Market
-
రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటి
ఒక్కో నీటి బిందువే.. మహా సముద్రమైనట్లు, ఒక్కో రూపాయి పోగేస్తేనే కోటీశ్వరులవుతారు. కాబట్టి రోజుకు కేవలం రూ.50 ఆదా చేయడం ద్వారా.. కోటి రూపాయలు సొంతం చేసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇదెలా సాధ్యం? దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.రోజుకి 50 రూపాయలు ఆదా చేస్తే.. నెలకు రూ.1,500, సంవత్సరానికి రూ.18,000 అవుతాయి. అయితే కోటి రూపాయలు కావాలంటే మాత్రం దీనిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే కంటే ముందు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అయితే కోటి రూపాయల కోసం దీర్ఘకాలిక పెట్టుబడి అవసరం.రోజుకు రూ.50 పొదుపు చేస్తూ.. రూ.1 కోటి సొంతం చేసుకోవాలంటే, ముందుగానే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. కనీసం 30 ఏళ్ల వరకు ఇన్వెస్ట్మెంట్లలను కొనసాగించాలి. ఇలా చేస్తూ ఉండటం వల్ల 10 నుంచి 20 శాతం వరకు రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కంపౌండింగ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.మీరు 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీరు కోటి రూపాయలు ఎలా పొందుతారో ఇక్కడ చూడండి.➤రోజుకి 50 రూపాయలు కాబట్టి.. 10 సంవత్సరాలలో మీ పెట్టుబడి రూ.1,80,000 అవుతుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.2,13,137 వస్తాయి. కాబట్టి ఈ మొత్తం రూ. 3,93,137.➤ఇదే విధంగా 20 సంవత్సరాలలో, మీ పెట్టుబడి రూ.3,60,000. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.16,14,519. కాబట్టి మొత్తం రూ.19,74,519.➤30 సంవత్సరాలలో.. పెట్టుబడి రూ.5,40,000 అయితే.. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.77,95,583 వస్తాయి. వీటి మొత్తం రూ.83,35,583.➤32 సంవత్సరాలలో, మీ పెట్టుబడి రూ.5,76,000, దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.1,04,76,949 అవుతుంది. కాబట్టి మీరు పొందే మొత్తం రూ.1,10,52,949.పైన చెప్పిన విధానం ప్రకారం, మీరు పెట్టే పెట్టుబడి, దానికి ఎంత లాభం వస్తుంది. చివరగా చేతికి ఎంత వస్తుందనే వివరాలు స్పష్టంగా అవగతం అవుతాయి.ఇదీ చదవండి: 15X15X15 ఫార్ములా.. కోటీశ్వరులు అవ్వడానికి ఉత్తమ మార్గం!గమనిక: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. -
బంగారమే.. ఆనందమే..!
Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా దిగివచ్చాయి. వరుసగా రెండో రోజూ గణనీయంగా క్షీణించాయి. దేశవ్యాప్తంగా శనివారం (డిసెంబర్ 14) పసిడి భారీగా తగ్గాయి. రెండు రోజుల్లో బంగారం 10 గ్రాములకు రూ.1500 పైగా పతనం కావడంతో కొనుగోలుకు ఇదే మంచి తరుణమని పసిడి ప్రియులు భావిస్తున్నారు.తెలుగు రాష్ట్రాలలో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,890 లుగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.900, రూ.980 చొప్పున పడిపోయాయి.ఇక దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,550 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.78,040 వద్ద ఉన్నాయి. వీటి ధరలు క్రితం రోజుతో పోల్చితే రూ.900, రూ.980 మేర దిగివచ్చాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.900 తగ్గి రూ.71,400 వద్దకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 తగ్గి రూ.77,890 వద్దకు వచ్చాయి.ఇదీ చదవండి: మహిళలకు కొత్త బ్యాంక్ అకౌంట్.. అదిరిపోయే బెనిఫిట్లువెండి కూడా..దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు పతనమయ్యాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.1000 చొప్పున తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్దకు రాగా ఢిల్లీలో రూ.92,500 వద్దకు క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
మార్కెట్లోకి మరో కొత్త ఐపీఓ
మమతా మెషినరీ లిమిటెడ్ స్టాక్మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. డిసెంబర్ 19 గురువారం రోజున కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రారంభం అవుతుందని సంస్థ తెలిపింది. ఈ ఐపీవో ధర కంపెనీ రూ.179 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. అందుకు ఒక్కో షేరుకు రూ.230-243 ధర నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 23, 2024న ముగుస్తుంది.ఈ సంస్థ ప్రధానంగా ప్యాకేజింగ్ యంత్రాల తయారీ, ఎగుమతి, వాటికి సర్వీస్ అందిస్తోంది. ప్లాస్టిక్ సంచులు, పౌచ్‌లు, ఎక్స్‌ట్రూషన్ పరికరాలను తయారు చేసే యంత్రాలను ఈ కంపెనీ తయారు చేస్తుంది. ప్యాకేజింగ్ పరిశ్రమలో ఎండ్-టు-ఎండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్లను అందిస్తుంది. ఎక్కువగా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ), ఫుడ్ & బెవరేజ్ పరిశ్రమలకు సర్వీస్ చేస్తుంది. ఈ కంపెనీ తయారు చేసే యంత్రాలను ‘వెగా’, ‘విన్’ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తున్నారు. 75కి పైగా దేశాలకు ఈ సంస్థ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?ఐపీఓ అలాట్ అవ్వాలంటే..ఒకటికి మించిన పాన్ కార్డుల ద్వారా ఐపీఓ దరఖాస్తు చేసుకుంటే షేర్ల అలాట్మెంట్ అవకాశాలు పెరుగుతాయి. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు వేస్తుంటారు. కానీ, ఒకే పాన్ నంబర్‌పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. దీనికి బదులు తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్ నంబర్లతో దరఖాస్తులు సమర్పించడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచ్చితంగా మెరుగుపడతాయి. -
ఐపీవోకు బ్లూస్టోన్ జ్యువెలరీ
వజ్రాల ఆభరణ రిటైలర్ బ్లూస్టోన్ జ్యువెలరీ అండ్ లైఫ్‌స్టైల్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ ప్రధానంగా బ్లూస్టోన్ బ్రాండుతో డైమండ్, గోల్డ్, ప్లాటినం, స్టడ్డెడ్ జ్యువలరీ విక్రయిస్తోంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.4 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. కళారి క్యాపిట ల్, సామా క్యాపిటల్, సునీ ల్ కాంత్ ముంజాల్ తది తరులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 750 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీలో ప్రస్తుతం ఇన్వెస్టర్లకు 26.82 శాతం వాటా ఉంది. కంపెనీ దేశవ్యాప్తంగా 203 స్టోర్లను నిర్వహిస్తోంది. గతేడాది(2024–25) మొత్తం ఆదాయం 64 శాతం జంప్‌చేసి రూ. 1,266 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: ఐపీవో వేవ్.. ఇన్వెస్టర్ల క్యూమరోవైపు ప్యాకేజింగ్ మెషినరీ తయారీలో కార్యకలాపాలు నిర్వహించే గుజరాత్ కంపెనీ ‘మమతా మెషినరీ లిమిటెడ్’ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకు రూ.230–243 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ మేరకు రూ.179 కోట్ల నిధులు సమీకరించనుంది. ఈ నెల 23న ఇష్యూ ముగుస్తుంది. ఈ నెల 18న యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్లు స్వీకరించనుంది. 50 శాతం సంస్థాగత ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం కోటాను నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. -
ఐపీవో వేవ్.. ఇన్వెస్టర్ల క్యూ
ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ మరోపక్క ప్రైమరీ మార్కెట్లు దుమ్ము రేపుతున్నాయి. వెరసి వారంతాన(13న) మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు విజయవంతమయ్యాయి. ఈ బాటలో వచ్చే వారం సైతం మరో 4 కంపెనీలు ఐపీవోలు చేపట్టనుండగా.. 11 కంపెనీలు లిస్ట్‌కానున్నాయి.వన్ మొబిక్విక్ డిజిటల్ పేమెంట్ సేవలు, ఫైనాన్షియల్ ప్రొడక్టుల అప్లికేషన్ సంస్థ వన్ మొబిక్విక్ పబ్లిక్ ఇష్యూకి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దీంతో చివరి రోజు శుక్రవారానికల్లా 119 రెట్లుపైగా బిడ్స్ దాఖలయ్యాయి. తద్వారా రూ. 572 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1,18,71,696 షేర్లు ఆఫర్ చేయగా.. 141,72,65,686 షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రిటైల్ ఇన్వెస్టర్లు దాదాపు 135 రెట్లు అధికంగా స్పందించగా.. క్విబ్ విభాగంలో 120 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 109 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. షేరుకి రూ. 265–279 ఇష్యూలో భాగంగా మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 257 కోట్లు సమీకరించింది. విశాల్ మెగా మార్ట్ రిటైల్ స్టోర్ల దిగ్గజం విశాల్ మెగా మార్ట్ పబ్లిక్ ఇష్యూ సక్సెస్ అయ్యింది. చివరి రోజు శుక్రవారానికల్లా 27 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. తద్వారా రూ. 8,000 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 75,67,56,757 షేర్లు ఆఫర్ చేయగా.. 20,64,25,23,020 షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. క్విబ్ విభాగంలో 81 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 14 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 2.3 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 74–78 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,400 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. సాయి లైఫ్ సైన్సెస్ కాంట్రాక్ట్ రీసెర్చ్ ఫార్మా రంగ కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు శుక్రవారానికల్లా 10 రెట్లుపైగా స్పందన నమోదైంది. తద్వారా రూ. 3,043 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 3,88,29,848 షేర్లు ఆఫర్ చేయగా.. 39,85,59,690 షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. క్విబ్ విభాగంలో 31 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 5 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 1.4 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. రూ. 522–549 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 913 కోట్లు సమీకరించింది. -
–1,207 నుంచి +843 పాయింట్లకు సెన్సెక్స్
ముంబై: ప్రారంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్న స్టాక్ సూచీలు శుక్రవారం భారీ లాభాలు నమోదుచేశాయి. టెలికం, ఐటీ, కన్జూమర్, ఎఫ్ఎంసీజీ షేర్లు ఇందుకు అండగా నిలిచాయి. దేశీయంగా ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. ఇంట్రాడేలో 1,207 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ అనూహ్యంగా రికవరీ అయ్యి చివరికి 843 పాయింట్ల లాభంతో 82,133 వద్ద నిలిచింది. నిఫ్టీ 220 పాయింట్లు పెరిగి 24,768 వద్ద స్థిరపడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్పైరీ ప్రభావంతో ప్రారంభంలో సెన్సెక్స్ 1,207 పాయింట్లు క్షీణించి 80,083 వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 24,181 వద్ద కనిష్టాలకు దిగివచ్చాయి. అయితే ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్ల సంబంధిత షేర్లు ఫైనాన్స్, రియలీ్ట, ఆటో షేర్లు రాణించడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్ల తీవ్రత మరింత పెరగడంతో లాభాలు ఆర్జించగలిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 924 పాయింట్లు పెరిగి 82,213 వద్ద, నిఫ్టీ 243 పాయింట్లు బలపడి 24,792 వద్ద గరిష్టాలు అందుకున్నాయి. మెటల్, సర్వీసెస్, కమోడిటీస్, ఇండ్రస్టియల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.29%, 0.08 శాతం చొప్పున నష్టపోయాయి. -
గోల్డ్ బాండ్లకు చెక్..!
ఫిజికల్‌గా పసిడి కొనుగోలుకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల పథకానికి తెరతీసింది. యూనిట్ల(ఒక గ్రాము)లో జారీ చేయడం ద్వారా నెమ్మదిగా రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. తద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలు వేసింది. అయితే బంగారం ధర ప్రతీ ఏడాది రేసు గుర్రంలా పరుగు తీయడంతో బాండ్ల గడువు ముగిసేసరికి రుణ భారం భారీగా పెరిగిపోతూ వచ్చింది. వెరసి ఇకపై వీటికి ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల అంచనా. వివరాలు చూద్దాం.. కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్‌జీబీలు) జారీని నిలిపివేసే అవకాశముంది. ప్రభుత్వ రుణాలను తగ్గించుకునే బాటలో ప్రభుత్వం ఎస్‌జీబీల జారీని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఫిజికల్‌గా బంగారం దిగుమతులను తగ్గించుకునే యోచనతో ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఈ ఏడాది జూలైలో వెలువడిన బడ్జెట్లో రూ. 18,500 కోట్ల విలువైన ఎస్‌జీబీల జారీకి ప్రణాళికలు వేసింది. అయితే గతేడాది జారీ చేసిన రూ. 26,852 కోట్లతో పోలిస్తే అంచనాలను భారీగా తగ్గించింది. ఎస్‌జీబీల గడువు ముగిశాక ప్రభుత్వం బంగారం మార్కెట్ ధరకు అనుగుణంగా ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా వీటిపై నిరంతరంగా వడ్డీని సైతం చెల్లిస్తుంది. ఫలితంగా ప్రభుత్వంపై అదనపు రుణభారానికి ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం 2026–27కల్లా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో రుణ(డెట్) నిష్పత్తిని తగ్గించుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో ఇకపై ఎస్జీబీలను జారీ చేసే యోచనకు ప్రభుత్వం స్వస్తి పలకవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 14.7 కోట్ల యూనిట్లు జారీ2015 మొదలు ఆర్బీఐ 67 ఎస్జీబీ పథకాల ద్వారా మొత్తం 14.7 కోట్ల యూనిట్లను జారీ చేసినట్లు అంచనా. అయితే పసిడి విలువ ఎప్పటికప్పుడు పరుగు తీస్తుండటంతో వీటి విలువ సైతం పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2016లో గ్రాము(యూనిట్)కు రూ. 3,007 ధరలో ఎస్జీబీలను విడుదల చేసింది. వీటి గడువు తీరేసరికి విలువ రూ. 4,781 జంప్‌చేసి రూ. 7,788కు చేరింది. అంటే 8 ఏళ్లలో 159% వృద్ధి. అంతేకాకుండా వార్షికంగా 2.5% వడ్డీ కూడా లభించింది. దీంతో ఆర్బీఐ 2017 మే నెలలో, 2020 మార్చిలో జారీ చేసిన ఎస్జీబీలను ముందుగానే చెల్లించేందుకు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిర్ణయించింది. తద్వారా ప్రభు త్వ రుణభారాన్ని తగ్గించేందుకు సంకలి్పంచింది. మరోవైపు ప్రభుత్వం సైతం జూలై బడ్జెట్లో పసిడిపై దిగుమతుల సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి భారీగా తగ్గించింది.ఎస్‌జీబీలంటే కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఎస్జీబీలను జారీ చేస్తుంది. ఒక గ్రాము బంగారాన్ని ఒక యూనిట్‌గా జారీ చేస్తుంది. అప్పటి మార్కెట్ ధర ఆధారంగా వీటిని కేటాయిస్తుంది. అంటే ఇది పేపర్ గోల్డ్. కాలపరిమితి 8 ఏళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి ఎప్పుడైనా వీటిని విక్రయించేందుకు వీలుంటుంది. అప్పటి బంగారం మార్కెట్ ధర ఆధారంగా మెచ్యూరిటీ విలువ ఉంటుంది. అంతేకాకుండా వీటిపై తొలి ఏడాది నుంచి 2.5 శాతం వార్షిక వడ్డీ అందుతుంది. ఈ బాండ్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ట్రేడవుతాయి. పసిడి మెరుపులు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం బలపడుతూనే ఉన్నాయి. భవిష్యత్‌లోనూ మరింత పెరిగే అవకాశముంది. ఇందుకు రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు, ప్రభుత్వాల విధానాలు, యుద్ధ భయాలు వంటి అంశాలు కారణంకానున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశీయంగా 2015లో ఎస్జీబీలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫిజికల్‌గా పసిడి కొనుగోళ్లకు చెక్ పెట్టే యోచనతో రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు వీటిని తీసుకువచి్చంది. తద్వారా ఫిజికల్ గోల్డ్ నుంచి పేపర్ గోల్డ్‌కు ఇన్వెస్టర్లను మళ్లించే ప్రయత్నం చేసింది. తొలుత 8 ఏళ్ల కాలపరిమితితో వీటికి శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల గడువు తదుపరి మార్కెట్ ధరలకు అనుగుణంగా రిడీమ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. 2017–18లో వ్యక్తులు, కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కేజీలవరకూ పెట్టుబడులకు అనుమతించింది. ట్రస్ట్‌లు, సంబంధిత సంస్థలు 20 కేజీలవరకూ ఇన్వెస్ట్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. 2015–16లో జారీ చేసిన బాండ్ల ముఖ విలువపై 2.75 శాతం, తదుపరి కాలంలో జారీ చేసిన బాండ్లపై 2.5 శాతం వడ్డీ చెల్లింపునకు తెరతీసింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 21న రూ. 8,008 కోట్ల విలువైన ఎస్జీబీలను జారీ చేసింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి!
స్టాక్ మార్కెట్లో మదుపర్లు శుక్రవారం ప్రారంభ సమయం నుంచి తమ షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. దాంతో ఉదయం 11.45 సమయం వరకు సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా పడిపోయింది. గత సెషన్ ముగింపు వరకు మార్కెట్ విలువ మొత్తంగా రూ.458 లక్షల కోట్లు ఉండగా, ఈరోజు సూచీలు నేల చూపులు చూస్తుండడంతో పెట్టుబడిదారుల సంపద రూ.4 లక్షల కోట్లు తగ్గి రూ.454 లక్షల కోట్లకు చేరుకుంది. నిఫ్టీ 368 పాయింట్లు జారి 24,180 వద్దకు పడిపోయింది.స్టాక్ మార్కెట్ పతనానికిగల కారణాలు..విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలు: ఎఫ్ఐఐలు నిన్నటి మార్కెట్ సెషన్లో రూ.3,560 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు. ఇటీవల కాలంలో కొంత తక్కువ మొత్తంలో అమ్మకాలు చేసిన ఎఫ్ఐఐలు తిరిగి భారీగా విక్రయాలకు పూనుకోవడం మార్కెట్ నెగెటివ్‌గా పరిగణించింది.బలహీనమైన రూపాయి: రూపాయి జీవితకాల కనిష్టాన్ని తాకింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 84.83కు చేరింది. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలను మరింత పెంచింది.గ్లోబల్ మార్కెట్ బలహీనత: అమెరికా, యూరప్, జపాన్, చైనా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. వాటి ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై పడినట్లు నిపుణులు చెబుతున్నారు.రంగాలవారీ క్షీణత: బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఐటీ వంటి రంగాలకు సంబంధించి మార్కెట్లో అధిక వాటాలున్న ప్రధాన షేర్లు భారీగా పతనమయ్యాయి.పారిశ్రామికోత్పత్తి సూచీ: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈసారి భారీగా కొలుకుంటుందని మార్కెట్ ఊహించింది. అయితే, ఈ సూచీ గతంలో కంటే కోలుకున్నా కాస్త నెమ్మదించింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.ఇదీ చదవండి: బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐరిలయన్స్ షేర్లు ఢమాల్..నిఫ్టీలో దాదాపు 10 శాతం వాటాను కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఈ వారంలో భారీగా క్షీణించింది. గడిచిన ఐదు సెషన్‌ల్లో 4.47 శాతం, అదే ఆరునెలల్లో 14.55 శాతం పడిపోయింది. అందుకుగల కారణాలను మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ రిటైల్, ఆయిల్-టు-కెమికల్స్ (ఓ2సీ) సెగ్మెంట్లు ఊహించిన దానికంటే బలహీనమైన పనితీరును కనబరిచినట్లు నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచుకోవడం కాస్తా నెమ్మదించింది. అంతకుముందు వీటి సంఖ్యను గణనీయంగా పెంచుతామని కంపెనీ పేర్కొంది. దానికితోడు ఏడాది కాలంలో పుంజుకున్న మార్కెట్లో క్రమంగా లాభాల స్వీకరణ పెరుగుతోంది. రిలయన్స్ వంటి కంపెనీల్లో ఎఫ్ఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగానే పెట్టుబడి పెట్టారు. వీరిలో చాలామంది ఇటీవల ప్రాఫిట్బుక్ చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. -
ఎగసి‘పడిన’ పసిడి.. వెండి
Gold Price Today: దేశంలో బంగారం ధరలు దిగివచ్చాయి. మూడు రోజులుగా వరుసగా ఎగిసిన పసిడి రేట్లకు క్రితం రోజున బ్రేక్ పడగా నేడు (డిసెంబర్ 13) భారీగా తగ్గాయి. వారం రోజులుగా తగ్గుదల కోసం ఎదురుచూస్తున్న పసిడి కొనుగోలుదారులకు శుక్రవారం భారీ ఊరట కలిగింది.దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,870 లుగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.550, రూ.600 చొప్పున క్షీణించాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.72,450 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.79,020 వద్ద ఉన్నాయి. వీటి ధరలు క్రితం రోజుతో పోల్చితే రూ.550, రూ.600 మేర దిగివచ్చాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.550 తగ్గి రూ.72,300 వద్దకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 తగ్గి రూ.78,870 వద్దకు వచ్చాయి.ఇదీ చదవండి: అకౌంట్లో క్యాష్.. ఎన్ని లక్షలు ఉండొచ్చు?వెండి పతనందేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు భారీగా పతనమయ్యాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.3000 చొప్పున తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,01,000 వద్దకు రాగా ఢిల్లీలో రూ.93,500 వద్దకు క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ట్రాన్స్‌రైల్ లైటింగ్ ఐపీవో 19న..
న్యూఢిల్లీ: ప్రధానంగా విద్యుత్ ప్రసారం, పంపిణీ సంబంధిత ఈపీసీ కంపెనీ ట్రాన్స్‌రైల్ లైటింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 19న ప్రారంభమై 23న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.01 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థ ఆజన్మా హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ విక్రయానికి ఉంచనుంది.ప్రస్తుతం ప్రమోటర్లకు 83.22 శాతం వాటా ఉంది. ఈ నెల 18న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. స్ట్రక్చర్స్, కండక్టర్స్, మోనోపోల్స్ తదితర సమీకృత తయారీ సౌకర్యాలను కంపెనీ కలిగి ఉంది.రూ. 2,000 కోట్లపై కన్ను విమానాశ్రయాలలో ట్రావెల్ క్విక్ సర్వీసు రెస్టారెంట్లు, లాంజ్ బిజినెస్ నిర్వహించే ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రధా నంగా భారత్, మలేషియాలో కంపెనీ సర్వీసులు అందిస్తోంది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్ సంస్థ కపూర్ కుటుంబ ట్రస్ట్ రూ. 2,000 కోట్ల విలువైన వాటాను విక్రయానికి ఉంచనుంది.దీంతో ఐపీవో ద్వారా కంపెనీ కాకుండా ప్రమోటర్ సంస్థ నిధులు సమకూర్చుకోనుంది. ప్రమోటర్లలో ఎస్ఎస్పీ గ్రూప్‌సహా.. కపూర్ కుటుంబ ట్రస్ట్, వరుణ్ కపూర్, కరణ్ కపూర్ ఉన్నారు. ఎస్ఎస్పీ లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ లిస్టయిన కంపెనీ. ఆదాయంరీత్యా 2024లో గ్లోబల్ ట్రావెల్ ఫుడ్, పానీయాల విభాగంలో దిగ్గజంగా నిలిచినట్లు రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. -
బంగారం స్పీడుకు బ్రేక్.. వెండి ప్రియులకు షాక్!
Gold Price Today: దేశంలో బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. మూడు రోజులుగా వరుస పెరుగుదలతో కొనుగోలుదారులలో దడ పుట్టించిన పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 12) నిలకడగా నమోదై ఉపశమనం కలిగించాయి.మూడు రోజుల్లో బంగారం ధర తులానికి (10 గ్రాములు) రూ. 1800 పైగా ఎగిసింది.ఈరోజు పసిడి ధరలు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,850, 24 క్యారెట్ల బంగారం ధర రూ.79,470 ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.73,000 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.79,620 వద్ద ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.72,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.79,470 లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: మహిళలకు కొత్త బ్యాంక్ అకౌంట్.. అదిరిపోయే బెనిఫిట్లుసిల్వర్ స్వింగ్దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు భారీగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్దకు చేరగా ఢిల్లీలో రూ.96,500 వద్దకు ఎగిసింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
షేర్లు.. ఉరితాళ్లు కాకూడదంటే..!
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టాలపాలై చివరకు ప్రాణాలు వదులుతున్న ఘటనలు చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ నిజంగానే అంత ప్రమాదకరమా? మార్కెట్లో అడుగుపెట్టిన వారికి ఈ పరిస్థితి రావాల్సిందేనా? మార్కెట్ ముంచేస్తుందా? మరి లాభాలు ఎవరికి వస్తున్నాయి? నష్టాలు వస్తున్నవారు అనుసరిస్తున్న విధానాలు ఏమిటి? అనే చాలా ప్రశ్నలొస్తాయి. వీటిని విశ్లేషించి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం.స్టాక్ మార్కెట్ అద్భుత సాధనంస్టాక్ మార్కెట్ ఎప్పటికీ ప్రమాదకరం కాదు. పైగా మంచి రాబడి ఇవ్వడానికి మనకు అందుబాటులో ఉన్న ఒక అద్భుత సాధనం. ఓ పక్క కుటుంబం ప్రాణాలు వదులున్న ఘటనలున్నాయని చెప్పారు కదా. మరి స్టాక్ మార్కెట్ బెటర్ అని ఎలా చెబుతారు? అని ప్రశ్నించొచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి వెంటనే రాబడి రావాలంటే చాలా కష్టం. మార్కెట్ తీవ్ర ఒడిదొడుకుల్లో ఉంటుంది. కాబట్టి సరైన సమయం ఇచ్చి రాబడి ఆశించాలి. లార్జ్ క్యాప్ స్టాక్ల్లో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే దాదాపు నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు తొందరగానే రావొచ్చు. నష్టాలు కూడా తీవ్రంగానే ఉండొచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.పెన్నీ స్టాక్స్‌తో జాగ్రత్తకొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్సైడర్ ట్రేడింగ్(అంతర్గత సమాచారంతో చేసే ట్రేడింగ్) జరుగుతుంటుంది. అది నిబంధనలకు విరుద్ధం. అది సాధారణ ఇన్వెస్టర్లకు తెలియక పోవచ్చు. దాంతో పెన్నీ స్టాక్ బాగా ర్యాలీ అవుతుందనే ఉద్దేశంతో అందులో పెట్టుబడి పెట్టి చివరకు నష్టాలతో ముగించాల్సి ఉంటుంది. కాబట్టి పెన్నీ స్టాక్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వారు వాటి వైపు చూడకపోవడం ఉత్తమం.ఎవరో చెప్పారని..చాలామంది స్టాక్ మార్కెట్ అనగానే వెంటనే లాభాలు వచ్చేయాలి.. తక్కువ మొత్తం పెట్టుబడితో అధికంగా లాభాలు ఆర్జించాలనే ఆశతో మార్కెట్లోకి అడుగుపెడుతుంటారు. అలాంటి వారు తొందరగానే నష్టాలు మూటగట్టుకుంటారు. కాసింత లాభం కళ్ల చూడగానే మార్కెట్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైందని అనుకుంటారు. కానీ చాలామందికి స్టాక్స్‌కు సంబంధించి సరైన అవగాహన ఉండడం లేదు. ఎవరో చెప్పారని, ఏదో ఆన్లైన్లో వీడియో చూశారని, వాట్సప్, టెలిగ్రామ్.. వంటి ఛానల్లో ఎవరో సజెస్ట్ చేశారని పెట్టుబడి పెడుతున్నవారు చాలా మంది ఉన్నారు.ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడిస్టాక్ మార్కెట్లో తాము ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఎందుకు పెరుగుతోందో చాలామందికి తెలియదు. అది ఇంకెంత పెరుగుతుందో అవగాహన ఉండదు. ఎప్పుడు పడుతుందో తెలియదు. నిన్నపెరిగింది కదా.. ఈరోజు పడుతుందిలే.. లేదంటే.. నిన్న పడింది కదా.. ఈరోజు పెరుగుతుందిలే..అని సాగిపోతుంటారు. దాంతో భారీగా క్యాపిటల్ కోల్పోవాల్సి వస్తుంది. అప్పటికీ తేరుకోకపోగా ఫర్వాలేదు.. పూడ్చేద్దాం అనుకుంటారు. ఆ నష్టం పూడకపోగా.. మరింత పెరుగుతుంది. అప్పు చేస్తారు. ఎలాగైనా సంపాదించి తీర్చేద్దాం అనుకుంటారు. అదీ జరగదు. క్రమంగా అప్పులు పెరిగిపోతాయి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇది కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ కుటుంబం ఆర్ధికంగా చితికిపోతుంది. చివరకు ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది.ఇదీ చదవండి: బీమా ప్రీమియం వసూళ్లు ఎలా ఉన్నాయంటే..దీర్ఘకాలిక దృక్పథం అవసరంట్రేడింగ్ విషయంలో ఆచితూచి అడుగేయాలి. స్టాక్మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు అనేది నిజం. కానీ నిమిషాల్లో సంపాదించేయలేం. ఓపిక ఉండాలి. దీర్ఘకాలిక దృక్పథం అవసరం. అప్పుడే ఎవరైనా మార్కెట్లో రాణించగలుగుతారు. లేదంటే ఆషేర్లే మెడకు ఉరితాళ్ళుగా మారి కుటుంబాల్ని విషాదాల్లో నింపేస్తాయి.డబ్బు ఎవరు సంపాదిస్తున్నారంటే..మార్కెట్ తీరుతెన్నులను ఓపిగ్గా గమనిస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేరుగా డబ్బు పెట్టి ట్రేడింగ్ చేయడం కంటే కనీస ఆరు నెలలపాటు పేపర్ ట్రేడింగ్ చేయాలి. దాంతో అవగాహన వస్తుంది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో చాలా కంపెనీలు కాన్కాల్ ఏర్పాటు చేస్తాయి. అందులో పాల్గొనాలి. ఒకవేళ అవకాశం లేకపోతే తర్వాత రెగ్యులేటర్లకు ఆయా వివరాలను అప్డేట్ చేస్తాయి. ఆ డాక్యుమెంట్లు చదవాలి. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి..రెవెన్యూ అంశాలు ఎలా ఉన్నాయి.. క్యాష్‌ఫ్లోలు ఎలా ఉన్నాయి.. అనుబంధ సంస్థలతో జరిపే రిలేటెడ్ పార్టీ లావాదేవీలు ఎలా ఉన్నాయి.. కంపెనీ సేల్స్ పెంచుకోవడానికి అనుసరిస్తున్న విధానాలు.. పోటీలో ఉన్న కంపెనీలు, వాటి విధానం.. కాలానుగుణంగా సరైన సెక్టార్‌లోని స్టాక్‌లనే ఎంచుకున్నామా.. వంటి చాలా అంశాలను పరిగణించి పెట్టుబడి పెట్టాలి. అలా చేసిన తర్వాత దీర్ఘకాలంపాటు వేచిచూస్తేనే మంచి రాబడులు అందుకోవచ్చు.- బెహరా శ్రీనివాసరావుస్టాక్ మార్కెట్ నిపుణులు -
500 షేర్లకు T+0 సెటిల్మెంట్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా టీప్లస్‌జీరో (T+0) సెటిల్మెంట్ను మరింత విస్తరించింది. లావాదేవీ చేపట్టిన రోజే సెటిల్మెంట్కు వీలు కల్పించే విధానంలోకి 500 కంపెనీల షేర్లను చేర్చింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా 500 కంపెనీల స్టాక్స్‌కు ఆప్షనల్‌గా టీప్లస్‌జీరో సెటిల్మెంట్ను వర్తింపచేయనుంది.నిబంధనలకు లోబడి టీప్లస్‌జీరో, టీప్లస్వన్ సెటిల్మెంట్ సైకిళ్లకు విభిన్న బ్రోకరేజీ చార్జీలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సెబీ తొలుత 2024 మార్చిలో 25 కంపెనీల స్టాక్స్ ద్వారా టీప్లస్‌జీరో సెటిల్మెంట్కు తెరతీసింది. నాన్కస్టోడియన్ క్లయింట్లకు మాత్రమే ఇది వర్తింపచేసింది. తదుపరి అభిప్రాయ సేకరణ చేపట్టి సెటిల్మెంట్ను విస్తరించింది. 2024 డిసెంబర్31కల్లా టాప్–500 కంపెనీల షేర్లు టీప్లస్‌జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేర్చుతూ సర్క్యులర్‌ను జారీ చేసింది.2025 జనవరి నుంచి అట్టడుగున ఉన్న 100 కంపెనీలు సెటిల్‌మెంట్‌లోకి రానున్నాయి. ఆపై ప్రతీ నెలా ఇదే రీతిలో 100 కంపెనీలు చొప్పున జత కానున్నాయి. వెరసి ప్రస్తుత 25 కంపెనీలతో కలిపి 525 షేర్లు టీప్లస్‌జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేరనున్నాయి. వీటికి ఉదయం 8.45–9 సమయంలో ప్రత్యేక బ్లాక్ డీల్ విండోను ఏర్పాటు చేయనుంది. ఐసీఈఎక్స్కు చెల్లు సెబీ తాజాగా ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఐసీఈఎక్స్) మూసివేతకు అనుమతించింది. రెండేళ్ల క్రితమే స్టాక్ ఎక్స్ఛేంజీ గుర్తింపును రద్దు చేయగా.. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఐసీఈఎక్స్ కార్యకలాపాల నిలిపివేతకు ఓకే చెప్పింది. వెరసి ఎక్స్ఛేంజీ విభాగం నుంచి ఐసీఈఎక్స్ వైదొలగనుంది. అయితే ఆదాయపన్ను నిబంధనలను అమలు చేయవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. పేరు మార్పుసహా గతకాలపు లావాదేవీలను డేటాబేస్ నుంచి తొలగించవలసిందిగా ఐసీఈఎక్స్ను సెబీ ఆదేశించింది. -
ఈక్విటీ ఫండ్స్ సానుకూలమా..?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు నవంబర్ నెలలో రూ.35,943 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అక్టోబర్ నెల పెట్టుబడులతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గాయి. అయినప్పటికీ వరుసగా 45వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లో సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నవంబర్ నెల గణాంకాలను విడుదల చేసింది.స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఎన్నికలు తదితర పరిణామాలతో ఈక్విటీ మార్కెట్లు గత రెండు నెలల కాలంలో ఎన్నో అస్థిరతలు ఎదుర్కోవడం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించి ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ సీబీవో అఖిల్ చతుర్వేది తెలిపారు. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నవంబర్‌లో నికరంగా రూ.60,295 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో పెట్టుబడుల రాక రూ.2.4 లక్షల కోట్లతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గడం గమనార్హం. ప్రధానంగా డెట్ ఫండ్స్ అక్టోబర్‌లో రూ.1.57 లక్షల కోట్లను ఆకర్షించగా, నవంబర్‌లో ఇవి కేవలం రూ.12,915 కోట్లకు పరిమితమయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) అక్టోబర్ చివరికి ఉన్న రూ.67.25 లక్షల కోట్ల నుంచి నవంబర్ చివరికి రూ.68.08 లక్షల కోట్లకు పెరిగింది. లక్ష్యాలకు కట్టుబాటు..నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.25,000 కోట్లకు పైనే ఉండడం అన్నది దీర్ఘకాల లక్ష్యాలు, ప్రణాళిక పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న అంకిత భావానికి నిదర్శనమని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. సిప్ పెట్టుబడులను స్థిరంగా ఉండడం దీర్ఘకాలంలో ఫండ్స్ విలువను సమకూర్చుతాయన్న విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. విభాగాల వారీగా..లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,548 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో వచ్చిన రూ.3,452 కోట్లతో పోల్చితే 26 శాతం తగ్గాయి. సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.7,658 కోట్లను రాబట్టాయి. అక్టోబర్‌లో ఇవే పథకాల్లోకి రూ.12,279 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.13,255 కోట్ల చొప్పున రావడం గమనార్హం. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,084 కోట్లు వచ్చాయి. ఇక స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల దూకుడు కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ నెలతో పోల్చితే నవంబర్‌లో స్మాల్ క్యాప్ ఫండ్స్ 9 శాతం అధికంగా రూ.4,112 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ 4.3 శాతం అధికంగా రూ.4,883 కోట్ల చొప్పున ఆకర్షించాయి. రిస్క్ ఉన్నా కానీ ఇన్వెస్టర్లు అధిక రాబడులు కోరుకుంటున్నారనే దానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తాయి.లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.4,680 కోట్లు, వ్యాల్యూ ఫండ్స్ రూ.2,088 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.430 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ రూ.619 కోట్ల చొప్పున ఆకర్షించాయి. 18 కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) నవంబర్ లో మార్కెట్లోకి వచ్చి రూ.4,052 కోట్లను సమీకరించాయి. అక్టోబర్‌లో 29ఎన్‌ఎఫ్‌వోలు రూ.6,078 కోట్లు సమీకరించడం గమనార్హం. డెట్ విభాగంలో 16 విభాగాలకు గాను 9 విభాగాల్లోకి పెట్టుబడులు రాగా, మిగిలినవి పెట్టుబడులు కోల్పోయాయి. ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి రూ.2,109 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.2,962 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ రూ.4,374 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.2,426 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లోకి రూ.2,138 కోట్ల చొప్పున వచ్చాయి.డెట్‌లో లిక్విడ్ ఫండ్స్ రూ.1,779 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.454 కోట్లు, మీడియం డ్యురేషన్ ఫండ్స్ రూ.201 కోట్ల చొప్పున కోల్పోయాయి. ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలుసిప్ పెట్టుబడులు ఫ్లాట్సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నవంబర్‌లో ఈక్విటీ పథకాల్లోకి రూ.25,320 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్ సిప్ పెట్టుబడులు రూ.25,323 కోట్లతో పోల్చి చూస్తే ఫ్లాట్‌గా నమోదయ్యాయి. కొత్తగా 49.46 లక్షల సిప్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అక్టోబర్‌లో ఇవి 63.70 లక్షలుగా ఉన్నాయి. మొత్తం సిప్ ఖాతాలు 10.12 కోట్ల నుంచి 10.23 కోట్లకు పెరిగాయి. -
బంగారం హ్యాట్రిక్ దడ..
Gold Price Today: దేశంలో బంగారం ధరలు కొనుగోలుదారులలో దడ పుట్టిస్తున్నాయి. పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 11) హ్యాట్రిక్ కొట్టాయి. వరుసగా మూడో రోజు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. మూడు రోజుల్లో బంగారం ధర తులానికి (10 గ్రాములు) దాదాపు రూ. 1800 పైగా పెరిగింది.ఇక ఈరోజు పసిడి ధరలు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లపై రూ.800, 24 క్యారెట్లపై రూ.870 చొప్పున పెరిగింది. దీంతో వీటి ధరలు వరుసగా రూ.72,850, రూ.79,470 వద్దకు ఎగిశాయి.దేశంలోని ఇతర ప్రాంతాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.800 పెరిగి రూ.73,000 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ. 870 ఎగిసి రూ.79,620 వద్దకు చేరాయి. ఇక చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.72,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.79,470 లుగా ఉన్నాయి. క్రితం రోజుతో పోల్చితే నేడు వీటి ధరలు వరుసగా రూ.800, రూ.870 చొప్పున పెరిగాయి.ఇదీ చదవండి: మహిళలకు కొత్త బ్యాంక్ అకౌంట్.. అదిరిపోయే బెనిఫిట్లుసిల్వర్ రివర్స్దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు భారీ తగ్గుదలను నమోదు చేశాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.1000 చొప్పున దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,03,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ.95,500 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
Stock market: ఈ ట్రాప్‌లో పడకండి
స్టాక్ మార్కెట్లో ఏమాత్రం అనుభవం లేకుండా డబ్బులు సంపాదించేయాలి అనుకుంటే అంతకుమించిన బుద్ధి పొరపాటు మరోటి ఉండదు. మిమ్మల్ని ఎలా ట్రాప్ లో ఇరికించి పబ్బం గడుపుకొంటారో మీకు అర్ధమయ్యేలా చెబుతా.. దయచేసి ఇలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. నాకు తెల్సిన ఒక మిత్రుని కథ అనుకోండి... వ్యథ అనుకోండి... అదెలాగో చెబుతా...నాకు బాగా కావాల్సిన మిత్రుడే... అతనికి అంతో ఇంతో స్టాక్ మార్కెట్ నాలెడ్జి ఉంది.. తన దగ్గరున్న డబ్బులతో కాస్తో కూస్తో బాగానే సంపాదించుకుంటున్నాడు. ఎప్పటినుంచో సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక.అందుకు తగ్గట్టే నాలుగు రూపాయలు రెడీ చేసుకుని... బ్యాంకు లోన్ కూడా తీసుకుని ఇంటి పనులు మొదలెట్టాడు. అవి చివరి దశకు వచ్చాయి. ఓ 3 లక్షలు ఎక్సట్రా కావాల్సి వస్తే ఓ మిత్రుడి దగ్గర 3 రూపాయల వడ్డీకి చేబదులు తీసుకున్నాడు. అంటే నెలకు రూ.9,000 వడ్డీ.కూలీల సమస్యో, తగిన మెటీరియల్ దొరక్కో మధ్యలో పనులు ఓ 15 రోజులు ఆగిపోయాయి. ఇదే అతని కొంప ముంచింది... ఇప్పుడతను... రూ. 4 వడ్డీకి (అంటే నెలకు రూ. 12,000) అప్పు తెచ్చి ఆ పాత బాకీ తీర్చి కొత్త బాకీ నెత్తికెత్తుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే...అసలేం జరిగి ఉంటుందో తెలియాలి. ముందే చెప్పానుగా...మనవాడికి స్టాక్ మార్కెట్ గురించి కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉందని. ఇంటి పనులకు 15 రోజులు గ్యాప్ రావడం కూడా అతని బుర్రని ఖరాబు చేసింది. ఆ 3 లక్షలు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టాడు. కనీసం ఓ పాతిక వేలు అయినా సంపాదించుకుందామని. అతని ప్లాన్ బాగానే పనిచేసింది.కేవలం పది రోజుల్లోనే పాతిక కాదు... 50 వేలు పైనే సంపాదించాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతలో... ఓ ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. అవతలివైపు నుంచి...హలో సర్..చెప్పండి..మేము xyz ట్రేడింగ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండీ ... మీరు మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారా...? అవతలి వ్యక్తి ప్రశ్న. మనవాడు కూడా మార్కెట్ పండితుడిగా... వాళ్ళేం చెబుతారో విందామని...అవునండీ చేస్తున్నా...ఎందులో చేస్తారు... ఇండెక్స్ లోనా... స్టాక్స్ లోనా...రెండూ..మీ క్యాపిటల్ ఎంతో తెలుసుకోవచ్చా...3 లక్షలు..ట్రేడింగ్ లో రోజుకెంత సంపాదిస్తారు...?4000 -5000 దాకా...అంత తక్కువా...? మీదగ్గరున్న క్యాపిటల్ కి రోజుకు పాతిక వేలు అయినా సంపాదించొచ్చు... మీరు మంచి అవకాశం వదులుకుంటున్నారన్న మాట...(అవతలి వ్యక్తి అన్న మాటకి మనవాడిలో ఎక్కడో అహం దెబ్బతింది. మరోపక్క రోజుకు పాతిక వేలు సంపాదించొచ్చు అన్న మాట ఎక్కడో సూటిగా గుచ్చుకుంది. ఆ క్షణం లోనే అతని మనసు రకరకాల ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. అసలే ఫ్రెండ్ దగ్గర అప్పుచేసి ఉన్నాడు.. రోజుకు పాతిక వేలు అంటే 15 రోజులు తిరిగేసరికి అప్పు మొత్తం తీర్చేయొచ్చు. ఇప్పుడు చేతిలో ఉన్న మూడు లక్షలు ఎటూ ఉండనే ఉంటాయి... ఇలా ఆనుకుంటూనే...అంత ఆశ లేదులెండి... నాకు వచ్చేది చాలు అని చెప్పబోయాడు..అదేంటి సర్... అలా అంటారు.. మార్కెట్ గురించి మీకు నేను చెప్పాలా...? రోజుకి కనీసం పాతిక వేలు దాకా సంపాదించొచ్చు... మీరు సరేనంటే అదెలాగో చెబుతా..(మనవాడిలో ఆశ బలపడింది.) అయితే చెప్పండి..మీరు ఏ బ్రోకరేజ్ సంస్థలో ట్రేడింగ్ చేస్తారు...?ఫలానా దాంట్లో...మీరు మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తే చాలు... మేము ఇక్కడ మా సిస్టం నుంచి లాగిన్ అవుతాం. మీ తరపున మేం ట్రేడ్ చేస్తాం. మీ సిస్టం లో లాగిన్ అయ్యి ట్రేడింగ్ ను మీరు కూడా గమనించొచ్చు. వచ్చే లాభాల్లో 30% మాకు, 70% మీకు.. ఏమంటారు?ఇలా అనేసరికి కాస్త ఆలోచనలో పడ్డాడు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇమ్మంటున్నారు... దానివల్ల ప్రమాదం ఏమీ లేదులే... ఎందుకంటే మన ఫండ్స్ మన అకౌంట్ లోనే ఉంటాయి. ఒకవేళ వాడు విత్ డ్రా పెట్టినా... పడేది నా అకౌంట్ లోనే... వాడు చేసే మోసమేమీ లేదు.. పైగా ఇక్కడ నేను కూడా చూసుకుంటూనే ఉంటానుగా.. అని అనుకుంటూనే... ఎందుకైనా మంచిదని... మీ ఆఫీస్ ఎక్కడ ? అని అడిగాడు...హైదరాబాద్ లో సర్.. కూకట్ పల్లి.అడ్రస్ చెబుతారా...? అని అడిగితే అతను అడ్రస్ కూడా చెప్పాడు.అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటూ... అవతలి వ్యక్తి ఇచ్చిన బంపర్ ఆఫర్ కు ఒప్పుకున్నాడు. వెంటనే ఆ డీటెయిల్స్ అవతలివాని చేతిలో పెట్టాడు. అప్పటికి అతని డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న మొత్తం రూ.. 3,55,000. ఫోన్ కట్ అయింది.. ట్రేడింగ్ మొదలైంది. ఆరోజు రూ. 10,000 దాకా ప్రాఫిట్ వచ్చింది. బాగానే ఉంది అనిపించింది. సాయంత్రం అవతలి వ్యక్తి మళ్ళీ ఫోన్ చేశాడు.చూశారుగా మా ట్రేడింగ్... మొదటిరోజు కదా ఎక్కువ చేయలేదు.. రేపటి నుంచి మనం టార్గెట్ తో పనిచేద్దాం సర్... అని చెప్పేసరికి.. మనవాడు ఆనందం తో సరే అంటూ ఫోన్ పెట్టేశాడు.తెల్లారింది.. ట్రేడింగ్ మొదలైంది. కొన్న షేర్లలో లాభాలు వస్తున్నట్లే కనిపించింది.. అంతలోనే నష్టాల్లోకి జారుతున్నట్లు అనిపించింది. ఫర్వాలేదులే అనుకున్నాడు. అలా... అలా... 30,000... 40,000 .... నష్టాల్లోకి కూరుకుపోతున్నట్లే ఉంది.. అవతలివాళ్ళకు ఫోన్ చేస్తే... కంగారుపడకండి సర్... మేమున్నాముగా.. అని చెప్పేసరికి కాస్త ధైర్యం వచ్చింది...ఆ షేర్ కాస్త కోలుకున్నట్లు అనిపించినా.. మళ్ళీ అంతలోనే భారీగా పడిపోయింది. కట్ చేస్తే... సాయంత్రానికి మొత్తం అకౌంట్ ఖాళీ అయిపోయింది.. మధ్యమధ్యలో ఫోన్ చేస్తున్నా... కంగారు పడకండి అన్న సమాధానమే...పోనీ అకౌంట్ తన చేతిలోనే ఉందిగా.. ఇక్కడితో లాస్ బుక్ చేసేసి బయటకు వచ్చేద్దామన్న సాహసం చేయలేకపోయాడు. పైగా అవతలివాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్లకు తెలుసులే... అని చూస్తూ ఉండిపోయాడు. ఇక ఆ తర్వాత ఎన్ని ఫోన్లు చేసినా అవతలినుంచి సమాధానమే లేదు.. మర్నాడు కూకట్ పల్లి లో వాడి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే అలాంటి సంస్థే లేదు. పిచ్చెక్కి పోయింది. ఈ షాక్ నుంచి తేరుకునేసరికి దాదాపు ఆరు నెళ్ళు పట్టింది. మరిన్ని వివరాల్లోకి వెళ్లట్లేదు కానీ... ఇదీ మావాడి విషాదాధ్యాయం.పొరపాటున కూడా ఇలాంటి ట్రాప్ లో చిక్కుకోకండి..మిమ్మల్ని మీరు నమ్ముకోండి... ీకు తెలిస్తే ట్రేడింగ్ చేయండి... లేదంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి.. అంతవరకు మంచి షేర్లు సెలెక్ట్ చేసుకుని దీర్ఘకాలానికి పెట్టుబడులపై దృష్టి పెట్టండి. ఇవే మీకు భవిష్యత్ లో లాభాలు పూయిస్తాయి.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
సూచీలు అక్కడక్కడే..!
ముంబై: ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు మంగళవారం అక్కడిక్కడే ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ రెండు పాయింట్ల లాభంతో 81,510 వద్ద నిలిచింది. నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 24,610 వద్ద నిలిచింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ప్రథమార్థంతా లాభాల్లో కదిలాయి. మిడ్‌సెషన్‌లో లాభాల స్వీకరణతో నష్టాలు చవిచూశాయి.ట్రేడింగ్ చివర్లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు రాణించడంతో నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 543 పాయింట్ల పరిధిలో 81,508 – 81,726 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 24,678 వద్ద కనిష్టాన్ని, 24,511 గరిష్టాన్ని తాకింది. రియలీ్ట, ఐటీ, మెటల్, కమోడిటీ, ఫైనాన్స్ సర్వీసెస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, పవర్, సర్విసెస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. -
15X15X15 ఫార్ములా.. కోటీశ్వరులు అవ్వడానికి ఉత్తమ మార్గం!
డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులవ్వాలని అందరికీ ఉంటుంది. అయితే ఆలోచన ఒక్కటి ఉంటే సరిపోదు, ఆచరణ కూడా అవసరం. ఈ కథనంలో 15 సంవత్సరాల్లో కోటీశ్వరులు ఎలా అవ్వాలో అనే విషయాన్ని.. 15X15X15 ఫార్ములా ద్వారా తెలుసుకుందాం.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే.. దానికి అత్యుత్తమ మార్గం ఇన్వెస్టిమెంట్ అనే చెప్పాలి. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి.ఇక 15X15X15 ఫార్ములా విషయానికి వస్తే, 15 సంవత్సరాల్లో నెలకు రూ. 15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు అవుతుందనేదే.. ఈ ఫార్ములా సందేశం. అంటే మీరు 15 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు 15,000 ఇన్వెస్ట్ చేసి 15 శాతం వార్షిక రిటర్న్స్ ఆశించాలి. ● పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 15,000 ● వ్యవధి: 15 సంవత్సరాలు ● వడ్డీ రేటు: 15 శాతంపైన చెప్పిన దాని ప్రకారం నెలకు 15,000 రూపాయలు పెట్టుబడి పెడితే.. 15 సంవత్సరాలకు అసలు రూ. 27 లక్షలు అవుతాయి. వడ్డీ రేటు 15 శాతం (రూ. 73 లక్షలు), కాబట్టి ఇలా మీరు కోటి రూపాయలు సంపాదించవచ్చు.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!15X15X15 ఫార్ములా ద్వారా కోటీశ్వరులవ్వాలంటే.. త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. మీరు 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. 40 ఏళ్లకే మీకు కోటి రూపాయలు వస్తాయి. 30 ఏళ్లకు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే 45 సంవత్సరాలకు మీ చేతికి డబ్బులు వస్తాయి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే.. మీరు ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, అంత త్వరగా కోటీశ్వరులు అవ్వొచ్చన్నమాట. -
దడ పుట్టిస్తున్న బంగారం! తులం ఎంతంటే..?
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కొంత ఒడిదొడుకుల్లో ఉన్న బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,050 (22 క్యారెట్స్), రూ.78,600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.750, రూ.820 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.750, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.820 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.72,050 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.78,600 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.750 పెరిగి రూ.72,200కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.820 పెరిగి రూ.78,750 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలతోపాటు వెండి ధరల్లోనూ భారీగా మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు ఏకంగా కేజీపై రూ.4,000 పెరిగి రూ.1,04,000కు చేరుకుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘ఈ ప్లాట్‌ఫామ్‌లపై ట్రేడింగ్ వద్దు’.. సెబీ హెచ్చరిక!
అనధికారిక ప్లాట్‌ఫామ్‌లపై అన్‌లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల సెక్యూరిటీలలో ట్రేడింగ్ నిర్వహించే విషయమై సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఈ తరహా లావాదేవీలు సెక్యూరిటీస్ కాంట్రాక్టుల చట్టం 1956, సెబీ యాక్ట్ 1992కు వ్యతిరేకమని స్పష్టం చేసింది.అన్‌లిస్టెడ్ సెక్యూరిటీల్లో ట్రేడింగ్ చేసేందుకు వీలుగా కొన్ని గుర్తింపు లేని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అవకాశం కల్పిస్తున్నట్లు సెబీ తెలిపింది. అటువంటి ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌లపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దని హెచ్చరించింది. ఆయా ప్లాట్ఫామ్ల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పేర్కొంది. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లకు సెబీ గుర్తింపు లేదని స్పష్టం చేసింది. అనధికార ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సెక్యూరిటీలను ట్రేడింగ్ చేయడం వల్ల పారదర్శకత లేకపోవడం, పరిమిత లిక్విడిటీ, చట్టపరమైన సమస్యలు వంటివి తలెత్తుతాయని తెలిపింది.ఇప్పటికే హెచ్చరికలుఅనధికారిక వర్చువల్ ట్రేడింగ్, పేపర్ ట్రేడింగ్, ఫ్యాంటసీ గేమ్స్ తదతర వాటిపై లావాదేవీలకు దూరంగా ఉండాలంటూ సెబీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. లిస్టెడ్ సెక్యూరిటీలలో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని సెబీ సూచించింది. అధీకృత ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్, గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయని పేర్కొంది. ఈ విధానాలు అనధికార ప్లాట్ఫామ్ల్లో ఉండవని వివరించింది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల సమాచారాన్ని సెబీ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: ద్రవ్యలోటు కట్టడికి కృషి చేయండి: సీఐఐకొన్ని లిస్టెడ్ ఆన్లైన్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్లుగ్రోజెరోధాఏంజిల్ వన్అప్స్టాక్స్ఐసీఐసీఐ డైరెక్ట్కోటక్ సెక్యూరిటీస్హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ఎస్బీఐ సెక్యూరిటీస్మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ -
వారమంతా.. ఐపీవోల సందడి..
న్యూఢిల్లీ: ఐపీవోల జాతరతో ఈ వారమంతా మార్కెట్ సందడిగా ఉండనుంది. చిన్నా, పెద్దవి కలిపి మొత్తం 11 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. రూ. 18,500 కోట్లు సమీకరించబోతున్నాయి. విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, ఫిన్‌టెక్ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం మీద అయిదు పెద్ద సంస్థల ఇష్యూలు, ఆరు చిన్న–మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) ఇష్యూలు వీటిలో ఉన్నాయి. ఆరు ఎస్ఎంఈలు సుమారు రూ. 150 కోట్లు సమీకరించనున్నాయి. వివిధ రంగాలకు చెందిన సంస్థల ఐపీవోలు.. కొత్త షేర్ల జారీ, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానాల్లో ఉండనున్నాయి. ప్రస్తుత షేర్హోల్డర్లు తమ వాటాలను విక్రయించుకునేందుకు, సంస్థలు విస్తరణ ప్రణాళికల కోసం నిధులను సమీకరించుకునేందుకు, రుణాలను తిరిగి చెల్లించివేసేందుకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు కంపెనీలకు ఈ ఇష్యూలు ఉపయోగపడనున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు, ఉత్తర్ ప్రదేశ్ లోక్‌సభ బై–ఎలక్షన్ల ఫలితాలతో మార్కెట్లో సానుకూల సెంటిమెంటు నెలకొందని, ఐపీవోలు విజయవంతమయ్యేందుకు ఇది దోహదపడగలదని ఆన్లైన్ బ్రోకరేజీ సంస్థ ట్రేడ్జినీ సీవోవో డి. త్రివేశ్ తెలిపారు.2024లో ఇప్పటివరకు రూ. 1.4 లక్షల కోట్ల సమీకరణ..ఈ ఏడాది ఇప్పటివరకు 78 మెయిన్ బోర్డ్ కంపెనీలు, పబ్లిక్ ఇష్యూల ద్వారా దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో హ్యుందాయ్ మోటర్ ఇండియా, స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి దిగ్గజ ఇష్యూలు ఉన్నాయి. 2023లో 57 సంస్థలు రూ. 49,436 కోట్లు సమీకరించాయి. గత కొన్నాళ్లుగా ఇటు ఇష్యూయర్లు అటు ఇన్వెస్టర్లలోను ప్రైమరీ మార్కెట్లపై గణనీయంగా ఆసక్తి పెరిగింది. గడిచిన అయిదు ఆర్థిక సంవత్సరాల్లో ఐపీవో ఇన్వెస్టర్లు భారీగా లాభాలు పొందారు. 2021–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యలో వచి్చన 236 ఐపీవోలు .. రిటైల్ ఇన్వెస్టర్లకు సగటున 27 శాతం మేర లిస్టింగ్ లాభాలు అందించాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ఇష్యూల వివరాలు..→ విశాల్ మెగా మార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ ఇష్యూలు డిసెంబర్ 11న ప్రారంభమై 13న ముగుస్తాయి. ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇనిస్టిట్యూట్ ఐపీవోలు డిసెంబర్ 12న, 13న ప్రారంభమవుతాయి. → విశాల్ మెగామార్ట్ ఐపీవో ద్వారా రూ. 8,000 కోట్లు సమీకరిస్తోంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ కేదారా క్యాపిటల్‌కి చెందిన సమాయత్ సరీ్వసెస్ ఓఎఫ్ఎస్ కింద షేర్లను విక్రయిస్తోంది. ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ. 74–78గా నిర్ణయించారు. → సాయి లైఫ్ సైన్సెస్ ఐపీవోకి సంబంధించి ధర శ్రేణి రూ. 522 నుంచి రూ. 549 వరకు ఉంటుంది. కంపెనీ మొత్తం రూ. 3,043 కోట్లు సమీకరిస్తోంది. ఇందులో రూ. 950 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ కింద ప్రమోటర్లు, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు, ఇతర షేర్హోల్డర్లు 3.81 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. → మొబిక్విక్ ఐపీవో రూ. 572 కోట్లు సమీకరిస్తోంది. ఇందుకోసం 2.05 కోట్ల షేర్లను తాజాగా జారీ చేస్తోంది. ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ. 265–279 వరకు ఉంటుంది. → ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఐపీవో పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది. ఇష్యూ పరిమాణం రూ. 2,500 కోట్లు. → ఇక ఎస్ఎంఈ ఐపీవోల విషయానికొస్తే ధనలక్ష్మి క్రాప్ సైన్స్ (డిసెంబర్ 9–11) టాస్ ది కాయిన్ లిమిటెడ్.. జంగిల్ క్యాంప్స్ ఇండియా (రెండూ డిసెంబర్ 10–12), సుప్రీమ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్.. పర్పుల్ యునైటెడ్ సేల్స్ (డిసెంబర్ 11–13), యశ్ హైవోల్టేజ్ (డిసెంబర్ 12–16) సంస్థలు ఉన్నాయి. -
బంగారం కొందామా.. వద్దా?
Gold Price Today: దేశంలో బంగారం ధరల్లో కదలిక నమోదైంది. రెండు రోజులుగా నిలకడగా ఉన్న పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 9) పుంజుకున్నాయి. తులానికి (10 గ్రాములు) స్వల్పంగా రూ. 160 మేర పెరిగింది. దీంతో ఇప్పుడు బంగారం కొందామా.. తగ్గేంతవరకూ ఆగుదామా అనే సంశయం కొనుగోలుదారుల్లో నెలకొంది.ఇక తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 చొప్పున పెరిగింది. ప్రస్తుతం వీటి ధరలు వరుసగా రూ.71,300, రూ.77,780 వద్దకు ఎగిశాయి.దేశంలోని ఇతర ప్రాంతాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి రూ.71,450 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ. 160 ఎగిసి రూ.77,930 వద్దకు చేరాయి. ఇక చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.71,300, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,780 లుగా ఉన్నాయి. నేడు వీటి ధరలు వరుసగా రూ.150, రూ.160 చొప్పున పెరిగాయి.ఇదీ చదవండి: భారత్ బంగారం.. 882 టన్నులువెండి ధరలుఇక దేశవ్యాప్తంగా వెండి ధరలలో (Silver Price Today) నేడు కూడా ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ.92,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
కొత్త ఫండ్స్ గురూ.. రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, కొత్తగా యాక్సిస్ క్రిసిల్–ఐబీఎక్స్ ఎఎఎ బాండ్ ఎన్బీఎఫ్సీ–హెచ్ఎఫ్సీ–జూన్ 2027 ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది క్రిసిల్– ఐబీఎక్స్ ఎఎఎ ఎన్బీఎఫ్సీ–హెచ్ఎఫ్సీ ఇండెక్స్–జూన్ 2027లోని సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే ఓపెన్–ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. ఈ స్కీములో ఒక మోస్తరు వడ్డీ రేటు రిస్కు, మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కు ఉంటాయి. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. డిసెంబర్ 10 వరకు ఇది అందుబాటులో ఉంటుంది.శామ్కో మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ శామ్కో అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. కొత్తగా శామ్కో మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను ప్రారంభించింది. ఈ నెల 4న ప్రారంభమైన న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో), ఈ నెల 18 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈక్విటీలు, బంగారం, డెట్, ఆర్బిట్రేజ్ సాధనాల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఆయా విభాగాల్లో ఆకర్షణీయమైన అవకాశాలకు అనుగుణంగా కేటాయింపుల్లోనూ మార్పులు, చేర్పులు చేస్తుంటుంది.ఈక్విటీలు ర్యాలీ చేసే సమయంలో వాటికి కేటాయింపులు పెంచడం, ఈక్విటీలు అధిక వ్యాల్యూషన్లకు చేరి నిదానించిన సమయంలో బంగారంలోకి పెట్టుబడులు తరలించడం తదితర వ్యూహాలను అనుసరిస్తుంది. తద్వారా రిస్క్‌ను అధిగమించి, మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా పనిచేస్తుంది. ఈక్విటీలకు 20–80 శాతం మధ్య, డెట్‌కు 10–70 శాతం మధ్య, బంగారం, సిల్వర్ ఈటీఎఫ్‌లకు 10–70 శాతం మధ్య అవకాశాలకు అనుగుణంగా కేటాయింపులు చేస్తుంది. 30 శాతం వరకు కమోడిటీ డెరివేటివ్‌లు, 10 శాతం వరకు రీట్లు, ఇన్విట్లలోనూ పెట్టుబడులు పెడుతుంది. ఎన్ఎఫ్వోలో భాగంగా ఒకరు కనీసం రూ.5,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఇన్వెస్కో ఇండియా మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ ఈక్విటీ, డెట్, గోల్డ్ ఈటీఎఫ్‌లు/సిల్వర్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్కో ఇండియా మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను ఇన్వెస్కో మ్యుచువల్ ఫండ్ ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ విధానంలో రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీలు, డెట్ సాధనాల్లో 10–80 శాతం వరకు, గోల్డ్ ఈటీఎఫ్‌లు/సిల్వర్ ఈటీఎఫ్‌లలో 10–50 శాతం వరకు ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. అలాగే అవకాశాన్ని బట్టి విదేశీ సెక్యూరిటీస్‌లో 35 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. -
దేశ, విదేశీ గణాంకాలకు ప్రాధాన్యం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ఈ వారం ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు నిర్దేశించే అవకాశముంది. వీటికితోడు ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. గత కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విషయం విదితమే. దీంతో విదేశీ పెట్టుబడులతోపాటు.. రాజకీయ భౌగోళిక అంశాలూ సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. ఎఫ్ఐఐల పెట్టుబడుల కారణంగా లార్జ్‌క్యాప్ బ్యాంకింగ్ షేర్లు జోరు చూపుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. కొన్ని ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడుల ప్రభావం కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. గత రెండు నెలలుగా భారీ అమ్మకాలు చేపట్టిన ఎఫ్ఐఐలు ఈ నెలలో నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.గత వారమిలా..శుక్రవారం(6)తో ముగిసిన గత వారం దేశీ సాŠట్క్ ఇండెక్సులు పలు ఆటుపోట్ల మధ్య తిరిగి జోరందుకున్నాయి. సెన్సెక్స్ నికరంగా 1,906 పాయింట్లు(2.4 శాతం) జంప్‌చేసి 81,709 వద్ద ముగిసింది. నిఫ్టీ 547 పాయింట్లు(2.3 శాతం) ఎగసి 24,678 వద్ద స్థిరపడింది. గత వారం మార్కెట్ విలువరీత్యా టాప్–10 కంపెనీలలో ఆరు కంపెనీల మార్కెట్ విలువ రూ. 2 లక్షల కోట్లమేర బలపడింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 62,575 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ. 45,338 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 26,886 కోట్లు, ఎస్బీఐ రూ. 22,312 కోట్లు చొప్పున ఎగసింది. అయితే ఎయిర్టెల్ విలువ రూ. 16,720 కోట్లు, ఐటీసీ విలువ రూ. 7,256 కోట్లు క్షీణించింది.ఆర్థిక గణాంకాలుదేశీయంగా అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెపె్టంబర్లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సైతం 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఐఐపీ, సీపీఐ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంకేతాలని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు వివరించారు. యుద్ధ భయాలురష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు కలిగించే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. మరోపక్క తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలహీనపడటానికితోడు ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ వెనకడుగు వేయడం భారత్‌వంటి వర్ధమాన మార్కెట్లకు సానుకూలంగా పరిణమిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. నవంబర్ నెలకు యూఎస్ వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు అంచనాలు(2 లక్షలు) మించుతూ 2.2 లక్షలకు చేరింది. నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైంది. అక్టోబర్‌లో తుఫాను సహా బోయింగ్‌లో ఉద్యోగుల సమ్మె కారణంగా ఉపాధి గణాంకాలు పడిపోయిన విషయం విదితమే. ఇవేకాకుండా పలు ఇతర విదేశీ గణాంకాలు సైతం ఈ వారం విడుదలకానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. చైనా ద్రవ్యోల్బణం నేడు(9న), వాణిజ్య గణాంకాలు 10న విడుదలకానుండగా.. 11న యూఎస్ కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఇవి ఈ నెలలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చేపట్టనున్న పాలసీ సమీక్షపై ప్రభావం చూపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 71 డాలర్ల ఎగువకు చేరగా.. న్యూయార్క్ మార్కెట్లో పసిడి ఔన్స్ 2,670 డాలర్లను తాకింది. డాలరు ఇండెక్స్ 106 వద్ద కదులుతోంది.