breaking news
Rangareddy
-
హనీట్రాప్ కలకలం
యోగాశ్రమం నిర్వాహకుడికి ఇద్దరు మహిళల వలపువల● రహస్య వీడియోలతో బెదిరింపులు ● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ● పక్కా ప్లాన్‌తో అరెస్టు ● స్థానికంగా చర్చనీయాంశంచేవెళ్ల: హనీట్రాప్ వ్యవహారం చేవెళ్లలో కలకలం రేపింది. నగరంలోని గోల్కొండ పోలీసులు ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు తెలియడంతో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ పరిధిలోని దామరగిద్దకు చెందిన మిట్ట వెంకటరంగారెడ్డి గతంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కొంత కాలంగా ఆయన దామరగిద్దలోని తన వ్యవసాయ క్షేత్రంలో గురుదత్తాత్రేయ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులోనే సీక్రెట్ ఆఫ్ నేచర్ అనే యోగాశ్రమం నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అక్కడే ఆశ్రయం కూడా కల్పిస్తుంటారు. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఇద్దరు మహిళలు 20 రోజుల కిత్రం ఆ శ్రమానికి వచ్చారు. అక్కడే ఉంటూ వెంకటరంగారెడ్డికి వలపు వల వేశారు. సీక్రెట్‌గా వీడియోలు తీసి బయటకు వెళ్లిన వారు ముఠా సభ్యుల్లో ఒకరైన అమర్ అనే వ్యక్తితో కలిసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. భయపడిన వెంకటరంగారెడ్డి ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని రూ.25లక్షల చొప్పున రెండు చెక్కులు ముందు డేట్ వేసి ఇచ్చారు. వారు మరో రూ.2 కోట్లు లేదా రెండెకరాల భూమి ఇవ్వాలని.. లేదంటే వీడియోలు సోషల్‌మీడియాలో, యూట్యూబ్‌లో పెడతామని.. చంపుతామని బెదిరింపులకు దిగారు. దీంతో ఆయన ఈనెల 4న హైదరాబాద్‌లో తనకు తెలిసిన పోలీస్ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. ముఠాను పట్టుకునేందుకు పోలీసులు పక్కాగా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా శనివారం గోల్కొండ పరిధిలోని తారామతి బారాదరి హోటల్ వద్దకు రావాలని, రూ.2 కోట్లు ఇస్తామని చెప్పి పిలిచారు. అక్కడికి రాగానే ప్లాన్ ప్రకారం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంకటరంగారెడ్డి వద్ద డబ్బులు కాజేసేందుకు పక్కా స్కెచ్‌తోనే ముఠాసభ్యులు హనీట్రాప్‌నకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
పొగ వెలువడి.. శ్వాస కొరవడి
పహాడీషరీఫ్: అక్రమంగా కొనసాగుతున్న సీసం బట్టీలతో జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజారోగ్యానికి ముప్పు పొంచి ఉంది. జల్పల్లి పార్ధివాడ, శ్రీరాం కాలనీలలో ఎలాంటి అనుమతులు లేకుండా సీసం బట్టీలు (పాత బ్యాటరీల నుంచి సీసం కరిగించడం) యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నగరంలోని బ్యాటరీ, స్క్రాప్ దుకాణాల నుంచి పాడైన బ్యాటరీలు తీసుకొచ్చి ఇక్కడ వాటిని ధ్వంసం చేసి అందులోని సీసంను కరగపోస్తూ పెద్ద ఎత్తున కాలుష్యానికి పాల్పడుతున్నారు. ఈ సమయంలో వెలువడుతున్న దట్టమైన పొగలు స్థానిక ప్రజలను శ్వాస తీసుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సమస్య తీవ్రతను గుర్తించిన ప్రజలు మున్సిపాలిటీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం లేదు. జల్పల్లి గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఒకట్రెండు పర్యాయాలు అధికారులు దాడులు చేసి సీసం బట్టీలు ధ్వంసం చేశారు. కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్న నిర్వాహకులు మళ్లీ తమ అక్రమాలను మొదలెట్టారు. తాజాగా మున్సిపల్ కార్యాలయం వెనుకాల కూతవేటు దూరంలో మరో బట్టీ ప్రారంభమయింది. భూమిలో కలుస్తున్న వ్యర్థాలు జల్పల్లి, శ్రీరాం కాలనీలలో కొనసాగుతున్న సీసం బట్టీలతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. కాలం చెల్లిన బ్యాటరీలను ధ్వంసం చేసి.. అందులో నుంచి సీసాన్ని వేడి చేసి బట్టీల ద్వారా కరగదీసి ద్రవంగా మార్చే క్రమంలో పెద్ద ఎత్తున రసాయన వ్యర్థాలను భూమిలోకి వదులుతున్నారు. ఈ కారణంగా శ్రీరాం కాలనీలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి బోర్లలో మొదటి 10–15 నిమిషాల పాటు నీరు రంగు మారి వస్తుండడం ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో పాటు సీసంను కరిగించే సమయంలో క్యాడ్మియం, లెడ్ కరిగి దాని వ్యర్థాలు కూడా దుమ్ము రూపంలో పొగలో కలిసి కాలనీలో పడిపోతుంది. శ్వాసకోశ వ్యాధులు పగలు, రాత్రి తేడా లేకుండా కొనసాగుతున్న ఈ సీసం బట్టీలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దట్టమైన పొగల కారణంగా శ్వాస పీల్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ సమస్య కారణంగా చిన్నారులు, వృద్ధులు, టీబీ, క్యాన్సర్, చర్మ వ్యాధులకు గురవుతున్నారు. ఇక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఈ సీసం బట్టీలు కొనసాగుతున్నా అటు మున్సిపాలిటీ గాని.. ఇటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కాని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. విమానాశ్రయాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అధికారులు పొగను పైకి విడుస్తూ సిగ్నల్‌ను ఇస్తారు. దాని ఆధారంగా విమానాల ల్యాండింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కాని ఇక్కడ విమానాశ్రయానికి ఒకట్రెండు కిలోమీటర్ల దూరంలో ఇలాంటి అక్రమ కంపెనీల ద్వారా వెలువడుతున్న పొగతో పెను ప్రమాదమే పొంచి ఉంది. జల్పల్లిలో ప్రజారోగ్యానికి కుంపటిలా సీసం బట్టీలు కలుషితమవుతున్న భూగర్భ జలాలు విమానాలకు పొంచి ఉన్న సిగ్నల్ సమస్య -
గుర్తు తెలియని వ్యక్తిమృతదేహం లభ్యం
ఇబ్రహీంపట్నం రూరల్: ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. ఆదిబట్లలోని టీసీఎస్ పక్కన ఉన్న మిలన్ డ్రైవ్ హోటల్ ముందు ఆదివారం ఓ గుర్తు తెలియని మృతదేహం పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వచ్చి పరిశీలించే సరికి మృతి చెందిన వ్యక్తి భిక్షాటన చేసే వ్యక్తిగా గుర్తించారు. వయసు దాదాపు 55 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అమ్మను ఎందుకు కొడుతున్నావని ప్రశ్న.. కుమారుడిపై తండ్రి హత్యాయత్నం ఫిలింనగర్: అమ్మను ఎందుకు కొడుతున్నావమని ప్రశ్నించిన కుమారుడిపై తండ్రి కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌లోని దీన్‌దయాళ్‌నగర్ బస్తీలో నివసించే అల్లం నర్సింహ్మ రోజూ పీకలదాకా మద్యం తాగి ఇంటికి వస్తూ భార్యపై అనుమానం పెంచుకుంటూ ఆమెను తీవ్రంగా కొడుతుండేవాడు. ప్రతిరోజూ భార్యను అనుమానించడమే కాకుండా తాగిన మైకంలో ఆమెను కొడుతుండడంతో ఇదేమి పద్ధతి అని కుమారుడు సురేష్ పలుమార్లు తండ్రిని నిలదీయగా అతన్ని కూడా కొట్టేవాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో భార్యపై దాడి చేసి తీవ్రంగా కొట్టగా సురేశ్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో నర్సింహ్మ జేబులో ఉన్న కత్తి తీసి కొడుకు మెడను కోశాడు. తీవ్ర రక్తస్రావం మధ్య సురేష్‌ను అపోలో హాస్పటల్లో చికిత్స నిమిత్తం చేర్చారు. మెడకు తీవ్రంగా గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. తనతో పాటు తల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన తండ్రిపై చర్యలు తీసుకోవాలంటూ సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం సినీనటుడు శ్రవణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ స్నేహలత, నిర్వాహకులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ చార్మినార్ నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి రాత్రికి రాత్రే ఇబ్రహీంపట్నం చిన్న చెరువులో డంప్ చేశారు. శనివారం అర్ధరాత్రి నగరం నుంచి జీహెచ్ఎంసీ– 4కి చెందిన రెండు వాహనాల్లో తెచ్చిన చెత్తను చెరువులో పోస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వెళ్లి పరిశీలించారు. రెండు వాహనా లను అదుపులోకి తీసుకొని, నలుగురు వ్యక్తులపై ఎన్విరాన్మెంట్ కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. చెరువులో వ్యర్థాలను పారబోసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. చెరువును కలుషితం చేయడానికి యత్నించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నేరాల నియంత్రణలో ‘సీసీ’లు కీలకం
మీర్‌పేట: ప్రతిఒక్కరూ తమ వీధిలో, ఇంటి ఎదుట సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మీర్‌పేట ఇన్స్పెక్టర్ శంకర్‌నాయక్ సూచించారు. మీర్‌పేట డీఎల్ఆర్ఎల్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం సీఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరస్తులను పట్టించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కీసర హరినాథ్‌రెడ్డి, కాలనీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, సభ్యులు లక్ష్మణాచారి, నరసింహులు, భిక్షపతిరెడ్డి, అంజయ్య, మాణిక్ ప్రభు, శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
150 కిలోల నల్లబెల్లం పట్టివేత
ఆమనగల్లు: నాటుసారా తయారీ కోసం అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికలను స్వాధీనం చేసుకుని ఒక మహిళను ఆమనగల్లు ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లబెల్లం, పటికలను ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి తరలిస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాద్‌చౌహాన్ ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ బృందం, ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం ఆమనగల్లు బస్టాండ్‌లో తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన మహిళ వద్ద ఉన్న బస్తాలను తనిఖీ చేయగా 150 కిలోల నల్లబెల్లం, 15 కిలోల పటిక లభ్యమైంది. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని, నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌కు చెందిన ఎల్లమ్మ అనే మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ తెలిపారు. తనిఖీల్లో ఎస్టీఎఫ్ ఎస్ఐ బాలరాజు, సిబ్బంది సురేశ్, శ్రీను, శ్రీజ తదితరులు ఉన్నారు. తరలిస్తే కఠిన చర్యలు నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, ముడి పదార్థాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ బద్యానాద్‌చౌహాన్ హెచ్చరించారు. దసరా పండుగ నేపథ్యంలో సారా తయారీ కోసం హైదరాబాద్ నుంచి నల్లబెల్లం, విప్పపువ్వు, ఇతర విడి పదార్థాలు తరలిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.ఆమనగల్లు బస్టాండ్‌లో ఎకై ్సజ్ పోలీసుల సోదాలు -
కార్యాలయానికి స్థలం కేటాయించండి
మీర్‌పేట: తెలంగాణ మాజీ కేంద్ర సాయుధ పోలీస్ ఫోర్సెస్ సిబ్బంది సంక్షేమ సంఘం కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఆదివారం సంఘం సభ్యులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కె.శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దాదాపు 1,500 పారామిలిటరీ కుటుంబాలు నివసిస్తున్నాయని, గతంలో పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో పాటు పక్కనున్న బడంగ్‌పేట కార్పొరేషన్లో మాజీ పారామిలిటరీ సిబ్బంది కుటుంబాలకు ఆస్తిపన్ను రద్దు వర్తింపజేస్తున్నప్పటికీ మీర్‌పేట ప్రాంతంలో మాత్రం వసూలు చేస్తున్నారని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లు దేశ సేవ చేసిన పారా మిలిటరీ బలగాల సంక్షేమానికి కుట్టుబడి ఉన్నానని, త్వరలోనే కుర్మల్‌గూడ ప్రాంతంలో స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు మీర్‌పేట కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి ఇంటి పన్నును రద్దును వర్తింపజేయాలని సూచించారు. కార్యక్రమంలో యాదగిరిరెడ్డి, యాదయ్య, రాజారత్నం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సబితారెడ్డిని కోరిన మాజీ పారా మిలిటరీ సిబ్బంది సంఘం -
‘ఇంట’ర్నెట్ కట్‌కట
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఆవుల కుమ్ములాటలో దూడలు బలైనట్లు’ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ–ఇంటర్నెట్ ఆప్టికల్ సర్వీసు ప్రొవైడర్లు(ఐఎస్పీ), ఎంఎస్ఓలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్‌సీఓలు) మధ్య నెలకొన్న పోరులో అమాయక వినియోగదారులు బలవుతున్నారు. మూడు వారాలు దాటినా ఇంటర్నెట్ సేవలు, టీవీ ప్రసారాలను పునరుద్ధరించకపోవడంతో.. ఇంటి నుంచి విధులు నిర్వహించే ఐటీ, అనుబంధ రంగాల ఉద్యోగులు సహా పిల్లలకు ఆన్లైన్ తరగతులు బోధించే తల్లిదండ్రులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. వివిధ ఆఫర్లలో భాగంగా ముందే ఏడాది/ఆరు నెలల చార్జీలు చెల్లించిన వినియోగదారులు సైతం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ● ఆగస్టు 17న రామంతాపూర్ గోఖలేనగర్ ఘటనతో విద్యుత్‌శాఖ అప్రమత్తమైంది. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు, కార్మికులు, సాధారణ పౌరుల మృత్యువాతకు కారణమవుతున్న ఈ ప్రమాదకరమైన ఆప్టికల్ కేబుల్ వైర్ల తొలగించాలని నిర్ణయించింది. ఆ మేరకు కొద్ది రోజులుగా గ్రేటర్ జిల్లాల్లో ఎక్కడికక్కడే కేబుళ్లను కట్ చేస్తోంది. స్తంభాలపై లైన్లు వేస్తున్నప్పుడు మిన్నకుండిపోయి.. తీరా వేసిన తర్వాత కట్ చేయడం ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఐఎస్పీలు, ఎంఎస్ఓలు, ఎల్‌సీఓలు తప్పు చేస్తే.. వినియోగదారులకు శిక్ష వేయడం ఎంత వరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతోంది. రూ.100 కోట్లకుపైగా నష్టం ● గ్రేటర్ పరిధిలో ఐదు లక్షలకుపైగా విద్యుత్ స్తంభాలు ఉన్నట్లు అంచనా. ఏదైనా విద్యుత్ స్తంభంపై కేబుల్ వేయాలంటే ముందస్తుగా ఆ శాఖ అనుమతి తీసుకోవాలి. ఇందుకు ఒక్కో స్తంభానికి ఏటా రూ.50 నుంచి రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంది. 15 మీటర్ల ఎత్తులోనే కేబుల్ అమర్చుకోవాలి. మెజారిటీ కేబుళ్లు ఆరేడు అడుగుల ఎత్తులోనే వేలాడుతున్నాయి. ఒక స్తంభానికి, మరో స్తంభానికి మధ్య 50 మీటర్లకు మించరాదు.. కానీ మెజార్టీ స్తంభాలకు టన్నుల కొద్దీ బరువైన కేబుల్ ఉండలు వేలాడుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి మధ్యలో ఏదైనా చెట్టు కొమ్మ విరిగి లైన్‌పై పడితే.. ఆ బరువుకు రెండు వైపులా ఉన్న స్తంభాలు నేలకూలుతున్నాయి. ● దెబ్బతిన్న ఇన్సులేటర్లు, జాయింట్లను పునరుద్ధరించేందుకు లైన్మెన్లు స్తంభాలపైకి ఎక్కడం చాలా కష్టంగా మారింది. కేబుళ్ల నుంచి ఎర్తింగ్ రివర్స్ వల్ల షాక్‌తో కిందపడి పోతున్న ఘటనలు లేకపోలేదు. కనీస అనుమతులే కాదు కనెక్షన్, మీటర్ తీసుకోకుండా ఏకంగా కేబుల్ జంక్షన్ బాక్సులకు కరెంట్‌ను వినియోగిస్తున్నారు. ఏళ్ల తరబడి కళ్లముందే ఈ చౌర్యం జరుగుతున్నా.. క్షేత్రస్థాయి ఇంజినీర్లు పట్టించుకోలేదు. కొత్తగా అనేక ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు (ఐఎస్పీ), ఎంఎస్ఓలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్‌సీఓలు) పుట్టుకురావడం, వ్యాపారంలో పోటీతో ఎవరికి వారు స్తంభాలపై కేబుళ్లను వేసుకుంటూ ముందుకెళ్లడం, ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పడు పాత వైర్లను అలాగే వదిలేసి, కొత్తగా మరో ఆప్టికల్ కేబుల్‌ను అమర్చుతుండటం, తాజాగా వాటన్నింటినీ తొలగిస్తుండటంతో ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నష్టపోవాల్సి వచ్చిందని ఆయా సర్వీసు ప్రొవైడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాలైనా పునరుద్ధరణకు నోచుకోని సేవలు వివిధ ఆఫర్లలో ముందే చార్జీలు చెల్లించిన వినియోగదారులు ఆన్లైన్ సేవల అంతరాయాలపై విరుచుకుపడుతున్న సిటిజన్లు కేవలం ఆపరేటర్లే కాదు సేవల వినియోగంలో భాగంగా ముందే ఆఫర్ల పేరుతో (సంవత్సరం/ఆరు నెలలు) చార్జీలు చెల్లించిన గృహ, వ్యాపార, వాణిజ్య సంస్థల వినియోగదారులు సైతం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. మూడు వారాలైనా ఆయా సర్వీసులు పునరుద్ధరించపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక..ఆయా సర్వీసు ప్రొవైడర్లు కాల్ సెంటర్లు/ వ్యక్తిగత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. మెజార్టీ ప్రజలు గృహ, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వైఫై సర్వీసులను వాడుతున్నారు. ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాల్లోనూ ఈ తరహా సేవలనే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆప్టికల్ కేబుళ్లన్నింటినీ కట్ చేయడంతో సర్వీసులు నిలిచిపోయి సిగ్నల్ సమస్యలు తలెత్తుతున్నాయి. రోజంతా టీవీ సీరియల్స్, ఓటీసీ సినిమాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ సర్వీసులకు అలవాటు పడిన గృహిణులు ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారు. కట్ చేసిన కేబుళ్లను అక్కడే రోడ్లపైనే గుట్టలుగా వదిలేసి వెళ్తుండటం, అటుగా వచ్చి పోయే వాహనదారులు వైర్ల మధ్య చిక్కుకుని ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాల రాకపోకల సమయంలో కేబుళ్లు టైర్ల మధ్య చిక్కుకు పోయి ప్రమాదాలకు కారణమవుతోంది. -
ఆర్థిక సమస్యలతో యువకుడి ఆత్మహత్య
అబ్దుల్లాపూర్‌మెట్: ఆర్థిక సమస్యల కారణంగా చెట్టుకు ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాకు చెందిన చెందిన సుబ్రత్ జైన్‌కు భార్య, ఇద్దరు కుమారులతో కలిసి మండలంలోని కవాడిపల్లిలో నివాసముంటున్నాడు. అతని పెద్దకుమారుడు సుకమోల్ జైన్(20) గ్రామ శివారులోని జీఎస్పీ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తున్నాడు. అతడు ఆదివారం ఉదయం బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. కాసేపటికే సుకమోల్తో పనిచేసే యువకుడు సుబ్రత్ జైన్‌కు ఫోన్‌చేసి మీ కుమారుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లి బోరున విలపించాడు. తన కుమారుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సినీ నటుడిని బెదిరిస్తున్న యువతిపై కేసు బంజారాహిల్స్: ఏఐ టెక్నాలజీతో ఓ బాలీవుడ్ నటుడి ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేస్తూ ఆయన స్నేహితులకు, దర్శక, నిర్మాతలకు, కుటుంబ సభ్యులకు పోస్ట్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న యువతిపై బంజారాహిల్స్‌లో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముంబై నివాసి, ఫ్రీలాన్స్ నటుడు ఆనంద సురేష్ కుమార్ రెన్వా (36)ను జియా ఉనిస్సా నస్రీన్ అనే మహిళ మూడు సంవత్సరాలుగా నిరంతరం వేధిస్తోంది. అతని ఇన్‌స్ట్రాగామ్, వాట్సప్, ఫోన్ అకౌంట్స్ హ్యాక్ చేసి, అతని పేరుతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన సెమీ న్యూడ్, న్యూడ్ ఫోటోలు, వీడియోలు సృష్టించింది. ఆ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను పరిశ్రమలోని దర్శకులకు, రెండు ప్రొడక్షన్ హౌస్‌లకు పంపించి అరాచకానికి పాల్పడిందని, ఈ కారణంగా తన వృత్తిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ బాధిత నటుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాదాపు 15 నుంచి 20 నకిలీ ఖాతాల ద్వారా అతన్ని అవమానపరిచేలా పలు సందేశాలను, వీడియోలను పంపింది. అతని కుటుంబాన్ని లక్ష్యంగా చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడిందని, హృద్రోగ లక్షణాలు కూడా వచ్చాయని బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా అతని సోదరికి కూడా అశ్లీల సందేశాలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జింఖానా క్లబ్ చైర్మన్‌గా శివరామకృష్ణ బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని ది హైదరాబాద్ జింఖానా క్లబ్ చైర్మన్‌గా గూడురు శివరామకృష్ణ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన క్లబ్ ఎన్నికల్లో నాగ కిషోర్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. చైర్మన్‌గా గూడురు శివరామకృష్ణ, వైస్ చైర్మన్‌గా ఎస్.మధుసూదన్‌రెడ్డి, సెక్రటరీగా ఎన్.నాగ కిషోర్, జాయింట్ సెక్రటరీగా వెన్నం అనిల్‌రెడ్డి, ట్రెజరర్‌గా గడ్డిపాటి హరీష్, డైరెక్టర్లుగా కనుమూరి నారాయణరాజు, రఘురామ్, కంజర్ల సదాశివయాదవ్, కంటిపూడి శ్రీనివాస్‌చౌదరి, అత్తలూరి సుధీర్‌కుమార్, రవికుమార్ వడ్లమూడి విజయం సాధించారు. మొత్తం 2064 ఓట్లకు గాను 1420 ఓట్లు పోలయ్యాయి. -
తెగని పంచాయితీ
● స్థానిక ఎన్నికలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ● రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఆందోళన ● జోరుగా అనుచరులతో మంతనాలుషాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో.. పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా.. కొత్త విధానం అవలంబిస్తారా.. ఇలా పల్లెల్లో ఎక్కడ చూసినా చర్చ సాగుతోంది. పంచాయతీ పదవులపై కన్నేసిన ఆశావహులు ఓ వైపు రిజర్వేషన్ కలిసొస్తుందో లేదోనని ఆందోళన పడుతూనే, వర్తించకపోతే ఏం చేయాలోనని ప్రస్తుతం తర్జన భర్జన పడుతున్నారు. కొందరు ఆసక్తిగల నేతలు తమ అనుచరగణంతో ఎన్నికలపై సమాలోచనలు జరుపుతున్నారు. మాజీ ప్రజాప్రతినిధులు సైతం తమ హయాంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రావాల్సి ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో తమ ఉనికి చాటుకునేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారు. కొత్త విధానమా? గత ప్రభుత్వం పంచాయతీ రిజర్వేషన్లు పదేళ్ల పాటు అమల్లో ఉండేలా గత ఎన్నికల సమయంలోనే చట్టం రూపొందించింది. ఆ చట్టం ప్రకారం పాత రిజర్వేషన్లనే కొనసాగించాల్సి ఉంటుంది. కానీ, ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని సర్కార్ కొత్త విధానం అమలు చేసి తన మార్కు చూపెట్టుకుంటుందనే అభిప్రాయాలున్నాయి. అదే జరిగితే పాత రిజర్వేషన్ల చట్టాన్ని రద్దు చేసి కొత్తది రూపొందించాల్సి ఉంటుందని, అందుకు ఏ పద్ధతులను అమలు చేస్తారోననే ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. రిజర్వేషన్ల అమలు, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఓటరు జాబితా తయారీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండేలా ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికార యంత్రాంగం ఓటరు తుది జాబితా తయారీ పూర్తి చేసింది. ఒకే కుటుంబానికి చెందిన వారంతా ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకునేలా చేశారు. ఫొటో ఓటరు జాబితా ప్రచురించింది. ఓటరు జాబితాపై అభిప్రాయ సేకరణ కోసం జిల్లాస్థాయి రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. పంచాయతీల వారీగా ఓటరు తుది జాబితాను ప్రచురించారు. -
ఎడాపెడా ఎల్సీలకు స్వస్తి
తెగని పంచాయితీ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో.. పాత రిజర్వేషన్లే కొనసాగిస్తారా.. అంటూ పల్లెల్లో చర్చ సాగుతోంది.సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘గతంలో ఎల్సీ (లైన్ క్లియరెన్స్)లపై నియంత్రణ ఉండేది కాదు. ఏ సబ్‌స్టేషన్ పరిధిలో ఏ ఫీడర్‌కు ఎల్సీ తీసుకున్నారో క్షేత్రస్థాయి ఇంజనీర్లకు తెలిసేది కాదు. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికాం. వారానికి ఒక రోజు (శనివారం) గంట నుంచి రెండు గంటలలోపు మాత్రమే ఎల్సీలకు అనుమతి ఇస్తున్నాం. డిస్కం పరిధిలో మూడు వేలకుపైగా ఫీడర్లు ఉండగా, వీకెండ్లో 300లోపు ఫీడర్ల పరిధిలోనే ఎల్సీలు జారీ చేస్తున్నాం. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులకు ముందస్తు సమాచారం చేరవేస్తున్నాం. సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడుతున్నాం. ప్రస్తుతం సాంకేతిక కారణాలతో వెలుగు చూస్తున్న స్వల్ప అంతరాయాలే కానీ.. అధికారికంగా ఎలాంటి విద్యుత్ కోతలు అమలు చేయడం లేదు’ అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.నరసింహులు తెలిపారు. ఈ మేరకు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే.. 30 నిమిషాలకు మించి ఇవ్వడం లేదు ‘నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా జరుగుతోంది. సామర్థ్యానికి మించి ఉత్పత్తి అవుతోంది. డిమాండ్‌కు సరఫరాకు మధ్య కనీస వ్యత్యాసం కూడా లేదు. సాంకేతిక కారణాలతో అక్కడక్కడా వెలుగుచూస్తున్న అంతరాయాలకు కారణాలపై విశ్లేషిస్తున్నాం. ఇంజనీర్లు వెంటనే అప్రమత్తమై సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఎఫ్ఓఎంఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షిస్తున్నాం. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా కాపాడుతున్నాం. అయినా కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి వీకెండ్ మినహా ఇతర రోజల్లో ఎల్సీలకు అనుమతి ఇవ్వడం లేదు. మల్టీ స్టోరేజీ భవనాలకు, వాణిజ్య సముదాయాల్లోని కొత్త కనెక్షన్లు, డీటీఆర్ ఛార్జింగ్ కోసం 30 నుంచి 60 నిమిషాలు మాత్రమే ఎల్సీ ఇస్తున్నాం. అదీ కార్పొరేట్ ఆఫీసు నుంచి లిఖిత పూర్వక అనుమతి పొందిన వారికే. సాధారణ సర్వీసులకు కనెక్షన్ ఇచ్చేందుకు ఎలాంటి ఎల్సీలు అవసరం లేదు. క్షేత్రస్థాయిలోని డీటీఆర్ ఏబీ స్విచ్ ఆఫ్ చేసి కనెక్షన్ ఇచ్చే వెసులుబాటు కల్పించాం. వినియోగం చూస్తే ఆశ్చర్యమేస్తోంది ప్రస్తుతం గ్రేటర్లో 63 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి తోడు ప్రతి నెలా కొత్తగా మరో 35 వేల సర్వీసులు వచ్చి చేరుతున్నాయి. కనెక్షన్లతో పాటు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. గతంలో వేసవిలో మాత్రమే ఏసీలు వాడేవారు. ప్రస్తుతం సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో ఏసీ పని చేస్తూనే ఉంది. ఏడాదికి కనెక్షన్ల పెరుగుదల 10 నుంచి 12 శాతం ఉండగా, విద్యుత్ వినియోగం 30 నుంచి 40శాతం నమోదవుతోంది. బిల్లే కదా కట్టుకుందాం అనే ధోరణి ఇటీవల విపరీతంగా పెరిగింది. గృహజ్యోతి పథకం లబ్ధిదారుల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. గతంలో 100 యూనిట్లలోపు వాడేవారు.. ప్రస్తుతం 200 యూనిట్లకుపైగా వినియోగిస్తున్నారు. ఏకధాటి వర్షాలు, వరదల సీజన్లోనూ ఇదే స్థాయిలో డిమాండ్ నమోదవుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోం ఒకవైపు సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయి సిబ్బంది పని తీరులోనూ మార్పునకు కృషి చేస్తున్నాం. సీఎండీ ముషారఫ్ ఫరూఖీతో కలిసి ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో సర్కిళ్లు, డివిజన్లు, సెక్షన్ ఇంజనీర్లతో సమావేశమవుతున్నాం. రాత్రి పగలు తేడా లేకుండా జోరు వానలోనూ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నాం. వినియోగదారులను స్వయంగా కలిసి విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నాం. సరఫరాలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇంజనీర్లు, జూనియర్ లైన్మెన్లపై చర్యలకు ఆదేశిస్తున్నాం. కొత్త కనెక్షన్లజారీలోనూ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. సెక్షన్ల వారీగా పెండింగ్ దరఖాస్తులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం. అవినీతి నిర్మూలన కోసం ఇప్పటికే సర్కిళ్లు, సెక్షన్లతో పాటు బహుళ అంతస్తుల భవనాల్లో కాల్ సెంటర్ నంబర్లతో కూడిన స్టిక్కర్లు అటించాం. ఇంజనీర్ల పనితీరుపై నిరంతర నిఘా ఏర్పాటు చేశాం అని స్పష్టం చేశారు. వారంలో ఒకే రోజుకు పరిమితం గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం అయినా నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు సరఫరా అంతరాయాలు తప్ప ఎలాంటి కోతలు లేవు ‘సాక్షి’తో డిస్కం ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ నరసింహులు -
చెట్లు.. కాపాడేటట్లు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రోడ్డుకు ఇరువైపులా ఉన్న పురాతన మర్రి చెట్లకు ముప్పు లేకుండా నిర్మాణంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చెట్ల ఉనికిని ఏమాత్రం దెబ్బతీయకుండా ఆయా ప్రాంతాల్లో స్వల్ప మార్పులు చేపట్టా లని భావిస్తున్నట్లు సమాచారం. వరుస ప్రమా దాల నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో కేసులు వేసిన పర్యావరణవేత్తలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్జీటీ అంగీకారం, పర్యావరణవేత్తల సూచనల మేరకు ఇకపై ముందుకు వెళ్లనుంది. ఎన్జీటీలో కేసుల కారణంగా నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ పనులకు త్వరలో మోక్షం లభించే అవకాశం ఉంది. నాలుగేళ్ల క్రితమే శంకుస్థాపన బీజాపూర్ రహదారి 163పై రక్తపుటేరులు పారుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం వెలుగు చూస్తూనే ఉంది. ఎవరో ఒకరు మృత్యువాత పడుతూనే ఉన్నారు. ప్రమాదాల నివారణ, మెరుగైన ప్రయాణం కోసం ఇటు అప్పా జంక్షన్ (తెలంగాణ పోలీసు అకాడమీ) నుంచి అటు మన్నెగూడ వరకు నాలుగు లేన్లుగా విస్తరించాలని ఆరేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.928.41 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. మొత్తం 266.55 హెక్టార్ల భూమి అవసరమని గుర్తించింది. అప్పా టు మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర విస్తరించతల పెట్టిన రోడ్డు పనులకు 29 ఏప్రిల్ 2022లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. దారి పొడవునా 18 అండర్‌పాసులు, మొయినాబాద్ సమీపంలో 4.35 కి.మీ, చేవెళ్ల సమీపంలో 6.36 కి.మీ రెండు బైపాస్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గ్రీన్ ట్రిబ్యూనల్‌లో కేసులతో జాప్యం రోడ్డుకు ఇరువైపులా పురాతన, ఎత్తయిన మర్రి చెట్లు ఉన్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా 750పైగా వృక్షాలను తొలగించాల్సి వచ్చింది. ఇదే అంశంపై శ్రీబన్యన్ ట్రీశ్రీ అనే స్వచ్ఛంద సంస్థ పర్యావరణ పరిరక్షణ పేరుతో ఎన్జీటీని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో రోడ్డు పనులకు బ్రేక్ పడింది. భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసిన నాటి ప్రభుత్వం చెట్లను రీ లొకేట్ చేసి, కేసును ఎత్తివేయించలేకపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లాకు ఇదే మార్గం నుంచి వెళ్లి వస్తుండటం, ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండటం, ఏళ్లుగా రోడ్డు నిర్మాణం ముందుకు సాగకపోవడంపై స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వంకరలు లేకుండా అలైన్మెంట్లో స్వల్ప మార్పులతో కూడిన నిర్మాణ పనుల డీపీఆర్‌ను కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిసింది. చెట్లున్న చోట రోడ్డును ఒకవైపు పెంచుతూ పోవడం ద్వారా ఆయా వృక్షాలను తొలగించాల్సిన అవసరం ఉండబోదని ఎన్జీటీకీ వివరించనుంది. ఎన్జీటీలో ఇప్పటికే నమోదైన కేసు వచ్చే వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. అలైన్మెంట్లో స్వల్ప మార్పులు కొలిక్కిరానున్న బీజాపూర్ రహదారి విస్తరణ రోడ్డు వంకరలు లేకుండా ముందస్తు చర్యలు ఎన్జీటీకీ స్పష్టం చేయనున్న ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ పూర్తి.. రెండు చోట్ల బైపాస్ పనులు -
కూరగాయలు కొనేందుకు వెళ్తూ..
చేవెళ్ల: కూరగాయలు కొనేందుకని బైక్‌పై వెళ్లిన ఓ వ్యక్తిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి గ్రామానికి చెందిన వడ్డె మల్లేశ్(32) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఇంటి నుంచి కూరగాయలు కొనేందుకు తన బైక్‌పై చేవెళ్లకు వస్తున్నారు. మార్గమధ్యలో కందవాడ లింక్ రోడ్డు సమీపంలో లారీ ఢీకొట్టింది. దీంతో మల్లేశ్ లారీ చక్రాల కింది పడి అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య సరిత, ముగ్గురు పిల్లలున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లారీ ఢీకొట్టడంతో ఒకరి దుర్మరణం -
హనీ ట్రాప్‌లో యోగా గురువు రంగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్న ఓ యోగా గురువు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. అనారోగ్య సమస్యలతో రంగారెడ్డి యోగా శ్రమంలో ఇద్దరు మహిళలు చేరారు. కొన్ని రోజులుగా రంగారెడ్డికి ఆ మహిళలు సన్నిహితంగా ఉన్నారు. మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫొటోలతో అమర్ గ్యాంగ్ బ్లాక్ మెయిల్‌కి తెరతీసింది.అమర్ గ్యాంగ్‌కు భయపడిన రంగారెడ్డి రూ.50 లక్షలు ఇచ్చారు. మరో రూ.2 కోట్లు అమర్ గ్యాంగ్ డిమాండ్ చేసింది. దీంతో రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. హనీ ట్రాప్‌పై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. -
విద్యాభివృద్ధికి పెద్దపీట
షాద్‌నగర్‌రూరల్: సాంకేతిక విద్యలో ప్రపంచంతో పోటీ పడే విధంగా గిరిజన గురుకులాల విద్యార్థులను తయారు చేస్తామని గిరిజన, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరిలక్ష్మణ్కుమార్ అన్నారు. పట్టణంలో రెండు రోజులుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి, గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో కృత్రిమ మేధ (ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్)పై జాతీయ సదస్సు కొనసాగుతోంది. పట్టణ సమీపంలోని కుంట్లరాంరెడ్డి గార్డెన్లో శనివారం నిర్వహించిన సదస్సు ముగింపు సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. భవిష్యత్ తరాల విద్యార్థుల అభివృద్ధికి ఏఐ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరిక మేరకు కొత్తూరు మండలంలోని దర్గా అభివృద్ధికి రూ.8 కోట్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యను అభ్యసించాలని అన్నారు. అనంతరం వెబ్సైట్లో గురుకుల కళాశాలల సమాచారంతో కూడిన ఏఐ చాట్‌బాక్స్‌ను ఆవిష్కరించారు. ఏఐలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సాంఘీక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి, డిప్యూటీ కార్యదర్శులు లింగారెడ్డి, వేణుగోపాల్‌రావు, పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమేష్‌బాబు, ఐఐటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్నీతాపోలె తదితరులు పాల్గొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ -
రాజీమార్గం ఉత్తమం
ఇబ్రహీంపట్నం: క్షణికావేశంలో జరిగిన గొడవలు, పంచాయతీలతో కేసుల్లో చిక్కిన కక్షిదారులు రాజీ మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం శ్రేయస్కరమని ఇబ్రహీంపట్నం కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్రీదేవి అన్నారరు. ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో 1,112 సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ కేసుల్లో న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేకంటే రాజీపడి పరిష్కరించుకోవడం మేలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి రీటాలాల్చంద్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి యశ్వంత్‌సింగ్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్, ఏసీపీ రాజు పాల్గొన్నారు. -
డిగ్రీ కోర్సుల్లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం
హయత్‌నగర్: హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 15,16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 176 సీట్లు ఖాళీగా ఉన్నాయని వాటిలో బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులో 21, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్‌లో 45, బీఎస్సీ లైఫ్‌సైన్స్‌లో 31, బీఏ తెలుగు మీడియంలో 40, బీబీఏలో 39 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి కళాశాల దోస్త్ కో ఆర్డినేటర్ నర్సింహను కలవాలని సూచించారు. మొయినాబాద్: ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిస్థాయిలో నిండిన సురంగల్ పెద్ద చెరువుకు చిన్నపాటి గండిపడటంతో అధికారులు సకాలంలో స్పందించారు. గండి పూడ్చి మరమ్మతులు చేయించడంతో ప్రమాదం తప్పింది. మున్సిపల్ పరిధిలోని సురంగల్ పెద్ద చెరువులోకి కొన్ని రోజులుగా వరద రావడంతో పూర్తిస్థాయిలో నిండింది. చెరువు కట్టకు చిన్నపాటి గండి పడి నీళ్లు కిందికి వెళ్తున్నాయి. గండి పెద్దది కాకముందే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్పందించారు. ఇరిగేషన్ ఏఈ ప్రియాంక, ఆర్ఐ రాజేష్, వర్క్ఇన్స్పెక్టర్ నర్సింహ తదితరులు శనివారం చెరువు వద్దకు చేరుకుని కట్టను పరిశీలించారు. మట్టి పోసి కట్టకు పడిన గండిని పూడ్చి మరమ్మతులు చేయించారు. ఆమనగల్లు: మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో శనివారం ఆయనను కలిసి పార్టీ గురించి చర్చించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజితారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొనుగోటి అర్జున్రావ్ ఉన్నారు. ఆర్టీసీ వినూత్న ప్రయోగం ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిందని ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వెంకటనర్సప్ప తెలిపారు. దాతల ద్వారా సేకరించిన విరాళాలతో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులకు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ఉచిత యాత్ర ప్రవేశపెడుతోందని చెప్పారు. దాతలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులు విరాళాలు అందించి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. -
ఉద్యమకారుల డిమాండ్లు నెరవేర్చాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీమా సీను, జిల్లా అధ్యక్షుడు కొంతం యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. అక్టోబర్ 26న చలో ఇందిరా పార్కు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 584 మండలాల ఉద్యమకారుల చైతన్య యాత్ర శనివారం యాచారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాల వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉద్యమాలతో తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు. పదేళ్లలో ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, సంక్షేమ బోర్డుకు రూ.10వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు, ట్రైన్ పాసులు, ఆరోగ్య కార్డులు కల్పించాలని, ఉద్యోగాల్లో 20 శాతం కోట కేటాయించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించి పదవులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు విష్ణు, నరేందర్, శ్యామల, బోసుపల్లి వీరేశం, శ్యామ్, నక్క జంగయ్యగౌడ్, కందుకూరి జంగయ్య, కారింగ శంకర్, గండికోట పాండు, బైరెడ్డి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం చేరిన బస్సుయాత్ర ఇబ్రహీంపట్నం: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చేపట్టిన బస్సుయాత్ర శనివారం ఇబ్రహీంపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యమకారులు డా. శ్రీనివాస్, డబ్బికార్ శ్రీనివాస్, కొంతం యాదగిరిరెడ్డి, బోసుపల్లి వీరేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల ప్లాట్లు, పింఛన్లు, గుర్తింపు కార్డులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యమకారులు విష్ణువర్ధన్, జానికిరెడ్డి, శ్యామల, మహేందర్, రవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవరే సూత్రధారి
ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025వీడిన శంకర్పల్లి రాబరీ కేసు ● పథకం ప్రకారమే రూ. 40 లక్షలు కొట్టేసిన నిందితులు ● 24 గంటల్లో ఛేదించిన సైబరాబాద్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రూ. 40 లక్షల దారి దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కారు పార్కింగ్ లైట్లు వెలగడమే దోపిడీకి సిగ్నల్‌గా పెట్టుకొని రాబరీకి పాల్పడినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ప్రధాన సూత్రధారి కారు డ్రైవర్ మధుతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయా వివరాలను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి శనివారం మీడియాకు వెల్లడించారు. ● హైదరాబాద్‌కు చెందిన రాకేష్ అగర్వాల్‌కు సాయిబాబా అనే వ్యక్తి మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. వ్యాపార అవసరాల నిమిత్తం సాయిబాబా ఎక్కడికి వెళ్లాలన్నా బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన కార్ యజమాని, డ్రైవర్ మధు కాసులను సంప్రదించేవాడు. ఈ క్రమంలో సాయిబాబా కదలికలను మధు గమనిస్తూ ఉండేవాడు. ఈనెల 12న రాకేష్ అగర్వాల్ వికారాబాద్‌లోని అన్సారీ అనే కస్టమర్ నుంచి రూ. 40 లక్షలు వసూలు చేసి తీసుకురమ్మని సాయిబాబాను ఆదేశించాడు. దీంతో సాయిబాబా మధుకు ఫోన్ చేసి వికారాబాద్‌కు తన క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అప్పుడే సాయిబాబా భారీ డబ్బును తీసుకొస్తాడని మధు ఊహించాడు. దారి దోపిడీకి స్కెచ్ పథకం ప్రకారం మధు తన స్నేహితులైన ఆర్సీపురానికి చెందిన విజయ్‌కుమార్, కాచిగూడకు చెందిన మహ్మద్ అజర్లకు ఈ విషయాన్ని తెలిపాడు. ఇరువురిపై గతంలో ఫోర్జరీ, డ్రగ్స్, దొంగతనాల కేసులు కూడా ఉన్నాయి. దోపిడీ చేసేందుకు విజయ్ పాత నేరస్తుడైన గచ్చిబౌలికి చెందిన హర్షవర్ధన్‌ను నియమించుకు న్నాడు. నలుగురు కలిసి వికారాబాద్ నుంచి హైదరాబాద్‌కు మార్గంలో రెక్కీ నిర్వహించారు. రద్దీ తక్కువగా ఉండే ప్రాంతం, దోపిడీ తర్వాత సులువుగా తప్పించుకునే వీలున్న హుస్సేన్‌పూర్ గేట్ వద్ద దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎస్కార్ట్ వాహనంలో.. ఈ నెల 12న ఉదయం 11:30 గంటలకు సాయిబాబా, డ్రైవర్ మధుతో పాటు కారులో వికారాబాద్ చేరుకున్నాడు. అన్సారీ నుంచి రూ. 40 లక్షలు తీసుకొని, కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. హర్ష తన స్నేహితులైన మహబూబ్‌నగర్‌కు చెందిన అనుదీప్ అలియాస్ లడ్డు స్విఫ్ట్ డిజైర్ కార్‌ను తీసుకొని హఫీజ్‌పేటకు చెందిన దీపక్, హుస్సేనీఆలంకు చెందిన షమీముల్లాలతో కలిసి కారులో మధు కారును వెంబడిస్తున్నారు. వీరి వెనుక ఎస్కార్ట్ వాహనంలో విజయ్, అజార్‌లు అనుసరిస్తున్నారు. డ్రైవర్ మధు నిరంతరం విజయ్‌తో ఫోన్లో తన లొకేషన్ వివరాలను అందిస్తూ ఉన్నాడు. దీన్ని విజయ్ హర్ష్‌కు పంపిస్తూ ఉన్నాడు. -
వాస్తవాలు తెలుసుకోవాలి
తుర్కయంజాల్: మేధావులు మౌనంగా ఉంటే చరిత్రను వక్రీకరించే అవకాశం ఉంటుందని, ప్రజలకు అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అబ్బాస్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా శనివారం తుర్కయంజాల్‌లోని అరుణ కన్వెన్షన్ హాల్లో ‘తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటం– వాస్తవాలు, వక్రీకరణ’ అంశంపై టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ.. 1946 సెప్టెంబర్ 11న ప్రారంభమైన సాయుధ పోరాట పిలుపు చారిత్రక మలుపుగా నిలిచిందని, ఈ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర ఎనలేనిదని గుర్తు చేశారు. నిజాం ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఎంతో మంది కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఆ పోరాట ఫలితంగానే తెలంగాణలో నిజాం పాలన అంతం కావడం, ప్రజలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి లభించడం, పేదలకు వ్యవసాయ భూమి దక్కాయని అన్నారు. బీజేపీ ఏటా సెప్టెంబర్ వచ్చిందంటే చాలు తామే సాయుధ పోరాటాన్ని నడిపినట్లు ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్నాయని, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలను కూడా అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నేటి తరం యువత వాస్తవాలను గ్రహించి, చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, ఉపాధ్యక్షుడు బింగి రాములయ్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుగంధ, సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య పాల్గొన్నారు. ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బాస్ -
ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ ● ఇబ్రహీంపట్నంలో సంఘం సర్వసభ్య సమావేశం ఇబ్రహీంపట్నం: పదోన్నతులలో మిగిలి పోయిన ఖాళీలను.. అర్హులైన ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పుట్టపాక ప్రవీణ్‌కుమార్ కోరారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంఘం ఇబ్రహీంపట్నం సెక్టార్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్ల కొరత ఏర్పడిందని తెలిపారు. అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పించి, వాటిని భర్తీ చేయాలని సూచించారు. ఈ ఏడాదిలో పదోన్నతులు కల్పించకపోతే అనేక మంది ఉద్యోగ విరమణ పొందుతారని పేర్కొన్నారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను తిరిగి పునరుద్ధరించడం హర్షణీయమని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తు పాండు రంగారెడ్డి మాట్లాడుతూ.. జీఓ 317 ద్వారా నష్టపోయిన స్థానికులకు న్యాయం చేయాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి, క్రమం తప్పకుండా డీఏలను మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాండురంగారెడ్డి, జగనోహ్మన్‌రెడ్డి, పరమేశ్, శ్రీనివాస్‌రావు, బాలకృష్ణ, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్మశానవాటికలో చెట్ల నరికివేత
తుర్కయంజాల్: శ్మశానవాటికలోని చెట్లను న రికిన వ్యక్తులకు మున్సిపల్ అధికారులు జరిమానా విధించిన సంఘటన పురపాలకసంఘం పరిధి రాగన్నగూడలో శనివారం చోటు చేసుకుంది. 10వ వార్డులోని శ్మశానవాటికలో ఉన్న 3 పెద్ద కానుగు చెట్లను ఎన్ఎస్ఆర్ నగర్‌కు చెందిన ఎస్.లక్ష్మయ్య, మల్లయ్య ఎలాంటి అనుమతులు లేకుండా నరికి వాహనంలో తరలించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న శానిటేషన్ ఇన్స్పెక్టర్ వనిత, కమిషనర్ అమరేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు రూ.15వేలు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సురేశ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇద్దరికి జరిమానా విధించిన అధికారులు -
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్, కవాడిపల్లి, చిన్నరావిరాల, ఇనాంగూడ, మజీద్‌పూర్ గ్రామాల్లో రూ.88.50 లక్షల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శనివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. పేదలను దృష్టిలో పెట్టుకునే వారికి అన్ని విధాలుగా లబ్ధి చేకూర్చేందుకు సంక్షేమ పథఽకాలను ప్రవేశ పెడుతున్నామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులనే గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు మండల, గ్రామ పంచాయతీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
తాగునీటికి కటకట!
మొయినాబాద్: వర్షా కాలంలోనూ ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం.. స్థానికంగా ఉన్న బోరు మోటార్లు కాలిపోవడంతో మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో వారం రోజులుగా తాగునీటి కటకట ఏర్పడింది. దీంతో ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లతో నీళ్లు పోయించుకుంటున్నారు. గ్రామానికి నీటి సరఫరా అయ్యే మిషన్ భగీరథ పైపులైన్లు పగిలిపోవడంతోపాటు స్థానికంగా ఉన్న బోరు మోటార్లు కాలిపోవడంతో వారం రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్లు, బోరు మోటార్లకు మరమ్మతులు చేయించాల్సిన మున్సిపల్ అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని పోయించుకుంటున్నామని చెబుతున్నారు. గ్రామస్తుల ఆందోళన హిమాయత్‌నగర్‌లో వారం రోజులుగా మంచినీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని శనివారం స్థానికులు ఆందోళన చేశారు. గ్రామంలో తాగునీటి సమస్యతోపాటు ఇతర సమస్యలు చాలా ఉన్నాయని.. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడంలేదని మండిపడ్డారు. రోజుకో దగ్గర మిషన్ భగీరథ పైపులైన్లు పగిలిపోతున్నాయని, మరమ్మతులు చేయాలని చెప్పినా ఎవరూ స్పందించడం లేదన్నారు. వీధిదీపాలు సరిగా లేవని.. రోడ్లపైనే మురుగునీరు పారుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలతోపాటు మున్సిపల్ కమిషన్ తీరుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. వర్షాకాలంలోనూ తప్పని తిప్పలు హిమాయత్‌నగర్‌లో పైపులైన్లుపగిలి భగీరథ నీళ్లు బంద్ బోరు మోటార్ల కాలిపోయినా పట్టించుకోని అధికారులు వారం రోజులుగా అవస్థలు పడుతున్న ప్రజలు -
పురుగు మందు తాగి డ్రైవర్ ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కుర్మల్‌గూడ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే మోతిలాల్(40) డ్రైవర్ పని చేసుకుంటూ జీవించేవాడు. కుటుంబ కలహాలతో ఈ నెల 8వ తేదీన పురుగు మందు తాగాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మట్టి ట్రాక్టర్ పట్టివేత మాడ్గుల: మండలంలోని మాడ్గుల గ్రామ శివారులోని వాగు నుంచి శనివారం ఉదయం అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు సీఐ వేణుగోపాల్‌రావు తెలిపారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి ప్రశ్నించగా ఎలాంటి అనుమతులు లేవని చెప్పడంతో వాటిని సీజ్ చెసినట్లు చెప్పారు. డ్రైవర్, వాహన యాజమనులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. బతుకుపోరాటంలో ఆగిన గుండె కందుకూరు: బతుకు పోరాటంలోనే ఓ గుండె ఆగిపోయింది. మండల పరిధిలోని కటికపల్లికి చెందిన ఎంట్ల అశోక్(35) టిప్పర్‌పై డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం గ్రామ సమీపంలోని క్రషర్ మిషన్ వద్ద డస్ట్ లోడ్ నింపుకొని బయలుదేరాడు. మార్గమధ్యలో ఛాతిలో నొప్పి రావడంతో వాహనాన్ని పక్కకు నిలిపేసి, డ్రైవింగ్ సీట్లోనే ప్రాణం వదిలాడు. మృతుడిడి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అశోక్ మృతితో వీరంతా దిక్కులేని పక్షులయ్యారు. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బైక్ దొంగకు ఏడాదిన్నర జైలు ఇబ్రహీంపట్నం రూరల్: నిత్యం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగకు ఏడాదిన్నర జైలు శిక్షాతో పాటు రూ.5వేల జరిమానా విధించిన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిఽధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రావిర్యాల సమీపంలో గ్యార దశరథ అనే వ్యక్తి స్కూటీని 2025 మార్చి17న రైస్ గోదాం వద్ద పెట్టి పనులు చేసుకుంటుండగా దొంగిలించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పట్లో పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా కేసును ఛేదించారు. మహమ్మద్ అప్రోజ్‌ఖాన్ దొంగిలించినట్లు గుర్తించి కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ జరిగింది. కేసు పూర్వపరాలను పరిశీలించిన ఇబ్రహీంపట్నం 15 ఎంఎం కోర్టు న్యాయమూర్తి నిందితుడు అప్రోజ్ఖాన్కు ఏడాదిన్నర జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. -
శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలి
పహాడీషరీఫ్: మిలాద్–ఉన్–నబీ ర్యాలీని శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం రాత్రి పీస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి, వాదే ముస్తాఫా, పహాడీషరీఫ్ ప్రాంతాలలో శాంతియుతంగా ర్యాలీలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కత్తులు దూసిన కుటుంబ కలహాలు
● వ్యక్తికి తీవ్ర గాయాలు ● పోలీసుల అదుపులో నిందితులు షాద్‌నగర్ రూరల్: కుటుంబ కలహా ల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన ఘటన శనివారం ఉదయం షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని ఆశాకాలనీకి చెందిన కాంట్రాక్టర్ గంతల ప్రభుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కుమా రుడు పృథ్వీరాజ్ తన కొడుకుతో కలిసి శనివారం ఉదయం బైక్‌పై పట్టణ శివారులోని ఓ డెయిరీ ఫాంకు వెళ్లి, పాలు తీసుకొని ఇంటికి వస్తున్నాడు. కేశంపేట రైల్వే గేటు మ లుపు వద్ద మాటువేసిన ప్రభు రెండో భార్య కుమారులు నందీశ్వర్, భరత్ అతనిపై కత్తులతో దాడి చేసి, పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసుకు సమాచారం అందించారు. రక్త గాయా లతో కింద పడిన పృథ్వీరాజ్‌ను చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభు త్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ గొడవలే దాడికి కారణమని బాధితుడు తెలిపాడు ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. -
రాజీ కోసమే లోక్ అదాలత్‌లు
చేవెళ్ల: కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్‌లు ఉపయోగపడుతాయని చేవెళ్ల కోర్టు సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య, జూనియర్ సివిల్ జడ్జి విజయ్‌కుమార్ ఉపాధ్యాయ, రిటైర్డు జడ్జి సాంబశివరావులు పేర్కొన్నారు. శనివారం కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వివిధ రకాల కేసులు 1014 పరిష్కరించటంతోపాటుగా జరిమానా కింద రూ.24,18,300 విధించినట్లు తెలిపారు. అనుకోకుండా, క్షణికావేశంలో జరిగే గొడవలతో అనేక కేసులు వేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు ఎందరో ఉన్నారన్నారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్‌లను తీసుకు వచ్చి అనేక కేసులను పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు క్రిష్ణగౌడ్, నర్సింలు, ప్రధాన కార్యదర్శి మహేశ్‌గౌడ్, సంయుక్త కార్యదర్శి యాదగిరి, ఏజీపీ గీతావనజాక్షి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్రకాశం, శివరాజ్, సీనియర్ సూపరింటిండెంట్ యాదయ్య, న్యాయవాదులు క్రిష్ణవేణి, ఇందిర, పాండురంగారెడ్డి, చంద్రశేఖర్, కుమార్, అభిలాష్‌రెడ్డి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందుకు రావాలని జడ్జీల సూచన -
మూసీలోకి పోటెత్తిన వరద
సాక్షి, సిటీబ్యూరో/బండ్లగూడ: మూసీ నదిలో భారీగా వరద ప్రవాహం పెరిగింది. జంట జలాశయాల గేట్లు నాలుగు అడుగుల చొప్పున ఎత్తి దిగువ భాగాన భారీగా జలాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారగా, ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం తెల్లవారు జామున నుంచి భారీగా వరద ప్రవాహం పెరిగింది. రెండు జలాశయాలాకు 2,300 క్యూసెక్కుల నుంచి 5,500 క్యూసెక్కుల వరకు వరద వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తి అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీలో వరద ప్రవాహం పెరగడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నివాసాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. హిమాయత్‌సాగర్ నుంచి రాజేంద్రనగర్ వెళ్లే ఔటర్ సబ్ రోడ్డుపై వరద భారీగా ప్రవహిస్తుండటంతో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. ఉస్మాన్‌సాగర్ జలాశయం 6 క్రస్ట్ గేట్లు ఎత్తడంతో మంచిరేవుల నుంచి నార్సింగి వెళ్లే దారిపై వరదనీరు రావడంతో ఆ రోడ్డుపై కూడా రాకపోకలు నిలిపివేశారు. -
బీహార్ ఎన్నికల కోసమే జీఎస్టీ తగ్గింపు
ఇబ్రహీంపట్నం: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందని.. ప్రజలపై మమకారంతో కాదని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం జాతీయ నాయకుడు నర్సిరెడ్డి విమర్శించారు. సీపీఎం జాతీయ మాజీ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్థంతి సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనుధర్మ శాస్త్రం అమలుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం దోపిడీ వర్గాలకు కొమ్ముకాస్తోందన్నారు. ఇందుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలలో విఫలమైందని విమర్శించారు. సీతారాం ఏచూరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అట్టడుగువర్గాలకోసం పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యదర్శివర్గ సభ్యులు సామేల్, నర్సింహ, జగన్, సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, రావుల జంగయ్య, అంజయ్య, నర్పింహ, సీహెచ్ జంగయ్య, సీహెచ్ బుగ్గరాములు, పి.జగన్, ఎల్లేశ్, పురుషోత్తం, వెంకటేశ్, రాజు, విఘ్ణేశ్, శారద, అరుణ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి -
పెట్రోల్‌లో నీళ్లు.. ఆగమైన వాహనాలు
ఇబ్రహీంపట్నం: పెట్రోల్‌తో పాటు నీళ్లు రావడంతో ఓ కారు మొరాయించి ఇంజన్ పాడయింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. శేరిగూడ శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఉన్న హెచ్‌పీ బంక్‌లో మహేశ్ తన కారులో పెట్రోల్ పోయించాడు. శుక్రవారం కారు మొరాయించడంతో మెకానిక్ వాహనాన్ని పరిశీలించి ఇంజన్ పాడయిందని తెలిపాడు. దీంతో మహేశ్ బంక్‌కు వచ్చి పరిశీలించగా పెట్రోల్‌తోపాటు నీరు వచ్చింది. దీంతో బంక్ సిబ్బందికి, అక్కడకు వచ్చినవారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గతంలోనూ ఇదే బంక్‌లో నీళ్లు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వినియోగదారులు ఆరోపించారు. చర్యలు తీసుకుంటాం వర్షాలు కురవడం.. పెట్రోల్ నిల్వ ఉండే ట్యాంకులు నాణ్యత లోపించడం తదితర కారణాలతో నీరు చేరే అవకాశం ఉంటుంది. సరిచేసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంటుంది. వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలను అందించకుంటే చర్యలు తప్పవు. వర్షకాలంలో నాజిల్‌ను పైకెత్తి వాహనాలకు పెట్రోల్ పొయించుకుంటే అందులో ప్యూయల్ వస్తుందా, నీరు వస్తుందా గమనించవచ్చు. – మాచన రఘునందన్, పౌరసరాఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ -
ఏఐతో గణనీయమైన మార్పులు
షాద్‌నగర్‌రూరల్: విద్యార్థుల భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ముడిపడి ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి, గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో కృత్రిమ మేధపై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బాలకిష్టారెడ్డి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. రానున్న రోజుల్లో సమాజంలో ఏఐతో గణనీయమైన మార్పులు వస్తాయని అన్నారు. కృత్రిమ మేధపై విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. గురుకులాల రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ నాగార్జునరావు మాట్లాడుతూ.. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ జీఎన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. విద్యావిధానంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన డిగ్రీ గురుకులాల డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ వేణుగోపాల్‌రావు, గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల, గిరిజన గురుకుల డిగ్రీ, పీజీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి ప్రైవేట్ పరిశ్రమల సౌజన్యంతో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి సూచించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అరబిందో ఫార్మా కంపెనీ సౌజన్యంతో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ జీఎన్ శ్రీనివాసన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల, ఫార్మాకంపెనీ ప్రతినిధి ఆనంద్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి -
వేతనాల అవకతవకలపై నివేదిక ఇవ్వండి
మహేశ్వరం: మహేశ్వరం మోడల్ స్కూల్లో స్కావెంజ ర్ల వేతనాల్లో ప్రిన్సిపాల్ గోపి అవకతవకలకు పాల్పడినట్లు బుధవారం ‘సాక్షి’దినపత్రిక లో ‘ఇదేమి ఆదర్శం!’శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన కలెక్టర్ నారాయణరెడ్డి మహేశ్వరం మోడల్ స్కూల్లో పని చేసే స్కావెంజర్లకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పథకానికి ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు మంజూరయ్యాయి? ఎంత మందిని నియమించి ఎంత జీతాలు ఇచ్చారు అనే విషయాలపై పూర్తి నివేదిక అందజేయలని డీఈఓ సుశీందర్‌రావును ఆదేశించారు. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు ఎంఈఓ కస్నానా యక్ ప్రిన్సిపాల్ గోపి నుంచి వివరాలు సేకరించారు. పూర్తి నివేదికను డీఈఓకు అందజేశారు. స్కూటీ డిక్కీలోంచి రూ.2.97 లక్షలు చోరీ శంకర్పల్లి: బ్యాంకులో నగదు డిపాజిట్ చే సేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని.. క్యూలైన్ కొంపముంచింది. ఈ ఘటన శుక్రవారం శంకర్‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హనుమాన్ నగర్‌కి చెందిన ప్రమోద్ గౌడ్(25) పట్టణంలో ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం ఆయన తల్లి డ్వాక్రా సంఘానికి సంబంధించిన రూ. 2.97లక్షల డబ్బులను యూనియన్ బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పింది. మధ్యాహ్నం బ్యాంక్‌కు వెళ్లగా క్యూలైన్ ఎక్కువ ఉంది. దీంతో ల్యాబ్‌లో పనిచేసుకుని వద్దామని నగదును స్కూటీలో పెట్టుకుని వెళ్లాడు. 15నిమిషాల తర్వాత బయటకి వచ్చి చూడగా నగదు మాయమైంది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. ఆర్టీఏ ఆల్నైన్స్కు రూ.25.50 లక్షలు సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ప్రత్యేక నంబర్లకు నిర్వహించిన బిడ్డింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. శుక్రవారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో రవాణాశాఖకు రూ.63,77,361 ఆదాయం లభించినట్లు హైదరాబాద్ జేటీసీ రమే ష్ తెలిపారు. ‘టీజీ 09జీ 9999’ నెంబర్‌కు హెటి రో డ్రగ్స్ సంస్థ రూ.25,50,200 చెల్లించి నెంబర్ దక్కించుకుంది.‘టీజీ 09హెచ్0009’ నెంబర్ ను ఏఆర్ఎల్ టైర్స్ లిమిటెడ్ సంస్థ రూ.6,50,009 చెల్లించింది.‘టీజీ 09హెచ్001’ నెంబర్‌కు డాక్టర్ రాజేశ్వరి స్కిన్అండ్ హెయిర్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.6,25,999 చెల్లించి ఆన్లైన్ బిడ్డింగ్‌లో నెంబర్ దక్కించుకుంది. ‘టీజీ 09హెచ్0006’ నెంబర్‌కు రూ.5,11,666 లభించింది. ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ ఈ నెంబర్‌ను సొంతం చేసుకుంది. -
హేయమైన చర్య
సాక్షి పత్రిక, జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని హేయమైన చర్యగా వివిధ సంఘాల నేతలు అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి సరికాదని, పత్రికా స్వేచ్ఛను హరించొద్దని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల పేరుతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతున్న సాక్షి పత్రిక, జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం హేయమైన చర్య. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు ఉంటారు. సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు పెట్టడం అన్యాయం. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురితమైతే సంబంధిత శాఖ అధికారులు ఖండించొచ్చు లేదంటే పరువు నష్టం దావా వేసుకునే వీలు చట్టంలో ఉంది. అక్రమ కేసులు బనాయించడం, దాడులకు తెగబడడం అవివేకం. – ఎం.డి.నసీర్ పాషా, హైకోర్టు న్యాయవాది, మహేశ్వరం జర్నలిస్టులు ఎక్కడైనా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏపీ లో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడులు, కేసులు నమోదు చేయడం వంటివి పత్రికా స్వేచ్ఛను హరించడమే. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత నెరవేర్చకుంటే కచ్చితంగా జర్నలిస్టులు ప్రజల తరఫున ప్రశ్నించడం సహజం. జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల పేరుతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. – చందోజీ, సామాజిక కార్యకర్త, కడ్తాల్ సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ సరికాదు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా అక్కడి ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. జర్నలిస్టుల ఇళ్లలో తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కడం సరి కాదు. – లక్ష్మణ్‌కుమార్, యువసత్తా యూత్ అధ్యక్షుడు, షాద్‌నగర్ ప్రజాస్వామ్య దేశంలో ప్రతికలపై దాడి చేయడం ఏమాత్రం సరి కాదు. పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వాలు పాత్రికేయులపైనే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛకు, జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించడం తగదు. – నర్సింలు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పత్రికా స్వేచ్ఛపై దాడిచేయడం రాజ్యాంగానికి విరుద్ధం. పత్రికా స్వేచ్ఛ రాజ్యా ంగం కల్పించిన హక్కు. పత్రికారంగాన్ని రాజకీయ కోణంలో చూడటం తగదు. ఉద్దేశ పూర్వకంగా మీడియాపై కేసులు పెట్టడం సరికాదు. మీడియాలో పాలకపక్షం వార్తలతో పాటు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు వార్తల రూపంలో వస్తాయి. తప్పుడు వార్తలు వస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. – రాఘవేందర్‌గౌడ్, టీడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షుడు, షాద్‌నగర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను కాలరాస్తోంది. జర్నలిస్టుల గొంతు నొక్కడమంటే ప్రజా హక్కులను హరించడమే. నిర్భందాలు, దాడు లతో వాస్తవాలను దాచలేరు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ఏపీ కూటమి ప్రభుత్వ చర్యలను సమాజం హర్షించదు. – వై.గీత, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి -
పదవులకు అప్పు ముప్పు!
యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో డైరెక్టర్లుగా ఉన్నవారు నిబంధనల ప్రకారం రైతుల మాదిరిగానే రుణాలు పొందే అవకాశం ఉంటుంది. పీఏసీఎస్‌ల్లో పొందిన వ్యక్తిగత రుణాలను ప్రతి మూడు నెలలకోసారి, స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను ప్రతి ఆరు నెలలకోసారి చెల్లించాల్సి ఉంటుంది. కానీ అప్పు తీసుకున్నవారంతా పదవీ పలుకుబడితో ఏళ్లుగా బకాయి చెల్లించకుండా మొండికేశారు. ఈ క్రమంలో సర్కార్ ఆదేశాల మేరకు తాజాగా జిల్లాలోని 37 పీఏసీఎస్‌ల్లో తొమ్మిది చైర్మన్ల పవర్ కట్ చేసిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మూడేళ్లకు మించి బకాయి చెల్లించని వారిని పదవిలోంచి తప్పించే విధంగా దృష్టి సారించారు. అప్పులు వసూలు చేయని పీఏసీఎస్‌ల కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అప్పుల వివరాలు సేకరణ జిల్లాలోని 37 పీఏసీఎస్‌ల్లో ప్రతి పీఏసీఎస్‌కు 13 మంది డైరెక్టర్ల (వీరిలో ఒకరు చైర్మన్‌గా ఉంటారు) చొప్పున మొత్తంగా 481 మంది ఉన్నారు. వీరంతా 2020 ఫిబ్రవరి 15న ఎన్నికయ్యారు. ఏ పీఏసీఎస్‌లో ఏ డైరెక్టర్ ఎంత రుణం పొందారు.. వ్యక్తిగత రుణాలా.. లేక పంట రుణాలా.. బినామీల పేర్లపై పొందారా.. అనే వివరాల నివేదికను అందజేయా లని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు కార్యదర్శులను ఆదేశించారు. ఆరు నెలల క్రితమే ఆన్లైన్ ద్వారా మొండి బకాయిదారుల వివరాలు ప్రాథమికంగా సేకరించారు. తాజాగా పూర్తి స్థాయి లో రుణాలు పొందిన వివరాలు, అప్పు మొత్తం, వడ్డీ బకాయి, వసూలు కోసం చట్టపరంగా తీసుకున్న నిర్ణయాలపై వివరాలు అడిగినట్లు తెలిసింది. పదవీ పలుకుబడితో.. పీఏసీఎస్‌ల్లో రుణాలు పొందిన డైరెక్టర్లు పదవీ పలుకుబడితో బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. కార్యదర్శులు బకాయిల కోసం ఒత్తిళ్లు తెచ్చినా చైర్మన్ల ద్వారా నోళ్లు మూయించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పీఏసీఎస్‌లో పది మందికి పైగా వ్యక్తిగత, బంగారు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు పొందారు. 350 మందికి పైగా రూ.కోట్లాది రుణాలు పొందినట్లు తెలిసింది. ప్రతి పీఏసీఎస్‌లో నలుగురైదుగురు డైరెక్టర్లు డిఫాల్టర్లుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిని గుర్తించిన ఉన్నతాధికారులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. అయినా సకాలంలో అప్పు మొత్తం చెల్లించని పక్షంలో పదవుల నుంచి దించేసి, తాకట్టు పెట్టిన ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పీఏసీఎస్‌ల్లో వ్యక్తిగత రుణాలు పొందిన డైరెక్టర్లు అప్పు బకాయిలపై సర్కార్ సీరియస్ రుణగ్రహీతలపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు త్వరలో నోటీసుల జారీకి రంగం సిద్ధం అవసరమైతే పదవి నుంచి తొలగించి, ఆస్తుల జప్తునకు సన్నద్ధం వసూలు చేయని కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు సంఘం ఆర్థిక బలోపేతానికి పాటుపడాల్సిన పలువురు పీఏసీఎస్ డైరెక్టర్లు పదవీ పలుకుబడితో రూ.లక్షల్లో రుణాలు పొందారు. గడువులోగా చెల్లించకపోగా డిఫాల్టర్లుగా మారారు. ఏళ్లుగా బకాయిలు చెల్లించడమే మానేశారు. దీనిపై సర్కార్ సీరియస్ కావడంతో శాఖాపరమైన చర్యలకు డీసీసీబీ ఉన్నతాధికారులు సన్నద్ధం అవుతున్నారు. పీఏసీఎస్‌ల్లోని డైరెక్టర్లు తీసుకున్న అప్పులు సకాలంలో చెల్లించి, మిగతా రైతులకు ఆదర్శంగా ఉండాలి. అప్పు బకాయిలపై సర్కార్ సీరియస్‌గా ఉంది. ఇప్పటికై నా తీసుకున్న మొత్తం త్వరగా చెల్లించాలి. లేదంటే పదవీ గండంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. – కొత్తకుర్మ సత్తయ్య, డీసీసీబీ చైర్మన్ -
భూములున్నాయ్.. కొంటారా?
శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంచుమించు రెండేళ్ల విరామం తరువాత భూములను వేలం వేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రంగం సిద్ధం చేసింది. నగరంలోని తుర్కయంజాల్, బాచుపల్లిల్లో ఉన్న ప్లాట్లను ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ రెండు చోట్ల నిర్వహించిన ప్రీబిడ్డింగ్ సమావేశంలో కొనుగోలుదార్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. సాధారణంగా హెచ్ఎండీఏ స్థలాల కోసం ఏర్పాటు చేసే ప్రీబిడ్ సమావేశాల్లోనే కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసక్తులను వ్యక్తం చేస్తారు. సందేహాలను నివృత్తి చేసుకుంటారు. కానీ.. ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశాల్లో అలాంటి ఆసక్తి కనిపించలేదు. అతి తక్కువ సంఖ్యలో కొనుగోలుదారులు పాల్గొన్నట్లు అధికారులు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో నిర్వహించే ఆన్లైన్ బిడ్డింగ్‌కు ఏ మేరకు స్పందన ఉంటుంద నేది సందేహాస్పదంగా మారింది. బిడ్డింగ్ నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థలాలపై విస్తృత ప్రచారం కూడా చేపట్టారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న స్తబ్ధత దృష్ట్యా అధికారుల్లోనూ డైలమా నెలకొంది, ధరలు ఎక్కువే... రెండు చోట్ల హెచ్ఎండీఏ నిర్ణయించిన బేసిక్ ధరలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుర్కయంజాల్‌లో చదరపు గజానికి రూ.65,000, బాచుపల్లిలో రూ.70,000 చొప్పున ధర నిర్ణయించారు. ప్రస్తుత స్తబ్ధత కారణంగా మార్కెట్ ధరల కంటే ఎక్కువే ఉన్నట్లు కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. ‘తుర్కయంజాల్‌లో ప్రస్తుతం గజానికి రూ.40,000 నుంచి రూ.45,000 వరకు ఉంది. కానీ హెచ్ఎండీఏ రూ.65,000 వరకు పెంచింది. దీంతో కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు’ అని తుర్కయంజాల్‌కు చెందిన రియల్టర్ ఒకరు చెప్పారు. ఇక్కడ మొత్తం 12 ప్లాట్లను విక్రయించేందుకు నోటిఫికేషన్ వెలువరించారు. ఒక్కో ప్లాట్ కనిష్టంగా 600 గజాల నుంచి 1,146 గజాల వరకు ఉంది. ప్లాట్ సైజులు నాలుగు వైపులా సమంగా లేకపోవడంపై కూడా పలువురు పెదవి విరుస్తున్నారు. కొన్ని స్థలాలకు క్రాసింగ్‌లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో భవన నిర్మాణాలకు అనుకూలంగా ఉండకపోవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. తుర్కయంజాల్‌లోని ప్లాట్లకు ఈ నెల 17న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించనున్నారు. కొనుగోలుదారులు 16వ తేదీ సాయంత్రం వరకు రూ.1,180 చెల్లించి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. బాచుపల్లికి స్పందన కరువే.. బాచుపల్లిలో ఉన్న 70 ప్లాట్లకు ఈ నెల 18న ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు దఫాలుగా వేలం నిర్వహించనున్నారు. ఉదయం 35 ప్లాట్లు, మధ్యాహ్నం 35 ప్లాట్లకు బిడ్డింగ్ ఉంటుంది. ఈ నెల 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ సదుపాయం ఉంది. ఈ స్థలాల కోసం నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లోనూ 30 మంది లోపే కొనుగోలుదారులు తమ ఆసక్తిని చూపడం గమనార్హం. ఈ స్థలాలకు గజానికి రూ.70,000 చొప్పున ధర నిర్ణయించారు. స్థానికంగా ఉన్న మార్కెట్ ధరల కంటే ఎక్కువేననే అభిప్రాయం ఉంది. చాలా వరకు మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేందుకు అనుకూలంగా ఉన్నాయి. కనిష్టంగా 266.67 గజాల నుంచి గరిష్టంగా 499.96 గజాల వరకు ఈ ప్లాట్ సైజ్లు ఉన్నాయి. ఈ లే అవుట్‌కు అప్రోచ్ రోడ్ లేకపోవడం కూడా ఒక లోపంగా ఉన్నట్లు ప్రీబిడ్డింగ్‌లో పాల్గొన్న కొందరు చెప్పారు. మరోవైపు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు చోట్ల మిగిలిపోయిన హెచ్ఎండీఏ స్థలాలకు ఈ నెల 19న బిడ్డింగ్ నిర్వహించనున్నారు. హెచ్ఎండీఏ ప్లాట్లు ఒకప్పుడు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కోకాపేట్లో ఎకరం రూ.కోటికిపైగా అమ్ముడు కాగా, మోకిలాలో గజానికి రూ.లక్షకుపైగా ధర పలికింది. బుద్వేల్‌లోనూ అనూహ్యమైన స్పందన లభించింది. ఉప్పల్ భగాయత్, బోడుప్పల్, మేడిపల్లి, హయత్‌నగర్, బాచుపల్లి, తుర్కయంజాల్, తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున అమ్ముడయ్యాయి. భూముల అమ్మకాలపైన ప్రభుత్వా నికి రూ.వేల కోట్ల ఆదాయం లభించింది. అన్ని మౌలిక సదుపాయాలతో లే అవుట్లను రూపొందించడం, ఎలాంటి వివాదాలు లేకపోవడం, బ్యాంకుల నుంచి సత్వరమే రుణసదుపాయం లభించడం వంటి వివిధ కారణాల దృష్ట్యా కొనుగోలుదారులు ఆసక్తి చూపారు. ఇప్పటికీ హెచ్ఎండీఏ స్థలాలపైన ప్రజల్లో నమ్మకం ఉన్నప్పటికీ ప్రస్తుత మార్కెట్ స్తబ్దత, అధికధరలు, అడ్డదిడ్డంగా ఉన్న ప్లాట్ సైజులు, రోడ్డు సదుపాయం లేకపోవడం వంటి అంశాలు బిడ్డింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 17 నుంచి హెచ్ఎండీఏ స్థలాలకు ఆన్లైన్ బిడ్డింగ్ ప్రీబిడ్ సమావేశాల్లో కొనుగోలుదారుల నుంచి స్పందన శూన్యం తుర్కయంజాల్, బాచుపల్లిలోవిక్రయాలకు సన్నాహాలు తుర్కయంజాల్‌లో 12, బాచుపల్లిలో 70 ప్లాట్లు సిద్ధం -
దేశానికి కీర్తిప్రతిష్టలు తేవాలి
శంకర్పల్లి: బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి, దేశానికి పేరు ప్రతిష్టలు తేవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.సుబ్రమణియన్ అన్నారు. దొంతన్‌పల్లిలోని ఇక్ఫాయ్ డిమ్డ్ యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ కోర్సుల్లో డిగ్రీలు పొందిన 3,947 మందికి పట్టాలు అందజేశారు. మాజీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేశవపరాశన్, సున్నా బడ్జెట్‌తో వ్యవసాయం చేస్తున్న పద్మశ్రీ సుభాష్ పాలేకర్, హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్‌కు యూనివర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ వి.సుబ్రమణియన్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ చిన్నతనం నుంచే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. జీవితంలో పైకి ఎదగడంతో పాటు వ్యక్తిత్వాన్ని సైతం సమస్థాయిలో పెంపొందించుకోవాలన్నారు. కళాశాల చాన్స్‌లర్, ఆర్బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ మాట్లాడుతూ.. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, దీనికి ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేస్తూ, దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చాన్సలర్ కోటిరెడ్డి, రిజిస్ట్రార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సుబ్రమణియన్ -
డయాలసిస్ పేషంట్ల కోసం ‘ఆశాయే ఇన్’
సాక్షి, సిటీబ్యూరో: డయాలసిస్ సేవలందించే ప్రముఖ సంస్థ నెఫ్రోప్లస్ ఆధ్వర్యంలో నగరంలోని డయాలసిస్ పేషంట్ల కోసం ‘ఆశాయే ఇన్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా పేషంట్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డయాలసిస్ పేషంట్ల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకులు కమల్ డి.షా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య నిపుణులు డయాలసిస్ చేయించుకుంటూనే రోజువారీ సాధారణ జీవితం గడిపేందుకు, డయాలసిస్ డైట్లో ఉంటూనే ఆహారాన్ని ఆస్వాదించేందుకు, క్షేమంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పేషెంట్లకు వివరించారు. -
యూరియా కోసం ఆందోళన వద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: రైతులకు అవసరమైన యూరియా ప్రభుత్వం సరఫరా చేస్తోందని జిల్లా వ్యవసాయాధికారి ఉష తెలిపారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని ఎంపీపటేల్‌గూడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో యూరియా నిల్వలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడారు. యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అధిక మొత్తంలో బస్తాలు కొని నిల్వ చేసుకోవద్దని సూచించారు. అనంతరం ఎంపీ పటేల్‌గూడలోని మెట్టు అశోక్‌రెడ్డి పండిస్తున్న వరి మేలు కేఎన్ఎం 1638 రకం పంటను పరిశీలించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏడీఏ సుజాత, ఏఓ విద్యాధరి, ఏఈఓ శ్రవణ్‌కుమార్, సహకార సంఘం సీఈఓ మాధవి, మాజీ చైర్మన్ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఉష -
రూ.282 కోట్లతో గండిపేట డీపీఆర్
● 27 ఎంజీడీ నీటి తరలింపునకు మరో పైపులైన్ ● త్వరలో ప్రభుత్వానికి జలమండలి నివేదిక సాక్షి, సిటీబ్యూరో: వందేళ్లకు పైగా నగర దాహార్తి తీర్చుతున్న గండిపేట (ఉస్మాన్ సాగర్) నుంచి మరో పైపులైన్‌న్ నిర్మాణం కోసం సుమారు రూ.రూ.282 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించి ప్రభుత్వానికి సమర్పించేందుకు జలమండలి సిద్ధమైంది. నగరం నలుదిక్కులా విస్తరిస్తుండటంతో తాగునీటి అవసరాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జంట జలాశయాలతో పాటు కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూర్ ప్రాజెక్టులను నీటిని తరలిస్తున్నా.. సరిపోని పరిస్థితి. దీంతో అందుబాటులో ఉన్న జలవనరుల నుంచి మరింత నీటిని నగరానికి తరలించేందుకు జలమండలి ప్రణాళిక రూపొందిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గండిపేట జలాశయం నుంచి ఆసిఫ్‌నగర్ రిజర్వాయర్ వరకు మరో పైపులైన్ ఏర్పాటుకు సిద్ధమైంది. గండిపేట నుంచి కాండూట్ లైన్ ద్వారా తరలిస్తున్న జలాలు మార్గమధ్యలో లీకేజీల కారణంగా సగానికిపై వృథా అవుతుండటంతో వాటి మరమ్మతులతో పాటు దానికి సమాంతరంగా కింద భాగంలో పైపులైన్ వేసేందుకు కార్యాచరణకు సిద్ధమైంది. కాలువ పునరుద్ధరణ.. ఉస్మాన్ సాగర్ నుంచి ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్ల వరకు 27 ఎంజీడీ నీటిని తరలించే కాలువను పునరుద్ధరించడం, తరచూ లీకేజీలు, మరమ్మతుల కోసం బ్రేక్డౌన్ల నివారణ కోసం జలమండలి సిద్ధమైంది. మొత్తంమీద ఉస్మాన్ సాగర్ వద్ద రా వాటర్ ఆర్సీసీ సంప్, పంపుహౌస్, 4.0 మీటర్ల ఎత్తు రిటైనింగ్ వాల్, షేక్‌పేటలో నీటిశుద్ధి కేంద్రం, నిర్వాహక భవన నిర్మాణాలు, షేక్‌పేటలో క్లియర్ వాటర్ సంప్ నిర్మాణం, ఆసిఫ్ నగర్ వద్ద 4.0 మీటర్ల ఎత్తు రిటైనింగ్ వాల్ నిర్మాణాలు చేపట్టనున్నారు. ట్రాన్స్మిషన్ కింద వద్ద ప్రతిపాదిత సంప్ వరకు 1500 ఎంఎం వ్యాసం కలిగిన గ్రావిటీ మెయిన్ పైపులైన్, ఉస్మాన్ సాగర్ నుంచి షేక్‌పేట వరకు 1300 ఎంఎం వ్యాసం కలిగిన పంపింగ్ మె యిన్ పైపులైన్, షేక్‌పేట్ నుంచి ఆసిఫ్ నగర్ వరకు 800 ఎంఎం డయా కలిగిన షేక్‌పేట్ పంపింగ్ మెయిన్లు, పైపులైన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. సగానికిపైగా నీటి వృథా గండిపేట నుంచి కాండూట్ ద్వారా నగరానికి తలిస్తున్న నీటిలో సగం నీరు వృథా అవుతోంది. వాస్తవానికి గండిపేట జలాశయం నుంచి సుమారు 26 ఎంజీడీలకుపైగా తాగునీరు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరానికి ప్రతినిత్యం సుమారు 20 నుంచి 22 ఎంజీడీల నీరు తరలిస్తుండగా కాండూట్‌కు అడుగడుగునా లీకేజీల కారణంగా దాదాపు 8 నుంచి 10 ఎంజీడీలు మాత్రమే వినియోగదారులకు సరఫరా అవుతున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గండిపేట నుంచి ఆసీఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్ వరకు సుమారు 14.5 కిలోమీటర్ల పొడువు గల కాండూట్‌కు దాదాపు 45 ప్రాంతాల్లో లీకేజీ సమస్య ఉంది. నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా జర్మన్ టెక్నాలజీతో లీకేజీల మరమ్మతు పనులు నిర్వహించి 1 నుంచి 2 ఎంజీడీల నీటి వృథాను అరికట్టగలిగారు. -
పాకిస్తానీ ఫొటోతో ‘పని’ కానిచ్చారు!
సాక్షి, సిటీబ్యూరో: ఇన్‌స్ట్రాగామ్ ఐడీ ‘ఖూబ్సూరత్.రిస్తే’లో పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబర్, ఇన్‌ఫ్ల్యూయెన్సర్ పర్వా షా ఫొటో పోస్టు చేసి పెళ్లి ప్రతిపాదనలతో నగరవాసిని మోసం చేసి ఇద్దరు బిజాపూర్ కిలేడీలు రూ.25 లక్షలు కాజేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ మహిళతో పాటు సహకరించిన హైదరాబాదీని అరెస్టు చేసినట్లు డీసీపీ దార కవిత శుక్రవారం ప్రకటించారు. కర్ణాటకలోని బిజాపూర్‌కు చెందిన అనీసా మహ్మద్యసీన్ హుండేకర్, జోహార్ ఫాతిమా తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ చేయాలని పథకం వేశారు. ఈ మేరకు 2023లో ఇన్‌స్ట్రాగామ్‌లో ఖూబ్సూరత్.రిస్తే పేరుతో ఓ ఐడీ క్రియేట్ చేశారు. ఇందులో పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబర్ పర్వా షా ఫొటోలు పోస్టు చేశారు. ఇవి తనవే అన్నట్లు అనీసా తన ఫోన్ నెంబర్ పోస్టు చేసింది. ఆ ఏడాది మార్చిలో ఈ ప్రొఫైల్ చూసిన నగర వాసి సంప్రదించి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. వివాహం చేసుకోవడానికి అంగీకరించిన అనీసా అతడితో మాట్లాడింది. ప్రత్యేక యాప్ ద్వారా పర్వా షానే మాట్లాడుతున్నట్లు వీడియో కాల్స్ కూడా చేసింది. ఆపై వైద్యం సహా వివిధ అత్యవసర అవసరాల పేరు చెప్తూ నగరవాసి నుంచి డబ్బు తీసుకోవడం ప్రారంభించింది. ఈ వ్యవహారంలో ఫాతిమా సైతం సహకరించింది. వీరికి పరిచయస్తుడైన హైదరాబాదీ మహ్మద్ అబ్దుల్ అమీర్ కమీషన్ ప్రాతిపదికన తన బ్యాంక్ ఖాతా వివరాలు అందించాడు. ఇందులోనూ బాధితుడు కొంత మొత్తం డిపాజిట్ చేశాడు. ఎట్టకేలకు తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీ ఆర్జీ శివమారుతి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కె.ప్రసాదరావు నేతృత్వంలోని బృందం ఈ కేసు దర్యాప్తు చేసింది. అమీర్‌తో పాటు అమీసాను అరెస్టు చేసి వీరి నుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్, ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న ఫాతిమా కోసం గాలిస్తోంది. ముగ్గురి నుంచి రూ.33 లక్షలు స్వాహా... డిజిటల్ అరెస్టు సహా మూడు రకాలైన నేరాల్లో ముగ్గురు నగర వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.33 లక్షలు కాజేశారు. ఈ మేరకు శుక్రవారం వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యాకుత్‌పురకు చెందిన వృద్ధుడికి (75) పోలీసు అధికారుల మాదిరిగా ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆయన ఆధార్ కార్డు దుర్వినియోగమైందని చెప్పారు. ఆపై కొందరు యూనిఫాంలో వీడియో కాల్స్ చేసి ఐపీఎస్ అధికారులుగా మాట్లడిన నేరగాళ్లు నేషనల్ సీక్రెట్స్ యాక్ట్ కింద కేసు నమోదైందని భయపెట్టారు. డిజిటల్ అరెస్టు చేశామని, విషయం ఎవరికీ చెప్పద్దని భయపెడుతూ గత నెల 19 నుంచి ఈ నెల రెండో తేదీ వరకు మొత్తం రూ.21,01,650 కాజేశారు. అబిడ్స్‌కు చెందిన ఓ బాధితుడికి (35) ఆన్లైన్లో ఉద్యోగం పేరుతో ఎర వేసిన సైబర్ నేరగాళ్లు ఆకర్షణీయ జీతమంటూ ఎర వేశారు. ఆపై గూగుల్ రివ్యూస్ సహా వివిధ టాస్క్‌లు ఇచ్చి, కమీషన్ల పేరుతో వర్చువల్ యాప్‌లో లాభాలు చూపించారు. ఆపై పెట్టుబడులంటూ రూ.10,25,550 డిపాజిట్ చేయించుకున్నారు. యాప్‌లో రూ.15,57,900 లాభం చూపించి... విత్‌డ్రా చేసుకోవాలంటే మరికొంత కట్టాలనడంతో అనుమానం వచ్చిన బాధితుడు ఆరా తీసి తాను మోసపోయానని గుర్తించాడు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తికి (44) వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.1,61,720 కాజేశారు. ఈ ముగ్గురి బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాట్రిమోనియల్ ఫ్రాడ్ చేసిన ఇద్దరు కిలేడీలు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.25 లక్షలు స్వాహా బ్యాంకు ఖాతాలు ఇచ్చిసహకరించిన హైదరాబాదీ ఇద్దరిని అరెస్టు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు -
‘పవన్ పెట్రోల్ బంక్’లో కల్తీ పెట్రోలు..!
శేరిగూడ, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్న మున్సిపల్ పరిధిలోని శేరిగూడ సమీపంలోని ‘పవన్ పెట్రోల్ బంక్’లో కల్తీ చేస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ కారుకు ఆ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించిన అనంతరం ఆగిపోయింది. పెట్రోల్ కొట్టించిన తర్వాత కారు ఆగిపోవడంపై అనుమానం వచ్చింది సదరు కారు యజమానికి. నిన్న(గురువారం, సెప్టెంబర్ 11వ తేదీ) రాత్రి పెట్రోల్ కొట్టించిన తర్వాత కారు ఆగిపోవడంతో బంక్ సిబ్బంది మార్నింగ్ రమ్మన్నారు. ఇక చేసేది లేక ఆ కారును అక్కడే వదిలేసి వేరే కారులో వారు వెళ్లిపోయారు. ఈ రోజు ఉదయం కారును తీసుకెళ్లడానికి వచ్చిన సమయంలో పెట్రోల్ బంక్ మేనేజర్.. తమ ఓనర్ వస్తారని, అప్పటిదాకా వెయిట్ చేయాలని చెప్పినట్లు కారు బాధితుడి తెలిపాడు.అయితే మధ్యాహ్నం అయినా బంక్ యజమాని రాకపోవడంతో ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. తాము ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత కారు ఆగిపోవడంతోనే అనుమానం వచ్చిందని, అయితే చేసేది లేక అప్పుడు వెళ్లిపోయి, మళ్లీ ఈరోజు వచ్చామన్నారు. తమను పట్టించుకోకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు లైవ్‌లోనే పెట్రోల్ తీస్తే అసలు విషయం బయటపడింది. తనిఖీలో భాగంగా బాటిల్లో తీసిన పెట్రోల్‌లో సగానికి పైగా నీళ్లే ఉన్నాయని, అందుచేత తమ కారు ఆగిపోయిందని తెలిపాడు. ఇలాగే చాలామంది తమ వాహనాలు దారిలో ఆగిపోవడంతో మళ్లీ బాటిల్స్ పట్టుకుని ఆ బంక్‌కు వచ్చిన సంగతిని బాధితుడు తెలిపాడు. -
అక్టోబర్ 12 నుంచి పల్స్‌పోలియో
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఐదేళ్లలోపు ఉన్న ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు సూచించారు. ఈ మేరకు గురువారం శివరాంపల్లిలోని జిల్లా కార్యాలయంలో సంబంధిత వైద్యు లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 12న పోలియో బూత్‌ల్లో చుక్కలు వేస్తారని, 13 నుంచి 15వ తేదీ వరకు నేరుగా ఇళ్లలోకి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అంగన్వాడీ సిబ్బందిని, ఆరోగ్య కార్యకర్తలను, ఆశ కార్యకర్తలను, మహిళా గ్రూపులను భాగస్వామ్యం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎంఓ డాక్టర్ మురారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శిభహయత్, జిల్లా ఉపవైద్యాధికారులు డాక్టర్ విజయ పూర్ణిమ, డాక్టర్ గీత, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ సుధ, పోగ్రామ్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు -
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
చేవెళ్ల: కేంద్రం ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరులో రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు, తంగడపల్లిలో రూ.9 లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను గురువారం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీలకు పైసా విడుదల చేయకుండా పాలనను అస్తవ్యస్తంగా మారుస్తోందని విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు పదేళ్లుగా కేంద్రం అందించే నిధులే దిక్కవుతున్నాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. మరిన్ని నిధులు తెచ్చి గ్రామాల అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్.ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ఎ.అనంత్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కృష్ణగౌడ్, శర్వలింగం తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి -
జోరు వాన
ఉప్పొంగిన ఈసీ, మూసీ వాగులు సాక్షి, రంగారెడ్డిజిల్లా: వర్షం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం దంచికొట్టింది. ఉదయం ప్రశాంతంగా, ఆహ్లాదంగా కన్పించిన వాతావరణం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హయత్‌నగర్ వద్ద ఉన్న హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పైకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డుపై నాలుగు అడుగుల ఎత్తు మేర వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, బీఎన్‌రెడ్డి, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, మీర్పేట్, బడంగ్పేట్, బాలాపూర్, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. యాచారంలో అత్యధికంగా 17.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హయత్‌నగర్‌లో 11.2 సెంటీమీర్ల వర్షపాతం కురిసింది. మళ్లీ తెరుచుకున్న గేట్లు జంట జలాశయాల ఎగువ ప్రాంతంలోని ఈసీ, మూసీ వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో హిమాయత్‌సాగర్ రెండు గేట్లను నాలుగు ఫీట్ల ఎత్తు, ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లను రెండు ఫీట్ల చొప్పున పైకి ఎత్తి..వచ్చిన వరదను వచ్చినట్లే కిందికి వదులుతున్నారు. యాచారం మండలం గున్గల్, మల్కీజ్‌గూడ, నల్లవెల్లి, మాల్, తక్కళ్లపల్లి, మొండిగౌరెల్లి తదితర ప్రాంతాల్లో గంటకుపైగా కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈ వర్షంతో మెట్ట పంటలకు జీవం పోసినట్లయింది. 15 రోజుల విరామం తర్వాత వర్షం కురియడంతో ఆయా ప్రాంతాల్లోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంటజలాశయాలతో పాటు జిల్లాలోని పలు చెరువులు, కుంటలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శిఖం భూములు నీటమునిగి, పంటలు దెబ్బతింటున్నాయి. మరోవైపు ఏకధాటి వర్షాలు, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే అనేక మంది దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్నారు. యాచారంలో అత్యధికంగా 17.95 సెంటీమీర్ల వర్షపాతం నమోదు మళ్లీ తెరుచుకున్న జంటజలాశయాల గేట్లు హైదరాబాద్–విజయవాడ రహదారిపైకి భారీగా వరద నీరు వాహనదారుల ఇబ్బందులు -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
షాబాద్: యూరియా పంపిణీలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలోని స్టార్ గార్డెన్లో గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యూరియా సరఫరాపై ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపట్టలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మహిళలు కనిపించినప్పుడు నా అక్కాచెల్లెళ్లను లక్షాధికారులను చేస్తానని మాటలు చెప్పడం తప్ప ఒక్క హామీ అమలు చేసింది లేదని దుయ్యబట్టారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యక్తరలకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. రెండేళ్లుగా ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రైతులు, మహిళలు ఎలా శాపనార్థాలు పెడుతున్నారో చూస్తున్నామన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరడం సిగ్గు చేటన్నారు. అంతకుముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాష్‌రెడ్డి, నాయకులు కౌశిక్‌రెడ్డి, దేశమల్ల ఆంజనేయులు, పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగ్‌రావు, కార్యదర్శి శ్రీరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సబితారెడ్డి -
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
● ఏపీ పోలీసుల కేసులపై ముక్తకంఠంతో ఖండన ● ఎడిటర్, పాత్రికేయులకు వెల్లువెత్తుతున్న సంఘీభావంసాక్షిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుసాక్షి, రంగారెడ్డిజిల్లా: పత్రికా స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరు పత్రికల గొంతునొక్కడమేనని అభిప్రాయపడ్డారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్‌ఛార్జి, రిపోర్టర్లపై ఏపీ ప్రభుత్వ ప్రోద్బలంతో అక్కడి పోలీసులు కేసులు పెట్టి ఆఫీసుకు వచ్చి నోటీసులు అందజేయడంపై వారు మండిపడ్డారు. పత్రికలో వచ్చిన కథనాలపై అభ్యంతరాలుంటే ఖండించడం, వివరణ ఇవ్వడం చేయాలి గానీ ఏకంగా కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కేసుల నమోదు హేయనీయం సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం హేయనీయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛపై అందరికీ గౌరవం ఉండాలి. అది లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణిస్తున్నాం. – వీర్లపల్లిశంకర్, ఎమ్మెల్యే, షాద్‌నగర్ కక్షపూరిత చర్యలు తగవు పత్రికా స్వేచ్ఛను హరించాలని చూస్తే సహించేదిలేదు. ప్రజా సమస్యలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్చార్జి, జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం. పత్రికాస్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించేలా కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. – పగడాల యాదయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి సమాజం హర్షించదు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం సరైంది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పులను ఎత్తి చూపుతున్న జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రచురించిన వార్తపై ఏదైనా అభ్యంతరం ఉంటే ఖండించడం, వివరణ ఇవ్వడం చేయాలి కానీ రాసిన విలేకరులపై కేసులు పెట్టడం సరి కాదు. పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. ఇలాంటి చర్యలను సమాజం హర్షించదు. – సబితారెడ్డి, ఎమ్మెల్యే, మహేశ్వరం జర్నలిస్టులపై కేసులు దారుణం పత్రికా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని హరించడమే. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసి పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం దారుణం. అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవిగితే ఎంతటి వారికి అయినా పతనం తప్పదు. నియంతలా వ్యవహరించిన ఎంతో మంది కాల గర్భంలో కలిసి పోయారు. – ఓరుగంటి యాదయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమే. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించడమే. విలేకరుల సమావేశంలో ఒక వ్యక్తి పేర్కొన్న అంశాలను ప్రచురిస్తే కేసులు పెట్టడం సరైంది కాదు. పత్రికాస్వేచ్ఛ విషయంలో సమాజంలోని అన్ని వర్గాలు గౌరవ దృక్పథం కలిగి ఉండాలి. ప్రెస్‌మీటర్ వార్తలను ప్రచురించిన సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకునే వరకు వెళ్లడం పత్రికా స్వేచ్ఛకు కళ్లెం వేయడం లాంటిదే. – మైల సైదులు, జిల్లా కార్యదర్శి, టీడబ్ల్యూజేఎఫ్ -
చర్యలుంటాయా..?
యాచారం: తాడిపర్తి భూదాన్ భూముల వ్యవహారంపై రకరకాల చర్చ జరుగుతోంది. ఈ భూములకు అక్రమంగా ఫార్మా పరిహారం ఇవ్వడం.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లడం.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి విచారణ జరపడం.. పూర్తి స్థాయి నివేదికను సర్కార్‌కు అప్పగించడం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పరిహారం రికవరీ చేస్తారా..? తాడిపర్తిలో బొక్క సీతారెడ్డి కుటుంబ సభ్యులు 1954లోనే సర్వేనంబర్ 104లోని 250 ఎకరాలను సర్వోదయ భూదాన్ యజ్ఞ బోర్డుకు దానం చేశారు. దానం చేసిన భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని రైతులు అప్పట్లోనే అధికారులకు విన్నవించారు. అధికారుల నిర్లక్ష్యంతో తర్వాత కొందరు రైతులు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించి తమ పేరిట పట్టాదారు, పాసుపుస్తకాలు పొందారు. 2018లో ఫార్మాసిటీకి ఆ భూమిని తీసుకుంటున్నట్లు నోటిఫికేషన్ ప్రకటించారు. తర్వాత పట్టాదారు, పాసుసుస్తకాలు పొందిన 86 మంది రైతులు 190 ఎకరాలకుపైగా ఫార్మాసిటీకి ఇచ్చి దాదాపు రూ.27 కోట్లకు పైగా పరిహారం పొందారు. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో మీరాఖాన్‌పేట టీజీఐఐసీ వెంచర్లో ఎకరాకు 121 గజాల చొప్పున ఇచ్చే ప్లాట్ల సర్టిఫికెట్లను నిలిపేశారు. ప్రస్తుతం అక్రమాల వ్యవహారం సీఎం దృష్టికి వెళ్లడంతో పరిహారం రికవరీ చేస్తారా.. లేదా అనే సందేహం నెలకొంది. అధికారులపై చర్యలుండేనా..? భూదాన్ భూములకు సంబంధించి రైతులకు పరిహారం ఇవ్వొద్దని హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ హెచ్చరించినా అధికారులు లెక్కచేయలేదు. 2020–2023 మధ్యనే పరిహారం ఫైళ్లు చకచకా కదిలాయి. ఓ ఆర్డీఓ చక్రం తిప్పి రూ.కోట్లాది పరిహారాన్ని అప్పనంగా అందజేశారు. ఈ వ్యవహారంలో సదరు ఆర్డీఓతో పాటు యాచారం తహసీల్దార్ కార్యాలయంలోని రెవెన్యూ, సర్వే అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా అధికారుల విచారణలో భూదాన్ భూములకు పరిహారం ఇచ్చిన అప్పటి ఆర్డీఓ, ఇతర రెవెన్యూ, సర్వే శాఖ అధికారుల పేర్లతో నివేదికను సర్కార్‌కు అందజేసినట్లు సమాచారం. సర్కార్‌కు నివేదిక అందజేశాం భూదాన్ భూములకు సంబంధించి ఫార్మా పరిహారం అందజేసిన విషయమై పూర్తి స్థాయి విచారణ నివేదికను సర్కార్‌కు అందజేశాం. పరిహారం రికవరీ చేస్తారా.. అప్పటి అధికారులపై చర్యలు ఉంటాయా అనేది సర్కార్ పరిధిలో ఉంది. – అనంత్‌రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం భూదాన్ భూములకు ఫార్మా పరిహారం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొనసాగిన విచారణ నివేదిక సర్కార్‌కు అందజేసిన అధికారులు ఏం చేస్తారనేదానిపై సర్వత్రా చర్చ -
యూరియా అవస్థలు
నందిగామ: యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగిన ఘటన మండల పరిధిలోని చేగూరు పీఏసీఎస్‌లో చోటుచేసుకుంది. చేగూరు పీఏసీఎస్‌కు గురువారం 250 బస్తాల యూరియా వచ్చింది. రైతులకు ఏ మాత్రం సరిపోక పోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పి పంపించారు. మేకగూడలోని పీఏసీఎస్‌కి 450 బ్యాగులు రాగా రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అందరికీ అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. గంటల తరబడి క్యూ ఇబ్రహీంపట్నం: శేరిగూడలోని ఉప్పరిగూడ పీఏసీఎస్‌కు గురువారం 20 టన్నుల యూరియా వచ్చింది. వందలాది మంది రైతులు క్యూ లైన్లో నిలుచుకున్నారు. సీఐ మహేందర్‌రెడ్డి వాటర్ బాటిల్స్ తెప్పించి క్యూలైన్లో ఉన్న వారికి అందజేశారు. రెండు గంటల్లోనే వచ్చిన స్టాక్ అయిపోయింది. అందని వారు ఉసూరుమంటూ వెనుదిరిగారు. పోలీసు భద్రత మధ్య పంపిణీ అబ్దుల్లాపూర్‌మెట్: మండల కేంద్రంలోని బాటసింగారం రైతు సేవా సహకార సంఘానికి గురువారం 225 యూరియా బస్తాలు వచ్చాయి. తోపులాటలు జరుగుతాయన్న ఉద్దేశంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల భద్రత మధ్య బస్తాలను గోదాంలోకి దింపారు. అనంతరం మండల వ్యవసాయశాఖ అధికారి పల్లవి, సహకార సంఘం మేనేజర్ జక్కుల ఐలేష్‌యాదవ్ రైతులకు అందజేశారు. -
ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోండి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ మహేశ్వరం: మహేశ్వరం మోడల్ స్కూల్లో స్కావెంజర్ల జీతాల్లో అవినీతికి పాల్పడిన ప్రిన్సిపాల్ గోపిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద గతేడాది ఆగస్టు నుంచి నెలకు రూ.10 వేల చొప్పున మరుగుదొడ్లు శుభ్రం చేసేవారు(స్కావెంజర్ల) జీతాల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ప్రిన్సిపాల్ ఇద్దరి స్కావెంజర్లను నియమించి వారికి నెలకు రూ.10 వేల చొప్పున జీతం ఇవ్వకుండా, కేవలం రూ.7వేల ఇచ్చారని ఆరోపించారు. స్కావెంజర్ల జీతాలలో ప్రిన్సిపాల్ చేతివాతం ప్రదర్శించి అవినీతి చేయడం సరికాదన్నారు. వెంటనే ప్రిన్సిపాల్ గోపిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సిద్ధు, తరుణ్, రాహుల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
బహదూర్‌పురా: అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర అటవీ శాఖ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఇకపై ప్రతిభావంతులైన ఫ్రంట్‌లైన్ అధికారులకు ఏటా రూ.10 వేలు నగదు పురస్కారం అందిస్తామన్నారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు వృథా కానివ్వమన్నారు. గురువారం నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు ఆవరణలోని అమరవీరుల విగ్రహం వద్ద నిర్వహించిన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్, రాష్ట్ర అటవీ ప్రధాన అధికారిణి డాక్టర్ సువర్ణలతో కలసి పాల్గొన్నారు. స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. 1984 సంవత్సరం నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో విధి నిర్వహణలో 22 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పచ్చదనం పెంపులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘వన మహోత్సవం’ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నమన్నారు. వనమహోత్సవం ద్వారా మన రాష్ట్రంలో 307.48 కోట్లకు పైగా మొక్కలను ఇప్పటికే నాటడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ అడవులను కాపాడుతున్న అటవీ అధికారుల కృషి అభినందనీయమన్నారు. ఎటువంటి సౌకర్యాలు లేనిచోట, దట్టమైన అడవుల్లో వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అడవులను కాపాడుతున్నారన్నారని, విధి నిర్వహణలో అమరులైన అటవీ అధికారులు, సిబ్బంది త్యాగాలను స్మరించుకోవాలన్నారు. డీజీపీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ..అడవులను కాపాడేందుకు అధికారులు చేస్తున్న కృషి ఎంతో గొప్పదన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ అడవులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వాటిని కాపాడటమే అమరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారిణి డాక్టర్ సువర్ణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎలుసింగ్ మేరు, పీసీపీఎఫ్ జౌహరి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా, అడిషనల్ పీసీపీఎఫ్లు సి.శరవనణ్, , ప్రియాంక వర్గీస్, జూపార్కుల డైరెక్టర్ డాక్టర్ సునీల్, క్యురేటర్ జె.వసంత, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్షితిజ, డాక్టర్ జి. రామలింగం, జీహెచ్ఎంసీ అర్బన్ ఫారెసీ్ట్ర డైరెక్టర్ సుభద్రాదేవి, జూపార్క్ డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ) డా.ఎం.ఎ. హకీమ్, డిప్యూటీ క్యురేటర్ బర్నోబా, అసిస్టెంట్ డైరెక్టర్ (వెట్) శ్రీనివాస్ , మాజీ క్యూరేటర్లు ఎ.శంకరన్, రాజశేఖర్, మాజీ డిప్యూటీ క్యూరేటర్ ఎ.నాగమణి, అసిస్టెంట్ క్యురేటర్లు నాజియా తబుసుమ్, ఎన్.లక్ష్మణ్, ఈపీఆర్ఓ హనీఫుల్లా, జూ సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ -
108 సిబ్బందికి అవార్డులు
మొయినాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఆల్ ఇండియా ప్రిసన్ డ్యూటీ మీట్లో ఉత్తమ సేవలు అందించిన 108 సిబ్బంది అవార్డులు అందుకున్నారు. నాలుగు రోజులపాటు జరిగిన 7వ ఆల్ ఇండియా ప్రిసన్ డ్యూటీ మీట్ 2025లో దేశంలోని అన్ని రాష్టాల క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడల్లో గాయపడినవారికి చికిత్స అందించడం, ఆసుపత్రికి తరలించడంలో మొయినాబాద్ 108 సిబ్బంది ఈఎంటీ భూక్య శ్రీకాంత్, పైలెట్ గవ్వల చంద్రశేఖర్ ఉత్తమ సేవలు అందించారు. వారి సేవలను గుర్తించిన ప్రిసన్ డీజీ సౌమ్యమిశ్ర గురువారం జరిగిన ముగింపు కార్యక్రమంలో అవార్డులు అందజేసి అభినందించారు. ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో వృద్ధుడి మృతి నాగోలు: ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ (70) నాగోలు బండ్లగూడలో పండ్లు అమ్ముతూ జీవనం సాగించేవారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో పని ముగించుకొని భారత్ పెట్రోల్ పంప్ ఎదుట రోడ్డు పక్కన టీ తాగి తన బైక్ వైపు వెళ్తుండగా నాగోలు నుండి బండ్లగూడ వైపు వేగంగా వచ్చిన గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయడిన ఖాజా మొయినుద్దీన్‌ను చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిల్వ ఉంచిన 34 సిలిండర్ల పట్టివేత
పహాడీషరీఫ్: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌కు విక్రయిస్తున్న కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడలోని కావ్య ప్లాస్టిక్, స్టీల్ హౌస్‌లో పోలోడు గోవర్ధన్, మామిడిపల్లికి చెందిన రాజు, కాటేదాన్‌కు చెందిన అనిల్‌లు అక్రమంగా సిలిండర్లను నిల్వచేసి అవసరమైన వారికి రెట్టింపు ధరలో విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి, వారి వద్ద నుంచి వివిధ పరిమాణాలకు సంబంధించిన 34 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. రోడ్లపై ‘బైక్ స్టంట్లు’రాజేంద్రనగర్: ద్విచక్ర వాహనాలతో రోడ్లపై స్టంట్లు చేస్తూ వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఇద్దరు యువకులతో పాటు మరో మైనర్‌ను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన అహ్మద్ బిన్ ఫారూఖ్, అతని స్నేహితుడు మహ్మద్ ఆజంలు రెండు ద్విచక్ర వాహనాలపై మరో స్నేహితుడు మైనర్ బాలుడు (16)తో కలిసి గురువారం ఉదయం అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ వైపు ప్రయాణిస్తున్నారు. రెండు బైక్‌లపై స్టంట్లు చేస్తూ వాహనాలను నిర్లక్ష్యంగా నడిపారు. దీంతో రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. కొందరు వాహనదారులు తమ సెల్ఫోన్లో ఈ విన్యాసాలను చిత్రీకరించి సోషల్ మీడియాతోపాటు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులకు పంపిచారు. వాహనాల నంబర్ల ఆధారంగా ఇద్దరు యువకులతో పాటు మైనర్‌ను గుర్తించి పోలీసులు సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలతో పాటు ముగ్గురిని తదుపరి విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్బంగా రాజేంద్రనగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, ఇన్స్పెక్టర్ రాజులు మాట్లాడుతూ..ద్విచక్ర వాహనాలపై స్టంట్లు చేస్తే వారికి శిక్ష తప్పదన్నారు. మైనర్లకు వాహనాలు అందించిన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
వర్షాలు కురిసి.. జలాలు పెరిగి
● నిండుకుండల్లా చెరువులు, కుంటలు ● పరిసరాల్లో వృద్ధి చెందిన భూగర్భ జలాలు ● సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు మొయినాబాద్‌రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు, కుంటలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాల నిల్వలు పెరిగాయని నిపుణులు, అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పంటల సాగుకు అవసరమైన నీటి వనరులు సమకూరాయని భావిస్తున్నారు. బోరు బావులు సైతం సమృద్ధిగా నీటిని పోస్తున్నాయి. ఎక్కడ బోరు వేసినా ౖపైపెనే నీరు వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు. రికార్డుస్థాయిలో వర్షాలు సగటు వర్షపాతం 400 మిల్లీమీటర్లు కాగా ఆగస్టు చివరి నాటికి 612 మి.మీ నమోదయింది. చేవెళ్ల నియోజకవర్గంలో వర్షపాతం నమోదు ఇలా ఉన్నది. చేవెళ్ల మండలంలో 63 శాతం, మొయినాబాద్‌లో 53 శాతం, షాబాద్‌లో 83, శంకర్‌పల్లిలో 48 శాతం అధిక వర్షం కురిసినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవలేదు. జూలై రెండోవారం వరకు అడపాదడపా మోస్తరు వర్షాలు మాత్రమే కురిశాయి. ఆగస్టు నెలలో సమృద్ధిగా వానలు పడడంతో అధిక వర్షపాతం నమోదైంది. రానున్న రబీ సీజన్‌కు నీటి కొరత ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. ౖపైపెకి గంగమ్మ వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం భూగర్భ జలాలు పైకి వచ్చేశాయి. గతంలో పాతాళానికి పడిపోయిన నీరు ప్రస్తుతం ౖపైపెకి పాకుతుంది. ఆగస్టు నెలలోనే 4.31 మీటర్ల మేర అండర్ గ్రౌండ్ వాటర్ వృద్ధి చెందాయి. వేసవితో పోలిస్తే చేవెళ్ల నియోజకవర్గంలోని ఆయా మండలాలలో మొయినాబాద్‌లో 5.06, చేవెళ్లలో 7.98, షాబాద్‌లో 6, శంకర్‌పల్లిలో 4.08 మీటర్ల నీటి మట్టం పెరిగాయి. సమృద్ధిగా జలాలు ఆగస్టు నెలలో అధిక వర్షాలు కురియడంతో సమీప వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కుంటలు నీటితో నిండి కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు సమృద్ధిగా పోస్తున్నాయి. ఈ సంవత్సరం పంటలకు నీటి కొరత ఉండదు. – సైపాల్‌రెడ్డి, రైతు, అమ్డాపూర్ పెరిగిన సాగు విస్తీర్ణం సమృద్ధిగా వర్షాలు కురవడంతో వరితో పాటు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. బోరు బావుల్లో జలాలు పెరిగాయి. వాగులు, వంకలు అలుగు పారుతున్నాయి. పత్తి, కంది ఇతర కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. – అనురాధ, ఏఓ, మొయినాబాద్ -
‘జూబ్లీహిల్స్ లయన్స్’ సేవలు భేష్
● మాదాపూర్ స్కూల్లో ఐరన్ షెడ్ ఏర్పాటు ● సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన మాదాపూర్: విద్యార్థుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ సేవాతత్పరతను చాటుకుంది. ఈ మేరకు మాదాపూర్‌లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల కోసం ఐరన్ షెడ్ నిర్మించారు. శనివారం ఈ షెడ్‌ను లయన్స్ జిల్లా గవర్నర్ 320డి లయన్ అమర్నాథ్రావు ప్రారంభించారు. ఈ నిర్మాణానికి లయన్ గిరిజారెడ్డి, డాక్టర్ పి.సీత, జయశ్రీ మూర్తి, జ్వాలా వైష్ణవి, మండవ శిల్ప విరాళాలు అందించారు. విద్యార్థుల సౌకర్యం కోసం నిర్మించిన ఈ షెడ్..విద్యాభివృద్ధికి లయన్స్‌క్లబ్ చూపుతున్న అంకితభావానికి నిదర్శనమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు లయన్ కోనేరు రామసుందరి, కార్యదర్శి లయన్ రిందా దేవి, హెడ్మాస్టర్ మోహన్‌రావు, నరసింహరాజు, రామమోహన్, సౌభాగ్య, మర్రి ప్రవీణ్, ఈవీ రమణ తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన మాదాపూర్‌లోని మండల ప్రాథమిక పరిషత్ స్కూల్లో లయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320డి అధ్వర్యంలో శనివారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. లయన్ నాగరాజు, నరసింహరాజు, పద్మావతి త్రిపురనేనిలు మానసిక ఆరోగ్యంపై మార్గనిర్దేశం చేయగా, తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, అంబర్పేట్ నిపుణులు విద్యార్థులకు సైబర్‌క్రైమ్స్, డ్రగ్స్ దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. ఫోరెన్సిక్, కెరీర్ ప్రోగ్రెస్‌పై సుశ్మిత, సైబర్ ముప్పు, హ్యాకింగ్‌పై రాహుల్ వివరించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ క్లబ్ అధ్యక్షుడు కోనేరు రామ సుందరి, హెడ్మాస్టర్ బసవలిగం తదితరులు పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కొందుర్గు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి మహదేవ్పూర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా, బల్లికురువ మండలం, కొర్రపాలెం గ్రామానికి చెందిన కుంచాల రఘువీర్(36) రెండేళ్ల క్రితం షాద్‌నగర్ ప్రాంతానికి వలస వచ్చాడు. తాపీపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రేగడిచిల్కమర్రిలో పనిచేస్తున్నాడు. కొందుర్గులో మరో సైట్ వద్ద పని ఉందని బైక్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మహదేవ్పూర్ చెరవుకట్టపై మధ్యాహ్నం 12.30 గంటలకు అతని బైక్‌ను మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్రగాయాలతో మృతి చెందాడు. మృతుడి బావ మరిది కల్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రవీందర్ తెలిపారు. విద్యుదాఘాతంతో కార్మికుడు.. ఇబ్రహీంపట్నం: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు ఇనప రాడ్ తగిలి ఓకార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన పట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన శివ నాగరాజు(34) భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. పోచారం గ్రామంలో నిర్మాణ పనుల్లో భాగంగా ఇనుప రాడ్‌ను భవనం పైకి తీసుకెళ్తున్న క్రమంలో 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో కరెంట్ షాక్‌తో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కేసు దర్యాప్తులో ఉంది. మార్టిగేజ్ విధానంపై వివరణ ఇవ్వండి కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో భవన నిర్మాణాలకు మార్టిగేజ్ విధానం అమలు చేయడాన్ని సవాలు చేస్తూ, బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ అంశంపై వారం రోజుల్లోగా పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా సూచిస్తూ కంటోన్మెంట్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా మన్నె క్రిషాంక్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో 200 చదరపు మీటర్లకు పైబడిన నిర్మాణాలకు మాత్రమే అమల్లో ఉన్న మార్టిగేజ్ విధానాన్ని, కంటోన్మెంట్లో కేవలం 111 చదరపు మీటర్ల నుంచే అమలు చేయడం దారుణమన్నారు. సామాన్య, మధ్యతరగతి కంటోన్మెంట్ ప్రజల సొంతింటి కలను జఠిలం చేసే ఈ చర్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా తాను డిమాండ్ చేశానన్నారు. బోర్డు అధికారులు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో భాగంగా మార్టిగేజ్ విధానం అమలు చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విధానం వల్ల చిన్న ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కఠినమైన కంటోన్మెంట్ నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందన్నారు. జీహెచ్ఎంసీని ఆదర్శంగా తీసుకునే బోర్డు అధికారులు, అదే తరహా నిబంధనలు అమలు చేయాలన్నారు. రచన జర్నలిజం కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం హిమాయత్‌నగర్ : నారాయణగూడలో రచన జర్నలిజం కళాశాలలో రెగ్యులర్, కరస్పాండెన్న్స్ విధానంలో జర్నలిజంలో పీజీ డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లమా కోర్సులో చేరడానికి ఏదైనా డిగ్రీ, సర్టిఫికెట్ కోర్సులో చేరేందుకు 10వ తరగతి పాసైనవారు అర్హులని తెలిపారు. సెప్టెంబర్ 30లోగా దరఖాస్తులు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ : 040–23261335 లేదా 9959640797 నెంబర్లలో సంప్రదించాలన్నారు. 14 ప్రవక్త మహ్మద్ జయంతి సభ సాక్షి,సిటీబ్యూరో: తామీర్–ఎ–మిల్లత్ 76వ ’యౌమ్–ఎ–రహ్మతుల్ లిల్ ఆలమీన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 14న ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తామీర్–ఎ–మిల్లత్ అధ్యక్షుడు ముహమ్మద్ జియావుద్దీన్ నయ్యర్ పర్యవేక్షణలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ పండితులు, మేధావులతో పాటు స్థానిక ఉలమాలు హాజరుకానున్నారు. రెండో రోజు 15న రాత్రి చంచల్‌గూడ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ’యౌమ్–ఎ–సహాబా’ ఉంటుందని సభ నిర్వాహకులు తెలిపారు. -
పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలి
ఆమనగల్లు: రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రాంచందర్ డిమాండ్ చేశారు. తలకొండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి రైతుసంఘం, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. అంతకుముందు తలకొండపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తహసీల్దార్ రమేశ్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ.. వందల ఎకరాలు ఉన్న భూస్వాముల భూములను కాపాడడానికి అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. ప్రస్తుత అలైన్మెంట్తో సన్న, చిన్నకారు రైతుల భూములు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ప్రకటించుకుంటూ పేద రైతుల పొలాలు ఎందుకు లాక్కుందో చెప్పాలని ప్రశ్నించారు. మొదట ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట య్య, సీపీఎం మండల కన్వీనర్ కురుమయ్య, నాయకులు శివశంకర్, వెంకటస్వామి, లక్ష్మయ్య, శ్రీను, పరమేశ్, నర్సింహారెడ్డి, యాదయ్య, రమేశ్, వెంకటేశ్, కృష్ణస్వామి, ధర్మారెడ్డి, రాములు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ -
యూరియా కోసం యుద్ధం
● ఒక్క బస్తా కోసం తెల్లవారుజామునుంచే పడిగాపులు ● పంటను బతికించుకునేందుకు రైతుల తిప్పలుమంచాల: యూరియా కొరత రైతులను వేధిస్తోంది. పనులు మానుకుని తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు. మండల పరిధిలో 34 వేల ఎకరాలు సాగుకు అనువైన భూమి ఉంది. ఇందుకు సాధారణ సాగుభూమి 28 వేల ఎకరాలు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రస్తుతం 13,500 ఎకరాల్లో సాగు చేపట్టారు. గతేడాది వర్షాకాలంలో 12 వేల ఎకరాలు సాగు చేయగా ప్రభుత్వం 147 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసింది. ఈ ఏడాది అదనంగా మరో 1,500 ఎకరాలకు పైగా సాగు చేపట్టారు. ఇందుకు ప్రభుత్వం 300 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసింది. అయినప్పటికీ రైతులకు యూరియా కోసం ఎగబడుతూనే ఉన్నారు. నిరాశలో రైతులు మంచాల మండల పరిధిలో 23 పంచాయతీలకు మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రంలోనే యూరియా, ఎరువులు అందిస్తున్నారు. యూరియా సరఫరా చేస్తున్న విషయం తెలుసిన వెంటనే రైతులు ప్రైవేట్ వాహనాలు కిరాయి తీసుకుని పీఏసీఎస్ కేంద్రానికి వస్తున్నారు. 1,500 మంది క్యూలో ఉంటే కేవలం 400–500 మందికి మాత్రమే ఒక్కొక్క బస్తా చొప్పున ఇచ్చి పంపుతున్నారు. దీంతో మిగిలిన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. -
రేపటి నుంచి ఏఐపై జాతీయ సదస్సు
షాద్‌నగర్‌రూరల్: గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 12, 13న కృత్రిమ మేథా(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె ఆధ్వర్యంలో నగరంలోని సెక్రెటేరియట్‌లో గిరిజన, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నీతాపోలె మాట్లాడుతూ... గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఏఐపై జాతీయ సదస్సు ఉంటుందన్నారు. ఈ సదస్సులో ప్రత్యక్ష పద్ధతి(ఆఫ్‌లైన్), పరోక్ష పద్ధతి(ఆన్లైన్)లో సెమినార్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సవ్యసాచి ఘోష్, ట్రైబర్ వెల్ఫేర్ సెక్రటరీ సీతాలక్ష్మి, అడిషనల్ సెక్రటరీ మాధవిదేవి, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలల డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ వేణుగోపాల్‌రావు, గిరిజన గురుకుల ఓఎస్డీ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. వాల్‌పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి -
ఆవులను తరలిస్తున్నకంటైనర్ పట్టివేత
గోశాలకు మూగజీవాల తరలింపు నందిగామ: గుట్టు చప్పుడు కాకుండా 32 ఆవులను తరలిస్తున్న ఓ కంటైనర్ వాహనాన్ని నందిగామ పోలీసులు బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ ప్రసాద్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపూరం జిల్లా నుంచి హైదరాబాదు వైపునకు భారీ వాహనంలో ఆవులను తరలిస్తున్నారనే విషయాన్ని హిందూ జన జాగ్రృతి సమితి కార్యకర్త రఘువీర్ సింగ్ తెలుసుకున్నారు. అనంతరం ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బైపాస్ రహదారిపై కాపు కాసి, వాహనాన్ని పట్టుకున్నారు. అందులోని మూగజీవాలను నగరంలోని సమర్ధ గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పేకాట స్థావరంపై దాడి ఇబ్రహీంపట్నం: పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.55 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి పట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎలిమినేడు గ్రామ పరిధిలో జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు డాడులు చేశారు. జూదరులను పట్టుకొన్నారు. నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పథకం బెడిసికొట్టింది..
బంజారాహిల్స్: ఓ సినీ యువ హీరోను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ఓ ఎకై ్సజ్ కానిస్టేబుల్ పథకం వేశాడు. ఇందుకోసం సదరు హీరో స్నేహితురాలైన యువ నటిని ఎరగా వేద్దామనుకున్నాడు. ఈ విషయం పసిగట్టిన సదరు హీరో సినీ ఫక్కీలో పథకం వేసి అదే స్నేహితురాలితో ఎకై ్సజ్ కానిస్టేబుల్‌ను అడ్డంగా ఇరికించాడు. సినిమాను తలపించిన ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎకై ్సజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎస్ఎన్ఎల్ మహేశ్వర్‌రావు అలియాస్ ఎస్.మహేష్ గత కొంతకాలంగా జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పబ్‌లలో పర్యటిస్తూ తాను ఎస్ఐనని, ఇన్స్పెక్టర్నని పరిచయం చేసుకుంటూ అక్కడికి వచ్చే సినీ నటుల కదలికలను గమనిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ యువ హీరో పలుమార్లు తన భార్య, స్నేహితురాలైన నటితో కలిసి పబ్‌లకు వస్తుండడాన్ని అతను గుర్తించాడు. సదరు నటి కదలికలపై నిఘా పెట్టిన అతను ఆమెకు ఫోన్ చేసి తాను ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్నని, మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారు.. నా వద్ద ఆధారాలు ఉన్నాయి.. వీడియోలు ఉన్నాయంటూ ఆమె వెళ్లిన ప్రాంతాల్లో తీసిన ఫోటోలను వాట్సప్ ద్వారా పంపించాడు. ఇటీవల ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించడమేగాక తన కోరిక తీర్చకపోతే డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. ఓ యువ హీరో పేరు చెప్పి అతను కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడని చెప్పాలని ఆమైపె ఒత్తిడి చేశాడు. మహేశ్ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు ఈ విషయాన్ని సదరు యువ హీరో భార్యకు చెప్పింది. అతను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఫిలింనగర్ పోలీసులు మంగళవారం సదరు నటిని విచారించడంతో ఆమె తనకు జరుగుతున్న వేధింపులను పోలీసుల దృష్టికి తీసుకువచ్చింది. పోలీసులు ఎకై ్సజ్ కానిస్టేబుల్ మహేశ్వర్‌రావును అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తాను కొందరు సినీనటులను డ్రగ్స్ కేసులో అరెస్టు చేసేందుకు ఈ పథకం వేశానని మహేశ్వర్‌రావు పోలీసులకు చెప్పాడు. అయితే అతను సీఐనని ఎందుకు చెప్పుకుంటున్నాడు.. ఆ నటిని ఎందుకు ఫాలో అయ్యాడు.. ఆ హీరోను ఎందుకు బుక్ చేద్దామనుకున్నాడు.. తదితర విషయాలపై ఆరా తీయగా అతను గత కొంతకాలంగా టాలీవుడ్ ప్రముఖులను బెదిరిస్తున్నట్లుగా నిర్థారణ అయ్యింది. పలువురు సినీ ప్రముఖుల ఇంటికి వెళ్లి డబ్బులు కూడా దండుకున్నట్లు తేలింది. డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో డ్రగ్స్ దొరికాయని కేసు పెడతానని బ్లాక్మెయిల్ చేసినట్లు నిర్థారించారు. అంతేకాకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో పలువురు పబ్ యజమానుల నుంచి రూ. లక్షలు వసూలు చేసినట్లు తేలింది. కొందరు మహిళలను బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, వారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆయన కాల్ డేటా, నగదు లావాదేవీలు, వాట్సప్, సోషల్ మీడియా మెసేజ్‌లను పరిశీలించిన పోలీసులు ఇప్పటివరకు 25 మంది సినీ ప్రముఖులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. సదరు కానిస్టేబుల్ ట్రూ కాలర్‌లో తాను సీఐనంటూ, డ్రగ్స్ పట్టుకోవడంలో దేశముదురునంటూ మోసాలకు పాల్పడుతున్నాడని ఇటీవల కొందరు సినీ ప్రముఖులు కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తేలింది. నిందితుడిని విచారించిన ఫిలింనగర్ పోలీసులు విచారణ నివేదికతో పాటు ఎకై ్సజ్ అధికారులకు అప్పగించారు. డ్రగ్స్ కేసులో యువ హీరోను ఇరికించేందుకు యత్నం సినీ నటిని బ్లాక్మెయిల్ చేసిన ఎకై ్సజ్ కానిస్టేబుల్.. విచారణ చేపట్టిన ఫిలింనగర్ పోలీసులు.. ఉన్నతాధికారులకు అప్పగింత. డ్రగ్స్ పేరుతో ప్రముఖులకు బెదిరింపులు -
వర్సిటీ.. ఇదేమిటి!
విద్యా పరిమళాలు వెదజల్లాల్సిన యూనివర్సిటీలో గంజాయి వాసన గుప్పుమంటోంది. డ్రగ్స్, గంజాయి, మద్యానికి బానిసలైన కొంతమంది విద్యార్థులు వర్సిటీ వాతావరణాన్ని కలుషితం, భయానకంగా మార్చేస్తున్నారు. ఉన్నత ఆశయాలతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్ఫాయ్ విశ్వవిద్యాలయంలో చేరుతున్న స్టూడెంట్లు అసాంఘిక శక్తులుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. శంకర్పల్లి: భావిభారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు పెడదోవపడుతున్నారు. నిత్యం ర్యాగింగ్, గంజాయి, ఘర్షణల్లో భాగం అవుతున్నారు. శంకర్పల్లి మండలం దొంతన్పల్లిలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్స్ ఆఫ్ ఇండియా (ఇక్ఫాయ్) విశ్వవిద్యాలయాన్ని 2008లో ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రూ.లక్షలు వెచ్చించి మరీ అడ్మిషన్ తీసుకుంటున్నారు. పిల్లల చదువు కోసం ఇతర రాష్ట్రాల తల్లిదండ్రులు కళాశాలలోని హాస్టళ్లతో పాటు బయట ఉన్న ప్రైవేటు వసతి గృహాల్లో పిల్లలను చేర్పిస్తున్నారు. అయితే కొంతమంది విద్యార్థులు నిత్యం బయటకు వచ్చి వికృత చేష్టలు, అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్నారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పలుమార్లు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. కానీ వీరిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తుండడం గమనార్హం. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. ఈనెల 4న కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రావడం, వారికి సరఫరా చేసింది సైతం కళాశాల విద్యార్థే కావడం సంచలనం రేపింది. అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిచి, కౌన్సెలింగ్, నోటీసులు ఇచ్చి పంపించేశారు. ఇంత మంది విద్యార్థులు డ్రగ్స్ టెస్టులో దొరికినా సోదాలు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మచ్చుకు కొన్ని ఘటనలు.. ● 2022 నవంబర్ 1న చోటుచేసుకున్న సంఘటన కళాశాలని కుదిపేసింది. ఇద్దరూ బీబీఏ విద్యార్థులు ప్రేమించుకొని, గొడవ పడ్డారు. అమ్మాయి వెళ్లి బంధువైన సీనియర్‌కి విషయం చెప్పింది. అది కాస్తా సీనియర్స్, జూనియర్స్ గొడవగా మారింది. పలువురు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ యాజమాన్యం 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఘటనపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ● 2023 ఫిబ్రవరి 10న కళాశాల ఎదుట ముగ్గురు బయటి వ్యక్తులు బైక్ మీద వచ్చి విద్యార్థులకు లిక్విడ్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. విద్యార్థులు తప్పించుకోగా అమ్మడానికి వచ్చిన వారిపై పోలీసులు ఎన్డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ● 2019 జనవరి 19న అర్ధరాత్రి ఓ ఎంబీఏ విద్యార్థిని కళాశాల బయట తిరుగుతుండగా ఓ దాబా నిర్వాహకుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో ఆమె మద్యం తాగి ఉనట్లు సమాచారం. ఇష్టారీతిన వాహనాల పార్కింగ్ పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థులకు కనీసం పార్కింగ్ సౌకర్యం కల్పించలేదు. నిత్యం కళాశాలకు సొంత వాహనాల్లో వచ్చే విద్యార్థులు వారి వాహనాలను హైదరాబాద్– శంకర్పల్లి ప్రధాన రోడ్డు పక్కన ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు. దీంతో కొన్నిసార్లు వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. కొంతమంది విద్యార్థులు కళాశాల ముందు ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వందల రూపాయలు చెల్లించి నిలుపుతున్నారు. తరచూ వార్తల్లో ఇక్ఫాయ్ విశ్వవిద్యాలయం పెడదోవ పడుతున్న పలువురు విద్యార్థులు ఆందోళన కలిగిస్తున్న ర్యాగింగ్, గంజాయి, ఘర్షణలు వెలుగు చూస్తున్న పలు ఘటనలు పట్టించుకోని అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలి కొంతమంది విద్యార్థులు రాత్రి వేళ ఇబ్బందికర దుస్తులు వేసుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. కుటుంబంతో వెళ్లే సమయంలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాం. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలి. – చంద్రశేఖర్, దొంతాన్పల్లి -
ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు
● శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి ● 207 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పట్నం మహేందర్‌రెడ్డి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం 207 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేస్తూ వారిని ఉన్నత శిఖరాలకు చేర్చేది ఉపాధ్యాయులే అన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా నుంచి 207 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. చేవెళ్ల శాసన సభ్యుడు కాలె యాదయ్య మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికి ఆదర్శప్రాయమన్నారు. ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతి వరకు ఎదగడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు దయానంద్ గుప్తా, ఏవీఎన్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని ఐలమ్మ
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తి వీర వనిత చాకలి ఐలమ్మ త్యాగమేనని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ సంగీత మాట్లాడుతూ.. ఐలమ్మ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. భూమి నాది, పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొర ఎవ్వడు, ప్రాణం పోయినా పంట పోనియ్య అని ఎదురుతిరిగిన ధీశాలి అని కొనియాడారు. భూ స్వాముల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి కేషురామ్, వివిధ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు . జిల్లా రెవెన్యూ అధికారి సంగీత -
ఓ వైపు భగభగ.. మరో వైపు జలకళ
● దిగువన ఈసీ పరుగులు ● నీటిపాలైన పంటపొలాలు మొయినాబాద్‌రూరల్: ఓ వైపు సూర్యుడి భగభగలు. మరోవైపు చినుకు వర్షం పడకపోయినా ఈసీకి ఉన్నట్టుండి వరద ప్రవాహం పోటెత్తింది. పంటపొలాలను ముంచెత్తింది. రైతులను నట్టేట ముంచింది. ఎగువ ప్రాంతమైన వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల నుంచి మొదలైన ఈసీ.. అక్కడ మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు మన్నెగూడ, చేవెళ్లతో పాటు మొయినాబాద్ మండలాన్ని తాకుతూ.. హిమాయత్‌సాగర్‌కు నీరు చేర్చే ఈసీ బుధవారం ఉదయం 9 గంటలకు ఉరకలు పెట్టింది. చుట్టూ ఉన్న పూలతోటలు, వరి చేలను నామరూపాల్లేకుండా చేసింది. స్థానికంగా వరుణుడు కరుణించకపోయినా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాగు ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు, వాహనాదారులు ఆసక్తిగా తిలకించారు. ఆశ్ఛర్యానికి లోనయ్యారు. -
చదువుతో పాటు.. ఆటలు ముఖ్యం
ఎన్ఐఎన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శిరీష కడ్తాల్: విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు ముఖ్యమేనని, శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలని జాతీయ పౌష్టికాహార పరిశోధన సంస్థ (ఎన్ఐఎన్) అసిస్టెంట్ ప్రొఫెసర్ శిరీష అన్నారు. రోజు వారి ఆహారంలో పోషక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో.. కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్, తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో యంగ్ ఎర్త్ లీడర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పౌష్టికాహార పరిశోధన సంస్థ నిపుణులు విద్యార్థులకు పౌష్టికాహారంపై అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం అరుణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రొఫెసర్ మాట్లాడారు. జంక్ ఫుడ్ తీసుకోవద్దని చెప్పారు. అనంతరం నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరిశోధన బృందం వంశీకృష్ణ, సప్తదీపఘోష్, జాన్వీ, కుజిత, యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేటర్లను ఆదుకోవాలి
మీర్‌పేట: ముందస్తు సమాచారం లేకుండా వైర్లు తొలగించడంతో దాదాపు 5 లక్షల మంది ఆపరేటర్లు రోడ్డున పడ్డారని, తమకు న్యాయం చేయాలని కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డికి వినతిపత్రం అందజేశారు. గత 20 ఏళ్లుగా తాము ఇదే వృత్తిని కొనసాగిస్తున్నామని, ప్రభుత్వ నిర్ణయంతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, కేబుల్ టీవీలు, బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని వివరించారు. తమకు మరో వృత్తి తెలియదని, ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆమె ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేబుల్, ఇంటర్నెట్ అసోసియేషన్ ప్రతినిధులు లక్ష్మణ్ ముదిరాజ్, శేఖర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, హనుమంతు, సాయినాథ్, చందు, శేఖర్, చారి తదితరులు ఉన్నారు. ● పంచిన ఘనత కమ్యూనిస్టులదే ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అబ్దుల్లాపూర్‌మెట్: పేదలకు పది లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత కమ్యూనిస్టులదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. బుధవారం ఆయన పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కేంద్రంలో వీర తెలంగాణ సాయుధ పోరాట సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో కమ్యూనిస్టులు అగ్రభాగాన నిలిచారని గుర్తు చేశారు. నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర ముఖ్యమైందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఎర్రజెండా రైతు కూలీల తరఫున పోరాటాలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి నర్సింహ, సభ్యులు శివకుమార్, ముత్యాలు, బాలరాజు, శ్రీశైలం, భిక్షపతి, ఊషయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శిగా పర్వతాలు గౌడ్ కందుకూరు: కొత్తగూడ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ ఎం.పర్వతాలుగౌడ్ జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శిగా నియమితులైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి వెంక్యానాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం కళాశాలలో ప్రిన్సిపాల్ ఎం.మంగరాజు ఆధ్వర్యంలో పీడీలు, అధ్యాపకులు ఆయన్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీడీలు లాలూనాయక్, ఎం.ఈశ్వర్, భీక్యానాయక్, జి.జగన్, డాక్టర్ బాల్‌రాజ్, డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. షాద్‌నగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ‘సాక్షి’పాత్రికేయుడు రఘునందన్ పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి ఆయన్ను పరామర్శించారు. డాక్టర్ అనురాగ్రెడ్డితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రఘునందన్‌కు మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. పరామర్శించిన వారిలో విష్ణువర్ధన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాంచందర్‌నాయక్, వెంకట్ తదితరులు ఉన్నారు. -
‘కేసీఆర్ గతే రేవంత్‌రెడ్డికి పడుతుంది’
● ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలి ● ఏబీవీపీ శంషాబాద్ విభాగ్ కన్వీనర్ సూర్యప్రకాశ్ షాద్‌నగర్‌రూరల్: విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుంటే గత ఎన్నికల్లో కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికి పడుతుందని ఏబీవీపీ శంషాబాద్ విభాగ్ కన్వీనర్ సూర్యప్రకాశ్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బుధవారం ఏబీవీపీ నగర కార్యదర్శి నవీన్‌నాయక్ ఆధ్వర్యంలో పట్టణ ముఖ్యకూడలిలో విద్యార్థులతో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల బలిదానాలపై నిర్మించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. స్కాలర్షిప్ భిక్ష కాదు, విద్యార్థుల హక్కు అనే నినాదంతో విద్యార్థులు పోరాటాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నా నేటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం శోఛనీయమన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్లను సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేక, ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేని యెడలా ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏబీవీపీ నాయకులు చందు, పవన్‌కళ్యాణ్, నవీన్, కోమల్, వినయ్, సాయి, జశ్వంత్, రాంచరణ్, రమేశ్, పాండు, భరత్ ఉన్నారు. -
కోడి పందేల స్థావరంపై దాడి
● ఇద్దరు పందెంరాయుళ్లు అరెస్ట్ ● మూడు పందెం కోళ్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం ఇబ్రహీంపట్నం రూరల్: కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు పందెం రాయుళ్లను రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ నోయల్‌రాజ్ తెలిపిన ప్రకారం.. మన్నెగూడ అటవీ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు తమ సిబ్బంది దాడి చేయగా తుర్కయంజాల్‌కు చెందిన తన్నీరు వేణుగోపాల్(32), కట్టంగూర్కు చెందిన దాచేపల్లి శేషగిరిరావు(40)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల రాకను గుర్తించిన పులువురు అక్కడ నుంచి పరారయ్యారు. వారి వద్ద మూడు పందెం కోళ్లను, రెండు సెల్పోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. -
ఏఎంసీ చైర్మన్ల ఫోరం అధ్యక్షుడిగా పెంటయ్యగౌడ్
చేవెళ్ల: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా చేవెళ్ల ఏఎంసీ చైర్మన్ జి.పెంటయ్యగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నగరంలో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి జిల్లా కమిటీ ఎన్నిక నిర్వహించారని చెప్పారు. చైర్మన్‌గా టి.మల్లేశ్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడిగా కె.వేణుగౌడ్, ప్రధాన కార్యదర్శిగా జి.మాధవరెడ్డి, జాయింట్ సెక్రటరీగా బి.ఆంజనేయులు ఎన్నికయ్యారని చెప్పారు. నూతన కమిటీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిశామన్నారు. -
బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొప్పు బాషా
యాచారం: గ్రామానికి చెందిన కొప్పు బాషా బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆయన 2000 సంవత్సరం నుంచి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేవైఎంలలో కీలక పదవులు నిర్వర్తించారు. ఈ క్రమంలో తన సతీమణి సుకన్యను యాచారం ఎంపీపీగా పదవీలో కూర్చోబెట్టారు. అనంతరం బండి సంజయ్ రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కులాల్లోని ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిన రాజీలేని పోరాటం చేశారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం తాజాగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు మంగళవారం తన నివాసంలో పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొప్పు భాషా మాట్లాడుతూ... పార్టీ అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. వ్యక్తి బలవన్మరణం షాద్‌నగర్‌రూరల్: ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ వ్యక్తి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం పట్టణ శివారులోని కీర్తి వెంచర్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ తెలిపిన ప్రకారం.. ఫరూఖ్‌నగర్‌లోని వివేకానంద కాలనీకి చెందిన చాపల గోపాల్(39) ఓ పెట్రోల్ పంపులో పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు లేక పోవవడం, అవివాహితుడు కావడంతో తన అన్న శేఖర్వద్దే ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, పెళ్లి కాకపోవడంతో మనస్థాపంతో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మంగళవారం కీర్తి వెంచర్ సమీపంలో రైలు కిందపడి ఆతహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధార్‌కార్డు, ఏటీఎం కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
ఇదేమి ఆదర్శం!
మహేశ్వరం: ప్రభుత్వ పాఠశాలలో పేదలకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో 2024 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వచ్చిన నిధులను పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, మరుగుదొడ్ల శుభ్రత, పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు నిధులను వెచ్చిస్తారు. అ మ్మ ఆదర్శ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యా యుడు, స్థానిక గ్రామ పంచాయతీలోని మహిళా సంఘం అధ్యక్షురాలు, ప్రతీ తరగతి నుంచి ముగ్గు రు విద్యార్థుల తల్లులు సభ్యులుగా ఉంటారు. స్కావెంజర్ల వేతనాల్లో స్కాం! మహేశ్వరం ప్రభుత్వ మోడల్ స్కూల్లోని అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద స్కావెంజర్ల జీతాల కోసం వచ్చే నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ ప్రిన్సిపాల్ గోపి నిధులను దారి మళ్లిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పాఠశాలలో 825 మంది విద్యార్థులున్నారు. వీరి సంఖ్యకు అనుగణంగా 2024 ఆగస్టు నుంచి నెలకు రూ.20 వేల చొప్పున స్కావెంజర్ల జీతాల కోసం ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నాయి. ఇద్దరు స్కావెంజర్లను నియమించి వారికి రూ.10 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా రూ.7 వేల చొప్పున ఇస్తూ రూ.6 వేలు పక్కదారి పట్టిస్తున్నారని స్కావెంజర్లు ఆరోపిస్తున్నారు. పని మానేసిన స్కావెంజర్లు మహేశ్వరం మోడల్ స్కూల్ ప్రాంగణం విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో పాటు 825 మంది విద్యార్థులున్నారు. దీంతో మరుగుదొడ్ల శుభ్రత, మొక్కల సంరక్షణ కష్టంగా ఉందని రూ.7 వేలకు పనిచేయలేమని లక్ష్మయ్య, మల్లీశ్వరి మరో ఇద్దరు మహిళలు మానేశారు. ఈ ఏడాది జూలై నుంచి ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా రూ.10వేల చొప్పున వేతనం ఇస్తున్నారు. ఎనిమిది నెలల వేతనం పక్కదారి పట్టించిన సదరు ప్రిన్సిపాల్ గోపిని విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మహేశ్వరం మోడల్ స్కూల్లో స్కావెంజర్ల వేతనాల్లలో అవకతవకలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పథకం దారి మళ్లింపు ఆరు నెలల పాటు శ్రమదోపిడీ చేశారని ప్రిన్సిపాల్‌పై ఆరోపణలు -
ప్రయాణికుల ముసుగులో గంజాయి రవాణా
● ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ● 21.33 కిలోల గంజాయి స్వాధీనం అబ్దుల్లాపూర్‌మెట్: ప్రయాణికుల ముసుగులో గుట్టుగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎకై ్సజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21.33 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ అధికారులు తెలిపిన ప్రకారం.. మంగళవారం జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆధ్వర్యంలో విజయవాడ జాతీయ రహదారి అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సులో తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి బ్యాగులు, సూట్ కేసులు తనిఖీ చేయడంతో ప్యాకింగ్ చేసిన ఉన్న గంజాయి కవర్లు కనిపించాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశా రాష్ట్రం జైపూర్‌కు చెందిన కుష్భూనాయక్ ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి డెలివరీకి అదే రాష్ట్రానికి చెందిన బీరెన్నాయక్, రాజేంద్రశెట్టిని కొరియర్లుగా నియమించుకున్నాడు. ఈ క్రమంలో కుష్భూనాయక్ సూచన మేరకు సోమవారం రాత్రి బీరెన్నాయక్, రాజేంద్రశెట్టి గంజాయితో హైదరాబాద్‌కు బయలుదేరారు. మంగళవారం ఉదయం మార్గమధ్యలో అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద వాహనాలను తనిఖీచేస్తున్న జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం వీరిని గుర్తించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణకు హయత్‌నగర్ ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. కాగా అసలు సూత్రధారి కుష్భూనాయక్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్–2025
బండ్లగూడ: ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్–2025 అట్టహాసంగా ప్రారంభమైంది. కరప్షనల్ సర్వీస్స్ చరిత్రలో ఇది చారిత్రాత్మక ఘట్ట మని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జైళ్ల శాఖ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసె ర్చ్ అండ్ డెవలప్మెంట్(బీపీఆర్‌అండ్‌డి) సంయుక్తంగా నిర్వహించారు. దేశంలోని 21 రాష్ట్రా లు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1,222 మంది పోటీదారులు, 144 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రొఫెషనల్, క్రీడలు, సాహిత్యం, కళల విభాగాల్లో మొత్తం 36 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇది కేవలం పోటీ వేదిక మాత్రమే కాదని.. జైలు సిబ్బందిలో క్రమ శిక్షణ, ప్రతిభ, ఐక్యతకు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీపీఆర్డీ అదనపు డైరెక్టర్ జనరల్ రవిజోసఫ్ లోక్కు, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్, హోం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులతో కలిసి ఆయన పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ అన్ని కన్టిజెంట్ల మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది. జైళ్ల డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. తెలంగాణకు ఈ వేదిక లభించడం గర్వకారణమన్నారు. రవిగుప్తా మాట్లాడుతూ.. డ్యూటీ మీట్ అనేది కేవలం పోటీ కాదని, దేశవ్యాప్తంగా జైలు సిబ్బందిలో స్నేహభావం, జ్ఞాన మార్పిడి, ఆవిష్కరణలకు వేదిక అన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. జైలు సిబ్బంది కనబడని హీరోలని, జైళ్లు శిక్షా గృహాలు కాకుండా పునరావాస, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు గా మారుతున్నాయన్నారు. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జైలు సిబ్బంది నిశ్శబ్ధ సేవలను కొనియాడుతూ టెక్నాలజీ ఎగ్జిబిషన్, ప్రిజన్ ప్రొడక్ట్స్ స్టాల్స్‌ను ముందు చూపు చర్యగా అభివర్ణించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ జైలు సిబ్బందిలోని క్రమ శిక్షణ, అంకితభావం ప్రశంసనీయమని తెలంగాణ జైలు శాఖ ఈ ఈవెంట్ నిర్వహించడం అభినందనీయమన్నా రు. డ్రోన్లు, రోబోటిక్స్, ఏఐ సిస్టమ్స్, స్కానర్లు, కాంట్రాబాండ్ డిటెక్షన్ టెక్నాలజీలు ప్రదర్శనలో ఉంచారు. ఈ మీట్లో వచ్చే మూడు రోజులు పోటీలు, క్రీడలు కళాప్రదర్శనలు, అనుభవాల మార్పిడి జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 11న వాలెడిక్టరీ ఫంక్షన్‌తో ముగియనుందన్నారు. ఈ మహోత్సవం సాంప్రదాయం–సాంకేతికత, క్రమశిక్షణ, కరుణ, పోటీ, స్నేహభావం కలయికగా చరిత్రలో నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. -
లేఅవుట్లో అవకతవకలపై విచారణ
కందుకూరు: ముచ్చర్లలోని ఫార్చ్యూన్ హోమ్స్ లేఅవుట్లో అవకతవకలపై మంగళవారం షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ ఢీల్లీలో విచారణ జరిపింది. వెంచర్ నిర్వాహకుడు రోసిరెడ్డి ఫార్చ్యూన్ హోమ్స్ పేరుతో ప్లాట్లను అమ్ముతామని చెప్పి మధ్యవర్తులు దేవీలాల్, పాండు ద్వారా షెడ్యూల్ తెగల వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుని అగ్రిమెంట్లు చేసి ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయకుండా వేధిస్తున్నారని బాధితులు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై జాతీయ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజును పిలిపించి విచారణ జరిపారు. అవకతవకలు నిజమేనని వారు తెలిపారు. మరోసారి అన్ని విషయాలతో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కమిషన్ సభ్యుడు ఆదేశించినట్లు ఆర్డీఓ తెలిపారు. -
తెగుతున్న బంధాలు!
ఆందోళన కలిగిస్తున్న కుటుంబ హత్యలు భార్యను కడతేర్చి ముక్కలుగా నరికి.. 11 గుంటల భూమి కోసం అన్నదమ్ముల కొట్లాటఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని దండుమైలారంలో 11 గుంటల భూమి కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆగస్టు 31న చోటు చేసుకుంది. రోజురోజుకూ నేర ప్రవృత్తి పెరిగిపోతోంది.. మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి.. అనుమానాలు.. అక్రమ సంబంధాలు.. ఆస్తి తగాదాలతో అయినవారని కూడా చూడకుండా అంత మొందించడం ఆందోళన కలిగిస్తోంది. విలువలు అవసరం -
యూరియా కోసం ఆందోళన వద్దు
యాచారం: యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నానో యూరియా వాడకంతో 8 శాతం అధికంగా పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు ఆర్థిక భారం సైతం తగ్గిస్తుందన్నారు. యూరియా బస్తా రూ.266.50 ఉంటే, రూ.225కు లభించే అర లీటర్ నానో యూరియా ఎకరా పొలానికి సరిపోతుందని చెప్పారు. వరి, మొక్కజొన్న, పత్తి, జొన్న, కంది, పండ్ల, కూరగాయల పంటల్లో మంచి దిగుబడి వస్తుందన్నారు. రైతులు సాగు చేసిన పంటలను వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు. సమావేశంలో మండల వ్యవసాయాధికారి రవినాథ్, వివిధ గ్రామాలకు చెందిన విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు
చేవెళ్ల: మద్యం తాగి వాహనాలు నడపకూడదని, దీంతో వారి ప్రాణాలతోపాటు ఎదుటి వారి ప్రాణాలకు ప్రమాదమని రిటైర్డు జడ్జి సాంబశివరావు అన్నారు. చేవెళ్ల కోర్టు ఆవరణలో మంగళవారం రెండో రోజు ట్రాఫిక్ పోలీస్ కేసుల లోక్ అదాలత్ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసిన లోక అదాలత్ ఈనెల 13వ తేదీ వరకు కొనసాగుతుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఎస్.వెంకటేశం, ఏఎస్ఐ చందర్‌నాయక్, కానిస్టేబుళ్లు జంగయ్య, కవిత తదితరులు పాల్గొన్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం 10 గంటలకు కొంగరకలాన్‌లోని కలెక్టరేట్లో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేయనున్నట్లు జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు సహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరు కానున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 159 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై నట్లు తెలిపారు. మొయినాబాద్: భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికై న సీపీ రాధాకృష్ణన్‌కు చిలుకూరు బాలాజీ దేవాలయం తరఫున అర్చకుడు రంగరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. గత సంవత్సరం రాధాకృష్ణన్ చిలుకూరు ఆలయాన్ని దర్శించుకున్న సందర్భాన్ని గుర్తుచేశారు. మంగళవారం ఉపరాష్ట్రపతిగా ఎన్నికై న అనంతరం మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాధాకృష్ణన్ ప్రజాసేవకు సమర్పించిన జీవితం, ధర్మం, నైతికత, భారతీయ సంస్కృతిని గుర్తుచేస్తూ ఆయన అంకితభావం దేశానికి గర్వకారణం అన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా బాలాజీ ఆశీస్సులు ఎల్లప్పుడు ఆయనకు ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నామన్నారు. -
ఏసీబీకి చిక్కిన నార్సింగి టీపీఓ
● చేవెళ్లలో చర్చనీయాంశం ● మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మణిహారిక చేవెళ్ల: నార్సింగి మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారి రూ.4లక్షలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడినట్లు తెలియడంతో చేవెళ్లలో కలకలం రేగింది. నార్సింగిలో పట్టుబడిన మణిహారిక చేవెళ్ల మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ ఇన్చార్జిగా ఎనిమిది నెలల నుంచి కొనసాగుతున్నారు. దీంతో ఇక్కడ కూడా ఆమె వ్యవహారం ఎలా ఉందనే దానిపై స్థానికంగా చర్చించుకున్నారు. మున్సిపల్ పరిధిలో కొత్త నిర్మాణాలు, ఎల్ఆర్ఎస్ ప్లాట్ల విషయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ వ్యవహారం టౌన్‌ప్లానింగ్ అధికారులే చూడాల్సి ఉండడంతో ప్లాట్లు పరిశీలనకువస్తే వసూళ్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మణిహారిక ఏసీబీకి పట్టుబడడంతో అధికారులు చేవెళ్ల మున్సిపాలిటీలో కూడా విచారణ చేస్తారన్న ప్రచారం జరిగింది. మంగళవారం మాత్రం కార్యాలయానికి ఎవరూ రాలేదు. కాగా ఎల్ఆర్ఎస్ సెకండ్ స్టేజీలో టౌన్‌ప్లానింగ్ అధికారి క్లియర్ చేయాల్సి ఉండగా ఆమె వద్ద ఫైల్స్ పెండింగ్‌లో ఉండటంతో దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. -
సన్నగా బియ్యం.. తిన్నగా నల్లబజార్‌కు!
తీసుకోవడానికి లబ్ధిదారుల అనాసక్తి ● సొమ్ము చేసుకుంటున్న రేషన్ డీలర్లు ● కిలోకు రూ.12 చొప్పున కొనుగోలు ● పట్టని పౌరసరఫరాల శాఖ సాక్షి, సిటీబ్యూరో: బియ్యం మారినా డీలర్ల తీరు మారలేదు. అదే చేతివాటం.. అదే తప్పుదారి.. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ‘ఉచిత సన్న బియ్యం’ నగదు దందా బాహాటంగా కొనసాగుతోంది. ఆహార భద్రత (రేషన్) కార్డుదారులు సన్న బియ్యంపై కూడా అనాసక్తి కనబర్చడం డీలర్లకు కలిసివస్తోంది. కొందరు కార్డుదారులు ఈ–పాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టి నెలవారీ బియ్యం కోటాను డీలర్లకు అప్పగించి నగదు పుచ్చుకోవడం, డీలర్లు కూడా కిలోకు రూ.12 చొప్పున లెక్క కట్టి నగదు అందించడం సర్వసాధారణమైంది. సన్నబియ్యంపై కూడా.. పూట గడవని అత్యంత నిరుపేద కుటుంబాలు మినహా మిగతా కుటుంబాలు పీడీఎస్ బియ్యం వండుకొని తినడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. మొన్నటి వరకు బియ్యం దొడ్డుగా, నాసిరకం, ముక్కి పోయి ఉండటం, వండి తిన్న తర్వాత జీర్ణం కాకపోవడం లాంటి కారణాలతో పెద్దగా ఆసక్తి కనబర్చేవారు కాదు. కొన్ని కుటుంబాలు మాత్రం రేషన్ బియ్యాన్ని కేవలం ఇడ్లీ, దోశలు, పిండి వంటలకు వినియోగిస్తున్నారు. ప్రతినెలా ఉచితంగా అందుతుండటం, అవసరానికి మించి వస్తుండటంతో డీలర్లకు అప్పగిస్తూ వచ్చేవారు. తాజాగా సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నా లబ్ధిదారులను డీలర్లు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక యూనిట్ బియ్యమే.. కొందరు కార్డుదారులు తమ నెలవారీ కోటాలో ఒక యూనిట్ బియ్యమే తీసుకొని మిగతా యూనిట్ల కోటాను డీలర్ల వద్ద నగదు రూపంలో బదిలీ చేసుకుంటున్నారు. వాస్తవంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఈ–పాస్ (బయోమెట్రిక్) అమలు కంటే ముందు రేషన్ డీలర్లు చేతివాటం ప్రదర్శించి డ్రా చేయని లబ్ధిదారుల సబ్సిడీ సరుకులు గుట్టుచ ప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకునేవారు. సంస్కరణలో భాగంగా ఈ– పాస్ అమలుతో లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరిస్, ఓటీపీ తప్పనిసరి కావడంతో డీలర్లు లబ్ధిదారుల ప్రమేయంతో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అడపాదడప విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసుల దాడుల్లో పీడీఎస్ బియ్యం క్వింటాళ్ల కొద్దీ పట్టుబడుతోంది. స్పెషల్ డ్రెవ్ సమయంలో బియ్యం వ్యాపారులు ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌గా.. మౌనం దాల్చుతున్నారు. అ తర్వాత తిరిగి దందాను కొనసాగించడం సర్వసాధారణంగా మారింది. -
ఆస్పత్రులపై నిఘా ఉంచాలి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అనుమతుల్లేని ఆస్పత్రులపై మరింత కఠినంగా వ్యవహరించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు సంబంధిత వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. అడ్డగోలు చికిత్సలు చేస్తున్న ఆస్పత్రులు, వైద్యులపై గట్టి నిఘా ఉంచాల్సిందిగా సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కార్యాలయంలో ఆయన సంబంధిత మెడికల్ ఆఫీసర్లతో సమావేశం అయ్యారు. తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వైద్యులు, ఇతర సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విఽధి నిర్వహణలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిందిగా కోరారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వస్తునారీ స్వశక్తి పరివార్ అభియాన్ (అతివ ఆరోగ్యమస్తు) పేరుతో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డాక్టర్ విజయ పూర్ణిమ, డాక్టర్ గీత, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ రాధిక, డాక్టర్ పూనం, డాక్టర్ రాకేష్, డెమో శ్రీనివాసులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు -
ఆరోగ్య శాఖకుఅవినీతి జబ్బు!
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఇష్టారాజ్యంసాక్షి, రంగారెడ్డిజిల్లా: ౖఫెర్సేఫ్టీ సహా అనుమతి లేని ఇరుకైన భవనాల్లో ఏర్పాటు చేసిన పలు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రోగుల సేవలో తరించాల్సిన కొంత మంది వైద్యాధికారులు ఆస్పత్రుల తనిఖీల పేరుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్‌లకు అనుమతుల జారీ సహా పాత ఆస్పత్రులకు లైసెన్సుల పునరుద్ధరణ పేరుతో ఇలా నోటీసులు జారీ చేసి, అలా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న సాంకేతిక అంశాలను సాకుగా చూపించి, ఆస్పత్రి, పడకలు, స్కానింగ్ మిషన్లు, లేబోరేటరీల నిష్పత్తిని బట్టి వసూలు చేస్తున్నారు. ఆస్పత్రి నిర్వాహకులు చేసేది లేక వారు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడిని మళ్లీ సంపాదించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అర్హత, అనుభవం లేకపోయినా గుట్టుగా అవయవమార్పిడి, సంతాన సాఫల్యం వంటి ఖరీదైన చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పనితీరుపై నిఘా పెట్టాల్సిన జిల్లా ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు తయారైంది. భారీగా ముడుపులు జిల్లాలో స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, జనరల్ నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు మూడు వేలకుపైగా ఉన్నట్లు అంచనా. వీటిలో 2,500 వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి అను మతులు పొందాయి. మరో 400 వరకు ఎలాంటి అనుమతులు లేని క్లినిక్‌లు ఉన్నట్లు అంచనా. అర్హతలు, అనుమతులు లేకుండా చికిత్స చేస్తున్న ఆస్ప త్రులు, వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వరుస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయుర్వేద, యునానీ కోర్సులు చేసిన వారు అల్లో పతి వైద్యులుగా.. ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ వైద్యు లుగా చలామణి అవుతున్నారు. ప్రాథమిక వైద్య సేవలు అందించాల్సిన చోట ఇన్పేషంట్లకు చికిత్స లు అందిస్తున్నారు. అబార్షన్లతో పాటు కుటుంబ నియంత్రణ, సున్తీ వంటి చికిత్సలు చేస్తున్నారు. అధిక రక్తస్రావం సహా ఇతర కారణాలతో ఆయా బాధితులు మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి నకిలీ వైద్యులను, ఆస్పత్రులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు గుర్తించి, కేసులకు సిఫార్సు చేస్తోంది. ఆ బాధ్యతను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అప్పగిస్తోంది. ఆయా ఆస్పత్రులను తాత్కాలికంగా సీజ్ చేస్తున్నారు. ఆస్పత్రు ల లైసెన్సులు రద్దు చేయక పోగా, కొద్ది రోజులకే వాటిని తిరిగి తెరిపిస్తున్నారు. ఇందుకు ఒక్కో ఆస్ప త్రి నుంచి భారీగా ముడుపులు ముడుతున్నట్లు తెలిసింది. కందుకూరు, షాద్‌నగర్ డివిజన్ల పరిధిలో అక్రమ వసూళ్ల దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు సమాచారం. డిప్యూటేషన్లపై అడ్డదారిలో వచ్చిన ఓ వైద్యురాలు.. గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా కొనసాగుతూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒకరి పేరున.. మరొకరు నిజానికి ఏ వ్యక్తి పేరునైతే ఫార్మసీ, ల్యాబ్‌లకు లైసెన్స్ పొందుతారో ఆ వ్యక్తి విధిగా అందుబాటులో ఉండాలి. కానీ మెజార్టీ కేంద్రాల్లో ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉండటం లేదు. కనీస అర్హత లేని వారితో రక్త, మూత్ర వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే అటెండర్లు మందులు ఇచ్చేస్తున్నారు. కీలకమైన స్కానింగ్ సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. రేడియాలజిస్టుకు బదులు ఎక్సరే టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులతో పరీక్షలు చేయిస్తున్నారు. కడుపులో ఉన్నది ఆడో మగో ముందే చెబుతూ పరోక్షంగా అబార్షన్లకు కారణమవుతున్నారు. జిల్లాలో 700పైగా స్కానింగ్ సెంటర్లు ఉండగా, వీటిలో మెజార్టీ సెంటర్లలో కనీస అర్హత ఉన్నవారు లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మూడు నెలలకోసారి మెడికల్ షాపుల నుంచి అసోసియేషన్ ప్రతినిధులే వసూలు చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్కు ముడుపులు ముట్టజెబుతున్నట్లు తెలిసింది. -
ఆ స్తంభాలను తొలగించండి
● లేదంటే ఆత్మహత్య చేసుకుంటా ● సబ్‌స్టేషన్ ఎదుట రైతు ఆందోళన మంచాల: తమ పొలంలో నాటిన విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఓ రైతు సోమవారం పెట్రోల్ డబ్బాతో సబ్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి జాపాల గ్రామానికి చెందిన బక్కున మల్లప్పకు చెందిన వ్యవసాయ పొలం నుంచి శనివారం ప్రక్క రైతు వ్యవసాయ బోరుకు విద్యుత్ కనెక్షన్ నిమిత్తం విద్యుత్ స్తంభాలను అమర్చారు. విషయం తెలుసుకున్న మల్లప్ప.. తమకు సమాచారం ఇవ్వకుండా పొలంలో స్తంభాలు ఎలా ఏర్పాటు చేశారని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏఈ బాజీసింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆ పోల్స్‌ను తొలగిస్తామని హామీ ఇచ్చాడు. రెండు రోజులు అయినా వాటిని తొలగించలేదని పేర్కొంటూ.. తాజాగా బాధిత రైతు నిరసన వ్యక్తం చేశారు. వాటిని తీయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ.. లేబర్ రాగానే మంగళవారం ఉదయం ఆ స్తంభాలను తొలగిస్తామని బాధిత రైతుకు హామీ ఇచ్చారు. అయినా సదరు వ్యక్తి వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మల్లప్పను ఠాణాకు తరలించారు. -
గ్రేటర్ కేడర్‌కు పెద్దపీట
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో గ్రేటర్ కేడర్‌కు పెద్దపీట వేసింది. మొత్తం 22 మందిని ఎంపిక చేయగా వీరిలో సగానికిపైగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నేతలే ఉండడం గమనార్హం. ఉపాధ్యక్షులుగా మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన మహిళా మోర్చ నాయకురాలు కొల్లి మాధవి, మాజీ మేయర్ బండారు కార్తీకారెడ్డి నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా పార్టీ హైదరాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎన్.గౌతంరావు, రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు టి.వీరేందర్‌గౌడ్, కార్యదర్శిగా ఎస్సీ మోర్చ మాజీ అధ్యక్షుడు కొప్పు బాష, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి, సీనియర్ నేత బద్ధం మహిపాల్‌రెడ్డి నియమితులయ్యారు. సంయుక్త కోశాధికారిగా సువర్ణజైన్, చీఫ్ స్పోక్‌పర్సన్‌గా ఎన్వీ సుభాష్ నియమితులయ్యారు. పార్టీ అనుబంధ సంఘాలకు సైతం బాధ్యులను ఎంపిక చేశారు. యువ మోర్చ అధ్యక్షుడిగా మొయినాబాద్‌కు చెందిన గణేశ్కుండే, మహిళా మోర్చ అధ్యక్షురాలిగా మేకల శిల్పారెడ్డి, ఓబీసీ మోర్చ అధ్యక్షుడిగా గందమల్ల ఆనంద్‌గౌడ్‌ను నియమించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో సముచిత స్థానం -
జర్నలిస్టులపై దాడులను సహించం
నందిగామ: జర్మలిస్టు సందీప్‌పై అకారణంగా దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై దాడులు చేస్తే ఎంతటి వారైన సహించేది లేదని టీయూడబ్ల్యూఎఫ్ డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్ అన్నారు. మండలానికి చెందిన జర్నలిస్టు సందీప్‌పై నందిగామకు చెందిన కొంతమంది యువకులు గణేశ్ నిమజ్జనం రోజు మూకుమ్మడిగా దాడి చేసి గాయపర్చారు. ఈ నేపథ్యంలో షాద్‌నగర్ నియోజకవర్గ జర్నలిస్టులు సోమవారం పెద్దఎత్తున నందిగామ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఇన్స్పెక్టర్ ప్రసాద్‌తో వారు మాట్లాడుతూ.. అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సూచనల మేరకు కొంత మంది యువకులు జర్నలిస్టు సందీప్‌పై అకారణంగా దాడి చేశారన్నారు. దాడి జరిగి రెండు రోజులైనా కూడా నేటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. కేసు విచారణ జరుపుతున్నామని, నిజనిజాలు తెలుసుకొని దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు ఖాజా పాషా, నరేశ్, లక్కాకుల రమేశ్, ఆంజనేయులుగౌడ్, నర్సింహారెడ్డి, యాదయ్య, వెంకన్న బాబు, చంద్రశేఖర్, నూరోద్దీన్, జగన్, మధుసూదన్ గౌడ్, శ్రీహరి, మహేశ్, వెంకటేశ్, అశోక్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్ -
బైకు దొంగల అరెస్టు
● నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఏసీపీ లక్ష్మీనారాయణ షాద్‌నగర్‌రూరల్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులను దొంగతనం చేస్తున్న ఇద్దరు దుండగులను సోమవారం షాద్‌నగర్ పోలీసులు అరెస్టు, చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం దావుడ్గూడ తండాకు చెందిన శివ, కొత్తూరు మండలం కొడిచర్ల గ్రామానికిచెందిన బ్యాగరి రాంచందర్‌లు స్నేహితులు. వీరు షాద్‌నగర్ ఠాణా పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల ఎదుట పార్కింగ్ చేసిన బైకులను అపహరిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకిచెందిన వెంకటేశ్వర్లుకు చెందిన ద్విచక్ర వాహనం జూలై నెలలో చోరికి గురైంది. ఇదే విషయమై సదరు బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బైకుదొంగలను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు రూ.2 లక్షల విలువ చేసే 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా కేసు ఛేదించిన సీఐ విజయ్‌కుమార్, డీఎస్ఐ శివారెడ్డి, కానిస్టేబుళ్లు రవీందర్, సంతోష్, కరుణాకర్, జాకీర్‌లను ఏసీపీ అభినందించి, రివార్డులు అందజేశారు. -
పింఛన్లు పెంచే దాకా పోరాటం
ఇబ్రహీంపట్నం రూరల్: పెంచుతామని చెప్పిన పింఛన్లు పెంచకుండా, కొత్తవి మంజూరు చేయకుండా రేవంత్‌రెడ్డి సర్కార్ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డా రు.పెన్షన్లు పెంచాలని కోరుతూ వికలాంగుల హ క్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు వికలాంగులకు రూ.6వేలు, ఆ సరా పెన్షన్ రూ.4వేలు, తీవ్ర వైకల్యం గల వికలాంగులకు రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి పోడు, ప్రజల్లోకి రాడని విమర్శించారు.పింఛన్ల పెంపుకోసం పోరాటం కొనసాగిస్తా మని స్పష్టం చేశారు.అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షడు జంగ య్య, కార్యదర్శి నాగార్జున శ్రీనివాస్‌చారి, ఉపాధ్యక్షులు వరికుప్పల వెంకటేశ్, యాచారం జంగయ్య పాల్గొన్నారు. పేదల బాధలు పట్టడం లేదు కందుకూరు: ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచడమో, సీఎం గద్దె దిగడమో తేలే వరకు పోరాడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్హాల్లో సోమవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటు సీఎం రేవంత్‌రెడ్డి, అటు మాజీ సీఎం కేసీఆర్ భూస్వామ్య కుటుంబాల నుంచే వచ్చారని, అందుకే పేదల బాధలు వారికి పట్టడంలేదని మండిపడ్డారు. అర్హులందరూ తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఎక్కడికక్కడ ధర్నాలు చేయాలని, ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దామన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు రావుగళ్ల బాబుమాదిగ, మాజీ సర్పంచులు మంద సాయిలు, మస్కు బాబు, టి.దేవేందర్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాట నిలబెట్టుకోవాలి షాద్‌నగర్‌రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచాలని లేదంటే పోరాటం ఆగదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అద్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. పట్టణంలోని గౌరీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సోమవారం వికలాంగులు, చేనేత, బీడీ, నేత కార్మికులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ మహాగర్జన సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల ఎదుట ధర్నా, 20న హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధనం, 21 నుంచి 26తేదీ వరకు పంచాయతీల ఎదుట నిరసన, 27న రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దిగ్బంధనం చేస్తామని వెల్లడించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్, జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
చైర్మన్ల పవర్ కట్
యాచారం: జిల్లాలో తొమ్మిది మంది పీఏసీఎస్ చైర్మన్లను పదవుల నుంచి తొలగిస్తూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2020 ఫిబ్రవరి 15న పీఏసీఎస్‌లకు, ఫిబ్రవరి 16న చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. 2025 ఫిబ్రవరి 15తో ఐదేళ్ల పదవీ కాలం పూర్తయింది. కాంగ్రెస్ సర్కార్ పాలకవర్గాల పదవీ కాలాన్ని మొదట ఆరు నెలల (ఆగస్టు 14) పాటు పొడిగించింది. ఆగస్టు 15న రెండో దఫా మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు లేకపోవడంతో ప్రొటోకాల్ వ్యవహారంలో మండల స్థాయిలో పీఏసీఎస్ చైర్మన్లే కీలకంగా మారారు. ఇది ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదు. అత్యధికంగా పీఏసీఎస్‌ల్లో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గెలుపొందిన ఆ పార్టీకి చెందిన వారే ఉన్నారని, కాంగ్రెస్ అధికారంలో ఉండగా వాళ్ల పెత్తనం ఏమిటని పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు జీర్ణించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆయా నియో జవర్గాల ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీల ఇన్చార్జిల ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కార్ వారు సూచించిన చైర్మన్ల కు మాత్రమే ఆరు నెలల పదవీ కాలాన్ని పొడిగిస్తు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 37 పీఏసీఎస్‌లకు గాను తొమ్మిదింటికి ఉద్వాసన పలికింది. తొలగించిన తొమ్మిది పీఏసీఎస్ చైర్మన్లల్లో నలుగురు డీసీసీబీ డైరెక్టర్లు సైతం ఉన్నారు. ఎమ్మెల్యేలే కీలకం ప్రస్తుతం జిల్లాలో పవర్ కట్ చేసిన తొమ్మిది పీఏసీఎస్‌ల్లో కొత్త వారిని ఎవరిని చైర్మన్ల సీటులో కూర్చోబెట్టాలన్న విషయంలో ఎమ్మెల్యేలే కీలకం కానున్నారు. నాలుగైదు రోజుల క్రితమే ఏ పీఏసీఎస్‌లో ఎవరు చైర్మన్‌గా ఉండాలనే విషయమై ఎమ్మెల్యేలు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు నివేదిక పంపారు. రెండు, మూడు రో జుల్లో కొత్త చైర్మన్ల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. పవర్ కట్ చేసిన పీఏసీఎస్‌లు ఇవే.. ఎంపీ పటెల్గూడ, ఆర్కే మైలారం, మాడ్గుల, ఆమనగల్లు, యాచారం, బాటాసింగారం, కందుకూరు, పాల్మాకుల, మహేశ్వరం. -
పట్టించుకోరు.. పరిష్కరించరు
కలెక్టరేట్లో అర్జీదారుల ఆవేదన ● త్రిపుల్ ఆర్ వద్దంటూ రైతుల ఆందోళన ● ప్రజావాణికి వినతుల వెల్లువ ఇబ్రహీంపట్నం రూరల్: ‘ఎన్నో సమస్యలతో ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసాలకు ఓర్చి కలెక్టరేట్‌కు వస్తున్నాం. అయినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. సమస్య వినరు. దరఖాస్తులు తీసుకొని, పొమ్మంటున్నారు. కానీ సమస్యలు తీర్చడం లేదు’ అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్‌లో నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులతో ప్రజలు బారులు తీరారు. సమస్యలు తీర్చాలని ఏళ్లుగా తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదని కలెక్టర్ తదితర అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావాణిని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 64 అర్జీలను అధికారుల స్వీకరించారు. ప్రాణాలైనా ఇస్తాం.. చిన్నసన్నకారు రైతులు సాగు చేసుకొంటూ జీవనోపాధి పొందుతన్న భూముల నుంచి త్రిపులఆర్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అలైన్మెంట్ చేసిందని కేశంపేట మండలం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల పరిధి తొమ్మిదిరేకుల గ్రామంలో 1420 ఎకరాల భూమిని 1518 మంది సాగు చేసుకొంటున్నామని తెలిపారు. ఈ భూముల్లోకి రోడ్డు వేయడానికి వీళ్లేదని, అలా చేస్తే తామంతా రోడ్డున పడతామని వాపోయారు. మాడ్గుల మండలం కలకొండ చంద్రాయన్పల్లిలో భూములను రోడ్డు కోసం తీసుకున్నా రని పేర్కొన్నారు. పెద్దలను వదిలి.. పేదల భూముల్లో రోడ్డు తీయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల భూముల్లోంచి ఉన్న అలైన్మెంట్ మార్చడం సిగ్గు చేటన్నారు. ప్రాణాలైన ఇస్తాం.. కాని భూములు ఇవ్వమన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వగా.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.ఇందిరమ్మ బిల్లు ఇవ్వాలి నా భార్య ఎక్కాల మనీష పేరిట ఇల్లు వచ్చింది. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తిచేసి 74 రోజులు గడిచింది. అయినా బిల్లు రావడం లేదు. బిల్లు ఇవ్వమంటే పీడీ నుంచి ఏఈ, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి అందరూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. –ప్రభాకర్, కందుకూరు నాలుగేళ్లుగా తిరుగుతున్నా మంచాల మండలం, అజ్జిన తండాల్లో మానాన్న పేరిట భూమి ఉంది. సర్వే నంబరు మిస్సింగ్ గురించి దరఖాస్తు చేసుకున్నాము. నాలుగేళ్లుగా తిరుగుతున్నాం. ఆర్డీఓ మొదలు తహసీల్దార్ వద్దకు తిరగని రోజు లేదు. కలెక్టర్ దగ్గరకు వస్తే అక్కడ భూమి లేదని చెబుతున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మాకు న్యాయం చేయాలి. – సరిత, గిరిజన మహిళ భూమి అమ్మలేదని.. మాకు తుక్కుగూడలో మూడు ఎకరాల భూమి ఉంది. ఇటీవల వట్రీక్స్ పేరుతో గొడవలు జరిగాయి. ప్రభుత్వ అధికారులు వచ్చి సీలింగ్ భూములని హద్దులు వేశారు. భూమి అమ్మలేదన్న అక్కసుతో కొందరు నాయకులు కావాలనే మమ్మల్ని ఇబందులకు గురిచేస్తున్నారు. మీకు భూమి లేదని హెచ్చరిస్తున్నారు. మా భూమి మాకుఇప్పించాలి. – ప్రకాష్‌రెడ్డి, తుక్కుగూడ ఇల్లు ఇవ్వకుంటే చచ్చిపోతా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇల్లు ఇవ్వకుంటే చచ్చిపోతాను. లంచం ఇస్తేనే ఇల్లు ఇస్తామని కొందరు అంటున్నారు. ఇదే విషయమై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. – సుల్తానాబేగం, రాజేంద్రనగర్ -
డయాలసిస్ కేంద్రం.. కిడ్నీ రోగులకు వరం
మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రిలోనిడయాలసిస్ కేంద్రం కిడ్నీ రోగులకు వరంగా మారింది. ఉచితంగా మెరుగైన సేవలుఅందిస్తూ భారీ ఊరట కలిగిస్తోంది. నిత్యం 15 మంది మెరుగైన వైద్య చికిత్సపొందుతూ ఉపశమనం పొందుతున్నారు. మహేశ్వరం: మహేశ్వరంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం రోగులకు వరంలా మారింది. గతంలో ఇక్కడ సెంటర్ లేకపోవడంతో బాధితులు నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు పురుగులు తీసేవా రు. రూ.3 వేల నుంచి ఐదు వేలు వెచ్చించి చికిత్స చేయించుకునే వారు. ఈ నేపథ్యంలో ఇక్కడి రోగు ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం.. మండల కేంద్రంలోని ధర్మాసుపత్రిలో 2018లో ఐ దు పడకల డయాలసిస్ సెంటర్‌ను నెలకొల్పింది. ఉచిత ప్రయాణం.. రోగులు ఉన్న ప్రాంతం నుంచి రక్తశుద్ధి కేంద్రానికి వచ్చేందుకు వీలుగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని కల్పించింది. ప్రభుత్వఒప్పందంతో అఫెక్స్ కిడ్నీకేర్ ప్రైవేట్ కంపెనీ.. ఆదీనంలోని డయాలసిస్ కేంద్రాల్లో రక్తశుద్ధి ప్రక్రియను ఉచితంగా చేయిస్తూ బాధితుల్లో మనోధైర్యాన్ని నింపుతోంది. చికిత్సతో పాటు ఉచితంగా సూది మందు ఇస్తోంది. మూడు విడతలుగా.. మండల కేంద్రంలోని డయాలసిస్ కేంద్రానికి మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు తదితర మండలాల నుంచి సుమారు 30 మంది రోగులు వస్తుంటారు. ప్రతి రోజు మూడు షిప్టుల్లో సేవలందిస్తున్నారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, 3.30 నుంచి రాత్రి 7.30 చికిత్స అందిస్తున్నారు. మరో కేంద్రం ఏర్పాటు ప్రతి బాధితుడికి వారంలో మూడు రోజుల పాటు ముందస్తుగా కేటాయించిన సమయం ప్రకారం సేవలు అందుతాయి. ఒక్కో వ్యక్తికి నాలుగు గంట ల పాటు రక్తశుద్ధి ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో డయాలసిస్ కోసం రోగులు నగరంలోని గాంధీ, ఉస్మానియా, ప్రైౖవేట్ ఆస్పత్రులకు వెళ్లేవారు. అక్కడ పేర్లు నమోదు చేసుకొని గంటల తరబడి నిరీక్షించేవారు. ప్రస్తుతం ఆ బాధలేదని బాధితులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతకేంద్రానికి రోగుల సంఖ్య పెరుగుతోంది. త్వరలో మరో ఐదు పడకల కేంద్రం ఏర్పాటు కోసం ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. జీవితం సాఫీగా.. చాలా కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాను. 2019 నుంచి సర్కారు దవా ఖానాలో ఏర్పాటు చేసి న డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాను. ఉచితంగా మెరుగైన సేవలు అందుతున్నాయి. ఆర్థిక సమస్య లేకుండా జీవితం సాఫీగా సాగుతోంది. – సాల్మన్‌రెడ్డి, రోగి, ధన్నారం వినియోగించుకోండి కార్పొరేట్ స్థాయిలో ఉచిత సేవలను అందిస్తున్నాం. బాధితులు వినియోగించుకోండి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 వేల నుంచి 10 వేల ఖర్చువుతుంది. ప్రస్తుతానికి రోజు 30 మంది కిడ్నీ బాధితులు వస్తున్నారు. 15 మందికి చికిత్స అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు దారులకు ఉచిత సేవలు అందిస్తున్నాం. – నవీన్, డయాలసిస్ కేంద్రం, ఇన్చార్జి, మహేశ్వరం సౌకర్యాలు కల్పిస్తున్నాం రోగులకు నిత్యం సేవలు అందిస్తున్నాం. రోజు మూడు షిప్టుల్లో 15 మందికి డయాలసిస్ చేస్తున్నాం. బాధితులకు సౌకర్య వంతంగా అన్ని వసతులను కల్పిస్తున్నాం. రోగుల సంఖ్య పెరిగితే పడకలు, యంత్రాలను పెంచుతున్నాం. మహేశ్వరం కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో సేవలు అందిస్తున్నాం. – డాక్టర్ అమీర్ సిద్దిఖీ, సూపరిండెంటెండ్, మహేశ్వరం బాధితులకు ఊరట తగ్గిన దూర, ఆర్థిక భారం -
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలి
ఆమనగల్లు: ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ వెంటనే మా ర్చాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.జంగారెడ్డి డిమాండ్ చేశారు. సన్న, చిన్నకారు రైతుల భూములను ఆక్రమించుకుని రోడ్డు నిర్మిస్తా రా అని ప్రశ్నించారు. పట్టణంలో సోమవారం ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు చెందిన పలువురు రైతులు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ ఫయీం ఖాద్రికి వినతిపత్రం అందించారు. అంతకుముందు హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై రాజీవ్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జంగారెడ్డి మాట్లాడుతూ.. వందల ఎకరాలు ఉన్న భూస్వాముల భూములను కాపాడటం కోసం సన్న, చిన్నకారు రైతుల భూము ల్లో రోడ్డు నిర్మించడం ఎంతవరకు సబబని అన్నా రు. రాష్ట్రంలో పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం ఉందని చెప్పుకొంటున్న నేతలు పేద రైతుల భూ ములను ఎందుకు లాక్కుంటున్నారని నిలదీశారు. నిరుపేద రైతులకు అన్యాయం జరగకుండా అలైన్మెంట్ రూపొందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్, జిల్లా నాయ కుడు పగడాల యాదయ్య, వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, ఉపాధ్యక్షుడు కానుగుల వెంకటయ్య పాల్గొన్నారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో వినతికొందుర్గు: ప్రభుత్వం ఇటీవల వెలువరించిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ప్రతిపాదనను మార్చా లని మండల పరిధిలోని తంగెళ్లపల్లి గ్రామస్తులు సోమవారం హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదించిన అలైన్మెంట్తో తమ గ్రామానికి చెందిన చాలామంది పేదల భూములు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో మాజీ సర్పంచ్ బాల్‌రాజ్, రవీందర్ రెడ్డి, శేఖర్, పెరుమాల్ రెడ్డి, శ్రీశైలం, పోచయ్య, వెంకటేశ్‌గౌడ్ ఉన్నారు. -
రైతుల ప్రయోజనాలే ముఖ్యం
అబ్దుల్లార్‌మెట్: రైతుల ప్రయోజనాల కోసమే మా ర్కెట్ కమిటీలు పని చేయాలని, మార్కెట్‌కు రైతు లు తెచ్చే సరుకుకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్య త వాటిపైనే ఉంటుందని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి స్పష్టం చేశారు. బాటసింగారంలోని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ను సోమవారం ఆయన సభ్యులతో కలిసి సందర్శించారు. బత్తాయి రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసమే పని చేస్తోందని అన్నారు. ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. అన్ని మార్కెట్ కమిటీల పనితీరును సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. కోహెడలో ఏర్పాటు చేయబోయే మార్కెట్ నిర్మా ణం త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు సునీల్ రెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్‌చారి, డైరెక్టర్లు, మార్కెట్ ఈఈ ప్రసాద్‌రావు, ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎల్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కుంగిన ‘బావి’
శంకర్పల్లి: మండల పరిధిలోని జన్వాడలో గతంలో తాగునీటి కోసం ఉపయోగించే బావి నాలుగు రోజుల క్రితం కుంగింది. దీంతో అధికారులు అప్రమత్తమై.. దాని దగ్గరకు ఎవరూ వెళ్లకుండా చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. బావి పక్కన విద్యుత్ స్తంభం కోసం గుంతను తవ్వి, దానిని నిలబెట్టారని, అది క్రమంగా భారీ గుంతగా మారి విద్యుత్ స్తంభం నెలకొరిగిందని గ్రామస్తులు తెలిపారు. దీంతో పక్కనే ఆనుకొని ఉన్న బావి సైతం కుంగిందని పేర్కొన్నారు. ఏళ్లనాటి బావి కుంగడంపై ఆ గ్రామస్తులు ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దానిని పునరుద్ధరించాలని అధికారులను కోరుతున్నారు. -
మద్యం మత్తులో పోలీసు వాహనాన్ని ఢీకొన్న కారు
యువతి మృతి ● డీఐ, కానిస్టేబుల్‌కు గాయాలు లంగర్‌హౌస్: మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ కొందరు విద్యార్థులు పోలీసు వాహనాన్ని ఢీకొట్టగా.. ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకటరాములు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అత్తాపూర్‌కు చెందిన హరీష్ రెండు రోజుల క్రితం తాము ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేశారు. వేడుకలు ఘనంగా జరగడంతో మిత్రులకు పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇక్ఫాయ్ యూనివర్సిటీ లో బీబీఏ చదువుతున్న తన స్నేహితులను పార్టీకి ఆహ్వానించాడు. పంజాబ్‌కు చెందిన కాశ్వి విజయ్ వర్గి(20), ఆమె సోదరుడు ఇంటర్ విద్యార్తి తనిష్క్ విజయ్ వర్గి, రియా విజయ్వర్గిలు పార్టీకి హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కోఠిలో ఉంటున్న అక్షిత్ సింగ్ కారులో వారు నలుగురితో పాటు కూకట్‌పల్లికి చెందిన లిఖిత షిండేతో కలిసి బయల్దేరారు. మొఘల్‌నగర్ రింగ్ రోడ్డు వైపు వినాయక నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్‌జామ్ కావడంతో పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 112 నుంచి మూసీ పక్క రోడ్డులో వెళ్లి లంగర్‌హౌస్ మీదుగా పీ ఇంద్రారెడ్డి ఫ్లై ఓవర్ ఎక్కారు. బ్రిడ్జి దిగే క్రమంలో అతివేగం కారణ ంగా కారు ముందు వెళుతున్న పోలీసు వాహనాన్ని వెనక నుంచి బలంగా ఢీకొంది. దీంతో కారు వెనక సీట్లో కూర్చున్న కాశ్వి సింగ్ ఛాతి, తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తప్పిన పెను ప్రమాదం ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ముందు కూర్చున్న వారు గాయాలతో బయటపడ్డారు. వెనక కూర్చున్న కాశి మృతిచెందగా ఆమె సోదరుడు తనిష్క్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే పోలీసు వాహనాన్ని ఢీ కొట్టగా పోలీసు వాహనం ముందు వెళుతున్న డీసీఎంను ఢీ కొట్టింది. అయితే పోలీసు వాహన డ్రైవర్‌తో పాటు, డీసీఎం డ్రైవర్ అప్రమత్తమై హాండ్ బ్రేక్ వేయడంతో వాహనాలు కొద్దిగా ముందుకు వెళ్లి ఆగిపోయాయి. లేని పక్షంలో ముందు ఉన్న ఊరేగింపులపైకి దూసుకెళ్లి పెను ప్రమాదం జరిగేది. ఈ ఘటనలో డీఐ సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా కానిస్టేబుల్ వాజీద్, హోంగార్డు అలీముద్దీన్‌ను స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాశ్వి మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
నందిగామ: పాత జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన నందిగామ శివారు నూజివీడు పరిశ్రమ సమీపంలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పరిశ్రమ సమీపంలోని రోడ్డు పక్కన చెట్ల పొదల్లో ఓ వ్యక్తి(65) మృతదేహం ఉందన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. బాలికపై లైంగికదాడి ఇద్దరిపై కేసు నమోదు యాచారం: ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి నందివనపర్తి గ్రామానికి చెందిన మైనర్(14)ను అదే గ్రామానికి చెందిన జి.క్రాంతి, బి.క్రాంతిలు రాత్రి వేళలో మాయమాటలు చెప్పి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. అక్కడ బాలికపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. సమాచారం మేరకు అదే రాత్రి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఆదివారం ఇద్దరిపై కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ, పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశామని సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు ఆపరేటర్ మృతి ఆమనగల్లు: ప్రమాదవశాత్తు ఆపరేటర్ మత్తి చెందిన సంఘటన తలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి గ్రామానికి చెందిన బాషామోని మహేశ్(25).. నాలుగేళ్లుగా శ్రీ వేంకటేశ్వర మినరల్స్ కంపెనీలో ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం విధి నిర్వహణలో భాగంగా ఒక లారీలో పౌడర్‌ను లోడ్ చేశారు. తిరిగి వచ్చే క్రమంలో డ్రైవర్ వెంకటేశ్వర్లు లారీని నిర్లక్ష్యంగా ముందుకు తీయగా.. మహేశ్ ఫోర్క్ లిఫ్ట్ కింద పడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి, మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం దోమ: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రే కీలకమని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి పట్టణంలోని ఆయన నివాసంలో జీహెచ్ఎంలుగా పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే సన్మానించారు. దిర్సంపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రూప్‌సింగ్‌కు ఇటీవలే జీహెచ్ఎంగా పదోన్నతి లభించడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
లాభాల ‘బంతి’
షాబాద్: ఉద్యానపంటల సాగులో డ్రిప్ పద్ధతిని అవలంభిస్తే నీటిని పొదుపు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పండుగలు, ఇంటి గుమ్మాల అలంకరణకు, ఆలయాల్లో నిర్వహించే పూజలకు అవసరమయ్యే బంతి పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ నీటి వనరులతో బంతిని సాగు చేస్తూ, సస్యరక్షణ చేపడితే మంచి ఆదాయాన్ని పొందవచ్చు అని చేవెళ్ల డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి కీర్తి తెలిపారు. అన్ని కాలాల్లో అనుకూలంగా సాగు చేసే బంతిపై సలహాలు, సూచనలు ఆమె మాటల్లోనే.. ఏపుగా పెరిగితే.. బంతిలో ఆఫ్రికన్, ఫ్రెంచ్ మేరీ గోల్డ్ ఉన్నాయి. నీటి వసతి కలిగిన అన్ని కాలాలు, సారవంతమైన గరప నేలలు, నీరు త్వరగా ఇంకిపోయే నేలలు బంతి సాగుకు అనుకూలం. ఎకరానికి వెయ్యి గ్రాముల విత్తనాలు అవసరం. మడులను తయారు చేసి విత్తనాలను చల్లుకోవాలి. బంతి మొక్కలు ఏపుగా పెరిగితే, పూల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. సాగుకు విత్తనాల ద్వారా లేదా కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేయవచ్చు. కోతకు ముందు నీరుపడితే.. నెల వయసు కలిగిన బంతి మొక్కలు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. నాటుకు వచ్చిన నారును సాయంత్రం వేళల్లో నాటుకోవాలి. నాటిన 60 రోజుల తర్వాత పూత దశ వచ్చేవరకు నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి ఎద్దడితో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. పూలు బాగా విచ్చుకున్న తర్వాతనే కోయాలి. అదీ ఉదయం లేదా సాయంత్రం మాత్రమే కోయాలి. కోతకు ముందు నీటి తడి ఇచ్చినట్లయితే పూలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. సాధారణంగా ఎకరానికి నాలుగు నుంచి ఐదు టున్నుల దిగుబడి వస్తుంది. సస్యరక్షణ చర్యలు పేను.. పూల మొగ్గలను ఆశించి నష్ట పరుస్తాయి. వాటి నివారణకు లీటర్ నీటికి మోనోక్రొటోఫాస్ 1.5 మిలీను కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. తామర పురుగులు.. ఆకులు, పూల నుంచి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మొగ్గలు గోదుమ రంగుకు మారి ఎండిపోతాయి. దీని నివారణకు మోనోక్రొటోఫాస్ 1.5 మిలీ.. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొగ్గతొలిచే పురుగులు.. లార్వాలు పూల మొగ్గలను తొలిచేస్తాయి. వీటి నివారణకు ఎండోసల్ఫాన్ 2 మిలీను.. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్లు, నివారణ నారుకుళ్లు తెగుళ్లు: నీటి తడి ఎక్కువగా ఉండి, వేడిగా ఉన్న చోట ఈ తెగులు వ్యాపిస్తుంది. లేత మొక్కలు చనిపోతాయి. మడులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. నేలను లీటర్ నీటికి 2 గ్రాముల కాఫ్టాన్ మందుతో తడపాలి. ఆకు మచ్చ తెగులు.. మొక్కల్లో బూడిద రంగు, లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి. లీటర్ నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి. సిరులు కురిపిస్తున్న సాగు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి యాజమాన్య పద్ధితిని అవలంబిస్తే మేలు చేవెళ్ల డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి కీర్తి ఎరువుల వాడకం మడులను తయారు చేసే సమయంలో బాగా చివికిన పశువుల ఎరువు ఎకరానికి 20 టన్నులు వేసి కలియ దున్నుకోవాలి. దీంతో పాటు 20 నుంచి 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్‌ను వేసుకోవాలి. నాటిన 37 రోజులకు 20 నుంచి 40 కిలోల నత్రజనిని వేసి నీరు పట్టాలి. పాలిడాల్ పాడి చల్లడం వలన చీమలు, చెదను నివారించుకోవచ్చు. విత్తిన విత్తనాలు వారం రోజుల్లో మొలకెత్తుతాయి. ఉద్యాన పంటలతో లాభాల పంట పడుతుంది. నీటి వసతి కలిగిన ప్రాంతం.. బంతి సాగుకు అనుకూలమైనది. తక్కువ పెట్టుబడితో, యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు అని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. -
యూరియా వచ్చింది.. కలత తీరింది!
యాచారం: యూరియా కొరత కారణంగా నిన్నమొన్నటి వరకు కర్షకులు కలత చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. సాగు పనులు వదిలి.. శాంతడంత పొడవుగా పీఏసీఎస్, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద గంటల కొద్దీ క్యూ కట్టారు. దీనికి స్పందించిన ప్రభుత్వం, అధికారులు.. ‘యూరియా కోసం రైతులు ఇబ్బంది పడొద్దు. అవసరం మేరకు స్టాక్ వస్తోంది. అందరికీ అందజేస్తాం’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా.. తాజాగా సెలవు రోజైన ఆదివారం.. యాచారం మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా పంపిణీ చేశారు. 450 మందికి టోకెన్లు ఇచ్చి, పోలీసుల సమక్షంలో ఒకొక్కరికి రెండు బస్తాల చొప్పున అందజేశారు. సరఫరా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గత నాలుగైదు దఫాలుగా యూరియా కోసం వందలాది మంది రైతులు ఆందోళన చెసిన విషయం విధితమే. -
ఎత్తే సవాలైంది!
సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన శోభాయాత్ర ఆదివారం తెల్లవారుజామున ముగిసినా హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగింది. సోమవారం ఉదయానికి ఇది పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈసారి మండపాల సంఖ్యతోపాటు విగ్రహాల ఎత్తూ గణనీయంగా పెరిగిపోవడంతోనే నిమజ్జన ప్రక్రియలో కొంత జాప్యం జరిగినట్లు నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రకటించారు. ‘ఆఫ్‌లైన్’లో రెట్టింపు వరకు.. నగర కమిషనరేట్ పరిధిలో గణేశ్ మండపాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ఏడాది మొత్తం 12,030 విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. అనుమతులు తీసుకోకుండా మరో 40 వేల మండపాలు ఏర్పాటయ్యాయి. క్షేత్రస్థాయి అధికారులు ఆఫ్‌లైన్ విధానంలో వాటి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆయా గణపతి విగ్రహాల ఎత్తు, నిమజ్జన ఊరేగింపు మార్గం తదితరాలను గుర్తిస్తూ అది నిమజ్జనం అయ్యే వరకు పర్యవేక్షించారు. దీనికోసం ప్రతి విగ్రహానికి ఓ క్యూఆర్ కోడ్ కేటాయించారు. ఈ మండపాల నుంచి నిమజ్జనం జరిగే ప్రాంతం వరకు ప్రతి మార్గాన్నీ పర్యవేక్షించిన అధికారులు అడ్డంకులు లేకుండా కృషి చేశారు. ‘లెక్కల్లో’లేని ఆ విగ్రహాలు నగరంలో ఏర్పాటైన కొన్ని విగ్రహాలతోపాటు పొరుగు కమిషనరేట్లు, జిల్లాల నుంచి వచ్చిన విగ్రహాల ఊరేగింపులతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వీటిలో కొన్ని ఏకంగా 40 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఫలితంగా ఆయా మార్గాల్లో ఉన్న కొన్ని కరెంట్ వైర్లు, చెట్లు, కేబుల్ తీగలు విగ్రహాలకు అడ్డంకు లుగా మారాయి. మోనప్ప ఐలాండ్–రాజ్‌భవన్ మార్గంలో శనివారం రాత్రి ఓ విగ్రహం చెట్టు కొమ్మలకు తగిలి వాహనంపైనే వెనక్కు ఒరిగిపోయింది. దీంతో పంజగుట్ట ప్రాంతంలో రిజర్వ్‌లో ఉంచిన క్రేన్‌ను తీసుకువచ్చి విగ్రహానికి ఎలాంటి నష్టం లేకుండా వాహనంపై నిలబెట్టారు. ఇలా మరికొన్ని చోట్లా జరగడంతో ఆయా మార్గాల్లో వాహనాలు ఆగిపోయి శోభాయాత్రకు అవాంత రాలు ఏర్పడ్డాయి. నెక్లెస్‌రోడ్‌లోకి చేరిన 900 విగ్రహాలు ఈ ఏడాది మూడోరోజు నుంచి పదకొండో రోజు వరకు దాదాపు 1.4 లక్షల విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో 1.2 లక్షల విగ్రహాలు బేబీ పాండ్స్, ఇతర చిన్న చెరువుల్లో నిమజ్జనం కాగా.. మిగిలినవి హుస్సేన్‌సాగర్‌సహా ఇతర చెరువుల్లో జరిగాయి. ఐదడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న 4,700 విగ్రహాలు శనివారం ఉదయం నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యాయి. ఆదివారం మధ్యాహ్నానికి దాదాపు 900 విగ్రహాలతో ఉన్న లారీలు మిగిలిపోవడంతో వీటిని నెక్లెస్ రోడ్డులోకి మళ్లించారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్, సంజీవయ్య పార్కు వద్ద ఉన్న కొన్ని క్రేన్ల ద్వారా నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు పాక్షికంగా ఎత్తేశారు. సోమవారం తెల్లవారుజాముకు ఈ క్రతువును సంపూర్ణం చేసి, ఆంక్షల్ని ఎత్తేయనున్నారు. విగ్రహాల ఎత్తు పెరగడమే దీనికి కారణం గత ఏడాదితో పోలిస్తే తగ్గిన ఉదంతాలు 40 గంటలు అవిశ్రాంతంగా విధులు : సీపీ ఆనంద్ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల సహకారంతో బడా గణేశుడి నిమజ్జనం గతేడాది కంటే ముందుగా పూర్తయింది. మాకు సహకరించిన ఉత్సవ సమితితోపాటు మండపాల నిర్వాహకులకు కృతజ్ఞతలు. ఊరేగింపుల్లో జరిగిన చిన్నచిన్న ఘర్షణలపై వివిధ ఠాణాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 170 మంది పోకిరీలతోపాటు జేబుదొంగల్ని పట్టుకున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇలాంటి నేరాల సంఖ్య తగ్గింది. సామూహిక నిమజ్జనం కోసం దాదాపు 40 గంటల నిర్విరా మంగా పని చేసిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు. – సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ -
రేపు జాబ్ మేళా
ఇబ్రహీంపట్నం రూరల్: నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ అధికారి జయశ్రీ ఆదివారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. ఈనెల 9న (మంగళవారం) ఉదయం 10.30 నుంచి 2.30 గంటల వరకు హైదరాబాద్‌లోని మల్లేపల్లిలోని ఉపాధి కార్యాలయం ఐటీఐ క్యాంపస్‌లో జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లోని రిటైల్, ఈ–కామర్స్, బ్యాంకింగ్, వాయిస్ నాన్ వాయిస్ ప్రాసెస్, నాన్ ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పోస్టులు ఉన్నట్టు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, ఐటీఐ డిప్లమా పూర్తి చేసి ఉండాలన్నారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు. వివరాలకు 90630 99306, 89771 75394 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. చేవెళ్ల: ట్రాఫిక్ పోలీసు కేసుల పరిష్కారానికి సోమవారం నుంచి ఈనెల 13వ తేదీవరకు చేవెళ్ల కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్.వెంకటేశం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మద్యం తాగి వాహనాలు నడిపించిన కేసులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడిన వారు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి పెండింగ్ కేసులు తక్కువ జరిమానాతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆధార్‌కార్డు, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌లతో రావాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 99632 95757, 94906 17461 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. షాద్‌నగర్‌రూరల్: పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనం ఆవరణలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో రెండు రోజులపాటు కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె తెలిపారు. గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 12, 13 తేదీల్లో సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రత్యక్ష పద్ధతి (ఆఫ్‌లైన్), పరోక్ష పద్ధతి (ఆన్లైన్)లో సెమినార్ ఉంటుందన్నారు. ప్రజెంటేషన్ ఇచ్చేవారు తగిన రుసుము చెల్లించి పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారని, ఉత్తమ ప్రజెంటేషన్ ఇచ్చిన వారికి బహుమతులు, ప్రజెంటేషన్‌లో పాల్గొన్న వారిందరికీ కిట్స్, సర్టిఫికెట్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు. వివరాలకు 97034 41345, 97059 67553, 79010 97702 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. షాద్‌నగర్‌రూరల్: పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ(డిగ్రీ) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమైనట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐఎంఎస్సీలో అడ్మిషన్ పొందాలనేకునే విద్యార్థినులు ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బీపీసీలో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. ఎస్టీలకు 30, బీసీలకు 2, ఎస్సీలకు 2, ఓసీలకు 2, అనాథ (ఆర్ఫాన్)లకు 2, స్పోర్ట్స్ కోటా కింద 2 సీట్లు ఉన్నట్టు తెలిపారు. అడ్మిషన్ పొందాలనుకునే వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో నేరుగా కళాశాలలో సంప్రదించాలని చెప్పారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థినులు డిగ్రీ, పీజీని పూర్తి చేసుకుంటారన్నారు. వివరాలకు 89789 42246, 97059 67553, 97034 41345 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కందుకూరు: మండలంలోని లేమూరు పరిధి లోని శ్రీదేవి, భూదేవి సమేత స్వయంభూ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆదివారం మాజీ మంత్రులు కె.జానారెడ్డి, జి.చిన్నారెడ్డి, డీకే సమరసింహారెడ్డి దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం గురించి ట్రస్ట్ చైర్మన్ గూడూరు కొండారెడ్డి, దేవాలయ విశిష్టత గురించి స్థపతి శివనాగిరెడ్డి వారికి వివరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఢిల్లీ గణేశ్, నాయకులు మూల భాస్కర్‌రెడ్డి, పాండు, కె.జైపాల్‌రెడ్డి, బాలకృష్ణ, ఐలయ్య, బీరప్ప, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
గణేశ్ నిమజ్జనోత్సవం విజయవంతం
● 2 లక్షల 70 వేల విగ్రహాల నిమజ్జనం ● 11 వేల టన్నుల వ్యర్థాల సేకరణ లక్డీకాపూల్ : గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా జరిగిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు గ్రేటర్ వ్యాప్తంగా 2 లక్షల 70 వేల గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేశారన్నారు. పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, పోలీస్, విద్యుత్, హెచ్ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ అభి నందనలు తెలిపారు. పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యంతోపాటు టాయిలెట్లు, సరిపడా క్రేన్ల ఏర్పాటు తదితర అంశాల్లో జీహెచ్ఎంసీ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. నిమజ్జనం మార్గం పొడవునా ఏర్పాటు చేసిన గణేశ్ యాక్షన్ టీమ్స్ రోడ్లపై చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేప ట్టాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో ఫలితం కనిపించింది. రోడ్డు సేఫ్టీ డ్రైవ్‌లో నగరంలోని రోడ్లకు మరమ్మతులు చేపట్టడం, ప్రధానంగా నగరంలో ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేశ్లతో సహా నిమజ్జన శోభాయాత్ర జరిగే 303 కిలోమీటర్ల మేర మార్గం మరమ్మతులు చేపట్టడంతో ఊరేగింపు సాఫీగా, సురక్షితంగా, వేగంగా జరిగిందని పేర్కొన్నారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తూ 15 వేల మంది సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించడంతో పారిశుద్ధ్య నిర్వహణలో ఇబ్బందులు కనిపించలేదన్నారు. 72 కృత్రిమ కొలనులతో ప్రధాన చెరువులపై ఒత్తిడి లేకుండా, ట్రాఫిక్ జామ్‌లు లేకుండా, భక్తులు స్థానికంగానే నిమజ్జనం అయ్యేలా చూడగలిగామన్నారు. జీహెచ్ఎంసీ కల్పించిన ఉచిత భోజన సౌకర్యం భక్తులు, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. వేడుకల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలను మేయర్, కమిషనర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారి నిరంతర సేవలతోనే ఇప్పటి వరకూ 11 వేల అధిక టన్నుల వ్యర్థాలను సేకరించి ప్రాసెసింగ్ సెంటర్‌కు పంపామన్నారు. కార్మికుల సేవలు భేష్ అంటూ ప్రశంసించారు. -
లోటులోనే లోతులోనే
సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025న్యూస్రీల్సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతంనమోదైంది. వికారాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఈసీ, మూసీ వాగులు పొంగిపొర్లాయి. జంటజలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు వరద పోటెత్తింది. కడ్తాల్, మాడ్గుల, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, జిల్లెడు చౌదరిగూడ, హయత్‌నగర్, గండిపేట మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఆయా మండలాల్లో ఇప్పటికీ పలు చెరువులు, కుంటలు నీళ్లు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు ఆశించిన స్థాయిలో నీరు చేరక వెలవెలబోతోంది. ఎగువ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడానికి తోడు వరదనీటిని మోసుకొచ్చే కాల్వలు, గొలుసు కట్టు చెరువులు, కుంటలు ధ్వంసం కావడమే ఇందుకు కారణం. జిల్లాలో 2,100పైగా చెరువులు, కుంటలు ఉండగా, వీటిలో సగానికి పైగా నీళ్లు లేక వెలవెలబోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక.. కడ్తాల్ మండలంలో సాధారణం కంటే అతి తక్కువగా 47.18 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, మాడ్గులలో 48.60, యాచారంలో 49.95, మంచాలలో 50.93 సెం.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. గత ఏడాది జిల్లాలో నమోదైన వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది చాలా తక్కువ నమోదైంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు ఇప్పటికీ పాతాళానికే పరిమితమయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం ఫీజో మీటర్లో 18 మీటర్ల లోతులో నీటి ఆనవాళ్లు కన్పించగా, మంచాల మండలంలో 12.14 మీటర్ల లోతుకే పరిమితమయ్యాయి. ఇక శంకర్పల్లి మండలంలో 10.99 మీటర్ల లోతులో నీటి ఆనవాళ్లు లభ్యం కాగా, తలకొండపల్లిలో 10.88 మీటర్ల లోతులో ఉన్నాయి. యాచారం మండలంలో 10.64 మీటర్ల లోతుకు పరిమితమయ్యాయి. ఏకధాటి వర్షాలు, భారీ వరదలు పోటెత్తినప్పటికీ జిల్లాలోని భూగర్భజల మట్టం ఆశించిన స్థాయిలో పైకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు నందిగామ, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, కేశంపేట, కందుకూరు, బాలాపూర్, చౌదరిగూడెం, చేవెళ్ల ఫీజో మీటర్లలో మాత్రం నాలుగు మీటర్ల లోతులోనే నీటి ఆనవాళ్లు కన్పిస్తుండటం విశేషం. కనిపించని ఆనవాళ్లు జిల్లాలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు ఇంకా 12.09 సెంటీమీటర్ల లోటు పాతాళంలోనే గంగమ్మ అడుగునే భూగర్భ జలాలు బోసిపోయిన పలు చెరువులు, కుంటలుమాసం సాధారణం నమోదైంది జూన్ 9.72 7.38 జూలై 14.43 22.18 ఆగస్టు 15.33 31.64 సెప్టెంబర్ 3.00 0.95 సంవత్సరం సాధారణం నమోదైంది 2022–21 69.46 122.52 2021–22 69.46 95.35 2022–23 69.46 112.20 2023–24 72.58 72.19 2024–25 72.58 93.74 2025–26 75.05 62.15అప్పుడే కరువు ఛాయలు మంచాల మండలంలో 23 గ్రామాలు ఉండగా, వీటిలో ఆరుట్ల, మంచాల మినహా ఇతర గ్రామాల్లోని చెరువులు, కుంటలకు చుక్క నీరు చేరలేదు. ఇక్కడి రైతులు పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడుతుంటారు. బోరుబావులు కూడా సరిపడా నీరు పోయక పోవడంతో వరినాట్లకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. గతంలో రెండు మూడు ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు ప్రస్తుతం అర ఎకరం, ఎకరానికే పరిమితమయ్యారు. వినాయక చవితి వేడుకల్లో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనం కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో నాగార్జున సాగర్ ఇతర ప్రాజెక్టుల వద్దకు తీసుకెళ్లాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోచ్చు. తాళ్లపల్లిగూడలో చెరువులో నీళ్లు లేక చెరువు మధ్యలో భారీ గుంత తవ్వి అందులో వినాయక విగ్రహాన్ని ఉంచి, బోరు నీటితో నింపి నిమజ్జనం చేయాల్సి వచ్చింది. అదేవిధంగా జాపాలలోని మధ్యకుంటలోకి ఇప్పటి వరకు చుక్కనీరు చేరలేదు. -
అలైన్మెంట్ మార్చి ఆగం చేస్తారా
ఆమనగల్లు: పెద్దోళ్ల కోసం ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చి పేదల బతుకులను ఆగం చేస్తారా అంటూ భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్టణంలో ఆదివారం నిరసన చేపట్టారు. తలకొండపల్లి మండలం వెంకట్రావ్పేట, గౌరిపల్లి, జంగారెడ్డిపల్లి, చంద్రదన, ఆమనగల్లు మున్సిపల్ పరిధిలోని సంకటోనిపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆమనగల్లు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. అనంతరం ర్యాలీగా వచ్చి హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు ధర్నాలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. బడాబాబులు, భూస్వాముల భూములను రక్షించేందుకు కొత్తగా అలైన్‌మెంట్‌ను తీసుకువచ్చి సన్న, చిన్నకారు రైతుల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న రైతులు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆమనగల్లులో భూ నిర్వాసితుల ఆందోళన భూములు ఇచ్చేది లేదు షాద్‌నగర్: ప్రాణాలైనా ఇస్తాం కానీ రీజినల్ రింగ్ రోడ్డుకు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. ట్రిపుల్ఆర్ భూసేకరణకు వ్యతిరేకంగా ఆదివారం కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో ట్రిపుల్ఆర్ భూసేకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్మిస్తున్న రీజనల్ రింగురోడ్డు తమ వ్యవసాయ భూముల నుంచి వెళ్తోందని, రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణంలో భూములు పోతే జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు రంగయ్య, మాజీ సర్పంచ్‌లు భీమయ్య, బాల్‌రాజ్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరాటేతో ఆత్మస్థైర్యం పెంపు
శంకర్పల్లి: కరాటే నేర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని మోకిలలోని ఓ ప్రైవేట్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి సక్సెస్ షోటోకాన్–2025 చాంపియన్ పోటీలను మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలం మధు ప్రారంభించగా.. ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. పోటీలను టి.కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా మోకిలకి చెందిన మన్నె వెంకటేశ్ స్పాన్సర్ చేశారు. పలు జిల్లాలకు చెందిన సుమారు 500 మంది 5 నుంచి 16 ఏళ్లలోపు చిన్నారులు తమ ప్రతిభ చాటారు. కార్యక్రమంలో సక్సెస్ షోటోకాన్ టెక్నికల్ అడ్వజైర్ రవీందర్, ఫౌండర్ అనిల్ కుమార్, కోచ్‌లు శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. -
చిలుకూరు ఆలయం మూసివేత
మొయినాబాద్: చంద్ర గ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని ఆదివారం సాయంత్రం మూసివేశారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. రాత్రి చంద్రగ్రహణం ఉండటంతో సాయంత్రం 4 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. గర్భగుడి తలుపులు మూసి తాళాలు వేశారు. ఆలయ గోపురం ప్రధాన ద్వారాన్ని సైతం మూసివేశారు. గ్రహణం తరువాత సోమవారం ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరువనున్నారు. స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్టు అర్చకుడు రంగరాజన్ తెలిపారు. మైసిగండి మైసమ్మ ఆలయం .. కడ్తాల్: చంద్రగ్రహణం సందర్భంగా మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వాహకులు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సోమవారం ఉదయం 8 గంటలకు ఆలయ సంప్రోక్షణ, ప్రత్యేక పూజల అనంతరం తిరిగి భక్తుల దర్శనానికి అనుమతి కల్పించనున్నట్టు తెలిపారు. -
కుక్కను తప్పించబోయి..
● ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన కారు ● ముగ్గురికి గాయాలు మొయినాబాద్: అతివేగంగా వెళ్తున్న కారు అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జువగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మొయినాబాద్ పీఎస్ పరిధిలోని అమ్డాపూర్ రోడ్డులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అతని స్నేహితులు అభిలాష్, ఆనంద్, గురు, మౌలి సాఫ్ట్వేర్ ఉద్యోగులు. శనివారం వీరంతా టీఎస్ 09 ఎఫ్డబ్ల్యూ 2607 నంబరు కారులో శంషాబాద్ మండలంలో ఓపెన్ ప్లాట్లు చూసేందుకు వెళ్లారు. సాయంత్రం 5.20 గంటలకు తిరిగి అమ్డాపూర్ మార్గంలో వెళ్తుండగా నజీబ్‌నగర్– ముర్తూజగూడ మధ్య కుక్క అడ్డుగా వచ్చింది. దీన్ని తప్పించే క్రమంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న సాయికృష్ణ హ్యాండ్ బ్రేక్ వేశాడు. దీంతో కారు రోడ్డు ఎడమ వైపునకు దూసుకుపోయి, పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ఈ ధాటికి విద్యుత్ తీగలు తెగిపోయి, ట్రాన్స్ఫార్మర్ కారుపై పడింది. అప్పటికే వైర్లు తెగిపోవడంతో ఎవరికీ షాక్ తగలలేదు. డ్రైవింగ్ సీట్లో ఉన్న సాయికృష్ణ కారులోనే ఇరుక్కుపోయాడు. ఇతనితో పాటు మరో ఇద్దరికి గాయాలు కాగా, మిగిలిన ఇద్దరు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. అక్కడే ఉన్న స్థానికులు గడ్డపారతో డోర్లు తొలగించి అందరినీ బయటకు లాగారు. ప్రమాదంతో భయాందోళనకు గురైన సాయికృష్ణ స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని 108లో ఆస్పత్రికి తరలించారు. ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
లడ్డూలు.. రూ.లక్షలు!
● అత్తెల్లి బ్రదర్స్ పాట రూ.16,11,001 ● ‘రచ్చబండ’ వేలంలో గణేశ్ లడ్డూ సొంతం చేవెళ్ల: పట్టణంలోని రచ్చబండ వినాయకుడి లడ్డూ ప్రసాదం రూ.16,11,001 పలికింది. శనివారం రాత్రి నిర్వహించిన శోభాయాత్రలో భాగంగా నిర్వహించిన వేలం పాటలో అత్తెల్లి బ్రదర్స్ స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. గతేడాదికన్నా ఈసారి రూ.8 వేలు అధికంగా పలికింది. శంకర్‌పల్లిలో.. శంకర్పల్లి: మున్సిపాలిటీ, మండలంలో గణనాథుని లడ్డూల ధరలు భారీగా పలికాయి. మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ హనుమాన్ మందిర్ గణేశ్ లడ్డూను మణికొండ మల్లారెడ్డి రూ.8 లక్షలకు దక్కించుకున్నారు. మండలంలోని మాసానిగూడ హనుమాన్ మందిర్ గణేశ్ లడ్డూను శంకర్పల్లి కురుమ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీశైలం రూ.7.20 లక్షలకు సొంతం చేసుకున్నాడు. విఠలేశ్వరాలయం వద్ద ప్రతిష్టించిన స్వామివారి లడ్డూను రూ.9,11,116 ఏనుగు పవన్ కుమార్‌రెడ్డి, ఏనుగు అనిల్ కుమార్‌రెడ్డి సోదరులు దక్కించుకున్నారు. నిర్వాహకులు వీరిని శాలువాతో ఘనంగా సన్మానించారు. -
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
● యాజమాన్యం నిర్లక్ష్యమేనని బాధితుల ఆందోళన ● కేఫ్ యజమాని హామీతో సద్దుమణిగిన వివాదం శంకర్పల్లి: కేఫ్‌లో విద్యుత్ మరమత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మోకిల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. కేఫ్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని, న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు శంకర్పల్లి– హైదరాబాద్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాజ్‌పేట్ గ్రామానికి చెందిన బద్రి శ్రీనివాస్(42)కి భార్య నాగమణి, కూతుళ్లు గౌతమి, గాయత్రి, కొడుకు సతీష్ ఉన్నారు. ఇక్ఫాయ్ కళాశాల ఎదురుగా ఉన్న కేఫ్– 3లో శ్రీనివాస్ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. శనివారం కేఫ్‌లో విద్యుత్ మరమ్మతులు చేసే సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే శంకర్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆగ్రహించిన బాధితులు మృతదేహంతో కేఫ్ ఎదుట ఆందోళన చేపట్టారు. చివరికి పోలీసులు, గ్రామస్తుల జోక్యం చేసుకుని యాజమానితో మాట్లాడారు. బాధితుని కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకోని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరబాబు తెలిపారు. -
ఉపాధ్యాయుల చేతుల్లోనే భవిష్యత్తు
కుల్కచర్ల: ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు దాగి ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లలోని రవీంద్రభారతి పాఠశాలలో టీచర్స్‌డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అత్యంత గౌరవప్రదమైన ఉపాధ్యాయ, విద్యారంగ వ్యవస్థను ప్రభుత్వాలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు పాఠ్యంశాలతో పాటు క్రమశిక్షణ, విలువలు, సంప్రదాయాలు, దేశభక్తి, జాతీయ భావాలను నేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో పీఎన్‌పీఎస్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య ముదిరాజ్, పాఠశాల డైరక్టర్ వెంకట్రాములు, ప్రిన్సిపాల్ అబ్దుల్ పర్సన్, రాంచంద్రయ్య, పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: విధులు ముగించుకుని ఇంటికి తిరిగివెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ ప్రైవేటు ఉద్యోగి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. మహేశ్వరం మండలం మంకాల గ్రామానికి చెందిన బరిగెల నర్సింగ్‌రావు (27) రావిర్యాలలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజులాగే శుక్రవారం విధులకు హాజరై అర్ధరాత్రి తన బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. సర్వీస్‌రోడ్డు రావిర్యాల కమాన్ వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నర్సింగ్‌రావు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. నర్సింగ్‌రావుకు ఏడాది క్రితమే వివాహం అయ్యింది. బెల్ట్ షాపులపై పోలీసుల దాడి మొయినాబాద్: డ్రై డే రోజు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులపై పోలీసులు దాడి చేశారు. మండల పరిధిలోని అమ్డాపూర్‌లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో శనివారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. శ్రీనివాస కిరాణ షాపులో ఆరు లీటర్ల మద్యం, రాజు కిరాణ షాపులో ఆరు లీటర్ల బీర్లు, జి.ప్రభాకర్ కిరాణ షాపులో 15 లీటర్ల బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రేపు కోకాపేటకు సీఎం రాక గోదావరి జలాల తరలింపు పనులకు శ్రీకారం మణికొండ: హైదరాబాద్ ప్రజలకు గోదావరి తాగునీటి తరలింపు, ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్సాగర్లను నింపటం, మూసీ పునరుద్ధరణ పనులను ప్రారంభించేందుకు ఈ నెల 8వ తేదీ (సోమవారం) ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కోకాపేటకు వస్తున్నారని ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ వెల్లడించారు. కోకాపేట నియోపోలీస్ లేఅవుట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపైకి వెళ్లేందుకు నిర్మించిన ఫ్లై ఓవర్ ట్రంపెట్‌ను సీఎం ప్రారంభిస్తారని వివరించారు. శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాల అనంతరం బహిరంగ సభ ఉంటుందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. తాగునీటి తరలింపు పనులను జలమండలి వారు రూ.7,360 కోట్ల వ్యయంతో చేపడుతున్నారని తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి ఫేజ్–1, ఫేజ్–2ల రూపంలో నీటిని గండిపేట పక్కనే నిర్మిస్తున్న భారీ రిజర్వాయర్ వరకు తరలిస్తారని చెప్పారు. అక్కడి నుంచి గండిపేటలోకి నీటిని వదలటం, అది నిండిన తరువాత హిమాయత్‌సాగర్‌కు మళ్లించటం వంటివి చేపడతారని పేర్కొన్నారు. రెండు జలాశయాల ద్వారా మూసీ నదిలోకి నీరు వదలటం వల్ల అందులో ఎప్పటికీ నీటి ప్రవాహం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జలమండలి, హెచ్ఎండీఏ అధికారులు, గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్ ముదిరాజ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
45 ఏళ్లుగా మాంసానికి దూరం
మా తల్లిదండ్రుల గ్రామం రోటిబండతండా. నా చిన్నతనంలో మాంసం ఇష్టంగా తినేదాన్ని. నాపెళ్లయి 45 ఏళ్లు దాటింది. ఆరోజు నుంచి ఇప్పటి వరకు మాంసం జోలికి వెళ్లలేదు. మా అత్త కూడా మాంసం తినలేదు. – అస్లీబాయి తరతరాలుగా వస్తున్న ఆచారం తండా కోడళ్లు మాంసం తినకూడదనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. మాకన్నా పెద్దవాళ్లు పాటించారు.. మేమూ కొనసాగిస్తున్నాం.. ఇప్పటి పిల్లలు కూడా మాతోవలోనే నడవడం సంతోషం కలిగిస్తోంది. – ప్రమీళాబాయి అదృష్టంగా భావిస్తున్నా.. నేను పీజీ చదివా.. స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో మాంసాహారం బాగా తినేదాన్ని. నాకు ఇటీవలే పెళ్లయింది. తండా ఆచారాన్ని చెప్పినప్పుడు వింతగా అనిపించినా.. ఇక్కడికి వచ్చాక ఇది ఎంతో అదృష్టమని తెలుసుకున్నా. – పద్మ వండుతాం.. కానీ తినం నేను కూడా మొదట్లో ఇదేం ఆచారం అని విచారపడ్డా. కానీ మాంసం వదిలేసిన కోడళ్లకు ఇక్కడ లభిస్తున్న గౌరవం చూసి ఆ ఆలోచన మారిపోయింది. ఇంట్లో మగవాళ్లు, వచ్చే బంధువులకు వండుతా కానీ నేను తినను. – శ్రీలత, అంగన్వాడీ టీచర్ -
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలి
ఆమనగల్లు: ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలని, లేదంటే భూ నిర్వాసితులతో కలిసి ఉద్యమిస్తామని రాష్ట్ర రైతు సంఘం నాయకుడు పగడాల యాదయ్య హెచ్చరించారు. కొత్త అలైన్మెంట్తో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని మాలెపల్లి సమీపంలో శనివారం ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులైన మాలెపల్లి, చింతలపల్లి, మేడిగడ్డ, సింగంపల్లి, నుచ్చుగుట్టతండా, పోలెపల్లి గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమకున్న కొద్దిపాటి భూమి ట్రిపుల్ఆర్తో పోతోందని ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. పగడాల యాదయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను ఏకపక్షంగా ప్రకటించి రైతులను గందరగోళంలో పడేసిందని ఆరోపించారు. సరైన సర్వే నిర్వహించకుండా అలైన్మెంట్ పేరుతో సర్వే నంబర్లు ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఉన్న అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి జగన్, సీపీఎం ఆమనగల్లు ఏరియా కన్వీనర్ శివశంకర్, మాజీ సర్పంచ్ శ్రీనయ్య తదితరులు పాల్గొన్నారు. -
యూరియా.. క్యూ తప్పదయా
మొయినాబాద్: రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. సురంగల్–మొయినాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 450 బస్తాలు రావడంతో శనివారం పంపిణీ చేశారు. యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంట ల నుంచే మొయినాబాద్ రైతు వేదిక వద్ద బారులు తీరారు. అధికారులు రాకముందే చెప్పులు లైన్లో పెట్టారు. వ్యవసాయాధికారులు రైతువేదిక వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఎగబడ్డారు. గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు క్యూ కట్టించారు. మండల వ్యవసాయాధికారి అనురాధ రైతులకు టోకెన్లు రాసి ఇచ్చారు. టోకెన్లు తీసుకున్న రైతులు పీఏసీఎస్ కార్యాలయం వద్దకు వెళ్లి బారులు తీరారు. అక్కడ పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, సీఈఓ మనోహర్‌రెడ్డి దగ్గరుండి రైతులకు యూరియా అందజేశారు. టోకెన్లు తీసుకుని మిగిలిపోయిన రైతులకు మంగళవారం స్టాక్ వచ్చిన తరువాత ఇస్తామని వివరించారు. -
మాంసం ముట్టరు! వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం వాల్యానాయక్‌తండాలో కొనసాగుతున్న ఆచారం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బాలాపూర్ గణేశుడి శోభాయాత్రజై.. బై గణేశాప్రశాంతంగా నిమజనోత్సవంసాక్షి, రంగారెడ్డిజిల్లా: గణేశ్ నిమజ్జనోత్సవం శనివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథులను మేళ తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. చిన్నారులు, యువతీ, యువకులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై బోలో గణేశ్ మహరాజ్‌కీ..జై .. గణపతి బొప్పా మోరియా.. అంటూ హోరెత్తించారు. మండపాల వద్ద వేలం పాటలు హోరాహోరీగా సాగాయి. లడ్డూ ప్రసాదాన్ని చేజిక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. సరూర్‌నగర్ మినీట్యాంక్‌బండ్, తుర్కయంజాల్ మాసబ్ చెరువు సహా జిల్లా వ్యాప్తంగా 44 చెరువులు, కుంటలను నిమజ్జనం కోసం ఎంపిక చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ఐదు గంటలకే .. ఉదయం ఐదు గంటలకే బాలాపూర్ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత వాహనంపై విగ్రహాన్ని ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు బొడ్రాయి వద్దకు చేరుకుంది. 10.44 గంటలకు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూ వేలం పాట ప్రారంభించారు. ఆరు నిమిషాల పాటు జోరుగా సాగిన వేలం పాటలో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. ఆయన ఆరేళ్లుగా వేలం పాటలో పాల్గొంటుండగా ఈ ఏడాది వరించింది. గత ఏడాది వేలం పాటలో లడ్డూను దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి రూ.30.01 లక్షలను ఉత్సవ కమిటీకి అందజేశారు. అనంతరం లడ్డూను దక్కించుకున్న దశరథగౌడ్‌ను గుర్రపు బండిలో ఎక్కించుకుని మేళతాళాలతో ఊరేగించి హనుమాన్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, వేలం పాట పూర్తయిన తర్వాత ఉదయం 11.30 గంటలకు శోభాయాత్ర మొదలైంది. అశేషభక్త జనం వెంటరాగా గణనాథుడి వాహనం ముందుకు కదిలింది. మల్లాపూర్, చంపాపేట్, పాతబస్తీ సహా ఇతర ప్రాంతాల్లో నెలకొల్పిన విగ్రహాలు అనుసరించాయి. శోభాయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు చాంద్రాయణగుట్టకు చేరుకుంది. అటు నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు చార్మినార్.. 3.56 గంటలకు ఎంజే మార్కెట్‌కు చేరింది. సాయంత్రం 4.30కు బషీర్‌బాగ్ దాటింది. 5.30 గంటలకు ట్యాంక్ బండ్ చేరుకుంది. సరిగ్గా 5.50 గంటలకు నిమజ్జన ప్రక్రియ పూర్తయింది. బాలాపూర్ గణేశుడికి దారి పొడవునా భక్తులు నీరాజనం పలికారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చార్మినార్ సహా పలు కూడళ్లలో స్వాగతం పలికారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాలాపూర్ వినాయకుడి లడ్డూను కర్మన్‌ఘట్‌కు చెందిన లింగాల దశరథగౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.4.99 లక్షలు అదనంగా పలకడం విశేషం. చేవెళ్ల రచ్చబండ వినాయక లడ్డూను రూ.16,11,001కు అత్తెల్లి బ్రదర్స్ దక్కించుకున్నారు. చేవెళ్ల మండలం ఖానాపూర్‌లో చేకూరి అంజిరెడ్డి రూ.9.50 లక్షలకు గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. రాగన్నగూడలో ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూను రూ.7.65 లక్షలకు రొక్కం భీంరెడ్డి దంపతులు దక్కించకున్నారు. తుక్కుగూడ బొడ్రాయి ఉత్సవ కమిటీ గణేశుడి లడ్డూను రూ.7,55,111కు ప్రకాష్‌రెడ్డి కై వసం చేసుకున్నారు. శంకర్పల్లి మండలం మాసానిగూడ హనుమాన్ మందిర్ గణేశ్ లడ్డూను రూ.7,20,000కు కురుమ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీశైలం కై వసం చేసుకున్నారు. బడంగ్‌పేట వీరాంజనేయ భక్తసమాజం గణనాథుడి లడ్డూను రూ.7.10 లక్షలకు గౌర సత్తయ్య కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు. గత ఏడాది ఇదే లడ్డూ రూ.17 లక్షలు పలకడం విశేషం. గతంతో పోలిస్తే ఈసారి రూ.9.90 లక్షలు తక్కువకు ధర పలికింది. మొయినాబాద్ మున్సిపాలిటీ ఎన్కేపల్లిలోని వినాయకుడి లడ్డూను రూ.6.50 లక్షలకు ముదిగొండ ప్రభాకర్‌యాదవ్ దక్కించకున్నారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని బురుజు వద్ద వినాయకుడి లడ్డూను రూ.6.50 లక్షలకు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ కోరె కలమ్మ జంగయ్య దక్కించుకున్నారు. చేవెళ్లలోని జర్నలిస్టు కాలనీలో జేసీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డూ ప్రసాదాన్ని రూ.6,06,666కు కోణార్క్ గ్రూప్ సభ్యులు కాసుల ఆనంద్ గౌడ్, కిష్టమొళ్ల త్రినేత్ర దక్కించుకున్నారు. చకచకా సాగిన బాలాపూర్ శోభాయాత్ర దారి పొడవునా భక్తుల నీరాజనం పాతబస్తీ మీదుగా హుస్సేన్‌సాగర్‌కు చేరిన గణేశుడు సరూర్‌నగర్, తుర్కయంజాల్ మాసబ్చెరువుల వద్ద కోలాహలం పోటాపోటీగా లడ్డూ వేలం పాటలు బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలు -
పింఛన్లు పెంచకుంటే యుద్ధమే
ఇబ్రహీంపట్నం: వికలాంగుల, చేయూత పింఛన్లు పెంచకుంటే ప్రభుత్వంపై యుద్ధం తప్పదని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య హెచ్చరించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ముఖ్యనేతల సమావేశం శనివారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలదివ్యాంగులకు రూ.4వేల నుంచి రూ.6 వేలకు, వితంతు, ఒంటరి మహిళకు రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. పింఛన్లు పెంచే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి యాదిగిరి మాదిగ, వీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున శ్రీనివాస్‌చారి, జిల్లా అధ్యక్షుడు యాచారం జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్లుగా అన్యాయం మంచాల: ఐదేళ్లుగా పాలక ప్రభుత్వాలు కొత్త పింఛన్లు ఇవ్వక పోవడం దారుణమని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య అన్నారు. మండల కేంద్రంలో శనివారం దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పింఛన్లు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య -
ప్రజలకు చేరువగా న్యాయసేవలు
చేవెళ్ల: ప్రజలకు న్యాయసేవలను మరింత చేరువ చేసేందుకే అడిషనల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ శావిలి అన్నారు. మండలకేంద్రంలో అడిషనల్ జూనియర్ సివిల్కోర్టును శనివారం ఆయన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కరుణకుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడిషనల్ కోర్టులతో ప్రజలకు సత్వర న్యాయం అందించే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి ప్రదీప్ నాయక్, చేవెళ్ల జూనియర్ సివిల్ జడ్జి దశరథరామయ్య, జూనియర్ జడ్జి వినోద్‌కుమార్ ఉపాధ్యాయ, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరంలో సీనియర్ సివిల్ కోర్టు మహేశ్వరం: మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో సీనియర్ సివిల్ కోర్టును శనివారం హైకోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ శావిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి విజయ్‌సేన్‌రెడ్డి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కరుణ కుమార్, 15వ జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి ప్రదీప్ నాయక్, మహేశ్వరం సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి రీటాలాల్ చంద్, జూనియర్ కోర్టు న్యాయమూర్తి అపర్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.హరికిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ శావిలి -
సిటీ పోలీసులోకి ‘లాడెన్ జాగిలాలు’
సాక్షి, సిటీబ్యూరో: పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటం కోసం అమెరికన్ నేవీ సీల్స్ 2011లో వినియోగించిన బెల్జియం మలినాయిస్ జాతి జాగిలాలు నగర పోలీసు విభాగంలో అందుబాటులోకి రానున్నాయి. సిటీ పోలీసులు కొత్తగా ఖరీదు చేసిన 12 జాగిలాల పిల్లల్లో ఆరు బెల్జియం మలినాయిస్ జాతివే ఉన్నాయి. దేశంలోనే ఈ తరహా జాగిలాలను నేరుగా ఎంపిక చేసి, అందుబాటులోకి తీసుకువస్తున్న తొలి పోలీసు విభాగంగా హైదరాబాద్ కమిషనరేట్ కావడం గమనార్హం. పోలీసు విభాగం సుదీర్ఘకాలం జర్మన్ షెపర్డ్, లాబ్రెడార్ తదితర జాతి జాగిలాలకు శిక్షణ ఇచ్చి వినియోగించింది. అయితే మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కొన్నేళ్ల క్రితం 300 బెల్జియం మలినాయిస్ జాగిలాలను ఖరీదు చేసి వినియోగించడం ప్రారంభించింది. 2015లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషనల్ విభాగమైన ఆక్టోపస్‌లో వినియోగించడానికి ప్రయోగాత్మకంగా మూడు (రెండు మగ, ఒక ఆడ) బెల్జియం మలినాయిస్ జాగిలాలను ఖరీదు చేశారు. వీటి పనితీరును అధ్యయనం చేసిన నగర పోలీసు అధికారులతో కూడిన కమిటీ సర్వకాల సర్వావస్థల్లోనూ విసుకు, విరామం లేకుండా ఏకధాటిగా పని చేయడం, పౌరుషం తదితర లక్షణాలను పరిగణలోకి తీసుకుంది. దశల వారీగా నగర పోలీసు విభాగంలో బెల్జియం మలినాయిస్, బీగల్ జాతి జాగిలాల సంఖ్యను పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. బెల్జియం మలినాయిస్ జాతి జాగిలం గరిష్టంగా 12 ఏళ్లు జీవిస్తుంది. ఇది 22 నుంచి 26 అంగుళాల వరకు ఎత్తు పెరుగుతుంది. 20 నుంచి 30 కేజీల బరువు కలిగి ఉంటుంది. పౌరుషం, సంగ్రహణ శక్తుల్లో ఉత్తమమైన వీటికి శిక్షణ ఇవ్వడం కూడా చాలా తేలిక. త్వరలో నిర్మాణాలు ప్రారంభిస్తాం గోషామహల్‌లోని పోలీసుస్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకోగా మిగిలిన 11.5 ఎకరాల్లో త్వరలో నిర్మాణాలు ప్రారంభించనున్నాం. వీటిలో ఓపక్క అశ్వకదళం (మౌంటెడ్ పోలీసు) కోసం స్టేబుల్స్, మరోపక్క జాబితాల కోసం కెన్నెల్ నిర్మించనున్నాం. ప్రస్తుతం సిటీ పోలీసు విభాగంలో ఉన్న 50 గుర్రాల్లో మూడు తప్ప మిలినవి అన్నీ యాక్టివ్‌గా ఉన్నాయి. కీలక సందర్భాల్లో క్రౌడ్కంట్రోల్కు ఇవి అత్యంత కీలకం. 2003లో నేను సెంట్రల్ జోన్ డీసీపీగా ఉండగా చేప ప్రసాదం పంపిణీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రోగులు రావడంతో తొక్కిసలాట వరకు విషయం వెళ్లినా... అక్కడ ఉన్న మౌంటెడ్ పోలీసు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. – సీవీ ఆనంద్, నగర కొత్వాల్ బెల్జియం మలినాయిస్ జాతివి సైతం కొనుగోలు తొలిసారిగా నేరుగా ఖరీదు చేసిన సిటీ పోలీసులు 11.5 ఎకరాల్లో కెన్నెల్స్, స్టేబుల్స్ సీవీ ఆనంద్ -
ఇక్ఫాయ్ గుర్తింపు రద్దు చేయాలి
● బీఆర్ఎస్వీ నేతల డిమాండ్ ● యూనివర్సిటీ గేట్ ఎదుట ఆందోళన శంకర్పల్లి: ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వర్సిటీ గేటు ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడటం బాధాకరమైన విషయమన్నారు. నిర్వాహకుల అసమర్థతతోనే ఈదుస్థితి నెలకొందని మండిపడ్డారు. యూనివర్సిటీలో డ్రగ్స్, గాంజా విక్రయాలు, వినియోగం అధికంగా ఉందన్నారు. ఎనిమిది మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడం ఇక్కడి పరిస్థితిని సూచిస్తోందని తెలిపారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ చేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదిశగా చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న మోకిల సీఐ ఆందోళనకారులను అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు. వీరిలో బీఆర్ఎస్వీ హైదరాబాద్ సెక్రటరీ రహమత్, నాయకులు శ్రీకాంత్, నాగేంద్రబాబు, రాకేశ్, దయాకర్, ఆఫ్రిద్, విజయ్, ఆసిఫ్, ఫృథ్వీ, రవికుమార్ తదితరులు ఉన్నారు. -
విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గదర్శకులు
చేవెళ్ల: విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని చేవెళ్ల ఏసీపీ బి.కిషన్ అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కేజీబీవీలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు మాలతి విద్యార్థులకు నోట్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో జ్ఞానం అనే వెలుగులు ప్రసాదించేది తల్లిదండ్రుల తరువాత గురువులే అన్నారు. అనంతరం విద్యార్థులను అడిగి పాఠశాల సమస్యలను తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా మాలతి కృష్ణారెడ్డి మాట్టా డుతూ.. విద్యార్థులకు అవసరమైన ఆట స్థలంతో పా టు తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, నాయకులు ఎన్.కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విలువలు నేర్పేది గురువే: ఏసీపీ లక్ష్మీనారాయణషాద్నగర్: విద్యార్థులకు జీవిత విలువలను నేర్పించేది గురువులేనని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఇంటర్నేషల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉపాద్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవ ప్రదమైనదని, ఉపాధ్యాయుడు లేని సమాజాన్ని ఊహించలేమని అన్నారు. విద్యార్థుల్లోని చీకటిని తొలగించి వెలుగులు నింపేవారే ఉపాధ్యాయుడని అన్నారు. ప్రతీ విజయంలో కీలక పాత్ర గురువుదేనని అన్నారు. విద్యార్థులు గురువులను దైవంగా భావిస్తూ వారి సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకు సాగితే విజయతీరాలకు చేరుకుంటారని అన్నారు. ప్రతి విద్యార్ధి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఉపాధ్యాయులు మంచి పునాదులు వేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటరమణ, వైస్ ప్రిన్సిపాల్ నాగరాణి, ఏబీవీ ఆస్పత్రి వైద్యులు ఆనంద్, భార్గవి తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఏసీపీ కిషన్ -
కారు బీభత్సం
కడ్తాల్: మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి, రోడ్డు పక్కన నిలబడిన వారిని ఢీకొడుతూ ఫుట్‌పాత్‌ల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం బారిన పడిన దంపతుల్లో భర్త మృతిచెందగా, భార్యతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని చల్లంపల్లి వద్ద ఓ తోటలో కూలీ పనులు చేసేందుకు ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా, నల్లమడ మండలం, కొండ్రవారిపల్లికి చెందిన జిన్నె రంగులు(54), ఆదిలక్ష్మి దంపతులతో పాటు నర్సపూర్ కిష్టప్ప శుక్రవారం ఉదయాన్నే బస్సులో ఏపీ నుంచి కడ్తాల్‌కు వచ్చారు. చల్లంపల్లి వెళ్లేందుకు శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నిలబడి ఆటోల కోసం వేచి చూస్తుండగా హైదరాబాద్ నుంచి డిండి వైపు వెళ్తున్న ఓ కారు అతి వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగులు, ఆదిలక్ష్మిని అంబులెన్స్‌లో ఉస్మానియాకు కిష్టప్పను వెల్దండలోని యెన్నం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం రంగులు మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. తప్పిన పెను ప్రమాదం ఉదయం ఆరు గంటలకే జరిగిన ఘటనతో పెను ప్రమాదమే తప్పింది. అదుపు తప్పిన కారు అతివేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన నిలబడిన వారితో పాటు చిరువ్యాపారులు ఏర్పాటు చేసుకున్న కొట్టులను ఢీకొడుతూ ముందుకు వెళ్లింది. అప్పటికీ షాపులు తీయకపోవడం, వేకువజామునే కావడంతో జనసందడి లేకపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రధాన కూడలిలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి కొనసాగుతున్న వ్యాపారాలను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు పక్కన నిలబడిన వారిపైకి దూసుకెళ్లిన వాహనం వలస కూలీ మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కడ్తాల్‌లోని శ్రీశైలం– హైదరాబాద్ రహదారిపై ఘటన -
చిన్నారిని చిదిమేసిన కారు
షాద్‌నగర్ రూరల్: ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడిని కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఈ ఘటన శుక్రవారం పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ తెలిపిన ప్రకారం.. కొందర్గు మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన బుట్ట గోపికృష్ణ, మీనాక్షి దంపతులకు ఇద్దరు కుమారులు. గోపికృష్ణ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో కుటుంబతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరి కుమారుడు విరాట్(2) ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. గోపికృష్ణ ఇంటి పక్కనే ఖాళీ స్థలం ఉండడంతో అదే కాలనీకి చెందిన అన్వేష్ తన థార్ వాహనాన్ని పార్క్ చేస్తున్నాడు. ఆయన తన వాహనాన్ని వెనక్కు తీస్తున్న క్రమంలో కారు వెనకాల ఉన్న చిన్నారిని గమనించలేదు. దీంతో బాలుడు వాహనం చక్రాల కింద పడిపోయాడు. వెంటనే గమనించి షాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం ఆమనగల్లు: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తలకొండపల్లి మండలం జూలపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంద్రకంటి నర్సింహ(45)కు ఇరవై ఏళ్ల క్రితం పద్మతో వివాహమైంది. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన నర్సింహ ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉరేసుకున్నాడు. మృతుడి అన్న కుమారుడు శ్రీశైలం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాబీలాన్ పబ్‌పై కేసు నమోదు బంజారాహిల్స్: నిబంధనలకు ఉల్లంఘించి గడువు ముగిసిన తర్వాత అర్ధరాత్రి దాకా కొనసాగుతున్న పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36/10లో ఉన్న బాబీలాన్ పబ్ నుంచి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున శబ్ధాలు వినిపిస్తుండడంతో పాటు ప్రజలు గుమికూడడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరా తీయగా గడువు ముగిసిన తర్వాత కూడా డీజే కొనసాగించడంతో పాటు కస్టమర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు తేలింది. దీంతో బాబీలాన్ పబ్ మేనేజర్ ఆసిఫ్‌తో పాటు డీజే ఆర్టిస్ట్ యశ్వంత్‌పై కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని బాలుడి దుర్మరణం అత్తాపూర్: గణేశ్ నిమజ్జనానికి వెళుతూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఇటుక లారీ ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐలు చిలుకల శ్రీను, జయరాజ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శివరాంపల్లి వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన సన్నీ(15) స్నేహితులతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున గణేష్ నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్నాడు. పి.వి.నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే 310 పిల్లర్ వద్ద రోడ్డు దాటుతుంగా వేగంగా వచ్చిన ఇటుక లోడ్ లారీ అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సన్ని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. -
సర్వం సిద్ధం
శనివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025శోభాయాత్రకు.. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు..సాక్షి, రంగారెడ్డిజిల్లా: గణేశుడి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజుల పాటు అశేష భక్తజనం పూజలు అందుకున్న వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం పూజలు నిర్వహించి, ఇప్పటికే సిద్ధం చేసుకున్న వాహనాల్లో ఆయా వినాయకులను సమీప చెరువులు, కుంటలకు తరలించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. శనివారం శోభాయమానంగా నిర్వహించే వేడుకలకు భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించే శోభయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా స్వాగత ద్వారాలు, ట్యాంక్‌బండ్ సహా సరూర్‌నగర్, తుర్కయంజాల్ మాసబ్ చెరువుల వద్ద భారీ క్రేన్లను సిద్ధం చేశారు. ఎలాంటి అంతరాయాలకు ఆస్కారం ఇవ్వకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కోసం విద్యుత్‌శాఖ ఆయా చెరువులు, కుంటల వద్ద అదనపు ఏర్పాట్లు చేసింది. మినీట్యాంక్ బండ్‌పై.. సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై ఎనిమిది క్రేన్లు సిద్ధం చేశారు. కట్ట మొత్తం ఇప్పటికే విద్యుత్ దీపాలతో అలంకరించారు. నిరంతర నిఘా కోసం 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 3,504 విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు తెలిపారు. చివరి రోజైన శనివారం మరో మూడు వేలకుపైగా విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. చైతన్యపురి, దిల్సుఖ్నగర్, ఎన్టీఆర్ కాలనీ, నాగోలు, ఎల్బీనగర్ మీదుగా వచ్చే వాహనాలను కర్మన్ఘట్ మీదుగా సరూర్‌నగర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించనున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలి, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్‌శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించనున్నారు. తుర్కయంజాల్ మాసబ్ చెరువు కట్టపై.. తుర్కయంజాల్ మాసబ్ చెరువు కట్టపై ఒక క్రేన్ ఏర్పాటు చేశారు. భక్తులు, ఇతర సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. కట్టపై భారీ విద్యుత్ లైట్లు సహా వైద్య శిబిరం, విద్యుత్ కాల్ సెంటర్, జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి సరఫరా వంటి ఏర్పాట్లు చేశారు. తుర్కయంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సహా ఇతర అధికారులకు ఇక్కడ విధులు కేటాయించారు. గజ ఈతగాళ్లను సైతం సిద్ధంగా ఉంచారు. వేలాదిగా తరలిరానున్న వినాయక విగ్రహాలు దారి పొడవునా భారీ బందోబస్తు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు సరూర్‌నగర్ మినీట్యాంక్‌బండ్, మాసబ్ చెరువు వద్ద ఏర్పాట్లు -
కన్హాలో ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
నందిగామ: మండల పరిధిలోని కన్హా శాంతివనంలో బీఏటీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న యోనెక్స్ సన్‌రైజ్ 79వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2025 పోటీలు శుక్రవారంతో ముగిసాయి. విజేతలకు పుల్లెల గోపీచంద్ ముఖ్యఅతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సాధారణమేనని అన్నారు. ఒక ఓటమి మరో విజయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. పురుషుల విభాగం సింగిల్స్‌లో తమిళనాడుకు చెందిన రిత్వీక్ విన్నర్‌గా, కేరళకు చెందిన గోవింద్ రన్నర్‌గా, మహిళల సింగిల్స్ విభాగంలో కర్ణాటకకు చెందిన సైనా విన్నర్‌గా, కర్ణాటకకే చెందిన రాజేష్ లక్షా రన్నర్‌గా నిలిచారని తెలిపారు. పురుషులు డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీవీహెచ్ వర్ధన్ రాయుడు, విష్ణుకేదార్ విన్నర్‌గా, పాండిచ్చేరికి చెందిన కృష్ణన్ మిత్లేష్, ప్రీజన్ రన్నర్‌గా నిలిచినట్టు వెల్లడించారు. మహిళల డబుల్స్ విభాగంలో తమిళనాడుకు చెందిన రిద్వర్షిణి, సింకేదర్ సానై విన్నర్‌గా, తెలంగాణకు చెందిన ఆలీషా మహముద్, వైష్ణవి రన్నర్‌గా నిలిచినట్టు వివరించారు. -
పార్కు స్థలం పరాధీనం!
● దర్జాగా ప్రహరీ నిర్మాణం ● రూ.12 కోట్ల విలువైన భూమి కబ్జా ● ఆదిబట్లలో అక్రమార్కుల నిర్వాకం ఇబ్రహీంపట్నం రూరల్: పంచాయతీలుగా ఉన్నప్పుడు కాపాడిన పార్కు స్థలాలు మున్సిపాలిటీలోకి చేరే సరికి మాయమైపోతున్నాయి. అధికారుల ఉదాసీన వైఖరితో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, లేఔట్లు మార్చేసి కబ్జాలకు పాల్పడుతున్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ ఏర్పడక ముందు 2017లో శ్రీమిత్ర ఎస్టేట్ ప్రైవేటు లిమిటెడ్ యాజమాన్యం సర్వే నంబర్ 72,73,74,75,76,77 పార్టుల్లో పార్కు స్థలాలను కేటాయించింది. మొత్తం 49.30 ఎకరాలు వెంచర్ చేయగా అందులో నిబంధనల ప్రకారం ఐదెకరాల పార్కు స్థలాలు చూపించారు. 2012లో పార్కు స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని అప్పటి జిల్లా పంచాయతీ అధికారి పద్మజారమణ స్థలాలను రక్షించాలని ఆదేశించారు. ఫిర్యాదు చేసినా స్పందన అంతంతే.. ప్రస్తుతం మరియపురానికి దగ్గరలో వైపీఆర్ వెంచర్‌కు వెళ్లే దారిలో అక్రమార్కులు కబ్జా చేశారు. సుమారు 2,400 గజాలకు పైగా కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించారు. దీనిపై అనేకమార్లు కలెక్టర్, సీడీఎంఏ, డీటీసీపీ కార్యాలయాల్లో స్థానికులు పలువురు ఫిర్యాదు చేశారు. ఎలాంటి విచారణ చేయకుండా స్థానికంగా ఉండే టౌన్‌ప్లానింగ్, మున్సిపల్ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తూ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రూ.12 కోట్ల విలువైన భూమి కబ్జా చేసినా పట్టించుకునే నాథుడే లేడని, కంటితుడుపు చర్యగా ప్రహరీ లోపల ఎవ్వరికీ కనిపించకుండా చిన్నబోర్డు పాతి వదిలేశారని పేర్కొన్నారు. అక్రమార్కుల కబంధ హస్తల్లో ఉన్న విలువైన భూమికి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. గత పంచాయతీ హయాంలో పార్కు స్థలాలను పంచాయతీకి గిఫ్ట్‌డీడ్ చేశారు. అప్పటి నుంచి కాపాడుతూ వచ్చారు. మున్సిపాలిటీ ఏర్పడ్డాక అధికారుల పర్యవేక్షణ కరువైంది. అక్రమార్కులపై కేసులు పెట్టి విలువైన స్థలాలను కాపాడాలి. – పల్లె రజినీకాంత్‌గౌడ్, ఆదిబట్ల టీసీఎస్ ముందున్న రియల్ ఎస్టేట్ సంస్థలో పార్కు స్థలం కబ్జాకు గురైన విషయం తెలిసింది. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. ఇప్పటికే ప్రహరీలో బోర్డు ఏర్పాటు చేశాం. అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తాం. – బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్, ఆదిబట్ల -
రేపు చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత
మొయినాబాద్: చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం 4 నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు. గ్రహణం ముగిసిన తరువాత ఆలయ సంప్రోక్షణ, అభిషేకం నిర్వహించి భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. షాద్‌నగర్: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా షాద్‌నగర్‌కు చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకట్రాంరెడ్డిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన అధ్యక్షుడిగా నియమితుడైన వెంకట్రాంరెడ్డి ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. చేవెళ్ల: మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కె.బాలాజీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందన్నారు. తనను ఎంపిక చేసిన అధికారులు, సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతగిరి: ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చాలని దేవరాంపల్లి రైతులు కోరారు. శుక్రవారం వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రీజినల్ రింగ్‌రోడ్డు ప్రతిపాదిత భూముల జాబితాలో మా గ్రామం ఉందని, పేద రైతులకు చెందిన పొలాలు ఉన్నాయని తెలిపారు. భూములు కోల్పోతే ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వేరే ప్రాంతం నుంచి ప్రతిపాదించాలని కోరారు. వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నామని, భూములు పోతే ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మాత్రం సరిపోదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు మా గ్రామాన్ని రెండు భాగాలుగా విభజిస్తుందన్నారు. రైతులకు నష్టం జరగని ప్రాంతాల నుంచి రోడ్డును ప్రతిపాదించాలని వారు కోరారు. ఈ విషయమై తాను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని స్పీకర్ హామీ ఇచ్చి నట్లు రైతులు తెలిపారు. -
ఆ కార్యక్రమాలను జయప్రదం చేయాలి
కందుకూరు: తెలంగాణ సాయుధ పోరాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పాషానరహరి స్మారక కేంద్రంలో శుక్రవారం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుబ్బాక రాంచందర్ అధ్యక్షతన జిల్లా కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచి 17 వరకు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా సభలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈనెల 17న ఖమ్మం జిల్లా జనగామలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి అఖిల భారత కార్యదర్శి ఎంఏ బేబి ముఖ్యఅతిథిగా హాజరవుతారని వెల్లడించారు. ఈనెల 12న సీతారాం ఏచూరి వర్ధంతిని అన్ని జిల్లాలు, మండలాల్లో జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.సామేల్, చంద్రమోహన్, కె.జగన్, ఇ.నరసింహ, కె.భాస్కర్, జగదీశ్, కవిత పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
రెవెన్యూ లుక్!
ఇబ్రహీంపట్నం: రెవెన్యూ వ్యవస్థకు పూర్వవైభవం రానుందని క్షేత్రస్థాయి ఉద్యోగులు, ప్రజలు సంబర పడుతున్నారు. ప్రక్షాళన పేరుతో గ్రామాల్లో పనిచేసిన వీఆర్ఏ, వీఆర్ఓలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది. జిల్లాలో సుమారు 277 మంది వీఆర్ఓలు, 800 మంది వీఆర్ఏలు పనిలేకుండా కొంత కాలం కూర్చున్నా అనంతరం వివిధ శాఖల్లో వారిని భర్తీ చేశారు. మాతృ సంస్థను వదిలి ఇతర శాఖల్లో పనిచేయలేక పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్లపైనే పనిభారం ఎక్కువ అయింది. గ్రామస్థాయిలో ఏదైన సమస్య ఎదురైతే విచారించడం కష్టంగా మారింది. వీఆర్ఓలు లేకపోవడంతో ప్రజలు సైతం అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం రెవెన్యూ వ్యవస్థను గ్రామస్థాయి నుంచి పటిష్ట పరుస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ధరణి స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. ఇప్పుడు పల్లెల్లో జీపీఓలను నియమించనుంది. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి అత్యధికం వివిధ శాఖల్లో పనిచేస్తున్న వీఆర్ఓ, వీఆర్ఏలను తిరిగి గ్రామ పరిపాలనాధికారులుగా నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి మాతృసంస్థలోకి వెళ్లాలనుకునే వారికి విద్యార్హతలు, అనుభవం తదితర కొన్ని నియమ నిబంధనలు పెట్టి గ్రామ పరిపాలన అధికారుల నియామకం కోసం పరీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి 271 మంది ఎంపికయ్యారు. ఇబ్రహీంపట్నం డివిజన్ నుంచి 81 మంది గ్రామ పరిపాలనాధికారులుగా(జీపీఓ) అర్హత సాధించారు. ఇబ్రహీంపట్నం మండలం నుంచి 14 మంది, అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి 18 మంది, యాచారం, మంచాల మండలాల నుంచి 11 మంది చొప్పున, హయత్‌నగర్, మాడ్గుల మండలాల నుంచి ఏడుగురు, ఇతర జిల్లాల నుంచి 13 మంది జీపీఓలుగా ఎంపికయ్యారు. పూర్వవైభవం సంతరించుకోనున్న శాఖ వీఆర్ఓ, వీఆర్ఏల స్థానంలో గ్రామ పరిపాలనాధికారులుగా భర్తీ జిల్లాలో 271 మంది జీపీఓల ఎంపిక హర్షం వ్యక్తం చేస్తున్న పూర్వ ఉద్యోగులు నేడు నియామక పత్రాల అందజేత ఎంపికై న జీపీఓలు నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో శుక్రవారం జరిగే కార్యక్రమంలో నియామకపత్రాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఇందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. జీపీఓలుగా ఎంపికై న వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా గ్రామాల్లో నియమించనున్నారు. దీంతో రెవెన్యూ వ్యవస్థకు గ్రామ స్థాయిలో ఓ అధికారిని నియమించినట్లు అవుతుంది. ఫలితంగా ఆ శాఖకు పూర్వ వైభవం వస్తుందనే ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించండి
కడ్తాల్: తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేతనం చెల్లించాలని కోరారు. ఆరు నెలలుగా వంట గ్యాస్, కోడిగుడ్ల బిల్లులు, వేతనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా బుజ్జమ్మ, గౌరవ అధ్యక్షురాలిగా లక్ష్మమ్మ, ఉపాధ్యక్షురాలుగా బాలమణి, అలివేలు, సభ్యులుగా తదితరులు నియమితులయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పెంటయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా సహకార్యదర్శి పద్మ, కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు రజియాభేగం తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న -
ప్రత్యేక ధన్యవాదాలు
రెవెన్యూ శాఖకు తిరిగి పూర్వవైభవం రానుంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో జీపీఓలుంటారు. కింది స్థాయిలోని సమస్యలను గుర్తించడంతో వాటికి పరిష్కారం దొరుకుతుంది. జీపీఓగా నియామకపత్రం అందుకోవడం సంతోషంగా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. – సుజాత, పూర్వ వీఆర్ఏ తిరిగి మాతృసంస్థకు వెళుతుండటం ఆనందాన్నిస్తోంది. గతంలో వీఆర్ఓగా పనిచేసి, పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విధులు చేపట్టాను. రెవెన్యూ విధులకు ఇక్కడి పనికి వ్యత్యాసం ఉంది. ఏ ప్రాంతంలో జీపీఓగా నియమించినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. – యార కృష్ణ, పూర్వ వీఆర్ఓ -
బెస్ట్ టీచర్్స
రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంపికఅబ్దుల్లాపూర్మెట్: బండరావిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న పి.రమాదేవి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. 2002లో మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలం హరిజన్వాడ యూపీఎస్‌లో తొలిసారి ఆమె విధుల్లో చేరారు. 2013లో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, 2018లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2019లో బెస్ట్ రిజల్ట్స్ సాధించిన టీచర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. 2020లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి బెస్ట్ టీచర్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉందని రమాదేవి పేర్కొన్నారు. ధారూరు: మండలం నుంచి ముగ్గురు టీచర్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ధారూరు బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న లక్ష్మీనర్సమ్మ, మోమిన్‌కలాన్ ప్రాథమిక పాఠశాల టీచర్ శ్రీనివాస్, నాగసమందర్ పీఎస్ ఉపాధ్యాయురాలు సరిత ఉన్నారు. కుల్కచర్ల: స్థానిక ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉప్పరి రమేశ్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. హుడాకాంప్లెక్స్: విక్టోరియా మెమోరియల్ పాఠశాలలో పనిచేస్తున్న జి.కళావతి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మాది వికారాబాద్ జిల్లా ధారూరు మండలం హరిదాసుపల్లి గ్రామం. తండ్రి పాండు రంగారావు రైల్వేలో స్టేషన్ మాస్టారు. అమ్మ రత్నమ్మ గృహిణి. నేను 1993లో కేంద్రియ విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా చేరా. 1994 జూన్‌లో విక్టోరియా మెమోరియల్ హోమ్ టీచర్‌గా ఎంపికయ్యా. పేద విద్యార్థులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది’ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పలువురు టీచర్లకు అవార్డులు ప్రకటించింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో బెస్ట్ టీచర్లుగా ఎంపికయ్యారు. దామరగిద్దలో.. చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద ప్రాథమికోన్నత పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు కె.బాలాజీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 25 ఏళ్లుగా బోధనా వృత్తిలో కొనసాగుతున్న ఆయన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎంఆర్పీ, డీఆర్ఎపీ, ఎస్ఆర్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర స్థాయిలో పలు అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. -
డీజే వాడిన ఏడుగురిపై కేసు
● పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అభియోగం ● డీజేతో పాటు వాహనం సీజ్ ● ఇబ్రహీంపట్నం కోర్టులో అప్పగింత యాచారం: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఏడుగురిపై కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. యాచారం అనుబంధ గ్రామమైన మొగుళ్లవంపులో బుధవారం రాత్రి హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జనం నిర్వహించారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్‌రెడ్డి, గౌరారం లింగారెడ్డి, నందీశ్వర్‌రెడ్డి, రేసు రాము, పట్టణ చంద్రశేఖర్‌రెడ్డి, మూడేడ్ల శ్యాంసుందర్, నాయిని వెంకట్‌రెడ్డి డీజే పెట్టి, ఎక్కువ సౌండ్‌తో రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రజలకు ఇబ్బంది కలిగించారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగి, వారి విధులకు ఆటంకం కలిగించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు డీజేతో పాటు వాహనాన్ని సీజ్ చేసి, ఇబ్రహీంపట్నం కోర్టులో అప్పగించినట్లు సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలి పారు. వినాయక నిమజ్జన కార్యక్రమంలో డీజేలను వాడొద్దని సూచిస్తున్నా కొంతమంది ప్రజలకు ఇబ్బ ందులు కలిగిస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అధ్వానరోడ్డుతో అవస్థలు
మరమ్మతు చేయించండి: కమిషనర్‌కు విన్నపం తుర్కయంజాల్: ఇంజాపూర్– హయత్‌నగర్ అధ్వాన రోడ్డుతో అవస్థలు పడుతున్నామని, వెంటనే మరమ్మతు చేయించాలని పలువురు నాయకులు కోరారు. గురువారం మున్సిపల్ కమిషనర్ కె.అమరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని, భారీ వాహనాల రాకపోకలతో గుంతలు ఏర్పడి, ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. దీనికి కమిషనర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంశీధర్ రెడ్డి, రాజు, విజయ్, రాజ్ కుమార్, వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మూడు తులాల బంగారం, 22 తులాల వెండి వస్తువుల అపహరణ కేశంపేట: దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లో చోరీ చేసిన సంఘటన మండల పరిధిలోని అల్వాల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్లీకర్ అంజలి, భర్త పరమేశ్వర్, ఇద్దరు పిల్లలతో కలిసి తన తల్లిగారి ఊరైన కొందుర్గు మండలంలోని ఉత్తరాశిపల్లికి బుధవారం వెళ్లింది. గురువారం ఉదయం ఆమెకు బంధువులు ఫోన్ చేసి తన ఇంట్లో దొంగలు పడినట్లు చెప్పారు. వెంటనే స్వగ్రామంలోని ఇంటికి వచ్చి చూడగా గేటు తెరిచి, మెయిన్ డోర్ తాళం పగిలి ఉంది. బెడ్రూంలోని బీరువా లాకర్‌ను దుండగులు పగులగొట్టి మూడు తులాల బంగారం, 22 తులాల వెండి వస్తువులతో పాటుగా రూ.రెండు వేల నగదును దొంగిలించినట్లు గుర్తించారు. ఇదే విషయమై పోలీసులకు అంజలి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ నరహరి తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని పెయింటర్ దుర్మరణం శంకర్పల్లి: ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ పెయింటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీపాద రామాచారి(35), భాను దంపతులు. వీరు బతుకుదెరువు నిమిత్తం పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి, బాలానగర్‌లో నివాసం ఉంటున్నారు. రామాచారి పెయింటర్‌గా, భాను కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శంకర్పల్లి మండలం మోకిలలో ఓ భవనానికి పెయింటింగ్ వేస్తున్న రామాచారి బుధవారం తన తమ్ముడు లక్ష్మణ్‌తో కలిసి రాత్రి వరకూ పని చేసి, ఇక్కడే పడుకున్నారు. గురువారం ఉదయాన్నే టిఫిన్ చేసేందుకు బయటకు వచ్చి, తిరిగి వెళ్తుండగా వెనక నుంచి అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ రామాచారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య భాను ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు కొత్తూరు: హక్కులు, తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాలని టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు పిలుపునిచ్చారు. మండలంలోని ఇన్ముల్‌నర్వలో ఉన్న జేపీదర్గా ఆవరణలో గురువారం నియోజకవర్గ స్థాయి జర్నలిస్టుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుక్కుగూడలో ఈ నెల 26న సంఘం మూడో మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంట్లో భాగంగా దర్గాలో విలేకరులతో కలిసి సన్నాహాక సమావేశాన్ని నిర్వహించామన్నారు. బలమైన సంఘం, జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలను సభలో చర్చించనున్నట్లు తెలిపారు. తుక్కుగూడలో నిర్వహించే మహాసభలకు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు సురేష్, శ్రీనివాస్‌చారి, గణేష్, మోహన్‌రెడ్డి, ఖాజాపాషా, డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్, నరేశ్ పాల్గొన్నారు. -
యూరియా కలిపిన నీళ్లు తాగి కాడెద్దు మృతి
షాబాద్: యూరియా కలిపిన నీళ్లు తాగి కాడెద్దు మృతి చెందిన ఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పశుఽవైద్యాధికారి డాక్టర్ స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్‌కు చెందిన దొండ్ర కృష్ణకు చెందిన రెండు కాడెడ్లు 25 కేజీల యూరియా కలిపిన నీళ్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. వెంటనే గమనించిన రైతు చికిత్స నిమిత్తం స్థానిక వెటర్నరీ ఆస్పత్రికి తరలించగా వైద్యం చేస్తుండగానే ఓ ఎద్దు మృతిచెందింది. చికిత్స చేయడం ద్వారా మరో ఎద్దు ప్రాణాలతో బయటపడిందని సిబ్బంది శ్రీకాంత్, కృష్ణమూర్తి, బాలమణి తెలిపారు. -
దివ్యాంగుల హామీలు అమలు చేయాలి
కొత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌మాదిగ డిమాండ్ చేశారు. మండలంలోని ఇన్ముల్‌నర్వలో గురువారం ఎమ్మార్పీఎస్, దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచని పక్షంలో ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి పట్టనట్లు వ్యవహరించడం సీఎం రేవంత్‌రెడ్డికి తగదన్నారు. పెన్షన్ల అంశంలో ప్రభుత్వం, సీఎం స్పందించని పక్షంలో ఈ నెల 8న కలెక్టరేట్లు, 12న తహసీల్దార్ కార్యాలయాలు, 20న హైదరాబాద్–విజయవాడ రహదారి దిగ్భందం చేయడంతో పాటు 21 నుంచి 26 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ధర్నాలు, 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై ధర్నాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు కోళ్ల శివ, రావుగళ్ల బాబు, శంకర్రావు, పెంటనోళ్ల రవికుమార్, రవి, రమేశ్, కృష్ణ, అశోక్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్ -
ప్రమాదంలో పెద్దచెరువు!
మొయినాబాద్: ప్రమాదకర స్థాయిలో నిండిన చిలుకూరు పెద్ద చెరువులోని నీటిని దిగువకు వదిలేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శిఖం రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎఫ్టీఎల్కు మించి ఒక అడుగు ఎత్తుకు చేరిన నీటిని విడుదల చేయకపోతే ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందంటున్నారు. కానీ నీటిని వదిలే విషయంలో మున్సిపల్, ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఎక్కువగా ఉన్న నీటిని కిందికి వదిలేందుకు ఇరిగేషన్ అధికారులు కాలువ తీయగా కొందరు స్థానికులు మూసేశారు. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరదతో చెరువు నీటిమట్టం మరింత పెరుగుతోంది. బ్యాక్ వాటర్‌తో ఓ వైపు పంటలు మునుగుతుండగా.. మరోవైపు గ్రామానికి ముప్పు పొంచి ఉంది. అలుగుపై మట్టి పేరుకుపోవడం, కింది భాగంలో రోడ్డు నిర్మించడంతో చెరువులో ఎఫ్టీఎల్ స్థాయికి మించి ఒక అడుగు మేర నీరు నిలుస్తోంది. వారం రోజుల క్రితం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ చెరువును పరిశీలించి, నీటిని కొద్దికొద్దిగా దిగువకు వదిలేయాలని అధికారులకు సూచించారు. దీంతో నీళ్లు వెళ్లేందుకు బుధవారం ఇరిగేషన్ అధికారులు కాలువ తీశారు. కానీ రాత్రి వేళ కొందరు స్థానికులు కాల్వలో మట్టిపోసి మూసేశారు. ఎగువ నుంచి వస్తున్న నీళ్లతో చెరువులోని నీటి మట్టం ప్రమాదకర స్థాయికిచేరుకుంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను అడగగా తమకు సంబంధం లేదని చెబుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.ఎఫ్టీఎల్ స్థాయికి మించి అడుగు మేర నిలిచిన నీళ్లు అధిక నీటిని దిగువకు వదలడంలో శాఖల మధ్య సమన్వయ లోపం ఎగువ నుంచి వస్తున్న వరదతో మరింతగా పెరుగుతున్న నీటి మట్టం -
కర్షకుల యూరియా కష్టాలు తీర్చాలి
బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ ఆమనగల్లు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవసరమైన యూరియాను అందించి, ఆదుకోవాలని బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్యానాయక్ డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. యూరియా కొరతకు కారణం మీరంటే మీరంటూ విమర్శలు చేసుకుంటున్నాయని, కానీ రైతుల కష్టాలు తీర్చడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వ్యవసాయం పండుగలా సాగిందని, రైతులకు చిన్నకష్టం రానివ్వలేదని గుర్తుచేశారు. రోడ్లన్నీ తానే తెచ్చానని చెప్పుకుంటున్న స్థానిక నాయకుడు ఒకరు.. కేంద్రంతో మాట్లాడి యూరియా తీసుకురావాలని హితవు పలికారు. అనంతరం డీటీ వినోద్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ పంతునాయక్, వార్డు మాజీ సభ్యుడు వస్పుల సాయిలు, నాయకులు రమేశ్, మహేశ్, గణేశ్, జగన్, పంతునాయక్, సోమ్లనాయక్, శ్రీకాంత్, గణేశ్‌నాయక్, కృష్ణవేణి, లలిత, విమలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
‘ఈ’ కుప్పలు!
రాష్ట్రంలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సాక్షి, సిటీబ్యూరో: సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతకు రెట్టింపు వేగంతో ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలు (ఈ–వేస్ట్) విడుదల అవుతున్నాయి. సెల్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్, రిఫ్రిజిరేటర్, ఏసీ, ప్రింటర్లు ఇలా ప్రతి ఎలక్ట్రానిక్ ఉత్పత్తి వినియోగం తర్వాత వ్యర్థాలుగా మారుతున్నాయి. తెలంగాణలో తొలిసారిగా ఈ–వేస్ట్ లక్ష మెట్రిక్ టన్నుల మార్క్‌ను దాటింది. 2024–25లో 1,19,187 మెట్రిక్ టన్నుల ఈ–వేస్ట్ విడుదలయ్యాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అదే 2023–24లో 65,226 మెట్రిక్ టన్నుల ఈ–వేస్ట్ విడుదలైంది. అంటే ఏడాది కాలంలో రాష్ట్రంలో అదనంగా 53,961 మెట్రిక్ టన్నులు ఈ–వ్యర్థాలు విడుదలయ్యాయి. ● దేశంలో ఉత్తరప్రదేశ్, హరియాణా తర్వాత దేశంలో అత్యధిక ఈ–వ్యర్థాలు విడుదలవుతున్నది మన రాష్ట్రంలోనే. తెలంగాణలో అధికంగా ఈ–వేస్ట్ విడులయ్యేది హైదరాబాద్ నుంచే. గత ఐదేళ్లలో నగరంలో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాల పరిమాణం గణనీయంగా పెరుగుతుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017–18లో నగరంలో 33,425 మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలు ఉత్పత్తి కాగా.. ఇప్పుడవి 50,835 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. ఈ–వేస్ట్ ప్రాసెసింగ్.. దేశంలో ఈ–వ్యర్థాల ప్రాసెసింగ్ సామర్థ్యం 13.97 మెట్రిక్ టన్నులు కాగా.. ఇందులో తెలంగాణ వాటా 8.5 శాతం. ప్రాసెసింగ్ వృద్ధిలో ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 2021–22 నుంచి ఈ–వేస్ట్ ప్రాసెసింగ్ మూడు రెట్లు వృద్ధి చెందుతోంది. ఐటీ సంస్థల కార్యకలాపాలు, పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం, చురుకై న ఈ–వేస్ట్ నిర్వహణ విధానాలు ప్రాసెసింగ్ వృద్ధికి ప్రధాన కారణాలు. 2021–22లో 42,297 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ప్రాసెసింగ్ కాగా.. గత ఆర్థిక సంవత్సరానికి 1.19 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అయితే రాష్ట్రంలో కేవలం 15 రీసైక్లింగ్ కేంద్రాలే ఉన్నప్పటికీ.. ప్రాసెసింగ్‌లో ఈ స్థాయిలో వృద్ధి నమోదు కావడం గమనార్హం. తొలిసారిగా లక్ష మెట్రిక్ టన్నులు దాటిన ఈ–వేస్ట్ 2024–25లో 1,19,187 మెట్రిక్ టన్నుల విడుదల ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా తర్వాత అత్యధికంగా మన రాష్ట్రంలోనే.. రాష్ట్రంలో కేవలం 15 రీసైక్లింగ్ కేంద్రాలే పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఈ–వ్యర్థాలు ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం చూపిస్తుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో సీసం, పాదరసం, కాడ్మియం, క్రోమియం వంటి రసాయన పదార్థాలు ఉంటాయి. వీటిని సరిగా నిర్వీర్యం చేయకుండా పారేస్తే.. గాలి, నీరు, నేల కలుషితం అవుతాయి. ఈ కలుషితాలతో శ్వాసకోశ వ్యాధులు, నాడీ సంబంధిత రుగ్మతలు, దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులపై ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంద ని వారు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా, కఠినంగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
గణేశ్ లడ్డూల చోరీ.. ఇన్‌స్టాలో పోస్ట్!
ఆదిబట్ల పీఎస్‌లో ఏడుగురిపై కేసు నమోదు ఇబ్రహీంపట్నం రూరల్: మండపాల్లోని గణేశుడి లడ్డూలు చోరీ చేసి, తిన్న ఏడుగురు యువకులపై పోలీసు కేసు నమోదైంది. ఆదిబట్ల ఎస్ఐ సైదయ్య కథనం ప్రకారం.. ఉపాధి నిమిత్తం మన్నెగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న సాయితేజ, శివకుమార్ వినాయకుడి లడ్డూలను చోరీ చేసి, తింటే మంచి జరుగుతుందని నమ్మి రాత్రి వేళ మన్నెగూడలోని ఎన్‌ఎస్‌ఆర్‌నగర్, మహోనియా ఆస్పత్రి వెనకాల, ఎంఎంకుంట ప్రాంతాల్లోని పలు వినాయక విగ్రహాల చేతుల్లో ఉన్న లడ్డూలను దొంగిలించారు. అబ్బు, ప్రవీణ్, రాహుల్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లతో కలిసి లడ్డూలను తినేశారు. అంతటితో ఆగకుండా లడ్డూలు చోరీ చేసిన సమయంలో తీసుకున్న వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఉదయాన్నే లడ్డూలు లేకపోవడాన్ని గమనించిన నిర్వాహకులకు ఇన్‌స్టాలో వీరు షేర్ చేసిన వీడియోలు కనిపించడంతో, నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మట్టి తరలిస్తున్న టిప్పర్లు సీజ్ ఇబ్రహీంపట్నంరూరల్: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. రావిర్యాల, నాదర్గుల్ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. నాలుగు టిప్పర్లను స్వాధీనం చేసు కొని సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. మహిళ మెడలో గొలుసు చోరీ సనత్‌నగర్: నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళ మెడలోని 1.5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సనత్‌నగర్ ఎస్సార్టీకాలనీకి చెందిన కడారి రమాదేవి ఈ నెల 1న సాయంత్రం స్థానిక నెహ్రు పార్కు సమీపంలోని గణేష్ మండపానికి వచ్చింది. రాత్రి ఇంటికి తిరిగి వెళుతుండగా సాయిబాబా ఆలయ సమీపంలో బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని 1.5 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌పై వచ్చిన వ్యక్తి స్కైబ్లూ కలర్ జర్కిన్ ధరించినట్లు బాధితురాలు పేర్కొంది. బైక్ అదుపుతప్పి ఉద్యోగి మృతి హస్తినాపురం: బైక్ అదుపుతప్పి కింద పడడంతో తీవ్రంగా గాయపడిన సాఫ్ట్వేర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక హైకోర్టు కాలనీకి చెందిన దుర్గంపూడి అంజిరెడ్డి(43) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను బైక్‌పై వెళుతుండగా పనామాచౌరస్తా సమీపంలోని మాక్స్‌విజన్ ఐ ఆసుపత్రి వద్ద బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని గుర్తించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. ఆయన్ని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు గోపాలకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
బాలుడి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: మేనమామ మందలించడంతో బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన దుర్గానాథ్ కొన్నేళ్ల క్రితం జల్పల్లికి జీవనోపాధి నిమిత్తం వలస వచ్చాడు. తల్లిదండ్రులు లేని అతని మేనల్లుడు ప్రవీణ్నాథ్(12) ఇతని వద్దే ఉంటాడు. తరచూ అల్లరి చేసే ప్రవీణ్‌ను మేనమామ గత నెల 31వ తేదీన రాత్రి మందలించాడు. ఉదయం లేచి చూసేసరికి కనిపించలేదు. అతని ఆచూకీ కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై మంగళవారం రాత్రి దుర్గానాథ్ పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని కోరారు. హెడ్ కానిస్టేబుల్‌పై యువకుల దాడి రహమత్‌నగర్: గణేశ్ నిమజ్జన యాత్ర సందర్భంగా హెడ్ కానిస్టేబుల్‌పై యువకులు దాడి చేసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి ఈఎస్ఐ విజయలక్ష్మీ ఆలయం వద్ద వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళుతున్నాయి. ఆ సమయంలో ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ యువకులు గొడవ చేస్తుండటాన్ని తన సెల్ ఫోన్లో రికార్డు చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన వారు హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బోరబండ పోలీసులు గణేశ్ మండప నిర్వాహకులకు ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆరిఫ్ మృతదేహం వెలికితీత రాజేంద్రనగర్: హిమాయత్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఆరీఫ్ మృతదేహన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బుధవారం వెలికి తీశారు. జీవితంపై విరక్తి చెంది ఆరీఫ్ అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆరీఫ్ మృతదేహన్ని వెలికి తీసిన అనంతరం రాజేంద్రనగర్ పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఆరీఫ్ కాలుకు గాయం కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఆలయ భూమిలో రోడ్డు లేదు
ప్రహరీ నిర్మాణానికి అనుమతి ఇవ్వండి: కుర్మసంఘం ఇబ్రహీంపట్నం రూరల్: బీరప్ప దేవాలయం భూమిలో రోడ్డు లేదని, ప్రహరీ నిర్మాణం చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆ ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వే నంబర్ 31లో 1.10 ఎకరాల విస్తీర్ణం భూమి 1995లో ఆలయానికి కొనుగోలు చేశామని తెలిపారు. అనంతరం చుట్టూ ప్రహరీ నిర్మించామన్నారు. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు కూల్చి వేశారని, అలా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ భూమిలో మరలా ప్రహరీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోరే జంగయ్య, బండ రాజు, బీరప్ప, బాలం భాస్కర్, యాదగిరి, శివకుమార్, ఐలయ్య, సతీష్, రవి, భిక్షపతి, మల్లేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కారు అదుపుతప్పి.. వాగులో పడి
యువకుడి దుర్మరణం చేవెళ్ల: కల్వర్టు వద్ద కారు అదుపుతప్పి వాగులో పడడంతో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్లకు చెందిన గుడిపల్లి నితీష్‌రెడ్డి(27) వ్యవసాయంతోపాటు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. మూడేళ్ల క్రితమే ఆయనకు వివాహం జరిగింది. మంగళవారం రాత్రి వినాయక మండపాల వద్ద జరిగిన అన్నదానాలు, పూజలు, భజన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అర్ధరాత్రి వ్యవసాయ పొలాల వైపు పని నిమిత్తం వెళ్తుండగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కారు బురదలో జారడంతో చేవెళ్ల–పామెన లింక్రోడ్డుపై ఉన్న పెద్ద వాగు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. కారు ఎగిరి వాగులో పడడంతో యువకుడు అందులో ఇరుక్కుపోయారు. వాగులో నీరు కారులోకి రావటంతో నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందారు. ఉదయం అటువైపు వెళ్తున్న రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీసి చూస్తే నితీష్రెడ్డిగా గుర్తించారు. యువకుడు మృతితో భార్య, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి నితీష్‌రెడ్డి బీజేపీ పార్టీలో చురుకుగా పనిచేసేవాడు. బుధవారం విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్ తదితరులు నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
ఆరువేల మందితో బందోబస్తు
● వినాయక నిమజ్జనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ● సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి మూసాపేట: సైబరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన కూకట్‌పల్లిలోని ఐడిఎల్ రంగధాముని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 వేల మంది పోలీసులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన 700కు పైగా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నాన్నారు. రాబోయే మూడు రోజుల్లో వినాయక నిమజ్జనాలు భారీ ఎత్తున జరగనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. చివరి రోజు నిమజ్జన ఏర్పాట్లపై ఇప్పటికే అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసినట్లు తెలిపారు. భక్తులు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసులతో గస్తీ నిర్వహిస్తూనే సీసీటీవీల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో బాలానగర్ జోన్ డీసీపీ సురేష్‌కుమార్, కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్, కూకట్పల్లి సీఐ కె.వి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో టోకరా నిందితుడి అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కర్నాటకకు చెందిన ప్రతాప్ కేసరి ప్రధాన్ బెంగళూరులోని తిరుమలశెట్టిహళ్లిలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కస్టమర్లకు పొదుపు, కరెంట్ ఖాతాలు తెరవడం, కస్టమర్లతో సంబంధాలు నిర్వహించడం అతడి బాధ్యత. ఈ క్రమంలో కస్టమర్లకు కమీషన్ ఆశ చూపించి, వారి నుంచి ఖాతా వివరాలను తీసుకుని వాటిని సైబర్ నేరగాళ్లకు చేరవేస్తూ అక్రమంగా డబ్బు సంపాదించేవాడు. వారు ఆయా ఖాతాలను సైబర్ నేరాలు, మోసాలకు వినియోగించేవారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన మహిళకు గత జులైలో సైబర్ నేరగాడు ప్రదీప్ సావంత్ అనే వ్యక్తి ఫోన్ చేసి, ముంబైలోని అంధేరి ఈస్ట్ పోలీసు అధికారిగా పరిచయం చేసుకున్నారు. బాధితురాలి బ్యాంక్ ఖాతా నుంచి అనధికారికంగా లావాదేవీలు జరిగాయని, మనీలాండరింగ్ కేసు నమోదైందని ఆమెను భయభ్రాంతులకు గురి చేశారు. ఆర్బీఐ, సీబీఐ, ఈడీ అధికారులుగా నటిస్తూ బాధితురాలిని ఏకంగా ఆరు గంటల పాటు వీడియో కాల్లో విచారించారు. వాట్సాప్ ద్వారా నకిలీ గుర్తింపు కార్డులు, అరెస్టు వారెంట్లను పంపించి బాధితురాలిని భయపెట్టారు. ఆర్బీఐ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ రాగానే 24 గంటల్లోపు డబ్బును తిరిగి చెల్లిస్తామని నమ్మించి, బాధితురాలి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రూ.10.02 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో నిందితుడు ప్రతాప్ కేసరి ప్రధాన్‌ను అరెస్టు చేశారు. అతడిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు కేసులు ఉండగా.. తెలంగాణలో రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు. -
కార్మిక హక్కులను కాలరాయొద్దు
● సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ ● కందుకూరులో యూనియన్ సర్వసభ్య సమావేశం కందుకూరు: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అమలవుతున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలు సరికాదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రమోహన్, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి.కవిత అన్నారు. మండల కేంద్రంలోని సీతారామశాస్త్రి ఫంక్షన్ హాల్లో బుధవారం యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల హక్కులను కాల రాశారన్నారు. ఈ విషయమై కార్మికులు ఆందోళనలు చేయకుండా భయపెడుతున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు మందలించినా కేంద్రం తీరు మారడం లేదని అసహనం వ్యక్తంచేశారు. ఎర్ర జెండా పోరాటంతో ఎనిమిది గంటల పని విధానం అమలులోకి రాగా, దాన్ని తుంగలో తొక్కి 12గంటలు అమలు చేస్తున్నారని తెలిపారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఐటీయూ మండల నూతన కమిటీ కన్వీనర్‌గా బుడ్డీరపు శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు, వ్యవసాయ కార్మిక, ఆశ, వీఓఏ, బీసీడబ్ల్యూ, మధ్యాహ్న భోజన, ఎఫ్ఏల, భగీరథ, ఆర్టీసీ, భవన నిర్మాణ, పంచాయతీ తదితర కార్మిక సంఘాల నాయకులు అంకగళ్ల కుమార్, శ్రీలత, సరస్వతి, బండి సత్తయ్య, పోల్కం శ్రీరాములు, కె.శ్రీనివాస్, రసింహ, లక్ష్మణ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆమనగల్లు: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ ఆమనగల్లు ఏరియా కన్వీనర్ పెంటయ్య డిమాండ్ చేశారు. పట్టణంలో బుధవారం మండల గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులకు రూ.18 వేలు అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అనంతరం ఎంపీడీఓ కుసుమ మాధురికి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులు పాండు, కార్యదర్శి పర్వతాలు, కోశాధికారి లక్ష్మణ్‌నాయక్, సభ్యులు భాగ్యనాయక్, దోడ్యనాయక్, భాగ్య, కవిత, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం మహాసభ నిర్వహించారు. మహాసభలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షురాలిగా పద్మ, అధ్యక్షురాలిగా రజియాబేగం, ప్రధాన కార్యదర్శిగా ఈశ్వరమ్మ, కోశాధికారిగా బేబి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆమనగల్లు ఏరియా కన్వీనర్ పెంటయ్య -
సరిపడా యూరియా ఇవ్వండి
సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య మంచాల: రైతులకు సరిపడా యూరియా అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్యర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు రాజ్యమని గొప్పలు చెప్పుకొని ప్రభుత్వాలు వారి బాధలను పట్టించుకోవడం లేదన్నారు. రైతాంగ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మూతలు ఆడడం సరైంది కాదన్నారు. యూరియా అందించి అండగా నిలవాలన్నారు. వర్షాకాలం రైతాంగం పంటలు సాగు చేసే సమయంలో కొరత విధించడం ఎంత వరకు సమంజసం కాదన్నారు. వ్యవసాయ పనులు మానేసి రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూలో నిరీక్షించడం దారుణన్నారు. ఇప్పటికై నా యూరియా నిల్వలు పెంచాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జంగయ్య, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి, యాదయ్య, జంగయ్య, లెనిన్, ఐలయ్య, వినోద్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్బందులు రానీయొద్దు
● నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయండి ● అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం సాక్షి, రంగారెడ్డిజిల్లా: గణేశ్ నిమజ్జనం సందర్భంగా చెరువులు వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనివ్వొద్దని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సరూర్‌నగర్ మినీట్యాక్ బండ్‌ను జీహెచ్ఎంసీ, పోలీసు, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. రూట్ మ్యాప్ ఆధారంగా ట్రాఫిక్ సమ స్య తలెత్తకుండా నిమజ్జనం సాఫీగా సాగేలా చూడాలని, అవసరమైన చోట బారికేడ్లను ఏర్పాటు చేసుకోవాలని పోలీసు శాఖకు సూచించారు. భారీ గణనాథులు నిమజ్జనం చేసే చోట అప్రమత్తంగా ఉండాలని, నిమజ్జనం పూర్తయే వరకు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. చెరువు కట్టపై వైద్య శిబిరాలతో పాటు అత్యవసర పరిస్థితి దృష్ట్యా అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. చెరువుకట్టపై పారిశుద్ధ్య సమస్య రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నా రు. భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం కలెక్టర్ బాలాపూర్ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ సమితి ప్రతినిధులు కలెక్టర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి ప్రసాదం అందజేశారు. కలెక్టర్ వెంట ఈస్ట్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, కందుకూరు ఆర్డీఓ రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. సామగ్రి ధరలు పెంచితే కఠిన చర్యలు ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేసే ఇసుక, ఇటుక, సిమెంట్ ధరలపై నియంత్రణ ఉంచాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఆయా ట్రేడర్స్‌తో మాట్లాడి ధరలు అదుపులో ఉండేలా చూడాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు పెంచే వ్యాపారులతో కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధ వారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ధరల నియంత్రణ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఇంటికి కావాల్సిన ఇసుకను మన ఇసుక మన వాహనం ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఎప్పటికప్పుడు తమ ఇంటి నిర్మాణ పనుల దశలను ఆన్లైన్ మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయడంతో పాటు బిల్లుల చెల్లింపు ఏ దశలో ఉందో కూడా తెలుసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. -
ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు
ఆమనగల్లు: ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందొచ్చని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి సురేశ్ అన్నారు. పంటను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందని చెప్పారు. ఆకుతోటపల్లి గ్రామంలోని రైతువేదికలో బుధవారం జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్‌పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయిల్‌పాం సాగుకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మొక్కలకు 90 శాతం, డ్రిప్ ఇరిగేషన్‌కు 80 శాతం రాయితీ ఉందన్నారు. పంట సాగుచేసిన రైతులకు ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లపాటు అందించడం జరుగుతుందని వివరించారు. జిల్లాలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించడానికి వ్యాల్యు ఆయిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుందని, సదరు కంపెనీ రైతుల నుంచి కొనుగోలు చేస్తుందని ఆయన వెల్లడించారు. పంటకు కోతుల బెడద ఉండదని, కూలీల అవసరం కూడా తక్కువగా ఉంటుందన్నారు. అనంతరం రైతులకు ఆయిల్కంపెనీతో కుదుర్చుకున్న కొనుగోలు ఒప్పంద పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి సౌమ్య, ఆయిల్ పాం ఏరియా మేనేజర్ ప్రమోద్, హెచ్ఈఓ శ్రవణ్‌కుమార్, ఏఈఓ భూదేవి పాల్గొన్నారు. జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి సురేశ్ -
కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో సంక్షోభం
షాద్‌నగర్: ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ సంక్షోభంలో కూరుకుపోయిందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన నేతలు కవిత మాటలతో మట్టి కొట్టుకుపోయే సమయం ఆసన్నమైందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సాగు, తాగునీటి కోసం ప్రాజెక్టులను నిర్మించిందన్నారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేలాది కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని స్వయానా కేసీఆర్ కూతురే చెప్పడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోవడం లేదన్నారు. ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరంపై జరిగిన అవినీతిని జస్టిస్ ఘోష్ కమిషన్ వెల్లడించిందని స్పష్టంచేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో పదేళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ కవిత దెబ్బతో సంక్షోభంలో చిక్కుకుందన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు బాబర్‌ఖాన్, రఘునాయక్, చెంది తిరుపతిరెడ్డి, కొంకళ్ళ చెన్నయ్య, కృష్ణారెడ్డి, పురుషోత్తంరెడ్డి, జితేందర్‌రెడ్డి, చంద్రశేఖర్, ఇబ్రహీం, శ్రీను, వీరేశం, సుదర్శన్, అశోక్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
కాటేస్తున్న కరెంట్!
సాక్షి, రంగారెడ్డి: ఎల్సీ (లోడ్ రిలీఫ్) తీసుకున్నామనే ధీమా.. అతి విశ్వాసం.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. వెరసి కార్మికులు తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వినియోగదారుల ఇళ్లలో వెలుగులు నింపుతూ.. వారి కుటుంబాల్లో మాత్రం చీకట్లు మిగుల్చుతున్నారు. విద్యుత్ స్తంభం ఎక్కే ముందు కరెంట్ ఉందో? లేదో ఎర్తింగ్ రాడ్‌తో చెక్ చేసుకోవాలని విద్యుత్ శాఖ సూచిస్తున్నా.. క్షేత్రస్థాయిలోని కార్మికులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే స్తంభాలు ఎక్కేస్తున్నారు. ఫలితంగా వినియోగదారుల ఇళ్లలోని ఇన్వెర్టర్లు, జనరేటర్ల నుంచి కరెంట్ రివర్స్ సప్లయ్ అవుతుండటంతో విద్యుత్‌షాక్‌కు గురై మృత్యువాతపడుతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆర్టిజన్లు మృత్యువాత పడ్డారు. లైన్ల నిర్వహణలో కీలకం విద్యుత్ లైన్ల నిర్వహణ, కనెక్షన్ల జారీ, సరఫరా, బిల్లుల జారీ, వంటి పనుల్లో ఆర్టిజన్లే కీలకం. డిస్కం పరిధిలో 23 వేల మంది ఆర్టిజన్లు పని చేస్తున్నారు. వీరిలో గ్రేటర్ పరిధిలోని 6,500–7000 మంది కార్మికులు పని చేస్తున్నారు. విద్యుత్ లైన్ల నిర్వహణలో ఆర్టిజనన్లదే కీలక పాత్ర. కొత్త లైన్లు వేయడం, విద్యుత్ స్తంభాలు పాతించడం, పాడైన వాటిని గుర్తించి వాటి స్థానంలో కొత్తవి అమర్చడం, లూజైన లైన్లు గుర్తించి సరి చేయడం, కనెక్షన్లు ఇచ్చి మీటర్లు అమర్చడం, హెచ్చుతగ్గుల సమస్యను నివారించడం, కాలిపోయిన ఫీజులను సరి చేసి విద్యుత్‌ను పునరుద్ధరించడం, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం వంటి కీలక పనులు వీరే చేయాల్సి ఉంటుంది. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా.. లైన్ల కింద పని చేసేవారు విధిగా తలకు హెల్మెట్, చేతులకు గ్లౌస్లు ధరించాలి. స్తంభాలపైకి ఎక్కినప్పుడు విధిగా నడుముకు సేఫ్టీ తాడు బిగించుకోవాలి. తీగలను తాకడానికి ముందే ఎర్త్‌రాడ్, టెస్టర్‌తో కరెంట్ సరఫరా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లైన్లకు ఇరు వైపులా ఏమైనా అపార్ట్మెంట్లు, వాణిజ్య సంస్థలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. కరెంట్ సరఫరా అవుతున్న ఫీడర్, డీటీఆర్‌ను గుర్తించి వాటిపై సరఫరా నిలిపివేయాలి. ఇవేవీ పట్టించుకోకుండా అతి విశ్వాసంతో స్తంభాలు ఎక్కి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సేఫ్టీ టూల్స్ అందజేయాల్సి ఉన్నా డిస్కం పరిధిలోని కార్మికులకు కనీసం టెస్టర్ కూడా సరఫరా చేయడం లేదనే విమర్శలు లేకపోలేదు. కొన్ని ప్రమాద ఘటనలు ● శంషాబాద్ మండలం సంఘీగూడ చౌరస్తాలోని విద్యుత్ లైన్ల మరమ్మతుల కోసం ఆర్టిజన్ అనిల్‌కుమార్ స్తంభాన్ని ఎక్కాడు. ఎల్సీ తీసుకున్నాడు. తీరా స్తంభం ఎక్కిన తర్వాత పవర్ రివర్స్‌తో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ● కందుకూరు మండలం సాయిరెడ్డిపల్లె సమీపంలోని అమ్మాలబావి తండా పొలాల వద్ద కరెంట్ సరఫరా నిలిచిపోయింది. లైన్మెన్ వెంకటయ్య, ముచ్చర్లకు చెందిన ఒప్పంద కార్మికుడు శివకుమార్‌గౌడ్(24)తో కలిసి అక్కడికి వెళ్లి 20 నిమిషాల్లో లైన్లకు మరమ్మతులు పూర్తి చేశారు. తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేసిన జంపర్లను కలిపేందుకు మరో స్తంభం వద్దకు వెళ్లారు. ఎల్సీ తీసుకునేందుకు సబ్‌స్టేషన్‌లోని సిబ్బందితో లైన్మెన్ వెంకటయ్య ఫోన్లో మాట్లాడుతుండగానే శివకుమార్ స్తంభంపైకి ఎక్కడంతో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. అంతలోని సరఫరా నిలిచిపోవడంతో గాయాలపాలైన శివకుమార్ వైర్లమధ్యే చిక్కుకుని విలవిల్లాడాడు. సమీపంలో ఉన్న రైతులు తాళ్ల సాయంతో స్తంభంపై నుంచి కిందికి దించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ● ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం వద్ద విద్యుత్ స్తంభంపై సాంకేతిక సమస్య తలెత్తింది. నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు జూనియర్ లైన్మెన్ రవికుమార్ సహా ఆర్టిజన్ బొమ్మ అశోక్‌కుమార్ వెళ్లి స్తంభంపైకి ఎక్కి లైన్లు సరి చేస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. విద్యుత్ స్తంభాలపై విగతజీవుల్లా.. ఎల్సీ తీసుకున్నా.. రివర్స్ సరఫరా అవగాహన లేక కొందరు.. అతి విశ్వాసంతో మరికొందరు మృత్యువాత పడుతున్న ఆర్టిజన్లు కార్మికుల భద్రత యాజమాన్యానికి పట్టడం లేదు. 80 శాతం కార్మికుల వద్ద ఎలాంటి సేఫ్టీ టూల్స్ లేవు. ఉన్నవి సైతం పాడైపోయాయి. క్షేత్రస్థాయి కార్మికులకు ఏటా సేఫ్టీటూల్స్ అందిస్తున్నట్లు చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఫీడర్లు, లైన్లపై చాలా మందికి కనీస అవగాహన ఉండటం లేదు. పవర్ రివర్సన్తో కార్మికులు షాక్‌కు గురవుతున్నారు. – గాంబో నాగరాజు, విద్యుత్ కార్మిక సంఘం నాయకుడు -
ఆసరా.. అంతేనా!
● జాడలేని కొత్త పింఛన్లు ● అర్హుల ఎదురుచూపులు ● కార్యాలయాల చట్టూ ప్రదక్షిణలు కేశంపేట: ఆసరా పింఛన్లు కొత్తగా మంజూరు కాకపోవడంతో అర్హులైనవారు అశగా ఎదురుచూస్తున్నారు. నాయకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు అర్హులకు నూతనంగా పింఛన్లు మంజూరు చేయలేదు. దీంతో గ్రామాల్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు ఆసరా పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ చక్కర్లు వృద్ధాప్యంలో ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ వస్తే భరోసాతో బతకవచ్చని వృద్ధులు భావిస్తున్నారు. అలాగే ఇంటి పెద్దలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వితంతు మహిళలు ఈ సహాయంతో కుటుంబాన్ని పోషించుకోవచ్చని, ఒంటరి మహిళలు ఎవరిపై ఆధారపడకుండా జీవించొచ్చని కొత్త పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మూడేళ్లుగా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయడం లేదు. దీంతో అర్హులైన వారు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయానికి పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకొని తిరుగుతున్నారు. స్పష్టత కరువు కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గతంలో 57 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి, విచారణ అనంతరం మంజూరు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య పింఛన్ వయస్సు పెంచినట్టు గ్రామాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ చేయూత పింఛన్ సైట్లో 65 ఏళ్ల వారికి వృద్ధాప్య పింఛన్లకు అర్హులగా కన్పిస్తోంది. దీంతో గ్రామాల్లో 57 ఎళ్లు నిండిన వృద్ధులు అయోమయంలో పడ్డారు. వయస్సు నిర్ధారణపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పింఛన్ల మంజూరుకు కొందరికి మాత్రమే ఉన్నతాధికారులు అవకాశం కల్పించారు. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారు మరణిస్తే ఆ పింఛన్‌ను పింఛన్‌దారు భార్య లేదా భర్తకు అందిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ పొందుతూ దివ్యాంగులైన వారికి వృద్ధాప్య పింఛన్ నుంచి వికలాంగుల పింఛన్‌కు మారుస్తున్నారు. దివ్యాంగుల పింఛన్ పొందుతూ మరణించిన వారి పింఛన్‌ను వృద్ధాప్య పింఛన్‌కు అధికారులు మార్చడం లేదు.