Annamayya
-
హోంగార్డుల సేవలు అభినందనీయం
కడప అర్బన్ : హోంగార్డుల సేవలు అభినందనీయమని హోంగార్డ్స్ కమాండెంట్ ఎం. మహేష్‌కుమార్ తెలియజేశారు. కడపలోని ఏఆర్ పోలీస్ పరేడ్ మైదానంలో ఆయన శుక్రవారం హోంగార్డ్స్ పరేడ్‌ను పరిశీలించి, దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోంగార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మంచిపేరు తీసుకురావాలని తెలిపారు. హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు. కుటుంబాల గురించి ఆలోచించాలన్నారు. ఇన్సూరెన్స్ (బీమా) చేసుకోవాలన్నారు. ఏడాదికి ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ హోంగార్డ్స్ డీఎస్పీ కేఎస్వీ ప్రసాద్, ఆర్ఐ శ్రీశైలంరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన, నిరంతర విద్యుత్తే లక్ష్యం
కడప కార్పొరేషన్ : వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా పని చేయాలని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక విద్యుత్ భవన్‌లోని సమావేశ మందిరంలో ఏపీఎస్పీడీసీఎల్లోని కడప, అన్నమయ్య జిల్లాల అధికారులు, ట్రాన్స్‌కో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థల సేకరణలు పూర్తి చేసి కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించుటకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రజలకు అందించే విద్యుత్తు సేవలు నిర్దేశిత సమయంలో పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు తిరిగి వారికి పరిహారం చెల్లించే విధంగా ప్రమాణాలు తీసుకురావడం జరిగిందన్నారు. వీటిని పటిష్టంగా ఆచరణలో పెట్టి విద్యుత్ సేవల్లో జాప్యం లేకుండా సంతృప్తికర స్థాయిలో అందించాలన్నారు. విద్యుత్ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. క్షేత్రస్థాయిలో పని చేసే ప్రతి ఉద్యోగి సంస్థకు వినియోగదారులకు మధ్య వారధిగా ఉంటారని, కావున జవాబుదారీతనంతో పని చేయాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉంటూ, ప్రమాదాల నివారణే లక్ష్యంగా క్షేత్రస్థాయి అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేయాలని తెలిపారు. డిస్కం, ఏపీ ట్రాన్స్‌కో అధికారులు ఎప్పటికప్పుడు సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసుకుని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ వరకుమార్, ఏపీ ట్రాన్స్ కో చీఫ్ ఇంజినీర్ కృష్ణమనాయుడు, ఓఎస్డీ మునిశంకరయ్య, ఎస్ఈ రమణ, ఏఓ మధు, డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. అంతకుముందు ఏపీఈఆర్సీ చైర్మన్ పాతకడప సబ్‌స్టేషన్‌ను పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
ఆధ్యాత్మిక నిలయం.. జ్యోతి క్షేత్రం
కాశినాయన : జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. ఇక్కడ కొలువైన శ్రీఅవధూత కాశినాయనస్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 29వ ఆరాధన మహోత్సవాలు శనివారం, ఆదివారం ఘనంగా జరగనున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం బెడుసుపల్లె గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన కాశినాయన చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనకు అలవాటుపడ్డారు. ఆయన గురువు యతిరాజు గురవయ్య వద్ద ఆత్మజానం పొందారు. అక్కడి నుంచి వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలోకి ప్రవేశించి వరికుంట్ల, నాయునిపల్లె, గంగనపల్లె గ్రామాలకు చేరుకున్నారు. అక్కడ కొన్నేళ్ల పాటు చిన్నపిల్లలకు విద్యాబోధన చేస్తూ ఆధ్యాత్మిక చింతన కొనసాగించారు. ఆ సమయంలో వరికుంట్ల సమీపంలోని నల్లమల అడవుల్లోని జ్యోతిక్షేత్రంలో జ్యోతి నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. జ్యోతి నరసింహస్వామికి పూజలు చేస్తుండేవారు. సమీపంలోని గరుడాద్రి కొండ మీద కఠోరదీక్షతో తపస్సు చేశారు. అనంతరం అన్నదాన ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ వచ్చేవారు. ఆలయాల పునరుద్ధరణకు కృషి అవధూతగా మారిన కాశినాయన శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. చుక్కనీరు దొరకని గరుడాద్రి కొండమీద నీటిబావులు తవ్వించారు. గరుడాద్రి, అనంతరాయుడు, జ్యోతి, సిద్దేశ్వరం, లింగమయ్యకొండ, యోగానందలోని ఆలయాలను పునరుద్ధరించారు. కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో ఉన్న అహోబిలం వద్ద యోగానంద ఆశ్రమం స్థాపించి.. పశు సంపద, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నరసింహస్వామి పాదాల చెంత సమాధి వందేళ్లు జీవించిన కాశినాయన తన ఇష్టదైవమైన జ్యోతి నరసింహస్వామి పాదాల చెంత 1995 డిసెంబర్ 5న సమాఽధి అయ్యారు. ఆయన సమాధి చెందిన ప్రాంతంలో ఒక పురాతన మర్రిచెట్టు తనంతట తానే నేలవాలింది. ఆయన సేవిస్తూ వచ్చిన గోమాత కాశినాయన మరణాన్ని జీర్ణించుకోలేక మూడవ రోజున తనువు చాలించింది. దేవాలయం ఏర్పాటు కాశినాయన సమాధిపై అద్భుతమైన దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 60 తెలుగు సంవత్సరాలకు ప్రతీకగా 60 రాతి స్తంభాలతో ‘నభూతో నభవిష్యతి’ అన్నట్లుగా దేవాలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆవు సమాధిని కూడా అందంగా నిర్మించారు. వంటశాలలు, భోజనశాలలు, వసతిగృహాల నిర్మాణాలతో జ్యోతిక్షేత్రం కళకళలాడుతోంది. నిత్యాన్నదానం కాశినాయన ఆశ్రమాన్ని దర్శించే భక్తులకు స్వామి దర్శనం ఎంత ఇష్టమో.. అక్కడ భోజనం చేసి రావడం అంత పవిత్రం. రోజూ వందల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని భోజనం చేస్తుంటారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో భక్త జనం భారీగా వస్తుంటారు. ఏడాది పొడవునా అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. రైతులు తాము పండించిన పంటలో కాశినాయన పేరున తీసి ఉంచిన ధాన్యం, కూరగాయలు, పప్పుధాన్యాలు ఆశ్రమానికి తమకు తాముగా చేరవేస్తుంటారు. దీంతో అన్నదానం సజావుగా సాగుతోంది. నేడు జ్యోతి ప్రజ్వలనరెండు రోజుల పాటు జరిగే కాశినాయన ఆరాధన మహోత్సవాలకు ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మైదుకూరు ఆర్టీసీ డిపో వారు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాశినాయన మాలను ధరించి కొంత మంది భక్తులు దీక్షలో కొనసాగుతున్నారు. వీరంతా ఈ నెల 14వ తేదీ రాత్రికి జ్యోతిక్షేత్రానికి చేరుకుని జ్యోతి ప్రజ్వలనలో పాల్గొంటారు. పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కాశినాయన ఎస్ఐ హనుమంతు, పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డిలు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మహిమాన్వితుడు కాశినాయన నేటి నుంచి ఆరాధన మహోత్సవాలు భక్తుల కోసం భారీగా ఏర్పాట్లు -
అంకాలమ్మ ఆలయంలో చోరీ
ఓబులవారిపల్లె : మండల పరిధి చెలంపాలెం గ్రామంలోని అంకాలమ్మ ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. రోజూ లాగే శుక్రవారం ఉదయం గుడి తెరిచి చూడగా హుండీ పగులగొట్టిన దృశ్యాన్ని చూసి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీ తాళం పగులగొట్టి అందులో ఉన్న నగదు దోచుకెళ్లారు. చాలా రోజుల నుంచి హుండీలో డబ్బులు తీయకపోడంతో దాదాపు లక్ష రూపాయల పైనే ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. కూలిన ఇల్లు రామాపురం : మండలంలోని చిట్లూరు పంచాయతీ ముసలిరెడ్డిగారిపల్లెలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఓ ఇంటి పైకప్పు శుక్రవారం కూలిపోయింది. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఓటేరు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశాడు. కూలి పని చేసుకొని జీవనం సాగించే తన కుటుంబానికి నిలువ నీడ లేకుండా పోందని వాపోయాడు. ప్రభుత్వం తమకు సాయం చేసి ఆదుకోవాలని ఆయన కోరాడు. అప్పుల బాధతోరైతు ఆత్మహత్య ములకలచెరువు : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వేపూరికోట పంచాయతీ చీకుచెట్టుపల్లెకు చెందిన బయ్యారెడ్డి(42) టమాటతోపాటు వివిధ పంటల కోసం రూ.16 లక్షల వరకు అప్పు చేశాడు. సరిగా దిగుబడి రాకపోవడంతో నష్టం పోయాడు. అప్పులు ఇచ్చిన వారు వేధిస్తుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బయ్యారెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులురామాపురం : భూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల ఉద్దేశమని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేందర్ అన్నారు. మండలంలోని నల్లగుట్టపల్లె సచివాలయంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్న మండలాల్లో రామాపురం ఒకటన్నారు. మండలంలోని 12 రెవెన్యూ గ్రామాల రైతుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. మండల అధికారులు పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ మణి, తహసీల్దార్ రామాంజనేయులు, ఆర్ఐలు సమ్మత్ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమేష్‌రెడ్డి, సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్‌రెడ్డి, టీడీపీ నాయకుడు అయోధ్యపురం పట్టాభిరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
అల్లు అర్జున్ అరెస్టు రాజకీయ కుట్ర
రైల్వేకోడూరు అర్బన్ : రాజకీయ కుట్రలో భాగంగానే హీరో అల్లు అర్జున్ను అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరులో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పుష్ప–2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో సోదరి రేవతి మరణించడం బాధాకర విషయమన్నారు. దీనిని హత్యగా అభివర్ణించి అందుకు అల్లు అర్జున్ను బాధ్యున్ని చేసి రిమాండ్‌కు పంపించారన్నారు. ప్రత్యక్షంగా ఇది పోలీసులే చేసినా పరోక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేయించారన్నారు. వారి హస్తం లేకపోతే, ఇందులో రాజకీయ కోణం దాగి ఉండకపోతే, తెలంగాణ ప్రభుత్వం ఇంతటి సాహసం చేయదన్నారు. ఎన్నికల ప్రచారానికి రావడమే తప్పా సినీ హీరో అల్లు అర్జున్ గడిచిన ఎన్నికల సందర్భంగా నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్ప రవి చంద్రకిశోర్రెడ్డికి మద్దతు తెలపడమే కారణమని తెలిపారు. తమ పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ఎక్కడలేని ఆక్రోశం చెందారన్నారు. ఆనాటి నుంచి అల్లు అర్జున్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్ లభించడం అల్లు అర్జున్‌కు కాస్త ఊరట లభించిందని, ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు సభల్లో మరణాలకు బాధ్యుడెవరు? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు 2015 జూలై 14న గోదావరి పుష్కరాల సందర్భంగా సినిమా షూటింగ్ తరహాలో చేయడం వల్ల జరిగిన తొక్కిసలాటలో 35 మంది చనిపోయారన్నారు. ఈ సంఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. అలాగే గత ఎన్నికల సందర్భంగా కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. జనాన్ని చూపించేందుకు చంద్రబాబు ఇరుకు సందులో మీటింగ్ ఏర్పాటు చేసి వారి మరణాలకు కారణమయ్యారన్నారు. ఈ మరణాలకు బాధ్యుడు చంద్రబాబు కాదా అని ఆయన ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు -
15న కళాశాలల యాజమాన్యాల సమావేశం
వైవీయూ : వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు పట్టణంలోని ఆర్.ఇ.ఎస్ జూనియర్ కళాశాల (మేధా డిఫెన్స్ అకాడమీ)లో ఈ నెల 15న ఉదయం 10 గంటలకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సి.నరసింహులు తెలిపారు. జిల్లా కమిటీ కాలపరిమితి ముగిసినందున సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జూనియర్ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు వివరించారు. వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించనున్నట్లు తెలిపారు. సంబంధికులందరూ హాజరు కావాలని ఆయన కోరారు. -
వృద్ధులపై యువకుడి దాడి
గుర్రంకొండ : పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్న వృద్ధులపై.. ఒక్కసారిగా ఓ యువకుడు దాడి చేయడంతో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతను మద్యం మత్తులో గ్రామంలో వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని మర్రిమాకులపల్లె కస్పాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎం.జయరామిరెడ్డి, ఆయన కుమారుడు దిలీప్‌కుమార్‌రెడ్డి చాలా ఏళ్ల క్రితం గ్రామం వదిలి బతుకుదెరువు కోసం వెళ్లారు. ఏడు నెలల కిందట వారు గ్రామంలోకి వచ్చి సొంత ఇంట్లో నివాసముంటున్నారు. ఆరునెలల కిందట జయరామిరెడ్డి మృతి చెందాడు. అప్పటి నుంచి దిలీప్‌కుమార్‌రెడ్డి ఒంటరిగా ఉంటున్నాడు. ఇతని తల్లి చిన్నతనంలో మృతి చెందింది. కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం గ్రామంలో రచ్చబండ వద్ద పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్న వృద్ధురాళ్లపై అతను ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. కట్టెలతో ఇష్టానుసారంగా చితకబాదాడు. ఓ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఇద్దరు వృద్ధురాళ్లను కొట్టాడు. ఈ సంఘటనలో కె.రామలక్ష్ముమ్మ(75), కె.లక్ష్ముమ్మ(80), హైమావతమ్మ(60), ఈశ్వరమ్మ(55), ఎస్.లక్ష్ముమ్మ(65), కత్తి లక్ష్ముమ్మ(60)కు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి కాళ్లు విరిగిపోయాయి. బాధితులను గ్రామస్తులు 108 వాహనం ద్వారా వాల్మీకిపురం, మదనపల్లె ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. దిలీప్‌కుమార్‌రెడ్డి కట్టెలు చేతపట్టుకొని గ్రామంలో వీరంగం సృష్టించడంతో.. గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీశారు. విషయం తెలుసుకొన్న ఎస్ఐ మధురామచంద్రుడు సిబ్బందితో వచ్చి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా దిలీప్‌కుమార్‌రెడ్డి గ్రామంలో పలువురు చిన్నారులను కిడ్నాప్ చేయడానికి యత్నించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నామని పలువురు చిన్నారుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఓవైపు కిడ్నాప్ కలకలం, మరోవైపు వృద్ధులపై దాడులతో మర్రిమాకులపల్లెలోఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపారు. ఆరుగురికి తీవ్ర గాయాలు మద్యం మత్తులో వీరంగం -
ప్రకృతి వ్యవసాయ పంటల పరిశీలన
పులివెందుల రూరల్ : పులివెందులలోని ఐజీ కార్ల్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాలను ఇటలీ దేశ రీసెర్చర్ అన్న డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ శివారెడ్డి మాట్లాడుతూ ఇటలీ రీసెర్చర్ అన్న డి అనే మహిళ ఈ నెల 19 వరకు పులివెందులలో ఉండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాలు, మోడల్స్‌ను పరిశోధన చేయడానికి ఐజీ కార్ల్‌కు వచ్చారన్నారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ మాట్లాడుతూ పులివెందుల డివిజన్లో ఎక్కువ రైతులు సాగు చేసే పంటలలో ప్రధానంగా అరటి, శనగలో ఏ గ్రేడ్ మోడల్ విధానాలు చేయించడం జరిగిందన్నారు. అదే విధంగా ఏటీఎం మోడల్స్, పీఎండీఎస్ విధానాలు చూడవచ్చునన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సందీప్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ సోహెల్, మాస్టర్ ట్రైనర్ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కరవు మండలాల ప్రకటనలతోనే సరిపెట్టారు
సాక్షి రాయచోటి/రాయచోటి : అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా అన్నదాతను ఆదుకోవడంలో మీనవేషాలు లెక్కిస్తున్న కూటమి సర్కార్‌పై వైఎస్సార్సీపీ సమరశంఖం పూరించింది. వైఎస్సార్ సీపీ హయాంలో వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆదర్శంగా తీసుకుని రైతులకు అండగా నిలబడాలని పార్టీ శ్రేణులు నినదించాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చినా నేటికీ అమలు చేయకుండా సాకులు చూపుతున్న ప్రభుత్వం దిగి రావాలంటూ శ్రేణులు రోడ్డెక్కాయి. తక్షణమే పెట్టుబడి సాయం కింద రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ...సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం అఽధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు దాటినా నేటికీ రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం కళ్లు తెరిపించడమే లక్ష్యంగా ‘అన్నదాతలకు అండగా వైఎస్సార్ సీపీ’కార్యక్రమానికి కడలి తరంగంలా కదిలివచ్చారు. కలెక్టరేట్ వద్ద నిరసన అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కలెక్టరేట్ ఎదురుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ప్రస్తుత కూటమి సర్కార్ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ...అన్నదాతకు అండగా నిలబడాలన్న మహాసంకల్పంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, ప్రజాప్రతినిధులు కదలివచ్చారు. రాయచోటిలోని కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కష్టాల్లో ఉన్న కర్షకులను వెంటనే ఆదుకోవాలని, ఇప్పటికే ఖరీఫ్ కోల్పొయిన అన్నదాతకు ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించాలని కోరారు. కార్యకర్తలు వైఎస్సార్ సీపీ జెండాలు చేతబూని...దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ నిరసనను హోరెత్తించారు.జిల్లాలోని రాజంపేట, రాయచోటి, మదనపల్లె, రైల్వేకోడూరు, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అయితే పోలీసులు 30 యాక్టు అమలులో ఉన్న నేపథ్యంలో పట్టణంలో ర్యాలీకి అనుమతులు లేకపోవడంతో...కలెక్టరేట్ ప్రధాన గేటు నుంచి కార్యాలయం వరకు వచ్చిన వారంతా ర్యాలీగా వెళ్లారు. వైఎస్ జగన్ నాయకత్వం వర్దిల్లాలి....ప్రభుత్వం రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. రైతులను ఆదుకోవాలని జేసీకి వినతి ప్రస్తుతం ఖరీఫ్ పంటలను కోల్పొయి...రబీలో కూడా వర్షాలతో తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న రైతులకు పూర్తి స్తాయిలో న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ తరపున రైతులు జేసీ అదర్శ రాజేంద్రన్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, చింతల రామచంద్రా రెడ్డి, మదనపల్లె ఇన్చార్జి నిస్సార్ అహమ్మద్ తదితరులు జేసీకి వినతిపత్రం సమర్పించారు. రైతులను ఆదుకునే దిశగా, ప్రభుత్వం స్పందించేలా చర్యలు చేపట్టాలని వారు జేసీని కోరారు. ఈ కార్యక్రమంలో రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, మదనపల్లె మున్సిపల్ చైర్మన్ మనూజ,జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జిల్లా వ్యవసాయ సలహా అధ్యక్షుడు సుకుమార్రెడ్డితోపాటు ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు, ఇప్పుడు రైతు వ్యతిరేకేనని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు.కరవు మండలాల ప్రకటనలతోనే సరిపెట్టారన్నారు. కరవు ప్రాంతం రైతులకు కూటమి ప్రభుత్వం మేలు చేయలేదన్నారు. రైతులకు సంబంధించిన పాల ధరల విషయంలో లీటరుకు పది రూపాయలు వంతున తగ్గించి కష్టపడుతున్న వారి నడ్డి విరిచారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమకేసులు పెడుతూ వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇకనైనా రైతులపై దయచూపాలన్నారు. రైతులకు, ప్రజలకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామిలు నెరవేర్చకపోతే రానున్న కాలంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు రైతుల ఉసురు తగలక తప్పదుకూటమి ప్రభుత్వం అన్నింటా విఫలం అన్నదాతకు అండగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద కొనసాగిన ధర్నా రైతులకు హామీలు ఇచ్చి విస్మరించడంపై నినాదాల హోరు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులు -
గాయపడిన బాలుడి మృతి
రాయచోటి : బండరాయి విరిగిపడి గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిపోగు సన్నీ (12) శుక్రవారం మృతి చెందాడు. రాయచోటి మండలం దిగువ అబ్బవరం పాత దళితవాడకు చెందిన బాలిపోగు నరేష్ కుమారుడు సన్నీ నవంబర్ 29న తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ సందర్భంలో బండరాయిని పట్టుకొని ఊగుతుండగా.. ఆ రాయి విరిగి మీదపడటంతో గాయపడ్డాడు. వెంటనే తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు ఎస్ఐ జహీర్ తెలిపారు. వ్యక్తి మృతిపై కేసు నమోదు రామసముద్రం : మండల పరిధి చెంబకూరు–ఈడిగపల్లె మార్గంలోని నల్లచిన్నేపల్లె క్రాస్ వద్ద ఆదివారం రోడ్డుప్రమాదంలో గాయపడి, మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె పంచాయతీ దిగువకొండమీదపల్లెకు చెందిన వెంకటరమణ(66) తన సొంత పని మీద ద్విచక్రవాహనంపై వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు మహేష్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వైవీయూ క్రీడా పోటీలువైవీయూ : యోగి వేమన విశ్వవిద్యాలయ వ్యాయామ విద్య, క్రీడా శాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో అంతర కళాశాలల యోగా, ఖోఖో క్రీడా పోటీలు వైవీయూ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ క్రీడా బోర్డు కార్యదర్శి డాక్టర్ కె.రామసుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 20న యోగ, 24న ఖోఖో పోటీలు సీ్త్ర, పురుషులకు ఉంటాయన్నారు. ఎంపికల్లో పాల్గొనదలచిన విద్యార్థులు 2024 జూలై 1వ తేదీ నాటికి 17– 25 ఏళ్ల మధ్య వయసు కలిగి, విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలో చదువుతూ ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు స్టడీ, పదో తరగతి, ఇంటర్మీడియెట్ మార్క్స్ మెమోలు ఒరిజినల్, జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు :9705459052, 7997047676కు సంప్రదించాలని వివరించారు. 15న జిల్లా ఆర్చరీ జట్టు ఎంపిక కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో ఈ నెల 15న జిల్లాస్థాయి సబ్‌జూనియర్ ఆర్చరీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రికర్వ్రౌండ్, కాంపౌండ్ రౌండ్, ఇండియన్ రౌండ్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్‌కార్డు, పుట్టినతేదీ సర్టిఫికెట్, 3 పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు. ఆర్చరీ అసోసియేషన్ పోర్టల్‌లో రిజిస్టర్ కానివారు గూగుల్ ఫారం పూరించి ఈనెల 15న రిజిస్టర్ చేసుకోవాలని వివరించారు. -
పాత్రికేయులపై దాడులను అరికట్టాలి
రాయచోటి : వైఎస్సార్ జిల్లా వేముల మండలం తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం విధి నిర్వహణలో ఉన్న సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము, రిపోర్టర్ రాజారెడ్డిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు..నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పాత్రికేయులపై దాడి చేసేవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. హేయమైన చర్య మీడియాపై దాడి చేయడం హేయమైన చర్య అని రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు ముక్తకంఠంతో ఖండించారు. అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మీడియాపై జరిగిన దాడి గర్హనీయమన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే పత్రికలపై దాడులకు పాల్పడి మీడియా గొంతు నొక్కడం మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి దాడిని తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లో మీడియాపై దాడి జరిగితే మోహన్‌బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు వరకు తీసుకెళ్లారన్నారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన సాక్షి మీడియా మీద దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. రాజ్యాంగం హైదరాబాద్‌లో ఓ రకంగా, వైఎస్సార్ జిల్లాలో మరో రకంగా ఉంటుందా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. అలాగే రాయచోటిలోని కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ను రాయచోటికి చెందిన ఏపీయూడబ్ల్యుజే, వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్, అన్నమయ్య జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ల ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు వైఎస్ఆర్ జిల్లా వేములలో నీటిసంఘం ఎన్నికల కవరేజీకి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. మీడియా రంగం అంతా ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందని పలువురు మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి రాయచోటి టౌన్ : సాక్షి మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షంచాలని మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ పత్రికల విలేకరులు నాగిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వలీబాషా, జనార్థన్ రాజు, బసయ్య, సి. రమేష్ బాబు, సర్ఫరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కోడిపందెం ఆటగాళ్ల అరెస్ట్
రాయచోటి : రాయచోటి మండలం మాధవరం మద్దెలకుంట సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందెం స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. పందెం ఆడుతున్న ఎనిమిది మందితోపాటు ఆరు కోళ్లు, 21 బైకులు, రూ.14500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి, శనివారం కోర్టుకు హాజరు పరచనున్నట్లు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్పీ, స్పెషల్ పార్టీ పోలీసులు మెరుపుదాడి చేసినట్లు సమాచారం. జూదరుల అరెస్ట్ మదనపల్లె : పట్టణంలోని రామిరెడ్డి లేఅవుట్లో శుక్రవారం జూదం ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.25,750 స్వాధీనం చేసుకున్నామని వన్‌టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత అట్లూరు : అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. అట్లూరు అటవీ చెక్‌పోస్టు దగ్గర కడప–బద్వేలు ప్రధాన రహదారిపై శుక్రవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. సిద్దవటం మండలం పెన్నానది నుంచి ఇసుకను తీసుకుని వస్తున్న నాలుగు ట్రాక్టర్లను తనిఖీ చేశారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్టేషన్‌కు తరలించి అట్లూరు తహసీల్దారుకు అప్పగించారు. వాహనాల యజమానులు తహసీల్దారు దగ్గర జరిమానా చెల్లించి ట్రాక్టర్లను తీసుకెళ్లారు. -
ముదివేడు కేజీబీవీ టీచర్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం
కురబలకోట : కురబలకోట కస్తూర్బా (కేజీబీవీ) స్కూల్ తెలుగు టీచర్ బిసన నిర్మలమ్మకు రాష్ట్ర స్థాయి ప్రతిభ పురస్కారం లభించింది. తెలుగుభాష అభివృద్దికి కృషి చేసినందుకు హైదరాబాదు దేవులపల్లె రామానుజరావు కళా మందిరంలో సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ, ఆంగ్ల ప్రొఫెసర్ మాధవరెడ్డి, జీర్కే గ్రూపు డైరెక్టర్ బి. రూపకుమార్రెడ్డి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మన సంస్కృతి పత్రిక నిర్వాహకులు మస్తాన్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇదే పాఠశాలకు చెందిన ఎనిమిదివ తరగతి విద్యార్థి డి. అంజలి తెలుగు ప్రతిభ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. తొమ్మిదవ తరగతి విద్యార్థి ఎం.ప్రణవ్య జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో రాణించి ప్రతిభ అవార్డులు అందుకున్నట్లు కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపాల్ రఫియా పర్విన్ తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుకు కృషి చేయాలి రాయచోటి (జగదాంబసెంటర్) : స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో భాగస్వాములై స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుకు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్ అధికారులకు సూచించారు. శుక్రవారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని రాయచోటి కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ హాలులో వర్చువల్‌గా ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ వీక్షించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్‌లో పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ నీటి భద్రత తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించి ఆవిష్కరించిందన్నారు. ఆయా అంశాలలో అభివృద్ధిని సాధించి జిల్లా మరియు స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుకు కృషి చేద్దామని జేసీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓ మధుసూదన్‌రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
టమాట ధరలు పతనం
ఆందోళనలో రైతులుమదనపల్లె సిటీ : టమాట ధరలు మళ్లీ పతనం అయ్యాయి. మొన్నటి వరకు 10 కేజీల క్రేట్ రూ. 400 ఉండగా తాజాగా రూ.180కి పడిపోయింది. దీంతో టమాట రైతులు లబోదిబోమంటున్నారు. ఉత్తర భారతదేశం నుంచి దిగుమతి అవుతున్న టమటా సరుకుతో నష్టాల బాటపట్టారు. పెట్టుబడి అయినా పొందుతామని ఎదురు చూసిన వీరికి ఒక్కసారిగా ధరలు కుప్పకూలడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర భారతదేశం నుంచి దిగుబడులు: మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర,ఛత్తీస్గడ్ ప్రాంతాల్లో టమాట పంట చేతికి రావడంతో దిగుబడులు పెరిగాయి. ఈ ప్రాంతాల టమాటాలు పలు ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్ నుంచి ఈ రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. అలాగే చైన్నెలో తుపాను కారణంగా ఎగుమతులు ఆగిపోయాయి. మదనపల్లె మార్కెట్లోని టమాటాలు స్థానికంగా మాత్రం అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ఎకరాకు రూ.1.50 లక్షల దాకా ఖర్చు: ఎకరా భూమిలో టమాట పంట సాగు చేస్తే పంట కోత దశ వరకూ రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల దాకా ఖర్చు వస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. మదనపల్లె టమాట మార్కెట్లో గత నెల రోజులుగా ధరలు ఆశించిన స్థాయిలోనే ఉన్నాయి. 10 కేజీలు రూ.500–600 వరకు పలకగా నేడు రూ.180కి పడిపోయింది. నాలుగైదురోజులుగా ధరలు పడిపోతుండటంలో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉత్తర భారతదేశంలో పంట దిగుబడులు వస్తుండటంతో సంక్రాంతి వరకు ధరలు పెరగకపోవచ్చునని వ్యాపారులు అంటున్నారు. మదనపల్లె మార్కెట్లో ధరల వివరాలు తేదీ మొదటి గ్రేడ్ రెండవ గ్రేడ్ (10 కేజీలు) (10 కేజీలు) 13–12–24 రూ.180.00 రూ.136.00 12–12–24 రూ.240.00 రూ.166.00 11–12–24 రూ.280.00 రూ.220.00 10–12–24 రూ.200.00 రూ.136.00 9–12–24 రూ.220.00 రూ.126.00 -
అన్నదాత సుఖీభవ నిధులు తక్షణమే అందించాలి
చంద్రబాబు చెప్పిన ష్యూరిటీ ఏమో గానీ ప్రజలపై బాదుడు మాత్రం గ్యారంటీ అయిందని, వెంటనే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు దాని గురించి ఆలోచన చేయడం లేదన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూటమి ప్రభుత్వం కల్పించలేదని మండిపడ్డారు. ఎన్నిలకు ముందు ఏ ఛార్జీలు పెంచనని ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక అన్ని వస్తువులపై రేట్లను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పేరిట వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాసిడర్ అని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. స్వచ్చంధంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన రైతులకు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతం
కడప రూరల్ : వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో శుక్రవారం స్థానిక ఆ కార్యాలయంలో నిర్వహించిన పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 9 మంది జూనియర్ అసిస్టెంట్స్‌కు సీనియర్ అసిస్టెంట్‌గా, ఒకరికి ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పదోన్నతులు కల్పించారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ భక్తవత్సలం, సూపరింటెండెంట్ వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. -
16న కబడ్డీ జట్టుకు ఎంపికలు
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డీఎస్ఏ క్రీడామైదానంలో ఈనెల 16వ తేదీన జిల్లాస్థాయి కబడ్డీ జూనియర్ విభాగం బాలబాలికల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఓ. రవీంద్రారెడ్డి, ఆర్. వెంకటసుబ్బయ్య తెలిపారు. 2005 జనవరి 12 తర్వాత పుట్టిన క్రీడాకారులు ఈ ఎంపికలకు అర్హులన్నారు. జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో నిర్వహించే అంతర్ జిల్లాల కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. వివరాలకు 9133480661, 9949304160 నెంబర్లో సంప్రదించాలని కోరారు. నేడు జాతీయ లోక్ అదాలత్ కడప అర్బన్ : జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో శనివారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘జాతీయ లోక్ అదాలత్’ ను నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టులలో 20 బెంచీలను ఏర్పాటు చేశామని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. -
తిరుపతిలో దంచికొడుతున్న వర్షం..
సాక్షి, తిరుపతి: ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిలో చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేశారు.తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శుభం భన్సల్. మరోవైపు.. వరద నీటి భారీగా వచ్చి చేరుతుండటంతో స్వర్ణముఖి నది పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజ్ వద్ద 7 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలారు అధికారులు. బాలిరెడ్డిపాలెం-గంగన్నపాలెం మధ్య స్వర్ణముఖి నది బ్రిడ్జిపై నీటి ప్రవాహం ఏడు అడుగులకు చేరుకుంది. దీంతో, 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. రోడ్లు, ఆనకట్టలపై నీరు ప్రవహిస్తున్న సమయంలో ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సిబ్బందిని జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్లో, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటును చేశారు. జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9849904062సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9441984020తిరుపతి ఆర్డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 7032157040శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 6281156474👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వర్షపాతం వివరాలు
మండలం వర్షపాతం (మి.మీటర్లు) రైల్వేకోడూరు 84 ఓబులవారిపల్లి 54 చిట్వేలి 42.4 కెవి పల్లి 33.8 పీలేరు 33.4 పుల్లంపేట 31.4 పెనగలూరు 30.6 కలికిరి 29.2 చిన్నమండెం 28.2 రాజంపేట 28 కలకడ 27.8 సుండుపల్లి 26.4 నిమ్మనపల్లి 23.6 గాలివీడు 23 నందలూరు 22 వాల్మీకిపురం 20.6 గుర్రంకొండ 19.4 రాయచోటి 19.2 కురబలకోట 17.2 వీరబల్లి 16.6 పెద్దమండెం 16 మదనపల్లి 15.2 రామసముద్రం 14.8 తంబళ్లపల్లి 12 ములకలచెరువు 11 రామాపురం 8.6 లక్కిరెడ్డిపల్లి 7.8 బి.కోట 7 -
‘తెలుగు’ వికాసానికి బ్రౌన్ విశేష కృషి
కడప కల్చరల్ : తెలుగు భాష వికాసానికి బ్రౌన్ విశేష కృషి చేశారని వైవీయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.కృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ‘తెలుగు సూర్యుడు’ సీపీ బ్రౌన్ 141వ వర్ధంతి సభను గురువారం బ్రౌన్ శాస్త్రి సమావేశ మందిరంలో నిర్వహించారు. తొలుత అతిథులతో కలిసి రాజీవ్‌మార్గ్‌లోని బ్రౌన్ విగ్రహానికి, అనంతరం గ్రంథాలయంలోని బ్రౌన్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. వీసీ మాట్లాడుతూ 19వ శతాబ్దంలో బ్రౌన్ గనుక లేకుంటే తెలుగుభాష పరిస్థితి మరోలా ఉండేదన్నారు. సభాధ్యక్షులు, వైవీయూ ప్రిన్సిపాల్ ఆచార్య రఘునాథ రెడ్డి మాట్లాడుతూ బ్రౌన్ తండ్రి డేవిడ్ బ్రౌన్ బహుభాషావేత్త అని, ఆయన ప్రభావంతోనే సి.పి.బ్రౌన్ గ్రీకు, లాటిన్, ఫ్రెంచి, సంస్కృతం మొదలైన భాషలెన్నో నేర్చుకున్నారన్నారు. గౌరవ అతిథి, వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ , బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి మాట్లాడుతూ బ్రౌన్ జీవిత విశేషాలను, సాహితీసేవను, బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణం వెనుక ఉన్న జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సీకే సంపత్ కుమార్ మొదలైన ప్రముఖుల కృషిని సభకు వివరించారు. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి, డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి సభను పర్యవేక్షించారు. వ్యాసరచన, వక్తృత్వం, పద్యపఠన పోటీలలో విజేతలైన విద్యార్థులకు వీసీ అతిథులతో కలసి బహుమతులు ప్రదానం చేశారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన డాక్టర్ పొదిలి నాగరాజు, డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, కె.రాజారెడ్డి, వరలక్ష్మిలను నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు– తులనాత్మక అధ్యయన విభాగం అధ్యాపకులు జి.బాలసుబ్రహ్మణ్యం, విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపకులు టి.రామప్రసాద రెడ్డి, పి.రమాదేవి, వినోదిని, బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సలహామండలి సభ్యులు జానమద్ది విజయ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. -
●వైఎస్సార్సీపీ పోరు
ప్రభుత్వ తీరును ఎండగడుతూ శుక్రవారం వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కనున్నాయి. జిల్లాలోని నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం జిల్లా కలెక్టర్‌కు రైతులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ నేతలు వినతిపత్రం అందించనున్నారు. డిమాండ్స్ ● తక్షణమే రైతుకు పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇవ్వాలి. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి. ● ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాలి. దళారీ వ్యవస్థను తొలగించాలి. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తేమ లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలి. ● ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలి. రైతుపై అదనపు భారం మోప వద్దు. -
ప్రత్యేక కార్యాచరణతో జిల్లా అభివృద్ధి
రాయచోటి : వినూత్న ఆలోచనలు, ప్రత్యేక కార్యాచరణతో జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులకు సూచించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సమావేశానికి అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి వీడియో కాన్ఫిరెన్స్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం జేసీ జిల్లా స్థాయి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులందరూ కార్యాచరణ రూపొందించుకొని నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నేడు విద్యా సంస్థలకు సెలవు రాయచోటి (జగదాంబసెంటర్) : జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ పాటించాలని ఆదేశించారు. వేగంగా ఆధునికీకరణ పనులు బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై చేపట్టిన పర్యాటక అతిథి గృహాల ఆధునికీకరణ పనులు త్వరగా పూర్తి చేసి అప్పగించాలని పర్యాటకశాఖ చీఫ్ ఇంజినీర్ వై.నరసింహరావు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గురువారం ఆయన కొండపై జరుగుతున్న 12 అతిథి గృహాల పనులను పరిశీలించారు. పనులు ప్రారంభించి ఆరునెలలు గడుస్తున్నా ఇంకా పూర్తి చేసి భవనాలను అప్పగించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా యాత్రి నివాస్ భవనాలను సిద్ధం చేసి అప్పగించాలని ఆదేశించారు. మిగిలిన వాటిని సంక్రాంతిలోపు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హార్సిలీహిల్స్‌పై రూ.9.13 కోట్లతో పర్యాటకశాఖ అతిథి గృహల ఆధునీకరణ, కొత్త భవనాల నిర్మాణం పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించామని తెలిపారు. అనంతరం ఆయన పర్యాటక శాఖ అతిథి గృహాలను పరిశీలించారు. టెంట్ హౌస్‌లను పరిశీలించి వాటికి చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట ఈఈ సుబ్రమణ్యంరాజు, డీఈఈ శ్రీనివాసులు, మేనేజర్ నేదురుమల్లి సాల్వీన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
సాగునీటి సంఘాల ఎన్నికల సందడి
రాయచోటి : జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల సందడి మొదలైంది. రెండు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ అయింది. జిల్లాలో కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ బుధవారం గెజిట్ విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఈ విషయాన్ని జిల్లా నీటి పారుదలశాఖ అధికారి భరత్ ధ్రువీకరించారు. ఈ నెల 14న సాగునీటి వినియోగదారుల సంఘాలకు కమిటీల ఎంపిక జరగనుంది. ఉదయం 7 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 3, 4 గంటలకు పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని వెలిగల్లు, ఝరికోన, శ్రీనివాసపురం ప్రాజెక్టుల ఎన్నికల ప్రక్రియ పూర్తికాక పోవడంతో ఎన్నికలు నిర్వహించడం లేదని జేసీ తెలిపారు. అలాగే అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల మరమ్మతుల కారణంగా ఎన్నికల నిర్వహణ చేపట్టడం లేదన్నారు. ఇదిలా ఉండగా మిగిలిన 167 సంఘాల ఎన్నికల నిర్వహణ కోసం జలవనరులు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వం సిద్ధం చేశాయి. ఇప్పటికే ఆయకట్టు రైతులకు సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో ఏ సమస్య, వివాదం తలెత్తకుండా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆయకట్టు రైతులతో సమన్వయ సమావేశాలు సైతం నిర్వహించారు. అధికారుల నియామకం సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు జలవనరులు శాఖ పరిధిలో డీఈఈ, ఏఈఈ, తహసీల్దార్లను ఎన్నికల అధికారి (ఈఓ), అదనపు ఎన్నికల అధికారులు (ఏఈఓ), ప్రొసీడింగ్ అధికారులుగా (పీఓ) నియమించారు. వీరికి నెలరోజుల కిందట రాయచోటి, మదనపల్లి, రాజంపేట, డివిజన్లలో శిక్షణ ఇచ్చారు. తాజాగా అన్ని మండల స్థాయిలో పీఓలకు తర్ఫీదు పూర్తి అయ్యింది. జలవనరులశాఖ ఈఈ, ఆర్డీఓలను ఎన్నికల పర్యవేక్షకులుగా నియమించారు. ఏకగ్రీవాల కోసం.. సాగునీటి సంఘాల ఎన్నికల సభ్యులు, చైర్మన్ల ఎంపికను అధికార పార్టీ నాయకులు ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని సాగునీటి సంఘాలకు తమ పార్టీ అనుయాయులకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీంతో అన్నమయ్య జిల్లా పరిధిలోని సాగునీటి సంఘాలన్నీ ఏకగ్రీవం కానున్నాయన్న వార్తలు దావనంలా వ్యాపిస్తున్నాయి. సాగునీటి ఎన్నికలుహైకోర్టు ఆదేశం మేరకు రహస్య ఓటింగ్ సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరగని సందర్భాల్లో చేతులెత్తి ఎన్నుకునే విధానాన్ని అనుసరిస్తే ఓటర్లు ఎవరికి ఓటు వేశారో అభ్యర్థులకు తెలిసిపోతుంది. ఇందువల్ల వారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ (ఎన్నికల నిర్వహణ) రూల్స్, 118 ప్రకారం చేతులెత్తే పద్ధతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. కనుక చేతులెత్తే విధానం కాకుండా రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలంటూ బెల్లన జగన్నాథం, చిరుమామిళ్ల శ్రీనివాసరావు హైకోర్టులో ఇటీవల రిట్ పిటీషన్లు దాఖలు చేశారు. 2020 నాటి లక్ష్మిసింగ్, ఇతరులు వర్సెస్ రేఖాసింగ్ ఇతరులు కేసులో రహస్య ఓటింగ్ అనేది రాజ్యాంగ పరమైన ప్రజాస్వామ్యంలో కీలకమైనదంటూ అపెక్స్ కోర్టు తన తీర్పులో స్పష్టం చేసిన విషయాన్ని కూడా పిటీషనర్లు పేర్కొన్నారు. ఈ పిటీషన్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాగూర్, రవి చీమలపాటి న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లింది. ఏకాభిప్రాయం కుదరని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకుంటామనే రైతులను.. అందుకు అనుమతించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. నోటిఫికేషన్ జారీ 14న అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం కోసం అధికార పార్టీ నాయకుల యత్నాలు -
అసభ్యంగా ప్రవర్తించాడనే హత్య
ఓబులవారిపల్లె : మనవరాలి వరుస అయిన ఓ బాలికపై.. వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తండ్రి గల్ఫ్ నుంచి వచ్చి అతన్ని సినీ ఫక్కీలో హత్య చేశాడు. తిరిగి వెంటనే గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అయితే ఆ హత్య తానే చేశానని ఒప్పుకొంటూ.. సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. ఈ హత్యోదంతానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త మంగంపేట పునరావాస కాలనీ పదో వీధిలో శనివారం గుట్ట ఆంజనేయులు(59) అనే దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్య చేసింది అయ్యలరాజుపల్లె దళితవాడకు చెందిన జెడ్డా ఆంజనేయ ప్రసాద్‌గా నిర్ధారించుకున్నారు. గ్రామంలో పోలీసులు విచారణ చేయడం, ఇతర గొడవలు, కుమార్తె పట్ల సొంత బంధువు వ్యవహరించిన తీరు వల్లే హత్య జరిగిందని పోలీసులకు క్లూ దొరకడంతో.. కువైట్‌లో ఉన్న జెడ్డా ఆంజేయప్రసాద్ విషయం తెలుసుకొని తనే హత్య చేశానని సామాజిక మాధ్యమాల్లో వీడియోను విడుదల చేయడం వైరల్‌గా మారింది.గతంలో..జెడ్డా ఆంజనేయప్రసాద్ తన భార్య చంద్రకళతో కలిసి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. తన 12 ఏళ్ల కుమార్తెను కొత్త మంగంపేటలోని చంద్రకళ చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద వదిలి వెళ్లారు. లక్ష్మి మామ దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు వరుసకు మనవరాలు అయిన ఆ 12 ఏళ్ల పాపపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో కువైట్‌లో ఉన్న ఆంజనేయప్రసాద్ భార్య చంద్రకళ అదే పనిగా ఇండియాకు వచ్చి సొంతూరైన ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అంతగా పట్టించుకోకపోవడం, దివ్యాంగుడిని పిలిచి మందలించి పంపడంతో ఒకింత ఆంజనేయప్రసాద్ కుటుంబం మనసు నొచ్చుకుని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. దివ్యాంగుడు బయట తిరుగుతూ కవ్వింపు చర్యలతో అందరికీ ఫోన్లు చేస్తూ ఏమీ చేయలేరని చెప్పుకుంటున్న తరుణంలోనే.. ఆంజనేయప్రసాద్ కుటుంబం దివ్యాంగుడు గుట్ట ఆంజనేయులును అంతమొందించాలని వ్యూహం రచించి పథకం ప్రకారమే హత్య చేసినట్లు సమాచారం.చైన్నెలో అదుపులోకి తీసుకున్న పోలీసులుఆంజనేయప్రసాద్కు పోలీసులు ఫోన్ చేసి లొంగిపోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట ఆయన విడుదల చేసిన వీడియో కూడా సంచలనంగా మారింది. పోలీసులు నిందితుడిగా భావిస్తున్న ఆంజనేయ ప్రసాద్ దంపతులను గురువారం చైన్నె ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జిల్లాకు తీసుకువచ్చి పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలియవచ్చింది.వీడియోతో కలకలంకువైట్లో ఉంటూ ఇక్కడికి వచ్చి హత్య చేసి అనంతరం మళ్లీ కువైట్ వెళ్లినట్లు చేసిన వీడియో సంచలనంగా మారింది. కుమార్తెను అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో తుద ముట్టించాలని నిర్ణయించుకుని హత్య చేసినట్లు ఆంజనేయప్రసాద్ యూట్యూబ్‌లో పెట్టిన వీడియో కలకలం రేపింది. హత్య చేయాలని నిర్ణయించుకుని కువైట్ నుంచి ఇక్కడికి వచ్చి.. కొత్తమంగంపేటలో నిద్రిస్తున్న గుట్ట ఆంజనేయులు తలపై బలంగా కొట్టడంతో చనిపోయాడని.. హత్య చేసి తిరిగి కువైట్‌కు వెళ్లి పోయినట్లు వీడియోలో స్పష్టం చేశాడు. తన కూమర్తెకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక హత్య చేశానని, తాను స్వచ్ఛందంగా పోలీసులకు లొంగి పోతానని సోషల్ మీడియాలో ఆంజనేయ ప్రసాద్ పోస్టు చేశాడు.ఎస్ఐ ఏమంటున్నారంటే...ఓబులవారిపల్లె ఎస్ఐ మహేష్‌ను ఈ విషయమై ‘సాక్షి’ అడగగా.. కేసు నుంచి తప్పించుకునేందుకే ఆంజనేయ ప్రసాద్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని తెలిపారు. చాలా రోజుల నుంచి కుటుంబ కలహాలు ఉన్నాయని, పాప విషయంలో పోలీస్‌స్టేషన్‌లో తల్లి కేసు పెట్టకుండానే కువైట్ వెళ్లిపోయిందని పేర్కొన్నారు. న్యాయం జరగలేదనిపిస్తే పై స్థాయి అధికారులు చాలా మంది ఉన్నారని, వారికి ఫిర్యాదు చేసి ఉండాల్సిందన్నారు. అంతేగానీ హత్య చేయడం ఏమిటని.. ఇది నేరం అవుతుందన్నారు.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో… pic.twitter.com/PxuBVI5WQL— Telugu Scribe (@TeluguScribe) December 12, 2024