Jogulamba
-
జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ప్రముఖులు దర్శించుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ షర్మిల, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మి, సినీ యాంకర్ ప్రదీప్ కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈఓ పురేందర్ కుమార్ అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. వీరితోపాటు ఆలయ ధర్మకర్తలు సరస్వతి, నాగశిరోమణి, మాజీ సర్పంచ్ జోగుల రవి తదితరులు ఉన్నారు. బొల్లుగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో.. ఎర్రవల్లి: మండల కేంద్రంలోని బొల్లుగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని గురువారం మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సతీమణి మహాలక్ష్మి, అదనపు కలెక్టర్ షర్మిళ, టాలీవుడ్ యాంకర్ ప్రదీప్ మాతృమూర్తి మంచిరాజు భావన, పలువురు టాలీవుడ్ ప్రముఖులు సందర్శించారు. ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేరుశనగ క్వింటా రూ.6,201 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు గురువారం 1427 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6201, కనిష్టం రూ.2806, సరాసరి రూ.4510 ధరలు పలికాయి. అలాగే, 27 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5521, కనిష్టం రూ.4509, సరాసరి రూ.5511 ధర లభించాయి. 67 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2466, కనిష్టం రూ.2275, సరాసరి రూ.2446 ధర పలికింది. 186 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.6869, కనిష్టం రూ. 3306, సరాసరి రూ. 6869 ధరలు వచ్చాయి. సింగోటం లక్ష్మీనృసింహుడి ప్రభోత్సవం కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ప్రభోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి దీక్షహవనం, లక్ష్మీగణపతి హోమతర్పణం, సతీసమేత ఆదిత్యాది నవగ్రహ, ఆంజనేయ, వాస్తు, సర్వతోభద్రహవనాలు జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను సింహవాహనంపై ఉంచి రత్నగిరి కొండ వరకు వేలాది మంది భక్తుల గోవిందనామస్మరణ మధ్య ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ పౌండర్ చైర్మన్ ఆదిత్య లక్ష్మణ్‌రావు, అర్చకులు పాల్గొన్నారు. అనంతరం టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనను మంత్రి జూపల్లి కృష్ణారావు తిలకించారు. అలాగే శుక్రవారం జరిగే రథోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. నవోదయ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు బిజినేపల్లి: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించే నవోదయ ప్రవేశ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేశామని, పరీక్షలను అధికారులు బాద్యతగా నిర్వహించాలని నాగర్‌కర్నూల్ జిల్లా విద్యా శాఖ అదనపు కమిషనర్ రాజశేఖర్‌రావు అన్నారు. గురువారం బిజినేపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రవేశ పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6 వేల మందికిపైగా విద్యార్థులు నవోదయ విద్యాలయంలో 6వ తరగతి కోసం ప్రవేశ పరీక్షకు హజరుకానున్నారని, మొత్తం 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 27 మంది సూపరింటెండెంట్లు, 27 మంది పరీశీలకులను నియమించామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆయా జిల్లాల పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్ష నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ వైస్ ప్రిన్సిపల్ జానకిరాములు, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రహణం వీడేదెన్నడో..?
వివరాలు 8లో u●11 ఏళ్లుగా కొనసాగుతున్న గద్వాల ఔటర్ రింగ్ రోడ్డు పనులు ● నిధుల లేమితో ముందుకు సాగని వైనం ● అసంపూర్తి పనులతో ఆరు మండలాల ప్రజల అవస్థలు ● ఇష్టానుసారంగా వెలసిన అక్రమ నిర్మాణాలు నివేదిక పంపించాం ఔటర్‌రింగు రోడ్డు పనులకు నిధులు లేకపోవడంతో ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం పనులు మొదలు పెట్టాలంటే గతంలో వేసిన రేట్లు పెరిగిపోయాయి. ప్రస్తుత ధరలకు అనుగుణంగా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడుతాం. – ప్రగతి, ఆర్అండ్బీ ఈఈ, గద్వాల గద్వాల: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఏళ్లుగా గద్వాల రింగ్‌రోడ్డు పనులు కొనసాగుతూ..నే ఉన్నాయి. ఇన్నేళ్లు పనులు ముందుకు కదలకపోయినా అటు పాలకులకు కాని, ఇటు అధికారులకు కాని చీమ కుట్టినట్లు కూడా లేదు. ఫలితంగా జిల్లాలోని ఆరు మండలాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దుగా ఉన్న రాయచూరుకు వెళ్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుతు పడుతున్న పరిస్థితి. 2013లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్వాల ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జమ్ములమ్మ నుంచి గద్వాల–రాయచూరు రోడ్డును కలుపుతూ 100 ఫీట్ల వెడల్పుతో 6.27 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం కోసం రూ.26కోట్లతో అంచనాలు రూపొందించారు. సర్వే పనులు పూర్తయిన అనంతరం 2014లో టెండర్లు నిర్వహించి మొదటి దశ పనులు చేపట్టారు. కొంతమేర పనులు పూర్తయినా ఆ తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈక్రమంలోనే నిధులు లేమితో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రూ.26 కోట్లతో రింగ్‌రోడ్డు ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్వాల చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు వెళ్లే రహదారి మార్గంలోని జమ్ములమ్మ వద్ద నుంచి గద్వాల–అయిజ రోడ్డును కలుపుతూ గద్వాల–రాయచూరుకు వెళ్లే రహదారి వరకు 6.27 కిలోమీటర్ల మేర 100 ఫీట్ల ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రూ.26కోట్లతో అంచనాలు రూపొందించింది. ఇందులో సర్వే కోసం రూ.15 లక్షలు, భూసేకరణకు రూ.4 కోట్లు, రోడ్డు నిర్మాణం కోసం రూ.8.76 కోట్లు, ఆర్వోబి కోసం రూ.7.58 కోట్లు, వివిధ ప్రాంతాలలో స్టక్చర్స్ నిర్మాణాల కోసం రూ.1.1 2కోట్లు, విద్యుత్ పోల్స్‌కు రూ.7లక్షలతో అంచనాలతో డీపీఆర్ రూపొందించి టెండర్ ప్రక్రియ చేపట్టింది. ఇందులో గద్వాల–రాయచూరు రోడ్డు మొదలుకుని గద్వాల–అయిజ వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆ తరువాత జమ్ములమ్మ ప్రధాన రహదారి వరకు చేపట్టాల్సిన పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదిలాఉండగా, నడిగడ్డగా పిలువబడే అలంపూర్ – గద్వాల నియోజకవర్గాల ప్రజలకు నిత్యం వివిధ రకాల పనుల నిమిత్తం రోజుకు సుమారు 20 వేల నుంచి 40వేలకుపైనే రాకపోకలు కొనసాగిస్తుంటారు. రింగ్‌రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో గద్వాల పట్టణం లోపలి నుంచి రాయచూరు, అయిజ, హైదరాబాద్, కర్నూల్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెలసిన అక్రమ నిర్మాణాలు ఇదిలాఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో గద్వాల ఔటర్రింగురోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకుండా పోయిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. గత పదేళ్ల కాలంలో ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం కోసం ఒక్క రూపాయిని ప్రభుత్వం విడుదల చేయలేదంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. దీనికితోడు గద్వాలఔటర్ రింగు రోడ్డు ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో చాలా చోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. ముఖ్యంగా జమ్ములమ్మ ఆలయం వద్ద ప్రభుత్వ భూములలో అక్రంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇళ్ల నిర్మాణాలు, ఫంక్షన్ హాళ్లు వెలిశాయి. ఆక్రమణదారులు వీటిని దర్జాగా అద్దెకిచ్చుకుని నెలనెలా డబ్బులు వెనకేసుకుంటున్నారు. రింగురోడ్డు పనులు పూర్తిచేయాలంటే ఇక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆక్రమణలపై అధికారులకు తెలిసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
నెలాఖరు వరకు వాటాధనం సమకూర్చాలి
శాంతినగర్: ఈనెల చివరి వరకు రూ.15 లక్షలు వాటాధనం సమకూర్చాలని రైతు ఉత్పత్తి దారుల సంఘం చైర్మన్లు అన్నారు. వడ్డేపల్లి రైతు వేదికలో వడ్డేపల్లి, ఇటిక్యాల, రాజోళి, ఐజ, గట్టు మండలాలకు చెందిన రైతు ఉత్పత్తి దారుల సంఘాల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘంలోని వాటాదారులు, సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. సెంట్రల్ సెక్టార్ స్కీంలో బాగంగా 2022లో జిల్లాలో ఐదు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఐదు సంస్థలలో ఇప్పటివరకు 3 వేల మంది రైతులు సభ్యత్వం తీసుకున్నారన్నారు. సభ్యత్వం ద్వారా రూ.30 లక్షల వాటాధనం సమకూర్చామని, ఇప్పటివరకు రూ.2 కోట్ల వరకు ఇన్పుట్ వ్యాపారం జరిగిందన్నారు. 300 ఎకరాల్లో చీని, మామిడి మొక్కలు ఉచితంగా ఇచ్చామని, సభ్యత్వం తీసుకున్న రైతులకు విత్తనాలు, ఫర్టిలైజర్, బ్యాటరీ పంపులు, పరదలు, డ్రిప్పు మందులు, సోలార్ లైట్లు, కలుపు తీసే యంత్రాలు, విత్తనాలు వేసే పరికరాలు అందజేశారన్నారు. ప్రతి గ్రామంలో సంఘం తరపున షాపులు ఏర్పాటుచేయాలని, రైతులకు విత్తనాలు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అందుబాటులో వుండేలా చూడాలని, సంఘాలు వ్యాపారం చేసుకోడానికి న్యాబ్ కిసాన్ సంస్థ ప్రతి సంఘానికి రూ.6 లక్షలు లోన్ మంజూరుచేస్తుందని చైర్మన్లు వివరించారు. సమావేశంలో వడ్డేపల్లి రైతు సంఘం చైర్పర్సన్ దేవేంద్ర, రాజోళి వెంకటేశ్వర్లు, ఇటిక్యాల యుగంధర్‌రెడ్డి, డైరెక్టర్లు సుధాకర్‌గౌడ్, లక్ష్మికాంతరెడ్డి, హనుమంతురెడ్డి, నర్సింహులు, మహేంద్రగౌడ్, తిమ్మప్ప, సీఎస్ఏ ప్రతినిధులు రమేష్, వీరబాబులు పాల్గొన్నారు. -
సకాలంలో పనులు పూర్తి చేయాలి
ఎర్రవల్లి: గ్రామాల్లో డిసెంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల యాక్షన్ ప్లాన్ కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం ఉమ్మడి ఇటిక్యాల మండల కేంద్రంతో పాటు షేకుపల్లి, కోదండాపురం గ్రామ పంచాయతీలను ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రూ.25,000 వ్యయంతో చేపట్టిన రూఫ్టాఫ్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, రూ.86,000 వ్యయంతో చేపట్టిన పశువుల షెడ్ నిర్మాణాలు, రూ.18వేలతో చేపట్టిన కంపోస్టు పెట్టును అదనపు కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్న హోల్డర్లు, భూమి ఐదు ఎకరాల కన్నా తక్కువగా ఉండి పశువులు ఉన్న రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకొచ్చిందని వివరించారు. అర్హులైన రైతులు ఈ పథకాన్ని వినియోగించుకొని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ శివజ్యోతి, పిఏలు లావణ్య, హసన్, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఏ లు, తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా లబి్ధ
26న నాలుగు పథకాల ప్రారంభం: జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘గణతంత్ర దినోత్సవం.. జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించనుంది. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి. అర్హులైన ప్రతి నిరుపేదకూ లబ్ధి చేకూరాలి’ అని ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలపై మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా కార్యాచరణ సమన్వయ సమావేశానికి ఆయన రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. ముందుగా ఆయా జిల్లాల్లో పథకాల అమలుకు తీసుకుంటున్న చర్యలపై దామోదర సమీక్షించారు. గ్రామ, వార్డు సభలను ఎలా నిర్వహిస్తున్నారు.. అధికారుల బృందాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు వంటి వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు వివరించారు. అనంతరం పథకాల సమర్థ నిర్వహణపై అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి: జూపల్లి సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగాలని, అర్హులకు అన్యాయం జరగొద్దన్నారు. ఆన్లైన్లో టిక్ చేయకపోవడం వల్ల అర్హులు కాకుండా పోతున్నారని చెప్పారు. వ్యవసాయ యోగ్యం కాని భూములపై పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో నిశితంగా సర్వే చేయాలని.. గూగుల్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేస్తున్నారా లేదా అని మంత్రి ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని.. కొత్త పథకాల అమలులో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని ఓ గ్రామంలో రేషన్ కార్డుల దరఖాస్తుల్లో వ్యత్యాసం వచ్చిందని ఉదహరించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి గ్రామాల్లో ఒక రోజు ముందే చాటింపు వేయించి.. గ్రామసభలు నిర్వహించాలన్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీలు, గ్రామైక్య మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని సూచించారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల్ల దామోదర్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రత్యేక అధికారి జి.రవినాయక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి కలెక్టర్లు విజయేందిర బోయి, బదావత్ సంతోష్, బీఎం.సంతోష్, ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకూ మేలు చేకూరేలా ఎంపికలు గ్రామ సభల్లో ఎమ్మెల్యేలు, ఇందిరమ్మ కమిటీల భాగస్వామ్యం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశం ‘రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల’ అమలుపై దిశానిర్దేశం హాజరైన రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి, 5 జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు -
ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
●● రైతు ఆత్మీయ భరోసా గొప్ప పథకమని.. దీని గురించి ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం వర్తించని వారు నిరాశ చెందకుండా ఉపాధి పనికి వెళ్లేలా అధికారులు సూచించాలని.. మరోసారి దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే సొంత స్థలం లేని వారికి మలి దఫాలో ఇళ్లు వస్తాయని సర్ది చెప్పాలన్నారు. ● కొత్త పథకాల అమలులో అర్హుల ఎంపిక సమర్థవంతంగా జరగాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సూచించారు. ● ఇందిరమ్మ ఇళ్ల పథకంలో టెక్నికల్, ప్రాక్టికల్ సమస్యలు తలెత్తుతున్నాయని.. క్షేత్రస్థాయిలో వడబోసిన జాబితాను గ్రామ సభలో పెట్టాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు. ● ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారికి కూడా ప్రభుత్వ పథకాల వర్తింపులో అవకాశం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కోరారు. ● మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సర్వే జరిగిన చోటే స్క్రూటినీ చేయాలని.. ఇళ్ల్లు ఉన్నవారిని అర్హుల జాబితా నుంచి వెంటనే తొలగించాలన్నారు. ఆర్అండ్ఆర్ సెంటర్లో ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. అక్కడి ప్రభుత్వంతో చర్చించి జూరాలకు ఐదు టీఎంసీల నీటిని వదిలేలా చూడాలని మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ● జర్నలిస్టులు కూడా ఇందిరమ్మ ఇళ్లు అడుగుతున్నారని, ఒకసారి పరిశీలించాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి కోరారు. అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ● ఎస్సీ నియోజకవర్గంలో ఎక్కువ ఇందిరమ్మ ఇళ్ల్లను కేటాయించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మంత్రులను కోరారు. -
ముగిసిన శివాంజనేయస్వామి ఉత్సవాలు
ఎర్రవల్లి/ఇటిక్యాల: మండలంలోని వావిలాల శివాంజనేయస్వామి బ్రహ్మాత్సవాలు గురువారం ఘనంగా ముగిసాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఆలయంలో తెప్పోత్సవం, పల్లకీసేవ కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అంతరాష్ట్ర ఆరు పండ్ల విభాగం బండలాగుడు, పొటేళ్ల పందెం పోటీలు అట్టహాసంగా జరిగాయి. అట్టహాసంగా పోటీలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పదుల సంఖ్యలో పొటేళ్లు పందెం పోటీల్లో పాల్గొనగా.. నంద్యాల జిల్లాలోని తిమ్మాపురంకు చెందిన హనుమ పొట్టేలు మొదటి స్థానంలో నిలిచింది. అయిజ మండలం బింగిదొడ్డికి చెందిన పరుశరాముడు పొట్టేలు రెండు, కర్నూలు జిల్లా ముళ్లగుర్తికి చెందిన భైరవ పొట్టేలు మూడు, అయిజ మండలానికి చెందిన నర్సింహ పోట్టేలు నాల్గో స్థానంలో నిలిచి వరుసగా రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు కై వసం చేసుకున్నాయి. అలాగే, ఆరుపళ్ల బండ లాగుడు పోటీల్లో కర్నూల్ జిల్లాలోని పిన్నాపురంకు చెందిన వెంకట కృష్ణయ్య వృషభాలు మొదటి స్థానంలో నిలిచి రూ.40వేలు, మండలంలోని సాతర్లకు చెందిన హర్షద్ భాషా వృషభాలు రెండోస్థానంలో నిలిచి రూ.30వేలు, వనపర్తి జిల్లాలోని పెద్దదగడకు చెందిన యశ్వంత్ యాదవ్ వృషభాలు మూడోస్థానంలో నిలిచి రూ. 20వేలు గెలుచుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీసభ్యులు రంగారెడ్డి, రామయ్య, విజయభాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మాణిక్యారెడ్డి, గ్రామ పెద్దలుపాల్గొన్నారు. -
వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురష్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భువనచంద్ర, దత్తుస్వాము ఆధ్వర్యంలో సీతారాముల విగ్రహాలను ముస్తాబుచేసి వేదమంత్రాల నడుమ కల్యాణం నిర్వహించారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు హాజరుకాగా.. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందించాలి
ఉండవెల్లి: పంటలు బాగా పండితే రైతు బాగుంటాడని.. ఆర్డీఎస్ పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందేలా మంత్రులు, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని కంచుపాడులో విలేకర్లతో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గంలోని 40వేల ఎకరాలకు మాత్రమే ఆర్డీఎస్ ద్వారా నీరు అందిందని, మిగతా 40వేల ఎకరాలకు, చివరి ఆయకట్టుకు నీరు అందకపోవడంతో పంటలకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. అలాగే, అలంపూర్‌లో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు త్వరగా ప్రారంభించాలని కోరారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, అలంపూర్ చౌరస్తాలో మినీ డిపో ఏర్పాటు చెయ్యాలని పేర్కోన్నారు. కంచుపాడుకు జాతీయ రహదారి నుంచి ఇటిక్యాలపాడు మీదుగా బీటి మంజూరైన ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. సమస్యలపై దృష్టి సారించాలని మంత్రులను కోరారు. ఇదిలాఉండగా, మాజీ పార్లమెంట్ సభ్యుడు మందా జగన్నాథం మరణం తీరని లోటని తెలిపారు. -
దందా సాగుతోంది ఇలా..
ఏపీకి చెందిన గొలుసు కట్టు వ్యాపారులు ఐబీసీసీ పేరుతో గద్వాలకు చెందిన యువతను లక్ష్యంగా చేసుకొని వారి నుంచి రూ.10వేలు చెల్లించి సభ్యునిగా చేర్చుకుంటున్నారు. అతను మరో నలుగురు యువకులకు సభ్యత్వం ఇప్పించేలా దందా కొనసాగింది. ఈ నిర్వహణపై మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. చర్యలు మాత్రం శూన్యంగా మారింది. గోల్డ్ స్కీంలు, గంధం చెట్ల పెంపకం ఇలా.. ఎన్నో స్కీంలు కొనసాగుతున్నాయి. అయితే ఈ దందాలపై గద్వాల, అయిజ పోలీసు స్టేషన్లో కేసులు నమోదు కాగా కొన్ని కేసులు సీఐడీకి బదిలీ అయ్యాయి. తాజాగా స్టాక్ మార్కెట్, రూ.లక్షలకు రూ. 40వేలు, రూ. 12వేలు పేడితే రూ.48 వేలు ఆదాయం వస్తుందని చేప్పే స్కీంలు వెలుగులోకి వచ్చాయి. అయితే, జిల్లాలో ఇలాంటి స్కీంలపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోగా.. తమకేందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. దీనికితోడు జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించినా సీవిల్ కేసుగా సూచిస్తూ కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాల్సిందిగా అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చిక్కుముడులు నేపథ్యంలో గొలుసుకట్టు స్కీంలకు అడ్డుకట్ట పడడం లేదని బాధితులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు బాధితులపై కంటే నిందితుల పట్ల కనికరం కనబరుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
సాగునీటికి రోడ్డెక్కిన ఆర్డీఎస్ రైతులు
శాంతినగర్: ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందక సాగుచేసిన పంటలు ఎండుతున్నాయంటూ మంగళవారం అన్నదాతలు ఆగ్రహించి రోడ్డెక్కి నిరసన తెలిపారు. వడ్డేపల్లి మండలానికి చెందిన వివిధ గ్రామాల రైతులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకొని అలంపూర్–రాయచూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఎండుతున్న మొక్కజొన్న, జొన్న మొక్కలను ప్రదర్శిస్తూ రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యాంలో 72 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ అధికారులు నీటిని విడుదల చేయకపోవడం బాధాకరమని.. రాజకీయ జోక్యంతో అప్పుడు ఇప్పుడంటూ నాయకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రూ.లక్షల పెట్టుబడి పెట్టి పంటలు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఆయకట్టుకు సాగునీరు నిలిచిపోయిందంటూ ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు. మార్చి నెలాఖరు వర కు సాగునీరు విడుదల చేయకపోతే ఆయకట్టు కింద 30 వేల ఎకరాల పంటలు ఎండిపోతాయని, అ లాంటి పరిస్థితి తలెత్తితే ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు రోడ్డెక్కితే అనుమతులు లేవు.. అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరించడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంతోశ్ అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని సూచించడంతో ఆందోళన విరమించారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు
ధరూరు : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలచ ఆవరణలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇంటి నమూనా నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని, సీఎం, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శీనివాస్రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఇందిరమ్మ మోడల్ నిర్మాణానికి భూమి పూజలు చేయాలని వచ్చిన ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించడం జరుగుతుందని అన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి అర్హులను గుర్తించి పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామన్నారు. రూ.5 లక్షలతో ఒక బెడ్ రూం, కిచెన్, హాల్ వంటి విధంగా ఇంటి నిర్మాణ చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, జెడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, శ్రీధర్‌గౌడ్, కురుమన్న, వేణుగోపాల్, పద్మావెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి. గట్టు : గ్రామాల్లో నిర్వహించే జాతరలు గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని గ్రామస్తులంతా ఉత్సవాలను కలిసిమెలిసి జరుపుకొంటున్నట్లుగానే గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కోరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలూరు గ్రామంలో నిర్వహించిన ఆంజనేయస్వామి రథోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామి వారి రథోత్సవానికి పూజలను నిర్వహించారు. మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ ఆనంద్‌గౌడ్, మాజీ సర్పంచు నర్సన్‌గౌడ్, నాయకులు రాముశెట్టి, తిమ్మప్ప, చంద్రశేఖర్,మహేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టుకు చేరుకున్న ఆర్డీఎస్ నీరు
అయిజ: రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్డీఎస్ నీరు బుధవారం మధ్యాహ్నానికి మండలంలోని సింధనూరు గ్రామ సమీపంలోని డిస్టిబ్యూటరీ 12ఏ ను చేరుకుంది. ఇటీవల రాష్ట్రానికి ఇండెంట్ పెట్టినా సరే అయిజ మండంలోని ఆర్డీఎస్ ఆయకట్టు వరకు సాగునీరు చేరలేదు. దీంతో వెంటనే ఆంధ్రప్రదేశ్ వాటా (కేసీ కెనాల్‌కు) 2.5 టీఎంసీల ఇండెంట్ పెట్టడంతో మండలంలోని ఆర్డీఎస్ కాల్వకు సాగునీరు చేరుకుంది. రాత్రి సమయానికి ఉప్పల సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ 20 వరకు నీరు చేరుకుంది. శనివారం నాటికి తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఆర్డీఎస్ కాల్వకు సాగునీరు సకాలంలో చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ కోసం స్థల పరిశీలన ఎర్రవల్లి: ఇటిక్యాల మండలంలోని పెద్దదిన్నె గ్రామంలో పీఎం కుసుమ్ పథకం ద్వారా నిర్మించే సోలార్ విద్యుత్ ప్లాంట్ కొరకు బుధవారం అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరేందర్ వివిధ శాఖల అధికారులతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన సర్వే నెంబర్ 66, 67, 68, 69, 75, 76, 77, 78, 79, 80, 82, 83 లలో దాదాపు 96 ఎకరాల 38 గుంటల ఎండోమెంట్ భూమిని పరిశీలించారు. కేంద్రం సోలార్ ప్లాంట్ నిర్మించేందుకు గాను పరిశీలించిన ఎండోమెంట్ భూమి వివరాలను ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్వేయర్ దౌలమ్మ, విద్యుత్ ఏఈ శేఖర్, ఎపిఎం కుర్మయ్య, ఆర్ఐ భీమ్సేన్రావ్ ఉన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం గద్వాలటౌన్: మహనీయుల సిద్ధాంతాలను భవిష్యత్ తరాలకు ఇవ్వాలని, రాజ్యాధికారమే తమ అంతిమ లక్ష్యమని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం బీఎస్పీ ఆధ్వర్యంలో జన కళ్యాణ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహంచారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. బీఎస్పీ చీఫ్ మాయావతి జన్మదినాన్ని పురస్కరించుకుని జన కళ్యాణ్ దివస్‌ను చేపట్టామన్నారు. బీఎస్పీ ద్వారానే దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతి జరుగుతుందన్నారు. మణికుమార్, రాజు, వెంకటేష్‌నాయక్, సవారన్న, మోహన్‌రాజు, నరేష్కుమార్ పాల్గొన్నారు. -
అడ్డుకట్ట పడేనా..?
జిల్లాలో జోరుగా గొలుసు దందా వ్యాపారం ●ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సులభ పద్ధతిలో ఆదాయం వస్తుందని గొలుసుకట్టు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా, పెట్టుబడులు పెట్టించినా నేరం. చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీం బ్యానింగ్ యాక్ట్ మేరకు చర్యలు ఉంటాయి. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులపై విచారణ చేపడుతున్నాం. బాధితులకు న్యాయం అందేలా చూస్తాం. ఇలాంటి వ్యాపారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సులభంగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పే వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందించాలి. – శ్రీనివాసరావు, ఎస్పీ ● రూ.లక్షకు నాలుగు రెట్లు అంటూ బురిడీ ● నిజమని నమ్మి సామాన్యుల పెట్టుబడి ● రూ.కోట్లు మోసపోతున్న ప్రజలు ● పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు గద్వాల క్రైం: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.. కేవలం రూ.లక్ష పెట్టుబడి పెడితే నాలుగు అంతలు ఎక్కువ ఆర్జించవచ్చు.. అంటూ.. సామాన్యులను నమ్మించి వారితో డబ్బులు కట్టించడమేగాక వారి బంధువులు, స్నేహితులతోనూ ఈ ఊబిలోకి లాగి బురిడీ కొట్టిస్తున్నారు కొందరు మోసగాళ్లు. ప్రస్తుతం నడిగడ్డలో ఈ దందాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో ఇటీవల అయిజ, గద్వాల రూరల్, గద్వాల పట్టణ పోలీసు స్టేషన్లో గొలుసుకట్టు స్కాంలపై ఇటీవల నమోదైన కేసులే ఇందుకు ఉదాహరణ. ఈ వ్యాపారం జిల్లాలో రూ.20 కోట్లకుపైగా నడిచినట్లు సమాచారం. -
జిల్లాలో పలు ఘటనలు ఇలా..
¢ 2025 జనవరిలో చోటుచేసుకున్న ఘటన విషయానికి వస్తే.. గద్వాల మండలం పూడూరు ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్లో వివిధ కంపెనీల షేర్లను కొనుగోలు చేస్తు వ్యాపారం చేస్తున్నాడు. అయితే గద్వాల పట్టణంలోని ఏంజెల్ –1 పేరుతో కార్యాలయం ప్రారంభించి తెలిసిన వ్యక్తులు, బంధువుల నుంచి రూ. 3 కోట్లు అప్పు తీసుకుని తన భార్య పేరుతో స్టాక్ మార్కెట్లోని వివిధ కంపెనీల షేర్లు కొనుగోలు చేసి లాభాలకు విక్రయాలు చేసేవారు. వచ్చిన లాభాలను రుణం తీసుకున్న వ్యక్తులు, బంధువులకు చెల్లింపులు చేస్తూ పలువురికి స్టాక్ మార్కెట్లో ఖాతాలను ఓపెన్ చేశాడు. ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి మృతి చెందడంతో కథ అడ్డం తిరిగింది. ఇచ్చిన రుణం చెల్లించాల్సిందిగా మృతుడి కుటుంబ సభ్యులను వారు ఒత్తిడి తీసుకువచ్చారు. నేడు రేపు అంటూ దాటవేయడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించి గద్వాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పై మూడు కేసులలో రూ. 20కోట్ల మేర బాధితులు మోసపోయినట్లు తెలుస్తోంది. తమకు ఎలాగైన న్యాయం చేయాల్సిందిగా ప్రజాప్రతినిధుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. నడిగడ్డలో ఇలాంటి గొలుసుకట్టు వ్యాపారాల్లో ప్రజలు పెట్టుబడులు పెట్టడం.. మోసపోవడం పరిపాటిగా మారింది. ¢ 2024 డిసెంబర్ 22న గద్వాలకి చెందిన ఓ వ్యక్తి ఎల్ఎఫ్ఎల్ కంపెనీ పేరుతో గొలుసుకట్టు స్కీం ప్రారంభించాడు. ఈ స్కీంలో సభ్యుడు రూ. 12వేలు డిపాజిట్ చేస్తే 45 రోజుల్లో రూ. 48వేలు ఆదాయం సమాకూరుతుందని ప్రజల నుంచి ఈ సంస్థలో పెట్టుబడులు రాబట్టేందుకు బీరోలు చౌరస్తాలోని ఓ బాంక్విట్హాల్ నందు 200 మంది సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ స్కీంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వీటికి సంబంధించిన అనుమతి, రిజిస్ట్రేషన్ లావాదేవీల చెల్లింపుల నివేదికలను చూయించాల్సిందిగా పోలీసులు వాకబు చేయగా నిర్వాహకుడి నుంచి సమాధానం లేదు. దీంతో ఈ సంఘటన పై పట్టణ పోలీసు స్టేషన్లో నిర్వాహకుడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ¢ 2024 డిసెంబర్ 29న అయిజ పట్టణంలో ఏజీజీకే ట్రేడర్స్ ఇండియా ప్రైవేటు లిమిటేడ్ కార్యాలయన్ని ప్రారంభించారు. ఈ సంస్థలో రూ.లక్ష పెట్టుబడి పేడితే ప్రతి నెల రూ. 40 వేల ఆదాయం అందజేస్తామని ఆ కంపెనీ నిర్వాహకులు నమ్మబలుకుతూ వ్యాపారం చేస్తున్నారు. ఆ సంస్థలో కొత్త వ్యక్తులను చేర్పిస్తే కొంత కమీషన్ సైతం అందజేస్తామని ప్రకటనలు చేయగా.. పలువురు పెట్టుబడులు పెట్టారు. అయితే కొన్ని రోజులకే ప్రజలకు శఠగోపం పెట్టిందీ కంపెనీ. మోసపోయిన బాధితులు లబోదిబోమన్నారు. ఈ క్రమంలో ఒకరు తనకు ఇవ్వాల్సిన డబ్బులు సంస్థ నిర్వాహకుడు ఇవ్వడం లేదని అయిజ పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. -
నేతన్నల్లో ఆనందం
●● చేనేత సంక్షేమానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం ● కొనసాగనున్న సంక్షేమ పథకాలు సంతోషంగా ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం త్రిఫ్ట్ పథకాన్ని కొనసాగించేందుకు నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. ఈ పథకంలో కార్మికుడు ప్రతి నెల రూ.1200 బ్యాంకులో జమ చేయడంతో ప్రభుత్వం వాటికి రెండింతలు చెల్లిస్తుంది. దీంతో కుటుంబ పోషణ సాఫీగా సాగుతోంది. – గాజుల సంధ్య, నేత కార్మికురాలు, అమరచింత అమరచింత: బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన చేనేత సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యధావిధిగా కొనసాగిస్తూ ఇందుకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో నేతన్నలు సంతోషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నేతన్నకు చేయూత, త్రిఫ్ట్ ఫండ్, బీమా పథకాల అమలుకు ఏడాదికి ఎన్ని నిధులు అవసరమో వాటి ప్రకారం మంజూరు చేస్తూ గత పథకాలను యధావిధిగా కొనసాగించేందుకు సిద్ధమవ్వడంతో చేనేత, జౌళిశాఖ అధికారులు గ్రామాల్లోని చేనేత సొసైటీలను సంప్రదించి పథకాలకు సంబంధించిన వివరాలపై త్వరలోనే అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు లబ్ధి పొందుతున్న నేత కార్మికులకే వర్తింపజేస్తామని.. కొత్త దరఖాస్తులకు త్వరలోనే ప్రకటన జారీ చేస్తామని వివరించారు. తెలంగాణ చేనేత అభయహస్తం పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాల జీఓను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 10న జారీ చేసింది. త్రిఫ్ట్ ఫండ్.. ఈ పథకం జియో ట్యాగ్ కలిగిన మగ్గాల నేత కార్మికులు, అనుబంధ కార్మికుల సంక్షేమానికి రూపొందించింది. కార్మికుల్లో పొదుపును ప్రోత్సహించడంతో పాటు సామాజిక భద్రత కల్పిస్తుంది. నేత కార్మికులు, అనుబంధ కార్మికులు వారి వేతనాల నుంచి నెలవారీగా 3 శాతం కాంట్రిబ్యూషన్ చేస్తారు. కాంట్రిబ్యూషన్ గరిష్ట పరిమితి రూ.1200. ఇందుకు ప్రభుత్వం రెండింతలు అంటే రూ.2,400 అందిస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 38 వేల మంది, జిల్లాలో 975 మంది నేత కార్మికులు, అనుబంధన కార్మికులు లబ్ధి పొందుతున్నారు. పవర్లూమ్, మరమగ్గాల కార్మికుల నెలసరి వాటాగా 8 శాతం బ్యాంకులో జమ చేస్తే ప్రభుత్వం 8 శాతం కాంట్రిబ్యూషన్ చేస్తుంది. తెలంగాణ నేతన్న భద్రత.. ఈ పథకం జియో ట్యాగింగ్ ఉన్న చేనేత, మర మగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికులకు వర్తిస్తుంది. నేతన్న భద్రతలో నమోదైన కార్మికుడు మృతిచెందితే రూ.5 లక్షల నగదు అతడి నామినీకి అందుతుంది. సహకార సంఘం ద్వారా బీమా కవరేజీ అందరికీ వర్తిస్తుంది. ఈ పథకంలో ఇప్పటి వరకున్న 65 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని ఎత్తివేశారు. 59 ఏళ్లు దాటిన వారికి ఇది వర్తిస్తుంది. ఈ పథకం అమలుకు ఏడాదికి రూ.9 కోట్లు మంజూరు చేస్తారు. నేతన్నకు భరోసా.. నేత కార్మికులకు వేతన ప్రోత్సాహకం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం. జియో ట్యాగ్ ఉన్న మగ్గాల నుంచి నిర్దిష్ట ఉత్పత్తి ప్రమాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాదికి రూ.18 వేలు. అనుబంధ కార్మికులకు రూ.6 వేలు వేతన సాయంగా అందిస్తారు. పథకం అమలుకు రాష్ట్రవ్యాప్తంగా వార్షిక బడ్జెట్లో రూ.44 కోట్లు మంజూరు చేశారు. చేనేతన్నకు బీమా మంచిదే.. చేనేత కార్మికులకు ప్రభుత్వం బీమా లబ్ధి చేకూర్చేందుకు మార్గదర్శకాలను సవరించడం సంతోషం. గత ప్రభుత్వంలో వయో పరిమితి 65 ఏళ్లు ఉండగా.. ప్రస్తుతం 57 ఏళ్లకు సవరించడంతో అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడం సంతోషం. – పగుడాకులు పద్మమ్మ, కార్మికులు, అమరచింత తెలంగాణ నేతన్న భద్రతకు రూ.5.25 కోట్లు తెలంగాణ నేతన్నకు చేయూతకు రూ.15 కోట్లు తెలంగాణ నేతన్న భరోసా పథకానికి రూ.31 కోట్లు మార్గదర్శకాలు రాగానే.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత సంక్షేమ పథకాల కొనసాగింపునకు నిధులు మంజూరు చేసింది. జిల్లాకు ఎన్ని నిధులు వస్తున్నాయి.. ఎంత మందికి లబ్ధి చేకూరుతుందన్న విషయాలపై ఇంకా మార్గదర్శకాలు అందలేదు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వచ్చిన వెంటనే కార్మికులకు సమాచారం ఇస్తాం. – గోవిందయ్య, ఏడీ చేనేత, సిల్క్ మార్క్ మాదిరే తెలంగాణకు ప్రత్యేకమైన చేనేత మార్క్ లేబుల్ రూపొందించారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రీమియానికి అనుగుణంగా తెలంగాణ చేనేత ఉత్పత్తుల లేబుల్ బ్రాండింగ్ చేస్తారు. తెలంగాణ చేనేత వస్త్రాల వారసత్వ, సంప్రదాయ ప్రతిష్టతను పెంపొందించడం, చేనేత బ్రాండ్ ప్రచారంతో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు, సముచిత మార్కెట్ సృష్టించడమే ప్రధాన లక్ష్యం. చేనేత మార్క్.. -
నోరూరించే పిండి వంటలు
సంక్రాంతి పండుగలో కొత్త బియ్యంతో వివిధ రకాల పిండి వంటలకు తయారు చేస్తారు. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుచ్చేవి అరిసలు. బెల్లంతో తయారు చేసే అరిసెలు ఆరోగ్యానికి మంచిది. కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులతో అరిసెలు తయారు చేస్తారు. అదే విధంగా బియ్యపు పిండి, కొబ్బరి, నువ్వుల పిండితో బూరెలు చేస్తారు. వీటికి తయారీకి కొంతమంది పంచదార పాకాన్ని వాడుతారు. అలాగే నువ్వుల ఉండలు, కజ్జికాయలు కూడా సంక్రాంతి స్పెషల్ వంటకాలే. వీటితో పాటు సజ్జ రొట్టె, నేతితో చేసిన గారెలు, పాయసం, పరమాన్నం, జంతికలు, సున్నుండలు తయారుచేస్తారు. కజ్జికాయలు -
అయ్యవారికి దండం పెట్టు..
‘‘అయ్యవారికి దండంపెట్టు.. అమ్మవారికి దండం పెట్టు.. ఈ ఇంటికి మంచి జరుగుతదని చెప్పు..’’అంటూ గంగిరెద్దులను ఆడించే వారు అనగానే తల ఊపి అవునన్నట్లుగా సమాధానం ఇస్తుంది. సంక్రాంతి వేడుకల్లో డూడూ బసవన్నల ఆటలు కూడా ప్రధానమైనవి. ఆడించేవారు చెప్పినట్లుగా తల ఊపుతూ.. కాళ్లు కదుపుతుంటే గజ్జెల శబ్ధంతో ఇళ్లు మందు గంగిరెద్దులు చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి. ఇంటి ముందుకు గంగిరెద్దు రాగానే ఇంట్లో ఉన్న కొత్త ధాన్యం గింజలను గంగిరెద్దులకు ఇరువైపుల ఉన్న జోళ్లేలో పోసి ఆశీర్వాదం తీసుకుంటారు. 300–400 కేజీలు బరువున్న గంగిరెద్దు ఒక వ్యక్తిపై తన నాలుగు కాళ్లు పెట్టి ఊపిిరిబిగబట్టడం చూస్తే గంగిరెద్దుకు, ఆ యజమానికి ఉన్న నమ్మకం బసవన్నకు ఉన్న ప్రత్యేకత. -
మిగిలింది 12 రోజులే..
● 26తో ముగియనున్న పురపాలిక పదవీకాలం ● తీవ్ర నిరాశలో పాలకవర్గాలు ● ఆశించిన మేర అభివృద్ధి చేయలేదని ఆవేదన ● మళ్లీ పోటీ చేయాలనే ఆలోచన ఉన్నవారు మాత్రమే వార్డు సమస్యలపై దృష్టి ● రిజర్వేషన్లు మారుతాయనే ప్రచారం అచ్చంపేట: మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం మరో 12 రోజుల్లో ముగియనుంది. అయితే ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని పాలకవర్గాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతికి నిధులు రాకపోవడంతో అభివృద్ధి చేయలేకపోయామని చాలా మంది కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయలేదని వాపోతున్నారు. అయితే మళ్లీ పోటీ చేయాలనే ఆలోచన ఉన్న వారు మాత్రమే వారి వార్డుల్లో తిరుగుతూ సమస్యలు పరిష్కరించడం వంటివి చేయిస్తున్నారు. పోటీ చేయాలనే ఆలోచన లేనివారు మాత్రం వార్డులను గాలికి వదిలేశారు. అవిశ్వాస తీరా్మానాలతో.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన నారాయణపేట మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్ (బీఆర్ఎస్)పై అవిశ్వాసం పెట్టాలని తీర్మానం చేశారు. ఆ తర్వాత అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంద్‌గౌడ్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా షబ్బీర్ అహ్మద్ ఎన్నికయ్యారు. ● కోస్గి మున్సిపల్ చైర్పర్సన్ మ్యాకల శిరీష (బీఆర్ఎస్)పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో 11 మంది కౌన్సిలర్లు వ్యతిరేకంగా ఓటేయడంతో ఆమె గద్దె దిగారు. వివిధ నాటకీయ పరిణామాల మధ్య నెలరోజుల తర్వాత వైస్ చైర్మన్ అన్నపూర్ణను చైర్మన్‌గా ఎంపిక చేశారు. మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ● వనపర్తి మన్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ (బీఆర్ఎస్)పై ఆరు నెలల క్రితం అవిశ్వాసం తీర్మానం పెట్టగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పుట్టపాగ మహేష్ నూతన చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ● కొల్లాపూర్ బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మిపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి నెగ్గారు. ఆ తర్వాత చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన రమ్యకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ● అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా బీజేపీతో కలిపి 15 మంది కౌన్సిలర్లతో ఎక్స్అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో నెగ్గారు. మారిన పరిణామాల్లో కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్ గార్లపాటి శ్రీనివాసులు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ● జడ్చర్ల బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మిపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అదే పార్టీకి చెందిన పుష్పలత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికలా.. ఇన్చార్జ్ పాలనా ఈ నెల 26న మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ముగుస్తోంది. ఇందుకు ఇంకా 12 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చే వరకు ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతుంది. 2023 జూన్ నుంచి పట్టణ ప్రగతి నిధులు రావడం లేదు. ప్రతినెలా ఆయా మున్సిపాలిటీల జనాభా ప్రకారం రూ.30 నుంచి రూ.60 లక్షల వరకు నిధులు వచ్చేవి. ఈ నిధులు ఇప్పుడు నిలిచిపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. ఇతర ఎలాంటి నిధులు రాకపోవడంతో చేసిన పనుల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. రిజర్వేషన్లు మారే అవకాశం గత రెండు ఎన్నికల్లో రిజర్వేషన్లు మారాయి. ఈసారి కూడా రిజర్వేషన్లు మారుతాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. గత ప్రభుత్వం రిజర్వేషన్లు పదేళ్లపాటు కొనసాగేలా మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం రిజర్వేషన్లు మార్పు చేస్తూ అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చింది. కొత్త చట్టం ప్రకారం ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు మారుతాయి. రిజర్వేషన్లు మారితే అవకాశం వస్తుందా.. రాదా అని ఆశావహులు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం ఉన్న వార్డుల్లో అభివృద్ధి చేసిన వారు వార్డు మారితే చేసిన వార్డులో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తామని చెబుతున్నారు. అధికార కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీలు సవాల్‌గా తీసుకుని పనిచేసే అవకాశం ఉంది. ● ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉండగా అచ్చంపేట, జడ్చర్ల మినహా 2020 జనవరి 22న 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. 25న ఓట్ల లెక్కింపు జరిగాయి. వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, కల్వకుర్తి, అయిజ, గద్వాలతోపాటు.. కొత్త మున్సిపాలిటీలైన భూత్పూర్, పెబ్బేరు, వడ్డేపల్లి, మక్తల్, కొత్తకోట, కోస్గి, కొల్లాపూర్, ఆత్మకూర్, అమరచింత, అలంపూర్లకు ఎన్నికలు నిర్వహించగా.. బీఆర్ఎస్ 8 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ సాధించగా.. ఇతరుల అండతో మరో మూడు పీఠాలు దక్కించుకుంది. కొల్లాపూర్, అయిజలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అధిక్యం కనబర్చినా.. ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో ఈ రెండు మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లాయి. వడ్డేపల్లిలో కాంగ్రెస్, మక్తల్‌లో బీజేపీ గెలుపొందగా.. వడ్డేపల్లి చైర్మన్‌తో సహా మెజార్టీ కాంగ్రెస్ సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. కోస్గి, భూత్పూర్లో హంగ్ ఏర్పడగా ఈ రెండు మున్సిపాలిటీలు బీఆర్ఎస్కు చెందిన వారే చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ● అచ్చంపేటకు రెండోసారి, జడ్చర్ల మున్సిపాలిటీ ఏర్పాటైన పదేళ్ల తర్వాత 2021 ఏప్రిల్ 30 ఎన్నికల పోలింగ్, మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టారు. అచ్చంపేటలో 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ 1 చొప్పున గెలుపొందారు. జడ్చర్లలో 27 వార్డులకు గాను బీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 2, బీజేపీ 2 గెలిచాయి. -
కళకళలాడిన పల్లెలు..
గ్రామగ్రామాన పండగ వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్, వడ్డేపల్లి, అయిజ, మానవపాడు, మల్దకల్ తదితర ప్రాంతాల్లో సంక్రాంతి సౌరభాలు వెల్లివిరిశాయి. గ్రామాల్లో భోగి మంటలు వేసి పండగ జరుపుకొన్నారు. బోగి మంటల చుట్టు యువత, చిన్నారులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. సూర్యోదయానికి ముందే మహిళలు లేచి ఇంటి ముందు అలుకు చల్లి ముచ్చటైన ముగ్గులు వేయడంలో పోటీ పడ్డారు. పండగ సెలవులకు వచ్చిన చిన్నారులతో ప్రతి ఇల్లు కళకళలాడింది. హరివిల్లు రంగుల్ని పులుముకున్న కాగితం పక్షులు గాలిపటాలతో పిల్లలు ఆనందంగా గడిపారు. పలు గ్రామాల్లో పిల్లల హృదయాలతో పాటు పెద్దలను సైతం గాలిపటాలు రంజింప చేశాయి. పండగను పురస్కరించుకొని పలుచోట్ల రంగవల్లుల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. -
శాశ్వత పరిష్కారం ఎప్పుడో..?
గద్వాలలో ఓ ఇంటి ఎదుట ముగ్గులు వేస్తున్న యువతులు ●ఆర్డీఎస్ కెనాల్లో సమస్యల తిష్ట ● నిత్యం కోతలు, తాత్కాలిక మరమ్మతుతో రైతుల అవస్థలు ● అధికారుల పర్యవేక్షణ అంతంతే.. ● మరమ్మతుకు రూ.13 కోట్లు మంజూరు ● పూర్తి లైనింగ్ చేస్తేనే మేలంటున్న ఆయకట్టు రైతులు నిత్యం ఆందోళన ఆర్డీఎస్ కెనాల్లో నీరు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అలాంటి కెనాల్ పై ఆధారపడి పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు నిత్యం ఆందోళన తప్పడం లేదు. కెనాల్ లో నీరు నిండుగా వస్తున్నాయని సంతోషించేలోగా.. కెనాల్ కోతకు గురి కావడం,పైకి ఎక్కి ప్రవహించి పంటలను ముంచేస్తుంది. దీంతో పంటల నష్టం తప్పడం లేదు. – వెంకటేశ్వర్లు, రైతు, చెన్నిపాడు పంటలకు నీరందట్లే.. ప్రతి ఏడాది కెనాల్‌కు ఎక్కడో ఒక చోట మరమ్మతులు తప్పడం లేదు. ఎగువన ఎక్కడైనా చిన్న కోతకు గురైనా కెనాల్లో నీరు నిలిపి వేయాల్సిందే. దీని వల్ల పంటలకు సక్రమంగా నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణతో ఎక్కడెక్కడ మరమ్మతు అవసరమో పంటలు వేయకముందే వాటిని పూర్తి చేస్తే బాగుంటుంది. సాగు మధ్యలో కెనాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. – గోవర్ధన్, మానవపాడు, రైతు ప్రతిపాదనలు పంపించాం గతంలో ఆర్డీఎస్ ఆధునీకరణ కోసం ప్రతిపాదనలు పంపించాం. కాని మంజూరు రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న నిధులతోనే అవసరమైన చోట మరమ్మతులు చేస్తున్నాం. కొన్ని చోట్ల లైనింగ్ మార్చాల్సిందే. గత నెలలో నారాయణపురం డిస్ట్రిబ్యూటరీ దగ్గర చనిపోయిన ఎద్దును కూడా కెనాల్లో వేశారు. కొంత సిల్ట్, పిచ్చి మొక్కల కారణంగా నీరు కెనాల్ పైకి ఎక్కి ప్రవహించింది. రైతులతో సమన్వయం చేసుకుని వాటిని తొలగించాం. – విజయ్‌కుమార్ రెడ్డి, ఆర్డీఎస్ ఈఈ రాజోళి: జిల్లాలో ఆర్డీఎస్ కెనాల్ ప్రవహిస్తున్న మండలాల్లో కెనాల్‌పై ఆశలు పెట్టుకుని వేలాది మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా కెనాల్ మరమ్మతులు చేయకపోవడం.. ఆధునీకరణ చేపట్టకపోవడం.. అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉండడంతో కెనాల్లో నీరున్నా కూడా రైతులకు ఏదో రకంగా నష్టమే జరుగుతుంది. కెనాల్లో నీరు వచ్చేదే అంతంత మాత్రం కాగా.. అది కూడా ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు రావో తెలియని పరిస్థితి. వచ్చినప్పుడు కెనాల్ కోతలకు గురికావడం పరిపాటిగా మారింది. దీంతో కెనాల్ నుంచి రైతులకు జరిగే మేలుతో పాటు నష్టం కూడా తప్పడం లేదు. తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టాలనే వాదన రైతుల నుంచి వినిపిస్తోంది. తాత్కాలిక మరమ్మతుతోనే సరి.. కెనాల్ మరమ్మతుల కోసం రూ.13 కోట్లు కేటాయించినప్పటికీ అవి ఎక్కడ చేయాలనే అనుమానం, అధికారులకు, రైతులకు వెంటాడుతుంది. పూర్తిగా దెబ్బతిన్న చోట చేసేందుకు పనులు మొదలుపెట్టేలోగా మరో డిస్ట్రిబ్యూటరీ దగ్గర సమస్య మొదలువుతుంది. అన్ని చోట్ల ఒకేసారి పనులు చేసేంత నిధులు లేవు. తుమ్మిళ్ల లిఫ్టు నుంచి సాగు నీరు అందుతున్నప్పటి నుండి డి–24 దిగువకే ఎక్కువగా మరమ్మతులు చేయాల్సి వస్తుంది. తుమ్మిళ్ల ప్రెజర్ మెయిన్ కెనాల్ ద్వారా నీరు డి–24 దగ్గరే డెలవరీ కావడంతో కెనాల్ పటిష్టంగా ఉండాలి. ఏళ్ల కిందట చేసిన మరమ్మతులు కావడంతో కెనాల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో తరుచూ ఇబ్బందులు తప్పడం లేదు. అందులో ప్రత్యేకించి తుమ్మిళ్ల నుంచి నీరు వచ్చే క్రమంలో కెనాల్‌పై ప్రెజర్ పడి కోతకు గురి కావడం, కెనాల్లో సిల్ట్, గడ్డి, ముళ్ల కంపలు పెరిగి, నీరు సాఫీగా ప్రవహించకుండా కెనాల్పైకి ఎక్కి పారడంతో పక్కనే ఉన్న పంట పొలాల్లోకి నీరు వెళ్లి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. కాగా అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో కూడా తరుచూ ఈ ఇబ్బందులు తప్పడం లేదని రైతులు అంటున్నారు. కెనాల్‌పై వారు నిత్యం పర్యవేక్షణ చేస్తే ఎక్కడెక్కడ అత్యవసరంగా మరమ్మతు చేయాలో తెలుస్తుందని రైతులు అంటున్నారు. లైనింగ్ లేక ఇక్కట్లు.. ఎంతకాలం గడిచినా కేవలం చిన్నపాటి మరమ్మతులతో సరి చేస్తే అవి కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నాయని శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు అంటున్నారు. ప్రస్తుతం సిల్ట్ పేరుకుపోయిన చోట అది తీయకపోవడంతో పాటు, లైనింగ్ ఏర్పాటు చేయకపోవడం, కెనాల్‌కు ఇరువైపులా వేసిన సిమెంట్ బిల్లలు కూడా ఊడిపోవడంతో కెనాల్ కోత ,కెనాల్ పైకి నీరు ఎక్కి ప్రవహించడం జరుగుతున్నాయి. గత నెలలో మానవపాడు మండలం నారాయణపురం దగ్గర కెనాల్ పైకి నీరు ప్రవహించడంతో రైతుల పంట పొలాల్లోకి నీరు చేరింది. ఆ డిస్ట్రిబ్యూటరీ గేట్ల దగ్గర చనిపోయిన ఎద్దును పడేయడంతో దాని వల్ల కూడా నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నట్లు తెలస్తుంది. అది మాత్రమే కాకుండా కెనాల్లో విచ్చలవిడిగా పెరిగిన కంప చెట్లు, పేరుకుపోయిన సిల్ట్ కూడా ప్రధాన కారణమే అని రైతులు అంటున్నారు. వీటిపై సరైన పర్యవేక్షణ ఉన్నట్లైతే సమస్య అంత వరకు రాకుండా ముందుస్తు చర్యలతో దాన్ని నివారించేవారమని రైతులు అంటున్నారు. అంతకు ముందు వడ్డేపల్లి మండలం, అంతకు పూర్వం రాజోళి మండలంలో కూడా కెనాల్ కోతకు గురయ్యాయి. దీనిపై పూర్తి పర్యవేక్షణ ఉంటే ముందస్తు మరమ్మతులు ఎక్కడ చేయాలో తెలుసుకుని అక్కడ పనులు చేసి ఉంటే కొద్ది మేరనైనా మేలు జరిగేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మరమ్మతులతో తాత్కాలిక ప్రయోజనం మాత్రమేనన్న విషయాన్ని గుర్తించి, ఆధునీకరణ కోసం అధికారులు ప్రయత్నాలు చేయాలని, నాయకులు వారికి సహకరించాలని అంటున్నారు. ఆధునీకరణ చేయాల్సిన ఆవశ్యకతను అధికారులు క్షేత్ర స్థాయిలో ఆయకట్టుపై పర్యవేక్షణ చేయాలని అంటున్నారు. -
భోగి సంబరం..
వైభవంగా సంక్రాంతి వేడుకలు గద్వాలటౌన్: ముంగిళ్ల ముందు గొబ్బెమ్మలతో ముచ్చటైన ముగ్గులు, వెచ్చదనాన్ని అందించే భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలతో జిల్లాలో సోమవారం సంక్రాంతి సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయానికి నిదర్శనంగా నిలిచే సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు. పిండి వంటల ఘుమఘుమలు.. పతంగుల కోలాహలం.. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు.. వాటిలో కొత్తగా పండిన ధాన్యాలు.. గొబ్బెమ్మలు తదితర దృశ్యాలు కనిపించాయి. ప్రతి ఇంటి ముంగిళ్లు రంగ వల్లులతో మెరిసిపోయాయి. సరదాల సంక్రాంతి పండగను చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహలతో జరుపుకొన్నారు. తెల్లవారుజామున నుంచే ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి కనిపించింది. నువ్వుల పొడితో స్నానాలు ఆచరించారు. మూడు రోజుల పండగలో భాగంగా మొదటిరోజు సోమవారం భోగి పండగును జరుపుకొన్నారు. భోగితో ప్రారంభమైన వేడుకలు కనుమతో ముగిస్తారు. సాంప్రదాయం వంటకాలు మొదటిరోజు సజ్జ, నువ్వులరొట్టెలు, తోడుగా రుచికరమైన కూరలు చేసుకున్నారు. ప్రతి ఇంటిలో వివిధ రకాలైన కాయగూరలతో కలకూర వండుకుని రుచికరమైన వంటలు ఆరగించారు. పుల్లూరులో భోగి మంటలు వేస్తున్న కుటుంబసభ్యులు ● రంగురంగుల ముగ్గులతో ఆకట్టుకున్న లోగిళ్లు ● బంధుమిత్రులతో కళకళలాడిన పల్లెలు ● పతంగులతో చిన్నారుల సందడి -
గాలి పటమా.. పదపద..
స్టేషన్ మహబూబ్‌నగర్: సంక్రాంతి పండుగ అంటే గాలిపటాలు ఎగురవేయడం అనవాయితీగా వస్తోంది. పిల్లలే కాదు.. యువకులు, పెద్దలు సైతం గాలి పటాలను ఎగురవేసేందుకు పోటీ పడుతుంటారు. ఇతరుల గాలిపటం కంటే మనదే ఎక్కువ ఎత్తులోకి ఎగురవేసే క్రమంలో కేరింతలు కొడుతారు. గాలిపటాల సందడి మార్కెట్లో సంక్రాంతికి పది రోజుల ముందు నుంచే ప్రారంభమైంది. జిల్లాకేంద్రంలోని ప్రధాన ప్రాంతాలు, వీధుల్లో గాలిపటాలను విక్రయిస్తున్నారు. కేవలం పట్టణాలకు వరకే ఉన్న గాలిపటాల హల్చల్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. చక్కని ఆకృతితో ఆకట్టుకునేలా వివిధ డిజైన్ల పతంగులు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. చిన్నారులను ప్రత్యేకంగా ఆకర్షించేలా ప్రింటెడ్, కార్టూన్ గాలిపటాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ● గాలిపటాలను ఆకాశంలో ఎగురవేయడం ఒక ఎత్తయితే ఒకదానికి ఒకటి పోటీపడడం మరో ఎత్తు. ఎవరి గాలిపటాలు తెగి పడుతాయోన్న విషయం ఎవరికీ అర్థం కాదు. తెగిపడిన గాలిపటాలను తీసుకోవడానికి చిన్నారులు ఒక్కటే పరుగు తీస్తారు. మహబూబ్‌నగర్‌లోని పాన్‌చౌరస్తా పతంగుల మార్కెట్‌గా పేరొందింది. హైదరాబాద్‌లోని చార్మినార్, ధూల్‌పేట్, లాడ్‌బజార్ తదితర ప్రాంతాల నుంచి గాలిపటాలు, మాంజాలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. రూ.5 నుంచి రూ.500 వరకు పతంగులు అందుబటులో ఉన్నాయి. -
గళం విప్పిన ‘మందా’
పాలమూరు సమస్యలపై..నేడు అంత్యక్రియలు.. అనారోగ్యంతో మృతిచెందిన మాజీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ దోబీ ఘాట్ వద్ద జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన మృతితో స్వగ్రామం కొండేరులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అలంపూర్: వృత్తిరీత్యా వైద్యుడు అయిన మందా జగన్నాథం అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి పాలమూరు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈయన స్వగ్రామం జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని కొండేరు అయినప్పటికీ.. విద్యాభ్యాసం, వృత్తి అంతా వేరే ప్రాంతాల్లో జరగడంతో పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో అక్కడి నుంచి పోటీ చేయడంతో స్థానికత గురించి జిల్లావాసులకు తెలిసింది. అయితే ఎంపీగా గెలిచిన మొదట్లో తెలియకపోయినప్పటికీ తరుచుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సమస్యలపై గళం విప్పి.. సుపరిచితుడయ్యారు. ప్రత్యేకించి పాలమూరు కరువు, వలసలకు మారు పేరైన జిల్లాకు సాగునీటి ప్రాజెక్టులు వస్తే సస్యశ్యామలం అవుతుందని.. వలసలు తగ్గిపోతాయని చెబుతుండే వారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్ రూపొందించే సమయంలో ఆయన చురుకై న పాత్ర పోషించారు. గత నెల 23న గుండె సంబంధ వ్యాధితో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరిన మందా జగన్నాథం చికిత్స సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం.. మందా జగన్నాథం తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా తెలంగాణలోని పలు జిల్లాల్లో విద్యాభ్యాసం సాగింది. నాగార్జున సాగర్‌లోని హిల్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి నుంచి 4వ తరగతి వరకు చదివారు. అనంతరం 5 నుంచి 8వ తేదీ వరకు నాగార్జున్ సాగర్‌లోని హైస్కూల్లో పూర్తి చేశారు. ఖమ్మంలోని నయా బజార్లో 9వ తరగతి కొంత వరకు చదివి అనంతరం వరంగల్ జిల్లా సంగంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 9, 10 తరగతులు పూర్తిచేశారు. వికారాబాద్ జెడ్పీహెచ్ఎస్లో హెచ్ఎస్సీ, నిజాం కళాశాలలో పీయూసీ, వికారాబాద్‌లోని పద్మనాభ కళాశాలలో మళ్లీ పీయూసీ, ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఎంస్ఎల్డీ, ఈఎన్టీ స్పెషలిస్టు సర్జన్ కోర్సులు చదివారు. కుటుంబ నేపథ్యం.. మందా జగన్నాథం తల్లిదండ్రులు మందా పుల్లయ్య, సవారమ్మ. మందాకు భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కూతురు ప్రసూతి గైనకాలజీలో మెడికల్ కోర్సు పూర్తి చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తుంది. పెద్ద కుమారుడు మందా శ్రీనాథ్ బీటెక్ మెకానికల్ ఇంజినీర్ చేసి ప్రస్తుతం సోషల్ వర్కర్‌గా ఉన్నారు. చిన్న కుమారుడు మందా విశ్వనాథ్ ఎంబీబీఎస్ చదివి వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. మాజీ ఎంపీ మృతితో స్వగ్రామం కొండేరులో విషాదఛాయలు -
బీఆర్ఎస్ ఒక్క ఎకరాకు నీళ్లివ్వలే..
నాగర్‌కర్నూల్/ తిమ్మాజిపేట/ బిజినేపల్లి: ‘తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నీటి కోసం.. అలాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు.. రాష్ట్రంలో ప్రస్తుతం నీరందిస్తున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే.. ఉమ్మడి పాలమూరు జిల్లాను తెలంగాణ కోనసీమగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతుందన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించిన ఆయన.. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపలి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మేఘారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లిలో మార్కండేయ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రూ.38 వేల కోట్లతో మొదలుపెట్టిన పాలమూరు ప్రాజెక్టు పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, దానిని తమ ప్రభుత్వం ఐదేళ్లలోనే పూర్తిచేసి చూపిస్తుందన్నారు. కేఎల్ఐ పెండింగ్ పనులను పూర్తిచేస్తామని, కృష్ణానది వాటాలో ఉన్న ప్రతి నీటి చుక్కను వినియోగించడానికి ఖర్చుకు వెనకాడమని స్పష్టం చేశారు. నిర్వాసితులను ఆదుకుంటాం.. నార్లాపూర్ భూ నిర్వాసితులకు గత ప్రభుత్వం జీఓ 123 ద్వారా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిందని మంత్రి విమర్శించారు. ‘పాలమూరు’ భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని, ముంపు గ్రామాలకు సంపూర్ణంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. భూ సేకరణలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామహేశ్వర, చిన్నకేశవ ఎత్తిపోతలను తమ ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కండేయ ఎత్తిపోతలకు మొదట రూ.76 కోట్లు కేటాయించి.. తర్వాత రీడిజైన్ పేరుతో రూ.86 కోట్లకు పెంచిందన్నారు. అందులో రూ.6 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని.. పథకం పనులకు కేవలం రూ.4 కోట్లు మాత్రమే విడుదల చేసి ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో ఈ పథకానికి నిధులు కేటాయించి పూర్తి చేశామన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగాలని సూచించారు. రైజింగ్ తెలంగాణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, విద్యుత్‌శాఖ సీఎండీ ముషారఫ్ అలీ, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టుల నిర్మాణాలు పాలమూరును తెలంగాణ కోనసీమగా మారుస్తాం ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి యాక్షన్ ప్లాన్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క