Narayanpet
-
మక్తల్ మార్కెట్ పాలకవర్గం నియామకం
మక్తల్: మక్తల్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ చైర్‌పర్సన్‌గా మక్తల్ మండలం సంగంబండకు చెందిన గవినోళ్ల రాధమ్మ, వైస్‌చైర్మన్‌గా మక్తల్‌కు చెందిన గణేష్ కుమార్, డైరెక్టర్లుగా మహేంద్ర, రంజిత్‌కుమార్‌రెడ్డి, సాలాబిన్ ఉమర్, పి.నాగప్ప, విష్ణువర్ధన్‌రెడ్డి, ఫయాజ్, మహేష్, శంకర్ లింగం, ఆంజనేయులు, జనార్దన్ గుప్తా, నాగప్పలను నియమించారు. మార్కెట్ పాలకవర్గం దాదాపుగా మూడేళ్లుగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ కోసం పనిచేసిన పదవులను కట్టబెట్టారని తెలుస్తోంది. నూతన పాలకవర్గం త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 13 నుంచి మక్తల్‌లో పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. 15వ తేదీన ఆంజనేయస్వామికి నిర్వహించే రథోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరవుతారని.. అదే రోజు మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలిసింది. చైర్‌పర్సన్‌గా గవినోళ్ల రాధమ్మ,వైస్‌చైర్మన్‌గా గణేష్‌కుమార్ -
పక్కాగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే
నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వేను పక్కాగా నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ బేన్‌షాలం అన్నారు. బుధవారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల సర్వే, గ్రూప్–2 పరీక్షల నిర్వహణ, నూతన డైట్ మెనూ పెంపు ప్రారంభం, సంక్షేమ హాస్టళ్ల తనిఖీ తదితర అంశాలపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సర్వేలో పూర్తిస్థాయిలో సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను నియమించినట్లు వివరించారు. 20 రోజుల్లోగా సర్వేను పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో గ్రూప్–2 పరీక్షల నిర్వహణకు కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్ల తరలింపునకు పోలీసు బందోబస్తు, ఎస్కార్ట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. వీసీలో ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల, ఎస్పీ యోగేష్ గౌతమ్, ఏఎస్పీ మహమ్మద్ రియాజ్, డీఎస్పీ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
సులభ పద్ధతిలో గణిత బోధన
నారాయణపేట రూరల్: గణితంపై విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఉపాధ్యాయులు సులభ పద్ధతిలో బోధన చేయాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గ్రౌండ్ ఉన్నత పాఠశాలలో బుధవారం గణితఫోరం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పోటీ పరీక్షల్లో గణితం ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించాలని తెలిపారు. పాఠశాల స్థాయిలోనే గణితంపై పట్టు సాధించేలా తీర్చిదిద్దాలని కోరారు. కాగా, గణిత పరీక్షకు మండలస్థాయిలో ప్రతిభ కనబరిచిన 84 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. విజేతలు వీరే.. తెలుగు మీడియం విభాగంలో శిరీష (మొగల్ మడ్క), అరవింద్ (భూనేడ్), నవిత (ఊట్కూర్), ఇంగ్లిష్ మీడియం విభాగంలో లక్ష్మీ మనోజ్ఞ (నారా యణపేట), శశాంక (మద్దూరు), నిహారిక (కోస్గి), రెసిడెన్షియల్ విభాగంలో శ్రీవేణి (మరికల్), హేమలత (కోటకొండ), శ్రీవాణి (మరికల్) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్, ఎంఈఓ బాలాజీ, గణిత ఫోరం అధ్యక్షుడు సురేష్, కార్యదర్శి రామకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన ఆహారంఅందించాలి
నారాయణపేట: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఎంఏ రషీద్, మున్సిపల్ కమిషనర్ సునీత సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు తాజా కూరగాయలు, ఆహార పదార్థాలతో భోజనం అందించాలని.. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. కళాశాల నిర్వహణపై సంతృప్తిని వ్యక్తంచేశారు. వారి వెంట ఆర్ఎల్సీ ఖాజా బహుద్దీన్, జిల్లా కోఆర్డినేటర్ సలీం తదితరులు ఉన్నారు. ప్రణాళికాబద్ధంగా చదవాలి మద్దూరు: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితేనే మంచి ఫలితాలు వస్తాయని ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి హెచ్.సుదర్శన్‌రావు అన్నారు. బుధవారం మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై విద్యార్థుల హాజరు శాతం, వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపు తదితర అంశాలపై సమీక్షించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాములు, అధ్యాపకులు పాల్గొన్నారు. అలసందలు క్వింటా రూ. 6,500 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం అలసందలు క్వింటా రూ. 6,500 ధర పలికింది. హంసధాన్యం గరిష్టంగా రూ. 2,823, కనిష్టంగా రూ. 1,931, సోనాధాన్యం గరిష్టంగా రూ. 2,736, కనిష్టంగా రూ. 1,900, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 11,606, కనిష్టంగా రూ. 8,539, తెల్లకందులు గరిష్టంగా రూ. 11,555, కనిష్టంగా రూ. 10,022 ధరలు వచ్చాయి. చిన్నరాజమూర్ హుండీ రూ.4.17 లక్షలు దేవరకద్ర: చిన్నరాజమూర్ శ్రీఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం హుండీని లెక్కించారు. దేవస్థాన కమిటీతోపాటు ఎండోమెంట్ అధికారులు, గ్రామపెద్దల సమక్షంలో హుండీని లెక్కించగా రూ.4,17,410 వచ్చాయి. హుండీ ద్వారా వచ్చిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు దేవస్థాన కమిటీ చైర్మన్ రాఘవేంద్రచారి తెలిపారు. త్వరలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో ముందస్తుగా హుండీని లెక్కించామన్నారు. బ్రహ్మోత్సవాల తర్వాత మరోసారి హుండీ లెక్కింపు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ప్రసాద్, అర్చకులు హన్మేషచారి, జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్, ప్రేమ్‌కుమార్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
తెల్లబోతున్నారు..
●మక్తల్ మండలం లింగంపల్లి పత్తి మిల్లు ఎదుట వాహనాల బారులు తేమ 12 శాతం లోపు ఉండాలి.. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. మద్దతు ధర లభించాలంటే పత్తిలో తేమ 12 శాతం లోపు ఉండాలి. కొంతమంది నీళ్లు చల్లి తెస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల మద్దతు ధరకు కొనుగోలు చేయలేకపోతున్నాం. – బాలామణి, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి, మహబూబ్‌నగర్ ధరలు తగ్గిస్తున్నారు.. 8 ఎకరాల్లో పత్తి సాగు చేశా. పండిన పంటను ట్రాక్టర్లో గుడిగండ్ల జిన్నింగ్ మిల్లుకు తీసుకొచ్చా. క్వింటాకు రూ.7,500 చెల్లించాల్సి ఉండగా.. రూ.7,300 మాత్రమే ఇచ్చారు. ప్రైవేటుకు వెళ్తే తూకం, ధరలో మోసం ఉంటుందని ఇక్కడికి వస్తే కేంద్రంలోనూ అదే పని చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే తేమ శాతం, చెత్త అంటూ లేనిపోని కారణాలు చెప్పి కష్టాన్ని దోచుకుంటున్నారు. – లక్ష్మన్న, రైతు, మదన్‌పల్లి (మక్తల్) పంట విక్రయించేందుకు కష్టాలే.. నాకు 8ఎకరాల పొ లం ఉండగా పత్తి సాగు చేశా. పెట్టుబడి రూ.3లక్షల వర కు అయింది. సుమారు 60 క్వింటాళ్ల దిగుబడి రాగా.. అమ్మేందుకు సీసీఐ కొను గోలు కేంద్రం ఎదుట రెండ్రోజులు పడిగాపులు పడాల్సి వచ్చింది. కేంద్రం వద్ద పత్తి వాహనాలు సుమారు కిలోమీటర్ మేర బారులు తీరి ఉన్నాయి. పంట పండించేందుకు, విక్రయించేందుకు కష్టాలు తప్పడం లేదు. రైతు లను పట్టించుకునే వారు కరువయ్యారు. – సతీష్‌కుమార్, ఎడవెళ్లి (ఊట్కూర్) 30 కి.మీ. నుంచి వచ్చాం.. జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలంలోనే ఉంది. 30 క్వింటాళ్ల పత్తి పండగా బొలెరో వాహనంలో రూ.4,500 అద్దె, పత్తి ఎత్తడానికి కూలీలకు రూ.3 వేలు చెల్లించి తరలించాల్సి వచ్చింది. కాని ఇక్కడ కేవలం క్వింటాకు రూ.7,400 మాత్రమే చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. – వెంకట్రాముడు, రైతు, ఎల్కూరు (మల్దకల్) సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గతేడాది పత్తికి ప్రభుత్వ మద్దతు ధరకు మించి ధర పలకడంతో ఈ ఖరీఫ్‌లో రైతులు ఆ పంట వైపే మొగ్గు చూపారు. కానీ వారి ఆశలు అడియాసలుగా మారాయి. వరుస వర్షాలు, తెగుళ్లతో దిగుబడి గణనీయంగా తగ్గింది. పెట్టుబడి అయినా వస్తుందని భావించిన రైతులు అనేక కష్టనష్టాలకు ఓర్చి కూలీల కొరతను సైతం అధిగమించారు. చివరకు పత్తిని విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రాలకు వచ్చిన వారిని తేమ, వ్యర్థాల పేరిట కొర్రీలు వెక్కిరిస్తున్నాయి. కొనుగోలు చేయకుండా అధికారులు చేతులెత్తేయగా.. దీన్ని సాకుగా చేసుకుని దళారులు తక్కువ ధరతో కొనుగోలు చేస్తుండడంతో రైతులు తెల్లబోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలో పత్తి రైతుల దీనావస్థపై ‘సాక్షి’ ఫోకస్.. వ్యాపారులకుఅధికారుల పరోక్ష మద్దతు.. సీసీఐ యంత్రాంగం కొనుగోళ్లలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. తేమ శాతం, వ్యర్థాలు అంటూ యంత్రాల ద్వారా నాణ్యతను పరీక్షించేందుకు అధికారులు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. చివరకు తేమ శాతం ఎక్కువ ఉంది.. పత్తి నల్లగా ఉంది వంటి కొర్రీలతో కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. దీన్ని సాకుగా చేసుకుని జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు, దళారులు రైతుల నుంచి తక్కువ ధరతో పత్తిని కొనుగోలు చేస్తున్నారు. పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521–రూ.7,220.16 (తేమ 8–12 శాతం) ఉండగా, వ్యాపారులు క్వింటాల్‌కు రూ.5,600 నుంచి రూ. 6,400 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇలా సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా దళారులే పత్తిని కొనుగోలు చేశారు. కొనుగోళ్లలో జాప్యం, కొర్రీల నేపథ్యంలో సీసీఐ యంత్రాంగంపై విమర్శలువెల్లువెత్తుతున్నాయి. సీసీఐ యంత్రాంగమే పరోక్షంగా వ్యాపారులకు సహకరిస్తోందని.. వారికి వ్యాపారులు కమీషన్ ఇస్తున్నారని.. వారి వ్యవహార శైలినే ఇందుకు నిదర్శనమని రైతులు ఆరోపిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మూడు సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 3,064 మంది రైతుల నుంచి 74,944 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఇందులో మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఓబ్లాయిపల్లి గ్రామ శివారులోని శ్రీ బాలాజీ ఇండస్ట్రియల్ కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన కేంద్రంలో 1,312 మంది రైతుల నుంచి 32,819 క్వింటాళ్ల పత్తి సేకరించారు. బాదేపల్లిలోని పద్మనాభ కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన కేంద్రంలో 1,233 మంది రైతుల నుంచి 31,343 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మహేష్ కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన కేంద్రంలో 519 మంది రైతుల నుంచి 10,783 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 3 లక్షల క్వింటాళ్ల మేర దళారులు తక్కువ ధరతో కొనుగోలు చేసినట్లు రైతు సంఘాల అంచనా. నాగర్‌కర్నూల్ జిల్లాలో 18 సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్ల లక్ష్యం 16 లక్షల క్వింటాళ్లు కాగా.. ఇప్పటివరకు 9 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. దళారులు ఇప్పటివరకు 4 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అంచనా. దళారులు ప్రభుత్వ మద్దతు ధర కంటే క్వింటాల్‌కు రూ.800 నుంచి రూ.1,300 తక్కువగా కొనుగోలు చేసినట్లు రైతులు చెబుతున్నారు. నారాయణపేట జిల్లాలో ఆరు సీసీఐ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 2,01,136 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. మరో నాలుగు లక్షల క్వింటాళ్లు దళారులు కొన్నట్లు అంచనా. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక సీసీఐ సెంటర్ ద్వారా ఇప్పటివరకు 36,400 క్వింటాళ్లు కొన్నారు. మరో నాలుగు లక్షల క్వింటాళ్ల వరకు వ్యాపారులు కొన్నట్లు రైతుల ద్వారా తెలిసింది. వనపర్తి జిల్లాకు సంబంధించి ఒక సీసీఐ సెంటర్ ద్వారా ఇప్పటివరకు 1,473 మంది రైతుల నుంచి 36,478 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. రైతుల నుంచి మరో 40 వేల క్వింటాళ్ల పత్తిని దళారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పత్తి రైతులకు శాపంగా మారిన తేమ కొర్రీలు కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్న సీసీఐ అధికారులు జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులకు పరోక్ష సహకారం తక్కువ ధర చెల్లిస్తూ దండుకుంటున్న వ్యాపారులు లబోదిబోమని మొత్తుకుంటున్న రైతులు -
కొనుగోళ్లలో జాప్యం.. కొర్రీలు
పత్తి జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో అధికారులు పత్తి నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతోంది. అంతేకాకుండా శని, ఆదివారాల్లో సీసీఐ కేంద్రాలకు సెలవు ఉండడంతో మిగతా రోజుల్లో జిన్నింగ్ మిల్లుల వద్ద వాహనాలు బారులుదీరుతున్నాయి. తేమ 12 శాతం లోపే ఉండాలని.. వ్యర్థాలు ఉండొద్దనే కొర్రీలతో పత్తిని అసలు పరీక్షించకుండానే తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ శివారులోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లు వద్ద రైతులు మంగళవారం నిరసన తెలపడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. -
రెండు విభాగాల్లో పిల్లల గుర్తింపు..
రెండు విభాగాల్లో బడిబయటి పిల్లలను గుర్తించనున్నారు. 6నుంచి 14ఏళ్ల వరకు పాఠశాలస్థాయి కావడంతో ఒక విభాగం, 15నుంచి 19ఏళ్ల వారు కళాశాలస్థాయి కావడంతో మరో విభాగంగా గుర్తించి వేర్వేరుగా జాబితాను రూపొందిస్తారు. విద్యార్థి సామర్థ్యం, వయసు, అర్హత, ఆసక్తి మేరకు తగిన తరగతిలో చేర్పించడం.. లేదా దూర విద్యలో ప్రవేశాలు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ● విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్ష కింద పనిచేసే సీఆర్పీలు, ఐఈఆర్పీలు, డీఎల్ఎంటీలు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు. చదువు ఎందుకు నిలిపివేశారనే అంశాలతో పాటు వారి కుటుంబ పరిస్థితులపై సమాచారం సేకరించి నమోదు చేసుకుంటారు. నెల రోజులపాటు సర్వే కొనసాగుతుంది. అనంతరం సర్వే వివరాలను డీఈఓ కార్యాలయంలో అందించడంతో పాటు ప్రబంద్ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. సర్వేపై సమ్మె ప్రభావం.. ఓవైపు బడిబయటి పిల్లల గుర్తింపు సర్వే చేయాలని విద్యాశాఖ ఆదేశించగా.. మరోవైపు సమగ్రశిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు సమ్మె నోటీసు అందించారు. ఇతర జిల్లాల్లో వారం రోజులుగా ఆందోళన చేపడుతుండగా.. నారాయణపేటలో మాత్రం గురువారం నుంచి సమ్మెబాట పడుతున్నారు. ప్రధానంగా సర్వే చేయాల్సిన సీఆర్పీలు, ఐఆర్పీలు సహాయ నిరాకరణ చేస్తుండటంతో ఓఎస్సీ సర్వేపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో సర్వే విజయవంతంగా నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో వేచి చూడాలి. -
సజావుగా సాగేనా?
నారాయణపేట రూరల్: చదువుకునే వయసులో ఆర్థిక స్థోమత, కుటుంబ పరిస్థితుల కారణంగా పలువురు చిన్నారులు బడికి వెళ్లడం లేదు. కొందరు ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంటే.. మరికొందరు కులవృత్తుల్లో కొనసాగుతున్నారు. ఇవేవీ లేని వారు హోటళ్లు, బేకరీలు, దుకాణాల్లో బాలకార్మికులుగా పనిచేస్తూ చదువుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టే చర్యలు కొంతమేర సత్ఫలితాలను ఇస్తున్నాయి. అందులో భాగంగా బడిఈడు పిల్లలను గుర్తించి, పాఠశాలల్లో చేర్పించేందుకు గాను ప్రత్యేకంగా సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది. ● బడిఈడు పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా పాఠశాలలకు వెళ్లని బడిఈడు పిల్లల గుర్తింపునకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలబాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నప్పటికీ.. చాలా మంది చిన్నారులు బడికి దూరంగానే ఉంటున్నారు. ఎన్ని సర్వేలు చేపట్టినా ఏటా పిల్లలను గుర్తించడంతోనే సరిపోతుంది. అధికారులు తల్లిదండ్రులకు ఎన్నిసార్లు విన్నవించినా పిల్లల బాల్యం మాత్రం బడిబయటే మగ్గుతుంది. కొంతమంది బడికి వచ్చినా కుటుంబ పరిస్థితుల కారణంగా మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. వీరిని గుర్తించేందుకు గురువారం నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నారు. నేటి నుంచి బడిబయటి పిల్లల గణన నెల రోజులపాటు కొనసాగనున్నఓఎస్సీ సర్వే బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యం సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మెతోతప్పని తిప్పలు -
బడిబయటి పిల్లలను గుర్తిస్తాం..
కలెక్టర్ అనుమతితో వివిధ శాఖ లతో సమన్వయ సమావేశం నిర్వహించి, బడిబయటి పిల్లల గుర్తింపు సర్వే చేపడతాం గుర్తించిన పిల్లలను రెగ్యులర్ పాఠశాలలో చేర్పించేందుకు తగు చర్యలు తీసుకుంటాం. – విద్యాసాగర్, ఏఎంఓ ఉన్నతాధికారులఆదేశాల మేరకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఓఎస్సీ సర్వేను గురువారం ప్రారంభించాలి. అయితే సమగ్రశిక్ష ఉద్యోగులు సమ్మె నోటీసు అందించిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. తదుపరి వారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. – గోవిందరాజులు, డీఈఓ -
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపాలి
నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీలోగా తెలియజేయాలని అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం రాజకీయ పార్టీల నాయకులను కోరారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ పర్యవేక్షణలో ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ నెల 7వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు. జిల్లా పరిధిలో 280 జీపీలు, 2544 వార్డులు, పోలింగ్ కేంద్రాలను ముసాయిదా జాబితాలో పొందుపర్చడం జరిగిందని వివరించారు. ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12 వ తేదీలోపు తెలపవచ్చని, 12న అన్ని మండలాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు నిర్వహించే సమావేశంలోనూ అభ్యంతరాలు స్వీకరిస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరించడం జరుగుతుందని, జిల్లా పాలనాధికారి ఆమోదం అనంతరం ఈ నెల 17న తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించబడుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,09,090 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. కొత్త ఓటర్లు ఒకే వార్డులో ఉండాలి అని రాజకీయ ప్రతినిధులు సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి, డిప్యూటీ సీఈఓ జ్యోతి, డీపీఓ కృష్ణ , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ‘ధరణి’ పెండింగ్ పనులు పూర్తి చేయాలి నారాయణపేట: ధరణిలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ బేన్ షాలం ఆదేశించారు. మంగళవారం వీసీలో హాల్లో తహసీల్దార్లతో ఫారం 6, 7, 8 పెండింగ్‌పై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి చేయాలని, ధరణిపై ఏ సమస్యలు ఉన్నాయని తహసీల్దార్లను ఆరా తీశారు. డాటా కరెక్షన్, మిస్సింగ్, సర్వే నంబర్లు ల్యాండ్ సీలింగ్ ఎలా చేస్తున్నారని అడిగారు. -
గ్రేడింగ్ పెరిగితే ప్రయోజనం..
యూనివర్సిటీకి గ్రేడింగ్ పెంచేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఐక్యూఏసీ (ఇంటర్నల్ క్వాలిటీ అసెస్మెంట్) సెల్ ఆధ్వర్యంలో వివిధ డిపార్ట్మెంట్ల అధ్యాపకుల సమక్షంలో ఐదేళ్లుగా చేసిన వివిధ యాక్టివిటీస్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. అందులోభాగంగా స్పోర్ట్స్‌లో పాల్గొన్న విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్, క్యాంపస్ సెలక్షన్స్, హాస్టల్స్ విద్యార్థులకు అందిస్తున్న వసతులు, లైబ్రరీలు, గ్రౌండ్, పీహెచ్డీ వివరాలతో పాటు వివిధ సెమినార్లు తదితర వివరాలను సేకరిస్తున్నారు. గతంలో ఉన్న వసతుల కంటే ఇప్పుడు మెరుగుపడిన నేపథ్యంలో ఏ ప్లస్ గ్రేడింగ్ వస్తే.. యూనివర్సిటీలో సొంతంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లు ఏర్పాటు చేయవచ్చు. అంతర్జాతీయ యూనివర్సిటీతో ఎంఓయూలు చేసుకోవడం.. పీహెచ్డీ సీట్లు భర్తీ చేసుకోవడం.. పెద్ద ఎత్తున నిధులు రావడం వంటి ప్రయోజనాలు కలగనున్నాయి. వివిధ రీసెర్చ్ ప్రాజెక్టులు రావడంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. -
ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలి
నారాయణపేట రూరల్: ప్రయాణికులు లేకుంటే సంస్థ మనుగడ అసాధ్యమని.. వారితో మర్యాదగా వ్యవహరించాలని ఆర్టీసీ మహబూబ్‌నగర్ రీజనల్ మేనేజర్ సంతోష్‌కుమార్ అన్నారు. ఇటీవల పదోన్నతి పొంది మంగళవారం తొలిసారి నారాయణపేట డిపోను సందర్శించారు. అన్ని విభాగాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ప్రగతిచక్రం అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదన్నారు. కార్మికులపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు ఉండవని, విధి నిర్వహణలో భాగంగా తప్పులు జరిగితే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చిందని, అదేవిధంగా రోజు వారి ఖర్చుల కోసం టికెట్‌కొనే ప్రయాణికులు ఎంతో ముఖ్యమని చెప్పుకొచ్చారు. సంస్థ అభివృద్ధికి టార్గెట్లు సాధించడంతో పాటు ఖర్చులను తగ్గించడం ప్రతి ఒక్కరి బాఽధ్యతని తెలిపారు. అనంతరం గత నెలలో అత్యధిక ఈపీకే, మంచి కేఎంపీఎల్ ద్వారా సంస్థ ఆదాయం పెంచడం, ఖర్చులు తగ్గించడంలో విశేషంగా కృషి చేసిన కార్మికులకు ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో డీఎం లావణ్య, సీఐ అలివేలమ్మ, ఎంఎఫ్ చందునాయక్, నరేందర్, వహీద్, రవికుమార్, ఆంజనేయులు పాల్గొన్నారు. కోస్గి: స్థానిక ఆర్టీసీ బస్ డిపోను ఆర్ఎం సంతోష్ కుమార్ సందర్శించారు. డిపోలో అత్యుత్తమ కేఎంపీఎల్ సాధించిన డ్రైవర్లతోపాటు పనిలో ప్రతిభ చూపిన డిపో సిబ్బందిని సన్మానించారు. -
లక్ష్యానికి చేరువగా..
నర్వ: జిల్లాలో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, మార్కెటింగ్‌శాఖల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌ల నుంచి జిల్లాలో ఎంపిక చేసిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటిండంతో ప్రారంభంలో కాస్త ఆలస్యమైనా ఆ తర్వాత కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన తర్వాత కూడా ప్రైవేటులో ధాన్యం రేటును దళారులు, ప్రైవేటు వ్యాపారస్తులు పెంచారు. కానీ, రైతులు మాత్రం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గుచూపుతున్నారు. 80వేల మెట్రిక్ టన్నులు లక్ష్యం జిల్లాలోని ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, ఎఫ్పీఓల ఆధ్వర్యంలో మొత్తం 102 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ లక్ష్యంగా 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో ఐకేపీ ద్వారా 37 కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా 60 కేంద్రాలు, మెప్మా ద్వారా 2 కేంద్రాలు, ఇతరుల ద్వారా మరో 3 కేంద్రాలు మొత్తం 102 కేంద్రాల్లో జిల్లా వ్యాప్తంగా నేటికి 52వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. కొన్ని కేంద్రాలలో పూర్తిగా సేకరణ పూర్తి అయి మిగిలిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతి రోజూ గ్రామాల్లో పర్యటిస్తూ.. సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు, తరుగు తీత తదితర విషయాల్లో మిల్లర్లకు ఖచ్చితమైన నిబంధనలు విధించారు. దీంతో పాటు రైస్ మిల్లులను సైతం తనిఖీ చేపట్టారు. ప్రారంభంలో ప్రైవేటు వైపు మొగ్గు ఖరీఫ్‌లో రైతులు ఆర్ఎన్ఆర్ సన్న రకంతో పాటు బీపీటీ రకం వరిని ఎక్కువగా సాగుచేశారు. ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించిన కొనుగోలు కేంద్రాల్లో సన్నరకానికి బోనస్ వస్తుందో లేదో అని అయోమయంలో రైతులు ఎక్కువగా ప్రైవేటుకు విక్రయించారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నరకం రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో ఇటీవల జమ అవుతుండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపడంతో ముమ్మరంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు వ్యాపారస్తులు సైతం సన్నరకాలకు ధర రూ.2500 నుంచి రూ.3 వేల వరకు పెంచారు. అయినప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయాలు జరపడంతో ఇప్పటికి 80 శాతం మేర ధాన్యం సేకరణ జరిగింది. జిల్లాలో 70శాతం మేర ధాన్యం సేకరణ 102 కేంద్రాల్లో 52వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సన్న రకానికి బోనస్‌తో రైతుల మొగ్గు రైతుల ఖాతాల్లో రూ.86 కోట్లు జమ.. బోనస్ రూ.10 కోట్లు నెలాఖరుకులక్ష్యం చేరుకుంటాం.. జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి సకాలంలో ధాన్యం సేకరించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 70శాతం మేర సేకరణ లక్ష్యం పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు పెండింగ్ లేకుండా జమ చేశాం. బోనస్ రూ.7 కోట్లు పెండింగ్‌లో ఉంది. రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దు. నెలాఖరు వరకు లక్ష్యాన్ని చేరుకుంటాం. – దేవదానం, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి. -
మాగనూర్ జీహెచ్ఎంపై సస్పెన్షన్ ఎత్తివేత
నారాయణపేట రూరల్ /మాగనూర్: మండలంలోని మాగనూర్ ప్రభుత్వ జెడ్పీ స్కూల్లో గత నెల 20న మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. ప్రభుత్వం డీఈఓ, రెగ్యులర్ జీహెచ్ఎం, మరో హెచ్ఎం బాబుల్‌రెడ్డిపై చర్యలు తీసుకుంది. అయితే, పాఠశాల రెగ్యులర్ జీహెచ్ఎం, ఎంఈఓగా వ్యవహరిస్తున్న మురళీధర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి జీహెచ్ఎంగా కొనసాగించాలని మంగళవారం ఆర్జేడీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఆర్డర్ కాపీలో పొందుపర్చారు. తెల్ల కందులు @ 11,515 నారాయణపేట: స్థానిక మార్కెట్ యార్డులో తెల్ల కందులు క్వింటాకు గరిష్టంగా రూ.11,515, కనిష్టంగా రూ.10,700 ధర పలికింది. వడ్లు సోనా గరిష్టం రూ.2,736, కనిష్టం రూ.1,600, హంస గరిష్టంగా రూ.2,823, కనిష్టంగా రూ.1,920 ధర పలికాయి. -
మీసేవ నిర్వాహుకులు నిబంధనలు పాటించాలి
మద్దూరు: మీసేవ కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఈడీఎం విజయ్‌కుమార్ తెలియజేశారు. మంగళవారం మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రాలను జిల్లా మేనేజర్ రాంమోహన్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో అందుతున్న సేవలను ప్రజలకు వివరించారు. నిబంధనల మేరకు ఎక్కడ కేటాయించిన కేంద్రాలు ఆ గ్రామాల్లోనే కొనసాగించాలని సూచించారు. అధికంగా డబ్బులు వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో కంరోద్దీన్, రాంగోవిందు, కాసీం, వెంకటేష్, బాలగంఘాధర్, నవీన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. హక్కులకు భంగం కలిగించొద్దు నారాయణపేట రూరల్:హక్కులను ఆయుధాలుగా ఉపయోగించుకొని వ్యక్తిత్వ వికాసం దిశలో ముందుకు సాగాలని, ఎవరి హక్కులకు భంగం కలిగించకూడదని జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మహమ్మద్ ఉమర్ అన్నారు. డిసెంబర్ 10న ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా జాజాపూర్ జడ్పీ స్కూల్లో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు బాల్యం నుంచి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే బంగారు భవిష్యత్తుకు బాట పడుతుందన్నారు. చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, న్యాయపరమైన రక్షణ, చట్టపరమైన అవగాహన కల్పించారు. హక్కులపై అవగాహన పెంచుకోవాలని వాటికి విఘాతం కలిగినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి సంపూర్ణ న్యాయం పొందాలని సూచించారు. హెచ్ఎం విజయ, డీఎస్ఓ భాను ప్రకాష్, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ, లక్ష్మిపతి గౌడ్, వెంకటేష్ పాల్గొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్నిదెబ్బతీసే కుట్ర మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తుందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మక్తల్‌లో తెలంగాణ తల్లి చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ అంటే బతుకమ్మ అని, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆకాంక్షలను రగిలించిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చ డం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింహాగౌడ్, రాజేష్‌గౌడ్, రాజుల ఆశిరెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, మారుతిగౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. సత్వర వైద్య సేవలుఅందించడమే లక్ష్యం మాగనూర్: ప్రజలకు అత్యవసర సమయాల్లో సత్వర వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతోనే సీఎం రేవంత్‌రెడ్డి 108 నూతన అంబులెన్స్‌లను మంజూరు చేశారని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం 108 అంబులెన్స్‌కు పూజలు చేసి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్నాళ్లు మండలంలో అంబులెన్స్ లేకపోవడంతో చాలా మంది క్షతగాత్రులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారన్నారు. మండల పరిధిలో ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే మక్తల్, నారాయణపేట లాంటి ప్రాంతాల నుంచి అంబులెన్స్‌లు వచ్చి క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్చేవి అని, దీంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆ ఇబ్బందులు పడకూడదనే అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. డీఎంహెచ్ఓ సౌభాగ్యలక్ష్మి, ఆనంద్‌గౌడ్, నాగజ్యోతి, అఫ్రోజ్ , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
పత్తి కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
మాగనూర్: సీసీఐ కేంద్రంలో మూడు, నాలుగు రోజుల నుంచి పత్తి కొనుగోలు చేయకుండా అధికారులు, మిల్లు యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకోకు దిగారు. మండలంలోని వడ్వాట్ గేట్ సమీపంలో ఇటీవల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే, మంగళవారం సదరు మిల్లు యాజమానులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నాలుగు రోజులైన పత్తి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్‌హెచ్–167 పై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో అక్కడికి చేరకున్న మాగనూర్ ఎస్ఐ అశోక్‌బాబు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఎమ్మెల్యే వచ్చి అధికారులతో మాట్లాడి పత్తి కొనుగోలు చేయించే వరకు రాస్తారోకో విరమించేది లేదని తేల్చి చెప్పడంతో చివరికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు.. పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయడం లేదని, రెండు మూడు రోజులు పత్తి లోడుతో ఉన్న అద్దె ట్రాక్టర్లతో ఆర్థిక భారం పడుతోందని, కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కరువయ్యాయని మొర పెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి రాస్తారోకో విరమింపజేశారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన ట్రాక్టర్‌ను స్వయంగా నడుపుకుంటూ మిల్లు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ గ్రేడర్ అధికారి శివాజీతో మాట్లాడిన ఆయన సమస్యను అడిగి తెలుసుకున్నారు. మిషనరీలో సమస్య వలన ఆలస్యం జరిగిందని తెలపగా.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, సకాలంలో పత్తిని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మరోసారి ఇబ్బందులు కలగజేస్తే చర్యలు తప్పవన్నారు. ఎట్టకేలకు అధికారులు పత్తి కొనుగోలును తిరిగి ప్రారంభించారు. జాతీయ రహదారిపై ఎక్కడికక్కడే నిలిచిన వాహనాలు -
న్యాక్‌కు సన్నద్ధం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా విద్యార్థుల వరప్రదాయిని పాలమూరు యూనివర్సిటీ. ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తూ.. ఏడాదికేడాది మరింత విస్తరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో పరీక్షకు పీయూ సిద్ధమైంది. ఈనెల రెండో వారం నుంచి వచ్చే నెలాఖరులోగా న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్) బృందం పీయూను సందర్శించనుంది. మూడు రోజుల పాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టనుంది. అయితే ఇప్పటికే పీయూ అధికారులు ఆన్లైన్లో యూనివర్సిటీకి సంబంధించిన అన్ని అంశాల వివరాలను న్యాక్‌కు అందించారు. ఈ వివరాలు వాస్తవంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని సంబంధిత అధికారులు పరిశీలించనున్నారు. 2018లో మొదటిసారి పీయూకు ‘బీ’ గ్రేడ్ రాగా.. ఈ సారి ఏ ప్లస్ సాధించే విధంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వివిధ గుర్తింపులు పొందిన పీయూకు న్యాక్ గ్రేడింగ్ పెరిగితే.. పనితీరుకు ఒక గుర్తింపు లభించడంతో పాటు రాష్ట్రంలోని పెద్ద యూనివర్సిటీల సరసన స్థానం పొందనుంది. పీయూ అభివృద్ధికి ప్రతి సంవత్సరం రూ.10 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. పీయూ పరిధిలో వివిధ కళాశాలలు 120 వరకు ఉండగా.. 35 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే పొందిన గుర్తింపులు.. ● పీయూలో మొదటిసారిగా 2018లో నిర్వహించిన న్యాక్ తనిఖీల్లో బీ–గ్రేడ్ సాధించగా.. రూసా (రారష్ట్రీయ ఉచ్చత్తర్ శిక్షా అభియాన్) ద్వారా యూనివర్సిటీకి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. ● 2015లో పీసీఐ (ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) నుంచి గుర్తింపు రావడంతో యూనివర్సిటీలో ఫార్మసీ కళాశాలను ప్రారంభించారు. పీయూ పరిధిలో డీ ఫార్మా, బీ ఫార్మా కోర్సులు అందిస్తున్నారు. ● 2016లో యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల అఫ్లియేషన్స్, వసతులను దృష్టిలో ఉంచుకుని 12బీ గుర్తింపును యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ప్రకటించింది. ● పీయూలో ఎంఈడీ కోర్సులను ప్రవేశ పెట్టేందుకు 2015లో ఎన్సీఈటీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచింగ్ ఎడ్యుకేషన్) గుర్తింపు లభించింది. దీంతో పీయూలో ఎంఈడీ కళాశాలను ప్రారంభించింది. బీఈడీ పూర్తి చేసిన వారికి ఎంఈడీ విద్య అందిస్తున్నారు. పీయూ పరిధిలో బీఈడీ కోర్సులను కూడా అందిస్తున్నారు. ● 2023లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి లా డిపార్ట్మెంట్ ఏర్పాటుకు అనుమతి వచ్చింది. దీంతో పీయూ పరిధిలోని వనపర్తి ప్రైవేటు కాలేజీలో లా కళాశాలను ఏర్పాటు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీయూలో కూడా లా అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ● ఇంజినీరింగ్ కళాశాలను కూడా పీయూలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ అడ్మిషన్లు ఇవ్వనున్న నేపథ్యంలో ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్)కు దరఖాస్తులు చేయనున్నారు. కళాశాల ప్రారంభించిన నాలుగేళ్లలో ఈ గుర్తింపు రానుంది. ఉత్తమ గ్రేడింగ్ సాధించేందుకు చర్యలు.. గతంలో వచ్చిన గ్రేడింగ్ కంటే ఉత్తమ గ్రేడింగ్ సాధించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే నెల వరకు న్యాక్ బృందం యూనివర్సిటీకి రానుంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఐదేళ్లతో పోల్చితే అనేక అభివృద్ధి పనులు జరగడం వల్ల న్యాక్ తనిఖీల్లో ఉత్తమ గ్రేడింగ్ సాధిస్తాం. రూసా నుంచి మంచి నిధులు వచ్చే విధంగా సిబ్బందితో కలిసి కృషి చేస్తాం. విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు, నాణ్యమైన విద్య అందించేందుకు పాటుపడతాం. – జీఎస్ శ్రీనివాస్, వైస్‌చాన్స్‌లర్, పీయూ త్వరలో పాలమూరు యూనివర్సిటీనిసందర్శించనున్న న్యాక్ బృందం గతం కంటే మెరుగుపడిన వసతులు న్యాక్‌కు పూర్తి వివరాలతో రిపోర్టుఇచ్చేందుకు కమిటీల ఏర్పాటు ఏ ప్లస్ గ్రేడింగ్ సాధించేందుకు ప్రయత్నం ఇప్పటికే వివిధ కేంద్ర సంస్థల నుంచి గుర్తింపు -
సేవ.. అభివృద్ధే లక్ష్యం
రూ.833.50 కోట్లతో ప్రగతి.. నియోజకవర్గంలో రూ.16.50 కోట్లతో సీసీ రోడ్లును వేయించాం. మక్తల్‌కు కోర్టు, అగ్రిమాపక కేంద్రం, ఆరు విద్యుత్ సబ్స్టేషన్లు (సంగంబండ, వడ్వాట్, పులిమామిడి, దేవరపల్లి, నాగల్‌కడ్మూర్, రాయికోడ్) గ్రామాలకు మంజూరయ్యాయి. వాటి పనులు త్వరలో ప్రారంభిస్తాం. మక్తల్ నుంచి నారాయణపేట రహదారి నిర్మాణానికి రూ.22 కోట్లు మంజూరు చేయించాం. ఈ పనులు వేగవంతంగా చేపడతాం. ఏడాదిలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయించాం. ఎస్డీఎఫ్ నిధులతో సీసీరోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆలయాలు, మసీదులు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, రిపేర్లు చేయించాం. భారీ వర్షాలతో చెరువులు, రోడ్లు దెబ్బతినగా రూ.కోటితో పునరుద్ధరణ పనులు చేయించాం. అనారోగ్యంతో బాధపడి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.కోట్లు అందజేశాం. నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి రూ.3 కోట్లు మంజూరు చేయించి ప్రత్యేకంగా బోర్లు వేయించడంతోపాటు నీటి ఎద్దడి లేకుండా చేశాం. మొత్తంగా ఏడాదిలో రూ. 833.50 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం.. చేపడుతున్నాం. గార్లపల్లి సమస్య తీరుస్తా గతంలో ఊట్కూర్ మండలంలోనే గార్లపల్లి గ్రామం ఉండేది. మక్తల్ మున్సిపాలిటీ అయిన సమయంలో గార్లపల్లి మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది. రేషన్, విద్యార్థులకు సర్టిఫికెట్లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాలన్నా, పట్టా పాసుపుస్తకాలు సైతం ఊట్కూర్ మండలం వస్తుంది. త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య తీర్చి మున్సిపాలిటీలోకి వచ్చే విధంగా చూస్తాం. ● సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు ● ప్రత్యేక నిధులతో త్వరలో కాల్వల మరమ్మతు ● ఏడాదిలో రూ.833.53 కోట్లతో అభివృద్ధి పరుగులు ● విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ● ఆర్అండ్ఆర్ సెంటర్ల ఏర్పాటుకు కృషి ● ‘సాక్షి’తో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్: పదేళ్లుగా వెనుకబాటుకు గురైన నియోజకవర్గాన్ని.. ఏడాదిలో రూ.833 కోట్లతో అభివృద్ధి పరుగులు పెట్టించాం.. 18 ఏళ్లుగా సంగం‘బండ’ సమస్య పెండింగ్‌లో ఉండగా.. ఎమ్మెల్యేగా గెలిచిన 18 రోజుల్లోనే నిర్వాసితులకు రూ.12 కోట్లు మంజూరు చేయించి.. 9 గ్రామాల్లోని 25వేల ఎకరాలకు సాగునీరు అందించాం.. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు పారించాం.. ఆర్అండ్ఆర్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేయడంతోపాటు విద్య, వైద్యా రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా సోమ వారం ఆయన నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను ‘సాక్షి’తో పంచుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గ ప్రజల సంక్షేమం.. అభివృద్ధే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నానని.. ప్రజలే నా దేవుళ్లని.. నా జీవితం ప్రజాసేవకే అంకితమని వివరించారు. 18 ఏళ్ల సమస్య18 రోజుల్లోనే పరిష్కారం సంగంబండ రిజర్వాయర్ కింద ముంపునకు గురైన సంగంబండ నిర్వాసితులకు పరిహారం అందక రూ.12 కోట్లు 18 ఏళ్లుగా పెండింగ్ ఉంది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన 18 రోజుల్లో ఆ నిధులను తీసుకువచ్చి పరిహారం అందించాం. నా రాజకీయ జీవితంలో ఈ సమస్య ఇంత త్వరగా పరిష్కారం అవుతుందని ఊహించలేదు. జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోయే విషయం ఇది. సంగంబండ రిజర్వాయర్‌లోని లెఫ్ట్ కెనాల్‌కు అడ్డుగా ఉన్న పెద్ద బండను పగల కొట్టించడంతో మాగనూర్, మక్తల్ మండలాల్లోని 9 గ్రామాలకు 25 వేల సాగునీరు అందింది. ఆ గ్రామాల రైతులు ఆనందంగా పంటలు పండించుకుంటున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నేరడ్‌గాం, భూత్పూర్ ఆర్అండ్ఆర్ సెంటర్లను త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నా. ఇందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించం. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల నుంచి 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నా. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి కాల్వలు మరమ్మతు చేయిస్తాం. -
ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తీర్చరూ..
నారాయణపేట: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్‌లో సోమవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కలిశారు. నియోజకవర్గంలోని సమస్యలు, వైద్య రంగంలో కావాల్సిన మౌలిక సదుపాయాలను విన్నవించారు. జిల్లా ఆస్పత్రి, చిన్న పిల్లల ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రిలతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చాలని మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానూకూలంగా స్పందించారు. ఆర్ఎంను కలిసినడిపో కార్మికులు నారాయణపేట రూరల్: ఆర్టీసీ మహబూబ్‌నగర్ రీజనల్ మేనేజర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంతోష్ కుమార్‌ను సోమవారం టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి నేతృత్వంలో నారాయణపేట డిపో కార్మికులు కలిశారు. ఆయన ఛాంబర్లో శాలువాతో సన్మానించి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిపో సమస్యలను, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. కార్యక్రమంలో మధు, పీవీఆర్ రెడ్డి, మోహన్ రెడ్డి, శేఖర్, నారాయణ, ప్రవీణ్, నర్సిరెడ్డి, నర్సింలు, రాములు పాల్గొన్నారు. అలసందలు క్వింటా రూ.7,011 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం అలసందలు క్వింటా గరిష్టం, కనిష్టంగా రూ.7,011 ధర పలికింది. అలాగే, వడ్లు (హంస) గరిష్టం రూ.2,813, కనిష్టం రూ.1,261, వడ్లు (సోన) గరిష్టం రూ.2,756, కనిష్టం రూ.1,500, ఎర్ర కందులు గరిష్టం రూ.11,435, కనిష్టం రూ.7,929, కందులు తెల్లవి గరిష్టం రూ.11,459, కనిష్టం రూ.8,809 ధర పలికింది. వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన గద్వాల (మల్దకల్): ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో భద్రాద్రి సీతారామలక్ష్మణ, మద్వాచారి భీమసేన విగ్రహాలను సోమవారం మంత్రాలయ పూర్వపు పీఠాధిపతి సువిదేంద్ర తీర్థులచే విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించారు. అంతకుముందు కల్యాణమండపంలో మహాహోమం, కుంభాభిషేకం, కలశప్రతిష్టలతో పాటు పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ చేపట్టారు. అనంతరం భద్రాద్రి సీతరామలక్ష్మణ, మద్వాచారిభీమసేన విగ్రహ ప్రతిష్టలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సువిదేంద్ర తీర్థులు భక్తులకు వేదప్రవచనాలు, ఆశీర్వచనాలు అందజేశారు. భక్తులు దైవమార్గంలో నడుచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, విగ్రహ దాతలు పద్మారెడ్డి, బిచ్చారెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నరేందర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. నేడు ధ్వజారోహణం ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయ ఆవరణలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు తెలిపారు. ధ్వజారోహణంతో దేవతామూర్తులకు ఆహ్వానం పలుకుతూ ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. -
ఎదురుచూపులు
మరికల్: తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేందుకు రాయితీపై ప్రభుత్వం రైతులకు అందజేసే తుంపర సేద్యం పరికరాలు రైతుల చెంతకు చేరడం లేదు. యాసంగి సాగులో జిల్లాలో పలు మండల్లాలో అధిక శాతం రైతులు వేరుశనగ పంటను సాగు చేస్తారు. తక్కువ నీటి వనరులు ఉన్న రైతులు జిల్లాలో 2వేల మంది సబ్సిడీపై అందించే తుంపర పరికరాలకు దరఖాస్తులు చేసుకున్నారు. రాయితీపై కేవలం 120 మంది రైతులకు మాత్రమే రావడంతో మిగిత రైతులు వాటికోసం ఎదురుచూస్తున్నారు. మరికొంత మంది రైతులు ప్రైవేట్‌లో కొనుగోలు చేసి పంటలను తడుపుతున్నారు. మరో నెల రోజులు అయితే పంట చేతికి వస్తుంది. ఇంతవరకు రాయితీ పరికరాలు రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా నీటితో మూడు ఎకరాలు సాగు జిల్లాలో పలు మండలాల్లో ఏటవాలు భూములున్నాయి. ప్రధానంగా బోర్లతో యాసంగిలో వేరుశనగ సాగు చేస్తారు. నీటి కొరతను దృిష్టిలో ఉంచుకుని తుంపర పరికరాల ద్వారా నీటితడులు ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల ఎకరాకు సరిపడా నీటితో మూడు ఎకరాలకు అందించవచ్చు. ఏటవాలు భూములు ఎత్తు భూములు వర్షంతో కోతకు గురికాకుండా నీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధ్యమవుతుంది. జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో రైతులు 8,100 ఎకరాల్లో సాగు చేశారు. నాలుగు నెలలకు పంటచేతికి వస్తుంది. మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో పాటు ఎకరాకు దాదాపు 10 నుంచి 12 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. ప్రధానంగా దామరగిద్ద, మద్దూరు, మక్తల్, కోస్గి, నారాయణపేట, మరికల్, నర్వ మండలాల్లోనే అధికంగా వేరుశనగ సాగు చేస్తారు. 120 మందిరైతులకు మాత్రమే.. జిల్లాలో రాయితీ తుంపర పరికరాల కోసం 2వేల మంది రైతులు మీసేవ కేంద్రాల్లో ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకంతో దరఖాస్తు చేసుకున్నారు. రైతు వాటా 25 శాతం డీడీ రూపంలో చెల్లిస్తే ప్రభుత్వం 75 శాతం రాయితీ ఇస్తుంది. రైతులు ఇచ్చిన డీడీలను కంపెనీకి పంపించి రైతులకు తుంపర యూనిట్లు అందజేస్తారు. ఒక యూనిట్లో 25 పైపులతో పాటు అవసరమైన ఇతర పరికరాలు ఉంటాయి. డీడీలు చెల్లించిన 2వేల మంది రైతుల్లో 120 మందికి మాత్రమే రాయితీ పరికరాలు అందాయి. మిగతా 1880 మందికి ఎదరుచూపులు తప్పడం లేదు. ప్రైవేట్‌లో కొనుగోలు చేశా 8 ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశా. మొదట రాయితీ తుంపర సేద్యం పరికరాల కోసం అధికారులను సంప్రదించాను. డీడీ చెల్లించాక ఎప్పుడు వస్తాయో తెలియదు. పరికరాలు వచ్చినప్పుడు అందజేస్తామన్నారు. దీంతో రూ.30 వేలు పెట్టి మహబూబ్గన్లో ప్రైవేట్ దుకాణంలో కొనుగోలు చేసి పంటకు నీరు అందిస్తున్నా. – బోయ శ్రీనివాసులు, రైతు, మరికల్ దశల వారీగా పంపిణీ చేస్తాం జిల్లా వ్యాప్తంగా 2వేల మంది రైతులు తుంపర సేద్యం పరికరాలకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 120 మందికి రాయితీపై పరికరాలు వచ్చాయి. త్వరలోనే ఎమ్మెల్యే చేతుల మీదుగా వీటిని అందజేస్తాం. మిగితా వారికి కూడా దశల వారీగా పంపిణీ చేస్తాం. – వెంకటరమణ, జిల్లా ఉధ్యానశాఖ అధికారి తుంపర సేద్యం పరికరాలు అందక రైతుల ఇబ్బందులు 75 శాతం రాయితీపై ప్రభుత్వంకొన్నేళ్లుగా అందజేత జిల్లాలో 2వేల మంది దరఖాస్తు 120 మందికి మాత్రమే యూనిట్లు మంజూరు ప్రైవేట్‌లో కొనుగోలు చేయలేక అవస్థలు -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట ఎడ్యుకేషన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని హార్ట్ఫుల్నేస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఆంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సుదర్శన్ సమక్షంలో యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో యోగా, ధ్యానం చేయడం ద్వారా శారీరక దృడత్వం, మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెంపొందించుకోవచ్చచి అన్నారు. తమ స్వచ్ఛంద సంస్థ ఇంటర్‌బోర్డు సహకారంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వెంకట్రాములు, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. -
మాజీ సర్పంచ్ల అరెస్టు
నారాయణపేట రూరల్: పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరుతూ సోమవారం నిర్వహించిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని తాజా మాజీ సర్పంచ్ లను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన పలువురు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సమయంలో మధ్యలో అడ్డుకొని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు అప్పులు తెచ్చి మరి పనులు చేయిస్తే అవార్డులను పొందిన ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదని విమర్శించారు. పల్లెల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం, మన ఊరు మనబడి, శ్మశాన వాటిక లాంటి పనుల కోసం అప్పులు తెచ్చి మరి పూర్తి చేస్తే రూ.లక్షలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా బిల్లులను ఆపేసిందని, ప్రతిపక్షంలోని కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల సర్పంచులు అప్పులకు వడ్డీలు కట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలను చూసి కూడా స్పందించకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు జయలక్ష్మి, శ్రీనివాసులు, సీతమ్మ వెంకట్ నాయక్, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. -
హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు
అలంపూర్: అష్టాదశ శకిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల హుండీ ఆదాయం రూ.1,06,04,436 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి పురేందర్‌కుమార్ తెలిపారు. అలంపూర్‌లో వెలసిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాల హుండీ లెక్కింపు సోమవారం ఉమ్మడి జిల్లా దేవాదాయ సహాయ కమిషనర్ మధనేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా జోగుళాంబ అమ్మ వారి ఆలయహుండీ లెక్కించడంతో రూ.87,02, 578 రాగా.. బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ హుండీ ద్వారా రూ.18,63,642 ఆదాయం వచ్చిందన్నారు. అలాగే అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.38,216 మొత్తం కలిపి రూ.1,06,04,436 ఆదాయం వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. అదేవిధంగా విదేశీ కరెన్సీ యూఎస్ డాలర్లు 17, ఆస్ట్రేలియా కరెన్సీ 5, స్వీడన్ కరెన్సీ 1000, మిశ్రమ బంగారం 61 గ్రాములు, మిశ్రమ వెండి 513 గ్రాములు వచ్చింది. ప్రస్తుతం 150 రోజులకు సంబంధించిన హుండీని లెక్కించడంతో ఈ ఆదాయం సమకూరిందని వివరించారు. గతంలో 110 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా రూ.58,66,623 వచ్చింది. అయితే ఈసారి కార్తీక మాసం కలిసి రావడంతో గతం కంటే రూ.47,37,813 ఆదాయం అదనంగా వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, ధర్మకర్తలు నాగశిరోమణి, జగన్మోహన్నాయుడు, విశ్వనాథరెడ్డి, జగదీశ్వర్‌గౌడ్, గోపాల్, వెంకటేశ్వర్లు, ఆలయ ఉప ప్రధాన అర్చకులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఆనంద్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ బేన్ షాలం ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఫిర్యాదులను నేరుగా ఆయన స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పరిష్కరించాలని పేర్కొన్నారు. మొత్తం 27 ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్, ఏవో జయసుధ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్‌కు చెరుకు రైతుల పాదయాత్ర
అమరచింత: తమ పాలిట శాపంగా మారిన కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట రికవరీ విధానాన్ని రద్దు చేయాలంటూ కృష్ణవేణి చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో చెరుకు రైతులు సోమవారం కొత్తకోట నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం సమస్యల వినతిపత్రాన్ని సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెరుకు మద్దతు ధర టన్నుకు రూ.ఆరు వేలు చెల్లించాలని, సన్నరకం వరి ధాన్యానికి ఇస్తున్నట్లుగా చెరుకు కూడా బోనస్ ప్రకటించాలన్నారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఫీల్డ్‌మెన్లను వేధిస్తున్న జీఎం రూపేష్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని కోరారు. రవాణా సమయంలో ఆర్టీఓ, పోలీసుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను నివారించాలని విన్నవించారు. ఏళ్లుగా కొత్త వంగడాలను ఫ్యాక్టరీ యాజమాన్యం పరిచయం చేయడం లేదని.. దీంతో దిగుబడి లేక రైతులు నష్టపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వేరుపురుగు సోకిన పంటలకు ఫ్యాక్టరీనే పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో వాసారెడ్డి, తిరుపతయ్య, నారాయ, రాజు, అరుణ్, చారి, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.