Vikarabad
-
రాష్ట్రంలోచివరి స్థానం
తాండూరు: మరో రెండు నెలల్లో 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది.. మున్సిపాలిటీకి ఆస్తి పన్నే ప్రధాన ఆదాయ వనరు. ఇంటి పన్ను వసూలులో తాండూరు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఉంది. ఆన్లైన్ ద్వారా పన్నులు సేకరించాలి. అయితే ఇందుకు వినియోగించే మిషన్లు 6 నెలలుగా పని చేయడం లేదు. దీంతో ఇప్పటి వరకు కేవలం 12.12 శాతమే వసూలు చేశారు. మిగిలిన పన్నులు మార్చి నెలాఖరుకు పూర్తి చేసే అవకాశం కనిపిండం లేదు. గత ఆర్థిక సంవత్సరం మొదటి నెల నుంచే పన్నుల వసూలు ప్రక్రియను ప్రారంభించి మార్చి నాటికి 100 శాతం లక్ష్యం చేరుకునేవారు. అయితే తరచూ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు తీసుకోవడం.. సర్వేలు చేయించడం లాంటివి పన్నుల వసూలుపై ప్రభావం పడింది. తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులు 14,707 ఆవాసాలున్నాయి. ఏటా ఆస్తి పన్ను రూపంలో మున్సిపాలిటీకి రూ.13.04కోట్ల ఆదాయం చేకూరుతుంది. ఈ సారి పన్నుల వసూలులో అధికారులు ఆసక్తి చూప లేదనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు రూ.1.58 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయగా ఇంకా రూ.11.02 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 152 మున్సిపాలిటీలున్నాయి. ఆస్తి పన్ను వసూలులో తాండూరు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. వచ్చే నెల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పన్నుల వసూలుకు కొత్త యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. -
అభివృద్ధి పనులు ప్రారంభించండి
● లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ ● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ● కిష్టాపూర్‌లో సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన ఆరోగ్యశ్రీ రంగారెడ్డి కో ఆర్డినేటర్‌గా డాక్టర్ సతీష్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌గా డాక్టర్ సతీష్‌రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన డాక్టర్ నరేష్ పదోన్నతి పొంది రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ హెడ్ ఆఫీసుకు బదిలీ అయ్యారు. పదోన్నతిపై వెళ్లిన డాక్టర్ నరేష్‌కు వీడ్కోలు పలికారు. కొడంగల్: నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. గురువారం పట్టణంలోని కడా కార్యాలయంలో కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్‌జైన్, శిక్తాపట్నయక్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కలాశాలలతోపాటు బొంరాస్‌పేట, గుండుమాల్ మండలాల్లో చేపట్టే సమీకృత పాఠశాల భవనాల నిర్మాణ పనులను త్వరలో చేపట్టాలని సూచించారు. వెటర్నరీ, వైద్య కళాశాలలకు సంబంధించి పనులను ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమాహారతి, గరిమనరుల, కడా కార్యాలయ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, నారాయణపేట ఆర్డీఓ రామచందర్, పంచాయత్‌రాజ్ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ వసంత్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ -
రాజకీయ లబ్ధి కోసమే సర్వేలు, సభలు
● ఎమ్మెల్యే సబితా రెడ్డి ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుమీర్పేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే సర్వేలు, సభలు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి విమర్శించారు. కార్పొరేషన్లో రూ.4.42 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇళ్లు, రేషన్‌కార్డులు ఇస్తామని ఓ వైపు మంత్రులు చెబుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తాము చెప్పిన వారికే ఇస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తుండడంతో గ్రామ సభలను నిర్భందాల మధ్య నడుపుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని అన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వ హయాంలో మీర్‌పేట, బడంగ్‌పేట, జల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు మంజూరు చేసిన కోట్లాది రూపాయలను నిలిపివేయడం రాజకీయం కాదా అని నిలదీశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్వేలు, సమావేశాలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మేయర్ ఎం.దుర్గ, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ఫ్లోర్‌లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు ఎనుగుల అనిల్‌యాదవ్, మాదరి సురేఖ, బొక్క రాజేందర్‌రెడ్డి, గడ్డమీది రేఖ తదితరులు పాల్గొన్నారు. -
ఎనిమిదేళ్లుగా ఎదురుచూపులే..!
● 2018లో బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న యువకులు ● ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతి కొడంగల్: నియోజకవర్గంలో నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పథకంలో భాగంగా బీసీ కార్పొరేషన్ రుణాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు అతీగతీ లేదు. రుణాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు దరఖాస్తుదారులను ఇంటర్వ్యూలకు పిలిచి అర్హులను గుర్తించారు. అప్పట్లో రుణాలు వస్తాయని లబ్ధిదారులు భావించారు. ముందస్తు ఎన్నికలతో ప్రక్రియ ఆగిపోయింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు కావడంతో రుణాల పంపిణీ నిలిచిపోయింది. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి. అనంతరం మున్సిపల్ ఎన్నికలు రావడంతో మరోసారి రుణాల పంపిణీ ఆగిపోయింది. గతంలో గ్రామానికి ఒకరిద్దరిని ఎంపిక చేసి రూ.50 వేలు, రూ. లక్షలోపు ఉన్న వారికి కొంతమందికి చెక్కులు ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇవ్వలేదు. స్వయం ఉపాధి కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన రుణాలు పెండింగ్‌లో పడ్డాయి. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎదురుచూపులు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలవారి ఉపాధి కోసం సబ్సిడీపై రుణాలు అందించాలని నిర్ణయించింది. 2015–16 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2017–18 ఆర్థిక సంవత్సరం వరకు దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు ఇవ్వాల్సి ఉంది. బీసీ యువకుల స్వయం ఉపాధికి మోక్షం ఎప్పుడు లభిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తగిన చొరవ తీసుకొని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. -
ఆ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు
చేవెళ్ల: ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టిందని, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక అభాసుపాలు అవుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో గురువారం ఇటీవల నూతనంగా ఎన్నికై న బూత్‌స్థాయి అధ్యక్షులు, మండల అధ్యక్షుల సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, కేంద్రం నుంచి వచ్చే నిధులే ఇప్పుడు దిక్కయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్లను నమ్మే పరిస్థితి లేదన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. బీజేపీ బలోపేతాన్ని చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు బదనాం చేసేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించటంతోపాటు తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి బుద్ధి చేపేందుకు త్వరలో ప్రజాచైనత్య యాత్రలు నిర్వహించనున్నట్టు వివరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్న, కంజర్ల ప్రకాశ్, అసెంబ్లీ కన్వీనర్ ప్రపతాప్రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది హామీల అమలులో కాంగ్రెస్ అభాసుపాలు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి -
మహిళను మోసం చేసిన వ్యక్తులకు రిమాండ్
కొత్తూరు: ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని కొత్తూరు పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. సీఐ నర్సింహారావు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్‌కు చెందిన ఎడ్ల హంసమ్మ ఈ నెల 20న తన కోడలు రాధిక, మనుమడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తుండగా ఈ నెల 22న రాధిక పోలీసుస్టేషన్‌కు చేరుకుని తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు ఎకరా పొలం ఇచ్చారు. గతేడాది ఆగస్టులో తన భర్త శ్రీకాంత్ డెంగీతో చనిపోయాడని.. ఈ క్రమంలో స్టేషన్ తిమ్మాపూర్‌కు చెందిన మహేందర్ శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిన వివరాలు చెబుతానంటూ నమ్మించి ఎకరా పొలానికి సంబంధించిన పట్టాపాస్‌బుక్ తీసుకున్నాడని చెప్పింది. ఈ నెల 20న మహేందర్ తన డ్రైవర్ శేఖర్‌తో కలిసి తిరుపతి తీసుకెళ్లి మార్గమధ్యలో దాడి చేసి బంగారు రింగ్, నగదు తీసుకుని బాండ్ పేపర్లపై సంతకం పెట్టాలని బలవంతం చేశారని వాపోయింది. తిరుపతి నుంచి తిరిగి హైదరాబాద్‌కు తీసుకుకువచ్చి సంతకం పెట్టాలని లేదంటే నిన్ను, కుమారుడిని చంపేస్తామని బెదిరించారని.. వారు మద్యం మత్తులో ఉండగా తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చానని పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మహేందర్, శేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఒక చాకు, కారు, రెండు సెల్ఫోన్లు, ఉంగరం, కొంతనగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును చేధించిన ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
దోమ: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం దోమ మండలం కిష్టాపూర్‌లో రూ.1.13కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందన్నారు. గత ప్రభుత్వం ప్రజలను విస్మరించి పాలన సాగించిందన్నారు. ఆరు లక్షల రేషన్ కార్డులు తొలగించి పేదలకు బియ్యం, సరుకులు అందకుండా చేసిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. త్వరలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు అధికారులతో కలిసి భూమిపూజ చేశారు. ఆ తర్వాత పట్టణ పరిధిలోని కేజీబీవీని సందర్శించారు. పాఠశాల పరిసరాలు, వంట గది, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. పరిశుభ్రతను పాటించాలని.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. చదువు బాగు చెబుతున్నారా? భోజనం సక్రమంగా.. మెనూ ప్రకారం అందిస్తున్నారా? అని ఆరా తీశారు. ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పాలన్నారు. పాఠశాల ఆవరణలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రహరీ చిన్నగా ఉందని, ఎత్తు పెంచేందుకు నిధులు మంజూరు చేయాలని ఎస్ఓ చైతన్య ఎమ్మెల్యేను కోరారు. త్వరలో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహేశ్‌బాబు, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, డైరెక్టర్ శాంతుకుమార్, పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాములునాయక్, మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం రూ.4.38 కోట్లు
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు 56.35శాతం పన్నులు వసూలు చేశారు. మరో రెండు నెలల్లో 100శాతం వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. గత ఏడాది 91.66 శాతం వసూలు చేశారు. ఈ సారి కాస్త వెనుకంజలో ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం రెండు మూడు నెలల నుంచి మున్సిపల్ బిల్ కలెక్టర్లకు సమగ్ర కుటుంబ సర్వే, ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్లు తదితర సర్వేలు, రేషన్ కార్డుల సర్వే, వార్డు సభలు వంటి బాధ్యతలు అప్పగించడంతో పన్నులు వసూళ్లపై శ్రద్ధ పెట్టలేకపోయారు. మున్సిపల్ పరిధిలో 15,092 ఇండ్లు ఉండగా పన్ను రూపంలో రూ.4.38 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 2.46కోట్లు వసూలు చేశారు. ఇంకా 1.91కోట్లు వసూలు చేయాల్సి ఉంది. స్పెషల్ డ్రైవ్‌లు ఏర్పాటు చేసి వంద శాతం లక్ష్యం చేరుకుంటామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి వంద శాతం పన్నులు వసూలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తెలిపారు. -
ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి మద్దతు ఇద్దాం
కొడంగల్ రూరల్: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న చేపట్టనున్న వేలగొంతులు–లక్ష డప్పులు కార్యక్రమానికి బీసీలుగా మద్దతును ఇద్దామని బీసీ నేత, కవులు, కళాకారుల ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన సంఘీభావ సభలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణలో మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే మహాప్రదర్శనకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కవి మోహన్బైరాగి, బీసీ సేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కన్నోజు వెంకటేశ్వర్లు, ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరన్‌పల్లి శ్రీనివాస్, గోవర్దన్చారి, అంబేడ్కర్ యువజన సంఘం తాలూకా అధ్యక్షుడు రమేష్‌బాబు, శ్రీనివాస్, లక్ష్మప్ప, మల్లేష్ యాదవ్, చిన్నయ్య, లాలప్ప తదితరులు పాల్గొన్నారు. కవులు, కళాకారుల ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న -
ఎవరూ అధైర్యపడొద్దు
● లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ ● మల్టీజోన్ – 2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణరెడ్డి దుద్యాల్: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రజ లు అధైర్య పడరాదని మల్టీజోన్ –2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. గురువారం దుద్యాల్ మండలం హకీంపేట్‌లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభకు ముఖ్య అథితులుగా హాజరై మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ భరత్ రెడ్డి, ట్రైనీ ఎస్ఐ రాహుల్, మోహన్, కోస్గి ఎంపీడీవో శ్రీధర్, కాంగ్రెస్ మండల నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజు, మెడికల్ ఆఫీసర్ నిర్మల, ఏవో హిమబిందు, ఆర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలనుసద్వినియోగం చేసుకోవాలి అడిషనల్ కలెక్టర్ సుధీర్ బంట్వారం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అన్నారు. గురువారం బంట్వారం, మద్వాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రజలకు వివరించారు. అర్హుల జాబితాలో పేర్లు రానివారు ఎవరైనా ఉంటే గ్రామసభలో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ రాములు, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీఓ నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ధారూరు స్టేషన్లో రైళ్లు ఆగేలా చూడండి ధారూర్: ధారూరు స్టేషన్లో హుబ్లీ, బీజాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, తాండూరు ప్యాసింజర్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణకుమార్ జైన్, డీజీఎం కె.ఉదన్నాథను బీజేపీ నాయకులు కోరారు. గురువారం నగరంలో ఆయన్ను కలిసి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సిఫారసు లేఖను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గతంలో పై పేర్కొన్న రైళ్లు ధారూరులో ఆగేవని.. కొంత కాలంగా ఆపడం లేదని తెలిపారు. దీంతో ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాలను జీఎం, డీజీఎంల దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్, నియోజకవర్గ కో ఆర్డినేటర్ వి.నందు, మండల అధ్యక్షుడు రాజునాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.81.96 లక్షల వసూలు
కొడంగల్: కొడంగల్ పురపాలక సంఘానికి సంబంధించి ఈ ఏడాది 42 శాతం పన్ను వసూలు చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.194. 82 లక్షలు టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు రూ. 81.96లక్షలు వసూలు చేశారు. 42.7 శాతం వసూలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి రూ.20.72 లక్షలు ఉండగా రూ.82 వేలు వసూలు చేశారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి ప్రాపర్టీ టాక్స్ రూ.165.32 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా రూ.78.51 లక్షలు మాత్రమే వసూలు చేశారు. 68.79 శాతం వసూలైంది. ఇందులో ప్రభుత్వ భవనాలకు సంబంధించి ప్రాపర్టీ టాక్స్ రూ.16.07 లక్షలు ఉండగా రూ.2.7 లక్షలను వసూలు చేశారు. మార్చి నెల చివరి వరకు వందశాతం పన్ను వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు కమిషనర్ తెలిపారు. -
●పరిగి, వికారాబాద్‌లలో 50% ●కొడంగల్‌లో 42 శాతమే.. ●తాండూరులో 12 శాతానికే పరిమితం ●మిగిలింది మరో రెండు నెలలే.. ●పేరుకుపోతున్న మొండి బకాయిలు
కొడంగల్ మున్సిపల్ కార్యాలయం మున్సిపాలిటీల్లో పన్నుల వసూలు డీలా పడ్డాయి. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగియనుండగా పన్నుల వసూళ్లు ఇంకా 50 శాతం దాటడంలేదు. జిల్లాలోనే పెద్ద మున్సిపాలిటీ అయిన తాండూరులో పరిస్థితి మరి అధ్వానంగా తయారైంది. ఇక్కడ కేవలం 12 శాతమే వసూలు చేశారు. పరిగి మున్సిపాలిటీలో రూ.1.5 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు రూ.75 లక్షలు వసూలు చేశారు. వికారాబాద్‌లో రూ.4.38 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు రూ.2.46 కోట్లు వసూలు చేశారు. కొడంగల్‌లో రూ.1.95 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ. 82 లక్షలు మాత్రమే వసూలు చేశారు. ఇక తాండూరులో రూ.13 కోట్లకు గాను రూ.1.85 కోట్లు అంటే 12.12 శాతం వసూలు చేశారు. -
రోగులకు మెరుగైన వైద్యం అందాలి
● జాతీయ కుటుంబ సంక్షేమ శాఖసీనియర్ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ అనురాధ మెడోస్ అనంతగిరి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ అనురాధ మెడోస్ వైద్యులకు సూచించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం జిల్లా వైద్యాధికారి వెంకటరమణతో కలిసి వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల గురించి వైద్య విద్యార్థులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. అనంతరం పాలిటివ్ కేర్ విభాగాన్ని సందర్శించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ అవసాన దశలో ఉన్న రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. అక్కడి నుంచి మహావీర్ వైద్య కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్లతో మాట్లాడారు. కళాశాలలో రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. టీబీ కేసులకు ఉచితంగా మందులు అందించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను కలిశారు. మూడు రోజుల పర్యవేక్షణలో జిల్లాలో పరిశీలించిన వివిధ అంశాలను వివరించారు. -
వ్యసనాలకు బానిసలవ్వొద్దు
మంచాల: యువత వ్యసనాలకు బానిసలవ్వొద్దని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి పొన్న శ్రీదేవి అన్నారు. గురువారం మండల పరిధిలోని నోముల సమీపంలోని మహాత్మాజ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్ ఉచ్చులో చిక్కుంటే జీవితం అంధకారమవుతుందన్నారు. చిన్న వయస్సుల్లో యువత డ్రగ్స్ కేసులో జైలు జీవితం గడిపడం బాధాకరమన్నారు. కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కళాశాల నుంచి బహిష్కరణ చేయడమే కాకుంగా రెండేళ్లు జైలు శిక్ష, రూ.పదివేలు జరిమానా విధిస్తామన్నారు. ఈ సందర్భంగా లీగల్ సర్వీస్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సీహెచ్ రవి, ప్రిన్సిపాల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీదేవి -
‘పశు సంక్రాంతి’కి సర్వం సిద్ధం
మణికొండ: హైదరాబాద్ నగర శివారు నార్సింగిలో ఏటా సందడిగా జరిగే పశుసంక్రాంతి జాతరను శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. నిజాం కాలంలో మొదలైన ఒరవడి నేటికీ నిరాటంకంగా కొనసాగుతున్నది. పంటలన్నీ ఇంటికి చేరి అవి అమ్మగా వచ్చిన డబ్బుతో రైతులు సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకొంటారని అందరికీ తెలుసు. మిగిలిన డబ్బుతో తమ పంటలకు తోడుగా పాడిని (పశువులు) కొనుగోలు చేసే సంస్కృతికి చిహ్నంగా నిలిచేదే నార్సింగి పశుసంక్రాంతి. ఒకప్పుడు నార్సింగి కుగ్రామంగా ఉన్న సమయంలో ప్రారంభమైన ఈ సంస్కృతి ప్రస్తుతం మున్సిపాలిటీగా అవతరించి ఎటు చూసినా ఆకాశాన్నంటే టవర్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కన్వెన్షన్లు, ఔటర్ రింగ్ రోడ్డుతో కొత్త హైటెక్ నగరంగా అవతరించినా కొనసాగుతుండటం అందరినీ అబ్బురపరుస్తుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ తరువాత వచ్చే రెండవ శుక్రవారం పశు సంక్రాంతిగా నిర్వహిస్తారు. ● గుజరాత్, హరియాణా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాది గేదెలు, ఆవులను వ్యాపారులు, రైతులు ఇక్కడకు తెచ్చి క్రయవిక్రయాలను నిర్వహిస్తుంటారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పశుసంక్రాంతిని ఈ సంవత్సరం శుక్రవారం నిర్వహించేందుకు మార్కె ట్ కమిటీ పాలక కమిటీ ఏర్పాట్లు చేసింది. ● ప్రతి సంవత్సరం నార్సింగి పశు సంక్రాంతికి వచ్చే గేదెలు, ఆవులు రికార్డు ధరలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈసారి పంటలు బాగా పండటం, వరి పంట అధిక దిగుబడి రావటంతో రైతుల వద్ద డబ్బు ఉందని, పంటలకు తోడుగా పశువులను పెంచుకోవాలనే దిశగా రైతులు ఆలోచన చేస్తున్నారని, దాంతో శుక్రవారం జరిగే సంతలో బారీగానే అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుందని పశు వ్యాపారులు పేర్కొన్నారు. నేడు నార్సింగిలో పశువుల జాతర నిజాం కాలంలో మొదలైన పశువుల సంత ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్ జాతరకు ఆవులు, గేదెలను తరలించిన రైతులు -
శంకర్పల్లి.. అభివృద్ధి లోగిలి
శంకర్పల్లి: చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో ఏర్పడిన తొలి మున్సిపల్ అయినప్పటికీ అభివృద్ధిలో మాత్రం అందలమెక్కింది. మండల కేంద్రం నుంచి మున్సిపల్‌గా అప్‌గ్రేడ్ అయితే ఎలాంటి అభివృద్ధి ఉంటుందనేది ఈ పురపాలికను చూస్తే అవగతమవుతోంది. గడిచిన ఐదేళ్లలో సుమారు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం గమనర్హం. మున్సిపల్ పరిధిలోని కాలనీల్లో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థతో మున్సిపాలిటీ కళకళలాడుతోంది. రేపటితో (జనవరి 25) మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగియనుండడంతో ‘సాక్షి’ప్రత్యేక కథనం ఏడాదిన్నర తర్వాత పాలవర్గం 2018 ఆగస్టులో శంకర్పల్లి, బుల్కాపూర్, ఫత్తేపూర్, రామంతాపూర్, సింగాపూర్తో పాటు మరో నాలుగు గ్రామాలను కలుపుతూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శంకర్పల్లి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 21వేల జనాభా ఉండగా.. 15వార్డులుగా విభజించారు. మున్సిపల్ ఏర్పడినప్పటికీ ఎన్నికలు నిర్వహించి నూతన పాలకవర్గం ఏర్పాటుకు మాత్రం ఏడాదిన్నర సమయం పట్టింది. 2020 జనవరి 25న తొలి పాలకవర్గం ఏర్పడగా.. చైర్‌పర్సన్‌గా అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి సాత విజయలక్ష్మిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే చొరవతో ప్రత్యేక నిధులు నియోజకవర్గంలోని ఏకై క మున్సిపాలిటీ కావడంతో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్యేకున్న సాన్నిహిత్యంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేశారు. గతంలో మున్సిపాలిటీకి వచ్చే ప్రధాన రహదారులు, కాలనీల్లోని సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం గందరగోళంగా ఉండగా.. ప్రస్తుతం ఒకదారిలోకి తీసుకోని వచ్చారు. అంతిమయాత్రకు వైకుంఠ రథం, నిత్యం చెత్త సేకరణకు అవసరమైన రెండు ఆటోలను కొనుగోలు చేశారు. పచ్చని ‘వెలుగులు’ హరితహారం, పట్టణ ప్రకృతి వనం పేరిట మున్సిపాలిటీలో పచ్చదనం పెంపునకు పెద్దపీట వేశారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వారాంతాల్లో పిల్లలు ఆడుకునేందుకు, వృద్ధులు సేదతీరడానికి పట్టణంలోని వివేకానందనగర్ కాలనీలో చిల్డ్రన్స్ పార్కుతో పాటు, మహిళలు, పిల్లలు వ్యాయామం చేసేందుకు గాను ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. బుల్కాపూర్ శివారు నుంచి శంకర్పల్లి పట్టణ చౌరస్తా వరకు నాలుగు వరుసల రహదారిపై డివైడర్ని ఏర్పాటు చేసి, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సారథ్యంలో మున్సిపాలిటీలో ప్రగతి రూ.వంద కోట్ల నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు ఆదర్శ పురపాలికగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం కృషి మంజూరైన నిధుల వివరాలు 14, 15 ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి నిధులు రూ.15.50 కోట్లు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.87.50 లక్షలు ఎల్ఆర్ఎస్ నిధులు రూ.30.80 లక్షలు రాష్ట్ర నిధులు రూ.3 కోట్లు టీయూఎఫ్ఐడీసీ రూ.37.58 కోట్లు రూర్బన్ నిధులు రూ.83 లక్షలు హెచ్ఎండీఏ రూ.ఒక కోటి ఎంపీ ల్యాడ్స్ రూ.55.60 లక్షలు అమృత్ 2.0 రూ.32.47 కోట్లు అభివృద్ధికి నిరంతరం కృషి మున్సిపాలిటీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేశాం. ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో సుమారు రూ.వంద కోట్ల అభివృద్ధి పనులు చేయించుకున్నాం. ఐదేళ్లలో ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశాను. – సాత విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్, శంకర్పల్లి -
బైక్‌ను ఢీకొట్టిన కారు
ఒకరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు పరిగి: ద్విచక్రవాహ నాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురు వారం పట్టణ కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ సంతోశ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన బాయికాడి చిన్న బుచ్చయ్య(68), ఘనపురం శ్రీనివాస్ పురుగుమందు కొనుగోలుకు పట్టణ కేంద్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు ఇండియన్ ఆయిల్ బంక్‌లోకి వెళ్లారు. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న బుచ్చయ్య, శ్రీనివాస్ గాయాలవ్వడంతో పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను ఈశా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న బుచ్చయ్య మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి అదృశ్యం యాచారం: గ్రీన్‌ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. సీఐ కృష్ణం రాజు తెలిపిన ప్రకారం.. నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన గొరిగె భిక్షపతి, పార్వతమ్మ దంపతుల కుమారుడు భానుప్రసాద్ బొంగ్లూరు వద్ద ఉన్న నారాయణ హాస్టల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు వచ్చిన విద్యార్థి గురువారం మధ్యాహ్నం ఫోన్ ఇంట్లోనే పెట్టి బైక్ తీసుకుని బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. షాపింగ్ మాల్ ఎదుట కార్మికుల ధర్నా షాద్‌నగర్: షాపింగ్ మాల్లో పని చేసేందుకు బైక్ వస్తున్న కార్మికుల వాహనాలకు భద్రత కల్పించాలని డిమాండ్‌తో గురువారం ధర్నా చేపట్టారు. చందన బ్రదర్స్ షాపింగ్‌మాల్ ఎదుట చేపట్టిన ఈ ధర్నాకు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.రాజు మాట్లాడుతూ.. చందన బ్రదర్స్ షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్న ఇద్దరు కార్మికుల బైక్‌లు ఈ నెల 11న చోరీకి గురయ్యాయి. షాపింగ్‌మాల్ యాజమాన్యం సీసీ కెమెరాలు, వాచ్‌మెన్‌ను పెట్టకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని.. చర్యలు తీసుకోవడం లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. -
చెస్‌లో సత్తాచాటుతున్న శివాంశిక
అత్తాపూర్: అత్తాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శివాంశిక చెస్ క్రీడలో సత్తాచాటుతూ ముందుకు సాగుతోంది. ఏపీలోని పెద్దాపూర్‌లో జనవరి 17 నుంచి 21వ వరకు జరిగిన అండర్–15 బాలిక నేషనల్ జాతీయ స్కూల్ చాంపియన్‌షిప్–2025లో తెలంగాణ రాష్ట్రం నుంచి శివాంశిక పాల్గొంది. వివిధ విభాగాలలో 2500 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. వారందరిలో అసాధ్యమైన ర్యాంకులు సాధిస్తూ తనదైన శైలిలో ఎవరు ఊహించని విధంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అంతర్జాతీయ చెస్ రంగంలో ఉన్న చెస్ క్రీడాకారుల ప్రశంసలు, ప్రోత్సాహాన్ని అందుకుంటోంది. పేదరికంలో ఉన్న శివాంశికకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహాన్నిస్తే దేశంలోనే అగ్ర స్థానానికి చేరుకుంటుందని.. మంచి కోచ్‌ను ఏర్పాటుచేస్తే ఉన్నత స్థానాలను తప్పక అధిరోహిస్తుందని మాస్ట్రో చెస్ అకాడమీ అత్తాపూర్ ట్రైనర్ అమిత్ పాల్‌సింగ్ ఈ సందర్భంగా శివాంశికను అభినందించారు. నిర్వాహకురాలు చెస్ క్రీడల్లో రాణించిన శివాంషికను ఘనంగా సత్కరించి ట్రోఫీ, రూ. 5 వేల ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. తమ పాఠశాలలో చదువుకుంటూ చెస్‌లో రాణిస్తున్న శివాంశిక తమ పాఠశాల విద్యార్థిని కావడం తమకు ఎంతో సంతోషంతోపాటు గర్వకారణంగా కలిగిస్తుందని రాజేంద్రనగర్ మండల విద్యా శాఖాధికారి (ఎంఈవో) శంకర్‌రాథోడ్, అత్తాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఉపాధ్యాయులు సాయిప్రసాద్, గాంగ్యానాయక్ తదితరులు అభినందించారు. -
బైక్ ఢీకొని వాచ్మెన్ మృతి
యాచారం: బైక్‌ను వెనుక నుంచి మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో వాచ్మెన్ అక్కడికక్కడే మృతి చెందాడు. యాచారం సీఐ నర్సింహారావు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని చింతపట్ల గ్రామానికి చెందిన నక్కమల్ల జంగయ్య(52) తక్కళ్లపల్లి సమీపంలోని శ్రావణ పవర్‌ప్లాంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని గురువారం ఉదయం తన స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. ఆయన సాగర్రోడ్డుపైకి వచ్చిన వెంటనే వెనుకనుంచి అంతివేగంగా వచ్చిన ద్విచక్రవాహనం జంగయ్య బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జంగయ్య తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఓ కూతురు ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రయ్య కొడంగల్ రూరల్: సంగారెడ్డి పట్టణంలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న సీపీఎం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుస్స చంద్రయ్య కోరారు. గురువారం పట్టణంలోని ఆటోస్టాండులో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతోందన్నారు. ఈ నెల 25న నిర్వహించే బహిరంగసభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజు, మల్లయ్య, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. 26న ‘లక్ష డప్పులు’సన్నాహక సదస్సు యాలాల: జిల్లా కేంద్రంలో ఈ నెల 26న ‘వేయి గొంతులు–లక్ష డప్పులు’ సన్నాహాక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎంఎస్పీ(మహాజన సోషలిస్టు పార్టీ) జిల్లా కార్యదర్శి డప్పు మహేందర్, ఎమ్మార్పీఎస్ యాలాల మండల అధ్యక్షుడు మెట్లి సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సన్నాహాక కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లోని మాదిగ, ఉపకులాల ప్రజలు కార్యక్రమానికి భారీగా తరలిరావాలని వారు కోరారు. పూత రాలకుండా నీరందించాలి రంగారెడ్డి ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త యమున రెడ్డి దుద్యాల్: మామిడి రైతులు పూత దశలోనే జాగ్రత్తలు పాటించాలని రంగారెడ్డి ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త యమున రెడ్డి సూచించారు. గురువారం మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలోని రైతు లక్ష్మారెడ్డి మామిడి తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం మామిడి చెట్లు పూత దశలో ఉన్నాయి. పిందెలు కాసినన్ని రోజులు పూతను కాపాడుకోవాలని చెప్పారు. పూత రాలకుండా మొక్కకు స్వల్పంగా నీరందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు భీంరెడ్డి, మహిపాల్, వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనధికారికంగా ‘మీ సేవ’లు ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడిపైతహసీల్దార్కు ఫిర్యాదు కొడంగల్: పట్టణంలోని ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు అనధికారికంగా మీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడని స్థానిక మీ సేవా కేంద్రాల నిర్వాహకులు గురువారం తహసీల్దార్ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకున్నా ఇతర మీ సేవా కేంద్రం ఐడీ నంబర్‌తో కుల, ఆదాయ, స్థానిక ధృవీకరణ పత్రాలు, ఇస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ పత్రాలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు నరేందర్ రావు, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాధికారంతోనే డిమాండ్ల సాధన
షాబాద్: రాజ్యాధికారంతోనే హక్కులు సాధించుకునేందుకు అవకాశం ఉంటుందని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ అన్నారు. గురువారం మండల పరిధిలోని అప్పారెడ్డిగూడలో బీసీసేన సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామ అధ్యక్షుడిగా పత్తి శేఖర్, ఉపాధ్యక్షుడిగా నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కార్యదర్శిగా సాయిరాంగౌడ్, కోశాధికారిగా చంద్రశేఖర్, సలహాదారులుగా శ్రీనివాస్, సభ్యులుగా మహేష్, శ్రీశైలం, శివ, రమేష్, లింగం, మల్లేష్, శ్రీకాంత్, శశికుమార్, మహేందర్‌ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. వచ్చే స్థానిక సంస్ధల ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలన్నారు. బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ -
ఆందోళన వద్దు.. అండగా ఉంటాం
నవాబుపేట: సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని మాదిరెడ్డిపల్లి గ్రామసభలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తోందన్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో రైతులకు రూ.770 కోట్ల రుణమాఫీ, వికారాబాద్ జిల్లాలో రూ.850 కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. సాంకేతిక కారణాలతో ఆగిన రుణమాఫీ సైతం త్వరలోనే పూర్తవుతుందన్నారు. నవాబుపేట మండలంలోనే 6,237 మంది రైతులకు రూ.43 కోట్ల రుణమాఫీ అయిందని గుర్తు చేశారు. జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనురాధ, తహసీల్దార్ జైరాం, పీఎసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు వెంకటయ్య, ప్రభాకర్, తదితరులు పాల్నొన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు మండలి చీఫ్‌విప్ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య -
ఐక్యతకు ప్రతీక ఉర్సు
షాద్‌నగర్: కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉర్సు ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నేరేళ్ల చెరువులోని దర్గా హజ్రత్ షా మూసా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. అల్లా దయ అందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయన కోరారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మౌనిక, హరికృష్ణ, పర్వేజ్ హుస్సేన్, అడ్డు, సయ్యద్ అద్నాన్ ఎల్లయ్య, నర్సింలు, సయ్యద్ సాబేర్, సాజిద్, నజీర్, మన్సూర్, జావిద్, జిలానీ, సయ్యద్ ఉస్మాన్, శివాచారి, పవన్ ఠాకూర్, సుధీర్, మధు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి -
ప్రతి ఒక్కరికీ సంక్షేమం
పరిగి: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని 8వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తుందని తెలిపారు. సీఎం రేంవంత్‌రెడ్డి పేద ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్ష 9వేల మంది రైతులకు రూ. 850 కోట్ల రుణమాఫీని ప్రభుత్వం అందించిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద రంగారెడ్డి రీజియన్‌లో 2కోట్ల 70లక్షల మంది మహిళాలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించారని, ఇందుకోసం ప్రభుత్వం రూ.98 కోట్లు చెల్లించిందని తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, మున్సిపల్ చైర్మన్ ముకుందఅశోక్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు అభివృద్ధికి నిధులు తెస్తా తాండూరు రూరల్: తాండూరు అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెస్తామని చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. కరన్‌కోట్‌లో బుధవారం నిర్వహించిన గ్రామ సభలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. కరన్‌కోట్‌లో ఇంటి స్థలంలేని నిరు పేదలకు గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగప్ప, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మండల స్పెషలాఫీసర్ సత్తార్, డీఎల్పీఓ శంకర్‌నాయక్, తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, నాయకులు ఉత్తమ్‌చందు, శరణు బసప్ప, రాజ్‌కుమార్, జర్పప్ప, సుధకర్, వడ్డె శ్రీను, పురుషోత్తం రెడ్డి, జగదీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అర్హ్హులకు పథకాలు: ఎమ్మెల్యే టీఆర్ఆర్ -
మెరుగైన వైద్యం మన బాధ్యత
బొంరాస్‌పేట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం మన బాధ్యత అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ ప్రాంతీయ సంచాలకులు డా.అనురాధ అన్నారు. బుధవారం బొంరాస్‌పేట పీహెచ్‌సీని ఆమె సందర్శించారు. వివిధ విభాగాలను పరిశీలించి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్‌సీకి వచ్చే రోగుల వివరాలను డాక్టర్ హేమంత్‌ను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా మరో డాక్టర్‌ను నియమించాలని డీఎంహెచ్ఓ వెంకటరమణకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉపకేంద్రాలను తరచూ పరిశీలించాలని ఆదేశించారు. ఎన్‌క్వాస్, కాయకల్పకు పీహెచ్సీ ఎంపికై ందని డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీంద్రయాదవ్ వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ అక్షయ్, సీహెచ్ఓ శివరాజ్, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ ప్రాంతీయ సంచాలకులు డా.అనురాధ