breaking news
East Godavari
-
విద్యార్థిని మృతదేహం లభ్యం
నిడదవోలు: ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని కప్పుల పూజిత (17) మృతదేహం బుధవారం మోర్త సరిహద్దు ప్రాంతంలో లభ్యమైంది. 24 గంటల పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. పూజిత మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వేలివెన్ను ఓ ప్రైవేట్ కళాశాలలో పూజిత ఇంటర్ చుదువుతోంది. మంగళవారం విద్యార్థులతో కలిసి బస్సులో ఇంటికి బయలుదేరింది. దమ్మెన్ను వంతెన వద్దకు రాగానే తనకు వాంతులు వస్తున్నాయని బస్సు ఆపమని కిందకు దిగింది. పూజిత వెంటనే వంతెన దగ్గర చెప్పులు విడిచిపెట్టి కాలువలో దూకేసింది. దీంతో బస్సు డ్రైవర్, సహచర విద్యార్థులు పెద్దగా అరవడంతో స్థానికులు స్పందించి కాలువలో గాలించారు. ఉండ్రాజవరం ఎస్సై డి.రవికుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలికి చేసుకుని విచారణ చేపట్టారు. ఎన్డీఎఫ్ బృందాలు కాలువలో గాలించగా చివరకు పూజిత మృతదేహం లభ్యమైంది. విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఉండ్రాజవరం ఎస్సై డి. రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రత్నగిరిపై ‘కార్తిక’ ఏర్పాట్లు
అన్నవరం: ఈ నెల 22 తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కొనసాగనున్న కార్తికమాసంలో సత్యదేవుని సన్నిధికి విచ్చేసే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం రత్నగిరిపై జరిగిన దేవస్థానం, ప్రభుత్వ శాఖల అధికారుల సమావేశంలో నిర్ణయించారు. ప్రకాష్‌సదన్ సత్రంలోని ట్రస్ట్‌బోర్డు సమావేశ హాలులో జరిగిన సమావేశానికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షత వహించారు. కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ నవంబర్ రెండో తేదీన సత్యదేవుని తెప్పోత్సవం, ఐదో తేదీన గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ భక్తులకు సత్యదేవుని దర్శనం సులభంగా జరిగేలా, వ్రతాల నిర్వహణ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, ఎస్ఐ శ్రీహరి బాబు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు దేవస్థానం అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్.కుమార్‌రాజా పాల్గొన్నారు. కార్తిక మాసోత్సవ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ● వ్రతాలు, దర్శనం టిక్కెట్లు, ప్రసాదాల విక్రయాలకు అదనంగా కౌంటర్ల ఏర్పాటు ● పర్వదినాలలో పశ్చిమ రాజగోపురం వద్ద రోప్ పార్టీ ఏర్పాటు చేసి బృందాల వారీగా దర్శనానికి భక్తులకు అనుమతి ● రెండో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి పంపా నదిలో జరిగే తెప్పోత్సవానికి 20 మంది గజ ఈతగాళ్లు, తెప్పకు ఎస్కార్ట్ గా రెండు బోట్లు ఏర్పాటు ● గిరి ప్రదక్షిణ జరిగే ఐదో తేదీన రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ దీపాల ఏర్పాటు ● నెల రోజులు చిన్నకార్లు, ఆటోలు మినహా మరే ఇతర పెద్ద వాహనాలను కొండమీదకు అనుమతించరు. ● రత్నగిరి, సత్యగిరి పై సుమారు వేయి కార్లు, మూడు వేల బైకులు నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు సిద్ధం ● మెయిన్ క్యాంటీన్ భవనాన్ని డార్మెట్రీ గా చేయాలని నిర్ణయం. ● గిరి ప్రదక్షిణ రోడ్డులో 24 తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు ● బెండపూడి వైపు ఆర్చి నుంచి మండపం సెంటర్ ఆర్చి వరకు రోడ్డుకు మరమ్మతులు ● ముఖ్యమైన దేవస్థానం అధికారులకు 20 వాకీటాకీలు అందించాలని నిర్ణయం. ప్రస్తుతం ఉన్న 20 వాకీటాకీ లకు ఇవి అదనం. ● రత్నగిరిపై అన్నిచోట్లా సీసీ టీవీ కెమెరాలు, పశ్చిమ రాజగోపురం, ఆలయ ప్రాంగణంలో రెండు చోట్ల రెండు సమాచార కేంద్రాలు, పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు ● విజయవాడ, విశాఖపట్నం, జిల్లాలోని ముఖ్య పట్టణాల నుంచి అదనపు ఆర్టీసీ బస్‌లు -
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుండి వస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని శరభవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అటికే సత్యవతి (58), ఆమె భర్త, మాజీ పంచాయతీ వార్డు సభ్యుడు అటికే సత్యనారాయణలు బైక్‌పై టి రాయవరంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా స్థానిక పెట్రోల్ బంకు సమీపానికి వచ్చేసరికి తుని వైపు వెళ్తున్న వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో సత్యవతి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సత్యనారాయణకు స్థానిక సీహెచ్‌సీలో ప్రాధమిక చికిత్స అనంతరం కాకినాడ తరలించారు. సత్యవతికి ముగ్గురు కుమారులున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరాల వెంకన్నకు బ్రహ్మోత్సవం
● రేపటి నుంచి వాడపల్లి క్షేత్రంలో ప్రారంభం ● రోజుకో ప్రత్యేక అలంకారంలో దర్శనం ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు కొత్తపేట: ‘ఏడు వారాల వెంకన్న దర్శనం.. ఏడేడు జన్మల పుణ్యఫలం’ నానుడితో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం వాడపల్లిలో స్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. దేవదాయ, ధర్మదాయ శాఖ, జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేశారు. అటు రావులపాలెం, ఇటు బొబ్బర్లంక నుంచి స్వాగత ద్వారాలు, అక్కడి నుంచి ఆలయం వరకు విద్యుద్దీపాలంకరణలు చేశారు. 1759లో ఆలయ నిర్మాణం స్వామివారి ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు అనే వ్యాపారి 1759వ సంవత్సరంలో నిర్మించారు. ఆయన స్నేహితుడు, ప్రాంతీయ పరిపాలకుడైన పెద్దాపురం మహరాజు రాజా వత్సవాయి తిమ్మ జగపతిరాజు ఈ ఆలయ నిర్వహణకు 275 ఎకారాలను విరాళంగా సమకూర్చారు. దీప ధూప నైవేద్యాల కోసం 110 ఎకరాలు, స్వామి వారి సేవల నిమిత్తం 165 ఎకరాల భూమి సమర్పించారు. అంతకంతకూ పెరుగుతున్న భక్తజనం.. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి తరువాత అత్యంత భక్తజనాదరణ పొందిన క్షేత్రంగా వాడపల్లి విలసిల్లుతోంది. గౌతమీ–వశిష్ట గోదావరుల నడుమ, గౌతమీ నదికి అతి సమీపంలోని ఈ క్షేత్రానికి కొద్ది దూరంలోనే విజ్జేశ్వరం, లొల్ల గ్రామానికి ఆనుకొని ఉండటంతో ఈ గ్రామాన్ని లొల్ల వాడపల్లి, చిన్న వాడపల్లిగా పిలుస్తారు. ఇక్కడ నిత్యం తిరుమల తరహాలో సుప్రభాత, నిత్య కల్యాణ సేవలు నిర్వహిస్తారు. ఏడు శనివారాల పాటు, ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు చెల్లించి, మరో వారం అష్టోత్తర పూజ చేయిస్తే సంకల్పాలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. ఈ ప్రాశస్త్యం మేరకు పదేళ్ల కాలంలో స్వామివారి ఖ్యాతి గణనీయంగా పెరిగి ప్రతి శనివారం సుమారు రూ.55 లక్షలకు పైబడి, నిత్యం రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షలు వరకు ఆదాయం వస్తుండగా, ప్రతి నెలా హుండీల ద్వారా సుమారు రూ 1.35 కోట్లు పైబడి ఆదాయం సమకూరుతోంది. దానితో ఆలయం డిప్యూటీ కమిషనర్ స్థాయికి చేరింది. వైఎస్సార్ సీపీ హయాం నుంచీ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కృషి, దాతల సహకారంతో సుమారు రూ.65 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అవరణలో గోశాల, భారీ రేకుషెడ్లు, అన్నదాన భవనం నిర్మాణం, వకుళమాత అన్న ప్రసాద భవనం, స్వామి వారి తెప్పోత్సవం నిర్వహణకు కోనేరు ఏర్పాటుకు శ్రీకారం. కాలినడకన వచ్చే భక్తులకు విశ్రాంతి, సామూహిక వివాహాలు, ఉపనయనాలు జరిపేందుకు వీలుగా మూడు అంతస్తుల భవనం నిర్మాణం, స్వామి వారికి శాశ్వత వార్షిక కల్యాణ వేదిక, వాటర్ ప్లాంట్, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం ఏర్పాటుచేశారు. ప్రత్యేక అలంకారాలు, వాహన సేవలు స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పదో తేదీన పరావసుదేవి అలంకరణలో శేషవాహనంపైనా, 11న సరస్వతిగా, హంసవాహనంపైనా, 12న కోదండరామునిగా హనుమద్వాహనంపైనా, 13న యోగనారసింహునిగా సింహ వాహనంపైనా, 14న మలయప్పస్వామిగా గరుడునిపైనా, 15న శ్రీకృష్ణునిగా ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి మోహినీదేవిగా చంద్రప్రభవాహనంపై, 16న రాజాధిరాజుగా గజవాహనంపై, 17న కల్కిగా ఉదయం కల్పవృక్షవాహనంపై, రాత్రి అశ్వవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. 18న స్వామివారికి చక్రస్నానం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో.. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పర్యవేక్షణలో దేవాదాయ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ అదనపు బస్సులు ప్రతి శనివారం రావులపాలెం డిపో నుంచి 12 బస్సులు, మిగిలిన రోజుల్లో అదనంగా మూడు బస్సులు చొప్పున, అలాగే ఉమ్మడి జిల్లాలో ఇతర డిపోల నుంచి అదనపు బస్సులు నడుతున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేసినట్టు రావులపాలెం డీఎం వైవీవీఎన్ కుమార్ తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నాం. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేశాం. అందరూ సహకరించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. – నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ ఈఓ, వాడపల్లి -
లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో రోజా
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వరుదు కల్యాణి స్వామివారికి పూజలు చేశారు. తొలుత ఆలయం వద్ద వారికి ఆలయ మర్యాదలతో ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస్ కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు పి.రామశేషాచార్యులు, ఎస్బీఎం రమేష్ స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ సూపరింటెండెంట్ పి.విజయ సారథి వారికి స్వామివారి చిత్రపటాలను, లడ్డు ప్రసాదాలను అందజేశారు. ఎంపీపీ వీరా మల్లిబాబు పాల్గొన్నారు.హుండీలో మంగళ సూత్రాలుఅమలాపురం టౌన్: దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక రవణం వీధిలోని మహిషాసుర మర్దినిదేవి ఆలయంలో హుండీని ఆలయ కమిటీ, ఆ వీధి ఉత్సవ కమిటీ ప్రతినిధులు బుధవారం తెరిచి లెక్కించారు. ఈ సమయంలో కరెన్సీ నోట్లు, చిల్లర నాణేలతో పాటు బంగారు మంగళ సూత్రాలు గమనించారు. మొక్కు చెల్లింపులో భాగంగా అజ్ఞాత భక్తురాలు హుండీలో తాళి బొట్టు వేసి ఉంటుందని భావిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యుడు చిక్కం కిట్టు తెలిపారు. దసరా శరన్నవ రాత్ర ఉత్సవాల సమయంలో అమ్మ వారి హుండీలో రూ.82 వేల నగదు వచ్చిందని కమిటీ తెలిపింది. -
హుండీల ఆదాయం లెక్కింపు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో జగన్మోహినీ కేశవ, గోపాలస్వామి, ఉమా కమండలేశ్వర స్వామివారి ఆలయాల హుండీలను ఆరు నెలల 19 రోజుల అనంతరం బుధవారం తెరిచి నగదు లెక్కించారు. ఆయా దేవస్థానాల ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో రావులపాలెం మండలం పొడగట్లపల్లి ఉప్పలపాటి జానకమ్మ అన్నదాన సత్రం ఈఓ మీసాల రామకృష్ణ పర్యవేక్షణలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో హుండీల ఆదాయం లెక్కించారు. జగన్మోహినీ కేశవ స్వామి ప్రధాన హుండీల ద్వారా రూ 8.29.515, అన్నదానం హుండీల ద్వారా రూ.3,67,275, విదేశీ యూఎస్ఏ 100 డాలర్ 1, 10 డాలర్లు మూడు, 5 డాలర్లు పది, 1 డాలర్ 59, సింగపూర్ 10 డాలర్లు 1, యూఏఈ 5 దినారం ఒకటి వచ్చినట్టు ఈఓ తెలిపారు. అలాగే ఉమా కమండలేశ్వరస్వామి ఆలయం హుండీల ద్వారా రూ.2,64,918 ఆదాయం సమకూరిందన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
● సంఘటనా స్థలంలో హత్య చేసినట్లు ఆనవాళ్లు● దర్యాప్తు చేస్తున్న పోలీసులు పిఠాపురం: పట్టణ శివారు చిత్రాడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద బుధవారం ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎవరో ఒక వ్యక్తి చనిపోయి పడి ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ ఎస్సై మణికుమార్ వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సుమారు 45 ఏళ్ల వయసు గల గుర్తుతెలియని వ్యక్తిగా పోలీసులు తెలిపారు.బండరాయితో మోది..మృతదేహం లభ్యమైన ప్రాంతంలో ఒక బండ రాయి రక్తపు మరకలతో ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడే మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో మద్యం సేవించి అనంతరం బండరాయితో కొట్టి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
మంచి అలవాటుగా తపాలా బిళ్లల సేకరణ
బాలాజీచెరువు (కాకినాడ): సాంకేతికత పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ తపాలా బిళ్ల సేకరణ మంచి అలవాటుగా మార్చుకోవాలని జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.రామచంద్రరావు పేర్కొన్నారు. స్థానిక సినిమా రోడ్డులోని సూర్య కళా మందిరంలో బుధవారం జిల్లా స్థాయి ఫిలాటెలి ఎగ్జిబిషన్ (తపాలా బిళ్లల ప్రదర్శన)‘ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ఈ ఫిలాటెలి అభిరుచి అతి ప్రాచీనమైనదని, తపాలా శాఖ తరచుగా విడుదల చేసే స్టాంపుల వలన ఈ కళ అజరామరంగా భావితరాలకు అందాలని ఆకాంక్షించారు. అసిస్టెంట్ డైరెక్టర్ (ఫిలాటెలి), ఆంధ్రప్రదేశ్ సర్కిల్, విజయవాడ జి.శివనాగరాజు మాట్లాడుతూ ఫిలాటెలి అభిరుచి గల అభిమానులు, ఔత్సాహికులు ఒకే వేదికపై తరచూ ఇలా ప్రదర్శనల ద్వారా ఈ కళకు జీవం పోస్తున్నారని కొనియాడారు. కాకినాడ డివిజనల్ సూపరింటెండెంట్ కె.కృష్ణ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ (హెడ్ క్వార్టర్స్) గంటి రామకృష్ణ పి.వి.రమణమూర్తి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ (రెగ్యులర్), సామర్లకోట అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ డి.అనిల్ అంబేడ్కర్ కుమార్ పాల్గొన్నారు. -
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
సాక్షి, అమలాపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దీపావళి వేళ ప్రమాదాలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. అధికారులు సమీక్షలకే పరిమితమవుతున్నారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రిక ముందుగానే హెచ్చరించింది. ఈ నెల ఒకటో తేదీన ‘అలక్ష్యంతో అనర్థం’, నాలుగో తేదీన ‘ప్రాణ సంకటంగా బాణసంచా’ శీర్షికలతో కథనాలను ప్రచురించింది. దీపావళి సమయాల్లో గతంలో జరిగిన ప్రమాదాలను ఊటంకిస్తూ.. అధికారులు పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపింది. అయినా జిల్లా యంత్రాంగంలో కదలిక లేదు. తయారీ కేంద్రాన్ని ఇటీవల సందర్శించామని, అన్నీ జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అయినా ఇంత ప్రమాదం జరగడం స్థానికులను విస్మయ పరుస్తోంది. -
బాణసంచా తయారీలో మూడు తరాలుగా..
రాయవరం: గ్రామం సమీపంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రాన్ని మూడు తరాలుగా ఒకే కుటుంబం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడి నుంచే బాణసంచా తయారీ కుటీర పరిశ్రమగా ప్రారంభమైంది. స్వాతంత్య్రానికి పూర్వమే వెలుగుబంట్ల వీరన్న బాణసంచా తయారీని ప్రారంభించినప్పటికీ వారి కుమారులు తాత నారాయణమూర్తి, రామకృష్ణల హయాంలోనే అభివృద్ధి చెందింది. తాత నారాయణమూర్తి కుమారుడు వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు), రామకృష్ణ కుమారుడు కోటిబాబులు వేర్వేరుగా వ్యాపారాన్ని సాగించారు. కోటిబాబు మరణించే వరకు ఈ వృత్తిని కొనసాగించగా, వారసులు వృత్తికి స్వస్తి పలికారు. ఇదిలా ఉంటే సత్యనారాయణమూర్తి మాత్రం బాణసంచా తయారీని కొనసాగిస్తున్నారు. దీపావళి పర్వదినానికే కాకుండా వివాహాది శుభకార్యాలకు, గ్రామాల్లో జరిగే అమ్మవారి జాతర్లు, రాజకీయ పార్టీల ఊరేగింపులు, ఉత్సవాలకు బాణసంచా తయారీ చేస్తున్నారు. 1952లో మద్రాస్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశం, 1978లో బెంగళూరులో జరిగిన జాతీయ క్రీడలకు, 1983లో ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి, 1983, 1999లలో ఫిలిం ఫెస్టివల్స్‌కు, పలు చలన చిత్రాల శత దినోత్సవాలకు వెలుగుబంట్ల సోదరులు తయారుచేసిన బాణసంచా కాల్చారు. వాటి తయారీలో ప్రత్యేక స్థానాన్ని సాధించి నిశిరాత్రిలో వెలుగుపూలు నింపిన వెలుగుబంట్ల సత్తిబాబు అదే బాణసంచా ప్రమాదానికి గురికావడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరున్న సత్తిబాబు మృతితో ఆయన అభిమానులు, మిత్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. -
ఆఫ్రికా నత్తల నిర్మూలనకు చర్యలు: కలెక్టర్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో నల్లజర్ల, కోరుకొండ, సీతానగరం, తాళ్లపూడి, అనపర్తి, రాజానగరం మండలాల్లో సుమారు 176 హెక్టార్లలో ఉద్యాన పంటలపై ఆఫ్రికా నత్తల ప్రభావం ఉన్నట్టు గుర్తించామని కలెక్టర్ కీర్తి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఉద్యానశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిమ్మ, బొప్పాయి, కూరగాయల పంటల్లో ఈ నత్తలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయన్నారు. కానీ పంటల ఉత్పత్తి మీద ఇప్పటి వరకు ఈ నత్తల ప్రభావం ఏమి లేదన్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నత్తల నిర్మూలనకు వివిధ పద్ధతులపై ప్రదర్శనలతో కూడిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నత్తలను చేతితో సేకరించి ఉప్పు ద్రావణంలో వేయడం, కాపర్ సల్ఫేట్, ఫెరరస్ సల్ఫేట్ ద్రావణాలను పిచికారీ చేయడం, మెటా డీఎన్ మందును పొలాల్లో వేయడం వంటి చర్యల ద్వారా సమర్థవంతంగా నిర్మూలించవచ్చని తెలిపారు. ఉప్పు ద్రావణంలో ముంచిన గన్ని బ్యాగులను పొలాల గట్లపై ఉంచితే, నత్తల వ్యాప్తి ఇతర పొలాలకు చేరకుండా అడ్డుకోవచ్చని వివరించారు. జిల్లాలో ఉద్యాన పంటలకు సంబంధించి 1,32,101 ఎకరాల్లో ఈ పంట నమోదు పూర్తయిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 6,000 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ విధానం ద్వారా పంటలను ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 3,573 మంది రైతులు 4,246 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి మల్లికార్జునరావు, ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గేష్, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు. -
లోపం ఎక్కడుంది?
రాయవరం: మండల కేంద్రం రాయవరంలో బుధవారం జరిగిన ప్రమాద ఘటన పలు లోపాలను ఎత్తి చూపుతోంది. ఈ ఘటనలో తప్పెవరిది అనే ప్రశ్నకు సమాధానం లేదు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంలో పలు ఊహాగానాలున్నాయి. దర్యాప్తు పూర్తయితే గానీ ప్రమాదానికి కారణం చెప్పలేని పరిస్థితి నెలకొంది. చిచ్చుబుడ్డిని దట్టించే సమయంలో ప్రమాదం జరిగిందా.. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనేది నిర్ధారించలేకపోతున్నారు.భీతావహ పరిస్థితిప్రమాద స్థలం మొత్తం మరుభూమిని తలపించింది. ప్రమాదం జరిగిన తర్వాత 7.30 గంటల సమయానికి కూడా ఆరో మృతదేహాన్ని గుర్తించలేక పోయారంటే అసలు పనికి ఎంతమంది ఎక్కడి నుంచి వెళ్తున్నారనేది పక్కాగా నమోదు చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.నివ్వెరపోయిన అధికారులు, ప్రజలుప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక అధికారులు కూడా సిబ్బందితో వచ్చి ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఘటనా స్థలిలో మృతదేహాలు ఉన్న తీరును చూసి అధికారులకు నోట మాట రాలేదు. అక్కడి పరిస్థితిని చూసిన వారు చలించిపోయారు.ఘటనా స్థలిని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, రామచంద్రపురం ఆర్డీవో అఖిల, డీఎస్పీ బి.రఘువీర్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం తదితరులు సందర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. -
బతుకులు చితికి..
చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి.. కానీ ఈ దీపావళి వారి జీవితాల్లో చీకట్లు నింపింది. మిరుమిట్లు గొలుపుతూ ఉవ్వెత్తున ఎగసే చిచ్చుబుడ్డి వెలుగులు వారి జీవితాల్లో చిచ్చుపెట్టాయి. ఎవరికి ఎవరూ కాకుండా చేశాయి. మరో పది రోజుల్లో దీపావళి వస్తుంది. ఇంటిల్లిపాదీ ఈ పండగకు ఏ లోటూ లేకుండా బాణసంచా కాల్చాలి.. కొత్త దుస్తులు వేసుకోవాలి.. ఇలా ఎన్నో ఆశలతో ఆ కూలీలు బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. ఇంతలో రాజుకున్న చిన్న నిప్పురవ్వ పేదల ఇంట పెను విషాదాన్ని నింపి వారి కుటుంబాలను అంధకారమయం చేసింది.సాక్షి, అమలాపురం/రాయవరం/అనపర్తి/బిక్కవోలు: చుట్టూ పచ్చని పొలాలు.. సమీపిస్తున్న దీపావళి.. పండగ నాడు జనం కళ్లల్లో ఆనంద వెలుగులు చూడాలని అహోరాత్రాలు కష్టపడుతున్న బాణసంచా తయారీ కార్మికులు. అప్పుడప్పుడూ వచ్చిపోయే కొనుగోలుదారుల సందడి. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్క సారిగా పేలుడు శబ్దం. చిచ్చుబుడ్డి తయారు చేస్తున్న సమయంలో రాజుకున్న నిప్పురవ్వలు కొద్ది క్షణాలలోనే ఆ ప్రాంతాన్ని భస్మం చేసేశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో పెను విస్ఫోటం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కాకినాడ జీజీహెచ్‌లో వాసంశెట్టి విజయలక్ష్మి, కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రిలో పొట్నూరి వెంకటరమణ చికిత్స పొందుతూ మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికులు పది నుంచి ఇరవై అడుగులు దూరం ఎగిరిపడ్డారు. మరి కొందరు కార్మికులు మంటల్లో చిక్కుకుని నీటితో ఆర్పుకొనేందుకు నాలుగువైపులా పరుగులు తీశారు. ఈ ఘటనతో తయారీ కేంద్రం మంటలకు ఆహుతై మరుభూమిని తలపించింది. ప్రమాదం బారిన పడిన వారిని రక్షించేందుకు వెళ్లిన వారికి అక్కడి దృశ్యాలు చూసి ఒళ్లు గగుర్పొడిచింది. ప్రమాద ధాటికి కొంతమంది కార్మికులు ఎగిరి పక్కనే ఉన్న పంట పొలాల్లో పడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. చేతికి ఉన్న గాజులు, కాళ్లకు ఉన్న మట్టెల ఆధారంగా మాత్రమే పురుషులు, సీ్త్రలుగా గుర్తించారు. ఒంటిపై ఉన్న ఆభరణాలు, చేతికి ఉన్న ఉంగరాల ఆధారంగా తయారీ కేంద్రం యజమానిని గుర్తించారు. మృతుల కుటుంబీకులు చెప్పిన ఆనవాళ్లను బట్టి పోలీసులు కొందరిని గుర్తించారు.శుభకార్యం ప్రాణాలు నిలిపిందిపేలుడు ఘటనలో గ్రామానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో అనపర్తి సావరం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ గ్రామం నుంచి ప్రతిరోజు సుమారు 15 నుంచి 20 మంది మహిళలు బాణసంచా దుకాణంలో పని చేసేందుకు వెళ్తుంటారు. స్థానికంగా శుభకార్యం ఉండడం, రాబోయే దీపావళికి ఇల్లు శుభ్రం చేసుకునే పని ఉందని చాలామంది పనికి వెళ్లకపోవడంతో వారు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. రోజూ తమతో పాటు పనికి వచ్చే వారిలో కొందరు మృతి చెందారని తెలిసి వారు కన్నీరుమున్నీరయ్యారు.ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదుఅసలు తన భార్య బతికుందా.. లేదా.. అనేది తెలియడం లేదని రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన కూలీ పాకా సుబ్బారావు రోదిస్తున్నాడు. మధ్యాహ్నం భోజన సమయంలో 12.02 గంటలకు తన భార్య అరుణకు ఫోన్ చేశానని, ఆ తర్వాత 12.30 గంటలకు ప్రమాదం జరిగినట్టు తెలిసిందని, ఇంతలోనే అంత ఘోరం జరుగుతుందనుకోలేదని బావురుమన్నాడు.విషాదంలో కుటుంబ సభ్యులుయజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి మృతితో కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఇంటి వద్ద నెలకొంది. ప్రమాద స్థలికి చిన్న కుమారుడు చిట్టిబాబు చేరుకుని గుండెలు పగిలే రోదించాడు.ఆలనాపాలనా చూసేవారెవరు?పెంకే శేషారత్నంకు భర్త సూరిబాబు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కార్తిక్ అనపర్తిలో దుకాణంలో పని చేస్తుండగా, సుబ్రహ్మణ్యం 9వ తరగతి చదువుతున్నాడు. భర్త సూరిబాబు కార్పెంటర్‌గా పని చేస్తున్నారు. అనారోగ్యంతో ఒకరోజు పని చేస్తే రెండు రోజులు ఇంటి వద్దే ఉంటాడు. శేషారత్నం సంపాదిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. తల్లి మృతి చెందిందని తెలిసి బేలగా చూస్తున్న చిన్నారులు స్థానికులకు కంట తడిపెట్టిస్తున్నారు. తమ చిన్నారుల పరిస్థితి ఏమిటని తండ్రి సూరిబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.పిల్లల చదువు కోసం పనికి వెళ్లి..నిరుపేద కుటుంబానికి చెందిన చిట్టూరి శ్యామలకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మృతి వార్త విన్న వృద్ధురాలైన ఆమె అత్తగారిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. పిల్లలు ఇద్దరూ ఇంకా చదువుకుంటున్నారని వారికి ఖర్చులకు ఉంటాయని పనికి వెళ్లిందని, ఇలా మృత్యువాత పడుతుందని ఊహించలేదని రోదిస్తున్నారు. అత్తగారు గుండెలు పగిలేలా రోదిస్తుంటే ఓదార్చేందుకు మాటలు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు.మా జీవన ‘జ్యోతి’ ఆరిపోయిందికుడిపూడి జ్యోతి కుటుంబ పరిస్థితి చాలా దయనీయం. కుమార్తె, కుమారుడు, వయసు పైబడిన తల్లి లక్ష్మి ఆమైపె ఆధారపడి జీవిస్తున్నారు. కుమార్తెకు ఇది వరకే వివాహం చేయగా, కుమారుడుకి ఇటీవలే వివాహమైంది. నాలుగు నెలల క్రితం భర్త సత్యనారాయణ మృతి చెందాడు. దీంతో వారి భారం జ్యోతిపై పడింది. ఆమె అనుకోకుండా ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి దిక్కులేకుండా పోయిందని, అనారోగ్యంతో ఉన్న తనను ముందు రోజు ఆస్పత్రికి తీసుకుని వెళ్లి రూ.రెండు వేలు ఖర్చు పెట్టిందని గుండెలు పగేలా రోదిస్తోంది.మృతులు, క్షతగాత్రుల వివరాలుమృతులు1. వెలుగుబంట్ల సత్యనారాయణ (65), బాణసంచా తయారీ దుకాణం యజమాని, కొమరిపాలెం, బిక్కవోలు మండలం2. పాకా అరుణ(35),సోమేశ్వరం, రాయవరం మండలం3. చిట్టూరి శ్యామల(35), అనపర్తి4. పెంకే శేషారత్నం(40), అనపర్తి సావరం5. కుడుపూడి జ్యోతి(38), అనపర్తి సావరం6. కె.సదానందం (52), ఒడిశా వాసి7. పొట్నూరి వెంకటరమణ (55), కొమరిపాలెం, బిక్కవోలు మండలం8. వాసంశెట్టి విజయలక్ష్మి (51), సోమేశ్వరం, రాయవరం మండలంక్షతగాత్రులు1. చిట్టూరి యామిని, అనపర్తి2. లింగం వెంకట కృష్ణ, వేండ్ర, పెదపూడి మండలం -
కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనలో పలువురి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో పలువురు మరణించడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు.రాయవరంలో జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. -
కోనసీమలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షతగాత్రుల్ని అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో బుధవారం ఉదయం సిబ్బంది బాణాసంచా తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆరుగురు మృతుల్లో ఐదుగురిని పోలీసులు గుర్తించారు. వెలుగుబంటి సత్యసనారాయణ(55) యజమాని, పాకా అరుణ (30), చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నంగా గుర్తించారు.బాణాసంచా తయారీ కేంద్రం నుంచి మంటలు ఎగసి పడుతుండగా.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పేలుడు తీవ్రతకు బాణసంచా తయారీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఉన్న రిటైల్ కేంద్రం కూడా దగ్ధమైంది. పేలుడు తీవ్రతకు షెడ్డు కుప్పకూలింది. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ,ఎస్పి రాహుల్ మీనా పరిశీలించారు. జిల్లాలో 35 బాణాసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చామని.. బాణాసంచి కేంద్రాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. -
దేశభక్తి చాటేలా.. స్ఫూర్తి నింపేలా..
సద్వినియోగం చేసుకోవాలి వీరగాథ 5.0 పోటీలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఈ పోటీల ద్వారా బయటకు వస్తుంది. విద్యార్థులకు నిర్వహించిన పోటీలు, మల్టీమీడియా వీడియోలు ఆన్లైన్లో నమోదు చేయాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా.. వీరగాథ 5.0 కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడమే కాకుండా, వారిలోని సృజనాత్మకతను వెలికితీసే చక్కటి కార్యక్రమం. విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయిలో కనబర్చేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకత్వం చేయాలి. విద్యార్థుల్లో దేశభక్తిని చాటేలా, వీరుల గాథలు వారిలో స్ఫూర్తి నింపేలా పోటీలు నిర్వహించాలి. – జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ● విద్యార్థులకు వీరగాథ 5.0 ● మూడు నుంచి 12వ తరగతుల వారికి పోటీలు ● కేటగిరీలుగా వివిధ అంశాలపై నిర్వహణ ● ఈ నెల 31తో ముగుస్తున్న గడువు రాయవరం: విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు, వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు జాతీయ విద్యా మంత్రిత్వ, రక్షణ శాఖలు సంయుక్తంగా వీరగాథ 5.0 పేరిట పోటీలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మూడు నుంచి 12వ తరగతి(ఇంటర్) వరకు విద్యార్థులకు నాలుగు అంశాల్లో పోటీలు చేపడుతున్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల గాథలను వివరించడం, వారి త్యాగాలను తెలిపేలా విద్యార్థులకు పద్యాలు, కథలు, చిత్రలేఖనం, వ్యాసరచన, మల్టీమీడియా ప్రదర్శన వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఆయా పోటీల్లో పాల్గొనే వారికి ఈ నెల 31వ తేదీ గడువు విధించారు. ఇప్పటికే ఈ పోటీలకు సంబంధించి జిల్లా విద్యా శాఖ ఆయా పాఠశాలలకు ఉత్తర్వులు పంపింది. నాలుగు విభాగాల్లో.. పాఠశాలల వారీగా ఆయా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 3–5 తరగతులకు ఓ విభాగంగా, 6–8, 9–10, 11–12 తరగతులకు వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. 3–5 తరగతుల వారికి పద్యం, కథ (150 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, 6–8 తరగతుల వారికి పద్యాలు/కథ(300 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 9–10 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(700 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 11–12 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(వెయ్యి పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన ఉంటుంది. ఒకటి లేదా రెండు నిమిషాల నిడివితో దేశభక్తికి సంబంధించిన ప్రదర్శన వీడియో రూపంలో ఇవ్వడమే మల్టీమీడియాగా పరిగణిస్తారు. ఎంచుకోవాల్సిన అంశాలు వీరగాథ 5.0 పోటీల్లో పాల్గొనే విద్యార్థులు వారికి నచ్చిన అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వారిని రోల్ మోడల్‌గా ఎంచుకుని, వారి నుంచి నేర్చుకున్న విలువలను ప్రస్తావించాలి. ఆ విద్యార్థికి అవకాశమిస్తే ఏం చేయదలిచాడో చెప్పాలి. ఉదాహరణకు ఝాన్సీలక్ష్మీబాయి కలలోకి వచ్చి దేశానికి సేవ చేయాలని కోరితే.. ఏం చేస్తారో వివరించవచ్చు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును తాను ఆదర్శంగా తీసుకున్న స్వాతంత్య్ర సమరయోధుల జీవిత కథఽలు విద్యార్థిపై ఎలా ప్రభావితం చేసిందో చెప్పాల్సి ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల తిరుగుబాటు పాత్ర, ఇతర అంశాలను ఎంపిక చేసుకుని వివరించవచ్చు. నమోదు విధానం ఆయా పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులు కేటగిరీలుగా, తరగతుల వారీగా పోటీలు నిర్వహించాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులకు పోటీలు నిర్వహించి, వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందుకు ఇన్నోవేటివ్ ఇండియా.మై జీవోవీ.ఇన్/వీర్.గాథ 5.0 అనే వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ యువర్ ఎంట్రీ అని ఉన్న చోట క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల నుంచి అత్యుత్తమమైన నాలుగు ఎంట్రీలను అప్లోడ్ చేయాలి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో 25 మంది వంతున అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున నగదు పారితోషికాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ఇప్పటికే ప్రతిభ కనబరుస్తూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న 2,030 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యల పరిధిలో 2.08 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా, కేటగిరీల వారీగా ఉపాధ్యాయులు పోటీలు నిర్వహిస్తున్నారు. పలువురు విద్యార్థులు సొంతంగా దేశభక్తిని పెంపొందించేలా చిన్న వీడియోలు రూపొందిస్తున్నారు. -
మార్కెట్లో కొత్త థార్–రీఫ్రెష్ విడుదల
రాజమహేంద్రవరం రూరల్: ప్రముఖ మహేంద్రా డీలరైన రాజమహేంద్రవరంలోని ఎంఅండ్ఎన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రిఫ్రెష్డ్ డిజైన్, మెరుగైన కంఫర్ట్, స్మార్ట్ కనెక్టివిటీతో కొత్త థార్‌ను మంగళవారం సాయంత్రం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ, ఐకానిక్ డిజైన్ డ్యుయల్–టోన్ బంపర్‌తో పాటు, విభిన్నమైన ఫ్రంట్ గ్రిల్, కొత్త స్టీరింగ్ వీల్‌తో, పూర్తిగా కొత్త బ్లాక్ థీమ్ డాష్ బోర్డ్, ఆరు రంగుల్లో (టాంగో రెడ్, బ్యాటిల్‌షిప్ గ్రే కొత్తవి) లభ్యమవుతాయన్నారు. కంఫర్ట్, కన్వీనియెన్స్, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, రియర్ ఏసీ వెంట్స్‌తో కూడిన కొత్త సెంటర్ కన్సోల్, డోర్–మౌంటెడ్ పవర్ విండోస్, అంతర్గతంగా పనిచేసే ఇంధన మూత, డెడ్ పెడల్ (ఏటీ), రియర్ వాష్ వైపర్, ఏ–పిల్లర్ ఎంట్రీ అసిస్ట్ హ్యాండిల్, రియర్ వ్యూ కెమెరా, స్మార్ట్ టెక్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో 26.03 సెం.మీ. హెచ్డీ ఇన్ఫోటై మెంట్ స్క్రీన్, యూఎస్బీ పోర్ట్ (ముందు, వెనుక) ఉంటాయని వివరించారు. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. కొత్త థార్‌ను కొత్త డిజైన్, అధునాతన కంఫర్ట్ ఫీచర్లు, స్మార్ట్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌తో రూపొందించబడిందన్నారు. బహుళ ట్రాన్స్మిషన్లతో జత చేయబడిన విభిన్న డ్రైవింగ్ ప్రాధాన్యాలకు అనుగుణంగా మహీంద్రా అనేక రకాల ఇంజిన్ ఎంపికలను అందిస్తుందన్నారు. 6–స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6–స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తదితర సౌలభ్యాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ రాజా, సేల్స్ మేనేజర్లు, ప్రాసెస్ సిబ్బంది, కస్టమర్లు, ఫైనాన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సత్యదేవుని సన్నిధిలో త్వరలో సంప్రోక్షణ, శాంతి పూజలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సంప్రోక్షణ, శాంతి పూజలు నిర్వహించాలని దేవస్థానం పండితులతో కూడిన వైదిక కమిటీ నిర్ణయించింది. మంగళవారం ‘సాక్షి’లో ‘అపశ్రుతులు అందుకేనా..?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించి, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పండితులతో సమావేశం నిర్వహించారు. దేవస్థానంలో చాలాకాలంగా సంప్రోక్షణ పూజలు కానీ, ప్రత్యేక యాగాలు, కోటి తులసి పూజలు జరగకపోవడంతో మూడు నెలలుగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నట్టు ఆ కథనంలో వెలువడింది. అదేవిధంగా రెండు నెలల క్రితం సిక్స్ వీఐపీ సత్రంలో భక్తుడు మరణించినప్పటికీ, అతడు కొండ దిగువన ఆస్పత్రిలో మృతి చెందాడని భావిస్తూ సంప్రోక్షణ పూజలు చేయలేదని కూడా పేర్కొనడం జరిగింది. వీటిపై స్పందించిన చైర్మన్, ఈఓలు మంగళవారం పండితులతో కూడిన దేవస్థానం వైదిక కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్తిక మాసం లోపుగా పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ పూజల తేదీని నిర్ణయించాలని పండితులను కోరినట్టు చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ సుబ్బారావు తెలిపారు. -
13 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రాజానగరం: అనధికారికంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేశారు. ఎంఎస్ఓ గొలుగూరి బాపిరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి కాకినాడ జిల్లా పిఠాపురానికి వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలిస్తున్నారు. ముందుగా అందిన సమాచారంతో జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా, వ్యాన్ ద్వారా గోనె సంచుల్లో తరలిస్తున్న 13,750 కిలోల రేషన్ బియ్యం లభ్యమైంది. దీని విలువ రూ.12 లక్షలు ఉంటుంది. పట్టుబడిన బియ్యానికి ఎటువంటి రికార్డులు లేకపోవడంతో పిఠాపురం మండలం భోగాపురానికి చెందిన డ్రైవర్ కోరసిక విజయ్, సరకు రవాణాదారు, వాహన యజమాని అయిన గొల్లప్రోలుకు చెందిన గారపాటి రాజుపై 6ఏ కేసు నమోదు చేశారు. రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్‌ఫోన్, నగదు కోసమే హత్య
● ఇద్దరు నిందితుల అరెస్టు ● మారణాయుధం, సొత్తు స్వాధీనం సామర్లకోట/తుని రూరల్: తాగిన మైకంలో ఓ యువకుడితో గొడవపడి, అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, రూ.ఐదొందలు నగదు కోసం అతడిని హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తుని రూరల్ పరిధిలోని నర్సీపట్నం బస్టాండ్ వద్ద ఈ నెల రెండో తేదీన రాత్రి తుని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద (నర్సీపట్నం బస్టాండ్ వద్ద) జరిగిన గుర్తు తెలియని యువకుడి హత్య సంచలనం రేపింది. కాకినాడ జిల్లా ఎస్సీ జి.బిందుమాధవ్ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో నియమించిన ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి హత్య కేసును ఛేదించారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు వివరాలు వెల్లడించారు. గొల్లప్రోలు మండలం కొడవలికి చెందిన బొడ్డు సురేష్, పాయకరావుపేటకు చెందిన తర్రా ప్రసాద్ చిత్తు కాగితాలు ఏరుకుంటూ, ఆ సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంటూ లేకపోవడంతో వారు ఆకతాయిలుగా తిరుగుతున్నారు. వీరిద్దరూ ఈ నెల రెండున రాత్రి బస్టాండ్ సమీపంలో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన తానార అప్పలనాయుడు(37) బస్టాండ్ వద్దకు వచ్చాడు. నిందితుల వద్దకు వచ్చిన సమయంలో పరధ్యానంలో అప్పలనాయుడు వారిపై పడబోయాడు. దాంతో సురేష్ అతడిని తోసేయడంతో జేబులో ఉన్న విలువైన సెల్‌ఫోన్ కిందపడింది. చొక్కా జేబులో నగదు కనిపించింది. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదు కాజేసేందుకు నిందితులు కుట్ర పన్నారు. అతడి సెల్‌ఫోన్, నగదును నిందితులు లాక్కునే క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. సమీపంలో ఉన్న రాయి, ఇనుప రాడ్డుతో నిందితులు కలిసి అప్పలనాయుడిపై దాడి చేశారు. ఇష్టానుసారం కొట్టిన తర్వాత రాడ్డును తుప్పల్లోకి విసిరేసి, సెల్‌ఫోన్, నగదును తీసుకుని నిందితులు పరారయ్యారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా, సంఘటన స్థలిలో దొరికిన ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించారు. మంగళవారం తుని పట్టణ శివార్లలో తచ్చాడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు వాడిన ఇనుప రాడ్డు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపర్చుతామన్నారు. కేసును ఛేదించిన తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, గీతారామకృష్ణ, తుని రూరల్ ఎస్సై కృష్ణమాచారి, తొండంగి ఎస్సైలు జగన్మోహన్, జె.విజయబాబు, సిబ్బంది, ప్రత్యేక బృందాలను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అభినందించారు.07టియుఎన్104 : తానార అప్పల నాయుడు (ఫైల్) -
జనారణ్యంలోకి వన్యప్రాణి
● కుక్కకాట్లకు గురైన జింక ● చికిత్స అనంతరం అడవిలో విడిచిపెట్టిన అటవీ అధికారులు ప్రత్తిపాడు: దారి తప్పి జనారణ్యంలోకి ఓ వన్యప్రాణి చొచ్చుకొచ్చింది. శునకాల బారిన పడి గాయపడింది. ప్రత్తిపాడులో శస్త్రచికిత్స చేయగా, తిరిగి అరణ్యంలోకి స్వేచ్ఛగా అడుగిడింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సమీప అటవీ ప్రాంతం నుంచి గొర్రెల మందతో పాటు ఓ జింక జనారణ్యంలోకి అడుగిడింది. రంగంపేట మండలం ఆనూరు గ్రామంలో ఓ గొర్రెల మందతో పాటు జింకను కాపర్లు గమనించారు. అప్పటికే అది కుక్కకాట్లకు గురై, గాయపడి ఉంది. ఈ మేరకు రంగంపేట గ్రామస్తులు జిల్లా అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. ఏలేశ్వరం డిప్యూటీ రేంజ్ అధికారి ఎం.జాన్సన్ తన సిబ్బందితో రంగంపేట చేరుకుని, గాయపడిన జింకను చికిత్స కోసం ప్రత్తిపాడు ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించారు. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర్ ఆ జింకకు శస్త్రచికిత్స అందించారు. కుదుటపడిన జింకను మంగళవారం సాయంత్రం ఏలేశ్వరం మండలం లింగంపర్తి రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో విడిచిపెట్టినట్టు డిప్యూటీ రేంజ్ అధికారి జాన్సన్ తెలిపారు. -
ప్రతీ కేసులో సాంకేతిక ఆధారాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రతి కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి, అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు చేయాలని, తద్వారా శిక్షాకాలం పెంచవచ్చని ఎస్పీ డి.నరసింహాకిశోర్ తెలిపారు. నెలవారీ నేర సమీక్షా సమావేశం సోమవారం పోలీసు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్ల కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. గ్రేవ్ కేసులలో నిర్ణీత గడువు లోపల విచారణ పూర్తి చేసి, చార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. దీపావళి పండగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా పేలుళ్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అంతట దీపావళి మందు గుండు సామగ్రి స్టోరేజ్ గోడౌన్లు, అమ్మకాలు జరిగే ప్రదేశాలను ఆకస్మిక తనిఖీలు చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం భద్రతా చర్యలు తీసుకుంటున్నారా, లేదా పరిశీలించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన బ్లాక్ స్పాట్లలో డ్రోన్ సర్వైలెనన్స్ విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనుమానిత ప్రాంతాలలో కార్డన్ ఆపరేషన్ నిర్వహించాలని, సంబంధిత పోలీసు అధికారులు అందరూ విలేజ్ విజిట్స్ తప్పక చేయాలన్నారు. తద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురయ్యే వివిధ సమస్యలను అరికట్టవచ్చన్నారు. రాత్రి పూట అన్ని స్టేషన్లలలో గస్తీలు ముమ్మరం చెయ్యాలని, అనుమానితుల వేలిముద్రలు ఎంఎస్డీ డివైస్ ద్వారా చెక్ చేయాలన్నారు. అనంతరం గత నెల రోజులలో వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. దీపావళి సందర్భంగా బాణసంచా తయారీదారులు, అమ్మకందారులు, వినియోగదారులు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై, పోస్టర్లను విడుదల చేశారు. అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ,సుబ్బరాజు, జోనల్ డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. క్రైం రివ్వూలో ఎస్పీ నరసింహకిశోర్ -
కార్యకర్తపై మండిపడ్డ మంత్రి దుర్గేష్ బంధువు
నిడదవోలు : పదేళ్ల నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడిన ఓ కార్యకర్తపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కార్యక్రమాలు పర్యవేక్షించే ఆయన బంధువు ప్రశాంత్ మండిపడ్డ ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త ఫణీంద్రకుమార్‌ను ఇటీవల విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిఫారసు చేశారు. అయితే అదే గ్రామానికి చెందిన అంజి అనే జనసేన కార్యకర్త మంత్రి దుర్గేష్ బంధువు ప్రశాంత్‌కి ఫోన్ చేసి అసలు గ్రామంలో ఎంకై ్వరీ చేయకుండా పదవి ఎందుకు ఇచ్చారంటూ నిలదీశాడు. గ్రామంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా పదవి ఎలా ఇచ్చారంటూ అంజి ప్రశ్నించాడు. దీంతో ప్రశాంత్ కార్యకర్త అంజిపై విరుచుకుపడ్డాడు. పార్టీ పదవుల విషయంపై నీకు ఏమిటి సంబంధం, నువ్వు ఎక్కువగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ వార్నింగ్ ఇచ్చాడు. నాకు సంబంధం లేదా అంటూ కార్యకర్త అంజి వాపోయాడు. మంత్రి దుర్గేష్ ఇష్ట ప్రకారం డైరెక్టర్ పదవి ఇచ్చారని, ఎక్కువగా మాట్లాడితే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ ప్రశాంత్ అన్నాడు. జనసేన పార్టీ నీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోమని దురుసుగా మాట్లాడాడు. ఈ విషయమై మంత్రి కందుల దుర్గేష్‌కి ఫోన్ చేసి అడుగుతానని కార్యకర్త అంజి చెప్పడంతో మంత్రితో నువ్వు మాట్లాడతావా నువ్వు ఎంత..నీ స్థాయి ఎంత.నువ్వు కేవలం కార్యకర్తవు మాత్రమే.. లీడర్‌ను అనుకుంటున్నావా అంటూ మండిపడ్డాడు. వైరల్ అవుతున్న ఆడియో -
ముగిసిన పవిత్రోత్సవాలు
పెరవలి: ఆలయానికి వచ్చే అపవిత్ర భక్తులు, మంత్రోచ్ఛారణలో తప్పులు, ఆలయంలోకి వచ్చే క్రిమికీటకాల వలన జరిగే అపవిత్రతను పోగొట్టేందుకే ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. పెరవలి మండలం అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. వేద పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఈ పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లకు హోమగుండం ఏర్పాటు చేసి అనంతరం వేదపండితులు పవిత్రాలకు పూజలు చేశారు. అనంతరం పవిత్రాలను, కలశాలను నెత్తిన పెట్టుకుని స్వామి వారికి సమర్పించారు. ఈ పవిత్రాల వల్ల ఆలయానికి, స్వామి వారికి భక్తులు, పండితుల వలన జరిగిన అపవిత్రత పోయి మళీకల జీవం వస్తుందని వర ప్రసాదాచార్యులు తెలిపారు.పంచారామ యాత్ర, శబరిమలైకి ప్రత్యేక బస్సులుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే కార్తికమాసం సందర్భంగా పంచారామ క్షేత్ర దర్శనం, అయ్యప్పస్వామి యాత్ర చేసే వారికి శబరిమలై ప్రత్యేక బస్సులు కాకినాడ డిపో నుంచి ఏర్పాటు చేస్తామని జిల్లా ప్రజారవాణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంగళవారం యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. పంచారామ స్పెషల్ అక్టోబర్ 25, 26 తేదీల్లో, నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీల్లోను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాకినాడలో శనివారం రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట దర్శనం తర్వాత కాకినాడ చేరుకొంటుందన్నారు. శబరిమలై యాత్రవెళ్లే అయ్యప్పభక్తులు వారు కోరుకున్న చోట నుంచి కోరుకొన్న క్షేత్రాలను చూపించడానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ యాత్రకు వెళ్లే వారు 99592 25564 నంబర్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మనోహర్, పీఆర్వో వెంకటరాజు పాల్గొన్నారు.కార్తిక మాస ఏర్పాట్లపై నేడు సమావేశంఅన్నవరం: ఈ నెల 22 నుంచి నవంబర్ 20 వ తేదీ వరకు కొనసాగనున్న కార్తికమాసంలో అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి విచ్చేసే భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి ప్రకాష్‌సదన్ సత్రంలోని ట్రస్ట్‌బోర్డు హాలులో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.ఘనంగా ప్రత్యంగిర హోమంఅన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి ఆశ్వీయుజ పౌర్ణిమ పర్వదినం సందర్భంగా మంగళవారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. హోమం అనంతరం ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు వేద పండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. ప్రత్యంగిర హోమంలో 30 మంది భక్తులు రూ.750 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి పాల్గొన్నారు. రూ.22,500 ఆదాయం దేవస్థానానికి సమకూరింది. వేద పండితులు యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, ఆలయ పరిచారకులు చిట్టెం వాసు, వేణు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్ ప్రత్యంగిర హోమం నిర్వహించారు. -
సీజేఐపై దాడి దుర్మార్గం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయిపై దాడి దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ పేర్కొంది. న్యాయమూర్తిపై దాడికి నిరసనగా మంగళవారం ఆర్ట్స్ కళాశాల అర్బన్ స్క్వేర్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.భాస్కర్, ఎన్.రాజా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై మతోన్మాదుల దాడి అన్యాయమన్నారు. సనాతన ధర్మానికి అవమానం జరిగిందన్న పేరుతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై మతోన్మాద అడ్వకేట్ ఒకరు కోర్టులో అందరూ చూస్తుండగానే చెప్పు విసరడం దేశంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోందన్నారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మతోన్మాదులు ఆగడాలు పెరిగిపోతున్నాయని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే దాడికి తెగబడేంత ధైర్యం చేశారన్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ప్రజాస్వామ్యానికి రక్షణ ఏముంటుందన్నారు. ఇలాంటి దాడులను ఖండించాలన్నారు. సనాతన ధర్మం పేరుతో ఎవరిపైబడితే వారిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు లహరి, జ్యోతి, సౌమ్య, భాగ్యలక్ష్మి, అమృత, సంధ్య, బాలాజీ, కనక, కార్తిక్, హేమంత్, మౌళి, సాయి పాల్గొన్నారు. -
కమిషనర్ లేక పాలన అస్తవ్యస్తం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం సిటీ): ఐదు నెలలుగా రాజమహేంద్రవరరం నగర పాలక సంస్థకు కమిషనర్ లేకపోవడంతో పాలన ముఖ్యంగా శానిటేషన్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పేరుకుపోయి అస్తవ్యస్తంగా తయారైందని ఏఐటీయూసీ జిల్లా నాయకులు తాటిపాక మధు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద నగరపాలక సంస్థకు కమిషనర్ని నియమించాలని మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ విభాగంలో చనిపోయిన కార్మికుల స్థానంలో వారి వారసులను ఉద్యోగాల్లో నియమించాలని, 60 ఏళ్లు నిండిన ఔట్ సోర్సింగ్ కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి మధు మాట్లాడుతూ రాజమహేంద్రవరం లాంటి చారిత్రక నగరానికి కమిషనర్ని నియమించడానికి ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు ఒకపక్క రానున్న గోదావరి పుష్కరాలు దగ్గర పడుతున్నాయని అయినా ప్రభుత్వానికి చలనం లేదన్నారు. ప్రతిరోజు మున్సిపల్ కార్మికులకు సమస్యలు ఉంటాయని ప్రతిసారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లడం ఇబ్బందిగా ఉందన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాజమండ్రి అధ్యక్షుడు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ పాల్గొన్నారు.ఏఐటీయూసీ నేతలు తాటిపాక మధు -
పట్టుబట్టి.. తూర్పార బట్టి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ/బోట్‌క్లబ్: కూటమి సర్కార్ తీరుపై తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. జిల్లా పరిషత్‌లో పూర్తి ఆధిపత్యం కలిగిన వైఎస్సార్ సీపీ సభలో పైచేయి సాధించింది. సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు వైఎస్సార్ సీపీ సభ్యులు కూటమి సభ్యులకు చుక్కలు చూపించారు. సర్కార్ పాలనా తీరును వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర స్థాయిలో ఎండగట్టడంతో సమావేశం ఆద్యంతం కూటమి పక్ష సభ్యులు ఖిన్నులయ్యారు. మంగళవారం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. తొలుత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కరప ఎంపీడీఓ బి కృష్ణగోపాల్‌కు సంతాపంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం అజెండాపై చర్చ ప్రారంభమవ్వగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చకు వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. జిల్లాలో రైతులను ఇబ్బందులు పాల్జేస్తోన్న యూరియా కొరత, మెట్ట ప్రాంత మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలతో రైతులకు జరిగిన నష్టం, జీఎస్టీ, రంపచోడవరం ఏజెన్సీలో ప్రొటోకాల్ పాటించని తీరు, జిల్లాలో అధ్వానంగా తయారైన రహదారులు తదితర అంశాలపై చర్చ వాడివేడిగా జరిగింది. తొలుత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటీకరించడంపై సభ అట్టుడికింది. ఈ అంశంపై చర్చ జరగాల్సిందే, ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సభ తీర్మానాన్ని ఆమోదించాల్సిందేనని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు గన్నవరపు శ్రీనివాస్, కుడుపూడి శ్రీనివాసరావు, గుబ్బల తులసీకుమార్, ఉలవకాయల లోవరాజు తదితరులు పట్టుబట్టారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ వ్యతిరేకించడంతో ఇరుపక్షాల మధ్య సంవాదం చోటు చేసుకుంది. సమావేశంలో ప్రైవేటీకరణపై చర్చ కోసం పట్టుబట్టి చివరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సీపీ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ వేణుగోపాలరావు కల్పించుకుని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు సూచించడంతో సభ్యులకు సర్దిచెప్పి తిరిగి సభలోకి తీసుకురావడంతో సమస్య సద్దుమణిగింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం అనంతరం జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జరిగిన చర్చలో వైఎస్సార్ సీపీ సభ్యులు పాల్గొని కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు. నిర్మాణాలు పూర్తి అయిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి ప్రభుత్వ వైద్యవిద్యను పేదలకు దూరం చేసే కూటమి కుట్రలను రాజ్యసభ సభ్యుడు సుభాష్‌చంద్రబోస్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర స్థాయిలో నిరసించారు. 16 సంవత్సరాలు సీఎంగా ఒక్క కాలేజీ కూడా తీసుకురాలేకపోయిన చంద్రబాబు.. 17 కాలేజీలను జగన్మోహన్రెడ్డి తీసుకువస్తే వాటిని ప్రైవేటీకరిస్తున్నారని సభ్యులు ధ్వజమెత్తారు. చర్చ అనంతరం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్వసభ్య సమావేశం తీర్మానాన్ని ఆమోదింపచేయడంలో వైఎస్సార్ సీపీ సభ్యులు సభలో పై చేయి సాధించారు. జిల్లాలో యూరియా కొరతతో రైతులు పడుతున్న కష్టాలు సర్కార్ చెవికెక్కలేదంటూ గొల్లప్రోలు, తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు, దొమ్మేటి సాగర్ ప్రశ్నించారు. 2023తో పోలిస్తే 2025లో 3వేల మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా పంపిణీ చేశామని వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్ ఇచ్చిన వివరణపై ఎంపీ బోస్ తప్పుపట్టారు. చెబుతున్న లెక్కలకు జిల్లాల్లో ఎరువుల పంపిణీకి అసలు పొంతనే ఉండటం లేదన్నారు. ఇంతలో ఎమ్మెల్సీ అనంతబాబు కల్పించుకుని రంపచోడవరం ఏజెన్సీలో వర్షాభావ పరిస్థితుల్లో ఐదు ఎకరాల రైతుకు ఒక యూరియా బస్తా కూడా ఇవ్వలేదన్నారు. మెట్ట ప్రాంతంతో పోలిస్తే ఏజెన్సీలో రైతులు యూరియా కోసం నానా పాట్లు పడ్డారన్నారు. జగన్ ప్రభుత్వంలో నూరుశాతం రాయితీ విత్తనాలు అందిస్తే ఇప్పుడు ఎంతమంది రైతులకు ఎన్ని టన్నులు ఇచ్చారో చెప్పాలని అనంతబాబు ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లభించలేదు. ఏజెన్సీలో ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని వై రామవరం ఎంపీపీ ఆనంద్, జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి నిలదీశారు. వై రామవరం మండలం చింతలపూడి పంచాయతీలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఫ్లెక్సీ పెట్టి కుటుంబ సభ్యులు టెంకాయ కొట్టిన ఫ్లెక్సీ ఫొటోను అనంతబాబు సభలో ప్రదర్శించి అధికారుల తీరును ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించకుండా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను అవమానపరుస్తున్నారని ఎమ్మెల్సీ అనంతబాబు, రంపచోడవరం ఎంపీపీ వెంకటలక్ష్మి ప్రశ్నించారు. ఐటీడీఏలో డీఈఈ చైతన్య చేసిన పనులకు రెండోసారి బిల్లులు పెట్టి రూ.40 లక్షలు కాజేసిన విషయాన్ని నిరూపిస్తానని ఎమ్మెల్సీ అనంతబాబు నిలదీయగా సమాధానం ఇవ్వలేక అధికారులు నీళ్లు నమిలారు. నకిలీ పత్తి విత్తనాల ప్రస్తావన పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు, చేబ్రోలు తదితర ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు లోవరాజు సభ దృష్టికి తీసుకువచ్చారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయగా విచారణ చేస్తున్నామని, నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ షణ్మోహన్ వివరణ ఇచ్చారు. ఉప్పాడ బీచ్ రోడ్డు చాలా అధ్వానంగా తయారైనా పట్టించుకోవడం లేదని జెడ్పీ వైస్ చైర్పర్సన్ మేరుగు పద్మలత ప్రశ్నించారు. తుని ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి తల్లి తనువు చాలించిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడాన్ని ఆమె నిలదీయగా విచారణ చేస్తున్నామని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. మరో ఏడాది మాత్రమే తమ పదవీ కాలం ఉందని, ఇప్పటికై నా నిధులు విడుదల చేయాలని జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. జీఎస్టీకి అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించే విషయంపై కూటమి పక్ష ప్రజాప్రతినిధులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సోము వీర్రాజుతో వైఎస్సార్ సీపీ రావులపాలెం, గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, లోవరాజు విభేదించారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతున్న చైర్పర్సన్ విప్పర్తి. చిత్రంలో కలెక్టర్ షణ్మోహన్,, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావుసాగునీటి కొరత రాకుండా చర్యలుఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.79 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు నీటి కొరత రాకుండా చూడాలని సభ్యులు అధికారులకు సూచించారు. ఇప్పటి వరకూ 60 టీఎంసీలు సరఫరా చేశామని, గోదావరిలో చేరిన సర్ ప్లస్ సరఫరా చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. సీలేరు జలాలను కూడా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఆలమూరు మండలం లంక భూముల్లో మట్టిని ఇటుక బట్టీల కోసం లోతుగా తవ్వేయడంతో దొండ, ఇతర కూరగాయల పంటల సాగు కనుమరుగవుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గోకవరం, కోరుకొండ, రాజానగరం మండలాలు ఎక్కడో దూరంగా ఉన్న అమలాపురం ఇరిగేషన్ డివిజన్ పరిధిలో ఉండటం వల్ల అధికారుల పర్యవేక్షణకు, రైతుల సమస్యల పరిష్కారానికి అసౌకర్యంగా ఉందని, వాటిని రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోకి తేవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన ప్రతిపాదనను సభ ఆమోదించింది. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరన్‌రాజ్, తూర్పుగోదావరి డీఆర్వో టీ.సీతారామమూర్తి, కోనసీమ జిల్లా డీఆర్వో కె.మాధవి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం యూరియా కొరతపై గళం విప్పిన సభ్యులు నకిలీ పత్తి విత్తనాలపై నిలదీత రంపచోడవరం మన్యంలో ప్రొటోకాల్‌పై చర్చ గరం..గరంగా ‘తూర్పు’ జెడ్పీ సమావేశం -
వాల్మీకి జీవితం ఆదర్శనీయం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రామాయణాన్ని మహాకావ్యంగా లోకానికి పరిచయం చేసిన వాల్మీకి మహర్షి జీవితం నేటి ఆధునిక సమాజానికి ఆదర్శనీయమని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే.భాస్కరరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా భాస్కర రెడ్డి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర రెడ్డి మాట్లాడుతూ జ్ఞానం ఉంటే మనిషి సాధించలేనిదేమీ లేదని వాల్మీకి నిరూపించారన్నారు. సీపీఓ అప్పలకొండ మాట్లాడుతూ రామాయణం రచన ద్వారా సీతారాముల సద్గుణాలు, కుటుంబ విలువలు, పాలనా సూత్రాలు, సమాజ శ్రేయస్సు వంటి ఎన్నో జీవన సూత్రాలను వాల్మీకి మహర్షి అందించారన్నారు. బీసీ వెల్ఫేర్ అధికారి బి. శశాంక మాట్లాడుతూ రామాయణం సామాజిక నీతిని బోధించే గ్రంథం అని, వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో, ఏడు కాండలతో మానవాళికి అద్భుతమైన కావ్యాన్ని అందించారన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే.ఎన్.జ్యోతి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ముత్యాల సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఘనంగా మహర్షి జయంతి -
అపశ్రుతులు అందుకేనా..?
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఎనిమిది నెలలుగా వివాదాల నడుమ వార్తల్లో నిలుస్తోంది. మూడు నెలలుగా పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మూడేళ్లుగా ఎటువంటి యాగాలు, కోటి తులసి పూజలు జరగకపోవడం, భక్తుని మృతి తర్వాత కూడా సంప్రోక్షణ పూజలు నిర్వహించకపోవడమే ఇందుకు కారణమనే అభిప్రాయం పండిత వర్గాల్లో వ్యక్తమవుతోంది. వైష్ణవాలయాల్లో పవిత్రోత్సవాల పేరిట.. సత్యదేవుని సన్నిధికి నిత్యం వేలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. వీరిలో కొందరు భక్తులు తెలిసో తెలియకో అశౌచం, ఇతర రాకూడని పరిస్థితుల్లో స్వామివారి సన్నిధికి వస్తుంటారు. ఇది అన్ని దేవస్థానాల్లో జరిగేదే. వైష్ణవాలయాల్లో పవిత్రోత్సవాల పేరుతో ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు ప్రత్యేక పూజలు చేసి, ఆలయాన్ని శుద్ధి చేస్తుంటారు. తిరుమల తిరుమతి దేవస్థానం, సింహాచలం, ద్వారకా తిరుమల దేవస్థానాల్లో బ్రహ్మోత్సవాలకు ముంందు ఇటువంటి పూజలు చేస్తుంటారు. దీంతో ఆయా దేవస్థానాల్లో దుస్సంఘటల వల్ల ఏర్పడిన ప్రభావం పోయి మరలా పవిత్రత చేకూరుతుందనే నమ్మకం ఉంది. గతంలో యాగాలు, సంప్రోక్షణలు అన్నవరం దేవస్థానంలో కూడా గతంలో రెండేళ్లకోసారి మహానారాయణ యాగం, కోటి తులసి పూజలు నిర్వహించేవారు. చివరగా 2022 ఫిబ్రవరిలో సత్యదేవుని సన్నిధిన పది రోజులు కోటి తులసి పూజ నిర్వహించారు. దేవస్థానంలో భక్తుడు మరణిస్తే వెంటనే సంప్రోక్షణ పూజలు చేసేవారు. మృతదేహాన్ని తరలించిన మార్గంలో కొండ దిగువ వరకూ సంప్రోక్షణ చేసేవారు. దీంతో తిరిగి పవిత్రత నెలకొంటుందనే భావన ఉండేది. కొన్నాళ్లుగా దేవస్థానంలో ఇటువంటి యాగాలు, సంప్రోక్షణ పూజలు జరగలేదు. రెండు నెలల్లో దుస్సంఘటనలు ● రెండు నెలల క్రితం దేవస్థానంలోని సిక్స్ వీఐపీ సత్రంలో బస చేసిన భక్తుడు అపస్మారక స్థితిలో ఉండగా, కొండ దిగువన దేవస్థానం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కొండపైనే అతడు మృతి చెందాడని, ఉద్దేశపూర్వకంగా కొండదిగువన చనిపోయినట్టు ప్రకటించారని తర్వాత వెల్లడైంది. ● ఆగస్టు ఒకటో తేదీన దేవస్థానంలోని స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, హుటాహుటిన తుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అన్నవరం వచ్చి పరిస్థితిని సమీక్షించాల్సి వచ్చింది. ● ఆగస్టు ఆరో తేదీన ప్రకాష్ సదన్ సత్రం వద్ద పార్కింగ్‌లో ఉంచిన సీఎన్జీ కారు దగ్ధమైంది. ఆ కారుతో పాటు పక్కనున్న మరో రెండు కార్లూ పాక్షికంగా దెబ్బతిన్నాయి. ● గత నెల 27వ తేదీన పశ్చిమ రాజగోపురం వద్ద ఫాన్సీ షాపు గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగి రూ.పది లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. దేవస్థానం సెక్యూరిటీ అధికారులు సకాలంలో స్పందించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే మరిన్ని దుకాణాలకు మంటలు వ్యాపించి, ఆస్తి నష్టం రూ.కోట్లలో ఉండేది. ● ఈ నెల మూడో తేదీ రాత్రి విష్ణుసదన్ సత్రంలో మూడో అంతస్తు నుంచి తల్లీకుమారుడు కిందపడ్డారు. తల్లికి రెండు కాళ్లు విరగగా, కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. కుమారుడికి స్పల్ప గాయాలయ్యాయి. ● ఇవే కాకుండా కొద్ది నెలలుగా అధికారుల వ్యవహార శైలి కారణంగా దేవస్థానం తరచూ వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి కార్తిక మాసం ప్రారంభమవుతుండగా, నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేస్తుంటారు. తెల్లవారుజామున రెండు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. కార్తిక పౌర్ణిమ నాడు జరిగే గిరి ప్రదక్షిణలో మూడు లక్షలు మంది భక్తులు పాల్గొంటారు. అదే రోజు స్వామివారి ఆలయానికి లక్ష మంది వరకు విచ్చేస్తారు. ఈ నేపథ్యంలో కార్తిక మాసానికి ముందే దేవస్థానంలో సంప్రోక్షణ పూజలు చేయిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పండితులతో చర్చిస్తాం దేవస్థానంలో సంప్రోక్షణ పూజలు జరిపించే విషయమై దేవస్థానం పండితులతో చర్చిస్తాం. అవసరమనుకుంటే కార్తిక మాసం కన్నా ముందుగానే చేయిస్తాం. – ఐవీ రోహిత్, చైర్మన్, అన్నవరం దేవస్థానం రత్నగిరిపై వరుస దుస్సంఘటనలపై అనుమానాలు ఎనిమిది నెలలుగా దేవస్థానంలో పలు వివాదాలు మూడు నెలలుగా ప్రమాద ఘటనలు గతంలో రెండేళ్లకోసారి నారాయణ యాగం, కోటి తులసి పూజలు భక్తుడు మరణిస్తే సంప్రోక్షణ ఇప్పుడు అవి లేకనే దుష్ప్రభావాలంటూ అభిప్రాయాలు -
14 నుంచి ‘నన్నయ’లో ఫుడ్ ఫెస్టివల్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే మెగా ఫుడ్ ఫెస్టివల్ ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతుందని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన అధ్యాపకులతో సోమవారం ఈ అంశంపై చర్చించారు. ఈ నెల 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని, గోదావరి రుచులను, అభిరుచులను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఆహార పదార్థాల తయారీలో చేయితిరిగిన ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ ప్రతిభను చాటాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.విజయనిర్మల, హెచ్ఓడీ ఆచార్య డి.కల్యాణి, అధ్యాపకులు ఎంఎం కృష్ణవేణి, కె.సింధూజ పాల్గొన్నారు. -
అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన గర్వకారణం
బాలాజీచెరువు (కాకినాడ): అంతర్జాతీయ వేదికపై శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ విద్యార్థులు ప్రదర్శనలిచ్చి ప్రతిభ చూపడం గర్వకారణమని శ్రీప్రకాష్ స్కూల్ డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ అన్నారు. కజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్(తాష్కెంట్)లో సాంస్కృతిక పర్యటన విజయవంతంగా పూర్తి చేసి, స్వదేశానికి వచ్చిన విద్యార్థుల బృందాన్ని సోమవారం అభినందించారు. కింగ్ లియర్, జూలియస్ సీజర్ వంటి క్లాసిక్ నాటకాలను అత్యున్నత స్థాయిలో ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారన్నారు. భారతీయ సాంస్కృతిక సంబంధ పరిషత్, స్వామి వివేకానంద సాంస్కృతిక కేంద్రం సహకారంతో భారత రాయబార కార్యాలయం (అస్తానా, కజికిస్తాన్) సమన్వయంతో విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చారన్నారు. విద్యార్థుల జీవితాల్లో ఇది స్ఫూర్తిదాయక మైలురాయి అవుతుందని విజయ్ ప్రకాష్ తెలిపారు. -
ఆటోను అటకాయించి దాడి
రాయవరం: వేకువజామున ప్రయాణికులతో వెళుతున్న ఆటోను కొందరు వ్యక్తులు అటకాయించి, దాడి చేసినట్టు కేసు నమోదు చేశామని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు తెలిపారు. ఆయన వివరాల మేరకు, మండలంలోని వి.సావరం గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణారావు ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. సోమవారం వేకువజామున 3.30 సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న వారిని ఆటో ఎక్కించుకునేందుకు మాచవరం వంతెన వద్దకు వచ్చాడు. ప్రయాణికులను ఎక్కించుకుని వి.సావరం వెళ్తున్న సమయంలో సోమేశ్వరం గ్రామం వద్ద అదే గ్రామానికి చెందిన శాకా వినయ్వంశీ ఆటోను అడ్డగించాడు. డ్రైవర్ౖ రామకృష్ణపై దాడి చేశాడు. దాడిని అడ్డుకున్న ప్రయాణికురాలు అన్నపూర్ణపై కూడా దాడికి పాల్పడ్డాడు. వంశీతో పాటు, మరో ముగ్గురు కలిసి డ్రైవర్ రామకృష్ణ, అన్నపూర్ణతో దురుసుగా ప్రవర్తించారు. దాడికి గురైన రామకృష్ణ అనపర్తి ఆస్పత్రిలో చేరగా, ఆటోలో ప్రయాణిస్తున్న వారు మరో వాహనంలో ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై హెచ్‌సీ వీర్రాజు కేసు నమోదు చేయగా, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ దొరరాజు తెలిపారు. భయంతో వణికిపోయాం రాయవరం పోలీస్‌స్టేషన్ వద్ద బాధితులు చింతపల్లి సత్యసాయి ప్రసన్న, అనుసూరి కీర్తన, అనుసూరి అన్నపూర్ణ, అనుసూరి శ్రీను తమ గోడును వెళ్లబోసుకున్నారు. శ్రీను, అన్నపూర్ణ, వారి కుమార్తెలు సత్యసాయిప్రసన్న, కీర్తనతో కలిసి హైదరాబాద్ నుంచి బస్సు దిగి మాచవరం వంతెన వద్ద ఆటో కోసం వేచిచూస్తున్న సమయంలో వినయ్వంశీ, మరో ముగ్గురు తమ వాహనంలోకి రావాలని అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. ఈలోగా ఆటో రావడంతో, అందులో ఎక్కి వెళుతుండగా ఆ నలు గురూ వెంబడించి, ఆటోను అడ్డగించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. అంతేకాకుండా అన్నపూర్ణపై వంశీ దాడి చేసి కొట్టాడన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.డ్రైవర్, ప్రయాణికులపై దురుసు ప్రవర్తన -
రూ.లక్ష విలువైన ప్లాస్టిక్ కవర్ల పట్టివేత
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట పట్టణంలో సోమవారం మున్సిపల్ అధికారులు రూ.లక్ష విలువైన ప్లాస్టిక్ కవర్లను పట్టుకున్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పట్టణంలోని దుకాణాలకు వినియోగదారుల్లా వెళ్లి కవర్లు అడిగి తీసుకున్నారు. అనంతరం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వాణిమహల్ రోడ్ పాత విక్టరీ బజార్ ఎదురుగా ఉన్న హోల్‌సేల్ ప్లాస్టిక్ కవర్ల దుకాణంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఆధ్వర్యంలోని సిబ్బంది దాడి చేశారు. స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్ కవర్లను మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. కమిషనర్ టీవీ రంగారావు మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, కొనుగోలు చేసినా, వినియోగించినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. -
అనారోగ్యంతో ఎంపీడీఓ కృష్ణగోపాల్ మృతి
కరప: కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరప ఎంపీడీఓ బి.కృష్ణగోపాల్(61) సోమవారం మృతి చెందారు. కాకినాడలోని జెడ్పీ కార్యాలయంలో ప్లానింగ్ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి లభించడంతో గత నెల 19న ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత అనారోగ్య కారణాలతో సెలవు పెట్టారు. ఆయనకు భార్య, వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి పలువురు నాయకులు, అధికారులు సంతాపం తెలిపారు. బైక్ చోరీ కేసులో ఇద్దరికి జైలు గోపాలపురం: మోటార్ బైక్ చోరీ కేసులో ఇద్దరికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్టు ఎస్సై పి.మనోహర్ సోమవారం విలేకరులకు తెలిపారు. గతేడాది అప్పటి ఎస్సై కర్రి సతీష్‌కుమార్ బైక్ చోరీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పూలపల్లి శివసుబ్రహ్మణ్యం, మరపట్ల రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. నిందితులపై నేరం రుజువు కావడంతో, కొవ్వూరు సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కె.నాగలక్ష్మి వారికి జైలు శిక్ష విధించారు. తైక్వాండో పోటీలకు ఇద్దరి ఎంపిక రాజోలు: రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు రాజోలుకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్టు కోచ్ మణికుమార్ సోమవారం తెలిపారు. ఇటీవల కాకినాడలో జరిగిన అండర్–17 జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో వై.గంగాభవాని, హేమ సత్యశ్రీ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. స్థానిక ఎల్బీ నగర్లో జరిగిన కార్యక్రమంలో వీరిని మాజీ ఎమ్మెల్యే వేమా, జిల్లా ఒలింపిక్ సంఘ ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ గోపాలకృష్ణ తదితరులు అభినందించారు. -
దొంగ హల్చల్
నిడదవోలు: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆదివారం రాత్రి ఓ దొంగ హల్చల్ చేశాడు. అసోం ప్రాంతానికి చెందిన యువకుడు రాత్రి 12 గంటల సమయంలో గోడ దూకి రెండంతస్తుల భవనంలోకి ప్రవేశించాడు. భవనంలో ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వారు నిద్రిస్తున్న సమయంలో కర్ర తీసుకొచ్చిన యువకుడు తలుపులు, కిటికీలు కొడుతూ, హిందీలో తలుపు తీయాలని బిగ్గరగా కేకలు వేశాడు. ఆ దంపతులు భయపడి పైన అద్దెకుంటున్న వారికి సమాచారమిచ్చారు. వారు కిందకొచ్చి పలువురు స్థానిక యువకుల సాయంతో దొంగను పట్టుకున్నారు. కర్రతో అతడు హల్చల్ చేయడంతో యువకులు అతడిని నిర్బంధించారు. కాళ్లూచేతులు కట్టి పోలీసులకు సమాచారమిచ్చారు. నైట్‌బీట్‌లో ఒకే కానిస్టేబుల్ ఉండటంతో దొంగను తీసుకెళ్లడానికి తీవ్ర జాప్యం జరిగింది. స్థానికులు నిద్రపోకుండా దొంగకు కాపలాగా ఉన్నారు. సమాచారం తెలుసుకున్న టూటౌన్ ఎస్సై సీహెచ్ పరమహంస అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. దొంగపై దాడి చేసిన యువకులపై ఎస్సై మండిపడ్డారు. ఈ క్రమంలో పలువురు మహిళలు ఎస్సైతో వాగ్వాదానికి దిగా రు. చివరకు వేకువజామున మూడు గంటల సమయంలో యువకులు దొంగను పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. పట్టణ ఎస్సై జగన్మోహన్రావు ఆ దొంగ మానసిన పరిస్థితిపై ఆరా తీశారు. అతడి మానసిక స్థితి బాగోలేకనే ఇలా చేశాడని, అసోంలో ఉన్న అతడి బంధువులకు సమాచారం అందించామని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు -
ఆర్ఎంసీ వెబ్సైట్లో అభ్యర్థుల జాబితా
కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో పారా మెడికల్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితాను http: //rmckakinada.com వెబ్సైట్లో వారి పరిశీలనార్థం విడుదల చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.విష్ణువర్దన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలో అభ్యంతరాలున్న వారితో పాటు, గతంలో సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించని వారు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ఆర్ఎంసీ కార్యాలయంలో అందించాలని సూచించారు. వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. కాకినాడ జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా సత్యనారాయణ కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కాకినాడ జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఏడాది మార్చి 28న కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేసున్న కె.ఆనందరావును అవినీతి కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆనందరావు స్థానంలో ఉమ్మడి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ జేఎస్‌యూ జయలక్ష్మిని కాకినాడ జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా నియమించారు. ఆమె వ్యక్తిగత కారణాలతో సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సెలవు పెట్టారు. ఆమె స్థానంలో రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణను నియమిస్తూ ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
రెండు షాపుల్లో చోరీలు
అమలాపురం టౌన్: పట్టణంలోని ఎర్ర వంతెన వద్ద, బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండు చోరీ ఘటనలతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. స్థానిక ఈదరపల్లి బైపాస్ రోడ్డులోని పవన్ మారుతీ కేర్ షాపు, స్థానిక ఎర్ర వంతెన సమీపంలోని కొల్లూరి బిల్డింగ్ మార్ట్‌లో ఉన్న ఎలక్ట్రికల్ షాపులో ఈ చోరీలు జరిగాయి. బైపాస్ రోడ్డులో కారులో వచ్చిన దొంగ.. షాపు షట్టర్లు పగులగొట్టి దోచుకున్నాడు. ఎర్ర వంతెన సమీపంలోని షాపు పైకప్పు పగులగొట్టి, లోనికి చొరబడి చోరీకి పాల్పడ్డారు. మరికొంత మంది దొంగలు ఇదే షాపు షట్టర్లు పగులగొట్టి మరీ షాపులోకి ప్రవేశించారు. ఈ షాపులో రూ.వేలల్లో నగదు, పది వైరు కట్టలు, ఇతర మెటీరియల్‌ను దోచుకున్నారు. బైపాస్ రోడ్డులోని పవన్ మారుతీ కేర్‌లో కొంత నగదును దొంగ తస్కరించాడు. సంఘటన స్థలాల్లో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. షాపు యాజమాని జయిన గణేష్, ఎర్ర వంతెన సమీపంలోని షాపు యాజమాని కొల్లూరి గుప్తా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్టు సీఐ పి.వీరబాబు తెలిపారు. ఆయా షాపుల్లో చెరో రూ.25 వేల సొత్తు దొంగిలించినట్టు చెప్పారు. ఒకే రాత్రి రెండు షాపుల్లో దొంగలు చొరబడ్డారంటే పట్టణంలోకి వేరే ప్రాంతానికి చెందిన దొంగల ముఠా వచ్చిందని వ్యాపారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
వ్యాపారి హత్య!
ఏలేశ్వరం: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించడంతో పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, అడ్డతీగల మండలం డి.కొత్తూరుకు చెందిన బొదిరెడ్డి వెంకటేశ్వర్లు సీజనల్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల రెండో తేదీన దసరా కావడంతో ఏలేశ్వరంలో నివసిస్తున్న కుమారుడు ఆంజనేయులు ఇంటికి వచ్చాడు. దసరా రోజు కావడంతో బంగారు ఆభరణాలు ధరించి, కొంత నగదు తీసుకుని వేరే వ్యక్తితో కలిసి ఏజెన్సీకి వెళ్లాడు. మధ్యాహ్నం భోజన సమయం దాటాక ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు కుమారుడు ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు సమీపంలోని బొంతువలస ప్రాంతం వద్ద వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గుర్తించారు. మృతుడితో వెళ్లిన వ్యక్తిని పోలీసులు ఆరా తీయగా, విషయం బయటపడింది. మృతుడికి భార్య సత్యవతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏలేశ్వరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అవార్డులతో బాధ్యత మరింత పెరిగింది
రాజమహేంద్రవరం సిటీ: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు సాధించడం ఆనందదాయకమని, ఈ అవార్డులు మనందరి బాధ్యతను మరింతగా పెంచాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అవార్డుల కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో జిల్లాకు మూడు రాష్ట్ర స్థాయి, 51 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని చెప్పారు. ఆయా అధికారులు, సంస్థల ప్రతినిధులకు ఈ అవార్డులను ఆమె అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జేసీ మేఘస్వరూప్, ఆర్డీఓ ఆర్.కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 25 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 25 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. సివిల్, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట తదితర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు కూడా పాల్గొన్నారు. సారాపై ఫిర్యాదులకు 14405 కాల్ సెంటర్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సారా తయారీ, రవాణా, అమ్మకాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు 14405 నంబర్‌తో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయన్నారు. ఎకై ్సజ్, జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. సారా నిర్మూలనకు జిల్లాలో 19 మండల స్థాయి, 240 గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమం కింద ఇప్పటివరకు 313 అవగాహన సమావేశాలు నిర్వహించామని, 63 మంది దత్తత అధికారులను నియమించామని జిల్లా ఎకై ్సజ్ అధికారి సీహెచ్ లావణ్య తెలిపారు. కలెక్టర్ కీర్తి, జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి లావణ్య, ఇతర అధికారులు కలిసి నవోదయం 2.0 – 14405 కాల్ సెంటర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఆర్డీఓలు కృష్ణనాయక్, రాణి సుస్మిత, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నేడు జెడ్పీ సమావేశం బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి జెడ్పీ పరిధిలోని కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు పాల్గొనాలని కోరారు. -
ఘనంగా పవిత్రోత్సవాలు
పెరవలి: అన్నవరప్పాడు అలివేలు మంగా వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలను సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం హోమం నిర్వహించారు. నూలు దండలతో స్వామి, అమ్మవార్ల మూర్తులను రూపొందించి, కలశ పూజతో పాటు వివిధ అర్చనలు నిర్వహించారు. పవిత్రోత్సవాలకు సంబంధించిన వివిధ క్రతువులు రాత్రి 9 గంటల వరకూ జరుగుతాయని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితుల సుస్వర వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. భక్తుల గోవింద నామోచ్చారణ ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. -
సత్యదేవునికి రూ.1.49 కోట్ల హుండీ ఆదాయం
అన్నవరం: సత్యదేవునికి హుండీల ద్వారా దండిగా ఆదాయం సమకూరింది. గడచిన 35 రోజులకు హుండీల ద్వారా రూ.1,48,77,755 రాబడి వచ్చింది. దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.1,39,47,961, చిల్లర నాణేలు రూ.9,29,794 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. హుండీల ద్వారా 62 గ్రాముల బంగారం, 345 గ్రాముల వెండి కూడా లభించాయి. అలాగే, అమెరికన్ డాలర్లు 76, ఇంగ్లండ్ పౌండ్లు 15, సింగపూర్ డాలర్లు 4, సౌదీ రియల్స్ 6, యుఏఈ దీరామ్స్ 20, ఖతార్ రియల్స్ 1, మలేషియా రింగిట్స్ 1 చొప్పున భక్తులు హుండీల్లో వేశారు. గత 35 రోజులకు సరాసరి హుండీ ఆదాయం రూ.4.25 లక్షలుగా నమోదైంది. ఈ 35 రోజుల్లో 23 రోజులు భాద్రపదం కాగా, 12 రోజులు మాత్రమే ఆశ్వయుజ మాసం. దసరా సెలవుల్లో భక్తులు రత్నగిరికి పోటెత్తడం, వివాహాది శుభకార్యాలు గణనీయంగా జరగడం కూడా హుండీ ఆదాయం పెరుగుదలకు కారణమని అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, ఈఓలతో పాటు సిబ్బంది, పలు స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు. హుండీల్లో వచ్చిన నగదును స్థానిక యూనియన్ బ్యాంకుకు తరలించారు. -
తప్పులతడకల్లో స్మార్ట్
● ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు ● జిల్లాలో ఇప్పటికే 80 శాతం పైగా కార్డుల పంపిణీ ● చిరునామా, పేర్లు తప్పుగా ప్రచురణ ● ఎక్కడ మార్చుకోవాలో తెలియని దుస్థితి ● కార్డుదార్లకు తప్పని అవస్థలు సాక్షి, రాజమహేంద్రవరం: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. అన్న చందంగా ఉంది కూటమి సర్కారు తీరు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాల ముద్రను చెరిపేసేందుకు కూటమి సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్యశ్రీ వంటి వాటి పేర్లు మార్చేసింది. తాజాగా రేషన్ కార్డులను సైతం మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. స్మార్ట్ కార్డుల పేరిట గతంలో ఉన్న గత ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభించింది. ఈ ప్రక్రియ హడావుడిగా చేపట్టడంతో స్మార్ట్ కార్డులు తప్పుల తడకలుగా ఉన్నాయని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. వారి వివరాలు సక్రమంగా ముద్రించకుండా, మరోసారి పరిశీలించకుండానే స్మార్ట్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేసేసింది. కొత్త కార్డులను పరిశీలించిన లబ్ధిదారులు అవాక్కవుతున్నారు. తమ పేర్లు తప్పున్నాయని కొందరు, చిరునామా మారిందని మరికొందరు గగ్గోలు పెడుతున్నారు. స్మార్ట్ కార్డుల పేరిట హడావుడి చేసి, క్రెడిట్ కొట్టేద్దామనుకున్న ప్రభుత్వానికి చివరకు ప్రజల నుంచి ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. ఇదీ సంగతి జిల్లావ్యాప్తంగా 871 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో 5,64,994 రేషన్ కార్డులున్నాయి. వీటి ద్వారా 15,77,393 మందికి ప్రతి నెలా ప్రభుత్వం బియ్యం, చక్కెర, కందిపప్పు తదితర నిత్యావసర సరకులు అందిస్తోంది. కార్డుదార్లకు ఇప్పటి వరకూ రేషన్ కార్డులను ఎప్పటి నుంచో మాన్యువల్‌గా తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. ఇలా కాదని, తాము వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టామని, స్మార్ట్ కార్డులు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్నదే తడవుగా ఎలాంటి పరిశీలనా లేకుండానే ఇష్టమొచ్చినట్లు కార్డులు ముద్రించేసింది. ఆగమేఘాల మీద వాటి పంపిణీ సైతం ప్రారంభించింది. ఈ బాధ్యతను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి, రేషన్ డీలర్లకు అప్పజెప్పింది. అయితే, దీనిని డీలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి నెలా 20 రోజుల పాటు తాము రేషన్ సరకులు పంపిణీ చేయాల్సి ఉందని, అదనంగా కార్డుల పంపిణీ కూడా ఎలా చేపట్టాలగలమని లోలోపల మధనపడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే తమను ఎక్కడ ఇబ్బందులు పెడతారోనని మిన్నకుండిపోతున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 80 శాతం పైగా స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. అడ్రస్సులే మారిపోయాయ్ స్మార్ట్ కార్డుల ముద్రణలో ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ తీవ్ర నిర్లక్ష్యం చూపాయనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా అనేక కార్డుల్లో సమాచారం తప్పుల తడకగా ఉంది. కొన్ని కార్డుల్లో లబ్ధిదార్ల పేర్లలో అచ్చుతప్పులున్నాయి. మరికొన్నింటిలో ఏకంగా ఇంటి అడ్రస్సులే మార్చేశారు. గ్రామం పేరు, పూర్తి పేరు, జిల్లా పేర్లలో సైతం తప్పులు దొర్లాయి. ఈ తప్పులను ఎక్కడ, ఏవిధంగా సరిదిద్దుకోవాలో తెలియక లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆధార్ కేంద్రాలకు వెళ్లాలని అధికారులు చెబుతూండటంతో అక్కడ పడిగాపులు పడుతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పులకు తమ జేబులకు చిల్లు పడుతోందని ఆవేదన చెందుతున్నారు. చదువు రాని వారు, కార్డులపై అవగాహన లేని వారు సరిదిద్దుకోలేక మిన్నకుండిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా.. తప్పులతో ముద్రించడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రచార ఆర్భాటం కోసం ఇలా తమ జీవితాలతో ఆడుకుంటారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏవైనా సమస్యలు, ఆస్పత్రులు, ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించాలంటే రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు తప్పులతడకగా ఇచ్చిన స్మార్ట్ కార్డులను బ్యాంకులు, వివిధ శాఖలు ఆమోదించడం లేదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. కార్డుల ముద్రణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో రేషన్ కార్డుల వివరాలు మండలం కార్డుల సంఖ్య అనపర్తి 22,488 బిక్కవోలు 22,480 చాగల్లు 21,072 దేవరపల్లి 25,416 గోకవరం 22,644 గోపాలపురం 21,128 కడియం 29,138 కోరుకొండ 26,991 కొవ్వూరు 33,320 నల్లజర్ల 27,554 నిడదవోలు 34,483 పెరవలి 23,233 రాజమహేంద్రవరం రూరల్ 50,511 రాజమహేంద్రవరం అర్బన్ 83,403 రాజానగరం 36,324 రంగంపేట 19,778 సీతానగరం 24,085 తాళ్లపూడి 16,811 ఉండ్రాజవరం 24,135 -
సానుకూల దృక్పథంతో ప్రజా సమస్యల పరిష్కారం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కారంలో సానుకూల దృక్పథం కలిగి ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, డీఆర్ఓ సీతారామమూర్తితో కలసి ప్రజల నుంచి ఆమె 149 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 78, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 24, హోం 11, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించి 10 చొప్పున అర్జీలు అందాయి. మరో 9 శాఖలకు సంబంధించి 26 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, మండల, డివిజన్ స్థాయి సమస్యలు జిల్లా స్థాయి గ్రీవెన్స్‌కు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని ఆయా స్థాయిల్లోనే పరిష్కరించాలని, దీనికి తహసీల్దార్, ఎంపీడీఓలు వ్యక్తిగత బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇక నుంచి అర్జీలపై అంశాలు, మండలాల వారీగా విశ్లేషిస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చురుకుగా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన అర్జీలు అధికంగా వస్తున్నాయని, ఈ శాఖలు తమ పని తీరు మెరుగు పరచుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో రీసర్వే చేపడుతున్నప్పుడు సంబంధిత భూ యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, మ్యుటేషన్ దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యాన పంటలపై నత్తల సమస్యకు సంబంధించి మండలాల వారీగా రైతుల వద్ద సర్వే నిర్వహించి, నివేదిక సమర్పించాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారానికి తగిన సూచనలు చేయాలని కలెక్టర్ సూచించారు. -
బెత్తంతో గుణపాఠం
ముప్పేట దాడి విద్యారంగ సమస్యలతో పాటు, ఆర్థికపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎన్జీవో సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఉపాధ్యాయ సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి ఈ నెల ఏడో తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. బకాయిలను వెంటనే విడుదల చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా కలెక్టర్, డీఈవో కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలకు దిగాయి. ఏపీటీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన వారం చేపట్టగా, యూటీఎఫ్ రణభేరి కార్యక్రమం నిర్వహించింది. ఈ నెల ఏడున ఫ్యాప్టో ఆధ్వర్యంలో పోరుబాట పేరుతో విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఎన్జీవో నాయకులు సైతం వచ్చే రెండు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేనిపక్షంలో ఉద్యమ కార్యా చరణ చేపడతామని హెచ్చరించారు. తప్పు చేసే విద్యార్థులను గాడిలో పెట్టడానికి టీచర్లు బెత్తం ఝుళిపిస్తారు. హోంవర్క్ ఎగ్గొట్టిన పిల్లల మాదిరిగా.. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా.. తమ కంట్లోనే కారం కొట్టేందుకు యత్నించిన కూటమి సర్కార్‌కు గట్టి గుణ‘పాఠం’ నేర్పేందుకు ఉపాధ్యాయులు ‘పోరుబాట’ అనే బెత్తం సిద్ధం చేశారు. అదిగో.. ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తూ.. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్న పాలకుల వైఖరిపై ఉద్యమ శంఖం పూరించారు. రాయవరం: తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక పరమైన లబ్దిని కలగజేస్తామని, పీఆర్సీ వేస్తామని కూటమి కీలక నేతలు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. పీఆర్సీ వేయకపోగా, కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పైగా విద్యా సంస్కరణల పేరిట వారిపై పనిభారం మోపుతుండడంపైనా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూటీఎఫ్ రణభేరి పేరుతో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించి, ఉపాధ్యాయుల అసంతృప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. సమస్యల పరిష్కారం కోరుతూ తాజాగా పది ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఫ్యాఫ్టో చలో విజయవాడకు పిలుపునిచ్చింది. జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో మంగళవారం చలో విజయవాడ కార్యక్రమానికి తరలివెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రతి పండగకూ నిరాశే.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తోంది. ఈ కాలంలో అనేక పండగలు వచ్చాయి.. వెళ్లాయి కానీ, ఉద్యోగులకు మాత్రం ఎదురుచూపులే మిగిలాయి. ప్రతి పండగకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత సంక్రాంతి పండగకూ ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్‌ను నియమించి ఐఆర్ ప్రకటిస్తారని, పెండింగ్‌లో ఉన్న డీఏలను ఇస్తారని ఆశించారు. పాఠశాలల పునఃప్రారంభం రోజునా ఉపాధ్యాయులు ఆశగా ఎదురు చూశారు. అప్పుడూ నిరాశే ఎదురైంది. వినాయక చవితికి ఇస్తారని ఆశించినా ప్రభుత్వం కనికరించలేదు. దసరా పర్వదినానికి కచ్చితంగా ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆశించారు. అప్పుడూ పీఆర్సీ కానీ, డీఏలు కానీ ప్రకటించకుండా ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ పరిస్థితుల్లో పోరుబాటే శరణ్యమని భావించిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఫ్యాఫ్టో పోరుబాటకు సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉంది. ఒక్క డీఏ కూడా ఇప్పటి వరకు ప్రకటించక పోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. దాచుకున్న డబ్బులకూ దిక్కులేదు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జీతభత్యాల నుంచి పీఎఫ్ మినహాయించుకుంటారు. వివిధ అవసరాల కోసం పీఎఫ్ సొమ్ము నుంచి డబ్బు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి నిధుల నుంచి డబ్బు సకాలంలో మంజూరు కాకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం తదితర అవసరాలకు పీఎఫ్ నుంచి దాచుకున్న డబ్బు సకాలంలో మంజూరు కాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సరెండర్ లీవ్ బిల్లులూ మంజూరు కాకపోవడంతో ఆర్థిక అవసరాలు తీరక అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 48 వేల మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 48 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 18 వేల మంది వరకు ఉపాధ్యాయులున్నారు. వీరు కాకుండా మరో 30 వేల మంది పెన్షనర్లు ఉంటారు. ఉపాధ్యాయులు కాకుండా, వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులూ ఉన్నారు. ఇప్పటి వరకు వీరికి నాలుగు డీఏలను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. దసరాకు కనీసం రెండు డీఏలు విడుదలవుతాయని ఆశించినా వీరికి నిరాశే మిగిలింది. పీఆర్సీ మాటేమిటి? ఎన్నికల సమయంలో పీఆర్సీపై మంచి నిర్ణయం తీసుకుంటామని, ఐఆర్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా.. నేటికీ కనీసం పీఆర్సీ చైర్మన్‌గా ఎవరినీ నియమించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ చైర్మన్‌ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని ఆశగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటనా విడుదల కాలేదు. నమ్మక ద్రోహంపై ఉపాధ్యాయ సంఘాల పోరుబాట విద్యారంగ, ఆర్థిక సమస్యల పరిష్కారమే కీలకం నేడు చలో విజయవాడకు ఫ్యాఫ్టో నేతల పిలుపు జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లనున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు -
జో లాలీ.. నిద్ర వీడాలి
అంబేద్కర్ కోనసీమ జిల్లా: అలసిన ప్రయాణానికి ఆటో పడకగా మారింది.. చేరాల్సిన గమ్యం ప్రమాదపుటంచున సాగింది.. అసలే పరిమితికి మించిన ప్రయాణం.. ఆపై ప్రయాణికుల పవళింపు.. ఇది ఉప్పలగుప్తంలో కనిపించిన దృశ్యం. ఒక డ్రైవర్ ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం ఓ తప్పయితే, వెనుక భాగంలో డోర్‌ను తీసి ప్రయాణికులను కూర్చోపెట్టాడు. అంత కంటే నిర్లక్ష్యంగా ముగ్గురు మహిళలు అక్కడ కూర్చోగా, ఇద్దరు నిద్రిస్తూ వెళ్లారు. ఇంత నిర్లక్ష్యపు ప్రయాణాలతో ప్రమాదాలు జరుగుతున్నా, కాస్తయినా ఆలోచన ఉండడం లేదని ప్రజలు పెదవి విరిచారు. వాహనాలకు చిన్న కారణాలతో చలానాలు విధించే రవాణా శాఖకు ఇవి కనిపించడం లేదా అని విమర్శించారు. -
ఆది నాయకా.. వినాయకా
అయినవిల్లి: ప్రసిద్ధి చెందిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆదినాయకుడైన ఆ వినాయక స్వామివారిని చూసి భక్తుల మది మురిసింది. తెల్లవారుజామునే స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ చేశారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయం తలుపులు మూసివేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 52 మంది, ఉండ్రాళ్ల పూజలో ఇరువురు పాల్గొన్నారు. ఇద్దరు చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేశారు. లక్ష్మీగణపతి హోమంలో 13 జంటలు, వాహన పూజలను 49 మంది చేయించుకున్నారు. 1,820 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజు వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలుగా రూ.3,27,275 ఆదాయం సమకూరిందని అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
పెదపూడి: జి.మామిడాడలో ఒక ఇంట్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ పీవీ సీతాపతిరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అధికారులకు అందిన ముందస్తు సమాచారం మేరకు ఆదివారం జి.మామిడాడ గజం కాలువ సమీపంలో ఓ ఇంటిపై తహసీల్దార్‌తో పాటు వీఆర్వోలు దాడి చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన 14.57 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. పోలీసులు, ఎంఎస్ఓ కమల, వీఆర్వోలు వివరాలు సేకరించారు. ఆ బియ్యాన్ని వేళంగిలోని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. అక్రమంగా బియ్యం నిల్వ ఉంచిన వేండ్ర గ్రామానికి చెందిన నర్ల సత్తిబాబుపై 6ఏ కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో వీఆర్వోలు కె.శ్రీను, ఎల్.రాంబాబు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
సామాజిక చైతన్యం కోసం కవుల పోరాటం
అమలాపురం టౌన్: దళిత కవి తేజాలైన కుసుమ ధర్మన్న, గుర్రం జాషువా, బోయి భీమన్నలు తమ కలాలతో సామాజిక చైతన్యం కోసం పోరాడారని శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. తెలుగు అసోసియేషన్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురం భూపయ్య అగ్రహారంలోని కోనసీమ మహిళా మండలి భవనంలో దళిత తేజాల పేరిట ఆదివారం రాష్ట్ర స్థాయి సాహిత్య సదస్సు జరిగింది. దీనికి తెలుగు అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షురాలు కె.ఉషాజ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురి మహా కవులు రచించిన కావ్యాలు, కథలు, కవితలపై చర్చించారు. సామాజిక కవి కుసుమ ధర్మన్న సమానత్వం కోసం పోరాడితే, కవి గుర్రం జాషువా సామాజిక రుగ్మతలపై తన కలంతో ఎక్కుపెట్టారని డాక్టర్ ప్రతాప్ గుర్తు చేశారు. ఇక కవి బోయి భీమన్న సామాజిక చైతన్యం కోసం పోరాడారన్నారు. సదస్సు కన్వీనర్లుగా శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, కోనసీమ రచయితల సంఘ అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ వ్యవహరించారు. తొలుత కవులు ధర్మన్న, జాషువా, భీమన్న చిత్రపటాలకు కవులు, సాహితీవేత్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సదస్సుకు హాజరైన దాదాపు 60 మంది కవులు, రచయితలు, సాహితీవేత్తలు తమ సాహిత్య పత్రాలను సమర్పించారు. వారి సాహిత్యాలపై సదస్సు విశ్లేషణ చేసింది. హాజరైన కవులు, రచయితలు, సాహితీవేత్తలను సదస్సు నిర్వాహకులు సత్కరించారు. కవులు అరిగెల బలరామమూర్తి, రవిచంద్ర, సబ్బెళ్ల వెంకట మహాలక్ష్మి, ఎం.నాగభూషణం, కోరుకొండ జాన్, పొలమూరి వెంకట్, జె.రాంబాబు, ముక్కామల చక్రధర్, వైఆర్కే నాగేశ్వరరావు, బొలిశెట్టి అనసూయ, కడలి సత్యనారాయణ, బి.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.సాహితీ సదస్సులో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ -
ఎన్నికల సంఘం పనితీరుపై సందేహాలు
జగ్గంపేట: భారత ఎన్నికల సంఘం పనితీరుపై అనుమానాలు, సందేహాలు నెలకొనడం విచారకరమని జేవీవీ వ్యవస్థాపకుడు వెన్నపూస బ్రహ్మారెడ్డి అన్నారు. రాష్ట్ర వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఒమ్మి రఘురామ్ అధ్యక్షతన జగ్గంపేట వివేకానంద విద్యా సంస్థలలో జిల్లా స్థాయి ప్రజా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ఆయువు లాంటివని, కానీ ఎన్నికల కమిషన్ తీరు పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. ఎన్నికల ప్రక్రియపై, ఓటరు లిస్టులపై, ఎన్నికలలో పోలింగ్ శాతం, వాటి కౌంటింగ్ శాతాల్లో హెచ్చుతగ్గులు, ఈవీఎంల సంఖ్య, వస్తున్న ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించి సందేహాలను నివృత్తి చేయకపోవడం దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో 2024లో చట్టం ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో సీనియర్ మంత్రిని చేర్చడంతో, వస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఉందని తెలిపారు. సభాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేత ఒమ్మి రఘురామ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోతోందని, దీనిపై ప్రతి పౌరుడూ స్పందించాలన్నారు. ఎన్నికల సంఘం తీరుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజా సదస్సులు నిర్వహించి వార్తా కథనాలు – వాస్తవాలు అనే అంశంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. సదస్సులో ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతారపు ప్రసాద్, కోర్ కమిటీ సభ్యులు లోక్‌నాఽథ్, సంస్థ ప్రధాన కార్యదర్శి సుందరపల్లి గోపాలకృష్ణ, ప్రసంగి ఆదినారాయణ, జిల్లా మాజీ అధ్యక్షుడు పప్పు దుర్గాప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు విద్యార్థుల ఎంపిక
అంబాజీపేట: రాష్ట్ర స్థాయి తైక్వాండో అండర్–14, 17 విభాగాల్లో పోటీలకు పలువురు విద్యార్థులు ఎంపికై నట్లు సీనియర్ కోచ్ పితాని త్రిమూర్తులు తెలిపారు. ఈ నెల 4న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీలు కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరిగాయని అన్నారు. ఇందులో విజేతలు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీలకు హాజరవుతారని త్రిమూర్తులు వివరించారు. కాగా అంబాజీపేటకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికైన వారిలో ఉన్నారన్నారు. ఇందులో అండర్–14 బాలికల విభాగంలో కె.సుందరి హరిప్రియ, వై.ఇషా శ్రీనిజ, ఎం.మౌనిక, అండర్–14 బాలుర విభాగంలో బి.హేమ హృతిక్, అండర్–17 బాలికల విభాగంలో పి.చరణ్యశ్రీలు ఉన్నారన్నారు. ఎంపికై న విద్యార్థులను హెచ్ఎం కడలి సాయిరాం, పీడీ ఉమా మహేశ్వర్, కుంపట్ల ఆదిలక్ష్మి, సూర్యకుమారి, క్రీడాకారులు అభినందించారు. -
బీసీవై పార్టీ అధినేత నిర్బంధం
● రామచంద్ర యాదవ్‌ను హోటల్లో నిర్బంధించిన పోలీసులు ● పోలీసులకు, ఆయన సెక్యూరిటీకి మధ్య ఘర్షణ ● రాజమహేంద్రవరంలో తీవ్ర ఉద్రిక్తత ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు, రైతులకు అండగా నిరసనకు పిలుపునిచ్చిన భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్‌ను పోలీసులు ఆదివారం రాజమహేంద్రవరం షెల్టాన్ హోటల్లో నిర్బంధించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పాయకరావుపేట నియోజకవర్గంలోని రాజయ్యపేటలో మత్స్యకారులు, రైతులకు మద్దతుగా నిరసన తెలిపేందుకు బీసీవై పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు గాను రామచంద్ర యాదవ్ రాజమహేంద్రవరం చేరుకుని షెల్టాన్ హోటల్లో బస చేశారు. ఆయనకు నక్కపల్లి పోలీసులు ఇచ్చిన నోటీసులను అందించేందుకు రాజమహేంద్రవరం సౌత్, సెంట్రల్ జోన్ డీఎస్పీలు భవ్య కిషోర్, శ్రీకాంత్‌ల ఆధ్వర్యాన ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసులు అధిక సంఖ్యలో ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వై కేటగిరీ భద్రత ఉన్న రామచంద్ర యాదవ్ సెక్యూరిటీ సిబ్బందికి, రాజమహేంద్రవరం పోలీసులకు మధ్య హోటల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. రామచంద్ర యాదవ్ గదిలో నుంచి బయటకు వస్తూండగా సెక్యూరిటీని పోలీసులు తోసివేశారు. అనంతరం ఆయనకు పోలీసులు నోటీసు అందించి, గదిలోకి పంపించి, బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్ తిరిగి పుంగనూరు వెళ్లేందుకు ప్రయత్నించగా బయటకు రాకుండా నిలుపుదల చేశారు. మధ్యాహ్నం ఆయన పుంగనూరుకు బయల్దేరుతూ విలేకర్లతో మాట్లాడారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ బాధితులైన మత్స్యకారులు, రైతులకు మద్దతుగా బీసీవై పార్టీ నిరసన తెలపడానికి వెళ్తూంటే పోలీసులు శాంతిభద్రతల సమస్య పేరు చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. వారు నోటీసు ఇవ్వడంతో తిరిగి పుంగనూరు వెళ్లడానికి ప్రయత్నిస్తే రూమ్‌లో నుంచి బయటకు రాకుండా నిర్బంధించే ప్రయత్నం చేశారని చెప్పారు. దీనిపై న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. హైకోర్టు అనుమతితో వారం పది రోజుల్లో నక్కపల్లి మండలంలో పర్యటించి, మత్స్యకాలకు, రైతులకు మద్దతుగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం వ్యవసాయ భూములు, మత్స్యకారులుండే తీర ప్రాంత భూములను బలవంతంగా లాక్కొని, వారి జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకు రావాలనే చిత్తశుద్ధి ఉంటే లక్షలాది ఎకరాల బీడు భూములు, సెజ్‌ల కోసం సేకరించిన భూములు ఉన్నాయని చెప్పారు. తీర ప్రాంతాలు, పంట భూములపై కన్నేసి పారిశ్రామికాభివృద్ధి పేరిట రూ.వేల కోట్ల చీకటి ఒప్పందాలకు, కుట్రలకు తెర తీస్తోందని ఆరోపించారు. -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి
అల్లవరం: ప్రతి పండగకు ఉద్యోగులకు డీఏ లేదా పీఆర్సీ, ఐఆర్ ఏదొకటి ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు, తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆదివారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వమని, నూతన పీఆర్సీని ప్రకటిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, డీఏ బకాయిలు చెల్లిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు, 16 నెలల్లో ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. 16 నెలల కాలంలో ఒక్క డీఏ ప్రకటించారా అని ప్రశ్నించారు. ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు. పండగ వచ్చిన ప్రతిసారీ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఉద్యోగులకు తీవ్ర నిరాశ తప్పడం లేదన్నారు. ఉద్యోగులకు ఇస్తామన్న రూ. 30 వేల కోట్లు ఎప్పుడు ఇస్తున్నారో ప్రకటించాలని, ఈ దీపావళికి పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు ప్రకటించాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
బాణసంచా పేలి అర్చకులకు గాయాలు
పి.గన్నవరం: మండలంలోని మానేపల్లి గ్రామంలో శనివారం రాత్రి దసరా మహోత్సవాల ముగింపు ఊరేగింపులో బాణసంచా పేలి ఇద్దరు అర్చకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక ఊరేగింపునకు చెందిన తారాజువ్వ, మరో ఊరేగింపు ట్రాక్టర్‌పై పడటంతో అందులో ఉన్న తారాజువ్వలు కాలి ఈ ప్రమాదం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మానేపల్లి శివారు శివాయలంకకు చెందిన ఊరేగింపు ఆ గ్రామ సెంటర్‌కు చేరుకుంది. అదే సమయంలో మానేపల్లి మెయిన్ గ్రామంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించేందుకు సిద్ధం చేశారు. ఈలోగా శివాయలంకకు చెందిన ఒక వ్యక్తి తారాజువ్వ వేశాడు. అది మానేపల్లి మెయిన్ ఊరేగింపు ట్రాక్టర్‌పై పడింది. దీంతో ఆ ట్రాక్టర్లో ఉన్న తారా జువ్వలకు నిప్పు అంటుకుంది. అక్కడున్న అర్చకులు విజయ ప్రసాద్, రత్నగోపాల్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. -
చీరమేను... అధరేను
● మార్కెట్లోకి విరివిగా చేపలు ● బకెట్ ధర రూ.28 వేలు ● అయినా దొరకని వైనంయానాం: చీరమేను.. ఈ పేరు చెబితేనే నోరూరుతోంది.. గోదారోళ్లకు పులస తర్వాత అత్యంత ప్రియమైన చేప ఇది. చిన్న సైజులో ఉండే చీరమేనును అంతా లొట్టలేసుకుని ఆరగిస్తారంటే, దాని రుచే వేరని చెప్పకనే అర్థమవుతోంది. సీజనల్ చేప కావడంతో ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో శీతాకాలం ప్రారంభంలో దొరుకుతోంది. ఇది గోదావరి నదీ ముఖద్వారం వద్ద అంటే (తీపినీరు), సముద్రం (ఉప్పునీరు) కలిసే ప్రాంతాల్లో లభిస్తుంది. చీరమేనును సోల, సేరు, తవ్వ, గ్లాసు, బకెట్ కొలతల్లో విక్రయిస్తుంటారు. యానాం మార్కెట్లో ఇది అధికంగా లభిస్తుండటంతో మాంసాహార ప్రియులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ వేలం ద్వారా ఈ చేపలను విక్రయిస్తుండడం విశేషం. ఆదివారం ప్లాస్టిక్ బకెట్లో ఉన్న సుమారు 10 సేర్ల చీరమేను ధర రూ.28 వేలు పలికింది. ఇలా చీరమేనుకు అధిక ధర లభిస్తుండడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నదీ ముఖద్వారంలో లభ్యం సుమారు అంగుళం సైజులో ఉండే చీరమేను చేపలను వలలతో పట్టడం సాధ్యం కాదు. దీనిని చీరల సహాయంతో గోదావరి ముఖ ద్వారాల్లో మత్స్యకారులు పడుతుంటారు. చీరలతో పట్టడం వల్లే దీనికి చీరమేను అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. సముద్రం, నదీ కలిసే ప్రాంతాల వద్ద చల్లగా వీచే తూర్పు గాలులకు నీటి అడుగుభాగంలో ఉన్న చీరమేను కాస్తా పైకి వస్తుంది. ముఖ్యంగా దసరా నుంచి దీపావళి వరకూ అధికంగా లభిస్తుంది. ఇది ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న లిజర్డ్‌ఫిష్ జాతికి చెందినదిగా చెబుతుంటారు. అబ్బబ్బా... ఆ రుచే వేరు చీరమేనును మామూలు చేపల కూరలా కాకుండా ప్రత్యేక విధానంలో వండుతుంటారు. దీనిని చాలామంది చింతకాయ, చింతకూర వేసుకుని ఇగురు పెడతారు. అంతేకాకుండా గారెలుగా వేసుకుని ఆరగిస్తారు. వివిధ రకాలుగా చీరమేనును ప్రైగా సైతం చేసుకుంటారు. ఈ రుచికి అలవాటు పడిన వారు ఎంతైనా కొనుగోలు చేస్తారని వినియోగదారులు అంటున్నారు. ఎక్కడ లభిస్తుందంటే.. గౌతమీ గోదావరి నది నీరు యానాం వద్ద బంగాళాఖాతంలో భైరవపాలెం సమీపంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో చీరమేను ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడ పడిన చీరమేనును యానాం మార్కెట్లో విక్రయిస్తుంటారు. దూర ప్రాంతాల్లోని తమ బంధువులకు ఈ చేపలను స్థానికులు తీసుకెళ్తుంటారు. జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు విశాఖ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు కూరగానో, ఐస్‌లో పెట్టో పంపుతుంటారు. అందుకే వీటికి డిమాండ్ పెరుగుతోంది. -
ఈ సీజన్లో పండగే
చీరమేను చేపల సీజన్ వచ్చిందంటే మాకు పండగే. ప్రస్తుతం వ్యాపారం బాగా సాగుతుంది. ఈ ఏడాది పులసలు చాలా తక్కువగా పడ్డాయి. దీంతో నిరాశలో పడ్డాం. ప్రస్తుతం చీరమేను పడుతుండటంతో చాలా ఆనందంగా ఉంది. వేటకు చీరలతో వెళ్తున్నాం. – పాలెపు పోసియ్య, మత్స్యకారుడు, యానాం బంధువులకూ పంపుతున్నాం ఈ ఏడాది చీరమేను పడుతుండటంతో ఎక్కువ ధర ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నాం. మేము తినడంతో పాటు మా బంధువులకు సైతం దాని రుచిని చూపించాలనే ఉద్దేశంతో పంపుతున్నాం. ఉభయగోదావరి జిల్లాలతో పాటు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చెందిన వారికి చీరమేను రుచి తెలిసిందే. – పుణ్యమంతుల సత్తిబాబు, జి.వేమవరం ● -
రైతులకు ఊరటనిచ్చిన పొగాకు మార్కెట్
పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో వేలం కేంద్రాల వారీగా పొగాకు విక్రయాలు (మిలియన్ కిలోల్లో) దేవరపల్లి 12.10 జంగారెడ్డిగూడెం–1 14.83 జంగారెడ్డిగూడెం–2 14.82 కొయ్యలగూడెం 14.80 గోపాలపురం 13.02 దేవరపల్లి: మార్కెట్లో ఊహించని విధంగా ధర పలకడం పొగాకు రైతులకు ఊరటనిచ్చింది. గత ఏడాది ధరకు మించి పలుకుతూండటంతో ఈ ఏడాది పొగాకు రైతుల ఇంట కాసుల పంట పండిందనే చెప్పవచ్చు. కొనుగోళ్ల ప్రారంభంలో దాదాపు రెండు నెలల పాటు పొగాకు మార్కెట్ ఒడుదొడుకుల్లో కొనసాగింది. చాలా మంది రైతులు కిలో రూ.290 చొప్పున అమ్ముకున్నారు. వారిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు, కౌలు రైతులే ఉన్నారు. ఆ తరువాత అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడటం, కర్ణాటకలో పంట దెబ్బ తిని ఉత్పత్తి తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడం మన వర్జీనియా పొగాకు రైతులకు కలిసొచ్చింది. మన గ్రేడు పొగాకుకు డిమాండ్ ఏర్పడి, నానాటికీ మార్కెట్లో ధర పుంజుకుంది. పొగాకు చరిత్రలోనే కిలోకు రూ.430 గరిష్ట ధర పలకడం సరికొత్త రికార్డుగా నిలిచింది. గత ఏడాది కిలో ధర రూ.410 పలకగా, ఈ ఏడాది రైతుకు మరో రూ.20 అదనంగా దక్కింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించి, దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. రైతులు ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల మేర దిగుబడులు సాధించారు. ప్రస్తుతం కిలోకు గరిష్టంగా రూ.425, కనిష్టంగా రూ.150, సగటున రూ.310 చొప్పున రైతుకు లభిస్తోంది. 69.59 మిలియన్ కిలోల కొనుగోళ్లు పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.2,157 కోట్ల విలువైన 69.59 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. దీనిలో 66.28 మిలియన్ కిలోలు ఉత్తర తేలిక నేలలు (ఎన్ఎల్ఎస్), 3.30 మిలియన్ కిలోలు బ్లాక్ సాయిల్ (బీఎస్) పొగాకు ఉన్నాయి. మార్చి 24న పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఇప్పటి వరకూ 156 రోజుల పాటు వేలం జరిగింది. మొత్తం 5.50 లక్షల బేళ్లు కొనుగోలు చేసినట్లు రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ తెలిపారు. నిర్దేశిత కోటా మేరకు పొగాకు కొనుగోళ్లు పూర్తి కాగా, నిబంధనల మేరకు అదనపు పొగాకును కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. నవంబరు మొదటి వారంలో కొనుగోళ్లు ముగియవచ్చని తెలిపారు. ఈ ఏడాది రైతులకు మంచి ధర లభించిందన్నారు. 2025–25 పంట కాలానికి పొగాకు నాట్లు వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ నెల 15 నుంచి నాట్లు ముమ్మరంగా జరుగుతాయన్నారు. -
కళాపోషణ లేక..
ఉపాధి దూరమైంది నేను డ్రామాలకు హార్మోనియం ఆర్టిస్టుగా జీవనం సాగిస్తున్నాను. ఒకప్పుడు జిల్లా వ్యాప్తంగా అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. నవరాత్రుల్లో ఖాళీ లేకుండా ప్రదర్శనలు ఉండేవి. కాలక్రమేణా ప్రేక్షకాదరణ తగ్గటంతో పాటు నాటకాల వ్యయం పెరిగిపోవడంతో అనేక ఉత్సవ కమిటీలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దానితో ఎందరో కళాకారులకు ఉపాధి కరువైంది.– కలిగట్ల వెంకటరమణ, హార్మోనియం కళాకారుడు, రాజమహేంద్రవరం ఫ వైభవం కోల్పోతున్న రంగస్థలం ఫ ఉమ్మడి జిల్లాలో కొన్నిచోట్లే ప్రదర్శనలు ఫ చిన్న నాటకాలు, ఆ కళాకారులకు ఆదరణ కరవు కొత్తపేట: కళా‘పోషణ’ కనుమరుగవుతోంది.. నాటక రంగం పూర్వ వైభవాన్ని కోల్పోతోంది.. కళాకారులకు పూట గడవడమే కష్టమవుతోంది.. ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన రంగస్థల పౌరాణిక నాటక రంగంపై క్రమంగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. గతంలో ఊరూరా నాటక ప్రదర్శనలతో సందడి నెలకొనేది. అనేక ఉత్సవాల్లో రంగస్థల వేదికలపై పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాలతో కళావైభవం కనువిందు చేసేది. ప్రస్తుతం ఇది కొన్ని ఉత్సవ పందిర్లకే పరిమితమైంది. పెద్ద నాటకాల్లో కళాకారులకే ప్రాధాన్యం లభిస్తోంది. చిన్న నాటకాలు, ఆ కళాకారులకు ఉపాధి దూరమైంది. ప్రస్తుతం వారి పరిస్థితి రంగులు వెలిసిన జీవితంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు నాటక రంగంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాకు చెందిన రంగస్థల నటుల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన వారెందరో ఉన్నారు. లవకుశ సినిమా రాక ముందే చింతా సుబ్బారావు నేతృత్వంలో లవకుశ డ్రామా ట్రూపు ఉండేదట. అప్పట్లో ఆ నాటకం ప్రేక్షకాదరణ పొందిందని చెబుతూంటారు. తరువాత రాజానగరం మండలం సంపత్ నగరం గ్రామానికి చెందిన పేపకాయల లక్ష్మణరావు (సంపత్ నగరం లక్ష్మణరావు) ఆంజనేయుని పాత్ర పోషించి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చి అభినవ ఆంజనేయునిగా పేరొందారు. రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నారు. కొత్తపేటకు చెందిన జగత పెద్దకాపు 1960–75 మధ్య కాలంలో దుర్యోధనుడు, విశ్వామిత్రుడు తదితర పాత్రలకు జీవం పోశారు. కోరుకొండకు చెందిన ఎన్వీఎల్ ఆచారి దుర్యోధనుడిగా రాణించారు. కృష్ణుడిగా సత్యంశెట్టి (ద్వారపూడి) సూర్యారావు, ఆయన తనయుడు శేషగిరిరావు, యెరుబండి మందేశ్వరరావు, కోట నాగేశ్వరరావు, సుబ్బిశెట్టిగా పడాల సుందరం (జూనియర్ రేలంగి), మాయల ఫకీర్‌గా బెజవాడ రామారావు, బత్తిన నాగేశ్వరరావు, ధర్మరాజుగా నరేంద్రపురపు గంగరాజు, కొమ్మిశెట్టి పెద వీర్రాజు, అర్జునుడిగా తంబాబత్తుల నాగేశ్వరరావు తదితర నటులు రంగస్థలంపై తమ నటనా కౌశలాన్ని చాటారు. అలాగే ప్రస్తుతం శ్రీరాముడిగా సంపత్ నగరం లక్ష్మణరావు కుమారుడు పి.రామాంజనేయులు, ఆయన తనయుడు జూనియర్ లక్ష్మణరావు ఆంజనేయుడిగా, చింతామణిలో శ్రీహరిగా పుణ్యక్షేత్రం సత్యప్రసాద్ తదితరులు రాణిస్తున్నారు. ఎందరున్నా కొందరికే.. ప్రస్తుత తరం నటీనటుల్లో కేవలం కొందరికే నాటక అవకాశాలు లభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం, అమలాపురం, కొత్తపేట, కడియం, వాడపాలెం, వానపల్లి, అవిడి, రామచంద్రపురం, తుని, ద్రాక్షారామ, తుని, జగ్గంపేట, కాకినాడ, యానాం, తాళ్లరేవు, చల్లపల్లి, సీతానగరం, అనపర్తి, రాజోలు, రాజానగరం, బిక్కవోలు, పెద్దాపురం, సామర్లకోట, మండపేట, ముమ్మిడివరం తదితర అనేక ప్రాంతాల్లో గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులతో పాటు శ్రీరామ నవమి, శ్రీకృష్ణాష్టమి, సుబ్రహ్మణ్య షష్ఠి, ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలను పురస్కరించుకుని వరుసగా 9, 10 రోజులు నాటక ప్రదర్శనలు నిర్వహించేవారు. దానితో రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన పెద్ద కళాకారులకే కాక చిన్న కళాకారులకు కూడా అవకాశాలు లభించేవి. కాలక్రమేణా పందిర్ల లైటింగ్, తదితర ఏర్పాట్లు, ఉత్సవాల ఖర్చు పెరగడంతో పాటు ఆర్టిస్టుల పారితోషికం అధికమవడంతో అనేక పందిర్లలో నాటక ప్రదర్శనలకు స్వస్తి చెప్పారు. రాజమహేంద్రవరం దేవీచౌక్, చాగల్లు, అమలాపురం, కడియం వంటి పలు పందిర్లలో ఐదారు నాటకాలు ప్రదర్శిస్తూండగా, మరో ఐదారు పందిర్లలో కళా ప్రోత్సాహకుల ఆర్థిక సహకారంతో కేవలం ఒకటి, రెండు ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అవీ రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ నటులను తీసుకువచ్చి నాటకాలు వేయిస్తున్నారు. ఆ నాటకాల్లో ఒక్కో నటుడు రూ.20 నుంచి రూ.50 వేల వరకూ పారితోషికం తీసుకుంటున్నారు. అలా ఒక్కో నాటకానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ అవుతుంది. హార్మోనిస్టుల పాత్ర కీలకం రంగస్థల నాటకానికి హార్మోనియం ప్రధానం. నాటక కళాకారుడు ఎంత బాగా పాడినా, పద్య రాగాలాపన చేసినా దానికి హార్మోనియం, డోలక్, క్లారినెట్ సహకారం అవసరం. వేదికపై నటుడి కృషి ఎంతో ఉంటుందో, స్టేజీ ముందు హార్మోనియం, డోలక్, క్లారినెట్ కళాకారుల కృషి కూడా అంతే ఉంటుంది. ఇటువంటి కళాకారులు జిల్లాలో ఎంతో మంది ప్రతిభ చూపి తెరమరుగయ్యారు. ప్రస్తుతం రాజమహేంద్రవరానికి చెందిన కలిగట్ల వెంకటరమణ, సత్తిబాబు, సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన మైలవరపు శ్రీనివాస్ నాయుడు, కోరుకొండకు చెందిన సుబ్రహ్మణ్యం, నరేంద్రపురానికి చెందిన టేకి వీరబాబు తదితరులు హార్మోనిస్టులుగా రాణిస్తున్నారు.మనుగడ లేని డ్రెస్ కంపెనీలుఒకప్పుడు డ్రామా డ్రెస్ కంపెనీలు ఎక్కువగా ఉండేవి. నటులకు వివిధ నాటకాల్లో ధరించే పాత్రలకు సంబంధించిన డ్రెస్‌లు, విగ్గులు, కిరీటాలు, గద, విల్లంబులు, కత్తులు వంటి ఆయుధాల నమూనాలు వంటి సామగ్రి అద్దెకు ఇచ్చేవారు. ప్రదర్శన పూర్తయిన తరువాత ఆ సామగ్రిలో నలిగిన వాటిని బాగు చేసి మరో ప్రదర్శనకు సిద్ధం చేసేవారు. ఇలాంటి డ్రామా డ్రెస్ కంపెనీలు పట్టణాల్లో ఉండేవి. ఒక్క రాజమహేంద్రవరంలోనే 10 వరకూ నిర్వహించేవారు. ప్రస్తుతం నాటకాలకు ఆదరణ తగ్గిపోవడంతో డ్రామా డ్రెస్ కంపెనీలు కనుమరుగయ్యాయి. అవకాశాలు లేకుంటే పస్తులే 30 ఏళ్ల నుంచి రంగస్థల నాటక రంగంలో నటులకు అలంకరణ, డ్రెస్‌లు, సామగ్రి సప్లై చేస్తూ జీవనం సాగిస్తున్నాం. వేషాల సామగ్రి స్థానికంగా తయారు చేయడంతో పాటు చైన్నె వంటి నగరాల నుంచి కొన్ని తీసుకు వస్తాం. నాతో పాటు మరో ఐదుగురు పని చేస్తారు. గతంలో మాదిరిగా ఇప్పుడు అవకాశాలు లేవు. వేరే వృత్తిలోకి వెళ్లలేక అవకాశాలు ఉన్నప్పుడు తింటున్నాం. లేకుంటే పస్తులుంటున్నాం. – తూము రమేష్, మేకప్ ఆర్టిస్ట్, డ్రామా డ్రెస్ కంపెనీ, రాజమహేంద్రవరం ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే మనుగడ నేను కురుక్షేత్రం నాటకంలో పలు పాత్రలు పోషిస్తాను. ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రమే. ఉత్సవ కమిటీలతో పాటు ప్రభుత్వం పౌరాణిక రంగస్థల నాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తేనే మాలాంటి చిన్న నటులు మనుగడ సాగించేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలున్నాయి. అక్కడ ఏటా వివిధ ఉత్సవాల్లో నాటక ప్రదర్శనలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – అన్నందేవుల నారాయణరావు, రంగస్థల కళాకారుడు, కేశవరం, మండపేట మండలం -
కోకో.. ఇచ్చింది తీస్కో
దేవరపల్లి: మార్కెట్లో కోకో గింజల ధర రోజురోజుకూ పతనమవుతోంది. దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ధర లేకపోవడంతో నష్టపోతున్నామని రైతులు దిగులు చెందుతున్నారు. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచే కోకో మార్కెట్ ఒడుదొడుకుల్లో ఉంది. కొనుగోలు సంస్థలు సిండికేట్‌గా ఏర్పడి మార్కెట్లో ధర పెరగకుండా తమ కష్టాన్ని దోచుకుంటూ.. ఇచ్చింది తీసుకోవాలన్నట్టు వ్యవహరిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. రివ్వున ఎగసి.. రయ్యిన జారి.. గతంలో కిలో గింజలకు రూ.250 మాత్రమే ధర లభించేది. అటువంటిది ఒక దశలో ఒకేసారి రూ.1,050 పలకడంతో రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. 2023 పంట కాలంలో ఎకరాకు ఆరేడు క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వింటాల్ ధర ఏకంగా రూ.1.10 లక్షలు పలికింది. ఎకరాకు సుమారు ఆరేడు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. దీంతో, రైతులు మంచి లాభాలు అందుకుని, ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఈ ధర ఆ ఏడాది ఏప్రిల్ వరకూ ఉంది. అనంతరం కిలో రూ.500 నుంచి రూ.700కు తగ్గింది. కోకో గింజలకు మంచి ధర లభిస్తూండటంతో పలువురు కౌలుదారులు దూకుడు పెంచారు. ఎకరం తోటను ఏకంగా రూ.1.50 లక్షలకు కౌలుకు తీసుకున్నారు. 2024–25 పంట కాలంలో దిగుబడి తగ్గడంతో పాటు ధర పడిపోయింది. ఒక దశలో గింజలు కొనే నాథుడు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీజన్ ప్రారంభంలో కిలో గింజలకు రూ.700 నుంచి రూ.750 ధర పలికింది. తాము ఇచ్చిందే తీసుకోవాలనే రీతిలో కంపెనీలు వ్యవహరించడంతో ధర రానురానూ రూ.400కు పతనమైంది. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర ఇవ్వాలని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతులు ఆందోళనలు నిర్వహించారు. వారి ఆగ్రహం తమకు చేటు తెస్తుందని భావించిన ప్రభుత్వం రైతుల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపింది. కంపెనీలు ప్రతి కిలో గింజలకు ఇస్తున్న రూ.450కి అదనంగా రూ.50 చెల్లిస్తామని కంటితుడుపుగా ప్రకటించి, చేతులు దులుపుకొంది. అయితే, ప్రస్తుతం కోకో గింజల ధర మరింత పతనమై, కిలోకు రూ.300 నుంచి రూ.350 మాత్రమే పలుకుతోంది. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కో రైతు 10 నుంచి 20 ఎకరాలు కౌలుకు తీసుకుని ఈ పంట సాగు చేస్తున్నారు. ఇప్పుడు లభిస్తున్న ధర ఎంత మాత్రమూ గిట్టుబాటు కాదని, కనీసం రూ.800 ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కోలుకోవడం కష్టం కోకో రైతులు కోలుకోవడం కష్టంగా ఉంది. కౌలుదారుల పరిస్థితి మరీ దారుణం. ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ కౌలు రైతులు నష్టపోయారు. రైతులు కంపెనీలకు తీసుకెళ్లి వారు చెప్పిన రేటుకు అమ్ముకోవాల్సి వస్తోంది. తప్పలు, తాలు ఉన్నాయని కంపెనీలు ధర తగ్గించేస్తున్నాయి. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కిలో గింజల ధర రూ.1,050 ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.750కి, మార్చి, ఏప్రిల్ నెల ల్లో రూ.450కి.. ఇప్పుడు రూ.350కి పడిపోయింది. – గడా రాంబాబు, రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం ధర పడిపోయింది నేను ఏడెకరాల్లో కోకో సాగు చేస్తూండగా ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించి మార్కెట్ బాగుంటే కోకో పంట లాభసాటిగా ఉంటుంది. గత ఏడాది ఎకరాకు ఆరేడు క్వింటాళ్ల దిగుబడి రాగా, కిలోకు రూ.1,050 ధర పలికింది. ఈ ఏడాది సీజన్లో దిగుబడి సగానికి తగ్గింది. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ధర రూ.450 నుంచి రూ.500 వరకూ పలికింది. ధర పడిపోవడంతో కౌలు రైతులు దెబ్బ తిన్నారు. – కొయ్యలమూడి వేణు, రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం 13,538 ఎకరాల్లో సాగుఫ పతనమైన గింజల ధర ఫ రైతుకు దక్కుతున్నది కిలోకు రూ.300 మాత్రమే.. ఫ కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ ఫ ముప్పుతిప్పలు పెడుతున్న కంపెనీలు జిల్లావ్యాప్తంగా 18 మండలాల్లో 13,538 ఎకరాల విస్తీర్ణంలో రైతులు కోకో సాగు చేస్తున్నారు. దీనిని అదనపు ఆదాయం కోసం కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. ధర బాగా లభిస్తే ప్రధాన పంటల కంటే కోకో ద్వారానే వారికి అధిక ఆదాయం లభిస్తూంటుంది. చాగల్లు, దేవరపల్లి, నిడదవోలు, నల్లజర్ల మండలాల్లో దాదాపు 12 వేల ఎకరాల్లో రైతులు కోకో సాగు చేస్తున్నారు. ఒక్క దేవరపల్లి మండలంలోని కురుకూరు, పల్లంట్ల గ్రామాల్లోనే సుమారు 900 ఎకరాల్లో కోకో సాగు జరుగుతోంది. కురుకూరులో 700 ఎకరాల్లో దీని సాగు జరుగుతూండగా.. ఇందులో సుమారు 500 ఎకరాల్లో ప్రకృతి సాగు పద్ధతుల్లో రసాయనిక, పురుగు మందుల అవశేషాలు లేని గింజలను రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. డిసెంబరులో తోటలు పూతలు వచ్చి, ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకూ గింజల దిగుబడి వస్తుంది. కోకో గింజలను ప్రధానంగా చాక్లెట్, ఐస్‌క్రీమ్‌ల తయారీలో వినియోగిస్తారు. ఈ గింజలను క్యాడ్బరీ, మోర్జీ సంస్థలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. గతంలో ఆయా కంపెనీల ప్రతినిధులు నేరుగా రైతుల ఇళ్లకు వచ్చి గింజలు కొనుగోలు చేసి తీసుకు వెళ్లేవారు. అటువంటిది ఈ ఏడాది రైతులే కంపెనీలకు చెందిన సేకరణ కేంద్రాల వద్దకు తీసుకు వెళ్లి అమ్ముకోవలసి వస్తోంది. -
బస్సు, రైలు కిటకిట
రాజమహేంద్రవరం సిటీ: దసరా పండగకు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోని స్వస్థలాలకు వచ్చిన వారు సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో, రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఆదివారం ఒక్కసారిగా కిక్కిరిసిపోయాయి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు తదితర నగరాలకు తిరిగి వెళ్లే వారు బస్సులు, రైళ్ల కోసం బస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బస్సులలో సీట్ల కోసం ప్రయాణికులు పోటీ పడటంతో కొన్ని సందర్భాల్లో తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుంచి రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా సుమారు 175 బస్సులు నడుపుతున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకు రెగ్యులర్ బస్సులతో పాటు ప్రయాణికుల రద్దీని అనుసరించి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పారు. కొవ్వూరు, నిడదవోలు, గోకవరం, రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోల నుంచి ప్రధానంగా విజయవాడకు అధిక సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు అధిక సంఖ్యలో వస్తే మరిన్ని బస్సులు నడిపేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశామని డీపీటీఓ తెలిపారు. ఇక రైళ్లలో వెళ్లే వారు రిజర్వేషన్ లేకపోయినా.. ఆ బోగీల్లో సైతం ఎక్కి ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. ఫ ముగిసిన దసరా సెలవులు ఫ తిరుగు ప్రయాణమైన జనం ఫ రద్దీగా మారిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు -
దుర్గమ్మ విగ్రహం @ రూ.1.45 లక్షలు
దేవరపల్లి: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా స్థానిక మూడు బొమ్మల సెంటర్లోని సౌభాగ్య దుర్గాంబికా ఆలయం వద్ద ప్రతిష్ఠించి, పూజలు నిర్వహించిన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ కమిటీ ఆధ్వర్యాన శనివారం రాత్రి వేలం నిర్వహించారు. ఈ పాటలో గ్రామానికి చెందిన జుత్తిగ సత్యనారాయణ రూ.1.45 లక్షలకు అమ్మవారి విగ్రహాన్ని దక్కించుకున్నారు. ఈ విగ్రహాన్ని ఈ నెల 8వ తేదీన గ్రామంలో ఊరేగించి, నిమజ్జనం చేయనున్నారు. మేము ఎవ్వరి భూములూ ఆక్రమించలేదు టీడీపీ నాయకులు కొఠారు గాంధీ, నారాయణ నల్లజర్ల: తాము ఎవ్వరి భూములూ ఆక్రమించలేదని, ఈ విషయమై బహిరంగ విచారణకు సిద్ధమని టీడీపీ నేతలు కొఠారు గాంధీ, నారాయణ అన్నారు. ‘ఇక్కడ పెట్టుబడులు పెట్టడం దండగ’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై వారు స్పందించారు. 1970 నుంచి పెద్దలు పంపకాలు చేసి, నిర్ణయించిన భూమి సరిహద్దులోనే తాము వ్యవసాయం చేసుకుంటున్నామన్నారు. కొఠారు ప్రదీప్ చక్రవర్తిది క్రిమినల్ మైండ్ అని అన్నారు. ఇంతవరకూ అతడి సోదరుడు భీమశంకరం, తల్లి శశిప్రభ చౌదరి ఆధీనంలోనే భూములు ఉన్నాయన్నారు. సంవత్సర కాలంగా ప్రదీప్ చక్రవర్తి అతని అన్న భీమశంకరాన్ని తన్ని తరిమేశాడని, అప్పటి నుంచీ సరిహ ద్దు రైతులమైన తమను ఇబ్బంది పెడుతూ, రాత్రి వేళల్లో కిరాయి మనుషులను తీసుకువచ్చి పొగా కు, మొక్కజొన్న పంటలు ధ్వంసం చేస్తున్నాడని ఆరోపించారు. పైపులైన్లు 15 సార్లు దొంగచాటుగా ధ్వంసం చేశాడన్నారు. ఇన్ని జరుగుతున్నా తాము ఎప్పుడూ తమ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు దృష్టికి తీసుకెళ్లలేదన్నారు. ప్రదీప్ చక్రవర్తి కుటుంబానికి చెందిన కొంత భూమి పోలవరం కుడి కాలువ నిర్మాణంలో పోయిందన్నారు. మిగిలినది కౌలుకు ఇచ్చారన్నా రు. పంట ధ్వంసం, పైపులైన్లు ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. టవర్‌కు సంబంధించి స్థల యజమాని కొఠారు బులిరాజుపై ప్రదీప్ చక్రవర్తి హత్యాయత్నం చేయబోయాడని, టవర్ ఇనుప సామగ్రిని తన ట్రాక్టరులో వేసుకొని ఉంగుటూరు మండలం వైపు పట్టుకుపోతూంటే కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఈ విషయంలో తమ ప్రమేయం లేదని చెప్పారు. ప్రదీప్ చక్రవర్తి సైకోలా ప్రవర్తిస్తాడని, అందుకే ఇంతవరకూ అతడితో ఎవరూ పెళ్లికి సిద్ధపడటం లేదని అన్నారు. మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేశాడని, ఈ విషయంలో పార్టీ వర్గాలు విచారణ జరిపి, ఆయనకు నివేదిక అందజేశాయని గాంధీ, నారాయణ చెప్పారు. -
చమురు సంస్థలతో నిరుద్యోగ భృతి ఇప్పించాలి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు డిమాండ్ అమలాపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాగూ నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, కనీసం కోనసీమ నుంచి రూ.కోట్ల విలువైన నిక్షేపాలను తరలించుకుపోతున్న చమురు సంస్థల నుంచి ఈ ప్రాంత యువతకు నిరుద్యోగ భృతి ఇప్పించేందుకు చొరవ చూపాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. దాదాపు 40 ఏళ్లుగా కోనసీమలో చమురు సంస్థలు రూ.కోట్ల లాభాలు ఆర్జిస్తున్నా, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోనసీమ నేల నుంచి తవ్వుతున్న నిక్షేపాలతో చమురు సంస్థలు రూ.వేల కోట్లతో వ్యాపారాలు చేస్తున్నా.. చంద్రబాబు ఏ రోజూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయా సంస్థలను ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. దాదాపు రూ.50 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చమురు సంస్థల నుంచి రాయల్టీ రూపంలో రావాల్సి ఉండగా, ప్రధాని మోదీకి భయపడి చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పైపెచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల రాష్ట్రానికి నాలుగు పెద్ద యూనివర్శిటీలు ప్రపంచ దేశాల నుంచి తెచ్చానని ఘనంగా చెబుతున్నారన్నారు. జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్‌లో ఎప్పుడో విదేశీ యూనివర్శటీలకు కార్పొరేట్ రంగంలో డబ్బు వసూలు చేసుకోవచ్చంటూ ఆయన చట్టం తెచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రానికి మంజూరైన పెట్రోలియం యూనివర్శిటీ ఉత్తరప్రదేశ్‌కు తరలిపోతున్నా ఉలుకూ పలుకు లేకుండా ఉండిపోయారని దుయ్యబట్టారు. చంద్రబాబు మాటలను నమ్మే స్థితిలో నిరుద్యోగులు లేరన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ నాయకుడు ముంగర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మూడో అంతస్తు నుంచి కిందపడ్డ తల్లీబిడ్డలు
● తల్లికి తీవ్ర గాయాలు ● స్వల్ప గాయాలతో బిడ్డ సురక్షితం ● సత్యగిరిపై విష్ణుసదన్‌లో ఘటన అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని సత్యగిరిపై ఉన్న విష్ణుసదన్ సత్రం మూడో అంతస్తు గోడ పైనుంచి అదుపుతప్పి తల్లి, కుమారుడు కిందపడ్డారు. ఈ ఘటనలో తల్లికి రెండు కాళ్లు విరిగిపోగా, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే, శుక్రవారం రాత్రి విష్ణుసదన్ సత్రంలోని మూడో అంతస్తులో 27, 28 నంబర్ హాళ్లలో జరిగిన వివాహానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురానికి చెందిన శ్యామల సింధు తన మూడేళ్ల కుమారుడు శ్యాకేత్రామ్తో కలిసి వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో శ్యామల సింధు తన కుమారుడు శ్యాకేత్ రామ్‌కు 28 హాలు ఎదురుగా పిట్టగోడపై కూర్చోబెట్టి అన్నం తినిపిస్తోంది. కుమారుడు హఠాత్తుగా వెనక్కు పడిపోతుండడంతో ఆమె గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ అదుపుతప్పి కింద మట్టిలో పడిపోయారు. కుమారుడిని గట్టిగా పట్టుకోవడంతో ముందు తల్లి పడగా, ఆమైపె కుమారుడు పడ్డాడు. నేరుగా నేలపై పడకుండా, రెండో అంతస్తు కిటికీ సన్‌షేడ్‌పై పడి.. అక్కడి నుంచి కిందపడ్డారు. ఈ ధాటికి సన్‌షేడ్ విరిగిపోయింది. ఈ ఘటనలో శ్యామల సింధు బలంగా నేలను తాకడంతో రెండు కాళ్లూ విరిగిపోయాయి. ఆమైపె ఉన్న కారణంగా కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి, పెళ్లి బృందాల వారు వెంటనే 108కు ఫోన్ చేయగా, సిగ్నల్స్ లేకపోవడంతో హరిహర సదన్ సత్రం నుంచి సమాచారం అందించారు. గంట తర్వాత అంబులెన్స్ చేరింది. క్షతగాత్రులను కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తొండంగి పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. భక్తుల ఆగ్రహం రత్నగిరిపై సత్రాలు, పెళ్లిళ్ల సీజన్లో మండపాలు కేటాయించి దేవస్థానం అధికారులు చేతులు దులుపుకొంటున్నారని, తర్వాత వారిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విష్ణుసదన్‌లో 36 హాళ్లు ఉన్నాయి. కొందరు రెండు హాళ్లు తీసుకుని పెళ్లిళ్లతో పాటు, భోజనాలూ అక్కడే ఏర్పాటు చేసుకుంటారు. రాత్రయితే అక్కడ అంతా అయోమయం. విద్యుత్ సరఫరా నిలిచిపోతే.. పునరుద్ధరణకు చాలా సమయం పడుతుంది. గతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినపుడే పెళ్లికి హాజరైన మహిళ మెడలో బంగారు గొలుసును దుండగుడు అపహరించాడు. అక్కడ పోలీసులే కాదు.. కనీసం ప్రైవేట్ సెక్యూరిటీ ఉండడం లేదనే విమర్శ ఉంది. అక్కడ సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. ఎటువంటి సంఘటనలు జరిగినా పోలీసులకు, దేవస్థానం అధికారులకు కానీ వెంటనే సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. ఆయా సమస్యలను దేవస్థానం అధికారులు చక్కదిద్దాలని భక్తులు కోరుతున్నారు. -
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల నిర్వహణ
ఏపీ వాలీబాల్ కోచ్ ముదునూరి కొత్తపేట: యువతను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీల నిర్వహణకు కృషి చేస్తున్నట్టు ఏపీ వాలీబాల్ కోచ్ ముదునూరి చలపతి రామకృష్ణంరాజు తెలిపారు. ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామానికి చెందిన రామకృష్ణంరాజు ప్రస్తుతం హైదరాబాద్‌లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. తన స్వగ్రామం తాడిపూడి వచ్చిన ఆయన శనివారం వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను దేవస్థానం తరఫున అధికారులు, అర్చకులు వేదమంత్రోచ్ఛరణతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణంరాజు విలేకరులతో మాట్లాడుతూ, గ్రామీణ క్రీడలైన వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వంటి వాటిలో యువత రాణించాలన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆరోగ్యంతో పాటు, మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. స్పోర్ట్స్‌మన్ కోటాలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇటీవల డీఎస్సీలో 900 మంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారని, వీరిలో వాలీబాల్ క్రీడాకారులు 50 మంది ఉన్నారని తెలిపారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి ఓసారి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ల నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. తద్వారా యువతలో క్రీడలపై ఆసక్తి పెరుగుతుందన్నారు. -
ఉల్లాసంగా ఎస్జీఎఫ్ఐ ఎంపికలు
ఉమ్మడి జిల్లా పరిధిలో 600 మంది హాజరు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో శనివారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వివిధ క్రీడాంశాల్లో జిల్లా జట్ల ఎంపికలను నిర్వహించారు. ఈ ఎంపికలను సీనియర్ పీడీలు రవిరాజు, బంగార్రాజు, పట్టాభిరామం, మాజీ ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి జార్జి, ఎస్జీఎఫ్ఐ కార్యదర్శులు కె.శ్రీనివాస్, సుధారాణి ప్రారంభించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిఽధిలో సుమారు 600 మంది క్రీడాకారులు హాజరయ్యారు. సైక్లింగ్, తైక్వాండో, రెజ్లింగ్, స్క్వాష్, పెంటాథలాన్లో జరిగిన ఎంపికలకు తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు, డీఎస్ఏ రెజ్లింగ్ కోచ్ కనకదుర్గ, డీఎస్ఏ స్క్వాష్ కోచ్ లక్ష్మణ్ సాంకేతిక అధికారులుగా వ్యవహరించారు. కాకినాడ రాజా ట్యాంక్ ఆవరణలోని వైఎస్సార్ మున్సిపల్ స్కేటింగ్ రింక్‌లో స్కేటింగ్ ఎంపికలను ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి సుధారాణి ప్రారంభించారు. -
మాలధారణం.. నియమాల తోరణం
కొత్తపేట: పవిత్రమైన అయ్యప్ప స్వామి దీక్షకు ‘మాలధారణం.. నియమాల తోరణం’ అంటూ భక్తులు శ్రీకారం చుట్టారు. పలుచోట్ల భక్తులు శుక్రవారం మాల ధరించి దీక్షలు ప్రారంభించగా, మరికొన్ని చోట్ల ఆదివారం మాల ధరించనున్నారు. ఎక్కువగా అయ్యప్ప స్వామి దీక్షలు దసరా రోజుల్లో లేదా విజయ దశమి అనంతరం ప్రారంభిస్తారు. దీనిని మండల దీక్ష అంటారు. 41 రోజుల అనంతరం దీక్ష ముగించి, ఇరుముడులతో శబరిమలకు పయనమవుతారు. అలాగే కార్తికమాసంలో కూడా అనేక మంది దీక్షను ప్రారంభిస్తారు. దీనిని జ్యోతి దర్శన దీక్ష అంటారు. మకర సంక్రాంతికి ముందు దీక్షను ముగించి జ్యోతి దర్శనానికి వెళతారు. 41 రోజుల పాటు కఠిన నియమాలతో దీక్షను ఆచరిస్తారు. అయ్యప్ప మాలధారణ నియమాలు మాల ధారణ అనేది అయ్యప్పను దర్శించడానికి భక్తులు చేపట్టే కఠినమైన 41 రోజుల వ్రత దీక్ష. ఈ దీక్షలో భక్తులు పవిత్రత, బ్రహ్మచర్యం, శాఖాహారం మాత్రమే తీసుకునే కఠినమైన నియమాలను పాటిస్తూ, రుద్రాక్ష లేదా, తులసి, స్పటిక పూసలతో చేసిన మాలలు, నల్లని లేదా నీలం దుస్తులు ధరిస్తారు. చెప్పులు లేకుండా నడవడం, రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా నదీ స్నానం లేదా చల్లటి నీటితో స్నానం చేయడం, కటిక నేలపై నిద్రించడం వంటి నియమాలు పాటిస్తారు. ఈ దీక్ష సమయంలో దైనందిన జీవితానికి, భౌతిక సుఖాలకు దూరంగా, కఠిన నియమాలు పాటించడం ద్వారా, భగవంతునిపై భక్తిని, అంకితభావాన్ని, క్రమశిక్షణతో ఆధ్యాత్మిక సాధన చేస్తూ.. అయ్యప్పస్వామిని దర్శించడానికి తమను తాము మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసుకోవడమే వ్రత దీక్ష ముఖ్యోద్దేశం. జిల్లాలో అయ్యప్ప ఆలయాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో అయ్యప్పస్వామి ఆలయాలున్నాయి. ద్వారపూడిలో అయ్యప్పస్వామి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దీనిని ఆంధ్ర శబరిమలగా పిలుస్తారు. కొత్తపేట మండలం వాడపాలెం అయ్యప్ప స్వామి – జ్ఞాన సరస్వతీదేవి ఆలయం కోనసీమ శబరిమలగా విరాజిల్లుతోంది. రాజమహేంద్రవరం సరస్వతీ ఘాట్ సమీపాన, కాకినాడ, సామర్లకోట, తుని, అమలాపురం, మండపేట, కొత్తపేట, వాడపాలెం, ముమ్మిడివరం, రామచంద్రపురం, రాజోలు, అనపర్తి, కత్తిపూడి తదితర ప్రాంతాల్లో అయ్యప్ప స్వామి ఆలయాలున్నాయి. ఏటా భక్తులు ఆయా ఆలయాల్లో గురుస్వాముల చేతుల మీదుగా మాలను ధరించి, దీక్ష ప్రారంభిస్తారు. కొత్తపేట మండలం వాడపాలెం అయ్యప్ప స్వామి – జ్ఞాన సరస్వతీదేవి ఆలయం వద్ద ఏకాదశి సందర్భంగా శుక్రవారం సుమారు 130 మంది అయ్యప్ప మాల ధరించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 30 వేల మంది భక్తులు మాల ధరిస్తారని అంచనా. 41 రోజుల అయ్యప్ప దీక్ష అనంతరం గురుస్వాముల చేతుల మీదుగానే ఇరుముడులు కట్టించుకుని శబరిమల పయనమవుతారు. శబరిమల వెళ్లలేని భక్తులు ద్వారపూడి వెళ్లి దీక్షను ముగిస్తారు. స్వాములకు సుభిక్ష కఠినమైన అయ్యప్ప దీక్షలో మాల ధరించింది మొదలు, దీక్ష పూర్తయ్యే వరకూ ఏకభుక్తం (ఒక్క పూట భోజనం) మాత్రమే చేయాలి. ఇంట్లో అన్ని రోజులూ నియమాలతో ఆహారం తయారుచేయడం కుదరదు. చాలా మంది భక్తులు బృందంగా ఏర్పడి స్వయంగా వండుకుంటారు. అలా కుదరని వారు ప్రత్యేకంగా మడిగా ఉండే వంట మనుషులతో ఉదయం, రాత్రి వడి (అల్పాహారం), మధ్యాహ్నం భిక్ష (భోజనం) చేయించుకుని స్వీకరిస్తారు. మరికొందరు స్వామిపై భక్తితో మాల ధరిస్తారు. వారికి మడిగా వడి, భిక్ష తయారుచేసుకునే అవకాశం ఉండదు. ఉద్యోగ, ఉపాధి, వివిధ పనులపై దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అటువంటి వారు భిక్ష లేక ఆ పూట ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి. అటువంటి వారి కోసం వడి, భిక్ష దాదాపు అన్ని అయ్యప్ప ఆలయాల్లో అందిస్తున్నారు. ద్వారపూడి అయ్యప్పస్వామి ఆలయం కొత్తపేట మండలం వాడపాలెం ఆలయంలో భిక్ష స్వీకరిస్తున్న స్వాములు వాడపాలెంలో ఉచిత భిక్ష ప్రారంభం కొత్తపేట మండలం వాడపాలెం అయ్యప్ప స్వామి – జ్ఞాన సరస్వతీదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా అయ్యప్ప మాలధారులకు ఉచిత భిక్ష (అన్న ప్రసాదం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాతలు కూడా ఇందుకు సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం భిక్ష ప్రారంభించారు. తొలిరోజు సుమారు 150 మంది భిక్ష స్వీకరించారు. కొత్తపేట బోడిపాలెం వద్ద గౌతమి అయ్యప్పస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి భిక్షను ప్రారంభించనున్నారు. సుమారు 250 మంది భక్తులు భిక్ష స్వీకరిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామగ్రామానా అయ్యప్ప స్వామి భక్తుల మండల దీక్ష ప్రారంభం కఠిన నియమాలతో నిర్వహణ 14న ఇరుముడులతో శబరిమల పయనం స్వాములకు ఉచిత భిక్ష -
ఆధ్యాత్మికం.. ఆరోగ్యం..
అయ్యప్ప స్వామి మాలధారణ, దీక్ష, నియమాలు పాటించడం ద్వారా ఆధ్యాత్మిక తత్వం పెరగడంతో పాటు, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయి. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం వల్ల చైతన్యం, చన్నీటి స్నానంతో నాడీ వ్యవస్థ ఉత్తేజపర్చడం, నేలపై పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యల పరిష్కారం, చెడు వ్యసనాలు దూరమవుతాయి. కులం, పేద, ధనిక తారతమ్యం లేకుండా దీక్ష చేయడం వల్ల స్నేహభావం పెరుగుతుంది. – దొంతికుర్తి రామచంద్రశర్మ, గురుస్వామి, ప్రధాన అర్చకుడు, అయ్యప్ప స్వామి – జ్ఞాన సరస్వతీదేవి ఆలయం, వాడపాలెం ● -
కెనరా బ్యాంకు నూతన శాఖలు ప్రారంభం
చాగల్లు/నల్లజర్ల: రెండు చోట్ల కెనరా బ్యాంకు నూతన శాఖలను బ్యాంక్ విజయవాడ జనరల్ మేనేజర్ సీజే విజయలక్ష్మి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. చాగల్లు, నల్లజర్ల బస్టాండ్ వద్ద ఆయా శాఖలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు, వ్యాపారులతో పాటు, అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కెనరా బ్యాంకు లక్ష్యమన్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.మాధవరావు మాట్లాడుతూ, డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు సహా, అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. బంగారం తాకట్టు, పంట, ముద్ర రుణాలు అందిస్తామన్నారు. బ్రాంచ్ మేనేజర్లు ప్రవీణ తోట, సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సినీ నటి శ్రీరెడ్డికి నోటీసు రాజమహేంద్రవరం రూరల్: ఐటీ యాక్ట్ కింద నమోదైన కేసులో సినీ నటి మల్లిడి శ్రీరెడ్డికి 35 బీఎన్ఎస్ నోటీసును బొమ్మూరు ఎస్సై రమేష్ శనివారం జారీ చేశారు. గతేడాది నవంబర్ 12న టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై ఐటీ యాక్ట్ కింద బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్తున్న శ్రీరెడ్డికి లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఎస్సై రమేష్, మహిళా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌తో వెళ్లి నోటీసు అందజేశారు. స్కూల్స్ గేమ్స్ ఉమ్మడి జిల్లా ఎంపికలు రేపు ప్రకాశంనగర్ (రాజమహేంద్రవరం): నగరంలోని ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్కూల్స్ గేమ్స్ ఎంపికలు నిర్వహించినున్నట్టు డీఈవో కె.వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫుట్‌బాల్ అండర్–14 బాలురు, బాలికలు, కరాటే అండర్–14, 17 బాలురు, బాలికల విభాగాల్లో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఆయా క్రీడాంశాల్లో పాల్గొనే వారు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని తెలిపారు. వివరాలకు స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఏవీడీ ప్రసాదరావు 98853 10089 నంబర్లో సంప్రదించాలని కోరారు. ప్రపంచ బాడ్మింటన్ పోటీలకు న్యాయ నిర్ణేతగా సాయిబాబు తొండంగి: వరల్డ్ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్ షిప్‌కు న్యాయనిర్ణేతగా మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన క్రీడాకారుడు, కోచ్ సువర్ణం సాయిబాబు ఎంపికయ్యారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసోం రాష్ట్రం గౌహతిలో ఈ నెల ఆరు నుంచి 19 వరకు జరగనున్న ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలకు న్యాయనిర్ణేతగా నియమిస్తూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) నుంచి ఉత్తర్వులు అందాయని చెప్పారు. ఈ పోటీలకు సుమారు 46 దేశాలకు చెందిన క్రీడాకారులు హాజరవుతారన్నారు. ఎంపికైన సాయిబాబుకు ఏపీ, తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ సంఘ కార్యదర్శులు అంకమ్మచౌదరి, బాలసుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు. -
నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా..
● వాడపల్లి క్షేత్రంలో భక్తజన ప్రవాహం ● ఒక్క రోజులో దేవస్థానానికి రూ.53.41 లక్షల ఆదాయం కొత్తపేట: గోవింద నామస్మరణతో కోనసీమ తిరుమల క్షేత్రం మార్మోగింది. నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా.. శ్రీనివాసా... శ్రీ పురుషోత్తమా.. అంటూ వాడపల్లి వాసుని స్మరిస్తూ భక్తులు తన్మయులయ్యారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కోర్కెలు తీరిన అనేక మంది భక్తులు స్వామివారి దర్శనానికి కాలినడకన చేరుకున్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. వేలాది మంది భక్తులతో లైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించారు. ఉచిత వైద్య శిబిరాల్లో పలువురు భక్తులకు వైద్య సేవలందించారు. ఉచిత వాహనాల్లో వృద్ధులు, దివ్యాంగులను, గర్భిణులను చేరవేశారు. విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదాన విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో దేవస్థానానికి సాయంత్రం 7 గంటల సమయానికి రూ.53,41,146 ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్సై ఎస్ రాము వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలను పర్యవేక్షించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
కడుపుకొట్టి.. బుజ్జగింపులా..?
సాక్షి, అమలాపురం/పి.గన్నవరం: ఓవైపు ఉచిత బస్సు పేరుతో తమ పొట్ట కొట్టారనే ఆగ్రహం.. దీనికి తోడు ఇస్తానన్న రూ.15 వేల సాయానికి నిబంధనల కొర్రీలు.. ఇలా గిల్లి జోల పాడినట్టుగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు తీరుపై ఆటో డ్రైవర్లు మండిపడ్డారు. టీడీపీ శనివారం నిర్వహించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ కార్యక్రమం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రసాభాసగా మారింది. ‘గోరంత సాయానికి.. కొండంత హడావుడి’ అనే తీరులో ప్రచారార్భాటం చేయాలనుకున్న నేతల వ్యూహం బెడిసికొట్టింది. పలుచోట్ల ఆటో డ్రైవర్లు ఎదురు తిరిగారు. కూటమి సర్కారు తీరుపై అసంతృప్తితో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. జిల్లా కేంద్రం అమలాపురంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఆటో డ్రైవర్ల సేవలో ర్యాలీకి వంద ఆటోలు కూడా రాలేదు. వచ్చిన వారిలోనూ చాలా మంది కార్యక్రమంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఎమ్మెల్యే ఆనందరావు, ఇతర టీడీపీ నేతలు వచ్చిన సమయంలో కొంతమంది చోటామోటా నాయకులు ఆటోల ముందు టీడీపీ జెండాలతో ఫొటోలు దిగేందుకు సిద్ధమయ్యారు. దీనికి ఆటో డ్రైవర్లు అభ్యంతరం చెప్పడంతో తమ్ముళ్లు కంగుతిన్నారు. టీడీపీ, జనసేన బాహాబాహీ నియోజకవర్గ కేంద్రమైన పి.గన్నవరంలో టీడీపీ, జనసేన నేతలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో పాటు, పరుష పదజాలతో తిట్ల దండకం అందుకున్నారు. ఇక్కడ నిర్వహించిన ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం కోసం రవాణా శాఖ తయారు చేసిన ఫ్లెక్సీపై, ఆటో డ్రైవర్లకు పంపిణీ చేసే నమూనా చెక్కుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో లేకపోవడంతో జనసేన నేతలు విరుచుకుపడ్డారు. జనసేనకు చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే అధికారులపై మండిపడ్డారు. పవన్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. తాము నిర్వహించే కార్యక్రమాల్లో చంద్రబాబు ఫొటో వేస్తున్నామని, టీడీపీ కార్యక్రమాల్లో మాత్రం పవన్ కల్యాణ్ ఫొటో వేయడం లేదని ప్రశ్నించారు. అధికారులు సర్ది చెబుతున్న సమయంలో టీడీపీకి చెందిన మద్దాల సుబ్రహ్మణేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో జనసేన నేతలు మండిపడ్డారు. సుబ్రహ్మణ్యేశ్వరరావుతో పాటు మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఇతర టీడీపీ నాయకుల పైకి దూసుకుపోయారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కలుగజేసుకుని ఇరు పార్టీల నాయకులకు సర్ది చెప్పారు. ఫ బెడిసికొట్టిన ‘ఆటోడ్రైవర్ సేవలో..’ ఫ ఉచిత బస్సు నేపథ్యంలో మొక్కుబడిగా పాల్గొన్న ఆటో డ్రైవర్లు ఫ పసుపు జెండాలతో ఫొటోలకు అంగీకరించని వైనం -
ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ప్రపంచానికి మేలు
పెరవలి: ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తే మానవాళికి మేలు జరుగుతుందని బ్రెజిల్ బృంద నాయకుడు వాల్టర్ లింక్ అన్నారు. బ్రెజిల్, యుఏఈ, శ్రీలంకకు చెందిన 27 మంది నిపుణులతో కూడిన బృందం పెరవలి మండలం ముక్కామలలో శనివారం పర్యటించింది. ప్రకృతి వ్యవసాయం, వినూత్న పద్ధతులు, రైతు సాధికారతపై బృంద సభ్యులు పరిశీలించారు. ప్రకృతి సాగు ఏవిధంగా గిట్టుబాటు అవుతుంది, ఆదాయం వంటి వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ముక్కామలలో ప్రదర్శించిన 9 సూత్రాల చక్రాన్ని సందర్శించారు. జీవామృతం, కోడిగుడ్డు – నిమ్మరసం ద్రావణం తయారీ, వినియోగం, నిల్వ పద్ధతులపై అవగాహన పొందారు. సాగు విధానాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వరిలో కలుపు నివారణ పద్ధతులు, కూలీల ఖర్చు తగ్గింపు తదితర సమాచారం రైతుల నుంచి సేకరించారు. వేసవిలో వేసిన నవధాన్యాల వలన పంట భూములకు కలిగే ప్రయోజనం, తక్కువ నీటి వినియోగంతో సాగు గురించి అవగాహన చేసుకున్నారు. డ్రోన్ ద్వారా కషాయాల పిచికారీని, బ్రిక్స్ రీడింగ్ ద్వారా పంట ఆరోగ్యం కొలిచే విధానాన్ని వీక్షించారు. ఆయిల్‌పామ్, వక్క, అరటి సాగు నమూనాలు పరిశీలించి, మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై ప్రకృతి వ్యవసాయంలో వారి పాత్ర గురించి తెలుసుకుని అభినందించారు. కార్యక్రమంలో అదనపు డీపీఎం షేక్ మహబూబ్ వలీ, జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సాకా రామకృష్ణ, మోడల్ మండల్ టీమ్ లీడర్ బసవన్నగౌడ్, వ్యవసాయాధికారి మేరీ కిరణ్, ఏపీఎం బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అర్హులైన ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో శనివారం ఆయన ప్రారంభించారు. ఆటో డ్రైవర్లకు నమూనా చెక్ అందజేశారు. కంబాల చెరువు నుంచి సభా స్థలి వరకూ స్వయంగా ఆటో నడిపారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 11,915 మంది ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు రూ.17.87 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. అర్హత ఉండి ఎవరికై నా ఆర్థిక సాయం అందకపోతే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని, సమస్య పరిష్కరించి లబ్ధి చేకూరేలా చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వందలాదిగా భక్తుల రాక ప్రారంభమైంది. భక్తులు క్యూలో ఆలయ ప్రాంగణం చుట్టూ బారులు తీరారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామి, అమ్మవార్లను అర్చకులు విశేషంగా అలంకరించారు. స్వామివారికి వందలాది మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. దాతల ఆర్థిక సహాయంతో 9 వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ప్రతి శనివారం దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నామని, ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ తెలిపారు. స్వామివారి పుష్పాలంకరణ, ప్రసాదం, నిత్యగోత్రార్చన, అన్నదానం తదితర సేవలకు విరాళాలు స్వీకరిస్తున్నామన్నారు. మరింత తగ్గిన గోదావరి ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి మరింత తగ్గింది. బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 9.10 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 6,06,421 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువన కాళేశ్వరంలో 9.03 మీటర్లు, పేరూరు 12.03, దుమ్ముగూడెం 9.43 మీటర్లు, భద్రాచలం వద్ద 32.60 అడుగులు, కూనవరంలో 15.53 మీటర్లు, కుంట 8.08, పోలవరం 10.51, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.09 మీటర్ల మేర నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. -
శాంతించిన గోదారమ్మ
దవళేశ్వరం: ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ ఎట్టకేలకు శాంతించింది. కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శుక్రవారం తెల్లవారుజామున 11.70 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం నీటిమట్టం మరింతగా తగ్గుతూ 10.10 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 7,48,015 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ ప్రాంతాల్లో కూడా నీటిమట్టాలు తగ్గడంతో కాటన్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి శనివారం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో..) కాళేశ్వరం 10.27 పేరూరు 14.17 దుమ్ముగూడెం 10.25 భద్రాచలం 36.80 (అడుగులు) కూనవరం 16.42 కుంట 7.88 పోలవరం 11.16 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 15.49 -
ఉమ్మడి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌గా గణేశ్
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌గా అడారి గణేశ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పుటి వరకు భీమవరం జిల్లా ట్రెజరీ శాఖలో అసెస్టెంట్ డైరెక్టర్, అకౌంట్ ఆఫీసర్‌గా పనిచేస్తూ పదోన్నతిపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌గా గణేశ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనను మర్యాద పూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఉద్యోగుల సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు పాము శ్రీనివాసరావు, ఉద్యోగులు కలిశారు. -
సహేతుకంగా పుష్కరాల పనుల అంచనాలు
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టే పనులకు అంచనాలను సహేతుకంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ కీర్తి చేకూరి నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. తొలుత 21 రహదారుల విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ముందుగా కోరుకొండ రోడ్డు, ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు, మోరంపూడి జంక్షన్ – శ్యామలా టాకీస్ రహదారి విస్తరణ పనులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రతి రోజూ మంచినీటి పరీక్షలు చేయాలన్నారు. ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల వద్ద కూడా ఈ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పుష్కర పనులకు సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్, ఘాట్ల అభివృద్ధి, ట్రాఫిక్ మళ్లింపు, రోడ్ల అభివృద్ధి తదితర అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై చర్చించారు. పుష్కరాల పేరిట తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీర్ఘకాలిక విధానంలో రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పన, పర్యాటకంగా నగరాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పుష్కరాలకు వచ్చే యాత్రికుల వసతికి పాఠశాలలు, కల్యాణ మండపాలు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు చూడాలన్నారు. ప్రతి ఘాట్ వద్ద పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ జి.శైలజ వల్లి, సిటీ ప్లానర్ జి.కోటయ్య, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) సీపీఓ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ (ఇన్చార్జి) రీటా, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అత్యవసర సమయం.. నాటు పడవే ఆధారం
రాజానగరం (సీతానగరం): గోదావరి వరదల సమయంలో సీతానగరం మండలం ములకల్లంక వాసులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఆ సమయంలో గ్రామంలో ఎవరికై నా ఆరోగ్యం బాగోకపోతే ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బంది పడక తప్పదు. శుక్రవారం ఉదయం అదే జరిగింది. ఆ గ్రామానికి చెందిన ఎం.అనసూయ (85) తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. వెంటనే వచ్చిన సిబ్బంది వరద ఉధృతి కారణంగా ఆమె ఉన్న ములకల్లంక వెళ్లలేకపోయారు. చివరకు అనసూయను కుటుంబ సభ్యుల సహకారంతో ఆ గ్రామం నుంచి బయటకు తీసుకువచ్చి, తమ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. -
వృద్ధుడి గల్లంతు
నిడదవోలు రూరల్: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ గోదావరిలోకి జారిపడి వృద్ధుడు గల్లంతైనట్టు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు శుక్రవారం తెలిపారు. నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ఉల్లూరి చిరంజీవి (64) ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటలకు గోదావరి ఒడ్డున బహి ర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడి పోయాడు. చిరంజీవి అల్లుడు ప్రత్తిపాటి శ్రీను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి గోదావరిలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని కొవ్వూరు ఆర్డీఓ రాణిసుస్మిత, తహసీల్దార్ బి.నాగరాజునాయక్, ఎంపీడీఓ జగన్నాథరావు శుక్రవారం పరిశీలించారు. -
ఆయిల్ ఫామ్ కొనసాగేనా!
రంగంపేట: మెట్ట రైతులకు వరంగా మారిన ఆయిల్‌పామ్ గెలల ధర తరచుగా ఆటుపోట్లకు గురవుతూండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర ఇచ్చే పంటల జాబితాలో లేకపోవడం.. ఆశించిన ధర దక్కకపోవడం వారిని కలవరపరుస్తోంది. ఆయిల్‌పామ్ గెలలు టన్నుకు 2023లో అత్యధికంగా రూ.23 వేల రికార్డు స్థాయి ధర లభించింది. ఆ తరువాతి సంవత్సరం పామాయిల్ కంపెనీలు సిండికేట్ అయి, ఒక్కసారిగా ధరను ఏకంగా రూ.13,500కు తగ్గించేశాయి. అనంతరం క్రమంగా ఆయిల్‌పామ్ ధరలు ఒడుదొడుకులకు గురవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో టన్ను గెలల ధర రూ.20,050 ఉండేది. అది ఫిబ్రవరిలో రూ.20,727కు, మార్చిలో రూ.20,935కు పెరిగింది. పరిస్థితి బాగానే ఉందని రైతులు ఆనందించినంతసేపు కూడా లేకుండా ఈ ధర కాస్తా జూన్ నాటికి రూ.17,340కి పడిపోయింది. సుంకం తగ్గింపు.. శాపం అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం అప్పట్లో 27 శాతం నుంచి ఏకంగా 10 శాతానికి తగ్గించింది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆయిల్‌పామ్ రైతులు టన్నుకు రూ.3,595 మేర నష్టపోయారు. ఒక దశలో నష్టాల ఏటికి ఎదురీదలేక ఆయిల్‌పామ్ తోటలను తొలగించే దిశగా రైతులు ఆలోచనలు చేశారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఫలితంగా గెలల ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. జూలై నాటికి రూ.17,997, ఆగస్టులో రూ.19,107, సెప్టెంబర్‌లో రూ.19,370కు ధర పెరిగింది. ఈ ధర ఈ నెలలో కూడా కొనసాగవచ్చని, నవంబర్ నాటికి రూ.20 వేల మార్కుకు చేరుతుందని రైతులు భావిస్తున్నారు. టన్ను గెలలకు రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకూ ధర ఇవ్వాలని వారు కోరుతున్నారు. 80 వేల ఎకరాల్లో.. రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఆయిల్‌పామ్ తోటలు ఉండగా.. సింహభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఈ పంట ఉంది. ఉమ్మడి పశ్చి మ గోదావరి జిల్లాలో 1.50 లక్ష ఎకరాలు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 80 వేల ఎకరాల్లో ఈ పంట సాగు జరుగుతోంది. ఇందులో 20 వేల ఎకరాలు ఇంకా ఫలసాయానికి రాని తోటలే ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కొవ్వూరు, రాజమహేంద్రవరం, పెద్దాపురం, కాకినాడతో పాటు, రంపచోడవరం, రామచంద్రపురం, అమలాపురం డివిజన్లలో రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఒక్క కొవ్వూరు డివిజన్‌లోనే 55,432 ఎకరాల్లో ఈ తోటలున్నాయి. ఇంకా గండేపల్లి, రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, జగ్గంపేట మండలాలు ఆయిల్సాగులో దూసుకుపోతున్నాయి. రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 65 శాతం ఈ తోటల సాగే జరుగుతోంది. కౌలు విధానం వరి మాదిరిగానే ఆయిల్‌పామ్ తోటలను కూడా కొంత మంది రైతులు కౌలుకు సాగు చేస్తున్నారు. తోటల దిగుబడి ఆధారంగా మూడు నుంచి ఐదు టన్నుల శిస్తు రైతులకు లభిస్తుంది. టన్ను గెలల ధర రూ.23 వేలున్నప్పుడు కౌలుదారులు తోటలను శిస్తుకు తీసుకునేందుకు ఎగబడేవారు. ఆ ధర రూ.13 వేలకు దిగజారినప్పుడు వెనుకంజ వేశారు. తాజాగా మళ్లీ ఆయిల్‌పామ్‌లో కౌలుదారుల ఉనికి కనిపిస్తోంది. టన్నులకు బదులుగా ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.70 వేలు నగదు రూపంలో ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. నూనె గింజల అభివృద్ధి పథకంలో భాగంగా కొత్తగా ఆయిల్‌పామ్ మొక్కలు నాటే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం హెక్టారుకు రూ.25 వేల సహాయం అందిస్తోంది. ఈ కారణంగా ఆయిల్‌పామ్ తోటల విస్తీర్ణం తిరిగి పెరుగుతుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పెట్టుబడులు పెరిగాయి పెరిగిన వ్యవసాయ పెట్టుబడుల దృష్ట్యా టన్ను ఆయిల్‌పామ్ గెలలకు రూ.22 వేలకు తగ్గకుండా ధర ఇవ్వాలి. దీనిని కనీస మద్దతు ధరల పంటల జాబితాలో చేర్చాలి. తెల్లదోమ సమస్యను ఉద్యాన శాఖ పరిష్కరించాలి. రాయితీపై సేంద్రియ ఎరువులు అందించాలి. – పుట్టా సోమన్న చౌదరి, ఆయిల్‌పామ్ రైతు, మర్రిపూడి, రంగంపేట మండలం ప్రభుత్వాలు ప్రోత్సహించాలి ఆయిల్‌పామ్ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. టన్ను గెలలకు రూ.25 వేల ధర ఇవ్వాలి. దిగుమతి సుంకాలతో ఆయిల్‌పామ్ గెలల ధరకు ముడి పెట్టకూడదు. తోటలపై వైట్ ఫ్లై(తెల్లదోమ) కారణంగా గెలల దిగుబడి తగ్గిపోవడం వలన కూడా రైతు నష్టపోతున్నాడు. నూనె శాతాన్ని నిర్ణయించే పెదవేగి ఆయిల్‌పామ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించకూడదు. – పెండ్యాల బుజ్జిబాబు, తూర్పు గోదావరి జిల్లా ఆయిల్‌పామ్ రైతు సంఘం అధ్యక్షుడు, రంగంపేటఫ మెల్లమెల్లగా పుంజుకుంటున్న ధర ఫ ప్రస్తుతం రూ.19,370కు చేరిక ఫ వచ్చే నెలలో రూ.20 వేలకు చేరుతుందని ఆశిస్తున్న రైతులు ఫ కనీసం రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ ఈ ఏడాది ఆయిల్‌పామ్ గెలల ధరలు (టన్నుకు రూ.లు) నెల ధర జనవరి 20,050 ఫిబ్రవరి 20,727 మార్చి 20,935 ఏప్రిల్ 20,123 మే 18,650 జూన్ 17,340 జూలై 17,997 ఆగస్టు 19,107 సెప్టెంబర్ 19,370 -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ఐ టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల క్రీడాసమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని టెన్నిస్ కోర్టులలో బాలబాలికల ఎంపికలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎంపికలను ఎస్జీఎఫ్ఐ అండర్–14, 17 కార్యదర్శి శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లా స్థాయిలో జరిగిన ఎంపికలకు 70 మంది హాజరయ్యారు. టెన్నిస్ కోచ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించారు. ఎంపికల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్, కార్యదర్శి మాచరరావు, కోశాధికారి నాగలింగేశ్వరరావు, సీనియర్ పీడీలు ఎల్.జార్జి, పట్టాభిరామం పాల్గొన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో త్వరలో జరిగే రాష్ట్రస్ధాయి పోటీలకు జిల్లా జట్లు ఎంపిక నిర్వహించామన్నారు. అండర్–14 బాలురు–5, బాలికలు–5, అండర్–17 బాలురు–5, బాలికలు–5 మందిని ఎంపిక చేశారు. ఎంపికలు ఎస్జీఎఫ్ఐ బాలికల కార్యదర్శి సుధారాణి పర్యవేక్షించారు. -
రైలు ఢీకొని జార్ఘండ్ వాసి మృతి
తుని: అన్నవరం రైల్వేస్టేషన్ ట్రాక్‌పై గుర్తుతెలియని రైలు ఢీకొని జార్ఘండ్ వాసి మృతి చెందిన ఘటన గురువారం జరిగిందని సామర్లకోట రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ పి.వాసు తెలిపారు. మృతుని వద్ద తుని రైల్వే హెడ్ కానిస్టేబుల్ మోహన్‌రావుకు దొరికిన ఆధారాలను బట్టి జార్ఘండ్ రాష్ట్రానికి చెందిన హోనార్ గ్రామానికి చెందిన సులం పాన్(25)గా తెలిసింది. మృతుడికి తండ్రి మంగళ్‌సింగ్ పాన్, తల్లి, ముగ్గురు తమ్ముళ్లు, చెల్లి ఉన్నట్టు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కొంతకాలం నుంచి మానసికంగా మృతుడు ఇబ్బంది పడుతున్నట్టు వివరించారు. సుమారు నెలక్రితం చేపల చెరువు వద్ద ప్యాకింగ్ నిమిత్తం వచ్చినట్టు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాయవరం: మండలంలోని వెంటూరు శివారు బుట్టాయిపేట వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో దుగ్గిరాల రాంబాబు(57) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు శుక్రవారం విలేకరులకు తెలిపారు. రాంబాబు కుటుంబ సభ్యులు వెంటూరు నుంచి రామచంద్రపురంలో బంధువుల ఇంటి వద్ద జరిగిన శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఆటో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో కూర్చున్న రాంబాబుకు తీవ్రగాయాలు కాగా, రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. రాంబాబు తమ్ముడు కుమారస్వామి ఆటో నడుపుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయన్నారు. రాంబాబు కుమారుడు కనకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. -
న్యాయం చేయాలంటూ ధర్నా
గణేశ్ జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని బ్లూ ఓషన్ కంపెనీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసగా శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికురాలు లొల్ల దుర్గమ్మను గత నెల ఏడవ తేదీన ఫ్యాక్టరీకి చెందిన వాహనం ఢీ కొనడంతో రెండు కాళ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆమెకు చెందిన ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం చేయించి ఇంటికి పంపించి వేశారు. అయితే ఆమెకు ప్యాక్టరీ యాజమాన్యం ఆర్థిక సహాయం అందించకపోవడంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితిపై శ్రద్ధ చూపలేదు. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ధర్నా చేయడానికి నిర్ణయించారు. ఆమెకు జి. రాగంపేట సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు బుంగా శేఖర్‌బాబు, ప్రజలు మద్దతు ఇచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. భర్త పని చేయలేని పరిస్థితిలో ఉండటంతో ఫ్యాక్టరీలో ఆమె పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటోందని చెప్పారు. దుర్గమ్మ మంచాన పడటంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతుందని తెలిపారు. దుర్గమ్మకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బంగారు కృష్ణ, గ్రామ నాయకులు కల్యాణ్, బాబీ, విజయ్‌లు ఆందోళన కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● ఒకరికి తీవ్ర గాయాలు ● మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ఇన్నోవా కారు పెరవలి: విజయ దశమి రోజున జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. జాతీయ రహదారిపై పెరవలి మండలం నల్లాకులవారిపాలెం వద్ద మోటార్ సైకిల్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గురువారం రాత్రి 9.20 గంటలకు నల్లాకులవారిపాలెం వద్ద రోడ్డు కట్టింగ్‌ను దాటే సమయంలో రావులపాలెం నుంచి తణుకు వైపు వస్తున్న ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మోటార్ సైకిల్‌పై ఉన్న ముగ్గురు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో పాటు వారిపై నుంచి కారు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. ప్రమాదంలో ఇంజేటి ఇస్సాకు (49)పై కారు వెళ్లటంతో తీవ్ర గాయాలు అయి రక్తపు మడుగులో కొట్టుకుంటూ మృతి చెందాడు. కంతేటి పోసయ్య (29) కారు ఢీకొట్టిన వేగానికి గాలిలోకి ఎగిరి రోడ్డు మధ్యలో ఉండే డివైడర్‌పై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాతు వెంకటేశ్వరరావు ప్రమాద సమయంలో గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్రగాయాలై కొట్టుకుంటుండగా స్థానికులు 108లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు అక్కడ నుంచి విజయవాడ, అక్కడ నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. వెనక్కి వెళ్లిపోదామనుకోగా... పండగ రోజు కావటంతో స్నేహితులు ముగ్గురు కలసి ఖండవల్లి నుంచి తణుకు వెళ్లటానికి మోటార్ సైకిల్‌పై వస్తుండగా నల్లాకులవారిపాలెం వచ్చేటప్పటికి తిరిగి ఖండవల్లి వెళ్లిపోదామని ఉద్దేశంతో మోటార్ సైకిల్ టర్నింగ్ తిప్పటంతో అదే సమయంలో రావులపాలెం నుంచి తణుకు వస్తున్న కారు వేగంగా ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. దీనికితో కారు ఢీకొట్టిన వెంటనే అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కన్నీటి సంద్రమైన ఖండవల్లి ప్రమాదం జరిగిందని తెలిసిన ఖండవల్లిలో మూడు కుంటుంబాలు కన్నీటి పర్యతం అయ్యాయి. పండగ రోజు ఎంతో ఆనందంగా గడిపిన ఈ ముగ్గురు స్నేహితులు రాత్రి అయ్యే సమయానికి మృతి చెందటంతో ఆ కుటుంబాలు కన్నీటిలో మునిగిపోయాయి. గ్రామస్తులు ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ కనిపించిన భయానక దృశ్యాలను చూచి కన్నీరు పెట్టుకున్నారు. మృతుడు పోసియ్య భార్య కనకదుర్గ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వరావు తెలిపారు. -
ప్రాణ సంకటంగా బాణసంచా
రాయవరం: దీపావళి పండగ అంటే చిన్నా, పెద్దా అందరికీ ఆనందమే. ఈ నెల 21న దీపావళి పర్వదినం జరుపుకునేందుకు జనం సన్నద్ధమవుతున్నారు. అయితే జీవితంలో వెలుగులు నింపాల్సిన దీపావళి పండగ..కొందరి స్వార్థంతో చీకట్లును తెస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా, అజాగ్రత్తగా బాణసంచా తయారీ, నిల్వలు చేస్తుండడంతో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా ఇలాంటి దుర్ఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. దీపావళి పండగ అంటేనే బాణసంచా కాల్చడం. లైసెన్స్ పొందినవారు బాణసంచా తయీరీలో నిమగ్నమయ్యారు. అధికారికంగా బాణసంచా తయారీ చేసే వారికంటే అనధికారికంగా చేసేవారు ఎక్కువ. గతంలో అధికారికంగా బాణసంచా తయారీ చేసే కేంద్రాలతో పాటు అనధికారికంగా బాణసంచా తయారీ చేసే చోట కూడా ప్రమాదాలు సంభవించి అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. 45 వరకు బాణసంచా తయారీ కేంద్రాలు దీపావళికే కాక పలు సందర్భాల కోసం బాణసంచా తయారు చేస్తుంటారు. ప్రస్తుతం దీపావళికి బాణసంచా తయారు చేసే పనిలో జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వేట్లపాలెం, జువ్విపాడు, ద్రాక్షారామ, వేళంగి, రాయవరం, వి.సావరం, కొమరిపాలెం, బిక్కవోలు, మండపేట తదితర ప్రాంతాల్లో తయారీ కేంద్రాలున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడి వ్యాపారులకు చేతినిండా పని ఉంటుంది. బాణసంచా తయారీ కోసం ఫారమ్ 20, కేవలం అమ్మకం కోసం ఫారమ్ 24 జారీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50కి పైగా లైసెన్స్డ్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. అతి పెద్ద ఘటన అదే బాణసంచా తయారీ సందర్భాల్లో అనేక ప్రమాదాలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. జిల్లాలోని మండపేట, జువ్విపాడు, ద్రాక్షారామ, కొమరిపాలెం, రాయవరం, బిక్కవోలు, యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప తదితర చోట్ల బాణసంచా కేంద్రాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే వాకతిప్పలో 2014 అక్టోబర్ 22వ తేదీన చోటు చేసుకున్న ఘటన జిల్లాలోనే అతి పెద్ద దుర్ఘటనగా చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద ఘటన అనేక లోపాలను ఎత్తిచూపింది. గతేడాది మండపేట మండలం ఏడిదలో దీపావళి ముందు రోజు జరిగిన దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో తాము నిర్వహిస్తున్న కిరాణా షాపులో బాణసంచా పేలి భార్యాభర్తలు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి మృతిచెందారు. అనధికార నిల్వలతోనే.. బాణసంచా తయారీకి పేరొందిన తమిళనాడులోని శివకాశి నుంచే రాష్ట్రానికి ఎక్కువగా సరకు దిగుమతి అవుతుంది. చైనా బాణసంచా కూడా అధికంగానే దిగుమతి చేసుకుంటున్నారు. పలువురు వ్యాపారులు దీపావళికి బాణసంచాను దిగుమతి చేసుకుని నిల్వలు పెట్టుకుంటారు. నిబంధనలు అతిక్రమించి గోడౌన్లలో నిల్వలు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బాణసంచా గొడౌన్ ఏర్పాటు చేయాలంటే ఫారం–26 ప్రకారం అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంది. జనావాస ప్రాంతంలో బాణసంచా నిల్వలు ఏర్పాటు చేయరాదు. అగ్నిమాపక నిబంధనలు పాటిస్తూ, గ్రామ శివారు ప్రాంతాల్లోనే బాణసంచా కేంద్రాలను నెలకొల్పాలి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవేమీ పాటించకుండా కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది లైసెన్స్‌లు పొందకుండానే జనావాసాల మధ్య అవగాహన లేకుండా అనధికారికంగా బాణసంచా తయారు చేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అనధికార తయారీదారులతోనే సమస్య జిల్లాలో లైసెన్స్ పొందిన బాణసంచా తయారీదారులు కచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని పలువురు అనధికారికంగా జనావాసాల మధ్య బాణసంచా తయారు చేయడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీస్, ఫైర్ అధికారులు వచ్చి తరచుగా తనిఖీలు చేపడుతున్నారు. – వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి, గౌరవ అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీ యజమానుల సంఘం, రాయవరం. రాజీపడే ప్రసక్తి లేదు బాణసంచా తయారీ కేంద్రాలు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి. అప్పుడే రెన్యువల్ లైసెన్స్‌లకు సిఫారసు చేస్తాం. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అధికారిక తయారీ కేంద్రాల్లో తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. అనధికారికంగా తయారు చేస్తున్నట్లుగా సమాచారం ఉంటే మా దృష్టికి తీసుకుని రావాలి. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం. బాణసంచా తయారీదారులు పాటించాల్సిన నిబంధనలు బాణసంచా తయారీ కేంద్రం చుట్టూ 9 మీటర్ల ఖాళీ స్థలం ఉంచాలి. అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వర్తించేందుకు అనువుగా నాలుగువైపులా 9 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలి. గ్రామ పంచాయతీ, పట్టణాలకు 1.5 కిలోమీటర్లలోపు మందుగుండు సామగ్రి తయారు చేయకూడదు. బాణసంచా తయారుచేసే ప్రదేశాల్లో అగ్నినిరోధక పరికరాలు ఉండాలి. షెడ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటిరీయల్ కనీసం రెండు గంటల పాటు అగ్నిని నిరోధంచగలగాలి. షెడ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గుమ్మాలు కనీసం 100 సెంటీమీటర్ల వెడల్పు, 200 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. తయారీ కేంద్రంలో ఆటోమెటిక్ వెంటిలేషన్ సిస్టమ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. 18 ఏళ్లలోపు పిల్లలను, మహిళలను బాణసంచా తయారీకి ఉపయోగించకూడదు. అక్కడ పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఫైర్‌ఫైటింగ్ కోర్సులో ప్రాథమిక శిక్షణ తీసుకుని ఉండాలి. తయారీ కేంద్రం విస్తీర్ణాన్ని బట్టి 5 కిలోల సామర్థ్యం ఉన్న డ్రై పౌడర్ ఎస్టింగ్విషర్ (అగ్నిమాపక సిలిండర్)లు నాలుగు సిద్ధంగా ఉండాలి. ఐదు ట్రక్కుల పొడి ఇసుకను కూడా ఆ ఆవరణలో సిద్ధంగా ఉంచాలి. ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి అవసరమైన నీటి కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. మంటలు, అగ్నిని సష్టించే ద్రవ పదార్థాలు (పెట్రోలు, డీజిల్ వంటివి) ఎట్టి పరిస్థితుల్లోనూ తయారీ కేంద్రాల్లో నిల్వ ఉంచకూడదు. తయారీ కేంద్రంలో విద్యుద్దీకరణలోను జాగ్రత్తలు పాటించాలి. వైర్లను బహిరంగంగా ఉంచకూడదు. వైర్ల జాయింట్లు ఎక్కడా ఉండకూడదు. తయారీ కేంద్రంలో వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలి. నీరు, పొడి ఇసుకను నింపిన బకెట్లు సిద్ధంగా ఉంచాలి. బయటి వ్యక్తులు అక్కడికి వెళ్లకుండా చూడాలి. అత్యవసర సమయంలో అలారం మోగించేందుకు, అవసరమైతే లోపలి వారిని బయటకు తీసుకువచ్చేందుకు తగినంత సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి. అగ్నిప్రమాద సమాచారాన్ని అత్యవసరంగా తెలియజేసేందుకు ఫోన్లు అందుబాటులో ఉంచాలి. మండుతున్న బాణసంచాను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఉంచకూడదు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అందులో మందులు సిద్ధంగా ఉంచాలి. ఈ నిబంధనలను పాటించకుంటే లైసెన్సు రద్దు అవుతుంది. ఎక్స్‌ప్లోజివ్ యాక్టు ప్రకారం బాణసంచా తయారు చేసే షెడ్లు, ప్లాట్ఫారం తగినంత దూరంలో ఉండాలి. తయారీ కేంద్రాలపై నిఘా అవసరం ప్రమాదాల నుంచి పాఠాలు నేర్వాలి ఈ నెల 21న దీపావళి పర్వదినం ప్రమాదాల్లో కొన్ని.. తేదీ ఊరు మృతులు 2012 డిసెంబర్ 30 వి.సావరం (రాయవరం) 3 2014 అక్టోబర్ 22 వాకతిప్ప(యు.కొత్తపల్లి) 18 2015 జూలై 22 పలివెల (కొత్తపేట మండలం) 5 2025 సెప్టెంబర్ 30 విలస (అయినవిల్లి మండలం) 2 -
అంబరాన్నంటిన దసరా సంబరాలు
● గగుర్పాటు కలిగించిన చెడీ తాలింఖానా విన్యాసాలు ● కత్తులు తిప్పిన ప్రజాప్రతినిధులు అమలాపురం టౌన్: విజయ దశమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన అమలాపురం దసరా ఉత్సవాలు, ఊరేగింపుల సంబరాలు గురువారం అంబరాన్నంటాయి. పట్టణంలోని ఏడు వీధులైన కొంకాపల్లి, మహిపాల వీధి, నల్లా వీధి, గండువీధి, రవణం వీధి, శ్రీరామపురం, రవణం మల్లయ్యవీధిలకు చెందిన దేవతా మూర్తుల వాహనాలతో ఊరేగింపులు వైభవంగా జరిగాయి. జిల్లావాసులతో పాటు సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారంతా అమలాపురానికి తరలివచ్చి దసరా ఊరేగింపులను కన్నులారా వీక్షించారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఏడు వీధుల ఊరేగింపుల సమ్మేళనంతో ఉత్సవాలు జరిగాయి. ఊరేగింపుల్లో చెడీ తాలింఖానా ప్రదర్శనలు ఉత్కంఠభరితంగా, గగుర్పాటు కలిగించేలా సాగాయి. కళ్లకు గంతలు కట్టుకుని నేలపై పడుకున్న వ్యక్తి పొట్ట, గొంతుపై కొబ్బరి కాయలు, కూరగాయలు ఉంచి పట్టా కత్తితో నరికే సన్నివేశాలను చూసేందుకు పలువురు ఎగబడ్డారు. అగ్గి బరాటాల విన్యాసాలు, లేడి కొమ్ములు, బల్లేలతో పోరాటాలు, కర్రసాము ప్రదర్శనలతో ఊరేగింపులు హోరెత్తాయి. రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీలు గంటి హరీష్ మాధుర్, సానా సతీష్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పలు వీధుల దసరా ఊరేగింపుల్లో పాల్గొని కొద్దిసేపు సరదాగా కత్తులు తిప్పారు. అమలాపురానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ కూడా ఊరేగింపుల్లో పాల్గొని సరదాగా కత్తులు, కర్రలు తిప్పారు. ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో దాదాపు 500 మంది పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఏడు వీధుల ఊరేగింపుల వద్ద అడుగడుగునా పోలీసులు వలయంగా మోహరించి ఆయుధాల ప్రదర్శనలతో సాగిన చెడీ తాలింఖానా బృందాలను పర్యవేక్షించారు. ఏడు వీధుల ఊరేగింపులతో అమలాపురం పట్టణం కత్తుల సవ్వడితో హోరెత్తింది. చెడీ తాలింఖానా ప్రదర్శనలకు తోడు ప్రతి వీధి ఊరేగింపులో శక్తి వేషాలు, తీన్ మార్ డప్పులు ఇలా ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఉత్సవాలు జరిగాయి. అమలాపురంలో ఊరేగింపులు సాగిన మెయిన్ రోడ్లన్నీ జనం రద్దీతో నిండిపోయాయి. ఇళ్ల అరుగులుపై, డాబాలపై ఎటు చూసినా ఊరేగింపులను జనం ఉత్కంఠగా, ఉత్సాహంగా తిలకించారు. ఊరేగింపులను వీక్షించిన డీఐజీ ఏడు వీధుల దసరా ఊరేగింపుల సమ్మేళనాన్ని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ శుక్రవారం తెల్లవారుజామున వీక్షించారు. గడియారం స్తంభం సెంటరులోని పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వద్ద ఐజీ, ఎస్పీ, ఏఎస్పీలు ఊరేగింపులను దాదాపు గంటన్నర సమయం పాటు వీక్షించారు. ఊరేగింపుల్లో భాగంగా రవణం వీధి మహిషాసుర మర్దినీదేవి ఉత్సవ వాహనానికి ఐజీ, ఎస్పీలు ప్రత్యేక పూజలు చేశారు. -
సచివాలయం తరలింపుపై ఆందోళన
తాళ్లపూడి (కొవ్వూరు): అధికారులు, టీడీపీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ సచివాలయాన్ని తరలిస్తున్నారంటూ కొవ్వూరు పట్టణంలో ప్రజలు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక ఐదో వార్డులో ఉన్న సచివాలయం వద్ద 5, 6 వార్డుల ప్రజలు నిరసన తెలిపారు. ఐదో వార్డు సచివాలయాన్ని ఏడో వార్డుకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీకి చెందిన ఐదో వార్డు కౌన్సిలర్ మద్దిపట్ల సాయిగీత, స్థానిక మహిళలు మాట్లాడుతూ, 5, 6, 7 వార్డులకు ఉమ్మడిగా ఉన్న సచివాలయాన్ని తమ ప్రాంతానికి దూరంగా ఉన్న ఏడో వార్డుకు మార్చడం తగదన్నారు. ఎవరి అభిప్రాయమూ తీసుకోకుండా కౌన్సిల్లో తీర్మానం చేసి తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సచివాలయం తరలింపుపై నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు, స్థానికుల అభిప్రాయాలు తీసుకోవాలని, అలా చేయకుండా ఇస్టానుసారం మార్చడమేమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న భవనానికి రూ.4,500 అద్దె చెల్లిస్తున్నారని, దీనిని ఏడో వార్డులోని భవనానికి రూ.8 వేలకు పెంచారని ఆరోపించారు. అక్కడ ప్రజలు కూడా తక్కువగా ఉన్నారని, ఈ రెండు వార్డుల్లోనే అధిక శాతం ఉన్నారని తెలిపారు. సచివాలయం మార్పును ఉపసంహరించుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. సచివాలయం మార్పు వద్దని కోరుతూ వైఎస్సార్ సీపీ వార్డు కౌన్సిలర్, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, సాయిగీత, ఆమె భర్త దొరబాబు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు చిట్టూరి అన్నవరం తదితరులు మున్సిపల్ కమిషనర్‌కు, ఇతర అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. -
6 నుంచి విద్యుత్ ఉద్యోగుల రెండో విడత ఆందోళన
రాజమహేంద్రవరం రూరల్: సమస్యల పరిష్కారంలో యాజమాన్యం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా రాష్ట్ర పవర్ జేఏసీ పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 6 నుంచి రెండో విడత ఆందోళనలు నిర్వహించనున్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా బొమ్మూరులోని ఏపీ ట్రాన్స్‌కో సర్కిల్ ఎస్ఈ (ఆపరేషన్స్, మెయింటెనెన్స్) ఎ.రమేష్‌కు శుక్రవారం నిరవధిక సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జగతా అచ్యుత రామయ్య మాట్లాడుతూ, గత నెల 15 నుంచి 22వ తేదీ వరకూ దశల వారీ ఆందోళనలు చేసినప్పటికీ విద్యుత్ సంస్థల యాజ మాన్యం పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 6న విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద, 8న ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ వద్ద ధర్నాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ నెల 13న చలో విజయవాడ, 14న వర్క్ టు రూల్, 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని తెలిపారు. వైఎస్సార్ సీపీలో పలువురికి పదవులు సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని అధిష్టానం పలు హోదాల్లో నియమించింది. పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సభ్యులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు, మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామినాయుడు, మేడా గురుదత్తప్రసాద్లను నియమించారు. ఆన్లైన్లో ఎన్ఎంఎంఎస్ పరీక్ష దరఖాస్తులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే డిసెంబర్ 7న జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ నుంచి దరఖాస్తులు పొందవచ్చన్నారు. దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకూ పొడిగించారన్నారు. పరీక్ష రుసుం 16వ తేదీలోగా చెల్లించాలన్నారు. ప్రింటెడ్ నామినల్ రోల్, ఒరిజినల్ ఎస్బీఐ కలెక్ట్ రశీదును తమ కార్యాలయంలో 18వ తేదీలోగా సమర్పించాలన్నారు. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ, 7వ తరగతిలో 55 శాతం మార్కులు, కుటుంబ వార్షికాదాయం రూ.3.50 లక్షల్లోపు ఉన్న విద్యార్థులందరూ ఈ పరీక్షకు అర్హులని వివరించారు. పరీక్ష రాసే సమయానికి అన్ని ధ్రువపత్రాలూ సిద్ధం చేసుకోవాలన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలని వాసుదేవరావు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కొప్పవరం పంచాయతీ ప్రథమం అనపర్తి: జాతీయ స్థాయిలో కొప్పవరం పంచాయతీ ప్రథమ స్థానంలో నిలిచిందని సర్పంచ్ కర్రి బులిమోహనరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా సర్పంచులు తమ అభిప్రాయాలు పంచుకోవడానికి భారతీయ నాణ్యతా మండలి (బీఐఎస్) సర్పంచ్ సంవాద్ పేరిట ఒక మొబైల్ అప్లికేషన్ ప్రారంభించింది. ఈ యాప్‌లో ప్రతి నెలా ఏదో ఒక అంశం నిర్దేశించి, ఆయా గ్రామాల్లో సర్పంచులు సాధించిన పురోగతిపై వీడియో రూపంలో పోటీలు నిర్వహిస్తోంది. గత నెలకు సంబంధించి గ్రామ పంచాయతీల సొంత ఆర్థిక వనరులు (ఓఎస్ఆర్) అనే అంశంపై ఈ పోటీ నిర్వహించింది. గ్రామ పంచాయతీ పరిధిలో కొప్పవరం నుంచి లక్ష్మీనరసాపురం రోడ్డు మార్జిన్లో ఉపాధి హామీ పథకం ద్వారా 2021లో కొబ్బరి మొక్కలు నాటి ఆదాయం సమకూర్చుకోవడానికి చేసిన కృషిని ఈ పోటీలో వీడియో రూపంలో వివరించామని సర్పంచ్ బులిమోహనరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 75 వేల మంది సర్పంచులు ఈ పోటీలో పాల్గొనగా కొప్పవరం ప్రథమ స్థానం సాధించింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాలకు చెందిన సర్పంచ్‌లు ఎంపికయ్యారని బులిమోహన్‌రెడ్డి తెలిపారు. ఆ మేరకు సంస్థ ప్రశంసాపత్రం పంపించిందని చెప్పారు. -
సౌత్ ఏషియన్ బాక్సింగ్‌కు యోగితాకుమారి
మామిడికుదురు: ఎస్జీఎఫ్ఐ సౌత్ ఏషియన్ బాక్సింగ్ పోటీలకు గెద్దాడ గ్రామానికి చెందిన చిట్టూరి యోగితాకుమారి ఎంపికై ంది. ఈ పోటీలు త్వరలో బెంగళూరులో జరుగుతాయని జాతీయ బాక్సింగ్ కోచ్ చిట్టూరి చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. సీఐఎస్సీఈ జాతీయ బాక్సింగ్ పోటీలు గత నెల 25 నుంచి 27 వరకు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జరిగాయి. ఆ పోటీల్లో 48 కిలోల విభాగంలో యోగితాకుమారి బంగారు పతకం గెలుపొందిందని చంద్రశేఖర్ తెలిపారు. తద్వారా సౌత్ ఏషియన్ బాక్సింగ్ పోటీలకు ఎంపికై ందన్నారు. యోగితాకుమారి ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు. రైల్వే ఫ్లై ఓవర్ కింద యువకుడి మృతదేహం గుర్తు పట్టలేనంతగా ముఖంపై గాయాలు తుని: పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్ కింద నర్సీపట్నం బస్టాండ్ సమీపంలో యువకుడి మృతదేహం ఉండటం శుక్రవారం ఉదయం కలకలం రేపింది. దారుణమైన గాయాలతో, ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ శ్రీహరిరాజు, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఇతర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ను, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ముఖంపై ఉన్న గాయాలను బట్టి కొట్టి చంపేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే యువకుడు ఎవరనేది వివరాలు తెలియకపోవడంతో ఈ ఘటన స్థానికంగా జరిగిందా లేక వేరే ప్రాంతంలో కొట్టి చంపి ఇక్కడకు తీసుకొచ్చి పడేశారా? అన్నకోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం ముఖం మీద తప్ప శరీరంపై ఎక్కడ గాయాలు కనిపించడం లేదు. సమీపంలో ఉన్న ఒక మద్యం బాటిల్‌ను పోలీసులు సేకరించి అది ఎక్కడ కొనుగోలు చేసిందనే దానిపై ఆరా తీస్తున్నారు. చనిపోయిన వ్యక్తి సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. సిబ్బంది మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
పీహెచ్సీ వైద్యుల నిరసన ర్యాలీ
రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని పీహెచ్సీ వైద్యులు బుధవారం బొమ్మూరులోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం నుంచి సెంటర్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఫ్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ నేతలు డాక్టర్లు సిరాజ్, భావన, తిరణ్ మాట్లాడుతూ ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పీహెచ్‌సీల్లో వైద్యాధికారులుగా పనిచేస్తున్న వారికి పీజీ సీట్లలో 30 శాతం కోటా ఉండేదన్నారు. దీనిని కూటమి ప్రభుత్వం 15 శాతానికి తగ్గించిందన్నారు. దీనిపై ఆందోళన చేస్తే 20 శాతానికి ప్రభుత్వం పెంచిందన్నారు. దానిని ఒక ఏడాది మాత్రమే అమలు చేసి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో ఉద్యోగంలో చేరిన వైద్యులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదన్నారు. 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వైద్యులకు ప్రమోషన్లు సైతం ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేసే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. ఇప్పటికే పీహెచ్‌సీల్లో అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలను బంద్ చేయడం జరిగిందన్నారు. ఈ నిరసనలో అధిక సంఖ్యలో పీహెచ్సీ వైద్యులు పాల్గొన్నారు. -
పెద్దలకు భయపడి ప్రాణాలు తీసుకున్నారు
పిఠాపురం: గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన యువతీ యువకుల ఆత్మహత్యతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోరన్న అనుమానంతో వారు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఉద్యోగం వస్తే ఇద్దరం ఒకటవ్వాలని ఎన్నో కలలు కన్న వారి ఆశలను ఎవరైనా తుంచేస్తారేమోనని భావించి పోతే కలిసే పోవాలనుకున్నారో ఏమో.. కలసికట్టుగా నిర్ణయం తీసుకుని తనువు చాలించారు. దుర్గాడకు చెందిన గొల్లపల్లి దీప్తి (17)ని కొమ్మూరి అశోక్ (25) అనే యువకుడు సామర్లకోటలో గొంతు కోసి చంపి, అనంతరం తాను సైతం ఆత్మహత్య చేసుకున్న ఘటనతో బుధవారం దుర్గాడలో కలకలం రేపింది. సామర్లకోట పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన సమాచారం మేరకు అశోక్‌కు తల్లి, తండ్రి, అక్క ఉండగా దీప్తికి తల్లి, తండ్రి, తమ్ముడు ఉన్నారు. దీప్తి ఇంటర్ చదువుతుండగా అశోక్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ పేద కుటుంబాలకు చెందిన వారే. కులాంతర ప్రేమే ప్రాణాలు తీసిందా? ఆ యువతీ యువకులిద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అశోక్‌కు 20 రోజుల క్రితం చైన్నెలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరి దసరాకు సెలవుపై మంగళవారం తన స్వగ్రామం దుర్గాడ వచ్చాడు. దీప్తి సైతం సెలవుల సందర్భంగా కాకినాడలో తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. మంగళవారం రాత్రి తన బంధువులతో కలిసి కాకినాడలో షాపింగ్‌కు వెళ్లిన దీప్తికి తన అక్క ఫోన్‌కు అశోక్ మెసేజ్ చేసినట్టు తెలిసింది. దీంతో ఆమె తన స్నేహితురాలి నుంచి మెసేజ్ వచ్చిందని, వెళ్లి వస్తానంటూ కాకినాడలో తన కూడా వచ్చిన వారికి చెప్పి వెళ్లింది. అయితే ఎంత సేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో కంగారు పడిన ఆమె భందువులు ఆమె కోసం గాలించారు. ఇదే సమయంలో అశోక్ తాను చనిపోతున్నానంటూ తన బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వారంతా అతని కోసం గాలింపు ప్రారంభించారు. అతని సెల్ స్విచ్ ఆఫ్ వారంతా కంగారు పడ్డారు. బుధవారం ఉదయానికి వారిద్దరు మృతి చెందినట్లు సామర్లకోట పోలీసులు ద్వారా సమాచారం అందింది. కాగా కొంత కాలంగా వీరు ప్రేమించుకుంటున్నట్టు చెప్తున్నారు. తనకు ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకోవచ్చని నిర్ణయించుకున్నారని, ఈ నేపథ్యంలో అశోక్‌కు ఉద్యగం రావడంతో పెళ్లి ప్రసక్తి తీసుకురాగా ఇద్దరివీ వేరే సామాజిక వర్గాలు కావడంతో ఇంటి దగ్గర వారు ఒప్పుకోరన్న భయంతో ఈ అఘయిత్యానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రేమజంట ఆత్మహత్యతో దుర్గాడలో విషాదఛాయలు -
కుక్క కడుపులో రాళ్ల తొలగింపు
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం కంబాలచెరువు ప్రాంతానికి చెందిన కోన పరసురామన్కు చెందిన నాలుగేళ్ల మినీ పమేరియన్ డాగ్‌కు స్థానిక ఏరియా పశు వైద్యశాలలో శస్త్ర చికిత్స చేసి కడుపులో ఉన్న వంద గ్రాముల బరువైన రాళ్లను తొలగించారు. పశు వైద్యశాల సహాయ సంచాలకుడు సత్యనారాయణ నేతృత్వంలో డాక్టర్లు యోగానంద్, రాజశేఖర్ల బృందం కుక్కకు స్కానింగ్ చేసి రాళ్లు ఉన్నట్లు గుర్తించి బుధవారం శస్త్రచికిత్స వాటిని తొలగించారు. నాలుగు కిలోల బరువు కల్గిన ఆ కుక్క కడుపులో 100 గ్రాముల బరువున్న రాళ్లను తీశారు. వంశపారంపర్యంగా, తక్కువ నీరు తాగడం, మాంసాహార అలవాట్లు వల్ల ఈ స్టోన్స్ వస్తుంటాయని సత్యనారాయణ తెలిపారు. -
వరి చేలపై తెగుళ్ల దాడి
● వాతావరణంలో వచ్చిన మార్పులే కారణం ● సస్యరక్షణ చర్యలు వెంటనే చేపట్టాలి ● ఏరువాక శాస్త్రవేత్త నరసింహరావు పెరవలి: అధిక వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల వలన వాతావరణంలో వచ్చిన మార్పులతో వరి చేలపై తెగుళ్లు ఆశించటంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో వరిని ఖరీఫ్ పంటగా 1.85 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా నిడదవోలు నియోజకవర్గంలో 36 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఈ పంటపై ఆశించే తెగుళ్లు, వాటి నివారణ చర్యలపై జిల్లా ఏరువాక శాస్త్రవేత్త సీహెచ్ వి నర్శింహరావు వివరించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఎండ, చల్లదనం వల్ల ఖరీఫ్ వరి పంటపై ఎండాకు తెగులు, సుడిదోమ, తుప్పు తెగులు, మాగుడు వంటివి ఎక్కువగా ఆశించాయన్నారు. అధిక వర్షాలు వల్ల తెగుళ్ళను తట్టుకోలేని బీపీటీ 5204, పీఎల్ఏ 1100, ఎంటీయూ 1318, 1282, 1121, 1224 రకాలు, స్వర్ణ, పీఆర్ 126 రకాల సాగులో అధిక నత్రజని వాడకం, పొటాష్ వాడకపోవటం వల్ల తెగుళ్లు వాప్తి చెందుతున్నాయన్నారు. ఎండాకు తెగులు ఈ తెగులు బాక్టీరీయా వల్ల వస్తుంది. ఇది ఆకుల అంచుల నుంచి పసుపురంగుకి మారి క్రమేపీ ఎండిపోతాయి. ఈ తెగులు ఎక్కవగా అధిక వర్షాలు కురిసినప్పుడు, గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఆశిస్తుంది. నివారణ చర్యలు ఈ తెగుళ్ల నివారణకు సరైన మందులు లేవు. బాక్టీరీయాను అరికట్టడానికి కొన్ని రకాల మందులు మాత్రమే ఉన్నాయి. ఎండాకు తెగులు సోకిన చేలు చూస్తుండగానే ఎండిపోతాయి. దీనిని అరికట్టడానికి కాఫర్ ఆక్సీక్లోరైడ్ లేదా కాఫర్ హైడ్రాక్సాడ్ మందును ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన తరువాత మళ్లీ కనిపిస్తే రెండు వారాల తరువాత మరోసారి పిచికారీ చేయాలి. ఈ మందును పిచికారీ చేసినప్పుడు మరో మందును కలిపి వాడకూడదు. మాగుడు లేక పొడతెగులు గ్రామీణ ప్రాంతాల్లో ఈ తెగులును మాగుడు లేక పొడ తెగులు అంటారు. అధిక ఎండలు, గాలిలో తేమ శాతం 90 శాతం ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఇది ఆశించిన చేను చూస్తుండగానే ఎండిపోతుంది. నివారణ చర్యలు పంటలోఎంతమేర ఈ తెగులు సోకిందనేది రైతులు గుర్తించాలి. దీని నివారణకు ఎకరానికి ఎక్సోకొనోజాల్ 400 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. లేదా పిప్రీకొనోజాల్ 200 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 400 మిల్లీలీటర్లు ఒక మిల్లీలీటరుకు 2 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేయాలి. వీటిని రెండవ దఫాగా 15రోజులకు పిచికారీ చేయాలి. తుప్పు తెగులు ఈ తెగులు ఆశించిన వరి ఆకులపై గోధుమ వర్ణంలో తుప్పు పట్టినట్లుగా మచ్చలు ఏర్పడి క్రమేపీ పెద్దవి అయి ఆకులో పత్రహరితం లేకుండా పోతుంది. ఇలా అవ్వటం వల్ల ఆకులు ఎండిపోయి క్రమేపీ దుబ్బు కూడ ఎండిపోతుంది. ఈ తెగులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే చూస్తుండగానే చేను ఎండిపోతుంది. నివారణ చర్యలు ఎకరానికి కార్బండిజమ్ 250 గ్రాములు తీసుకుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారించవచ్చు. పిచికారీ చేసిన వారం రోజులకు మచ్చలు ఇంకా ఉంటే మరో దఫా పిచికారీ చేయాలి. అగ్గి తెగులు ఈ తెగులు గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు వ్యాప్తి చెందుతుంది. ఇది ఆశించిన చేలు ఆకులపై ముదురు గోధుమ మచ్చలు, ఆకులు ఎండిపోయి తగులబడినట్లుగా కనిపిస్తాయి. వెన్ను మెడభాగంలో ఈ తెగులు వ్యాపిస్తుంది. వెన్ను విరిగిపోతుంది. అంతేకాకుండా ఎరువుల్లో నత్రజని ఎక్కువైనప్పుడు కూడ ఈ తెగులు ఆశిస్తుంది. నివారణ చర్యలు ఈ తెగులు ఆశించిన చేల చుట్టూ గట్లపై గడ్డిని నివారించాలి. ట్రైసెక్లోజోల్ 6 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారించవచ్చు. సుడిదోమ సుడిదోమ కాండం మొదలకు చేరి రసం పీల్చివేయటంతో ఆకులు పసుపు రంగులోకి మారిపోయి సుడులు సుడులుగా ఎండిపోతుంది. దీనిని త్వరగా అరికట్టపోతే చేను అంతా ఎండిపోతుంది. నివారణ చర్యలు వరిదుబ్బుకి దోమలు 10 నుంచి 15 ఉంటే ఎకరానికి పై మెట్రోజోల్ 120 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరిదుబ్బుకి 25 నుండి 50 దోమలు ఉంటే ఎకరానికి హితోఫిన్ ప్లాక్స్ 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరిదుబ్బుకి 50 దోమలు దాటితే దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది దీని నివారణకు ఎకరానికి ఎస్పేట్ 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారించవచ్చు. పెరవలిలో ఎండాకు తెగులు సోకి ఎండిపోతున్న వరి చేను ఉసులుమర్రులో సుడి దోమ ఆశించి ఎండిపోతున్న వరిచేను -
జయజయహే మహిషాసుర మర్దిని
నాసి ఫెలోగా నిర్కా డైరెక్టర్ శేషుమాధవ్ ఎంపికఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): అలహాబాద్‌లోని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా (నాసి) ఫెలోగా రాజమహేంద్రవరం ఐసీఏఆర్ –జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిఽశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ ఎన్నికయ్యారు. నాసి సంస్థ 1930లో ప్రొఫెసర్ మేఘనాథ్ సాహా (వ్యవస్థాపక అధ్యక్షుడు) నేతృత్వంలోని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల బృందం స్థాపించిన పురాతన సైన్సు అకాడమీ. భారత ప్రభుత్వ సైనన్స్ – టెక్నాలజీ విభాగానికి చెందిన శాసీ్త్రయ వృత్తిపరమైన సంస్థ. ఇందులోలో నోబెల్ బహుమతి విజేతలు సహా విభిన్న రంగాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు ఫెలోస్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ్యవసాయ రంగం నుంచి కొంతమంది మాత్రమే ఫెలోస్‌గా ఎంపికయ్యారు. వరిలో అగ్గి తెగులు నిరోధక జన్యువులను క్లోనింగ్ చేయడంలో, అగ్గి తెగులు వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో, వాణిజ్య పంటలపై తీసుకున్న నూతన ప్రణాళికలలో చేసిన కృషికి గాను వ్యవసాయ శాస్త్రంలో 2025 సంవత్సరానికి శేషుమాధవ్ నాసి ఫెలోగా ఎంపికయ్యారు. ఈ ఎన్నిక రాజమహేంద్రవరంలోని ఐ.సి.ఎ.ఆర్.– నిర్కా సంస్థకు ఎంతో గౌరవప్రదమైన గుర్తింపుగా భావించవచ్చు. ఉప్పొంగి ఉరికింది గోదావరి!సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి ఉప్పొంగుతోంది. జీవనదికి అతి భారీ వరదలు సంభవించే ఆగస్టు మాసం సైతం దాటిపోయింది. ఇక వరద ముప్పు తప్పినట్లేనంటూ అధికారులు సైతం ఊపిరిపీల్చుకున్నారు. అయితే అనూహ్యంగా గతంలో ఎన్నడూ లేని ఘట్టం ఆవిష్కృతమైంది. సెప్టెంబర్ మాసంలో గోదావరి వరద ప్రవాహం పెరిగింది. గత ఏడేళ్లలో లేని విధంగా ఇన్‌ఫ్లో గత నెలలో నమోదైంది. ఇందుకు తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ తరహా వర్షాలు కురవడమే కారణమని సాగునీటి నిపుణులు వెల్లడిస్తున్నారు. గోదావరి సెప్టెంబర్ మాసంలో ఉధృతంగా ప్రవహించింది. ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా.. గోదావరి పరీవాహక ప్రాంతాలు, తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురవడంతో గోదావరికి వరద ప్రవాహం పోటెత్తింది. ఫలితంగా సెప్టెంబర్ మాసంలో అత్యధిక ఇన్‌ఫ్లో నమోదైంది. ఆ ఒక్క నెలలో 1,587 టీఎంసీల ఇన్‌ఫ్లో నమోదైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఏడేళ్లలో ఇంత భారీ స్థాయిలో ఇన్‌ఫ్లో నమోదవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఏడాది జూన్ మాసం నుంచి ఆగస్టు నాటికి 1,998.787 టీఎంసీల ఇన్‌ఫ్లో నమోదవగా.. ప్రస్తుతం 3,727 టీఎంసీల ఇన్‌ఫ్లో ఉంది. ఈ పరిణాం పంటల సాగుకు ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో వరద గోదావరికి సాధారణంగా ఆగస్టు నెలలో వరద ప్రవాహం పెరుగుతుంది. ఈ సీజన్లో మూడుసార్లు వరదలు వచ్చాయి. గత నెల 21వ తేదీన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి నీటి మట్టం చేరింది. 22న బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి ఉధృతి చేరింది. గత నెల 30 తేదీ నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి నీటి మట్టం చేరింది. గత శనివారం మూడో సారి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరింది. వరద సీజన్ దాదాపు పూర్తి కావస్తున్న తరుణంలో ఈ ఏడాది తక్కువ ఇన్‌ఫ్లో నమోదవుతుందని భావించారు. కానీ సెప్టెంబర్‌లో నమోదైన ఇన్‌ఫ్లోతో ఇక ముందు ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొవాల్సిన పరిస్థితిని నుంచి బయటపడే సూచనలు దర్శనమిస్తున్నాయని సాగునీటి పారుదల నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి ఎగువ నుంచి భారీగా వస్తున్న నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాటన్ బ్యారేజీ వద్ద బుధవారం ఉదయం 10 గంటల సమయానికి నీటి మట్టం 13.50 అడుగులకు చేరింది. 12,42,526 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 13,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఈ ప్రవాహం సాయంత్రానికి మరింతగా పెరిగింది. 13.60 అడుగులకు చేరింది. ఇది రాత్రికి మరింతగా పెరిగే అవకాశం ఉంది. 12,59,482 క్యూసెక్కుల మిగులు జలాలు సముంద్రంలోకి విడుదల చేయగా.. 12,800 క్యూసెక్కుల నీరు డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. పాడి గేదెలను వదలని వ్యాధి తాళ్లపూడి: మండలంలోని పెద్దేవం గ్రామంలో అంతు చిక్కని వ్యాధితో పాడి గేదెలు మృతి చెందుతున్న పరిస్థితులు నేటికీ కొనసాగుతున్నాయి. పశు సంవర్ధక శాఖ అధికారుల పర్యవేక్షణ చేస్తూ వైద్యం అందజేస్తుండడంతో పాటు, కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటన నేపథ్యంలో రైతుల్లో ఒకింత ధైర్యం వచ్చింది. గ్రామంలో మృతి చెందుతున్న చూడి గేదెలు, లేదా ఈనిన పాడి గేదెలు మాత్రమే వ్యాధి బారిన పడుతున్నట్టు గుర్తించి ఆ దిశగా వైద్య సేవలు అందించారు. అయినా ఫలితం లభించడం లేదు. గ్రామంలో 38 గేదెలు ఇప్పటి వరకు వ్యాధి భారిన పడ్డాయి. వైద్యం చేయించుకున్న గేదెలు కూడా రోగం బారిన పడటం సర్వసాధారణంగా మారింది. జిల్లా స్థాయి అధికారులు వచ్చి వెళ్లిన తరువాత మరో ఐదు గేదెలు ప్రమాదం లో పడ్డాయి. తాజాగా రెండు గేదెలు వ్యాధి బారిన పడ్డాయి. దీంతో రైతు ఆందోళన చెందుతున్నారు. సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అమ్మవారి ఆలయాల్లో బుధవారం అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్ర మహోత్సవాలు ముగియనుండటంతో భక్తులు అమ్మవారి దర్శనాలకు పోటెత్తుతున్నారు. రాజమహేంద్రవరంలోని దేవీచౌక్‌లో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దిని దేవిగా అలంకరించారు. విజయవాడకి బయలుదేరే భవానీలు దేవీచౌక్‌లోని అమ్మవారిని దర్శించుకుని వెళ్లారు. సెప్టెంబర్‌లో ఉధృతంగా వరద ప్రవాహం ఒక్క నెలలోనే 1,584 టీఎంసీల ఇన్‌ఫ్లో గడిచిన ఏడేళ్లలో ఇదే తొలిసారి జూన్ నుంచి ఆగస్టు నాటికి 1,998.787 టీఎంసీల ఇన్‌ఫ్లో తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ తరహా వర్షాల వల్లే అంటున్న నిపుణులు సెప్టెంబర్ నెలలో ఇన్‌ఫ్లో... సంవత్సరం ఇన్‌ఫ్లో (టీఎంసీలలో) 2019 1307.367 2020 865.640 2021 1055.275 2022 1218.214 2023 859.877 2024 1330.387 2025 1584.53 0000662982-000001-TALARI VENKATAR 15.00x8.00 TALARI VENKATARAOసెప్టెంబర్‌లో వరద రావడం అరుదు గోదావరికి సెప్టెంబర్ నెలలో రెండు సార్లు వరద రావడం చాలా అరుదు. ఏకంగా 1,584 టీఎంసీల ఇన్ ఫ్లో నమోదు కావడం మరింత అరుదు. గతంలో ఈ స్థాయిలో ఇన్ ఫ్లో వచ్చిన ఉదంతాలు ఉన్నప్పటికీ గత కొన్ని ఏళ్లలో ఇదే తొలిసారి. ఆగస్టు నెలాఖరు వరకు ఉన్న ఇన్ ఫ్లో చూసి గోదావరి డెల్టాలో రబీ పరిస్థితిపై భయం వేసింది. ఇప్పుడు ఇన్ ఫ్లో బాగుంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగనన్‌మోహనన్‌రెడ్డి హయాంలో పోలవరం స్పిల్ వేకు గేట్లు పెట్టడం వల్ల 16 టీఎంసీలకు పైగా నీటి నిల్వ చేసే సౌలభ్యం దక్కింది. దీనివల్ల వచ్చే రబీలో పెద్దగా నీటిఎద్దడి రాకపోవచ్చు. – విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఎస్ఈ, ధవళేశ్వరం ఇరిగేషనన్ సర్కిల్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి
వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ: మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. బుధవారం నగరంలో ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదన్నారు. మెడికల్ విద్య పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండాలని సదాశయంతో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారన్నారు. 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే పూర్తయి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదంటూ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలకు పీపీపీ విధానం ద్వారా ధారాదత్తం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదన్నారు. సంక్షేమ పథకాలు 40 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో వారు బుద్ధి చెబుతారన్నారు. రాజకీయ కక్షలు లేవు అంటూనే లిక్కర్ స్కాం చేశారంటూ ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమ అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా హైవేపై, బడి గుడి ఉన్న ప్రాంతాలలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. విజయదశమి సందర్భం పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఉరకలేస్తున్న వరద గోదావరి
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజ్ వద్ద వరద గోదావరి ఉరకలేస్తుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. డెల్టాలకు సంబంధించి 12,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,400, మధ్య డెల్టాకు 1,900, పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి సమీపానికి 13.60 అడుగులకు చేరకున్న నీటి మట్టం అక్కడ నుంచి అదే స్థాయిలో నిలకడగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి 12,59,482 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి నీటి మట్టాలు తగ్గుతున్నాయి. దీంతో గురువారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం సాయంత్రం భద్రాచలంలో 44.90 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. కాళేశ్వరంలో 11.68 మీటర్లు, పేరూరులో 15.32 మీటర్లు, దుమ్ముగూడెంలో 12.02 మీటర్లు, కూనవరంలో 19.86 మీటర్లు, కుంటలో 10.93 మీటర్లు, పోలవరంలో 12.70 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 16.69 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. ఇంటి వద్దనే పంపిణీ రాజమహేంద్రవరం రూరల్: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను, వృద్ధులు, దివ్యాంగులకు నిత్యావసర సరకులను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం ఉదయం హుకుంపేట గ్రామ పంచాయతీ కాపులపేటలో కొలపాటి మంగయమ్మకు వృద్ధాప్య పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 2,35,502 మంది లబ్ధిదారులకు రూ.103,00,44,500 కేటాయించగా, రాత్రి 7.00 గంటల వరకు 2,20,592 మంది (93.67శాతం) లబ్ధిదారులకు రూ.96.18 కోట్లు పంపిణీ జరిగిందని కలెక్టర్ వివరించారు. డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.వి.వి.ఎస్. మూర్తి, మండల ప్రత్యేక అధికారి/జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్. జ్యోతి, ఎంపీడీవో కె.ఎస్.ఆర్మ్‌స్ట్రాంగ్, పంచాయతీ కార్యదర్శి జి.కాశీవిశ్వనాథ్ పాల్గొన్నారు. అనాథ శిశువు జాడ కోసం... కాకినాడ క్రైం: రోడ్డు పక్కన లభ్యమైన సుమారు నాలుగు నెలలు వయసున్న ఓ అనాథ ఆడ శిశువు జాడ కోసం సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మి బుధవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 31వ తేదీ రాత్రి 10.40 సమయంలో జగ్గంపేట గ్రామ శివారులో రోడ్డు పక్కన ఓ ఆడ శిశువు ఏడుస్తూ ఉండడాన్ని మేడపాడు గ్రామానికి చెందిన వల్లూరి సురేష్ గమనించాడని తెలిపారు. శిశువుని చేరదీసి అనారోగ్యంగా ఉండడాన్ని గుర్తించి కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి, చికిత్స అనంతరం ఆగస్టు 13వ తేదీన శిశు గృహకు అప్పగించాడని పేర్కొన్నారు. అక్కడి సిబ్బంది శిశువుని సంరక్షిస్తుండగా, బాలిక లభ్యతపై గత నెల 24న జగ్గంపేట పోలీసులు జీడీలో నమోదు చేశారన్నారు. శిశువు ఆరోగ్యం మరింత క్షీణించడంతో మళ్లీ జీజీహెచ్‌లో చేర్చామని తెలిపారు. శిశువు రక్త సంబంధీకులు లేదా బంధువులు ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో కాకినాడ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు సమీపంలో ఉన్న పీడీ కార్యాలయ అధికారులను లేదా 0884–2368442, 89191 23488 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఈ నెల ఐదున పంపిణీ చేయనున్న కాత్వా అమలాపురం టౌన్: చదువులో ప్రతిభ కనబరుస్తున్న వెయ్యి మంది పేద కాపు విద్యార్థులకు ఈనెల 5న కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కాత్వా) ఆధర్యంలో రూ.70 లక్షల విలువైన స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు జిల్లా కాత్వా అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాపు నాయకులు అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ చేతుల మీదుగా కాత్వాకు భారీగా విరాళాలు అందజేశారు. అమలాపురంలోని కల్వకొలను వీధిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో తాతాజీకి, కాత్వా ప్రతినిధులకు ఆ మొత్తాలను అందించారు. కాపు నాయకులు తాడి నరసింహారావు, బండిగుప్తాపు పాండురంగారావు, బోనం కనకయ్య, గంధం పల్లంరాజు, త్సవటపల్లి నాగబాబు, జయన సత్తిరాజు బూరి విరాళాలు అందించారు. ఈనెల 5న స్థానిక సత్యనారాయణ గార్డెన్స్‌లో వీటిని పంపిణీ చేయనున్నట్టు కాత్వా జిల్లా ప్రధాన కార్యదర్శి నందెపు శ్రీనివాసరావు తెలిపారు. -
రాజమహేంద్రవరం–తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం
కోరుకొండ: మధురపూడిలోని విమానాశ్రయం నుంచి తిరుపతికి తొలి విమాన సర్వీసు బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ జెండా ఊపి సర్వీసును ప్రారంభించారు. తొలుత వర్చువల్ ద్వారా ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్నాయుడు, ఎంపీ పురందేశ్వరి ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఈ సర్వీసు వారానికి 3 రోజులు నిర్వహిస్తారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఉదయం 7–40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరిన ఈ సర్వీసు 9–25 గంటలకు రాజమహేంద్రవరం చేరుతుందన్నారు. ఇక్కడ నుంచి 9–50 గంటలకు తిరుపతికి బయలుదేరి ఉదయం 11–20 గంటలకు చేరుతుందన్నారు. మొదటి 35 సీట్లు రూ.1,999కు, తర్వాత 35 సీట్లు రూ.4,000కు అందిస్తామన్నారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డువెంకటరమణ చౌదరి, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కె.ఎన్ శ్రీకాంత్, అలయన్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కాకినాడ జిల్లాలో ప్రేమ్మోనాది ఘాతుకం..
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. గొల్లప్రోలు మండలం పనసపాడులో ప్రేమ్మోనాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లేడ్‌తో ప్రియురాలు దీప్తి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు అశోక్.. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.గ్రామానికి చెందిన బాలిక, యువకుడు అశోక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం అర్ధ రాత్రి పనసపాడులోని ఓ ఆలయం వద్దకు బాలికను అశోక్ తీసుకెళ్లాడు. అక్కడ బ్లేడుతో ఆమె గొంతుకోసి హతమార్చాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కిందపడి అశోక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
దుర్గా.. దుర్గతినాశని..
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు ప్రాంతాల్లో అమ్మవారు మంగళవారం దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. పలువురు కుంకుమ పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో శ్రీ బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. అమ్మవారిని సాధారణ భక్తులతో పాటు భవానీదీక్షధారులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లకు ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ మౌనిక హెచ్చరించారు. సమ్మెలో భాగంగా పీహెచ్సీ వైద్యులు బొమ్మూరులోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయం వద్ద మంగళవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ, పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్యాధికారులకు పీజీ సీట్లలో 30 శాతం కోటా ఉండేదని, దీనిని కూటమి ప్రభుత్వం 15 శాతానికి తగ్గించిందని అన్నారు. దీనిపై ఆందోళన చేస్తే 20 శాతానికి పెంచిందన్నారు. దానిని ఒక ఏడాది మాత్రమే అమలు చేసి, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో ఉద్యోగంలో చేరిన వైద్యులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదన్నారు. 20 ఏళ్ల నుంచి పని చేస్తున్న వైద్యులకు ప్రమోషన్లు సైతం ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పీహెచ్‌సీల్లో అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలను బంద్ చేశామని తెలిపారు. ఈ నిరసనలో అధిక సంఖ్యలో పీహెచ్సీ వైద్యులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో దళితులకు అన్యాయం
చంద్రబాబు పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య కళాశాలలు నిర్వహించాలి. అప్పుడే దళితులు, పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువవుతుంది. పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడితే పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారుతుంది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు దారుణం. పేదలు వైద్య విద్య అభ్యసించాలంటే రూ.లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే ఆ అవసరం ఉండదు. ఏ కులంలోని పేదవారికై నా ప్రభుత్వ ఆసుపత్రులు పెద్దాసుపత్రులుగా కనిపిస్తాయి. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – సాలి వేణు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు -
దండెత్తిన దళితులు
రూ.5 వేల కోట్లు పెట్టలేరా బాబూ? పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు కూటమి సర్కారు కుట్ర పన్నుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.8,500 కోట్లు వెచ్చించి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టారు. వీటి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,000 కోట్లు ఖర్చు పెట్టింది. మిగిలిన కళాశాలలకు రూ.5 వేల కోట్లు వెచ్చిస్తే నిర్మాణ పనులు పూర్తయి, పేదలకు వైద్య విద్య అందుతుంది. కూటమి నేతల బినామీల భూములకు రేట్లు పెంచేందుకు అమరావతిలో రూ.లక్ష కోట్ల అప్పు చేస్తోంది. ఆ భారాన్ని రాష్ట్ర ప్రజలపై రుద్దుతోంది. కానీ, పేదలకు ఉచితంగా వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు అప్పు చేసి ఖర్చు పెట్టలేకపోవడమేమిటి? 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు టెండర్లు పిలవడం పేదవాడికి వైద్యాన్ని దూరం చెయ్యడమే. – తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు, విద్యార్థులు కదం తొక్కారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు.. పార్టీ ఎస్సీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సాలి వేణు ఆధ్వర్యాన.. రాజమహేంద్రవరం నగరంలోని గోకవరం బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో నేతలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎవరి మొరా ఆలకించడం లేదని.. మీరైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కలిగించాలని అంబేడ్కర్ విగ్రహానికి వేడుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, ఇతర నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పీపీపీ విధానం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. కార్యక్రమంలో తాళ్లపూడి ఎంపీపీ ముప్పిడి పోసిరాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా శ్రీను, లీగల్ సెల్ కన్వీనర్ కవలల నాగేశ్వరరావు, దాసి వెంకటరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆరే శ్రీను, రాజానగరం అధ్యక్షుడు గొంతు లక్ష్మణరావు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఇరికిమల్లి చిన్న, అనపర్తి చంటి తదితరులు పాల్గొన్నారు.ఫ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఆగ్రహం ఫ వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యాన నిరసన ఫ అంబేడ్కర్ విగ్రహానికి వినతి ఫ నిర్ణయం ఉపసంహరించుకునేంత వరకూ ఉద్యమిస్తామని హెచ్చరిక తాబేదారులకు కట్టబెట్టేందుకే.. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం వెనుక వేరే మతలబు దాగుంది. పెత్తందార్లు, వారి తాబేదార్లకు కట్టబెట్టేందుకే కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తెర పైకి తీసుకొచ్చింది. ప్రభుత్వాలు పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి. రాజ్యాంగం సైతం అదే స్పష్టం చేస్తోంది. వాటిని కూటమి సర్కారు విస్మరిస్తోంది. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. గుత్తేదారులకు సంపద సృష్టించి పెడుతున్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రాన్ని ఒప్పించి వైద్య కళాశాలలు తీసుకొస్తే.. కూటమిలో ఉన్న చంద్రబాబు మాత్రం ప్రైవేటీకరించడం దారుణం. బడుగు బలహీన వర్గాలు బాగు పడకూడదన్నదే చంద్రబాబు అజెండా. – నక్కా శ్రీనగేష్, రాష్ట్ర కార్యదర్శి, రాజమండ్రి రూరల్ పరిశీలకుడు -
ఇదేనా సంపద సృష్టి?
అధికారంలోకి రాక ముందు సంపద సృష్టిస్తా, పేద ప్రజలకు పంచుతా.. అని హామీలిచ్చిన చంద్రబాబు ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే వైద్య కళాశాలలను ప్రైవేటు రంగానికి కట్టబెట్టి వారికే సంపద సృష్టిస్తున్నారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గపు చర్య. మాజీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తాం. గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలను చైతన్యపరుస్తాం. ప్రజల మద్దతు కూడగట్టి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకూ అవిశ్రాంత ఉద్యమాలు చేపడతాం. – తిరగట్టి దుర్గారావు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు, రాజమహేంద్రవరం -
మళ్లీ గోదావడి
ధవళేశ్వరం: ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదావరి ఉరకలెత్తుతోంది. కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం ఉదయం నుంచీ నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉదయం 6 గంటలకు 12 అడుగులుగా ఉన్న నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ రాత్రికి 12.60 అడుగులకు చేరింది. 10,96,937 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. వరద ఉధృతి బుధవారం మరింత పెరిగి, రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి సమీపానికి నీటిమట్టం చేరుకునే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, ఎగువన భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉన్నాయి. ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూము నుంచి ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం 12.55 పేరూరు 16.78 దుమ్ముగూడెం 13.64 భద్రాచలం 50.30 (అడుగులు) కూనవరం 19.65 కుంట 10.72 పోలవరం 12.33 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 16.39 ఎగువన గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో) -
పీహెచ్‌సీల్లో వైద్య సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
రాజమహేంద్రవరం రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పని చేస్తున్న కొంత మంది వైద్యాధికారులు సమ్మెకు దిగిన నేపథ్యంలో ప్రజలకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ కె.వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీహెచ్‌సీల్లో పీజీ వైద్యులు, ఇతర వైద్యాధికారులను నియమించామన్నారు. జిల్లాలో పని చేస్తున్న 25 మందితో పాటు మరో 40 మంది వైద్యాధికారులను విధులకు పంపే ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 104, 108 వాహనాల సేవలు అందిస్తామని చెప్పారు. గ్రామాల్లో ఎంఎల్‌హెచ్‌పీ, సీహెచ్‌ఓల ద్వారా వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ ఆదేశాలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
గురువు మార్గదర్శకత్వం అవసరం
రాయవరం: సన్మార్గం వైపు అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరికీ గురు మార్గదర్శకత్వం అవసరమని, అప్పుడే దైవానుగ్రహానికి దగ్గరవుతామని సాగరఘోష కవి, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఉద్బోధించారు. మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆధ్మాత్మిక ప్రసంగం చేస్తూ తల్లి, తండ్రి, గురువు తర్వాతే దైవం అన్నారు. తల్లిదండ్రులను, గురువును ఆరాధించడం భగవంతుడిని ప్రార్థించడం కంటే గొప్పదన్నారు. ఐశ్వర్యం, భోగభాగ్యాలు అశాశ్వతమని, గురువు చూపిన మార్గంలో పయనిస్తే దైవానుగ్రహానికి దగ్గరవుతారన్నారు. విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) చూపిన దారిలో భక్తులు నడవాలన్నారు. మరో సాహితీవేత్త మహామహాపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అమ్మతత్వాన్ని వివరించారు. పీఠంలో ఆర్డీవోల పూజలు కొత్తపేట, రామచంద్రపురం ఆర్డీవోలు శ్రీకర్, అఖిల దంపతులు మంగళవారం విజయదుర్గా పీఠాన్ని సందర్శించారు. అనంతరం పీఠంలో విజయదుర్గా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో పీఠాన్ని సందర్శించినట్లు తెలిపారు. విజయదుర్గా అమ్మవారి ఆశ్శీస్సులు అందరిపై ఉండాలని, అందరికీ మంచి జరగాలని అమ్మవారిని కోరుకున్నట్టు వారు తెలిపారు. సహస్రావధాని గరికపాటి -
విరిసిన ధరలు!
కడియం: మండలంలోని కడియపులంక అంతర్రాష్ట్ర పువ్వుల మార్కెట్లో దసరా సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాల అలంకరణలో పువ్వుల అలంకరణకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో పువ్వుల ధరలు గతం కంటే మెరుగ్గా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా దసరా అలంకరణలో వినియోగించే బంతి, చామంతి తదితర రకాల ధరలు పెరిగాయని వివరించారు. స్థానికంగా పువ్వుల దిగుబడులు స్వల్పంగానే ఉన్నాయంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచే ఎక్కువగా పువ్వులు దిగుమతి అయ్యాయని వ్యాపారులు తెలిపారు. మంగళవారం కడియపులంక పువ్వుల మార్కెట్లో కేజీ చామంతులు రూ.150 నుంచి రూ.200 ధర పలికాయి. లిల్లీలు రూ.400, మల్లెపువ్వులు రూ.1,500, జాజులు రూ.1,000, కాగడాలు రూ.1,100, బంతి రూ. 100 నుంచి రూ.130, కనకాంబరం బారు రూ.270–రూ.300 ధర పలికాయి. -
ప్రాణాలు తీసిన బాణసంచా
● భార్యాభర్తల మృత్యువాత ● విలస గ్రామంలో విషాద ఛాయలు అయినవిల్లి: దీపావళి పండగకు కిరాణా సామగ్రితో పాటు బాణసంచా అమ్ముకుని నాలుగు రూపాయలు వెనుక వేసుకుందామనే ఆశ ఆ భార్యాభర్తలను బలిగొంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలం విలస గ్రామంలో బాణసంచా పేలి కంచర్ల శ్రీనివాసరావు (51). అతని భార్య సీతామహా లక్ష్మి(46) మృత్యువాత పడ్డారు. కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఆ దంపతులు గతేడాది దీపావళికి అమ్మగా మిగిలిన బాణసంచా సామగ్రిని ఇంటి అటక పై నుంచి తీసి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి వారి ఇంటిపై శ్లాబు, ప్రహరీ కూలింది. పక్కనున్న ఇల్లు కూడా దెబ్బతింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృత్యు ఒడికి చేరారు. వారి కుమారుడు ప్రదీప్ గాయపడ్డాడు. అతనిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అమలాపురం ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ సుంకర మురళీకృష్ణ, సీఐ ఆర్. భీమరాజు, ఎస్ఐ హరికోటి శాస్త్రి పరిళీలించారు. శిథిలాల కింద చిక్కుకున్న భార్యాభర్తల మృతదేహాలను అంబులెన్స్‌లో అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయినవిల్లి ఎస్సై హరికోటిశాస్త్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోవాలి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పి.గన్నవరం నియోజక వర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. లైసెన్సు కలిగిన గోడౌన్స్లోనే బాణసంచా భద్రపరచాలి: ఎస్పీ బాణసంచా సామగ్రి లైసెన్సు పొందిన గోడౌన్స్లోనే భద్రపరచాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. లైసెన్సు లేకుండా బాణసంచా సామాగ్రి నిలువ ఉంచడం, తయారు చేయడం నేరమన్నారు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుండా ఇలా బాణసంచా నిలువ ఉంచితే ఇటువంటి ప్రమాదాలే ముంచుకొస్తాయని ఆయన హెచ్చరించారు. శిథిలాల మధ్య ఉన్న కంచర్ల శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటకు తీసి అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు, స్థానికులు పేలుడు శబ్దానికి కూలిన ఇంటి శ్లాబు, ప్రహరీ ప్రమాద స్థలంలో గుమిగూడిన గ్రామస్తులు -
డీఎస్సీలో విజయం సాధించిన హాకీ క్రీడాకారులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): డీఎస్సీ–2025లో కాకినాడ జిల్లా క్రీడామైదానంలో హాకీ కోర్టులో కోచ్ రవిరాజు వద్ద తర్ఫీదు పొందుతున్న నలుగురు క్రీడాకారిణులు పీఈటీలుగా ఉద్యోగాలు సాధించారు. జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన జి.వరలక్ష్మి, డీఎస్ సింధు దేవి, ఎస్.పరంజ్యోతి, కె.భారతి ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. వీరు అనేకసార్లు రాష్ట్ర చాంపియన్‌షిప్ సాధించిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగాలు సాధించిన క్రీడాకారిణులను, తర్ఫీదునిచ్చిన కోచ్ రవిరాజును డీఎస్డీఓ బి.శ్రీనివాస్‌కుమార్ మంగళవారం డీఎస్‌ఏలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
పి.గన్నవరం: స్థానిక ఏటిగట్టు సెంటర్లో మంగళవారం సాయంత్రం లారీ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై బి.శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడకు సమీపంలోని బట్టాయగూడెంనకు చెందిన షేక్ నాగూర్ మీరా (50) 15 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి డీఎస్ పాలెంలో నివసిస్తున్నాడు. మంగళవారం, శుక్రవారాల్లో అతడు షాపుల వద్ద సాంబ్రాణి పొగ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక ఏటిగట్టు సెంటర్లో షాపుల వద్ద సాంబ్రాణి పొగ వేసి, మూడు రోడ్ల సెంటర్‌కు సైకిలుపై వస్తుండగా అతడిని వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో అతడి తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోవడంతో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద స్థానికులు అడ్డుకుని లారీని ఆపారు. మృతదేహం వద్ద అతడి భార్య జీ బాషా బోరున విలపించింది. అందరితో కలివిడిగా ఉండే నాగూర్ మీరా ప్రమాదంలో మృతి చెందడంతో స్థానిక వ్యాపారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివకృష్ణ వివరించారు. రైల్వే ప్లాట్‌ఫాంపై గుర్తు తెలియని వ్యక్తి.. తుని రూరల్: అన్నవరం రైల్వే రెండవ ప్లాట్‌ఫాంపై గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్టు గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ తుని ఎస్సై పి.వాసు మంగళవారం తెలిపారు. ప్లాట్‌ఫాంపై బెంచీ కింద మరణించి ఉన్న వ్యక్తి శరీరంపై నలుపు రంగు టీ షర్టు, నీలం రంగు ట్రాక్ ఉన్నాయన్నారు. మృతుడికి కొంతదూరంలో కాఫీ రంగు బ్యాగ్ ఉందన్నారు. ఎవరైన గుర్తిస్తే జీఆర్పీకి 9490619020 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. హెచ్‌సీ మోహన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాం తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భద్రపర్చామన్నారు. పాము కాటుకు మహిళ.. ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలంలోని బురదకోట గిరిజన గ్రామ పంచాయతీలోని ధారపల్లిలో పాము కాటుకు గురైన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. స్థానిక పోలీసుల కథనం మేరకు బురదకోట గిరిజన గ్రామ పంచాయతీలోని బాపన్నధారకు చెందిన బుట్టారి సన్యాసిరావు, లోవకుమారిలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు ధారపల్లిలో నివాసం ఉంటున్నారు. ఎప్పటి మాదిరిగానే సోమవారం రాత్రి బుట్టారి లోవకుమారి తన ఇంటిలోనే నేలపై నిద్రపోయింది. మంగళవారం తెల్లవారుజామున పాము కాటుకు గురైంది. ఆమెను బంధువులు ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు భర్త బుట్టారి సన్యాసిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నోట్ల పెళపెళ.. లక్ష్మీ కళకళ!
పిఠాపురం: మండలంలోని రాపర్తిలో వేంచేసియున్న దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని రూ.15 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు. శ్రీ దుర్గాదేవిగా మాణిక్యాంబ రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు మంగళవారం మాణిక్యాంబా అమ్మవారి మట్టి ప్రతిమకు శ్రీ దుర్గాదేవి అలంకరణ చేశారు. సరస్వతీదేవి, ఐశ్వర్యలక్ష్మిగా..అయినవిల్లి: మండలంలోని నల్లచెరువు గ్రామంలో కొలువైన శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పద్మావతి అమ్మవారు మంగళవారం సరస్వతీదేవి, ఐశర్యలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ వేద పండితులు ఉదయం అమ్మవారిని పెన్నులతో సరస్వతీదేవిగా అలంకరించారు. మధ్యాహ్నం అమ్మవారిని రూ.10లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణకు రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లను ఉపయోగించారు. -
అంతర పంటగా అశ్వగంధను సాగు చేయొచ్చు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆయిల్‌పామ్ తోటల్లో మూడేళ్ల వరకూ అశ్వగంధను అంతర పంటగా సాగు చేయవచ్చని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. సోమవారం తెలంగాణ ఆయిల్ సీడ్ ఫెడరేషన్ సంస్థ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని నిర్కాను సందర్శించి అశ్వగంధ పంటను ఆయిల్‌పామ్‌లో అంతర పంటగా సాగు చేయడానికి, అధిక దిగుబడులు పొందడానికి, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఉన్న అవకాశాలను విశ్లేషించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శేషుమాధవ్ మాట్లాడుతూ అన్ని నేలల్లో అశ్వగంధ వేయవచ్చని తెలిపారు. అంతే కాకుండా అశ్వగంధ సాగుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి సహకరిస్తామన్నారు. అశ్వగంధ పంట మార్కెటింగ్, బైబ్యాక్ విధానాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. పలు అంశాలను విశ్లేషించి ఆయిల్‌ఫెడ్ సలహాదారుడు ఎ.కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ముసాయిదాను రూపొందించడానికి నిర్ణయించారు. నిర్కా సంస్థ పరిధిలో చేస్తున్న మిరప, పసుపు పంట ఉత్పత్తులను తెలంగాణ ఆయిల్‌ఫెడ్ వారి విజయబ్రాండ్ స్టోర్స్‌లో చేర్చి అమ్మడానికి ఉన్న అవకాశాలను చర్చించి ఎంఓయూ ఏర్పాటు చేసి సంయుక్తంగా ముందుకెళ్లాలని రెండు సంస్థలు నిర్ణయించారు. సమావేశంలో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ అధికారులు టి.సుధాకరరెడ్డి, ఎన్.శ్రీకాంత్‌రెడ్డి, అభ్యుదయ రైతులు భాస్కర్, అప్పారావు, నిర్కా సంస్థ విజన్ హెడ్స్ కె.సరళ, రాజశేఖర్, ఎల్కే ప్రసాద్, ప్రిన్సిపాల్ శాస్త్రవేత్తలు కస్తూరి, సుబ్బయ్య, సుమన్కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
భర్త ఆత్మహత్య
సీతానగరం: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని హెడ్ కానిస్టేబుల్ రేలంగి శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నాగంపల్లికి చెందిన గుడాల ప్రసన్న కుమార్ (34) భార్యపై అనుమానం పెంచుకుని మనస్తాపంతో ఉన్నాడు. ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనిలోకి వస్తానని చెప్పి రాకపోవడంతో స్థానికులు మధ్యాహ్నం ఇంటికి వెళ్లగా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లంపల్లి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు -
ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘ ఎన్నిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖోఖో సంఘ అధ్యక్షుడిగా సీనియర్ పీడీ కె.పట్టాభిరామ్ ఎన్నికయ్యారు. సోమవా రం కాకినాడలోని కుడుపూడి రామ్‌కుమార్ క్రీడాభవన్లో జిల్లా ఖోఖో సంఘ ఎన్నికలు రాష్ట్ర ఖోఖో సంఘ అధ్యక్షుడు టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఎన్నికలకు జిల్లా ఒలింపిక్ సంఘ నుంచి వి.రవిరాజు, డీఎస్ఏ పరిశీలకులుగా పాపారావు హాజరయ్యారు. అలాగే ఎన్నికల పరిశీలకుడిగా అడ్వకేట్ ఎం.సత్యనారాయణ వ్యవహరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి అధ్యక్షుడిగా కె.పట్టాభిరామ్, కార్యదర్శిగా ఎం.శ్రీనివాస్ కుమార్, కోశాధికారిగా కె.రాంబాబు, ఉపాధ్యక్షులుగా ఎల్.గోవిందరాజులు, కె.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా మాచరరావు, ఎండీ ఇబ్రహీం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా పి.సూర్యనారాయణ, డి.సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులు టీవీఎస్ రంగారావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి నాగు, చీఫ్ టెక్నికల్ అడ్వయిజర్ సాయిప్రసాద్, బంగార్రాజులు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి మరోసారి ఖోఖో సంఘ ఐక్యతను చాటి చెప్పారని కొనియాడారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో పోస్టులు సాధించిన ఖోఖో క్రీడాకారులు వై.జగదీష్, బి.ఆదినారాయణ, వై.సతీష్‌లను సంఘ సభ్యులు అభినందించారు. -
ఈవీఎంలతో ఓట్ల దుర్వినియోగం
ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రుద్రరాజు అమలాపురం టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓట్ల దుర్వినియోగానికి పాల్పడుతుందని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏవీఎంల విధానం వద్దు.. దాని స్థానే మాన్యువల్ విధానమైన బ్యాలెట్ పత్రాలతోనే ఓటింగ్, పోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తోందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల అక్రమాలను కాంగ్రెస్ పార్టీ అనేక ఆధారాలతో బయట పెట్టినప్పటికీ ప్రధాని మోదీ పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ఓట్ల అక్రమాల్లో చంద్రబాబు ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అయ్యిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఈవీఎంల పరంగా వైఎస్సార్ సీపీకి జరిగిన అన్యాయాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ సంతకాలను సేకరిస్తూ ప్రజల నుంచి మద్దతు కూడగడుతోందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కొత్తూరి శ్రీనివాస్, అయితాబత్తుల సుభాషిణి, వంటెద్దు బాబి, ముషిణి రామకృష్ణారావు, యార్లగడ్డ రవీంద్ర, కుడుపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చివరగా అమలాపురం ప్రెస్‌క్లబ్ భవనంలో ఫర్నీచర్ కొనుగోలు నిమిత్తం రుద్రరాజు రూ.25 వేల చెక్కును ప్రెస్‌క్లబ్ ప్రతినిధులకు అందజేశారు. -
యువకుడి బలవన్మరణం
సీతానగరం: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై డి.రామ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సీతానగరం మండలం మునికూడలికి చెందిన మురాల అనిల్దేవ (22) వెల్డర్‌గా పని చేస్తున్నాడు. తల్లి కువైట్‌లో ఉండటంతో అమ్మమ్మ నూకతట్ల సుభద్రమ్మ వద్ద ఉంటున్నాడు. ఉదయం పనిపై వేరే వీధిలోకి సుభద్రమ్మ వెళ్లగా, ఇంట్లో ఫ్యాన్‌కు అనిల్దేవ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుభద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
సరస్వతీ కటాక్షంతో విజయం తథ్యం
విజయదుర్గా పీఠం పీఠాధిపతి ‘గాడ్’ రాయవరం: సరస్వతీ కటాక్షం ఉంటే విజయం తథ్యమని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) అన్నారు. పీఠానికి వచ్చిన భక్తులనుద్దేశించి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగిస్తూ.. జ్ఞానప్రదాయినిగా ఉన్న సరస్వతీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. జ్ఞాన సంపన్నులుగా మెలగాలంటే మంచి వాక్శుద్ది లభించాలన్నారు. అమ్మవారి దయకు పాత్రులు కావాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పీఠం కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులు పీఠంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. పీఠంలో విజయదుర్గమ్మ వారిని సరస్వతీమాత అవతారంలో అలంకరించారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్వో వేణుగోపాల్, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కరనారాయణ, సత్యవెంకట కామేశ్వరి, పెదపాటి సత్యకనకదుర్గ, బలిజేపల్లి రమా తదితరుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. సరస్వతీదేవికి పూజలు చిన్నారులకు విద్యాబుద్ధులు కలగాలని ఆకాంక్షిస్తూ విజయదుర్గా పీఠంలో సరస్వతీ పూజలు నిర్వహించారు. చీమలకొండ వీరావధాని, శివ, చక్రవర్తుల మాధవాచార్యులు, గండికోట సూర్యనారాయణ అర్చకత్వంలో చిన్నారులు సరస్వతీ అష్టోత్తర సహస్రనామాలతో సామూహిక సరస్వతీ పూజలు చేశారు. అనంతరం విద్యార్థులకు సరస్వతీదేవి ప్రతిమను, రక్షాబంధనాన్ని ప్రసాదంగా అందజేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
ఏనుగమ్మా... ఏనుగు
ఫ గొల్లపాలెంలో ఏనుగుల సంబరం ప్రసిద్ధి ఫ దసరా రోజున భారీ ఊరేగింపు ఫ పోటీపోటీగా ఉత్సవాల నిర్వహణ కాజులూరు: దసరా.. ప్రతి పల్లెకూ ప్రత్యేకతే. అచ్చం అలానే కాజులూరు నియోజకవర్గం గొల్లపాలెంలో ఏనుగుల సంబరం ప్రఖ్యాతి గాంచింది. ఏటా విజయ దశమిని పురస్కరించుకుని ఇక్కడ ఏనుగుల సంబరాలు నిర్వహించడం అనాదిగా వస్తోంది. సాధారణంగా ప్రతి గ్రామంలో శరన్నవరాత్ర ఉత్సవాల్లో దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తుంటారు. అయితే గొల్లపాలెంలో పాత మార్కెట్ సెంటర్ వద్ద రామాలయం సమీపంలో మాత్రం శరన్నవరాత్ర రోజుల్లో భేతాళునికి పూజలు నిర్వహించడం విశేషం. చివరి రోజు దసరా పండగ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ గ్రామ వీధుల్లో చిన్న ఏనుగు ప్రతిమను, రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ట్రాక్టరుపై పెద్ద ఏనుగు ప్రతిమను ఊరేగిస్తుంటారు. సుమారు రెండు వందల ఏళ్ల నుంచి ప్రతి ఏటా ఈ సంబరం నిర్వహిస్తుండడం విశేషం. ఐరావతాన్ని తలపించేలా తెల్లని వస్త్రం, ఎండు గడ్డితో తయారు చేసిన ఏనుగు ప్రతిమలకు పెద్ద, పెద్ద చావిళ్లు నిర్మించి ఏడాది పొడవునా స్థానికులు వాటిని పరిరక్షిస్తుంటారు. విజయ దశమికి 10 రోజుల ముందు ఏనుగు ప్రతిమలను బయటకు తీసి శుభ్రం చేసి మెరుగులు దిద్ది ప్రత్యేక పూజలు చేసి సంబరం చేస్తారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ గ్రామంలోని వెలమ కులస్తుల ఆధ్వర్యంలో చిన్న ఏనుగు సంబరం, కాపు, బలిజ కులస్తుల సారథ్యంలో పెద్ద ఏనుగు సంబరం చేస్తుంటారు. చిన్న ఏనుగును ఎడ్లబండి మాదిరి బండిపై ఉంచి భక్తులు జేజేలు పలుకుతూ తోసుకుంటూ ముందుకు సాగుతారు. పెద్ద ఏనుగునైతే ట్రాక్టర్‌పై ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు. ఎండు గడ్డి, తెల్లని వస్త్రం, తదితర వస్తువులతో తయారు చేసిన భారీ ఏనుగుల ప్రతిమలను ఊరేగించే సమయంలో వేలాది మంది ముందుకు సాగుతుంటారు. భేతాళుని రూపంలో భక్తులు ఏనుగుల ప్రతిమలకు పూజలు చేస్తుంటారు. గరగ నృత్యాలు, కోయ డ్యాన్సులు, గారడీ, బ్యాండ్ మేళాలతో ఈ ఊరేగింపు కోలహలంగా సాగుతోంది. ఇరువర్గాల వారూ పోటీపోటీగా సంబరం నిర్వహిస్తుండడం ఇక్కడ ప్రత్యేకత. గతంలో ఈ సంబరాల్లో ఘర్షణలు జరిగేవి. పెద్దలు సఖ్యత కుదర్చడంతో ఇటీవల ప్రశాంతంగా జరుగుతున్నాయి. పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి ఉత్సవాలను తిలకిస్తుంటారు. అలాగే బాణసంచా కాల్పులకు ప్రత్యేకత ఉంది. రాత్రి మిరుమిట్లు గొలిపేలా ఇక్కడ సంబరాలు నిర్వహిస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచారం గొల్లపాలెంలో ఏనుగుల సంబరం అనాదిగా వస్తుంది. గ్రామంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. జీవనోపాధి నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారు సైతం ఈ పండగకు తిరిగి గ్రామానికి వస్తుంటారు. –టేకుమూడి దుర్గారావు, స్థానికుడు సంప్రదాయాలను కొనసాగిస్తూ.. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కాస్త తీరిక దొరికితే సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతుంటారు. పండగలు, సంబరాలను మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలో మన ఆచారాలను తెలిపేలా పురాతన సంప్రదాయాలు కొనసాగిస్తూ నేటికీ ఏనుగుల సంబరాలు నిర్వహించడం అభినందనీయం. –జొన్నకూటి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు -
ఎంపీ మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం
● సెంట్రల్ జైలు వద్దకు భారీగా చేరుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు ● ఎయిర్పోర్ట్ వరకూ భారీ బైక్ ర్యాలీసాక్షి, రాజమహేంద్రవరం: లిక్కర్ అక్రమ కేసులో అరెస్టయ్యి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలను పరిశీలించిన జైలు అధికారులు మిథున్‌రెడ్డిని సాయంత్రం 5.55 గంటలకు విడుదల చేశారు. ఎంపీ విడుదల విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. దీంతో జైలు వద్ద కోలాహలం నెలకొంది. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో భారీ బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. సెంట్రల్ జైలు నుంచి మధురపూడి ఎయిర్పోర్ట్ వరకూ ఈ ర్యాలీ సాగింది. మిథున్‌రెడ్డికి స్వాగతం పలికిన వారిలో ఆయన తండ్రి, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్, కొవ్వూరు, అనపర్తి కో ఆర్డినేటర్లు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్ల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కోనసీమ, కాకినాడ జిల్లాల నేతలు పాల్గొన్నారు. మిథున్‌రెడ్డి అరెస్టు పైశాచిక ఆనందం ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు కూటమి ప్రభుత్వ పైశాచిక ఆనందానికి నిదర్శనమన్నారు. అక్రమ అరెస్టులకు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎవరూ భయపడరు. లిక్కర్ అక్రమ కేసులో కూటమి ప్రభుత్వం కేసులు పెట్టిన వారందరూ కడిగిన ముత్యాల్లా బయటకు వస్తారు. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముమ్మాటికీ కక్ష సాధింపే పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధించేందుకే ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు. ఆయన జైలు నుంచి బయటకు రావడంతో పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నారు. న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది. అందుకు మిథున్‌రెడ్డికి వచ్చిన బెయిలే నిదర్శనం. – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ అనపర్తి కో ఆర్డినేటర్ చంద్రబాబు శాడిజం ఎంపీ మిథున్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం పెట్టినది మ్యానేజ్డ్ కేసు. ఈ విషయాన్ని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. బెయిల్ పత్రాలు వచ్చినా విడుదల చేసేందుకు కావాలనే ఆలస్యం చేశారు. ఇది చంద్రబాబు శాడిజానికి నిదర్శనం. చంద్రబాబు ఎప్పుడూ అంతే. హింసించి ఆనందం పొందుతారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బాబు ఎవరు? – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్ దుర్మార్గమైన కేసు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో కాలక్షేపం చేస్తోంది. సంబంధం లేని కేసును ఎంపీ మిథున్‌రెడ్డిపై పెట్టారు. ఆయనపై ఉన్నది అభియోగం మాత్రమే. కేసులో ఏం సంబంధం ఉందో చెప్పలేకపోయారు. కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. దుర్మార్గ పాలనను తుదముట్టిస్తారు. – తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ స్వాగతిస్తున్నాం కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధించేందుకు చంద్రబాబు చేసిన కుట్ర ఇది. బెయిల్ మంజూరును స్వాగతిస్తున్నాం. హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకే కూటమి సర్కారు అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేస్తోంది. మిథున్‌రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదు. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేడర్‌లో నిస్తేజం కోసమే నేతలను అక్రమంగా అరెస్టు చేసి, అన్యాయంగా ఇబ్బందులు పెడితే కేడర్‌లో నిస్తేజం వస్తుందని కూటమి ప్రభుత్వం అనుకుంటోంది. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. ఎప్పటికీ మేం ధర్మపోరాటం చేస్తాం. లిక్కర్ అక్రమ కేసులో అంతమందిని అరెస్టు చేసి ఏం సాధించారు? మధ్యాహ్నం బెయిల్ వస్తే.. ప్రొసీజర్ పూర్తి చేసి పంపించకుండా ఆలస్యం చేశారు. – మార్గాని భరత్‌రామ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
● సరస్వతీ నమోస్తుతే..
● వాగ్దేవీ.. వరదాయినీ.. దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించారు. రెండు చేతుల్లో జపమాల, పుస్తకం, మరో రెండు చేతులతో వీణ ధరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానాన్ని ప్రసాదించే వరదాయిని జగజ్జనని. ఆ అమ్మవారి జన్మనక్షత్రం మూల కావడంతో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో పుస్తకాల పూజలు, అక్షరాభ్యాసాలు చేయించి, ఆ తల్లి దీవెనలు పొందారు. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాల సందర్భంగా సోమవారం 507 మంది దంపతులు సహస్రనామ కుంకుమ పూజలు, చండీ పారాయణ, హోమాలు నిర్వహించారు. మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఉచిత సామూహిక సరస్వతీ పూజల్లో సుమారు 1,200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి దాతల సహకారంతో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అమ్మవారికి వివిధ రూపాల్లో రూ.2,34,412 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్, తెలిపారు. ప్రత్యేక అలంకరణలో కోటసత్తెమ్మ తల్లి -
కూటమి అరాచకాలకు డిజిటల్ బుక్‌తో బుద్ధి చెబుతాం
● ఎవ్వరినీ వదిలిపెట్టం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు ● డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ రాజమహేంద్రవరం రూరల్: అధికార మదంతో కూటమి నాయకులు, కార్యకర్తలు, వారికి వంత పాడుతున్న అధికారులకు బుద్ధి చెప్పేందుకే తమ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్‌ను తీసుకొచ్చారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలసి ఆయన సోమవారం డిజిటల్ బుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపించి వేధిస్తోందని మండిపడ్డారు. దీనికి కారకులైన వారిని తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే డిజిటల్ బుక్ ద్వారా చట్టబద్ధంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అక్రమంగా పెట్టిన ప్రతి కేసుకూ ఈ డిజిటల్ బుక్ సమాధానంగా ఉంటుందని చెప్పారు. కార్యకర్తలకు, ప్రజలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సులువుగా సమాచారం అందించేందుకే డిజిటల్ బుక్ పెట్టామని తెలిపారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్తులో చర్యలు తప్పవని వేణు హెచ్చరించారు. పాలకుల ఆదేశాలతో వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టేలా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే భవిష్యత్తులో ఎక్కడున్నా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. బాధితులు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను డీబీ.డబ్ల్యూఈవైఎస్సార్సీపీ.కామ్ అనే వెబ్సైట్లో నమోదు చేయవచ్చన్నారు. 040–49171718 నంబర్‌కు కాల్ చేసి కూడా తెలపవచ్చని వేణు చెప్పారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, కడియం మండల అధ్యక్షుడు యాదల సతీష్‌చంద్ర స్టాలిన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల వీర్రాజు (బాబు), మింది నాగేంద్ర, వివిధ విభాగాల నేతలు ఎంఎం ఆలీ, పడాల వీర రాఘవరెడ్డి, అంగాడి సత్యప్రియ, తాడాల చక్రవర్తి, దాసరి శివ, పెయ్యల రాజేష్, బొప్పన సుబ్బారావు, యెజ్జు వాసు, ముత్యాల పోసికుమార్, జిల్లా కార్యదర్శులు యెనుముల త్యాగరాజు, తాడాల విష్ణు, రాజమౌళి, ముద్దాల అను, వివిధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు. -
నిలకడగా గోదారి
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటి ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6.15 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.70 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం రాత్రి 7 గంటల వరకూ అదే స్థాయిలో నీటి ఉధృతి కొనసాగింది. బ్యారేజీ నుంచి 9,77,625 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువన పెరుగుతున్న నీటిమట్టాలతో ధవళేశ్వరం వద్ద మంగళవారం నీటి ఉధృతి తిరిగి పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూము నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూండటంతో గోదావరి ఉధృతి మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఎగువన గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో) కాళేశ్వరం 13.21 పేరూరు 17.15 దుమ్ముగూడెం 12.38 భద్రాచలంలో 45.70 (అడుగులు) కూనవరం 18.50 కుంట 9.61 పోలవరం 11.85 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 16.08 వరదలపై సమన్వయంతో చర్యలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరి వరదల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ ఆదేశించారు. వరద పరిస్థితులపై పలు శాఖల అధికారులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. వరద బాధితులను రెవెన్యూ యంత్రాంగం సురక్షిత ప్రదేశాలకు తరలించి, సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు, రెవెన్యూ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారులతో ఘాట్ల వద్ద బారికేడింగ్ ఏర్పాటు చేసి, పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందించేందుకు కంట్రోలు రూములు ఏర్పాటు చేశామని మేఘస్వరూప్ తెలిపారు. కంట్రోల్ రూము నంబర్లు కలెక్టరేట్, బొమ్మూరు–89779 35611 రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయం 0883–2442344 కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం 79953 67797 టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 1800 – 425–0101, 83339 05022 -
వాటాలివ్వాలంటూ లూఠీ!
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి నేతల నేతృత్వంలోని సిండికేట్ మద్యం విక్రయాల్లో అడ్డగోలు వ్యవహారానికి తెర తీసింది. ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీని ఏమాత్రం లెక్క చేయకుండా మరీ అమ్మకాలకు బరితెగిస్తోంది. క్వార్టర్‌పై రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తోంది. ఇక రాత్రయితే ధర మరింత పెంచి, రూ.30 వరకూ గుంజుతోంది. అదనపు వసూళ్లతో తమ జేబులకు చిల్లు పెడుతున్నారని మందుబాబులు నిలదీస్తే.. పర్మిట్ రూముల కోసం ప్రభుత్వానికి చెల్లించాలని, కూటమి నేతలకు, కొంత మంది అధికారులకు వాటాలివ్వాలని చెబుతున్నారు. ఈవిధంగా అక్రమంగా రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. దోచేస్తున్నారిలా.. ● రాజమహేంద్రవరం రూరల్ ఐఎంఎల్ డిపో పరిధిలో జిల్లాలోని రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌తో పాటు అల్లూరి సీతారామరాజు, కోనసీమ జిల్లాలున్నాయి. ఈ ప్రాంతంలోని 134 మద్యం షాపులకు ప్రతి నెలా దాదాపు 1.17 లక్షల వివిధ రకాల మద్యం కేసులు, 44,300 బీర్ కేసులు సరఫరా చేస్తూంటారు. వీటి విలువ రూ.103 కోట్లు. పండగల సమయాల్లో అయితే వ్యాపారం మరింత ఊపందుకుంటుంది. ఇదే అదునుగా వ్యాపారులు అదనంగా దోచేస్తున్నారు. ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేస్తే.. మద్యం కేసులకు రూ.11.70 లక్షలు, బీర్లకు రూ.4.43 లక్షల మేర మందుబాబుల నుంచి గుంజుతున్నారు. అదే రూ.20 చొప్పున వసూలు చేస్తే ఆ భారం రూ.23.40 లక్షలకు పెరుగుతోంది. ● చాగల్లు ఐఎంఎల్ డిపో నుంచి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఏలూరు పరిధిలోని 111 షాపులకు మద్యం సరఫరా అవుతోంది. ప్రతి నెలా సుమారు 43,743 మద్యం కేసులు, 13,354 బీర్ కేసులు సరఫరా చేస్తున్నారు. దీని ప్రకారం మద్యం కేసులకు రూ.4.37 లక్షలు, బీర్లకు రూ.1.33 లక్షల మేర మందుబాబులకు అదనంగా వదిలిపోతోంది. రూ.20 చొప్పున లెక్క వేస్తే మద్యం కేసులకు రూ.8.74 లక్షలు, బీర్లకు రూ.2.66 లక్షల మేర అదనపు భారం పడుతోంది. పర్మిట్ రూముల పేరిట.. మద్యం ద్వారా ప్రస్తుతం వస్తున్న ఆదాయం చాలదని భావించిన కూటమి ప్రభుత్వం దీనిని మరింతగా పెంచుకునేందుకు ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చేసింది. జిల్లావ్యాప్తంగా 125 మద్యం షాపులుండగా.. ఒక్కో షాపునకు ఒక్కో పర్మిట్ రూము చొప్పున ఏర్పాటు చేశారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో పర్మిట్ రూమ్‌కు రూ.7.50 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం వసూలు చేసింది. సగటున ఒక్కో షాపునకు రూ.5 లక్షలు వసూలు చేసినా.. ప్రభుత్వానికి అదనంగా రూ.62 కోట్ల ఆదాయం ఏటా సమకూరనుంది. పర్మిట్ రూముల కోసం ప్రభుత్వానికి చెల్లించిన మొత్తాన్ని దండుకునే లక్ష్యంతో మందుబాబులను సిండికేట్ అదనపు వసూళ్ల పేరిట ఎడాపెడా బాదేస్తోంది. స్పందించని అధికారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా, బెల్టు షాపులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నా దీనిని అరికట్టేందుకు ఏర్పాటైన ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ బృందం, అధికారులు కనీసంగా కూడా స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం దుకాణాల ఆధ్వర్యంలో బెల్టు షాపులు నిర్వహిస్తే ఆ షాపును రద్దు చేస్తామని స్వయంగా సీఎం చంద్రబాబే ప్రకటించారు. కానీ, వాస్తవానికి క్షేత్ర స్థాయిలో ప్రతి షాపు పరిధిలో 30కి పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఇది బహిరంగ రహస్యమే అయినప్పటికీ ఎకై ్సజ్ అధికారులు ఒక్క షాపుపై కూడా దాడులు చేసిన దాఖలాలు లేవు. వారిపై కేసులు నమోదు చేయడంలో ఎకై ్సజ్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మద్యం వ్యాపారులతో కొంత మంది పోలీసులు సైతం మిలాఖత్ అయ్యారనే ఆరోపణలున్నాయి. మద్యం షాపుల నుంచి కొంత మంది ఎకై ్సజ్, పోలీసు అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతున్నాయని, అందుకే అధికంగా వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మందుబాబులు మండిపడుతున్నారు. కొన్నిచోట్ల ఎకై ్సజ్, పోలీసు అధికారులు మీది మీరు తీసుకోండి.. మాది మేము తీసుకుంటామన్నట్టుగా వ్యహరిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. మద్యం విక్రయాల్లో కూటమి సిండికేట్ దోపిడీ క్వార్టర్‌పై రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు పర్మిట్ రూముల నిర్వహణ, మామూళ్లకు అంటూ బుకాయింపు రాత్రయ్యేకొద్దీ మరింత పెరుగుతున్న ధర -
ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల
సాక్షి, రాజమండ్రి: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు సోమవారం (సెప్టెంబర్29న) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన మిథున్‌రెడ్డికి వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికాయి అంతకుముందు మిథున్‌రెడ్డి జైలు నుంచి విడుదలపై ఉత్కంఠ నెలకొంది. మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలు సెంట్రల్ జైలు అధికారిక ఈమెయిల్‌కు పంపించింది. అయితే ఎంపీ మిథున్‌రెడ్డి జైలు నుంచి విడుదలకు సంబంధించిన పత్రాలు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిక మెయిల్‌కు వెళ్లినా.. మెయిల్‌కు పత్రాలు రాలేదని జైలు అధికారులు తెలిపారు. దీంతో ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ వచ్చినా ఎందుకు విడుదల చేయడం లేదంటూ జైలు అధికారులతో న్యాయవాదులు మాట్లాడారు. మిథున్‌రెడ్డి విడుదలలో జాప్యంపై వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జైలు అధికారులు ఎంపీ మిథున్‌రెడ్డిని జైలు నుంచి విడుదల చేశారు. విడుదల అనంతరం మిథున్‌రెడ్డికి పార్టీ నేతలు,శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఆందోళనకరంగా గుండెపోటు
గుండె రక్తనాళాలు మూసుకుపోయి రక్తం సరఫరా తగ్గిపోవడం వల్లనే ఛాతిలో నొప్పి వస్తుంది. ఛాతిలో బరువుగా అనిపించడం, మెడ భాగం నుంచి మొదలై, ఎడమ చేతి వరకు లాగడం, నొప్పి వీపు వెనక భాగంలో రావడం, ఆయాసం, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం, కడుపులో మంట రావడం జరుగుతాయి. ఈ లక్షణాలు ఉండే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – డాక్టర్ కారెం రవితేజ, ఎండీ ఫిజీషియన్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం ప్రతి రోజూ వ్యాయామం చేయాలి ఫాస్ట్‌ఫుడ్, జంక్ఫుడ్స్ అధికంగా తినడం, వ్యాయామం లేకపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. తెలియకుండానే శరీరంలో కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో పెరిగి, రక్తంలో బ్లాక్స్ ఏర్పడతాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె, మెదడు స్ట్రోక్స్ వస్తాయి. – డాక్టర్ సుమలత, డిస్ట్రిక్ట్ నోడల్ అధికారి, ఎన్సీడీ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ● -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ఆలమూరు: మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం సాయంకాలం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం 216 ఏ జాతీయ రహదారిపై జొన్నాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెలగల సుజాత (45) మృతి చెందారు. కడియం మండలంలోని పొట్టిలంకకు చెందిన సుజాత తన భర్త సూరిబాబుతో కలిసి బైక్‌పై కపిలేశ్వరపురం వెళుతున్నారు. స్థానిక ఏటిగట్టు రోడ్డుకు వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న సైక్లిస్ట్‌ను తప్పించేందుకు సడన్ బ్రేక్ వేయగా వెనుక కూర్చున్న సుజాత రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి రాజోలు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆమె తలపై నుంచి వెళ్లిపోవడంతో సుజాత అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై నరేష్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్ ఢీకొని.. మండలంలోని చొప్పెల్లలో శనివారం రాత్రి జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పసుపులేటి వేణుగోపాలరావు (47) మృతి చెందారు. వివరాలలోకి వెళితే మోరంపూడికి చెందిన వేణుగోపాలరావు కొద్దికాలంగా పుణ్యక్షేత్రమైన వాడపల్లిలో రోజ్ మిల్క్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్నారు. శనివారం రాత్రి ఇంటికి వెళుతుండగా స్థానిక ఇరిగేషన్ లాకుల వద్దకు వచ్చేసరికి తాను నడపుతున్న బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వేణుగోపాలరావును హైవే, పోలీసు సిబ్బంది అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. -
నేతన్నలకు బకాయిల వెతలు
కపిలేశ్వరపురం: తమ శ్రమతో స్థాపించిన చేనేత సహకార సంఘం నిర్వహణకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు గుదిబండలా మారాయంటూ అంగర చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు పూనుకున్నారు. అంగరలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సంఘం రెండు జాతీయ స్థాయి అవార్డులను సాఽధించింది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులు మీదుగా ప్రశంసా పత్రాలను అందుకుంది. అలాంటి సంఘానికి ప్రభుత్వం నుంచి రూ.3,85,18,292 బకాయిలు రావాల్సి ఉంది. అందులో రూ.1,00,11, 858 ఆప్కో సంస్థ చెల్లించాల్సి ఉంది. పాలకులు పట్టించుకోకపోవడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. గ్రామంలో ఆదివారం నిరసన ర్యాలీ చేశారు. చేనేత సహకార సంఘం ఎదుట సుమారు 100 మంది రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. నాయకులు మాట్లాడుతూ ఆప్కో ద్వారా బకాయిలను చెల్లించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కో బకాయిలకు తోడు మరిన్ని పథకాల ద్వారా రావాల్సిన బకాయిలు సైతం సంఘం నిర్వహణకు సమస్యగా మారాయన్నారు. తమ డిమాండ్‌ను పరిశీలించి పరిష్కరించే వరకూ ఆందోళనను కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. వారికి పలువురు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. -
ఇద్దరు భవానీ మాలధారుల మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు● వెనుక నుంచి ఢీకొట్టిన కారునల్లజర్ల: జాతీయ రహదారిపై నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద ఆదివారం ఉదయం కాలినడకన విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న భవానీ మాలధారులను వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దోశలపాడు గ్రామానికి చెందిన పక్కురి శివ, పక్కుర్తి శ్రీను, పక్కురి శేశీలు, కోనాగోవిందు భవానీ మాలలు ధరించి ఈ నెల 24న తమ స్వగ్రామం నుంచి ఇరుముళ్లు కట్టుకొని విజయవాడలోని దుర్గమ్మ సన్నిధికి పాదయాత్రగా బయలు దేరారు. వీరంతా ఆదివారం ఉదయం పుల్లలపాడు జాతీయ రహదారిపైకి వచ్చేసరికి విశాఖపట్టణం నుంచి హైదరాబాదు వెళ్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన కారు వీరిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో శివ చక్రాల కింద, గాలిలోకి ఎగిరి పక్కనే పంటబోదెలోకి పడిన శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా శేశీలుకు రెండు కాళ్లూ విరిగిపోయాయి. ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోవిందు ఫోన్ మాట్లాడుతూ దూరంగా ఉండటంతో క్షేమంగా బయటపడ్డాడు. మృతిచెందిన శివకు భార్యదేవి, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. శ్రీను అవివాహితుడు కాగా వీరంతా వ్యవసాయ కూలీలే. మృతదేహాలను కోసం తాడేపల్లిగూడెం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. -
వాడపల్లి వెంకన్నకు దసరా శోభ
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కిక్కిరిసింది. శనివారం ఇసుక వేస్తే రాలనంత రీతిలో భక్తులు తరలిరాగా దాదాపు ఆ స్థాయిలో ఈ ఆదివారం భక్తజనంతో ఆ క్షేత్రం కిక్కిరిసింది. ‘ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం’ నానుడితో అశేష భక్తజనం తరలిరావడంతో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా మిగిలిన ఆరు రోజులు కూడా అత్యధికంగా భక్తజనం తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం దసరా సెలవులు, ఆదివారం కావడంతో అత్యధికంగా భక్తులు తరలివచ్చారు. వారితో పాటు ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. కొందరు స్వామివారి కల్యాణం చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజు దేవస్థానానికి రూ.8,90,146 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు.● అత్యధికంగా తరలివచ్చిన భక్తజనం ● ఒక్కరోజు రూ 8.90 లక్షల ఆదాయం -
హడలెత్తిస్తున్న ధార్‌గ్యాంగ్
రాజమహేంద్రవరం రూరల్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు షాపులో ఒక గోల్డుషాపులో దుండగులు ఈ నెల 23వ తేదీన షట్టర్ పైకి వంచి అద్దాలు పగలు గొట్టి 11 కిలోల వెండి దొంగతనం చేశారు. ● తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల జంక్షన్ వెనుక ఒంటరిగా నివసిస్తున్న పాకలపాటి సుభద్ర ఇంట్లోకి ఈ నెల 24వ తేదీ రాత్రి నలుగురు దుండగులు వెళ్లి రాళ్లతో ఆమైపె దాడి చేసి 15 కాసుల బంగారం అపహరించుకు పోయారు. ● అంతకు ముందు నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సైతం ఈ తరహా చోరీలకు పాల్పడ్డారని సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు ఈ చోరీలకు పాల్పడుతన్న వ్యక్తులు మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్గ్యాంగ్గా గుర్తించారు. చోరీలకు పాల్పడిన ప్రదేశాలలో ఒకరి వేలిముద్రలు మధ్యప్రదేశ్‌కు చెందిన నేరస్తుడి వేలిముద్రలతో సరిపోవడంతో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్‌గ్యాంగ్ ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ధార్గ్యాంగ్లో నలుగురి నుంచి ఆరుగురు వరకు సభ్యులు ఉంటారన్నారు. వీరికి రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలు, శివారు ప్రాంతాలతో పాటు, తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్. ఉదయం సమయంలో ఆటోల్లో రెక్కీ నిర్వహిస్తుంటారు. రాత్రి సమయాల్లో నలుగురు నుంచి ఆరుగురు వెళ్లి చోరీలకు పాల్పడతారు. ఒకవేళ ఇంటిలో ఎవరైనా ఉంటే వారిపై విచక్షణా రహితంగా దాడులు చేసి సొత్తును చోరీ చేస్తుంటారు. అవగాహన కల్పిస్తున్న జిల్లా పోలీసులు పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయా పోలీస్ స్షేషన్ల పరిధిలో ఇన్స్పెక్టర్లు,ఎస్సైలు శివారు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా తిరగవద్దని, ముఖ్యంగా అర్ధరాత్రుళ్లు ఎవరైనా తలుపు తడితే తీయవద్దని, వచ్చిన వారు ఎవరో నిర్ధారించుకోవాలన్నారు. దోపిడీలకు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్‌కి చెందిన ధార్ గ్యాంగ్ తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో తిరుగుతోందని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ధార్ గ్యాంగ్ గ్రామాల శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించారు. రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్రైమ్ పోలీసుల హెచ్చరిక అమలాపురం టౌన్: మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంటి దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోనసీమ జిల్లా క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆదివారం హెచ్చరించింది. ధార్గ్యాంగ్తోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన గ్యాంగ్‌లు కూడా రాష్ట్రంలోకి వచ్చినట్టు సమాచారం ఉందని పేర్కొంది. ఈ గ్యాంగ్ ఒంటరిగా ఉన్న మహిళలను, ఇళ్లను టార్గెట్ చేస్తుందని క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ గజేంద్రకుమార్ తెలిపారు. ధార్గ్యాంగ్లోని ఎనిమిది మంది ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. ఒంటరి మహిళలు, తాళాలు వేసిన ఇళ్లు, శివారుప్రాంతాలే టార్గెట్ నల్లజర్ల, ప్రత్తిపాడుతో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన వైనం ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
రాజోలు: స్నేహితుడిని కలిసేందుకు మోటార్ సైకిల్‌పై బయలుదేరిన పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడికి చెందిన బీటెక్ విద్యార్థి కడలి అక్షయ్(22) రాజోలు మండలం ములికిపల్లి–కడలి రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అక్షయ్ తండ్రి కడలి మోహనరావు ఫిర్యాదు మేరకు రాజోలు ఎస్సై రాజేష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలగంపూడి గ్రామానికి చెందిన అక్షయ్ చైన్నెలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. దసరా సెలవులు పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీ రాత్రి కలగంపూడి వచ్చాడు. మర్నాడు ఉదయమే తన స్నేహితుడిని కలిసేందుకు బుల్లెట్ మోటార్ సైకిల్‌పై ములికిపల్లి రాగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చైన్నె నుంచి ఇంటికి వచ్చి తమతో గడపకుండానే కుమారుడు మృతి చెందడం పట్ల తండ్రి మోహనరావు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
నన్నయ వర్సిటీ కబడ్డీ జట్టు ఎంపిక
పెదపూడి: జి.మామిడాడ డి.ఎల్.రెడ్డి డిగ్రీ కళాశాలల్లో ఆదివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ పురుషుల కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహించారు. పోటీల్లో 70 మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో 14 మందిని విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపిక చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన రిజిస్ట్రార్ కె.వి.స్వామి మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభతో అంతర్ విశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీల్లో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. తమ యూనివర్సిటీ పరిధిలో 395 గుర్తింపు పొందిన కళాశాలలు ఉన్నాయన్నారు. 2006లో ప్రారంభించిన యూనివర్సిటీ తక్కువ కాలంలోనే పెద్ద యూనివర్సిటీగా రూపాంతరం చెందిందన్నారు. అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో జరగనున్న జాతీయ స్థాయి అంతర విశ్వవిద్యాలయాల పురుషుల కబడ్డీ జట్టు పోటీల్లో తమ యూనివర్సిటీ జట్టు పాల్గొంటుందన్నారు. జి.మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ– కరస్పాండెంట్ డీ.ఆర్.కె.రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ పురుషుల కబడ్డీ సెలెక్షన్స్ తమ కళాశాలలో నిర్వహించేందుకు అనుమతినిచ్చిన యూనివర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. -
రావులపాలెం అభివృద్ధికి కృషి చేయాలి
రావులపాలెం: నూతనంగా ఎన్నికై న చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు వ్యాపారుల సమస్యలు పరిష్కరించడంతోపాటు, రావులపాలెం అభివృద్ధికి కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. స్థానిక సీఆర్సీ ఫంక్షన్ హాల్లో ఆదివారం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పూర్వపు అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగా పోతంశెట్టి కనికిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కర్రి శ్రీనివాస్‌రెడ్డి, మామిడిశెట్టి సోమరాజు, ఆకుల శివశంకర్, ప్రధాన కార్యదర్శిగా మల్లవరపు సూరిబాబు, సంయుక్త కార్యదర్శులుగా కొవ్వూరి వంశీకృష్ణారెడ్డి, మన్యం ప్రదీప్, మల్లూరి నీలకంఠ దుర్గారావు, కోశాధికారిగా మండవిల్లి నగేష్, సహ కోశాధికారిగా కండిచర్ల వీర వెంకట నాగరాజుతో ఎమ్మెల్యే బండారు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అభినందించారు. కనికిరెడ్డికి ఆయన శాలువా కప్పించి అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ రెడ్డి అనంత కుమారి, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి పాల్గొన్నారు.చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం -
గుండె లయ తప్పుతోంది
●రాయవరం: ఇటీవలి కాలంలో ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే ఎలా చనిపోయారు అని ప్రశ్నించగానే ఎక్కువగా వినిపించే సమాధానం గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా చోటు చేసుకునే మరణాల్లో హార్ట్ ఎటాక్‌తో జరిగేవే అధికం. మన శరీరానికి పెద్దదిక్కుగా వ్యవహరించే హృదయం లయ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. సోమవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అతి ప్రధానమైన అవయవం మనిషి శరీరంలో పనిచేసే అవయవాల్లో అతి ప్రధానమైనది గుండె. దీనికి ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత లేకుండా పోతోంది. వ్యాయామం లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం. పొగ తాగడం, ఒత్తిళ్లతో గుండెపోటుకు గురవుతున్నారు. మనుషుల్లో మారుతున్న అలవాట్లు, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలకు దారి తీయడంతోపాటు అంతిమంగా గుండైపె ప్రభావం పడుతోంది. అయితే మధుమేహం (సుగర్)తోనే అధిక ముప్పు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు రెండు దశాబ్దాల కిందట 50 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వచ్చే గుండెపోటు, మారిన జీవన శైలి కారణంగా నేడు 20 ఏళ్ల యువకుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు వస్తోంది. వీరిలో 30 ఏళ్ల వయసువారే ఎక్కువ మంది ఉంటున్నారు. దీనికి కారణం అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యం, సుగర్, ఫాస్ట్ ఫుడ్ , లావు పెరగడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్, నిద్రలేమి, అధికంగా ఫోన్ చూడడం, ప్యాక్డ్ ఫుడ్‌ను అధికంగా తీసుకోవడం, మితిమీరి శీతలపానీయాలు తాగడం, తరచుగా ఆయిల్ ఫుడ్‌ను తీసుకోవడం. జిల్లాలో 14 శాతం బాధితులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు 14 శాతం ఉన్నట్లు అంచనా. ఆకస్మిక హృద్రోగ సమస్య ఎదురైన వారిలో 10 శాతం మంది మాత్రమే చికిత్స పొంది, కోలుకుంటున్నారు. హైపర్ టెన్షన్‌తో ఇబ్బంది పడేవారు 1.06 లక్షల మంది, సుగర్ వ్యాధిగ్రస్తులు 43వేల మంది ఉన్నారు. కోవిడ్–19తో పెరిగిన కేసులు జిల్లాలో కోవిడ్ వైరస్ వల్ల గుండె సమస్యలు 50 నుంచి 60 శాతానికి పెరిగాయి. గతంలో అధిక కొలెస్ట్రాల్, బీపీ, సుగర్, మద్యం, సిగరెట్ వల్ల ఈ సమస్య ఉండేది. గుండె నొప్పి, అధిక ఆయాసం ఉంటే వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించి, చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఆహారంలో సాధ్యమైనంతవరకు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు రోజుకు కనీసం 20 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. బీపీని అదుపులో ఉంచుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా విటమిన్ లోపాలను అధిగమించవచ్చు. మాంసం, కొవ్వు పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. పార్కులు, ఇతర ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం ద్వారా ఒత్తిడిని జయించాలి. కరోనాతో మరింత పెరిగిన గుండెపోటు బాధితులు ఆహారపు అలవాట్లు అదుపు చేసుకుంటేనే మంచిది నేడు వరల్డ్ హార్ట్ డే -
● జగజ్జననీ.. దివ్య స్వరూపిణీ..
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ అమ్మవారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి 417 మంది దంపతులు సహస్రనామ కుంకుమ పూజలతో పాటు చండీ పారాయణ, హోమాలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ రూపాల్లో రూ.2,59,768 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చిన్నారుల కోలాటం భక్తులను ఆలరించింది. కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ పాల్గొన్నారు. – నిడదవోలు రూరల్ -
రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీల్లో ‘తూర్పు’ విజయం
● జట్టు క్రీడాకారులంతా దేవరపల్లి విద్యార్థులే ● ఐదు బంగారు పతకాలు కై వసం దేవరపల్లి: ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగిన రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీల్లో జిల్లా జట్టు విజయకేతనం ఎగురవేసి, ప్రథమ స్థానం సాధించింది. ఈ జట్టులోని క్రీడాకారులంతా దేవరపల్లికి చెందిన విద్యార్థులే కావడం ఒక విశేషం కాగా, ఐదు బంగారు పతకాలు సాధించడం మరో విశేషం. శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ ఈ వివరాలు తెలిపారు. క్రీడాకారులు లక్కా గణపతి, చింతపల్లి సతీష్, పాటంశెట్టి సాయి, కుక్కల పవన్‌కుమార్, తంగెళ్ల వంశీ బంగారు జిల్లా జట్టులో ఆడి బంగారు పతకాలు, కప్ సాధించారని వివరించారు. 2017లో జరిగిన అండర్–19 స్కూల్ గేమ్స్ సెపక్తక్రా పోటీల్లో కూడా వీరు ప్రథమ స్థానం సాధించి, బంగారు పతకాలు కై వసం చేసుకున్నారని తెలిపారు. క్రీడాకారులను రవీంద్రనాథ్, పంచాయతీ కార్యదర్శి నిట్టా రవికిషోర్, ఫిజికల్ డైరెక్టర్ తలారి సరస్వతి తదితరులు అభినందించారు. వైభవంగా సత్యదేవుని ప్రాకార సేవ తొండంగి: రత్నగిరిపై సత్యదేవుని ప్రాకార సేవ ఆదివారం వైభవంగా జరిగింది. ప్రధానాలయంలో మూలవిరాట్టుకు వేదమంత్రోచ్చారణతో అర్చకులు అభిషేకాలు, అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీపై రాజగోపురం వద్దకు తీసుకువచ్చి, తిరుచ్చి వాహనంపై వేంచేయించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ గావించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రధానాలయంలోకి చేర్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహాశక్తి యాగ ప్రాంగణంలో 64 అడుగుల అమ్మవారి విగ్రహం కాకినాడ రూరల్: మహాశక్తి యాగ ప్రాంగణంలో 64 అడుగుల అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి తెలిపారు. పీఠంలో మహాశక్తి యాగం వంద కోట్ల కుంకుమార్చనలు ఆదివారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం వారాహి, కీలక స్తోత్ర హోమం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారు వారాహి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమార్చనల్లో వేలాదిగా పాల్గొన్న మహిళలనుద్దేశించి స్వామీజీ మాట్లాడుతూ, కోట్ల కుంకుమార్చనలు అందుకున్న అమ్మవారు మహాశక్తిగా అందరినీ కాపాడేందుకు మహాశక్తి దీపం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ మహాశక్తి దీపంలో 108 అడుగుల ఎత్తున ఒక మహాపర్వతం, దానిని ఆనుకుని 64 అడుగుల ఎత్తున అమ్మవారు ఉంటారని వివరించారు. అమ్మవారి చుట్టూ చండీ, భైరవి, మాతంగి, వారాహి, బగళాముఖి, ప్రత్యంగిర తదితర 8 శక్తులు ఉంటాయన్నారు. దేశంలోని వన మూలికల వృక్షాలను అమ్మవారి చుట్టూ పెంచుతామన్నారు. అందరూ కూర్చుని హాయిగా పారాయణ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. లలితా సహస్ర నామ పారాయణతో 72 వేల నాడులు యాక్టివేట్ అవుతాయని స్వామీజీ చెప్పారు. ప్రతి ఒక్కరూ లలితా పారాయణ చేసుకోవాలని సూచించారు. మహాశక్తి యాగంలో మొదటి, రెండో సంవత్సరం పాల్గొన్న భక్తురాలికి వివాహమైన 14 ఏళ్లకు ముగ్గురు కుమార్తెలు శశిరేఖ, శశిప్రియ, శశికళ జన్మించారని, ఇది యాగ ఫలితమని పేర్కొంటూ వారిని ఒడిలోకి తీసుకుని ముచ్చటించి, భక్తులకు చూపించారు. -
బ్రిటిషర్లను భయపెట్టిన... చెడీ తాలింఖానా
సాక్షి, అమలాపురం/అమలాపురం టౌన్: కోనసీమ అనగానే ప్రకృతి అందాలు, పర్యాటక కేంద్రాలకే కాదు.. సంస్కృతీ సంప్రదాయాలకు.. ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. సంక్రాంతి వస్తే పల్లె ముస్తాబవుతుంది. నింగిలోని ఇంద్ర ధనస్సులు ‘ప్రభ’లుగా మారి నేలన నడయాడతాయి. తీర్థాలతో ఈ ప్రాంతం హోరెత్తుతుంది. ఇక దసరా వస్తే చెడీ తాలింఖానా ప్రదర్శన.. అమ్మవార్ల వాహనాల ఊరేగింపులతో జనజాతరగా మారిపోతుంది. ఒకప్పుడు స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో నేర్చుకున్న ఈ చెడీ తాలింఖానా వీర విద్య రానురానూ ప్రజల సంప్రదాయ కళలలో ఒక భాగమైంది. శతాబ్దాల చరిత్ర అజ్ఞాతం ముగిసిన తరువాత జమ్మి చెట్టు మీద ఉన్న పాండవుల ఆయుధాలు చేతులకు వచ్చినట్టుగా ఇక్కడ దసరాకు ముందు దాచి ఉంచిన కత్తులు కొత్తగా పదునెక్కుతాయి. బరిసెలు బయటకు వస్తాయి. రాత్రి వేళల్లో అగ్గిబరాటాలు నిప్పులు కక్కుతాయి. లేడి కొమ్ములు, పొడవాటి కర్రలు కళాత్మకంగా తిరుగుతుంటాయి. ఆపై అమ్మవారి ఊరేగింపులతో కోనసీమలో దసరా కొత్త పుంతలు తొక్కుతుంది. దసరా ఉత్సవాలు కర్ణాటకలోని మైసూరు తరువాత కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఇంచుమించు రెండు శతాబ్దాల నుంచి జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రాచీన యుద్ధాలను తలపించే చెడీ తాలింఖానా వీరత్వానికి మారుపేరుగా నిలుస్తోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న తాలింఖానాకు నేటికీ ఆదరణ చెక్కు చెదరలేదు. కర్రలు, కత్తులు, లేడి కొమ్ములతో వారు చేసే ప్రదర్శన ప్రేక్షకులను గగుర్పాటుకు గురి చేస్తాయి. యువకుల నుంచి వృద్ధుల వరకూ వయోభేదం మరచి చేసే తాలింఖానా విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అన్ని వీధులు ఈ ప్రదర్శనలతో నిండిపోతాయి. ఇంచుమించు నెల రోజుల ముందు నుంచే ఈ ప్రదర్శనకు అవసరమైన శిక్షణ పొందుతారు. కొత్త తరం కూడా ఈ విద్యా ప్రదర్శనకు ఉత్సాహంగా ముందుకు రావడం విశేషం. మంత్రముగ్ధులను చేసేలా.. దసరా ఉత్సవాలలో భాగంగా పురవీధుల్లో చెడీతాలింఖానా ప్రదర్శన జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ రాత్రి అంతా ఈ కార్యక్రమం జరుగనుంది. వీధుల్లో యువకులు, పెద్దలు ప్రాచీన యుద్ధవిన్యాసాలను తలపించేలా ప్రదర్శించే చెడీ తాలింఖానా విద్య ఉద్విగ్నభరితంగా సాగుతుంది. కళ్లకు గంతలు కట్టుకుని మనిషి మీద, కంఠం, నుదిటిపై, పొత్తి కడుపుల మీద కొబ్బరి కాయలు, కూరగాయలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు తాలింఖానాలో ముఖ్య ఘట్టాలు. అగ్గిబరాటాలు, లేడికొమ్ములు, పట్టాకత్తులు వేగంగా.. చురుగ్గా కదుపుతూ యువకులు చేసే విన్యాసాలు రాచరిక యుద్ధ సన్నాహాలను తలపిస్తాయి. ఈ ప్రదర్శనలో ఏమాత్రం ఏమరు పాటు జరిగినా ప్రాణాలకు ప్రమాదం. అయినా కూడా అత్యంత ధైర్య సాహసాలతో శిక్షణ పొందిన ఆరేళ్ల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు చేసే ప్రదర్శన మంత్రముగ్ధులను చేస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా, ఎన్ఆర్ఐలైనా ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. అమలాపురంలో చెడీ తాలింఖానా విద్య ప్రదర్శన వెనుక స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ఉందని స్థానికులు చెబుతుంటారు. బ్రిటిష్ సేనలతో పోరాడే భారతీయుల్లో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు. ఈ విద్య స్థానికంగా 1835 కొంకాపల్లిలో మొదలైంది. అయితే దసరా వేడుకలలో 1856లో మహిపాల వీధిలో రైతుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిరెడ్డి రామదాసు ఈ విద్యకు అంకురార్పణ చేశారు. ఇది ఇక్కడ ప్రారంభమై 190 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఈ ప్రదర్శన నిర్విఘ్నంగా సాగుతోంది. వీటితో పాటు గండువీధి మైనర్స్ పార్టీ, నల్లా వీధి, శ్రీరామపురం మైనర్స్ పార్టీ, రవణం మల్లయ్య వీధి తాలింఖానా ప్రదర్శనలకు దశాబ్దాల చరిత్ర ఉంది. చెడీ తాలింఖానా ప్రదర్శనతో పాటు పట్టణానికి చెందిన ఏడు వీధులలో కొలువు తీరిన వాహనాలను ఊరేగింపులో ప్రదర్శిస్తారు. బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, శక్తి వేషధారణలు, కోయడ్యాన్సులు, బుట్టబొమ్మలు, మ్యూజికల్, తీన్మార్ బ్యాండ్లు, విద్యుత్ దీపాలంకరణలతో వాహనాలు ముందుకు సాగుతాయి. కొంకాపల్లి ఏనుగు అంబారీ వాహనం, ఆంజనేయస్వామి వాహనం, మహిపాలవీధి రాజహంస, గండువీధి శేషశయన, రవణం వీధి మహిషాసుర మర్దిని, రవణం మల్లయ్యవీధి గరుడ విష్ణు, నల్లా వీధి శ్రీవిజయ దుర్గమ్మవారు వాహనం, శ్రీరామపురం హంస, శ్రీకృష్ణుడు, వినాయక వాహనాలు పురవీధుల్లో ఊరేగింపుగా వెళతాయి. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి, తెలంగాణా ప్రాంతం నుంచి కూడా ఈ ఉత్సవాలను తిలకించేందుకు అమలాపురానికి తరలివస్తారు. తరతరాలుగా నిర్వహిస్తున్నాం దశాబ్దాల కాలం నుంచి అమలాపురంలో ఈ ప్రదర్శన జరుగుతోంది. మా తాతలు మాకు వారసత్వంగా అందించారు. మేము మా వారసులకు ఈ విద్యను అందిస్తాం. ఈ ప్రాచీన విద్యను ప్రభుత్వాలు గుర్తించాల్సి ఉంది. – పనస బుజ్జి, నిర్వహకుడు, కొంకాపల్లి, అమలాపురం రోజుకు ఎనిమిది గంటల శిక్షణ దసరాకు ముందు ఆయుధ పూజ చేసిన తరువాత సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు శిక్షణ ఇస్తాం. రోజుకు 150 నుంచి 250 మంది వరకు గురువుల వద్ద శిక్షణ పొందుతారు. ఎక్కువగా చిన్నారులు, యువత రావడం వల్ల భవిష్యత్‌లో కూడా ఈ ప్రదర్శన నిర్విఘ్నంగా సాగుతుందనే ఆశ మాకుంది. – అబ్బిరెడ్డి మల్లేష్, నిర్వాహకుడు, మహిపాల వీధి, ఎన్ఆర్ఐ (అమెరికా) కోనసీమలో దసరా ప్రత్యేకం స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో 169 ఏళ్లుగా సాగుతున్న ప్రదర్శన ఇటీవల పెరిగిన ఆదరణ ఎన్ఆర్ఐలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రాక మైసూర్ తరువాత... ‘పచ్చని సీమ’లోనే ‘దసరా’ శోభ సంక్రాంతికి ప్రభల తీర్థం.. దసరాకు చెడీ తాలింఖానా -
● లలితా.. లోకమాతా...
దసరా మహోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం రాజమహేంద్రవరం దేవీచౌక్‌లోని మండపంలో అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ ఉపాసకులకు లలితా పరాభట్టారిక అమ్మవారు ముఖ్య దేవత. పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపుర సుందరీదేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తిగా.. చెరుకు గడ, విల్లు, పాశాంకుశాలను ధరించి.. కుడివైపు లక్ష్మీదేవి, ఎడమవైపు సరస్వతీదేవి సేవలు చేస్తూండగా లలితాదేవి భక్తులకు దర్శనమిస్తుంది. దారిద్య్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వార్యాభీష్టాలను సిద్ధింపజేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. లలితా త్రిపురసుందరీదేవి రూపంలో అమ్మవారికి 108 మంది దంపతులతో ప్రత్యేకంగా కుంకుమ పూజ నిర్వహించారు. తెల్లవారు జూము నుంచే దంపతులు భక్తిశ్రద్ధలతో ఈ పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకుమలు అందజేశారు. గోదావరి గట్టున శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో స్వయంభువుగా వెలసిన పార్వతీ మాతను శ్రీమహాచండీ దేవిగా అలంకరించారు. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
● 220.966 గ్రాముల బంగారం, 8.25 గ్రాముల వెండి వస్తువులు ● రూ.4.21లక్షల నగదు స్వాధీనం ● సొత్తు విలువ రూ.9,98,415 ● డీఎస్పీ భవ్యకిషోర్ రాజమహేంద్రవరం రూరల్: కరుడుగట్టిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి నుంచి 220.966 గ్రాముల బంగారం, 8.25 గ్రాముల వెండి వస్తువులు, రూ.4.21 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని జిల్లా సౌత్ జోన్ డీఎస్పీ, ఇన్చార్జి ఈస్ట్‌జోన్ డీఎస్పీ ఎస్.భవ్యకిశోర్ తెలిపారు. మొత్తం సొత్తు విలువ రూ.9,98,415 ఉంటుందని ఆయన అన్నారు. శనివారం బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. దివాన్‌చెరువు డీబీవీ రాజు లే అవుట్లో నివసిస్తున్న క్యానమ్ అన్వేష్ తన తల్లి అస్తికలను గంగానదిలో కలపడానికి గత నెల 24వ తేదీన కాశీ వెళ్లి తిరిగి 27న వచ్చారు. అప్పుడు బీరువాలోని బంగారు వస్తువులు, నగదు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బొమ్మూరు ఎస్సై మురళీమోహన్ కేసు నమోదు చేశారు. ఎస్పీ డి.నరసింహకిశోర్ ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ(క్రైమ్) అర్జున్ పర్యవేక్షణలో ఈస్ట్ జోన్ డీఎస్పీ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బొమ్మూరు ఇన్స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథ్‌కు వచ్చిన సమాచారం మేరకు డీఎస్పీ భవ్యకిషోర్ పర్యవేక్షణలో సిబ్బంది ఒడిశా రాష్ట్రం బరంపురానికి చెందిన ప్రస్తుతం భువనేశ్వర్‌లో ఉంటున్న కారాడ ప్రశాంత్‌కుమార్, ఒడిస్సా రాష్ట్రం గంజామ్ ప్రాంతానికి చెందిన సాగర్‌కుమార్ పాండాను శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 2000 నుంచి నేరాల బాట : నిందితులు ప్రశాంతకుమార్, సాగర్‌కుమార్ పాండాలు 2000 సంవత్సరం నుంచి నేరాలు ప్రారంభించారని డీఎస్పీ భవ్యకిషోర్ తెలిపారు. విశాఖపట్నం పరిధిలో 11, కాకినాడ పరిధిలో నాలుగు, గుంటూరు పరిధిలో మూడు, ఒడిస్సా బరంపురంలో ఐదు, బైద్యనాథ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు, బడాబజార్ పోలీస్‌స్టేషన్ పరిదిలో ఐదు, గుస్సాన్ నుగవు పోలీసు స్టేషన్ పరిధిలో ఎనిమిది, హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఆరు, నాగ్‌పూర్ ప్రతాప్‌నగర్‌లో ఆరు మొత్తం 56 కేసులు వీరి మీద ఉన్నాయన్నారు. నిందితులను రిమాండ్ కోసం ఆరో అదనపు ఫస్ట్ క్లాస్‌మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు. ఈకేసులో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథం, ఎస్సై మురళీమోహన్, బొమ్మూరు పీఎస్ హెచ్‌సీ పి.వెంకటేశ్వరరావు, సీసీఎస్ పీఎస్ హెచ్‌సీలు ఎం.ప్రసాద్, డి.వెంకటరమణ, పీసీలు కె.సురేష్‌బాబు, ఎ.మణికంఠ, ఎఆర్పీసీ బి.హరీష్, ఉమెన్ పీసీ పూర్ణిమరాజ్లను ఎస్పీ డి.నరసింహకిశోర్ అభినందించారని డిఎస్పీ భవ్యకిషోర్ తెలిపారు. -
ఏ కాటు రేబిస్ కానుందో!
తన చూపులతో.. చేష్టలతో మనుషులను వశం చేసుకునే పెంపుడు జంతువులలో కుక్క ఒకటి. ఒక్కసారి దాని ప్రేమకి లొంగిపోతే పరోక్షంగా ఆ యజమాని లేదా ఆ ఇంటి వారు దానికి బానిసలైపోయినట్టే. దానిని నెత్తినెక్కించేసుకుంటారు. ఈ ప్రేమ, వశం మాటున పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆ దాని మాయలో పడినవారికీ.. ఆ మూగజీవికి సైతం తెలియదు. తెలిసినా ఎక్కువ శాతం ఆ ప్రమాదాన్ని విస్మరిస్తారు. దాని పోషణ ఎంత ముఖ్యమో.. దాని ఆరోగ్య విషయంలోనూ అంతే జాగ్రత్తతీసుకోవాలంటారు వైద్యులు. ఆ జీవి చొంగ కానీ.. కంటి నీరు కానీ ఎంతో ప్రమాదకరమైనవి. మితిమీరి ప్రేమించేవారు దాని ముక్కమీద.. నోటి మీద ముద్దులిస్తుంటారు. అంతే కాకుండా దానికి అన్నం సైతం నోట్లో పెట్టి తినిపిస్తారు. ఈ విషయంలో అత్యంత జాగ్రత్త వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. దాని నుంచి ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా.. నిర్ణీత కాల వ్యవధిలో ఏఆర్వీ ఇంజెక్షన్లు, టీకాలు, ఏ అనారోగ్యం వచ్చినా మందులు ఇప్పించాలి. లేదంటే ఆ ప్రేమ చూపించే మూగజీవే ప్రాణాంతకం కావచ్చు. ● కుక్కలతో అప్రమత్తం అంటున్న వైద్యులు ● ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3,794 కేసులు ● నేడు వరల్డ్ రేబిస్ డే రాయవరం: జంతువులు, మనుషుల్లోను వచ్చే అతి ప్రాణాంతక వ్యాధి రేబిస్. అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధుల్లో ఇది ఒకటి. దీనినే లిస్సా హైడ్రోఫోబియా అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన జంతువులు కరవడం వల్ల మనుషులకు కూడా ఆ వ్యాధి వ్యాపిస్తుంది. కుక్కకాటు ద్వారా సంక్రమించే అతి పురాతనమైన వ్యాధి ఇది. రేబిస్ నివారణకు ప్రయత్నాలు జరుగుతున్నా నేటికీ అదుపులోకి రాకపోగా చాలా మందిని ఇది పొట్టన పెట్టుకుంటోంది. పిచ్చి కుక్క కరవడం ద్వారా వచ్చే రేబిస్ వ్యాధికి సకాలంలో చికిత్స చేస్తే పూర్తిగా నివారించే వీలుంటుంది. వ్యాధి లక్షణాలు రెండు రకాలు● ఉగ్రరూపం ఈ దశలో జంతువు విపరీతమైన ఆందోళనగా ఉంటుంది. ప్రతి ఒక్కరినీ విచక్షణా రహితంగా కరుస్తూ యజమానిని గుర్తించలేదు. రాళ్లు, కర్రలు తదితర వాటిని తినడానికి ప్రయత్నిస్తుంది. ఆహారం తినదు. కళ్లు ఎర్రబడి వుండి నోటి నుంచి చొంగ విపరీతంగా కారుతుంది. గొంతు కండరాలకు పక్షవాతం వచ్చి గొంతు బొంగురు పోతుంది. నీరు తాగలేదు. అరుపులో మార్పు వస్తుంది. పిచ్చిగా పరుగులు తీసి గోడలను రుద్దు కుంటుంది. దవడలు బిగుసుకు పోతాయి. సాధారణంగా ఈ లక్షణం పిల్లుల్లో వస్తుంది. ● మూగతనం రేబిస్ సోకిన జంతువుకి కింద దవడ వేలాడుతుంది. వ్యాధి లక్షణాలు అంతగా కనిపించవు. ముందుగా పక్షవాతం లక్షణాలు కన్పిస్తాయి. కరవలేదు. కుందేళ్లలో ఈ లక్షణం కన్పిస్తుంది. వ్యాధి నివారణ చర్యలు ● వ్యాధికి చికిత్స లేదు. వ్యాధి నిరోధక టీకాలు (పోస్ట్ బైట్) వేయించుకోవాలి. ● రేబిస్ సోకిన కుక్క లేదా అడవి జంతువుల ద్వారా అయిన గాయాలకు వెంటనే చికిత్స చేయించాలి. యాంటీ రేబిస్ ఇమ్యునో గాబులిన్స్ ఇప్పించాలి. ● కుక్క కరిచిన గాయాలను శుభ్రంగా డిటర్జెంట్ సబ్బుతో కడగాలి. ● కార్బలిక్ యాసిడ్, టింక్చర్ అయోడిన్‌ను గాయంపై పూయాలి. యాంటీ రేబిస్ ఇమ్యునో గ్లాబ్యులిన్స్ ఇంజక్షన్ ఇవ్వాలి. ● యాంటీ రేబిస్ పోస్టుబైట్ కోర్సు 0, 3, 7, 14, 28, 90 రోజుల్లో క్రమం తప్పకుండా వ్యాక్సిన్ చేయించుకోవాలి. ● పెంపుడు కుక్కల యజమానులందరూ తప్పనిసరిగా తమ కుక్కలకు యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఇప్పించేలా చట్టబద్ధం చేయాలి. ● వీధి కుక్కలకు గర్భనిరోధక ఆపరేషన్లు చేసే కార్యక్రమాలను బ్లూక్రాస్ వంటి సంస్థల సహకారంతో చేపట్టాలి. ● ఇతర దేశాలు, ప్రాంతాల నుంచి కుక్కలను తీసుకువచ్చే సమయంలో వాటికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండేలా చూడాలి. ● రేబిస్ లక్షణాలు, వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అలాగే రేబిస్ కేసుల గురించి తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇవ్వాలి. ● వెటర్నరీ, మెడికల్, మున్సిపల్ శాఖలు కలిసికట్టుగా రేబిస్ వ్యాధి నిరోధానికి చర్యలు చేపట్టాలి. యాంటి రేబిస్ టీకా పిచ్చికుక్క కరిచిన ఒక బాలుడికి 1885వ సంవత్సరంలో లూయిస్‌పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా యాంటి రేబిస్ టీకా వేశారు. వెంటనే వైద్యులను సంప్రదించాలి కుక్క కాటుకు గురైన వ్యక్తి వెంటనే వైద్యులను సంప్రదించాలి. కుక్క కరిచిన చోట సబ్బుతో 10–15 నిమిషాలు సబ్బుతో కడగాలి. కచ్చితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయించాలి. రేబిస్ వ్యాధి నివారణ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. కుక్కల సంతతిని వ్యాక్సినేషన్ ద్వారా కట్టడి చేయాలి. మీరు..నేను..సమాజం అనే స్లోగన్‌తో రేబిస్ నివారణ దినోత్సవాన్ని ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. – డాక్టర్ ఆర్బీ ప్రతాప్, జిల్లా సర్వైలైన్స్ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పెరిగిపోతున్న కుక్కల సంతతి ఇటీవలి కాలంలో కుక్కల సంతతి బాగా పెరిగిపోవడంతో పలువురు కుక్కకాటు బారిన పడుతున్నారు. ఈ వ్యాధి వల్ల జిల్లాలో ఏటా వేల సంఖ్యలో కుక్కకాట్లకు గురవుతున్నారు. మనుషులే కాదు పశువులు కూడా కుక్క కాటు బారిన పడుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు 26వ తేది వరకు 3,794 మంది కుక్కకాటు బారిన పడ్డారు. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేపడితే పూర్తిగా నివారించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి స్వరూపం ఇదీ.. రేబిస్ వ్యాధి రెబ్డో వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువు లేదా జంతువు కరవడం వల్ల ఇది వ్యాపిస్తుంది. రేబిస్ వ్యాధి ఎక్కువుగా కుక్కల వలనే వస్తుంది. వాటిలో లాలాజలం కళ్లు, ముక్కు, పుండు నుంచి కారుతుంది. దానిలో ఉన్న వైరస్ ఆ జంతువు కరచిన ప్రదేశం నుంచి కేంద్ర నాడీ మండలం ద్వారా మెదడుకు చేరి అక్కడ లాలాజల గ్రంధులకు చేరుతుంది. రేబిస్ వ్యాధిని పిచ్చి కుక్క వ్యాధి, హైడోఫోబియా (నీళ్లంటే భయపడడం) అని కూడా పిలుస్తారు. ఐదేళ్ల వ్యవధిలో కుక్క కాట్లు, మరణాల సంఖ్య ఇలా సంవత్సరం డాగ్ బైట్స్ రేబిస్ కేసులు రేబిస్ డెత్స్ 2021 4,378 0 0 2022 5,562 0 0 2023 5,215 0 0 2024 4,559 1 1 2025 జనవరి నుంచి నేటి వరకు 3,794 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. -
రాజమహేంద్రవరాన్ని రక్షించే శ్యామలాదేవిగా..
చిరకాలంగా రాజమహేంద్రవరం గ్రామ దేవతగా పూజలందుకుంటున్న తల్లి శ్రీ శ్యామలాదేవి. ఆ అమ్మవారిని భక్తులు సోమాలమ్మ తల్లిగా, శ్యామలాంబగా పిలుచుకుంటూంటారు. శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం దేవీచౌక్‌లోని మండపంలో శ్రీ బాలాత్రిపురసుందరి అమ్మవారు శ్యామలాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఏడాది శరన్నవరాత్రులు తొమ్మిది కంటే ఎక్కువ రోజులు రావడంతో అమ్మవారిని శ్యామలాదేవిగా అలంకరించారు. అమ్మవారికి పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) -
వాడపల్లి.. జనసంద్రం
● భక్తులతో పోటెత్తిన వేంకన్న క్షేత్రం ● మార్మోగిన గోవింద నామస్మరణ ● ఒక్కరోజు ఆదాయం రూ––లక్షలు కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి క్షేత్రానికి శనివారం భక్తజనం పోటెత్తారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వరుని క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. శుక్రవారం రాత్రి నుంచే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు కాలినడకన వాడపల్లికి చేరుకున్నారు. సాధారణ భక్తులతో పాటు అత్యధిక సంఖ్యలో శ్రీఏడు శనివారాలు – ఏడు ప్రదక్షిణలశ్రీ నోము ఆచరిస్తున్న భక్తులతో ఆ క్షేత్రం నిండిపోయింది. పలువురు భక్తులు మోకాళ్లపై ప్రదక్షిణలు చేశారు. గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది. ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితుల బృందం విశేష పూజలు చేసి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అత్యధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. వివిధ సేవల ద్వారా దేవస్థానానికి రూ – ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము పోలీస్ సిబ్బందితో ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా క్రమబద్ధీకరించారు. -
అంబేద్కర్ నడయాడిన ఈలి వాడపల్లి
రామచంద్రపురం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రామచంద్రపురంలో పర్యటించి నేటికి 81 ఏళ్లు పూర్తయ్యింది. 1944 సెప్టెంబర్ 28న ఆయన స్థానిక ఈలి వాడపల్లి ఆశ్రమానికి వచ్చారు. తాళ్లరేవు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు ఈలి వాడపల్లి 1944లో అంబేడ్కర్‌ను జిల్లా ప్రజలకు పరిచయం చేసేందుకు జాతికి నూతన చైతన్యాన్ని, స్ఫూర్తిని కలిగించేందుకు జిల్లాకు ఆహ్వానించారు. ఆ మేరకు ఆయన కాకినాడ రాగా అక్కడ ఏనుగుపై ఆయనను కూర్చుండబెట్టి వేలాది దళితులు, పుర ప్రముఖుల సమక్షంలో ఊరేగించారు. అనంతరం వాడపల్లి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయనకు కుయ్యేరు గ్రామానికి చెందిన దండంగి గంగమ్మ స్వాగతం పలికారు. రామచంద్రపురంలో వంద ఎడ్ల బండ్లను అలంకరించి గారడీలు, డప్పుల బ్యాండ్లు, కోలాటాలతో టాప్ లేని కారు మీద అంబేడ్కర్‌ను ఘనంగా ఊరేగింపుగా వాడపల్లి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ దళిత విద్యార్థుల చదువు, పోషణ తదితర వివరాలను అడిగి తెలుసుకుని వాడపల్లిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన వాడపల్లి పెద్ద కుమారునికి ప్రేమప్రసాద్ అనే నామకరణం చేశారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు.ఆయన స్మారకంగా తపాలా కవరుఅంబేడ్కర్ రామచంద్రపురం పర్యటనను పురస్కరించుకుని తపాలా శాఖ 2021 సెప్టెంబర్‌లో ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేసింది. దీనిని అప్పటి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీని వాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో విడుదల చేశారు. -
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సీపీఆర్ రెడ్డి అన్నారు. ఈ దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద న్యాయవాదులు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ, వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. తొలి విడతలో నాలుగు కళాశాలలను పీపీపీ పద్ధతిలో అప్పగించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల మంజూరు చేసి, సామాన్యులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకు వచ్చారని గుర్తు చేశారు. గత చంద్రబాబు పాలనలో ఒక్క వైద్య కళాశాల కూడా స్థాపించలేదన్నారు. పీపీపీ అంటే ముమ్మాటికీ ప్రైవేటీకరణేనన్నారు. ఇది పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని రెడ్డి డిమాండ్ చేశారు. పుష్కర ఘాట్‌లో ఇద్దరి గల్లంతు ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు భవానీ భక్తులు గల్లంతైన సంఘటన స్థానిక పుష్కర ఘాట్‌లో చోటు చేసుకుంది. గోకవరం మండలం పెంటపల్లికి చెందిన గుబ్బల బాపిరాజు (28) వాచ్‌మెన్‌గా పని చేస్తూ రాజమహేంద్రవరంలో ప్రస్తుతం నివసిస్తున్నాడు. రాజానగరం మండలం శ్రీరాంపురానికి చెందిన అతడి బావమరిది రాయుడు వీరబాబు (25) హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. భవానీమాల వేసుకోవడానికి అతడు ఇటీవల ఇంటికి వచ్చాడు. బాపిరాజు, వీరబాబు కుటుంబ సభ్యులతో కలసి శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌కు వచ్చారు. అక్కడ బాపిరాజు, వీరబాబు స్నానానికి దిగారు. నది లోతు ఎంత ఉందో తెలియక ఊబిలో దిగి ఇద్దరూ గల్లంతయ్యారు. వారి కోసం త్రీటౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు ఆధ్వర్యాన ఎస్సైలు, సిబ్బంది స్థానిక మత్స్యకారులతో గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో పుష్కర్ ఘాట్ గేట్లన్నీ మూసివేశారు. ఎవ్వరూ గోదావరి స్నానాలకు వెళ్లకుండా పోలీసు గస్తీ ఏర్పాటు చేశారు. భవానీ దీక్షధారులు పుష్కర ఘాట్ శివలింగం వద్ద జల్లు స్నానాలు చేస్తున్నారు. వేలాదిగా.. శృంగార వల్లభుని దర్శనానికి.. పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో శృంగార వల్లభ స్వామివారిని సుమారు 30 వేల మంది దర్శించుకున్నారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లతో పాటు అన్నదాన విరాళాలు కలిపి స్వామివారికి రూ.4,77,983 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. -
ఉగ్ర గోదారి
ధవళేశ్వరం: ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద ఉధృతితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. బ్యారేజీ నుంచి శనివారం ఉదయం 9 గంటలకు 6 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను విడిచిపెట్టగా.. సాయంత్రం 5 గంటలకు అది ఏకంగా 10 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. వరద ఉధృతి మరింతగా పెరగడంతో బ్యారేజీ వద్ద నీటిమట్టం రాత్రి 8 గంటలకు 12.10 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 10,25,075 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. డెల్టా కాలువలకు 10,300 క్యూసెక్కులు విడుదల చేశారు. వరద ఉధృతి పెరుగుతూండటంతో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బ్యారేజీని సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ప్రవాహ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ్లడ్ కంట్రోల్ రూము నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో) కాళేశ్వరం 10.70 పేరూరు 15.18 దుమ్ముగూడెం 11.96 భద్రాచలం 44.50 అడుగులు కూనవరం 19.15 కుంట 10.85 పోలవరం 12.40 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 16.16 -
లక్షణంగా.. లక్ష్మీ కళ ఉట్టిపడేలా..
రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు – రాజవోలు రోడ్డులోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారు శ్రీమహాలక్ష్మీదేవిగా శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్ర వేడుకల్లో భాగంగా అమ్మవారిని రూ.10 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. కుడిపూడి శ్రీనివాస్, లక్ష్మి దంపతుల ఆధ్వర్యాన రూ.500, రూ 200, రూ.100, రూ.20 కరెన్సీ నోట్లతో అలంకరించారు. – రాజమహేంద్రవరం రూరల్ దేవీ నవరాత్రులను పురస్కరించుకుని రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్లో అమ్మవారిని సుమారు రూ.35 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. అమ్మవారితో పాటు ఆలయం లోపలి భాగాన్ని సైతం కరెన్సీ నోట్లతో అలంకరించడంతో ఆ ప్రాంగణం ‘లక్ష్మీ’ శోభను అద్దుకుంది. శ్రీ కనకదుర్గ భవానీ దీక్షా పీఠం ఆధ్వర్యాన గురు భవాని నీలాద్రి వెంకటరమణ, భక్తుల సహకారంతో ఈ అలంకరణ చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం -
స్టెతస్కోప్ వీడి.. సమ్మెబాటలో..
సాక్షి, రాజమహేంద్రవరం: ఏరు దాటేవరకు ఏటి మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా మారింది చంద్రబాబు, కూటమి నేతల తీరు. సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కేందుకు గంపెడు హామీలు ఇచ్చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక నెరవేర్చకుండా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ వ్యవహార శైలితో అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఒక్క వర్గం ఆనందంగా లేని పరిస్థితి. ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారానికి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పింఛన్లలో కోత విధించడంతో దివ్యాంగులు రోడ్డెక్కి ధర్నాలు చేసిన దుస్థితి కళ్లకు కట్టింది. తాజాగా ఆ జాబితాలోకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు సైతం చేరారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకపోవడంతో వారు తాత్కాలికంగా స్టెతస్కోప్ పక్కన పెట్టి.. సమ్మె బాట పట్టారు. పట్టింపేదీ.. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో పీహెచ్‌సీలది కీలక భూమిక. అంతటి ప్రాధాన్యం ఉన్న పీహెచ్సీ వైద్యులపై కూటమి ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని పలుమార్లు విన్నవించినా స్పందించలేదు. చేసేది లేక వైద్యులు సమ్మె బాట పట్టారు. దశల వారీ ఆందోళనకు కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వానికి ఇప్పటికే సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ప్రభుత్వం స్పందిస్తుందని గురువారం వరకూ ఎదురు చూశారు. ఎలాంటి స్పందనా లేకపోవడంతో పూర్తి స్థాయి సమ్మెకు దిగుతామని పేర్కొంటూ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్ఓ)కి శనివారం వినతిపత్రం అందజేశారు. ఇవీ సమస్యలు ఫ జిల్లావ్యాప్తంగా 40 పీహెచ్‌సీలున్నాయి. వాటిలో 90 మంది వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగులకు వ్యతిరేకమైన జీఓ నంబర్ 99 అమలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫ పీహెచ్‌సీల్లో వైద్యాధికారులుగా పని చేస్తున్న వారికి పీజీలో 30 శాతం సీట్ల కోటా ఉండేది. దీనిని కూటమి ప్రభుత్వం గత ఏడాది 15 శాతానికి తగ్గించింది. దీనిపై ఆందోళన చేస్తే 20 శాతానికి పెంచింది. ఏటా ఇదే విధానం కొనసాగిస్తుందని వారు భావించగా.. ఒక ఏడాది మాత్రమే అమలు చేసి, ఇప్పుడు పట్టించుకోవడం లేదు. దీనిపై పీహెచ్సీ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ 2020లో రిక్రూట్ అయిన వైద్యులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంది. ఫ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఎంతో మంది వైద్యులు ఒకే క్యాడర్లో 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నా, ప్రమోషన్లు ఇవ్వడం లేదు. గతంలో టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇస్తామని హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఫ ఏజెన్సీలో పని చేస్తున్న వైద్యులకు 30 శాతం అలవెన్స్ వస్తోంది. అదే ప్రాంతంలో పని చేస్తున్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఉన్న వైద్యులకు మాత్రం ఈ అలవెన్స్ ఇవ్వడం లేదు. దీంతో పాటు సీఎస్ఈ అలవెన్స్ సైతం ఇవ్వడం లేదు. ఫ నోషన్ ఇంక్రిమెంట్లలోనూ కూటమి ప్రభుత్వం మెండిచేయి చూపడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యమ కార్యాచరణ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేంత వరకూ దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు. దీనికి కార్యచరణ ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా తొలి రోజైన శనివారం డీఎంహెచ్ఓకు వినతిపత్రం అందజేశారు. పీహెచ్‌సీల్లో అన్ని ఆన్లైన్ సేవలకు శుక్రవారం నుంచి బ్రేక్ ఇచ్చారు. శనివారం నుంచి క్షేత్ర స్థాయిలో సంచార చికిత్స, వైద్య శిబిరాలు తదితర సేవలు నిలిపివేశారు. అదివారం అన్ని అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అవుతారు. సోమవారం ఓపీ సేవలు బహిష్కరిస్తారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కాన్పులు, పాముకాటు తదితర అత్యవసర వైద్య సేవలు అందిస్తారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఆందోళన కార్యక్రమాలు చేపడతారు. వచ్చే నెల 1న జిల్లా కేంద్రంలో ప్లకార్డులు చేబూని ర్యాలీ, ధర్నా నిర్వహిస్తారు. వచ్చే నెల రెండో తేదీన చలో విజయవాడ నిర్వహిస్తారు. ఫ కూటమి సర్కారు విధానాలపై అసంతృప్తి ఫ సమ్మె ప్రారంభించిన పీహెచ్సీ వైద్యులు ఫ ఇప్పటికే ఆన్లైన్ సేవల నిలిపివేత ఫ ప్రభుత్వం స్పందించకుంటే అన్ని వైద్య సేవలూ నిలిపివేయాలని నిర్ణయం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం గ్రామీణ ప్రజలకు వైద్యం అందించే మా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ప్రస్తుతం రోగులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే ఆందోళన ఉధృతం చేయక తప్పదు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ రూపొందించాం. – డాక్టర్ మౌనిక, జిల్లా అధ్యక్షురాలు, పీహెచ్సీ వైద్యుల సంఘం -
పరవళ్లు తొక్కుతున్న గోదావరి
ధవళేశ్వరం, విజయపురిసౌత్, పోలవరం రూరల్: పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీలో శనివారం సాయంత్రానికి 10 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. నీటిమట్టం 12 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు నుంచి 10.14 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది.స్పిల్‌వే వద్ద 32.730 మీటర్లకు నీటిమట్టం చేరుకోగా, ఎగువన భద్రాచలం వద్ద నీటిమట్టం 44.50 అడుగులకు చేరింది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 4,19,598 క్యూసెక్కులు వచ్చి చేరటంతో ఇక్కడ నుంచి అంతేమొత్తంలో అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అందులో కుడి కాలువకు 8,023, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,373, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కుల నీరు చేరుతోంది. -
‘మిథున్ రెడ్డి అరెస్టుకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది’
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ ఎంపీ ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏ తప్పు చేయకపోయినా కక్షపూరితంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ప్రభుత్వం అనుసరిస్తుందని మండిపడ్డారు.రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్‌లో మాజీమంత్రి అమర్నాథ్, విజయనగరం జడ్పీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ కలిశారు. అనంతరం, మాజీ మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారు. తప్పుడు కేసు పెట్టి మిథున్ రెడ్డిని జైల్లో ఉంచారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది. అయినప్పటికీ ఆయన ధైర్యంగా ఉన్నారు. పార్టీ కోసం అన్ని భరిస్తానని మిథున్ రెడ్డి చెప్పారు. అధికారులు అడిగిన అన్ని రకాల డాక్యుమెంట్లను మిథున్ రెడ్డి అధికారులకు ఇచ్చారు. ఏ తప్పు లేకపోయినా కక్ష పూరితంగా మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. పేర్లు చెప్పిన వారు బయట ఉన్నారు.. ఏ తప్పు చేయని వ్యక్తిని లోపల ఉంచారు. ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్పై అరెస్టులు చేయటం కరెక్ట్ కాదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ప్రభుత్వం అనుసరిస్తుంది. బాలకృష్ణ మాట్లాడిన మాటలు చూశాం. చిరంజీవి ఇచ్చిన కౌంటర్ చూశాం. రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనికోసం మరో డైవర్షన్ అమలు చేస్తున్నారు. పార్టీ నేతలకు ఏ సమస్య వచ్చినా పార్టీ కేడర్ అంతా అండగా ఉంటాం. మిథున్ రెడ్డి అరెస్టుకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది’ అని హెచ్చరించారు.విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘మిథున్ రెడ్డిని ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బందులు పెడుతుందో ప్రజలు గమనిస్తున్నారు. 15 నెలలుగా రాష్ట్రంలో అనేక దారుణాలు చోటుచేసుకున్నాయి. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ మాటలు చూస్తే ప్రభుత్వ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని అన్నారు.కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ..‘ఇది కూటమి ప్రభుత్వం కాదు.. కుట్ర ప్రభుత్వం. వైఎస్సార్సీపీలో కీలకంగా ఉన్న నాయకులను టార్గెట్ చేయడం ప్రభుత్వ లక్ష్యం. కూటమి ప్రభుత్వానికి ప్రజలు సమాధానం చెప్పాలని ఎదురుచూస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలతో కక్షసాధింపు చేస్తే ఊరుకునేది లేదు. బ్యాలెన్స్ తప్పిన బాలకృష్ణ.. చిరంజీవిపై వ్యాఖ్యలు చేసినా పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం విడ్డూరం. ప్రభుత్వానికి కళ్ళు లేవని మిథున్ రెడ్డి అరెస్టుతో నిరూపితమైంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అసెంబ్లీలో సంస్కార హీనంగా మాట్లాడతారా?
● బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలి ● మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు డిమాండ్ ● చాగల్లులో అంబేడ్కర్ విగ్రహానికి వినతి చాగల్లు: హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల సంస్కారహీనంగా మాట్లాడటం చాలా నీచమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు మండిపడ్డారు. బాలకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ చాగల్లు ఎస్సీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి తలారి వెంకట్రావు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాల్పుల ఘటనలో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ చేసిన మేలును బాలకృష్ణ మరచి, ఇటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. బాలకృష్ణ సినిమాలకు రేట్లు పెంచాలని ఆదేశాలిచ్చింది అప్పటి సీఎం వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. బాలకృష్ణకు చెందిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు 2014–19 మధ్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బకాయిలు పెడితే, తరువాత అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఆ బకాయిలు చెల్లించాలంటూ ఆదేశించారని చెప్పారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చిరంజీవి ఆధ్వర్యాన తనను కలసిన సినీ బృందాన్ని వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా గౌరవించారని చెప్పారు. బాలకృష్ణ విశ్వాసం లేని వ్యక్తి అని, మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని తలారి అన్నారు. గొప్ప మనసున్న నాయకుడు జగన్‌ను సైకో అనడానికి బాలకృష్ణకు నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు. చేసిన తప్పుడు వ్యాఖ్యలకు బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకుంటే భవిష్యత్తులో ప్రజలు ఆయనను చీదరించుకునే పరిస్థితులు వస్తాయని చెప్పారు. మాజీ సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, మరోసారి సంస్కారం లేకుండా మాట్లాడితే బాలకృష్ణకు తగిన బుద్ధి చెబుతామని తలారి హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ నాయకులు సుంకర సత్యనారాయణ, ముప్పిడి మహాలక్ష్ము డు, మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్ర కుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి జుట్టా కొండలరావు, పార్టీ మండల అధ్యక్షుడు మట్టా వెంకట్రావు, జిల్లా ప్రచార కమిటీ మాజీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, ఆర్టీఐ జిల్లా విభాగం అధ్యక్షుడు ఇంటి వీర్రాజు, నాయకులు ఉండవల్లి శ్రీనివాస్, చెల్లింకుల దుర్గామల్లేశ్వరరావు, ఉప్పులూరి సూరిబాబు, కుదప రాంబాబు, చౌటుపల్లి వీరన్న, బొర్రా రజనీప్రసాద్, ఎస్కే పాషా, పిల్లి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.