Hyderabad
-
రేవంత్.. ముందు నీ భాష మార్చుకో: కౌశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది తాను కాదు.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట కౌశిక్ రెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకుపైగా ఆయనను పోలీసులు విచారించారు.ఇక, విచారణ అనంతరం పీఎస్ బయట కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు నన్ను గంట పాటు విచారించారు. విచారణలో భాగంగా 32 ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నే అడిగారు మళ్లీ అడిగారు. నేను అన్నింటికీ సమాధానం ఇచ్చాను నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలపై ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. డిసెంబర్ నాలుగో తేదీన ఫిర్యాదు చేయడానికి నేను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కి వెళ్ళాను. బంజారాహిల్స్ ఏసీపీ అపాయిట్మెంట్ తీసుకొని అక్కడిని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపైనే కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పండుగ రోజు కూడా నన్ను దొంగ లాగ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది నేను కాదు.. రేవంత్ మార్చుకోవాలి అని హితవు పలికారు. -
పొన్నాల ఇంట భారీ చోరీ
హైదరాబాద్, సాక్షి: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు దొంగలు దోచుకెళ్లారు. ఫిలిం నగర్ పోలీసులకు ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎక్కడైనా అంతే.. ఆరోగ్యం గల్లంతే!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో చిన్న హోటళ్లలోనే కాదు, బడా స్టార్ హోటళ్లలోనూ ప్రజలకు వడ్డించే ఆహారంపై గ్యారంటీ లేదు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ఫుడ్‌సేఫ్టీ విభాగం నిర్వహించిన తనిఖీల్లో ఎంతో పేరెన్నికగన్న ఫైవ్‌స్టార్ హోటళ్లలోనూ వంటగదుల బండారం బట్టబయలైంది. నిల్వ ఉంచిన ఆహారం, కనీస జాగ్రత్తలు లేకపోవడం కూడా వెలుగు చూడటం తెలిసిందే. హైదరాబాద్ బిర్యానీతో పాటు ఇతరత్రా ఆహారాలకు ఎంతో పేరున్నప్పటికీ, ఫుడ్ సేఫ్టీ లేకపోవడం కూడా అదే స్థాయిలో ఉంది. అందుకే ఫుడ్ సేఫ్టీఅండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ర్యాంకుల్లోనూ తెలంగాణకు దక్కింది అధమ స్థానమే. అయినా నగరంలో హోటల్ నిర్వాహకుల తీరు మారలేదు. మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నప్పటికీ, ప్రభుత్వరంగ సంస్థల్లోని హోటళ్లలో ఆహారం కల్తీ కాదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటారని చాలామంది భావిస్తారు. కానీ.. అది కూడా నిజం కాదని, అన్ని హోటళ్ల మాదిరిగానే అక్కడా ప్రజారోగ్యంపై శ్రద్ధ లేదని వెల్లడైంది. నీళ్లు నమిలిన మేనేజర్లు.. నగరంలోని ప్రజాభవన్‌కు సమీపంలోనే ఉన్న టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ప్లాజాలోని ‘మినర్వా’లోని పప్పు కర్రీలో ఓ వినియోగదారుకు బొద్దింక కనిపించింది. దీంతో హతాశుడైన అతను ఇదేమని మేనేజర్లను ప్రశ్నిస్తే.. నీళ్లు నమిలారు. పొరపాటైందని అన్నారు. మీరు తరచూ వస్తుంటారుగా సార్.. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా కాలేదుగా అన్నారు. తనకు ఎదురైన అనుభవాన్ని పేర్కొంటూ.. వీడియోలు సహా అతను సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం వైరల్‌గా మారింది. ఇలాంటి ఆహార వడ్డనతో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని, తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రెగ్యులర్ తనిఖీలు నిర్వహించాలన్నారు. ఫిర్యాదు అందగానే జీహెచ్ఎంసీ అధికారులు మినర్వాలో తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించారు. లోపాలు వెలుగులోకి వస్తున్నా.. నగరంలో కొంత కాలంగా ఎక్కడ తనిఖీలు నిర్వహించినా ప్రమాణాలు పాటించకపోవడం, ఫుడ్‌సేఫ్టీ లేకపోవడం బట్టబయలవుతూనే ఉన్నాయి. అయినా.. ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. లోపాలు వెల్లడవుతున్నప్పటికీ, నిర్వాహకులపై తగిన చర్యలు లేకపోవడం వల్లే పరిస్థితిలో మార్పు రావడం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. టూరిజం ప్లాజాలో గదులు దొరకడం అందరికీ సాధ్యం కాదు. వాటికి ఎంతో డిమాండ్ ఉంది. దేశ, విదేశీ పర్యాటకులెందరో విడిది చేసే టూరిజం ప్లాజాలోని హోటల్లోనే పరిస్థితి ఇలా ఉండటాన్ని చూసి ప్రజలు బయట ఎక్కడ తినాలన్నా భయపడాల్సి వస్తోంది. పప్పులో కనిపిస్తున్న బొద్దింకప్రైవేట్ హోటళ్లే కాదు.. ప్రభుత్వ సంస్థల్లోనూ అదే తీరు టూరిజం ప్లాజాలోని ‘మినర్వా’ ఆహారంలో బొద్దింక వినియోగదారుడి ఫిర్యాదుతో వెలుగు చూసిన ఘటన -
ట్రాఫిక్ సెన్స్ ఎంతో అవసరం
అబిడ్స్: ట్రాఫిక్ అవగాహన, ట్రాఫిక్ సెన్స్ వాహనదారులకు మెండుగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగవని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నుమాయిష్‌లో పోలీస్ స్టాల్‌ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో విద్యారంగ వ్యాప్తికి నిర్వాహకులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. తన చిన్నప్పటి నుంచి నుమాయిష్‌ను సందర్శించి ఎంతో ఉల్లాసంగా గడిపేవాడినని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ మాట్లాడుతూ..... చిన్నప్పటి నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్శంగా చుక్ చుక్ రైల్లో సీపీ సీవీ ఆనంద్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ప్రయాణించారు. కార్యక్రమంలో డీసీపీలు రాహుల్ హెగ్డే, వెంకటేశ్వర్లు, కవిత, అశోక్‌కుమార్, డీసీపీ రామ్‌దాస్ తేజ, ఏసీపీలు చంద్రశేఖర్, ధనలక్ష్మి, ఇన్స్పెక్టర్లు విజయ్‌కుమార్, బాలాజీ, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్ రెడ్డి, ప్రతినిధులు ఆర్.సుకేష్ రెడ్డి, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నుమాయిష్‌లో పోలీస్ స్టాల్ ప్రారంభం -
ట్రేడ్ లైసెన్స్ లేకుంటే 100 శాతం పెనాల్టీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసేవారికి లైసెన్స్ ఫీజుతో పాటు 100 శాతం పెనాల్టీ విధించనున్నట్లు అధికారులు హెచ్చరించారు. లైసెన్స్ పొందేంత వరకు నెలకు 10 శాతం ఫైన్ కూడా అదనంగా విధించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు కమిషనర్ ఇలంబర్తి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ట్రేడ్ లైసెన్సులున్న వారు పెనాల్టీలు లేకుండా ఉండేందుకు ఈ నెలలోగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు 25 శాతం పెనాల్టీ, ఏప్రిల్ 1 నుంచి 50 శాతం పెనాల్టీ పడుతుందని పేర్కొన్నారు. పెనాల్టీలు పడకుండా ఉండేందుకు మీసేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ పౌరసేవ కేంద్రల్లో సంప్రదించి రెన్యువల్ చేయించుకోవచ్చని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు లైసెన్సులు పొందనివారు ఆన్లైన్ ద్వారా కానీ.. మీసేవ కేంద్రాల ద్వారా కానీ తాజాగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌ను (www. ghmc.gov.in) చూడాలని ఇలంబర్తి సూచించారు. -
రా‘బంధు’లెవరో?
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంజూరు చేసిన బీసీ, మైనారిటీ బంధు యూనిట్లపై అధికార యంత్రాంగం ఆరా తీస్తోంది. వంద శాతం సబ్సిడీతో రూ. లక్షల విలువైన యూనిట్లను మంజూరు చేసింది. అప్పట్లో లబ్ధిదారుల ఎంపిక నుంచి చెక్కుల పంపిణీ వరకు వ్యవహారమంతా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే సాగింది. తాజాగా సంక్షేమ శాఖల నుంచి లబ్ధిదారులు ఫోన్ల తాకిడి పెరిగింది. ‘యూనిట్ల పరిశీలనకు వస్తున్నాం.. షాపు చిరునామా చెప్పండి’ అంటూ ఫోన్లు వస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవంగా బీసీ, మైనారిటీ బంధు కింద రూ.లక్ష లబ్ధి పొందిన వారిలో సగానికిపైగా యూనిట్లను నెలకొల్పనట్లు తెలుస్తోంది. రుణ మంజూరుకు సిఫారసులు చేసిన వారికి కొంత ముట్టజెప్పి మిగితాది తమ అవసరాలకు ఖర్చు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా యూనిట్లపై విచారణ ప్రారంభం కావడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. గ్రేటర్లో 7,200 యూనిట్లు.. గ్రేటర్ పరిధిలో సుమారు 7,200 యూనిట్లు మంజూరైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో బీసీ బంధు కింద మొదటి విడతగా నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వృత్తి, చిరు వ్యాపారాల కోసం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు. వాస్తవంగా గ్రేటర్ పరిధిలో సుమారు 65 వేల మందికి పైగా చేతి, కులవృత్తిదారులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 20,724, మేడ్చల్‌లో 22 వేల 87 మంది, రంగారెడ్డి జిల్లాలో సుమారు 20 వేలకుపైగా దరఖాస్తులు అందినట్లు బీసీ సంక్షేమ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి విడత పంపిణీ తర్వాత రెండో విడతలో మిగిలిన అర్హులైన వారికి అందిస్తామని ప్రకటించినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో వాటి ప్రస్తావనే లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వంద శాతం సబ్సిడీతో బీసీ, మైనారిటీ బంధు పథకాలను అమలు చేసింది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రతీ యేటా సబ్సిడీతో కూడిన బ్యాంక్ లింకేజీ ఆర్థిక చేయూత కోసం దరఖాస్తులను స్వీకరిస్తూ వచ్చింది. అందులో కేవలం 80 శాతం సబ్సిడీతో కూడిన బ్యాంక్ లింకేజీ కింద రూ.లక్ష రుణం మాత్రమే మంజూరు చేసి మిగతా సబ్సిడీ రుణాలను పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. అయితే.. రూ. లక్ష రుణం కోసం కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులను రావడంతో అర్హులను గుర్తించి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను గుర్తించినా నిధుల విడుదల కాకపోవడంతో ఆర్థిక సాయం మంజూరు పెండింగ్‌లో పడిపోతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం బీసీ, మైనారిటీ బంధు పథకం ప్రకటించి వంద శాతం సబ్సిడీని వర్తింపజేసింది. అయితే.. రుణ సహాయం పొందిన వారిలో సగానికి పైగా యూనిట్లు ఏర్పాటు చేయకపోవడంతో అసలు తలనొప్పి ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు రుణ వితరణలు బీసీలు, మైనారిటీలకు రూ.లక్ష చొప్పున అప్పు ప్రస్తుతం యూనిట్లపై ఆరా తీస్తున్న అధికారులు అయోమయానికి గురవుతున్న లబ్ధిదారులు మనుగడలో లేని సగానికి పైగా యూనిట్లు -
కలర్.. కమాల్!
వాహన అద్దాల ‘రంగు’ ముదురుతోంది!! సాక్షి, సిటీబ్యూరో: ‘కార్లు ఇతర వాహనాల అద్దాలపై రంగు ఫిల్మ్‌లు తదితరాలు ఉండకూడదు. ఆయా వాహనాల్లోని లోపలి భాగం స్పష్టంగా బయటికి కనిపించేలా ఉండాలి’ అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గతంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలివి. వీటి అమలు నగరంలో క్రమక్రమంగా మసకబారుతోంది. అనేక వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసుకుని సంచరిస్తున్నా పోలీసుల చర్యలు మాత్రం నామమాత్రంగా మారాయి. 70.. 50 శాతం కాంతి ప్రసారం కచ్చితం.. వాహనాల్లో జరుగుతున్న నేరాలు, ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం 2012లో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమలు చేయాల్సిన బాధ్యతను రాష్ట్రాల డీజీపీలు, కమిషనరేట్ల కమిషనర్ల ద్వారా ఆయా ట్రాఫిక్ విభాగాలకు అప్పగించింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వాహనాల ముందు వెనుక అద్దాలు 70 శాతం, పక్క తలుపులకు ఉన్న అద్దాలు 50 శాతం కాంతి ప్రసారకాలుగా (విజువల్ లైట్ ట్రాన్స్మిషన్) ఉండాల్సిందే. ప్రస్తుతం అనేక వాహనాలకు ఇది కేవలం 30, 10 శాతంగానే ఉంటోంది. ఫిల్మ్‌లతో పాటు ఇతర ఏ విధమైనవీ అద్దాలపై నిర్ణీత ప్రమాణాలకు మించి ఉండకూడదు. కార్లను తయారు చేసే కంపెనీలు కచ్చితమైన ప్రమాణాలతో అద్దాలను రూపొందిస్తాయి. వీటినే కొనసాగిస్తే ఉత్తమమని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే.. అనేక మంది ఆ అద్దాలపై ఫిల్మ్‌లు వేసుకుంటున్నట్లు వివరిస్తున్నారు. ఆ రెండు కేటగిరీలకే మినహాయింపు.. బ్లాక్ ఫిల్మ్‌తో కూడిన అద్దాల వాహనాలు వినియోగిస్తున్న వారిలో సామాన్యులే కాదు.. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు సైతం ఉంటున్నారు. సెలబ్రెటీలు కూడా తమకు పబ్లిక్ ప్లేసుల్లో అభిమానులతో అనవసర ఇబ్బందులు వస్తాయనే సాకుతో వినియోగిస్తున్నారు. ప్రజాప్రతినిధులైతే ఏకంగా భద్రతా కారణాలు చెబుతున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం బ్లాక్ ఫిల్మ్ నిబంధన నుంచి కేవలం జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే అత్యంత ప్రముఖులకు మాత్రమే మినహాయింపు ఉంది. అదీ కేవలం అధీకృత వాహనాలు, భద్రతాపరమైన అంశాల్లో మాత్రమే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యున్నత అధికారుల వాహనాలకు సైతం ఫిల్మ్ లేని అద్దాలతో కూడిన వాహనాలనే వినియోగించాల్సి ఉంది. మినహాయింపు పొందటం ప్రహసనమే... ఓ ప్రముఖుడు లేదా వ్యక్తికి భద్రత కల్పించాలన్నా, గన్మెన్లను ఏర్పాటు చేయాలన్నా దానికి సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్సార్సీ) సిఫార్సులు తప్పనిసరి. అలాగే ఈ బ్లాక్ ఫిల్మ్ నిబంధన నుంచి జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీల్లో ఉన్న వారు కాకుండా ఇతరులు మినహాయింపు పొందాలంటే దానికి పెద్ద ప్రహసనమే ఉంది. రాష్ట్ర స్థాయిలో హోమ్ సెక్రటరీ నేతృత్వంలో డీజీపీ తదితరులతో ఏర్పాటయ్యే అత్యున్నత స్థాయి ప్రత్యేక కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ కమిటీ దరఖాస్తుతో పాటు దరఖాస్తుదారుడి పూర్వాపరాలను పరిశీలించి, వివిధ కోణాల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కమిటీ కేవలం భద్రతాపరమైన అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మినహాయింపులు ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘సుప్రీం’ తీర్పులో ప్రస్తావన లేనందున వాహనాల వెనుక, పక్క అద్దాలకు లోప లి వైపు నుంచి కర్టెన్లు వేసుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదని అధికారులు చెబుతున్నారు.లోపలి భాగం స్పష్టంగా కనిపించకుండా ఏర్పాటు సుప్రీం కోర్టు ఆదేశాలూ బేఖాతర్ సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులదీ ఇదే పంథా నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్న పోలీసులు అప్పట్లో పక్కాగా అమలు.. ప్రస్తుతం నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ గతంలో సిటీ ట్రాఫిక్ విభాగం చీఫ్‌గా వ్యవహరించారు. అప్పట్లోనే సుప్రీం కోర్టు తీర్పు కూడా రావడంతో పక్కాగా అమలు చేశారు. ఉల్లంఘనులకు జరిమానాలు విధించడానికి ముందు కొన్ని రోజుల పాటు ప్రచారం చేశారు. ఆపై ప్రత్యేక డ్రైవ్స్ ప్రారంభించారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 100 కింద తొలుత రూ.500 చొప్పున, ఆపై రూ.వెయ్యి చొప్పున జరిమానాలు విధించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు దేశ వ్యాప్తంగా అందరికీ శిరోధార్యం కావడంతో జిల్లాల నుంచి నగరానికి వచ్చే వాహనాలకూ వర్తింపజేశారు. కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫిల్మ్‌లు కలిగి ఉన్న వాహనాలను ఆపి, రోడ్లపైనే తొలగించారు. వాహనాల అద్దాలపై ఉన్న ఫిల్మ్ పరిమాణాన్ని కొలవడానికి టిల్టో మీటర్ల కూడా వినియోగించారు. ఫిల్మ్ వినియోగం వద్దని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలంటూ సాధారణ పరిపాలన శాఖ, పోలీసు వాహనాలకు సంబంధించి పోలీసు రవాణా విభాగం, కమిషనరేట్లలోని సంబంధిత విభాగాలు, హైకోర్టు రిజిస్ట్రార్లతో పాటు అన్ని విభాగాల అధిపతులకు (హెచ్ఓడీ) లేఖలు సైతం రాశారు. -
విద్యకు మొదటి ప్రాధాన్యం
మంత్రి సీతక్క చైతన్యపురి: రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యమిస్తోందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం కొత్తపేటలోని సరూర్‌నగర్ సంక్షేమ గురుకులాల కళాశాలలో సంక్షేమ గురుకుల విద్యాలయాలు, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గురుకులాల్లో ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. తోటమాలి మొక్కలను ఎలా జాగ్రత్తగా సంరక్షిస్తారో అదే రకంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని పండిట్ జవహర్ లాల్ చెప్పేవారని గుర్తు చేశారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్ నిర్మితమవుతుందని, ఆ భవిష్యత్ టీచర్లు, ప్రిన్సిపాల్స్ చేతుల్లో ఉంటుందన్నారు. టీచర్లు నిత్య విద్యార్థుల్లా ఉండాలని సూచించారు. తాను హాస్టల్లో ఉండి చదుకువున్నానని, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, పీహెచ్డీ చేసి ఇప్పుడు మరో పీజీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. హాస్టల్ జీవితం ఆనందదాయకంగా ఉండాలని, అందించే ఆహారం సొంత కుటుంబాన్ని గుర్తు చేసుకునేలా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. -
పోలీస్ విచారణకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అరగంటకుపైగా ఆయన్ని విచారణ జరిపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీన కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్(Banjara Hills) పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ ఆయన ఫిర్యాదు చేయబోయారు. అయితే ఆ సమయంలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ బయటకు వెళ్తున్నారు. దీంతో.. సీఐ వాహనానికి తన వాహనాన్ని అడ్డు పెట్టి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. ఈ ఘటనపై సీఐ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై కేసు నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. నా తప్పేమీ లేదు: కౌశిక్రెడ్డిమాసబ్ ట్యాంక్ పీఎస్ లోపలికి వెళ్లే క్రమంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నేను చేసిన తప్పేమీ లేదు. విచారణకు పూర్థిస్తాయిలో సహకరిస్తా’’ అన్నారు. అయితే తన అడ్వొకేట్(Advocate)తో కలిసి ఆయన లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకున్నారు. ఆపై ఆయన విజ్ఞప్తితో ఉన్నతాధికారులను సంప్రదించి.. అనంతరం వాళ్లను లోపలికి వెళ్లనిచ్చారు. -
నగదు ఇస్తానని..
మలక్‌పేట: నగదు ఇస్తానని చెప్పి గుర్తుతెలియని వ్యక్తి ఓ వ్యాపారి నుంచి రూ. 75 వేలు గూగుల్‌పేకు ట్రాన్స్ఫర్ చేయించుకుని పరారైన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్బర్‌బాగ్ డివిజన్, ఆంధ్రాకాలనీకి చెందిన తిప్పన జనార్దన్‌రెడ్డి మలక్‌పేట సూపర్బజార్లో జిరాక్స్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం యాక్టీవాపై అక్కడికి వచ్చిన గుర్తు తెలియని జనార్దన్‌రెడ్డిని మాటల్లో పెట్టాడు. అత్యవసర పరిస్థితి ఉన్నందున రూ.75 వేలు గూగుల్ పే చేయాలని, నగదు ఇస్తానని కోరాడు. అతడి మాటలు నమ్మిన జనార్దన్‌రెడ్డి నగదు బదిలీ చేశాడు. నగదు బైక్ డిక్కీలో ఉందని తీసుకొస్తానని బయటికి వచ్చిన అతను అక్కడి నుంచి పరారయ్యాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు స్థానిక యూకే బ్యాంక్‌లో తన అకౌంట్ ఫ్రీజ్ చేయించాడు. కాగా అగంతకుడు అప్పటికే అందులో నుంచి రూ.50 వేలు డ్రా చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. ● వృద్ధుడికి టోకరా ● రూ.75వేలు బదిలీ చేయించుకుని పరారీ -
మహిళల చేతికి సోలార్ పవర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పేద, మధ్య తరగతి మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఆలోచనలో భాగంగా ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. తద్వార విలువైన దేవుడి మాన్యాలు కబ్జాకాకుండా కాపాడటంతో పాటు మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వొచ్చని భావిస్తోంది. ఇందుకోసం రెవెన్యూ అధికారులు ప్రాణాళిక రూపొందించారు. ఏ దేవుడి పేరున? ఏ గ్రామంలో? ఎంత భూమి ఉందో? గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించనున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు బ్యాంకర్లతో చర్చలు కూడా జరిపారు. సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, డిస్కం గ్రిడ్లకు అనుసంధానం చేయనున్నారు. వచ్చే డబ్బులతో బ్యాంకు రుణాలను తీర్చడంతో పాటు మహిళల ఆర్థిక పురోగతికి బాటలు వేయనున్నారు. 24 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తి జిల్లాలో 21 మండల మహిళా సమాఖ్యలు, 788 గ్రామ మహిళా సంఘాలు, 19,209 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 2,06,116 మంది సభ్యులు ఉన్నారు. వివిధ బ్యాంకులు వీరికి ఏటా రూ.వెయ్యి కోట్ల వరకు రుణాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్ కోసం పూర్తిగా థర్మల్, హైడల్ పవర్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. డిమాండ్ మేరకు వనరులు లేకపోవడంతో సరఫరాలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అదే ఒక్కసారి సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే.. 24 ఏళ్లు పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కనీసం నాలుగెకరాల భూమి అవసరమవుతోంది. అదే ఖాళీ గా ఉన్న ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూముల్లో వీటిని ఏర్పా టు చేయడం ద్వారా స్థానిక అవసరాలు తీర్చడంతో పాటు మిగిలిన విద్యుత్‌ను డిస్కంలకు అమ్ముకుని సొమ్ము చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. జిల్లాలోని దేవుడి భూములివే.. ● మాడ్గుల మండలం అర్కపల్లిలోనిశ్రీఆంజనేయస్వామి దేవాలయం పేరున 34 ఎకరాలు. ● ఇంజాపూర్‌లోని శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పేరున 74.15 ఎకరాలు. ● యాచారం మండలంలోని ఓంకారేశ్వరాలయానికి 1,450 ఎకరాలు. ● పెండ్యాల లక్ష్మీనరసింహ్మస్వామి దేవాలయానికి 360 ఎకరాలు. ● అమ్మపల్లిలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి 222 ఎకరాలు. ● మామిడిపల్లి బాలాజీ వేంకటేశ్వ రస్వామి దేవాలయానికి 33.12 ఎకరాలు. ● జెన్నాయిగూడలోని క్షేత్రగిరి లక్ష్మీనరసింహ్మస్వామి దేవాలయానికి 800 ఎకరాలు. ● కడ్తాల్‌లోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయానికి 41.29 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. ● ఈ స్థలాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేవుడి మాన్యాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు మహిళా సమాఖ్యల ఆర్థిక అభ్యున్నతి దిశగా అడుగులు ఆలయ భూములను గుర్తించే పనిలో రెవెన్యూ యంత్రాంగం మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు నాలుగెకరాల భూమి అవసరం -
36 గంటల్లో పట్టేశారు..
మణికొండ: పుప్పాలగూడలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. 36 గంటల్లో కేసును ఛేదించిన నార్సింగి పోలీసులు నిందితులను మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో గురువారం అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బిందు(25) అనే యువతి సెక్స్‌వర్కర్‌గా పని చేసేది. ఈ నేపథ్యంలో ఆమెకు రాహుల్‌కుమార్ సాకేత్ అనే యువకుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రాహుల్ కుమార్ సాకేత్ వీడియో తీసేందుకు యత్నించాడు. అందుకు అభ్యంతరం చెప్పిన బింధు అతడితో గొడవ పడి అక్కడినుంచి వచ్చేసింది. ఈ విషయాన్ని అంకిత్ సాకేత్(27)కు చెప్పింది. దీంతో ఆగ్రహానికి లోనైన అంకిత్, రాహుల్‌ను మందలించాడు. ఈ కారణంగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను మందలించాడనే కోపంతో రాహుల్, అంకిత్ సాకేత్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని తన మిత్రులు రాజ్‌కుమార్ సాకేత్, సుఖేంద్ర కుమార్ సాకేత్‌లను కోరాడు. పథకం ప్రకారం ఈనెల 11న రాహుల్‌కుమార్ సాకేత్, అంకిత్‌తో పాటు తన స్నేహితులతో కలిసి మరోమారు బింధును తీసుకుని ఆటోలో పుప్పాలగూడలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టలపైకి వచ్చారు. సుఖేంద్రకుమార్ సాకేత్ బిందుతో కలిసి ఉండగా రాహుల్‌కుమార్, రాజ్‌కుమార్, అంకిత్ సాకేత్‌ను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి కత్తితో పొడిచి, బండ రాయితో మోది దారుణంగా హత్య చేశారు. ఈ సందర్భంగా అంకిత్ ఎదురుతిరగడంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. అనంతరం ముగ్గురూ కలిసి బింధు వద్దకు వచ్చి ఆమెను తలపై బండరాయితో మోది హత్య చేశారు. జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ ముగ్గురు నిందితుల అరెస్టు హత్య చేసి మధ్యప్రదేశ్‌కు పరారీ హైదరాబాద్‌కు తీసుకువస్తున్న పోలీసులు మధ్యప్రదేశ్‌కు పరార్ హత్య అనంతరం నిందితులు ముగ్గురూ మృతుల వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకుని 12న తెల్లవారుజామున తమ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌కు పారిపోయారు. 14న ఉదయం గుట్టపై మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితుల వద్ద ఉన్న మృతుల సెల్ఫోన్ల ఆధారంగా వారు మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం గురువారం వారిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి మృతుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని స్థానిక కోర్టులో హాజరుపరచి ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. -
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
అమీర్‌పేట: విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..బాపట్లకు చెందిన వినయ్ భాస్కర్ (53) ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో డ్యూటీకి వచ్చాడు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుండె పోటు రావడంతో సిబ్బంది అతడిని అమీర్‌పేటలోని వెల్నెస్ ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేయడంతో సాధారణ స్థితికి వచ్చాడు. ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తుండగా అర్థరాత్రి రెండో సారి గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వినయ్ భాస్కర్‌కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డీఐ గోపాల్ సిబ్బందితో కలిసి బోయిన్ పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.కో–ఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.50 వేలు, శాఖ తరఫున రూ.30 వేలు ఆర్థికసాయం అందజేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
తుక్కు కోసం వెళ్తే ట్రాలీ కూడా దొరికింది!
జీడిమెట్ల: పాతబస్తీ ప్రాంతానికి చెందిన నలుగురు దొంగలు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఓ స్క్రాప్ గోదాంను టార్గెట్ చేశారు. అందులో ఉన్న తుక్కు చోరీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ రాత్రి తాళాలు పగులకొట్టి గోదాంలోకి వెళ్లిన వారికి తుక్కుతో పాటు టాటా ఏస్ ట్రాలీ కూడా కనిపింది. దాని తాళాలు సైతం అందుబాటులో ఉండటంతో దొంగిలించిన స్క్రాప్‌ను అందులోనే వేసుకుని ఉడాయించారు. వివిధ సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు బాలానగర్ డీసీపీ సురేష్‌కుమార్ తెలిపారు. జీడిమెట్ల ఠాణాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గోపిరెడ్డి బాలకృష్ణ అనే వ్యక్తి జీడిమెట్ల పరిధిలోని రాంరెడ్డినగర్‌లో స్క్రాప్ గోదాం నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో గోదాం, గేటుకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. రాగి వైరుతో సహా అనేక వస్తువులు ఉంటాయని ఈ గోదాంపై కన్నేసిన పాతబస్తీలోని కాలపత్తర్ వాసులు సయ్యద్ ఫెరోజ్, మహ్మద్ అలం, అస్లాం ఖాన్న్, రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ గఫూర్, సోహైల్ అదే రోజు రాత్రి తాళాలు పగులకొట్టి గోదాంలోకి ప్రవేశించారు. వారికి అక్కడ రాగి వైరు, సామానుతో పాటు ఓ ట్రాలీ కూడా కనిపించింది. ఆ సమీపంలోనే దాని తాళాలు సైతం ఉండటంతో చోరీ చేసిన సొత్తు అందులోనే వేసుకుని ఉడాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో రెండు వేల కేజీల రాగి వైరుతో పాటు గోదాంలో ఉన్న ఇతర లోహ వస్తువులను ట్రాలీలో వేసుకుని పరారయ్యారు. మర్నాడు ఉదయం తన గోదాంకు వచ్చిన బాలకృష్ణ చోరీ జరిగినట్లు గుర్తించి జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన గోదాం, దానికి దారి తీసే మార్గాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న 150 సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలించారు. వాటిలో కనిపించిన దృశ్యాల ఆధారంగా పాత నేరగాళ్లయి సయ్యద్ ఫెరోజ్, ఆలంలను గుర్తించారు. ఫెరోజ్‌పై 2011లో పంజగుట్ట, ఆలంపై 2023లో హయత్‌నగర్ ఠాణాల్లో చోరీ కేసులు నమోదయ్యాయి. వారి కదలికలపై పోలీసులు నిఘా ఉంచిన పోలీసులు గురువారం ఉదయం గాజులరామారం చౌరస్తాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఫెరోజ్, ఆలం, అస్లాం ఖాన్, గఫూర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో రూ.7.64 లక్షల నగదు, ట్రాలీ, వెయ్యి కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సోహైల్ కోసం గాలిస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ హన్మంత్‌రావు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, డీఐ కనకయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజులను డీసీపీ అభినందించారు. స్క్రాప్ చోరీ కోసం గోదాంలోకి నలుగురు దొంగలు అక్కడ ఉన్న వాహనంతో సహా సరుకు చోరీ సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల అరెస్ట్ -
పాత నేరస్తుడి పనే..
బంజారాహిల్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని ఇందిరానగర్‌లో జరిగిన భారీ చోరీ కేసు బంజారాహిల్స్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇందిరానగర్‌కు చెందిన లోవకుమారి, వీరవెంకటరమణ దంపతులు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 12న ఇంటికి తాళం వేసి రాజమండ్రికి వెళ్లారు. ఇంటి భద్రతను ఇంట్లో కిరాయికి ఉండే తిరుమలరెడ్డికి అప్పగించారు. అయితే సినిమా షూటింగ్లలో హెల్పర్‌గా పనిచేసే తిరుమలరెడ్డికి నాలుగు రోజుల క్రితం ఫేస్బుక్లో బోరబండ కార్మికనగర్‌కు చెందిన దాసరి రక్షక్‌రాజ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మూడు రోజులుగా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 13న రాత్రి తిరుమలరెడ్డి ఆహ్వానం మేరకు రక్షక్‌రాజ్ అతడి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. పీకలదాకా మద్యం తాగిన తిరుమలరెడ్డి నిద్రపోయాడు. అదే అదునుగా అంతకముందే సదరు ఇంటి యజమానుల వివరాలు ఆరా తీసిన రక్షక్‌రాజ్ వారు లేరని తెలుసుకున్నాడు. బండరాయితో ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న రూ.25 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలతో తన స్కూటీపై ఉడాయించాడు. రంగంలోకి దిగిన బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా బైక్‌పై ఇద్దరు వచ్చిన దృశ్యాలు, వెళ్లేటప్పుడు ఒక్కడే వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. తిరుమలరెడ్డితో వచ్చిన వ్యక్తి ఎవరని ఆరా తీయగా తనకు మూడు రోజుల క్రితమే పరిచయం ఏర్పడిందని చెప్పాడు. దీంతో పోలీసులు రక్షక్‌రాజ్ ఫోన్ నెంబర్ ఆధారంగా గురువారం ఉదయం అతడిని కార్మికనగర్లోని అతడి ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. బీరువాలో దాచిన నోట్ల కట్టలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 2020లో జూబ్లీహిల్స్‌లో ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. ఎనిమిది నెలల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే చోరీకి యత్నించి పోలీసులకు చిక్కినట్లుగా విచారణలో వెల్లడైంది. కిరాయిదారు తిరుమలరెడ్డికి రక్షక్‌రాజ్ ఫేస్బుక్లో పరిచయమైనట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. చోరీ సొత్తు పూర్తిగా పట్టుబడడంతో అటు బాధితులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ● భారీ చోరీ కేసులో నిందితుడి అరెస్టు ● 24 గంటల్లోనే కేసును ఛేదించి సొత్తు రికవరీ చేసిన పోలీసులు -
మద్యం మత్తులో..
మణికొండ: మద్యం మత్తు రెండు కార్ల ప్రమాదానికి కారణమైన సంఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన వెంకట సుబ్బయ్య తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రాయదుర్గం ప్రాంతానికి చెందిన చిన్నగౌడ్ తన స్కార్పియోలో మర్రిచెట్టు సర్కిల్ వైపు వెళుతున్నాడు. అదే సమయంలో మర్రిచెట్టు సర్కిల్ నుంచి ఓయూ కాలనీ వైపు వస్తున్న శాంత్రో కారులో వస్తున్న వెంకటసుబ్బయ్య ఎస్బీఐ బ్యాంకు ముందుకు రాగానే ఎదురుగా వస్తున్న స్కార్పియోను వేగంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో స్కార్పియో ముందు టైరు విరిగిపోగా, శాంత్రో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. శాంత్రో కారులో బెలూన్ ఓపెన్ కావడంతో ఎవరికీ గాయాలు కాలేదు. వెంకట సుబ్బయ్య అతిగా మద్యం తాగటం, డ్రైవింగ్ లైసెన్స్ సైతం లేకుండా అతి వేగంగా కారు నడపటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ముగ్గురు యువకులు పారిపోగా, డ్రైవింగ్ చేస్తున్న వెంకట సుబ్బయ్యను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదం జరగటంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రాయదుర్గం పోలీసులు వాహనాలు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఎదురెదురుగా రెండు కార్లు ఢీ మణికొండలో భారీగా నిలిచిపోయిన వాహనాలు -
వైభవంగా జేపీదర్గా గంధోత్సవం
కొత్తూరు: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే గంధోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇన్ముల్‌నర్వ గ్రామం హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీలు బాబాకు గంధం సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... జేపీ దర్గాకు దేశ వ్యాప్తంగా ఖ్యాతి ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో బాబా దర్శనం కోసం వస్తారని తెలిపారు. గత ప్రభుత్వాలు దర్గా అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దర్గా దర్శనం కోసం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు, వసతులు కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా బస్టాండ్, తాగునీరు, వసతి, మరుగుదొడ్లతో పాటు పలు వసతులను కల్పించనున్నట్లు వివరించారు. ఉత్సవాల నేపథ్యంలో శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు శివవంకర్గౌడ్, హరినాథ్‌రెడ్డి, ఖాజా, ఖాలేద్, సిరాజ్, తస్లీమ్, రషీద్, షౌకత్, కృష్ణ, ఆగీరు రవికుమార్‌గుప్త, శేఖర్‌గుప్త తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న భక్తజనం బాబాకు గంధం సమర్పించిన ఎమ్మెల్యే, వక్ఫ్‌బోర్డు చైర్మన్ -
నల్లపెట్టె మౌనరాగం!
నల్ల రంగులో ఉండదు. పేరు మాత్రం బ్లాక్ బాక్స్. ‘డెత్ కోడ్’ను తనలో గోప్యంగా దాచుకుంటుంది. నిజానికిది ఒక్క బాక్సు కూడా కాదు. రెండు పెట్టెలు! విమానం కూలిందంటే అందరి కళ్లూ దానికోసమే చూస్తాయి. రికవరీ బృందాలు దాని వేటలో నిమగ్నమవుతాయి. అది దొరికితే ప్రమాద కారణాలు తెలిసినట్టే. కానీ ఇటీవల బ్లాక్‌బాక్సులు తరచూ విఫలమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.గాలిలో ప్రయాణం ఎప్పుడూ గాల్లో దీపమే. రన్ వే నుంచి ఎగిరిన విమానం క్షేమంగా కిందికి దిగేదాకా టెన్షనే. వైమానిక దుర్ఘటనలకు కచి్చతమైన కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ చిక్కాలి. అందులో ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) అని రెండు భాగాలుంటాయి. వీటిని ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. సులభంగా గుర్తు పట్టేందుకు వీలుగా అవి ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉంటాయి. బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా ప్రమాదాల్లో తక్కువ నష్టం జరిగే తోక భాగంలో అమర్చుతారు. ఎఫ్డీఆర్ సెకన్ల వ్యవధిలో దాదాపు వెయ్యి పరామితులను నమోదు చేస్తుంది. ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు, ప్రయాణ మార్గం, దిశ తదితరాలను రికార్డు చేస్తుంది. ఇక సీవీఆర్ పైలట్ల సంభాషణలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు వారు పంపిన, స్వీకరించిన సమా చారం, కాక్‌పిట్ శబ్దాల వంటివాటిని నమోదు చేస్తుంది. కనుక విమాన ప్రమాదాలకు దారితీసిన కారణాలు, చివరి క్షణాల్లో మార్పులు తదితరాలను బ్లాక్ బాక్స్ మాత్రమే వెల్లడించగలదు. దాని డేటాను విశ్లేషించి ప్రమాద కార ణంపై పరిశోధకులు అంచనాకు వస్తారు. ఇంత కీలకమైన ఈ ‘నల్ల పెట్టె ఇటీవల మొండికేస్తుంది. మూగనోము పడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘జెజు ఎయిర్’విమానం గత నెల 29న కూలిపోయి ఇద్దరు మినహా 179 దుర్మరణం పాలవడం తెలిసిందే. కూలడానికి నాలుగు నిమిషాల ముందు నుంచే అందులోని ఫ్లైట్ రికార్డర్లు పని చేయడం మానేశాయి. దాంతో దర్యాప్తు క్లిష్టంగా మారింది.వైఫల్యానికి కారణాలివీ...బ్లాక్ బాక్సులోని రెండు రికార్డర్లు 4.5 కిలోలుంటాయి. గురుత్వశక్తి కంటే 3,400 రెట్లు అధిక శక్తితో విమానం కూలినా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతనూ కాసేపటిదాకా భరించగలదు. సము ద్రంలో కూలినా హై పిచ్ శబ్దాలతో 90 రోజులపాటు సంకేతాలు పంపగలదు. 20 వేల అడుగుల లోతులోనూ నెల పాటు పని చేయగలదు. దొరికాక కీలక డేటా, ఆడియో చెరిగిపోకుండా జాగ్రత్తగా వివరాలు సేకరిస్తారు. డేటాను డౌన్లోడ్ చేసి కాపీ చేస్తారు. దాన్ని డీకోడ్ చేసి గ్రాఫ్స్ రూపొందిస్తారు. అయితే... → సర్క్యూట్ పాడవటం, సెన్సర్లు విఫ లమవడం తదితర సాంకేతిక అవరోధాలు, సాఫ్ట్వేర్ లోపాలు తలెత్తినప్పుడు బ్లాక్ బాక్సు పనిచేయదు. → ప్రమాద తీవ్రత విపరీతంగా ఉండి భౌతికంగా ధ్వంసమైనప్పుడు కూడా దానిపై ఆశ వదిలేసుకోవాల్సిందే. → విమాన సిబ్బంది ఉద్దేశపూర్వకంగా డీ యాక్టివేట్ చేసినా బ్లాక్‌బాక్స్ పనిచేయడం మానేస్తుంది. → డేటా ఓవర్ లోడ్ అయినప్పుడు కూడా మొరాయిస్తుంది. → కొన్ని పాత బ్లాక్ బాక్సుల్లో నిరీ్ణత కా లం తర్వాత డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. దాంతో వాటినుంచి ఎ లాంటి సమాచారమూ లభించదు. నిరుడు జనవరిలో అలస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం ప్రయాణ సమయంలో తలుపు ఊడటంతో సీవీఆర్ పూర్తిగా ఓవర్ రైట్ అయింది. దాని నుంచి డేటా లభ్యం కాలేదు. → అత్యుష్ణ, అత్యల్ప ఉష్ణోగ్రతలు, ఎక్కువ కాలం నీటిలో నానడం వల్ల కూడా ఫ్లైట్ రికార్డర్లు పాడవుతాయి. → తేమ చేరి సున్నిత భాగాల్లో పరికరాలు దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ కావడం, అత్యధిక ఎత్తుల్లో పీడనం, పక్షులు ఢీకొనడం, పిడుగుపాట్లు వంటి వాటి వల్ల కూడా బ్లాక్ బాక్సు పనిచేయకపోవచ్చు. పదేళ్లుగా జాడ లేని మలేసియా విమానం! నిజానికి ఫ్లైట్ రికార్డర్ల సామర్థ్యం పెంచాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఖర్చు, పరిమితుల దృష్ట్యా అది ఆలస్యమవుతోంది. అత్యవసర సందర్భాల్లో ఫ్లైట్ రికార్డర్లు పనిచేయాలంటే వాటికి విమానంలో ప్రత్యేక వ్యవస్థల నుంచి పవర్ సరఫరా తప్పనిసరి. రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు విమానమంతటా ఎలక్ట్రికల్ పవర్ నిలిచిపోతుంది. 1999లో న్యూయార్క్ నుంచి కైరో వెళుతున్న ‘ఈజిప్ట్ ఎయిర్’విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 217 మంది మరణించారు. ఎలక్ట్రికల్ పవర్ ఆగిపోగానే దాని ఫ్లైట్ రికార్డర్లు పని చేయడం మానివేశాయి. దాంతో, విమానం లోపల సాధారణ అవసరాల కరెంటుపై ఆధారపడకుండా ఫ్లైట్ రికార్డర్లు 10 నిమిషాలు అదనంగా రికార్డింగ్ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయ బ్యాకప్ పవర్ ఏర్పాట్లుండాలని అమెరికా జాతీయ రవాణా సేఫ్టీ బోర్డు సిఫార్సు చేసింది. బ్లాక్ బాక్సుల బ్యాకప్ బ్యాటరీల జీవితకాలం తక్కువ. కొన్ని సందర్భాల్లో పనే చేయవు. దక్షిణ కొరియా ‘జెజు ఎయిర్’విమానంలోనూ విద్యుత్ వ్యవస్థ విఫలమై ఫ్లైట్ రికార్డర్లకు పవర్ అందక మూగవోయాయని భావిస్తున్నారు. సీవీఆర్ ఒక విడతలో రెండు గంటలపాటు మాత్రమే రికార్డు చేయగలదు. ఆ డేటానే రిపీట్ చేస్తుంది. రికార్డింగ్ నిడివిని 25 గంటలకు పెంచాలన్న డిమాండ్ కార్యరూపం దాలుస్తోంది. 2009లో ఎయిర్ ఫ్రాన్స్ విమానం బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళ్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 228 మంది చనిపోయారు. మలేసియా ఎయిర్‌లైన్స్ ఎంహెచ్ 370 విమానానిదైతే ఇప్పటికీ అంతు లేని వ్యథే! 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ అకస్మాత్తుగా రాడార్ తెర నుంచి అదృశ్యమైంది. మొత్తం 239 మందీ మరణించారని భావిస్తున్నారు. విమానం ఎందుకు, ఎలా అదృశ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. వైమానిక చరిత్రలోనే ఇదో పెద్ద మిస్టరీ. విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిందని అనుమానిస్తున్నారు. దాని జాడ కోసం మళ్లీ అన్వేషణ చేపట్టాలని మలేసియా తాజాగా నిర్ణయించింది. ‘ఎయిర్ ఫ్రాన్స్’దుర్ఘటన దరిమిలా మహా సముద్రాలను దాటి ప్రయాణించే విమానాల కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల డేటా రికార్డింగ్ తప్పనిసరి చేయాలని ఫ్రాన్స్ సిఫార్సు చేసింది. అమెరికా కూడా దీన్ని చట్టంలో చేర్చింది. కానీ కొత్తగా తయారయ్యే విమానాల్లోనే ఈ మార్పులకు వీలుంది. పాతవాటిలో సాధ్యపడటం లేదు. ఇప్పుడు తిరిగే చాలా విమానాల జీవిత కాలం 40–50 ఏళ్లు! కొత్త టెక్నాలజీతో బ్లాక్ బాక్సులు! తాజా సవాళ్లు, మారిన సాంకేతికత నేపథ్యంలో అధునాతన రీతిలో సరికొత్త బ్లాక్ బాక్సుల కు పకల్పన జరుగుతోంది. ఎక్కువ గంటల రికార్డింగ్, అధిక డేటా స్టోరేజీ, బ్యాకప్ బ్యాటరీల జీవితకాలం పెంపు వంటివి వీటిలో ప్రధానాంశాలు. ప్రమా ద తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సమర్థంగా పనిచేసే బ్లాక్ బాక్సులూ రానున్నాయి. సముద్రాల్లో కూలినప్పుడు తక్కువ శ్రమతో సత్వరం గుర్తించే అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. ముఖ్యంగా, డేటాను రియల్ టైమ్‌లో పంపే బ్లాక్ బాక్సులు రానున్నాయి. తద్వారా కీలక సమాచారం వెంటనే గ్రౌండ్ స్టేషనుకు చేరుతుంది కనుక ప్రమాదంలో బ్లాక్ బాక్స్ నాశనమైనా ఇబ్బంది ఉండబోదు. – జమ్ముల శ్రీకాంత్ -
వేళకాని వేళల్లో.. ఆహారంతో అనర్థం..
షిఫ్టుల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులూ, అడపాదడపా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నవారంతా వేళకాని వేళల్లో ఆహారం తీసుకోవడం చాలా సాధారణం. అయితే ఓ అధ్యయనం ప్రకారం ఇలాంటివారిలో ఊబకాయంతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది. జీర్ణాశయానికి, మెదడుకూ మధ్య సమాచార సమన్వయాలు జరుగుతున్న విషయాలు అనేక అధ్యయనాల్లో వెలుగు చూశాయి.కాలేయానికి, మెదడుకూ మధ్య కూడా బయటకు కనపడని కమ్యూనికేషన్స్ ఉంటాయని ఈ సరికొత్త అధ్యయనం తేల్చిచెబుతోంది. యూఎస్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని పెరల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందాల పరిశోధనల్లో ఈ అంశాలు వెలుగుచూశాయి. – సాక్షి, హైదరాబాద్కాలేయానికి, మెదడుకు మధ్య కూడా ‘క్లాక్’లింకు పట్టపగలు పనిచేయడంతోపాటు రాత్రివేళల్లో నిద్రపోయేలా మెదడులోని బయలాజికల్ క్లాక్ నిర్దేశిస్తుందని, దీన్నే సర్కేడియన్ రిథమ్‌గా చెబుతారన్న విషయం తెలిసిందే. తాజాగా పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం.. కాలేయానికి, మెదడుకూ మధ్య కూడా ఓ బయలాజికల్ క్లాక్ ఉంటుంది. ఆకలి వేసినప్పుడూ, ఏం తినాలన్నది నిర్ణయం తీసుకునేటప్పుడూ వేగస్ నర్వ్ ద్వారా కాలేయం నుంచి మెదడుకూ, మెదడు నుంచి మళ్లీ కాలేయానికి సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంటుంది.దాన్నిబట్టే ఓ వ్యక్తి తానెప్పుడు తినాలి? తినేటప్పుడు ఎలాంటి ఆహారాలను ఎంపిక చేసుకోవాలి వంటివి జరుగుతుంటాయి. ఈ కాలే య, మెదడు క్లాక్ సమాచారాల రిథమ్‌లో ఏదైనా తేడా వస్తే.. అది జీవక్రియల్లో అంతరాయాలకు దారితీస్తుందని, దాంతో బరువు పెరగడం, అది అనేక ఆరోగ్య సమస్యలకు తావివ్వడం,అవి మరికొన్ని అనారోగ్యాలకు దారితీయ డం.. ఇలా ఒక దానివెంట మరొక సమస్యకు దారితీస్తుంటాయి. ఎలుకల కాలేయంలోని ‘రెవ్–ఎర్బ్స్’అనే కుటుంబానికి చెందిన జన్యువులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దేహంలోని సర్కేడియమ్ రిథమ్‌ను నిర్దేశించే బయలాజికల్ క్లాక్ నిర్వహణలో ఈ జన్యువులు కీలక భూమిక పోషిస్తాయి. రకరకాల జీవక్రియలు, హార్మోన్లు వెలువడేలా చూడటం వంటి అనేక వాటిలో అవి పాలు పంచుకుంటుంటాయి. ఎలుకలు, మనుషుల జీవక్రియల పరిశీలన ఈ అధ్యయనంలో పాల్గొన్న ముఖ్యుల్లో ఒకరూ అలాగే పెన్ మెడిసిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్, ఒబిసిటీ అండ్ మెటబాలిజమ్ డైరెక్టర్ డాక్టర్ మిచెల్ లాజర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎలుకలూ, మనుషులూ మెలకువతో ఉన్నప్పుడు తినే జీవులు కాబట్టి ఈ రెండు శరీరాల్లో జీవక్రియల పనితీరు పరిశీలించినప్పుడు కాలేయానికి, మెదడుకూ మధ్య ఉండే నిర్దేశిత సమాచారాల గురించిన వివరాలు తెలిశాయి. ఎలుకల్లో ఉండే ‘రెవ్–ఎర్బ్స్’జన్యువులకు మెదడుతో ఉన్న కనెక్షన్ తొలగించినప్పుడు ఎలుకలు తాము చురుగ్గా లేని సమయంలోనూ ఇష్టం వచ్చినట్టుగాతినడం, అవసరమైన దానికంటే ఎక్కువగా తినేయడం మొదలుపెట్టాయి. ఈ తిండి ఎలా ఉందంటే... అచ్చం రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు ఆకలితో నిమిత్తం లేకుండా మామూలు కంటే ఎక్కువగానే తినేయడంలా అనిపించింది. ఇంకా ఇదెలా ఉందంటే.. జెట్లాగ్ తర్వాత బయలాజికల్ క్లాక్‌లో అంతరాయం కలగడంతో వేళాపాళా లేకుండా ఇష్టమొచ్చి నట్టు తినేయడంలా కనిపించింది. వేగస్ నర్వ్ ద్వారా సమాచార మార్పిడి ఎప్పుడు, ఎలా తినాలి అనే ఈ సమాచారాల ఇచ్చిపుచ్చుకోడాలు వేగస్ నర్వ్ అనే ఓ కీలక నరానికి చెందిన అత్యంత సంక్లిష్టమైన నర్వ్ ఫైబర్స్ ద్వారా జరుగుతుంటుంది. ఎప్పుడు ఆకలిగా అనిపించాలి, ఎప్పుడు ఎంత మొత్తంలో తినాలనే ఆదేశాలు కాలే యం ఈ నరం ద్వారానే మెదడుకు చేరవేస్తుంది. దాని ప్రకారమే మనుషులకూ లేదా జీవాలకు ఎప్పుడు ఆకలి వేయాలో అప్పుడు ఆకలిగా అనిపించడం, దాన్ని బట్టి ఎంత తినాలో అంత తినేశాక ఆకలి తీరడం వంటివన్నీ సర్కేడియన్ రిథమ్‌కు అనుగుణంగా జరుగుతుంటాయి. డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం ప్రస్తుతం పనివేళల్లో గణనీయమైన మార్పులు రావడం, అర్ధరాత్రి, అపరాత్రీ అనే తేడాలు లేకుండా పనులు చేయాల్సి రావడం దుష్ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అధిక రక్తపోటు, మధుమేహం, రక్తంలో కొలెస్టరాల్ మోతాదులు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. చివరకు ఇవన్నీ టైప్–2 డయాబెటిస్, గుండెజబ్బులూ, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తున్నాయని డాక్టర్ మిచెల్ లాజర్ చెబుతున్నారు. మనదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఇండియా డయాబెటిస్ (ఐసీఎమ్ఆర్–ఇండియాబ్) నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం భారత్‌లో 10.1 కోట్ల డయాబెటిస్ బాధితులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మంది డయాబెటిస్ బాధితులు ఉండగా... అందులో 10.1 కోట్ల మంది కేవలం మన దేశం నుంచే ఉన్నారు. అంటే ప్రపంచంలోని ప్రతి 8 మంది డయాబెటిస్ బాధితుల్లో ఒకరు భారత్‌వాసి అన్నమాట. మన భారతీయ గణాంకాలను యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధనల ఫలితాలతో అనుసంధానించి చూస్తే నిద్రపోవాల్సిన సమయంలో పనిచేస్తూ, వేళగాని వేళల్లో భోజనం చేస్తున్నవారిలో ఈ జీవక్రియలకు సంబంధించిన జబ్బులైన డయాబెటిస్ వంటివి చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా... ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన చికిత్స ప్రణాళికల ప్రాధాన్యాన్నీ నొక్కి చెబుతోంది. ఉదాహరణకు చాలా ఊబకాయంతో ఉన్న ఎలుకల తాలూకు వేగస్ నర్వ్‌ను కట్ చేసినప్పుడు... మళ్లీ అవి నార్మల్ ఎలుకల్లాగే తినడం, మితంగానే ఆహారం తీసుకోవడం వంటివి చేశాయి.ఈ పరిశోధనతో ఎంతో మేలుదేహం తాలూకు ఓ పూర్తిస్థాయి సమన్వయ వ్యవస్థ (హోమియోస్టాటస్) అంతా చక్కగా కొనసాగుతూ జీవక్రియలన్నీ సక్రమంగా జరిగేలా చూడటానికి కాలేయం తాలూకు ఏఏ అంశాలు, ఏఏ జన్యువులు పాలుపంచుకుంటున్నాయో పరిశీలించి, ఆ వ్యవస్థల కారణంగా దేహంపై పడే ప్రతికూల ప్రభావాలూ, దాంతో వచ్చే అనర్థాలూ, అనారోగ్యాలకు అవసరమైన చికిత్సలను తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఎంతగానో తోడ్పడుతుందన్నది పరిశోధకుల అభిప్రాయం. ఈ పరిశీలనల వెలుగులో ప్రజల ఆరోగ్య సంరక్షణలకు అసరమైన చర్యలూ, ప్రణాళికలు రూపొందింవచ్చన్నది అనేక ఆరోగ్య సంస్థలకు చెందిన అధికారులు, ప్రణాళికావేత్తల భావన. -
పాస్‌పోర్ట్‌లో.. సింగపూర్ ‘బాద్షా’
సాక్షి, హైదరాబాద్ : విదేశీ పర్యటనలు, దేశ పౌరులుగా గుర్తింపు విషయంలో పాస్‌పోర్ట్ అనేది కీలక డాక్యుమెంట్‌గా నిలుస్తోంది. దేశ సరిహద్దుల్లో ఐడెంటీ, వలసదారులను రెగ్యులేట్ చేయడంలోనూ ఇది ముఖ్యమైన పత్రంగా మారిన విషయం తెలిసిందే. విదేశాలకు విద్య, వైద్యం, పర్యాటకం, తీర్థయాత్రలు, వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం వెళ్లేందుకు, మళ్లీ స్వదేశాలకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు పాస్‌పోర్ట్ కలిగి ఉండడం తప్పనిసరి. వివిధ అధికారిక లేక వ్యక్తిగత, కుటుంబపరమైన విధులు, అవసరాలకు కూడా ఇది అధికారిక గుర్తింపుగా ఉపయోగపడుతోంది. మొత్తంగా చూస్తే పాస్‌పోర్ట్ అనేది ‘టికెట్ టు ద వరల్డ్’గా పరిగణిస్తున్నారు. సింగపూర్ అనే చిన్నదేశం ప్రపంచస్థాయిలో పాస్‌పోర్ట్‌ల గుర్తింపు, వాటి విలువ విషయంలో ‘బాద్షా’గా నిలుస్తోంది. ఈ దేశ పాస్‌పోర్ట్ కలిగి ఉంటే వీసా లేకుండానే 195 దేశాలు సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ గుర్తింపు కారణంగా సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గత ఐదేళ్లుగా సింగపూర్ ప్రథమ స్థానంలో కొనసాగుతుండడం ఓ విశేషం. » పాస్‌పోర్ట్‌ల విలువ, గుర్తింపు విషయంలో ఆ తర్వాతి స్థానంలో జపాన్ నిలుస్తోంది. ఈ దేశ పాస్ట్‌పోర్ట్ ఉంటే 193 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించే వీలుంది. »ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫిన్లాండ్, దక్షిణకొరియాల పాస్ట్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండానే 192 దేశాలు సందర్శించొచ్చు. » ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, లగ్జ మ్బర్గ్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే దేశాల పాస్‌పోర్ట్‌లు కలిగిన వారు వీసా అవసరం లేకుండానే 191 దేశాల్లో పర్యటించొచ్చు. » బెల్జియం, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, యూకే వంటి దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లకు 190 దేశాలకు వీసా లేకుండా వెళ్లేందుకు అనుమతి ఉంది. ‘హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్’ఇలా... ఒకదేశ పౌరుడు స్వేచ్ఛగా ఇతర దేశాల్లో విహరించడం ఆధారంగా... ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలకు సంబంధించి జాబితాను ‘హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్’విడుదల చేస్తోంది. ఇతర దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు...అక్కడకు చేరుకునేలోగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే అవకాశం ప్రాతిపదికన వివిధ దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌లకు ఈ ఇండెక్స్ ద్వారా ర్యాంకింగ్‌లు ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పౌరులు జరుపుతున్న పర్యటనలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఐఏటీఏ) సమకూర్చిన సమాచారం, వివరాలు, గణాంకాల ఆధారంగా ర్యాంకింగ్‌లను ఈ సంస్థ నిర్థారిస్తోంది. వివిధ అంశాలతోపాటు, ఫలానా దేశ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న పౌరుడు వీసా లేకుండానే ఏఏ దేశాలకు వెళ్లగలుగుతారు,ఆయా దేశాలతో ఈ పౌరుడి దేశానికున్న దౌత్యపరమైన సంబంధాలు, ఏ మేరకు అంతర్జాతీయ ఒప్పందాలు కలిగి ఉన్నాయనే దాని ప్రాతిపదికన సమగ్ర విధానాన్ని పాటించి పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లను సిద్ధం చేస్తున్నారు. మరింత దిగజారిన భారత్ ర్యాంకింగ్ హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్–2025 నివేదికను బట్టి చూస్తే...భారత్ ర్యాంకింగ్ మరో 5 ర్యాంకులు దిగజారి 85వ ర్యాంక్ (2024లో 80వ ర్యాంక్) వద్ద నిలిచింది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ 103 స్థానంలో, బంగ్లాదేశ్ 100వ స్థానంలో ఉన్నాయి. అదే 2021లో ఇండియా 90వ ర్యాంక్ సాధించి మరింత అడుగున నిలిచింది. ఇదిలా ఉంటే 2006 భారత్ 71వ ర్యాంక్‌లో నిలిచి ఒకింత సత్తా చాటింది. రంగుల వారీగా చూస్తే... మొత్తంగా 84 దేశాలు నీలంరంగు (బ్లూరంగు షేడ్స్) పాస్‌పోర్ట్‌లతో అత్యధిక రంగులు ఉపయోగిస్తున్న దేశాలుగా ప్రథమస్థానంలో నిలిచాయి. 68 దేశాలు ఎరుపురంగు కలిగిన పాస్‌పోర్ట్‌లు కలిగి ఉంటే..40 దేశాల పాస్‌పోర్ట్‌లు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నాయి. కేవలం ఏడు దేశాల పాస్ట్పోర్ట్లే నలుపు (బ్లాక్) రంగులో ఉండడం కొసమెరుపు. -
ప్రజా ప్రతినిధులే ఫైనల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధులే కీలక పాత్ర పోషించనున్నారు. లబ్ధిదారులను అధికారులు ప్రాథమికంగా ఎంపిక చేసిన తర్వాత జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో తుది జాబితా సిద్ధం కానుంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు, కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ షురూ కానుంది. దీంతో గురువారం నుంచి దాదాపుగా అన్ని ప్రధాన ప్రభుత్వ శాఖలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన సూచనలతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయికి తరలివెళ్లింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, ఎంఏయూడీ, హౌసింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది అర్హులను గుర్తించడంలో బిజీగా ఉన్నారు. ఈ ప్రక్రియ ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. 21, 22 తేదీల్లో గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహించనున్నారు. అర్హులు, అనర్హుల జాబితాను ఈ సభల్లో ప్రకటించే అవకాశం ఉంది. 23, 24 తేదీల్లో జిల్లా స్థాయిల్లో తుది జాబితా సిద్ధం కానుంది. తుది జాబితాను రూపొందించే క్రమంలో ప్రజా ప్రతినిధుల నిర్ణయం కీలకం కానుంది. స్థానికంగా ఉన్న రాజకీయ, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ అర్హుల ఎంపికలో ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించనున్నారు. ఎమ్మెల్యేల సిఫారసులతో తుదిరూపు దిద్దుకున్న జాబితా ఇన్చార్జి మంత్రి ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది. ఆ జాబితా ప్రకారమే 26వ తేదీన లబ్ధిదారుల ప్రకటన ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు చెపుతున్నాయి. భూభారతిలోకి సాగు యోగ్యం కాని భూములు రైతుభరోసా పథకం కింద సీజన్‌కు రూ. 6,000 చొప్పున వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాగు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు ప్రస్తుతం ఫీల్డ్ సర్వే జరుగుతోంది. సాగు యోగ్యం కాని భూములను రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల వ్యవసాయ విస్తరణాధికారులు పరిశీలించి, భూ భారతి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసి గ్రామసభల్లో నివేదిస్తారు. గ్రామసభల్లో వచ్చే విజ్ఞాపనల ఆధారంగా స్థానిక ఎమ్మెల్యే ఆమోదంతోనే అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా నమోదై ఉండి సంవత్సరంలో కనీసం 20 రోజుల పాటు వ్యవసాయ కూలీగా పనిచేసిన వారి కుటుంబాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఒక కుటుంబంలో ఎంత మంది కూలీలు ఉన్నా, ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఒక్కో సీజన్‌కు రూ.6 వేల చొప్పున రెండు సీజన్లకు ఏటా రూ.12 వేలు ఈ పథకం కింద చెల్లించనున్నారు. ఈ మేరకు అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించే పనిలో అధికారులున్నారు. అయితే కుటుంబాన్ని నిర్ధారించేందుకు రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే రేషన్‌కార్డులు గత కొన్నేళ్లుగా అప్డేట్ కాకపోవడంతో కుటుంబంలోని వారికి పెళ్లిళ్లై, వేర్వేరు కుటుంబాల్లో నివసించే పక్షంలో వారిని గుర్తించడంలో గ్రామసభలు కీలకం కానున్నాయి. ఇక్కడ వచ్చిన ఫిర్యాదులు, సూచనలను కూడా స్థానిక ఎమ్మెల్యేల దృష్టికే తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు! ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేలో ఏ కుటుంబానికి రేషన్‌కార్డు లేదనేది సిబ్బంది నమోదు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 20 లక్షల కుటుంబాలు కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తుండగా, కార్డుల్లో పేర్ల చేర్పుల కోసం లక్షలాది మంది వెయిటింగ్లో ఉన్నారు. ఎమ్మెల్యేలకు రేషన్‌కార్డుల అంశం కీలకం కాబట్టి అర్హులైన వారందరికీ ఇప్పించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఓ ప్రజా ప్రతినిధి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లతోనే తిప్పలు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతి నియోజకవర్గంలో కొత్తగా ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇప్పటికే ఫీల్డ్ సర్వే కూడా పూర్తయింది. లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. కాగా ఒక్కో గ్రామం నుంచి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారనేదే ప్రధాన సమస్యగా మారనుంది. ఇప్పటికే సొంత స్థలం ఉన్న వారికి తొలి ప్రాధాన్యత అని ప్రభుత్వం చెప్పడంతో ఎమ్మెల్యే విచక్షణ మేరకు ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పల్లె నుంచి నగరానికి తిరుగు పయనం
చౌటుప్పల్/ చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరుగుపయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు బారులుతీరాయి. దీంతో గురువారం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ మార్గంలో ఉదయం నుంచి వాహనాల రాక పెద్ద ఎత్తున సాగుతూనే ఉంది. జంక్షన్లు, క్రాసింగ్‌ల వద్ద వాహనాలు సాఫీగా ముందుకుసాగేందుకు, ప్రమాదాల నివారణకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల కూడలి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద సాఫీగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు సాఫీగా సాగాయి. టోల్‌ప్లాజాలో 16 గేట్లు ఉండగా, హైదరాబాద్ వైపు 12 గేట్ల నుంచి వాహనాలను పంపించారు. విజయవాడ వైపు నుంచి వస్తున్న వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా జాతీయ రహదారిపై హైవే అథారిటీ అధికారులు గుర్తించిన 17 సమస్యాత్మక ప్రాంతాలతోపాటు ప్రతి గ్రామ స్టేజీ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. -
బీజేపీలో ‘జిల్లా అధ్యక్ష లొల్లి’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకానికి ముందే లొల్లి షురూ అయ్యింది. నియామక ప్రక్రియకు సంబంధించి అనుసరిస్తున్న విధానంపై పార్టీ నాయకులు, కార్య కర్తలు చిర్రుబుర్రుమంటున్నారు. కొన్ని జిల్లా ల్లోనైతే ఏకంగా ఈ ప్రక్రియను తప్పుబడుతూ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు పంపేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్, మెదక్ పరిధిలోని జిల్లాలు, హైదరాబాద్, ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నట్టుగా కొందరు పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా జిల్లా అధ్యక్షుల నియామకం సందర్భంగా అభిప్రాయసేకరణలో వెల్లడైన వ్యక్తులను కాకుండా ఇతరులకు అధ్యక్షులుగా అవకాశం కల్పించారని కొందరు నేతలు ఉదహరిస్తున్నారు. అప్పట్లో కొందరిని జిల్లా అధ్యక్షులుగా నియమించడంపై కేడర్ కొట్టుకుందని, బహిరంగంగానే విమర్శలు గుప్పించారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర పార్టీ నేతలు జిల్లాల్లో పర్యటించి కేడర్ నుంచి చేపడుతున్న అభిప్రాయసేకరణ, దాని ఆధారంగా జాతీయ పార్టీకి పంపుతున్న ఆశావహుల జాబితాలపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. కొందరు అభిప్రాయ సేకరణ జరపకుండానే.. కొన్ని జిల్లాల పరిశీలకులుగా వెళుతున్న కొందరు స్వతంత్రంగా వ్యవహరించకుండా, నిజమైన అభిప్రాయసేకరణ జరపకుండా ఎవరి ప్రభావానికో లోనై ఆశావహుల జాబితాను సిద్ధం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో పర్యటించిన పరిశీలకులు పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి అధ్యక్షుడి నియామకంపై పూర్తిస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపకుండానే జాబితాలు సిద్ధం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. జిల్లా అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారి కార్లలోనే కొందరు పరిశీలకులు తిరగడంతోపాటు వారికి సంబంధించిన ఫామ్‌హౌస్‌లలో కూర్చొని ఆశావహుల జాబితాను తయారు చేస్తున్నారని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది జిల్లా అధ్యక్షుడిగా కోరుకుంటున్న వ్యక్తి పేరు కాకుండా తమకు నచ్చిన వారి పేర్లతో లిస్ట్ సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుల నియామకానికి ఒక్కో జిల్లా నుంచి ఐదేసి మంది పేర్లతో జాబితాలు తయారు చేసి పంపించాలన్న జాతీయ నాయకత్వం ఆదేశాలను సైతం కొందరు నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే వాదనలు వస్తున్నాయి. రాష్ట్ర నేతలు సమర్పించిన జాబితాల ఆధారంగా ఒకట్రెండు రోజుల్లోనే జిల్లా అధ్యక్షులను ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో సమర్థులైన వారికి ఈ పదవి లభిస్తుందా లేదా అనే ఆందోళనను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. సంస్థాగతంగా చూస్తే. తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ పరంగా మొత్తం 38 జిల్లాలుగా విభజించారు. హైదరాబాద్ నగరాన్ని నాలుగు జిల్లాలుగా (హైదరాబాద్ సెంట్రల్, మలక్‌పేట–భాగ్యనగర్, గోషామహల్– గోల్కొండ, మహంకాళి సికింద్రాబాద్) రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లాలు, మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్, రూరల్ జిల్లాలు, ఇలా వివిధ జిల్లా శాఖలున్నాయి. -
మరో 20,000 సీట్లు కావాలి!
సాక్షి, హైదరాబాద్: అదనపు ఇంజనీరింగ్ సీట్ల కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ ఏడాది దాదాపు 50 వేల ఇంజనీరింగ్ సీట్లు అదనంగా కావాలని ఏఐసీటీఈకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కాలేజీలు దరఖాస్తులు చేశాయి. తెలంగాణ నుంచి దాదాపు 20 వేల అదనపు సీట్ల కోసం దరఖాస్తులు అందాయి. అయితే సీట్లు పెంచే ముందు తమ అనుమతి తీసుకోవాలని, అప్పుడే అనుబంధ గుర్తింపు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఏఐసీటీఈకి లేఖ రాసింది. మరోవైపు కారణాలు లేకుండా సీట్ల పెంపును తిరస్కరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కాలేజీలు అంటున్నాయి. ఏఐసీటీఈ వర్గాలు మాత్రం సీట్ల పెంపుపై తమకు అభ్యంతరం లేదని తెలిపాయి. రాష్ట్రంలో ఇప్పటికే 58 శాతం ఇంజనీరింగ్ సీట్లు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లోనే ఉన్నాయి. కొత్త సీట్లు కూడా ఇదే బ్రాంచీలో ఉండే అవకాశం ఉంది. దక్షిణాదిలోనే బీటెక్ సీట్లు అధికం దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లున్నాయి. దేశంలోని మొత్తం సీట్లలో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో 35 శాతం బీటెక్ సీట్లున్నాయి. దేశం మొత్తంలో 14.90 లక్షల బీటెక్ సీట్లుంటే.. తమిళనాడు 3.08 లక్షల సీట్లతో మొదటి స్థానంలో ఉంది. 1.83 లక్షల సీట్లతో ఏపీ రెండోస్థానంలో, తెలంగాణ 1.45 లక్షల సీట్లతో మూడోస్థానంలో ఉంది. సీట్లు పెంచుకోవడంలోనూ ఈ మూడు రాష్ట్రాలే అగ్రస్థానంలో ఉన్నాయి. మూడేండ్లుగా దేశంలో బీటెక్ సీట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే 2014 –15తో పోల్చితే సీట్ల సంఖ్య తక్కువగానే ఉండటం గమనార్హం. 2014 –15లో దేశంలో 17.05 లక్షల ఇంజినీరింగ్ సీట్లుండగా, 2021–22 వరకు ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పెరగడం ప్రారంభమైంది.50% మూడు రాష్ట్రాల్లోనే..2024–25 విద్యా సంవత్సరంలో పెరిగిన బీటెక్ సీట్లల్లో 50 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దేశం మొత్తంగా చూస్తే 50 శాతం సీట్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే పెరిగాయి. తమిళనాడులో 32,856 సీట్లు పెరగగా, ఆంధ్రప్రదేశ్‌లో 23,518, తెలంగాణలో 20,213 సీట్లు పెరిగాయి.జాతీయంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ బీటెక్ (ఈవినింగ్ బీటెక్) కోర్సును నిర్వహించేందుకు 400 – 500 విద్యా సంస్థలకు ఏఐసీటీఈ అనుమతినిచ్చింది. ఈ కాలేజీల్లో దాదాపు 40 వేల నుంచి 50 వేల సీట్లు పెరిగాయి.ఈ విద్యా సంవత్సరంలో 2,906 కాలేజీలకు ఏఐసీటీఈ గుర్తింపునిచ్చింది. 1,256 కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి.జాతీయంగా కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీల్లో ఆక్యుపెన్సీ రేషియో (సీట్ల భర్తీ నిష్పత్తి) 2021–22లో 72 శాతం ఉండగా, 2022 –23కు వచ్చేసరికి 81 శాతానికి పెరిగింది. త్వరలో ఏఐసీటీఈ పరిశీలనతెలంగాణలో 23 ప్రైవేటు కాలేజీలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సులను కోర్ గ్రూపుతో కాంబినేషన్‌గా అందించాలని ప్రతిపాదిస్తున్నాయి. అవసరమైన మౌలిక వసతులు తమకు ఉన్నాయని దరఖాస్తుల్లో పేర్కొన్నాయి. వీటిని స్వయంగా పరిశీలించేందుకు త్వరలో ఏఐసీటీఈ బృందాలు తెలంగాణలో పర్యటించనున్నాయి. -
నిధులెందుకు మళ్లించారు?.. కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ) ఖాతాల్లోకి హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?, రేస్ నిర్వహణ ఒప్పందాలను అతిక్రమించి ఎఫ్ఈఓకు డబ్బులు చెల్లించాలని మీరు ఎందుకు ఆదేశించారు?, ఆర్థిక శాఖ, కేబినెట్ అనుమతి లేకుండానే నిధులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?, మీరు చెబితేనే అధికారులు నగదు బదిలీకి పాల్పడ్డారా?, విదేశీ కంపెనీకి నగదు చెల్లింపులో ఆర్బీఐ నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదు?, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. ఈసీ అనుమతి తీసుకోవాలని మీకు తెలియదా?, ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి చేకూరిన లబ్ధి ఏంటి?.. అంటూ మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు ఏడు గంటలపాటు విచారణ కొనసాగింది. గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కేటీఆర్ 10.30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన మొబైల్ ఫోన్‌ను అధికారులు సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేయించారు. అనంతరం మూడో అంతస్తులో జేడీ రోహిత్ ఆనంద్ ముందు ఓ న్యాయవాదితో కలిసి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం ఐదుగురు సభ్యుల బృందం ప్రశ్నించింది. మధ్యలో కాసేపు భోజన విరామం ఇచ్చారు. సాయంత్రం 5–30 గంటల వరకు విచారణ కొనసాగింది. రెండు డాక్యుమెంట్లు సమర్పించిన కేటీఆర్ఈ నెల 8, 9వ తేదీల్లో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ అందజేసిన డాక్యుమెంట్ల ఆధారంగా కూడా ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. అవసరమైతే మరోమారు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని సూచించారు. వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్, ఆస్తుల వివరాలు ఆరా తీయగా, అన్నీ అందిస్తానని కేటీఆర్ తెలిపారు. అలాగే ఈడికి రెండు డాక్యుమెంట్లను (ఫార్ములా–ఈ పైన నీల్సన్ సంస్థ రూపొందించిన నివేదిక, తెలంగాణ ఈవీ పాలసీ –2020) ఇచ్చిన కేటీఆర్ అందుకు సంబంధించి వారి నుంచి రశీదు తీసుకున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేసినట్లు వెల్లడివిశ్వసనీయ సమాచారం మేరకు.. కేటీఆర్ చాలా ప్రశ్నలకు విపులంగా సమాధానం ఇవ్వగా..నిధుల మళ్లింపు అంశం, నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చిందన్న ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు దాటవేశారు. మరికొన్నింటికి ముక్తసరిగా జవాబులిచ్చారు. మంత్రిగా తనకు అన్ని విషయాలు తెలుసని చెప్పారు. బిజినెస్ రూల్స్, ఆర్బీఐ నిబంధనల ప్రకారమే ఎఫ్ఈఓకు చెల్లింపులు జరిగాయని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకూడదనే ఎఫ్ఈవోకు చెల్లింపులు జరిపామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హెచ్ఎండీఏ బోర్డు నుంచి మంజూరైన రూ.45.71 కోట్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవని చెప్పారు. కేటీఆర్ చెప్పిన అంశాలన్నీ అధికారులు రికార్డ్ చేసినట్టు సమాచారం. ఎఫ్ఈఓ ప్రపోజల్స్ ఎవరు తీసుకొచ్చారు? కంపెనీనే నేరుగా సంప్రదించిందా? లేక ఇతర ప్రైవేట్ కంపెనీలు ఈ కార్ రేస్ ఫార్ములాను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాయా? అనే కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈవెంట్ నిర్వహణకు స్పాన్సర్‌గా అగ్రిమెంట్ చేసుకున్న ఏస్ నెక్సŠట్ జెన్ సంస్థ గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం. పటిష్ట బందోబస్తు .. ఉద్రిక్తతకేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఈడీ కార్యాలయంలోకి వెళుతున్న సమయంలో పార్టీ శ్రేణులు పెద్దపెట్టున జై తెలంగాణ నినాదాలతో ఆయన వాహనం వైపు దూసుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, మన్నె క్రిశాంక్, సుమిత్రానంద్, పావని గౌడ్, కీర్తిలత గౌడ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 5–30 గంటలకు కేటీఆర్ తిరిగి వెళ్లే సమయంలోనూ కొందరు నాయకులు, కార్యకర్తలు అక్కడే ఉండి జై తెలంగాణ నినాదాలు చేశారు.