YSR
-
పులివెందుల టీడీపీలో వర్గపోరు.. కార్యకర్తపై బీటెక్ రవి అనుచరుల దాడి!
సాక్షి, వైఎస్సార్: పులివెందులో టీడీపీ(TDP) నేతల మధ్య వర్గపోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రేషన్ షాప్ డీలర్ల విషంయలో తమ ఆధిపత్యం చాటుకునేందుకు పచ్చ నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో, టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వాగ్వాదంలో అతడి చొక్కా చిరిగిపోయింది. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.వివరాల ప్రకారం.. పులివెందులలో రేషన్ షాపుల కోసం టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. నేడు రేషన్ షాప్ డీలర్ల కోసం పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తమ వర్గానికి చెందినవారే పరీక్షకు హాజరు కావాలంటూ రెండు వర్గాలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కేవలం తమ వాళ్ళే పరీక్ష రాసి షాపులు పొందాలంటూ ఇరువర్గాల పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో వాగ్వాదం మరింత పెరిగింది.ఘర్షణ అనంతరం, వేంపల్లికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తిపై బీటెక్ రవి అనుచరులు దాడి చేశారు. దీంతో, దాడికి నిరసనగా పరీక్షా కేంద్రం వద్ద ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత నాటకీయంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. పరీక్షా కేంద్రం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు భారీగా మోహరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తతకర పరిస్థితిలు నెలకొన్నాయి. మరోవైపు గురువారం సాయంత్రం కలెక్టరేట్లో ఇసుక టెండర్ల కోసం బీటెక్ రవి అనుచరులు హంగామా సృష్టించారు. ఆ ఘటన మరవక ముందే శుక్రవారం పులివెందులలో మరోసారి రెచ్చిపోయారు. -
ఇసుక కోసం టీడీపీ, జనసేన సిగపట్లు
కడప కోటిరెడ్డి సర్కిల్: ఇసుక కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు గురువారం సిగపట్లు పట్టారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గీయులు, సిద్దవటం మండల జనసేన పార్టీ నాయకుడు అతికారి కృష్ణ వర్గీయులు బాహాబాహీకి దిగారు. వైఎస్సార్ జిల్లా కడపలోని కలెక్టరేట్లోనే ఈ రెండు వర్గాలు తీవ్రంగా ఘర్షణపడ్డాయి. జిల్లాలోని సిద్దవటం మండలం గుండ్లమూల గ్రామం వద్ద ఇసుక రీచ్‌కి గనులు, భూగర్భ శాఖ జిల్లా స్థాయి ఇసుక కమిటీ షార్ట్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 5.30 లోగా టెండర్లు దాఖలు చేయాలని, 17వ తేదీ ఉదయం 10 గంటలకు టెండర్లు తెరుస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెండర్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్ ఆవరణలోని మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయానికి ఇరువర్గాల నాయకులు గురువారం ఉదయమే చేరుకున్నారు. టెండరు పత్రాల దాఖలు సమయంలోనే వివాదం మొదలైంది. తమ సొంత మండలమైన సిద్దవటంలో ఇసుక టెండరు తమకే దక్కాలని అతికారి కృష్ణ వర్గీయులు పట్టుపట్టారు. బీటెక్ రవి వర్గీయులు ససేమిరా అన్నారు. అతికారి కృష్ణ వర్గీయుల నుంచి టెండరు ఫారాలు లాగేసుకున్నారు. టెండర్లు వేయడానికి వచ్చిన ఇతర కాంట్రాక్టర్లను బెదిరించి అక్కడి నుంచి పంపేశారు. ఈ సందర్భంగా బీటెక్ రవి, అతికారి కృష్ణ వర్గీయుల మధ్య మాటామాటా పెరిగి బాహాబాహీకి దారి తీసింది. ఒక దశలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో కార్యాలయం ప్రాంతం దద్దరిల్లింది. ఇరువర్గాల మధ్య ఘర్షణతో అక్కడి ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. వన్‌టౌన్ సీఐ రామకృష్ణ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఘర్షణ వాతావరణంలోనే టెండర్లు వేశారు. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి వర్గీయులు సైతం టెండర్లకు హాజరయ్యారు. టెండర్లను ఖరారు చేస్తారా లేదా తిరిగి నిర్వహిస్తారా అనే విషయం కలెక్టర్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా మైన్స్ అండ్ జియాలజీ డీడీ సూర్యచంద్రరావు అందుబాటులోకి రాలేదు. -
No Headline
సాక్షి ప్రతినిధి కడప: కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నేతలు భూ ఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలాలు కన్పిస్తే కబ్జాకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా కడప నగరంలో ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, ఆపై రెవెన్యూ డిపార్టుమెంటును మేనేజ్ చేయడంలో తల మునకలయ్యారు. ఇలా పక్కా స్కెచ్ తో కోట్లాది రూపాయల విలువజేసే స్థలాలను కొట్టేస్తున్నారు. తాజాగా కడప నగరంలోని ద్వారకానగర్‌లో రూ.12 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని చదును చేశారు. ఈ ప్రాంతంలో ఇది ప్రభుత్వ భూమి అని హె చ్చరిక బోర్డును సైతం కబ్జాదారులు లెక్కచేయకుండా చదును చేసి ఆక్రమించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ● కడప నగరం ద్వారకానగర్‌లో రైతు బజార్ సమీపంలో నాగరాజుపల్లె పొలం సర్వే నెంబరు 71/1లో 2.52 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో రైతు బజార్ ఏర్పాటు చేయగా మరో 40 సెంట్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉండిపోయింది. ఈ స్థలం బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్‌కు ఆనుకునే ఉంది. ఆన్లైన్లో రికార్డులల్లో అనుభవదారు పేరు ‘వాగు’అని ఇప్పటికీ వస్తోంది. కాగా ఆ స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. జిల్లా టీడీపీ ముఖ్యనేత సన్నిహితులు స్వాహాకు ప్రణాళిక రచించారు. ప్రతిరోజు ముఖ్యనేత చుట్టు ఉండే తెలుగుతమ్ముళ్లు ఈకబ్జా వ్యవహారంలో క్రియాశీలక ప్రాత పోషించినట్లు ఆరోపణలున్నాయి. -
జంప్ రోప్లో ఆశాకిరణం ప్రసన్న
వేంపల్లె: వేంపల్లె మండలానికి చెందిన రామిరెడ్డి ప్రసన్న జంప్ రోప్లో విశేష ప్రతిభతో ఆకట్టుకుంటోంది. ముతుకూరు గ్రామానికి చెందిన రామిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి, రామలక్షుమ్మల కుమార్తె రామిరెడ్డి ప్రసన్న విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తిని కనబరిచేది. ప్రసన్న క్రీడా ప్రతిభను గుర్తించిన సింహాద్రిపురం మండలం కస్తూర్భా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించి క్రీడల్లో ప్రతిభ చూపే విధంగా తీర్చిదిద్దారు. అప్పటినుంచి జంప్ రోప్లో రాణిస్తూ జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు గుర్తింపు పొందింది. ఇటీవల నేపాల్‌లో జరిగిన ప్రపంచస్థాయి ఆటగాళ్లతో పోటీపడి తన సత్తా చాటి మొదటి స్థానంలో గోల్డ్ మెడల్ సాధించింది. పేద రైతు కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. దాతలు చేయూతనందిస్తే జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి పేరు తెస్తుందని పలువురు క్రీడాకారులు అంటున్నారు. -
కిటకిట
ప్రయాణికులతో రద్దీగా మారిన కడప ఆర్టీసీ బస్టాండ్ప్రయాణికులతో బస్సులు.. బస్టాండులు రద్దీగా మారాయి. పండక్కు సొంతూళ్లకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాలు తిరుగు ప్రయాణాలతో కడప ఆర్టీసీ బస్టాండు గురువారం కిటకిటలాడింది. ఆర్టీసీ అధికారులు తిరుగు ప్రయాణానికి మొత్తం 270 సర్వీసులు నడుపుతున్నారు. ప్రధానంగా హైదరాబాదుకు 100 బస్సు లు, బెంగుళూరు 70, విజయవాడ 25, చైన్నె 15 బస్సులతోపాటు తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురానికి 60 బస్సులను అధికారులు నడుపుతున్నారు. బస్సులన్నీ రద్దీగా ఉండడంతో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయా ణికులకు అవసరమైన మేర బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని రూట్లలో రద్దీ అధికంగా ఉండడంతో ఇబ్బందులు తప్పలేదు. –కడప కోటిరెడ్డిసర్కిల్ -
హెచ్చరిక బోర్డును లెక్కచేయని అక్రమార్కులు
రెవెన్యూ అధికారులు ఈ స్థలం ప్రభుత్వ భూమి...దీనిని ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేశారు. ఇవేవి తెలుగుతమ్ముళ్లు లెక్కచేయలేదు. కాగా ఈ స్థలం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. ఈవ్యవహారం వెలుగులోకి రావడంతో సదరు నేతలు తేలుకుట్టిన దొంగలా ఉండిపోయారు. రూ.12కోట్ల విలువజేసే స్థలాన్ని కొట్టేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించి ఇది తమదేనని చదును చేసేశారు. విషయం తెలుసుకున్న ద్వారకానగర్కాలనీ డెవెలప్మెంట్ కమిటీ వారు రెవిన్యూ, కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. దాంతో వ్యవహారం బహిర్గతం కావడంతో అధికారులు సైతం కాస్తా అప్రమత్తమయ్యారు. కోట్లు విలువైన భూమి కాజేసేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లు సైతం సృష్టించినట్లు సమాచారం. ఆమేరకు ఓ రెవెన్యూ అధికారితో సైతం సంప్రదించి సహాకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఓ నేతకు పీఏగా ఉన్న వ్యక్తి తలదూర్చడంతోనే సాధ్యమైందనే ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి చర్యలను ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం భూ కబ్జాలను అరికట్టేడంలో చేతులెత్తేస్తోందనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కడప నగరంలో వార్డు సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు నిత్యం ఇక్కడే ఉంటారు. అలాంటి నగరంలోనే ప్రభుత్వ భూమిని పక్కాగా స్వాహా చేసేందుకు స్కెచ్ వేయడం గమనార్హం. ఇప్పటికై నా రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల మత్తు వీడి ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు. -
No Headline
కడప నగరంలో భూచోళ్లు పడ్డారు. భూ దాహంతో ‘సైకిల్ చక్రాలు’ కట్టుకుని మరీ ఊరంతా తిరుగుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నోరు తెరుస్తున్నారు. పట్టపగలే ప్రభుత్వ స్థలాలను చదును చేస్తూ కబ్జా చర్యలకు పదును పెడుతున్నారు. అధికారులకు మామూళ్ల మకిలీ అంటగట్టి.. ఆపై ఏంచక్కా నకిలీ డాక్యుమెంట్లతో స్థలాలనుహాంఫట్ చేస్తున్నారు. ● నకిలీ డాక్యుమెంట్లతో కోట్ల భూములు కాజేసే యత్నం.. ● కడప ద్వారకనగర్‌లో 40 సెంట్లు కొట్టేసేందుకు ఎత్తుగడ ● యంత్రాలతో చదును చేసిన ‘తమ్ముళ్లు’ ● జిల్లా నేత కనుసన్నల్లో స్వాహాకు యత్నాలు ● ప్రభుత్వ భూమిగా హెచ్చరిక బోర్డు ఖాతరు చేయని వైనం ● ఆక్రమణకు పక్కా ప్రణాళిక -
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్‌రోడ్స్/మైదుకూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18న మైదుకూరులో పర్యటించే అవకాశం ఉన్న నేపధ్యంలో అఽధికారులతో సమన్వయంతో పనిచేసి పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్లో జేసీ అదితి సింగ్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడులతోపాటు జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేయాలని విధులను కేటాయించిన అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంభందిత అధికారులను ఆదేశించారు. జెడ్పీ సీఈవో ఓబులమ్మ, కడప, జమ్మలమడుగు, బద్వేలు ఆర్డీఓ లు జాన్ ఇర్వీన్, సాయిశ్రీ, చంద్రమోహన్, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, ఇన్‌ఛార్జి సీపీఓ హజ్రతయ్య, డీఆర్డీఏ, డ్వామా, ఐసీడీఎస్ పీడీలు ఇతర అధికారులు పాల్గొన్నారు. హెలిప్యాడ్, ఏర్పాట్ల పరిశీలన: మైదుకూరులో సీఎం పర్యటించే ప్రాంతాలను, హెలిప్యాడ్‌ను ఇన్చార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలసి కలెక్టర్ పరిశీలించారు. మైదుకూరులోని కోర్టు సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌తోపాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను, స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానాన్ని వారు పరిశీలించారు. జిల్లాలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అమలు తీరు పర్యవేక్షణలో భాగంగా సీఎం మైదుకూరులో పర్యటిస్తున్నట్లు ఈసందర్భంగా కలెక్టర్ తెలిపారు. జేసీ అదితి సింగ్, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, డీపీఓ రాజ్యలక్ష్మి, బద్వేలు, కడప ఆర్డీఓలు చంద్రమోహన్, జాన్ ఇర్విన్ పాల్గొన్నారు. -
●గణతంత్ర వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
కడప సెవెన్‌రోడ్స్: గణతంత్ర దిన వేడుకల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే వేడుకల్లో జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను, వేదికను అందంగా అలంకరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సౌకర్యాల ఏర్పాట్లపై కడప మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. శకటాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖల్లో విశిష్ట సేవలు అందించిన ఉత్తమ అధికారులు, సిబ్బంది, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడానికి సంబంధిత ప్రతిపాదిత జాబితాను నిర్ణీత గడువు లోపు అందించాలని ఆదేశించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీసుల మార్చ్ ఫాస్ట్‌లో ఎన్సీసీ కేడెట్లను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ యాక్సిడెంట్ బాధితులకు సహాయం అందించి వారి ప్రాణాలు కాపాడుదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రవాణా భద్రత మాసోత్సవాలు–2025 పురస్కరించుకొని ‘దారి భద్రత ప్రచారం‘ – (శ్రద్ధ వహించండి)‘ కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 36వ జాతీయ రవాణా భద్రత మాసోత్సవాలు–2025లో భాగంగా తేదీ ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 15వ తేది వరకు నెల రోజులాటు ‘దారి భద్రత ప్రచారం‘ – (శ్రద్ధ వహించండి)‘ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన గంట (గోల్డెన్ అవర్)లోపు బాధితులకు సరైన వైద్య చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చునన్నారు. మద్యంతాగి వాహనం నడపరాదని, రాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ నేరమన్నారు. సీట్ బెల్ట్ ధరించాలని, భద్రంగా గమ్యం చేరాలన్నారు. -
నీలగిరి.. నింగినంటి..
బి.కొత్తకోట: 1859లో బ్రిటీష్ పాలనలో ఓ కలెక్టర్ నీలగిరి నాటిన మొక్క ఇంతై..ఇంతింతై అన్నట్టు ఎదుగుతోంది. 1995లో మహావృక్ష పురస్కారంతోపాటు రూ.50వేల నగదు బహుమతి పొందిన ఈ మహావృక్షం బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై ఉంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ మహానీలగిరి వృక్షం తాజా లెక్క ప్రకారం ఎత్తు, మొదలు ఆమాంతం పెరిగింది. ఇదీ ఇంకా పెరుగుతుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఈ ఆసక్తికర నీలగిరి మహావృక్షం వివరాల్లోకి వెళ్తే...బ్రిటీష్ పాలనలో ఉమ్మడి కడపజిల్లా కలెక్టర్‌గా డబ్ల్యూడీ హార్సిలీ పని చేస్తున్న కాలంలో ఆయన హార్సిలీహిల్స్‌ను కనుగొన్న విషయం అందరికి తెలిసిందే. కొండపై విడిది చేసుకుని ఓ అతిథిగృహం నిర్మించుకున్న ఆయన ఆ గది పక్కనే ఓ నీలగిరి మొక్కను 1959లో నాటారు. ఆయన నాటిన ఆ మొక్క ఇంతై..ఇంతింతై అన్నట్టుగా ఎదిగి రికార్డులకెక్కుతుందని ఆనాడు భావించి ఉండరేమో. ఇప్పుడిది రికార్డును సృష్టిస్తోంది. వయసు పెరిగేకొద్ది తరిగిపోతారు. అయితే ఈ నీలగిరికి ఏళ్లు పెరిగేకొద్ది అందరూ తలెత్తి చూసేలా ఎత్తుకు ఎదుగుతూ శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఆక్షరిస్తోంది. 1995 నాటికి ఉమ్మడి ఏపీలో పురాతన, అతి ఎత్తయిన వృక్షంగా గుర్తింపు పొంది రికార్డును సొంతం చేసుకుంది. 2000 మార్చి 16న అప్పటి కేంద్ర ప్రభుత్వం దీనికి మహా వృక్ష పురస్కారం అవార్డును, రూ.50వేల నగదును బహుమతిగా అందించారు. దీనిని అప్పటి చిత్తూరు డీఎఫ్ఓ, మదనపల్లె ఎఫ్ఆర్ఓలు ఢీల్లీలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. 2000లో అప్పటి లెక్క ప్రకారం ఈ మహానీలగిరి వయసు 141 ఏళ్లు, ఎత్తు 40 మీటర్లు, చుట్టు కొలత 4.7 మీటర్లు (15.6 అడుగులు). తాజా లెక్కల ప్రకారం ఈ లెక్క మారింది. ఇప్పుడు దీని వయసు 165 ఏళ్లు. ఎదిగిన ఎత్తు 43 మీటర్లు (అంచనా), అంటే మూడు మీటర్ల ఎత్తు పెరిగింది. కాగా ప్రస్తుతం చుట్టు కొలత 6.32 మీటర్లు. అంటే 20.10 అడుగుల చుట్టు కొలత ఉంది. 2000 ఏడాది నుంచి ఇప్పటి వరకు పెరిగింది 1.66 మీటర్లు, అంటే 5.44 అడుగులు పెరిగింది. ఇదే కొలత ఛాతీ ఎత్తులో అయితే చుట్టు కొలత 6.25 మీటర్లు. అంటే 20.6 అడుగులు అవుతుంది. ఈ లెక్క తీసుకున్నా 1.55 మీటర్లు పెరిగింది. అంటే 5.08 అడుగులు పెరిగినట్టు లెక్క స్పష్టం. ఇప్పటిలెక్క ఇదికాగా వయసు పెరిగేకొద్ది ఇంకెంత ఎదుగుతుందో. కొండ నిండా నీలగిరి హార్సిలీహిల్స్‌పై అత్యధికంగా కనిపించేది యూకలిప్టస్ (నీలగిరి) వృక్షాలే. ఈ కొండపై ఏపుగా పెరిగిన నీలగిరి వృక్షాల సందర్శకులకు ప్రత్యేక ఆక్షరణగా నిలుస్తాయి. ఇక్కడ విశేషంగా ఎదిగిన ఈ వృక్షాలపై అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. తొమ్మిది కిలోమీటర్ల ఘాట్‌రోడ్డుపై ఎత్తయిన నీలగిరి వృక్షాలు అలరిస్తాయి. హార్సిలీహిల్స్‌ను అధికారిక విడిదిగా చేసుకునేందుకు కడప కలెక్టర్ హార్సిలీ లేఖ పంపగా మద్రాసు ప్రభుత్వం దీనికి ఆమోదం తెలుపుతూ 1869 మే 4న జీవోఎంఎస్ నంబర్ 11579ను జారీచేసింది. అంతకుముందు గుర్రంపై కొండపైకి వచ్చిన హార్సిలీ మొక్కను నాటారు. తర్వాత అతిథి గృహం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరగా రిజర్వ్ ఫారెస్ట్‌లో బంగ్లా నిర్మించుకునేందుకు 1869 జూన్ 9న జీవోఎంఎస్ నంబర్ 4162ను జారీచేసింది. హార్సిలీహిల్స్‌పై 1859లో నాటినమహా నీలగిరి వృక్షం ఎత్తు, మొదలు పెరిగింది 1995లో కేంద్రమహావృక్ష పురస్కారం ఏపీలోనే పురాతన నీలగిరి వృక్షంగా రికార్డు 1995లో దీని ఎత్తు 40 మీటర్లు, చుట్టు కొలత 4.7మీటర్లు తాజాగా చుట్టు కొలత 6.36మీటర్లు..ఎత్తు 43 మీటర్లు -
నేటి నుంచి రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు
మదనపల్లె సిటీ: మదనపల్లె పట్టణం బీటీ కాలేజీ హాకీ మైదానంలో శుక్రవారం నుంచి 14వ ఏపీ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ది అన్నమయ్య జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు పి.వి.ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, కోశాధికారి ప్రసాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభమయ్యే పోటీలకు ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, మున్సిపల్ చైర్మన్ మనూజరెడ్డి, ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలు 19వతేదీ వరకు జరుగుతాయన్నారు. 21 జట్లు పాల్గొంటాయని తెలిపారు. -
వైభవంగా పీరయ్య స్వామి ఆరాధనోత్సవాలు
చిన్నమండెం: మండలపరిధిలోని చిన్నర్సుపల్లె గ్రామం పీరయ్యమఠంలో 219 సంవత్సరాల క్రితం సజీవ సమాధి అయిన పీరయ్యస్వామి ఆరాధనోత్సవాలు ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు నాలుగో పీఠాధిపతి మఠం నాగలింగమయ్య ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే చెక్కభజన, కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గురువారం మౌలాలి జెండా ఊరేగింపు వైభవంగా సాగింది. ఆరాధనోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పీరయ్య స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో పీరయ్యస్వామి సమాధి -
ట్రాక్టర్ల దొంగతనం కేసులో నిందితుడి అరెస్టు
సింహాద్రిపురం : ట్రాక్టర్ల దొంగతనం కేసులో నిందితుడు ఎరగ్రుడి బాబాను అరెస్టు చేసినట్లు పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. గురువారం మండల కేంద్రమైన సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ట్రాక్టర్ల దొంగతనం కేసులో నిందితుడు ఎరగ్రుడి బాబాను హిమకుంట్ల క్రాస్ రోడ్డు వద్ద ఎస్ఐ తులసి నాగప్రసాద్ అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఒక ట్రాక్టర్, మూడు ట్రాక్టర్ ట్రాలీలు, ఒక వాటర్ ట్యాంకును స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ.11.50 లక్షల మేర ఉంటుందన్నారు. సమావేశంలో ఎస్ఐలు తులసి నాగప్రసాద్, మధుసూదన్‌రావు పాల్గొన్నారు. అంతర్ రాష్ట్ర బస్సు బోల్తా కురబలకోట : మదనపల్లె సమీపంలోని అంగళ్లు–జంగావారిపల్లె మార్గంలో గురువారం వేకువజామున అంతర్ రాష్ట్ర మార్కాపురం–బెంగళూరు ప్రైవేటు బస్సు జంగావారిపల్లె సమీపంలో బోల్తాపడింది. రోడ్డు డివైడర్‌ను ఢీకొని బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మార్కాపురం, గిద్దలూరు, కడపతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 11 మంది గాయపడ్డారు. బస్సు అద్దాలను పగుల గొట్టి హుటాహుటిన వీరిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. సంక్రాంతి పండగకు ఇంటికి వచ్చి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో క్లీనర్ సి. వెంకటనారాయణ, వినోద్, నవీన్‌కుమార్, సాహితి, వినీత్, ఉమామహేశ్వర్ రెడ్డి, విక్రమ్, యశ్వంత్, వంశీ, కేశవరావు, నరసింహులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. -
ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని కొత్త కలమల్ల గ్రామంలో నివాసం ఉండే చిత్రాల జాషువా కుమార్తె చిత్రాల కీర్తి(17) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కలమల్ల పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు కొత్త కలమల్ల గ్రామంలో నివాసం ఉండే జాషువాకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద అమ్మాయి చిత్రాల కీర్తి కాగా, మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. జాషువా లారీ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కీర్తి కడపలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. కడుపునొప్పి తాళలేక సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. తల్లిదండ్రులు ఇంటికి రాగా తలుపు వేసి ఉంది. తలుపును పగులగొట్టి లోపలికి చూడగా కీర్తి ఉరి వేసుకుని వేలాడుతూ ఉండటం గమనించారు. వెంటనే కొన ఊపిరితో ఉన్న ఆమెను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిమోతి తెలిపారు. -
సీఎం వస్తున్నారని.. ముందస్తు నోటీసులు
కడప అర్బన్ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ఈనెల 18వ తేదీన పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఎవరైనా ప్రజా సమస్యలపై నిరసన తెలుపుతారని, ఆయనకు సమ్యలు విన్నవించేందుకు ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి గంగాసురేష్ను ఆయన ఇంటివద్ద కలిసిన పోలీసులు నోటీసు ఇచ్చారు. రెండు రోజుల ముందునుంచే పోలీసులు నోటీసులు జారీ చేసి నిరసనలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనెల 17న తెల్లవారుజామునుంచే మరికొంతమంది నేతలను వారి ఇళ్లవద్దకు వెళ్లి నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. -
రేషన్ కోసం రోడ్డెక్కిన మహిళలు
పులివెందుల రూరల్ : గత ఏడు నెలలుగా రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని నల్లపురెడ్డిపల్లె గ్రామంలో సుంకులమ్మపేటకు చెందిన గ్రామస్తులు, మహిళలు గురువారం రోడ్డుపై బైఠాయించారు. అందరికీ రేషన్ పంపిణీ చేసిన తర్వాత సుంకులమ్మపేటలో పంపిణీ చేస్తుండటంతో చాలామందికి రేషన్ బియ్యం అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కంది బేడలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదంటూ వారు వాపోతున్నారు. తమతో మాత్రం వేలిముద్రలు వేయించుకుంటున్నారని, కంది బేడలు, రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇదేమని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వారు అంటున్నారు. రేషన్ సక్రమంగా పంపిణీ చేసేంతవరకు రోడ్డుపైనే బైఠాయిస్తామని వారు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు హుటాహుటిన రేషన్ బియ్యం తీసుకెళ్లి సుంకులమ్మపేట గ్రామస్తులకు పంపిణీ చేశారు. -
చిత్రం.. భలే విచిత్రం!
అందమైన పక్షి గాలిలో ఎగురుతున్నట్లు..మనసుకు హత్తుకునేలా గీసిన చిత్రాలు చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ప్రపంచంలో అంతరించి పోతున్న అరుదైన పక్షి జాతుల్లో ఒకటి కలివికోడి. ఆ పక్షి ఉనికిని కనుగొనేందుకు అట్లూరు మండలం కొండూరు అటవీ బంగళా ఆవరణలో పరిశోధనా కేంద్రం ఏర్పాటైంది. అక్కడ కలివి కోడి చిత్రాలతోపాటు పలు రకాల పక్షుల చిత్రాలు, జంతువుల చిత్రాలు గోడపై గీశారు. అవి నిజమైన దృశ్యాన్ని తలపిస్తున్నాయి. ఈ పరిశోధనా కేంద్రంలో వాటిని తిలకించేందుకు జిల్లాలోని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీసుకొచ్చి వివరిస్తున్నారు. – అట్లూరుఅడవిలో పక్షులు ఎగురుతున్నట్లుపిల్లలతో ఉన్న పెద్దపులి -
హోరాహోరీగా బండలాగుడు పోటీలు
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని కామనూరు గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన సీనియర్ క్యాటగిరి ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రారంభించారు. ఇందులో 11 జతల ఎద్దులు పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌కు చెందిన సుంకి సురేంద్రరెడ్డి ఎద్దు, నంద్యాల టౌన్ పెద్దకొట్టాలకు చెందిన బోరెడ్డి కేశవరెడ్డికి చెందిన ఎద్దు కలసి పోటీలో పాల్గొని 3,643.09 అడుగుల దూరం బండ లాగి ప్రథమ స్థానంలో నిలిచి బుల్లెట్ ద్విచక్రవాహనాన్ని కై వసం చేసుకున్నాయి. మైదుకూరుకు చెందిన కుర్రా వెంకటేష్ యాదవ్ ఎద్దులు 3,260.02 అడుగుల దూరం బండ లాగి రెండో స్థానంలో నిలిచి టీవీఎస్ అపాచి ద్విచక్రవాహనాన్ని గెలుపొందాయి. ప్రొద్దుటూరు మండలం చౌటపల్లెకు చెందిన మార్తల చంద్ర ఓబుళరెడ్డి ఎద్దులు మూడో స్థానంలో నిలిచి టీవీఎస్ స్పోర్ట్స్ ద్విచక్రవాహనం, ప్రొద్దుటూరుకు చెందిన ద్వార్శల గురివిరెడ్డి ఎద్దులు నాలుగో స్థానంలో నిలిచి టీవీఎస్ ఎక్సెల్, గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన పులగం త్రిష్ణారెడ్డి ఎద్దులు ఐదో స్థానంలో నిలిచి రూ.25వేలు నగదు బహుమతి అందుకున్నారు. ప్రొద్దుటూరు మండలం చౌటపల్లె గ్రామానికి చెందిన మార్తల చంద్ర ఓబుళరెడ్డి ఎద్దులు ఆరో స్థానంలో నిలిచి రూ.15వేలు నగదు, మిగిలిన ఎద్దుల జతలకు కన్సొలేషన్ బహుమతి కింద ఒక్కో కాడికి రూ.5,116 గ్రామ కమిటీ ప్రతినిధులు అందజేశారు. ఈ ఎద్దుల పోటీలో యాంకర్లుగా ఓగేటి సురేంద్ర, చిరంజీవి వ్యవహరించారు. -
మా బిడ్డ మృతదేహం వెలికితీయరా.!
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ దద్దాలవారిపల్లె సమీప క్వారీ నీటి గుంతల్లో ఈనెల 15న ఈతకెళ్లి మృతి చెందిన యువ ఇంజినీర్ బి.వెంకటరత్నం మృతదేహాన్ని రెండురోజులైనా పోలీసులు వెలికితీయలేదు. దీంతో ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. రెండు రోజులుగా పోలీసుల తీరు సరిగ్గా లేదంటూ మృతుడి తండ్రి రోడ్డుపై బోరున విలపించడం అందరినీ కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కలకడ మండలం గుడిబండ పంచాయతీ చొక్కనవారిపల్లెకు చెందిన బి. సూరి కుమారుడు బి. వెంకటరత్నం(25) సంక్రాంతి పండుగరోజున ఈనెల 15న దద్దాలవారిపల్లె క్వారీ గుంతల్లో స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌కు 15 రోజుల్లో ఉద్యోగంలో చేరడానికి బయలుదేరి ఉండాల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి పీలేరు, వాల్మీకిఫురం, రాయచోటికి చెందిన అగ్నిమాపక సిబ్బంది దద్దాలవారిపల్లె వద్ద ఉన్న క్వారీ నీటి గుంతల వద్దకు చేరుకున్నారు. తమ సామగ్రితో నీటి గుంతల్లో మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండురోజులుగా గాలింపు చర్యలు ముమ్మరంగా నిర్వహించినా మృతదేహాన్ని పోలీసులు వెలికి తీయలేక పోయారు. పోలీసులు మళ్లీ ఇద్దరు గజ ఈతగాళ్లను నీటి గుంతల్లోకి దింపి మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసుల చర్యలు రెండు రోజులుగా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదని మృతుడి బంధువులు ఆరోపించారు. యువ ఇంజినీర్ మృతి వార్త తెలుసుకుని కలకడ మండలం నుంచి బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు పెద్ద ఎత్తున క్వారీ గుంతల వద్దకు చేరుకున్నారు. సాయంకాలం వరకు ఓపిక పట్టిన అందరూ ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డారు. క్వారీ గుంతల పక్కనే ఉన్న ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారి, కడప–బెంగళూరు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. అమరావతి నుంచి ఎస్డీఎస్ బలగాలను ఎందుకు పిలిపించలేదని అధికారులపై మండిపడ్డారు. నా బిడ్డ మృతదేహాన్ని బయటకు తీయడంలో పోలీసులు సహకరించడం లేదంటూ మృతుడి తండ్రి సూరి రోడ్డుపై బోరున విలపిస్తుంటే ప్రతి ఒక్కరూ చలించిపోయారు. వాల్మీకిపురం సీఐ ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ మధురామచంద్రుడులు ధర్నా చేస్తున్న వారితో చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. చివరకు కర్నూలు నుంచి ఎస్డీఎస్ బలగాలను రాత్రికి దింపి మృతదేహాన్ని వెలికితీసే పనులు ముమ్మరం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రెండు రోజులైనా మృతదేహాన్ని వెలికితీయలేకపోవడంతో మృతుడి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై యువ ఇంజినీర్ బంధువులు, గ్రామస్తుల ఆగ్రహం జాతీయ రహదారిపై ధర్నా కన్నీరుమున్నీరైన మృతుడి తండ్రి -
పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరి అరెస్టు
వేంపల్లె : వేంపల్లె పట్టణం వడ్డె వీధిలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ సురేష్ రెడ్డి తెలిపారు. మూడు రోజుల క్రితం ఇంటివద్ద గొడవ చేస్తున్నారని, వడ్డెర వీధికి చెందిన గౌరీ అనే మహిళ భర్త మల్లికార్జునపై ఫిర్యాదు చేశారు. పోలీసులు మల్లికార్జున ఇంటి వద్దకు వెళ్లగా గొడవకు దిగి విధులకు ఆటంకం కలిగించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రంగారావు వెళ్లగా ఆయనపై ఎదురు తిరిగారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ నజీర్ ఫిర్యాదు మేరకు మల్లికార్జున, శివలపై కేసు నమోదు చేశారు. గురువారం వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా.. మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో వారిని జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు. -
పంచాయతీ అవినీతిపై విచారణ
వేంపల్లె : వేంపల్లె గ్రామపంచాయతీలో జరిగిన అవినీతి ఆరోపణలపై ఆరుగురు కమిటీ సభ్యులతో విచారణ చేపట్టారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో జమ్మలమడుగు డీఎల్పీఓ తిమ్మక్క ఆధ్వర్యంలో రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎల్పీఓ మాట్లాడుతూ 2023 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలో పంచాయతీ ఈఓ వెంకటసుబ్బారెడ్డి అవినీతికి పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో డీపీఓ రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు ఈఓపీఆర్డీలు రామచంద్రారెడ్డి, షాకీర్ అలీఖాన్, శివారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు బషీర్, శ్రీనివాసులు, మాధవరెడ్డిలతో కమిటీ వేశారు. దీంతో అందుకు సంబంధించిన 15వ ఫైనాన్స్ కమిషన్, ఇంటి పన్ను, నీటి పన్ను, జనరల్ ఫండ్, టాక్స్, నాన్ టాక్స్ వసూళ్ల రికార్డులను పరిశీలించారు. అన్ని రికార్డులను జమ్మలమడుగు డీఎల్పీఓ కార్యాలయానికి తీసుకెళుతున్నామని తెలిపారు. ఇంకా కొన్నింటికి సంబంధించి రికార్డులు పరిశీలించాల్సి ఉందన్నారు. త్వరలో పూర్తి రికార్డులను పరిశీలించి, విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదికలను పంపుతామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఓ వెంకటసుబ్బారెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. వర్గ పోరుతో అవినీతి ఆరోపణలు..? పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నాయకుడు బీటెక్ రవి వర్గానికి సంబంధించి 13 మంది వ్యక్తులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాలు వేసుకోవాలని కోరగా... మరో వర్గం టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తమకు సంబంధించి 9మంది వ్యక్తుల లిస్టు పంపారు. అందుకు ఈఓ సహకరించలేదని ఈఓపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. కలెక్టర్ అప్రూవల్ చేసినంతవరకు ఎవరిని కూడా కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగంలోకి తీసుకునే పరిస్థితి లేదు. రెండు వర్గాలు పోటీ పడడంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోందని.. ఒక వర్గానికి చేస్తే, మరో వర్గం ఇలా అవినీతి ఆరోపణలు అంటగట్టడం పరిపాటిగా మారుతోందని తెలుస్తోంది. దీంతో మండలంలోని అధికారులు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో తలలు పట్టుకుంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్మాస్‌పేట సమీపంలో ఈనెల 13వ తేదీన మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు చదిపిరాళ్ల తులసీధర్ (57) ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కడప టూటౌన్ ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు కమలాపురం టౌన్ సొసైటీకాలనీలో నివాసం ఉంటున్న చదిపిరాళ్ల తులసీధర్ గంగవరం స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈనెల 13న కడపలోని సింహపురికాలనీలో ఉన్న సోదరుడి ఇంటికి వెళ్లి తిరిగి తన ద్విచక్ర వాహనంలో కమలాపురం వెళుతుండగా అల్మాస్‌పేట సర్కిల్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి పడిపోయారు. తీవ్ర గాయాలతో కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వెంకటయ్య కుటుంబానికి న్యాయం చేయాలి
చాపాడు: కనుమ పండుగ రోజైన బుధవారం నక్కలదిన్నె గ్రామ సమీపంలోని పంట పొలాల్లో బావిలో పడి మృతి చెందిన సండ్రా వెంకటయ్య(38)కుటుంబానికి న్యాయం చేయాలని గురువారం గ్రామంలో కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. నక్కలదిన్నెకు చెందిన టీడీపీ నాయకుడు ఎర్రిబోయిన ప్రసాద్ వల్లనే తన భర్త మృత్యువాత పడ్డాడని మృతుడి భార్య యశోద ఆరోపించారు. పోస్టుమార్టం అనంతరం వెంకటయ్య మృతదేహాన్ని నక్కలదిన్నెకు తీసుకువచ్చి ప్రసాద్ ఇంటి ఎదుట బాధిత కుటుంబీకులు, బంధువులతో పాటు గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో టీడీపీ నాయకుడి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుమ రోజైన బుధవారం కొట్టాలపల్లెకు చెందిన సండ్ర వెంకటయ్య, నక్కలదిన్నెకు చెందిన టీడీపీ నాయకుడు ఎర్రిబోయిన ప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు కలసి పొలాల వద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో బావిలో వెంకటయ్య మృతి చెందాడు. వెంకటయ్య ఇంటికెళ్లే క్రమంలో బావి వద్ద శుభ్రం చేసుకునేందుకు వెళ్లి బావిలో పడ్డాడని, తాము గుర్తించి కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే నీటి లోపలికి వెళ్లాడని ప్రసాద్ చెబుతున్నాడు. ఇది సరి కాదని ప్రసాద్ వల్లనే తన భర్త మృతి చెందాడని, ఇంట్లో భోజనం చేస్తున్న తన భర్తను కావాలనే విందుకు తీసుకెళ్లారని వారి ప్రమేయం లేకుండా ఎలా బావిలో పడతాడని మృతుడి భార్య యశోద ప్రశ్నించింది. తన కుటుంబానికి న్యాయం జరిగితేనే తన భర్త మృత దేహానికి అంత్యక్రియలు చేస్తామని లేకుంటే ఇక్కడే ఉంచుతామని తేల్చి చెప్పింది. దీంతో గ్రామ పెద్దలు, బంధువులు ఇరు కుటుంబీకుల వారితో చర్చించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చిన్న పెద్దయ్య సంఘటనా స్థలానికి చేరుకుని వెంకటయ్య మృతి చెందిన ఘటనపై భార్య యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. విచారణ జరిపి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.నక్కలదిన్నెలో టీడీపీ నాయకుడు ప్రసాద్ ఇంటి ఎదుట గ్రామస్తుల ఆందోళన -
వైఎస్సార్ జిల్లా: కూటమి నేతల కుమ్ములాట
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇసుక టెండర్ల దాఖలులో కూటమి నేతలు కొట్లాటకు దిగారు. జిల్లాలో రెండు ఇసుక క్వారీలకు టెండర్లు వేయగా, రంగంలోకి దిగిన బీటెక్ రవి అనుచరులు హల్చల్ చేశారు. ఇద్దరు మీడియా ప్రతినిధులను బీటెక్ అనుచరులు నిర్భంధించారు.సిద్ధవటం మండలం మూలపల్లి ఇసుక క్వారీ విషయంలో బీటెక్ రవి, జనసేన నేతల మధ్య వార్ జరుగుతోంది. ఎవర్నీ టెండర్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ జనసేన నేత అతికారి కృష్ణ హల్చల్ చేశారు. పోలీసులపై జనసేన నేతలు దౌర్జన్యానికి దిగారు. చక్రాయపేట మండలం గండికొవ్వూరు ఇసుక రీచ్ టెండర్లలతో బీటెక్ రవి, కడప టీడీపీ నేతల మధ్య వార్ కొనసాగుతోంది.దీంతో మైన్స్ ఏడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులపైకి జనసేన నేతలు తిరగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో టెండర్ల స్వీకరణను అధికారులు నిలిపివేశారు. -
తాగు నీటి మోటారు వైర్లు చోరీ
అట్లూరు : మండల పరిధిలోని కమలకూరు బీసీ కాలనీలో తాగు నీటి మోటారుకు సంబంధించిన వైర్లు చోరీకి గురయ్యాయి. దీంతో పండగ పూట తాగు నీటి కోసం కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. కాలనీలో సుమా రు 100 కుటుంబాల వారు నివసిస్తున్నారు. కాలనీ వాసుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మోటారు వెళ్లే వైర్లు, అలాగై విద్యుత్ లైన్ మీద నుంచి స్టార్టర్కు వెళ్లే వైర్లు మంగళవారం రాత్రి కత్తిరించుకుని వెళ్లారు. దీంతో బుధవారం కనుమ పండుగ రోజు కాలనీ వాసులు గ్రామంలోకి, చేతి పంపులు, పొలాల వద్దకు వెళ్లి తాగు నీరు తెచ్చుకోవాల్సి వచ్చింది. కాగా కాలనీ వాసులంతా వైఎస్సార్సీపీకి చెందిన వారు. ఎవరైనా గిట్టని వారు చేశారా లేక కాపర్ కోసం దొంగలు చేశారా? ఒక వేళ దొంగల పని అయితే స్టార్టర్ కూడా ఎత్తుకు వెళతారు కదా? అని చర్చించుకుంటున్నారు. కాగా ఈ విషయం తెలిసిన వెంటనే కమలకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ వడ్డమాను సుబ్రమణ్యంశాస్త్రి చోరీకి గురైన వైర్ల స్థానంలో కొత్త వైర్లు తెప్పించి మరమ్మతులు చేయించారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్ వైరు..పులివెందుల రూరల్ : పట్టణంలోని కదిరి రోడ్డులోని ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో ఉన్న మోపూరి రామంజనమ్మ తోటలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పగులగొట్టి అందులోని కాపర్ వైరును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అలాగే తోటలోని గదిలో ఉన్న మోటారు పైపులు, కేబుల్ వైర్లతో పాటు సామగ్రి దొంగిలించారు. సుమారు రూ.2 లక్షలు విలువ చేసే కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోరుగా కోడి పందేలు లింగాల : లింగాల మండలం దొండ్లవాగు, మురారి చింతల గ్రామాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు జోరుగా సాగాయి. 3 రోజుల పాటు ఈ పందేలు కొనసాగాయి. జూదంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. ఆయా గ్రామాల టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో కోడి పందేలు నిర్వహించారు. మండలం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది కోడి పందేల కోసం వచ్చారు. బావిలో పడి వ్యక్తి మృతి చాపాడు : మండల పరిధిలోని నక్కలదిన్నె గ్రామ సమీపంలోని పంట పొలాలలో బుధవారం మధ్యాహ్నం కొట్టాలు గ్రామానికి చెందిన సండ్రా వెంకటయ్య(38) అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటయ్య పంట పొలాల్లోని బావి దగ్గరికి వెళ్లి కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. గత ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడు ప్రమాదశాత్తు పడ్డాడా లేక మద్యం సేవించి బావిలో పడ్డాడా అనే విషయం పోస్టుమార్టం నివేదికలో తేలుతుందని ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. మృతుడికి భార్య యశోద, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు మదనపల్లె : ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. బి.కొత్తకోట మండలం బడికాయలపల్లెకు చెందిన చిన్నప్ప(24) కుటుంబ పోషణ నిమిత్తం ఊరూరా తిరిగి తినుబండారాల వ్యాపారం చేస్తుంటాడు. మంగళవారం వ్యాపారం ముగించుకుని ద్విచక్రవాహనంలో తిరిగి వెళుతుండగా దొమ్మన్నబావి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.