Kakinada
-
రత్నగిరిపై భక్తజనవాహిని
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● 2 వేల వ్రతాల నిర్వహణ ● దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి గురువారం కిక్కిరిసింది. సంక్రాంతి పండగలకు స్వస్థలాలకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో భాగంగా మార్గం మధ్యలో సత్యదేవుని దర్శించుకుంటున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ పెరిగింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని మొత్తం 40 వేల మంది దర్శించారు. సుమారు 2 వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. నిజరూప దర్శనం ప్రతి రోజూ సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుడు స్వర్ణాభరణాలు, వజ్ర కిరీటాలు, పట్టు వస్త్రాలతో దర్శనమిస్తారు. ప్రతి గురువారం మాత్రం ఎటువంటి అలంకరణా లేకుండా నిజరూపాలతో దర్శనమిస్తారు. ఆవిధంగా సత్యదేవుని నిజరూప దర్శనం చేసుకున్న భక్తులు పులకించారు. నేడు జన్మ నక్షత్ర పూజలు సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్లకు పంచామృతాభిషేకాలు, ఉదయం 11 గంటలకు ఆయుష్య హోమం నిర్వహిస్తారు. వనదుర్గ అమ్మవారికి ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ చండీ హోమం నిర్వహిస్తారు. -
ప్రభోత్సవం త్వరగా ముగించడంపై ఫిర్యాదు
అన్నవరం: కనుమ పండగ సందర్భంగా బుధవారం రాత్రి అన్నవరంలోని పురగిరి క్షత్రియుల రామకోవెలలో జరిగిన సత్యదేవుని ప్రభోత్సవాన్ని త్వరగా ముగించడంపై ధర్మకర్త సోము జోగురాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుకు గురువారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని భక్తుల సందర్శనార్థం రాత్రి 8 గంటల వరకూ ఉంచకుండా రాత్రి 7.15 గంటలకే ఊరేగింపుగా తీసుకుని వెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏటా వస్తున్న ఆచారం ప్రకారం రామాలయం వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం లేదని పేర్కొన్నారు. ఏటా ఇలాగే జరుగుతోందని, కనీసం ఈసారైనా స్వామి, అమ్మవార్లను రామకోవెలలో ఎక్కువసేపు ఉంచాల్సిందిగా అధికారులను కోరామని తెలిపారు. దానికి అధికారులు అంగీకరించినప్పటికీ ఎప్పటిలానే రాత్రి 7.15 గంటలకే స్వామి, అమ్మవార్లను తీసుకుని వెళ్లారని, ఆ తరువాత స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశ చెందారని తెలిపారు. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జోగురాయుడు కోరారు.వచ్చే నెలలో సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలు కాకినాడ సిటీ: వచ్చే నెల 15 నుంచి 28వ తేదీ వరకూ కాకినాడలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ జరగనుందని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఈ టోర్నమెంట్‌ను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్ నిర్వహించాలంటూ ఆయన గతంలో ప్రతిపాదించారు. దీనికి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ బోర్డు అంగీకరించింది. ఈ నేపథ్యంలో కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్, ట్రస్ట్ ఫౌండర్, ఆదాయ పన్ను అధికారి రవిచంద్ర, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బి.శ్రీనివాస్ కుమార్‌తో కలిసి కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షణ్మోహన్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కాకినాడలో జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ పోటీలను కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్, జిల్లా అసోసియేషన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన పక్కాగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో కాకినాడలో అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహించేందుకు కూడా కృషి చేస్తామని అన్నారు. వేటకు వేళాయె..పిఠాపురం: సంక్రాంతి సంబరాలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతూ ఇప్పటి వరకూ ఇళ్లకు పరిమితమైన వారు తిరిగి ఎవరి పనుల్లో వారు క్రమంగా తలమునకలవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12 నుంచి వేటకు విరామం ప్రకటించి, సంబరాల్లో మునిగి తేలిన మత్స్యకారులు కూడా ఐదు రోజుల అనంతరం తిరిగి తమ జీవన పోరాటం ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఒడ్డున ఉన్న బోట్లను, తెప్పలను సముద్రంలోకి చేర్చుకుంటున్నారు. వలలు, ఇతర వేట సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే సుదూర ప్రాంతాల్లో చేపల వేటకు కొంత మంది మత్స్యకారులు సముద్రం పైకి వెళ్లగా.. మిగిలిన వారు కూడా వేటకు ఉపక్రమిస్తున్నారు. ఐదు రోజులుగా బోసిపోయిన సముద్ర తీరం శుక్రవారం నుంచి చేపల క్రయవిక్రయాలతో కళకళలాడనుంది. భీమేశ్వరాలయ నిత్య అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళంరామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి హైదరాబాద్‌కు చెందిన దాత పుప్పాల అజయ్‌కుమార్ గురువారం రూ. 1,00,116లు విరాళంగా అందజేశారు. ఈ మేరకు చెక్‌ను ఆలయ సీనియర్ సహాయకుడు సూరపుపురెడ్డి వెంకటేశ్వరరావు(వెంకన్నబాబు) చేతికి అందజేశారు. -
గ్యాస్ వాటా కోసం అందరం ఉద్యమిద్దాం
కాకినాడ సిటీ: మన గ్యాస్ మన రాష్ట్రానికే దక్కాలనే డిమాండుతో వచ్చే నెల 1న కాకినాడలో సదస్సు నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. కాకినాడ పీఆర్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పుల్లో ఉన్న మన రాష్ట్రం అభివృద్ధికి.. కాకినాడ సముద్ర తీరంలో లభిస్తున్న చమురు, గ్యాస్ నిక్షేపాల్లో వాటా కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. కాకినాడకు 30 కిలోమీటర్ల దూరాన గత ఏడాది జనవరి 7న సముద్ర గర్భం నుంచి ముడి చమురు ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. కృష్ణా – గోదావరి బేసిన్లో గ్యాస్‌తో పాటు చమురు ఉత్పత్తుల విలువ లక్షల కోట్ల రూపాయలకు మించి ఉంటుందన్నారు. ఈ నిక్షేపాలు దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చబోతున్నాయని, రాష్ట్ర ప్రజల ఆర్థికాభివృద్ధికి ఇది చాలా కీలకమైనదని చెప్పారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా స్థానికంగా లభ్యమయ్యే సహజ వనరులను ఉపయోగించుకునే హక్కు ఆ ప్రాంతానికే ఉంటుందనేది సహజ న్యాయ సూత్రమన్నారు. సహజ వనరుల ఉత్పత్తిలో ఆ రాష్ట్రానికి 50 శాతం కేటాయించాలని 12వ ఆర్థిక సంఘం కూడా చెప్పిందని అన్నారు. మన తీరం నుంచి 1,500 కిలోమీటర్ల దూరాన ఉన్న గుజరాత్, మహారాష్ట్రలకు గ్యాస్ అక్రమంగా తరలిస్తూ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మధు విమర్శించారు. మన చమురు, గ్యాస్ నిక్షేపాల్లో అత్యధిక వాటా మనకే దక్కాలంటూ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవంగా తీర్మానించినా కేటాయింపులు, ఆదాయంలో సగం పొందలేకపోతున్నామని మధు చెప్పారు. వచ్చే నెల 1న నిర్వహిస్తున్న సదస్సును ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. 21, 22 తేదీలలో కోనసీమ క్రీడోత్సవాలు అమలాపురం రూరల్: ఈ నెల 21, 22 తేదీలలో జిల్లా స్థాయిలో ‘కోనసీమ క్రీడోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు మండల స్థాయిలో గెలుపొందిన 7, 8, 9 తరగతుల సుమారు 2,700 మంది విద్యార్థులకు జీఎంసీ బాలయోగి స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
అంబాజీపేటలో ఘనంగా ప్రభల తీర్థం
అంబాజీపేట: సంక్రాంతి సందర్భంగా అంబాజీపే ట సెంటర్లో ఏటా ముక్కనుమ రోజున నిర్వహించే ప్రభల తీర్థం (చక్ర తీర్థం) గురువారం అత్యంత ఘనంగా జరిగింది. మాచవరంలోని రామ్‌ఘాట్‌లో వేంచేసియున్న శ్రీపార్వతీ రాజేశ్వరస్వామి, కందుల మల్లేశ్వరస్వామి, యువగణపతి ఆలయాల వద్ద నుంచి ప్రభలను పురవీధుల్లో గౌడ యువసేన యువకులు ఊరేగింపుగా అంబాజీపేట సెంటర్‌కు తీసుకొచ్చారు. అక్కడ కొలువుతీరిన ప్రభలను భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. సెంటర్లో ఏర్పాటు చేసిన తీర్థానికి మండలంలోని పలువురు తరలివచ్చారు. ఎస్సై కె.చిరంజీవి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. తీర్థం ముగిసిన అనంతరం ప్రభలతో గ్రామోత్సవం నిర్వహించారు. తీర్థంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ ఆర్కెస్ట్రా పలువురిని అలరించాయి. ఎంపీ గంటి హరీష్ మాధుర్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యానారాయణ, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు ప్రభలను దర్శించుకున్నారు. -
రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రహదారులపై ప్రయాణం చేసే క్రమంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ మేరకు అందరికీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రవాణా, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే సూచించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకూ జరిగే భద్రతా వారోత్సవాల ప్రారంభం సందర్భంగా గురువారం ఆయన కాకినాడ వచ్చారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంతిలాల్ దండే మాట్లాడుతూ, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనాలు నడిపే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియమావళి, జాతీయ రహదారులపై వాహనాలు నడిపే క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆటో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ చేపట్టాలన్నారు. రవాణా, పోలీస్, ఆర్అండ్బీ, జాతీయ రహదారులు తదితర శాఖల అధికారుల సమన్వయంతో పని చేసి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. హెల్మెట్ ధారణపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా రహదారుల భద్రతపై యువతకు, ఆటో డ్రైవర్లకు, మహిళలకు విస్తృత స్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ కె.శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రారంభించిన గుడ్ సమారిటన్ అంశంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని, ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించాలని కోరారు. వాహన చోదకులకు, యువతకు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమావళిపై ప్రత్యేక శిక్షణ చేపట్టేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. ఆటో డ్రైవర్లు, భారీ వాహనాలు నడిపే వారికి కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. -
బాలారిష్టాలు
● సత్యదేవుని సన్నిధిలో డిజిటల్ చెల్లింపుల్లో ఇబ్బందులు ● నత్తలా ఇంటర్నెట్ వేగం ● టిక్కెట్ల జారీకి ఎక్కువ సమయం ● తప్పనిసరి అవుతున్న నగదు లావాదేవీలుఅన్నవరం: సత్యదేవుని భక్తుల సౌకర్యార్థం రత్నగిరిపై ప్రారంభించిన డిజిటల్ చెల్లింపుల విధానానికి బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. పశ్చిమ రాజగోపురం వద్ద డిజిటల్ పేమెంట్స్ కౌంటర్‌ను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.సుబ్బారావు ఈ నెల 2న ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే, క్రెడిట్, డెబిట్ కార్డులతో భక్తులు సత్యదేవుని వ్రతం, దర్శనం, నిత్య కల్యాణం, లక్ష్మీప్రయుక్త ఆయుష్య హోమం, ప్రత్యంగిర హోమం (అడ్వాన్స్), ఇతర సేవల టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. రోజూ తెల్లవారుజామున 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఈ కౌంటర్ ద్వారా డిజిటల్ పేమెంట్ల సౌకర్యం అందుబాటులో ఉంటోంది. పీఆర్ఓ కార్యాలయంలోని కౌంటర్ ద్వారా ఈ నెల 1 నుంచి ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ డిజిటల్ చెల్లింపుల ద్వారా టిక్కెట్లు జారీ చేస్తున్నారు. కానరాని ప్రచారం దేవస్థానంలో డిజిటల్ పేమెంట్ల సౌకర్యం ఉన్నట్లు భక్తులకు తెలిసేలా రత్నగిరి పైన కానీ, కొండ దిగువన కానీ ఎక్కడా ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే, మైకు ద్వారా కూడా ప్రచారం చేయడం లేదు. దీంతో చాలా మంది భక్తులకు డిజిటల్ చెల్లింపుల విధానం ఉన్న విషయం తెలియడం లేదు. పశ్చిమ రాజగోపురం వద్ద నగదు లావాదేవీల కౌంటర్, డిజిటల్ పేమెంట్ కౌంటర్ ఎదురెదురుగా ఉన్నాయి. అక్కడకు వచ్చాక మాత్రమే డిజిటల్ చెల్లింపులకు అవకాశం ఉందనే విషయం తెలిసిన కొంత మంది భక్తులు మాత్రమే అప్పటికప్పుడు దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఇంటర్నెట్తో సహనానికి పరీక్ష డిజిటల్ పేమెంట్ల విషయంలో మరో ఇబ్బంది కూడా ఎదురవుతోంది. రత్నగిరిపై ఇంటర్నెట్ వేగం నత్తతో పోటీ పడుతోంది. ఫలితంగా ఒక్కో టిక్కెట్టు జారీకి 5 నిమిషాల సమయం పడుతోంది. దీంతో భక్తులు అసహనానికి గురవుతున్నారు. ఎక్కువ సేపు వేచి ఉండలేక, గత్యంతరం లేక నగదు ద్వారానే టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. 10 శాతమే.. డిజిటల్ పేమెంట్ల ద్వారా వస్తున్న రాబడి దేవస్థానం ఆదాయంలో 10 శాతం మాత్రమే ఉంటోంది. ఈ నెల ఒకటి తేదీ నుంచి పదో తేదీ వరకూ దేవస్థానానికి నగదు కౌంటర్ల ద్వారా సుమారు రూ.3 కోట్ల ఆదాయం రాగా డిజిటల్ పేమెంట్ల ద్వారా సుమారు రూ.30 లక్షలు మాత్రమే వచ్చింది. డిజిటల్ పేమెంట్లపై దేవస్థానం విస్తృత ప్రచారం చేస్తే ఈ ఆదాయం ఇంకా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పాటు ఇంటర్నెట్ వేగం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే, పశ్చిమ రాజగోపురం ముందున్న కౌంటర్ భక్తులకు పెద్దగా కనిపించడం లేదు. దీనిని ముందు వైపునకు మార్చాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. -
నేతలకు మేత
● నీకింత.. నాకింత..సాక్షి ప్రతినిధి, కాకినాడ: పండగల వేళ బరి వేసుకో.. కోడిపందేలాడుకో.. గుండాట, జూద క్రీడలు మీ ఇష్టం.. మేం ఉన్నాంగా.. మిమ్మల్ని అడ్డుకునే వారే లేరు.. వచ్చినదాంట్లో నువ్వు ఇంత తీసుకో.. నాకు ఇంత ఇవ్వు.. ఇవీ సంక్రాంతి కోడిపందేల నిర్వాహకులతో కూటమి నేతలు చేసుకున్న ఒప్పందాలు. ఈ మేరకు పండగ ముగిసిన తర్వాత పంపకాలు మొదలవడంతో కూటమి నేతల ముంగిట్లో మామూళ్ల రూపంలో కాసుల వర్షం కురుస్తోంది. వారి స్థాయిని బట్టి రూ.లక్షలు, రూ.కోట్లలో నజరానాలు ముట్టాయనే మాట టీడీపీ శ్రేణుల నుంచే బాహాటంగా వినిపిస్తోంది. తునిలో ఓ ముఖ్య నేతకు రూ.1.20 కోట్లు! జిల్లాలోనే అత్యధికంగా తుని నియోజకవర్గంలో కూటమి నేతలకు భారీగా ముట్టిందని చెబుతున్నారు. పండగల సందర్భంగా ఈ నియోజకవర్గంలోని 60 బరుల్లో మూడు రోజుల పాటు 2,100 పందేలు జరిగాయి. నియోజకవర్గంలోని మూడు మండలాలు, తుని పట్టణంతో కలిపి రూ.15 కోట్ల వరకూ పందేలు సాగాయి. ఇందులో ఓ ముఖ్య నేతకు రూ.1.20 కోట్లు అందినట్లు సమాచారం. మండల స్థాయి నాయకులకు రూ.10 లక్షల చొప్పున మూడు మండలాలకు రూ.30 లక్షలు, గ్రామ స్థాయి నాయకులకు రూ.2 లక్షల చొప్పున పంపకాలు చేశారు. ఎస్.అన్నవరం, తేటగుంట, వెలమపేట, అల్లిపూడి, బెండపూడి, పెరుమాళ్లపురం గ్రామాల్లో పందేలు జోరుగా జరిగాయి. పిఠాపురంలో రూ.కోట్లలో.. పిఠాపురం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గొల్లప్రోలు నగర పంచాయతీ, పి.దొంతమూరు, చిత్రాడ, తాటిపర్తి, దుర్గాడ, వాకతిప్ప, నాగులాపల్లి, రమణక్కపేట, ఇసుకపల్లి తదితర గ్రామాల్లో 56 బరులు ఏర్పాటు చేశారు. మొత్తం 1,380 పందేలు రూ.9 కోట్ల మేర జరిగినట్లు సమాచారం. కొందరు నేతలకు రూ.కోటి వరకూ, మండల స్థాయి నాయకులకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చారు. గ్రామ స్థాయి నాయకుడికి రూ.లక్ష చొప్పున మొత్తంగా రూ.కోటి వరకూ ముట్టజెప్పారు. ఇవి కాకుండా గ్రామాల్లోని చిన్నాచితకా నాయకులు రూ.1.50 కోట్ల వరకూ పంచుకున్నట్లు చెబుతున్నారు. కాకినాడ రూరల్‌లో.. నియోజకవర్గంలో రూ.13 కోట్ల మేర పందేలు జరిగాయి. ఓ నేతకు రూ.25 లక్షల వరకూ ముట్టజెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమిలోని రెండు ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలు పందేల్లో కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. కాకినాడ, కరప మండలాల్లో పందేలు ఎక్కువగా జరిగాయి. కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్ గైగోలుపాడులో కూడా పందేలు నిర్వహించారు. తిమ్మాపురం, సర్పవరం, కరప, గురజనాపల్లి తదితర గ్రామాల్లో కూటమి నేతలు దగ్గరుండి మరీ పందేలు ఆడించారు. ఆ 3 నియోజకవర్గాల్లోనూ మామూళ్లే.. ● జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో కూటమి ముఖ్య నేతలు కాకుండా కొందరు కార్యకర్తలు కూడా మామూళ్లు తీసుకున్నారు. ● జగ్గంపేట నియోజకవర్గంలో 45 బరుల్లో 1,600 పందేలు జరిగాయి. మూడు రోజులూ కలిపి మొత్తం రూ.9.05 కోట్ల మేర పందేలు జరిగాయి. బరుల వద్ద గుండాటల నిర్వహణకు నియోజకర్గంలోని ఒకరిద్దరు రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ పాడుకున్నారు. జగ్గంపేట మండలం మర్రిపాకలో రోజుకు రూ.50 లక్షల మేర జూదం జరిగింది. ● పెద్దాపురం నియోజకవర్గంలోని 14 గ్రామాల్లో 42 బరుల్లో రూ.7 కోట్ల వరకూ పందేలు జరిగాయి. బరుల వద్ద కూటమి కార్యకర్తల హడావుడి కనిపించింది. ● ప్రత్తిపాడు నియోజకవర్గంలో 20 బరుల్లో జరిగిన పందేల ద్వారా రూ.కోటి వరకూ చేతులు మారాయి. కూటమికి చెందిన కొందరు రాజకీయ నాయకులే స్వయంగా పందేలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ఏలేశ్వరం, లింగంపర్తి, ప్రత్తిపాడు, రాచపల్లి, కత్తిపూడి, శంఖవరం, అన్నవరం, రౌతులపూడి, ములగపూడి తదితర చోట్ల పందేలు జోరుగా జరిగాయి. కోడి పందేలతో పండగే పండగ బరిలోనే పంపకాలు కూటమి ముఖ్య నాయకులకు రూ.50 లక్షలు ద్వితీయ శ్రేణి మండల స్థాయి వారికి రూ.2 లక్షలు -
ఘనంగా గోపూజోత్సవం
అన్నవరం: కనుమ పండగ సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన బుధవారం గోపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను పల్లకిలో ఉంచి ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అష్టోత్తర పూజ, శ్రీకృష్ణునికి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం గోవుకు దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు పూజలు చేశారు. గోవు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి, బియ్యం, బెల్లం తినిపించారు. అనంతరం గోవులకు హారతి ఇచ్చారు. తరువాత సత్యదేవుడు, అమ్మవార్లకు పండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గోపూజ తదితర కార్యక్రమాలను దేవస్థానం వేద పండితులు గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ ఘనపాఠి, శివ ఘనపాఠి, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు కంచిభట్ల సాయిరామ్, ముత్య వేంకట్రావు, వైదిక కమిటీ సభ్యుడు, వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు నిర్వహించారు. రత్నగిరిపై సప్తగోకులంలోని గోవులకు కూడా అర్చకుడు కంచిభట్ల వరదయ్య ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో స్వామి, అమ్మవార్లతో పాటు సప్తగోకులంలో గోవులను కూడా దర్శించి, పూజలు చేశారు. ఏర్పాట్లను ఏఈఓ కె.కొండలరావు, పీఆర్ఓ డీవీఎస్ కృష్ణారావు తదితరులు పర్యవేక్షించారు. -
సబ్ జూనియర్స్ హాకీ జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలోని హాకీ కోర్టులో జిల్లా సబ్ జూనియర్స్ హాకీ జట్టు ఎంపిక బుధవారం జరిగింది. హాకీ కోచ్ రవిరాజు ఆధ్వర్యాన జరిగిన ఈ ఎంపికల్లో 25 మంది పాల్గొనగా 18 మంది ఎంపికయ్యారు. వీరు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకూ మదనపల్లిలో జరిగే సబ్ జూనియర్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని రవిరాజు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా హాకీ సంఘం అధ్యక్షుడు ఎ.బాబ్జీ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ హాకీ కోచ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. బీచ్‌లో డ్రోన్లతో నిఘా కాకినాడ రూరల్: సంక్రాంతి పండగను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యాన పోలీసులు కాకినాడ బీచ్‌లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పండగ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు బీచ్‌కు వస్తారనే అంచనాతో ఉప్పాడ కొత్తపల్లి నుంచి కాకినాడ సూర్యారావుపేట బీచ్ వరకూ డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. తిమ్మాపురం, యు.కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని బీచ్‌లలో ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధిక సంఖ్యలో సివిల్, మైరెన్ పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అధిక సంఖ్యలో సందర్శకులు బీచ్‌కు రావడంతో సూర్యారావుపేట – ఉప్పాడ బీచ్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. ఎప్పటికప్పుడు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కిక్కిరిసిన అంతర్వేది సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని క్షేత్రం మంగళ, బుధవారాలలో సంక్రాంతి, కనుమ పర్వదినాలు పురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణం ఎటు చూసినా భక్తులతో రద్దీగా మారింది. ఆలయంలో నిత్యం నిర్వహించే నారసింహ సుదర్శన హోమంలోను, విశేష అభిషేకంలోను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల క్యూ లను, అన్నదాన పథకాన్ని అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. -
కత్తులు దూసిన కోళ్లు
‘అధికారం’.. నిబంధనల ధిక్కారం తుని రూరల్: అధికార దర్పం ఏదైనా చేయిస్తుందనడానికి ఇదో నిదర్శనం. ఏకంగా విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలోనే.. కూటమి నేతల దన్నుతో కోడి పందేలు, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహించి ఖుషీ చేసుకున్నారు నిర్వాహకులు. వి.కొత్తూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో కోడి పందేలు, గుండాట శిబిరాలు నిర్వహించడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఈ పాఠశాలలో నిబంధనల ధిక్కారం జరగడం గమనార్హం. పిఠాపురం: మూడు రోజుల ముచ్చటైన పండగ సంక్రాంతి వేళ.. జిల్లావ్యాప్తంగా సంప్రదాయం ముసుగులో కోడిపందేలు, జూద క్రీడలు యథేచ్ఛగా జరిగాయి. కొన్నిచోట్ల భారీ బరులు ఏర్పాటు చేశారు. కోడి పుంజుల కాళ్లకు కత్తులు కట్టి మరీ బరిలోకి దించారు. పందెంరాయుళ్లను ఆకట్టుకునేందుకు బరుల వద్ద సకల సౌకర్యాలూ కల్పించారు. మాంసాహార దుకాణాలు, బెల్టు షాపులు విచ్చలవిడిగా ఏర్పాటయ్యాయి. గుండాట, పేకాట వంటి జూద క్రీడలు అడ్డూ అదుపూ లేకుండా జరిగాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండగ రోజుల్లో వేలాది మంది ఈ పందేలు, జూదాల్లో పాల్గొన్నారు. ఇదే అదనుగా పందెంరాయుళళ్లు రూ.లక్షల్లో వేలం పాట పాడుకొని మరీ బరి తెగించారు. గుండాట నిర్వహణ ద్వారా ఎక్కువ మొత్తంలో సొమ్ము చేతులు మారినటట్లు అంచనా. కొన్నిచోట్ల రికార్డింగ్ డ్యాన్సులు సైతం నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో పండగ మూడు రోజులూ మహిళలు కూడా పందేల్లో పాల్గొన్నారు. పెరిగిన బరులు కోడిపందేల నిర్వహణలోనూ కూటమి నేతలు ఆధిపత్య పోరు కనిపించింది. టీడీపీ, జనసేన నేతలు భారీగా బరులు ఏర్పాటు చేశారు. పోటాపోటీగా పార్టీకో బరి ఏర్పాటు చేసి మరీ పందేలు జరిపారు. కొన్నిచోట్ల బరుల ఏర్పాటుకు భారీగానే వసూళ్లు చేసినట్లు చెబుతున్నారు. పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, కాకినాడ రూరల్, సామర్లకోట, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో ఒక్కోచోట రెండేసి బరులు వెలిశాయి. గత ఏడాది జిల్లావ్యాప్తంగా సుమారు 80 బరుల్లో పందేలు జరగగా ఈ ఏడాది వాటి సంఖ్య సుమారు 130కి పెరిగింది. మొత్తం మీద ఈ పండగ సీజన్లో పందేలు, ఇతర జూద క్రీడల ద్వారా రూ.100 కోట్లకు పైగా నగదు చేతులు మారిందని అంచనా వేస్తున్నారు. గతంలో కత్తి పందేలు మాత్రమే జరిగేవి. గత ఏడాది నుంచి జెట్టీ పందేలు కూడా అధికంగా నిర్వహిస్తున్నారు. ఐరన్ మెష్‌తో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కోడిపందేలు జరిపారు. ఫ పెద్దాపురం నియోజకవర్గంలోని సుమారు 30 ప్రాంతాల్లో కోడిపందేలు జరిగాయి. రోజుకు రూ.3 కోట్లకు పైగా చేతులు మారాయని అంచనా. ఫ కాకినాడ రూరల్ అచ్చంపేట, సర్పవరం, తిమ్మాపురం, పండూరు, నేమాం, సూర్యారావుపేట, వాకలపూడి, వలసపాకల, కొత్తూరు, చీడిగ, తూరంగి గ్రామాలతో పాటు, అర్బన్ పరిధిలోని గైగోలుపాడు, గొడారిగుంటల్లో పందేలు సాగాయి. ఫ తుని నియోజకవర్గంలో అత్యధికంగా 40కి పైగా బరుల్లో జరిగిన పందేలు, జూదాల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఫ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పోటాపోటీగా పందేలు సాగాయి. ఇక్కడ కోట్లాది రూపాయల మేర జరిగిన పందేల్లో కూటమి నాయకులు భారీగానే సొమ్ము వెనకేసుకున్నారు. పలు బరుల వద్ద యువత పెద్ద సంఖ్యలో గుండాట, పేకాటల్లో పోటీ పడి మరీ పాల్గొన్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని జూదాల నిర్వాహకులు రేయింబవళ్లు ఆటలు కొనసాగించారు. యువత పెడదారి పడుతోందంటూ బహిరంగ సభలో ఏకరవు పెట్టిన ఉప ముఖ్యమంత్రి ఇలాకాలోనే యువత ఎక్కువగా పందేల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఫ జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గోకవరం మండలం మల్లవరం, రంపయర్రంపాలెం, కామరాజుపేట, గోకవరం, కృష్ణునిపాలెం, వెదురుపాక, కొత్తపల్లి, తిరుమలాయపాలెం తదితర గ్రామాల్లో భారీగా కోడి పందేలు జరిగాయి. అలాగే, కిర్లంపూడి మండలం కిర్లంపూడి, చిల్లంగి, వేలంక, గెద్దనాపల్లి, భూపాలపట్నం, తామరాడ, గోనేడ, వీరవరం, కృష్ణవరం, బూరుగుపూడి గ్రామాల్లో మూడు రోజుల పాటు జరిగిన పందేల్లో రూ.కోటికి పైగా డబ్బులు చేతులు మారాయి. జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో కూడా కోడిపందేలు నిర్వహించారు. ఫ ప్రత్తిపాడు నియోజకవర్గంలో 25 వరకూ బరుల్లో కోడి పందేలు జోరుగా జరిగాయి. భారీగా నగదు చేతులు మారింది. మద్యం ఏరులు ఈ మూడు రోజులూ బరుల వద్ద మద్యం ఏరులై పారింది. ప్రతి బరి వద్ద నిర్వాహకులు మినీ బార్లు ఏర్పాటు చేశారు. మద్యపాన ప్రియులకు కావాల్సినంత మద్యాన్ని అందుబాటులో ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో మద్యం వ్యాపారులే ఈ సదుపాయం కల్పించారు. అధిక ధరలకు విక్రయించి రూ.లక్షలు దండుకున్నారు. పోలీసుల ఆరంభ శూరత్వం కోడి పందేలపై, అసాంఘిక, అశ్లీల కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతామంటూ పోలీసులు మొదట్లో హడావుడి చేశారు. కొన్ని రోజుల ముందు నుంచే మైకులు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం చేశారు. కొన్నిచోట్ల బరులు ధ్వంసం చేశారు. కానీ, చివరకు వారిది ఆరంభశూరత్వమే అయింది. కూటమి నేతల ఒత్తిళ్లతో పండగ మూడు రోజులూ పందేల వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదు. ఫ చేతులు మారిన రూ.కోట్లు ఫ పండగ మూడు రోజులూ యథేచ్ఛగా కోడి పందేలు, జూద క్రీడలు ఫ జిల్లాలో భారీగా పెరిగిన బరులు ఫ పోటాపోటీగా కూటమి నేతల ఏర్పాట్లు -
వైభవంగా సత్యదేవుని ప్రభోత్సవం
అన్నవరం: కనుమ పండగ సందర్భంగా బుధవారం రాత్రి సత్యదేవుని ప్రభోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సత్యదేవుడు, అమ్మవారు, క్షేత్ర పాలకులు సీతారాముల ఉత్సవమూర్తులను రత్నగిరి నుంచి పల్లకీలపై ఊరేగింపుగా స్థానిక చినరావిచెట్టు సమీపంలోని పురగిరి క్షత్రియ కులస్తుల రామకోవెల వద్దకు తీసుకువచ్చారు. స్వామి, అమ్మవార్లకు రామకోవెల ధర్మకర్త సోము జోగురాయుడు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. రామకోవెలలో రెండు ప్రత్యేక ఆసనాలపై సత్యదేవుడు, అమ్మవారిని, సీతారాములను వేంచేయించి, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీస్సులు అందజేశారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రభపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి, రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకూ గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. జోగురాయుడు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం వేద పండితులు, ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు సుధీర్, పరిచారకులు ముత్య వేంకట్రావు, కల్యాణ బ్రహ్మ చామర్తి వేంకటరెడ్డి పంతులు (కన్నబాబు) తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాదస్వర సంగీతం, తప్పెటగుళ్లు, కోలాటం భక్తులను అలరించాయి. ముగిసిన ధనుర్మాసోత్సవాలు గత నెల 16వ తేదీ నుంచి అన్నవరంలో నిర్వహిస్తున్న సత్యదేవుని ధనుర్మాసోత్సవాలు కనుమ పండగ నాడు నిర్వహించిన ప్రభోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఈ నెల రోజులూ సత్యదేవుడు, అమ్మవారిని గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఘనంగా ఊరేగించారు. తమ ఇళ్ల ముంగిటకు వచ్చిన స్వామి, అమ్మవారికి గ్రామస్తులు ఘనంగా నివేదనలు సమర్పించారు. -
ప్రభలసీమ
సాక్షి, అమలాపురం/అంబాజీపేట/కొత్తపేట: అందమైన పూదోటల్లో.. మరింత అందమైన రంగురంగుల సీతాకోక చిలుకలు విహరించినట్టుగా పైరు పచ్చని కోనసీమలో రంగురంగుల ప్రభలు విహరించాయి. పచ్చని వరిచేలు.. కొబ్బరితోటల మధ్య నుంచి... గలగల పారే పంట, మురుగునీటి కాలువలను దాటుకుంటూ సందడి చేశాయి. రంగురంగుల కంకర్లు.. అందమైన అల్లికలు.. జే గంటలు.. పసిడి కంకులతో తయారు చేసిన ధాన్యం కుచ్చులు.. భారీ గజమాలలు.. గుమ్మడికాయలు.. నెత్తిన నెమలిపింఛాలతో ముగ్ధమనోహరమైన ప్రభలను చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. కోనసీమలో జగ్గన్నతోటతో పాటు పలుచోట్ల మంగళ, బుధవారాల్లో జరిగిన తీర్థాలకు జనం పోటెత్తారు. వ్యాఘ్రేశ్వరస్వామి అధ్యక్షతన.. నింగిలోని ఇంద్రధనస్సు నేలకొచ్చివాలిందా అన్నట్టు జగ్గన్నతోటలో పరమేశ్వరుని పదకొండు రూపాలు భక్తుల కళ్లముందు దర్శనమిచ్చాయి. మొసలపల్లి భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సమావేశానికి అధ్యక్షత వహించే వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభ వచ్చిన సమయంలో మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకి ఎత్తి దించారు. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థానికి వేలాది మంది భక్తులు పోటెత్తారు. జిల్లా నలమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానికులే కాకుండా వివిధ రాష్ట్రాలు, దేశాలకు ఉపాధి కోసం వెళ్లినవారు తీర్థానికి కుటుంబ సమేతంగా వచ్చారు. తీర్థానికి సుమారు లక్ష మంది హాజరైనట్టు అంచనా. ఒక వైపు ప్రభల మోసే భక్తుల ఓంకార నాదాలు.. ప్రభలకు వేలాడదీసిన జేగంటల శబ్దాలు.. ప్రభల మోసేవారి అశ్శరభ.. శరభ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. తీర్థం జరిగిన జగ్గన్నతోటకు రెండు కిలోమీటర్ల మేర భక్తజన సవ్వడి వినిపించింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. 2.30 గంటల సమయంలో గంగలకుర్రు, ఆ తరువాత గంగలకుర్రు అగ్రహారం ప్రభలు మురుగునీటి కాలువ (కౌశిక) దాటుతున్న సమయంలో వేలాదిగా జనం మురుగునీటి కాలువ, వంతెనల మీదకు చేరుకున్నారు. ప్రభలు కౌశిక దాటే సన్నివేశాన్ని ఆసక్తిగా తిలకించారు. తీర్థాలకు సంప్రదాయ వస్త్రధారణలతో యువతులు ప్రభల అందాలతో పోటీ పడ్డారు. వృద్ధులు, యువకులు, మహిళలు అనే తేడా లేకుండా తీర్థానికి వచ్చారు. కొన్ని కుటుంబాల వారు గూడు ఎడ్లబండ్లపై తీర్థానికి రావడం పలువురిని ఆకట్టుకుంది. ఇదే మండలంలో వాకలగరువు సరిహద్దులో జరిగిన ప్రభల తీర్థంలో వాకలగరువు 53 అడుగులు, తొండవరం 55 అడుగుల ఎత్తున ప్రభలు భక్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వీటి వద్ద ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. కొత్తపేటలో బాణసంచా కాల్పులు కొత్తపేటలో సంక్రాంతి రోజు మంగళవారం తెల్లవారు జాము నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 24 గంటల పాటు జరిగిన ఈ తీర్థానికి సైతం పెద్ద ఎత్తున జనం వచ్చారు. పాత, కొత్త రామాలయం వీధుల వారు ఒకరి తరువాత ఒకరు ప్రభలను ఊరేగించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ కాలేజ్ గ్రౌండ్లో, అనంతరం ప్రభల తిరుగు ఊరేగింపులో భాగంగా అర్థరాత్రి 2 గంటల నుంచి బుధవారం ఉదయం 5.30 గంటల వరకూ పాత బస్టాండ్ సెంటర్లో బాణసంచా కాల్పుల మోత హోరెత్తింది. ఇదే మండలంలో మందపల్లి, అవిడి డ్యామ్సెంటరు, వాడపాలెం, రావులపాలెం మండలం దేవరపల్లిలో కూడా ప్రభల తీర్థాలు జరిగాయి. కొర్లగుంటకు 12 ప్రభలు మామిడికుదురు మండలం కొర్లగుంటలో జరిగిన తీర్థంలో 12 ప్రభలు కొలువుదీరాయి. ప్రభలు పంటచేలు, కాలువలు దాటుకుని వచ్చాయి. కొత్తపేట మండలం అవిడి, పి.గన్నవరం మండలం మానేపల్లి, నాగుల్లంక, పప్పులవారిపాలెం, అయినవిల్లి, అమలాపురం మండలం సాకుర్రు గరువు, బండారులంక, అమలాపురంలో గనికమ్మగుడి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, రాజోలు పొదలాడ, ముమ్మిడివరం మండలం పల్లిపాలెం, క్రాప చింతలపూడి, కాట్రేనికోన మండలం చెయ్యేరు, ఐ.పోలవరం మండలం గుత్తెనదీవిల్లో ప్రభలు తీర్థాలు సాగాయి. జిల్లాలో పలుచోట్ల ప్రభల తీర్థాలు దారులన్నీ జగ్గన్నతోట వైపే పోటెత్తిన భక్తజనం లోకకల్యాణార్థం కొలువుతీరిన ఏకాదశ రుద్రులు కొత్తపేట, కొర్లగుంటల్లో సైతం జనం బారులు -
కోనసీమ: జగ్గన్నతోట ప్రభల తీర్థంలో అపశ్రుతి
సాక్షి, కోనసీమ జిల్లా: జగ్గన్నతోట ప్రభల తీర్థం(Jagganna Thota Prabhala Theertham)లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల బండ్లు(Bullock carts) జనంలోకి దూసుకెళ్లడంతో బాలుడు సహా ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కూటమి నేతల కుటుంబ సభ్యుల కోసం ఎడ్ల బండ్లు ఏర్పాటు చేశారు. జనం నడవటానికే ఖాళీ లేని చోట ఎడ్ల బండ్లను ఏర్పాటు చేయడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా, కోనసీమలో సంక్రాంతి నుంచి మక్కనుమ తరువాత రోజు వరకూ అన్ని మండలాల్లో ప్రభల తీర్థాలు జరుగుతాయి. చిన్నా పెద్దా అన్నీ కలిపి సుమారు 84 వరకూ ప్రభల తీర్థాలు నిర్వహిస్తారని అంచనా. సంక్రాంతి రోజున జరిగే తొలి ప్రభల తీర్థం కొత్తపేటదే. కనుమ రోజున నిర్వహించే.. మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి ప్రత్యేకత ఉంది. కనుమ రోజున జరిగే తీర్థంలో 11 గ్రామాలకు చెందిన ప్రభలు ఈ తీర్థానికి తరలివస్తాయి.మొసలపల్లి భోగేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామిలు జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఇదీ చదవండి: నెమలి ‘పుంజు’ తడాఖా.. పందెంలో ‘కోటి’ గెలిచిన కోడిగంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు ప్రభలు జగ్గన్నతోటను ఆనుకుని ఉండే ఎగువ కౌశికను దాటుకుని వచ్చే తీరు నయనానందకరంగా ఉంటుంది. తీర్థానికి చాలా మంది ఇప్పటికీ గూడు బండ్లపై రావడం సంప్రదాయమే. ఈ తీర్థానికి 50 వేల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. వాకలగరువు సోమేశ్వరస్వామి, తొండవరం ఉమా తొండేశ్వరస్వామి, గున్నేపల్లి రామలింగేశ్వరస్వామి ప్రభలు 45 అడుగులు, 43 అడుగుల ఎత్తున నిర్మిస్తారు.మామిడికుదురు శివారు కొర్లగుంటలో జరిగిన ఈ తీర్థానికి సైతం అరుదైన గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రభలు పంట కాలువలు, పచ్చని పొలాల మధ్య నుంచి తరలి వస్తుంటాయి. తీర్థానికి మామిడికుదురు, నగరం, పాశర్లపూడి, ఈదరాడ, పెదపట్నం గ్రామాల నుంచి 17 ప్రభలు వస్తాయి. పెదపట్నం నుంచి 12 ప్రభలు కొర్లగుంట తీర్థానికి రావడం గమనార్హం. వీటితోపాటు అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, అయినవిల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో పలుచోట్ల ప్రభల తీర్థాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. -
‘బరి’తెగించిన కూటమి నేతలు
సాక్షి, కాకినాడ జిల్లా: సంక్రాంతి (Sankranti) పండగ సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని.. కోడి పందేలకు(Cockfighting), జూద క్రీడలకు దూరంగా ఉండాలని.. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ పోలీసు యంత్రాంగం కొన్ని రోజులుగా హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ ఆఫ్ట్రాల్ అన్నట్టుగా ఆ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయని పందేలరాయుళ్లు.. అధికార కూటమి నేతల అండతో.. తమకు అడ్డే లేదన్నట్టుగా ‘బరి’ తెగించేశారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో షరా మామూలుగానే పందెం కోడి కాలు దువ్వింది.. కత్తి కట్టించుకుని.. తగ్గేదేలే అన్నట్లుగా బరిలో తలపడింది.పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. మూడు రోజుల సంక్రాంతి పండగల్లో తొలి రోజయిన భోగి నాడే కోడి పందేలు, గుండాట, పేకాట, లాటరీ, జూదం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరిగిన కోడిపందేలు, గుండాటల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మొదటి స్థానంలో నిలవగా కాకినాడ జిల్లా రెండో స్థానంలో ఉంది.ఉమ్మడి జిల్లాలో మొత్తం సుమారు 350 బరుల్లో కోడి పందేలు జరిగాయని అంచనా. ఇందులో కోనసీమ జిల్లాలోనే అత్యధికంగా 110 బరుల్లో కోడి పందేలు జరిగాయి. ఈ ప్రాంతంలో తొలి రోజు రూ.110 కోట్లుపైనే పందేలు జరిగాయని లెక్కలేస్తున్నారు. బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. కూటమి నేతల. ప్రజలను నిలువునా దోచేస్తున్నారు.పశ్చిమ గోదావరి జిల్లా: జీవహింస వద్దన్న కోర్టు మార్గదర్శకాలను కూటమి నేతలు లెక్కచేయడం లేదు. యథేచ్ఛగా కూటమి నేతల కనుసన్నల్లో పందెం కోళ్లు కత్తులు దూశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు జూదాలను ప్రోత్సహిస్తున్నారు. కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు పందెం బరులను ప్రారంభించారు. పోలీసుల మైకులు మూగబోయాయి. జిల్లా వ్యాప్తంగా బరుల వద్ద కోడిపందేలు, గుండాట, పేకాట నిర్వహణ యథేచ్ఛగా సాగిపోతోంది. మద్యం స్టాళ్లు ఏర్పాటు చేసి భారీగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో మద్యం ఏరులై పారుతోంది. తొలి రోజే రూ.100 కోట్లకు పైగాచేతులు మారింది.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
వీడిన దాంపత్య బంధం
ఫ రోడ్డు ప్రమాదంలో భార్య మృతి ఫ భర్తకు తీవ్ర గాయాలు తొండంగి: వారి పయనం అర్ధాంతరంగా ముగిసిపోయింది.. అనుకోని ప్రమాదం దాంపత్య బంధాన్ని విడదీసింది.. తొండంగి మండలం జాతీయ రహదారి బెండపూడి శివారు వై.జంక్షన్ వద్ద ఓ బైకును కారు ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా, భర్త తీవ్ర గాయాల పాలయ్యాడు. కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన మార్తుర్తి వీరబాబు, అతని భార్య లక్ష్మిలు తమ బైక్‌పై బంధువులను పరామర్శించేందుకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామానికి బయలు దేరారు. ఈ నేపథ్యంలో బెండపూడి ఆర్చి వద్దకు వచ్చేసరికి వీరి బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొంది. దీంతో లక్ష్మి (35) తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన వీరబాబును 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరికి కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె ధనలక్ష్మి ఉన్నారు. వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడిగా జాన్‌వెస్లీ జగ్గంపేట: వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఉపాధ్యక్షుడిగా జగ్గంపేటకు చెందిన కుండా జాన్ వెస్లీ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జాన్ వెస్లీకి పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీగా మనీష్ దేవరాజ్ కాకినాడ క్రైం: జిల్లా అదనపు ఎస్పీగా మనీష్ దేవరాజ్ పాటిల్‌ను నియమిస్తూ ప్రభుత్వం సో మవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. తొలుత గ్రే హౌండ్స్‌లో పని చేసిన అనుభవం ఉంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ అంబాజీపేట: మోటారు సైకిళ్లు తప్పించే ప్రయత్నంలో రెండు సామాజిక వర్గాల మధ్య సోమవారం సాయంత్రం ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ముక్కామల జెడ్పీ హైస్కూల్ సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందేలు, గుండాల బరికి కూతవేటు దూరంలో ప్రధాన రహదారిపై ఇరువర్గాలకు చెందిన యువ కులు మోటారు సైకిళ్లు తప్పించే ప్రయత్నంలో వివాదం జరిగింది. ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. ఈ విషయమై స్థానికులు అంబాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అక్కడ ఉన్నవారిని చెదరగొట్టారు. అలాగే కోడి పందేలు, గుండాలను నిలుపుదల చేయించారు. క్షతగాత్రులు అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు లు అందలేదని ఎస్సై కె.చిరంజీవి తెలిపారు. ఇదిలా ఉండగా ఘర్షణ సమయంలో పోలీస్ కానిస్టేబుల్ నియంత్రిస్తుండగా, అతనిపైనా యువకులు కేకలు వేసినట్లు స్థానికులు తెలిపారు. -
అంబరాన్ని తాకేలా..
ఫ రత్నగిరిపై సంక్రాంతి సంబరాలు ప్రారంభం ఫ భోగి మంటతో ప్రారంభించిన తపోవనం స్వామీజీ ఫ ఆలయ ప్రాంగణంలో ఉట్టిపడిన గ్రామీణ సంస్కృతి అన్నవరం: సత్యదేవుడు కొలువైన రత్నగిరిపై సంక్రాంతి సంబరాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రత్నగిరి రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలను పండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ తుని తపోవనం ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామీజీ ఉదయం ఆరు గంటలకు భోగి మంట వెలిగించి ప్రారంభించారు. అనంతరం తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుతో కలసి తిలకించారు. స్వామివారి వార్షిక కల్యాణ మండపంలో ప్రతిష్ఠించిన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూర్తులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ తెలుగు సంస్కృతికి సంక్రాంతి ప్రతీక అని అన్నారు. పాడిపంటలు, పశుపోషణతో పెనవేసుకున్న మన సంస్కృతిని, అనుబంధాలను ఏటా గుర్తు చేసే అపురూపమైన పండుగ అని చెప్పారు. అచ్చ తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా దేవస్థానంలో చేసిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. ఏటా ఇదే విధంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి గణపతి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, ఉప ప్రధానార్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, పవన్, సుధీర్, శర్మ, పరిచారకులు యడవిల్లి చిన్నా తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఏఈఓ కొండలరావు, పీఆర్ఓ కృష్ణారావు తదితరులు ఏర్పాట్లు చేశారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా.. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అచ్చ తెలుగు పల్లె వాతావరణాన్ని తలపించేలా రత్నగిరిపై చేసిన ఏర్పాట్లు అందరినీ అలరించాయి. ఒకవైపు పొంగలి వంట, ఇంకోవైపు భోగి మంట, పాడి ఆవులు, తెలుగు పౌరుషానికి ప్రతిరూపంగా నిలిచే కోడి పుంజులు, పొట్టేళ్లు, ఎడ్ల బండి, భోగి పండ్లు, బొమ్మల కొలువు, తాటిచెట్టు, కొబ్బరిచెట్టు వంటి ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి. వీటితో పాటు సంప్రదాయ జానపద కళారూపాలైన గంగిరెద్దుల వాళ్లు, కొమ్మదాసరి, హరిదాసు, కళాకారుల కోలాట నృత్యాలతో ఆలయ ప్రాంగణం శోభాయమానంగా దర్శనమిచ్చింది. దీనికి తోడు స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి, భక్తులు దర్శించే అవకాశం కల్పించారు. వేడుకల ప్రాంగణంలో కొలను.. దాని వెనుక సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి ఉత్సవమూర్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ అలంకరణల వద్ద ఫొటోలు దిగడానికి చాలా మంది భక్తులు పోటీ పడ్డారు. సత్యదేవుని పూజల్లో నిత్యం బిజీగా గడిపే దేవస్థానం ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు సుధీర్, పవన్ తదితరులు కాస్త ఆటవిడుపుగా ట్రాక్టర్ నడుపుతున్నట్టు ఫొటోలు దిగారు. -
నాలుగెకరాల్లో మామిడి తోట దగ్ధం
తొండంగి: మండలంలోని కొమ్మనాపల్లిలో నాలుగుగెకరాల్లో మామిడితోట దగ్ధమైంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామ శివారులో కోన గోవిందు, కోన రాంబాబు, కోన వెంకటరావు, కుర్రా పెదకాపు, కుర్రా రాంబాబు, కుర్రా సత్తిబాబు, కుర్రా నాగబాబులు ఎన్నో ఏళ్లుగా నాలుగెకరాల్లో మామిడి తోటలు సాగు చేసుకుంటున్నారు. వీరి తోటలకు సమీపాన పక్క గ్రామానికి చెందిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తరచుగా వైర్లు తగులబెడుతూ, వాటి నుంచి వచ్చిన రాగిని ముద్దగా కరిగించి తీసుకుని వెళ్తున్నారు. ఆదివారం రాత్రి కూడా ఇదే విధంగా వైర్లు తగులబెట్టడంతో ఆ మంటలు క్రమంగా వ్యాపించి తమ తోటల్లోని చెట్లన్నీ మాడిపోయాయని రైతులు వాపోతున్నారు. పూత పూసిన మామిడి చెట్లన్నీ మంటలకు మాడిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు పశుగ్రాసం కోసం ఎకరం విస్తీర్ణంలో వేసిన గడ్డి, తాటిచెట్లు, ఇతర చెట్లు పూర్తిగా కాలిపోయాయని వివరించారు. దీనిపై బాధిత రైతులు తొండంగి పోలీసులకు, ఉద్యానవన శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తోటలకు దుక్కి, పూత కోసం, తెగుళ్ల నివారణకు అవసరమైన పురుగు మందుల కోసం దాదాపుగా రూ.2 లక్షల వరకూ పెట్టుబడి పెట్టామని, చెట్లు కాలిపోవడంతో ఆ మేరకు నష్టపోయామని, జీవనాధారం కోల్పోయామని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తమ న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ఉత్సాహంగా బాడీ బిల్డింగ్ పోటీలు
అమలాపురం టౌన్: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో ఆదివారం సాయంత్రం మొదలైన యునైటెడ్ డిస్ట్రిక్ట్ జోనల్ బాడీ బిల్డింగ్ పోటీలు అదేరోజు అర్ధరాత్రితో ముగిశాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నుంచి హాజరైన దాదాపు 200 మంది బాడీ బిల్డర్లు వివిధ కేటగిరీల్లో పాల్గొని తమ కండలను ప్రదర్శించారు. ఈ మేరకు విజేతల వివరాలను జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు సోమవారం ఉదయం వెల్లడించారు. ఈ పోటీలకు సంబంధించి బాడీ బిల్డింగ్ టైటిల్ విన్నర్‌గా కాకినాడకు చెందిన ఎం.దుర్గాప్రసాద్, రన్నర్‌గా కాకినాడ జిల్లాకు చెందిన జి.హేమంతకుమార్, ఫిజిక్స్ స్పోర్ట్స్ టైటిల్ విన్నర్‌గా సీహెచ్ ఇళయరాజా, రన్నర్‌గా పి.బాలరాజు నిలిచారు. 55 కిలోల విభాగంలో ఎస్.రమేష్‌రాజు (అల్లూరి సీతారామరాజు జిల్లా), 60 కిలోల విభాగంలో ఎం.దుర్గాప్రసాద్ (కాకినాడ జిల్లా), 65 కిలోల విభాగంలో ఎస్.దిలీప్ (తూర్పుగోదావరి జిల్లా), 70 కిలోల విభాగంలో పి.బాలరాజు (కాకినాడ జిల్లా), 75 కిలోల విభాగంలో పి.శివగణేష్ (కోనసీమ జిల్లా), ప్లస్ 75 కిలోల విభాగంలో జి.హేమంతకుమార్ (కాకినాడ జిల్లా), దివ్యాంగ విభాగంలో జి.మోషే (కోనసీమ జిల్లా), మాస్టర్స్ విభాగంలో బి.శంకర్ (కాకినాడ జిల్లా), 165 బిలో ఫిజిక్ స్పోర్ట్స్ విభాగంలో పి.బాలరాజు (కాకినాడ జిల్లా), 165 యబో ఫిజిక్స్ స్పోర్ట్స్ విభాగంలో సీహెచ్ ఇళయరాజా (కాకినాడ జిల్లా) వరుసగా ప్రథమ స్థానాలు కై వసం చేసుకున్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతులుగా ఎం.పోలయ్య, బి.కృష్ణ, బి.ప్రకాష్, దొమ్మేటి వెంకటరమణ, వై.శ్రీనివాసరావు, ఎంవీ సముద్రం వ్యవహరించారు. విజేతలకు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, పోటీల ఆర్గనైజర్ ఆశెట్టి ఆదిబాబు, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నగభేరి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, ముత్తాబత్తుల వెంకటరమణ బహుమతులు అందజేశారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్, అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు నగదు పురస్కారాలతో పాటు మెరిట్ సర్టిఫికెట్లు, షీల్డ్‌లు, పతకాలు అందజేశారు. టైటిల్ విన్నర్‌గా దుర్గాప్రసాద్ విజేతలను ప్రకటించిన జిల్లా అసోసియేషన్ -
ప్రభవించేలా..
ఫ నేటి నుంచి ప్రభల తీర్థాలు ఫ జగ్గన్నతోటలో రేపు ఉత్సవం ఫ ఇదే రోజు పలుచోట్ల సంబరాలు జగ్గన్నతోటకు జాతీయ ఖ్యాతి జగ్గన్నతోట ప్రభల తీర్థం జాతీయ స్థాయిలో గుర్తింపు సంతరించుకుంది. 2024లో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడం విశేషం. రాష్ట్ర శకటంగా దీనిని ఎంపిక చేశారు. గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులు ఈ తీర్థ విశేషాలను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ 2020లో మెయిల్ చేశారు. తీర్థం ప్రాముఖ్యతను మోదీ అభినందించారు. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్లే రాష్ట్ర ప్రభుత్వ శకటం మీద జగ్గన్నతోట తీర్థానికి వచ్చే ఏకాదశ రుద్రులను ప్రదర్శనకు ఉంచాలని అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయించడంతో జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించినట్టయ్యింది. రిపబ్లిక్ డే పెరేడ్లో దర్శనమిచ్చిన ఏకాదశ రుద్రులు దేశాన్ని ఆకర్షించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ వెబ్ సైట్లో ఈ తీర్థానికి సంబంధించిన విశేషాలను పొందుపరిచింది. సాక్షి, అమలాపురం/ అంబాజీపేట: పచ్చని చేలు.. కొబ్బరి తోటలు.. అందమైన పంట కాలువలు.. లోతైన మురుగునీటి కాలువలు.. వాటి మధ్య నింగిలోని ఇంద్ర ధనస్సులా కదిలాడే ప్రభలు. ఇలా ఒకేసారి అన్నింటినీ చూసేందుకు చాలవు రెండు కళ్లు. విభిన్న రంగులు.. వింతైన రూపురేఖలు.. అందమైన ఆకృతులతో 20 అడుగుల వెడల్పు.. 35 నుంచి 48 అడుగుల ఎత్తు ఉండే ప్రభలు పుర వీధుల మీదుగా గ్రామ పొలిమేరలు దాటే అరుదైన దృశ్యం చూడాలంటే కోనసీమ రావాల్సిందే. ఒకవైపు వరద గోదావరిలా పోటెత్తే భక్తులు.. మరోవైపు ఓంకార నాదాలు.. మేళతాళాలు.. బాణసంచా కాల్పులు.. ప్రభల మెడలో జే గంటల సవ్వడితో నిజమైన ఆధ్యాత్మిక అనుభూతులు పొందాలంటే కోనసీమలో జరిగే ప్రభల తీర్థాలు చూడాల్సిందే. కోనసీమలో సంక్రాంతి నుంచి మక్కనుమ తరువాత రోజు వరకూ అన్ని మండలాల్లో ప్రభల తీర్థాలు జరుగుతుంటాయి. చిన్నా పెద్దా అన్నీ కలిపి సుమారు 84 వరకూ ప్రభల తీర్థాలు నిర్వహిస్తారని అంచనా. సంక్రాంతి రోజున జరిగే తొలి ప్రభల తీర్థం కొత్తపేటదే. అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో తీర్థం కనుమ రోజు బుధవారం జరగనుంది. మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి ప్రత్యేకత ఉంది. కనుమ రోజున జరిగే తీర్థంలో 11 గ్రామాలకు చెందిన ప్రభలు ఈ తీర్థానికి తరలివస్తాయి. మొసలపల్లి భోగేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘువేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామిలు జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు ప్రభలు జగ్గన్నతోటను ఆనుకుని ఉండే ఎగువ కౌశికను దాటుకుని వచ్చే తీరు నయనానందకరంగా ఉంటుంది. తీర్థానికి చాలా మంది ఇప్పటికీ గూడు బండ్లపై రావడం సంప్రదాయమే. ఈ తీర్థానికి 50 వేల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. కాలువలను దాటుకుని.. వాకలగరువు సోమేశ్వరస్వామి, తొండవరం ఉమా తొండేశ్వరస్వామి, గున్నేపల్లి రామలింగేశ్వరస్వామి ప్రభలు 45 అడుగులు, 43 అడుగుల ఎత్తున నిర్మిస్తారు. మామిడికుదురు శివారు కొర్లగుంటలో జరిగిన ఈ తీర్థానికి సైతం అరుదైన గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రభలు పంట కాలువలు, పచ్చని పొలాల మధ్య నుంచి తరలి వస్తుంటాయి. తీర్థానికి మామిడికుదురు, నగరం, పాశర్లపూడి, ఈదరాడ, పెదపట్నం గ్రామాల నుంచి 17 ప్రభలు వస్తాయి. పెదపట్నం నుంచి 12 ప్రభలు కొర్లగుంట తీర్థానికి రావడం గమనార్హం. వీటితోపాటు అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, అయినవిల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో పలుచోట్ల ప్రభల తీర్థాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. భారీగా పోలీసు బందోబస్తు అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో ఈ నెల 15న నిర్వహించే ప్రభల తీర్థానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ వై.గోవిందరావు ఆధ్వర్యంలో 360 మంది బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పి.గన్నవరం సీఐ వై.భీమరాజు తెలిపారు. ఏడుగురు సీఐలు, 23 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, 32 మంది హెడ్ కానిస్టేబుల్స్, 230 పోలీసులు, 80 మంది హోంగార్డులను నియమించారన్నారు. ఎస్సై కె.చిరంజీవి పర్యవేక్షణలో మొబైల్ పార్టీ లు తీర్థంలో పర్యవేక్షిస్తాయన్నారు. ప్రభల నిర్వాహకులు, పోలీసులకు భక్తులు సహకరించాలన్నారు. తీర్థంలోకి ప్రభల వెంట ఎటువంటి సినీ, రాజకీయ ఫ్లెక్సీలు, బూరలను తీసుకు రావద్దన్నారు. అలా తీసుకుని వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నేడు వాహన రాకపోకల మళ్లింపు కొత్తపేట: సంక్రాంతి ప్రభల ఉత్సవం సందర్భంగా మంగళవారం కొత్తపేట గ్రామం మీదుగా వాహన రాకపోకలు నిషేధించినట్టు ఎస్సై జి.సురేంద్ర తెలిపారు. ప్రభల ఉత్సవాలు అన్ని ప్రాంతాల్లో కనుమ పండగ (బుధవారం) రోజున జరుగుతుండగా, కొత్తపేటలో మాత్రం మకర సంక్రాంతి రోజున నిర్వహించనున్న విషయం తెలిసిందే. అందువల్ల వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకూ అమలాపురం, రావులపాలెం వెళ్లే బస్సులు, ఇతర వాహనాలను దారి మళ్లించామని తెలిపారు. రావులపాలెం వైపు నుంచి అమలాపురం వెళ్లే వాహనాలన్నీ బోడిపాలెం వంతెన నుంచి వాడపాలెం, అయినవిల్లి, ముక్తేశ్వరం మీదుగా అమలాపురం వెళ్లాలని, అదే విధంగా అమలాపురం నుంచి రావులపాలెం వెళ్లే వాహనాలు పలివెల వంతెన నుంచి పలివెల, గంటి మలుపు, ఈతకోట మీదుగా జాతీయ రహదారికి రావాలని సూచించారు. అట్టహాసంగా ఉత్సవాలు జగ్గన్నతోటలో కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థంలో కొలువు తీరే ఏకాదశ రుద్రులను దర్శించుకుంటే సప్త సంతతులు కలుగుతాయి. సప్త సంతతుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త, సంతానం, కీర్తి, గృహం, ఆరోగ్యం, ఆయుష్యులు కలుగుతాయని శివ పురాణా ల్లో చెప్పబడింది. ఈ ఉత్సవాలను ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. –పుల్లేటికుర్రు సత్యనారాయణ శాస్త్రి, అర్చకుడు, మొసలపల్లి -
నయన మనోహరం..
అంబాజీపేట కొబ్బరి మార్కెట్ మామిడికుదురు: సంక్రాంతి ‘కళ’ ఉట్టిపడింది.. అహో అద్భుతహః అనేలా కట్టిపడేసింది. మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిచేలా అప్పనపల్లి శ్రీబాల బాలాజీస్వామి క్షేత్రంలో సోమవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కూచిపూడి నృత్యం, కొమ్మ దాసరి, బుడ బుక్కల, సోదెమ్మ, గంగిరెద్దుల విన్యాసాలు, విచిత్ర వేషధారణలు, కేరళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఈ సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో భోగి మంట వేసి సందడి చేశారు. 500 మీటర్ల భోగి పిడకల దండ ఊరేగింపులో భక్తులు భారీగా పాల్గొన్నారు. అనంతరం స్వామివారి సన్నిధిలో వివిధ పుష్పాలతో రూపొందించిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. -
కొక్కొరొకో.. కోఢీ
ఫ కూటమి నేతల బరితెగింపు ఫ యథేచ్ఛగా కోడిపందేలు ఫ విచ్చలవిడిగా గుండాటలు.. జూదాలు ఫ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఒప్పందాలు ఫ రూ.లక్షలు పలికిన గుండాట బోర్డులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతి పండగ సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని.. కోడి పందేలకు, జూద క్రీడలకు దూరంగా ఉండాలని.. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ పోలీసు యంత్రాంగం కొన్ని రోజులుగా హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ ఆఫ్ట్రాల్ అన్నట్టుగా ఆ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయని పందేలరాయుళ్లు.. అధికార కూటమి నేతల అండతో.. తమకు అడ్డే లేదన్నట్టుగా ‘బరి’ తెగించేశారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో షరా మామూలుగానే పందెం కోడి కాలు దువ్వింది.. కత్తి కట్టించుకుని.. తగ్గేదేలే అన్నట్లుగా బరిలో తలపడింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. మూడు రోజుల సంక్రాంతి పండగల్లో తొలి రోజయిన భోగి నాడే కోడి పందేలు, గుండాట, పేకాట, లాటరీ, జూదం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరిగిన కోడిపందేలు, గుండాటల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మొదటి స్థానంలో నిలవగా కాకినాడ జిల్లా రెండో స్థానంలో ఉంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం సుమారు 350 బరుల్లో కోడి పందేలు జరిగాయని అంచనా. ఇందులో కోనసీమ జిల్లాలోనే అత్యధికంగా 110 బరుల్లో కోడి పందేలు జరిగాయి. ఈ ప్రాంతంలో తొలి రోజు రూ.110 కోట్లుపైనే పందేలు జరిగాయని లెక్కలేస్తున్నారు. పత్తా లేని పోలీసులు సంక్రాంతికి రెండు రోజులు ముందు పోలీసులు హడావుడి చేశారు. కోడిపందేలు, గుండాటలు ఆడితే కటకటాల్లో వేస్తామని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రైవేటు లే అవుట్లలో కోడి పందేలకు సిద్ధం చేస్తున్న బరులు, టెంట్ల వంటి వాటిని పీకేశారు. తీరా చూస్తే ఈ పండగల్లో మొదటిదైన భోగి నాడే ఎక్కడికక్కడే కోడిపందేలు, గుండాటలు బహిరంగంగానే మొదలైపోయాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు పత్తా లేకుండా పోయారు. కూటమి ప్రజాప్రతినిధుల ఆదేశాలు.. ఆయా పార్టీల నేతల కనుసన్నల్లో పందేలరాయుళ్లతో ముందస్తుగా కుదిరిన ఆర్థికపరమైన ఒప్పందాలు పోలీసులను కట్టడి చేశాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీ సెట్టింగ్‌లు, ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌ను తలపించేలా గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లతో కోడి పందేలు నిర్వహించినా పోలీసు యంత్రాంగం మొత్తం చోద్యం చూస్తూ మిన్నకుండిపోయింది. కూటమి నేతల అండదండలతో.. అధికార కూటమిలోని టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు, మాజీలు, ఆ పార్టీ నేతల సమక్షంలో పందేలరాయుళ్లు చేసుకున్న ఒప్పందాలు రూ.కోట్లలోనే ఉన్నాయని అంటున్నారు. సంక్రాంతి పండగ మూడు రోజులు కోడి పందేలకు అనుమతులున్నాయంటూ పందేలరాయుళ్లు బరి తెగించారు. కూటమి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల స్వీయ పర్యవేక్షణలోనే కోళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు జరిపించారు. కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచే కోడిపందేలు, గుండాటలు హోరెత్తాయి. కోనసీమ జిల్లాలో.. ఫ అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, రామచంద్రపురం తదితర నియోజకవర్గాల్లో కోడిపందేలతో పాటు గుండాట బోర్డులు విచ్చలవిడిగా నిర్వహించారు. ఫ ఐ.పోలవరం మండలం మురమళ్లలో 10 ఎకరాల ప్రైవేటు లే అవుట్లో మూడు బరులు ఏర్పాటు చేసి మరీ భారీ హంగామాతో కోడిపందేలు, గుండాటలు జరిపించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద సహా కూటమి నేతల సమక్షంలోనే కోడిపందేలు జరిగాయి. వీటిని వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు, క్రికెట్ టోర్నమెంట్ మాదిరి గ్యాలరీలు, వీఐపీలకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్క మురమళ్ల బరుల్లోనే రూ.25 కోట్లు పైగా కోడిపందేలు జరిగాయని అంటున్నారు. గుండాటలో ఆరితేరిన పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన నిర్వాహకుడు ఇక్కడి గుండాట బోర్డును వేలంలో రూ.80 లక్షలకు పాడుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సంక్రాంతి మూడు రోజులూ గుండాట ద్వారా రూ.2 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెంట్లు, గ్యాలరీ, ఎల్ఈడీల ఏర్పాటులో చేయి తిరిగిన హైదరాబాద్‌కు చెందిన కంపెనీతో రూ.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. పండుగ మూడు రోజులు ఇక్కడి బరుల్లో రూ.75 కోట్లు పైనే పందేలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పందేల దరిదాపుల్లోకి పోలీసులు రాకుండా ఉండేందుకు రోజుకు రూ.10 లక్షల వంతున మూడు రోజులకు రూ.30 లక్షలకు ఒప్పందం జరిగిందని విశ్వసనీయంగా తెలిసింది. ఫ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో 14 బరులు ఏర్పాటయ్యాయి. ఇక్కడ తొలి రోజు సుమారు రూ.3 కోట్ల మేర పందేలు జరిగాయని అంచనా. కూటమి నేతలు కోడిపందేల కంటే గుండాట బోర్డులు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాలో.. ఫ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతలు బరి తెగించి మరీ నిస్సిగ్గుగా పార్టీ పరంగా కోడిపందేలు నిర్వహించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంప్రదాయం ముసుగులో దగ్గరుండి మరీ పిఠాపురం పట్టణంలో కోడిపందేలు ఆడించారు. నియోజకవర్గంలోని పిఠాపురం, వాకతిప్ప, పి.దొంతమూరు, గొల్లప్రోలుల్లో టీడీపీ, జనసేన నేతలు పార్టీల పేరుతో వేర్వేరుగా బరులు ఏర్పాటు చేసి, రూ.కోట్లలో పందేలు హోరెత్తించారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 30 బరులు ఏర్పాటైనట్టు లెక్క తేల్చారు. ఫ కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు బోట్‌క్లబ్ పార్క్‌లో సంప్రదాయం పేరుతో కోడి పందేలు ప్రారంభించారు. కూటమి నేతల కనుసన్నల్లోనే కాకినాడ రూరల్, కరప మండలాల్లో విచ్చలవిడిగా పందేలు జరుగుతున్నాయి. కాకినాడ రూరల్ తిమ్మాపురం, సర్పవరం గ్రామాల్లో జరుగుతున్న పందేలు రూ.7 కోట్ల వరకూ ఉంటాయని అంచనా వేస్తున్నారు. కరపలో మూడు రోజుల పాటు నిర్వహించే 60 పందేల్లో ఎక్కువ గెలిచిన వారికి బహుమతిగా రూ.25 లక్షల విలువైన తార్జీపు.. గురజనాపల్లి, గొర్రిపూడి బరుల్లో 4 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లను బహుమతులుగా ఇచ్చేందుకు సిద్ధం చేశారు. మూడు రోజుల పందేల అనంతరం విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. టీడీపీ, జనసేన విడివిడిగా బరులు ఏర్పాటు చేయగా, తొలి రోజే రూ.కోటికి పైనే చేతులు మారినట్లు అంచనా. కరప మండలంలోని కొన్ని గ్రామాల్లో టీడీపీ, కొన్ని గ్రామాల్లో జనసేన కోడిపందేలు నిర్వహించుకునేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఒక్కో బరికి రూ.లక్ష వంతున పోలీసులకు ముట్టజెప్పారని అంటున్నారు. ఫ ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పందేలు జరుగుతున్నాయి. కోడిపందేలకు ప్రసిద్ధి చెందిన వేట్లపాలెంలో ఇటీవల జరిగిన మూడు హత్యల నేపథ్యంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ కోడిపందేలకు చెక్ పడింది. మొదటి రోజున పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో రూ.2 కోట్ల వరకూ పందేలు జరిగాయి. ఫ తుని నియోజకవర్గంలో సుమారు రూ.50 లక్షల మేర కోడిపందేలు, గుండాటలు జరిగాయి. ఫ జగ్గంపేట మండలంలోని 8 బరుల్లో రోజుకు రూ.80 లక్షల వరకూ కోడి పందేలు జరుగుతున్నాయి. గోకవరం మండలం కృష్ణునిపాలెం, గోకవరం, మల్లవరం, కొత్తపల్లి గ్రామాల్లో కోడిపందేలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఒక్కో బరికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ పాటలు జరిగాయి. గోకవరంలో రూ.50 లక్షలు పైనే పలికింది. కిర్లంపూడి, వేలంక, తామరాడ, గ్రామాల్లో పెద్ద బరుల్లో తొలి రోజు రూ.60 లక్షలు, గండేపల్లి మండలంలోని 13 బరుల్లో రూ.30 లక్షల చొప్పున పందేలు జరిగాయి. -
చూసిన కనులదే భాగ్యం
ఆత్రేయపురం: కల్యాణం వైభోగం అన్నట్లు గోదాదేవి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.. చూసిన కనులదే భాగ్యం అన్నట్లు సాగాయి.. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి శ్రీభూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం గోదాదేవి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, కల్యాణం, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు భోగిమంట వేశారు. అనంతరం భక్తజన సందోహం నడుమ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. వాడపల్లి క్షేత్రంలోని విశాలమైన స్థలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గోదాదేవి, శ్రీరంగనాథుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. స్వామివారికి డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తదితర ప్రముఖులు కల్యాణ పట్టువస్త్రాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, కల్యాణాన్ని తిలకించి, మొక్కుబడులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సతీసమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. అప్పనపల్లిలో.. మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి క్షేత్రంలో కొలువు దీరిన శ్రీగోదా రంగనాథుల తిరు కల్యాణ మహోత్సవం సోమవారం రమణీయంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, కర్పూర పరిమళ సుగంధ ద్రవ్యాల నడుమ అర్చక స్వాములు గోదా రంగనాథుల కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా జరిపించారు. 200 మందికి పైగా భక్త దంపతులు కల్యాణంలో కర్తలుగా పాల్గొన్నారు. పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా రూపొందించిన మంటపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. స్వామి, అమ్మవార్ల గుణగణాలను వివరిస్తూ అర్చక స్వాములు రాయభార ఉత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు దంపతులు కర్తలుగా పాల్గొని కల్యాణ క్రతువును జరిపించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. పలువురు ప్రముఖులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తన్మయత్వం చెందారు. -
No Headline
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 16,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 15,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 15,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ముగిసిన డ్రాగన్ బోట్ పోటీలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద ప్రధాన పంట కాలువలో కోనసీమ సంక్రాంతి సంబరాల పేరిట సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ– 2025 పడవలు, స్విమ్మింగ్ తదితర పోటీలు సోమవారంతో ముగిశాయి. కేరళ తరహాలో పచ్చని చెట్లు, పంట కాలువలతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే గోదావరి పరీవాహక కోనసీమ ప్రాంతంలో మూడు రోజుల పాటు ఆయా పోటీలు విశేషంగా అలరించాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఏపీ పర్యాటక శాఖ పర్యవేక్షణలో గౌతమి– వశిష్ట నదుల మధ్య సెంట్రల్ డెల్టా ప్రధాన పంట కాలువలో మూడు రోజులపాటు జరిగిన డ్రాగన్ బోటు, ఈత పోటీలు, అదే ప్రాంతంలో రంగవల్లులు, గాలిపటాల పోటీలు ఉత్కంఠగా సాగాయి. విజేతలు వీరే.. ఆర్థర్ కాటన్– సంక్రాంతి సంబరాలు, గోదావరి ట్రోఫీ 2025 డ్రాగన్ బోట్ ఫైనల్ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు టీమ్‌లు పోటీ పడగా, జంగారెడ్డిగూడెం జైంట్స్, పల్నాడు తండర్స్ హోరా హోరీగా తలపడి సమాంతరంగా గమ్యానికి చేరుకున్నాయి. దానితో న్యాయ నిర్ణేతలు ఆ రెండు జట్లకు మొదటి బహుమతి ప్రకటించారు. ఆ మేరకు రూ.లక్ష నగదు చొప్పున, ట్రోఫీ, సర్టిఫికెట్లు, తృతీయ స్థానంలో నిలిచిన ఎన్టీఆర్ ఈగల్స్ టీమ్‌కు రూ.30 వేల నగదు, ట్రోఫీ, సర్టిఫికెట్ అందజేశారు. ● రంగవల్లుల పోటీల్లో ఎ.అమ్మాజీ (రావులపాలెం) మొదటి బహుమతి రూ.10 వేలు, ఫ్రిజ్, కె.సృజన (ఈతకోట) రెండో బహుమతి రూ.7500, మిక్సీ, టి.ఆదిశ్రీ (రాజమహేంద్రవరం) మూడో బహుమతి రూ.5 వేలు, కుక్కర్ అందించారు. మిగతా వారికి ప్రోత్సాహకాల కింద రూ. వెయ్యి, పతకం, సర్టిఫికెట్ అందజేశారు. ● సీనియర్స్ పతంగుల పోటీల్లో ఎం.సీతారామరాజు (ఊబలంక) ప్రథమ స్థానంలో నిలిచి రూ.4,500, ఆర్.చంటి (ఉచ్చిలి) ద్వితీయ స్థానంలో నిలిచి రూ.3,500, వి.శాంతరాజు (ఆత్రేయపురం) తృతీయ స్థానంలో నిలిచి రూ.2,500, ఎ.శ్రీనివాసు (అంకంపాలెం) నాలుగో స్థానంలో నిలిచి రూ.2500 బహుమతి గెలుచుకున్నారు. జూనియర్స్ పతంగుల పోటీల్లో వరుసగా ఎం.ప్రణీత్ వర్మ (హైదరాబాద్), ఎం.దుర్గా సుబ్రహ్మణ్యం (ఆత్రేయపురం), ఎ.పూజితాదేవి(రాజోలు), టి.సన్నీ (కొత్తపేట) బహుమతులు సాధించారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, డీసీసీబీ మాజీ డైరెక్టర్ ఆకుల రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, వాడపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, టీడీపీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు, కంఠంశెట్టి శ్రీనివాసరావు, ముళ్లపూడి భాస్కరరావు, తహసీల్దార్ టీవీ రాజేశ్వరరావు, ఎంపీడీఓ వెంకటరమణ, ఈవెంట్ ఆర్గనైజర్ దండు శివ తదితరులు పాల్గొన్నారు. విజేతలుగా జంగారెడ్డిగూడెం, పల్నాడు టీమ్‌లు తృతీయ స్థానంలో ఎన్టీఆర్ ఈగల్ -
మద్య ప్రవాహం
వీకే రాయపురంలో అక్కడక్కడ చిన్న సోడా కొట్లు, పచారీ దుకాణాలు, అటుకుల మిల్లులు కనిపించాయి. కానీ, గ్రామంలో మూడు వైపులా మూడు బెల్ట్ షాపులు మాత్రం దర్శనమిచ్చాయి. ఇది వరకు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరాన ఉండూరు రైల్వే జంక్షన్లో ఒకే ఒక్క మద్యం దుకాణం ఉండేది. దూరంగా ఉండటంతో మద్యపాన ప్రియులు రెండు రోజులకోసారి అక్కడకు వెళ్లి మద్యం తాగేవారు. మళ్లీ అంత దూరం వెళ్లలేక ఆగిపోయేవారు. అటువంటిది ఇప్పుడు ఈ గ్రామంలోనే నాలుగడుగులేస్తే బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. రోజంతా కష్టపడితే ఏడెనిమిది వందల రూపాయలు వస్తూంటే అందులో సగం మద్యానికి తగలేస్తున్నారని అప్పలకొండ తదితరులు ఆవేదనతో చెప్పారు. వియ్ ఆర్ టాకింగ్ ఇన్ ఇంగ్లిష్ సత్యవరపుపేట నుంచి తిరిగి వీకే రాయపురం సెంటర్‌కు వస్తూండగా మార్గం మధ్యలో ఇద్దరు చిన్నారులు కనిపించి హలో గుడాఫ్టర్నూన్ సార్ అంటూ చిరునవ్వుతో పలకరించారు. వీరు సత్యవరపుపేటకు చెందిన వ్యవసాయ కూలీలు పైలా తలుపులయ్య, రాణి దంపతుల కుమార్తెలు హాసిని, వేగవర్షిణి. ఈ ఇద్దరూ ఎంపీపీ స్కూల్లో 5, 3 తరగతులు చదువుతున్నారు. జగనన్న మా స్కూల్లో పిల్లలకు నేర్పించిన ఇంగ్లిషుతోనే ఇలా మాట్లాడుతున్నామని వారు చెబుతున్నప్పుడు వారి కళ్లల్లో ఒకింత ఆనందం కనిపించింది.