breaking news
-
పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలి: పొన్నవోలు
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రపు బాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నేతల దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాక్షసులా వ్యవహరిస్తున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి వెనుక పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్టు చేయాలి. కూటమి ప్రభుత్వం అరాచకం తారా స్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను పీకు తింటున్నారు’’ అని పొన్నవోలు మండిపడ్డారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వచ్చింది కాబట్టి ఏం జరిగిందో అందరికీ తెలిసింది.. లేకపోతే ఈ ఘటనను యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలనుకున్నారని పొన్నవోలు చెప్పారు.పొన్నూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావు దాడి వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర నాగమల్లేశ్వరరావు గురించి మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనమన్నారు. నరేంద్రపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. -
మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకా మరి.. శ్మశానాన్నీ వదల్లేదు
సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో శ్మశాన వాటికలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. మచిలీపట్నంలో క్రైస్తవుల స్మశాన వాటికను టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ కబ్జా చేసేశారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో క్రైస్తవులకు ఏర్పాటు చేసిన స్మశాన వాటికకు టీడీపీ నేత తాళం వేశారు. క్రైస్తవుల స్మశాన వాటిక కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడు ఎకరాలు కొనుగోలు చేశారు. క్రైస్తవుల స్మశాన వాటిక నిర్వహణను నగరపాలక సంస్థకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది.నగరపాలక సంస్థ నిర్వహణలో ఉన్న స్మశాన వాటికను తన చేతుల్లోకి తీసుకున్న టీడీపీ నేత.. స్మశాన వాటికను తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. స్మశాన వాటికకు తాళం వేసి.. టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ తన గేదెలను పెంచుకుంటున్నారు. దీంతో టీడీపీ నేతపై మున్సిపల్ కమిషనర్‌కు క్రైస్తవులు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. క్రైస్తవుల మనోభావాలతో ఆడుకుంటున్న టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఓటేసిన వారిని కాటేస్తారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రీజనల్ కో-ఆర్డినేటర్ కురుసాల కన్నబాబు. అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రులు పాముల పుష్పా శ్రీవాణి, పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి అధికార పక్షం రెండోది ప్రతి పక్షం, ప్రతి పక్షం బాధ్యత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై గొంతుగా నిలవడం. ఇచ్చిన హామీలపై నిలదీయడం ప్రతి పక్షం బాద్యత. అమలు కానీ హామీలపై అడిగితే కేసులు పెట్టడం, నలకమందం అనడం సంప్రదాయం కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరు హామీలు ఇచ్చారు. నెలలు గడుస్తున్నాయి. ఆ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజలు తరపున అడిగే హక్కు ఉంది. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిలో ఈ మోసాలపై నిలదీస్తాం. ఏడాది పాలనలో ఉద్యోగాలు తీసి.. నిరుద్యోగ భృతి మాట లేకుండా చేశారు. ఈ ఏడాది నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి రూ.36 వేలు ఎప్పుడు ఇస్తారు?. మా ప్రభుత్వంలో హామీల అమలు కోసం మేనిఫెస్టోను జేబులో పెట్టుకుని తిరిగితే.. కుటమి నాయకులు అమలు చేయలేక వారి మేనిఫెస్టోను బిరువాలో పెట్టారు.’’ అంటూ బొత్స దుయ్యబట్టారు.‘‘పువ్వు పుట్టిగానే పరిమళించినట్లు లోకేష్ మంత్రి అయ్యారు. తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ‘‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’’ అన్నట్లు ఉంది. ఏడాది పుర్తి అయినా కేంద్రం ఇచ్చిన సాయం తప్ప రాష్ట్ర హామీ ఏమైంది?. సభ సాక్షిగా మే నెలలో ఇస్తామని చెప్పిన మంత్రి లోకేష్ ఏ మే నెలలో ఇస్తారో చెప్పాలి. వైద్య విద్యార్థులపై ఆడ పిల్లలు, చిన్న పిల్లలు అని చూడకుండా లాఠీఛార్జ్ చేయడం ప్రభుత్వ ధర్మం కాదు. ఏమి చేసిన అడిగే వారే లేరని వ్యవహరించడం సరికాదు. మనిషికి ఉన్న ఆశపైనే మోసపురిత రాజకీయాలు చంద్రబాబు చేస్తారు...చంద్రబాబు ఎప్పుడూ రైతులు, మహిళాలనే మోసం చేసి ముఖ్యమంత్రి అవుతున్నారు. రాష్ట్రంలో రైతులకు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. సరైన గిట్టుబాటు ధర కల్పించే బాద్యత ప్రభుత్వనిదే. వాటిపై మాట్లాడితే కేసులు పెట్టి తాట తీస్తామని వ్యాఖ్యలు చేస్తారా?. ఉపాధి హామీలో ఎప్పుడైనా మూడు నెలల బకాయిలు చెల్లించకుండా ఉంచారా?. రెక్క ఆడితే కానీ డొక్కా ఆడాని వారిని ఇబ్బందులకు గురి చేస్తారా?. మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు’’ అంటూ బొత్స నిలదీశారు.కూటమి సర్కార్ నయ వంచన: కన్నబాబుమాజీ మంత్రి కురుసాల కన్నబాబు మాట్లాడుతూ.. మోసపోయింది ప్రజలు తప్ప.. చంద్రబాబు కాదు. ఓటేసిన వాడిని కాటేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాలు కాపీ కొట్టి.. పక్క రాష్ట్రాల్లో కొన్ని కాపీ కొట్టి నయవంచన చేశారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చేతులెత్తేసిన ఘనత చంద్రబాబుది. ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తామని బాండ్లపై సంతకాలు చేసిన హామీ ఏమయింది?. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్య పరచాలి.ఏడాది పాలనలో ఏవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేదో ప్రజలకు వివరించాలి. సంక్షేమ పథకాలు అమలు చేసామని చెప్పిన చంద్రబాబును ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎన్నికల్లో ప్రజల్లో మోసం చేసే గెలిచిన నాయకుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డులు సాధిస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాబు ష్యూరిటీ అని చంద్రబాబు ప్రమాణం చేశారు. తల్లి వందనం కార్యక్రమంలో సర్పంచ్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి పథకం రాకుండా చేశారు. రాష్ట్రంలో లక్షలాది మహిళాలకు తల్లికి వందనం రాలేదు అన్నది నిజం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు ఆడి అధికారం దక్కించుకున్నారు. గతంలో కూడా ఆనాడు చంద్రబాబు 89 వేల కోట్లు రుణ మాఫీ చేయ్యల్సి వస్తే 15వేల కోట్లు మాత్రమే రుణ మాఫీ చేశారు. మీరు కనబడితే తొలి అడుగు కాదు తొలిసారిగా మిమ్మల్ని నిలదీస్తారు ప్రజలు. మా ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమన్ని నేరుగా ఇంటికి వెళ్లి తెలియజేశాం. మీరు చేసిన ప్రతి అరాచకాన్ని 2.0 లో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు’’ అని కన్నబాబు చెప్పారు. -
అదంతా కూటమి కుట్రే.. జగన్ రైతులను కలవడం ఖాయం: భూమన
సాక్షి, తిరుమల: ఏపీలో కూటమి ప్రభుత్వం మామిడి రైతులతో చలగాటం ఆడుతుందని ఆరోపించారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తూరులో కుమార్ అనే రైతును ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. బిన్ లాడెన్‌పై అమెరికా దాడిచేసినట్లు.. మారుమూల గ్రామంలో ఉన్న రైతును కూటమి నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు అని మండిపడ్డారు. రైతుల కోసం వైఎస్ జగన్ తప్పకుండా వస్తారు.. వారిని కలిసి కష్టాలను తెలుసుకుంటారు అని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుల కోసమే బంగారుపాల్యం గ్రామానికి వైఎస్ జగన్ వస్తున్నారు. అందుకే కూటమి నాయకులు రైతులను వేధింపులకు గురిచేస్తున్నారు. జగన్ చూస్తే కూటమి నాయకులకు భయం.. అందుకే రైతులను రాకుండా అడ్డుకుంటున్నారు. మరోపక్క వైఎస్సార్సీపీ నాయకులను భయపెడుతున్నారు. జనసేన, టీడీపీ వారు జగన్ పర్యటన రద్దు అయిందని అంటున్నారు. జగన్ రావడం.. రైతులను కలవడం ఖాయం.కర్ణాటకలో మామిడికి ప్రభుత్వం మంచి ధర కల్పించింది. కానీ, చిత్తూరులో కుమార్ అనే రైతు నష్టాలకు భరించలేక, చెట్లు నరికేశాడు. దానికి ఫారెస్టు అధికారులు.. కుమార్‌ను నా ఇబ్బందులకు గురి చేశారు. అటవీశాఖ పవన్ కళ్యాణ్ అధీనంలో ఉంది. ఓ మామిడి రైతును ఎర్ర చందనం స్మాగ్లర్ గా చూపించారు. తన తోటలో తోతాపురి మామిడి కుళ్లిపోయే పరిస్థితి వచ్చింది. మామిడి రైతులతో కూటమి సర్కార్ చెలగాటం ఆడుతుంది. వైఎస్సార్సీపీ నాయకులు నిజాలు చెబితే తట్టుకోలేకపోతున్నారు.వైఎస్ జగన్ పర్యటనపై నిర్బంధాలను విధించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ప్రజా సముద్రాన్ని ఎవరూ అడ్డుకోలేరు. వైఎస్ జగన్ రాష్ట్రంలోనే అత్యధిక, అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి. జగన్‌కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టే పద్దతి మారాలి. హెలికాప్టర్ అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరాము’ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాటలను మేము పట్టించుకోము. ఎవరో చెప్పారు. నేను లేస్తే మనిషి కాదని బెదించేవాడంటా.. ప్రజలు కూడా అతనికి భయపడేవారు.. వాస్తవానికి అతనికి కాళ్లే లేవు.. పవన్ కళ్యాణ్ మాటలు కూడా అలా ఉంటాయ్.. వాటిని మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అంటూ ఎద్దేవా చేశారు. -
గంటాను గెలిపించి తప్పు చేశాం..
విశాఖపట్నం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న జీవీఎంసీ భీమిలి జోన్ 2, 3 వార్డు నాయకులు, భీమిలి మండల నాయకులు శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీకి ఫిర్యాదు చేశారు. గంటాను గెలిపించుకోవడం తమకు భస్మాసురహస్తం అయిందని వారు బాబ్జీ వద్ద వాపోయినట్లు తెలిసింది. ఈ నెల 7న తాళ్లవలసలో జరగనున్న ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమం గురించి అదే గ్రామానికి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు డీఏఎన్ రాజుకు ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గంటా వెంట ఉన్న వ్యక్తి (స్వామి) ఇప్పుడు కూటమి నాయకుల నెత్తిన కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గంటా శైలి మారకపోతే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం ఢిల్లీ నుంచి రానున్న ఎంపీ భరత్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం.. అమరావతి వెళ్లి పార్టీ అధిష్టానం దృష్టికి తమ సమస్యను వివరిస్తామని నాయకులు తెలిపారు. బాబ్జీకి ఫిర్యాదు చేసిన వారిలో డీఏఎన్ రాజు, యరబాల అనిల్ ప్రసాద్, పతివాడ రాంబాబు, సాగిరాజు రాంబాబు, గరికిన పరశురాం, మరగడ రఘురామిరెడ్డి, లక్ష్మణరావు, వివిధ పంచాయతీల నాయకులు ఉన్నారు. అంతకు ముందు వారంతా డీఏఎన్ రాజు ఇంటి వద్ద సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. -
బీజేపీ ఐదు శాతం పార్టీనే ఉండిపోతుందేమో!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ భాగస్వామి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అన్యాయానికి గురవుతోందా? నామ్ కా వాస్తే మాత్రమే ప్రభుత్వ భాగస్వామిగా మిగిలిపోతోందా? ఆ పార్టీ నేతలు స్వయంగా వాపోతున్న విషయాలివే. ఈ ఆవేదన కూడా అర్థం చేసుకోదగ్గదే. ఏదో పెద్దన్న పాత్ర పోషిద్దామన్న ఆలోచనతో తెలుగుదేశంతో జతకట్టిన ఆ పార్టీ రాష్ట్ర నేతలకు ఇప్పుడు కనీసం చిన్నతమ్ముడు పాత్ర కూడా లభిస్తున్నట్లు లేదు. కొందరు మిత్రపక్ష నేతలు ఇప్పటికే బీజేపీని ఐదు శాతం పార్టీగా అవహేళన చేస్తున్నారని వీరు వాపోతున్నారు. పార్టీకి కొత్త అధ్యక్షుడుగా పీవీఎన్ మాధవ్ ఎన్నికైన సందర్భంగా జరిగిన సమావేశంలో కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తికి దర్పణం పడుతున్నాయి. మంత్రివర్గం కూర్పు నుంచి, నామినేటెడ్ పదవుల నియామకం వరకూ అన్నింటిలోనూ తమకు అన్యాయం జరుగుతోందన్నది వారి ఆవేదన. 2014-19 మధ్యకాలంలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలే ఉన్నా కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావుల రూపంలో రెండు మంత్రి పదవులు దక్కాయి. 2024లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఒకే మంత్రి పదవి దక్కడం.. అది కూడా ఢిల్లీలో పలుకుబడి కలిగిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ కావడం విశేషం. ఆ నియోజకవర్గానికి ఆయనకు సంబంధమే లేదట. సూట్ కేస్‌తో ధర్మవరం వెళ్లి ఎమ్మెల్యే అయిపోయారని, తదుపరి మంత్రి అయ్యారని వివిధ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈసారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డట్టు చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ సభలో ఆయన తన బాధను వ్యక్తం చేసినట్లు అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం, గుర్తింపు లేదని, బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండని రాజు వ్యాఖ్యానించారు. ఇది నిజం కూడా. ఎందుకంటే 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం నానా తంటాలు పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారాలు జరిపింది. ఆ విషయాన్ని ఆయన ఆ రోజుల్లో బహిరంగంగానే చెబుతూ తాను టీడీపీ పొత్తు గురించి మాట్లాడితే బీజేపీ పెద్దలు చివాట్లు పెట్టారని అనేవారు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు బతిమలాడి మరీ పొత్తు కుదిరేలా చేసుకున్నారు. పొత్తు కోసం చంద్రబాబు స్వయంగా ఢిల్లీలో రెండు,మూడు రోజులు వేచి చూసిన సందర్భాలూ ఉన్నాయి. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత లోకేష్ తన పెద్దమ్మ పురందేశ్వరిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వెంటబెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ క్రమంలోనే పొత్తు పెట్టుకోవడానికి మంతనాలు జరిగాయి. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉండడం కూడా కలిసి వచ్చింది. అంతేకాక వైఎస్సార్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ నాయకత్వం ఆసక్తి చూపినా, వివిధ కారణాల వల్ల వైసీపీ ముందుకు రాలేదు. ఆ తర్వాత బీజేపీ కూడా టీడీపీ, జనసేనలతో పొత్తుకు ఓకే చేసిందని చెబుతారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రధాని మోడీని, భారతీయ జనతా పార్టీని ఎంత తీవ్రంగా విమర్శించారో గుర్తు చేసుకుంటే.. రాజకీయాలలో ఇంతగా దూషించుకుని మళ్లీ కలవగలుగుతారా అన్న సందేహం వస్తుంది. ఎలాగైతేనేం..పొత్తు కుదరడంతో బీజేపీ తన కార్డును ప్లే చేసినట్లే ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో కూటమి ప్రయోజనాలకు అనుకూలంగా పని చేసిందన్న విమర్శలు వచ్చాయి. కొందరు పోలీసు అధికారులను బదిలీ చేసిన తీరు దీనికి దర్పణం పడుతుందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అంతేకాక ఈవీఎంల మానిప్యులేషన్ జరగిందని కూడా చాలా మంది నమ్ముతారు. పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన ఓట్ల శాతం, ఆ తర్వాత అర్దరాత్రికి పెరిగిన ఓట్ల శాతంపై పలు అనుమానాలు వచ్చాయి. అయినా ఎన్నికల సంఘం వాటిని పట్టించుకోలేదు.ఎన్నికల తర్వాత వీవీపాట్ స్లిప్‌లను, ఈవీఎంలతో కలిపి లెక్కించాలని కొందరు అభ్యర్థులు కోరినా ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో అనుమానాలు మరిన్ని పెరిగాయి. ఇదంతా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్లే జరిగిందన్నది పలువురి భావన. ఆ విషయం నేరుగా చెప్పకపోయినా, విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యల మతలబు ఇదేనన్న సందేహాం వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ వ్యూహాత్మకంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యత నడుపుతూ, వారు కోరిన విధంగా రాజ్యసభ సీట్లు కేటాయిస్తూ, క్షేత్ర స్థాయి బీజేపీ నేతలను పట్టించుకోవడం లేదన్నది ఒక అభిప్రాయం.ఈ నేపథ్యంలోనే తమను ఐదు శాతం పార్టీగా ప్రచారం చేయడాన్ని బీజేపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. అయినా బీజేపీ నేతల డిమాండ్లు ఎంతవరకు నెరవేరతాయన్నది అప్పుడే చెప్పలేం. గతంలో బీజేపీతోపాటు ఇతరత్రా వారు కూడా పురందేశ్వరిని టీడీపీ ప్రతినిధే అన్నట్లుగా పరిగణిస్తుండే వారు. ఒకప్పుడు చంద్రబాబుకు దగ్గుబాటి కుటుంబానికి మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పుగా ఉన్నా, తదుపరి వారి కుటుంబాల మధ్య రాజీ చేసుకున్నారు. దీంతో ఒరిజినల్ బీజేపీ నేతలు వెనకబడిపోయారు. ఆ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే సీట్లు కూడా పలువురు మాజీ టీడీపీ నేతలకే దక్కాయని అంటారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలలో ఐదుగురు టీడీపీ మద్దతుదారులు కావడం విశేషం. ఇదేమి రహస్యం కాదు. వారిలో ఒకరైన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా బీజేపీకి సరైన ప్రాధాన్యత లభించడం లేదని అన్నారట. ఆయన కూడా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో సహజంగానే అసంతృప్తి ఉంటుంది. నామినేటెడ్ పదవులకోసం చంద్రబాబుకు జాబితాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదట. తాజాగా కొత్త అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఒరిజినల్ బీజేపీ నేత కావడంతో ఆ పార్టీ క్యాడర్లో కాస్త ఆశ చిగురించినట్లయింది. ఆయన టీడీపీతో గొడవ పెట్టుకోకపోయినా, అవసరమైనప్పుడు గట్టిగానే నిలదీయవచ్చని అనుకుంటున్నారు. కొంతకాలం క్రితం రాజ్యసభ సీటును బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు పాకా సత్యానారాయణకు కేటాయించడం, ఇప్పుడు మాధవ్‌కు అధ్యక్ష పదవి ఇవ్వడంలో కేంద్ర బీజేపీకి ఏమైనా వ్యూహం ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది. భవిష్యత్తులో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడానికి కూడా సిద్దపడవచ్చన్న అభిప్రాయం ఉన్నా, టీడీపీ బీజేపీ కేంద్ర నేతలను ప్రసన్నం చేసుకుంటున్నంత కాలం కూటమి యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అందువల్ల బీజేపీ క్యాడర్‌కు రాష్ట్రంలో పదవులు పెద్దగా దక్కకపోవచ్చు. వారు నిజంగానే ఐదు శాతం పార్టీగానే మిగిలిపోవచ్చు. అప్పుడప్పుడు మీటింగ్‌లలో తమ గోడు వెళ్లగక్కుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండకపోవచ్చు. కేంద్ర బీజేపీ పెద్దలే పలు అవమానాలను దిగమింగుకుని టీడీపీతో కలిసిన తర్వాత రాష్ట్రంలోని బీజేపీ నేతలుకాని, కార్యకర్తలు కాని ఏమి చేయగలుగుతారు?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘పవన్.. నీదే టెంట్‌హౌజ్ పార్టీ.. కనీసం నీ శాఖ గురించైనా తెలుసా?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి పేర్నినాని. ఏపీలో పోలీసు వ్యవస్థ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. బాబు రావు మీద దాడి చేసిన వారంతా టీడీపీలోనే ఉన్నారు కదా?. టీడీపీ నేతల దోపిడీని అడ్డుకోవడమే నాగ మల్లేశ్వర రావు చేసిన నేరమా?. ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు.. ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా? అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ర్టంలో నరరూప రాక్షసులు రాజ్యం ఏలుతున్నారు. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా ఉండాల్సిన ఖాకీలు సైలెంట్ అయిపోయాయి. ఒక ముఖ్యమంత్రి గా అందరికీ న్యాయం చేయాల్సిన చంద్రబాబు వైఎస్సార్సీపీ వారికి ఏ పనీ చేయొద్దంటున్నారు. దైవ సాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు ఇలా చేయటం సబబేనా?. వైఎస్సార్సీపీ వారిపై దాడులు చేయండి, పోలీసులు అండగా ఉంటారని చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయిపొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కనుసన్నల్లోనే మల్లేశ్వరరావుపై హత్యాయత్నం జరిగింది. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబమే ఇరవై ఏళ్లుగా ఆ గ్రామంలో సర్పంచ్‌గా ఉంటున్నారు. మరి ఎమ్మెల్యే చెప్పినట్టు ఆ కుటుంబమంతా రాక్షసులైతే జనం ఇన్నేళ్లుగా ఎలా గెలిపిస్తున్నారు?. ఎమ్మెల్యే మనుషులే నాగమల్లేశ్వర రావుపై హత్యాయత్నం చేశారు. బాబూరావు అనే ఎమ్మెల్యే మనిషితో గొడవల వలనే నాగ మల్లేశ్వరరావుపై దాడి చేశారని అంటున్నారు. నిజానికి బాబూరావుపై గతంలో దాడి జరుగుతుంటే ఆపిందే నాగ మల్లేశ్వరరావు. అలాంటి వ్యక్తిని ఈరోజు చంపేందుకు ప్రయత్నించారుమన్నవ గ్రామంలో వైఎస్సార్సీపీదే హవా. దాన్ని చూసి తట్టుకోలేక ఎమ్మెల్యే ధూళిపాళ్ళ ఊర్లో గొడవలు పెడుతున్నారు. ఆ పక్కనే ఉన్న వెల్లలూరు గ్రామంలో ఆరు హత్యలకు కారకులెవరో అందరికీ తెలుసు. ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చేయాలని ధూళిపాళ్ళ కోరుకుంటున్నారు?. రప్పా రప్పా అని పోస్టర్ పట్టుకున్నోడిపై కేసులు పెట్టినవాళ్లు మరి నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నంపై ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఆడపిల్లలు కనపడకపోతే పోలీసులు పట్టించుకోవడం లేదు.పవన్ కళ్యాణ్ చెబితేనే పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. మరి ఆయన దగ్గరకు వెళ్దామంటే సినిమా షూటింగ్ బిజీలో ఎక్కడో ఉంటారు . చంద్రబాబుకు ఇబ్బంది కలిగినప్పుడు ఒక తమ్ముడు, చెల్లెలు కలుగులో నుండి వస్తారు. మిగతా సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగినా పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా? జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ. చంద్రబాబుకు అద్దెకు ఇవ్వటానికే పవన్ పార్టీ పెట్టారు.వైఎస్ జగన్‌ని అధికారంలోకి రానీయను అనటానికి పవన్ ఎవరు?. 2019లో కూడా జగన్‌ని అధికారంలోకి రానీయనని పవన్ అన్నారు. మరి ఏమైంది?. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది జనమే తప్ప పవన్ కాదు. సుగాలీ ప్రీతి అదృశ్యం కేసును పవన్ రాజకీయాలకు వాడుకుని ఇప్పుడు వదిలేశారు. కనీసం కార్యకర్తలను కూడా పవన్ పట్టించుకోవడం లేదు. హెలికాఫ్టర్‌లో పిల్లల్ని తీసుకుని తిరగటం తప్ప పవన్‌కి ఇంకేం తెలుసు?. కనీసం తన సొంత శాఖలో ఏం జరుగుతుందో కూడా పవన్‌కి తెలియదు.పంచాయతీలకు రావాల్సిన రూ.2,800 కోట్లను ప్రభుత్వం పక్క దారి పట్టిస్తే పవన్ ఎందుకు నోరు మెదపటం లేదు?. రేషన్ బియ్యం షిప్పుల కొద్దీ బయటకు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. తిరుమలలో రోజూ అపచారాలు జరుగుతుంటే పవన్ పోరాటం ఎందుకు చేయటం లేదు?. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించటం లేదు?. హెలికాఫ్టర్‌లో ప్రకాశం జిల్లాకు వెళ్లిన పవన్‌కి కరేడులో రైతుల సమస్యలు కనపడటం లేదా?. మీ ప్రభుత్వం 8 వేల ఎకరాలను మీ ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుంటే ఏం చేస్తున్నారు?.రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల విధానాలు బాగ లేవంటూనే వాటిని ఎందుకు అమలు చేస్తున్నారు?. చంద్రబాబు, లోకేష్ లకు సిగ్గు లేదా?. కలుషిత ఆహారం తిన్న విద్యార్థులను మంత్రి వచ్చే వరకు సైకోగాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు సోదరుడికి వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,గుంటూరు: టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నాగమల్లేశ్వరరావు సోదరుడు వేణు ప్రసాద్‌తో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
‘బాబు, పవన్‌లు గ్రామాల్లోకి రండి.. ఎవరి తాటతీస్తారో చూద్దాం’
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయిందని, మరి సూపర్ సిక్స్ హామీలు ఏమైపోయాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ప్రశ్నించారు వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో ‘ చంద్రబాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ నర్సాపురం పార్లమెంట్ పరిశీలకు మురళీ కృష్ణంరాజు, కన్వీనర్ ఉమాబాల, జిల్లా అధ్యక్షుడు ముదునూరు ప్రసాద్ రాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా బొత్స మాట్లాడుతూ.. ‘మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావించిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. ‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాండ్లు రాసి పేద ప్రజలను మోసం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంవత్సరం దాటిపోయింది మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమైపోయాయి..?, సూపర్ సిక్స్ హామీలు.. అన్ని ఇచ్చేసాను ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ నాలుక మందం అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తాటతీస్తాను మధ్యలో ఇరగ కొడతా అంటున్నాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు దగా కోరులు మోసగాళ్లు.. పేద ప్రజల పక్షాన ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూటమినేతల మెడలు వంచుతాం. చంద్రబాబు పాలన ఎప్పుడు వచ్చినా మహిళలు రైతులు నష్టపోతు ఉంటారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రండి గ్రామాల్లోకి వెళదాం... ఎవరి తాటతీస్తారో తేలిపోతుంది. చంద్రబాబు వచ్చి 100 అబద్ధాలు చెబుతాడు..లోకేష్ వచ్చి... 200 అబద్ధాలు చెబుతాడు. అన్నదాత సుఖీభవ రూ. 20000 ఇస్తా అన్నారు సంవత్సరమైంది ఎవరికైనా ఇచ్చారా....?, ప్రజల సమస్యలపై పోరాడటం మా పార్టీ ధ్యేయం. రాష్ట్రంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా....?, సిండికేట్లుగా మారి ఆక్వా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ’ అని ధ్వజమెత్తారు బొత్స. జగన్ 2.0 లో కార్యకర్త ఏది చెబితే అదే జరుగుతుందిజగన్ 2.0 లో కార్యకర్త ఏది చెబితే అదే జరుగుతుందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. మన నాయకుడు మాటిస్తే మాట తప్పే పరిస్థితి లేదు.. తగ్గేదే లేదని ఈ సందర్భంగా తెలిపారు. కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రజలందరిని వంచించి మోసం చేశాడు. సంపదల సృష్టి కరెంటు బిల్లులు పెన్షన్ అంటూ అబద్ధాలు చెప్పాడు. చంద్రబాబు దుర్మార్గమైన మనిషి. ఒక పెద్ద మనిషి ప్రశ్నిస్తాను అన్నాడు. కాపు నేస్తమా అమలు చేయడం లేదు. దానిపై ప్రశ్నించడం లేదుచంద్రబాబు సంపద సృష్టించడంలో నెంబర్ వన్ కాదు అప్పులు చేయడంలో నెంబర్ వన్. సంవత్సరం తిరగకుండానే రూ. 1,50,000 కోట్లు అప్పులు చేశాడు’ అని మండిపడ్డారు. -
పచ్చమూకల పైశాచికత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న దారుణాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనపై వైఎస్ జగన్ శుక్రవారం (జులై 4) ఎక్స్ వేదికగా స్పందించారు.‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు.గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైఎస్సార్సీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు… pic.twitter.com/VfNxKZRUlz— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 విషమంగా నాగమల్లేశ్వర్రావు ఆరోగ్యంకూటమి ప్రభుత్వంలో దారుణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మన్నవ గ్రామంలో టీడీపీ అడ్డు అదుపూ లేకుండా పోతున్న ఆగడాల్ని ఆ ఊరి సర్పంచి నాగమల్లేశ్వర్రావు ప్రశ్నించారు. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, సర్పంచి నాగమల్లేశ్వర్రావు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. -
‘ఈ ప్రభుత్వంలో అసలు పవన్‌కు భాగస్వామ్యం ఉందా?’
తాడేపల్లి : డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైట్ తప్ప ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. జగన్‌ని అధికారంలోకి రానివ్వనని చెప్పడం కన్నా.. చంద్రబాబును మోస్తూ ఉంటానని చెప్తే మంచిదని అంబటి రాంబాబు చురకలంటిచారు. జగన మళ్లీ అధికారంలోకి వస్తాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు భయం పట్టుకుందని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. కూటమి నేతల తాటాకు చప్పుళ్లకు భయపడమని హెచ్చరించారు. ‘పుష్ప సినిమా అన్నా, ఆ సినిమాలోని హీరో అన్నా పవన్ కళ్యాణ్‌కు నచ్చదు. అందుకే ఆ సినిమాలోని డైలాగులు పోస్టర్ వేసిన యువకుడిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారు. సినిమా షూటింగులు చేసుకుంటూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో పవన్ తెలుసుకోలేక పోతున్నారు. చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తీసుకొని, ఆయన ఇచ్చిన స్క్రిప్టులు చదవటమే పనిగా పెట్టుకున్నారు. పవన్‌కి ఇల్లు, ఆఫీసు కట్టిస్తున్నది చంద్రబాబు కాదా?, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పేరుతో దియేటర్ల యాజమాన్యాలను బెదిరించారు. నాగబాబుని మంత్రి పదవిలోకి తీసుకుంటానని చంద్రబాబు లెటర్ రాసిచ్చి మోసం చేశాడు. మరి పదవి ఇవ్వలేదని చంద్రబాబును ఎందుకు అడగటం లేదు?’ అని అంబటి ప్రశ్నించారు.మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరి పరిపాలనఏపీలో చంద్రబాబు నేతృత్వంలో పరిపాలన మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా ఉందని అంబటి స్పష్టం చేశారు. ప్రతిరోజూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును చంపేందుకు ప్రయత్నించారు. పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే ఈ హత్యాయత్నం జరిగిందా?, ఆ నిందితులను ఎమ్మెల్యేనే రక్షించి ఊరు దాటించేశారు. రెడ్‌బుక్‌ని కొనసాగించేందుకు కొందరు అధికారులు, రిటైర్డ్ అయినవారు కలిసి అజ్ఞాతంగా పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపాలని చూడటం లేదు. ఆ అజ్ఞాత వ్యక్తులు మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్తాం. పల్నాడులోని గుండ్లపాడులో టీడీపీలోని రెండు వర్గాలు గొడవ పడి చంపుకుంటే మా నేతలపై కేసులు పెట్టారు.సింగయ్యను ప్రయివేటు కారు ఢీకొట్టి చనిపోయాడని తొలుత ఎస్పీ చెప్పారు తర్వాత మాట మార్చారు. ఆ తర్వాత జగన్ కారే ఢీకొట్టిందంటూ ఆయన మీద కూడా కేసు పెట్టారు. సింగయ్యను ఆస్పత్రికి తరలించటానికి 40 నిమిషాలు ఎందుకు ఆలస్యం చేశారు?, అంబులెన్స్ లో ఎక్కకముందు చక్కగా మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత ఎలా చనిపోయారు?అని అంబటి నిలదీశారు. -
కస్తూర్బా వసతి గృహంలో ఫుడ్‌పాయిజన్.. పోలీసుల అత్యుత్సాహం
శ్రీ సత్యసాయి జిల్లా : సోమందేపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సాక్షాత్తూ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు మెరుగైన వైద్యం అందించాల్సి ఉండగా.. హాస్టల్ నేలపైనే ఉన్న చికిత్స అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదే విషయంపై ఆరా తీసేందుకు వచ్చిన మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్‌తో పాటు ఇతర వైఎస్సార్సీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. బాలికలు గురువారం రాత్రి తిన్న ఆహారం కలుషితమవడంతో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. దీంతో బాలికలు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ప్రత్యేక వైద్య బృందం అక్కడికి చేరుకుని వసతిగృహంలోనే వారికి చికిత్స అందిస్తున్నారు.అయితే,బాలికల ఆరోగ్యంపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ బాలికల వసతి గృహానికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న బాలికల్ని పరామర్శించారు. బాలికలకు హాస్టల్లో కాకుండా మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు.ఈ సమయంలో పోలీసులు అత్యుత్సాహం చేశారు. హాస్టల్లో బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆహారం, భద్రత వంటి వివరాల్ని ఆరా తీయగా.. మంత్రి సవిత బాలికల్ని పరామర్శించేందుకు వస్తున్నారంటూ మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్‌తో పాటు ఇతర వైఎస్సార్సీపీ నేతలను బలవంతంగా బయటకు పంపారు. మీడియా ప్రతినిధులపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఓ విలేకరి సెల్ ఫోన్‌ను లాక్కొని పగులగొట్టారు. ఈ ఘటనలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. ఏరాసుపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి
సాక్షి, నంద్యాల: జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి, టీడీపీ నేత ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహణపై పెద్ద రచ్చే జరిగింది. తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి చెప్పకుండా ఎలా నిర్వహిస్తారంటూ బుడ్డా అనుచరులు రెచ్చిపోయారు.ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటి అద్దాలను బుడ్డా వర్గీయులు ధ్వంసం చేశారు. బుడ్డా అనుచరులు.. ఏరాసుపై చేయి చేసుకున్నారు. ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. -
మా నాన్నకు 50 ఏళ్లు.. పింఛన్ ఎప్పుడిస్తారు!
సి.బెళగల్: ‘యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు.. మా నాన్నకు ఇంతవరకు పింఛన్ రాలేదు. పింఛన్ ఎప్పుడిస్తారు?’అంటూ కర్నూలు జిల్లా సి.బెళగల్లో ఓ ముస్లిం కుటుంబం కేడీసీసీ బ్యాంకు చైర్మన్, కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్ధన్‌రెడ్డిని ప్రశ్నించింది. సి.బెళగల్లో టీడీపీ నాయకులు గురువారం తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కోట వీధిలోని అబ్దుల్ సత్తార్ ఇంటికి టీడీపీ నాయకులతో కలిసి వెళ్లిన విష్ణువర్ధన్‌రెడ్డిని అబ్దుల్ కుమార్తెలు తమ తండ్రికి 50 ఏళ్ల పింఛన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నింనంచారు. దీనితో టీడీపీ నాయకులు కొంత ఇబ్బంది పడ్డారు.అదే విధంగా గ్రామ ప్రధాన రోడ్డు, మురికి కాలువలు, మంచినీటి ట్యాంక్ నిర్మాణాల వంటి డిమాండ్లూ గ్రామస్తుల నుంచి వచ్చాయి. కాగా, ఎంపిక చేసిన కొన్ని ఇళ్లను మాత్రమే టీడీపీ నాయకులు సందర్శిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
రెండు గంటల్లో.. ‘వెనకడుగు..’ మంత్రి, ఎంపీలకు చేదు అనుభవం
జరుగుమల్లి (సింగరాయకొండ): కూటమి ప్రభుత్వ హామీల అమలు, అవకతవకలపై అడుగడుగునా మహిళలు నిలదీయడంతో రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యకు చేదు అనుభవం ఎదురైంది.ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల కేంద్రంలో గురువారం తొలిరోజు ప్రారంభమైన ‘తొలిఅడుగు’ కార్యక్రమంలో భాగంగా నాయకులు జరుగుమల్లి మండల కేంద్రానికి వచ్చారు.‘అయ్యా.. నాకు ముగ్గురు పిల్లలు. ఒక పాపకు మాత్రమే తల్లికి వందనం నగదు పడింది.. మిగతా వారికి పడలేదు’ అని మహిళ అడగ్గా, ‘మాకు గ్యాస్ డబ్బులు పడలేదు’ అంటూ మరికొందరు నిలదీశారు. ‘సార్.. నాకు ఇంటి స్థలం ఉంది.. ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇల్లు మంజూరు కాలేదు’ అని మరో మహిళ ఆగ్రహం వ్యక్త చేసింది. -
ఇవిగో సాక్ష్యాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) పనితీరులో మాయాజాలం.. ఈవీఎంలలో పోలైన ఓట్లకు (ఫారం–17 ప్రకారం), లెక్కించిన ఓట్లకు (ఫారం–20 ప్రకారం) మధ్య భారీ వ్యత్యాసం ఉండటం.. అదే రోజు రాత్రి ఈసీ తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికీ, ఆ తర్వాత నాలుగు రోజులు గడిచాక ప్రకటించిన శాతానికి మధ్య దేశంలోనే అత్యధికంగా భారీ తేడా ఉండటం.. తొలుత ప్రకటించిన దానితో పోలిస్తే అనూహ్యంగా పోలింగ్ ఏకంగా 12.54 శాతం పెరగడం.. దీనివల్ల సగటున ఒక్కో శాసనసభ స్థానంలో 28 వేల ఓట్లు, లోక్‌సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరగడం.. అంతిమంగా ఇది 87 శాసనసభ స్థానాల పరిధిలో గెలుపోటములను నిర్దేశించడం.. తదితర అంశాలపై వైఎస్సార్సీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఫిర్యాదు చేసింది. పలు నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరు అనుమానాస్పదంగా ఉందన్న అంశాన్ని సాక్ష్యాధారాలతో సీఈసీ ముందుంచింది. ఈవీఎంల పనితీరుపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వాటిని పక్కనపెట్టి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను సీఈసీ దృష్టికి గట్టిగా తీసుకొచ్చింది. 2024 ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుకు సంబంధించి సాంకేతిక అంశాలు, కొన్ని పోలింగ్ బూత్‌లలో చోటుచేసుకున్న అసంబద్ధ వ్యవహారాలపై వైఎస్సార్సీపీ గతంలోనే సీఈసీకి ఫిర్యాదుచేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చేందుకు గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధు నిర్వహించిన సమావేశానికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, లోక్‌సభ పక్షనేత పి.మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ హాజరయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం మిథున్‌రెడ్డి, చంద్రశేఖర్‌తో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈవీఎం, వీవీ ప్యాట్లను పోల్చి చూడాలి2024 ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల తీరుపై అనేక అనుమానాలున్నందున వాటిని నివృత్తి చేయాలని కోరాం. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల ఓట్లను పోల్చి చూడాలని కోరాం. ఇందుకు ఫీజు కింద నిర్ణీత రుసుము కూడా ఇప్పటికే చెల్లించాం. బ్యాటరీ చార్జింగ్ విషయంలో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలున్నాయి. పోలింగ్ పూర్తయ్యాక 80 శాతం ఉంటే.. 40 రోజుల తర్వాత కౌంటింగ్ సమయంలో 98 శాతం చార్జింగ్ ఉన్న సందర్భాలు కనిపించాయి. సాయంత్రం 6 గంటల తర్వాత చాలాచోట్ల పోలింగ్ శాతం పెరిగింది. నాలుగు కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాతే పోలయ్యాయి. వీటిపై అనేక అనుమానాలున్నాయని, విచారణ జరిపించాలని సీఈసీని కోరాం. అయితే, వీవీ ప్యాట్లను కంపారిజన్ చేయడం కుదరదని చెప్పారు. అవి రీ చార్జబుల్ బ్యాటరీలు కావడం వల్ల చార్జింగ్ పెరగడం, తగ్గడం అంటూ జరగదని చెబుతున్నారు.రాయచోటి ఓ ఉదాహరణ..2014–19 కంటే గతేడాది ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయాన్ని సీఈసీకి వివరించాం. రాయచోటి నియోజకవర్గం దీనికి ఉదాహరణ అని చెప్పాం. దీనిపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఎక్కువ శాతం పోలింగ్ అంశంపై నియోజకవర్గం డేటా తెప్పించుకుని పరిశీలిస్తామని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల పెరుగుదలపై మావద్ద ఉన్న ఆధారాలను ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌కుమార్‌కు అందించాం. దీనిపై ఈసీ సానుకూలంగా స్పందిస్తూ.. ఓటర్ల జాబితా విషయంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ప్రత్యేక విస్తృత సవరణ) చేపడతామని హామీ ఇచ్చింది.మీడియాతో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి. పక్కన పి.మిథున్‌రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ హిందూపురం ఓటింగ్ సరళిలో వ్యత్యాసాలు..ఈవీఎంలపై సాంకేతికతపరంగా ఉన్న సందేహాలను ఈసీకి వివరించాం. మేం ఓడిపోయాం కదా అని నేరం ఎవరిపైనా మోపట్లేదు. అందుకే ప్రత్యేకంగా హిందూపురం నియోజకవర్గంలో జరిగిన అవకతవకలను సీఈసీ ముందుంచాం. హిందూపురం నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్–157, 28లలో వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థికి 472 ఓట్లు పోలవ్వగా, అదే బూత్‌లో అసెంబ్లీ అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు పోలైన విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఇక కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి ఒక ఓటు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి 464 ఓట్లు వచ్చాయి. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థికి 8 ఓట్లు పోలవ్వగా, అసెంబ్లీ అభ్యర్థికి 95 ఓట్లు వచ్చిన విషయాన్ని ఆధారాలతో సహా సీఈసీ ముందుంచాం. ఓటింగ్ సరళిలో ఇన్ని తేడాలు రావడం మా అనుమానాలకు కారణం. దీనిపై క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని కోరాం. దీంతో.. బిహార్ తరహాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించేందుకు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ అంగీకరించారు.బ్యాలెట్‌తోనే ఎన్నికలు జరపాలి..ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీఎంలను, వీవీ ప్యాట్లను విశ్వసించేందుకు ఏమాత్రం ఆస్కారం లేనందున బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేశాం. అమెరికా, జర్మనీ, యూరప్ దేశాల్లో సైతం బ్యాలెట్‌తోనే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని వారికి గుర్తు చేశాం. బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరిగితే ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత, పారదర్శకత ఉంటుందని వివరించాం. వీవీ ప్యాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్కించబోమని.. ఆయా పోలింగ్ బూత్‌లకు సంబంధించి సీసీ ఫుటేజీలను కూడా ఇచ్చేది లేదని సీఈసీ చెప్పింది.ఎన్నికల ప్రక్రియ బలోపేతం: ఈసీఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ప్రత్యక్షంగా కమిషన్ దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ బృందంతో చర్చలు జరిపినట్లు సీఈసీ తెలిపింది. ఈమేరకు ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకే వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గురువారం వైఎస్సార్సీపీ నేతలతో భేటీ అనంతరం సీఈసీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. రాజకీయ పార్టీలతో నిర్మాణాత్మక చర్చలు అవసరమని ఈసీ పేర్కొంది. -
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్సీపీ సర్పంచ్‌పై దాడి
సాక్షి, గుంటూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఓ షాపు దగ్గర టీ తాగుతుండగా కర్రలు, రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా టీడీపీ నేతల అక్రమాలను సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగానే నాగమల్లేశ్వరరావును టీడీపీ నేతలు.. రాడ్లు, కర్రలతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన నాగమల్లేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
‘సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది’
విశాఖ: హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు‘శవరాజకీయాలపై పేటెంట్ హక్కు చంద్రబాబుది. సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది. అంబులెన్స్‌లో నా భర్తకు ఏదో జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సింగయ్య భార్యను లోకేష్ మనుషులు ఎందుకు బెదిరించారు. వైఎస్ జగన్‌ను చూసి పాలక పక్షం భయపడుతోంది. ఏఐ ద్వారా జగన్‌పై తప్పుడు ప్రచారం చేశారు. తండ్రీ కొడులు ఇద్దరూ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి పిచ్చెక్కిపోతున్నారు. కూటమికి ఓటు వేసి ప్రజలు మోసపోయారు..షరతులు పెట్టి తల్లికి వందనం కట్ చేశారు.. పురుగులు పట్టిన అన్నం విద్యార్థులకు పెడుతున్నారు. హోమ్ మంత్రి అనిత చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. బొద్దింక ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.’ అని జూపూడి డిమాండ్ చేశారు. -
‘నిజం చెప్పినందుకు లోకేష్ మనుషులు బెదిరిస్తారా?’
తాడేపల్లి: సత్తెనపల్లిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య వెల్లడించడం ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలను బద్దలు చేశారని అన్నారు. నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా? ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకైమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా చంద్రబాబు భాషలో మార్పు రావడం లేదు. దళితులు, అణగారిన వర్గాల పట్ల తన అసహనాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోతున్నారు. సత్తెనపల్లి లో జరిగిన సింగయ్య మరణంపై చంద్రబాబు నీచంగా మాట్లాడటం ద్వారా తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే కుక్క పిల్లలా లాగిపడేశారని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తిని కుక్కతో పోల్చడం వెనుక దళితులపై చంద్రబాబు తనకు ఉన్న చులకలభావాన్ని చాటుకున్నారు. సింగయ్య మరణాన్ని అడ్డం పెట్టుకుని, వైఎస్ జగన్‌పై పన్నిన కుతంత్రంను సింగయ్య భార్య ధైర్యంగా మాట్లాడి పటాపంచలు చేశారు.దళితులంటే అంత చులకనా బాబూసింగయ్య భార్య లూర్దు మేరి వైఎస్ జగన్‌ని కలిశారు. తమ కుటుంబానికి వైఎస్ జగన్ అంటే అభిమానమని, ఆయన్ను చూడటానికి తాను, తన భర్త సింగయ్య బయటకు వచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు తన భర్తే స్వయంగా మా పేర్లు, ఫోన్ నెంబర్లు చెప్పారని, అంబులెన్స్ లోకి చేరేవరకు బాగానే ఉన్నారని, బాగానే మాట్లాడుతున్నారని, తనకు కొద్దిపాటి దెబ్బలే తగిలాయని చెప్పిన విషయం ఆమె గుర్తు చేశారు. ఆటోలో తీసుకెళ్తామని చెప్పినా వినకుండా అంబులెన్స్‌లో తరలించారు. బాగా మాట్లాడుతున్న వ్యక్తి ఎలా చనిపోయాడని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఎస్పీ సైతం ప్రమాదం జరిగిన్పపుడు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారు. నారా లోకేష్ 50 మందిని తన ఇంటికి పంపించి బెదరించారని బాధితురాలు మేరీ చెబుతోంది. ఇవన్నీ సింగయ్య మరణంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దళితుల పట్ల చంద్రబాబు ఎంత ప్రేమ ఉందనేది మా అందరికీ తెలుసు. మొన్న తెనాలిలో దళిత యువకులను పోలీసులు లాఠీలు విరిగేలా కొడితే వారిపై చర్యలు తీసుకోకుండా గంజాయి బ్యాచ్ అని విషప్రచారం చేశారు. గత చంద్రబాబు పాలనను పక్కన పెడితే, ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్ననే చంద్రగిరిలో దళిత మహిళను బట్టలు చించి కొట్టారు. జేమ్స్ అనే యువకుడితే మూత్రం తాగించారు. దళితుల మీద సాంఘిక బహిష్కరణలు ఎక్కువైపోయాయి. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా కనీసం దానిపై ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? మంగళగిరి నియోజకవర్గంలో దళితులు నడిచారని రోడ్డు మైలపడిందని పసుపు నీళ్లతో కడిగిన దారుణం ఇప్పటికీ మా కళ్లలో కదులుతూనే ఉంది. సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై టీడీపీ యువకులు 16 మంది రెండేళ్లుగా అత్యాచారం చేస్తే వారి కుటుంబానికి న్యాయం చేశారా? ఆ బాలిక తండ్రి మీ పార్టీ కార్యకర్త అని, మీ పార్టీ విజయోత్సవ సంబరాల్లో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ వారి కుటుంబాన్ని ఆదుకోకపోగా ఇంత దారుణంగా మృతుడి కుమార్తెకి అన్యాయం చేస్తారా? ఇలా ఏ ఒక్క ఘటనలోనూ నిందితులపై చర్యలు తీసుకున్నారా? ఒక దళితుడిని కారులో పక్కన కూర్చోబెట్టుకుని ఇంటికి వెళ్లినంత మాత్రాన దళితులను ఉద్దరించినట్టు ప్రజలకు అనుకుంటారనే భ్రమల్లో నుంచి బయటకు రండి. మైకులు పెట్టి ఇచ్చిన స్ర్కిప్టు చదివితే మేం నమ్మేస్తామని ఎలా అనుకుంటారు? మీ హయాంలో జరిగిన వాటికి ఏం సమాధానం చెబుతారు?నాడు సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్‌లో ఉండగా గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట జరిగి 29 మంది అమాయక భక్తులు చనిపోయారు. చంద్రబాబు నిర్వహించిన కందుకూరు రోడ్ షోలో 7 మంది చనిపోయారు. గుంటూరులో చంద్రబాబు బహిరంగ సభ తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస జాగ్రత్తలు పాటించని కారణంగా ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ ప్రమాదాలు జరిగిన అన్ని సందర్భాల్లో అక్కడ చంద్రబాబు ఉన్నారు. వీటన్నింటికీ ఆయన ఏం సమాధానం చెబుతారు. అన్ని వర్గాల్లోనూ కూటమి ప్రభుత్వంపై రోజురోజుకీ వ్యతిరేకత పెరిగిపోతోంది. వైఎస్ జగన్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుని, ఆయన పర్యటనలకు బ్రహ్మరథం పడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. వైఎస్ జగన్‌కి ఉన్న ప్రజాభిమానాన్ని తక్కువ చూసి చూపించడానికి వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. ఆయన బయటకు రాకుండా చేయాలనే కుట్రతో ఆయన పర్యటనలకు అనుమతులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలపై చర్చ జరిగితేనే పాలన మెరుగువుతుందన్న కీలక విషయాన్ని చంద్రబాబు మర్చిపోతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారు. సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే నాలుక మందం అనడం దేనికి సంకేతం? పోలీసులను కూడా పార్టీల వారీగా విభజించి వేధిస్తున్న ఘనత చంద్రబాబుది.ఇంత వికృతమైన రాజకీయాలు చేయటం చంద్రబాబుకే చెల్లింది. ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారో చర్చించటానికి మేము సిద్ధం. మా హయాంలో జరిగిన అప్పుల గురించి తప్పుడు ప్రచారం చేశారు. లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారని సింగయ్య భార్య చెప్పింది. దీనిపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పటం లేదు?, ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై లైంగిక దాడి జరిగితే చంద్రబాబు ఏం చేశారు?, ఆ బాలిక తండ్రి టీడీపీ కార్యకర్త. చంద్రబాబు మీటింగుకి వెళ్లి ఆయన చనిపోయారు. అలాంటి కుటుంబానికి చంద్రబాబు ఎందుకు న్యాయం చేయలేదు?, చంద్రబాబు గానీ ఆయన మంత్రులుగానీ కనీసం పరామర్శించకపోవటానికి కారణం ఏంటి?, లైంగికదాడి కేసులో ప్రధాన నిందితుడిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని శైలజానాత్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య -
బాబు.. సెక్యూరిటీ లేకుండా వెళ్లండి.. ప్రజలే చెబుతారు: పెద్దిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీ ప్రజల్ని మోసం చేసి సుపరిపాలన అనే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడంపైన మాత్రమే దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారని అన్నారు. అలాగే, బనకచర్లపై గురు శిష్యులు దోబూచులాడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు.కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు ఏడాది పాటు ప్రజలను ఎలా మోసం చేశాడో మనం ప్రజలకు వివరించాలి. ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడం పైన మాత్రమే దృష్టి పెట్టారు. రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం ఎత్తివేశారు.. రెండు రూపాయల కిలో బియ్యం ఆపేసి ప్రజలను మోసం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే తరహాలో ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారు. 2014లో కూడా మోసపూరిత హామీలు ఇచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేశారు. 2024లో మరోసారి మోసం చేసి పబ్బం గడుపుతున్నారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. గ్రామాల్లో తిరిగి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని మనం వివరించాలి. బాబు ష్యూరీటీ మోసం గ్యారంటీ అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించాలి.బనకచర్ల ప్రాజెక్ట్ పై గురు శిష్యులు దోబూచులాడుతున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకరిపై మరొకరు పెట్టుకొని బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి తెర లేపారు. బాబుకు బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఆలోచన లేదు. అందుకే వాటిని వివాదాస్పదం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టాలి. ఒక్క సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. ఘోరంగా వైఫల్యం చెంది ఇప్పుడు సుపరిపాలనా అంటూ ప్రజల వద్దకు వెళ్లడం సిగ్గు చేటు. సంక్షేమ పథకాలను ఏడాది విస్మరించిన చంద్రబాబు సుపరిపాలన అంటూ ప్రజల్లోకి వెళ్లడం ఏంటి?.రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక ఆయన హయాంలోని సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కారు. హామీలన్నింటినీ తుంగలోకి తొక్కారు. మోసపురిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అప్పులు చేసినా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. ప్రతీదీ అబద్దాలు చెప్పడం మోసపురిత వాగ్దానాలను చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య..త్రికరణశుద్ధితో సంక్షేమ పథకాలు కులాలు, మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత జగన్‌కే దక్కింది. ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. తల్లికి వందనంలో సాంకేతిక కారణాల పేరిట దగా చేశారు. పోలీసుల పహారా మధ్య ఇంటింటికి.. సెక్యూరిటీ లేకుండా వెళ్ళితే ప్రజలు చొక్కా పట్టుకుంటారు. సుపరిపాలన అంటే ఏమిటో ప్రజలే చెబుతారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
జనసేనకు షాక్.. వైఎస్సార్సీపీలోకి దేవమణి
ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు యేశపోగు దేవమణి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి సుబ్బారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గతంలో జెడ్పీటీసీ సభ్యురాలు దేవమణి శ్రీనివాస్ వైఎస్సార్ సీపీ తరుపున ఎన్నికయ్యారు. తరువాత మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి జనసేనలో చేరారు. జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చక తిరిగి సొంతగూటికి వచ్చారు. ఈ సందర్భంగా సుబ్బా రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విలువ ఇప్పుడు పేద ప్రజలకు తెలుస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ అభివృద్ధికి మారుపేరన్నారు. రానున్న కాలంలో పార్టీనుండి వెళ్లిన అందరూ తిరిగి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో రాష్ట్ర ప్రజలు బుద్దిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, వత్సవాయి ఎంపీపీ కొలుసు రమాదేవి పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని గురువారం కలిశారు. కూటమి ప్రభుత్వ కక్షరాజకీయాలకుగానూ వంశీ సుమారు నాలుగున్నర నెలలపాటు విజయవాడ జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో ఊరట లభించడంతో బుధవారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజులపాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్యం బారిన పడ్డారు కూడా. చివరకు వంశీకి బెయిల్ వచ్చినా తర్వాత కూడా విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ కూడా వేశారు. అయితే సుప్రీం కోర్టు వంశీకి ఊరట ఇవ్వడంతో.. బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. -
తప్పుడు కేసులు పెట్టినోళ్లు శిక్ష అనుభవిస్తారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: మద్యం కుంభకోణం కేసు నిందితులను మూడో రోజు సిట్ తమ కస్టడీకి తీసుకుంది. ఈ క్రమంలో.. విజయవాడ జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడ్ని తొలుత జీజీహెచ్‌కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. జైలు నుంచి తరలించే సమయంలో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.తప్పుడు కేసులు ఎక్కువ రోజులు నిలబడవు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. తప్పుడు కేసులు పెట్టిన వారు ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తారు అని చెవిరెడ్డి అన్నారు. ఆ సమయంలో మీడియా కాస్త దూరంలో ఉండగా.. చెవిరెడ్డిని మాట్లాడనీయకుండా పోలీసులు దురుసుగా నెడుతూ వాహనంలోకి తరలించారు. ఇదీ చదవండి: వంశీని జైల్లో ఉంచి టీడీపీ గొయ్యి తవ్వుకుంది! -
ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు.. ఆన్సర్ ఉందా బాబూ?
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఎవరివల్ల చెడ్డ పేరు వస్తోంది? అధినేతల లోపాల వల్ల ఎమ్మెల్యేలకు డ్యామేజ్ అవుతోందా? లేక ఎమ్మెల్యేల అక్రమాలు, అలసత్వాలు ప్రభుత్వం పరువును దిగజారుస్తున్నాయా? రెండూ కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే...ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కీలక మంత్రి లోకేశ్‌లు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేసిన భ్రమ కల్పించాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆగ్రహం పెరిగేందుకు కారణమవుతున్నాయి.అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపివ్వడం మంచిదే. ప్రజల్లో తిరిగితే కదా వారి మనోభావాలు, ప్రభుత్వం పనితీరు, రెడ్‌బుక్ హడావుడి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా? లేదా? అన్నది తెలిసేది? విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వేధింపులు, అక్రమ అరెస్ట్, నిర్బంధాలతో సామాన్యులకు ఒరిగిందేమిటని కూడా ప్రజలను అడిగి తెలుసుకోవచ్చు. ఏడాది కాలంలో తామోన్నో ఎన్నో విజయాలు సాధించేశామని చంద్రబాబు అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అన్ని విషయాలు తెలిసినా ఆయన చెప్పినదానికి ఊ కొట్టడం తప్ప మరో గత్యంతరం ఉండదు. ముందుగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం గురించి ఏమి అనుకుంటున్నారో తెలుసుకుని ఆ తర్వాత తొలి అడుగో, మలి అడుగో వేస్తే అదో పద్దతి కాని, అదేమీ లేకుండా తాము బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చిందని, లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి ఎమ్మెల్యేలవే అన్నట్లుగా మాట్లాడితే ఆశ్చర్యం పోవడం తప్ప వేరే ఏమి ఉంటుంది?. 👉ఏడాది కాలం ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైనదే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా గత ప్రభుత్వం ఒక ఏడాదిలోనే నెరవేర్చిన హామీలెన్ని? తెచ్చిన సంస్కరణలు ఏమిటి? ప్రజలకు ఎలా ఇళ్ల వద్దే ప్రభుత్వ సేవలు అందించింది అందరికి తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసి ప్రజలను రోడ్లపైకి తెచ్చిందన్నదీ పలువురు ఎమ్మెల్యేల భావన. ఉదాహరణకు జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని చంద్రబాబు ఉగాది నాడు దైవపూజ చేసి మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా తాము ఎవరి పొట్టగొట్టబోమని ఊదరగొట్టారు. కానీ.. 👉.. అధికారంలోకి వచ్చాక అసలుకే ఎసరు పెట్టారా? లేదా? రేషన్ సరుకులను ప్రజల ఇళ్లవద్దకే చేర్చే వ్యవస్థ గతంలో ఉంటే, ఇప్పుడు దానిని ఎత్తివేశారా? లేదా? ప్రభుత్వ పరంగా గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ రైతు భరోసా కేంద్రాలు వంటివాటిని గ్రామ, గ్రామానా, పట్టణాలలో వార్డు, వార్డులో జగన్ ప్రభుత్వం నెలకొల్పితే వాటన్నిటిని నీరు కార్చుతున్నారా? లేదా ?వారికి ఈ వ్యవస్థలపై నమ్మకం లేకపోతే, మంచివి కావని భావిస్తే ఎన్నికల ముందే ఆ విషయం చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా, అవన్నీ యథాతథంగా కొనసాగుతాయని ప్రచారం చేసి, తీరా పవర్ లోకి వచ్చాక అన్నిటిని నిర్వీర్యం చేస్తే ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవుతుందా? లేక చెడ్డ ప్రభుత్వం అవుతుందా?. హామీలపై ప్రజలకు బాండ్లు ఇచ్చారు కదా?. వాటిలో పెన్షన్ రూ.వెయ్యి రూపాయలు పెంచడం తప్ప మొదటి ఏడాదిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదే! గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చి సరిపెట్టారే. తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఏబై ఏళ్లకే బలహీన వర్గాలకు పెన్షన్ మొదలైన వాటన్నిటికి తొలి ఏడాది ఎగనామం పెట్టారా? లేదా? ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారికి ఇచ్చిన బాండ్ల గురించి ,ఆయా వాగ్దానాల గురించి ప్రశ్నిస్తే వారందరిని వైఎస్సార్సీపీ వారి కింద జమకట్టి కేసులు పెడతామని బెదిరిస్తారా? ముఖ్యమంత్రే స్వయంగా వైఎస్సార్సీపీ వారు నిలదీయడానికి లేదని, అలా చేస్తే తాట తీస్తామని అనడం దేనికి సంకేతం. రెండో ఏడాదిలో తల్లికి వందనం కొంతవరకు అమలు చేసినా, మొదటి ఏడాది బకాయిల మాటేమిటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పాలి? తల్లికి వందనం ఈ మాత్రం అయినా అమలు అయిందంటే అది జగన్ ప్రభావం వల్లే అన్న సంగతి అందరికి తెలుసు. జగన్ ఎప్పటికప్పుడు దీని గురించి నిలదీస్తున్న ఫలితంగా ఈ స్కీమ్ ఈ మాత్రం అయినా ఇవ్వక తప్పలేదు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికలలో వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తు చేసి, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తెగ బాదుతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందమని ఎమ్మెల్యేలు అనగలరా? ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారో, లేక ఆయన కుమారుడు నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి గురించి ఎవరైనా అడిగితే జవాబు ఏమని చెబుతారు?. 👉మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేస్తూ కాలం గడపాలని చంద్రబాబు సర్కార్ చేస్తున్న యత్నాలను ప్రజలు అర్థం చేసుకోలేరా? జగన్ టైమ్‌లో అప్పుల గురించి అనేక అసత్యాలు ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదిలోనే లక్షన్నర కోట్లకు పైగా అప్పులు చేసి రికార్డు సృష్టించింది కదా! అప్పట్లో 'దాన్ని తనఖా పెట్టారు.. దీన్ని తనఖా పెట్టార"ని ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఏకంగా అప్పులు ఇచ్చేవారికి ట్రెజరీనే తాకట్టు పెట్టి ఘన చరిత్ర నెలకొల్పారే. దాని గురించి ఎవరైనా మాట్లాడితే అంగీకరిస్తారా? లేక వారిని కోప్పడతారా? వైసీపీ వారు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు అవేమిటో వివరించాలి కదా?. 👉నిత్యం విధ్వంసం అంటూ నిందలు వేసే చంద్రబాబు అదేమిటో ఎన్నడైనా చెప్పారా? కేవలం సినిమా డైలాగులు చెప్పి ప్రజలను మభ్య పెట్టే యోచన కాకుండా వాస్తవ దృక్పథంతో వ్యవహరిస్తే ఎమ్మెల్యేలు అర్థం చేసుకుంటారు.అలా కాకుండా ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని ఎమ్మెల్యేలపైకి నెట్టేసి తప్పుకోవాలని చూస్తే వారు గుసగుసలాడు కోకుండా ఉంటారా? 1995 లొ ముఖ్యమంత్రి అయింది మొదలు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యేలపై అసంతృప్తి అంటూ లీకులు ఇవ్వడం ఆయనకు అలవాటే. ప్రస్తుతం కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల వైఫల్యాలు లేవా అంటే చాలానే ఉన్నాయి. అనేక చోట్ల ఇసుక, మద్యం, గనులు, పరిశ్రమలు తదితర లావాదేవీలలో ఎమ్మెల్యేల దందా పై ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరుల వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. వెరసి అటు ప్రభుత్వం, ఇటు ఎమ్మెల్యేలు రెండువైపులా సాగుతున్న దందాల వల్ల ప్రజలు నలిగిపోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రజలలోకి వెళ్లాలంటే భయం ఏర్పడిన మాట నిజం. కొనమెరుపు ఏమిటంటే కీలకమైన తొలి అడుగు సన్నాహక సమావేశానికి 56 మంది టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
యువ వైద్యులపై పోలీసులతో దాడులు చేయిస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఆ విద్యార్థుల కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని.. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణు్ణలైన వారికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? ‘చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఎన్ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (ఎఫ్ఎంజీ) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత ఇక్కడే ఇంటర్న్‌షిప్ పూర్తిచేసినా, ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా.. ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు? ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ.. ఇంటర్న్‌షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా.. ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) నంబర్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా? తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే.. ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగా చూస్తూ వారి కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్‌లో భాగం కాదా?.విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ?డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా ఇక్కడే.. మన రాష్ట్రంలోనే.. ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటిద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే.. చంద్రబాబు గారూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే వాటిని వద్దు అన్న ప్రభుత్వం దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతి కోసం స్కామ్‌లు చేస్తూ ఆ కాలేజీలను ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన సీట్లను కూడా వద్దు అంటూ లేఖరాసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని.. కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే వారికి పీఆర్ నంబర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్ స్టేషన్లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.వైఎస్ జగన్‌కు గోడు వెళ్లబోసుకున్న యువ వైద్యులువిదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తిచేసుకున్న యువ వైద్యులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవడంతో తామంతా విజయవాడలోని వైద్య విశ్వవిద్యాలయానికి మంగళవారం వెళ్లామన్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు తమపై దాడి చేశారని యువ వైద్యులు వైఎస్ జగన్‌కు వివరించారు. ఇక్కడ మెడికల్ సీట్లు రాకపోవడంతో తమ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకోర్చి, అప్పులు చేసి మరీ తమను విదేశాలకు పంపించారని చెప్పారు. తాము కష్టపడి మెడికల్ కోర్సులు పూర్తిచేశామని, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్ష, ఇంటర్న్‌షిప్ చేసినా తమకు పర్మినెంట్ నంబర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఎంజీ చేసిన మరికొంతమంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇవ్వడం లేదని, గడువుకు మించి ఇంటర్న్‌షిప్ పేరిట గొడ్డుచాకిరీ చేయించుకున్నారని యువ వైద్యులు వైఎస్ జగన్‌కు వివరించారు. యువ వైద్యుల వెంట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర ఉన్నారు.