జాబితాలో కాల్గేట్, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్
ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితం
రేపు మధ్యాహ్నం గంటపాటు ముహూరత్ ట్రేడింగ్
ఆర్‌ఐఎల్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీపై దృష్టి
ఈ వారం మార్కెట్ల కదలికలపై నిపుణుల అంచనా
దీపావళి సందర్భంగా మంగళవారం(21) నిర్వహించనున్న మూరత్ ట్రేడింగ్‌ను మినహాయిస్తే ఈ వారం మార్కెట్లు మూడు రోజులే పనిచేయనున్నాయి. అయితే క్యూ2 ఫలితాలతోపాటు పలు అంశాలు మార్కెట్లను నడిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత వారాంతాన మార్కెట్లు ముగిశాక డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్(ఆర్‌ఐఎల్)సహా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జూలై–సెపె్టంబర్ ఫలితాలు ప్రకటించాయి.
దీంతో నేడు(20న) ఈ కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడ్‌కానున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో ఈ వారం హిందుస్తాన్ యూనిలీవర్, కాల్గేట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోఫోర్జ్, ఐటీసీ హోటల్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. దీంతో నేడు ఫలితాల ప్రభావంతో ట్రెండ్ నిర్దేశితంకానున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్ కార్పొరేట్ ఫలితాల సీజన్‌కు దారి చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్
అంచనా వేశారు.
సంవత్ 2082 షురూ
స్టాక్ మార్కెట్లలో మంగళవారం కొత్త ఏడాది సంవత్ 2082 ప్రారంభంకానుంది. దీపావళి పండుగ సందర్భంగా స్టాక్ ఎక్సే్ఛంజీలు(బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ) మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 వరకూ ప్రత్యేక(ముహూరత్) ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. మరుసటి రోజు(22న) బలిప్రతిపాద సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఆపై గురు, శుక్రవారాలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఫలితాలు, పండుగ జోష్ సంవత్ 2082 తొలి రోజు సెంటిమెంటుకు బలాన్నివ్వనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు.
గణాంకాలు..
దేశీయంగా 21న సెపె్టంబర్ నెలకు మౌలిక రంగ గణాంకాలు వెలువడనున్నాయి. 2025 ఆగస్ట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఔట్‌పుట్ 6.3 శాతం ఎగసింది. ఇది 13 నెలల గరిష్టంకాగా.. కోల్, స్టీల్, సిమెంట్ తదితరాలు ఇందుకు సహకరించాయి. ఇక 24న అక్టోబర్ తయారీ, సరీ్వసులు, కాంపోజిట్ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. తయారీ పీఎంఐ సెపె్టంబర్‌లో 57.7కు నీరసించగా.. ఆగస్ట్‌లో 59.3కు బలపడింది.
అంతర్జాతీయ అంశాలు
చైనాపై యూఎస్ విధించిన తాజా టారిఫ్‌లు, వీటిపై చైనా స్పందనతోపాటు.. పరిష్కారం వంటి అంశాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు తెలియజేశారు. యూఎస్, చైనా మధ్య వాణిజ్య ఆందోళనలకు తెరపడితే సెంటిమెంటు పుంజుకోవచ్చని గౌర్ అభిప్రాయపడ్డారు. జూలై–సెపె్టంబర్‌కు చైనా జీడీపీ గణాంకాలు 20న విడుదలకానున్నాయి. ఏప్రిల్–జూన్‌లో 5.2 శాతం వృద్ధి చూపింది. 23న యూఎస్ సెపె్టంబర్ గృహ విక్రయ గణాంకాలు వెలువడనున్నాయి. 24న యూఎస్ ద్రవ్యోల్బణ వివరాలు వెల్లడికానున్నాయి. ఇవికాకుండా ముడిచమురు ధరలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు తీరు వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మిశ్రా, గౌర్ పేర్కొన్నారు.
కొనుగోళ్లకు ఎఫ్‌పీఐలు సై
ఈ నెలలో రూ. 6,480 కోట్లు
గత మూడు నెలలుగా దేశీ స్టాక్స్‌పట్ల విముఖత చూపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అక్టోబర్‌లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టపడటంతో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల 1–17 మధ్య రూ. 6,480 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతక్రితం సెపె్టంబర్‌లో రూ. 23,885 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. ఆగస్ట్‌లో రూ. 34,900 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే.
గత వారమిలా..
13–17 మధ్య ముగిసిన గత వారం వరుసగా మూడోసారి దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,625 పాయింట్లు(2 శాతం) ఎగసి 83,952 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 483 పాయింట్లు(2 శాతం) బలపడి 25,710 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు స్వల్పంగా 0.2 శాతం పుంజుకున్నాయి.


