breaking news
Telangana
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో తనకు సిట్ విచారణపై నమ్మకం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదట బయటపెట్టింది తానే అని సంజయ్ చెప్పుకొచ్చారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేంద్రమంత్రి బండి సంబయ్ బయలుదేరారు. ఈ సందర్బంగా బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నన్ను విచారణకు పిలిచారు.. వెళ్తున్నాను. నా దగ్గరున్న సమాచారాన్ని సిట్‌కు అందజేస్తాను. బాధ్యత గల పౌరుడిగా నేను వెళుతున్నాను. సిట్ విచారణపై నాకు నమ్మకం లేదు. ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదట బయటపెట్టింది నేనే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి క్షణం నా ఫోన్ ట్యాప్ చేశారు. ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే నన్ను దెబ్బతీయాలని అనేక కుట్రలు చేశారు. మిగిలిన విషయాలు సిట్ విచారణ అనంతరం మాట్లాడతాను’ అని తెలిపారు.మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక, బీజేపీ ఈ వ్యవహారాన్ని.. జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తోంది. కేంద్ర నిఘా వర్గాల నుండి కీలక సమాచారాన్ని కూడా బండి సంజయ్ సేకరించినట్టు తెలుస్తోంది. నిఘా వర్గాలు సైతం సంజయ్ ఫోన్‌ను అత్యధికంగా ట్యాప్ చేసినట్టు నిర్ధారించారని సమాచారం. ఇక, ఈరోజు బండి సంజయ్‌తో పాటుగా.. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్, పీఆర్వో పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా సిట్ విచారణకు హాజరు కానున్నారు. -
ఘోష్ కమిషన్.. కాంగ్రెస్ దారెటు.. బీజేపీ కోర్టులోకి బంతి?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘట్టంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. బ్యారేజీ దెబ్బతిన్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 16 నెలలు విచారణ చేసి ఒక నివేదిక సమర్పించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావులతో పాటు పలువురు అధికారుల పాత్రను తప్పుపట్టింది.అలాగే ప్రస్తుతం బీజేపీ ఎంపీ, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కూడా ఆక్షేపించింది. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తదితర మంత్రుల సమక్షంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికలోని ముఖ్యమైన అంశాల సారాంశాన్ని ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేసీఆర్ తన పార్టీ నేతల సమావేశంలో ఒక వ్యాఖ్య చేస్తూ అది కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. ఈ నివేదిక పేరుతో కొన్ని అరెస్టులు కూడా జరగవచ్చని ఆయన అంచనా వేశారు. తదుపరి హరీష్ రావు బీఆర్ఎస్ పక్షాన మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కమిషన్ చేసిన అబ్జర్వేషన్స్‌ను తప్పుపట్టారు. హరీష్ అలా చేయడం న్యాయ వ్యవస్థను కించపరచడమేనని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ వాద ప్రతివాదాలలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నదానిపై ఇప్పటికిప్పుడే ఒక అభిప్రాయానికి రాలేము.ఈ సందర్భంలో గతంలో ఆయా ప్రభుత్వాలపై వేసిన కమిషన్లతో ఎవరికి ఇబ్బంది కలగలేదనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవ్వరూ ఈ తరహా కేసులు ఎదుర్కోలేదు. చలన చిత్రాభివృద్ది సంస్థ అవకతవకలకు సంబంధించి జరిగిన కమిషన్ విచారణకు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి హాజరయ్యారు. కమిషన్ నివేదికలో ఆయనను తప్పు పట్టలేదు. ఒక భూ సేకరణ స్కాంలో విచారణ జరుగుతున్న సమయంలోనే ఇంకో మాజీ సీఎం స్టే పొందారు. విభజన తర్వాత ఏపీలో రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబే విచారణ సంఘాన్ని నియమించుకున్నారు. అందులో ఆయనను కమిషన్ ఆక్షేపించలేదు. ఇప్పుడు కేసీఆర్ ఈ విచారణ సంఘం నివేదికను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. రేవంత్ ప్రభుత్వం ఆయనపై కేసు పెడుతుందా? అరెస్టు చేస్తారా?.ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కాంలపై దర్యాప్తు జరిపించి అంతకుముందు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టింది. కొన్ని కేసుల్లో ఆయన బెయిల్ తెచ్చుకోగా, ఒక కేసులో అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో అప్పుడే చెప్పలేం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆ అనుభవం రీత్యా కేసీఆర్‌ను కూడా అరెస్టు చేస్తారా అన్న చర్చ ఉన్నప్పటికీ తాము కక్ష రాజకీయాలు చేయబోమని అంటున్నారు. పైగా కేసీఆర్‌కు ఫాం హౌసే ఒక జైలు అని, వేరే జైలు ఎందుకు అని వ్యాఖ్యానించి అరెస్టు జరగక పోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ఇది ఒక్క కేసీఆర్‌కే వర్తిస్తుందా? హరీష్ రావు, ఇతర అధికారులకు కూడా వర్తిస్తుందా అన్నది చెప్పలేం. మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు ఇచ్చి కుంగిన ఘటన కేసీఆర్, హరీష్‌రావులకు, బీఆర్ఎస్కు అప్రతిష్ట తెచ్చిందన్నది వాస్తవం.అదే సమయంలో కేసీఆర్ లక్ష్య శుద్ధితోనే కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పించారని చెప్పాలి. కాకపోతే నిర్మాణం వేగంగా చేయాలన్న తొందరపాటులో ఆయన తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు దారి తీసి ఉండవచ్చునని అనిపిస్తుంది. కమిషన్ పరిశీలనల్లో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. కాళేశ్వరం నిర్మాణంపై ప్రభుత్వ స్థాయిలో కాకుండా, కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నది ఒకటి. మంత్రివర్గం నుంచి పాలనాపరమైన అనుమతులు తీసుకోలేదన్నది ఇంకో పరిశీలన. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పి, బరాజ్‌ను మేడిగడ్డకు మార్చడంలో నిజాయితీ కొరవడిందన్నది మరో వ్యాఖ్య. మేడిగడ్డ వద్ద నిర్మాణానికి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ వ్యతిరేకత తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే యత్నం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ తప్పుడు డిజైన్లు ఇచ్చిందన్నది వేరొక ఆరోపణ. అధిక వడ్డీకి రూ.84 వేల కోట్ల అప్పు చేయడాన్ని కూడా తప్పు పట్టారు. ఈ విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. శాసనసభలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు.ఘోష్ కమిషన్ నివేదికను ఆధారం చేసుకుని బీఆర్ఎస్పై కాంగ్రెస్ దాడి పెంచింది. అయితే, వెంటనే ఏం చేయాలన్న దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయింది. అసెంబ్లీలో ఎటూ ఈ నివేదికను పెడతారు. అందులో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు తమ వైఖరికి అనుగుణంగానే మాట్లాడుతారు తప్ప కొత్తగా చెప్పేది ఉంటుందా అన్నది సందేహం. అయినా అసెంబ్లీలో చర్చించడం మంచిదే. ఈ నివేదికలో కొంతమంది కీలక అధికారుల పాత్ర గురించి విస్మరించారన్న వాదన ఉంది. ప్రస్తుత సీఎస్‌గా ఉన్న రామకృష్ణారావు జోలికి కమిషన్ వెళ్లలేదని చెబుతున్నారు. బారేజ్ను మేడిగడ్డకు మార్చడం వల్ల ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని కమిషన్ అభిప్రాయపడిందని కథనం. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన దాదాపు లక్ష కోట్ల వ్యయం వృథా అయినట్లే అన్నట్లు ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తుండడం విశేషం. ఈ ప్రాజెక్టులో మరో రెండు బారేజీలు, కాల్వలు, టన్నెల్స్ తవ్వకం, రిజర్వాయర్ల నిర్మాణం వంటివి కూడా ఉన్న విషయాన్ని ప్రజలలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని అనిపిస్తుంది.స్థల ఎంపికపై నిపుణుల కమిటీ అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో కేసీఆర్ వివరించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్లనిచ్చిందన్న ప్రశ్న వస్తుంది. పైగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు ప్రశంసించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పఢ్నవీస్ స్వయంగా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరై కేసీఆర్‌ను మెచ్చుకున్నారు. మరో పాయింట్ ఏమిటంటే ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా, కాళేశ్వరం సబ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టును సమర్థించినట్లే కదా!. దానిపై ఏం చెబుతారు?. ప్రాణహిత-చేవెళ్లకు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చిన ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మాణం చేసి ఘనత తెచ్చుకోవాలన్న క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కొన్ని తప్పులు కూడా చేసినట్లు అర్దం అవుతుంది.అయితే, అవి పెద్ద తప్పులా? కాదా? అన్నది పరిశీలించాలి. ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.. అది కూడా మంచిదే. మామూలుగా అయితే ఈ నివేదిక ఆధారంగా కేసులు పెట్టి ఉండవచ్చు. కానీ, అలా చేయకుండా అసెంబ్లీలో చర్చిస్తామని చెబుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ప్రాజెక్టుపై విచారణకు సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం అలా చేస్తుందా? అన్నది ఒక ప్రశ్న. తద్వారా ఈ బాల్‌ను బీజేపీ కోర్టులో వేస్తుందా? అలా జరిగితే కాంగ్రెస్ చేతిలో ఒక ఆయుధం పోయినట్లు అవుతుంది. కనుక ఆ పని చేయకపోవచ్చు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి ఇంతకాలమైనా ప్రభుత్వం మరమ్మతులకు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ప్రాజెక్టు నిరర్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఉన్న ప్రాజెక్టును వినియోగించుకుంటూనే ప్రభుత్వం తదుపరి చర్యలకు వెళ్లితే మంచిదే.ఇక మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వాదన కూడా సమర్థంగానే ఉందని చెప్పాలి. ఇది ఏకపక్ష నిర్ణయం కాదని, అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందని ఆయన అంటున్నారు. కేబినెట్ ఆమోదం కూడా ఉందన్నది ఆయన వాదన. మొత్తం 665 పేజీల రిపోర్ట్ కాకుండా సంక్షిప్త నివేదికను బహిర్గతం చేస్తే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత సరిపడా లేదని కేంద్ర జల సంఘమే చెప్పిందని హరీష్ రావు వివరిస్తున్నారు. మరి కమిషన్ తన నివేదికలో అందుకు విరుద్దంగా ఎలా పెట్టిందో తెలియదు. అలాగే మంత్రివర్గ ఆమోదం ఉందన్న హరీష్ వాదనకు కేబినెట్ తీర్మానాలు చూపించాల్సి ఉంటుంది. అసెంబ్లీలో చర్చ జరిగిన మాట అయితే వాస్తవం. దానిని కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదా అన్నది చూడాలి. ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ ఉదంతం బీఆర్ఎస్కు నష్టం చేసింది.ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలడం, పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిన ప్రమాదం వంటి వాటిని ఈ సందర్భంగా హరీష్, కేటీఆర్ తదితరులు ప్రస్తావిస్తున్నారు. గుజరాత్లో ఒక వంతెన కూలిన ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన ఉదంతాన్ని కూడా ఉటంకిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే దానిని ముఖ్యమంత్రికి అంటగడితే, ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు రేవంత్, ఉత్తమ్ కుమార్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైతే మరీ తీవ్రమైన చర్య తీసుకుంటుందా అన్నది సందేహమే. రాజకీయంగా తమకు ప్రయోజనం అనుకుంటేనే అలా చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ మాత్రం డిఫెన్స్ నుంచి అఫెన్స్ వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.అందుకే కేసీఆర్ దీనిని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అని ధ్వజమెత్తితే, కేటీఆర్ ఈ నివేదిక ఒక ట్రాష్ అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా.. ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటనే ఆ బారేజీకి రిపేర్లు చేయించి, నీటిని ప్రజలకు అందుబాటులోకి తేవడం ఉపయుక్తం అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అఫీషియల్: ఆ పార్టీలోకే గువ్వల బాలరాజు
బీఆర్ఎస్ మాజీ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజుల కిందటే ఆయన గులాబీ పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంపై ఇవాళే స్పష్టత వచ్చింది. బీజేపీలో చేరబోతున్నారని అధికారిక సమాచారం. సాక్షి, హైదరాబాద్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన తమ పార్టీలో చేరబోతున్నారని రామచందర్‌రావు ప్రకటించారు. నియోజకవర్గ, జిల్లా ప్రజలు, కార్యకర్తలతో చర్చించాకే బాలరాజు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.2007 అక్టోబరు 6న బీఆర్ఎస్లో చేరారు గువ్వల బాలరాజు. 2009లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్) తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో, 2018లో రెండు పర్యాయాలు అచ్చంపేట(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2022 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న ఆయన అనూహ్యంగా రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాశమైంది.రాజీనామా సమయంలోనే ఆయన బీజేపీ అధిష్టానం నుంచి భరోసా ఇవ్వడంతోనే ఆయన బీఆర్ఎస్ను వీడినట్లు చర్చ జరిగింది కూడా. అటుపై ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ తీవ్రంగా విఫలమైందంటూ బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. -
భార్యపై ఇన్‌స్టాలో భర్త అసభ్య పోస్టులు.. నవవధువు ఆత్మహత్యాయత్నం
సాక్షి, రాంగోపాల్‌పేట్: ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసికున్నారు. మూడు నెలలకే భార్యపై అనుమానం పెంచుకున్న అతను ఇన్‌స్ట్రాగామ్‌లో అసభ్యంగా పోస్టులు పెడుతుండటంతో మనస్తాపానికి లోనైన నవవధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రాంగోపాల్‌పేట్ గైదీన్‌బాగ్‌కు చెందిన కీర్తి, రామంతపూర్‌కు చెందిన భీమ్రాజ్ ప్రేమించుకున్నారు. మే 8న పెద్దలను ఎదిరించి సైదాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే ఇటీవల అత్తింటి వారు కట్నం కోసం వేధిస్తుండటంతో ఆమె పుట్టింటికి తిరిగి వచ్చింది. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చారు.ఆ తర్వాత ఆమె మళ్లీ అత్తారింటికి వెళ్లగా మళ్లీ అదే పరిస్థితి ఎదురు కావడంతో ఆమె తిరిగి పుట్టింటికి వచ్చింది. రెండు రోజుల క్రితం తాను గర్భవతి అని తెలియడంతో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అయితే ఆ బిడ్డ తనకే పట్టాడని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించడంతో మనస్తాపానికి లోనైన కీర్తి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాంగోపాల్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రహదారి విస్తరణకు కేంద్రం ప్రణాళికలు
సాక్షి, న్యూఢిల్లీ: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వాహనాల రద్దీని తగ్గించేందుకు.. మాస్టర్ ప్లాన్ ఆధారంగా లింక్ రోడ్ల నిర్మాణం అవసరమవుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో నివాసితులు.. మున్సిపల్ కార్పొరేషన్లను లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలంటూ కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అయితే పట్టణ ప్రణాళిక బాధ్యత రాష్ట్రాలకే ఉందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు గురువారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ డీకే అరుణ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.రాష్ట్రాల సహాయార్థంగా కేంద్రం అమృత్ పథకం ద్వారా పలు పట్టణాల్లో ఏఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ తయారీకి నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 461 పట్టణాల్లో ఈ పనులు చేపట్టగా, తెలంగాణలో 12 నగరాల్లో ఏఐ డేటాబేస్ సిద్ధమవగా.. వాటిలో 10 మాస్టర్ ప్లాన్లు రూపుదిద్దుకున్నాయి. కాగా, ఇప్పటి వరకు కేవలం మూడు మాస్టర్ ప్లాన్లకే అధికారిక అనుమతి లభించిందని వెల్లడించారు. అమృత్ 2.0 లో రెండో స్థాయి పట్టణాలు (జనాభా 50,000 నుంచి 99,999 మధ్య) కూడా మాస్టర్ ప్లాన్ల పరిధిలోకి వచ్చాయి.అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క పట్టణం కోసం కూడా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగలేదని కేంద్ర మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారంగా లింక్ రోడ్ల నిర్మాణం కీలకమవుతుందని, అందుకు ప్రణాళికల దశ నుంచే సమగ్రంగా ముందుకు సాగాలని సూచించారు. ‘వికసిత భారత్ – 2047‘ లక్ష్యంతో పట్టణాలలో జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినట్టు మంత్రి స్పష్టం చేశారు. -
తెలంగాణలో 1.5 కోట్లకు పైగా ఉపాధి అవకాశాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి.. కేంద్రం అమలు చేస్తున్న విధానాల ఫలితంగా ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్’ ప్రారంభమైన 2020 జూలై 1 నుంచి 2025 జూలై 31 వరకు.. తెలంగాణలో నమోదైన ఎంటర్‌ప్రైజ్‌ల ద్వారా 1.59 కోట్ల మందికి ఉపాధి లభించిందని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ వెల్లడించింది.గురు వారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. ఈ ఐదేళ్ల కాలంలో నల్లగొండ జిల్లాలో 5.92 లక్షల మందికి, సూర్యాపేట జిల్లాలో 5.44 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. వెనుకబడిన జిల్లాల్లో ఆంట్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. పశుపోషణ, డెయిరీ, పౌల్ట్రీ, ఆక్వాకల్చర్, తేనె పరిశ్రమలు వంటి సంప్రదాయ రంగాలు కూడా పీఎంఈజీపీ పథకంలో భాగంగా అంగీకరించామని, అన్ని రాష్ట్రాల్లోనూ, వెనుకబడిన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. -
ఏ క్షణంలోనైనా సింగూరుకు గండి!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం, పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగు, తాగునీటిని సరఫరా చేసే సింగూరు జలాశయానికి తక్షణమే మరమ్మతులు నిర్వహించకపోతే ఏ క్షణంలోనైనా జలాశయం తెగిపోయి దిగువ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరగనుందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్ఆర్పీ) హెచ్చరించింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ సభ్యులు, డిజైన్స్ విభాగం నిపుణుడు అశోక్‌కుమార్ గంజు నేతృత్వంలో సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు యోగిందర్‌కుమార్ శర్మ, హైడ్రాలజిస్ట్/నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ పి.రామరాజు, జీఎస్ఐ మాజీ డీజీ ఎం.రాజు, డ్యామ్ గేట్ల నిపుణుడు ఎన్.కన్హయ్య నాయుడుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఎస్ఆర్పీ మార్చి 23న సింగూరు జలాశయాన్ని సందర్శించి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. సామర్థ్యానికి మించి నీటి నిల్వలతో.. ‘సింగూరు జలాశయానికి ఎగువ మట్టి కట్టల (అప్‌స్ట్రీమ్ ఎర్త్ డ్యామ్)కు రక్షణగా రాళ్లతో ఏర్పాటు చేసిన రివిట్‌మెంట్‌తోపాటు మట్టి కట్టలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల అప్‌స్ట్రీమ్ వంపునకు రక్షణగా ఏర్పాటు చేసిన రివిట్మెంట్ దెబ్బతింది. వాస్తవ డిజైన్ల ప్రకారం జలాశయంలో నీటినిల్వలు 517.8 మీటర్లకు మించకుండా నిర్వహించాలి. దీనికి విరుద్ధంగా మిషన్ భగీరథ అవసరాల కోసం 520.5 మీటర్లకు తగ్గకుండా నిల్వలను నిర్వహించాలని 2017 అక్టోబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో 885 జారీ చేసింది. కొన్నేళ్లుగా సామర్థ్యానికి మించి 522 మీటర్ల మేర నిల్వలను కొనసాగిస్తుండటంతో జలాశయం తీవ్రంగా దెబ్బతింది. అప్‌స్ట్రీమ్ రివిట్మెంట్కు మరమ్మతులు నిర్వహించి పూర్వ స్థితికి పునరుద్ధరించకపోవడం వల్ల జలాశయం కట్టలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. అత్యవసరంగా రివిట్‌మెంట్‌కి మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించకపోతే ఏ క్షణంలోనైనా మట్టి కట్టలకు గండిపడి లోతట్టు ప్రాంతాలను ముంచేస్తుంది. సింగూరుకు దిగువన ఉన్న మంజీర, నిజాంసాగర్ జలాశయాలతోపాటు పెద్ద సంఖ్యలో ఉన్న చెక్‌డ్యామ్‌లూ తెగిపోయి నష్టం తీవ్రత మరింత పెరగొచ్చు’అని నిపుణుల ప్యానెల్ నివేదికలో హెచ్చరించింది. మరమ్మతులకు అనుమతించండి.. వర్షాకాలం ముగిశాక జలాశయంలో నీటి నిల్వను తగ్గించి అప్‌స్ట్రీమ్ రివిట్మెంట్కు మరమ్మతులు నిర్వహించి పూర్వ స్థితికి పునరుద్ధరించేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల ప్యానెల్ సూచించింది. మట్టికట్టల రక్షణ కోసం కట్టిన పారాపెట్ వాల్ ఒకచోట కుంగిపోయి నిలువనా చీలినందున గ్రౌటింగ్‌తో చీలికలను పూడ్చాలని సూచించింది. జలాశయంలో 97 శాతం నిల్వలు పూర్తిగా గేట్లపై ఆధారపడినందున గేట్ల నిర్వహణకు నిరంతరం పూర్తి సంసిద్ధతతో ఉండాలని సూచించింది. ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం.. మంజీరా నదీపై 29.91 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1989లో నిర్మించిన సింగూరు జలాశయం ఏటా హైదరాబాద్‌కు 6.96 టీఎంసీల తాగునీటిని సరఫరా చేస్తోంది. మంజీరా, మహబూబ్‌నగర్, ఫతేహ్ నహర్, నిజాంసాగర్‌లకు అవసరమైన నీటిని నిల్వ చేసి వాటికి అవసరమైనప్పుడు విడుదల చేస్తోందని ప్యానెల్ తెలిపింది. ఈ క్రమంలో మార్గమధ్యంలోని ఎన్నో చెక్‌డ్యామ్‌లను నింపుతూ కనీసం 7 కరువుపీడిత జిల్లాలకు జీవనాడిగా సేవలందిస్తోందని పేర్కొంది. గోదావరి నదీ సబ్ బేసిన్–4 పరిధిలోని తీవ్ర కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటిని సరఫరా చేసే మేజర్ ప్రాజెక్టు సింగూరుకు విపత్తు సంభవిస్తే ప్రాణ, ఆస్తినష్టంతోపాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. 2016, 2019, 2024లలో జలాశయానికి తనిఖీలు చేసి స్పిల్‌వే, ఎర్త్ డ్యామ్, గ్యాలరీలకు తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని నివేదికలు ఇవ్వగా ఇప్పటివరకు చేయలేదని ప్యానెల్ తేలి్చంది. -
బీసీ రిజర్వేషన్లను తగ్గించే కుట్ర: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్‌ను 32 శాతానికి తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు బీసీలను అణగదొక్కే కుట్రలో భాగమని ఆరోపించారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ సీట్లలో 31 మంది నాన్–బీసీలు గెలవడం ఏమిటని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఒవైసీ బీసీనా? బీసీలకు రిజర్వు చేసి మజ్లిస్ చేతుల్లో పెట్టడం ద్వారా న్యాయం జరుగుతుందా?’అని కిషన్‌రెడ్డి నిలదీశారు. రాష్ట్రంలో జరిగిన బీసీ లెక్కల సర్వేను తూతూ మంత్రంగా నిర్వహించారని, హైదరాబాద్ నగరంలో 25 శాతం ఇళ్లలోకి వెళ్లకుండా సర్వే ముగించారని ఆరోపించారు. బీసీ జనాభాను తక్కువగా చూపించి రిజర్వేషన్లను తగ్గించాలన్న కుట్రలో భాగంగానే ఇది జరిగిందని ధ్వజమెత్తారు. ఈ కుట్రలను బీసీలు గుర్తించాలని కోరారు. నాడు బీఆర్ఎస్.. నేడు కాంగ్రెస్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మతపరమైన రిజర్వేషన్ల కోసం రాజకీయ నాటకాలు ఆడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 12 శాతం ముస్లిం రిజర్వేషన్ల కోసం కుట్రలు చేసినట్టే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ‘ఇదేనా మీ తెలంగాణ మోడల్? బీసీలను మోసం చేయడమే మోడలా?’అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వమే బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిందని తెలిపారు. రాహుల్‌గాందీని ప్రధానిని చేస్తామన్న సీఎం రేవంత్ ప్రకటనను కిషన్‌రెడ్డి కొట్టిపారేశారు. ‘మీరు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనైనా గెలవండి. మోదీని గద్దె దించుతామన్న మీ గొప్పలు సూర్యుడిపై ఉమ్మేసినట్టే. అది మీ మీదే పడుతుంది’అని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతిపై రాష్ట్ర మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి ఖండించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేమే ప్రత్యామ్నాయం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఇప్పటికే పశ్చాత్తాపం చెందుతున్నారని, రాబోయే ఎన్నికల్లో అవినీతి బీఆర్ఎస్, చేతకాని కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని ప్రజలు ఆశిస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. అధికారం కోసం అలవిగాని హామీలిచ్చి, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తోందని ఆరోపించారు. -
నిబంధనలు పాటించినందుకు శ్రావణం చీర
గోదావరిఖని(రామగుండం): మహిళా బైక్‌రైడర్లకు ట్రాఫిక్ పోలీసులు శ్రావణం చీర కానుక ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించిన మహిళలకు చీర, జాకెట్ అందజేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా వద్ద గురువారం పోలీసులు ప్రత్యేక తనిఖీ చేపట్టారు. హెల్మెట్ ధరించి.. నిబంధనలకు అనుగుణంగా బైక్ డ్రైవ్ చేస్తున్న మహిళలను గుర్తించి చీరలు అందజేసి సత్కరించారు. ట్రాఫిక్ చలాన్లు, డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ పార్కింగ్ ఫైన్లే కాదు.. నిబంధనలు పాటించే వారిని గుర్తించి గౌరవిస్తామని రామగుండం ఏసీపీ సీహెచ్.శ్రీనివాస్ స్పష్టం చేశారు. మొదటి దఫాగా పదిమంది మహిళలను గుర్తించి చీరలు అందజేసినట్లు తెలిపారు. భర్త హెల్మెట్‌తో బైక్ నడుపుతుంటే.. వెనకాల కూర్చున్న భార్యకు కూడా చీర, జాకెట్ అందజేసి.. హెల్మెట్ పెట్టుకునేలా ప్రోత్సహించాలని ఏసీపీ కోరారు. బట్టల దుకాణాల యజమానుల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తామని వివరించారు. గతంలో పూలు అందజేసి అభినందిస్తే చాలామంది బాధపడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలకు చీర, జాకెట్, బైక్ నడిపే పురుషులకు ప్యాంట్, షర్ట్ దాతల సహకారంతో అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్ఐ హరిశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
పైసలు కడితేనే ప్రవేశం
కే.నవీన్ కుమార్ అనే ఎస్సీ కేటగిరీ విద్యార్థి టీజీఈఏపీసెట్–2025లో ర్యాంకు సాధించి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సాధించాడు. మూడు రోజుల క్రితం కాలేజీలో రిపోర్టు చేసేందుకు వెళ్లాడు. నూరుశాతం ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందన్న ధీమాతో వెళ్లిన అతడికి కాలేజీ యాజమాన్యం మాటలతో దిమ్మ తిరిగి పోయింది. ట్యూషన్ ఫీజు, ఇతర నిర్వహణ ఫీజులు కలిపి రూ.1.25 లక్షలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం తేల్చిచెప్పింది. తనకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని చెప్పినప్పటికీ..ఆ డబ్బు విద్యార్థి వ్యక్తిగత ఖాతాలోనే జమ చేస్తారని, ఇప్పుడు ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేయడంతో దిక్కు తోచని స్థితిలో పడిపోయాడు. సీటును కాపాడుకొనేందుకు అప్పుచేసి ఎలాగోలా ట్యూషన్ ఫీజు చెల్లించాడు.మాసాబ్‌ట్యాంక్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ – సైఫాబాద్‌లో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతన్న ఎస్సీ విద్యారి్థకి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అర్హత ఉన్నప్పటికీ.. మూడు సంవత్సరాలకు సంబంధించిన ట్యూషన్ ఫీజు రూ.75వేలు (ఏటా రూ.25 వేల చొప్పున) చెల్లించాలని కాలేజీలో ఆదేశించింది. ఫీజు చెల్లించకపోతే క్లాసులకు అనుమతించబోమని స్పష్టం చేసింది. త్వరలో జరిగే సెమిస్టర్ పరీక్షల హాల్ టిక్కెట్లు కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సదరు విద్యారి్థ.. ఫీజు డబ్బుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) విద్యార్థులకు పోస్టుమెట్రిక్ ఫీజుల చెల్లింపుల విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మార్పులు వారి నెత్తిన పిడుగుపాటుగా మారాయి. ఎస్సీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తించినప్పటికీ.. వారు పూర్తి ఫీజును ముందుగా చెల్లిస్తేనే కాలేజీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. రెండు, మూడో సంవత్సరం ట్యూషన్ ఫీజులను సైతం విద్యా సంవత్సరం మొదట్లోనే వసూలు చేస్తున్నాయి. లేదంటే తరగతులకు అనుమతించటం లేదు. ప్రైవేటు కాలేజీలతోపాటు ప్రభుత్వ కాలేజీలు కూడా ఇదే కండిషన్లు పెడుతుండటంతో విద్యార్థులు వేలు.. లక్షల రూపాయలు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు. ఫీజుల కోసం అప్పులపాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. వీరిలో ఎస్సీ విద్యార్థులు 2 లక్షల మంది వరకు ఉంటారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులు 1,22,205 (రెన్యూవల్స్), 77,722 (ఫ్రెషర్స్) దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు విద్యార్థులు 45 వేల మంది ఉన్నారు. జనరల్ కోర్సుల ఫీజులు రూ.వేలల్లో ఉండగా.. ఇంజనీరింగ్, వృత్తివిద్యా కోర్సుల ఫీజులు రూ.లక్షలకు చేరాయి. ఇంత పెద్దమొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని కాలేజీలు ఒత్తిడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర భారంగా మారుతోంది. చదువును కొనసాగించాలంటే తప్పనిసరిగా అప్పులు చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఇవ్వాలని వేడుకున్నా.. కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకోటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనల మార్పుతో మొదటికే మోసం.. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వాలు మార్పులు తీసుకొచ్చాయి. ఎస్సీ విద్యార్థుల ఫీజులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో చెల్లిస్తున్నాయి. గతంలో కేంద్రం తన వాటా ఫీజు నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కలిపి కాలేజీలకు నేరుగా చెల్లించేది. ఈ విధానాన్ని మార్చి ఫీజులో తన వాటాను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకే బదిలీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.ఆ మేరకు విద్యార్థి వివరాలను ఈపాస్ ద్వారా లింక్ చేసుకుని నిధులు విడుదల చేస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా ఫీజును విద్యార్థి ఖాతాలోనే జమ చేస్తోంది. ఈ పథకం ప్రయోజనాలను లబి్ధదారులకు నేరుగా అందించేందుకే ఈ మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఫీజు విద్యార్థి ఖాతాలో జమ కావటానికి కొంత సమయం పడుతుంది. ఫీజు బ్యాంకు ఖాతాలో జమ అయిన తర్వాత దానిని విద్యార్థి నుంచి కాలేజీలు తీసుకోవాలి. కానీ, అప్పటివరకు ఆగకుండా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఫీజు మొత్తం వసూలు చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. -
తల్లి తీరు నచ్చక కొడుకు ఆత్మహత్య
నెన్నెల: తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ కొడుకు క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నెన్నెల మండలం గంగారాం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ (21) ఇంటర్ వరకు చదువుకున్నాడు. అనిల్ తల్లి ఆవుడం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మంగళి తిరుపతితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై అనిల్ తండ్రి తన భార్యను మందలించాడు. అయినా ఆమె వినలేదు. ఈ విషయం తెలిసిన అనిల్ కూడా తల్లిని మందలించాడు. అంతేకాకుండా తిరుపతి ఇంటికి వెళ్లి హెచ్చరించాడు. అయితే తిరుపతి వినకపోగా, అనిల్‌నే చంపుతానని బెదిరించాడు. తల్లి తీరు మారకపోవడం, తిరుపతి బెదిరింపులతో మనస్తాపం చెందిన అనిల్.. బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. అనంతరం సెల్ఫీ వీడియో తీసుకుని, మిత్రులు, కుటుంబ సభ్యులకు పంపించాడు. వారు అనిల్‌ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువులు గురువారం అనిల్ మృతికి కారణమైన తిరుపతి ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంటి ముందే ఆందోళన చేశారు. తిరుపతి అప్పటికే ఇంటికి తాళం వేసి పారిపోయాడు. దీంతో తాళం బద్దలుకొట్టి సామాగ్రిని ధ్వంసం చేసి కిచెన్‌షెడ్‌కు నిప్పు పెట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, తిరుపతిపై కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హామీ ఇవ్వడంతో అనిల్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఉపాధ్యాయుల పేట
సాక్షి, మహబూబాబాద్: ఆ ఊరు ఉపాధ్యాయులకు కేరాఫ్‌గా మారింది. ఎన్ని ఎకరాల భూములున్నా.. ఎంత పెద్ద కొలువు వచ్చే అవకాశం ఉన్నా.. ఈ ఊరి యువత మాత్రం బడి పంతులు ఉద్యోగానికే మొగ్గు చూపుతుంది. ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. అందుకే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటను ఉపాధ్యాయుల ఊరుగా చెప్పుకుంటారు. గ్రామ సర్పంచ్ చొరవతో.. స్వాతంత్య్రానికి ముందు నుంచే నర్సింహులపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ఉండేది. అప్పుడు ఉర్దూ మీడియంలో బోధన జరిగేది. ఆ రోజుల్లో ఖాజాం అలీ అనే ఉపాధ్యాయుడు పనిచేసేవారు. ఆ తర్వాత షేక్ హుస్సేన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు. స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఊరి పాఠశాలలో తెలుగు మీడియం బోధించడం మొదలు పెట్టారు. అయితే స్వాతంత్య్రం వచి్చన తర్వాత రెండో సర్పంచ్‌గా ఎన్నికైన నాయిని మనోహర్ రెడ్డి.. బడిపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఎస్సెస్సీ తర్వాత హెచ్ఎస్సీ కోర్సును ప్రవేశపెట్టారు.అది చదివిన వారు ఇంటర్ చేయకుండానే ఎస్‌జీబీటీ శిక్షణకు అర్హులు. అలా ఆ ఊరిలో హెచ్ఎస్సీ చదివిన వారు.. సర్పంచ్ వద్దకు వెళ్లి చెప్పడంతో అప్పుడు సమితి అధ్యక్షులకు ఉత్తరం రాసి పంపితే చాలు మరుసటి రోజు నుంచే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరే వారు. ఇలా ఒక్కొక్కరుగా సమితిలో ఉద్యోగం చేరడం.. వారి తర్వాత తరం కూడా కాలానుగుణంగా ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకొని చదవడం, ఉద్యోగాలు పొందడం పరిపాటిగా మారింది. ఇలా గ్రామంలోని కుటుంబాలకు కుటుంబాలే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. గ్రామంలో పుట్టి చదువుకున్నవారే కాకుండా గ్రామం, పరిసర ప్రాంతాల్లో పనిచేసిన ఉపాధ్యాయులు కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండటం గమనార్హం. ప్రతీ డీఎస్సీలో ఉద్యోగం.. స్వాతంత్య్రానికి ముందు ఉర్దూ మీడియం, తర్వాత తెలుగు మీడియంలో సమితి పరిధిలో నియామకాల నుంచి ప్రస్తుతం ఉపాధ్యాయ ఉద్యోగం కోసం నిర్వహించే డీఎస్సీ వరకు ప్రతిసారి ఈ గ్రామానికి ఉపాధ్యాయ ఉద్యోగం తప్పకుండా వస్తుందనే నమ్మకం. 2024 డీఎస్సీలో కూడా నర్సింహులపేట గ్రామం నుంచి టీచర్లు, 15 మందికి గురుకుల టీచర్ ఉద్యోగం వచి్చంది. ఇప్పటికీ బీఈడీ, డీఈడీ, పీఈటీ, పండిట్, టైలరింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్ వంటి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకొని డీఎస్సీ ఎప్పుడు పడుతుందా? అని ఎదురు చూసేవారు 50 మందికి పైగా ఉంటారు.మా కుటుంబం నుంచి పది మంది టీచర్లు.. మాది ఉమ్మడి కుటుంబం. మేం ఐదుగురం అన్నదమ్ములం. ఇందులో నలుగురం, మా బావ, మా పిల్లలు, అల్లుళ్లు మొత్తం పది మందిమి ప్రభుత్వ ఉపాధ్యాయులమే. మా ఇంట్లో ఫంక్షన్లు వస్తే అందరం ఉపాధ్యాయులమే కనిపిస్తాం. ఉపాధ్యాయులుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తాం. – కొండ్రెడ్డి మల్లారెడ్డి, నర్సింహులపేటదొరవారి దగ్గరికి పోతే ఉద్యోగమే.. మా రోజుల్లో పంతులు ఉద్యోగం అంటే జీతం తక్కువ. అందుకోసం పెద్దగా పోటీ ఉండేది కాదు. మా ఊరి దొరవారు (సర్పంచ్ మనోహర్ రెడ్డి) ఉపాధ్యాయ ఉద్యోగం చేయాలని ప్రోత్సహించేవారు. చదువుకొని ఆయన దగ్గరికి పోతే పోస్టు పెట్టించే వారు. మా ఇంటి నుంచి ముగ్గురం అన్నదమ్ములం, మా అక్కకొడుకు, వాళ్ల పిల్లలు అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులమే. – దాసరోజు దక్షిణామూర్తి, నర్సింహులపేటటీచర్ ఉద్యోగం చేయాలన్న క్రేజీ మా ఊరిలో ఎంత చదివాం అన్నది ముఖ్యం కాదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. అందుకోసమే నేను, మా తమ్ముడు, మరదలు, ఇద్దరు కొడుకులు, కోడలు అంతా ప్రభుత్వ ఉపాధ్యాయులమే. ఏ ఉద్యోగం చేసినా లేని తృప్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. – గండి మురళీధర్, నర్సింహులపేటపూర్వం నుంచి అదే పద్ధతి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటారు. వారిని చూసినప్పుడల్లా తాము కూడా అదే కావాలని కోరుకుంటూ చదువుతారు. అందుకోసమే ఇంటర్ పూర్తి కాగానే డీఈడీ, డిగ్రీ పూర్తి కాగానే బీఈడీ పూర్తి చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ డీఎస్సీలో మా ఊరికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. – జినుకల వెంకట్రాం నర్సయ్య, నర్సింహులపేట -
వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వర్షాలు, వరదలతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలు, రైతులకు ఎలాంటి సాయమైనా అందించేందుకు అందుబాటులో ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండు రోజులపాటు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి.. హైదరాబాద్‌లో గురువారం భారీగా కురిసిన వర్షాలపై ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని సూచించారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ గురువారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
బీసీల సమస్యలు ప్రధాని దృష్టికి..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన గురువారం గోవా యూనివర్సిటీ సమీపంలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో జరిగిన 10వ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభకు ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీలు కోరుకున్న కులగణన ప్రక్రియను మోదీ ప్రభుత్వం ఆచరణలో పెడుతోందన్నారు.వచ్చే ఏడాదిలో జరిగే జనగణనలో కులగణనను జోడించిందని తెలిపారు. ప్రధాని మోదీ ఓబీసీలకు మేలు చేసే ఉద్దేశంతో కేబినెట్లో 27 మంది బీసీలకు అవకాశం కలి్పంచారన్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ మహాసభల ద్వారా బీసీల ఐక్యత పెరుగుతుందని.. డిమాండ్లు సాధించుకొనే అవకాశం లభిస్తుందన్నారు. తన మంత్రివర్గంలో ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. గోవా కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాకూర్ మాట్లాడుతూ బీసీ కులాల లెక్కలు తేల్చి జనాభా ఆధారంగా బీసీలకు వాటా అందించాలన్నారు. సదస్సుకు విశిష్ట అతిథిగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారం అహిర్ హాజరయ్యారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తేయాలి: జాజుల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్రం చేసిన కులగణన ప్రక టన 100% బీసీల పోరాట విజయంగా భావిస్తున్నామన్నారు. దేశంలో సామాజిక రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేసి దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ ప్రకారం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మహాసభలో 12 తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. -
ట్రాన్స్‌కో ప్రతిపాదనలను ఆమోదించండి
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఎనర్జీ కారిడార్ మూడో దశ పథకం కింద రాష్ట్ర ట్రాన్స్‌కో చేసిన ప్రతిపాదనలకు అనుమతినివ్వాలని.. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని గురువారం కలిశారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 13.5 గిగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ పవర్ జోన్‌ను గుర్తించిందని తెలిపారు.సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా జాతీయ కారిడార్‌కు అందించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ట్రాన్స్‌కో రూ.6895 కోట్లతో ఎనిమిది ట్రాన్స్మిషన్ పథకాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అనుమతించాల్సి ఉందన్నారు. అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని ‘భట్టి’ కోరారు. -
14న కరీంనగర్లో బీఆర్ఎస్ ‘బీసీ సభ’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14న కరీంనగర్ వేదికగా ‘బీసీ సభ’నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత ఈ నెల 8న కరీంనగర్లో బీసీ సభ నిర్వహిస్తామని ప్రకటించినా తక్కువ సమయంలో భారీ సభ నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రాయంతో 14వ తేదీకి వాయిదా వేసింది.ఈ సభ వేదికగా బీసీ రిజర్వేషన్ల అంశంపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ కీలక నేతలు గురువారం భేటీ అయ్యారు. మాజీ మంత్రులు తలసాని, గంగుల, శ్రీనివాస్‌గౌడ్, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మండలిల్చోఛ్చి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సహా 50 మంది ఈ భేటీలో పాల్గొన్నారు.బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ వైఖరి, కేంద్రం స్పందిస్తున్న తీరుపై చర్చించారు. కేటీఆర్ నేతృత్వంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. 42% రిజర్వేషన్లు అమలు చేసేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు. జిల్లాలవారీగా బీసీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.బీసీ రిజర్వేషన్ల పేరిట ఢిల్లీలో డ్రామాలుబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు తనంతో ఆర్డినెన్స్ ఇచ్చి సంబురాలు చేసుకుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ చేసిన ధర్నాకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే సహా ముఖ్య నేతలెవరూ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో అన్ని పార్టీలను ఒప్పించి రిజర్వేషన్లు సాధించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. -
వచ్చే నెల 30లోగా స్థానిక సమరం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 30వ తేదీలోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై ఏమీ తేలని నేపథ్యంలో మూడు ఆప్షన్లు పరిశీలిస్తున్నా.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గ్రామ పంచాయతీ పాలకమండళ్ల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా, మండల, జిల్లా పరిషత్‌ల కాలపరిమితి పూర్తయి ఏడాదికి పైగా కావడంతో కేంద్రం నుంచి గ్రాంట్లు, కేంద్ర పథకాల నిధులు ఆగిపోయాయి.దీంతో గ్రామీణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థల పనితీరును చక్కదిద్ది గ్రామ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గాడిలో పెట్టడం, కోర్టు గడువు దృష్ట్యా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రాజకీయపార్టీ గుర్తులపై జరిగే మండల, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు) ఎన్నికలను ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. అవి ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఉన్నట్టు సమాచారం. 8వ తేదీలోగా ఓటర్ల తుది జాబితా ఈ నెల 8వ తేదీలోగా గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితాలను (అసెంబ్లీ ఓటర్ల లిస్ట్‌ల ఆధారంగా) రూపొందించాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి గ్రామపంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను గ్రామ కార్యదర్శులు సరిపోల్చి సిద్ధం చేసిన విషయం తెలిసిందే. -
మోదీ, అమిత్ షా అడ్డుకున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయంలో కాంగ్రెస్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావించే మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రభుత్వం మొత్తం ఢిల్లీకి వచ్చినా..‘బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించి పది రోజుల ముందే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరాం. అయితే కాంగ్రెస్ నేతలు అపాయింట్మెంట్ కోరాక మోదీ, అమిత్‌షాలు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.కానీ, రాష్ట్రపతి మా వినతిని వింటే రిజర్వేషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావించి ఆమె అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నట్టుగా మా మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ నిర్ధారణకు వచ్చారు. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో అందుబాటులో ఉంటామని రాష్ట్రపతికి తెలియజేసినా అపా యింట్మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వం మొత్తం ఢిల్లీకే వచ్చినా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరక్కపోవడం శోచనీయం, బాధాకరం, అవమానకరం..’ అని సీఎం పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహులు..‘బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బీసీ వ్యతిరేకులుగా మారారు. 42 శాతం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ కనీస నైతిక మద్దతు తెలపడం లేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయంటూ బీజేపీ అడ్డుకుంటోంది. బీజేపీది తొలి నుంచీ బీసీ వ్యతిరేక వైఖరే. మండల్ కమిషన్ సిఫార్సులను అడ్డుకునేందుకు కమండల్ యాత్రను ప్రారంభించింది. మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు యూత్ ఫర్ ఈక్వేషన్ పేరుతో వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీతో అంటకాగుతూ బీఆర్ఎస్ శిఖండిలా వ్యవహరిస్తోంది. విధ్వంసకర పాత్ర పోషిస్తోంది. పది రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను, మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించిన బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించడం ఒక్క రోజు పని అని. కానీ చిత్తశుద్ధి లేనందునే బిల్లులు ఆమోదించడం లేదు..’ అని రేవంత్ ధ్వజమెత్తారు.గల్లీ లీడర్లా కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు‘బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెట్టుకింద ప్లీడర్లా, గల్లీ లీడర్లా మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయ శాఖ మంత్రిని కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు తీసుకొని వస్తే ఆయనకు కావల్సిన వివరాలన్నీ అందిస్తాం. లేకుంటే ఆయన సమయం చెబితే మేమే ఢిల్లీలో అన్ని గణాంకాలు అందజేస్తాం. ముస్లింలు ముఖ్యమంత్రులు కావద్దనేలా కిషన్‌రెడ్డి మాట్లాడడం సరికాదు. ముస్లింలను తొలగిస్తే రిజర్వేషన్లు పెంచుతామని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలా తొలగిస్తారో.. ఎలా పెంచుతారో వాళ్లు చేసి చూపాలి. రిజర్వేషన్ల పెంపు, ఇతర విషయాల్లో కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్పినంత కాలం నేను నిజాలు చెబుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు. మోదీని కుర్చీ దింపడమే పరిష్కారం‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అన్ని ప్రయత్నాలు చేశాం. ఇక ముందు ఏం చేయాలనే దానిపై రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)తో భేటీ అవుతాం. మంత్రులు, పీఏసీతో చర్చించిన తర్వాత త్వరలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర సమస్యలన్నింటికీ పరిష్కారం మోదీని కుర్చీ నుంచి దింపడమే. ఇప్పటికైనా రాష్ట్రపతి, మోదీ బీసీ బిల్లులను ఆమోదించాలి..’ అని రేవంత్ కోరారు. అందుకే రాహుల్ రాలేదు..‘రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇందిరా భవన్లో 4 గంటల పాటు తెలంగాణ కుల సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి సావధానంగా విన్నారని.. వంద మంది ఎంపీలకు వివరించారని సీఎం చెప్పారు. శిబుసోరెన్ అంత్యక్రియలు.. ఓ కేసు విషయమై జార్ఖండ్ వెళ్లినందునే రాహుల్ జంతర్ మంతర్ సదస్సుకు హాజరుకాలేదని వివరించారు. ఓడిపోవడమే కేసీఆర్‌కు పెద్ద శిక్షవిలేకరుల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెడతాం. అక్కడేం నిర్ణయిస్తారో చూద్దాం. ఈ విషయంలో ప్రతీకార చర్యలేవీ ఉండవు. కేసీఆర్‌ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. చర్లపల్లి జైలుకు, ఆయన ఫాంహౌస్‌కు పెద్దగా తేడా లేదు. ఆయన ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అక్కడా అదే నాలుగు గోడలు.. పోలీసు పహారా..ఫాంహౌస్‌లోనూ అదే పహారా. ఎన్నికల్లో ఓడిపోవడమే ఆయనకు పడిన పెద్ద శిక్ష.. ’ అని సీఎం వ్యాఖ్యానించారు.ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే..ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ లేవనెత్తిన ఓటరు జాబితా అక్రమాలపై ముఖ్యమంత్రి స్పందించారు. ‘ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే. 2018లో కొడంగల్‌లోనే 15 వేల ఓట్లు తొలగించారు. నేను 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయా..’ అని అన్నారు. చిట్‌చాట్ అనంతరం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమి పక్షాల విందుకు రాహుల్‌గాంధీ ఆహ్వానం మేరకు రేవంత్ కూడా హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ముంచెత్తిన వాన.. చెరువులుగా మారిన రోడ్లు
సాక్షి, హైదరాబాద్/తిర్యాణి/కెరమెరి/కౌటాల: హైదరాబాద్ మహానగరంలో గురువారం రాత్రి కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. చాలాచోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగగా, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతోపాటు పాదచారులు సైతం నరక యాతన పడ్డారు.సుమారు 43 ఫీడర్ల (11 కేవీ) పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్‌నగర్, శ్రీనగర్ కాలనీల్లో 12 సెంటీæమీటర్ల వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివారులోని పలు అపార్ట్మెంట్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు.నగరమంతా ట్రాఫిక్ చక్రబంధం..రోడ్లపై వరదనీరు భారీగా నిలిచిపోవటంతో హైదరాబాద్ నగరం మొత్తం గంటలపాటు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. ఎల్బీనగర్ నుంచి చాదర్‌ఘాట్ వరకు, పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ మీదుగా గచ్చిబౌలి వరకు, ఖైరతాబాద్ నుంచి బేగంపేట వరకు, మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు, గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు, బషీర్‌బాగ్ నుంచి కోఠి మీదుగా మలక్‌పేట వరకు, ట్యాంక్‌బండ్ నుంచి ఎస్పీరోడ్, ఆర్పీరోడ్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.కూ కట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మల్కా జిగిరి, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, సికింద్రాబా ద్, నాంపల్లి, చార్మినార్, ఎల్బీనగర్, రాజేంద్రన గర్, ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్ జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతా బాద్ – రాజ్‌భవన్ రహదారి నీట మునిగింది.పలు జిల్లాల్లోనూ..పలు జిల్లాల్లోనూ గురువారం భారీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వరంగల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మూడు మండలాల్లో పిడుగుపాటుకు ఏడు పశువులు మృతిచెందాయి. చేలల్లో పని చేస్తున్న పలువురు గాయపడ్డారు. -
రేవంత్‌కు కేసీఆర్ ఫోబియా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రసంగాల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఆయనకు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా ఉండలేని మానసిక రుగ్మత రేవంత్‌రెడ్డికి ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరిట ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తు న్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీ డిక్లరేషన్‌లోని ఇతర హామీలను పూర్తిగా పక్కన పెట్టిందని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు గురువారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌వన్నీ డ్రామాలే..: ‘42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని ఓట్లు వేయించుకున్న రేవంత్.. ఇప్పుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత రిజర్వేషన్ల పెంపు జరుగుతుందన్నట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో తెలంగాణ సాధించిన తర్వాతే తిరిగి వస్తానని ప్రకటించి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ లక్ష్యాన్ని చేరుకున్నారు. అదే తరహాలో ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్లు సాధించారో లేదో చెప్పాలి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీతో సీఎం రేవంత్ ఏకకాలంలో డ్రామా చేస్తున్నాడు. చంద్రబాబు కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టే డ్రామాలకు పాల్పడుతున్నాడు. చివరివరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రేవంత్ చెప్తున్న మాటలు ఆయన డ్రామాలో భాగమే..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు.. ‘బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ కండువాలు వేసుకుని దేవుడి కండువాలు కప్పుకున్నామని చెప్తున్నారు. వారు ఏ పార్టీలో ఉన్నారో రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. కానీ అసెంబ్లీ స్పీకర్‌కు మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు. స్థానిక సంస్థల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అడ్డగోలుగా నిధులు సమకూర్చుకుంటోంది. గడిచిన 20 నెలల్లో సంపాదించిన అవినీతి సొమ్మును స్థానిక ఎన్నికల్లో పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పదేళ్లు వెనక్కి పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుంది..’అని కేటీఆర్ అన్నారు. కార్యకర్తలకు న్యాయం చేస్తాం ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించడంతో పార్టీ కార్యకర్తలకు తగినంత న్యాయం చేయలేకపోయాం. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను కాపాడుకుని వారికి అండగా నిలుస్తాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలి. కొందరు చెప్తున్నట్లు బీఆర్ఎస్ ఏ పార్టీలోనూ విలీనమయ్యేది లేదు. తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ కండువా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి మళ్లీ కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇలా 'ట్రై' చేస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన కీలక బిల్లుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సర్కారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో దీనిపై సీరియస్‌గా దృష్టి సారించింది. తదుపరి తీసుకోవాల్సిన కార్యాచరణపై సీనియర్ నేతలు, అధిష్టాన పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్లు.. మూడు ఆప్షన్లు ముందు పెట్టుకొని సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా అధిష్టానం ఫైనల్ చేసే ఆప్షన్ ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ముమ్మరంగా మంతనాలు: స్థానిక ఎన్నికల్లో, విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బుధవారం జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డిలతో గురువారం ఇక్కడ మంతనాలు జరిపారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన మూడు మార్గాలపై చర్చించారు. మూడు ఆప్షన్లు ఇలా..: 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం నిర్ణయం చేసే వరకు వేచిచూడటం మూడు ఆప్షన్లలో మొదటిది కాగా.. 50 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన పాత జీవో ప్రకారం ఎన్నికలకు వెళుతూనే, కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం రెండోది. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో జారీ చేయడం మూడోది. ఈ మూడు ఆప్షన్లకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అయితే రిజర్వేషన్లపై కేంద్ర నిర్ణయం వెలువడే వరకు వేచిచూస్తే,సెప్టెంబర్ 30లోగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. అప్పుడు ఎన్నికల నిర్వహణకు కోర్టును మరింత గడువు కోరాల్సి ఉంటుంది. గడువు కోరేందుకు సహేతుక కారణాలు కూడా చూపాలి. అప్పుడైనా కోర్టు అంగీకరిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమేనని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ కోర్టు అంగీకరించినా అప్పటివరకు స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం, కేంద్రం నుంచి అందాల్సిన నిధులకు ఎదరయ్యే అవాంతరాలను కూడా అంచనా వేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. జీవో ఇస్తే..కోర్టులకెళితే.. ఒకవేళ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో ఇస్తే, దానిపై ఎవరు కోర్టులకెళ్లినా జీవో అమలు సాధ్యం కాదు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కంటి తుడుపుగా జీవో ఇచ్చారనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాకాకుండా పాత జీవోలు అమలు చేస్తే బీసీ వర్గాలు ఎలా స్పందిస్తాయో కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా నిర్ణయం చేయాలన్నా..సొంత పార్టీలోనే అనేక అభ్యంతరాలు రావచ్చని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లపై తొలుత పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో చర్చించాల్సి ఉంటుందని, జిల్లాల వారీగా పార్టీ సమావేశాలను నిర్వహించి దీనిపై అవగాహన కల్పించడం, కొన్ని వర్గాల నేతలను ఒప్పించడం చాలా కీలకమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయని సమాచారం. కాగా బీసీ ధర్నా కవరేజీకి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జర్నలిస్టులు గురువారం ఉదయం తనను మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలోనూ ముఖ్యమంత్రి ఈ మూడు ఆప్షన్లపై చర్చ పెట్టి, అందులో ఏది మంచిదో సూచించాలని కోరడం గమనార్హం. రిజర్వేషన్ల అమలు ఆలస్యమైతే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్లాలనే సూచనలు రాగా, తాము అమలు చేసినా, ఇతర పార్టీలపై ఒత్తిడి తేవడం, వారిని ఒప్పించడం అంత సులువు కాదన్న తరహాలో సీఎం స్పందించినట్లు తెలిసింది. ఖర్గేతో మంతనాలు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సీఎం రేవంత్ ఈ విషయమై భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయనతో సమావేశమై.. మహాధర్నా విజయవంతమైన తీరును వివరించారు. ఇండియా కూటమి పక్షాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందని ఖర్గే దృష్టికి తెచ్చారు. రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలని కోరారు. ఒకవేళ కేంద్రం స్పందన లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఆయన మార్గదర్శనం కోరారు. దీంతో పార్టీ పరంగా రిజర్వేషన్ల అమలు కచ్చితంగా జరగాలనే అభిప్రాయాన్ని ఖర్గే వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. వచ్చే నెల 30 లోగా స్థానిక సమరం! – తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చే నెల 30వ తేదీలోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై ఏమీ తేలని నేపథ్యంలో..మూడు ఆప్షన్లు పరిశీలిస్తున్నా.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గ్రామపంచాయతీ పాలకమండళ్ల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా, మండల, జిల్లా పరిషత్‌ల కాలపరిమితి పూర్తయి ఏడాదికి పైగా కావడంతో...కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం గ్రాంట్లు, ఇతర పథకాల కింద వచ్చే నిధులు ఆగిపోయాయి. తద్వారా గ్రామీణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థల పనితీరును చక్కదిద్దడంతో పాటు, గ్రామ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గాడిలో పెట్టడం, కోర్టు గడువు దృష్ట్యా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రాజకీయపార్టీ గుర్తులపై జరిగే మండల, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు) ఎన్నికలను ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతున్నట్టుగా అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. అవి ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఉన్నట్టు సమాచారం. 8వ తేదీలోగా ఓటర్ల తుది జాబితా ఈ నెల 8వ తేదీలోగా గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితాలను (అసెంబ్లీ ఓటర్ల లిస్ట్‌ల ఆధారంగా) రూపొందించాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి గ్రామపంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను గ్రామ కార్యదర్శులు సరిపోల్చి సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలను మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), మండల పంచాయతీ అధికారులు (ఎంపీవోలు) పరిశీలించి పంపించాలని అధికారులకు పీఆర్‌శాఖ స్పష్టం చేసింది. -
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో కుండపోత.. భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad Rains Updates: హైదరాబాదులో భారీ వర్షాల నేపథ్యంలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లుNDRF ఫోన్ నెం.8333068536, ఐసీసీసీ 8712596106.హైడ్రా ఫోన్ నెం.9154170992, ట్రాఫిక్ 8712660600.సైబరాబాద్ 8500411111, రాచకొండ 8712662999.TGSPDCL ఫోన్ నెం.7901530966, RTC 9444097000.GHMC ఫోన్ నె.8125971221, HMWSSB 9949930003.👉జంట జలాశయాల్లోకి భారీగా వరదకాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తనున్న అధికారులులోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనకిస్మత్పూర్, బండ్లగూడ, సన్‌సిటీ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారుల సూచనవరద నీటిలో మునిగిన ఖైరతాబాద్-రాజ్‌భవన్ రహదారిమోండా మార్కెట్, బండిమెట్‌లో భారీగా వరదజీడిమెట్ల, సుచిత్రలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాబేగంబజార్, గౌలిగూడ బస్తీల్లో భారీగా నిలిచిన వరదభారీ వర్షానికి మణికొండలో కారుపై కూలిన గోడయూసుఫ్గూడ, కృష్ణానగర్‌లో భారీగా వరద ప్రవాహంభారీ వర్షానికి మాదాపూర్‌లో పొంగుతున్న డ్రైనేజీ👉నగరంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం మెుదలైంది. అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, కూకట్పల్లి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మణికొండ, మియాపూర్, చందానగర్, బాలానగర్ సనత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్....అబ్దుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్పేట్. దిల్సుఖ్నగర్ చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, నాచారం తార్నాక, నల్లకుంట హబ్సిగూడ, బేగంపేట్, వారణాసిగూడ, కంటోన్మెంట్, మారేడుపల్లి, హియాయత్‌నగర్, లక్డీకపూల్, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.👉హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు.👉జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.👉నగరంలో భారీగా వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో 12 సెంటీ మీటర్లు, ఎస్ఆర్ నగర్ 11, ఖైరతాబాద్ 11, సరూర్‌నగర్‌లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఒక వైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. కిలో మీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. చాదర్‌ఘాట్ నుండి ఎల్బీ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.👉ఆఫీసుల నుంచి ప్రజలు బయటకు వచ్చే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షాల దాటికి రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరువు, ఖైరతాబాద్, మల్కాజిగిరి, నాంపల్లి, మెహదీపట్నం, గోల్కొండ, కాప్రా, సికింద్రాబాద్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ముందుగానే తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరించాడు. కొన్ని ప్రాంతాల్లో 2.5-4 సెం.మీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.👉కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్, కొండాపూర్ బయోడైవర్శిటీలో భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.👉బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నల్లగొండ, యాదాద్రి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ముందని.. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
కేసీఆర్ అరెస్ట్ అవుతారా?.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్
సాక్షి,న్యూఢిల్లీ: విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు,కాళేశ్వరం స్కాంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆరోపణలొచ్చాయి. ఈ కేసుల్లో కేసీఆర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారనే ఊహాగానాలూ ఊపందుకున్నాయి. అయితే,ఈ ఊహాగానాలకు ఢిల్లీ కేంద్రం సీఎం రేవంత్ తెరదించారు. కేసీఆర్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి పార్లమెంట్లో ఒత్తిడి పెంచాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ చిట్‌చాట్ నిర్వహించారు. కేసీఆర్‌ను నేనెందుకు జైల్లో వేస్తా.. ఆయనే స్వీయ నియంత్రణగా జైల్లో ఉన్నట్లు ఫామ్ హౌస్‌లో ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు.. చర్లపల్లి జైలుకు తేడా లేదు. ఫామ్ హౌస్‌లో పోలీసుల పర్యవేక్షణ ఉంటది. జైల్లో పోలీసుల పహారా ఉంటుంది. అప్పుడప్పుడు జైలుకు విజిటర్స్ వస్తుంటారు.. అలాగే ఫామ్ హౌస్‌కి విజిటర్స్ వెళ్లి వస్తున్నారు. కేసీఆర్‌ను ఓడించడమే పెద్ద శిక్ష. నేనెందుకు విద్వేష రాజకీయాలు చేస్తా.మేం దుప్పటి కప్పుకొని పడుకున్నా తెలంగాణ ప్రజలు రెండోసారి కాంగ్రెస్ గెలిపిస్తారు. బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక వస్తుందని అనుకుంటున్నా. బీఆర్ఎస్ నేతలు కూడా నైతిక విజయం అంటే నైతికత కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. బీఆర్ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదు . బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది మా విధానం. బీజేపీ నేతలు.. మీకు కావలసిన పద్ధతిలో చట్టం చేయండి. కిషన్ రెడ్డికి బీసీ బిల్లులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్ల కంటే ఎక్కువ రానివ్వం. 2029లో ఎన్నికలు గెలిచి చూపిస్తాం..కిషన్ రెడ్డి అడ్డుకుంటారా?’ అని అన్నారు. -
తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఓయూ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 2016లో రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓయూలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించారంటూ రేవంత్‌పై ఫిర్యాదు చేయగా.. రేవంత్‌రెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదైంది.విచారణ పూర్తి చేసిన పోలీసులు.. అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసును కొట్టేయాలంటూ రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటరకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణ వాయిదా వేసింది. -
పబ్‌లో యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36 లోని క్రిస్టల్ క్లబ్ పబ్‌లో ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురు యువకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మణికొండలో నివసించే యువతి (29) మంగళవారం రాత్రి తన స్నేహితురాలితో కలిసి క్రిస్టల్ పబ్‌కు వచ్చారు. రాత్రి 11.40 గంటల ప్రాంతంలో వీరి వెనుక సీట్లో కూర్చొన్న ఓ యువకుడు వాటర్ బాటిల్‌ను యువతి ఉన్న చోటికి వదిలాడు. తీసుకునే క్రమంలో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. రాత్రి 12.10 గంటల ప్రాంతంలో సదరు యువతి స్నేహితురాలితో కలిసి బయట నిలబడగా భరత్, మారుతి, డోనాల్డ్ అనే ముగ్గురు యువకులు బయటకు వచ్చి మరోసారి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అప్పటికే ఆమె సోదరుడు బయటకు రాగా తీవ్రంగా కొట్టారు. ఆపేందుకు వెళ్లిన ఆమెను దూషించారు. విషయం తెలుసుకున్న బౌన్సర్లు బయటకు వచ్చి యువకులను కట్టడి చేసేందుకు యతి్నంచగా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో బాధిత యువతితో పాటు ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు కాగా, అదే రోజు అర్ధరాత్రి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. జరిగిన ఘటన పట్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు భరత్, మారుతి, డోనాల్డ్పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మా ఆఖరి పోరాటం పూర్తి చేశాం.. ఇక నిర్ణయం కేంద్రానిదే: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ అవకాశాలకు మాత్రమే వర్గీకరణ ఉంటుందని, ఆయన(కిషన్ రెడ్డి) చెప్పినట్లు ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లేం లేవని అన్నారాయన. ఢిల్లీలో గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ అవకాశాలు మాత్రమే ఏబీసీడీ వర్గీకరణ ఉంది. పొలిటికల్ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ లేదు. బీసీ మొత్తానికి కలిపి 42 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఒక ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లు లేవు. కిషన్ రెడ్డి ముందుగా చట్టం చదవాలి. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదు. బీసీఈ గ్రూపుకు ఇప్పటికే నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అలాంటప్పుడు కొత్తగా 10% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయి. కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’’ అని సీఎం రేవంత్ అన్నారు.రిజర్వేషన్ సాధన కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని రేవంత్ ఉద్ఘాటించారు. ‘‘బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలన్నది మా కమిట్మెంట్. మా కమిట్మెంట్కు విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదు. జంతర్ మంతర్ వేదికగా మావాయిస్ బలంగా వినిపించాం. మా ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశాం. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలోని బీజేపీనే. బీసీలపై అంత ప్రేమ ఉంటే కేంద్రం వెంటనే బిల్లు ఆమోదించాలి. అబద్ధాలతో ప్రజల్ని మభ్య పెట్టడం బీఆర్ఎస్ నైజం. లోకల్‌బాడీ ఎన్నికలు సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. ఆలోపు బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపకపోతే ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ఆలోచన చేస్తాం. ప్రజల అభిష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుంది’’ అని రేవంత్ స్పష్టం చేశారు. -
IND vs ENG: అసదుద్దీన్ ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదే.. పోస్ట్ వైరల్
ఇంగ్లండ్ గడ్డ మీద అదరగొట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది. ఓడిపోతామనుకున్న ఆఖరి టెస్టు (IND vs ENG 5th Test)లో అద్భుత ప్రదర్శనతో సిరాజ్ భారత్‌ను గెలిపించిన తీరు.. అమోఘమంటూ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులూ కొనియాడుతున్నారు. ఆల్వేస్ వి న్నర్ఇందులో భాగంగా సిరాజ్ మియాను ఉద్దేశించి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసాపూర్వక ట్వీట్ చేశారు. ‘‘‘ఎల్లప్పుడూ విజేతే.. మన హైదరాబాదీ శైలిలో చెప్పాలంటే.. పూరా ఖోల్ దియే పాషా!’’ అంటూ ఒవైసీ సిరాజ్‌ను అభినందించారు. బౌలర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడని కితాబు ఇచ్చారు. ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదేఇక సిరాజ్ కూడా ఇందుకు బదులిస్తూ.. ‘‘ధన్యవాదాలు సార్.. ఎల్లవేళలా నన్ను ప్రోత్సహిస్తూ చీర్ చేస్తున్నందకు కృతజ్ఞతలు’’ అంటూ హార్ట్ సింబల్‌తో పాటు నమస్కారం పెడుతున్నట్లుగా ఉండే ఎమోజీని షేర్ చేశాడు. సిరాజ్ ఈ మేరకు ఒవైసీకి థాంక్యూ చెబుతూ చేసిన పోస్ట్ అర మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.కెరీర్ బెస్ట్ ర్యాంకులో సిరాజ్ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయాడు. ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో 9 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఈ హైదరాబాదీ బౌలర్.. బుధవారం విడుదల చేసిన ఐసీసీ బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు ఎగబాకాడు. సిరాజ్ 674 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. గతంలో సిరాజ్ అత్యుత్తమంగా 16వ ర్యాంక్ సాధించాడు.ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా (889 పాయింట్లు) అగ్ర స్థానంలో కొనసాగుతుండగా... భారత్ నుంచి రవీంద్ర జడేజా (17వ స్థానం) కూడా టాప్–20లో ఉన్నాడు. టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్ (792 రేటింగ్ పాయింట్లు)కు చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జైస్వాల్ 2 సెంచరీలు సహా మొత్తం 411 పరుగులు చేశాడు.ఈ జాబితాలో జో రూట్ (908) తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకోగా... రిషభ్ పంత్ (8వ), శుబ్‌మన్ గిల్ (13వ)లకు టాప్–20లో చోటు లభించింది. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (405 పాయింట్లు) నిలకడగా నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా... వాషింగ్టన్ సుందర్ 16వ ర్యాంక్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌లో సన్మానం! ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల పోరులో అత్యధికంగా 23 వికెట్లు తీసి సిరీస్‌ను భారత్ సమంగా ముగించడంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ సొంతగడ్డకు చేరుకున్నాడు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో సన్నిహితులు, అభిమానులు అతనికి స్వాగతం పలికారు. ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌తో కలిసి లండన్ నుంచి నేరుగా ముంబైకి చేరుకున్న సిరాజ్ ఆ తర్వాత స్వస్థలానికి వచ్చాడు. వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ వరకు భారత జట్టు ఎలాంటి మ్యాచ్‌లు ఆడటం లేదు.ఈ నేపథ్యంలో నగరంలోనే ఉండనున్న సిరాజ్‌కు త్వరలోనే ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) యోచిస్తోంది. ప్రస్తుతానికి అధ్యక్ష, కార్యదర్శులు వివిధ ఆరోపణలతో జైలులో ఉన్నందుకు ఈ కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: Asia Cup 2025: అతడు భేష్.. ఇతడు ఓకే.. టీమిండియా సెలక్టర్లకు తలనొప్పి! -
దుక్కి దున్ని.. నాట్లు వేసి
నర్సాపూర్ రూరల్: ట్రాక్టర్‌తో దుక్కి దున్ని నాట్లు వేశారు మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థినులు. మండలంలోని అవంచలో బుధవారం రైతులతో కలిసి పొలం బాట పట్టారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి రైతుల దిగుబడిని పెంచే విధంగా తమ సేవలను అందించడానికే వ్యవసాయ విద్యను ఎంచుకున్నట్లు తెలిపారు. అనంతరం రైతులకు నూతన వ్యవసాయ సాగు పద్ధతులను వివరించారు.ఎప్పుడు దారి కొచ్చేనో..?మున్సిపాలిటీ పరిధిలోని హన్మంతాపూర్‌కు వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు. అక్కడికి వెళ్లడానికి నర్సాపూర్ నుంచి రెండు మార్గాలున్నాయి. ఒకటి నర్సాపూర్–తూప్రాన్ రహదారి నుంచి ఉండగా, మరోటి నర్సాపూర్‌లోని జగన్నాథరావు కాలనీ నుంచి ఉంది. రెండు రోడ్లు గుంతలమయంగా మారగా, కనీస మరమ్మతులు కరువయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలుస్తుందన్నారు. వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భార్యాభర్తలపై కత్తితో దాడి
రంగారెడ్డి జిల్లా: పశువుల మేత విషయంలో చోటుచేసుకున్న దాడిలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మొయినాబాద్‌కు చెందిన మహ్మద్ హఫీజ్, మహ్మద్ వాజిద్ ఖురేషీ ముర్తూజగూడ రెవెన్యూలోని షమ్స్ కాలనీలో ఇళ్లు కట్టుకుని, కుటుంబాలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇరువురి వద్దా మేకలు, గేదెలు, ఆవులు ఉన్నాయి. కాలనీలోని ఖాళీ ప్లాట్లలో వీటిని మేపుతుంటారు. బుధవారం ఉదయం వాజిద్ తన మేకలు, గేదెలను ఓ ప్రాంతంలోని ఖాళీ ప్లాట్లలో కట్టేశాడు. ఇది గమనించిన హఫీజ్, అతని కొడుకు అఫ్రోజ్ ముందు నుంచీ తమ పశువులను ఇక్కడే మేపుతున్నామని, నీవెందుకు కట్టేశావని వాజిద్‌తో గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో అఫ్రోజ్ తమ ఇంట్లో నుంచి కొమ్మలు కొట్టే కత్తి తీసుకొచ్చి తండ్రికి ఇచ్చాడు. ఇద్దరూ కలిసి పక్కింట్లో ఉండే వాజిద్‌పై దాడి చేశారు. అడ్డుకోబోయిన అతని భార్య రఫియాను సైతం కత్తితో గాయపర్చారు. దీంతో వాజిద్ తల, మెడ, ఛాతితో పాటు శరీరంపై గాట్లు పడ్డాయి. రఫియా తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇరువురిపైనా హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
రక్షా బంధన్.. పోషణ బంధం
ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అంటూ పోషణ బంధం రాఖీ.. వ్యసనాలకు లోనుకాకు, మత్తువదులూ అంటూ సోదరబంధం రాఖీలతో కొత్త రాఖీలకు శ్రీకారం చుట్టింది పెద్దపల్లి జిల్లా స్త్రీ శిశుసంక్షేమ శాఖ. పోషకాహారం, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనదైన శైలిలో సరికొత్త మార్గంలో రాఖీ వేడుకలకు సన్నద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్ (poshan abhiyaan) పథకంలో భాగంగా చిన్నారులకు పోషణ బంధం రాఖీల పంపిణీ.. ప్రభుత్వ కళాశాలల్లోని యువతకు మిషన్ పరివర్తన నషాముక్త్భారత్ అభియాన్ పథకంలో భాగంగా సోదరబంధం రాఖీలు పంపిణీ చేసి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించనుంది. జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్ వీటికి సోదరబంధం, పోషణ బంధం రాఖీలుగా నామకరణం చేసి ఈ ఏడాది ప్రతీ అంగన్వాడీ బడిలోనూ, కళాశాలల్లోనూ రాఖీ వేడుకలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.ఇదీ చదవండి: Raksha Bandhan 2025 పర్వాల పూర్ణిమ, రాఖీ పరమార్థం ఇదే! -
బీసీ రిజర్వేషన్ల బాధ్యత నేనే తీసుకుంటా, కానీ..: కిషన్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్లు చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేస్తే.. బీసీల రిజర్వేషన్ల బాధ్యత తానే తీసుకుంటానని అన్నారాయన. గురువారం ఉదయం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ‘‘రేవంత్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రిని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటారా? రేపు లంబాడాలను కన్వర్టెడ్ ఎస్టీ అంటారా?. అసలు ఆయనే కన్వర్టెడ్ కాంగ్రెస్. మజ్లిస్ కనుసన్నల్లో కాంగ్రెస్ పని చేస్తోంది. ఇదిలాగే కొనసాగితే ఒవైసీ కుటుంబానికే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. వచ్చేఎన్నికల్లో రేవంత్ ఓటమి ఖాయం.. .. గతంలోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను తెలంగాణ హైకోర్ట్ కొట్టేసింది. మజ్లిస్ కనుసైగలతో కేసీఆర్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీలకు 34 శాతం నుంచి 27 శాతం రిజర్వేషన్ తగ్గించారాయన. అలాంటప్పుడు ఇప్పుడెలా 10 శాతం రిజర్వేషన్లు ఇస్తారు. మత రిజర్వేషన్లతో దేశంలో అల్లకల్లోలం జరుగుతుంది.... అసలు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?. ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు తీసేస్తే.. బీసీల రిజర్వేషన్ బాధ్యత నేనే తీసుకుంటా. రాష్ట్రపతి, ప్రధానితో కూడా మాట్లాడతా అని కిషన్ రెడ్డి అన్నారు. .. బీసీలకు వెన్నుపోటు పొడవడంలో తెలంగాణ రోల్ మోడల్. బీసీలను మోసం చేయడంలో, అక్రమాలు చేయడంలో మేము నిరక్షరాస్యులం. కేసీఆర్ వల్ల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ సీట్లలో నాన్ బీసీలు మాత్రమే గెలిచారు. కాంగ్రెస్ తెచ్చిన బిల్లుతో బీసీలకు కేవలం 32 శాతం రిజర్వేషన్లు దక్కుతాయి. ఇది బీసీలను మోసం చేయడమే. రాజ్యాంగ సమస్యల వల్లే గవర్నర్ రాష్ట్రపతికి బీసీ బిల్లు పంపారు అని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘రాష్ట్రపతిపై తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు సిగ్గు చేటు. దీనిపై సోనియాగాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలి’’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారాయన. -
బర్త్ సర్టిఫికెట్ కోసం వెళ్తే.. డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు!
ఖమ్మం జిల్లా: నాలుగేళ్ల బాలిక పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తహసీల్ ఉద్యోగుల తీరు విమర్శలకు తావిచ్చింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్ – మమత దంపతుల నాలుగేళ్ల కుమార్తెకు జనన ధ్రువీకరణ పత్రం కావాలని గతేడాది డిసెంబర్ 17న తహసీల్‌లో దరఖాస్తు ఇచ్చారు. నాటి నుంచి తిరుగుతుండగా రకరకాల సాకులు చెప్పిన ఉద్యోగులు.. ఎట్టకేలకు ఈనెల 4వ తేదీన సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ అది డెత్ సర్టిఫికెట్ కావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఉద్యోగి తప్పుగా వచ్చిందంటూ దాన్ని వెనక్కి తీసుకుని చించేశారు. ఆపై బర్త్ సర్టిఫికెట్ ఇచ్చినా అందులో సరైన వివరాలు లేకపోవడంతో ప్రశ్నించగా.. ఆ ఉద్యోగి ‘సర్టిఫికెట్ ఇవ్వడమే ఎక్కువ.. మళ్లీ ప్రశి్నస్తారా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడని ఉపేందర్ తెలిపాడు. ఈ ఘటనపై తహసీల్దార్ రవికుమార్ స్పందిస్తూ, విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, సరైన పత్రం జారీ చేస్తామని తెలిపారు. -
‘మహాలక్ష్మి’ వదంతులు.. బారులు తీరిన మహిళలు
నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడతామని చెప్పిన మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో అకౌంట్ ఉంటేనే వస్తుందని వదంతులు రావడంతో మహిళలు పోస్టాఫీసుకు బారులు తీరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో రూ.200లు పెట్టి కొత్త అకౌంట్ ఇవ్వాలని కౌంటర్ వద్ద తోపులాడుకుంటూ ఇలా అకౌంట్లు తీస్తున్నారు. దీనిపై పోస్టాఫీసు అధికారులను సంప్రదించగా.. బయట ఎవరో వదంతి సృష్టించడంతో ఇంతమంది వస్తున్నారని చెప్పారు. -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు క్లియర్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పదవీ విరమణ చేసి ఆర్థిక ప్రయోజనాలు అందక ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిసొలసి చివరకు ప్రతి సోమవారం రోడ్డెక్కి నిరసనలు తెలిపేందుకు సిద్ధమైన వృద్ధులకు తీపి కబురు ఇది. ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.300 కోట్లు సిద్ధం చేసుకుంది. అందుకు కావాల్సిన మొత్తాన్ని హడ్కో నుంచి రుణంగా పొందింది. దాదాపు 16 వేల మంది విశ్రాంత ఉద్యోగుల ఆవేదనను కళ్లకు కడుతూ గత నెల 27న సాక్షి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన రాష్ట్రప్రభుత్వం, ఆ వృద్ధ కుటుంబాలకు వెంటనే ఆర్థిక ప్రయోజనాలు అందజేయాల్సిందిగా ఆర్టీసీని ఆదేశించింది. 2017 వేతన సవరణ ఫిట్మెంట్ 2024 జూన్ నుంచి అమలులోకి రాగా, ఆ ఏడాది మే వరకు రిటైర్ అయిన అందరికీ ఇప్పుడు ఆ బకాయిలు చెల్లించాల్సి ఉంది. పనిచేసిన కాలంలో 300 వరకు పేరుకునే ఆర్జిత సెలవుల (దాదాపు 10 నెలల వేతనంతో సమానం) మొత్తాన్ని కూడా రిటై ర్మెంట్ సమయంలో ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉండగా ఇది కూడా బకాయి ఉంది. 2017 వేతన సవరణతో జీతాలు పెరిగినందున, ఆర్జిత సెలవు బకాయిలు కూడా పెరుగుతాయి. 2019 జూలై నుంచి ఆర్టీసీలో డీఏల చెల్లింపు నిలిచిపోయింది.గతేడాది ఒకే సారి ఐదు పెండింగు డీఏలను చెల్లించారు. ఈ మధ్య కాలంలో రిటైర్ అయినవారికి ఆ లబ్ధి ఇవ్వలేదు. ఒక్కో పెండింగ్ డీఏ నికరంగా 2.5 శాతం నుంచి 3.2 శాతం మధ్య ఉంది. ఆ మొత్తం కూడా రిటైర్డ్ ఉద్యోగులకు భారీగా లభించాల్సి ఉంది. గ్రాట్యుటీపై 2017 వేతన సవరణ ప్రభావాన్ని లెక్కగట్టి ఇవ్వాల్సి ఉంది. వేతన సవరణ తో పెరిగే జీతం ప్రకారం పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. ఆ పెరిగిన మొత్తా న్ని ఇవ్వలేదు. ఆర్టీసీ సహకార పరపతి సంఘంలో రిటైర్డ్ ఉద్యోగులు అధిక వడ్డీ ఆశతో దాచుకున్న మొత్తాలపై ప్రస్తుతం వడ్డీ చెల్లింపు నిలిచిపోయింది. చాలామందికి ఆ బకాయి కూడా పేరుకుపోయి ఉంది. ఈ లబ్ధి పొందకుండానే పలువురు చనిపోయారు. ఇలా.. రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదనను ‘సాక్షి’ఆ కథనంలో వివరించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం ఆ ప్రయోజనాలను తక్షణం చెల్లించాలని ఆదేశించింది. దీంతో రిటైర్డ్ ఉద్యోగుల వివరాలను ఆడిట్ చేయించి ఈనెల 13లోపు అందించాలని ఆర్టీసీ అన్ని డిపోలను ఆదేశించింది. ఆ వివరాలు అందిన వెంటనే బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోబోతోంది. -
బాలిక అబార్షన్‌కు హైకోర్టు నో
సాక్షి, హైదరాబాద్: పెళ్లికాకుండానే గర్భందాల్చి 28 వారాల గర్భంతో ఉన్న ఓ బాలిక అబార్షన్‌కు ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రాణాపాయం ఉందన్న వైద్య నివేదిక నేపథ్యంలో ప్రసవం వరకు ఆమెను డిశ్చార్జ్ చేయొద్దని.. నిరంతరం వైద్యం అందించాలని నిలోఫర్ ఆస్పత్రిని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేసింది. తన కుమార్తె గర్భాన్ని (కవలలు) తొలగించేందుకు నిలోఫర్ వైద్యులను ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది జూలై 22 నాటి వైద్య నివేదిక ప్రకారం తన కుమార్తె గర్భధారణ వయసు 27 వారాలు (ట్విన్ ఏ), 25 వారాలు (ట్విన్ బీ) అని పేర్కొంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక మరోసారి విచారణ చేపట్టారు. మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలన్న గత ఉత్తర్వుల మేరకు నివేదిక అందించిన నిలోఫర్ సూపరింటిండెంట్... గర్భాన్ని తొలగిస్తే మైనర్ బాలిక ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్ విజ్ఞప్తిని నిరాకరించారు. -
‘సబ్ కా సాత్’ అంతా డొల్ల
సాక్షి, న్యూఢిల్లీ: ‘సబ్ కా సాత్ సబ్కా వికాస్’అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా డొల్ల అని, అణగారిన వర్గాల రిజర్వేషన్ల కోసమే తమ పోరాటమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. న్యాయం ఆలస్యం కావడమంటే, దాన్ని నిరాకరించడమేనని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిల్లులకు కేంద్రం ఆమోదం తెలపాలని కోరుతూ బుధవారం జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ ధర్నా పురస్కరించుకుని వారు ‘ఎక్స్’లో తమ అభిప్రాయాలను వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం తెలంగాణ సర్కారు కృషి: ఖర్గే ‘విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్ హక్కు కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఆమోదించింది. కానీ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో.. రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో మహాధర్నా చేపట్టారు. రాష్ట్రంలో కుల సర్వే అనంతరం సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసే చర్య మా ప్రభుత్వం తీసుకుంది. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా డొల్ల. ఎందుకంటే ఈ బిల్లులకు, అణగారిన వర్గాల హక్కులకు మోదీయే అడ్డుగోడగా ఉన్నారు..’అని ఖర్గే ధ్వజమెత్తారు. అణగారిన వర్గాల కోసమే ఈ పోరాటం: రాహుల్ గాంధీ ‘తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేశా యి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలని వారు డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం దిశగా ఈ బిల్లు ఒక పెద్ద ముందడుగు. మద్దతు ఇచ్చిన ‘ఇండియా’నేతలకు నా కృతజ్ఞతలు. రాష్ట్రపతి దీనిని గుర్తించి ఆమోదిస్తారని ఆశిస్తున్నా. ఈ పోరాటం కేవలం తెలంగాణ కోసం మాత్రమే కాదు. దేశంలోని అణగారిన వర్గాలకు అధికారం, హక్కుల కోసం జరుపుతున్న సమిష్టి పోరాటం.’. అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. చరిత్రాత్మక బిల్లు ‘తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక బిల్లు ఆమోదించింది. అయితే ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడే ఆగిపోయింది. ఇందుకు నిరసనగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. రాష్ట్రపతి తక్షణమే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం తెలంగాణ పోరాటమే కాదు. అణగారిన వర్గాలకు న్యాయం, సమానత్వం, న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కోసం జాతి యావత్తు చేస్తున్న ఆందోళన. న్యాయాన్ని ఆలస్యం చేయడమంటే, దాన్ని తిరస్కరించడమే..’అని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. -
ప్రాణం తీసిన పందుల పంచాయితీ
వెల్దండ: పందులను చోరీ చేశారంటూ రెండు వర్గాలు ఘర్షణ పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు.. కల్వకుర్తి మున్సిపాలిటీలోని విద్యానగర్‌కు చెందిన బెల్లంకొండ రాములు (45), కొర్రెడ్డి నిరంజన్, రామచంద్రి, వెంకటయ్య, మహేశ్‌తో పాటు మరో 10మంది పందులను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వెల్దండకు వచ్చారు. అయితే కొన్ని రోజులుగా వీరి పందులు చోరీకి గురవుతున్నాయి. అయితే చోరీకి గురైన పందులు వెల్దండ మండలం పోతేపల్లికి వెళ్లే దారిలో ఉన్నాయని కొందరు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వారు అక్కడికి వెళ్లి షెడ్లో ఉన్న పందులను చూస్తున్న క్రమంలో మరో వర్గానికి చెందిన మానపాటి వెంకటమ్మ, పవన్‌కుమార్, శివ, అన్వేశ్, దుద్రాక్షల కృష్ణ వారిపై దాడికి దిగారు. కర్రలు, కొడవళ్లతో విచక్షణరహితంగా దాడికి పాల్పడటంతో రాములుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. నిరంజన్, రామచంద్రి, వెంకటయ్య, మహేశ్‌లకు తీవ్రగాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాములు మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన వారికి కల్వకుర్తిలోనే చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పందుల చోరీ ఘటనపై కల్వకుర్తి, వెల్దండ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశామని.. పోలీసులు సమయానికి స్పందించి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. కల్వకుర్తి సీఐ నాగార్జున ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. -
టార్గెట్ రేవంత్!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం వ్యాఖ్యలను, ఆయన వైఖరిని తప్పుపడుతున్న రాజగోపాల్‌రెడ్డి.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, సూచనలు మాత్రమే చేస్తున్నానంటూనే తనదైన శైలిలో విమర్శలు కొనసాగిస్తున్నారు. తానే పదేళ్లు సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలను ఇటీవల బహిరంగంగానే ఖండించారు. అంతేకాదు సమయం వచ్చినప్పుడల్లా రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేలుస్తుండటం కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. పార్టీ విధానాలకు వ్యతిరేకమంటూ..పాలమూరు జిల్లాలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగా ఖండించడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 19 నెలల తర్వాత తొలిసారి పార్టీలో అసంతృప్త స్వరాన్ని వినిపించారు. ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని, తానే సీఎంగా ఉంటానని రేవంత్ చెప్పడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని, ఈ వ్యాఖ్యలను నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరనే కోణంలో ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. రాజగోపాల్ వ్యాఖ్యలు అప్పట్లోనే కాంగ్రెస్ శిబిరంలో చర్చకు తెరలేపాయి. వాటి వెనుక ఆంతర్యమేంటన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ ఎపిసోడ్ మరుగునపడుతోందనుకునే లోపే రాజగోపాల్ మరోమారు మరింత ఘాటైన విమర్శలు చేశారు. సోషల్ మీడియా గురించి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఆ తర్వాత బుధవారం కూడా అదే వైఖరి కొనసాగించారు. తనను కలిసిన డిజిటల్ మీడియా ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ప్రతిపక్షాలను ఉద్దేశించి వాడుతున్న భాషను మార్చుకోవాలని సూచించారు. తాను రేవంత్‌రెడ్డిని విమర్శించడం లేదంటూనే, పార్టీలో జరుగుతున్న తప్పులను చెప్పకపోతే నష్టం జరుగుతుందని, అందుకే చెపుతున్నానంటూ ముక్తాయింపునివ్వడం గమనార్హం. అధిష్టానాన్నీ వదలకుండా..రాజగోపాల్‌రెడ్డి అప్పుడప్పుడూ పార్టీ అధిష్టానాన్ని సైతం వదిలిపెట్టకుండా సుతిమెత్తని వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. తనకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం మాట ఇచ్చిందని చెబుతూ.. భువనగిరి ఎంపీ సీటులో గెలిపించినప్పటికీ అధిష్టానం మాత్రం తన మాట నిలబెట్టుకోవడం లేదంటూ నర్మగర్భంగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తుందా లేదా అన్నది వారిష్టమని అంటూనే, మునుగోడు ప్రజల కోసం మళ్లీ త్యాగం చేసేందుకు కూడా వెనుకాడేది లేదంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తుండడం గమనార్హం. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలన్నిటిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రిపదవి ఇవ్వనందుకే రాజగోపాల్‌రెడ్డి అలా మాట్లాడుతున్నారని కొందరు, మంత్రిపదవి మాత్రమే కాదని దీర్ఘకాలిక వ్యూహంతో ఆయన వెళుతున్నారని, అందుకే రేవంత్ పదేళ్ల సీఎం వ్యాఖ్యలకు చెక్ పెట్టేందుకు ముందుకు వచ్చారని మరికొందరు అంటున్నారు. పార్టీలోని కొందరు నేతలు చేయలేని పనిని ఆయన చేశారని మరికొందరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. డీకేతో భేటీ..!రాజగోపాల్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయనతో మాదాపూర్‌లోని ఓ హోటల్లో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా ఇరువురు వ్యక్తిగత, రాజకీయ అంశాలపై చర్చించారని, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను రాజగోపాల్‌రెడ్డి వివరించారని సమాచారం. కాగా ఈ వ్యవహారంపై గురువారం ఆయనతో మాట్లాడతానని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఢిల్లీలో వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
మంత్రి పదవి హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చారు
సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చారని, అధిష్టానం పిలుపు మేరకే తాను తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, ఐదేళ్లు అధికారంలో ఉంటుందని చెప్పిన ఆయన.. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలియకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని, అందుకే కొన్ని విషయాలను చెబుతున్నానన్నారు. రాష్ట్రంలోని డిజిటల్ మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లోని నివాసంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు భాష మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకోవాలని, తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న కేబినెట్ బెర్తులను భర్తీ చేసి, వీలున్నంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తాను రేవంత్‌రెడ్డిని విమర్శించడం లేదని సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తున్నానని చెప్పారు. వాళ్లు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందన్న ఫ్ర్రస్టేషన్‌లో ఉందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదాలో కొనసాగే అర్హత లేదని, ఆయన అసెంబ్లీకి రావాలని లేదంటే ప్రతిపక్ష నేత హోదా ఇంకెవరికైనా ఇవ్వాలన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయిస్తే ఆంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, సమయం వచ్చినప్పుడు వారి బండారం బయటపెడతానన్నారు. రాష్ట్ర సంపదను లూటీ చేసే విషయంలో, కాంట్రాక్టుల విషయంలో, భూములు, ఇసుక మాఫియా విషయంలో... తెలంగాణకు అన్యాయం జరిగే ఏ విషయం గురించైనా తాను బహిరంగంగానే మాట్లాడతానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ లక్షల కోట్లు దాచుకుందని, విచారణల పేరుతో కాలయాపన చేయకుండా గత పదేళ్ల కాలంలో అవినీతి సొమ్మును దోచుకున్న వారందరినీ వీలున్నంత త్వరగా జైల్లో పెట్టాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కోరారు. -
నీట్ యూజీ కౌన్సెలింగ్‌కు కొత్త షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: నీట్‌యూజీ–2025లో భాగంగా మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. గత నెల 12వ తేదీన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ జూలై 21 నుంచి ప్రారంభమైతే, స్టేట్ కోటా కౌన్సెలింగ్ అదే నెల 30 నుంచి ప్రారంభం కావలసి ఉంది. అయితే, స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండటంతో స్టేట్ కోటా కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. మంగళవారం స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసి, తీర్పు రిజర్వు చేసిన నేపథ్యంలో వర్సిటీ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. అదే సమయంలో ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ వర్సిటీ ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీల్లో కొన్ని మార్పులు జరిగినట్లు తెలిపింది. 9 నుంచి స్టేట్ కోటా కౌన్సెలింగ్ఆల్ ఇండియా కోటాలో జూలై 21 నుంచి 30 వరకు తొలి విడత కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా, దానిని ఆగస్టు 9 వరకు పొడిగించారు. స్టేట్ కోటా తొలి విడత కౌన్సెలింగ్‌ను ఆగస్టు 9 నుంచి 18 వరకు నిర్వహించాలని వర్సిటీ నిర్ణయించింది. మూడు విడతల తర్వాత ఆల్ ఇండియా కోటా కింద స్ట్రే వేకెన్సీ కోటా కౌన్సెలింగ్ సెప్టెంబర్ 30 నుంచి 4 అక్టోబర్ వరకు జరగనుంది. రాష్ట్ర కోటాలో స్ట్రే వేకెన్సీ కోటా కౌన్సెలింగ్ అక్టోబర్ 2 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. అక్టోబర్ 10వ తేదీతో ఆల్ ఇండియా కోటాతోపాటు స్టేట్ కోటా ప్రవేశాల ప్రక్రియ ముగుస్తుందని యూనివర్సిటీ ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు 9వ తేదీ వరకు వెలువడే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే వర్సిటీ కొత్త షెడ్యూల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా, బీఎస్సీ, బీడీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల అకడమిక్ సెషన్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది.కొత్త షెడ్యూల్ ప్రకారం నీట్ కౌన్సెలింగ్ వివరాలుఆల్ ఇండియా/డీమ్డ్/కేంద్ర విశ్వవిద్యాలయాలుమొదటి రౌండ్ కౌన్సెలింగ్: జూలై 21 నుంచి ఆగస్టు 9 వరకుఎంసీసీ ద్వారా అభ్యర్థుల డేటా ధ్రువీకరణ: ఆగస్టు 19 నుంచి 20 వరకుచేరికకు చివరి తేదీ: ఆగస్టు 18రెండో రౌండ్ కౌన్సెలింగ్: ఆగస్టు 21 నుంచి 29 వరకుచేరికకు చివరి తేదీ: సెప్టెంబర్ 5మూడో రౌండ్: సెప్టెంబర్ 9–17చేరికకు చివరి తేదీ: సెప్టెంబర్ 25స్ట్రే వేకెన్సీ రౌండ్: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 వరకుచేరికకు చివరి తేదీ: అక్టోబర్ 10స్టేట్ కోటా కౌన్సెలింగ్ వివరాలుమొదటి రౌండ్: ఆగస్టు 9 నుంచి 18 వరకుడేటా ధ్రువీకరణ: ఆగస్టు 25 నుంచి 26 వరకుచేరికకు చివరి తేదీ: ఆగస్టు 24రెండో రౌండ్: ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 5 వరకుడేటా ధ్రువీకరణ: సెప్టెంబర్ 12 నుంచి 13 వరకుచేరికకు చివరి తేదీ: సెప్టెంబర్ 11మూడో రౌండ్: సెప్టెంబర్ 15 నుంచి 25 వరకుడేటా ధ్రువీకరణ: అక్టోబర్ 1చేరికకు చివరి తేదీ: సెప్టెంబర్ 30స్ట్రే వేకెన్సీ రౌండ్: అక్టోబర్ 2 నుంచి 5 వరకుచేరికకు చివరి తేదీ: అక్టోబర్ 10 -
మోదీని గద్దె దించుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించకుంటే రాహుల్‌గాంధీ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించుతామని హెచ్చరించారు. ఎర్ర కోటపై మూడు రంగుల జెండా ఎగురవేసి రాహుల్ గాందీని ప్రధానమంత్రిని చేసుకుని బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌ను నెరవేర్చుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రజల శక్తిని, ఉద్యమ స్ఫూర్తిని మోదీ తక్కువగా అంచనా వేస్తే తడాఖా చూపిస్తామని అన్నారు. బిల్లులు ఆమోదం పొందే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో టీపీసీసీ బుధవారం నిర్వహించిన మహాధర్నాలో సీఎం ప్రసంగించారు. సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తే అదే మరణ శాసనం ‘గోధ్రా అల్లర్ల సమయంలో రాజీనామా చేయమని నాటి ప్రధానమంత్రి వాజ్‌పేయి నాడు సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని కోరితే చేయలేదు. 75 ఏళ్లు నిండినందున ప్రధాని పదవి నుంచి వైదొలగాలని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ కోరుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. మోదీ లేకపోతే బీజేపీకి 150 సీట్లు కూడా రావని ఆయన భక్తుడు నిశికాంత్ దూబే అంటున్నారు. ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 150 సీట్లు దాటవు. బీసీ రిజర్వేషన్లను మోదీ అడ్డుకుంటే ఆయనను గద్దె దించడం ఖాయం. రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించకుంటే ఇక ఢిల్లీ రాము.. గల్లీకి వచ్చినప్పుడు బీజేపీ నేతలను పట్టుకుంటాం. ఇందిరాగాం«దీ, రాజీవ్‌గాంధీ వారసునిగా వచ్చిన రాహుల్‌గాంధీ బీసీలకు న్యాయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. సామాజిక న్యాయంపై రాహుల్‌గాంధీ శిలాశాసనానికి వ్యతిరేకంగా వస్తే అదే మరణ శాసనం అవుతుంది..’అని రేవంత్ హెచ్చరించారు. బీజేపీకి తెలంగాణ బీసీల అవసరం లేదా? ‘బలహీన వర్గాలపై కక్ష గట్టిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేశారు. నాడు కేసీఆర్ చేసిన చట్టమే నేడు రిజర్వేషన్ల పెంపునకు గుదిబండగా మారింది. తెలంగాణలో బలహీన వర్గాల బిడ్డలు.. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు కాకుండా అడ్డుగా ఉన్న చట్టాన్ని తొలగించాలని ఆర్డినెన్స్ చేసి గవర్నర్‌కు పంపినా ఆమోదించడం లేదు. కేసీఆర్‌తో పాటు బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాంచందర్‌రావులు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డుపడుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు తెలంగాణ బీసీల అవసరం లేదా? బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాకు ఎందుకు రాలేదు? తెలంగాణతో పేరు బంధంతో పాటు పేగు బంధం కూడా తెంచుకుందా? ఆ అదృష్టం నాకు దక్కింది ‘దేశంలో వందేళ్ల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయలేదు. ఇప్పటివరకు దేశంలో 300 మంది ముఖ్యమంత్రులైనా ఎవరూ చేయని పనిని చేసే అదృష్టం నాకు దక్కింది. బీసీల రిజర్వేషన్లు పెంచే అవకాశం నాకు వచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకే ఢిల్లీలో ధర్నాకు దిగాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సాధించి తీరతాం..’అని ముఖ్యమంత్రి అన్నారు. కేటీఆర్ బుద్ధి మారలేదు.. అహంకారం తగ్గలేదుబీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాను కేటీఆర్ డ్రామా అంటున్నారు. కానీ కేటీఆర్ పేరే డ్రామారావు. కేసీఆర్ కుటుంబం డ్రామాలతో బతుకుతోంది. అధికారం, పదవులు పోయినా కేటీఆర్ బుద్ధి మారలేదు..అహంకారం తగ్గలేదు. ఆ కుటుంబంలోనే ఒకరు రిజర్వేషన్లకు అనుకూలం.. మరొకరు ప్రతికూలం.. మరొకరు అటూఇటూ కాకుండా మాట్లాడుతున్నారు..’అని సీఎం ధ్వజమెత్తారు. -
‘సృష్టి’ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ‘సృష్టి’ కేసులో గోపాలపురం పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్లను వాడి నమ్రత పలువురికి ఇంజక్షన్లు, మందులు ఇచ్చినట్లు తేలింది. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి షాక్ తిన్న.. ఆ గైనకాలజిస్ట్ డాక్టర్ నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరోగసి పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.పిల్లలను అమ్ముకున్నట్టు అంగీకరించిన నమ్రత.. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను సేకరించామని.. అందరికీ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామని తెలిపారు. అయితే, ఏజెంట్ల వివరాలు లేవంటూ ఆమె చెప్పింది. 80 మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. మళ్లీ నమ్రతను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పలు రాష్ట్రాలకు చెందిన 9 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య మొత్తం 26కి చేరింది.కాగా, ఈ కేసులో నిందితురాలైన విద్యుల్లతకు బెయిల్ లభించింది. కేసులో ఏ16గా ఉన్న ఆమెకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెను సోమవారం.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో డాక్టర్ విద్యులత ఉన్నారు. A3 కల్యాణి, A6 సంతోషిల ఐదు రోజుల కస్టోడీయల్ విచారణ నేటితో ముగిసింది. నిందితులను గోపాలపురం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. -
సంగారెడ్డి జిల్లా: అన్నారంలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల అన్నారంలో గ్రామంలో గుబ్బ కోల్డ్ స్టోరేజ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోల్డ్ స్టోరేజ్‌కు సంబంధించిన పరిశ్రమలో మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాల వరకు విస్తరించాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు వెల్లడి కాలేదు -
దేనికింద ఏముందో.. ఏది కుంగనుందో?
సాక్షి, హైదరాబాద్: నాలాలు కుంగిపోయి వాహనాలు దిగబడుతున్నా దిక్కేలేకుండా పోయింది. కుహరాల్లా కుంగిపోతున్నా బల్దియాకు సోయే లేకుండాపోతోంది. గత ఏడాది బంజారాహిల్స్ రోడ్ నెంబర్– 11 ఉదయ్‌నగర్‌లో నాలా శ్లాబ్‌తో పాటు రిటైనింగ్ వాల్ కూలింది. గోషామహల్ చాక్నవాడి ప్రాంతంలో నాలాశ్లాబ్ స్వల్ప సమయంలోనే ఐదారుసార్లు కుంగింది. ఈ సంవత్సరం కూడా ఆ శ్లాబ్ కూలింది. వాహనాలు దిగబడ్డాయి. గతంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ ప్రాంతంలోనూ నాలాపైనున్న రోడ్డు కుంగిపోయింది. ఇలా ఎంతోకాలంగా నగరంలోని నాలాల పైకప్పులు, నాలాలపై ఉన్న రోడ్లు కుంగిపోవడం, వాహనాలు అందులో దిగడం పరిపాటిగా మారినా ప్రమాదాలు జరగకుండా గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఎలాంటి శ్రద్ధ చూపడంలేదు. పురాతన కాలం నాటివెన్నో.. నగరంలోని నాలాలు ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినవి. నిజాం కాలం నాటి నాలాలూ వాటిల్లో ఉన్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన నాలాలు, వాటి పైకప్పులు (రోడ్లు) ఎలా ఉన్నాయి.. ఏమేర దెబ్బతిన్నాయి వంటి అంశాలను అధికారులు ఏనాడూ పట్టించుకోలేదు. నాలాల కింద ఎక్కడెక్కడ ఏమేమున్నాయో తెలిసే ఇన్వెంటరీ కూడా జీహెచ్ఎంసీ వద్ద లేదు. దీంతో.. ఏ నాలా కింద ఏముందో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలిసే పరిస్థితి లేదు. తాజాగా బంజారాహిల్స్‌లో నాలాలో వాటర్ ట్యాంకర్ దిగబడటంతో ఈ అంశం మళ్లీ తెరమీదికొచి్చంది. భారీ వాహనం కావడంతో నాలాలో పడిపోయింది. కనీసం నాలాలున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ప్రయాణించేందుకు హెచ్చరికల బోర్డుల వంటివి సైతం ఎక్కడా ఏర్పాటు చేయలేదు. గతంలోనూ నాలాలపై రోడ్లు కుంగినప్పుడు సైతం ఏ నాలా పరిస్థితి ఏమిటో, వాటికింద ఏమేమున్నాయో, రిటైనింగ్ వాల్స్ పరిస్థితేమిటో తెలుసుకోవాలనుకోలేదంటే అధికారుల తీరును అంచనా వేయవచ్చు. రూ.55 కోట్లు ఖర్చు చేస్తున్నా.. జీహెచ్ఎంసీ పరిధిలో 955 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడికతీతల కోసం దాదాపు రూ. 55 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ.. రోడ్ల దిగువనున్న నాలాల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. అదృష్టవశాత్తు నాలాల్లో వాహనాలు దిగబడినప్పుడు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.అదే వాహనాల్లో ఎక్కువమంది ఉండి ప్రమాదం తీవ్రమైతే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఆధునికీకరణ సరే.. ఆపదల మాటేమిటి? వరద ముంపు సమస్యల పరిష్కారం కోసం వ్యూహాత్మక నాలా అభివద్ధి పథకం కింద ఇప్పటికే దాదాపు రూ. 950 కోట్లు ఖర్చుచేశారు. నాలాల ఆధునికీకరణ, నీటి పారుదలకు బాక్స్ డ్రెయిన్ల నిర్మాణాల వంటివి చేపట్టారు కానీ.. పురాతన నాలాలపై కనీస శ్రద్ధ పెట్టలేదు. వీటిలో కాలనీలు, స్లమ్స్ మధ్యన ఉన్నవి కూడా ఎన్నో ఉన్నాయి. నాలా రిటైనింగ్ వాల్స్నే ఆనుకుని వెలసిన అపార్ట్మెంట్లు సైతం ఉన్నాయి. అయినప్పటికీ, నాలాల వల్ల కలిగే ప్రమాదాల గురించి అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. నాలా సేఫ్టీ ఆడిట్ పేరిట ప్రతి నాలానూ అధికారులు తనిఖీలు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ, నాలాల శ్లాబ్ (రోడ్)లు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేరు. శిథిల భవనాల విషయంలో మొక్కుబడి సర్వేలు చేస్తున్నప్పటికీ, పురాతన నాలాలు, వాటిపై ఉన్న రోడ్ల స్టెబిలిటీ గురించి మా త్రం కనీసం పట్టించుకోవడం లేదు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే.. ఏ నాలా ఎప్పుడు కుంగుతుందో తెలియని దుస్థితి దాపురించింది. కాగితాలకే పరిమితం.. నాలా సేఫ్టీ చర్యల్లో భాగంగా ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో నడుచుకుంటూ వెళ్లి పరిశీలించాలి. రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పున్న ఓపెన్ నాలాలకు అన్ని ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఉండాలి. పైకప్పులున్న నాలాల్లో ఎక్కడైనా కప్పులు దెబ్బతిన్నా, ఓపెన్‌గా ఉన్నా గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నది కాగితాలకే పరిమితమైంది. వరదనీరు ఏ నాలా నుంచి ఎక్కడకు వెళ్తుందో కూడా తెలియని అధికారులున్నారంటే అతిశయోక్తి కాదు. బలహీనంగా నాలా కప్పులు నగరంలో ప్రస్తుతమున్న నాలా వ్యవస్థ గంటకు 20 మి.మీ వర్షపాతాన్ని మాత్రమే తట్టుకోగలదు. సగటున గంటకు 60 మి.మీ.లకు పైగా వర్షపాతం న మోదవుతుండటంతో ఉన్న నాలాలు వర్షాన్ని తట్టుకునేలా లేవు. దాంతో నాలాల పైకప్పులూ బలహీనమవుతున్నాయి. 000లో కురిసిన భారీ వర్షాలతో అప్పటి ఎంసీహెచ్ పరిధి వరకు వరద కాలువలపై అధ్యయనం చేసిన కిర్లోస్కర్ కమిటీ సమగ్ర నివేదిక రూపొందించింది. 170 కి.మీ పొడవున్న 71 నాలాలను తక్షణం విస్తరించాలని సూచించింది. 2007లో జీహెచ్ఎంసీగా> రూపాంతరం చెందాక గ్రేటర్ పరిధి మొత్తానికి వాయెంట్స్ సొల్యూషన్స్ వరదనీటి కాలువలపై అధ్యయనం చేసింది. 20మి.మీ మించి వర్షం కురిసిన ప్రతిసారీ నగరం నీట మునుగుతోంది. 390 కి.మీ మేర మేజర్ నాలాలను ఆధునికీకరించాలని వాయెంట్స్ సొల్యూషన్స్ సూచించింది. నాలాల వెంబడి బఫర్‌జోన్ పరిధిలో మొత్తం 28వేల అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించింది. రోడ్డు కుంగి నాలాలో కూరుకుపోయిన వాటర్ ట్యాంకర్బంజారాహిల్స్: రోడ్ నెం– 1లోని మహేశ్వరి చాంబర్స్ అపార్ట్మెంట్ వీధిలో ఓ వాటర్ ట్యాంకర్ నాలాలో దిగబడిన ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి ఈ రోడ్డులోని నాలా కుంగిపోయింది. దీంతో అపార్ట్‌మెంట్‌కు వస్తున్న వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అపార్ట్మెంట్ రోడ్డు నుంచి ప్రధాన రోడ్డుకు రాకపోకలు నిలిచిపోయాయి. వాటర్ ట్యాంకర్‌ను వెలికితీసేందుకు 70 టన్నుల క్రేన్ కావాల్సి ఉంటుందని, ఇంత పెద్ద క్రేన్ నిలిపేందుకు అక్కడ స్థలం లేకపోవడంతో సాయంత్రం వరకు అధికారులు తర్జనభర్జన పడ్డారు. రాత్రి వరకు క్రేన్ ద్వారా నాలాలో పడిపోయిన ట్యాంకర్‌ను తొలగిస్తామని ఈఈ విజయ్‌కుమార్ తెలిపారు. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన నాలా కావడంతో కుంగిపోయిందని అధికారులు గుర్తించారు.మాస్టర్‌ప్లాన్ ఏదీ?నాలాలపై ఉన్న రోడ్లపై వాహనాల రాకపోకలతో దెబ్బతినే ప్రమాదాలున్నందున నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ పని జరగడం లేదు. వర్షం వచి్చనప్పుడు నీరు నాలాల్లో చేరినప్పటి నుంచి ఎక్కడి నుంచి వెళ్లి ఎక్కడ కలుస్తోంది వంటి వివరాలు లేవు. నిర్వహణ లేదు. నాలాలకు మాస్టర్‌ప్లాన్ అనేదేమీ లేదు. అక్రమ నిర్మాణాల కారణంగానూ నాలా పరిసరాలు బలహీనమవుతున్నాయి. నాలాలకు అడ్డుగా ఉన్న పైపులైన్లు తదితర యుటిలిటీస్‌ను తరలించడం, నాలాల్లో చెత్తా చెదారాలు చేరకుండా చూడాల్సి ఉంది. పైకప్పుల్ని బలోపేతం చేయాల్సి ఉంది.కాంక్రీట్ కప్పుల వల్లే.. నాలాలపై కాంక్రీట్ కప్పుల (రోడ్ల) వల్ల లోపల మరమ్మతులు చేయలేని పరిస్థితులుంటున్నాయి. లీకేజీలు గుర్తించలేకపోతున్నారు. చాలాకాలం క్రితం నిర్మించిన నాలాల పైకప్పులు బీటలు పడుతున్నా పట్టించుకోవడం లేదు. అంబర్‌పేట, బేగంబజార్, విజయ్‌నగర్ కాలనీ, మలక్‌పేట తదితర ప్రాంతాల్లోనూ కప్పులు దెబ్బతిని ప్రమాదాలు జరిగాయి. వీటికి తగిన పరిష్కారాలపై దృష్టి సారించాల్సి ఉంది. -
ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ?
జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఇటీవల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భాగంగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆపి పరీక్షించారు. అతను మద్యం తాగినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. అయితే ఆ సమయంలో బైక్‌తోపాటు అతని సెల్‌ఫోన్‌ను కూడా లాక్కొని పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అక్కడున్న హోంగార్డు, మరో కానిస్టేబుల్ మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అతని మరణానికి కారణం పోలీసుల దురుసు ప్రవర్తనేనని బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. విచిత్రం ఏంటంటే.. ఆ వ్యక్తి తమ విధులకు ఆటంకం కలిగించాడంటూ పోలీసులు అదేరోజు రాత్రి కేసు నమోదు చేశారు.చింతపల్లి మండలం కూర్మేడ్ గ్రామంలో తాము కొనుగోలు చేసిన భూమి విషయంలో చింతపల్లి ఎస్సై రామ్మూర్తి తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారంటూ టీవీ నటి శిల్పా చక్రవర్తి, ఆమె భర్త జడ కల్యాణ్ యాకయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఎదుటి వారితో కుమ్మకై ్క భూవివాదం సెటిల్ చేసుకోవాలంటూ తమ వేధిస్తున్నారని పేర్కొన్నారు. సివిల్ కోర్టు ఇంజెక్షన్ ఉన్నా పోలీసుల సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ గతేడాది శాలిగౌరారం ఎస్సైపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కుటుంబ వివాదంలో పోలీసుస్టేషన్‌కు వెళ్లిన మహిళపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్సైపై ఎస్పీ విచారణ జరిపించి చర్యలు తీసుకున్నారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో ఫ్రెండ్లీ పోలిసింగ్ గాడి తప్పుతోంది. కొందరు పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల వేధింపుల కారణంగా బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. బాధితుల ఫిర్యాదులతో బయటకు వస్తున్న సంఘటనలు కొన్నే. పోలీస్ స్టేషన్లలోనే పంచాయతీలు, సెటిల్మెంట్లు చేస్తూ దండుకుంటున్న వారు కొందరైతే, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారు మరికొందరు. అదీ చాలదన్నట్లు ఇంకొందరైతే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖకే మచ్చ తెస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సస్పెండ్ చేయడం, ఎస్పీ కార్యాలయాలకు అటాచ్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నా అలాంటి వారిలో మార్పు రావడం లేదు. పైగా రాజకీయ పలుకుబడితో కొద్దిరోజుల్లోనే తిరిగి పోస్టింగ్ పొందుతున్నారు.ముడుపులే లక్ష్యంగా దందాలుకొందరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు రాజకీయ నేతల అండదండలతో అవినీతి దందా కొనసాగిస్తున్నారు. ఏదైనా కేసు విషయంలో పోలీసు స్టేషనన్‌కు వెళితే చాలు న్యాయ అన్యాయాలు పట్టించుకోకుండా, ముడుపులు ముట్టజెప్పిన వారికి వంతపాడుతూ బాధితులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలంలో గతంలో పనిచేసిన ఓ ఎస్సై భూవివాదాల్లో మితిమీరిన జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తనకు ఎదురు తిరిగిన వారిపై చేయి చేసుకోవడం బెదిరింపులకు పాల్పడడం, అక్రమ కేసులను పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని ముసిపట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసు స్టేషన్లో బంధించి చితకబాదడమే కాకుండా, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిపైనా చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.చర్యలు చేపడుతున్నా తీరు మారట్లే..⇒ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన సంధ్యకు యాదాద్రి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలోని మరిపిరాల గ్రామానికి చెందిన కృష్ణతో ఏడాదిన్నర కిందట వివాహమైంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు రావడంతో పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే ఎస్సై తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ మే నెల 20వ తేదీన ఆమె మండల కేంద్రంలోని వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో మృతురాలి బంధువులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు ఎస్సైని బదిలీ చేశారు.⇒ సూర్యాపేట జిల్లాలో నకిలీ డాక్టర్ల కేసులో సూర్యాపేట పట్టణ సీఐ వీర రాఘవులు, సూర్యాపేట డీఎస్పీ పార్థ సారధి రూ. 16లక్షలు లంచం డిమాండ్ చేసి మే 12న ఏసీబీకి పట్టుబడ్డారు.⇒ నూతనకల్ మండలం మిర్యాలలో చక్రయ్యగౌడ్ హత్య కేసులో అప్పటి డీఎస్పీ డబ్బులు తీసుకొని నిందితులను ప్రోత్సహించడంతో పాటు హత్య కేసులో పాల్గొన్న నిందితులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందాన్ని కాదని తుంగతుర్తి సీఐకి బాధ్యతలు అప్పగించడం పట్ల పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో డీఎస్పీని డీజీపీ ఆఫీస్‌కు, సీఐని ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు.⇒ నూతనకల్ పోలీస్ స్టేషనన్‌లో పనిచేసిన ఎస్ఐ వి.ప్రవీణ్‌కుమార్ అదే పోలీస్ స్టేషనన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించడంతో సదరు మహిళా కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌ను శనివారం డీఐజీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.⇒ నేరేడుచర్ల మండలం మేడారంలో ఓ భూవివాదంలో తమ హత్యకు కుట్ర చేశారంటూ ఒక వర్గం వారు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో మరోవర్గం వారిపై నేరేడుచర్ల ఎస్సై రవీందర్‌నాయక్ కేసు నమోదు చేసి స్టేషన్‌కి పిలిపించి తీవ్రంగా కొట్టారని బాధితులు ఆరోపించారు. అంతేకాదు అదే మండలంలోని కందులవారిగూడెంలో భూవివాదంలో ఎస్సై రవీందర్‌నాయక్ ఒక వర్గం వారిని విచారణ పేరుతో బాధితులను కొడుతున్నట్లు విమర్శలు వచ్చాయి. విచారణ పేరుతో ఎందుకు కొడుతున్నారని అడిగితే తమపైనా దురుసుగా ప్రవర్తించారంటూ స్వప్న అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.⇒ గతేడాది భూవివాదంలో గుర్రంపోడు మండలంలో జరిగిన ఓ మహిళ హత్య కేసులో ఎదుటివారితో కుమ్మకై ్క సూసైడ్ కేసుగా నమోదు చేశారు. ఆ కేసును ఎస్పీ శరత్‌చంద్రపవార్ విచారణ జరిపించారు. ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఆ తరువాత సీఐపైనా విచారణ జరిపించారు. పీఏపల్లి మండలం గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని కొట్టిన విషయంలో సీఐపై విచారణ జరిపి ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు.వివాదాల కేంద్రంగా చింతపల్లిచింతపల్లి మండలంలో గతంలో పనిచేసిన ఓ ఎస్సై భూవివాదంలో జోక్యం చేసుకున్నారు. ఆ కేసులో ఓ వృద్ధున్ని పోలీసు స్టేషనన్‌కు తీసుకువచ్చి కొట్టడం వల్లే అతను చనిపోయాడని ఆ వృద్ధుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో వృద్ధునికి గుండెపోటు వచ్చిందని, పోలీసులు కొట్టినందున ఆయన చనిపోలేదని, గుండెపోటు కారణంగానే అతను చేనిపోయాడని తేల్చారు. అయితే సదరు ఎస్సైని పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. అయినా కొద్దినెలలకే రాజకీయ పలుకుబడితో ఆయన మరో కీలకమైన పోస్టింగ్ తెచ్చుకోగలిగారు.డ్రంక్ అండ్ డ్రైవ్.. పోలీసుల అత్యుత్సాహంపోలీసుల అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి పట్టణ కేంద్రాల్లో పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మద్యం తాగినా, తాగకపోయినా తనిఖీల సమయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. వాహనంతోపాటు సెల్ ఫోన్లు లాక్కోవడం, ఇష్టానుసారంగా మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే నిబంధనల ప్రకారం ఏం చేయాలన్నది కాకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
‘ముందు భాష మార్చుకో రేవంత్’.. ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘సీఎం తన భాష మార్చుకోవాలి. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి.. ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. చాలామంది సీమాంధ్ర నాయకులు ఇంకా తెలంగాణను దోచుకుంటుంన్నారు.నాకు మంత్రి పదవి హైకమాండ్ ప్రామిస్ చేసింది. ఇంకా మూడున్నరేళ్ళు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి.. ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దాం. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లుగా సీఎం రేవంత్ తీరు ఉంది’ అని ధ్వజమెత్తారు. -
Cable Bridge: బర్త్ డే రోజే..
హైదరాబాద్: స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని హాస్టల్‌కు బైక్‌పై తిరిగి వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కేక్ కట్ చేసిన అరగంటకే యువకుడు మృత్యువాత పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ముక్కురాళ్ల గ్రామానికి చెందిన ఎర్రగొల్ల అనిల్ (23) అమీర్‌పేటలోని ఓ హాస్టల్లో ఉంటూ సమీపంలో ఉన్న మైండ్ మ్యాప్స్ వీఎఫ్ఎక్స్ స్టూడియోస్‌లో ఎడిటింగ్ పనిచేస్తుంటాడు. మంగళవారం పుట్టినరోజు కావడంతో అనిల్ తన స్నేహితులు జాన్‌పాల్, మహేష్ నాగరాజు, వెంకటేష్ భాను తదితరులతో కలిసి బైక్‌లపై సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి వెళ్లారు. తమతో పాటు తెచ్చుకున్న కేక్‌ను అనిల్ కట్ చేసిన అనంతరం స్నేహితులంతా అక్కడే సరదాగా గడిపి తెల్లవారుజామున 2 గంటల సమయంలో బయలుదేరారు. ఈ క్రమంలో జాన్‌పాల్ బైక్ నడుపుతుండగా అనిల్ వెనుక కూర్చొన్నాడు. మిగతా స్నేహితులంతా ఎవరి బైక్‌లపై వారు అనుసరించారు. అనిల్ ఎక్కిన బైక్‌ను జాన్‌పాల్ అధిక వేగంతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 ఫ్లైఓవర్ వైపు దూసుకెళ్తుండగా మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. దీంతో అనిల్ కిందపడగా కొద్ది దూరం వరకు రోడ్డుపై రాసుకుంటూ వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న జాన్‌పాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెనుక వస్తున్న స్నేహితులంతా తల పగిలి రక్తపు మడుగులో విలవిల్లాడుతున్న అనిల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పుట్టినరోజు కావడంతో అంతకు ఆరు గంటల ముందే వీరు హాస్టల్లోనే మద్యం సేవించినట్లు పోలీసుల అదుపులో ఉన్న జాన్‌పాల్ వెల్లడించారు. జాన్‌పాల్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా మద్యం సేవించినట్లుగా నమోదైంది. అర్ధరాత్రి మద్యం మత్తులో అదుపుతప్పిన వేగంతో బైక్‌పై దూసుకెళ్తుండడంతో మలుపు వద్ద కంట్రోల్ చేయలేక డివైడర్‌ను ఢీకొట్టినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేబుల్ బ్రిడ్జి వద్ద నుంచి బయలుదేరే ముందు అనిల్ తన బర్త్ డే కేక్‌ను చేతిలో పట్టుకొని బైక్‌పై కూర్చోగా ఈ ప్రమాదంలో అనిల్ కిందపడ్డ తర్వాత కేక్ రోడ్డంతా చిందరవందరగా పడిపోయింది. బర్త్ డే రోజు ఈ ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల రోదనలకు అంతులేకుండాపోయింది. జూబ్లీహిల్స్ పోలీసులు ప్రమాదానికి కారకుడైన జాన్‌పాల్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సై అంటూ సత్తా చాటుతూ..!
డబ్బులు పొదుపు చేయడం, రుణాలు పొందడానికి మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదు గ్రామీణ మహిళా సంఘాలు. పెట్రోల్ బంక్‌ల నిర్వాహణ నుంచి ఆర్టీసీ బస్సులను అద్దె తీసుకొని నడపడం వరకు తమ సత్తా చాటుతున్నారు. సోలార్ ప్లాంట్ల నిర్వహణకు సిద్ధం అవుతున్నారు.’పెట్రోల్ బంక్’ అనగానే ‘పురుషులు మాత్రమే’ అన్నట్లుగా ఒక చిత్రం మదిలో ముద్రితమై ఉంటుంది. ఇప్పుడు ఆ చిత్రాన్ని మార్చేస్తున్నారు గ్రామీణ మహిళలు. ‘మేము సైతం’ అంటూ పెట్రోల్‌బంక్‌ల నిర్వాహణలో సత్తా చాటుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా’ గ్రామైక్య సంఘం మహిళలు పెట్రోల్ బంక్ నిర్వహణకు ముందుకు వచ్చారు.రాష్ట్రంలోనే మూడోది...మహిళా సంఘాల ద్వారా నడిపే పెట్రోల బంక్ ఇటీవల నారాయణపేట జిల్లాలో మొదటిసారి ్ర΄ారంభమైంది. తర్వాత సంగారెడ్డి జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటైంది. రాష్ట్రంలో మూడో పెట్రోల్ బంక్ లింగన్నపేటలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ్ర΄ారంభమైంది. పెట్రోల్ బంక్ ఏర్పాటుతో గ్రామైక్య సంఘానికి నెలవారీ స్థిర ఆదాయం లభించనుంది.ధాన్యం కొనుగోలు కేంద్రాలుసిరిసిల్ల జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న మహిళా సంఘాలు పొదుపు చేయడం, రుణాలు పొందడానికే పరిమితం కాకూడదని జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా భావించారు. ‘ఇందిరా క్రాంతి’ పథం ద్వారా మహిళా సంఘాలకు ఆరు నెలల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అప్పగించారు. 192 ఐకేపీ కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించగా 20లక్షల 25వేల 252 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి శభాష్ అనిపించుకున్నారు. రూ.6.80 కోట్ల ధాన్యం కమీష¯Œ ను సాధించారు.రైతుల ముంగిట్లోకి ఎరువులువానకాలం సాగులో రైతుల ముంగింట్లోకే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా మహిళలకు ఎరువుల దుకాణాలను అప్పగించారు. ఇలా 23 కేంద్రాలను ఇప్పటికే జిల్లాలో ప్రారంభించారు. ప్రతి మండలానికి రెండేసి చొప్పున ఎరువుల దుకాణాలను మహిళా సంఘాలకు అప్పగించారు.అద్దెకు ఆర్టీసీ బస్సులుమహిళల భాగస్వామ్యంతో ఆర్టీసీకి సిరిసిల్ల జిల్లా నుంచి తొమ్మిది బస్సులను అందించారు. 9 మండలాల సమాఖ్యల ద్వారా రూ.6 లక్షల వాటా ధనంతో రూ.30 లక్షలతో ఒక్కో ఆర్టీసీ బస్సును మహిళలు అద్దెకు తీసుకున్నారు. మూడు నెలల క్రితం మొదలైన అద్దె బస్సులతో ప్రతి నెల రూ. 50వేల అద్దెను తొమ్మిది సమాఖ్యలు పొందుతున్నాయి.ఇక సోలార్ పవర్పెట్రోల్ బంక్‌లే కాదు సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ముష్టిపల్లి, ధర్మారంలో భూసేకరణ పూర్తిచేయగా, జిల్లా సమాఖ్య ద్వారా రూ.3కోట్ల పెట్టుబడితో సోలార్ ΄్లాంట్లను ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి. – అవధూత బాలశేఖర్, సాక్షి, ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్లఉపాధి పొందుతున్నాంమేము నాలుగు నెలల క్రితం వరకు ధాన్యం కొనుగోళ్లు చేశాం. మా వీవోకు రూ.4.29లక్షల కమిషన్ వచ్చింది. పదిమందికి పని లభించింది. ‘కుట్టు’తో స్వశక్తి మహిళలు ఉపాధి పొందుతున్నారు. గత ఏడాదిగా స్వశక్తి మహిళలు జిల్లాలో స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు. మా ఊళ్లో కూడా యూనిఫామ్స్ కుడుతున్నాం. ఇప్పుడు ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాం.– పందిర్ల సునీత, ఆవునూర్ఎంతో గర్వంగా ఉందిపెట్రోల్ బ్యాంక్‌ల నిర్వహణ అనేది మా సంఘానికి సంబంధించి పెద్ద మలుపు. మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పటివరకు మేము గృహిణులుగా ఇంటికే పరిమితమయ్యాం. పెట్రోల్ బంక్ నిర్వహణను సవాల్‌గా తీసుకొని విజయవంతంగా కొనసాగిస్తామనే ధీమాతో ఉన్నాం. – సుభద్ర, అధ్యక్షురాలు, శ్రీ షిర్డీ సాయిబాబా గ్రామైక్య సంఘం, లింగన్నపేటమహిళా శక్తిని చాటారుఇందిరా మహిళా శక్తి ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపట్టాం. క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఎరువుల దుకాణాలు, ఆర్టీసీ బస్సులు ్ర΄ారంభించాం. త్వరలో రైస్‌మిల్లులు, సోలార్ ΄్లాంట్లను మహిళలకు అందజేస్తాం. – సందీప్‌కుమార్ ఝా, జిల్లా కలెక్టర్ -
కాంగ్రెస్ కార్యకర్తను.. అయినా ఇందిరమ్మ ఇల్లు రాలేదు!
కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ కార్యకర్తనైనప్పటికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదంటూ కరీంనగర్ జిల్లా సుందరగిరిలో దంపతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వంతడ్పుల శ్రీనివాస్, సృజన దంపతులు కరీంనగర్లో అద్దెకుంటున్నారు. సుందరగిరిలో వీరికి సొంత ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు కోసం మేలో గ్రామ కమిటీ సభ్యులను శ్రీనివాస్ నిలదీసినా మంజూరు కాలేదు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ తన కోటా నుంచి సుందరగిరికి మరో 20 ఇళ్లు మంజూరు చేశారు. జాబితాలో శ్రీనివాస్ పేరు లేదు. దీంతో దంపతులు మంగళవారం సుందరగిరిలోని హుస్నాబాద్–కరీంనగర్ ప్రధా న రహదారిపై బైఠాయించారు. శ్రీనివాస్ భార్యపై పెట్రోల్ పోసి.. తన ఒంటిపై, నోట్లో కూడా పోసుకున్నాడు. పోలీసులు వెంటనే వచ్చి వారిని 108లో హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఢిల్లీలో కొనసాగుతున్న టీపీసీసీ ధర్నా.. పలువురు ఎంపీల మద్దతు
Congress Delhi dharna Updates..కొనసాగుతున్న కాంగ్రెస్ ధర్నా..బీసీ రిజర్వేషన్ల సాధనకు దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదీక్షకు సంఘీభావం తెలిపేందుకు హాజరైన కాంగ్రెస్ ఎంపీలుఎంపీలు గౌరవ్ గొగోయ్, జ్యోతిమణి సెన్నిమలై, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ, శివసేన, ఎన్సీపీ ఎంపీల మద్దతు👉ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ ధర్నా సభా స్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిCongress Protest for 42% BC Quota at Jantar Mantar pic.twitter.com/9bh91VwPcQ— Naveena (@TheNaveena) August 6, 2025ఎమ్మెల్సీ విజయ శాంతి కామెంట్స్..బీసీ రిజర్వేషన్లు అడిగితే మమ్మల్ని ఢిల్లీ నడి రోడ్డు మీద నిలబెట్టింది బీజేపీ.బీసీ రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము వదలము.ఈరోజు దేశం ఇంత అభివృద్ధిలో ముందు ఉందని అంటే కారణం ఎస్సీ, ఎస్టీ, బీసీలే..బీసీ బిల్లులో న్యాయపరమైన చిక్కులు ఉంటే EWS బిల్లు ఎలా అమలు అయ్యింది..బీసీలు తయారు చేసిన కుర్చీలో మీరు కూర్చున్నారు.కానీ మీరు బీసీలకు మాత్రం న్యాయం చేయడం లేదు.42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.కొండా సురేఖ కామెంట్స్..42శాతం రిజర్వేషన్లలో ముస్లింలు ఉంటే తప్పేంటి అని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడుగుతున్నానుముస్లింలు మనుషులు కాదా?వారికి ఒటుహక్కు లేదా?రాష్ట్రపతి ఒక ఎస్టీ మహిళ, వితంతువు కాబట్టి ఆమెను పార్లమెంట్ ప్రారంభోత్సవానికి మోదీ పిలవలేదు.రాష్ట్రపతి తెలంగాణ బిల్లును ఆమోదిస్తుందనే నమ్మకం నాకు లేదు. LIVE : ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ భారీ ధర్నా https://t.co/R7xbpWWxBK— Telangana Congress (@INCTelangana) August 6, 2025 కనిమొళి కామెంట్స్..జంతర్ మంతర్‌లో కాంగ్రెస్ ధర్నాకు హాజరై మద్దతు పలికిన డీఎంకే ఎంపీ కనిమొళి50 శాతం న్యాయం కాదు.. సంపూర్ణ న్యాయం చేయాలి #WATCH | Delhi: On Congress workers holding a protest at Jantar Mantar over the 42% OBC reservation in Telangana state local bodies, DMK MP Kanimozhi says, "Tamil Nadu has 69% reservation. We stand in support to make centuries-old wrong into right. We stand with the Telangana… pic.twitter.com/QHWSCYJNc9— ANI (@ANI) August 6, 2025 కాసేపట్లో ధర్నా ప్రారంభం..కాసేపట్లో జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ భారీ ధర్నా ప్రారంభం కానుంది.తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తూ భారీ ధర్నాతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా.టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ధర్నా నిర్వహించనున్నారు.ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు.సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ గారు విచ్చేసి ప్రసంగిస్తారు.తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, జిల్లా స్థాయి ప్రముఖ నేతలు, బీసీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమం ద్వారా బీసీల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పోరాట పటిమను మరోసారి నిరూపించబోతుంది.👉తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించనుంది.Massive protest at Delhi’s Jantar Mantar today demanding 42% BC reservations. Led by CM @revanth_anumula & TPCC chief Mahesh Kumar Goud, joined by ministers, MPs & BC leaders the protest will be innugarted by AICC president #MallikarjunKharge @kharge at 11 AM, LoP #RahulGandhi… pic.twitter.com/EolP9x0AxK— Ashish (@KP_Aashish) August 6, 2025👉జంతర్ మంతర్ వద్ద ధర్నాలో 200 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. 1,500 మందికి పైగా కూర్చునేలా కుర్చీలు వేశారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే ధర్నా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్‌మంతర్‌కు వెళ్లే దారిలో ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు.👉మహాధర్నాలో పాల్గొనే దాదాపు వెయ్యి మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సోమవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంది. వీరికి స్థానిక వైఎంసీఏతో పాటు పలు హోటళ్లలో వసతి కల్పించారు. వీరితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు సుమారు 500 మంది వరకు విమానాల్లో ఢిల్లీకి వచ్చారు. వీరందిరికీ ఎంపీల అధికారిక నివాస గృహాలు, వెస్ట్రన్ కోర్ట్‌లో వసతిని ఏర్పాటు చేశారు. -
అత్తమామలపై కక్ష సాధింపు కేసు చెల్లదు
సాక్షి, హైదరాబాద్: గృహ హింస, వరకట్నం కేసు ల్లో ఆరోపణలతో, భర్తపై కక్ష సాధింపుతో అత్తమామలపై పెట్టే కేసు చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని నిందితుల జాబితాలో చేర్చడాన్ని తప్పుబట్టింది. పిటిషనర్లపై ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది. తమ కోడలు సెక్షన్ 498 –ఏ కేసులో తమను నిందితులుగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ.. మహారాష్ట్ర చోర్బుర్జికి చెందిన 74 ఏళ్ల గోవింద్ ప్రసాద్, అతని భార్య ఉషాశర్మ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున కపీష్కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లపై ఆరోపణలకు నిర్దిష్ట ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. పిటిషనర్లకు వ్యతిరేకంగా ఫిర్యాదీ ఎలాంటి వివరాలను సమర్పించలేదని పేర్కొన్నారు. వేధింపులు, క్రూరత్వం, వరకట్నం డిమాండ్‌కు సంబంధించిన ఏదైనా ప్రత్యేక సందర్భాన్ని వివరించలేకపోయారన్నారు. దీంతో పిటిషనర్లపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇడియట్ ముచ్చట్లు చెప్పకు..!
గీసుకొండ: మండలంలోని కొమ్మాల, విశ్వనాథపురం, శాయంపేట హవేలి, మరియపురం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విశ్వనాథపురం గ్రామంలో లబ్ధిదారుడు మూడు నర్సింహకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలిస్తూ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పది మందికి ఇళ్లు మంజూరు కాగా, నలుగురు మాత్రమే ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించడంతో సంబంధిత ఏఈ వినోద్‌ను వివరణ కోరారు. అందులో ఒకరి ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ కావడంతో జాప్యం జరిగిందని ఏఈ వివరణ ఇస్తుండగా, ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. ‘నీ వయస్సు ఎంత’ అని ఏఈని ప్రశ్నించగా.. 28 ఏళ్లు అని చెప్పాడు. ఇడియట్ ముచ్చట్లు చెప్పకు డీఈకి ఫోన్ చెయ్ అంటూ పరుష పదజాలంతో ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ వచ్చిన 45 రోజుల్లో బేస్మెంట్ వరకు నిర్మాణం చేపట్టాలని, లేకుంటే అవి రద్దవుతాయని అన్నారు. నిర్మాణాల విషయంలో జాప్యం జరిగితే పంచాయతీ కార్యదర్శి, సంబంధిత ఏఈలకు మెమోలో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కొమ్మాలలో కాంగ్రెస్ నాయకులకు చెందిన ఒకే కుటుంబానికి రెండు ఇళ్లు మంజూరైనట్లు స్థానికులు తెలపగా, జక్కుల రాజ్‌కుమార్, సాయిలి రమాదేవికి మంజూరు చేసిన ఇళ్లను వెంటనే రద్దు చేయాలని అధికారులను ప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. కొమ్మాలలో ప్రజా గ్రంథాలయానికి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్థలం కేటాయించాలని, సెర్ప్ మహిళా సంఘాలకు డైరీ ఫాం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను స్థానికులు కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఎండీ.రియాజుదీ్దన్, ఎంపీడీఓ పాక శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు శంకర్రావు, ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు దూల వెంటేశ్వర్లు, వీరాటి రవీందర్‌రెడ్డి, కూసం రమేష్, కొమ్ము శ్రీకాంత్, నాగరాజు, సాయిలి ప్రభాకర్, మూడు నర్సింహ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జక్కుల సరిత, సెర్ప్ సీసీ కోల శోభ, ప్రగతి మండల సమాఖ్య అధ్యక్షురాలు గట్టు రాధిక తదితరులు పాల్గొన్నారు. -
తేజ్ నేను ఎవరితో మాట్లాడలేదురా..!
కరీంనగర్: ‘తేజ్ నేనెవరితో మాట్లాడలేదు. ఆ దేవుడు, కొడుకు, మా అమ్మ.. నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. మన పెళ్లయినప్పటి నుంచి ఇంతవరకు నేనెవరితోనూ మాట్లాడలేదు. ఎవరితోనూ నాకు సంబంధం లేదు. నా కొడుకును బాగా చూసుకో. నీ వేధింపులతో నాకు పిచ్చిపడుతోంది. నేను మరణించాక నువ్వు మంచిగా ఉండు. నా ఫోన్ చూడు నిజం తెలుస్తుంది’ అని భర్తనుద్దేశించి సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శంకరపట్నం మండలం తాడికల్‌లో చోటుచేసుకుంది. ఆమె సెల్ఫీ వీడియో చూసిన బంధువులందరూ కన్నీరుమున్నీరయ్యారు. కేశవపట్నం ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. తాడికల్‌కు చెందిన గొట్టె శ్రావ్య (27) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్‌ను ప్రేమించి 2020లో వివాహం చేసుకుంది. తరువాత వారిద్దరూ బోయినపల్లిలో నివాసమున్నారు. అప్పుడే బాబు జన్మించాడు. రెండున్నర సంవత్సరాల క్రితం ధర్మతేజ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అప్పటినుంచి శ్రావ్య తాడికల్‌లోనే ఉంటోంది. కొంతకాలంగా ధర్మతేజ్ దుబాయ్ నుంచి ఫోన్ చేసి వేరే వారితో మాట్లాడుతున్నావంటూ శ్రావ్యను మానసికంగా హింసించాడు. ఇద్దరిమధ్య గొడవ జరగడంతో మంగళవారం వేకువజామున ఇంట్లో శ్రావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని హుజూరాబాద్ ఏసీపీ మాధవి, గ్రామీణ సీఐ వెంకట్, ఎస్సై పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ సురేఖ శవపంచనామా నిర్వహించారు. శ్రావ్య సోదరుడు గొట్టె శివకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
కరీంనగర్ : మానేరు తీరం పర్యాటక హారం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఏపీ మాజీ ఎంపీ హల్చల్
హైదరబాద్ : ‘నేను తాజా మాజీ ఎంపీని. నా కారు ఆపి సైరన్ తొలగిస్తారా.. నేను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడిని.. నీ ప్రాంతం కాకున్నా సైరన్ తొలగిస్తారా.. ఇక్కడ ఏ మంత్రికి ఫోన్ చేయమంటారు..?’ అంటూ ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీ బంజారాహిల్స్ (Banjara Hills) ట్రాఫిక్ పోలీసులపై రుసరుసలాడారు. మంగళవారం ఉదయం బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సాయిప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ఐ గోవర్ధన్‌రెడ్డి తదితరులు సైరన్లు, సైలెన్సర్లపై స్పెషల్ డ్రైవ్ (Special Drive) చేపట్టారు. అదే సమయంలో ఓ కారును ఆపగా, అందులో కూర్చొన్న వ్యక్తి తాను మాజీ ఎంపీనని, తాము సైరన్లు పెట్టుకోవచ్చని, ఏపీలో కాకుండా ఇక్కడ తొలగించడానికి మీకు ఏమి హక్కు ఉందంటూ నిలదీశాడు. ఎంపీలైనా సరే సైరన్లు పెట్టుకోవద్దు సార్ అంటూ పోలీసులు చెబుతున్నా వినిపించుకోకుండా ఇక్కడ మంత్రులంతా తనకు తెలుసునని, ఎవరికి ఫోన్ చేయమంటావంటూ ఆగ్రహించారు. అయితే స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మోటారు వాహన చట్టానికి విరుద్ధంగా అక్రమంగా ఏర్పాటుచేసిన సైరన్లను తొలగిస్తున్నామని, ఇది కూడా తొలగించాల్సిందేనని సూచిస్తూ ఆయన కారులో ఏర్పాటు చేసిన సైరన్‌ను పోలీసులు తొలగించారు.చదవండి: నెల్లూరు ఎంపీ కుమారుడిని అంటూ.. -
సీఎస్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు అధికార వర్గాల సమాచారం. ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు ఈనెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలం పొడిగించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో మరో మూడు నెలలు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఏర్పడింది. రామకృష్ణారావు పదవీ విరమణ చేస్తే ఆయన స్థానంలో సీఎస్‌గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్‌రంజన్, వికాస్‌రాజ్ పోటీలో ఉన్నా రు. కేంద్ర సరీ్వసులో ఉన్న సంజయ్ జాజు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా లేరని సమాచారం. అలాగే ఢిల్లీలో తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్‌కు సీఎస్‌గా అవకాశం లేదని సమాచారం. -
మంత్రిపదవి ఇస్తరా.. ఇవ్వరా మీ ఇష్టం: రాజగోపాల్‌రెడ్డి
సంస్థాన్ నారాయణ పురం: ‘ప్రజల మధ్యనే ఉంటా.. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచు కుంటా.. వారి కోసం ఎంత దూరమైనా పోతా.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తా’ అని మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెం, చిమిర్యాల గ్రామాల్లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మంగళవారం విద్యుత్ సబ్సేష్టన్లను ప్రారంభించారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘నేను మాట్లాడితే మంత్రిపదవి రాలేదు కాబట్టే మాట్లాడుతున్నానని కొందరు ఆరోపిస్తున్నారు. మంత్రిపదవి కావాలనుకుంటే నేను ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేవాడిని. మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివద్ధి కోసమే నేను ఇక్కడి నుంచి పోటీచేశాను. పదవుల వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. అదష్టం ఉండి నాకు పెద్ద పదవి వస్తే ..అది మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుంది. పైరవీలకు పోయి, దోచుకొనేటోడిని కాను. రాజకీయాలు అడ్డం పెట్టుకొని వచ్చి రూ.వేల కోట్లు దోచుకునే వారికి పదవులు కావాలి. రాజగోపాల్‌రెడ్డికి ప్రజలు కావాలి..వారి అభివద్ధి, సంక్షేమం కావాలి. ప్రజల కోసం పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చిన. మీరు మంత్రిపదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇస్తారా.. ఇవ్వరా మీ ఇష్టం, నేను సీనియర్‌ను కాబట్టి..తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చిన జూనియర్లకు పదవులు ఇచ్చారు. మీరు ఎంపీని గెలిపించమంటే గెలిపించాను. పార్టీలోకి రమ్మంటే, పార్టీని నమ్ముకొని వచ్చినా. మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం. నేను మాత్రం పదవుల కోసం ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కి బతిమిలాడే మనసు చంపుకొని దిగజారే రకం కాదు. అది బతికుండగా కాదు. నా వెనకాల ప్రజలు ఉన్నారు. నాకు కావాల్సింది ప్రజలు.. వాళ్ల బాగోగులు, నియోజకవర్గ అభివద్ధి. ఒకవేళ ఏదైనా మంచి జరిగితే ప్రజలకు మంచి జరుగుతుంది. లేకపోతే ప్రజల మధ్యనే ఉంటా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా’అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఏదైనా ప్రజల కోసమే..‘పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ల దగ్గరకు తీసుకొచ్చిన. నేను రాజీనామా చేసి.. 100 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల వద్దకు తీసుకొచ్చినాను. అవసరమైతే అంత దూరమైనా పోతా. నేను భయపడను. ఏదైనా మంచి పనిచేస్తే మీ కోసం చేస్తాను. త్యాగమైనా, పోరాటమైనా మీరు తలదించుకొనే పని ప్రాణం పోయినా చేయను. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి రూ.5వేల కోట్ల నిధులు అభివద్ధికి తీసుకొని పోతే నాకు నిద్ర పట్టలేదు. పదవి లేకున్నా పైసలు మునుగోడు నియోజకవర్గ అభివద్ధికి రావాలి. ఈ విషయంలో రాజీపడేది లేదు’అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కరంటోతు శ్రీనివాస్‌నాయక్, గుత్త ఉమాదేవి, ప్రేంచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ‘రిజర్వేషన్’ ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ బుధవారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనుంది. జంతర్ మంతర్‌లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాధర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, వివేక్, వాకిటి శ్రీహరి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ధర్నాలో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలతో పాటు, ఇండియా కూటమి పారీ్టల ఎంపీలు పాల్గొననున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ధర్నాలో పాల్గొనాలని సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, వామపక్ష పారీ్టల ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి లేఖలు రాశారు. కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం మహేశ్‌కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. 200 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. 1,500 మందికి పైగా కూర్చునేలా కురీ్చలు వేశారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే ధర్నా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్‌మంతర్‌కు వెళ్లే దారిలో ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. మహాధర్నాలో పాల్గొనే దాదాపు వెయ్యి మంది కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలతో సోమవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహా్ననికి ఢిల్లీ చేరుకుంది. వీరికి స్థానిక వైఎంసీఏతో పాటు పలు హోటళ్లలో వసతి కల్పించారు. వీరితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు సుమారు 500 మంది వరకు విమానాల్లో ఢిల్లీకి వచ్చారు. వీరందిరికీ ఎంపీల అధికారిక నివాస గృహాలు, వెస్ట్రన్ కోర్ట్‌లో వసతిని ఏర్పాటు చేశారు. -
లోకలెవరు? కానిదెవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర కోటా కింద సీట్ల భర్తీలో నెలకొన్న ‘స్థానికత’వివాదంపై ఉత్కంఠ వీడటం లేదు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు ముగిసినప్పటికీ, తీర్పును రిజర్వు చేసింది. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడా లేని స్థానికత వివాదం తెలంగాణలోనే ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 తీసుకొచ్చిన జీఓ 114లో మార్పులు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 33తో వివాదం మొదలైంది. ఈ జీవో వల్ల తెలంగాణకు ఉన్న సానుకూలత ప్రతికూల తలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. జీవో 33తో మొదలు..ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఏపీ విద్యార్థులకు పదేళ్లపాటు తెలంగాణలోని విద్యా సంస్థల్లో కల్పించిన 15 శాతం రిజర్వే షన్ 2023 విద్యా సంవత్సరంతో ముగిసింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 85%, ప్రైవేటు కళాశాలల్లో 50%సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, మెడికల్ కాలేజీల్లో లోకల్, నాన్ లోకల్ కోటాను నిర్ణయించే నిబంధనలతో 2017లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓ 114ను జారీచేసింది. ఆ జీఓను సవరిస్తూ గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ 33ను తీసుకొచ్చింది. జీఓ 114 ఏముంది? ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో స్థానికతను నిర్ధారిస్తూ 2017 జూలై 5న బీఆర్ఎస్ప్రభుత్వం ఈ జీఓను తీసుకొచ్చింది. దీనిలో స్థానికత నిర్ధారణకు రెండు క్లాజ్‌లను పొందుపరిచారు. మొదటి క్లాజ్ ప్రకారం 6వ తరగతి నుంచి 12 వరకు కనీసం 4 ఏళ్లపాటు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణిస్తారు. రెండో క్లాజ్ ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు ఒకే దగ్గర చదివిన విద్యార్థులను స్థానికులుగా గుర్తిస్తారు. ఈ రెంటిలో ఏది ఉన్నా స్థానికులే. జీఓ 33లో ఏముంది? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జీఓ 114ను సవరిస్తూ 2024 జూలై 19న ఈ జీఓను తీసుకొచ్చింది. 114 జీఓలోని మొదటి క్లాజ్ (6 నుంచి 12 తరగతి వరకు ఎక్కడ నాలుగేళ్లు చదివితే అక్కడే స్థానికులు అనే నిబంధన) జీఓ 33 ద్వారా తొలగించారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారే స్థానికులు అని స్పష్టం చేశారు. జీఓ 114 దుర్వినియోగం జీఓ 33 ఆధారంగానే గత సంవత్సరం కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారందరికీ తహసీల్దార్ ఇచ్చే నివాస ధ్రువీకరణ పత్రం ఆధారంగా సీట్లు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ వాదనలు జరుగుతుంగానే ఈ ఏడాది కూడా కాళోజీ వర్సిటీ జీఓ 33 ప్రకారమే ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో గత నెల 24న సుప్రీంకోర్టు కేసును విచారించి, స్థానికత అంశం తేలే వరకు పాత నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని వర్సిటీని ఆదేశించింది. కాగా, 6 నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికత అనే నిబంధనతో మెడికల్ సీట్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు కాళోజీ యూనివర్సిటీ 2023లో గుర్తించింది. ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు 6 నుంచి 9 వరకు (నాలుగేళ్లు) తెలంగాణలో చదివినట్లు ప్రైవేటు స్కూళ్ల నుంచి నకిలీ స్టడీ, బోనఫైడ్ సర్టిఫికేట్లు తెచ్చి ఎంబీబీఎస్ సీట్లు పొందినట్లు తేల్చి ఏడుగురి సీట్లను రద్దు చేసింది. ఈ అక్రమాలను నివారించేందుకు బోర్డు పరీక్షలు ఉన్న 10వ తరగతిని తప్పనిసరి చూస్తూ 9 నుంచి 12 (ఇంటరీ్మడియట్) తరగతులు తెలంగాణలో చదివితేనే స్థానికులుగా పేర్కొంటూ ప్రభుత్వం జీఓ 33ను తెచ్చింది. జీఓ 33తో తెలంగాణవారూ నాన్ లోకల్ జీవో 33 వల్ల కొందరు తెలంగాణ విద్యార్థులు కూడా లోకల్ స్టేటస్ కోల్పోవటంతో వివాదం ముదిరింది. నల్లగొండ, ఖమ్మం, గద్వాల జిల్లాలకు చెందిన తెలంగాణ విద్యార్థులు 10వ తరగతి వరకు స్థానికంగా చదివి, ఇంటర్మీడియట్ ఏపీలో చదివారు. వారు జీఓ 33 ప్రకారం స్థానికులు కాదు. -
ప్రైవసీ కోసం.. ఆన్లైన్ షాపింగ్..!
ఆన్ లైన్ షాపింగ్ మన జీవితాల్లో భాగమైపోయింది. కొంతమందికి ఇది గేమ్–ఛేంజర్. కిరాణా సామగ్రి, దుస్తులు, ఆహారం, బహుమతులు, ఫర్నిచర్, ఫోన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు.. ఇలా అన్నీ ఆన్లైన్లో లభిస్తున్నాయి. వీటిని కొనేవారి సంఖ్య నేడు కోట్లలో ఉంది. ఆన్ లైన్ షాపింగ్ అంటే సౌకర్యం, ఎంచుకోవడానికి లక్షలాది ఉత్పత్తులే కాదు.. కొందరికి వ్యక్తిగత గోప్యత కూడా. ఆన్ లైన్ అయితే మనం ఉన్నచోటు నుంచే 24 గంటల్లో ఎప్పుడైనా షాపింగ్ చేయవచ్చు. మరొకరి అభీష్టాలతో కాకుండా సొంత నిర్ణయంతో తమకు నచ్చినవి చేజిక్కించుకోవచ్చు. జనం మధ్యలో కొనాల్సి వస్తోందన్న ఒత్తిడి లేదు. ట్రాఫిక్, ప్రయాణం వంటి అడ్డంకులూ లేవు.కొంత మంది జనంలో కలవడానికి ఇష్టపడరు. మరి కొందరు అధికంగా అవసరానికి మించి కొనుగోలు చేస్తారు. ఖర్చు ఎక్కువగా పెడితే షాపులోని వాళ్లు, చుట్టూ ఉన్నవాళ్లు ఏమనుకుంటున్నారో అని పదేపదే ఆలోచించి ఒత్తిడికి గురి అవుతారు. ఇలాంటి వారికి ఆన్ లైన్ షాపింగ్ గొప్ప ఉపశమనం. వీరు తమ గురించి ఇతరులు అంచనా వేయకూడదని అనుకోవడం, సామాజిక ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వంటి లోతైన మానసిక భావాలను కలిగి ఉంటారని వైద్య నిపుణులు అంటున్నారు.కొంతమందికి బహిరంగ ప్రదేశాల్లో షాపింగ్ అసౌకర్యంగా అనిపించవచ్చు. ఆన్ లైన్ షాపింగ్‌ను ఇష్టపడే వ్యక్తులు సౌలభ్యం, సమయం, ఆచితూచి ఖర్చు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కొంతమంది అంతర్ముఖులు ఉంటారు. వీరు ఏకాంతంగా ఆన్ లైన్ లో షాపింగ్ ఇష్టపడతారు.ఇలాంటివి నచ్చక..ఆన్ లైన్ షాపింగ్‌లో ఏం కొనాలనేది మన నియంత్రణలో ఉంటుంది. ఏం కొన్నామో మరొకరికి తెలియదు. సురక్షితం అన్న భావన ఉంటుంది. నెమ్మదిగా, కావాల్సినంత సమయం షాపింగ్ చేయవచ్చు. 24 బై 7.. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా కొనుక్కోవచ్చు. ఎవరో ఏదో అనుకుంటారన్న ఆలోచనే రాదు. మనకు ఇష్టమైన వెరైటీలు చూడొచ్చు, ధరలను పోల్చవచ్చు, కావలసినదాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఈ సౌలభ్యాలేవీ ఆఫ్‌లైన్ లో ఉండవు. మన రూపం, ఎంపికలు, బడ్జెట్ ఆధారంగా దుకాణదారులు కస్టమర్లను అంచనా వేస్తారు. ఏం కొనాలనేది కస్టమర్ల అభీష్టం. అలాంటిది ‘మీకు ఈ డ్రెస్ బాగుంటుంది’, ‘తక్కువ రేటే’ అంటూ షాప్‌వాళ్లు చేసే సూచనలు / సలహాలు చాలామందికి నచ్చవు. ఇవి కూడా ఆన్ లైన్ లో ఉండవు. దేనికి, ఎంతకు షాపింగ్ చేస్తున్నారో ఇతరులెవరూ కనుక్కోలేరు. అందువల్ల ఒకరి షాపింగ్ తీరుపై మరొకరు కామెంట్ చేసే అవకాశమూ ఉండదు.అపరాధ భావన ఉండొద్దని..ఆన్ లైన్ లో షాపింగ్ చేసినప్పుడు డబ్బు ఖర్చులోనూ ఇబ్బందులు ఉండవు. సంప్రదాయ నగదు మార్పిడి ఉండదు. చెక్అవుట్ వద్ద ఇబ్బందికరమైన స్వైప్ ఉండదు. ఖర్చు చేశామన్న అపరాధ భావన ఉండకూడదని ఆన్ లైన్ లో షాపింగ్ చేసేవారూ లేకపోలేదు. ఇతరులు వారి అభిప్రాయాలను రుద్దకుండా, జన సమూహం లేకుండానే ఆన్ లైన్ షాపింగ్ పూర్తి చేయవచ్చు. అయితే అవసరం లేకపోయినా కొంత మంది.. ఏమీ తోచక లేదా వెబ్సైట్లో ఏదో డిస్కౌంట్ సేల్ అని ప్రకటించగానే కొనుగోళ్లు చేస్తున్నారట.కొనేసిన తరవాత.. అవసరానికి మించి కొన్నామన్న అపరాధ భావన వీరిలో ఉంటోందట. క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేసేవారిలో ఇది ఎక్కువగా ఉంటోందట. ఆన్లైన్ షాపింగ్ చేసే.. అంతర్ముఖ స్వభావం ఉండే వ్యక్తుల్లో మరో ప్రత్యేకత కూడా ఉంటుందట. ఒక ప్లాట్ఫామ్లో షాపింగ్ చేస్తున్నప్పుడు అది ఏదో సందర్భంలో నచ్చకపోతే.. దానిమీద కోపంతో మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లిపోతారు. అంతేకాదు, ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరేది / క్వాలిటీ లేని వస్తువు వచ్చినా.. రిటర్న్ పెట్టేటప్పుడు ఇబ్బందులు ఎదురైనా కూడా వీరు వేరే వేదికను ఎంచుకుంటారట. తాము బహిష్కరించినట్టు భావించే మొదటి ప్లాట్‌ఫామ్‌ను కొన్నాళ్లు వదిలేస్తారు.ఈ సమస్యలూ ఉన్నాయిబయటకు వెళ్లి, ట్రాఫిక్‌లో విసుక్కుంటూ ప్రయాణించి, దుకాణాల్లో షాపింగ్ చేయడానికి కొన్ని గంటలు సమయం పడుతుంది. దీనివల్ల కొందరిలో అలసిపోయిన భావన ఉంటుంది. అదే పనిని కొన్ని క్లిక్‌లతో సాధ్యం చేసే మరింత అనుకూల అవకాశం ఉన్నప్పుడు అటువైపు మొగ్గు చూపేవారూ ఉంటారు. కానీ అధిక ఆన్ లైన్ షాపింగ్ కొన్నిసార్లు సామాజిక ఆందోళన లేదా అనవసరపు ఖర్చులకు దారితీయవచ్చు. ఆన్లైన్ షాపింగ్‌కి పరిమితమవడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. జనానికి దూరం అవుతారు. నిశ్శబ్దంగా శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు ఆన్ లైన్ షాపింగ్ తలుపులు తెరిచే అవకాశమూ లేకపోలేదు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.⇒ ఆన్ లైన్ షాపింగ్ శత్రువు కాదు. ఇది మారుతున్న జీవితాలు, అలవాట్లు, ప్రాధాన్యాలను ప్రతిబింబిస్తుంది. కొంతమందికి ఇది సహాయకారి. సమయం ఆదా చేయడం, నచ్చినన్ని వెరైటీలు చూసుకునే వెసులుబాటు.. ఇలాంటి సానుకూల అంశాలు ఉన్నాయి. అదే సమయంలో జీవితం మరింత డిజిటల్‌గా మారుతున్న కొద్దీ వాస్తవ ప్రపంచ అనుబంధాల విలువను, ఉనికిని మర్చిపోకూడదు. మనల్ని మనమే ఒంటరిని చేసుకోకూడదు అంటున్నారు మానసిక వైద్య నిపుణులు.⇒ సమస్యల నుంచి తప్పించుకోవడానికి..: తక్కువ ఆత్మస్థైర్యం లేదా ఆత్మన్యూనత లేదా అంతర్ముఖత్వం కారణంగా దుకాణాలకు వెళ్లకుండా ఆన్ లైన్ లో షాపింగ్ చేసేవాళ్లు కూడా ఉంటారు. ఆ భావనను కప్పిపుచ్చుకునేందుకు లేదా అధిగమించే ప్రయత్నంలో.. తెలిసి కొందరు, తెలియక కొందరు అనవసరపు ఖర్చులు చేస్తుంటారని మానసిక వైద్యులు అంటున్నారు. -
రూ. 2 లక్షలిస్తే గుడిలో కొలువు
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ పరిధిలోని పలు పెద్ద దేవాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంగడి సరుకుగా మారాయి. రేటుగట్టి మరీ అమ్మేసుకుంటున్నారు. ఆయా దేవాలయాలకు ఔట్సోర్సింగ్ సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీల ప్రతినిధులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. శానిటేషన్, ప్రసాదాల తయారీ, ప్రసాద విక్రయ కౌంటర్లు, గోశాలల నిర్వహణ, క్యూలైన్ల పర్యవేక్షణ.. ఇలా పలు రకాల పనుల కోసం దేవాదాయశాఖ ఔట్సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని తీసుకుంటోంది. నేరుగా ఆ బాధ్యతను తనే నిర్వహించకుండా జిల్లా కలెక్టర్ల ద్వారా టెండర్ పద్ధతిలో మ్యాన్‌పవర్ సప్లయింగ్ సంస్థలకు కట్టబెట్టి చేతులు దులుపుకొంటోంది. ఆ ఏజెన్సీలు సిబ్బందిని నియమించే విషయంపై అధికారులు దృష్టి సారించకపోవటంతో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. దేవాలయాల వారీగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఆయా ఏజెన్సీలు కొందరు ప్రతినిధులను నియమిస్తున్నాయి. ఆ ప్రతినిధులు కూడా ఔట్సోర్సింగ్ ఖాతాలోనే నియమితులవుతూ నెలవారీ జీతాన్ని పొందుతున్నారు. కానీ, వారిలో చాలామంది అసలు దందా మాత్రం..పోస్టులను బేరానికి పెట్టి డబ్బులు వసూలు చేయటమే. ప్రసాద తయారీ కౌంటర్ పోస్టు కావాలంటే 2.25 లక్షలు, ప్రసాద తయారీ పోస్టు అయితే రూ.2 లక్షలు, శానిటేషన్ విభాగంలో అయితే రూ.1.80 లక్షలు.. ఇలా ధరల పట్టిక తయారు చేసి వసూళ్లకు దిగుతున్నారు. ఆ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైన వారిని పిలిచి మాట్లాడి ఉద్యోగాలు కేటాయిస్తున్నారు. అదంతా ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారం కావటంతో దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవటం లేదు. ఇటీవల కొన్ని దేవాలయాలకు సంబంధించి ఏజెన్సీ ప్రతినిధులు, నిరుద్యోగుల మధ్య సాగిన బేరసారాలకు సంబంధించిన ఫోన్‌కాల్ రికార్డులు వెలుగులోకి రావటంతో మరోసారి ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. పెద్ద దేవాలయాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో..అక్కడ సేవలను విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో సిబ్బంది అవసరం పెరుగుతోంది. ప్రస్తుతం దేవాదాయశాఖలో నియామకాలు లేనందున, అవసరమైన సిబ్బందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు. ఫలితంగా అన్ని పెద్ద దేవాలయాల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రసాదాల తయారీపై ఏదీ శ్రద్ధ.. దేవాలయాల్లో ప్రసాదాల విక్రయానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దర్శన అనంతరం ప్రసాదం స్వీకరించడం భక్తులు తప్పనిసరి అని భావిస్తారు. తినే పదార్థాలు అయినందున ప్రసాదాల తయారీలో పరిశుభ్రత చర్యలు అత్యవసరం. కానీ, ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకంలో నిర్వాహకులు దీనిని పట్టించుకోవటం లేదు. శానిటేషన్ విధుల్లో ఉండే సిబ్బందిని ఇటు ప్రసాదాల తయారీకి పురమాయిస్తున్నారు. ప్రసాదాల తయారీ సమయంలో తలపై క్యాప్ (జుట్టు రాలిపడకుండా), చేతులకు గ్లౌవ్స్ ధరించటంతోపాటు చేతి గోళ్లు పెరిగి ఉండకూడదని, రోజూ పరిశుభ్రమైన వ్రస్తాలు ధరించాలనే నిబంధనలుంటాయి. కానీ, సిబ్బందిని సర్దుబాటు చేసే క్రమంలో గోశాలల్లో పేడ ఎత్తే విధుల్లో ఉండేవారిని ప్రసాదాల తయారీకి మారుస్తున్నారు. వారి చేతి గోళ్లలో పేడ ఇరుక్కొని ఉంటే ప్రసాదం కలుషితమయ్యే ప్రమాదం ఉంటుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శానిటేషన్ విధుల్లో ఉండే వారిని ప్రసాదాల తయారీ, ప్రసాదాల కౌంటర్లకు ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు. విధుల్లోకి ఎంపిక చేసే వారికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో కచ్చితంగా విచారణ జరపాలన్న నిబంధన అపహాస్యమవుతోంది. ఆ వ్యక్తి ఎలాంటి వాడో వాకబు చేయకుండానే దేవాలయాల్లో కీలక బాధ్యత అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో అన్యమతస్తులు కూడా దేవాలయ విధుల్లోకి వస్తున్నారని, ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వెళుతున్నాయన్న ఆరోపణలున్నాయి. -
రాజకీయం.. రసవత్తరం!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన సుదీర్ఘ నివేదిక రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చేసింది. మూడు ప్రధాన పార్టీలూ.. నివేదికను, అనంతర పరిణామాలను రాజకీయంగా తమకు ఎలా అనుకూలంగా మలుచుకోవాలా అన్న దానిపై దృష్టి సారించాయి. ఈ రిపోర్టు ఆధారంగా బీఆర్ఎస్ను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టాలని అధికార కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుండగా, అందులోని లోపాలను ఎత్తిచూపుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మరో ప్రధాన రాజకీయ పక్షం బీజేపీ ఈ నివేదికపై ఎలాంటి వైఖరి తీసుకోవాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. అధికార కాంగ్రెస్ ద్విముఖ వ్యూహంకాళేశ్వరం నివేదిక విషయంలో తమ చేతికి మట్టి అంటకుండా ఉండాలనే వ్యూహంతోనే అధికార కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పాచిక విసిరిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నివేదికను అసెంబ్లీ ముందు పెట్టడం ద్వారా ద్విముఖ వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అసెంబ్లీ వేదికగా అన్ని పార్టీలతో మాట్లాడించి.. నివేదికకు అసెంబ్లీ ఆమోదం ఇప్పించి.. అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ఆదేశించడం ఈ వ్యూహంలో ప్రధాన భాగం అయితే, మరో ఎత్తుగడ కూడా ఉందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను అక్కడకు రప్పించే వ్యూహం కూడా ఇందులో ఉందనే చర్చ జరుగుతోంది. ఈ నివేదిక ద్వారా అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొని తన వాదనను వినిపించాల్సిన అనివార్యతను కేసీఆర్‌కు కల్పించామని, ఆయన వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన చేసిన తప్పులను అక్కడే ఎండగడతామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని వారంటున్నారు. దూకుడుగానే బీఆర్ఎస్నివేదిక విషయంలో బీఆర్ఎస్ కూడా దూకుడుగానే వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జస్టిస్ ఘోష్ నివేదికను ఆ పార్టీ నేతలు చాలామంది ఖండించగా, మాజీ మంత్రి హరీశ్‌రావు ఓ అడుగు ముందుకేసి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదికలోని లోపాలను ఎత్తిచూసే ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహం రచించారు. అన్ని జిల్లాల్లోనూ స్క్రీన్లు పెట్టి పార్టీ నాయకులకు ప్రజెంటేషన్‌ను చూపించారు. ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా వెళ్లాలనే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నప్పటికీ.. భవిష్యత్ పరిణామాలపై కూడా బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే కమిషన్ విచారణ పేరుతో పిలిపించడంతో పాటు నివేదిక ప్రజల్లో పెట్టి ఆయన ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాలు చేయగా.. అసెంబ్లీ వేదికగా మరో విచారణ ప్రకటించి మానసికంగా పార్టీ నేతలను ఇబ్బంది పెట్టవచ్చనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఏదిఏమైనా ఘోష్ నివేదిక ఆధారాల్లేనిదని, బీఆర్ఎస్ను బద్నాం చేయడమే లక్ష్యంగా ఇచ్చిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని గులాబీ నేతలంటున్నారు. బీజేపీ అటా..ఇటా?జస్టిస్ ఘోష్ నివేదిక కమలం పార్టీకి గొంతులో వెలక్కాయ పడినంత పని చేసిందని రాజకీయ వర్గాలంటున్నాయి. కాళేశ్వరం నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కేసీఆర్ కుటుంబం ఈ ప్రాజెక్టుతో ఆయాచిత లబ్ధి పొందిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఘోష్ నివేదికను సమర్థించాలో, వ్యతిరేకించాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. ఈ నివేదికను బీజేపీ సమర్థించకపోతే.. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటేనని, అందుకే ఇన్నాళ్లు ఆరోపణలు చేసినా ఇప్పుడు మౌనంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించే అవకాశాలున్నాయి. ఒకవేళ నివేదికతో ఏకీభవిస్తే.. ఆ నివేదిక తప్పుపట్టినట్టుగా తమ పార్టీకి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ కూడా తప్పు చేశారని అంగీకరించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై కమలనాథులు మల్లగుల్లాలు పడుతున్నారు. కింకర్తవ్యంపై ప్రభుత్వం మల్లగుల్లాలుప్రస్తుత పరిస్థితుల్లో కింకర్తవ్యం ఏమిటనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడు తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ–రేసు, ఫోన్‌ట్యా పింగ్ కేసుల్లో ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం వెళుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇప్పుడు కాళేశ్వరం విషయంలోనూ అదే జరిగితే బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగాయన్న కాంగ్రెస్ ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రజలు భావింవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్ల అసెంబ్లీ వేదికగా ప్రకటించే విచారణను త్వరగా పూర్తి చేసి కాళేశ్వరం అక్రమాల బాధ్యులపైనైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో పార్టీపై నమ్మకం కలుగుతుందని అంటున్నారు. మరోవైపు అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన అధికారిని కూడా కమిషన్ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఆయన పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబిస్తుందనేది కూడా ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. -
రూ.4.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న 847 కిలోల హైగ్రేడ్ (అత్యధిక నాణ్యత) గంజాయిని ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) టీమ్ స్వాదీనం చేసుకుంది. పట్టుబడిన గంజాయి విలువ రూ.4.2 కోట్లు ఉంటుందని ఈగల్ టీం డైరెక్టర్ సందీప్‌శాండిల్య తెలిపారు. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి ఉత్తర ప్రదేశ్‌కు భారీ మొత్తంలో గంజాయి సరఫరా చేస్తున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం ఆర్ఎన్సీసీ (రీజినల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్), ఈగల్ టీమ్ శంషాబాద్ సమీపంలోని తొండపల్లి వద్ద అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని సోమవారం సాయంత్రం ఐదు గంటలకు అడ్డగించింది. సోదాలు చేయగా, పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. వాహనంలో ఉన్న మల్కన్‌గిరికి చెందిన ఖిలాధన, రాజేందర్ బజింగ్‌లను అరెస్టు చేశారు. ఈ ముఠాతో సంబంధమున్న రమేశ్ సుక్రి, జగదీశ్ కులదీప్, షిబో అలియాస్ షిబా, బసు, షఫీక్ అలియాస్ షఫీల కోసం గాలిస్తున్నారు. గంజాయిని సరిహద్దు దాటించడంలో ఆ ఇద్దరూ దిట్ట మల్కన్‌గిరికి చెందిన ఖిలాధన, రాజేందర్ బజింగ్లు గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటించడంలో దిట్ట అని ఈగల్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య తెలిపారు. ఖిలాధన 2019లో 20 కిలోల గంజాయి రవాణా చేస్తూ ఏపీలోని డొంకరాయి వద్ద పోలీసులకు పట్టుబడి రాజమండ్రి సెంట్రల్ జైలులో 4 నెలలు ఉన్నాడు. బెయిల్‌పై బయటకు వచి్చన తర్వాతా ఉత్తరప్రదేశ్‌కు ఈ ఏడాదిలో 350 కిలోలు, 500 కిలోలు, 600 కిలోల చొప్పున గంజాయి తరలించిన చరిత్ర ఉంది. పోలీసులకు చిక్కకుండా స్థానిక రోడ్ల మీదుగా దూర ప్రాంతాలకు డ్రైవింగ్ చేయడంలో నిపుణుడు. » మరో నిందితుడు రాజేందర్ బజింగ్ 2023లో 150 కిలోల గంజాయి రవాణా చేస్తూ ఏపీలోని నర్సీపట్నం పోలీసులకు చిక్కాడు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి 10 నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. గ్రామీణ ప్రత్యామ్నాయ రహదారుల గురించి లోతైన అవగాహన ఉంది. » పెద్ద మొత్తంలో గంజాయి పట్టివేతలో కీలకంగా వ్యవహరించిన ఆర్ఎన్సీసీ ఖమ్మం బృందం డీఎస్పీ సీహెచ్ శ్రీధర్, ఇన్స్పెక్టర్ విజయ్, ఎస్సై రవిప్రసాద్, సైబరాబాద్ నార్కోటిక్స్ డీఎస్పీ హరీశ్చంద్రారెడ్డి, ఇన్స్పెక్టర్లు రమేశ్‌రెడ్డి,రామునాయక్, సిబ్బందిని ఈగల్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య అభినందించారు. -
రెండేళ్లు బయట చదివితే స్థానికులు కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థి కేవలం రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదువుకోవడానికి వెళితే తప్పు ఏంటని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉన్నత చదువుల కోసమో.. తల్లిదండ్రుల బదిలీ కారణంగానో రెండేళ్లపాటు రాష్ట్రం బయట చదివితే వారిని స్థానికత కోటా నుంచి తప్పించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. వచ్చే శుక్రవారంలోపు స్థానికత అంశంపై లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మెడికల్ సీట్ల భర్తీలో స్థానికత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 11న దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం వాదనలు ముగించి, తీర్పును రిజర్వ్ చేసింది. 2028లో ఎందుకు అమలు చేయకూడదు?తెలంగాణ విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం జీఓ 33ను తీసుకొచ్చిందని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తెలిపారు. ప్రస్తుత విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి) ప్రకారం ఉందని చెప్పారు. ఏపీ విభజన చట్టంలో ఏపీ విద్యార్థులకు కల్పించిన గడువు ముగిసిపోవటంతో ఈ జీఓ తెచ్చినట్లు వివరించారు. దీని ప్రకారం సివిల్ సర్వీసెస్ (ఐఏఎస్, ఐపీఎస్), ఇతర ఉద్యోగాల్లో తల్లిదండ్రులు డిప్యుటేషన్‌పై వెళితే, ఇతర రాష్ట్రాల్లో చదువుకొన్న వారి పిల్లలకు మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని కొన్ని ప్రత్యేక కేసులతో ముడి పెట్డకుండా లక్షలాది మంది తెలంగాణ స్థానిక విద్యార్థుల దృష్టితో ఆలోచించాలని కోరారు. ఈ సమయంలో కలగజేసుకున్న సీజేఐ జస్టిస్ గవాయ్.. పదేళ్లు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, 2028లో జీఓ 33ను ఎందుకు అమలు చేయకూడదు అని ప్రశ్నించారు. పదేళ్ల గడువు ముగిసినంత మాత్రాన అందరికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డీ)లోని అంశాలు తెలియవని అభిప్రాయపడ్డారు. 2028లో కొత్త నిబంధనలు తీసుకువస్తే వచ్చే నాలుగేళ్లలో స్థానికంగా చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కాళోజీ వర్సిటీ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, తమిళనాడులోనూ ఇలాంటి స్థానికత అమలులో ఉందని గుర్తుచేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉన్న పదేళ్ల గడువు ముగిసినందున తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించిందని తెలిపారు. దీంతో జస్టిస్ చంద్రన్ స్పందిస్తూ.. ‘తెలంగాణలో వరుసగా నాలుగేళ్లు విద్యనభ్యసించి ఉండాలని రూల్ తెస్తున్న విషయం స్థానిక ప్రజలందరికీ తెలుసు అని భావించడం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రతి విద్యార్థి ఆర్టికల్ 371 (డి) గురించి తెలుసుకోవాలని అన్నట్లుగా మీ వాదన ఉంది. 8వ తరగతిలోనే రాజ్యాంగాన్ని చదువుకోవాలన్నట్లు మాట్లడటం సరికాదు. చదువురాని తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా’ అని ప్రశ్నించారు.పదేళ్లు చదివినానాన్ లోకల్ అవుతున్నాంప్రభుత్వం తరఫున సుదీర్ఘ వాదనల అనంతరం విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తెలంగాణలో పుట్టి 10వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదివినా జీఓ 33 కారణంగా స్థానిక కోటా దక్కడం లేదని తెలిపారు. 11, 12వ తరగతులు చదవని కారణంగా నీట్లో స్థానిక కోటా దక్కక నష్టపోతున్నట్లు నివేదించారు. దాదాపు 2 గంటలపాటు సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఇంక ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. -
లోతుగా పరిశీలించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఫీజులపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ నిర్ణయించింది. కొన్ని కాలేజీలను నేరుగా తనిఖీ చేయాలని భావిస్తోంది. ఫీజుల పరిశీలన కమిటీలో ఆడిట్, టౌన్‌ప్లానింగ్, సాంకేతిక విద్య, ఉన్నత విద్య ఉన్నతాధికారులు ఉన్నారు. వీళ్లంతా ఉప కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీల్లోని నిపుణులు ఆయా విభాగాలకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యమిస్తారు. అఫిలియేషన్ జాబితాలో ఉన్న ప్రతి ప్రైవేటు కాలేజీని అన్ని కమిటీలు పరిశీ లిస్తాయి. వారంరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయా లని తాజా భేటీలో ప్రత్యేక కమిటీ నిర్ణయించింది. నిబంధనల ఉల్లంఘనపై దృష్టి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) బృందాలు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయకుండానే కాలేజీలకు అనుమతులు ఇస్తున్నాయనే విమర్శలున్నాయి. ముఖ్యంగా కాలేజీలకు ఒక చోట అనుమతులు తీసుకుని, మరో చోట నిర్వహిస్తున్నారు. ఏఐసీటీఈకి సమర్పించిన డాక్యుమెంట్లలో అనేక లొసుగులు ఉంటున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ పరిధిలో కొన్ని కాలేజీల భూములు నిషేధిత ప్రాంతాల్లో ఉన్నాయి. అయినా అనుమతులు ఎలా వచ్చాయనే అంశాలను నగర ప్లానింగ్ విభాగం అధికారులు పరిశీలిస్తారు. ఆడిట్ కథేంటి? ప్రతి కాలేజీ గత మూడేళ్ల (2022–2025) ఆడిట్ నివేదికలను తెలంగాణ అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ)కి సమర్పించాయి. ఎఫ్ఆర్సీ కొంతమంది ఆడిటర్లను నియమించుకుని కాలేజీల ప్రతిపాదనలను పరిశీలిస్తుంది. ఆడిట్ విభాగం ఉన్నతాధికారులు ప్రతి కాలేజీ డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. ఈ లెక్కల్లో ఎక్కడ తేడా వచ్చినా ఆ కాలేజీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 20 కాలేజీలపై సీరియస్‌గా ఫిర్యాదులు వచ్చాయి. ఫ్యాకల్టీ లేకుండానే ఎమర్జింగ్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. అధ్యాపకులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని తేలింది. ఈ నేపథ్యంలో వాటి బ్యాంకు లావాదేవీలపైనా దృష్టి పెడతామని అధికారులు అంటున్నారు. ఈ కాలేజీలపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. -
మద్యం తాగించి.. చెవిలో గడ్డి మందుపోసి
కరీంనగర్‌రూరల్: నిత్యం తనపై అనుమానంతో తాగొచ్చి కొడుతున్నాడని, ప్రియుడు, మరోవ్యక్తితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఈ ఘటన జూలై 29న కరీంనగర్ శివారులో చోటు చేసుకుంది. కేసును ఛేదించిన పోలీసులు మంగళవారం ఆ వివరాలు వెల్లడించారు. సీపీ గౌస్ ఆలం కథనం ప్రకారం.. కరీంనగర్‌లోని సుభాశ్‌నగర్‌కు చెందిన ఐలవేణి సంపత్ (45) జిల్లా గ్రంథాలయంలో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. జూలై 29న కరీంనగర్ శివారులోని రైల్వేట్రాక్‌పై అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి భార్య రమాదేవిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రమాదేవికి కిసాన్‌నగర్‌కు చెందిన కర్రె రాజయ్యతో వివాహేతర సంబంధం ఉంది. సంపత్ మద్యానికి బానిసై తరచూ కొడుతుండటంతో భర్తను హత్య చేసేందుకు రాజయ్యతోపాటు దూరపు బంధువు అయిన ఖాదర్గూడేనికి చెందిన కీసరి శ్రీనివాస్‌ను రమాదేవి సంప్రదించింది. ప్రణాళిక ప్రకారం రాజయ్య, శ్రీనివాస్ కలిసి సంపత్‌ను జూలై 29న బొమ్మకల్ ఫ్లై ఓవర్‌బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించారు. రమాదేవి ఆదేశాల మేరకు మద్యం మత్తులో ఉన్న సంపత్ చెవిలో రాజయ్య, శ్రీనివాస్ గడ్డిమందు పోసి హత్య చేశారు. అనంతరం సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు సంపత్ భార్యను విచారించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గుర్తించారు. నిందితులు కర్రె రాజయ్య, కీసరి శ్రీనివాస్, ఐలవేణి రమాదేవిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సైలు టి.నరేశ్, లక్ష్మారెడ్డిని సీపీ అభినందించారు. -
తెలంగాణ స్కేటర్లకు పతకాల పంట
సాక్షి, హైదరాబాద్: ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ స్కేటర్లు పతకాల పంట పండించారు. దక్షిణ కొరియా వేదికగా ఇటీవల ముగిసిన ఈ టోర్నీలో... తెలంగాణ స్కేటర్లు గ్రూప్ స్వర్ణం సహా మొత్తంగా.... 16 పతకాలు సాధించారు. ఇందులో 9 స్వర్ణాలు, 6 రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. గత రెండేళ్లుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీల్లో రాణిస్తున్న యువ స్కేటర్లు... 20వ ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకాలతో మెరిశారు. శ్రియ మురళి, తేజేశ్ మూడేసి పతకాలు కైవసం చేసుకోగా... అనుపోజు కాంతిశ్రీ, రెండు పతకాలు ఖాతాలో వేసుకుంది. ఆకాంక్ష, జూహిత్, జయేశ్ పటేల్, రక్షిత్ మురళి, సంచిత్ చౌదరీ, ప్రతీక్, సౌరవ్ సింగ్ సీనియర్ విభాగంలో వ్యక్తిగత పతకాలు సాధించారు. జూనియర్ విభాగంలో కావ్యశ్రీ రజత పతకం నెగ్గింది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు నెగ్గిన యువ స్కేటర్లను కోచ్ అనూప్ కుమార్ యామ ప్రత్యేకంగా అభినందించాడు. భారత్ తరఫున రోలర్ స్కేటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకం సాధించిన ఏకైక స్కేటర్ అయిన అనూప్ దిశానిర్దేశంలో రాష్ట్ర యువ స్కేటర్లు పతకాలతో సత్తాచాటారని తెలంగాణ రోలర్ స్కేటింగ్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. -
న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా?: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ’ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్కు చులకన భావం. చట్టసభలు, న్యాయ వ్యవస్థపై గౌరవం, నమ్మకం లేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలోని జ్యుడీషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదు. ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ వాళ్లలో మార్పు రాలేదు. మేడిగడ్డను కుంగబెట్టిన దుర్మార్గులు ఇప్పడు ఏకంగా సీనియర్ జస్టిస్ పీసీ ఘోష్‌ను అవమానిస్తున్నారా? న్యాయబద్ధ కమిషన్‌కు అపార్థాలు అంటగట్టే నీచానికి దిగజారటం కూడా మీకే చెల్లింది..’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఖండిస్తూ మంగళవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వారి బండారం బట్టబయలైంది ’కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలకు, అక్రమాలకు పాల్పడిందో కమిషన్ విచారణలో బయటపడింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు బండారం బట్టబయలైంది. అందుకే తేలు కుట్టిన దొంగల్లా.. హరీశ్‌రావు మళ్లీ కల్ల»ొల్లి కబుర్లు చెప్తున్నారు. కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది. అది రేవంత్‌రెడ్డి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాసిన రిపోర్టు కాదనే విషయాన్ని హరీశ్‌రావు మరిచిపోయినట్లున్నారు. ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు.. కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన మొదలైనప్పటి నుంచి డిజైన్లు, నిర్మాణంలో లోపాలు, మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు వరకు అవకతవకలన్నింటిపై కమిషన్ సమగ్రంగా విచారణ జరిపింది. ఎవరెవరు తప్పులు చేశారో.. ఎవరెవరు అందుకు బాధ్యులనే వివరాలను నివేదికలో వెల్లడించింది. మేమేం తప్పు చేయలేదంటూ మీ పార్టీ ఆఫీసులో తప్పులు మాట్లాడి తెలంగాణ ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు? ఇప్పుడు పార్టీ ఆఫీసులో పెడబొబ్బలు పెడుతున్న హరీశ్‌రావు.. ఆరోజు కమిషన్ ముందు ఎందుకు ఈ వివరాలు చెప్పుకోలేదు?..’ అని ఉత్తమ్ నిలదీశారు. ప్రభుత్వం చర్యలపై భయం పట్టుకుంది.. ’హరీశ్ అబద్ధపు సాక్ష్యాలు, బుకాయింపులన్నీ.. న్యాయ వ్యవస్థ ముందు అబద్ధాలుగా తేలిపోయాయి. ఆయన చేసిన తప్పులన్నీ బయటపడ్డాయి. కేసీఆర్ పాత్ర ఏమిటో, హరీశ్‌రావు చేసిన ఘనకార్యాలేమిటో కమిషన్ విచారణలో తేలిపోయాయి. దాంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతోంది. అందుకే కమిషన్‌ను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారు. అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధం ప్రజాస్వామ్య వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు, చట్ట సభలపై మా ప్రభుత్వానికి గౌరవముంది. అందుకే అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చించేందుకు సిద్ధంగా ఉంది. కాళేశ్వరంలో దోషులుగా తేలిన బాధ్యులు.. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. ఫార్మ్ హౌస్‌లో మామ డైరెక్షన్, పార్టీ ఆఫీస్‌లో అల్లుడి యాక్టింగ్ ఇకనైనా ఆపాలి. ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులు ఒప్పుకుని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాలి. మీరు వేలకోట్ల అవినీతి చేస్తే ఒప్పు,.. మేం విచారణ చేసి నిజాలు నిగ్గుతేలిస్తే అది రాజకీయ కక్ష సాధింపా?..’ అని మంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే హక్కే లేదు.. ’కమీషన్ల కక్తుర్తితో ప్రజలను, రైతులను పదేళ్ల పాటు మోసం చేశారు, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు ఇస్తే దాచిపెట్టారు. నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద బరాజ్‌ల నిర్మాణం వద్దని చెపితే తొక్కిపెట్టారు. బరాజ్‌లు ఎక్కడ కట్టాలో మీరే నిర్ణయించుకున్నారు. కుంగి పోయే ప్రాజెక్టు కట్టినందుకు సిగ్గుపడాల్సింది పోయి హరీశ్‌రావు కొత్త రికార్డు సృష్టించారు. జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేశారు. ఒక్క మాట కూడా నిజం చెప్పకుండా మరోసారి డూప్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారు. మా ప్రభుత్వం ఒక్క రూపాయి బిల్లు కూడా ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు ఇవ్వలేదు. కేబినెట్ ఆమోదం లేకుండానే మామా అల్లుళ్లు సంతకాలు చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. తెలంగాణ ప్రజలను దగా చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పాతరపెట్టి, ఆర్థికంగా లక్ష కోట్ల దుర్మార్గానికి ఒడిగట్టిన బీఆర్ఎస్ నేతలకు నైతికంగా మాట్లాడే హక్కే లేదు..’ అని ఉత్తమ్ విమర్శించారు. -
ఏకపక్షం కాదు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు లేకుండా వండి వార్చిన నివేదికను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బయట పెట్టింది. ఈ ప్రాజెక్టుకు కేబినెట్‌తో పాటు అసెంబ్లీ ఆమోదం కూడా ఉంది. గవర్నర్ ప్రసంగంలో కాళేశ్వరం అంశం ఉండటం కేబినెట్ ఆమోదాన్ని సూచిస్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణం నాటి సీఎం కేసీఆర్ సొంత నిర్ణయం కాదు. వ్యక్తుల నిర్ణయం ఆధారంగా బరాజ్‌ల నిర్మాణం జరగలేదు. వ్యాప్కోస్ నివేదిక, హై పవర్ కమిటీ సిఫారసులు, కేబినెట్ నిర్ణయం, సీడబ్ల్యూసీ ఆమోదం మేరకు జరిగాయి. సీఎం రేవంత్‌రెడ్డి పాలనను గాలికి వదిలి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ‘డబ్బులు దండుకునేందుకు కమీషన్లు..కక్ష సాధింపుల కోసం కమిషన్లు’ అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ టీవీ సీరియళ్ల తరహాలో కమిషన్లు, విచారణలతో కాలం గడుపుతున్నాడు. కేసీఆర్‌ను హింసించాలన్నదే ఆయన ఉద్దేశం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి..’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు.. కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు’ అనే అంశంపై మంగళవారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నేతలు, రైతులు దీనిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ వద్దకు బరాజ్ మార్చడంలో నాటి సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. కుట్ర పూరిత విచారణ! కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యాలూ లేవు. అన్ని అంశాలు డీపీఆర్‌లో ఉన్నాయి. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు నేరుగా తరలించలేమని నిపుణులు చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ కుట్రపూరితంగా జరిగినట్లు కనిపిస్తోంది. కమిషన్ ఎదుట విచారణకు రావాలని మాకు నోటీసులు రాకమునుపే మీడియాలో లీకులు ఇచ్చారు. సంక్షిప్త నివేదిక పేరిట అవాస్తవాలు, రాజకీయ కక్ష సాధింపులతో 60 పేజీలు వండి వార్చారు. నచ్చిన పేరాల లీకులు, నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్లుగా నివేదిక తీరు ఉంది. ఒక వైపే చూసి, విని, నిలబడి ఇచ్చిన నిరాధార నివేదిక ఇది. అసెంబ్లీలో 665 పేజీల పూర్తి నివేదికను పెడితే వాస్తవాలను నిగ్గు తేల్చేలా నిలదీసి చీల్చి చెండాడతాం. అనుమతుల్లేని ‘కొడంగల్’కు ఎలా శంకుస్థాపన చేస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఈ నివేదిక తప్పు పట్టింది. 11 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రాజెక్టును ఆమోదించాయి. ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ గతంలో ప్రధానికి లేఖ రాశారు. ఏ అనుమతులు లేని కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రేవంత్ ఎలా శంకుస్థాపన చేశారు? దీనిపై కూడా అసెంబ్లీలో దుమ్ము దులిపి అన్ని ఆధారాలు బయట పెడతాం. కానీ మైక్ కట్ చేయకుండా, సభను వాయిదా వేసుకోకుండా వాస్తవాలు చెప్పే అవకాశం మాకు ఇవ్వాలి. గతంలో దేశంలో వేసిన అనేక కమిషన్ల తరహాలోనే ఈ కమిషన్ నివేదిక కూడా న్యాయస్థానం ముందు నిలవదు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకే మేడిగడ్డకు మార్పు తుమ్మిడిహెట్టి వద్ద ఏ ప్రాతిపదికన గతంలో బరాజ్‌ను ప్రతిపాదించారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. అక్కడ నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీనే చెప్పింది. అందుకే మేడిగడ్డకు మార్చాం. ప్రతిపాదిత 165 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాల వాటా ఉంది. దాన్ని కాంగ్రెస్ దాచిపెట్టింది. ప్రాణహిత–చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతి ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్తోంది. కానీ 152 మీ. ఎత్తులో బరాజ్ నిర్మించవద్దని మహారాష్ట్ర స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి కావాలన్న ఉద్దేశంతోనే తుమ్మిడిహెట్టి నుంచి మార్చాం. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాలు చేసినా నాటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించ లేదు. అప్పట్లో ఖర్చు చేసింది రూ.3,700 కోట్లే.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.11 వేల కోట్లతో 32 శాతం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పాడు. కానీ ఈ ప్రాజెక్టు కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం రూ.3700 కోట్లే. అందులోనూ మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారు. కేసీఆర్ వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారు. నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఏ అనుమతి ఉందని రేవంత్‌రెడ్డి కొబ్బరికాయ కొట్టిండు. డీపీఆర్ లేకుండానే రేవంత్‌రెడ్డి పనులు ప్రారంభించాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్లులు కూడా చెల్లించారు. దీనికి ఒక్క అనుమతైనా ఉంటే ఉత్తమ్ చూపించాలి. కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తున్న రేవంత్ గందమల్ల రిజర్వాయర్‌కు కొబ్బరికాయ కొట్టి, మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తెస్తానని టెండర్లు పిలుస్తున్నాడు. కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయని. ప్రజల గుండెల్లో కేసీఆర్ దేవుడిలా నిలుస్తారు. రాజకీయ కుట్రతోనే ఎన్డీఎస్ఏ నివేదిక గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు మూడుసార్లు కుప్పకూలినా స్పందించని ఎన్డీఎస్ఏ మేడిగడ్డ బరాజ్‌లో చిన్న ఘటన జరగ్గానే వచ్చింది. రాజకీయ కుట్రతోనే నివేదిక ఇచ్చింది. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే కేసీఆర్‌ను బాధ్యులుగా చేస్తున్న వారు పోలవరం కట్టిన ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? పోలవరం కట్టిన ప్రధాని మోదీపై చర్య తీసుకుంటారా? శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిన ఘటనకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ బాధ్యత వహించాలి. అధికారంలోకి రాగానే మరమ్మతులు చేస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో బాగుంది. ప్రాజెక్టు ద్వారా రెండు పంటలు పండాయి. సుందిళ్ల, అన్నారం బరాజ్‌లు సురక్షితంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పాడు. మేడిగడ్డలో రెండు పియర్లు కుంగితే కాళేశ్వరం కూలిందని తప్పుడు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కుంగిన రెండు పియర్లను బాగు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణకు వరప్రదాయని అని నిరూపిస్తాం. -
రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి స్పందన
ఢిల్లీ: తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. మంత్రి పదవులు విషయంలో హైకమాండ్, సీఎం నిర్ణయాలు తీసుకుంటారన్నారు. తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్‌లో తాను లేనంటూ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.కేంద్ర పెద్దలు మాటిచ్చిన విషయం తనకు తెలియదన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తాను మొదటి నుంచి ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్నారు. మంత్రి వర్గంలో నేనొక సీనియర్ మంత్రినని.. నేనెప్పుడూ తన మంత్రి పదవి కోసం ఢిల్లీ రాలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు.రెండు నెలల్లో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్తున్నారని మంత్రి అన్నారు.కాగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తానన్నారు. మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధం.. ఎంత దూరమైన పోతా’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేది. మునుగోడు ప్రజల కోసం నేను మంత్రి పదవి వదులుకున్నాను...నేను పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారు. భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించినప్పుడు కూడా మంత్రి పదవి ఇస్తామన్నారు. మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజల ఆలోచన. పదవులను అడ్డుపెట్టుకొని సంపాదించే వాడిని కాదు. నా స్వార్థం కోసం మంత్రి పదవి అడగట్లేదు’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. -
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థాన్ నారాయణపురంలో ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తానన్నారు. మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధం.. ఎంత దూరమైన పోతా’’ అంటూ వ్యాఖ్యానించారు.‘‘ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేది. మునుగోడు ప్రజల కోసం నేను మంత్రి పదవి వదులుకున్నాను. నేను పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారు. భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించినప్పుడు కూడా మంత్రి పదవి ఇస్తామన్నారు. మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజల ఆలోచన. పదవులను అడ్డుపెట్టుకొని సంపాదించే వాడిని కాదు. నా స్వార్థం కోసం మంత్రి పదవి అడగట్లేదు’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.నాలాంటి వాడికి మంత్రి పదవి వస్తే ఇంకా ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు. రాజగోపాల్‌రెడ్డికి ప్రజలు కావాలి. మంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా అది మీ ఇష్టం. నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్నాను. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాను. వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారు. నాకన్నా చిన్నవారికి పదవులు ఇచ్చారు. మీరు ఎంపీ గెలిపించుకో అంటే గెలిపించాను. నేను ఎవరి కాళ్లు మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు. మనసు దిగజార్చుకొని బతకడం నాకు తెలియదు. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఏనాడు చేయను’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
‘కాళేశ్వరం కమిషన్ నివేదిక ట్రాష్, గ్యాస్’
సాక్షి,న్యూఢిల్లీ: ఈవీఎంలు వద్దు పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణ, సంస్కరణలపై అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈసీ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్‌తో పాటు ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. ఈసీతో సమావేశం అనంతరం, కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.‘పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి. బీహార్ ఎన్నికల నుంచే పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికల జరపాలి. ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక దేశాలు బ్యాలెట్ విధానంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై బాండ్ పేపర్లతో ప్రజలను వంచించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే ప్రజలు శిక్షించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. హామీలు నెరవేర్చకపోతే సభ్యత్వం రద్దు చేయాలి. బీహార్ ప్రత్యేక ఓటర్ సవరణ పై కూడా చర్చ జరిపాం. ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తీసేయలేదు అని ఎన్నికల సంఘం చెప్పింది. ఓటరు జాబితా సవరణ మంచిదే కానీ అందరి విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని చేయాలి. అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.అదే సమయంలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై స్పందించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ట్రాష్, గ్యాస్. కాళేశ్వరం కమిషన్ నివేదికలో 650 పేజీల్లో ఉన్న నివేదికను 60 పేజీల్లోకి కుదించి అసెంబ్లీలో పెడతామని అంటున్నారు.అసెంబ్లీలో మైకు కట్ చేయకుండా ఉంచితే కాంగ్రెస్ ను చీల్చి చెండాడుతాం.దురుద్దేశంతో మాపై ప్రచారం చేస్తున్నారు.కేసీఆర్ ,బీఆర్ఎస్పై దుష్ప్రచారం. మొత్తం నివేదికను బయట పెట్టాలి.అసెంబ్లీలో నివేదిక పెట్టాలి.బీసీల కు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చెయ్యడం లేదు. సబ్ ప్లాన్ ఎందుకు పెట్టరు. మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చెయ్యండి. ఢిల్లీలో డ్రామా లు చేస్తే ఎవ్వరు నమ్మరు’అని ఎద్దేవా చేశారు. -
డాక్టర్ నమ్రతా కస్టడీలో బయటపడ్డ సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. కస్టడీలో పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు. కస్టడీలో డాక్టర్ నమ్రతా అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆధారాలు ముందు ఉంచి నమ్రతాను విచారించిన పోలీసులు.. చైల్డ్ ట్రాఫికింగ్‌తో పాటు సరోగసి మోసాలపై ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో డాక్టర్ నమ్రతాకు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.కళ్యాణితో కలిసి ఏజెంట్లు సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్టు నిర్థారణ అయ్యింది. కస్టడీ విచారణలో భాగంగా ఏజెంట్ల నెట్‌వర్క్‌ను పోలీసులు గుర్తించారు. రేపటితో కళ్యాణి, ధనశ్రీ సంతోషి విచారణ ముగియనుంది. మరికాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరుపర్చనున్నారు.కాగా, సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో గోపాలపురం పోలీసులు మరో డాక్టర్‌ను కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్‌కు వచ్చిన డాక్టర్ విజ్జు లతను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె అరెస్టుతో ఈ కేసులో ఇప్పటి వరకు కటకటాల్లోకి చేరిన వారి సంఖ్య 15కు చేరింది. మరోపక్క డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందంటూ మరో ఐదుగురు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు.సరోగసీ కోసం హైదరాబాద్‌లోని సృష్టి సెంటర్‌ను ఆశ్రయించిన వారిని నమ్రత విశాఖపట్నంలోని బ్రాంచ్‌కు పంపేది. అక్కడ కీలకంగా వ్యహరించిన డాక్టర్ విజ్జు లత వారికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం తదితరాలు చేసేది. నమ్రత విచారణలో ఈ విషయం గుర్తించిన దర్యాప్తు అధికారులు విజ్జు లత కోసం గాలించారు. అయితే నమ్రత గ్యాంగ్ అరెస్టు విషయం తెలియడంతోనే ఆమెతోపాటు అనేక మంది ఏజెంట్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నమ్రత చేతిలో మోసపోయిన మరో ఐదుగురు బాధితులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కేసుల్లోనే విజ్జు లతను అరెస్టు చేశారు. సరోగసీ పేరుతో ఒప్పందాలు చేసుకున్న నమ్రతకు రూ.11 లక్షలు, రూ.15 లక్షలు, రూ.13 లక్షలు చొప్పున ఆ ముగ్గురు, మరో జంట రూ. 20 లక్షలు చెల్లించినట్టు ఫిర్యాదు చేయగా, కేసులు నమోదు చేశారు. నమ్రతతో పాటు ఇతర నిందితులను ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్‌పై అరెస్టు చేయడంతో పాటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. రాజస్తాన్ మహిళ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నమ్రత పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఆపై ఇతర కేసుల్లో అరెస్టు, కస్టడీ ప్రక్రియలు చేపట్టనున్నారు.నమ్రత ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహణ లైసెన్స్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 2021లో పొడిగించలేదు. దీంతో తాను ఆ వృత్తి నిర్వహించట్లేదంటూ నమ్రత లేఖ కూడా ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని గోపాలపురంలో నాలుగు అంతస్తుల భవనంతోపాటు మరో మూడు చోట్లా అక్రమంగా యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్ హెడ్స్‌తో కథ నడిపించారు.ఈ సూరి శ్రీమతి వయస్సు ప్రస్తుతం 94 ఏళ్లు అని, ఆమెకు తెలియకుండానే నమ్రత ఈ పని చేసినట్టు గుర్తించిన గోపాలపురం పోలీసులు ఈ మేరకు వాంగ్మూలాలు నమోదు చేశారు. నమ్రతకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఏజెంట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరి ద్వారానే మగ శిశువును గరిష్టంగా రూ.4.5 లక్షలు, ఆడ శిశువును గరిష్టంగా రూ.3.5 లక్షలకు ఖరీదు చేస్తోందని, వారిని సరోగసీ పేరుతో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఏజెంట్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
రాజకీయ దురుద్దేశంతో రిపోర్టులా?.. చర్చకు సిద్దంగా ఉన్నాం: హరీష్‌రావు
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో రాజకీయ కక్ష సాధింపునకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కమీషన్ల పేరుతో పాలన నడుస్తోందన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు కోర్టు ముందు నిలబడవు, ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ పెడితే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చీల్చి చెండాడుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్‌లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది. విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ రాక ఇంట్లోనే ఉంటున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. కమీషన్ల పేరుతో పాలన నడుస్తుంది. రాష్ట్రం మొత్తం కమీషన్ల మయం చేశారు. రెండు పార్టీలు రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నాయి. NDSA రిపోర్ట్ గురించి అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టు రెండు సార్లు కూలిపోతే NDSA లేదు. మేడిగడ్డ బ్యారజ్లో రెండు పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద NDSA రిపోర్ట్ వచ్చింది.కాళేశ్వరం కమిషన్ గడువు రాత్రికి రాత్రే పెంచారు. కేసీఆర్‌కు, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని మీడియాకే ముందు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ పూర్తి రిపోర్ట్ వస్తే బీఆర్ఎస్ ఎలా స్పందించాలో మాకు తెలుసు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చ పెడితే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చీల్చి చెండాడుతుంది. ప్రభుత్వం బయటపెట్టిన రిపోర్టు చూస్తుంటే పూర్తిగా ఆధారాల్లేవు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు కోర్టు ముందు నిలబడవు, ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది.టీవీల్లో వచ్చే సీరియల్లా రోజుకో అంశంపైన రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయి. కన్నేపల్లి పంపు హౌస్ ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా.. నీళ్లను ఇవ్వడం లేదు. తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు పని కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ గో బెల్స్ ప్రచారం చేస్తుంది. బేగంపేట ఎయిర్ పోర్టులో కేసీఆర్ సవాల్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించలేక పారిపోయాడు. తుమ్మడిహట్టి 152 మీటర్ల ఎత్తుకు ప్రాజెక్టు కట్టేందుకు అనుమతి ఉన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశాడు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
చనిపోయిన వారి పింఛన్ల రికవరీ
సాక్షి, హైదరాబాద్: ఏడాది కిందట చని పోయిన పింఛనుదారులకు చేయూత పింఛన్లు అందజేశారు. ఇలా గత ఏడాది 28 వేల మందికి రూ.60 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్) తాజాగా గుర్తించింది. చేయూత పింఛన్లు అందుకుంటూ మరణించిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర కేటగిరీ లబ్ధిదారుల వివరాలను వారి కుటుంబసభ్యులు అధికారులకు తెలియ జేయకపోవ డంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఉన్నతాధికారులు నిర్ధారించారు. వృద్ధులు, ఇత రకేటగిరీల వారికిచ్చే రూ.2,016 మొదలు.. దివ్యాంగులకు ఇచ్చే రూ.4,016 వరకు చనిపో యిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఏడాది పాటు పింఛన్ మొత్తం జమ అయినట్టు వెల్లడైంది. దీంతో ఈ పింఛన్‌దారుల కుటుంబీకుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు గ్రామీణాభివృద్ది శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామీణ– పట్టణ స్థానిక సంస్థల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు, సర్వేలు, క్రాస్ వెరిఫికేషన్, ఎన్ఐసీ పోర్టల్‌లో పేర్లను సరిచూడడం వంటి వాటి ద్వారా పింఛన్‌దారులు చనిపోయినా వారి కుటుంబసభ్యు లు డబ్బులు విత్డ్రాచేయడాన్ని గుర్తించారు. అంతేకాకుండా మరణించిన వారి బ్యాంక్ డెబి ట్ కార్డులను వారి కుటుంబీకులు ఉపయోగించి ఏటీఎంల నుంచి డబ్బు తీసుకున్నట్టుగా కూడా తేలింది. దీంతో మరణించిన 28 వేల పింఛనుదారుల పేర్లను జాబితా నుంచి తొల గించినట్టు అధికారులు వెల్లడించారు. అదేసమ యంలో వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి మరణించిన వారి భార్య లేదా భర్తకు పింఛన్ అందించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. -
రేవంత్.. మంచి చెడులు రాశులు పోసి ఉండవు!
‘నవ తెలంగాణ’ పత్రిక వార్షికోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల గురించి చేసిన వ్యాఖ్యలు కొన్ని అభ్యంతరకరం. మరికొన్ని అర్ధసత్యాలు. ఇంకొన్ని పూర్తిగా అసత్యాలు. కొంతమంది తీరు చూస్తే చెంప చెళ్లుమనిపించాలని అనిపిస్తుందని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు అనడం భావ్యం కాదు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలలో పనిచేసే వారిని జర్నలిస్టులుగా గుర్తించేందుకు ఆయన ఇష్టపడకపోవచ్చు వారి వల్ల ఆయనకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉండవచ్చు కానీ.. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమైనా అంతా పద్దతిగా ఉందని ఆయన చెప్పగలరా? లోపాలు ఎక్కడైనా ఉండవచ్చు.ప్రముఖ పత్రికలు, టీవీ ఛానళ్లు కొన్ని చేస్తున్న అసత్య ప్రచారాలు, వాటి యజమానులు కొందరు చేసే పైరవీలు, రాజకీయ బ్రోకరిజాలు రేవంత్‌కు తెలియవని అనుకుంటే పొరపాటే. ఒకరిద్దరితో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటారు. వారు చెప్పిన మాట జవదాటరని కూడా కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటి వారిలో రేవంత్‌కు సత్యసంధత కనిపిస్తోందా? అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం ఇస్తారు?. ప్రధాన మీడియా ఇవ్వని అనేక విశ్లేషణలు, ముఖ్యమైన వార్తా కథనాలను డిజిటల్ మీడియా ఇస్తోంది. రేవంత్ సహా పలువురు రాజకీయ వేత్తలు డిజిటల్ మీడియాను పూర్తిగా వాడుకుంటున్నారు. కొందరు పార్టీ కార్యాలయాలలో వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తూ తమ అనుకూల స్టోరీలతోపాటు ప్రత్యర్థి పార్టీపై, గిట్టని నేతలపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. వీటిలో చాలా అబద్దాలు ఉంటున్నాయన్న అభిప్రాయం ఉంది. సాధారణ జర్నలిస్టులు నిర్వహించే యూట్యూబ్ ఛానళ్ల కన్నా, రాజకీయ పక్షాలు నడిపే ఛానళ్లే సమాజానికి హానికరంగా మారుతున్నాయని. వాటి గురించి రేవంత్ ఏమి చెబుతారు!.రాజకీయాలలో మాదిరే జర్నలిజంలో కూడా విలువలు తగ్గిన మాట నిజమే. నాలుగు ముక్కలు రాయడం రాకపోయినా ప్రతి వాడు జర్నలిస్టునే అని చెప్పుకుంటున్నాడు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో కొంతవరకు నిజం లేకపోలేదు. అక్షర జ్ఞానం అవసరమే కావచ్చు. కానీ, మారిపోయిన కాలమాన పరిస్థితులను కూడా ఆయన అర్థం చేసుకోవాలి. గతంతో పోలిస్తే సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయి. సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి జర్నలిస్టు కావచ్చంటారు. వారందరిని జర్నలిస్టులు అనాలా?.. వద్దా అన్నది ప్రభుత్వ ఇష్టం. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రధాన స్రవంతిలో ఉన్న జర్నలిస్టుల కన్నా, సోషల్ మీడియాలో, ప్రత్యేకించి యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తున్న కొందరు చెప్పే విషయాలను జనం శ్రద్దగా వింటున్నారు. వారికి లక్షల సంఖ్యలో వ్యూస్ కూడా వస్తున్నాయి.ఈ మధ్య కొన్ని సామాజిక సమస్యలపై ఒక మహిళా జర్నలిస్టు ఇచ్చిన కథనాలు, ఇంటర్వ్యూలు బాగా ప్రాచుర్యం పొందాయి. కర్ణాటకలోని ధర్మస్థళలో యువతులపై జరిగిన ఘోర అకృత్యాలు, అనేక మంది కనిపించకుండా పోయిన ఘటనపై యూట్యూబ్ మీడియానే సంచలనాత్మక స్టోరీలు ఇచ్చింది. కొందరు రాజకీయ పార్టీలకు సంబంధించి ఇస్తున్న విశ్లేషణలు కూడా గుర్తింపు పొందుతున్నాయి. ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తారంగా వస్తుంటాయి. జర్నలిస్టులకు ఇది ప్రత్యామ్నాయ ఉపాధిగా మారింది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. జర్నలిస్టు అంటే ఎవరన్నది నిర్వచించడం కష్టమైన పరిస్థితి ఇది. యూట్యూబ్ ఛానల్లో పని చేసే వారికి ప్రభుత్వపరమైన ప్రత్యేక గుర్తింపు లేదు. సాయం ఉండదు. కాకపొతే కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల పేరుతో బ్లాక్ మెయిలింగ్, పైరవీలు వంటివి చేస్తుంటారు. ఆహ్వానం లేకపోయినా ఆయా కార్యక్రమాలలో పాల్గొనడం, అర్థం పర్థం లేని ప్రశ్నలు వేయడం వంటివి చేస్తుండవచ్చు. అలాంటి వారి వల్ల రేవంత్‌కు చికాకు కలిగి ఉండవచ్చు. కాని కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి వారి చెంపపై కొట్టాలనిపిస్తుందని ఎలా అంటారో అర్థం కాదు.రాజకీయాలలో ఉన్న వారంతా సుద్దపూసలని ఆయనే అంగీకరించ లేదు. వారిలో చాలామందికి పెద్దగా పదవులు ఉండవు. ఆయా నేతల వెనుక అనుచరులమని చెప్పుకుని తిరుగుతుంటారు. దందాలు కూడా చేస్తుంటారు. భూ కబ్జాలు జరుగుతుంటాయి. రాజకీయ నేతలపై ఎవరిపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలిపే సంస్థలు ఉన్నాయి. అలా కేసులు ఉన్నవారు పదవులలోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉండదు. రేవంతే ఒక సందర్భంలో చెప్పినట్లు ఆయనపై చాలా కేసులు ఉన్నాయి. అవన్ని నిజమైనవా? కావా? అన్నది వేరే చర్చ. కొందరు చిన్న, చితక రాజకీయ నేతలు విజిటింగ్ కార్డులు పెట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతూ పైరవీలు సాగిస్తుంటారు. వారందరిని అరికట్టే వ్యవస్థ ప్రభుత్వంలో ఉందా అన్నది ప్రశ్న. ఇంటి పేరు మాదిరి జర్నలిస్టు అని తగిలించుకుంటున్నారని రేవంత్ అనడం సబబు కాదు. ఎవరి స్వేచ్చ వారిది. వారు తమ ప్రతిభను చాటుకోగలిగితే జర్నలిస్టుగా పేరు తెచ్చుకుంటారు. రాణించగలుగుతారు. రోడ్లపై ఆవారాగా తిరిగేవారు, తిట్లు వచ్చిన వారు జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారని అన్నారు. రాజకీయాల్లోనూ ఇదే రీతిలో పలువురు వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది.రాజకీయ పార్టీలకు అనుబంధంగా మీడియా గురించి కూడా మాట్లాడారు. కొన్ని పత్రికలు తాము ఫలానా పార్టీకి చెందిన విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకోగలుగుతున్నాయి. వాటిలో ఇబ్బంది లేదు. అవి రాసే, లేదా టీవీలలో ప్రసారం చేసే వాటిపై స్పష్టత ఉంటుంది. కాని స్వతంత్ర పాత్రికేయం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, ఇతర పార్టీలపై పచ్చి అబద్దాలను ప్రచారం చేసే మీడియాతోనే ఇప్పుడు ఉన్న సమస్య. కాంగ్రెస్ పార్టీ కూడా మీడియాను నిర్వహించేది. అలాగే వామపక్షాలకు చాలాకాలంగా మీడియా ఉంది. ఒకప్పుడు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు మీడియాపై విరుచుకుపడే వారు. కానీ, ఇప్పుడు అదే మీడియాను, అవే పార్టీలను రేవంత్ పొగుడుతున్నారు. తప్పులేదు. కాలం మారింది. కొన్నిసార్లు కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీచేసి అధికారంలోకి వస్తున్నాయి. కొన్నిసార్లు విబేధించుకుంటున్నాయి.ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ పెట్టింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అణచివేసింది. నక్సలిజానికి వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకుంది. కానీ, ఇప్పుడు అదే సాయుధ పోరాటం గొప్పది అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రముఖ గాయకుడు గద్దర్ వంటి నక్సల్ నేతల పేరు మీద సినీ అవార్డులు కూడా ఇస్తున్నాయి. అంతెందుకు కాంగ్రెస్‌ను, సోనియా గాంధీని రేవంత్ ఎంతగా దునుమాడింది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎంతగా పొగుడుతున్నది చూస్తున్నాం. తప్పులేదు. కాలం మారింది. రాజకీయాలు మారాయి.మరో సంగతి చూద్దాం. కొన్ని పత్రికలు ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి, మరో రాష్ట్రంలో ఇంకో పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి బహిరంగంగా మద్దతు ఇచ్చే ఒక వర్గం మీడియా తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్‌కు సపోర్టు చేస్తోంది. అంతకు ముందు ఇదే మీడియాలో ఒక భాగం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండేది. రాజకీయ పార్టీలు కూడా తెలుగు రాష్ట్రాలలో తమాషా రాజకీయాలు చేస్తున్నాయి. బీజేపీ కూటమిలోని టీడీపీ ప్రభుత్వానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా సహకరిస్తోందన్న ప్రచారం ఉంది. ఏపీలో కాంగ్రెస్ కూడా బీజేపీ కూటమికే పరోక్షంగా మద్దతు ఇస్తోందన్న అభిప్రాయం ఉంది. అది నైతికమా?. అలా చేసే రాజకీయ నేతలను నిరోధించగలమా?. ప్రజలను మోసం చేయకపోతే వారు ఓట్లు వేయరన్న ఫిలాసఫీ కూడా రాజకీయ నేతలలో ఉంది కదా!. అమెరికాలో ఒక సందర్భంలో రేవంత్ చేసిన ఆ తరహా వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఆయన నిజమే చెప్పి ఉండవచ్చు. కానీ, అది మోసం చేయడం అవ్వదా అన్నది పాయింట్. తాను నిజాలు చెప్పకపోవచ్చని, కాని అబద్దాలు ఆడనని రేవంత్ అంటున్నారు. దానికి, దీనికి పెద్ద తేడా ఉంటుందా?.రాజకీయ నేతల మాదిరే జర్నలిస్టులు కూడా వారి స్వేచ్చకు అనుగుణంగా ఉండవచ్చు. ఎటు వచ్చి అబద్దాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు, తిట్ల పురాణాల జోలికి వెళ్లనంతవరకు ఓకే. అలా కాకపోతే ఎటూ చట్టాలు ఉండనే ఉన్నాయి. కాకపోతే తమకు నచ్చని యూట్యూబ్ ఛానళ్లపై ప్రభుత్వాలు దాడులు చేస్తుంటాయి. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను బాగా వాడుకున్న వ్యక్తే అని అంటారు. ఇప్పుడు దానిపై ఆయనకు ఎందుకు ఏవగింపు కలిగిందో తెలియదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డిజిటల్ మీడియా బాగా ఉపయోగపడిందన్న భావన కూడా ఉంది. ఏది ఏమైనా ఏ మీడియా అయినా, ఏ రాజకీయ సమాజం అయినా బాధ్యతగా ఉండటమే శ్రేయస్కరం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్నాప్‌చాట్‌లో పరిచయం.. ప్రేమపేరుతో సహజీవనం
హైదరాబాద్ : యువకుడిపై పోక్సో కేసు నమోదైన సంగటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిన వివరాల ప్రకారం.. మేడిపల్లి కి చెందిన బాలిక(17)ను చిన్నతనంలోనే తన అక్కకు, బావకు పిల్లలు లేకపోవడంతో బాలికను దత్తత ఇచ్చారు. అప్పటినుంచి బాలిక వారితోనే మేడిపల్లిలో పెరిగింది.పెంపుడు తల్లి సంవత్సరం క్రితం జబ్బుపడి మరణించగా అప్పటినుంచి బాలిక చదువు మానేసి తండ్రితోనే ఉంటోంది. ఈ సందర్బంగా బాలికకు ఒక సంవత్సర కాలంగా స్నాప్‌చాట్ అనే యాప్‌లో అలియాబాద్‌కు చెందిన యువకుడు పరిగి రవితేజ్(23)తో పరిచయం ఏర్పడింది. కాగా బాలిక తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు అదునుగా చేసుకుని ప్రేమ పేరుచెప్పి మాయమాటలతో బాలికను లోబర్చుకుని గత రెండునెలలుగా బాలిక ఇంట్లోనే సహజీవనం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక కన్నతల్లి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. తల్లి పిర్యాదుమేరకు నిందితుడిపై పోక్సోకేసును నమోదు చేసి నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్లు మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి తెలిపారు. -
Hyderabad Rains: నగరం.. నిలిచిపోయింది!
సాక్షి, హైదరాబాద్: హఠాత్తుగా కురిసిన భారీ వర్షానికి సోమవారం నగరం నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటరు దూరం దాటడానికి కనీసం అరగంటకు పైగా పట్టింది. ఇంకొన్ని చోట్ల గంటల తరబడి వాహనాలు ముందుకు కదలనే లేదు. వర్షం నేపథ్యంలో ద్విచక్ర వాహనచోదకులు మెట్రోరైల్ స్టేషన్ల కింద ఆగిపోవడంతో ఆ ప్రాంతాలు బాటిల్ నెక్స్‌గా మారి మరిన్ని ఇబ్బందులు తెచ్చాయి.సాధారణంగా మిగిలిన రోజుల కంటే మొదటి పని దినమైన సోమవారం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పరిస్థితి చేతులు దాటింది. ట్రాఫిక్ పోలీసులతో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమించినా వాహనచోదకుడిని నరకం తప్పలేదు. నగర వ్యాప్తంగా దాదాపు 140 ప్రాంతాల్లో ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాల కారణంగా రోడ్లన్నీ చెరువులుగా మారాయి. వర్షానికి రోడ్లన్నీ నీళ్లు నిండటంతో ఏది గొయ్యే, ఏది రోడ్డో అర్థంకాక వాహనచోదకులు తమంతట తామే వాహన వేగాలను తగ్గించుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ రహదారులపై వాహన శ్రేణులు నిలిచిపోయాయి.కీలక మార్గాల్లోనూ అత్యంత నెమ్మదిగా ముందుకు సాగాయి. నాగోల్–మెట్టుగూడ, సికింద్రాబాద్–బేగంపేట్, ఎల్బీనగర్–చాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్–నాంపల్లి, పంజగుట్ట–కూకట్పల్లి, పంజగుట్ట–మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్–మెహదీపట్నం ప్రాంతాల్లో వాహనాలు భారీగా ఆగిపోయాయి. రోడ్లన్నీ జామ్ కావడంతో గంటల తరబడి వాహనాలు రోడ్ల పైనే ఉండిపోయాయి. కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వెళ్లే దారిలోనూ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్వయంగా రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్... సోమవారం నాటి పరిస్థితుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. కేవలం గంట వ్యవధిలో ఏకంటా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం పడే అవకాశం ఉందని రెండు గంటల ముందుగానే సమాచారం అందుకున్న హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయన కూడా స్వయంగా ముంపు ప్రాంతాలకు వెళ్లారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడైనా వరద ముప్పు ఉంటే హైడ్రా కంట్రోల్ రూమ్‌కు (9000113667) ఫిర్యాదు చేయాలని సూచించారు. -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే రణరంగమే
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే రణరంగం సృష్టిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తమది రాజకీయ పోరాటం కాదని, బీసీల ఆత్మగౌరవం కోసమే తమ ఆరాటమని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోపాటు ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి బీజేపీ వైఖరిని బయట పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి కవిత సూచించారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సోమవారం కవిత ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద 72 గంటల దీక్షకు దిగారు. హరియాణాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ)నాయకుడు అర్జున్‌సింగ్ చౌతాలాతోపాటు వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులు కవితకు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణలో రాజ్యాధికారంలో అందరికీ వాటా రావాలని, బీసీలకు ప్రాధాన్యం దక్కాలని కవిత డిమాండ్ చేశారు. జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తాం: బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు కూడా వాటా ఉందన్న అనుమానంతో బిల్లులను ఆపుతున్నామని బీజేపీ చెబుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని కవిత అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోపాటు ప్రత్యేకంగా ముస్లింల కోసం పది శాతం రిజర్వేషన్ల బిల్లులపై కేంద్ర ప్రభుత్వం సంతకం చేయకపోతే ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు.ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే టైమ్ పాస్ ధర్నాలతో సాధించేదేమీ లేదని, బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతిని కలవడంతోపాటు ఆర్డినెన్స్ ఆమోదంలో గవర్నర్ జాప్యంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఆగస్టు 8 తర్వాత కవిత దీక్ష చేసేందుకు.. పోలీసులు హైకోర్టు ఎదుట సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో కోర్టులపై ఉన్న గౌరవంతో తన దీక్షను విరమిస్తున్నట్టు కవిత ప్రకటించారు. అయితే బీసీ రిజర్వేషన్ల కోసం తన పోరాటం వివిధ రూపాల్లో కొనసాగుతుందని స్పష్టం చేశారు. కూకటివేళ్లతో కాంగ్రెస్‌ను పెకిలించాలి: అర్జున్‌సింగ్ చౌతాలా కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో సహా పెకిలించాలని ఐఎన్ఎల్డీ నాయకుడు అర్జున్‌సింగ్ చౌతాలా పిలుపునిచ్చారు. న్యాయమైన డిమాండ్ కోసం కవిత చేస్తున్న పోరాటంలో తాము భాగస్వాములం అవుతామని ప్రకటించారు. -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇందుకోసం అందరం చేయి చేయి కలిపి పనిచేద్దామని కోరారు. సోమవారం గాందీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ల సమక్షంలో ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావుతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కొండబాలకు పార్టీ కండువా కప్పిన పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ పార్టీలోకి ఆహా్వనించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి భట్టి మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని, వారి అవసరాలు తీర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు అన్ని విషయాలపై అవగాహన కలిగిన కొండబాల లాంటి నేతలు పార్టీలోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు.మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కొండబాల తన సొంత ఇంటికి తిరిగి వచ్చారని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వరరావుతో పాటు ఖమ్మం జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఇది రైతు ప్రభుత్వం కాదు.. రాక్షస ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఇది రైతు ప్రభుత్వం కాదని..రాక్షస ప్రభుత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సకాలంలో పంటలకు యూరియా అందించకపోవడంతో 70 లక్షల మంది రైతులు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారని సోమవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా పొలంలో ఉండాల్సిన రైతులు ఎరువుల దుకాణాల ముందు ఎదురుచూపులు చూస్తున్నారన్నారు. గత పదేళ్లలో ఎన్నడూ రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లు కట్టిన దాఖలాలు లేవని చెప్పారు.యూరియాపై ప్రభుత్వ సమీక్షలు లేకపోవడం, కేంద్రం, రాష్ట్రం మధ్య కొరవడిన సమన్వయం మూలంగా రాష్ట్రంలో ఇప్పుడు యూరియా, డీఏపీ కొరత ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం ఎరువుల కొరత రాకుండా ఏప్రిల్, మే నెలలో ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ లేని సమయంలోనే నోడల్ ఏజెన్సీ మార్క్‌ఫెడ్‌కు ఆర్థిక సహాయం అందించి జూన్ నెల నాటికి 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నులు, డీలర్ల వద్ద మరో 3 లక్షల టన్నుల బఫర్ స్టాక్ ఉండేలా చూసుకునేదని గుర్తు చేశారు. అదే నేడు ప్రభుత్వ సమన్వయ లోపమే ఈ పరిస్థితికి కారణమని కేటీఆర్ పేర్కొన్నారు. -
నడిరోడ్డుపై నరకం
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. జనజీవనం అతలాకుతలమైంది. సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా మూడుగంటల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించగా, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. మరోవైపు రోడ్లపై చెట్లు విరిగి పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. ట్రాఫిక్ ఇబ్బందులతో జనజీవనం స్తంభించిపోయింది. విద్యాసంస్థలు వదిలే వేళ, ఉద్యోగులు ఇంటిబాట పట్టే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముందుకు సాగేందుకు గంటల కొద్దీ సమయం పట్టింది. అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు నీటమునిగాయి. నాలాలు, మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. నగరంలో అత్యధికంగా కుత్బుల్లాపూర్ పరిధిలోని మహదేవుపురంలో 15 సెంటీమీటర్లు, బంజారాహిల్స్‌లో 12, యూసుఫ్‌గూడలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో సగటున ఆరు నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది.రోడ్లపై నిలిచిన వరదఏకధాటి వర్షంతో వరద నీరు రోడ్లపై భారీగా చేరింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో ఇరువైపులా ఇటు నాంపల్లి వరకు అటు అమీర్‌పేట మార్గంలో వాహనాల రాకపోకలకు గంటల కొద్ది ఆటంకం ఏర్పడింది. ట్యాంక్‌బండ్–సెక్రటేరియట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ పరిసర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సచివాలయ బస్టాప్, సిటీ సెంట్రల్ జోన్ నీట మునిగాయి. హిమాయత్‌నగర్–నారాయణగూడ మార్గంలోనూ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్ నీట మునిగింది. వందలాది మంది విద్యార్థులు స్కూల్లోనే చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. -
ఇసుక 'దారి' మళ్లకుండా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ డంపింగ్, బ్లాక్ మార్కెటింగ్‌కు చెక్ పెట్టేందుకు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) వినూత్న విధానాన్ని అమలు చేయనుంది. ఇసుక క్వారీల నుంచి బయల్దేరే లారీలు నేరుగా గమ్యస్థానానికి వెళ్తున్నాయా లేదా అనే విషయాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించనుంది. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను వినియోగించనుంది. ప్రస్తుతం ఇసుక క్వారీలు, రీచ్‌ల నుంచి లోడ్‌తో బయల్దేరే వాహనాలను అక్రమార్కులు నేరుగా బుకింగ్ చేసుకున్న చోటుకు కాకుండా ప్రైవేటు డంపుల వద్దకు తరలిస్తూ ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి తద్వారా భారీగా సొమ్ముచేసుకుంటున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు టీజీఎండీసీ సిద్ధమవుతోంది. హైవేలపై ఏఎన్పీఆర్ సీసీ కెమెరాలు ప్రస్తుతం ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్న ప్రతి వాహనమూ రీచ్ నుంచి బయల్దేరుతుండగా రీచ్ లేదా క్వారీలో ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ హైవేల వెంబడి ఆ వాహనాలు దారిమళ్లాయో లేదో తెలుసుకొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆయా వాహనాలను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా హైవేలు, రాష్ట్ర రహదారుల వెంబడి ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలను అమర్చేందుకు టీజీఎండీసీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాచలంలో రెండు చోట్ల ఐదు పాయింట్లను ఎంపిక చేసింది. ఇందుకోసం ఏఎన్పీఆర్ సాంకేతికతగల సీసీ కెమెరాలు, హైస్పీడ్ ఇంటర్నెట్, విద్యుత్ సదుపాయాలు సమకూర్చుకుంటోంది. సీసీ కెమెరాలు అమర్చేందుకు కావాల్సిన అనుమతుల కోసం ఇప్పటికే రాష్ట్ర హైవేలు, జాతీయ రహదారుల ఉన్నతాధికారులకు లేఖలు రాసింది. ఏ వాహనం ఎప్పుడు, ఎటు వెళ్తోందో తెలుసుకొనేలా.. ఏఎన్పీఆర్ సీసీ కెమెరాల ద్వారా ఇసుక లారీల కదలికలను హైదరాబాద్‌లోని టీజీఎండీసీ కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా అధికారులు కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. రీచ్ నుంచి ప్రతి వాహనం ఎప్పుడు బయల్దేరింది? ఏ దిశగా వెళ్తోందనే విషయాన్ని అక్కడి నుంచే ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు నెల రోజుల కిందే ప్రారంభం కావాల్సి ఉండగా వర్షాల కారణంగా ఆలస్యంగా నడుస్తోందని అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన జిల్లాల్లో పర్యవేక్షణ అనంతరం అందులో తలెత్తే లోపాలు, సవాళ్లను అధ్యయనం చేసి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇదే మోడల్‌ను అమలు చేసేందుకు టీజీఎండీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
జనంలోకి వెళ్దాం.. అసెంబ్లీలో ఎండగడదాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో రెండు పియర్స్ కుంగుబాటును సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. గతంలో ప్రతిపక్ష పార్టీగా, నేడు అధికార పార్టీగా కాంగ్రెస్ వల్లెవేస్తూ వస్తున్న అబద్ధాలకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ముసుగు వేసి బీఆర్ఎస్పై బురద చల్లే ప్రయ త్నం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అబ ద్ధాలను అసెంబ్లీతోపాటు ప్రజాక్షేత్రంలోనూ ఎండగట్టాలని పార్టీ నేతలను ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవల్లి నివాసంలో కొన్ని రోజులుగా పార్టీ కీలక నేతలు కె. తారక రామారావు, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో వరుస భేటీలు జరుపుతున్న కేసీఆర్.. సోమవారం కూడా వారితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. బీజేపీ ప్రేరేపిత జాతీయ డ్యామ్‌ల భద్రత ప్రాధికార సంస్థ (ఎన్డీఎస్ఏ)ను అడ్డుపెట్టుకొని తయారు చేయించిన నివేదికపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని కేసీఆర్ ఆదేశించినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ వేదికగానే అసలు నిజాలు చెబుదాం పీసీ ఘోష్ కమిషన్ నివేదికను త్వరలో అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తామని సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై ఈ భేటీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. గతంలో అధికారపక్షంగా రాష్ట్రంలో సాగునీటి రంగం స్థితిగతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రజలకు వివరించినట్లుగానే కమిషన్ విచారణ నివేదికపైనా స్పందించాలని కేసీఆర్ అభిప్రాయపడ్డట్లు తెలియవచ్చింది. ఈ అంశంపై తానే అసెంబ్లీకి స్వయంగా హాజరై వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ తప్పూ చేయనందునే పీసీ ఘోష్ కమిషన్ విచారణకు తనతోపాటు హరీశ్‌రావు హాజరై వివరణ ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారని... అదే రీతిలో అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రభుత్వం వ్యవహరించే తీరునుబట్టి అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై కక్షపూరిత చర్యలకు పాల్పడితే అనుసరించాల్సిన వ్యూహంపైనా కేసీఆర్ ఈ భేటీలో చర్చించినట్లు తెలియవచ్చింది. నేడు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఎంచుకున్న అంశాలను మాత్రమే కేబినెట్లో ప్రభుత్వం చర్చించినట్లు బీఆర్ఎస్ అభిప్రాయపడుతోంది. సోమవారం కేబినెట్లో చర్చించిన కమిషన్ సంక్షిప్త నోట్లోని అంశాలను పార్టీ నేతలకు వివరించి ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలకు కమిషన్ నివేదికలోని డొల్లతనాన్ని, రేవంత్ సర్కారు కుట్రలను ప్రజలకు విడమర్చి చెప్పాలని హరీశ్‌రావును కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హరీశ్‌రావు తెలంగాణ భవన్లో కమిషన్ నివేదికపై ప్రభుత్వ కార్యదర్శుల త్రిసభ్య కమిటీ ఇచ్చిన సంక్షిప్త నివేదికలో పేర్కొన్న వివరాల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ ప్రజెంటేషన్‌ను రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ముఖ్య నేతలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని కేడర్‌ను కేటీఆర్ ఆదేశించారు. ప్రజెంటేషన్ అనంతరం ముఖ్య నేతలు ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వ తీరును ఖండించాలని నిర్దేశించారు. నేడు ఢిల్లీకి కేటీఆర్ కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో జరిగే సమావేశానికి హాజరు కానుంది. ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళితోపాటు వివిధ పార్టీలు సమర్పించిన పెండింగ్ ప్రతిపాదనలపై చర్చలు జరగనున్నాయి. -
అసెంబ్లీలో పెడతాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నివేదికను అసెంబ్లీలోపెట్టి చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని చెప్పారు. ఇది స్వతంత్ర కమిషన్ ఇచ్చిన నివేదిక అని, సిఫార్సుల ఆధారంగా చర్యలు ఉంటాయి తప్ప.. ఎలాంటి కక్షపూరిత చర్యలకు తావులేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. కమిషన్ ఇచ్చిన నివేదికపై నీటిపారుదల, న్యాయ, సాధారణ పరిపాలన శాఖలకు చెందిన ముగ్గురు కార్యదర్శులతో కమిటీ వేసి, సంక్షిప్త నివేదిక రూపొందించినట్లు చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కమిషన్ నివేదికపై కూలంకషంగా చర్చించి ఆమోదం తెలిపింది. అనంతరం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. నాడు హామీ ఇచ్చాం... రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోవడంపై అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపడతామని ఎన్నికలప్పుడు ప్రజలకు హామీ ఇచ్చా మని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. దాని ప్రకారమే న్యాయరంగంలో విశేష అనుభవం ఉన్న ఉమ్మడి ఏపీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, తొలి లోక్‌పాల్‌గా వ్యవహరించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిషన్‌ను నియమించామని గుర్తుచేశారు. ఈ కమిషన్ 16 నెలలపాటు అందరి అభిప్రాయాలు తీసుకుని 665 పేజీల నివేదికను రూపొందించిందని, దీన్ని మంత్రివర్గం ఆమోదించిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘ఊరు, పేరు, అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం కూలిపోయింది. ఈ విషయాన్ని కమిషన్ స్పష్టంగా తన నివేదికలో పొందుపర్చింది. రాజకీయ నేతలు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు, నిపుణులు, ప్రజా సంఘాలు, ప్రజలు, పాత్రికేయుల నుంచి సమాచారం సేకరించడమేకాక, వారి వాదనలను పరిగణనలోకి తీసుకుంది. మంత్రివర్గం ఆమోదించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి, అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను, ప్రతిపక్ష నాయకుడు, అప్పటి నీటిపారుదల మంత్రి, ఇతర మంత్రుల అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి అవకాశం కల్పిస్తాం. దీనిపై సభ్యులకు పూర్తి అవగాహన కల్పిస్తాం. తొందరలోనే సభ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను విన్నాకే ప్రభుత్వం ముందుకెళ్తుంది’ అని సీఎం చెప్పారు. నోటీసులు ఇచ్చి.. వాదనలు విన్న కమిషన్ ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భూమిక పోషించిన అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇచ్చి వారికి తమ వాదనలు వినిపించడానికి కమిషన్ పూర్తి అవకాశం కల్పించింది. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత–చేవేళ్లకు గోదావరి నీళ్లు తీసుకుని రావడానికి ప్రాజెక్టు డిజైన్ చేస్తే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఏడాదిన్నర తరువాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రీడిజైన్ పేరిట ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టు స్థలం తుమ్మిడిహెట్టి నుంచి మార్చి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన మూడేళ్లల్లోనే మేడిగడ్డ కుంగడం, అన్నారం, సుందిళ్ల పగలడం జరిగింది. ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలు ఉన్నాయని నిపుణులు నివేదించారు. ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయని సాంకేతిక నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి వాటి మీద విచారణ చేశాయి. ఆ విచారణలో ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణలో లోపాలు ఉన్నాయిని తేల్చాయి. దీని మీద పూర్తిస్థాయి విచారణ జరగాలని ఆనాటి ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చాయి. మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీతోపాటు టీపీసీసీ అధ్యక్షుడిగా నేను, మా కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమకుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టులను సందర్శించాం. లోపభూయిష్టమైన నిర్ణయాలు, అవినీతి, అశ్రిత పక్షపాతం నిర్లక్ష్య వైఖరి ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయింది’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. అనుకూలమైతే ఒకలా.. లేదంటే మరోలా.. నివేదికలు తమకు అనుకూలంగా ఉంటే ఒకలా.. లేదంటే మరోలా మాట్లాడడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటేనని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కమిషన్ నివేదికను వారు తప్పుపట్టడం సహజమేనని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ నివేదికనో, ప్రభుత్వ నివేదికనో కాదని, ఇది స్వతంత్ర కమిషన్ ఇచ్చిన నివేదిక అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎవరు ఏ రకమైన విశ్లేషణలు చేస్తారన్నది వారి విజŠక్షతకే వదిలేస్తున్నానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తన బావ (హరీశ్‌రావు) అవినీతి చేశారని, ఇందులో ఎవరెవరు కుమ్మక్కయ్యారో కవిత.. జస్టిస్ చంద్ర ఘోష్ కమిషన్‌కు నివేదిక ఇచ్చి ఉంటే బాగుండేదని సీఎం వ్యాఖ్యానించారు. కవిత అప్పుడు మాట్లాడకుండా, ఇప్పుడు ఇక్కడ ప్రశ్నించడం ఎందుకని, కోల్‌కతాకు వెళ్లి అడగమనండి అని పేర్కొన్నారు. కమిషన్ నివేదికపై ఊహాజనిత వార్తలు, కల్పనకు అవకాశం ఉండకూడదనే ఏ శషభిషలు లేకుండా అన్ని విషయాలను స్పష్టంగా మీడియాకు చెప్పానన్నారు. -
హైదరాబాది స్టైల్లో సిరాజ్‌పై ఓవైసీ ప్రశంసలు
సాక్షి,హైదరాబాద్: చివరి వరకు ఉత్కంఠగా సాగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఆరుపరుగుల తేడాతో ప్రత్యర్ధి జట్టు ఇంగ్లండ్‌ను భారత్ మట్టి కరిపించింది.ఈ మ్యాచ్ విజయంతో సిరీస్2-2 సమమైంది.మమ్మద్ సిరాజ్ ఈ సిరీస్‌లో మొత్తం 23 వికెట్లు తీసి మెరుపులు మెరిపించాడు.చివరి మ్యాచ్‌లో అతడు తీసిన ఫైవ్ వికెట్ హల్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.అయితే నరాలు తెగే ఉత్కంఠ పోరులో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన మహ్మద్ సిరాజ్‌పై హైదరాబాద్ ఎంపీ అహ్మద్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా సిరాజ్‌ను హైదరాబాద్ స్టైల్లో పొగడ్తలతో ముంచెత్తాడు. సిరాజ్ ‘ఎప్పుడూ విజేతే @mdsirajofficial! మన హైదరాబాదీలో మాట్లాడతే.. పూరా ఖోల్ దియే పాషా!’అంటూ అభినందించాడు. Always a winner @mdsirajofficial! As we say in Hyderabadi, poora khol diye Pasha! pic.twitter.com/BJFqkBzIl7— Asaduddin Owaisi (@asadowaisi) August 4, 2025 -
చెరువుల్లా హైదరాబాద్ రోడ్లు.. వాహనదారులకు నరకం
-
‘కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెడుతున్నాం’
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే కాళేశ్వరం కమిషన్ నివేదిక అసెంబ్లీకి రాబోతుందని ఆయన తెలిపారు. తెలంగాణ కేబినెట్ అనంతరం సీఎం రేవంత్ ప్రెస్మీట్లో మాట్లాడారు. ‘ ఊరు, పేరు మార్చి అంచనాలు మించి కట్టిన ప్రాజెక్టు కూలింది. కాశేళ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రజాప్రతినిధులకు కమిషన్ నివేదిక ప్రతులను అందిస్తాం. స్వేచ్ఛగా అందరూ అభిప్రాయాలు చెప్పొచ్చు’ అని పేర్కొన్నారు.అంతకుముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలం కావడానికి సూక్ష్మంగా అప్పటి సీఎం కేసీఆరేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన విషయాలు అబద్ధాలు అనేది కమిషన్ రిపోర్ట్‌తో బయటపడింది. మూడు బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ సొంత, ఏకైక నిర్ణయం అంటూ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. ఈటెల రాజేందర్ సైతం కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పింది అవాస్తవం అనేది కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తేలింది. ఇది మా వ్యతిగత అభిప్రాయం కాదు...ఘోష్ కమిషన్ రిపోర్ట్ మాత్రమే’ అని ఆయన పేర్కొన్నారు. -
ప్రజాధనం దుర్వినియోగమైనట్లు నివేదికలో స్పష్టమైంది: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఉత్తమ్ ఆ సమావేశం బ్రీఫింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు.మేడిగడ్డ బ్యారేజ్‌లో చాలా లోపాలున్నట్లు సీడబ్యూసీ చెప్పిందని, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనడం సరైంది కాదని ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో స్పష్టమైనట్లు ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్దని హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఉత్తమ్ విమర్శించారు.ప్రజాధనం దుర్వినియోగం చేశారు..‘మేడిగడ్డ కుంగిపోవడానికి కేసీఆర్ ప్రధాన కారణమని పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించింది. మొత్తం ఆర్థిక అవతవకలు, అవినీతి, ప్లానింగ్, డిజైనింగ్ అంతా కేసీఆర్ పర్యవేక్షణలోనే జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడేలా మేడిగడ్డ బ్యారేజ్ అంచనాలు పెంచి నిర్మించారు. కాళేశ్వరం కమిషన్‌కు హరీష్‌రావు సరైన సమాచారం ఇవ్వలేదు. మేడిగడ్డ కరెక్ట్ ప్రదేశంలో కట్టలేదు. కాంట్రాక్టర్స్‌కు ఫేవర్‌గా చూడటానికి ప్రజాధనం దుర్వినియోగం చేశారు’ అని ఉత్తమ్ తెలిపారు.ఇష్టానుసారం ప్రాజెక్టుల డిజైన్ మార్చేశారు..‘కాగ్, ఎన్డీఎస్ఏ నివేదికలను ఘోష్ కమిషన్ పరిశీలించింది. కమిషన్ నివేదికపై కేబినెట్లో చర్చించాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునాదుల్లోనే సమస్యలు. కేసీఆర్ ఇష్టానుసారం ప్రాజెక్ట్ డిజైన్ మార్చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును గతంలోనే నిర్ణయించారు. 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా డిజైన్ చేశారు. కేసీఆర్ ఇష్టానుసారం ప్రాజెక్టు డిజైన్లు మార్చేశారు. అధిక వడ్డీకి ఎన్బీఎఫ్ దగ్గర లోన్లు తెచ్చారు. అధిక వడ్డీలకు రూ. 84 వేల కోట్ల ురుణాలు తీసుకొచ్చారు. రుణాలు తెచ్చే విషయంలో అవతవకలకు పాల్పడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాళేశ్వరంపై విచారణ. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను 25 పేజీలకు కుదించాం’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) తెలంగాన కేబినెట్ సమావేశం నిర్వహించారు.సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం అసెంబ్లీని నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చించనున్నారు. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చలు అనంతరం దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరంపై అవతవకలపై ఏర్పాటు చేసిన కమిషన్.. తుది నివేదికను కొన్ని రోజుల క్రితం ప్రభుత్వానికి అందించింది. ఈ నేపథ్యంలో నేటి కేబినెట్ సమావేశంలో కూడా దీనిపైనే ప్రధానంగా చర్చించారు.మరోవైపు.. కాళేశ్వరంలో ఎక్కడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. డిజైన్‌లో లోపాలు లేవని అంటున్నారు. అది కాంగ్రెస్ కమిసన్ అని వారు విమర్శిస్తున్నారు. వ్యాప్కో సంస్థ సూచనల మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు తెలిపారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ నేతలు ఈరోజు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ అందించిన నివేదికపైనే ఈ భేటీలో బీఆర్ఎస్ నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.కాళేశ్వరం నివేదికపై స్పందించిన కేసీఆర్ -
Guvvala Balaraju: బీఆర్ఎస్కు గువ్వల బాలరాజు రాజీనామా
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, అచ్చం పేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం (ఆగస్టు4) బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. పార్టీపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. బాలరాజుతో పాటుగా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. గువ్వల బాలరాజ్ 2014 నుంచి 2023 వరకు రెండు సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే, మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో నాటి నుంచి పార్టీలో ఇన్ యాక్టీవ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఆగస్టు3) రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో గువ్వల బాలరాజ్ భేటీ అయ్యారు. ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాగా, బాలరాజు త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. -
కాళేశ్వరం నివేదికపై స్పందించిన కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందించారు. సోమవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ అయిన ఆయన.. కమిషన్ నివేదికను, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ‘‘అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్. ఆ కమిషన్ నివేదిక ఊహించిందే. ఎందరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ వ్యవహారంలో కొంతమంది BRS నేతలను అరెస్ట్ చేయవచ్చు.. అంతమాత్రాన భయపడవద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని.. .. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలి. కాళేశ్వరంపై క్యాబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం’’ అని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో హరీష్ రావు, కేటిఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఇదిలా ఉంటే.. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టడం కంటే ముందే మీడియాకు లీకు కావడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: ‘కాళేశ్వరం అవకతవకలు.. ఆయనదే పూర్తి బాధ్యత’ -
Rain: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షం ధాటికి నగరం అతలాకుతలమైంది. కురిసిన కుండపోత వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కురిసిన వర్షంతో రోడ్లు చెరువల్ని తలపించాయి.సికింద్రాబాద్,కోఠితో పాటు అన్నీ ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరంచి ఆస్పత్రి వరకు భారీ ట్రాఫ్రిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ కదిలేందుకు గంట సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జూబ్లిహిల్స్‌లో 7.4సెంటీమీటర్లు, మెహిదీపట్నంలో 5.3సెంటీమీటర్లు, బంజారాహిల్స్‌లో 4.6, యూసఫ్ గూడా 3.9,ఖైరతాబాద్ 3.6, మైత్రీవనం 3.4, కూకట్పల్లి 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వర్షంతో పాటు ఈదురు గాలులు నగర వాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో నగర వాసులు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హయత్‌నగర్, వనస్థలీపురం, అబ్ధుల్లాపూర్ మెట్లలో వర్షం కురుస్తుండగా.. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్పేట్, ఉప్పల్, రామాంతపూర్, నాచారం, తార్నాకలో భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి,అబిడ్స్,మలక్‌పేట్‌లో దంచికొడుతోంది. రాజ్ భవన్ రోడ్, తెలంగాణ సెక్రటరియేట్ ఎదుట వరద నీరు రోడ్డు మీదకు చేరింది.తెలంగాణను భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వర్షం దాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రానున్న మరో రెండు గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ ,హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. -
కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల భేటీ.. కవిత, కాళేశ్వరంపై చర్చ!
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌తో పాటుగా కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్లో కాళేశ్వరంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. గత బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నిర్మాణంపై ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టుపై కేబినెట్లో చర్చించనున్నారు. మరోవైపు.. కాళేశ్వరంలో ఎక్కడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. డిజైన్‌లో లోపాలు లేవని అంటున్నారు. వ్యాప్కో సంస్థ సూచనల మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు తెలిపారు. -
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. అడ్డుకున్న పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా కవర్ చేయకుండా పోలీసులు.. మీడియాను అడ్డుకుంటున్నారు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని శాసనసభ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ముందు గాంధీ విగ్రహం వద్ద ధర్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. కాగా, శాసనసభ ఆవరణలో మీడియాపై ఆంక్షలు ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా కవర్ చేయకుండా పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. -
లోకేష్ చిన్నపిల్లోడు.. అతని వ్యాఖ్యలపై స్పందించను: కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ: తెలంగాణ నీటి ప్రాజెక్టుల గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి స్పందించారు. సోమవారం నల్లగొండ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి కోమటిరెడి మాట్లాడారు.‘‘నా ఫోన్ ట్యాపింగ్ చేశారని అంటున్నారు. కానీ, ఎప్పటినుంచో నా నంబర్ అదే ఉంది. దాన్నే కొనసాగిస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని అందరికీ తెలుసు. ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నాం. కమిషన్ నివేదికపై కేబినేటలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఏం జరగాలో అదే జరుగుతుంది. బనకచర్ల చాప్టర్ క్లోజ్. బనకచర్లని నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతాం. అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతాం. లోకేష్ లాంటి చిన్నపిల్లోడి వ్యాఖ్యలపై నేను మాట్లాడను. డిండి ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ పూర్తి అయింది. జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలకు లైనింగ్ ఏడాదిలోనే పూర్తిచేస్తాం అని తెలిపారాయన.రైతు భరోసా వంద ఎకరాలు ఉన్నవారికి కూడా ఇచ్చాం. ఎంజీ యూనివర్శిటీలో నూతన బిల్డింగులను నిర్మిస్తాం. నార్కెట్‌పల్లి పెద్ద చెరువును వేణుగోపాలస్వామి పేరుతో మినీ ట్యాంక్ బండ్‌గా మారుస్తాం. క్యాంపు కార్యాలయానికి ఇందిరా భవన్ గా నామకరణం చేస్తున్నాం.బీఆర్ఎస్ లో ఐదు గ్రూపులు ఉన్నాయి. కేసీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్, కేటీఆర్ గ్రూపులు నడుపుతున్నారు. బీసీలకు కవితకు ఏం సంబంధం. గత పదేళ్లు ఆమెకు బీసీలు గుర్తుకురాలేదా?. బీఆర్ఎస్ పార్టీ అనేదే భవిష్యత్తులో ఉండదు. దాని గురించి నేను మాట్లాడను అని కోమటిరెడ్డి అన్నారు. -
తెలంగాణ సమాజం సహించదు.. రేవంత్ వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కౌంటరిచ్చారు. ఇటీవల రేవంత్.. సోషల్ మీడియా జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కొత్త చర్చ నడుస్తోంది.ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు…— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) August 4, 2025రేవంత్ వ్యాఖ్యలు.. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘జర్నలిజం డెఫినేషన్ మారిందని అన్నారు. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్నా వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను వేరే చేయాలని.. వాళ్లను వేరుగా కూర్చోబెట్టాలని పాత్రికేయులకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ రోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు జర్నలిస్ట్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. పెన్ను పేపర్ ఇస్తే ఏబీసీడీలు కూడా రాయలేని వారు కూడా నేను జర్నలిస్ట్‌ని అంటారన్నారు. ఏం జర్నలిస్ట్ అని అడిగితే సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటున్నారు. వాడు ఎప్పుడైన జర్నలిజం స్కూల్లో చదివిండా? లేకపోతే ఓనమాలు మొత్తం అయినా వస్తాయా అంటే రెండూ రావు.రోడ్లమీద ఆవారాగా తిరిగేటోడు.. ఎక్కువ తిట్లొచ్చినోడు, ఏందంటే అదే మాట్లాడేటోడే జర్నలిజం అనే ముసుగు తొడుక్కొని అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చాయి. ఇలా జర్నలిజం ముసుగులో కొందరు ప్రెస్మీట్లు పెట్టినప్పుడు ముందలి వరుసలో ధిక్కారంగా కూర్చుంటారు. మనమేదో లోకువ అయినట్టు, వాళ్లేదే పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్లు మన కళ్లలోకి చూస్తుంటారు. ఇంకా నన్ను చూసి నమస్కారం పెడతలేవు. నన్ను చేసి ఇంకా తల వంచుకుంటలేవు అని చూస్తుంటాడు. స్టేజీ దిగిపోయి చెంపలు పగులగొట్టాలని నాకు అనిపిస్తది. కానీ, పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు.రేవంత్‌కు కౌంటర్..ఇక.. అంతకుముందు కూడా సీఎం రేవంత్‌కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ..‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను… pic.twitter.com/nGtGpQzgGk— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 19, 2025 -
ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో గట్టి వానలు
సాక్షి, విశాఖపట్నం: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపరితల ఆవర్తనం కాస్త ఉపశమనం కలిగించనుంది. ఉత్తర తమిళనాడు, నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై కనిపించనుంది.ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా.. ఉత్తరాంధ్రలో మాత్రం ఒకట్రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. తీరం వెంబడి 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం• అనంతపురం,శ్రీసత్యసాయి, అన్నమయ్య,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు-భారీ వర్షాలు • మన్యం,అల్లూరి,ఏలూరు, గుంటూరు,బాపట్ల,కర్నూలు, నంద్యాల,కడప,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి-మోస్తారు వర్షాలు,మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 3, 2025తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు.. అల్పపీడనం కారణంగా తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడి ఉంటాయని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. SOUTH TG ALERT ⛈️⛈️Heavy to Very Heavy Rainfall is expected across South TG districts during next 8-9 days #Telangana ‼️Hyderabad will get One or Two Heavy Spell in this period #Hyderabad pic.twitter.com/ZcMZGmXL5R— Weatherman Karthikk (@telangana_rains) August 4, 2025నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు వివరించారు. ఆగస్టు 5 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.గత 24 గంటల్లో నారాయణపేట జిల్లాలోని మాగనూరులో అత్యధికంగా 3.13 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో 2.74 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇక ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశం వైపు ఎక్కువగా కేంద్రీకృతం కావడంతో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. నైరుతి గాలులు పొడిబారిపోవడం కూడా వర్షాలు తగ్గడానికి ఒక ముఖ్య కారణంగా నిపుణులు పేర్కొన్నారు.Telangana Rainfall – Last 24 HrsOvernight, Yadadri, Jangoan, Nalgonda (North), Suryapet (North), Mahabubabad, Khammam, Warangal, and Bhadradri districts experienced POWERFUL THUNDERSTORMS ⛈️.Valigonda (Yadadri) topped the charts with 107.8 mmIn HYDERABAD, Isolated spells… pic.twitter.com/0tiv9pkjXh— Hyderabad Rains (@Hyderabadrains) August 4, 2025 -
ఎంఎస్ఎంఈల్లో.. మహిళా శక్తి
భారతీయ మహిళా వ్యాపారులు పారిశ్రామిక రంగంలోనూ గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటు, నిర్వహణలో వారు కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల్లో సుమారు 40 శాతం కంపెనీలకు యజమానులు మహిళలే కావడం విశేషం. అత్యధికంగా 30 లక్షలపైచిలుకు మహిళా పారిశ్రామికవేత్తలతో దేశంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. టాప్ – 10 రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి.భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగం ముఖ్య భూమిక పోషిస్తోంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 45%, మొత్తం ఎగుమతుల్లో 45% వాటా ఎంఎస్ఎంఈలదే అంటే ఇవి ఏ స్థాయిలో పురోగతి సాధించాయో అర్థం చేసుకోవచ్చు. జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా 37.54%కి చేరింది. దేశవ్యాప్తంగా 2025 జూలై 24 నాటికి 6,57,97,647 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వీటిలో 39.59 శాతం కంపెనీలకు యజమానులు మహిళలే. దేశంలోని మొత్తం ఎంఎస్ఎంఈల్లో సూక్ష్మ, చిన్న తరహావే 99.99%. సూక్ష్మ కంపెనీల్లో 39.79 శాతం, చిన్న తరహా కంపెనీల్లో 11.63 శాతం మహిళలు నెలకొల్పినవి ఉన్నాయి.ప్రభుత్వ ప్రోత్సాహంతో..ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) సూక్ష్మ సంస్థల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోంది. 2008లో ప్రారంభమైన నాటి నుండి ఇది 9.87 లక్షలకు పైగా యూనిట్లకు సహాయం అందింది. 2023 సెప్టెంబర్‌లో రూ.13,000 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకం సంప్రదాయ చేతివృత్తుల వారి నైపుణ్యాలను, మార్కెట్‌తో అనుసంధానించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. 2025 జూన్ 26 నాటికి ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 30 లక్షలు దాటింది.2020లో ప్రవేశపెట్టిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఎంఎస్ఎంఈలకు ఉచిత, పేపర్ రహిత రిజిస్ట్రేష¯Œ కు వీలు కల్పిస్తోంది. అనధికారిక వ్యాపారాలకు అధికారిక ప్రయోజనాలను విస్తరించడానికి ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫామ్ 2023లో అందుబాటులోకి వచ్చింది. ఎంఎస్ఎంఈ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు, వారికి మార్గదర్శనం చేసేందుకు ‘యశస్విని’ అనే కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది.మార్కెట్ అనుసంధానాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగించే వస్తు, సేవల్లో 25 శాతం సూక్ష్మ, చిన్న సంస్థల నుండి సేకరించాలని ప్రభుత్వ సేకరణ విధానం నిర్దేశించింది. దీనికింద ఇందులో 3 శాతం మహిళల యాజమాన్యంలోని వ్యాపారాల నుండి కొనుగోలు చేయాలి. ఇలాంటి అనేక కార్యక్రమాలతో మహిళలు ఈ రంగంలో దూసుకుపోతున్నారు.ఉద్యోగాల్లో 18.73%ఉపాధి: ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఉద్యమ్ పోర్టల్‌లో నమోదిత మహిళా వ్యాపారులు ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా సృష్టించిన ఉద్యోగాలు.. మొత్తం ఉద్యోగాల్లో సుమారు 18.73%పెట్టుబడి: మొత్తం పెట్టుబడిలో మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈల వాటా 11.15%టర్నోవర్: మొత్తం టర్నోవర్‌లో వాటా 10.22%కేంద్రం విడుదల చేసిన ‘ఎమ్ఎస్ఎమ్ఈ వార్షిక నివేదిక 2024–25’ ప్రకారం..⇒ ఎమ్ఎస్ఎమ్ఈలు.. వ్యవసాయం తరవాత అతిపెద్ద ఉద్యోగ కల్పనా రంగం.⇒ మొత్తం సృష్టించిన ఉద్యోగాలు 24.4 కోట్లు⇒ మొత్తం ఎమ్ఎస్ఎమ్ఈల్లో సూక్ష్మ పరిశ్రమలు 98.6 శాతం.⇒ 2024 డిసెంబరు 31 నాటికి.. మొత్తం ఎమ్ఎస్ఎమ్ఈల్లో మహిళలు యజమానులుగా ఉన్న వాటి శాతం 28.8. -
మెగా టెక్స్టైల్ పార్కుతో వేలకోట్ల పెట్టుబడులు
మాదాపూర్ (హైదరాబాద్): దేశంలో ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో ఒకటి రాష్ట్రంలోని వరంగల్‌లో ఏర్పాటు కానుందని చెప్పారు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో వేల కోట్లలో పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. మాదాపూర్‌లోని శిల్పారామం ఎత్నిక్ హాల్లో ఆదివారం నేషనల్ హ్యాండ్లూమ్ డే నిర్వహించారు. హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్, హ్యండ్లూమ్స్ డెవలప్మెంట్ కమిషనర్, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయం తర్వాత చేనేతే.. ‘దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించేది చేనేత రంగం. దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ రంగం కీలకపాత్ర పోషిస్తోంది. మన చేనేత ఉత్పత్తులు ఎంతో నాణ్యత, నైపుణ్యంతో తయారు చేసినవి. విదేశాల్లోని పలు విమానాశ్రయాలు, ప్రముఖ షాపింగ్ కాంప్లెక్స్‌లలో కూడా మన దేశానికి సంబందించిన, రాష్ట్రానికి సంబందించిన పట్టు చీరలు, చేనేత ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు. సుమారు 5 కోట్ల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల చేనేత పరిశ్రమకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆయా సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. తెలంగాణ చీరలు, తివాచీలకు జీఐ ట్యాగ్ తెలగాణలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, నారాయణపేట కాటన్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్ తివాచీలకు జీఐ ట్యాగ్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత కార్మీకులను మరింత ప్రోత్సహించి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలి. ప్రపంచ మార్కెట్లో మరింత విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో చేనేత పరిశ్రమ జీడీపీలో 2.3 శాతంగా ఉంది. దీనిని 5 శాతం వరకు తీసుకువెళ్ళాలి. ఇందుకు ప్రతి చేనేత కార్మీకుడు పట్టుదలతో కృషి చేయాలి. నైపుణ్యం పెంచుకోవాలి. శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. అలా చేస్తే రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా భారతదేశంలో తయారైన ఉత్పత్తులే అందుబాటులో ఉంటాయి..’అని కిషన్‌రెడ్డి చెప్పారు. చేనేత దుస్తులు ధరించాలి ‘మన ఉత్పత్తులను బయటి దేశాలలో అమ్మకాలు చేస్తుంటే, కొందరు అక్కడ కొనుగోలు చేసి మన దేశానికి తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాడే ప్రతి వస్తువు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నట్టు ఉండాలి. ప్రతి కుటుంబం నెలకు వారం రోజులు చేనేత దుస్తులు ధరించాలి..’అని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న చింతకింది సుదర్శన్‌ను ఈ సందర్భంగా సత్కరించారు. చేనేత కళాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. చేనేత మగ్గాలను, ఉత్పత్తులను తిలకించారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం ప్రత్యేక అధికారి జి.కిషన్‌రావు, నిప్ట్ డైరెక్టర్ మాలిని, డాక్టర్ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చుక్క నీటినీ వదులుకోం: భట్టి విక్రమార్క
ముదిగొండ: తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన సాగునీటి వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని, తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బనకచర్ల పాపం బీఆర్ఎస్దేనని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ కుట్రలను అడ్డుకుని తీరతామని అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న 10 వేల మెట్రిక్ టన్నుల గోదాముల పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో 5.91 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములే రైతులకు అందుబాటులో ఉండేవని, తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర వ్యవధిలోనే కొత్తగా 10.75 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు నిర్మించామని తెలిపారు. అన్నదాతల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. దాని ఫలితంగానే దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. సీఎం, ఉత్తమ్ వల్లే బనకచర్లకు బ్రేక్ ఉమ్మడి ఏపీలో సాగునీటి రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా రాష్ట్రంపై అవే కుట్రలు జరుగుతున్నాయని భట్టి చెప్పారు. తెలంగాణలో పంటలు ఎండిపోయేలా ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సమర్థంగా వాదనలు వినిపించడం వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడిందని చెప్పారు. కృష్ణా, గోదావరిపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే పంటలకు నీరందుతోందని, బీఆర్ఎస్ హయాంలో ఒక్కటి కూడా పనికొచ్చే ప్రాజెక్టు నిర్మించలేదని విమర్శించారు. రూ.లక్ష కోట్లు వెచ్చించిన కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు కూడా నీరందడం లేదన్నారు. నాడు పోలవరం నిర్మిస్తుంటే చోద్యం చూశారని, బనకచర్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తోందని భట్టి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
వారం తర్వాతే వానలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షపాతం గణాంకాలు క్రమంగా పడిపోతున్నాయి. పదిరోజుల క్రితం కురిసిన వర్షాలు ఉత్సాహపర్చినప్పటికీ... ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 10 శాతం లోటు వర్షపాతం ఉంది. గత ఐదేళ్ల వర్షపాతం గణాంకాలను పరిశీలిస్తే... ఆగస్టు నాటికి రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కానీ ప్రస్తుతం నైరుతి సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వర్షపాతం లోటులోనే ఉంది. గత వారం వరకు సాధారణ స్థితికి వచ్చిన గణాంకాలు మళ్లీ పడిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కానీ వరుస వర్షాలకు అవకాశం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో వారం వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవన సీజన్లో ఇప్పటివరకు బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం, వాయుగుండం, తుఫాను లాంటివి ఏర్పడలేదు. సాధారణంగా నైరుతి సీజన్లో రాష్ట్రంలో వర్షాలు కురవాలంటే బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితులే కీలకం. కానీ ఇప్పటివరకు బంగాళాఖాతంలో తుఫానులాంటివి ఏర్పడకపోవడంతో వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. ఈనెల 10వ తేదీ తర్వాత రుతుపవనాల గమనం అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నైరుతి రుతుపవన సీజన్లో ఆదివారం నాటికి రాష్ట్రంలో 37.80 సెం.మీ. సగటు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 34.30 సెం.మీ. నమోదైంది. అంటే సాధారణం కంటే 10 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదుకాగా, 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ⇒ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, జనగామ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ⇒ మండలాల వారీగా వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే... ఆరు మండలాల్లో మాత్రమే అత్యధిక వర్షాలు కురిశాయి. 73 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా.. 315 మండలాల్లో సాధారణ వర్షపాతం, 227 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. -
లోకేశ్ మాటలు పట్టించుకోం: మంత్రి ఉత్తమ్
సాక్షి పెద్దపల్లి: ‘నారా లోకేశ్ సహా ఏపీ మంత్రుల మాటలు పట్టించుకోం. ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అది తెలంగాణ నీటిహక్కుల ఉల్లంఘనే అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి, నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. మా ఫిర్యాదుతోనే బనకచర్లను కేంద్ర జలసంఘం తిరస్కరించింది. ఏపీ సీఎంతో జరిగిన సమావేశంలోనూ మేం బనకచర్లను వ్యతిరేకించాం’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ వద్ద రామగుండం ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుదిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఉత్తమ్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఏపీ మంత్రుల మాటలను పట్టుకొని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని విమర్శించారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువెళ్తానని కేసీఆర్ గతంలో అన్నారని ఆయన గుర్తుచేశారు. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల నీటి వాటాను సంపూర్ణంగా వినియోగించుకునెలా ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని పునఃప్రారంభిస్తాం.. గత ప్రభుత్వం దోపిడీ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే దిగువన ఉన్న 44 ఊళ్లు, భద్రాచలం వరదలో కొట్టుకుపోతాయని జాతీయ డ్యామ్‌ల భద్రత ప్రాధికార సంస్థ నివేదిక అందించిందని చెప్పారు. అందుకే మూడు బ్యారేజీల మరమ్మతులకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రూ. 38 వేల కోట్లతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాళేశ్వరం ఉపయోగంలో లేకపోయినా రికార్డుస్థాయిలో వరి పండిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను కేబినెట్ ముందు పెడతామని.. దీనిపై అసెంబ్లీ చర్చిస్తామని మంత్రి వెల్లడించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని పునఃప్రారంభిస్తామన్నారు. ఇచ్చంపల్లి వద్ద కూడా మరో ప్రాజెక్టు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
లారీ బీభత్సం
భువనగిరి: భువనగిరి పట్టణంలోని జగదేవ్‌పూర్ చౌరస్తాలో లారీ బీభత్సం సృష్టించింది. లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పోతిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిలమామిడి రామకృష్ణ(35), చిలమామిడి సాయి కుమార్(22) హైదరాబాద్‌లోని సూరారం కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. రామకృష్ణ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా, సాయికుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం భువనగిరి పట్టణంలోని సంతోషనగర్లో నిశ్చితార్థం వేడుకకు బంధువులతో కలిసి వచ్చారు. నిశ్చితార్థం జరుగుతున్న క్రమంలో స్వీట్స్ కోసం రామకృష్ణ, సాయికుమార్ ఇద్దరూ కారులో పట్టణంలోని జగదేవ్‌పూర్ చౌరస్తాకు బయలుదేరారు. కారును రోడ్డు పక్కన పార్కింగ్ చేసి షాపు దగ్గరకు వెళ్తున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లారీ ఉత్తరప్రదేశ్ నుంచి జగదేవ్‌పూర్ రోడ్డు మార్గం నుంచి చెన్నైకు వెళ్తున్న లారీ వేగంగా దూసుకువచ్చి అక్కడే ఉన్న పాదచారులు, ద్విచకవ్రాహనదారులను ఢీకొట్టింది. దీంతో అక్కడే నిలబడి ఉన్న రామకృష్ణ మృతి చెందగా, సాయికుమార్‌తో పాటు రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన బీమారి శివసాయికుమార్, లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సాయికుమార్‌తో పాటు శివకుమార్‌ను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సాయికుమార్ మృతి చెందాడు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. మృతుడు రామకృష్ణకు భార్య ఇద్దరు కుమార్తెలు, సాయికుమార్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. ధ్వంసమైన షాపులు, బైకులులారీ వేగంగా దూసుకురావడంతో రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్, పాన్ షాప్‌లు, అక్కడే ఉన్న మూడు బైకులు ధ్వంసమయ్యాయి. మృతుడు లారీ, గోడ మధ్యన ఇరుక్కుపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో లారీని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
ఇష్టపడిన వ్యక్తిపై కక్షగట్టిన భగ్నప్రేమికురాలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని వివిధ సంస్థలకు 22 బెదిరింపు ఈ–మెయిల్స్ పంపిన కేసులో నిందితురాలు రినే జోషిదా ఆద్యంతం చాలా తెలివిగా వ్యవహరించింది. తాను ఇష్టపడిన వ్యక్తి మరో యువతిని వివాహం చేసుకోవడంతో కక్షగట్టిన రినే అతడి పేరునే వినియోగించింది. డార్క్ వెబ్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) సహాయంతో తన ఆచూకీ బయటపడకుండా ఐదు నెలల పాటు పోలీసులను పరుగులు పెట్టించిన రినే.. ఆమెకు తెలియకుండా జరిగిన వైఫై కనెక్టివిటీతో చిక్కింది. ఇటీవల అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ఈమెను శంషాబాద్ అధికారులు పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి శనివారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఉన్నత విద్య.. ఎమ్మెన్సీ ఉద్యోగం.. చెన్నైకి చెందిన రినే జోషిదా తొలుత ఇంజినీరింగ్, ఆపై రోబోటిక్స్‌లో అడ్వాన్డ్స్ కోర్సు చేసింది. ఈమె ప్రతిభకు మెచ్చిన మల్టీ నేషనల్ కంపెనీ (ఎమ్మెన్సీ) డెలాయిట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా తమ సంస్థలో ఉద్యోగం ఇచి్చంది. ఆ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పని చేసిన రినే తన సహోద్యోగి దివిజ్ ప్రభాకర్‌ను ఇష్టపడింది. అతడినే పెళ్లి చేసుకోవాలని భావించిన ఆమె అందమైన జీవితాన్ని ఊహించుకుంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఈమె ప్రేమను తిరస్కరించిన ప్రభాకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో అతడిపై కక్షకట్టిన రినే కటకటాల పాలు చేయడం ద్వారా భార్య నుంచి విడగొట్టాలని పథకం వేసింది. దీన్ని అమలులో పెట్టడం కోసం పక్కా పథకం ప్రకారం కథ నడిపింది. ప్రభాకర్ పేరుతో మెయిల్ ఐడీలు.. తొలుత రినే తన ల్యాప్‌టాప్ నుంచి డార్క్వెబ్ను యాక్సస్ చేసింది. దాని ద్వారానే తన వివరాలు పొందపరచకుండా ప్రభాకర్ పేరు, వివరాలతో ఈ–మెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. వీపీఎన్ ద్వారా ఇంటర్నెట్ను యాక్సస్ చేసే రినే.. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాలు, కార్పొరేట్ స్కూళ్లు, ఆస్పత్రులకు 22 బెదిరింపు మెయిల్స్ పంపింది. ఒక ప్రాంతానికి పంపిన మెయిల్లో మరో ప్రాంతంలో ఓ నేరం జరిగినట్లు, దాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడానికే బాంబు పెట్టినట్లు రాసింది. అహ్మదాబాద్‌కు పంపిన ఓ ఈ–మెయిల్లో ‘2023లో హైదరాబాద్‌లోని లెమన్ ట్రీ హోటల్లో బాలికపై అత్యాచారం చేసిన రేపిస్ట్ విషయం పోలీసుల దృష్టికి తీసుకురావడానికి మీ స్కూల్లో బాంబు పేల్చబోతున్నారు’ అంటూ ప్రస్తావించింది. వీటిలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బెదిరింపు మెయిల్ కూడా ఉంది. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న ఆయా పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ ప్రమాదం తర్వాత తీవ్రంగా పరిగణించి.. ఇలా రినే తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బిహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, హరియాణా, గుజరాత్‌ల్లోని వివిధ సంస్థలకు మెయిల్స్ పంపినా ఆమె ఆచూకీ పోలీసులకు చిక్కలేదు. పోలీసులు ప్రభాకర్‌ను అనుమానితుగా భావించడం, విచారణ అనంతరం వదిలేయడం జరిగాయి. అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఆ మర్నాడు అదే కాలేజీకి పాక్ ఉగ్రవాదుల పేరుతో మెయిల్ పంపిన రినే మరోసారి విధ్వంసం తప్పదని హెచ్చరించింది. దీంతో రంగంలోకి దిగిన గుజరాత్ ఏటీఎస్, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. అప్పటి వరకు 12 రాష్ట్రాలకు వచి్చన 22 ఈ–మెయిల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి అధ్యయనం చేసింది. ఆ పొరపాటుతో ఆమె ఆటలకు చెక్... ఈ ఏడాది ఏప్రిల్‌లో అహ్మదాబాద్‌లోని ఓ స్కూల్‌కు రినే ఇలానే బెదిరింపు మెయిల్ పంపింది. ప్రతి సందర్భంలోనూ డార్క్‌వెబ్ ద్వారా, వీపీఎన్ నెట్వర్క్ వాడటంతో ఆమె వివరాలు పోలీసులకు చిక్కలేదు. ఆయా సందర్భాల్లో వైఫై ఆఫ్ చేసి ఉండే రినే.. మొబైల్ డేటా ద్వారానే హాట్‌స్పాట్ కనెక్ట్ చేసుకుని, వీపీఎన్‌ను యాక్టివేట్ చేసింది. అయితే ఏప్రిల్‌లో మెయిల్ పంపుతున్న సందర్భంలో పొరపాటున రినే ల్యాప్‌టాప్ ఆమె నివసిస్తున్న వైఫైకి కనెక్ట్ అయింది. దీంతో ఆ మెయిల్ పంపిన ఐపీ అడ్రస్ రికార్డుల్లో నమోదైంది. ఈ వివరాలను సాంకేతికంగా సేకరించిన గుజరాత్ పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా రినే ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీలతో పాటు లోకేషన్ సంగ్రహించారు. గత వారం చెన్నైలోని ఆమె ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. -
పెండింగ్.. పరిష్కారమయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్‌లో పెట్టిన జీవో 59 అమలు కోసం ఒత్తిడి పెరుగుతోంది. గత 20 నెలల కాలంగా తమ దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్నాయని, వీలున్నంత త్వరలో నిర్ణయం తీసుకుని తాము నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కారణంతో తమ దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టడం సమంజసం కాదంటూ మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు దరఖాస్తుదారులు వస్తున్నారని, మరోవైపు ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ మంత్రిపై కూడా పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జీవో 59 ద్వారా ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ విషయంలో ఈ నెలలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని రెవెన్యూ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. దరఖాస్తుదారులకు మరోమారు నోటీసులిచ్చి, అవసరాన్ని బట్టి ఆ భూములపై మరోమారు కూలంకషంగా విచారణ జరిపి అర్హులకు క్రమబద్ధీకరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆ శాఖ వర్గాలంటున్నాయి. కేబినెట్ సబ్ కమిటీకి ఇప్పటికే నివేదిక ఆదాయ వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి గతంలోనే రెవెన్యూ శాఖ జీవో 59కి సంబంధించిన నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. జీవో 59 కింద మొత్తం 57,661 దరఖాస్తులు రాగా, 55,997 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే 32,788 దరఖాస్తులకు డిమాండ్ నోటీసులు కూడా జారీ చేశారు. వీరిలో 13,726 మంది డిమాండ్ మేరకు ప్రభుత్వానికి చెల్లింపులు చేశారు. దీంతో 10,553 మంది కన్వేయన్స్ డీడ్లు కూడా మంజూరు చేశారు. మిగిలిన దరఖాస్తుల్లో 828 దరఖాస్తులు అధిక విలువ ఉన్న భూములకు సంబంధించినవని, సాధారణ విలువ ఉన్న పెండింగ్ దరఖాస్తుల ద్వారా దాదాపు రూ.1,000 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతుందని, అధిక విలువ గల భూములను కూడా క్రమబద్ధీకరిస్తే మరో రూ.5 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే కన్వేయన్స్ డీడ్స్ వచ్చినప్పటికీ సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో జీవో 59 క్రమబద్ధీకరణ భూములపై లావాదేవీలు నిర్వహించవద్దని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిశీలన పూర్తయిన దరఖాస్తులు, మార్కెట్ విలువ చెల్లించినవి, డీడ్స్ జారీ అయి కూడా పెండింగ్‌లో ఉన్నవి, అధిక విలువ కలిగిన భూములు... ఇలా పలు దశల్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించే దిశలో త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. -
యూరియా కోత.. రైతన్న వెత
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వరినాట్లు ఊపందుకున్నాయి. దీంతో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా అవసరమైన మొత్తంలో యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే తీవ్రమైన కొరత నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ విధానంలో ఒక్కొక్కరికి రెండు బస్తాలే ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ ఆగస్టు నెలలో రైతుల అవసరాలు తీరాలంటే కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి ఆ మేరకు యూరియా వస్తేనే గండం గట్టెక్కే అవకాశం ఉంటుందని, లేకపోతే రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం వానాకాలం సీజన్‌కు గాను నెలల వారీగా కేటాయించిన 9.80 ఎల్ఎంటీల యూరియాలో కోత పెట్టడంతోనే రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా..రాష్ట్రానికి కోటాకు మించి ఎరువులు సరఫరా చేశామంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో గందరగోళం నెలకొంది. ఇది రైతులకు తప్పుడు సంకేతాలను ఇస్తుందని, గ్రామాల్లో యూరియా కోసం ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు అంటున్నారు. చర్చనీయాంశమైన కేంద్రమంత్రి ప్రకటన రాష్ట్రంలో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, లోక్‌సభలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. తెలంగాణకు ఈ ఖరీఫ్ (వానాకాలం) సీజన్లో అవసరమైన 20.30 ఎల్ఎంటీల కన్నా అధికంగా 22.15 ఎల్ఎంటీలు సరఫరా చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. దీంతో బిత్తరపోవడం రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల వంతయ్యింది. వాస్తవానికి ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి.. యూరియాతో పాటు డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్, ఎస్ఎస్పీ ఎరువులు కలిపి 22.15 ఎల్ఎంటీ ఇచ్చినట్లు చెప్పాల్సిన కేంద్ర మంత్రి.. కేవలం యూరియానే 22.15 ఎల్ఎంటీ సరఫరా చేసినట్లుగా చెప్పారని ఓ అధికారి వివరించారు. నిజానికి ఇప్పటివరకు ఇచ్చిన యూరియా 4.50 ఎల్ఎంటీలు మాత్రమేనని చెప్పారు. అసలు లెక్కలేంటి? రాష్ట్రంలో పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ వానాకాలంలో ఏకంగా 134 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 10.48 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం ఈ సీజన్‌కు గాను నెలవారీగా 9.80 ఎల్ఎంటీలు మాత్రమే కేటాయించింది. అదేమంటే యాసంగి సీజన్లో మిగిలిన యూరియా 1.92 ఎల్ఎంటీ గోదాముల్లో ఉందని, దాన్ని వినియోగించుకోవాలని సూచించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సమాచారం మేరకు.. ఏప్రిల్ నుంచి జూలై వరకు కేంద్రం 6.60 ఎల్ఎంటీల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 4.50 ఎల్‌ఎంటీలే వచ్చింది. అంటే 2.10 ఎల్ఎంటీ (32 శాతం) తక్కువగా వచ్చిందన్న మాట. దీనికి రాష్ట్రం వద్ద ప్రారంభ నిల్వ కింద ఉన్న యూరియా 1.92 ఎల్ఎంటీలు కలిపితే మొత్తం 6.42 ఎల్ఎంటీలు అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. ఇందులో సుమారు 5.20 ఎల్ఎంటీలు ఇప్పటికే రైతులకు విక్రయించగా.. 1.20 ఎల్ఎంటీల పైచిలుకు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. 2 ఎల్‌ఎంటీలైనా వస్తేనే.. ఈ సీజన్లో రాష్ట్రానికి కేటాయించిన 9.80 ఎల్ఎంటీలకు గాను జూలై వరకు 4.50 ఎల్ఎంటీలు సరఫరా చేసిన నేపథ్యంలో ఇంకా 5.30 ఎల్ఎంటీల యూరియా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల్లో కోత విధించిన 2.10 ఎల్ఎంటీలతో పాటు ఆగస్టు కోటా 1.70 ఎల్ఎంటీలు కలిపి ఈ నెలలో సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. కాగా ఇటీవల కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో అధికారులు సమావేశమై యూరియా కొరత పరిస్థితిని సమీక్షించారు. ఆగస్టులో కనీసం 2 ఎల్ఎంటీల యూరియా అయినా వస్తేనే ప్రస్తుతానికి గట్టెక్కే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తాజాగా కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు లేఖ రాశారు. రాష్ట్రానికి యూరియా కేటాయింపులు, ఇప్పటివరకు కేంద్రం నుంచి వాస్తవంగా వచ్చిన యూరియా వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలో కొరతను దృష్టిలో పెట్టుకుని తక్షణమే అవసరమైన యూరియాను పంపించాలని విజ్ఞప్తి చేశారు. -
4 యాప్‌లతో రూ.300 కోట్లు హాంఫట్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఆన్లైన్ పెట్టుబడుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్ తదితర జిల్లాల్లో నాలుగు క్రిప్టో కరెన్సీ యాప్‌ల ద్వారా కేటుగాళ్లు సుమారు రూ. 300 కోట్లు కొల్లగొట్టి జనాన్ని నిండా ముంచారు. ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న ముంబైకి చెందిన ప్రధాన నిందితుడు హిమాన్ష్‌ను గత నెల 31న హైదరాబాద్‌లోని ఉప్పల్ పరిధిలో మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముంబైకి చెందిన డాక్టర్ హిమాన్ష్ మొదట ఓ క్రిప్టో యాప్ ద్వారా సుమారు రూ. 150 కోట్ల మేర పెట్టుబడులు సేకరించాడు. ఆపై ఉన్నపళంగా దాన్ని మూసేసి దుబాయ్ పరారయ్యాడు. కొన్ని రోజులకు తిరిగివచ్చి ఇంకో యాప్‌లో సుమారు రూ. 130 కోట్ల మేర పెట్టుబడులు రాబట్టాడు. ఆ యాప్‌ను కూడా 6 నెలల క్రితం మూసేసి మళ్లీ దుబాయ్ చెక్కేశాడు. ఇటీవలే మళ్లీ వచ్చి ఇంకో యాప్ ద్వారా పెట్టుబడులు సేకరించాడు. పెట్టుబడి పెట్టిన వారిలో 40 మందిని ఇటీవలే విహారయాత్ర కోసం బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడు. గత నెల 31న హైదరాబాద్‌లోని ఓ హోటల్లో పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహిస్తుండగా మేడిపల్లి పోలీసులు హిమాన్ష్‌ను అరెస్ట్ చేశారు.కరీంనగర్‌కు చెందిన జమీల్, అనిల్, సిరిసిల్లకు చెందిన వంశీ, నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్టుబడుల సొమ్మును హిమాన్ష్ దుబాయ్ మళ్లించడంతో ఈ స్కాం వెనుక అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిందితులు నెక్ట్స్‌బిట్ అనే క్రిప్టో కరెన్సీ యాప్ ద్వారా రూ. 19 కోట్లు సేకరించినట్లు సుమారు 400 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో హిమాన్ష్‌కు రికీ ఫామ్ (ఫారిన్ ఆపరేటర్), అశోక్ శర్మ (థాయ్‌లాండ్ ఆపరేటర్), డీజే సొహైల్ (రీజినల్ రిక్రూటర్), మోహన్ (సహాయకుడు), అశోక్‌కుమార్ సింగ్ (హిమాన్ష్ సహాయకుడు) సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే హిమాన్ష్ గతంలో రిక్సోజ్ అనే క్రిప్టో యాప్‌ను నడిపించినట్లు కనుగొన్నారు. అయితే బాధితులు మాత్రం హిమాన్ష్ మరో రెండు యాప్‌లను సైతం నిర్వహించి తమను మోసగించారని ఆరోపిస్తున్నారు. త్వరలో మెటా యాప్‌పైనా చర్యలు.. ఇదే తరహాలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్లలో మెటా యాప్ పేరుతో రూ. 100 కోట్ల వరకు కొల్లగొట్టిన మెటా యాప్ నిర్వాహకులపైనా పోలీసులు దృష్టిపెట్టారు. దీనిపై ఇప్పటికే డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. నిఘా వర్గాలు సైతం ఈ కేసులో సూత్రధారిగా ఉన్న లోకేశ్, ఓ మాజీ కార్పొరేటర్, ప్రకాశ్, రమేశ్, రాజు అనే వ్యక్తులపై పూర్తి వివరాలు సేకరించారు. లోకేశ్ ప్రస్తుతం దేశం విడిచి పరారయ్యాడని పోలీసులు నిర్ధారించుకున్నారని సమాచారం. ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలైతే నిందితుడిని ఇండియాకు రప్పించడం ప్రహసనంగా మారనుంది. -
రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం ఫైనల్ రిపోర్టు..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల అధ్యయనం ముగిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో కమిషన్ పేర్కొంది. పూర్తిస్థాయి నివేదికలో కీలక అంశాలను కమిటీ ప్రస్తావించింది. బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కమిషన్ సూచించింది.ఆర్థిక శాఖ అధికారుల లోపాలపైనా కమిషన్ ఫోకస్ పెట్టింది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలను గుడ్డిగా ఆమోదం తెలిపారని నివేదికలో తెలిపింది. ఆర్థిక శాఖ చేయాల్సిన కనీస బాధ్యతలు నిర్వహించలేదన్న కమిషన్.. ప్రాజెక్టు నిర్మాణంలో టెక్నాలజీ వ్యవహారంలో లోటుపాట్లను కమిషన్ ప్రస్తావించింది. లోకేషన్ల విషయంలో కేసీఆర్ చొరవే ఎక్కువని కమిషన్ పేర్కొంది.రేపు(సోమవారం) కేబినెట్లో రిపోర్ట్‌పై పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కేబినెట్ చర్చ తర్వాత అసెంబ్లీ సమావేశంలో ఈ నివేదికపై సుదీర్ఘంగా చర్చించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అన్ని పార్టీల ఆలోచన తెలుసుకునే పనిలో ప్రభుత్వం ఉంది.కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్‌ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం.బరాజ్‌ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. నాడు సీఎం హోదాలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో బరాజ్‌ల అంచనాల పెంపు (ప్రైస్ అడ్జస్ట్మెంట్), కాంట్రాక్టర్లతో ఒప్పందాల సవరణ, వారికి ఫైనాన్షియల్ గ్యారంటీల విడుదల విషయంలో అధికారులపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని నిర్ధారించినట్లు తెలిసింది.మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది. -
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం.. వాటిపైనే చర్చ
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. కాళేశ్వరం నివేదిక, స్థానిక ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.గత గురువారం కూడా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కేసీఆర్.. ఎర్రవల్లి నివాసంలో ఆ పార్టీ నేతలతో సుదీర్ఘంగా భేటీ అవుతున్నారు. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించడంతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు.మరో వైపు, ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు అధికారంలో కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ కొత్త తరానికి చేరువ అయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తదితరాలను విద్యార్థులు, యువతకు నూరిపోయాలని భావిస్తోంది.టీఆర్ఎస్గా అవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశం తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. -
కరీంనగర్: మంత్రుల పర్యటనలో మళ్లీ బయటపడ్డ విభేదాలు
సాక్షి, కరీంనగర్: జిల్లాలో మంత్రుల పర్యటనలో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. మానకొండూరు నియోజకవర్గం గట్టుదుద్దెనపల్లి సహకార సంఘం నూతన భవన ప్రారంభోత్సవంలో ఫ్లెక్సీల విషయంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావువి తప్ప.. వేదికపైనున్న ఫ్లెక్సిపై మంత్రి అడ్లూరి ఫోటో కనిపించలేదు.గత క్యాబినెట్ విస్తరణతో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. తనకు మంత్రి పదవి దక్కుతుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆశపడి భంగపడ్డ సంగతి తెలిసిందే. అడ్లూరికి మంత్రి పదవి దక్కడంతో కవ్వంపల్లి అలిగారు. ఆ ప్రభావమే ఇవాళ ప్రోటోకాల్ వివాదానికి కారణమనే చర్చ జరుగుతోంది.స్కూటీని ఢీకొట్టిన మంత్రుల కాన్వాయ్శంకరపట్నంలో ప్రజాపాలన మీటింగ్ ముగించుకొని వెళ్తున్న మంత్రుల కాన్వాయ్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కేశపట్నం గ్రామానికి చెందిన సల్ల వెంకటికి స్వల్ప గాయాలయ్యాయి. కాన్వాయ్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్, పీఆర్వోలు ఉన్నారు. -
ఎమ్మెల్సీ కవితకు జగదీష్ రెడ్డి కౌంటర్.. బీఆర్ఎస్లో దుమారం!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గులాబీ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత వ్యాఖ్యలపై తాజాగా జగదీష్ రెడ్డి స్పందిస్తూ..‘నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘కొంత మంది ఏదో చేసేదామని అనుకుంటున్నారు. వ్యక్తులుగా ఏదో చేస్తామనుకుంటే అది వాళ్ల భ్రమ. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేరు. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను చావు తప్పి కన్నులొట్టబోయినట్టు గెలిచాను. కొంత మంది అది కూడా గెలవలేదు కదా. పార్టీ నిర్ణయమే ఫైనల్. పార్టీ గొప్పది. నల్లగొండలో అంతకుముందు ఎక్కువ సీట్లు వచ్చాయి.. అప్పుడు నేనే కారణం అన్నారు.. ఇప్పుడు ఒక్కడినే గెలిచాను.. అందుకే దీనికి కూడా నేనే కారణం. బనకచర్ల, కాళేశ్వరంపై కేసీఆర్‌తో చర్చించాం. కేసీఆర్‌తో చర్చల్లో కవిత విషయమే ప్రస్తావనకు రాలేదు. కవిత వైఖరి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు...కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణ లు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్న....— Jagadish Reddy G (@jagadishBRS) August 3, 2025అంతకుముందు.. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసి కవిత సంచలన ఆరోపణలు చేశారు. లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడు. కన్ను లొట్టపోయి గెలిచిన నాయకుడు.. ఎన్నడు ప్రజా పోరాటాల్లో పాల్గొన లేదు. అసలు బీఆర్ఎస్తో మీకేం సంబంధం?. లిల్లీపుట్ నాయకుడు, నిన్న మొన్న వచ్చిన చోటా మోటా నాయకులు కూడా నాపై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్కు సంబంధం లేని వ్యక్తితో నాపై ఆరోపణలు చేయిస్తున్నారు. వారి వెనక బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు ఉన్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతాను. పార్టీ కూడా సమయం వచ్చినప్పుడు స్పందిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ఒక ఆడ బిడ్డగా నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు కానీ, బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ విమర్శలు చేశారు. దీంతో, కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా పెను దుమారం రేపాయి. -
చేవెళ్లలో కలకలం.. ఫాంహౌస్‌లో ఐటీ ఉద్యోగుల డ్రగ్స్ పార్టీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్లలో డ్రగ్స్ కలకలం రేగింది. సెరీన్ ఆచార్జ్ ఫాంహౌస్‌లో బర్త్‌డే వేడుకలు పేరుతో డ్రగ్స్, విదేశీ మద్యంతో హంగామా చేస్తుండగా.. ఎస్టీఎఫ్ బీ టీమ్, ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. బర్త్‌డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ ఈ ఫాంహౌస్‌ను బుక్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫాంహౌస్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.పక్కా సమాచారంతో ఫాంహౌస్‌లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. ఐటీ ఉద్యోగుల నుంచి రూ.రెండు లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మూడు లగ్జరీ కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్‌ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురు ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
ఎన్నికల్లో ‘గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు’
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధికి ,సేవలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.‘బీఆర్ఎస్ పార్టీకి 50 వేల మంది కార్యకర్తల సభ్యత్వం ఉన్న నియోజకవర్గం జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి. కాంగ్రెస్ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బస్తీల్లో ఉండే పేదల ఇండ్లు కూల్చుతున్నారు. సీఎం రేవంత్ కొడంగల్ నియోజకవర్గంలో ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నాడు.హైదరాబాద్‌లో రేవంత్, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లోనే ఉంటుంది. ఇలా చెప్పుకుంటే పోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లు అన్ని బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లోనే ఉన్నాయి. కూట్లో రాయి తెయ్యలేని వాడు, ఎట్లో రాయి తీస్తా అని రేవంత్ మాట్లాడుతున్నాడు.జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ఒకటే చెప్తున్నా. గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు. గెలుస్తాం అని ఇంట్లోనే ఉండకుండా ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ గెలుపుకు కృషి చెయ్యాలి. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన మాగంటి గోపినాధ్ బీఆర్ఎస్ పార్టీ వీడలేదు. ఉపఎన్నిక గెలిచి మాగంటి గోపీనాథ్ అంకితం ఇవ్వాలి.ఎలక్షన్ కమిషన్ తీరు సరిగా లేదు. ఎలక్షన్ కమిషన్ దేశ వ్యాప్తంగా ఓట్లు తీసివేసి పనిలో ఉంది. బీహార్‌లో మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఓటునే తీసేశారు. మన ఓట్లు తీసివేయడం ఒక లెక్కనాఅందరం జాగ్రత్తగా ఉండాలి’ అని అన్నారు. -
ఏకాంత సేవలో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వివాహిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఉన్న సమయంలో సదరు మహిళ భర్త వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం, కుటుంబ సభ్యులు, స్థానికులు వారిద్దరినీ స్థంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి (సాగర్) మండలం నాయకుని తండాలో వివాహిత, రమేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ గమనించిన సదరు మహిళ భర్త.. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం, సదరు భర్త స్థానికుల సాయంతో.. విద్యుత్ స్తంభానికి కట్టేసి ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే, శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
నాగార్జునసాగర్ గేట్ల మూసివేత..!
నల్గొండ: వర్షాలు తగ్గటంతో నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఆదివారం అధికారులు ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను మూసివేశారు. అయితే, 18 ఏళ్ల తర్వాత తొలిసారి జులైలో ప్రాజెక్టు గేట్లు ఎత్తటంతో సాగర్‌కు పర్యాటకుల తాకిడి నెలకొంది. ప్రస్తుతం గేట్లు మూసివేయటంతో ఈ విషయాన్ని పర్యాటకులు గమనించాల్సిందిగా అధికారులు సూచించారు. వరద ఉధృతిని బట్టి నీటి విడుదల చేపడుతామని ఈ సందర్భంగా తెలిపారు. కాగా, నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులగా ఉంది. -
‘మహా ప్రణాళిక’కు సాంకేతిక దన్ను
హైదరాబాద్: మహా నగర సమగ్ర ప్రణాళిక– 2050 రూపకల్పనకు ఐఐటీ హైదరాబాద్ సాంకేతిక భాగస్వామిగా సేవలందించనుంది. ఈ మేరకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ), ఐఐటీ హైదరాబాద్‌తో ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీ సంస్థ అందజేయనుంది. భవిష్యత్ అవసరాలకనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాల మేరకు హైదరాబాద్ నగర విస్తరణ, అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ సమగ్ర మాస్టర్ ప్లాన్ కోసం భారీ కసరత్తు చేపట్టిన విషయం విదితమే. ఇప్పటి వరకు ఉన్న ఐదు మాస్టర్ ప్లాన్లను విలీనం చేస్తూ ట్రిపుల్ ఆర్ వరకు ఒకే సమగ్రమైన మహా ప్రణాళికను రూపొందించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజా రవాణా, మౌలిక సదుపాయాల కల్పన కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, లాజిస్టిక్స్, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా ఆర్థికాభివృద్ధి ప్రణాళిక, జల వనరులు, అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం బ్లూగ్రీన్ ప్లాన్లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు రకాల ప్రణాళికలు తుది దశకు చేరుకున్నాయి. వీటికి అనుగుణంగా సమగ్రమైన మాస్టర్‌ప్లాన్– 2050ను తయారు చేస్తారు. ఇందుకోసం రెండు రకాల సాంకేతికతను జోడించనున్నారు. హైదరాబాద్ ఐఐటీ అభివృద్ధి చేసిన త్రీడీ, టూడీ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ ఆధారంగా బేస్ మ్యాపులను సిద్ధం చేయనున్నారు. దీంతో హైదరాబాద్ మహానగర సమగ్ర స్వరూపం ఆవిష్కృతమవుతుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఔటర్ వరకు ఉన్నది ఉన్నట్లుగా... కొత్తగా రూపొందించనున్న మాస్టర్‌ప్లాన్– 2050లో ఔటర్ రింగ్‌రోడ్డు వరకు అంటే.. సుమారు 2050 చ.కి.మీ పరిధిలో త్రీడీ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని వినియోగిస్తారు. దీనిద్వారా ప్రతి ప్రాంతం వెడల్పు, పొడవు, ఎత్తులను పరిగణనలోకి తీసుకొని మూడు డైమెన్షన్లలో మ్యాపింగ్ చేస్తారు. ఇందుకోసం లైడార్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ టెక్నాలజీతో ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న నగరంలోని ప్రతి అంగుళాన్ని రియల్ టైమ్‌లో ఉన్నది ఉన్నట్లుగా వీక్షించేందుకు అవకాశం లభిస్తుంది. వరదలు, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, మౌలిక సదుపాయాలు వంటి సేవలను సత్వరమే అందజేసే అవకాశం లభిస్తుంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ తదితర ప్రభుత్వ విభాగాల ప్లానింగ్‌లోనూ రియల్ టైమ్ టెక్నాలజీ వల్ల వంద శాతం కచి్చతత్వాన్ని పాటించవచ్చు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాలో కూడా త్రీడీ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రిపుల్ఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లోని స్మార్ట్ లివింగ్ ల్యాబ్ ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీనిద్వారా ఇనిస్టిట్యూట్ సమీపంలో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య, రద్దీని కచి్చతంగా అంచనా వేసి ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన సూచికలను ఏర్పాటు చేశారు. నీటి వనరులను రియల్–టైమ్‌లో పర్యవేక్షించేందుకు, వృథాను నివారించేందుకు కూడా ఈ టెక్నాలజీ దోహదం చేసింది. గచ్చిబౌలిలోని ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఈటెక్నాలజీ ద్వారా పైప్లైన్ల లీకేజీలను గుర్తించి, నీటి సరఫరాను సమర్ధవంతంగా మెరుగుపరిచారు.అలాగే పార్కులు, పచ్చదనం పరిరక్షణలో త్రీడీ డిజిటల్ ట్విన్ మ్యాపింగ్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఈ టెక్నాలజీనే ఔటర్ వరకు విస్తరించనున్నారు. ముంబై, జైపూర్, వారణాసి, పుణె తదితర నగరాల మాస్టర్ప్లాన్ల రూపకల్పనలో త్రీడీ టెక్నాలజీని వినియోగించినట్లు అధికారులు తెలిపారు.ట్రిపుల్ ఆర్ వరకు టూడీ డిజిటల్.. హెచ్ఎండీఏలో కొత్తగా విలీనమైన ట్రిపుల్ ఆర్ వరకు అంటే సుమారు 11 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని టూడీ డిజిటల్ టెక్నాలజీతో మ్యాపింగ్ చేస్తారు. ఇక్కడ రియల్ టైమ్ సమాచారం లభించదు. ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న అన్ని ప్రాంతాల పొడవు, వెడల్పులను మ్యాపింగ్ చేస్తారు. ఆర్థిక అభివృద్ధి మండలాలను, నీటి వనరులు, అడవులు తదితర ప్రాంతాలను సమగ్రంగా మ్యాపింగ్ చేస్తారు. ట్రిపుల్ ఆర్ వరకు రవాణా సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన రోడ్లు, బస్‌ర్యాపిడ్ సిస్టమ్, మెట్రో, ఎంఎంటీఎస్ తదితర ప్రజా రవాణా సదుపాయాలను ఈ ప్రణాళికలో పొందుపరుస్తారు. పార్కులు, పచ్చదనం విస్తరణకు ఈ ప్రణాళిక దోహదం చేయనుంది. త్వరలో టెండర్లు..మాస్టర్‌ప్లాన్– 2050పై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేసేందుకు త్వరలో కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ఆర్ఎఫ్పీ టెండర్ ప్రకటన విడుదల చేయనున్నారు. ఎంపికైన కన్సల్టెన్సీ అందజేసే నివేదిక ఆధారంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించనున్నారు. ట్రిపుల్ ఆర్ వరకు సమగ్ర మాస్టర్‌ప్లాన్ అమల్లోకి రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. -
నువ్వో లిల్లీపుట్.. నా గురించి మాట్లాడతావా?: బీఆర్ఎస్ నేతపై కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఆడ బిడ్డగా నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు కానీ, బీఆర్ఎస్ పార్టీ, నేతలు స్పందించకపోవడం దారుణమన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్తో సంబంధం లేని వ్యక్తితో తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లిల్లీపుట్ నాయకుడు తనను విమర్శించమేంటని కవిత ప్రశ్నించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వానికి, పోలీసులను అనుమతి కోరాం. ప్రభుత్వం అనుమతి విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిరాహార దీక్ష అనుమతి కోసం కోర్టుకు వెళ్ళాము.. కోర్ట్ మాకు అనుమతి ఇస్తుంది అనే నమ్మకం ఉంది. గాంధేయ మార్గంలో దీక్ష చేస్తాం. సానుకూల దృక్పథంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. 42 శాతంలో ముస్లింలు ఉన్నారో లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.. ఉన్నారా లేదా స్పష్టత ఇవ్వాలి. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. దొంగనే దొంగ అన్నట్టుగా ఉంది బీజేపీ వాళ్ళ ధర్నా..ఒక ఆడ బిడ్డగా నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు కానీ, బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడు. కన్ను లొట్టపోయి గెలిచిన నాయకుడు.. ఎన్నడు ప్రజా పోరాటాల్లో పాల్గొన లేదు. అసలు బీఆర్ఎస్తో మీకేం సంబంధం?. లిల్లీపుట్ నాయకుడు, నిన్న మొన్న వచ్చిన చోటా మోటా నాయకులు కూడా నాపై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్కు సంబంధం లేని వ్యక్తితో నాపై ఆరోపణలు చేయిస్తున్నారు. వారి వెనక బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు ఉన్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతాను. పార్టీ కూడా సమయం వచ్చినప్పుడు స్పందిస్తుంది. దీక్షకు అనుమతి రాకపోతే ఇంట్లోనే దీక్ష చేస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 03-10)
-
లోకేశ్.. తప్పుడు ప్రచారం వద్దు, కచ్చితంగా నిలదీస్తాం: పొన్నం
సాక్షి, హైదరాబాద్: ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల విషయంలో తామేదో.. రెచ్చగొడుతున్న లోకేశ్ మాట్లాడటం సరికాదన్నారు. ఆయన ముందుగా.. వరద జలాలు, నికర జలాలు, మిగులు జలాల గురించి తెలుసుకుంటే మంచిది అంటూ హితవు పలికారు.మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ..‘ఏపీ మంత్రి నారా లోకేశ్ బనకచర్ల కోసం వరద నీరు తీసుకుపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారు. నికర జలాలు, మిగులు జలాల సంగతి తేలాక వరద జలాల గురించి ఆలోచించాలి. ఆయన ముందుగా.. వరద జలాలు, నికర జలాలు, మిగులు జలాల గురించి తెలుసుకుంటే మంచిది. తెలంగాణ ప్రాజెక్టుల పైనున్న ప్రాజెక్టుల్లో నీటి వినియోగం పూర్తైన తర్వాత వరద జలాల గురించి ఆలోచన చేయాలి. అవేమీ తెలియకుండా లోకేశ్.. ఏపీ ప్రజలను మభ్యపెట్టి, తప్పుదోవ పట్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ట్రిబ్యునల్స్ చెప్పినదాని ప్రకారం ఒక్క చుక్క నీటిని కూడా తెలంగాణ వదులుకోదు.సీనియర్ నాయకుడిగా చంద్రబాబు ఇలాంటి నీటి వాటాలపై ఘర్షణ పూరిత వాతావరణానికి ఇరు రాష్ట్రాల మధ్య తెర లేపొద్దు. వరద జలాలు సముద్రంలో కలవాలని ఎవరూ కోరుకోరు.. మీరు వాటిని వాడుకుంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరమూ ఉండదు. కానీ, మా కోటా, మా వాటా పూర్తి కాకుండా నీటిని తరలిస్తామంటే మా హక్కులపై కచ్చితంగా నిలదీస్తాం, అడ్డుకుంటాం. మా రైతుల హక్కుల కోసం కచ్చితంగా మాట్లాడతాం. దానికి మేమేదో ప్రాంతీయ అసమానతలను రెచ్చగొడుతున్నట్టు లోకేశ్ వక్రీకరించడం సరికాదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీలు ఏపీకి ఇచ్చిన తరువాత ఆ నికర జలాల మీద మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. మా రాష్ట్ర హక్కులు మేము కాపాడుకుంటాం.. మీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోండి. అంతే కానీ ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వకండి అంటూ హితవు పలికారు. -
ఐదో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. నారాయణగూడ అడ్మిన్ ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం హిమాయత్‌నగర్ ఉర్దూ గల్లీలో సాయికృష్ణ గ్రాండ్యువర్ అపార్ట్మెంట్లో అరుణ్ కుమార్ జైన్ తన భార్య పూజజైన్(43) ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా పూజ జైన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. శనివారం ఉదయం ఆమె భర్త అరుణ్ కుమార్ బయటకు వెళ్లగానే ఐదో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
ఐటీ భళీ..ఆరోగ్యం బలి
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులంటే.. వాళ్లకేంటి బాబూ లక్షల్లో జీతం.. వీకెండ్స్ హాలీడేస్.. కాస్మోపాలిటన్ వర్క్ కల్చర్.. విలాసవంతమైన జీవనం అని ఠక్కున అనేయకండి. నాణేనికి రెండో వైపులాగే ఐటీ ఉద్యోగులను తీవ్ర అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. జీవనశైలి, అధిక పని ఒత్తిడితో రకర కాల వ్యాధుల బారినపడుతున్నారు. హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ (ఐటీ) ఉద్యోగులలో 84% మంది ఫ్యాటీ లివర్ (కాలేయంలో అధిక కొవ్వు) బారిన పడ్డారని ఏకంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా లోక్‌సభలో ప్రకటించారు. ఇదొక నిశ్శబ్ద మహమ్మారిగా మారిందని, దీనిని నియంత్రించేందుకు అన్నివర్గాల సమన్వయంతో తక్షణ చర్యలు అవసరమని నొక్కి చెప్పారు. 2025లో నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనాన్ని కేంద్ర మంత్రి ఉదహరించారు.క్రమం తప్పిన జీవన శైలిఐటీ పరిశ్రమలో ఉండే పని ఒత్తిడికి తోడు క్రమం తప్పిన పని వేళలు, ఆహార అలవాట్లతో ఉద్యోగులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటంతో జీవక్రియ దెబ్బతింటోంది. దానివల్ల కాలేయంలో కొవ్వు (ఫ్యాటీ లివర్– ఎంఏఎఫ్ఎల్డీ) పెరిగిపోయి వ్యాధులకు దారితీస్తోంది. హైదరాబాద్‌లో సర్వే చేసిన ఐటీ ఉద్యోగులలో 71 శాతం మందికి ఊబకాయం, 34 శాతం మందికి మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలు ఉన్నట్లు తేలింది. వీటి వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు వంటి సమ స్యలు పెరుగుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ ఈ అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. సాధారణంగా హృద్రోగం, మధుమేహం, కేన్సర్, శ్వాస సంబంధ సమస్యలు వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్ సీడీ)లన్నీ 40 ఏళ్ల తర్వాతే వస్తుంటాయి. కానీ, ఐటీ ఉద్యోగుల్లో మాత్రం అవి 30 ఏళ్ల లోపే వస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్, రెడీమేడ్ ఆహారం తీసుకోవటం, కదలకుండా గంటల కొద్దీ ఒకే చోట కూర్చోవటం కూడా ఈ అనారోగ్యాలకు కారణాలని సర్వేలో తేలింది.యోగా బ్రేక్ తప్పనిసరి..సంస్థల యాజమాన్యాలకే కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా యువ, పట్టణ శ్రామిక శక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అత్యంత కీలకం. అందుకే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్పీ–ఎన్సీడీ) కింద ఆరోగ్య మంత్రిత్వ శాఖ కంపెనీల యాజ మాన్యాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగులకు తప్పని సరిగా 5 నిమిషాల పాటు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో కూడిన ‘యోగా బ్రేక్’ఇవ్వాలని ఆదేశించింది. ఇది శారీరక, మానసిక శ్రేయ స్సుకు అత్యవసరం. దీంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్ప కుండా వ్యాయామం, బరువు నియంత్రణ, చక్కెర, అధిక కొవ్వు పదార్థాలను తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది. -
బాంబు బెదిరింపు మెయిల్స్ చేసిన యువతి రిమాండ్
హైదరాబాద్: ప్రియుడిపై కోపంతో దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు ఈ–మెయిల్స్ పంపిన యువతిని శనివారం ఆర్జీఐఏ పోలీసులు కోర్టు ముందు హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. చెన్నైకు చెందిన రోబోటిక్ సాఫ్ట్వేర్ ఇంజరీన్ రినే జోషిదా (30) చెన్నైకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ప్రేమించింది. పెళ్లికి ప్రియుడు అంగీకరించకపోవడంతో అతడిపై పగబట్టిన జోషిదా అతడిని ఏదైనా నేరంలో ఇరికించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా గత ఏడు నెలలుగా దేశవ్యాప్తంగా సుమారు 11 విమానాశ్రయాలతో పాటు పలు విద్యాసంస్థలకు బాంబులున్నాయంటూ ప్రియుడికి సంబంధించిన మెయిల్‌తో సందేశాలు పంపింది. స్విట్జర్లాండ్ వేదికగా వచ్చిన వీటిపై విమానాశ్రయం అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటన సైతం తామే చేసినట్లు పంపిన ఈమెయిల్‌ను కేంద్ర దర్యాప్తు అధికారులు తీవ్రంగా పరిగణించి రినే జోషిదాను అరెస్ట్ చేశారు. ఈమెపై ఆర్జీఐఏ ఔట్‌పోస్టు పోలీస్ స్టేషన్లో కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ కేసులు ఉండడంతో శనివారం ఆర్జీఐఏ ఔట్‌పోస్టు సీఐ బాలరాజు ఆధ్వర్యంలో కోర్టు ముందు హాజరుపర్చి రిమాండ్ చేశారు. -
బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థి మృతి
హైదరాబాద్: బిల్డింగ్‌పై వాకింగ్ చేస్తుండగా..మూర్ఛ వ్యాధి రావడంతో అదుపుతప్పి విద్యార్థి మూడో అంతస్తు నుండి కిందపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన ఐఎస్ సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దుర్గా భవానీనగర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి బద్రీనాథ్ రావు కుమారుడు గౌరవ్ రావు (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో భోజనం చేసిన అనంతరం వాకింగ్ చేసేందుకు మూడో అంతస్తుకు వెళ్లాడు. అక్కడ వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అదుపుతప్పి భవనం నుంచి కిందపడిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలకు గురైన గౌరవ్‌ను చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
బాలసదనాల్లో భారీగా ఖాళీలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటైన శిశు గృహాలు, బాలసదనాలు, జిల్లా స్థాయి శిశు సంరక్షణ యూనిట్లలో పలు కేటగిరీల్లో 267 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. నవజాత శిశువు మొదలు ఆరేళ్లలోపు ఉన్న చిన్నారుల సంరక్షణలో ఈ గృహాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17 శిశు గృహాలు, బాలసదనాలున్నాయి. వీటితో పాటు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ పరిధిలో శిశు విహార్ ఉంది. మంజూరైన పోస్టుల్లో దాదాపు 60 శాతానికి పైబడి ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.కీలక పోస్టులు ఖాళీ..శిశు గృహాలు, బాల సదనాల్లోని చిన్నారుల ఆలనా, పాలన చూసుకోవడంలో ఆయాలు కీలక భూమిక పోషిస్తుండగా.. వారికి వైద్య సేవలందించడంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది. ఈ గృహాల్లో మొత్తం 32 మంది వైద్యులు పనిచేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 8 మంది మాత్రమే కొనసాగుతున్నారు. నర్సుల కేటగిరీలో 70 శాతం మేర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఇవికాకుండా సూపరింటెండెంట్, మ్యాట్రిన్, నైట్ వాచ్మెన్ పోస్టులు కూడా పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా స్థాయి శిశు సంరక్షణ కేంద్రాల్లో చాలా కేటగిరీల్లో వేకెన్సీ ఉంది. శిశు గృహాల్లో మొత్తంగా 267 పోస్టులు ఖాళీగా ఉండగా జిల్లా స్థాయి శిశు సంరక్షణ కేంద్రాల్లో 67 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు గణాంకాలు వెల్లడించారు. వీటి భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ అనుమతి కోసం పంపాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
‘కాళేశ్వరం’ నివేదికపై తప్పుడు రాతలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక పేరు మీద మీడియాలో ఇష్టమొచ్చినట్టు రాతలు రాయిస్తున్నారని, అవేవీ నిజాలు కావని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. అవన్నీ సీఎం రేవంత్‌రెడ్డి కార్యాలయం నుంచి వస్తున్న తప్పుడు లీకులు మాత్రమేనని స్పష్టంచేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేలా వార్తలు రాయవద్దని కోరారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు.‘మేము మౌనంగా ఉన్నామని అనుకోవద్దు. తప్పుడు వార్తలు రాసేవారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి. అయితే, నేను కేవలం మీడియా ముసుగులో ఉన్న తెలంగాణ వ్యతిరేక స్లాటర్ హౌస్ (వధశాల)ల గురించి మాట్లాడుతున్నా. ఈ రోత రాతలను అర్ధం చేసుకోవాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాళేశ్వరం కమిషన్ రహస్య నివేదిక ఇస్తే అందులోని అంశాలు ఈ స్లాటర్ హౌస్‌లకు ఎలా తెలిశాయి? సొంత వ్యాఖ్యానాలు చేస్తామంటే కుదరదు’అని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని పేర్కొన్నారు.ఏ కమిషన్ అయినా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి నివేదికలు ఇవ్వలేవు అన్నారు. తెలంగాణ కోసమే కేసీఆర్ ప్రతీ క్షణం పరితపించారని, నాలుగేళ్లలోనే కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితమిచ్చారని పేర్కొన్నారు. ‘పోలవరం పనులు ప్రారంభించి నాలుగు దశాబ్దాలైనా ఇంకా పూర్తి చేయలేక పోయారు. కేంద్రం పోలవరంపై ఇప్పటికే రూ.30 వేల కోట్లు ఖర్చు పెట్టింది. అందులో రూ.2 వేల కోట్లు వరదల్లో కొట్టుకుపోయిన వాటి బాగుకే వెచ్చించారు. ఇప్పటికే పోలవరం మూడు సార్లు కొట్టుకుపోయింది. అలాంటిది 500 సంవత్సరాల్లో ఎపుడూ రాని విధంగా దాదాపు 38 లక్షల క్యూసెక్కులు రావడంతోనే మేడిగడ్డ బరాజ్‌లో కొంతభాగం కుంగిపోయాయి. కానీ, మోదీ, చంద్రబాబు, రేవంత్ కలిసి కేసీఆర్‌పై దుర్మార్గమైన దాడి చేస్తున్నారు’ అని విమర్శించారు. రూ.50 వేల కోట్ల మూటల సంగతేంటి? దాదాపు రూ.50 వేల కోట్ల మూటలు ఢిల్లీకి సమర్పణ అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గతంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేశారని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ పారీ్టకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని చేసిన విమర్శలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా పదేళ్ల కాలంలో పదిసార్లు కూడా ఢిల్లీకి వెళ్లలేదని, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఢిల్లీ పర్యటనల్లో అర్థశతకం పూర్తి చేశారని ఎద్దేవా చేశారు.50 సార్లు వెళ్లినా రాష్ట్రానికి 50 పైసలు కూడా తేలేదని విమర్శించారు. ‘ఢిల్లీ వెళ్లేది సంచుల పంపిణికి మాత్రమే. నిన్న సీఎం, మంత్రులు ఢిల్లీ వాటాల గురించి మాట్లాడుకున్నారు’ అని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. గతంతో సోషల్ మీడియాను వాడుకుని బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే సోషల్ మీడియాను చూస్తే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్ .భాస్కర్ రావు, రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. -
ఒలింపిక్స్ పతకం లక్ష్యం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఒలింపిక్స్ నిర్వహించేందుకు మన వద్ద నిధులు, వేదికలు, అన్ని వనరులు, హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. కానీ ఇంతా చేసి మనం ఒక్క స్వర్ణ పతకం కూడా గెలవలేకపోతే మన ముఖం ప్రపంచానికి ఎలా చూపిస్తాం? అందుకే మున్ముందు రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే కొత్త క్రీడా విధానాన్ని తీసుకొచ్చాం’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో క్రీడా సదస్సు(స్పోర్ట్స్ కాంక్లేవ్) నిర్వహించింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఒలింపిక్ పతక విజేతలు అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, ప్రపంచ చాంపియన్‌షిప్ మెడలిస్ట్ అంజూ బాబీ జార్జ్, మాజీ వాలీబాల్ ప్లేయర్ రవికాంత్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఉన్న అవకాశాలపై తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. పలువురు మాజీ క్రీడాకారులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండదు ‘క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా ఉండేందుకు ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ప్రముఖ ప్రైవేట్ కంపెనీలతో కలిసి పని చేస్తాం. స్పోర్ట్ పాలసీ అమలుకు సంబంధించి పలువురు ప్రముఖులతో గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేస్తున్నాం. ఇకపై క్రీడల్లో ప్రభుత్వ పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. రాజకీయ నాయకులు ఎవరూ ఇందులో జోక్యం చేసుకోరు. ఈ రంగంలో ఎంతో అనుభవం ఉన్న, నిష్ణాతులైన వారిని ఏరికోరి భాగస్వాములను చేస్తున్నాం. వారంతా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తారని నమ్ముతున్నా..’అని సీఎం పేర్కొన్నారు. మున్ముందు క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ ‘పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పేలవ ప్రదర్శన చూసిన తర్వాతే నాకు రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. చాలా కాలంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ అనేదే లేదు. ఈ క్రమంలోనే కొత్త క్రీడా విధానం గురించి నిర్ణయం తీసుకున్నాం. విజన్ 2047లో క్రీడలకు ప్రత్యేక అధ్యాయం కేటాయించాం. మున్ముందు క్రీడలకు ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయిస్తాం. ఈ పాలసీ లైబ్రరీలో పడేసే కాగితం ముక్క కాదు. బంగారంతో గీసిన రేఖ లాంటిది..’అని రేవంత్ అన్నారు. హైదరాబాద్‌కు చాన్స్ ఇవ్వమని అడిగాం.. ‘1956 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టులో 9 మంది హైదరాబాదీలే ఉన్నారు. హైదరాబాద్‌లో గతంలో జాతీయ క్రీడలు, ఆఫ్రో ఏషియన్ క్రీడలు, ప్రపంచ మిలిటరీ క్రీడలను సమర్థంగా నిర్వహించాం. అయితే గత ప్రభుత్వం పదేళ్లు క్రీడలను ఏమాత్రం పట్టించుకోలేదు. స్టేడియంలు ఫంక్షన్ హాళ్లుగా, సన్‌బర్న్‌లాంటి ఈవెంట్లకు వేదికలుగా మారిపోయాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. 2026లో ఖేలో ఇండియా నిర్వహణ హక్కులు మనకు కేటాయించాలని, 2036లో భారత్‌లో ఒలింపిక్స్ జరిగితే రెండు క్రీడాంశాలను హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. కొరియా యూనివర్సిటీ నుంచి కోచ్‌లు ‘రాష్ట్రంలో డ్రగ్స్ వాడకంతో యువత పెడదారి పడుతోంది. అటువంటివారిని సరైన మార్గంలోకి తెచ్చేందుకు క్రీడలే తగిన మార్గమని భావిస్తున్నాం. గత ఏడాది నేను కొరియా వెళ్లినప్పుడు అక్కడ 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి 16 మంది ఒలింపిక్ పతక విజేతలు వచ్చిన విషయం నన్ను ఆశ్చర్యపర్చింది. ఇప్పుడే అదే యూనివర్సిటీతో జత కట్టి కోచ్‌లను తీసుకురానున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీ కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది..’అని రేవంత్ ప్రకటించారు. సిరాజ్, నిఖత్ జరీన్, దీప్తిలాంటి ప్రతిభావంతులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఇంటి స్థలం, నగదు ప్రోత్సాహకాలతో ప్రభుత్వం అండగా నిలిచిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. 15 మందితో గవర్నింగ్ బోర్డు కొత్త స్పోర్ట్స్ పాలసీని సమర్థంగా నిర్వహించేందుకు 15 మందితో ప్రభుత్వం గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు మాజీ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా, కపిల్ దేవ్, భైచుంగ్ భూటియా, రవికాంత్ రెడ్డి, మాజీ అధికారులు పాపారావు, ఇంజేటి శ్రీనివాస్, వ్యాపారవేత్తలు సంజీవ్ గోయెంకా, ఉపాసన కామినేని, విటా దావి, కావ్య మారన్, సి.శశిధర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. పలు సంస్థలతో ఎంఓయూలు ‘స్పోర్ట్ కాంక్లేవ్’లో భాగంగా వేర్వేరు సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఫుట్‌బాల్ అకాడమీ కోసం ‘ఫిఫా’, ‘ఏఐఎఫ్ఎఫ్’లతో, ఒలింపిక్ వాల్యూస్ ప్రోగ్రామ్‌కు సంబంధించి అభినవ్ బింద్రాతో, షూటింగ్లో ప్రతిభాన్వేషణ, శిక్షణ కోసం ‘గన్ ఫర్ గ్లోరీ’అకాడమీతో, బాస్కెట్ బాల్ క్రీడలో ప్రతిభాన్వేషణ, అభివృద్ధి కోసం ‘స్పోర్ట్స్ ప్రిక్స్’సంస్థతో, క్రీడలతో పాటు చదువులో కూడా కెరీర్ మార్గనిర్దేశం చేసేలా ‘హర్ స్పోర్ట్స్ కీ చాంపియన్’సంస్థతో ఒప్పందాలు కుదిరాయి. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు చెందిన ‘టెన్విక్’సంస్థ రాష్ట్రంలోని 50 పాఠశాలల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా కూడా ఎంఓయూ కుదిరింది. -
బీసీలకు 32 శాతమే రిజర్వేషన్లు ఇచ్చే కుట్ర: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో ఆయా వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపాదిత 42 శాతం రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలని అందులో 10 శాతం ముస్లింలకు ఇస్తామంటే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన బీసీల మహాధర్నాలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పి, వాస్తవంగా 32 శాతం రిజర్వేషన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు కోసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్నాయకులు అసత్య ప్రచారం చేస్తూ, ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతపరమైన రిజర్వేషన్లు తొలగించి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని ప్రకటించారు. సీఎం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలిసీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ముస్లింలకు సంబంధం లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినా రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో జంతర్ మంతర్ వద్ద నిరసన డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు చీవాట్లు పెట్టాక బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెచ్చారని అన్నారు. రిజర్వేషన్లు అమలు చేయకుంటే సీఎం భరతం పడతంరిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి బీసీలను నిలువునా మోసం చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే రేవంత్‌రెడ్డి భరతం పడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో బీసీల రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించారని, బీసీల కళ్లలో మట్టి కొట్టిన బీఆర్ఎస్కు ఇప్పుడు ఆయా వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతూ..బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243– ఈ (6) ప్రకారం బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని తెలిపారు. బీసీలకు మేలు చేయకూడదన్న ఎజెండాతోనే కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మీరిచ్చే 42 శాతం రిజర్వేషన్లను కోర్టులు ఆపుతున్నాయా..? ఢిల్లీ ఆపుతుందా..?’అని ప్రశ్నించారు. సమావేశంలో బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్, బీజేపీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, డా.కాసం వెంకటేశ్వర్లు, ఆనంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కాళేశ్వరం’ వైఫల్యంలో బాధ్యులు వారే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్‌ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం. బరాజ్‌ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. నాడు సీఎం హోదాలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో బరాజ్‌ల అంచనాల పెంపు (ప్రైస్ అడ్జస్ట్మెంట్), కాంట్రాక్టర్లతో ఒప్పందాల సవరణ, వారికి ఫైనాన్షియల్ గ్యారంటీల విడుదల విషయంలో అధికారులపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని నిర్ధారించినట్లు తెలిసింది. మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది. కేసీఆర్ రెండు విధాలుగా బాధ్యుడు! విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలకు నాటి సీఎం కేసీఆర్ డైరెక్ట్‌గా, వైకారియస్గా బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది. న్యాయ పరిభాషలో వైకారియస్ అంటే సేవకులు చేసే తప్పిదాలకు యజమాని (మాస్టర్) పరోక్ష బాధ్యత వహించడం. అంటే సహచర మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు చేసిన తప్పిదాలకు సీఎంగా కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఇక ప్రత్యక్షంగా కూడా కేసీఆర్ పలు అవకతవకలకు పాల్పడినట్టు తెలిపింది. ఈటల, హరీశ్‌లది బాధ్యతారాహిత్యం! నాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ బాధ్యతలను గాలికి వదిలేశారని, కేఐపీసీఎల్ బోర్డులో ఆర్థిక శాఖ ఉన్నా పూర్తి బాధ్యతలను ఆ సంస్థకే వదిలేశారని కమిషన్ తప్పుబట్టింది. ఇక హరీశ్‌రావు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా ఆదేశాలు జారీ చేశారని, పరిపాలన వ్యవస్థను నిర్వీర్యం చేశారని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రుణాల సమీకరణ కోసం గత ప్రభుత్వం కేఐపీసీఎల్‌ను ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిందని కమిషన్ పేర్కొంది. దీనికి గతంలో, ప్రస్తుతం బోర్డులో సభ్యులుగా ఉన్న వారందరూ బాధ్యులేనని స్పష్టం చేసింది. నేరపూరిత విశ్వాసఘాతం, నిధుల దురి్వనియోగానికి వీరంతా బాధ్యులని పేర్కొంది. భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపింది. ఇష్టారాజ్యంగా వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు! ‘మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తికాక ముందే దాదాపుగా పూర్తైందని నిర్థారిస్తూ 2019 సెప్టెంబర్ 9న బరాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్‌స్టాన్షియల్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తైందని మళ్లీ 2021 మార్చి 15న మరో సర్టిఫికెట్ ఇచ్చారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో లోపాలు/లీకేజీలపై నిర్లక్ష్యం వహించి అవి సైతం పూర్తైనట్టు ఆయా బరాజ్‌ల క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు సర్టిఫికెట్లు జారీ చేశారు..’ అని కమిషన్ పేర్కొంది. ఇక బరాజ్‌ల నిర్వహణ, పర్యవేక్షణలో పూర్తిగా విఫలమైనందుకు గాను మాజీ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేంద్ర రావుతో పాటు డ్యామ్ సేఫ్టీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవాలను తొక్కిపెట్టిన మాజీ ఈఎన్సీలు బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాలి? లంప్సమ్ విధానంలో చేసుకోవాలా? టర్న్ కీ విధానంలోనా? అనే విషయంలో..మాజీ ఈఎన్సీ(జనరల్) సి.మురళీధర్, మాజీ సీఈ బి.హరిరామ్ వాస్తవాలను తొక్కిపెట్టారని కమిషన్ పేర్కొంది. నీటి లభ్యత విషయంలో నిపుణుల కమిటీ నివేదికను విస్మరించి కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) తప్పుదోవ పట్టించారని వెల్లడించింది. ఇక కమిషన్ ముందు హాజరై తప్పుడు సాక్ష్యం ఇచ్చిన సీడీఓ మాజీ సీఈ ఎ.నరేందర్ రెడ్డి, సీఈ టి.శ్రీనివాస్, కాళేశ్వరం బరాజ్ మాజీ ఈఈ ఓంకార్ సింగ్‌లను కమిషన్ తప్పుబట్టింది. నివేదిక తొక్కిపెట్టిన జోషి..బిజినెస్ రూల్స్ ఉల్లంఘించిన స్మిత మేడిగడ్డ బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ నిపుణుల కమిటీ సమర్పించిన కీలక నివేదికను ఎస్కే జోషీ తొక్కిపెట్టారని కమిషన్ పేర్కొంది. లేనిపక్షంలో బరాజ్ నిర్మాణం జరగక పోయేదని అభిప్రాయపడింది. ఇక స్మిత సభర్వాల్ బరాజ్‌ల నిర్ణయాలకు సంబంధించిన కీలకమైన ఫైళ్లను కేబినెట్ ముందుంచడంలో విఫలమయ్యారని, ఈ విషయంలో ఆమె బిబినెస్ రూల్స్‌ను ఉల్లంఘించారని పేర్కొంది. ఎల్ అండ్ టీకి ఆ అర్హత లేదు మేడిగడ్డ బరాజ్ నిర్మాణం పూర్తైందని నిర్ధారిస్తూ జారీ చేసిన సర్టిఫికెట్‌ను పొందడానికి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి అర్హత లేదని కమిషన్ పేర్కొంది. బరాజ్‌లో కుంగిపోయిన 7వ బ్లాక్‌ను తన సొంత ఖర్చుతో ఆ సంస్థ పునరుద్ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. డిఫెక్ట్ లయబిలిటీ కాలంలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో ఏర్పడిన లోపాలను గుర్తించి సరిచేయడంలో విఫలమైనందుకు ఆ రెండు బరాజ్‌ల నిర్మాణ సంస్థలూ బాధ్యత వహించాలని పేర్కొంది. బాధ్యులైన ఇంజనీర్లు వీరే.. మోడల్ స్టడీస్ నిర్వహించకుండానే డిజైన్ల తయారీ, నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం, థర్డ్ పార్టీతో డిజైన్లకు వెట్టింగ్ చేయించకపోవడం, నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను నీటిపారుదల శాఖలోని పలు విభాగాల ఇంజనీర్లను కమిషన్ బాధ్యులుగా తేల్చింది. విభాగాల వారీగా వారి పేర్లను ప్రస్తావించింది.. – సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నాటి చీఫ్ ఇంజనీర్ – తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ చీఫ్ ఇంజనీర్ – కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ – సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు -
నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందన
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని స్పష్టం చేసిందని.. ఈ దేశ న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ కేసులు, కొట్లాటలు కొత్త కాదు నాకు. నా జీవితమే ఒక పోరాటం’’ అంటూ చెప్పుకొచ్చిన కొండా సురేఖ.. ఏ కేసులోనైనా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమన్నారు.మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్‌పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
గచ్చిబౌలి అభివృద్ధికి అక్కడి క్రీడా మైదానాలే కారణం: సీఎం రేవంత్
హైదరాబాద్: క్రీడాకారుల ప్రోత్సాహం కోసం ప్రతేక పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి,. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కాంక్లేవ్ ఏర్పాటు చేశామన్నారు. గతంలో సరైన పాలసీ లేకపోవడంతో యువత పెడదారి పట్టిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మన గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు కొదవలేదని, క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు, నజరానాలు ఇచ్చామన్నారు. గచ్చిబౌలి అభివృద్ధికి అక్కడి క్రీడా మైదానాలే కారణమని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. హెచ్ఐసీసీ(HICC)లో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మంత్రి వాకిటి శ్రీహరి , సాట్ చైర్మన్ శివసేన రెడ్డి,క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జాతీయ ,అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రముఖులు, క్రీడా సంస్థల నిర్వాహకులు హజరయ్యారు. -
కేటీఆర్ పరువు నష్టం కేసు.. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్‌పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.కేటీఆర్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి మనోరంజన్ కోర్టు.. త్వరలో సీసీ నెంబర్ కేటాయించనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కోర్టు నేరంగా పరిగణించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత విడాకుల వంటి అంశాలపై కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు ప్రాథమికంగా నిరాధారమని కోర్టు భావించింది. కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ పోగుల వాదనలను వినిపించగా.. కోర్టు సమర్థించింది. సాక్ష్యుల వాంగ్మూలాలు, సమర్పించిన పత్రాలు, ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు తేల్చింది. కొండా సురేఖ తరపు న్యాయవాది వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. ఆయన లేవనెత్తిన పలు అంశాలను తిరస్కరించింది. -
‘సృష్టి’ కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కస్టడీ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతో పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు చేస్తామంటూ గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని పలు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలే టార్గెట్‌గా మెడికల్ క్యాంపులు నిర్వహించిన డాక్టర్ నమ్రత.. పేద మహిళలను గుర్తించింది. పేద మహిళల ఆర్థిక అవసరాలను గుర్తించి.. ఏజెంట్లు ట్రాప్‌లోకి లాగుతూ.. ఆర్థికంగా ఆశ చూపి పిల్లలను కన్న తర్వాత డబ్బులు ఇస్తామని ఎర వేసినట్లు పోలీసులు నిర్థారించారు.విశాఖపట్నం, విజయవాడ కేంద్రంగా డెలివరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డెలివరీ అయిన తర్వాత డాక్టర్ నమ్రత బృందం.. నవజాత శిశువును తీసుకుని తల్లికి డబ్బులు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. అలా నవజాత శిశువులను తీసుకొచ్చి డాక్టర్ నమ్రత బ్యాచ్.. చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతోంది. సరోగసి ద్వారా అద్దె గర్భంలో పుట్టిందంటూ బాధిత దంపతులకు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో హైదరాబాద్, ఏపీలో ఫామ్ హౌస్, భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మియాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, యూసఫ్‌గూడతో పాటు చాలా ప్రాంతాల్లో భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు విచారణలో బయపడ్డాయి.సృష్టి సెంటర్ కేసులో ఏ3 కల్యాణి, A6 సంతోషి స్టేట్మెంట్లు విచారణలో కీలకంగా మారనున్నారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఏజెంట్స్ ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డ డాక్టర్ నమ్రత.. కల్యాణి, సంతోషిలే దగ్గరుండి నవజాత శిశువులను తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. పోలీసుల విచారణలో డాక్టర్ నమ్రత అక్రమాలు.. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. -
మా నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా: బండి సంజయ్
కరీంనగర్: తనను మంత్రి పదవి నుంచి విముక్తి కల్పించాలంటూ తాను అధిష్టానాన్ని కోరినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. అవన్నీ అవాస్తవమని బండి సంజయ్ ఖండించారు. మంత్రి పదవి తనకు వద్దని గానీ, కావాలని గానీ తాను అధిష్టానానికి చెప్పలేదన్నారు. ఈ మేరకు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ ‘క్రమశిక్షణ గల బీజేపీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలాంటింది కాదు బీజేపీ. నాకు మా నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా నేను నిర్వహిస్తా’ అని తెలిపారు.రైతును రారాజున చేయడమే మోదీ లక్ష్యం.. చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానమంత్రి కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రై‘తును రారాజును చేయడమే మోదీ లక్ష్యం. 11 ఏళ్లలో రైతుల కోసం రూ. 71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మోదీది. రైతులు ఎరువుల కోసమే సబ్సిడీ రూపంలో రూ.11 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేశాం. కనీస మద్దతు ధర అందించేందుకు 16 లక్షల 35 వేల కోట్లు ఖర్చు చేసింది మోదీ సర్కారు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల ఖాతాల్లో రూ.3 లక్షల 69 వేల 561 కోట్లు జమ చేశాం. టెన్త్ బాగా చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు స్కూటీ ఇచ్చేందుకు యత్నిస్తా ’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ Vs బీఆర్ఎస్.. హత్నూరలో రచ్చ రచ్చ..
సాక్షి, సంగారెడ్డి: హత్నూర మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య పెద్ద రచ్చే జరిగింది. సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం కోసం కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. పాలాభిషేకం వద్దని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వారించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా.. బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణ నెలకొంది. మరోవైపు, పాలాభిషేకం చేయకుండా బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల పార్టీ శ్రేణులు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా నాయకులను చెదరగొట్టారు. -
ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. ఇన్నోవా కారులో ఎత్తుకెళ్లి..
సాక్షి, సికింద్రాబాద్: నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆవుల దొంగతనం కలకలం రేపుతోంది. మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండిమెట్ రెండో బజార్లో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బండిమెట్ ప్రాంతంలో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఇన్నోవా కారులో వెనుక భాగంలో వేసుకొని యువకులు పారిపోయారు.ఈ నెల 27 న రాత్రి సమయంలో కారులో ఆవులను తీసుకువెళ్తున్న క్రమంలో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవులను తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ యువకులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో కూడా మారేడుపల్లి పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.Shocking Incident of Cow Theft in #Bandimet Area Of #SecunderabadA disturbing case of cow theft has come to light in the Bandimet area, where a gang of youths allegedly stole cows by injecting them with anesthetics.According to eyewitnesses, the accused arrived in a luxury… pic.twitter.com/wfIa4EF6lA— BNN Channel (@Bavazir_network) August 2, 2025 -
‘ఎన్ని హామీలున్నాయో గుర్తుందా రేవంత్ రెడ్డి..?’
హైదరాబాద్: బీసీల కళ్లలో మట్టికొట్టిన పార్టీ బీఆర్ఎస్ అని బీజేపీ నాయకుడు, ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో బీసీ శాతం 23కు పడిపోయిందని, ఆ పార్టీకి ఓబీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 2) ఇండిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన ఓబీసీ మహాధర్నాలో ఈటల మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో అనేక అంశాలున్నాయి. స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం ఇస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఓటమిని అంగీకరించారు. డిక్లరేషన్ల పేరిట అనేక హామీలిచ్చారు. రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోలేకపోయామనీ, మోస పోయామని ప్రజలు అనుకుంటున్నారు. రిజర్వేషన్ల పేరుతో రేవంత్ రెడ్డి బీసీలను నిలువునా మోసం చేస్తున్నారు. 20 నెలలు దాటిపోయింది రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు?, మోసం చేసిన కాంగ్రెస్ అని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. పాత పద్ధతుల్లో ఫీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే సీఎం నీ భరతం పడతామని హెచ్చరికలు ఇస్తున్నాం..ఎన్ని హామీలున్నాయో గుర్తుందా రేవంత్ రెడ్డి..?బీసీ రిజర్వేషన్లపై కమిషన్ వేసిన రేవంత్ రెడ్డి, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌కు చట్ట బద్దత ఉంటదా..?, రిజర్వేషన్లపై మొట్టమొదటి కమిషన్ వేసిన రాష్ట్రం తమిళనాడు. చట్ట బద్దంగా 9th సెడ్యూల్ ల్లో చేర్చుకొని రిజర్వేషన్లను సాధించుకున్న తొలి రాష్ట్రం తమిళనాడు.డిల్లీకి వెళ్ళి రేవంత్ డ్రామాలు ఆడుతున్నారు, బీజేపీపై నెపం వేసే కుట్రలు చేస్తున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని కోర్టులు చెబుతున్నాయి. ఆర్టికల్ 340, కమిషన్ ఎంక్వారి 1942 ప్రకారం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళాలి. బీసీలను మోసం చేసే కుట్రలు రేవంత్ రెడ్డి మానుకోవాలి. రేవంత్‌కు ఆత్మశుద్ధి ఉంటే మంత్రి వర్గంలో బీసీలకు ఏం ఇచ్చారు..? ఏం శాఖలు ఇచ్చారో చెప్పాలి. బీఆర్ఎస్ ఉన్నంత కాలం బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ఉన్నంత కాలం బీసీ అధ్యక్షుడు కయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ హయాంలో బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు, భవిష్యత్‌లో కూడా చేస్తారనే నమ్మకం లేదు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి నీ భరతం పడతాం’ అని హెచ్చరించారు. -
సచివాలయ సందర్శకులకు క్యూఆర్ కోడ్
సాక్షి, హైదరాబాద్: సచివాలయ సందర్శకులకు ఇకనుంచి ‘విజిటర్ ఈ–పాస్ మేనేజ్మెంట్ సిస్టం’ను అమల్లోకి తీసుకురానున్నారు. దీనికోసం క్యూఆర్ కోడ్ ఉన్న విజిటర్ పాస్‌ను రూపొందించారు. దీనిలో అర్జీదారు పూర్తి వివరాలు నమోదవుతాయి. అర్జీదారు వచ్చిన సమయం నుంచి.. వెళ్లే వరకు అన్ని వివరాలను నమోదు చేస్తారు. ఎంతమంది అర్జీదారులు సచివాలయానికి వస్తున్నారు?, వాళ్లు ఏయే మంత్రుల పేషీకి వెళ్తున్నారు?, ఏ నంబర్ గదికి వెళ్తున్నారు? తదితర వివరాలను తీసుకుంటారు. ఈ–పాస్‌లతో మంత్రులు, పేషీకి ఇచ్చిన అర్జీల్లో ఎంత మొత్తం పరిష్కారం అవుతున్నాయో కూడా చూస్తారని సమాచారం. మరోవైపు అర్జీదారు పాస్ తీసుకున్న చోటికే వెళ్లారా? లేక ఇతర అధికారుల దగ్గరకు వెళ్లారా? అనేది తెలుసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం. పారదర్శకతతో పాటు జవాబుదారీతనం ఉంటుందని క్యూఆర్ కోడ్ విధానం అమలు చేయనున్నారు. గతంలో డిప్యూటీ సీఎం చాంబర్ ముందు కొంతమంది ఆందోళన చేసిన నేపథ్యంలో.. ఈ విధానానికి రూపకల్పన చేసినట్లు సమాచారం. -
పెళ్లి చేసుకోమని అడిగితే చంపేస్తారా?
వరంగల్ లీగల్ : ఓ మహిళ తనను వివాహం చేసుకోమని కోరగా కోపోద్రిక్తుడై ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం జమస్తాపురం గ్రామానికి చెందిన నేరస్తుడు చిన్నపాక అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సంతోషి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్‌కు చెందిన పార్వతితో చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌కు చెందిన సింగారపు బాబుకు వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల అనంతరం బాబు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో పార్వతి రంగశాయిపేటలో అద్దెకుంటూ కూలీ చేసుకుంటూ జీవించేది. పక్కనే అద్దెకుంటున్న చిన్నపాక అనిల్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై పార్వతి సోదరులు పలుమార్లు హెచ్చరించినా ఇరువురిలో మార్పు రాలేదు. దీంతో పార్వతిని తన తండ్రి స్వగ్రామం ఊకల్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పార్వతి తండ్రి మృతి చెందడంతో అనిల్ ఊకల్‌కు రావడం ప్రారంభించాడు. 2015, జూన్ 7న ఊకల్‌కు వచ్చిన అనిల్‌ను తనను వివాహం చేసుకోవాలని పార్వతి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్.. పార్వతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పార్వతి కేకలు విని చుట్టూ పక్కల వారు రాగా అనిల్ పరారయ్యాడు. పార్వతిని 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పార్వతి సోదరుడు వెంకన్న.. రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్ అధికారులు ఎస్.శ్రీనివాస్, ఆర్.సంతోష్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్‌కానిస్టేబుల్ సోమనాయక్, కానిస్టేబుల్ అనిల్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. -
అయిననూ పోయి రావలె.. నో ప్రాజెక్ట్, నో ఫండింగ్.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఢిల్లీకి 50 సార్లు చక్కర్లు కొట్టినా.. ఫలితం మాత్రం సున్నా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి.. ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు! అంటూ సెటైర్లు వేశారు. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశ్యం కాంగ్రెస్‌కు, సీఎంకు లేదన్నారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..50 TRIPS – ZERO RESULTS !హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్!తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా...✈️ ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి..ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు.కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు:మొదటి పని – ఫ్లైటు టికెట్ బుక్ చేయడం!రెండో పని – ఢిల్లీకి పోవడం!మూడో పని – ఖాళీ చేతులతో తిరిగి రావడం!రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదు..రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదు...సాగునీళ్లు రావు .. తాగునీళ్లు లేవు ..కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదుబనకచర్ల నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన లేదురెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదు .. జాబ్ క్యాలెండర్ల జాడ లేదురుణమాఫీ కాలేదు- రైతు భరోసా రాలేదుతులం బంగారం ఊసు లేదు .. రూ.4 వేల ఫించన్ జాడ లేదుగురుకులాల గోడు పట్టదు - గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదుకానీ రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్లు ఎక్కుతున్నాడు .. దిగుతున్నాడు“ఒక్కసారి కాదు… రెండు సార్లు కాదు…50 సార్లకు చేరిన హస్తిన యాత్రకానీ తెచ్చింది ఏమీ లేదు!శుష్కప్రియాలు .. శూన్య హస్తాలు అయిననూ పోయి రావలె హస్తినకు!కానీ ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి?? నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ…దానికి బదులు దక్కింది మాత్రం...👉 ఫోటో షూట్లు, వీడియోలు 👉 విందు రాజకీయాలు!రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి.. ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు! అంటూ ఘాటు విమర్శలు చేశారు. 50 TRIPS – ZERO RESULTS !హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్!తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా...✈️ ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి..ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు.కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు:మొదటి పని –… https://t.co/FaCLYRgY0n— KTR (@KTRBRS) August 2, 2025 -
'ఊరు' పాటకు కిరీటం
జాతీయ అవార్డుల్లో తెలంగాణ పల్లె పద సౌందర్యం మెరుపై మెరిసింది. తళుక్కున వెలిగింది. ‘బలగం’ సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన పాట ‘ఊరు పల్లెటూరు’ ఆ సినిమా విడుదలైనప్పుడే తెలుగు వారందరి మనసును తాకింది. పల్లె జీవనం అందరికీ ఇష్టమే కాబట్టి, ఆ పల్లెను మిస్సయ్యి పట్నవాసం, ప్రవాసం ఉండక తప్పదు కాబట్టి పాటలోని పల్లెతనాన్ని వినగానే అందరి ప్రాణం లేచివచ్చింది. కాసర్ల రచనకు భీమ్స్ అందించిన సంగీతం, మంగ్లి–రామ్ మిరియాల అందించిన గళం, దర్శకుడు వేణు ఎల్దండి దృశ్యరూపం అన్నీ కలిసి పాటను నిలబెట్టాయి. ఇప్పుడు జాతీయస్థాయిలో ఆ పాట గెలిచి తెలంగాణ గ్రామీణ సౌందర్యానికి అందిన వందనం స్వీకరించింది. ప్రయివేట్ గీతాల నుంచి జాతీయ పురస్కార గ్రహీతగా..‘ఊరు పల్లెటూరు’ పాటతో ఉత్తమ గేయ రచయితగా జాతీయ పురస్కారం అందుకోనున్న కాసర్ల శ్యామ్‌ది తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణవాడ. తండ్రి మధుసూదన్ రావు రంగస్థల, టీవీ, సినీనటుడు కావడంతో నటుడు కావాలనే ఆకాంక్ష శ్యామ్ చిన్నతనం నుంచే ఉండేది. అయితే సాహిత్యం పట్ల తనకున్న అభిలాషతో జానపద పాటలు రాయడం, పాడడంలో అనుభవాన్ని సంపాదించారు. వరంగల్ శంకర్, సారంగపాణి బృందంతో కలసి పలు ప్రదర్శనలు ఇవ్వడంతో గాయకుడిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కాలేజీ పిల్ల చూడరో.. యమ ఖతర్నాక్‌గుందిరో..’ శ్యామ్ రాసిన తొలి జానపద సాంగ్. ఆ తర్వాత సుమారు 50పైగా ఆల్బమ్స్‌కు పాటలు రాశారు. ఆ సమయంలోనే మిత్రుల సాయంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించగా.. ‘చంటిగాడు’(2003) సినిమాలో తొలి అవకాశం వచ్చింది. బాలాదిత్య, సుహాసిని జోడీగా బి. జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ‘కోకోకో .. కొక్కొరోకో, సిగ్గులొలికే సీతాలు’ పాటలతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘ప్రేమికులు’, ‘మహాత్మ’, ‘పటాస్’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘డీజే టిల్లు ‘అల వైకుంఠపురములో’... వంటి పలు సినిమాల్లో సుమారు 800కుపైగా పాటలు రాశారు శ్యామ్. తెలంగాణ మాండలికం, యాస, మాస్‌తోపాటు మెలోడీ గీతాలు రాయడంలో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. తన అభిమాన రచయిత చంద్రబోస్ అని చెబుతుంటారాయన. ఆయన భార్య రాధిక ఆర్కిటెక్ట్. ‘బలగం’ సినిమాలోని అన్ని పాటల్నీ కాసర్ల శ్యామ్ రాయగా ‘ఊరు.. పల్లెటూరు...’ పాటకిగానూ రచయితగా తొలి జాతీయ అవార్డు అందుకోనున్నారు. (చదవండి: స్త్రీ వాణి రాణించింది..!) -
ప్రజెంట్ సార్... అర్ధనగ్నంగా సెల్ఫీ దిగి..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పంచాయతీ కార్యదర్శులు నిత్యం డీఎస్ఆర్ యాప్‌లో సెల్ఫీ దిగి తమ హాజరును నమోదు చేయాలి. అనంతరం గ్రామంలో చేపట్టే పనుల ఫొటోలు పోస్టు చేయాలి. కానీ తంగళ్లపల్లి, సారంపల్లి గ్రామాల కార్యదర్శి మహ్మద్ సమీర్ జూలై 29, 30 తేదీలలో ఒంటిపై బట్టలు లేకుండా.. తన ఇంటిలోనే సెల్ఫీ దిగి హాజరు పూర్తిచేసినట్లు గుర్తించారు. దీనిపై తంగళ్లపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణను ‘సాక్షి’వివరణ కోరగా.. పంచాయతీ కార్యదర్శుల డీఎస్ఆర్ పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇలాంటివి జరిగినట్లు గుర్తిస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. సీఎం ఫొటోతో హాజరుపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన జగిత్యాల కలెక్టర్బుగ్గారం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోతో ఆన్లైన్లో హాజరు నమోదు చేసుకున్న జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చంద్రయ్యపల్లి పంచాయతీ కార్యదర్శిపై వేటు పడింది. కలెక్టర్ సత్యప్రసాద్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా పంచాయతీ కార్యదర్శుల హాజరు నమోదుపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు.. ఇటీవల ప్రత్యేక పరిశీలన జరిపారు. పలువురు పంచాయతీ కార్యదర్శులు తమ హాజరు నమోదు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తేలింది. చంద్రయ్యపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి టి.రాజన్న ఏకంగా ముఖ్యమంత్రి ఫొటోనే వాడి డీఎస్ఆర్ (డైలీ శానిటేషన్ రిపోర్ట్)యాప్‌లో హాజరు నమోదు చేసుకున్నాడు. ఉన్నతాధికారుల పరిశీలనలో విషయం బయటపడడంతో.. కలెక్టర్ సత్యప్రసాద్ కార్యదర్శి రాజన్నను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై బుగ్గారం ఎంపీడీవో అఫ్జల్మియాను వివరణ కోరగా.. హాజరు నమోదుకు సంబంధించి కారోబార్ చేసిన పొరపాటుతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. -
మంత్రి కారే అడ్డుగా ఉందంటావా ?
హైదరాబాద్: మంత్రి కారు ఎక్కడ పెట్టాలో కూడా మీరు చెప్తారా..? మీ సీఐ ఎవరు పిలవండి... సస్పెండ్ చేయిస్తా ఏమనుకుంటున్నారో..? నేనేమైనా కారును అడ్డంగా పెట్టానా కామన్ సెన్స్ లేదా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాఫిక్ ఎస్ఐ రామ్ మనోహర్‌తో పాటు, బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులపై రుసరుసలాడారు. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం బంజారాభవన్‌లో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి కారు డ్రైవర్ భవన్ గేటు ఎదుట కారును ఆపాడు. కారు అడ్డుగా ఉందని కాస్తా పక్కకు తీయాలని బంజారాహిల్స్ ట్రాఫిక్ సీఐ సాయి ప్రకాశ్ డ్రైవర్‌కు సూచించాడు. మంత్రిగారు కారు ఇక్కడే పెట్టమన్నారని మేము ఇలాగే పెడతామని డ్రైవర్ చెప్పడంతో ట్రాఫిక్ సీఐకి డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సీఐ కారును పక్కకు పెట్టించారు. కార్యక్రమం ముగించుకుని బయటికి వచ్చిన మంత్రికి వారు ఈ విషయాన్ని చెప్పడంతో ఆయన అక్కడే విధుల్లో ఉన్న అడిషనల్ డీసీపీ గోవర్ధన్‌ను పిలిచి మాట్లాడారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ రామ్ మనోహర్‌ను పిలిచి మందలించారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సస్పెండ్ చేయిస్తా, సస్పెండ్ చేయించే వరకు ఇక్కడి నుంచి కదలనంటూ మంత్రి అధికారులకు ఫోన్ కలిపారు. ఇంతలోనే కిందికి వచ్చిన ఎమ్మెల్యే దానం అధికారులకు, మంత్రికి సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపించారు. -
బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటే లోక్‌సభలో కొట్లాడేవారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు లోక్‌సభలో డజను మంది ఎంపీలు ఉంటే బనకచర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలని ఆదేశించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించాలనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. ఎర్రవల్లి నివాసంలో మూడు రోజులుగా ముఖ్య నేతలతో భేటీ నిర్వహిస్తున్న కేసీఆర్ శుక్రవారం కూడా సమావేశం కొనసాగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు శుక్రవారం జరిగిన భేటీలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. – రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయాలి. 8న కరీంనగర్లో సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం విజ్ఞప్తి చేద్దాం’అని కేసీఆర్ సూచించారు. – సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల సన్నద్ధతను ఇప్పటినుంచే ప్రారంభించాలని ఆదేశించారు. – స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా గట్టిగా కృషి చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందనే అంశంపై స్పష్టత లేదు. అయినా ఎన్నికల సన్నద్ధతకు పార్టీ నేతలు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. – స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దాం. ప్రభుత్వ విధానాలు, తెలంగాణకు జరిగే అన్యాయాలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యేలా కార్యాచరణ ఉంటుందని ఈ భేటీల్లో కేసీఆర్ ప్రకటించారు. -
గొర్రెల స్కామ్ రూ.1,000 కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకుపైనే గోల్మాల్ జరిగినట్టు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం 200లకు పైగా మ్యూల్, డమ్మీ బ్యాంక్ అకౌంట్లతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, బ్రోకర్లు కలిసి సర్కార్ ఖజానాకు గండి కొట్టినట్టు ఈడీ వెల్లడించింది. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం ఎనిమిది ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. నాటి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా ఉన్న జి.కల్యాణ్‌కుమార్, కొందరు వినియోగదా రులు, మరో మధ్యవర్తి ఇంట్లో ఈ సోదాలు చేసినట్టు పేర్కొన్నారు. సోదాల్లో భాగంగా 200 డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్ బుక్స్, డెబిట్ కార్డులు, 31 మొబైల్ ఫోన్లు, 20కి పైగా సిమ్ కార్డులను స్వాధీనంచేసు కున్నట్టు తెలిపారు. ఈ అకౌంట్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌కు జరి గిన లావాదేవీల లింకులను కూడా ఈడీ అధికారులు గుర్తించారు. గొర్రెల పంపిణీ పథ కంలో కొల్లగొట్టిన కోట్ల రూపాయలను దారి మళ్లించేందుకు బెట్టింగ్ యాప్స్‌ను ఉప యోగించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. రూ.2.1 కోట్లతో మొదలై.. రూ.వందల కోట్లకుగొర్రెల పెంపకం, అభివృద్ధి పథకం (షీప్ రియరింగ్ డెవలప్మెంట్ స్కీం–ఎస్ఆర్డీఎస్) కేసు ఆది నుంచి కీలక మలుపులు తిరుగుతోంది. తమ వద్ద కొనుగోలు చేసిన గొర్రెల యూనిట్లకు సంబంధించి రూ.2.1 కోట్ల డబ్బు తమకు ఇవ్వకుండా పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు అక్రమంగా ఇతర అకౌంట్లకు మళ్లించారని కొందరు గొర్రెల విక్రేతలు ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా ఉన్న జి.కల్యాణ్‌కుమార్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని కొన్ని రికార్డులను ధ్వంసం చేసి తీసుకెళ్లాడు. ఈ రెండు కేసుల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. కల్యాణ్‌కుమార్ సహా ఫిష్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ ఫెడరేషన్ మాజీ సీఈఓ రాంచందర్‌నాయక్, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి, శ్రీనివాస్‌రావు, బ్రోకర్లు సహా మొత్తం17 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్–2002) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కుంభకోణంలో తొలుత రూ.2.1 కోట్ల మేర అవినీతి బహిర్గతమైంది. ఆ తర్వాత కాగ్ ఇచ్చిన నివేదికతో రూ.253.93 కోట్లకు ఈ కుంభకోణం చేరింది. తాజాగా ఈడీ అధికారుల సోదాల్లో లభించిన ఆధారాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో కలిపి మొత్తం రూ.వెయ్యికోట్లకుపైనే అవినీతి జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. గొర్రెల పంపిణీ చేయకుండానే..నిధులు పంచుకుతిన్నారు గొర్రెల పంపిణీ పథకంలో ‘నీకిది నాకది’(కిక్‌బ్యాక్) తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ప్యాసింజర్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు సహా నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో బిల్లులు, గొర్రెల యూనిట్లకు డూప్లికేట్ ట్యాగ్లు, మృతి చెందిన వారి పేర్లతో యూనిట్లు కేటాయించడం వంటి అక్రమాలను గుర్తించింది. గొర్రెల స్కీమ్ నిధులు డిపాజిట్ అయిన లబ్ధిదారుల్లో చాలామంది ఈ పథకం ప్రారంభానికి ముందు గొర్రెల వ్యాపారంలో లేరని ఈడీ అధికారులు నిర్ధారించారు. ఎటువంటి కొనుగోలు, అమ్మకాలు జరగలేదని గుర్తించారు. కేవలం కాగితాలపైనే గొర్రెల కొనుగోలు, నకిలీ వాహనాలు, లబ్ధిదారుల పేర్లతో ప్రభుత్వ నిధులను నకిలీ సరఫరాదారుల ఖాతాల్లోకి మళ్లించారని తేల్చారు. నకిలీ సరఫరాదారులకు చెల్లింపులు, గొర్రెలను మళ్లీమళ్లీ చూపించి ప్రభుత్వ నిధులను కొల్లగొట్టి భారీ అక్రమాలకు తెర తీసినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. లబ్ధిదారుల వివరాలు సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా వాహనాల బిల్లు, చెల్లింపుల రికార్డులు, ఇన్వాయిస్లు సరిగ్గా లేని రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది. తాజా సోదాల్లో కీలక ఆధారాలు కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని జి.కల్యాణ్‌కుమార్ ఇంటితోపాటు రాంచందర్‌నాయక్, రవికుమార్, కేశవసాయి, శ్రీనివాస్‌రావు, లోలోనా ది లైవ్ కాంట్రాక్ట్ సంస్థ యజమానులు మొయిద్దీన్, ఇక్రముద్దీన్ ఇళ్లు, ఆఫీసులు సహా మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన కల్యాణ్‌కుమార్ ఇంట్లో పలు కీలక ఆధారాలు ఈడీ అధికారులు గుర్తించారు. డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్‌బుక్స్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధ, గురువారాల్లో కల్యాణ్కుమార్తోపాటు మరో ఇద్దరిని బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు.. వారిని వేర్వేరుగా విచారించారు. కల్యాణ్‌కుమార్ అరెస్టుకు ఈడీ అధికారులు చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది. బెట్టింగ్‌యాప్ వ్యవహారంతో కొత్త మలుపు ఇప్పటి వరకు గొర్రెల కొనుగోళ్లలో అక్రమాలు..గొర్రెల పంపిణీ పేరిట లబ్ధిదారులకు చేరకుండానే నిధుల మళ్లింపునకు పరిమితమైన ఈ కుంభకోణంలో ఈడీ తాజా తనిఖీలతో బెట్టింగ్‌యాప్‌ల లింక్ బయటపడింది. గొర్రెల కొనుగోలు కుంభకోణం నిధుల మళ్లింపునకు వాడిన డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్‌బుక్స్, డెబిట్ కార్డులు ఓ ఆన్లైన్ బెట్టింగ్‌యాప్‌తో లింక్ అయినట్టు అధికారులు గుర్తించారు. గొర్రెల కొనుగోలు డబ్బును విదేశాలకు చేర్చేందుకు లేదంటే దారి మళ్లించేందుకు ఈ బెట్టింగ్ యాప్స్‌ను వాడుకున్నారా? అన్న కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
కాళేశ్వరం నివేదికపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలు, అవినీతిపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ (పీసీ ఘోష్) కమిషన్ సమర్పించిన నివేదికపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతిని కమిటీలో సభ్యులుగా నియమించింది. నివేదికను అధ్యయనం చేసి.. దాని సారాంశం (జిస్ట్) సిద్ధం చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేసేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ నెల 4వ తేదీన ఈ నివేదికపై చర్చించడానికి సింగిల్ పాయింట్ ఎజెండాతో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఆ సమావేశంలో నివేదికపై విస్తృతంగా చర్చించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేసే అవకాశం ఉంది. సీఎం చేతికి నివేదికజూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డికి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికను శుక్రవారం సీల్డ్ కవర్లలో అందజేశారు. నివేదికను అందుకున్న వెంటనే దానిపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. 4న జరిగే మంత్రివర్గ సమావేశంలోపు నివేదిక సారాంశాన్ని ఈ కమిటీ అందించనుంది. కేబినెట్లో చర్చించిన తర్వాత రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నివేదికను ప్రభుత్వం సభ ముందుంచే అవకాశాలు ఉన్నాయి. శాసనసభలో దీనిపై చర్చించాకే తదుపరి చర్యల దిశగా అడుగులు పడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, నివేదిక అందించే సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సీఎం కొద్దిసేపు చర్చించినట్లు తెలిసింది. ప్రణాళిక లోపమేనా?కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయిన విషయం విదితమే. ఈ నిర్మాణ లోపాలతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో విచారణ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బరాజ్‌లకు సంబంధించి ప్రణాళిక, నమూనాలు, నాణ్యత, నిర్వహణ ప్రధాన లోపాలు కాగా, స్థల ఎంపిక కూడా ఇందుకు కారణమన్న అభిప్రాయాన్ని కమిషన్ తన నివేదికలో వ్యక్తంచేసినట్లు చెబుతున్నారు. ఈ బరాజ్‌ల నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు, చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సహా దాదాపు 150 మందిని విచారించిన తరువాత ఈ నివేదికను నివేదిక రూపొందించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతకలు చోటు చేసుకున్నట్లు కమిషన్ నివేదికలో వెల్లడించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్ మార్పుపై నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అనే అంశంపై కమిషన్ స్పష్టతనిచ్చిందని అంటున్నారు. -
సర్కారు బడికి ‘రాం’ రాం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో (గవర్నమెంట్, లోకల్ బాడీ) చేరుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. సర్కారు బడుల్లో అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు, డిజిటల్ పద్ధతిలో బోధన చేస్తున్నా కార్పొరేట్ స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2019–20 నుంచి 2021–22 వరకు సర్కారు బడుల్లో పెరిగిన ఎన్రోల్మెంట్.. ఆ తర్వాత 2022–23, 2023–24ల వరకు వచ్చే సరికి గణనీయంగా పడిపోయింది.2024–25లో కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల చేరిక ఆశాజనకంగా లేదని యూనిఫైడ్ డిస్టిక్ట్ర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్‌ఇ) నివేదికలు చెబుతున్నాయి. 2019–20 నుంచి 2023–24ల వరకు ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా సర్కారు బడుల్లో నమోదైన విద్యార్థుల గణాంకాలను రెండు రోజుల కిందట కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 2021–22 సంవత్సరంలో నమోదైన విద్యార్థుల సంఖ్య.. 2023–24లోని సంఖ్యతో పోలిస్తే రెండు సంవత్సరాల్లో 1,57,50,281 మంది తగ్గారు.దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి..ఏటేటా సర్కారు బడుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2019–20లో 13,09,31,634 మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా సర్కారు బడుల్లో ఉంటే.. 2020–21 నాటికి ఆ సంఖ్య 13,49,04,560లకు చేరింది. మరుసటి సంవత్సరం 2021–22లో 14,32,40,480 లకు పెరగ్గా ఆ తర్వాత నుంచి ఎన్రోల్మెంట్ తగ్గింది. 2022–23లో 13,62,04,917లు కాగా, 2023–24 నాటికి 12,74,90,199లకు పడిపోయినట్లు రికార్డులు చెప్తున్నా యి. ఈ లెక్కన అత్యధికంగా రెండేళ్లలో బిహార్‌లో 45,22,871, ఉత్తరప్రదేశ్‌లో 31,88,070, రాజస్థాన్‌లో 15,30,705, మధ్యప్రదేశ్‌లో 7,57,974, తెలంగాణలో 5,23,986 మంది సర్కారు బడులకు దూరం అయ్యారు. ఒడిశా, లక్షదీప్‌లు మినహా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి పలు రాష్ట్రాల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా తగ్గింది.ఉమ్మడి వరంగల్‌లో మూతబడులురాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు మొత్తం 18,254 ఉండగా.. వాటిల్లో 6,90,816 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఒక్కో బడిలో సగటు పిల్లల సంఖ్య 38 మాత్రమే. ఏకంగా 1,864 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి లేనట్లు అప్పట్లో అధికా రులు ప్రకటించడం గమనార్హం. కాగా ఉమ్మడి వరంగల్లోనూ 298 వరకు ప్రభుత్వ పాఠశాల లు మూత బడినట్లు అధికారులు పేర్కొన్నారు. సర్కారు బడుల్లో సంఖ్య తగ్గడానికి గురుకు లాలు, మోడల్ స్కూళ్లు కారణమవగా.. ఏమాత్రం ఆర్థిక స్తోమత లేని వారు, గురుకులాల్లో సీట్లు దక్కని వారు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు బడుల్లో చేరుతున్నారని ఉపాధ్యా యులు చెప్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో నాణ్యత తక్కువగా ఉంటుందని భావించి, ప్రైవే టు పాఠశాలలకు ప్రాధాన్యం ఇస్తు న్నారన్న ప్రచారం కూడా ఉంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలు ఉండటం వల్ల కూడా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపడానికి ఇష్టపడటం కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెప్తున్నారు.మూతబడులను పునఃప్రారంభించాలి సర్కారు బడులకు పిల్లలు రావడం లేదని చాలాచోట్ల స్కూల్స్ మూసేస్తున్నారు. ఇదే కారణంతో నేను చదువుకున్న కుమ్మరికుంట తండా బడిని కూడా బంద్ చేశారు. పాఠశాలలో అన్ని వసతులు కల్పించి తిరిగి ప్రారంభించాలి. ఆ బడిని అన్ని వసతులతో మళ్లీ తెరిపిస్తే చాలామంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్నాం. జిల్లా పాలనాధికారులు విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలలను పునఃప్రారంభించాలి. – బానోత్ శ్రీను, కుమ్మరి కుంట తండా, మహబూబాబాద్ జిల్లా -
ఈ నెలలో వర్షాలు సాధారణమే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు సాధారణ స్థితిలోనే నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్ నెలలో తీవ్ర లోటువర్షపాతం నమోదు కాగా... జూలైలో కాస్త ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్ర వర్షపాతం గణాంకాలు సాధారణ స్థితికి చేరాయి. ప్రస్తుతం నాలుగైదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర సగటు గణాంకాలు లోటు దిశగా పడిపోతున్నాయి. ప్రస్తుతం ఆగస్టు నెలలో వర్షాలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆగస్టు నెల వర్షపాతం అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. ఈ నెలలో వర్షాలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, 94 శాతం నుంచి 106 శాతం మధ్యలో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్ ద్వితీయార్ధంలో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదైతేనే రైతాంగానికి లాభం చేకూరుతుందని వ్యవసాయ శాఖ చెబుతుండగా.. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాలు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. మండుతున్న ఎండలు... రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. పగటి పూట తీవ్ర ఉక్కపోతతో కూడిన వాతావరణం... రాత్రిపూట సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో భాగంగా ద్వితీయార్ధం ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉండగా... ప్రస్తుతం అధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఈ నెలలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, రాత్రిపూట మాత్రం సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని సూచించింది. నైరుతి సీజన్లో ఆగస్టు 1 వరకు 36.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 34.24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మూడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా... 24 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 6 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. -
బాబును దత్తత మాత్రమే ఇచ్చాను.. సరోగసీ అని చెప్పలేదు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సృష్టి ఆస్పత్రి కేసు వ్యవహారంలో కీలకమైన ఏ1 ముద్దాయి డాక్టర్ నమ్రత పోలీసుల విచారణలో నోరు విప్పడం లేదు. పిల్లలు లేరని తన దగ్గరకు వచి్చన మహిళకు తాను కేవలం బాబును దత్తత ఇప్పించానని పోలీసులకు ఇచి్చన వాంగ్మూలంలో చెప్పినట్లు తెలిసింది. అది తప్ప ఇక ఏ విషయంలోనూ ఆమె నోరు విప్పకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో డాక్టర్ నమ్రతను శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు పోలీసులు విచారించేందుకు కోర్టు నుంచి కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో డీసీపీ, ఏసీపీతో పాటు గోపాలపురం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు వివిధ అంశాల గురించి ఆమెను గుచి్చగుచ్చి ప్రశ్నించినా ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదని తెలిసింది. తను ఎలాంటి తప్పూ చేయలేదని, తనకు బిడ్డ కావాలని, తన భర్త విదేశాల్లో ఉంటారని ఓ మహిళ తన దగ్గరకు రాగా దత్తత ఇప్పించానని మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలిసింది. అంతకుమించి ఆమె నుంచి ఎటువంటి వివరాలూ పోలీసులు రాబట్టలేకపోయారు. ఆస్పత్రినుంచి సేకరించిన రికార్డుల్లో అనుమానం వచ్చిన కేసుల గురించి ప్రశ్నించినా డాక్టర్ నమ్రత తనకు గుర్తు లేదని చెప్పినట్లు తెలిసింది. ఇక్కడ సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా మాత్రమే జరగడంతో చాలా కేసులు రికార్డుల్లోకి ఎక్కలేదు. ఇంకా నాలుగు రోజులపాటు పోలీసులు డాక్టర్ నమ్రతను విచారించనున్నారు. పోలీసు కస్టడీకి మరో ఇద్దరు నిందితులు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. శుక్రవారం వైజాగ్‌కు చెందిన ఏ3–కల్పన, అమీర్‌పేట్‌కు చెందిన ఏ6 సంతోషిలను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. శనివారం వారిని పోలీసులు విచారించనున్నారు. బాబును అసలైన తల్లిదండ్రుల నుంచి తీసుకుని వచ్చి రాజస్తాన్‌కు చెందిన దంపతులకు అందించడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది.