Politics
-
తెలంగాణను ఉద్దరించలేనోడు.. ఢిల్లీని ఉద్దరిస్తాడా?: కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘రేవంత్‌రెడ్డి( Revanth Reddy) ఢిల్లీని ఉద్దరిస్తానంటున్నారు.. తెలంగాణను ఉద్దరించలేనోడు ఢిల్లీని ఉద్దరిస్తాడా?’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బీఆర్ఎస్ రైతు దీక్ష(BRS Rythu Diksha)లో ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేర్చామని ఢిల్లీలో సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.‘‘ప్రతీ ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇవ్వాలి. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదు. రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారు. రైతులను సీఎం రేవంత్ మోసం చేశారు. కొండారెడ్డి పల్లె, కొడంగల్‌లో ఒక్క ఊర్లో అయినా పూర్తి స్థాయి రైతు రుణమాఫీ అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా’’ అని సవాల్ విసిరారు.‘‘ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ అయ్యిందని.. రైతులు చెబితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయిస్తా. మళ్ళీ ఓట్లకు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు.. గళ్ళ పట్టుకొని రైతు రుణమాఫీ, రైతు భరోసా డబ్బులు ఎక్కడని అడగండి’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: అఫ్జల్‌గంజ్ టూ ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ? -
బీఆర్ఎస్ది వడ్డీ మాఫీనే.. దొంగ దీక్ష అందుకే: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ అని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అలాగే, తెలంగాణ ప్రజలకు రేషన్‌కార్డులు ఇవ్వడమే మర్చిపోయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతోందని తెలిపారు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు.. వడ్డీ మాఫీ మాత్రమే చేసింది. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. మేము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ రైతు భరోసా అమలు చేస్తుందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతల ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతోంది. రైతు భరోసా పేరుతో ఈనెల 26 నుండి రైతుకు ప్రోత్సాహం కింద ఎకరాకు 12 వేలు ఇస్తుంది. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా కింద 12వేల ఆర్థిక సహాయం అందజేస్తుంది. బీఆర్ఎస్ రైతుబంధు పేరుతో ఏడాదికి 8వేల నుండి పది వేలు చేస్తే.. కాంగ్రెస్ పది వేల నుండి 12 వేలు ఇస్తుంది. భవిషత్తులో 14 వేలు కూడా కాంగ్రెస్ ఇవ్వబోతోంది.దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరాకు 500 బోనస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రైతులకు సన్నాలు పండిస్తే రూ.500 బోనస్ ఇస్తున్నాం. రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ఈనెల 26నుండి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఎస్ హౌసింగ్ పథకాన్ని మర్చిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చేలా ప్రణాళిక చేసింది. 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ రుణమాఫీ అంశాన్నే ఎత్తేసింది. బీజేపీ రుణమాఫీ అనే మాటే ఎత్తలేదు. కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి నీతి ఆయోగ్‌లో ప్రస్తావిస్తే బాగుండేది. రైతాంగానికి ఉచిత విద్యుత్ పేటెంట్ అంటే అది కాంగ్రెస్ మాత్రమే’ అంటూ కామెంట్స్ చేశారు. -
‘కేటీఆర్ అపరిచితుడిలా మాట్లాడుతున్నాడు’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చేయాల్సింది లై డిటెక్టర్ టెస్ట్ కాదు.. నార్కో అనాలసిస్ టెస్ట్ అంటూ కామెంట్స్ చేశారు సీఎల్పీ మధుసూదన్ రెడ్డి. తప్పు చేసింది మీరైతే.. విచారణకు ముఖ్యమంత్రిని ఎందుకు రమ్మంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన తప్పులు కేసీఆర్‌కు తెలుసు కాబట్టే బయటకు రావడం లేదని వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ మధుసూదన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ మాటల్లోనే డొల్లతనం బయటపడింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందు ఒకలా.. నమోదు చేశాక అపరిచితుడులా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే కేసు కొట్టేయాలంటూ కోర్టులకు వెళ్లి మరీ మొట్టికాయలు తిన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో క్యాష్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. నిన్న ఈడీ విచారణ సందర్బంగా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.ఈడీ వాళ్లు.. ఏసీబీ అడిగిందే అడుగుతున్నారు అని చెప్పారు. నేరం ఒక్కటే అయినప్పుడు ఇంకేం అడుగుతారు. కేటీఆర్‌కు చేయాల్సింది.. లై డిటెక్టర్ టెస్ట్ కాదు.. నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలి. డ్రగ్స్ మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు. తప్పు మీరు చేసి.. విచారణకు సీఎంను రమ్మని అడుగుతారా?. కేటీఆర్ చేసిన తప్పులు కేసీఆర్‌కు తెలుసు కాబట్టి.. బయటకు రావడం లేదు. మీ హయాంలో ప్రతిపక్షనేతల కేసులకు మీరు విచారణకు వెళ్ళారా?.కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్.. ఇలా ఫ్యామిలీ మొత్తం దోపిడీ చేసింది. మీ హయాంలో జరిగిన తప్పులు బయటకు వస్తున్నా నేపథ్యంలో విచక్షణ కోల్పోయి.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులకు.. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. -
పులివెందుల టీడీపీలో వర్గపోరు.. కార్యకర్తపై బీటెక్ రవి అనుచరుల దాడి!
సాక్షి, వైఎస్సార్: పులివెందులో టీడీపీ(TDP) నేతల మధ్య వర్గపోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రేషన్ షాప్ డీలర్ల విషంయలో తమ ఆధిపత్యం చాటుకునేందుకు పచ్చ నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో, టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వాగ్వాదంలో అతడి చొక్కా చిరిగిపోయింది. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.వివరాల ప్రకారం.. పులివెందులలో రేషన్ షాపుల కోసం టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. నేడు రేషన్ షాప్ డీలర్ల కోసం పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తమ వర్గానికి చెందినవారే పరీక్షకు హాజరు కావాలంటూ రెండు వర్గాలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కేవలం తమ వాళ్ళే పరీక్ష రాసి షాపులు పొందాలంటూ ఇరువర్గాల పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో వాగ్వాదం మరింత పెరిగింది.ఘర్షణ అనంతరం, వేంపల్లికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తిపై బీటెక్ రవి అనుచరులు దాడి చేశారు. దీంతో, దాడికి నిరసనగా పరీక్షా కేంద్రం వద్ద ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత నాటకీయంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. పరీక్షా కేంద్రం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు భారీగా మోహరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తతకర పరిస్థితిలు నెలకొన్నాయి. మరోవైపు గురువారం సాయంత్రం కలెక్టరేట్లో ఇసుక టెండర్ల కోసం బీటెక్ రవి అనుచరులు హంగామా సృష్టించారు. ఆ ఘటన మరవక ముందే శుక్రవారం పులివెందులలో మరోసారి రెచ్చిపోయారు. -
రేవంత్.. ముందు నీ భాష మార్చుకో: కౌశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది తాను కాదు.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట కౌశిక్ రెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకుపైగా ఆయనను పోలీసులు విచారించారు.ఇక, విచారణ అనంతరం పీఎస్ బయట కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు నన్ను గంట పాటు విచారించారు. విచారణలో భాగంగా 32 ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నే అడిగారు మళ్లీ అడిగారు. నేను అన్నింటికీ సమాధానం ఇచ్చాను నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలపై ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. డిసెంబర్ నాలుగో తేదీన ఫిర్యాదు చేయడానికి నేను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కి వెళ్ళాను. బంజారాహిల్స్ ఏసీపీ అపాయిట్మెంట్ తీసుకొని అక్కడిని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపైనే కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పండుగ రోజు కూడా నన్ను దొంగ లాగ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది నేను కాదు.. రేవంత్ మార్చుకోవాలి అని హితవు పలికారు. -
‘సంక్రాంతికి వెరైటీ దోపిడీ.. కూటమి సూపర్ ఫైవ్ ఇవేనా?’
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చిందని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(Jakkampudi Raja). ఏపీలో నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగిందన్నారు. పేకాట, గుండాట, కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్స్, మద్యం అమ్మకాలు.. ఇదే కూటమి మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు.రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఏం జరుగుతుందో చంద్రబాబు(Chandrababu), పవన్(Pawan Kalyan) ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. సంక్రాంతి(sankranthi) సంబరాలు అంటే గంగిరెద్దులు ముగ్గులు, అక్కడక్కడ కోడిపందాలు మాత్రమే గతంలో ఉండేవి. సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చారు కూటమి నేతలు.. నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా జూదాలు.. గుండాటలు జరిగాయి.ఒక్కో మహిళకు నెలకు 15వేలు చొప్పున ఆర్థిక సాయం అన్నారు.. సూపర్ సిక్స్ మేనిఫెస్టో దేవుడి పేరిట అటకెక్కింది. పేకాట, గుండాట.. కోడిపందాలు.. రికార్డింగ్ డ్యాన్స్.. మద్యం అమ్మకాలు.. ఇవే కూటమి మేనిఫెస్టో. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చూసినట్టు కోడి పందాలను, ప్రీమియర్ లీగ్‌లా నిర్వహించి పార్కింగ్ పేరిట సామాన్యుడి దగ్గర విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశారు. రాజానగరం నియోజకవర్గంలో భూపాలపట్నంలో డ్రగ్స్.. రేవ్ పార్టీలు.. రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతి తీసుకొచ్చారు. అనకాపల్లిలో గంజాయి దొరికితే.. అందులో రాజానగరం నియోజకవర్గం కాపవరం గ్రామానికి చెందిన జనసేన నేతలు మూలాలు ఉన్నాయి.గంగాధర్ అనే వ్యక్తి గుండాటలో డబ్బులు పోయాయని ఆత్మహత్య చేసుకున్నాడు. బహిరంగంగా పోలీసులను కూడా వేదికలపై నుండి బయటకి గెంటేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గాల్సి వచ్చింది. కొన్నిచోట్ల సంక్రాంతికి అసలు పోలీసులు ఉన్నారా లేరా అనే ప్రశ్న తలెత్తింది. రాజమండ్రి పేపర్ మిల్‌పై వేలమంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి చేస్తున్నాడు. ప్రవీణ్ చౌదరికి తెలుగుదేశంలో మూలాలు ఉన్నాయి.. బుచ్చయ్య చౌదరి అడుగుజాడల్లో నడుస్తాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
వాట్సాప్ పాలన.. అలాంటి విజన్ కాదుగా!
ఎప్పటికి ఎయ్యేది ప్రస్తుతమో అప్పటికి.. ప్రజలను మాయ చేయడమనేది... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిత్యకృత్యంలా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును మరచి ఎప్పటికప్పుడు కొత్త కొత్త నినాదాలు తయారు చేసి ప్రజలపైకి వదులుతూంటారు ఈయన. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఆత్మ పరిశీలనను ఏమాత్రం చేసుకోరు. సరికదా.. తాను చేసిందే రైట్ అన్నట్టుగా వ్యవహరిస్తూంటారు. ఏ రోజుకు ఆ రోజు మీడియాలో కనిపించామా లేదా? అన్నదే ఆయన ఆలోచనగా ఉంటుంది. ఇలా బాబు గారి బుర్రకు తట్టిన సరికొత్త నినాదం ‘వాట్సప్ పాలన’!!!. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మాల చెంతకు చేర్చేందుకు వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎనిమిది నెలల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరచి మరీ ఈ వ్యవస్థకు మంగళం పాడేశారు. ఇప్పుడు కొత్తగా వాట్సప్ పాలన రాగం అందుకున్నారు. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు గారు గతంలోనూ ఇలాంటి గిమ్మిక్కులు చాలానే చేశారు. ఒకసారి సుపరిపాలన అంటారు ఇంకోసారి కంప్యూటర్ పాలన అంటారు. జన్మభూమి కమిటీలతో పాలన అని రకరకాల పేర్లతో ప్రజల్లో ఏదో ఒక భ్రమ నిత్యం ఉండేలా చూస్తారన్నది తెలిసిందే. వాట్సప్ పాలన కూడా ఇదే కోవకు చెందిందా? ప్రజలకు ఏమైనా ప్రయోజనం లభిస్తుందా? లేక బాబుగారి ప్రచార ఆర్భాటాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోతుందా?.... వాట్సప్ పాలన ఆలోచన నిజాయితీతో కూడినదైతే తప్పు లేకపోవచ్చు. అయితే కొంచెం తరచి చూస్తే దీని లక్ష్యం ఇంకోటి ఏదో అని అనిపించకమానదు. ఎందుకంటే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని, గౌరవ వేతనాన్ని రూ.ఐదు నుంచి రూ.పది వేలకు పెంచుతామని చంద్రబాబు గత ఏడాది ఉగాది పర్వదినం రోజున దైవసాక్షిగా ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దీనికి ‘ఊ’ కొట్టారు. పెంచిన జీతం పక్కా అని ఊదరగొట్టారు. కానీ పాత లక్షణాలు అంత తొందరగా పోవంటారు. మాట ఇచ్చి తప్పడమనే బాబుగారి పాత లక్షణం కూడా మాసిపోలేదు. ఎన్నికలయ్యాక యథా ప్రకారం క్రమ పద్ధతిలో వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ బాబు ఒకడుగు ముందుకేసి ‘‘వలంటీర్ల వ్యవస్థ ఎక్కడుంది?’’ అని కూడా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని, అందువల్ల అసలు వ్యవస్థే లేనప్పుడు జీతాలు ఇస్తామని వీరు అమానవీయ ప్రకటనలు చేశారు. అప్పటికి గాని వలంటీర్లకు చంద్రబాబు, పవన్ అసలు స్వరూపం తెలియరాలేదు. రెండు లక్షల మంది వరకూ ఉన్న వలంటీర్లకు ఉన్న కాస్తా అదరువు కూడా లేకుండా పోయింది. ప్రజలకు అందాల్సిన సేవలూ నిలిచిపోయాయి. కరోనా సమయంలో ఇంటింటికీ తిరిగి వ్యాధి నియంత్రణకు ఈ వ్యవస్థ చేసిన కృషిపై అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించేవారు. గ్రామాల్లో ఎవరికి ఏ అవసరమొచ్చినా వలంటీర్‌కు చెబితే చాలు అన్నీ జరిగిపోతాయన్న భరోసా ఉండేది. కులం, నివాస, ఆదాయం.. ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా గంటల వ్వవధిలో ఇంటికి చేర్చేవారు. ప్రతి నెల మొదటి తేదీనే ఇళ్ల వద్దే వృద్దులకు ఫించన్లు అందచేసేవారు. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. ప్రజల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు ప్రభుత్వం వాట్సప్ పాలన ఆలోచన!. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను వాట్పప్ ద్వారా అందివ్వాలన్నది ఈ వాట్సప్ పాలన ప్రాథమిక ఆలోచన. దీంతోపాటే మరో 150 రకాల ప్రభుత్వ సేవలూ అందిస్తామని చెబుతున్నారు. బాగానే ఉంది కానీ.. అంత సులువుగా అంతా జరిగిపోతుందా? ప్రజలు ఆఫీసులకు వెళ్లకుండానే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయా? ప్రజలు వాట్సప్ ద్వారా తమ అవసరాలు తెలియజేస్తే అధికారులు వెంటనే స్పందిస్తారా? ఆ స్థాయిలో యంత్రాంగం ఉంటుందా? వాట్సప్‌లో నకిలీ సర్టిఫికెట్లు వస్తే ఏమి చేయాలి? ఎవరైనా వాట్పప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చా? అనేది చూడాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా ఈ వాట్సప్ పాలన అదిరిపోతుందని ఇకపై ప్రచారం చేయవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ప్రజలు మర్చిపోవడానికి దీనిని ప్లాన్ చేసి ఉండవచ్చు. ఇది డైవర్షన్ టాక్టిస్లలో ఒకటని చెప్పవచ్చు. ఇదే టైమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా తన ప్రచారానికి కూడా ఈ వ్యవస్థను వాడుకునే అవకాశం ఉంది. గతంలో సుపరిపాలన ,కంప్యూటర్ పాలన అంటూ రకరకాల విన్యాసాలు చేశారు. కాని అవేవీ ప్రజలకు సంతృప్తి కలిగించలేదు. జన్మభూమి పేరుతో ప్రజల నుంచి ప్రతి పనికి ఏభై శాతం వాటా చెల్లించాలని కండిషన్ పెట్టేవారు. ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తే, ఆయనను దించేసి ప్రజల వద్దకు ప్రభుత్వం అంటూ కొంతకాలం హడావుడి చేశారు. అవన్ని ఆయన తన పబ్లిసిటీ కోసమే వాడుకునేవారన్నది అందరికీ తెలిసిన విషయం. తత్ఫలితంగా 2004లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2014 టరమ్‌లో జన్మభూమి కమిటీల పాలన చేశారు. అది ప్రజలను మరింతగా వేధించింది. దాంతో 2019లో మళ్లీ పరాజయం చెందారు. ఈసారి వాట్సప్ పాలన. ఇది ఏ ఫలితాన్ని ఇస్తుందో?. ఇక.. మరోవైపు ప్రతి కుటుంబం నలుగురు పిల్లలు కలిగి ఉండాలని ఆయన ప్రచారం ఆరంభించారు. కుటుంబ నియంత్రణను తానే గతంలో ప్రచారం చేశానని, ఇప్పుడు పిల్లలను అధికంగా కనమని చెబుతున్నానని అంటున్నారు. నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్లే అని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. నిజంగానే 400 ఎకరాలు ఉన్నట్లే అయితే చంద్రబాబు చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి వారే తమ కుటుంబంలో ఎందరు పిల్లలు ఉండాలన్నది డిసైడ్ చేసుకుంటారు. చంద్రబాబు ముందుగా తన కుటుంబం, బంధు మిత్రులు, తెలుగుదేశం నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ నలుగురు పిల్లల సిద్ధాంతం చెప్పి ఆచరింపచేయాలని కొందరు సూచిస్తున్నారు. ఉన్నతాదాయ వర్గాల వారు నలుగురు పిల్లలు ఉన్నా బాగానే పోషించుకోగలుగుతారు. ప్రస్తుత సమాజంలో వారేమో ఒక్కరు లేదా ఇద్దరికి పరిమితం అవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటే ఎవరు పోషిస్తారన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికే అధిక సంతానం ఉన్న పేద కుటుంబాలు ఎన్ని కష్టాలు పడుతున్నాయో అందరికి తెలుసు. చంద్రబాబును నమ్మి పిల్లలను కంటే కొంప మునుగుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు తల్లికి వందనం కింద ఇంటిలో స్కూల్ కు వెళ్లే పిల్లలు ఎందరు ఉంటే వారందరికి రూ.15 వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని టీడీపీ, జనసేన జాయింట్ మేనిఫెస్టోలో ప్రకటించాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదికి తల్లికి వందనం స్కీమ్‌కు ఎగనామం పెట్టారు.అలాగే మహిళలు చంద్రబాబును నమ్మెదెలా? అనే మరో చర్చ నడుస్తోంది. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పోనీ యువత అయినా విశ్వసిస్తారా? అంటే అదీ కనబడడం లేదు. నిరుద్యోగులపై యువకులు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేసి తుస్సుమనిపించారు. ఎప్పుడు ఈ స్కీములు అమలు అవుతాయో తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు లేదా అంతకుమించి పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత నిబంధన తెస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఎవరికైనా పిల్లలు కలగకపోతే వారు స్థానిక ఎన్నికలకు అర్హులు కారని ప్రభుత్వం చెబితే దారుణంగా ఉంటుంది. అది కేవలం స్థానిక ఎన్నికలకే ఎందుకు? ముందుగా శాసనసభ ఎన్నికలలో నిబంధన పెట్టేలా కేంద్రానికి చెప్పి చేయించవచ్చు కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలను కనడం కరెక్టా ? కాదా? అన్నది ప్రశ్న కాదు. నిజంగానే ప్రతి కుటుంబం అలా చేస్తే ప్రత్యేకించి, పేద, మధ్య తరగతి కుటుంబాలు వారందరికి సరైన విద్య చెప్పించగలుగుతాయా? వైద్యం అందించగలుగుతాయా? ప్రభుత్వాలు వారందరికి ఉపాధి అవకాశాలు చూపగలుగుతాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఎప్పుడో ఏదో ఒక కొత్త సంగతి చెబుతూ ప్రజలను ఏమార్చుతూ, వేరే అంశాలపై చర్చ జరిగేలా చేస్తే సూపర్ సిక్స్ వంటివాటిని జనం మర్చిపోతారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
అమరావతి, సాక్షి: బ్యూరోక్రసీతో తనకు ఎలాంటి అవసరం లేదని.. తాను కేవలం రాజకీయ పాలనే చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ తరహా పాలన అంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. వ్యవస్థలన్నీ కుంటుపడిపోయాయి. సంక్షేమ పథకాలు మూలనపడ్డాయి. ఈ తరుణంలో.. ఇక రాజకీయ పాలనతో ఆ పరిస్థితిని మరింత దిగజార్చాలన్నది చంద్రబాబు (Chandrababu) ప్రయత్నంగా కనిపిస్తోంది. ‘‘రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నాం. రాయలసీమ తరహాలో ఒకరి పోస్ట్‌మార్టమ్‌కు కారణమైన వారికి కూడా పోస్ట్‌మార్టం తప్పదు. సోషల్ మీడియాలో విర్రవీగిన వారిని కంట్రోల్లో పెట్టాం. ఒకరిని చంపితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని.. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారు. పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది పార్టీ కార్యకర్తలే తప్ప బ్యూరోక్రసీ కాదన్నారు. అందువల్ల కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుంది’’రాజకీయ పాలన పేరుతో మళ్ళీ జన్మభూమి కమిటీ(Janmabhoomi Committee)ల రంగప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కుటుంబాలకు పెన్షన్లు కట్ అయ్యాయి. ఏ పని కావాలన్నా టీటీడీ నేతల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే.. తమ నేతలు చెప్పిన వారికే పనులు చేయాలని అధికారులకూ ఆదేశాలు వెళ్లాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలోనే మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. కుర్చీలో కూర్చోపెట్టి కాఫీ ఇచ్చి మరీ పని చేసిపెట్టాలని ఆయన అన్నారు. ఇక ఇప్పుడు ఏపీలో రాజకీయ పాలనతో అధికార యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. అర్హులకు పెన్షన్లు అందడం లేదు.. అలాగే ఇతర ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి కూడా. -
ఢిల్లీ గల్లీలో కొత్త నాటకం.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్(Congress) సర్కార్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఇక్కడ హామీలకు దిక్కులేదు గానీ.. అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. నవ్విపోదురు గాక.. నాకేంటి సిగ్గు అన్నట్లుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యవహారం అంటూ విమర్శించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి.. ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండు. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన - ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి. ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి?.. గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి?. నెలకు రూ.2500 ఇస్తున్న మహిళలు ఎవరు?. తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు?.రైతుభరోసా రూ.7500 ఇచ్చిందెక్కడ?. ఆసరా ఫించన్లు రూ.4000 చేసిందెక్కడ?. రూ.5 లక్షల విద్యాభరోసా ఎక్కడ?. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ?. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా. ఈడ ఇచ్చిన హామీలకు దిక్కు లేదు.. ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా?. ఢిల్లీ గల్లీల్లో కాదు దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామని. నవ్విపోదురు గాక.. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం. జాగో ఢిల్లీ జాగో’ అంటూ కామెంట్స్ చేశారు. -
డీకే Vs సతీష్.. కన్నడ కాంగ్రెస్‌లో రసవత్తర రాజకీయం!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ పోస్టుపై ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో, అధికార పార్టీ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ సెటైర్లు వేస్తోంది.కన్నడ కాంగ్రెస్‌లో కలహాలు ఉధృతమయ్యేలా ఉన్నాయి. డిప్యూటీ సీఎంతో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ.. కేపీసీసీ అధ్యక్ష పోస్టు అంగడిలో దొరకదు. మీడియా ముందు మాట్లాడితే లభించదు. మనం పార్టీకి చేసిన సేవలు, శ్రమను గుర్తించి సరైన పదవి ఇస్తారని, కొంతమంది మీడియా ముందుకొచ్చి పదవిని కోరుతున్నారని అన్నారు.పార్టీలో అందరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్‌గాంధీ, సీఎం సిద్దరామయ్య సూచించారన్నారు. కాంగ్రెస్ పార్టీని తానొక్కడే కాదు, కార్యకర్తలు, ప్రజలు కలిసి గెలిపించారన్నారు. జై భీమ్ సమావేశాల నిర్వహణ పరిశీలనకు ఇన్చార్జి సుర్జేవాలా శుక్రవారం బెళగావికి వస్తారని, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆయనను అడగాలని నేతలకు సూచించారు. మరోవైపు మంత్రి సతీష్ జార్కిహొళికి కేపీసీసీ నుంచి నోటీసులు వెళ్లాయి.రేసులో ఉన్నాననలేదు: సతీశ్కేపీసీసీ నుంచి నోటీసులు ఇచ్చినప్పటికీ ఏమీ కాదు, దీనికి స్పష్టమైన సమాధానం అధ్యక్షుడి ముందు ఇస్తానని మంత్రి సతీష్ జార్కిహొళి చెప్పారు. డీకేపై తరచూ విమర్శలు చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటీస్ ఇచ్చే అధికారం ఆయనకు ఉందన్నారు. కేపీసీసీ రేసులో ఉన్నానని నేను ఎక్కడా చెప్పలేదన్నారు. తన మాటలతో ఎవరికీ ఇబ్బంది లేదని, నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. మీడియా ఉదయం హీరోను చేసి, సాయంత్రం విలన్‌ను చేస్తారని, ఇది సబబు కాదని వాపోయారు. మరోవైపు.. కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలపై ప్రతిపక్ష బీజేపీ నేతలు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటివి కొత్తేమీ కాదని కామెంట్స్ చేస్తున్నారు. -
‘‘రేయ్.. నీ కథ చూస్తా!’’ జేసీ బెదిరింపులు వెలుగులోకి
అనంతపురం, సాక్షి: కూటమి సర్కార్ అండతో తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) రెచ్చిపోతూనే ఉన్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఎవరనేది చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ నిత్యం వార్తల్లోక్కి ఎక్కుతున్నారు. తాజాగా మరోసారి ఆయన వివాదంలో నిలిచారు. ఓ దళిత నేతను ఫోన్లో బెదిరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా ఇది ఇక్కడితోనే ఆగలేదు. దళిత సంఘం నేత రాంపుల్లయ్య మున్సిపల్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ విషయంపై ఆయన్ని ఫోన్లో బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిలిచినా మీటింగ్‌కు రాకపోవం ఏంటని జేసీ ప్రశ్నించగా.. ఆ ఆహ్వానం గౌరవంగా ఉండాలని రాంపుల్లయ్య అన్నారు. ఆ సమాధానం తట్టుకోలేని జేసీ ‘‘నేను పిలిస్తే రావా.. రేయ్.. నీ కథ చూస్తా’’ అంటూ చిందులు తొక్కాతూ ఫోన్ పెట్టారు. అయితే.. ఈ బెదిరింపుల వ్యవహారాన్ని తాడిపత్రి(Tadipatri) సీఐ సాయి ప్రసాద్ దృష్టికి ఫోన్ ద్వారా రాంపుల్లయ్య తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. సీఐ కూడా జేసీకి మద్దతుగా రాం పులయ్యనే దూర్భాషలాడారు. పరస్పర దూషణలతో కూడిన ఆ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత! -
అలా చేయడం బీజేపీతో కలిసిన్నట్టు కాదు: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు చెప్పారు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యమని అన్నారు. ఇదే సమయంలో ఇలా చేయడం బీజేపీ పార్టీతో కలిసినట్టు కాదు అని క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో ఎవరు ఉన్నా తాము ఇలాగే ముందుకెళ్తామని స్పష్టం చేశారు.సీఎం ఒమర్ అబ్దుల్లా కన్వాల్‌లో జాతీయ చానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒమర్.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిశాను. నేను కేంద్రం తీరు పట్ల సానుకూలంగా ఏమీ లేను. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే వారు చేసే ప్రతిదాన్ని నేను అంగీకరిస్తున్నాను అని కాదు. బీజేపీ చేసే పనిని నేను అంగీకరిస్తున్నానని దీని అర్థం కాదు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన అంశాలపై మాత్రమే కేంద్రంతో అనుకూలంగా ఉంటున్నాం. అంతమాత్రాన మేము బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు కాదు.రాష్ట్రం పురోగతి సాధించాలంటే కేంద్రం అవసరం ఎంతో ముఖ్యం. అభివృద్ధి జరగడం, రాష్ట్ర హోదా పునరుద్ధరించడం మా ముందున్న లక్ష్యాలు. పార్టీలు ముఖ్యం కాదు.. కావాల్సింది అభివృద్దే. అవసరం లేని చోట నేను కేంద్రంతో పోరాటం ఎంచుకోవాలా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. గత సంవత్సరం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అనంతరం, రెండుసార్లు అమిత్ షాను కలిశారు. ఇటీవల సోనామార్గ్‌లో జరిగిన సొరంగం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని కలిశారు. దీంతో, ఒమర్..బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఒమర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
బీజేపీలో ‘జిల్లా అధ్యక్ష లొల్లి’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకానికి ముందే లొల్లి షురూ అయ్యింది. నియామక ప్రక్రియకు సంబంధించి అనుసరిస్తున్న విధానంపై పార్టీ నాయకులు, కార్య కర్తలు చిర్రుబుర్రుమంటున్నారు. కొన్ని జిల్లా ల్లోనైతే ఏకంగా ఈ ప్రక్రియను తప్పుబడుతూ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు పంపేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్, మెదక్ పరిధిలోని జిల్లాలు, హైదరాబాద్, ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నట్టుగా కొందరు పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా జిల్లా అధ్యక్షుల నియామకం సందర్భంగా అభిప్రాయసేకరణలో వెల్లడైన వ్యక్తులను కాకుండా ఇతరులకు అధ్యక్షులుగా అవకాశం కల్పించారని కొందరు నేతలు ఉదహరిస్తున్నారు. అప్పట్లో కొందరిని జిల్లా అధ్యక్షులుగా నియమించడంపై కేడర్ కొట్టుకుందని, బహిరంగంగానే విమర్శలు గుప్పించారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర పార్టీ నేతలు జిల్లాల్లో పర్యటించి కేడర్ నుంచి చేపడుతున్న అభిప్రాయసేకరణ, దాని ఆధారంగా జాతీయ పార్టీకి పంపుతున్న ఆశావహుల జాబితాలపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. కొందరు అభిప్రాయ సేకరణ జరపకుండానే.. కొన్ని జిల్లాల పరిశీలకులుగా వెళుతున్న కొందరు స్వతంత్రంగా వ్యవహరించకుండా, నిజమైన అభిప్రాయసేకరణ జరపకుండా ఎవరి ప్రభావానికో లోనై ఆశావహుల జాబితాను సిద్ధం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో పర్యటించిన పరిశీలకులు పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి అధ్యక్షుడి నియామకంపై పూర్తిస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపకుండానే జాబితాలు సిద్ధం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. జిల్లా అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారి కార్లలోనే కొందరు పరిశీలకులు తిరగడంతోపాటు వారికి సంబంధించిన ఫామ్‌హౌస్‌లలో కూర్చొని ఆశావహుల జాబితాను తయారు చేస్తున్నారని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది జిల్లా అధ్యక్షుడిగా కోరుకుంటున్న వ్యక్తి పేరు కాకుండా తమకు నచ్చిన వారి పేర్లతో లిస్ట్ సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుల నియామకానికి ఒక్కో జిల్లా నుంచి ఐదేసి మంది పేర్లతో జాబితాలు తయారు చేసి పంపించాలన్న జాతీయ నాయకత్వం ఆదేశాలను సైతం కొందరు నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే వాదనలు వస్తున్నాయి. రాష్ట్ర నేతలు సమర్పించిన జాబితాల ఆధారంగా ఒకట్రెండు రోజుల్లోనే జిల్లా అధ్యక్షులను ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో సమర్థులైన వారికి ఈ పదవి లభిస్తుందా లేదా అనే ఆందోళనను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. సంస్థాగతంగా చూస్తే. తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ పరంగా మొత్తం 38 జిల్లాలుగా విభజించారు. హైదరాబాద్ నగరాన్ని నాలుగు జిల్లాలుగా (హైదరాబాద్ సెంట్రల్, మలక్‌పేట–భాగ్యనగర్, గోషామహల్– గోల్కొండ, మహంకాళి సికింద్రాబాద్) రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లాలు, మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్, రూరల్ జిల్లాలు, ఇలా వివిధ జిల్లా శాఖలున్నాయి. -
ఇసుక కోసం టీడీపీ, జనసేన సిగపట్లు
కడప కోటిరెడ్డి సర్కిల్: ఇసుక కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు గురువారం సిగపట్లు పట్టారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గీయులు, సిద్దవటం మండల జనసేన పార్టీ నాయకుడు అతికారి కృష్ణ వర్గీయులు బాహాబాహీకి దిగారు. వైఎస్సార్ జిల్లా కడపలోని కలెక్టరేట్లోనే ఈ రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణపడ్డాయి. జిల్లాలోని సిద్దవటం మండలం గుండ్లమూల గ్రామం వద్ద ఇసుక రీచ్‌కి గనులు, భూగర్భ శాఖ జిల్లా స్థాయి ఇసుక కమిటీ షార్ట్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 5.30 లోగా టెండర్లు దాఖలు చేయాలని, 17వ తేదీ ఉదయం 10 గంటలకు టెండర్లు తెరుస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెండర్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్ ఆవరణలోని మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయానికి ఇరువర్గాల నాయకులు గురువారం ఉదయమే చేరుకున్నారు. టెండరు పత్రాల దాఖలు సమయంలోనే వివాదం మొదలైంది. తమ సొంత మండలమైన సిద్దవటంలో ఇసుక టెండరు తమకే దక్కాలని అతికారి కృష్ణ వర్గీయులు పట్టుపట్టారు. బీటెక్ రవి వర్గీయులు ససేమిరా అన్నారు. అతికారి కృష్ణ వర్గీయుల నుంచి టెండరు ఫారాలు లాగేసుకున్నారు. టెండర్లు వేయడానికి వచ్చిన ఇతర కాంట్రాక్టర్లను బెదిరించి అక్కడి నుంచి పంపేశారు. ఈ సందర్భంగా బీటెక్ రవి, అతికారి కృష్ణ వర్గీయుల మధ్య మాటామాటా పెరిగి బాహాబాహీకి దారి తీసింది. ఒక దశలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో కార్యాలయం ప్రాంతం దద్దరిల్లింది. ఇరువర్గాల మధ్య ఘర్షణతో అక్కడి ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. వన్‌టౌన్ సీఐ రామకృష్ణ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఘర్షణ వాతావరణంలోనే టెండర్లు వేశారు. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి వర్గీయులు సైతం టెండర్లకు హాజరయ్యారు. టెండర్లను ఖరారు చేస్తారా లేదా తిరిగి నిర్వహిస్తారా అనే విషయం కలెక్టర్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా మైన్స్ అండ్ జియాలజీ డీడీ సూర్యచంద్రరావు అందుబాటులోకి రాలేదు. -
లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో కేటీఆర్(KTR) ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీపైనే కేటీఆర్‌ను ఈడీ(ED) ప్రశ్నించింది. విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అడిగిన ప్రశ్ననే పదేపదే అడిగారు. ఎన్ని సార్లు అయినా విచారణకు వస్తానని చెప్పా. రేవంత్‌పై ఏసీబీ కేసు ఉందని.. నాపై ఏసీబీ కేసు బనాయించారు. రేవంత్‌పై ఈడీ కేసు ఉందని.. నాపై ఈడీ కేసు బనాయించారు.’’ అని ఆయన మండిపడ్డారు‘‘న్యాయ స్థానాలపై మాకు విశ్వాసం ఉంది. లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా?. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎన్ని ప్రశ్నలు అడిగిన సమాధానం చెబుతా. నేను ఎలాంటి తప్పు చేయలేదు’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని, చట్టాలను గౌరవించే పౌరుడిని.. ఏ తప్పు చేయకపోయినా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు పెడితే విచారణ సంస్థలను గౌరవించి విచారణకు హాజరయ్యారు. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి ఈ రోజు విచారణకు పిలిస్తే హాజరయ్యాను. రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయి.ఇదీ చదవండి: ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్..రెండు సంస్థలు ఎన్నిసార్లు పిలిచినా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తా. పూర్తిగా విస్తరణ సహకరిస్తాను అని చెప్పాను. తప్పకుండా నా నిజాయితీని రుజువు చేసుకుంటానని చెప్పాను. ఈ విచారణకు దాదాపు 5 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది. నేను నిజాయితీపరుడ్ని.. ధైర్యంగా ఎదుర్కొంటా. 10 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేయొచ్చు. పెన్షన్ ఇయ్యొచ్చు. రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే జడ్జి ముందు కూర్చుందాం. మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. నేను రేవంత్ రెడ్డి న్యాయమూర్తి ముందు కూర్చుంటాం.. ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఒక 50 లక్షల రూపాయలతో ఓడిసిపోతుంది విచారణ. అనవసరంగా 10 కోట్ల ఖర్చు ఎందుకు?’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
‘తాగు.. తిను.. ఊగు.. సంక్రాంతి పేరుతో కూటమి సర్కార్ దోపిడీ’
సాక్షి, విజయవాడ: సంక్రాంతిని కూటమి ప్రభుత్వం దోచుకుందని.. దోపిడీకి ఏ మార్గాన్ని వదలడం లేదంటూ వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్(Pothina Mahesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సంక్రాంతి(Sankranti)ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారు. సంక్రాంతి సంబరాలను క్యాసినో స్థాయికి తీసుకెళ్లారు. పాఠశాలలను కూడా జూద కేంద్రాలుగా మార్చేశారు’’ అని దుయ్యబట్టారు.‘‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాల బరుల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేల కోట్లు సంపాదించారు. మద్యాన్ని ఏరులై పారించారు. రికార్డింగ్ డాన్స్‌లు చేయించారు. పండుగను అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకున్నారు. పేదలు ఈ సంక్రాంతి పండుగకు దూరమయ్యారు. తాగు... తిను.. ఊగు అనే కొత్త నినాదాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది’’ అంటూ పోతిన మహేష్ ధ్వజమెత్తారు.‘‘సంక్రాంతి సంబరాలను ఆర్గనైజింగ్ క్రైమ్‌గా మార్చేశారు. జూదం అధికారికమే అనేలా కూటమి అనుమతులిచ్చింది. ఐపీఎల్ మాదిరి కోడి ప్రీమియర్ లీగ్‌లు పెట్టారు. పనులు చేసుకోవద్దు.. వ్యసనాలకు అలవాటు పడండని చంద్రబాబు ప్రజలకు చెప్పదలచుకున్నారా సమాధానం చెప్పాలి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణంరాజు కోడి పందాల్లో పాల్గొన్నారు. మహిళా బౌన్సర్లను పెట్టి విష సంస్కృతి తెచ్చారు. మైనర్లు సైతం గుండాట, పేకాట ఆడారు. కోడి పందాలు ఆడుకోవచ్చని అనుమతులుచ్చారా.. హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలి’’ అని మహేష్ నిలదీశారు.‘‘భీమవరంలో క్యాసినో సెంటర్ పెట్టారు. కుక్కుట శాస్త్రం ప్రకారం రూ.కోటి 25 లక్షలతో ముహూర్తం పెట్టి ఆడించారు. చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి. కోడి పందాల బరులకు టీడీపీ, జనసేన ట్యాక్స్ కట్టించుకున్నారు. స్కూళ్లలో కోళ్ల పందాలు పెట్టి విద్యార్ధులకు ఏం సందేశం ఇస్తారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. గోదావరి జిల్లాలకు ధీటుగా కృష్ణాజిల్లాలో 320కి పైగా కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు’’ అని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు...ఇదేం పాలన అని జనం చంద్రబాబు, పవన్‌ను తిట్టుకుంటున్నారు. వైఎస్ జగన్‌ను అనవసరంగా వదులుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విజనరీ ఎవరని ప్రజల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రాన్ని కోడి పందాలు.. పేకాటకు కేరాఫ్‌గా మార్చాలనుకుంటున్నారా చంద్రబాబు?. అశ్లీల నృత్యాలేనా పర్యాటకం అభివృద్ధి అంటే. ఇదేనా చంద్రబాబు మీ విజన్ 2047 అంటే. కోడి పందాలను ప్రమోట్ చేసిన ఒక్క సెలబ్రిటీ మీదనైనా కేసు పెట్టారా?. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను చంద్రబాబు, పనన్ సర్వ నాశనం చేస్తున్నారు.ఇదీ చదవండి: పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?..పేకాట, కోడి పందాలు.. అశ్లీల నృత్యాలు చూడాలంటే ఏపీకి వెళ్లాలని పొరుగు రాష్ట్రాల్లోని ప్రజలు అనుకుంటున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు కట్టిన జగన్ అసలైన విజనరీ. ఉపాధి అవకాశాలు కల్పించలేమని పవన్ చెప్పిన కొద్దిసేపటికే ఇద్దరు యువకులు చనిపోయారు. ఇద్దరి చావుకు కారణమైన పవన్‌పై కేసు పెట్టాలా వద్దా?. పవన్ పదే పదే సనాతన ధర్మం.. సంస్కృతి అంటున్నారు. కోడి పందాలు, పేకాట, గుండాట ఆడటమే ధర్మమా?..అశ్లీల నృత్యాలే మన సంస్కృతా... పవన్ సమాధానం చెప్పాలి. ఇటీవల పవన్ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అడిగేవాడు లేక జనసేన కార్యకర్తలు బరితెగించారు. నేషనల్ హైవేపై టోల్ గేట్ పెట్టడమేంటి?. కోడి పందాలు నిర్వహించినందుకు పవన్ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదు. పార్టీలో చేర్చుకున్న భూకబ్జాదారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నలు గుప్పించారు. -
సైఫ్‌పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్
నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులు వెల్లడిస్తున్నారని చెప్పారు. అయితే.. ఈ ఘటన ఆధారంగా ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర విమర్శలకు ఆయన అంతే ఘాటుగా బదులిచ్చారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, వరుసగా ప్రముఖులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ప్రతిపక్షాలు ఫడ్నవిస్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మరోవైపు.. ఈ విమర్శలకు సినీ ప్రముఖుల గొంతు కూడా తోడైంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నాం ఎమర్జెన్సీ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆ చిత్ర నటి కంగనా రనౌత్‌తో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంలో ఆయన్ని సైఫ్‌పై దాడి గురించి మీడియా ప్రశ్నించింది. దేశంలో ఉన్న మెగాసిటీ(Megacities)ల్లో ముంబై అత్యంత సురక్షితమైన నగరం. నగరంలో ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు జరిగిన మాట వాస్తవం. వాటిని అంతే తీవ్రంగా మేం వాటిని భావించి దర్యాప్తు జరిపిస్తున్నాం. అలాగని.. ఏదో ఒక ఘటనను పట్టుకుని ముంబై ఏమాత్రం సురక్షితం కాదని అనడం సరికాదు. ఇది ముంబై ప్రతిష్టను దెబ్బ తీసే అంశం. ముంబైను మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని అన్నారు. మహారాష్ట్ర హోం శాఖ ప్రస్తుతం ఫడ్నవిస్ వద్దే ఉంది.#WATCH | Mumbai: Maharashtra CM Devendra Fadnavis on the attack on actor Saif Ali Khan says, “Police have provided all the details. What kind of attack this was, the motive behind it, and the intention are all before you.”#SaifAliKhan #DevendraFadnavis #Mumbai pic.twitter.com/L7hGKE8XnE— Organiser Weekly (@eOrganiser) January 16, 2025ముంబై మహానగరంలో అత్యంత విలాసవంతమైన ఏరియాగా బాంద్రాకు ఓ పేరుంది. వీవీఐపీలు ఉండే ఈ ఏరియాలో కట్టుదిట్టమైన పోలీస్ పహారా కనిపిస్తుంటుంది కూడా. అలాంటి ప్రాంతంలో..గత అర్ధరాత్రి అలజడి రేగింది. ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. ఈ క్రమంలో జరిగిన సైఫ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. రెండు కత్తిపోట్లు లోతుగా దిగడం, వెన్నెముకకు దగ్గరగా కత్తికి దిగడంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఆయనకు ప్రమాదం తప్పిందని, రెండ్రోజుల తర్వాత డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంలో సైఫ్‌తో పాటు ఆయన ఇంట్లో పని చేసే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెకు చికిత్స అందించి వైద్యులు ఇంటింకి పంపించేశారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాంద్రా(Bandra Police) పోలీసులు.. నిందితుడిని దాదాపుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అతన్ని పట్టుకునేందుకు ఏడు బృందాలను రంగంలోకి దింపాయి.ఊహాజనిత కథనాలొద్దుఈ ఘటనపై మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య కరీనా కపూర్, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. శస్త్రచికిత్స జరిగి ఆయన కోలుకుంటున్నారు. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది. -
ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ.. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారు. ‘‘జైలుకు వెళ్లడానికి కేటీఆర్ సిద్ధమవ్వాలి. 4 జతల డ్రెస్‌లు, టవల్, బ్లాంకెట్, హ్యాండ్ కర్చీఫ్. సోప్, అవకాయ, స్వెటర్ దగ్గర పెట్టుకోవాలి. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే తిరిగి కర్మ రూపంలో మనం అనుభవించాల్సి వస్తుంది’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.జైలుకు వెళ్లే ముందు 4 జతల బట్టలు (కటకటాల వెనుక కూడా ఫ్యాషన్ కీలకం), ఒక హాయిగా ఉండే వెచ్చని దుప్పటి, టవల్ (జైలులో కూడా పరిశుభ్రత ముఖ్యం), కర్చీఫ్(భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు), సబ్బులు(ఆ "క్లీన్ ఇమేజ్"ని కొనసాగించడానికి), ఒక ప్యాకెట్ ఊరగాయ(ఎందుకంటే జైలు భోజనం ఫైవ్ స్టార్ కాదు) తీసుకెళ్లండి.. స్వెటర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంటూ కేటీఆర్‌కు రాజా సింగ్ చురకలు అంటించారు.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. Karma doesn’t forgetI have been thrown in jail by both the Congress and BRS/TRS governments after they filed false cases against me. I know exactly how the game works.So, @KTRBRS ji, here’s a little checklist to pack before heading to jail:👉Four sets of clothes – fashion…— Raja Singh (@TigerRajaSingh) January 16, 2025 -
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్
సాక్షి, ఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party).. సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. రెండు పిటిషన్లను బీఆర్ఎస్ దాఖలు చేసింది. ఏడుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపు(Defections)పై రిట్ పిటిషన్ వేసింది. పోచారం, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, గాంధీలపై రిట్ వేయగా, ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ వేసింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఎస్ఎల్పీ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ స్పీకర్ కనీసం ఎమ్మెల్యేలకు నోటీసు ఇవ్వలేదని పిటిషన్లో బీఆర్ఎస్ పేర్కొంది. స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనర్హత పిటిషన్లపై వెంటనే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ కోరింది. కాగా, ప్రస్తుతం ఢిల్లీలోనే బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ఉన్నట్లు సమాచారం.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది.. స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. అయితే, మూడు నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది.2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించగా, ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. దీంతో పార్టీ బలం 38 మంది ఎమ్మెల్యేలకు తగ్గింది. కాగా.. భద్రాచలం, బాన్సువాడ, ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, జగిత్యాల, చేవెళ్ల, గద్వాల్, రాజేంద్రనగర్, పటాన్ చెరువు, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. -
కోడి పందెం ముసుగులో గొడవ.. వైఎస్సార్సీపీ నాయకుడి హత్య!
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో కూటమి పాలనలో వైఎస్సార్సీపీ యువనేత మణితేజ అనుమానస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రశాంతంగా ఉన్న నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పచ్చ గూండాలే హత్య చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక, మణితేజ మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు.మణితేజ మృతి విషయం తెలుసుకుని నందిగామలోని ఆసుపత్రి వద్దకు వైస్సార్సీపీ నాయకులు చేరుకున్నారు. మణితేజ మృతదేహాన్ని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు సహా పలువురు పరిశీలించారు.అనంతరం, దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మణితేజది ముమ్మాటికీ రాజకీయ హత్యే. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. మణితేజ కుటుంబం వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటోంది. వారంతా పార్టీలో యాక్టివ్‌గా ఉండటం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు పెడుతోంది. కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పొట్టనపెట్టుకున్నారు. మణితేజ హత్యను టీడీపీ, పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేయత్నం చేస్తున్నారు. మణితేజ మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి.ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలి. మణితేజ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. మణితేజ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులదే. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మూడు సంక్రాంతులే. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారు. తప్పుచేసిన వారికి చట్టపరంగా కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం. మణితేజ కుటుంబానికి చంద్రబాబు, పవన్, లోకేష్ సమాధానం చెప్పాలి. రెడ్ బుక్ ఇంకా తెరిచే ఉంది ముగిసిపోలేదని లోకేష్ అంటున్నాడు. మనుషుల ప్రాణాలు తీయడమేనా రెడ్ బుక్ అంటే అని ప్రశ్నించారు.అనంతరం, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. మణితేజ మృతిని ప్రమాదంగా చిత్రీకరించారు. తలపై బలంగా కొట్టినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మణితేజ మృతిపై మాకు అనేక అనుమానాలున్నాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు చేసినందుకు మణితేజను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కోడిపందాల వద్ద గొడవ తర్వాత మణితేజ చనిపోయాడు. మణితేజ మృతిని హత్య కోణంలోనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరావు మాట్లాడుతూ.. మణితేజది ముమ్మాటికీ హత్యే. మణితేజ మృతిని హత్య కేసుగానే నమోదు చేయాలి. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. జై జగన్ అంటే కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించి తిరిగి మా పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేస్తున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను బెదిరిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఢిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ గ్యారంటీలను విడుదల చేసిన రేవంత్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రజల కోసం కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రకటించింది. ఈ సందర్బంగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్, ఉచిత రేషన్ కిట్ గ్యారెంటీలను కాంగ్రెస్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు గ్యారంటీల పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల అప్పులు మాఫీ చేశాం. 21వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశాం. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నాం. ఇది మా నిబద్దతను తెలియచేస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ తరహా హామీలు ఇస్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చాక ఈ స్థాయిలో ఎవరూ రుణమాఫీ చేయలేదు. మోదీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసింది. ఉచిత బస్సు ప్రయాణం కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించాం. #WATCH | Delhi: If voted to power in #DelhiElections2025, Congress announces to provide LPG cylinders at Rs 500, free ration kits and 300 units of free electricity (Source: Congress) pic.twitter.com/SK4HsNnCAk— ANI (@ANI) January 16, 2025 దేశంలో నిరుద్యోగం సమస్యగా మారింది. మోదీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చింది. అమలు చేసిందా?. 11 ఏళ్లుగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చూడండి. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. ఇచ్చారా?. 11 ఏళ్లలో మోదీ ఇచ్చింది కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే. తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాక 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ ఢిల్లీలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేందుకు నాది బాధ్యత. కాలుష్యంతో ఢిల్లీ నివాసయోగ్యం కాకుండా చేశారు. ఢిల్లీ రావాలంటే భయపడాల్సి వస్తోంది. ఢిల్లీకి వస్తే జ్వరాలు వస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేజ్రీవాల్, మోదీ ఇద్దరు ఢిల్లీలో విఫలమయ్యారు. ఢిల్లీని నాశనం చేశారు. మళ్లీ కాంగ్రెస్ వస్తేనే ఢిల్లీ బాగుపడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో పార్టనర్ బీఆర్ఎస్ను తెలంగాణలో ఓడించాం. లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉన్న ఆప్‌ను కూడా ఢిల్లీలో ఓడిస్తాం. దావోస్‌కు పెట్టుబడుల కోసం వెళ్తున్నాం. పర్యటన ముగిసిన తర్వాత పెట్టుబడులు ఎంత వచ్చాయో చెబుతాం. అవినీతిని కట్టడి చేస్తే గ్యారంటీలు అమలు చేయవచ్చు. 16లక్షల కోట్ల రూపాయలు అప్పులను కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని మోదీ మాఫీ చేశారు. మోదీ, కేజ్రీవాల్ కుర్చీ కొట్లాట వల్ల ఢిల్లీ ప్రజల వల్ల నష్టపోతున్నారు. తెలంగాణలో ఒకటిన్నర శాతం ఓట్లు ఉన్న కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు తెచ్చాం. అధికారంలోకి వచ్చాం. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
‘సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల గతేంటి?’
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి.. యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. అటు సినీ, ఇటు ఇతర రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడి ఘటన మహారాష్ట్రలో రాజకీయ అలజడికి కారణమైంది.సైఫ్ అలీఖాన్ దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాలయంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్దవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సెలబ్రిటీలకే భద్రత కరువైనప్పుడు ముంబైలో సామాన్యుల సంగతి ఏంటి?’’ అంటూ ట్వీట్ చేశారామె.ముంబైలో వరుసగా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మరో హై ప్రొఫైల్ వ్యక్తిపై దాడి జరగడం నిజంగా నగరానికి సిగ్గుచేటు. ముంబై పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పని తీరును ఈ ఘటన కచ్చితంగా ప్రశ్నిస్తుంది అని అన్నారామె. ఈ క్రమంలో సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య ఉదంతంతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన దాడి ఘటనను ఆమె ప్రస్తావించారు.My comment on the latest murderous attack in Mumbai. https://t.co/a2aD1ymRGr pic.twitter.com/MohkfAN01d— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 16, 2025బాబా సిద్ధిఖీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్ ఖాన్ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్‌ఫ్రూఫ్‌గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు ఉండే బాంద్రాలో సైఫ్‌పై దాడి జరిగింది. అలాంటప్పుడు ముంబైలో ఇంకెవరు సురక్షితంగా ఉంటారు?.. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆమె అన్నారు.మరోవైపు.. పవార్ ఎస్పీపీ సైతం ఈ పరిణామంపై స్పందించింది. సైఫ్ అలీ ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తిపై ఆయన ఇంట్లోనే దాడి చేసినప్పుడు.. సామాన్యుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో ట్వీట్ చేశారు.Attack on Saif Ali Khan is a cause for concern because if such high profile people with levels of security can be attacked in their homes, then what could happen to common citizens?Fear of law seems to be at a low in Maharashtra due to leniencies in the past couple of years— Clyde Crasto - क्लाईड क्रास्टो 🇮🇳 (@Clyde_Crasto) January 16, 2025సైఫ్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ముంబైలో ఏం జరుగుతోంది?. ప్రముఖులుండే నివాసాల మధ్య.. అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒక నటుడి ఇంట్లోనే దాడి జరగడం శోచనీయం. ఇలాంటప్పుడు సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశిస్తాడు? అని అన్నారామె. తుపాకీ మోతలు, దొంగతనాలు, కత్తిపోట్లు.. ముంబైలో నిత్యకృత్యం అయిపోయాయి. అసలు ముంబైలో ఏం జరుగుతోంది?. వీటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాలి అని అన్నారామె.एक पद्मश्री विजेता लोकप्रिय अभिनेता जो एक हाइ प्रोफाइल सोसायटी में बांद्रा जैसे सुरक्षित माने जाने वाले इलाके में रहते हैं, उनके घर में घुसकर कोई उनको चाकू मारकर चला जाता है, ये कितनी भयानक घटना है! महाराष्ट्र में कानून व्यवस्था की आए दिन धज्जियां उड़ रही है। बांद्रा में एक नेता… pic.twitter.com/EV13yNkQnq— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) January 16, 2025అయితే.. తీవ్ర విమర్శల వేళ బీజేపీ స్పందించింది. ఘటనను రాజకీయం చేయొద్దని.. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారాయన. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులెవరైనా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, పోలీసులు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన.ఇక.. మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది.గురువారం తెల్లవారుజామున బాంద్రా(Bandra)లోని సైఫ్ నివాసంలో 2-2.30 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, ఆయన కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో పని చేసే మరో మహిళకూ గాయాలైనట్లు సమాచారం. వీరిద్దరినీ లీలావతి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఈ ఉదయం స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఏడు బృందాలు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి సహకారంతోనే దుండగుడు లోపలికి ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడ్ని విచారించే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు.. సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు అయ్యాయని, రెండు లోతుగా దిగాయని, వెన్నుపూస అతిసమీపంలో మరో గాయం కావడంతో సర్జరీ అవసరం పడిందని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 3గం. సమయంలో సైఫ్‌ను ఆస్పత్రికి తెచ్చారు. ఆయనకు తీవ్ర రక్త స్రావం జరిగింది. సర్జరీ జరిగాక ఎప్పటికప్పుడు ఆయన హెల్త్‌బులిటెన్ విడుదల చేస్తామని, ఊహాజనిత కథనాలు ఇవ్వొద్దని వైద్యులు మీడియాను కోరారు. 54 ఏళ్ల సాజిద్ అలీఖాన్ పటౌడీ అలియాస్ సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ యాక్టర్‌గా సుపరిచితుడే. ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్ల తనయుడు ఈయన. 1993లో పరంపర చిత్రంతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్లోకి డెబ్యూ ఇచ్చి అలరించారు. -
రేవంత్.. నువ్వు జైలుకెళ్లావని మాపై కక్ష సాధింపా?: కౌశిక్‌రెడ్డి
సాక్షి, కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth Reddy) జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy). ప్రపంచం మొత్తం చూసి వచ్చిన వ్యక్తి కేటీఆర్(KTR). ఇదంతా రేవంత్‌కు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ కారు రేసు కేసు అనే లొట్టపీసు కేసు అంటూ విమర్శించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులను రేవంత్ వేధింపులకు చేస్తున్నాడు. గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ ఒక్క రూపాయి రైతుభరోసా ఇవ్వలేదని అడిగినందుకు కేసులు పెడుతున్నారా?. రుణమాఫీ గురించి అడిగితే పెడుతున్నారా?. తులం బంగారం ఏమైందన్నందుకా కేసులు?. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారు.కారు రేసు అనేది ఓ లొట్టపీసు కేసు. ఈ రేసు కోసం రాష్ట్రాల మధ్య పోటీ ఉంటుంది. ఆ పోటీలో తెలంగాణకు తీసుకొస్తే.. దాన్ని కూడా రేవంత్ రద్దు చేశాడు. తెలంగాణకు రూ. 700 కోట్లు లాభం వచ్చినట్టు నెల్సన్ సర్వేనే చెప్పింది. టెస్లా కంపెనీని తీసుకురావాలనేది కేటీఆర్ లక్ష్యం. ఆ కంపెనీని తీసుకురావడానికే కేటీఆర్ కారు రేసు తీసుకొచ్చారు. దాన్ని రేవంత్ అడ్డుకున్నాడు. రేవంత్ జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ పంపించాలని అనుకుంటున్నాడు.కేటీఆర్ ప్రపంచం చూసి వచ్చిన వ్యక్తి. కేటీఆర్‌కు, రేవంత్ రెడ్డికి అదే డిఫరెన్స్. అవినీతే లేనప్పుడు ఏసీబీ ఎందుకు?. అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు?. ప్రొసీజర్ ల్యాప్స్ కేటీఆర్ తప్పు ఎందుకు అవుతుంది?. పాలసీ డిసీషన్ మాత్రమే కేటీఆర్ తీసుకుంటారు తప్ప ప్రొసీజర్‌తో ఆయనకేం సంబంధం?. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు పోతే.. 60 లక్షల మంది కేసీఆర్‌లు తయారు అవుతారు. కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ను అంటే ఊరుకోవాలా?. కేసీఆర్ బొమ్మ లేకుండా సంజయ్ కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలవలేడు.ఆర్డీవో మీద నేను ఒక్క మాటైనా మాట్లాడానా?. ఒక్కడితో నేను మాట్లాడితే ఆరుగురితో కేసులు పెట్టిస్తారా?. డీకే అరుణపై నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కేసు పెట్టలేదే?. నాడు జూపల్లిపై ఇష్టారాజ్యంగా చేస్తే కేసీఆర్ కేసులు పెట్టలేదు కదా?. నీకో న్యాయం మాకో న్యాయమా?. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో దాడి చేయిస్తారా? ఖమ్మంలో హరీష్ రావుపై దాడి జరిగింది ఇదేం సంస్కృతి? అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అయ్యన్న ముంగిట్లో సీఎం రమేష్ హడావుడి రగులుతున్న కుంపటి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అయ్యన్న ముంగిట్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంక్రాంతి సందడి చేశారు. నర్సీపట్నంలోని ప్రైవేటు రిసార్టులో గత మూడు రోజులుగా మకాం వేసిన రమేష్... సంక్రాంతి వేడుకలను బీజేపీ, జనసేన నేతలతో కలిసి నిర్వహించుకున్నారు. ఇటువైపు కనీసం టీడీపీ నేతలు కన్నెత్తి చూడలేదు. మరోవైపు స్పీకర్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో జరుగుతున్న మకర జ్యోతి మహోత్సవాలకు సీఎం రమేష్‌ను ఆహ్వానించలేదు. ఒకవైపు నర్సీపట్నం కేంద్రంగా పలువురు నేతలను తనకు తెలియకుండా బీజేపీలో చేర్చుకోవడంతోపాటు పోటీగా రాజకీయాలు చేస్తున్నారని అయ్యన్న భావిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు కనీస సమాచారం లేకుండా జరుగుతున్న చేరికలపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు కొద్దిరోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన ప్రధాని సభ సందర్భంగా కూడా స్పీకర్ హోదాలో తనకు కనీస గుర్తింపు దక్కలేదని ఆయన కినుక వహించినట్టు తెలుస్తోంది. ప్రధాని సభకు జన సమీకరణ సందర్భంగా... నర్సీపట్నంలో మీరు చేర్చుకున్న నేతల ద్వారా జనాలను తరలించుకోండంటూ సీఎం రమేష్‌కు అయ్యన్న గట్టిగా బదులిచ్చినట్టు సమాచారం. మొత్తంగా నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు రిసార్టు కేంద్రంగా జరిగిన సంక్రాంతి వేడుకలు కాస్తా కూటమిలో భోగి మంటలను మించి వేడిని రాజేశాయని అర్థమవుతోంది. కొరివితో తలగోక్కున్నట్టు...! వాస్తవానికి అనకాపల్లి ఎంపీ పోటీలో స్థానికేతరుడైన దిలీప్‌కుమార్‌కు సీటు ఇవ్వాలని టీడీపీ భావించింది. ఈ సీటును తన కుమారుడి కోసం ఆశించిన అయ్యన్నపాత్రుడు... స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ ఎన్నికల ముందు జరిగిన పార్టీ సమావేశాల్లో బహిరంగంగానే మాట్లాడారు. అయితే, పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ స్థానంలో ఎంపీ అభ్యరి్థగా సీఎం రమేష్‌ను బీజేపీ ప్రకటించింది. అనూహ్యంగా అయ్యన్నపాత్రుడు రమేష్‌ను వెంటబెట్టుకుని మరీ ఎన్నికల్లో కలియతిరిగారు. మిగిలిన నేతల కంటే ఎక్కువగా సీఎం రమేష్ తో సఖ్యతగా మెలిగారు. తీరా ఎన్నికల తర్వాత నర్సీపట్నంలోనే సీఎం రమేష్ రాజకీయం మొదలుపెట్టారు. దీంతో కొరివితో తలగొక్కున్నట్టుగా పరిస్థితి తయారయ్యిందని అయ్యన్న వాపోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విశాఖలో ప్రధాని పర్యటన సందర్భంగా నర్సీపట్నం నుంచి జనసమీకరణపై సీఎం రమేష్ అయ్యన్నను కదిపే ప్రయత్నం చేశారు. మీరు చేర్చుకున్న నాయకులతో జనాలను తరలించుకువెళ్లండంటూ అయ్యన్న గట్టిగానే బదులిచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సంక్రాంతి సందర్భంగా సీఎం రమేష్ నర్సీపట్నంలో మకాం వేయడం చర్చనీయాంశమవుతోంది. సీఎం రమేష్ సమక్షంలో బీజేపీలో చేరిన ఇద్దరు విశాఖ డెయిరీ డైరెక్టర్లతో పాటు ఓ డాక్టర్, జనసేన నేతలు సదరు ప్రైవేటు రిసార్టు వద్ద హడావుడి చేస్తున్నారు. అయితే, అటువైపు ఏ ఒక్క టీడీపీ నేత కానీ కార్యకర్త కానీ వెళ్లకపోవడం గమనార్హం. విశాఖ డెయిరీ డైరెక్టర్ల చేరికపై...! విశాఖ డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ హడావుడిగా అసెంబ్లీలో సభా సంఘాన్ని స్పీకర్ అయ్యన్న ఏర్పాటు చేశారు. దీనిపై పార్టీలోని నేతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయనే ప్రచారం ఉంది. మరోవైపు తమ పార్టీలో విశాఖ డెయిరీ నేతలను చేర్చుకుంటున్నట్టు సీఎం రమేష్.... అయ్యన్నకు సమాచారమిచ్చినప్పటికీ ఆ విషయంలో ముందుకు వెళ్లడంపై కూడా సీఎం రమేష్ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలోని ఇద్దరు విశాఖ డెయిరీ డైరెక్టర్లు సూర్యనారాయణ, రాజకుమారిలను బీజేపీలో చేర్చుకున్నారు. అంతేకాకుండా నర్సీపట్నంలోని డాక్టర్ కిలాడి సత్యనారాయణను కూడా తాజాగా ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీలో చేర్చుకున్నారు. ఈ చేరిక వెనుక కూడా సీఎం రమేష్ ఉన్నట్టు అయ్యన్న మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ అంటే ఎవరో తెలియని సందర్భంలో ప్రతీ చోట పరిచయం చేసిన తననే లెక్కచేయకపోవడంపై అయ్యన్న ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగ కాస్తా కూటమి నేతల మధ్య కుంపటి రాజేసిందని చెప్పవచ్చు. అది నేనే.. ఇది నేనే..! -
పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?
తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతా బాగానే ఉందా? వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల కోసం గంటల తరబడి వేచి ఉండి, చివరికి తొక్కిసలాటకు గురై ఆరుగురు మరణించినా... ప్రభుత్వం, టీటీడీ పెద్దలు అదేదో చాలా చిన్న అంశమైనట్లు వ్యవహరిస్తున్నారా? టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టి తమ మధ్య విభేదాలు లేవు.. కలసి పని చేస్తున్నామని చెబితే జనం నమ్మాల్సిందేనా?.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు బీఆర్ నాయుడు ఇతర ఉన్నతాధికారులంతా ఎవరిని మోసం చేస్తున్నారు?. ప్రజలనే కాదు.. తమను తాము మోసం చేసుకుంటూ తిరుమలేశుడిని కూడా మోసం చేయడం కాదా!. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయుడు సూక్తి ముక్తావళి చెబుతున్నారు. తిరుమల లడ్డూ ఉదంతం నుంచి వరసగా జరుగుతున్న అనేక సంఘటనలలో అపచారానికి పాల్పడుతున్నది ఎవరు?. హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నది ఎవరు?. కచ్చితంగా చంద్రబాబు, పవన్‌తో పాటు బీఆర్ నాయుడు కూడా బాధ్యత వహించవలసిందే. 👉బీఆర్ నాయుడు(BR Naidu)కు నిజంగా హిందూ సెంటిమెంట్, దైవభక్తి ఉంటే పదవి నుంచి తప్పుకుని దైవ సన్నిధిలో క్షమాపణ కోరి ఉండాల్సింది. ఒకవేళ రాజీనామాకు మొండికేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవి నుంచి తొలగించి ఉండాలి. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు, టీటీడీ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి ఉండాల్సింది. ఉప ముఖ్యమంత్రి పవన్ తిరుపతిలో సనాతన హైందవ ధర్మం సక్రమంగా నడవడం లేదని, తిరుమల పుణ్యక్షేత్రానికి అపచారం జరిగిందని ప్రకటించి కూటమి నుంచి వైదొలగి ఉండాల్సింది. బీజేపీ హిందూ మతానికి తానే ప్రతినిధి అన్నట్లు నటించడం కాకుండా, తాము ఈ పాపానికి బాధ్యత తీసుకోలేమని ప్రకటించి ఉండాలి. వీరెవ్వరూ ఆ పని చేయలేదు. క్షమాపణల డ్రామా నడిపి, ఛైర్మన్, ఇద్దరు ఉన్నతాధికారులను బలవంతంగా కూర్చోబెట్టి అతా బాగున్నట్లు కలరింగ్ ఇచ్చి ప్రజలను పక్కదారి పట్టించే యత్నం చేశారు. దీంతో మరణించినవారి ప్రాణాలు తిరిగి వచ్చేసినంతగా పిక్చర్ ఇస్తున్నట్లుగా ఉంది. ఇదంతా చంద్రబాబు స్టైలే. పైకి సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తూ, లోపల మాత్రం తుతు మంత్రంగా కథ నడిపిస్తుంటారు. ఇలాంటి తొక్కిసలాటలు(Stampede) జరిగితే పదవుల నుంచి తప్పుకోవడం అనేది నైతిక బాధ్యత. అలా విలువలు పాటిస్తారనుకోవడం అత్యాశే కావచ్చు!. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట వల్ల 29 మంది మరణిస్తేనే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోలేదు. ఇప్పుడు బీఆర్ నాయుడు పదవి ఎందుకు వదలుకుంటారు?. పుష్కరాల తొక్కిసలాట కేసులో ఎవరిపైన అయినా చర్య తీసుకుంటే అది తన వరకు వస్తుందని భయపడ్డ చంద్రబాబు ఒక్కరిపై కూడా యాక్షన్ తీసుకోలేకపోయారు. తిరుపతి ఘటనలో కూడా ఒక ఐదుగురు చిన్న స్థాయి అధికారులపై చర్య చేపట్టి, తనకు కావల్సిన అధికారి ఒక్కరిని మాత్రం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ డ్రామాలో పవన్ తన వంతు పాత్ర పోషించి రక్తి కట్టించారు. కాకపోతే మధ్యలో బీఆర్ నాయుడు చేతిలో పరువు పోగొట్టుకున్నారు. బీఆర్ నాయుడుతో సహా అధికారులంతా అంతా క్షమాపణ చెప్పాలని అన్నారు. కాని టీటీడీ చైర్మన్ మాత్రం పవన్ ఎవరు తనకు చెప్పడానికి అని తీసిపారేశారు. చివరికి ముఖ్యమంత్రి ఒత్తిడితో క్షమాపణ చెప్పినా పవన్ మాత్రం ఏ మాత్రం ఫీల్ కాకుండా సరిపెట్టుకున్నారు. బీఆర్ నాయుడి దెబ్బకు భయపడి ఆయన ఇతర అధికారుల జోలికి వెళ్లలేదు. ఇక చంద్రబాబు ఎదుటే బీఆర్ నాయుడు, శ్యామలరావులు ఘర్షణ పడ్డారు. దీన్ని తెలుగుదేశం జాకీ మీడియానే ప్రముఖంగా వార్త ఇచ్చింది. ‘నువ్వంటే.. నవ్వు...’ అనుకున్నారని కూడా రాశారు. అసలు తమకు ఏమీ చెప్పడం లేదని చైర్మన్ అంటే.. తాను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నానని ఈవో అన్నారు. మధ్యలో రెవెన్యూ మంత్రి జోక్యం చేసుకోవడం, చంద్రబాబు వారించడం వంటి సన్నివేశాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఆ రోజున వీరెవరూ ఖండించలేదు. కానీ.. తదుపరి బి.ఆర్.నాయుడు, శ్యామలరావు, వెంకయ్య చౌదరిలు ఏమీ తెలియనట్లు నటించారు. ఇక నుంచి కలిసి పనిచేస్తామని చెబితే అది వేరే సంగతి. కాని అసలు గొడవలే లేవన్నట్లుగా మాట్లాడి ఎవరిని ఫూల్స్‌ను చేస్తారు?. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని నాయుడు అనడం మరీ విడ్డూరం. కొద్ది నెలలుగా ఈ అపచారానికి పాల్పడుతున్నది కూటమి పెద్దలు కాదా! తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని అబద్దం చెప్పడం అపచారం కాదా? అలాంటిది ఏమీ లేదని శ్యామలరావు తొలుత చెప్పగా, ఆయనతో మాట మార్పించ లేదా? అది అప్రతిష్ట కాదా? ఆ మీదట పవన్ రెచ్చిపోయి సనాతని అంటూ వేషం కట్టి మరింత పరువు తీయలేదా? ఐదేళ్లుగా అసలు తిరుమలనే దర్శించని బీఆర్ నాయుడును ఛైర్మన్ పదవికి నియమించడం చంద్రబాబు చేసిన తప్పు కాదా? ఇప్పుడు లోకేష్ మనిషిగా ఉన్నందున బీఆర్ నాయుడును కనీసం పదవి నుంచి తప్పుకో అని చెప్పలేకపోతున్న చంద్రబాబు నిస్సహాయత వల్ల ఇమేజీ దెబ్బతినడం లేదా? జరగని కల్తీకి సంప్రోక్షణ చేయించిన చంద్రబాబు ప్రభుత్వం వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులు మరణిస్తే ఎందుకు అలా ప్రత్యేక పూజలు చేయించలేదు? ఇది అపచారం కాదా? ఈ ఘటన కారణంగా భక్తుల సంఖ్య తగ్గిందని అంకెలతో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. అయినా అబ్బే అదేమీ లేదని బుకాయించడం అవసరమా?. టీటీడీ బోర్డులో ఛైర్మన్‌తో సహా పలువురు బోర్డు సభ్యులు ఈవో శ్యామలరావుపై ధ్వజమెత్తడం అసత్యమా? ఆయన గుడికి వెళ్తే ఇతర అధికారులు సైతం పలకరించడానికి భయపడ్డారట!. అది ఎందుకు జరిగింది అంటే ఆయనకంటే వెంకయ్య చౌదరే పవర్ ఫుల్ అనే భావం కాదా? టీటీడీలో టెక్నాలజీని వాడుతున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ద్వారా క్రౌడ్, క్యూలైన్ మేనేజ్ మెంట్ గురించి గూగుల్ అధికారితో సలహాలు తీసుకున్నామని వెంకయ్య చెబుతున్నారు. అది నిజమైతే ఆ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారు?. పెద్ద ఘనకార్యం చేయబోతున్నట్లుగా చెప్పేవారు కదా?. ఇక.. అధికారిక సమావేశంలో కూడా కొందరు అనధికారులను ఎలా కూర్చోబెట్టారు.లక్ష్మణ్ అనే వ్యక్తి లోకేష్ సన్నిహితుడని చెబుతున్నారు. ఆయన, మరికొందరు తిరుమలలో పెత్తనం చేస్తున్న వార్తలను ఎందుకు ఖండించలేకపోయారు? తిరుపతిలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు చెప్పినట్లుగానే టీటీడీ అధికారులు వ్యవహరించారని, ఒక డీఎస్పీ వల్ల తొక్కిసలాట జరిగిందని శ్యామలరావు అంటున్నారు. అంటే టీటీడీ అధికారుల తప్పు లేకపోయినా ఒక మహిళా జేఈవో పై చంద్రబాబు ఎందుకు చర్య తీసుకున్నారు?. ఎస్పీపై ఎందుకు సస్పెన్షన్ వేటు వేయలేదు? ఇవన్ని పక్షపాతంతో చేసిన నిర్ణయాలుగానే కనిపిస్తాయి. ఇదేనా దైవభక్తి ఉన్నవారు చేసేది?. గతంలో జగన్ టైమ్‌లో ఉన్నవి, లేనివి సృష్టించి తిరుమలకు అపచారం జరిగిందంటూ చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి దారుణ విష ప్రచారం చేసేవి. మరి ఇప్పుడు ఇంత ఘోరం జరిగినా హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? కేవలం టీటీడీ ఛైర్మన్ నిర్వాకంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మనోభావాలు దెబ్బతింటాయా? తిరుమలకు అప్రతిష్ట వస్తుందా? గతంలో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకై పదమూడు మంది మరణించిన ఘటనలో విదేశాలలో ఉన్న యాజమాన్యం వారిని కూడా అరెస్టు చేయాలని చంద్రబాబు, పవన్ లు డిమాండ్ చేశారా? లేదా?. ఆ ప్రకారమే జగన్ ప్రభుత్వం అరెస్టు చేయించిందా? లేదా?. మరి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు దెబ్బతగిలేనా తొక్కిసలాటలో ఆరుగురు మరణిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ఎందుకు కనీసం ఎవరిపైన కేసు పెట్టలేదు?. కేవలం పదవులు అంటిపెట్టుకుని హిందూ మతానికి తీరని పాపం చేస్తున్నది వీరే అని వేరే చెప్పనవసరం లేదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.