breaking news
Other Sports
-
భారత స్టార్‌కు ఊహించని షాక్
జాగ్రెబ్ (క్రొయేషియా): స్వర్ణ పతకం గెలవడమే లక్ష్యంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సిద్ధమైన భారత స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ఊహించని షాక్ ఎదురైంది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన ఈ రెజ్లర్ అనర్హతకు గురయ్యాడు. తన వెయిట్ కేటగిరీలో అధిక బరువు వల్లే అతను ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించాడు. సాధారణంగా.. పోటీలకు ముందు రెజ్లర్‌కు బరువును (వెయింగ్) చూస్తారు.1.7 కేజీలు అధిక బరువుపురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో తలపడేందుకు సిద్ధమైన అమన్ ఉండాల్సిన బరువుకంటే ఏకంగా 1.7 కేజీలు (1700 గ్రాములు) అధిక బరువు ఉండటంతో నిర్వాహకులు డిస్క్వాలిఫై చేశారు. ‘ఇది చాలా దురదృష్టకరం. అమన్లాంటి రెజ్లర్ తన బరువును అదుపులో ఉంచుకోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. బరువును తూచే వెయింగ్ మిషిన్‌పై అతను నిలబడితే 1.7 కేజీలు అధికంగా ఉన్నట్లు కనిపించింది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. అతను అంత బరువు ఎలా పెరిగాడో అర్థమవడం లేదు’ అని జాగ్రెబ్‌లో ఉన్న భారత జట్టు అధికారి ఒకరు వెల్లడించారు.100 గ్రాములు ఎక్కువ ఉన్నాకాగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనల ప్రకారం ప్రపంచకప్, ర్యాంకింగ్ సిరీస్ టోర్నీల్లో ఉండాల్సిన బరువు కంటే రెండు కేజీల అదనపు బరువును కూడా అనుమతిస్తారు. అయితే ప్రపంచ చాంపియన్ షిప్, ఒలింపిక్స్‌లాంటి మెగా టోర్నీల్లో మాత్రం 100 గ్రాములున్నా వెంటనే అనర్హత వేటు వేస్తారు. నెల వ్యవధిలోనేగత నెల 25నే అమన్ జాగ్రెబ్‌కు చేరుకున్నాడు. పలువురు భారత రెజ్లర్లతో కలిసి ఈవెంట్ కోసం ముమ్మరసాధనలో నిమగ్నమయ్యాడు. కానీ ఇంత చేసీ కీలకమైన బరువును అదుపులో ఉంచుకోవడంలో విఫలమయ్యాడు. నెల వ్యవధిలోనే భారత బృందానికి ఇది రెండో డిస్క్వాలిఫై! మహిళా రెజ్లర్ నేహా సాంగ్వాన్ (59 కేజీల కేటగిరీ) గత నెల బల్గేరియాలో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 600 గ్రాములు అధిక బరువు వల్ల అనర్హతకు గురైంది.నిజానికి ఆమె తాజాగా క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో జరుగుతున్న ఈవెంట్లో కూడా పాల్గొనేందుకు సీనియర్ జట్టుకు ఎంపికైంది. అయితే బరువు నియంత్రణలో పదేపదే నిర్లక్ష్యం వహిస్తున్న ఆమెను భారత రెజ్లింగ్ సమాఖ (డబ్ల్యూఎఫ్ఐ) ఈ టోర్నీ నుంచి తప్పించడంతో పాటు రెండేళ్ల నిషేధం కూడా విధించింది. ఆరోజు హృదయం ముక్కలుపారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కష్టపడి ఒక్కో విజయంతో ఫైనల్‌కు చేరింది. ఓడినా కనీసం రజతం ఖాయమనుకుంటే... స్వర్ణ పతక పోరుకు నిమిషాల ముందు ఆమె కేవలం 100 గ్రాముల అధిక బరువుతో బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయింది. ఇది ఆమెనే కాదు భారత క్రీడాలోకానికే గుండె పగిలినంత పనైంది. -
అటు సెవిల్లె... ఇటు మెలిస్సా
టోక్యో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జమైకా కొత్త చిరుత ఒబ్లిక్ సెవిల్లె పురుషుల 100 మీటర్ల స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసును ఒబ్లిక్ 9.77 సెకన్లలో ముగించి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఉసెన్ బోల్ట్ (2016) తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గిన తొలి జమైకా రన్నర్‌గా ఒబ్లిక్ సెవిల్లె నిలిచాడు. సెవిల్లెకు ఇదే వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కాగా... జమైకాకే చెందిన ఒలింపిక్ రజత పతక విజేత కిషానె థామ్సన్ (9.82 సెకన్లు) రజతం దక్కించుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్, అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ (9.89 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. ‘ప్రపంచ చాంపియన్‌షిప్ పురుషుల 100 మీటర్ల పరుగులో ఉసెన్ బోల్ట్ తర్వాత జమైకా అథ్లెట్‌కు స్వర్ణం దక్కడం ఇదే తొలిసారి. ఈ టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యా. సెమీస్‌లో నా ప్రదర్శనతో సంతృప్తిపడలేకపోయా. ఫైనల్లో శక్తినంతా కూడగట్టుకొని ప్రయత్నించా. నా పూర్తి సామర్థ్యంతో పరుగు తీస్తే... అందరికంటే ముందు నిలవగలనని విశ్వసించా’ అని 24 ఏళ్ల సెవిల్లె వెల్లడించాడు. పోటీలో ఉన్న అందరిలో అత్యుత్తమ వ్యక్తిగత టైమింగ్ ఉన్న థామ్సన్ ఆరంభంలోనే వెనుకబడిపోయాడు. ఇక అక్కడి నుంచి ఏ దశలోనూ సెవిల్లెను వెనక్కి నెట్టలేకపోయిన ఈ జమైకా అథ్లెట్ రెండో స్థానంతో సంతృప్తి పడాల్సి వచి్చంది. మహిళల 100 మీటర్లలో అమెరికా అథ్లెట్ మెలిస్సా జెఫర్సన్ వుడెన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో మెలిస్సా 10.61 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా అవతరించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇది సంయుక్తంగా అత్యుత్తమ టైమింగ్ కాగా... రెండో స్థానంలో నిలిచిన టీనా క్లాటన్ కంటే 0.15 సెకన్ల ముందే మెలిస్సా రేసు పూర్తి చేసింది. వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఇదే అత్యధిక గెలుపు వ్యత్యాసం. జమైకాకు చెందిన టీనా క్లాటన్ (10.76 సెకన్లు), జూలియన్ అల్ఫ్రెడ్ (10.84 సెకన్లు; సెయింట్ లూసియా) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. జమైకా స్టార్ అథ్లెట్ షెల్లీ ఆన్ ఫ్రెజర్ ప్రైస్ 11.3 సెకన్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. రెండో రోజు పోటీలు ముగిసేసరికి అమెరికా 5 స్వర్ణాలు, ఒక కాంస్యంతో మొత్తం 6 పతకాలు సాధించి పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతుండగా... కెన్యా (2 స్వర్ణాలు), జమైకా (1 స్వర్ణం, 2 రజతాలు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా ఒక్కో పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాయి. -
తుది పోరులో తడబాటు
హాంగ్జౌ (చైనా): వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీకి నేరుగా అర్హత సాధించాలని ఆశించిన భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడింది. ఆతిథ్య చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో సలీమా టెటె నాయకత్వంలోని టీమిండియా 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ మొదలైన తొలి నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను నవ్‌నీత్ కౌర్ గోల్‌గా మలచడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చైనా పుంజుకోవడంతో భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. 21వ నిమిషంలో జిజియా ఒయు గోల్‌తో చైనా స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత హాంగ్ లీ (41వ నిమిషంలో), మెరోంగ్ జు (51వ నిమిషంలో), జియాకి జాంగ్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ చేసి చైనాకు విన్నర్స్ ట్రోఫీతోపాటు ప్రపంచ కప్ బెర్త్‌ను అందించారు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఐదు పెనాల్టీ కార్నర్లు... చైనాకు ఆరు పెనాల్టీ కార్నర్లు రాగా... రెండు జట్లు ఒక్కో దానిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాయి. భారత క్రీడాకారిణి ఉదిత ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును గెల్చుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 2–1తో దక్షిణ కొరియాను ఓడించింది. -
జైస్మీన్, మీనాక్షి ‘పసిడి’ పంచ్
లివర్‌పూల్ (ఇంగ్లండ్): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు నాలుగు పతకాలతో మెరిశారు. జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు) పసిడి పతకాలతో అదరగొట్టగా... నుపుర్ షెరాన్ (ప్లస్ 80 కేజీలు) రజత పతకం, పూజా రాణి (80 కేజీలు) కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో హరియాణాకు చెందిన మీనాక్షి ఫైనల్లో 4–1తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత కిజైబీ నజిమ్ (కజకిస్తాన్)ను బోల్తా కొట్టించి తన కెరీర్లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. గత జూలైలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో కిజైబీ చేతిలో ఎదురైన పరాజయానికి మీనాక్షి ఈ గెలుపుతో బదులు తీర్చుకుంది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన 57 కేజీల ఫైనల్లో హరియాణాకే చెందిన జైస్మీన్ 4–1తో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత జూలియా జెరెమెటా (పోలాండ్)ను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. ‘నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. గత రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో క్వార్టర్ ఫైనల్స్‌లో వెనుదిరిగాను. ఈసారి ఎలాగైనా విజేతగా తిరిగి రావాలనే లక్ష్యంతో నా ఆటతీరులో మార్పులు చేసుకొని అనుకున్న ఫలితాన్ని సాధించాను’ అని జైస్మీన్ వ్యాఖ్యానించింది. ప్లస్ 80 కేజీల ఫైనల్లో నుపుర్ 2–3తో అగాటా కమర్స్‌కా (పోలాండ్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 80 కేజీల సెమీఫైనల్లో పూజా రాణి 1–4తో ఎమిలీ (ఇంగ్లండ్) చేతిలో పరాజయం పాలై కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 10 ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత మహిళా బాక్సర్లు. ఈ జాబితాలో మేరీకోమ్, నిఖత్ జరీన్, సరితా దేవి, జెన్నీ, లేఖ, నీతూ, లవ్లీనా, స్వీటీ బూరా, జైస్మీన్, మీనాక్షి ఉన్నారు. -
భారత్ ఖాతాలో మరో గోల్డ్‌మెడల్.. ఫైనల్లో మీనాక్షి అదుర్స్
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్- 2025లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. మహిళల 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా బంగారు పతకం చేసుకుంది. ఆదివారం జరిగన ఫైనల్ పోరులో కజకిస్తాన్‌కు చెందిన నాజిమ్ కైజైబేను 4-1 స్ప్లిట్ డెసిషన్‌తో మీనాక్షి ఓడించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన నాజిమ్ నుంచి భారత బాక్సర్‌కు గట్టి పోటీ ఎదరైంది. ప్రత్యర్ధిపై తన పంచ్‌లతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మీనాక్షి.. తొలి రౌండ్‌ను 4-1తో సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాజిమ్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. దీంతో రెండో రౌండ్లో మీనాక్షిపై నాజీమ్ 3-2తో విజయం సాధించింది. మూడో రౌండ్లో ఈ ఇద్దరూ బాక్సర్లు హోరాహోరీగా తలపడ్డారు. నిర్ణీత సమయంలో ఎవరూ పాయింట్లు సాధించకపోవడంతో నలుగురు న్యాయమూర్తులు మీనాక్షికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో 4-1 తేడాతో మీనాక్షి స్వర్ణం సొంతం చేసుకుంది. ఇదే టోర్నమెంట్లో భారత బాక్సర్ లంబోరియా 57 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది. -
PKL 12: తమిళ్ తలైవాస్ సంచలన నిర్ణయం!.. జన్మలో కబడ్డీ ఆడనంటూ..
ప్రొ కబడ్డి లీగ్ ఫ్రాంఛైజీ తమిళ్ తలైవాస్ (Tamil Thalaivas) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కెప్టెన్, భారత కబడ్డీ జట్టు సారథి పవన్ సెహ్రావత్ (Pawan Sehrawat)ను టీమ్ నుంచి తొలగించింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.అందుకే ఈ నిర్ణయం‘‘క్రమశిక్షణా రాహిత్యం కారణంగా పవన్ సెహ్రావత్‌ను ఇంటికి పంపించివేశాము. ఈ సీజన్లో అతడు ఇక మా జట్టులో భాగంగా ఉండడు. జట్టుకు సంబంధించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాము’’ అని తమిళ్ తలైవాస్ స్పష్టం చేసింది.ఒక వ్యక్తి కారణంగానే ఇలా..ఈ ఆరోపణలపై పవన్ సెహ్రావత్ తాజాగా స్పందించాడు. ‘‘ఫ్రాంఛైజీ పెట్టిన పోస్టు చూసి నాకు చాలా మంది ఫోన్లు, మెసేజ్‌లు చేశారు. వారందరికీ ధన్యవాదాలు. తొమ్మిదో సీజన్లో కూడా నేను ఈ జట్టులోనే ఉన్నాను. గాయపడిన సమయంలో వారు నాకు అండగా నిలిచారు.మా తమ్ముడు అర్జున్‌తో కలిసి జట్టును ముందుకు తీసుకువెళ్లేందుకు నేను ఎన్నో ప్రణాళికలు రచించాను. అయితే ఒక వ్యక్తి కారణంగా మేము ఆ పని పూర్తిచేయలేకపోయాము’’ అని పవన్ సెహ్రావత్ తెలిపాడు.దోషినని తేలితే.. ఇక జన్మలో కబడ్డీ ఆడనుఅదే విధంగా.. ‘‘ఈ ఫ్రాంఛైజీ నా మీద క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాననే ఆరోపణలు చేస్తోంది. నేను భారత జట్టులో ఉన్నాను. క్రమశిక్షణ అంటే ఏమిటో నాకు తెలుసు. నిజంగా వారు ఆరోపించినట్లు నేను దోషినని తేలితే.. ఇక జన్మలో కబడ్డీ ఆడను’’ అంటూ పవన్ సెహ్రావత్ సవాలు విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రూ. 59.5 లక్షల భారీ ధరకాగా గతేడాది వరకు పవన్ సెహ్రావత్ తెలుగు టైటాన్స్‌కు ఆడాడు. అయితే, ఈసారి వేలంలో రూ. 59.5 లక్షల భారీ ధరకు తమిళ్ తలైవాస్ పవన్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌గా నియమించింది. ఇక ఈ సీజన్లో తలైవాస్ ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో పవన్ భాగమయ్యాడు.అయితే, జైపూర్ లెగ్‌లో భాగంగా బెంగాల్ వారియర్స్‌తో ఆడాల్సిన మ్యాచ్‌కు పవన్ హాజరు కాలేదు. జట్టుతో కలిసి అతడు జైపూర్‌కు ప్రయాణం చేయలేదు. ఇక ఈ మ్యాచ్‌లో అర్జున్ దేశ్వాల్ తమిళ్ తలైవాస్ సారథిగా వ్యవహరించి జట్టుకు విజయం అందించాడు.రెండు గెలిచి..ఇదిలా ఉంటే.. ప్రొ కబడ్డి లీగ్ పన్నెండో సీజన్లో తమిళ్ తలైవాస్ మిశ్రమ ఫలితాలు చవిచూస్తోంది. ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలిచింది. నాలుగు పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే, కెప్టెన్ పవన్ సెహ్రావత్ వంటి ఆల్‌రౌండర్‌ను వదులుకుని పెద్ద సాహసమే చేసింది. ఇక ఈ సీజన్లో పవన్ 22 రెయిడింగ్ పాయింట్లు సాధించగలిగాడు.చదవండి: పాక్‌తో మ్యాచ్ బహిష్కరించాలంటూ విజ్ఞప్తులు!.. ఆటగాళ్లకు గంభీర్ మెసేజ్ ఇదే.. Pawan Sehrawat gives clarification on undisciplinary allegation by Tamil Thalaivas 😲🎥 - Pawan Sehrawat/Insta#PKL | #PKL12 | #ProKabaddiLeague | #Kabaddi | #PKLSeason12 | #ProKabaddi | #PawanSehrawat | #TamilThalaivas pic.twitter.com/xrbrSeJEoJ— Khel Kabaddi (@KhelNowKabaddi) September 14, 2025 -
World Boxing Championships 2025: చరిత్ర సృష్టించిన భారత బాక్సర్
భారత బాక్సింగ్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. లివర్‌పూల్‌లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్-2025లో ముగ్గురు మహిళా బాక్సర్లు పతకాలు సాధించారు. నుపూర్ 80 ప్లస్ కేజీల విభాగంలో రజత పతకం సాధించగా.. పూజా రాణి 80 కేజీల విభాగంలో కాంస్యం.. తాజాగా జైస్మిన్ లంబోరియా 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ఫలితం (ముగ్గురు మహిళా బాక్సర్లకు పతకాలు) ఇదే.చరిత్ర సృష్టించిన లంబోరియా తాజాగా జరిగిన 57 కేజీల విభాగం ఫైనల్లో జైస్మిన్ లంబోరియా పోలాండ్‌కి చెందిన ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ జూలియా సెరెమెటాపై 4-1 స్ప్లిట్ డెసిషన్‌తో విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. నూతన గ్లోబల్ బాక్సింగ్ గవర్నింగ్ బాడీగా 'వరల్డ్ బాక్సింగ్' ఏర్పడ్డాక జరుగుతున్న తొలి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇదే.నుపూర్‌కు రజతంఇదే టోర్నీలో 80 ప్లస్ కేజీల విభాగంలో నుపుర్ గోల్డ్ మిస్ అయ్యింది. అగాటా కాజ్‌మార్స్కాతో (పోలాండ్) ఫైనల్లో నుపుర్ 2-3తో పోరాడి ఓడింది.పూజా రాణికి కాంస్యం80 కేజీల విభాగంలో పూజా రాణి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్‌కి చెందిన ఎమిలీ ఆస్క్విత్‌తో సెమీఫైనల్లో గట్టిగానే పోరాడింది.భారత బాక్సింగ్‌లో చారిత్రక ఘట్టంభారత బాక్సింగ్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారి ముగ్గురు మహిళా బాక్సర్లు ఫైనల్స్‌కు చేరారు. జైస్మిన్, నుపుర్ ఇది వరకే స్వర్ణం, రజతం సాధించగా.. మీనాక్షి 48 కేజీ విభాగంలో స్వర్ణం కోసం పోటీపడాల్సి ఉంది. -
తెలుగు టైటాన్స్ పరాజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్‌కు పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన తెలుగు టైటాన్స్ శనివారం 33–39 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్ చేతిలో ఓడింది. ఈ సీజన్లో టైటాన్స్‌కు ఇది మూడో పరాజయం. తెలుగు టైటాన్స్ తరఫున భరత్ 12 పాయింట్లతో విజృంభించగా... కెపె్టన్ విజయ్ మాలిక్ 7 పాయింట్లు సాధించాడు. పల్టన్ తరఫున అస్లమ్ ఇనామ్దార్, గౌరవ్ చెరో 7 పాయింట్లు సాధించారు. విశాల్ భరద్వజ్ (6 పాయింట్లు), ఆదిత్య (5 పాయింట్లు), పంకజ్ (5 పాయింట్లు) కూడా మెరవడంతో పల్టన్ ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... పల్టన్ 15కే పరిమితమైంది. ట్యాక్లింగ్‌లో పల్టన్ 17 పాయింట్లు సాధిస్తే తెలుగు టైటాన్స్ పది పాయింట్లకే పరిమితమైన పరాజయం పాలైంది. లీగ్‌లో భాగంగా ఆరు మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ మూడింట గెలిచి మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడి 6 పాయింట్లతో పట్టిక నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 41–29 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున నితిన్ కుమార్ 11 పాయింట్లు, అలీ సమది 10 పాయింట్లతో సత్తాచాటారు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో యూపీ యోధాస్ 22 రెయిడ్ పాయింట్లు సాధించగా... జైపూర్ పింక్ పాంథర్స్ 21 సాధించింది. అయితే ట్యాక్లింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన పింక్ పాంథర్స్ 12 పాయింట్లు సాధిస్తే... యూపీ యోధాస్ 4 పాయింట్లకే పరిమితమైంది. -
ఆసియాకప్ మహిళల హాకీ ఫైనల్లో భారత్
హాంగ్జౌ (చైనా): భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ‘సూపర్–4’ దశ చివరి మ్యాచ్‌లో శనివారం డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో పోరును భారత జట్టు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున బ్యూటీ డుంగ్ డుంగ్ 7వ నిమిషంలో గోల్ సాధించింది. చివరి క్వార్టర్ వరకు ఆధిక్యాన్ని కొనసాగించిన టీమిండియా... విజయం సాధించడం ఖాయమే అనుకుంటుండగా... 58వ నిమిషంలో కోబయకావా షిహో గోల్‌తో జపాన్ స్కోరు సమం చేసింది. ఇరు జట్ల మధ్య గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ సైతం ‘డ్రా’గానే ముగిసింది. మరో మ్యాచ్‌లో చైనా 1–0 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై గెలవడంతో టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో ‘సూపర్–4’ దశలో మూడు మ్యాచ్‌లాడిన భారత్ ఒక విజయం, ఒక పరాజయం, ఒక ‘డ్రా’తో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంతో ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు జరగనున్న ఫైనల్లో చైనాతో భారత్ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధిస్తుంది. -
క్వాలిఫయర్స్‌కు భారత్
బీల్ (స్విట్జర్లాండ్): మూడు దశాబ్దాల తర్వాత డేవిస్ కప్‌లో భారత జట్టు ఓ ఘనమైన విజయంతో ముందంజ వేసింది. డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 టైలో భాగంగా స్విట్జర్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 3–1తో విజయం సాధించింది. తొలి రోజు కొత్త కుర్రాడు దక్షిణేశ్వర్‌తో పాటు భారత స్టార్ సుమిత్ నగాల్ వరుస విజయాలతో సింగిల్స్‌లో 2–0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌కు రెండో రోజు శనివారం డబుల్స్‌లో పరాజయం ఎదురైంది. దీంతో భారత్ ఆధిక్యం 2–1కి తగ్గింది. ఈ దశలో రివర్స్ సింగిల్స్ బరిలోకి దిగిన భారత నంబవర్వన్ టెన్నిస్ స్టార్ సుమిత్ 6–1, 6–3తో హెన్రీ బెర్నెట్‌పై విజయం సాధించాడు. దీంతో ఈ ‘టై’లో భారత్ గెలుపొందింది. ఫలితం రావడంతో నామమాత్రమైన రెండో రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. మూడేళ్ల క్రితం 2022లో డెన్మార్క్‌పై గెలిచినప్పటికీ ఇది న్యూఢిల్లీ వేదికపై జరిగింది. తాజా విజయంతో డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌కు భారత్ అర్హత సాధించింది. తొలిరౌండ్ డేవిస్ కప్ క్వాలిఫయర్స్ పోటీలు వచ్చే జనవరిలో జరుగుతాయి. అంతకుముందు జరిగిన డబుల్స్‌లో భారత బృందానికి నిరాశ ఎదురైంది. శ్రీరామ్ బాలాజీతో జోడీగా బరిలోకి దిగిన తెలంగాణ ఆటగాడు రితి్వక్ బొల్లిపల్లి జంటకు ఆతిథ్య స్విట్జర్లాండ్ జోడీ చేతిలో చుక్కెదురైంది. రితి్వక్–బాలాజీ ద్వయంకు 7–6 (8/3), 4–6, 5–7తో జాకుబ్ పాల్–డామినిక్ స్ట్రికెర్ జంట చేతిలో పరాజయం ఎదురైంది. మొత్తమ్మీద విదేశీ గడ్డపై భారత్ చివరిసారిగా 1993లో గెలిచింది. -
ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
హాంకాంగ్: భారత బ్యాడ్మింటన్ అగ్ర శ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో టైటిల్ పోరుకు సిద్ధమైంది. సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న భారత ఆటగాడు 23–21, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, మూడో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)ని కంగు తినిపించాడు. సుమారు గంటపాటు హోరా హోరీగా జరిగిన సమరంలో లక్ష్యసేన్ ఏ దశలోనూ పట్టు సడలించలేదు. నేడు జరిగే టైటిల్ పోరులో చైనాకు చెందిన రెండో సీడ్ లి షి ఫెంగ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ ఏడాది సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ సెమీస్‌తోనే ఆగిపోతున్నారు. ఆరు టోర్నీల్లో సెమీస్‌తోనే ముగిసిన భారత జోడీ పోరాటం ఇక్కడ ఫైనల్‌కు చేరింది. ఈ సీజన్లో తొలిసారి సాత్విక్–చిరాగ్‌లు ఎట్టకేలకు టైటిల్ వేటలో అడుగు దూరంలో ఉన్నారు. తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య విజేత అయిన భారత డబుల్స్ జోడీ వరుస సెట్లలో చైనీస్ తైపీకి చెందిన బింగ్ వే లిన్–చెన్ చెంగ్ కున్ జంటను కంగుతినిపించింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకులో ఉన్న సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–15తో తైపీ జోడీని కంగుతినిపించింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఎనిమిదో సీడ్ భారత జోడీ... పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతక విజేతలైన లియాంగ్ వే కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జంటతో తలపడుతుంది. -
ISSF World Cup: ఎట్టకేలకు భారత్ బోణీ.. స్వర్ణం గెలిచిన ఇషా
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ISFF) తాజా సీజన్‌లోని చివరి ప్రపంచకప్‌లో భారత షూటర్ ఇషా సింగ్ (Esha Singh) సత్తా చాటింది. మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు తొలి మెడల్ అందించింది. కాగా చైనాలోని నింగ్బోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ టోర్నీలో తొలి నాలుగు రోజుల్లో భారత్ కనీసం ఒక్క కాంస్య పతకం కూడా నెగ్గలేకపోయింది.వైఫల్యాల పరంపరషూటింగ్ ఈవెంట్లో ఇన్ని రోజులైనా కూడా భారత్ బోణీ కొట్టలేకపోవడం బహుశా ఇటీవల ఇదే తొలిసారి!.. పురుషులు, మహిళల ఈవెంట్లలో శుక్రవారం వరకు వరుస వైఫల్యాల పరంపర కొనసాగింది. శుక్రవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో మెహులీ ఘోష్, మానిని కౌశిక్ అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. 2023లో బాకులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన మెహులీ క్వాలిఫయింగ్‌లో 583 పాయింట్లతో 23వ స్థానంలో నిలిచింది.ఇక మానిని 580 పాయింట్లతో 45వ స్థానానికి పరిమితమైనింది. తెలంగాణకు చెందిన మరో షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ 578 పాయింట్లతో ఏకంగా 52వ స్థానంలో నిలిచింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ భవేశ్ షెకావత్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో అతను నాలుగో స్థానంలో నిలువడం ద్వారా ఫైనల్ చేరే అవకాశాల్ని సజీవంగా ఉంచుకున్నాడు.ఇషాకు ఇదే తొలి స్వర్ణంఈ క్రమంలో భారత్ ఆశలన్నీ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పోటీపడే రిథమ్ సాంగ్వాన్, ఇషా సింగ్, సురభి రావులపై నిలవగా.. 20 ఏళ్ల ఇషా శనివారం పసిడి పతకం గెలిచింది. నింగ్బో స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన పోటీ ఫైనల్లో యావో కియాంగ్జున్ (చైనా)ను 0.1 పాయింట్ తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక ఒలింపిక్ చాంపియన్ ఓ యెజిన్ (సౌత్ కొరియా) కాంస్యం దక్కించుకుంది.కాగా ప్రపంచకప్ ఈవెంట్లో ఇషాకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక ఈ తెలంగాణ షూటర్ గెలుపుతో.. ఈ ఈవెంట్లో బోణీ కొట్టిన భారత్ పతకాల పట్టికలో ఎట్టకేలకు చోటు సంపాదించింది. ప్రస్తుతానికి ఐదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆతిథ్య దేశం చైనా రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.చదవండి: బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి! -
బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికే పెద్దపీట వేస్తోందని, తద్వారా భారత్‌ను ప్రపంచ టాప్–10 క్రీడా దేశాల్లో నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ‘ప్లేకామ్ బిజినెస్ ఆఫ్ స్పోర్ట్స్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘గతంలో క్రీడా సమాఖ్యల్లో తిష్ట వేసుకు కూర్చున్న సమస్యలు, వివాదాలే పతాక శీర్షికలయ్యేవి. ప్రస్తుతం మేం ఈ వివాదాలను పక్కనబెట్టి అథ్లెట్ల ప్రదర్శన మెరుగుపర్చడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం. అంతర్జాతీయ క్రీడల్లో భారత ఆటగాళ్లు పోడియంలో నిలిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. కొత్తగా తీసుకొచ్చిన క్రీడా బిల్లు కూడా తగవుల్ని పరిష్కరించడంతో పాటు క్రీడాకారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది. అథ్లెట్లు రాణించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్నాం’ అని అన్నారు. బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి!దేశంలోని క్రీడా సమాఖ్యలన్నీ క్రీడా బిల్లుకు లోబడే ఉండాలని నిర్ణయించామని, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా కొత్త క్రీడా పాలసీ ప్రకారమే నడచుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. తద్వారా ప్రతీ సమాఖ్యలోనూ జవాబుదారీతనాన్ని పెంచామని అన్నారు. అంతర్జాతీయ క్రీడల్లో పురుషులకు దీటుగా భారత మహిళా అథ్లెట్లు పోటీపడాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఫిట్ ఇండియా’, ‘ఖేలో ఇండియా’, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) కార్యక్రమాలు అథ్లెట్ల కోసమే రూపొందించామని మాండవీయ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని, భారత క్రీడావికాసం కోసం ప్రణాళికబద్ధంగా కృష్టి చేస్తున్నారని ఆయన చెప్పారు. పదేళ్ల ప్రణాళికతో క్రీడాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మన్సుఖ్ మాండవీయ అన్నారు. క్షేత్రస్థాయిలోఇక భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతిభాన్వేషణ పోటీలను పెంచుతామని చెప్పారు. కేవలం నగరాలు, అకాడమీలే కాదు... మారుమూల గ్రామాలు, పట్టణాల్లో ఉన్న ప్రతిభావంతులను పాఠశాల స్థాయి పోటీల్లో గుర్తించి నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. -
గుకేశ్‌ను నిలువరించిన దివ్య
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో పోటీపడుతున్న భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌తో శుక్రవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను దివ్య 103 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఇటీవల మహిళల ప్రపంచకప్ టోర్నీలో విజేతగా నిలిచిన దివ్య రేటింగ్ 2478 పాయింట్లు కాగా... గుకేశ్ రేటింగ్ 2767 పాయింట్లు. ఈ టోర్నీలో వరుసగా మూడు పరాజయాల తర్వాత గుకేశ్ ‘డ్రా’తో గట్టెక్కాడు. ఎనిమిదో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, ప్రణవ్, అభిమన్యు పురాణిక్, లియోన్, ఆదిత్య మిట్టల్, రౌనక్ సాధ్వాని, నారాయణన్, ఆర్యన్ చోప్రా తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... విదిత్, పెంటేల హరికృష్ణ ఓటమి చవిచూశారు. కార్తికేయన్ మురళీ మాత్రం విజయాన్ని అందుకున్నాడు. మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి తొలి ఓటమి చవిచూసింది. బీబీసారా అసబయేవా (కజకిస్తాన్)తో జరిగిన గేమ్‌లో వైశాలి 39 ఎత్తుల్లో ఓడిపోయింది. ఓల్గా గిర్యా (రష్యా)తో జరిగిన గేమ్‌ను ద్రోణవల్లి హారిక 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఎనిమిదో రౌండ్ తర్వాత వైశాలి 6 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి రెండో స్థానంలో, హారిక 4.5 పాయింట్లతో 20వ స్థానంలో ఉన్నారు. -
అథ్లెటిక్స్ ‘ప్రపంచం’ పిలుస్తోంది!
198 దేశాలు... 2000లకు పైగా అథ్లెట్లు... 49 ఈవెంట్లు... రికార్డులు బద్దలు కొట్టేందుకు... అంతర్జాతీయ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించేందుకు... అథ్లెట్లందరూ ‘సై’ అంటున్నారు. స్ప్రింట్ రేసుల్లో అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్యం కొనసాగుతుందా.... మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్‌లో ఆఫ్రికా తమ హవా కొనసాగిస్తుందా... ఫీల్డ్ ఈవెంట్స్‌లో యూరోపియన్లు తమ సత్తా చాటుకుంటారా... ఇవన్నీ తెలుసుకోవాలంటే క్రీడాభిమానులు నేటి నుంచిమొదలయ్యే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌పై దృష్టి సారించాల్సిందే. 1983లో ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు వేదిక కాగా... తాజాగా 20వ ఎడిషన్‌కు జపాన్ రాజధాని టోక్యో ముస్తాబైంది. ఈ మెగా ఈవెంట్ జపాన్‌లో జరగడం ఇది మూడోసారి. ఇంతకుముందు 1991లో టోక్యో, 2007లో ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చాయి. టోక్యో: ఒలింపిక్స్ క్రీడలు... ఫుట్‌బాల్ ప్రపంచకప్... ఆ తర్వాత క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించేది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్‌కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మొత్తం 198 దేశాల అథ్లెట్లు 49 ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి రోజు ఐదు ఈవెంట్లలో అథ్లెట్లు మెడల్స్ కోసం బరిలోకి దిగనున్నారు.పురుషుల, మహిళల 35 కిలోమీటర్ల రేస్ వాక్... అనంతరం పురుషుల షాట్‌పుట్, మహిళల 10,000 మీటర్లు, మిక్స్డ్ 4–400 మీటర్ల రిలే ఫైనల్ ఈవెంట్లు జరుగుతాయి. పురుషుల, మహిళల 100 మీటర్ల విభాగాల్లో ప్రిలిమినరీ రౌండ్లు ఉంటాయి. పురుషుల, మహిళల 100 మీటర్ల సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆదివారం జరుగుతాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో నిషేధం ఎదుర్కొంటున్న రష్యా అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్లో ‘తటస్థ అథ్లెట్లు’గా పోటీపడనున్నారు. జమైకా దిగ్గజ మహిళా స్ప్రింటర్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ ‘టోక్యో’లో తన కెరీర్‌ను ముగించనుంది. ఇప్పటి వరకు ఆమె ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో వ్యక్తిగత, టీమ్ రిలే ఈవెంట్స్‌లో కలిపి మొత్తం 16 పతకాలు సాధించింది. ఇందులో 10 స్వర్ణాలు, 5 రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. మరోవైపు పురుషుల పోల్ వాల్ట్‌లో స్వీడన్ స్టార్ డుప్లాంటిస్ ప్రధాన ఆకర్షణ కానున్నాడు. ఇప్పటికే 13 సార్లు పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన డుప్లాంటిస్ స్వర్ణం సాధించి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలని పట్టుదలతో ఉన్నాడు. 2022, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో బంగారు పతకాలు నెగ్గిన డుప్లాంటిస్, 2019లో రజత పతకం సాధించాడు. నీరజ్ ఈవెంట్ 17న, 18న... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈసారి భారత్ నుంచి 19 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. అయితే అందరి దృష్టి మాత్రం జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే ఉంది. ఈ మెగా ఈవెంట్లో 2022లో రజతం, 2023లో స్వర్ణం గెలిచిన నీరజ్... మళ్లీ విజేతగా నిలిస్తే... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండుసార్లు బంగారు పతకాలు నెగ్గిన మూడో జావెలిన్ త్రోయర్‌గా గుర్తింపు పొందుతాడు. గతంలో జాన్ జెలెజ్నీ (1993, 1995), అండర్సన్ పీటర్స్ (2019, 2022) మాత్రమే ఈ ఘనత సాధించారు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్ రెండు రోజులపాటు జరుగుతుంది. ఈనెల 17న క్వాలిఫయింగ్... 18న ఫైనల్ ఉంటాయి. జావెలిన్ త్రోలో భారత్ నుంచి నీరజ్ చోప్రాతోపాటు సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్ బరిలో ఉన్నారు. మహిళల జావెలిన్ త్రోలో భారత స్టార్ అన్ను రాణి ఐదోసారి (2017, 2019, 2022, 2023) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడనుంది. 2019, 2022లో ఫైనల్ చేరిన అన్ను రాణి ఈసారి ఏం చేస్తుందో వేచి చూడాలి. తొలి రోజు శనివారం భారత్ నుంచి నలుగురు అథ్లెట్లు బరిలో ఉన్నారు. పురుషుల 35 కిలోమీటర్ల రేస్ వాక్‌లో రామ్‌బాబూ, సందీప్ కుమార్... మహిళల 35 కిలోమీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి... మహిళల 1500 మీటర్ల హీట్స్‌లో పూజ పోటీపడతారు. ఇదీ భారత బృందం... పురుషుల విభాగం: నీరజ్ చోప్రా, సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్ (జావెలిన్ త్రో), గుల్వీర్ సింగ్ (5000, 10000 మీటర్లు), ప్రవీణ్ చిత్రావెల్, అబ్దుల్లా అబూబాకర్ (ట్రిపుల్ జంప్), మురళీ శ్రీశంకర్ (లాంగ్‌జంప్), సర్వేశ్ కుషారే (హైజంప్), అనిమేశ్ కుజుర్ (200 మీటర్లు), తేజస్ షిర్సే (110 మీటర్ల హర్డిల్స్), సెర్విన్ సెబాస్టియన్ (20 కిలోమీటర్ల రేస్ వాక్), రామ్‌బాబూ, సందీప్ కుమార్ (35 కిలోమీటర్ల రేస్ వాక్). మహిళల విభాగం: అన్ను రాణి (జావెలిన్ త్రో), పారుల్ చౌధరీ, అంకిత దయాని (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్), పూజ (800, 1500 మీటర్లు), ప్రియాంక గోస్వామి (35 కిలోమీటర్ల రేస్ వాక్).443 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో అమెరికా సాధించిన పతకాలు. ఇందులో 195 స్వర్ణాలు, 134 రజతాలు, 114 కాంస్యాలు ఉన్నాయి. ‘ఆల్‌టైమ్ పతకాల పట్టిక’లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 171 పతకాలతో (65 స్వర్ణాలు, 58 రజతాలు, 48 కాంస్యాలు) కెన్యా రెండో స్థానంలో ఉంది.3 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన పతకాలు. 2003లో అంజూ జార్జి మహిళల లాంగ్‌జంప్‌లో కాంస్యం నెగ్గగా.. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా 2022లో రజతం, 2023లో స్వర్ణం గెలిచాడు. ఆల్‌టైమ్ పతకాల పట్టికలో భారత్... బుర్కినఫాసో, ట్యునీసియాలతో కలిసి సంయుక్తంగా 65వ స్థానంలో ఉంది. -
సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
హాంకాంగ్: ఈ ఏడాది తమ అద్భుత ఫామ్ కొనసాగిస్తూ... భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆరో టోర్నమెంట్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–14, 20–22, 21–16తో జునైది ఆరిఫ్–రాయ్ కింగ్ యాప్ (మలేసియా) జంటపై విజయం సాధించింది. 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జోడీకి గట్టిపోటీనే ఎదురైంది. తొలి గేమ్ నెగ్గిన భారత ద్వయం రెండో గేమ్‌లో తడబడింది. 16–20తో వెనుకబడిన దశలో ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేసింది. అయితే మలేసియా జోడీ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను సాధించి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ తమ వ్యూహాలను మార్చి ఆడి పైచేయి సాధించారు. స్కోరు 6–5 వద్ద సాత్విక్–చిరాగ్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 10–5తో ముందంజ వేశారు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నారు. లక్ష్య సేన్‌దే పైచేయి... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ సెమీఫైనల్లో అడుగు పెట్టాడు. భారత రెండో ర్యాంకర్ ఆయుశ్ శెట్టితో జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 66 నిమిషాల్లో 21–16, 17–21, 21–13తో విజయం సాధించి ఈ ఏడాది రెండో టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ ఏడాది 13 టోర్నీల్లో ఆడిన లక్ష్య సేన్ మకావ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరుకున్నాడు. -
‘పసిడి’ పోరుకు జైస్మీన్, నుపుర్
లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళా బాక్సర్లు నాలుగు పతకాలు ఖరారు చేసుకొని భారత్ పరువును నిలబెట్టారు. 57 కేజీల విభాగంలో జైస్మీన్ లంబోరియా, ప్లస్ 80 కేజీల విభాగంలో నుపుర్ షెరాన్ ఫైనల్లోకి దూసుకెళ్లి పసిడి పతకాలకు విజయం దూరంలో నిలిచారు. 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 80 కేజీల విభాగంలో ఇప్పటికే పూజా రాణి సెమీఫైనల్ చేరి పతకాన్ని ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన 57 కేజీల విభాగం సెమీఫైనల్లో జైస్మీన్ 5–0తో అల్కాలా కరోలినా (వెనిజులా) ఘనవిజయం సాధించింది. ఫైనల్లో జూలియా జెరెమిటా (పోలాండ్)తో జైస్మీన్ తలపడుతుంది. అల్కాలాతో జరిగిన బౌట్లో జైస్మీన్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. మూడు రౌండ్లలోనూ భారత బాక్సరే పైచేయి సాధించింది. ప్లస్ 80 కేజీల విభాగం సెమీఫైనల్లో నుపుర్ 5–0తో సేమా దుజ్‌టాస్ (టర్కీ)పై గెలుపొందింది. 48 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో మీనాక్షి 5–0తో అలైస్ పంఫేరి (ఇంగ్లండ్)పై నెగ్గింది. నేడు జరిగే సెమీఫైనల్లో లుట్‌సైఖాన్ (మంగోలియా)తో మీనాక్షి తలపడుతుంది. మరోవైపు పురుషుల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. 12 ఏళ్ల తర్వాత భారత పురుష బాక్సర్లు ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగారు. బరిలో మిగిలిన చివరి బాక్సర్ జాదూమణి సింగ్ (50 కేజీలు) కూడా ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో జాదూమణి సింగ్ 0–4తో వరల్డ్ చాంపియన్ సంజార్ తషె్కన్‌బె (కజకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు కాంస్యాలు లభించాయి. -
బెంగళూరు బుల్స్ ‘హ్యాట్రిక్’ విజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో బెంగళూరు బుల్స్ జట్టు ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన తొలి పోరులో బెంగళూరు బుల్స్ 28–23 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. బెంగళూరు తరఫున అలీ రెజా 8 రెయిడ్ పాయింట్లతో సత్తా చాటగా... దీపక్ (5 పాయింట్లు), సత్యప్ప (4 పాయింట్లు) రాణించారు. జైపూర్ జట్టు తరఫున నితిన్ కుమార్ 8 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 46–36 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లతో విజృంభించాడు. బెంగాల్ వారియర్స్ తరఫున దేవాంక్ 13 పాయింట్లతో పోరాడాడు. లీగ్‌లో భాగంగా నేడు యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్... పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్ ఆడతాయి. -
భారత్ వర్సెస్ స్విట్జర్లాండ్
బీల్ (స్విట్జర్లాండ్): వచ్చే ఏడాది డేవిస్‌కప్ క్వాలిఫయర్స్‌లో చోటు కోసం భారత పురుషుల టెన్నిస్ జట్టు కీలకపోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి రెండు రోజులపాటు స్విట్జర్లాండ్ జట్టుతో వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్లో భారత్ ఆడనుంది. ముఖాముఖి పోరులో భారత్ 2–1తో స్విట్జర్లాండ్‌పై ఆధిక్యంలో ఉంది. భారత్ తరఫున సింగిల్స్‌లో సుమిత్ నగాల్, దక్షిణేశ్వర్ సురేశ్, డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–శ్రీరామ్ బాలాజీ జోడీ బరిలోకి దిగనుంది. నేడు జరిగే రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో జెరోమ్ కిమ్‌తో దక్షిణేశ్వర్ సురేశ్; మార్క్ ఆండ్రియా హుస్లెర్తో సుమిత్ నగాల్ తలపడతారు. శనివారం మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. డబుల్స్ మ్యాచ్‌లో జాకబ్ పాల్–డొమినిక్ స్ట్రికర్ జంటతో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ ద్వయం పోటీపడుతుంది. అనంతరం జెరోమ్ కిమ్‌తో నగాల్; హుస్లెర్తో సురేశ్ ఆడతారు. గురువారం ‘డ్రా’ కార్యక్రమం కంటే ముందు భారత టెన్నిస్ జట్టుకు స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్ సన్మానించారు. -
చైనా, ఉజ్బెక్ క్లబ్‌లతో ఈస్ట్ బెంగాల్ పోరు
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ జట్టుకు ఏఎఫ్సీ మహిళల చాంపియన్‌షిప్ గ్రూప్ ‘బి’లో చోటు దక్కింది. కౌలాలంపూర్‌లో తీసిన ‘డ్రా’లో ఈస్ట్ బెంగాల్ మహిళల జట్టుకు ఒక రకంగా ఇది క్లిష్టమైన పోరే! ‘బి’ గ్రూపులో చైనా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్లకు చెందిన క్లబ్‌లతో ఈస్ట్ బెంగాల్ తలపడనుంది. ఈ సీజన్ భారత మహిళల లీగ్‌లో విజేతగా నిలువడం ద్వారా ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ ఏఎఫ్సీ మహిళల టోర్నీకి అర్హత సంపాదించింది.తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ ఈస్ట్ బెంగాల్‌కు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించింది. వివిధ దేశాలకు చెందిన దేశవాళీ చాంపియన్లు ఈ టోర్నీలో పోటీ పడతాయి. మొత్తం 12 జట్లను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘బి’లో చైనాకు చెందిన వుహాన్ జియాంగ్దా, ఇరానీ చాంపియన్ బమ్ ఖటూన్, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన పీఎఫ్సీ నసఫ్ మహిళల క్లబ్ జట్లు (డబ్ల్యూఎఫ్సీ) ఉన్నాయి. జియాంగ్లా ఐదుసార్లు చైనీస్ లీగ్‌లో విజేతగా నిలిచింది. బమ్ ఖటూన్ (ఇరాన్) అయితే ఏఎఫ్సీ టోర్నీకి అర్హత సాధించడం ఇది నాలుగోసారి. ఇక ఉజ్బెకిస్తాన్‌లో తిరుగులేని దేశవాళీ జట్టు పీఎఫ్సీ నసఫ్. ఈ జట్టు ఏకంగా 16 సార్లు అక్కడ విజేతగా నిలిచింది. ఇలాంటి ఘనాపాటిలతో భారత అమ్మాయిలు ఏ మేరకు తలపడతారో చూడాలి. నవంబర్‌లో జరిగే చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌ల్లో ఈ మూడు జట్లతో ఈస్ట్ బెంగాల్ క్లబ్ తలపడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.ఈ ఆరు జట్లతో పాటు మూడు గ్రూపుల్లో ఉన్న అత్యుత్తమ మూడో స్థానంలో ఉన్న మరో రెండు జట్లకు నాకౌట్ భాగ్యం దక్కుతుంది. వచ్చే ఏడాది మార్చిలో క్వార్టర్ ఫైనల్ పోటీలు, మే నెలలో సెమీస్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ షెడ్యూల్ నవంబర్ 17: ఈస్ట్ బెంగాల్ X బమ్ ఖటూన్ ఎఫ్‌సీ (ఇరాన్ టీమ్) నవంబర్ 20: ఈస్ట్ బెంగాల్ X వుహాన్ జియాంగ్దా (చైనా టీమ్) నవంబర్ 23: ఈస్ట్ బెంగాల్ X పీఎఫ్సీ నసఫ్ (ఉజ్బెక్ టీమ్) -
భారత షూటర్లకు మళ్లీ నిరాశే
నింగ్బో (చైనా): భారత షూటర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా క్వాలిఫికేషన్ రౌండ్లలోనే గురి కుదరక పతకం బరికి దూరమవుతున్నారు. చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్‌లో గురువారం జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమా మహేశ్ సహా దివ్యాన్‡్ష, రాహీ సర్నోబత్‌లు క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్లో దివ్యాన్‡్ష 630 స్కోరుతో 19వ స్థానంలో నిలిచాడు. ఉమామహేశ్ 627.7 పాయింట్లు స్కోరు చేసి 39 స్థానంలో, మరో భారత మరో షూటర్ నీరజ్ కుమార్ (626.1) 54వ స్థానంలో నిలిచారు. మహిళల ర్యాపిడ్ ఫైర్ క్వాలిఫికేషన్లో అభిజ్ఞ అశోక్ పాటిల్ 583 స్కోరుతో 11వ స్థానంలో నిలిచింది. టీఎస్ దివ్య (581), ఒలింపియన్, ఆసియా క్రీడల చాంపియన్ రాహీ సర్నోబత్ (581)లు వరుసగా 16, 17 స్థానాలు పొందారు. ఇప్పుడిక భారత్ ఆశలన్నీ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌పైనే ఉన్నాయి. మెహులీ ఘోష్, తెలంగాణ అమ్మాయి సురభి రాపోలు, మానిని కౌశిక్‌లు బరిలో ఉన్నారు. -
మళ్లీ ఓడిన గుకేశ్
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌కు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన ఏడో రౌండ్లో గుకేశ్ 52 ఎత్తుల్లో ఇదిజ్ గురెల్ (టర్కీ) చేతిలో ఓడిపోయాడు. ఐదో రౌండ్లో అభిమన్యు మిశ్రా (అమెరికా) చేతిలో, ఆరో రౌండ్లో నికోలస్ (గ్రీస్) చేతిలో ఓడిన గుకేశ్ ... ఏడో రౌండ్ తర్వాత మూడు పాయింట్లతో 84వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తొలి పరాజయాన్ని చవిచూశాడు. మథియాస్ బ్లూబామ్ (జర్మనీ)తో జరిగిన గేమ్‌లో అర్జున్ 51 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఓపెన్ విభాగంలో పోటీపడుతున్న భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ రెండో విజయం అందుకుంది. ఇవిచ్ వెల్మిర్ (సెర్బియా)తో జరిగిన గేమ్‌లో దివ్య 49 ఎత్తుల్లో గెలిచింది. -
పూజా రాణికి పతకం ఖాయం
లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత్‌కు మూడో పతకం ఖాయమైంది. ఇప్పటికే నుపుర్ షెరాన్ (ప్లస్ 80 కేజీలు), జైస్మీన్ లంబోరియా (57 కేజీలు) సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకోగా... 80 కేజీల విభాగంలో పూజా రాణి కూడా సెమీస్‌లో అడుగు పెట్టింది. తొలి రౌండ్లో ‘బై’ దక్కించుకున్న 34 ఏళ్ల పూజ క్వార్టర్ ఫైనల్లో 3:2 తేడాతో ఎమిలియా కొటెరస్కా (పోలాండ్)పై విజయం సాధించింది. సెమీఫైనల్లో ఎమిలీ అస్క్విత్ (స్విట్జర్లాండ్)తో పూజ తలపడనుంది. పురుషుల 65 కేజీల విభాగంలో అభినాశ్ జమ్వాల్ 1:4తో ఒలింపిక్ కాంస్య పతక విజేత లాషా గురులి (జార్జియా) చేతిలో ఓడాడు. ఇక భారత్ నుంచి జాదూమణి సింగ్ (48 కేజీలు), మీనాక్షి (48 కేజీలు) మాత్రమే పోటీలో ఉన్నారు. తాష్కెంట్లో జరిగిన గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి దీపక్ భోరియా (51 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) కాంస్యాలు సాధించారు. -
దబంగ్ ఢిల్లీ ‘పాంచ్ పటాకా’
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ జోరు కొనసాగుతోంది. సీజన్ ఆరంభం నుంచి పరాజయం ఎరగకుండా దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ నెగ్గింది. గురువారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 38–28 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. దీంతో ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో నెగ్గిన ఢిల్లీ 10 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ అశు మలిక్ 14 పాయింట్లతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అజింక్యా పవార్, ఫజల్ చెరో 5 పాయింట్లతో సారథికి అండగా నిలిచారు. రెయిడింగ్‌లో ఇరు జట్లు సమంగానే నిలిచినా... ట్యాక్లింగ్‌లో ఢిల్లీ 13 పాయింట్లు సొంతం చేసుకోగా... గుజరాత్ 5 పాయింట్లకే పరిమితమైంది. జెయింట్స్ తరఫున ప్రతీక్ 9 పాయింట్లతో పోరాడాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 40–39 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్‌పై గెలిచింది. యు ముంబా తరఫున అమీర్ మొహమ్మద్ 12 పాయింట్లు, అనిల్ 9 పాయింట్లు సాధించారు. పట్నా తరఫున అయాన్ 21 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. గురువారంతో విశాఖపట్నం అంచె పోటీలు ముగియగా... నేటి నుంచి జైపూర్ వేదికగా టోర్నీ కొనసాగుతుంది. ఈ రోజు మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్... తమిళ్ తలైవాస్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
ఆయుశ్ సంచలనం
హాంకాంగ్: భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో సంచలనం సృష్టించాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ కొడాయ్ నరోకా (జపాన్)ను బోల్తా కొట్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 31వ ర్యాంకర్ ఆయుశ్ 72 నిమిషాల్లో 21–19, 12–21, 21–14తో ఐదో సీడ్ నరోకాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సహచరుడు హెచ్ఎస్ ప్రణయ్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 15–21, 21–18, 21–10తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్లో ఆయుశ్ శెట్టితో తలపడేందుకు సిద్ధమయ్యాడు. మరో మ్యాచ్‌లో కిరణ్ జార్జి (భారత్) 6–21, 12–21తో చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 18–21, 21–15, 21–11తో పిరత్చాయ్ సుఖ్‌ఫున్–పకాపోన్ తీరత్సాకుల్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రుతపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) జోడీ 13–21, 7–21తో లి యి జింగ్–లువో జు మిన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. -
బ్యాడ్మింటన్‌లో తెలంగాణ అమ్మాయికి రజతం
గ్వాటెమాల అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి రూహి రాజు సత్తా చాటింది. ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన 22 ఏళ్ల రూహి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో కొలంబియాకు చెందిన జూలియానా గిరాల్డో చేతిలో 10-21, 15-21 తేడాతో ఆమె ఓటమి చవిచూసింది.అన్‌సీడెడ్ ప్లేయర్‌గా ఈ ఈవెంట్లోకి అడుగుపెట్టిన రూహి రాజు.. క్వార్టర్ ఫైనల్లో గ్వాటెమాలకు చెందిన టాప్ సీడ్ నైక్ సోటోమేయర్ను 21-23, 21-19, 21-16 తేడాతో ఓడించింది. ఆతర్వాత హైదరాబాద్ అమ్మాయి సెమీఫైనల్లో పెరూ స్టార్ మియాహిరాపై 21-18, 21-17 తేడాతో విజయం సాధించింది.కానీ టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన రూహి రాజు.. ఆఖరి మొట్టుపై మాత్రం బోల్తా పడింది. రూహి రాజు గతంలో సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ ప్రధాన కోచ్, వ్యవస్థాపకుడు ప్రదీప్ రాజు వద్ద శిక్షణ తీసుకుంది. -
సింధుకు షాక్
హాంకాంగ్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు వేట ఇంకా కొనసాగనుంది. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –500 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ప్రపంచ 27వ ర్యాంకర్, అన్‌సీడెడ్ లినె క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–15, 16–21, 19–21తో ఓటమి పాలైంది. గతంలో లినె క్రిస్టోఫర్సన్తో ఆడిన ఐదుసార్లూ విజయం సాధించిన సింధు ఆరోసారి మాత్రం ఓటమి తప్పలేదు. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు నిర్ణాయక మూడో గేమ్‌లో 16–13తో, 17–15తో ఆధిక్యంలోకి వెళ్లి విజయం దిశగా సాగింది. ఈ కీలక తరుణంలో సింధు అనవసర తప్పిదాలు చేయడం... 15–17తో వెనుకబడిన లినె వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి ఒక్కసారిగా 19–17తో ముందంజ వేసింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్ గెలిచినా... ఆ వెంటనే లినె రెండు పాయింట్లు నెగ్గి తన కెరీర్లో తొలిసారి భారత స్టార్‌పై విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత్‌కే చెందిన అనుపమ, రక్షిత శ్రీ కూడా తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అనుపమ 17– 21, 22–20, 14–21తో తొమ్మిదో ర్యాంకర్ టొమోకా మియకాజి (జపాన్) చేతిలో, రక్షిత శ్రీ 13–21, 7–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. లక్ష్య సేన్, ప్రణయ్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన నలుగురు భారత క్రీడాకారులు లక్ష్య సేన్, ప్రణయ్, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్ 22–20, 16–21, 21–15తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై, ప్రణయ్ 21–17, 21–14తో లు గ్వాంగ్ జు (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. కిరణ్ జార్జి 21–16, 21–11తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్)పై, ఆయుశ్ 15–21, 21–19, 21–13తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ)లపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రుతపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) ద్వయం 21–17, 21–9తో పాంగ్ వనెస్సా–వాంగ్ సమ్ (హాంకాంగ్) జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ (భారత్) జోడీ 14–21, 17–21తో ప్రపంచ రెండో ర్యాంక్ జంట ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) చేతిలో... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 16– 21, 11–21తో చెన్ చెంగ్ కువాన్–సు యిన్ హుయ్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయాయి. -
తెలుగు టైటాన్స్ ‘హ్యాట్రిక్’
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్–12లో తెలుగు టైటాన్స్ వరుసగా మూడో విజయంతో సత్తా చాటింది. హోం గ్రౌండ్లో ఐదు మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా...ఇప్పుడు ‘హ్యాట్రిక్’ విజయంతో వైజాగ్ అంచెను ముగించింది. బుధవారం జరిగిన పోరులో టైటాన్స్ 45–37 స్కోరుతో యు ముంబాను చిత్తు చేసింది. టైటాన్స్ తరఫున భరత్ హుడా 13 పాయింట్లతో చెలరేగగా... చేతన్ సాహు 6, కెపె్టన్ విజయ్ మలిక్ 5 పాయింట్లతో అతనికి సహకరించారు. చివరి 10 నిమిషాల్లో కాస్త పోరాడిన ముంబా ప్రత్యర్థిని ‘ఆలౌట్’ చేయగలిగినా పాయింట్ల అంతరం మాత్రమే తగ్గించ గలిగింది. ముంబా ఆటగాళ్లలో సందీప్, ఆమిర్ మొహమ్మద్ చెరో 7 పాయింట్లు సాధించారు.మరో మ్యాచ్‌లో పుణేరీ పల్టన్ 43–32 తేడాతో యూపీ యోధాస్‌పై గెలిచిది. నేడు జరిగే మ్యాచ్‌లలో యు ముంబాతో పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీతో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి. తొలి 28 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన విశాఖపట్నంలో నేటితో పీకేఎల్ పోటీలు ముగియనున్నాయి. రేపటి నుంచి జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా టోర్నీ కొనసాగుతుంది. -
పాకిస్తాన్‌కు ఆహ్వానం పంపిన హాకీ ఇండియా
చెన్నై: పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో యువ భారత జట్టు తొలి మ్యాచ్‌లో చిలీ జట్టుతో తలపడనుంది. చెన్నై, మదురై వేదికగా మొత్తం 24 దేశాల మధ్య ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేశారు. పాకిస్తాన్, చిలీ, స్విట్జర్లాండ్‌తో కలిసి భారత జట్టు పూల్ ‘బి’ నుంచి పోటీపడుతుంది.ఇక టోర్నీ ఆరంభ రోజే చిలీతో భారత్ మ్యాచ్ జరగనుంది. మరుసటి రోజు పాకిస్తాన్‌తో... డిసెంబర్ 2న స్విట్జర్లాండ్ భారత్ మ్యాచ్‌లు ఆడనుంది. షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రామ్, హాకీ ఇండియా (హెచ్ఐ) కార్యదర్శి భోళానాథ్ సింగ్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ జట్టుకు ఆహ్వానం పంపాంఅయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్టు... భారత్‌కు వస్తుందా లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత లోపించింది. ఆతిథ్య హోదాలో హాకీ ఇండియా అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.‘పాకిస్తాన్ జట్టుకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆసియా కప్ సమయంలో కూడా పాకిస్తాన్ జట్టుకు ఆహ్వానం పంపాం. కానీ భద్రతా కారణాల దృష్ట్యా వారు రాలేదు. జూనియర్ ప్రపంచకప్‌నకు సైతం మా నుంచి అధికారిక ఆహ్వానం పంపించాం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ అన్నారు. చదవండి: Asia Cup 2025: భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు ఇంకా అమ్ముడుపోలేదు.. ఆసక్తి తగ్గిందా..? ఆగ్రహమా..? -
దబంగ్ ఢిల్లీ దూకుడు
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ జోరు కొనసాగుతోంది. తిరుగులేని ప్రదర్శనతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీ లీగ్‌లో వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన తొలి పోరులో దబంగ్ ఢిల్లీ 45–34 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై సునాయాస విజయం సాధించింది. కెపె్టన్ అశు మలిక్ 16 పాయింట్లతో విజృంభించగా... అజింక్య పవార్ (8 పాయింట్లు), నీరజ్ నర్వాల్ (6 పాయింట్లు) సారథికి సహకరించారు.బెంగాల్ వారియర్స్ కెపె్టన్ దేవాంక్ 12 పాయింట్లు సాధించగా... విశ్వాస్ 9 పాయింట్లతో పోరాడాడు. అయితే మ్యాచ్ ఆరంభంలోనే దబంగ్ ఢిల్లీ ఆధిక్యం సాధించింది. నీరజ్, అజింక్య సూపర్ రెయిడ్లతో ఢిల్లీ జట్టు వరుస పాయింట్లు సాధించగా... ఆ తర్వాత అశు చెలరేగిపోయాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన దబంగ్ ఢిల్లీ 8 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. బెంగాల్ వారియర్స్ 4 మ్యాచ్‌లాడి ఒక విజయం, 3 పరాజయాలతో 2 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అట్టడుగున ఉంది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ‘గోల్డెన్ రైడ్’లో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన పోరు నిర్ణీత సమయంలో 30–30 పాయింట్లతో సమం కాగా... విజేతను నిర్ణయించేందుకు ‘గోల్డెన్ రైడ్’ నిర్వహించాల్సి వచ్చింది. మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున నితిన్ కుమార్ 15 పాయింట్లతో సత్తా చాటగా... గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ 11 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో తెలుగు టైటాన్స్... యూపీ యోధాస్‌తో పుణేరి పల్టన్ తలపడనున్నాయి. -
పతకానికి విజయం దూరంలో నిఖత్ జరీన్
లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, రెండుసార్లు విశ్వవిజేత నిఖత్ జరీన్ మూడో పతకానికి విజయం దూరంలో నిలిచింది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5:0తో జపాన్‌కు చెందిన యునా నిషినాకాపై విజయం సాధించింది. 29 ఏళ్ల నిఖత్ 2022, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాలు గెలిచింది. మరోవైపు 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించి పతకానికి గెలుపు దూరంలో నిలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మీనాక్షి 5:0తో వాంగ్ కియుపింగ్ (చైనా)పై గెలుపొందింది. పురుషుల విభాగంలో భారత బాక్సర్లు సుమిత్ కుందు (75 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), నరేందర్ (ప్లస్ 90 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. సుమిత్ 0:5తో రామి కివాన్ (బల్గేరియా) చేతిలో, సచిన్ 1:4తో బిబార్స్ జెక్సన్ (కజకిస్తాన్) చేతిలో, నరేందర్ 1:4తో డీగో లెంజీ (ఇటలీ) చేతిలో, లక్ష్య చహర్ 0:3తో సీజర్ యోజెర్లిన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. పురుషుల విభాగంలో భారత్ నుంచి ప్రస్తుతం ఇద్దరు బాక్సర్లు మాత్రమే బరిలో మిగిలారు -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
హాంకాంగ్: భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 18–21, 21–10తో చియు సియాంగ్ చియె–వాంగ్ చి లిన్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిరణ్ జార్జి (భారత్) మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో కిరణ్ జార్జి 21–14, 21–13తో చియెమ్ జూన్ వె (మలేసియా)పై, 21–18, 21–14తో శంకర్ ముత్తుస్వామి (భారత్)లపై గెలుపొందాడు. మరోవైపు హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో తరుణ్ 28–26, 21–13తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించి... రెండో రౌండ్లో 23–21, 13–21, 18–21తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. -
బెంగళూరు బుల్స్‌కు రెండో విజయం
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్ ఖాతాలో రెండో విజయం చేరింది. హరియాణా స్టీలర్స్‌తో సోమవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 40–33 పాయింట్ల తేడాతో గెలుపొందింది. బెంగళూరు తరఫున అలీ రెజా 12 పాయింట్లు సాధించగా, యోగేశ్ 6 పాయింట్లు సాధించాడు. హరియాణా ఆటగాళ్లలో శివమ్ పటారే 7, మయాంక్ సైనీ 6 పాయింట్లతో రాణించారు. మరోవైపు మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ చేసింది. మూడు పరాజయాల తర్వాత ఆ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. పుణేరి పల్టన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 48–37 పాయింట్ల తేడాతో నెగ్గింది. పైరేట్స్ రెయిడర్ అయాన్ లోచబ్ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. అయాన్ ఒక్కడే 21 పాయింట్లు సాధించడం విశేషం. తొలి అర్ధ భాగంలోనే అయాన్ ‘సూపర్ 10’ సహా ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసిన పట్నా 27–10 తేడాతో ముందంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో సమష్టితత్వంతో కోలుకున్న పుణేరి పదునైన ఆటతో చెలరేగినా భారీ వ్యత్యాసాన్ని తగ్గించలేకపోయింది. పైరేట్స్‌ను రెండుసార్లు ఆలౌట్ చేసి రెండో అర్ధభాగంలో 27–21తో పైచేయి సాధించినా తుది ఫలితంలో మాత్రం 11 పాయింట్ల తేడాతో నిరాశ తప్పలేదు. పుణేరి తరఫున సచిన్ 6, అభిషేక్ గున్గే 5 పాయింట్లు నమోదు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌లలో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్...గుజరాత్ జెయింట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
జోరు కొనసాగించాలని...
హాంకాంగ్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తాజా కాంస్య పతకంతో జోరు మీదున్న భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి హంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పురుషుల డబుల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకు ద్వయం ఇటీవల పారిస్‌లో జరిగిన ఈవెంట్లో సత్తా చాటుకుంది. భారత బ్యాడ్మింటన్‌లోనే అత్యంత నిలకడైన షట్లర్లుగా ఖ్యాతి గాంచిన వీరిద్దరు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ ఈవెంట్లలో సెమీఫైనల్, ఫైనల్స్ చేరారు. ఇండియా ఓపెన్ సహా మలేసియా, చైనా, సింగపూర్ టోర్నీల్లో రాణించిన సాత్విక్–చిరాగ్ జంటకు హాంకాంగ్ టోర్నీలో ఎనిమిదో సీడ్ కేటాయించారు. పురుషుల డబుల్స్ తొలి మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ భారత జోడీ తొలి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన చియు హియాంగ్–వాంగ్ చి లిన్ జంటతో తలపడనుంది. సింధు సత్తా చాటేనా! రెండు వరుస ఒలింపిక్ పతకాల విజేత, భారత స్టార్ పీవీ సింధు ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్లో క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ పయనంలో ఆమె తనకన్నా ర్యాంకింగ్‌లో మెరుగైనా చైనా సూపర్‌స్టార్ వాంగ్ జి యిని కంగుతినిపించి తన పూర్వ వైభవాన్ని చాటుకుంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో హాంకాంగ్ టోర్నీపై కన్నేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ ఆంధ్రప్రదేశ్ షట్లర్ డెన్మార్క్ ప్లేయర్ లినె క్రిస్టోఫెర్సన్‌తో తలపడుతుంది. ఆమెతో పాటు మహిళల సింగిల్స్‌లో అనుపమ, రక్షిత శ్రీలు బరిలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో భారత మేటి ఆటగాడు లక్ష్యసేన్ తన ఫామ్‌ను అందిపుచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ టోర్నీని సానుకూలంగా మలచుకోవాలని ఆశిస్తున్నాడు. తొలి రౌండ్లో అతను వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)ను ఎదుర్కోనున్నాడు. యూఎస్ ఓపెన్ చాంపియన్ ఆయుశ్ షెట్టి... లూ గ్వాంగ్ జు (చైనా)తో, ప్రణయ్... ఐదో సీడ్ కొడాయ్ నరొకా (జపాన్)తో పోటీపడనున్నారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్, తరుణ్ మన్నేపల్లి క్వాలిఫయర్స్‌లో తలపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో హరిహరన్–రూబన్ కుమార్, మహిళల డబుల్స్‌లో రుతపర్ణ–శ్వేతపర్ణ జోడీలు బరిలోకి దిగుతున్నాయి. మిక్స్డ్ డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన గద్దె రుతి్వక శివాని... రోహన్ కపూర్‌తో జోడీ కట్టింది. -
భారత్‌కు మూడో స్థానం
హిసోర్ (తజికిస్తాన్): సెంట్రల్ ఏషియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (సీఏఎఫ్‌ఏ) నేషన్స్ కప్ టోర్నీలో భారత జట్టుకు మూడో స్థానం లభించింది. ఒమన్ జట్టుతో సోమవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో 3–2తో విజయం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ఒమన్ జట్టుపై భారత్‌కిదే తొలి గెలుపు కావడం విశేషం. నిరీ్ణత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఒమన్ తరఫున జమీల్ (55వ నిమిషంలో) గోల్ చేయగా... 80వ నిమిషంలో ఉదాంత సింగ్ గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. ‘షూటౌట్’లో ఒమన్ ఆటగాళ్లు తొలి రెండు షాట్లను వృథా చేయగా... చివరిదైన ఐదో షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నిలువరించి జట్టును గెలిపించాడు. భారత్ తరఫున లాలియన్జువాలా, రాహుల్ భెకె, జితిన్ గోల్స్ చేయగా... అన్వర్ అలీ, ఉదాంత సింగ్ గురి తప్పారు. -
గుకేశ్‌కు అభిమన్యు షాక్
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) గ్రాండ్ స్విస్ టోర్నీలో సోమవారం సంచలనం చోటు చేసుకుంది. ఐదో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. భారత సంతతికి చెందిన అమెరికా గ్రాండ్‌మాస్టర్, 16 ఏళ్ల అభిమన్యు మిశ్రా 61 ఎత్తుల్లో గుకేశ్‌ను ఓడించాడు. మరో గేమ్‌లో టాప్ సీడ్, భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద 55 ఎత్తుల్లో మథియాస్ బ్లూబామ్ (జర్మనీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 37 ఎత్తుల్లో నికిత వితియుగోవ్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. ఈ టోర్నీలో మూడు గేముల్లో నెగ్గి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న అర్జున్ మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నాడు. -
అల్కరాజ్ ‘సిక్సర్’
న్యూయార్క్: మూడు నెలల వ్యవధిలో మూడోసారి చిరకాల ప్రత్యర్థులు కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), యానిక్ సినెర్ (ఇటలీ) మధ్య ‘గ్రాండ్‌స్లామ్ ఫైనల్’ సమరం... ప్రతి పాయింట్‌కూ హోరాహోరీ తప్పదని... ఐదు సెట్ల పోరు ఖాయమని అభిమానులు భావించారు. కానీ అల్కరాజ్ అలాంటి అవకాశం ఇవ్వలేదు. 2 గంటల 42 నిమిషాల్లో డిఫెండింగ్ చాంపియన్ సినెర్‌ను 6–2, 3–6, 6–1, 6–4తో ఓడించి రెండోసారి యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. విజేత అల్కరాజ్కు 50 లక్షల డాలర్లు (రూ. 44 కోట్ల 11 లక్షలు), రన్నరప్ సినెర్‌కు 25 లక్షల డాలర్లు (రూ. 22 కోట్ల 5 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా విజయంతో అల్కరాజ్ రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ అందుకున్నాడు. ఇప్పటికే అల్కరాజ్ రెండుసార్లు చొప్పున ఫ్రెంచ్ ఓపెన్ (2024, 2025), వింబుల్డన్ (2023, 2024), యూఎస్ ఓపెన్ (2022, 2025) టైటిల్స్ నెగ్గాడు. రెండు బ్రేక్ పాయింట్లతో... ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఐదు సెట్లలో సినెర్‌ను ఓడించిన అల్కరాజ్... వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో నాలుగు సెట్లలో సినెర్ చేతిలో ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో యూఎస్ ఓపెన్ తుదిపోరుపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. అయితే ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరిన అల్కరాజ్ తొలి గేమ్ నుంచే తన జోరు కనబరిచాడు. రెండో గేమ్‌లో, ఏడో గేమ్‌లో సినెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో సినెర్ పుంజుకున్నాడు. నాలుగో గేమ్‌లో అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను గెల్చుకున్నాడు. ఇక మూడో సెట్లో అల్కరాజ్ అసాధారణ ప్రదర్శన ముందు సినెర్ తేలిపోయాడు. 5–0తో ఆధిక్యంలోకి వెళ్లిన అల్కరాజ్ ఆ తర్వాత ఒక గేమ్ కోల్పోయి సెట్‌ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్ పోటాపోటీగా సాగినా ఐదో గేమ్‌లో సినెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.2 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్ మొదలయ్యాక (1973లో) ఒకే సీజన్లో రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌ను ఓడించిన రెండో ప్లేయర్‌గా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు రాఫెల్ నాదల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 2008లో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీ ఫైనల్స్‌లో నాటి నంబర్‌వన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై గెలిచి విజేతగా నిలిచాడు.2 జాన్ బోర్గ్ (స్వీడన్ –7 టైటిల్స్) తర్వాత 23 ఏళ్ల లోపే ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా అల్కరాజ్ (22 ఏళ్ల 111 రోజులు) నిలిచాడు.1 మూడు వేర్వేరు కోర్టులపై (హార్డ్, క్లే, గ్రాస్) రెండుసార్లు చొప్పున గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన అతిపిన్న వయస్కుడిగా అల్కరాజ్ గుర్తింపు పొందాడు.6 అల్కరాజ్ కెరీర్లో నెగ్గిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్. ఓపెన్ శకంలో (1968 నుంచి) కనీసం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడా కారుల జాబితాలో స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), బోరిస్ బెకర్ (జర్మనీ) సరసన అల్కరాజ్ చేరాడు. ఈ జాబితాలో జొకోవిచ్ (24), నాదల్ (22), ఫెడరర్ (20), సంప్రాస్ (14), జాన్ బోర్గ్ (11), జిమ్మీ కానర్స్, ఇవాన్ లెండిల్, అగస్సీ (8 చొప్పున), విలాండర్, జాన్ మెకన్రో (7 చొప్పున) ముందున్నారు. -
సింగపూర్‌పై 12–0తో గెలిచి ‘సూపర్–4’ దశకు భారత్
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ లీగ్ దశను భారత జట్టు అజేయంగా ముగించింది. సింగపూర్ జట్టుతో సోమవారం జరిగిన పూల్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 12–0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవ్‌నీత్ కౌర్ (14వ, 20వ, 28వ నిమిషాల్లో), ముంతాజ్ ఖాన్ (2వ, 32వ, 39వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున చేశారు. నేహా (11వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించింది. లాల్రెమ్సియామి (13వ నిమిషంలో), ఉదిత (29వ నిమిషంలో), షరి్మలా (45వ నిమిషంలో), రుతుజా (53వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 11–0తో నెగ్గిన భారత్... జపాన్‌తో రెండో మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకుంది. పూల్ ‘బి’లో భారత్, జపాన్ జట్లు ఏడు పాయింట్లతో సమంగా నిలిచినా... ఎక్కువ గోల్స్ చేసిన భారత్‌కు అగ్రస్థానం ఖాయమైంది. జపాన్‌కు రెండో స్థానం దక్కింది. పూల్ ‘బి’ నుంచి భారత్, జపాన్... పూల్ ‘ఎ’ నుంచి చైనా, దక్షిణ కొరియా జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధించాయి. బుధవారం జరిగే ‘సూపర్–4’ మ్యాచ్‌ల్లో కొరియాతో భారత్; జపాన్‌తో చైనా తలపడతాయి. ‘సూపర్–4’ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత పొందుతాయి. విజేత జట్టు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధిస్తుంది. -
మానవ శక్తికి కొత్త నిర్వచనం.. 510 కిలోల బరువును సునాయాసంగా ఎత్తేశాడు..!
ఐస్లాండ్కు చెందిన ప్రఖ్యాత స్ట్రాంగ్‌మాన్ హాఫ్థోర్ బ్జోర్న్సన్ (Hafthor Bjornsson) మానవ శక్తికి కొత్త నిర్వచనం చెప్పాడు. బర్మింగ్హమ్లో జరిగిన 2025 వరల్డ్ డెడ్‌లిఫ్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఊహకందని విధంగా 510 కిలో బరువు (1,124.4 పౌండ్లు) ఎత్తాడు. ఈ క్రమంలో తన పేరిటే ఉండిన ప్రపంచ రికార్డును (505 కిలోలు) తిరగరాశాడు. బ్జోర్న్సన్ 500 కిలోలకు పైగా డెడ్‌లిఫ్ట్ చేయడం ఇది మూడోసారి. 2020లో 501 కిలోలు, 2025 జులై 505 కిలోల బరువులు ఎత్తాడు. తాజా ఉదంతంతో బ్జోర్న్సన్ మానవ శక్తి సామర్థ్యానికి కొత్త ప్రమాణాన్ని స్థాపించాడు. అతని శ్రమ, పట్టుదల, శరీర సామర్థ్యం ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్నాయి.510kg / 1124lbs DEADLIFT WORLD RECORD pic.twitter.com/WMKUqQvvzr— Hafþór J Björnsson (@ThorBjornsson_) September 6, 20252018లో వరల్డ్ స్ట్రాంగ్మాన్గా అవతరించిన బ్జోర్న్సన్.. ఆతర్వాత Arnold Strongman Classic, Europe’s Strongest Man పోటీలు గెలిచి, ఒకే సంవత్సరంలో ఈ ఘనతలు సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్రకెక్కాడు. 36 ఏళ్ల బ్జోర్న్సన్ తన కెరీర్లో 129కి పైగా ప్రపంచ రికార్డులు, 32 అంతర్జాతీయ టైటిళ్లు సాధించాడు. బ్జోర్న్సన్ Game of Thrones సినిమాలో “The Mountain” పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. -
యూఎస్ ఓపెన్ విజేత అల్కరాజ్.. అరుదైన ఘనత
స్పానిష్ యువ సంచలనం కార్లోస్ ఆల్కరాజ్ 2025 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఫైనల్లో ఇటలీకి చెందిన జానిక్ సినర్‌ను 6–2, 3–6, 6–1, 6–4 తేడాతో ఓడించి, రెండో యూఎస్ ఓపెన్‌ను (2022, 2025), ఓవరాల్‌గా ఆరో గ్రాండ్‌స్లామ్‌ను (2022 యూఎస్ ఓపెన్, 2023 వింబుల్డన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, 2025 ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్) సొంతం చేసుకున్నాడు.ఈ గెలుపుతో అల్కరాజ్ నంబర్ వన్ స్థానాన్ని కూడా తిరిగి దక్కించకున్నాడు. అల్కరాజ్ 23 ఏళ్ల వయసులోనే మూడు వేర్వేరు సర్ఫేస్‌లపై (క్లే, గ్రాస్, హార్డ్కోర్ట్) బహుళ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. అల్కరాజ్, సినర్ ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో తలపడ్డాడు. ఇందులో సినర్ వింబుల్డన్ విజేతగా నిలువగా.. అల్కరాజ్ మిగతా రెండు (ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్) గెలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్థర్ ఆష్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అల్కరాజ్ తన అద్భుతమైన ఫుట్‌వర్క్, శక్తివంతమైన ఫోర్హ్యాండ్స్తో సినర్‌ను కట్టడి చేశాడు. ఆట ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన అల్కరాజ్ తొలి సెట్ గెలిచి, రెండో సెట్ కోల్పోయినప్పటికీ.. తిరిగి పుంజుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ఫస్ట్-సర్వ్ అద్భుతంగా ఉండింది. ఇందులో అతను 83 శాతం విజయవంతమయ్యాడు. ఇదే అతని ఆటకు స్థిరతనిచ్చింది. మ్యాచ్ ఆధ్యాంతం అల్కరాజ్ ఫోర్‌హ్యాండ్ వేగం 100mph పైబడి ఉండింది. ఈ శక్తివంతమైన షాట్లే సినర్‌ను వెనక్కి నెట్టాయి. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ అసమాన మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాడు. కీలక పాయింట్లలో ఒత్తిడిని ఎదుర్కొని, క్లచ్ షాట్లతో మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నాడు.సినర్ విషయానికొస్తే.. తొలి సెట్ కోల్పోయినప్పటికీ, రెండో సెట్లో అద్భుతంగా పుంజుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సినర్ బేస్‌లైన్ కంట్రోల్ బాగా ఉండింది. ర్యాలీల్లో స్థిరత్వాన్ని ప్రదర్శించాడు. అన్ ఫోర్స్డ్ ఎర్రర్లు తక్కువగా ఉన్నాయి. ఫుట్‌వర్క్, బ్యాక్ హ్యాండ్ ఎగ్జిక్యూషన్ బాగానే ఉన్నాయి.అయితే సర్వీస్‌లో లోపాలు అతని కొంపముంచాయి. సినర్ ఫస్ట్-సర్వ్ విజయశాతం కేవలం 48 శాతంగా ఉంది. అలాగే సినర్ అల్కరాజ్కు బ్రేక్ అవకాశాలు చాలా ఇచ్చాడు. అతని ఆటకు తగిన విధంగా స్పందించలేకపోయాడు. మూడో సెట్ కోల్పోవడం సినర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఓవరాల్‌గా చూస్తే ఈ మ్యాచ్‌లో సినర్ అల్కరాజ్తో పోటీలో వెనుకపడ్డాడు. -
తెలుగు టైటాన్స్‌కు రెండో విజయం
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ లో తెలుగు టైటాన్స్ రెండో విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ 44–34 తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. టైటాన్స్ జట్టులో భరత్ 12, విజయ్ 11 పాయింట్లు సాధించారు. రెయిడర్ చేతన్ సాహు, డిఫెండర్ అంకిత్ చెరో 5 పాయింట్లు చేశారు. బెంగాల్ తరఫున కెప్టెన్ దేవాంక్ ఒంటరి పోరాటం చేసి 13 పాయింట్లు సాధించాడు. డిఫెండర్లలో నితీశ్ (6), ఆశిష్ (5) మెరుగ్గా ఆడారు. అనంతరం పోటాపోటీగా జరిగిన రెండో మ్యాచ్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన జైపూర్ పింక్ పాంథర్స్ 35–36తో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. దబంగ్ కెప్టెన్ అశు మలిక్ 21 పాయింట్లు సాధించాడు. జైపూర్ తరఫున రెయిడర్లు నితిన్ (14), సాహిత్ (10) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణాతో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
మనదే ఆసియా కప్
రాజ్‌గిర్ (బిహార్): మ్యాచ్ మ్యాచ్‌కూ రాటుదేలిన భారత పురుషుల హాకీ జట్టు అసలు సిసలు సమరంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. సొంతగడ్డపై జరిగిన ఆసియా కప్ టోర్నీలో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 4–1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా జట్టును ఓడించింది. ఈ విజయంతో ఆసియా కప్ విజేత హోదాలో... భారత జట్టు వచ్చే ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచ కప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది. కొరియాతో జరిగిన ఫైనల్లో భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (28వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... సుఖ్జీత్ సింగ్ (1వ నిమిషంలో), అమిత్ రోహిదాస్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. కొరియా జట్టుకు డెయిన్ సన్ (51వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. విజేతగా నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 3 లక్షల చొప్పున... సహాయక సిబ్బందికి రూ. 1 లక్ష 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది. ఆసియా కప్‌ను అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన కొరియా జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఫైనల్లో భారత్ పక్కా వ్యూహంతో ఆడింది. తొలి నిమిషం నుంచే సమన్వయంతో కదులుతూ దాడులు చేసింది. ఫలితంగా తొలి నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ జోరు కొనసాగించగా... ఆతిథ్య జట్టు దాడులను అడ్డుకోవడంలోనే కొరియాకు సమయం సరిపోయింది. మ్యాచ్ మొత్తం భారత్ ఒకేతీరుగా ఆడటంతో కొరియాకు తేరుకునే అవకాశం లేకుండా పోయింది. నాలుగు గోల్స్ సమర్పించుకున్నాక కొరియా ఖాతా తెరిచినా అప్పటికే ఆలస్యమైపోయింది. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు రాగా ఒక దానిని సద్వినియోగం చేసుకుంది. ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను వృథా చేసింది. కొరియా జట్టుకు లభించిన మూడు పెనాల్టీ కార్నర్లలో ఒక దానిని గోల్‌గా మలిచింది. అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మలేసియా 4–1తో చైనాపై గెలిచింది.4: ఆసియా కప్ టైటిల్ సాధించడం భారత్‌కిది నాలుగోసారి. గతంలో భారత్ 2003, 2007, 2017లలో విజేతగా నిలిచింది. కొరియా అత్యధికంగా ఐదుసార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది.164: తాజా ఆసియా కప్‌లో నమోదైన మొత్తం గోల్స్. ఇందులో 97 ఫీల్డ్ గోల్స్ కాగా... 59 పెనాల్టీ కార్నర్ల ద్వారా, 8 పెనాల్టీ స్ట్రోక్‌ల ద్వారా వచ్చాయి. మలేసియా ప్లేయర్ అఖీముల్లా 12 గోల్స్‌తో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున అభిõÙక్, హర్మన్‌ప్రీత్, సుఖ్జీత్ 6 గోల్స్ చొప్పున చేశారు.39: తాజా ఆసియా కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా భారత్ (39) నిలిచింది. ఈ టోర్నీలో భారత్ ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. -
ఆసియకప్ విజేతగా టీమిండియా..
హాకీ ఆసియా కప్- 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం రాజ్‌గిర్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సౌత్ కొరియాను 4-1 తేడాతో టీమిండియా చిత్తు చేసింది. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఆసియాకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరగనున్న హాకీ వరల్డ్‌కప్‌కు భారత్ నేరుగా ఆర్హత సాధించింది.ఓవరాల్‌గా భారత్‌కు ఇది నాల్గో ఆసియాకప్ టైటిల్. చివరగా 2017 బంగ్లాదేశ్‌లో జరిగిన హాకీ ఆసియాకప్‌ను ఇండియా గెలుచుకుంది. ఈ తుది పోరులో భారత్ తరపున దిల్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించగా.. సుఖ్జీత్, అమిత్ రోహిదాస్ చెరో గోల్ సాధించింది. నిర్ణీత సమయంలో భారత్ నాలుగు గోల్స్ సాధించగా.. కొరియా కేవలం ఒక్క గోల్‌కే పరిమితమైంది. రెండు గోల్స్‌తో మెరిసిన దిల్ప్రీత్కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత హాకీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలుఆసియాకప్లో అద్భుత విజయం సాధించిన భారత హాకీ జట్టుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ‘టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ‘ ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు జగన్.Heartiest congratulations to Team India on a magnificent victory at the Asia Cup 2025 in Rajgir, Bihar! Wishing the entire team continued success, good health, and glory in the years ahead.#HockeyIndia pic.twitter.com/80jd1hj5s3— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2025 -
World Archery Championships: భారత్‌కు గోల్డ్ మెడల్.. జ్యోతి జోడీకి రజతం
ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్-2025లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫుగేలతో కూడిన భారత పురుషల జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిషబ్- వెన్నం జ్యోతిసురేఖ జోడికి రజత పతకం దక్కింది.ఆదివారం జరిగిన ఫైనల్లో తొలుత భారత మెన్స్ టీమ్ ఫ్రాన్స్‌తో తలపడింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో కేవలం రెండు పాయింట్ల తేడాతో ఇండియా విజయం సాధించింది. రిషబ్ అండ్ కో 235 పాయింట్లు సాధించగా ఫ్రాన్స్ 233 పాయింట్లు సాధించింది. భారత పురుషుల జట్టు ఈ మెగా ఈవెంట్లో స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. మరోవైపు కాంపౌండ్ మిక్సిడ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో సురేఖ, రిషబ్ యాదవ్‌లతో కూడిన భారత జట్టు తృటిలో స్వర్ణాన్ని చేజార్చుకుంది. ఫైనల్ లో నెదర్లాండ్స్ జోడి చేతిలో 157-155 తేడాతో ఓటమి పాలయ్యారు. కేవలం రెండు పాయింట్ల తేడాతో పసడి పతకాన్ని భారత్ కోల్పోయింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు గెలిచిన భారత ఆర్చర్‌గా ఇప్పటికే రికార్డు సాధించిన జ్యోతి సురేఖకు ఇది తొమ్మిదో పతకం కావడం విశేషం.చదవండి: పాక్‌లో మ్యాచ్ జరుగుతుండగా ఉగ్రదాడి.. సౌతాఫ్రికా పర్యటనపై నీలినీడలు? -
యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సబలెంకా
బెలారస్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ అరినా సబలెంకా వరుసగా రెండో ఏడాది యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఆమె అమెరికాకు చెందిన అమండ అనిసిమోవాను వరుస సెట్లలో (6–3, 7–6(3)) ఓడించింది. 94 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సబలెంక 13 విన్నర్లు కొట్టి, 15 అన్ఫోర్స్డ్ ఎర్రర్లు మాత్రమే చేసింది. అనిసిమోవా 29 అన్ఫోర్స్డ్ ఎర్రర్లు, 7 డబుల్ ఫాల్ట్స్ చేసి తడబడింది.ఈ మ్యాచ్‌లో సబలెంక తన శక్తివంతమైన సర్వ్‌లు, ఖచ్చితమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లతో అనిసిమోవాను కట్టడి చేసింది. రెండో సెట్ టైబ్రేక్‌కి వెళ్లినా, ఆమె మానసిక స్థైర్యాన్ని చూపించి విజయం సాధించింది.సబలెంకకు ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్. అన్ని టైటిళ్లను ఆమె హార్డ్కోర్ట్లపైనే సాధించింది. దీంతో ఆమెకు హార్డ్కోర్డ్ల రాణిగా గుర్తింపు వచ్చింది. సబలెంక 2023, 2024లో వరుసగా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు సాధించి.. 2024, 2025లో వరుసగా యూఎస్ ఓపెన్‌ను గెలిచింది. వరుసగా రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లు సాధించడంతో సబలెంక సెరీనా విలియమ్స్ సరసన చేరింది. సెరీనా కూడా గతంలో వరుసగా రెండు ఎడిషన్లలో యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచింది.టైటిల్ గెలిచిన అనంతరం సబలెంక మాట్లాడుతూ.. ఇది నా జీవితంలో మరచిపోలేని క్షణం. నా దేశానికి, అభిమానులకు ఈ విజయం అంకితమని తెలిపింది. తాజా విజయంతో సబలెంక 100 గ్రాండ్ స్లామ్ మ్యాచ్‌లు గెలిచిన రెండో మహిళగానూ గుర్తింపు పొందింది. సబలెంక ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఫైనల్‌కు చేరి కోకో గాఫ్ చేతిలో పరాజయంపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. -
బెంగళూరు బోణీ
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు 38–30తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. పీకేఎల్‌లో అత్యధికంగా మూడుసార్లు విజేతగా నిలిచిన పట్నా పరాజయాల పరంపరలో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. పైరేట్స్ ఆడిన మూడు ఓడగా... నాలుగో మ్యాచ్‌లో బుల్స్ తొలి విజయాన్ని సాధించింది. బెంగళూరు జట్టులో ఆల్‌రౌండర్ అలీరెజా మిర్జాయిన్ (10), రెయిడర్ ఆశిష్ మాలిక్ (8) అదరగొట్టారు. డిఫెండర్లు దీపక్ శంకర్ (4), యోగేశ్ (3), సత్యప్ప, సంజయ్ చెరో 2 పాయింట్లు చేశారు. పట్నా పైరేట్స్ జట్టులో రెయిడర్ అయాన్ (10) ఒంటరి పోరాటం చేశాడు. 15 సార్లు కూతకెళ్లిన అయాన్ పది పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతావారిలో సుధాకర్ (6), అంకిత్ కుమార్ (4) మెరుగ్గా ఆడారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయంట్స్ 37–28తో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. గుజరాత్ జట్టులో ఆల్‌రౌండర్లు నితిన్ పన్వార్ (8), మొహమ్మద్ రెజా (6) రాణించారు. రెయిడర్లు రాకేశ్ 6, హిమాన్షు సింగ్ 4 పాయింట్లు సాధించారు. తలైవాస్ జట్టులో కెపె్టన్ పవన్ సెహ్రావత్ (6), నితీశ్ కుమార్ (5), అర్జున్ దేశ్వాల్ (5) ఆకట్టుకున్నారు. నేడు ఆదివారం జరిగే మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్, దబంగ్ ఢిల్లీతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనున్నాయి. -
తెలంగాణ శుభారంభం
నారాయణ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్): సీనియర్ మహిళల జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ రాజ్‌మాత జిజాబాయ్ ట్రోఫీలో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి పోరులో తెలంగాణ జట్టు 8–1 గోల్స్ తేడాతో ఆంధ్రప్రదేశ్‌పై విజయం సాధించింది. తెలంగాణ జట్టు తరఫున రంజిత దేవి (36వ, 40వ, 51వ, 60వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో అదరగొట్టింది. గుగులోత్ సౌమ్య (6వ, 25వ నిమిషంలో), పుల్లూరి సోనీ (21వ, 67వ నిమిషంలో) చెరో రెండు గోల్స్‌తో సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున వ్యాసపురం నందిని (49వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. మ్యాచ్ ఆరంభమైన ఆరో నిమిషంలోనే సౌమ్య గోల్‌తో ఖాతా తెరిచిన తెలంగాణ... ఇక ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్న సౌమ్య... రెండు గోల్స్ చేయడంతో పాటు జట్టుకు ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించింది. శనివారమే జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో పశ్చిమ బెంగాల్ 7–0 గోల్స్ తేడాతో మేఘాలయపై, సిక్కీం 2–1తో రైల్వేస్‌పై, అస్సాం 7–0తో త్రిపురపై గెలుపొందాయి. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక మధ్య మ్యాచ్ 1–1 గోల్స్‌తో ‘డ్రా’ కాగా... మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. తదుపరి మ్యాచ్‌ల్లో సోమవారం ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణ... కర్ణాటకతో ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. -
సినెర్ X అల్కరాజ్
పురుషుల టెన్నిస్‌లో అసాధారణంగా సాగుతున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్ల వైరం మరో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరింది. వరల్డ్ నంబర్ 1 యానిక్ సినెర్, నంబర్ 2 కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్‌లో తుది పోరుకు అర్హత సాధించారు. ఏకపక్షంగా సాగిన తొలి సెమీస్‌లో దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను అల్కరాజ్ అలవోకగాఓడించగా... మరో సెమీస్‌లో ఆగర్ అలియసిమ్పై సినెర్ విజయం సాధించాడు. ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ సినెర్, అల్కరాజ్‌ల మధ్యనే జరుగుతుండటం విశేషం. న్యూయార్క్: క్లే కోర్టు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ గెలుపు... గ్రాస్ కోర్టు వింబుల్డన్ ఫైనల్లో విజేత సినెర్... ఇప్పుడు హార్డ్ కోర్ట్‌లో చాంపియన్ ఎవరో నేడు తేలనుంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో సినెర్ (ఇటలీ), అల్కరాజ్ (స్పెయిన్) ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్లో అల్కరాజ్ 6–4, 7–6 (7/4), 6–2తో జొకోవిచ్ (సెర్బియా)పై ఘన విజయం సాధించాడు. 2 గంట 23 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో అల్కరాజ్ ముందు 38 ఏళ్ల జొకోవిచ్ నిలవలేకపోయాడు. 31 విన్నర్లు కొట్టిన అల్కరాజ్ 7 ఏస్‌లు సంధించాడు. రెండో సెమీ ఫైనల్లో సినెర్ 6–1, 3–6, 6–3, 6–4తో 25వ సీడ్ అలియసిమ్ (కెనడా)ను ఓడించాడు. 3 గంటల 21 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో అలియసిమ్ గట్టి పోటీనిస్తూ ఒక సెట్ గెలవడంలో సఫలమైనా...చివరకు సినెర్దే పైచేయి అయింది. సినెర్ 11 ఏస్‌లు కొట్టగా, ఆగర్ 9 ఏస్‌లు బాదాడు. నువ్వా, నేనా... పురుషుల టెన్నిస్‌ను 24 ఏళ్ల సినెర్, 22 ఏళ్ల అల్కరాజ్ శాసిస్తున్నారు. ఓపెన్ ఎరా చరిత్రలో ఒకే సీజన్లో మూడు గ్రాండ్‌స్లామ్‌లలో ఫైనల్‌కు చేరిన తొలి జోడీగా వీరిద్దరు గుర్తింపు పొందారు. గత తొమ్మిది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో ఎనిమిదింటిని వీరిద్దరే పంచుకున్నారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల మధ్య 14 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో అల్కరాజ్ 9–5తో ముందంజలో ఉన్నాడు. యూఎస్ ఓపెన్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే 2022 క్వార్టర్ ఫైనల్లో వీరిద్దరు తలపడ్డారు. ఏకంగా రికార్డు స్థాయిలో 5 గంటల 15 నిమిషాల పాటు సాగిన పోరులో అల్కరాజ్ గెలిచాడు. నాటినుంచే గ్రాండ్‌స్లామ్‌లో ఇద్దరి వైరం మొదలైంది. తాజా ఫామ్‌ను చూసుకుంటే 2025లో రెండు గ్రాండ్‌స్లామ్‌లు (ఆ్రస్టేలియన్ ఓపెన్, వింబుల్డన్) సినెర్ ఖాతాలో చేరగా, ఫ్రెంచ్ ఓపెన్‌ను అల్కరాజ్ గెలుచుకున్నాడఆ్రస్టేలియన్ ఓపెన్‌లో అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. సినెర్ వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌లోనూ ఫైనల్ చేరిన ఘనతను నమోదు చేశాడు. రాడ్ లేవర్, ఫెడరర్ (3 సార్లు), జొకోవిచ్ (3 సార్లు) తర్వాత ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా సినెర్ నిలిచాడు. ప్రస్తుత టోర్నీలో అల్కరాజ్ పూర్తి స్థాయిలో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించగా...సినెర్ సెమీస్‌లో గాయంతో కాస్త తడబడ్డాడు. అతను పూర్తి ఫిట్‌గా ఉంటే మరో అద్భుత పోరును చూడొచ్చు.మళ్లీ వస్తా: జొకోవిచ్25వ గ్రాండ్‌స్లామ్ సాధించేందుకు పట్టు వదలకుండా పోరాడుతున్న దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సెమీస్‌లో అల్కరాజ్ ముందు 38 ఏళ్ల జొకోవిచ్ నిలవలేకపోయాడు. 2025 సీజన్లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలోనూ సెమీ ఫైనల్ వరకు వచ్చిన సెర్బియా స్టార్ ఆట అక్కడే ముగిసింది. సెమీస్‌లలో వరుసగా జ్వెరెవ్, సినెర్ (2 సార్లు), అల్కరాజ్ చేతుల్లో అతను ఓడాడు. అయితే తాను ఇంకా ఆశలు కోల్పోలేదని, పోరాటం ఆపనని అతను స్పష్టం చేశాడు. ‘గ్రాండ్‌స్లామ్‌ల వేటలో నేను ఆగిపోవడం లేదు. కనీసం మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసమైనా నా పోరాటం కొనసాగిస్తాను. ఇది కష్టమైన పని అని అందరికీ తెలుసు. సెమీస్‌లో తొలి రెండు సెట్ల వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత నాలో సత్తువ తగ్గిపోయింది. తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్న ఒక కుర్రాడితో తలపడుతున్నప్పుడు ఈ వయసులో అంతకంటే ఎక్కువ ఆశించడం కూడా సరైంది కాదు. సినెర్, అల్కరాజ్ లాంటి ప్లేయర్లతో 5 సెట్లు ఆడటం కష్టంగా మారిపోయింది. అయితే ఈ పోటీని నేను ఇష్టపడుతున్నా. మైదానంలో అభిమానుల మద్దతు, ఆ ఉత్సాహం వల్లే నేను ఇంకా ఆడగలుగుతున్నా’ అని జొకోవిచ్ చెప్పాడు. -
భారత్, జపాన్ మ్యాచ్ ‘డ్రా’
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారీ విజయంతో శుభారంభం చేసిన భారత జట్టు... డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. తొలి మ్యాచ్‌లో 11–0 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుచేసిన సలీమా టెటె సారథ్యంలోని టీమిండియా... శనివారం జపాన్‌తో రెండో మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’గా ముగించింది. పూల్ ‘బి’లో భాగంగా జరిగిన ఈ పోరులో చివరి క్షణాల్లో నవ్‌నీత్ కౌర్ గోల్ చేసి జట్టును గట్టెక్కించింది. భారత్ తరఫున రుతుజ (30వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్ (60వ నిమిషంలో) చెరో గోల్ సాధించగా... జపాన్ తరఫున హిరోకా మురయామా (10వ నిమిషంలో), చికో ఫుజిబయాషి (58వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేసుకున్నారు. పూల్ ‘బి’లో భాగంగా శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 2–1 గోల్స్ తేడాతో సింగపూర్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో సోమవారం సింగపూర్‌తో భారత్ తలపడనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటుండగా... ఒక్కో పూల్ నుంచి ఉత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్లు... సూపర్–4 దశకు అర్హత సాధించనున్నాయి. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఈ నెల 14న ఫైనల్ జరుగుతుంది. అందులో గెలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనున్న మహిళల వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత సాధించనుంది. -
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ శుభారంభం
లివర్‌పూల్: తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటుతూ శుభారంభం చేసింది. మరో వైపు టోక్యో ఒలింపిక్స్ పతక విజేత లవ్లీనా బొర్గోహైన్‌కు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. పారిస్ ఒలింపిక్స్‌లో గాయంతో రెండో రౌండ్లోనే నిష్క్రమించిన నిఖత్ ఈ టోర్నీకి దీటుగా సిద్ధమైంది. శనివారం మహిళల 51 కేజీల విభాగంలో జరిగిన తొలి రౌండ్లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఆమె అద్భుతమైన పంచ్ పవర్‌తో అమెరికా ప్రత్యర్థి జెన్నిఫర్ లొజానోను కంగుతినిపించింది. ఈ తెలంగాణ స్టార్ 5–0తో జెన్నిఫర్‌పై తిరుగులేని విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. అయితే మహిళల 75 కేజీల కేటగిరీలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన లవ్లీనా తొలి రౌండ్లోనే 0–5తో టర్కీకి చెందిన బుస్రా ఇసిల్దార్ చేతిలో కంగుతింది. పురుషుల ఈవెంట్లోనూ భారత్‌కు శనివారం కలిసిరాలేదు. రెండు సార్లు ప్రపంచకప్ పతకాలు సాధించిన హితేశ్ గులియా 70 కేజీల కేటగిరీలో రెండో రౌండ్లోనే ఇంటి దారి పట్టాడు. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత బాక్సర్ 1–4తో బాస్ ఫిన్ రాబర్ట్ చేతిలో ఓడాడు. హితేశ్‌కు తొలిరౌండ్లో బై లభించగా.. రెండో రౌండ్లో తలపడిన భారత ఆటగాడికి డచ్ బాక్సర్ చేతిలో చుక్కెదురైంది. పురుషుల 90 ప్లస్ కేజీల తొలిరౌండ్లో నరేందర్ బెర్వాల్ 4–1తో ఐర్లాండ్ బాక్సర్ మారి్టన్ క్రిస్టోఫర్‌పై విజయం సాధించాడు. -
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. రెండు పతకాలు ఖాయం
సౌత్ కొరియా వేదికగా జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్ షిప్-2025లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫుగేలో కూడిన భారత పురుషల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.తొలి రౌండ్లో భారత బృందానికి బై లభించడంతో నేరుగా రెండో రౌండ్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో సెకెండ్ రౌండ్లో ఇండియన్ టీమ్‌కు ఆస్ట్రేలియా నుంచి గట్టి పోటీ ఎదురైంది. నిర్ణీత సమయంలో రెండు జట్ల పాయింట్లు 232-232 సమం కావడంతో షూట్-ఆఫ్ నిర్వహించారు. షూట్-ఆఫ్‌లో 30-28 తేడాతో భారత్ విజయం సాధించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో యూఎస్‌పై (234-233) ఒక్క పాయింట్ తేడాతో భారత్ గెలుపొందింది. క్వార్టర్స్‌లో భారత్ ఆరంభం నుంచి వెనకబడి ఉన్నప్పటికి ఆఖరిలో ఆర్చర్లు అద్భుతాలు చేయడంతో యూఎస్‌పై పైచేయి సాధించింది.ఇక సెమీఫైనల్లో మూడవ సీడ్ టర్కీ(234-232 )ని రెండు పాయింట్ల తేడాతో ఓడించి తమ ఫైనల్ బెర్త్‌ను టీమిండియా ఖారారు చేసుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్‌ను భారత్ బృందం ఎదుర్కొనుంది. భారత్ ఫైనల్ చేరడంలో రిషబ్ యాదవ్‌ది కీలక పాత్ర. క్వాలిఫయింగ్ రౌండ్లో 709 పాయింట్లతో భారత తరపున టాప్ స్కోరర్‌గా నిలిచిన రిషబ్.. క్వార్టర్స్, సెమీస్‌లోనూ సత్తాచాటాడు.ఆ తర్వాత రిషబ్ యాదవ్.. వెన్నం జ్యోతీ సురేఖతో కలిసి కాంపౌండ్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. సెమీఫైనల్లో చైనీస్ తైపీపై 157-155 పాయింట్లతో తేడాతో ఈ భారత ద్వయం విజయం సాధించింది. ఆదివారం ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడనున్నారు. -
ఒక్కసారి కూడా కలవలేదు.. వ్యక్తిత్వం నచ్చి రూ. 8400 కోట్ల ఆస్తి రాసిచ్చేశాడు..!
ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనంగా మారిన ఓ వార్త ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బ్రెజిల్‌కు చెందిన ఓ 31 ఏళ్ల వ్యాపారవేత్త తన యావదాస్తిని (సుమారు ₹8,400 కోట్లు (USD 6.1 బిలియన్)) తన దేశానికే చెందిన స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్‌కు రాసిచ్చాడు. ఈ వార్త సోషల్‌మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.బ్రెజిల్‌లోని రియో గ్రాండ్ డో సల్కు చెందిన ఓ వ్యాపారవేత్త ఇటీవలే మరణించాడు. అతనికి భార్య, పిల్లలు లేరు. అతనికి నెయ్మార్ అంటే అపారమైన ప్రేమ, అభిమానం. ఆ వ్యక్తి తన జీవితంలో ఒక్కసారి కూడా నెయ్‌మార్‌ను కలవలేదు. కేవలం నెయ్మార్ వ్యక్తిత్వం నచ్చి ఇదే ఏడాది జూన్‌లో తన యావదాస్తిని వారసత్వంగా ఇస్తున్నట్లు వీలునామా రాశాడు.ఆ విల్లో సదరు వ్యాపారవేత్త ఈ విషయాలను ప్రస్తావించాడు. నేను ఎవరి ప్రమేయం లేకుండా, ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు నెయ్మార్ అంటే చాలా ఇష్టం, అతనిలో నన్ను నేను చూసుకుంటాను. నెయ్మార్ చాలా నిస్వార్థమైన వ్యక్తి. ఎంత ఎదిగినా చాలా తగ్గి ఉంటాడు. అతనిలో గర్వం కొంచమైనా లేదు. నెయ్మార్ కుటుంబానికి ఇచ్చే విలువ, తండ్రితో అతని బాండింగ్ నాకు చాలా నచ్చుతుంది. అతన్ని చూసినప్పుడు నాకు నా తండ్రితో గడిపిన క్షణాలు గుర్తుకొస్తాయి. ఈ కాలంలో నెయ్మార్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారిని చూడలేము. అందుకే అతనికి నా యావదాస్తి రాసిస్తున్నాను. నెయ్‌మార్‌కు నా ఆస్తి దక్కితే ఖచ్చితంగా మంచి పనికే ఉపయెగపడుతుందని సదరు వ్యాపారవేత్త తన విల్లో రాసుకొచ్చాడు.ఈ వీలునామా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ విల్‌కు ఆ వ్యాపారవేత్త బంధువులు అభ్యంతరం చెప్పకపోతే అతి త్వరలో నెయ్మార్ చేతుల్లోకి ఆస్తి వస్తుంది. అయితే ఈ విల్పై నెయ్మార్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయం తెలిసి యావత్ ప్రపంచం నిర్ఘాంతపోతుంది. వ్యక్తిత్వం నచ్చినంత మాత్రనా, ఇంత ఆస్తిని ధారాదత్తం చేస్తారా అని జనాలు నోరెళ్లబెడుతున్నారు.వాస్తవానికి ప్రపంచం మొత్తానికి నెయ్మార్ ఓ స్టార్ ఫుట్‌బాలర్‌గా మాత్రమే తెలుసు. అతనిది చిన్నపిల్లల మనస్తత్వం అని దగ్గరి వారు అంటుంటారు. నెయ్మార్ ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ చాలా సరదాగా ఉంటాడు. సహచరులతో నెయ్మార్ చిలిపి చేష్ఠలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజా ఉదంతంతో నెయ్మార్లోని కొత్త కోణం ప్రపంచానికి తెలిసింది. ఓ వ్యక్తి ఒక్క సారి కూడా కలవకుండానే వేల కోట్ల ఆస్తి రాసిచ్చాడంటే నెయ్మార్ వ్యక్తిత్వం ఎంత గొప్పదై ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి ఈ వార్త నెయ్‌మార్‌ను ఫుట్‌బాల్‌కు పరిచయం లేని వారికి కూడా పరిచయం చేసింది.33 ఏళ్ల నెయ్మార్ ప్రస్తుతం సాంటోస్ క్లబ్‌కు ఆడుతున్నాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు (బ్రెజిల్) దూరంగా ఉన్నాడు. 2026 వరల్డ్‌కప్ సమయానికంతా జట్టులోకి రావాలని భావిస్తున్నాడు. అయితే కొత్త కోచ్ కార్లో అంచెలొట్టి నెయ్‌మార్‌ను జాతీయ జట్టులోకి రాకుండా అడ్డుపడుతున్నట్లు తెలుస్తుంది. -
సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్‌లో...
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ సొంతగడ్డకు ఘనంగా వీడ్కోలు పలికాడు. కెరీర్‌కు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ అర్జెంటీనాలో మాత్రం ఇదే తన ఆఖరి పోరని ఇది వరకే స్పష్టం చేసిన మెస్సీ సొంత అభిమానులను 2 గోల్స్‌తో మురిపించాడు. దీంతో శుక్రవారం జరిగిన దక్షిణ అమెరికా జోన్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–0తో వెనిజులాపై ఘనవిజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 39వ నిమిషంలో, ద్వితీయార్ధంలో 80వ నిమిషంలో మెస్సీ గోల్స్ కొట్టాడు. మరో గోల్‌ను మార్టినెజ్ (76వ నిమిషంలో) చేశాడు. మెస్సీ కుమారులు, కుటుంబసభ్యులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా మైదానానికి వచ్చి తిలకించారు. వచ్చే ఏడాది ప్రపంచకప్ కోసం దక్షిణ అమెరికా నుంచి తాజాగా ఉరుగ్వే, కొలంబియా, పరాగ్వే జట్లు మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాయి. అర్జెంటీనా మార్చిలోనే క్వాలిఫై అయ్యింది. -
సబలెంకా X అనిసిమోవా
న్యూయార్క్: కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించేందుకు సబలెంకా (బెలారస్)... కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకునేందుకు అమండ అనిసిమోవా (అమెరికా) ఒక్క విజయం దూరంలో ఉన్నారు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సబలెంకా, అనిసిమోవా ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ సబలెంకా 4–6, 6–3, 6–4తో నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై నెగ్గగా... ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ అనిసిమోవా 6–7 (4/7), 7–6 (7/3), 6–3తో నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత, ప్రపంచ 24వ ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్)లపై విజయం సాధించారు. సబలెంకా, అనిసిమోవా మధ్య ఫైనల్ భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి గం. 1:30 నుంచి జరుగుతుంది. ముఖాముఖి రికార్డులో అనిసిమోవా 6–3తో సబలెంకాపై ఆధిక్యంలో ఉంది. 27 ఏళ్ల సబలెంకా తన కెరీర్లో ఇప్పటి వరకు మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (2023, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్), యూఎస్ ఓపెన్ (2024) సాధించి... మూడుసార్లు రన్నరప్‌గా (2025 ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్; 2023 యూఎస్ ఓపెన్) నిలిచింది. మరోవైపు అనిసిమోవా తన కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే ఫైనల్ (ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ) చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గత ఏడాది జెస్సికాను ఓడించి యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సబలెంకా ఈసారి సెమీఫైనల్లోనే అమెరికా ప్లేయర్ ఆట కట్టించింది. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా తొలి సెట్‌ను కోల్పోయినా కంగారు పడలేదు. పట్టుదలతో ఆడి ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఎనిమిది ఏస్‌లు సంధించిన ఈ బెలారస్ స్టార్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 27 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు నెగ్గిన సబలెంకా 43 విన్నర్స్ కొట్టింది. మరోవైపు జెస్సికా మూడు ఏస్‌లు కొట్టి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 15 అనవసర తప్పిదాలు చేసింది. నయోమి ఒసాకాతో 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అనిసిమోవా ఏడు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 50 విన్నర్స్ కొట్టిన అనిసిమోవా 45 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు ఒసాకా 15 ఏస్‌లు సంధించినా, కేవలం 32 విన్నర్స్‌తో సరిపెట్టుకుంది. 2 యూఎస్ ఓపెన్ చరిత్రలో రెండు సెమీఫైనల్స్ విజేతలు తొలి సెట్‌ను కోల్పోయి నెగ్గడం ఇది రెండోసారి మాత్రమే. 1993లో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) 4–6, 6–1, 6–0తో మలీవా (స్విట్జర్లాండ్)పై; హెలెనా సుకోవా (చెక్ రిపబ్లిక్) 6–7 (7/9), 7–5, 6–2తో అరంటా శాంచెజ్ వికారియో (స్పెయిన్)పై గెలిచారు. -
అజిత్ ‘సిక్సర్’
విశాఖ, స్పోర్ట్స్: యు ముంబా రెయిడర్ అజిత్ చౌహన్ సంచలన ప్రదర్శనతో తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబా ఏకంగా 20 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన పోరులో ముంబా 48–28తో బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది. అజిత్ చౌహాన్ ఒక్కడే 13 పాయింట్లతో అదరగొట్టాడు. 13వ నిమిషంలో అజిత్ సంచలన ప్రదర్శన కనబర్చాడు. ఒకే రెయిడ్‌లో అతను ఏకంగా ఆరుగురు ఆటగాళ్లను అవుట్ చేయడం విశేషం. పీకేఎల్ చరిత్రలో ఒకే రెయిడ్‌లో ఆరు లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించిన మూడో ప్లేయర్‌గా అజిత్ నిలిచాడు. గతంలో పట్నా పైరేట్స్ తరఫున ప్రదీప్ నర్వాల్ (ఒకే రెయిడ్‌లో 8 పాయింట్లు; 2017లో హరియాణా స్టీలర్స్‌పై)... తమిళ్ తలైవాస్ తరఫున అజింక్య పవార్ (ఒకే రెయిడ్‌లో 6 పాయింట్లు; 2022లో తెలుగు టైటాన్స్‌పై) ఈ ఘనత సాధించారు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 37–32తో యూపీ యోధాస్‌ను ఓడించింది. హరియాణా ఆటగాళ్ళలో నవీన్ కుమార్, రాహుల్ చెరో 6 పాయింట్లు నమోదు చేయగా, యూపీ తరఫున గగన్ గౌడ 13 పాయింట్లు స్కోర్ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగళూరు బుల్స్, తమిళ్ తలైవాస్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి. -
భారత్ భారీ విజయం
హాంగ్జౌ (చైనా): ప్రపంచ కప్ బెర్త్ సాధించడమే లక్ష్యంగా... ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో బరిలోకి దిగిన భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. థాయ్‌లాండ్ జట్టుతో శుక్రవారం జరిగిన పూల్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో సలీమా టెటె సారథ్యంలోని టీమిండియా 11–0 గోల్స్ తేడాతో గెలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముంతాజ్ ఖాన్ (7వ, 49వ నిమిషాల్లో), ఉదిత (30వ, 52వ నిమిషాల్లో), బ్యూటీ డుంగ్‌డుంగ్ (45వ, 54వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. సంగీత కుమారి (10వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్ (18వ నిమిషంలో), లాల్రెమ్సియామి (18వ నిమిషంలో), షర్మిలా దేవి (57వ నిమిషంలో), రుతుజా (60వ నిమిషంలో) టీమిండియాకు ఒక్కో గోల్ అందించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత జట్టు విరామ సమయానికి 5–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓవరాల్‌గా తమకు లభించిన తొమ్మిది పెనాల్టీ కార్నర్లలో ఐదింటిని గోల్స్‌గా మలిచిన భారత జట్టు నాలుగింటిని వృథా చేసింది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న థాయ్‌లాండ్ జట్టుకు ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా దక్కలేదు. పూల్ ‘బి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో జపాన్ 9–0తో సింగపూర్ జట్టును ఓడించగా... పూల్ ‘ఎ’లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో దక్షిణ కొరియా 9–0తో చైనీస్ తైపీపై, చైనా 8–0తో మలేసియాపై విజయం సాధించాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జపాన్‌తో భారత్; థాయ్‌లాండ్‌తో సింగపూర్ తలపడతాయి. -
భారత్, అఫ్గానిస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
హిసర్ (తజికిస్తాన్): అందివచ్చిన అవకాశాల్ని చేజార్చుకున్న భారత ఫుట్‌బాల్ జట్టు అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించుకుంది. సీఏఎఫ్‌ఏ నేషన్స్ కప్ ఫుట్‌బాల్ టోరీ్నలో గురువారం భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక్క గోల్ నమోదు కాకుండానే 0–0తో ‘డ్రా’ అయ్యింది. ‘ఫిఫా’ ర్యాంకుల్లో 127వ స్థానంలో ఉన్న భారత్ తమకన్నా దిగువ ర్యాంకు 160లో ఉన్న అఫ్గానిస్తాన్‌పై ప్రభావం చూపలేకపోయింది. మ్యాచ్ మొత్తం మీద బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడంలోనూ విఫలమైంది. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై చేసిన దాడుల్లోనూ నిరాశపరిచింది. అఫ్గానిస్తాన్ మూడుసార్లు భారత్ గోల్‌పోస్ట్‌పై గురిపెడితే... భారత్ కేవలం రెండుసార్లే గోల్ ప్రయత్నాలు చేయగలిగింది. భారత్ కన్నా అఫ్గానిస్తాన్ రక్షణ శ్రేణి మెరుగ్గా ఆడింది. తాజా ఫలితంలో భారత్ గ్రూప్ ‘బి’లో 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాల్ని కోల్పోయిన భారత్ ఇప్పుడు మూడు, నాలుగో స్థానాల కోసం ఉజ్బెకిస్తాన్‌తో తలపడుతుంది. ఈ నెల 8న ఈ కాంస్య పతకపోరు జరుగుతుంది. -
గుకేశ్ గెలుపు
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ విజయంతో ఖాతా తెరిచాడు. ఎటెని బాక్రోట్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి గేమ్‌లో నల్ల పావులతో ఆడిన గుకేశ్ 45 ఎత్తుల్లో గెలిచాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు విదిత్, అభిమన్యు పురాణిక్ కూడా తొలి గేముల్లో నెగ్గగా... ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, రౌనక్ సాధ్వాని, లియోన్, ప్రణవ్, నారాయణన్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. పెంటేల హరికృష్ణ, మురళీ కార్తికేయన్, ఆర్యన్ చోప్రా, ఓపెన్ విభాగంలో పోటీపడుతున్న మహిళా గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్‌లకు తొలి గేమ్‌లో ఓటమి ఎదురైంది. మహిళల విభాగం తొలి రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి 56 ఎత్తుల్లో గుల్రుఖ్ బేగం (ఉజ్బెకిస్తాన్)పై, వంతిక అగర్వాల్ 65 ఎత్తుల్లో యూలియా (ఉక్రెయిన్)పై నెగగ్గా... మార్సెల్ ఎఫ్రోమ్స్కీ (ఇజ్రాయెల్)తో జరిగిన గేమ్‌ను ద్రోణవల్లి హారిక 55 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. -
ప్రపంచ కప్ బెర్త్ లక్ష్యంగా...
హాంగ్జౌ (చైనా): సీనియర్ గోల్‌కీపర్ సవితా పూనియా... స్టార్ డ్రాగ్ ఫ్లికర్ దీపిక గైర్హాజరీలో.. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు జరిగే ఈ మెగా టోర్నీలో భారత జట్టు శుక్రవారం పూల్ ‘బి’లోని తమ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ తొమ్మిదో స్థానంలో... థాయ్‌లాండ్ 30వ స్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ భారీ విజయంపై గురి పెట్టింది. పూల్ ‘బి’లో భారత్, థాయ్‌లాండ్‌లతోపాటు జపాన్ (12వ ర్యాంక్), సింగపూర్ (31వ ర్యాంక్) జట్లున్నాయి. శుక్రవారం థాయ్‌లాండ్‌తో మ్యాచ్ తర్వాత... శనివారం జపాన్‌తో, సోమవారం సింగపూర్‌తో భారత్ ఆడుతుంది. పూల్ ‘ఎ’లో చైనా, దక్షిణ కొరియా, మలేసియా, చైనీస్ తైపీ జట్లున్నాయి. లీగ్ దశ ముగిశాక రెండు పూల్ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్–4’ మ్యాచ్‌లు ముగిశాక టాప్–2లో నిలిచిన రెండు జట్లు ఫైనల్లో టైటిల్ కోసం పోటీపడతాయి. ఆసియా కప్ విజేత జట్టుకు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు నేరుగా అర్హత లభిస్తుంది. చీలమండ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న మాజీ కెపె్టన్, గోల్‌కీపర్ సవితా పూనియా స్థానంలో గోల్ కీపింగ్ బాధ్యతలు బిచ్చూదేవి, బన్సారి సోలంకి తీసుకుంటారు. దీపిక లేని లోటును డిఫెన్స్‌లో ఉదిత, నిక్కీ ప్రధాన్, మనీషా చౌహాన్, ఇషిక, సుమన్ దేవి భర్తీ చేయాల్సి ఉంటుంది. నేహా, కెప్టెన్ సలీమా టెటె, లాల్రెమ్సియామి, షర్మిలా దేవి, సునెలితా టొప్పో, వైష్ణవిలతో భారత మిడ్‌ఫీల్డ్ పటిష్టంగా ఉంది. ఫార్వర్డ్ శ్రేణిలో నవ్‌నీత్ కౌర్, సంగీత, ముంతాజ్ ఖాన్, బ్యూటీ డుంగ్‌డుంగ్, రుతుజా, సాక్షి సత్తా చాటాల్సి ఉంటుంది. ఈ టోర్నీ భారత చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్‌కు కూడా పరీక్షగా నిలువనుంది. ఇటీవల యూరోపియన్ అంచె ప్రొ లీగ్‌లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. ప్రొ లీగ్‌లో భారత జట్టు 100 కంటే ఎక్కువ పెనాల్టీ కార్నర్లను సమర్పించుకోగా.. బెల్జియంతో జరిగిన పోరులో ఏకంగా 17 పెనాల్టీ కార్నర్లు ఉన్నాయి. 1985లో మొదలైన ఈ టోర్నీలో భారత జట్టు రెండుసార్లు (2004, 2017) చాంపియన్‌గా, రెండుసార్లు (1999, 2009) రన్నరప్‌గా నిలిచింది. మూడుసార్లు (1993, 2013, 2022) మూడో స్థానాన్ని పొందిన టీమిండియా ... రెండుసార్లు (1989, 2007) నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. -
ఇక ట్రోఫీ కూడా సరితూగేలా...
న్యూయార్క్: కొన్నాళ్ల కిందట గ్రాండ్‌స్లామ్ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని సమం చేసిన నిర్వాహకులు ట్రోఫీల్లో మాత్రం అంతరాలు చూపుతున్నారు. కానీ ఇకమీదట సమానత్వం పాటించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ కొన్ని మార్పులతో జరుగుతున్న సంగతి తెలిసిందే. సింగిల్స్ స్పెషలిస్టులు, టాప్‌స్టార్లతో మిక్స్డ్ డబుల్స్ నిర్వహించారు. ఇప్పుడు మహిళల సింగిల్స్ విజేతకు ఇచ్చే ట్రోఫీని కూడా పురుషుల సింగిల్స్ విజేతకు దీటుగా ప్రదానం చేయనున్నారు. దీంతో మహిళలకు ‘మినియేచర్’ (చిన్న పరిమాణంలో) ట్రోఫీలనే విమర్శలకు ఈ యూఎస్ ఓపెన్‌తో తెరపడనుంది. రోలాండ్ గారోస్‌లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అమెరికన్ స్టార్ కోకో గాఫ్ తాను అందుకున్న ట్రోఫీపై ఓ టిక్‌టాక్ రీల్ కూడా చేసింది. వివక్షాపూరితమైన ట్రోఫీ సైజ్ వీడియోను ఏకంగా 20 లక్షలకు పైగా వీక్షించారు. వ్యంగ్యంగా ఆమె పెట్టిన వీడియోకు అప్పట్లో లక్షల్లో లైక్‌లు వచ్చాయి. ఒకే టోర్నీ... ఒకే వేదిక... ఒకే ఈవెంట్ (సింగిల్స్)... అయినప్పుడు ట్రోఫీల్లో వ్యత్యాసమేంటనే చర్చ కూడా జరిగింది. అయితే ఇప్పుడు యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విజేతకు ఇచ్చే ట్రోఫీతో ఆ లింగ వివక్ష ట్రోఫీకి కాలం చెల్లనుంది. వైరల్ వీడియోతో వార్తల్లో నిలిచిన కోకో గాఫ్ ఇప్పుడు ట్రోఫీ పరిమాణం సమానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. సాధారణంగా పురుషుల ట్రోఫీతో పోల్చితే ఏడున్నర అంగుళాలు చిన్నగా ఉండే మహిళల ట్రోఫీ ఇకపై సరితూడే సమానం అయ్యింది. దీనిపై యూఎస్ ఓపెన్ నిర్వాహకులు గర్వంగా ప్రకటించుకున్నారు. లింగ సమానత్వం మా డీఎన్ఏలోనే ఉందని టోర్నీ డైరెక్టర్ స్టేసీ అలెస్టెర్ చెప్పుకొచ్చారు. -
భారత బాక్సర్ పవన్ శుభారంభం
లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. పురుషుల 55 కేజీల విభాగంలో భారత బాక్సర్ పవన్ బర్త్వాల్ తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మైకేల్ డగ్లస్ సిల్వా (బ్రెజిల్)తో జరిగిన బౌట్లో పవన్ 3:2తో విజయం సాధించాడు. భారత ఇతర బాక్సర్లు హితేశ్ గులియా (70 కేజీలు), అభినాశ్ (65 కేజీలు), లవ్లీనా (75 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), నుపుర్ (ప్లస్ 80 కేజీలు), జాదూమణి (60 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు), జుగ్నూ (85 కేజీలు) తొలి రౌండ్లో ‘బై’ పొందగా... నిఖత్ జరీన్ (51 కేజీలు) తొలి రౌండ్లో అమెరికా బాక్సర్ జెన్నిఫర్ లొజానాతో ఆడుతుంది. -
గెలిచి నిలిచిన భారత్
రాజ్‌గిర్ (బిహార్): సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. మలేసియా జట్టుతో గురువారం జరిగిన ‘సూపర్–4’ దశ రెండో మ్యాచ్‌లో భారత్ 4–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ (17వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (19వ నిమిషంలో), శిలానంద్ లాక్రా (24వ నిమిషంలో), వివేక్ సాగర్ ప్రసాద్ (38వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.మలేసియా జట్టుకు షఫీక్ హసన్ (2వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా ‘సూపర్–4’ పట్టికలో భారత్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాతో జరిగిన ‘సూపర్–4’ తొలి మ్యాచ్‌ను భారత్ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. శుక్రవారం విశ్రాంతి దినం తర్వాత... శనివారం చైనాతో జరిగే చివరి ‘సూపర్–4’ మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’ చేసుకున్నా పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. గురువారం జరిగిన ‘సూపర్–4’ మరో మ్యాచ్‌లో చైనా 3–0 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించింది. ప్రస్తుతం చైనా, మలేసియా మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో... కొరియా ఒక పాయింట్‌తో నాలుగో స్థానంలో ఉంది. మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. మ్యాచ్ మొదలైన రెండు నిమిషాలకే మలేసియా హసన్ గోల్‌తో ఖాతా తెరిచింది. అయితే భారత్ వెంటనే తేరుకుంది. సమన్వయంతో ఆడుతూ మలేసియా గోల్‌పోస్ట్‌పై ఎడతెరిపి లేకుండా దాడులు నిర్వహించింది. రెండో క్వార్టర్లో భారత్ దాడులకు ఫలితం లభించింది. ఏడు నిమిషాల వ్యవధిలో భారత్ మూడు గోల్స్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అదే జోరు కొనసాగించిన టీమిండియా ప్రత్యర్థి జట్టుకు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఆరు పెనాల్టీ కార్నర్లు లభించగా... ఒక పెనాల్టీ కార్నర్‌ను భారత్ గోల్‌గా మలిచింది. లేదంటే మరింత తేడాతో మలేసియాపై భారత్‌కు విజయం దక్కేది. -
అనిసిమోవా అదరహో
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో అమెరికా స్టార్, ఎనిమిదో సీడ్ అమండ అనిసిమోవా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అనిసిమోవా 6–4, 6–3తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను ఓడించిది. ఈ గెలుపుతో... గత జూలై 12న ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో ఒక్క గేమ్ కూడా నెగ్గకుండా 0–6, 0–6తో స్వియాటెక్ చేతిలో ఎదురైన దారుణ ఓటమికి అనిసిమోవా బదులు తీర్చుకుంది. ‘వింబుల్డన్ ఫైనల్లో ఘోర పరాజయం తర్వాత పుంజుకొని స్వియాటెక్‌పై నెగ్గడం నాకెంతో ప్రత్యేకం. ఆ ఓటమి నుంచి తేరుకోవడానికి నేను చాలా శ్రమించాను. నా కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు లభించినందుకు ఆనందంగా ఉంది’ అని తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన అనిసిమోవా వ్యాఖ్యానించింది. స్వియాటెక్‌తో 96 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనిసిమోవా మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, స్వియాటెక్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 23 విన్నర్స్ కొట్టిన అనిసిమోవా 12 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్ మూడు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 15 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఫైనల్లో చోటు కోసం నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నయోమి ఒసాకా (జపాన్)తో అనిసిమోవా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో 23వ సీడ్ ఒసాకా 6–4, 7–6 (7/3)తో 11వ ర్యాంకర్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. సినెర్ దూకుడు పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఇటలీకే చెందిన 10వ సీడ్ ముసెట్టితో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–1, 6–4, 6–2తో నెగ్గాడు. సినెర్ పది ఏస్‌లు సంధించడంతోపాటు ముసెట్టి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో 25వ సీడ్ ఫెలిక్స్ (కెనడా) 4–6, 7–6 (9/7), 7–5, 7–6 (7/4)తో ఎనిమిదో సీడ్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. -
తెలుగు టైటాన్స్ గెలుపు బోణీ
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన తెలుగు టైటాన్స్ జట్టు మూడో మ్యాచ్‌తో గెలుపు బోణీ చేసింది. గురువారం జరిగిన పోరులో టైటాన్స్ 37–32తో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. టైటాన్స్ కెప్టెన్ విజయ్ మలిక్, ఆల్‌రౌండర్ భరత్ హుడా చెరో 8 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెయిడర్ చేతన్ సాహు, డిఫెండర్ అజిత్ పవార్ కూడా చెరో 5 పాయింట్లు సాధించి సహకరించారు. జైపూర్ తరఫున నితిన్ కుమార్ (13 పాయింట్లు) ఒంటరి పోరాటం వృథా అయింది. మ్యాచ్ 13వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి ఆధిక్యం సాధించిన టైటాన్స్, పదునైన డిఫెన్స్‌తో తొలి అర్ధ భాగాన్ని 16–9తో ముగించింది. మరో పది నిమిషాల తర్వాత ఇది 23–16కు మారింది.అయితే ఆ తర్వాత రెయిడర్ నితిన్ ఒక్కసారిగా చెలరేగి టైటాన్స్‌ను ఆలౌట్ చేయడంతో పాటు సూపర్ రెయిడ్ సాధించాడు. దాంతో చివరి మూడు నిమిషాల్లో అంతరం కేవలం మూడు పాయింట్లకు తగ్గి ఉత్కంఠ పెరిగింది. అయితే విజయ్ మలిక్ ఒత్తిడిని అధిగమించి రెండు పాయింట్లు రాబట్టడంతో టైటాన్స్ ఊపిరి పీల్చుకుంది. తొలిసారి గోల్డెన్ రెయిడ్‌లో గెలుపు పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ మధ్య హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో చివరకు ‘గోల్డెన్ రెయిడ్’ ద్వారా ఫలితం వచ్చింది. ఇందులో ఢిల్లీ విజేతగా నిలిచింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 28–28 పాయింట్లతో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ‘టైబ్రేక్’లో కూడా స్కోరు 5–5తో సమంగానే ముగిసింది. అనంతరం ‘గోల్డెన్ రెయిడ్’ కోసం టాస్ నెగ్గిన ఢిల్లీ తరఫున అశు మలిక్ రెయిడింగ్‌కు వెళ్లి అద్భుతంగా 2 పాయింట్లు సాధించడంతో జట్టుకు గెలుపు దక్కింది. -
యుకీ బాంబ్రీ దూకుడు.. తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు
భారత టెన్నిస్ డబుల్స్ నంబర్‌వన్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు ఫైనల్ చేరుకున్నాడు. న్యూయార్క్‌లో జరుగుతున్న యూఎస్ ఓపెన్ టర్నీలో మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో జతకట్టి పురుషుల డబుల్స్ విభాగంలో ఆడుతున్న యూకీ సెమీస్‌లోకి ప్రవేశించాడు.బుధవారం ఆర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 14వ సీడ్ యూకీ–వీనస్ ద్వయం 6-3, 7-6, 6-3 తేడాతో 11వ సీడ్ నికోలా మెక్టిక్ - రాజీవ్ రామ్‌పై విజయం సాధించింది. శుక్రవారం జరగబోయే సెమీస్‌లో బ్రిట్స్ నీల్ స్కుప్స్కీ - జో శాలిస్బరీ జోడీతో యుకీ - మైకెల్ తలపడనున్నారు.ప్రీకార్టర్స్‌లో దూకుడు..అంతకుముందు ప్రీక్వార్ట్స్‌లో కూడా ఈ ఇండో-కివీ ద్వయం అదరగొట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో యూకీ–వీనస్ జోడీ 6–4, 6–4తో నాలుగో సీడ్ కెవిన్ క్రావిట్జ్–టిమ్ పుయెట్జ్ (జర్మనీ) జంటను ఓడించింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–కివీస్ జోడీ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు జూనియర్ విభాగంలో భారత ప్లేయర్ల పోరాటం ముగిసింది. బాలికల సింగిల్స్ రెండో రౌండ్లో మాయ రాజేశ్వరన్ 7–6 (7/1), 4–6, 3–6తో రెండో సీడ్ హనా క్లుగ్మన్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ తొలి రౌండ్లో మాయ (భారత్)–సినెల్లి (అర్జెంటీనా) జోడీ 2–6, 2–6తో జెలీనా (బెల్జియం)–లైమా (లిథువేనియా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
భారత బాక్సర్లకు సవాల్
లివర్‌పూల్: రెండేళ్ల క్రితం జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో భారత బాక్సర్లు మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటారు. మహిళల విభాగంలో మన బాక్సర్లకు నాలుగు స్వర్ణాలు దక్కగా, పురుషుల విభాగంలో మూడు కాంస్యాలు లభించాయి. అయితే ఆ తర్వాత మన బాక్సర్ల ప్రభ తగ్గింది. అటు ఆసియా క్రీడల్లో, ఇటు పారిస్ ఒలింపిక్స్‌లో కూడా పేలవ ప్రదర్శనతో మన ప్లేయర్లు విఫలమయ్యారు. ఈ ఏడాది వరల్డ్ కప్‌లలో ఫర్వాలేదనిపించినా... దీంతో పోలిస్తే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పోటీ చాలా ఎక్కువ. 65 దేశాలకు చెందిన 550 మంది బాక్సర్లు ఇందులో పాల్గొంటుండగా... పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన 17 మంది ఇక్కడ బరిలో నిలవడం విశేషం. ఈ నేపథ్యంలో రెండేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 14 వరకు పోటీలు జరుగుతాయి. భారత్ నుంచి పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి 20 మంది బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. మూడో మెడల్‌పై నిఖత్ గురి... తెలంగాణ ప్లేయర్ నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచ వేదికపై తన సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. గతంలో రెండుసార్లు (2022, 2023)లలో ఆమె చాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ రెండు సందర్భాల్లో ఆమె 52 కేజీలు, 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. ఇప్పుడు ఈవెంట్ మారిన నిఖత్ 51 కేజీల కేటగిరీలో పోటీ పడనుంది. దాంతో ఆమె కొత్తగా సన్నద్ధం కావాల్సి వచ్చింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఇదే వయో విభాగంలో ఆడిన నిఖత్.. .రెండో రౌండ్లోనే ఓటమి పాలైంది. ఇప్పుడు కూడా ఆమె తగిన స్థాయిలో సాధన చేయలేకపోయింది. పారిస్‌లో పరాజయం తర్వాత నిఖత్ ఒకే ఒక టోర్నీలో అది కూడా జాతీయ స్థాయిలోనే ఆడింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు సాధించిన లవ్లీనా బొర్గొహైన్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. 75 కేజీల కేటగిరీలో తలపడనున్న లవ్లీనాకు కూడా సరైన ప్రాక్టీస్ లభించలేదు. ఎక్కువ మంది కొత్తవారితో... మహిళల బృందంతో పోలిస్తే పురుషుల విభాగంలో అనుభవజు్ఞలైన భారత బాక్సర్లు తక్కువ మంది ఉన్నారు. 2023లో జరిగిన గత ఈవెంట్లో పతకాలు సాధించిన నిశాంత్ దేవ్, దీపక్ భోరియా, హుసాముద్దీన్ వేర్వేరు కారణాలతో ఈసారి టోర్నీకి దూరమయ్యారు. సుమీత్ కుందు, 2021 వరల్డ్ యూత్ చాంపియన్ సచిన్ సివాచ్, హర్‡్ష చౌధరీలకు మాత్రమే గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న అనుభవం ఉంది. మిగతా యువ బాక్సర్లంతా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు దీనికి సరైన వేదికగా వాడుకోనున్నారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న బాక్సర్లందరికీ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 1 వరకు షెఫీల్డ్‌లో ప్రత్యేక శిక్షణా శిబిరం కూడా జరిగింది. భారత జట్ల వివరాలు: పురుషుల విభాగం: జాదుమణీ సింగ్ (50 కేజీలు), పవన్ బర్త్వాల్ (55 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు), హితేశ్ గులియా (70 కేజీలు), సుమీత్ కుందు (75 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు), జుగ్నూ అహ్లావత్ (85 కేజీలు), హర్‡్ష చౌధరీ (90 కేజీలు), నరేందర్ బెర్వాల్ (ప్లస్ 90 కేజీలు). మహిళల విభాగం: మీనాక్షి హుడా (48 కేజీలు), నిఖత్ జరీన్ (51 కేజీలు), సాక్షి (54 కేజీలు), జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), సంజు ఖత్రి (60 కేజీలు), నీరజ్ ఫొగాట్ (60 కేజీలు), సనమచ చాను (70 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు), పూజ రాణి (80 కేజీలు), నుపూర్ షెరాన్ (ప్లస్ 80 కేజీలు). -
జొకోవిచ్ జైత్రయాత్ర
న్యూయార్క్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్... యూఎస్ ఓపెన్‌లో తన విజయపరంపరను కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జొకోవిచ్ 6–3, 7–5, 3–6, 6–4తో గత ఏడాది రన్నరప్, ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. టేలర్ ఫ్రిట్జ్‌తో ఇప్పటి వరకు ఆడిన 11 సార్లూ జొకోవిచే నెగ్గడం విశేషం. ఫ్రిట్జ్‌తో 3 గంటల 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ పది ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 22 సార్లు పాయింట్లు గెలిచాడు. 33 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ 40 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు చేజార్చుకున్న జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు ఫ్రిట్జ్ 12 ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 42 అనవసర తప్పిదాలు చేశాడు. ఫ్రిట్జ్‌పై గెలుపుతో జొకోవిచ్ కెరీర్లో 53వ సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు చేరుకున్నాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధికసార్లు సెమీఫైనల్‌కు చేరిన ప్లేయర్‌గానూ జొకోవిచ్ రికార్డు సృష్టించాడు. 19వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్ 14వ సారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టి జిమ్మీ కానర్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. యూఎస్ ఓపెన్‌లో నాలుగుసార్లు చాంపియన్‌గా, ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచిన జొకోవిచ్ ఈ టోర్నీలో 11వ వసారి ఫైనల్ చేరుకోవాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది. సెమీఫైనల్ పోరులో రెండో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 5–3తో అల్కరాజ్పై ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ఈ టోర్నీలో అల్కరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా అల్కరాజ్ సెమీఫైనల్ చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–4, 6–2, 6–4తో 20వ ర్యాంకర్ జిరీ లెహెస్కా(చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. సబలెంకాకు ‘వాకోవర్’ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్) వరుసగా ఐదో ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో సబలెంకా ప్రత్యర్థి, 2023 వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో ‘వాకోవర్’తో సబలెంకా సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో 45 ఏళ్ల వీనస్ విలియమ్స్ (అమెరికా)–లేలా ఫెర్నాండెజ్ (కెనడా) ద్వయం 1–6, 2–6తో టాప్ సీడ్ టేలర్ టౌన్సెండ్ (అమెరికా)–సినియకోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోయింది. 1997 తర్వాత యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో టాప్–4 సీడింగ్ జోడీలు సెమీఫైనల్ చేరుకోవడం విశేషం.1 అత్యధికసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకున్న ప్లేయర్‌గా జొకోవిచ్ (53 సార్లు) రికార్డు సృష్టించాడు. అమెరికా మహిళా స్టార్ క్రిస్ ఎవర్ట్ (52 సార్లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సవరించాడు.14 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకోవడం జొకోవిచ్‌కిది 14వ సారి. ఈ టోర్నీలో అత్యధికసార్లు సెమీఫైనల్ చేరుకున్న జిమ్మీ కానర్స్ (అమెరికా; 14 సార్లు) రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. 7 ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ సెమీఫైనల్ చేరుకోవడం జొకోవిచ్‌కిది ఏడోసారి కావడం విశేషం. అంతేకాకుండా ఒకే సీజన్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగానూ జొకోవిచ్ (38 ఏళ్ల 94 రోజులు) గుర్తింపు పొందాడు. -
పుణేరి పల్టన్ ‘హ్యాట్రిక్’
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో మాజీ చాంపియన్ పుణేరి పల్టన్ వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 45–36 తో బెంగాల్ వారియర్స్ జట్టుపై నెగ్గింది. కెప్టెన్, ఆల్‌రౌండర్ అస్లామ్ ఇనామ్దార్, రెయిడర్ ఆదిత్య షిండే పుణేరి విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు చెరో 11 పాయింట్లు స్కోరు చేయగా... పంకజ్ మోహితే, విశాల్ చెరో 5 పాయింట్లు సాధించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి పుణేరి 26–22తో స్వల్పంగా ముందంజలో నిలిచింది. రెండో అర్ధ భాగంలోనూ పల్టన్ తమ జోరును కొనసాగించింది. రెండో ‘ఆలౌట్’తో ఆ జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించింది. బెంగాల్ తరఫున కెపె్టన్ దేవాంక్ ఒక్కడే 17 పాయింట్లు స్కోరు చేసినా లాభం లేకపోయింది. హరియాణా స్టీలర్స్, యు ముంబా మధ్య జరిగిన రెండో మ్యాచ్ ముందు ‘టై’గా ముగిసింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 36–36 పాయింట్లతో సమంగా నిలిచాయి. హరియాణా ఆటగాళ్లలో నవీన్ కుమార్ 9, వినయ్ 8 పాయింట్లు సాధించగా...ముంబా జట్టు తరఫున అజిత్ చౌహాన్ ఒక్కడే 12 పాయింట్లు సాధించడం విశేషం. అయితే చివరకు ‘టైబ్రైక్’లో హరియాణాను విజయం వరించింది. ఇందులో హరియాణా 7–6తో ముంబాపై పైచేయి సాధించింది. నేడు జరిగే మ్యాచ్ ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్... పుణేరి పల్టన్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
భారత్‌ను ఆదుకున్న మన్దీప్
రాజ్‌గిర్ (బిహార్): లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టుకు ఆసియా కప్‌లో తొలిసారి గట్టిపోటీ ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా జట్టుతో బుధవారం జరిగిన ‘సూపర్–4’ దశ మ్యాచ్‌ను భారత్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. మ్యాచ్ ముగియడానికి ఏడు నిమిషాలు ఉన్నాయనగా మన్దీప్ సింగ్ గోల్ చేసి భారత్‌ను ఓటమి బారి నుంచి తప్పించాడు. గోల్స్ చేసేందుకు వచ్చిన పలు అవకాశాలను వృథా చేసుకున్న భారత జట్టు చివరకు విజయం బదులు ‘డ్రా’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఎనిమిదో నిమిషంలో హార్దిక్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కొరియా జట్టు రెండు నిమిషాల తేడాలో రెండు గోల్స్ చేసి భారత్‌కు షాక్ ఇచి్చంది. 12వ నిమిషంలో జిహున్ యాంగ్ గోల్‌తో స్కోరును 1–1తో సమం చేసిన కొరియా... 14వ నిమిషంలో హైయోన్హాంగ్ కిమ్ గోల్‌తో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఒకదశలో భారత్‌కు ఓటమి తప్పదేమోనని అనిపించినా... 53వ నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్ చేసి భారత్‌ను ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తమకు లభించినా ఆరు పెనాల్టీ కార్నర్లను వృథా చేసుకుంది. అంతకుముందు చైనాతో జరిగిన మరో ‘సూపర్–4’ మ్యాచ్‌లో మలేసియా 2–0తో గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో కొరియాతో చైనా; మలేసియాతో భారత్ తలపడతాయి. -
ఒలింపిక్ ఓటమి బాధ దూరమైంది!
న్యూఢిల్లీ: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇటీవలే పారిస్‌లో భారత పురుషుల డబుల్స్ ఆటగాళ్లు సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ ఈవెంట్లో రెండోసారి కాంస్యం గెలిచిన ద్వయం... తద్వారా భారత్ తరఫున ఒకటికంటే ఎక్కువ పతకాలు సాధించిన ఆటగాళ్లుగా పీవీ సింధు (5), సైనా నెహ్వాల్ (2) సరసన నిలిచారు. ఇదే వేదికపై, ఇదే కోర్టులో గత ఏడాది ఒలింపిక్స్‌లో ఓటమిపాలై తీవ్ర నిరాశ చెందిన భారత జంట ఇప్పుడు అక్కడే మంచి విజయాన్ని అందుకుంది. ‘గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో పరాజయం పాలైన చోటే వరల్డ్ చాంపియన్‌షిప్ పతకం గెలవడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇది ఒక రకంగా మా పునరాగమనంలాంటిది. దీని వల్ల నాటి ఓటమి బాధ దూరమైంది. సింధు, సైనాలవంటి స్టార్ల జాబితాలో మా పేరు కూడా ఉండటం సంతోషంగా ఉంది. పైగా ఇటీవల మా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అలాంటి సమయంలో ఈ పతకం గెలవడం ఈ ఆనందాన్ని రెట్టింపు చేసింది’ అని చిరాగ్ శెట్టి అన్నాడు. సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడి చైనాకు చెందిన చెన్ బో యంగ్–ల్యూ యి చేతిలో ఓటమి పాలైంది. అయితే అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో వీరిద్దరు ఆరోన్ చియా–సో వూకీ (మలేసియా)పై సంచలన విజయం సాధించి కాంస్యాన్ని ఖాయం చేసుకున్నారు. ‘వరుసగా రెండు గేమ్‌లలో ఈ మ్యాచ్ గెలవడం మాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. ఆరోన్ ద్వయంపై గెలుపు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. పతకం సాధించడం మాత్రమే కాదు, మేం సరైన వ్యూహంతో ఆడితే ప్రపంచంలో ఎవరినైనా ఓడించగలమనే నమ్మకం వచ్చింది’ అని చిరాగ్ గర్వంగా చెప్పాడు. ‘డ్రా’ కఠినంగా ఉన్నా సరే, భారత షట్లర్లు అంచనాలకు తగినట్లుగా రాణించడం జట్టుగా సంతృప్తినిచి్చందన్న చిరాగ్... వరల్డ్ రెండో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సన్పై దాదాపు విజయానికి చేరువగా వచ్చి త్రుటిలో అవకాశం కోల్పోయిన హెచ్ఎస్ ప్రణయ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు. 2011 నుంచి భారత్ వరుసగా ఏదో ఒక పతకంతో తిరిగి రావడం సానుకూల విషయమని అతను పేర్కొన్నాడు. మున్ముందు మరిన్ని పెద్ద విజయాలు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్న చిరాగ్... ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఫిట్‌గా మారడంపై దృష్టి పెట్టినట్లు వెల్లడించాడు. ‘గత కొంత కాలంగా మాకు కలిసి రాలేదు. అటు కోర్టులో, ఇటు కోర్టు బయట వ్యక్తిగతంగా కూడా సమస్యలు ఎదుర్కొన్నాం. 100 శాతం ట్రైనింగ్ కూడా చేయలేకపోయాం. అత్యుత్తమ ఫిట్నెస్ అందుకోవాలని మొదటి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత వచ్చే టోర్నీల్లో కనీసం ఫైనల్ చేరి ఆపై టైటిల్ సాధించడం ముఖ్యం. ఈ ఏడాదికి సంబంధించి బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌పై మా దృష్టి ఉంది. ఇప్పుడు సరైన దిశలోనే వెళుతున్నామని భావిస్తున్నాం’ అని చిరాగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
దబంగ్ ఢిల్లీ శుభారంభం
విశాఖ స్పోర్ట్స్: మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన పోరులో ఢిల్లీ 41–34తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. కెప్టెన్ అశు మలిక్ (15 పాయింట్లు) ముందుండి జట్టును గెలిపించాడు. రెయిడింగ్‌లో అదరగొట్టాడు. 23 సార్లు కూతకెళ్లిన కెప్టెన్ 12 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. మరో రెయిడర్ నీరజ్ నర్వాల్ (7) ఆకట్టుకున్నాడు. వీరిద్దరి శ్రమకు ఊతమిచ్చేలా... డిఫెండర్లు సౌరభ్ నందల్ (3), ఫజల్ అత్రాచలి (3), సుర్జీత్ సింగ్ (3) సమష్టిగా రాణించారు. ప్రత్యర్థి రెయిడర్లను అద్భుతంగా టాకిల్ చేశారు. బెంగళూరు జట్టులో ఆల్‌రౌండర్ అలీరెజా మిర్జాయిన్ (10), రెయిడర్ ఆశిష్ మలిక్ (8) మెరుగ్గా ఆడారు. అయితే సహచరుల నుంచి సరైన సహకారం లేక బెంగళూరు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడింది. విశాఖ అంచెలో బెంగళూరు బుల్స్ ఇంకా బోణీ కొట్టలేకపోయింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో రెండుసార్లు చాంపియన్ జైపూర్ పింక్‌పాంథర్స్ 39–36తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. జైపూర్ రెయిడర్లు నితిన్ కుమార్ (13), అలీ చౌబ్తరష్ (8) క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చారు. పట్నా జట్టులో రెయిడర్లు మణీందర్ సింగ్ (15), సుధాకర్ (9), అయాన్ (6) అద్భుతంగా రాణించినప్పటికీ డిఫెండర్ల వైఫల్యంతో పరాజయం తప్పలేదు. పైరేట్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్; హరియాణా స్టీలర్స్‌తో యు ముంబా తలపడతాయి. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం మూడు జట్లు పుణేరి పల్టన్, యూపీ యోధాస్, యు ముంబా జట్లు నాలుగు పాయింట్లతో ‘టాప్’లో ఉన్నాయి. -
సెమీస్‌లో జెస్సికా
న్యూయార్క్: సొంతగడ్డపై తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా ఆ దిశగా మరో అడుగు వేసింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జెస్సికా పెగూలా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జెస్సికా 6–3, 6–3తో ప్రపంచ 62వ ర్యాంకర్, 2021 ఫ్రెంచ్ ఓపెన్, 2024 వింబుల్డన్ టోర్నీ విజేత బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందింది. 86 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గత ఏడాది రన్నరప్ జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి పదిసార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు క్రెజికోవా ఏకంగా ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 24 అనవసర తప్పిదాలు చేసింది. కోకో గాఫ్ అవుట్ మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన కోకో గాఫ్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన నయోమి ఒసాకా (జపాన్) 6–3, 6–2తో 2023 చాంపియన్ కోకో గాఫ్‌ను ఓడించింది. తద్వారా 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఒసాకా మరోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–3, 6–1తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై, కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–7 (0/7), 6–2తో మార్టా కోస్టుక్ (ఉక్రెయిన్)పై, ఎనిమిదో సీడ్ అమండ అనిసిమోవా (అమెరికా) 6–0, 6–3తో బీట్రిజ్ హదద్ మాయ (బ్రెజిల్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సూపర్ సినెర్... పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సినెర్ కేవలం మూడు గేమ్‌లు కోల్పోయాడు. 81 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సినెర్ 6–1, 6–1, 6–1తో బుబ్లిక్‌ను ఓడించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఫెలిక్స్ అలియాసిమ్ (కెనడా) 7–5, 6–3, 6–4తో 15వ సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై, పదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) 6–3, 6–0, 6–1తో మునార్ (స్పెయిన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
చరిత్ర సృష్టించిన జొకోవిచ్
టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా అవతరించేందుకు ప్రయత్నిస్తున్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు ముందుకు వేశాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ఈ మాజీ చాంపియన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గత ఏడాది మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన ఏడో సీడ్ ఈసారి మాత్రం సాధికారిక ఆటతో టైటిల్‌పై గురి పెట్టాడు.గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో ఓవరాల్‌గా 64వ సారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించిన జొకోవిచ్... యూఎస్ ఓపెన్‌లో 14వ సారి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో 38 ఏళ్ల జొకోవిచ్ ఒకే ఏడాది అన్ని గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) కనీసం క్వార్టర్ ఫైనల్ చేరిన అతి పెద్ద వయస్కుడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. న్యూయార్క్: కెరీర్లో 19వ సారి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ దూసుకెళ్తున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–2తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 1 గంట 49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. 12 ఏస్‌లతో అదరగొట్టిన జొకోవిచ్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం.నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చిన అతను 15 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను ఒకసారి చేజార్చుకున్న మాజీ చాంపియన్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 33 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ కేవలం 20 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు జాన్ లెనార్డ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 32 అనవసర తప్పిదాలతో డీలా పడ్డాడు. ‘ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన. ఇదే జోరును మున్ముందు కొనసాగిస్తానని నమ్మకంతో ఉన్నా’ అని నాలుగుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించి, ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచిన జొకోవిచ్ వ్యాఖ్యానించాడు.ఇక క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్, గత ఏడాది రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో జొకోవిచ్ తలపడతాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్ 6–4, 6–3, 6–3తో టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్), ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అల్కరాజ్ 7–6 (7/3), 6–3, 6–4తో ఆర్థర్ రిండర్నీచ్ (ఫ్రాన్స్)పై, డిమినార్ 6–3, 6–2, 6–1తో లియాండ్రో రీడి (స్విట్జర్లాండ్)పై నెగ్గారు. రిబాకినాకు షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ప్రపంచ 60వ ర్యాంకర్, 2023 వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 5–7, 6–2తో 2022 వింబుల్డన్ విజేత, ప్రపంచ 10వ ర్యాంకర్ రిబాకినాను ఓడించి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 1 గంట 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొండ్రుసోవా 13 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్), బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సబలెంకా 6–1, 6–4తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్)పై, క్రెజికోవా 1–6, 7–6 (15/13), 6–3తో టేలర్ టౌన్సెండ్ (అమెరికా)పై గెలుపొందారు. టౌన్సెండ్తో జరిగిన మ్యాచ్‌లో క్రెజికోవా రెండో సెట్లో ఏకంగా 8 మ్యాచ్ పాయింట్లను కాచుకొని గట్టెక్కడం విశేషం. క్వార్టర్ ఫైనల్స్‌లో వొండ్రుసోవాతో సబలెంకా; క్రెజికోవాతో జెస్సికా పెగూలా (అమెరికా) తలపడతారు. -
పైరేట్స్‌కు యోధాస్ షాక్
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో యూపీ యోధాస్ జోరు పెంచుతోంది. ఈ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ 34–31తో మూడుసార్లు చాంపియన్ అయిన పట్నా పైరేట్స్‌ను కంగుతినిపించింది. ఆట ఆరంభంలో పైరేట్స్ పైచేయి కనబరిచింది. మొదటి పది నిమిషాలైతే చకచకా పాయింట్లు రాబట్టిన పట్నా 7–6తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత యూపీ యోధాస్ ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతో పట్నా వెనుకబడింది. రెయిడర్లలో గగన్ గౌడ 7 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో భవాని రాజ్‌పుత్, శివమ్ చెరో 5 పాయింట్లు చేశారు. డిఫెండర్లలో కెప్టెన్ సుమిత్, అశు సింగ్ తలా 5 పాయింట్లు సాధించారు. పట్నా పైరేట్స్ జట్టులో రెయిడర్లు అయాన్ (9) మణిందర్ సింగ్ (7) రాణించారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ పుణేరి పల్టన్ 41–19తో గుజరాత్ జెయంట్స్‌పై అలవోక విజయం సాధించింది. రెయిడింగ్ లో ఆదిత్య షిండే (6), పంకజ్ (5), డిఫెండర్లలో అభినేశ్ (6), గౌరవ్ ఖత్రి (4) అద్భుతంగా ఆడారు. ఆల్‌రౌండర్లు అస్లామ్ (5), గుర్దీప్ (4)లు కూడా మెరుగ్గా రాణించడంతో పుణేరి జట్టు క్రమం తప్పకుండా పాయింట్లు సాధించింది. గుజరాత్ తరఫున రెయిడర్ రాకేశ్ (6) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
వచ్చే ఏడాది భారత్‌లో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టోర్నీ వరల్డ్ చాంపియన్‌షిప్‌కు 17 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 ఆగస్టులో న్యూఢిల్లీ వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. మన దేశంలో చివరిసారిగా 2009లో వరల్డ్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. పారిస్‌లో జరిగిన 2025 టోర్నీ ముగింపు సందర్భంగా వచ్చే ఏడాది వేదిక వివరాలను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. ఈ కార్యక్రమంలో బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షురాలు ఖున్యింగ్ పటామా, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా వంద శాతం అత్యుత్తమ స్థాయిలో ఈ మెగా టోర్నీని తమ దేశంలో నిర్వహిస్తామని మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్‌లో నిలకడగా విజయాలు సాధిస్తున్న జట్లలో భారత్ కూడా ఒకటి. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఇప్పటి వరకు 15 పతకాలు గెలుచుకుంది. 1983లో ప్రకాశ్ పడుకోన్ పురుషుల సింగిల్స్‌లో కాంస్యంతో తొలి పతకం అందించగా... 2011 నుంచి ప్రతీ ఏటా కచ్చితంగా మన ఆటగాళ్లు ఏదైనా ఒక పతకం గెలుస్తూ వచ్చారు. అత్యధికంగా పీవీ సింధు ఒక స్వర్ణం సహా మొత్తం ఐదు పతకాలు సాధించింది. -
భారత్ 15 కజకిస్తాన్ 0
రాజ్‌గిర్ (బిహార్): తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్ తేడాతో నెగ్గిన భారత హాకీ జట్టు... చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయింది. ఆసియా కప్ పురుషుల హాకీ టోరీ్నలో భాగంగా... కజకిస్తాన్ జట్టుతో సోమవారం జరిగిన పూల్ ‘ఎ’ ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 15–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఎనిమిది మంది ఆటగాళ్లు గోల్స్ చేశారు. టీమిండియా సగటున నాలుగు నిమిషాలకు ఒక్కో గోల్ సాధించడం విశేషం. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టీమిండియా అజేయంగా నిలిచింది. తొమ్మిది పాయింట్లతో పూల్ ‘ఎ’లో అగ్రస్థానం పొందిన భారత బృందం ‘సూపర్–4’ సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. అంతర్జాతీయస్థాయిలో తొలిసారి కజకిస్తాన్‌తో పోటీపడ్డ భారత్ ప్రత్యర్థి జట్టుపై ఎడతెరిపిలేని దాడులు నిర్వహించి హడలెత్తించింది. ఐదో నిమిషంలో భారత్ నుంచి తొలి గోల్ నమోదుకాగా... మ్యాచ్ ముగియడానికి మరో నిమిషం వరకు ఈ గోల్స్ వేట కొనసాగింది. భారత్ తరఫున అభిõÙక్ (5వ, 8వ, 20వ, 59వ నిమిషాల్లో) అత్యధికంగా నాలుగు గోల్స్ చేశాడు. సుఖ్జీత్ సింగ్ (15వ, 32వ, 38వ నిమిషాల్లో), జుగ్రాజ్ సింగ్ (24వ, 31వ, 47వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున సాధించారు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (26వ నిమిషంలో), అమిత్ రోహిదాస్ (29వ నిమిషంలో), రాజిందర్ సింగ్ (32వ నిమిషంలో), సంజయ్ (54వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. భారత జట్టుకు 13 పెనాల్టీ కార్నర్లు, 2 పెనాల్టీ స్ట్రోక్‌లు లభించాయి. 13 పెనాల్టీ కార్నర్లలో కేవలం నాలుగింటిని మాత్రమే భారత ఆటగాళ్లు గోల్స్‌గా మలిచారు. లేదంటే భారత్ ఖాతాలో మరిన్ని గోల్స్ చేరేవి. కజకిస్తాన్ జట్టు తమకు లభించిన మూడు పెనాల్టీ కార్నర్లను వృథా చేసుకుంది. చైనా ముందుకు... పూల్ ‘ఎ’లో భాగంగా చైనా, జపాన్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. చైనా, జపాన్ జట్లు నాలుగు పాయింట్లతో సమంగా నిలిచినా... గోల్స్ అంతరంలో జపాన్ను (6 గోల్స్) వెనక్కి నెట్టిన చైనా (11 గోల్స్) జట్టుకు ‘సూపర్–4’ బెర్త్ దక్కింది. పూల్ ‘బి’ నుంచి డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా, మలేసియా జట్లు కూడా ‘సూపర్–4’ దశకు అర్హత పొందాయి. నేడు విశ్రాంతి దినం. బుధవారం నుంచి భారత్, కొరియా, చైనా, మలేసియా జట్ల మధ్య ‘సూపర్–4’ దశ మ్యాచ్‌లు మొదలవుతాయి. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో దక్షిణ కొరియాతో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి), మలేసియాతో చైనా (సాయంత్రం గం. 5 నుంచి) తలపడతాయి. -
ఏఎఫ్సీ మహిళల చాంపియన్స్ లీగ్‌కు ఈస్ట్ బెంగాల్ క్లబ్ అర్హత
దేశవాళీ ఫుట్‌బాల్‌లో మేటి జట్టు ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ మరో ఘనతను సాధించింది. తొలి ప్రయత్నంలోనే ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల చాంపియన్స్ లీగ్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. భారత మహిళల లీగ్ చాంపియన్ హోదాలో ఆసియా చాంపియన్స్ లీగ్ ప్రిలిమినరీ టోర్నీలో ఈస్ట్ బెంగాల్ జట్టు పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. కంబోడియాలో జరిగిన ఈ టోర్నీలో గ్రూప్ ‘ఇ’లో బరిలోకి దిగిన ఈస్ట్ బెంగాల్ జట్టు నాలుగు పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచి ముందంజ వేసింది. కిచీ స్పోర్ట్స్ క్లబ్ (హాంకాంగ్)తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను ఈస్ట్ బెంగాల్ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఈస్ట్ బెంగాల్ తరఫున సంగీత (11వ నిమిషంలో), కిచీ స్పోర్ట్స్ క్లబ్ తరఫున హో ముయ్ మె (59వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. తొలి మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ 1–0తో ఫొనోమ్ పెన్ క్రౌన్ (కంబోడియా)పై గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గోల్ చేయకపోయినా... తెలంగాణ అమ్మాయి, భారత జట్టు ఫార్వర్డ్ సౌమ్య గుగులోత్ ఈస్ట్ బెంగాల్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. గత సీజన్‌కుగాను భారత ‘ఉత్తమ మహిళా ఫుట్‌బాలర్’గా ఎంపికైన సౌమ్య దూకుడుగా ఆడి తమ జట్టుకు గోల్ అవకాశాలను సృష్టించింది. ఆసియాలోని 12 క్లబ్ జట్లు పోటీపడే చాంపియన్స్ లీగ్ అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మే వరకు మూడు అంచెల్లో జరుగుతుంది. -
క్వార్టర్స్‌లో జెస్సికా
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ జెస్సికా పెగూలా (అమెరికా) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జెస్సికా 6–1, 6–2తో అమెరికాకే చెందిన ప్రపంచ 58వ ర్యాంకర్ ఆన్ లీపై గెలుపొందింది. కేవలం 54 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జెస్సికా రెండు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. నెట్ వద్దకు 15 సార్లు దూసుకొచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 12 విన్నర్స్ కొట్టిన ఆమె 12 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు ప్రపంచ రెండో ర్యాంకర్ స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో రౌండ్లో స్వియాటెక్ 7–6 (7/2), 6–4తో కలిన్స్కాయ (రష్యా)పై నెగ్గింది. జ్వెరెవ్‌కు చుక్కెదురు పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) పోరాటం ముగిసింది. మూడో రౌండ్లో జ్వెరెవ్ 6–4, 6–7 (7/9), 4–6, 4–6తో ఫెలిక్స్ అలియాసిమ్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), ఎనిమిదో సీడ్ డిమినార్ (ఆ్రస్టేలియా), పదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్లో సినెర్ 5–7, 6–4, 6–3, 6–3తో షపోవలోవ్ (కెనడా)పై గెలిచాడు. యూకీ జోడీ బోణీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో యూకీ–వీనస్ 6–0, 6–3తో గిరోన్–లెర్నర్ టియెన్ (అమెరికా)లపై గెలిచారు. -
తమిళ్ తలైవాస్‌కు షాక్
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా ఆఖర్లో పుంజుకొని తమిళ్ తలైవాస్‌కు షాక్ ఇచ్చింది. మాజీ చాంపియన్ యు ముంబా 36–33 పాయింట్ల తేడాతో తలైవాస్‌ను ఓడించి ఈ లీగ్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. యు ముంబా రెయిడర్ అజిత్ చౌహాన్ 9, ఆల్‌రౌండర్ అనిల్ 8 పాయింట్లు సాధించారు. డిఫెండర్లలో లోకేశ్, రింకూ చెరో 4 పాయింట్లు స్కోరు చేశారు. తమిళ్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 18 సార్లు కూతకెళ్లి 12 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో కెపె్టన్ పవన్ సెహ్రావత్ 7, డిఫెండర్లు నితీశ్ కుమార్, హిమాన్షు చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా స్టీలర్స్‌కు బెంగాల్ వారియర్స్ చేతిలో చుక్కెదురైంది. కెపె్టన్ దేవాంక్ (21) రెయిడింగ్‌లో చెలరేగడంతో 2019 చాంపియన్ బెంగాల్ 54–44తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. వారియర్స్ జట్టులో దేవాంక్తో పాటు మరో రెయిడర్ మన్‌ప్రీత్ (13) అదరగొట్టాడు. స్టీలర్స్ జట్టులో రెయిడర్లు శివమ్ పటారే (17), వినయ్ (13) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో యూపీ యోధాస్, పుణేరి పల్టన్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి. -
నీరజ్‌తోపాటు మరో ముగ్గురు...
న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రో విభాగంలో భారత్ నుంచి అత్యధికంగా నలుగురు త్రోయర్లు పాల్గొననున్నారు. టోక్యో వేదికగా ఈ నెల 13 నుంచి 21 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్లో పాలొననున్న అన్నీ దేశాల్లోకెల్లా... భారత్ నుంచే అత్యధికంగా నలుగురు జావెలిన్ త్రోయర్లు పోటీ పడుతున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన నీరజ్ చోప్రా భారత బృందానికి నేతృత్వం వహించనున్నాడు. నీరజ్‌తో పాటు సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్ జావెలిన్ పోటీల్లో పాల్గొంటున్నారు. మొత్తంగా ఈ పోటీల్లో భారత్ నుంచి 19 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రోహిత్ యాదవ్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలో లేకున్నా... పలువురు త్రోయర్లు తప్పుకోవడంతో ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ర్యాంకింగ్స్ ఆధారంగా అతడికి ఆహా్వనం పంపింది. 2023లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ పోటీలకు సైతం భారత్ నుంచి నలుగురు జావెలిన్ త్రోయర్లు అర్హత సాధించగా... గాయం కారణంగా రోహిత్ పోటీ నుంచి తప్పుకున్నాడు. బుడాపెస్ట్‌లో జరిగిన ఆ పోటీల్లో నీరజ్ విజేతగా నిలవగా... కిషోర్ జెనా, డీపీ మనూ వరుసగా ఐదో, ఆరో స్థానాలు దక్కించుకున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒకే విభాగంలో నలుగురు భారత అథ్లెట్లు పాల్గొననుండటం ఇదే తొలిసారి. డిఫెండింగ్ చాంపియన్‌గా నీరజ్ నేరుగా ఈ పోటీలకు అర్హత సాధించాడు. ఒక్కో దేశం నుంచి అత్యధికంగా ముగ్గురు అథ్లెట్లకు మాత్రమే అవకాశం ఉన్నప్పటికీ... నీరజ్‌కు నేరుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కడంతో నలుగురికి చాన్స్ లభించింది. ఈ పోటీల అర్హత మార్క్ 85.50 మీటర్లు కాగా... నీరజ్ అంతకంటే మెరుగైన త్రోతో ముందుండగా... మిగిలిన ముగ్గురు ర్యాంకింగ్స్ ఆధారంగా పోటీలో నిలిచారు. 2023 పోటీల్లో భారత్ నుంచి 28 మంది అథ్లెట్లు పాల్గొనగా... ఈసారి ఐదుగురు మహిళలు సహా మొత్తం 19 మంది అథ్లెట్లు పోటీలో ఉన్నారు. తెలంగాణ అథ్లెట్ అగసర నందిని, స్టీపుల్ చేజర్ అవినాశ్ గాయాలతో దూరమయ్యారు. భారత అథ్లెటిక్స్ జట్టు: పురుషులు: నీరజ్ చోప్రా, సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్ (జావెలిన్ త్రో), మురళీ శ్రీశంకర్ (లాంగ్‌జంప్), గుల్వీర్ (5,000, 10,000 మీటర్లు), ప్రవీణ్, అబూబకర్ (ట్రిపుల్ జంప్), సర్వేశ్ (హైజంప్), అనిమేశ్ (200 మీటర్లు), తేజస్ (110 మీటర్ల హర్డిల్స్), సెరి్వన్ (20 కి.మీ రేస్‌వాక్), రామ్‌బాబూ, సందీప్ (35 కి.మీ. రేస్‌వాక్). మహిళలు: పారుల్, అంకిత (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్), అన్ను రాణి (జావెలిన్ త్రో), ప్రియాంక (35 కి.మీ. రేస్‌వాక్), పూజ (800, 1500 మీ.) -
‘సులువుగా పాయింట్లు ఇచ్చాం’
పారిస్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో ఆద్యంతం ఒకే రకమైన దూకుడును కనబర్చలేకపోయామని... నిర్ణాయక మూడో గేమ్‌లో ప్రత్యర్థి జోడీకి సులువుగా పాయింట్లు ఇచ్చామని... పురుషుల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట వివరించింది. ఈ మెగా ఈవెంట్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 67 నిమిషాల్లో 19–21, 21–18, 12–21తో చెన్ బో యాంగ్–లియు యి (చైనా) జంట చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో సాత్విక్–చిరాగ్ జోడీకిది రెండో పతకం కావడం విశేషం. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ ఈ జంట కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ‘సెమీఫైనల్లో శుభారంభం లభించలేదు. ఒక లయను దొరకబుచ్చుకోలేకపోయాం. మూడో గేమ్‌లో సులువుగా పాయింట్లు ఇచ్చేశాం. కీలకదశలో కాస్త చాకచక్యంగా ఆడాల్సింది. అయితే చైనా జోడీ అద్భుతంగా ఆడింది. మూడు గేముల్లోనూ ఆ జంట సర్వీస్ బాగా చేసింది’ అని చిరాగ్ వ్యాఖ్యానించాడు. ‘చైనా జోడీ పూర్తి విశ్వాసంతో ఆడింది. ఆరంభ మ్యాచ్‌ల్లో మేము ఇలాగే ఆడాం. చైనా ఆటగాళ్లు మ్యాచ్‌ను ఆద్యంతం ఆస్వాదించారు. తొలి గేమ్‌లో మేము 12–7తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ చైనా ద్వయం ఆందోళన చెందకుండా సహజశైలిలో ఆడి మాపై ఒత్తిడి పెంచింది. మ్యాచ్‌లో అడపాదడపా మేము మెరిపించాం. కీలక మ్యాచ్‌ల్లో ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం కూడా ముఖ్యం’ అని సాత్విక్ తెలిపాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో షి యుకి (చైనా), మహిళల సింగిల్స్‌లో అకానె యామగుచి (జపాన్) విజేతలుగా నిలిచారు. -
భారత్‌కు రెండో విజయం
రాజ్‌గిర్ (బిహార్): వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత పురుషుల హాకీ జట్టుకు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. భారీ విజయాలు సాధిస్తుందనుకున్న చోట భారత జట్టు మరోసారి గోల్ తేడాతోనే గట్టెక్కింది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన పూల్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3–2 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. వరుసగా రెండో విజయం నమోదు చేసుకున్న భారత జట్టు ‘సూపర్–4’ దశకు మరింత చేరువైంది. చైనాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–3తో గెలిచింది. జపాన్‌తో జరిగిన పోరులో భారత్ తరఫున మన్దీప్ సింగ్ (4వ నిమిషంలో) ఒక గోల్ చేయగా... కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (5వ నిమిషంలో, 46వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. జపాన్ జట్టుకు కొసె కవాబె (38వ, 59వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు. పూల్ ‘ఎ’లో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... చెరో మ్యాచ్‌లో గెలిచిన చైనా, జపాన్ మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. నేడు జరిగే చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో కజకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో చైనా 13–1 గోల్స్ తేడాతో కజకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. -
హోరాహోరీగా ప్రో కబడ్డీ
విశాఖ స్పోర్ట్స్: పోర్టు స్టేడియం జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ విశాఖ క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లు ప్రేక్షకులకు అసలైన కబడ్డీ మజాను పంచాయి. ఒక మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగితే, మరో మ్యాచ్ పాయింట్ల వర్షంతో కనులవిందు చేసింది.ఉత్కంఠ పోరులో ముంబా థ్రిల్లింగ్ విక్టరీఊహించని మలుపులతో, చివరి క్షణం వరకు హోరాహోరీగా సాగిన పోరులో తమిళ్ తలైవాస్‌పై యు ముంబా 36–33 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి అర్ధభాగంలో వెనుకబడిన ముంబా, ద్వితీయార్ధంలో అద్భుతంగా పుంజుకుంది. సమష్టి కృషితో ఆడి, చివరి ఐదు నిమిషాల్లో ఆటను పూర్తిగా తమవైపు తిప్పుకుని అభిమానులకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించింది.వారియర్స్ జోరు.. చాంపియన్‌కు షాక్మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ పాయింట్ల సునామీ సృష్టించింది. డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్‌ను 44–54 తేడాతో చిత్తు చేసింది. ఈ సీజన్లో 50 పాయింట్ల మార్కును దాటిన తొలి జట్టుగా నిలిచి తమ సత్తా చాటింది. వారియర్స్ కెప్టెన్ దేవాంగ్ ఏకంగా 21 పాయింట్లతో ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. సోమవారం విశాఖ వేదికగా మరో రెండు ఆసక్తికరమైన మ్యాచ్‌లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు పాట్నా పైరేట్స్, యూపీ యోధాస్, రాత్రి 9 గంటలకు పుణేరి పల్టన్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. -
ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ బోణీ..
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ జట్టు భారీ విజయం సాధించింది. పూల్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ 8–3 గోల్స్ తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. బంగ్లాదేశ్ తరఫున మొహమ్మద్ అబ్దుల్లా (4వ, 26వ నిమిషాల్లో), రకీబుల్ హసన్ (42వ, 43వ నిమిషాల్లో), అష్రఫుల్ ఇస్లామ్ (45వ, 48వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ సాధించగా... సోహనుర్ సోబుజ్ (36వ నిమిషంలో), రిజావుల్ బాబు (56వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. చైనీస్ తైపీ జట్టు తరఫున సుంగ్ యూ (10వ, 18వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ చేయగా... సుంగ్ జెన్ షిహ్ (60వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. తొలి పోరులో మలేసియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్... ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబర్చింది. మరో మ్యాచ్‌లో మలేసియా 4–1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాపై గెలిచింది. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే గెనెహో జిన్ గోల్‌తో ఖాతా తెరిచిన ఐదు సార్లు చాంపియన్ దక్షిణ కొరియా... చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది.మలేసియా తరఫున అఖీముల్లా అన్వర్ (29వ, 34వ, 58వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. అష్రాన్ హమ్సాని (33వ నిమిషంలో) ఒక గోల్ కొట్టాడు. పూల్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జపాన్‌తో భారత్, కజకిస్తాన్‌తో చైనా తలపడనున్నాయి. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్, సబలెంకా
న్యూయార్క్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఆశిస్తున్న సెర్బియా దిగ్గజ క్రీడాకారులు నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ జొకోవిచ్ 6–4, 6–7 (4/7), 6–2, 6–3తో కామెరాన్ నోరీ (యూకే)పై విజయం సాధించాడు. ప్రపంచ 35వ ర్యాంకర్ నోరీనుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా...చివరకు జొకోవిచ్ పైచేయి సాధించాడు. మ్యాచ్ మధ్యలో వెన్నునొప్పితో కొంత ఇబ్బంది పడిన జొకోవిచ్ 1991 (జిమ్మీ కానర్స్) తర్వాత యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు చేరిన అతి పెద్ద (38) వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 2 గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జొకో 18 ఏస్‌లు సంధించడం విశేషం. అమెరికాకు చెందిన నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ కూడా ప్రిక్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్లో ఫ్రిట్జ్ 7–6 (7/3), 6–7 (9/11), 6–4, 6–4తో జెరోమ్ కిమ్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో లోరెంజో ముసెట్టి (ఇటలీ) 6–3, 6–2, 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఫ్లావియో కొబొలి (ఇటలీ) గాయంతో తప్పుకోవడంతో ముసెట్టి నాలుగో రౌండ్లోకి అడుగు పెట్టాడు. పావొలిని పరాజయం... మహిళల విభాగంలో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్లో 6–3, 7–6 (7/2)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)ను ఓడించి సబలెంకా ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. నాలుగో సీడ్ పెగులా (యూఎస్) కూడా 6–1, 7–5తో అజరెంకా (రష్యా)ను చిత్తు చేసి ముందంజ వేసింది. వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/4), 6–1తో ఏడో సీడ్ పావొలిని (ఇటలీ)పై సంచలన విజయం సాధించి నాలుగో రౌండ్లోకి అడుగు పెట్టింది. మూడో సీడ్, అమెరికాకు చెందిన కోకో గాఫ్ కూడా ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. మూడో రౌండ్లో గాఫ్ 6–3, 6–1 స్కోరుతో మాగ్దలీనా ఫ్రెంచ్ను చిత్తు చేసింది.పురుషుల డబుల్స్‌లో భారత జోడి అనిరుధ్ చంద్రశేఖర్ – విజయ్ ప్రశాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌లో చంద్రశేఖర్ – ప్రశాంత్ 3–6, 6–3, 6–4 స్కోరుతో అమెరికా ద్వయం, ఎనిమిదో సీడ్ హారిసన్ – కింగ్‌పై విజయం సాధించారు. అయితే మరో భారత జోడీ ఎన్.బాలాజీ – రిత్విక్ బొల్లిపల్లికి మొదటి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. వాసిల్ కిర్కోవ్ (అమెరికా) – బార్త్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) ద్వయం 3–6, 7–6 (10/8), 6–4 తేడాతో బాలాజీ – రిత్విక్‌ను ఓడించింది. -
సాత్విక్ జోడీకి పతకం ఖాయం
పారిస్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి పతకం ఖాయం చేసుకుంది. 2022లో ఈ టోరీ్నలో కాంస్య పతకం నెగ్గిన సాత్విక్ జోడీ... ఇప్పుడు రెండో పతకం కైవసం చేసుకోనుంది. తద్వారా 2011 నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ల పతకాల పరంపర దిగి్వజయవంతంగా కొనసాగుతోంది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–12, 21–19తో ఆరోన్ చియా–సోహ్ వూయ్యిక్ (మలేసియా) ద్వయంపై విజయం సాధించింది. 43 నిమిషాల్లో ముగిసిన పోరులో రెండు సార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన మలేసియా జోడీపై భారత జంట సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో మలేసియా షట్లర్ల చేతిలోనే ఓడి పతకానికి దూరమైన భారత ప్లేయర్లు... ఈ సారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు. ‘చాలా ఆనందంగా ఉంది. ఒలింపిక్స్‌లో పరాజయం తర్వాత ఏడాది అనంతరం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మలేసియా జోడీపై నెగ్గడం సంతోషం. ఆరోన్ జంటతో ఆడటం ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే. మా మధ్య ఎన్నో రసవత్తర పోరాటాలు జరిగాయి. ఇప్పటి వరకు తలపడ్డ ప్రతీసారి వరుస గేమ్‌ల్లోనే ఫలితం వచి్చంది. అయినా వాటిలో ఉండే ఉత్కంఠ వేరే. ఈ విజయంతో ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం ఖాయం కావడంతో మరింత ఆనందంగా ఉంది, రెండో గేమ్ సమయంలో నియంత్రణలో ఉండాలని అనుకున్నాం. పాయింట్ల కోసం తొందరపడకుండా... ఒక్కో అడుగు ముందుకు వేయాలని భావించాం. దాన్నే ఆచరణలో చూపాం’ అని మ్యాచ్ అనంతరం సాత్విక్–చిరాగ్ పేర్కొన్నారు. మ్యాచ్ ఆరంభంలోనే 59 షాట్ల సుదీర్ఘ ర్యాలీ ఆడిన భారత జంట... ఆ తర్వాత కూడా సుదీర్ఘ ర్యాలీలతో కట్టిపడేసింది. చిరాగ్ నెట్ వద్ద తన ప్రతిభ కనబర్చగా... సాత్విక్ సర్విస్తో ఆకట్టుకున్నాడు. -
కూత ఉత్కంఠగా..
విశాఖ స్పోర్ట్స్: విశాఖ పోర్టులో శుక్రవారం రాత్రి ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఆరంభమైంది. అభిమానుల కోలాహలం, సందడి వాతావరణం మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 38–35 తేడాతో తెలుగు టైటాన్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి. ప్రోకబడ్డీ లీగ్ 12వ సీజన్‌ను తమిళ్ తలైవాస్ జట్టు విజయంతో ప్రారంభించింది. మ్యాచ్ ఆఖరి క్షణంలో తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ తన మాజీ జట్టుపై చేసిన సూపర్ రైడ్‌తో విజయం సాధించారు. ఒక దశలో టైటాన్స్ 27–20 ఆధిక్యంతో విజయం సాధించేలా కనిపించినా, చివరిలో తడబడింది. తలైవాస్ తరఫున స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ 12 పాయింట్లతో సూపర్ టెన్ సాధించాడు. తెలుగు టైటాన్స్ జట్టులో ఆల్‌రౌండర్ భరత్ 11 పాయింట్లతో రాణించినా ఫలితం దక్కలేదు. కెప్టెన్ విజయ్ మాలిక్ 6 పాయింట్లు, డిఫెండర్ శుభం షిండే 4 పాయింట్లు సాధించారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన జాతీయగీతాలాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, ఐపీఎల్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, హాకీ ఆటగాడు ధన్‌రాజ్ పిళ్లై తదితరులు పాల్గొన్నారు. శనివారం తెలుగు టైటాన్స్ జట్టు యూపీ యోధాస్‌తో తలపడనుంది. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుండగా మరో పోటీలో యు ముంబా జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. మరో మ్యాచ్‌లో బెంగళూర్ బుల్స్ జట్టుపై పునేరి పాల్టన్ జట్టు విజయం సాధించింది. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా: నీరజ్ చోప్రా
జ్యూరిక్ డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ ఫైనల్స్‌లో 85.01 మీటర్లు జావెలిన్ విసిరి రెండో స్థానంలో నిలిచిన భారత స్టార్ నీరజ్ చోప్రా తన ప్రదర్శనపై కొంత అసంతృప్తిని ప్రదర్శించాడు. పూర్తిగా వైఫల్యం అనకపోయినా, తాను మరింత మెరుగ్గా ఆడాల్సిందని అతను వ్యాఖ్యానించాడు.‘జావెలిన్‌ను విసిరే సమయంలో నా రనప్ గానీ టైమింగ్ గానీ బాగా లేవు. సరైన లయను అందుకోలేకపోయాను. నా ప్రదర్శనతో కొన్ని సానుకూలతలు కనిపించినా మొత్తంగా చూస్తే మరింత మెరుగ్గా త్రో చేయాల్సింది. నాకు సంబంధించి ఇది కఠినమైన రోజుగా భావిస్తున్నా.ఇలాంటి స్థితిలోనూ చివరి ప్రయత్నంలో 85 మీటర్లు విసరగలిగాను కానీ నాకు మరింత ప్రాక్టీస్ అవసరం. వరల్డ్ చాంపియన్‌షిప్‌కు మరో మూడు వారాల సమయం ఉంది. ఆలోగా లోపాలు సరిదిద్దుకొని నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా’ అని నీరజ్ చెప్పాడు. టోక్యోలో జరిగే ఈ పోటీల్లో నీరజ్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు.చదవండి: DPL 2025: నితీష్ విధ్వంసకర సెంచరీ.. 15 సిక్స్‌లతో వీర విహారం! వీడియో -
కూత ఉత్కంఠగా..
విశాఖ స్పోర్ట్స్: విశాఖ పోర్టులో శుక్రవారం రాత్రి ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఆరంభమైంది. అభిమానుల కోలాహలం, సందడి వాతావరణం మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 38–35 తేడాతో తెలుగు టైటాన్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి. ప్రోకబడ్డీ లీగ్ 12వ సీజన్‌ను తమిళ్ తలైవాస్ జట్టు విజయంతో ప్రారంభించింది. మ్యాచ్ ఆఖరి క్షణంలో తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ తన మాజీ జట్టుపై చేసిన సూపర్ రైడ్‌తో విజయం సాధించారు. ఒక దశలో టైటాన్స్ 27–20 ఆధిక్యంతో విజయం సాధించేలా కనిపించినా, చివరిలో తడబడింది. తలైవాస్ తరఫున స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ 12 పాయింట్లతో సూపర్ టెన్ సాధించాడు. తెలుగు టైటాన్స్ జట్టులో ఆల్‌రౌండర్ భరత్ 11 పాయింట్లతో రాణించినా ఫలితం దక్కలేదు. కెప్టెన్ విజయ్ మాలిక్ 6 పాయింట్లు, డిఫెండర్ శుభం షిండే 4 పాయింట్లు సాధించారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన జాతీయగీతాలాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, ఐపీఎల్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, హాకీ ఆటగాడు ధన్‌రాజ్ పిళ్లై తదితరులు పాల్గొన్నారు. శనివారం తెలుగు టైటాన్స్ జట్టు యూపీ యోధాస్‌తో తలపడనుంది. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుండగా మరో పోటీలో యు ముంబా జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. మరో మ్యాచ్‌లో బెంగళూర్ బుల్స్ జట్టుపై పునేరి పాల్టన్ జట్టు విజయం సాధించింది. -
మోండో ట్రాక్ ఏర్పాటు...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవం రోజున పలు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. నేషనల్ స్టేడియంలో ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాల వేసి క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నివాళి అర్పించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్పోర్ట్స్ బిల్ వల్ల మన క్రీడారంగం దశ, దిశ మారిపోతాయని... భవిష్యత్తులో అత్యుత్తమ క్రీడా వేదికగా భారత్ నిలుస్తుందని మాండవీయ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని మన దేశంలోని క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన మోండో అథ్లెటిక్ ట్రాక్‌ను మంత్రి ప్రారంభించారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో, అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన ఈ ట్రాక్‌లో సెప్టెంబర్ 26 నుంచి వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంత్రి, మాజీ అథ్లెట్ అంజూ బాబీజార్జ్తో పాటు పలువురు క్రీడాకారులు, క్రీడాధికారులు కలిసి సరదాగా మైదానంలో పలు ఆటలు ఆడి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు అథ్లెట్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముచ్చటించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశంలో ఆటగాళ్ల ఘనతలు గుర్తు చేస్తూ వారిపై ప్రత్యేక ప్రశంసలు కురిపించిన దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అభినవ్ బింద్రా... యువ క్రీడాకారులు ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో అగ్రస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. -
భారత్ గురి భళా...
షిమ్కెంట్ (కజకిస్తాన్): గురి తప్పని లక్ష్యంతో అదరగొట్టిన భారత షూటర్లు ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌ను దిగ్విజయంగా ముగించారు. శుక్రవారం తెర పడిన ఈ మెగా ఈవెంట్లో సీనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో కలిపి భారత షూటర్లు మొత్తం 103 పతకాలు నెగ్గి అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో 52 స్వర్ణాలు, 26 రజతాలు, 25 కాంస్యాలు ఉండటం విశేషం. ఆఖరి రోజు నాన్ ఒలింపిక్ కేటగిరీ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో ప్రపంచ మాజీ చాంపియన్ అంకుర్ మిట్టల్ స్వర్ణ పతకం గెలిచాడు. 18 మంది షూటర్లు పోటీపడ్డ ఈ ఈవెంట్లో అంకుర్ 107 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. అంకుర్, భానుప్రతాప్ సింగ్, హర్షవర్ధన్‌లతో కూడిన భారత జట్టు 264 పాయింట్లతో టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది. మహిళల డబుల్ ట్రాప్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. అనుష్క సింగ్ (93 పాయింట్లు), ప్రాణిల్ ఇంగ్లే (89), యెశాయ హఫీజ్ కాంట్రాక్టర్ (87) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. అనుష్క, ప్రాణిల్, యెశాయ బృందం టీమ్ విభాగంలోనూ బంగారు పతకం సొంతం చేసుకుంది.పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లోనూ భారత షూటర్లు మెరిశారు. వ్యక్తిగత విభాగంలో రాజ్కన్వర్ సింగ్ సంధూ 583 పాయింట్లతో స్వర్ణ పతకం నెగ్గాడు. టీమ్ విభాగంలో రాజ్కన్వర్, గుర్ప్రీత్ సింగ్, అంకుర్ గోయల్‌లతో కూడిన భారత బృందం 1733 పాయింట్లతో బంగారు పతకాన్ని దక్కించుకుంది. సురభి బృందానికి రజతం మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ మానిని కౌశిక్ (617.8 పాయింట్లు) కాంస్య పతకం గెలిచింది. తెలంగాణ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్, మానిని, విదర్శలతో కూడిన భారత బృందం 1846 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. -
హర్మన్‌ప్రీత్ ‘హ్యాట్రిక్’
రాజ్‌గిర్ (బిహార్): అంచనాలకు తగ్గట్టు ఆడకపోయినా... ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు శుభారంభం లభించింది. శుక్రవారం మొదలైన ఈ టోర్నీలో భాగంగా జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో చైనా జట్టును ఓడించింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (20వ, 33వ, 47వ నిమిషాల్లో) ‘హ్యాట్రిక్’ నమోదు చేసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. మరో గోల్‌ను జుగ్రాజ్ సింగ్ (18వ నిమిషంలో) అందించాడు. చైనా తరఫున షిహావో డు (12వ నిమిషంలో), బెన్హాయ్ చెన్ (35వ నిమిషంలో), జీషెంగ్ గావో (41వ నిమిషంలో) ఒక్కోగోల్ చేశారు. ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం ఏడు గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారానే రావడం విశేషం. హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. హర్మన్‌ప్రీత్‌కు 200 డాలర్ల చెక్‌ను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అందజేశారు. తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న చైనాపై భారత్ భారీ విజయం సాధిస్తుందని ఆశించినా... ప్రత్యర్థి జట్టు నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. భారత జట్టు తమకు లభించిన 11 పెనాల్టీ కార్నర్లో కేవలం నాలుగింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. చైనా జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్లు రాగా, మూడింటిని లక్ష్యానికి చేర్చింది. తొలి రోజు జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో మలేసియా 4–1తో బంగ్లాదేశ్ జట్టుపై... డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా 7–0తో చైనీస్ తైపీపై... జపాన్ 7–0తో కజకిస్తాన్‌పై విజయం సాధించాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో చైనీస్ తైపీతో బంగ్లాదేశ్; మలేసియాతో దక్షిణ కొరియా తలపడతాయి. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం జపాన్ జట్టుతో ఆడుతుంది. -
టైటాన్స్ ఓటమితో మొదలు
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) కొత్త సీజన్‌ను కూడా తెలుగు టైటాన్స్ పరాజయంతో ప్రారంభించింది. గత సీజన్లో ఏడో స్థానంలో నిలిచిన టీమ్ ఈసారి విశాఖపట్నం వేదికగా కూడా శుభారంభం చేయలేకపోయింది. శుక్రవారం ప్రారంభమైన పీకేఎల్ 12వ సీజన్ తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 38–35 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. టైటాన్స్ తరఫున ఆల్‌రౌండర్ భరత్ 11 పాయింట్లు సాధించగా, కెప్టెన్ విజయ్ మలిక్ 6 పాయింట్లు నమోదు చేశాడు. తలైవాస్ జట్టులో రైడర్ అర్జున్ దేశ్వాల్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెపె్టన్ పవన్ సెహ్రావత్ చెలరేగి 9 పాయింట్లతో జట్టును విజయం దిశగా నడిపించాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి తలైవాస్ జట్టు 14–13తో ఆధిక్యంలో నిలవగా, రెండో అర్ధ భాగంలోనూ రెండు పాయింట్లు ముందంజలో నిలిచిన జట్టు చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. మొదటి రోజే జరిగిన రెండో మ్యాచ్‌లో ‘టైబ్రేక్’ ద్వారా ఫలితం వచ్చింది. బెంగళూరు బుల్స్, పుణేరి పల్టన్ మధ్య జరిగిన ఈ పోరు నిర్ణీత సమయంలో 32–32తో సమంగా ముగిసింది. బుల్స్ తరఫున ఆకాశ్ షిండే 12, ఆశిష్ మలిక్ 8 పాయింట్లు సాధించగా... పల్టన్ ఆటగాళ్లలో ఆదిత్య షిండే 9, పంకజ్ మోహితే 6 పాయింట్లు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత పుణేరీ ‘టైబ్రేక్’లో విజయం సాధించింది. ఐదు రైడ్ల ఈ టైబ్రేక్‌ను పల్టన్ 6–4తో గెలుచుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటల నుంచి), గుజరాత్ జెయింట్స్‌తో యు ముంబా (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
సింధుకు చుక్కెదురు
పారిస్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఆరో పతకం సాధించాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో సింధు పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సింధు 14–21, 21–13, 16–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ పుత్రి కుసుమవర్దిని (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సింధు గెలిచి ఉంటే సెమీఫైనల్ చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకునేది. గతంలో సింధు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు (స్వర్ణం–2019, రెండు రజతాలు–2017, 2018, రెండు కాంస్యాలు–2013, 2014) సాధించింది. గతంలో కుసుమవర్దినిపై రెండుసార్లు గెలుపొంది, రెండుసార్లు ఓడిపోయిన సింధుకు ఐదోసారి పరాజయమే ఎదురైంది. 64 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో సింధు ఆటతీరులో నిలకడ కనిపించలేదు. తొలి గేమ్‌లో స్కోరు 6–6 వద్ద కుసుమవర్దిని చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10–6తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సింధు పుంజుకుంది. స్కోరు 4–3 వద్ద సింధు విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి 10–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత మూడు పాయింట్లు కోల్పోయిన సింధు... 10–6 వద్ద మళ్లీ చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించి 16–6తో పది పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. అదే క్రమంలో రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒత్తిడికి లోనైంది. స్కోరు 5–4 వద్ద 59 షాట్ల ర్యాలీలో కుసుమవర్దిని షటిల్‌ను నెట్‌కు కొట్టడంతో పాయింట్ నెగ్గిన సింధు 6–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ స్వల్ప ఆధిక్యాన్ని సింధు కాపాడుకోలేకపోయింది. స్కోరును 7–7 వద్ద సమం చేసిన కుసుమవర్దిని... ఆ తర్వాత స్కోరు 12–11 వద్ద ఇండోనేసియా ప్లేయర్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఒకదశలో సింధు తేరుకొని ఆధిక్యం అంతరాన్ని ఒక పాయింట్‌కు తగ్గించినా స్కోరు 17–16 వద్ద కుసుమవర్దిని అద్భుత ఆటతీరుతో వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి విజయాన్ని అందుకుంది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లోనూ తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ 15–21, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ చెన్ టాంగ్ జియె–తో ఈ వె (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. -
డైమండ్ లీగ్ రన్నరప్‌గా నీరజ్ చోప్రా
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా జూరిచ్ డైమండ్ లీగ్-2025 రన్నరప్‌గా నిలిచాడు. గురువారం జ్యూరిచ్ వేదికగా జరిగిన ఫైనల్లో నీరజ్ తొలి స్దానాన్ని దక్కించుకోలేకపోయాడు. నీరజ్ తన ఈటెను అత్యుత్తమంగా 85.01 మీటర్ల దూరం విసిరి రెండో స్ధానాన్ని కైవసం చేసుకున్నాడు.అయితే డైమండ్ లీగ్ విజేతగా జర్మనీ స్టార్ ప్లేయర్ జూలియన్ వెబర్(91.51 మీ) అవతరించాడు. వెబర్ తన సంచలనాత్మక త్రోలతో అందరిని ఆశ్యర్యపరిచాడు. వెబర్ తన జావెలిన్‌ను తొలి ప్రయత్నంలో 91.37 మీటర్లు, రెండో ప్రయత్నంలో 91.51 మీటర్ల దూరం విసిరాడు. వరల్డ్ ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో ఉన్న జూలియన్ వెబర్‌కు (91.51) ఇదే కెరీర్ బెస్ట్ ప్రదర్శన కావడం విశేషం. అంతకు ముందు అతడు అత్యుత్తమ ప్రదర్శన 91.06 మీటర్లగా ఉంది. ఇక ఈ పోటీలో 2012 ఒలింపిక్ ఛాంపియన్, ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్( 84.95) మూడో స్ధానంలో నిలిచాడు.కాగా ఫైనల్ రౌండ్లో నీరజ్ రెండో స్ధానంలో నిలిచినప్పటికి తన స్దాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు. ఒకనొక దశలో టాప్-2లో కూడా నిలిచే అవకాశాన్ని కోల్పోయేలా చోప్రా కన్పించాడు. తొలి ప్రయత్నంలో 84.35 మీటర్లు, రెండో ప్రయత్నంలో 82 మీటర్లు బల్లెం విసిరిన నీరజ్, తర్వాత 3 ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు.అయితే ఈ భారత స్టార్ తన చివరి ప్రయత్నంలో 84.35 మీటర్లను విసిరి రెండో స్ధానానికి చేరుకోగలిగాడు. ఏదేమైనప్పటికి అగ్రస్ధానంలో నిలిచిన వెబర్ కంటే నీరజ్ ఆరు మీటర్లు వెనుకబడ్డాడు. ఇక వచ్చే నెలలో ప్రపంచ ఛాంపియన్షిప్ జరగనున్న నేపథ్యంలో నీరజ్ తన ప్రదర్శనను మెరుగుచుకోవాలి. టోక్యో వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్లో నీరజ్.. పారిస్ ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్, వెబర్‌ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరిద్దరి నుంచి నీరజ్‌కు మరోసారి గట్టి పోటీ ఎదురు కానుంది.చదవండి: అజయ్ బాబుకు స్వర్ణ పతకం -
కబడ్డీ.. కబడ్డీ
విశాఖ స్పోర్ట్స్: కబడ్డీ.. కబడ్డీ అంటూ కొదమ సింహాల్లా బరిలో నిలిచే ప్లేయర్లు సిద్ధమయ్యారు. అదరగొట్టే యాక్షన్ మొదలుకాబోతోంది. కబడ్డీ ప్రేమికులను ఉత్కంఠతో నిలబెట్టే ప్రో కబడ్డీ సీజన్–12 విశాఖ వేదికగా శనివారం ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా గురువారం 12 జట్ల కెప్టెన్లు ట్రోఫీతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. పోటీకి సై అంటూ తొడకొడుతూ సవాల్ విసిరారు. ప్రముఖ క్రియెటర్లతో కలిసి మ్యాట్ మావెరిక్స్, రైడ్ మాస్టర్లు పేరిట రెండు జట్లుగా విడిపోయి కబడ్డీ ఆడారు. విశాఖ వేదికగా శుక్రవారం రాత్రి 8 గంటలకు తెలుగు టైటాన్స్–తమిళ్ తలైవాస్ మధ్య మ్యాచ్‌తో లీగ్ ఆరంభంకానుంది. ఈసారి ప్రో కబడ్డీ ఫార్మాట్లో మార్పులు చేశారు. తొలిసారిగా జట్లు రెండు గ్రూపుల్లో ఆడనున్నాయి. తెలుగు టైటాన్స్ జట్టు ‘బి’ గ్రూప్‌లో ఉంది. ప్రతి జట్టు లీగ్ దశలో 18 మ్యాచ్‌లు ఆడుతుంది. ప్లే–ఆఫ్స్‌తో పాటు ‘ప్లే–ఇన్లు’ కూడా ప్రవేశపెట్టారు. తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే–ఇన్లు, ప్లే–ఆఫ్స్ ఆడతాయి. ఫలితం తేలని మ్యాచ్‌ల్లో విజేతను నిర్ణయించడానికి ‘గోల్డెన్ రైడ్’ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ కొత్త ఫార్మాట్ భవిష్యత్తులో మరిన్ని లీగ్‌లలో అనుసరించవచ్చని ప్రో కబడ్డీ ఛైర్మన్ అనుపమ్ గోస్వామి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ సీజన్ ప్రారంభం కావడం విశేషం. గురువారం అంతర్జాతీయ క్రీడాకారుడు రాహుల్ చౌదరి వంటి వారిని సత్కరించారు. అలాగే సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్లు ఐఎన్ఎస్ కురుసురను సందర్శించి సాయుధ దళాలకు నివాళులర్పించారు. ప్రో కబడ్డీ లీగ్–12ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. ఈ సీజన్ టికెట్లను జొమాటో డిస్ట్రిక్ట్‌లో అందుబాటులో ఉంచారు. -
అజయ్ బాబుకు స్వర్ణ పతకం
అహ్మదాబాద్: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు వల్లూరి అజయ్ బాబు, బేద్బ్రత్ భరాలి బంగారు పతకాలు సాధించారు. గురువారం జరిగిన సీనియర్ పురుషుల 79 కేజీల కేటగిరీలో జాతీయ క్రీడల చాంపియన్ అయిన అజయ్ బాబు మొత్తం 335 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 152 కేజీల బరువెత్తి కామన్వెల్త్ చాంపియన్‌షిప్ రికార్డును కూడా నెలకొల్పాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో 183 కేజీలు ఎత్తాడు. స్నాచ్‌లో ఇంతకుముందు నైజీరియాకు చెందిన ఎడిడివోంగ్ జోసెఫ్ 147 కేజీల రికార్డును అజయ్ తిరగరాశాడు. గత క్రీడల్లోనూ అతను బంగారు పతకం సాధించినప్పటికీ అప్పుడు 81 కేజీల విభాగంలో పోటీపడ్డాడు. సీనియర్ మహిళల 69 కేజీల కేటగిరీలో కామన్వెల్త్ క్రీడల (2022) కాంస్య పతక విజేత హర్జిందర్ కౌర్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. జూనియర్ పురుషుల 79 కేజీల విభాగంలో బేదబ్రత్ భరాలి స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌లో కొత్త రికార్డులతో పసిడి పట్టాడు. అతను స్నాచ్‌లో 145 కేజీల బరువెత్తాడు. తద్వారా 139 కేజీల గత రికార్డును అధిగమించాడు. అలాగే క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీల బరువెత్తి 169 కేజీల గత రికార్డును తుడిచిపెట్టాడు. మొత్తంగా బేదబ్రత్ 326 కేజీల బరువెత్తాడు. యూత్ మహిళల 77 కేజీల విభాగంలో గ్రీష్మ తోరట్ రజతం నెగ్గింది. -
సబలెంకా ముందుకు...
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సబలెంకా 7–6 (7/4), 6–2తో పొలీనా కుదెర్మెటోవా (రష్యా)పై విజయం సాధించింది. 96 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు నాలుగుసార్లు దూసుకొచ్చి రెండుసార్లు పాయింట్లు గెలిచింది. 18 విన్నర్స్ కొట్టిన ఆమె 22 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన ఈ బెలారస్ స్టార్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్), ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ) కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సుజాన్ లామెన్స్ (నెదర్లాండ్స్)తో 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వియాటెక్ 6–1, 4–6, 6–4తో కష్టపడి గెలిచింది. పెగూలా 6–1, 6–3తో బ్లింకోవా (రష్యా)పై, రాడుకాను 6–2, 6–1తో జానైస్ జెన్ (ఇండోనేసియా)పై, పావోలిని 6–3, 6–3తో ఇవా జోవిక్ (అమెరికా)పై విజయం సాధించారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా) 6–1, 6–3తో పొటపోవా (రష్యా)పై, పదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా) 6–2, 6–1తో మెక్నాలీ (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–3, 7–6 (9/7)తో తెరెజా వాలెన్టోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొంది మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 16వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) 3–6, 3–6తో ఆన్ లీ (అమెరికా) చేతిలో, 17వ సీడ్ సమ్సోనోవా (రష్యా) 6–4, 3–6, 2–6తో ప్రిసిల్లా హాన్ (ఆ్రస్టేలియా) చేతిలో, 25వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాతి్వయా) 5–7, 1–6తో టేలర్ టౌన్సెండ్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. 11వ సీడ్ రూనె ఓటమి పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్), మాజీ విజేత జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్లోకి ప్రవేశించగా... 11వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అల్కరాజ్ 6–1, 6–0, 6–3తో మటియా బెలూచి (ఇటలీ)పై, జొకోవిచ్ 6–7 (5/7), 6–3, 6–3, 6–1తో జచారీ వజ్దా (అమెరికా)పై గెలుపొందారు. రూనె 6–7 (5/7), 6–2, 3–6, 6–4, 5–7తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 4–6, 7–6 (7/3), 6–2, 6–4తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)పై, ఆరో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) 6–4, 6–2, 6–4తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, పదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) 6–4, 6–0, 6–2తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై విజయం సాధించారు. -
విశాఖతీరంలో కబడ్డీ కూత
విశాఖ స్పోర్ట్స్: భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా... చెప్పుకోదగిన స్థాయిలో అభిమానుల్ని సంపాదించుకున్న లీగ్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్). గత 11 ఏళ్లుగా కబడ్డీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న పీకేఎల్ 12వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. నేడు ‘జాతీయ క్రీడా దినోత్సవం’ రోజున ఉక్కు నగరం విశాఖపట్నంలో కబడ్డీ కూత మొదలు కానుంది. ప్రతీ రోజు రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి పోరు తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరుగుతుంది. తర్వాత రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో పుణేరి పల్టన్ తలపడుతుంది. గత సీజన్లలా కాకుండా కొత్త షోకులతో ఈ సీజన్ పోటీలు జరుగుతాయి. మ్యాచ్ ‘టై’తో కాకుండా ఫలితంలో ముగించేందుకు టై–బ్రేకర్‌ను తీసుకొచ్చారు. లీగ్ దశ తర్వాత పాయింట్ల పట్టికలో తొలి 4 జట్లు కాకుండా మొత్తం 8 జట్లు టైటిల్ రేసులో ఉండేలా ప్లే ఆఫ్స్‌ను మార్చారు. ఫుట్‌బాల్‌లో పెనాల్టీ షూటౌట్ తరహా ఐదు రెయిడ్ల షూటౌట్‌ను ఇకపై చూడొచ్చు. జయజయధ్వానాలతో... సీజన్ ప్రారంభానికి ముందు గురువారం లీగ్‌లో పాల్గొనే 12 ఫ్రాంచైజీల కెపె్టన్లు భారత సాయుధ బలగాలకు జేజేలు పలికారు. ఇందులో భాగంగా విశాఖ తీరంలో ఉన్న ‘ఐఎన్ఎస్ కుర్సురా’ జలాంతర్గామిని 12 జట్ల కెపె్టన్లు సందర్శించారు. ఈ సబ్ మెరైన్ 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్‌లో ‘కూత’ లేదు ఈ సీజన్ లీగ్ దశను నాలుగు వేదికల్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్‌ను ఏర్పాటు చేయలేదు. తెలుగు టైటాన్స్ ఆడే మ్యాచ్‌లన్నీ వైజాగ్‌కు తరలించారు. ఈ అంచె పోటీలు సెప్టెంబర్ 11న ముగిశాక... జైపూర్‌లో 12 నుంచి 28 వరకు జరుగుతాయి. ఆ మరుసటి రోజే చెన్నై అంచె పోటీలు మొదలై అక్టోబర్ 10న ముగుస్తాయి. ఆఖరి లీగ్ దశ పోటీలు ఢిల్లీలో 11 నుంచి 23 వరకు జరుగుతాయి. బరిలో 12 ఫ్రాంచైజీలివే... తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, జైపూర్ పింక్‌పాంథర్స్, పట్నా పైరేట్స్, పుణేరి పల్టన్, తమిళ్ తలైవాస్, యుముంబా, యూపీ యోధాస్. లీగ్ దశలో 108 మ్యాచ్‌లు మారిన ఫార్మాట్లో 12వ సీజన్‌ను నిర్వహిస్తారు. లీగ్ దశలో 108 మ్యాచ్‌లు జరుగుతాయి. 12 ఫ్రాంచైజీలు 18 మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి. గెలిచిన జట్టుకు 2 పాయింట్లు. ఓడితే పాయింట్ ఉండదు. బోనస్ పాయింట్‌ను ఎత్తేశారు. కొత్త టై–బ్రేక్ పద్ధతిలో స్కోరు సమమైతే గోల్డెన్ రెయిడ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. -
సింధు సంచలనం
పారిస్: సత్తాకు సవాల్‌గా నిలిచిన మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన ప్రతాపాన్ని చూపించింది. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా సాధికారిక ఆటతీరుతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సింధు 21–19, 21–15తో గెలిచింది. 48 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో సింధు రెండు గేముల్లోనూ నిలకడగా ఆడింది. గతంలో వాంగ్ జి యిపై రెండుసార్లు గెలిచి, రెండుసార్లు ఓడిపోయిన సింధు ఐదో ప్రయత్నంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్‌లో ఒకదశలో 6–2తో ముందంజ వేసిన సింధు... ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని 11–6కు పెంచుకుంది. ఈ దశలో వాంగ్ జి యి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 12–11తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత వాంగ్ జి యి 19–17తో తొలి గేమ్ సొంతం చేసుకునేందుకు రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. అయితే సింధు ఆందోళన చెందకుండా, తన అనుభవాన్నంత రంగరించి ఆడి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను 21–19తో దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. స్కోరు 6–6 వద్ద సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు సాధించి 11–6తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం వాంగ్ జి యి తేరుకొని ఆధిక్యం అంతరం ఒక పాయింట్‌కు తగ్గించింది. స్కోరు 12–11 వద్ద సింధు మళ్లీ విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 16–11తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న సింధు విజయాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ పుత్రి కుసుమ వర్దిని (ఇండోనేసియా)తో సింధు ఆడుతుంది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ సాత్విక్–చిరాగ్ ద్వయం 19–21, 21–15, 21–17తో ప్రపంచ ఆరో ర్యాంక్ లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జోడీని బోల్తా కొట్టించింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) జోడీ కూడా సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐదో ర్యాంక్ జంట టాంగ్ చున్ మాన్–సెయింగ్ సుయెట్ (హాంకాంగ్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్–తనీషా జోడీ 19–21, 21–12, 21–15తో గెలిచింది.ప్రణయ్‌కు నిరాశ పురుషుల సింగిల్స్ విభాగంలో 2023 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, భారత స్టార్ ప్రణయ్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో ప్రపంచ 34వ ర్యాంకర్ ప్రణయ్ 8–21, 21–17, 21–23తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో ప్రణయ్ మూడు మ్యాచ్ పాయింట్లు చేజార్చుకోవడం గమనార్హం. -
ప్రపంచ ‘బెర్త్’ లక్ష్యంగా...
రాజ్‌గిర్ (బిహార్): వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాలనే లక్ష్యంతో... నేడు మొదలయ్యే ఆసియా కప్‌లో భారత పురుషుల హాకీ జట్టు బరిలోకి దిగనుంది. ఆసియా కప్ విజేత జట్టు ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత పొందుతుంది. శుక్రవారం మొదలయ్యే ఆసియా కప్ పూల్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడుతుంది. ఇటీవల జరిగిన యూరోపియన్ అంచె ప్రొలీగ్‌లో భారత్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. 8 మ్యాచ్‌లాడితే ఏకంగా ఏడింట పరాజయాన్నే మూటగట్టుకుంది. అయితే తాజా ఆసియా కప్ పరిస్థితులను ఐరోపా జట్లు, పరిస్థితులతో పోల్చలేం. కానీ అక్కడ తలెత్తిన లోటుపాట్లను మాత్రం ఇక్కడా కొనసాగిస్తే మాత్రం మూల్యం తప్పదు. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో భారత్ డిఫెన్స్‌లో దుర్భేద్యంగా మారాలి. పెనాల్టీ కార్నర్లను గోల్‌గా మలిచే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. గోల్‌కీపింగ్ కూడా పటిష్టం కావాలి. రిటైరైన దిగ్గజ గోల్‌కీపర్ శ్రీజేశ్ స్థానంలో ఆడుతున్న కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా ఇంకా చాలా మెరుగవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలా అన్ని రంగాల్లో మెరుగైతేనే మేటి జట్లను నిలువరించగలం. యూరోపియన్ అంచెలో ఎదురైన పరాజయాల భారాన్ని తగ్గించుకోగలం. మిడ్‌ఫీల్డ్‌లో రాజిందర్ సింగ్, రాజ్ కుమార్ పాల్, మన్‌ప్రీత్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్లు మరింత బాధ్యత కనబరిస్తేనే ఆసియా కప్‌లో ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధిస్తాం. ఆసియా కప్‌లో భారత్, చైనాలున్న పూల్ ‘ఎ’లో జపాన్, కజకిస్తాన్ మిగతా జట్లు కాగా... పూల్ ‘బి’లో దక్షిణ కొరియా, మలేసియా, బంగ్లాదేశ్, చైనీస్ తైపీ జట్లున్నాయి. -
US Open 2025: అమెరికా స్టార్‌పై జాత్యహంకర వ్యాఖ్యలు..!? వీడియో వైరల్
యూఎస్ ఓపెన్-2025లో జాత్యహంకార వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అమెరికా క్రీడాకారిణి టేలర్ టౌన్సెండ్, లాట్వియన్ టెన్నిస్ స్టార్ జెలెనా ఒస్టాపెంకో మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఆగస్టు 27(బుధవారం) టౌన్సెండ్, ఒస్టాపెంకో తలపడ్డారు. ఈ రెండో రౌండ్ మ్యాచ్‌లో 25వ సీడ్ ఒస్టాపెంకోను 7-5, 6-1 తేడాతో టౌన్సెండ్ ఓడించింది.అయితే 2017 ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ అయిన ఒస్టాపెంకో.. టౌన్సెండ్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. దీంతో మ్యాచ్ ముగిసినంతరం హ్యాండ్ షేక్ చేసే సమయంలో టౌన్‌సెండ్‌పై వేలు చూపిస్తూ ఒస్టాపెంకో జాత్యహంకర వ్యాఖ్యలు చేసింది. నీకు ఒక స్దాయి లేదు, సరైన చదువు లేదని తనను దూషించినట్లు టౌన్సెండ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హద్దులు మీరిన జెలెనా.."ఒక పోటీలో ఓడిపోయినప్పుడు సహజంగా ఎవరైనా నిరాశ చెందుతారు. కానీ ఆ సమయంలో కొంత మంది తమ హద్దలు మీరి ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఒస్టాపెంకో నాతో అలానే ప్రవర్తించింది. నాకు ఒక క్లాస్ లేదు, చదువు లేదని నన్ను విమర్శించింది.యూఎస్ వెలుపుల ఏమి జరుగుతుందో వెళ్లి చూడమని నన్ను హెచ్చరించింది" అని మ్యాచ్ అనంతరం ఆన్-కోర్ట్ ఇంటర్వ్యూలో టౌన్సెండ్ పేర్కొంది. దీంతో జెలెనాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలకు సోషల్ మీడియా వేదికగా ఒస్టాపెంకో కౌంటరిచ్చింది.అందరిని గౌరవిస్తా.."నా జీవితంలో నేను ఎప్పుడూ జాత్యహంకార వ్యాఖ్యలు చేయలేదు. అన్ని దేశాల ప్రజలను నేను గౌరవిస్తాను. నాకు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. పోటీలో గెలవడమే నా లక్ష్యం అని ఒస్టాపెంకో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చింది. అయితే ఒస్టాపెంకో కోపం వెనక ఓ కారణముందంట. టెన్నిస్ మ్యాచ్ నియమాలకు విరుద్దంగా టౌన్సెండ్ ప్రవర్తించినట్లు ఒస్టాపెంకో ఆరోపించింది."మ్యాచ్ ప్రారంభంలో అందరు ఆటగాళ్లు బేస్లైన్లోనే వార్మప్ ప్రారంభించాలి. కానీ టౌన్సెండ్ మాత్రం బెస్లైన్లో కాకుండా బయటకు వచ్చి వెంటనే వార్మప్ ప్రారంభించింది. టౌన్సెండ్ అలా చేయడం సరి కాదు. ఆమె టెన్నిస్ మ్యాచ్ నియమాలకు విరుద్ధంగా వెళ్లింది. కనీసం నెట్కార్డ్ విన్నర్‌కు సారీ కూడా చెప్పలేదని ఒస్టాపెంకో తన పోస్ట్‌లో పేర్కొంది.😭👏 Townsend to Ostapenko:“You can learn how to take a loss better” pic.twitter.com/L0m5GGAVC6— Olly Tennis 🎾🇬🇧 (@Olly_Tennis_) August 27, 2025చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం: ఇంగ్లండ్ స్టార్ పేసర్ -
కామన్వెల్త్ క్రీడల బిడ్ సమర్పణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
భారతదేశం మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలవబోతోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ సమర్పించాలన్న యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రీడలకు గుజరాత్‌లోని ప్రధాన నగరం అహ్మదాబాద్ వేదికగా ఎంపిక చేయబడింది.బిడ్ ఆమోదం పొందితే గుజరాత్ ప్రభుత్వానికి సహకార ఒప్పందం, గ్రాంట్–ఇన్–ఎయిడ్ మంజూరు చేయడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో 72 దేశాల నుంచి అథ్లెట్లు, కోచ్‌లు, మీడియా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ క్రీడల నిర్వహణ వల్ల పర్యాటకం అభివృద్ది చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడి, స్థానిక వ్యాపారాలకు లాభాలు వస్తాయి. అలాగే భారత యువతకు కూడా ప్రేరణ కలిగే అవకాశం ఉంది.అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియం లాంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్న క్రికెట్ స్టేడియం ఉంది. ఇందులో 2023 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌ను విజయవంతంగా నిర్వహించారు. బిడ్ మనకు దక్కితే ఈ స్టేడియం కామన్వెల్త్ క్రీడలకు కూడా సిద్ధమవుతుంది. అహ్మదాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎంక్లేవ్ కూడా నిర్మాణంలో ఉంది. ఇందులో అక్వాటిక్స్ సెంటర్, ఫుట్‌బాల్ స్టేడియం, ఇండోర్ ఎరీనాలు ఉండనున్నాయి.2030 కామన్వెల్త్ క్రీడలకు ఆగస్టు 31 లోపు తుది బిడ్ సమర్పించాల్సి ఉంది. నవంబర్ చివరి వారంలో గ్లాస్గోలో జరిగే జనరల్ అసెంబ్లీ ద్వారా ఆతిథ్య దేశం నిర్ణయించబడుతుంది. భారత్‌లో చివరిసారిగా 2010లో న్యూఢిల్లీ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. -
సింధు శుభారంభం
పారిస్: మరో పతకం లక్ష్యంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అడుగు పెట్టిన భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, ప్రణయ్ తొలి రౌండ్ అడ్డంకిని దాటారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాజీ చాంపియన్ సింధు 23–21, 21–6తో ప్రపంచ 69వ ర్యాంకర్ కలోయానా నల్బంతోవా (బల్గేరియా)పై విజయం సాధించింది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్ సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది. సింధు రెండుసార్లు గేమ్ పాయింట్లను కాచుకోవడం గమనార్హం. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సింధు రెండో గేమ్‌లో మాత్రం దూకుడుగా ఆడింది. స్కోరు 6–5 వద్ద సింధు చెలరేగి వరుసగా 14 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. నేడు జరిగే రెండో రౌండ్లో ప్రపంచ 40వ ర్యాంకర్ కరుపథెవన్ లెట్షానా (మలేసియా)తో సింధు ఆడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో 2023 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత ప్రణయ్ 21–18, 21–15తో ప్రపంచ 47వ ర్యాంకర్ జోకిమ్ ఒల్డార్ఫ్ (ఫిన్లాండ్)పై గెలుపొందాడు. 47 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్‌కు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా కీలకదశలో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. నేడు జరిగే రెండో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఇద్దరు 2–2తో సమంగా ఉన్నారు. రుత్విక–రోహన్ జోడీ బోణీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని శుభారంభం చేసింది. తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 18–21, 21–16, 21–18తో లియోంగ్ లోక్ చోంగ్–ఎన్జీ వెంగ్ చి (మకావ్) జంటపై గెలుపొందింది. నేడు జరిగే రెండో రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంక్ జోడీ చెన్ టాంగ్ జి–తో ఈ వె (మలేసియా)తో రుత్విక–రోహన్ ద్వయం పోటీపడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో హరిహరన్–రూబన్ కుమార్ (భారత్) జోడీ 15–21, 5–21తో లియు కువాంగ్ హెంగ్–యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం నేడు జరిగే రెండో రౌండ్లో లియు కువాంగ్ హెంగ్–యాంగ్ పో హాన్లతో ఆడుతుంది. -
అల్కరాజ్ అలవోకగా...
న్యూయార్క్: కెరీర్లో ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ శుభారంభం చేశాడు. అమెరికా ఆజానుబాహుడు, ప్రపంచ 67వ ర్యాంకర్ రీలి ఒపెల్కాతో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అల్కరాజ్ 6–4, 7–5, 6–4తో గెలుపొందాడు. 2 గంటల 5 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ నాలుగు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 13 సార్లు దూసుకొచ్చి పదిసార్లు పాయింట్లు గెలిచాడు. 19వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న అల్కరాజ్ ఏనాడూ తొలి రౌండ్లో ఓడిపోలేదు. మరోవైపు 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 102 కేజీల బరువున్న ఒపెల్కా 14 ఏస్‌లతో విరుచుకుపడ్డా... తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 32 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఐదో సీడ్ డ్రేపర్ (బ్రిటన్), పదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ), 11వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్), 12వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో డ్రేపర్ 6–4, 7–5, 6–7 (7/9), 6–2తో ఫెడెరికో గోమెజ్ (అర్జెంటీనా)పై, ముసెట్టి 6–7 (3/7), 6–3, 6–4, 6–4తో పెరికార్డ్ (ఫ్రాన్స్)పై, రూడ్ 6–1, 6–2, 7–6 (7/5)తో ఆఫ్నెర్ (ఆ్రస్టియా)పై, రూనె 6–3, 7–6 (7/4), 7–6 (7/2)తో జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ నిశేష్ బసవరెడ్డి తొలి రౌండ్లోనే ని్రష్కమించాడు. ‘వైల్డ్ కార్డు’తో పోటీపడ్డ 20 ఏళ్ల నిశేష్ 7–6 (7/5), 3–6, 5–7, 1–6తో తొమ్మిదో సీడ్ ఖచనోవ్ (రష్యా) చేతిలో పోరాడి ఓడాడు. తొలి రౌండ్లో ఓడిన నిశే‹Ùకు 1,10,000 డాలర్లు (రూ. 96 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. వీనస్ తొలి రౌండ్లోనే... మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. 2000, 2001లలో విజేతగా నిలిచిన 45 ఏళ్ల వీనస్‌కు నిర్వాహకులు ఈసారి ‘వైల్డ్ కార్డు’ కేటాయించడంతో 25వ సారి ఆమె యూఎస్ ఓపెన్ టోర్నిలో బరిలోకి దిగింది. ప్రపంచ 13వ ర్యాంకర్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన తొలి రౌండ్లో వీనస్ 3–6, 6–2, 1–6తో ఓటమి పాలైంది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వీనస్ పది డబుల్ ఫాల్ట్‌లు, 24 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు రెండో సీడ్ స్వియాటెక్ (పోలాండ్), ఐదో సీడ్ మీరా ఆండ్రీవా (రష్యా), తొమ్మిదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో స్వియాటెక్ 6–1, 6–2తో ఎమిలియానా అరాంగో (కొలంబియా)పై, ఆండ్రీవా 6–0, 6–1తో అలీసియా పార్క్స్ (అమెరికా)పై, రిబాకినా 6–3, 6–0తో జూలియెటా పరీజా (అమెరికా)పై నెగ్గగా... 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) తొలి రౌండ్లో 2–6, 4–6తో అనా బొండార్ (హంగేరి) చేతిలో ఓడిపోయింది. -
భారత షూటర్ల పసిడి పంట
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇటు సీనియర్లు, అటు జూనియర్లు పసిడి పంట పండిస్తున్నారు. సీనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో ఒలింపియన్ సిఫ్ట్ కౌర్ సమ్రా వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లో బంగారు పతకాలు గెలుచుకుంది. ఫైనల్లో 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్ 459.2 స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టీమ్ విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా (589), ఆషి చౌక్సీ (586), అంజుమ్ మౌద్గిల్ (578)లతో కూడిన భారత బృందం మొత్తం 1753 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. క్వాలిఫయింగ్‌లో భారత్‌కే చెందిన శ్రీయాంక సదండి ‘టాప్’లో నిలిచింది. అయితే శ్రీయాంక ‘ర్యాంకింగ్ పాయింట్స్ ఓన్లీ’ (ఆర్పీఓ)లో పోటీపడటంతో పతకం బరిలో నిలిచే అవకాశం దక్కలేదు. ఆర్పీఓ షూటర్లకు మెడల్ రౌండ్ చాన్స్ ఉండదు. జూనియర్ ఈవెంట్లో షూటర్ అనుష్క ఠాకూర్ పసిడిపై గురిపెట్టి తొలిసారి అంతర్జాతీయ పతకాలతో డబుల్ ధమాకా సాధించింది. జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో 18 ఏళ్ల అనుష్క 460.7 స్కోరుతో ప్రథమ స్థానంలో నిలిచింది. అనుష్క (583), ప్రాచీ గైక్వాడ్ (588), మహిత్ సంధూ (587) బృందం 1758 స్కోరుతో పసిడి పతకాన్ని గెల్చుకుంది. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో సమీర్ కాంస్యం నెగ్గాడు. ఫైనల్లో సమీర్ 21 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. సమీర్, సూరజ్ శర్మ, అభినవ్ కలిసి టీమ్ ఈవెంట్లో పసిడి పతకం నెగ్గారు. జూనియర్ మహిళల ట్రాప్ ఈవెంట్లో హరీస్ సబీరా స్వర్ణం, ఆద్య రజతం నెగ్గారు. టీమ్ ఈవెంట్లో సబీర–ఆద్య–భవ్యలతో కూడిన త్రయం కూడా బంగారు పతకం గెలిచింది. ఆర్యవంశ్–అర్జున్–ఉద్ధవ్‌లతో కూడిన జూనియర్ పురుషుల టీమ్ కూడా పసిడి పతకం నెగ్గింది. ఓవరాల్‌గా భారత్ 31 స్వర్ణాలు, 11 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 56 పతకాలతో ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
దిగ్గజం లేకుండానే.. భారత జట్టు ప్రకటన
బెంగళూరు: సెంట్రల్ ఏషియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (సీఏఎఫ్‌ఏ) నేషన్స్ కప్‌లో పాల్గొనే భారత ఫుట్‌బాల్ జట్టును సోమవారం ఎంపిక చేశారు. 23 మందితో కూడిన ఈ జట్టులో దిగ్గజ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రిని ఎంపిక చేయలేదు. నిజానికి ముందుగా ప్రకటించిన ప్రాబబుల్స్‌లోనూ ఛెత్రి లేడు. ఆగస్టు 1 నుంచి జరిగిన శిక్షణ శిబిరంలో పాల్గొన్న 29 మందిలో 23 మందిని ఎంపిక చేశారు. కోత్త కోచ్ ఖాలిద్ జమీల్ జట్టుతో పాటు తజికిస్తాన్‌కు పయనమవుతారు. ఈ నెల 29 నుంచి జరిగే నేషన్స్ కప్‌లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది.ఇందులో ఆతిథ్య జట్టు తజికిస్తాన్‌తో పాటు ఇరాన్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. ముందుగా 29న తజికిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది. అనంతరం సెపె్టంబర్ 1న ఇరాన్, 4న అఫ్గానిస్తాన్‌లో పోటీపడుతుంది. సన్నాహక టోర్నీగాఏఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు కీలకమైన మ్యాచ్‌లు ముందున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత నేషన్స్ కప్‌ను పూర్తిస్థాయి సన్నాహక టోర్నీగా సద్వినియోగం చేసుకోవాలని భారత్ ఆశిస్తోంది.ఏఎఫ్సీ క్వాలిఫయర్స్‌లో తనకన్నా తక్కువ ర్యాంకు జట్లు బంగ్లాతో డ్రా చేసుకున్న భారత్... 0–1తో హాంకాంగ్ చేతిలో ఓడిపోయింది. థాయ్‌లాండ్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత్ 0–2తో ఓడిపోవడంతో కోచ్ మనొలో మార్కెజ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో చాన్నాళ్ల తర్వాత మళ్లీ జట్టుకు స్వదేశీ కోచ్ జమీల్‌ను ఎంపిక చేశారు. తదుపరి ఏఎఫ్సీ క్వాలిఫయర్స్‌లో భారత్ అక్టోబర్ 9, 14 తేదీల్లో సింగపూర్‌తో ఇంటా బయటా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఛెత్రిలాంటి మేటి ఆటగాళ్లు లేరు నేషన్స్ కప్ జట్టులోకి మాజీ కెపె్టన్ సునీల్ ఛెత్రిని ఎంపిక చేయనప్పటికీ అతనిలాంటి నాణ్యమైన ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో లేరని కోచ్ జమీల్ అంగీకరించారు. నేషన్స్ కప్ అనేది కేవలం సన్నాహక టోర్నీ కావడం వల్లే ఛెత్రిలాంటి దిగ్గజాన్ని ఎంపిక చేయలేదని చెప్పారు. ‘భారత్‌లో సునీల్ ఛెత్రి అంతటి ఆటగాళ్లు లేనపుడు... అతను ఆడతానంటే అభ్యంతరం ఏముంటుంది. అతనొక దిగ్గజం.జట్టు కోసం ఎంతో చేశాడు. అలాంటి ఆటగాడి అనుభవాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటాం’ అని జమీల్ అన్నాడు. ప్రస్తుతం నేషన్స్ కప్‌పై దృష్టి పెట్టినట్లు చెప్పాడు. కీలకమైన ఆసియా క్వాలిఫయర్స్‌కు ముందు జరుగుతున్న ఈ పోటీలను సది్వనియోగం చేసుకుంటామన్నాడు.భారత ఫుట్‌బాల్ జట్టు: గుర్ప్రీత్ సింగ్, అమ్రిందర్, హృతిక్ (గోల్ కీపర్స్); రాహుల్, నోరెమ్ రోషన్, అన్వర్ అలీ, సందేశ్, చింగ్లేశన సింగ్, మింగ్తన్మవియా రాల్తే, మొహమ్మద్ ఉవాయ్ (డిఫెండర్లు); నిఖిల్ ప్రభు, సురేశ్, ఫరూఖ్ భట్, జీక్సన్ సింగ్, బోరిస్ సింగ్, ఆశిక్ కురునియన్, ఉదాంత సింగ్, మహేశ్ సింగ్ (మిడ్ ఫీల్డర్లు); ఇర్ఫాన్, మాన్వీర్, జితిన్, లలియంజులా ఛాంగ్తే, విక్రమ్ ప్రతాప్ (ఫార్వర్డ్). -
నీరూ ‘డబుల్’ ధమాకా
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం సీనియర్ విభాగంలో భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల ట్రాప్ ఈవెంట్లో నీరూ ధండ రెండు బంగారు పతకాలతో అదరగొట్టింది. ఆరుగురు పోటీపడ్డ మహిళల ట్రాప్ ఫైనల్లో భారత షూటర్ నీరూ ధండ 43 పాయింట్లు స్కోరు చేసి చాంపియన్‌గా అవతరించింది. భారత్‌కే చెందిన ఆషిమా అహ్లావత్ 29 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని సంపాదించింది. నీరూ, ఆషిమా, ప్రీతి రజక్‌లతో కూడిన భారత జట్టు 319 పాయింట్లతో టీమ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. పురుషుల ట్రాప్ వ్యక్తిగత ఈవెంట్లో భౌనీశ్ మెండిరట్టా రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో భౌనీశ్ 45 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఇషా బృందానికి కాంస్యం మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ సభ్యురాలిగా ఉన్న భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది. ఇషా సింగ్, మనూ భాకర్, సిమ్రన్ప్రీత్ కౌర్ బృందం 1749 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. 25 మీటర్ల వ్యక్తిగత విభాగం ఫైనల్లో మనూ భాకర్ 25 పాయింట్లతో నాలుగో స్థానంలో, ఇషా సింగ్ 18 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి పతకాలకు దూరమయ్యారు. జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్లు క్లీన్‌స్వీప్ చేశారు. పాయల్ స్వర్ణం, నామ్యా కపూర్ రజతం, తేజస్విని కాంస్యం గెలిచారు. ప్రస్తుతం భారత్ 29 స్వర్ణాలు, 11 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 54 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
‘పసిడి’తో పునరాగమనం
అహ్మదాబాద్: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న తొలి ఈవెంట్లోనే భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మెరిసింది. సోమవారం మొదలైన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 31 ఏళ్ల మీరాబాయి చాను స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మీరాబాయి మొత్తం 193 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. స్నాచ్‌లో 84 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు బరువెత్తిన మీరాబాయి... ఈ క్రమంలో కొత్త కామన్వెల్త్ చాంపియన్‌షిప్ రికార్డులు నెలకొల్పింది. ఏడాది విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన మీరాబాయి ముందుగా స్నాచ్ తొలి ప్రయత్నంలో విఫలమైంది. రెండో ప్రయత్నంలో 84 కేజీలు ఎత్తిన ఈ మణిపూర్ లిఫ్టర్... మూడో ప్రయత్నంలో 89 కేజీలు ఎత్తబోయి విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్ తొలి ప్రయత్నంలో 105 కేజీలు, రెండో ప్రయత్నంలో 109 కేజీలు ఎత్తిన మీరాబాయి... మూడోసారి 113 కేజీలు ప్రయతి్నంచి విఫలమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో 49 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన మీరాబాయి... గత ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అన్ని వెయిట్ కేటగిరీలను సవరించింది. ఇందులో భాగంగా 49 కేజీల విభాగాన్ని తొలగించి 48 కేజీల విభాగాన్ని మళ్లీ తెచ్చారు. గతంలో మీరాబాయి 48 కేజీల విభాగంలో 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో.. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో.. 2013, 2017 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించింది. రిషికాంతకు బంగారు పతకం కామన్వెల్త్ చాంపియన్‌షిప్ తొలి రోజు రిషికాంత సింగ్ ప్రదర్శనతో భారత్‌కు రెండో స్వర్ణం దక్కింది. పురుషుల 60 కేజీల విభాగంలో రిషికాంత మొత్తం 271 కేజీలు (స్నాచ్‌లో 120 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 151 కేజీలు) బరువెత్తి మొదటి స్థానంలో నిలిచాడు. -
మీరాబాయి మెరిసేనా!
అహ్మదాబాద్: ఏడాది విరామం తర్వాత భారత స్టార్ లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను పోటీల బరిలోకి దిగుతోంది. నేటి నుంచి ఇక్కడ జరిగే కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె స్టార్ ఆఫ్ అట్రాక్షన్ కానుంది. పారిస్ ఒలింపిక్స్‌లో కేవలం ఒక కిలోగ్రామ్ తేడాతో పోడియంలో నిలువలేకపోయిన మీరాబాయి తర్వాత గాయాల బారిన పడింది. దీంతో చాలా టోర్నీలకు ఆమె దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా పతకం పట్టుపట్టేందుకు 32 ఏళ్ల మీరా 48 కేజీల కేటగిరీకి మారింది. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్‌లో ఆమె రెగ్యులర్ కేటగిరీ కాకుండా 48 కేజీల కేటగిరీ ఉండటంతో ఇప్పటి నుంచే ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు ఈ తాజా చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ టోర్నీ కావడంతో మీరాబాయి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమెతో పాటు కామన్వెల్త్ క్రీడల రజత విజేత బింద్యారాణి దేవి, కాంస్య విజేతలు హర్జిందర్ కౌర్, లవ్‌ప్రీత్ సింగ్‌లు సహా భారత లిఫ్టర్లే ఈ టోర్నీలో ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. భారత జట్ల వివరాలు: మహిళలు: మీరాబాయి చాను (48 కేజీలు), స్నేహా సోరెన్ (53 కేజీలు), బింద్యారాణి (58 కేజీలు), నిరుపమా (63 కేజీలు), హర్జిందర్ కౌర్ (69 కేజీలు), హర్మన్‌ప్రీత్ కౌర్ (77 కేజీలు), వన్షిత (86 కేజీలు), మెహక్ (+86 కేజీలు). పురుషులు: రిషికాంత సింగ్ (60 కేజీలు), ఎం.రాజా (65 కేజీలు), నారాయణ అజిత్ (71 కేజీలు), వల్లూరి అజయ్ బాబు (79 కేజీలు), అజయ్ సింగ్ (88 కేజీలు), దిల్బాగ్ సింగ్ (94 కేజీలు), హర్చరణ్ సింగ్ (110 కేజీలు), లవ్‌ప్రీత్ సింగ్ (+110 కేజీలు). -
రాడుకాను శుభారంభం
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) శుభారంభం చేసింది. ఆదివారం మొదలైన ఈ మెగా టోర్నీలో తొలి రౌండ్లో రాడుకాను 6–1, 6–2తో ఇనా షిబహారా (జపాన్)పై గెలుపొందింది. 62 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 2021 చాంపియన్ రాడుకాను రెండు ఏస్‌లు సంధించింది. నెట్ వద్దకు ఏడుసార్లు దూసుకొచి్చన ఆమె ఐదుసార్లు పాయింట్లు గెలిచింది. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని రాడుకాను ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు షిబహారా ఐదు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 36 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. షెల్టన్ బోణీ పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) గెలుపు బోణీ కొట్టాడు. ఇగ్నాసియో బుసె (పెరూ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో షెల్టన్ 6–3, 6–2, 6–4తో విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 7 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో షెల్టన్ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. 35 విన్నర్స్ కొట్టిన ఈ అమెరికా స్టార్ 32 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని షెల్టన్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 16వ సీడ్ జాకుబ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) 7–6 (7/5), 6–3, 6–4తో నికోలస్ జారీ (చిలీ)పై, 18వ సీడ్ డేవిడోవిచ్ ఫొకీనా (స్పెయిన్) 6–1, 6–1, 6–2తో అలెగ్జాండర్ షెవ్చెంకో (కజకిస్తాన్)పై నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. -
భారత షూటర్ల జోరు
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆదివారం సీనియర్ పురుషుల విభాగంలో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణ పతకం నెగ్గగా... టీమ్ విభాగంలో ఐశ్వర్య ప్రతాప్, చెయిన్ సింగ్, అఖిల్ షెరాన్‌లతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ 462.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెన్యు జావో (చైనా; 462) రజతం, నయోవా ఒకాడా (జపాన్; 448.8) కాంస్యం గెలిచారు. చెయిన్ సింగ్ (435.7) నాలుగో స్థానంలో, అఖిల్ (424.9 పాయింట్లు) ఐదో స్థానంలో నిలిచారు. టీమ్ విభాగంలో ఐశ్వర్య ప్రతాప్ (584 పాయింట్లు), చెయిన్ సింగ్ (582 పాయింట్లు), అఖిల్ (581 పాయింట్లు) బృందం మొత్తం 1747 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత భారత్‌కు చెందిన అడ్రియన్ కర్మాకర్ (463.8 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. టీమ్ విభాగంలో అడ్రియన్, నితిన్, రోహిత్‌లతో కూడిన భారత బృందం 1733 పాయింట్లతో పసిడి పతకాన్ని నెగ్గింది. ఓవరాల్‌గా భారత్ 26 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 46 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
చికిత ‘పసిడి’ గురి
ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత స్వర్ణ పతకంతో మెరిసింది. కెనడాలోని విన్నీపెగ్లో ఆదివారం ఈ మెగా ఈవెంట్ ముగిసింది. అండర్–21 మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో చికిత విశ్వవిజేతగా అవతరించింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన చికిత ఫైనల్లో 142–136 పాయింట్ల తేడాతో దక్షిణ కొరియాకు చెందిన యెరిన్ పార్క్‌పై విజయం సాధించింది. అంతకుముందు సెమీఫైనల్లో చికిత 142–133తో మొరిలాస్ డియాజ్ (స్పెయిన్)పై, క్వార్టర్ ఫైనల్లో 146–143తో పర్ణీత్ కౌర్ (భారత్)పై గెలుపొందింది. క్వాలిఫయింగ్ రౌండ్లో చికిత 687 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి మెయిన్ ‘డ్రా’లో నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ పొందింది. రెండో రౌండ్లో చికిత 143–140తో మా యువెన్ (చైనీస్ తైపీ)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 142–138తో జిమెనా ఎ్రస్టాడా (మెక్సికో)పై గెలిచింది. అండర్–21 మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో చికిత, పర్ణీత్ కౌర్, తేజల్లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 229–232తో టర్కీ చేతిలో ఓడిపోయింది. -
చాంపియన్ హరియాణా
జలంధర్: జాతీయ జూనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో హరియాణా జట్టు విజేతగా నిలిచింది. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో హరియాణా 3–2తో ఒడిశా జట్టుపై గెలుపొందింది. తొలి క్వార్టర్లో ఇరు జట్ల ఆటగాళ్లు అదేపనిగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేసినప్పటికీ ఏ జట్టుకు ఫలితం దక్కలేదు. కానీ రెండో క్వార్టర్ మొదలవగానే ఒడిశా అందివచ్చిన అవకాశాల్ని ఒడిసిపట్టుకొని 2 నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసింది. దీపక్ ప్రధాన్ (17వ ని.), ప్రతాప్ టొప్పొ (19వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచారు. దీంతో ఒడిశా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్లోనూ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. కానీ ఆఖరి క్వార్టర్ మ్యాచ్ ఫలితాన్నే తారుమారు చేసింది. హరియాణా ఆటగాళ్లు చిరాగ్ (50వ ని.), మరుసటి నిమిషంలోనే నితిన్ (51వ, 60వ ని.) స్కోరును 2–2తో సమం చేశారు. ఈ దశలో మ్యాచ్ ఉత్కంఠరేకిత్తించగా ఆఖరి నిమిషంలో నితిన్ గోల్ చేసి హరియాణాను విజేతగా నిలిపాడు. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పంజాబ్ 4–3తో షూటౌట్లో ఉత్తర ప్రదేశ్‌పై విజయం సాధించింది. -
ప్రజ్ఞానందకు మరో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. శనివారం మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను ప్రజ్ఞానంద 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఈ టోర్నీలో ప్రజ్ఞానందకు ఇది వరుసగా నాలుగో ‘డ్రా’. ఇక ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్... జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్)తో గేమ్‌ను 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. సామ్ సెవియాన్ (అమెరికా), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)... అరోనియన్ (అమెరికా), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) మధ్య మ్యాచ్‌లు కూడా ‘డ్రా’గా ముగిశాయి. మొత్తంగా శనివారం జరిగిన అన్నీ మ్యాచ్‌లు ‘డ్రా’గానే ముగిశాయి. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఫాబియానో కరువానా (అమెరికా) 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రజ్ఞానంద, అరోనియన్ చెరో 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. గుకేశ్, మాక్సిమి లాగ్రెవ్, వెస్లీ సో, అలిరెజా 2.5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. గ్రాండ్ చెస్ టూర్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ప్లేయర్లు ఫైనల్లో తలపడతారు. -
ఇలవేనిల్–అర్జున్ పసిడి ధమాకా
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా షూటర్ ఇలవేనిల్ వలారివన్ డబుల్ ధమాకా సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో శుక్రవారం బంగారు పతకం చేజిక్కించుకున్న ఆమె మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ మరో పసిడి నెగ్గింది. తమిళనాడుకు చెందిన ఈ యువ షూటర్... శనివారం జరిగిన పోటీల్లో అర్జున్ బబుతాతో కలిసి స్వర్ణంపై గురిపెట్టింది. చైనీస్ జంట డింగ్కె లూ–జిన్ లూ పెంగ్‌తో పోటీ ఎదురైనప్పటికీ చివరకు భారత జోడీ 17–11తో విజేతగా నిలిచింది. మొదట్లో చైనా జోడీ ఆధిక్యంలో నిలిచినప్పటికీ ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా ఇలవేనిల్–అర్జున్ ద్వయం లక్ష్యంపై గురి పెట్టడంలో సఫలమైంది. ఇటు తమిళ షూటర్ ఇలవేనిల్‌కు, అటు పంజాబ్ షూటర్ బబుతాకు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో అర్జున్ బబుతా తొలి పసిడి పతకం నెగ్గాడు. రుద్రాం„Š పాటిల్, కిరణ్ జాదవ్, అర్జున్‌లతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది.జూనియర్ ఈవెంట్లోనూ శాంభవి శ్రవణ్–నరేన్ ప్రణవ్ జంట బంగారం గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత జంట 16–12తో చైనా జోడీపై విజయం సాధించింది. క్వాలిఫికేషన్లో చైనాకే చెందిన రెండు జట్లు 632.3 స్కోరు, 630 స్కోర్లతో శాంభవి– నరేన్ ప్రణవ్ (629.5) జోడీ కంటే ముందు వరుసలో నిలిచాయి. కానీ అసలైన పతకం రేసులో భారత ద్వయం పుంజుకుంది. గురి తప్పని షాట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. భారత్‌కే చెందిన ఇషా తక్షలే–హిమాన్షు జోడీ (628.6 స్కోరు) క్వాలిఫికేషన్లో నాలుగో స్థానంలో నిలిచింది. జూనియర్ పోటీల్లో శాంభవికిది రెండో స్వర్ణం. మహిళల టీమ్ ఈవెంట్లో ఆమె హృదయశ్రీ, ఇషా అనిల్‌లతో కలిసి తొలిరోజే బంగారు పతకం గెలిచింది. -
కేరళకు మెస్సీ సేన
కొచ్చి: ప్రపంచ ఫుట్‌బాల్ చాంపియన్ అర్జెంటీనా జట్టు భారత్‌లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో భాగంగా లయోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఈ ఏడాది మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ప్రత్యర్థి జట్లు, నగరాలు ఖరారు కానప్పటికీ ఏ ఏ దేశాల్లో జరిగేవి వెల్లడించారు. ముందుగా మెస్సీ సేన అమెరికాలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6 నుంచి 14వ తేదీల మధ్యలో అర్జెంటీనా... అమెరికాలో ఈ మ్యాచ్ ఆడుతుంది. తర్వాత నవంబర్ 10 నుంచి 18వ తేదీల మధ్యలో లువాండా (అంగోలా), కేరళ (భారత్) రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో మెస్సీ జట్టు తలపడుతుంది. ఈ మేరకు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అర్జెంటీనా ఎదుర్కోబోయే జట్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అందులో పేర్కొంది. అయితే మొరాకో, కోస్టా రికో, ఆస్ట్రేలియాలతో పాటు ఆసియా మేటి జట్టు జపాన్‌లతో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఘనమైన ఆతిథ్యానికి ఏర్పాట్లు చేస్తోంది. కొన్నాళ్లుగా సాకర్ స్టార్ మెస్సీని కేరళకు తీసుకొచ్చేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమైంది. మొత్తానికి అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) షెడ్యూల్లో కేరళను చేర్చడంలో సఫలమైంది. మెస్సీ నవంబర్‌లో గనక జట్టుతో పాటు వస్తే నెల వ్యవధిలో ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మళ్లీ డిసెంబర్లో భారత్‌కు రానున్నాడు. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను ఆర్గనైజర్లు ఇటీవలే ప్రకటించారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్‌లోని సాకర్ ప్రియులకు, మెస్సీని ఆరాధించే అభిమానులకు ఇది పెద్ద పండగే. -
నువ్వా... నేనా?
న్యూయార్క్: పురుషుల టెన్నిస్‌లో 2023నుంచి జరిగిన గత 11 గ్రాండ్‌స్లామ్‌లలో 8 టైటిల్స్‌ను యానిక్ సినెర్, కార్లోస్ అల్కరాజ్ పంచుకోగా...మరో మూడు ట్రోఫీలు జొకోవిచ్ ఖాతాలో చేరాయి. అయితే ఈ ఏడాది తాజా ఫామ్‌ను, గత రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ప్రదర్శనను బట్టి చూస్తే సినెర్, అల్కరాజ్ మరో టైటిల్ వేటలో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు తన 25వ గ్రాండ్‌స్లామ్ కోసం తీవ్రంగా పోరాడుతున్న జొకోవిచ్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో సింగిల్స్ పోటీలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే 2025 చివరి గ్రాండ్‌స్లామ్‌ను ఎవరు సొంత చేసుకుంటారనేది ఆసక్తిరం. అల్కరాజ్ (స్పెయిన్) తొలి రౌండ్లో భారీ సర్వీస్‌లకు పెట్టింది పేరయిన 7 అడుగుల రీలీ ఒపెల్కా (యూఎస్)ను ఎదుర్కోనున్నాడు. ఇటీవలే జొకోవిచ్, డి మినార్, రూన్లను ఓడించిన రికార్డు ఒపెల్కాకు ఉంది. ఆ తర్వాత ముందంజ వేస్తే అల్కరాజ్కు ప్రిక్వార్టర్స్‌లో 2021 చాంప్ మెద్వెదెవ్ ఎదురయ్యే అవకాశం ఉంది. తొలి రౌండ్లో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)తో సినెర్ (ఇటలీ) తలపడతాడు. క్వార్టర్స్ వరకు వెళితే జేక్ డ్రేపర్ (యూకే) అతనికి ఎదురు పడతాడు. ఈ టాప్ ప్లేయర్లతో పాటు తాజా సీజన్లో అద్భుతంగా ఆడుతున్న ఇతర ఆటగాళ్లు జాకబ్ మెన్సిక్, హోల్గర్ రూన్, కాస్పర్ రూడ్, టియాఫో, ఫ్రిట్జ్, బబ్లిక్ తదితరులు కూడా తమ తొలి గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సబలెంకా జోరు సాగేనా...మహిళల విభాగంలో టైటిల్ వేటలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్) మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమైంది. రెబెకా మసరోవా (స్విట్జర్లాండ్)తో జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌తో ఆమె తన పోరును మొదలు పెడుతుంది. అయితే ఈ సారి సొంతగడ్డపై ట్రోఫీని గెలిచేందుకు అమెరికా అమ్మాయిల మధ్యే గట్టి పోటీ ఉంది. కోకో గాఫ్, మాడిసన్ కీస్, జెస్సికా పెగులా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 2023లో గాఫ్ ఇక్కడ విజేతగా నిలిచింది. వరల్డ్ నంబర్ 2 స్వియాటెక్ (పోలండ్) తొలి రౌండ్లో ఎమీలియానా అరాంగో (కొలంబో)ను ఎదుర్కొంటుంది. ఇదే క్రమంలో ముందంజ వేస్తే ఆమెకు తాను వింబుల్డన్ ఫైనల్లో చిత్తు చేసిన అనిసిమోవా (అమెరికా) ఎదురవుతుంది. జాస్మిన్ పొవొలిని, మిరా ఆండ్రీవా, ఎమా నవరో కూడా సంచలనాన్ని ఆశిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్న సీనియర్ ప్లేయర్, మాజీ చాంపియన్ వీనస్ విలియమ్స్ తొలి రౌండ్లో కరోలినా ముకోవాను ఎదుర్కొంటుంది.‘హాల్ ఆఫ్ ఫేమ్’లో షరపోవాప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మాజీ స్టార్ మారియా షరపోవాకు చోటు దక్కింది. ఆమెతో పాటు పురుషుల డబుల్స్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన ‘బ్రైన్ బ్రదర్స్’ను ఇందులో చేరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటించింది. రష్యాకు చెందిన 38 ఏళ్ల షరపోవా కెరీర్లో ఐదు సింగిల్స్ గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకుంది. నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను కూడా సాధించిన 10 మంది మహిళా ప్లేయర్లలో షరపోవా కూడా ఉంది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ కు చేరిన తొలి రష్యా మహిళగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తన ఆటతో పాటు అందంతో ప్రపంచ టెన్నిస్‌లో స్టార్‌గా వెలిగింది. 2020లో ఆమె ఆటనుంచి రిటైరైంది. అమెరికాకు చెందిన కవల సోదరులు బాబ్ బ్రైన్, మైక్ బ్రైన్ టెన్నిస్ ప్రపంచంలో ‘బ్రైన్ బ్రదర్స్’గా ఆడిన సంచలన రికార్డులను నెలకొల్పారు. వీరిద్దరు జోడీగా 119 డబుల్స్ టైటిల్స్ గెలవగా...ఇందులో 16 గ్రాండ్‌స్లామ్‌లు ఉన్నాయి. ప్రతీ గ్రాండ్‌స్లామ్‌ను కనీసం రెండు సార్లు నెగ్గి వీరు డబుల్ కెరీర్ గ్రాండ్‌స్లామ్‌ను సాధించారు. ఈ జంట ఏకంగా 438 వారాలు వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగడం విశేషం. -
Durand Cup 2025: సరికొత్త చరిత్ర.. విజేత ఎవరంటే..
నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశవాళీ వార్షిక పుట్‌బాల్ టోర్నమెంట్ డ్యురాండ్ కప్ టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. తద్వారా ఈస్ట్ బెంగాల్ జట్టు (మూడుసార్లు) తర్వాత అత్యధికసార్లు ఈ ట్రోఫీ గెలిచిన రెండో జట్టుగా నిలిచింది.డ్యూరాండ్ కప్-2025 (Durand Cup) ఎడిషన్‌లో అరంగేట్ర జట్టు డైమండ్ హార్బర్ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఓడించి నార్త్ ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్ ఈ ఘనత సాధించింది. కాగా ఆసియా ఖండంలో అత్యంత పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌గా డ్యూరాండ్ కప్ టోర్నీకి పేరుంది.డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి..ఈ మెగా ఈవెంట్లో ఈ ఏడాది అడుగుపెట్టిన డైమండ్ హార్బర్ జట్టు తొలి ప్రయత్నంలోనే.. సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ నార్త్ ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్‌తో శనివారం నాటి టైటిల్ పోరులో తలపడింది.ఆరు గోల్స్.. వేర్వేరు ఆటగాళ్లుఈ క్రమంలో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నార్త్ ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్ ఆది నుంచే అదరగొట్టింది. అషీర్ అక్తర్ మ్యాచ్ ముప్పైవ నిమిషంలో గోల్ కొట్టి జట్టుకు శుభారంభం అందించగా.. పార్థిబ్ గొగొయ్ రెండో గోల్ కొట్టాడు.సెకండాఫ్ యాభైవ నిమిషంలో థోయీ సింగ్ మూడో గోల్ కొట్టగా.. 81వ నిమిషంలో జైరో సంపేరియో, 86వ నిమిషంలో ఆండీ రోడ్రిగెజ్ గోల్స్ కొట్టారు. ఇక అలాడిన్ అజారీ ఆరో గోల్ కొట్టగా.. నార్త్ ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్ విజయం ఖరారైంది. 6-1 తేడాతో డైమండ్ హార్బర్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి డ్యూరాండ్ కప్‌ను కైవసం చేసుకుంది. కాగా డైమండ్ హార్బర్ జట్టు తరఫున జాబీ జస్టిన్ సాయంతో మైకేల్ కొర్టాజర్ ఓ గోల్ కొట్టాడు.విజేతకు రూ. 1.21 కోట్లుఇక డ్యూరాండ్ కప్-2025 విజేత నార్త్ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్‌కు రూ. 1.21 కోట్ల భారీ ప్రైజ్‌మనీ దక్కింది. గతేడాది ప్రైజ్‌మనీ కంటే ఇది 250 శాతం ఎక్కువ. ఇక రన్నరప్ డైమండ్ హార్బర్ క్లబ్‌కు రూ. 60 లక్షలు దక్కుతాయి. ఇదిలా ఉంటే.. డ్యూరాండ్ కప్- 1989, 90, 91లో ఈస్ట్ బెంగాల్ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆ తర్వాత 34 ఏళ్లకు అంటే మళ్లీ ఇప్పుడే నార్త్ ఈస్ట్ ఇలా వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది. -
ఆసియా కప్ కోసం భారత్‌కు రావడం లేదు: పాక్ హాకీ దిగ్గజం
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌కు ఇదివరకే పాకిస్తాన్ జట్టు దూరంగా ఉంది. ఇప్పుడు ఆ దేశ దిగ్గజం సొహైల్ అబ్బాస్ కూడా మలేసియా జట్టు అసిస్టెంట్ కోచ్ హోదాలో భారత్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.ఈ మేరకు ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగే టోరీ్నకి అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. పాక్ దిగ్గజ డ్రాగ్ఫ్లికర్గా ఖ్యాతి గడించిన అతను ప్రస్తుతం మలేసియా హాకీ జట్టుకు సేవలందిస్తున్నారు. ఈ జట్టు ఆసియా కప్ కోసం భారత్‌కు రానుంది. ఈ టోర్నీ విజేత నేరుగా ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆసియా ఈవెంట్‌కు మలేసియా జట్టు తరఫున వచ్చేందుకు అనాసక్తి చూపడం విడ్డూరంగా ఉంది. అయితే తన నిర్ణయానికి స్వదేశం (పాక్) తీసుకున్న గైర్హాజరుకు సంబంధం లేదని అబ్బాస్ చెప్పుకొచ్చాడు.‘నేను ఆసియా కప్ కోసం భారత్‌కు వెళ్లడం లేదు. వ్యక్తిగత కారణాల వల్లే ఆ ఈవెంట్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఇది నా సొంత నిర్ణయం. దీనిపై ఎవరి ప్రభావం లేదు’ అని అన్నాడు. అబ్బాస్ 2012లో అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత 2024 వరకు లోప్రొఫైల్ జీవితాన్నే గడిపారు. గతేడాది మలేసియా కోచింగ్ బృందంలో చేరారు. 48 ఏళ్ల సొహైల్ అబ్బాస్ ఏకంగా నాలుగు ప్రపంచకప్‌లు (1998, 2002, 2006, 2010), మూడు ఒలింపిక్స్ (2000, 2004, 2012)లలో పాల్గొన్నారు. 1998, ఫిబ్రవరిలో భారత్‌తో పెషావర్‌లో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన అబ్బాస్ 311 మ్యాచ్‌లు ఆడి 21 సార్లు హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. భారత్‌లో 20 ఏళ్ల క్రితం జరిగిన ఇండియన్ ప్రీమియర్ హాకీ లీగ్‌లో విజేత హైదరాబాద్ సుల్తాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
‘కూత’ మారుతోంది
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఫార్మాట్ మారినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 29 నుంచి జరిగే 12వ సీజన్ పీకేఎల్‌ను మారిన ఫార్మాట్ ప్రకారం నిర్వహిస్తారు. మ్యాచ్‌ల్లో రసవత్తర పోటీ పెరిగేందుకు అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని పంచేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. కొత్తగా టైబ్రేకర్, గోల్డెన్ రెయిడ్ నిబంధనలను తీసుకొచ్చారు. గతంలో గోల్డెన్ రెయిడ్ కేవలం ప్లేఆఫ్స్‌లోనే ఉండేది. ఇప్పుడు లీగ్ ఆసాంతం కొనసాగిస్తారు. మ్యాచ్ ‘టై’ అయితే కొత్త టైబ్రేకర్‌తో ఫలితం కచ్చితంగా ఫలితం రానుంది.స్కోరు సమమైన పక్షంలో ఒక్కో జట్టుకు ఫుట్‌బాల్ తరహాలో 5 రెయిడ్ షూటౌట్ అవకాశాలిస్తారు. ఇరు జట్లు ఏడుగురు చొప్పున ఆటగాళ్లను నామినేట్ చేస్తాయి. ఇందులో ఐదుగురు రెయిడ్ చేస్తారు. ‘షూటౌట్’ స్కోరు సమమైతే అప్పుడు గోలెడ్న్ రెయిడ్ తెరపైకి వస్తుంది. ఇలాంటి మార్పులతో మ్యాచ్‌లో మరింత నాటకీయత పెరుగుతుందని, ఆటలోనూ పోటీ కూడా అభిమానుల్ని ఆకర్శిస్తుందని పీకేఎల్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సీజన్లో లీగ్ దశలో 108 మ్యాచ్‌లుంటాయి. ఒక్కో ఫ్రాంచైజీ జట్టు 18 మ్యాచ్‌లు ఆడుతుంది. పాత పద్ధతిలో ప్లే ఆఫ్స్ ఉంటాయి... కానీ ఇకపై పాయింట్ల పట్టికలో మొదటి 8 స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్ చేరతాయి. తద్వారా టైటిల్ రేసులో 8 జట్లు పోటీలోనే ఉంటాయి. 5 నుంచి 8వ స్థానంలో నిలిచిన ఫ్రాంచైజీలు ‘ప్లే–ఇన్’ మ్యాచ్‌లు ఆడతాయి. గెలిచిన జట్లు ముందంజ వేస్తాయి. అలాగే 3, 4 స్థానాల జట్లు ‘మినీ క్వాలిఫయర్’ ఆడతాయి. ఇక్కడ గెలిచిన జట్టు ముందుకెళుతుంది. కానీ ఓడిన జట్టు నిష్క్రమించదు. ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ చేరేందుకు మరో అవకాశముంటుంది. ఈ ప్రక్రియలో మొత్తం మూడు ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు క్వాలిఫయర్–1 ఆడతాయి. విజేత జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్–2 ఆడుతుంది. ఎలిమినేటర్ ఫలితాల విజేత క్వాలిఫయర్–2కు అర్హత సాధిస్తుంది. అంటే 3 నుంచి 8వ స్థానం వరకు నిలిచే ఏ జట్టయిన ఇకపై ఫైనల్‌కు చేరే అవకాశంఉందన్న మాట! -
విజేత ఎవరో?
కోల్‌కతా: ఆసియా ఖండంలో అత్యంత పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌గా గుర్తింపు సాధించిన... దేశవాళీ వార్షిక పుట్‌బాల్ టోర్నీ డ్యురాండ్ కప్ ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ టోర్నీ 134వ ఎడిషన్ ఫైనల్లో శనివారం డైమండ్ హార్బర్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)తో నార్త్ ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్‌తోనే అరంగేట్రం చేసిన డైమండ్ హార్బర్ జట్టు... తొలిసారే టైటిల్ హస్తగతం చేసుకోవాలని తహలాడుతుండగా... డిఫెండింగ్ చాంపియన్ నార్త్ఈస్ట్ ఫుట్‌బాల్ క్లబ్ టైటిల్ నిలబెట్టుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. తద్వారా 34 ఏళ్లలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలవాలని చూస్తోంది. ఈ టోర్నీలో చివరగా 1989, 90, 91లో ఈస్ట్ బెంగాల్ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆ తర్వాత మరే జట్టు వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలవలేకపోయింది. నార్త్ ఈస్ట్ హెడ్ కోచ్ జాన్ పెడ్రో బెనాలీ మాట్లాడుతూ... ‘తుదిపోరులో ఫేవరెట్స్ ఉండరు. మెరుగైన ప్రదర్శన చేసిన జట్లే ఫైనల్‌కు చేరుతాయి. మానసికంగా పైచేయి సాధించగల జట్టే ట్రోఫీ చేజిక్కించుకుంటుంది’ అని అన్నాడు. మరోవైపు కిబు వికునా శిక్షణలో రాటుదేలిన డైమండ్ హార్బర్ జట్టు... ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం పోరులో డైమండ్ హార్బర్ జట్టు విజయం సాధిస్తే... ఓపెన్ ఎరాలో అరంగేట్రంలోనే టైటిల్ గెలిచిన తొలి జట్టుగా నిలవనుంది. తొలి సెమీఫైనల్లో నార్త్ ఈస్ట్ 1–0 గోల్స్ తేడాతో షిల్లాంగ్ లాజాంగ్ జట్టుపై విజయం సాధించగా... రెండో సెమీస్‌లో డైమండ్ హార్బర్ 2–1తో ఈస్ట్ బెంగాల్‌పై గెలిచి ఫైనల్లో అడుగు పెట్టింది. విజేతకు రూ. 1.21 కోట్లు డ్యురాండ్ కప్ 134వ ఎడిషన్ విజేతకు భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ప్రైజ్‌మనీని 250 శాతం పెంచినట్లు డ్యురాండ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ (డీసీఓసీ) వెల్లడించింది. ఫైనల్లో నెగ్గిన జట్టుకు రూ. 1.21 కోట్లు లభిస్తుందని డీసీఓసీ శుక్రవారం పేర్కొంది. రన్నరప్ జట్టుకు రూ. 60 లక్షలు దక్కనున్నాయి. సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లకు రూ. 25 లక్షల చొప్పున... క్వార్టర్ ఫైనల్లో ఓడిన జట్లకు రూ. 15 లక్షల చొప్పున ఇస్తారు. ‘గోల్డెన్ బాల్’, ‘గోల్డెన్ బూట్’, ‘గోల్డెన్ గ్లవ్’ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లకు రూ. 3 లక్షల నగదు బహుమతితో పాటు ఒక మహింద్ర ఎక్స్‌యూవీ కారు లభించనుంది. -
ఇలవేనిల్‌కు స్వర్ణ పతకం
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ సీనియర్ విభాగంలో శుక్రవారం భారత్‌కు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో తమిళనాడుకు చెందిన ఇలవేనిల్ వలారివన్ భారత్‌కు పసిడి పతకాన్ని... ఇలవేనిల్, మెహులీ ఘోష్, అనన్య నాయుడులతో కూడిన బృందం కాంస్య పతకాన్ని అందించింది. స్కీట్ మిక్స్డ్ విభాగంలో గనీమత్ సెఖోన్–అభయ్ సింగ్ సెఖోన్ జోడీ భారత్ ఖాతాలో కాంస్య పతకాన్ని జమ చేసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్లో 26 ఏళ్ల ఇలవేనిల్ 253.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఇలవేనిల్ కొత్త ఆసియా రికార్డును నెలకొల్పింది. 2019 నుంచి అపూర్వీ చండేలా (భారత్; 252.9 పాయింట్లు) పేరిట ఉన్న ఆసియా రికార్డును ఇలవేనిల్ సవరించింది. భారత్‌కే చెందిన మెహులీ ఘోష్ 208.9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. టీమ్ విభాగంలో ఇలవేనిల్ (630.7 పాయింట్లు), మెహులీ (630.3 పాయింట్లు), అనన్య (630 పాయింట్లు) మొత్తం 1891 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. స్కీట్ మిక్స్డ్ కాంస్య పతక మ్యాచ్‌లో గనీమత్–అభయ్ ద్వయం 39–37తో అబ్దుల్లా అల్రషీది–అఫ్రా (కువైట్) జంటపై నెగ్గింది. మరోవైపు మహిళల జూనియర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో శాంభవి, హృదయశ్రీ, ఇషాలతో కూడిన భారత జట్టు 1896.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. జూనియర్ స్కీట్ మిక్స్డ్ టీమ్ విభాగంలో హర్మెహర్ సింగ్–యశస్వి రాథోడ్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. -
ఎంపికైంది 35 ... హాజరైంది 25!.. కోచ్ ఏమన్నాడంటే..
బెంగళూరు: నేషన్స్ కప్ సన్నాహాల్లో భాగంగా భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు కొత్త హెడ్ కోచ్ ఖాలిద్ జమీల్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. ఈ శిబిరానికి మొత్తం 35 మంది ప్లేయర్లు ఎంపిక కాగా... 16 నుంచి బెంగళూరులో శిక్షణ ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం 25 మంది ప్లేయర్లు మాత్రమే శిక్షణలో పాల్గొంటున్నారు. మరో 11 మంది ఆటగాళ్లు ఇంకా శిబిరంలో చేరాల్సి ఉంది. జాతీయ శిబిరానికి ఎంపికైన ప్లేయర్లలో ఏడుగురు ఆటగాళ్లు... డ్యురాండ్ కప్‌లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఆ ఏడుగురు ఎవరంటే?ఈ ఏడుగురిని ఆ క్లబ్ ఇంకా విడుదల చేయకపోవడంతో... అనిరుధ్ థాపా, దీపక్, రాల్టె, లిస్టన్ కొలాకో, మాన్వీర్ సింగ్, సహల్ అబ్దుల్ సమద్, విశాల్ జాతీయ శిబిరంలో పాల్గొనలేకపోతున్నారు. నేషన్స్ కప్‌లో భాగంగా ఈ నెల 29న భారత జట్టు తజకిస్తాన్‌తో పోటీపడాల్సి ఉంది. అయితే నేషన్స్ కప్ ఫిఫా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భాగం కాకపోవడంతో... నిబంధనల ప్రకారం ప్లేయర్లను విడుదల చేయాల్సిన అవసరం లేదు.డ్యురాండ్ కప్‌లో భాగంగా ఈ నెల 17న జరిగిన క్వార్టర్ ఫైనల్లోనే మోహన్ బగాన్ పరాజయం పాలై... టోర్నీ నుంచి వైదొలిగినా ఇప్పటి వరకు ఆటగాళ్లను మాత్రం జాతీయ శిబిరానికి పంపలేదు. ఈ టోర్నీ సెమీస్‌లో ఓడిన ఈస్ట్ బెంగాల్ జట్టులోనూ శిబిరానికి ఎంపికైన ముగ్గురు ఆటగాళ్లు అన్వర్ అలీ, జాక్సన్ సింగ్, మహేశ్ సింగ్ ఉండగా... వాళ్లు కూడా ఇప్పటి వరకు క్యాంప్‌లో అడుగు పెట్టలేదు.కోచ్ ఏమన్నాడంటే..ఈ నేపథ్యంలో కొత్త కోచ్ జమీల్ మాట్లాడుతూ... ‘ఆటగాళ్ల కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో శిబిరం కొనసాగుతోంది. మరింత మంది ప్లేయర్లను పరీక్షిస్తాం. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో అత్యుత్తమ ప్లేయర్లతోనే బరిలోకి దిగుతాం’ అని అన్నాడు.నమ్మకాన్ని నిలబెట్టుకుంటాశిబిరంలో పాల్గొంటున్న మాన్వీర్ మాట్లాడుతూ... ‘గత ఆరేళ్లుగా జాతీయ జట్టు జెర్సీ వేసుకోవాలని ఎదురుచూస్తున్నా. ఎట్టకేలకు ఇప్పు డు అవకాశం వచి్చంది. అండర్–19 స్థాయిలో 2019లో ఏఎఫ్సీ అండర్–19 ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా. భారత జట్టుకు స్ట్రయికర్ స్థానంలో ఆడటం చాలా కష్టం. కోచ్ జమీల్ ఆధ్వర్యంలో గతంలో మ్యాచ్‌లు ఆడా. నా శక్తి సామర్థ్యాలు కోచ్‌కు తెలుసు. నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తా’ అని అన్నాడు. -
Asia Cup: భారత జట్టు ఇదే
న్యూఢిల్లీ: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును గురువారం ప్రకటించారు. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు జార్ఖండ్‌కు చెందిన 23 ఏళ్ల సలీమా టెటె సారథ్యం వహిస్తుంది. సెప్టెంబరు 5 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమిస్తుంది. గ్రూప్ ‘బి’లో జపాన్, థాయ్‌లాండ్, సింగపూర్ జట్లతో కలిసి భారత్‌కు చోటు లభించింది.సెప్టెంబరు 5న థాయ్‌లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్... 6న జపాన్‌తో, 8న సింగపూర్‌తో పోటీపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో చైనా, చైనీస్ తైపీ, దక్షిణ కొరియా, మలేసియా జట్లున్నాయి. ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆసియా కప్‌లో భారత జట్టు రెండుసార్లు (2004, 2017) చాంపియన్‌గా, రెండుసార్లు రన్నరప్‌గా (1999, 2009) నిలిచింది. భారత మహిళల హాకీ జట్టు: బన్సరీ సోలంకి, బిచ్చూ దేవి ఖరీబమ్ (గోల్ కీపర్లు), మనీషా చౌహాన్, ఉదిత, జ్యోతి, సుమన్ దేవి థౌడమ్, నిక్కీ ప్రధాన్, ఇషిక చౌధరీ (డిఫెండర్లు), నేహా, వైష్ణవి విఠల్ ఫాల్కే, సలీమా టెటె, షర్మిలా దేవి, లాల్రెమ్సియామి, సునీలితా టొప్పో (మిడ్ ఫీల్డర్లు), నవ్‌నీత్ కౌర్, రుతుజా పిసాల్, బ్యూటీ డుంగ్‌డుంగ్, ముంతాజ్ ఖాన్, దీపిక, సంగీత కుమారి (ఫార్వర్డ్స్).ఇదీ చదవండి: రజత పతకాలు నెగ్గిన రీనా, ప్రియ సమోకోవ్ (బల్గేరియా): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో గురువారం భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రీనా (55 కేజీలు), ప్రియ (76 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలను గెల్చుకున్నారు. ప్రియ 0–4తో నదియా సొకోలవ్స్కా (ఉక్రెయిన్) చేతిలో, రీనా 2–10తో ఎవరెస్ట్ లెడెకర్ (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యారు.మరోవైపు 72 కేజీల విభాగంలో కాజల్ ఫైనల్లోకి దూసుకెళ్లి స్వర్ణ పతకం కోసం పోరాడనుంది. సెమీఫైనల్లో కాజల్ 13–6తో జాస్మిన్ (అమెరికా)పై విజయం సాధించింది. 50 కేజీల విభాగంలో శ్రుతి... 53 కేజీల విభాగంలో సారిక కాంస్య పతకాల కోసం పోటీపడనున్నారు. సెమీఫైనల్స్‌లో సారిక 0–10తో అనస్తాసియా పొలాస్కా (ఉక్రెయిన్) చేతిలో... శ్రుతి 0–11తో రింకా ఒగావా (జపాన్) చేతిలో ఓడిపోయారు. -
సారా ఎరాని–వవసోరి జోడీదే ‘మిక్స్డ్’ టైటిల్
సింగిల్స్‌లో ఎంతటి మేటి క్రీడాకారులైనా... డబుల్స్ విభాగంలో రాణించాలంటే మాత్రం విశేష ప్రతిభ, చక్కటి సమన్వయం ఉండాలని సారా ఎరాని–ఆండ్రియా వవసోరి (ఇటలీ) నిరూపించారు. మ్యాచ్‌లను, టోర్నీని కొత్త ఫార్మాట్లో నిర్వహించినా... సింగిల్స్ స్టార్స్‌ను బరిలోకి దించినా... డిఫెండింగ్ చాంపియన్స్ సారా ఎరాని–వవసోరి తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడారు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ ‘మిక్స్డ్ డబుల్స్’ విభాగంలో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో ‘సూపర్ టైబ్రేక్’లో పైచేయి సాధించిన సారా ఎరాని–వవసోరి ద్వయం ‘మిక్స్డ్ డబుల్స్’ టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. న్యూయార్క్: కొత్త ఫార్మాట్‌కు ఆహ్వానం పలికి... డబుల్స్ స్పెషలిస్ట్ అవకాశాలను దెబ్బ తీశారని నిర్వాహకులను విమర్శించినా... మరోవైపు తమ సహజ నైపుణ్య ప్రదర్శనతో సారా ఎరాని–ఆండ్రియా వవసోరి జోడీ అదరగొట్టింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఈ ఇటలీ జంట వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచింది. గురువారం ఉదయం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్స్ సారా ఎరాని–వవసోరి 6–3, 5–7, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)–కాస్పర్ రూడ్ (నార్వే)లపై గెలుపొందారు. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఎరాని–వవసోరి నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. విజేతగా నిలిచిన ఎరాని–వవసోరిలకు 10 లక్షల డాలర్లు (రూ. 8 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ స్వియాటెక్–రూడ్‌లకు 4 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 50 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రెండు రోజుల్లోనే ముగిసిన మిక్స్డ్ ఈవెంట్లో ఎరాని–వవసోరి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. గురువారమే జరిగిన సెమీఫైనల్స్‌లో ఎరాని–వవసోరి 4–2, 4–2తో డానియెలా కొలిన్స్–క్రిస్టియన్ హారిసన్ (అమెరికా)లను ఓడించింది. మరో సెమీఫైనల్లో స్వియాటెక్–రూడ్ 3–5, 5–3, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)–జాక్ డ్రేపర్ (బ్రిటన్)లపై గెలిచారు. 2018, 2019లలో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)–జేమీ ముర్రే (బ్రిటన్) జోడీ వరుసగా రెండేళ్లు ‘మిక్స్డ్ డబుల్స్’ టైటిల్ నెగ్గగా... ఇప్పుడు ఎరాని–వవసోరి ఈ ఘనత సాధించారు. -
ఇకపై లింగ నిర్ధారణ తర్వాతే పోటీలకు...
లాస్ ఏంజెలిస్: ఒలింపిక్ బాక్సింగ్ ఈవెంట్లో ఇకపై లింగ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. గతంలో పురుషుల స్థాయి హార్మోన్లతో ఉన్న మహిళా బాక్సర్లు పోటీలకు దిగినపుడు విమర్శలు వచ్చాయి. ఇకపై ఇలాంటి విమర్శలు పునరావృతం కాకూడదనే ఉద్దశంతో మహిళా ఈవెంట్లలో పోటీ పడే ప్రతి ఒక్కరికి పరీక్షలు తప్పనిసరి చేశారు. ఇందులో భాంగా వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే బాక్సర్లకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు ప్రపంచ బాక్సింగ్ అధ్యక్షుడు బోరిస్ వాన్ డిర్ వోర్స్ వెల్లడించారు. ‘సమాఖ్య అందరిపట్ల హుందాగా వ్యవహరిస్తుంది. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తుంది’ అని బోరిస్ అన్నారు. బాక్సింగ్ లాంటి పోరాట క్రీడలో భద్రత, పోటీతత్వం సమన్యాయంను పాటించాల్సి ఉంటుందని, మరింత జవాబుదారీతనం, పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. జీవసంబంధ లింగ సూచిక అయిన ‘వై’ క్రోమోజోమ్ జన్యువుల ఉనికిని ఈ పరీక్షల్లో నిర్ధారిస్తారు. ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్‌లో సెపె్టంబర్లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి. గత జూన్‌లో అల్జీరియాకు చెందిన ఇమాన్ ఖెలిఫ్‌ను నెదర్లాండ్స్‌లో జరిగిన పోటీల్లో అనుమతించలేదు. నిర్ధారిత టెస్టుల తర్వాతే అనుమతిస్తామని తెగేసి చెప్పారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆమెతో పాటు లిన్ యూ తింగ్ (చైనీస్ తైపీ) శారీరక సామర్థ్యంలో ఉన్న తేడాల వల్ల పెను విమర్శలకు దారితీసింది. వీరిని మహిళల ఈవెంట్లో అనుమతించడమేంటని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బాక్సింగ్ లింగ నిర్ధారణ పరీక్షల్ని తప్పనిసరి చేసింది. -
అజేయంగా ప్రజ్ఞానంద
సింక్ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద అజేయంగా సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మూడో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 46 ఎత్తుల్లో... స్యామ్ సెవియాన్ (అమెరికా)తో జరిగిన గేమ్‌ను ప్రపంచ చాంపియన్ గుకేశ్ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. ఇతర గేముల్లో ఫాబియానో కరువానా (అమెరికా) 46 ఎత్తుల్లో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలుపొందగా... అరోనియన్ (అమెరికా)–మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్) గేమ్ 73 ఎత్తుల్లో; వెస్లీ సో (అమెరికా)–జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) గేమ్ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. మూడో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, కరువానా, అరోనియన్ రెండు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
భారత్ గురి ‘బంగారం’
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ సీనియర్ విభాగంలో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. గురువారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు బంగారు పతకం లభించింది. రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబూటా, అంకుశ్ జాదవ్‌లతో కూడిన భారత జట్టు 1892.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని గెల్చుకుంది. రుద్రాంక్ష్ 632.3 పాయింట్లు, అర్జున్ 631.6 పాయింట్లు, అంకుశ్ 628.6 పాయింట్లు స్కోరు చేశారు. అయితే వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ 207.6 పాయింట్లతో నాలుగో స్థానంలో, అర్జున్ 185.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. సత్పయేవ్ (కజకిస్తాన్; 250.1 పాయింట్లు) స్వర్ణం... లూ డింగ్‌కి (చైనా; 249.8 పాయింట్లు) రజతం... హజున్ పార్క్ (కొరియా; 228.7 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు మెరిశారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగంలో భారత్‌కే స్వర్ణాలు దక్కాయి.వ్యక్తిగత విభాగంలో అభినవ్ షా 250.4 పాయింట్లతో పసిడి పతకం నెగ్గగా... టీమ్ విభాగంలో అభినవ్, హిమాంశు, ప్రణవ్‌లతో కూడిన భారత జట్టు 1890.1 పాయింట్లతో బంగారు పతకాన్ని నెగ్గింది. జూనియర్ మహిళల స్కీట్ ఈవెంట్లో మాన్సి స్వర్ణం, యశస్వి రజతం... జూనియర్ పురుషుల స్కీట్ ఈవెంట్లో హర్మెహర్ రజతం, జ్యోతిరాదిత్య సిసోడియా కాంస్యం గెలిచారు. హర్మెహర్, జ్యోతిరాదిత్య, అతుల్లతో కూడిన బృందం టీమ్ స్కీట్ ఈవెంట్లో బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా భారత్ 16 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో 31 పతకాలతో ‘టాప్’లో ఉంది. -
Asia Cup 2025: పాక్ అవుట్.. భారత జట్టు ఇదే
స్వదేశంలో ఈనెల 29 నుంచి జరిగే ఆసియాకప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును బుధవారం ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు ‘డ్రాగ్ ఫ్లికర్’ హర్మన్‌ప్రీత్ సింగ్ నాయ కత్వం వహిస్తాడు. సెప్టెంబరు 7వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది దేశాలు పోటీపడతాయి. విజేతగా నిలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్‌లలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది.టైటిల్ పోరు బాట ఇలాచైనాతో ఈనెల 29న జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌తో భారత్ తమ టైటిల్ వేటను మొదలుపెడుతుంది. అనంతరం ఆగస్టు 31న జపాన్‌తో, సెప్టెంబరు 1న కజకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా, మలేసియా, చైనీస్ తైపీ, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు ‘సూపర్–4’ దశకు చేరుకోనున్నాయి. ‘సూపర్–4’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబరు 7న టైటిల్ కోసం తలపడతాయి. ఇదిలా ఉంటే.. భారత్‌లో జరిగే ఈ ఆసియాకప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఆ జట్టు స్థానంలో బంగ్లాదేశ్ గ్రూప్-‘బి’లో చేరింది.భారత పురుషుల హాకీ జట్టు: కృషన్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్ కీపర్లు), సుమిత్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, హర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, అమిత్ రోహిదాస్ (డిఫెండర్లు), రాజిందర్ సింగ్, రాజ్‌కుమార్ పాల్, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ (మిడ్‌ఫీల్డర్లు), మన్దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్ (ఫార్వర్డ్స్). -
మరింత ప్రాక్టీస్ కోసం...
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ (డీఎల్) చివరి అంచె పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్... ప్రధాన టోర్నీకి ముందు పూర్తి స్థాయిలో ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో జరుగనున్న మీట్ నుంచి తప్పుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా... ఈ నెల 28న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ వేదికగా జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్లో బరిలోకి దిగనున్నాడు.ఒక సీజన్లో జావెలిన్ త్రో ఈవెంట్లో నాలుగు డైమండ్ లీగ్ అంచె పోటీలు జరగడం పరిపాటి కాగా... ఇందులో ప్రదర్శన ఆధారంగా అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఈ సీజన్లో నీరజ్ చోప్రా రెండు పోటీల్లోనే పాల్గొన్నా... మెరుగైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరాడు. ఇటీవల సిలెసియా టోర్నీ నుంచి సైతం నీరజ్ తప్పుకున్నాడు. 27 ఏళ్ల నీరజ్ చోప్రా ఈ సీజన్లో తొలిసారి 90 మీటర్ల మార్క్ అందుకున్నాడు. మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్ అంచె పోటీల్లో నీరజ్ జావెలిన్‌ను 90.23 మీటర్ల దూరం విసిరాడు. అనంతరం జూన్‌లో పారిస్ డైమండ్ లీగ్‌లో నీరజ్ జావెలిన్‌ను 88.16 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. శుక్రవారం జరగనున్న బ్రస్సెల్స్ అంచె పోటీల అనంతరం టాప్–6లో నిలిచిన త్రోయర్లు డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించనున్నారు. జూలై 5న భారత్‌లో నిర్వహించిన తొలి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ తర్వాత భారత స్టార్ తిరిగి బరిలోకి దిగలేదు. బెంగళూరు వేదికగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఆ టోర్నీలో నీరజ్ జావెలిన్‌ను 86.18 మీటర్ల దూరం విసిరి టైటిల్ గెలుచుకున్నాడు. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఆరు పోటీల్లో పాల్గొన్న నీరజ్ అందులో నాలుగింట టైటిల్ సాధించడంతో పాటు మరో రెండు టోర్నీల్లో రెండో స్థానంలో నిలిచాడు. డైమండ్ లీగ్ ఫైనల్ అనంతరం వచ్చే నెల 13 నుంచి 21 వరకు టోక్యో వేదికగా ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుండగా... అందులో నీరజ్ డిఫెండింగ్ చాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగనున్నాడు. పెరిగిన ప్రైజ్‌మనీ... అథ్లెటిక్స్‌లో డైమండ్ లీగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏటా 14 అంచెల పోటీలు నిర్వహించిన అనంతరం అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్లను ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. ఇందులో మొత్తం 32 ఈవెంట్స్ జరుగుతాయి... వాటి విజేతలకు డైమండ్ ట్రోఫీతో పాటు... వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నేరుగా పాల్గొనేందుకు ‘వైల్డ్ కార్డు’ లభిస్తుంది. ఈ నెల 28న జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్ జావెలిన్ త్రో పోటీల్లో విజేతగా నిలిచిన అథ్లెట్‌కు రూ. 26.11 లక్షల ప్రైజ్‌మనీ సైతం లభించనుంది. ఈ ఏడాది పురుషుల 100 మీటర్ల పరుగు, 1500 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగు, పోల్‌వాల్ట్... మహిళల 100 మీటర్ల పరుగు, 100 మీటర్ల హర్డిల్స్, 3000 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ ఈవెంట్ల విజేతలకు మెరుగైన ప్రైజ్‌మనీ లభించనుంది. ఈ విభాగాల్లో విజేతగా నిలిచిన వారికి రూ. 43.52 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 17.40 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 8.70 లక్షలు దక్కనున్నాయి. -
ఆనంద్ X కాస్పరోవ్ , గుకేశ్ X కార్ల్సన్
న్యూఢిల్లీ: ఇద్దరు చదరంగ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్ మరోసారి ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్‌లో అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా జరగనున్న క్లచ్ చెస్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో ఈ దిగ్గజాలు ఎత్తులు పైఎత్తులు వేయనున్నారు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) మధ్య కూడా గేమ్‌లు జరగనున్నాయి.ప్రపంచ చదరంగంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా గుర్తింపు సాధించిన ఆనంద్, కాస్పరోవ్ మధ్య ఇప్పటి వరకు 82 గేమ్‌లు జరిగాయి. చివరిసారిగా 2021లో క్రొయేషియా ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్లో ఈ ఇద్దరు తలపడగా... భారత గ్రాండ్‌మాస్టర్ విజయం సాధించాడు. ‘ఇద్దరు ప్రపంచ మాజీ చాంపియన్లు గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనంద్... క్లచ్ చెస్ (లెజెండ్స్) ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడనున్నారు. అక్టోబర్ 7 నుంచి 11 మధ్య ఈ టోర్నీ జరగనుంది. తరానికి ఒక్కసారి జరిగే మ్యాచ్ ఇది’ అని సెయింట్ లూయిస్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 1 కోటీ 25 లక్షలు కాగా... ఇద్దరు దిగ్గజాల మధ్య 12 గేమ్‌లు నిర్వహించనున్నారు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఇక ఇదే వేదికపై అక్టోబర్ 27 నుంచి 29 వరకు ప్రస్తుత అగ్రశ్రేణి ఆటగాళ్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ప్రపంచ నంబర్‌వన్ కార్ల్సన్, రెండో ర్యాంకర్ నకముర, మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా, ప్రపంచ స్టార్ గుకేశ్ తదితరులు పాల్గొననున్నారు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన వారికి భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది. ‘ఈ టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 3 కోట్ల 58 లక్షలు. దీంతో పాటు ప్లేయర్లకు ప్రతిరోజు బోనస్, విజేతకు జాక్‌పాట్ వంటి ఎన్నో ఇతర ప్రయోజనాలు ఉంటాయి’ అని నిర్వాహకులు తెలిపారు. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించనున్న ఈ పోటీల్లో 18 గేమ్‌లు జరుగుతాయి. -
అనంత్ అదరహో...
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ సీనియర్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. బుధవారం జరిగిన పురుషుల స్కీట్ ఈవెంట్లో భారత షూటర్ అనంత్ జీత్ సింగ్ నరూకా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రాజస్తాన్‌కు చెందిన అనంత్‌కు ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో ఇదే తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం కావడం విశేషం. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 27 ఏళ్ల అనంత్ 60 పాయింట్లకుగాను 57 పాయింట్లు స్కోరు చేసి విజేతగా అవతరించాడు. ఆసియా క్రీడల చాంపియన్ మన్సూర్ అల్ రషీది (కువైట్) 56 పాయింట్లు సాధించి రజత పతకం నెగ్గాడు. 43 పాయింట్లతో అల్ ఇషాక్ అలీ అహ్మద్ (ఖతర్) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 46 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో అనంత్ 119 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందాడు.క్వాలిఫయింగ్‌లో టాప్–6లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్‌లు లభిస్తాయి. 2023 ఆసియా చాంపియన్‌షిప్ టీమ్ విభాగంలో, మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచిన అనంత్ హాంగ్జౌ ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో రజతం సాధించాడు. మరోవైపు మహిళల స్కీట్ టీమ్ విభాగంలో భారత బృందానికి కాంస్య పతకం లభించింది. మహేశ్వరి చౌహాన్ (113 పాయింట్లు), గనీమత్ సెఖోన్ (109 పాయింట్లు), రైజా ధిల్లాన్ (107 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు 329 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో మహేశ్వరి చౌహాన్ 35 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. సురుచి–సౌరభ్ జోడీకి కాంస్యం ఎయిర్ పిస్టల్ 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్–సౌరభ్ చౌధరీ జోడీ భారత్‌కు కాంస్య పతకం అందించింది. కాంస్య పతక మ్యాచ్‌లో సురుచి–సౌరభ్ 17–9 పాయింట్లతో లియు హెంగ్ యు–సెయి సియాంగ్ చెన్ (చైనీస్ తైపీ)లపై విజయం సాధించారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వన్షిక చౌధరీ–జొనాథన్ గావిన్ ఆంటోనీ ద్వయం భారత్ ఖాతాలో స్వర్ణ పతకాన్ని జమ చేసింది. ఫైనల్లో వన్షిక–జొనాథన్ 16–14తో కిమ్ యెజిన్–కిమ్ డూయోన్ (దక్షిణ కొరియా)లపై గెలుపొందింది. సీనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో కలిపి ప్రస్తుత చాంపియన్‌షిప్‌లో భారత్ ఏడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి 17 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
తపస్య ‘పసిడి పట్టు’
సమోకోవ్ (బల్గేరియా): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో తపస్య (57 కేజీలు) భారత్‌కు మొదటి బంగారు పతకాన్ని అందించింది. బుధవారం జరిగిన ఫైనల్లో తపస్య 5–2 పాయింట్ల తేడాతో ఫెలిసిటాస్ దొమయెవా (నార్వే)పై విజయం సాధించింది. సెమీఫైనల్లో తపస్య 4–3తో సొవాకా ఉచిద (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 9–0తో రొమైసా (ఫ్రాన్స్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–0తో డొల్జాన్ (రష్యా)పై గెలుపొందింది. భారత్‌కే చెందిన సృష్టి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. 68 కేజీల ఫైనల్లో సృష్టి 0–7తో రే హోషినో (జపాన్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు భారత్‌కే చెందిన రీనా (55 కేజీలు), ప్రియ (76 కేజీలు) కూడా స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. వీరిద్దరూ తమ కేటగిరీల్లో ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన సెమీఫైనల్స్‌లో రీనా 11–1తో అలెగ్జాండ్రా వాయిసులెసు్క(రొమేనియా)పై, ప్రియ 10–0తో ఎవెలిన్ ఉజెల్జి (సెర్బియా)పై విజయం సాధించారు. అంతకుముందు రీనా క్వార్టర్ ఫైనల్లో 8–2తో జెర్డా టెరెక్ (హంగేరి)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–6తో ఖాలియున్ బ్యామ్బసురెన్ (మంగోలియా)పై... ప్రియ క్వార్టర్ ఫైనల్లో 4–0తో డయానా టిటోవా (రష్యా)పై, తొలి రౌండ్లో 10–0తో వెరోనికా నికోస్ (హంగేరి)పై గెలుపొందారు. నేడు జరిగే ఫైనల్స్‌లో నదియా సొకోలోవ్స్కా (ఉక్రెయిన్)తో ప్రియ; ఎవరెస్ట్ లెడెకర్ (అమెరికా)తో రీనా తలపడతారు. -
స్టార్ జోడీలు తొలి రౌండ్లోనే అవుట్
న్యూయార్క్: సింగిల్స్‌లో మేటి క్రీడాకారులుగా ఉన్న వారిని జోడీలుగా మార్చి... మిక్స్డ్ డబుల్స్ ఆడించాలని యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం అంతగా సక్సెస్ కాలేదు. స్టార్ ఆటగాళ్లతో నిర్వహించిన మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. సెర్బియా దిగ్గజం, ప్రపంచ ఏడో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్... ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)... ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మిక్స్డ్ డబుల్స్‌లో తమ తొలి మ్యాచ్‌లలోనే పరాజయం పాందగా... ప్రపంచ ఆరో ర్యాంకర్ బెన్ షెల్టన్ (అమెరికా) క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. జొకోవిచ్–డానిలోవిచ్ (సెర్బియా) జంట 2–4, 3–5తో మెద్వెదెవ్–మిరా ఆండ్రీవా (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. అల్కరాజ్ (స్పెయిన్)–ఎమ్మా రాడుకాను (బ్రిటన్) జంట 2–4, 2–4తో జెస్సికా పెగూలా (అమెరికా)–జేక్ డ్రేపర్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓటమి పాలైంది. జ్వెరెవ్–బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) ద్వయం 0–4, 3–5తో డానియెలా కొలిన్స్–క్రిస్టియన్ హారిసన్ (అమెరికా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. క్వార్టర్ ఫైనల్లో పెగూలా–డ్రేపర్ ద్వయం 4–1, 4–1తో మెద్వెదెవ్–ఆండ్రీవా జంటపై నెగ్గి సెమీఫైనల్ చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో కొలిన్స్–హారిసన్ జోడీ 4–1, 5–4 (7/2)తో టేలర్ టౌన్సెండ్–బెన్ షెల్టన్ (అమెరికా) ద్వయంపై నెగ్గి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. -
స్వియాటెక్ సాధించె... విజేతగా అల్కరాజ్.. యూఎస్‌కు పయనం
సిన్సినాటి (ఒహాయో): ఎట్టకేలకు ఏడో ప్రయత్నంలో పోలాండ్ టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో తన లక్ష్యాన్ని చేరుకుంది. గతంలో ఆరుసార్లు ఈ టోర్నీలో ఆడిన స్వియాటెక్ సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. అయితే ఏడో ప్రయత్నంలో మాత్రం స్వియాటెక్ చాంపియన్‌గా అవతరించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వియాటెక్ 7–5, 6–4తో ప్రపంచ ఏడో ర్యాంకర్ జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై గెలిచింది.1 గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ తుదిపోరులో స్వియాటెక్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. స్వియాటెక్ కెరీర్లో ఇది 24వ సింగిల్స్ టైటిల్‌కాగా... ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్ తర్వాత రెండోది.విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 7,52,275 డాలర్ల (రూ. 6 కోట్ల 54 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, రన్నరప్ పావోలినికి 3,91,600 డాలర్ల (రూ. 3 కోట్ల 40 లక్షలు ) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.విజేత అల్కరాజ్ సిన్సినాటి ఓపెన్ ఏటీపీ–1000 టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో జరిగిన ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 5–0తో గెలిచాడు. తొలి సెట్లో 0–5తో వెనుకబడిన దశలో అనారోగ్యం కారణంగా సినెర్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు.ఇక టైటిల్ నెగ్గిన అల్కరాజ్కు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 78 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సినెర్‌కు 5,97,890 డాలర్ల (రూ. 5 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ఈ ఏడాది అల్కరాజ్కిది ఆరో టైటిల్‌కాగా, కెరీర్లో 22వది కావడం విశేషం.ఒకే విమానంలో..ఇదిలా ఉంటే.. సిన్సినాటి ఓపెనర్ టైటిల్స్ గెలిచిన తర్వాత స్వియాటెక్, అల్కరాజ్ కలిసి ఒకే విమానంలో న్యూయార్క్‌కు బయలుదేరారు. యూఎస్ ఓపెన్‌లో విజేతలుగా నిలవడమే లక్ష్యంగా అమెరికాలో అడుగుపెట్టారు. వీరిద్దరు ఒకే విమానంలో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.Iga Swiatek and Carlos Alcaraz sharing a plane to New York. 🗽Cincinnati champions ready for the US Open.Love this. ❤pic.twitter.com/nLD6KMnHJd— The Tennis Letter (@TheTennisLetter) August 19, 2025 -
మను గురికి రెండు కాంస్యాలు
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత స్టార్ మనూ భాకర్ వ్యక్తిగత విభాగంతోపాటు టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మను 219.7 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మనూ భాకర్, సురుచి సింగ్, పలక్లతో కూడిన భారత జట్టు 1730 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మను 583 పాయింట్లు, సురుచి 574 పాయింట్లు, పలక్ 573 పాయింట్లు సాధిచారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో రష్మిక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. ఫైనల్లో రషి్మక 241.9 పాయింట్లు స్కోరు చేసింది. రషి్మక, వన్షిక, మోహిని సింగ్‌లతో కూడిన భారత జట్టు 1720 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. -
గుకేశ్‌కు ప్రజ్ఞానంద షాక్
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ సంచలన ఫలితంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రజ్ఞానంద 36 ఎత్తుల్లో భారత్‌కే చెందిన క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌ను ఓడించాడు. ఈ ఫలితంతో ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ లైవ్ రేటింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. క్వీన్స్ గాంబిట్ పద్ధతిలో మొదలైన ఈ గేమ్‌లో ప్రజ్ఞానంద ఎత్తులకు సమాధానం ఇచ్చేందుకు గుకేశ్ తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. ఒకదశలో సమయాభావంవల్ల గుకేశ్ దీటైన ఎత్తులు వేయలేకపోయాడు. చివరకు 36 ఎత్తులు ముగిశాక గుకేశ్ ఓటమిని అంగీకరించాడు. 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 9 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. మరోవైపు లెవోన్ అరోనియన్ (అమెరికా) 41 ఎత్తుల్లో నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందగా... సో వెస్లీ (అమెరికా)–సామ్ సెవియాన్ (అమెరికా) మధ్య గేమ్ 56 ఎత్తుల్లో... అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)–మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్) గేమ్ 58 ఎత్తుల్లో... ఫాబియానో కరువానా (అమెరికా)–జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. -
సెమీస్‌లో సారా ఎరాని–వావసోరి జోడీ
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో మంగళవారం మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ మొదలైంది. డిఫెండింగ్ చాంపియన్ జోడీ సారా ఎరాని–ఆండ్రియా వావసోరి (ఇటలీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ముందుగా తొలి రౌండ్లో ఎరాని–వావసోరి ద్వయం 4–2, 4–2తో రెండో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)–టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) జంటపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్ చేరింది. ఆ వెంటనే జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎరాని–వావసోరి జోడీ 4–1, 5–4 (7/5)తో ముకోవా (చెక్ రిపబ్లిక్)–రుబ్లెవ్ (రష్యా) జంటను ఓడించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 4–1తో నెగ్గిన ఇటలీ జోడీ రెండో సెట్‌ను టైబ్రేక్‌లో దక్కించుకుంది. రెండో సెట్లో స్కోరు 4–4తో సమం కావడంతో టైబ్రేక్‌ను నిర్వహించారు. టైబ్రేక్‌లో ముందుగా ఏడు పాయింట్లు గెలిచిన ఎరాని–వావసోరి జంట విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు స్వియాటెక్ (పోలాండ్)–కాస్పర్ రూడ్ (నార్వే) జోడీ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్–రూడ్ జంట 4–1, 4–2తో కేటీ మెక్నాలీ (అమెరికా) –ముసెట్టి (ఇటలీ) జోడీపై గెలిచింది. అంతకుముందు తొలి రౌండ్లో స్వియాటెక్–రూడ్ 4–1, 4–2తోనే మాడిసన్ కీస్–ఫ్రాన్సిస్కో టియాఫో (అమెరికా)లపై... కేటీ మెక్లానీ–ముసెట్టి 5–3, 4–2తో ఒసాకా (జపాన్)–Vమోన్ఫిల్స్ (ఫ్రాన్స్) లపై గెలిచారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ముకోవా–రుబ్లెవ్ 4–2, 5–4 (7/4)తో వీనస్ విలియమ్స్–రీలీ ఒపెల్కా (అమెరికా)లపై నెగ్గారు. -
జాతీయ క్రీడా పాలన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: దేశ క్రీడా పరిపాలన వ్యవస్థను సమూలంగా మార్చడంతో పాటు... క్రీడా రంగానికి మరింత చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జాతీయ క్రీడా పాలన చట్టం–2025’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో బిల్లు చట్టంగా మారిందని... ఇది దేశ క్రీడారంగంలో విప్లవాత్మక సంస్కరణ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ‘ఆగస్టు 18న జాతీయ క్రీడా పాలన చట్టం–2025కు రాష్ట్రపతి ఆమోదం లభించింది’ అని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గత నెల 23న ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా... ఈ నెల 11న ఆమోదం పొందింది. ఈ నెల 12న రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బిల్లుకు కొన్ని సవరణల అనంతరం ఉభయసభలు ఆమోదించాయి. దీంతో ప్రభుత్వ నిధులపై ఆధారపడే క్రీడా సంస్థలు మాత్రమే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రానున్నాయి. మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆర్టీఐ పరిధిలోకి రాదు. -
రూ. 7 కోట్లు పెరిగిన ప్రైజ్‌మనీ.. ‘సోలో’ స్టార్స్ జోడీగా.. వాళ్లకు అన్యాయం?
న్యూయార్క్: టెన్నిస్‌లో ‘సోలో’ స్టార్స్ కాస్త ఇకపై ‘మిక్స్డ్’ చాంపియన్స్ కాబోతున్నారు. సింగిల్స్ టైటిల్ కోసం సర్వశక్తులు ఒడ్డే పురుషుల, మహిళల సింగిల్స్ సీడెడ్లు ఇకపై జోడీగా స్ట్రాంగ్... డబుల్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్కు ‘సై’ అంటున్నారు. ఈ మేరకు యూఎస్ ఓపెన్ ఆర్గనైజర్లు గ్రాండ్‌స్లామ్‌లో సరికొత్త శోభను తీసుకొస్తున్నారు.‘మిక్స్డ్ డబుల్స్’కు సింగిల్స్ స్టార్లతో మరో దశకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 24న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మొదలుకానుండగా... మిక్స్డ్ డబుల్స్ పోటీలు మాత్రం మంగళవారం ప్రారంభంకానున్నాయి. రెండు రోజుల్లోనే మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్‌ను నిర్వాహకులు ముగించనున్నారు.ఫలితంగా ఎన్నడూ లేని విధంగా ప్రపంచ సింగిల్స్ స్టార్లంతా ఇప్పుడు మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కోసం కూడా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు యూఎస్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు జోడీలను ఎంపిక చేశారు. అల్కరాజ్, సినెర్, స్వియాటెక్, మాడిసన్ కీస్‌లు ‘మిక్స్డ్ డబుల్స్’ దశను మార్చే ఆట ఆడతారా లేదో కొన్ని రోజుల్లోనే తేలనుంది. ‘మిలియన్’ మార్పు గతేడాది యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌ను సారా ఎరాని–వావసొరి (ఇటలీ) జోడీ గెలుచుకుంది. వీరిద్దరు ట్రోఫీతో పాటు 2 లక్షల డాలర్ల (రూ. 1 కోటీ 75 లక్షలు)ను పంచుకున్నారు. కానీ ఇప్పుడు మిక్స్డ్ ప్రైజ్‌మనీ ఏకంగా 10 లక్షల డాలర్లకు (రూ. 8 కోట్ల 73 లక్షలు) చేరింది. ఐదు రెట్లకు పెరిగిన మొత్తం సింగిల్స్ స్టార్లకు వరమైతే... స్పెషలిస్టు డబుల్స్ ప్లేయర్లకు గుండెకోతను మిగిల్చనుంది.ఒక్క ప్రైజ్మనే కాదు... ఆట కూడా మారింది. 6 గేమ్‌ల స్థానంలో 4 గేమ్‌లతో ఆడిస్తారు. అంటే 6–0, 6–1 స్కోర్లు కాస్తా 4–0, 4–1గా ఉంటాయి. 32 జోడీలకు బదులుగా 16 జోడీలనే బరిలో దించుతారు. అంటే ప్రిక్వార్టర్స్ నుంచే మిక్స్డ్ పోరు మొదలవుతుంది. ఒక్క మ్యాచ్ గెలవగానే ఆ జోడీ క్వార్టర్స్ చేరుతుంది. మ్యాచ్‌లు కూడా ప్రధాన వేదికల్లో నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. జోడీ కట్టించారిలా... స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ సరికొత్త సమరాన్ని ఎమ్మా రాడుకాను (బ్రిటన్)తో కలిసి ప్రారంభిస్తాడు. ఇటలీ సంచలనం యానిక్ సినెర్ (ఇటలీ)... కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)తో జోడీ కట్టాడు. షెడ్యూల్ ప్రకారం ఎమ్మా నవారో (అమెరికా)తో సినెర్ ఆడాల్సి ఉండగా... ఆమె తప్పుకోవడంతో చెక్ స్టార్‌ను జతచేశారు.సెర్బియా దిగ్గజం జొకోవిచ్ తన దేశానికే చెందిన డానిలోవిక్తో మిక్స్డ్ టైటిల్ కోసం పోటీపడనున్నాడు. స్వియాటెక్ (పోలాండ్)–కాస్పర్ రూడ్ (నార్వే), మాడీసన్ కీస్–టియాఫె (అమెరికా), నయోమి ఒసాకా (జపాన్)–మోన్ఫిల్స్ (ఫ్రాన్స్), జ్వెరెవ్ (జర్మనీ)–బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్), రుబ్లెవ్ (రష్యా)– కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్), రీలి ఒపెల్కా–వీనస్ విలియమ్స్ (అమెరికా), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)– రిబాకినా (కజకిస్తాన్) తదితర హేమాహేమీ జోడీలు ఈసారి కొత్తగా మిక్స్డ్ డబుల్స్ బరిలో ఉన్నారు.మరి మా సంగతేం కాను? పాత ఒక రోత... కొత్త ఒక వింత.. తాజాగా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో కొత్త మిక్సింగ్‌పై అసలు సిసలైన డబుల్స్ ఆటగాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటీపీ, డబ్ల్యూటీఏలతో పాటు వందకు పైగా టోర్నీలు జరుగుతున్నాయి. మిక్స్డ్ డబుల్స్ మాత్రం కేవలం నాలుగే నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నిర్వహిస్తారు. ఇందులోనే పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ ఆడే ప్లేయర్లు అదనంగా మిక్స్డ్ జోడీ కడతారు.సాధారణంగా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రైజ్‌మనీ కూడా ఎక్కువ. తొలిరౌండ్లో ఓడినా పెద్ద మొత్తంలోనే వస్తాయి. అలాంటి సువర్ణావకాశాన్ని ఇప్పుడు యూఎస్ ఓపెన్ నిర్వాహకులు సరికొత్త మిక్స్‌తో మార్చేయడంతో స్పెషలిస్టు డబుల్స్ ఆటగాళ్ల ఆదాయానికి గండికొట్టారు. మిగతా మూడు గ్రాండ్‌స్లామ్‌ల నిర్వాహకులు సైతం ఇదే ధోరణిని అవలంభిస్తే డబుల్స్ ప్లేయర్లకు కోలుకోలేని దెబ్బ పడుతుంది. గత యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ విజేతగా నిలిచిన ఇటలీ జంట సారా ఎరాని–వావసొరి నిర్వాహకుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. -
డోపింగ్‌లో దొరికిన ట్రిపుల్ జంపర్ షీనా
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో పతకాలెన్నో సాధించిన ట్రిపుల్ జంపర్ షీనా వార్కే డోపింగ్‌లో దొరికిపోయింది. ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. కేరళకు చెందిన 32 ఏళ్ల షీనా ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ క్రీడల్లోనూ రజత పతకంతో మెరిసింది. ఫెడరేషన్ కప్‌లో కాంస్యం గెలుచుకుంది. ఆసియా ఇండోర్ చాంపియన్‌షిప్ (2018)లో రజతం గెలిచింది. రెండేళ్ల క్రితం హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కూడా ఆమె పోటీపడింది. డోపింగ్‌లో పట్టుబడిన షీనాను సస్పెండ్ చేస్తున్నట్లు ‘నాడా’ వర్గాలు తెలిపాయి. అయితే ఆమె తీసుకున్న ఉత్ప్రేరకాలెంటో నాడా బహిర్గతపరచలేదు. డోపింగ్ పాజిటివ్ ఫలితాల రేటింగ్‌లో భారత్ 3.8 శాతంతో చైనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాల కంటే ముందువరుసలో నిలవడం భారత క్రీడల ప్రతిష్టను మసకబారుస్తోంది. ఒక్క అథ్లెటిక్స్‌లోనే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) జరిపిన పరీక్షల్లో 1223 పాజిటివ్ కేసులుంటే ఇందులో 61 మంది భారత అథ్లెట్లు ఉండటం క్రీడావర్గాలను కలవరపెడుతోంది. -
Europe Smash 2025: మనికపై శ్రీజ పైచేయి
మాల్మో (స్వీడన్): యూరోప్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో తెలంగాణ అమ్మాయి, భారత నంబర్‌వన్ ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 45వ ర్యాంకర్ శ్రీజ 5–11, 11–9, 15–13, 10–12, 11–8తో భారత్‌కే చెందిన ప్రపంచ 52వ ర్యాంకర్ మనిక బత్రాపై విజయం సాధించింది. 44 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు కీలకదశలో పాయింట్లు నెగ్గిన శ్రీజను విజయం వరించింది. శ్రీజ మొత్తం 52 పాయింట్లు సాధించగా... అందులో తన సర్విస్‌లో 27 పాయింట్లు, ప్రత్యర్థి సర్విస్‌లో 25 పాయింట్లు సంపాదించింది. మనిక బత్రా మొత్తం 53 పాయింట్లు గెలవగా... అందులో తన సర్విస్‌లో 28, ప్రత్యర్థి సర్విస్‌లో 25 పాయింట్లు సాధించింది. భారత్‌కే చెందిన ప్రపంచ 77వ ర్యాంకర్ యశస్విని తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. యశస్విని 6–11, 2–11, 1–11తో ఐదో ర్యాంకర్ వాంగ్ యిది (చైనా) చేతిలో ఓడిపోయింది. మానవ్ సంచలనం ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ 43వ ర్యాంకర్ మానవ్ ఠక్కర్ సంచలన విజయంతో శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో మానవ్ 12–10, 11–5, 5–11, 11–9తో ప్రపంచ 23వ ర్యాంకర్ హిరోటో షినోజుకా (జపాన్)ను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. -
ఛెత్రికి తలుపులు తెరిచే వున్నాయి
బెంగళూరు: భారత స్టార్ ఫుట్‌బాలర్, మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రికి తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని కొత్త కోచ్ ఖాలీద్ జమీల్ అన్నారు. సెంట్రల్ ఏషియా ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్ (సీఏఎఫ్‌ఏ) నేషన్స్ కప్ కేవలం సన్నాహక టోర్నీ మాత్రమే అని, దీని కోసం ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌లో ఛెత్రి పేరు లేనంత మాత్రాన అతని ఆటకు తెరపడినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లలో జరిగే నేషన్స్ కప్ కోసం 35 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం ప్రకటించారు. అయితే ఇందులో స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి పేరు లేకపోవడంతో మీడియాలో వస్తున్న ఊహాగానాలకు హెడ్ కోచ్ ముగింపు పలికే ప్రయత్నం చేశారు. ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్‌లకు ఛెత్రి సహా ఇతర కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని అన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో భారత్ ఇంటాబయటా సింగపూర్‌తో రెండు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. 9న సింగపూర్‌లో, 14న సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ‘భారత ఫుట్‌బాల్‌లో సునీల్ ఒక దిగ్గజం. మన సాకర్‌కు అతనో రోల్ మోడల్. అంతేకాదు... నా ఫేవరెట్ ఆటగాడు కూడా! అతడితో తలపడిన (క్లబ్, లీగ్) సందర్భాలెన్నో ఉన్నాయి’ అని జమీల్ తెలిపినట్లు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటనను విడుదల చేసింది. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు ఉమ్మడిగా నిర్వహించబోయే నేషన్స్ కప్‌లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది. ఈ నెల 29న తొలి మ్యాచ్‌లో తజికిస్తాన్‌తో భారత్ పోటీపడుతుంది. సెప్టెంబర్1న ఇరాన్, 4న అఫ్గానిస్తాన్‌తో ఆడుతుంది. మూడో స్థానం సహా ఫైనల్ పోటీలు 8న తాష్కెంట్లో జరుగుతాయి. ఈ టోర్నీ కోసం శనివారమే ప్రాబబుల్స్‌కు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 22 మంది ఆటగాళ్లు శిబిరంలో ఉండగా... మిగతా 13 మంది డ్యురాండ్ కప్ ముగిసిన వెంటనే క్యాంప్‌లో పాల్గొంటారు. -
గుకేశ్‌పైనే దృష్టి
సెయింట్ లూయిస్ (అమెరికా): ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తిరిగి క్లాసికల్ చెస్ పోటీల్లో తలపడేందుకు సిద్ధమయ్యాడు. గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా ఐదో టోర్నీ అయిన సింక్ఫీల్డ్ కప్‌లో భారత్ తరఫున గుకేశ్‌తోపాటు ప్రజ్ఞానంద విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. పదిమంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతుంది. సోమవారం నుంచి ఇక్కడ జరిగే ఈ టోర్నీలో అమెరికా గ్రాండ్‌మాస్టర్లు ఫాబియానో కరువానా, వెస్లీ సో, లెవోన్ అరోనియన్, స్యామ్ సేవియన్లతో పాటు ఫ్రాన్స్‌కు చెందిన మాక్సిమి వాచియెర్ లాగ్రెవ్, అలీరెజా ఫిరూజా... పోలాండ్ స్టార్ జాన్ క్రిస్టోఫ్ డూడా... ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ కూడా పాల్గొంటున్నారు. అయితే ప్రపంచ నంబర్‌వన్, మాజీ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ఆడకపోవడమే టోర్నీకి ప్రధాన లోటు అని చెప్పొచ్చు. ఈ నార్వే గ్రాండ్‌మాస్టర్ క్లాసికల్ చెస్‌ను ఆస్వాదించలేకపోతున్నానని ఇదివరకే ఎన్నోసార్లు స్పష్టం చేశాడు. అందువల్లే ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. అయితే చెస్ దిగ్గజం కార్ల్సన్ లేకపోయినప్పటికీ భారత ఆటగాళ్లకు ప్రధానంగా అమెరికా ఆటగాళ్లు ఆరోనియన్, కరువానా, అలీరెజా నుంచి గట్టిపోటీ తప్పదు. సెయింట్ లూయిస్‌లోనే జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో గుకేశ్ ఆశించినంతగా రాణించలేకపోయాడు. అయితే తనకు పట్టున్న క్లాసికల్ ఫార్మాట్లో సత్తా చాటుకోవడానికి గుకేశ్ రెడీగా ఉన్నాడు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 3,50,000 డాలర్లు (రూ. 3 కోట్ల 6 లక్షలు). విజేతకు 1,00,000 డాలర్లు (రూ.87 లక్షల 51 వేలు) అందజేస్తారు. రన్నరప్‌గా నిలిచిన ప్లేయర్‌కు 65 వేల డాలర్లు (రూ. 56 లక్షల 88 వేలు), మూడో స్థానం పొందిన ప్లేయర్‌కు 48 వేల డాలర్లు (రూ. 42 లక్షలు) లభిస్తాయి. -
‘మళ్లీ సత్తా చాటుతాం’
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో సంచలన జోడీగా ఘన విజయాలు అందుకున్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి గత కొంత కాలంగా అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోతున్నారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, థామస్ కప్‌లో స్వర్ణంతో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు గెలుచుకొని రెండేళ్ల క్రితమే వరల్డ్ నంబర్‌వన్ జంటగా నిలిచారు. అయితే గాయాలు తదితర కారణాలతో వెనుకబడిన వీరికి 2025లో కూడా కలిసి రాలేదు. ఏడాది కాలంగా సాత్విక్–చిరాగ్ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. అయితే ప్రదర్శన మరీ పేలవంగా ఏమీ లేదు కానీ ట్రోఫీలు మాత్రం సాధించలేకపోతున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన తర్వాత వరుసగా మూడు టోర్నీల్లో వారు సెమీఫైనల్ చేరారు. ఇటీవల కూడా సింగపూర్, చైనా ఓపెన్ టోర్నీల్లో కూడా సెమీఫైనల్ వరకు రాగలిగారు. తాము విఫలమవుతున్న విషయాన్ని వీరు కూడా అంగీకరించారు. ‘పారిస్ ఒలింపిక్స్ తర్వాత పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది. నేను గాయపడ్డాను. ట్రైనర్‌ను మార్చాల్సి వచ్చింది. అంత మళ్లీ కొత్తగా మొదలు పెట్టినట్లు అనిపించింది. గాయాలు, వ్యక్తిగత సమస్యలతో లయ కోల్పోయాం. మొత్తంగా చూస్తే మెరుగ్గానే ఆడినా ఇంకా ఫలితాలు రావాల్సింది. అయితే త్వరలోనే అది జరుగుతుందని నమ్ముతున్నాం. వరుసగా టోర్నీలు ఆడితే అది సాధ్యమవుతుంది’ అని సాత్విక్ వ్యాఖ్యానించాడు. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ తర్వాత చిరాగ్‌కు గాయం కావడంతో రెండు నెలలు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన సింగపూర్ టోర్నీలో ఊహించిదానికంటే మెరుగైన ప్రదర్శనే చేసారు. ‘సింగపూర్ టోర్నీలో మేం ఒక గేమ్ గెలవడం కూడా గగనంగా అనిపించింది. తొలి రౌండ్ దాటలేం అనుకున్న స్థితిలో కూడా సెమీస్ చేరగలిగాం’ అని చిరాగ్ గుర్తు చేశాడు. అయితే తాము పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేమని మాత్రం సాత్విక్– చిరాగ్ వెల్లడించారు. ‘గత ఏడాది కాలంలో మేం పూర్తి ఫిట్‌గా ఉండి ఆడిన మ్యాచ్‌లు లేవు. ఏదో చిన్న చిన్న సమస్యలతోనే ఆడుతూ పోయాం. గాయాలు మా ఆటలో జోరును నిలువరిస్తున్నాయి. మేం 100 శాతం ఫిట్‌గా మారాల్సిన అవసరం ఉంది. అప్పుడే వరుస విజయాలు దక్కుతాయి’ అని ఈ భారత ద్వయం పేర్కొంది. ఈ నెల 25 నుంచి పారిస్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్ జరగనున్న నేపథ్యంలో వీరిపై గెలుపు అంచనాలు ఉన్నాయి. తమ ఫిట్నెస్ మెరుగవుతోందని, పూర్తి స్థాయిలో కోలుకొని మళ్లీ సత్తా చాటుతామన్న డబుల్స్ జంట వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలమని విశ్వాసం వ్యక్తం చేసింది. -
డాక్టర్ వేస్ పేస్ అంత్యక్రియలు పూర్తి
కోల్‌కతా: ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ క్రీడా వైద్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ వేస్ పేస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడ్డ 80 ఏళ్ల వేస్ గురువారం కన్నుమూయగా... ఆదివారం కోల్‌కతాలోని సెయింట్ థామస్ చర్చ్‌లో జరిగిన ఆయన అంత్యక్రియల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ సహా పలు క్రీడా రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. భారత హాకీకి ఆయన చేసిన సేవలకు గుర్తుగా... వేస్ పార్థీవ దేహానికి యువ ఆటగాళ్లు హాకీ స్టిక్‌లతో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వేస్ కుమారుడు లియాండర్ పేస్‌ను గంగూలీ ఓదార్చాడు. మాజీ క్రికెటర్ అరుణ్ లాల్, తృణముల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఒబ్రియన్తో పాటు ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్, హాకీ బెంగాల్, కోల్‌కతా క్రికెట్ క్లబ్, ఫుట్‌బాల్ క్లబ్‌ల ప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టులో వేస్ సభ్యుడు కాగా... ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం వైద్యుడిగా భారత క్రీడారంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్, అఖిల భారత ఫుట్‌బాల్ సంఘం, భారత ఒలింపిక్ సంఘం, భారత డేవిస్ కప్‌కు వేస్ వైద్య కన్సల్టెంట్‌గా పనిచేశారు. వేస్ సేవలు వెలకట్టలేనివి: టిర్కీ హాకీ, రగ్బీ, ఫుట్‌బాల్, టెన్నిస్ ఇలా అనేక క్రీడల్లో ప్రవేశం ఉన్న వేస్... ఆ తర్వాతి కాలంలో భారతీయ క్రీడా వైద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ‘వేస్ పేస్ లోటు పూడ్చలేనిది. ఆటతో సంబంధం లేకుండా భారతీయ క్రీడారంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. ప్లేయర్‌గా, డాక్టర్‌గా, మెంటార్‌గా, కన్సల్టెంట్‌గా, క్రీడా పరిపాలకుడిగా ఆయన జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. జాతీయ శిబిరాల సమయంలో ఆయన ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ప్లేయర్లతో పాటే ఉండి వారి బాగోగులు చూసుకునేవారు. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్ సమయంలో ఆయన సేవలను దగ్గర నుంచి చూశా. ప్రస్తుతం క్రీడా రంగంలో వైద్యుల ప్రాధన్యత పెరిగింది. అవేవీ లేని సమయంలో ఆయనే అన్నీ అయి నడిపించారు’ అని టిర్కీ గుర్తుచేసుకున్నాడు. వేస్ది పూర్తి స్పోర్ట్స్ ఫ్యామిలీ అని... ఒకే కుటుంబం నుంచి వీస్ హాకీలో ఒలింపిక్స్ పతకం నెగ్గితే ఆయన కుమారుడు లియాండర్ పేస్ టెన్నిస్‌లో ఆ కల తీర్చుకున్నాడని.. వేస్ భార్య జెన్నిఫర్ భారత బాస్కెట్‌బాల్ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించారని టిర్కీ గుర్తు చేశాడు. -
ఆసియా కప్ హాకీ టోర్నీ మస్కట్ ‘చాంద్’ ఆవిష్కరణ
రాజ్‌గిర్ (బిహార్): ఈ నెలాఖరులో భారత్ ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీకి సంబంధించి కనువిందు చేసే ‘మస్కట్’ను ఆదివారం ఆవిష్కరించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధికారిక మస్కట్‌గా ‘చాంద్’ (చందమామ)ను ఆవిష్కరించారు. భారత దివంగత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ ప్రాక్టీస్ స్ఫూర్తితో పాటు బిహార్‌లోని ప్రఖ్యాత వాల్మీకి టైగర్ రిజర్వ్‌లోని పులుల శౌర్యానికి ప్రతీకగా ‘చాంద్’ను ఆవిష్కరించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) తెలిపింది. ఫ్లడ్‌లైట్లు కాదు కదా... కనీసం పూర్తిస్థాయి వీధి దీపాలు లేని ఆ రోజుల్లో చందమామ పంచిన వెన్నెల వెలుగుల్లోనే ధ్యాన్‌చంద్ తన ప్రాక్టీస్‌ను పూర్తి చేసేవారు. ఆ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఆయన పుట్టిన రోజున (ఆగస్టు 29) మొదలయ్యే ఆసియా కప్ టోర్నీకి ‘చాంద్’ మస్కట్‌ను ఖరారు చేశారు. సెపె్టంబర్ 7 వరకు రాజ్‌గిర్‌లోని స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఆసియా దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో మొదట్లో ఆసక్తి కనబరిచిన దాయాది పాకిస్తాన్ జట్టు చివరకు వైదొలగింది. పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ బరిలోకి దిగనుంది. ఆసియా కప్ టోర్నీ విజేత వచ్చే ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. 16 జట్లు పోటీపడే ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటికే ఆస్ట్రేలియా, స్పెయిన్, అర్జెంటీనా, జర్మనీ, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. -
టాప్ షూటర్లంతా బరిలోకి...
న్యూఢిల్లీ: కజకిస్తాన్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత టాప్ షూటర్లంతా పతకాలపై గురిపెట్టేందుకు సిద్ధమయ్యారు. డబుల్ ఒలింపిక్ పతకాల విజేత మను భాకర్, సిఫ్త్ కౌర్, అర్జున్ బబుతా, సౌరభ్ చౌదరి తదితర మేటి షూటర్లు సహా 182 మందితో కూడిన భారత బృందం ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొంటోంది. ఈ టోర్నీ బరిలోకి దిగుతున్న భారీ సేన మన జట్టే కావడం విశేషం. సోమవారం నుంచి కజకిస్తాన్‌లోని షింకెంట్ నగరంలో ఈ పోటీలు జరుగనున్నాయి. రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ విభాగాల్లో 58 ఈవెంట్లలో పోటీలుంటాయి. ఇందులో 46 వ్యక్తిగత ఈవెంట్లు కాగా, 12 మిక్స్డ్ టీమ్ ఈవెంట్ పోటీలు నిర్వహిస్తారు. భారత్ సీనియర్ విభాగంలోనే ఒక్కో ఈవెంట్లో ఐదుగురు చొప్పున షూటర్లను బరిలోకి దింపుతోంది. వీటిలో మూడు పతకాలకు ఆస్కారం ఉండగా, మరో ఇద్దరు ర్యాంకింగ్ పాయింట్స్ కోసం ఆడతారు. ఇప్పటివరకు జరిగిన ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లలో భారత్ 59 పతకాలు గెలుపొందింది. ఇందులో 21 స్వర్ణాలు, 22 రజతాలు, 16 కాంస్యాలున్నాయి. చివరిసారిగా చాంగ్వాన్ (దక్షిణ కొరియా)లో జరిగిన ఈవెంట్లో భారత జట్టు ఆరు బంగారు పతకాలు, 8 రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 19 పతకాలతో టాప్–3లో నిలిచింది. గత టోర్నీలో సత్తా చాటిన మను భాకర్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ విజయోత్సాహంతో ఉంది. ఆమె 10 మీ., 25 మీ పిస్టల్ ఈవెంట్లతో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ పోటీపడనుంది. ఆమెతో పాటు ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబుతా, సౌరభ్, అనిశ్ భన్వాలాలపై భారత్ పతకాల ఆశలు పెట్టుకుంది. సీనియర్, జూనియర్ విభాగాల్లో ఒలింపిక్ ఈవెంట్స్‌తో పాటు ఒలింపిక్స్‌లో లేని సెంటర్ ఫైర్, స్టాండర్డ్, ఫ్రీ పిస్టల్, రైఫిల్ ప్రోన్, డబుల్ ట్రాప్ ఈవెంట్లలో కూడా పోటీలు నిర్వహిస్తారు. -
ఆంధ్రప్రదేశ్ ఓటమి
జలంధర్: హాకీ ఇండియా (హెచ్ఐ) జూనియర్ పురుషుల జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు ఘోర పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కర్ణాటక 10–1 గోల్స్ తేడాతో ఆంధ్రప్రదేశ్‌పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కర్ణాటక తరఫున హర్పాల్ (12వ, 35వ నిమిషాల్లో), తనీశ్ రమేశ్ (17వ, 56వ ని.) చెరో రెండు గోల్స్ సాధించారు. మిగతా వారిలో రాజు మనోజ్ గైక్వాడ్ (5వ ని.) నితీశ్ శర్మ (10వ ని.) కెపె్టన్ ధ్రువ (25వ ని.), అచ్చయ్య (24వ ని.), కుశాల్ బోపయ్య (51వ ని.), పూజిత్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. మిగతా మ్యాచ్‌ల్లో హరియాణా 3–0తో దాద్రా నగర్ హవేలిపై విజయం సాధించగా, ఉత్తర ప్రదేశ్ 9–2తో మహారాష్ట్రపై జయభేరి మోగించింది. ఆతిథ్య పంజాబ్ 8–4తో తమిళనాడుపై గెలుపొందింది.