Ananthapur
-
తోలుబొమ్మ.. రూపు మార్చిందమ్మా!
ఒకప్పుడు తెరవెనుక లేలేత వెలుగుల మధ్య సందడి చేసిన బంగారక్క.. కేతిగాడు.. జుట్టుపోలిగాడు.. అల్లాటప్పగాడు రూపం మార్చేసుకున్నారు. తోలు బొమ్మలాటకు ఆదరణ కరువైన తరుణంలో అలనాటి తోలు బొమ్మలు కొత్తరూపు సంతరించుకుని అలంకరణ వస్తువులుగా జనాన్ని అలరిస్తున్నాయి. లాంతర్లు, ఇళ్లలో గోడలకు అమర్చుకునే అందమైన కర్టెన్లు, హ్యాండ్ బ్యాగుల రూపంలో మార్కెట్లోకి వస్తున్నాయి.ధర్మవరం రూరల్: కరువు.. కళలు పేరు చెబితే గుర్తొచ్చేది ఉమ్మడి అనంతపురం జిల్లానే. ధర్మవరం మండలం నిమ్మలకుంటలో తయారయ్యే తోలుబొమ్మలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటి తయారీదారులు ఏ డిగ్రీలు చేయకపోయినా.. ఇతర దేశాలకు వెళ్లిమరీ తోలు బొమ్మల తయారీలో శిక్షణ సైతం ఇస్తున్నారు. కేవలం పొట్టకూటి కోసం పేద కళాకారులు అంకితభావంతో చేస్తున్న ఈ పని కళాభిమానుల మనసు దోచుకుంటోంది. ఇళ్లలో అంతర్గత అలంకరణ (ఇంటీరియర్ డెకరేషన్) పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ నిమ్మలకుంట కళాకారులు తయారు చేసే తోలు బొమ్మల్ని కొని తీరాల్సిందే అనేంత అందంగా తీర్చిదిద్దుతున్నారు. తరతరాలుగా ఇదే వృత్తి ధర్మవరం పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తి వెళ్లే రహదారిపై గల నిమ్మలకుంట కళాకారులు తరతరాలుగా హస్తకళల్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరంతా తోలు బొమ్మలాట ప్రదర్శనతో పాటు తోలుబొమ్మల తయారీలోనూ అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. వీరి పూర్వీకులు ఎడ్లబండ్లపై గ్రామాలు తిరుగుతూ తోలు బొమ్మలాట ప్రదర్శించేవారు. కాలక్రమేణా సినిమాలు, టీవీల ప్రభావం ఎక్కువ కావడంతో తోలుబొమ్మల ప్రదర్శనకు ఆదరణ కరువైంది. బొమ్మలాటనే నమ్ముకున్న కుటుంబాలు తోలుబొమ్మల తయారీ, విక్రయం వైపు దృష్టి సారించారు. మేక, గొర్రె, జంతువుల చర్మాలతో ల్యాంప్‌సెట్స్ (లాంతర్లు), ఇళ్లలో గోడలకు అమర్చుకునే అందమైన కర్టెన్లు, హ్యాండ్ బ్యాగులు తదితర ఆకృతుల్లో తోలుబొమ్మల్ని తయారు చేస్తున్నారు. వీటిని ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై తదితర ప్రాంతాలలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో తోలుబొమ్మలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు 200 వరకు ఉన్నాయి. తయారీ ఇలా.. మేక తోలును మాత్రమే బొమ్మల తయారీకి ఉపయోగిస్తున్నారు. మేక చర్మాన్ని బాగా కడిగిన తర్వాత ఎండబెడతారు. ఎండిన చర్మంపై తయారు చేయాలనుకున్న బొమ్మను మొదట పెన్సిల్‌తో గీస్తారు. చిన్నచిన్న రంధ్రాల ద్వారా మిగతా భాగాన్ని తొలగించి బొమ్మకు రంగులు వేస్తారు. ఒక బొమ్మ తయారీకి మూడు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. తయారైన బొమ్మలను హ్యాండ్లూమ్ సొసైటీ ద్వారా పట్టణాలలో మార్కెటింగ్ చేస్తున్నారు. గతంలో కొద్దిమంది మాత్రమే ఈ బొమ్మలను తయారు చేసేవారు. మార్కెటింగ్ సదుపాయం అందుబాటులోకి రావడంతో తయారీదారులు పెరుగుతున్నారు. పద్మశ్రీ వరించింది తోలుబొమ్మలాటకు ఆదరణ కరువైన తరువాత ఆ కళాకారులంతా వివిధ ప్రాంతాల్లో స్థిరపడి వేర్వేరు వృత్తుల్లోకి మారిపోగా.. దళవాయి కడేరావు, వీరనారప్ప, అంజినప్ప అనే కళాకారులు మాత్రం ఇదే వృత్తిని కొనసాగిస్తూ నిమ్మలకుంట గ్రామంలో స్థిరపడ్డారు. వీరి వారసులే గ్రామంలో తోలుబొమ్మలకు జీవం పోస్తున్నారు.వీరితో పాటు ఇతర కులాల వారు కూడా తోలుబొమ్మల తయారీ నేర్చుకుని.. ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. తోలుబొమ్మల ప్రదర్శనకు విశేష గుర్తింపు తె చ్చినందుకు గాను గ్రామానికి చెందిన దళవాయి చలపతిరావును 2020వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం వరించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా చలపతిరావు అవార్డు అందుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన శివమ్మ అనే కళాకారిణి ‘శిల్పగురు’ అవార్డుకు ఎంపికైంది. షిండేరావు, శ్రీరాములు వంటి కళాకారులు సైతం అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. -
షాపులు నడిపితే చంపేస్తామంటున్నారు
● ఎమ్మెల్యే పరిటాల సునీత, అనుచరులు బెదిరిస్తున్నారు ● మద్యం షాపుల లైసెన్స్‌దారుల ఆవేదన పంజగుట్ట (హైదరాబాద్): అనంతపురం జిల్లాలో మంజూరైన మద్యం షాపులు నడిపించుకోకుండా టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, అనుచరులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన మేడ గోపి, కె.గురునాథం శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం టెండర్లలో తాము మొత్తం 25 షాపులకు టెండర్ వేశామన్నారు. గోపికి అనంతపురంలో రెండు షాపులు (ఏటీ–100, ఏటీ–97), రాప్తాడులో ఒకటి (ఎస్ఎస్–22), గురునాథంకు అనంతపురంలో ఒకటి (ఏటీ–89), తాడిపత్రిలో ఒక షాపు (ఏటీ–93) దక్కాయన్నారు. ఒక్కో షాపునకు రూ.20 లక్షల చొప్పున ఎకై ్సజ్ డ్యూటీ చెల్లించామన్నారు. షాపు రూములను కూడా అద్దెకు తీసుకున్నామన్నారు. కానీ ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరులు గుంపుగా వచ్చి తమను తీసుకెళ్లి తీవ్ర భయ భ్రాంతులకు గురిచేశారని, షాపులు నడిపితే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఎక్కడైనా టెండర్లు వేసుకోవచ్చునంటూ పేర్కొని తీరా షాపులు మంజూరయ్యాక బెదిరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పెట్టుబడి పెట్టి రెండు నెలలుగా షాపులు నడిపించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎకై ్సజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు జిల్లా కలెక్టర్‌కూ లేఖలు రాశామని, అయినా ఎలాంటి స్పందనా లేదని తెలిపారు. కేవలం రెండు లక్షల రూపాయలు ఇస్తాము.. తప్పుకోండని అంటున్నారని, ఇదెక్కడి న్యాయ మని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తగిన భద్రత కల్పించి.. తాము షాపులు నడిపించుకునే అవకాశం కల్పించాలని కోరారు. -
‘సాగునీటి’ ఎన్నికల్లో ‘అధికార’ పెత్తనం
అనంతపురం సెంట్రల్/శింగనమల/యల్లనూరు: జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు శనివారం ఏకపక్షంగా సాగాయి. అధికార టీడీపీ నేతలు పెత్తనం చెలాయించారు. అన్ని స్థానాల్లో తామే గెలవాలన్న ఉద్దేశంతో అప్రజాస్వామిక విధానాలకు తెర తీశారు. ఇతరులెవరూ ఎన్నికల్లో పోటీపడకుండా దౌర్జన్యాలకు దిగారు. అధికారులు, పోలీసులు కూడా వారికి సహకరించారు. నామినేషన్ సైతం వేయకుండా అడ్డగించి.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలిపారు. టీడీపీ నేతలు, అధికారుల తీరుకు నిరసనగా చాలాచోట్ల ఎన్నికలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు బహిష్కరించారు. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ప్రాజెక్ట్ కింద అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మొత్తం 54 నీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 648 మంది సభ్యులను ఎన్నుకున్నారు. అలాగే చిన్ననీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో 89 నీటి సంఘాలకు ఎన్నికలు జరగ్గా.. రెండు వాయిదా పడ్డాయి. బెళుగుప్ప మండలం శీర్పి, కూడేరు మండలం రామచంద్రాపురం (పొట్టి చెరువు) నీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. భైరవానితిప్ప ప్రాజెక్ట్ (బీటీపీ) కమిటీ ఎన్నిక కూడా పూర్తయిందన్నారు. త్వరలోనే జిల్లా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. శింగనమలలో టీడీపీ దౌర్జన్యం.. శింగనమల రంగరాయల చెరువు సాగు నీటి సంఘం ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఇండిపెండెంట్ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా, ఓటు కోసం వచ్చిన రైతులను బలవంతంగా బయటకు పంపించారు. ఆరు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ 500 దాకా ఓటర్లు ఉన్నారు. అందులో దాదాపు 200 మంది పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. వీరిలో ఎక్కువమంది ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన సాగునీటి పారుదల సంఘం మాజీ అధ్యక్షుడు నూర్ మహమ్మద్‌కు మద్దతుగా ఉన్నారు. అతనితోపాటు అతని అనుచరులు నామినేషన్లు వేయడానికి సిద్ధమవగా.. రైతుల మద్దతు లేని టీడీపీ నాయకులు లోనికి చొచ్చుకొచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు తీసుకోరాదంటూ పోలింగ్ అధికారులతో గొడవ పెట్టుకున్నారు. ‘మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము చెప్పిన వారే ఎన్నికవుతారు. ఓట్లు ఏమీ లేవు. రైతులందరూ బయటకు పోవాలి’ అంటూ రైతులను బయటకు పంపించేశారు. గంట తరువాత అధికార పార్టీ నాయకులు నామినేషన్లు వేసుకొని ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ప్రకటించుకున్నారు. ఈ విషయమై తహసీల్దార్ బ్రహ్మయ్య, సీఐ కౌలుట్లయ్యకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా అధికార పార్టీ వారికే సహకరించారని నీటిపారుదల సంఘం మాజీ అధ్యక్షుడు నూర్‌మహమ్మద్ ఆరోపించారు. న్యాయబద్ధంగా ఎన్నికలు తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కోర్టుకు పోతామని చెప్పారు. పోలీసుల ‘పచ్చ’పాతం.. పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) సాగునీటి సంఘం ఎన్నికల్లో పోలీసులు ‘పచ్చ’పాతం చూపారు. నామినేషన్ వేసేందుకు అనుచరులతో వస్తున్న యల్లనూరు జెడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్‌రెడ్డిని సీ్త్ర శక్తిభవనం వద్దనున్న పుట్లూరు సీఐ సత్యబాబు, యల్లనూరు ఏఎస్ఐలు శ్రీనివాసులగౌడ్, సంపత్‌కుమార్, పోలీసుసిబ్బంది అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. సమయమంతా అక్కడే గడిచిపోయింది. దీంతో నామినేషన్ వేయకుండా వెనక్కు వెళ్లారు. జిల్లాలో ఏకపక్షంగా ఎన్నికలు ఇతరులెవరూ పోటీ చేయకుండా టీడీపీ నేతల అడ్డగింత సహకరించిన అధికారులు, పోలీసులు -
లోక్ అదాలత్‌లో ఇరువురూ విజేతలే
అనంతపురం: సాధారణంగా ఏ కేసులోనైనా ఒక వైపు మాత్రమే విజయం వరిస్తుందని, అదే లోక్ అదాలత్‌లో ఇరు వైపులా (ఉభయులూ) విజేతలేనని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (జిల్లా జడ్జి) జి.శ్రీనివాస్ అన్నారు. జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్‌ను జిల్లా జడ్జి ప్రారంభించారు. ఎస్పీ పి.జగదీష్, జిల్లా న్యాయశాఖాధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 6,235 కేసుల పరిష్కారం.. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 6,235 కేసులు పరిష్కారమయ్యాయి. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మొత్తం 25 బెంచ్‌ల ద్వారా కేసులు విచారించారు. ఈ సందర్భంగా 5,753 క్రిమినల్ కేసులు, 151 సివిల్ కేసులు, 66 మోటారు వాహన ప్రమాదభరిత కేసులు, 271 ప్రీలిటిగేషన్ కేసులకు పరిష్కారం దక్కింది. ప్రమాదభరిత కేసుల కక్షిదారులకు రూ.5.67 కోట్ల పరిహారం చెల్లింపునకు రాజీ కుదిర్చారు. సివిల్ కేసుల్లో రూ.31,96,134, ప్రీలిటిగేషన్ కేసుల్లో రూ.1.21 కోట్ల పరిహారాన్ని కక్షిదారులకు న్యాయమూర్తులు ఇప్పించారు. -
No Headline
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే రోడ్డులోని న్యూరో డాక్టరు వద్దకు తలనొప్పిగా ఉందని వెళితే ఏకంగా ఎంఆర్ఐ స్కానింగ్ రాశారని లక్ష్మీనగర్‌కు చెందిన పేషెంటు ఆవేదన చెందారు. కనీసం నాడి కూడా చూడకుండానే తలనొప్పి అనగానే ఎంఆర్ఐ అన్నారని వాపోయారు. అనంతపురం సాయినగర్ నుంచి విద్యుత్ నగర్ సర్కిల్‌కు వెళ్లే దారిలో రోడ్డుకు ఎడమవైపున ఇద్దరు డాక్టర్లు (భార్యాభర్త) ఆస్పత్రి నడిపిస్తున్నారు. ఇందులో భర్త స్కిన్ స్పెషలిస్టు. ఆయన దగ్గరకు వెళితే ఫీజు సెపరేటు.. తర్వాత సబ్బులు, క్రీములు, మందులు అంటూ రూ.2 వేలు తక్కువ కాకుండా రాస్తారని స్థానిక అశోక్‌నగర్‌కు చెందిన ఓ పేషెంటు గగ్గోలు పెట్టారు. అనంతపురం పాతూరుకు చెందిన ఓ పేషెంటు స్థానిక ధర్మవరం బస్టాండ్ సమీపంలోని సూర్యానగర్‌లో ఉన్న ఓ ఎండోక్రినాలజిస్ట్ దగ్గరకు వెళ్లాడు. అక్కడే ఉన్న ల్యాబ్‌లో బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే డాక్టర్ అపాయింట్మెంట్ ఇస్తారనడంతో తెల్లవారుజామున నాలుగు గంటలకే అక్కడికి చేరుకున్నాడు. ఏనాడూ స్టెతస్కోప్ వాడని సదరు డాక్టర్..పేషెంటు రిపోర్టులు చూసి మందులు రాశారు. ఏడాది తర్వాత హైదరాబాద్‌లో చూపించుకుంటే మందులే అవసరం లేదని, ఇంకా ప్రీడయాబెటిక్ స్టేజ్‌లోనే ఉన్నావని చెప్పడంతో నిర్ఘాంతపోవడం పేషెంటు వంతైంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో కొందరు ప్రైవేటు వైద్యుల దోపిడీ పరాకాష్టకు చేరింది. చిన్న చిన్న సమస్యలతో వెళ్లినా పెద్దమొత్తంలో బిల్లు చేసి రోగుల గుండె గుబేల్మన్పిస్తున్నారు. మధుమేహ బాధితులు రక్తంలో గ్లూకోజు స్థాయిని తగ్గించుకునేందుకు ఎండోక్రినాలజిస్ట్ దగ్గరకు వెళితే కనీసం చూడకుండానే రక్తాన్ని పిండుకుంటున్నారు. చర్మం మీద మచ్చలొచ్చాయని వెళ్లిన వారికి స్కిన్ స్పెషలిస్టులు చర్మం వలిచేస్తున్నారు. పురిటినొప్పులతో నర్సింగ్ హోంలకు వెళితే కళ్లు బైర్లు కమ్మేలా బిల్లులు వేస్తున్నారు. సిజేరియన్‌కు ఏకంగా లక్ష రూపాయలు బిల్లు వేస్తున్న పరిస్థితి. జిల్లా కేంద్రంలోని కొందరు స్పెషలిస్టు డాక్టర్లయితే రోజురోజుకూ ఫీజులు పెంచేస్తున్నారు. ఏ డాక్టరు వద్దకు వెళ్లినా ఏమున్నది గర్వకారణం..సర్వం డబ్బు మయం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇక సవేరా వంటి కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు సామాన్య రోగులు వెళ్లే పరిస్థితే లేదు. పేషెంటు బెడ్డు ఎక్కకమునుపే లక్షలకు లక్షలు అడ్వాన్సులు కట్టించుకుంటున్నారు. నాడిపట్టే దిక్కు లేదాయె.. అనంతపురం నగరంలోనే కాదు.. వివిధ నియోజకవర్గ కేంద్రాల్లోనూ 98 శాతం మంది డాక్టర్లు స్టెతస్కోప్ పట్టడం లేదు. పల్స్, గుండె లయ చూడటం ఎప్పుడో వదిలేశారు. ఐదు నిమిషాల్లోపే రోగ లక్షణాలడిగి మూరెడు పొడవున టెస్టులు రాస్తున్నారు. వాటికే రూ.6 వేల నుంచి రూ.10 వేలవుతోంది. తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలతో వెళితే వందశాతం ఎంఆర్ఐ రాస్తున్నారు. గోటితో పోయేది గొడ్డలిదాకా అన్నట్టుగా అనవసర వైద్యపరీక్షలతో రోగిని గుల్ల చేస్తున్నారు. ల్యాబుల నుంచి వచ్చే కమీషన్ల కోసం డాక్టర్లు కక్కుర్తి పడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. నియంత్రణ ఏదీ? ప్రైవేటు వైద్యుల దోపిడీకి నియంత్రణే లేదు. పర్యవేక్షణ, నియంత్రణ చేయాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు లంచాలు తీసుకుని చూసీచూడనట్టు వెళుతున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింతలు, పసికందులు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ఈ విషయంలో వైద్య శాఖ ఉన్నతాధికారి సొమ్ములు కూడబెట్టుకున్నారు గానీ.. బాధితులకు ఏమాత్రమూ న్యాయం చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే ఆర్ఎంపీలను ఏజెంట్లుగా పెట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులు సాగిస్తున్న అరాచకాలతో రోజూ వేలాదిమంది రోగులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. వైద్యుడి చేతిలో కన్పించని స్టెతస్కోప్ రోగ లక్షణాలు చెప్పకముందే మూరెడు పొడవున టెస్టుల జాబితా తలనొప్పి అనగానే ప్రిస్కిప్షన్‌లో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ ప్రైవేటు ల్యాబులతో కుమ్మకై ్క వేలకు వేలు పిండుతున్న కొందరు డాక్టర్లు సిజేరియన్ కాన్పులకు వెళుతున్న వారికి గరిష్టంగా రూ.లక్ష ఖర్చు పరాకాష్టకు ఎండోక్రినాలజీ డాక్టర్ల దోపిడీ -
సైబర్ వలలో మున్సిపల్ కార్మికుడు
రాయదుర్గంటౌన్: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఓ మున్సిపల్ కార్మికుడు రూ.60 వేలు పోగొట్టుకున్నాడు. రాయదుర్గం పురపాలకసంఘంలోని ఇంజినీరింగ్ వాటర్ వర్క్స్ విభాగంలో సురేష్ పనిచేస్తున్నాడు. ఇతడికి వినోద్ రాజ్ అనే అపరిచిత వ్యక్తి 99894 73081 నంబర్ నుంచి కాల్ వచ్చింది. ‘నీకు రూ.2.50 లక్షల లాటరీ తగిలింది. నీవు నాకు రూ.60 వేలు చెల్లిస్తే లాటరీ డబ్బు నీ అకౌంట్‌కు పంపుతాం’ అని అపరిచిత వ్యక్తి చెప్పాడు. నిజమని నమ్మిన సురేష్ విడతల వారీగా శుక్ర, శనివారాల్లో రూ.60 వేల నగదును గూగుల్ పే ద్వారా అపరిచిత వ్యక్తికి పంపాడు. ఆ తరువాత నుంచి అతడి ఫోన్ స్విచాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించిన సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.60 వేలు పోగొట్టుకున్న వైనం -
మీడియా స్వేచ్ఛపై దాడి సహించం
అనంతపురం/అనంతపురం సిటీ: మీడియా స్వేచ్ఛపై దాడిని సహించబోమని జర్నలిస్టులు హెచ్చరించారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేములలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ న్యూస్ కవరేజీకి వెళ్లిన సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాస్, కెమెరామెన్ రాము, సాక్షి దినపత్రిక విలేకరి గొందిపల్లి రాజారెడ్డిపై జరిగిన టీడీపీ నేతల దౌర్జన్యకాండపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనాగ్రహం పెల్లుబుకింది. అనంతపురంలో శనివారం ఉదయం జర్నలిస్టులు ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే ఆందోళన చేపట్టారు. జిల్లాపరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, ఇతర సంఘాల నేతలూ మద్దతుగా ఆందోళనలో భాగస్వాములయ్యారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలంటూ నినదించారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికే దాడులు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జర్నలిస్టులకు రక్షణ లేకుండాపోయిందని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. వేములలో సాక్షి జర్నలిస్టుల బృందంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. కూటమి పాలన దాడులు, దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సర్కారు తప్పులను మీడియా పసిగట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు చూపించే పాత్ర పోషిస్తుంటే.. ప్రజలను డైవర్షన్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా జర్నలిస్టులపై దాడులకు దిగడం దుర్మార్గ, అరాచక పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కరువైంది.. రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీడబ్ల్యూజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వేముల ఘటన మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు మీడియా పట్ల ఏమైనా ప్రేమ ఉందా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితేనే వాళ్లను పట్టుకొని అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతూ కేసులు పెడుతున్న ప్రభుత్వ పెద్దలు.. వేములలో సాక్షి జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై పీడీ యాక్ట్‌లు పెట్టాలని డిమాండ్ చేశారు. ● సాక్షి జర్నలిస్టుల బృందంపై దాడిని ఏపీడబ్ల్యూజే(ఎఫ్) జిల్లా ప్రతినిధి రేపటి రామాంజనేయులు ఖండించారు. మీడియా మీద దాడులు చేసుకుంటూ పోతే మా కెమెరాలన్నీ మీవైపు తిప్పితే ఏమవుతారో ఆలోచించాలని సూచించారు. ● ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ మాట్లాడుతూ వేముల ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ● జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు వృత్తిరీత్యా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో సాక్షి బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, ఎడిషన్ ఇన్చార్జ్ మహేశ్వర రెడ్డి, సాక్షి టీవీ కరస్పాండెంట్ శివారెడ్డి, ఎన్టీవీ కరస్పాండెంట్ శ్రీనివాసులు, ఏపీజేడీఎస్ జిల్లా కార్యదర్శి విజయరాజు, సాక్షి జర్నలిస్టులతో సహా వివిధ పత్రికల ప్రతినిధులు, సబ్ ఎడిటర్లు, ఎలక్ట్రానిక్, యూట్యూబ్ చానళ్ల విలేకరులు, ఫొటో, వీడియా గ్రాఫర్లు, పత్రికల అనుబంధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. వేములలో సాక్షి జర్నలిస్టులపై దాడికి నిరసన సంఘీభావం తెలిపినజెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ జర్నలిస్టు, ప్రజా సంఘాల ప్రతినిధుల మద్దతు -
మందకొడిగా పంటల బీమా ప్రీమియం చెల్లింపు
● నేటితో ముగియనున్న గడువు అనంతపురం అగ్రికల్చర్: రబీకి సంబంధించి పంటల బీమా పథకం కింద గుర్తించిన పంటలకు రైతులు తమ వాటా ప్రీమియం చెల్లించడానికి సమయం దగ్గర పడింది. వరికి మినహా మిగతా పంటలకు ఆదివారంతో గడువు ముగియనుంది. వాతావరణ, ఫసల్ బీమా కింద పప్పుశనగ, వేరుశనగ, పప్పుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి, టమాట, మామిడి పంటలకు బీమా వర్తింపజేశారు. ఇందులో వ్యవసాయ పంటలకు రైతులు తమ వాటా కింద 1.5 శాతం, అలాగే మామిడి, టమాట వంటి ఉద్యాన పంటలకు 5 శాతం మేర ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే పప్పుశనగ రైతులు ఎకరాకు 450, వేరుశనగకు రూ.480, జొన్నకు రూ.315, మొక్కజొన్నకు రూ.525, వరికి రూ.630, టమాటకు రూ.1,600, మామిడికి రూ.1,650 ప్రకారం ప్రీమియం చెల్లించాలి. ఇందులో వరికి ప్రీమియం చెల్లింపు గడువు నెలాఖరు వరకు ఉంది. మిగతా అన్ని పంటలకు ఈ నెల 15వ తేదీ (ఆదివారం)తో గడువు ముగియనుంది. అయితే ఇప్పటికీ 40 శాతం మంది కూడా ప్రీమియం చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పంటలకూ ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించాలని ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. క్రమశిక్షణతో మెలగాలి● ఘర్షణలో పాల్గొన్న 8 మంది విద్యార్థులు హాస్టల్ నుంచి సస్పెన్షన్ ● హాస్టల్‌ను సందర్శించిన ఇన్చార్జ్ వీసీ అనంతపురం: విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత సూచించారు. ఎస్కేయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడు, నాలుగో సంవత్సరం చదువుతూ తుంగభద్ర హాస్టల్లో ఉన్న విద్యార్థుల మధ్య గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. శనివారం ఉదయం హాస్టల్‌ను సందర్శించిన ఇన్చార్జ్ వీసీ ఇంజినీరింగ్ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఘర్షణకు పాల్పడిన ఎనిమిది మంది విద్యార్థులను తల్లిదండ్రుల సమక్షంలోనే మందలించారు. కష్టపడి చదివిస్తుంటే మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు. క్రమశిక్షణతో మెలగకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఇన్చార్జ్ వీసీ భోజనం చేశారు. మరోవైపు ఇటుకలపల్లి ఎస్ఐ విజయ్‌కుమార్ సైతం 8 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సదరు విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన వాచ్మెన్లు ఉజ్జినయ్య, నాగరాజు, మెయిన్ గేట్ వద్ద ఉన్న రామ్మోహన్ రెడ్డి, సూర్యనారాయణ, బాలరాజుకు మెమో జారీ చేశారు. ఇన్చార్జ్ వీసీ వెంట ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర పాల్గొన్నారు. -
హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నిద్దాం
అనంతపురం కల్చరల్: ప్రతి చోటా సాగుతున్న హక్కుల ఉల్లంఘన లేకుండా ఆధిపత్యాన్ని ప్రశ్నిద్దామని వక్తలు సూచించారు. హెచ్ఆర్ఎఫ్ (మానవ హక్కుల వేదిక) 10వ రాష్ట్ర మహాసభలు శనివారం స్థానిక ఆపిల్ ఫంక్షన్ హాలులో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అంతర్గత సమావేశాలు, వివిధ జిల్లాల కమిటీల ఎంపిక జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 144 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభల ఆహ్వాన కమిటి అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్, తెలంగాణ హెచ్ఆర్సీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, డాక్టర్ తిరుపతి, ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, రాజేష్, కర్ణాటక ప్రతినిధి శ్రీధర్ తొలి సందేశం ఇచ్చారు. పీపుల్స్ డెమెక్రటిక్ ఫ్రంట్, ఏపీ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. అనంతరం పలు తీర్మానాలను ఆమోదించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు చేయాలని, ప్రార్థనా స్థలాల చట్టం 1991ను అమలు చేసి మైనార్టీల ప్రార్థనా స్థలాల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని వక్తలు డిమాండ్ చేశారు. నూతన విద్యావిధానం –2020 ద్వారా చేపడుతున్న కాషాయికరణ , కార్పొరేటికరణను ఆపేయాలన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల కేసుల్లో దర్యాప్తు విచారణ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు. అనంతరం మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీలను ఎన్నుకున్నారు. ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులుగా అనంతకు చెందిన చంద్రశేఖర్‌తో పాటూ జీవన్‌కుమార్, వసంతలక్ష్మి, కృష్ణ తదితరులున్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్రసభల్లో వక్తలు -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
రాప్తాడు: మండలంలోని బుక్కచెర్ల గ్రామ సమీపంలో నల్లలమ్మ దేవాలయం వెనక కల్లందొడ్డిలో ఈ ఏడాది ఏప్రిల్ 10న జరిగిన హత్య కేసును పోలీసులు శనివారం ఛేదించారు. రాప్తాడు సీఐ టీవీ.శ్రీహర్ష వివరాల మేరకు.. బుక్కచెర్లకు చెందిన జలగాని నల్లపరెడ్డి అల్లుడు బుక్కచెర్ల పురుషోత్తంరెడ్డి వ్యభిచారానికి, మద్యానికి బానిసై హెచ్ఐవీ వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఊళ్లో కూడా ఇష్టానుసారంగా తిరుగుతూ అందరితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. హెచ్ఐవీ ఉన్నా ఇంట్లో వాడే అన్ని వస్తువులను వాడుతూ కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టేవాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న నల్లపరెడ్డి చెల్లెలు అయిన కవితతో పురుషోత్తంరెడ్డి గొడవపడి తీవ్రంగా కొట్టాడు. దీంతో పురుషోత్తంరెడ్డిని ఎలాగైనా చంపాలని మేనమాన నల్లపరెడ్డి పథకం రచించాడు. అదే రోజు సాయంత్రం తమ కల్లందొడ్డి వైపు పురుషోత్తంరెడ్డి వెళ్లగా.. అతని వెంటే నల్లపరెడ్డి కల్లందొడ్డి దగ్గరకు వెళ్లి ఎందుకు రోజూ ఇంట్లో గోడవ పడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో పురుషోత్తంరెడ్డి నల్లపరెడ్డి మీదకు వెళ్లాడు. వెంటనే నల్లపరెడ్డి కుడిచెత్తో పురుషోత్తంరెడ్డి చెంపపై బలంగా కొట్టాడు. పురుషోత్తంరెడ్డి పశువుల పాక కోసం నాటిన ఇనుప పైపునకు కొట్టుకుని కింద పడిపోయాడు. పురుషోత్తంరెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న నల్లపరెడ్డి వెంటనే పశువుల పాకలోని చీరను మేడకు బిగించి ఉరి వేసుకుని మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. నిందితుడైన మేనమామ జలగాని నల్లపరెడ్డిని సీఐ టీవీ శ్రీహర్ష తమదైన శైలిలో విచారించగా నిందితుడు తానే చంపానని ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ జగదీష్, డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు. -
హిందీ పండిట్ ఆత్మహత్య
రాయదుర్గంటౌన్: మండల పరిధిలోని టి.వీరాపురం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న పురంధర దాసు(46) శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాలమేరకు... డీ.హీరేహాళ్ మండలం పూలకుర్తి గ్రామానికి చెందిన పురంధర రాయదుర్గం పట్టణంలోని గ్యాస్ గోడౌన్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. భార్య సుజాత మండలంలోని పల్లేపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే తాగుడుకు బానిసైన పురంధర విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాలకు వెళ్లకుండా గైర్హాజరవుతున్నాడు. అయితే రాయదుర్గం పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న ఓ చింత తోపులో చెట్టుకు ఉరివేసుకుని పురంధర ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గమనించి స్థానికులు పోలీసులకు సమచారం అందజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకొని మహిళ ఆత్మహత్య రాయదుర్గంటౌన్: ఉరివేసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని టి.వీరాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలమేరకు... టి. వీరాపురానికి చెందిన సువర్ణమ్మ (38) భర్త శ్రీరాములు ఆరేళ్ల క్రితమే చనిపోయాడు. సువర్ణమ్మ గ్రామంలోనే ఓ కిరాణ చిల్లరకొట్టును నడుపుతూ జీవనం సాగిస్తోంది. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెను కించపరిచే విధంగా మాట్లాడారు. మనస్తాపానికి గురైన సువర్ణమ్మ ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి ఈ ఘటనపై బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు. కారును ధ్వంసం చేసిన టీడీపీ మూకలు ధర్మవరం రూరల్: మండల పరిధిలోని ఓబుళనాయనపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు గంగాధర్నాయుడుకు చెందిన కారు (స్కార్పియో)ను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలో ఉంచిన స్కార్పియోను అర్ధరాత్రి సమయంలో రాళ్లతో ధ్వంసం చేశారని గంగాధర్‌నాయుడు తెలిపారు. గ్రామానికి చెందిన టీడీపీ మూకలే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. -
వైద్య ఆరోగ్య శాఖలో ఆయనో చిరుద్యోగి. తనకన్నా ఉన్నత స్థానంలో కుమారుడిని చూడాలనుకున్నాడు. వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసి కుమారుడిని వైద్య కళాశాలలో చేర్పించాడు. ఇక మరికొన్ని నెలల్లో తన కోరిక నెరవేరబోతోందని ఎంతో ఆశపడ్డాడు. అయితే విధి ఆడిన వింత నాటకంల
పేరు ః ఉడమాల నారాయణస్వామి బ్యాంక్ ః స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తాడిపత్రి బజార్ బ్రాంచ్ ఖాతా నంబర్ ః 1109 307 5181 ఐఎఫ్ఎస్సీ కోడ్ ః SBIN0004189 ఫోన్‌పే నంబర్ @ 93912 14490 ● మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థి ● శస్త్రచికిత్సకు రూ.10 లక్షలవుతుందన్న వైద్యులు ● దాతల సాయం కోసం ఎదురు చూపు ● ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు సాయం చేయదలిస్తే..యాడికి: తాడిపత్రిలో నివాసముంటున్న నారాయణస్వామి యాడికి మండలం రాయలచెరువులోని పీహెచ్సీలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఎలాంటి స్థిరాస్తులు లేవు. కేవలం జీతంపైనే ఆధారపడి కుమార్తెను, కుమారుడిని చదివించుకుంటూ వచ్చారు. కుమారుడు గోపీకృష్ణ తనకంటే ఉన్నత స్థానంలో ఉండాలని కలలు కన్న ఆయన ఆ కలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమించారు. తండ్రి ఆశలను వమ్ము చేయకుండా గోపీకృష్ణ సైతం పట్టుదలతో చదువుకుని నీట్లో ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడులోని విశ్వభారతి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం అభ్యసిస్తున్నాడు. కుమారుడి చదువులు, కుమార్తె పెళ్లి కోసం నారాయణస్వామి అప్పులు చేశాడు. విశ్వభారతి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీ రాత్రి కళాశాల హాస్టల్లో భోజనం చేసి తన స్నేహితుడు వైఎస్సార్ జిల్లాకు చెందిన సాయిమణితో కె.నాగలాపురం వద్ద ఉన్న రూముకు ద్విచక్ర వాహనంపై గోపీకృష్ణ బయలుదేరాడు. పెంచికలపాడు పత్తి మిల్లు వద్దకు చేరుకోగానే ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే కర్నూలులోని సర్వజనాస్పత్రికి తరలించారు. విద్యార్థులు అపస్మారక స్థితిలో ఉండడంతో ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియరాలేదు. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చొని ప్రయాణిస్తున్న గోపీకృష్ణకు ప్రమాదంలో ముఖంపై ఉన్న ఎముకలన్నీ విరిగిపోయాయి. కొన్ని నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న నారాయణస్వామి ఆగమేఘాలపై కర్నూలులోని సర్వజనాస్పత్రికి చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న గోపీకృష్ణను చూడగానే ఆయన దుఃఖం కట్టలు తెంచుకుంది. కుమారుడిని ఎలాగైనా బతికించుకోవాలనుకున్న ఆయన వెంటనే స్థానిక ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు... గోపీకృష్ణను మాములు మనిషిని చేయాలంటే శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. ప్రస్తుతం ఐసీయూలో అందజేస్తున్న చికిత్సకు రోజుకు రూ.30 వేల ఖర్చు వస్తోంది. అప్పు చేసి తనతో పాటు తీసుకెళ్లిన రూ.3 లక్షలను ఆస్ప్రతి నిర్వాహకులకు నారాయణస్వామి చెల్లించాడు. శస్త్రచికిత్స అనంతరం మరో నెల రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు. ఇందుకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని తెలిపారు. అంత పెద్దమొత్తంలో డబ్బు సమకూర్చడం తలకు మించిన భారం కావడంతో దాతల ఆర్థిక సాయాన్ని ఆర్థిస్తున్నాడు. ప్రభుత్వం, దాతలు మానవతా దృక్పథంతో ఆదుకుని తన కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని కోరుతున్నాడు. ముఖం ఛిద్రమై.. క్షణాల్లోనే జరిగిపోయింది.. -
దొంగను పట్టించిన గ్రామస్తులు
లేపాక్షి: మండలంలోని పులమతి ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఉన్న హుండీలోని నగదును ఓ దొంగ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. స్థానికుల వివరాలమేరకు... పులమతి గ్రామ సమీపంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. ఆ విగ్రహం ముందు హుండీని కూడా ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఆంజనేయ విగ్రహం వద్ద పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు ఆ పరిసరాలను గమనించారు. ఆంజనేయస్వామి విగ్రహం ముందున్న హుండీలోని కానుకలను తీసి లెక్కిస్తుండటాన్ని చూశారు. వెంటనే దొంగను పట్టుకొని హుండీలోని రూ.18 వేల నగదును స్వాధీనం చేసుకొని అతన్ని పోలీసులకు అప్పగించారు. దొంగ కర్ణాటకకు చెందిన హరీష్‌గా పోలీసుల విచారణలో తేలింది. మరిన్ని వివరాలు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
ఘనంగా బాబయ్య స్వామి గంధం వేడుక
పెనుకొండ: ప్రసిద్ధి గాంచిన పెనుకొండ బాబయ్య స్వామి గంధం వేడుకలు వైభవంగా జరిగాయి. డప్పు వాయిద్యాలు, ఫక్కీర్ల విన్యాసాల నడుమ శనివారం తెల్లవారుజాము 2 గంటలకు దర్గా పీఠాధిపతి తాజ్‌బాబా గంధంను తలపై ఉంచుకుని ఇంటి బయలు దేరారు. తెల్లవారుజాము 5 గంటలకు బాబయ్య స్వామి సమాధి వద్దకు చేరుకుని గంధంసమర్పించారు. అనంతరం మత పెద్దలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు జరిగిన సర్వమత సమ్మేళనంలో వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం అందరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. కాగా గంధం వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో పెనుకొండ కిటకిటలాడింది. ఉర్సు సందర్భంగా బాబయ్య స్వామి దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు
రాప్తాడురూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనంతపురం రూరల్ మండలం కొడిమి, ఆలమూరు జగనన్న కాలనీలపై కొందరు తమ్ముళ్లు కన్నేశారు. ఇంటి నిర్మాణాల కోసం ఉంచిన మెటీరియల్‌ను యథేచ్ఛగా ఎత్తుకెళ్తున్నారు. ప్రభుత్వ మెటీరియల్ తెలిసినా అధికారమే అండగా ట్రాక్టర్లు, లగేజీ వాహనాలు పెట్టి మరీ తరలించారు. ఆయా లేఔట్లలో ఇళ్ల నిర్మాణాల కోసం డంప్ చేసిన ఇసుక, సిమెంట్, ఐరన్, సిమెంట్ పెల్లలను విచ్చలవిడగా తరలించారు. కొందరైతే గుజరీలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అప్రమత్తమైన అధికారులు వాచ్మెన్లను ఏర్పాటు చేశారు. వీరుకూడా స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు సూచించిన వారే కావడంతో వాచ్మెన్లు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎవరెవెరు ఎత్తుకెళ్తున్నారో ఈ వాచ్మెన్లకు తెలుసని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు. పట్టపగలే ట్రాక్టర్లలో తరలింపు.. ఇన్ని రోజులు రాత్రిపూట, తెల్లవారుజామున మెటీరియల్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు... ఇప్పుడు పట్టపగలే బరి తెగిస్తున్నారు. కొడిమి జగనన్న లేఔట్ నుంచి ఇసుక, కడ్డీలు, సిమెంట్ పెల్లలు, సిమెంట్, చివరకు కార్మికులు పనిమీద వినియోగించుకునే ఇనుప కుర్చీలు, రేకులు (షీట్లు) ఎత్తుకెళ్తున్నారు. నరసనాయనికుంట, కొడిమి, రాచానపల్లికి చెందిన వారే ఎక్కువగా ఈ మెటీరియల్‌ను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. కొందరు ఇళ్ల వద్ద, తోటల్లో డంప్ చేసుకున్నట్లు సమాచారం. మరికొందరు షెడ్ల నిర్మాణాలకు అవసరమైన మొత్తం మెటీరియల్ ఇక్కడి నుంచి తరలించారు. లేఔట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఓ తోటలో కొడిమికి చెందిన వ్యక్తి షెడ్డు నిర్మాణానికి ఇక్కడి నుంచి ఇసుక, పెల్లలు, కడ్డీలు తరలించినట్లు చెబుతున్నారు. బలికానున్న హౌసింగ్ ఉద్యోగులు.. మెటీరియల్ పెద్ద ఎత్తున తరలిపోవడంతో హౌసింగ్ ఉద్యోగులు బలికానున్నారు. పనులు నిలబట్టే రోజుకు లేఔట్లలో ఏయే మెటీరియల్ ఎంతెంత ఉందో రికార్డు చేశారు. ఇదంతా సంబంధిత హౌసింగ్ ఏఈ ధ్రువకరించి సంతకం చేసి ఉంటారు. మెటీరియల్ వివరాలను ఆన్లైన్లో కూడా నమోదు చేశారు. జగనన్న లేఔట్లలోని మెటీరియల్‌పై విజిలెన్స్ విచారణ సాగుతోంది. మరో 10–15 రోజుల్లో కొడిమి, ఆలమూరు లేఔట్లలోనూ ఈ విచారణ జరుగుతుంది. ఆన్లైన్లో ఉన్న స్టాక్, ఫిజికల్‌గా ఉన్న స్టాక్‌కు కచ్చితంగా వ్యత్యాసం వస్తుంది. అలావస్తే తమ ఉద్యోగులు బలవుతారని హౌసింగ్ అధికారి ఒకరు వాపోయారు. హౌసింగ్ ఏఈ రాజేష్ ఏమంటున్నారంటే.... కొడిమి జగనన్న లేఔట్ నుంచి మెటీరియల్ ఎత్తుకెళ్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ట్రాక్టర్లలో తరలించినట్లు గుర్తించాం. స్టాక్‌లో తేడా వస్తే తాము ఇబ్బందులు పడతాం. తాటిచెర్ల లేఔట్ పనులు జరుగుతున్నాయి. రెండుమూడు రోజుల్లో టిప్పర్ల ద్వారా మెటీరియల్‌ను అక్కడికి తరలిస్తాం. ఇప్పటికే ఎత్తుకెళ్లిన మెటీరియల్‌పై పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. నిందితుల నుంచి రికవరీ చేయించి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం. కొడిమి జగనన్న లేఔట్లో ఇళ్ల నిర్మాణ మెటీరియల్ ఎత్తుకెళ్తున్న వైనం ఇప్పటికే లక్షలాది రూపాయల సరుకు మాయం మెటీరియల్ తరలింపు వెనుక ‘తమ్ముళ్ల ’ హస్తం -
No Headline
అమ్మ కోసం పోలీసులను ఆశ్రయించిన చిన్నారులు అమ్మ.. అనే రెండక్షరాల పదం అనురాగ చిహ్నం, ఆత్మీయతకు సంకేతం, భాషకు అందని భావం... అయితే ఓ మహిళ తీసుకున్న నిర్ణయం అమ్మతనానికి తలవంపులు తెచ్చింది. ఏకంగా కన్న బిడ్డలను రోడ్డుపై పడేలా చేసింది. నువ్వే కావాలమ్మా అంటూ ఆ బిడ్డలు పడుతున్న వేదనను చూసి అంతా కరిగిపోతున్నా ఆ తల్లి హృదయం మాత్రం కరగడం లేదు. – తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణంలోని పోరాట కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణమ్మ, రంగనాయకుల దంపతులకు ముగ్గురు కుమార్తెలు మేఘన (15), మేఘన, సుష్మ (మొదటి ఇద్దరి పేర్లు మేఘనానే) ఉన్నారు. భార్యాభర్తలు వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. అయితే ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో రంగనాయకులు మృతి చెందాడు. వీధి వ్యాపారంతో పాటు చిన్నపాటి కూలి పనులు చేసుకుంటూ లక్ష్మీనారాయణమ్మ బిడ్డలను చదివించేది. అయితే తాడిపత్రిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో అక్కడి పనులకు వెళ్లిన లక్ష్మీనారాయణమ్మ ఓ యువకుడి ప్రేమలో పడింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టారు. వారి జీవితానికి పిల్లలు అడ్డంకిగా మారడంతో వారిని వదిలి మరోచోట ఇల్లు అద్దెకు తీసుకొని పిల్లలను పట్టించుకోవడం మానేశారు. దాదాపు మూడు నెలలుగా పిల్లల బాగోగులను బంధువులు చూస్తూ వస్తున్నారు. పిల్లలు, బంధువులు ఎంత బతిమలాడినా లక్ష్మీనారాయణమ్మ రాకపోవడంతో పిల్లలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ‘సార్ .. అమ్మ కావాలంటూ’ ప్రాధేయపడ్డారు. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో అర్థంకాక పోలీసులు సందిగ్ధంలో ఉన్నారు. -
రైలు ఢీకొని వృద్ధురాలి దుర్మరణం
అనంతపురం సిటీ: అనంతపురం రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలోని గార్లదిన్నె – కల్లూరు మార్గమధ్యంలో రైలు ఢీకొని శనివారం మధ్యాహ్నం ఓ వృద్ధురాలు (75) మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఊరు, పేరు తెలియని వృద్ధురాలి కాళ్లు, చేతులకు బలమైన గాయాలైనట్లు పేర్కొన్నారు. మృతురాలి ఒంటిపై బ్లూకలర్ చీర మాత్రమే ఉందన్నారు. తమకు సమాచారం అందిన వెంటనే సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం తరలించామని చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసిన వారు సెల్: 94414 45354కు సమాచారం ఇవ్వాలని సూచించారు. హోరాహోరీగా షూటింగ్ బాల్ పోటీలు ఆత్మకూరు: రాష్ట్రస్ధాయి 7వ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ షూటింగ్ బాల్ చాంపియన్ షిప్ పోటీలు శనివారం మండలంలోని తలుపూరు గ్రామ ఉన్నత పాఠశాలలో హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 11 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చిన్న గ్రామాల్లోనూ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు షూటింగ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాముడు తెలియజేశారు. 11 జట్లకు పోటీలు నిర్వహించగా శ్రీసత్యసాయి, కృష్ణ, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలు సెమీస్‌కు చేరుకున్నాయన్నారు. ఆదివారం సెమీస్, ఫైనల్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులు జనవరి 2వ తేదీన పూరిలోని జగన్నాథ స్టేడియంలో జరిగే జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. -
ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డూ నుంచి కాకినాడ ఓడరేవు వరకూ డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలాన్ని వెళ్లదీస్తోంది. సూపర్ సిక్స్ హామీలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. సంపద సృష్టిస్తామని ఇసుక, మట్టి, బూడిదతో బడా కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తోంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం రోడ్డెక్కినా..మాట్లాడినా..ఏం చేసినా కేసులను బహుమతిగా ఇస్తున్నారు. లడ్డూ అంశంలో కళ్యాణదుర్గంలో ర్యాలీ చేస్తే నాతో పాటు 47 మందిపై కేసు నమోదు చేశారు. – తలారి రంగయ్య , కళ్యాణదుర్గం సమన్వయకర్త -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాతల భారీ ర్యాలీ
కర్షకలోకం కడలి తరంగమై కదలివచ్చింది. అనంతపురంలో కవాతు నిర్వహించింది. హామీలిచ్చి మోసం చేసిన కూటమి సర్కారుపై ధ్వజమెత్తింది. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు వెంటరాగా.. జెడ్పీ కార్యాలయం వద్ద నుంచి కలెక్టరేట్ వరకూ గర్జన చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం అన్నదాతలకు అండగా అనంతపురంలో నిర్వహించిన ర్యాలీ విజయవంతమైంది. ● జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకూ నిరసన ప్రదర్శన ● వేలాదిగా తరలివచ్చిన రైతులు, ప్రజలు ● ప్రభుత్వ తీరును ఎండగట్టిన నాయకులు ● అన్నదాతలను ఆదుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత అనంతపురం కార్పొరేషన్: రైతు సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, అన్నదాతలకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రమైన అనంతపురంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించింది. రైతులు, ప్రజలు నిరసన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆరు నెలల కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టమైంది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయం వద్దకు ఎమ్మెల్సీలు మంగమ్మ, శివరామిరెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దారెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, శింగనమల సమన్వయకర్త వీరాంజినేయులు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, రాయదుర్గం మునిసిపల్ చైర్పర్సన్ శిల్పా, గుంతకల్లు వైస్‌చైర్‌పర్సన్ నైరుతిరెడ్డి, టాస్క్ ఫోర్స్ సభ్యులు రమేష్‌గౌడ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్వీ నారాయణ, పార్టీ ముఖ్యనేతలు అనంత చంద్రారెడ్డి, ఉమామహేశ్వర్‌నాయుడు, సాకే చంద్ర, తదితరులు చేరుకున్నారు. మొదటగా జిల్లా అధ్యక్షుడు అనంతతో పాటు సమన్వయకర్తలు.. అంబేడ్కర్, మహానేత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ నుంచి సప్తగిరి సర్కిల్, సూర్యనగర్, సంగమేష్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ సాగింది. మొదటి నుంచి చివరి వరకూ ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతులకు జరిగిన అన్యాయానికి సంబంధించిన ప్లకార్డులను ర్యాలీలో ప్రదర్శించారు. రెట్టింపు ఉత్సాహంతో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అనంతరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మకు 8 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అంతకుముందు కలెక్టరేట్ ఎదుట ప్రచార రథంపై జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, సమన్వయకర్తలు ప్రసంగించారు. -
నేడు సాగునీటి సంఘాల ఎన్నికలు
అనంతపురం అర్బన్: జిల్లాలో సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ శనివారంతో పూర్తవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాగునీటి సంఘాల ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల ఎన్నిక, సంఘాల అధ్యక్షుల, ఉపాధ్యక్షుల ఎన్నిక శనివారంతో పూర్తవుతుందన్నారు. 17వ తేదీన సర్వసభ్య సమావేశాలు నిర్వహించి డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులను ఎన్నుకుంటారని తెలిపారు. జిల్లాలో మొత్తం 149 సాగునీటి వినియోదారులు సంఘాలు, 6 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయని వెల్లడించారు. భారీ నీటి పారుదలలో 54 సాగునీటి వినియోదారుల సంఘాలు, 648 ప్రాదేశిక నియోజకవర్గాలు, మధ్య తరహా నీటి పారుదలలో 6 సాగునీటి వినియోదారుల సంఘాలు, 72 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా చిన్ననీటి పారుదలలో 89 సాగునీటి వినియోగదారుల సంఘాలు, 534 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. వీటి ఎన్నికల నిర్వహణకు వివిధ శాఖల నుంచి సిబ్బందిని నియమించడంతో పాటు శిక్షణ కూడా ఇచ్చామన్నారు. ఓటరుగా నమోదైన వారు ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పకడ్బందీగా నిర్వహిస్తామన్న కలెక్టర్ వి.వినోద్‌కుమార్ -
ఇవీ వైఎస్సార్సీపీ డిమాండ్లు
● అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు అందజేయాలి. ● వరి, వేరుశనగ, మొక్కజొన్న, కంది, ఆముదం, పత్తి, తదితర పంటలను మద్దతు ధరకు అనుగుణంగా కొనుగోలు చేయాలి. అందుకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ● రైతులపై ప్రీమియం భారం వేయకుండా ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి. ● రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ డ్రిప్, స్ప్రింక్లర్లు పంపిణీ చేయాలి. ● ఖరీఫ్ 2023–24 సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా కింద పరిహారం చెల్లించాలి. 2023 రబీలో కరువు జాబితాలో ప్రకటించిన 17 మండలాల రైతులకు రూ.32 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ● వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థలో దళారుల ప్రమేయాన్ని అరికట్టాలి. ● రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే విత్తనాలు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్‌ను ఎమ్మార్పీ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలి. -
ఎటు చూసినా అరాచకాలే..
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీలు, దొంగతనాలే. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఐదు క్లబ్‌లు ఉన్నాయి. విచ్చలవిడిగా మట్కా , బంగాకు విక్రయాలు సాగుతున్నాయి. ఆరు నెలలుగా తాడిపత్రికి వెళ్లాలని పోలీసులకు విన్నవిస్తే శాంతిభద్రతలకు విఘాతం కల్గుతుందని చెబుతున్నారు. నేను లేకున్నా తాడిపత్రిలో దాడులు చేయడం లేదా? రైతులకు మేలు చేయాల్సింది పోయి ఇసుక, బూడిద కోసం ప్రజాప్రతినిధులు గొడవ పడుతున్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేలపై నిఘా పెట్టాలి. – కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి సమన్వయకర్త -
జర్నలిస్టులపై దాడులు చేయడం దుర్మార్గం
అనంతపురం ఎడ్యుకేషన్/అనంతపురం: జర్నలిస్టులపై రాజకీయ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికై నా ఆపకపోతే తాము కూడా ప్రతిఘటించాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీడబ్ల్యూజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లాలో ‘సాక్షి’ విలేకరులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం మచ్చా రామలింగారెడ్డి అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులు, సినిమా స్టార్లకు జర్నలిస్టులపై దాడులు చేయడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. మీడియా అండతో ఎదిగిన మంచు ఫ్యామిలీ టీవీ–9 రిపోర్టర్‌పై దాడి చేయడం హేయమన్నారు. ఇటీవల గుంతకల్లులో ఐన్యూస్ ప్రతినిధిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. జర్నలిస్ట్‌లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం సరికాదన్నారు. టీడీపీ గూండాలను అరెస్టు చేయండి వైఎస్సార్ కడప జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల కవరేజీకి వెళ్లిన సాక్షి టీవీ విలేకరి శ్రీనివాసులు, కెమెరామెన్ రాము, సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై దాడి చేసిన టీడీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి అనిల్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై అమానుషంగా దాడి చేసి, వారి వద్ద ఉన్న కెమెరాలను, సెల్ఫోన్లను లాక్కొని పగులగొట్టడం తీవ్రంగా పరిగణించి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. నేడు నిరసన ప్రదర్శనలు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జెడ్పీ కార్యాలయం సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 10:30 గంటలకు నిరసన కార్యక్రమం ఉంటుందని ఐక్య జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామికవాదులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయంతం చేయాలన్నారు. ముక్తకంఠంతో ఖండించిన జర్నలిస్టు సంఘాలు నేడు జెడ్పీ కార్యాలయం వద్ద నిరసన -
ఆరు నెలల్లో ఏం చేశారో చెప్పండి
కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. అతివృష్టి, అనావృష్టితో నష్టపోతున్నా ఆదుకునే పరిస్థితి మాత్రం లేదు. కేవలం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకే కూటమి నాయకులు సమయాన్ని వృథా చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఆరు నెలల్లో ఏం చేశారో చెప్పే పరిస్థితిలో లేరు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 99 శాతం హామీలను వైఎస్ జగన్ అమలు చేశారు. మీరెన్ని హామీలు అమలు చేశారో చెప్పాలి. – విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త -
ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. సమస్యలను పక్కదారి పట్టించే యోచనలో ఉన్న ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికే వివిధ డిమాండ్లతో వేలాది మందితో ర్యాలీని చేపట్టాం. పంటలు సరిగా పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ర్యాలీ చేస్తున్నామని తెలియడంతో మద్దతు ధర పేరుతో ఇక్కడ ఫ్లెక్సీలు వేయడం కాదు.. ప్రకటించిన మొత్తాన్ని ఇవ్వాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 అందజేశాం. ఐదేళ్ల కాలంలో జిల్లా రైతాంగానికి ఏకంగా రూ.1900 కోట్లు పెట్టుబడి సాయంగా అందింది. కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పినా ఇంత వరకూ ఇవ్వలేదు. ఎరువులు, పురుగు మందులను బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారు. ఎంఆర్పీకే రైతులకు విక్రయించాలి. నకిలీ బయో ప్రాడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా ఉన్నాయి. వాటిని లేకుండా చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మకై ్క వ్యాపారులతో రైతులు పండించిన పంటకు ధర కల్పించడం లేదు. రైతులను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేదిలేదు. ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమై ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు అండగా నిలుస్తాం. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు