Editorial
-
బలపడిన మైత్రీబంధం!
ఎవరి అంచనాలకూ అందని తన ఆచరణతో, మాటలతో దిగ్భ్రమపరిచే డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించి నెల్లాళ్లు కాకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనపై మన దేశంలో మాత్రమే కాదు, అనేక దేశాల అధినేతలు సైతం ఎంతో ఉత్కంఠ కనబరిచారు. అందుకు కారణం ఉంది. వేరే దేశాలు తమ ఉత్పత్తులపైఎంత సుంకం విధిస్తాయో తామూ వారి ఉత్పత్తులపై అదే స్థాయిలో ప్రతిచర్యాత్మక సుంకం వసూలు చేస్తామని ట్రంప్ చెబుతున్నారు. అదే అమలైతే అన్ని దేశాల వ్యాపార, వాణిజ్యాలుతీవ్రంగా ప్రభావితమవుతాయి. ట్రంప్ తొలి ఏలుబడిలో ఆయనతో మోదీకున్న సాన్నిహిత్యం ఎవరికీ తెలి యనిది కాదు. చర్చల్లో ఆయన సుంకాల విషయంలో ట్రంప్‌ను ఒప్పిస్తే, తాము కూడా భారత్ కిచ్చిన వెసులుబాట్లను చూపి గండం నుంచి గట్టెక్కవచ్చని వారి ఆశ. ప్రమాణస్వీకారం చేసింది మొదలుకొని సన్నిహిత మిత్రులా... ‘నువ్వా నేనా’ అని పోటీపడే ప్రత్యర్థులా అనే విచక్షణ లేకుండా అందరికీ సుంకాల వడ్డింపు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇరుదేశాల మధ్యా అధికారుల స్థాయి చర్చలు జరిగితే గానీ స్పష్టత రాదు. అధినేతలిద్దరూ నాలుగు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం గమనిస్తే వారిద్దరి మధ్యా గతం మాదిరే సౌహార్ద సంబంధాలున్నాయని అర్థమవుతుంది. మోదీ ‘చాలా ప్రత్యేకమైన వ్యక్తి’ అని అభివర్ణించటంతో పాటు 2020లో భార్యాసమేతంగా భారత్ వెళ్లినప్పుడు ఆయన ఇచ్చిన ఆతిథ్యం మరువలేనని ట్రంప్ అన్నారు.మోదీ సైతం ‘మీతో ఉన్న అతి గొప్ప స్నేహబంధాన్ని ఇప్పటికీ మా ప్రజలు గుర్తు చేసుకుంటార’ని చెప్పారు. బైడెన్ హయాంలో రెండు దేశాల సంబంధాలకూ నష్టం కలిగే రీతిలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ట్రంప్ అనటం గమనించదగ్గది. అయితే మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందే సుంకాల పెంపుదల ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. దీన్నిబట్టే అంచనాలకు దొరకని ట్రంప్ మనస్తత్వాన్ని గ్రహించవచ్చు. ప్రతిచర్యాత్మక సుంకాలపై ట్రంప్ అభీష్టం నెరవేరితే సంపన్న రాజ్యాల మధ్య అవగాహన ఫలితంగా దాదాపు 80 ఏళ్ల నుంచి ప్రపంచ వ్యాపార, వాణిజ్యాల్లో కొనసాగుతూ వస్తున్న విధానాలకు తిలోదకాలిచ్చినట్టవుతుంది. మధ్యలో ప్రపంచ దేశాల మధ్య సుంకాలు, వాణిజ్యాలపై కుదిరిన గాట్ ఒప్పందం, అటు తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల కింద వర్థమాన దేశాలకు సుంకాల విషయంలో వెసులుబాట్లు లభించాయి. ఫలితంగా వాటి ఉత్పత్తులపై సంపన్న దేశాల్లో తక్కువ సుంకాలున్నాయి. అదే సమయంలో సంపన్న దేశాల ఉత్పత్తులపై వర్ధమాన దేశాలు అధిక సుంకాలు విధించగలిగాయి. ఇందువల్ల అమెరికా, ఇతర సంపన్న దేశాలకు కలిగిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆ దేశాల కంపెనీలకు పరిశ్రమల స్థాపన కోసం నామమాత్ర ధరకు భూములు, అనేక ఇతర సదుపాయాలు లభించాయి. వాటి యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఇతరేతర రక్షణ ఉత్పత్తులు వర్ధమాన దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒకచోట కనిపించే లోటు మరోచోట భర్తీ అవుతోంది. వాటి వ్యాపార వాణిజ్యాలు వందల రెట్లు పెరుగుతున్నాయి. కానీ ట్రంప్‌కు ఇవేం పట్టవు. అమెరికాలోని సంపన్న రైతులకు భారీ సబ్సిడీలిస్తున్న కారణంగా వారి సాగు ఉత్పత్తులు కారుచౌకగా ఉంటాయి. ఆ ఉత్పత్తులు భారత్ మార్కెట్లో అడుగుపెడితే మన ఉత్పత్తు లకు గిరాకీ పడిపోతుంది. అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ట్రంప్ తరచు చెప్పే అత్యంత ఖరీదైన హార్లీ–డేవిడ్ సన్ బైక్‌కి కూడా ఇది వర్తిస్తుంది. చవగ్గా లభించే విదేశీ ఆహారోత్పత్తులూ, విలాసవంతమైన వస్తువులూ కొనడానికి జనం ఎగబడితే మన విదేశీ మారకద్రవ్యమూ కరిగిపో తుంది. మన ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తుంది. కనుకనే మనం భారీ సుంకాలు విధించాల్సి వస్తుంది.సుంకాల సంగతలా వుంచితే ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భావసారూప్యత ఉంది. ఉమ్మడి లక్ష్యాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అదుపు చేయటం, చైనా దుందు డుకు పోకడలను నియంత్రించటం అందులో ముఖ్యమైనవి. మన దేశం నుంచి చట్టవిరుద్ధంగా 7,25,000 మంది అమెరికాకు వలస పోయారని గణాంకాలు చెబుతున్నాయి. వీరందరినీ వెనక్కి పంపితే తమకు అభ్యంతరం లేదని మోదీ అమెరికాకు స్పష్టంగా చెప్పారు. ఇక మన ప్రయోజ నాలకు ఎంతగానో తోడ్పడే ఇరాన్‌లోని చాబహార్ పోర్టుతో తెగతెంపులు చేసుకోవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. పాకిస్తాన్‌తో ప్రమేయం లేకుండా అఫ్గాన్‌కు చేరడానికి, పశ్చిమాసియా దేశా లతో వాణిజ్యం నెరపడానికి దోహదపడుతుందని చాబహార్ పోర్టు నిర్మాణంలో మన దేశం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇరాన్ తమ శత్రువు గనుక ఆ పోర్టును వదులుకోవాలని ట్రంప్ చెబుతున్నారు. ఇన్నాళ్లుగా భారత్‌కి స్తున్న మినహాయింపు రద్దు చేశారు. ఇదెక్కడి న్యాయం! మోదీ పర్యటన వల్ల అమెరికా తయారీ ఎఫ్–35 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు, చమురు, సహజవాయు కొనుగోళ్లు, కృత్రిమ మేధ, ఇతర సాంకేతికతలు, అంతరిక్ష అన్వేషణ, అణు ఇంధనం వగైరా అంశాల్లో సహకారం పెంపుపై అవగాహన కుదిరింది. పరస్పర ప్రయోజనకరంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకోవటం, ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరగనుండటం బల పడుతున్న మైత్రీబంధానికి చిహ్నం. అయితే అసంబద్ధమైన సుంకాలతో, అడ్డగోలు విధానాలతో ఈ బంధాన్ని దెబ్బ తీయరాదని అమెరికా గ్రహించాలి. మోదీ పర్యటన అందుకు దోహదపడాలని అందరూ కోరుకుంటారు. -
‘సుప్రీం’ బోనులో ఈసీ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భాల్లో తప్ప వినబడని ఎన్నికల సంఘం(ఈసీ) పేరు ఇటీవలి కాలంలో తరచు వార్తల్లోకెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని ప్రచారం వరకూ... ఆ తర్వాత ఎన్నికల్లో పోలైన వోట్ల శాతం, వాటి లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకూ అన్ని దశల్లోనూ ఈసీపై నిందలు తప్పటం లేదు. తాజాగా ప్రజాతంత్ర సంస్కరణల సంఘం (ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తున్న సందర్భంగా ఈవీఎంల పరిశీలన ప్రక్రియ అమల వుతుండగా వాటి డేటాను తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. నిరుడు ఏప్రిల్‌లో ఈ విషయమై ఇచ్చిన ఆదేశాలను సరిగా అర్థం చేసుకుని, సక్రమంగా పాటిస్తే ఇలా చెప్పించుకోవాల్సిన స్థితి ఈసీకి ఉండేది కాదు. ఈవీఎంలనూ, దానికి అనుసంధానించి వుండే ఇతర యూనిట్లనూ భద్రపరిచే విషయమై సుప్రీంకోర్టు అప్పట్లో కీలక ఆదేశాలిచ్చింది. అవి సరిగా పాటించటం లేదని ఏడీఆర్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల్లో పరాజితులై 2, 3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కనుక ఆ ఎన్నికను సవాలు చేసిన సందర్భాల్లో తనిఖీ చేయడానికి అనువుగా ఈవీఎంలతోపాటు, వాటిలో పార్టీల గుర్తులను లోడ్ చేయటానికి ఉపయోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ)లను సైతం 45 రోజులపాటు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఎన్నికల ఫలితంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటానికి పరాజిత అభ్యర్థులకుండే 45 రోజుల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని ధర్మాసనం ఇలా ఆదేశించింది. అసెంబ్లీ నియో జకవర్గ పరిధిలోని 5 శాతం ఈవీఎంలు, ఎస్‌ఎల్‌యూలను ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చని సూచించింది. వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కించే యంత్రాలు సమకూర్చు కునే ఆలోచన చేయాలని కూడా ఆ సందర్భంగా కోరింది. ఈ ఆదేశాల ఆంతర్యమేమిటో సుస్పష్టం. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగడమే కాదు... అలా జరిగినట్టు కనబడాలంటే అంతా పారదర్శకంగా ఉండాలన్నది ధర్మాసనం ఉద్దేశం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అనంతరం ఈవీఎంలూ, వీవీప్యాట్‌లూ, ఎస్ఎల్యూల పరిశీలన విషయంలో ఈసీ కొన్ని నియమ నిబంధనలు విడుదల చేసింది. న్యాయస్థానం ఆదేశాలకూ, ఆ నియమ నిబంధనలకూ ఎక్కడా పొంతన లేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనూ 5 శాతం ఈవీఎంలు తనిఖీ చేయాలని ధర్మాసనం ఇచ్చిన ఆదేశానికి ఈసీ వేరే రకమైన భాష్యం చెప్పింది. వినియోగించిన ఈవీఎంలలో ఏ పార్టీకి ఎన్ని వోట్లు లభించాయో చూసి, వీవీ ప్యాట్ స్లిప్‌లు దానికి అనుగుణమైన సంఖ్యలో ఉన్నాయా లేదా అన్నది తేలిస్తే వేరే రకంగా ఉండేది. కానీ ఈసీ చేసిందల్లా ఇతరత్రా గుర్తులతో మళ్లీ నమూనా పోలింగ్ నిర్వహించి ఈవీఎంల డేటాకూ, వీవీప్యాట్ స్లిప్‌ల సంఖ్యకూ మధ్య తేడా లేదని నిరూపిస్తే చాలని భావించింది. అంతేకాదు... ఆ నమూనా పోలింగ్ కోసం ఈవీఎంలలోని డేటాను ఖాళీ చేసింది! ఈవీఎంలు సరిచూడాలని అభ్య ర్థులు కోరటం అంటే తమ సమక్షంలో ఈవీఎంలలో ఉన్న సాఫ్ట్‌వేర్‌నూ, హార్డ్వేర్నూ ఇంజనీర్లు పరిశీలించాలని... వీవీ ప్యాట్ స్లిప్‌ల సంఖ్య ఈవీఎంల డేటాతో సరిపోయిందో లేదో చూడాలని అడగటం. ఈసీ అనుసరించిన ప్రక్రియకూ, అభ్యర్థులు కోరుకునేదానికీ పొంతన ఎక్కడైనా ఉందా? ఈ మాత్రానికే అభ్యర్థులనుంచి ఈవీఎంకు రూ. 40,000 చొప్పున వసూలు చేయటం సిగ్గనిపించ లేదా? చిత్రమేమంటే... ఒక్కో ఈవీఎం తయారీకి ఖర్చయ్యేది కేవలం రూ. 30,000! గత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి 11 మంది అభ్యర్థులు ఈవీఎంలూ, వీవీప్యాట్ స్లిప్‌ల పరిశీలన కావాలన్నారని, అంతా పూర్తయ్యాక ఎక్కడా తేడా కనబడలేదని ఈసీ తేల్చింది. దేశవ్యాప్తంగా చూస్తే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి అభ్యర్థనలే 83 వరకూ రాగా, అంతా సవ్యంగానే ఉన్నదని నిర్ధారణ అయిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 45 రోజులలోపు ఈవీఎంల డేటా తొలగించరాదన్న నిబంధనను సైతం ఈసీ ఉల్లంఘించింది. ఒకపక్క ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా ఇలా చేయటం అనుమానాలను మరింత పెంచుతుందన్న ఇంగితజ్ఞానం దానికి లేకపోయింది.మేమిచ్చిన ఆదేశాలేమిటో, మీరు అనుసరించిన ప్రక్రియేమిటో వివరిస్తూ వచ్చే నెల 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించటం హర్షించదగ్గది. అసలు 45 రోజుల్లోపే డేటాను ఎందుకు తొలగించాల్సివచ్చిందో కూడా ఈసీనుంచి సంజాయిషీ కోరాలి. ఇక పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు మరింత చిత్రంగా ఉన్నాయి. ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకూ వోట్లు పెరిగినట్టు ఈసీ తేల్చింది. ఈ పెరిగిన వోట్ల శాతం ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం ఉంది. పోలింగ్ ముగిసిన రాత్రి ఏపీలో 68 శాతం వోట్లు పోలయ్యాయని ప్రకటించగా, తుది ప్రకటనలో అది కాస్తా 81 శాతానికి ఎగబాకింది. ఈవీఎంల చార్జింగ్ పెరగటం మరో కథ! ఈ మార్పుల వెనకున్న మంత్రమేమిటో చెప్తే అందరూ విని తరిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంతో నిష్ఠగా నిర్వహించాల్సిన క్రతువు. ఒక రాజ్యాంగ సంస్థ అయివుండి, నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు భిన్నమైన పోకడలను ప్రదర్శించటం దానికి ఎంతమాత్రమూ గౌరవప్రదం కాదు. ఈసీ తీరు గమనించాక చాలామంది మళ్లీ బ్యాలెట్ పత్రాలకు మళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీ బాణీ మారకపోతే చివరకు బ్యాలెట్ పత్రం విధానం కోసం జనం ఎలుగెత్తే రోజులు రావటం ఖాయం. -
కుంటిసాకులు
ఇప్పటికే సమస్త జీవన రంగాలనూ అల్లుకుపోయిన కృత్రిమ మేధ (ఏఐ)పై పారిస్‌లో వరసగా రెండురోజులపాటు కొనసాగి మంగళవారం ముగిసిన మూడో శిఖరాగ్ర సదస్సు ఆశించిన ఫలితాలు అందించలేకపోయింది. సరిగ్గా రెండేళ్ల క్రితం బ్రిటన్‌లోని బ్లెచ్లీ పార్క్‌లో జరిగిన తొలి ఏఐ శిఖరాగ్ర సదస్సు (సేఫ్టీ సమ్మిట్) పూర్తిగా భద్రతాపరమైన అంశాలపై దృష్టిపెట్టింది. నిరుడు దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన రెండో శిఖరాగ్ర సదస్సు ప్రముఖ ఏఐ సంస్థల నుంచి భద్రతకు సంబంధించి నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామన్న వాగ్దానాలు పొందగలిగింది. దానికి కొనసాగింపుగా పారిస్ శిఖరాగ్ర సదస్సును ‘ఏఐ యాక్షన్ సమ్మిట్’గా నామకరణం చేశారు. ఏఐ పరిమితు లేమిటో, అంతర్జాతీయ స్థాయిలో అందుకు పాటించాల్సిన నిబంధనలేమిటో ఈ శిఖరాగ్ర సదస్సు నిర్దేశిస్తుందని అందరూ ఊహించారు. కానీ బ్లెచ్లీ సదస్సు సాధించిన కొద్దిపాటి విజయాలనూ పారిస్ సదస్సు ఆవిరి చేసింది. దాపరికం లేని, సమ్మిళిత ఏఐ సాధనకు సమష్టిగా కృషి చేయాలన్న పిలుపునైతే ఇచ్చిందిగానీ, ఈ డిక్లరేషన్‌పై సంతకం చేసేది లేదని అమెరికా, బ్రిటన్లు మొరాయించాయి. మనతోపాటు 60 దేశాలు అంగీకరించిన ఈ డిక్లరేషన్‌ను అగ్రరాజ్యాలు కాదన్నాయంటే ఈ రంగం తీరుతెన్నులు ఎలా వుండబోతున్నాయో అంచనా వేయొచ్చు. ‘కొన్నేళ్ల క్రితం చర్చించిన ఏఐ భద్రత గురించి మాట్లాడటానికి ఇక్కడకు రాలేదు. ఏఐలో వెల్లువలా వచ్చిపడే అవకాశాలే నావరకూ ప్రధానాంశం’ అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు. ఆయన ప్రస్తావించిన ఏఐ భద్రత అనేది నిజానికి 2023లో బ్రిటన్ చొరవతో బ్లెచ్లీ పార్క్ శిఖరాగ్ర సదస్సులో లోతుగా చర్చించిన అంశం. కానీ సదస్సులో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆ సంగతే గుర్తులేనట్టు వ్యవహరించి అమెరికా తోకపట్టుకుపోయారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశాల వైఖరులు మారితే అంతర్జాతీయంగా వాటికి విశ్వసనీయత ఏముంటుంది? ఇప్పటికే అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పారిస్ వాతావరణ ఒడంబడిక నుంచి బయటికొస్తున్నట్టు ప్రకటించారు. లక్షల కోట్ల పెట్టుబడితో ప్రధాన ఏఐ సంస్థలన్నీ సాగిస్తున్న పరిశోధనలు భవిష్యత్తులో ఎటువంటి కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేస్తాయో, అవి ప్రపంచ పౌరుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపగలవోనన్న ఆందోళన అగ్రరాజ్యాలకు లేశమాత్రమైనా లేదని తేలిపోయింది. ఏఐతో ఉద్యోగాలకు ముప్పు వచ్చిపడుతుందని, భవిష్యత్తు అగమ్యగోచరమవుతుందని అన్ని దేశాల్లోనూ భయాందోళనలున్నాయి. వందమంది గంటలో చేయగల పని ఏఐ కొన్ని క్షణాల్లో చేసి చూపటాన్ని గమనిస్తే అవి సహేతుకమైనవేనన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే శిఖరాగ్ర సదస్సుకు సహాధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఉద్యోగాల స్వభావం మారు తుంది తప్ప ఉద్యోగాలు పోవు. కొత్త సాంకేతికతలు అడుగుపెట్టినప్పుడు ఆ నైపుణ్యతలను పెంచు కోలేనివారికి ఇబ్బందులుంటాయి. ఆ సాంకేతికతల్ని లొంగదీసుకోవటమే ఇందుకు పరిష్కారం. ఏఐ ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా వైద్య, వైజ్ఞానిక రంగాల్లో చోటుచేసుకుంటున్న పరిశోధనలు పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఊహకందని వినూత్న ఆవిష్కరణలు రంగప్రవేశం చేస్తాయి. చికిత్సకు లొంగని మొండివ్యాధులు పలాయనం చిత్తగిస్తాయి. ఆయుఃప్రమాణాలు పెరుగుతాయి. అయితే రక్షణ, యుద్ధతంత్ర, అంతరిక్ష రంగాల్లో ఇది సృష్టించగల ఉత్పాతాలు చిన్నవేమీ కాదు. ఇందుకు కొత్త తరం ఏఐ మోడల్స్ ఉదాహరణ. తాజా మోడల్ ఒకటి సవరణలకు అవకాశం లేకుండా తన సృజనకర్తనే పక్కదారి పట్టించేలా తనను తాను కాపీ చేసుకుందని ఆ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వచ్చే అయిదేళ్లలో సూపర్ హ్యూమన్ స్థాయి ఏఐ రూపొందటం ఖాయమని వారంటున్నారు. భద్రతకు సంబంధించి ఏఐలో సాగుతున్న పరిశోధనల్లో తలెత్తే ప్రశ్నలకు పరిష్కారం కనుగొనకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయన్నది వారి హెచ్చరిక. కానీ అమెరికా తప్పుడు సూత్రీకరణలు చేస్తోంది. భద్రత గురించిన జాగ్రత్తలను సెన్సార్‌షిప్‌గా వక్రీకరిస్తోంది. యూరప్ యూనియన్ (ఈయూ) రూపొందించిన నియంత్రణ చట్టాలు ఆ రంగం పీకనొక్కడానికే పనికొస్తాయని వాన్స్ భాష్యం చెబుతున్నారు. ఏఐ విషయంలో సైద్ధాంతిక పక్షపాతాలకు అతీతంగా వ్యవహరించాలని, స్వేచ్ఛనీయాలని ఆయన డిమాండ్. తప్పుడు సమాచార వ్యాప్తిని గుర్తించి తొలగించటానికి ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు రూపొందించుకున్న ఉపకరణాలను (ట్రంప్ వస్తారనగానే ఆ సంస్థలు స్వచ్ఛందంగా వాటిని ఉపసంహరించుకున్నాయి) సెన్సార్‌షిప్‌గా వక్రభాష్యం చెప్పినవారు ఇంతకుమించి ఆలోచించగలరా? ఏఐ రంగంలో ఇప్పట్లాగే భవిష్యత్తులోనూ తన ప్రాబల్యమే కొనసాగుతుందని, దాన్ని గుప్పెట్లో పెట్టుకుని లక్షల కోట్ల లాభాలు ఆర్జించవచ్చని అమెరికా కలగంటోంది. కానీ ఇటీవల చైనా నుంచి వచ్చిన డీప్‌సీక్ దూకుడు గమనిస్తే ఈ రంగం ఎవరి జాగీరూ కాదని స్పష్టమవుతోంది. ఇలా నిరంతరం ఊహాతీతంగా చక చకా ఎదుగుతున్న రంగానికి బాధ్యతాయుతమైన మార్గాన్ని నిర్దేశించకపోతే దానివల్ల మానవాళికి ముప్పు కలిగే అవకాశం లేదా? సురక్షిత, హేతుబద్ధ, పారదర్శక ఏఐ రూపొందటానికి దేశాలన్నీ సమష్టిగా కృషి చేయకపోతే, సాధించే అభివృద్ధిని ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి నెలకొల్పనట్టయితే అది స్వీయ వినాశనానికే దారితీస్తుందని అన్ని దేశాలూ గుర్తించాలి. -
ఘర్షణాత్మక ఆలోచన
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకొచ్చినప్పటినుంచీ మీడియాకు కావలసినంత మేత దొరుకుతోంది. వలసదారులను తిప్పిపంపటంలో ఆ దేశం ఎంత అమానుషంగా, అమానవీయంగా వ్యవహరిస్తున్నదో అందరూ చూశారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటానికి సిద్ధపడాలంటూ కెనడాను కోరటం, గ్రీన్‌ల్యాండ్ ప్రాంతాన్ని తమకు అమ్మేయాలని డెన్మార్క్‌ను అడగటం, పనామా కాల్వను అప్పగించాలని తాఖీదు పంపటం వగైరాలన్నీ తెలిసీ తెలియక మాట్లాడే మాటలుగా అందరూ కొట్టిపారేశారు. గాజాను స్వాధీనం చేసుకుని దాన్ని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో కలిసి గత బుధ వారం మీడియాకు చెప్పడాన్ని సైతం అలాగే భావించారు. సాక్షాత్తూ వైట్ హౌస్ ప్రతినిధే ట్రంప్ వ్యాఖ్యల్ని మీడియా తప్పుగా అర్థం చేసుకున్నదంటూ తోసిపుచ్చారు. అదంతా తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనన్నారు. కానీ ట్రంప్ మరోసారి జూలు విదిల్చారు. గాజా స్ట్రిప్ అమెరికాకు కూడా చెందదట. తానే సొంతం చేసుకుంటారట. గాజా పౌరులు నివాసం ఉండటానికి చుట్టూ ఉన్న జోర్డాన్, ఈజిప్టు, సౌదీ, టర్కీ తదితర పశ్చిమాసియా దేశాల్లో ఆరుచోట్ల మెరుగైన కాలనీలు నిర్మిస్తారట. గాజా పౌరులకు ఇక తిరిగొచ్చే హక్కే లేదట. విధ్వంసం తప్ప నిర్మాణం సంగతి తెలియని దేశానికి ఇలాంటి ఆలోచన రావటం వెనకున్న వ్యూహం చిన్నదేం కాదు. తనకు 7,000 కిలోమీటర్ల ఆవల దాదాపు 25 లక్షలమంది నివసించే ఒక ప్రాంతాన్ని ‘సొంతం’ చేసుకోదల్చుకున్నట్టు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన అధినేత ఒకరు ప్రకటించారంటే అదెంత వైపరీత్యమో, అంతకుమించి మరెంత దుస్సాహసమో అర్థం చేసుకోవచ్చు. 2023 అక్టోబర్ మొదలుకొని గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేవరకూ ఇజ్రాయెల్ సైన్యాలు అక్కడ టన్నులకొద్దీ బాంబులు జార విడిచినా... దారుణ హింసను చవిచూపినా, పసిపిల్లలూ, స్త్రీలతో సహా 47,000 మంది పౌరులను హతమార్చినా, లక్షలమందిని గాయపరిచినా ఆ ప్రాంతం లొంగిరాలేదు. హమాస్ ఆనుపానులన్నీ తెలిశాయని ఇజ్రాయెల్ చెప్పుకున్నా, ఆ సంస్థ అపహరించిన పౌరులందరినీ విడిపించటంలో అది పూర్తిగా విఫలమైంది. చివరకు హమాస్‌తో కుదిరిన ఒడంబడికతోనే వారంతా దశలవారీగా విడు దలవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఎంత మతిమాలినదో అమెరికా పౌరులు గ్రహించాలి. యుద్ధాలన్నిటినీ అంతం చేస్తానని వాగ్దానాలిచ్చి పీఠం అధిష్టించిన అధినేత కొత్త కుంపట్లు రాజేయటంలోని మర్మమేమిటో నిలదీయాలి. అమెరికాతో చెట్టాపట్టాలేసుకున్న పశ్చిమాసియా దేశాలు మాత్రమే కాదు... భద్రతామండలి దేశాలన్నీ ట్రంప్ ప్రతిపాదనను ఖండించాయి. సుతిమెత్తగానే అయినా ‘ఇది యుద్ధాల యుగం కాద’ని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 1948లో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌కు ప్రాణప్రతిష్ఠ చేసి పాలస్తీనా పేరిట వదిలిన ఒక చిన్న ప్రాంతాన్ని సైతం ఇప్పుడు ట్రంప్ ఆక్రమిద్దామని చూస్తు న్నారు. అంతరంగంలో ఏమనుకున్నా ‘రెండు దేశాల’ ఏర్పాటే సమస్యకు పరిష్కారమని పైకి చెబుతూ వచ్చిన అమెరికా... ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తన నైజాన్ని బయటపెట్టుకుంది. పాలకులెవరైనా, పైకి ఏం చెప్పినా అమెరికా విధానాలు యుద్ధాలకూ, ప్రత్యేకించి ఇజ్రాయెల్‌కు అనుకూలమైనవే. చరిత్ర వరకూ పోనవసరం లేదు. గత 15 నెలలుగా గాజాలో ఇజ్రాయెల్ సాగించిన నర మేథం అమెరికా ఆశీస్సులు లేకుండా జరిగే అవకాశం ఉందా? రష్యాను కవ్వించి కయ్యా నికి కాలు దువ్వమని ఉక్రెయిన్ను ప్రోత్సహించి ఓడిపోక తప్పని యుద్ధంలోకి దాన్ని దించిన ఘనత గత పాలకుడు జో బైడెన్‌ది. ఒకప్పుడు సోవియెట్ బూచిని చూపి ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలకు దిగిన అమెరికా ఇవాళ ప్రపంచ దేశాలన్నిటినీ శత్రువులుగా చూస్తోంది. వేరే దేశాల సరుకులపై భారీ సుంకాలు మోపుతూ, వాటిని దివాలా తీయించటం ఒకవైపు... ‘నచ్చిన ప్రాంతం’ సొంతం చేసుకుంటానంటూ మరోవైపు ప్రపంచాన్ని ట్రంప్ అస్థిరతలోకి నెడుతున్నారు. ఈ సంస్కృతినే రష్యా, చైనాలు కొనసాగిస్తే ఏం జరుగుతుందో ఆయనకు అర్థమవుతున్నట్టు లేదు. ప్రపంచ దేశాలన్నీ తన జాగీరుగా ఆయన భావిస్తున్నారు. పొట్టచేతబట్టుకు వచ్చిన వలసదారులను అమెరికాలో నేరస్తు లుగా పరిగణించే ట్రంప్ తన విస్తరణవాద కాంక్షను ఏమనాలో, అందుకు శిక్షేమిటో చెప్పాలి. అమెరికా దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన జోర్డాన్, ఈజిప్టులు రెండూ ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కానీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 ట్రంప్ హుంక రింపులను తట్టుకుని నిలబడగలరా? అనుమానమే. ఎందుకంటే అమెరికానుంచి సైనిక, ఆర్థిక సాయం పొందుతున్న దేశాల్లో జోర్డాన్ది మూడో స్థానం. ఆ దేశానికి ఏటా 1,700 కోట్ల డాలర్ల ప్యాకేజీ అందుతుంది. 1,500 కోట్ల డాలర్లతో తర్వాతి స్థానం ఈజిప్టుది. అమెరికా నుంచి 17,200 కోట్ల డాలర్ల సాయం పొందుతూ ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రథమస్థానంలో వున్నా అదెంతో కాలం సాగకపోవచ్చు. 3,300 కోట్ల డాలర్లతో ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉంది. ట్రంప్‌కు మోకరిల్లితే ఈజిప్టు, జోర్డాన్ ప్రజలు మౌనంగా ఉండరు. ఇప్పటికే గాజా శరణార్థులతో నిండివున్న ఆ దేశాల్లో మరింతమందిని తీసుకొస్తామంటే ఆగ్రహజ్వాలలు మిన్నంటుతాయి. అందుకే అక్కడి పాలకుల స్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిగా ఉంది. గాజాను పునర్నిర్మించాల్సిందే. సర్వం శిథిలమైన చోట మెరుగైన ఆవాసాలు ఏర్పాటు కావాల్సిందే. కానీ అదంతా అక్కడి పౌరుల చేతుల మీదుగా జరగాలి. అమెరికాతో సహా బయటి దేశాలకు అక్కడ కాలుమోపే హక్కులేదు. -
మణిపూర్ శాంతిస్తుందా?
ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు రెండేళ్లనాడు హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన ఆ రాష్ట్రం 649 రోజులైనా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయితీలకూ, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండ గానే కార్చిచ్చులా వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు. 60,000 మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయితీలు, కుకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. పోలీసు స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై దాడులకు దిగి తుపాకులు, మందుగుండు ఎత్తుకుపోయిన ఉదంతాలు కోకొల్లలు. ఈ మొత్తం హింసాకాండలో బీరేన్ సింగ్‌కు కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు... నేరుగా ఆయన ఒక వర్గానికి వత్తాసుగా నిలిచారని అనేకులు ఆరోపించారు. ఇటీవల బయటపడి, ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న సంభాషణల ఆడియో క్లిప్ ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.కొందరి మతిమాలిన చర్యలవల్లా, పాలకులకు సరైన అంచనా లేకపోవటంవల్లా శాంతి భద్రతలు చేజారే ప్రమాదం ఉంటుంది. కానీ మణిపూర్‌లో జరిగింది వేరు. ఘర్షణలను కుకీ మిలి టెంట్లకూ, కేంద్ర భద్రతా బలగాలకూ మధ్య సాగుతున్న లడాయిగా మొదట్లో బీరేన్ సింగ్ కొట్టి పారేశారు. కానీ దాన్ని అప్పటి రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఖండించారు. అవి రెండు తెగలమధ్య కొనసాగుతున్న ఘర్షణలేనని తేల్చిచెప్పారు. ఆ తర్వాత దశలో ఘర్షణలను ఆపడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర భద్రతా బలగాలు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా యంటూ బీరేన్ నిందించారు. విషాదం ఏమంటే 21 నెలలు గడిచినా ఈనాటికీ పరిస్థితి పెద్దగా మారింది లేదు. వాస్తవానికి ఘర్షణలు చెలరేగిన కొన్ని వారాల తర్వాత 2023 జూన్‌లో బీరేన్‌సింగ్ రాజీనామాకు సిద్ధపడ్డారు. కానీ రాజ్‌భవన్ కెళ్లే దారిలో ఆయన మద్దతుదార్లు పెద్దయెత్తున గుమి గూడి అడ్డంకులు సృష్టించి వెనక్కు తగ్గేలా చేశారు. ఇన్నాళ్లకు తప్పుకున్నారు. ఈ పని మొదట్లోనే జరిగుంటే ఈపాటికి పరిస్థితులు మెరుగుపడేవి. సకాలంలో తీసుకోని నిర్ణయం ఊహించని విష పరిణామాలకు దారితీసే ప్రమాదమున్నదని చెప్పటానికి మణిపూర్ పెద్ద ఉదాహరణ. ఇంతకూ బీరేన్ రాజీనామాకు కారణం ఏమిటన్నది మిస్టరీయే. సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీల నలో వున్న ఆడియో టేప్ అందుకు దారితీసి వుండొచ్చని కొందరంటున్నా... మణిపూర్ అరాచకంలోకి జారుకున్నప్పటినుంచీ ఆయనకు సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చిందన్నది వాస్తవం. కేబినెట్ సైతం రెండుగా చీలింది. ఒక వర్గం మణిపూర్‌ను విభజించి తాముండే ప్రాంతా లను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న కుకీల డిమాండ్‌ను సమర్థించగా, మరో వర్గం మణిపూర్ సమగ్రత కాపాడాలంటూ కోరుతూ వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసెంబ్లీ స్పీకర్ సత్యబ్రతసింగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఇంఫాల్ హోటల్లో సమావేశమై బీరేన్‌ను సాగనంపటానికి వ్యూహం రచించగా, సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నోటీసులిచ్చింది. బీరేన్ తప్పుకున్నాక అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దుచేశారు. బీజేపీ అధిష్టానం అండదండలుంటే అవిశ్వాస తీర్మానానికి బీరేన్ జడిసేవారు కాదు. ఎందుకంటే తొలి ఏలుబడిలో మూడుసార్లు అవిశ్వాస తీర్మానం వచ్చిపడినప్పుడు అసెంబ్లీలో తగినంత బలం లేకున్నా సునాయాసంగా బయటపడిన చరిత్ర బీరేన్ది. దేశానికి బలమైన రాజ్యాంగం ఉన్నా మణిపూర్‌లో కొనసాగుతున్న దారుణ హింసను అన్ని వ్యవస్థలూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. అది మన దేశంలో అంతర్భాగమని, అక్కడి ప్రజలు కూడా ఈ దేశ పౌరులేనని గుర్తించనట్టే ప్రవర్తించాయి. గవర్నర్ మొదలుకొని న్యాయవ్యవస్థ వరకూ అందరికందరూ మౌనంగా మిగిలారు. ఇలాంటి సమయాల్లో జోక్యం చేసుకోవాల్సిన కేంద్రం తన కర్తవ్యాన్ని మరిచింది. పార్లమెంటులో ఈ సమస్య ప్రస్తావనకొచ్చినప్పుడల్లా అధికార, విపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోవటం మినహా జరిగిందేమీ లేదు. కనీసం ఇప్పుడైనా అందరూ కదిలి క్షతగాత్రగా మిగిలిన మణిపూర్‌లో ఉపశమన చర్యలు తీసుకుంటారా?మాయమైన మనుషులు, ధ్వంసమైన ఇళ్లు, ఛిద్రమైన బతుకులు, మానప్రాణాలు తీసే మృగాళ్లు, జీవిక కోల్పోయి ఎలా బతకాలో తెలియక కుమిలిపోతున్న కుటుంబాలు – మణిపూర్ వర్తమాన ముఖచిత్రం ఇది. అందుకే ఆయుధాలు సమకూర్చుకుని అధికారంలో ఉన్నవారి అండదండలతో ఇన్నాళ్లనుంచీ రెచ్చిపోతున్న ముఠాల ఆటకట్టించటం తక్షణావసరం. అసెంబ్లీని సస్పెండ్ చేసి తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధిస్తారో, మరెవరినైనా ముఖ్యమంత్రి పీఠంపై ఎక్కిస్తారో ఇంకా తేలాల్సేవుంది. ఏం జరిగినా ముందు చట్టబద్ధ పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవటం అధికార యంత్రాంగం కర్తవ్యం. అప్పుడే శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి. సంక్షుభిత మణిపూర్ మళ్లీ చివురిస్తుంది. -
‘తెలివి’ తెల్లారకూడదు!
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’– పొడి అక్షరాలలో ‘ఏఐ’ – ఇంతింతై వటుడింతౖయె అన్నట్టుగా రోజు రోజుకూ విశ్వరూపాన్ని సంతరించుకుంటోంది. ‘కృత్రిమ మేధ’గా మనం అనువదించుకుంటున్న ఆ మాట చూస్తుండగానే మన నిత్య వ్యవహారంలో భాగమైపోతోంది. అమెరికా అభివృద్ధి చేసిన ‘చాట్ జీపీటీ’ అనే ఏఐ లాంగ్వేజ్ నమూనాకు పోటీగా చైనా అభివృద్ధి చేసిన ‘డీప్ సీక్’ కొన్ని రోజులుగా చర్చనీయమవుతోంది. చాట్ జీపీటీ కన్నా ఇది మెరుగైన సాంకేతికత అనీ, ఏఐ రంగంలో చైనా పురోగమనాన్ని ఇది చాటి చెబుతోందనీ అంటున్నారు. ఇప్పటికే ఏఐ రంగంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా; చైనా, బ్రిటన్ రెండు, మూడు స్థానాలలో ఉన్నాయని సమాచారం. కృత్రిమమేధా రంగంలో ముందున్నవారే ప్రపంచాన్ని ఏలగలరని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్య, ఈ సాంకేతికాద్భుతం ప్రపంచాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయబోతోందో స్పష్టం చేస్తోంది. ఇంతటి కీలకరంగంలో మనదేశం ఏ స్థానంలో ఉందన్న ప్రశ్న తలెత్తడం సహజమే. మరీ వెనకబడి లేము కానీ, చైనా మొదలైన దేశాలతో పోల్చితే వెళ్లవలసినంత ముందుకూ వెళ్లలేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా వేగాన్ని పెంచుకుని పోటాపోటీగా మన ఉనికిని స్థాపించుకోగల సత్తా మనకుందన్న భావన వ్యక్తమవుతోంది. అదలా ఉంచితే, ఏఐ సాంకేతికత సృష్టించే అద్భుతాలను సామాజిక మాధ్యమాల తెరపై ఇప్ప టికే చూస్తున్నాం. ఇటీవలి కుంభమేళాలో కొందరు విదేశీ ప్రముఖులు కాషాయవస్త్రాలు ధరించి పవిత్ర స్నానాలు చేసినట్టు చూపే చిత్రాలు సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమయ్యాయి. అవి ఏఐ సాంకేతికతతో సృష్టించినవని చెప్పకపోతే నిజమని నమ్మేసే ప్రమాదం ఉండనే ఉంటుంది. ఇలాగే, తను కుంభమేళాలో స్నానం చేస్తున్నట్టు చూపించే ఏఐ చిత్రం ఒకటి చక్కర్లు కొడుతుండటం గమనించి ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రకరకాల మాధ్యమాలలో హోరెత్తుతున్న నకిలీ సమాచారానికి తోడు ఇప్పుడు నకిలీ చిత్రాలు కూడా అడుగు పెట్టాయనీ, వీటికి వ్యతిరేకంగా తన వంతు పోరాటంగా పోలీసులకు ఫిర్యాదు చేశాననీ ఆయన చెప్పుకొచ్చారు. నిక్కమైన సమాచారానికి నకిలీ వార్తల బెడద విడుపులేని రాహుగ్రహణంగా మారిన మాట నిజం. మంచి, చెడులు రెంటికీ పనికొచ్చే రెండంచుల కత్తి లాంటి సాంకేతిక సాధనాల జాబితాలో ఏఐ కూడా ఇలా చేరిపోతోంది. ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేయడం, ఏఐలో పురోగతిని సాధించడాన్ని మించిన సవాలు కాబోతోంది. ఇంకోవైపు, ఆకాశమే హద్దుగా ఏఐ సాంకేతికత సాధించగల అద్భుతాలను ఊహించుకున్న కొద్దీ, అది అచ్చంగా మాయల ఫకీరు చేతిలోని మంత్రదండాన్ని గుర్తుచేస్తుంది. తలకాయలను, వేషభాషలను మార్చడమే కాదు; స్త్రీ, పురుషుల రూపాలను కూడా అది తారుమారు చేయగలదు. ఆ విధంగా మంత్రాలూ, మహిమలతో నిండిన పౌరాణిక మాయాప్రపంచాన్ని కొత్తరూపంలో కళ్ళముందు ఆవిష్కరించగలదు. ఉదాహరణకు రామాయణంలోనే చూడండి, యుద్ధరంగంలో రాముని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇంద్రజిత్తు ఒక మాయాసీతను సృష్టించి తన రథం మీద యుద్ధభూమికి తీసుకొచ్చి అందరూ చూస్తుండగా ఆమెను నరికి చంపుతాడు. రాముడంతటివాడు కూడా ఆమెను నిజ సీత అనుకుని దుఃఖంతో మూర్ఛపోతాడు. వినాయకుడికి ఏనుగు తలను, మరో పౌరాణిక పాత్రకు గుర్రం తలను అతికించడమూ పురాణాలలో కనిపిస్తాయి. ఒక రాకుమారుడు వేటకెళ్లి ఓ వనంలోకి ప్రవేశించగానే స్త్రీగా మారిపోయినట్టు చెప్పే కథ ఒకటి మహాభారతంలో ఉంది. అభిమన్యుని వధకు కారణమైన సైంధవుని సూర్యాస్తమయంలోగా చంపి తీరుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టి స్తాడు. ఏఐ సాంకేతికత ఇటువంటి అనేకానేక ఉదంతాలను తలపించి మరిపించే ఒక సరికొత్త మాంత్రిక ప్రపంచాన్ని సృష్టించి ఏది నిజమో, ఏది అబద్ధమో పోల్చుకోలేని ద్వైదీస్థితిలో మనిషిని నిలబెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. మనిషి సృష్టించిన సాంకేతికత తిరిగి ఆ మనిషినే పునఃçసృష్టి చేయడం మానవ చరిత్ర పొడవునా జరుగుతూ వచ్చింది. రాతియుగంలో మనిషి కనిపెట్టిన శిలాసాధనాలే అన్నసంపాదనలో కొత్త మార్గాలు తెరచి భద్రమైన మనుగడ దిశగా అతణ్ణి ముందడుగు వేయించాయి. అతను కనిపెట్టిన ధనుర్బాణాలే ఆ అడుగుకు మరో పదడుగులు జమచేశాయి. ఆ తర్వాత అతనే కనిపెట్టి విడిచిపెట్టిన చక్రం వందల వేల సంవత్సరాలలో వేనవేల రూపాల్లోకి మారి, అతణ్ణి కూడా మార్చి ప్రపంచ యాత్ర చేయిస్తూ అప్రతిహతంగా తిరుగుతూనే ఉంది. ఆహార సేకరణ, పెరటి సాగు దశలను దాటి మనిషి సృష్టించిన వ్యవసాయ సాంకేతిక జ్ఞానమే, తిరిగి అతడికి నాగరికుడిగా కొత్త అవతారాన్ని సంతరించి సరికొత్త యుగావిష్కరణ వైపు నడిపించింది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మనిషి తను సృష్టించిన సాంకేతికతను తన అదుపులో ఉంచుకున్నప్పుడే అది ఉపయుక్తంగా మారి అతని మనుగడను ఎవరెస్టు ఎత్తుకు తీసుకెడుతుంది; కళ్లేలు వదిలేస్తే సమస్యలు, సంక్షోభాల లోయల్లోకి పడదోస్తుంది. ఏఐ లాంటి ఎంతటి అత్యాధునిక సాంకేతికత అయినా ఇందుకు మినహాయింపు కాదు. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషి మేధనే కృత్రిమంగా మార్చివేయకుండా చూసు కోవాలి; ప్రపంచాన్నే మయసభగా మార్చి మాయావుల పరం చేయకుండా జాగ్రత్తపడాలి. -
‘కారుణ్యం’ శాపం కారాదు!
వైద్య కారణాల రీత్యా ఎప్పటికీ కోలుకోలేని అచేతన స్థితికి చేరుకుని, మరణం తప్ప మరో దారిలేని రోగులకు ‘కారుణ్య మరణం’ ప్రసాదించే నిబంధనలు దేశంలోనే తొలిసారి కర్ణాటకలో అమల్లో కొచ్చాయి. వాస్తవానికి కేరళ, గోవా, మహారాష్ట్రలు ఇప్పటికే ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే కర్ణాటక మరో అడుగు ముందుకేసి సవివరమైన న్యాయ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ విషయంలో 2018లోనూ, 2023లోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వాలు తగిన చట్టాలు చేసేవరకూ ఇవి అమల్లో వుంటాయని ప్రకటించింది. ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాలు ఇందుకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాయి. సమస్య చాలా జటిలమైనది. మంచానికి పరిమితమైపోయిన రోగులు లోలోపల ఎంత నరకం చవి చూస్తున్నారో బయటి ప్రపంచానికి తెలియదు. నిత్యం సేవలందించే వైద్య సిబ్బందికి, నిరంతరం కనిపెట్టుకుని వుండే కుటుంబ సభ్యులకు సైతం ఆ రోగుల అంతరంగం, వారు పడుతున్న యాతనలు అర్థంకావు. వ్యాధి నయమయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని, వైద్య ఉపకరణాల సాయంతో కోమాలో మంచంపై వెళ్లదీయటం తప్ప మరో మార్గం లేదని తెలిశాక వారిని ఆ స్థితి లోనే ఉంచటం సరికాదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకు విరుద్ధంగా ప్రాణం పోసే శక్తిలేని మనిషికి ప్రాణం తీసే హక్కు ఎక్కడిదన్న వాదనలూ ఉన్నాయి. ఒక మానవ మృగం సాగించిన లైంగిక హింస పర్యవసానంగా కోమాలోకి వెళ్లి ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆసుపత్రి బెడ్‌పై దాదాపు 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి 2015లో కన్నుమూసిన అరుణా రామచంద్ర శాన్‌బాగ్ కేసు ఉదంతంలో తొలిసారి ఈ కారుణ్య మరణం అంశం చర్చ కొచ్చింది. ఆమె దశాబ్దాల తరబడి జీవచ్ఛవంలా రోజులు వెళ్లదీయటం చూడలేకపోతున్నానని,ఇంకా ఎన్నాళ్లపాటు ఆమె ఇలా కొనసాగాల్సి వస్తుందో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారని జర్న లిస్టు పింకీ విరానీ సుప్రీంకోర్టు ముందు 2009లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ప్రశాంత మరణా నికి అవసరమైన ఆదేశాలివ్వాలని విరానీ విన్నవించుకున్నారు. కానీ ఆమె శాన్‌బాగ్ కుటుంబ సభ్యు రాలు కాకపోవటంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇలాంటి స్థితికి చేరుకున్న రోగుల కారుణ్య మరణానికి చట్టబద్ధతను కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది. అయితే ఆ తీర్పు అరుణకు ‘పునర్జన్మ’నిచ్చిందంటూ ఆమెకు సేవలు చేస్తున్న నర్సులంతా మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకున్నారు. రిటైరవుతున్నవారి స్థానంలో వచ్చే కొత్త నర్సులు సైతం ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవారు. కారుణ్య మరణంపైనే కామన్ కాజ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 2018లో తొలిసారి మార్గదర్శకాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలను మరింత సరళం చేస్తూ 2023లో మరో తీర్పునిచ్చింది. హుందాగా జీవించటం మాత్రమే కాదు... హుందాగా మరణించటం కూడా రాజ్యాంగంలోని 21వ అధికరణం పరిధిలోకి వస్తుందని చెప్పింది. అయితే కారుణ్య మరణం కేసుల్లో ఇమిడివుండే జటిల సమస్యలేమిటో, వాటిని స్వప్రయోజన పరులు ఎలా ఉపయోగించుకునే ప్రమాదమున్నదో న్యాయమూర్తులు గుర్తించే వుంటారు. అందుకే ఆ మార్గదర్శకాలు అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. తిరిగి కోలుకునే అవకాశం లేదని, కేవలం వైద్య సాయంతో జీవచ్ఛవాల్లా బతుకీడ్చక తప్పదని గుర్తించిన రోగులకు ఇది వర్తిస్తుందని ధర్మా సనం తెలిపింది. అలాగే చికిత్స తీసుకునేముందే రోగి ఆ ప్రక్రియలో ఎదురుకాగల ప్రమాదాన్ని గుర్తించి, ఆ పరిస్థితి ఏర్పడిన పక్షంలో వైద్యాన్ని నిలిపేయటానికి అంగీకారం తెలిపే ముందస్తు ఆదేశం(ఏఎండీ)పై సంతకం చేసి ఇవ్వొచ్చు. దాన్ని ‘లివింగ్ విల్’గా పరిగణించాల్సి వుంటుంది. ఒకవేళ అది రోగి ఇవ్వలేని పక్షంలో వైద్యానికి ముందు ఆయన తరఫున కుటుంబంలోని పెద్ద ఎవరైనా ఏఎండీని అందజేయొచ్చు. దాని ఆధారంగా రోగికి అమర్చే ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్, ఇతరేతర ఉపకరణాల వంటి ప్రాణావసర వ్యవస్థల్ని తొలగిస్తారు. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా సాగడానికీ, ఎలాంటి లొసుగులకూ ఆస్కారం లేకుండా ఉండటానికీ ప్రతి ఆసుపత్రిలోనూ ముగ్గు రేసి సీనియర్ డాక్టర్లతో రెండు బోర్డులు ఏర్పాటుచేయాలి. ప్రాథమిక స్థాయి బోర్డు తన అభిప్రాయం చెప్పాక, సెకండరీ బోర్డు మరోసారి పరిశీలించాలి. జిల్లా వైద్యాధికారి ఈ నిర్ణయ ప్రక్రియలో పాలుపంచుకోవాలి. దీన్ని ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆమోదించిన పక్షంలో ఆ సంగతిని హైకోర్టు రిజిస్ట్రార్‌కి తెలపాలి. ఇలాంటి అంశాల్లో కుటుంబ సభ్యుల మధ్యే ఏకాభిప్రాయం కుదరక పోవచ్చు. అందుకే విడివిడిగా అందరితో మాట్లాడటం, వారిఅంగీకారం విషయంలో ఇమిడి వున్న సమస్యలేమిటో చెప్పటం ఎంతో అవసరం.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రక్రియ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. డబ్బు కోసం, ఆస్తుల కోసం ఆరాటపడుతూ ఎంతకైనా తెగించే లోకంలో స్వపరభేదాలుండవు. ఇది గాక వైద్యానికి తడిసి మోపెడవుతుందన్న భయంవల్ల లేదా త్వరగా ‘వదుల్చుకోవాలన్న’ తొందర వల్ల వైద్యులను పక్కదోవ పట్టించే ప్రబుద్ధులుంటారు. కనుక ఈ సమస్య చుట్టూ అల్లుకుని వుండే చట్టపరమైన అంశాలు సరే... నైతిక, సామాజిక, ఆర్థిక అంశాలను సైతం తరచి చూడక తప్పదు. సమాజ పోకడలు ఎలా వుంటున్నాయో గమనించుకోక తప్పదు. ‘హుందాగా మరణించటం’ హక్కే కావొచ్చు... కానీ అది ‘మరణించటానికి గల హక్కు’గా పరిణమించకూడదు. ఈ ‘హక్కు’ నిస్సహాయ రోగుల పాలిట శాపంగా మారకూడదు. -
అమెరికా అమానుషత్వం
సహజ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలపై కన్నేసి వాటిని నయానో భయానో ఒప్పించి అక్కడి ప్రాంతాలను దురాక్రమించాలని చూస్తున్న అమెరికా... పొట్టకూటి కోసం తనను ఆశ్రయించినవారి పట్ల మాత్రం అమానుషంగా, హేయంగా ప్రవర్తిస్తున్నదని రుజువైంది. సైనిక విమానంలో అమృత్ సర్ చేరుకున్నవారి కథనాలు వింటుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి, కూర్చోవటానికి కూడా అసౌకర్యంగా ఉండే సైనిక విమానంలో పశువుల్ని తరలించిన చందాన మనవారిని తీసుకొచ్చారు. ఇందులో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు కూడా ఉన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. గత నెలలో కొలంబియా, మెక్సికో దేశాలవారిని ఈ పద్ధతిలోనే పంపటానికి ప్రయత్నించినప్పుడు వాటినుంచి నిరసన వ్యక్తమైంది. అమెరికా సైనిక విమానాలకు అనుమతినీయబోమన్నాయి. చివరకు కొలంబియా తలొగ్గినా మెక్సికో మాత్రం తమ విమానాన్ని పంపి వలసదారులను వెనక్కు తెచ్చుకుంది. బ్రెజిల్ సైతం తమవారిపట్ల అమానుషంగా వ్యవహరించటాన్ని ఖండించింది. భారతీయులకు జరిగిన అవమానంపై సహజంగానే పార్లమెంటులో గురువారం ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారిని గుర్తించి వెనక్కు పంపటం ఏ దేశంలోనైనా జరిగేదే. పార్లమెంటులో విదేశాంగమంత్రి జైశంకర్ చెప్పినట్టు అక్రమ వలసదారులను వెళ్లగొట్టడం కొత్తేమీ కాదు. ఏ దేశమూ అలాంటివారిని సమర్థించదు. అక్రమ వలసల్ని ప్రోత్సహించదు. కానీ వెనక్కు పంపే క్రమం మానవీయంగా, నాగరికంగా ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. చట్టబద్ధంగానో, చట్టవిరుద్ధంగానో తమ భాష, తమ ప్రాంతం కానివారు ప్రవేశిస్తే సహజంగానే స్థానికుల్లో అనేక సంశయాలు కలుగుతాయి. తెలియని భయాందోళనలుంటాయి. ప్రభుత్వాలకుండే ఇతరేతర అనుమానాలు సరేసరి. అమెరికాలో రిపబ్లికన్ల ఏలుబడివున్నా, డెమాక్రాట్ల ప్రభుత్వం నడిచినా అక్రమ వలసదారులను కనికరించింది లేదు. కాకపోతే ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో దాన్నొక బూచిగా చూపారు. శ్వేతజాతీయులు ఎదుర్కొంటున్న సకల సమస్యలకూ మూలం వలసదారులేనన్న భ్రమ కలగజేయటంలో, వారికి డెమాక్రటిక్ పార్టీ మద్దతునిస్తున్నదని నమ్మించడంలో విజయం సాధించారు. తాను అధికారంలోకొచ్చాక అలాంటి వారందరినీ గుర్తించి పంపేస్తానని పదే పదే చెప్పారు. ఆ ప్రచారం ఆయనకు గణనీయంగా వోట్లు రాల్చింది. కానీ తమది ప్రపంచంలోనే పురాతన ప్రజా స్వామ్య వ్యవస్థ అని స్వోత్కర్షకు పోయే దేశం వలసదారులను పశువులకన్నా హీనంగా పరిగణించటం, వారి కనీస మానవహక్కులను బేఖాతరు చేయటం సబబేనా? వలసదారులు తిరుగుబాటు చేయడానికి రాలేదు. వారి దగ్గర మారణాయుధాలుండవు. ఏజెంట్లను నమ్మి, వారికి లక్షలకు లక్షలు అర్పించుకుని నిజంగా అమెరికా చాన్సు వచ్చిందేమోనన్న భ్రమలో కొందరు నిర్భాగ్యులు విమానం ఎక్కుతారు. వారిని ఇటలీ, బ్రెజిల్, మెక్సికో, పెరూవంటి దేశాల్లో దించి ‘మీ చావు మీరు చావండ’ని గాలికొదిలేస్తారు. తమ దగ్గరున్న కాగితాలు నిజమైన వేనన్న భ్రమలో ఉన్న వలసదారులకు అప్పుడిక ఏం చేయాలో పాలుపోదు. చివరకు దేవుడిపై భారంవేసి ముందుకు పోవటానికే నిర్ణయించుకుని కొండలూ, గుట్టలూ, నదులూ దాటుకుంటూ తిండీతిప్పలూ లేక నీరసించి అమెరికా సరిహద్దులకు చేరుకుంటారు. అదృష్టం ఉంటే అక్కడి భద్రతా బలగాల కళ్లుగప్పి ఆ దేశంలోకి ప్రవేశిస్తారు. లేదా దొరికిపోయి జైళ్లపాలవుతారు. భ్రమ లన్నీ అడుగంటి, అక్కడ ఉండలేక, వెనక్కొచ్చే దారి దొరక్క జైళ్లలో మగ్గుతారు. సవ్యంగా పంపితే ‘బతుకు జీవుడా’ అనుకుంటూ అక్కడినుంచి నిష్క్రమించటానికే అత్యధికులు సిద్ధంగా ఉంటారు. అలాంటివారిపైనా ట్రంప్ ప్రతాపం! అప్పుడెప్పుడో వియత్నాం మొదలుకొని వర్తమానంలో గాజా వరకూ అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేర్వేరు దేశాల్లో సాగించిన అకృత్యాల మాటేమిటి? వాటికి పడాల్సిన శిక్షేమిటి? ఏనాడైనా ఆత్మసమీక్ష చేసుకుందా? ఎడ్వర్డ్ స్నోడెన్, చెల్సియా మానింగ్ వంటివారు బట్టబయలు చేసిన రహస్య పత్రాలను ఒకసారి అమెరికా చదువుకుంటే మంచిది. అక్రమ వలసదారులను సమర్థించాలని ఎవరూ చెప్పరు. కానీ అమెరికా వ్యవహరించిన తీరును మన ప్రభుత్వం ఖండించాల్సిన అవసరం లేదా? గతంలో యూపీఏ హయాంలో అమెరి కాలో మన దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై వచ్చిన ఆరోపణలు ఆసరా చేసుకుని ఆమెకు సంకెళ్లు వేసి, వివస్త్రను చేసి తనిఖీ చేసినప్పుడు మన ప్రభుత్వం అప్పటి అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. భారత్‌లో పర్యటిస్తున్న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల్ని కలుసుకునేందుకు మన నాయకులు నిరాకరించారు. అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందికిచ్చే అనేక రాయితీలనూ, సౌకర్యాలనూ ఉపసంహరించారు. దౌత్యరంగంలో రెండు దేశాల మధ్యా విడ దీయరాని అనుబంధం ఉండి వుండొచ్చు. అది మనకు మిత్ర దేశమే కావొచ్చు. వలస దారులను సవ్యంగా పంపి వుంటే సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు. కానీ జరిగింది అందుకు భిన్నం. ఈ విషయమై పార్లమెంటులో వ్యక్తమైన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. తప్పును తప్పని చెప్పితీరాలి. వలసదారుల విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పే అంతర్జాతీయ ఒడంబడిక లున్నాయి. అగ్రరాజ్యమైనంత మాత్రాన వాటిని బేఖాతరు చేస్తానంటే కుదరదు. మున్ముందు ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోకూడదనుకుంటే మన నిరసనను తెలియజేయటమే ఉత్తమం. -
చెదిరిన డాలర్ డ్రీమ్స్
అక్రమ వలసల్ని సహించేది లేదనీ, అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి వెనక్కి పంపేవరకు నిద్రపోయేది లేదనీ చెబుతూ వస్తున్న అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు చేతల్లోకి దిగారు. సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో ఉంటున్న భారత్‌కు చెందిన అక్రమ వలసదారుల్లో కొందరిని తొలి విడతగా వెనక్కి పంపేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో శాన్ ఆంటోనియో నుంచి బయలు అమెరికన్ యుద్ధవిమానం బుధవారం మధ్యాహ్నం మన అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడంతో కొత్త అంకం ఆరంభమైంది. ఆ ఖరీదైన సీ–17 అమెరికా యుద్ధ విమానం నుంచి 104 మంది భారతీయ అక్రమ వలసదారులు వెనక్కి వచ్చినట్టు కథనం. వచ్చిన వారి పత్రాలనూ పరిశీలించి, ప్రాథమికంగా ప్రశ్నించి, వైద్యపరీక్షలు సైతం చేసి, ఎలాంటి నేర చరిత్రా లేదని నిర్ధరించుకున్నాక వారిని స్వరాష్ట్రాలకు పంపే పనిలో భారత పాలనా యంత్రాంగం నిమగ్నమైంది. గడచిన బైడెన్ హయాంలో 2024లో అమెరికాతో మన సంబంధాలు కొంత అడుగంటాక, తాజా ట్రంప్ ఏలుబడిలో వాటిని మళ్ళీ బలోపేతం చేసుకోవాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ అక్రమ వలసల అంశం కొంత చీకాకు పరిచేదే అయినా, అనివార్యతల్ని గ్రహించి, సహనంతో సమస్యల్ని చక్కదిద్దుకోవడమే భారత్ ముందున్న మార్గం. పత్రాలు లేకుండా ఉంటున్నవారిని సహించేది లేదని హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్ జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాంటివారిని ఏరి ఏరి మరీ భారత్‌కు వెనక్కు పంపడం ఇది తొలిసారి. గతంలో, గ్వాటెమలా, పెరూ, హాండూరస్ల నుంచి చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారిని తిరుగు టపాలో పంపేందుకు అమెరికా సైనిక విమానాన్ని వినియోగించింది. ఇప్పుడు మన విషయంలోనూ అదే చేసింది. వెనక్కి పంపేందుకు సిద్ధం చేసిన 15 లక్షల మంది జాబితాలో భారతీయులు 18 వేల మంది దాకా ఉన్నారట. అంటే, రానున్న నెలల్లో ఇలాంటి మరిన్ని విమానాల్లో వందల సంఖ్యలో మనవాళ్ళు వెనక్కి రానున్నారన్నది చేదు నిజం. అంటే, ఎంత స్నేహమున్నా అసలు సంగతికొచ్చే సరికి అగ్ర రాజ్యాధినేత భారత్‌తోనూ ముక్కుసూటిగానే ఉంటారన్నది సుస్పష్టం. నిజానికి, మెక్సికో, ఎల్సాల్వడార్ల తర్వాత అమెరికాలో అక్రమ వలసదారుల్లో అధిక సంఖ్యాకులు భారతీయులే. అక్కడ అలాంటి భారతీయుల సంఖ్య దాదాపు 7.25 లక్షలని ఓ లెక్క. తాజాగా వెనక్కివచ్చినవారిలో పంజాబ్ (30 మంది), హరియాణా (33), గుజరాత్ (33), తదితర రాష్ట్రాల వారున్నారు. వీరిలో పిల్లలు, మహిళలు కూడా ఉండడం గమనార్హం. ఆ మాటకొస్తే, అమె రికా ఇలా అక్రమ వలసదారులైన భారతీయుల్ని వెనక్కిపంపడం కొత్తేమీ కాదు. గత అక్టోబర్‌లోనూ వంద మంది పంజాబ్‌కు తిరిగొచ్చారు. 2023 అక్టోబర్ నుంచి నిరుడు సెప్టెంబర్ ఆఖరు వరకు మొత్తం 1100 మంది ఇలా ఇంటి ముఖం పట్టినవారే! అగ్రరాజ్యాన్ని కలలస్వర్గంగా ఊహించుకుంటూ, అక్కడ జీవనం బాగుంటుందనే ఆశతో, డాలర్ల సంపాదనపై ఆకర్షణతో అక్కడకు సక్రమంగానో, అవసరమైతే అక్రమంగానో వెళ్ళి, స్థిరపడాలనే ధోరణి చాలాకాలంగా ఉన్నదే. ఒక లెక్క ప్రకారం ప్రపంచపు పెద్దన్న పంచన చట్టప్రకారమే దాదాపు 50 లక్షల మంది భారత జాతీయు లున్నారంటే మన అమెరికా మోజు ఎంతో అర్థం చేసుకోవచ్చు. దీర్ఘకాలంగా మన భారతీయుల్లో అంతకంతకూ అధికమవుతూ వచ్చిన ఆ మోజు ఫలితమే – అధికసంఖ్యలోని అక్రమ వలసలు. ముఖ్యంగా, పంజాబ్ లాంటి ప్రాంతాల నుంచి అలా వెళ్ళేవారు మరీ ఎక్కువ. స్థానిక పంజాబీ జాతీయంలో చెప్పాలంటే ‘డాంకీ రూట్స్’లో (వాహనాలు మారుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతూ) అమెరికా చేరుకుంటారు. విదేశాల్లో బతుకు తెరువుకై తపిస్తున్న వ్యక్తుల ఆశల్ని సొమ్ము చేసుకుంటూ, ట్రావెల్ ఏజెన్సీలు భారీగా లక్షల్లో డబ్బు గుంజి, దొంగ వీసాలతో వారిని ఇలా దేశాల హద్దుల్ని దాటిస్తుంటాయి. సగటున ఏటా 90 వేల పైచిలుకు భారతీయులు ఇలా అక్రమంగా అమెరికాలో ప్రవేశించబోయి, పట్టుబడుతున్నారు. తల తాకట్టుపెట్టి, సరైన పత్రాలు లేకుండానే అందరి కళ్ళుగప్పి అలా హద్దులు దాటి వెళ్ళిన పలువురికి ఇప్పుడు కల చెదిరింది. ట్రంప్ రాకతో వారి కథ మారింది. చాలామందికి కన్నీరే మిగిలింది. తగిన పత్రాలు లేకుండా అమెరికాలోనే కాదు, ఏ దేశంలోనైనా ఏ జాతీయులు నివసించినా అది తప్పే. శిక్షార్హమైన నేరమే. ఇంతకాలం చూసీచూడనట్టు చెల్లిపోయినా, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానంటూ ఇప్పుడు రెండోసారి పగ్గాలు చేపట్టిన ట్రంప్ ఖడ్గప్రహారం చేయడాన్ని తప్పుపట్టలేం. అందుకే, బాధితులు భారతీయులైనా మన దేశం మారుమాట్లాడ లేకపోతోంది. ఆ మాటకొస్తే, వ్యవస్థీకృత నేరాలకు దారి తీస్తున్నట్లు భావిస్తున్న అక్రమ వలసలకు భారత్ వ్యతిరేక మని మన విదేశాంగ శాఖ నొక్కి వక్కాణించాల్సి వచ్చింది. అదే సమయంలో భారతీయుల పునరా గమనానికి వీలు కల్పిస్తామనీ చెప్పాల్సి వచ్చింది. వాణిజ్య సుంకాల విధింపు సహా అనేక విష యాల్లో ట్రంప్ దూకుడు మీదున్న తరుణంలో అమెరికాతో దీర్ఘకాలిక స్నేహసంబంధాలకు ఇబ్బంది కలగకుండా మన దేశం ఆచితూచి వ్యవహరించక తప్పదు. ఆ కోణం నుంచి చూసినప్పుడు భారత్ వైఖరి సమంజసమే కాదు సహజం కూడా! అయితే, ఈ అక్రమ వలసల్ని ఆపాలంటే, అమాయకుల ఆశను సొమ్ము చేసుకొనే అక్రమార్కుల పనిపట్టాలి. అంతకన్నా ముఖ్యంగా, ఆశల పల్లకీలో అగ్రరాజ్యం వైపు ఉరికే మనవాళ్ళకు గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగావకాశాలిక్కడే కల్పించడంపై పాలకులు దృష్టిపెట్టాలి. చిత్తశుద్ధితో అది చేయనంతకాలం ఈ డాలర్డ్రీవ్స్ు కథలు కంచికి చేరవు! -
ఆసక్తి రేపుతున్న అగ్నిపరీక్ష
దేశ రాజధాని ప్రాంతం ఎన్నికల సమరానికి సిద్ధమైంది. నేడు జరగనున్న ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఉత్కంఠ ఇంత చలిలోనూ వేడి పుట్టిస్తోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీలో 70 స్థానాల్లోని 699 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.56 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ సమరమిది. సోమవారం సాయంత్రం గడువు ముగిసేవరకు హోరాహోరీగా సాగిన ప్రచారంలో పార్టీల పరస్పర నిందారోపణలు పతాక స్థాయికి చేరాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశి తమ పాలన నమూనాను ఆదర్శంగా చూపితే, ఆ పాలనంతా అవినీతిమయమంటూ, అగ్రేసర కమలనాథులు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు శాంతి భద్రతల సమస్యను సైతం లేవనెత్తారు. గత రెండు ఢిల్లీ ఎన్నికల్లో కనీసం ఖాతా అయినా తెరవలేకపోయిన కాంగ్రెస్ పక్షాన రాహుల్, ప్రియాంకలు మిగతా రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికారిక నివాసాలకు ఆప్ ప్రజాధన దుర్వినియోగం, యమునా నది నీటి నాణ్యత, ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణలు పతాకశీర్షికలకు ఎక్కితే, ప్రతి పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన ఉచిత కానుకలు ప్రజాకర్షణకు పోటీలు పడ్డాయి. నేటి ఓటింగ్, శనివారం నాటి కౌంటింగ్లతో కానీ రానున్న రోజులకు కానున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరో తేలనుంది. ఏకోన్ముఖంగా సాగిన గడచిన 2015, 2020 నాటి ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఉత్కంఠభరిత పోరాటం సాగనుంది. ముచ్చటగా మూడోసారి ఆప్ విజయం నల్లేరుపై బండి నడక కాదని కేజ్రీవాల్‌కూ తెలుసు. అయితే, ప్రస్తుతం ఎక్సైజ్ పాలసీతో అనుచిత లబ్ధి కేసులో బెయిల్‌పై ఉన్న కేజ్రీ వాల్ ఇప్పటికీ కాషాయ పార్టీకి బలమైన ప్రత్యర్థే. చిత్రమేమిటంటే... ఓటర్లను కుదిపేస్తాయనుకున్న అనేక అంశాలు క్షేత్రస్థాయిలో ఏమంత ప్రభావం చూపడం లేదట. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా పలువురు ‘ఆప్’ అగ్ర నేతల్ని జైలుకు పంపిన ఎక్సైజ్ కుంభకోణం కానీ, ప్రజాధన దుర్వినియోగంతో కేజ్రీవాల్ ఆర్భాటంగా ‘శీష్ మహల్’ కట్టుకున్నారన్న ఆరోపణలు కానీ ఓటరుల్ని పెద్దగా ఆకర్షించడం లేదని వార్త. కూటి కోసం, కూలీ కోసం దేశ రాజధానికి వచ్చి కష్టాలు పడుతున్న బడుగు వర్గాలు కాస్తంత ఊపిరి పీల్చుకొనేందుకు ఎంతో కొంత చేయడంలో ఆప్ సఫలమైంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఉచిత మంచినీరు, ఉచిత ఆస్పత్రి – వైద్యం లాంటి ప్రభుత్వ సౌకర్యాలు అన్నీ అందరికీ సక్రమంగా అందకున్నా, ఎంతో కొంత లబ్ధి చేకూరడంతో ఆ వర్గాల్లో పార్టీ కొంత బలంగా ఉందని ఓ విశ్లేషణ. అదే సమయంలో ‘ఇండియా’ కూటమిలోని ఆప్, కాంగ్రెస్‌లు ఢిల్లీలో పరస్పరం అస్త్రాలు సంధించుకోవడం చిత్రమైన స్థితి. 2024 హరియాణా ఎన్నికల్లో తమ మధ్య పోరు చివరకు బీజేపీకి లాభించిన చేదు నిజం నుంచి ఈ భాగస్వామ్య పక్షాలు పాఠం నేర్చుకున్నట్టు లేదు. గతంలో ఏకధాటిగా 15 ఏళ్ళు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. పోగొట్టుకున్న ఇమేజ్ను కూడగట్టుకొనేందుకు హస్తం పార్టీ తంటాలు పడుతోంది కానీ, పరిస్థితి ‘అప్ప ఆరాటమే కానీ... బావ బతికే మార్గం లేదు’ అన్నట్టుంది. గమ్మత్తేమిటంటే, దశాబ్దిన్నర క్రితం కాంగ్రెస్‌పై కోపంతో మార్పు కోరిన మధ్యతరగతి జనాభా సైతం ప్రస్తుతం ఆప్ ఉచిత హామీలు, అంతంత మాత్రపు అభివృద్ధితో కినిసినప్పటికీ మళ్ళీ మార్పు కావాలనీ, మళ్ళీ కాంగ్రెస్ రావాలనీ కోరుకోవట్లేదు. వెరసి, పోటీ అంతా బలమైన ఆప్కీ, బీజేపీకీ మధ్యనే! హరియాణాలోని బీజేపీ సర్కార్ ఢిల్లీకి వచ్చే యమునా జలాల్ని విషతుల్యం చేస్తోందన్న కేజ్రీవాల్ బాధ్యతారహిత ఆరోపణ ఎన్నికల సంఘం (ఈసీ) తాఖీదుకు దారి తీసినా, వివరణతో ఆయన దాన్ని అధిగమించారు. బీజేపీని ఆత్మరక్షణ ధోరణిలో పడేసి, ఆరోపణలకు జవాబివ్వడంలోనే ఆ పార్టీకి పుణ్యకాలం గడిచిపోయేలా చేశారు.స్థానిక ఢిల్లీ పీఠంపై ఆప్ 11 ఏళ్ళు గడపడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజం. అదే సమయంలో కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టినప్పటికీ, 27 ఏళ్ళుగా ఢిల్లీ అసెంబ్లీపై జెండా ఎగరేయలేకపోయిన బీజేపీ ఈసారి చరిత్ర తిరగరాయాలని బలంగా సంకల్పించింది. దిగువ శ్రేణి జనం ఆప్‌కు అండగా నిలబడితే, ఆదాయపు నిచ్చెనలో పైకి పోయినకొద్దీ అవకాశాలను అందుకుంటున్న ప్రజానీకం మాత్రం మోదీ మార్కు బీజేపీ అభివృద్ధి మాటల వైపు మొగ్గుతున్నారు. ఈ సంకుల సమరంలో బీజేపీ సైతం ఓటర్ల కోసం ఉచితాల బాట తొక్కక తప్పలేదు. పనిలోపనిగా ఇంతకాలంగా భారం మోస్తున్న మధ్య తరగతి వర్గానికి తాజా కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను నుంచి భారీ ఊరట అందించింది. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఢిల్లీకి ప్రత్యేకించే ఏదీ చేయరాదంటూ నెల క్రితం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) హూంకరించినా, జరిగింది వేరు. పన్ను మినహాయింపు ‘ఢిల్లీకి మోదీ సర్కార్ కానుక’ అంటూ పత్రికల్లో మొదటి పేజీలో బీజేపీ భారీ ప్రకటనలు గుప్పించినా ఈసీ కిమ్మనలేదు. గత పదేళ్ళలో అధికారాలతో బలోపేతుడైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, ఓటర్ల జాబితాల్లో గోల్మాల్ ఆరోపణలు సహా అనేక అంశాల్లో ఇప్పుడు ఈసీ కానీ నిష్పక్షపాతంగా ఉన్నట్టు నమ్మించలేకపోయారు. ఈ నెలలోనే రిటైర్ కానున్న సీఈసీపై ఆప్ ఆరోపణల నేపథ్యంలో ఈసీ వివరణనిచ్చుకోవాల్సి వచ్చిన దుఃస్థితి. ఆరోపణలు, అనుమా నాల నేపథ్యంలో ‘ఢిల్లీలో కేజ్రీవాల్... కేంద్రంలో మోదీ’ అన్న మాట మారిపోయే అవకాశమూ లేక పోలేదు. అందువల్లే, ఈసారి ఢిల్లీ ఎన్నికలు ఆప్‌కు అగ్నిపరీక్షయ్యాయి. ఈ ఏటి బిహార్ ఎన్నికలపై, వచ్చే ఏటి బెంగాల్ ఎన్నికలపైనా ఈ ఫలితాల ప్రభావం తధ్యం గనక ఆసక్తి రేపుతున్నాయి. -
అగ్రరాజ్యపు వాణిజ్య యుద్ధం
అగ్రరాజ్యం కొత్త యుద్ధానికి తెర తీసింది. అయితే, ఇది ఆయుధాలతో కూడిన యుద్ధం కాదు... ఆర్థికపరమైన యుద్ధం. అధ్యక్షుడు ట్రంప్ తన అత్యవసర అధికారాలను ఉపయోగిస్తూ... కెనడా, మెక్సికోల నుంచి దిగుమతులపై 25 శాతం మేర, అలాగే చైనా నుంచి దిగుమతులపై ఇప్పటికే ఉన్న భారానికి అదనంగా మరో 10 శాతం మేర సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కెనడా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, సహజ వాయువుపై మాత్రం 10 శాతం వడ్డింపుతో సరి పెట్టారు. ఇది అమెరికాకూ, దాని అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు మూడింటికీ మధ్య వాణిజ్య యుద్ధాల శకానికి శ్రీకారం చుట్టింది. చైనాను పక్కనబెట్టినా, సాక్షాత్తూ పొరుగుదేశాలపైనే ట్రంప్ ఇలా ఆర్థికంగా కత్తి దూయడం విడ్డూరమే. అదేమంటే... పెరుగుతున్న నేరాలనూ, డ్రగ్స్ సరఫరానూ అడ్డుకోవడానికే ఈ చర్య అంటూ సమర్థించుకోవడం మరీ విచిత్రం. ఈ సంచలనాత్మక చర్యకు ప్రతిచర్యగా మెక్సికో సైతం ఎదురు సుంకాలు వేయగా, త్వరలో జాతీయ ఎన్నికలున్న కెనడా కూడా అమెరికాకు దీటుగా 25 శాతం సుంకాల వడ్డింపుతో ఎదురుదాడికి దిగింది. అమెరికా తప్పుడు విధానాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు వేయనున్నట్టు చైనా ప్రకటించింది. కడపటి వార్తలు అందుతున్న సమయానికి అమెరికా – మెక్సికోల మధ్య మాత్రం సయోధ్య కుదురుతోందనీ, ఆ దేశంపై సుంకాలను అమెరికా నెల రోజులు వాయిదా వేసిందనీ సమాచారం. ఆ మాట ఏమైనా, విశ్వవేదికపై ట్రంప్ ఆరంభించిన వాణిజ్య పోరు రసకందాయంలో పడింది. ఇప్పటికే పరాయి దేశాలకు 36 లక్షల కోట్ల డాలర్ల మేర అప్పులున్న అగ్రరాజ్యం వాటి నుంచి బయటపడేందుకు సుంకాలు పెంచినట్టనిపిస్తున్నా, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు స్వయంకృత గాయమే. పెరిగిన సుంకాలతో అమెరికాకు సరఫరా తగ్గి, సరుకుల ధరలు పెరిగి, సామాన్యులపై భారం పడుతుంది. ఈ సుంకాల వల్ల ఈ ఏడాది అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పు డున్న 2.9 శాతం నుంచి మరో అర శాతం దాకా పెరుగుతుందట. ఇక, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 1.5 శాతం మేర పడిపోతుందని విశ్లేషణ. సగటు అమెరికన్ కుటుంబంపై ఏటా వెయ్యి నుంచి 1200 డాలర్ల మేర భారం పడుతుందని లెక్క. మొత్తం మీద అక్రమ వలసలు, ఫెంటానిల్ తరహా మందుల లాంటి ప్రధాన సమస్యలపై ట్రంప్ దృష్టి పెట్టడం బానే ఉన్నా, దిగుమతి సుంకాలు పెంచడమనే తప్పుడు విధానం వల్ల అమెరికన్లకే నష్టమనే భావన ఉంది. సరుకుల ధరలు తగ్గిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తీరా అందుకు వ్యతిరిక్తంగా వ్యవహరిస్తున్నా రని ప్రతిపక్ష డెమోక్రాట్లు ధ్వజమెత్తుతున్నారు. గత ట్రంప్ హయాంలోని చైనాతో వాణిజ్య యుద్ధాన్నే తమ పాలనలో కొనసాగించిన డెమోక్రాట్లు ఇప్పుడు భిన్న వైఖరి తీసుకుంటారేమో చూడాలి. ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై ఇంతగా సుంకాల విధింపు ఆలోచనను దశాబ్దం క్రితం చేస్తే దాన్ని వెర్రిమొర్రి ఆలోచనగా చూసేవారు. కానీ, ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఆ పనే చేసింది. మెక్సికో, కెనడా, చైనాలతో ఇది ఆగుతుందా, లేక రానున్న రోజుల్లో యూరోపియన్ యూనియన్, భారత్ సహా ఇతర దేశాలపైనా ట్రంప్ ఈ అస్త్రం ప్రయోగిస్తారేమో చూడాలి. నిజానికి, వలసలను ఆపి, అధిక దిగుమతులకు ముకుతాడు వేయాలంటే, తగినంత సమయం వెచ్చించి, విధానపరమైన అంశాలపై లోతుగా దృష్టి పెట్టాలి. వలసజీవుల్ని పెద్దయెత్తున వెనక్కి పంపడంతో అమెరికాలో చౌకగా దొరికే శ్రామికులు తగ్గి, వేతనాలు పెరిగి, ద్రవ్యోల్బణం హెచ్చుతుంది. కానీ, ఎవరు చెప్పినా ఒక పట్టాన వినే ఘటం కాని ట్రంప్ సమస్త వాణిజ్య, ఆర్థికేతర సమస్యలకూ ఈ సుంకాల విధింపే సర్వరోగ నివారిణి అని భావిస్తున్నారు. చమురు మొదలు సరుకుల దాకా ఏవీ పొరుగుదేశాల నుంచి అమెరికాకు అక్కర్లేదని హూంకరిస్తున్నారు కానీ, దిగుమతులేవీ చేసుకోకుండా, సమస్తం స్వదేశంలోనే సిద్ధం చేసుకొని, ఎవరితోనూ ఏ వాణిజ్య సంబంధాలూ అవసరం లేని బంధిత ఆర్థిక వ్యవస్థగా అమెరికాను తీర్చిదిద్దడం సాధ్యమేనా? దేశాల ద్వారాలన్నీ తెరుచుకొని, ప్రపంచమొక కుగ్రామంగా మారిన వర్తమాన కాలంలో ఈ రకమైన విధానంతో మనగలగడం అగ్రరాజ్యానికైనా సరే కుదురుతుందా?ట్రంప్ తాజా చర్యతో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి, గందరగోళం నెలకొన్నాయి. ప్రపంచమంతటా దీని ప్రకంపనలూ తప్పవు. భారత్ అనేక విడిభాగాల కోసం దిగుమతులపై ఆధారపడినందున మన వస్తూత్పత్తి రంగం పైన, అలాగే డాలర్ బలపడి, విదేశీ మదుపరులు విక్రయాల్ని కొనసాగించడంతో మార్కెట్ పైన ప్రభావం కనిపించనుంది. అలాగే, అమెరికా భారీ సుంకాల బారిన పడ్డ ఆర్థిక వ్యవస్థలు ఇక తమ వస్తువుల్ని ఇతర దేశాల్లో కుమ్మరించాలి గనక భారత పరిశ్రమలకు బెత్తం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి, ఇప్పటికైతే సుంకాల విధింపు జాబితాలో మన పేరు లేకున్నా భారత్ తగిన జాగరూకతతో వ్యవహరించాలి. ఈ నెలలోనే అమెరికాలో పర్యటించ నున్న భారత ప్రధాని ఇరుదేశాల బలమైన బంధాన్ని మనకు సానుకూలంగా మలుచుకోవాలి. అయితే, ఒకటి మాత్రం నిజం. కోర్టులు బరిలోకి దిగి, ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమని తీర్మానిస్తే తప్ప... ప్రజాభిమతంతో గద్దెనెక్కిన ట్రంప్ ఆలోచనలకూ, అనుసరించే విధానాలకూ అడ్డులేదు. కనుక ట్రంప్ మార్కు వ్యవహారశైలికి ఇవాళ్టికి ఇవాళ బ్రేకులు పడవు. అదేసమయంలో దిగుమతి సుంకాల వల్ల అమెరికా సంపద్వంతమై, బలోపేతమవుతుందన్న ఆయన ఆలోచన మాత్రం ఆచరణలో వాస్తవరూపు దాల్చడమూ కష్టమే! -
దేవభూమి
గతేడాది డిసెంబర్ 25న మరణించిన మలయాళ మహారచయిత ఎమ్.టి.వాసుదేవన్ నాయర్ తన సాహిత్య జీవితంలో తనను బాగా కదిలించిన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన 1976లో తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో ఉన్నారు. అప్పుడో పల్లెటూరతను వచ్చి, ఆయనంటే అభిమానమని చెప్పడమే కాదు, ‘మీరు జబ్బుతో ఉన్నారని తెలిసి సేవ చేయడానికి వచ్చాను. కొన్ని పనులు మగ నర్సులే చేయాల్సి ఉంటుంది. మీకు నయమయే దాకా ఆ పనులు చేస్తాను’ అన్నాడట. మనిషి మానసిక ఘర్షణల మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఎమ్టీ విస్తారంగా రాశారు. కథలు, నవలలు, యాత్రా రచనలు, బాల సాహిత్యం, విమర్శతో పాటు సినిమాలకు స్క్రీన్ ప్లే రచనలు చేయడమే కాకుండా, అత్యుత్తమ చిత్రాలు అనదగ్గవాటికి దర్శకత్వమూ వహించారు. కేరళ సంస్కృతి మీద ఆయన ప్రభావం ఎనలేనిది. ఆ పల్లెటూరి మనిషి ఎమ్టీ రచనలు చదవడమే కాదు, ఆయన కోసం తన వ్యవసాయ పనులను ఆపుకొని మరీ వచ్చాడు. ఏ రచయితకైనా తన రచనా ప్రయాణంలోని కష్టాల బరువు దిగిపోయే ఘట్టమిది. సహజంగానే ఆ స్పందనకు వాసుదేవన్ నాయర్ కళ్లు చెమ్మగిల్లాయి. ఇది ఒక గొప్ప రచయితగా వాసుదేవన్ నాయర్‌కు జరిగిన ఒక విడి అనుభవమే కావొచ్చు; కానీ మలయాళీయుల సాహిత్య సంపన్నతకు అది గుర్తు. పామరులను కూడా సాహిత్యం ఎలా పెనవేసుకుపోయిందో చెప్పడానికి నిదర్శనం. ఎందుకంటే, ఇదే వాసుదేవన్ నాయర్ మరో సందర్భంలో ఒక గ్రామీణుడు ఆయన దగ్గర ఉచితంగా పుస్తకం తీసుకోవడానికి నిరాకరించి, అతడి దగ్గరున్న ముడుతలు పడిన నోట్లు బలవంతంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ నేల అలాంటిది. దోస్తోవ్స్కీ లాంటి రష్యన్ రచయిత మీద కూడా ఒక సాధారణ ఆటోడ్రైవర్ తనదైన అభిప్రాయాన్ని కలిగివుంటాడని మురిసిపోయే మలయాళీ సాహిత్యజీవులు ఎందరో! ‘స్వర్గాన్ని నేను ఎప్పుడూ ఒక రకమైన గ్రంథాలయంలా ఊహిస్తాను,’ అంటారు అర్జెంటీనా రచయిత జార్జ్ లూయీ బోర్హెస్. పుస్తకాలను మించిన పెన్నిధి ఏముంది! గ్రంథాలయం అనేది ఒక ఆశ. ఒక దారిదీపం. ఎమ్టీ సహా చాలామంది రచయితలు తాము రచయితలు కావడానికి ఒక కారణంగా ‘ఎక్కువ సమయం లైబ్రరీలో గడపడం’ అని చెబుతారు. అత్యంత ప్రకృతి రమణీయత వల్ల కాబోలు కేరళను దేవభూమి అని పిలుస్తుంటారు. కానీ అక్కడి గ్రంథాలయాల వల్ల కూడా అది దేవభూమి అవుతోంది. రాష్ట్రంలో ఎనిమిది వేలకు పైగా లైబ్రరీలు ఉండటమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ముప్పైకి పైగా పెద్ద సాహిత్య ఉత్సవాలు జరుగుతుంటాయి. దేశంలో ప్రతి పంచాయితీలో దాదాపు ఎనిమిది గ్రంథాలయాలున్న ఏకైక రాష్ట్రం కేరళ. దేశంలో అత్యధిక పబ్లిక్ లైబ్రరీలున్న రాష్ట్రం మహారాష్ట్ర (12,191). తర్వాతి స్థానంలో ఉన్న కేరళ (8,415)తో పోల్చితే మహారాష్ట్ర విస్తీర్ణం సుమారు ఎనిమిదింతలని గ్రహిస్తే కేరళ గొప్పదనం అర్థమవుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా కూడా కేరళ సంఖ్యలో నాలుగో వంతైనా లేవు. అక్కడి గిరిజన గ్రామాల్లోనూ కొత్తగా 630 గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలని గతేడాది నిర్ణయించారు. కేరళ గ్రంథాలయోద్యమ పితామహుడు పీ.ఎం.పణిక్కర్ వర్ధంతి అయిన జూన్ 19ని అక్కడ ‘రీడింగ్ డే’గా జరుపుతుంటారు. చదవడాన్నీ, చదివే వాతావరణాన్నీ మలయాళీయులు ఎంతగా ప్రోత్సహిస్తున్నారనడానికి ఇది రుజువు. ఈమధ్య ‘కేరళ లెజిస్లేచర్ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్–2025’ ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా తిరువనంతపురంను ‘యునెస్కో’ గుర్తించాలని కోరింది అందుకే. తమ రాజధాని నగరం ఆ గౌరవానికి పూర్తిగా అర్హమైనదేనని ఆయన ధీమా!గతేడాదే ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో కేరళలోని మరో నగరమైన కోళిక్కోడ్ను ‘సాహిత్య నగరం’గా గుర్తించిన సంగతి ఇక్కడ గుర్తుచేసుకోవాలి. భారత్‌లో యునెస్కో గౌరవం దక్కించుకున్న తొలి నగరం ఇదే. ఒక్క కోళిక్కోడ్లోనే 600 గ్రంథాలయాలు, రీడింగ్ రూములు ఉన్నాయి. వాసుదేవన్ నాయర్, వైకోం మహమ్మద్ బషీర్, పి.వత్సల లాంటి ఎందరో రచయితలకు కోళిక్కోడ్తో అనుబంధం ఉంది. యునెస్కో మొదలైన 1945లోనే కేరళలో ‘సాహిత్య ప్రవర్ధక సహకార సంఘం’ ఏర్పాటుకావడం ఆ రాష్ట్ర ఘన సాహిత్య వారసత్వాన్ని గుర్తుచేస్తోంది. పుస్తకాల ప్రచురణ కోసం కొంతమంది రచయితలు కలిసి ఏర్పాటుచేసిన ఈ సంఘం సుమారు 8,400 పుస్తకాలను ప్రచురించింది. మలయాళ సినిమా అంతగా వర్ధిల్లుతుండటానికి కూడా ఈ సాహిత్య దన్నే కారణం. అందుకే ప్రముఖ సినీ జర్నలిస్ట్ అనుపమా చోప్రా నవతరం మలయాళ దర్శకులను ఇంటర్వ్యూ చేస్తూ, ‘అసలు మీరు ఏంచదువుతారు? ఏం చూస్తారు?’ అని ప్రశ్నించారు.పుస్తక ప్రేమికులుగా వ్యక్తులు ఉండటం దానికదే విశేషమే. కానీ వ్యవస్థలు పుస్తకాన్ని ప్రేమిస్తే దాని ప్రభావం వేరే ఉంటుంది. ‘పర్వతము ఎంత ఎత్తయి గగన భేద్యమయినా దాని విశాలమైన వక్షస్థలము నుండి చిన్న సెలయేరుగాని ప్రవహించకపోతే ఆ ప్రకృతి సౌందర్యం అసమగ్రంగా ఒంటరిగా శుష్కంగా గోచరిస్తుంది, ’ అంటారు తన ‘జీవనలీల’ పుస్తకంలో కాకాసాహెబ్ కాలేల్కర్. ఒక ఇల్లు ఎంత ఘనంగా నిర్మించినా దానిముందు ఒక పూలచెట్టో, ఒక ఊరు ఎంత పెద్దదయినా దాని మధ్యన ఒక గ్రంథాలయమో లేకపోతే అవి అసంపూర్ణం అవుతాయి. పువ్వులు (ప్రకృతి), పుస్తకాలు (వివేకం) ఉన్న ప్రతిచోటూ దేవభూమే! -
వృద్ధి సాధనకు ఊతం ఏదీ?
ప్రపంచవ్యాప్తంగా చాలామేరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నా, ఉపాధి కల్పన మెరుగ్గా కనబడు తున్నా వాణిజ్య వ్యవహారాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దేశాల మధ్య పెరుగుతున్న పోటీ ఒక రకమైన అనిశ్చిత వాతావరణానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్థిక సర్వే విడుదల చేసింది. పరస్పర ఆధారిత వర్తమాన ప్రపంచంలో ఏ దేశమూ సమస్యలనూ, సంక్షో భాలనూ తప్పించుకోలేదు. అలాగే వాటి పరిష్కారానికి సాగే కృషిలో భాగస్వామి కాకుండా ఒంట రిగా దేన్నీ అధిగమించలేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే దీన్నంతటినీ ప్రతిబింబించింది. మనది ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ఇతర దేశాలతో పోలిస్తే మనది చురుకైన ఆర్థిక వ్యవస్థే. కానీ ఇటీవలి కాలంలో అది కొంత మంద గమనంతో కదులుతోంది. 2023లో 8.2 శాతంగా ఉన్న వృద్ధి రేటు నిరుడు 6.5 శాతానికి క్షీణించింది. ఇది 2026 వరకూ ఈ స్థాయిలోనే వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈ నెల 17న అంచనా వేసింది. పట్టణ ప్రాంత వినియోగంలో క్షీణత, ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల, వేతన స్తంభన, అంతంతమాత్రంగా ఉన్న ఉపాధి కల్పన, ప్రైవేటు రంగ పెట్టుబడుల మందకొడితనం స్పష్టంగా కనబడుతోంది. ఒక్క కర్ణాటక, మహారాష్ట్రల్లో మాత్రమే వినియోగిత పెరి గింది. ఆంధ్రప్రదేశ్‌లో అంతక్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెరుగ్గా ఉన్న వినియో గిత ఎన్డీయే సర్కారు వచ్చాక క్షీణించింది. ‘మొత్తంమీద ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా ఆహార పదార్థాల ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయ’ని సర్వే అంగీకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉండగా, అదిప్పుడు 4.9 శాతానికి చేరుకుంది. ఆహారేతర, ఇంధనేతర సరుకుల ధరల తగ్గుదల ఇందుకు కారణం. వాస్తవానికి పంపిణీ మెరుగుకావటం, వాతావరణం అనుకూలించటం వంటి కారణాల వల్ల చాలా దేశాల్లో ఆహార సరుకుల ధరలు తగ్గాయి. మన దేశమూ, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఇందుకు భిన్నమైన పోకడ కనబడుతోంది. నిరుడు 7.5 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం 8.4 శాతానికి చేరుకుంది. పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా కూరగాయలు, పప్పులు వగైరా ధరల్లో పెరుగుదల నమోదవుతున్నదని నిపుణుల అభిప్రాయం. రాగల రోజుల్లో కూరగాయల ధరలు తగ్గుతాయని, ఖరీఫ్ పంటలు మార్కెట్లో అడుగుపెడితే ఇతర ధరలు కూడా సర్దుకుంటాయని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదంతా ప్రపంచ స్థితిగతులపై ఆధారపడి వుంటుంది. మున్ముందు ప్రపంచ సాగుపంటల ధర వరలు పెరుగుతాయని, వాతావరణ మార్పులు కూడా అనుకూలించకపోవచ్చని అంచనాలు న్నాయి. అదనంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉండనే ఉన్నాయి. ఎదగదల్చుకున్నవారికి ఆశావహ దృక్పథం అవసరం. స్వాతంత్య్రం వచ్చి 2047కి వందేళ్లవు తాయి కాబట్టి అప్పటికల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని ఎన్డీయే సర్కారు కోరుకుంటోంది. కానీ వరసగా రెండు దశాబ్దాలపాటు 8 శాతం నిలకడైన జీడీపీ కొనసాగితేనే ఇది సాధ్యం. ప్రస్తుత జీడీపీలో పెట్టుబడుల వాటా 31 శాతం. దీన్ని కనీసం 35 శాతానికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా తయారీరంగం వృద్ధి చెందాలి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బయోటెక్నాలజీరంగాల్లో విస్తరిస్తున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ‘వికసిత్ భారత్’ సాకారమవుతుంది. అందుకు భూసంస్కరణలు, కార్మికరంగ సంస్కరణలు అత్యవసరం అంటు న్నది ఆర్థిక సర్వే. కానీ కార్మిక రంగ సంస్కరణలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. బ్రిటిష్ వలస పాలకుల కాలంనుంచి ఇంతవరకూ పోరాడి సాధించుకున్న అనేక హక్కుల్ని లేబర్ కోడ్ హరిస్తున్నదని వాటి ఆరోపణ. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును కష్టతరం చేయటం, ఇప్పటికేవున్న ట్రేడ్ యూనియన్ల గుర్తింపు రద్దుకు వీలు కల్పించటం, సమ్మె హక్కును కాలరాయటం, మధ్యవర్తిత్వ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పర్చటం, లేబర్ కోర్టుల మూసివేత, ట్రిబ్యునల్ ఏర్పాటు వంటివి ఉన్నాయంటున్నారు. వీటిపై కార్మిక సంఘాలతో చర్చించటం, పార దర్శకత పాటించటం, అవసరమైన మార్పులకు సిద్ధపడటం వంటి చర్యలద్వారా అపోహలు తొల గించటానికి కేంద్రం కృషి చేస్తే కార్మిక రంగ సంస్కరణల అమలు సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చటానికి సంస్కరణలు అవసరం అనుకున్నప్పుడు ఇదంతా తప్పనిసరి. వాస్తవాలను గమనంలోకి తీసుకుని జాగురూకతతో అడుగులేయకపోతే లక్ష్యసాధన కష్ట మవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నిరుడు లిస్టెడ్ కంపెనీల లాభార్జన22.3 శాతం పెరిగింది. చెప్పాలంటే ఆర్థిక, ఇంధన, ఆటోమొబైల్ రంగాల కార్పొరేట్ సంస్థలకు లాభాలు వచ్చిపడ్డాయి. కానీ ఆ రంగాల్లో ఉపాధి కల్పన పెరిగింది లేదు. వేతనాలు స్తంభించాయి. పరిస్థితులిలా వుంటే వినియోగిత పెరుగుతుందా? తగినంత డిమాండ్ లేనప్పుడు తయారీరంగంలో పెట్టుబడుల వృద్ధి సాధ్యమవుతుందా? ఈ వ్యత్యాసాలపై దృష్టి పెట్టనంతకాలమూ ఆర్థిక రంగ స్వస్థత సులభం కాదు. వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వీలుగా రుణాల వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వ్‌బ్యాంకును నిర్మలా సీతారామన్‌తోపాటు కేంద్ర వాణిజ్యమంత్రి పీయుష్ గోయల్ కూడా కోరుతున్నారు. మంచిదే. తమవంతుగా ఉద్యోగకల్పన, వేతనాల పెంపుపై కూడాకేంద్రం దృష్టి సారించాలి. శనివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అందుకు తగిన ప్రతిపాదనలుంటాయని ఆశిద్దాం. -
శతప్రయోగ విజయసీమ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని చేరుకుంది. బుధవారం ఉదయం జరిపిన నూరవ రాకెట్ ప్రయోగంతో చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)లో రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ఎగసిన భూ సమకాలిక ఉపగ్రహ ప్రయోగవాహక నౌక (జీఎస్ఎల్వీ–ఎఫ్15) ఎన్వీఎస్–02 ఉపగ్రహాన్ని విజయ వంతంగా నిర్ణీత కక్ష్య అయిన జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ – జీటీఓలోకి చేర్చింది. ఈ కొత్త ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం నిర్విఘ్నంగా సాగడం శాస్త్రవేత్తల్లో ఆనందం పెంచింది. రోదసిలో చేరిన ఈ తాజా శాటిలైట్‌తో మన ‘నావిక్’ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్)లో విధులు నిర్వహిస్తున్న ఉపగ్రహాల సంఖ్య 4 నుంచి 5కు పెరిగింది. దీని వల్ల మన దేశంతో పాటు మన పొరుగు దేశాలకూ మొబైల్ ఫోన్లలో జీపీఎస్ సహా అనేక సేవల్లో కచ్చితత్వం పెరగనుంది. ఇతర దేశాలన్నీ అమెరికా తాలూకు జీపీఎస్‌పై ఆధారపడితే, భారత్ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌లో సొంత కాళ్ళపై నిలబడేందుకు చేస్తున్న ఈ కృషి సగటు భారతీయుడి ఛాతీ ఉప్పొంగే క్షణం. సైకిళ్ళు, ఎడ్లబండ్లపై రాకెట్ విడిభాగాలను తరలించిన కాలం నుంచి ఇటీవలే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించే (డాకింగ్ చేసే) స్థాయికి ఇస్రో చేరడం చిరకాలం చెప్పుకోవా ల్సిన స్ఫూర్తిగాథ. విక్రమ్ సారాభాయ్, సతీశ్ ధవన్ లాంటి దిగ్గజాల తొలి అడుగులతో ఆరంభించి, ఆపైన కలామ్ లాంటి వారి మేధను వినియోగించుకొని అయిదు దశాబ్దాల పైగా సాగించిన ప్రస్థానం చిరస్మరణీయం. 1962లో అణుశక్తి విభాగం కింద ఏర్పాటైన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ ద్వారా ఇస్రోకు బీజం పడింది. చంద్రుడి మీదకు అమెరికా మానవుణ్ణి పంపిన 1969లోనే ఇప్పుడు మనం చూస్తున్న ఇస్రో స్థాపన జరిగింది. 1972లో ప్రత్యేకంగా అంతరిక్ష శాఖ ఏర్పాటైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన అంతరిక్ష పరిశోధనా సంస్థ అనేక రాకెట్లకు పురుడు పోయడమే కాక, ఇతర దేశాల ఉపగ్రహ ప్రయోగాలలోనూ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగింది. మన ఇస్రో 1979 ఆగస్ట్ 10న తొలిసారిగా ఉపగ్రహ ప్రయోగ నౌక (ఎస్ఎల్వీ–3 ఈ10) ద్వారా ప్రయోగాత్మకంగా రోహిణీ టెక్నాలజీ పేలోడ్‌ను నింగిలోకి పంపిన క్షణాలు ఆ తరంలో చాలామందికి ఇప్పటికీ గుర్తే. అప్పట్లో ఇస్రోతో పనిచేస్తున్న అబ్దుల్ కలామే ఆ ప్రయోగానికి డైరెక్టర్. సదరు ప్రయోగం పాక్షికంగానే విజయం సాధించింది కానీ, ఆ తర్వాత కాలగతిలో అంతరిక్ష ప్రయోగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా ఆరితేరాం. అంకెల్లో చెప్పాలంటే, ఇప్పటి వరకు ఇస్రో 548 ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాదాపు 120 టన్నుల పేలోడ్‌ను నింగిలోకి పంపింది. అందులో 433 విదేశీ ఉపగ్రహాలకు చెందిన 23 టన్నులూ ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో షార్ కేంద్రం ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికైంది. మూడు చంద్రయాన్‌లు, ఒక మార్స్ ఆర్బిటర్ ప్రయోగం, ఆదిత్య ఎల్1 ప్రయోగం లాంటివి గణనీయమైనవి. కక్ష్యలో పరిభ్రమించే వ్యోమనౌకను భూవాతావరణంలోకి ప్రవేశింపజేసి... భూమి పైకి క్షేమంగా తెచ్చి రికవరీ చేసే ‘స్పేస్ క్యాప్సూల్ రికవరీ ప్రయోగం’ (ఎస్ఆర్ఈ), అలాగే ఒకే రాకెట్‌తో 104 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం వగైరా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఇస్రో ప్రయోగించినవాటిల్లో కమ్యూనికేషన్ శాటిలైట్లు, భూ పరిశీలన ఉపగ్రహాలు, మార్గనిర్దేశక (నావిగేషనల్), ప్రయోగాత్మక శాటిలైట్లు అనేకం. ఆ వివరాలు సగర్వంగా తోస్తాయి. రానున్న రోజుల్లోనూ మరిన్ని చారిత్రక ఘట్టాలకు ఇస్రో చోదకశక్తి కానుంది. గగన్‌యాన్‌లో భాగంగా మానవరహిత జి1 ప్రయోగం తొలిసారి చేయనున్నారు. అలాగే, నెక్స్›్ట జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ), చంద్రయాన్, శుక్రయాన్ జరగనున్నాయి. ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగాలకు సైతం వేదికగా నిలిచి, అంతరిక్ష వాణిజ్యంలో తగిన వాటా కోసం ప్రయత్నిస్తున్న ఇస్రో మరో రెండేళ్ళలో శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్‌ను నిర్మించనుండడం విశేషం. అలాగే, తమిళనాడులోని కులశేఖరపట్నంలో రెండో ఉపగ్రహ ప్రయోగ కాంప్లెక్స్ సైతం సిద్ధమవుతోంది. భారీ పేలోడ్ లను రోదసిలోకి తీసుకెళ్ళగలిగే ఎన్జీఎల్వీల రూపకల్పనకూ, మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికీ దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుంది. అంత మొత్తం వెచ్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన, ప్రయోగ రంగానికి ఇది పెద్ద ఊతం. ఇవన్నీ ప్రైవేట్ రంగ రోదసీ ప్రయోగాల్లో ఇస్రో సింహభాగం దక్కించుకోవడానికి ఉపకరిస్తాయి. ఒకప్పుడు అగ్రరాజ్యాలు సాంకేతిక విజ్ఞానాన్ని అందించడానికి నిరాకరించినప్పుడు స్వశక్తితో దేశీయంగా బుడిబుడి అడుగులతో మొదలుపెట్టిన భారత్ దాదాపు అయిదు పదుల ఏళ్ళలో శత రోదసీ ప్రయోగాలు సాగించింది. రానున్న అయిదేళ్ళలోనే రెండో శతం పూర్తి చేసి, మొత్తం 200 ప్రయోగాల మైలురాయికి చేరుకోవడానికి ఉరకలు వేస్తోంది. ఇన్నేళ్ళుగా మన అంతరిక్ష పరిశోధ కులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చూపుతున్న అచంచలమైన నిబద్ధత, అంకితభావానికి మచ్చుతునక ఈ ఇస్రో విజయగీతిక. విశ్వవేదికపై అగ్రరాజ్యాల సరసన అంతరిక్షంలో భారత్ సూపర్ పవర్‌గా ఎదిగిందనడానికీ ఇది ప్రతీక. అనేక ఆర్థిక, సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ సృజనాత్మకంగా ఆలోచించి, పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మలుచుకొంటే గణనీయ విజయాలు సాధ్యమే అనడానికి ఇదే తిరుగులేని రుజువు. 1975లో తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం నుంచి ఆ మధ్య మంగళ్యాన్ వరకు ప్రతిసారీ తక్కువ ఖర్చుతో, అంచనాలకు అందని విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల ఘనతకు భవిష్యత్తులోనూ ఆకాశమే హద్దు. -
డీప్ సీక్ నేర్పుతున్న పాఠం
సాంకేతిక రంగంలో, అందులోనూ కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ఇది సరికొత్త విప్లవం. కేవలం 200 మంది ఉద్యోగులతో, కోటి డాలర్లు వెచ్చించి, చైనాకు చెందిన చిన్న స్టార్టప్ కంపెనీ డీప్ సీక్ చేసిన మేజిక్ అగ్రరాజ్యపు బడా సంస్థల్ని సైతం ఆలోచనలో పడేసింది. డీప్ సీక్ ఇటీవల విడుదల చేసిన రెండు ‘స్వేచ్ఛా వినియోగ’ (ఓపెన్ సోర్స్) ఏఐ ప్రోగ్రామ్‌లు, ఛాట్బోట్లు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, ఈ 27న అప్డేట్ వచ్చిన డీప్ సీక్ గురించే చర్చ. భారత్‌లోనూ యాపిల్ యాప్ స్టోర్లలో ఛాట్ జీపీటీ, గూగుల్ జెమినీలను దాటేసి, అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్ ఇవాళ ఇదే. ఆర్1, వీ3 అల్గారిథమ్‌లను తక్కువ ఖర్చుతోనే తీర్చిదిద్దినట్టుగా చెబుతున్న డీప్‌సీక్ ఇప్పుడు ఏఐ వినియోగ సామర్థ్యంలో ఛాట్ జీపీటీ, గ్రోక్, క్లాడ్, లామా లాంటి తోటి ప్రత్యర్థుల సరసన పెద్ద గీతగా నిలబడింది. భారీగా పెట్టుబడులు పెడితే తప్ప, ఏఐలో సంచలనాలు సాధ్యం కావన్నది భ్రమ అనీ, ఆలోచన, ఆచరణ ఉంటే అద్భుతాలు అసాధ్యమేమీ కాదనీ నిరూపించింది. ట్రంప్ అధ్యక్షపీఠమెక్కిన వారం రోజులకే అమెరికా ఆభిజాత్యానికి డీప్ సీక్ దెబ్బకొట్టినట్టయింది. ఆగ్నేయ చైనాలోని హాంగ్జౌకు చెందిన అనామక ఇంజనీర్ల బృందం తమ సాంకేతికతతో ఈ స్థాయి విజయం సాధించడం అనూహ్యం. అనేక అత్యుత్తమ అమెరికా సంస్థలు అపారమైన పెట్టుబడులు, వనరులతో రూపొందించిన ఏఐ నమూనాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో, పరి మిత వనరులతో చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఇలా ప్రపంచాన్ని కుదిపేయడం విశేషం. ఆవిష్కృతమైన వారం రోజుల్లోనే డీప్ సీక్ సరికొత్త వెర్షన్ వీ3 అనేక సంక్లిష్టమైన, సూక్ష్మమైన ప్రశ్నలకు ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీ కన్నా మెరుగ్గా జవాబులివ్వడం గమనార్హం. సందర్భో చితంగా, కచ్చితత్వంతో, అంతకు మించి సృజనాత్మకంగా అప్పటికప్పుడు సమాధానాలివ్వడంలో డీప్ సీక్ ముందంజలో ఉంది. వివిధ భాషల్లోకి నిర్దుష్టమైన అనువాదాలు అందించడంలోనూ అగ్ర రాజ్యపు బడాబాబుల యాప్లన్నిటినీ అధిగమించేసింది. డీప్ సీక్ ఛాట్ బోట్ జవాబుల నాణ్యతను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రశంసిస్తున్నారంటే అది చిన్న విజయమేమీ కాదు.లెక్కతీస్తే డీప్ సీక్ సాధించిన విజయాలు అనేకం. ఓపెన్ ఏఐ కొన్ని వందల కోట్ల డాలర్ల ఖర్చు చేస్తే, కేవలం 60 లక్షల డాలర్లతో డీప్ సీక్ తన ఏఐ వేదికను అభివృద్ధి చేసిందని కథనం. అలాగే, అత్యాధునిక ఎన్విడియా ఏ100 చిప్స్‌ను చైనాకు విక్రయించడంపై షరతులున్న నేపథ్యంలో, వాటిపై ఆధారపడకుండా చౌక రకం, తక్కువ శ్రేణి వాటితోనే ఇంతటి విజయం సాధించింది. పైపెచ్చు, ఓపెన్ ఏఐకి పూర్తి భిన్నంగా డీప్ సీక్ అనేది... డెవలపర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా వాడు కొని, దాన్ని తమ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకొని, మరింత పెంపొందించుకోవడానికీ వీలున్న ‘స్వేచ్ఛా వినియోగ’ సాఫ్ట్వేర్. ఇన్ని ప్రత్యేకతలున్నందున డీప్ సీక్ ప్రభావం తక్షణమే విస్తృతంగా కనిపించింది. అమెరికాలోని ఏఐ సంస్థల స్టాక్ మార్కెట్ ప్రపంచం తలకిందులైపోయింది. ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీని సైతం రెండో స్థానానికి నెట్టి, యాపిల్ వాళ్ళ యాప్ స్టోర్ జాబితాలో ఈ చైనీస్ యాప్ ఏకంగా అగ్రేసర స్థానాన్ని అధిష్ఠించడం గణనీయమైన అంశం.మొత్తానికి ఈ స్టార్టప్ తన ‘డీప్ సీక్–ఆర్1’ మోడల్‌తో ప్రపంచ ఏఐ చిత్రాన్నే మార్చేసింది. ఏఐకి సంబంధించిన ఆర్థిక, సాంకేతిక చలనసూత్రాలను తిరగరాసింది. అదే సమయంలో రాజకీ యంగా, మరీ ముఖ్యంగా చైనాకు సున్నితమైన 1989 నాటి తియానన్మెన్ స్క్వేర్ ఊచకోత ఘటన, అరుణాచల్ ప్రదేశ్ లాంటి అంశాలపై జవాబిచ్చేందుకు ఇది నిరాకరించడం విచిత్రం. అంటే, ఆధునిక ప్రపంచంలో ఒకరకంగా సాంకేతిక పురోగతితో పాటు జనానికి ఏది చెప్పాలి, ఏది చూపాలి,ఎంత వివరించాలనే అంశాన్ని ఈ కొత్త సాధనాలతో నిర్ణయించేలా సెన్సార్షిప్లూ పెరగనున్నాయన్న మాట. పారదర్శకత, ఏఐ వ్యవస్థల్లో సిసలైన స్వేచ్ఛ ఎంత అన్న నైతిక ప్రశ్నలకు ఇది తావి స్తోంది. ఇంతటి సంచలనాత్మక ఏఐ మోడల్ సైతం చైనా ప్రభుత్వ సెన్సార్షిప్ సంకెళ్ళలో బందీగా, ప్రభుత్వ నియంత్రణలో పాలక వర్గాల ప్రచారానికే పరిమితమనే భావన కలుగుతోంది. ఏమైనా, పదే పదే ‘ఆత్మనిర్భర భారత్’ అంటూ పెడబొబ్బలు పెట్టే మన పాలకులకు డీప్ సీక్ విజయం కళ్ళెదుటి పాఠం. ప్రపంచానికి పెద్దన్నగా భావిస్తూ, అమెరికా అనేక ఆంక్షలు పెట్టి, సుంకాలు విధించినా చైనా తన సొంత కాళ్ళపై నిలబడడం ఎవరికైనా స్ఫూర్తిదాయకం, ఆదర్శం. అవరో ధాలను అధిగమించి, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఏఐ, పర్యావరణ సానుకూల టెక్నాలజీ లాంటి అనేక అంశాల్లో డ్రాగన్ సాధించిన విజయం అసామాన్యం. దూరదృష్టితో కూడిన విధాన నిర్ణయాలు, వాటి సమగ్ర ఆచరణ వల్లనే పొరుగునున్న చైనాకు ఇది సాధ్యమైంది. ఆ మార్గాన్ని మనమూ ఇప్పటికైనా చిత్తశుద్ధితో అనుసరించాలి. భారత్‌లోనూ ప్రతిభకు కొదవ లేదు. మన విద్యార్థులు, ఐటీ రంగ నిపుణులు అందరూ పొలోమని అమెరికా వైపు చూడడానికీ, ఆ సంస్థల వైపు ఆకర్షితులు కావడానికీ కారణాలను అన్వేషించాలి. ప్రతిభావంతుల్ని ఇక్కడే స్థిరపడేలా చేసి, వారి సేవలను జన్మభూమికి ఉపకరించేలా చూసుకోవాలి. హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్‌ను మంచి చేసుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్న మనం డీప్ సీక్ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అదే సమయంలో నియంత్రణ, సెన్సార్లకు అతీతంగా సరికొత్త సాంకేతికతల్ని ఎదగనిచ్చేలా చైతన్యవంతమైన చట్టాలు చేయాలి. నైతికత, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పునాదిపై నూతన శకానికి దారులు వేయాలి. -
ప్రయోగాత్మక పౌరస్మృతి
దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు శ్రీకారం చుట్టింది. గత ఏడాది ఫిబ్రవరిలో చట్టసభ ఆమోదించిన యూసీసీని ఉత్తరాఖండ్ ఆచరణలోకి తెచ్చింది. ఆ రాష్ట్ర సీఎం సోమవారం డెహ్రాడూన్‌లో యూసీసీ నియమావళి ప్రకటించి, పోర్టల్‌ను ప్రారంభించడంతో కొత్త కథ మొదలైంది. వివాదాస్పద యూసీసీ అమలు ‘దేవభూమి’ నుంచి ఆరంభమైందన్న మాటే కానీ, వివాదాల పెనుభూతం మాత్రం ఇప్పుడప్పుడే వదిలిపెట్టడం కష్టం. ఇదంతా చూపులకు... మతాలకు అతీతంగా అందరికీ ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలుండేలా ప్రమాణీకరించే ఉద్దేశంతో చేపట్టిన ప్రయత్నంగా, సమానత్వం – సమన్యాయ సిద్ధాంతాలకు అనుగుణంగా గొప్పగా అనిపించవచ్చు. ఆధునిక విలువలకూ, లైంగిక సమానత్వ – న్యాయాలకూ జై కొట్టినట్టు కనిపించవచ్చు. కానీ, లోతుల్లోకి వెళితే – ఆచరణలో ఇది కీలకాంశాలను అందిపుచ్చుకోలేదు. అనేక లోటుపాట్లూ వెక్కిరిస్తాయి. ముఖ్యంగా... చట్టసభలో సమగ్ర చర్చ లేకుండానే, ఏకాభిప్రాయం సాధించకుండానే హడావిడిగా యూసీసీ తేవడం బీజేపీ పాలకుల తెర వెనుక ఉద్దేశాలకు ప్రతీకగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్‌లో ఇకపై పెళ్ళిళ్ళు, విడిపోవడాలు, భరణాలు లాంటివన్నిటికీ అన్ని మతాలకూ ఒకే చట్టం వర్తించనుంది. ఆ రాష్ట్రంలో పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. చేయకపోతే, జరిమానాతో పాటు, వివాహాల రిజిస్ట్రేషన్ కానివారు ప్రభుత్వ ప్రయోజనాలకు పూర్తిగా అనర్హులు. అలాగే, విడాకుల కేసుల్లో భార్యాభర్తలకు ఒకే నియమావళి వర్తిస్తుంది. బహుభార్యాత్వంపై నిషేధమూ విధించారు. అదే సమయంలో, భిన్న సంస్కృతి, సంప్రదాయాలను అంటిపెట్టుకొని ఉండే షెడ్యూల్డ్ ట్రైబ్‌లను మాత్రం నిషేధం నుంచి మినహాయించారు. ప్రభుత్వ కొత్త ప్రతిపాదనలో కొన్ని అంశాలు నైతిక నిఘా అనిపిస్తున్నాయి. పెళ్ళి చేసుకున్నవారే కాదు, సహజీవనం చేస్తున్నవారూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనడం, అలా చేయకపోతే జైలుశిక్ష, జరిమానా అనడం బలవంతంగా అందరినీ దారికి తెచ్చుకోవడమే తప్ప, న్యాయపరిరక్షణ అనుకోలేం. అసలు విభిన్న మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవైన మన దేశంలో పెళ్ళి, విడాకులు, దత్తత, వారసత్వం, పిత్రార్జితం లాంటి అంశాల్లో అందరినీ ఒకే తాటిపైకి తీసుకు రావాలని సమష్టి వ్యక్తిగత చట్టాలు చేయడం సరైనదేనా అన్నది మౌలికమైన ప్రశ్న. ఎవరి మత ధర్మం వారికి ఉండగా, అందరినీ ఒకే గాటన కట్టి, మూకుమ్మడి పౌరస్మృతిని బలవంతాన రుద్దడ మేమిటని జమైత్ ఉలేమా ఇ–హింద్ లాంటివి అభ్యంతరం చెబుతున్నాయి. షరియాకూ, మతానికీ విరుద్ధమైన చట్టాన్ని ముస్లిమ్‌లు ఆమోదించలేరని కుండబద్దలు కొడుతున్నాయి. ఇలా ఉత్తరాఖండ్ యూసీసీపై ఒకపక్క దేశవ్యాప్తంగా వాడివేడి చర్చలు జరుగుతుండగానే, మరోపక్క గౌరవ ఉపరాష్ట్రపతి హోదాలోని వారు మాత్రం ‘ఇలాంటి చట్టం దేశమంతటా త్వరలోనే రావడం ఖాయమ’ని ఢంకా బజాయించడం విడ్డూరం. నిజానికి, ఉత్తరాఖండ్ యూసీసీలో లోటుపాట్లకు కొదవ లేదు. అందరూ సమానమే అంటున్నా, స్వలింగ వివాహాల ప్రస్తావన లేదేమని కొందరి విమర్శ. అలాగే, దత్తత చట్టాలపైనా యూసీసీ నోరు మెదపలేదని మరో నింద. అందరూ సమానం అంటూనే కొందర్ని కొన్ని నిబంధనల నుంచి మినహాయించడమేమిటని ప్రశ్న. ఎస్టీలకు సహేతుకంగా వర్తించే అదే మినహాయింపులు ఇతర వర్గాలకూ వర్తించాలిగా అన్న దానికి జవాబు లేదు. 44వ రాజ్యాంగం అధికరణం యూసీసీని ప్రస్తావించిందన్నది నిజమే. దీర్ఘకాలంగా యూసీసీపై అందరూ మాట్లాడుతున్నదీ నిజమే. కానీ, అది ఏ రకంగా ఉండాలి, లేదా ఉండకూడదన్న దానిపై ఇప్పటికీ ఎవరికీ స్పష్టత లేదు. పైగా, గందరగోళమే ఉందన్నదీ అంతే నిజం. ఆది నుంచి ఉమ్మడి పౌరస్మృతిని తారకనామంగా జపిస్తున్న కమలనాథులు ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారనుకోవాలి. యూసీసీ వల్ల జరిగే మంచి మాట దేవుడెరుగు, అసలిది చేయగలిగిన పనే అని ప్రపంచానికి చాటాలనుకున్నారు. అయితే, ఈ ఉత్తరాఖండ్ యూసీసీ రాజ్యాంగబద్ధత పైనా సందేహాలున్నాయి. ఒక రాష్ట్ర చట్టసభలో చేసిన చట్టాలు ఆ రాష్ట్ర పరిధికే వర్తిస్తాయని 245వ రాజ్యాంగ అధికరణ ఉవాచ. కానీ, రాష్ట్రం వెలుపల ఉన్న ఉత్తరాఖండీయులకూ యూసీసీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది హాస్యాస్పదం. అలాగే, సహజీవనాల రిజిస్ట్రేషన్ తప్పదంటున్నారే తప్ప, అలా చేసుకుంటే చట్టపరంగా ఆ భాగస్వాముల పరస్పర హక్కులకు రక్షణ లాంటివేమీ కల్పించ లేదు. వారి ప్రైవేట్ బతుకులు వ్యవస్థలో నమోదై నడిబజారులో నిలవడమే తప్ప, నిజమైన ప్రయో జనమూ లేదు. పైగా 21వ అధికరణమిచ్చిన గోప్యత హక్కుకు విఘాతమే! నిజానికి, గోప్యత హక్కులో సమాచార గోప్యత, స్వతంత్ర నిర్ణయాధికారం కూడా ఉన్నాయని జస్టిస్ పుట్టస్వామి కేసులో తొమ్మండుగురు న్యాయమూర్తుల సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం ఏనాడో తేల్చి చెప్పింది. ఇప్పుడీ యూసీసీ నిబంధన అచ్చంగా దానికి విరుద్ధమే. అలాగే, కులాంతర, మతాంతర వివాహాలపై విచ్చుకత్తులతో విరుచుకుపడి, ప్రాణాలు తీసే స్వభావం నేటికీ మారని సమాజంలో ఈ తరహా నిబంధనలు ఏ వెలుగులకు దారి తీస్తాయి? వెరసి, ఉత్తరాఖండ్ సర్కారు వారి యూసీసీ పైకి పెను సంస్కరణగా కనిపించినా, ఆఖరికి వేర్వేరు చట్టాల్లోని అంశాల్ని అనాలోచితంగా కాపీ చేసి అతికించిన అతుకుల బొంతగా మిగిలింది. ఇది ఏకరూపత పేరిట ప్రభుత్వం బల ప్రయోగం చేయడమే అవుతుంది. ఉత్తరాఖండ్ బాటలోనే ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలూ పయనించి, ఆఖరికి యూసీసీని దేశవ్యాప్తం చేస్తారన్న మాట వినిపిస్తున్నందున ఇకనైనా అర్థవంతమైన చర్చ అవసరం. -
బలమైన బంధం దిశగా..!
భౌగోళికంగానే కాదు... సంస్కృతి, నాగరికతల్లోనూ శతాబ్దాలుగా సన్నిహితమైన రెండు దేశాల మధ్య సహకారం సహజం. ఉమ్మడి ప్రయోజనాలూ అనేకం. ప్రయాణ, వాణిజ్యాలు చిరకాలంగా ఉన్నా, ఇప్పటి దాకా ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడ్డ భారత, ఇండొనేసియాలు దాన్ని చక్కదిద్దుకొనే పనిలో పడ్డాయి. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 4 రోజులు భారత్‌లో పర్యటించి, భారత 76వ గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం బలమైన బంధానికి పునరంకితమయ్యే వీలు కల్పించింది. అన్నీ సాకల్యంగా చర్చించు కొనే విలువైన అవకాశం వచ్చింది. మొత్తం 55 పేరాల తాజా ఉమ్మడి ప్రకటనలో ఇరుపక్షాలూ విస్తృత ద్వైపాక్షిక, అంతర్జాతీయ సహకారంపై ఏకస్వరంతో మాట్లాడడం అందుకు నిదర్శనం. భౌగోళికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా భారత్‌తో ఇండొనేసియా అను బంధం బలమైనది. చిత్రమేమిటంటే చిరకాలంగా బలమైన బంధమున్నా అది భారీ స్థాయిలో ప్రతి ఫలించినట్లు కనిపించదు. అగ్రరాజ్యాల అధికార రాజకీయాలకు వ్యతిరేకతతో, అలీనోద్యమంతో ఆది నుంచి ముడిపడిన ఈ ఉభయ దేశాలూ వలస పాలనానంతర ఆసియా ఖండంలో ద్వైపాక్షికంగానూ, నాయకత్వంలోనూ కలసి అడుగేయాల్సింది. అయితే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఢిల్లీ, జకార్తాలు దూరం జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తాజా ఢిల్లీ పర్యటన ఆశావహ పరిణామం. ఉభయదేశాల మధ్య అనుబంధానికి అవసరమైన వ్యూహాత్మక ప్రేరణను ఈ పర్యటన అందించింది. భారత గణతంత్ర దినోత్సవ కవాతుకు ముఖ్య అతిథిగా ఇండొనేసియా అధ్యక్షులు హాజరవడం ఇది నాలుగోసారి. భారత్ తొలిసారి జరుపుకొన్న రిపబ్లిక్ డే వేడుకలకు 1950లో సైతం ఇండొనేసియా అధ్యక్షుడే (సుకర్ణో) ముఖ్య అతిథి. ఆపైన సుసిలో బమ్బాగ్ యుధొయోనో (2011), జోకో విడోడో (2018), ఇప్పుడు సుబియాంటో! గమనిస్తే, ఆగ్నేయాసియా దేశాలతో బలమైన స్నేహం 1990ల నుంచి భారత ప్రయత్నం.అందులో భాగంగా జకార్తా, ఢిల్లీల మధ్య దూరం క్రమంగా తగ్గసాగింది. చైనా వ్యూహాత్మక ప్రాబల్యానికి పగ్గం వేసేలా ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవాలని భారత్ ‘ప్రాచ్యానికి ప్రాధాన్య విధానం’ (యాక్ట్ ఈస్ట్ పాలసీ) చేపట్టింది. ఇండో – పసిఫిక్ ప్రాంతం కీలకమని గుర్తించింది. అయినా, ఇరు దేశాల భాగస్వామ్యం ఉండాల్సినంత లేదు. సుమత్రా, జావా... ఇలా 17 వేలకు పైగా ద్వీపాలతో కూడిన ఇండొనేసియా 28 కోట్లకు పైగా ప్రజలతో జనసంఖ్యలో ప్రపంచంలో నాలుగోది. దాదాపు 1.4 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థతో వచ్చే 2030 నాటి కల్లా ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి ఎకానమీల్లో ఒకటిగా నిలవడానికి ఉరకలు వేస్తోంది. ఈ దేశ వేలాది ద్వీపాలు హిందూ, పసిఫిక్ మహా సముద్రాల మధ్య వారధుల లాంటివి. ఇండొనేసియా సముద్ర జలాలు భారత్ సహా ఈ ప్రాంతంలో పలు దేశాల ప్రపంచ వాణిజ్యానికి ఆయువుపట్టు. సహజ వనరులు పుష్కలంగా ఉండే ఈ అతి పెద్ద ద్వీపసమూహ దేశంతో బంధం భారత ఆర్థికప్రగతికి కీలకమనీ, బంధాన్ని బలోపేతం చేసుకోవాలంటున్నది అందుకే!అధ్యక్షుడి తాజా పర్యటనలో ఆరోగ్యం, సాంప్రదాయిక వైద్యం, సముద్రయాన భద్రత, డిజిటల్ అభివృద్ధి, సాంస్కృతిక సహకారంపై 5 అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుది రాయి. అలాగే, రక్షణ సహకారాన్ని పటిష్ఠం చేసుకోవాలన్న మాట ఉమ్మడి ప్రకటనలోనూ ప్రస్తావించారు. అయితే, భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను ఇండొనేసియా కొననున్నదంటూ పర్యట నకు ముందు వార్తలు గుప్పుమన్నా, ఆ రకమైన ఒప్పందమేదీ జరగలేదు. ఇండో– పసిఫిక్‌లో అమెరికా– చైనా శత్రుత్వం, దక్షిణ– తూర్పు చైనా సముద్రాల్లో చైనా బిగిస్తున్న పట్టు లాంటి సున్నిత అంశాలు, వాటి భౌగోళిక రాజకీయ ప్రభావాలు చర్చకు వచ్చిందీ, లేనిదీ తెలియలేదు. ఆర్థికాభివృద్ధిలోనూ ఇరుపక్షాలూ చేయాల్సింది చాలా ఉంది. ప్రస్తుతం 3 వేల కోట్ల డాలర్లే ఉన్న రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని ద్విగుణం, బహుళం చేయాలి. రెంటి మధ్య రాకపోకలు, ఆదానప్రదానాల పెంపుదల, పారిశ్రామిక భాగస్వామ్యాలను పెంచుకోవాలి. అధ్యక్షుడి వెంట దాదాపు 100 మంది సభ్యుల వ్యాపార బృందం వచ్చినందున ఆ రంగంలో పురోగతి కనిపిస్తుందని ఆశించవచ్చు. ఇండో–పసిఫిక్ ప్రపంచ వివాదానికి కేంద్రమవుతున్న వర్తమాన పరిస్థితుల్లో ద్వైపాక్షిక,ప్రాంతీయ సహకారానికి ఉభయ దేశాలూ నడుంకట్టాలి. గత అక్టోబర్‌లో ఇండొనేసియా అధ్యక్షు డిగా పదవీ బాధ్యతలు చేపట్టి, ప్రస్తుతం ఆ దేశంలో అమితమైన ప్రాచుర్యం ఉన్న సుబియాంటో గద్దెనెక్కిన కొద్దికాలానికే భారత్‌లో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలకు ఉత్ప్రేరకమే. ఇరు దేశాలు సన్నిహిత మిత్రులుగా, భాగస్వాములుగా కొనసాగాలని ఆయన అభిలషించడం గమనార్హం. ‘ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య’కు మూలస్తంభమైన ఇండొనేసియా ప్రాంతీయ ఆర్థిక సమన్వయానికి, రాజకీయ, భద్రతా అంశాలకూ ముఖ్యమైనది. ఆ సంగతి భారత్ గమనంలో ఉంచుకోవాలి. బీజింగ్ కళ్ళతో, భౌగోళిక రాజకీయాల కోణం నుంచే జకార్తాతో బంధాన్ని చూడరాదు. ఇండొనేసియా సైతం ఆది నుంచీ అగ్ర దేశాలతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆ సంగతి గుర్తించి, ఆ దేశంతో ద్వైపాక్షిక సహకారం వెల్లివిరిసేలా భారత్ కృషి చేయాలి. ఆసియాలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనేలా చూడాలి. పర్యటనతో రాజకీయ నాయకత్వం చొరవ చూపినందున ఇప్పుడిక అధికార యంత్రాంగం, దౌత్యవేత్తలు, పారిశ్రామిక భాగస్వాములు ఆచరణలో ముందుకు తీసుకుపోవాలి. -
ఇంగితం సంగతేంటి?
ఇంగితజ్ఞానం ఇంగితజ్ఞానమే, చదువులు చదువులే! చదువు పరమావధి జ్ఞానమే అయినా, చదువుకున్న వారందరూ జ్ఞానులు కాలేరు. అత్యంత దురదృష్టకరమైన విషయమేమిటంటే, చదువు కున్న వారిలో కొందరు కనీసం ఇంగితజ్ఞానులు కూడా కాలేరు. విపరీతంగా చదువుకుని, బహు పట్టభద్రులై, పాఠాలు బోధించే స్థాయిలో ఉన్నా, ఇలాంటివారు ఎప్పటికప్పుడు తమ ఇంగితజ్ఞాన రాహిత్యాన్ని బయటపెట్టుకుంటూ జనాలను విభ్రాంతికి గురిచేస్తుంటారు. ‘విద్యలేనివాడు వింత పశువు’ అంటూ నిరక్షరాస్యులను ఎద్దేవా చేసే పెద్దలు – అతి విద్యావంతులైన ఇంగితజ్ఞాన రహితులను ఏమంటారో!‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్/ బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/ పొదవెడు నుప్పు లేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని శతకకారుడు వాపోయాడు. రసజ్ఞత లేని చదువును ఉప్పులేని కూరతో పోల్చాడు. బహుశా, ఎంత చదువు చదువుకున్నా, కాస్తంతైనా ఇంగితజ్ఞానం లేనివారు ఆయనకు తారసపడి ఉండరు. అలాంటి అతి చదువరులే తారసడితే ఆయన ఇంకెంతలా వాపోయేవాడో! ఈ రోజుల్లో చదువుకున్న వాళ్లలో రసజ్ఞత సంగతి దేవుడెరుగు, ఇంగితజ్ఞానం కూడా కొరవడు తోందంటే, మన చదువులు ఎలా అఘోరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు మన చదువులు ఇలా ఎందుకు అఘోరిస్తున్నాయో, అందుకు గల కారణాలను అన్వేషించే వాళ్లు బహు అరుదు. ‘చాలామందికి, పిల్లల్ని చదువంటే బెదరగొట్టడం చాతనయినంత బాగా వాళ్లకి చదువు మీద ఇష్టం కలిగించడం చాతకాదు’ అంటారు కొడవటిగంటి కుటుంబరావు. ‘చదువు’ నవలలో ఆయన వెలి బుచ్చిన అభిప్రాయం ఇది. బెదరగొట్టి మరీ పిల్లలకు చదువు చెప్పే బడిపంతుళ్ల ధోరణి కూడా చదువుకున్న వాళ్లలో ఇంగితజ్ఞాన లోపానికి ఒక కీలక కారణం. బెదరగొట్టి పిల్లలకు చదువు చెప్పే దండోపాయ నిపుణులు పురాణకాలం నుంచే ఉన్నారు. ప్రహ్లాదుడికి చదువు చెప్పిన చండా మార్కుల వారసత్వాన్ని కొందరు నేటికీ కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చండా మార్కుల వారసులకే గిరాకీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి గురువులు పిల్లల బుర్రల్లోకి పాఠాల నైతే ఎక్కించగలరేమో గాని, చిటికెడు ఇంగితజ్ఞానాన్ని మాత్రం అలవరచలేరు. ‘ఇంగితజ్ఞానం మరీ అంత సర్వసాధారణమైనది కాదు’ అంటాడు ఫ్రెంచ్ తత్త్వవేత్త వోల్టేర్. ఇంగితజ్ఞానాన్ని ఇంగ్లిష్‌లో ‘కామన్సెన్స్’ అంటారు. అలాగని, ఇది మనుషులందరికీ ఉండే లక్షణ మని అనుకుంటే పొరపాటే! ‘మనుషులందరిలోనూ ఇంగితజ్ఞానం ఉందనే నమ్మకంతో కొన్నిసార్లు మనం ప్రమాదంలో పడుతుంటాం’ అన్నాడు ఐరిష్ సంగీతకారుడు హోజీర్.ఒకప్పుడు సమాజంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు అక్షరాస్యులు బాగా పెరిగారు. అక్షరాస్యత పెరిగితే, జనాల్లో బుద్ధి జ్ఞానాలు, తెలివితేటలు పెరగడం సర్వసహజ పరిణా మమనేది ఒక అమాయకపు అంచనా. సమాజంలో అక్షరాస్యత పెరిగింది, నిజమే! తత్ఫలితంగా మూర్ఖత్వం తగ్గిందనుకుంటే పారపాటే! ‘చదవేస్తే ఉన్న మతి పోయింద’నే నానుడి ఉంది. ఇప్పటి చదువులను చూస్తే, పరిస్థితి అలాగే ఉందనిపిస్తుంది. ఈ చదువులతో కొందరిలో ఇంగితజ్ఞానం లోపిస్తుంటే, ఇంకొందరిలో చావుతెలివి పెచ్చుమీరుతోంది. బొటాబొటి చదువుల సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నత విద్యావంతులు సైతం బోల్తాపడుతున్న ఉదంతాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకవైపు శాస్త్రవేత్తలు కృత్రిమ మేధతో కుస్తీలు పడుతున్న రోజులు వచ్చిపడ్డాయి గాని, మనుషుల్లో ఇంగితాన్ని పెంచే చదువులే కరవవుతున్నాయి. ‘నడవడికను చక్కబరచడానికి ఉత్త పాఠ్య పుస్తకాల చదువు చాలదు’ అని గాంధీజీ చెప్పిన మాటలను నేటి కార్పొరేట్ విద్యావ్యవస్థ పట్టించు కుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. గాంధీజీ ‘హింద్ స్వరాజ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పాఠ్యపుస్తకాల విద్య మానవుల నైతికోన్నతికి ఇంచుకైనా సహకరించదని; చదువు వేరు, సద్గుణం వేరని స్వానుభవంతో తెలుసుకున్నాను’ అన్నారు. ఆయన దేశానికి స్వాతంత్య్రం రాకముందు చెప్పిన మాటలివి. ఇప్పటికీ మన చదువులు పూర్తిస్థాయిలో చక్కబడకపోవడం విచారకరం.చదువులు చెప్పడానికి ఎన్నో బడులు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రత్యేక నైపుణ్యాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయి. పుట్టల నుంచి చీమలు పుట్టుకొచ్చినట్లు వీటి నుంచి ఏటా పట్టభద్రులు పుట్టుకొస్తున్నారు. వాళ్లలో చాలామంది సమాజంలో మేధావులుగా చలామణీ అవుతున్నారు. అంతమాత్రాన, వాళ్లంతా ఇంగితజ్ఞాన సంపన్నులనుకోవడానికి ఆస్కారం లేదు. ‘మీ డిగ్రీ ఒక కాగితం ముక్క మాత్రమే. మీ చదువేమిటో మీ ప్రవర్తనలోను, ఆలోచనా ధోరణిలోను, సౌశీల్యంలోను ప్రతిఫలిస్తుంది’ అన్నాడు అమెరికా మూడో అధ్యక్షుడు థామస్ జెఫర్సన్. ప్రవర్తనను, ఆలోచనా ధోరణిని మార్చలేని డిగ్రీలు ఉత్త కాగితం ముక్కలు మాత్రమే! ‘కొన్ని ఆలోచనలు చాలా మూర్ఖంగా ఉంటాయి. వాటిని మేధా వులు మాత్రమే నమ్ముతారు’ అని ఇంగ్లిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ అన్నాడు. గోమూత్రపానంతో జ్వరాలు తగ్గుతాయని ఇటీవల ఐఐటీ–మద్రాసు డైరెక్టర్ మహాశయుడు సెలవిచ్చారు. ఆయనను బహుశా మేధావులే నమ్ముతారు కాబోలు! -
లాంగ్ లివ్ ద రిపబ్లిక్
డెబ్బయ్ ఐదు సంవత్సరాలు. కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఆనాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజా స్వామ్య రిపబ్లిక్ నేడు ఈ మజిలీకి చేరుకున్నది. ఈ ప్రయాణ మంతా సాఫీగానే జరిగిందని చెప్పలేము. ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎటుచూస్తే అటు చీకటి ముసిరిన చేటు కాలాన్ని కూడా దాటవలసి వచ్చింది. దారి పొడుగునా ఎగుడు దిగుళ్లూ, ఎత్తుపల్లాలూ ఇబ్బందులు పెట్టాయి. అయినా మన రిపబ్లిక్ రథం వెనుదిరగలేదు. వెన్ను చూపలేదు. రాజ్యాంగ దీపం దారి చూపగా మున్ముందుకే నడిచింది.సుదీర్ఘ ప్రయాణం ఫలితంగా మన రిపబ్లిక్ ఎంతో పరిణతి సాధించి ఉండాలి. అందువల్ల ఇకముందు సాగే ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుందని ఆశించాలి. ప్రతిష్ఠాత్మకమైన శతాబ్ది మైలురాయిని తాకేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో సాగిపోతామనే ధీమా మనకు ఏర్పడి ఉండాలి. కానీ, అటువంటి మనో నిబ్బరం నిజంగా మనకున్నదా? మన రిపబ్లిక్కు ఆయువు పట్టయిన రాజ్యాంగం ఇకముందు కూడా నిక్షేపంగా ఉండగలదనే భరోసా మనకు ఉన్నట్టేనా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ ఆశించిన విధంగానే పనిచేస్తున్నాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోగలమా?మన స్వాతంత్య్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఆ స్వాతంత్య్రానికి సాధికార కేతనమే మన గణతంత్రం. స్వాతంత్య్ర పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక ప్రధాన స్రవంతి మాత్రమే! ఇంకా అటువంటి స్రవంతులు చాలా ఉన్నాయి. ఆ పార్టీ పుట్టకముందు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ ఆ పోరాటాన్ని ఫైనల్స్‌కు చేర్చిన టీమ్ క్యాప్టెన్ మాత్రమే. రెండొందల యేళ్లలో అటువంటి క్యాప్టెన్లు చాలామంది కనిపిస్తారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే బ్రిటీషర్ల దాష్టీకంపై తిరగబడిన వీర పాండ్య కట్టబ్రహ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి పాలె గాళ్ల వీరగాథలు మనం విన్నవే.ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగా, ఆ తర్వాత కూడా బ్రిటీష్ పాలనపై ఎందరో గిరిజన యోధులు తిరగ బడ్డారు. బిర్సాముండా, తిల్కా మాఝీ, సిద్ధూ–కన్హూ ముర్ములు, అల్లూరి దళంలోని సభ్యులు వగైరా అటవీ హక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ధారపోశారు. తొలి స్వాతంత్య్ర పోరుకు నాయకత్వం వహించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వేలాదిమంది ముస్లిం స్వరాజ్య యోధుల దిక్సూచి. బ్రిటీషర్ల ఆగ్రహానికి గురై బర్మాలో ప్రవాస జీవితం గడిపిన జాఫర్ కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన మాతృదేశంలో ఖననం చేయాలని పాలకులను అభ్యర్థించారు.స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగంగా, సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగాయి. అందులో కొన్ని సాయుధ పోరు రూపాన్ని తీసుకున్నాయి. జమీందారీ, జాగీర్దారీ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ విధంగా భిన్నవర్గాల, విభిన్న తెగల ఆకాంక్షలు, ఆశలూ ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వేరువేరు భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో కూడిన సువిశాల భారత దేశ ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వాతంత్య్రోద్యమం సాధించగలిగింది. ఆ ఉద్యమాన్ని నడిపిన జాతీయ నాయకత్వా నికి ఈ భిన్నత్వంపై అవగాహనా, గౌరవం ఉన్నాయి.స్వతంత్ర దేశంగా అవతరించడానికి కొన్ని గంటల ముందు పండిత్ నెహ్రూ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఆ రోజునే ఆయన దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందవలసి ఉన్నదనీ, సమాన అవకాశాలు కల్పించవలసి ఉన్నదనీ స్పష్టం చేశారు. మత తత్వాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరాదని ఆనాడే ఆయన నొక్కిచెప్పారు. ఆ తర్వాత మూడేళ్లపాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లోనూ ఇదే విచారధార ప్రధాన భూమికను పోషించింది. స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో విపుల మైనది, పటిష్ఠమైనది భారత రాజ్యాంగమే. భవిష్యత్తులో దేశం నియంతృత్వంలోకి జారిపోకుండా చెక్స్అండ్ బ్యాలెన్సెస్లతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలకు రూప కల్పన చేశారు. భారత్‌తోపాటు అదే కాలంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అనేక దేశాలు అనంతరం స్వల్పకాలంలోనే సైనిక పాలనల్లోకి, నిరంకుశ కూపాల్లోకి దిగజారిపోయాయి. వాటన్నింటి కంటే పెద్ద దేశమైన భారత్ మాత్రం కాలపరీక్షలను తట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది.ఇందుకు మనం మన అద్భుతమైన రాజ్యాంగానికీ, దాని రూప కర్తలకూ ధన్యవాదాలు సమర్పించుకోవలసిందే! మన పాలకుడు ఎంత గొప్ప మహానుభావుడైనప్పటికీ సర్వాధికారాలను అతనికే అప్పగిస్తే చివరికి మిగిలేది విధ్వంసమేనని జాన్ స్టూవర్ట్ మిల్ చేసిన హెచ్చరికను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ ప్రస్తావించారు. ఇందిరాగాంధీపై మొదలైన వ్యక్తి పూజ ‘ఇందిరే ఇండియా’ అనే స్థాయికి చేరి పోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే! మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చగా ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇందిర తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుత నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కనిపిస్తున్నది. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ‘అయామ్ ది కాన్స్టిట్యూషన్’ (నేనే రాజ్యాంగం) అని ప్రకటించుకోవడం ఈ వీరపూజ ఫలితమే! ఫ్రెంచి నియంత పధ్నాలుగో లూయీ చేసిన ‘అయామ్ ది స్టేట్’ ప్రకటనకు ఇది తీసిపోయేదేమీ కాదు.ఈ దేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన కొన్ని వ్యవస్థలు బీటలు వారుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అధినాయకుని వీరపూజల ముందు వ్యవస్థలు నీరుగారుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, ఫెడరల్ తరహా పాలననూ రాజ్యాంగం ఆకాంక్షించింది. ఫెడరల్ అనే మాటను వాడకపోయినా ‘యూనియన్ ఆఫ్ ది స్టేట్స్’ అనే మాటను వాడారు. ఈ మాటలో రాష్ట్రాలకే ప్రాదేశిక స్వరూపం ఉన్నది తప్ప కేంద్రానికి కాదు.కేంద్ర ప్రభుత్వం కూడా బలంగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన మాట నిజమే. దేశ విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో బలహీన కేంద్రం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు.అందువల్ల కేంద్రానికి కొన్ని అత్యవసర అధికారాలను కట్ట బెట్టారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ అధికారాలను చలా యించడానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. కేంద్రం పెత్తనం ఇప్పుడు మరీ పరాకాష్ఠకు చేరు కున్నది. అసమంజసమైన ద్రవ్య విధానాలతో రాష్ట్రాలను బల హీనపరిచే ఎత్తుగడలు ఎక్కువయ్యాయి.మొత్తం జీఎస్టీ వసూళ్లలో అన్ని రాష్ట్రాలకూ కలిపి మూడో వంతు లభిస్తుంటే, కేంద్రం మాత్రం రెండొంతులు తీసుకుంటున్నది. మోయాల్సిన భారాలు మాత్రం రాష్ట్రాల మీదే ఎక్కువ. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని సుంకాలు, సర్ ఛార్జీల వసూళ్లు ఏటేటా పెరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజా స్వామ్యం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. కానీ పార్లమెంట్ చర్చలు పలు సందర్భాల్లో ఒక ప్రహసనంగా మారుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తున్నది. అసలు చర్చలే లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ఉదాహరణ లున్నాయి.స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం ఆకాంక్షించిన ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వ్యవస్థ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతున్నది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది పాతాళానికి పడిపోయింది. పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో తెలియదు. తొలుత ప్రకటించిన పోలయిన ఓట్ల శాతాన్ని నాలుగైదు రోజుల తర్వాత సవరించి అసాధారణంగా పెరిగినట్టు చెప్పడం ఎందువల్లనో తెలియదు. వాటిపై ప్రశ్నించిన స్వతంత్ర సంస్థలకూ, రాజకీయ పక్షాలకూ ఇప్పటి దాకా ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోవడమంటే ప్రజాస్వామ్యం శిథిలమవుతున్నట్లే లెక్క.రిజర్వు బ్యాంకు స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ. కరెన్సీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవలసిన బాధ్యత దానిదే. కానీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసాధారణ నిర్ణయాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఆర్బీఐకి తెలియజేసి, బహి రంగ ప్రకటన చేశారు. ఆర్బీఐ పాలక మండలిని కనుసన్నల్లో పెట్టుకొని, దాన్ని అనుబంధ సంస్థగా మార్చేసుకున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. ఇక సీబీఐ, ఆర్టీఐ, సీవీసీ వంటి ‘స్వతంత్ర’ సంస్థలు పంజరంలో చిలకలుగా మారిపోయాయనే విమర్శ సర్వత్రా వినబడుతూనే ఉన్నది.తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థను వాడుకున్నాయి. అయితే కొందరు గవర్నర్ల విపరీత ప్రవర్తన గతంతో పోల్చితే ఎక్కువైంది. విపక్ష ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలకు ‘ట్రోజన్ హార్స్’ను పంపించినట్టే ఇప్పుడు గవర్న ర్లను పంపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెచ్చిన ‘ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్’ (ఓఎన్ఓఈ) విధానానికి పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని మరింత బలహీనపరిచే స్వభావమున్నది.ప్రాంతీయ రాజకీయ పార్టీలనూ, రాజ్యాంగ ఫెడరల్ స్వభా వాన్నీ ధ్వంసం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే చేయవలసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వ భావన అనేవి మన రాజ్యాంగానికి పునాది వంటివి. పార్లమెంట్లో ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని కేశవానంద భారతి (1973) కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తున్నా యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యసాధనకు ప్రస్తుత రాజ్యాంగం ఉపయోగపడదు.ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని తమకు పట్టున్న ఉత్తరాదిలో సీట్లు పెరిగేలా, బలహీనంగా ఉన్న దక్షిణాదిలో సీట్లు తగ్గేవిధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు కూడా విపక్షాలకు ఉన్నాయి. ఇదే నిజమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇదంతా రాజకీయ భాగం మాత్రమే! అంబేడ్కర్ చెప్పినట్టు రాజ్యాంగం అభిలషించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కేవలం రాజకీయపరమైనవే కాదు. సామాజిక ఆర్థికపరమైనవి కూడా! ఈ రంగాల్లో ఇంకా ఆశించిన లక్ష్యం సుదూరంగానే ఉన్నది. ఇప్పుడు రాజకీయ అంశాల్లోనే మన రిపబ్లిక్ సవాళ్లను ఎదుర్కో వలసి వస్తున్నది. ఈ సవాళ్లను అధిగమించి ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా నిజమైన స్వాతంత్య్రం సిద్ధించాలంటే మన రాజ్యాంగం, మన రిపబ్లిక్ చిరకాలం వర్ధిల్లాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ట్రంప్ ‘వాణిజ్య యుద్ధభేరి’
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలుకొని నాలుగు రోజులుగా డోనాల్డ్ ట్రంప్ వరసపెట్టి జారీచేస్తున్న ఉత్తర్వులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికనుద్దేశించి గురువారం ఆయన చేసిన ప్రసంగం కూడా ఆ కోవలోనిదే. అది ఒకరకంగా ‘వాణిజ్య యుద్ధభేరి’. తమ దేశంలో పెట్టుబడులు పెడితే ప్రపంచ దేశాలన్నిటికన్నా తక్కువ పన్నులు విధిస్తామనీ, కాదంటే ట్యారిఫ్ల మోత మోగిస్తామనీ ఆయన హెచ్చరించారు. భారత్, చైనాలపై ఆయనకు మొదటినుంచీ ఆగ్రహం ఉంది. ఈ రెండు దేశాలూ వర్ధమాన దేశాల ముసుగులో అనేక వెసులుబాట్లు పొందుతూ అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయని గతంలో ఆయన విరుచుకుపడ్డారు. అనంతర కాలంలో దక్షిణాఫ్రికా, ఇండొనేసియాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వల్ల అమెరికా బాగా నష్టపోతున్నదని చీటికీ మాటికీ ఆరోపించేవారు. నిజానికి డబ్ల్యూటీవో అమెరికా మానసపుత్రిక. వాణిజ్య ప్రపంచంలో హద్దులుండరాదని, కనీసం వాటిని తగ్గించాలని, హేతుబద్ధమైన ట్యారిఫ్‌లు అమలయ్యేలా చూడా లని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వర్ధమాన దేశాలకు సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ (జీఎస్పీ) కింద దిగుమతి చేసుకునే కొన్ని సరుకులపై సుంకాలు తగ్గుతాయి. ఇతర దేశాల ఉత్పత్తులను సైతం సమానంగా చూసే దేశాన్ని అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్)గా పరిగణించే సూత్రం డబ్ల్యూటీవో పాటిస్తోంది. ఇవన్నీ ట్రంప్‌కు కంటగింపుగా ఉన్నాయి. సంస్థ నిబంధనల్లో ఉన్న లొసుగులు అమెరికాను దెబ్బతీస్తూ వేరే దేశాలకు తోడ్పడుతున్నాయని ఆరోపించటం అందుకే! ఇంతకూ ట్రంప్ నిజంగానే అన్నంత పనీ చేస్తారా? అలాచేస్తే అమెరికా వాణిజ్యం ఏమవు తుంది? ట్రంప్ హెచ్చరించి 24 గంటలు కాకుండానే పొరుగునున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గట్టి జవాబే ఇచ్చారు. కెనడా, మెక్సికోల ఉత్పత్తులపై 25 శాతం ట్యారిఫ్ విధించే ఆలోచన చేస్తున్నా మని, బహుశా ఫిబ్రవరి 1 నుంచి అది అమలుకావచ్చని ప్రకటించటాన్ని ప్రస్తావిస్తూ అదే జరిగితే తమ నుంచి కూడా ప్రతీకారం ఉంటుందని, అమెరికా వినియోగదారులు భారీయెత్తున నష్ట పోవాల్సి వస్తుందని ట్రూడో హెచ్చరించారు. కెనడా నుంచి అమెరికా 34 అత్యవసర ఖనిజాలు, లోహాలు దిగుమతి చేసుకుంటున్నది. అలాగే అమెరికా నుంచి భారీ యంత్రాలూ, సహజవాయువు, విద్యుత్, ముడి చమురు, పండ్లు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది. నిత్యం 270 కోట్ల డాలర్ల విలువైన సరుకులు, సేవలు అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ వెళ్తుంటాయి. భిన్న వాతావరణ పరిస్థితులున్నప్పుడు కావలసిన సమస్తాన్నీ ఏ దేశమూ సొంతంగా ఉత్పత్తి చేసు కోవటం సాధ్యం కాదు. ఈ సంగతి ట్రంప్‌కు తెలియదనుకోలేం. క్రితంసారి అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు అమెరికా ఉత్పత్తి చేస్తున్న ఖరీదైన హార్లీ–డేవిడ్సన్ బైక్‌లపై సుంకాలు తగ్గించాలని మన దేశంపై ఒత్తిళ్లు తెచ్చారు. తీరా తగ్గించాక చాలదని పేచీ పెట్టారు. ప్రతీకారంగా మన ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు. దీనికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ట్రంప్ అక్కడితో ఆగలేదు. జీఎస్పీ నిబంధనలు భారత్‌కు వర్తింపజేయొద్దని డబ్ల్యూటీవోకు లేఖ రాశారు. మనం భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ దేశాలపై మరింతగా ట్యారిఫ్ వడ్డింపులు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. బ్రిక్స్‌లో ఉన్న రష్యా, చైనాలు దానివల్ల దండిగా లాభపడతాయని, శక్తి మంతంగా రూపుదిద్దుకుంటాయని ఆయన ఆందోళన. ఉన్నంతలో మనను ఆ సంస్థకు దూరం చేయాలన్నది ట్రంప్ లక్ష్యంగా కనబడుతోంది. అయితే తెగేదాకా లాగే ధైర్యం ట్రంప్‌కు ఉందా అన్నది సందేహమే. ఎందుకంటే 2019లో చైనా ఎగుమతులపై 30 వేల కోట్ల డాలర్ల సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించిన వెంటనే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడం ఆపేయాలని తమ పబ్లిక్‌రంగ సంస్థలకు చైనా సూచించింది. ఆ వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. మళ్లీ ట్రంప్ రంగంలోకి దిగి చైనాపై సుంకాల పెంపు ఇప్పట్లో ఉండబోదని ప్రకటించాకగానీ పరిస్థితి కుదుటపడలేదు. తన ప్రకటనల పర్యవసానం ఎలావుంటుందో ట్రంప్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. 1930లో అమెరికా తీసుకొచ్చిన టారిఫ్ చట్టానికి ప్రతీకారంగా ఎవరికి వారు వాణిజ్య ఆంక్షలు అమలు చేయటం పెను సంక్షోభానికి దారితీసిన సంగతి ట్రంప్ గుర్తుంచుకోవాలి. ఈ పరస్పరహననం వల్ల ఎన్నో దేశాల జీడీపీలు భారీయెత్తున పడిపోవటం పర్యవసానంగానే అప్పట్లో అన్ని చోట్లా అశాంతి, అపనమ్మకం ప్రబలాయి. దీన్ని హిట్లర్ వంటి నియంతలు చక్కగా వినియోగించు కున్నారు. జాతి విద్వేషాలు, జాతీయ దురభిమానాలను రెచ్చగొట్టారు. సహజ వనరుల వినియోగం పెరగటం, సాంకేతికతల అభివృద్ధి జరగటం తదితర కారణాల వల్ల కొంత హెచ్చుతగ్గులతో చాలా దేశాలు అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో వంటి సంస్థల వెనకుండి ప్రపంచ వాణి జ్యాన్ని శాసించినవారే, లాభపడ్డవారే ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్’ అంటూ స్వరం మారిస్తే ఇతర దేశాలు సాగిలపడాలా? ‘అమెరికా మితిమీరినా డబ్ల్యూటీవో ద్వారా వివాద పరిష్కారానికి గల అవకాశాలను వినియోగించుకోండి. తీవ్ర చర్యలొద్దు’ అని ఇతరేతర దేశాలకు డబ్ల్యూటీవో సంస్థ డైరెక్టర్ జనరల్ గోజీ ఒకాంజో ఇవేలా హితవు చెబుతున్నారు. మంచిదే! మరి ట్రంప్‌కు చెప్ప గలవారెవరు? ఆయనను నియంత్రించగలిగేదెవరు? -
రసవత్తరంగా ఢిల్లీ రణం
శీతలగాలులు కమ్మేసిన సమయంలోనూ దేశ రాజధాని ఎన్నికల హంగామాతో వేడెక్కుతోంది. ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ పక్షాల ‘ఉచిత హామీల’ వ్యూహం ఊపందుకుంది. మహిళా ఓటర్లను కేంద్రంగా చేసుకొని ఎన్నికల మేనిఫెస్టోలలో పార్టీలు పోటా పోటీగా వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. 2012 నుంచి ఢిల్లీలో ఆధిపత్యం చూపుతున్న అధికార ఆప్, దాని ప్రధాన ప్రత్యర్థి బీజేపీలు రెండూ ఏక తీరున ఎడాపెడా హామీలిస్తుంటే, పోగొట్టుకున్న పట్టును వెతుక్కుంటూ కాంగ్రెస్ కొత్త ఉచితాల ప్రకటనలతో ఊపిరి పీల్చుకోవాలని చూస్తోంది. ఆప్ తన మేనిఫెస్టోలో సీనియర్ సిటిజన్లందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యచికిత్స, ఆటోడ్రైవర్లకు 5 గ్యారెంటీలు, అద్దెకున్నవారికి సైతం ఉచిత విద్యుత్, నీటి పథకం వర్తింపు లాంటివి ప్రకటించింది. బీజేపీ తన మేనిఫెస్టోలో హోలీ, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు, గర్భిణు లకు రూ. 21 వేలు, ప్రతి నెలా మహిళలకు రూ. 2.5 వేలు సహా పలు హామీలిచ్చింది. ఇప్పటికే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని బీజేపీ తోసిపుచ్చకపోవడం ఢిల్లీ నమూనాను సమర్థించ డమేనని ఆప్ ఎద్దేవా చేస్తుంటే... బీజేపీ మాత్రం ఆప్ మాటలు ధయాధర్మం చేస్తున్నామన్నట్లున్నా యనీ, తమది మాత్రం సమాజ సమగ్రాభివృద్ధికై సాగిస్తున్న సంక్షేమ వాగ్దానమనీ వాదిస్తోంది. వెరసి, మాటల యుద్ధంతో 70 స్థానాల ఢిల్లీ పీఠానికి పోటీ రసవత్తరంగా మారింది. 1993 నవంబర్‌లో తొలి ఢిల్లీ శాసనసభ ఏర్పాటైంది. అప్పటి నుంచి గమనిస్తే, ప్రజా ఉద్య మాలు పెల్లుబికిన ప్రతిసారీ జాతీయ రాజధానిలో అధికారం చేతులు మారిందని విశ్లేషణ. 1998లో షీలా దీక్షిత్ అధికారంలోకి వచ్చినా, 2013లో ఆమెను గద్దె దింపి అరవింద్ కేజ్రీవాల్ పీఠమెక్కినా... ప్రతి అసెంబ్లీ ఎన్నిక ముందు ఏదో ఒక ప్రజాందోళన జరిగిందని విశ్లేషకులు గుర్తు చేస్తుంటారు. 1998 నవంబర్‌లో ఎన్నికలైనప్పుడు అంతకంతకూ పెరుగుతున్న ధరలు సహా ప్రజల కోపకారణాలే ఊతంగా షీలా అధికారంలోకొచ్చారు. అంతకు కొద్దినెలల ముందు లోక్‌సభ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన బీజేపీ తీరా ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, 2013లో నిర్భయ కేసులో ప్రజ్వరిల్లిన ప్రజాగ్రహం, అవినీతి అంశాల ఆసరాతో, ఉచిత విద్యుత్, నీటి సరఫరా హామీలు అండగా కేజ్రీవాల్ జయకేతనం ఎగరేశారు. సంక్షేమ పథకాలతో 2015, 2020లోనూ గట్టెక్కారు. పదేళ్ళ పైగా ‘ఆప్’ అధికారంలో ఉన్నందున ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజమే. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలూ వాడుతోంది. కాంగ్రెస్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తోంది. చిత్రమేమిటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంతున్నా అదేమీ పట్టనట్టు ఆప్, దాని అధినాయకత్వం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ ఓటర్ల మనసెరిగి ప్రవర్తించడంలో ఆరితేరిన అధికార పక్షం గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంక్షేమ పథకాలు, తాయిలాలతో వారిని ఆకట్టుకోగలిగింది. ఈసారి కూడా పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్య బీమా అందిస్తామంటూ ఆప్ భారీ వాగ్దానమే చేసింది. నిజం చెప్పాలంటే, ఇతర పార్టీలు సైతం తన దోవ తొక్కక తప్పని పరిస్థితిని కల్పించడంలో కేజ్రీవాల్ విజయం సాధించారు. ఒకప్పుడు ‘ఎన్నికల ఉచిత మిఠాయిలు’ అంటూ ఈసడించిన ప్రధాని మోదీ సైతం చివరకు ఢిల్లీలో వాటికే జై కొట్టడం గమనార్హం. ఆప్ మళ్ళీ పగ్గాలు పడుతుందా, లేక పొరుగున హర్యానాలో అనూహ్య విజయంతో ఆశ్చర్యపరిచిన బీజేపీ ఢిల్లీలోనూ ఆ మ్యాజిక్ చేస్తుందా అన్నది ఆసక్తికరం. చిరకాలంగా లోక్‌సభలో బీజీపీకీ, అసెంబ్లీలో ఆప్కూ అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఓటర్లు ఈసారీ అలాగే చేస్తారా అన్నది ప్రశ్న. ఆప్‌కు ఒకప్పుడున్న అవినీతి రహిత ఇమేజ్, సామా న్యులకు సానుకూలమనే పేరు ఇప్పుడు దెబ్బతిన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల వలలో పార్టీ నేతలు చిక్కగా, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఘర్షణతోనే పుణ్యకాలం హరించుకు పోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే. ప్రతి ఎన్నికనూ జీవన్మరణ సమస్యగానే భావించే బీజేపీ ఎప్పటిలానే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకొచ్చింది. నిరుటి లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి భాగస్వాములుగా సీట్ల పంపిణీతో చెట్టపట్టాలేసుకున్న ఆప్, కాంగ్రెస్‌లు ఈసారి పరస్పరం కత్తులు దూసుకోవడమూ విడ్డూరమే. మరోపక్క భుజాలపై పార్టీ కండువాలు మార్చిన నేతలు పలువురు కొత్త జెండాతో బరిలో అభ్యర్థులుగా నిలవడం కార్యకర్తలకూ, పార్టీ నేతలకే కాదు... ఓటర్లకూ చీకాకు వ్యవహారమే. ఇలాంటి 20 మంది నేతల భవితవ్యం ఢిల్లీ కొత్త పీఠాధిపతిని నిర్ణయిస్తుందని అంచనా. అవన్నీ ఎలా ఉన్నా ప్రధాన చర్చనీయాంశం మాత్రం ఉచిత హామీలే.సమాజంలో అంతరాలు అంతకంతకూ అధికమవుతున్న పరిస్థితుల్లో అణగారిన వర్గాల సముద్ధరణకు చేయూత నివ్వడం సమంజసం. అయితే, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెంచి, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం దూరదృష్టి గల పాలకులు చేయాల్సిన పని. అవసరం లేని ఉచితాలపై మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల జాతరలో తాత్కాలికంగా పైచేయి అనుచితమైన ఉచితాలను పార్టీలు ప్రకటిస్తే, ఆ మాటలు నీటి మీది రాతలుగా మిగిలిపోతాయి. అథవా అమలు చేసినా, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై, పాలనారథం తలకిందులయ్యే ప్రమాదమూ ఉంటుంది. అభివృద్ధి మంత్రానికీ, అధికారం కోసం పప్పుబెల్లాలు పంచాలనుకొనే ఉచితాల తంత్రానికీ నడుమ పోటీలో ఢిల్లీ జనం ఎటు మొగ్గుతారన్నది ఓట్ల లెక్కింపు జరిగే ఫిబ్రవరి 8న చూడాలి. -
ఆశయాన్ని దెబ్బతీసే ఆచరణ?
రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన విద్యారంగానికీ రంగులు అంటుకున్నాయి. కేంద్రం ఇటీవల జారీ చేసిన ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు – 2025’ ముసాయిదా చర్చ నీయాంశమైంది. విశ్వవిద్యాలయ ఉపకులపతుల ఎంపిక ప్రక్రియను సమూలంగా మార్చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెలువరించిన ఈ ముసాయిదా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో రచ్చ రేపుతోంది. ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యారంగంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పెత్తనం చేయాలనుకుంటున్నదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. తాజా యూజీసీ ముసాయిదా అందుకు నిదర్శనమన్నది వాటి భావన. రాష్ట్ర గవర్నర్ నిర్వాకమా అని ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో వీసీలు లేకుండా పోయిన తమిళనాడు ఈ ముసాయిదాను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరుతూ చట్టసభలో తీర్మానం చేయడం గమనించాల్సిన అంశం. వీసీల పదవీ కాలాన్ని మూడు నుంచి అయిదేళ్ళకు పెంచడం మంచిదే అయినా, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట కాషాయ భక్తుల్ని వీసీలను చేస్తారన్న అనుమానాలకు జవాబు దొరకడమే కష్టంగా ఉంది. ముసాయిదా ప్రకారం వైస్‌ఛాన్సలర్ల (వీసీల) నియామకం కోసం ముగ్గురు సభ్యుల అన్వేషణ, ఎంపిక కమిటీని నియమించే అధికారాన్ని ఛాన్సలర్లకు, అంటే కేంద్రసర్కార్ నియమించే ఆ యా రాష్ట్రాల గవర్నర్లకు కట్టబెట్టారు. ఒకవేళ మార్గదర్శకాలను గనక అమలు చేయకుంటే... సదరు విద్యా సంస్థను యూజీసీ పథకాల నుంచి, లేదంటే అసలు డిగ్రీ కోర్సులు చెప్పడానికైనా వీలు లేకుండా బహిష్కరించవచ్చు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు, సామాన్య ప్రజలు నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చెప్పాలని కేంద్రం కోరుతోంది. వైస్–ఛాన్సలర్ మాట అటుంచి, పాఠశాల నుంచి కాలేజ్‌లు, విశ్వవిద్యాలయాల దాకా విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ హోదానైనా కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి (గవర్నర్)కి అసలెలా కట్టబెడతారన్నది తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురి ప్రాథ మిక ప్రశ్న. సమాఖ్య స్ఫూర్తినే దెబ్బ తీసేలా ఉన్న తాజా ముసాయిదాను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు చట్టసభల్లో తీర్మానాలు చేయాలని ఆయన ఏకంగా పిలుపునివ్వడం విశేషం. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా అనేక రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వా లకూ, పై నుంచి వచ్చిన గవర్నర్లకూ మధ్య నిత్య ఘర్షణ చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర సర్కార్లు నడిపే పలు విశ్వవిద్యాలయాల్లో సదరు గవర్నర్లే ఛాన్సలర్లు. వీసీల నియామకంపై వాళ్ళు రాష్ట్ర ప్రభు త్వాల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటి వరకు వీసీల నియా మక అన్వేషణ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటుచేసేవి. తాజా ముసాయిదా ప్రకారం ఆ కమిటీల నియామకం సైతం ఛాన్సలర్లయిన గవర్నర్ల చేతిలోకి వెళ్ళిపోనుంది. ఢిల్లీ నుంచి తాము పంపే రబ్బరు స్టాంపులతో రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్ని సైతం తమ చేతుల్లోకి తీసుకోవాలన్న ప్రయత్నమిది అని ప్రతిపక్షాల ఆరోపణ. కేంద్ర పాలకులు ఆ ఆరోపణల్ని నిజం చేయరాదు. నిజానికి, నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) అమలు చేస్తామంటూ కేంద్రం ప్రకటించి మూడున్నరేళ్ళు దాటినా, ఉన్నత విద్యాసంస్థల సంస్కరణ నేటికీ నత్తనడక నడుస్తోంది. దీర్ఘకాల లోపాల్ని సవరించి, ఆధునిక కాలానికీ, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ అవసరాలకూ తగ్గట్లు యూనివర్సిటీలను తీర్చిదిద్దాల్సి ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి నియంత్రణ వ్యవస్థయిన యూజీసీది అందులో ప్రధాన బాధ్యత. అతిగా నియంత్రిస్తోందంటూ గతంలో విమర్శలను ఎదుర్కొన్న యూజీసీ వైఖరి తాజా ముసాయిదాలో కొంత మారినట్టు కనిపిస్తోంది కానీ, కొత్త విమర్శలకు తావిచ్చింది. ఫలానా అంశం బోధించాలంటే అందులో పీజీ చేసి ఉండాల్సిందేనన్న అర్హత ప్రమాణాల్ని సడలించడం, వీసీ పదవికి పరిశ్రమలోని సీనియర్లు, ఉన్నతాధికారులకు సైతం వీలు కల్పించడం లాంటివి కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా,సంస్థాగత స్వతంత్రత ఎన్ఈపీ ప్రధానోద్దేశమైతే... తద్విరుద్ధంగా వీసీల నియామకంలో గవర్నర్లకు పెద్దన్న పాత్ర కల్పించడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. ‘నీ ఎడమ చేయి తీయి... నా పుర్ర చేయి పెడతా’ అన్నట్టు ఇక వీసీల ఎంపికలో రాష్ట్రం బదులు కేంద్రం పట్టు బిగుస్తుందన్న మాట. పార్లమెంట్ చేసిన 1956 నాటి చట్టం ప్రకారం తన పరిధిలోకే రాని వీసీల ఎంపిక, నియామకాన్ని యూజీసీ నియంత్రించాలనుకోవడం సమస్యే కాదు రాజ్యాంగపరమైన చిక్కులు తెస్తుంది. గతంలో శాస్త్రవేత్త నాయుడమ్మ లాంటి వారిని వీసీలుగా నియమించినప్పుడు, వారి విజ్ఞానం విద్యాలయాలకు వన్నె తెచ్చింది. అలా చూస్తే, అధ్యాపక వర్గానికి ఆవల ఉన్న వృత్తి నిపుణులకు సైతం తలుపులు తెరవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో ప్రతిభావంతుల సమూహం పెరగడం మంచిదే. యూనివర్సిటీల్లో నియామక నిబంధనల్ని సరళం చేయడం స్వాగతించాల్సిందే. కానీ, ఇప్పుడైనా, అప్పుడైనా వీసీ పదవిని రాజకీయ నియామకంగా మార్చడంతోనే అసలు సమస్యంతా! వీసీల నియామకాల్లో రాజ్‌భవన్‌ను కీలకంగా మార్చడమన్నది అసలు ఎన్ఈపీ లక్ష్యాలకే విరుద్ధం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ మధ్య నలిగి పోతున్నాయి. వీసీల ఎంపిక సైతం గవర్నర్ల చేతికొచ్చాక పరిస్థితేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉన్నత విద్యాలయ ప్రాంగణాన్ని నడిపే ఉత్తముడి ఎంపిక ఇటు రాష్ట్రం, అటు కేంద్రాల రాజకీయ ఒత్తిళ్ళకు అతీతంగా ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. -
భవిష్యత్తు బంగారమేనా?
అనుకున్నదే అయింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూనే డొనాల్డ్ ట్రంప్ తన మాటలు, చేతలు, చేష్టల ద్వారా సంచలనాలు సృష్టించారు. గతంలో దేశానికి 45వ అధ్యక్షుడిగా పనిచేసి, తాజాగా 47వ అధ్యక్షుడిగా సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే ‘ఇక నుంచి అమెరికాకు స్వర్ణయుగం’ అంటూ అమెరికన్లలో ఆశలు, ఆకాంక్షలు పెంచారు. అయితే, ‘అమెరికాను మళ్ళీ ఘనమైన దేశంగా తీర్చిదిద్దాల’ని (మాగా) నినదిస్తూ ఆయన ప్రకటించిన కొన్ని చర్యలు ఆధిపత్య, విస్తరణవాదానికి ప్రతీకగానూ ప్రతిధ్వనించాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని మార్చివేసే పలు చర్యలకు నడుం బిగి స్తున్న తీరు, అలాగే కోవిడ్, చైనాలను సాకుగా చూపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, అలాగే పర్యావరణ రక్షణపై ప్యారిస్ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం పైకి సాదాసీదా అధికార మార్పిడిగా అనిపించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులు సైతం చిరునవ్వులు చిందిస్తూ సౌహార్దం చూపుకుంటున్నట్టు కనిపించవచ్చు. అంతమాత్రాన అంతా మామూలే అనుకొంటే పొరపాటు. పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో దర్శనమిచ్చిన ఐక్యతకు భిన్నంగా ప్రత్యర్థులపై తుపాకులు ఎక్కుపెట్టిన తీరు ఆయన ప్రసంగంలో స్పష్టంగా వినిపించింది. కునారిల్లిన దేశాన్ని తాను మాత్రమే మళ్ళీ పునరుత్తేజితం చేయగలనన్న భావన కలిగించడంతో పాటు ఆయన ఒకటికి రెండు జాతీయ ఎమర్జెన్సీలు ప్రకటించడం పెను పర్యవసానమే. అలాగే, చైనా నుంచి పనామా కాలువను వెనక్కి తీసుకోవాలని పిలుపునివ్వడమూ వివాదాస్పదమే. బలప్రయోగం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అలాంటి పనుల ప్రస్తావన నిప్పుతో చెలగాటానికి సిద్ధమని స్పష్టం చేయడమే. ఇక, గద్దెనెక్కిన తొలిరోజునే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా ట్రంప్ ప్రకటించడంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా మరెన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్విగ్నత నెలకొంది. పదవి చేపడుతూనే ట్రంప్ చకచకా సంతకాలు చేసిన పదుల సంఖ్యలోని కార్యనిర్వాహక ఆదేశాలు ఆసక్తికరం. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేయడం, జన్మహక్కుగా సంక్రమించే పౌర సత్వంపై అమెరికా రాజ్యాంగాన్ని సైతం తోసిపుచ్చడం లాంటివి ఇట్టే మింగుడుపడే అంశాలు కావు. జాతీయతతో సంబంధం లేకుండా దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి పుట్టినబిడ్డలకు సైతం 150 ఏళ్ళ పైచిలుకుగా అమెరికా పౌరసత్వం దక్కుతూ వచ్చింది. కానీ, నెల రోజుల్లో అమలులోకి రానున్న తాజా ఆదేశం ఫలితంగా ఇప్పుడిక అలాంటి పిల్లలకు పౌరసత్వ పత్రాలివ్వరు. అదేమంటే, 1868లో చేసిన 14వ సవరణ కింద అమెరికా గడ్డపై పుడితేచాలు ఆ పిల్లలకు మారుమాట లేకుండా పౌరసత్వమివ్వాలనేమీ లేదనీ, సవరణను తప్పుగా వ్యాఖ్యానించారనీ ట్రంప్ వాదన. తాత్కాలిక వీసాలతో అమెరికాలో నివసిస్తూ, ఉద్యోగాధారిత గ్రీన్కార్డ్కై దీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న 10 లక్షల పైచిలుకు మంది భారతీయులకు ఈ కొత్త నిర్ణయం అశనిపాతమే. ఇప్పటికే కొన్నిచోట్ల ఇమ్మిగ్రేషన్ లాయర్లు కోర్టుకెక్కిన ఈ ఆదేశం గనక అమలైతే, తాత్కాలిక వర్క్ వీసాలు, టూరిస్ట్ వీసాలపై అగ్రరాజ్యంలో ఉంటున్నవారి సంతానానికి అక్కడి పౌరసత్వ ఆశలు అడుగంటినట్లే. 2022 నాటి అమెరికా జనాభా లెక్కలపై ప్యూ రిసెర్చ్ విశ్లేషణ ప్రకారం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లుంటే, వారిలో మూడింట రెండొంతుల మంది వలసజీవులే. కేవలం 34 శాతం, మరో మాటలో 16 లక్షల మంది మాత్రం అగ్రరాజ్యంలోనే పుట్టారు. ఇక, చట్టవిరుద్ధమైన వలసల్ని అడ్డుకుంటాననీ, సరైన పత్రాలు లేని లక్షలాది వలస జీవుల్ని దేశం నుంచి పంపివేస్తాననీ ట్రంప్ చేసిన గర్జన కూడా లక్షలమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ జాబితాలో మెక్సికో (40 లక్షలు), ఎల్ సాల్వడార్ (7.5 లక్షలు) తర్వాత 7.25 లక్షల మంది భారతీయులదే మూడో స్థానం. ఫలితంగా, ట్రంప్ ప్రతి మాట, ప్రతి అడుగు మనవాళ్ళలో ఆదుర్దా పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ కొత్త ఏలుబడిలో భారత్‌తో బంధం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. మరోపక్క డెమోక్రాట్లను జనం బాధలు పట్టని కులీనులుగా చిత్రించి, సామాన్య పౌరుల సంరక్ష కుడిగా ఎన్నికల్లో తనను తాను చూపుకొన్న ట్రంప్‌ను అతిగా నమ్మి మోసపోయామనే భావన రేకెత్తడం సహజమే. చేతిలోని నియంత్రణ నిర్ణయాలే అండగా ఇటీవలే ఓ బ్రాండెడ్ క్రిప్టో టోకెన్ ద్వారా ఆయన వందల కోట్ల డాలర్ల లబ్ధి పొందాడనే విమర్శలూ గుప్పుమంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ళ తర్వాత కీలక సమయంలో పగ్గాలు చేపట్టిన ట్రంప్ తన మద్దతుదారులకై ఏమైనా చేసేలా ఉన్నారు. 2021లో అమెరికా అధ్యక్ష భవనంపై దాడి చేసిన దాదాపు 1500 మంది దుండగులకూ ఆయన తక్షణం సామూహిక క్షమాభిక్ష ప్రసాదించడమే అందుకు తార్కాణం. నాలుగేళ్ళు విచారించి, శిక్షలు వేసిన న్యాయవ్యవస్థను అలా నూతన అధ్యక్షుడు పరిహసించినట్టయింది. ఆశ్రితులు, ఆర్థిక దాతలు, బంధు మిత్రులకై క్షమాభిక్ష వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో నిన్నటి బైడెన్ నుంచి నేటి ట్రంప్ దాకా అందరూ ఒకే తాను గుడ్డలన్న మాట. కాలు మోపిననాడే కాపురం చేసే లక్షణం తెలిసిందన్నట్టు ట్రంప్ 2.0 హయాం ఆరంభమవు తూనే రోజులు ఎలా ఉండనున్నాయో తేటతెల్లమైంది. బహుళ ధ్రువ ప్రపంచం వైపు అంతర్జాతీయ అధికార క్రమం అడుగులేస్తున్న కాలంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో సామాజిక, ఆర్థిక రంగాల్లో ట్రంప్ ఆధిపత్యభావ నిర్ణయాలు రానున్న నాలుగేళ్ళలో ప్రపంచాన్ని కుదిపేయడం ఖాయం. -
తప్పు ఎవరిది? శిక్ష ఏమిటి?
దేశాన్ని అట్టుడికించిన కేసులో కోర్టు తీర్పు వెలువడింది. తీరా తీర్పు సైతం ఆ కేసులానే చర్చకు దారి తీస్తోంది. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలోని సెమినార్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ డాక్టర్‌పై గత ఆగస్ట్ 9న జరిగిన దారుణ హత్యాచార ఘటనపై తాజా తీర్పు సహేతుకం కాదనే విమర్శ వినిపిస్తోంది. ఆస్పత్రిలో వాలంటీరైన సంజయ్ రాయ్ భారతీయ న్యాయ సంహిత లోని వివిధ సెక్షన్ల కింద నేరస్థుడంటూ శనివారమే కోర్ట్ ప్రకటించేసింది. కానీ, ఈ కేసులో అతనికి ఉరిశిక్ష బదులుగా యావజ్జీవ కారాగారవాస శిక్ష మాత్రమే విధిస్తున్నట్టు సియాల్డాలోని అడిషనల్ జిల్లా, సెషన్స్ కోర్ట్ సోమవారం తీర్పు చెప్పేసరికి మళ్ళీ తేనెతుట్టె కదిలింది. బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారే కాక, అటు కేంద్ర నేరదర్యాప్తు సంస్థ (సీబీఐ), ఇటు బాధితురాలి కుటుంబం సైతం నేరస్థుడికి ఉరిశిక్ష విధించాలంటూ వాదించింది. కానీ, అంతటి తీవ్ర శిక్ష విధించేందుకు హేతుబద్ధత లేదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం గమనార్హం. దాంతో, మహిళా లోకంలో, బాధిత, వైద్య వర్గాల్లో అసహనం కట్టలు తెంచుకుంది. సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాలే అందుకు నిదర్శనం.హత్యాచారానికి గురైన ఆడకూతురు, ఆమె కుటుంబం బాధను ముగ్గురు ఆడపిల్లలకు తల్లినైన తాను అర్థం చేసుకోగలనంటూ నేరస్థుడి తల్లే స్వయంగా అనడం గమనార్హం. కన్నకొడుకైనా సరే నేరం రుజువైతే, శిక్ష పడాల్సిందేనని ఆ మాతృమూర్తి అన్న మాటలు జరిగిన ఘటన రేపిన భావోద్వేగాలను గుర్తు చేస్తుంది. పైపెచ్చు, ఆగస్ట్ 9 తర్వాత బెంగాల్లో అయిదు హత్యాచార ఘటనల్లో, మైనర్లపై దారుణానికి పాల్పడ్డ నేరస్థులకు ‘పోక్సో’ కోర్టులు ఏకంగా మరణశిక్షే విధించాయి. అందుకే, ఈ కేసులోనూ నేరస్థుడికి ఉరిశిక్ష పడుతుందనీ, పడాలనీ బలమైన భావన వ్యాపించింది. అయితే జరిగింది వేరు. బెంగాల్‌నే కాక అప్పట్లో భారత్ మొత్తాన్నీ కదిలించిన ఈ ఘటనలో బాధిత కుటుంబానికి రూ. 17 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ ఘటన ఉరిశిక్ష విధించాల్సినంత అత్యంత అరుదైన కేసు ఏమీ కాదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. బెంగాల్ ఏలిక మమతా బెనర్జీ సైతం తీర్పుతో సంతృప్తికరంగా లేమంటూ కుండబద్దలు కొట్టేసి, తీర్పుపై హైకోర్టుకు వెళతామని తేల్చేశారు. సర్వసాధారణంగా నేరం తాలూకు తీవ్రత, సమాజంపై దాని ప్రభావం, నేరస్థుడి గత చరిత్ర, ప్రవర్తన లాంటివన్నీ మరణశిక్ష విధింపునకు ప్రాతిపదిక అవుతాయి. అయితే, గౌరవ న్యాయస్థానం తన ముందున్న సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే ఎలాంటి తీర్పునైనా ఇస్తుంది. తీర్పు చెబుతూ న్యాయమూర్తి సైతం ఆ మాటే అన్నారు. అంతేతప్ప, మీడియాలో సాగుతున్న ప్రచారం సహా ఇతరేతర కారణాలను బట్టి శిక్షపై నిర్ణయం తీసుకోవడం జరగదు. కాబట్టి, తగినంత బలమైన సాక్ష్యాధారాలు లేనందు వల్లనే ఈ కేసులో నేరస్థుడికి కోర్ట్ మరణశిక్ష విధించలేదా అన్నది ఆలోచించాల్సిన అంశం. తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ ఆ అంశంపై మరింత స్పష్టత రాదు. ఆస్పత్రి సిబ్బంది భద్రత కోసం పనిచేయాల్సిన వాలంటీర్ రాయ్ అసలు తన ఉద్యోగ ధర్మాన్నే మంటగలిపి, కాపాడాల్సిన డాక్టర్నే కాటేశాడన్నది చేదు నిజం. అతడు చేసిన నేరం ఘోరం, హేయమన్నదీ నిర్వివాదాంశం. అయితే, హత్యాచారానికి పాల్పడ్డ సదరు నేరస్థుడు జీవితంలో మారే అవకాశం లేదంటూ ప్రాసిక్యూషన్ బలంగా వాదించలేక పోయింది. ఆ మాటను నిరూపించలేక పోయింది. అది కూడా శిక్ష విషయంలో నేరస్థుడికి కలిసొచ్చిందని నిపుణుల మాట.కోల్‌కతా కేసు దర్యాప్తు ఆది నుంచి అనుమానాలకు తావివ్వడం దురదృష్టకరం. నిజానిజా లేమో కానీ, అత్యంత హేయమైన ఈ ఘటనలో శిక్షపడ్డ నేరస్థుడే కాక, ఇంకా పలువురి హస్తం ఉంద నేది అందరి నోటా వినిపిస్తున్న మాటే. స్థానిక పోలీసుల నుంచి చివరకు సీబీఐ చేతుల్లోకి దర్యాప్తు వెళ్ళినా జనంలో అనుమాన నివృత్తి కాలేదన్నది నిష్ఠురసత్యం. సీసీ టీవీ దృశ్యాల్లో 68 దాకా రాకపోకలు కనిపించినా, రాయ్ ఒక్కరినే గుర్తించారన్న ఆరోపణలే అందుకు సాక్ష్యం. పనికి మాలిన రీతిలో దర్యాప్తు జరిగిందనీ, పలుకుబడి గల బడాబాబులు తప్పించుకున్నారనీ, ఆఖరికి ఒకడే నేర స్థుడని తీర్మానించి యావజ్జీవ ఖైదుతో సరిపెట్టారనీ విమర్శలు వెల్లువెత్తడానికి కారణమూ అదే. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ సహా పలువురి వ్యవహారశైలి, ఆశ్రిత పక్ష పాతం, అవినీతి ఆరోపణలు, ఆస్పత్రి యంత్రాంగం పనితీరు, వగైరా... ఎన్నో ప్రశ్నల్ని ముందుకు తెచ్చాయి. సాక్ష్యాధారాల తారుమారు యత్నంలో ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసినా, నిర్ణీత 90 రోజుల వ్యవధిలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోయే సరికి నిష్పూచీగా ఆయన బయటకొచ్చారంటే మన నిఘా, దర్యాప్తు సంస్థలు ఎంత ఘనంగా పనిచేస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కీలకమైన మరో విషయం – ఈ ఘటనకు కారణమైన పరిస్థితులు. ప్రగతి బాటలో ముందున్నా మనే దేశంలో... పనిప్రదేశాల్లో సైతం మహిళలకు రక్షణ కొరవడడం, ఉద్యోగస్థలాలు స్త్రీలకు సురక్షితంగా లేకపోవడం శోచనీయం. కోల్‌కతా ఘటనతో పార్టీలు, ప్రజలు కదం తొక్కిన మాట నిజమే కానీ, ఇప్పటికైనా ఈ పరిస్థితుల్ని సమూలంగా మార్చాల్సిన అవసరం పాలకులకుంది. అవినీతి పంకిలమై, లోపభూయిష్ఠంగా నడుస్తున్న అనేక వ్యవస్థల్ని చక్కదిద్దాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనే కోర్టులు ఉన్నంతలో సత్వర న్యాయం అందించడం, ప్రజాభిప్రాయం కన్నా ప్రత్యక్ష సాక్ష్యాలే ప్రాతి పదికగా తీర్పులివ్వడం ఆహ్వానించదగ్గదే. అయితే, చాలా సందర్భాల్లో న్యాయం చెప్పడమే కాదు... న్యాయమే చేస్తున్నట్టు కనిపించడం ముఖ్యం. ఈ కేసులో అది జరిగిందా అన్నదే పలువురి ప్రశ్న. -
పనీ – పాటా
పనీ–పాటా అనే నుడికారం ఊరికే పుట్టలేదు; శ్రామిక సంస్కృతిలో పని లేకుండా పాటా, పాట లేకుండా పనీ ఉండవు; అవి అన్యోన్యాలు. పాడుకుంటూ పనిచేస్తే పనిభారం తగ్గుతుందంటారు; అందుకే, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నదని ఓ సినీకవి అన్నాడు. అసలు పాట రూపంలో కవిత్వమే కానీ, అభినయ రూపంలో నృత్య, నాటకాలే కానీ, ఆమాటకొస్తే ఇతర కళారూపాలే కానీ పుట్టింది పనితోనేనని పండితులు తేల్చారు. వైయక్తిక, సామూహిక శ్రమలో భాగమైన శారీరక చర్యలను కళారూపాలు అంటిపెట్టుకునే ఉండేవన్నారు. పనినీ, పాటనూ విడదీసి చూడడం నాగరికత ముదిరిన తర్వాతే వచ్చింది. పాట అనేది పనిలేనప్పుడు పాడుకునే వ్యాపకమైంది. రానురాను పాటను పక్కన పెట్టి పనికి మాత్రమే పట్టం కట్టే స్థితికి దారితీసి; తాజాగా వారానికి 70 గంటలు పనిచేయాలని ఒకరంటే, కాదు 90 గంటలు పనిచేయాలని మరొకరు అనే వరకు వెళ్లింది. కొన్నిరోజులుగా ఇదే పెద్ద చర్చనీయాంశం. మనిషితో సహా సమస్త జీవరాశితోనే పని కూడా పుట్టింది; అది కర్మగా మారి కర్మయోగంగా తాత్విక శిఖరానికీ చేరింది; దాంతోపాటు కలలూ, కన్నీళ్ళ చరిత్రనూ మూటగట్టింది. వేల సంవత్సరాల వెనకటి వేట–ఆహార సేకరణ జనాల జీవనంలోకి తొంగి చూస్తే, వారు వారానికి పదిహేను గంటలే పనిచేసేవారని మానవశాస్త్ర నిపుణులంటారు. వారిది మొరటుదనం, అజ్ఞానం మూర్తీభవించిన దుర్భర జీవితమని కొందరంటే; కాదు, ఆ తర్వాతి కాలానికి చెందిన వ్యవసాయ జీవనంతో పోల్చితే వేట–ఆహారసేకరణ జనాలది అత్యున్నత సంస్కృతికి చెందిన సంపన్న సమాజమనీ, తగినంత తీరిక ఉండడమే అందుకు కారణమనీ మరికొందరు అన్నారు. ప్రకృతిని అధ్యయనం చేయడానికీ, చంద్రుడి వృద్ధిక్షయాలపై ఆధారపడిన కాలగణనాన్ని కూర్చడానికీ, కళారూపాల అభివృద్ధికీ ఆ తీరిక తోడ్పడిందనీ, వారే తొలి శాస్త్రవేత్తలూ, కళాకారులనీ – అప్పటి అనేక గుహా చిత్రాలు, కుడ్యచిత్రాల ఆధారంగా నిపుణులు నిరూపించారు. వ్యవసాయ జీవనం నుంచీ ఆ తీరిక అడుగంటి పారిశ్రామిక యుగానికి వచ్చేసరికి వారానికి 80 నుంచి 100 గంటలు పనిచేయవలసిన దుఃస్థితి దాపురించి, ఆ నిర్బంధ శ్రమకు వ్యతిరేకంగా ఉద్యమాలు తలెత్తడంతో వారానికి 40 గంటల పని ప్రామాణిక కొలమానంగా స్థిరపడిందని చరిత్ర చెబుతోంది. నిజానికి పనీ–తీరికా అనేవి ఏదో ఒక నిర్ధారణకో, ఒకే ఒక్క నిర్వచనానికో అందని సంక్లిష్ట అనుభవాలు. ప్రతిసారీ పనిభారాన్ని దాని పరిమాణంతోనూ, గంటలతోనూ తూచలేం. ఇష్టంతో స్వచ్ఛందంగా చేసే పని అలాంటి కొలతలనూ, శ్రమనూ కూడా అధిగమిస్తుంది. నిర్బంధంగా విధించే పని తక్కువ పరిమాణంలో ఉండి, తక్కువ సమయాన్ని తీసుకునేదైనా భారంగానే తోస్తుంది. స్వతంత్రంగా కొయ్యపని చేసుకుంటూ అందులో కళాత్మకతనూ, తృప్తినీ ఆస్వాదించిన ఒక వడ్రంగి ఒక ఫ్యాక్టరీ కార్మికుడిగా మారడంతోనే వాటిని కోల్పోయి ఎలా నిరాసక్తంగా మారాడో కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో చిత్రిస్తారు. పనిగంటలు పెరిగితే ఉత్పాదకత పెరుగుతుందనుకోవడమూ సత్యదూరమేనని చెప్పి, ఐస్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ లాంటి దేశాల అనుభ వాన్ని ఉటంకించేవారూ ఉన్నారు. వారానికి 30–35 గంటల పనితోనే ఈ దేశాలు ఉత్పాదకత లోనూ, సంతోషభరిత జీవనంలోనూ అగ్రస్థానం వహించడాన్ని వారు ఉదాహరిస్తున్నారు. పనీ–తీరికలలో ఏది ఎక్కువైనా జీవనశకటం ఒకవైపే ఒరిగిపోయి జీవితమే అస్తవ్యస్తమవుతుంది. జీవిక కోసమే మొత్తం సమయాన్ని వెచ్చిస్తే, జీవించడమే మరచిపోతామని ఒక సూక్తి. అన్నిటా సమతూకం పాటించడంలోనే సంతోష రహస్యం ఇమిడి ఉందన్నది మరొక ఉద్బోధ.అందుకే, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నారు; అదే అన్ని సందర్భాలకూ వర్తించే సార్వకాలిక సూత్రం. నిజానికి పనికీ–తీరికకీ మధ్య అన్యోన్యతా, పరస్పరతా ఉన్నాయే తప్ప వైరుద్ధ్యం లేదని, దేని విలువ దానిదేనని అనేవారూ ఉన్నారు. కుటుంబ సభ్యులతోనూ, విందు వినోదాలతోనూ ఆహ్లాదంగా గడిపే తీరిక సమయం పనిలో నిమగ్నతకూ, నాణ్యతకూ, ఉత్పాదకత పెరగడానికే తోడ్పడుతుందంటారు. పనిలో ఇతర దేశాలతో పోటీ, అభివృద్ధీ అనేవి కొత్తగా వచ్చాయి. దేశాభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించడానికి పని గంటలు పెంచాలనడం పూర్తిగా కొట్టిపారవేయవలసినదేమీ కాదు. కాకపోతే, ఇతర అనేకానేక దృష్టికోణాలను, వాస్తవాలను విస్మరించి ఏకపక్షంగా అలాంటి అభిప్రాయానికి రావడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువన్నది ఒక విమర్శ. అభివృద్ధిలో పోటీ పడవలసిందే కానీ, ఇక్కడి మానవవనరుల అందుబాటునూ, వాటి అభివృద్ధినీ కూడా పరిగణనలోకి తీసుకుని తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే వాదన వినిపిస్తోంది. వివిధ రంగాలలో ఇప్పటికే పెరిగిన పని భారం ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందనీ, అందువల్ల ఉత్పాదకత మందగిస్తోందనీ ఆయా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇంకోవైపు దేశంలో నిరుద్యోగం రేటు పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కనుక, పని గంటలను పెంచడం కన్నా పని చేసే చేతుల సంఖ్యను పెంచి పనిని పంచడమే అత్యుత్తమ పరిష్కారమనీ; అందుకు అవసర మైన అన్నిరకాల శిక్షణ సదుపాయాలనూ అభివృద్ధి చేయాలనే వాదన ముందుకు వస్తోంది. పని నుంచి పాటను వేరు చేసినప్పుడు చిన్న పని కూడా పెనుభారమే అవుతుంది. పనికి పాటను జోడించడమే దానిని తేలికచేసే మార్గం. పనీ–పాటా కలిసినప్పుడు... పనే పాటవుతుంది!