Women Power
-
అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో అగాధాన్ని సృష్టించింది. మరెందరో జీవితాల్ని అతలాకుతలం చేసింది. అంతేకాదు కోవిడ్-19 సృష్టించిన విలయం కారణంగా ఆత్మీయులను కోల్పోయినవారిలో, ఉద్యోగాలను పోగొట్టుకున్నవారిలో జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని ఆవిష్కరించింది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వారిలో ఒకరు కావ్య ధోబ్లే. కోవిడ్ రోగుల మధ్య నెలల తరబడి పనిచేస్తూ, రోజుకు అనేక మరణాలను చూడటం, స్వయంగా కరోనా బాడిన నేపథ్యంలో జీవితంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. అదే ఆమె విజయానికి, సంతోషకరమైన జీవితానికి పునాది వేసింది. ఏంటి ఆ నిర్ణయం? కావ్య సాధించిన విజయం ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో.కావ్య ధోబ్లే-దత్ఖిలే ముంబైలో ఒక నర్సు. కావ్య ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనలో పెరిగింది. బహుశా ఆ కోరికే ఆమెన నర్సింగ్పైపు మళ్లించిందేమో.జనరల్ నర్సింగ్,మిడ్‌వైఫరీలో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత, ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్ (సియోన్ హాస్పిటల్)లో పనిచేయడం ప్రారంభించింది. తరువాత ను టాటా క్యాన్సర్ హాస్పిటల్లో రెండు సంవత్సరాలు పనిచేసింది. దీనితో పాటు, కావ్య 2017లో నర్సింగ్‌లో బి.ఎస్సీ పూర్తి చేసింది. ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక సంవత్సరం బోధించిన తర్వాత,ముంబైలోని సియోన్ ఆసుపత్రికి స్టాఫ్ నర్సుగా చేరింది. 2019 నుండి 2022 వరకు సియోన్ హాస్పిటల్లో ఆయన పనిచేసిన కాలంలోనే కరోనా మహమ్మారి విజృంభించింది.ఉద్యోగం మానేసి, సంచలన నిర్ణయం కావ్య కూడా కరోనా బారిన పడి దాదాపు మరణం అంచుల దాకా వెళ్లి వచ్చింది. ఎన్నో మరణాలను చూసింది. కానీ తన రోగనిరోధక శక్తి తనను కాపాడిందనే విషయాన్ని అర్థం చేసుకుంది. అలాగే వ్యవసాయం అంటే మక్కువ ఉన్న ఆమె మనం పండించే, రసాయనాలతో నిండిన ఆహారం వ్యాధులకు హేతువని తెలుసుకుంది. అందుకే సమస్య మూలాన్ని తొలగించాలని గట్టిగా నిర్ణయించుకుంది. అంతే నెలకు రూ. 75వేల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేసింది. ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించినా, ఆమె భర్త రాజేష్ దత్ఖిలే క్యావకు మద్దతు ఇచ్చాడు. 2022లో, ఆమె తన ఉద్యోగాన్ని వదిలి భర్త గ్రామానికి వెళ్లింది.నర్సింగ్ నుండి జీరో ఇన్వెస్ట్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకుఆహారానికి ఆధారం వ్యవసాయం. అందుకే ఎలాంటి రసాయనాలు వాడని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది కావ్య. పట్టుదలగా కృషి చేసింది. వర్మీ కంపోస్ట్ బిజినెస్‌తో లక్షలు సంపాదిస్తోంది. రాజేష్ కుటుంబానికి పూణేలోని జున్నార్‌లోని దత్ఖిలేవాడి గ్రామంలో ఒక ఎకరం భూమి ఉంది. ఇందులో 5 గుంతల (0.02 ఎకరాలు) వర్మీకంపోస్ట్ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని వదిలి, వర్మీకంపోస్ట్ వంటి సేంద్రీయ ఇన్పుట్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కావ్య స్థానిక రైతులతో మాట్లాడింది. ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై ఒక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి సంవత్సరంలో టర్నోవర్ రూ. 24 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 50 లక్షల టర్నోవర్ టార్గెట్ పెట్టుకుంది. కావ్య ప్రతి నెలా దాదాపు 20 టన్నుల రిచ్ వర్మీకంపోస్ట్‌ను తయారు చేస్తుంది. 50 శాతం లాభం మార్జిన్‌తో 50 కిలోల బ్యాగు ధర రూ. 500 లకు విక్రయిస్తుంది. ప్రస్తుతం 30 లక్షల వార్షిక టర్నోవర్‌తో విజయ వంతంగా దూసుకుపోతోంది. వోల్జా డేటా ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వర్మీకంపోస్ట్ ఎగుమతిదారు. ఆ తర్వాత టర్కీ, ఇండోనేషియా,వియత్నాం ఉన్నాయి. ఈ రంగంలో అవార్డును కూడా అందుకుంది. ప్రారంభంలో తప్పని సవాళ్లుసేంద్రీయ వ్యవసాయం, వర్మీ కంపోస్ట్ గురించి కావ్య రైతులతో మాట్టాడినప్పుడల్లా, ఆమెకు లభించే సమాధానం, 'మీరు దీన్ని చేసి మాకు చూపించండి' అని. దీంతో ఆగస్టు 2022లో, అతను ఒక రైతు నుంచి ఒక కిలో వానపాములతో జీరో పెట్టుబడితో వర్మీ కంపోస్ట్ తయారీనీ మొదలు పెట్టింది. ప్రారంభించాడు. అక్టోబర్ 2022 నాటికి, వర్మీకంపోస్ట్ సిద్ధమైంది. మార్చిలో, కావ్య కృషి కావ్య బ్రాండ్ కింద వర్మీకంపోస్ట్ వాణిజ్య అమ్మకాలను ప్రారంభించింది. దాని ఫలితాలను రైతులు స్వయంగా అనుభవించారు. వారి విజయాలను తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసేది. ఒక రైతు ఐదు టన్నుల వర్మీకంపోస్టును రూ. 50,000 (కిలోకు రూ. 10) కు కొనుగోలు చేశాడు. రెండు వేల మంది రైతులకు ఇవ్వడానికి ఒక ఫౌండేషన్ 2,000 కిలోల వానపాములను కొనుగోలు చేసింది. కావ్య కిలో రూ.400కి అమ్మింది. ప్రతి రెండు నెలలకు 200 కిలోల వానపాములు, 35వేల కిలోల వర్మీ కంపోస్టును విక్రయిస్తుంది. అంతేకాదు ఆమె శిక్షణ తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తున్నారు.తన చుట్టూ ఉన్నరైతుల్లో ఈ మార్పు తీసుకురాగలిగినందుకు చాలా సంతోషం అంటుంది కావ్య. వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు?వర్మీకంపోస్ట్కు అవసరమైన ప్రధానమైనవి ఆవు లేదా గొర్రెలు , మేక పెంట, చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, బయోగ్యాస్ ప్లాంట్ స్లర్రీ లాంటి సేంద్రియ వ్యర్థాల మిశ్రమానికి వానపాములు కలుపుతారు, అవి ఎరువుగా రూపాంతరం చెందుతాయి.కేవలం రూ.500 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. కంపోస్ట్‌ను ఎత్తైన పడకల మీద, డబ్బాలు, చెక్క డబ్బాలు, సిమెంటు ట్యాంకులు లేదా గుంటలు, వెదురు, ప్లాస్టిక్ కంటైనర్లు లేదా మట్టి కుండలలో కూడా తయారు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 జాతుల వానపాములు ఉన్నాయి. అయితే స్థానిక జాతులను ఉపయోగించడం అనువైనది ఎందుకంటే అవి తక్షణమే అందుబాటులో ఉంటాయి, పైగా స్థానిక వాతావరణానికి బాగా సరిపోతాయి. భారతదేశంలో, సాధారణంగా ఉపయోగించే వానపాము జాతులు పెరియోనిక్స్ ఎక్స్కవాటస్, ఐసెనియా ఫోటిడా , లాంపిటో మౌరిటీ లాంటివి ఉన్నాయి. View this post on Instagram A post shared by Kavya Dhoble - Datkhile (@kavya.dhoble) -
అంబరాన మహాకుంభ సంబరం
ఆకాశం అంటే అనంతం... అనంతమైన భక్తి కూడా ఆకాశం లాంటిదే. తనలోని అనంతమైన భక్తిని ఆకాశ వేదికగా చాటింది ఇరవై నాలుగు సంవత్సరాల అనామికాశర్మ...ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్కైడైవర్ అనామికా శర్మ బ్యాంకాక్ మీదుగా 13 వేల అడుగుల ఎత్తులో మహాకుంభ్ అధికారిక జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించింది. అనామిక డేరింగ్ ఫీట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. విమానం ఎక్కే ముందు ఆత్మవిశ్వాసంతో మహాకుంభ్ జెండాను అనామిక పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో ఉన్నాయి. అనామిక విమానం నుండి దూకడం, జెండా ఎగరవేస్తూ ‘మహాకుంభ్ 2025’కు ప్రపంచానికి స్వాగతం పలికే దృశ్యాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే కుంభమేళ న్ట అబ్బురపరుస్తాయి.‘ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభ్ 2025కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆహ్వానిస్తున్నాను’ అని అనామిక శర్మ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోనే చూస్తూ నెటిజనులు అనామికను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.వాటిలో కొన్ని...‘అపూర్వ సాహసం, భక్తిభావం మేళవించిన దృశ్యం’‘మన సంస్కృతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు’‘ఇది స్టంట్ కాదు. ప్రపంచానికి అందించిన శక్తిమంతమైన సందేశం’అనామిక తండ్రి మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తండ్రి ఒడిలో సాహసాల ఓనమాలు నేర్చుకున్న అనామికకు ధైర్యంగా ముందుకు దూసుకెళ్లడమే తెలుసు. తాజా ఫీట్‌తో తన సాహసాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది.పవిత్ర క్షేత్రమైన ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక మన సంస్కృతి, సంప్రదాయాలను వింటూ పెరిగింది. ‘మన సంస్కృతిలోని గొప్పదనం ఏమిటంటే, ఒక మంచి పని కోసం అందరూ ముందుకు వస్తారు. నేనేమిటి? నా స్థాయి ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించరు. రామాయణంలో ఉడుత కథ దీనికి ఉదాహరణ. భరతమాత బిడ్డను అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను’ అంటుంది అనామిక.భవిష్యత్‌లో మరెన్నో సాహసాలు చేయడానికి సిద్ధం అవుతున్న అనామిక ట్రైన్డ్ స్కూబా డైవర్ కూడా. మన దేశంలో ‘స్కై సి లైసెన్స్’ ఉన్న యంగెస్ట్ ఫీమెల్ స్కైడైవర్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.‘వీడియోను చూసి చాలామంది... మీకు భయంగా అనిపించలేదా అని అడిగారు. నిజం చెప్పాలంటే భక్తి భావంతో నాకు భయం కలగలేదు. ఒకటికి పదిసార్లు మనసులో మేరా భారత్ మహాన్ అనుకున్నాను’ అంటోంది అనామిక. -
ష్... ఎగ్జామ్ ప్రిపరేషన్..!
సినీరంగంలో రాణించాలనే లక్ష్యం ఉన్నంత మాత్రాన అకాడమిక్ జర్నీని నిర్లక్ష్యం చేయనక్కర్లేదు. అయితే రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం అనేది పెద్ద కళ. ఆ కళలో రాషా ఆరితేరింది.ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ(Rasha Thadani) ‘ఆజాద్’(Azzad) సినిమాతో బాలీవుడ్లో ఆరంగేట్రం చేయనుంది. ‘ఆజాద్’ సెట్స్‌కు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌లో సినిమా సెట్స్‌లో మేకప్‌లో ఉన్న రాషా 12వ తరగతి ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతూ కనిపిస్తుంది. జాగ్రఫీ పరీక్ష కోసం శ్రద్ధగా ప్రిపేరవుతున్న రాషా వీడియోను చూసి నెటిజెనులు ప్రశంసలు కురిపించారు. ‘ఎంతైనా చదువు చదువే. సినిమాల్లోనే కాదు అకడమిక్‌గా కూడా రాషా విజయం సాధించాలి’ అని ఆశీర్వదించారు. (చదవండి: కలల మేఘంపై అనూజ..) -
గృహిణి అంత చులకనా? అందుకే ఇలా చేశా!
‘కలలు కనడం మానవద్దు. కలలను సాకారం చేసుకోవాలంటే కష్టపడాలని మరువద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆశలకలను త్యాగం చేయవద్దు’ అంటోంది అరుణా విజయ్. తోటి గృహిణులకు ఆమె ఇస్తున్న సందేశం ఇది. గృహిణి అంటే ఏ పనీ రానివాళ్లనే అపోహతో కూడిన వెక్కిరింతకు చెంప చెళ్లుమనిపించింది అరుణ. ఏ సోషల్‌మీడియా అయితే ఆమెను తక్కువ చేసి మాట్లాడిందో అదే సోషల్ మీడియాలో ఇప్పుడామె ఒక ఇన్ఫ్లూయెన్సర్. మాస్టర్ షెఫ్ టాప్ 4 గా నిలిచి ప్రశంసలందుకుంటోంది. ఆమె వంటలకు వ్యూస్, లైక్స్‌తో విజేతగా నిలిచింది. అపోహ తొలగింది! చెన్నైలో పుట్టి పెరిగిన అరుణ 22 ఏళ్లకు పెళ్లి చేసుకుని ఇంటికి పరిమితమైంది. పదిహేనేళ్ల వయసు నుంచే వంటగదిలో ప్రయోగాలు చేసిన అరుణ భార్యగా, తల్లిగా ఇంటి బాధ్యతల నిర్వహణలో విజయవంతమైన మహిళ అనే చెప్పాలి. ఆమెది ఉద్యోగం చేసి డబ్బు సం పాదించాల్సిన అవసరం లేని జీవితమే. కానీ గృహిణి అనగానే తేలిగ్గా పరిగణించే సమాజం ఆమెకు చేసిన గాయాలెన్నో. తాను ఏదో ఒకటి సాధించాలనే కోరిక రగులుతూనే ఉండేదామెలో. ఆ కోరికే ఆమెను మాస్టర్ షెఫ్ ఇండియా 2023పోటీలకు తీసుకెళ్లింది. పోటీదారుల మీద రకరకాల కామెంట్లు రువ్విన సోషల్ మీడియా అరుణను ‘ఈవిడా... ఈవిడ గృహిణి’ అంటూ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదనే భావంతో తేలిక చేసింది. మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్లలో అరుణకు ఎదురైన చేదు అనుభవం ఇది. దక్షిణ భారత వంటలు ఇడ్లీ, దోశెలతో ఆమె ప్రయోగాలు న్యాయనిర్ణేతల నోట్లో నీళ్లూరించాయి. పోటీదారుల్లో నాలుగవ స్థానంలో నిలిచింది. పోటీ పాల్గొన్న నాటికి టాప్ ఫోర్లో నిలిచిన నాటికి మధ్య ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ‘‘సోషల్ మీడియా కామెంట్లకు మనసు గాయపడి కన్నీళ్లతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని’ చెప్పింది. మన సమాజంలో ‘గృహిణి అంటే ఏమీ తెలియని వ్యక్తి’ అనే అభిప్రాయం బలంగా ముద్రించుకుపోయి ఉంది. ఆ అపోహను తుడిచి పెట్టగలిగాను. గృహిణుల మనోభావాలకు నేను గళమయ్యాను’’ అంటోంది అరుణా విజయ్. View this post on Instagram A post shared by Aruna Vijay (@aruna_vijay_masterchef) -
భారమైన జీవనాన్ని పరుగులు తీయిస్తోంది
జీవితం ప్రతి దశలోనూ ఒక అడ్డంకిని సృష్టిస్తుంది. ఆ అడ్డంకిని ఎదుర్కొనే విధానంలోనే విజయమో, అపజయమో ప్రాప్తిస్తుంది. విజయాన్ని సాధించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది మూడు పదుల వయసున్న సంతోషి దేవ్ జీవన పోరాటం. హర్యానా వాసి సంతోషి దేవ్ ఒడిశాలోని కొయిడా మైనింగ్ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని రవాణా చేసే వోల్వో ట్రక్కు నడుపుతోంది. ఈ రంగంలో పురుషులదే ప్రధాన పాత్ర. మరి సంతోషి మైనింగ్‌లో ట్రక్కు డ్రైవర్‌గా ఎలా నియమితురాలైంది?! ముందు ఆమె జీవనం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి. మలుపు తిప్పిన గృహహింస...పదహారేళ్ల వయసులో సంతోషి దేవ్‌ని ఒడిశాలోని హడిబంగా పంచాయతీ, బాదముని గ్రామంలోని ఒక వ్యక్తితో వివాహం జరిగింది. ఆ వివాహం ఆమె జీవితాన్ని భయంకరమైన మలుపు తిప్పింది. నిత్యం వరకట్న వేధింపులు, గృహహింసతో బాధాకరంగా రోజులు గడిచేవి. కన్నీటితోనే తన పరిస్థితులను తట్టుకుంటూ కొన్నాళ్లు గడిపింది. అందుకు కారణం తల్లిదండ్రులకు తొమ్మిదిమంది సంతానంలో తను ఆరవ బిడ్డ. ఎంతటి కష్టాన్నైనా సహనంతో సర్దుకుపొమ్మని పుట్టింటి నుంచి సలహాలు. కొన్నాళ్లు భరించినా, కఠినమైన ఆ పరిస్థితులకు తల వంచడానికి నిరాకరించి, పోరాడాలనే నిర్ణయించుకుంది. తిరిగి పుట్టింటికి వచ్చింది. కానీ, అక్కున చేర్చుకోవాల్సిన కన్నవారి నుంచి అవమానాల్ని ఎదుర్కొంది. అధైర్యపడకుండా, తన సొంత మార్గాన్ని ఎంచుకోవాలనుకుంది. స్కూల్ వయసులోనే డ్రాపౌట్ స్టూడెంట్. తెలిసినవారి ద్వారా స్పిన్నింగ్ మిల్లులో పని చేయడానికి జీవనోపాధి కోసం తమిళనాడుకు వలస వచ్చింది.కుదిపేసిన పరిస్థితుల నుంచి...భారీ వాహనాలు నడపడంలో శిక్షణ పొందింది. 2021లో క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్్సపోర్ట్ (సిఆర్యుటి) నిర్వహిస్తున్న సిటీ బస్ సర్వీస్ అయిన ‘మో’ బస్‌కు డ్రైవర్‌గా నియమితురాలైంది. ఒడిశాలో ఒంటరి మహిళా బస్సు డ్రైవర్‌గా మహిళా సాధికారతని చాటింది. అయితే ఆశ్చర్యకరంగా, ఆమె విజయగాథ అక్కడి నుంచి తొలగింపుతో ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. ‘తొలి మహిళా బస్సు డ్రైవర్ కావడంతో స్థానిక మీడియా నన్ను హైలైట్ చేసింది. ఒక నెల తరువాత, అధికారులు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. నా తప్పు ఏమిటో అర్థం కాలేదు. కానీ, మళ్ళీ జీవితం నన్ను పరీక్షించిందని అర్ధమైంది. దీంతో బతకడానికి మళ్లీ ఆటో రిక్షా డ్రైవింగ్‌కు వచ్చేశాను’ అని తన జీవిత ప్రస్థానాన్ని వివరించింది సంతోషి. ఆరు నెలల క్రితం ఓ మైనింగ్ కంపెనీ సంతోషి పట్టుదల, ధైర్యాన్ని గుర్తించింది. వోల్వో ట్రక్కును నడపడానికి ఆఫర్ చేసింది. ‘ఏ కల కూడా సాధించలేనంత పెద్దది కాదు. ఆరు నెలల నుంచి నెలకు రూ.22,000 జీతం పొందుతున్నాను’ అని గర్వంగా చెబుతోంది ఈ పోరాట యోధురాలు. జీవనోపాధిని వెతుక్కుంటూ...‘‘మా అత్తింటిని విడిచిపెట్టిన నాటికే గర్భవతిని. కొన్ని రోజులకు తమిళనాడులోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడే 2012లో కూతురు పుట్టింది. మూడేళ్లు నా తోటి వారి సాయం తీసుకుంటూ, కూతురిని పెంచాను. ఆమెకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ప్రతి పైసా పొదుపు చేశాను. స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నప్పుడు చెన్నైలో ఆటో రిక్షా నడుపుతున్న ఓ మహిళను చూశాను. ‘ఆమెలా డ్రైవింగ్ చేయలేనా?‘ అని ఆలోచించాను. నా దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు మొత్తం, చిన్న రుణంతో ఆటో రిక్షా కొనుక్కుని ఒడిశాలోని కియోంజర్కి వచ్చేశాను. నా కూతురుకి మంచి భవిష్యత్తును అందించడానికి ఆమెను హాస్టల్ వసతి ఉన్న స్కూల్లో చేర్పించాను. ఒడిశాలోని అనేక మంది ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు అందుకున్నాను’ అని వివరించే సంతోషి ఆశయాలు అక్కడితో ఆగలేదు. -
పల్లె టు దిల్లీ
‘ఇప్పుడు ఎందుకు లే...’ అని రాజీపడే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ‘ఎప్పుడు అయితే ఏమిటి!’ అనుకుంటూ ఉత్సాహంగా కార్యక్షేత్రంలోకి దిగేవాళ్లు ఎప్పుడూ విజేతలే. అలాంటి ఒక విజేత పెబ్బటి హేమలత. పెద్ద చదువులు చదవకపోయినా... పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కన్నది. హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ (ఫిష్ ఆంధ్ర) తో తన కలను నిజం చేసుకుంది. అత్యుత్తమ వ్యాపారవేత్తగా రాష్ట్రపతి అవార్డ్‌కు ఎంపికైంది. స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం డొమెస్టిక్ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిష్ ‘ఆంధ్ర స్టోర్స్’ను ప్రోత్సహించింది. రూ.3.25 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన యూనిట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. ఆరోజు మొక్కై మొలిచిన ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ఇప్పుడు చెట్టై ఎంతోమందికి నీడనిస్తోంది. ‘డొమెస్టిక్ మార్కెటింగ్’ విలువను జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది...కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని సోమప్ప నగర్‌కు చెందిన హేమలత సాధారణ గృహిణి. ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనేది తన కల. స్నాక్స్ (తినుబండారాలు)తో వ్యాపారం మొదలుపెడితే బాగుంటుందని ఆలోచించింది. కొంత మంది మహిళలతో కలసి చక్కిలాలు తయారు చేయటం మొదలు పెట్టింది. వాటిని పట్టణంలోని చిన్నచిన్న మిఠాయి కొట్లకు సరఫరా చేసేది. క్రమంగా నలభై మంది మహిళలతో కలసి వ్యాపారాన్ని విస్తరించింది. పరోక్షంగా వంద మందికిపైగా ఉపాధి కల్పించింది. చకిలాలతోపాటు చెగోడిలు, నిప్పట్లు, బులెట్లు, మసాలా వడలు, స్వీట్స్ వంటి పదిరకాల స్నాక్స్‌ను తయారు చేసి ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, తెలంగాణ లోని ఐజ, గద్వాల వరకూ అంగళ్లకు సరఫరా చేస్తోంది. ప్రతి రోజు రూ.30 వేలకు పైగా స్నాక్స్‌ను తయారు చేయించి మార్కెట్ చేస్తోంది. తన దగ్గర పనిచేసే నలభై మంది మహిళలతో నాలుగు పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసింది.ఎకో ఫ్రెండ్లీ నాన్ ఓవెన్ బ్యాగ్‌లు΄్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయం ఆలోచించిన హేమలత బ్యాంక్‌ల సహకారంతో రూ.50 లక్షలతో కాలుష్యరహిత నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ యూనిట్నుప్రారంభించింది. పది మంది వర్కర్స్‌తో ఈ యూనిట్‌ను నడుపుతోంది. 10–14 ఇంచుల సైజ్ మొదలు 16–21 సైజు వరకూ వివిధ రకాల బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. వినియోగదారుల డిమాండ్‌ను బట్టి డి–కట్, డబ్లూ–కట్, బాక్స్‌టైప్, స్టిచ్చింగ్ బ్యాగ్‌లను తయారు చేయిస్తోంది. తమ దగ్గర తయారు చేసే నాన్ ఓవెన్ బ్యాగ్‌ల స్టిచ్చింగ్ పనిని పొదుపు సంఘాల్లో పనిచేసే మహిళా టైలర్లకు ఇస్తూ వారికి వేతనాలు చెల్లిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని మాల్స్, స్టోర్స్‌కు సరఫరా చేస్తోంది. నాన్ ఓవెన్ బ్యాగ్‌ల తయారీ టర్నోవర్ ఏడాదికి రూ. కోటి దాటిపోయింది. కోవిడ్ సమయంలో మాస్క్‌లు, ఆస్పత్రి మెటీరియల్స్‌ను తయారు చేయించి ఎంతోమందికి ఉపాధి చూపింది.దక్షిణాదిలో నెంబర్వన్ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్వయం ఉపాధి రంగాలకు ప్రోత్సాహకాలందించేవారు. గత ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి మత్స్య సహకార యోజన (పీఎంఎంఎస్వై)తో హేమలత ఎమ్మిగనూరులో రూ.50 లక్షలతో ఫిష్ ఆంధ్ర (హేమ శ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్) ను ప్రారంభించింది. ఫిష్ ఆంధ్ర నిర్వహణ లో దక్షిణాదిలోనే ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ప్రథమ స్థానంలో నిలిచింది.కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ఓ చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన హేమలత ఎంతోమంది ఔత్సాహికులకు ‘ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్’గా స్ఫూర్తిని ఇస్తోంది.‘ఫిష్ ఆంధ్ర’కు రాష్ట్రపతి అవార్డు ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. రూ.20 లక్షలు సబ్సిడీ రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చగా, రూ.7.5 లక్షలు హేమలత సమకూర్చుకుంది. మిగిలిన రూ.42.50 లక్షలను బ్యాంక్ రుణంగా ఇచ్చింది. ‘ఫిష్ ఆంధ్ర లాంజ్..హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ తక్కువ కాలంలోనే విశేష ఆదరణ పొందింది. ఇరవై మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న ఈ యూనిట్ ద్వారా రోజుకు రూ.40–50 వేల వరకు వ్యాపారం సాగించే స్థాయికి చేరుకుంది. చిక్కీల నుంచి రెస్టారెంట్ వరకు ఏటా రూ.కోటికి పైగా వ్యాపారం చేస్తూ వందమంది ప్రత్యక్షంగా, మరో యాభై మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచింది హేమలత. సూపర్ సక్సెస్ అయిన ఈ యూనిట్‌ను కేంద్ర బృందం పలుమార్లు సందర్శించి అత్యుత్తమ యూనిట్‌గా గుర్తించింది. హేమలత రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైంది. గర్వంగా ఉందిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నెల 26న అవార్డు అందుకోబోతున్నానన్న వార్త తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది. సుమారు వందమందికిపైగా మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది. పేదరిక నిర్మూలనకు, మహిళా ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వాలు అందిస్తున్నప్రోత్సాహం, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. చాలా పథకాలపై ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రభుత్వ పథకాలు, నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. – పెబ్బటి హేమలత– గోరుకల్లు హేమంత్ కుమార్, సాక్షి, ఎమ్మిగనూరు, – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి. -
సరిహద్దుల్లో సాహసమే వెన్నెముకగా...
‘ఓ పక్షీ! నీ పాట ఇక్కడ పాడబోకు ఎగిరిపో... నీ వనాలెక్కడున్నాయో వెతుక్కుంటూ’ అనేది కవి వాక్యం. బీటెక్ చదువుతున్న మహాలక్ష్మి టెక్ దారిలో వెళ్లకుండా... బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)కు ఎంపికైంది. తెనాలి అయితానగర్ అమ్మాయి మహాలక్ష్మి ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సగర్వంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది..ఎన్సీసీలో చేరిన రోజుల్లో ఎంతోమంది సాహసికులైన సైనికుల గురించి తెలుసుకునే అవకాశం మహాలక్ష్మికి వచ్చింది. ఆ సమయంలోనే ‘నేను సైతం సైన్యంలోకి’ అనే లక్ష్యానికి బీజం మహాలక్ష్మి మదిలో పడింది. మహాలక్ష్మి తల్లి వెంకాయమ్మ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు, తండ్రి రాజుది పెయింటింగ్ వృత్తి. చాలీచాలని సంపాదనైనా ఆ దంపతులు బిడ్డలిద్దరినీ చదివించారు. మహాలక్ష్మి చదువుతో పాటు ఆటపాటల్లోనూ ప్రతిభ చూపేది. ఎన్సీసీ మాస్టారు బెల్లంకొండ వెంకట్ ప్రోత్సాహంతో ఎన్సీసీలో చేరింది. రెండు జాతీయ శిబిరాలకు హాజరయ్యే అవకాశం వచ్చింది. కాలేజి గ్రౌండులో వ్యాయామం చేసేందుకు వస్తుండే బాలయ్య అన్నయ్య రన్నింగ్, హైజంప్‌లో అథ్లెటిక్స్‌లో సాధన చేయించాడు.జోనల్ అథ్లెటిక్ మీట్లో రన్నింగ్‌లో ఫస్ట్ వచ్చింది. చదువే లోకం అనుకునే అమ్మాయికి ఎన్సీసీ, ఆటలు పరిచయం కావడంతో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపించింది. తనలోని శక్తిసామర్థ్యాలకు పదును పెట్టుకునే అవకాశం వచ్చింది. టెన్త్ తర్వాత సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజిలో పాలిటెక్నిక్‌లో చేరిన మహాలక్ష్మి, తర్వాత అదే కాలేజిలో బీటెక్ సెకండియర్‌లో చేరింది. ప్రస్తుతం ఫైనలియర్లో ఉండాల్సింది. ఈలోగా 2022లో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. 2023లో బీఎస్ఎఫ్కు ఎంపికైంది. పశ్చిమబెంగాల్ బైకాంతపూర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంపులో 11 నెలల శిక్షణ పూర్తి చేసుకుంది. గత అక్టోబరు 28న పశ్చిమబెంగాల్లోని బీఎస్ఎఫ్ 93 బెటాలియన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అదే రాష్ట్రంలో ఇండో–బంగ్లాదేశ్ బోర్డర్లోని జపర్సల వద్ద మహాలక్ష్మి సైనికురాలిగా ఉద్యోగ విధులు నిర్వహిస్తోంది.ప్రస్తుతం క్రిస్మస్ సెలవులకని సొంతూరు తెనాలికి వచ్చింది. శిక్షణ రోజుల గురించి ప్రస్తావించినప్పుడు ఇలా చెప్పింది.... ‘బైకాంతపూర్‌లోని క్యాంపులో శిక్షణ చాలా కఠినంగా ఉండేది. చిన్నప్పటి నుంచి ఆడిన ఆటలు, చేసిన వ్యాయామాల వల్ల కష్టం అనిపించేది కాదు. తెల్లవారుజాము నాలుగు గంటల్నుంచే రన్నింగ్, ఇతర వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. తర్వాత తరగతులు ఉంటాయి. ఏకే 47తో సహా రకరకాల వెపన్లు విడగొట్టటం, నిర్ణీత వ్యవధిలో అమర్చటం, బుల్లెట్లను లోడు చేయడం, ఫైరింగ్... మొదలైనవి ఎన్నో సాధన చేయించేవారు. సాయంత్రం 5 గంటల నుంచి సరిహద్దులో డ్యూటీ చేయాలి. కష్టమే అయినా ఇష్టంగా చేయగలిగాను’‘సైన్యంలో పనిచేస్తున్నావట కదా... మంచి విషయం అమ్మా’ అని అభినందించే వారే కాదు... ‘సరిహద్దుల్లో ఉద్యోగమా! అంత కష్టమెందుకమ్మా. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకోవచ్చు కదా!’ అని సలహా ఇచ్చేవారు ఉన్నారు. సైన్యంలో జెండర్ బారియర్స్ తొలగిపోతున్న కాలం ఇది. పురుషులతో సమానంగా అమ్మాయిలు సత్తా చాటుతున్న కాలం ఇది. ఇలాంటి కాలంలో.... నిరాశపరిచే మాటలు వారి హృదయాలను చేరవు. దేశభక్తి ఉన్న హృదయాలకు భయాలతో పనేమిటి! కమాండర్ స్థాయికి చేరుకోవాలని...ఎన్సీసీలో ఉన్నప్పుడు ఎంతోమంది గొప్ప సైనికుల గురించి, వారి త్యాగాల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆ వీరులు, త్యాగధనుల గురించి వింటున్న క్రమంలో ‘ఏదో ఒకరోజు నేను కూడా సైన్యంలో పనిచేస్తాను’ అనుకునేదాన్ని.అయితే అదెంత కష్టమో నాకు తెలియంది కాదు. ప్రోత్సహించేవారి కంటే నిరూత్సాహపరిచేవారే ఎక్కువగా ఉంటారు. కష్టాన్ని ఇష్టపడేవారే విజేతలు అవుతారు. శిక్షణ కాలంలో బైకాంతపూర్ క్యాంప్‌లో ‘ఇంత కష్టమా’ అనిపించలేదు. ‘ఇన్ని విషయాలు తెలుసుకున్నాను కదా’ అనుకున్నాను. దేశభక్తి గురించి అధికారులు చెప్పిన మాటలు నాలో స్ఫూర్తిని కలించాయి. ఆ స్ఫూర్తితోనే దేశ సరిహద్దుల రక్షణకు అంకితమయ్యాను. బాగా కష్టపడి బీఎస్ఎఫ్లో కమాండర్ స్థాయికి చేరుకోవాలనేది నా కల.– వై.మహాలక్ష్మి – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
‘పురుషసూక్తం': పురుషాధిపత్యాన్ని కాపాడటానికి మహిళలే..
‘పురుషసూక్తం’.. ‘టిట్ ఫర్ టాట్.. కన్వర్జేషన్స్ బిట్వీన్ ఎ బ్రా అండ్ ఎ బ్రీఫ్’.. రెండు నాటకాలు. ఇవి పురుష భావజాలంపై నటి ఝాన్సీ రూపొందించిన సంవాదాలు. ఆలోచనావీచికలు... మార్పుకై నివేదనలు. ఝాన్సీ తన టీమ్‌తో రవీంద్రభారతిలో జనవరి 12న ప్రదర్శించనున్న సందర్భంగా...‘తెలంగాణ థియేటర్ రీసెర్చ్ కౌన్సెల్ వాళ్లు 2019లో విమెన్స్ డేకి ‘విమెన్ డైరెక్టర్స్ ఫెస్టివల్’ను కండక్ట్ చేస్తూ నన్ను కూడా అడిగారు ఒక నాటకం ఇస్తాం.. డైరెక్ట్ చేయమని. వాళ్లిచ్చిన నాటకం కంటే నేను నా ఐడియాలజీని నాటకంగా ప్రెజెంట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దాన్నొక చాలెంజ్‌గా తీసుకున్నాను. నేను చదివిన, చూసిన, నేర్చుకున్న, ఏర్పర్చుకున్న దృక్పథాన్ని పేపర్ మీద పెట్టాను. అదే నా ఫస్ట్ ప్లే.. ‘పురుషసూక్తం.’ జెండర్ కళ్లద్దాలతో మాస్క్యులినిటీని మనమెలా చూస్తున్నాం, దాన్నెలా పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల పురుషుడు తాను మనిషినన్న విషయాన్ని మరచిపోయి, అనవసరపు బరువు బాధ్యతలను ఎలా మోస్తున్నాడు, ఆ పురుషాధిపత్యాన్ని కాపాడటానికి మహిళ ఎలా కోటగోడగా మారిందనే అంశాల మీద సీరియస్ చర్చే ఆ నాటకం’ అన్నారు ఝాన్సీ.రవీంద్రభారతిలో తన రెండు నాటకాలను ప్రదర్శించడానికి ఒకవైపు రిహార్సల్స్ చేస్తూ మరోవైపు సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ‘పురుషసూక్తం నాటకానికి 18 రోజు ల్లోనే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాను. డైరెక్ట్ చేయడమే కాక నటించాను కూడా. అంత సీరియస్ నాటకాన్ని రెండు పాత్రలతో ఎంతవరకు మెప్పించగలను అనుకున్నా! కానీ ఆశ్చర్యం.. కె. విశ్వనాథ్ లాంటి వారి మహామహుల ప్రశంసలు అందాయి. అది నాటక రచయితగా, దర్శకురాలిగా నా ప్రయాణాన్ని ఖరారు చేసుకునేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. థియేటరే నా మీడియమనీ అర్థమైంది’ అన్నారామె.టిట్ ఫర్ టాట్.. కన్వర్జేషన్స్ బిట్వీన్ ఎ బ్రా అండ్ బ్రీఫ్ ‘కిందటేడు (2024) అక్టోబర్ 4న వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ డే సందర్భంగా స్త్రీల ఆరోగ్యం, పురుషుల బాధ్యత లాంటి విషయాలెన్నో చర్చకు వచ్చి.. అసలిలాంటి వాటి మీద మనమెందుకు అవసరమైనంతగా మాట్లాడట్లేదు, ఏదో ఒకటి చేయాలి అనిపించి ‘టిట్ ఫర్ టాట్.. ’ మొదలుపెట్టాను’ అన్నారు ఝాన్సీ. ఇది ‘పురుషసూక్తం’ తర్వాత ఆమె రాసి నటించి దర్శకత్వం వహించనున్న రెండోనాటకం.‘రెండు రోజులకే ఏం రాయాలో తెలిసింది గాని మొదట సగం స్క్రిప్టే రాయగలిగాను. దానికే ఇంకొన్ని ఆలోచనలు జోడించి ఇంట్లో పిల్లలనే చేర్చి, క్లోజ్ సర్కిల్ ముందు వేసి చూపించాను. అలా వర్క్ చేసుకుంటూ నాటకం రాసుకుంటూ వచ్చాను. పార్ట్స్ పార్ట్స్‌గా రాస్తూ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రదర్శించి ఫ్రెండ్స్‌కు చూపించాను. అందరికీ నచ్చింది. మెయిన్ షో ఎప్పుడని అడగడం మొదలుపెట్టారు. ‘టిట్ ఫర్ టాట్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ బ్రా అండ్ బ్రీఫ్’కి కూడా మూలం పురుషాధిపత్య విషతుల్య భావజాలమే. కాకపోతే అప్రోచ్ వేరు. ఇదొక సోషల్ సెటైర్. దీనికి టార్గెట్ ఆడియన్స్ 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వాళ్లు. వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. అందుకే హ్యూమర్‌ని, వ్యంగ్యాన్ని ఎంచుకున్నాను. సీరియస్‌ను పండించడం తేలికే. వ్యంగ్యం చాలా కష్టం. భాష కూడా జెన్ జీ జార్గాన్స్‌తో ఉంటుంది. వాళ్ల తాలూకు మీమ్స్ ఉంటాయి. పురుషసూక్తం.. మగవాడు మీదేసుకున్న బాధ్యతల బరువు మీద ఫోకస్ చేసింది. ఇదేమో ఆ బాధ్యతలను ఇంకా వేసుకోని వాళ్లకు వేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతుంది’ అన్నారామె.డిబేట్.. ‘రవీంద్రభారతి ప్రదర్శనలో ఈ రెండూ నాటకాలు మరింత మార్పు చేర్పులతో వస్తున్నాయి. పురుషసూక్తంలో కోరస్ యాడ్ అవుతోంది. ‘టిట్ ఫర్ టాట్.. ’ లో ట్రాన్స్ ఉమన్, ట్రాన్స్ మన్ ఇలా అన్ని వర్గాల వాళ్లు నటిస్తున్నారు. ప్రతివాళ్లు వాళ్ల వాళ్ల శరీర ధర్మాలను రిప్రెజెంట్ చేస్తూ తమ సహజమైన పాత్రలనే పోషిస్తున్నారు. అంటే ప్రకృతిలో ఇంత వైవిధ్యం ఉంటుంది.. దాన్ని మనం గౌరవించాలి.. వాళ్ల వల్నరబులిటీని అర్థం చేసుకోవాలని తెలిపే ప్రయత్నం చేస్తున్నాం.. ప్రేక్షకులకే కాదు.. అందులో నటించిన నటీనటులకు కూడా! ఇందులో మా అమ్మాయి ధన్య పరిచయం అవుతోంది. నాటకాల ప్రదర్శన తర్వాత ఓపెన్ డిబేట్ ఉంటుంది’ అన్నారామె.రంగయాత్ర.. సామాజిక చైతన్యాన్ని తీసుకురావడంలో నాటకానిదే ప్రధాన పాత్ర మొదటి నుంచీ! ఆ బాధ్యతను కొనసాగించాలనుకుంటున్నాం.. ‘రంగయాత్ర.. థియేటర్ ఫర్ సోషల్ డిబేట్’ పేరుతో! అందులో భాగంగానే రవీంద్రభారతిలో ప్రదర్శన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని కాలేజెస్‌కి వెళ్లి అక్కడ ఈ నాటకాలను ప్రదర్శించబోతున్నాం స్ట్రీట్ ప్లే తరహాలో. ప్రదర్శన తర్వాత విద్యార్థులతో డిబేట్ పెడతాం. జెండర్ మీద అవగాహన కల్పించే ప్రయత్నమే ఇదంతా!’ అంటూ ముగించారామె.– సరస్వతి రమకొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది ‘పురుషసూక్తం నన్ను థియేటర్ ఆర్టిస్ట్‌ని చేసింది. ఈ నాటకాన్ని మగవాడిని అర్థంచేసుకునే ప్రయత్నంగా చెప్పొచ్చు. ఆ దిశగా .. పురుషాధిపత్య భావజాలంతో కండిషనింగ్ అయి ఉన్న మొత్తం సమాజాన్నే ఆత్మవిమర్శకు గురిచేస్తుంది ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది! రిహార్సల్స్‌లో ఎన్నిసార్లు నన్ను నేను తరచి చూసుకున్నానో! ఇది నాకొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్!’– వంశీ చాగంటి, హ్యాపీడేస్ ఫేమ్ -
భారతదేశపు తొలి స్టంట్ విమెన్..ధైర్యానికి కేరాఫ్ అడ్రస్..!
సినిమాల్లో హీరోలు చేసే స్టంట్ సీన్లను కళ్లను పెద్దవిగా చేసుకుని మరీ చూసేస్తాం. అంతలా చేయాలంటే ఎంతో ప్రాక్టీస్ ఉండాల్సిందే. అయితే హీరోయిన్ల విషయానికి వస్తే అలాంటి సీన్ ఉండవు. లేడీ ఓరియంటెడ్ మూవీల్లో తప్పా.. అది కూడా అన్యాయాన్ని ఎదిరించే వీర వనితలాంటి పాత్ర అయితేనే ఫైటింగ్ సీన్లు లేదంటే ఉండవు. అందులోనూ బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైంలో మహిళలను ఆ రేంజ్లో చూపించే ఛాన్సే లేదు.అయితే ఆ టైంలో ఒక అమ్మాయి అందర్నీ ఆశ్చర్యపరిచేలా స్టంట్లు చేసి వావ్ అనిపించుకుంది. కండలు తిరిగిన మగవాళ్లని ఒక్క ఊదుటన కట్టడి చేసే ఆమె తెగువకు అందరూ కంగుతిన్నారు. అమ్మాయిలు ఇలాంటివి కూడా చేయగలరనేందుకు ఆమె ప్రేరణగా నిలిచింది. ఆమె వల్లనే ఈనాడు సినిమాల్లో అమ్మాయిలకు మంచి స్టైలిష్ ఫైటింగ్ సీన్లు ఇచ్చారని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాంటే భారతదేశపు తొలి స్టంట్ విమెన్ ఆమె. ఎవరామె..ఎలా ఆమె సినీ ప్రస్థానం మొదలైందంటే..ఫియర్లెస్ నదియా(Nadia)గా ప్రసిద్ధి చెందిన నటి-స్టంట్ విమెన్(Stuntwoman) మేరీ ఆన్ ఎవాన్స్ ఆరోజుల్లో అసాధారణమైన ఫైట్లతో ప్రేక్షకులను అలరించింది. 1908లో జన్మించిన నదియా అసామాన్యమైన ధైర్యం బలం, నిర్భయ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండేది. అలనాటి బాలీవుడ్(Bollywood) మూవీ హనీ బన్నీలో అసామాన్యమైన ధైర్యసాహసాల గల హీరోయినే నదియా. అందులో ఆమె చేసిన స్టంట్లు సినిమా వరకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె నిజజీవితంలో కూడా అలానే ఉంటారామె. ఆస్ట్రేలియా(Australia) మూలాలకు చెందిన నీలి కళ్ల అందగత్తె నదియా. ఆ రోజుల్లో మెకాలి ఎత్తు బూట్లువేసుకుని కొరడాతో ప్రత్యర్థులను చిత్తు చేసే హీరోయిన్గా ప్రేకక్షకులను మెప్పించింది. చెప్పాలంటే ఇలాంటి ధైర్యవంతమైన మహిళలను కూడా ఆదిరిస్తారు ప్రజలు అని తన నటనతో చాటిచెప్పింది. వైవిధ్య భరితమైన సాహోసోపేతమైన పాత్రల చేసినందుకు గానూ ఆమెను హంటర్‌వాలి అని ముద్దుగా పిలుచుకునేవారు అభిమానులు. ఆస్ట్రేలియాలోని గ్రీకుకి చెందిన తల్లి పెర్త్, బ్రిటిష్ తండ్రి(British father)కి జన్మించింది ఎవాన్స్(నదియా). తన తండ్రి సైనిక విభాగంతో భారత్‌కు రావడంతో ఇక్కడ వచ్చింది. అయితే తండ్రి మరణంతో కుటుంబం మొత్తం బొంబాయిలోనే స్థిరపడింది. నటిగా కెరీర్ ప్రారంభించటానికి ముందు సర్కస్‌లో పనిచేసేది. అక్కడ నృత్యం,గుర్రపుస్వారీల వంటి ప్రదర్శనలు ఇచ్చేది. అలా నటిగా కెరీర్‌ని చిన్న చిన్న పాటలతో ప్రారంభించింది. వాటికి ప్రేక్షకుల ఆదరణ లభించడమే గాక ఓ బాలీవుడ్ దర్శకుడుని దృష్టిలో పడేలా చేసింది. ఆయన ఆమెలోని ప్రతిభను గుర్తించి బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా పరిచయం చేశాడు. అలా ఆమె సినిరంగ ప్రవేశం చేయడమే గాక, మహిళలు స్టంట్ సీన్లను చేయగలరని ప్రూవ్ చేసింది. ఆమె కెరీర్లో మైలు రాయి హంటర్‌వాలి మూవీ. అందులో తన తండ్రి మరణానికి న్యాయం కోరుతూ ప్రతీకారం తీర్చుకునే యువరాణిగా అలరించింది. ప్రజలు మదిలో ఆ పాత్ర నిలిచిపోయేలా నటించింది నదియా. ఆ విధంగా ఆమె బాలీవుడ్లో ప్రముఖ తారగా వెలుగొందింది. ఆమె సంతకం కూడా వెరైటీగా ఉంటుంది అరుపులాగా హే య్! అని క్యాచీగా సంతకం చేస్తుంది. నదియా నిర్భయమైన మహిళగా విలన్లతో పోరాడే పాత్రలనే ఎక్కువగా చేసింది. ప్రజలు ఆమె స్టంట్లకు బ్రహ్మరథం పట్టేవారట. ఆమె కారణంగానే హీరోయిన్లకు ఇలాంటి పాత్రల ఇచ్చేలా మార్గం సుగమం అయ్యిందని అంటారు సినీ విశ్లేషకులు. అంతేగాదు బాలీవుడ్ కల్ట్ హోదా(విశేష ప్రజాదరణ)ను పొందిన విదేశీయులలో ఆమె కూడా ఒకరు. హీరోయిన్లంటే మాములు పాత్రలకే పరిమితమైన మూసధోరణిని బద్ధలు కొట్టి సాహసోపేతమైన విన్యాసాలను అవలీలగా చేయగలరని చెప్పేలా స్ఫూర్తిగా నిలిచింది. ఆమె 1996లో 88వ పుట్టిన రోజున మరణించారు. ఇప్పటికీ స్టంట్ విమెన్ అనగానే నదియా అని గుర్తొచ్చాలా ప్రజల మదిలో నిలిచిపోయారామె.(చదవండి: ఆయన దూరమవ్వడానికి కారణం అదేనేమో..! ఈ వేదన, బాధను..) -
రూ. 25 లక్షల ఐటీ జాబ్ వదిలేసి.. ఆర్గానిక్ వైపు జాహ్నవి జర్నీ!
మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్, ఐఎమ్‌టీ ఘజియాబాద్‌లో ఎంబీఏ చదివి నగరంలోని ఐటీ కంపెనీల్లో ఏడాదికి రూ.25 లక్షలకు పైగా జీతమిచ్చే ఉద్యోగాలు చేశారు. ఆ ఉద్యోగాలను వదిలేసి..‘ఆర్గానిక్ ఉత్పత్తులు ఆరోగ్యాన్నిస్తాయి.. కల్తీ ఆహార ఉత్పత్తులతో రోగాల పాలు కావొద్దు’ అని ఇంటింటికీ వెళ్లి చెబుతున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఆ విశేషాలు నగరవాసి యోగితా జాహ్నవి మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో గర్భిణిగా ఉన్నప్పుడు పోషకాహారం తినాలని ప్రతి ఒక్కరూ చెబుతారు కానీ పోషకాలు అందించే ఆహారం దొరకాలి కదా.. ఇప్పుడు ఎటు చూసినా కల్తీ.. ఈ పరిస్థితుల్లో కడుపులోని బిడ్డకు స్వచ్ఛమైన ఆహారం అందించడం ఎలా?’ అంటూ చాలా ఆందోళన చెందాను’ అంటూ తాను గర్భిణిగా ఉన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు ఆర్గానిక్ ఉత్పత్తుల సంస్థ వీ రిచ్ నిర్వాహకురాలు యోగితా జాహ్నవి. అంతా కల్తీ.. తినేదెలా? అదీ ఇదీ లేదని సందేహం వలదు.. ఎందెందు వెదికినా అందందే కలదు అడల్ట్రేషన్.. మనం తింటున్న ఆహారం మనకు పోషకాలు ఇస్తోందా? రోగాలు తెస్తోందా? ఈ ఆందోళన గర్భిణిగా ఉన్నప్పుడు మరింత పెరిగింది. కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా స్వచ్ఛమైన పాలు, తేనె, కుంకుమ పువ్వు తీసుకోవాలనే ఆరాటంతో నా అన్వేషణ మొదలైంది. ఎంత కష్టమైనా సరే స్వచ్ఛమైన ఆహారోత్పత్తులను అందించాలనే తపన పెరిగింది. అదే ఏళ్ల తరబడి శ్రమించి అందుకున్న డిగ్రీ పట్టా, అది అందించిన లక్షల జీతమిచ్చే ఉద్యోగం.. వదిలేసి మా పల్లెటూరి వైపు నా చూపును మళ్లించింది. ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం పాడితో కూడి.. ప్రభుత్వోద్యోగం చేసి రిటైరయ్యాక డైరీ ఫార్మ్ పెడదామని నాన్న కల. ఉద్యోగం వదిలేశాక మా నాన్న కల సాకారంతో పాటు నా ఆశయాలకు ఆకారం కూడా ఇవ్వాలని మా సొంత ఊరు కందుకూరులో ఒక డైరీ ఫార్మ్‌ను ఏర్పాటు చేశా. ఆవులు, గేదెలకు గ్రోత్ హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వకుండా వాటి మేత కూడా సహజమైన ఆహారమే అందిస్తున్నాం.. తద్వారా ఏ దశలోనూ కల్తీ కాని, రసాయనాలు కలవని స్వచ్ఛమైన పాలు ఉత్పత్తి చేస్తున్నాం. పరిశోధించి.. పరిశీలించి.. పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ఒకే సీజన్లో తేనె లభిస్తుంది. ప్రభుత్వం, ఎన్జీవోలు కలిపి ప్రతి ఇంటికీ తేనె సేకరించేలా ఏర్పాట్లు చేస్తారు. విభిన్న రకాల పూల నుంచి సేకరించిన ఈ తేనెలో ఔషధ విలువలు పుష్కలం. ఇది తెలిసి అక్కడకు వెళ్లి వారితో ఒప్పందం కుదర్చుకున్నా. అదేవిధంగా బెల్లం పొడి కూడా అక్కడిదే. మెటల్ సీడ్ నుంచే పుట్టే ఈ బెల్లం ఆరోగ్యకరం. ఇక్కడ లభించే బెల్లం పొడిలా దీన్ని కలిపితే పాలు విరగవు. ఇందులో ఐరన్ కంటెంట్ బాలింతలకు ఆరోగ్యకరం. అలాగే అత్యుత్తమ రైస్ రకం గురించి అన్వేషిస్తే బ్లాక్ రైస్ గురించి తెలిసింది. వియత్నాం, రష్యాలో ఈ రైస్‌కి బాగా డిమాండ్ ఉంది. మన దేశంలో మణిపూర్‌లో బాగా పండిస్తారు. అక్కడి నుంచి బ్లాక్ రైస్ తెస్తున్నా. అలాగే కశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు ఇలా దాదాపు డజనుకుపైగా అన్వేషించినవి, అత్యుత్తమమైనవి అందిస్తున్నా. దీన్నేదో కేవలం వ్యాపారంగా చూడటం లేదు. అత్యధిక శాతం మహిళా సిబ్బందితో నడిచే మా సంస్థ.. ఇంటింటికీ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు చేరవేయాలని, ముఖ్యంగా బాలింతలు, బలహీనంగా ఉండే మహిళలకు బలవర్థకమైన ఆహారం అందించాలనే ఆశయంతో నిర్వహిస్తున్నాం. -
పుట్టినింటికి ఆడబిడ్డలు
ఊరు అంటే ఊరు కాదు. జ్ఞాపకాల తోట. ఖండాంతరాలు దాటినా ఆ పరిమళం మనసును వీడిపోదు. ఏదో ఒక సమయాన స్వరూపకు నాగమణి గుర్తుకు వస్తుంది. పక్కింటి నాగమణి, స్వరూప క్లోజ్‌ఫ్రెండ్స్. దగ్గరలో ఉన్న మండల కేంద్రానికి సినిమాకు వెళ్లడం నుంచి సీమచింతకాయల వేట వరకు వారి జ్ఞాపకాల్లో ఎన్నో ఉన్నాయి. పెళ్లి అయిన తరువాత నాగమణి అక్కడెక్కడో సూరత్‌లో ఉంటుంది. స్వరూప కూడా పెళ్లయిన తరువాత సొంతూరులో కాకుండా వేరే ఊళ్లో ఉంటుంది. ఆ దూరం అలా కొనసాగుతూనే ఉంది.ఇక అంతేనా?‘ఈ 5జీ జమానాలో కూడా అంతేనా... ఇంతేనా అంటూ నిట్టూరిస్తే ఎలా?’ అంటూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజన్న గూడెం మహిళలు. పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితుల ‘పూర్వ విద్యార్థుల సమ్మేళనం’ మనకు తెలుసు. అయితే ఇది అలాంటి సమ్మేళనం కాదు... రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం!పెళ్లయిన తరువాత ఎక్కడెక్కడో వేరు వేరు ఊళ్లలో ఉంటున్న ఆడపడుచులు ఈ సమ్మేళనం పుణ్యమా అని ఎన్నో సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. రోజంతా సంబరాలు చేసుకున్నారు! ‘నా బిడ్డలందరూ నా దగ్గరికి వచ్చారు’ అని ఊరు సంతోషంతో ఉప్పొంగి పోయిన రోజు అది....బతుకమ్మ పండుగ రోజు...యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాజన్న గూడెం ఆడబిడ్డలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉన్న ఊరిని వదిలి అత్తారింటికి వెళ్లిన ఆడపడుచులందరు ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో ఒక చోటకు చేరారు. అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చే వారి సంఖ్య ప్రతి యేడూ తగ్గుతోంది. పోయిన బతుకమ్మ పండుగ రోజు ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారు కొందరు మహిళలు. ‘అందరం ఒక రోజు కలుసుకొని మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది’ అనుకున్నారు. అది అసాధ్యమైన కోరికేమీ కాదనే విషయం కూడా వారికి తెలుసు. ‘ఎంత బాగుంటుంది అని ఒకటికి పదిసార్లు అనుకోవడం కాదు. కచ్చితంగా కలవాల్సిందే’ అంటూ నడుం బిగించారు.సోషల్ మీడియా వేదికగా....అనుకున్నదే తడవుగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. వివిధ రంగాల్లో ఉన్న తమ ఊరి ఆడబిడ్డలను ఒకదగ్గర చేర్చడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. పేరాల ఇందిర, సూదిని రజిని, యాట ఇందిరాదేవి, రావుల ఉమాదేవి, ఊట్కూరి లక్ష్మి నాలుగు నెలల పాటు ఎంతో శ్రమ తీసుకున్నారు. ఫోన్ నెంబర్లు సేకరించడం నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వరకు ఎన్నో చేశారు.దాగుడుమూతలు... దస్తీబిస్తీలుఅనుకున్న రోజుకు దాదాపు అందరూ వచ్చారు. ఇరవై ఏళ్ల నుంచి తొంభై ఏళ్ల వయసు వరకు ఎంతోమంది మహిళలు వచ్చారు. వయసు తేడా లేకుండా చిన్నపిల్లలై పోయారు. దాగుడు మూతలు, దస్తీబిస్తీ, మ్యూజికల్ చైర్, బెలూన్ బ్లాస్టింగ్, ఒంటికాలి కుంటుడు ఆటలు, డీజే పాటలతో హోరెత్తించారు.‘ఎవరి లోకం వారిదే’ అయిపోయిన ఈ కాలంలో, ఒకే ఇంటి కుటుంబ సభ్యులు కూడా వేరు వేరు ప్రపంచాలు అయిన ఈ ఉరుకులు పరుగుల కాలంలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయి. పల్లె మోములో రోజూ పండగ కళను తీసుకువస్తాయి.మరెన్నో ఊళ్లకు ‘రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం’ స్ఫూర్తిని ఇవ్వాలని ఆశిద్దాం.ఇక ప్రతి సంవత్సరం...ఆ రోజు పండగే!మా ఊరి ఆడబిడ్డలం అందరం ఒకచోట చేరి చిన్న పిల్లలమయ్యాం. చిన్నప్పటి పండుగలను, ఆనాటి సంబరాలను గుర్తు చేసుకున్నాం. వయసు తేడా లేకుండా ఆటలాడుకున్నాం. మా ఊరి మీద మరింత ప్రేమ పెంచుకున్నాం. ప్రతి సంవత్సరం ‘ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ ఏర్పాటు చేయాలని, మరింత ఎక్కువమంది హాజరయ్యేలా చూడాలనుకుంటున్నాం.– ఊట్కూరి లక్ష్మి, నల్లగొండకళ్లనీళ్లు పెట్టుకున్నారు‘రాజన్న గూడెం ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో చేపట్టిన కార్యక్రమం మా జీవితంలో మరవలేనిది. ఎన్నోతరాల ఆడబిడ్డలను ఒకచోటికి రప్పించాం. రకరకాల కారణాలతో పుట్టిన ఊరికి ఇక రాలేమనుకున్న వారిని సైతం గుర్తించి రప్పించడం విశేషంగా భావిస్తున్నాం. ఆడబిడ్డలందరినీ ఒకచోట చూసి పెద్ద వయసు వారు కన్నీటి పర్యంతమయ్యారు.– పేరాల ఇందిర, మోత్కూరుమళ్లీ మళ్లీ రావాలని...తల్లిదండ్రులు చనిపోయిన వారు, సింగిల్ పేరేంట్స్... మొదలైనవారు మా ఊరికి చాలా ఏళ్లుగా రావడం లేదు. అలాంటి వారందరినీ ‘ఆత్మీయ సమ్మేళనం’ ద్వారా రప్పించాం. వచ్చినవారంతా ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకున్నారు. నిక్‌నేమ్‌లను గుర్తు చేసుకున్నారు. మరోసారి ఇలాంటి కార్యక్రమం పెడితే మళ్లీ పుట్టింటికి వచ్చినట్లు వస్తామని సంతోషంగా చెప్పి వెళ్లారు. – సూదిని రజిని, సిరిపురంఅంబరాన్ని అంటిన సంబరంప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు కొద్దిమందిమి మాత్రమే పుట్టింటికి వస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఆత్మీయ సమ్మేళనం’కు రూపకల్పన చేశాం. ఊరు దాటగానే ఎవరి లోకం వారిదై పోతుంది. అలా కాకుండా పట్టుదలగా, ఇష్టంగా పనిచేశాం. రాలేమన్న వారిని ఒప్పించి రప్పించాం. మా ఊరి ఆడబిడ్డల ముఖాల్లో మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని చూశాం. – యాట ఇందిరాదేవి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్,సీతాఫల్ మండి, సికింద్రాబాద్ – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం
నెలకు లక్షల్లో సంపాదిస్తేనే ఔరా అనుకుంటాం కదా. కానీ బ్రిటీష్ బిలియనీర్, మహిళా వ్యాపారవేత్త, అత్యధిక వేతనం పొందే మహిళగా నిలిచింది. 2024లో జీతం , డివిడెండ్లలో 150 మిలియన్ పౌండ్లను ( రూ.1,500 కోట్లకు పైగా) వేతనం అందుకుంది. అంటే రోజురు నాలుగు కోట్ల వేతనం అన్నమాట. అదీ 45 శాతం వేతన కోత తరువాత. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎవరీ డెనిస్.. ఆమె కంపెనీ ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలో.57 ఏళ్ల డెనిస్ కోట్స్(denise Coates)కన్న కల చాలా పెద్దది. అందుకే ఆమె స్థాపించిన ఒక చిన్న కంపెనీ ఇపుడు ప్రపంచాన్ని ఏలుతోంది. 2000లో ఒక మామూలు కారు పార్కింగ్ స్థలంలో "బెట్365" (Bet365)అనే ఆన్లైన్ బెట్టింగ్ సంస్థను ప్రారంభించింది. బహుశా అపుడు ఆమె ఊహించి ఉండదు..వేల కోట్ల టర్నోవర్‌తో, 8,500 మంది ఉద్యోగులతో దిగ్గజంగా ఎదిగుతుందని. కట్ చేస్తే...ఆమె విజయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డెనిస్ కోట్స్ బ్రిటన్‌లోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా అవతరించారు. సంస్థలో ఆమె మెజారిటీ వాటా50 శాతానికి పైమాటే.ది గార్డియన్ నివేదిక ప్రకారం "బెట్365" కంపెనీ అంతకుముందు సంవత్సరంలో 3.4 బిలియన్ పౌండ్ల నుండి 3.7 బిలియన్ పౌండ్లకు ఆదాయ వృద్ధిని సాధించింది. ఈక్విటీ మార్కెట్ పరిస్థితుల మెరుగుదల మధ్య ఖర్చులను తగ్గింపు, పెట్టుబడి మదింపుల నుండి లాభాన్ని ఆర్జించింది. గత ఏడేళ్లలో ఆమె సంపద ఏకంగా రూ. 20 వేల కోట్లను దాటిపోగా, గత పదేళ్లలో ఆమె ఆర్జించిన మొత్తం దాదాపు రూ.24 వేల కోట్లు. మార్చి 2024తో ముగిసిన ఏడాది లో సంస్థ పన్నుకు ముందు 626 మిలియన్ పౌండ్ల లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాదితోపోలిస్తే 60 మిలియన్ పౌండ్ల ప్రీ-టాక్స్ నష్టం నుండి గణనీయమైన పెరుగుదల.ఆన్లైన్ బెట్టింగ్స్ ఊపందుకున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో (2020) ఆమె ఆదాయం అత్యధికంగా రూ.4,690 కోట్లుగా నమోదైంది. కాగా ప్రపంచంలోని ప్రముఖ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కంపెనీల్లో ఒకటి నిలిచిన Bet365 వ్యవస్థాపకురాలైన కోటస్ 1967, సెప్టెంబరు 26న ఇంగ్లాండ్‌లోని స్టోక్-ఆన్-ట్రెంట్‌లో జన్మించింది. షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామెట్రిక్స్ అభ్యసించింది. బెట్టింగ్ షాపులను నిర్వహించు కుటుంబ నేపథ్యంతో ఆమె ఈ కంపెనీని స్థాపించింది. ఆమె సోదరుడు జాన్ కోట్స్ సంస్థకు సంయుక్త సీఈఓగా(CEO), ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నారు. అంతేకాదు స్టోక్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ స్టేడియానికి బెట్365 పేరు పెట్టారంటేనే Bet365కంపెనీ ప్రాముఖ్యతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు.విమర్శలు, వివాదాలు అయితే ఇంత ప్రాపులర్ అయిన సంస్థకు సంబంధించి మరో కోణం కూడా ఉంది. పేదప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్న కంపెనీ అంటూ సంస్థపై అనేక విమర్శలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న లక్షలాది మంది కష్టార్జితాన్ని ఈ సంస్థ కొల్లగొడుతోందని విమర్శకులు మండిపడుతున్నారు.మరోవైపు 2020లో డెనిస్ తండ్రి పీటర్ కోట్స్(Peter Coates) బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది . అలాగే 2023లో కస్టమర్ల భద్రతా వైఫల్యం, మనీలాండరింగ్ లాంటి ఆరోపణలతో ఈ సంస్థ రూ.5.82 కోట్ల జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. -
సన్యాసిలా జీవించిన ఆమె ఇవాళ ఐఏఎస్ అధికారిణి..ఏకంగా మాజీ సీఎం..!
రాజస్థాన్(Rajasthan)కి చెందిన బిష్ణోయ్ తెగ(Bishnoi community) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంతా పర్యావరణ యోధులు. వారి జీవన విధానమే పచ్చదనంతో మమేకమై ఉంటుంది. వన్యప్రాణులకు హాని కలిగించిన జీవన విధానం వారి సొంతం. అలాంటి కమ్యూనిలో తొలి ఐఎస్ అధికారిణిగా ఓ మహిళ నిలిచింది. తొలుత సన్యాసిలా జీవించిన అమ్మాయి కాస్త అందరికి పెద్ద షాకిచ్చేలా ఘనంగా పెళ్లి చేసుకుంది. ఎవరామె..? ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..రాజస్థాన్‌లోని అజ్మీర్‌కి చెందిన పరి విష్ణోయ్ బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన తొలి ఐఏస్ అధికారిణిగా నిలిచింది. కేవలం 23 ఏళ్ల వయసుల్లోనే ఈ ఘనత సాధించింది. అయితే ఆమె విజయ తీరాలను అంత సులభంగా చేరుకోలేదు. ఫిబ్రవరి 26, 1996న బికనీర్‌లోని కక్రా గ్రామంలో జన్మించిన పరి బిష్ణోయ్ సంప్రదాయంలోనే పెరిగారు. ఆమె తండ్రి మణిరామ్ బిష్ణోయ్ న్యాయవాది కాగా, తల్లి సుశీలా బిష్ణోయ్ పోలీసు అధికారి. ఆమె ఇంటర్ నుంచి ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించింది. దీంతోపాటు అజ్మీర్‌లోని ఎండీఎస్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుండేది. అలా ఆ ఒక్క యూపీఎస్సీ తోపాటు సంబంధిత పోటీ పరీక్షలన్నీ రాసింది. అలా పరి యూజీసీ నెట్ జెఆర్ఎఫ్ పరీక్షలో కూడా మంచి ఉత్తీర్ణత సాధించింది. అయితే సివిల్స్ ఎగ్జామ్ తొలి రెండు ప్రయత్నాలలో పరి ఘోరంగా విఫలమైంది. మూడో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకుంది. ఇక పరి తన జీవన శైలి అచ్చం సన్యాసిని పోలి ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అంతేగాదు ఆమె చూడటానికి కూడా చాలా వైరాగ్యంగా ఉన్నట్లుగా ఆహార్యం ఉండేది. అయితే అందరికీ షాక్ ఇస్తూ..2023లో పరి విష్ణోయ్ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌ని వివాహం చేసుకున్నారు. ఇక ఆమె భర్త భవ్య హర్యానాలోని అడంపూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. భవ్య బిష్ణోయ్ తండ్రి, కుల్దీప్ బిష్ణోయ్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇరువురు తమ కెరీర్లలో ఉన్నత శిఖరాలను చేరుకునేలా శ్రమిస్తున్నారు. తొలుత 2022లో సహజవాయువు మంత్రిత్వశాఖ(Ministry of Natural Gas)లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసింది. ఆ తర్వాత గ్యాంగ్‌టక్(Gangtok)లో ఎస్డీఎంగా పనిచేసింది. ప్రస్తుతం హార్యానాలో సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by Pari Bishnoi (@pari.bishnoii) (చదవండి: చలికాలం తప్పక తీసుకోవాల్సిన సూప్ ..!) -
క్యారమ్స్ కాశీమా
పైన లైట్ బల్బు వెలుగుతుండగా... ఆ కాంతిలో...క్యారమ్ బోర్డ్‌పై ‘టప్’ ‘టప్’ అంటూ శబ్దాలు వినిపించేవి. లక్ష్యాన్ని ఛేదించడం నుంచి ఛేదించక పోవడం వరకు ఆ శబ్దాలలో ఎన్నో అర్థాలు ఉండేవి. ఆ అర్థాలను ఔపాసన పట్టింది చెన్నైకి చెందిన కాశీమా. ‘క్యారమ్స్’ కుటుంబ ఆట అంటారు. ఆ ఆటలోని రెడ్, వైట్, బ్లాక్ కాయిన్స్, స్ట్రైకర్... కాశీమాకు కుటుంబ సభ్యులు అయ్యాయి. వాటితో అనుబంధం ఆమెను క్యారమ్స్ ప్లేయర్‌గా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.ఆరు సంవత్సరాల వయసు నుంచి కాశీమా క్యారమ్స్ ఆడడం మొదలుపెట్టింది. కుమార్తె క్యారమ్స్‌లో చూపుతున్న ప్రతిభకు సంబరపడిపోయేవాడు తండ్రి మెహబూబ్ బాషా.ఉత్తరచెన్నై పరిధిలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా కాశీమాను ఆడించే వాడు బాషా. కప్పులు గెలుచుకోవడం సంగతి ఎలా ఉన్నా ఇరుగు, ΄÷రుగు, బంధువులు ‘అమ్మాయిని అలా బయటికి తీసుకువెళ్లవచ్చా? ఇది పద్ధతేనా!’ అనేవారు. అయితే మెహబూబ్ వారి మాటల్ని పట్టించుకునేవాడు కాదు. ‘వారి మాటలు పట్టించుకోవద్దు. క్యారమ్స్‌లో నువ్వు పెద్దపేరు తెచ్చుకోవాలి’ అంటూ కూతుర్నిప్రోత్సహించేవాడు బాషా.గల్లీనుంచి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల వరకు ఎన్నో పతకాలు సొంతం చేసుకున్న కాశీమా జాతీయ స్థాయిలో పదికి పైగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించింది. కాశీమా ప్రతిభ అర్జున అవార్డు గ్రహీత మరియా ఇరుదయం దృష్టిలో పడింది. ఆయన శిక్షణలో తనలోని ప్రతిభను మరింత మెరుగు పరుచుకునే అవకాశం కాశీమాకు వచ్చింది.అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలలో జరిగిన 6వ క్యారమ్ ప్రపంచ కప్ పోటీలలో 18 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి పాల్గొన్న కాశీమా సింగిల్స్, డబుల్స్, గ్రూప్ పోటీలలో మూడు బంగారు పతకాలు సాధించి క్యారమ్స్‌లో విశ్వవిజేతగా నిలిచింది. అమెరికాకు వెళ్లడానికి ముందు వీసా రెండుసార్లు తిరస్కరణకు గురి కావడంతో కాశీమా పడిన బాధ ఇంతా అంతా కాదు. ‘నేను కచ్చితంగా అమెరికాకు వెళ్లాలి. వెళ్లడమే కాదు పతకాలు సాధించాలి’ అని గట్టిగా అనుకుంది. పట్టువదలకుండా ప్రయత్నించి అమెరికాలో అడుగుపెట్టిన కాశీమా ఏకంగా మూడు స్వర్ణాలతో క్యారమ్స్ విశ్వవిజేతగా చెన్నైలో అడుగు పెట్టింది. ఆటకు అడ్డుపడే విధంగా విమర్శలు చేసిన వారే కాశీమాకు చెన్నైలో బ్రహ్మరథం పట్టడం విశేషం. ఆమె విజయానికి మరింతప్రోత్సాహాన్నిస్తూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే ఆమెకు కోటి రూపాయల చెక్ అందజేశారు. ‘క్యారమ్స్’ అనేది జీవితంలాంటిది. కాయిన్స్ లక్ష్యాలు అనుకుంటే ‘స్టైకర్’ అనేది ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలాంటిది. స్ట్రైకర్ మీద పట్టు ఉన్న కాశీమా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.నాన్న కల సాకారం చేస్తానుక్యారమ్స్ ఆడుతుంటే ఉత్సాహంగా ఉండడమే కాదు కొత్తశక్తి నాలో ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ శక్తే నన్ను చెన్నైలోని న్యూ వాషర్‌మెన్‌పేట మురికివాడ నుంచి అమెరికా వరకు తీసుకువెళ్లింది. ‘క్యారమ్స్ ఆకాడమీ’ ఏర్పాటు చేసి మురికివాడలోని పేద పిల్లలకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలనేది నాన్న కల. ఆయన కల నెరవేర్చాలని ఉంది.– కాశీమా – అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
హూప్ హూప్ హుర్రే...ఈ కుట్టీ ఎవరో తెలుసా?
ఆ సన్నటి పెద్ద రింగును ‘హూప్’ అంటారు. పిల్లలు సరదాగా నడుము చుట్టూ దానిని తిప్పుతారు. సర్కస్‌లో హూప్తో చేసే ఫీట్లు ఉండేవి. కాని ఇప్పుడు హూప్ డాన్స్ ఫిట్‌నెస్‌కు ఒక దారిగా ఉంది. సరదాగా ఉంటూనే శరీరాన్ని విపరీతంగా కదిలించే ఈ డాన్స్‌లో దేశంలోనే నంబర్1గా ఉంది ఈష్నా కుట్టి. ఆమె పరిచయం.‘మూవ్మెంట్ థెరపీ గురించి ఇప్పుడు ఎక్కువమంది మాట్లాడుతున్నారు సైకాలజీలో. అంటే శరీర కదలికల వల్ల స్వస్థత పొందడం. హూపింగ్తో మూవ్మెంట్ థెరపీ చేయవచ్చు. హూపింగ్ వల్ల కండరాలు శక్తిమంతమవుతాయి. గుండె బాగవుతుంది. యాంగ్జయిటీ, స్ట్రెస్ మాయమవుతాయి. హూపింగ్లో ఆట ఉంది. వ్యాయామం ఉంది. నృత్యం ఉంది. మూడూ కలగలసిన హూపింగ్ స్త్రీల ఫిట్‌నెస్‌కు బాగా ఉపయోగం’ అంటుంది ఈష్న కుట్టి.ఢిల్లీలో స్థిరపడ్డ మలయాళ కుటుంబంలో జన్మించిన 25 ఏళ్ల ఈష్న కుట్టి ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 హూపర్గా గుర్తింపు పొందింది. హూప్ లేదా హులా హూప్ అని పిలిచే ‘టాయ్ రింగ్’తో విన్యాసాలు చేసేవారిని హూపర్స్ అంటారు. (20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!)మన దేశంలో ఎప్పటినుంచో హూపింగ్ ఉన్నా 1950లలో ఆట వస్తువుగా దీని తయారీ మొదలయ్యాక వ్యాప్తిలోకి వచ్చింది. నడుమును తిప్పుతూ హూప్‌ను నడుము చుట్టూ తిప్పడంతో మొదలెట్టి మెరుపు వేగంతో హూప్‌ను కదిలిస్తూ ఎన్నో విన్యాసాలు చేయొచ్చు. ఇలా చేయడాన్ని ‘ఫ్లో ఆర్ట్’లో భాగంగా చూస్తారు. బంతులు ఎగరేయడం, జగ్లింగ్ చేయడం.. ఇవన్నీ ఫ్లో ఆర్ట్ కిందకే వస్తాయి. హూపింగ్ కూడా.చిన్న వయసులోనే...‘చిన్నప్పుడు మా బంధువు ఒకామె హూప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. కాసేపు ఆడుకోవడానికి ట్రై చేసి మానుకున్నాను. కాని ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్రాక్టీసు చేశాను. మెల్లగా వచ్చేసింది. దాంతో ఎవరూ లేనప్పుడుప్రాక్టీసు కొనసాగించాను. మెల్లమెల్లగా హూప్ నా శరీరంలో భాగమైపోయింది’ అంటుంది ఈష్న. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ చదివిన ఈష్న ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’లో ‘డిప్లమా ఇన్ డాన్స్ మూవ్మెంట్ థెరపీ’ కూడా చేసింది. ‘సైకాలజీ, హూపింగ్ తెలియడం వల్ల మనిషికి ఉత్సాహం, ఆరోగ్యం కలిగించడానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాను’ అంటుంది ఈష్న.తిహార్ జైలులో...తిహార్ మహిళా జైలులో ఖైదీలకు ఆరు నెలల పాటు హూపింగ్ నేర్పించడానికి వెళ్లింది ఈష్న. ‘జైలుకు వెళ్లి ఖైదీలను కలవడం ఎవరికైనా కష్టమే. కాని అక్కడ ముప్పై నుంచి 60 ఏళ్ల వరకూ ఉన్న మహిళా ఖైదీలకు హూపింగ్ నేర్పించాను. వారు హూప్ రింగ్‌తో రేయింబవళ్లు ప్రాక్టీసు చేసేవారు. నేను వెళ్లినప్పుడల్లా ఆ ముందుసారి కన్నా మరింత ఉత్సాహంగా, హుషారుగా కనిపించారు’ అంది ఈష్న.ఇలా చేయాలి‘సౌకర్యవంతమైన బట్టలు, సరైన ఫ్లోర్ ఉంటే హూప్తో మీరు ఎన్ని విన్యాసాలైనా సాధన చేయొచ్చు. మార్కెట్లో హూప్ రింగ్‌లు 28 ఇంచ్‌ల నుంచి 39 ఇంచ్‌ల వరకూ దొరుకుతాయి. వాటితోప్రాక్టీసు చేయడమే. ఈ ఆటలో పోటీలేదు పోలిక లేదు. అందుకే మన ఇష్టం వచ్చినట్టు ఆడవచ్చు. ఒకరకంగా బయటకు రాని స్త్రీలకు బెస్ట్ ఆటవిడుపు’ అంటుంది ఈష్న. మన దేశంలో హూపింగ్ నేర్పించే టీచర్లు తక్కువ కనుక ఆమె తరచూ నగరాలు తిరుగుతూ స్త్రీలకు క్యాంప్స్ నిర్వహిస్తూ నేర్పిస్తూ ఉంటుంది. ‘హూప్ రింగ్ మీ బెస్ట్ ఫ్రెండ్ కాగలదు. మీ మంచి చెడుల్లో అది పక్కనే ఉంటే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి’ అంటున్న ఈష్నకు ఇటీవల కార్పొరేట్ ఈవెంట్స్‌లో షో చేయమని ఆహ్వానాలు అందుతున్నాయి. డబ్బు కూడా బాగా వస్తోంది. షోలలో ఆమె చేసే హూపింగ్ నోరెళ్లబెట్టేలా ఉంటుంది. ఒక్క రింగు ఆమె జీవితాన్నే మార్చేసింది. మీ జీవితాన్ని కూడా మార్చొచ్చు. -
బర్డ్ ఉమన్.. పిట్టలు వాలిన చెట్టు
పురుషుల చరిత్రలో స్త్రీలు తెర వెనుక ఉంటారు. ప్రఖ్యాత పక్షి శాస్త్రజ్ఞుడైన సలీం అలీని‘బర్డ్ మేన్ ఆఫ్ ఇండియా’ అంటారు. కాని ‘బర్డ్ ఉమన్ ఆఫ్ ఇండియా’కూడా ఉంది. ఆమె పేరు జమాల్ ఆరా. బిహార్‌కు చెందిన జమాల్ ఆరా ఎన్నో అరుదైన పక్షులను, వాటి జీవనాన్నిగుర్తించి, రికార్డు చేసింది. జనవరి 5 జాతీయ పక్షుల దినోత్సవం. పక్షుల ఆవరణాలను కాపాడుకోవడంతోపాటు వాటికై స్త్రీలు చేసిన సేవను కూడా గుర్తు చేసుకోవాలి.మనిషికి పక్షిని చూశాకే ఎగరాలనే కోరిక పుట్టింది. పక్షి మనిషికి అలారం. రైతుకు పురుగుల మందుగా మారి పురుగు పుట్రను తిని పంటను కాపాడింది. పక్షి పాట పాడింది. పురివిప్పింది. గంతులేసింది. పలుకులు పలికింది. ఎడతెగని ఉల్లాసాన్ని ఇచ్చింది. జనవరి 5 ‘జాతీయ పక్షుల దినోత్సవం’ ఎందుకు జరుపుతామంటే పక్షి గురించి చైతన్యం కలిగించుకోవడానికి. ప్రపంచంలో దాని వాటా దానికి ఇవ్వడానికి. దానినీ బతకనివ్వమని కోరడానికి.అడవులు, ఆవాసాలుమన దేశంలో నలభై యాభై ఏళ్ల క్రితం వరకూ కూడా పక్షులు, మనుషులు కలిసి బతికేవారు. అడవిలో ఉండే పక్షులు, జలాశయాల పక్షులు, వలస పక్షులు... ఇవి కాక మనిషి ఆవాసాల దగ్గర ఉండే పిచుకలు, కాకులు, కోయిలలు, గొరవంకలు... వంటివి మనగలిగేవి. మనిషి ఆవాసాల్లో పెరళ్లు, బావులు, చెట్లు మాయమయ్యాక ఇక అవి వాటికి కాకుండా పోయాయి. సెల్‌ఫోన్ టవర్లు, కాంక్రీట్తనం, రేడియేషన్... పిచుకలకు దెబ్బ కొడుతోంది. అడవులను కొట్టేయడం వల్ల అడవి పిట్టలు... జలాశయాల ఆక్రమణల వల్ల తడి, తేమల్లోని పురుగుల్ని చేపల్ని తినే కొంగలు, పిట్టలు ఆర్తనాదాలు చేసే స్థితికి వచ్చాయి. పక్షులు లేని ఈ ప్రపంచం క్షణమైనా బాగుంటుందా? అందుకే పక్షికి గుక్కెడు నీళ్లు, గుప్పెడు గింజలు, మాంజా దారాలు లేని ఆకాశం ఇవ్వగలగాలి. పిల్లలకు నేర్పగలగాలి. ‘బర్డ్‌వాచింగ్’ను హాబీగా మార్చగలగాలి.అడవుల కోసంబిహార్లో అడవుల నరికివేత మీద జమాల్ ఆరాపోరాటం చేసింది. అడవులుపోతే ఎడారులొస్తాయని పక్షులు బతకవని ప్రభుత్వానికి లేఖలు రాసింది. రాచరిక కుటుంబాలు సరదా కోసం బిహార్‌లో ఖడ్గమృగాలను వేటాడటాన్ని నిషేధించాలని కోరింది. ‘అడవిలోకి ఎవరు వచ్చినా ఫారెస్ట్ ఆఫీసర్లు గానీ మామూలు మనుషులుగాని.. వారి దగ్గర తుపాకులు ఉండకూడదు’ అని ఆమె 1950లలోనే సూచించింది. 1970లో ఈ నియమం అమలయ్యింది. ఎందుకంటే తుపాకీ చేతిలో ఉంటే అడవిలో పేల్చబుద్ధవుతుంది. ఒక మూగజీవో పక్షో మరణిస్తుంది. పిల్లల కోసం పక్షుల గురించి పుస్తకాలు రాసి, ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో ప్రసంగాలు చేసిన జమాల్ ఆరా ప్రపంచవ్యాప్త జర్నల్స్‌లో తన పరిశోధనలు ప్రచురించుకోవడం తెలియక తెర వెనుక ఉండి΄ోయింది. ఇటీవలే ఆమె కృషి బయటకు తెలిసి మహిళా జాతి గర్వపడుతోంది. 1995లో మరణించిన జమాల్ ఆరాను– ‘ఫస్ట్ ఇండియన్ బర్డ్ ఉమన్’గా చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. -
వైజాగ్ -కాకినాడ ఛాలెంజ్ : 52 ఏళ్ల తెలుగు మహిళ సాహసం
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల అరుదైన ఘనతను సాధించారు. విశాఖపట్నం (వైజాగ్) నుండి కాకినాడ వరకు బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈది చరిత్రకెక్కారు. ఐదు రోజుల పాటు సాగిన శ్యామల సాహస యాత్ర సాగింది. డిసెంబర్ 28న ఆర్.కె. వైజాగ్‌లోని బీచ్ నుంచి మొదలై కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్‌లో జనవరి 1న ముగిసింది. ఇలాంటి విజయాలను అలవోకంగా అందుకోవడం ఆమెకు కొత్తేమీ కాదు. వైజాగ్-కాకినాడ ఛాలెంజ్ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్యామలకు సముద్రాలను ఈదడం హాబీ. తాజాగా బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి కాకినాడ వరకూ 150 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా ఈదారు. వారం రోజుల తరువాత సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకోవడంతో ఆమె సాహస యాత్ర ముగిసింది. ఆమె భద్రత, విజయాన్ని నిర్ధారించేందుకు ఒక డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, ఫీడర్లు, స్కూబా డైవర్లు , కయాకర్లతో సహా 12 మంది సభ్యుల, రెండు పెద్ద పడవలు ఒక చిన్న నౌక ఆమె వెంట సాగాయి.52-Year-Old woman Goli Shyamala Swims 150 km from #Visakhapatnam to #Kakinada, Inspiring GenerationsGoli #Shyamala, a 52-year-old #WomanSwimmer from Samalkot in Kakinada district, #AndhraPradesh successfully completed an adventurous swim of 150 kilometers in the sea from… pic.twitter.com/DenfvFaHgr— Surya Reddy (@jsuryareddy) January 4, 2025 అంతకుముందు- తమిళనాడు- శ్రీలంక నార్త్ ప్రావిన్స్‌ను అనుసంధానించే పాల్క్ స్ట్రెయిట్‌ను 13 గంటల 43 నిమిషాల్లో అధిగమించి ఈ ఘనతను సాధించిన రెండో మహిళగా శ్యామలనిలిచారు. గతంలో రామసేతు సమీపంలో అలవోకగా ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అమెరికాలోని కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు ఇలాంటి సాహసాన్ని పూర్తి చేశారు. కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు గల 36 కిలోమీటర్ల దూరాన్ని 12 డిగ్రీల టెంపరేచర్లో 19 గంటల్లో అధిగమించారు. లక్షద్వీప్‌లో కీల్టన్ ఐలండ్- కడ్మట్ ఐలండ్, హుగ్లీ, గంగ, భాగీరథీ నదుల్లో రికార్డు సమయాల్లో ఈది రికార్డు సృష్టించిన చరిత్ర శ్యామలది. శ్యామల సృజనాత్మక దర్శకురాలు, రచయిత కూడా. అయితే తన యానిమేషన్ స్టూడియో సక్సెస్‌కాకపోవడంతో ఆమె స్విమ్మింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వేసవి ఈత శిబిరాల్లో పాల్గొనడం ద్వారా మరింత ఆసక్తి పెరిగింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ గురించి అవగాహన కల్పించడం, ప్రజలను ప్రోత్సహించడం ఆమె లక్ష్యంగా మారింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో విజయాలుపాక్ స్ట్రెయిట్: 13 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ఈదుతూ, ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచింది.కాటాలినా ఛానల్: కాటాలినా ద్వీపం నుండి లాస్ ఏంజిల్స్ వరకు 36 కిలోమీటర్లు 19 గంటల్లో గడ్డకట్టే 12°C ఉష్ణోగ్రతల మద్య స్విమ్మింగ్ చేశారు.లక్షద్వీప్ : లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది కిల్టన్ ద్వీపం నుండి కద్మత్ ద్వీపానికి 18 గంటల్లో 48 కిలోమీటర్లు ఈదారు.ఆమె స్విమ్మింగ్ చేసిన నదులు•కృష్ణా నది: 1.5 కి.మీ•హూగ్లీ నది: 14 కిలోమీటర్లు•గంగా నది: 13 కి.మీ•భాగీరథి నది: 81 కి.మీ -
55 ఏళ్లు.. 150 కిలోమీటర్లు
కొందరు ఓటమి నుంచి విజయాలు అందుకుంటారు. మరికొందరు తమ జీవితంలో ఎదురైన ప్రతిబంధకాల నుంచి బయటపడేందుకు ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతారు. ఆ కోవకు చెందిన వారే స్విమ్మర్ గోలి శ్యామల. సామర్లకోటకు చెందిన శ్యామల భర్త మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు పనిచేశారు. దురదృష్టవశాత్తూ స్టూడియో ద్వారా తీవ్రంగా నష్టపోవడంతో మానసికంగా మనోవేదనకు గురయ్యారు. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 45 ఏళ్ళ వయసులో శరీరం సహకరించని స్థితిలో మనసును మళ్ళించేందుకు హైదరాబాద్‌లో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. స్వతహాగా ఆమె స్విమ్మర్ కాదు... అయితేనేం, నాటి మనోవేదనకు ఉపశమనంగా ప్రారంభించిన స్విమ్మింగ్ నేడు ఐదు పదుల వయసులో ఆమెను సముద్రాలు దాటే సాహస యాత్రికురాలిగా తీర్చిదిద్దింది.150 కిలోమీటర్లు ఏడు రోజుల్లో అలవోకగా.. డిసెంబరు 28న విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద సముద్ర తీరంలో ఈత ప్రారంభించిన శ్యామల శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ యానిమేషన్ స్టూడియోలో నష్టం రావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తాను మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు స్విమ్మింగ్ప్రారంభించాననీ, కోచ్ జాన్ సిద్ధిక్ సహకారంతో జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల స్విమ్ చేసేలా తయారయ్యానని సగర్వంగా చెప్పారు. 2021లో శ్రీలంక నుంచి ఇండియా వరకు రామ్‌సేతు దాటానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్ చేశానన్నారు. బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదడం ద్వారా ఆసియా స్థాయిలో ఘనత సాధించానన్నారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈదాలని రెండేళ్ళ కిందటే నిర్ణయించుకున్నానని, అయితే రెండుసార్లు వాతావరణం అనుకూలించలేదనీ, ఎట్టకేలకు డిసెంబర్ 28న చిన్న ఫిషింగ్ బోట్, ఇద్దరు స్క్రూపర్ డ్రైవర్స్తోప్రారంభించానన్నారు. ఆర్కే బీచ్‌లో సముద్రంలో ప్రవేశించాక మళ్ళీ కాకినాడలో నేలపైకి వచ్చామన్నారు. మొదటి రోజు 7 గంటల్లోనే 30 కిలోమీటర్ల దూరం ఈదానన్నారు. తరువాత నుంచి ఈరోజు వరకు అనేక ఒడుదొడుకులను అధిగమిస్తూ ఈదుకుంటూ వచ్చానన్నారు. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు స్విమ్మింగ్ వల్లే ఆరోగ్యం కలుగుతుందని, స్విమ్మింగ్‌ను స్పోర్ట్‌గా కాకుండా సర్వైవల్ స్పోర్ట్‌గానే చెబుతానన్నారు. మహిళలు ఈత చేయడం వలన గైనిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. హేళన చేసిన వారే పొగుడుతున్నారుసముద్రంలో ఈత కోసం తొలి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. కొందరు యూ ట్యూబ్‌లో కామెంట్లు పెట్టారు. వాటిని పట్టించుకోలేదు. అరేబియా సముద్రం ఈదాను, శ్రీలంక నుంచి ఇండియా ఈత మరపురానిది, మేదీ స్ఫూర్తితో లక్షద్వీప్‌లో 18గంటల పాటు 48 కిలోమీటర్లు ఈదాను. వైజాగ్ నుంచి కాకినాడ 150 కిలోమీటర్లు ఈదగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. – గోలి శ్యామల – స్విమ్మర్. – లక్కింశెట్టి శ్రీనివాసరావుసాక్షి ప్రతినిధి.. కాకినాడ.ఫోటోలు: విశ్వనాధుల రాజబాబు. కాకినాడ రూరల్ -
గ్రీన్ ఆర్మీ
ఉత్తరప్రదేశ్‌లో గతంలో ‘గులాబ్ గ్యాంగ్’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్‌కీ బాత్‌లో ప్రశంసించారు.వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్‌రైట్ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్ కీ బాత్’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్ ఆర్మీలో కొత్త జోష్ వచ్చింది.వారణాసి చుట్టుపక్కలగ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది.270 పల్లెల్లో...వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్కైతే స్థానమే లేదు. గ్రీన్ ఆర్మీతో స్థానిక పోలీస్ కాంటాక్ట్‌లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.ఆడపిల్లే అదృష్టంకొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి. అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే. -
Savitribai Phule Birth Anniversary : మహిళా చైతన్య దీప్తి
మన దేశంలో ఆడపిల్లల చదువు, వారి అభ్యున్నతి గురించి మాట్లాడుకోవాలంటే ముందుగాగుర్తుకు వచ్చేది సావిత్రిబాయి ఫూలే కృషేనని చెప్పవచ్చు. మహిళల అభివృద్ధికి పాటు పడిన మొట్ట మొదటి బహుజన మహిళ ఆమె. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు. మహారాష్ట్ర, సతారా జిల్లాలోని నయాగావ్ గ్రామంలో 1831 జనవరి 3న ఒక సామాన్య రైతు కుటుంబంలో సావిత్రిబాయి (Savitribai Phules) మహిళా చైతన్య దీప్తి జన్మించారు. నిరక్షరాస్య అమాయక బాల్యంలో జీవిస్తున్న ఆమెకు 9వ యేటనే 12 సంవత్సరాల జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది. సావిత్రిబాయి, భర్త ప్రోత్సాహంతో ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలై, అహ్మద్‌నగర్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. అనంతరం బాలికా విద్య ఉద్య మానికి పునాది వేశారు.విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మిన సావిత్రిబాయి 1848లో భర్తతో కలిసి బాలికల కోసం పుణెలో మొట్ట మొదటి పాఠశాలను నెలకొల్పి, చదువు చెప్పటం ప్రారంభించారు. మహిళా హక్కులే మానవ హక్కులని నినదించి అనేక సామాజిక సమస్యలపై కూడా అలుపెరుగని పోరాటం చేశారు. స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో ‘మహిళా సేవా మండల్‘ అనే మహిళా సంఘాన్ని స్థాపించారు. లింగ వివక్ష, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. సామాజిక అణిచివేతలను, మూఢత్వాన్ని పారద్రోలి సత్యాన్ని శోధించడానికి 1873లో భర్తతో కలిసి సత్య శోధక సమాజాన్ని ప్రారంభించారు. భర్త మరణంతో అంతులేని దుఃఖసాగరంలో ఉండి కూడా ఆయన చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. పుణె నగరాన్ని అతలాకుతలం చేసిన తీవ్ర కరువులో ప్లేగు వ్యాధి గ్రస్తులకు సావిత్రిబాయి అసమాన సేవలు అందించారు. చివరకు ఆమె కూడా అదే వ్యాధి బారినపడి 1897 మార్చి10న తుది శ్వాస విడిచారు. 1997లో భారత ప్రభుత్వం ఆమె జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. పుణె విశ్వవిద్యాలయానికి ఆమె పేరే పెట్టారు. సావిత్రిబాయి ఫూలే అక్షర ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఆమె జయంతి రోజున గతేడాదే ‘ధర్మ టీచర్ యూనియన్’ ఏర్పాటైంది. సావిత్రి బాయి ఫూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలి. ఇదే ఆమెకు ఇవ్వగలిగిన ఘన నివాళి.– సంపతి రమేశ్ మహారాజ్ ‘ ధర్మ టీచర్ యూనియన్ తెలం -
ఐఐటీ నిరాకరిస్తే..ఏకంగా ఎంఐటీ ఆహ్వానించింది..!
కష్టపడి చదివి, నేర్చుకుని ప్రతిభాపాటవాలను సొంతం చేసుకుంటాం. ఇది సర్వసాధారణం. కానీ కొందరూ పుట్టుకతోనే మేధావులుగా ఉంటారు. చిన్న వయసులోనే తమలో ఉన్న అసాధారణ ప్రతిభతో ఆకట్టుకుంటారు. మనలా సంప్రదాయ విద్య సరిపడదు వారికి. ఎందుకంటే వయసుకి అనుగుణమైన విద్యకు మించిన జ్ఞానం వీరి సొంతం. అలాంటి కోవకు చెందిందే మాళవిక రాజ్ జోషి. ఆ ప్రతిభే ఆమె ఉన్నతికి ప్రతిబంధకమై.. ఐఐటీలో ప్రవేశానికి అనర్హురాలిగా చేసింది. విద్యాపరంగా పలు సవాళ్లు ఎదుర్కొనక తప్పలేదు. చివరికి ప్రతిష్టాత్మకమైన ఎంఐటీలో చోటు దక్కించుకుని శెభాష్ మాళవిక అని అనిపించుకుంది.ముంబైకి చెందిన మాళవిక రాజ్ జోషికి చిన్నప్పటి నుంచి అపారమైన ప్రతిభ ఉంది. చిన్న వయసులోనే గణితం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో అపారమైన నైపుణ్యం ఉంది. ఆమె ఇంటెలిజెన్సీ పవర్‌ని గుర్తించి.. ఏడో తరగతి నుంచి సంప్రదాయ విద్యా విధానానికి స్వస్తి చెప్పించింది తల్లి సుప్రియ. అప్పటి వరకు ముంబైలోని దాదర్ పార్సీ యూత్ అసెంబ్లీ స్కూల్లో చదువుకునేది మాళవిక. ఆమె చదువుని సీరియస్ తీసుకుని ఇంటివద్దే ప్రిపేర్ అయ్యేలా శిక్షణ ఇచ్చారు తల్లి సుప్రియ. కూతురు ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్యోగాన్ని కూడా వదిలేశారామె. పాఠశాల విద్యను అభ్యసించకపోయినప్పటికీ మాళవిక గణితం, ప్రోగ్రామింగ్‌లో బాగా రాణించింది. దీంతో మాళవిక తల్లిదండ్రులు ఆమెను ఐఐటీకీ పంపాలనుకున్నారు. కానీ టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరు కానందున ప్రతిష్టాత్మకమైన ఐఐటీ క్యాంపస్‌లు ఆమెను తిరస్కరించాయి. అయితే ఆమె ప్రతిభాపాటవాలు బీఎస్సీ డిగ్రీకి సరితూగేవి. దీంతో ఆమె చిన్న వయసులోనే చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (CMI)లోని ఎమ్మెస్సీ స్థాయి కోర్సులో అడ్మిషన్ పొందగలిగింది. అలా ఆమె గ్లోబల్ ప్రోగ్రామింగ్ పోటీలలో కూడా పాల్గొనడం ప్రారంభించింది. ఈ పోటీల్లో రాణించి.. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో చోటు దక్కించుకుంది. దీంతో మాళవిక కేవలం 17 ఏళ్లకే ఎంఐటీ సీటు పొందిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఒక చోట మన ప్రతిభను గుర్తింకపోయినా..వాటిని తలదన్నే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు గుర్తిస్తాయని చాటి చెప్పింది. టాలెంట్ ఉన్న వాడిని ఆపడం ఎవరితరం కాదంటే ఇదే కదూ..!(చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది) -
సక్సెస్‌ని ఒడిసిపట్టడం అంటే ఇదే..!
'సక్సెస్' అంది అందనంత దూరంలో మిస్ అవ్వుతూ దోబుచులాడుతుంటే విసిగిపోతాం. మన వల్ల కాదని చేతులెత్తేస్తాం. కానీ ఈమె అలా చేయలేదు. చిన్నప్పటి నుంచి సక్సెని ఏదోలా అందుకున్నా..ఇప్పుడు ఈ సివిల్స్ ఎగ్జామ్(Civil Services Examination)లో ఇలా ఈ తడబాటు ఏంటనీ అనుకుంది. సక్సెస్ అంతు చేసేదాక వదలిపెట్టేదే లే అని భీష్మించింది. తాడోపేడో అన్నట్లు ఆహర్నిశలు కష్టపడింది. చివరికి విజయమే తలవంచి వొళ్లోకి వచ్చి వాలింది. ఫెయిల్యూర్స్‌తో ఆగిపోకూడదు ఓటమిని ఓడించేలా గెలిచితీరాలని చేతల్లో చూపించింది.. సివిల్స్‌లో గెలిచి మంచి ర్యాంకు సంపాదించుకోవాలనేది చాలామంది యువత కోరిక. ఆ క్రమంలో మాములు తడబాటులు రావు. ఒకనోకదశలో మన వల్ల కాదని చేతులెత్తేసే పరిస్థితి వచ్చేస్తుంది. దాన్ని తట్టుకుని ముందుకు సాగిన వారే విజయతీరాలను అందుకోగలరు. అలాంటి గొప్ప సక్సెనే అందుకుంది నీపా మనోచ(Neepa Manocha). ఆమె విద్యా నేపథ్యం వచ్చేసి..2015లో ప్రసిద్ధ లేడీ శ్రీ రామ్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది. ఇక 2017లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) నిర్వహించే సెక్రటరీ (CS) ప్రొఫెషనల్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై స్టాక్ ఎక్స్ఛేంజ్ కంపెనీ సెక్రటరీ(CS)గా ఉద్యోగం సాధించింది. అయినా సంతృప్తి చెందాక ఇంకా ఏదో సాధించాలన్న ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకమైన సివిల్స్ సర్వీస్‌కి ప్రిపేరయ్యింది. పగలు స్టాక్ ఎక్ఛ్సేంజ్ మార్కెట్లో కంపెనీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ.. రాత్రిళ్లు ప్రిపరేషన్ సాగించేది. అయితే సీఎస్‌లో వరించినట్లుగా సక్సెస్‌ని సులభంగా అందుకోలేకపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఫెయిలైంది. తన ఆత్మవిశ్వాసమే సన్నగిల్లిపోయేలా ఓటమిని ఎదుర్కొంది. లాభం లేదు ఈ ఎగ్జామ్ మన వల్ల కాదనే నైరాశ్యం తెప్పించేలా నిపాకి సివిల్స్ చుక్కలు చూపించింది. ఇక్కడ నిపా ఆ తడబాటుల్ని తరిమేసి సక్సెని అందుకునేదాక వెనక్కి తగ్గకూడదనే పట్టుదల, కసితో చదివింది. చివరికి ఆమె కష్టం ముందు ఓటమే తలవంచి..దోబులాచుడతున్న సక్సెస్ ఒడిసిపట్టింది. నాలుగో ప్రయత్నంలో 144వ ర్యాంకు సాధించి ఐపీఎస్ సాధించింది. అంతేగాదు నిపా గనుక వరుస ఓటములతో ఆగిపోతే ఎవ్వరికీ ఆమె గురించి తెలిసి ఉండేది కాదు. ఓ ఫెయ్యిల్యూర్ స్టోరీగా మిగిలిపోయేది. ఓటమే తలొగ్గాలి తప్పా తాను కాదనుకుంది కాబట్టే సివిల్స్‌లో నిపా నెగ్గింది. అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. వదలిపెట్టకుండా పలకరిస్తున్న ఓటమి అంతు చూడాలే తప్ప తగ్గొద్దని చాటి చెప్పింది. (చదవండి: డెంటిస్ట్ కాస్త ఐఏఎస్ అధికారిగా..! కానీ ఏడేళ్ల తర్వాత..) -
ఇదీ మన సంస్కృతి
డ్రగ్స్, డిజిటల్ డిస్ట్రాక్షన్స్ నుంచి టీనేజర్స్‌ని బయటపడేసే ప్రయత్నానికి పయనీర్‌గా నిలిచింది హైదరాబాద్‌కి చెందిన పద్నాలుగేళ్ల అమ్మాయి.. డిజిటల్ సేఫ్టీ వెల్నెస్, డ్రగ్స్ ఫ్రీ– వెల్నెస్ ఆన్లైన్ కోర్స్‌లను డిజైన్ చేసి! వాటికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సర్టిఫికెట్స్నీ అందిస్తోంది! ఆమె పేరు సంస్కృతి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతోంది.డిజిటల్ డిస్ట్రాక్షన్, డ్రగ్ అడిక్షన్.. అందరినీ కలవరపరుస్తున్నా వాటికి వల్నరబుల్గా ఉంటోంది మాత్రం టీనేజర్సే అని గ్రహించింది సంస్కృతి.. తన వాలంటీరింగ్ అనుభవాల ద్వారా, తోటి పిల్లల ద్వారా. వాటి బారిన వాళ్లెందుకు, ఎలా పడుతున్నారు? ఆ ప్రభావానికిలోనై ఎలా ప్రవర్తిస్తున్నారు? అసలా ఊబిలో పడకుండా ఉండేందుకు ఏం చేయాలి? అని ఆలోచించి, ఓ ప్రశ్నావళిని తయారుచేసి మానసిక వైద్యులు, మానసిక విశ్లేషకులు, సామాజిక వేత్తల ముందుంచింది. వాళ్ల చర్చల సారాన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సహాయంతో ‘డిజిటల్ సేఫ్టీ వెల్నెస్’, ‘డ్రగ్స్ ఫ్రీ వెల్నెస్’ అనే రెండు ఆన్లైన్ కోర్స్‌లను డిజైన్ చేసింది. ఫీడ్‌బ్యాక్ కోసం వంద మంది టీనేజ్ స్టూడెంట్స్‌కి ఆ కోర్స్ మాడ్యూల్స్‌ని చూపించింది. కంటెంట్ బాగుంది, కానీ చెప్పే విధానం ఆసక్తికరంగా లేదన్న అభిప్రాయాలు వచ్చాయి. సమీక్షించుకుంటే తనకూ అదొక కౌన్సెలింగ్లా అనిపించింది. టీనేజర్స్కెప్పుడూ ఎదుటివాళ్లు జడ్జ్ చేస్తారేమోనన్న భయం ఉంటుంది. ఆ జంకుతో మనసువిప్పి మాట్లాడరు. అంతేకాదు వద్దన్నదే చేయాలన్న కుతూహలమూ జాస్తే! ఈ కోణంలోనూ ఆలోచించి, మొత్తం కోర్స్ మాడ్యూల్స్‌ని నిజ జీవిత సంఘటనలకు అన్వయించి చాట్ ఫార్మాట్లో రీడిజైన్ చేసింది. వాటికి ఆన్లైన్ ΄్లాట్‌ఫామ్ కావాలి కాబట్టి అక్క ప్రకృతి సహాయంతో ‘క్రియేట్ ఎడ్యుటెక్’ అనే వెబ్‌సైట్‌ను స్టార్ట్‌చేసింది. ఈ మొత్తం ప్రక్రియకు ఎనిమిది నెలలు పట్టింది. ఆఫ్‌లైన్ లోనూ సేవలందించడానికి ‘ఎడిస్టిస్ ఫౌండేషన్ ’ అనే స్వచ్ఛంద సంస్థతో పనిచేస్తోంది సంస్కృతి. యాప్స్ అవసరం లేని ఈ కోర్సులకు మొబైల్ డేటా ఉంటే చాలు. వీటిని పూర్తి చేసినవారికి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు స్కూల్స్, కాలేజీల్లో ఈ కోర్సులు లాంచ్ అయ్యాయి. ఇప్పటివరకు పదివేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కోర్స్‌లను సర్కారు బడుల్లోని విద్యార్థులకు ఉచితంగా అందిచాలనేది సంస్కృతి లక్ష్యం. కార్పొరేట్ స్కూల్స్‌కి మాత్రం నామమాత్రపు రుసుముంటుందని చెబుతోంది. టీనేజర్స్‌కి ‘రెసిస్టెన్స్.. రెజిలియెన్స్’ కల్పించడమే ఈ కోర్సుల ముఖ్య లక్ష్యం. డిజిటల్ డిస్ట్రాక్షన్, డ్రగ్స్ అడిక్షన్.. దేన్నయినా అవగాహనతో తిరస్కరించడం మొదటిదైతే, ఆ అడిక్షన్ నుంచి విజయవంతంగా బయటకు వచ్చి, ఆరోగ్యకర జీవితాన్ని గడపడం రెండవది. ఆ వలలో పడకుండా ఉండటమే కాదు, అలాంటి వాతావరణాన్ని వ్యాపించకుండా చూసే బాధ్యతనూ ఎలా తీసుకోవాలో కూడా చేతన కల్పిస్తాయీ కోర్సులు అని చెబుతుంది సంస్కృతి.నేపథ్యం.. అంత చిన్న వయసులో ఆమె చేసిన ఇంత పెద్ద ప్రయత్నానికి ఆమె నేపథ్యం చాలా తోడ్పడింది. అందులో తల్లిదండ్రులు సుమతి(ఐజీ, ఇంటెలిజెన్స్, తెలంగాణ), శ్రీనాథ్ (బిజినెస్‌మన్), తాతయ్య తిరుపతి రెడ్డి, అక్క ప్రకృతిల పాత్ర ఎంతో ఉంది. ఎలాగంటే.. సుమతి సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నప్పుడు సైబర్ వరల్డ్‌లో జరుగుతున్న వాటి గురించి ఇంట్లో చర్చించేవారు. వాటికి చెవొగ్గేది సంస్కృతి. అవి అర్థమయ్యీ.. కాక ఆ చిన్నబుర్రలో కలవరం రేపేవి. సైబర్ సెక్యూరిటీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ కాస్తున్న పహారా, దానిమీద పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల గురించి అమ్మ ద్వారా తెలుసుకుంది. ఆ ఎన్జీవోల్లో వాలంటీరింగ్ మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఎంతోమందిని కలిసింది, మాట్లాడింది. పెద్దవాళ్లు సమస్యల్ని ఎలా చూస్తున్నారు, ఎలా పరిష్కరిస్తున్నారో పరిశీలించింది. అలా కూతురికి సామాజిక స్పృహను కలిగించి, సామాజిక బాధ్యతనూ తెలియజేసింది సుమతి.నాన్న.. శ్రీనాథ్.. ఐఐఎమ్ అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్. బిజినెస్‌లో వినూత్న ఆలోచనలను ఆయన ప్రోత్సహస్తున్న తీరు, అందిస్తున్న సపోర్ట్‌ను గమనించేది సంస్కృతి. కొత్త విషయాలు, సరికొత్త స్కిల్స్ గురించి ఆయన ఆన్ లైన్ లో టీచ్ చేస్తుంటే, కరెంట్ అఫైర్స్‌ను ‘వాట్–వై–హౌ’ పద్ధతిలో వివరిస్తుంటే శ్రద్ధగా వినేది. వాటన్నిటినీ తన వాలంటీరింగ్లో అమలుచేసేది. అలా తండ్రి ఆంట్రప్రెన్యూర్షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కూడా ఒంటబట్టించుకుంది సంస్కృతి. తాతయ్య.. ఆంజనేయుడిని పరిచయం చేసి!తిరుపతిరెడ్డి ప్రతిరోజూ మననవరాలికి పురాణేతిహాసాల్లోని ఒక్కో పాత్రను పరిచయం చేసేవారు. ప్రతి పాత్రకు సహానుభూతి, సహాయం చేసే గుణం, జడ్జ్ చేయని తత్వాలను అద్దుతూ ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని వర్ణించేవారు. అవన్నీ ఆ అమ్మాయి మనసులో ముద్రపడిపోయాయి. ఆ లక్షణాలతో పాటు, తెగువ, అచీవ్మెంట్, డెడికేషన్ కూడా ఉన్న ఆంజనేయుడు ఆమెకు ఫేవరిట్ అయ్యాడు. ఆ పాత్రలో తనను చూసుకోవడం మొదలుపెట్టింది. చదువుతో పాటు ఆర్ట్, మ్యూజిక్ వంటి కళల్లోనూ సంస్కృతి ప్రతిభ మెచ్చుకోదగ్గది. పోటీల్లో మనవరాలు ప్రైజ్ తెచ్చుకున్న ప్రతిసారి చాకోబార్తో ఆమెనుప్రోత్సహిస్తునే ‘గెలుపు కన్నా కూడా మన పనితో ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నామనే దాని మీద దృష్టి పెట్టాల’ని చెప్పేవారు. ఆ విలువనే తన ఫిలాసఫీగా మలచుకుంది సంస్కృతి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అక్క ప్రకృతి, సైకాలజీ స్టూడెంట్. చెల్లికి మంచి ఫ్రెండ్, గైడ్! సంస్కృతి ఈ కోర్స్‌లను డిజైన్ చేయడంలో ఆమె సహాయం ఎంతో ఉంది. టెన్త్ బర్త్‌డేకి అమ్మ, నాన్న ఇచ్చిన గిఫ్ట్‌నూ సంస్కృతి ఓ టర్నింగ్ పాయింట్‌గా చెబుతుంది. అదేంటంటే..ఒక నోట్ బుక్‌లో అమ్మ, నాన్న ‘నీ జీవితం ఈ ఎమ్టీ–బుక్ లాంటిది. నీ గురించి ఎవరూ ఏదీ రాయరు. నువ్వేం నేర్చుకుంటున్నావ్, నీకోసమే కాకుండా, ఇతరుల కోసమూ నువ్వేం చేయగలుగుతున్నావ్ అన్న క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ దొరికినప్పుడల్లా ఒక్కో పేజీ ఫిల్ చేయాలి. అలా ఈ పుస్తకం నీ విశిష్ట వ్యక్తిత్వంతో నిండిపోవాలని ఆశిస్తూ అమ్మ.. నాన్న!’ అని రాసిన నోట్. ఈ ఆన్లైన్ కోర్స్ల డిజైన్ ఆ పుస్తకంలోని మొదటి పుటకు శుభారంభమని చెప్పపచ్చు. ఇలాంటి ఇంకెన్నో ప్రయత్నాలతో ముందుకు సాగాలనుకుంటున్న ఆ చిరంజీవికి ఆల్ ద వెరీ బెస్ట్! వై, వై నాట్, వాట్, హూ, వేర్, వెన్ లాంటి ఇంగ్లిష్ డబ్ల్యూసే నా బెస్ట్ ఫ్రెండ్స్. వాటితోనే నా లెర్నింగ్, గ్రోత్, అచీవ్మెంట్! ఏబీసీడీఈ.. అంటే అంబీషస్, బోల్డ్, క్రియేటివ్ అండ్ క్యూరియస్, డిటర్మైండ్, ఎంపథిటిక్గా నన్ను నేను డిస్క్రైబ్ చేసుకుంటాను. శరీర నిర్మాణంలో తేడాలుండొచ్చు కానీ, చేసే పనికి, ప్రయత్నానికి బాయ్స్, గర్ల్స్ అనే తేడా ఉండదని, పదిమందికి మేలు చేయగలగడమే నిజమైన అచీవ్మెంట్ అని చె΄్తారు మా పెద్దవాళ్లు. ఆ స్ఫూర్తితోనే నేనీ కోర్స్‌లను డిజైన్ చేశాను!’– సరస్వతి రమ, ఫొటోలు @ నోముల రాజేష్‌రెడ్డి -
వనితదే చరిత
చరిత్ర సృష్టించిన విజేతలు కాలం దారిలో వెలిగే దీపాలు అవుతారు. ఎంతోమందిని తమ బాటలో నడిపించే ఉత్తేజం అవుతారు. క్రీడల నుంచి సైన్యం వరకు వివిధ రంగాలలో 2024లో ‘శభాష్’ అనిపించుకోవడమే కాదు చరిత్ర సృష్టించారు మహిళలు...పవర్ఫుల్ బుల్లెట్హరియాణ లోని ఝుజ్జర్ జిల్లాకు చెందిన మను బాకర్ చిన్న వయసులోనే వివిధ ఆటల్లో అద్భుత ప్రతిభాసామర్థ్యాలు చూపింది. షూటింగ్‌లోకి అడుగు పెట్టడానికి ముందు మార్షల్ ఆర్ట్స్, టెన్నిస్, బాక్సింగ్, స్కేటింగ్లాంటి వివిధ విభాగాలలో రాణించింది. ‘షూటింగ్’లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను బాకర్ చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత షూటర్ల వరుసలో చేరింది. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో తన అద్భుతమైన ప్రదర్శనతో కాంస్య పతకం సాధించి దేశం మొత్తం గర్వపడేలా చేసింది. మిక్స్డ్ టీమ్ విభాగంలో సరబ్జోత్ సింగ్‌తో కలిసి మన దేశానికి మరో కాంస్య పతకాన్ని సాధించింది. స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.పట్టుదల ఉంటే ప్రతికూలతలు పారిపోతాయిప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా సరే... దృఢ సంకల్పం, నిబద్ధత ఉంటే తిరుగులేని విజయాలు సాధించవచ్చని నిరూపించింది రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అవని లేఖర. 2012లో రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. నిరాశ నిండిన ఆ చీకటిలో అవని విల్‌పవర్ కోల్పోయి ఉంటే విజయాలు సాధించి ఉండేది కాదు. స్తబ్దత నుంచి బయటపడడానికి తండ్రి సలహాతో క్రీడల వైపు వచ్చింది. పారిస్‌లో జరిగిన 2024 పారాలింపిక్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్–1 విభాగంలో స్వర్ణపతకం గెల్చుకొని మన దేశంలోని ప్రసిద్ధ పారాలింపియన్లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. టోక్యో పారాలింపిక్స్‌లో తొలిసారి స్వర్ణం గెలుచుకున్న అవని రెండోస్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.స్ఫూర్తినిచ్చే తేజంభారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ యుద్ధవిమానాన్ని నడిపిన తొలి మహిళా ఫైటర్‌పైలట్‌గా స్క్వాడ్రన్ లీడర్ మోహనా సింగ్ చరిత్ర సృష్టించింది. జోద్‌పూర్‌లో జరిగిన ‘తరంగ్ శక్తి’ సైనిక విన్యాసాల్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. సాయుధ దళాలలో జెండర్ బ్యారియర్స్‌ను విచ్ఛిన్నం చేసిన అద్భుతం అది.రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్‌లో సైనిక కుటుంబంలో పుట్టిన మోహనాసింగ్కు ఫైటర్ పైలట్ కావాలని కోరిక. భారత వైమానిక దళం ఫైటర్ పైలట్ ్రపోగ్రామ్(2016)లో అవనీచతుర్వేది, భావనా కాంత్‌తో కలిసి చేరిన మొదటి మహిళల్లో మోహన ఒకరు. ఐఏఎఫ్ హాక్ ఎంకే.132 అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్లలో పూర్తిస్థాయి ఆపరేషన్ స్టేటస్ సాధించిన తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా రికార్డ్ సృష్టించింది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ కాంబాట్ మోడ్స్లోప్రావీణ్యం సాధించింది. -
డ్యూటీ... డ్యాన్సుల్లో ట్రాక్ రికార్డ్
విశిష్ట రైల్వే సేవా పురస్కారానికి ఎంపికైన ఉద్యోగిగా గుంటూరుకు చెందిన జవ్వాది వెంకట అనూష వార్తల్లో నిలిచింది. దిల్లీ ప్రగతి మైదాన్ లో జరిగిన 69వ రైల్వే సేవా పురస్కారాల కార్యక్రమంలో అతి విశిష్ట రైల్వే సేవా పురస్కారాన్ని అందుకున్న అనూష కూచిపూడి నృత్యకారిణి కూడా. మనసు ఉంటే మార్గం ఉన్నట్టే... ఒక్క పడవ అని ఏమిటి ఎన్ని పడవల మీద అయినా ప్రయాణం అద్భుతంగా సాధ్యం అవుతుంది!నేర్చుకోవడానికి వ్యక్తులకు మించిన పాఠశాలలు ఉంటాయా?అనూషకు నాన్న ఒక పాఠశాల. ఆయన రైల్వేలో ఇంజినీర్. వృత్తిపట్ల అంకితభావం తండ్రి నుంచే నేర్చుకుంది. తాను కూడా నాన్నలాగే రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంది. జవ్వాది వెంకట నాగ సుబ్రమణ్యంతో అనూషకు వివాహం జరిగింది. ఆయన అప్పుడు కేరళ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. 2008లో మళ్లీ సివిల్స్ రాసి ఐఎఎస్‌కు ఎంపిక అయ్యారు. ‘మరింత కష్టపడాలి’ అనే పాఠాన్ని భర్త నుంచి నేర్చుకున్న అనూష ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్ (ఐఆర్ఎస్ఈ)గా ఎంపిక అయింది.ఇక కళలకు సంబంధించి అమ్మ తనకు పాఠశాల.తల్లి స్ఫూరితో కూచిపూడి నేర్చుకుంది. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వేదాంతం రామలింగశాస్త్రి శిష్యురాలైన అనూష యూరోపియన్ తెలుగు అసోసియేషన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలలో చిన్నప్పుడే ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ఏడాది జూన్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో భోపాల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చింది.నృత్యంలో ‘భేష్’ అనిపించుకున్న అనూష ఉద్యోగ జీవితంలో ‘ది బెస్ట్’ అనిపించుకుంది.‘గుంటూరు డివిజన్ కు 2022లో వచ్చాను. కృష్ణకెనాల్ జంక్షన్ నుంచి కృష్ణా నదివైపు ఉన్న ట్రాక్ వీక్‌గా ఉండేది. దీనికోసం ప్రతి ఏటా 50 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. జియో టైల్స్, జియో బ్రిడ్జెస్ వేసి కొత్త తరహాలో ట్రాక్‌ను పటిష్టపరిచాము. దీనివల్ల ఇప్పుడు ఏడాదికి రెండు లక్షలు కూడా ఖర్చు అవ్వడం లేదు. పెద్ద పెద్ద యంత్రాలు వాడకుండా ఎన్నో పనులను వినూత్న రీతిలో పూర్తి చేశాము. దీనికి కూడా జీఎం నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఈ ప్రయోగాలు గుంటూరు డివిజన్ కు బోలెడంత పేరు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే రైల్వేబోర్డు నన్ను గుర్తించింది. అతి విశిష్ట రైలు సేవా పురస్కారం దక్కింది. మన కష్టం వల్ల వచ్చిన ఫలితాన్ని చూసినప్పుడు వృత్తిపట్ల అంకితభావం మరింతగా పెరుగుతుంది’ అంటుంది అనూష. వృత్తి జీవితంలో, కూచిపూడి నృత్యకారిణిగా ఆమె మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆశిద్దాం.ఎన్నో అడ్డంకులు... అయినా సరే ముందుకు వెళ్లాం!నా భర్త అస్సాం కేడర్ ఐఏఎస్ కావడంతో నాకు కూడా నార్త్ ఈస్ట్ రైల్వేలో పోస్టింగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా వచ్చింది. అక్కడ తీవ్రవాదంతో పాటు బ్రహ్మపుత్ర వరదల సమస్య ఎక్కువగా ఉన్న కారణంగా ఏడాదిలో ఎనిమిది నెలలు ΄్లానింగ్, నాలుగు నెలలు మాత్రమే ఎగ్జిక్యూషన్ ఉండేది. అక్కడ ఉన్న పరిస్థితుల్లో రైలు నడిచేలా చర్యలు తీసుకోవడంతోపాటు సిబ్బందిని కాపాడుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్‌లా ఉండేది. ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాము. రెండు వర్గాల మద్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో రైల్వే కూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. మేం కూడా వారితో కలిసి ప్రశాంతత నెలకొల్పే విషయంలో గట్టిగా పనిచేశాం. గౌరీపూర్ నుంచి బిలాస్పూర్ వరకూ కొత్త రైల్వేలైన్ వేసిన సమయంలో బ్రహ్మపుత్రపై పెద్ద పెద్ద బ్రిడ్జీల నిర్మాణం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. భూసేకరణ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అన్నింటిని అధిగమించి రైల్వే లైన్ పూర్తి చేయడం పెద్ద అచీవ్మెంట్. దీనికి గుర్తింపుగా రైల్వే జీఎం అవార్డు వచ్చింది.– జవ్వాది వెంకట అనూష– దాళా రమేష్‌బాబు, సాక్షి ప్రతినిధి గుంటూరుఫోటోలు: షేక్ సుభానీ, లక్ష్మీపురం