్టణానికి చెందిన పలువురు రచయితలు అభినందించారు. -
యువకుడిపై హత్యాయత్నం
తెనాలి రూరల్: తెనాలిలో యువకుడిపై హత్యాయత్నం జరిగింది. వెండి పని చేసుకునే తేలప్రోలు గ్రామానికి చెందిన షేక్ సుభానీపై గురువారం ఉదయం నడిరోడ్డుపై ఈ హత్యాయత్నం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తేలప్రోలుకు చెందిన షేక్ సుభానీ తన సోదరుడు బాజితో కలిసి ఓ ఫంక్షన్‌కు మిత్రులను పిలిచేందుకు తెనాలి వచ్చాడు. గాంధీచౌక్ నుంచి కొత్తపేట వెళ్లే దారిలో రోడ్డు పక్కన నిలబడి ఉండగా తేలప్రోలుకు చెందిన అరాఫత్, ఇర్ఫాన్‌లు వచ్చి కత్తితో దాడి చేశారు. సుభానీ తీవ్రంగా గాయపడటంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. సుభానీ బంధువులు, సోదరుడు మాట్లాడుతూ.. తమ ఊరికే చెందిన అరాఫత్, ఇర్ఫాన్‌లు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. అదేమంటే తమకు జనసేన అండ ఉందని చెబుతూ రెచ్చిపోతున్నారని వాపోయారు. -
దళితులపై కూటమి ప్రభుత్వానికి ద్వేషం
ఫిరంగిపురం: కూటమి ప్రభుత్వానికి దళితులంటే ద్వేషం అని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. మండలంలోని పొనుగుపాడు గ్రామం ఎస్సీకాలనీలోని బాధిత దళితులను గురువారం ఆయన పరామర్శించారు. చర్చిగోడకు సంబంధించి కూల్చివేసిన ఘటన గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ బలంతో పోలీసులను అడ్డుపెట్టుకొని దళితులను నిర్బంధించి గోడ కూలగొట్టి రోడ్డు వేశారన్నారు. ఇది దారుణమైన సంఘటన అని పేర్కొన్నారు. గ్రామంలో ఎప్పుడో బ్రిటీష్ వారి కాలంలో దళితులకు చర్చి కోసం స్థలం కేటాయించారని చెప్పారు. ఇక్కడి గోడను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోర్టు కేసులను కూడా పట్టించుకోకుండా కూల్చివేశారని చెప్పారు. గతంలో కూడా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం దేవరపల్లిలో ఈ తరహా సంఘటన జరిగిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు ఉన్నతస్థానం కల్పించారని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులపై ప్రభుత్వానికి ఎందుకింత ద్వేషం అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా పచ్చ మీడియా కనీసం నోరు కూడా మెదపని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గ్రామంలో కూడా పేదదళితులు చర్చికి ఒకవైపు గోడ నిర్మించుకున్నారని, మరోవైపు డబ్బు లేక నిర్మించుకోలేదని చెప్పారు. అధికారబలంతో ఎంపీ, ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్, అధికారులు కలిసి గోడను పడగొట్టించడం దారుణమన్నారు. దళిత ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఇంత జరుగుతున్నా కనీసం నోరు విప్పకపోవడం సరికాదన్నారు. పేద ప్రజలు నమ్ముకున్న చర్చికి సంబంధించిన గోడను పునర్మించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని మరలా వారికి కేటాయించాలని డిమాండు చేశారు. సమావేశంలో స్థానిక నాయకులు గేరా కోటేశ్వరరావు, సేవా నాగరాజు, మేళం జోజిబాబులు పాల్గొన్నారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పొనుగుపాడులో దళితులకు పరామర్శ -
పీఎం ఇంటర్న్‌షిప్ పోస్టర్ ఆవిష్కరణ
లక్ష్మీపురం: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంపై రూపొందించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ సంయుక్తంగా గురువారం ఆవిష్కరించారు. కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో కార్యక్రమం జరిగింది. అర్హులైన వారు పీఎంఇంటర్న్షిప్.ఎం.సి.ఏ.జీఓవి.ఐఎన్ అనే వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వివరాలకు 99885 3335, 87126 55686, 87901 18349, 87901 17279, 80745 97926 లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు. -
తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రులకు అప్పగింత
మంగళగిరి (తాడేపల్లి రూరల్): ఉదయం తప్పిపోయిన బాలుడ్ని గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని టిడ్కో గృహ సముదాయాల్లో నివాసముంటున్న దంపతులకు మతిస్థిమితం లేని కుమారుడు (8) ఉన్నాడు. గురువారం ఉదయం నుంచి కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెదికారు. మంగళగిరి బస్టాండ్ ఎదురు రోడ్డులో ఓ గుర్తుతెలియని వాహనం సదరు బాలుడ్ని ఢీకొని వెళ్లిపోవడంతో చుట్టుపక్కల ఉన్న కొంతమంది యువకులు ఆరా తీశారు. మతిస్థిమితం లేని బాలుడు ఏమీ మాట్లాడలేకపోవడంతో పోలీసులకు అప్పగించారు. రెండు గంటల వ్యవధిలో బాలుడి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అక్కడ తమ కుమారుడిని చూసి విలపించారు. కుమారుడిని పోలీసులకు అప్పగించిన యువకులకు, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు
నగరంపాలెం: స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు గురువారం కొనసాగాయి. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మైదానానికి చేరుకుని వారికి పలు సూచనలు చేశారు. 383 మందిలో 77 మంది ధ్రువపత్రాలు తేకపోవడంతో వెనుదిరిగారు. మిగతా 306 మందికి శరీర కొలత పరీక్షలు నిర్వహించగా, 23 మందిని తిరస్కరించారు. మిగతా వారికి 1,600 మీటర్ల పరుగు పందెం జరగ్గా, 41 మందిని అనర్హులుగా ప్రకటించారు. 241 మందికి 100 మీటర్ల పరుగు పందెం పెట్టగా 147 మంది అర్హత సాధించారు. 242 మందికి లాంగ్ జంప్ నిర్వహిస్తే 236 మంది అర్హత సాధించారు. 306 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా 238 మంది అర్హత సాధించారు. జిల్లా ఏఎస్పీలు ఏవీ రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్) పర్యవేక్షించారు. -
ఏటీఎం మోడల్‌తో నిరంతర ఆదాయం
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం మోడల్ ద్వారా నిరంతరం ఆదాయం పొందవచ్చని డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. పట్టణంలోని పోస్టల్‌కాలనీలో ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆకుకూరలు, కూరగాయలు సాగుచేస్తున్న కోడూరి వెంకటేశ్వరరెడ్డి పొలాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు ఎకరాల్లో అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు వెంకటేశ్వరరెడ్డి పండిస్తున్నట్టు తెలిపారు. ఆకుకూరలు కట్ట రూ.10కే విక్రయిస్తున్నారని, వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మూడు అడుగుల వెడల్పుతో బెడ్స్ వేసుకొని వాటిలో అవసరం మేరకు విత్తే దశలో, పెరిగే దశలో, పాత దశలో ఉండే విధంగా తోటకూర, చుక్కకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీరతో పాటు టమాటాలు, గోరుచిక్కుడు, వంగ, మిరప, క్యాబేజీ, బెండలతో పాటు తీగజాతి కూరగాయలను పండిస్తున్నారని వివరించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్లో ఈ ఉత్పత్తులను అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
సురక్షిత చెల్లింపులకు ‘డాక్ పే’
డిజిటల్ లావాదేవీలకు తపాలా శాఖ ప్రోత్సాహం లక్ష్మీపురం: తపాలా శాఖ వినియోగదారుల కోసం ఆన్లైన్లో నగదు బదిలీ చేసుకునేందుకు డాక్ పే సురక్షిత యాప్‌గా మారింది. దాదాపు మూడేళ్ల క్రితం కేంద్రం దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఈ డాక్ పే ద్వారా డిజిటల్ ఫైనాన్స్ సేవలు పొందడంతోపాటు ఇండియా పోస్టు, ఐపీపీబీ, బ్యాంకింగ్ సేవల విషయమై సాయం పొందవచ్చు. డబ్బు పంపడం, క్యూఆర్ కోడ్ స్కాన్, డిజిటల్ రూపంలో వ్యాపారులకు నగదు చెల్లించడం వంటి పనులను చక్కబెట్టుకోవచ్చు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో యూపీఐ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేలా చిరు వ్యాపారులు ఈ డాక్ పే ద్వారా వినియోగదారుల నుంచి డిజిటల్ చెల్లింపులు స్వీకరించవచ్చు. ఏ బ్యాంకు ఖాతా అయినా సరే అనుసంధానం చేసుకునే వెలుసుబాటు కల్పించారు. తాజాగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ప్రవేశ పెట్టిన వర్చువల్ డెబిట్ కార్డును వినియోగించి ఈ ● కామర్స్ వెబ్సైటులో ఆన్లైన్ క్రయ విక్రయాలు కూడా చేసుకోవచ్చు. దీని కోసం ఐపీపీబీ (ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు) మొబైల్ బ్యాకింగ్ యాప్‌ను ఖాతాదారులు తమ స్మార్డ్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. పెన్షనర్లు ప్రతి ఏడాది డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను రూ.70కే తమ ఇంటి వద్దగానీ, పోస్ట్ ఆఫీస్‌లోగానీ, పోస్ట్‌మాన్ ద్వారా గానీ పొందే సదుపాయం కూడా ఇటీవల ప్రవేశపెట్టింది. తక్కువ ప్రీమియంతో బీమా.... ఖాతాదారుకు కేవలం రూ.330తో రూ.2 లక్షల బీమా సదుపాయం కూడా పీఎంజేజేబీవై (ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన) ద్వారా సంవత్సరం చెల్లుబాటయ్యేలా బీమా సదుపాయాన్ని కల్పిస్తారు. ఇప్పటి వరకు పలు యాప్‌లలో నగదు లావాదేవీలకు సంబంధించి సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి కార్యాలయాలు, బ్రాంచ్‌లు ఎక్కడా లేవు. డాక్ పే యాప్ ద్వారా నగదు బదిలీ సమయంలో ఏ ఇబ్బంది వచ్చినా పరిష్కరించుకునేందుకు తపాలా శాఖ వెసులుబాటు కల్పించింది. వివరాలకు ఐపీపీబీ టోల్‌ఫ్రీ నంబర్ 155299ను వినియోగదారులు సంప్రదించవచ్చు.సమస్యల పరిష్కారం బాధ్యత మాదే ఇతర ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల యాప్‌లకు ప్రత్యేకంగా కార్యాలయాలు, బ్రాంచ్‌లు లేవు. కానీ తపాలా శాఖ ప్రవేశ పెట్టిన డాక్ పే యాప్ ద్వారా నగదు బదిలీ సమయంలో అవకతవకలు జరిగినా, నగదు జమ కాకపోయినా, ఇతత సమస్యలెదురైనా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంది. డాక్ పే అనే యాప్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తుంది. – యలమందయ్య, పోస్టల్ సూపరింటెండెంట్, గుంటూరు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
నాదెండ్ల: రోడ్డు ప్రమాదంలో గుంటూరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలెక్షన్ మేనేజర్ మన్నెం వెంకట రాజేష్ (45) దుర్మరణం పాలయ్యారు. గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై సాతులూరు గ్రామ సమీపంలోని హోసన్న ప్రార్థనా మందిరం వద్ద గురువారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఎస్ఐ జి.పుల్లారావు తెలిపిన వివరాల మేరకు గుంటూరు వసంతరాయపురం సమీపంలోని వెంగయ్యనగర్ నాలుగో లైనుకు చెందిన మన్నెం వెంకటరాజేష్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరుకు చెందిన మరో వ్యక్తి వినుకొండ నవీన్ క్రెడిట్ కార్డు ఏజెన్సీ టీం లీడర్‌గా పనిచేస్తున్నాడు. వీరిరువురూ ద్విచక్రవాహనంపై నరసరావుపేటకు వెళ్తూ సాతులూరు చర్చి వద్దకు రాగానే గేదెను తప్పించే క్రమంలో వెనుకగా వస్తున్న కియా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వెంకటరాజేష్ను కారులో నరసరావుపేట తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వాహనం నడుపుతున్న నవీన్‌కు గాయాలు కావటంతో ఆసుపత్రిలో చేర్చారు. -
25 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణ
రేపల్లె రూరల్: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారం అపహరణకు గురైన సంఘటన పట్టణంలోని 23వ వార్డులో చోటుచేసుకుంది. సీఐ మల్లికార్జునరావు వివరాల మేరకు.. అల్లపర్తి లావణ్య, ఆమె భర్త వాసులు ఈ నెల 2వ తేదీన బాపట్ల వెళ్లారు. వారి ఇరువురు పిల్లలు హైదరాబాద్ వెళ్లారు. బుధవారం ఆమె ఇంటికి తిరిగి రాగా అప్పటికే ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోని బీరువా తెరచి ఉంది. బీరువాలోని 25 సవర్ల బంగారు ఆభరణాలు కనిపించలేదు. బాధితురాలు లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. సంఘటనా స్థలాన్ని వేలిముద్రల బృందం పరిశీలించింది. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
తెనాలి రూరల్: తెనాలిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పట్టణంలోని ముత్తెంశెట్టిపాలెం నుంచి ఇస్లాంపేట వైపు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఆమె మృతి చెంది ఉండటాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. తమిళనాడుకి చెందిన మణి అనే వ్యక్తితో 50 ఏళ్ల ఈ మహిళ కొంత కాలంగా కలిసి ఉంటోందని చెబుతున్నారు. మణి కర్రీ పాయింట్లో పని చేస్తుండగా, మహిళ బిక్షాటన చేసేదన్నారు. గత రాత్రి రోడ్డు పక్కన నిద్రించిన మహిళ తెల్లవారే సరికి మృతి చెంది ఉండటం చర్చనీయాంశమైంది. రాత్రి ఇద్దరూ కలిసి మద్యం తాగి గొడవపడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ ప్రైవేటు శరీర భాగాల నుంచి తీవ్రంగా రక్తస్రావం అయినట్లుగా తెలుస్తోంది. మణిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ బి. జనార్దనరావు, వన్ టౌన్ సీఐ వి.మల్లికార్జునరావులు పరిశీలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘తాగు.. తిను.. ఊగు.. సంక్రాంతి పేరుతో కూటమి సర్కార్ దోపిడీ’
సాక్షి, విజయవాడ: సంక్రాంతిని కూటమి ప్రభుత్వం దోచుకుందని.. దోపిడీకి ఏ మార్గాన్ని వదలడం లేదంటూ వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్(Pothina Mahesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సంక్రాంతి(Sankranti)ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారు. సంక్రాంతి సంబరాలను క్యాసినో స్థాయికి తీసుకెళ్లారు. పాఠశాలలను కూడా జూద కేంద్రాలుగా మార్చేశారు’’ అని దుయ్యబట్టారు.‘‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాల బరుల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేల కోట్లు సంపాదించారు. మద్యాన్ని ఏరులై పారించారు. రికార్డింగ్ డాన్స్‌లు చేయించారు. పండుగను అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకున్నారు. పేదలు ఈ సంక్రాంతి పండుగకు దూరమయ్యారు. తాగు... తిను.. ఊగు అనే కొత్త నినాదాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది’’ అంటూ పోతిన మహేష్ ధ్వజమెత్తారు.‘‘సంక్రాంతి సంబరాలను ఆర్గనైజింగ్ క్రైమ్‌గా మార్చేశారు. జూదం అధికారికమే అనేలా కూటమి అనుమతులిచ్చింది. ఐపీఎల్ మాదిరి కోడి ప్రీమియర్ లీగ్‌లు పెట్టారు. పనులు చేసుకోవద్దు.. వ్యసనాలకు అలవాటు పడండని చంద్రబాబు ప్రజలకు చెప్పదలచుకున్నారా సమాధానం చెప్పాలి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణంరాజు కోడి పందాల్లో పాల్గొన్నారు. మహిళా బౌన్సర్లను పెట్టి విష సంస్కృతి తెచ్చారు. మైనర్లు సైతం గుండాట, పేకాట ఆడారు. కోడి పందాలు ఆడుకోవచ్చని అనుమతులుచ్చారా.. హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలి’’ అని మహేష్ నిలదీశారు.‘‘భీమవరంలో క్యాసినో సెంటర్ పెట్టారు. కుక్కుట శాస్త్రం ప్రకారం రూ.కోటి 25 లక్షలతో ముహూర్తం పెట్టి ఆడించారు. చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి. కోడి పందాల బరులకు టీడీపీ, జనసేన ట్యాక్స్ కట్టించుకున్నారు. స్కూళ్లలో కోళ్ల పందాలు పెట్టి విద్యార్ధులకు ఏం సందేశం ఇస్తారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. గోదావరి జిల్లాలకు ధీటుగా కృష్ణాజిల్లాలో 320కి పైగా కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు’’ అని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు...ఇదేం పాలన అని జనం చంద్రబాబు, పవన్‌ను తిట్టుకుంటున్నారు. వైఎస్ జగన్‌ను అనవసరంగా వదులుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విజనరీ ఎవరని ప్రజల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రాన్ని కోడి పందాలు.. పేకాటకు కేరాఫ్‌గా మార్చాలనుకుంటున్నారా చంద్రబాబు?. అశ్లీల నృత్యాలేనా పర్యాటకం అభివృద్ధి అంటే. ఇదేనా చంద్రబాబు మీ విజన్ 2047 అంటే. కోడి పందాలను ప్రమోట్ చేసిన ఒక్క సెలబ్రిటీ మీదనైనా కేసు పెట్టారా?. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను చంద్రబాబు, పనన్ సర్వ నాశనం చేస్తున్నారు.ఇదీ చదవండి: పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?..పేకాట, కోడి పందాలు.. అశ్లీల నృత్యాలు చూడాలంటే ఏపీకి వెళ్లాలని పొరుగు రాష్ట్రాల్లోని ప్రజలు అనుకుంటున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు కట్టిన జగన్ అసలైన విజనరీ. ఉపాధి అవకాశాలు కల్పించలేమని పవన్ చెప్పిన కొద్దిసేపటికే ఇద్దరు యువకులు చనిపోయారు. ఇద్దరి చావుకు కారణమైన పవన్‌పై కేసు పెట్టాలా వద్దా?. పవన్ పదే పదే సనాతన ధర్మం.. సంస్కృతి అంటున్నారు. కోడి పందాలు, పేకాట, గుండాట ఆడటమే ధర్మమా?..అశ్లీల నృత్యాలే మన సంస్కృతా... పవన్ సమాధానం చెప్పాలి. ఇటీవల పవన్ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అడిగేవాడు లేక జనసేన కార్యకర్తలు బరితెగించారు. నేషనల్ హైవేపై టోల్ గేట్ పెట్టడమేంటి?. కోడి పందాలు నిర్వహించినందుకు పవన్ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదు. పార్టీలో చేర్చుకున్న భూకబ్జాదారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నలు గుప్పించారు.