Rajanna
-
అమర జవాన్ అనిల్‌కు నివాళి
బోయినపల్లి(చొప్పదండి): హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన అమర జవాన్ పబ్బాల అనిల్‌కుమార్‌కు గ్రామస్తులు ఘనంగా నివాళి అర్పించారు. సైనిక దినోత్సవం సందర్భంగా అనిల్‌కు సేనా అవార్డు, ఆయన సతీమణి సౌజన్యకు వీరనారీ టైటిల్ అందించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును అతని భార్య, పిల్లలు అయాన్, అరయ్లతో కలిసి అనిల్ విగ్రహం వద్ద పెట్టి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అనిల్ స్వగ్రామంలో గ్రామస్తులు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు దండు వినోద్, జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడు ఏనుగుల కనకయ్య, యువజ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కౌడగాని వెంకటేశ్, మండలాధ్యక్షుడు ఏనుగుల అనిల్‌కుమార్, బత్తుల మహేందర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పురిటిగడ్డ రుణం తీర్చుకుంటా
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● రుద్రంగిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనరుద్రంగి(వేములవాడ): నా సొంతూరు ప్రజలు ఇచ్చిన అవకాశంతో పురిటిగడ్డ రుణం తీర్చుకుంటానని, రుద్రంగిని నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండలంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రాష్ట్ర కోపరేటీవ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డితో కలిసి రూ.2.3 కోట్ల అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 2009 కంటే ముందే రుద్రంగి నాగారం, ఫాజుల్‌నగర్ రిజర్వాయర్లను పూర్తి చేసుకున్నామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వేములవాడ వెనకబడిందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుతానన్నారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు జనవరి 26 నుంచి అందిస్తామని తెలిపారు. రైతుభరోసాతో ప్రతీ ఎకరాకు రూ.12వేలు అందజేయనున్నట్లు చె ప్పారు. గత ప్రభుత్వం ఆర్భాటాలకు పోయి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రంగి మండలం మానాలకు వచ్చిన విప్.. చిన్నతనంలో తాను ఆడి, పెరిగిన తాత ఇంటిని చూసి ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. స్థానికులతో ముచ్చటించారు. ఈఈ సుదర్శన్‌రెడ్డి, ఆర్డీవో శేషాద్రి, డీఈ పవనకుమారి, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో నట రాజ్, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, పీఆర్ ఏఈ మనోహర్ పాల్గొన్నారు. -
రథోత్సవం.. రమణీయం
ఇల్లంతకుంట(మానకొండూర్): మూడు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న జంగారెడ్డిపల్లి రామలింగేశ్వరస్వామి జాతర ఉత్సవాలు గురువారం ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన రథోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. తమ గండాలు తొలగిపోవాలని పలువురు భక్తులు గండదీపం మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు రథోత్సవంలో పాల్గొన్నారు. అర్చకులు పవన్‌శర్మ, విఠల్‌శర్మ, లింగమూర్తి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ బందోబస్తు చేపట్టారు. ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు సేవలందించారు. పీహెచ్సీ సిబ్బంది వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. -
ఆర్ఎంపీ క్లినిక్‌లలో తనిఖీలు
● నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తింపు ● పలు గ్రామాల్లో సీజ్ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట/వేములవాడరూరల్/వేములవాడఅర్బన్/కోనరావుపేట/బోయినపల్లి/రుద్రంగి/ఇల్లంతకుంట/చందుర్తి/వీర్నపల్లి: జిల్లాలోని పలు ఆర్ఎంపీల క్లినిక్‌లలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. రాచర్లగొల్లపల్లిలోని అశ్విని క్లినిక్, శివ మందుల దుకాణం, ఎల్లారెడ్డిపేటలోని నాగరాజు క్లినిక్, శ్రీవేంకటేశ్వర మెడికల్ షాపుల్లో తనిఖీలు చేశారు. వేములవాడరూరల్ మండలంలోని వట్టెంల, కోనరావుపేటలోని మల్లేశం క్లినిక్‌లో విచారణ చేపట్టారు. గంభీరావుపేటలోని పీఎంపీ, ఆర్ఎంపీల క్లినిక్‌లను అధికారులు తనిఖీ చేశారు. వేములవాడ పట్టణం గాంధీనగర్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మూడు క్లినిక్‌లను సీజ్ చేశారు. బోయినపల్లి మండలం నీలోజిపల్లిలో ఓ ఆర్ఎంపీ తన క్లినిక్‌లో అనుమతులు లేకుండా యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్లు నిల్వ చేయడంతో సీజ్ చేశారు. రుద్రంగి మండల కేంద్రంలోని పలు ఆర్ఎంపీ, పీఎంపీల క్లినిక్‌లను అధికారులు తనిఖీలు చేశారు. చందుర్తి మండలం నర్సింగపూర్, జోగాపూర్, కిష్టంపేట, రామన్నపేట, చందుర్తి, మల్యాల గ్రామాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లపై అధికారులు దాడులు చేశారు. చందుర్తిలోని శ్రీప్రవళిక ప్రథమ చికిత్స కేంద్రం, రుద్రంగిలో వేంకటేశ్వర క్లినిక్‌లను సీజ్ చేశారు. వీర్నపల్లిలోని మణికంఠ క్లినిక్‌ను సీజ్ చేశారు. మూడు ఆస్పత్రులు సీజ్ ఇల్లంతకుంటలోని మూడు ప్రైవేటు ఆస్పత్రులను సీజ్ చేసినట్లు మండల వైద్యాధికారి శరణ్య తెలిపారు. సిరిసిల్లరూరల్ సీఐ మొగిలి, ఎస్సై శ్రీకాంత్‌గౌడ్, పీహెచ్సీ వైద్యులు శరణ్య, జీవనజ్యోతి తనిఖీలు చేశారు. అనుమతులకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నట్లు గుర్తించి మండల కేంద్రంలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రులను సీజ్ చేశారు. కాగా తనిఖీ సమయంలో ఆయా ఆస్పత్రుల వైద్యులు అందుబాటులో లేరు.దాడులు చర్చనీయంసిరిసిల్లటౌన్: జిల్లాలో వైద్యశాఖ, పోలీస్, రెవెన్యూశాఖల అధికారులు బృందాలుగా విడిపోయి ప్రైవేటు ప్రాక్టీషనర్స్(ఆర్ఎంపీ, పీఎంపీ) క్లినిక్స్లపై దాడులు చేయడం చర్చనీయంగా మారింది. ప్రైవేటు ప్రాక్టీషనర్స్ క్లినిక్స్‌లలో ఇటీవల కొద్ది రోజుల క్రితం సిరిసిల్లలో ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రైవేటు ప్రాక్టీషనర్స్ క్లిని క్స్పై దాడులు జరుగగా.. గురువారం పోలీస్ బందోబస్తుతో, రెవెన్యూ, వైద్యశాఖల అధి కారులు తనిఖీలు చేయడం విశేషం. జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది క్లినిక్‌లలో తనిఖీలు జరిపినట్లు డీఎంహెచ్‌వో రజిత తెలిపారు. ఆస్పత్రి నిర్వహణ, నిబంధనలు అతిక్రమించరాదని వారిని హెచ్చరించినట్లు తెలిపారు. ఎవరిపై కూడా కేసు నమోదు చేయలేదని ఆమె వివరించారు. -
పోటీ పరీక్షల కోసం ఉచిత ఫౌండేషన్ కోర్సు
సిరిసిల్లకల్చరల్: రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మైనారిటీ స్టడీసర్కిల్‌లో వివిధ పోటీ ప రీక్షల కోసం అవసరమైన ఫౌండేషన్ కోర్సులో ఉ చితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ అ భివృద్ధి అధికారి ఆర్వీ రాధాబాయి గురువారం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ 1, 2, 3, 4తోపాటు డీఎస్సీ, ఎస్ఎస్బీ, ఆర్ఆర్బీ వంటి పోటీపరీక్షల అభ్యర్థులకు 4 నె లలు అందించే ఉచిత శిక్షణకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పే ర్కొన్నారు. ఈనెల 15లోపు దరఖాస్తులను కలెక్టరేట్లోని ఎఫ్26 గదిలో అందజేయాలని, వివరాలకు 99499 10328లో సంప్రదించాలని సూచించారు. -
26 నుంచి కొత్త పథకాలు
● మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ ఇల్లంతకుంట(మానకొండూర్): మరో నాలుగు కొత్త పథకాలను ఈనెల 26 నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని జంగారెడ్డిపల్లి రామలింగేశ్వరస్వామి జాతరలో గురువారం పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు, గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బి.రాఘవరెడ్డి, ప్యాక్స్ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, నాయకులు పసుల వెంకటి, అంతగిరి వినయ్‌కుమార్, మంద బాల్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. నార్మల్ డెలివరీలు చేయాలి ● జిల్లా వైద్యాధికారి రజితసిరిసిల్ల: ప్రైవేటు ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలు చేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లాలోని గైనకాలజిస్ట్‌లతో సమావేశమయ్యారు. డాక్టర్ రజిత మాట్లాడుతూ మొదటి కాన్పులోనే సాధారణ ప్రసవం చేయాలని, సీ సెక్షన్ తగ్గించాలని సూచించారు. స్కానింగ్ సెంట ర్లలోని రేడియాలజిస్ట్‌ల పేర్లను సర్టిఫికెట్లలో పొందుపరచాలన్నారు. వైద్యులు అంజలినా ఆల్ఫ్రెడ్, లక్ష్మీనారాయణ, పెంచలయ్య, సుగుణ, నయీమ, శోభారాణి, లీలాశిరీష, ఉమా, శ్రీవాణి, సత్యనారాయణ పాల్గొన్నారు. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా వనిత సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురా లిగా రెండోసారి కాముని వనితను నియమించారు. పార్టీకి ఆమె అందిస్తున్న సేవలను గుర్తిస్తూ వరుసగా రెండోసారి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పార్టీ నియమించింది. ఈమేరకు గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతారావు చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. -
పత్తిరైతు పరేషాన్
● దక్కని మద్దతు ధర ● కూలీల కొరతతోనూ ఇబ్బంది ● ప్రకృతి సహకరించక తగ్గిన దిగుబడి ● పెట్టుబడులు నిండవని రైతుల ఆందోళన ● మద్దతు ధర పెంచాలని డిమాండ్చందుర్తి(వేములవాడ): వాతావరణం అనుకూలించక పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీనికితోడు ప్రభుత్వ మద్దతు ధర కూడా అంతంతే ఉండడంతో పెట్టుబడి డబ్బులు కూడా వచ్చేలా లేవు. గతేడాది కంటే ప్రస్తుతం రూ.600 పెంచిన ప్రభుత్వం ఏ–గ్రేడ్ క్వింటాల్‌కు రూ.7,071, బీ–గ్రేడ్‌కు రూ.7,021 చెల్లిస్తుంది. ఇదే సమయంలో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.6,200 నుంచి రూ.6,500 వరకు చెల్లిస్తున్నారు. పూత, కాత దశలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అంతా రాలిపోయింది. పత్తిచేలలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో మొక్కలు ఎర్రబడిపోయాయి. వరుసగా కురిసిన వర్షాలు పత్తి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. వర్ష ప్రభావంతో.. జిల్లా వ్యాప్తంగా 45,625 ఎకరాల్లో పత్తి సాగైంది. వరి తర్వాత పత్తి పంటనే అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. ఆగస్టు నెలాఖరు నుంచి విస్తృతంగా కురిసిన వర్షాలతో నల్లరేగడి భూముల్లోని పత్తిపంట ఎర్రబడిపోయింది. కనీసం కలుపు తీసుకునే అవకాశం కూడా లేదు. భూమిలో తేమ శాతం ఉండడంతో తెగుళ్లు ఆశించడంతోపాటు కలుపు మొక్కలు ఏపుగా పెరిగాయి. పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు కురిసిన వర్షాలతో పత్తి పంట సాగుకు పెట్టుబడులు పెరిగాయి. ఒక్కో ఎకరాకు రూ.45వేలు నుంచి రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంటలో కలుపుమొక్కల తీవ్రత పెరిగి కూలీలు ఖర్చు నాలుగింతలైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 8 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కానీ ప్రస్తుతం 4 నుంచి 7 క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. కూలీల కొరతతో ఇబ్బంది యాసంగి వరి నాట్లతో పత్తితీసేందుకు కూలీల కొరత తీవ్రంగా ఉంది. వరినాట్ల కోసం పత్తి ఏరకుండా రైతులు ఉండడంతో ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి నల్లబడింది. దీంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారుల వైపే మొగ్గు జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించేందుకు తేమశాతం అడ్డు వస్తుండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నాయి. ఇదే అవకాశంగా ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.6,200 నుంచి రూ.6,500 పెడుతున్నారు. ఫలితంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇతను గుగులోతు రాములునాయక్. చందుర్తి మండలంలోని జలపతితండాకు చెందిన పత్తిరైతు. పది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశాడు. నల్లరేగడి భూములు కావడం, వరుసగా వర్షాలు కురవడంతో మొదట్లోనే మొక్కలు ఎర్రబడ్డాయి. భూమిలో తేమ ఎక్కువ కావడంతో పూత, కాయలు రాలిపోయాయి. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవని ఆందోళన చెందుతున్నాడు.ధరలు ఇలా..(క్వింటాల్‌కు) ప్రభుత్వం.. ఏ–గ్రేడ్ : రూ.7,071 బీ–గ్రేడ్ : రూ.7,021 ప్రైవేట్ వ్యాపారులు : రూ.6,200 -
పేదల్లో పెద్దలా?
● రేషన్ జాబితాలో రిటైర్డ్ ఉద్యోగులు, కోటీశ్వరులు ● కులగణనలో తెల్లకార్డు లేదన్నవారి పేర్లు జాబితాలో ● గ్రామాల్లో రేషన్ దరఖాస్తుల్లో వింత చోద్యాలు ● కులగణన సర్వేలో లోపం వల్లే ఈ పొరపాటు ● జాబితాలో పేరులేని పేదలకు దక్కని ఊరట ● 360 డిగ్రీస్ యాప్‌తో ఆస్తుల చిట్టా తేటతెల్లంసాక్షిప్రతినిధి, కరీంనగర్: సమాజంలో ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు నెలనెలా రేషన్ కోసం, ఆరోగ్యశ్రీ ఇతర సంక్షేమ పథకాలకు తెల్లరేషన్‌కార్డులు ప్రామాణికం. అయితే, ఈ రేషన్‌కార్డులు లేని కుటుంబాల జాబితాను ప్రభుత్వం రూపొందించి అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు పంపింది. ఈ జాబితాపై వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు సర్వే ప్రారంభించారు. ఈ జాబితా చూసిన గ్రామస్తులు, అధికారులు అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఆ గ్రామంలో భూస్వాములు, కోటీశ్వరులు, వ్యాపారులు కూడా జాబితాలో ఉన్నారు. ఇలా ఎందుకు జరిగిందని ఆరాతీస్తే.. ఇటీవల జరిగిన బీసీ కులగణన సర్వేలో వివరాల నమోదులో లోపమే ఇందుకు కారణమని పలువురు అధికారులు వెల్లడించారు. ఏం జరిగింది? ఇటీవల సామాజిక కులగణనును ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహించింది. ఆ సమయంలో చాలా మంది తమ కుటుంబాలకు రేషన్‌కార్డు లేదు అని చెప్పారు. అందులో రేషన్‌కార్డు లేని పేద, మధ్య తరగతి కుటుంబాలతోపాటు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, కోటీశ్వరులు, భూస్వాములు, వ్యాపారులు ఇతరులు తమకు రేషన్కార్డులేదని చెప్పారు. వచ్చిన ఎన్యూమరేటర్లు కూడా అవే వివరాలు నమోదు చేసుకుని వెళ్లిపోయారు. అప్పుడు రేషన్‌కార్డు కాలమ్‌లో లేదని తెలిపిన పేద, ఉన్నత వర్గాలకు చెందిన అందరి పేర్లు ప్రత్యక్షమయ్యాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేస్తున్న వారి ఐడీ నంబర్లు రాసుకోవడం వల్ల వారి పేర్లు రాలేదని, మిగిలిన వారి పేర్లు జాబితాలో వచ్చాయని వివరిస్తున్నారు. ఈ జాబితాలో అర్హులను గుర్తించేదుకు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో సర్వే జరుగుతోంది. అనంతరం గ్రామసభల్లో ఈ జాబితాలను ప్రదర్శించి అభ్యంతరాల ఆధారంగా చర్యలు చేపడతారు. 360 డిగ్రీస్ యాప్‌తో దొరికిపోతారు అదే సమయంలో అధికారులు అంతా ఈ జాబితాపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అంటున్నారు. ఈ సర్వేతోపాటు గ్రామాల్లో నిర్వహించే గ్రామసభల్లోనే అనర్హులను (అధిక ఆదాయం ఉన్నవారు) 90 శాతం గుర్తిస్తామని ధీమాగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా తమ దృష్టి నుంచి తప్పించుకున్నా.. జాబితాపై పౌరసరఫరాలశాఖ 360 డిగ్రీస్ యాప్‌లో తుదిజాబితాను మరోసారి తనిఖీ చేస్తుంది. ఈ యాప్‌లో దరఖాస్తు దారుల భూములు, వాహనాలు, ఐటీ వివరాలు, ఆర్థిక స్థితిగతులు మొత్తం తెలిసిపోతాయని విశ్వాసంగా ఉన్నారు. కాబట్టి, ఈ జాబితాపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అభిప్రాయపడ్డారు. జాబితాలో లేని వారిపై మౌనం చాలాచోట్ల రేషన్‌కార్డు జాబితాలో కొందరు పేదలకు చోటు దక్కలేదు. వీరికి జరిగిన విషయం తెలియక శ్రీమంతులు, రిటైర్డ్ ఉద్యోగుల పేర్లు జాబితాలో ఎక్కి.. తమ పేర్లు ఎక్కకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు మౌనం వహిస్తున్నారు. రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకుని, అన్ని అర్హతలు ఉండీ.. జాబితాలో చోటు దక్కని పేదలకు దరఖాస్తు చేసుకునేందుకు తిరిగి ఎప్పుడు అవకాశం కల్పిస్తారు? అన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. అది ప్రభుత్వం చేతిలోనే ఉందని, దానిపై తమకు ఎలాంటి సమాచారం లేదని రెవెన్యూ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు స్పష్టంచేస్తున్నారు. రేషన్‌కార్డు దరఖాస్తులుసిరిసిల్ల 20,976పెద్దపల్లి 14,910జగిత్యాల 35,101కరీంనగర్ 18,384జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీరావుపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగి తండ్రిపేరు రేషన్‌కార్డు దరఖాస్తు జాబితాలో పేరు ప్రత్యక్షమైంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కమాన్‌పూర్ గ్రామంలో విశ్రాంత ఎంఈవో, రైస్‌మిలర్ల పేర్లు రేషన్‌కార్డు దరఖాస్తుల్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. -
ఎన్సీడీ వ్యాధుల నమోదు చేయాలి
సిరిసిల్ల/బోయినపల్లి: జిల్లాలో ఎన్సీడీ(బీపీ, షుగర్, క్యాన్సర్) వ్యాధుల నమోదు లక్ష్యం చేరుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. బోయినపల్లి మండలం కొదురుపాక, విలాసాగర్ పీహెచ్‌సీలను బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. టీబీ, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాల లక్ష్యాలు సాధించాలని వైద్యాధికారులకు డీఎంహెచ్‌వో సూచించారు. కొదురుపాక వైద్యాధికారి రేణుప్రియాంక, విలాసాగర్ వైద్యాధికారి అనిత, డిప్యూటీ డెమో రాజకుమార్, సీహెచ్‌వో సత్యనారాయణ పాల్గొన్నారు. జాతీయస్థాయిలో రామానుజమ్మకు పతకం సిరిసిల్ల: జాతీయ స్థాయి ఫస్ట్ సౌత్ ఏషియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లో సిరిసిల్లకు చెందిన టమటం రామానుజమ్మ(70) పతకం సాధించారు. కర్నాటకలోని మంగళూర్ మంగళ స్టేడియంలో జనవరి 10, 11, 12 తేదీల్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో 70 ఏళ్లకు పైబడిన విభాగంలో రామానుజమ్మ పోటీపడ్డారు. 800 మీటర్ల పరుగుపందెంలో మూడో స్థానంలో నిలిచి పతకం సాధించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయస్థాయిలో పతకం సాధించిన ఏకైక మహిళగా రామానుజమ్మ గుర్తింపు పొందారు. 7న ‘వెయ్యి గొంతులు– లక్ష డప్పులు’ సిరిసిల్లటౌన్: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించే ‘వెయ్యిగొంతులు– లక్ష డప్పులు’ మహాప్రదర్శన నిర్వహించనున్నట్లు సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు బడుగు లింగయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరులో బుధవారం డప్పుచప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈనెల 24న సిరిసిల్లలో నిర్వహించే ఎమ్మార్పీఎస్ జిల్లాస్థాయి సన్నాహక సదస్సుకు మందకృష్ణమాదిగా హాజరవుతున్నారని, పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. నాయకులు ఆవునూరి ప్రభాకర్, కానాపురం లక్ష్మణ్, లింగంపెల్లి సత్యనారాయణ, సావనపల్లి రాకేశ్, పసుల దుర్గయ్య, మంగళి చంద్రమౌళి, సంతోష్ పాల్గొన్నారు. గోదారంగనాథుల కల్యాణం బోయినపల్లి(వేములవాడ): మండలంలోని మాన్వాడ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గోదారంగనాథుల కల్యాణం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని మండపంలో ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి కల్యాణం జరిపించారు. స్వామివారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పరాంకుశం రమేశ్‌తో పాటు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. -
పథకాలు శ్రద్ధగా అమలు చేయాలి
● ఇన్చార్జి డీపీవో శేషాద్రితంగళ్లపల్లి(సిరిసిల్ల): తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలలో లబ్ధిదారుల ఎంపికలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డీఆర్డీవో, ఇన్చార్జి డీపీవో, మండల నోడల్ అధికారి శేషాద్రి పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండల పరిషత్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అర్హులకు పథకాలు అందేలా చూడడంతోపాటు అనర్హులను ఏరివేయాలని సూచించారు. ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, ఎంపీవో మీర్జా అహ్మద్ బేగ్, ఎంఈవో రాజునాయక్ పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రోడ్డు భద్రతపై ఆటోడ్రైవర్లకు అవగాహన ఉండాలని మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ సూచించా రు. మండల కేంద్రంలో బుధవారం ఆటోడ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎంవీఐ వంశీధర్ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడప డం నేరమన్నారు. సహాయక వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజు, కానిస్టేబుల్ ప్రశాంత్, సంజన డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు కట్టెల బాబు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. -
30 ఏళ్ల కల.. తీరిన వేళ
● నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం ● పంటకు సరైన ధర కోసం అనేక పోరాటాలు ● ఎట్టకేలకు హామీ నెరవేర్చిన ప్రధాని మోదీ ● చిగురిస్తున్న ఆశలు ● ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాల్లో సాగుజగిత్యాల అగ్రికల్చర్: పసుపును ఆహార పదార్థాల్లోనే కాకుండా చర్మ సౌందర్య సాధనాల్లో, రంగులు, ఔషధ పరిశ్రమల్లో, పరిమళ ద్రవ్యాల తయారీలో వాడుతుండటంతో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఒకప్పుడు బంగారంతో పోటీ పడ్డ పసుపు పంటకు కొన్నేళ్లుగా సరైన ధర రావడం లేదు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు 30 ఏళ్లు అనేక పోరాటాలు చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 178 మంది రైతులు నామినేషన్ వేసి, పసుపు బోర్డు ఏర్పాటుపై దేశవ్యాప్త చర్చకు తెరలేపారు. 2023 పార్లమెంట్ ఎన్నికల సమయంలో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. తాజాగా, ఆ హామీని నెరవేరుస్తూ బోర్డును సంక్రాంతి సందర్భంగా ప్రారంభించడంతోపాటు నిజామాబాద్‌కే చెందిన గంగారెడ్డిని చైర్మన్‌గా ప్రకటించడంతో పసుపు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జగిత్యాలలోనే 30వేల ఎకరాలకు పైగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 50వేల ఎకరాల్లో పసుపు సాగవుతుంటే, ఒక్క జగిత్యాల జిల్లాలోనే 30 వేల ఎకరాలకు పైగా పండిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పసుపు ధర క్వింటాల్‌కు రూ.5వేల నుంచి రూ.6వేలు ఉండటంతో, గిట్టుబాటు కాక రైతులు పసుపు సాగు విస్తీర్ణం తగ్గించారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఎక్కువగా మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో పసుపు సాగుచేస్తున్నారు. ఇందుకోసం డ్రిప్ సిస్టం వాడుతూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. దీనికితోడు, ఆధునిక యాజమాన్య పద్ధతులు పాటించి, ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల పసుపు దిగుబడి తీస్తున్నారు. పసుపు 9 నెలల పంట కావడంతో, రైతులు ఇంటి పంటగా భావించి, దాదాపు ఎకరాకు సేంద్రియ ఎరువుల పేరిట రూ.లక్ష వరకు ఖర్చు చేస్తుంటారు. వారి దశ, దిశ మార్చింది కూడా పసుపు పంటే కావడం విశేషం. పసుపు బోర్డుతో సాగు మరింతగా పెరిగి, మంచి ఆదాయం వస్తుందని రైతులు భావిస్తున్నారు. బోర్డుతో ఏం లాభం? పసుపు బోర్డు ఏర్పాటు వల్ల పసుపు పంట ఉత్పత్తులను నేరుగా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మంచి ధర వస్తుంది. అలాగే, పసుపు ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి, పలు ఉప ఉత్పత్తులుగా తయారు చేయడం వల్ల కూడా అధిక రేటు పొందవచ్చు. పంటకు మార్కెట్లో ధర లేనప్పుడు నేరుగా పసుపు బోర్డు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. పంట నిల్వకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయవచ్చు. కనీస మద్దతు ధర దక్కుతుంది. పసుపు పంటపై శాస్త్రవేత్తల బృందం రకరకాల పరిశోధనలు చేసి, కుర్కుమిన్ శాతం అధికంగా ఉండేలా దిగుబడులను పెంచడమే కాకుండా తెగుళ్లను, పురుగులను తట్టుకునే నూతన రకాలను రూపొందించే వీలుంటుంది. పసుపు సాగు చేసే భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయవచ్చు. ఈ పంటలో వస్తున్న ఆధునిక యంత్రాలు, శాస్త్ర, సాంకేతిక టెక్నాలజీని రైతులకు పరిచయం చేయవచ్చు. పసుపు పంట తవ్వడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, పాలిషింగ్ చేయడం తదితరాలకు సబ్సిడీపై ఆధునిక యంత్రాలను సమకూరుస్తారు. అత్యధిక నిధులకు అవకాశం పసుపుబోర్డులో వ్యవసాయ, ఉద్యాన, ఔషధ, వైద్య, ఆర్థికం, వాణిజ్య, పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు వంటి పలు రంగాలకు చెందిన ప్రముఖులు, రైతు ప్రతినిధులు, ఎగుమతిదారులు ఉంటారు. సబ్సిడీకి పసుపు విత్తనంతోపాటు ఆధునిక యంత్రాలను అందించే వీలుంటుంది. పసుపు సాగుపై గ్రామాల్లో రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహించవచ్చు. పసుపు బోర్డుకు కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుంది, తద్వారా పసుపు పంట ఉత్పాదకతను పెంచి, రైతులకు అదనపు ఆదాయం అందించవచ్చు. ప్రధానంగా పసుపు విత్తనం నాటినప్పటి నుంచి మార్కెట్‌కు తీసుకెళ్లే వరకు నాణ్యత వంటి విషయాలపై పసుపుబోర్డు దృష్టి పెట్టనుంది. పసుపు ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.బోర్డు ఏర్పాటు అభినందనీయం పసుపు బోర్డు 30 ఏళ్ల రైతుల కల. నిజామాబాద్‌లో ఏర్పాటు అభినందనీయం. తాత్కాలిక కార్యాలయం అక్కడే ఏర్పాటు చేసినప్పటికీ, శాశ్వత ప్రాతిపదికన నిజామాబాద్–జగిత్యాల మధ్యలో ఏర్పాటు చేస్తే రెండు జిల్లాలకు ఉపయోగకరంగా ఉంటుంది. – పన్నాల తిరుపతి రెడ్డి, పసుపు రైతుల ఉద్యమ నాయకుడు, జగిత్యాలరైతుల ఆదాయం పెరుగుతుంది పసుపు బోర్డుతో అనుకున్న ధర వస్తే రైతుల ఆదాయం పెరుగుతుంది. పసుపు సాగు ఘననీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. రైతుల జీవితాలు బాగుపడతాయి. పసుపు ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే, ఇక్కడి యువతకు ఉపాధి లభిస్తుంది. – మామిడి నారాయణ రెడ్డి, పసుపు రైతుల ఉద్యమ నాయకుడు, మెట్పల్లి -
గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులపై సమీక్షసిరిసిల్ల: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పటిష్టమైన కార్యాచరణను అమలుచేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయానల్నారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా అధికారులతో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్‌కార్డుల జారీ అంశాలపై సమీక్షించారు. ఈనెల 26 నుంచి కొత్తగా నాలుగు ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి పాటించాల్సిన విధానాలపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలోని అంశాలు, గైడ్‌లైన్స్‌పై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రైతుభరోసాకు సంబంధించి అధికారులు వ్యవసాయ యోగ్యమైన భూమో.. కాదా.. అని మాత్రమే పరిశీలించాలని సూచించారు. భూభారతి(ధరణి) నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతుభరోసా జాబితా నుంచి తొలగించాలని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూమిలో పంట వేసినా, వేయకపోయినా రైతుభరోసా అందుతుందనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తహసీల్దార్, మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో పట్టాదార్ పాస్‌పుస్తకాల డేటా, గూగల్మ్యాప్, రెవెన్యూ మ్యాప్‌ల వారీగా పరిశీలించాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చేసిన భూములను చెరువులు, కుంటలలో ఉన్న భూములను డీ–మార్కింగ్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. నాలా భూములను గుర్తించాలి జిల్లా పంచాయతీ అధికారి, పరిశ్రమల అధికారి, ఎంపీడీవోలు, ఎంపీవీవోలు, పంచాయతీ కార్యదర్శులు సర్వేనంబర్ల వారీగా ఆబాదీ భూములను డీ–మార్కింగ్ చేయాలని, పట్టణాలకు స మీపంలో పరిశ్రమల భూములు, నాలా కన్వర్షన్, లేఔట్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తు భూముల వివరాలు రైతు భరోసా నుంచి తొలగించాలన్నారు. భూమి లేని పేదలకు.. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి రూ.12వేలు రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిందని, 2023–24 సంవత్సరానికి 20 రోజులు పనిచేసిన భూమి లేని రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలి పారు. గ్రామసభలో ఎంపిక చేసిన జాబితాపై అభ్యంతరాలు వస్తే ఎంపీడీవో 10 రోజుల్లో పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులకు రేషన్‌కార్డులు సామాజిక ఆర్థిక సర్వే కింద జిల్లాలో 9 వేల కుటుంబాలకు తెల్ల రేషన్‌కార్డు లేదని తేలిందని, మండలాలలో ఎంపీడీవోలు, పట్టణాలలో మున్సిపల్ కమిషనర్లు రేషన్‌కార్డుల జారీ పర్యవేక్షించాలన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేషన్‌కార్డుల ప్రోసిడింగ్స్ పంపిణీ చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లను సైతం అత్యంత పేదలకు మొదటి జాబితాలో చోటు కల్పించాలన్నారు. ఈనెల 16 నుంచి 20 వరకు పరిశీలించి, 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించి అర్హుల జాబితా ప్రదర్శించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్డీవో శేషాద్రి, జిల్లా వ్యవసాయాధికారి అబ్జల్బేగం, బీసీ సంక్షేమ అధికారి రాజమోహన్, మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు తహసీల్దార్లు, వ్యవసాయ ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయ భరోసాకు సిద్ధం
● నేటి నుంచి పల్లెల్లో గ్రామసభలు ● ఉపాధిహామీ కనీస పనిదినాలు 20గా నిర్ధారణ ● కూలీల వివరాల అప్‌లోడ్‌లో సమస్యలు ● భోగి, సంక్రాంతి రోజూ 20 గంటలు పని చేసిన ఉద్యోగులు ● గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆరోపణలు.. ఇప్పుడూ వారే కీలకం ● 100 శాతం పూర్తయిన ఆధార్ సీడింగ్ ● ఉమ్మడి జిల్లాలో 8,77,798 మంది కూలీలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు అందించే సంక్షేమ పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అంతా సిద్ధమైంది. వ్యవసాయ భూమి లేని కూలీలుగా పనిచేస్తున్న వారందరికీ 2 పంటల సమయంలో రూ.6వేల చొప్పున అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో నమోదైన కూలీలను ఎంపిక చేయనుంది. ఇందుకోసం కనీసం ఏడాదిలో 20 రోజులైనా ఉపాధిహామీ పనిచేసి ఉండాలన్న నిబంధన విధించింది. ఈక్రమంలో అన్ని జిల్లాల్లో ఉపాధిహామీ జాబ్‌కార్డుల ప్రక్షాళనకు అధికారులు నడుం బిగించారు. ఇందుకోసం వ్యవసాయ కూలీల ఆధార్ కార్డులను అనుసంధానం చేస్తున్నారు. అనర్హుల గుర్తింపు, డబుల్ కార్డులు, 20 రోజుల్లోపు పని చేసినవారి వివరాలు గ్రామాల వారీగా జాబితా రూపొందించి, తిరిగి అప్లోడ్ చేస్తున్నారు. కూలీల గుర్తింపు సాగుతోందిలా.. ఉపాధి హామీ కూలీల డేటా మొత్తం ఎన్ఐసీ వెబ్సైట్లో ఉంటుంది. ఇందులోని వివరాలను డీఆర్డీవో అధికారులు ముందుగా డౌన్లోడ్ చేస్తున్నారు. కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఉంటుంది. అందులో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సభ్యులు ఉండవచ్చు. తర్వాత స్థానికంగా ఉన్న కూలీల వివరాలను, ఆధార్‌కార్డులతో అప్డేట్ చేస్తున్నారు. అంటే ప్రతీ కూలీ పేరు, ఆధార్ కార్డు నంబర్, జాబ్‌కార్డు, బ్యాంకు ఖాతా తదితర వివరాలు సరిగా ఉన్నాయో లేదా తనిఖీ చేస్తున్నారు. అంతేకాదు, కొత్తగా ఎవరైనా కూలీలు చేరారా? పాత వారు స్థానికంగా ఉంటున్నారా? ఎవరైనా మరణించారా? పెళ్లి చేసుకొని వెళ్లిపోయారా? తదితర వివరాలను వాస్తవ వివరాలతో సరిపోలుస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ఐసీ వెబ్సైట్ నుంచి ఒక్కో గ్రామం వివరాలను డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అధికారులకు ఇబ్బందిగా మారింది. సర్వర్‌లో బిజీ కారణంగా ఒక్కో డేటా డౌన్లోడ్ అయ్యేందుకు, దాన్ని తిరిగి మరో కొత్త ఎక్సెల్ షీట్లో పొందుపరిచి, రాష్ట్ర వెబ్సైట్(సీఎంఎస్)లో పొందుపరిచేందుకు కనీసం గంట వరకు సమయం పడుతోంది. అధికారులకు పనిభారం ఎన్ఐసీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న సమాచారాన్ని తిరిగి మూడు దశల్లో క్రాస్ చెక్ చేస్తున్నారు. మొదటిది దశలో వలస వెళ్లిన, పెళ్లి చేసుకున్న, చనిపోయిన, డబుల్ కార్డులను రిజెక్ట్ చేస్తున్నారు. రెండో దశలో రిజెక్ట్ అయిన వివరాలను ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేస్తున్నారు. మూడో దశలో వివరాలను డీఆర్డీవో టెక్నికల్ బృందం స్టేట్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తోంది. ఇది అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం కావడంతో ఉన్నతాకారులు ప్రతీ గంటకు పనిలో పురోగతిని అడుగుతున్నారు. దీంతో కిందిస్థాయి ఉద్యోగులు రోజులో దాదాపు 12 గంటలకు పైగా కంప్యూటర్లకే అతుక్కుపోతున్నారు. 16వ తేదీ నాటికి ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని టార్గెట్ విధించడంతో సంక్రాంతి రోజు కూడా పని చేయాల్సి వచ్చింది. చాలామంది భోగి రోజు ఏకంగా 20 గంటలపాటు పని చేశారు. సంక్రాంతి, కనుమ రోజు కూడా చాలా మంది పని చేయాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఉపాధిహామీ వివరాలుకరీంనగర్జగిత్యాలపెద్దపల్లిసిరిసిల్ల2,96,7562,73,0001,68,0001,88,9801,54,7681,19,0621,19,01198,006ఆధార్ సీడింగ్ 100 శాతం‘తప్పుడు హాజరు’పై ఆందోళన.. లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 16 నుంచి అన్ని జిల్లాల్లో గ్రామసభలు నిర్వహిస్తారు. ఇందులో 20 రోజులు కనీస పనిదినాలు అర్హతగా నిర్ధారించి, తుది జాబితా రూపొందిస్తారు. అభ్యంతరాలు లేకపోతే దాన్నే ఖరారు చేస్తారు. అయితే, ఉపాధిహామీ పథకంలో గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు అనేక కుంభకోణాలు చేశారన్న ఆరోపణలున్నాయి. కూలీల హాజరు, పని వివరాలు వీరి చేతిలో ఉండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలులోనూ వీరే కీలకం కానున్నారు. కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధిహామీ పనికి రాని వారికి కూడా తప్పుడు హాజరుతో పథకం వర్తింపజేస్తారన్న ఆందోళన ఉన్నతాధికారుల్లో ఉంది. దీన్ని వీలైనంతగా నివారించేందుకు అప్రమత్తంగా ఉంటున్నారు. అదే సమయంలో ఆధార్ సీడింగ్‌ను 100 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేయడంతో ఆధార్‌కార్డుల్లో పేరు తప్పులు, అక్షర దోషాలకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. -
పంటలు చేతికొస్తే పండుగే..
సంక్రాంతి వచ్చే నాటికి పంటలు చేతికొస్తే రైతులకు పండుగే. ధాన్యం విక్రయించగా వచ్చే డబ్బులను చూసి తెగ సంబరపడిపోతుంటారు. గత సీజన్ సాగులో కష్టనష్టాలను గుర్తు చేసుకుంటూ మరో సీజన్‌కు ఉత్సాహంగా ముందుకు సాగుతుంటారు. అయితే, రైతులకు ఆనందం తెచ్చే సంక్రాంతి ఆధునిక టెక్నాలజీ నేపథ్యంలో గ్రామాల్లో మాయమవుతోంది. ట్రాక్టర్లు వంటి ఆధునిక పరికరాలు వ్యవసాయంలోకి చొచ్చుకురావడంతో అన్నదాతలకు చేదోడువాదోడుగా ఉండే కాడెద్దులు, పాడి ఆవులు దూరమవుతున్నాయి. ఎన్ని మార్పులు వచ్చినా ఇప్పటికీ గ్రామాలు వరి, మొక్కజొన్న, పసుపు వంటి పంటలతో కళకళలాడుతున్నాయి. అయితే, రైతుల్లో వెనకటి ప్రేమలు కరువవుతున్నాయి. ఏదేమైనా సంక్రాంతి రైతు పండుగ. – జగిత్యాల అగ్రికల్చర్ -
ఆర్టీఏలో ‘ప్రైవేట్ దందా’
● ధనార్జనే ధ్యేయంగా పీఏల నియామకం ● అనధికారికంగా విధులు ● వారు చెప్పిందే రేటు.. చూపించిందే ఫైలు ● పైసలు ముడితేనే ఫైలు ముందుకు.. ● వాటాలవారీగా పంపకాలు ● ఇబ్బందులు పడుతున్న వాహనదారులుసిరిసిల్లక్రైం: జిల్లా రోడ్డు రవాణాశాఖ(ఆర్టీఏ)లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం పెరిగిపోయింది. చిన్న పని కోసం కార్యాలయానికి వెళ్తే పీఏలుగా చెప్పుకునే ప్రైవేట్ వ్యక్తులను ప్రసన్నం చేసుకుంటేనే ఆ ఫైలు ముందుకెళ్తుంది. లేదంటే రోజులకొద్దీ ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిందే. లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ వరకు అన్ని పనులు పీఏలుగా చెప్పుకునే వ్యక్తులే చక్కదిద్దుతున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేట్ అంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని పీఏల వ్యవహారం సిరిసిల్లలో నడుస్తోంది. ప్రతీ పనిలో వాటాలు లర్నింగ్ డ్రైవింగ్, పర్మినెంట్ డ్రైవింగ్, వాహనాల ఫిట్నెస్ వంటి సేవల కోసం వచ్చే ప్రజల నుంచి బ్రోకర్లు వాటాలవారీగా డబ్బులు డిమాండ్ చేయడం ఇక్కడ పరిపాటి. అయితే ఏ పనికి ఎంత అనేది ముందుగా ఆర్టీఏ అధికారులే నిర్ణయించి, కోడ్ రూపంలో ఏజెంట్లకు చెప్పినట్లు తెలిసింది. ఇలా వివిధ పనుల కోసం ఆఫీస్‌కు వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేసి వారానికోసారి అధికారులకు ముట్టజెప్పుతారని సమాచారం. ఆ మాముళ్లలో 10 నుంచి 20 శాతం అనధికారిక పీఏలు తీసుకుని మిగతా సొమ్మును అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిసింది. ఆమ్యామ్యాలు ముట్టజెప్పని వారి వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్ చేయకుండా ఏదో ఒక వంక పెట్టడం ఇక్కడ జరిగే వ్యవహారం. అసలుకు అదనం కలిపి.. వాహనాలకు ఫిట్నెస్ చేయడానికి రూ.1,100 ఉంటే ఇక్కడ రూ.2వేలు తీసుకుంటున్నారు. అన్ని పనులు సక్రమంగా సాగాలంటే కిందిస్థాయిలో మరో రూ.200 అప్పగించాలి. కమర్షియల్ వాహనాలు నడిపే డ్రైవర్‌కు బ్యాడ్జి ఇవ్వాలంటే ప్రభుత్వ ఫీజు రూ.365 ఉంటే అదనంగా దీనికి రెండింతలు వసూలు చేస్తున్నారు. లర్నింగ్ డ్రైవింగ్ కోసం రూ.450 అధికారికంగా ఫీజు కాగా దీనికి అదనంగా మరో రూ.800 వసూలు చేస్తున్నారు. పర్మిట్ కోసం తీసుకునే ఫీజును రెండింతలు చేసేసుకున్నారు. కోడ్ లేకుంటే కష్టాలు ఆర్టీఏలో పనులు కావాలంటే ఏజెంట్లను కలవాలని జిల్లాలో అందరూ చర్చించుకుంటున్నారు. నిజానికి ఆర్టీఏలో ఏజెంట్ అనే విధానం లేదు. ఇదంతా ఆర్టీఏ అధికారులు ఆర్థికలావాదేవీల కోసమే మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్నారని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో దాదాపు 45 మంది వ్యక్తులు ఆర్టీఏ ఏజెంట్లుగా చలామణి అవుతున్నారు. వీరందరికీ ఆర్టీఏ ఆఫీస్ నుంచి కోడ్ ఉంటుంది. వారి వద్దకు వచ్చిన వారికి ఏదేని సేవలు నేరుగా అందాలంటే ఆ ఫైల్‌పై సదరు ఏజెంటు కోడ్ ఉండాల్సిందే. లేదంటే ఇక ఆ ఫైల్ ముందుకెళ్లదు. మామూళ్లు చెల్లించి కోడ్ వేసి రాగానే మళ్లీ అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయని అనేక మంది పేర్కొంటున్నారు.ఆన్లైన్లోనే సేవలు వాహనదారులు ఆన్లైన్లో రశీదు తీసుకొని వస్తే అన్ని సేవలు అందుతాయి. కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులకు ఆస్కారం లేదు. పీఏలు ఎవరూ లేరు. మధ్యవర్తిత్వం కోసం ఎవరైనా వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఏజెంట్లుగా చలామణి అవుతున్న వారందరూ బయట జిరాక్స్ సెంటర్లు, ఆన్లైన్లో నమోదుచేసే వాళ్లే. వారితో మా కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు. – లక్ష్మణ్, డీటీవో, సిరిసిల్ల -
విలీన గ్రామాన్ని విడదీయండి
● ఎమ్మెల్యేకు గ్రామస్తుల వినతివేములవాడరూరల్: వేములవాడ మున్సిపాలిటీలో విలీనం చేసిన శాత్రాజుపల్లిని విడదీసి గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆ గ్రామస్తులు సోమవారం వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో విలీనమైన సందర్బంలో గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకోలేదన్నారు. నిరుపేదలకు ఉపాధిహామీ పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయిస్తానని చెప్పిన హామీని గుర్తు చేశారు. ప్రవేశపరీక్ష పోస్టర్ ఆవిష్కరణ వేములవాడఅర్బన్: గురుకుల విద్యాసంస్థల ప్రవేశపరీక్ష పోస్టర్‌ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళా శాల ప్రిన్సిపాల్ జ్యోతి, లావణ్య ఉన్నారు. తిరుప్పావై ప్రవచకులకు సన్మానం సిరిసిల్లటౌన్: ధనుర్మాసం సందర్భంగా సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నెల రోజులుగా సందుగు వేణుగోపాలాచార్యులు తిరుప్పావై ప్రవచనాలు చెబుతున్నారు. సోమవారం చివరి రోజు కావడంతో వేణుగో పాలచార్యుల దంపతులను శాలువాతో సత్కరించారు. ఈవో మారుతిరావు, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, అర్చకస్వా ములు కృష్ణమాచారి, వర్ధనాచారి ఉన్నారు. కాంగ్రెస్ తీరు బాధాకరం ● నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుసిరిసిల్లటౌన్: ఏడాదిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వం తీరు బాధాకరంగా ఉందని నాఫ్స్కా బ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నా రు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో అందరికీ సమాన గౌరవం ఇచ్చామని, కాంగ్రెసోళ్లు అధికార పార్టీ నేతలకు మాత్రమే అభివృద్ధి నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవా లని సూచించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, దార్నం లక్ష్మీనారా యణ, గుండ్లపెల్లి పూర్ణచందర్ పాల్గొన్నారు. మందా జగన్నాథంకు నివాళి సిరిసిల్లటౌన్: నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంకు ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఆదివారం నివాళి అర్పించారు. ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు కానాపురం లక్ష్మణ్, గుండా థామస్, సాంస్కృతిక జిల్లా అధ్యక్షుడు గజ్జల అశోక్, ఆకునూరి దేవయ్య, పసుల దుర్గయ్య, మంగలి చంద్రమౌళి, కంసాల మల్లేశం పాల్గొన్నారు. కాటిరేవుల పండుగవేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లి, తిప్పాపూర్ రైతులు సోమవారం కాటిరేవుల పండుగ ఘనంగా నిర్వహించారు. తమ కష్టంలో పాలుపంచుకొంటున్న కష్టపడుతున్న ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించారు. కొమ్ములకు జాజురంగు పూసి, పూలు చేశారు. రైతులు ఎలా రాజయ్య, పోషవేణి రమేశ్, నర్సయ్య, వెంకటి, శ్రీనివాస్, బుర్ర లింగయ్య తదితరులు ఉన్నారు -
ట్రాక్టర్ వచ్చె.. కాడెడ్లకు విశ్రాంతినిచ్చె..
సిరిసిల్ల: ట్రాక్టర్ల రాకతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఎడ్లతో వ్యవసాయం చేసే రోజుల్లో ఒక్క నాగలితే ఐదు ఎకరాలకు మించి సాగు సాధ్యం కాకపోయేది. కానీ ఇప్పుడు ట్రాక్టర్ల ఆగమనంతో ఎకరాల కొద్ది భూములు సాగుచేస్తున్నారు. ఫలితంగా పుట్ల కొద్ది ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. ట్రాక్టర్ రాకతో చాలా గ్రామాల్లో ఎడ్లతో వ్యవసాయం చేయడం లేదు. కోనరావుపేట మండలం బావుసాయిపేట శివారులో ఓ రైతు తన పొలం వద్ద ఎడ్లకు విశ్రాంతినిస్తూ కనిపించాడు. అయితే వాటి పక్కనే ట్రాక్టర్ కనిపించింది. యాంత్రీకరణతో ఎడ్లకు కాస్త విరామం దొరికినట్లు అయ్యింది. -
No Headline
కరీంనగర్ రూరల్ మండలం గోపాల్‌పూర్‌లో ఎడ్లబండిపై యువతుల సందడిన్యూస్రీల్సంబురాల సంక్రాంతి పంట దిగుబడులతో రైతుల కళ్లల్లో కనిపించే కొత్త కాంతికి ప్రతీక సంక్రాంతి. ముంగిళ్లలో ముచ్చటైన ముగ్గులు.. గొబ్బెమ్మలు.. డూడూ బసవన్నలు.. హరిదాసుల కీర్తనలు.. భోగిమంటలు.. పిండివంటలు.. నింగిలో పతంగులు.. సంబురాల సంక్రాంతిని జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. సోమవారం భోగితో ప్రారంభమైన సందడి మంగళవారం సంక్రాంతికి మరింత పెరగనుంది. పండుగొస్తే చాలు అమ్మలాంటి ఊరి ముంగిట్లో వాలిపోవాలనిపిస్తుంది. అందుకే, వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, విదేశాల్లో స్థిరపడిన వారు కూడా సంక్రాంతికి సొంతూళ్లకు చేరుకున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. మహిళలు ముగ్గులు, పిండి వంటల్లో బిజీగా ఉంటే.. యువత, పెద్దలు ఇరుగుపొరుగు వారి పలకరింపులతో హడావుడి నెలకొంది. – కరీంనగర్ కల్చరల్/సిరిసిల్ల కల్చరల్/సుల్తానాబాద్ -
కమనీయం గోదారంగనాథుల కల్యాణం
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో గోదారంగనాథుల కల్యాణం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పచ్చని పందిళ్లు, ముత్యాల తలంబ్రాలు, భాజాభజంత్రీల మధ్య కల్యాణోత్సవం సాగింది. ఆలయ ప్రధాన అర్చకులు ఈ వేడుకలు నిర్వహించారు. ఏటా ధనుర్మాసోత్సవాల్లో భాగంగా చివరి రోజున కల్యాణ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ముత్తయిదువులు గోదామాతకు ఓడిబియ్యం సమర్పించారు. అర్చకులు కృష్ణమాచారి, వేణుగోపాలాచారి, వర్ధనాచారి వేడుకలు నిర్వహించారు. అనంతరం 2వేల మందికి అన్నదానం చేశారు. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవో రవీందర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, తీగల శేఖర్‌గౌడ్, చేపూరి నాగరాజు, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడఅర్బన్: వేములవాడలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో గోదాదేవిరంగనాథ స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ, నమిలికొండ రాజేశ్వరశర్మ, దుమాల నాగరాజు, ఆలయ ఏఈవో బ్రాహ్మణగారి శ్రీనివాస్ పాల్గొన్నారు. రెండువేల మందికి అన్నదానం శ్రీశాల క్షేత్రంలో పోటెత్తిన భక్తజనం -
పోరాట కెరటం.. అమృత్లాల్ శుక్లా
● నిజాంను ఎదిరించిన యోధుడు ● నేడు 34వ వర్ధంతిసిరిసిల్ల: దేశం యావత్తు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వేళ.. సిరిసిల్ల గడ్డపై రజాకార్ల ముఠాలను ఎదిరించేందుకు నూనూగు మీసాల యువకుడు పిడికిలెత్తాడు. ఉద్యమకారుడిగా పీడిత ప్రజలకు మార్గదర్శిగా నిలిచాడు. ప్రజల కష్టాలను తొలగించేందుకు ప్రజాప్రతినిధిగా గెలిచాడు. ప్రజాపోరాటంలో పాల్గొన్న అమృత్లాల్ శుక్లా 1908లో జన్మించారు. 83 ఏళ్ల వయసులో 1991 జనవరి 14న అస్తమించారు. నేడు ఆయన 34వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. ఆంధ్ర మహాసభతో కీలక మలుపు తెలంగాణ విముక్తి ఉద్యమం చురుగ్గా సాగుతున్న దశలో 1935 డిసెంబర్లో సిరిసిల్లలో నాల్గో ఆంధ్ర మహాసభ మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బూరుగుల రామకృష్ణారావు, పీవీ నర్సింహారావు, బద్దం ఎల్లారెడ్డి, కేవీ రంగారెడ్డి వంటి వారితో జిల్లాకు చెందిన బద్దం ఎల్లారెడ్డి, అమృత్లాల్ శుక్లా, చెన్నమనేని రాజేశ్వర్‌రావు, గడ్డం తిరుపతిరెడ్డి, కర్రెల్లి నర్సయ్య పాల్గొన్నారు. పోలీస్‌స్టేషన్‌పై దాడి.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే నేరమైన ఆ రోజుల్లో రజాకార్లపై తిరుగుబాటు చేశారు. పల్లెల్లో రైతుకూలీలను సంఘటితం చేసి నిజాం వ్యతిరేఖ ఉద్యమంలో భాగస్యామి అయ్యారు. అమృత్లాల్ శుక్లా 1950లో సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌పై దాడిచేశాడు. గడీలను లూటీ చేసి, ఆ సంపదను పేదలకు పంచిపెట్టారు. అమృత్లాల్శుక్లాను నిజాం పోలీసులు నిర్బంధించి 13 ఏళ్ల జైలు శిక్ష విధించగా... చంచల్‌గూడ జైలు నుంచి తరలిస్తుండగా పోలీసుల కళ్లు గప్పి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తప్పించుకున్నాడు. నిజాంకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో మళ్లీ భాగస్వామి అయ్యారు. అజ్ఞాతంలో ఉంటూ పోరాడారు. హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యే వరకు పోరుబాటలోనే ఉన్నారు. సిరిసిల్ల రెండో ఎమ్మెల్యేగా... 1957లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అమృత్లాల్ శుక్లా ఎన్నికయ్యారు. అప్పట్లో కమ్యూనిస్ట్‌లపై నిషేధం ఉండడంతో ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఏవీఆర్ రెడ్డిపై విజయం సాధించారు. 1991 జనవరి 14న అస్తమించారు. అమృత్లాల్ శుక్లా పోరాటాన్ని ఆయన సమకాలికులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. అమృత్లాల్ శుక్లా వర్ధంతి సందర్భంగా కమ్యూనిస్ట్ నాయకులు సిరిసిల్ల మానేరువాగులోని స్మారకస్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. -
సెల్‌ఫోన్ మాయలో పల్లెలు
ఊరు మారింది.. తీరు మారింది.. పల్లెల రూపురేఖలు వేగంగా మారిపోయాయి.. దశాబ్దాల కిందటి పల్లెల్లో కులాలు, మతాలకతీతంగా ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాలు కనిపించేవి. చాలా కాలం తర్వాత తమవారిని చూస్తే ఆనందభాష్పాలు, పట్టలేని సంతోషం. ఇప్పుడవి కనుమరుగయ్యాయి. పల్లెలు సెల్‌ఫోన్ మాయలో పడ్డాయి. ప్రపంచాన్ని అరచేతిలోనే చూస్తున్నరు. కానీ, పక్కింటోళ్లతో, ఆత్మీయులతో మనస్ఫూర్తిగా మాట్లాడేవారు కనిపించడం లేదు. మనస్ఫూర్తిగా నవ్వడం లేదు. మునుపటి ఆప్యాయతలు, అనురాగాలు లేవు. చలికి రైతులు నాగలి కడ్తలేరు. ఫోన్ చేసి, ట్రాక్టర్ మాట్లాడుకొని, పొలం దున్నిస్తున్నరు. పిండివంటలు చేయడం వద్దనుకునేవారు ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నరు. – సిరిసిల్ల -
గమ్యానికి చేరువై.. అంతలోనే దూరమై..
గోదావరిఖని(రామగుండం): మరో నిమిషంలో ఇంటికి చేరుకునేవారు.. ఇంకో రెండుగంటలు గడిస్తే భోగి పండుగతో ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివిరిసేవి. ఈలోగా మృత్యువు ముంచుకొచ్చింది. కుటుంబానికి పెద్దదిక్కు, అతడి కొడుకు మృతిచెందడం, ఇల్లాలు ఆసుపత్రి పాలు కావడంతో ఖనిలో విషాదఛాయలు నెలకొన్నాయి. సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు, అతడి కొడుకు అక్కడికక్కడే మృతిచెందారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాలు.. జీడీకే–11గనిలో పనిచేస్తున్న గిన్నారపు సతీశ్(32) తనకు వరుసకు సోదరుడు అయిన వ్యక్తికి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కొడుకు జన్మించాడు. వారిని చూసేందుకు ఆదివారం సతీశ్ తన భార్య కీర్తి, కుమారుడు నవీశ్(11నెలలు), బావ ఎ.సతీశ్, చెల్లె అనూషతో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లారు. తిరిగి రాత్రి 11 గంటలకు గోదావరిఖనికి పయనమయ్యారు. ఎన్టీపీసీ బీ పవర్‌హౌజ్ వరకు తన బావ కారు డ్రైవ్ చేయగా అక్కడ కొద్ది సేపు మూత్ర విసర్జన కోసం ఆగారు. తర్వాత సతీశ్ డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు. ఈక్రమంలో సోమవారం వేకువజామున 3గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చేసరికి కుక్క అడ్డు రావడంతో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనగా, సతీశ్, అతడి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య, బావ, చెల్లె గాయాలపాలయ్యారు. ఒక్క నిమిషం గడిస్తే.. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సతీశ్ ఇల్లు ఐదువందల మీటర్ల దూరంలో ఉంది. ఒక్క నిమిషం గడిస్తే ఇంటికి చేరుకునేవారు. ఈలోగా జరిగిన ప్రమాదం సింగరేణి యువ కార్మికుడు, అతడి ముక్కుపచ్చలారని 11నెలల చిన్నారిని కబలించింది. తన ఎదపైన ఆడాల్సిన చిన్నారి బాబును పోస్టుమార్టం అనంతరం తండ్రి మృతదేహంపై పడుకోబెట్టిన దృశ్యం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. అంత్యక్రియల కోసం మృతదేహాలను తిమ్మాపూర్ మండలం పోరండ్లకు తరలించారు. కుక్క అడ్డు రావడంతో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు సింగరేణి కార్మికుడు, అతడి కుమారుడు మృతి మృతుడి భార్య, బావ, చెల్లికి గాయాలు పండుగ పూట విషాదం -
ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యంపై కేసు
కరీంనగర్‌క్రైం: నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి డాక్టర్లు సరైన వైద్యం అందించకపోవడంతో మృతిచెందగా, అతడి భార్య కరీంనగర్ టూటౌన్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాలు.. నగరంలోని భాగ్యనగర్‌కు చెందిన మాదరి అశోక్ (58) కరీంనగర్ కోర్టులో న్యాయవాదిగా పని చేస్తుండగా, అతడి భార్య సుజాత సిద్దిపేట కోర్టులో సూపరింటెండెంట్‌గా పనిచేస్తోంది. ఈనెల 10న అర్ధరాత్రి అశోక్‌కు ఒంట్లో బాగలేకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అతడికి వైద్యులు పరీక్షలు చేసి ఎలాంటి ఇబ్బంది లేదని మందులు ఇచ్చి 12వ తేదీన ఇంటికి పంపించారు. సోమవారం మరోసారి అశోక్ అనారోగ్యానికి గురికావడంతో తిరిగి అదే ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతోనే తన భర్త మృతి చెందాడని పేర్కొంటూ మృతుడి భార్య ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా అశోక్ పూర్తిగా వైద్యం తీసుకోకుండానే ఇంటికి వెళ్లిపోయాడని, అతడి మృతిపై పలువురు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. -
కౌశిక్‌పై కాంగ్రెస్ గరం గరం
కరీంనగర్ కార్పొరేషన్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీ సుకుంది. కలెక్టరేట్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా సాక్షిగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్‌రెడ్డి దాడి చేయడాన్ని పార్టీ తీవ్రంగా పరి గణిస్తోంది. గతంలోనూ జరిగిన ఉదంతాల నేపథ్యంలో, ఈ సంఘటనను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్ర మంలోనే కౌశిక్‌రెడ్డిపై వరుసగా పోలీసు కేసులు నమోదవుతున్నాయి. సంజయ్‌పై దాడి చేశారంటూ ఆయన పీఏ, సంఘటన జరిగిన రోజే 12వ తేదీన వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ కూడా కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అధికారిక సమావేశంలో అనుచితంగా వ్యవహరించడంతో పాటు, ఎమ్మెల్యే పై దాడి చేసిన కౌశిక్‌రెడ్డిపై చర్యతీసుకోవాలని పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరు వెనుక కేసీఆర్ ఉన్నట్లు అనుమానంగా ఉందని, విచారించి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని సుడా చైర్మన్, కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ‘ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి’ తోటి ఎమ్మెల్యేపై వీధి రౌడీలా వ్యవహరించిన పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించినందుకు ఆయనపై వేటు వేయాల్సిందేనన్నారు. నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఆకుల ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల కుటుంబంపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు హుజూరాబాద్: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కల్వకుంట్ల కుటుంబంపై ఉన్న ప్రేమ నియోజకవర్గ ప్రజలపై లేద ని, అతన్ని వెంటనే మెంటల్ హాస్పిటల్లో చేర్చాలని నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం పట్టణంలో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై గగ్గొలు పెట్టే ఎమ్మెల్యే తను ఏ పార్టీ నుంచి ఫిరాయించి బీఆర్ఎస్లో చేరాడో తెలుసుకోవాలని సూచించారు. దమ్ముంటే హుజూరాబాద్‌లో రాజీనామా చేసి మళ్లీ గెలువాలని సవాల్ విసిరారు. పోలీసు స్టేషన్లో వరుసగా ఫిర్యాదులు -
యువత క్రీడలపై ఆసక్తి చూపాలి
వేములవాడరూరల్: యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా వేములవాడ మున్సిపల్ పరిధి శాత్రాజుపల్లిలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు సోమవారం ముగిశాయి. పోటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి 40 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విప్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ప్రాంతంలో క్రీడాపోటీలు నిర్వహిస్తే తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తామన్నారు. గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. పోటీల్లో సిరిసిల్ల జట్టు ప్రథమ, రామడుగు ద్వితీయ, ఎస్సారార్ కరీంనగర్ తృతీయ, శాత్రాజుపల్లి నాల్గో స్థానంలో నిలిచాయి. ప్రథమ బహుమతి రూ.15,000, ద్వితీయ రూ.10,000, తృతీయ రూ.6,000, 4వ స్థానం పొందిన జట్టుకు రూ.4,000 నగదు, షీల్డ్‌లు అందించారు.