Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

IndusInd Bank reported disappointing Q3 FY26 results1
ఇండస్‌ఇండ్‌కు మైక్రోఫైనాన్స్‌ మంటలు

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. బ్యాంక్‌ నికర లాభం 90 శాతం క్షీణించి రూ. 128 కోట్లకు పరిమితమైంది. కొత్త యాజమాన్య నిర్వహణలో లోన్‌ బుక్‌ వెనకడుగు వేయడం, మైక్రోఫైనాన్స్‌ బుక్‌లో క్షీణత ప్రభావం చూపాయి. గత క్యూ3లో బ్యాంక్‌ లాభం రూ. 1,402 కోట్లుగా నమోదైంది. తాజాగా.. నికర వడ్డీ ఆదాయం 13% నీరసించి రూ. 4,562 కోట్లకు చేరింది. స్లిప్పేజీలు రూ. 2,200 కోట్ల నుంచి రూ. 2,560 కోట్లకు పెరిగాయి. వీటిలో మైక్రో రుణాల వాటా రూ. 1,022 కోట్లుకాగా.. మైక్రో లోన్‌బుక్‌ 46% క్షీణించి రూ. 17,669 కోట్లకు పరిమితమైంది. స్థూల మొండిబకాయిలు 2.25% నుంచి 3.56 శాతానికి పెరిగాయి. బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో 1 శాతం నష్టంతో రూ. 893 వద్ద ముగిసింది.

Indian rupee has fallen to historic lows against the US dollar2
రూపాయి విలవిల.. 

ముంబై: డాలరు డామినేషన్‌కు రూపాయి విలవిల్లాడుతోంది. విలువ అంతకంతకూ కరిగిపోతోంది. తాజాగా శుక్రవారం డాలర్‌ మారకంలో 32 పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 91.90 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం, అంతర్జాతీయ అనిశి్చతులు రూపాయి పతనానికి ప్రధాన కారణమయ్యాయి. అలాగే క్రూడాయిల్‌ ధరల ర్యాలీ, అమెరికా బాండ్లపై రాబడులు పెరగడమూ ఒత్తిడి పెంచాయని నిపుణులు తెలిపారు. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 91.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో 42 పైసలు క్షీణించి 92.00 వద్ద చరిత్రాత్మక ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్‌ బలోపేతం, ఎఫ్‌ఐఐల విక్రయాల ప్రభావంతో గతేడాదిలో 5% క్షీణించి రూపాయి... 2026లో జనవరి 23 వరకు 2% (202 పైసలు) పతనమైంది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో రిస్క్‌ సామర్థ్యం తగ్గడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల కొనసాగింపు ఒత్తిళ్ల ప్రభావంతో రూపాయి మరింత క్షీణించే వీలుంది. వచ్చే వారం నెలాఖరు కావడంతో దిగుమతిదారులు, హెడ్జర్ల నుంచి డాలర్ల్ల డిమాండ్‌ నెలకొనవచ్చు. రానున్న రోజుల్లో 91.60 – 92.30 శ్రేణిలో ట్రేడవ్వొచ్చు’’ అని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ విశ్లేషకుడు అనుజ్‌ చౌదరీ తెలిపారు.

Gold, silver prices continue to touch new highs amid global Markets3
పరుగు ఆపని పసిడి

న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా జోడు గుర్రాల్లా పరిగెడుతున్న వెండి, బంగారం మరోసారి కదంతొక్కాయి. స్పాట్‌ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పసిడి 10 గ్రాములు రూ. 1,500 బలపడి రూ. 1,58,700కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ. 9,500 జంప్‌చేసి రూ. 3,29,500ను తాకింది. ఫ్యూచర్స్‌ మార్కెట్లో కూడా బంగారం, వెండి సరికొత్త రికార్డులను సాధించాయి. కేజీ వెండి తాజాగా 4 శాతం జంప్‌చేసింది. ఎంసీఎక్స్‌లో మార్చి కాంట్రాక్ట్‌ రూ. 12,638 బలపడి రూ. 3,39,927ను తాకింది. ఇదే బాటలో బంగారం 10 గ్రాములు 2 శాతం(రూ. 2,885) ఎగసింది. ఫిబ్రవరి డెలివరీ రూ. 1,59,226కు చేరింది. బుధవారం వెండి(కేజీ) రూ. 3,35,521 వద్ద, గురువారం పసిడి(10 గ్రా.) రూ. 1,56,341 వద్ద చారిత్రక గరిష్టాలకు చేరిన విషయం విదితమే. వెరసి బంగారం వరుసగా ఐదో రోజు లాభపడింది. ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు 98.31కు వెనకడుగు వేయడం, యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపును చేపట్టవచ్చన్న అంచనాలు విలువైన లోహాలకు డిమాండ్‌ పెంచుతున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా సిల్వర్‌ సెంచరీ..యూఎస్‌ కామెక్స్‌లోనూ వెండి, బంగారం గరిష్ట ధరలతో ధగధగలాడుతున్నాయి. ఔన్స్‌ వెండి చరిత్రలో తొలిసారి 100 డాలర్లను దాటగా.. బంగారం అంచనాలను నిజం చేస్తూ ఔన్స్‌(31.1 గ్రా.) 5,000 డాలర్ల సమీపానికి చేరింది. సిల్వర్‌ మార్చి ఫ్యూచర్స్‌ 3.7 డాలర్లు ఎగసి 100 డాలర్లను తాకింది. గోల్డ్‌ ఫిబ్రవరి కాంట్రాక్ట్‌ 4,989.54 డాలర్లను తాకింది. వెరసి 2020 మార్చి తదుపరి ఈ వారం అత్యధికంగా లాభపడినట్లు నిపుణులు వెల్లడించారు.

Adani Group completes full takeover of IANS news agency4
బిజినెస్‌ నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌ దాకా

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ తాజాగా ఇండో–ఏషియన్‌ న్యూస్‌ సర్విస్‌(ఐఏఎన్‌ఎస్‌)ను పూర్తిగా స్వాదీనంలోకి తెచ్చుకుంది. ఇప్పటికే న్యూస్‌ ఏజెన్సీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌ మిగిలిన 24 శాతం వాటాను సైతం చేజిక్కించుకుంది. డీల్‌ విలువను వెల్లడించనప్పటికీ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ ద్వారా ఐఏఎన్‌ఎస్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌లో మిగిలిన వాటా ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. కాగా.. 2023 డిసెంబర్‌లో అదానీ గ్రూప్‌ ఏఐఎన్‌ఎస్‌ న్యూస్‌ ఏజెన్సీలో 50.5 శాతం వాటా కొనుగోలు చేసింది. తద్వారా న్యూస్‌వైర్‌ ఏజెన్సీని ఏఎంజీ మీడియాకు అనుబంధ సంస్థగా మార్చుకుంది. తిరిగి 2024 జనవరిలో ఐఏఎన్‌ఎస్‌లో వాటా పెంచుకోవడం ద్వారా ఏఎంజీ మీడియా 76 శాతం వోటింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ బాటలో మిగిలిన 24 శాతాన్ని సొంతం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఐఏఎన్‌ఎస్‌ను పూర్తి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేసుకోనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. దేశీయంగా వివిధ భాషల న్యూస్‌ ఏజెన్సీలలో ఒకటైన ఐఏఎన్‌ఎస్‌ ప్రింట్, డిజిటల్, బ్రాడ్‌క్యాస్ట్‌ ప్లాట్‌ఫామ్స్‌కు వార్తలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్‌డీటీవీ, బీక్యూ ప్రైమ్‌లలో వాటాలు కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌ ఇకపై మీడియా, కంటెంట్‌ ఎకోసిస్టమ్‌లో కార్యకలాపాలను మరింత విస్తరించనుంది.

common itr to couples in india soon5
భారత్‌లోనూ.. దంపతులకు ఉమ్మడి ఐటీఆర్‌కు చాన్స్..?

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తుంటే.. వేర్వేరుగా ఆదాయపన్ను రిటర్న్స్(ఐటీఆర్) దాఖలు చేయడం సహజమే..! అయితే.. పన్ను వెసులుబాటు విషయంలో ఇరువురూ తంటాలు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. హౌసింగ్ లోన్, పిల్లల ట్యూషన్ ఫీజులు, ఇంటి అద్దె, ఎడ్యుకేషన్ లోన్, విద్యుత్తు వాహనాల కొనుగోలు, మెడికల్ ఇన్సూరెన్స్.. ఇలా క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బందులు తప్పవు. ఇకపై ఆ సమస్య లేకుండా దంపతులకు ఉమ్మడి ఐటీఆర్ వెసులుబాటును కల్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి చర్యలు తీసుకుంటున్నారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.ఐసీఐఏ ప్రతిపాదనలతో..నిజానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఐఏ) కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి ఐటీఆర్ ప్రతిపాదనలు చేసింది. ఈ విధానం వల్ల దంపతులు ఒకే ఐటీఆర్ చెల్లించే వెసులుబాట్లు ఉంటాయి. ఇప్పటికే అమెరికా, జర్మీన వంటి దేశాల్లో ఈ విధానం కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఐసీఐఏ వెల్లడించింది. ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపై ఓ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.వేతన జీవులకు ఊరటనిచ్చేందుకు..వేతన జీవులకు ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో కొత్తపన్ను విధానంలో ఉన్నవారికి రూ.12 లక్షల వార్షికాదాయం వరకు పన్ను మినహాయింపునిచ్చిన విషయం తెలిసిందే..! పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు కూడా వరాల జల్లులు కురిపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక వేతన సవరణ సంఘం సిఫార్సులను సైతం అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలిసింది.ఉమ్మడి పన్నుల వల్ల ప్రయోజనాలెన్నో..!ఉమ్మడి పన్ను విధానం వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలుంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పన్ను విధానానికి ఆదాయపన్ను చట్టం అంగీకరించదు. ఇందుకోసం పార్లమెంట్ చట్టంలో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి పన్ను వల్ల దంపతులిద్దరూ తమ క్లెయిమ్‌లను కలిపి చేసుకోవచ్చు. దంపతుల్లో ఒకరికి చాలా ఎక్కువ వేతనం, మరొకరికి తక్కువ ఉండడం సహజమే..! ఇలాంటి సందర్భాల్లో ఉమ్మడి ఐటీఆర్ వల్ల, పన్ను భారం భారీగా తగ్గే అవకాశాలుంటాయి. ఈ విధానం అందుబాటులోకి వస్తే.. పన్ను ఎగవేతలకు కూడా చెక్ పెట్టవచ్చని ఐసీఐఏ భావిస్తోంది.

Five Reasons Life Insurance Should Be Central to Retirement Plan6
లైఫ్ ఇన్సూరెన్స్.. ఎందుకు తీసుకోవాలంటే?

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో.. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రజల జీవన విధానం కూడా ఒకటి. ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగాలవైపు పరుగులు పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నవారికి పదవీ విరమణ తర్వాత జీవితం.. సురక్షితంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ముందుగానే సరైన ప్రణాళిక అవసరం. వయసు పెరిగేకొద్దీ.. వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. మనం ఈ కథనంలో పదవీ విరమణ ప్రణాళికలో జీవిత బీమా ఎందుకు ముఖ్యమో చూసేద్దాం.పదవీ విరమణ తర్వాత ఆదాయంఉద్యోగం చేస్తున్న వ్యక్తి పదవీ విరమణ చేస్తే జీతం ఆగిపోతుంది. అలాంటి సమయంలో.. ఖర్చుల కోసం స్థిరమైన ఆదాయం అవసరం. కొన్ని జీవిత బీమా పథకాలు పదవీ విరమణ తర్వాత నెలవారీ లేదా వార్షిక ఆదాయం అందిస్తాయి. ఎండోమెంట్ పాలసీలు, ULIP (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లు వంటి అనేక ప్రణాళికలు ఒకేసారి మొత్తం ఇవ్వడం కాకుండా.. నిరంతర ఆదాయం అందించే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా సాగేందుకు సహాయపడుతుంది.వైద్య ఖర్చులువయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. జీవిత బీమాతో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గుతుంది. ఖర్చుల గురించి ఆందోళన లేకుండా మంచి వైద్యం పొందే అవకాశం ఉంటుంది.అప్పులు తీర్చేందుకుకొన్ని సందర్భాల్లో హోమ్ లోన్స్ లేదా ఇతర లోన్లు పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాంటి అప్పులు వృద్ధాప్యంలో తప్పకుండా భారం అవుతాయి. జీవిత బీమా పాలసీ నుంచి వచ్చే మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపయోగించి మిగిలిన అప్పులను తీర్చేయవచ్చు. దీంతో అప్పుల ఒత్తిడి లేకుండా జీవించవచ్చు.ఖర్చుల నుంచి రక్షణకాలక్రమంలో ఖర్చులు పెరగవచ్చు. దీనికోసం డబ్బు దాచుకుంటే సరిపోదు. డబ్బును పెంచుకునే మార్గాలు ఉండేలా చూడాలి. దీనికోసం ULIPల వంటి మార్కెట్ ఆధారిత జీవిత బీమా పథకాలు. పెట్టుబడికి అవకాశం కల్పిస్తాయి. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు మంచి వృద్ధి పొందుతాయి.తక్షణ నగదు లభ్యతభూములు, ఇళ్లు వంటి స్థిర ఆస్తులను అవసరమైనప్పుడు వెంటనే అమ్మడం కష్టం. కానీ జీవిత బీమా నుంచి వచ్చే మొత్తాన్ని సులభంగా పొందవచ్చు. అంతే కాకుండా.. ఈ మొత్తంపై ట్యాక్స్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబానికి అవసరమైన సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..

Advertisement
Advertisement
Advertisement