Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

West Indies lose in third ODI1
న్యూజిలాండ్‌ ‘క్లీన్‌ స్వీప్‌’

హామిల్టన్‌ (న్యూజిలాండ్‌): ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్‌ జట్టు... వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. శనివారం జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 4 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది. టి20 సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకున్న కివీస్‌... వన్డే సిరీస్‌ను 3–0తో చేజిక్కించుకుంది. ఆఖరి పోరులో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ 36.2 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. రోస్టన్‌ ఛేజ్‌ (51 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... జాన్‌ క్యాంప్‌బెల్‌ (26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఖారీ పియర్‌ (22 నాటౌట్‌; 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. కెపె్టన్‌ షై హోప్‌ (16), అకీమ్‌ అగస్ట్‌ (17), కార్టీ (0), రూథర్‌ఫోర్డ్‌ (19), జస్టిన్‌ గ్రేవ్స్‌ (1) విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్ల ధాటికి కరీబియన్‌ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మ్యాట్‌ హెన్రీ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జాకబ్‌ డఫీ, మిచెల్‌ సాంట్నర్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ 30.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. మార్క్‌ చాప్‌మన్‌ (63 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి హాఫ్‌సెంచరీతో సత్తాచాటగా... మిచెల్‌ బ్రాస్‌వెల్‌ (31 బంతుల్లో 40 నాటౌట్‌; 6 ఫోర్లు) రాణించాడు. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (11), రచిన్‌ రవీంద్ర (14)తో పాటు విల్‌ యంగ్‌ (3), టామ్‌ లాథమ్‌ (10) విఫలమవడంతో ఒక దశలో 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కివీస్‌ జట్టును చాప్‌మన్‌ ఆదుకున్నాడు. బ్రాస్‌వెల్‌తో కలిసి జట్టును విజయానికి చేరువ చేశారు. వెస్టిండీస్‌ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్, జైడెన్‌ సీల్స్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్‌ ప్లేయర్లు మ్యాట్‌ హెన్రీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, కైల్‌ జెమీసన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య డిసెంబర్‌ 2 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Bangladesh set a target of 509 runs for their opponents in the second Test2
విజయం ముంగిట బంగ్లాదేశ్‌

మిర్పూర్‌: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు... సొంతగడ్డపై ఐర్లాండ్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా సాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించి 1–0తో ఆధిక్యంలో ఉన్న బంగ్లాదేశ్‌... రెండో టెస్టులో ప్రత్యర్థి ముందు 509 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్‌ (80 బంతుల్లో 50; 7 ఫోర్లు)హాఫ్‌ సెంచరీతో మెరవగా... కర్టీస్‌ కాంపెర్‌ (93 బంతుల్లో 34 బ్యాటింగ్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడుతున్నాడు. కెప్టెన్‌ ఆండీ బాల్‌బిర్నీ (13)తో పాటు పాల్‌ స్టిర్లింగ్‌ (9), కార్మిచెల్‌ (10), టకర్‌ (7) విఫలమయ్యారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తైజుల్‌ ఇస్లామ్‌ 3 వికెట్లు పడగొట్టగా... హసన్‌ మురాద్‌ 2 వికెట్లు తీశాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 4 వికెట్లు ఉన్న ఐర్లాండ్‌ జట్టు... విజయానికి ఇంకా 333 పరుగులు చేయాల్సి ఉంది. కాంపెర్‌తో పాటు మెక్‌బ్రినె (11 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 156/1తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌... చివరకు 69 ఓవర్లలో 297/4 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. మహ్ముదుల్‌ హసన్‌ జాయ్‌ (91 బంతుల్లో 60; 6 ఫోర్లు), షాద్‌మన్‌ ఇస్లామ్‌ (119 బంతుల్లో 78; 7 ఫోర్లు), మోమినుల్‌ హక్‌ (118 బంతుల్లో 87; 10 ఫోర్లు), ముషి్ఫకర్‌ రహీమ్‌ (81 బంతుల్లో 53 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీలతో కదంతొక్కారు. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ముషి్ఫకర్‌ రహీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో పాటు... రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్ధశతకంతో రాణించాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో గవిన్‌ 2 వికెట్లు పడగొట్టాడు.249 తైజుల్‌ ఇస్లామ్‌ వికెట్ల సంఖ్య. టెస్టుల్లో బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షకీబ్‌ అల్‌ హసన్‌ (246)ను తైజుల్‌ అధిగమించాడు.

India in the ring for the Azlan Shah Hockey Tournament3
శుభారంభమే లక్ష్యంగా...

ఐపో (మలేసియా): సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో ఐదు సార్లు చాంపియన్‌ అయిన భారత హాకీ జట్టు మరో సారి టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టోర్నీ చరిత్రలో రెండో విజయవంతమైన జట్టుగా ఘనత వహించిన భారత్‌ ఆదివారం జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో ఢీకొనేందుకు సిద్ధమైంది. నాలుగేళ్ల విరామం తర్వాత భారత్‌ ఈ ఇన్విటేషనల్‌ టోర్నీ ఆడుతోంది. 2019 తర్వాత భారత్‌ ఈ టోర్నీలో ఆడలేకపోయింది. ఈ సారి మొత్తం ఆరు జట్లు బరిలో ఉన్నాయి. భారత్, బెల్జియం, కెనడా, కొరియా, న్యూజిలాండ్‌ సహా ఆతిథ్య మలేసియా అజ్లాన్‌ షా సమరానికి సై అంటున్నాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో టాప్‌–2లో నిలిచిన జట్లు అమీతుమీకి అర్హత సాధిస్తాయి. కొరియాతో మ్యాచ్‌ ముగిసిన మరుసటి రోజే భారత్‌ 24న పటిష్టమైన బెల్జియంతో తలపడుతుంది. 26న మలేసియాతో, 27న న్యూజిలాండ్‌తో, చివరి లీగ్‌ మ్యాచ్‌ను 29న కెనడాతో తలపడుతుంది. టైటిల్‌ పోరు 30న నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ఎఫ్‌ఐహెచ్‌ పురుషుల హాకీ ప్రపంచకప్‌తో పాటు, ఆసియా క్రీడలు కూడా జరుగనున్న నేపథ్యంతో ఈ టోర్నీలో జరుగుతుంది. ఈ టోర్నీలో పలువురు సీనియర్‌ ఆటగాళ్లు, రెగ్యులర్‌ కెపె్టన్‌హర్మన్‌ప్రీత్‌ సింగ్, మన్‌ప్రీత్‌ తదితరులకు విశ్రాంతి ఇచ్చారు.

South Africa batting falters on the first day of the second Test against India4
భారత బౌలర్ల పైచేయి

బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌...టాస్‌ గెలిచిన తర్వాత తొలి వికెట్‌కు 82 పరుగుల శుభారంభం... ఆ తర్వాతా బవుమా, స్టబ్స్‌ కీలక భాగస్వామ్యం... అయినా సరే దక్షిణాఫ్రికా తొలి రోజును సంతృప్తికరంగా ముగించలేకపోయింది. మెరుగ్గానే మొదలు పెట్టినా ఒక్కరూ కనీసం అర్ధ సెంచరీ కూడా సాధించలేకపోయారు. భారత బౌలర్లు సరైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి ని నిలువరించారు. ముఖ్యంగా కుల్దీప్‌ యాదవ్‌ పదునైన బౌలింగ్‌తో తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. నేడు మిగిలిన నాలుగు వికెట్లను భారత్‌ ఎంత తొందరగా పడగొడుతుందో చూడాలి.గువహటి: భారత్‌తో మొదలైన రెండో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ తడబడింది. శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (112 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా, కెప్టెన్ తెంబా బవుమా (92 బంతుల్లో 41; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. ప్రస్తుతం సెనూరన్‌ ముత్తుసామి (25 బ్యాటింగ్‌), కైల్‌ వెరీన్‌ (1 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ (3/48) రాణించగా, బుమ్రా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. కోల్‌కతా టెస్టులో ఆడిన భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. గిల్, అక్షర్‌ స్థానాల్లో సాయి సుదర్శన్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి టీమ్‌లోకి వచ్చారు. దక్షిణాఫ్రికా కార్బిన్‌ బాష్‌ స్థానంలో ముత్తుసామికి అవకాశం కల్పించింది. శుభారంభం... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (81 బంతుల్లో 38; 5 ఫోర్లు), ర్యాన్‌ రికెల్టన్‌ (82 బంతుల్లో 35; 5 ఫోర్లు) జాగ్రత్తగా మొదలు పెట్టారు. మార్క్‌రమ్‌ ఖాతా తెరిచేందుకు 17 బంతులు తీసుకున్నాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్‌రమ్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను స్లిప్‌లో రాహుల్‌ వదిలేశాడు. నితీశ్‌ కుమార్‌తో 4 ఓవర్లు వేయించగా అతను 21 పరుగులు ఇచ్చాడు. తొలి సెషన్‌లో ఈ భాగస్వామ్యం మరింత బలపడుతున్న దశలో బుమ్రా బ్రేక్‌ ఇచ్చాడు. చక్కటి బంతితో మార్క్‌రమ్‌ను బుమ్రా బౌల్డ్‌ చేయడంతో టీ విరామం లభించింది. రెండో సెషన్‌లో రెండో బంతికే రికెల్టన్‌ను అవుట్‌ చేసి కుల్దీప్‌ తన విలువను ప్రదర్శించాడు. కీలక భాగస్వామ్యం... రెండో సెషన్‌లో స్టబ్స్, బవుమా పార్ట్‌నర్‌షిప్‌ దక్షిణాఫ్రికాను ఆదుకుంది. వీరిద్దరు ఓపిగ్గా చక్కటి డిఫెన్స్‌తో ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. 27 పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో బవుమా అదృష్టవశాత్తూ అంపైర్‌ రివ్యూలో త్రుటిలో ఎల్బీగా అవుట్‌ కాకుండా బతికిపోయాడు. స్పిన్నర్లు ప్రభావం చూపడంతో పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. లంచ్‌ తర్వాత పూర్తిగా భారత బౌలర్ల ఆధిపత్యం కొనసాగి దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు చేజార్చుకుంది. జడేజా బౌలింగ్‌లో పేలవ షాట్‌తో బవుమా వెనుదిరిగాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో స్టబ్స్, ముల్డర్‌ (13)లను అవుట్‌ చేసి కుల్దీప్‌ దెబ్బ తీశాడు. అయితే టోనీ జోర్జీ (59 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ముత్తుసామి కలిసి మళ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ 45 పరుగులు జోడించారు. అయితే కొత్త బంతితో తన తొలి ఓవర్లోనే జోర్జీని సిరాజ్‌ పెవిలియన్‌ పంపించాడు. అదే ఓవర్లో మరో నాలుగు బంతుల తర్వాత వెలుతురు మందగించడంతో నిర్ణీత ఓవర్లలో మరో 8.1 ఓవర్లు ఉండగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. దక్షిణాఫ్రికా టాప్‌–5 బ్యాటర్లంతా 25–49 మధ్యలోనే పరుగులు చేశారు. టెస్టు క్రికెట్‌లో ఇలా జరగడం ఇది మూడో సారి మాత్రమే.స్కోరు వివరాలుభారత్‌ ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (బి) బుమ్రా 38; రికెల్టన్‌ (సి) పంత్‌ (బి) కుల్దీప్‌ 35; స్టబ్స్‌ (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 49; బవుమా (సి) జైస్వాల్‌ (బి) జడేజా 41; జోర్జి (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 28; ముల్డర్‌ (సి) జైస్వాల్‌ (బి) కుల్దీప్‌ 13; ముత్తుసామి (బ్యాటింగ్‌) 25; వెరీన్‌ (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (81.5 ఓవర్లలో 6 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–82, 2–82, 3–166, 4–187, 5–201, 6–246. బౌలింగ్‌: బుమ్రా 17–6–38–1, సిరాజ్‌ 17.5–3–59–1, నితీశ్‌ రెడ్డి 4–0–21–0, సుందర్‌ 14–3–36–0, కుల్దీప్‌ 17–3–48–3, జడేజా 12–1–30–1. కెప్టెన్‌లకు జ్ఞాపిక గువహటిలో తొలి టెస్టు కావడంతో మ్యాచ్‌ ఆరంభానికి ముందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్టేడియం బొమ్మ ముద్రించిన చిత్రపటంపై ఇరు జట్ల కెప్టెన్లు తమ ఆటోగ్రాఫ్‌లు చేసి అస్సాం క్రికెట్‌ అసోసియేషన్‌కు అందించారు. అనంతరం బీసీసీఐ కార్యదర్శి, అస్సాంకే చెందిన దేవజిత్‌ సైకియా తమ తరఫున పంత్, బవుమాలకు ప్రత్యేక జ్ఞాపికలు అందజేశారు. అధికారిక లెక్కల ప్రకారం బర్సపర మైదానంలో తొలి రోజు 15,448 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

Mahit Sandhu wins fourth gold medal at Deaflympics5
మహిత్‌కు మరో స్వర్ణం

న్యూఢిల్లీ: బధిరుల ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే మూడు పతకాలు నెగ్గిన భారత షూటర్‌ మహిత్‌ సంధు తాజాగా నాలుగో పతకం ఖాతాలో వేసుకుంది. శనివారం మహిళల 50 మీటర్ల రైఫిల్‌ ‘త్రి’ పొజిషన్‌లో మహిత్‌ స్వర్ణ పతకంతో మెరిసింది. ఫైనల్లో మహిత్‌ 456 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో మహిత్‌కు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. దక్షిణ కొరియాకు చెందిన డైన్‌ జెంగ్‌ 453.5 పాయింంట్లతో రజతం దక్కించుకోగా... హంగేరి షూటర్‌ మిరా జుసన్నా బియాటోజ్‌కీ (438.6 పాయింట్లు) కాంస్యం నెగ్గింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో మహిత్‌ 585 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డుతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఆమె నీలింగ్‌ పొజిషన్‌లో 194 పాయింట్లు, ప్రోన్‌లో 198 పాయింట్లు, స్టాండింగ్‌లో 193 పాయింట్లతో అదరగొట్టింది. గతంలో 576 పాయింట్లతో తన పేరిటే ఉన్న వరల్డ్‌ రికార్డును మహిత్‌ తిరగరాసింది. ఇదే విభాగంలో పోటీపడిన భారత మరో షూటర్‌ నటాషా జోషీ 417.1 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ పోటీల్లో భారత షూటర్లు ఇప్పటి వరకు 14 పతకాలు (5 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు) గెలుచుకున్నారు.

Anahat Singh wins Indian Open international squash tournament title6
అనాహత్‌కు టైటిల్‌

ఇండోర్‌: భారత నంబర్‌వన్, రైజింగ్‌ స్టార్‌ అనాహత్‌ సింగ్‌ ఇండియన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్క్వాష్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన వెటరన్‌ స్టార్‌ జోష్నా చినప్పపై అనాహత్‌ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్‌ అనాహత్‌ సింగ్‌ 3–2 (11–8, 11–13, 11–9, 6–11, 11–9)తో ఒకప్పటి ప్రపంచ టాప్‌–10 ప్లేయర్‌ జోష్నా చినప్పపై గెలిచింది. 55 నిమిషాల పాటు సాగిన పోరులో టీనేజ్‌ స్టార్‌ అనాహత్‌ అదరగొట్టింది. ఎదురుగా ఉన్నది సీనియర్‌ ప్లేయర్‌ అయినా ఏమాత్రం ఒత్తిడికి గురికాని అనాహత్‌ చక్కటి స్ట్రోక్‌ ప్లేతో ఆకట్టుకుంది. ఐదో గేమ్‌లో 6–6తో స్కోర్లు సమమైన దశలో 39 ఏళ్ల జోష్నా పైచేయి సాధించేందుకు ప్రయత్నించినా... పట్టువిడవని అనాహత్‌ కెరీర్‌లో 13వ పీఎస్‌ఏ టైటిల్‌ ఖాతాలో వేసుకుంది.

Indias squad announcement on Sunday, Shubman Gill to miss South Africa ODIs: Reports7
రేపే జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌?

సౌతాఫ్రికాతో వైట్ బాల్ సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ఆదివారం(నవంబర్ 23) ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు జరుగుతున్న గువహటిలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, సెల‌క్ట‌ర్ ఆర్పీ సింగ్‌, సెక్ర‌ట‌రీ దేవజిత్ సైకియా సమావేశమై స్క్వాడ్‌ను ఎంపిక చేయనున్నారు. అయితే ప్రోటీస్‌తో వ‌న్డే సిరీస్‌కు రెగ్యూల‌ర్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ దూరం కానున్న‌ట్లు స‌మాచారం. మెడ‌నొప్పి గాయం కార‌ణంగా స‌ఫారీల‌తో టెస్టు సిరీస్ నుంచి త‌ప్పుకొన్న గిల్‌.. పూర్తిగా కోలుకోవ‌డానికి మ‌రో రెండు వారాల స‌మ‌యం ప‌ట్టనున్న‌ట్లు వ‌స్తున్నాయి. అత‌డు తిరిగి టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వ‌చ్చే అవకాశ‌ముంది. అత‌డితో పాటు హార్దిక్ పాండ్యా, శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా వ‌న్డే సిరీస్‌కు దూరంగా ఉండ‌నున్నారు. హార్దిక్ తొడ కండరాల గాయం కార‌ణంగా ఆసియా కప్ నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇంకా అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. అదేవిధంగా ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతడు సౌతాఫ్రికాతో సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో వన్డేలకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా సౌతాఫ్రికాతో వన్డేలకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.కెప్టెన్‌గా రిషబ్ పంత్‌..?కాగా శుభ్‌మన్ గిల్ గైర్హజరీలో భారత వన్డే జట్టు పగ్గాలను స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వన్డేల్లో గిల్‌కు డిప్యూటీగా అయ్యర్ ఉన్నాడు. కానీ అయ్యర్ కూడా ఇప్పుడు గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో పంత్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపుతున్నారు. పంత్ ప్రస్తుతం గౌహతిలో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.ఇప్పటివరకు టెస్టు, టీ20ల్లో టీమిండియాకు సారథ్యం వహించిన పంత్‌.. తొలిసారి వన్డే జట్టు బాధ్యతలను తీసుకునేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు వన్డే జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. సౌతాఫ్రికా-ఎతో జరిగిన అనాధికారిక వన్డే సిరీస్‌లో రుతురాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నవంబర్ 30 నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: Bengal squad for SMAT: మ‌హ్మ‌ద్ ష‌మీకి చోటిచ్చిన సెలక్టర్లు.. కెప్టెన్ ఎవ‌రంటే?

India to face Nepal in first-ever Blind Womens T20 World Cup final8
సెమీస్‌లో ఆసీస్ చిత్తు..

ఐసీసీ అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌ 2025లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం కొలంబో వేదికగా జరిగిన సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో చనకన్ బువాఖావో (34) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ సెమీస్ పోరులో ఆరుగురు ఆస్ట్రేలియా బ్యాటర్లు రనౌట్ అయ్యారు. భారత బౌలర్లలో సిమ్రన్‌జీత్ కౌర్, జమునా రాణి, అను కుమారి తలా వికెట్ సాధించారు.అనంతరం 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో బసంతి హన్సా 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గంగా కదమ్ (41 నాటౌట్), కె. కరుణ (16 నాటౌట్‌) రాణించారు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో నేపాల్‌తో భారత్ తలపడనుంది. రెండో సెమీఫైనలో పాకిస్తాన్ ఓడించి నేపాల్ ఫైనల్‌కు అర్హత సాధించింది.చదవండి: Bengal squad for SMAT: మ‌హ్మ‌ద్ ష‌మీకి చోటిచ్చిన సెలక్టర్లు.. కెప్టెన్ ఎవ‌రంటే?

Mohammed Shami named in Bengals Syed Mushtaq Ali squad,9
మ‌హ్మ‌ద్ ష‌మీకి చోటిచ్చిన సెలక్టర్లు.. కెప్టెన్ ఎవ‌రంటే?

టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ మ‌రోసారి త‌న ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు సిద్ద‌మ‌య్యాడు. దేశ‌వాళీ టీ20 టోర్నీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో బెంగాల్ త‌ర‌పున‌ ఆడ‌నున్నాడు. ఈ టోర్నీ కోసం బెంగాల్ క్రికెట్ అసోయేషిన్ ప్ర‌కటించిన జ‌ట్టులో ష‌మీకి చోటు ద‌క్కింది. ఈ జ‌ట్టు కెప్టెన్‌గా వెట‌ర‌న్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ఎంపిక‌య్యాడు. ష‌మీతో పాటు టీమిండియా పేసర్ ఆకాష్ దీప్ కూడా బెంగాల్ జ‌ట్టులో ఉన్నాడు. ఈ జ‌ట్టులో వికెట్ కీప‌ర్‌గా అభిషేక్ పోరెల్ స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఈ టోర్నీ గ్రూప్-సిలో ఉన్న బెంగాల్ జట్టు.. నవంబర్ 26న హైదరాబాద్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ గ్రూపులో బెంగాల్‌తో పాటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, సర్వీసెస్, పుదుచ్చేరి, హర్యానా జట్లు ఉన్నాయి.షమీ రీ ఎంట్రీ ఇస్తాడా?కాగా మ‌హ్మ‌ద్ ష‌మీ గ‌త కొంత కాలంగా జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉంటున్నాడు. ష‌మీ భార‌త్ త‌ర‌పున చివ‌ర‌గా ఈ ఏడాది మార్చిలో ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడాడు. అప్ప‌టి నుంచి అత‌డు జ‌ట్టు బ‌య‌టే ఉంటున్నాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న‌ప్ప‌టికి ష‌మీని మాత్రం సెల‌క్ట‌ర్లు ప‌రిగణ‌లోకి తీసుకోవ‌డం లేదు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ మొదటి దశలో పూర్తిస్థాయిలో పాల్గొన్న ఈ వెటరన్ పేసర్.. ఏకంగా 20 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాత్రం ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగానే షమీని జట్టులోకి తీసుకోవడం లేదని చెప్పుకొస్తున్నాడు.కానీ ఇటీవల షమీ అయితే తన ఫిట్‌గా ఉన్నప్పటికి కావాలనే ఎంపిక చేయడం లేదని పరోక్షంగా సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. ఒకవేళ షమీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే న్యూజిలాండ్‌తో టీ20లకు రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది.బెంగాల్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సుదీప్ ఘరామి, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్‌), షకీర్ హబీబ్ గాంధీ , యువరాజ్ కేస్వానీ, ప్రియాంషు శ్రీవాస్తవ్, షాబాజ్ అహ్మద్, ప్రదీప్త ప్రమాణిక్, రిటిక్ ఛటర్జీ, కరణ్ లాల్. సాక్షం చౌదరి, మహమ్మద్ షమీ, ఆకాష్ దీప్, సయన్ ఘోష్, కనిష్క్ సేథ్, యుధాజిత్ గుహా, శ్రేయాన్ చక్రవర్తి.చదవండి: అతడిని చూసి భయపడ్డా.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాము: స్టోక్స్‌

USAs Akhilesh Reddy charged under ICC Anti-Corruption Code10
మ్యాచ్‌ ఫిక్సింగ్‌​కు యత్నం.. యువ క్రికెటర్‌పై ఐసీసీ బ్యాన్‌

అంతర్జాతీయ క్రికెట్‌లో యూఎస్‌ఏ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆఫ్‌స్పిన్నర్‌ బొడుగం అఖిలేష్‌ రెడ్డి అబుదాబి టి10 లీగ్‌లో ఆడుతూ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అవినీతి నిరోధక నిబంధనలను అతను ఉల్లంఘించినట్లు వెల్లడైంది.25 ఏళ్ల అఖిలేష్‌ రెడ్డిపై మూడు వేర్వేరు అభియోగాలు నమోదు చేసిన ఐసీసీ... అతడిపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు అఖిలేష్‌కు 14 రోజుల గడువు ఇచ్చింది. విచారణ ముగిసిన అనంతరం అతనిపై పూర్తి స్థాయిలో చర్యలుంటాయి.అబుదాబి టి10 లీగ్‌లో అస్పిన్‌ స్టాలియన్స్‌ జట్టు తరఫున బుధ, గురువారాల్లో అతను 2 మ్యాచ్‌లు ఆడాడు. హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల అఖిలేష్‌ రెడ్డి ఈ ఏడాది ఆరంభంలో నార్త్‌ అమెరికా టి20 కప్‌లో యూఎస్‌ తరఫున అరంగేట్రం చేసి 4 మ్యాచ్‌లు ఆడాడు.చదవండి: అతడిని చూసి భయపడ్డా.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాము: స్టోక్స్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement