Palnadu
-
‘కిక్కు’రుమనరే!
కూటమి ప్రభుత్వంలో మద్యం అస్తవ్యస్త విధానాల వల్ల వైన్స్ బార్లుగా మారుతున్నాయి. పర్మిషన్ లేకుండానే పర్మిట్ రూములు వెలుస్తున్నాయి. అనుమతుల్లేకుండానే టచ్చింగ్ వంటి అమ్మకాలు సాగుతున్నాయి. ఎకై ్సజ్ అధికారుల కళ్ళకు గంతలు కడుతూ గోవా, తెలంగాణ, హర్యానా మద్యం బాటిళ్లు యథేచ్ఛగా వస్తున్నాయి. మాచర్లలో మద్యం చుక్కలు లెక్క తప్పి ప్రభుత్వ గజానాకు గండి పెడుతున్నాయి. నరసరావుపేటటౌన్: మాచర్లలో మద్యం వ్యాపారులు బరితెగించారు.. పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నారు. ఇతర రాష్ట్రాల మద్యాన్ని దుకాణాల్లో బహిరంగంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తంతు యథేచ్ఛగా జరుగుతున్నా నివారణకు చర్యలు చేపట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు మాముళ్ల మత్తులో జోగుతున్నారు. మాచర్ల పట్టణంలో ప్రధానంగా రాయవరం జంక్షన్, రింగ్ రోడ్డు, స్టేషన్ రోడ్డు, అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని వైన్స్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దుకాణాల వద్ద గ్రీన్ మ్యాట్లు అడ్డుగా కట్టి అక్కడ నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. మద్యం తాగేందుకు వచ్చే మందు బాబులకు సకల సౌకర్యాలు అందిస్తున్నారు. దీంతోపాటు మద్యం దుకాణాలకు ఎదుట రోడ్లపై మందుబాబులు బహిరంగంగా మద్యం తాగుతున్నారు. కూలింగ్ వాటర్ క్యాన్ల ద్వారా లూజ్ వాటర్, గ్లాసులు దుకాణాల ఎదుట విక్రయిస్తున్నారు. దీంతో మందుబాబులు వైన్స్‌ల్లో మద్యం కొనుగోలు చేసి అక్కడే తాగుతున్నారు. మద్యం వ్యాపారులంతా అధికార పార్టీకి చెందిన వారు కావటంతో యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. దీంతోపాటు ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ.50 వేలు అధికారులకు మామూళ్లు అందుతున్నట్లు వ్యాపారులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. యథేచ్ఛగా ఇతర రాష్ట్రాల మద్యం అమ్మకం మాచర్ల నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాల మద్యం యథేచ్ఛగా లభిస్తోంది. గోవా, హర్యానా రాష్ట్రాల నుంచి అక్రమార్కులు మద్యాన్ని తీసుకొచ్చి వాటిని ఆంధ్రరాష్ట్రానికి చెందిన బాటిళ్లలో నింపి విక్రయాలకు పాల్పడుతున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో యథేచ్ఛగా గోవా మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇటీవల వెల్దుర్తి మండలంలో గోవా మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కొన్ని వైన్స్‌ల్లో గోవా మద్యాన్ని లేబుళ్లు మార్చి విక్రయిస్తున్నట్లు సమాచారం. ఎనీటైం మందు.. వైన్స్లలో పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలు మద్యం అమ్ముతున్నారు. మద్యం దుకాణాల షెటర్లు మూసి వేసి చిన్న కంత పెట్టి అందులో నుంచి రాత్రుళ్లు మద్యం విక్రయాలకు పాల్పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిబంధనల ప్రకారం మద్యాన్ని దుకాణాల్లో విక్రయించాలి. అయితే యథేచ్ఛగా రాత్రింబవళ్లు దుకాణాలు తెరిచి ఉన్నా అధికారులు ఆవైపు కన్నెత్తి కూడా చూడరు. మద్యం తాగి రాత్రుళ్లు మందు బాబులు చేస్తున్న గొడవలతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు మాచర్లలో బారుల్లా వైన్స్ ఇతర రాష్ట్రాల మద్యమూ అమ్మకం నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్స్ కన్నెత్తి చూడని ఎకై ్సజ్ అధికారులు బెల్టు షాపులకు సరఫరా.. మాచర్ల పట్టణంలోని మూడు మద్యం దుకాణాల నుంచి బెల్టు షాపులకు మద్యం సరఫరా అవుతోంది. ప్రతిరోజూ గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపులు నిర్వహించే వారు పట్టణానికి వచ్చి పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసుకొని పోతున్నారు. కొందరు వైన్స్ నిర్వాహకులు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. ఒక్కో క్వార్టర్‌కు ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా బెల్టు షాపుల నిర్వాహకులకు మద్యం దుకాణా నిర్వాహకులు విక్రయిస్తున్నారు. ఆ మద్యాన్ని గ్రామాల్లో క్వార్టర్‌కు రూ.50 అదనంగా విక్రయించి బెల్టు షాపుల వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. -
ఒక్క రాత్రిలో 15 చోరీలు
దొంగల ముఠా స్వైరవిహారం గురజాల: దొంగల ముఠా స్వైరవిహారం చేసింది. ప్రజలంతా సంక్రాంతి సందడిలో ఉండగా ఒక్కరాత్రిలో గురజాల, దాచేపల్లి మండలాల్లో ఏకంగా 15 చోరీలకు తెగబడింది. ఈ చోరీలు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇంటికి తాళాలు వేసు కుని పండగకు ఊరు వెళ్లిన కుటుంబాలనే దొంగలు టార్గెట్ చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈ చోరీలు జరిగినట్టు సమాచారం. గురజాలలోని కోతమిషన్ సెంటర్లో రెండు ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు బీరువాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడవేశారు. అలాగే పులిపాడు గ్రామంలో ఐదు ఇళ్లుతోపాటు ఒక షాపులో చోరీకి తెగబడ్డారు. దాచేపల్లి మండలం నడికూడిలో ఐదు ఇళ్లు, శ్రీనివాసరావుపేటలోని రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. పోలీసులను పక్కదారి పట్టించేందుకు దొంగల ముఠా యత్నించింది. దీనికోసం గురజాలలోని న్యాయవాది ఇంటిలో చోరీచేసిన హ్యాండ్ బ్యాగ్‌ను నడికూడిలోని ఓ ఇంటిలో, ఎక్కడో దొంగతనం చేసిన పర్సును న్యాయవాది ఇంటిలో వదిలి వెళ్లింది. ఫలించిన పోలీసుల అప్రమత్తత సంక్రాంతి సెలవుల ముందు నుంచే పోలీసులు ప్రజల్లో చోరీలపై అవగాహన కల్పించడంతో గ్రామీణులు అప్రమత్తమయ్యారు. ఇళ్లల్లో ఎక్కువ బంగారం, నగదు ఉంచుకోలేదు. ఫలితంగా దొంగల ముఠా 15 ఇళ్లలో చోరీ చేసినా మొత్తమ్మీద కేవలం రూ.1.50 లక్షల సొత్తును మాత్రమే చోరీ చేయగలిగిందని సమాచారం. చోరీలు జరిగిన ఇళ్లలో బుధవారం రాత్రి క్లూస్ టీం పరిశీలించింది. ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సీఐ భాస్కర్ పర్యవేక్షణలో క్లూస్‌టీం వేలిముద్రలు సేకరించింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. క్లూస్ టీం ద్వారా నిందితుల వేలిముద్రలు సేకరించామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. -
శుక్రవారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2025
శావల్యాపురం: రైతు వద్ద ప్రతి ధాన్యపు గింజ మద్దతు ధరకు కొంటామని ప్రగల్భాలు పలికిన టీడీపీ కూటమి సర్కారు మాట తప్పింది. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా చేయలేక చేతులెత్తేసింది. ఫలితంగా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో ధాన్యాన్ని ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని పురులు కట్టి వాటిల్లో దాచుకుంటున్నారు. మాయదారి సర్కారు వల్ల కష్టాలు దాపురించాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు దళారులను ఆశ్రయించి తెగనమ్ముకుంటున్నారు. ప్రస్తుతం బస్తా ధాన్యం ధర గ్రామాల్లో రూ.1,400 వరకు పలుకుతోంది. ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. పురులు కట్టి ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎకరానికి రూ.40వేలు ఖర్చు గత ఖరీఫ్‌లో పల్నాడు జిల్లాలో 35వేల హెక్టార్లలో వరి సాగైంది. రెండు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి మురళీ చెప్పారు. ఒక్కో ఎకరానికి రైతులు రూ.40 వేల వరకు సాగు ఖర్చులు చేశారు. ఎకరానికి 30 నుంచి 40 బస్తాల దిగుబడి వచ్చింది. 76 కేజీల బస్తా ప్రస్తుతం బయట మార్కెట్లో రూ.1,400 పలుకుతుండగా, ఇది ఏమాత్రం సరిపోదని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం 76 కేజీల ధాన్యం బస్తాను మద్దతు ధర రూ.1720కు కొంటామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు జిల్లా మొత్తమ్మీద ఐదువేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నది. ఇప్పుడు కొనుగోళ్లు ఆపివేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. న్యూస్‌రీల్ ధాన్యం రైతు దైన్యం నిలిచిన ప్రభుత్వ కొనుగోళ్లు ఇంకా రైతుల వద్దే ఖరీఫ్ నిల్వలు బయట ధర లేక అష్టకష్టాలు పురుల్లో దాచుకుంటున్న వైనం జిల్లాలో ఇలా.. ఖరీఫ్‌లో వరి సాగు : 35,000 హెక్టార్లు ధాన్యం దిగుబడి : 2,00,000 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు కొన్నది : 5,000 మెట్రిక్ టన్నులు -
పోస్టుమార్టం నివేదిక రానిదే నిర్ధారణకు రాలేం
మద్యం తాగి ఇద్దరు మృతిచెందిన ఘటనపై ఎకై ్సజ్ సీఐ తులసి క్రోసూరు/అచ్చంపేట: అచ్చంపేట మండలంలోని చామర్రులో ఈనెల 14న మద్యం తాగడం వల్ల అనారోగ్యానికి గురై ఇద్దరు మృతి చెందారనేది నిజం కాదని, వదంతి మాత్రమేనని క్రోసూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ టి.తులసి వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక రానిదే వారిద్దరూ ఎలా చనిపోయారనే దానిపై నిర్ధారణకు రాలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. చామర్రు గ్రామ నివాసి గౌతుకట్ల కోటయ్య (80) అనారోగ్యంతో చనిపోవటంతో అతని దహన సంస్కారాలకు హాజరైన మృతుని కుమారుడు గౌతుకట్ల నాగేశ్వరరావు, తెల్లమేకల నాగేశ్వరరావు మద్యం తాగి అనారోగ్యానికి గురై సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని, దీనిపై విచారణ చేపట్టామని తులసి వివరించారు. వారిద్దరి మృతికి మద్యమే కారణమని చెప్పలేమని, వారు తాగిన కూల్‌డ్రింక్ లేదా ఆహారంలోనూ ఏదైనా కలిసి ఉండొచ్చని పేర్కొన్నారు. -
పెట్టుబడి సాయం కోరుతూ నేడు బెజవాడలో రైతుల ధర్నా
ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకరరావు తెనాలి: ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేల చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం అమలుతో సహా పలు డిమాండ్లతో ఈనెల 17వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న ధర్నాలో రైతాంగం పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకరరావు కోరారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. 2024–25 ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ముగిసిందని, రబీ సీజను కూడా సగానికి పూర్తయినా పెట్టుబడి సాయం ఇవ్వకపోవటం అన్యాయమన్నారు. ఉచిత పంటల బీమా కొనసాగించాలని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. వాణిజ్య, ఉద్యాన సహా మిగిలిన అన్ని పంటలకు ధరలు పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అదనపు చార్జీలను రద్దుచేయాలని కోరారు. పాడి రైతులకు పొరుగు రాష్ట్రాల్లో ఇస్తున్న విధంగా లీటరుకు రూ.5 బోనస్ ఇవ్వాలని, కౌలురైతులకు బ్యాంక్ రుణాలు, సబ్సిడీలను అందించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధ నకు శుక్రవారం విజయవాడలోని అలంకార్ సెంట ర్లోని ధర్నాచౌక్‌కు తరలిరావాలని రైతులకు విజ్ఞప్తిచేశారు. వీరితోపాటు రైతు ప్రతినిధులు కన్నెగంటి భాస్కర్చంద్, పోతురాజు కోటేశ్వరరావు, జెట్టి బాలరాజు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు ఉన్నారు. -
జాతీయ జెండా
ఏది సారూ..! నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు వచ్చే వారికి స్వాగతం పలుకుతూ గుంటూరు రోడ్డు శివారులోని ఆజాదీ పార్కు మధ్యలో ఏర్పాటుచేసిన జాతీయ జెండాను మున్సిపల్ అధికారులు తొలగించి నెలన్నర అవుతుంది. ఇప్పటివరకు మళ్లీ ఏర్పాటు చేయలేదు. అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆలోచన మేరకు సుమారు రూ.12 లక్షల మున్సిపల్ నిధులతో 2022 ఆగస్టు 14వ తేదీన 100 అడుగుల స్తంభం(పోల్)పై జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, అప్పటి కలెక్టర్ లోతేటి శివశంకర్, ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. చూపరులకు సుమారు ఒక కిలోమీటరు దూరం నుంచే జాతీయ జెండా కన్పిస్తూ ఉండేది. అలాంటి జెండాను నెలన్నర క్రితం ఏ కారణంచేతనో తొలగించిన అధికారులు మళ్లీ ఏర్పాటు చేయలేదు. పార్కులోని మొక్కలు కూడా ఎండిపోయాయి. గత ప్రభుత్వంలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి నిత్యం ఈ పార్కును పర్యవేక్షిస్తూ ఉండేవారు. రాష్ట్రంలో అధికారం మారగానే ఆ ఉద్యోగిని తొలగించారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని పట్టణ పౌరులు కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావును వివరణ కోరగా జెండా చిరిగిందనే ఫిర్యాదుపై తొలగించామని, త్వరలో మళ్లీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
వీరుల ఆయుధాలకు శాంతి క్రతువులు
కారెంపూడి: పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో కారెంపూడికి చెందిన కిల్లా కోటయ్య, కోటమ్మల కుటుంబీకులు తమ ఇళ్లలో ఉన్న పల్నాటి వీరుల ఆయుధాలకు శాంతి కార్యక్రమాలు నిర్వహించి పల్నాటి వీరాచారాన్ని గురువారం పునఃప్రతిష్ట చేసుకున్నారు. 60 ఏళ్ల క్రితంవరకు తమ పూర్వికులైన వీర్లకు పెట్టుకున్న ఆ కుటుంబీకులు ఆతర్వాత మానేసి తర్వాత మళ్లీ జరిగిన పొరపాటును గుర్తించి వీర్ల ఆయుధాలకు శాంతి కార్యక్రమాల క్రతువులు నిర్వహించారు. నాగులేరు ఒడ్డున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వీర్లగుడికి చేరుకుని అక్కడ పోతురాజుకు నైవేద్యం, ఇతర మొక్కులు చెల్లించారు. తర్వాత వీర్లగుడికి, తర్వాత చెన్నకేశవస్వామి, వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇళ్లకు చేరుకుని ఇళ్లలో వీర్ల అంకాలమ్మ తల్లి బుట్టను కత్తులను పెట్టి సాంభ్రాణి వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో విశ్రాంత డీటీ రామకృష్ణారావు, ఎంపీపీ బొమ్మిన సావిత్రి అల్లయ్య పాల్గొన్నారు. కిల్లా పెదకోటేశ్వరరావు, చెన్నకేశవస్వామి మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్ కిల్లా చినకోటేశ్వరరావు వీర్ల ఆయుధాలకు శాంతి కార్యక్రమాలు చేశారు. వీర్ల గుడి పూజారులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కారెంపూడి రణక్షేత్రంలో వీరాచారాన్ని వదలివేసిన వారు మళ్లీ స్వీకరించడం ఇక్కడ విశేషం. గతంలో జక్కా కుటుంబీకులు వీర్లకు పెట్టుకుని పునః ప్రతిష్టకు శ్రీకారం చుట్టారు. తర్వాత రణక్షేత్రంలో ఇది రెండవ కార్యక్రమం. -
ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో ముందుండాలి
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పిడుగురాళ్ల: ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో ముందుండి అందరికీ ఆదర్శవంతంగా నిలబడాలని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళుతూ మధ్యలో పిడుగురాళ్లలో కాసేపు ఆగారు. పట్టణంలోని ఆర్యవైశ్య నేతలు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు ఘన స్వాగతం పలికి దుశ్శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ... పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన ఆర్యవైశ్యులు జాతీయ స్థాయిలో పదవుల్లో ఉన్నారని, అన్నిరంగాల్లో ఆర్యవైశ్యులు ముందు ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఉప్పల ఫౌండేషన్ కో–చైర్మన్ ఉప్పల సాయితేజకు కూడా ఘనస్వాగతం పలికారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జూలకంటి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు, విద్యాశాఖ రాష్ట్ర మాజీ డైరెక్టర్ చింతా వెంకట రామారావు, ఆర్యవైశ్య యువ నాయకులు పతంగి అమర్, మద్దాలి శివ, ఆలేటి కనకయ్య, దేవరపల్లి కృష్ణప్రసాద్, తోటా బుచ్చిబాబు, పలువురు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రులకు అప్పగింత
మంగళగిరి (తాడేపల్లి రూరల్): ఉదయం తప్పిపోయిన బాలుడ్ని గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని టిడ్కో గృహ సముదాయాల్లో నివాసముంటున్న దంపతులకు మతిస్థిమితం లేని కుమారుడు (8) ఉన్నాడు. గురువారం ఉదయం నుంచి కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెదికారు. మంగళగిరి బస్టాండ్ ఎదురు రోడ్డులో ఓ గుర్తుతెలియని వాహనం సదరు బాలుడ్ని ఢీకొని వెళ్లిపోవడంతో చుట్టుపక్కల ఉన్న కొంతమంది యువకులు ఆరా తీశారు. మతిస్థిమితం లేని బాలుడు ఏమీ మాట్లాడలేకపోవడంతో పోలీసులకు అప్పగించారు. రెండు గంటల వ్యవధిలో బాలుడి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అక్కడ తమ కుమారుడిని చూసి విలపించారు. కుమారుడిని పోలీసులకు అప్పగించిన యువకులకు, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. -
తరాల సంక్రాంతి.. తరగని కాంతి
నరసరావుపేట: పట్టణంలోని మండవ, పెనుగొండ కుటుంబ సభ్యులు 89మంది సంక్రాంతి పర్వదినాన మరోసారి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో నివాసం ఉండే ఈ రెండు కుటుంబాలకు చెందిన వారు గత 11 ఏళ్ల నుంచి సంక్రాంతి పర్వదినాన సమావేశమవుతున్నారు. సుమారు నాలుగు తరాలకు చెందిన వీరు మూడురోజుల పాటు పట్టణంలోని పాతూరులో గల సీతారామస్వామి దేవాలయంలోని కల్యాణ మండపంలో సమావేశమై ఉల్లాసభరితమైన వాతావరణంలో ఆటపాటలతో పండుగ జరుపుకొన్నారు. గత 11 ఏళ్లుగా సమావేశమవుతున్న మండవ, పెనుగొండ కుటుంబాల నాలుగు తరాల సభ్యులు ఉల్లాసభరిత వాతావరణంలో సంక్రాంతి వేడుకలు -
దళితులపై కూటమి ప్రభుత్వానికి ద్వేషం
ఫిరంగిపురం: కూటమి ప్రభుత్వానికి దళితులంటే ద్వేషం అని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. మండలంలోని పొనుగుపాడు గ్రామం ఎస్సీకాలనీలోని బాధిత దళితులను గురువారం ఆయన పరామర్శించారు. చర్చిగోడకు సంబంధించి కూల్చివేసిన ఘటన గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ బలంతో పోలీసులను అడ్డుపెట్టుకొని దళితులను నిర్బంధించి గోడ కూలగొట్టి రోడ్డు వేశారన్నారు. ఇది దారుణమైన సంఘటన అని పేర్కొన్నారు. గ్రామంలో ఎప్పుడో బ్రిటీష్ వారి కాలంలో దళితులకు చర్చి కోసం స్థలం కేటాయించారని చెప్పారు. ఇక్కడి గోడను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోర్టు కేసులను కూడా పట్టించుకోకుండా కూల్చివేశారని చెప్పారు. గతంలో కూడా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం దేవరపల్లిలో ఈ తరహా సంఘటన జరిగిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు ఉన్నతస్థానం కల్పించారని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులపై ప్రభుత్వానికి ఎందుకింత ద్వేషం అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా పచ్చ మీడియా కనీసం నోరు కూడా మెదపని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గ్రామంలో కూడా పేదదళితులు చర్చికి ఒకవైపు గోడ నిర్మించుకున్నారని, మరోవైపు డబ్బు లేక నిర్మించుకోలేదని చెప్పారు. అధికారబలంతో ఎంపీ, ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్, అధికారులు కలిసి గోడను పడగొట్టించడం దారుణమన్నారు. దళిత ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఇంత జరుగుతున్నా కనీసం నోరు విప్పకపోవడం సరికాదన్నారు. పేద ప్రజలు నమ్ముకున్న చర్చికి సంబంధించిన గోడను పునర్మించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని మరలా వారికి కేటాయించాలని డిమాండు చేశారు. సమావేశంలో స్థానిక నాయకులు గేరా కోటేశ్వరరావు, సేవా నాగరాజు, మేళం జోజిబాబులు పాల్గొన్నారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పొనుగుపాడులో దళితులకు పరామర్శ -
పురస్కారాలకు ఎంపికై న తెనాలి కవులు
తెనాలి: ప్రముఖ సాహితీ, సాంస్కతిక, సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఏటా బహూకరిస్తున్న తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారాలకు తెనాలి నుంచి నలుగురు సాహితీమూర్తులు ఎంపికయ్యారు. శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పొయెట్రీ అకాడమీ సంయుక్తంగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నాయి. ఈ నెల 21వ తేదీన విజయవాడలో సాహిత్య సభలో పురస్కారాలను అందజేస్తారు. శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఈ మేరకు సమాచారం పంపారు. పురస్కారాలను అందుకోనున్న వారిలో తెనాలికి చెందిన ప్రముఖ కవయిత్రి/తెలుగు ఉపాధ్యాయిని షేక్ అస్మతున్నీసా, రంగిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రంగిశెట్టి రమేష్ (గంగాశ్రీ), సాహితీబంధువు ఆళ్ల నాగేశ్వరరావు (కమలశ్రీ), ప్రముఖ పద్యకవి డాక్టర్ పాతూరి సుబ్రహ్మణ్యం ఉన్నారు. వీరిని పట్టణానికి చెందిన పలువురు రచయితలు అభినందించారు. -
ఏటీఎం మోడల్‌తో నిరంతర ఆదాయం
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం మోడల్ ద్వారా నిరంతరం ఆదాయం పొందవచ్చని డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. పట్టణంలోని పోస్టల్‌కాలనీలో ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆకుకూరలు, కూరగాయలు సాగుచేస్తున్న కోడూరి వెంకటేశ్వరరెడ్డి పొలాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు ఎకరాల్లో అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు వెంకటేశ్వరరెడ్డి పండిస్తున్నట్టు తెలిపారు. ఆకుకూరలు కట్ట రూ.10కే విక్రయిస్తున్నారని, వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మూడు అడుగుల వెడల్పుతో బెడ్స్ వేసుకొని వాటిలో అవసరం మేరకు విత్తే దశలో, పెరిగే దశలో, పాత దశలో ఉండే విధంగా తోటకూర, చుక్కకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీరతో పాటు టమాటాలు, గోరుచిక్కుడు, వంగ, మిరప, క్యాబేజీ, బెండలతో పాటు తీగజాతి కూరగాయలను పండిస్తున్నారని వివరించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్లో ఈ ఉత్పత్తులను అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
తెనాలి రూరల్: తెనాలిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పట్టణంలోని ముత్తెంశెట్టిపాలెం నుంచి ఇస్లాంపేట వైపు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఆమె మృతి చెంది ఉండటాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. తమిళనాడుకి చెందిన మణి అనే వ్యక్తితో 50 ఏళ్ల ఈ మహిళ కొంత కాలంగా కలిసి ఉంటోందని చెబుతున్నారు. మణి కర్రీ పాయింట్లో పని చేస్తుండగా, మహిళ బిక్షాటన చేసేదన్నారు. గత రాత్రి రోడ్డు పక్కన నిద్రించిన మహిళ తెల్లవారే సరికి మృతి చెంది ఉండటం చర్చనీయాంశమైంది. రాత్రి ఇద్దరూ కలిసి మద్యం తాగి గొడవపడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ ప్రైవేటు శరీర భాగాల నుంచి తీవ్రంగా రక్తస్రావం అయినట్లుగా తెలుస్తోంది. మణిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ బి. జనార్దనరావు, వన్ టౌన్ సీఐ వి.మల్లికార్జునరావులు పరిశీలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చదువులమ్మ చెట్టు నీడలో..!
అచ్చంపేట: స్థానిక శ్రీ తుమ్మేపల్లి శ్రీరాములు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000–01 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులంతా 25 సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. పాఠశాలలో గురువారం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పూర్వ విద్యార్థులు పాఠశాల పరిసరాలు కలయతిరిగి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అప్పటి విద్యార్థులంతా ఇప్పుడు వివిధ వృత్తులలో ఇంజినీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, లాయర్లు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు, రైతులు, కాంట్రాక్టర్లు, తాపీమేసీ్త్రలు, గృహిణిలుగా.. ఇలా స్థిరపడ్డారు. ఇప్పటి వారి హోదాలగురించి పట్టించుకోకుండా పాఠశాలకు రాగానే వారంతా ఒక్కసారిగా విద్యార్థుల్లా మారిపోయారు. టెన్త్‌లో ఎవరు ఎక్కడ కూర్చునేవారు, ఎవరిపక్కన ఎవరు ఉండేవారో అలానే బల్లలపై కూర్చున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో కుశల ప్రశ్నలు వేసుకున్నారు. చదువులు చెప్పిన నాటి ఉపాధ్యాయులందరిని పిలిచి దుశ్శాలువాలు, జ్ఞాపికలు, పూలమాలలతో ఘనంగా సన్మానించుకున్నారు. ఉపాధ్యాయుల దీవెనలతోనే తాము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటూ తమ తమ అనుభవాలను వ్యక్తపరచారు. ఆనాటి హెచ్ఎం గోళ్లమూడి పాపారావు, ఉపాధ్యాయులు చలపతిరావు, మార్కు మస్టారు, సాంబశివరావు, పీఈటీ కమతం శ్రీనివాసరావు, డ్రాయింగ్ టీచర్ మల్లేశ్వరి, తదితర గురువులతో కలసి సహపంక్తి భోజనాలు చేశారు. అప్పటి టెన్త్ చదివిన బ్యాచ్‌లో సుమారుగా 80 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. మిగిలిన 20 శాతంలో విదేశాలలో స్థిరపడినవారు, కొన్ని అనివార్య పరిస్థితులవల్ల రాలేనివారంతా ఫోన్లు ద్వారా పలుకరించుకుని గురువుల ఆశీర్వాదాన్ని పొందారు. 25 సంవత్సరాల తరువాత కలుసుకున్న పూర్వవిద్యార్థులు తుమ్మేపల్లి శ్రీరాములు జెడ్పీ హైస్కూల్లో 2000–01 బ్యాచ్ టెన్త్ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం -
యువకుడిపై హత్యాయత్నం
తెనాలి రూరల్: తెనాలిలో యువకుడిపై హత్యాయ త్నం జరిగింది. వెండి పని చేసుకునే తేలప్రోలు గ్రా మానికి చెందిన షేక్ సుభానీపై గురువారం ఉదయం నడిరోడ్డుపై ఈ హత్యాయత్నం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తేలప్రోలుకు చెందిన షేక్ సుభానీ తన సోదరుడు బాజితో కలిసి ఓ ఫంక్షన్‌కు మిత్రులను పిలిచేందుకు తెనాలి వచ్చాడు. గాంధీచౌక్ నుంచి కొత్తపేట వెళ్లే దారిలో రోడ్డు పక్కన నిలబడి ఉండగా తేలప్రోలుకు చెందిన అరాఫత్, ఇర్ఫాన్‌లు వచ్చి కత్తితో దాడి చేశారు. సుభానీ తీవ్రంగా గాయపడటంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. సుభానీ బంధువులు, ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న సోదరుడు మాట్లాడుతూ.. తమ ఊరికే చెందిన అరాఫత్, ఇర్ఫాన్‌లు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. అరాఫత్ తరచూ ఘర్షణకు దిగుతున్నాడని, రెక్కీ నిర్వహించి మరీ కత్తులతో తిరుగుతున్నారని తెలిపారు. అదేమంటే తమకు జనసేన అండ ఉందని చెబుతూ రెచ్చిపోతున్నారని వాపోయారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో ఎస్బీఐ క్రెడిట్‌కార్డ్ మేనేజర్ దుర్మరణం
నాదెండ్ల: రోడ్డు ప్రమాదంలో గుంటూరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలెక్షన్ మేనేజర్ మన్నెం వెంకటరాజేష్ (45) దుర్మరణం పాలయ్యారు. గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై సాతులూరు గ్రామ సమీపంలోని హోసన్న ప్రార్థనా మందిరం వద్ద గురువారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఎస్ఐ జి.పుల్లారావు తెలిపిన వివరాల మేరకు గుంటూరు వసంతరాయపురం సమీపంలోని వెంగయ్యనగర్ నాలుగో లైనుకు చెందిన మన్నెం వెంకటరాజేష్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరుకు చెందిన మరో వ్యక్తి వినుకొండ నవీన్ క్రెడిట్ కార్డు ఏజెన్సీ టీం లీడర్‌గా పనిచేస్తున్నాడు. వీరిరువురూ ద్విచక్రవాహనంపై నరసరావుపేటకు వెళ్తూ సాతులూరు చర్చి వద్దకు రాగానే గేదెను తప్పించే క్రమంలో వెనుకగా వస్తున్న కియా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వెంకటరాజేష్ను కారులో నరసరావుపేట తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వాహనం నడుపుతున్న నవీన్‌కు గాయాలు కావటంతో ఆసుపత్రిలో చేర్చారు. వెంకటరాజేష్ మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని మేనల్లుడు వేములకొండ విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరో వ్యక్తికి గాయాలు -
విధి నిర్వహణలో అప్రమత్తత అవసరం
ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారి శ్రీనివాసరావు నరసరావుపేట: ఆర్టీసీ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్‌లో డిపో మేనేజర్ జీవీఎస్ఎస్ మూర్తి అధ్యక్షతన రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రారంభోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ భద్రతా మాసోత్సవాలు వచ్చే నెల 15వరకు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నెల రోజుల కార్యక్రమాలను గురించి వివరించారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేశారు. గ్యారేజీ ఇన్చార్జి లావణ్య, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభం
పట్నంబజారు: డ్రైవర్లు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ ఎం.రవికాంత్ చెప్పారు. గుంటూరు జిల్లా పరిధిలోని హెవీమోటారు వెహికల్ డ్రైవింగ్ స్కూల్ 18 బ్యాచ్‌కు శిక్షణ తరగతులు గురువారం బస్టాండ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. హెవీ డ్రైవింగ్ స్కూల్లో సీనియర్ డ్రైవర్ల చేత నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిపో –2 మేనేజర్, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్ షేక్ అబ్దుల్సలాం పాల్గొన్నారు. ద్విచక్ర వాహనం పై నుంచి పడి మహిళ మృతి గురజాల: ద్విచక్ర వాహనంపై నుంచి పడి మహిళ మృతి చెందిన ఘటన మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. దాచేపల్లి మండలం తక్కళ్లపాడు గ్రామానికి చెందిన పిందెబోయిన నాగలక్ష్మి(30) సంక్రాంతి పండుగ సందర్భంగా గురజాల మండలం గొట్టెముక్కల గ్రామానికి పుట్టింటికి వచ్చింది. పండుగ అనంతరం తిరిగి తన సోదరుడి ద్విచక్రవాహనంపై తక్కళ్లపాడు వెళ్తుండగా మార్గ మధ్యలో దైద గ్రామ సమీపంలో వాహనంపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో నాగలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. నాగలక్ష్మిని గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ నెహ్రూనగర్: గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఫిబ్రవరి 3న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 వరకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరుగుతాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక కాలపరిమితి గత సంవత్సరం ఆగస్టుతో ముగిసింది. ఇప్పటి వరకు ఉన్న సభ్యులతోనే స్టాండింగ్ కమిటీ నడిచింది. ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ ఓటర్ల లిస్టు 16వ తేదీన ప్రకటించామని, ఓటర్ల లిస్టు, నోటిఫికేషన్‌ను నగర పాలక సంస్థ నోటీసు బోర్డులో ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 11– సాయంత్రం 3 గంటల వరకు నగర అదనపు కమిషనర్ చాంబర్లో నామినేషన్లు దాఖలు చేయవచ్చునన్నారు. 24న అందిన నామినేషన్ల ప్రకటన, 27న ఉదయం 11 – 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని, అదే రోజు వ్యాలిడ్ నామినేషన్ల ప్రకటన ఉంటుందన్నారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 – సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, అనంతరం తుది పోటీలోని అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 3న ఉదయం 10.30 – సాయంత్రం 3 వరకు సమావేశ మందిరంలో ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయన్నారు. -
కోడి పందేలు వద్ద ఘర్షణ
చుండూరు(వేమూరు): మద్యం బీరు సీసాలతో యువకులు పొడుచుకున్నారని ఎస్ఐ షేక్ రహిమాన్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం...సంక్రాంతి సంబరాలలో భాగంగా చుండూరు మండలం కేఎన్ పల్లి సమీపంలో కోడి పందేలు నిర్వహించారు. బుధవారం చేబ్రోలు గ్రామానికి చెందిన మదాసు అక్షయకుమార్, మాటుపల్లి రాజేష్, ముసలా శ్రీనివాసరావులు కోడి పందేలు చూసేందుకు వచ్చారు. కోడి పందేలు చూసిన తర్వాత ముగ్గురు కలసి సైకిల్ స్టాండ్ వద్ద బీరు తాగుతున్నారు. అక్షయకుమార్, శ్రీనివాసరావు మధ్య మాటామాట పెరిగింది. దీంతో శ్రీనివాసరావు బీరు బాటిల్ పగలు కొట్టి అక్షయకుమార్ను పొడిచాడు. అనంతరం రాజేష్ బీరు బాటిల్‌తో శ్రీనివాసరావును పొడిచాడు. ముగ్గురికి గాయాలయ్యాయి. 108 వాహనంలో అక్షయకుమార్, రాజేష్‌లను తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీనివాసరరావును ఽప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. ముగ్గురిపైన కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బీరు సీసాలతో పొడుచుకున్న యువకులు -
జగ్జీత్సింగ్ ప్రాణాలకు కేంద్రమే బాధ్యత వహించాలి
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు నరసరావుపేట ఈస్ట్: రైతులు పండించిన పంటకు మద్దతు ధర చట్టం కోసం గత 50 రోజులుగా ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న జగ్జీత్సింగ్ దలేవాల్ ప్రాణాలకు ముప్పు ఏర్పడితే కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. జగ్జీత్సింగ్ ఆమరణ దీక్షకు మద్దతుగా మంగళవారం గాంధీపార్క్ వద్ద సంఘీభావ దీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీని మాత్రమే అమలు చేయాలని జగ్జీత్సింగ్ కోరుతున్నారని వివరించారు. దేశంలోని రైతాంగం కన్నెర్ర చేస్తే మోదీ వంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, సీపీఐ జిల్లా కార్యదర్శి ఏ.మారుతీ వర ప్రసాద్, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, ప్రజా నాట్యమండలి జాతీయ కార్యదర్శి షేక్ గని, న్యాయవాది సీజే ప్రతాప్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ షేక్ సుభాని పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మద్యం అమ్మకాలు
చుండూరు(వేమూరు): సంక్రాంతి సంబరాల మాటున వేమూరు నియోజకవర్గంలో కోడి పందేల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పేకాట, మద్యం ఏరులై పారింది. మద్యం ఇష్టారాజ్యంగా అమ్ముతున్నా ఎకై ్సజ్ అధికారులు పట్టించు కోలేదు. వాస్తవానికి మద్యం షాపుల్లోనే అమ్మకాలు చేయాలి. నిబంధనలను పక్కన పెట్టి బరుల్లో బెల్టు షాపులు జోరుగా నిర్వహించారు. వేమూరు మండలంలోని జంపనిలో ఏకంగా పందేల దగ్గర రెండు బెల్టు షాపులు ఏర్పాటు చేసి జోరుగా మద్యాన్ని అమ్మారు. కొల్లూరు మండలంలోని క్రాప వద్ద, భట్టిప్రోలు మండలంలోని పల్లెకోనలో బరుల వద్ద బెల్టు షాపులు నిర్వహించారు. చుండూరు మండలంలోని కోడి పందేలు బరిలో మద్యం అమ్ముతున్నా అధికారులు పట్టించు కోలేదు. జూదగాడిపై దాడి దొంగ ముక్కలతో పేకాడుతున్న వ్యక్తికి దేహశుద్ధి దొంగ ముక్కలతో పేకాడుతున్న వ్యక్తికి దేహశుద్ధి చేశారు. చుండూరు మండలంలోని కేఎన్ పల్లి బరి దగ్గర దొంగ ముక్కలతో పేకాడుతున్న వ్యక్తిని పట్టుకున్నారు. బరి దగ్గర ఇష్టారాజ్యంగా కొట్టారు. తర్వాత ఆటోలో వేటపాలెం తీసుకెళ్లి అక్కడ కూడా కొట్టారు. గ్రామస్తులు 100 కాల్ ఫోన్ చేయడంతో చుండూరు పోలీసులు హడావుడిగా సంఘటన స్థలం వద్దకు చేరుకుని దాడిని ఆపారు. పేకాటలో తప్పు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని, దాడి చేయకూడదని తెలిపారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ షేక్ రహిమాన్ తెలిపారు. -
గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎన్ఈసీ విద్యార్థులు
నరసరావుపేట రూరల్: రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ ఎంపికయ్యారు. ఈ మేరకు కళాశాల ఎన్సీసీ అధికారి మేడికొండ రాజేష్ తెలిపారు. కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న కె.హరీష్, కె.కావేరి, ఏ.అర్తి, డి.అప్పలనాయుడు ఈనెల 26వ తేదీన నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అర్హత సాధించినట్టు వివరించారు. విద్యార్థులను కళాశాల చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి, ప్రిన్సిపాల్ ఎస్.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ డి.సునీల్, అధ్యాపకులు అభినందించారు. -
దళితుల ఇళ్లు కూల్చివేత దారుణం
క్రోసూరు:ిపడుగురాళ్లలో దళితుల ఇళ్లను కూల్చిన మద్దాల సుబ్బయ్యపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ బుధవారం డిమాండ్ చేసింది. క్రోసూరులో కమిటీ సభ్యులు గార్లపాటి దాసు, బంకా శ్రీనివాసరావు, పట్టెపు మరియదాసు విలేకరులతో మాట్లాడారు. 1996లో ప్రభుత్వం కొమ్ము కోటిరత్నానికి 14.5 సెంట్ల స్థలాన్ని ఇచ్చింది. దాన్ని గతంలో చల్లా సీతారామిరెడ్డి కబ్జా చేసేందకు యత్నించగా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ద్వారా కోటిరత్నం కుమారుడు ఆనందరావు తన తల్లి పేర డిక్రీ తెచ్చుకున్నారు. ఉత్తర్వుల కాపీని అప్పటి ఆర్డీవోకు, తహశీల్దార్‌కు అందించారు. ఆ స్థలంలో ఆనందరావు సహా ఏడు కుటుంబాలు సిమెంట్ బ్రిక్స్ తయారీతో పాటు హోటల్ పెట్టుకుని జీవిస్తున్నారు. ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి మద్దాల సుబ్బయ్య అనే వ్యక్తి 40 మంది మనుషులతో వచ్చి దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. ఇళ్లను పడేసి, ఆర్థికంగా రూ.50 లక్షల ఆస్తి నష్టపరిచాడని కమిటీ సభ్యులు తెలిపారు. సుబ్బయ్యపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గృహాలు మంజూరు చేసి, నిందితుడితో బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఎయిమ్స్‌లో ఆగిన పసిగుండె
మంగళగిరి (తాడేపల్లిరూరల్): మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పాప చనిపోయిందంటూ బుధవారం తల్లిదండ్రులు మంగళగిరి రూరల్‌పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన కొత్తం గంగరాజు, కుమారి దంపతులకు పెళ్లయిన ఆరు సంవత్సరాల తరువాత పాప జన్మించింది. ఆ పాపకు తన్విశ్రీ (14 నెలలు) అని పేరు పెట్టుకున్నారు. ఇంటి దగ్గర ద్విచక్రవాహనం పైనుంచి కిందపడి మెడలోపలి భాగంలో స్వల్ప గాయమైంది. లేకలేక పుట్టిన బిడ్డకు దెబ్బ తగలడంతో తల్లిదండ్రులు స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో చూపించగా, వారు మంగళగిరిలోని ఎయిమ్స్‌కు తీసుకువెళ్లమని సూచించడంతో మూడు రోజుల కిందట ఇక్కడకు తీసుకువచ్చారు. సోమవారం ఎయిమ్స్‌కు రాగా వైద్యులు పరీక్షించి రెండు సిరప్లు ఇచ్చి, ఇంటికి వెళ్లి బుధవారం రమ్మని చెప్పారు. పాపకు దెబ్బతగిలినా ఆడుకుంటూ నవ్వుతూ ఉండేదని తల్లిదండ్రులు తెలిపారు. అయితే బుధవారం మళ్లీ ఆస్పత్రికి రాగా పాపకు స్కానింగ్ తీయాలని చెప్పి లోపలికి తీసుకు వెళ్లారు. తొలుత స్కానింగ్ తీసి, అనంతరం ఎంఆర్ఐ స్కానింగ్ అంటూ పాపకు మత్తు ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు. రెండు మూడు సార్లు స్కానింగ్ తీసినా సరిగా రాకపోవడంతో మళ్లీ పాపకి మత్తు ఇంజక్షన్ ఇచ్చారని, అరగంట తరువాత పాప స్కానింగ్ మిషన్‌లోనే చనిపోయిందని చెబుతున్నారని, క్యాన్సర్ అని వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ●పాప చనిపోకముందు జూనియర్ డాక్టర్లు వైద్యం అందించగా, పాప మృతితో సీనియర్ వైద్యులు వచ్చి పరిశీలించి చనిపోయిందని నిర్ధారించారు. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న పాప ఎలా చనిపోయిందని అడగడంతో డాక్టర్లు మాకు తెలియని భాషలో ఏదేదో చెబుతూ మమ్మల్ని బయటకు వెళ్లమని చెప్పారని తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్‌స్టేషన్ ముందు కన్నీరు మున్నీరుగా విలపించారు. అసలు ఏ పరీక్షలు చేయకుండా క్యాన్సర్ అని ఎలా నిర్ధారించారో తమకు తెలియజెప్పాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశామని, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తండ్రి గంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సామాజిక మాధ్యమాల్లో ఎయిమ్స్ హాస్పిటల్లో పాప ఎవరూ చనిపోలేదని, ఇలాంటి సంఘటనలు ఎవరూ నమ్మవద్దని ప్రచారం నిర్వహిస్తున్నారు. జరిగిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపణలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తల్లిదండ్రులు లేకలేక పుట్టిన బిడ్డను చంపేసి, ఇప్పుడు క్యాన్సర్ అంటున్నారని ఆవేదన