Mahabubnagar
-
నెలరోజుల వ్యవధిలోనే..
నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో ఒక్క నెలలోనే మూడు పాఠశాలలు మూసివేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ మండలంలోని నర్సాయపల్లి, వెంకటగిరి, చౌటతండా పాఠశాలలను విద్యార్థులు లేరన్న కారణాలతో మూసేశారు. నర్సాయపల్లి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే.. అక్టోబర్‌లో ఇద్దరూ బదిలీపై వెళ్లిపోయారు. ఇక్కడ కొత్తగా ఉపాధ్యాయులను నియమించకపోగా.. విద్యార్థులే లేరంటూ బడిని మూసేశారు. వెంకటగిరిలోనూ ముగ్గురు విద్యార్థులు ఉన్నప్పటికీ ఇక్కడి టీచర్‌ను మరోచోట ‘సర్దుబాటు’ చేసి బడిని మూసేశారు. ఇప్పటికే అచ్చంపేట తెల్జిరిగుడిసెలు, గోపాల్‌రావునగర్ పాఠశాలలకు అధికారులు శాశ్వతంగా తాళం వేశారు. -
ఉత్సాహంగా అర్బన్స్థాయి సీఎం కప్ క్రీడలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం మున్సిపాలిటీ (అర్బన్ స్థాయి) సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 300 మంది పాఠశాలల విద్యార్థులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. వీరికి అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన జట్లను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. క్రీడాపోటీల ప్రారంభం సీఎం కప్ అర్బన్ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, డీవైఎస్ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారుల ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడాపోటీలు నిర్వహిస్తుందని, పోటీల్లో విద్యార్థులు ప్రతిభచాటాలని కోరారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్, ఉపాధ్యక్షులు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్, డీఎస్ఏ సూపరింటెండెంట్ రాజగోపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు బాలరాజు, విలియం, సాదత్‌ఖాన్, పరశురాం, రామేశ్వరయ్య, ప్రసన్నకుమార్, అరుణజ్యోతి, ఉమాదేవి, కురుమూర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాల కల్పన
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో శనివారం ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీల కనుగుణంగా మెనూ అమలు కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డైట్ చార్జీల పెంపు మెనూ అమలు ప్రారంభ కార్యక్రమంం, గురుకుల, హాస్టల్ విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, సంక్షేమ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు డైట్ చార్జీలు భారీగా పెంచిందని, ఇందుకనుగుణంగా డైట్ ప్లాన్ తయారు చేశామన్నారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆలిండియా సర్వీస్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. ప్రతి హాస్టల్, గురుకుల పాఠశాలలకు ప్రత్యేకాధికారులను నియమించామని చెప్పారు. సంబంధిత గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత 40 శాతం డైట్ చార్జీలు, 16 ఏళ్ల తర్వాత కాస్మొటిక్ చార్జీలను 200 శాతం పెంచిందన్నారు. పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీల వివరాలను తెలిపేలా బ్యానర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. గురుకుల విద్యార్థుల కోసం పౌష్టికాహారం అందిస్తుందన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతోపాటు ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. జిల్లాలోని జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రూప్–2 పరీక్షలు సాఫీగా నిర్వహించాలి జిల్లాలో గ్రూప్–2 పరీక్షలను సాఫీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ఆది, సోమవారాల్లో జరగనున్న గ్రూప్–2 పరీక్షల నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు అన్నిరకాల సదుపాయాలు కల్పించాలన్నారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. -
రేపు రాష్ట్రస్థాయి సభలు
పాలమూరు: సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం రాష్ట్ర తొలి మహాసభలు జిల్లాకేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం 10గంటలకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ప్రతినిధులు రాఘవాచారి, లక్ష్మణ్‌గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు సాహిత్యకారులు విద్వేషాలు లేని సమాజం కోసం, మానవీయ విలువల కోసం గతేడాది ఆగస్టులో రాష్ట్రస్థాయి సమూ హ సెక్యులర్ రచయితల ఫోరం ఏర్పాటు చేశారన్నారు. ఈ సభల్లో ప్రారంభ ఉపన్యాసం ప్రొఫెసర్ హరగోపాల్, అలాగే కల్లూరి భాస్కరం కీలక ఉపన్యాసం చేస్తారన్నారు. వీరితోపాటు స్కైబాబా, కాశీం, మెట్టు రవీందర్, విద్మహె హాజరవుతారని వెల్లడించారు. -
మూతబడులు
విద్యార్థులు లేరని ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్న అధికారులు సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మెరుగైన విద్య అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఒకదిక్కు రూ.కోట్ల నిధులు వెచ్చించి.. కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు ప్రగల్భాలు పలుకుతుండగా.. మరోదిక్కు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు లేరని అధికారులు శాశ్వతంగా తాళాలు వేస్తున్నారు. బడులను నడిపిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భరోసా కల్పించాల్సిన అధికారులు.. విద్యార్థులు లేరన్న సాకుతో బడులను మూసివేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. జీరో ఎన్రోల్మెంట్ పేరుతో.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటికే చాలా వరకు పాఠశాలలకు శాశ్వతంగా తాళాలు పడ్డాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 73 పాఠశాలలను అధికారులు మూసివేశారు. ఈ విద్యా సంవత్సరం మధ్యలోనే 10 పాఠశాలలకు తాళం వేశారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలనే తాత్కాలికంగా మూసివేయాలి. కానీ, చాలా పాఠశాలల్లో మూడు నుంచి పది మంది వరకు విద్యార్థులు ఉన్నా.. వారిని ఇతర పాఠశాలలు, ప్రైవేటుకు వెళ్లమని సూచిస్తూ.. అర్ధంతరంగా బడులను మూసేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు చోటుచేసుకోగా.. పట్టణాలు, సమీపంలోని పాఠశాలల్లోకి ఉపాధ్యాయులు ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు రాక, వచ్చిన వారు మళ్లీ సర్దుబాటు కోసం పైరవీలు చేసుకుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఉపాధ్యాయులు లేక ఖాళీగా ఉన్న పాఠశాలలను సైతం విద్యార్థుల జీరో ఎన్రోల్మెంట్ పేరుతో మూసేస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో 46, వనపర్తి జిల్లాలో 32, జోగుళాంబ గద్వాల జిల్లాలో 10, నారాయణపేట జిల్లాలో 35 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. మూసివేసేందుకే ఆరాటం.. ఇన్నాళ్లు విద్యార్థులతో కళకళలాడిన బడులు.. ఉన్నట్టుండి బోసిపోతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ బడుల్లో నియామకం, వసతులు పెంచి తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించాల్సిన అధికారులు.. బడులను మూసివేసేందుకే ప్రాధాన్యం చూపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సంబంధిత అధికారులు చొరవ తీసుకుంటున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఉన్నా.. మరింత మందిని చేర్పించి, బలోపేతం చేయాల్సింది పోయి, ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీల కోసం ఏకంగా బడులకే తాళాలు వేస్తుండటం గమనార్హం. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇదే తంతు అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 73 స్కూళ్ల మూసివేత బల్మూరు మండలంలో ఒకే నెలలో మూడింటికి తాళం ప్రభుత్వ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు -
బృహత్తర ప్రణాళికకు అవకాశం
ముడా పరిధిని జిల్లా మొత్తానికి విస్తరించినందున బృహత్తర ప్రణాళిక అమలు చేయడానికి వీలవుతుంది. ఆయా గ్రామాల అభివృద్ధితో పాటు జిల్లా కేంద్రానికి అనుసంధానం చేస్తూ రహదారుల నిర్మాణానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి స్మార్ట్ సిటీ, అమృత్ తదితర పథకాల ద్వారా భారీగా నిధులు అందుతాయి. ఇప్పటికే కొత్త లే–అవుట్ల ఏర్పాటు, బిల్డింగ్ అనుమతుల ద్వారా సుమారు రూ.20 కోట్లు సమకూరాయి. ఈ నిధులతోనే వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. – డి.మహేశ్వర్‌రెడ్డి, వైస్‌చైర్మన్, ముడా, మహబూబ్‌నగర్ కొత్త ప్రతిపాదనలు చేస్తాం జిల్లావ్యాప్తంగా ముడా పరిధి విస్తరించినందున 3 మున్సిపాలిటీలతో పాటు అన్ని గ్రామాల అభివృద్ధికి కొత్త ప్రతిపాదనలు చేస్తాం. అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే ఆయా ఎమ్మెల్యేల నుంచి కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించి ప్రక్రియ చేపడతాం. అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు యత్నిస్తాం. ఇప్పటివరకు కార్పస్ ఫండ్ రానేలేదు. వచ్చే ఏడాది రాష్ట్ర బడ్జెట్ నుంచి కనీసం రూ.500 కోట్లు ఇవ్వాలని కోరతాం. ముఖ్యంగా కొత్త భవనం నిర్మించాల్సి ఉంది. – కె.లక్ష్మణ్‌యాదవ్, ముడా చైర్మన్, మహబూబ్‌నగర్ ● -
ఇంటి వద్దే ఉంటున్నా..
చౌటతండా పాఠశాలలో ముగ్గురం చదువుతున్నాం. స్కూల్లో విద్యార్థులు లేరని బడి మూసేస్తున్నట్టు చెప్పారు. కొన్ని రోజులుగా స్కూల్‌కు తాళం వేసి ఉంటోంది. ఇద్దరు విద్యార్థులు గ్రామంలోని ప్రైవేటు స్కూల్‌కు వెళ్తున్నారు. నేను మాత్రం ఇంటి వద్దే ఉంటున్నాను. – కార్తిక్, విద్యార్థి, చౌటతండా, బల్మూరు మండలం బడిని తెరిపించాలి.. ఏళ్లుగా విద్యార్థులతో కళకళలాడిన పాఠశాలలను అర్ధంతరంగా మూసివేయడం సరికాదు. చాలావరకు పాఠశాలల్లో ఐదు తరగతులకు కలిపి ఒకే టీచర్ ఉండటంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, ప్రజల్లో నమ్మకం కలిగించాలి. కానీ, బడులను మూసేస్తే పేద విద్యార్థులు ఏం కావాలి. ఉన్నతాధికారులు దృష్టిసారించి బడిని తెరిపించాలి. – శంకర్‌నాయక్, నర్సాయపల్లి, బల్మూరు మండలం విద్యార్థుల సంఖ్య పెంచుతాం జీరో విద్యార్థుల నమోదు ఉన్న స్కూళ్లను గుర్తించి తాత్కాలికంగా మూసేస్తున్నాం. పూర్తిగా విద్యార్థులు లేకుంటేనే మూసేస్తాం. కొద్ది మంది విద్యార్థులు ఉన్నా పాఠశాలలను నడిపించేలా చర్యలు తీసుకుంటున్నాం. మూసేసిన పాఠశాలల్లో సైతం విద్యార్థుల సంఖ్య పెంచి తెరిచేలా చర్యలు చేపడతాం. – రమేశ్‌కుమార్, డీఈఓ ● -
మార్మోగుతున్న హనుమాన్ నామస్మరణ
అమ్రాబాద్: పదర మండలంలోని మద్దిమడుగు క్షేత్రంలో వెలిసిన పబ్బతి ఆంజనేయస్వామి ఉత్సవాలు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా హనుమాన్ నామస్మరణ మార్మోగింది. ఆలయ ప్రాంగణం హనుమాన్ మాలధారులతో కిటకిటలాడింది. భక్తులు స్వామి సన్నిధిలో దీక్షమాల విరమించారు. ఆలయ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రంగాచారి, అర్చకులు వీరయ్యశాస్త్రి బృందం ఆధ్వర్యంలో విజ్ఞేశ్వరపూజ, పంచగవ్యం, వాస్తుపూజ, హోమం, రుద్రహోమం, స్వామివారికి సహస్రనామార్చన, మన్యు సూక్తహోమం, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
డైరెక్టర్ల నియామకం ఎప్పుడో?
● 45 రోజుల క్రితమే ముడా చైర్మన్గాలక్ష్మణ్యాదవ్ బాధ్యతల స్వీకరణ ● 12మంది అడ్వయిజరీ బోర్డు సభ్యులను ప్రకటించని వైనం ● ఇంకా పేర్లు సిఫారసు చేయని ముగ్గురు ఎమ్మెల్యేలు ● జిల్లామొత్తం 441 గ్రామాలకు విస్తరించిన ముడా పరిధి మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ముడా చైర్మన్‌గా కె.లక్ష్మణ్‌యాదవ్ పదవీ బాధ్యతలు చేపట్టి 45 రోజులు దాటినా అడ్వయిజరీ బోర్డు సభ్యులను ఇంకా నియమించలేదు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల తర్వాతే ముడాకు కొత్త పాలకవర్గం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిబంధనల ప్రకారం ఈ బోర్డులో 12 మంది సభ్యులతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటారు. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యులుగా డీటీసీపీఓ, ఎంఏయూడీ డైరెక్టర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) వ్యవహరిస్తారు. పరిధి విస్తరణ.. మొదట మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ని గత బీఆర్ఎస్ హయాంలో 2002 ఫిబ్రవరి 14న ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి జిల్లాలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీలతో పాటు 217 గ్రామ పంచాయతీలను తెచ్చారు. అదే ఏడాది ఏప్రిల్‌లో చైర్మన్‌గా మహబూబ్‌నగర్‌కు చెందిన గంజి వెంకన్నతో పాటు 12 మంది సభ్యులను సైతం నియమించారు. అనంతరం గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాలకవర్గం రాజీనామా చేసింది. ఈ క్రమంలోనే గత అక్టోబర్‌లో ముడా పరిధిని జిల్లా మొత్తానికి (441 గ్రామపంచాయతీలు) విస్తరించారు. అదే నెల 23న కొత్త చైర్మన్‌గా లక్ష్మణ్‌యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా 12 మంది డైరెక్టర్ల పేర్లను మాత్రం ఇప్పటివరకు ఎమ్మెల్యేలు సిఫారసు చేయలేకపోయారు. అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున ఆలస్యమవుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎలాంటి జీతభత్యాలు లేకపోయినా చైర్మన్‌కు ఆయా ప్రాంతాలకు సంబంధించిన పూర్తి వివరాలను వారే ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాలకవర్గం రెండేళ్ల పాటు కొనసాగుతుంది. దీంతో ఈ పదవులకు జిల్లావ్యాప్తంగా తీవ్రమైన పోటీ నెలకొంది. కొత్త లే–అవుట్లు, ఓపెన్ ప్లాట్లలో భవన నిర్మాణానికి అనుమతులు ముడా నుంచే పొందాలి. వీటి ద్వారా ఇప్పటికే రూ.20 కోట్లు జమ అయ్యాయి. అలాగే స్థానికంగా వివిధ అభివృద్ధి పనులు దీని ద్వారానే చేపట్టాల్సి ఉన్నందున డైరెక్టర్లకు ప్రాధాన్యం పెరిగింది. -
రైతులను మోసం చేస్తే క్రిమినల్ కేసులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రైతులను మోసం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వార్ల వెంకటయ్య అన్నారు. రైతులకు రక్షణ కల్పించాలనే డిమాండ్‌తో గురువారం రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అంతకు ముందు వన్‌టౌన్ నుంచి ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రైతులకు పంట రుణాల కింద రూ.లక్ష ఇవ్వాలని, అసైండ్‌మెంట్ ల్యాండ్ చట్టం, సీలింగ్ యాక్ట్, ఆర్ఓఆర్ చట్టాలను ధిక్కరించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, రైతులకు చట్టబద్ధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. వ్యాపారులకు ఇళ్లు, బంగారం తాకట్టు పెట్టుకుని బ్యాంకులు రుణాలు ఇస్తారని, కానీ, రైతులకు భూమి తాకట్టు పెట్టుకుని రుణం ఇవ్వరని విమర్శించారు. పంట నష్టపోతే రెండు పంటలకు రుణాలు ఇవ్వాలని, నకిలీ విత్తనాలు, మందుల వల్ల పంట నష్టపోయిన రైతులకు విత్తన కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించాలని, అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని కలెక్టర్ విజయేందిరకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్కిషన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు భీమన్న, నాయకులు రాములమ్మ, మల్లమ్మ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల తిరుపతి ‘ఆదిశిలాక్షేత్రం’
మల్దకల్: పేదల తిరుపతిగా పేరొందిన మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలో ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో నిర్వహించనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 12 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం, 14న తెప్పోత్సవం, 15న రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే బాంధవుడిగా.. స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని స్థానిక ప్రజలు కోరిన కోర్కెలు తీర్చే భక్తజన బాంధవుడిగా కొలుస్తారు. ఆదిశిలా వాసుడుని తిమ్మప్ప స్వామి , శ్రీనివాసుడు, మల్దకల్ రాయుడిగా సంభోదిస్తుంటారు. కులమతాలకు అతీతంగా స్థానిక ప్రజలు పూజలు చేసి మొక్కులు చెల్లిస్తుంటారు. మల్దకల్ క్షేత్ర మహత్యం.. మల్దకల్ క్షేత్ర మహత్యం బ్రహ్మాండ పురాణంలో వర్ణించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రంలో క్షేత్రమూర్తి శివుడు అయినా విష్ణు దేవాలయంగా వెలుగొందుతోంది. బ్రహ్మదేవుడు మొదట ఓ శిలను సృష్టించి ఆదిశిలా అని పేరు పెట్టినట్లు ప్రశస్తి. శివుడు ఇక్కడ తపస్సు చేయగా స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి సాక్ష్యాత్కరించి దశావతారాలు స్తుతించగా మెచ్చి ఈ ఆదిశిలకు గిరీశచలమని పేరెడినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. తదనుగుణంగా ఒకే శిలలో స్వయంభుగా శ్రీనివాసుడు అనిరుద్దరూపంలో అవతరించాడు. పశుపక్ష్యాదుల రూపంలో సేవలు.. ఆదిశిలా క్షేత్రంలో దేవతలు పశు, పక్ష్యాది రూపంలో వేంకటేశ్వరుడిని సేవిస్తూ తత్వజ్ఞానం పొందుతారని పురాణాల్లో పేర్కొన్నారు. ఇక్కడ వెలసిన రుద్దరూపంలో అంటే చతుర్భుజంలో ఉండి శంఖు చక్రాలతో... ఒక హస్తం నడుముపై, మరో హస్తంపై పాదములు చూపుతూ వెలిశాడు వేంకటేశ్వరుడు. సంసారం అనే భావ సాగరంలో మునిగి తేలుతున్న మానవాళికి తన పాదసేవ చేస్తే మోక్ష దాయకమని విరాజిల్లుతున్నాడు. వాల్మీకులే పూజారులు.. ఆదిశిలా క్షేత్రంలో లక్ష్మీవేంకటేశ్వర స్మామిని వాల్మీకులు పూజారులుగా పూజలు చేస్తుంటారు. ఆలయంలో జరిగే తొలి పూజల్లో వాల్మీకులే ముందుంటారు. ఆలయంలో పూజలు చేసే వాల్మీకులకు దేవుడి పేరుతో మాన్యాలు ఉన్నాయి. వాటి ద్వారా ఆలయంలో దేవుడికి సేవలు చేయడం గమనార్హం. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు.. శుక్రవారం నాడు జరిగే కల్యాణోత్సవ కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు ముఖ్య అతిథిగా హజరవనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. వైభవంగా జరిగే ఈ కల్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వేడుకల్లో పాల్గొనున్నారు. ఆలయ శిఖరం నేడు స్వామి వారి కల్యాణోత్సవం 14న తెప్పోత్సవం 15న రథోత్సవం -
శ్రీఆంజనేయం..
మక్తల్: పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. సాధారణంగా ప్రతి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహాలు తూర్పు ముఖమై ఉంటాయి. కానీ ఇక్కడ స్వామివారు పశ్చిమ (పడమటి) దిశకు కొలువుదీరి ఉండటం విశేషం. ఇలాంటి విగ్రహం దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. ఆలయ గర్భగుడికి పైకప్పు లేకపోవడం విశేషం. గతంలో పైకప్పు నిర్మిస్తే బీటలువారి పడిపోయిందని పూర్వీకులు చెబుతున్నారు. సుమారు ఏడు అడుగులపైనున్న స్వామివారి భారీ విగ్రహం భూమిపై ఎలాంటి ఆధారం లేకుండా నిలబడి ఉండటం మరో విశేషంగా చెప్పవచ్చు. ఫ మహబూబ్‌నగర్–రాయచూర్ అంతర్రాష్ట్ర ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారిని నిష్టతో 41 రోజుల పాటు కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా మార్గశిర మాసంలో బ్రహ్మోత్సవాలు, పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. నేటి నుంచి పడమటి అంజన్న బ్రహ్మోత్సవాలు 19వ తేదీ వరకు కొనసాగింపు 15న రథోత్సవం ఏర్పాటు పూర్తిచేసిన నిర్వాహకులు -
ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి
● భార్య పరిస్థితి విషమం జడ్చర్ల: జడ్చర్ల, కల్వకుర్తి ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల సమీపంలోని ప్రధాన రహదారిపై గంగాపూర్ శివారులో మిడ్జిల్ మండలం రెడ్డిగూడకు చెందిన జైపాల్ (45), శౌరిలమ్మతో దంపతులు మోటార్ బైక్‌పై వస్తుండగా.. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టారు. ప్రమాదంలో జైపాల్ అక్కడిక్కడే మృతి చెందగా.. అతడి భార్య తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు 108 వాహనంలో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. శౌరిలమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. ట్రాక్టర్ కిందపడి బాలుడి.. బిజినేపల్లి: మండల కేంద్రంలోని లింగమయ్య కాలనీలో ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని లింగమయ్య కాలనీలో నివాసం ఉంటున్న రాములు, అనూష దంపతుల కుమారుడు నితిన్(7) పాఠశాలకు వెళ్లడానికి గురువారం ఉదయం రోడ్డు పైకి వస్తుండగా.. అటుగా వస్తున్న ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని డ్రైవర్ మహేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. కారు బోల్తా.. డ్రైవర్.. ఆర్మూర్ టౌన్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులోని జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో వనపర్తికి చెందిన కారు డ్రైవర్ ప్రకాశ్(18) మృతిచెందాడు. ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన మద్దెల చందు, ఆర్మూర్ మండలం కోటార్మూర్‌కు చెందిన అక్షయ్ స్నేహితులు. అక్షయ్ బంధువుల వివాహంలో పాల్గొనడానికి చందు హైదరాబాద్ నుంచి కారు అద్దెకు తీసుకొని వచ్చాడు. బుధవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో డ్రైవర్ ప్రకాశ్‌తోపాటు మరో ఆరుగురు టీ తాగేందుకు కారులో వెళ్తుండగా.. పెర్కిట్ శివారులోని స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ప్రకాశ్‌కు తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రకాశ్‌ను ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గడ్డిమందు తాగి యువకుడి బలవన్మరణం మహమ్మదాబాద్: తన ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదనే క్షణికావేశంతో గడ్డిమందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గండేడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెన్నాచేడ్ గ్రామానికి చెందిన తలారి అంజిలయ్య కుమారుడు తలారి బాల్‌రాజ్ (19) ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడంతో మనస్తాపానికి గురై ఈనెల 11న గడ్డిమందు తాగాడు. వెంటనే చికిత్స కోసం యువకుడిని మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం ఆస్పత్రిలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి అంజిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. కొడుకు మందలించాడని తల్లి ఆత్మహత్య ఖిల్లాఘనపురం: కల్లు తాగొద్దని కొడుకు మందలించడంతో మనస్థాపానికి ఓ తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మానాజీపేటలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ సురేష్‌గౌడ్ గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన తలారి కాశమ్మ (68) తరుచుగా కల్లు తాగేది. కల్లు తాగొద్దని తల్లిని కుమారుడు మందలించాడు. దీంతో కా శమ్మ మనస్థాపంతో క్షణికావేశానికి గురై గ్రా మం సమీపంలో ఉన్న పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమారు డు తలారి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పర్సనల్ లోన్ పేరిట సైబర్ మోసం నాగర్‌కర్నూల్ క్రైం : పర్సనల్ లోన్ పేరిట సైబర్ నేరగాళ్లు వ్యక్తిని మోసం చేసిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రానికి చెందిన ఆకుతోట సాయిరామ్‌కు ఓ గుర్తు తెలియని సైబర్ నేరగాడు ఫోన్ చేసి పర్సనల్ లోన్ ఇస్తానని నమ్మించాడు. ఇదే క్రమంలో అతని నుంచి రూ. 99 వేలు అతని అకౌంట్లో వేయించుకున్నాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఆవిష్కరణలు అదరహో
స్మార్ట్ చేతికర్ర.. ఇంటి నమూనా కళ్లు కనిపించని వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో స్మార్ట్ చేతికర్ర, స్మార్ట్ ఇంటి నమూనాలను విద్యార్థులు శృతి, సాక్షి ఆవిష్కరించారు. ఈ మేరకు స్మార్ట్ చేతికర్రతో బయటికి వెళ్లిన వ్యక్తికి ఆ కర్ర ఎదురుగా ఏదైనా వస్తువు వస్తే వెంటనే అలారం వచ్చే విధంగా రూపొందించారు. దీంతోపాటు స్మార్ట్ హోంలో ఎవరైనా బయటి వ్యక్తులు వెళ్తే ఆటోమేటిక్‌గా అలారం శబ్ధం చేస్తుంది. దీంతో కళ్లు కనిపించని అంధులకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు పేర్కొన్నారు. – శృతి, సాక్షి, శ్లోక స్కూల్, జడ్చర్ల ఆటోమేటిక్ అలారం ప్రజలు సొంత పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లినప్పుడు ఇటీవల చాలా చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు విద్యార్థిని నిఖిత ఆటోమేటిక్ అలారాన్ని కనుగొన్నారు. బయటికి వెళ్లే క్రమంలో అలారం ఆన్ చేసి వెళ్తే మన ప్రమేయం లేకుండా వ్యక్తులు డోర్ తెరిచినప్పుడు పెద్ద శబ్ధంతో అలారం మోగుతుంది. దీంతో చుట్టుపక్కల వారు అలర్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది. – నిఖిత, జెడ్పీహెచ్ఎస్ ఇబ్రహింబాద్ అవసరాలు తీర్చే రోబో.. ఇంట్లో చిన్నపాటి అవసరాలను తీర్చేలా.. తక్కువ ఖర్చుతో ఇంట్లో లభించే వస్తువులతో కావేరమ్మపేట విద్యార్థులు చిన్నపాటి రోబోను ఆవిష్కరించారు. దీంతో ఇంట్లో చిన్నపాటి వస్తువులను మోసుకెళ్లడం, చిన్నపిల్లలు కాలక్షేపం చేసే విధంగా వారిని ఆడించడం వంటి పనులను ఈ రోబో చేస్తుంది. వీటి వల్ల ఇంట్లో అవసరాలు తీర్చే అవకాశం ఉన్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. – చందు, వరుణ్, కావేరమ్మపేట, జడ్చర్ల జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ప్రదర్శన విద్యార్థుల్లో ఆలోచనలను రేకెత్తించింది. విద్యార్థుల ఆవిష్కరణలు సమాజ ప్రగతికి దోహదపడేలా.. శాస్త్ర, సాంకేతిక అంశాలపై పట్టుసాధించేలా గొప్పగా ఆవిష్కరించారు. సాధారణ ప్రజల నుంచి శాస్త్రవేత్తలు ఇలా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా తమ చిట్టి బుర్రలతో ఎంతో మేలు చేకూర్చే ఆవిష్కరణలకు రూపమిచ్చారు. – మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ ఫైర్ స్ప్రింక్లింగ్ రోబోట్.. భవనాలు ఇతర చోట్ల మంటలు అంటుకున్న సమయంలో వ్యక్తుల ప్రమేయం లేకుండా నేరుగా రోబో సహాయంతో నీటిని పోసి ఆర్పే విధంగా విద్యార్థిని తేజశ్రీ ఫైర్ స్ప్రింక్లింగ్ రోబోట్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా మంటలు ఆర్పే క్రమంలో వ్యక్తులకు గాయాలు కాకుండా పూర్తి ఖచ్చితత్వంతో మంటలు ఆర్పే రోబోను ఆవిష్కరించారు. దీని ద్వారా మనుషులకు మంటల్లో ఇబ్బంది కలగకుండా నేరుగా నీటిని పోసే ఆస్కారం ఉందని విద్యార్థులు తెలిపారు. – తేజశ్రీ, జెడ్పీహెచ్ఎస్, చిన్నవార్వాల్ -
రాష్ట్రస్థాయి వాలీబాల్ విజేత పాలమూరు
కోస్గి: గుండుమాల్ మండల కేంద్రంలోని ఏకే అకాడమీ క్రీడా మైదానంలో మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–19 వాలీబాల్ పోటీల్లో పాలమూరు జట్లు విజేతగా నిలిచాయి. హోరాహోరీగా గురువారం జరిగిన ఫైనల్లో మహబూబ్‌నగర్ జిల్లా బాలుర, బాలికల జట్లు విజయం సాధించాయి. ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి బాలబాలికల జట్లు హాజరు కాగా, బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు ప్రథమ స్థానం, ఖమ్మం జట్టు ద్వితీయ స్థానం, కరీంనగర్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలోనూ మహబూబ్‌నగర్ జట్టు ప్రథమ స్థానం, నిజామాబాద్ జట్టు ద్వితీయ స్థానం, కరీంనగర్ జట్టు తృతీయ స్థానం సాధించాయి. క్రీడల ముగింపు కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేష్ శెట్టి, పెటా టీఎస్ కార్యదర్శి బాల్‌రాజ్, మాజీ ఎంపీపీ మధుకర్ రావు, మాజీ జెడ్పీటీసీ ప్రకాష్‌రెడ్డి, కాంగ్రెస్ గుండుమాల్ మండల అధ్యక్షుడు విక్రంరెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాల్‌రాజ్, పీడీలు నర్సింహ, రవి, సాయినాథ్, చంద్రశేఖర్, రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, రాధిక, స్వప్న, పుష్పలత, తదితరులు పాల్గొన్నారు. షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం చిన్నచింతకుంట: షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసె దగ్ధమైన ఘటన చిన్నచింతకుంట మండలం పల్లమరి గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలకు వెళితే.. గ్రామానికి చెందిన గట్టాకుల రామంజనేయులు కొన్నేళ్లుగా బీసీ కాలనీలో గుడిసె ఏర్పాటు చేసుకొని భార్య, పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. రామాంజనేయులు బుధవారం గుడిసెకు తాళం వేసి కుటుంబంతో కలిసి అడ్డాకుల మండలంలోని ముంగల్చేడ్ గ్రామానికి తన బంధువుల పెళ్లికి వెళ్లాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు షార్ట్య్సర్క్యూట్ ఏర్పడి గుడిసెకు నిప్పంటుకోవడంతో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. గమనించిన గ్రామస్తులు మంటలను అదుపు చేశారు. గుడిసెలో ఎవరూ లేని కారణంగా పెను ప్రమాదం తప్పింది. కుట్టు మిషన్, 50 వేల నగదు, బియం బస్తాలు, సైకిల్, బట్టలు, పట్టా దారు పాస్ బుక్కులు, బ్యాంకు పాసుబుక్కులు, వంట సామగ్రి పూర్తిగా కాలిపోయింది. ఘటన స్థలానికి తహసీల్దార్ ఎల్లయ్య చేరుకొని పంచనామా నిర్వహించి, దాదాపుగా రూ.2లక్షల ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.10వేల నగదు, 50 కిలోల బియ్యం అందించారు. ఘటనను ఉన్నతాధికారులకు నివేదిక పంపించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
ఏర్పాట్లు పూర్తి..
ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 19 శనివారం వరకు కొనసాగుతాయని ఆలయ ధర్మకర్త ప్రాణేష్‌చారి, ఈఓ శ్యాంసుందరాచారి గురువారం తెలిపారు. కార్యక్రమాల నిర్వహణ వివరాలను ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ¢ శుక్రవారం ఉదయం 7 గంటలకు ఉత్తరాది మఠం నుంచి ఆలయం వరకు స్వామివారి ఊరేగింపు, 7.30కి అంకురార్పణం, ధ్వజారోహణం, అలంకారోత్సవం, 8 గంటలకు హనుమద్వ్రతం, సాయంత్రం గజవాహన సేవ. ¢ 14న ఉదయం పవమాన హోమం, సాయంత్రం మయూర వాహనసేవ, 6 గంటలకు ప్రభోత్సవం. ¢ 15న మధ్యాహ్నం మూడు గంటలకు పల్లకీసేవ, సాయంత్రం నాలుగు గంటలకు రథంపై స్వామివారికి మంగళహారతులు, 6 గంటలకు రథోత్సవం. ¢ 16న సాయంత్రం 5 గంటలకు హంసవాహన సేవ, 6.30కి పాల ఉట్లు. ¢ 17న ఉదయం 10 గంటలకు చక్రతీర్థం, 11 గంటలకు అశ్వవాహన సేవ. ¢ 18న సాయంత్రం ఆరు గంటలకు ఉష్ట్రవాహన సేవ ¢ 19న సాయంత్రం ఆరు గంటలకు కల్పవృక్ష వాహన సేవ వీటితో పాటు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, 8 గంటలకు పంచామృత అభిషేకం, ఆకుపూజ, మధ్యాహ్నం 12 గంటలకు మహా నివేదన, సాయంత్రం ఆరు గంటలకు వాహన సేవల అనంతరం మహా మంగళహారతి, అవధారలు తదితర పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. -
కొలిచిన వారి కొంగు బంగారం కాళికాదేవి
● రామచంద్రాపూర్‌లో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం ● 18న ఎల్లమ్మ దేవత సిడె వేడుక 36 ఏళ్లుగా ఉత్సవాలు అమ్మవారి ఉత్సవాలను 36 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. మా నాన్న కుర్వ మల్లయ్య ఆధ్వర్యంలో దేవస్థానాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు. భక్తులు, గ్రామస్తుల సహకారంతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వద్ద అన్ని ఏర్పాట్లు చేశాం. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి అందరూ సహకరించాలి. – ఆనంద్, దేవస్థాన నిర్వాహకులు, రామచంద్రాపూర్ ●మహబూబ్‌నగర్ రూరల్: మండలంలోని రామచంద్రాపూర్ గ్రామ ఊరగుట్టపై వెలసిన కాళికాదేవి అమ్మవారి దేవస్థానం కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతుంది. ఇంత విశిష్టత గల అమ్మ వారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శుక్రవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ దేవత సిడె కార్యక్రమాన్ని 18న నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు గ్రామస్తులతోపాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తా రు. ఉత్సవాలు జరిగే ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశేషోత్సవాలు ఇలా.. కాళికాదేవి అమ్మవారి 36వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం తుల్జాభవాని ధ్వజారోహణం, శనివారం యజ్ఞం, నాగదేవతా పూజలు, ఆదివారం అమ్మవారి రథోత్సవం, సోమవారం గంగాదేవి బిందెసేవ, మహిషాసురమర్ధిని, మంగళవారం అమ్మవారికి బోనాలు, బుధవారం ఎల్లమ్మ దేవతకు సిడె తిప్పుట, గురువారం భూలక్ష్మీదేవికి గొర్రె, మేకపోతులతో బండ్లుతిప్పుట, శుక్రవారం అమ్మవారికి అమృత స్నానం పూజా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
సొంత డబ్బులు వెచ్చిస్తున్నాం..
గ్రామాల్లో పారిశుద్ధ్యం, ట్రాక్టర్‌తో చెత్త సేకరణకు డీజిల్ ఖర్చులతోపాటు నిర్వహణ, ఫాగింగ్ మిషన్లు, బ్లీచింగ్ పౌడర్, వీధిదీపాల నిర్వహణ, మల్టీపర్పస్ వర్కర్లకు శానిటేషన్ కిట్లతోపాటు స్వచ్ఛదనం– పచ్చదనం, స్వచ్ఛతహీ సేవ కార్యక్రమాలకు సొంత డబ్బులు వెచ్చిస్తున్నాం. దీంతో వచ్చే జీతం కుటుంబ పోషణతోపాటు గ్రామ పాలనకు సరిపోక అప్పులు చేయాల్సి వస్తుంది. – జానేశ్వర్, జిల్లా అధ్యక్షుడు, పంచాయతీ కార్యదర్శుల ఫోరం నిధులు విడుదల చేయాలి.. పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేస్తున్నారు. గ్రామంలో చేసే రోజు వారి నిర్వహణ ఖర్చులకై నా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చే నిధులు మల్టీ పర్పస్ వర్కర్ల జీతాలకు సరిపోవడం లేదు. వారికి ప్రభుత్వమే డైరెక్ట్‌గా జీతాలు చెల్లించాలి. – రవీందర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు, పంచాయతీ కార్యదర్శుల ఫోరం● -
జిల్లా కబడ్డీ జూనియర్ జట్ల ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జనగామలో ఈ నెల 27 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలను ఈనెల 15న జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్‌కార్డు, పదోతరగతి మెమో, బోనఫైడ్‌తో హాజరుకావాలని సూచించారు. నేడు జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ ప్రారంభం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో గురువారం జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు వివిధ ప్రాజెక్టులు ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రవీణ్‌కుమార్ ఫాతిమా విద్యాలయంలో విద్యార్థుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన నిర్వహణ కమిటీలతో మాట్లాడుతూ ఎగ్జిబిట్ చేసే ప్రతి ప్రదర్శన కూడా ఎంతో ముఖ్యమని, అందుకోసం వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అన్ని విషయాలపై వివిధ స్థాయిల్లో పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండాలని, సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో సైన్స్ అధికారి శ్రీనివాస్, సూపరింటెండెంట్ శంభూప్రసాద్, ఏఎంఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎట్టకేలకు మార్కెట్లో ధాన్యం టెండర్లు నవాబుపేట/దేవరకద్ర: నవాబుపేట మార్కెట్ యార్డులో అధికారులు ఎట్టకేలకు బుధవారం టెండర్లు నిర్వహించారు. ఇక్కడ వారం రోజుల నుంచి టెండర్లు జరగకపోవడంతో మార్కెట్ చైర్మన్ లింగం చొరవ తీసుకుని టెండర్లు జరిగేలా చేశారు. కాగా బుధవారం మార్కెట్లో 38,459 బస్తాల ధాన్యానికి టెండర్లు వేయగా.. వరి క్వింటాల్ గరిష్టంగా రూ.2,788, కనిష్టంగా రూ.2,720 ధర వచ్చిందని మార్కెట్ అధికారి రమేష్ తెలిపారు. అయితే ధాన్యం మొత్తం తూకాలు వేసి ఎగుమతి చేయడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆర్ఎన్ఆర్ క్వింటాల్ రూ.2,700 దేవరకద్ర మార్కెట్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,700, కనిష్టంగా రూ.2,500 చొప్పున ధరలు నమోదయ్యాయి. సీజన్ తగ్గడంతో మార్కెట్‌కు కేవలం 200 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. చిన్నరాజమూర్ హుండీ లెక్కింపు దేవరకద్ర: చిన్నరాజమూర్ శ్రీఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం హుండీని లెక్కించారు. దేవస్థాన కమిటీతోపాటు ఎండోమెంట్ అధికారులు, గ్రామపెద్దల సమక్షంలో హుండీని లెక్కించగా రూ.4,17,410 వచ్చాయి. హుండీ ద్వారా వచ్చిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు దేవస్థాన కమిటీ చైర్మన్ రాఘవేంద్రచారి తెలిపారు. త్వరలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో ముందస్తుగా హుండీని లెక్కించామన్నారు. బ్రహ్మోత్సవాల తర్వాత మరోసారి హుండీ లెక్కింపు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ప్రసాద్, అర్చకులు హన్మేషచారి, జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్, ప్రేమ్‌కుమార్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బిల్లులు మంజూరు చేయాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు ఒక్క బిల్లు కూడా విడుదల చేయలేదన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు టైమ్ స్కేల్ ఇవ్వాలని, 317 జీఓలో ప్రభావితమైన వారికి లోపాలను సవరించి స్థానికతకు ప్రాధాన్యత ఇచ్చి సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్, రవికుమార్, ఉమాదేవి, నర్సింహులు, భాస్కర్, కిష్ట్యనాయక్, రాములు, కృష్ణయ్య పాల్గొన్నారు. -
పక్కాగా ఇందిరమ్మ ఇళ్ల వివరాల సేకరణ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఈ నెలాఖరులోగా పకడ్బందీగా సేకరించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి సీఎస్ శాంతికుమారితో కలిసి కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి 500 ఇళ్ల దరఖాస్తుల సర్వే కోసం ఒక సిబ్బందిని నియమించాలన్నారు. గ్రామ, మున్సి పాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను నియమించామని, వీరిని సమన్వయం చేసుకుంటూ వివరాలు సేకరించాలన్నారు. అలాగే హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, ఇందులో అధికంగా నూక వస్తుందని ఫిర్యాదులు ఉన్నాయని వీటిని పరిశీలించి కలెక్టర్లు నాణ్యమైన బియ్యం, విద్యాసంస్థలకు చేరేలా చూడాలని మంత్రి ఆదేశించారు. సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ ప్రతి సర్వేయర్ రోజుకు 20 ఇళ్ల దరఖాస్తులు పూర్తిచేయాలన్నారు. గ్రూప్–2 పరీక్షలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శనివారం డైట్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించాలని, ముఖ్యంగా తల్లి హాజరయ్యేలా చూడాలన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం మాట్లాడుతూ గ్రూప్–2 పరీక్ష అభ్యర్థులకు ప్రత్యేకంగా ఓఎంఆర్ షీట్ అందిస్తామని, చిన్న పొరపాటు జరగకుండా పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలని కోరారు. అనంతరం కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీల్లో శనివారం నుంచి డైట్ చార్జీలు పెంపునకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు పాల్గొన్నారు. -
శరవేగంగా సబ్‌స్టేషన్ మరమ్మతు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాకేంద్రంలోని 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అత్యవసర మెయింటెనెన్స్ నిర్వహణను విద్యుత్ శాఖ సిబ్బంది శరవేగంగా చేపట్టారు. బుధవారం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ముందుగానే అధికారులు తెలియజేశారు. మొత్తం 55 మంది విద్యుత్ సిబ్బంది శ్రమించి అనుకున్న సమయం కన్నా అరగంట ముందుగానే మరమ్మతు ప్రక్రియ పూర్తిచేశారు. పిల్లలమర్రి రోడ్డు, కాటన్ మిల్లు, పరిశ్రమశాఖ ప్రాంతాల్లో 11 కేవీ విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడంతోపాటు విద్యుత్ భవన్ పరిధిలో ఉన్న 132/33 కేవీ మరమ్మతు చేపట్టారు. ఈ మెయింటెనెన్స్ మూడేళ్ల క్రితం చేపట్టగా.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో పునరుద్ధరించే క్రమంలో మరమ్మతుకు పూనుకున్నారు. టౌన్–1 పరిధిలో ఓల్డ్ పవర్ హౌస్, టౌన్–2 పరిధిలో విద్యుత్ భవన్, పిల్లలమర్రి, టౌన్–3 పరిఽ దిలో జెడ్పీ ఇండోర్ సబ్‌స్టేషన్, కేసీఆర్, టీడీగుట్ట సబ్ స్టేషన్ల మరమ్మతు ఏకకాలంలో పూర్తిచేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరగా మరమ్మతు పూర్తిచేసినట్లు పట్టణ ఏడీ తావుర్యనాయక్ తెలిపారు. మెయింటెనెన్స్‌కు సహకరించిన ప్ర జలు, రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఆరోగ్యశ్రీ కేసులు తిరస్కరించొద్దు
పాలమూరు: జనరల్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కేసులు మరింత పెంచాలని, కేసు రిజిస్ట్రేషన్ చేయడం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తిచేయాలని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సంపత్‌కుమార్ సింగ్ అన్నారు. జనరల్ ఆస్పత్రిలోని అన్ని విభాగాల హెచ్‌వోడీలతో బుధవారం ఆరోగ్యశ్రీ సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సూపరింటెండెంట్‌తోపాటు హైదరాబాద్ నుంచి ఆరోగ్యశ్రీ నిపుణుడు డాక్టర్ కేవీఎన్ దుర్గాప్రసాద్ హాజరై మాట్లాడారు. రోగుల వివరాలను ఆరోగ్యశ్రీ డీవోలు వార్డుకు వెళ్లి సేకరించాలని, ఆరోగ్య మిత్రలు మూడు షిఫ్ట్‌లలో డ్యూటీ రోస్టర్ తయారు చేసుకొని దాని ప్రకారం పని చేయాలన్నారు. కేసు రిజక్ట్ కాకుండా ఉండటానికి కావాల్సిన జాగ్రత్తలపై తెలియజెప్పారు. ప్రతి కేసులో ఒరిజినల్ కేషీట్ ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. రిజక్ట్ అయిన ఆరోగ్యశ్రీ కేసుల నెలవారి వివరాలను డీవోలు సంబంధిత హెచ్‌వోడీ విచారించి తిరస్కరణకు గల కారణాలు చెప్పాలన్నారు. ప్రతిరోజు ఆరోగ్యశ్రీ కేసుల రిపోర్ట్ వివరాలను సూపరింటెండెంట్ కార్యాలయంలో అందజేయాలన్నారు. సమావేశంలో ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, ఆర్ఎంఓ డాక్టర్ జరీనా, అన్ని విభాగాల హెచ్వోడీలు, ఆరోగ్యశ్రీ సిబ్బంది పాల్గొన్నారు. -
హోరాహోరీగా రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
కోస్గి: ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో గుండుమాల్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్–19 వాలీబాల్ పోటీలు రెండోరోజు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. స్థానిక ఏకే అకాడమీ క్రీడామైదానంలో బుధవారం సెమీ ఫైనల్ పోటీలు నిర్వహించారు. గురువారం ఫైనల్ పోటీలు జరగనున్నాయి. రెండో రోజు విజేతలు.. రెండోరోజు జరిగిన పోటీల్లో మహబూబ్‌నగర్ బాలుర జట్టు మెదక్ జట్టుపై 25–12, 25–17 స్కోర్‌తో విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు నల్గొండ జట్టుపై 25–19, 25–23 స్కోర్‌తో విజయం సాధించింది. ఖమ్మం జట్టు అదిలాబాద్ జట్టుపై 27–25, 25–19 స్కోర్‌తో విజయం సాధించింది. బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు ఖమ్మం జట్టుపై 15–9, 15–2 స్కోర్‌తో విజయం సాధించింది. నల్గొండ జట్టు వరంగల్ జట్టుపై 16–14, 15–7 స్కోర్‌తో విజయం సాధించింది. మహబూబ్‌నగర్ జట్టు ఆదిలాబాద్ జట్టుపై 15–3, 15–3 స్కోర్‌తో విజయం సాధించింది. కార్యక్రమంలో వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాల్‌రాజ్, పీడీలు శ్రీనివాస్, నర్సింహులు, రాధిక, స్వప్న, పుష్పలత పాల్గొన్నారు. -
మద్దిమడుగు అంజన్న ఉత్సవాలు ప్రారంభం
అమ్రాబాద్: పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి దీక్షమాల విరమణ ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. వేదపండితులు వీరయ్యశాస్త్రి, వీరయ్యశర్మల బృందం వేద మంత్రాలతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి రంగాచారి ఉత్సవాలను ప్రారంభించారు. ఈనెల 15వరకు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిత్యార్చన విజ్ఞేశ్వరపూజ, పుణ్యహవచనం, పంచగవ్యం, ఉష్ణవాహణ సేవ, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలకు దీక్షమాల చేపట్టిన భక్తులు మద్దిమడుగు క్షేత్రానికి చేరుకుంటున్నారు. పదర ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. పదర పోలీసుస్టేషన్, అమ్రాబాద్ సీఐ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్ రాములు, కార్యనిర్వహణాధికారి రంగాచారి, ఆలయ అధికారులు నాగరాజు, విశ్వేశ్వరరెడ్ది, జంగయ్య, ప్రధాన అర్చకులు వీరయ్యశర్మ పాల్గొన్నారు. అంతకు ముందు పదర మండలం వంకేశ్వరంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించారు.