Amaravati
-
‘చలో విజయవాడ’పై ఉక్కుపాదం.. వాలంటీర్ల గృహ నిర్బంధం
సాక్షి, విజయవాడ: వాలంటీర్ల ‘చలో విజయవాడ’(Chalo Vijayawada) కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల(Volunteers)ను హౌస్ అరెస్ట్ చేశారు. కేబినెట్లో వాలంటీర్ల అంశంపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సెక్రటేరియట్‌కు వెళ్లి సీఎంను కలుస్తామన్న వాలంటీర్లపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. విజయవాడలోని దాసరి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.చలో విజయవాడను అడ్డుకోవడంపై వాలంటీర్లు మండిపడ్డారు. గత ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. వాలంటీర్లకు ఉద్యోగం కల్పించడంతో పాటు బకాయి పడ్డ ఎనిమిది నెలల వేతనం ఇవ్వాలి. పోలీసులతో అడ్డుకున్నంత మాత్రాన మా పోరాటం ఆగదు’’ అని గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయున్ బాషా అన్నారు.‘‘ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే వరకూ వదిలిపెట్టం. చంద్రబాబు అబద్ధాల ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నాడు. మమ్మల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడుపోతుందోనని వాలంటీర్లు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట తప్పి మహిళలను మోసం చేశారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని మంత్రి డోలా బాలవీరాంజనేయులు మాట్లాడటం సిగ్గుచేటు’’ అని షేక్ హుమాయున్ బాషా మండిపడ్డారు.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం -
చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
అమరావతి, సాక్షి: బ్యూరోక్రసీతో తనకు ఎలాంటి అవసరం లేదని.. తాను కేవలం రాజకీయ పాలనే చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ తరహా పాలన అంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. వ్యవస్థలన్నీ కుంటుపడిపోయాయి. సంక్షేమ పథకాలు మూలనపడ్డాయి. ఈ తరుణంలో.. ఇక రాజకీయ పాలనతో ఆ పరిస్థితిని మరింత దిగజార్చాలన్నది చంద్రబాబు (Chandrababu) ప్రయత్నంగా కనిపిస్తోంది. ‘‘రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నాం. రాయలసీమ తరహాలో ఒకరి పోస్ట్‌మార్టమ్‌కు కారణమైన వారికి కూడా పోస్ట్‌మార్టం తప్పదు. సోషల్ మీడియాలో విర్రవీగిన వారిని కంట్రోల్లో పెట్టాం. ఒకరిని చంపితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని.. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారు. పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది పార్టీ కార్యకర్తలే తప్ప బ్యూరోక్రసీ కాదన్నారు. అందువల్ల కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుంది’’రాజకీయ పాలన పేరుతో మళ్ళీ జన్మభూమి కమిటీ(Janmabhoomi Committee)ల రంగప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కుటుంబాలకు పెన్షన్లు కట్ అయ్యాయి. ఏ పని కావాలన్నా టీటీడీ నేతల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే.. తమ నేతలు చెప్పిన వారికే పనులు చేయాలని అధికారులకూ ఆదేశాలు వెళ్లాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలోనే మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. కుర్చీలో కూర్చోపెట్టి కాఫీ ఇచ్చి మరీ పని చేసిపెట్టాలని ఆయన అన్నారు. ఇక ఇప్పుడు ఏపీలో రాజకీయ పాలనతో అధికార యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. అర్హులకు పెన్షన్లు అందడం లేదు.. అలాగే ఇతర ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి కూడా. -
పీజీ వైద్య విద్య నిబంధనల సవరణ సబబే
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా చేరిన వారికి పీజీ వైద్య విద్యను అభ్యసించే నిమిత్తం కేటాయించే ఇన్‌సర్వీస్ కోటా నిబంధనలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 20న జారీ చేసిన జీవో–85లోని పలు నిబంధనలను హైకోర్టు సమర్థించింది. ఇన్‌సర్వీస్ కోటా కింద రిజర్వేషన్ సీటు పొందాలంటే నీట్ పీజీ, సూపర్ స్పెషాలిటీ పరీక్ష నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి 50 ఏళ్లు దాటి ఉండకూడదన్న నిబంధన విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. అలాగే పీజీ కోర్సు పూర్తి చేసిన తరువాత రాష్ట్రంలో పదేళ్ల పాటు సేవలు అందించాలన్న నిబంధనను కూడా సమర్థించింది. అంతేకాక ఇన్‌సర్వీస్ కోటా ఒప్పందాన్ని ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాను రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచడాన్ని కూడా హైకోర్టు సమర్థించింది. జీవో–85లోని ఈ నిబంధనలను ఎంతమాత్రం ఏకపక్షంగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలు వరించింది. కాల వ్యవధి, జరిమానా పెంపు వంటి సవరణలను సవాల్ చేస్తూ మేదరమెట్ల ప్రైమరీ హెల్త్ సెంటర్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ జి.చిట్టిబాబు పిటిషన్ దాఖలు చేశారు. -
మద్యం, జూదం, కాసుల వేట
సాక్షి, అమరావతి: ఇసుక నుంచి మద్యం దాకా కాసుల వేటకు అలవాటు పడిన టీడీపీ కూటమి నేతలు కోడి పందేలను వదల్లేదు. సంప్రదాయం ముసుగులో మూడు రోజులపాటు సాగించిన జూదక్రీడలో సంపాదనే లక్ష్యంగా బరి తెగించారు. మునుపెన్నడూ లేని విధంగా ఊరూవాడా కోడి పందాలు, పేకాట, గుండాటలను యథేచ్ఛగా నిర్వహించారు.వైఎస్సార్సీపీ హయాంలో సంప్రదాయాన్ని గౌరవిస్తూ మూడు రోజులపాటు షరతులతో కోడి పందేల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పచ్చ ముఠాలు ఎల్లో మీడియాలో నానా రభస సృష్టించాయి. గుడివాడలో క్యాసినో నిర్వహించారంటూ.. అమ్మ ఒడి సొమ్ము ఆవిరైపోయిందని.. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కున్నారంటూ దుష్ప్రచారాలకు తెగబడ్డ కూటమి నేతలు ఈ ఏడాది కోడి పందేలకు రాజకీయ రంగు పులిమి ఆదాయ మార్గంగా మార్చేశారు. రాష్ట్రాన్ని క్యాసినో అడ్డాగా మార్చేశారు. పలుచోట్ల కోడి పందేలను కూటమి ప్రజాప్రతినిధులు, మంత్రులు స్వయంగా ప్రారంభించడంతోపాటు వారి ఫొటోలతో బరుల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. చట్టాన్ని ఉల్లంఘించి.. జూదానికి జై కత్తులు కట్టి కోడి పందేలను నిర్వహించకూడదని చట్టాలు చెబుతుండగా కూటమి ప్రజా ప్రతినిధులు వాటిని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాలలో రూ.కోటికిపైగా ఖర్చు చేసి మినీ స్టేడియంలా తీర్చిదిద్దిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మూడు రోజుల పాటు జూదాల జాతర నడిపించారు. ఏలూరు జిల్లాలో ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్, కాకినాడలో జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పిఠాపురం టీడీపీ ఇన్చార్జీ వర్మ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పులివెందులలో బీటెక్ రవి కోడి పందేలను ప్రారంభించడంతోపాటు దగ్గరుండి పర్యవేక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటలో యథేచ్ఛగా పందేలు వేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కూటమి నేతల కనుసన్నల్లోనే పందేలు జరిగాయి. తాడిగడపలోని వక్ఫ్ భూమిలో, ఉభయ గోదావరి జిల్లాల్లో దేవాలయాలకు అతి సమీపంలో, రాయచోటిలో క్రషర్ స్థలాన్ని ఆక్రమించి మరీ కోడి పందేలు వేసినా పోలీసులు కన్నెత్తి చూడలేదు. సీజ్ ద గ్యాంబ్లింగ్.. అనలేరా? తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా జనసేన నేతలు కోడి పందేలకు ప్రత్యేక బరులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. భీమవరానికి సమీపంలోని తాడేరులో సంక్రాంతి సంబరాల పేరుతో ఏర్పాట్లు చేసుకున్న జనసేన స్థానిక నేతలు కోడి పందేలు, రాత్రి రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. తాడిగడపలో బరికి ఆనుకుని ఉన్న జాతీయ రహదారిపై అనధికారింగా టోల్ వసూళ్లకు దిగారు. కాకినాడలో సీజ్ ద షిప్ అని వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ జూద క్రీడలపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వసూళ్ల దందా.. మూడు రోజుల్లో ఏకంగా రూ.5 వేల కోట్లు బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారినట్టు అంచనా. ప్రతి పందేనికి ఒడ్డిన మొత్తంలో 10 శాతం కేవుల్ (కమిషన్) వసూలు చేశారు. అంటే పది నిమిషాల్లో తేలిపోయే కోడి పందెంలో బెట్టింగ్ రూ.కోటి గెలిస్తే అందులో రూ.10 లక్షలు నిర్వాహకులకు చెల్లించాలి. అనధికారికంగా మద్యం బెల్ట్‌షాపు మూడు రోజులు ఏర్పాటు చేసుకోవాలంటే బరి స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు నిర్వాహకులకు కప్పం కట్టారు. ఫలితంగా బెల్ట్‌షాపుల విక్రయాలతో మద్యం ఏరులై పారింది. గుండాట, పేకాట, కోతాట పెట్టాలంటే రోజుకు కనీసం రూ.10 వేల నుంచి రూ.లక్షకుపైగా రుసుం వసూలు చేశారు. కోడి పకోడి, బిర్యానీ, సిగరెట్, వాటర్, కూల్‌డ్రింక్స్ స్టాల్స్ పెట్టుకోవాలంటే రోజుకు రూ.5 వేల నుంచి రూ.25 వేలు చెల్లించాల్సి వచ్చింది. మోటార్ సైకిల్‌కు రూ.50, కార్కు రూ.200 వసూలు చేశారు. విజయవాడ రూరల్ మండలం పాములకాల్వ సమీపంలో బుధవారం రాత్రి పొద్దుపోయాక కోడిపందాలు నిర్వహించడంతో అక్కడకు వెళ్లిన వన్‌టౌన్ ఎస్సై హరిప్రసాద్‌పై నిర్వాహకులు తిరగబడటం కూటమి నేతల అరాచకాలకు పరాకాష్ట. -
బాలలకు నవోదయం
మదనపల్లె సిటీ: గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల జీవితానికి జవహర్ నవోదయ విద్యాలయం విజ్ఞాన వారధిగా నిలుస్తోంది. విలువలతో కూడిన విద్య, నైపుణ్యాలు, దేశభక్తి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనం, ఎన్సీసీ ఇలా అన్నింటికి నవోదయ విద్యాలయం ప్రసిద్ధి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సామాన్య, బడుగు, బలహీనవర్గాల పేద విద్యార్థులకు విద్యనందిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె సమీపంలోని వలసపల్లెలోని నవోదయ విద్యాలయం, ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పరిధిలోని రాజంపేట నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి ఈనెల 18న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో ఇందులో సీటు సాధించేందుకు మెలకువలను అక్కడి ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు. ఒకే బుక్‌లెట్‌లో (ప్రశ్నపత్రం) మూడు భాగాలుంటాయి.అంకగణితం పరీక్ష ప్రవేశ పరీక్షలో అంకగణితంలోని 23 చాçప్టర్ల నుంచి ఒక లెక్క వస్తుంది. సరాసరి, సంఖ్యల మీద మూల ప్రక్రియ, దశాంశాలను భిన్నంకాలుగా మార్చడం, భిన్నాంకాలను దశాంశాలుగా మార్చడం, వివిధ రకాల కొలతలు, పొడవులు, శక్తి, కాలం, ధనం మొదలైన వాటితో సంఖ్యతో వినియోగం, చిన్న సంఖ్యలు భిన్నంతో కూడిక, తీసివేత, గుణకారం,శాతాన్ని లెక్కించడం, లాభం, నష్టం (శాతం లెక్కింపు లాభం, నష్టం అంశం నుంచి వినహాయింపు) చుట్టుకొలత, ప్రాంతం–బహుభుజి, దీర్ఘచతురస్రం, త్రిభుజాలు వస్తాయి. వీటిపై ఎక్కువ సాధన చేయాలి. కోణం రకాలు, బార్ రేఖాచిత్రం తప్పకుండా వస్తుంది. –చలపతినాయుడు, గణిత ఉపాధ్యాయుడు, మదనపల్లెవిద్యార్థి సామర్థ్యం అంచనావిద్యార్థి పఠనాశక్తిని అంచనా వేయడానికి పరీక్ష ఉంటుంది. సొంతంగా గద్యభాగం ఇస్తారు. ప్రతి అంశానికి ఐదు ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చదివి ప్రశ్నలకు జవాబులను సమాధానపత్రంలో గుర్తించాలి. కింద ఒక గద్యాంశం, దానికి కొన్ని ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థి దీనిని ఒక నమునాగా గ్రహించాలి. గద్యభాగం అర్థం, తెలుగుకు సంబంధించిన గద్యభాగాలను ఎక్కువగా ఇస్తారు. చిన్న పిల్లలకు ఇచ్చే పుస్తకాల్లో ఏదైనా ఒక కథ అంశాన్ని ఎంచుకుని ఇస్తారు. తెలుగు వాచకంలో ఎక్కడ ఉండవు. వీటికి మంచి మార్కులు తెచ్చుకుంటే సీటు సాధింవచ్చు. –క్రిష్ణయ్య, ఉపాధ్యాయుడు, మదనపల్లెపరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశాంఉమ్మడి చిత్తూరు జిల్లాలో పరీక్షలు రాసే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశాం. 26 కేంద్రాలకు సిబ్బంది,ప్రత్యేక స్క్వాడ్, ఫ్లయింగ్ స్వా్కడ్ ఉంటారు. ప్రవేశపరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి నేరుగా సీట్లు కేటాయిస్తాం. ఇక్కడ సీటు వస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్ని వసతులు ఉంటాయి. ఒత్తిడి చేయడం, ప్రయోగ పూర్వకంగా బోధిస్తాం. ప్రతి రోజూ ఆయా తరతగతుల ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటుంది. –వేలాయుధన్, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ, మదనపల్లెప్రవేశ పరీక్ష తేదీ: 18–1–2025 ప్రవేశం: 6వ తరగతి పరీక్షా కేంద్రాలు: 26సమయం: ఉదయం 11.30 నుంచిమధ్యాహ్నం 1.30 గంటల వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు: 5058సీట్లు: రాజంపేటలో 80, మదనపల్లెలో 80 -
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం గ్యాప్–2లో 2016–19 మధ్య నాటి చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1.5 మీటర్ల మందంతో నిర్మించేందుకు రాష్ట్ర జల వనరులశాఖ, ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా, సబ్ కాంట్రాక్టు సంస్థ బావర్ రూపొందించిన డిజైన్‌పై ఆమోద ముద్ర వేసింది. నిర్మాణంలో టీ–16 రకంతో పోల్చితే టీ–5 రకం కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించడమే శ్రేయస్కరమని సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) చేసిన ప్రతిపాదన వైపు సీడబ్ల్యూసీ మొగ్గు చూపింది. అయితే డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్ మిశ్రమంపై.. ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం పటిష్టతపై 28 రోజుల పరీక్ష నివేదికల ఆధారంగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీవోఈ) సూచన తీసుకోవాలని మెలిక పెట్టింది. నిర్మాణ పనుల్లో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటికి రాష్ట్ర జల వనరుల శాఖ, మేఘా, బావర్ సంస్థలే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం సీడబ్ల్యూసీ డైరెక్టర్ రాకేశ్ టొతేజా లేఖ రాశారు. కాంక్రీట్ మిశ్రమంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ అభిప్రాయం తీసుకుని ఒకట్రెండు రోజుల్లో పనులు చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ఇలా.. » ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా 6 మీటర్ల ఎగువన 89.09 మీటర్ల నుంచి 1,485.69 మీటర్ల మధ్య 1,396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తారు.» కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం భారీ గ్రాబర్లు, ట్రెంచ్ కట్టర్ యంత్రాలతో భూమిని తవ్వుతూ ప్యానళ్లను దించుతూపోతారు. రాతి పొర తగిలే(కనిష్టంగా పది మీటర్లు.. గరిష్టంగా 93.5 మీటర్లు) వరకూ ప్యానళ్లను దించి.. ఆ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని పంపుతారు. ఆ తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కాంక్రీట్ మిశ్రమంతో కొంత బెంటనైట్ మిశ్రమం కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్ గోడగా ఏర్పడుతుంది. అదే డయాఫ్రం వాల్. » డయాఫ్రం వాల్‌కు లీకేజీ (సీపేజీ) ఫర్మియబులిటీ (తీవ్రత) ఒక లీజీయన్ లోపు ఉండాలి(ఫర్మియబులిటీని లీజీయన్ లలో కొలుస్తారు). అప్పుడే ఆ డయా ఫ్రం వాల్ నాణ్యంగా ఉన్నట్లు లెక్క. గ్యాప్–1లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రం వాల్లో లీకేజీ ఫర్మియబులిటీ ఒక లీజీయన్ లోపే ఉండటం గమనార్హం. -
మమ్మల్ని గర్వపడేలా చేశావు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా పుచ్చుకున్న సందర్భంగా కుమార్తె వర్షారెడ్డికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘వర్షమ్మకు అభినందనలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్‌లో చదివి పట్టభద్రురాలవడంతోపాటు, డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని స్పందించారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. Congratulations dear! Not only have you graduated from a prestigious institute such as King’s College London, but you have made us proud passing with distinction! God bless you dear! pic.twitter.com/8QN5qrGOEe— YS Jagan Mohan Reddy (@ysjagan) January 16, 2025 -
‘జీఎస్డీపీ పెంపే సంపద సృష్టి!’
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తిని (జీఎస్డీపీ) పెంచడమే సంపద సృష్టి అని, దాన్ని చూపించి అప్పులు తేవడంతో పాటు.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ద్వారా అభివృద్ధి, సంక్షేమానికి వ్యయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అదే తన విజన్ 2047 అని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై గురువారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి పెరిగే జీఎస్డీపీ అంచనాలతో అదనంగా ఎంత అప్పు చేసేది, తద్వారా అదనంగా వ్యయానికి ఎన్ని నిధులు వస్తాయనేది వివరిస్తూ.. ఇదే రీతిలో విజన్–2047 నాటికి ఏటా 15 శాతం వృద్ధితో (ఊహాజనిత) జీఎస్డీపీ, తలసరి ఆదాయం పెరుగుదలపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ఆర్థిక ఏడాదితో పోల్చితే, ఈ ఆర్థిక ఏడాది ప్రస్తుత ధరల ప్రకారం ముందస్తు అంచనా మేరకు రాష్ట్ర స్తూల ఉత్పత్తి అదనంగా 4.03 శాతం పెరిగిందన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం ముందస్తు అంచనాల మేరకు 2024–25 ఆర్థిక ఏడాది జీఎస్డీపీ 12.94 శాతం వృద్ధిగా ఉందని తెలిపారు. పారిశ్రామిక రంగం వృద్ధి గత ఆర్థిక ఏడాది 7.42 శాతం ఉంటే, ఈ ఆర్థిక ఏడాది ముందస్తు అంచనా మేరకు 6.71 శాతంగా ఉందని చెప్పారు. 2025–26 నుంచి 2029–30 వరకు జీఎస్డీపీ పెంచడం ద్వారా అదనంగా రూ.4,35,867 కోట్ల అప్పు చేస్తానని, తద్వారా అదనంగా వ్యయం చేయడానికి రూ.1,58,987 కోట్లు వస్తాయని చెప్పారు. విజన్–2047 లక్ష్యం తలసరి ఆదాయం రూ.58 లక్షలకు పెంచడమేనని స్పష్టం చేశారు. పెరిగిన తలసరి ఆదాయాన్ని ప్రజలు ఖర్చు చేస్తారని, దాంతో రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పారు.విజన్–2047పై 16 లక్షల అభిప్రాయాలుకేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్‌కు కూడా రాని రీతిలో రాష్ట్ర విజన్–2047పై ఏకంగా 16 లక్షల మంది అభిప్రాయాలను తెలిపారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏటా 15 శాతం చొప్పున వృద్ధి సాధిస్తే 2047 నాటికి జీఎస్డీపీ రూ.3.47 కోట్లకు చేరుతుందని, ఈ లెక్కన తలసరి ఆదాయం రూ.58.14 లక్షలకు చేరుతుందని వివరించారు. నిరంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఇది సాధ్యమని, లేదంటే తలసరి ఆదాయం రూ.13 లక్షలకే పరిమితం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ లక్ష్యాలు వాస్తవ రూపం దాల్చితేనే తాను చెప్పిన రీతిలో జీఎస్డీపీ ఉంటుందని, లేదంటే అప్పులు చేయడమే మార్గమని అన్నారు. లక్ష్యాలు వాస్తవ రూపం దాల్చకపోతే రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్తుందన్నారు. ఇప్పుడు అప్పులు ఇవ్వడం లేదని, బ్యాంకులు గానీ, ఇతర సంస్థలు గానీ అప్పులు ఇవ్వాలంటే విశ్వసనీయత ప్రధానమని చెప్పారు. పీ–4లో భాగంగా రాష్ట్రంలో కుటుంబ సభ్యులందరినీ అనుసంధానం చేస్తూ, ప్రతి ఇంటిని జీయో ట్యాగింగ్ చేసి వారి అకౌంట్లను తీసుకున్నామన్నారు. ఈ నెల 18 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తామని, తద్వారా సెల్ ఫోన్ ద్వారా ప్రజలకు 150 సేవలు అందిస్తామని చెప్పారు. పీ–4లో జనాభాయే ఆస్తి అని చెప్పారు. పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేస్తామన్నారు. తాను పెన్షన్ పెంచడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులను పిల్లలు చూసుకుంటున్నారని అన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారు పేదలను పైకి తీసుకురావడానికి ముందు రావాలన్నారు. ఎవరైనా ఒకరిని చంపితే వారికీ అదే గతిరాయలసీమ తరహాలో ఒకరి పోస్ట్‌మార్టమ్‌కు కారణమైన వారికి కూడా పోస్ట్‌మార్టం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టబోమని, రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఒకరిని చంపితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని.. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది పార్టీ కార్యకర్తలేనని, బ్యూరోక్రసీ కాదన్నారు. అందువల్ల కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో విర్రవీగిన వారిని కంట్రోల్లో పెట్టామన్నారు. గంజాయి, డ్రగ్స్, లిక్కర్ దందాలను నిరోధిస్తున్నామని చెప్పారు. -
Andhra Pradesh: కృష్ణా జలాల 'హక్కులు హుళక్కే'!
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునేలా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ) 2లో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థ వాదనలు వినిపించడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ) 1956 సెక్షన్ 3 ప్రకారం కేంద్రం జారీ చేసిన తాజా విధి విధానాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలంటే.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను సవరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఆ చట్టానికి సవరణ చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విభజన చట్టాన్ని సవరించకుండా సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన విధి విధానాలను అనుసరించి విచారణ చేయడానికి వీల్లేదనే కోణంలో వాదనలు వినిపించకుండా కూటమి ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని నిపుణులు తప్పుబడుతున్నారు. చంద్రబాబు సర్కారు సమర్థంగా వాదనలు వినిపించకపోవడం వల్లే సెక్షన్ 3 ప్రకారమే కృష్ణా జలాల పంపిణీపై వాదనలు వింటామని కేడబ్ల్యూడీటీ 2 గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని.. అంతిమంగా ఇది రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలుత రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయ ప్రయోజనాల కోసం.. ఆ తరువాత ఓటుకు కోట్లు కేసుతో వ్యక్తిగత లబ్ధి కోసం 2014–19 మధ్య కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణకు తాకట్టు పెట్టిన తరహాలోనే ఇప్పుడు కూడా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.బాబు సర్కారు నిర్వాకంతో...కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులకు 811 టీఎంసీలను కేటాయిస్తూ 1976 మే 27న కేడబ్ల్యూడీటీ–1 తీర్పు ఇచ్చింది. అయితే కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమలులోకి రాని నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 తీర్పే ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ క్రమంలో విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్ 89 ద్వారా కేడబ్ల్యూడీటీ–2కే కేంద్రం అప్పగించింది. రెండు రాష్ట్రాలకు నీటి లెక్కలను ట్రిబ్యునల్ తేల్చే వరకూ.. కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అదే విధానంలోనే 2023–24 వరకూ కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తోంది. అయితే ఐఎస్ఆర్డబ్యూడీఏ 1956 సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ జల్ శక్తి శాఖకు లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2023 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ కేడబ్ల్యూడీటీ–2కు అదనపు విధి విధానాలను జారీ చేసింది. వాటిని సవాల్ చేస్తూ 2023 అక్టోబర్ 31న సుప్రీంకోర్టులో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. అయితే సుప్రీంకోర్టులో ఆ రిట్ పిటిషన్‌పై సమర్థంగా వాదనలు వినిపించడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. విభజన చట్టానికి విరుద్ధంగా కేంద్రం సెక్షన్ 3 కింద జారీ చేసిన అదనపు విధి విధానాలు చెల్లుబాటు కావనే కోణంలో సుప్రీం కోర్టులో వాదనలు వినిపించి ఉంటే.. కేడబ్ల్యూడీటీ–2లో ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు.నాటి తరహాలోనే నేడూ..విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇటు ఏపీ, అటు తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం రెండు కళ్లు, కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ.. నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. అయితే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం, పులిచింతల విద్యుత్ కేంద్రం తమ భూభాగంలో ఉన్నాయంటూ తెలంగాణ సర్కార్ వాటిని తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే నాగార్జునసాగర్ స్పిల్ వేలో సగభాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ రాష్ట్ర భూభాగంలో ఉన్నా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఆధీనంలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్ చేతికి చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. దీంతో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస తదితర ప్రాజెక్టులను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టినా నాడు చంద్రబాబు నోరు మెదపలేదు. ఫలితంగా తెలంగాణ సర్కార్ ఏపీ హక్కులను కాలరాస్తూ శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు తరలిస్తూనే ఉంది. తెలంగాణ సర్కార్ జల దోపిడీపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసిన ఫలితంగానే 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగ భాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించిందని ప్రస్తావిస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ 2014–19 తరహాలోనే వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కృష్ణా జలాలను అక్రమంగా తరలించేలా కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ చేపట్టినా చంద్రబాబు కనీసం నోరెత్తడం లేదని.. కేడబ్ల్యూడీటీ–2లోనూ సమర్థంగా వాదనలు వినిపించడం లేదని నిపుణులు ఆక్షేపిస్తున్నారు. -
‘తాగు.. తిను.. ఊగు.. సంక్రాంతి పేరుతో కూటమి సర్కార్ దోపిడీ’
సాక్షి, విజయవాడ: సంక్రాంతిని కూటమి ప్రభుత్వం దోచుకుందని.. దోపిడీకి ఏ మార్గాన్ని వదలడం లేదంటూ వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్(Pothina Mahesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సంక్రాంతి(Sankranti)ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారు. సంక్రాంతి సంబరాలను క్యాసినో స్థాయికి తీసుకెళ్లారు. పాఠశాలలను కూడా జూద కేంద్రాలుగా మార్చేశారు’’ అని దుయ్యబట్టారు.‘‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాల బరుల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేల కోట్లు సంపాదించారు. మద్యాన్ని ఏరులై పారించారు. రికార్డింగ్ డాన్స్‌లు చేయించారు. పండుగను అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకున్నారు. పేదలు ఈ సంక్రాంతి పండుగకు దూరమయ్యారు. తాగు... తిను.. ఊగు అనే కొత్త నినాదాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది’’ అంటూ పోతిన మహేష్ ధ్వజమెత్తారు.‘‘సంక్రాంతి సంబరాలను ఆర్గనైజింగ్ క్రైమ్‌గా మార్చేశారు. జూదం అధికారికమే అనేలా కూటమి అనుమతులిచ్చింది. ఐపీఎల్ మాదిరి కోడి ప్రీమియర్ లీగ్‌లు పెట్టారు. పనులు చేసుకోవద్దు.. వ్యసనాలకు అలవాటు పడండని చంద్రబాబు ప్రజలకు చెప్పదలచుకున్నారా సమాధానం చెప్పాలి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణంరాజు కోడి పందాల్లో పాల్గొన్నారు. మహిళా బౌన్సర్లను పెట్టి విష సంస్కృతి తెచ్చారు. మైనర్లు సైతం గుండాట, పేకాట ఆడారు. కోడి పందాలు ఆడుకోవచ్చని అనుమతులుచ్చారా.. హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలి’’ అని మహేష్ నిలదీశారు.‘‘భీమవరంలో క్యాసినో సెంటర్ పెట్టారు. కుక్కుట శాస్త్రం ప్రకారం రూ.కోటి 25 లక్షలతో ముహూర్తం పెట్టి ఆడించారు. చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి. కోడి పందాల బరులకు టీడీపీ, జనసేన ట్యాక్స్ కట్టించుకున్నారు. స్కూళ్లలో కోళ్ల పందాలు పెట్టి విద్యార్ధులకు ఏం సందేశం ఇస్తారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. గోదావరి జిల్లాలకు ధీటుగా కృష్ణాజిల్లాలో 320కి పైగా కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు’’ అని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు...ఇదేం పాలన అని జనం చంద్రబాబు, పవన్‌ను తిట్టుకుంటున్నారు. వైఎస్ జగన్‌ను అనవసరంగా వదులుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విజనరీ ఎవరని ప్రజల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రాన్ని కోడి పందాలు.. పేకాటకు కేరాఫ్‌గా మార్చాలనుకుంటున్నారా చంద్రబాబు?. అశ్లీల నృత్యాలేనా పర్యాటకం అభివృద్ధి అంటే. ఇదేనా చంద్రబాబు మీ విజన్ 2047 అంటే. కోడి పందాలను ప్రమోట్ చేసిన ఒక్క సెలబ్రిటీ మీదనైనా కేసు పెట్టారా?. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను చంద్రబాబు, పనన్ సర్వ నాశనం చేస్తున్నారు.ఇదీ చదవండి: పుణ్యక్షేత్రంలో పాపాల భైరవులు ఎవరు?..పేకాట, కోడి పందాలు.. అశ్లీల నృత్యాలు చూడాలంటే ఏపీకి వెళ్లాలని పొరుగు రాష్ట్రాల్లోని ప్రజలు అనుకుంటున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు కట్టిన జగన్ అసలైన విజనరీ. ఉపాధి అవకాశాలు కల్పించలేమని పవన్ చెప్పిన కొద్దిసేపటికే ఇద్దరు యువకులు చనిపోయారు. ఇద్దరి చావుకు కారణమైన పవన్‌పై కేసు పెట్టాలా వద్దా?. పవన్ పదే పదే సనాతన ధర్మం.. సంస్కృతి అంటున్నారు. కోడి పందాలు, పేకాట, గుండాట ఆడటమే ధర్మమా?..అశ్లీల నృత్యాలే మన సంస్కృతా... పవన్ సమాధానం చెప్పాలి. ఇటీవల పవన్ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అడిగేవాడు లేక జనసేన కార్యకర్తలు బరితెగించారు. నేషనల్ హైవేపై టోల్ గేట్ పెట్టడమేంటి?. కోడి పందాలు నిర్వహించినందుకు పవన్ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేయలేదు. పార్టీలో చేర్చుకున్న భూకబ్జాదారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నలు గుప్పించారు. -
ప్రాజెక్ట్ చిరుత.. పరాజిత
భారతదేశంలో అంతరించిపోయిన చిరుత జాతులను పునరుజ్జీవింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ చిరుత’ (ప్రాజెక్ట్ చీతా) ప్రశ్నార్థకంగా మారింది. అడవిలో వదిలిన చిరుతల్లో జీవించి ఉన్న ఒకే ఒక చిరుత పవన్ కొద్దినెలల క్రితం మృతి చెందడంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. వన్యప్రాణి ప్రేమికుల ఆనందోత్సాహాల మధ్య 2022 సెప్టెంబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆఫ్రికాలోని నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. వాటిలో మొట్టమొదటిది పవన్. ఆఫ్రికన్ చీతాలు సాధారణంగా 10 నుంచి 12 సంవత్సరాలపాటు అడవిలో జీవిస్తాయి. కానీ.. పవన్ ఆరేళ్ల వయసులోనే బతకలేక చనిపోయింది. దీంతో చీతా ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, అమరావతిసరైన సంరక్షణా చర్యలు లేవా! పవన్ మృతి చెందిన తర్వాత మిగిలి ఉన్న చీతాలన్నింటినీ ఎన్క్లోజర్లు, అడవిలా తీర్చిదిద్దిన ప్రాంతాల్లో ఉంచి వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో చీతా ప్రాజెక్టు అతి పెద్దది. దేశంలోని చాలా వన్యప్రాణుల ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను ఈ ప్రాజెక్టుకు మళ్లించి సుమారు 58 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టారు. అయితే, శాస్త్రీయ అధ్యయనం, సరైన సంరక్షణ చర్యలు లేకపోవడం వల్లే అత్యంత ఖరీదైన ఈ ప్రాజెక్టు విఫల దశలో ఉన్నట్టు చెబుతున్నారు. సరైన ప్రణాళిక, అవగాహన లేకుండా చీతాలను ఆఫ్రికా నుంచి తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్టు వన్యప్రాణుల నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చేసి ఉంటే.. ఆఫ్రికన్ చీతాలకు అనువుగా ఉండే అడవులను మొదట సిద్ధం చేసి ఆ తర్వాత వాటిని తీసుకురావాల్సి ఉంది. కానీ.. ముందే వాటిని తీసుకువచ్చి ఆ తర్వాత కునో జాతీయ పార్కు అందుకు అనువైనదని భావించి అందులో వదిలారు.కానీ.. కునో పార్కు వాటికి సరైన ఆవాసం కాదని తేలింది. అందుకే చీతాలు అందులో జీవించలేకపోయాయి. దీంతో కొన్ని గడ్డి మైదానాల్లోని ఫెన్సింగ్‌లు, క్యాప్టివ్ బ్రీడింగ్‌పై ఆధారపడ్డారు. కేవలం ప్రచారం కోసం పాకులాడడం తప్ప నిబద్ధత లోపించడంతో వన్యప్రాణుల ప్రాజెక్టులకు సంబంధించి భారతదేశం పరువు అంతర్జాతీయంగా మసకబారింది. అత్యంత వేగం చిరుతల ప్రత్యేకతచిరుతలు అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు. మూడు సెకన్లలోనే గంటకు 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం వీటి ప్రత్యేకత. 1967 వరకూ ఇవి మన దేశంలోనూ ఉన్నాయి. వాటి ఆవాసాలు కుచించుకుపోవడం, అడవులు తగ్గిపోవడం, వేటాడటం, సింహాలు, పులులు, చిరుతలు వాటి ఆహారం కోసం పోటీ పడుతుండడంతో క్రమేపీ అవి దేశంలో అంతరించిపోయాయి. ఇన్ఫెక్షన్లు, గాయాలతో.. దేశంలో వీటిని మళ్లీ పునరుజ్జీవింపచేసేందుకు నమీబియా, కెన్యా, దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికన్ దేశాలతో కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల్లో సంప్రదింపులు జరిపింది. ఇందుకోసం 2021లో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మన అడవుల్లో చీతాల పునరుత్పత్తిని ప్రారంభించి అడవిలో వాటి జనాభాను పెంచాలని భావించింది. అయితే.. తీసుకువచ్చిన చీతాలను అడవిలో వదిలిన తర్వాత అవి ప్రాణాంతకమైన సెప్టిసిమిమా వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడ్డాయి. మరికొన్ని ప్రమాదాల వల్ల గాయాలపాలయ్యాయి. దీంతో వాటిని ఎన్‌క్లోజర్లలోనే ఉంచి పర్యవేక్షించారు. ప్రభుత్వం చీతా ప్రాజెక్టు చేపట్టిన లక్ష్యాన్ని సాధించాలంటే పర్యావరణ వ్యవస్థలో భాగమైన గడ్డి భూముల అడవుల్లో మనుగడ సాగిస్తేనే ఉపయోగం ఉంటుంది. అలాంటి వాతావరణం లేకపోవడంతో అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ మిగిలిన ఏకైక చీతా పవన్ మృతి చెందింది. అంతకుముందు 12 చీతాలు కూడా ఇలాగే మృత్యువాతపడ్డాయి. ప్రస్తుతం కునో నేషనల్ పార్కులో 12 చీతాలు, మరో 12 పిల్ల చీతాలు ఎన్క్లోజర్లలో ఉన్నాయి. వాటిని అడవిలోకి వదిలితే అవి బతుకుతాయో లేదోననే అనుమానాలు, భయాలతో వాటిని అక్కడే ఉంచి సంరక్షిస్తున్నారు. ఇలా సంరక్షణలో ఉన్న చీతాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. -
చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మెదపని సీఐడీ
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును అటకెక్కించేసిన సీఐడీ ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ అదే రీతిన వ్యవహరించింది. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గట్టిగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ఇప్పుడు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోయింది. స్కిల్ కుంభకోణం కేసులో చార్జిషీట్లు దాఖలు చేసేశామన్న సీఐడీ.. ఇక చేసేదేమీ లేదన్నట్టు సుప్రీంకోర్టు ముందు వ్యవహరించింది. దీంతో దర్యాప్తు సంస్థ అయిన సీఐడీనే చంద్రబాబు బెయిల్ రద్దు విషయంలో అసహాయత వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరించింది. స్కిల్ కుంభకోణం కేసు విచారణకు అవసరమైన సమయంలో సహకరించాలని సీఎం చంద్రబాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.చంద్రబాబే సీఎం కావడంతో మారిన సీన్చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా రూ.వందల కోట్లు దారి మళ్లాయి. షెల్ కంపెనీల ద్వారా విదేశీ ఖాతాలకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి టీడీపీ అధికారిక ఖాతాల్లోకి ఆ నిధులు వచ్చాయి. దీనిపై గత ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ ప్రాథమిక విచారణ జరిపి నిధుల మళ్లింపు వాస్తవమేనని తేల్చింది. ఇందుకు గాను చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు 2023 నవంబర్‌లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీఐడీ అదే నెలలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరింది. తమ తరఫున వాదనలు వినిపించేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని నియమించుకుంది. దీనిపై అప్పటినుంచి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది. ఈ మధ్యలో ప్రభుత్వం మారడం.. స్కిల్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబే ముఖ్యమంత్రి కావడంతో సీఐడీ తన దర్యాప్తును అటకెక్కించేసింది. చార్జిషీట్ల దాఖలులో అసాధారణ జాప్యం చేసింది. స్కిల్ కుంభకోణం కేసును ఎన్ని రకాలుగా నీరుగార్చాలో అన్ని రకాలుగా నీరుగార్చేందుకు చర్యలు తీసుకుంది.జోక్యం అవసరం లేదన్న సీఐడీతాజాగా బుధవారం సీఐడీ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హైకోర్టు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి మరీ తీర్పునిచ్చిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాలేదు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశామని, అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్‌పై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రమే సీఐడీ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ, చార్జిషీట్ దాఖలు చేసినందున చంద్రబాబు బెయిల్ విషయంలో ఇప్పుడు తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. సీఐడీ పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. -
సర్వర్లు పనిచేయవు...వెబ్సైట్ ఓపెన్ కాదు!
రబీ సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలు కావస్తున్నా ఈ–క్రాప్ నమోదులో సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. సర్వర్లు పనిచేయక, వెబ్సైట్ సకాలంలో ఓపెన్ అవ్వక, క్షేత్రస్థాయి పరిశీలనలో యాప్ సరిగా పనిచేయకపోవడంతో సిబ్బంది సతమతమవుతున్నారు. రబీ సాగు లక్ష్యం 57.66 లక్షల ఎకరాలు కాగా..ఇప్పటి వరకు 30.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు 22.76 లక్షల ఎకరాల్లో (74%) సాగైన పంటలను మాత్రమే ఈ–పంటలో నమోదు చేయగలిగారు. ఇక ఈ–కేవైసీ నమోదు మాత్రం వీఏఏలు 16.92 లక్షల ఎకరాలకు, వీఆర్వోలు, 11.77 లక్షల ఎకరాలకు సంబంధించి అథంటిఫికేషన్ పూర్తి చేయగా, రైతుల ఈ–కేవైసీ మాత్రం 3.55 లక్షల ఎకరాలకు (30%) మించి పూర్తి కాలేదు. రైతులు ఇష్టపూర్వకంగానే ఈ–కేవైసీ నమోదుకు అవకాశం కల్పించడంతో ఈ–కేవైసీ నమోదుకు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాధాన్యతనివ్వడం లేదని చెబుతున్నారు. – సాక్షి, అమరావతి వెబ్సైట్లోనే అప్డేట్కు అవకాశం తొలుత ఈ–పంట నమోదులో తెలిపిన వివరాలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిశీలనలో మార్పులు, చేర్పులు ఉంటే గతంలో మొబైల్ యాప్‌లోనే అప్డేట్ చేసేవారు. ఉదాహరణకు, తొలుత తాను వరిని మాత్రమే సాగు చేస్తానని చెప్పిన రైతు, ఆ తర్వాత వరితో పాటు మరికొన్ని పంటలు కూడా సాగు చేస్తోన్న సందర్భంలో ఆ వివరాలను యాప్‌లో అప్లోడ్ చేసే వెసులుబాటు ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ మేరకు మార్పులు చేర్పులన్నీ రైతు సేవా కేంద్రానికి వచ్చి ఈ పంట వెబ్సైట్లోనే అప్టేడ్ చేయాల్సి ఉంది. దీంతో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతు సేవా కేంద్రం సిబ్బంది వాపోతున్నారు. 200 మీటర్ల వరకు మాగాణి, 50 మీటర్ల వరకు మెట్ట పొలాల్లో వెసులుబాటు ఇచ్చినప్పటికీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రోజుకు 10 కి.మీ మించి వెళ్లలేని పరిస్థితి ఉంది. రోజుకు 100 ఎకరాలు ఈ–క్రాప్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, క్షేత్రస్థాయిలో 40 ఎకరాలకు మించి పూర్తవడంలేదు. ఇటు ఎన్యుమరేషన్, అటు ఈ–క్రాప్ నమోదుకు రోజుకు 10–12 గంటలు పనిచేస్తున్నా పూర్తి కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. -
రాత్రికి రాత్రే రూ.12కోట్ల బెరైటీస్ లూటీ
సాక్షి ప్రతినిధి, కడప : అందరూ సంక్రాంతి సంబరాల్లో జోరుగా హుషారుగా మునిగితేలుతుంటే తెలుగుదేశం తమ్ముళ్లు ఇదే అదనుగా దోపిడీకి తెగబడ్డారు. సందట్లో సడేమియాలా రూ.12 కోట్ల విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టారు. వెలికితీసి నిల్వ ఉంచిన బెరైటీస్‌ను లూటీ చేసేశారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన మైనింగ్ లీజుదారులు అధికారులకు విన్నవించినా ఉపయోగంలేకుండా పోయింది.వైఎస్సార్ జిల్లా వేముల మండల కేంద్రంలో పులివెందుల టీడీపీ తమ్ముళ్లు రాత్రికి రాత్రే ఈ దోపిడీకి బరితెగించారు. వివరాలివీ..వేముల గనుల్లో వెలికితీసిన బెరైటీస్ ఖనిజాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి వేలంలో టిఫిన్ బెరైటీస్ ఆస్బెస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ ప్రాంగణంలో దాదాపు 3,500 టన్నులు నిల్వలు అధికారికంగా ఉన్నాయి. ఈ స్టాకుపై తెలుగు తమ్ముళ్ల కన్నుపడింది. అక్రమ మైనింగ్ చేస్తే కొంతమేరే అక్రమ ఆదాయం వస్తుంది.. అదే రాత్రికి రాత్రే నిల్వ ఉన్న ఈ ఖనిజాన్ని కొల్లగొడితే దెబ్బకు ఒకేసారి భారీగా లబ్ధిపొందవచ్చని వారు భావించారు. అంతే.. సుమారు 3వేల టన్నుల బెరైటీస్‌ను ఉన్నపళంగా తరలించేశారు. మరోవైపు.. తెలుగుదేశం నేతలు తమ కంపెనీ ప్రాంగణంలోకి అక్రమంగా చొరబాట్లకు పాల్పడుతున్నారని.. పైగా అక్రమ మైనింగ్‌కూ పాల్పడుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిరుపయోగమే అయ్యిందని ఆ సంస్థ ప్రతినిధి వాపోయారు. సుమారు రూ.12 కోట్ల విలువైన ఖనిజాన్ని 20 లారీల ద్వారా తెల్లవారేలోపే వివిధ ప్రాంతాలకు తరలించేశారని.. వారి పన్నాగాన్ని పసిగట్టి అటు మైనింగ్ అధికారులకు ఇటు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో లూటీకి ఆస్కారం ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు.బీటెక్ రవి ప్రోద్బలంతోనే..ఇదిలా ఉంటే.. టిఫిన్ కంపెనీకి చెందిన దాదాపు 3 వేల టన్నుల బెరైటీస్‌ను అక్రమంగా రాత్రికి రాత్రే తరలించుకుపోవడం వెనుక పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి ఉన్నారని.. ఆయన ప్రోద్బలంవల్లే ఇది సాధ్యమైందని ఆ కంపెనీ ఏజెంట్, వైఎస్సార్సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డి (వేల్పుల రాము) మీడియాకు వెల్లడించారు.అలాగే, వేముల మండల టీడీపీ నేతలు పార్థసారథిరెడ్డి, మబ్బుచింతలపల్లె శ్రీనాథ్రెడ్డిల ప్రత్యక్ష ప్రమేయంతో పెద్దపెద్ద యంత్రాల ద్వారా లోడింగ్ చేస్తూ దాదాపు 20 లారీల బెరైటీస్‌ను తెల్లవారేలోపు కడపలోని పవన్, డైమండ్, జకరయ్య మినరల్స్‌కు తరలించారన్నారు. మరికొంత స్టాకు వేములలోని రామిరెడ్డితోటకు, పేర్ల పార్థసారథిరెడ్డి ఇంటి దగ్గర నిల్వ ఉంచారని తెలిపారు. నిజానికి.. కూటమి ప్రభుత్వం వచ్చాక కంపెనీ ప్రతినిధిని అయిన తనను అనేక విధాలుగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని.. కుదరకపోవడంతో చివరికి హత్యాయత్నానికి కూడా తెగబడ్డారన్నారు. వారి బెదిరింపులకు భయపడకుండా వీరి గురించి అధికారులతో పాటు చివరికి ఎస్పీ హర్షవర్థన్‌రాజుకు సైతం స్వయంగా ఫిర్యాదు చేశానన్నారు. ఎన్సీఎల్టీ ద్వారా కొనుగోలు చేసిన ఈ స్టాకుపైన హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులున్నా టీడీపీ నేతలు కొల్లగొట్టుకుపోయారని వారికి తెలిపానన్నారు. అవసరమైతే పోలీసు పికెట్ ఏర్పాటుచేయాలని డీఎస్పీ, ఎస్ఐలను ఆదేశించారనన్నారు. అయినా.. సంక్రాంతి రోజున రాత్రికి రాత్రే మాయంచేశారని వేల్పుల రామలింగారెడ్డి వాపోయారు. ఈ విషయంలో తాము న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. -
అలా చూస్తూ ఉంటే బీపీ వచ్చేస్తుంది
సాక్షి, అమరావతి: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వినోదం, వ్యాపార ప్రకటనలు, ప్రచారాల్లో రీల్స్, షార్ట్ వీడియోస్ హవా నడుస్తోంది. పిల్లలు, కుర్రకారు, పెద్దలు కూడా మొబైల్ రీల్స్ చూడటానికి గంటల సమయం కేటాయిస్తున్నారు.కొంచెం ఖాళీ సమయం దొరికితే చాలు మొబైల్లో ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్‌లు ఓపెన్ చేయడం.. అందులో వచ్చే షార్ట్ వీడియోస్, రీల్స్ చూస్తూ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం ఓ దైనందిన కార్యక్రమం అయిపోయింది. ఇది రాన్రాను ఓ వ్యసనంలా మారి, విలువైన సమయాన్ని హరించడంతో పాటు, అధిక రక్తపోటు (బీపీ) ముప్పు తెస్తోందని చైనాలోని హెబేయ్ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 4,318 మంది యువత, మధ్య వయసు వారిపై చేసిన అధ్యయనంలో వెల్లడైన వివరాలను తాజాగా బీఎమ్సీ జర్నల్‌లో ప్రచురించారు.తొమ్మిది నెలల పాటు విశ్లేషణ ఈ శాస్త్రవేత్తలు 2023 జనవరి నుంచి సెప్టెంబరు వరకు మెడికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న 4,318 మంది యువకులు, మధ్య వయస్కుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించారు. 2,245 మంది పురుషులు, 1893 మంది స్త్రీలపై ఈ అధ్యయనం చేశారు. వారికి పలు రకాల పరీక్షలు నిర్వహించి, రాత్రిళ్లు నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్లల్లో ఎంత సేపు రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తున్నారనే అంశాన్ని పరిశీలించారు. రాత్రిళ్లు ఎక్కుసేపు రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తూ గడిపే యువత, మధ్య వయసు వారిలో బీపీ బారినపడే ప్రమాదం పెరుగుతున్నట్లు నిర్ధారించారు. రీల్స్, షార్ట్ వీడియోలు చూసే సమయాన్ని వీలైనంత తగ్గించాలని, ఈ వ్యసనాన్ని పూర్తిగా వీడితే మంచిదని సూచించారు. దీంతోపాటు శరీర బరువును అదుపులో పెట్టుకోవడం, రక్తంలో కొవ్వు, చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు. -
హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయాధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు న్యాయాధికారులు (జిల్లా జడ్జిలు) కోటా నుంచి ఇద్దరు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్మానం చేసింది. జుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ యడవల్లి లక్ష్మణరావును హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ ఇద్దరి నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత అవి ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తరువాత వీరి నియామకాన్ని కేంద్ర న్యాయ శాఖ నోటిఫై చేస్తుంది.ముగ్గురిని సిఫారసు చేసిన హైకోర్టు కొలీజియంహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని హైకోర్టు కొలీజియం గత ఏడాది మేలో న్యాయాధికారుల కోటా నుంచి హరిహరనాథ శర్మ, లక్ష్మణరావుతో పాటు ప్రస్తుతం శ్రీకాకుళం ప్రధాన జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్న జునైద్ అహ్మద్ మౌలానా పేర్లను సుప్రీంకోర్టుకి సిఫారసు చేసింది. వీరిలో సుప్రీం కోర్టు ఇద్దరి పేర్లకు ఆమోద ముద్ర వేసింది. జునైద్ విషయంలో సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుందో తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఈ పేర్లకు సుప్రీం కోర్టు కొలీజియం ఇంతకు ముందే ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ఈ ఇద్దరికి సంబంధించి అదనపు వివరాలు అవసరం కావడంతో కొంత ఆలస్యం జరిగింది. ఈ ఇద్దరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుకుంటుంది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పోస్టులకు హైకోర్టు కొలీజియం త్వరలోనే కొందరి పేర్లను సిఫారసు చేయనుంది.అవధానం హరిహరనాథ శర్మ..కర్నూలుకి చెందిన అవధానం హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్ 16న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, రామచంద్రయ్య. తండ్రి పురోహితులు. శర్మ 1988లో కర్నూలులోని ఉస్మానియా కాలేజీలో బీఎస్సీ, 1993లో నెల్లూరు వీఆర్ కాలేజీలో బీఎల్ పూర్తిచేశారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి, కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1994 నుంచి 98 వరకు సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 1998లో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2017–18లో అనంతపురం ప్రధాన జిల్లా జడ్జిగా, 2020–22లో విశాఖపట్నం ప్రధాన జిల్లా జడ్జిగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023 నుంచి ఏపీ జుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2016లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు.డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు..ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. పద్మావతి, వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు. లక్ష్మణరావు ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యశించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి రెండు మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు కావలిలో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన పరీక్షలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించారు. తొలుత ఏలూరులో మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్రంలో పలు చోట్ల వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్ (జుడిషియల్)గా నియమితులయ్యారు. ఆయన పనితీరు, క్రమశిక్షణ నచ్చిన హైకోర్టు ఆయన్ని రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా నియమించింది. హైకోర్టు న్యాయమూర్తిగా ఈయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే 2038 వరకు సుదీర్ఘ కాలం పాటు ఆ పోస్టులో కొనసాగనున్నారు. -
క్యాసినోలా కోళ్ల పందేలు
సాక్షి, అమరావతి, నెట్వర్క్: ఇటు జూదం.. అటు మద్యం! కోట్లు వెదజల్లితే చాలు కోరినవన్నీ కూర్చున్న చోటకే! ఎక్కడ చూసినా పందెం కోళ్లు.. బెల్టు షాపుల కోలాహలం! గోవా, శ్రీలంక, బ్యాంకాక్ తదితర చోట్ల కళ్లు మిరుమిట్లు గొలిపే క్యాసినోలను మించి రాష్ట్రంలో కోడి పందేలు, జూద క్రీడలు బరి తెగించి విచ్చలవిడిగా సాగాయి. కోడి పందేల బరుల వద్ద మినీ బార్లు, మద్యం షాపులను తెరిచి యథేచ్ఛగా బెల్టు అమ్మకాలు సాగించారు. హైకోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా సంక్రాంతి సంబరాల ముసుగులో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ కూటమి పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అడ్డూ అదుపు లేకుండా నిర్వహించారు. పోలీసులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. ఎన్నడూ లేనిది విజయవాడ నడిబొడ్డున రామవరప్పాడులో కోడి పందేలు, పేకాట, గుండాట జోరుగా నిర్వహించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో సాగించిన ఈ పందేల విలువ ఏకంగా రూ.5 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. కోడిపందేల నిర్వహణ పూర్తిగా కూటమి ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలోనే సాగింది. చాలాచోట్ల నేరుగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనగా కొన్నిచోట్ల వారి అనుచరులతో నిర్వహించారు. కోడి పందేలను భారీ ఆదాయ వనరుగా మార్చుకుని కూటమి నేతలు ఈ మూడు రోజులు విజృంభించారు. ఒక్కో బరిపై మూడు రోజుల్లో రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లు పిండుకున్నట్లు తెలుస్తోంది.పోటాపోటీగా ‘గోదావరి’రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200కిపైగా బరుల్లో కోడి పందేలు జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే సుమారు 350 చోట్ల పందేలు నిర్వహించగా వాటిలో 120కిపైగా పెద్ద బరులున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 300కిపైగా పందేల బరులుండగా సుమారు వందకుపైగా పెద్ద బరులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ 320కిపైగా కోడి పందేల బరుల్లో పందేలు జరిగాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 150 వరకు బరులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పెద్ద బరుల్లో రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలు.. ఆపైన మొత్తాలతో పందేలు నిర్వహించారు. చిన్న బరుల్లో రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ పందేలు సాగాయి. కొన్నిచోట్ల రూ.కోటి, కోటిన్నర పందేలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందేలను స్వయంగా ఎమ్మెల్యేలే పోటాపోటీగా నిర్వహించడం గమనార్హం.‘బరి’లో డిప్యూటీ స్పీకర్పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలో భారీగా నిర్వహించిన కోడి పందేలకు అక్కడి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు నేతృత్వం వహించారు. 25 ఎకరాల్లో కోడి పందేల ప్రాంగణాన్ని ఆయన సిద్ధం చేయించారు. సినిమా సెట్టింగులను తలపించేలా దారి పొడవునా ఫ్లెక్సీలు, వేలాది మంది కూర్చునేలా కుర్చీలు, ప్రముఖుల కోసం వీఐపీ గ్యాలరీలు, సోఫా సెట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్లైట్లతో ఒక ఉత్సవంలా పందేలను నిర్వహించారు.చింతమనేని ‘మినీ స్టేడియం’దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాధారణ కోడి పందేల్లా కాకుండా తన బరిని మినీ స్టేడియంలా సిద్ధం చేయించి అందులో పందేలు నిర్వహించారు. నియోజకవర్గంలోని దుగ్గిరాలలో జాతీయ రహదారికి ఆనుకుని ఏర్పాటైన ఈ పందేల బరులు కుంభమేళాను తలపిస్తున్నాయి. సుమారు రూ.కోటికి పైగా వ్యయంతో నెల రోజులకు పైగా కార్మికులు శ్రమించి దీన్ని తయారు చేశారు. చిన్న పిల్లలు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్లు, వీఐపీలు రెస్ట్ తీసుకునేందుకు క్యారవాన్, పక్కనే కోసాట, గుండాడ ఒకటని కాకుండా అన్ని రకాల జూద క్రీడలు అక్కడ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.కూటమి ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో..పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం రూరల్ డేగాపురం, మహదేవపట్నం, సీసలి, ఆకివీడు, కొవ్వాడ, అన్నవరం, వీరవాసరం మండలం నౌడూరు, తాడేపల్లిగూడెం, యలమంచిలి మండలం కలగంపూడి, తణుకు తదితర ప్రాంతాల్లో భారీ బరులతో పందేలు నిర్వహించారు. డేగాపురంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు, తణుకులో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, సీసలిలో ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు దగ్గరుండి కోడి పందేలు వేయించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సమీపంలో కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. విస్సన్నపేటలో ఏకంగా కాకతీయ ప్రీమియర్ లీగ్ పేరుతో పందేల బరులు పెట్టారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని గ్రామాల్లో భారీగా కోడిపందేలు జరిగాయి. పామర్రు, కూచిపూడి, కోసూరు, పమిడిముక్కల, గడ్డిపాడు, గరికపర్రు, తోట్లవల్లూరు, కొమ్ముమూరు, పెదపారుపూడి, యలమర్రులో భారీ ఎత్తున పందేలు నిర్వహించారు. బాపట్ల జిల్లా తీరప్రాంతంలో కోడి పందేల బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం, పిట్టలవానిపాలెం మండలం మంతెనవారి పాలెం, కొల్లూరు మండలం అనంతవరంలో ప్రధాన రహదారుల పక్కనే బరులు ఏర్పాట్లు చేశారు.క్యారవ్యాన్లు.. మహిళా బౌన్సర్లు!కోడి పందేల బరుల వద్ద భారీ సెట్టింగులతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. చాలాచోట్ల వీవీఐపీలు, ముఖ్యులకు క్యారవ్యాన్ల సదుపాయం కల్పించారు. డ్రోన్లు, అత్యాధునిక కెమెరాలతో వీడియో, సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు. పందేలు నిర్వహించే చోటే అన్ని రకాల మాంసాహారాలతో విందు భోజనాలు వడ్డించారు. బిర్యానీ పాయింట్లు, చికెన్ పకోడీ పాయింట్లు, ఇతర ఆహార పదార్థాలతో స్టాళ్లు ఏర్పాటయ్యాయి. రాత్రి సమయాల్లోనూ నిరాటంకంగా పందేలు జరిగేందుకు ఫ్లడ్‌లైట్లు పెట్టారు. కోడి పందేలకు వచ్చిన వారి కార్లు, ద్విచక్ర వాహనాలతోనే ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. జూద జన సందోహాలు, వాటిని వీక్షించడానికి వచ్చే వారితో కిటకిటలాడిపోయాయి. కొన్నిచోట్ల లోపలికి ప్రవేశించేందుకు రుసుము పెట్టారు. పెద్ద బరుల్లో టోకెన్లు జారీ చేసి అవి ధరించిన వారినే లోపలకు అనుమతించారు. ఇందుకోసం ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించారు. కొన్నిచోట్ల మహిళా బౌన్సర్లు కూడా ఉండడం గమనార్హం.బరుల వద్దే బార్లు, బెల్టు షాపులు అన్ని బరుల వద్ద మద్యం బెల్టు షాపులు ఏర్పాటు చేయడంతో మందు ఏరులై పారింది. పెద్ద బరుల వద్ద ఏకంగా బార్లు తెరిచి అమ్మకాలు సాగించారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా అందించే ఏర్పాట్లు చేశారు. యధేచ్చగా అమ్మకాలు సాగుతున్నా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది కన్నెత్తి చూడలేదు.బాపట్ల ‘బరి’లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు..బాపట్ల జిల్లాలో సాక్షాత్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలే కోడిపందేలను నిర్వహించడమే కాకుండా స్వయంగా పాల్గొనడం గమనార్హం. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో 30 ఎకరాల బరిలో కోడిపందేలతో పాటు పలురకాల జూద క్రీడలు జరిగాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకటరమణతో పాటు పలువురు సినీ నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగ్నేశ నరేంద్రవర్మ ఆధ్వర్యంలో ఆయన బంధువులు మంతెన వారిపాలెంలో 40 ఎకరాల్లో పెద్ద బరి ఏర్పాటు చేసి కోడిపందేలు ఆడించారు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ దగ్గరుండి మూడు రోజులపాటు పర్యవేక్షించడంతోపాటు స్వయంగా సొంత కోళ్లతో బరిలో నిలిచి పందెంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నియోజకవర్గంలో ఐదు బరులు ఏర్పాటు చేయించి పందేలను స్వయంగా పర్యవేక్షించారు. అన్ని బరుల వద్ద మద్యం షాపులు ఏర్పాటు చేశారు.అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ సమక్షంలో..అనకాపల్లి జిల్లాలో కూటమి నేతలు విద్యాలయాన్నే కోళ్ల పందేలకు అడ్డాగా మార్చేశారు. దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పోలీసుల సమక్షంలోనే కోళ్లకు కత్తులు కట్టి మంగళవారం రోజంతా పందేలను నిర్వహించారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కోసం ప్రత్యేకంగా కోడి పందేలు జరిపించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పేకాట, కోళ్ల పందేలు, బల్లాట తదితర జూద క్రీడలు నిర్వహించరాదని ఎస్పీ ముందుగానే ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా లెక్క చేయలేదు. దేవరాపల్లి చరిత్రలో ఇంత విచ్చలవిడిగా కోళ్ల పందేలు జరగడం ఇదే తొలిసారి. హోంమంత్రి ఇలాకాలో బెల్టు షాపులు, పందేలు..ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రధానంగా హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటతో పాటు యలమంచిలి, మాడుగులలో ఇష్టారాజ్యంగా కోడి పందేలను నిర్వహించారు. అడ్డరోడ్డు, వేంపాడు టోల్‌ప్లాజా వద్ద విచ్చలవిడిగా జరిగాయి. హోంమంత్రి నియోజకవర్గంలోనే బెల్టు షాపులు, కోళ్ల పందేలు ఏర్పాటైనా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది కన్నెత్తి చూడలేదు. జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న యలమంచిలి నియోజకవర్గంలోని రామన్నపాలెం వద్ద లాటరీ బాల్‌తో పాటు బెల్టు షాపులకు వేలం నిర్వహించి మరీ అప్పగించారు. భీమిలి, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాల్లో కూడా కోడి పందేలను నిర్వహించారు. మురమళ్లలో హైటెక్ హంగులతో..సంక్రాంతి సంప్రదాయాల ముసుగులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గుండాటలు, అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా సాగాయి. ఐ.పోలవరం మండలం మురమళ్లలో స్టేడియాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన భారీ బరి వద్ద ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో బుధవారం కోడి పందేలు జరిగాయి. ఆయనే స్వయంగా బరి వద్ద తిష్ట వేసి పందేలను పర్యవేక్షించారు. అమలాపురం, కాకినాడ ఎంపీలు గంటి హరీష్ మాధుర్, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కూడా పందేలను ఆద్యంతం వీక్షించారు. రామచంద్రపురం, మండపేట, రాజోలు, కొత్తపేట, అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల అండదండలతో పందేలు జోరుగా సాగాయి. అన్ని బరుల వద్ద గుండాటలు, జూద క్రీడలు యథేచ్ఛగా సాగాయి. జిల్లా మొత్తం మీద దాదాపు 110 కోడిపందేల బరులు ఏర్పాటు కాగా మురమళ్లలో హైటెక్ హంగులు, ఎల్ఈడీ స్క్రీన్లతో సిద్ధం చేశారు. ఒక్క మురమళ్ల బరి వద్దే రూ.60 కోట్ల మేర పందేలు జరగ్గా జిల్లాలో మొత్తం రూ.300 కోట్ల మేర సాగినట్లు అంచనా. ఇక మామిడికుదురు మండలం గోగన్నమఠం, మలికిపురం మండలం కేశనపల్లితో పాటు అమలాపురంలో రికార్డింగ్ డ్యాన్సుల పేరుతో హద్దులు మీరి అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆదేశాలతో పోలీసులు అటువైపు తిరిగి కూడా చూడలేదు.వేంపల్లెలో మందుబాబుల ఘర్షణ..వైఎస్సార్ కడప జిల్లా గిడ్డంగి వారి పల్లెలో మంగళవారం కోడిపందేల సందర్భంగా ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. గెలిచిన వారికి ఓడిపోయిన వారు కోడి ఇవ్వలేదని తాగిన మైకంలో గొడవ పడ్డారు. భోగి రోజు టి.వెలమ వారి పల్లె గ్రామంలో ఆటగాళ్లకు తాగేందుకు నీళ్లు ఏర్పాటు చేయలేదని దుర్భాషలకు దిగారు. వర్షాలు సరిగా లేక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు ఒడిగడుతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో కోడిపందేలు, జూదాలు లాంటివి నిర్వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. రామిరెడ్డి పల్లె, గిడ్డంగివారి పల్లె, ఎగువతువ్వపల్లె, అలవలపాడు గ్రామాల్లో పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా రెండు రోజులపాటు కోడి పందేలు కొనసాగించారు.ఎన్నారై టీడీపీ నేత తోటలో..అన్నమయ్య జిల్లా రాజంపేటలో సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన ఎన్నారై టీడీపీ నేతకు చెందిన తోటలో కోడి పందేలు జోరుగా సాగాయి. పల్లెల్లో ఎక్కడా పెద్దగా సంక్రాంతి కనిపించకపోయినా ఎన్ఆర్ఐ నేత తోటలో మాత్రం కోలాహలం నెలకొంది. రూ.లక్షల్లో జూదం సాగుతున్నా పోలీసులు అటువైపు తొంగి కూడా చూడలేదు. హద్దుల విషయంలో పుల్లంపేట, మన్నూరు పోలీసులు ఒక నిర్ణయానికి రాకుండా అది తమ పరిధిలోది కాదంటూ తప్పుకున్నారు. ⇒ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. పందెం నిర్వహించే ప్రాంతాన్ని పూర్తిగా గ్రీన్ మ్యాట్‌తో కప్పేశారు. పందెం కాసేందుకు, తిలకించేందుకు వచ్చిన వ్యక్తుల నుంచి రూ.500 చొప్పున ప్రవేశ రుసుము వసూలు చేశారు.⇒ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలో కోడి పందేల్లో గెలుపొందిన విజేతలకు రెండు బులెట్లతో పాటు నాలుగు బైకులను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతుల మీదుగా నిర్వాహకులు అందజేశారు. ఫొటో: జిడివి63 : విజేతలకు బులెట్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే రాము⇒ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం, అమలాపురం రూరల్ మండలం కామనగరువులో కోడి పందేల విజేతలకు బుల్లెట్లు బహుమతులుగా అందించారు. భీమవరంలో క్యాసినో.. డ్యాన్స్లుఉమ్మడి పశ్చిమ గోదావరిలో భారీ సినీ సెట్టింగులతో బరులు ఏర్పాటు చేసి ఫ్లడ్‌లైట్ వెలుగుల్లో రాత్రిపూట కూడా జాతరలా కోడి పందేలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో రూ.300 కోట్ల మేరకు కోడి పందాలు, జూదం కొనసాగినట్లు అంచనా. ప్రధానంగా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామన్నగూడెం, ఉండి నియోజకవర్గంలోని సీసలి, పెదఅమిరం, భీమవరం నియోజకవర్గంలోని డేగాపురం, దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగిలో కోట్లల్లో పందాలు కొనసాగాయి. వెంకట్రామన్నగూడెంలో బుధవారం రూ.1.25 కోట్ల పందెం కొనసాగింది. భీమవరం మండలంలో కోడిపందేల బరి వద్ద యువతుల రికార్డింగ్ డ్యాన్స్‌లు తాడేపల్లిగూడెంలోని ప్రభాకర్‌కు చెందిన నెమలి పుంజు, రంగాపురం రత్తయ్యకు చెందిన రసంగి పుంజు 20 నిమిషాల పాటు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రభాకర్‌కు చెందిన పుంజు విజేతగా నిలవడంతో రూ.1.25 కోట్లను కైవసం చేసుకున్నారు. దెందులూరు, భీమవరంలో, వెంకట్రామన్నగూడెంలో భారీ సెట్టింగులు ఏర్పాటు చేసి మద్యం, నాన్‌వెజ్‌తో సహా అన్ని సౌకర్యాలను శిబిరాల్లోనే ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించారు. క్యాసినో తరహాలో నగదు కాకుండా కాయిన్స్‌తో జూదాలు నిర్వహించారు. వెంకట్రామన్నగూడెంలో మహిళా బౌన్సర్లను ప్రత్యేకంగా నియమించారు. చింతలపూడి, పోలవరం, కైకలూరు, ఉంగుటూరు, తణుకులో ఎమ్మెల్యేలు శొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, కామినేని శ్రీనివాస్, పి.ధర్మరాజు, ఆరమిల్లి రాధాకృష్ణలు కోడి పందాలను ప్రారంభించి పరిశీలించారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో అత్యధిక పందేలు గెలిచిన వారికి బుల్లెట్ బహుకరించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పశ్చిమ గోదావరిలో బరుల సంఖ్య భారీగా పెరిగింది.డ్యాన్స్‌లు.. క్యాసినోభీమవరం మండలంలో కూటమి నాయకులు నిర్వహించిన కోడి పందేల బరి వద్ద మ్యూజికల్ నైట్ పేరుతో మహిళలతో డ్యాన్స్‌లు చేయించారు. భీమవరంలో గతంలో ఎన్నడూలేని విధంగా క్యాసినో జూదం నిర్వహించారు. -
సిట్ క్లోజ్.. బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్
న్యూఢిల్లీ, సాక్షి: స్కిల్ కుంభకోణం కేసులో నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఏపీ సీఐడీ తరఫున ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతోనే బుధవారం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. స్కిల్ స్కాం(Skill Scam Case) కేసులో దర్యాప్తు దాదాపు పూర్తి అయిందని, కేసును పెండింగ్‌లో ఉంచడం వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు అయిందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల బెయిల్ రద్దు పిటిషన్ చేశారని తెలిపారాయన. ఈ క్రమంలో బెయిల్ రద్దు చేయాలని కోరడం లేదా ? అని ఏపీ ప్రభుత్వాన్ని జస్టిస్ ఎం.బేలా త్రివేది ప్రశ్నించారు. ‘లేదు’ అని ప్రభుత్వం నుంచి సమాధానం రావడంతో కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ తరఫున న్యాయమూర్తికి సూచించారు. అయితే ఈ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉండడంతో.. బెయిల్ షరతులు(Bail Conditions) ఉల్లంఘించినా, విచారణకు సహకరించకపోయినా తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.కూటమి ప్రభుత్వం కొలువు దీరరాక.. స్కిల్ స్కాం కేసులో దర్యాప్తు స్పీడ్ మొత్తం తగ్గిపోయింది. చంద్రబాబు సీఎం కావడంతో ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు అందరూ ఆయన్ని బయటపడేసేందుకు మూకుమ్మడిగా కృషి చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్రద్దు పిటిషన్లో స్వర్ణాంధ్ర పత్రికా విలేకరి బాలాగంగధర్ తిలక్ భాగమయ్యారు. ఆయన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది హరిన్ రావల్ వాదనలు వినిపించారు. చంద్రబాబే(Chandrababu) ప్రభుత్వం కావడంతో తనపై ఉన్న కేసులను కొట్టేయించుకున్నారని హరిన్ రావల్ వాదించారు. ప్రభుత్వం మారగానే సిట్ ఆఫీస్‌ను మూసేయించారని, పైగా అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే స్కిల్ స్కాం కేసులో మీకేం సంబంధమంటూ పిటిషనర్‌ను మందలిస్తూ ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. ఇదిలా ఉంటే.. గతంలో చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ తరఫున ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే ఇప్పుడు అదే దర్యాప్తు సంస్థ ఆయన బెయిల్ రద్దు పిటిషన్‌పై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం గమనార్హం. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై.. జైలు జీవితం గడిపారు. ఆపై హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.స్కిల్ స్కాం కేసులో ఎప్పుడు ఏం జరిగిందంటే.. 6.9.2023: ‘రేపో మాపో నన్నూ అరెస్టు చేస్తారేమో?’ అనంతపురం జిల్లా రాయదుర్గంలో చంద్రబాబు వ్యాఖ్యలు 9.9.2023: నంద్యాలలో చంద్రబాబు అరెస్టు. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారణ 10.9.2023: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచిన సీఐడీ అధికారులు. రోజంతా కొనసాగిన విచారణ. 14 రోజుల రిమాండు విధించిన కోర్టు. అర్ధరాత్రి 1.16 గంటలకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలింపు 11.9.2023: జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉన్నందున హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని, నైపుణ్యాభివృద్ధి కేసు దస్త్రాలివ్వాలని కోరుతూ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ 12.9.2023: హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు 13.9.2023: క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి, సీఐడీ కస్టడీ పిటిషన్‌పై 18 వరకూ ఒత్తిడి చేయొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశం. విచారణ 19కి వాయిదా 14.9.2023: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలుచంద్రబాబును ములాఖత్‌లో కలిసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్. 15.9.2023: బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం 17.9.2023: నైపుణ్యాభివృద్ధి కేసుపై దిల్లీలో సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిల మీడియా సమావేశం 19.9.2023: చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ 21కి వాయిదా 20.9.2023: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ. 21న నిర్ణయం వెల్లడిస్తామన్న ఏసీబీ కోర్టు సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులు భద్రపరచాలని పిటిషన్. కౌంటర్ వేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం 21.9.2023: స్కిల్ కేసు సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పిల్ 22.9.2023: రెండు రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు. రిమాండ్ 24 వరకు పొడిగింపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు బెయిలు పిటిషన్, పీటీ వారంట్ల పిటిషన్‌పై విచారణ 25కి వాయిదా 23.9.2023: చంద్రబాబును తొలిరోజు దాదాపు 5 గంటలపాటు విచారించిన సీఐడీ అధికారులు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయటంతో సుప్రీంకోర్టులో చంద్రబాబు అప్పీలు సీఐడీ కస్టడీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు. అత్యవసర విచారణకు న్యాయస్థానం నిరాకరణ 24.9.2023: రెండో రోజూ చంద్రబాబును విచారించిన సీఐడీ అధికారులు. అక్టోబరు 5 వరకు జ్యుడిషియల్ రిమాండు పొడిగించిన ఏసీబీ కోర్టు 25.9.2023: చంద్రబాబును మరో 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ 26.9.2023: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ సెప్టెంబరు 27కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 27.9.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబరు 3కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు బెయిలు, కస్టడీ పిటిషన్ల విచారణ అక్టోబరు 4కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 28.9.2023: చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం 30.9.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారించే ధర్మాసనం ఖరారు 3.10.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ. హైకోర్టులో సమర్పించిన దస్త్రాలన్నీ ఇవ్వాలంటూ ధర్మాసనం ఆదేశం 4.10.2023: చంద్రబాబు బెయిలు, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ 5.10.2023: చంద్రబాబు బెయిలు, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ చంద్రబాబు రిమాండ్‌ను 19 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు 6.10.2023: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు 9.10.2023: చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ వర్తించేలా కనిపిస్తోందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్‌ను కొట్టేసిన ఏసీబీ కోర్టు 10.10.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ 12.10.2023: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను 17కు వాయిదా వేసిన హైకోర్టు 13.10.2023: కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఉండవల్లి దాఖలు చేసిన పిల్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు 14.10.2023: చంద్రబాబు శరీరంపై తీవ్రమైన దద్దుర్లు, పొక్కులు. చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశం 17.10.2023: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి. తీర్పు రిజర్వు చేసిన సర్వోన్నత న్యాయస్థానం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా 19.10.2023: ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట వర్చువల్‌గా చంద్రబాబు హాజరు 20.10.2023: ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారంట్‌పై చంద్రబాబును నవంబరు 9 వరకు ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచొద్దని, అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశం చంద్రబాబుకు రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లకు అనుమతిచ్చిన ఏసీబీ కోర్టు కాల్‌డేటా పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం 26.10.2023: చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యుల వెల్లడి 27.10.2023: తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకొన్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి సీఐడీ కాల్ డేటా రికార్డుపై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు తమ పార్టీ బ్యాంకు లావాదేవీల వివరాలను సీఐడీ కోరడంపై హైకోర్టుకు టీడీపీ 28.10.2023: చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స చేయాలని ప్రభుత్వ వైద్యుడి నిర్ధారణ 30.10.2023: చంద్రబాబు మధ్యంతర బెయిలుపై వాదనలు పూర్తి. తీర్పు రిజర్వు 31.10.2023: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు -
మనసే కోవెలగా..
అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లాలోని గ్రామాల్లో ఆధ్యాత్మిక సందడి వెల్లివిరుస్తోంది. భక్తి పారవశ్యం మానసిక ప్రశాంతత చేకూరుస్తోంది. సనాతన సంప్రదాయాలకు మళ్లీ పెద్దపీట వేస్తూ దేవుని పూజలతో తన్మయత్వం పొందుతున్నారు భక్తులు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ధనుర్మాసం పూజల్లో నిమగ్నం అవుతున్నారు. పెద్ద పండుగ ముందు పల్లెలన్నీ హరినామ సంకీర్తనతో మార్మోగిపోతున్నాయి. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేలుకొలుపు కార్యక్రమాలు అన్ని గ్రామాలకు విస్తరిస్తున్నాయి. చలికాలం వచ్చిందంటే కాసింత వెచ్చని ఎండ వచ్చే వరకూ నిద్ర లేవని వారు సైతం హరినామ సంకీర్తనలో మమేకం అవుతున్నారు. అచ్యుతాపురం మండలంలోని జగ్గన్నపేటలో ఐదేళ్ల క్రిందట ప్రారంభమైన మేలుకొలుపులు ఇప్పుడు మండలంలోని 12 గ్రామాలకు పైగా విస్తరించింది.తిమ్మరాజుపేట, హరిపాలెం, జగన్నాథపురం, కొండకర్ల, ఎర్రవరం, ఉప్పవరం, చీమలాపల్లి, దుప్పుతూరు, దోసూరు, గండివానిపాలెం, నరేంద్రంపురం గ్రామాల్లో మేలుకొలుపులు నెలగంట కొట్టిన రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్తరాయనంలో 6 నెలల పాటు దేవతలు సంచరించే సమయంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు దేవుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. మేలుకొలుపు కార్యక్రమం వల్ల తెల్లవారుజాము నుంచే భక్తులు లేచి పుణ్య స్నానాలు ఆచరించి హరినామ సంకీర్తన చేస్తున్నారు. అయ్యప్ప మాలధారులు స్వామి సన్నిధికి వెళ్లిన తర్వాత మళ్లీ భక్తితత్వంలో కొనసాగేందుకు మేలుకొలుపులు ఉపయోగపడుతున్నాయని సమరసత సేవా ఫౌండేషన్ యలమంచిలి డివిజన్ ధర్మ ప్రచారకులు కొల్లి అప్పారావు చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మానసిక ప్రశాంతత, ఉల్లాసం లభిస్తోందని భక్తులు పేర్కొనడం గమనార్హం.హరిదాసుల సందడినెలగంట పెట్టిన రోజు నుంచి గ్రామాల్లో హరిదాసుల సందడి మొదలయ్యింది. అక్షయ పాత్రను తలపై పెట్టుకొని హరినామస్మరణతో వీధుల్లో సంచరిస్తూ ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్నారు. గంగిరెద్దుల సందడి, గాలిపటాలతో చిన్నారుల కోలాహలం, ముగ్గుల పోటీల్లో మహిళల కళా కౌశలం ఊరూరా ప్రతిఫలిస్తోంది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏకాదశి రోజున నగర సంకీర్తన, వారం వారం భజనలు, పౌర్ణమి రోజున సామూహిక హారతి, సత్సంగం, కార్తీక పౌర్ణమి రోజున వెన్నెలలో పాలను మరిగించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో మహిళలు కీర్తనలు, కోలాటాలు నేర్చుకొని దేవాలయాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇది కూడా వారిలో భక్తి భావం పెంపొందించడంతోపాటు, శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడుతోంది. ఈ చిత్రంలో కూరగాయల వ్యాపారం చేస్తున్న వ్యక్తి పేరు చిలకా నారాయణ. 30 ఏళ్లుగా ఊనగట్ల వారపు సంతలో కూరగాయలు విక్రయిస్తున్నాడు. గత ఏడాది ఇదే సమయానికి రూ.40 వేల వరకూ వ్యాపారం చేశాడు. ప్రస్తుతం కొనేవారు లేకపోవడంతో రూ.10 వేలు కూడా దాటని దుస్థితి నెలకొందని వాపోతున్నాడు. ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన చెందుతున్నాడు.నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం ఊనగట్లలోని వారపు సంత. మూడు గ్రామాల పరిధిలోని సుమారు 10 వేల మంది ప్రజలకు ఈ సంతే ప్రధానం. ప్రతి ఆదివారం నిర్వహించే ఈ సంతకు వచ్చి ఆయా గ్రామాల ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేస్తారు. గత ఏడాది ఇదే సమయానికి ఈ సంత కొనుగోలుదారులతో కిటకిటలాడేది. ప్రస్తుతం జనం లేక వెలవెలబోతోంది.అతని పేరు రవి. విజయనగరం పట్టణంలోని వీటీ అగ్రహరంలో ఉంటున్నాడు. కూటమి ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ ఇస్తుందంటే కుటుంబ ఆర్థిక భారం తగ్గుతుందని సంబరపడ్డాడు. పథకం అమలు తరువాత రెండుసార్లు గ్యాస్ సిలిండర్ విడిపించారు. ఒక్క దానికి కూడా నగదు జమ కాలేదు. మొదటి సిలిండర్‌కు నగదు జమ కాలేదని విజయనగరం జిల్లా పౌర సరఫరాల శాఖ, గ్యాస్ ఏజెన్సీ, బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఈకైవేసీ చేయించమంటే చేయించారు. అయినా నగదు జమ కాలేదు. -
నా భద్రతా బృందంతో బాషాను పంపేలా ఆదేశాలివ్వండి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: తన కుమార్తె స్నాతకోత్సవం నిమిత్తం లండన్ వెళుతున్న నేపథ్యంలో... తన భద్రతా బృందంలో గతంలో డీఎస్పీగా వ్యవహరించిన ఎస్.మహబూబ్ బాషాను ప్రస్తుతం తన భద్రతా బృందంతోపాటు పంపేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం అత్యవసరంగా హౌస్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ విచారణ జరిపారు. వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు.మంగళవారం నాడు వైఎస్ జగన్ లండన్ బయలుదేరుతున్నారని, ఈ నెలాఖరు వరకు అక్కడే ఉంటారని శ్రీరామ్ తెలిపారు. లండన్ వెళ్లేందుకు కోర్టు నుంచి చట్ట ప్రకారం అనుమతులు కూడా తీసుకున్నారని ఆయన వివరించారు. జగన్‌కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఆయనకు జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు విదేశాలకు వెళుతున్న నేపథ్యంలో ఎల్లోబుక్ ప్రకారం ఆయనకు సెక్యూరిటీ ప్రొటోకాల్ కింద భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ పలుమార్లు లండన్ వెళ్లారని, అప్పుడు భద్రతా బృందంలో మహబూబ్ బాషా ఉన్నారని కోర్టుకు వివరించారు. తన భద్రతాపరమైన విషయాల గురించి బాషాకు స్పష్టమైన అవగాహన ఉందని, అందువల్ల ఆయనను తన వెంట పంపాలంటూ జగన్ ఈ నెల 9న ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారన్నారు. మంగళవారం లండన్ వెళుతున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ వినతిపత్రంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ నేపథ్యంలో అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని భద్రతను కల్పించి తీరాల్సి ఉండగా, ప్రభుత్వం ఇప్పటి వరకు చోద్యం చూస్తూ ఉందన్నారు. జగన్ భద్రతను ఈ ప్రభుత్వం భారీగా కుదించిందిరాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఎల్లోబుక్ ప్రకారం తనకు నిర్దిష్ట వ్యక్తినే భద్రతాధికారిగా నియమించాలని కోరడానికి వీల్లేదన్నారు. శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ జగన్‌కు ఉన్న భద్రతను ఈ ప్రభుత్వం భారీగా కుదించిందని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తున్నామని వివరించారు. తమ వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థంకావడం లేదన్నారు. దమ్మాలపాటి స్పందిస్తూ ఆ వినతిపత్రంపై తప్పక పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటామని, ఇందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అందువల్ల విచారణను ఈ నెల 17కి వాయిదా వేయాలని కోరారు. తమకు అభ్యంతరం లేదని శ్రీరామ్ చెప్పారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాల సమర్పణ నిమిత్తం విచారణను 17కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
కత్తులు దూసిన కోళ్లు
సాక్షి అమరావతి/నెట్వర్క్: సంక్రాంతి తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేల జాతర మొదలైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్ హంగులు.. మినీ స్టేడియంలను తలపించిన బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి. భారీ టెంట్లు.. వీవీఐపీ, వీఐపీ, సామాన్య జనానికి వేర్వేరుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందేలను తిలకించేందుకు వీలుగా కుర్చీలు.. సోఫాలు.. ఎయిర్ కూలర్లతో సౌకర్యవంతమైన ఏర్పాట్ల నడుమ ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్య పందేలు సాగాయి.ప్రత్యేక ఎంట్రీ పాస్‌లు ఇచ్చి.. పందేల్లో తలపడిన కోళ్లు ప్రేక్షకులకు కన్పించేల భారీ ఎల్ఈడీ స్క్రీన్ల లైవ్ ఇచ్చారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోను పెద్దఎత్తున కోడి పందేలు సాగాయి. గతానికి మించిన భారీ ఏర్పాట్లతో కోళ్ల సమరం సాగింది. ఈ ఏడాది కోడి పందేల జాతర రాయలసీమ జిల్లాలకు పాకింది. గోదావరి జిల్లాల్లో ఇలా.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో జాతీయ రహదారి పక్కనే రూ.కోటి ఖర్చుతో కోడి పందేల బరిని మినీ స్టేడియాన్ని తలదన్నేలా నిర్మించారు. అక్కడ కోడి పందేలు వేసేవారికి.. వాటిని చూసేవారికి ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గొల్లవానితిప్ప–డేగాపురం వద్ద హైటెక్ హంగులతో ఏర్పాటు చేసిన భారీ బరిలో కోడి పందేలు మొదలయ్యాయి. పందేలరాయుళ్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా బరులకు సమీపంలోనే కార్వేన్లు, రెస్ట్‌రూమ్‌ల సౌకర్యాలు కల్చించారు. బౌన్సర్లతో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఉండి నియోజకవర్గంలోని పెదఅమిరం, సీసలి, మహాదేవపట్నం, ఆకివీడులో బరులను సినిమా సెట్టింగులను తలపించేలా తీర్చిదిద్దారు. ఇక్కడ ఓ బరిలో పందేలను ప్రారంభించేందుకు గోల్డ్ కాయిన్ తయారు చేయించి హెడ్ అండ్ టాస్ వేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 350 బరుల్లో కోడిపందేలు పోటాపోటీగా నిర్వహించారు. కోడిపందేలు, గుండాట కలిపి తొలిరోజు సుమారు రూ.250 కోట్లకు పైగా పందేలు జరిగాయని అంచనా. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యవేక్షణలో ఐ.పోలవరం మండలం మురమళ్లలో 10 ఎకరాల లే–అవుట్లో భారీగా కోడిపందేలు, గుండాటలు నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో 15 బరుల్లో సుమారు రూ.3 కోట్ల పందేలు జరిగాయని అంచనా. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 30 బరులు ఏర్పాటు చేశారు. కరపలో మూడు రోజులపాటు నిర్వహించే 60 పందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన వారికి బహుమతిగా రూ.25 లక్షల విలువైన తార్ జీపు, గురజనాపల్లి, గొర్రిపూడి బరుల్లో నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లను విజేతలకు బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధం చేశారు. బరిలోకి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ భారీ ఏర్పాట్ల నడుమ కోడి పందేలు, జూద జాతరకు సోమవారమే శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పందేలు మొదలయ్యాయి. మంతెనవారిపాలెంలో 40 ఎకరాల్లో భారీ బరి ఏర్పాటు చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గంలోని తూర్పుపాలెం వద్ద 30 ఎకరాల్లో 6 బరులు ఏర్పాటయ్యాయి.వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు బోస్‌నగర్, అనంతవరం, జంపని, చుండూరు మండలం కేఎన్ పల్లి, భట్టిప్రోలు మండలం పల్లకోన ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో పందేలు తొలిరోజే జోరందుకున్నాయి. సంతనూతలపాడు మండలం వడ్డెపాలెం పరిసరాల్లో సోమవారం కోడి పందేలు జరిగాయి. ఒంగోలు పాతపాడు, కొత్తపట్నం మండలం మడనూరు, గామళ్లపాడులో పందేలు మొదలయ్యాయి. ‘సీమ’లోనూ కాలు దువ్విన కోడి⇒ ఎకరాల్లో ప్రత్యేక బరి ఏర్పాటు చేశారు. ఇక్కడ కోడి పందేలు, క్యాసినో, కోత ముక్క ఆడించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ సమీపంలోని రామవరప్పాడు, ఎనికేపాడు, అంబాపురంలోనూ భారీ బరులు ఏర్పాటయ్యాయి. పెనమలూరు పరిధిలోని ఈడుపుగల్లు, గొడవర్రు, ఉప్పులూరు, పెద్దపులిపాకలో కోడి పందేలు జరిగాయి. నందిగామ, పామర్రు గుడివాడ, జగ్గయ్యపేట, పెడన, తిరువూరు, మచిలీపట్నం, మైలవరం నియోజకవర్గాల్లో భారీగా బరుల్లో కోడిపందేలు సాగుతున్నాయి. -
ఉపాధికి 'నూతన ఎనర్జీ'
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగం పురోగమిస్తోంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 2050 నాటికి ఈ రంగంలో పని చేసేందుకు 43 మిలియన్ల మంది కావాల్సి ఉంటుందని తాజాగా ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) విడుదల చేసిన సంయుక్త నివేదికలో వెల్లడించాయి.ఇంజనీర్లు, నైపుణ్యం గల కార్మికులు, మధ్యస్థ నైపుణ్యం గల కార్మికులు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఇతర కార్మికుల సేవలు ఎక్కువగా అవసరం ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో 16.2 మిలియన్ల మంది పని చేస్తున్నారని, వారిలో మన దేశంలోనే 1.2 మిలియన్ల మంది ఉన్నారని తెలిపాయి. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉపాధి అవకాశాలు⇒ దేశంలో 2032 నాటికి విద్యుత్ వినియోగం మరో 70 శాతం పెరుగుతుందని అంచనా.⇒ 2070 నాటికి కర్బన ఉద్గారాలు నెట్ జీరో స్థాయిని చేరుకోవడంలో భాగంగా 2030 నాటికి దేశ వ్యాప్తంగా 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ స్థాపిత ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించాలని సూచించింది. ⇒ అందువల్ల మన దేశంలో కొత్తగా ఏర్పడే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో 2050 నాటికి 8.5 మిలియన్ల మందికి కొలువులు లభిస్తాయని ఐఆర్ఈడీఏ వివరించింది. ⇒ ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే అది శిలాజ ఇంధనాల నుంచి కాకుండా స్వచ్చ ఇంధనం(గ్రీన్ ఎనర్జీ) ద్వారానే జరగాలని అంతర్జాతీయంగా అన్ని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.నివేదికలోని ముఖ్యాంశాలు...⇒ ప్రపంచ పునరుత్పాదక రంగానికి సంబంధించి 2022లో 4.9 మిలియన్ల మందికి ఉద్యోగాలు లభించాయి. దీంతో 2022లో మొత్తం ఉద్యోగాలు 13.7 మిలియన్లకు చేరాయి. అదే 2023లో ఆ సంఖ్య 16.2 మిలియన్లకు పెరిగింది. ⇒ మన దేశానికి సంబంధించి 2022లో 2,82,200 మందికి ఈ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. ⇒ 2023లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. జలవిద్యుత్ రంగంలో అత్యధికంగా దాదాపు 4,53,000 మందికి ఉద్యోగాలు లభించాయని అంచనా. సౌర విద్యుత్ ఫొటో వాల్టాయిస్ రంగంలో 3,18,600 మందికి ఉపాధి లభించింది. పవన విద్యుత్ రంగంలో సుమారు 52,200 మందికి, ద్రవ జీవ ఇంధన రంగంలో 35వేల మందికి, బయోమాస్‌లో 58 వేల మందికి, సోలార్ హీటింగ్, కూలింగ్ సెక్టార్లో 17 వేల మందికి, బయోగ్యాస్ రంగంలో 85 వేల మందికి కొలువులు లభించాయి. ⇒ భారతదేశంలో 2023లో దాదాపు 10,18,800 లక్షల ఉద్యోగాలు లభించినట్లు తమ అధ్యయనంలో తేలినట్లు ఆర్‌ఈఎన్‌ఏ, ఐఎల్వో వెల్లడించాయి. ⇒ ఒక్క చైనా మినహా మిగతా ప్రపంచ దేశాలన్నిటి కంటే మన దేశమే ఈ రంగంలో పురోగమనంలో ఉంది. -
భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల దహనం
సాక్షి, అమరావతి /కృష్ణలంక(విజయవాడతూర్పు)/ఒంగోలు టౌన్/చిత్తూరు కార్పొరేషన్/ ఆమదాలవలస: చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సోమవారం భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దహనం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చిన వెంటనే సర్దుబాటు చార్జీల పేరుతో రెండు విడతల్లో రూ.16వేల కోట్ల భారం మోపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు మంగళంపాడారని మండిపడ్డారు. తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. -
ఆహ.. ఏమి రుచి!
సాక్షి, అమరావతి: భారతీయ వంటకాలు ప్రపంచ ఆహార ర్యాంకింగ్స్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచస్థాయి వంటకాలు, ఐకానిక్ రెస్టారెంట్ల క్యూరేటెడ్ జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. టేస్ట్ అట్లాస్ ఇటీవల 2024–25 ప్రపంచ ఆహార అవార్డులను ప్రకటించింది. ఇందులో భారతీయ వంటకాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. సంప్రదాయం, రుచుల్ని మిళితం చేసే భారతదేశం పాకశాస్త్ర సంస్కృతికి అద్దం పట్టాయి. భారతీయ వంటకాలు సుగంధ ద్రవ్యాలతో కూడినవని విమర్శకులు పేర్కొన్నప్పటికీ.. ప్రపంచంలోని అత్యంత ఇష్టపడే వంటకాల్లో అగ్రస్థానంలో నిలవడం విశేషం. మొఘల్, పంజాబీ, దక్షిణాది వంటకాల రుచి అనేక రెస్టారెంట్లకు సైతం ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చాయి.దక్షిణాదిలో దోశ.. ఉప్మా రెస్టారెంట్ టేస్ట్ అట్లాస్ 100 మోస్ట్ లెజెండరీ రెస్టారెంట్లలో ఐకానిక్ వంటకాలు, గొప్ప వంటలో భారతీయ ఆహార మార్కెట్ సత్తా చాటింది. కలకత్తాలోని పీటర్ క్యాట్ రెస్టారెంట్‌కు 7వ ర్యాంక్ రాగా.. ఇక్కడ దొరికే ‘చెలో కబాబ్’కు ఆదరణ లభిస్తోంది. ముర్తల్లోని అమ్రిక్ సుఖ్‌దేవ్ రెస్టారెంట్‌కు 13వ ర్యాంక్‌లో ఆలూ పరాటా అందిస్తూ ఆకట్టుకుంటోంది. న్యూఢిల్లీలోని కరీం రెస్టారెంట్ 1,913 నుంచి కోర్మా వంటకం ద్వారా భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది.దీనికి 59వ ర్యాంక్ రావడం విశేషం. బెంగళూరులోని సెంట్రల్ టిఫిన్ రూమ్ మసాలా దోశ మంచి క్రేజ్ సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా 69వ ర్యాంక్‌లో నిలిచింది. న్యూఢిల్లీలోని గులాటి రెస్టారెంట్ 77 ర్యాంక్‌తో బట్టర్ చికెన్.. ముంబైలోని రామ్ ఆశ్రమం ఉప్మాకు 78వ ర్యాంక్ సంపాదించింది.హైదరాబాద్ బిర్యానీ అదుర్స్ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాను వెల్లడించింది. భారత్ నుంచి ముర్గ్ మఖానీ 29వ, హైదరాబాద్ బిర్యానీ 31 స్థానాల్లో నిలిచాయి. చికెన్–65 సైతం 97వ స్థానంలో, కీమా 100వ స్థానం పొందాయి. ముర్గ్ మఖానీ, హైదరాబాద్ బిర్యానీ గ్లోబల్ ఆహార ప్రియుల నుంచి వరుసగా 5, 4.52 స్టార్ రేటింగ్ అందుకున్నాయి. మరోవైపు చికెన్ 65, కీమాకు 4.44 స్టార్ రేటింగ్ వచ్చింది.కొలంబియా లెచోనా.. ఇటలీ పిజ్జా టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్‌లో కొలంబియాకు చెందిన లెచోనా (పోర్క్) వంటకం 4.78 రేటింగ్‌తో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానంలో ఇటలీకి చెందిన పిజ్జా 4.75 రేటింగ్‌తో రెండో స్థానంలో, బ్రెజిల్‌కు చెందిన పికాన్హా 4.69 రేటింగ్‌తో మూడో స్థానం, ఆ తరువాత స్థానాల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఫనాంగ్ కర్రీ, అర్జెంటీనాకు చెందిన అసడో వంటకాలు 4.65 రేటింగ్‌ను పొందాయి. -
అమరావతి ‘ముంపు టెండర్ల’లో అక్రమాల వరద
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కొండవీటి వాగు, పాల వాగు వరద ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు చేపట్టే పనుల టెండర్లలో అక్రమాలు వరదెత్తాయి. పనుల అంచనా వ్యయాన్ని 100 నుంచి 250 శాతం పెంచేసి.. మూడు ప్యాకేజీలుగా విభజించి.. ముందుగా ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారుల ద్వారా ముఖ్యనేతలు మూడు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వీటి కాంట్రాక్ట్ విలువ (అన్ని పన్నులతో కలిపి) రూ.1,404.13 కోట్లుగా నిర్దేశించారు. పనుల విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్ట్ సంస్థలకు పనులు అప్పగించి.. పెంచిన అంచనా వ్యయం రూ.702.33 కోట్లను కమీషన్ల రూపంలో రాబట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. మూడు ప్యాకేజీల పనులు ఇవీ ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణంగా ఇస్తున్న నిధులతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ చేపట్టింది. ఒకటో ప్యాకేజీ కింద కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి, లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎల్ఎస్ (లంప్సమ్) విధానంలో 24 నెలల్లో పూర్తి చేయడంతోపాటు మరో రెండేళ్లు నిర్వహించాలని నిబంధనతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.462.26 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా రూ.60.53 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ ప్యాకేజీ పనుల అంచనా వ్యయం రూ.522.79 కోట్లు. రెండో ప్యాకేజీ ఇదీ రెండో ప్యాకేజీ కింద నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడం.. కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో రెండేళ్లలో పూర్తి చేసి, మరో రెండేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.303.73 కోట్లుగా నిర్దేశించింది.దీనికి అదనంగా రూ.38.57 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా విలువ రూ.342.3 కోట్లు. ఒకటో, రెండో ప్యాకేజీ పనులకు షెడ్యూళ్లు దాఖలు చేయడానికి ఈనెల 31 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరిచి.. అర్హత ఉన్న కాంట్రాక్ట్ సంస్థలు దాఖలు చేసిన ఆరి్థక బిడ్లను ఫిబ్రవరి 5న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనున్నారు. మూడో ప్యాకేజీ కింద.. మూడో ప్యాకేజీ కింద మంగళగిరి మండలం నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో ఈ నెల 1న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.470.74 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా వ్యయం రూ.539.04 కోట్లు. ఈ పనుల టెండర్లలో షెడ్యూళ్ల దాఖలుకు ఈ నెల 22 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్, ఈనెల 25న ఆర్థిక బిడ్ తెరిచి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టనున్నారు. అంచనాల్లో పొంగిపొర్లిన అక్రమాలు రాజధాని ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు వంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించడమే.. కొత్తగా 7.843 కిమీల పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వడానికి ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు.ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, 10 నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ. రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల (జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ వంటి పన్నులతో కలిపి)కు మించదని జలవనరుల శాఖలో అనేక ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక అధికారి తేల్చిచెప్పారు.ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను జీఎస్టీ వంటి పన్నులతో కలిపి రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. కొండవీటి వాగు, పాల వాగు లోతు, వెడల్పు పెంచే పనులకు కి.మీ. రూ.5 కోట్లు చొప్పున వేసుకున్నా రూ.201.75 కోట్లు అవుతుంది. శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.వంద కోట్లు లోపే అవుతుంది.జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే..జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉండి ఉంటే టెండర్ ముసాయిదా షెడ్యూల్ దశలోనే ఈ అక్రమాలు బహిర్గతమయ్యేవని.. అందుకే ఆ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు స్పష్టం చేశారు. జాయింట్ వెంచర్‌గా ఏర్పడి టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి వీల్లేదని నిబంధన పెట్టడం ద్వారా ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్ట్ సంస్థకే పనులు అప్పగించేందుకు ముఖ్యనేతలు ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది. అదే టెండర్ నోటిఫికేషన్లో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే వెసులుబాటును కల్పించడాన్ని బట్టి చూస్తే ముఖ్యనేతల దోపిడీ పన్నాగం బట్టబయలవుతుందని రిటైర్డ్ ఎస్ఈ ఒకరు స్పష్టం చేశారు.రాష్ట్రంలో 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి, ప్రతిపాదన దశలోనే పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి.. వాటిని కమీషన్ల రూపంలో వసూలు చేసుకుని జేబులో వేసుకోవడానికి ముఖ్య నేతలు మరిగారు. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని చేసి.. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని రద్దు చేశారు. రూ.100 కోట్లు.. అంతకంటే వ్యయం ఎక్కువగా ఉన్న పనులకు సంబంధించి టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలి.దీన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. ఇంజనీర్లు, మేధావులు, ప్రజలు, కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఆన్లైన్లో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి అభిప్రాయాలను తీసుకుంటారు. వాటి ఆధారంగా ముసాయిదా షెడ్యూల్లో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసిన ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదిస్తారు. దాంతోనే సంబంధిత శాఖ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని పునరుద్ధరించింది. ఇది జరిగాకే రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్లు పిలుస్తున్నారు. మిగిలిన రెండు ప్యాకేజీల్లోనూ ఇదే తీరురెండో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.197.05 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం పన్నులతో కలిపి రూ.342.3 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే అంచనా వ్యయం రూ.145.25 కోట్ల మేర పెంచేసినట్టు స్పష్టమవుతోంది. 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడానికి.. కిలోమీటర్‌కు రూ.6 కోట్ల చొప్పున రూ.47.05 కోట్లు అవుతుంది.కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం రూ.150 కోట్లకు మించదు. మూడో ప్యాకేజీ కింద నీరుకొండ వద్ద 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.200 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.339.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టు తేటతెల్లమవుతోంది.