Karimnagar
-
ఎస్డీఎఫ్ పనుల్లో కాంట్రాక్టర్ల సిండికేట్!
● 20 పనులకు సింగిల్ బిడ్ దాఖలుకరీంనగర్ కార్పొరేషన్: ప్రత్యేక నిధులు(ఎస్డీఎఫ్)తో నగరంలో చేపట్టనున్న పనులకు సంబంధించిన టెండర్లో కాంట్రాక్టర్లు సిండికేట్ అయినట్లు సమాచారం. నగరపాలకసంస్థ పరిధిలో ఎస్డీఎఫ్ కింద రూ.1.31 కోట్లతో చేపట్టనున్న 38 పనులకు సంబంధించి గతంలో ఈ–పొక్యూర్ టెండర్ పిలిచారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలతో పాటు కొన్నిచోట్ల హైమాస్ట్ లైట్లు కూడా ఈపనుల్లో ఉన్నాయి. కాగా ఎస్డీఎఫ్ పనులకు సంబంధించిన టెండర్ గడువు గురువారంతో ముగిసింది. ఈ టెండర్లలో కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారనే ప్రచారం సాగుతోంది. గురువారం పలువురు కాంట్రాక్టర్లు నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలో మిగతా వారితో మంతనాలు సాగించి, పనులు పంచుకున్నట్లు సమాచారం. పనుల్లో కొన్నింటికి కేవలం ఒక్కబిడ్ మాత్రమే దాఖలు కావడం ఈ ప్రచారానికి బలంచేకూరుస్తోంది. పనుల్లో స్థానిక కాంట్రాక్టర్లే టెండర్లకు మొగ్గుచూపుతుండడంతో, ఆన్లైన్ టెండర్ అయినా సిండికేట్‌కు అవకాశం ఏర్పడింది. కాగా మొత్తం 38 పనులకు మూడు పనులకు సంబంధించి బిడ్ దాఖలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోగా, 35 పనులకు స్పందన వచ్చింది. 35 పనుల్లో 20 పనులకు సంబంధించి సింగిల్ బిడ్ మాత్రమే దాఖలైంది. కాంట్రాక్టర్ల నడుమ కుదిరిన ఒప్పందం మేరకే 20 పనులకు సింగిల్ బిడ్ దాఖలైనట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలాఉంటే శాతవాహన అర్బన్ డెవలెప్మెంట్ (సుడా) నిధులతో చేపట్టనున్న పనులకు సంబంధించిన టెండర్ శుక్రవారంతో ముగియనుంది. ఇందులో కూడా కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యారనే ప్రచారం సాగుతోంది. -
వీల్చైర్లు లేవు... పేషెంట్ కేర్లు సరిపోరు!
● సహాయకులే వీల్చైర్లు తోసుకెళ్లే పరిస్థితి ● ఇబ్బందులు పడుతున్న పేషెంట్లుకరీంనగర్టౌన్: కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వీల్ చైర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఉన్న వీల్ చైర్లను తోసుకెళ్లడానికి సరిపడా పేషెంట్ కేర్స్ లేకపోవడంతో రోగులతో వచ్చిన సహాయకులే వీల్‌చైర్ తోసుకెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో రోగులు, వారితో వచ్చిన సహాయకులు ఆసుపత్రి సేవలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా లేని వీల్చైర్లు... ప్రభుత్వ ప్రధానాసుపత్రికి ప్రతీరోజు సుమారు 800 నుంచి 1000 మంది వరకు ఔట్ పేషెంట్ సేవలు పొందుతుంటారు. వీరిలో 50 మంది వరకు నడవలేని స్థితిలో వైద్యం కోసం ఆసుపత్రికి వస్తుంటారు. ఇలాంటి వారికి తప్పనిసరిగా వీల్‌చైర్ అవసరం. కానీ.. ఆసుపత్రిలో ఉండే అరకొర వీల్చైర్లు పది మందికి కూడా సరిపోవడం లేదు. మిగతా వారంతా ఇంటి వద్ద నుంచి తెచ్చుకునే స్టాండులు పట్టుకొని ఇబ్బందులు పడుకుంటూ నడుస్తూ వస్తుంటారు. కొంత మంది పేషెంట్లను సహాయకులే మోసుకు వస్తున్నారు. పేషెంట్ కేర్లు ఇతర అవసరాలకు... జిల్లా ఆసుపత్రిలో పేషెంట్లకు సహాయకులుగా ఉండాల్సిన పేషెంట్ కేర్లను ఇతర పనులకు పురమాయించడంతో నడవలేని పేషెంట్లను ఆసుపత్రిలోకి తీసుకువచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పేషెంట్ల సేవలో ఇద్దరు, ముగ్గురే పేషెంట్ కేర్స్ ఉండడంతో మిగతా వీల్చైర్లను పేషెంట్ల సహాయకులే నెట్టుకొని వెళ్తున్నారు. ఏజిల్ సంస్థ ద్వారా పేషెంట్ కేర్లను సరిపడా కేటాయించాలని నిబంధన ఉన్నప్పటికీ వారందరికీ ఇతర పనులను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీల్ చైర్లు ఆర్డర్ పెట్టాం ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. సిక్ పేషెంట్లకు సరిపడా వీల్చైర్లు లేకపోవడంతో ఆర్డర్ పెట్టాం. త్వరలోనే సమకూరుస్తాం. ఇంకా కొన్ని డొనేషన్ రూపంలో వచ్చేవి ఉన్నాయి. పేషెంట్కేర్స్ను సరిపడా నియమించి పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – వీరారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
● నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అన్నారు. గురువారం నగరంలోని 20వ డివిజన్ ఆరెపల్లిలో కొనసాగుతున్న అభివృద్ధిపనులను, డివిజన్లోని పారిశుద్ధ్యం తీరును, మట్టిరోడ్లను ఆమెతనిఖీ చేశారు. అలాగే తెలంగాణచౌక్తో పాటు ఇతరరత్రా ప్రాంతాలను కూడా పరిశీలించారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేసేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులు అవసరమైన చోట అంచనాలు సమర్పించాలన్నారు. అలాగే నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలని ఆదేశించారు. డ్రైనేజీల్లో సిల్ట్ తొలగించాలని, డ్రైనేజీల వెంట కలుపు మొక్కలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలన్నారు. కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ తుల రాజేశ్వరి బాలయ్య, డీఈలు వెంకటేశ్వర్లు, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: కరీంనగర్లో విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు 11కేవీ గీతాభవన్, మంకమ్మతోట ఫీడర్ల పరిధిలోని ఆకుల శైలజ ఆసుపత్రి, మంకమ్మతోట, పాత లేబర అడ్డ, హనుమాన్ ఆలయం, దన్గర్‌వాడీ పాఠశాల ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11కేవీ రాంనగర్ ఫీడర్ పరిధిలోని సత్యనారాయణ స్వామి ఆలయం, చేపల మార్కెట్, బొబ్బిలి లక్ష్మయ్య అపార్ట్మెంట్, మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు 11 కేవీ శివనగర్, ఇండస్ట్రీయల్ ఫీడర్ పరిధిలోని సప్తగిరికాలనీ, శివనగర్, ప్రగతినగర్, రామాలయం హస్నాపురికాలనీ, టెలి ఫోన్ క్వార్టర్స్, మార్కెండేయనగర్, సాయిబాబా ఆలయం, రాంనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు 11 కేవీ కమాన్ ఫీడర్ పరిధిలోని కోతిరాంపూర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. -
2 నుంచి వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్ కల్చరల్: జిల్లాకేంద్రంలోని మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 2 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శ్రీలక్ష్మీ, పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. భక్తులకు తాగునీరు, షామియానా, క్యూలైన్లు, బారికేడ్లు, అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం లోపించకుండా చూడాలని మున్సిపల్‌శాఖ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. స్టేజీ, లైటింగ్, సౌండ్, డెకరేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఫైరింజిన్ అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్, లక్ష్మీకిరణ్, నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, ఇన్చార్జి డీఆర్వో పవన్‌కుమార్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ హయాంలోనే కౌశిక్‌రెడ్డిపై 15 కేసులు
● సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డికరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కౌశిక్‌రెడ్డిపై 15 కేసులు నమోదయ్యాయని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 28 కేసులు పెట్టారంటూ హరీష్‌రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో గురువారం విలేకరుల సమావేశంలో కౌశిక్‌రెడ్డిపై ఉన్న కేసుల వివరాలు ఆధారాలతో సహా వెల్లడించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై అబద్దాలతో విషప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. 2013 నుంచి 2023 వరకు కౌశిక్‌రెడ్డిపై 15 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇవన్నీ బెదిరింపులు, భూఆక్రమణలు వంటి సంఘటనల్లో స్థానిక పోలీసులు పెట్టిన కేసులు అని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో పెట్టిన కేసులకు ఎవరూ బాధ్యత వహిస్తారో తెలపాలని కోరారు. నేరచరిత్ర గల వ్యక్తులకు బీఆర్ఎస్ రెడ్‌కార్పెట్‌తో ఆహ్వానం పలుకుతోందని విమర్శించారు. తోటి ఎమ్మెల్యేపై దాడిచేసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తికి ఎదురేగి ఆలింగనం చేసుకోవడం కేటీఆర్, హరీష్‌ల దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు. దొంగలముఠా బీఆర్ఎస్ను ప్రజలు నిలదీయాలని కోరారు. కోటగిరి భూమాగౌడ్, ఆకుల నర్సయ్య, అర్ష మల్లేశం, గంట శ్రీనివాస్, వాడె వెంకటరెడ్డి, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రవణ్‌నాయక్, కొరివి అరుణ్‌కుమార్, ఎండీ తాజ్, తమ్మిడి ఎజ్రా తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెడుతున్నరు
● హామీలు అమలు చేసేవరకు పోరాటం చేస్తాం ● హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికరీంనగర్: రాష్ట్రంలో ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి, 13 నెలలు గడిచినా ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతోపాటు 420 హామీలు అమలు చేసేవరకు పోరాటం చేస్తామన్నారు. గురువారం కరీంనగర్ ఎమ్మెల్యే మీసేవ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈ–కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. రుణమాఫీ, తులం బంగారం, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెడుతున్నారని తెలిపారు. ఈ–కార్ రేస్ కోసం వివిధ రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ ఉందని, దాన్ని తట్టుకొని కేటీఆర్ తెలంగాణకు తీసుకొస్తే... రేవంత్ రెడ్డి రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ సమావేశంలో తాను ఆర్డీవో గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కానీ, తనపై ఆరుగురితో కేసులు పెట్టించారని పేర్కొన్నారు. ఖమ్మంలో హరీశ్‌రావుపై దాడి జరిగితే కేసులు ఎందుకు పెట్టలేదని, కేసీఆర్ ఇచ్చిన బీ–ఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యే సంజయ్‌ని నిలదీస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేసులకు తాము భయపడమని, చట్ట ప్రకారం ఎదుర్కొంటామని చెప్పారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్‌కుమార్, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, చెల్లోజి శ్రీనివాస్, దూలం సంపత్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
మార్చిలోగా స్మార్ట్‌సిటీ పనులు పూర్తి
కరీంనగర్ కార్పొరేషన్: మార్చి గడువులోగా స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేస్తామని నగర మేయర్‌యాదగిరి సునీల్‌రావు తెలిపారు. గురువారం నగరంలోని 13వ డివిజన్లోని వేంకటేశ్వరకాలనీ రోడ్ నెంబర్ 21లో రూ.35.75 లక్షలతో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు స్మార్ట్‌సిటీలో భాగంగా చేపట్టిన పనుల్లో 75 శాతం పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన 25 శాతం పనులను మార్చిలోగా పూర్తిచేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన వాటాగా రూ.వెయ్యికోట్లు నగరానికి కేటాయించగా, రూ.930 కోట్లతో వివిధ పనులు చేపట్టామన్నారు. రూ.796 కోట్ల పనులు పూర్తిచేసి బిల్లులు చెల్లించామన్నారు. మిగిలిన రూ.130 కోట్లతో చేపట్టిన పనులు చివరిదశలో ఉన్నాయన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల మొత్తం నిధుల నుంచి రూ.70 కోట్లు (ఏఎనఎం) పరిపాలన నిర్వహణ కోసం కేటాయించామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, నగరపాలకసంస్థ డీఈ ఓం ప్రకాశ్, ఏఈ గట్టుస్వామి, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రవణ్, డివిజన్ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. డీఈటీగా బాధ్యతల స్వీకరణకొత్తపల్లి: టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఆఫీసులో డివిజన్ ఇంజినీర్ (టెక్నికల్ అండ్ సెఫ్టీ ఆఫీసర్)గా కంచనపల్లి ఉపేందర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ కార్పొరేట్ కార్యాలయంలో డీఈ (ఎమ్మార్టీ అండ్ ఎనర్జీ, ఆడిట్ అసెస్మెంట్)గా పనిచేస్తున్న ఆయన డీఈటీగా కరీంనగర్‌కు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఉపేందర్ మర్యాదపూర్వకంగా ఎస్ఈ మేక రమేశ్‌బాబును కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. డీఈలు, ఎస్‌ఏవో, ఏవోలు, పీవో, ఏడీఈలు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు. క్వింటాల్ పత్తి రూ.7,300జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో గురువారం క్వింటాల్ పత్తి రూ. 7,300 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజాలు పర్యవేక్షించారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా సత్యప్రసన్న రెడ్డి●● వరుసగా రెండోసారి నియామకంకరీంనగర్ కార్పొరేషన్: మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా వరుసగా రెండోసారి కర్ర సత్యప్రసన్నరెడ్డి నియమితులయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్క లంబా ఆదేశాల మేరకు రెండోసారి సత్యప్రసన్నరెడ్డి నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన బీసీసంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సత్యప్రసన్న కృతజ్ఞతలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ బలోపేతానికి మరింతగా కృషి చేస్తానన్నారు. దరఖాస్తుల ఆహ్వానంకరీంనగర్స్పోర్ట్స్: పట్టణంలోని రాంనగర్లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో భాగంగా కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సులకోసం ఆసక్తిగల యువతీ యువకులు ఉదయం 10: 30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఏడో తరగతి, ఆపైన తరగతుల్లో పాస్, ఫెయిలైన 18 ఏళ్లు నిండిన విద్యార్థులు, యువతులు అర్హులన్నారు. శిక్షణకాలం మూడు నెలలు ఉంటుందని, కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ అందజేయనున్నట్లు తెలిపారు. కంప్యూటర్ (ఎంఎస్ ఆఫీస్, డీటీపీ)–వెయ్యి, బ్యూటీషియన్ రూ.1500 ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9640967943, 9949850360 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
పేదల్లో పెద్దలా?
● రేషన్ జాబితాలో రిటైర్డ్ ఉద్యోగులు, కోటీశ్వరులు ● కులగణనలో తెల్లకార్డు లేదన్నవారి పేర్లు జాబితాలో ● గ్రామాల్లో రేషన్ దరఖాస్తుల్లో వింత చోద్యాలు ● కులగణన సర్వేలో లోపం వల్లే ఈ పొరపాటు ● జాబితాలో పేరులేని పేదలకు దక్కని ఊరట ● 360 డిగ్రీస్ యాప్‌తో ఆస్తుల చిట్టా తేటతెల్లంసాక్షిప్రతినిధి, కరీంనగర్: సమాజంలో ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు నెలనెలా రేషన్ కోసం, ఆరోగ్యశ్రీ ఇతర సంక్షేమ పథకాలకు తెల్లరేషన్‌కార్డులు ప్రామాణికం. అయితే, ఈ రేషన్‌కార్డులు లేని కుటుంబాల జాబితాను ప్రభుత్వం రూపొందించి అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు పంపింది. ఈ జాబితాపై వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు సర్వే ప్రారంభించారు. ఈ జాబితా చూసిన గ్రామస్తులు, అధికారులు అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఆ గ్రామంలో భూస్వాములు, కోటీశ్వరులు, వ్యాపారులు కూడా జాబితాలో ఉన్నారు. ఇలా ఎందుకు జరిగిందని ఆరాతీస్తే.. ఇటీవల జరిగిన బీసీ కులగణన సర్వేలో వివరాల నమోదులో లోపమే ఇందుకు కారణమని పలువురు అధికారులు వెల్లడించారు. ఏం జరిగింది? ఇటీవల సామాజిక కులగణనును ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహించింది. ఆ సమయంలో చాలా మంది తమ కుటుంబాలకు రేషన్‌కార్డు లేదు అని చెప్పారు. అందులో రేషన్‌కార్డు లేని పేద, మధ్య తరగతి కుటుంబాలతోపాటు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, కోటీశ్వరులు, భూస్వాములు, వ్యాపారులు ఇతరులు తమకు రేషన్కార్డులేదని చెప్పారు. వచ్చిన ఎన్యూమరేటర్లు కూడా అవే వివరాలు నమోదు చేసుకుని వెళ్లిపోయారు. అప్పుడు రేషన్‌కార్డు కాలమ్‌లో లేదని తెలిపిన పేద, ఉన్నత వర్గాలకు చెందిన అందరి పేర్లు ప్రత్యక్షమయ్యాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేస్తున్న వారి ఐడీ నంబర్లు రాసుకోవడం వల్ల వారి పేర్లు రాలేదని, మిగిలిన వారి పేర్లు జాబితాలో వచ్చాయని వివరిస్తున్నారు. ఈ జాబితాలో అర్హులను గుర్తించేదుకు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో సర్వే జరుగుతోంది. అనంతరం గ్రామసభల్లో ఈ జాబితాలను ప్రదర్శించి అభ్యంతరాల ఆధారంగా చర్యలు చేపడతారు. 360 డిగ్రీస్ యాప్‌తో దొరికిపోతారు అదే సమయంలో అధికారులు అంతా ఈ జాబితాపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అంటున్నారు. ఈ సర్వేతోపాటు గ్రామాల్లో నిర్వహించే గ్రామసభల్లోనే అనర్హులను (అధిక ఆదాయం ఉన్నవారు) 90 శాతం గుర్తిస్తామని ధీమాగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా తమ దృష్టి నుంచి తప్పించుకున్నా.. జాబితాపై పౌరసరఫరాలశాఖ 360 డిగ్రీస్ యాప్‌లో తుదిజాబితాను మరోసారి తనిఖీ చేస్తుంది. ఈ యాప్‌లో దరఖాస్తు దారుల భూములు, వాహనాలు, ఐటీ వివరాలు, ఆర్థిక స్థితిగతులు మొత్తం తెలిసిపోతాయని విశ్వాసంగా ఉన్నారు. కాబట్టి, ఈ జాబితాపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అభిప్రాయపడ్డారు. జాబితాలో లేని వారిపై మౌనం చాలాచోట్ల రేషన్‌కార్డు జాబితాలో కొందరు పేదలకు చోటు దక్కలేదు. వీరికి జరిగిన విషయం తెలియక శ్రీమంతులు, రిటైర్డ్ ఉద్యోగుల పేర్లు జాబితాలో ఎక్కి.. తమ పేర్లు ఎక్కకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు మౌనం వహిస్తున్నారు. రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకుని, అన్ని అర్హతలు ఉండీ.. జాబితాలో చోటు దక్కని పేదలకు దరఖాస్తు చేసుకునేందుకు తిరిగి ఎప్పుడు అవకాశం కల్పిస్తారు? అన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. అది ప్రభుత్వం చేతిలోనే ఉందని, దానిపై తమకు ఎలాంటి సమాచారం లేదని రెవెన్యూ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు స్పష్టంచేస్తున్నారు. రేషన్‌కార్డు దరఖాస్తులుజగిత్యాల 35,101సిరిసిల్ల 20,976పెద్దపల్లి 14,910కరీంనగర్ 18,384జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీరావుపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగి తండ్రిపేరు రేషన్‌కార్డు దరఖాస్తు జాబితాలో పేరు ప్రత్యక్షమైంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కమాన్‌పూర్ గ్రామంలో విశ్రాంత ఎంఈవో, రైస్‌మిలర్ల పేర్లు రేషన్‌కార్డు దరఖాస్తుల్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. -
సౌదీ బాధితుడిపై స్పందించిన సీఎంవో
జగిత్యాలక్రైం: వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలో చిక్కుకున్న జగిత్యాలకు చెందిన కుక్కల చిన్న భీమయ్యను ఇండియాకు వాపస్ తెప్పించాలని అతని భార్య గంగలక్ష్మి ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డికి మెయిల్ ద్వారా బుధవారం విజ్ఞప్తి చేయగా.. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పందించింది. సాధారణ పరిపాలనశాఖ ప్రవాసీ భారతీయుల విభాగం (జీఏడీ– ఎన్నారై) ముఖ్య కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, సౌదీ అరేబియా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి ‘వెర్ మెసేజ్’ పంపారు. భీమయ్య కుమారుడు సునీల్‌కు ‘బోన్‌మ్యారో’ (ఎముక మూలుగు) మార్పిడి చికిత్స కోసం దాతగా భీమయ్యను సౌదీ నుంచి అత్యవసరంగా రప్పించాల్సి ఉంది. కాగా, కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ఎక్స్‌లో చేసిన విజ్ఞప్తికి కూడా రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. సౌదీలోని సామాజిక సేవకులు గాజుల నరేష్, మీర్జా బేగ్, మహ్మద్ ఫారూఖ్ అహ్మద్‌లు స్థానిక అధికారులతో, ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు. -
దీక్షాపరులతో కిక్కిరిసిన రైల్వేస్టేషన్
రామగుండం: అయ్యప్ప మాలాధారణ స్వాములతో రామగుండం రైల్వేస్టేషన్ గురువారం కిక్కిరిసింది. మకరజ్యోతి దర్శనం కష్టతరంగా మారడంతో మరుసటి రోజు మణికంఠుడిని ప్రశాంతంగా దర్శించుకునేందుకు శబరిమల వెళ్లే వందలాది మంది దీక్షాపరులు స్టేషన్‌కు రాగా, వారికి వీడ్కోలు పలికేందుకు కుటుంబసభ్యులు తరలిరావడంతో ప్లాట్‌ఫాం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాగా గురువారం రఫ్తిసాగర్ ఉదయం 10.30 గంటలకు రావాల్సి ఉండగా 15 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా రావడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. సాయంత్రం 5 గంటలకు రావాల్సిన కేరళ ఎక్స్‌ప్రెస్ ఎనిమిది గంటల ఆలస్యంతో శుక్రవారం వేకువజామున రానున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య
మల్లాపూర్: ఒంటరి జీవితం భరించలేక ఎస్ఆర్ రాజేశ్(52) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై రాజు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కేరళ రాష్ట్రం అలెప్పి జిల్లా కొట్టనాడు తాలుక తగ్గడి గ్రామానికి చెందిన శారదామందిర్ రాజప్పన్(ఎస్ఆర్) రాజేశ్(52) కొన్నేళ్లుగా మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. కొత్తదాంరాజుపల్లిలోని కేరళ హైస్కూల్లో టీచర్‌గా చేస్తున్నాడు. రాజేశ్‌కు 12ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం కలుగకపోవడంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగి విడివిడిగా ఉంటున్నారు. భార్య వెళ్లిపోవడంతో కొంతకాలంగా తీవ్రమనస్తాపం చెందుతూ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. ఈనెల 14న ఇంటి నుంచి బయటికి వెళ్లి గ్రామశివారులోని దుబ్బగట్టు ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేశ్ కనిపించకపోవడంతో స్థానికులు సమీప ప్రాంతంలో గాలించారు. దుబ్బగట్టు ప్రాంతంలో ఉరివేసుకుని వేలాడుతున్న రాజేశ్ మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేరళ హైస్కూల్ ప్రిన్సిపాల్ సీబీ.అనిల్‌సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
No Headline
ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు వాటిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ట్రిపుల్, మైనర్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. పై దృశ్యాలు గురువారం సిరిసిల్ల అంబేడ్కర్ సర్కిల్ వద్ద కనిపించగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివారు మారరని అభిప్రాయ పడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అవగాహన కల్పిస్తున్నా.. మారరే -
వర్సిటీ అధ్యాపకులకు నియామక పత్రాలు అందజేత
కరీంనగర్‌సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఉట్కూర్ ఉమేశ్‌కుమార్ తన బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి తనదైన శైలిలో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. నూతనంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా ఆచార్య రవికుమార్ జాస్తిని(ఉస్మానియా విశ్వవిద్యాలయం) నియామకం చేశారు. 2025–26 సంవత్సరానికి మూడు సంవత్సరాల ఎల్ఎల్బీ కోర్సు, ఎంఫార్మసీని మంజూరు చేయించారు. పరిపాలన విభాగంలో కూడా తనదైన ముద్ర వేస్తూ అధ్యాపకులకు వివిధ పదవులను అందిస్తూ నియామక పత్రాలు జారీ చేశారు. కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న డాక్టర్ హరికాంత్‌ను వీసీకి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా నియామకం చేశారు. ఉర్దూ విభాగంలో పని చేస్తున్న హుమేరా తస్లీమ్‌ను శాతవాహన ఎస్టేట్ ఆఫీసర్‌గా, డాక్టర్ మహమ్మద్ జాఫర్‌ను డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్‌కు డైరెక్టర్‌గా, డాక్టర్ అబ్రారుల్ బకీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్‌గా, డాక్టర్ మనోహర్‌ను చీఫ్ వార్డెన్‌గా, మేనేజ్మెంట్ విభాగానికి బీవోఎస్గా డాక్టర్ సరసిజను అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా, చైర్మన్ బీవోఎస్ కెమిస్ట్రీగా, డాక్టర్ శ్రీరంగ ప్రసాద్‌ను బిజినెస్ మేనేజ్మెంట్ శాఖ అధిపతిగా, డాక్టర్ శ్రీవాణిని ఎకనామిక్స్ శాఖ అధిపతిగా, విజయ ప్రకాశ్‌ను ప్రజా సంబంధాల అధికారిగా, ఇన్చార్జి ఆంగ్ల శాఖాధిపతిగా, డాక్టర్ జోసెఫ్ రాజును ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్చార్జి శాఖ అధిపతిగా, డాక్టర్ ప్రసాద్‌ను మ్యాథమెటిక్స్ ఇన్చార్జి శాఖ అధిపతిగా, డాక్టర్ ఎస్.కిరణ్‌ను వృక్షశాస్త ఇన్చార్జి శాఖ అధిపతిగా, డాక్టర్ అర్జున్ను ఇన్చార్జి కంప్యూటర్ సైన్స్ శాఖ అధిపతిగా నియామకం చేశారు. డాక్టర్ తిరుపతిని కోఆర్డినేటర్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ విభాగంలో, డాక్టర్ మనోజ్‌కుమార్‌ని యూత్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా నియామక పత్రాలు అందజేసి అందరూ తమ బాధ్యతతో పనులు నిర్వర్తించాలని సూచించారు. అధ్యాపకేతర సిబ్బంది సంతోష్‌కుమార్‌ను వీసీ వ్యక్తిగత కార్యదర్శిగా, మారుతిని వీసీ వ్యక్తిగత సహాయకులుగా, శ్రీకాంత్‌ను రిజిస్ట్రార్ వ్యక్తిగత సహాయకులుగా నియామకం చేశారు. -
కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
కరీంనగర్‌క్రైం: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి మంగళవారం కోర్టు మంజూరు చేసిన బెయిళ్లకు సంబంధించి గురువారం కౌశిక్‌రెడ్డి కరీంనగర్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరై పూచీకత్తులను సమర్పించారు. కరీంనగర్ కలెక్టరేట్లో ఈనెల 12న నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్‌కుమార్‌తో గొడవకు సంబంధించి కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పీఎస్‌లో రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో అతన్ని సోమవారం రాత్రి అరెస్టు చూపిన పోలీసులు మంగళవారం ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరయింది. కోర్టు ఆదేశాల ప్రకారం కౌశిక్‌రెడ్డి పూచీకత్తులను కోర్టుకు సమర్పించగా.. కోర్టు స్వీకరించింది. -
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నేరువాట్ల సంజయ్ (23) బుధవారం రాత్రి బైక్ అదుపుతప్పి మృతిచెందాడు. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలు.. సంజయ్ సొంత పనిమీద ధర్మారం వచ్చి తిరిగి రాత్రి 10 గంటలకు ఇంటికి బైక్‌పై వెళ్తుండగా కటికెనపల్లి శివారులో అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతుడి తండ్రి నేరువాట్ల రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గట్టెపల్లి శివారులో ఒకరు.. సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి శివారులోని రైల్వే బ్రిడ్జి వద్ద గురువారం ద్విచక్రవాహనం అదుపుతప్పి డోకె అజయ్(20) మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూర్‌కు చెందిన అజయ్ ద్విచక్ర వాహనంపై మానకొండూర్‌లోని బంధువుల ఇంటికి బయలుదేరాడు. గట్టెపల్లి నుంచి నీరుకుల్ల మీదుగా మానకొండూర్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు కరీంనగర్ ఆస్పత్రి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందలేదు. ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధురాలు..మంథని: మంథని పరిధిలోని బొక్కలవాగు వంతెనపై గురువారం ద్విచక్రవాహనం ఢీకొని మండలంలోని సూరయ్యపల్లి గ్రామానికి చెందిన తాటి కమల(62) మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూరయ్యపల్లికి చెందిన కమల కూరగాయల కోసం నడుచుకుంటూ మంథనికి వచ్చి తిరిగి వెళ్తుండగా బొక్కలవాగు వంతెనపై వెనక నుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టింది. తలకు తీవ్రగాయం కావడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు యువకులకు దేహశుద్ధికథలాపూర్: కథలాపూర్ శివారులోని ఎస్సారెస్పీ వరదకాలువకు బిగించిన వ్యవసాయ మోటార్‌ను దొంగతనం చేశారనే అనుమానంతో ముగ్గురు యువకులకు స్థానిక రైతులు గురువారం ఉదయం దేహశుద్ధి చేశారు. యువకులు బుధవారం రాత్రి వరదకాలువ వెంబడి తిరుగుతూ వ్యవసాయ మోటార్లను, కాపర్ వైర్లను ఎత్తుకెళ్తున్నట్లుగా స్థానిక రైతులు అనుమానించారు. ఈ విషయంలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. వ్యక్తిపై కేసుసారంగాపూర్: మండలంలోని పోతారం శివారు గ్రామం గణేశ్‌పల్లికి చెందిన మహిళపై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన ఇడగొట్టు గంగారాంపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై దత్తాద్రి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం బాధిత మహిళ పొలం నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో దారిలో గంగారాం వెనుకనుంచి వచ్చి ఆమె చేయి పట్టుకోగా కేకలు వేసింది. ఈమైపె కర్రతో దాడి చేసి గాయపర్చాడు. మహిళ ఫిర్యాదుతో గంగారాంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో కరీంనగర్ జోన్ జట్లు విజయకేతనం ఎగురవేయాలని అండర్ ట్రైటీ ఐపీఎస్ వసుంధర యాదవ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల కరీంనగర్ జోన్‌స్థాయి పోలీస్ జట్ల ఎంపిక పోటీలను మహిళలు, పురుషుల విభాగాల్లో నిర్వహించారు. పోటీలకు 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈసందర్భంగా ట్రైనీ ఐపీఎస్ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. కరీంనగర్లో రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఏసీపీ విజయకుమార్ ఫుట్‌బాల్ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. పోలీస్ ఉద్యోగులకు క్రీడలు ఆటవిడుపుగా పనిచేస్తాయన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కరీంనగర్ జోన్ జట్లు ప్రతిభ చాటి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, షటిల్ పోటీలు నిర్వహించారు. పోటీల నిర్వహణలో ఆర్ఐలు కుమారస్వామి, జానీమియా, సీఐ సంతోష్, ఆర్ఎస్ఐలు రాజు, మహేశ్, లేక్ పీఎస్ రాజు, డీవైఎస్వో వి. శ్రీనివాస్‌గౌడ్, వివిధ సంఘాల ప్రధాన కార్యదర్శులు వై.మహేందర్‌రావు, గిన్నె లక్ష్మణ్, మల్లేశ్‌గౌడ్, క్రీడా సంఘాల ప్రతినిధులు సీహెచ్. సంపత్‌రావు, వి.సూర్యప్రకాశ్, కట్ట సంతోష్, మహమ్మద్ యూనిపాష, డి.వీరన్న, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ట్రైనీ ఐపీఎస్ వసుంధరయాదవ్ కరీంనగర్ జోన్ పోలీస్ జట్ల ఎంపిక పోటీలకు స్పందన ఐదు జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారుల హాజరు -
నవోదయ పరీక్షకు ఏర్పాట్లు సిద్ధం
చొప్పదండి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు సిద్ధం చేశామని జేఎన్వీ ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. నవోదయ సమావేశ మందిరంలో గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరీక్ష నిర్వాహకులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025–26 విద్యా సంవత్సరంలో జేఎన్వీలో ఆరోతరగతి ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు 6,806 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఈ నెల 18న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఉదయం 10 గంటల లోపే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌తో పాటు, ఏదేని గుర్తింపు కార్డు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి డీఈవో అశోక్ రెడ్డి, జిల్లాల వారిగా అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలు ప్రిన్సిపాల్ మంగతాయారు -
మద్యానికి బానిసై దొంగతనం
ఎలిగేడు(పెద్దపల్లి): మద్యానికి బానిసై చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తెలిపారు. గురువారం సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. గత నెల 27న కొత్తిరెడ్డి వేమారెడ్డి, గంధం రవి, గాజంగి లక్ష్మణ్, మడిగే అఖిల్‌సాయి ఎలిగేడు మండలం నారాయణపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు అట్టేపల్లి లక్ష్మి మెడలో నుంచి పుస్తెలతాడు దొంగిలించారు. పుస్తెలతాడును కుదవబెట్టి రూ.లక్ష డబ్బు తెచ్చుకొని నలుగురు రూ.20,000 చొప్పున పంచుకున్నారు. రూ.20 వేలతో గురువారం వేమారెడ్డి ఇంట్లో దావత్ చేసుకుంటుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కాగా పుస్తెలతాడు చోరీ సమయంలో సదరు వృద్ధురాలు మంచంపై నుంచి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసును ఛేదించడంలో క్రియాశీల పాత్ర పోషించిన ఎస్సై నరేశ్‌కుమార్, ఏఎస్సై తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ శాంతయ్య, కానిస్టేబుల్ స్వామికి రివార్డు ప్రకటించినట్లు ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. నలుగురు నిందితుల అరెస్ట్ -
అత్యవసర సేవలోనే ‘సంక్రాంతి’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వారికి సేవలోనే పండుగ.. ఆపదలో ఉన్నవారికి సత్వర వైద్య సేవలందించడమే ఆనందం.. అదే వారికి సంక్రాంతి.. అంతులేని ఆనందాన్నిచ్చే వేడుక. లోకమంతా సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకుంటుంటే.. 108 వైద్య సిబ్బంది మాత్రం ఆరోజు వైద్యపరంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా.. క్షణాల్లో అక్కడ వాలిపోయారు. ప్రథమ చికిత్స చేసి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్సులు నేటికీ నిర్విరామంగా సేవలందిస్తూనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నెల 14న పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో విధులు నిర్వహించిన సిబ్బంది పలువురి ప్రాణాలు కాపాడారు. 226 మంది ఈఎంటీలు, పైలెట్లు సంక్రాంతి రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 179 మందికి అత్యవసర వైద్య సేవలందించారు. అందులో ట్రామా : 35 కేసులు, ప్రమాదాలు : 30, ప్రెగ్నెన్సీ కేసులు : 18, ఫీవర్ : 19, కడుపునొప్పి సంబంధిత : 25, గుండె సంబంధిత : 7, శ్వాస సంబంధిత 9, ఆత్మహత్యాయత్నాలు 5, ఇతర కేసులు 32 నమోదయ్యాయి. వీరిలో 12 మంది ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. వారి పరిస్థితిని బట్టి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 112 మంది ఎమర్జెన్సీ మెడికట్ టెక్నీషియన్లు(ఈఎంటీ), 114 మంది పైలెట్లు విధుల్లో ఉన్నారు. పండుగ రోజూ విధుల్లో 108 సిబ్బంది 12 మంది ప్రాణాలు కాపాడిన వైనం ఉమ్మడి జిల్లాలో 179 మందికి అత్యవసర వైద్యంప్రాణాలు కాపాడితే సంతృప్తి మా సిబ్బంది పండుగలు, దినోత్సవాలకు ప్రాధాన్యం ఇవ్వరు. ఇంకా చెప్పాలంటే.. పండుగ రోజు మేం మరింత అప్రమత్తంగా ఉంటాం. ఆ రోజు ప్రైవేటు అంబులెన్సులు, వైద్యసేవలు తక్కువగా అందుబాటులో ఉంటాయి. అందుకే, రోజూవారీ కంటే ఆరోజు 24 గంటలపాటు సేవలందిస్తాం. 14వ తేదీన మొత్తం 179 మందికి వైద్య సేవలందించాం. పేషెంట్ల ప్రాణాలు కాపాడితే.. మాకు సంతృప్తి లభిస్తుంది. – సలీం, 108 ప్రోగ్రాం ఉమ్మడి జిల్లా మేనేజర్ -
అకౌంట్ నుంచి రూ.97 వేలు మాయం
ముత్తారం(మంథని): ముత్తారం మండలానికి చెందిన మల్యాల బాలయ్య బ్యాంకు ఖాతా నుంచి రూ.97 వేలు సైబర్ నేరగాళ్లు మాయం చేసిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఈనెల 8న బాలయ్య ఎస్బీఐ అకౌంట్లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రూ.1.45లక్షలు జమయ్యాయి. 10న రాత్రి 9 గంటల సమయంలో ఎస్బీఐ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని, ఖాతా వివరాలు అడుగుతుండగానే అకౌంట్ నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకు అకౌంట్లో మొదట రూ.45వేలు, తర్వాత మరో రూ.45వేలు జమయ్యాయి. అనంతరం తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి రూ.90 వేలు, మరో అకౌంట్ నుంచి రూ.7వేలు విత్ డ్రా అయినట్లు మెస్సేజ్ రావడంతో బాధితుడు 1930 నంబరుకు ఫోన్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. -
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు వైద్య కళాశాల వెబ్సైట్లో దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలతో ఈ నెల 20వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు, 2 జతల జిరాక్స్‌లతో కొత్తపల్లిలోని కళాశాలలో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని సూచించారు. ప్రొఫెసర్–4, అసోసియేట్ ప్రొఫెసర్–8, అసిస్టెంట్ ప్రొఫెసర్ –3 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు www.gmcknr. com/gmcknr.html వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పంట డబ్బులు ఇస్తలేరు● బ్యాంకు ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం ధర్మపురి: భూమి పట్టాదారు పుస్తకాలు కుదువపెట్టి ఓ రైతు బ్యాంకులో రుణం తీసుకున్నాడు. కొద్దికాలానికి చనిపోయాడు. అతని కొడుకు భూమి సాగు చేసుకోగా.. పంట డబ్బులు బ్యాంకులో పడ్డాయి. ఆ డబ్బులను బ్యాంకర్లు ఇవ్వడం లేదని సదరు వ్యక్తి బ్యాంకు ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గురువారం చోటు చేసుకుంది. బాధిత రైతు మల్లేశ్ వివరాల ప్రకారం.. జిల్లాలోని బుగ్గారం మండలం మద్దునూర్‌కు చెందిన సోమ రాజయ్య ధర్మపురిలోని సహకార కేంద్ర బ్యాంకులో భూమి పట్టాపాసు పుస్తకం కుదవపెట్టి రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కిస్తీకి రూ.55 వేల చొప్పున ఒకసారి చెల్లించాడు. రాజయ్య ఇటీవల చనిపోయాడు. బ్యాంకులో ఇంకా రూ.2.92 లక్షల అప్పు ఉంది. అతని కొడుకు మల్లేశం పంట సాగు చేయగా వచ్చిన డబ్బులు రూ.3 లక్షలు బ్యాంకులో పడ్డాయి. మీరేమాకు అప్పు ఉన్నారంటూ వాటిని బ్యాంకు అధికారులు ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన మల్లేశ్ గురువారం బ్యాంకు ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అడ్డుకొని నీళ్లు పోశారు. మల్లేశ్ మూసిఉన్న బ్యాంకు అద్దాలను బలంగా గుద్దడంలో చేతికి తీవ్ర గాయమైంది. అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై బ్యాంకు ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్‌ను వివరణ కోరగా ‘గతంలో మల్లేశ్ తండ్రి తీసుకున్న అప్పును సరైన సమయంలో చెల్లించక ఇబ్బందులు పెట్టారు. ప్రస్తుతం వచ్చిన పంట డబ్బులు మల్లేశ్ తల్లి శంకరమ్మ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఆ డబ్బులను ఇరువురి సంతకాలతో అప్పుకింద తీసుకున్నాం. రూ.8 వేలు వారికి ఇవ్వాల్సి ఉంది. రాజయ్య చనిపోయినట్లు ధ్రువపత్రాలు తీసుకొస్తే ఇస్తాం’ అని సమాధానం ఇచ్చారు. ఒకరి రిమాండ్తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఉమెన్స్ సేఫ్టీలో భాగంగా మండలంలోని రామన్నపల్లిలో బుధవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై బి.రామ్మోహన్ తెలిపారు. గ్రామంలోని ఐకేపీ సెంటర్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న గుండి ప్రశాంత్‌ను పోలీస్ సిబ్బంది ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించడంతో పాటు నెట్టివేసినట్లు తెలిపారు. కానిస్టేబుల్ ప్ర శాంత్ ఫిర్యాదుతో గుండి ప్రశాంత్‌పై కేసు నమోదుచేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా 15 రోజు ల జ్యూడీషియల్ రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. చంపుతానని బెదిరించిన వ్యక్తిపై కేసుసారంగాపూర్: సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన బంక చిన్నక్క అనే మహిళను చంపుతానని బెదిరించిన బాలపల్లి గ్రామానికి చెందిన గుంటి కనుక మల్లేశ్‌పై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై దత్తాద్రి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. చిన్కక్కకు గ్రామ శివారులో గల వ్యవసాయ భూమిలోకి మల్లేశ్ అక్రమంగా ప్రవేశించి హద్దురాళ్లు, కరెంటు ప్యూజులు తొలగించాడు. ఈ క్రమంలో తమ భూమిలోకి వచ్చి హద్దురాళ్లు ఎందుకు తొలగించావని ప్రశ్నించినందుకు చిన్నక్కను మల్లేశ్ చంపుతానని బెదిరించాడు. చిన్నక్క పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రేవంత్.. నువ్వు జైలుకెళ్లావని మాపై కక్ష సాధింపా?: కౌశిక్‌రెడ్డి
సాక్షి, కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth Reddy) జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy). ప్రపంచం మొత్తం చూసి వచ్చిన వ్యక్తి కేటీఆర్(KTR). ఇదంతా రేవంత్‌కు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ కారు రేసు కేసు అనే లొట్టపీసు కేసు అంటూ విమర్శించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులను రేవంత్ వేధింపులకు చేస్తున్నాడు. గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ ఒక్క రూపాయి రైతుభరోసా ఇవ్వలేదని అడిగినందుకు కేసులు పెడుతున్నారా?. రుణమాఫీ గురించి అడిగితే పెడుతున్నారా?. తులం బంగారం ఏమైందన్నందుకా కేసులు?. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారు.కారు రేసు అనేది ఓ లొట్టపీసు కేసు. ఈ రేసు కోసం రాష్ట్రాల మధ్య పోటీ ఉంటుంది. ఆ పోటీలో తెలంగాణకు తీసుకొస్తే.. దాన్ని కూడా రేవంత్ రద్దు చేశాడు. తెలంగాణకు రూ. 700 కోట్లు లాభం వచ్చినట్టు నెల్సన్ సర్వేనే చెప్పింది. టెస్లా కంపెనీని తీసుకురావాలనేది కేటీఆర్ లక్ష్యం. ఆ కంపెనీని తీసుకురావడానికే కేటీఆర్ కారు రేసు తీసుకొచ్చారు. దాన్ని రేవంత్ అడ్డుకున్నాడు. రేవంత్ జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ పంపించాలని అనుకుంటున్నాడు.కేటీఆర్ ప్రపంచం చూసి వచ్చిన వ్యక్తి. కేటీఆర్‌కు, రేవంత్ రెడ్డికి అదే డిఫరెన్స్. అవినీతే లేనప్పుడు ఏసీబీ ఎందుకు?. అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు?. ప్రొసీజర్ ల్యాప్స్ కేటీఆర్ తప్పు ఎందుకు అవుతుంది?. పాలసీ డిసీషన్ మాత్రమే కేటీఆర్ తీసుకుంటారు తప్ప ప్రొసీజర్‌తో ఆయనకేం సంబంధం?. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు పోతే.. 60 లక్షల మంది కేసీఆర్‌లు తయారు అవుతారు. కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ను అంటే ఊరుకోవాలా?. కేసీఆర్ బొమ్మ లేకుండా సంజయ్ కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలవలేడు.ఆర్డీవో మీద నేను ఒక్క మాటైనా మాట్లాడానా?. ఒక్కడితో నేను మాట్లాడితే ఆరుగురితో కేసులు పెట్టిస్తారా?. డీకే అరుణపై నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కేసు పెట్టలేదే?. నాడు జూపల్లిపై ఇష్టారాజ్యంగా చేస్తే కేసీఆర్ కేసులు పెట్టలేదు కదా?. నీకో న్యాయం మాకో న్యాయమా?. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో దాడి చేయిస్తారా? ఖమ్మంలో హరీష్ రావుపై దాడి జరిగింది ఇదేం సంస్కృతి? అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
రామగిరి కోటను టూరిజం హబ్‌గా మార్చండి
మంథని: కాళేశ్వరం, మంథని, రామగిరి ప్రాంతాలను ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూ ట్‌గా గుర్తించి అభివద్ధి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను కలిశారు. మంథని నియోజకవర్గంలోని కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం, రామగిరి కోటను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలన్నారు. దక్షిణకాశీ కాళేశ్వర ముక్వీశ్వరస్వామి ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉందని, దేశంలో మరెక్కడా కనిపించని విధంగా గర్భగుడిలో రెండు శివలింగాలు పూజలు అందుకుంటున్నాయని వివరించారు. ఒకటి ముక్వీశ్వరునిది(శివుడు), మరొకటి కాళేశ్వరునిది(యముడు)దని పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. 30 లక్షల నుంచి 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 2027లోనూ గోదావరి పుష్కరాలు ఇక్కడే జరుగుతాయని, కోటి మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. పుష్కరాలు మొదలయ్యే నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేసేలా చొరవ చూపాలని కోరారు. రామగిరి కోటకు సుమారు 1,200 ఏళ్ల చరిత్ర ఉందనిచ రామాయణంలోనూ దీని గురించిన ప్రస్తావన ఉందని గుర్తుచేశారు. రాముడి ఆలయాలు, జలపాతాలు, అనేక ఔషధ మొక్కలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రానికి కావాల్సిన అన్నిఆకర్షణలు ఇక్కడ ఉన్నాయని, స్వదేశీ దర్శన్ 2.0 లేదా ఇతర పథకాల కింద ఈ కోటను మెగా టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌కు మంత్రి శ్రీధర్‌బాబు వినతి -
మెట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు
మెట్‌పల్లిరూరల్: మెట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించా రు. బుధవారం మధ్యాహ్నం ఓ డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేసిన సబ్‌రిజిస్ట్రార్ ఆసిఫోద్దీన్, సహకరించిన కార్యాల య సబార్డినేట్ బానోత్ రవి, లంచం డబ్బులు తీసుకున్న డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాల ప్రకా రం.. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌కు చెందిన సుంకె విష్ణు మెట్పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో 266 గజాల భూమిని కొనుగోలు చేశాడు. సేల్‌డీడ్ చేసుకున్న విష్ణు కొద్దిరోజులకే మార్ట్గేజ్ చేసుకునేందుకు గత నెల 28న స్లాట్ బుక్ చేసుకున్నాడు. ఆ సమయంలో మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయానికి వెళ్లిన విష్ణు సబ్‌రిజిస్ట్రార్‌ను కలిస్తే రూ.10 వేలు డిమాండ్ చేశాడు. ఈ మొత్తాన్ని తన సబార్డినేట్‌కు ఇవ్వాలని సూచించాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పడంతో సార్‌తోనే మాట్లాడుకోవాలని సభార్డినేట్ బదులిచ్చాడు. మరలా సబ్‌రిజిస్ట్రార్‌ను కలవగా రూ.9వేలు ఇవ్వాలని చెప్పగా రూ.5 వేలు ఇస్తానని తేల్చిచెప్పాడు. అనంతరం బా ధితుడు ఏసీబీ అధికారులను సంపద్రించాడు. బుధవారం కార్యాలయానికి వెళ్తున్నట్లు ఏసీబీ అధి కారులకు సమాచారం ఇచ్చిన బాధితుడు మొదట సబ్‌రిజిస్ట్రార్, సబార్డినేట్‌ను కలిశాడు. డాక్యుమెంట్ రై టర్ అసిస్టెంట్ అయిన ఆర్మూర్ రవిని కలిసి రూ.5 వేలు ఇవ్వాలని వారు సూచించారు. అప్పటికే అక్క డ నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు లంచం డబ్బులు తీసుకుంటుండగా రవిని చాకచక్యంగా పట్టుకున్నారు. అతన్ని విచారించగా జరిగిన మొత్తాన్ని వివరించాడు. దీంతో సబ్ రిజిస్ట్రార్, సబార్డినేట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వివరించారు. భూమి మార్ట్‌గేజ్‌కు సబ్‌రిజిస్ట్రార్ రూ.10వేలు డిమాండ్ రూ.5వేలకు కుదిరిన ఒప్పందం ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ డబ్బులు తీసుకుంటుండగా పట్టివేత