SPSR Nellore
-
గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025 – 26 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి నుంచి ఐఐటీ, నీట్ అకాడమీలో ప్రవేశానికి బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త పద్మజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులు సెప్టెంబర్ ఒకటి, 2012 నుంచి ఆగస్ట్ 31, 2016 మధ్య.. బీసీ, ఓసీ విద్యార్థినులు సెప్టెంబర్ ఒకటి, 2014 నుంచి ఆగస్ట్ 31, 2016 మధ్య జన్మించి ఉండాలని చెప్పారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోరే వారు 2024 – 25 విద్యా సంవత్సరంలో పదో తరగతిని రెగ్యులర్ ప్రాతిపదికన చదివి ఉండాలని వివరించారు. ఈ ఏడాది ఆగస్ట్ 31 నాటికి 17 ఏళ్లు మించి ఉండకూడదని తెలిపారు. apbragcet.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల ఆరో తేదీ సాయంత్రం ఐదు తర్వాత దరఖాస్తులను స్వీకరించబోమన్నారు. వివరాలకు 97045 50083, 97045 50096 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
కోలాహలం.. ఛత్రపతి జయంత్యుత్సవం
నెల్లూరు (బృందావనం): దేశభక్తిని చాటుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నగరంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవ ర్యాలీ బుధవారం కోలాహలంగా సాగింది. శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ 496వ జయంతిని పురస్కరించుకుని హిందూ ధార్మిక సంస్థలు, పార్టీలకతీతంగా పలువురు పాల్గొన్నారు. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న శివాజీ జయంతి వేడుకలకు ప్రజలు భారీగా తరలిరావడంతో నగరంలో కోలాహల వాతావరణం కనిపించింది. వక్తలు మాట్లాడుతూ భరతమాత ముద్దు బిడ్డ ఛత్రపతి శివాజీ అని, దేశానికి ఆయన వరమని, ఆయన త్యాగనిరతిని దేశం ఎన్నటికీ మరువదన్నారు. యువత ఛత్రపతి భావజాలాన్ని, శౌర్యాన్ని నింపుకుని ముందుకు సాగితే దేశం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు. యువతకు ఛత్రపతి మార్గదర్శకుడన్నారు. దేశం కోసం, హైందవ ధర్మం కోసం శివాజీ మహరాజ్ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కోలాహలంగా ప్రదర్శన ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కాకు మురళీరెడ్డి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంత్యుత్సవ ర్యాలీ స్థానిక మద్రాస్ బస్టాండ్ దగ్గర ఉన్న వైఎంసీఏ మైదానం నుంచి బయలుదేరి వీఆర్సీ, గాంధీబొమ్మ, శివాజీ సెంటర్, ఏసీ సెంటర్, నర్తకి సెంటర్, కనకమహల్, కొత్తహాల్ సెంటర్, సండే మార్కెట్ సెంటర్ మీదుగా వైఎంసీఏ మైదానానికి చేరింది. అశ్వంపై అధిరోహించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
No Headline
కూటమి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల్లా కాకుండా ‘పచ్చ’ మంద ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష పార్టీ నేతలు, ఆ పార్టీ మద్దతుదారులపై దాడులకు తెగబడుతున్న వీరు.. చివరికి ‘చిరు ఉద్యోగాలతో’ కుటుంబాలను పోషించుకుంటున్న వారిపై కత్తి కట్టి వేధిస్తున్నారు. ఆయా ఉద్యోగాల్లోకి అధికార పార్టీ కార్యకర్తలను చొప్పిస్తున్నారు. బతుకుదెరువు పోతుందని ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయస్థానానికి వెళ్లిన వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. వీరి బెదిరింపులకు బయపడి కొందరు తప్పుకుంటే.. మరి కొందరిపై అకారణంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. కొందరు తమ ఉద్యోగాలు తీయొద్దని, కోర్టు ఉత్తర్తుల ప్రకారం కొనసాగించాలని సదరు ప్రజాప్రతినిధిని కలిసి గోడు వెళ్లబోసుకున్నప్పటికీ కనీసం కనికరం లేకుండా.. రాజీనామా చేసి వెళ్లిపోండి.. లేదంటే రూ.లక్షల్లో రికవరీలు వేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. బెయిల్ కూడా రాకుండా చేస్తామంటూ బెదిరింపులకు దిగారని సదరు ఎఫ్‌ఏలు కన్నీటి పర్యంతమయ్యారు. దగదర్తి మండలానికి చెందిన వాణి, రేవతి భర్తలు ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో గుండె నొప్పితో మరణించారు. గత ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆ స్థానాల్లో వారి భార్యలను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించడంతో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇటువంటి వారితోపాటు ఈ మండలంలో 11 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జీవనోపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నారు. నెల్లూరు (పొగతోట): అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రజాపాలన గాలికి వదిలేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారు. ‘తామెలా దోచుకోవాలి.. తమ పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా దోచి పెట్టాలి’ అనే రీతిగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అభిమానులే లక్ష్యంగా బెదిరింపులు, వేధింపులతో కాలక్షేపం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లో పచ్చ నేతలను పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రంలా ‘ఉపాధి’ శాఖలో ఏళ్ల తరబడి ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని వేధిస్తున్నారు. రాజీనామా చేసి వెళ్తారా? కేసులు పెట్టించమంటారా? అని ఓ వైపు బెదిరిస్తూనే.. మరో వైపు కేసులు పెట్టండి, క్లీన్చిట్ ఉన్నా.. రూ.లక్షలో రికవరీ విధించమంటూ ఆదేశాలు జారీ చేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారు. రాజీనామా చేయండి దగదర్తి, కావలి ఎఫ్‌ఏలకు హెచ్చరిక సోషల్ ఆడిట్లో క్లీన్చిట్ ఉన్నా.. రూ.లక్షల్లో రికవరీకి సిఫార్సు ఆ ప్రజాప్రతినిధి ఆదేశాలను అమలు చేస్తున్న క్లస్టర్ ఏపీడీ నలుగురు ఎఫ్‌ఏలు రాజీనామా.. ఆరుగురు సస్పెన్షన్ కోర్టుకెళ్లిన వారికి బెదిరింపులు, వేధింపులునలుగురు రాజీనామా.. ఆరుగురి సస్పెన్షన్ ప్రజాప్రతినిధి బెదిరింపులతో కావలి మండలంలో కోర్టును ఆశ్రయించిన ఎఫ్ఏల్లో నలుగురు రాజీనామా చేశారు. సోషల్ ఆడిట్లో అవినీతిని చూపించి ఆరుగురిని సస్పెండ్ చేస్తూ డ్వామా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సోషల్ ఆడిట్ జరిగిన మండలాలు పరిశీలిస్తే రాపూరు మండలం రూ.1.30 కోట్లు, సైదాపురం రూ.70 లక్షలు, కలిగిరి రూ.50 లక్షలు, కొండాపురం రూ.60 లక్షలకు పైగా రికవరీలు విధించారు. ఆయా మండలాల్లో సిబ్బందిని ఇప్పటి వరకు సస్పెండ్ చేయలేదు. వారంతా యథావిధిగా విధుల్లో కొనసాగుతున్నారు. కావలి మండలానికి సంబంధించి కోర్టును ఆశ్రయించారనే అక్కసుతో ఆరుగురు ఎఫ్‌ఏలను సస్పెండ్ చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి కావలి మండలంలో రూ.12 లక్షల రికవరీలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ఉద్దేశ పూర్వకంగా విధించినవే కావడం గమనార్హం. భారీగా రికవరీలు విధించమని హుకుం కూటమి అధికారంలోకి రాగానే కావలి మండలంలో 17 పంచాయతీల్లో టీడీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తులను ఎఫ్‌ఏలుగా నియమించారు. ఇది నచ్చని పది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కోర్టును ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకుంటే వారిపై వేధింపులు ప్రారంభించారు. సోషల్ ఆడిట్ సిబ్బందిని ప్రజాప్రతినిధి తన ఇంటికి పిలిపించుకుని ఆయా పంచాయతీల్లో భారీగా రికవరీలు వేయమని ఆదేశించినట్లు సమాచారం. సదరు ప్రజాప్రతినిధికి అనుకూలంగా వ్యవహరిస్తూ, కూటమి ప్రభుత్వానికి జైకొట్టిన కొందరు ఎఫ్‌ఏలకు ‘జీరో’ రికవరీలకు ఆదేశించారు. గౌరవరం, అన్నగారిపాళెం పంచాయతీల్లో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అధిక శాతం అవినీతి జరిగింది. పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు స్వాహా చేశారు. అయితే ఈ రెండు పంచాయతీల్లో ఎఫ్‌ఏలు కూటమికి అనుకూలం కావడంతో గౌరవరం ఎఫ్‌ఏకు రూ.2 వేలు, అన్నగారిపాళెం ఎఫ్‌ఏకు రూ.11 వేలు మాత్రమే రికవరీ విధించారు. సర్వాయపాళెం ఎఫ్ఏ కోర్టును ఆశ్రయించి ఉద్యోగం కావాలని ప్రయత్నం చేయడంతో ఆయనపై రూ.4 లక్షల రికవరీ విధించారు. సర్వాయపాళెం పంచాయతీలో తల్లికి జాబ్ కార్డు ఉండడం, పనులు కొడుకు చేయడం, భార్యకు జాబ్‌కార్డు ఉంటే భర్త పనులు చేయడం తదితర పొరపాట్లు జరిగాయి. ఆయా పొరపాట్లకు సంబంధించి గ్రామ సభలో పనులు మేమే చేశాం. మా అకౌంట్లలోనే నగదు జమ అయిందంటూ సభ్యులు స్పష్టం చేశారు. రాత పూర్వకంగా అధికారులకు తెలియజేశారు. అయినా ప్రజాప్రతినిధి చెప్పాడని, ఆయన ఆదేశాల ప్రకారం రూ. 4 లక్షలకు పైగా రికవరీ విధించారు. మంగళవారం కావలి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఆ మండలానికి సంబంధించి సోషల్ ఆడిట్లో అధికారులు సైతం స్థానిక ప్రజాప్రతినిధి చెప్పినట్లు వ్యవహరించినట్లు సమాచారం. పెద్దపట్టపుపాళెం ఎఫ్ఏ గ్రామసభలో ఎటువంటి రికవరీలు పడలేదు. దీంతో ‘పనులు కల్పించాలంటే రూ.300 లంచం అడిగాడంటూ’ ఆకాశ రామన్న ఉత్తరంతో అతనిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
మితిమీరుతున్న టీడీపీ దౌర్జన్యాలు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పొదలకూరు: టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలు మితిమీరిపోయాయనే విషయాన్ని ఎక్కడికెళ్లినా ప్రజలు తెలియజేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు, వెంకటాచలం మండలాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల వద్ద పొలాలను కొనుగోలు చేసి జగనన్న కాలనీలను నిర్మిస్తే, టీడీపీ మూకలు దౌర్జన్యం చేసి ఆక్రమిస్తున్నారని బాధితులు వాపోతున్నారని తెలిపారు. ఆక్రమించిన వారు ఇల్లు కట్టుకున్నా, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే అసలైన లబ్ధిదారులకు అప్పగిస్తామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లభించడంలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఎదురయ్యే ప్రతి సమస్యపై పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి స్పందించి ప్రజలకు అండగా పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పేదలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఘన నివాళి కల్యాణపురానికి చెందిన పార్టీ నేత లక్ష్మణరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. పట్టణంలోని యాదవవీధికి చెందిన నాయీబ్రాహ్మణ సేవా సంఘ నాయకుడు బెల్లకొండ కాళిదాస్ తల్లి ఇటీవల మృతి చెందడంతో పరామర్శించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు నరసాపురం సుబ్బయ్య ఇటీవల మృతి చెందడంతో నివా ళులర్పించారు. బిరదవోలు ఎంపీటీసీ రావుల దశరథరామయ్యగౌడ్, వెన్నపూస దయాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, యనాదిరెడ్డి, ఆకుల గంగిరెడ్డి, మాలపాటి రమణారెడ్డి, లక్ష్మయ్య, మద్ది రెడ్డి రమణారెడ్డి, బెల్లంకొండ ప్రసాద్, తుమ్మ ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు వేధింపులు
కావలి: ఉపాధి హామీ పథకంలో ఏన్నో ఏళ్లుగా చిరు ఉద్యోగాలతో కుటుంబాలను పోషించుకుంటున్న ఎఫ్ఏలపై కూటమి నేతల వేధింపులు పతాక స్థాయికి చేరాయి. ఆయా స్థానాల్లో టీడీపీ నేతలను నియమించేందుకు అధికారులు నోటి మాటగా అధికారికంగా ఫైల్‌ను తయారు చేసి ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించారు. కోర్టు ఆదేశాలంటూ పోరాడుతున్న ఎఫ్ఏలపై అవినీతి ఆరోపణలతో రికవరీలతో ఇబ్బందులు పెడుతున్నారు. అందులో భాగంగానే కావలి మండలంలో సర్వాయపాళెం, రుద్రకోట, అడవిలక్ష్మీపురం, తుమ్మలపెంట, పెద్దపట్టపుపాళెం ఐదుగురు ఎఫ్‌ఏలను తొలగించారు. ఇక ఆముదాలదిన్నె ఎఫ్ఏ విషయంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని తమ వాడని చెప్పడంతో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ ఇచ్చి సరిపెట్టారు. తొలగించిన ఎఫ్‌ఏలు అందరూ కూడా 15, 10 ఏళ్ల నుంచి నెలకు రూ.10 వేలు మాత్రమే జీతంగా తీసుకుంటూ పని చేస్తున్నారు. వీరిని తొలగించడానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ గంగాభవాని మంగళవారం ఏకంగా కావలి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఉపాధి హామీ పనుల్లో కూలీల హాజరు, పనుల కొలతల్లో తేడాలకు సంబంధించి రూ.11,37,684 అవినీతి జరిగిందని ప్రకటించారు. జరిగిన నష్టం నగదును తొలగించిన ఎఫ్ఏల నుంచి వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ ప్రకటించారు. సోషల్ ఆడిట్లో రికవరీలు పడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. రూ.లక్షల్లో రికవరీలు ఉన్న సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆ ప్రకారం అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. రికవరీలకు సంబంధించి ఎఫ్‌ఏలు తమ వద్ద ఉన్న వివరాలను డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్, ఉన్నతాధికారులకు చూపించి తగ్గించుకునే అవకాశం ఉంది. – గంగాభవాని, డ్వామా పీడీ పరిశీలించి చర్యలు తీసుకుంటాం -
వ్యక్తిపై హత్యాయత్నం
నెల్లూరు(క్రైమ్): పాతకక్షలను మనస్సులో పెట్టుకొని వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడ్ని గంటల వ్యవధిలోనే నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. రాయపుపాళెంలో చికెన్ పకోడా దుకాణాన్ని నిర్వహిస్తున్న ఏసీనగర్‌కు చెందిన పఠాన్ మౌలాలీ వద్దకు అదే ప్రాంతానికి చెందిన గంగాధర్ 20 రోజుల క్రితం వెళ్లారు. చికెన్ పకోడా ఇవ్వాలని కోరగా, అందజేయడంలో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి గురైన గంగాధర్.. దుకాణంలో ఉన్న చికెన్ పకోడాను కిందపడేశారు. దీంతో వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాయపుపాళెం – రామచంద్రాపురం జంక్షన్లో గంగాధర్‌పై మౌలాలీ కత్తితో మంగళవారం రాత్రి దాడి చేసి గాయపర్చారు. ఈ మేరకు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం ఎస్సై రెహమాన్ గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంతినగర్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం కావలి: పట్టణంలోని ముసునూరులో గల ఓ ఇంట్లో ఏసీ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం మంగళవారం రాత్రి సంభవించింది. దీంతో భయాందోళనలకు గురైన కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. మంటలతో ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పింది. 15 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.ఐదు లక్షల నగదు కాలిబూడిదైందని బాధితుడు నరసయ్య వాపోయారు. బాధిత కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఉపాధి హామీ వ్యవస్థను దెబ్బతీయొద్దు నెల్లూరు (పొగతోట): క్షేత్రస్థాయిలో వివిధ రకాల ఒత్తిళ్లు, బెదిరింపులు ఉండొచ్చని, దీనికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వ్యవస్థను దెబ్బతీయొద్దని డ్వామా పీడీ గంగాభవాని పేర్కొన్నారు. నగరంలోని డ్వామా కార్యాలయంలో క్లస్టర్ ఏపీడీలు, ఏపీఓలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒత్తిళ్లను అధిగమించి పథకం సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అందరూ అనుభవమున్న అధికారులేనని, సమస్యలను అధిగమించి పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలని పేర్కొన్నారు. పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను లక్షకు పెంచాలని ఆదేశించారు. ఆర్బీకేలో జేసీ పరిశీలన బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని రేబాలలో గల రైతు భరోసా కేంద్రాన్ని జేసీ కార్తీక్ బుధవారం పరిశీలించారు. పరికరాలను పరిశీలించి రైతులతో ముచ్చటించి వారి సమస్యలను ఆరాతీశారు. ధాన్యం మద్దతు ధరతో పాటు తేమ శాతంలో సడలింపులిచ్చి గోడౌన్లను ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. రైతులు తెలియజేసిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాతకక్షలతో మహిళ ఇంటికి నిప్పు పొదలకూరు: పాతకక్షలను దృష్టిలో ఉంచుకొని పూరింటికి ఓ వ్యక్తి నిప్పుపెట్టిన ఘటన మండలంలోని బిరదవోలులో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల వివరాల మేరకు.. గ్రామంలో పూరింట్లో నివాసం ఉంటున్న కై తేపల్లి లక్ష్మమ్మకు అదే గ్రామానికి చెందిన రంగయ్య కుటుంబానికి మధ్య విభేదాలున్నాయి. ఈ తరుణంలో ల క్ష్మ మ్మ తన కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండ గా, రంగయ్య నిప్పు పెట్టారు. మంటలు వ్యా పించడంతో లక్ష్మమ్మ, ఆమె కుమార్తె బయటకు పరుగులు తీశారు. గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై హనీఫ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. పెన్షనర్ల సర్వసభ్య సమావేశం నేడు నెల్లూరు(అర్బన్): పురమందిర ప్రాంగణంలోని వర్ధమాన సమాజ మందిరంలో ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని గురువారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్నామని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, వెంకయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెన్షనర్ల పెండింగ్ సమస్యలు, డీఆర్ బకాయిలు తదితరాలపై చర్చించనున్నామని, సభ్యులు సకాలంలో హాజరుకావాలని కోరారు. -
నూతన సాంకేతికతను ప్రోత్సహించాలి
మాట్లాడుతున్న సునీత వెంకటాచలం: ఆర్థిక స్థిరత్వం, గ్రామీణ స్వయంప్రతిపత్తి కోసం నూతన సాంకేతికతలు, వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు కోరారు. సుస్థిర జీవనోపాధులవైపు నూతన మార్గదర్శనలు, గ్రామీణ వృత్తుల విభజన అనే అంశంపై కాకుటూరు సమీపంలోని వర్సిటీలో జాతీయ సదస్సును బుధవారం నిర్వహించారు. గూగుల్ మీట్ ద్వారా వర్చువల్ విధానంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్చార్జి రిజిస్ట్రార్ సునీత మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి కోసం కొత్త అవకాశాలను గుర్తించి, వాటి అమలు దిశగా ఈ సదస్సు ఎంతో ఉపయోగకరంగా మారనుందని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ఆంకాలజీ ప్రొఫెసర్ రఘునాథరావు, డాక్టర్ మహేష్ పవన్, వీఎస్‌యూ ప్రిన్సిపల్ విజయ తదితరులు పాల్గొన్నారు. -
జీబీఎస్ కలకలం
● అరవపాళెంలోముమ్మరంగా పారిశుధ్య పనులు సంగం: మండలంలోని అరవపాళెంలో గులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జీబీఎస్ లక్షణాలతో మంగళవారం నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. అతనికి అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ సర్పంచ్, అధికారులు అరవపాళెంతోపాటు పుట్టువారిగుంట గ్రామాల్లో బుధవారం ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వే, శానిటేషన్, వాటర్ ట్యాంక్ క్లోరినేషన్, వాటర్ టెస్టింగ్‌లను నిర్వహించారు. డాక్టర్ శ్రీనివాసులరెడ్డి ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించారు. జ్వరం, దగ్గు, వాంతులు, విరోచనాలు, జలుబు ఈ వ్యాధి లక్షణాలని, వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత తిమ్ముర్లు, నరాల బలహీనత, కండరాల నొప్పులు వస్తాయన్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రాణాపాయం ఉంటుందని, ఈ వ్యాధి వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని డాక్టర్ అశోక్ తెలిపారు. -
కూటమి దెబ్బకు కదిలిన కమిషనర్ కూసాలు
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆకస్మికంగా బదిలీ కావడం స్థానికంగా చర్చకు దారి తీసింది. మరో ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న ఆయన్ను తప్పించడం వెనుక అధికార పార్టీ రాజకీయ కుట్రలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న పట్టణాని కి ఆక్రమణలు శాపం కాకూడదని భావించిన కమిషనర్ ప్రధాన రహదారుల్లో వాటిని తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ ఆక్రమణలు తొలగించకుండా అడ్డుకునేందుకే ఆయన్ను ఆకస్మికంగా బదిలీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటరీగా వ్యవహరిస్తున్న వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పావులు కదిపి కమిషనర్ కూసాలు కదిలించారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తామనుకున్న లక్ష్యంలో భాగంగా ఆయన్ను బదిలీ చేశామని జబ్బలు చరుచుకున్నా.. ఇది బుచ్చి పట్టణానికి భవిష్యత్‌లో పెను శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. మేజర్ పంచాయతీ స్థాయి నుంచి నగర పంచాయతీ హోదా సంతరించుకున్న బుచ్చిరెడ్డిపాళెంలోని ప్రధాన రహదారులు ఇప్పటికీ ఇరుకుగా ఉన్నాయి. భవిష్యత్‌లో గ్రేడ్–1 మున్సిపాలిటీ అవతరించే స్థాయిలో పట్టణం విస్తరిస్తోంది. ఇదే సమయంలో రహదారులు విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఆక్రమణలు తొలగిస్తే.. భవిష్యత్ కాలంలో పట్టణం అభివృద్ధి దిశగా అడుగులు పడుతాయి. లేదంటే ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా మారుతుంది. బుచ్చి అభివృద్ధిలో తనదైన మార్కు చూపించిన కమిషనర్ ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకే ఆకస్మిక బదిలీ చక్రం తిప్పిన రియల్ ఎస్టేట్, వ్యాపారులు పట్టణానికి శాపంగా మారనున్న ఈ పరిణామం -
పకడ్బందీగా రీసర్వే చేయండి
సంగం: మండలంలోని కొరిమెర్ల కండ్రికలో జరుగుతున్న రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ కె.కార్తీక్ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. బుధవారం రీసర్వే జరుగుతున్న తీరును పరిశీలించి, తహసీల్దార్ సోమ్లానాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ భూములకు సంబంధించిన రైతులతో మాట్లాడారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 35 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నామన్నారు. భూములకు సంబంధించిన పట్టాదారులకు నోటీసులు అందజేసి రీసర్వే ప్రక్రియను జరపాలన్నారు. జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ భూమిరెడ్డి పావని, డీఎస్‌ఎల్‌ఓ నాగశేఖర్, సర్వేయర్ శివరంజని, ఆర్ఐ సల్మా, వీఆర్ఓలు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓగా మల్లికార్జునరెడ్డి నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఐటీడీఏ పీఓగా మల్లికార్జునరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఆయనకు అడిషనల్ డైరెక్టర్‌గా తాత్కాలిక పదోన్నతిని కల్పిస్తూ నెల్లూరు ఐటీడీఏ పీఓగా ఉత్తర్వులను ఇచ్చారు. నేడు లంకా దినకర్ రాక నెల్లూరు(అర్బన్): ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ గురువారం రాత్రి నెల్లూరుకు వస్తారని జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ డీడీ సదారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21వ తేదీ జిల్లా అధికారులతో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం అమలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారన్నారు. డాక్టర్ విజయకుమార్ రాక రేపు మాల సంక్షేమ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయకుమార్ ఈ నెల 21న నెల్లూరుకు చేరుకుని రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22వ తేదీ సంబంధితశాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం కలెక్టర్‌తో సమావేశమవుతారు. ఆర్పీ సిసోడియా రాక రేపు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా శుక్రవారం నెల్లూరుకు రానున్నారు. అధికారులతో రెవెన్యూ సమస్యలపై చర్చిస్తారు. మితిమీరిన టీడీపీ నేతల అరాచకాలు ● ప్రజా సంక్షేమం గాలికి ● అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మేస్తున్నారు ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ధ్వజం నెల్లూరు (వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు, అరాచకాలు ఎక్కువయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతోందని విమర్శించారు. నెల్లూరులోని సీపీఎం జిల్లా కార్యాలయంలో బుధవా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోలార్ విద్యుత్ పేరుతో ఒప్పందం చేసుకుని రైతుల నుంచి తీసుకున్న భూములను అదానీకి కట్టబెట్టిందని, ఇది చాలదన్నట్టుగా యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని యూనిట్ విద్యుత్‌ను రూ.4.23 కొనేందుకు సిద్ధపడిందన్నారు. ఈ ఒప్పందంలో భారీగా ముడుపులు దండుకున్నారని ఆరోపించారు. దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా చూస్తూ హిందూ మతాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని రిమ్స్‌లో రేడియోలజీ విభాగంలో మతం ప్రాదిపదికన నియామకాలు జరపాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ మూతపడిన కారణంగా 400 మంది ఉద్యోగులు వారి కుటుంబాలు వీధిన పడ్డాయని, వారికి చెల్లించాల్సిన రూ.23 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్లను టీడీపీ నేతలు నరికి విక్రయాలు సాగిస్తున్నా.. అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వరికుంటపాడు అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్లను నరికిన విషయమై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకులపై దాడి చేసిన టీడీపీ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, అజయ్‌కుమార్, వెంగయ్య, మంగలి పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు
నెల్లూరు(బారకాసు): అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. డైకస్‌రోడ్డులోని ఎన్‌జేఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. గత సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యమిచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు – నేడు కింద తీర్చిదిద్దడంతో బడిబాట పట్టే పిల్లల సంఖ్యా పెరిగిందని చెప్పారు. వీటిని చూసి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే ఇప్పుడు డేటా అవసరమంటూ ఆ విషయాన్ని దాటేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వృద్ధి రేటు 15 శాతానికి చేరితేనే అన్ని పథకాలను అమలు చేస్తామంటున్నారని, అవి అందే పరిస్థితి లేదనే విషయం దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. పిల్లల చదువుకు గండికొట్టడం సరికాదని హితవు పలికారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎందుకు ఇవ్వాలనే ధోరణిలో మంత్రి లోకేశ్ ఉన్నారన్నారు. 2019 నాటికి అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన దాదాపు రూ.రెండు వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చెల్లించిందని తెలిపారు. పాఠశాల.. కళాశాల విద్యను అనుసంధానం చేసేందుకు బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ను ఏర్పాటు చేశారని, ఈ కారణంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. విద్యారంగాన్ని ప్రస్తుతం భ్రష్టు పట్టిస్తున్నారని, విద్యార్థుల్లేకుండా విజన్ – 2047ను ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నాలుగు విడతల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాల్సి ఉందని, ఒక్క విడతా.. అదీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ఆరోపించారు. ప్రైవేట్ రంగానికి లబ్ధి చేకూరుస్తారే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ పనినీ చంద్రబాబు చేయరని ధ్వజమెత్తారు. హెరిటేజ్ లాభాల్లో ఉండగా, ప్రభుత్వ రంగానికి చెందిన విజయ డెయిరీ నష్టాల్లో ఉందనే అంశాన్ని దీనికి ఉదాహరణగా చూపారు. కూటమి ప్రభుత్వంపై మండిపడిన నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి -
సమస్యాత్మకంగా మారిన ఆక్రమణలు
బుచ్చిరెడ్డిపాళెం బస్టాండ్ నుంచి చెన్నూరు రోడ్డు వరకు ఆక్రమణలు అత్యంత సమస్యాత్మకంగా మారాయి. ఈ క్రమంలో ఇటీవల కమిషనర్ చంద్రశేఖరరెడ్డి పట్టణాభివృద్ధిని కాంక్షించి రోడ్డును ఆక్రమించిన వ్యాపారులను తొలగించేందుకు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు లోకాయుక్తను ఆశ్రయించారు. లోకాయుక్త ఇచ్చిన నోటీసులను కొంత మంది రియల్టర్లకు కమిషర్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే కమిషనర్ బదిలీ అంటూ ప్రచారం జరిగినప్పటికీ పలు ఆక్రమణల తొలగింపు ప్రక్రి య కొనసాగింది. నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్‌కు వెళ్లే రోడ్డులో నీటిపారుదల శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించి కొందరు వ్యాపారులు పక్కాగా షాపులు నిర్మించి నిర్వహిస్తున్నారు. వాటిని కూడా తొలగిస్తే చెన్నూరు రోడ్డు నుంచి మార్కెట్‌కు, బైపాస్ రోడ్డు వరకు రహదారి విశాలంగా ఉంటుందనే ఆలోచనతో కమిషనర్ కొంత మేర కొలతలు కూడా తీశారు. ఆ స్థలం నీటిపారుదల శాఖకు చెందినది కావడంతో ఆ శాఖ జిల్లా ఎస్ఈ, ఈఈలకు కమిషనర్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.కోట్ల విలువైన ఆ స్థలాలను వదులు కునేందుకు ఇష్టపడని వ్యాపారులు పైరవీలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆకస్మికంగా కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డిని రాష్ట్ర పురపాలక శాఖా కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులు అందాయి. ఆ స్థానంలో నెల్లూరు కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డబ్బుగుంట బాలకృష్టను నియమిస్తూ ఆదేశాలు సైతం వచ్చా యి. ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న ఉద్యోగులను బదిలీలు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ ఆయన బదిలీ జరగడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఆయన బదిలీ వెనుక ఎమ్మెల్యే కోటరీ శక్తులు బలంగా పని చేసినట్లు సమాచారం. కమిషనర్ బదిలీ విషయం తెలుసుకుని కలకలం రేగడంతో, నష్ట నివారణ చర్యల్లో భాగంగా బుధవారం బుచ్చిరెడ్డిపాళెం వచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రోడ్డు మార్జిన్ నుంచి తొలగించిన చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చారు. ఆక్రమణలను తొలగింపును అడ్డుకునేందుకు చర్యలు తాత్కాలికంగా ఉపశమనం కలిగించవచ్చు కానీ, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ అభివృద్ధికి ఆదిలోనే హంసపాదు పడినట్లుగా అయింది. -
ఉపాధి పథకం అధికారులకు ప్రజాప్రతినిధి ఆదేశాలు
ఉపాధి హామీ పథకం ‘పచ్చ’ మయం ఉపాధి హామీ పథకం అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరుగా మారిపోయింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనులు జరుగుతున్నాయి. ఆ పార్టీ కార్యకర్తలే మేట్లు, ఫీల్డ్ అసిసెంట్లుగా వ్యవహరిస్తున్నారు. కూలీల కడుపులు కొట్టి తమ జేబులు నింపుకుంటున్నారు. వీరి అక్రమాలకు అడ్డుగా ఉన్నారని, తమకు అనుకూలంగా లేని ఫీల్డ్ అసిసెంట్లను తొలగించి టీడీపీ కార్యకర్తలను పెట్టి పనులు జరుపుకుంటున్నారు. తమ ఉద్యోగాలు తమకు కావాలని పోరాడుతున్న వారిపై కేసులు పెట్టమని, భారీగా రికవరీలు చేయమని సిఫార్సులు చేస్తూ మరింతగా వేధిస్తున్నారు. ఈ రకంగా వేధింపులు బెదిరింపుల్లో కావలి ప్రజాప్రతినిధి ప్రథమ స్థానంలో ఉన్నారని జిల్లా ఉపాధి హామీ కార్యాలయంలో చర్చ నడుస్తోంది. ‘నేను చెప్పినట్లు చేస్తారా.. మిమ్మల్ని ఊడగొట్టించమంటారా? అంటూ తమనే బెదిరిస్తూ, ఒత్తిడి పెంచుతున్నట్లు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఇన్సులిన్‌కూ కటకటే..!
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని కూటమి ప్రభుత్వం తరచూ ఊదరగొడుతున్నా, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అదంతా ఒట్టిదేనని తేలిపోతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఆధారపడే ఇన్సులిన్ వైల్స్ సరఫరాలో నిర్లక్ష్య ధోరణిని కనబరుస్తోంది. పీహెచ్‌సీలకు ఐదు నెలలుగా వీటి సరఫరా నిలిచిపోయిందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని సిబ్బందే నిర్ధారిస్తుండటం గమనార్హం. ఆత్మకూరు: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని కనబరుస్తోంది. పెద్దాస్పత్రి, పీహెచ్‌సీలకు ఇన్సులిన్ వైల్స్ ఐదు నెలలుగా సరఫరా కావడంలేదు. వాస్తవానికి షుగర్ వ్యాధి తీవ్రమైతే దీన్ని వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి సంబంధించిన మందులు ఖరీదు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వాస్పత్రులపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. దీంతో జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లోని ఆస్పత్రులకు అన్ని రకాల మందులు సక్రమంగా సరఫరా అయ్యేవి. ఇన్సులిన్ వైల్స్ తగినంత అందుబాటులో ఉండేవి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో అర్బన్ హెల్త్ కేంద్రాలు 25, పీహెచ్‌సీలు 52 ఉన్నాయి. నెల్లూరులో జీజీహెచ్, ఆత్మకూరులో ప్రభుత్వ జిల్లా వైద్య కేంద్రం, కావలి, కందుకూరులో ప్రాంతీయ వైద్య కేంద్రాలు, ఉదయగిరి, వింజమూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు, కోవూరు, రాపూరు ప్రాంతాల్లో సీహెచ్‌సీలున్నాయి. వీటికి మందులు ఏపీఎంఐడీఎస్ నుంచి సరఫరా అవ్వాలి. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు చేరితే అక్కడి నుంచి మండలాలకు సరఫరా చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో పీహెచ్‌సీలకు మందుల సరఫరాను తగ్గించారని సమాచారం. మందుల సరఫరా ఇలా.. వివిధ రోగాలకు సంబంధించిన మందులను ఏడాదిలో నాలుగుసార్లు సరఫరా చేస్తారు. పేషెంట్ల తాకిడిని బట్టి ఒక్కో పీహెచ్‌సీకి రూ.50 వేల నుంచి రూ.3.5 లక్షల విలువగల 84 రకాల నుంచి 172 రకాల మందులు సరఫరా అవుతాయి. ఏరియా, జీజీహెచ్ లాంటి కేంద్రాలకు రూ.15 లక్షల విలువగల మందులను సరఫరా చేస్తారు. ఆన్లైన్లోనే ఇండెంట్ ప్రక్రియ ఆయా పీహెచ్‌సీల పరిధిలోని షుగర్ పేషెంట్ల వివరాల మేరకు.. గతంలో పంపిణీ చేసిన షుగర్ వైల్స్‌ను దృష్టిలో ఉంచుకొని కావాల్సిన మేరకు ఇండెంట్‌ను ఫార్మసిస్ట్‌లు పెడతారు. ఇలా ఒక్కో పీహెచ్సీ కేంద్రంలో 300 నుంచి 500 వరకు షుగర్ వైల్స్‌ను ఇండెంట్లో నమోదు చేస్తారు. ఈ వ్యవహారమంతా ఆన్లైన్ ద్వారానే జరగాల్సి ఉంది. ఒక్కో వైల్లో 10 ఎమ్మెల్ ఇన్సులిన్ ఉంటుంది. వైల్స్లోనూ 30 / 70.. 40 ఐయూ ఇలా రెండు రకాలుంటాయి. అయితే ఇండెంట్లో ఇన్సులిన్ అనే కాలమ్‌ను తాజాగా ఎత్తేశారని సమాచారం. దీంతో రానున్న త్రైమాసికంలో దీని సరఫరా నిలిచిపోనుందని తెలుస్తోంది. కొన్ని పీహెచ్‌సీల్లో వైల్స్ పూర్తవ్వడంతో సమీప కేంద్రాల నుంచి తెచ్చుకొని అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిబ్బంది పేర్కొంటున్నారు. కొనుగోలు భారం పీహెచ్‌సీల్లో వైల్స్ కొరత కారణంగా రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఇన్సులిన్ 10 ఎమ్మెల్ను రూ.150 నుంచి రూ.170 వరకు విక్రయిస్తున్నారు. వీటి సరఫరాను పునరుద్ధరించాలని రోగులు కోరుతున్నారు. కాగా ఈ విషయమై ఎడీఎంహెచ్ఓ ఖాదర్‌వలీని సంప్రదించగా, ఫార్మసిస్ట్‌లు నమోదు చేసే ఇండెంట్ మేరకు సరఫరా అవుతోందని చెప్పారు. ఈ త్రైమాసికంలో ఇన్సులిన్ సరఫరా కాని విషయాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని బదులిచ్చారు. పీహెచ్‌సీలకు ఐదు నెలలుగా నిలిచిన సరఫరా ఆన్లైన్లో ఇండెంట్ కాలమే ఎత్తివేత ప్రజారోగ్యాన్ని విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌గా కొనుగోలు చేసుకోవచ్చు ఆస్పత్రిలో ఇన్సులిన్ వైల్స్ తగినంత ఉన్నాయి. అవకాశం బట్టి ప్రైవేట్‌గా కొనుగోలు చేయొచ్చు. అయితే ఇప్పటి వరకు ఆ పరిస్థితే రాలేదు. ఫార్మసిస్ట్‌లు నమోదు చేసే ఆన్లైన్ కాలమ్‌ను పరిశీలిస్తా. పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూస్తా. – శేషారత్నం, ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ -
ఫొటో షూట్ పేరుతో రాసలీలలు!
నెల్లూరు సిటీ: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు డీఐజీ కిరణ్‌కుమార్ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన పలువురు మహిళా ఉద్యోగులను ఫొటోషూట్ల పేరుతో దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి రాసలీలలు సాగించారని సమాచారం. ఆ దుర్మార్గాలను ఫొటోలు తీసుకుని దాచుకునేవాడని తెలుస్తోంది. కిరణ్‌కుమార్ చీకటి జీవితాన్ని వివరిస్తూ ఆయన భార్య అనసూయరాణి బయటపెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. భార్యకు దూరంగా ఉంటూ...గుంటూరు జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్, అనసూయరాణి ప్రేమించుకుని 1998లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. కిరణ్‌కుమార్‌కు 2009లో రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. కిరణ్‌కుమార్, అనసూయరాణి మధ్య ఏడాది కిందట విభేదాలు తలెత్తాయి. ఇద్దరూ విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనసూయరాణి వద్ద కుమారుడు ఉండేలా, వారి బాగోగులను కిరణ్‌కుమార్ చూసుకునేలా పది నెలల కిందట పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా ఒప్పందాలు జరిగాయి. సోమవారం విజయవాడలో ఒక ఫంక్షన్లో కలిసిన కిరణ్‌కుమార్, అనసూయరాణి మధ్య గొడవ జరిగింది. తనతోపాటు తన కుమారుడిపై కిరణ్‌కుమార్ విచక్షణారహితంగా దాడి చేశారని అనసూయరాణి గుంటూరు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వికృత చేష్టలు భరించలేక విడిగా ఉంటున్నానని ఆమె తెలిపారు. కిరణ్‌కుమార్ ఇతర మహిళలతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను తనకు పంపించి మానసిక క్షోభకు గురిచేసేవాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె కొన్ని ఫొటోలను కూడా బయటపెట్టారు. -
మధ్యాహ్న భోజన పథకంపై ఎంఈఓ విచారణ
● హెచ్ఎంకు మెమో, నిర్వాహకురాలికి నోటీసు ఆత్మకూరు: పట్టణంలోని ఏసీఎస్ఆర్కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా లేదని ఫిర్యాదులు రావడం, పత్రికల్లో కథనాలు రావడంతో జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు ఎంఈఓ జ్యోతి మంగళవారం పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, విచారణ చేపట్టారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఎంఈఓ ఆహార పదార్థాలను రుచి చూశారు. విద్యార్థులను భోజన నాణ్యతపై నిర్భయంగా చెప్పాలని కోరడంతో కొందరు ఎంఈఓ దృష్టికి తీసుకొచ్చారు. హెచ్ఎం హజరత్తయ్య, ఉపాధ్యాయురాలు కె.సుజాతను ఎంఈఓ విచారించారు. పాఠశాల విద్యా కమిటీ సభ్యులను, కొందరు విద్యార్థుల తల్లులతోనూ ఎంఈఓ జ్యోతి విడివిడిగా మాట్లాడారు. పథకం నిర్వాహకురాలికి నోటీసు ఇచ్చినట్లు మరోసారి ఇలా జరగకుండా విద్యార్థులకు చక్కని భోజనం పెట్టాలని హెచ్చరించినట్లు తెలిపారు. హెచ్ఎంకు మెమో ఇచ్చినట్లు ఎంఈఓ జ్యోతి వివరించారు. ఈ మేరకు నివేదికను డీఈఓకు పంపనున్నట్లు ఆమె తెలిపారు. -
వంద కేజీల గంజాయి స్వాధీనం
● ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కందుకూరు: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.17.50 లక్షల విలువైన 100 కేజీల గంజాయితోపాటు, కారును స్వాధీనం చేసుకున్నారు. కందుకూరులో డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కొంతల్లి గ్రామానికి చెందిన ఇల్లపు నాగేశ్వరరావు, నాతవరం మండలం మన్నేపురట్ల గ్రామానికి చెందిన తాడి నాగసత్యన్నారాయణ, దుర్గారావు, ఆనందవేలు మరో ఇద్దరితో కలిసి గంజాయి అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నారు. వీరు ఒడిశా రాష్ట్రం నుంచి తమిళనాడుకు గంజాయిని రవాణా చేస్తుంటారు. ఈ మేరకు ఉలవపాడు పోలీసులకు సమాచారం రావడంతో సోమవారం ఉలవపాడు సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయం వద్ద వాహనాల తనిఖీని చేపట్టారు. క్యాబ్ వాహనాన్ని పోలీసులు ఆపి అందులో ఉన్న ఇల్లపు నాగేశ్వరరావు, తాడి నాగసత్యన్నారాయణను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో వీరితో పాటు ఉన్న దుర్గారావు, ఆనందవేలు అక్కడి నుంచి తప్పించుకు పారిపోయారు. అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నించడంతో గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు. కారు డోర్లు, స్పీకర్ బాక్స్‌ల స్థానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అమరికల్లో గంజాయిని ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నట్లు చెప్పారు. కారు డోర్లలో దాచి ఉంచిన రూ.17.50 లక్షల విలువైన 95 ప్యాకెట్ల (100 కేజీల) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు కారును, సెల్ఫోన్లు వంటివి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో ఉండే వ్యక్తులతో కుదిరిన ఒప్పందం మేరకు వీరు కావలి వద్దకు గంజాయిని చేర్చాల్సి ఉందని, ఆ తర్వాత అక్కడి నుంచి వేరే బ్యాచ్ గంజాయిని తమిళనాడు వరకు చేరుస్తారన్నారు. పారిపోయిన దుర్గారావు, ఆనందవేలును కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. కార్యక్రమంలో కందుకూరు సీఐ కే వెంకటేశ్వరరావు, ఉలవపాడు ఎస్సై కే అంకమ్మ, కానిస్టేబుల్లు ఎన్ శంకర్, పీ శ్రీనివాసరావు, కే బ్రహ్మయ్య, ఎస్కే రిజ్వాన్, జయశంకర్, ఎం మాలకొండయ్య, డీ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
వీఎస్‌యూ వైస్ చాన్సలర్‌గా అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ నూతన వైస్ చాన్సలర్‌గా అల్లం శ్రీనివాసరావు మంగళవారం నియమితులయ్యారు. రాష్ట్ర గవర్నర్ పలు యూనివర్సిటీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఢిల్లీ టెక్నాలాజికల్ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు మూడేళ్ల పాటు వీఎస్‌యూ వైస్ చాన్సలర్‌గా కొనసాగుతారు. ఆడిట్‌పై ప్రత్యేక దృష్టి ● ఎస్‌హెచ్‌జీలు ఆర్థిక ప్రగతి సాధించాలి ● డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి నెల్లూరు (పొగతోట): జిల్లా, మండల సమాఖ్యలు ఇంటర్నల్ ఆడిట్ విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఖర్చులు, ఆదాయాల విషయాల్లో లోటుపాట్లు ఉండకూడదని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. మంగళవారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా సమాఖ్య సమావేశంలో పీడీ మాట్లాడారు. స్వయం సహాయక గ్రూపు మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఉల్లాస్, సూర్యఘర్ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు కుటీర పరిశ్రమల ద్వారా చేస్తున్న ఉత్పత్తులను మార్కెటింగ్ కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఉత్పత్తులకు సంబంధించి ఆన్లైన్లో మార్కెటింగ్ జరిగేలా విక్రయాలపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డీపీఎం కామాక్షి, రవికుమార్, సూరిబాబు, వెంకటేశ్వర్లు, జిల్లా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి వరికుంటపాడు: మండలంలోని తోటలచెరువుపల్లెలో వైఎస్సార్సీపీ కార్యకర్త పులి వెంకటప్రసాద్‌పై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు మౌలాలి, అతని కుమారుడు మరో ముగ్గురు కలిసి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. బాధితుడి కథనం మేరకు.. వెంకటప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ విషయాలు మాట్లాడుకుంటుండగా దొడ్ల మౌలాలి మద్యం తాగి వచ్చి నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. ఉదయం ప్రసాద్ బస్టాండ్ సెంటరుకు వెళ్లి తిరిగి వస్తుండగా మౌలాలి మరి కొంత మందితో కలిసి మరోసారి దాడి చేసి గాయపరిచారు. రాత్రి ఫిర్యాదు చేసేందుకు వరికుంటపాడు స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు తీసుకోలేదని, మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఎస్ఐ రఘునాథ్‌ను వివరణ కోరగా ప్రసాద్ కుటుంబ సభ్యులు టీడీపీని విమర్శిస్తూ తనపై దాడి చేశారని మౌలాలి ఫిర్యాదు చేేశాడన్నారు. మంగళవారం ఉదయం ప్రసాద్‌పై మౌలాలి మరికొంత మంది తనపై దాడి చేశారని ప్రసాద్ ఫిర్యాదు చేశాడన్నారు. ఈ మేరకు ఇద్దరి ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నిబంధనలు అతిక్రమించొద్దు
సైదాపురం: నిరుపేద గిరిజనులు, పేదలు సాగు చేసుకునే పొలాలను నిబంధనలను మితిమీరి ఎలా స్వాధీనం చేసుకుంటారని, నిబంధనలు అతిక్రమించొద్దంటూ హైకోర్టు రెవెన్యూ అధికారులకు మొట్టికాయలు వేస్తూనే.. ఈ విషయంలో నిబంధనలు ప్రకారం నడుచుకోవాలంటూ ఈ నెల 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపురంలోని 793 ఏ సర్వే నంబర్లో ఉన్న 114 ఎకరాల భూమికి మైనింగ్ లీజు ఉండేది. గడిచిన కొన్నేళ్లగా లీజు గడువు కూడా ముగిసింది. ఈ క్రమంలోనే సమీపంలోని కమ్మవారిపల్లికి చెందిన ఐదు గిరిజన కుటుంబాలతో పాటు మరో 10 మంది నిరుపేదలు ఎకరా నుంచి రెండెకరాల వంతున అక్రమించుకుని నిమ్మ తోటలను సాగు చేసుకుంటున్నారు. అయితే సాగులో ఉన్న ఆ భూములను స్వాధీనం చేసేందుకు అధికారులు ప్రయత్నించడంతో గిరిజనులతోపాటు పేదలు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలే తప్ప ఇప్పటికిప్పుడు చర్యలు చేపట్ట వద్దంటూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పేదలం మాకు న్యాయం చేయండి తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చి అందుకోవాలని ప్రభుత్వ భూముల్లో నిమ్మ సాగు చేసుకుంటున్న రైతులు అధికారులను కోరుతున్నారు. ఈ విషయమై అధికారులకు కూడా వినతిపత్రంతో పాటు కోర్డు ఆర్డర్‌ను అందజేయనున్నట్లు బాధితులు పేర్కొన్నారు. తాము కష్టపడి రెండెకరాల వంతున ఆక్రమించుకుని, అప్పులు తెచ్చి నిమ్మతోటలపై పెట్టుబడులు పెట్టాం. తీరా పంట చేతికొచ్చే సరికి ఆ భూములు మైనింగ్ లీజులు ఇచ్చే ప్రయత్నం చేయడం సరికాదు. రెవెన్యూ అధికారులకు హైకోర్టు మొట్టికాయలు నిరుపేద గిరిజనులు, పేద రైతులకు ఊరట కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు -
ముక్కు మూసుకోవాల్సిందే
నగరంలో అపరిశుభ్రత కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్డుపై చెత్తాచెదారం కనిపిస్తోంది. రోడ్లపై రాకపోకలు సాగించాలంటే దుర్గంధం భరించలేక ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి తప్పడం లేదు. పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో నగరం కంపు కొడుతోంది. గతంలో ప్రతి రోజు చెత్త తీసుకెళ్తే.. ఇప్పుడు వారంలో రెండు రోజులు కూడా వచ్చి తీసుకెళ్లడం లేదు. ఇళ్లలో చెత్త పెట్టుకుంటే కంపుకొడుతోంది. బయట వేద్దామంటూ జరిమానా అంటూ బెదిరిస్తున్నారు. – సుబ్బారెడ్డి, నగర వాసి అంటువ్యాధులు ప్రబలుతున్నాయి ఏ వీధిలో చూసినా అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. చెత్తాచెదారం రోడ్డుపైనే పడేయడం, వాటిని తొలగించకపోవడంతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించి రోడ్లపై ఎక్కడా కూడా చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటే నగరం పరిశభ్రంగా ఉంటుంది. వ్యాధులు కూడా ప్రబలకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. చెత్త తొలగింపులో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. – ప్రసాద్‌రెడ్డి, నెల్లూరు నగర వాసి -
రైతులకు భూపరిహారం పెంచాలి
నెల్లూరు (అర్బన్): భారతమాల, సాగరమాల జాతీయ రహదారుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం కమిటీల నాయకులు కలెక్టర్‌ను కోరారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ జిల్లాలోని ఏడు మండలాల్లో 108 కి.మీ. పరిధిలో సాగరమాల, 30 కి.మీ. జాతీయ రహదారులు నిర్మిస్తున్నారన్నారు. 35 గ్రామాల్లో 900 ఎకరాలు భూసేకరణ జరుగుతుందన్నారు. భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం నామమాత్రంగా చెల్లిస్తున్నారన్నారు. గత కలెక్టర్ చెప్పిన ప్రకారం రైతులు ఆర్బిట్రేషన్ వేసినప్పటికీ ఇప్పటికీ విచారణ జరగలేదన్నారు. ఇకనైనా విచారణ జరిపి చట్ట ప్రకారం రైతులకు భూ పరిహారం పెంచాలని కోరారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలె వెంగయ్య మాట్లాడుతూ తోటపల్లిగూడూరు మండలం పేడూరులో బీపీసీఎల్ పైపు లైను నిర్మాణం కోసం కోత దశకు వస్తున్న పంటలను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికై నా ఆ పనులు ఆపి పంట కోతలు పూర్తయ్యాక పైపులైను నిర్మాణం చేపట్టాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పులిగండ్ల శ్రీరాములు, సంఘాల నాయకులు వెంకమరాజు, రాజా, పోతుగుంట కృష్ణయ్య, ఆదిశేషయ్య, వంశీకృష్ణ, లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు. -
రెడ్‌క్రాస్‌లో కలెక్టర్ తీరు ఆక్షేపణీయం
నెల్లూరు(అర్బన్): సేవకు మారు పేరుగా ఉన్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పాలక మండలి వ్యవహారంలో కలెక్టర్ ఆనంద్ తీరు ఆక్షేపణీయంగా ఉందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ముద్ర వేసి ఐదుగురు సభ్యులను తొలగించిన కలెక్టర్, అదే టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తిని రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఎన్నుకునేందుకు కలెక్టర్ ఎలా సహకరించారని నిలదీశారు. తిరిగి చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని, కలెక్టర్ నిర్ణయాన్ని తప్పు పడుతూ కాకాణి మంగళవారం కలెక్టర్‌కు లేఖ రాశారు. రెడ్‌క్రాస్ పాలక మండలి సభ్యుల్లో 15 మందితో జనవరి 8న కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. అందులో ఏడుగురు రాజకీయ పార్టీలతో సంబంధాలు కలిగి ఉన్నారని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే వారిలో 7 మంది కాకుండా కేవలం వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు చైర్మన్‌గా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డితోపాటు సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, దామిశెట్టి సుధీర్, ఎంవీ సుబ్బారెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డిలను మాత్రమే టార్గెట్ చేసి గత నెల 11న నోటీసులు ఇచ్చిన కలెక్టర్, వారి నుంచి వివరణ తీసుకుని కూడా పదవుల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. వైఎస్సార్సీపీ రాజకీయాల్లో ఉన్నప్పటికీ వీరు రెడ్‌క్రాస్‌లో ఎలాంటి రాజకీయ పక్షపాత ధోరణి అవలంభించలేదన్నారు. ఏ పార్టీకి చెందిన వారైన రెడ్‌క్రాస్‌లో పని చేయొచ్చన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ ఎంపీ జాతీయ స్థాయిలో రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఉన్నారని, మన రాష్ట్రంలో సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షుడు అక్కడి రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఉన్నారన్నారు. రెడ్‌క్రాస్ ప్రాథమిక సభ్యత్వం కలిగిన వారిలో 80 శాతం మంది ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు ఉండేవారన్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన వాకాటి విజయకుమార్‌రెడ్డి నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని మంత్రికి మద్దతుగా కరపత్రాలు ముద్రించి, అందులో తన నంబర్ కూడా ఇచ్చిన వ్యక్తి అని, అటు వంటి వ్యక్తిని చైర్మన్ చేశారన్నారు. కలెక్టర్ సభ్యత్వాలు రద్దు చేసిన ఐదుగురిని తిరిగి పాలక మండలి సభ్యులుగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కలెక్టర్ పట్టించుకోలేదన్నారు. మిగతా 10 మంది సభ్యులతోనే ఎన్నిక నిర్వహించి నేరుగా టీడీపీ ప్రచారంలో పాల్గొన్న వాకాటి విజయకుమార్‌రెడ్డిని చైర్మన్‌గా, జనార్దన్‌రాజును వైస్ చైర్మన్‌గా ఎన్నుకునేందుకు సహకరించడం దారుణమన్నారు. విజయకుమార్‌రెడ్డి టీడీపీతో అంటకాగిన ఆధారాలను లేఖతో జతచేసి కలెక్టర్‌కు పంపించారు. కలెక్టర్ ఇప్పటికై నా 10 మంది సభ్యులతో ఎన్నికై న వాకాటి విజయకుమార్‌రెడ్డి చైర్మన్ పదవిని రద్దు చేయాలని కోరారు. కోర్టు తీర్పును అనుసరించి తిరిగి 15 మంది సభ్యులతో ఎన్నికలు నిర్వహించాలని, తద్వారా పక్షపాత ధోరణిని వదిలి పారదర్శకతను పాటించాలని కోరారు. అధికార పార్టీకి వంత పాడుతున్న కలెక్టర్ తిరిగి చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి డిమాండ్ -
అధికార సేవలో పారిశుధ్య కార్మికులు
సాక్షాత్తు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగరం కంపుకొడుతోంది. ‘నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే కాకుండా దోమల రహిత నగరంగా మార్చుతాం’ అంటూ మంత్రి తరచూ చెబుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. నగరం చెత్తమయంగా తయారైంది. గతంలో ప్రతి రోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరించగా, ప్రస్తుతం వారానికి రెండు రోజులే సేకరిస్తున్నారు. ఇళ్లల్లో పేరుకుపోయిన చెత్త నిల్వలతో దుర్గంధంతోపాటు కొత్త వ్యాధులు విజృంభిస్తున్నాయి. ●● ఐవీఆర్ఎస్ సర్వేలో 57 శాతం అసంతృప్తి ● చెత్త సేకరణలో రాష్ట్రంలోనే అట్టడుగు స్థానం ● గతంలో రోజూ చెత్త సేకరణ.. ఇప్పుడు వారానికి రెండు రోజులే ● చెత్త బయట వేస్తే జరిమానా అంటూ హెచ్చరికలు ● ఇళ్లల్లో మగ్గిపోతున్న చెత్తతో దుర్గంధం ● మొత్తం 1,500 మంది పారిశుధ్య కార్మికులు ● దోమల దండయాత్రతో పెరిగిన వ్యాధులు ● మున్సిపల్‌శాఖ మంత్రి ఇలాకాలో దుర్భర పరిస్థితులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలో చెత్త సేకరించడం లేదని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో తేటతెల్లమైంది. ఆ సర్వేలో దాదాపు 57 శాతం మంది ఇది చెత్త నగరంగా ఉందంటూ అభిప్రాయం వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రంలోనే నెల్లూరు కార్పొరేషన్ చెత్త సేకరణలో అట్టడుగు స్థానంలో ఉన్నట్లు స్పష్టమైంది. మున్సిపల్ శాఖమంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్లో ఈ దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ప్రతి రోజూ.. ఇప్పుడు వారానికి రెండు రోజులే.. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్ల ఉండగా దాదాపు 10 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. 149.89 చ.కి.మీ. మేర విస్తరించిన నగరంలో 1.84 లక్షల గృహాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తే.. ప్రస్తుతం వారానికి రెండు రోజులే చెత్త సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నగరంలో చెత్త సేకరణకు గత ప్రభుత్వం 143 మినీ వాహనాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ వాహనాల్లో అత్యధికం మరమ్మతులకు గురై మూలన పడ్డాయి. వాటి స్థానంలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా చెత్త సేకరణ చేస్తున్నారు. దీంతో చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగడం లేదు. చిన్న చిన్న వీధుల్లో ట్రాక్టర్లు వెళ్లే వీలు లేకపోవడంతో ఇళ్లలో చెత్తను రోడ్లపై పడేస్తున్నారు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో వీధులన్నీ చెత్తా చెందారంతో దర్శనమిస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. చెత్త వేస్తే జరిమానా అంటూ.. నగరపాలక సంస్థ అధికారులు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నామని ప్రచారం చేయడానికి గతంలో వీధి చివరలో ఉండే చెత్త డంపర్లను తొలగించేశారు. అదే స్థానంలో చెత్త వేస్తే జరిమానా విధిస్తామంటూ మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల వినూత్న చర్యలంటూ చెత్త వేసే దగ్గర ముగ్గులు వేసి, పూల కుండీలు పెట్టి అక్కడ చెత్త వేయకుండా అడ్డుకుంటున్నారు. దీనికి తోడు వారానికి రెండు రోజులే ఇంటింటికి వచ్చి చెత్త సేకరిస్తుండడంతో ఇళ్లలో ప్రతి రోజు తయారయ్యే చెత్త నిల్వలతో ఇళ్లు కంపుకొడుతున్నాయి. దోమలు పెరగడంతోపాటు వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రధాన వీధులకే పరిమితం నగరంలో 54 డివిజన్లు ఉంటే.. పారిశుధ్య కార్మి కులు ప్రధాన సెంటర్లు, కూడళ్లలోనే ఊడ్చుతూ కనిపిస్తారు. ఇళ్ల మధ్య వీధుల్లో ఎక్కడ వెతికినా కనిపించడం లేదు. ఉదాహరణకు మినీబైపాస్ మొత్తం మీద దాదాపు 3 డివిజన్లలో ఇరవై మంది కార్మికులు కూడా కనిపించని పరిస్థితి. మరి 15 వందల మంది కార్మికులు ఎక్కడ పనిచేస్తున్నారో అధికారులకే తెలియాలి. డ్రైనేజీలు చూస్తే దారుణంగా ఉన్నాయి. చెత్త పేరుకుపోయి నీరు రోడ్లపై పారుతోంది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. చెత్త సేకరణ కోసం ప్రతి నెలా కార్పొరేషన్ దాదాపు రూ.7 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. ఇంత ఖర్చు చేస్తున్నా.. ఆశించిన ఫలితాలు రావడం లేదు. మంత్రి, ఎమ్మెల్యే ఆర్భాటపు ప్రచారాలు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతోపాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నగరాన్ని పరిశభ్రంగా ఉంచుతామంటూ ఆర్భాటంగా ప్రచారాలు చేస్తున్నారు. చెత్త పరిశీలన అంటూ ఫొటోలకు ఫోజులిచ్చి పోతున్నారే కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్షించడం కానీ, చర్యలు తీసుకోవడం కానీ చేయడం లేదని నగర ప్రజలు మండిపడుతున్నారు. విజృంభిస్తున్న వ్యాధులు నెల్లూరు నగరాన్ని వ్యాధులు చుట్టుముట్టాయి. పేరుకుపోతున్న చెత్త నిల్వలతోపాటు అపరిశుభ్రత కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. నగరంలో దాదాపు 45 శాతం మంది ప్రజలు వివిధ రకాల వ్యాధులతో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూస్తే దాదాపు 75 శాతం నగర వాసులే కనిపిస్తున్నారు. ప్రస్తుతం గులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి భయపెడుతోంది. కొత్తగా ఈ వ్యాధి చుట్టేస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. రూ.లక్షల్లో ఖర్చు చేసి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రస్తుతం పెద్దాస్పత్రిలో 20 మందికి పైగా జీబీఎస్ వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా చేయిదాటిపోతోందో అర్థం చేసుకోవచ్చు. నగరాన్ని పరిశుభ్రతగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులే కీలకం. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 1,500 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వీరిలో రెగ్యులర్ 262 మంది, ఔట్సోర్సింగ్ 1,237 మంది ఉన్నారు. రెగ్యులర్ మేసీ్త్రలు 27 మంది, అవుట్సోర్సింగ్ విధానంలో 323 మంది పనిచేస్తున్నారు. వీరిలో సంగం మంది కార్పొరేషన్ ఉన్నతాధికారులు నుంచి కింది స్థాయి ఉద్యోగుల ఇళ్లలో పనిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పారిశుధ్య కార్మికులు విధులకు రాకున్నా జీతాలు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక మరమ్మతులకు గురైన మినీ చెత్త వాహనాల స్థానంలో ప్రత్యామ్నాయంగా కార్పొరేషన్ అధికారులు ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. 89 ట్రాక్టర్లు, 17 కాంపాక్టర్లు, 54 మినీ వాహనాల ద్వారా చెత్త తరలిస్తున్నారు. -
మన్నేరులో ఇసుక దొంగలు
గుడ్లూరు: కూటమి ప్రభుత్వంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. మండలంలోని దారకానిపాడు సమీపంలో ఉన్న మన్నేరులో టీడీపీ నాయకులు జేసీబీల ద్వారా ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. దారకానిపాడు సమీపంలో డంపింగ్ చేసి అర్ధరాత్రి వేళల్లో మండలంలోని చుట్టుపక్కల ఉన్న వారికి, కందుకూరు పట్టణానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తంతు ఆరునెలల నుంచి సాగుతోంది. కాగా టీడీపీలోని రెండు వర్గాలు ఇసుక తరలింపుపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వర్గం ఇటీవల కందుకూరు సబ్ కలెక్టర్‌కు తిరుమణిశ్రీ పూజకు ఈ దోపిడీ గురించి అర్జీ ఇచ్చింది. నాలుగు ట్రాక్టర్లలో.. సోమవారం సాయంత్రం నాలుగు ట్రాక్టర్లలో ఇసుక నింపి కందుకూరు ప్రాంతానికి తరలించారు. ఈ విషయమై గ్రామస్తులు సబ్ కలెక్టర్‌కు సమాచారమిచ్చారు. దీంతో ఆమె దారకానిపాడు గ్రామానికి చేరుకున్నారు. ఇంతలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాయకుడికి కొందరు సమాచారం అందించారు. వాహనాల లైట్ల ఫోకస్ చూసి జేసీబీ డ్రైవర్ అప్రమత్తమై జామాయిల్ తోటలోకి తీసుకెళ్లినట్లు సమాచారం. మన్నేరు నుంచి దారకానిపాడు గ్రామంలోకి రావడానికి ప్రత్యామ్నాయ మార్గం లేక స్కూటీ, ట్రాక్టర్, కారు యజమానులు సబ్ కలెక్టర్ వాహనాన్ని చూసి పరారయ్యారు. ఆమె స్థానిక వీఆర్వోకి మూడు వాహనాలను స్వాధీనపరిచి పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆదేశించారు. కేసు నమోదు మన్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు గుడ్లూరు ఎస్సై పి.వెంకట్రావు మంగళవారం తెలిపారు. స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు మూడు వాహనాలపై కేసు నమోదు చేశామన్నారు. మన్నేరులో ఇసుక డంపింగ్ జోరుగా తవ్వకాలు దారకానిపాడు సమీపంలో డంపింగ్ కూటమి నాయకుల్లో విభేదాలు -
ఆయుర్వేద మందుల పేరిట మోసం
● నిందితులపై కేసు నమోదు నెల్లూరు(క్రైమ్): ఆయుర్వేద మందులు వాడితే చెవుడు పోతుందని ఓ వృద్ధుడిని నమ్మించి రూ.లక్షలు కాజేసిన నిందితులపై నెల్లూరు సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. గుప్తా పార్క్ సెంటర్‌కు చెందిన ఓ వృద్ధుడు స్థానికంగా చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయనకు చెవుడు ఉంది. ఈక్రమంలో కృష్ణ అనే వ్యక్తి పరిచయమై తన తండ్రికి సైతం చెవుడు ఉందన్నాడు. ఓ ఆయుర్వేద కంపెనీకి చెందిన మందులు వాడటం ద్వారా చెవుడు పోయిందని నమ్మబలికాడు. అయితే ఆ మందులు చాలా ఖరీదైనవని కొంతకాలం క్రమం తప్పకుండా వాడాలని చెప్పాడు. దీంతో వృద్ధుడు అతడికి రూ.95 వేలను ఫోన్‌పే ద్వారా వేశాడు. ఈక్రమంలోనే విజయ్ అనే వ్యక్తిని తన అన్న అంటూ కృష్ణ వృద్ధుడికి పరిచయం చేశాడు. విజయ్ కొన్ని ఆకులు, లేహ్యం ఇచ్చి వాటిని రోజూ వాడాలన్నాడు. వృద్ధుడు కొద్దిరోజులు వాడగా సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో వారిని ప్రశ్నించాడు. ఇంకొన్ని మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పారు. ఇటీవల వృద్ధుడిని శోధన్నగర్లోని ఓ ఆయుర్వేద దుకాణం వద్దకు తీసుకెళ్లి రూ.4.25 లక్షలు తీసుకుని కొన్ని మందులను ఇప్పించారు. వాటిని ఎలా వినియోగించాలో ఇంటి వద్దకు వచ్చి చెబుతామని కృష్ణ, విజయ్‌లు వెళ్లిపోయారు. ఇంటికెళ్లిన వృద్ధుడు వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. షాపు వద్దకు వెళ్లి చూడగా మూసివేసి ఉండటంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సంతపేట పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేశారు. -
విలీన ప్రక్రియను ఆపాలంటూ..
నెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని పెద్దచెరుకూరులో ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల విద్యార్థులను 1.2 కిమీటర్ల దూరంలో ఉండే మరో స్కూల్లో విలీనం చేసే ప్రక్రియను విరమించుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మంగళవారం స్కూల్ ఎదుట పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎస్టీ వర్గానికి చెందిన వారిమని, ఎక్కువ మందిమి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. విలీనం చేస్తే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు బడి మానేస్తారని తెలిపారు. బేసిక్ ప్రైమరీ స్కూల్‌గానే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ బి.శారద, వెంకటరమణమ్మ, పద్మప్రియ, హర్షిణి, చెంచులక్ష్మి పాల్గొన్నారు. -
ఆక్రమణ దిశగా..
మోడల్ స్కూల్‌కు సంబంధించిన మైదానాన్ని ఆనుకుని నారాయణ స్కూల్ ఉంది. ఇక్కడ చదివే పిల్లలు ఆడుకునేందుకు స్థలం లేదు. ఈ నేపథ్యంలో సదరు యాజమాన్యం కన్ను మోడల్ స్కూల్ మైదానంపై పడింది. నారాయణ పాఠశాల వెనుక వైపు నుంచి మైదానంలోకి వెళ్లేందుకు సొంతంగా దారిని ఏర్పాటు చేశారు. మెట్లు కూడా నిర్మించారు. మోడల్ స్కూల్ పిల్లలు మైదానంలోకి వెళ్లేందుకు గతంలోనే దారి ఉంది. దీనిని పట్టించుకోని నారాయణ యాజమాన్యం వారి పిల్లల కోసం దారి ఏర్పాటు చేయడం, స్టేజీ చర్చనీయాంశంగా మారింది. వారి స్కూల్‌కు సంబంధించిన పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు అన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. మైదానం లేకుండానే నారాయణ యాజమాన్యాం పాఠశాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ స్కూల్‌కు స్థలాన్ని యథేచ్ఛగా వినియోగించడంపై విమర్శలు వస్తున్నాయి. -
సిమెంట్ బ్రిక్స్ తరలిస్తుండగా అడ్డగింత
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పక్కాగృహం నిర్మాణానికి సంబంధించిన సిమెంట్ బ్రిక్స్‌ను ఓ కాంట్రాక్టర్ తరలిస్తుండగా ప్రజలు అడ్డుకున్న ఘటన మంగళవారం జరిగింది. నెల్లూరు 54వ డివిజన్ భగత్‌సింగ్ కాలనీలో గత ప్రభుత్వంలో లేఅవుట్ వేశారు. కొన్ని ఇళ్లు నిర్మించగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలో నరాల సుబ్బారెడ్డి అనే కాంట్రాక్టర్ సగం నిర్మించిన ఓ ఇంటిని పగులకొట్టి సిమెంట్ బ్రిక్స్‌ను ట్రాక్టర్లో తరలిస్తుండగా స్థాని కులు అడ్డుకున్నారు. ఈ విష యమై హౌసింగ్ ఈఈ మోహన్‌రావు మాట్లాడుతూ సదరు కాంట్రాక్టర్ సిమెంట్ బ్రిక్స్‌ను అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తున్నట్టు స్థానికులు తనకు సమాచారం ఇచ్చారన్నారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించానన్నారు. -
భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు
● డీఎంహెచ్ఓ సుజాత నెల్లూరు(అర్బన్): భ్రూణ హత్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ సుజాత తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ నిఽషేధ చట్టం అమలుపై నెల్లూరు సంతపేటలోని వైద్యశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి కమిటీ సభ్యులకు, స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలకు, మెడికల్ అసోసియేషన్ల నేతలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లపై దాడులను విస్తృతం చేస్తామన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ చేసినట్టు తెలిస్తే ఆ సెంటర్లను సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్కానింగ్ చేసేవారు ప్రతి గర్భిణి వివరాలను ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. అల్ట్రా సౌండ్, ఎంఆర్ఐ, సీటీస్కాన్, ఎకో, బీ–స్కాన్ నిర్వాహకులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ ఖాదర్‌వలీ, డీఐఓ డా.ఉమామహేశ్వరి, కమిటీ సభ్యులు పీడియాట్రిషియన్ డా.సర్ధార్ సుల్తానా, గైనకాలజిస్ట్ డా సీహెచ్ కిరణ్, డివిజనల్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డా.దయాకర్, డీఎస్పీ రామారావు, డా.బ్రిజిత, డా.శోభారాణి, డెమో అధికారి కనకరత్నం తదితరులు పాల్గొన్నారు. -
21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 21వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి జెడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు సీఈఓ విద్యారమ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక ప్రణాళిక, గృహ నిర్మాణ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర వాటిపై సమీక్షలు ఉంటాయన్నారు. జెడ్పీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సమావేశాలు జరుగుతాయని తెలియజేశారు. 1.71 లక్షల మంది రైతులకు యూనిక్ ఐడీలు ● జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి మనుబోలు: జిల్లాలోని 1,71,500 మంది రైతులకు యూనిక్ ఐడీ (విశిష్ట సంఖ్య) నమోదు చేయడమే లక్ష్యమని జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి తెలిపారు. మండలంలోని జట్ల కొండూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వరి పొలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి రైతు యూనిక్ ఐడీ కలిగి ఉండాలన్నారు. దీని ద్వారానే ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో నెలాఖరులోపు యూనిక్ ఐడీని నమోదు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో 297 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే రైతులందరూ ఈకేవైసీ, ఈ–క్రాప్ నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ శివనాయక్, నర్సోజిరావు, ఏఓ జహీర్, ఏఏఓ కళారాణి తదితరులు పాల్గొన్నారు. మద్యం మత్తులో రౌడీషీటర్ వీరంగం నెల్లూరు(క్రైమ్): మద్యం మత్తులో ఓ రౌడీషీటర్ తన స్నేహితుడితో కలిసి వీరంగం సృష్టించిన ఘటన నెల్లూరు పొదలకూరురోడ్డులోని ఓ వైన్‌షాపు వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. నగరానికి చెందిన ఓ రౌడీషీటర్ తన స్నేహితుడితో కలిసి మంగళవారం వైన్ షాపునకు వెళ్లారు. పక్కనే ఉన్న కూల్‌డ్రింక్ షాపులో ఫూటుగా మద్యం తాగారు. సాయంత్రం బయటకు వచ్చిన వారు మద్యం మత్తులో వీరంగం చేశారు. ఓ యువకుడిపై దాడి చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న దర్గామిట్ట ఎస్సై రమేష్‌బాబు తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మందుబాబులు పరారయ్యారు. దీంతో వారికోసం గాలిస్తున్నారు. న్యాయసేవ సహాయకుల పోస్టుల భర్తీకి చర్యలు నెల్లూరు(అర్బన్): జిల్లా న్యాయసేవాధికార సంస్థ నెల్లూరు, మండల న్యాయసేవాధికార సంస్థ కమిటీలైన గూడూరు, కోవూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, కోట, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఉదయగిరిల్లో పారా లీగల్ వలంటీర్లు (న్యాయసేవ సహాయకులు)గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు నిండి ఇంటర్ ఆపైన విద్యార్హతలు గల వారు రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాలన్నారు. ఒక సంవత్సర కాలపరిమితితో భర్తీ అయ్యే ఈ పోస్టులకు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు నిర్ధారించిన గౌరవ వేతనాన్ని అందిస్తామన్నారు. దరఖాస్తులను చైర్మన్ కం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయసేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్టు కాంపౌండ్, నెల్లూరు చిరునామాకు ఈనెల 25వ తేదీలోగా పంపాలని కోరారు. రిజిస్టర్ పోస్టుపై అప్లికేషన్ ఫర్ ఎంపానెల్మెంట్ ఆఫ్ పారా లీగల్ వలంటీర్స్ అని రాయాలన్నారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించాలని కోరారు. ప్రజలకు చట్టపరంగా న్యాయసహాయం అందించేందుకు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ సేవకులు, లా డిగ్రీ చదవుతున్న విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.గరుడ వాహనంపై నృసింహుడి ఊరేగింపు రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వా మి చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వాతి నక్షత్రం శ్రీవారి జన్మ నక్షత్రం కావడంతో మంగళవారం మూలమూర్తికి చందనంతో అలంకారం చేసినట్లుగా అర్చకులు తెలిపారు. సాయంత్రం బంగారు గరుడ వాహనంపై లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి మేళతాళాల నడుమ కోన మాడవీధుల్లో ఊరేగించారు. -
విన్నవించినా.. స్పందన లేదు
● అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలి ● సంబంధిత అసోసియేషన్, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ● టీడీపీ నాయకుల ఓవరాక్షన్వరికుంటపాడు: అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదని సీపీఐ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, ఆ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావులు మండలంలోని కనియంపాడు సమీపంలో అక్రమంగా నరికివేసిన జామాయిల్ తోటలను మంగళవారం పరిశీలించారు. కొంతసేపు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్స్టేషన్ల వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వరికుంటపాడు మండలంలో భాస్కరాపురం, కనియంపాడు గ్రామాల సమీపంలో 150 ఎకరాల్లో జామాయిల్ సాగు ఉందన్నారు. ఆ చెట్లను సుమారు రెండు నెలల నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమార్కులు నరికివేసి రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ఇటీవల తహసీల్దార్‌కు విన్నవించామన్నారు. అయినా స్పందన లేదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ కర్రను తరలింపు వెనుక బడా నాయకుల హస్తం ఉందని తెలుస్తోందన్నారు. తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడే ప్రసక్తే లేదని, ఆందోళనలను కొనసాగిస్తామన్నారు. ఈ అంశాన్ని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరుతామన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లగా అక్కడ అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తీవ్ర వాగ్వాదం నిరసన కార్యక్రమాల అనంతరం నేతలు తిరుగు ప్ర యాణమయ్యారు. వరికుంటపాడు సమీపంలో జా మాయిల్ లోడుతో ట్రాక్టర్ వెళ్తుండగా అడ్డుకుని ప్ర శ్నించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నా యకులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. కార్యక్రమంలో ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శంకరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య పాల్గొన్నారు. -
ఉపాధి పనుల్లో కూలీల పొట్టగొడుతున్నారు
● వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు ● ర్యాలీగా కలెక్టరేట్‌కు... జేసీకి వినతిపత్రం అందజేత నెల్లూరు రూరల్: నిబంధనలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఉపాధి హామీ పనులు కట్టబెడుతూ కూలీల పొట్టగొడుతోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు ఆలపాక శ్రీనివాసులు విమర్శించారు. ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సోమవారం ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో జేసీ కార్తీక్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలపాక శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదని 2024లో ఇచ్చిన కోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం 50శాతం పనులను కచ్చితంగా కూలీలతో చేయించాల్సి ఉందన్నారు. గ్రామ సభలు ఆమోదం పొందిన పనులు మాత్రమే చేయాలన్నారు. అందుకు విరుద్ధంగా కూటమి నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని గ్రామసభల తీర్మానం లేకుండా కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారన్నారు. దీంతో తాము కోర్టుకెళ్లగా అలా ప్రైవేటు కాంట్రాక్టర్లకు కేటాయించిన పనులు రద్దు చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు. ఉపాధి చట్టం అమలులో ప్రధాన భూమిక పోషిస్తున్న డ్వామా పీడీ, జెడ్పీ సీఈఓ, ఎంపీడీఓ, పీఓ, ఏపీఓలు, సంబంధిత జిల్లా అధికారులే జరుగుతున్న అవకతవకలకు బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఏఎస్‌పేట ఎంపీపీ పద్మజారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, సర్పంచ్ అడపాల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. -
రూ.కోట్లు కొల్లగొట్టి.. పోలీసులకు చిక్కి..
కావలి: కావలి పట్టణంలో షేర్ మార్కెట్ ట్రేడింగ్ ముసుగులో జనాల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ప్రధాన నిందితుడు షేక్ మహబూబ్ సుభాని, అతని ప్రధాన అనుచరుడైన మరో నిందితుడు యలసిరి బ్రహ్మానందంను అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ పుల్లూరు శ్రీధర్ చెప్పారు. కావలిలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కావలిలో అనంతార్థ అసొసియేట్స్ పేరుతో 17 మంది కలిసి షేర్ మార్కెట్ ఫైనాన్సియల్ ట్రేడింగ్‌ను 2021లో ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుదాస లీలా స్టాక్ మార్కెట్ ఏజెన్సీ పేరుతో కూడా మరొక సంస్థను ప్రారంభించారు. దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుభాని. అలాగే ప్రభుదాస లీలా స్టాక్ మార్కెట్ ఏజెన్సీకి యలసిరి బ్రహ్మానందం హెడ్‌గా ఉన్నారు. వీరు అధిక వడ్డీ ఆశ పెట్టి ప్రజలు నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుభాని కార్యాలయాన్ని మూసేసి పరారయ్యాడు. మందా ప్రభాకర్ అనే వ్యక్తి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుభానిపై ఫిర్యాదు అందడంతో కావలి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ జి.రాజేశ్వరరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ సూత్రధారి సుభాని నేపథ్యం బాపట్ల జిల్లా ఏల్చూరుకు చెందిన షేక్ మహబూబ్ సుభాని విజయవాడలోని సిద్ధార్థ అకాడమీలో ఎంసీఏ పూర్తి చేసి నరసరావుపేటలో కొంతకాలం కంప్యూటర్ లెక్చరర్‌గా పనిచేశాడు. తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలోకి వచ్చి షేర్ మార్కెట్ ట్రేడింగ్ మీద అవగాహన పెంచుకున్నాడు. గుంటూరు, విజయవాడలో కొంతకాలం పనిచేసి, తర్వాత కుటుంబంతో కలిసి కర్ణాటకలోని బీదర్, మహారాష్ట్రలోని పూణేలలో కొంత కాలం ఉన్నాడు. కాకినాడలో... తర్వాత కాకినాడకు మకాం మార్చి డబ్బులు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ప్రజలకు నమ్మకం కలిగించాడు. ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ ముసుగులో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ, క్రమంగా ఒక పెద్ద నెట్‌వర్క్‌ను సృష్టించాడు. ఏజెంట్ల ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత కాకినాడ నుంచి పారిపోయాడు. దీంతో సుభాని మీద కాకినాడ పోలీస్ స్టేషన్లో 2014లో చీటింగ్ కేసు నమోదు అయింది. తెలంగాణలో... కొంతకాలానికి సుభాని తెలంగాణ రాష్ట్రం మక్తల్ ప్రాంతానికి వెళ్లి చెప్పులు, ఫెర్టిలైజర్, బంగారం వ్యాపారాలు చేశాడు. అక్కడ కూడా ప్రజలను మభ్యపెట్టి షేర్ మార్కెట్ ముసుగులో కోట్ల రూపాయలు ప్రజల నుంచి సేకరించి పారిపోయాడు. దీంతో మక్తల్, మరికల్ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదు అయ్యాయి. దీంతో అరెస్ట్ కాకుండా సుభాని మాయమైపోయాడు. నిందితుడు పోలీసుల కంటపడకుండా అరెస్టు కాకుండా తెలివిగా జాగ్రత్త పడ్డాడు. కావలిలో... 2021 నవంబర్‌లో కావలి పట్టణం ముసునూరు ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అనంతార్థ అసోసియేట్స్ అనే ఏజెన్సీని స్థాపించాడు. షేర్ మార్కెట్ ముసుగులో కొంతమంది ఏజెంట్లను నియమించుకుని ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ప్రజల సొమ్ముతో తన కుటుంబ సభ్యుల పేరుతో, తన ఏజెన్సీలోని వ్యవస్థాపక సభ్యుల పేర్లతో కొన్ని స్థిరాస్తులు కొన్నాడు. నిందితుడు సుభాని, అతనికి సహకరించిన కావలికి చెందిన యలసరి బ్రహ్మానందంను కావలి రూరల్ పోలీస్ స్టేషన సీఐ జి.రాజేశ్వరరావు ఆదివారం రాత్రి గౌరవరం దగ్గర అరెస్టు చేశారు. అతని ఆస్తులకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకొని, బ్యాంకులో ఉన్న నగదు స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకున్నారు. సుభానికి ఇవ్వడం ద్వారా ప్రజలు పోగొట్టుకున్న డబ్బు తాలూకు వివరాలను దర్యాప్తులో తేలుస్తామని డీఎస్పీ తెలిపారు. సుభాని కొనుగోలు అనేక ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు ఇప్పటికే గుర్తించి ఫ్రీజ్ చేసినట్లు చెప్పారు. వీరే సభ్యులు అనంతార్థ అసోసియేట్స్‌లో సుభానితో పాటు ఈపలపూడి కమలకుమార్, చలంచర్ల అనిల్, పిల్లి సామ్రాజ్ రోమ్డీ చో, యలసిరి బ్రహ్మానందం, గోనె కిరణ్, యలసిరి ఆదినారాయణ, తలపల శివశంకర్, అద్దూరి శీనయ్య, చౌటూరి అశోక్, నిమ్మగడ్డ రాం రాబర్ట్ రహీం, కాకిని ప్రశాంతి, వట్టికాల ప్రశాంతి, బుట్టి శివార్జున, కశెట్టి పుష్పలత, జ్యోతి స్రవంతి, గుళ్లమూరి వంశీరెడ్డిలు సభ్యులని డీఎస్పీ వివరించారు. ఈ మనీ స్కాంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల భార్యలు ఉన్నారని గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. పోలీస్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ ఇలాంటి మనీ స్కాంలో ఉండటం నేరంగా భావించి ఈ చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. పోలీస్ కానిస్టేబుళ్లు వట్టికాల రాధాకృష్ణ భార్య వట్టికాల ప్రశాంతి, జ్యోతి అయోధ్య కుమార్ భార్య జ్యోతి స్రవంతిలు ఉన్నారని తెలిపారు. వివరాలు తెలియజేయండి... సుభాని ద్వారా మోసపోయిన బాధితులు వివరాలు తెలియజేయాలని డీఎస్పీ శ్రీధర్ సూచించారు. ఇప్పటి వరకు 150 మంది ఫిర్యాదు అందజేశారని అన్నారు. వారందరి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.25 కోట్ల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోందని డీఎస్పీ చెప్పారు. సీజ్ చేసిన నగదు, ఆస్తులు ప్రధాన నిందితుడితోపాటు సభ్యుల బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.5,35,92,126లు సీజ్ చేసినట్లు తెలిపారు. సుభాన్ కుటుంబసభ్యుల పేర్లతో స్థిరాస్తులు రూపేణా ఉన్న రూ.5,74,51,000 విలువ కలిగిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే సుభాని నివాసంలో రూ.28,48,600 నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీతోపాటు కావలి రూరల్ సీఐ జి.రాజేశ్వరరావు, వన్ టౌన్ సీఐ ఎండీ ఫిరోజ్, టు టౌన్ సీఐ వేల్పుల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. కావలిలో మనీ స్కామ్ సూత్రధారి మహబూబ్ సుభాని అరెస్ట్ అతని ప్రధాన అనుచరుడు కూడా.. బ్యాంక్ అకౌంట్లు, నగదు, ఆస్తులు సీజ్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీధర్ -
కేసులు లేవంట
ఇంత జరుగుతున్నప్పటికీ జిల్లాలో జీబీఎస్ కేసులు ఒక్కటి కూడా లేవని డీఎంహెచ్ఓ డాక్టర్ వి.సుజాత తెలిపారు. రోగులు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటే వైద్యశాఖ చోద్యం చూస్తోంది. కేసులు లేవంటూ దాచి పెడుతున్నారు.భయపడాల్సిన పనిలేదు జీబీఎస్ కేసులు గురించి భయపడాల్సిన పని లేదు. నిదానంగా కోలుకుంటారు. తిమ్మిర్లు, కాళ్లలో చచ్చుబడినట్టు ఉండటం, బ్యాలెన్స్ తగ్గిపోవడం లాంటి లక్షణాలుంటే సత్వరమే సమీప వైద్యశాలలో డాక్టర్ సలహాలను పొంది చికిత్స చేయించుకోవాలి. – డాక్టర్ నరేంద్ర, ఇన్చార్జి సూపరింటెండెంట్, పెద్దాస్పత్రి ● -
భోజనం బాగాలేదని విద్యార్థులు నిరసన
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ఏసీఎస్ఆర్ కాలనీలోని మండల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా అన్నం సరిగా ఉడకడంలేదంటూ, కూరలు సైతం బాగాలేకపోవడంతో విద్యార్థులు వాంతులు చేసుకున్న సంఘటనలు జరిగాయని తల్లిదండ్రులు తెలిపారు. దీని గురించి భోజన పథకం నిర్వాహకులను ప్రశ్నిస్తే వెటకారంగా సమాధానం చెప్పారని ఓ విద్యార్థి తల్లి పేర్కొంది. ఈ విషయమై హెచ్ఎం హజరత్తయ్యను సంప్రదించగా భోజనం బాగాలేదని విద్యార్థులు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, నిర్వాహకురాలిని మందలించినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీల ధర్నా నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పొదలకూరు రోడ్డులోని సీడీపీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయనందున హెల్పర్లు, మినీవర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పెట్టుబడులు పెట్టి కేంద్రాలను నిర్వహిస్తున్నారన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనంగా రూ 26వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్, రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు కొండా ప్రసాద్, నగర అధ్యక్షుడు అత్తిమూరు శ్రీనివాసులు, నాయకులు షాహినాబేగం, నాగభూషణమ్మ, సంపూర్ణమ్మ, రజని, కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు. చౌక దుకాణాలకు రేషన్ అలాట్మెంట్ నెల్లూరు (పొగతోట): జిల్లాలోని వివిధ చౌకదుకాణాలకు పదిశాతం రేషన్ విడుదల చేసినట్లు డీఎస్ఓ అంకయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘సాక్షి’లో సోమవారం రేషన్ బియ్యం కోటాలో కోత శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు స్పందించారు. చౌక దుకాణాలకు పదిశాతం రేషన్ విడుదల చేశారు. కార్డుదారులు ఇబ్బందులు పడకుండా రేషన్ సరఫరా చేస్తామని డీఎస్ఓ తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా పెన్నా డెల్టాకు నీటి విడుదల సోమశిల: అనంతసాగరం మండల పరిధిలోని సోమశిల జలాశయం నుంచి సోమవారం పెన్నా తీర ప్రాంతాల వారికి ఎలాంటి సమాచారం లేకుండా నీటిని విడుదల చేసినట్లు ప్రజలు తెలిపారు. దీనిపై జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దశరథరామిరెడ్డిని అడుగగా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెన్నా దిగువ ప్రాంతంలోని రైతుల తాగు, సాగునీటి అవసరం కోసం నీటిని విడుదల చేశామన్నారు. 22న ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సూపర్ కప్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే జట్టుకు క్రీడాకారులను ఈనెల 22న ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి బి.ఉమాశంకర్ సోమవారం తెలిపారు. ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉదయం 7.30 గంటలకు ఈ ఎంపికలు ప్రారంభమవుతాయని అన్నారు. ఎంపికై న క్రీడాకారులు మార్చిలో జరిగే టోర్నమెంట్లో కోరమాండల్ జోనల్ ఫుట్‌బాల్ క్లబ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. -
వెల్లువెత్తుతున్న వినతులు
● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 472 అర్జీలు నెల్లూరురూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ కార్యక్రమానికి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయంటే.. క్షేత్రస్థాయిలో అధికారులు, పరిపాలన తీరుఎలా ఉందో ఈ వినతులే అద్దం పడుతున్నాయి. వారం వారం వచ్చే అర్జీల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారం వరకు 400 వస్తున్న అర్జీలు ఈ వారం 472కు చేరాయి. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్‌తోపాటు డీఆర్ఓ ఉదయభాస్కర్‌రావు, జెడ్పీ సీఈఓ విద్యారమ, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డీపీఓ శ్రీధర్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయొద్దు విద్యార్థులను మార్కుల కోసం పాఠశాలల యాజమాన్యాలు మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నగర విద్యార్థి నాయకుడు తిరకాల శేషసాయి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, అప్రోజ్, జస్వంత్, సాయి పాల్గొన్నారు. స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు... ఆరు నెలల నుంచి పలు జిల్లాల్లో గిరిజనులపై జరుగుతున్న దాడులపై అనేక సార్లు సంబంఽధిత పోలీస్‌శాఖ వారికి గ్రీవెన్స్ సందర్భంగా వినతిపత్రాలు సమర్పిస్తే వాళ్లు స్థానిక ఎస్హెచ్ఓలకు పంపుతున్నారని, వారు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్లను స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు రాగి పోలమ్మ, హైమావతి, సింహాద్రి, మాధవి, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, వక్ఫ్ జేపీసీ రిపోర్టు, ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కి వందల కోట్ల విలువ చేసే ఆస్తులను అన్యాక్రాంతం చేసి ముస్లిం సమాజానికి అన్యాయం చేసే కుట్రలను తీవ్రంగా విభేదిస్తున్నామని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలంటూ నేషనల్ మైనార్టీ సెల్ నాయకులు ర్యాలీగా వచ్చి వినతిపత్రం సమర్పించారు. ప్రతిపక్షాలు చెబుతున్న సవరణలను స్వీకరించకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో మరింత తీవ్రతరం చేస్తామన్నారు. -
మమ్మల్ని చంపేసి.. భూముల్ని తీసుకోండి
● సమాచారం ఇవ్వకుండా మా భూముల్లో సర్వేలు చేయడమేంటి ● కావలి ఆర్డీఓకు మొరపెట్టుకున్న తీర ప్రాంత గ్రామాల రైతులుకావలి: మా భూముల్లోకి రెవెన్యూ అధికారులు వచ్చి భూములు తీసుకుంటున్నాం, సర్వే చేస్తున్నాం అంటూ హడావుడి చేస్తున్నారు. ఎందుకు తీసుకుంటున్నారో.. ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నారో.. ఇవేవీ మాకు చెప్పడం లేదు. ఇలా చేసే బదులు మమ్మల్ని చంపేసి మా భూములు తీసుకోండి అంటూ కావలి మండలంలోని తీర ప్రాంత గ్రామాలకు చెందిన రైతులు కావలి ఆర్డీఓ ఎం.వంశీకృష్ణ వద్ద ఆవేదన వ్యకం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆర్డీఓను పెద్ద సంఖ్యలో రైతులు కలిశారు. రామాయపట్నం పోర్టుకు సమీపంలో ఉన్న వేలాది ఎకరాలు భూములను సేకరించడానికి కూటమి ప్రభుత్వం దూకుడు పెంచిన విషయం తెలిసిందే. సాంకేతికంగా మారిటైం బోర్డు ద్వారా భూసేకరణ జరుగుతున్నా ఈ ప్రక్రియలో కావలి తహసీల్దార్ కింద పని చేసే రెవెన్యూ ఉద్యోగులే క్రియాశీలకంగా ఉంటూ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. భూసేకరణలో ప్రధాన ఘట్టమైన గ్రామసభ నిర్వహించే విషయం రైతులకు తెలియలేదు. దీంతో సోమవారం చెన్నాయపాళెం, పాముగుంటపాళెం, మూలంపేట, పెద్దపట్టపుపాళెం, నందెమ్మపురం, చిన్నపాళెం, పల్లెపాళెం, శ్రీరాంపురం తదితర గ్రామాలకు చెందిన రైతులు ఆర్డీఓను కలిశారు. ఈ గ్రామాల్లో 3,000 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ భూములతో బతుకుతున్న తాము జోవనోపాధి కోల్పోతే ఎలా బతకాలి? ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు ధర ఉన్న భూములకు ఎంతోకొంత నష్ట పరిహారం ఇస్తామని చెప్పడం మమ్మల్ని అవమానపరచడం కాదా? అంటూ రైతులు ప్రశ్నించారు. ఆర్డీఓ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన గ్రామసభకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసేలా చేయడంలో పొరపాటు జరిగిందని, అలాంటి పొరపాటు పునరావృతం కానివ్వకుండా జాగ్రత్త పడతానని చెప్పారు. మీరు తెలియజేసిన అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని అన్నారు. -
21న మామిడి సాగుపై క్రాప్ సెమినార్
నెల్లూరు(సెంట్రల్): ఈ నెల 21న మామిడి పంటపై జిల్లా స్థాయి క్రాప్ సెమినార్ కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలువురు శాస్త్రవేత్తలు మామిడి పంటలో తెగుళ్ల నివారణ, సాగులో పలు సూచనలు ఇస్తారన్నారు. మామిడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అక్రమ మైనింగ్‌పై కేసు నమోదు పొదలకూరు: మండలంలోని తాటిపర్తి పంచాయతీలో 2023లో అక్రమంగా మైనింగ్‌కు పాల్పడ్డారని మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎస్సై ఎస్కే హనీఫ్ కథనం మేరకు వివరాలు.. పేర్నేటి శ్యాంప్రసాద్, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి అక్రమంగా మైనింగ్ చేసి తెల్లరాయిను తరలించారని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు వేటకెళ్లి మత్స్యకారుడి మృతి తోటపల్లిగూడూరు: వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు మృతి చెందా డు. ఈ ఘటన సోమ వారం వెలుగు చూ సింది. ఎస్సై వీరేంద్రబాబు సమాచారం మేరకు.. వెంకన్నపాళెంపట్టపుపాళెం గ్రామానికి చెందిన కొండూరు వెంకటేశ్వర్లు (51) సముద్రంలో వేటపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం వెంకన్నపాళెం పట్టపుపాళెం సమీపంలోని సముద్రతీరం గుండా ఇంజిన్ బోటుపై వేటకు బయల్దేరాడు. సోమవా రం ఉదయానికి కూడా వెంకటేశ్వర్లు తీరానికి చేరుకోకపోవడంతో తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇందుకూరుపేట మండలం కొరుటూరు సమీపంలోని తీరంలో వెంకటేశ్వర్లు మృతదేహం బయటకు కొట్టుకొచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు వెంకటేశ్వర్లకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మమ్మల్ని ఆదుకోండి సారూ..
● ఎస్పీ కృష్ణకాంత్‌కు బాధితుల మొర ● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 93 ఫిర్యాదులు నెల్లూరు(క్రైమ్): నమ్మించి మోసం చేశారు.. న్యాయం చేయాలని బాధితులు ఎస్పీ జి. కృష్ణకాంత్‌ను కోరారు. సోమవారం స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 93 మంది తమ సమస్యలపై ఎస్పీకి వినతులు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసుస్టేషన్, ఆత్మకూరు డీఎస్పీలు చెంచురామారావు, వేణుగోపాల్‌రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని.. సాఫ్ట్వేర్ జాబ్ (వర్క్ ఫ్రమ్ హోమ్) ఉద్యోగాలు ఇప్పిస్తానని పొదలకూరుకు చెందిన ఎన్. భగవాన్ అనే వ్యక్తి నమ్మించి ఒక్కొక్కరి వద్ద రూ.1.60 లక్షలు తీసుకున్నాడు. దీంతోపాటు ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి మాకు తెలియకుండా ఒక్కొక్కరి పేరుపై రూ.3 లక్షలు లోన్ తీసుకుని నకిలీ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాడు. నగదు తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడు. విచారించి న్యాయం చేయాల ని నెల్లూరు బాలాజీనగర్, కోవూరు, గుడ్లూరు, బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన పలువురు కోరారు. రూ 1.25 లక్షలు తీసుకుని.. తన కుమారుడికి వెటర్నరీ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన నూర్జాహాన్ రూ.1.25 లక్షలు తీసుకుంది. నెలలు గడుస్తున్నా.. ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఆమెను నిలదీయగా సమాధానం దాటేస్తుంది. తగిన చర్యలు తీసుకోవాలని బాలాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి కోరారు. ● నా పేరుపై ఉన్న స్థలం పత్రాలు తీసుకుని పెద్ద కొడుకు వేధిస్తున్నాడని, విచారించి న్యాయం చేయాలని నెల్లూరు రూరల్‌కు చెందిన ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. ● భూ వివాదంపై తిరుపాల్, కిశోర్, రమణమ్మ తమపై దాడిచేశారు. మాకు తీవ్రగాయాలయ్యాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మాపైనే కేసుల నమోదు చేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు మండలం బండారుపల్లికి చెందిన బాధితులు కోరారు. ● మా అమ్మమ్మ ఆత్మకూరు బస్టాండు సమీపంలో పూల వ్యాపారం చేస్తోంది. గుర్తుతెలియని ఇద్దరు యువకులు ఆమైపె దాడిచేశారని, ఆమె ఒంటిపై కాల్చిన గాయాలున్నాయి. వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరుకు యువకులు కోరారు. -
ప్రాక్టికల్స్‌కు 143 మంది గైర్హాజరు
నెల్లూరు(టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్ కు సోమవారం 143 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం ప్రాక్టికల్స్‌కు 2,685 మందికి 73 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2,2 16 మందికి 70 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ శ్రీనివాసు లు కేంద్రాలను తనిఖీ చేశారు. నేటి నుంచి భాషోత్సవాలు నెల్లూరు (టౌన్): జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మంగళవారం నుంచి భాషోత్సవాలను నిర్వహించాలని డీఈఓ ఆర్.బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న ఇంగ్లిష్, 19న సంస్కృతం, హిందీ, ఉర్దూ, 20న గిరిజన భాష, కన్నడ, తమిళం, ఒరియా 21న తెలుగు భాషకు సంబంధించి ఉత్సవాలను జరపాలని చెప్పారు. ఇందు కోసం ఒక్కో పాఠశాలకు రూ.500 నిధులు కేటాయించినట్లు తెలిపారు. -
వెల్లువెత్తుతున్న వినతులు
● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 472 అర్జీలు నెల్లూరురూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ కార్యక్రమానికి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయంటే.. క్షేత్రస్థాయిలో అధికారులు, పరిపాలన తీరుఎలా ఉందో ఈ వినతులే అద్దం పడుతున్నాయి. వారం వారం వచ్చే అర్జీల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారం వరకు 400 వస్తున్న అర్జీలు ఈ వారం 472కు చేరాయి. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్‌తోపాటు డీఆర్ఓ ఉదయభాస్కర్‌రావు, జెడ్పీ సీఈఓ విద్యారమ, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డీపీఓ శ్రీధర్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయొద్దు విద్యార్థులను మార్కుల కోసం పాఠశాలల యాజమాన్యాలు మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నగర విద్యార్థి నాయకుడు తిరకాల శేషసాయి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, అప్రోజ్, జస్వంత్, సాయి పాల్గొన్నారు. స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు... ఆరు నెలల నుంచి పలు జిల్లాల్లో గిరిజనులపై జరుగుతున్న దాడులపై అనేక సార్లు సంబంఽధిత పోలీస్‌శాఖ వారికి గ్రీవెన్స్ సందర్భంగా వినతిపత్రాలు సమర్పిస్తే వాళ్లు స్థానిక ఎస్హెచ్ఓలకు పంపుతున్నారని, వారు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్లను స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు రాగి పోలమ్మ, హైమావతి, సింహాద్రి, మాధవి, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, వక్ఫ్ జేపీసీ రిపోర్టు, ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కి వందల కోట్ల విలువ చేసే ఆస్తులను అన్యాక్రాంతం చేసి ముస్లిం సమాజానికి అన్యాయం చేసే కుట్రలను తీవ్రంగా విభేదిస్తున్నామని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలంటూ నేషనల్ మైనార్టీ సెల్ నాయకులు ర్యాలీగా వచ్చి వినతిపత్రం సమర్పించారు. ప్రతిపక్షాలు చెబుతున్న సవరణలను స్వీకరించకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో మరింత తీవ్రతరం చేస్తామన్నారు. -
తీరంలో ‘భూ’ అలజడి!
ఉలవపాడు: ‘మా ఊరు దగ్గరలో పరిశ్రమ వస్తే సొంత ఇంట్లో ఉంటూ పని చేసుకోవచ్చు. పరిశ్రమ కోసం మా ఊరే లేకుండా చేస్తే ఎలా..? మా ఊరే లేకుండాపోయిన తర్వాత ఆ పరిశ్రమ వస్తే ఎంత..? రాకపోతే ఎంత...? ఉన్న భూమిని సాగు చేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్...’ అంటున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండల తీరప్రాంత ప్రజలు. ఉలవపాడు మండలంలో ఇటీవల కలెక్టర్ ఆనంద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయదేవ్ పర్యటించి పరిశ్రమల ఏర్పాటుకు భూములను పరిశీలించారు. కరేడు నుంచి రామాయపట్నం వరకు తీరప్రాంత భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో గుబులు మొదలైంది. శుక్రవారం తీరప్రాంత మత్స్యకారులందరూ అలగాయపాలెంలో సమావేశమై పరిశ్రమలకు తమ భూములు ఇవ్వకూడదని తీర్మానించారు. పోలీసులు వచ్చి సమావేశాన్ని అడ్డుకున్నా కూడా మత్స్యకారులు ఐక్యంగా ఉంటూ తీర్మానం చేయడం గమనార్హం. అయితే, శనివారం కందుకూరుకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ నియోజకవర్గంలోనే బీపీసీఎల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, భూములు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో తీరప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందని..బీపీసీఎల్ రిఫైనరీ కోసం ప్రధానంగా కరేడు చెరువు అనుకుని ఉన్న ఆయకట్టును తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ సమీపంలోని సపోటా, మామిడి తోటలు కూడా సేకరించే భూముల జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రాథమికంగా కరేడు గ్రామ చెరువు నీటిని ఉపయోగించుకుని కంపెనీ నిర్మాణాలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. తమ చెరువు ఆయకట్టు కింద వరి, వేరుశనగ పండించుకుని సంతోషంగా ఉన్నామని, తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని రైతులు తెగేసి చెబుతున్నారు.కరేడుతోపాటు తీరప్రాంత గ్రామాలైన అలగాయపాలెం, టెంకాయచెట్లపాలెం, చిన్నపట్టపుపాలెం, చాకిచర్ల, పెదపట్టపుపాలెం, రామాయపట్నం, పల్లెపాలెం గ్రామాల్లో అధిక శాతం ప్రజలు సముద్ర వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని భూములు బీపీసీఎల్ కోసం తీసుకునే జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 6వేల ఎకరాలను సేకరించనున్నట్లు తెలిసింది. భూములను తీసుకోవడంతోపాటు ఆయా గ్రామాలను ఖాళీ చేయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కన్నతల్లి లాంటి సొంత ఊరు.. జీవనాధారమైన భూములు... తీరం వదిలి తాము ఎక్కడికి వెళ్లాలని మత్స్యకారులు భగ్గుమంటున్నారు. ఉలవపాడు మండలంలోని కొన్ని ప్రధాన గ్రామాలను లేకుండా చేసేందుకు బడాబాబులు కుట్ర పన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పరిశ్రమకు వెయ్యి ఎకరాలు సరిపోతుందని, అటవీ భూములను తీసుకుని పరిశ్రమ పెడితే తమకు ఉపాధి లభిస్తుందని, తమను తరిమేసి పరిశ్రమ పెడితే ఎలా..అని ప్రశ్నిస్తున్నారు.ఇవేమీ పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ భూములను పరిశీలిస్తున్నారు. సర్వేలు చేస్తున్నారు.భూములు లాక్కోవడానికి కుట్ర పరిశ్రమ పెట్టడానికి ఆరు వేల ఎకరాలు అవసరమా? అటవీ భూమి వెయ్యి ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది. కేవలం పేదల భూములు లాక్కోవడానికే పరిశ్రమ పేరుతో కుట్ర పన్నారు. – మిరియం శ్రీనివాసులు, 139 కులాల జేఏసీ చైర్మన్, కరేడు భూములు ఇచ్చేది లేదు బీపీసీఎల్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేది లేదు. మండలంలో చాలా అటవీ భూములు ఉన్నాయి. పరిశ్రమల కోసం వాటిని తీసుకోవచ్చు. – వాయల అంజయ్య, అలగాయపాలెం -
పశువులను కబేళాలకు తరలిస్తూ రూ.లక్షల్లో సంపాదన
డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కోవూరు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న కొందరు నేతలు నీచ స్థితికి దిగజారిపోయారు. ఇప్పటికే సహజ వనరులతోపాటు పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని దోచుకుంటూ జేబులు నింపుకుంటున్న వీరు పర్యావరణాన్ని కలుషితం చేస్తూ చేపలకు చికెన్ వేస్ట్ సరఫరా చేస్తున్నారు. తాజాగా పశువులను కబేళాలకు పంపిస్తూ కమీషన్లు దండుకునే నీచ స్థాయికి దిగజారిపోయారు. పంచాయతీ పాలకవర్గం తీర్మానం లేకుండానే ఆగమేఘాల మీద పంచాయతీ కార్యదర్శి అనుమతలు మంజూరు చేయడం చూస్తే ఏ స్థాయిలో సొమ్ములు చేతులు మారాయో అర్థమవుతోంది. ● పంచాయతీ పాలకవర్గ తీర్మానం లేకుండానే సంత నిర్వహణకు అనుమతి ● కోవూరు, పడుగుపాడు, రేగడిచెలికల్లో పశువుల సంతల నిర్వహణ ● రూ.లక్షల్లో చేతులు మారడంతో సంతలకు అనుమతి ● కోవూరులో బరితెగించిన షాడో ఎమ్మెల్యేలు -
పూలే దంపతుల విగ్రహావిష్కరణ
నెల్లూరు (టౌన్): నగరంలోని పప్పులవీధిలో ఉన్న వీవీఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఆవరణలో బండారు ఈశ్వరమ్మ పొదుపు గ్రూపు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పూలే దంపతుల విగ్రహాలను ఆదివారం హరియాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొంగూరు నారాయణ ఆవిష్కరించారు. గవర్నర్ దత్తాత్రేయను మంత్రి నారాయణ ఘనంగా సత్కరించారు. గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వారి ఆదర్శాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్అజీజ్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆర్డీఓ అనూష, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. మనీ స్కాం నిర్వాహకులను కఠినంగా శిక్షించాలి కావలి: పట్టణంలోని ముసునూరులో అనంతార్థ అసోసియేట్స్ ఏర్పాటు చేసిస్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కావలిలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) నాయకులు బలిజేపల్లి వేంకటేశ్వర్లు, కె నాగరాజు, దమ్ము దర్గాబాబు, పసుపులేటి పెంచలయ్య, లక్ష్మీరెడ్డి, కరవది భాస్కర్, మల్లి అంకయ్య, చిట్టిబాబు, చేవూరి కొండయ్య తదితరులు మాట్లాడారు. నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని, మనీ స్కాంలో నష్టపోయిన బాధితులకు వామపక్ష పార్టీలు అండగా ఉంటాయని ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. మనీ స్కాంలో ఏజెంట్లుగా ఉండి, అండగా నిలిచిన ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2024 ఆగస్టులోనే మనీ స్కాంపై పత్రికల్లో కథనాలు ప్రచురితమైనప్పటికీ పోలీసులు దృష్టి సారించలేదన్నారు. అనేక రాష్ట్రాల్లో ఈ తరహా నేరాలకు పాల్పడిన వ్యక్తికి కావలిలో పోలీసు అధికారులు కొమ్ము కాయడం అత్యంత విచారకరమన్నారు. ఆజాద్ సెంటర్లో పోలీసు పికెట్ నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరం ఆజాద్ సెంటర్లో శనివారం అర్ధరాత్రి స్వామి వివేకానంద విగ్రహ ఏర్పాటు చేయడంతో రెండు వర్గాల నడుమ వివాదానికి దారి తీసింది. అక్కడ ఆ రెండు వర్గాలు మోహరించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ పి.సింధుప్రియ నేతృత్వంలో పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఆజాద్సెంటర్ వైపు వెళ్లే అన్నీ రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిషేధించారు. దుకాణాలన్ని మూయించివేశారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతం ఆదివారం నిర్మానుష్యంగా మారింది. -
సిమెంట్ రోడ్డుకు అడ్డంగా గోడ..!
● పరిహారం చెల్లించలేదంటూ వ్యక్తి వినూత్న నిరసన ఆత్మకూరు: పట్టణ పరిధిలోని రెండో వార్డులో గల నరసాపురంలో తన స్థలంలో సిమెంట్ రోడ్డును నిర్మించి, దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని చెల్లించలేదంటూ రోడ్డుపై అడ్డంగా గోడను ఓ వ్యక్తి నిర్మించారు. నరసాపురానికి చెందిన అల్లంపాటి మాధవరెడ్డి వలంటీర్‌గా పనిచేసేవారు. అతని ఇంటి దగ్గర సిమెంట్ రోడ్డును నాలుగేళ్ల క్రితం నిర్మించారు. తన స్థలంలో సైతం నిర్మించారని, దీంతో ఉమ్మడి ఆస్తి పంపకాల్లో తమ బంధువుల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. నష్టపరిహారాన్ని సైతం ఇవ్వలేదని ఆరోపించారు. అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా ప్రయోజనం లభించలేదని, ఈ కారణంగానే సిమెంట్ రోడ్డు నిర్మించిన ప్రాంతంలో గోడను ఏర్పాటు చేశానని వివరించారు. మరోవైపు దారి మూసేయడమేమింటూ పలువురు గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న కమిషనర్ గంగా ప్రసాద్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని గోడను తొలగించారు. -
పరిహారంలో దగా
విజయవాడ–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ పరిహారంపై సీతారామపురం మండల రైతులకు కూటమి సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తోంది. నామమాత్రపు పరిహారం చెల్లించి బలవంతంగా భూములు లాక్కొంటున్నారని రైతులు లబోదిబోమంటున్నారు. మా కడుపులు కొట్టొదంటూ రైతులు అధికారులు, కాంట్రాక్టర్లను వేడుకున్నా కనికరించడంలేదు. పచ్చని పైర్లను యంత్రాలతో ధ్వంసం చేసి రోడ్డు పనులు చేపడుతున్నారు. ఉదయగిరి: సీతారామపురం మండల పరిధిలో జరుగుతున్న ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం.. రైతుల పాలిట శాపంగా మారింది. విలువైన భూములను రోడ్డు నిర్మాణానికి సేకరిస్తున్న క్రమంలో రైతుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సముచిత పరిహారం చెల్లించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అరకొరగా పరిహారం ఇస్తామంటూ బెదిరించి మరీ స్వాధీనం చేసుకుంటోంది. ఆయా గ్రామాల్లో సేకరిస్తున్న భూములకు ఇచ్చే పరిహారంపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే అప్పటి అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల కడుపుకొట్టి పచ్చని పంట సాగులో ఉన్న భూములను దౌర్జన్య పూరితంగా స్వాధీనం చేసుకుంటుంది. కనీసం పంట కాలం పూర్తయ్యాక అయినా.. తీసుకుని ప్రాధేయపడుతున్నా.. అధికారులు కనికరించడం లేదు. పరిహారంలో అన్యాయం మండలంలో మారుమూల గ్రామాల్లో కూడా ప్రస్తుతం ఎకరా ధర రూ.8 లక్షలు వరకు పలుకుతోంది. కొన్ని చోట్ల అయితే రూ.15 లక్షలు వరకు కూడా ఉంది. అయితే రైతులకు మాత్రం రూ.4 లక్షలు మాత్రమే పరిహారం చెల్లిస్తున్నారు. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా పరిహారం చెల్లింపుల్లో కూడా సమన్యాయం పాటించలేదని, అధికార పార్టీ నేతల మద్దతు ఉన్న వారికి అధికంగా చెల్లింపులు జరిగాయని పలువురు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం రూ.6 లక్షలు అయినా ఇవ్వాలని రైతులు కోరుతున్నా.. పట్టించుకోవడంలేదు. బలవంతంగా భూములు స్వాధీనం మండలంలోని మారంరెడ్డిపల్లి, గంధంవారి పల్లి, పబ్బులేటిపల్లి, ఓగూరువారిపల్లి గ్రామాల్లో భూములు సేకరించారు. అయితే పబ్బులేటిపల్లికి చెందిన కొంత మంది రైతులు న్యాయమైన పరిహారం ఇచ్చేంత వరకు తమ భూముల్లో పనులు చేయనీయమని గట్టిగా చెప్పారు. అయితే గత నెల 23న పోలీసులను అడ్డంపెట్టుకుని పంటలు ధ్వంసం చేసి పనులు చేపట్టారు. పొలం చుట్టు రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించుకున్న గోడకు పైసా పరిహారం ఇవ్వకుండా కూల్చేశారు. ఏళ్ల తరబడి పెంచుకున్న టేకుచెట్లకు కూడా పరిహారం ఇవ్వకుండా తొలిగించడంపై రైతులు లబోదిబోమంటున్నారు. పొలాల్లో నిర్మిస్తున్న రోడ్డు నామమాత్రపు ధరలతో రైతుల భూముల సేకరణ బలవంతంగా లాక్కొంటున్న అధికారులు -
దేశ సంపదను దోచేయడమే లక్ష్యంగా నిర్ణయాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): దేశ సంపద, వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు – సవాళ్లు అనే అంశంపై నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఈ విధానాలను వీడకపోతే వికసిత్ భారత్ కాస్త చీకటి భారత్‌గా మారే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం, విద్య, వైద్యం, ఆహార సబ్సిడీ, వ్యవసాయం తదితరాలకు బడ్జెట్లో కోత విధించారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, నేతలు కత్తి శ్రీనివాసులు, రాంబాబు, నరసింహులు, మాలకొండయ్య, మాదాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
మూడు చోట్ల సంతలు.. చేతులు మారిన రూ.లక్షలు
అరె! మీరు మాకన్నా మేయడంలో గొప్పోళ్లు! తినడంలో మిమ్మల్ని మించిపోయాం!సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోవూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు పశువుల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారు. పాడి పశువులను కబేళాలకు తరలించేందుకు ఏకంగా మూడు చోట్ల సంతలను ఏర్పాటు చేసి కమీషన్లతో జేబులు నింపుకుంటున్నారు. వారానికి రెండు రోజుల పాటు నిర్వహిస్తూ మూగజీవాల ఉసురుపోసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో గతంలో నెల్లూరు పెన్నావంతెన, చిల్లకూరు ప్రాంతాల్లో ఉండే పశువుల సంతల నిర్వాహకులు పశువులను కబేళాలకు పంపించడం మహాపాపమని భావించి ఎత్తేయడంతో ఆ వ్యాపారాన్ని కోవూరు టీడీపీ నేతలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ప్రస్తుతం కోవూరు నియోజకవర్గంలో మూడు చోట్ల సంతలను ఏర్పాటు చేసి పశువుల అక్రమ రవాణాను ప్రోత్సహిస్తుండడంపై ఆ పార్టీ శ్రేణులే ఛీదరించుకుంటున్నాయి. పంచాయతీ పాలకవర్గం అనుమతి లేకుండానే కార్యదర్శి ఉత్తర్వులు కోవూరు పంచాయతీలో సంత నిర్వహించేందుకు ఆగమేఘాల మీద పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వులిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ సంత నిర్వహణకు ఈ ఏడాది జనవరి 6వ తేదీ దరఖాస్తు చేసుకుంటే అదే రోజు పంచాయతీ తీర్మానం చేసినట్లు, ఫిబ్రవరి 3వ తేదీ సిఫార్సు, ఫిబ్రవరి 4వ తేదీ ఈఓపీఆర్డీ, అదే రోజు డివిజనల్ పంచాయతీ అధికారి అంగీకారం మేరకు ఫిబ్రవరి 5వ తేదీన కోవూరు పంచాయతీ కార్యదర్శి సంత నిర్వహణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియను పరిశీలిస్తే దరఖాస్తు చేసిన రోజునే పంచాయతీ తీర్మానం చేయడం, మూడు రోజుల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి డివిజనల్ పంచాయతీ అధికారి వరకు ఆగమేఘాల మీద అనుమతుల్వివడం చూస్తుంటే ఏ స్థాయిలో ముడుపులు చేతులు మారాయో అర్థమవుతోంది. వేరెవరైనా అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే.. ఇంత వేగంగా ప్రభుత్వ శాఖలు అనుమతి ఇస్తాయా? ఇచ్చినా దాఖాలు ఉన్నాయా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉంటే కోవూరులో సంత నిర్వహణకు పంచాయతీ పాలకవర్గానికి తెలియకుండానే ఈ ప్రక్రియ అంతా పంచాయతీ కార్యదర్శి నడిపించినట్లు విమర్శలు ఉన్నాయి. బోగస్ పంచాయతీ తీర్మానంతో ఆగమేఘాల మీద సంత నిర్వహణ ఏడాది పాటు చేసుకునేందుకు ఏకంగా నిబంధనలు ఉల్లంఘించి రాత్రికి రాత్రే ఉత్తర్వులు ఇవ్వడం పెద్ద దుమారం రేపింది. అయితే పాలకవర్గం ఉన్నప్పటికి వారి అనుమతి లేకుండానే కోవూరు పంచామతీ కార్యదర్శి మండల స్థాయి నేతకు నిర్వహణ ఉత్తర్వులు ఎలా ఇస్తారంటూ పాలకవర్గం నిలదీసింది. తమపై వస్తున్న రాజకీయ ఒత్తిళ్ల క్రమంలోనే ఉత్తర్వులు ఇచ్చేశానని కార్యదర్శి బహిరంగంగానే చెబుతుండడం గమనార్హం. కోవూరులో ఏర్పాటు చేసిన సంతలో కట్టేసిన పశువులురవాణాకు పశుసంవర్థక శాఖ అనుమతుల్లేకుండానే.. పశువులను కబేళాలకు తరలించేందుకు పశుసంవర్థక శాఖ వైద్యుల అనుమతి ముఖ్యం. ఒట్టిపోయిన పశువులనే కబేళాలకు తరలించాల్సి ఉంది. జబ్బున పడ్డ పశువులను ఏమాత్రం కబేళాలకు తరలించకూడదు. ఇలాంటి నిబంధనల నేపథ్యంలో పశు వైద్యులు సర్టిఫై చేసిన పశువులనే కబేళాలకు తరలించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా రెండు.. మూడేళ్ల దూడల నుంచి పాలిచ్చే పశువుల వరకు ఈ సంతల నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ సంతల నుంచి అపహరించిన పశువులను రవాణా చేస్తున్నారు. డబ్బు సంపాదించేదుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ పశువుల ఉసురుతో డబ్బు సంపాదించేందుకు ప్రభుత్వ శాఖల అధికారులతోపాటు అధికార పార్టీ నేతలు దిగజారిపోవడం పశు పోషకులతోపాటు మానవతావాదులను బాధిస్తోంది. హిందుత్వ వాదులూ.. ఏమయ్యారో! గోవధను నిషేధించాలంటూ ఉద్యమాలు చేసే హిందుత్వ సంఘాలు కోవూరు నియోజకవర్గం నుంచి పశువులను కబేళాలకు అధికార పార్టీ నేత లు అక్రమంగా తరలిస్తుంటే ఏం చేస్తున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్యం దైవసేవలో ఉండే స్థానిక ప్రజాప్రతినిధి సైతం తన షాడో ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ దురాగతాన్ని అడ్డుకోకపోవడాన్ని కూడా హిందువులు నిలదీస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పట్టీపట్టనట్ల ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కోవూరు, పడుగుపాడు పంచాయతీలతోపాటు కొడవలూరు మండలంలోని రేగడిచెలికలో పశువుల సంతలను ఏర్పాటు చేశారు. ఇందులో కోవూరు పంచాయతీలో సంత నిర్వహణకు అనుమతులు తీసుకుంటే.. పడుగుపాడు, రేగడిచెలిక సంతలకు కనీసం అనుమతులు కూడా లేవని తెలుస్తోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సంత నిర్వహణను ఏర్పాటు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందు కోసం రూ.లక్షల్లో చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క సంత నుంచి వారంలో రెండు రోజుల్లో కనీసం 100 నుంచి 150 లారీల్లో పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. తద్వారా నెలకు రూ.లక్షల్లో కమీషన్లు వస్తున్నట్లు సమాచారం. -
కూటమికి కొమ్ముకాస్తే కష్టాలే!
నెల్లూరు(బారకాసు)/వెంకటగిరి (సైదాపురం): ప్రజా సేవే లక్ష్యంగా అధికారులు పని చేయాలని, కూటమి నేతలకు కొమ్ముకాస్తూ.. వారిచ్చే మౌఖిక ఆదేశాలను పాటిస్తే భవిష్యత్‌లో కష్టాలు తప్పవని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌జేఆర్ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పేదలకు న్యాయం చేయాలని, ఇబ్బంది పెట్టేలా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీ కార్యకర్త పేచీరాజ్‌పై గతేడాది డిసెంబర్ 21న అక్రమంగా గంజాయి కేసు బనాయించి జైలుపాలు చేశారని ఆరోపించారు. అయితే పేచీరాజ్ కేసును విచారించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజీ సమర్పించాలని పోలీసులను ఆదేశించిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు భవిష్యత్‌తో హైకోర్టుకు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని వివరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వెంకటగిరి సుందరీకరణకు 110 ఎకరాల్లో నగర వనం ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశామని, ప్రస్తుతం ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నగరవనం ప్రారంభోత్సవంలో శిలాఫలకం విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని, దళితుడైన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తిని అవమానించేలా ఆయన పేరు లేకుండా చేశారని మండి పడ్డారు. ఈ విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ పేరు కూడా శిలాఫలకంలో లేదన్నారు. దీనిపై స్థానిక జనసేన నేతలు స్పందించాలని సూచించారు. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం తథ్యమని స్పష్టం చేశారు. తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికారులు నిబంధనల అమల్లో సాంకేతిక కారణాలను సాకుగా చూపి సరైన విధానాన్ని పాటించలేదన్నారు. మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, చైర్మన్ల మార్పు జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో వెంకటగిరిలో అలాంటి ప్రయత్నం జరిగితే దానిని ఎలా తిప్పి కొట్టాలో తనకు సంపూర్ణ అవగాహన ఉందని, అధికారులు నిబంధనలు విధిగా పాటించాలని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఎస్.బాలయ్య, జిల్లా సంయుక్త సహాయ కార్యదర్శి చిట్టేటి హరికష్ణ, బాలాయపల్లి, డక్కిలి మండలాల కన్వీనర్లు వెందోటి కార్తీక్‌రెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, కౌన్సిలర్లు ఆటంబాకం శ్రీనివాసులు, సుబ్బారావు, వహిదా, నేతలు అల్లంసాయి, పేచీరాజ్, దశరథరామిరెడ్డి, సతీష్, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. అధికార పార్టీ నేతల మౌఖిక ఆదేశాలు పాటిస్తే అధికారులకు ఇబ్బందులు తప్పవు న్యాయమే గెలిచిందనేందుకు పేచీరాజ్కు బెయిల్ మంజూరే నిదర్శనం నగరవనం ప్రారంభోత్సవ శిలాఫలకంలో తిరుపతి ఎంపీ పేరు లేకపోవడం సరికాదు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
● మరొకరికి గాయాలు మనుబోలు: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు సమీపంలోని కాఫీ డే వద్ద లారీ యాక్సిల్ విరిగిపోవడంతో రోడ్డుపై నిలిచిపోయింది. ఇదే సమయంలో ఏర్పేడు మండలం బండారుపల్లికి చెందిన మద్దిపట్ల రాజేష్ నాయుడు (34), తన స్నేహితుడు శేఖర్ కలిసి బైక్‌పై సొంతూరు వెళ్లసాగారు. ఈ క్రమంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ప్రమాదంలో బైక్ నడుపుతున్న రాజేష్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, శేఖర్ గాయపడ్డారు. ఘటన స్థలాన్ని మనుబోలు ఎస్సై శివరాకేష్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అతిగా ప్రవర్తించే వారి లెక్కలు తేలుస్తాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పొదలకూరు : మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావడం ఖామని, కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో అతిగా ప్రవర్తించే వారి లెక్కలు తేలుస్తామని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బిరదవోలులో శనివారం రాత్రి కాకాణి పర్యటించారు. ఆయన్ను పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. అక్రమ కేసులు పెట్టి తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి లెక్కలు రాసుకుంటామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు నడవాలని సూచించారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముత్యాలపేట గ్రామ నాయకుడు కండే రమణయ్య సోదరుడు కండే వెంకటేశ్వర్లు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. కాకాణి వెంట బిరదవోలు ఎంపీటీసీ రావుల దశరథరామయ్యగౌడ్, నాయకులు వెన్నపూస దయాకర్‌రెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, వెంకటశేషయ్య, వెన్నపూస యానాదిరెడ్డి, మాలపాటి రమణారెడ్డి, వెన్నపూస కృష్ణారెడ్డి, ఆకుల గంగిరెడ్డి ఉన్నారు. రోడ్లపై సాగునీరు సాగునీటి కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల సాఫీగా సాగాల్సిన సాగునీరు రోడ్లపై ప్రవహరించి రోడ్లు దెబ్బతింటున్నాయని కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. సోమిరెడ్డి ధన దాహానికి సాగునీటి కాలువల్లో పూడిక తీయకపోవడం వల్ల కాలువలు పొంగుతున్నాయని విమర్శించారు. కాలువ నీరు ఉబికి రోడ్లపైకి రావడమే కాక పొలాల్లోకి వెళ్లడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. పొదలకూరు మండలం నందివాయ–అమ్మవారిపాళెం గ్రామాల మధ్య సాగునీరు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది తప్పడం లేదన్నారు. పరిస్థితిని గమనించిన స్థానిక రైతులు సొంత నిధులతో నీరు రోడ్లపైకి రాకుండా కట్టలు పోసుకుంటున్నారన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
వింజమూరు(ఉదయగిరి): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని బుక్కాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కృష్ణ (48) తనకున్న నాలుగెకరాల వ్యవసాయ భూమిలో పైరుకు నీరు పెట్టేందుకు ఉదయం 6.30 గంటల సమయంలో వెళ్లారు. ఆ సమయంలో మోటార్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ హెడ్ ఫ్యూజ్ కాలిపోవడాన్ని గమనించారు. దాన్ని సరిచేసే నిమిత్తం స్తంభమెక్కి విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయారు. ఎంతకీ రాకపోవడంతో భార్య ఫోన్ చేసినా ప్రయోజనం లభించలేదు. దీంతో పొలం వద్దకు కుటుంబసభ్యులు హుటాహుటిన వెళ్లగా నేలపై పడి ఉన్నారు. ఆయన్ను లేపి మాట్లాడగా, షాక్‌కు గురయ్యానని చెప్పడంతో ఆటోలో వింజమూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. పెద్ద దిక్కు మృత్యువాతపడటంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆందోళన వద్దు
● బర్డ్ ఫ్లూపై చర్యలు శూన్యం ఎక్కడా ఇబ్బందుల్లేవు ● నష్టపోతున్న నిర్వాహకులు ● ఆర్నెల్ల క్రితమే గుర్తించినా ముందస్తు చర్యలేవీ..? ● అంతా అయ్యాక టీకాల పేరిట హడావుడి నెల్లూరు(సెంట్రల్): బర్డ్ ఫ్లూ కేసులు జిల్లాలో ఆర్నెల్ల క్రితమే నమోదైనా, సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పెద్దగా నష్టం ఉండదంటూ పశుసంవర్థక శాఖ అధికారులూ నిర్లిప్త ధోరణిని కనబర్చారు. ఫలితంగా ఈ వైరస్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విజృంబిస్తూ పౌల్ట్రీ రంగాన్ని కకావికలం చేస్తోంది. నష్టపోతున్న నిర్వాహకులు జిల్లాకు ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటారు. జిల్లాలో పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కోళ్ల ఫారాలను కొందరు నిర్వహిస్తున్నారు. 19 ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫారాలుండగా, ప్రస్తుత ఇబ్బందుల తరుణంలో అది పదికే పరిమితమైంది. ఇందులో దాదాపు మూడు లక్షల కోళ్లను పెంచుతున్నారని సమాచారం. చిన్నచితకా చికెన్ వ్యాపారులు వారి షాపుల వద్దే కోళ్లను పెంచుకుంటున్నారు. వీటిలో ఒక్క దానికి వ్యాధి వచ్చినా, మిగిలినవి మృత్యువాతపడే అవకాశాలున్నాయి. అధికారులు మాత్రం ఈ విషయాన్ని బయటకు రానివ్వడంలేదు. ఎక్కడ తమ నిర్లక్ష్యం బయటపడుతుందోననే భయంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో స్పందించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. మీరే జాగ్రత్తలు పాటించాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామంటూ పౌల్ట్రీ నిర్వాహకులను కొందరు అధికారులు హెచ్చరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అంతులేని నిర్లక్ష్యం జిల్లాలో బర్డ్ ప్లూ ఆనవాళ్లు కోళ్లకు వచ్చాయనే అంశం ఆర్నెల్ల క్రితమే బయటపడింది. గుమ్మళ్లదిబ్బ, చాటగొట్ల ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. వ్యాధి కారణంగా అప్పట్లో దాదాపు పది వేల కోళ్లకుపైగా చనిపోయాయి. అప్పట్లో ఈ వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. కేంద్రం నుంచి నెల్లూరొచ్చిన ప్రత్యేక బృందం అధ్యయనం చేసి బర్డ్‌ఫ్లూ అని నిర్ధారించింది. కొన్ని రోజుల పాటు ఈ ప్రాంతాల్లో పది కిలోమీటర్ల మేర ప్రత్యేక జోన్‌ను ప్రకటించారు. ఇప్పుడు హడావుడి.. బర్డ్ ఫ్లూ అనేది హెచ్5ఎన్1 అనే వైరస్ ద్వారా వస్తుందని సంబంధిత శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వ్యాధి ఒక కోడి నుంచి మరోదానికి వ్యాపించి మృత్యువాత పడే అవకాశాలున్నాయి. తాజాగా ఉభయగోదావరి జిల్లాల్లో వెలుగులోకి రావడంతో టీకాలంటూ జిల్లాలో సంబంధిత శాఖ అధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. పౌల్ట్రీ నిర్వాహకుల వద్దకెళ్లి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కోళ్లను అనుమతించొద్దని, ఫారాల్లోకి కొత్త వ్యక్తులను రానీయొద్దంటూ సూచనలు జారీ చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని అధికారులు చెప్తున్నారు. వీటిపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో కొద్ది నెలల క్రితం వ్యాధి వచ్చిన మాట వాస్తవమే. ప్రస్తుతం జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎక్కడా లేదు. వ్యాధి ప్రబలకుండా ప్రత్యేక బృందాలు పర్యటిస్తున్నాయి. ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. – చైతన్యకిశోర్, ఏడీ, జిల్లా పశువైద్య నిర్ధారణ ప్రయోగశాల జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ ఇబ్బందుల్లేవు. ఉభయగోదావరి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిసింది. ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భయపడాల్సిన అవసరం లేదు. – వెంకటరమణయ్య, బ్రాయిలర్ ఫార్మర్స్ అసోసియేషన్ -
మలివయసులో ఆదరణ కరువై..
● మనస్తాపంతో వృద్ధురాలి ఆత్మహత్య సీతారామపురం: వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పడమటి రొంపిదొడ్లలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. ముటుకుందు చెన్నమ్మ (75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యుల ఆదరణ కరువవడంతో జీవితంపై విరక్తి చెంది ఊరి బయటకెళ్లి పురుగుల మందు సేవించి పడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. 108లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే చెన్నమ్మ మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జోయాలుక్కాస్‌లో 50 శాతం ఆఫర్లు నెల్లూరు(బృందావనం): అన్నమయ్య సర్కిల్ సమీపంలోని జోయాలుక్కాస్ జ్యూవెలరీ షోరూమ్ ప్రథమ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. కేక్‌ను కట్ చేసిన అనంతరం 50 శాతం ఆఫర్ల బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ అక్రమ్ అహ్మద్, అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్ మాట్లాడారు. మాఘమాసం, పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకొని గోల్డ్, డైమండ్ జ్యువెలరీ, అన్‌కట్ డైమండ్స్, ప్లాటినమ్, సిల్వర్ ఆభరణాలపై మజూరీ చార్జీల్లో 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశం మార్చి ఏడు వరకే అందుబాటులో ఉంటుందని వివరించారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్
● ఇద్దరికి గాయాలు పొదలకూరు: ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన పట్టణానికి సమీపంలోని రాపూరు మార్గంలో చైతన్య స్కూల్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. మర్రిపాడు మండలం పల్లవోలుకు చెందిన ముగ్గురు యువకులు సైదాపురం మండలం కలిచేడుకు వెళ్లారు. తిరిగొస్తుండగా, పొదలకూరు నుంచి రాపూ రుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొంది. ఘటనలో ఇండ్ల పుల్లయ్య, రాగి వెంకయ్య గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆటో చోరీపై ఫిర్యాదు వెంకటాచలం: మండలంలోని గొలగమూడిలో ఆటో చోరీపై పోలీసులకు బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేశారు. వెంకటాచలానికి చెందిన మేకల గోవింద్, కుటుంబసభ్యులతో కలిసి గొలగమూడిలోని భగవాన్ వెంకయ్యస్వామి ఆశ్రమానికి తన ఆటోలో శనివారం వెళ్లారు. ఆశ్రమం వద్ద పార్కింగ్ స్టాండ్‌లో ఆటోను నిలిపారు. అనంతరం వచ్చేసరికి కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల సంఘ అధ్యక్షుడిగా శ్రీధర్ నెల్లూరు సిటీ: పంచాయతీ కార్యదర్శుల సంఘ జిల్లా అధ్యక్షుడిగా శ్రీధర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ జనరల్ సెక్రటరీగా ముషీధర్, ఉపాధ్యక్షులుగా పద్మజ, కోశాధికారిగా దుర్గా దొరబాబు ఎన్నికయ్యారు. సమస్యలపై రాష్ట్ర కార్యవర్గానికి తెలియజేసి పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. ఉద్యోగ భద్రత కల్పించాలి నెల్లూరు(అర్బన్): అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్, ఉపాధ్యక్షుడు సంపత్‌కుమార్ డిమాండ్ చేశారు. నగరానికి ఆదివారం వచ్చిన వీరు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కలిసి ఉద్యోగ భద్రత కోసం చేపట్టాల్సిన ఉద్యమాలపై చర్చించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యాలయంలో సంఘ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆప్కాస్ విధా నాన్ని నేటి ప్రభుత్వ పెద్దలు రద్దు చేస్తామని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఇలా అయితే మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి చిరుద్యోగులు బలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సొసైటీల కింద పనిచేస్తున్న మెప్మా, సెర్ఫ్ సిబ్బందికి హెచ్ఆర్ పాలసీని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించారని గుర్తుచేశారు. ఆప్కాస్‌పై ఏర్పడిన అనిశ్చితిని తొలగించాలని కోరారు. సంఘ జిల్లా అధ్యక్షుడు మహిధర్బాబు, జాయింట్ సెక్రటరీ విజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి రాజేష్, రాష్ట్ర కోశాధికారి రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక చిల్లకూరు: రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న హ్యాండ్‌బాల్ పోటీలకు 16 మంది క్రీడాకారులతో ఉమ్మడి నెల్లూరు జిల్లా జట్టును ఎంపిక చేశామని హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి, గురుకుల పాఠశాల పీడీ శ్రీరేష్ తెలిపారు. చిల్లకూరులోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో జట్లను ఆదివారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్నూల్లోని క్రీడా మైదానంలో ఈ నెల 21 నుంచి 23 వరకు పోటీలను నిర్వహించనున్నారని చెప్పారు. పీడీ హేమంత్, పీఈటీ అఖిల్తేజ తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తు సర్జరీలతో మెనోపాజ్
నెల్లూరు(అర్బన్): చిన్న వయస్సులోనే ఆపరేషన్లు చేసి గర్భ సంచులను తొలగించడం ద్వారా మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఢిల్లీకి చెందిన ఇండియన్ మెనోపాజ్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అంజూసోనీ పేర్కొన్నారు. మెడికవర్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నూతనంగా ఏర్పడిన నెల్లూరు మెనోపాజల్ సొసైటీని నగరంలోని ఓ హోటల్లో ఆదివారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. చిన్న అనారోగ్య కారణాలతో 30 ఏళ్లకే గర్భసంచిని తొలగించడం దారుణమని, దీంతో ముందస్తుగా మెనోపాజ్‌కు మహిళలు గురవుతున్నారని చెప్పారు. అనంతరం పలు రకాల కేన్సర్ వ్యాధులు, నివారణ తదితరాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. మెడికవర్ సెంటర్ హెడ్ బిందురెడ్డి, డాక్టర్లు రమేష్‌బాబు, రంగరామన్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక జిల్లాలోని 100కుపైగా మహిళా డాక్టర్లు సభ్యులుగా నెల్లూరు మెనోపాజల్ సొసైటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షురాలిగా పల్లంరెడ్డి యశోధర, కార్యదర్శిగా ఉషారాణి, నెల్లూరు అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులుగా సుప్రజ, లలితషిర్డీశాను ఎన్నుకున్నారు. -
రేషన్ బియ్యం కోటాకు కోత
నెల్లూరు(పొగతోట): జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాలో సమస్యలు నెలకొన్నాయి. చౌకదుకాణాలకు సరఫరా చేయాల్సిన దానికన్నా తక్కువ స్థాయిలో రేషన్‌ను అందించారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి దుకాణానికి పది నుంచి 20 శాతం కోత విధించారని సమాచారం. ఈ క్రమంలో 20 శాతం మంది కార్డుదారులకు బియ్యం అందక ఎండీయూ వాహనాలు, చౌక దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ విధానానికి స్వస్తి జిల్లాలో 7.23 లక్షల రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా 1,513 చౌక దుకాణాల ద్వారా 13 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. చౌక దుకాణంలో మిగిలిన బియ్యం ఆధారంగా మరుసటి నెల్లో కేటాయింపులుంటాయి. అయితే రెండు నెలల నుంచి బ్యాక్ లాగ్ ఆధారంగా రేషన్ సరఫరా విధానానికి అధికారులు స్వస్తి పలికారు. ఇష్టానుసారంగా కోత విధించారు. దీంతో కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. అందుబాటులో ఉన్న బియ్యాన్నే పంపిణీ చేశారు. ప్రస్తుతం 20 శాతం మందికి బియ్యం అందలేదని తెలుస్తోంది. బియ్యాన్ని తక్కువగా సరఫరా చేశారని డీలర్లు చెప్పడంతో ఆయా ప్రాంతాల సీఎస్డీటీలు ప్రతి దుకాణానికి మరో పది శాతాన్ని మంజూరు చేయాలంటూ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా విన్నవించుకున్నారు. కాగా దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇంతవరకు జారీ కాలేదు. డీలర్లు ఏమంటున్నారంటే.. జిల్లాలో రేషన్ కొరత ఉన్నా, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అధికారులను సంప్రదిస్తే మా చేతుల్లో ఏమీ లేదంటూ చేతులెత్తేశారని డీలర్లు చెప్తున్నారు. కార్డుదారులు తమ చుట్టూ తిరుగుతున్నారని, వారికి సమాధానం చెప్పలేకపోతున్నామని డీలర్ల అసోసియేషన్ నేతలు వెల్లడిస్తున్నారు. మాకు సంబంధం లేదు రెండు నెలల నుంచి రేషన్‌లో కోత విధించారని డీలర్లు చెప్తున్నారు. అలాట్మెంట్ విషయం రాష్ట్ర స్థాయి అధికారుల చేతుల్లో ఉంటుంది. జిల్లా పౌరసరఫరాల శాఖకు సంబంధం లేదు. రేషన్ అలాట్మెంట్ తర్వాత కార్డుదారులకు పంపిణీ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మిగిలిన కార్డుదారులకు రేషన్ అందించేలా చర్యలు చేపడతాం. – అంకయ్య, డీఎస్ఓ చౌక దుకాణాలకు పూర్తి స్థాయిలో జరగని సరఫరా కార్డుదారుల ఇబ్బందులు అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు శాంతమ్మ బియ్యం కోసం నాలుగుసార్లు ఎండీయూ వాహనం, ఆ ప్రాంత చౌక దుకాణం చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కోవూరుకు చెందిన మస్తాన్ అనే వ్యక్తి బియ్యం కోసం వారం రోజులుగా తిరుగుతున్నారు. ఇంత వరకు అందలేదు. నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాళేనికి చెందిన వ్యవసాయ కార్మికుడు శ్రీనివాసరావు రేషన్ కోసం చౌక దుకాణం చుట్టూ తిరుగుతున్నారు. -
వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ప్రసిది్ధ పెంచలకోన
దట్టమైన అడవులు.. నిలువెత్తు కొండలు.. ప్రకృతి సిగలో కొలువైనదే పెంచలకోన క్షేత్రం. చెంచులక్ష్మీదేవిని పెన వేసుకుని ఏకశిలా రూపంలో ఉన్న ఏకై క నరసింహ క్షేత్రమే పెంచలకోన. ఇక్కడి నరసింహుడు రాయలసీమ ఇలవేల్పు. తనకు ఇష్టమైన గరుడ వాహనంపై కొలువుదీరిన స్వామిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు.రాపూరు: వైష్ణవ పుణ్యక్షేత్రాల్లోనే పెనుశిల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం పెద్దదని నానుడి. ఇది కొండలు, కోనల మధ్య ఉండడంతో అక్కడి ప్రకృతి సౌందర్యం కూడా భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్రం సమీపంలో కొండల నుంచి జలపాతాలు, దట్టమైన అడవులు ఉన్నందున దూరప్రాంతాల ప్రజలు, విద్యార్థులు విహార యాత్రలు సాగిస్తుంటారు. పర్యాటకులు మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలని ఇష్టపడుతుంటారు. ఈ క్షేత్రంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, చెంచులక్ష్మీదేవిని పెనవేసుకుని శిలగా స్థిరపడినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ స్వామికి పెనుశిల నరసింహస్వామి అని పేరు సార్థకమయినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలు వైశాఖ శుద్ధ విదియ వరకు 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో సుమారు ఐదు లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు. పెంచలకోన ప్రాశస్త్యం నెల్లూరుకు సరిగ్గా 80 కిలోమీటర్ల దూరంలో సముద్రానికి 3 వేల కిలోమీటర్ల ఎత్తులో తూర్పుకనుముల్లో కణ్వనది పరీవాహక ప్రాంతంలో ఉన్న పెనుశిలకోన కాలక్రమేణా పెంచలకోనగా మారింది. గర్భగుడిలోని శిలారూపం రెండు తీగలు పెనవేసుకుని ఉన్నట్లే స్వామి, అమ్మవార్లు ఉంటారు. అయితే పెనుశిలను ఏ శతాబ్దంలో కనుగొన్నారో ఆధారాలు లభించలేదు. 1809లో హంటన్ దొర 200 ఎకరాల అటవీప్రాంతాన్ని పెంచలకోనకు ధారాదత్తం చేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు దాఖలాలున్నాయి. హిరణ్య కశిపున్ని వధించిన అనంతరం ఉగ్రరూపంలో సంచరిస్తున్న లక్ష్మీనరసింహస్వామి పెంచలకోన అడవుల్లోని చెంచు వనితను చూసి మోహించి వివాహం చేసుకున్నారని ప్రతీతి. ఎత్తైన శేషాచలం కొండలు, దట్టమైన అడవుల నడుమ సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో కండలేరు చెంత స్వామివారు స్వయంగా వెలిశారని చెబుతారు. విష్ణుమూర్తి అవతారాల్లో 9వ అవతారంగా పిలవబడుతున్న క్షేత్రం పెంచలకోన. స్వామికి పేర్లు ఎన్నో.. పెంచలకోన క్షేత్రంలోని పెంచలస్వామిని పలు పేర్లతో పిలుస్తారు. పెంచలస్వామి, పెనుశిల స్వామి, నరసింహస్వామి, లక్ష్మీనరసింహస్వామి, ఛత్రవట నరసింహుడు, కొండికాసులవాడు ఇలా పలుపేర్లతో స్వామిని పిలుస్తారు. కణ్వమహర్షి ఆశ్రమం ఈ క్షేత్రంలో కణ్వమహర్షి తపస్సు చేసినారని అందువల్లే ఇక్కడ నదికి కణ్వనది అని కాలక్రమేణా కండ్లేరు, కండలేరుగా మారిందని ఈప్రాంత వాసులు చెపుతారు. కండలేరు వద్ద జలాశయం నిర్మించారు. దీని ద్వారా నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తాగు, సాగునీరుతోపాటు చైన్నె నగర ప్రజలకు తాగునీరందిస్తారు. పరిసర ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలు పెంచలకోనలో కరుణామయి ఆశ్రమం ఆఽధ్యాత్మి క కేంద్రంగా విరాజిల్లుతోంది. ఆశ్రమంలో భవనాలు అమెరికాలోని వైట్హౌస్లా ఉంటాయి. లలితాపరమేశ్వరి ఆలయంలో చక్రీపీఠం ఉంది. విశాల ప్రాంగణంలో పచ్చదనంతోపాటు సేద తీరేందుకు పెద్దపెద్ద వృక్షాలున్నాయి. అలాగే పలు దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటాయి. అప్పుడప్పుడూ విదేశీ భక్తులు ఇక్కడికి చేరి ధ్యానం నేర్చుకుంటారు. అభివృద్ధి ఇలా.. పెంచలకోన క్షేత్రం అభివృద్ధి చెందుతోంది. తొలినాళ్లలో శనివారం మాత్రమే గోనుపల్లి నుంచి డప్పుల మోతలు, బాణసంచాతో శబ్దం చేసుకుంటూ కోనకు కాలినడకన భక్తులు, అర్చకులు చేరుకుని స్వామివారికి నైవేద్యం సమర్పించి వచ్చేవారు. దట్టమైన అడవిలో కోనకు వెళ్లే సమయంలో అడవి మృగాలు రాకుండా ఉండేందుకు ఇలా శబ్దం చేసుకుంటూ వెళ్లేవారు. ఆ తర్వాత రెండు పూట్లా నైవేద్యాలు జరిపేవారు. నేడు నిత్యపూజలు జరుగుతున్నాయి.క్షేత్ర విశేషాలు గొల్లబోయికి తొలి దర్శనం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి గ్రామానికి వచ్చిన తొలిసారి గొర్రెలకాపరి గొల్లబోయికి స్వామి తొలిదర్శనం ఇవ్వడంతో ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో కోనకు బయలుదేరే స్వామివారికి గ్రామ సమీపంలోని గొల్లబోయిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీవారు అప్పట్లో గ్రామానికి చేరుకున్నప్పుడు తమ మహిమలను గురించి వివరించి తమకు ఆలయం నిర్మించమని చెప్పి అలాగే గొల్లబోయిని వెనుతిరిగి చూడకుండా వెళ్లమని ఆదేశించారని దారిలో గొల్లబోయిన వెనుతిరిగి చూడడంతో శ్రీవారే గొల్లబోయి శిలారూపం దాల్చారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఏటా శ్రీవారు సతీసమేతంగా గొల్లబోయికి తొలి దర్శనమిచ్చి అనంతరం కోనకు చేరుకుంటారు. తిరుమల నుంచి శ్రీశైలం వరకు ఉన్న ఒకే కొండ మధ్యభాగంలో పెంచలకోన కొండలున్నాయి. ఈ క్షేత్రంలోని కొండ రెక్కలు విప్పినట్లు గరుడ ఆకారంలో ఉంటుంది. దక్షిణం, ఉత్తర దిశలు కొండలు, తూర్పు పడమర దట్టమైన అడవులు, ఈశాన్య భాగం జలప్రవాహం, రమణీయ ప్రకృతితో ఉంటుంది. పెంచలకోన క్షేత్రంలోని గర్భగుడిని ఎప్పుడు నిర్మించారోనన్న ఆధారాలు లేకపోయినా సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారని ఈ ప్రాంతీయులు చెబుతారు. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో సంతానలక్ష్మి వటవృక్షం ఉంది. ఈ వృక్షానికి చీరకొంగుతో ఉయ్యాల కడితే సంతానం కలుగుతుందని ఈ జనం నమ్మకం. ఈ క్షేత్రంలో సప్తతీర్థాలున్నాయి. కొండ మీద నుంచి కోనకు చేరుకునే వరకు ఏడు నీటి గుండాలున్నాయి. వీటిల్లో స్నానమాచరిస్తే అన్ని దోషాలు హరించి పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. -
ఆడుకుంటుండగా..
● ధాన్యం తొట్టెలో పడి బాలుడి మృతి నెల్లూరు సిటీ: ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదశాత్తు ధాన్యం తొట్టెలో పడి మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రూరల్ మండలంలోని గుండ్లపాళెం గ్రామంలోని శరణ్య రా అండ్ బాయిల్డ్ రైస్‌మిల్లులో బిహార్‌కు చెందిన మంగళ పాశ్వాన్ తన కుటుంబంతో నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నారు. మిల్లు వద్ద గదిలో కాపురం ఉంటూ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం అతని కుమా రుడు సత్యం కుమార్ (11) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ధాన్యం పడే తొట్టెలో పడ్డాడు. దీనిని ఎవరూ గుర్తించలేదు. కొంతసేపటికి బాలుడు తొట్టెలోని బియ్యంలో మునిగిపోయాడు. అక్కడి వారికి కాళ్లు కనిపించడంతో వెంటనే ధాన్యం పడటాన్ని ఆపారు. సత్యం కుమార్‌ను బయటికి తీసి హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శైవక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం
ఉదయగిరి: ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి ప్రముఖ శైవక్షేత్రాలైన సిద్దేశ్వరం, బైరవకోనకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు డీఎం శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి సూచనల మేరకు ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయగిరిలో ఉదయం 7 గంటలకు బస్సు బయల్దేరి సిద్దేశ్వరం చేరుకుంటుందన్నారు. అనంతరం 9.30 గంటలకు సిద్దేశ్వరంలో బయలుదేరి 11 గంటలకు భైరవకోనకు చేరుకుంటుందని చెప్పారు. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు భైరవకోనలో బయలుదేరి 2 గంటలకు ఉదయగిరికి చేరుకుంటుందని తెలిపారు. కాగా బస్సు సౌకర్యం కల్పించిన డిపో మేనేజర్‌ను ఉదయగిరి నియోజకవర్గ బీజేపీ నాయకులు ముడమాల రమేష్‌రెడ్డి, స్థానిక నాయకులు సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. -
అందరూ రహదారి నిబంధనలు పాటించాలి
● ముగిసిన రహదారి భద్రత మాసోత్సవాలు నెల్లూరు (టౌన్): ప్రతి వాహనాదారుడు తప్పనిసరిగా రహదారి నిబంధనలను పాటించాలని ఇన్చార్జి ఆర్టీఓ బాలమురళీకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓవర్ స్పీడ్, మద్యం తాగి వాహనం నడపడడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగం తదితర వాటిని తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రమాదాల్లో ఒకరు చేసిన తప్పు వల్ల మరొకరు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వాహనానికి ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా పొందాలన్నారు. ఈ సమావేశంలో ఎంవీఐలు ఎండీ రఫీ, కార్తీక్, ఏఎంవీఐలు పూర్ణచంద్రరావు, మల్లికార్జున్‌రెడ్డి, ఆటో, లారీ యూనియన్ నాయకులు, డ్రైవింగ్ స్కూల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. -
కందుకూరు అభివృద్ధికి దక్కని హామీ
కందుకూరు: సీఎం చంద్రబాబు కందుకూరు పర్యటన నియోజకవర్గ ప్రజలను పూర్తిగా నిరాశ పరిచింది. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ల పురోభివృద్ధికి ఎటువంటి హామీలివ్వకుండానే వెళ్లిపోయారు. నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో ఎప్పుడు కలుపుతారంటూ ప్రశ్నించిన వారిపై ఎదురు దాడి చేయడం చర్చనీయాంశమైంది. శనివారం సీఎం చంద్రబాబు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. స్పందించని సీఎం చంద్రబాబు కందుకూరు నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యల పరిష్కారానికి సీఎం హామీలిస్తారని ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. నియోజకవర్గానికే తలమానికమైన రామాయపట్నం పోర్టు అభివృద్ధి విషయంపై మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు. కందుకూరులో పట్టణ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఉత్తర బైపాస్ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. రాళ్లపాడు ప్రాజెక్ట్‌కు అందాల్సిన 1.5 టీఎంసీల దామాషా నీరు చేరడానికి సోమశిల ఉత్తర కాలువను వెడల్పు పనులు పూర్తి కాలేదు. వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి రాళ్లపాడు ప్రాజెక్ట్‌కు నీటిని తెచ్చే ప్రక్రియ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఎన్నికల ముందు కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇవి కాకుండా స్థానిక ఎమ్మెల్యే ఇంటూరు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చారు. ఆయా పెండింగ్ ప్రాజెక్ట్‌లను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చంద్రబాబు నుంచి ప్రజలకు హామీ దక్కుతుందని భావించారు. అయితే ఏ ఒక్కదానిపై కూడా చంద్రబాబు ప్రస్తావించలేదు. నిధులిస్తామని హామీ ఇవ్వలేదు. కేవలం మున్సిపాలిటీలో వివిధ పనుల నిమిత్తం రూ.50 కోట్లు ఇస్తామంటూ ప్రకటనతో సరిపెట్టారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదనలు చేస్తుంటే.. పట్టించుకోకుండా చంద్రబాబు నీకు ఎక్కువ సమయం ఇవ్వడం లేదు ముగించాలంటూ వారించారు. స్థానికుల డిమాండ్‌పై ఎదురుదాడి వేదిక ముందు కూర్చొన్న కొంత మంది కార్యకర్తలు కందుకూరును ప్రకాశంలో కలిపే విషయంపై ఏమి చేశారంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో చంద్రబాబు ఆ విషయం నాకు గుర్తుంది. ఎప్పుడు ఏం చేయాలో సమయానుకూలంగా చేస్తామంటూ చెప్పారు. దీనిపై సంతృప్తి చెందని ఓ కార్యకర్త ఎప్పుడు మారుస్తారో చెప్పాలంటే మరోసారి ప్రశ్నించారు. దీంతో వారిపై చంద్రబాబు ఎదురు దాడి చేశారు. ‘నువ్వు చాలా తెలివైన వాడిలా ఉన్నావు.. అందరూ నీలాగా ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పుడు కందుకూరు హామీ ఇస్తే మిగిలిన వాళ్లు అందరూ కూడా అడుగుతారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందని’ అంటూ చంద్రబాబు ముక్తాయింపు ఇచ్చారు. మాట మార్చిన బాబు గత ఎన్నికల ప్రచారం సందర్భంగా కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సైతం గెలిసిన ఆరు నెలల్లోనే ప్రకాశం జిల్లాలో కలుపుతామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కందుకూరు పర్యటనలో చంద్రబాబు ఈ విషయాన్ని దాటవేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తిరిగి ప్రకాశంలో కలవడం ఇప్పట్లో జరిగే పని కాదని ఆ పార్టీ శ్రేణులే ఒక అభిప్రాయానికి వచ్చాయి. ఎమ్మెల్యే ప్రతిపాదనలను పట్టించుకోకుండా తనదైన శైలిలో చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగం చేయడంపై కూడా రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ శ్రీకాంత్ డుమ్మా కందుకూరు స్థానికుడైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ శనివారం చంద్రబాబు పర్యటనకు డుమ్మా కొట్టారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్ తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు రాకపోవడం వెనుక ఎమ్మెల్యే ఇంటూరితో ఉన్న రాజకీయ విభేదాలే కారణమని తెలుస్తోంది. తిరిగి ప్రకాశంలో కలిపే విషయం దాటవేత రామాయపట్నం పోర్టు, ఉత్తర బైపాస్, రాళ్లపాడు ప్రాజెక్ట్ అభివృద్ధి ఊసేలేదు నిరాశ పర్చిన బాబు పర్యటన -
వైద్యమిత్రలపై కూటమి కత్తి
సీతారామపురం: ఆరోగ్యశ్రీ పథకాన్ని (ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్) రోగులకు అందించడంలో కీలకభూమి పోషించే వైద్యమిత్రలకు భరోసా కరువైంది. ఆరోగ్యశ్రీని బీమా కంపెనీకి అప్పగిస్తారన్న ప్రకటన వైద్యమిత్రులను ఆవేదనకు గురి చేస్తోంది. 17 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న వారిని నేడు ఆధారం కోల్పోతామేమోనన్న భయం వెంటాడుతోంది. 120 మంది జిల్లాలోని 132 పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, డి స్ట్రిక్, జీజీహెచ్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి. వాటిలో 35 ప్రైవేట్, 31 డెంటల్ (ప్రైవేట్), 66 ప్రభుత్వాస్పత్రులున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణకు ఎనిమిది మంది టీం లీడర్లు, ఆఫీస్ అసోసియేట్ ఒకరు, డీఎల్ ఒకరు, జిల్లా మేనేజర్ ఒకరుండగా 120 మంది వైద్యమిత్రలు పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.15 వేల జీతాన్ని నిర్ధారించగా కటింగ్‌లు పోను రూ.13 వేలు చేతికందుతుంది. వైద్యమిత్రులంతా ఉన్నత చదువు లు చదివిన వారే. ఎప్పటికై నా తమకు గుర్తింపు, కనీస వేతనం అందుతుందని, ఉద్యోగభద్రత ఉంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఎఫ్ఎంఎస్లో జీతాలివ్వడం ప్రారంభించినప్పటి నుంచి వారి కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా పరిగణిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధాన భూమిక నెట్వర్క్ ఆస్పత్రుల్లో నెలకు రెండు వేలకు పైబడి శస్త్రచికిత్సలు జరుగుతున్నట్టు అంచనా. రోగులు హాస్పిటల్లో చేరినప్పటి నుంచి తిరిగి క్షేమంగా ఇంటికెళ్లే వరకు నిరంతరం వైద్యమిత్రలు పర్యవేక్షిస్తుంటారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటంతో వైద్యమిత్రలంతా ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచుతారా? లేక ప్రైవేట్‌కు అప్పగిస్తారా? అనే మీ మాంస వారిని వెంటాడుతోంది. ప్రైవేట్‌కు అప్పగిస్తే ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న సర్వీస్ మొత్తం ఎందుకు పనికిరాకుండా పోతుందనే ఆవేదనలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. దీనికితోడు ఉద్యోగాలు కొనసాగిస్తారా? లేక కొత్తవారిని తీసుకుంటారా అనే భయంలో ఉన్నారు. ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు అప్పగించే యత్నం ఉద్యోగభద్రతపై ఆందోళన -
నేడు హరియాణా గవర్నర్ రాక
వెంకటాచలం: హరియాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కు రానున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రజామందిరంలో జరగనున్న మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనుమడు విష్ణు వివాహ రిసెప్షన్‌కు హాజరవుతున్నారని ట్రస్ట్ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.45 గంటలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఈ రిసెప్షన్ వేడుకలకు హాజరుకానున్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి సంతానం అడ్డుకాదు ● ఆ నిబంధన సడలిస్తూ గెజిట్ జారీ చేసిన న్యాయశాఖ సీతారామపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల పోటీకి సంబంధించి ఉన్న ‘సంతానం’ నిబంధనలను పంచాయతీరాజ్ చట్టం నుంచి తొలగిస్తూ న్యాయశాఖ ఈ నెల 12న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధన ఇప్పటి వరకు పంచాయతీరాజ్ చట్టంలో ఉంది. 30 ఏళ్ల కిందట దేశ జనాభా రికార్డు స్థాయిలో పెరిగిన నేపథ్యంలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. కుటుంబ నియంత్రణకు శ్రీకారం చుట్టాయి. ప్రత్యేక చట్టాలు తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించారు. అప్పట్లో ఈ నిబంధన కలకలం రేపి ఎంతో మంది రాజకీయ ఆశావహులపై నీళ్లు చల్లింది. తాజా నిర్ణయంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎండలోనే నిలువ కాళ్లపై ఎన్సీసీ విద్యార్థులు కందుకూరు రూరల్: కందుకూరులోని దూబగుంట వద్ద పారిశుధ్య కార్యక్రమాన్ని, ఇంకుడు గుంతను సీఎం చంద్రబాబు పరిశీలించే సమయంలో సెల్యూట్ కొట్టేందుకు స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్సీపీ విద్యార్థులను ఎండలో నిలువు కాళ్లపై రోడ్డుపై నిలబెట్టారు. సీఎం వచ్చే గంట ముందు నుంచే వారితో ఎండలో మాక్ డ్రిల్ చేయించారు. ఎండ తీవ్రత ఉన్న సమయంలో ఆకలి దప్పులతో ఎన్సీసీ విద్యార్థులను ఇలా ఇబ్బంది పెట్టడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. తిరిగి సీఎం వెళ్లిపోయిన తర్వాత కనిగిరి రోడ్డులో చెట్ల కింద వారికి మధ్యాహ్న 2.50 గంటలకు భోజనం పెట్టారు. క్లస్టర్ సమావేశాలు ఎంతో ఉపయోగం వరికుంటపాడు: ఉన్నత పాఠశాల్లో నిర్వహిస్తున్న పాఠశాల స్థాయి క్లస్టర్ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతామని ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం మండలంలోని వరికుంటపాడు, తిమ్మారెడ్డిపల్లి ఉన్నత పాఠశాలల్లో జరిగిన ప్లస్ క్లస్టర్ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం క్లస్టర్ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశాలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు హాజరైతే బోధనా నైపుణ్యాలు, పద్ధతులపై చర్చించుకోవచ్చన్నారు. క్లస్టర్ సమావేశాలు జ్ఞాన భాండాగారాలుగా తయారు అవుతాయని, విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్య నందించవచ్చన్నారు. సమావేశాల్లో మాదిరి పాఠ్యాంశ బోధనకు ప్రతి ఉపాధ్యాయుడు సిద్ధం కావాలన్నారు. బోధనకు ముందు ఉపాధ్యాయులు సంసిద్ధత కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశాల్లో ఎంఈఓ–1, 2 షేక్ మస్తాన్‌వలి, సీహెచ్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ముగిసిన సీఎం పర్యటన నెల్లూరు(క్రైమ్): సీఎం చంద్రబాబు కందుకూరు పర్యటన శనివారం భారీ బందోబస్తు నడుమ ముగిసింది. ఈ నేపథ్యంలో ఎస్పీ జి.కృష్ణకాంత్ 1,060 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. పర్యటన ఆద్యంతం ప్రశాంతంగా ముగియడంతో పటిష్టంగా బందోబస్తు విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. సహకరించిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల సిబ్బందికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. -
వెటర్నరీ పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ
రాపూరు: విజయనగరం జిల్లా గడివిడిలో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు జరిగిన 12వ రాష్ట్ర స్థాయి అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక పోటీల్లో రాపూరు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారని ప్రిన్సిపల్ శ్రీహరి తెలిపారు. వారిని శనివారం అభినందించారు. ఆయన మాట్లాడుతూ క్రికెట్ బాలుర విభాగం, బాలికల డిస్కస్ త్రోలో ప్రథమ స్థానం సాధించారన్నారు. బాలుర కబడ్డీ, బాలికల క్యారమ్స్, బాలికల షాట్‌పుట్, బాలుర డిస్కస్‌త్రో, 200 మీటర్ల రన్నింగ్‌లో ద్వితీయ స్థానం సాధించినట్లు వివరించారు. విద్యార్థులు బహుమతులు సాధించేందుకు కృషి చేసిన వ్యాయామ అధ్యాపకుడు పెంచలయ్యను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విశాలి, శివ, చంద్రశేఖర్, పాల్గొన్నారు. -
అంతర్జాతీయ పోటీలకు కావలి విద్యార్థినులు
కావలి: కావలి రూరల్ మండలం కొత్తసత్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు వి.షాలిని, వై.జ్యోతిలు అంతర్జాతీయ జంప్‌రోప్ పోటీలకు ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో వారు పాల్గొన్నారు. షాలిని రెండో స్థానంలో, జ్యోతి మూడో స్థానంలో నిలిచారు. దీంతో వారు శ్రీలంకలో జరుగనున్న అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారు. విద్యార్థినులను హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, పీడీ మురళి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 148 మంది గైర్హాజరు నెల్లూరు(టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్‌కు శనివారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 148 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్‌కు 2,874 మందికి 2,803 మంది హాజరయ్యారు. 71 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి జరిగిన ప్రాక్టికల్స్‌కు 2,148 మందికి 2,071 మంది హాజరయ్యారు. 77 మంది గైర్హాజరయ్యారు. కండలేరులో 53.270 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 53.270 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 720, లో లెవల్ కాలువకు 150, హైలెవల్ కాలువకు 190, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కు ల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
అంబేడ్కర్ విగ్రహాన్ని విస్మరించిన సీఎం
కందుకూరు రూరల్: పట్టణంలోని దూబగుంటలో మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించేందుకు శనివారం వచ్చిన సీఎం చంద్రబాబు అక్కడే ఉన్న భారత రాజ్యాంగ నిర్మాణ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విస్మరించి అగౌరవపరిచారు. బస్‌లో నుంచి కాన్వాయిలోకి మారే సమీపంలో ఆ విగ్రహం ఉన్నప్పటికీ కనీసం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాలని అనుకోకపోవడంపై సర్వత్రా దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అక్కడే దాదాపు అర్ధగంట సేపు సీఎంతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఆయన రాసిన రాజ్యాంగంతో పదవులు, అధికారాలు నిర్వహిస్తున్న వీరు ఆయన్ను విస్మరించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రీ సైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం దూబగుంట వద్ద ఏర్పాటు చేసిన మెటీరియల్ రీ సైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్ (ఎంఆర్ఎఫ్సీ)ను సీఎం ప్రారంభించారు. కండి మినరల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.45 లక్షలతో దీన్ని ఏర్పాటు చేశారు. రోజుకు 24 టన్నుల పునర్వినియోగం లేని వ్యర్థాలను శుభ్రపరిచే యంత్రాన్ని సీఎం పరిశీలించారు. అక్కడి నుంచి దూబగుంటలో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో దూబగుంటలోని పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. భీమని హరికృష్ణ ఇంటిలో నిర్మించిన ఇంకుడుగుంతను పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, సీడీఎంఏ సంపత్‌కుమార్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, సబ్‌కలెక్టర్ టి.శ్రీపూజ తదితరులు ఉన్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు రీసైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం -
ఆక్వా జోన్లో కలిపితే రాయితీలు
చిట్టమూరు: నాన్ ఆక్వా జోన్‌లోని భూములను జోన్ పరిధిలోకి తెస్తే.. పలు రకాల రాయితీలు వర్తించే వీలుంటుందని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రఘుబాబు సూచించారు. చిట్టమూరు, మల్లాం సచివాలయాల్లో శనివారం ఆక్వా సాగుదారులతో సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా 134 హెక్టార్లలో ఆక్వా సాగు చేసే భూములను ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆక్వా సాగుదారులు సుముఖత వ్యక్తం చేస్తే సిఫారసు చేస్తామన్నారు. మండలంలోని మల్లాం, చిట్టమూరు, పాదర్తివారికండ్రిక, రంగనాథపురం, పోతువాయినపాళెం, కొక్కుపాళెం, ముక్కుటిపాళెం, రాయిపెద్దిపాళెం గ్రామాల్లో ఆక్వా సాగు చేసే భూములను జోన్ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. మత్స్యశాఖ అసిస్టెంట్ వెంకటరమణ, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ట్రాలీ తిరగబడి మహిళ మృతి
● ఇద్దరికి గాయాలు లింగసముద్రం: వారంతా కూలీలు. అప్పటి వరకు పొగాకు పొలంలో పనిచేశారు. తర్వాత ట్రాక్టర్లో వెళ్తుండగా ట్రాలీ తిరగబడింది. దీంతో ఓ మహిళా కూలీ మృతిచెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఆర్ఆర్ పాళెం గ్రామం వద్ద శనివారం జరిగింది. ఎస్సై మహమ్మద్ సుభానీ కథనం మేరకు.. మొగిలిచర్ల పంచాయతీలోని నారసింహాపురం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో పొగాకు ఆకులు రెలిపేందుకు మొగిలిచర్ల గ్రామానికి చెందిన 22 మంది కూలీలు ట్రాక్టర్లో వెళ్లారు. పని పూర్తయ్యాక ఇంటికి బయలుదేరారు. పెంట్రాల నుంచి మొగిలిచర్లకు వెళ్లే రోడ్డుకు సమీపంలో ట్రాక్టర్ ట్రాలీ బండరాయిని ఎక్కడంతో తిరగబడింది. దీంతో ట్రాలీలో ఉన్న పోతినేని కుమారి (50), మరికొందరిపై పచ్చాకు పడిపోయింది. తోటి కూలీలు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే కుమారి ఊపిరాడక మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో కందుకూరు ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. పోస్టుమార్టం నిమిత్తం కుమారి మృతదేహాన్ని కందుకూరుకు తరలించారు. ఈ ఘటనపై కుమారి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
● స్వచ్ఛఆంధ్ర, స్వచ్ఛదివస్ను ప్రారంభించిన ఆనం ఆత్మకూరు: పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆత్మకూరు ఆర్డీఓ బి.పావని, మున్సిపల్ కమిషనర్ సి.గంగాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ వద్ద శనివారం మంత్రి ప్రారంభించారు. మున్సిపల్ సిబ్బంది తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానాన్ని ప్రదర్శించారు. అనంతరం మంత్రి ఆనం, అధికారులు స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞను నిర్వహించారు. అక్కడి నుంచి తూర్పువీధిలో అలఘనాథస్వామి ఆలయం వరకు స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్‌పై అవగాహన కల్పిస్తూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అలఘనాథస్వామి ఆలయానికి సంబంధించి కల్యాణ మండపం అభివృద్ధికి రూ.53.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు ఆరోగ్య శాఖా మంత్రి సత్యప్రసాద్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ఆత్మకూరు–సోమశిల మార్గాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధిత ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ నిధులు మంజూరు చేస్తారన్నారు. బీసీ హాస్టళ్ల భవనాల పునఃనిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు మంజూరైనట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గంలో పలు విద్యుత్ లైన్ల మార్పు, ఆ శాఖ భవనాల నిర్మాణానికి రూ.85 కోట్లు మంజూరైనట్లు వివరించారు. అనంతరం రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చెరువు ఎదురుగా మొక్కలు నాటారు. బైపాస్‌రోడ్డులోని ఏపీ బాలికల గురుకుల రెసిడెన్సియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ ఆర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ జి వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్ షేక్ సర్దార్, కౌన్సిలర్లు, రవాణా శాఖ ఎంవీఐ ఎం రాములు, ఫారెస్ట్ రేంజర్ శేఖర్, డీఆర్ఓ పిచ్చిరెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మమ్మీ.. డాడీ.. త్వరగా వచ్చేయండి
పెళ్లకూరు: విధి ఎంత విచిత్రమైనదో ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. సరిగ్గా గంట ముందు కుమారిడితో ముచ్చటించిన ఆ దంపతులు ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారిపోయారు. శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. 71వ నంబర్ జాతీయ రహదారి మార్గం దొడ్లవారిమిట్ట గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని తిరుమల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న గాను మాధవకృష్ణ (48), పొక్కల సరిత సుమంగళి (43) అనే సాఫ్ట్వేర్ దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసుల కథనం.. హైదరాబాద్‌లోని ఆంజనేయనగర్ ప్రాంతానికి చెందిన మాధవకృష్ణ, సరిత సుమంగళి అదే పట్టణంలోని ఓ ప్రయివేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. దైవదర్శనం కోసం దంపతులిద్దరూ మూడురోజుల క్రితం కారులో బయలుదేరి శుక్రవారం అరుణాచలం గిరిప్రదక్షణ చేశారు. అదే రోజు రాత్రి తిరుమలకు వెళ్లి శనివారం తెల్లవారుజామున స్వామిని దర్శించుకుని మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. దారిలో దొడ్లవారిమిట్ట గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి అతి వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లింది. సాఫ్ట్వేర్ దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, ఎస్సై నాగరాజు తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కారును స్థానికుల సహాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీశారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. కన్నీళ్లు తెప్పించిన కుమారుడి మాటలు తిరుమలలో శనివారం స్వామివారిని దర్శించుకున్న మాధవకృష్ణ, సరిత సుమంగళి దంపతులకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కుమారుడు నిషాంత్ ఫోన్ చేసి మాట్లాడాడు. మమ్మీ.. డాడీ.. త్వరగా ఇంటికి వచ్చేయమని చెప్పాడు. యాక్సిడెంట్ తర్వాత పోలీసులు అతడికి ఫోన్ చేయగా ఇందాకే వారితో మాట్లాడానని బోరున విలపించాడు. దంపతులకు ఒకే ఒక కుమారుడైన నిషాంత్ 9వ తరగతి చదువుతున్నాడు. ఎక్కడికి వెళ్లాలన్నా ముగ్గురూ కలిసే వెళ్లేవారు. అయితే దూర ప్రయాణం కావడం, ప్రస్తుతం పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో నిషాంత్‌ను ఇంటి వద్ద వదిలిపెట్టి, భార్యాభర్తలిద్దరూ దైవదర్శనానికి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు సాఫ్ట్వేర్ దంపతులు దుర్మరణం తల్లడిల్లిన ఒక్కగానొక్క కుమారుడు -
జిల్లాలో చెలరేగిపోతున్న క్రీడా మాఫియా
జిల్లాలో బోగస్ క్రీడల మాఫియా చెలరేగిపోతోంది. ప్రభుత్వ క్రీడా శాఖలో భాగమైన క్రీడా ప్రాధికార సంస్థకు సమాంతరంగా నకిలీ క్రీడా అసోసియేషన్లు, క్రీడా నిర్వాహక సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ గుర్తింపు లేని స్వయం ప్రకటిత సంస్థలు జిల్లా, రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు, విజేతలను ఎంపిక చేసినట్లు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నాయి. విద్యార్థులకు క్రీడల్లో ప్రావీణ్యం లేకపోయినా.. పేమెంట్ ఇస్తే చాలు అంటూ ఒక్కో ఈవెంట్, టోర్నమెంట్ పేరుతో రూ.లక్షల్లో దండుకుంటున్నాయి. ● క్రీడాప్రాధికార సంస్థకు సమాంతర వ్యవస్థ ● ప్రావీణ్యం వద్దు.. పేమెంటే ముద్దు ● ఇండోర్గేమ్స్లో ప్రతిభ లేకున్నా అంతర్జాతీయ స్థాయి విజేతగా సర్టిఫికెట్లు ● నకిలీ క్రీడా నిర్వాహక సంస్థలతో ప్రైవేట్ స్కూళ్లు మిలాఖత్ ● ఒక్కో టోర్నమెంట్‌కు రూ.లక్షల్లో వసూళ్లు నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో యోగా, కరాటే, తైక్వాండో, చెస్, క్యారమ్స్, కర్రసాము వంటి ఇండోర్ క్రీడలకు సంబంధించి నకిలీ క్రీడా అసోసియేషన్లు, క్రీడా నిర్వాహక సంస్థలు ఒక మాఫియాగా తయారై క్రీడలను వ్యాపారంగా మలుచుకుంటున్నాయి. రాష్ట్ర, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలకు సమాంతర స్థాయిలో నకిలీ అసోసియేషన్లు, నిర్వహణ సంస్థలుగా అవతరించాయి. విద్యార్థులకు ఆయా క్రీడలపై కనీస అవగాహన లేకపోయినప్పటికీ వీరు జిల్లా, రాష్ట్ర, అంతర్రాష్ట, జాతీయ స్థాయిలో విజేతలుగా ప్రకటించి ప్రశంసా వేదికలపై సర్టిఫికెట్లు అందజేస్తున్నాయి. క్రీడ, ఈవెంట్ స్థాయిని బట్టి అమౌంట్ ఫిక్స్ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు ప్రచారం.. విద్యార్థుల భవిష్యత్ అంధకారం జిల్లాలో దాదాపు అన్ని కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు క్రీడా మైదానాలు లేవు. దీన్ని అవకాశంగా తీసుకుని ఈ మాఫియా విద్యార్థులకు క్రీడల్లో ప్రావీణ్యం లేకపోయినా ఇండోర్ గేమ్స్‌లో విజేతలుగా ప్రకటించుకుంటూ డబ్బులు దండుకుంటుంటే.. ప్రైవేట్ యజమాన్యాలు గొప్పలు ప్రచారం చేసుకుంటున్నాయి. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లోనూ శిక్షణ ఇస్తున్నట్లు యజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ప్రత్యేకంగా ఫీజులు వసూలు చేస్తుంటే.. ప్రతి ఈవెంట్ పేరుతో అదనంగా మరికొంత వసూలు చేస్తున్నారు. మరో రకంగా మీ పిల్లలకు క్రీడల్లో సర్టిఫికెట్లను, మెడల్స్‌ను ఇప్పిస్తామని వేల రూపాయలు దండుకుంటున్నారు. ఈ ఇండోర్ గేమ్స్‌కు సంబంధించి ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆ సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని అవగాహన రాహిత్యంతో పిల్లలను పంపిస్తున్నారు. ఒక స్కూల్ నుంచి 40 నుంచి 50 మందిని సంవత్సరానికి మూడు టోర్నమెంట్లకు తీసుకెళ్తున్నారు. నేర్పించే మెంటర్‌కు ఎటువంటి అధికార పూర్వక గుర్తింపు ఉండదు. ఈ పోటీలు నిర్వహించే వారికి సంబంధిత అసోసియేషన్లు, ప్రభుత్వ గుర్తింపులు ఉండవు. విదేశాల్లోనూ క్రీడలు నకిలీ క్రీడా సమాఖ్యలు, అసోసియేషన్లు జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోటీలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడి వ్యక్తులే అంతర్జాతీయ స్థాయి పోటీలంటూ సింగపూర్, శ్రీలంక, మలేసియా, లక్ష దీవులు వంటి దేశాల్లో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. క్రీడా మైదానాలు, ఇండోర్ స్టేడియంలతో కూడా పనిలేకుండా ఒక హైప్రొఫెల్తో ఈ అంతర్జాతీయ పోటీలను నిర్వహిస్తున్నారు. ఆ సర్టిఫికెట్లను తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు అంటూ ప్రభుత్వం ఇచ్చే ప్రశంసా పత్రాలకు అర్హులుగా ప్రకటించేందుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు పంపిస్తున్నారు. కొత్తకొత్త క్రీడా సమాఖ్యలు నకిలీ క్రీడా సమాఖ్యలు, అసోసియేషన్ల మధ్య నగదు లావాదేవీల్లో గొడవలు రావడంతో ఎవరికి వారు ప్రత్యేకంగా కొత్త సమాఖ్యలను ఏర్పాటు చేసుకుంటున్నారు. క్రీడ ఏదైనా ఆ అసోసియేషన్‌కు ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. అందుకు సంబంధించి మెంటర్లు, కోచ్‌లు, వారు నిర్వహించే జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకే గుర్తింపు లభిస్తుందన్న విషయం తల్లిదండ్రులు తెలుసుకోవాలని గుర్తింపు పొందిన క్రీడా అసోసియేషన్లు చెబుతున్నాయి. ఒక్కో గేమ్‌కు.. ఒక్కో ఇన్స్ట్రక్టర్ ఒక్కొక్క స్కూల్ ఒక్కో ఇండోర్ గేమ్‌ను ఎంపిక చేసుకుని పిల్లలకు అవి నేర్పిస్తున్నట్లు ఒక పిరియడ్‌ను కేటాయిస్తున్నట్లు నమ్మ బలుకుతారు. ఇందు కోసం ఇండోర్ గేమ్స్ నేర్పించేందుకు ఒక ఇన్స్ట్రక్టర్ను ఏర్పాటు చేస్తారు. సంవత్సరంలో వాళ్లు వేసుకున్న షెడ్యూలు ప్రకారం టోర్నమెంట్లకు పిల్లలను తీసుకెళ్తారు. ఏ మాత్రం అధీకృత లేని సంస్థలు, కొంత మంది వ్యక్తులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న క్రీడా సమాఖ్యలు ఈ టోర్నమెంట్లను నిర్వహిస్తుంటాయి. ఇందుకు సంబంధించి స్కూళ్లల్లో ఆ టోర్నమెంట్లకు వెళ్లేందుకు పిల్లల దగ్గర నుంచి క్రీడా పరికరాలు, క్రీడా దుస్తులు, భోజనాలు, వసతి అంటూ ఒక్కో పిల్లాడి నుంచి వేలల్లో దండుకుంటారు. ఆ టోర్నమెంట్‌కు వెళ్లిన ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్లు మెమెంటోలు, సన్మానాలు ఏర్పాటు చేసి పిల్లలను ఫొటోలు తీసుకుని నకిలీ క్రీడల సమాఖ్యలు ప్రచారం చేసుకుంటుంటే.. తమ విద్యార్థులు పలానా క్రీడల్లో టాలెంట్ చూపించారని స్కూళ్ల యాజమాన్యాలు పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటాయి. తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్యా సంస్థలు చేసే నిర్వాకం పిల్లలకు ఎటువంటి క్రీడా స్ఫూర్తిని ఇవ్వకపోవడంతోపాటు ఏడాది పొడవునా డబ్బులు దండుకోవడానికి ఈ పోటీలు ఉపయోగపడుతున్నాయి. అవగాహన పెంచుకోవాలి ప్రైవేట్ స్కూళ్లల్లో నిర్వహిస్తున్న పోటీల్లో ఏవి అధికారిక పూర్వకమైనవో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఒక టోర్నమెంట్లో ఒక స్కూల్ నుంచి 30 మంది, 40 మంది పిల్లలకు ఒకేసారి మెడల్స్, ప్రైజ్‌లు ఎలా వస్తాయి? అనే విషయంపై దృష్టి సారిస్తే వాస్తవం తెలుసుకోవచ్చు. ఆయా క్రీడలకు సంబంధించిన వారిని సంప్రదించినా తెలుసుకోవచ్చు. బూటకపు టోర్నమెంట్లు ఈ మధ్య ఎక్కువయ్యాయి. – ఎస్కే ఖయ్యూం, యోగా అసోసియేషన్ ట్రెజరర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు రూ.వేలు దండుకుంటున్నారు ట్రాక్ సూట్లు, బనియన్లు, బూట్లు అంటూ 2, 3వ తరగతి చదివే పిల్లల దగ్గర నుంచి కూడా వేలాది రూపాయలు దండుకుంటున్నారు. స్కూల్ వాళ్లు చెప్పారని ఆ క్రీడలకు పంపిస్తున్నాం. వాస్తవానికి ఆ వయసు పిల్లలకు వారు సేకరించే అమౌంట్‌కు సంబంధం లేదు. క్రీడల పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని తల్లిదండ్రులందరూ తెలుసుకోవాలి. – భువనేశ్వరి, గృహిణి అంతా డబ్బు మయం పిల్లల టాలెంట్‌తో పనిలేదు. రాష్ట్రస్థాయి పోటీలకు తీసుకెళ్తే వాళ్లు చెప్పిన అమౌంట్ ఇస్తే జాతీయ స్థాయి పోటీలకు ఆపై పోటీలకు ఎంపిక చేస్తారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే టీమ్ అంతటికి అయ్యే ఖర్చులో కొంత మీరు పెట్టుకోండి అని ఆఫర్లు కూడా ఇస్తారు. అలా చేసిన వారి పిల్లలకే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో స్థానం కల్పిస్తారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలి. – వెంకటేశ్వరరావు, పేరెంట్ నకిలీ క్రీడా సమాఖ్యలు -
చంద్రబాబుకు చిన్నారి షాక్
సాక్షి, నెల్లూరు జిల్లా: కందుకూరు సభలో చంద్రబాబుకు చిన్నారి షాక్ ఇచ్చింది. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభలో దీప్తి అనే విద్యార్థిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇవాళ కందుకూరు సీఎం వస్తున్నారు కాబట్టే చెత్త ఎత్తేశారంటూ దీప్తి వ్యాఖ్యానించింది. రోజూ ఇలాగే కందుకూరులో వీధులు శుభ్రం చేయాలని విద్యార్థిని దీప్తి కోరింది.సిబ్బంది, అధికారులు పనితీరు ఎలా ఉందో దీప్తి మాటలు బట్టి అర్థమవుతోంది. చిన్నారి మాటలు సభికులను నిర్ఘాంత పోయేలా చేశాయి. ప్రభుత్వ పనితీరును తన ముందే ఆ చిన్నారి బయటపెట్టడంతో షాక్‌కు గురైన చంద్రబాబు.. ఆమె మాట్లాడినంత సేపు మౌనంగా ఉండిపోయారు. అంతలోనే తేరుకుని.. టాపిక్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. -
14 ఏళ్లు సీఎం.. 54 సంస్థలను ప్రైవేట్ పరం చేసిన చరిత్ర బాబుది: కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. అలాగే, 14 ఏళ్ళు సీఎంగా పనిచేసి 54 సంస్థలను ప్రైవేట్ పరం చేసిన చరిత్ర చంద్రబాబుది అంటూ ఎద్దేవా చేశారు. రైతులను దళారులు దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందా? అని ప్రశ్నించారు.నెల్లూరులోని జిల్లా పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అన్నదాతలఫై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎకరాకి లక్ష రూపాయలు అదనంగా వస్తే.. ఇప్పుడు ఎకరానికి 40 వేలు దాకా రైతులు నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాటల్లో తప్ప.. చేతల్లో లేదు. టీడీపీ హయాంలోనే రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటారు.టీడీపీ గెజిట్ పత్రికల్లోనే వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మిర్చి రైతులు ధరలు లేక అల్లాడిపోతున్నారు. ఆరు వేల కోట్ల రూపాయలు మేర మిర్చి రైతులు నష్టపోతున్నారు. దళారులు దోచుకుంటుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం అమలు చెయ్యకపోవడం వల్ల.. అప్పులు తెచ్చుకుని రైతులు వ్యవసాయం చేస్తున్నారు. పెట్టుబడులు పెరిగి.. రాబడి తగ్గడంతో రైతులు అప్పులు ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు.వైఎస్ జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలు ఉండకూడదనే కక్షతో.. రైతులను చంద్రబాబు రోడ్డున పడేస్తున్నాడు. 14 ఏళ్ళు సీఎంగా పని చేసి 54 సంస్థలను ప్రైవేట్ పరం చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కింది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యకపోతే అన్నదాతలను కలుపుకుని ఆందోళనకు శ్రీకారం చూడతాం’ అని హెచ్చరించారు. -
బర్డ్ ఫ్లూ వైరస్‌పై అప్రమత్తం
● జిల్లా సరిహద్దులో కోళ్ల రవాణా వాహనాల తనిఖీ మర్రిపాడు: బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దుల్లో అధికారులు శుక్రవారం కోళ్ల లోడుతో వస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వైఎస్సార్ జిల్లా ల్యాబ్ ఏడీ, బద్వేల్ ఏడీ నాగభూషణం, మర్రిపాడు మండల పశుసంవర్థక శాఖ సహాయకులు ముజమిల్, రాచాల శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్‌పై ఆరోపణలు వస్తే చర్యలు నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్‌లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తే సంబంధిత సెంటర్ బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు హెచ్చరించారు. సాక్షిలో లక్ష్యం ప్రాక్టి‘కిల్’ అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనంపై ఎట్టకేలకు ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు స్పందించారు. శుక్రవారం స్థానిక స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్ఐఓ కార్యాలయం నుంచి చీఫ్ సూపరింటెండెంట్లు, అడిషనల్ సూపరింటెండెంట్లు, ఎగ్జామినర్లతో పర్చువల్ సమావేశం నిర్వహించారు. ప్రాక్టికల్స్ నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కళాశాలల యాజమాన్యాల ఒత్తిళ్లకు, ప్రలోభాలకు తలొగ్గితే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాక్టికల్ పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీవీఈఓ మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రాక్టికల్స్‌కు 81 మంది గైర్హాజరు ఇంటర్ ప్రాక్టికల్స్‌కు జిల్లాలో మొత్తం 81 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్‌కు 2029 మందికి 2012 మంది హాజరయ్యారు. 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి జరిగిన ప్రాక్టికల్స్‌కు 2061 మందికి 1997 మంది హాజరయ్యారు. 64 మంది గైర్హాజరయ్యారు. పరిశోధనల్లో నెల్లూరుకు ప్రత్యేక స్థానం ● వ్యవసాయంలో నూతన పద్ధతులు ● కిసాన్ మేళాలో శాస్త్రవేత్తలు నెల్లూరు (సెంట్రల్): వరి విత్తనాల పరిశోధనలకు సంబంధించి నెల్లూరుకు ప్రత్యేక స్థానం ఉందని లాంఫాం యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు శివన్నారాయణ అన్నారు. నెల్లూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం కిసాన్ మేళా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు పరిశోధన స్థానం నుంచి వరి వంగడాలపై కొత్తగా పలు పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. లాంఫాం పరిశోధనా సంచాలకులు సత్యనారాయణ మాట్లాడుతూ 1937లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో స్థాపించిన ఈ పరిశోధన స్థానం 1961 నుంచి నెల్లూరులో ఏర్పా టు చేసినట్లు గుర్తుచేశారు. ఇక్కడి అనేక పరిశోధనలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సుమతి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభదాయక నూతన పద్ధతులు అనుసరణీయం అన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి సత్యవాణి మాట్లా డుతూ ఎప్పటికప్పుడు మండలాల్లోని వ్యవసా య అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు అందిస్తున్నారని, శాస్త్రవేత్తలు సూచనలు తీసుకుంటే మంచిదన్నారు. ప్రధాన శాస్త్రవేత్త వినీత, కృషి విజ్ఞాన కో–ఆర్డినేటర్ లలితా శివజ్యోతి మాట్లాడారు. మద్దతు ధరలు కల్పిస్తే చాలు రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కిసాన్‌మేళాకు వచ్చిన పలువురు రైతులు అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీశారు. తమకు మద్దతు ధర ఎంతో అవసరమని, ఆ ధరే లేనప్పుడు ఈ సభలు, సమావేశాలు ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వాన్ని పొగడడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో రైతులు లేచి వెళ్లిపోయారు. -
బీపీసీఎల్‌కు భూములిచ్చేది లేదు
ఉలవపాడు: పరిశ్రమల పేరుతో మత్స్యకార గ్రామాల్లోని భూములు తీసుకుంటామంటే సహించేది లేదని, బీపీసీఎల్‌కు భూములిచ్చేది లేదని, అవసరమైతే అందరూ కలిసికట్టుగా పోరాడాలని మత్స్యకార గ్రామాల నాయకులు తీర్మానించారు. మండలంలోని అలగాయపాళెంలో శుక్రవారం మత్స్యకారుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తీరంలో ఉన్న మత్స్యకార గ్రామాలు ఖాళీ చేయించి ఆ భూములు లాక్కోవడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఇలా పరిశ్రమల పేరుతో భూసేకరణ చేయాలని నిర్ణయించిందని దీనిని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రధాన పంటలుగా వరి, వేరుశనగతోపాటు సపోట, మామిడి తోటలను ఖాళీ చేయించాలనుకోవడం బాధాకరమన్నారు. మత్స్యకారులందరూ ఐక్యంగా ఉండి ఈ భూసేకరణ వ్యతిరేకించాలని నిర్ణయించారు. పచ్చని పంటలు పండే భూములు సేకరించడం వల్ల ప్రజలకు అన్నం కూడా దొరికే పరిస్థితి ఉండదన్నారు. అటవీ, పోరంబోకు భూములు పరిశ్రమలకు కేటాయించకుండా కరేడు, చాకిచర్ల, పెదపట్టపుపాళెం, రామాయపట్నం గ్రామాల స్వరూపం లేకుండా ఖాళీ అయ్యేలా భూసేకరణ చేయాలని ఈ ప్రభుత్వం పన్నాగం పన్నిందన్నారు. ఇటీవల కలెక్టర్ పర్యటించడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో అలగాయపాళెం కాపు వాయల వెంకటేశ్వర్లు, చాకిచర్ల పెదపట్టపుపాళెం కాపు రామ్మూర్తి, టెంకాయచెట్ల పాళెం కాపు గోవిందుతో పాటు కరేడు పెదపల్లిపాళెం, బట్టిసోమయ్యపాళెం, అంకమ్మపాళెం, చినపట్టపుపాళెం, పల్లెపాళెం గ్రామకాపులు హాజరయ్యారు. కార్యక్రమంలో మత్స్యకార గ్రామాల కాపులు, 139 కులాల జేఏసీ చైర్మన్ మిరియం శ్రీనివాసులు హాజరయ్యారు. సమావేశం జరగకుండా పోలీసుల యత్నం మత్స్యకార గ్రామాల ప్రజల సమావేశాన్ని ఆపాలని పోలీసులు ప్రయత్నం చేశారు. భూములు అప్పగించడానికి వ్యతిరేకంగా సమావేశం అని తెలియడంతో వేసిన టెంట్లు విప్పేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో సమావేశం ఆపాలని పోలీసులు ప్రయత్నించినట్లు మత్స్యకార గ్రామ నాయకులు తెలిపారు. సమావేశం జరగడానికి వీల్లేదని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంకమ్మ టెంట్లు తీయించారు. తాము ధర్నా చేయడం లేదని తమ కుల సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పినా వినకుండా టెంట్లు ఊడదీయించారు. దీంతో వారు బహిరంగంగానే ఉన్న చోట సమావేశం జరిపారు. మత్స్యకార గ్రామాల తీర్మానం హడావుడి చేసి టెంట్లు పీకేసిన పోలీసులు -
పాథమిక పాఠశాలలను కొనసాగించాలి
నెల్లూరు (టౌన్): పాఠశాలల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ప్రాథమిక పాఠశాలలను కొనసాగిస్తూ మోడల్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శేషు, చలపతి సూచించారు. ఈ మేరకు శుక్రవారం డీఈఓ ఆర్.బాలాజీరావును కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ 60 మంది ఉన్న ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలన్నారు. ఉర్దూ మీడియం స్కూల్స్‌ను యథావిధిగా కొనసాగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు అచ్చయ్య, నాగిరెడ్డి, ఖాజావలి, రమణయ్య, జమీర అహ్మద్ పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు 1060 మందితో భద్రత
కందుకూరు: సీఎం చంద్రబాబు శనివారం కందుకూరులో పర్యటించనున్న నేపథ్యంలో 1060 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. స్థానిక ఎస్వీఎస్ కల్యాణ మండపంలో అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది ఎవరికి నిర్ణయించిన ప్రదేశాల్లో వారు హాజరు కావాలన్నారు. అడిషనల్ ఎస్పీ (ఏఆర్) మునిరాజు, ఎస్బీ టౌన్, రూరల్, కావలి, ఆత్మకూరు, కందుకూరు ఏఆర్, హెచ్‌జీ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ ఆర్ఐ, ఎస్సైలు పాల్గొన్నారు. విజయవంతం చేయాలి : సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కందుకూరు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే నాగేశ్వరరావు, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, సబ్ కలెక్టర్ టి.శ్రీపూజతో కలిసి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. టీజీపీ స్పెషల్ కలెక్టర్ శీనానాయక్, అధికారులు పాల్గొన్నారు. -
సెక్యూరిటీ పెంచాలని అడిగాం
● కావలిలోని ముసునూరు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో గత శనివారం అర్ధరాత్రి తర్వాత ముసుగులు ధరించిన ముగ్గురు ఆగంతకులు మారణాయుధాలతో ప్రవేశించి బాలికలను తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. ఈ ఘటనను స్కూల్ యాజమాన్యంతో పాటు పోలీసులు గోప్యంగా ఉంచారు. మరుసటి రోజు బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వచ్చి కేజీబీవీ ముందు ఆందోళనకు దిగారు. ● వెంకటాచలం మండలంలోని గుడ్లూరువారిపాళెంలో రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై 10వ తరగతి చదువుతున్న విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● ఇటీవల సంతపేటలోని మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికపై అదే పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై సదరు బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పాఠశాలకు వచ్చి అటెండర్‌కు దేహశుద్ధి చేశారు. అయితే హెడ్మాస్టరు, కొంతమంది ఉపాధ్యాయులు వారి మధ్య రాజీ కుదిర్చినట్లు తెలిసింది. ఈ మూడే ఘటనలు కాదు. ప్రతి రోజు జిల్లాలో ఏదొక ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడ పిల్లలకు, మహిళలకు భద్రత కొరవడింది. బడిలో, బస్సులో, ఇంట్లో, బయట ఎక్కడ చూసినా మృగాళ్ల దాష్టీకానికి బలైపోతున్న ఘటనలు కోకొల్లలు. ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్తే.. తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పడం లేదు. స్నేహం ముసుగులో బాలికలపై కన్నేసి మాయమాటలు చెబుతూ లొంగదీసుకుని లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డపై జరిగిన అఘాయిత్యాన్ని బహిర్గతం చేసుకోలేక గుట్టుచప్పుడు కాకుండా ఉండిపోతున్నారు. అరకొర ఘటనలే పోలీస్స్టేషన్ల వరకు వెళ్తున్నాయి. అక్కడ కూడా మనీ, పవర్ ఉపయోగించి కేసుల నమోదు వరకు వెళ్లకుండా బయట పడుతున్నారు. ● ఆడపిల్ల బడికెళ్లి ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు టెన్షన్ ● మాయ మాటలతో లైంగిక దాడులు ● మరికొందరు బలవంతంగా అఘాయిత్యాలు ● పరువుకు వెరసి సరిపెట్టుకుంటున్న పేరెంట్స్ ● పోలీసు స్టేషన్లలో కొంత మంది ఫిర్యాదులు చేస్తున్న వైనం బాలికలు ఉండే వసతిగృహాలు వద్ద సెక్యూరిటీ పెంచాలన్న విషయాన్ని ఎస్పీడీ దృష్టికి తీసుకెళ్లాం. ఆ ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని కోరాం. హాస్టల్స్ ఉన్న ప్రాంతాల్లో లైటింగ్ కూడా పెంచాల్సి ఉంది. భవిష్యత్‌లో ఎలాంటి ఘటనలు జరగకుండా హాస్టల్స్, కేబీబీవీలు, భవిత కేంద్రాల్లో పనిచేసే సిబ్బందిని అప్రమత్తం చేశాం. – డి. వెంకటసుబ్బయ్య, ఏపీసీ సమగ్రశిక్ష నెల్లూరు (టౌన్): జిల్లాలో నిత్యం ఏదోక ప్రాంతంలో బాలికలపై మృగాళ్ల లైంగిక దాడులు, వేధింపుల ఘటనలు అధికమవుతున్నాయి. ఇంటా, బయట ఆడ పిల్లకు భద్రత లేకుండా పోతోంది. అయితే కొన్ని ఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో, మరికొన్ని బయట ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కొందరు బాలికలు ఇంట్లో చెబుతుండగా, ఇంకొందరు చెప్పకుండా లోలోన మదన పడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు పరువుకు భయ పడి బయటకు రాకుండా సరిపెట్టుకుంటున్నారు. కొన్ని ఘటనల్లో నిందితుల తరఫున బెదిరింపులకు లొంగి రాజీ కుదుర్చుకోవడం లేదా మిన్నకుండిపోవడం జరుగుతోంది. మరికొన్ని ఘటనల్లో ఫిర్యాదు చేసి శిక్ష పడే వరకు పోరాడుతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలు జిల్లాలో 3,438 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1,52,922 మంది బాలికలు చదువుకుంటున్నారు. వీరంతా మైనర్ బాలికలే. వీరికి బయట ప్రపంచంపై అంత పూర్తి పరిజ్ఞానం ఉండదు. ఎవరు ఏం చెప్పినా పూర్తిగా నమ్మేస్తారు. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది బాలికలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారు. పిల్లలు బడికి పోయి ఇంటికి వచ్చేంత వరకు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. నెల్లూరు రూరల్ మూడో మైలులోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓ బాలికపై లైంగిక దాడి జరిగింది. నరుకూరు దళితవాడకు చెందిన సతీశ్ ఆ బాలికను ప్రతి రోజు ఇంటి నుంచి స్కూల్‌కు, మళ్లీ స్కూల్ నుంచి ఇంటి దగ్గరకు ఆటోలో తీసుకెళ్తుంటాడు. సదరు బాలికపై కన్నేసిన ఆటో డ్రైవర్ సతీశ్ కొత్త కోడూరు బీచ్‌కు తీసుకెళ్లి బలవంతంగా లైంగిక దాడి చేశారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు రూరల్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేయగా ఆటోడ్రైవరు సతీశ్, అతని స్నేహితులపై పోక్సో కేసు నమోదైంది. పోక్సో చట్టం ఉన్నా.. బాలికలు, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడితే పోక్సో కేసు నమోదు చేస్తారని తెలిసినా మృగాళ్లు వెనక్కి తగ్గడం లేదు. ఇలాంటి కేసుల్లో జీవిత ఖైదు, లేదా 7 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అయినా లైంగిక దాడులు ఆగడం లేదు. దీంతో పాటు నేటి స్మార్ట్ యుగంలో చిన్న పిల్లల్లో సైతం స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండడంతో పిల్లలు చెడుమార్గంలో పడే అవకాశం ఉందని సైకాలజిస్టులు, విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఏమి చేస్తున్నారో, వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలంటున్నారు. తల్లిదండ్రులదే బాధ్యత లైంగిక దాడులు, యువత పోకడలకు తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత. పిల్లల అలవాట్లు, స్నేహితులు, పూర్తి స్వేచ్ఛ కల్పిండం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలకే పరిమితమై నైతిక విలువలు నేర్పించడం లేదు. సామాజిక మాధ్యమాల వల్ల యువత క్రమశిక్షణ కోల్పోయి నేర ప్రవృత్తి, లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. – సీహెచ్ రమేష్‌బాబు, సైకాలజిస్టు, లైఫ్ స్కిల్స్ కౌన్సిలర్ -
మనీ స్కామ్.. అంతా కామ్
కావలి: కావలి పట్టణాన్ని కుదిపేస్తున్న మనీస్కాం వ్యవహారంపై కొద్ది రోజుల్లోనే అ‘శుభం’ కార్డు పడనుంది. ఈ స్కామ్‌లో పోలీసులే ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు కావడంతో రాష్ట్ర పోలీస్‌శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊదాసీనత ప్రదర్శిస్తోందని తెలుస్తోంది. ఆర్థిక నేరాలను ఆలవోకగా చేసే మహ్మద్ సుభాని మాటలు నమ్మి కావలితోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి బాధితులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. తెలంగాణలోని మక్తల్‌లో 2021లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో సుమారు రూ.70 కోట్లకు పైగా కొల్లగొట్టిన సుభాని వ్యవహారం తెలిసీ కావలిలో కొందరు పోలీసు సిబ్బంది ప్రోత్సహించడంతో అతి తక్కువ కాలంలోనే ప్రజల నుంచి రూ.200 కోట్ల మేర కొల్లగొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా పాతనేరస్తుల విషయంలో నిఘా ఉంచే పోలీసు యంత్రాంగం ఇక్కడ మాత్రం ఏకంగా ఆర్థిక నేరగాడికి ఎర్ర తివాచీ పరిచి ఏజెంట్ల అవతారమెత్తడం విశేషం. సుభానిని ప్రజలు కూడా నమ్మి పిల్లల చదువులు, పెళ్లిళ్లకు దాచుకున్న డబ్బులు, ఇంటి కోసం పొదుపు చేసుకున్న సొమ్ముతోపాటు, బ్యాంకు లోన్లు తీసుకుని, తెలిసిన వారి వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వందలాది మంది అతని వద్ద పెట్టుబడులు పెట్టారు. కేవలం ఏడాది కాలంలోనే సుమారు రూ.200 కోట్ల మేర కొల్లగొట్టాడంటే ఇది మామూలు విషయం కాదు. ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనుంది మనీస్కాంపై ఒకటి, రెండు రోజుల్లో జిల్లా పోలీస్ బాస్ ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పది రోజుల నుంచి దర్యాప్తు సాగుతున్నా, జరిగిన స్కామ్ ఎంత, నిందితుడి వద్ద ఎంత మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకున్నారు, ఇందులో పోలీసుల పాత్రపై కూడా ఎక్కడా సమాచారం బయటకు పొక్కకుండా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఇంత వరకు నోరు మెదపకపోవడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదోక సంస్థ పేరుతో రూ.వంద కోట్ల స్కామ్ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దర్యాప్తు సంస్థల వరకు హడావుడి చేస్తాయి. కానీ కావలి పరిసరాల్లోనే సుమారు రూ.200 కోట్ల స్కామ్ జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చినా ఎవరి నుంచి స్పందన కనిపించకపోవడంతో ఇందులో పెట్టుబడి పెట్టిన బాధితుల్లో ఆందోళన అధికమవుతోంది. ఈ స్కామ్‌లో పోలీసులే ప్రధాన పాత్రధారులు కావడంతో దర్యాప్తుతోపాటు ఆస్తుల స్వాధీనం అంతా కామ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులదే ప్రధాన పాత్ర తిలా పాపం.. తలా పిడికెడు ఆర్థిక నేరగాడికి అనుచరులుగా మారిన ఖాకీలు ఇంత పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చినా స్పందించని ప్రభుత్వం సీఐడీ, సీబీఐ విచారణ సంస్థలతోనే అసలు న్యాయం పోలీసు వ్యవస్థ ఇంత నిద్రాణంగా ఉందా? మహ్మద్ సుభాని విషయంలో పోలీసు వ్యవస్థ కళ్లకు గంతలు కట్టుకుంది. ఆర్థిక నేరాల్లో ఆరితేరిన పాతనేరస్తుడు కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేని సంస్థను ఏర్పాటు చేసి రూ.కోట్లు దండుకుంటున్నా, ఆరేడు నెలల క్రితమే పత్రికల్లో కథనాలు వచ్చినా సంస్థ వైపు కన్నెత్తి చూడలేదు. పైపెచ్చు పోలీసు సిబ్బందే ఏజెంట్లుగా మారి సుభానిపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వ్యవహరించారు. వీరి విషయంలో ఉన్నతాధికారులు కూడా మౌనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది.