Sports
-
చరిత్ర సృష్టించిన స్మిత్.. విలియమ్సన్, మార్క్‌వా రికార్డులు బద్దలు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. స్మిత్‌కు ఇది 25 ఇన్నింగ్స్‌ల తర్వాత వచ్చిన టెస్టు సెంచరీ కావడం గమనార్హం.స్మిత్ చివరగా 2023 జూన్‌లో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై చివరి సెంచరీ సాధించాడు. మళ్లీ ఇప్పుడు దాదాపు ఏడాదిన్నర తర్వాత మూడెంకెల స్కోర్‌ను స్మిత్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 190 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 12 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. స్మిత్‌కు ఇది భారత్‌పై 10వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 33వ టెస్టు సెంచరీ. ఈ క్రమంలో స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.స్మిత్ అరుదైన రికార్డులు..టెస్టుల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ స్టార్ జోరూట్ రికార్డును స్మిత్ సమం చేశాడు. రూట్ 55 ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీలు నమోదు చేయగా... స్మిత్ 41 ఇన్నింగ్స్‌లలో పది శతకాలు సాధించాడు. అదే విధంగా ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో స్ధానానికి స్మిత్(33) ఎగబాకాడు. ఈ క్రమంలో మార్క్ వా(32)ను వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(41) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పదకుండో స్ధానంలో స్మిత్(33) కొనసాగుతున్నాడు. ఈ సెంచరీతో కేన్ విలియమ్సన్(32)ను స్మిత్ వెనక్కి నెట్టాడు. -
మహ్మద్ షమీకి బైబై!
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేలా కనిపించడం లేదు. ఆసీస్‌తో మూడో టెస్టు నుంచే ఈ బెంగాల్ బౌలర్ భారత జట్టుకు అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇటీవల... వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడాయి.‘‘షమీ టీమిండియా కిట్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పూర్తి కాగానే అతడు కూడా కంగారూ గడ్డపై అడుగుపెట్టనున్నాడు’’ అని పేర్కొన్నాయి. అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. ఇప్పటికే టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మొదలైపోయింది.బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం ఈ మ్యాచ్ ఆరంభమైంది. మరోవైపు.. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే బెంగాల్ జట్టులో షమీ పేరును చేర్చారు సెలక్టర్లు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి జనవరి 18 వరకు జరుగనుంది.ఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనబోయే తమ జట్టులో ఇరవై మంది ఆటగాళ్లకు చోటిచ్చింది. సుదీప్ కుమార్ ఘరామీ కెప్టెన్సీలో ఆడబోయే ఈ టీమ్‌కు టీమిండియా స్టార్లలో మహ్మద్ షమీతో పాటు ముకేశ్ కుమార్‌ను కూడా ఎంపిక చేసింది. అదే విధంగా షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్ కూడా ఈ టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.కాగా 34 ఏళ్ల షమీ చివరగా వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. స్వదేశంలో జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో షమీ 24 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత అతడు చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు.ఈ నేపథ్యంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందిన షమీ.. దాదాపు ఏడాది తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు. ఈ టోర్నమెంట్లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 7.85 ఎకానమీతో పదకొండు వికెట్లు తీశాడు.తద్వారా టీ20 క్రికెట్లో 201 వికెట్లు పూర్తి చేసుకున్నాడు షమీ. ఈ క్రమంలో షమీ ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే తరువాయి అనుకున్న తరుణంలో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. షమీ కోసం టీమిండియా తలుపులు తెరిచే ఉన్నాయని.. అయితే, అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని పేర్కొన్నాడు.కాగా షమీ ఫిట్‌గానే ఉన్నప్పటికీ ఐదు రోజుల క్రికెట్(టెస్టు) ఆడేందుకు అతడు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అందుకే బీసీసీఐ అతడిని ఆసీస్ పర్యటన నుంచి పూర్తిగా పక్కనపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు షమీ సిద్ధం కావడం విశేషం.ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు పూర్తి చేసుకున్న టీమిండియా.. బ్రిస్బేన్(డిసెంబరు 14-18), మెల్బోర్న్(డిసెంబరు 26-30), సిడ్నీ(జనవరి 3-7)లో మిగిలిన మూడు టెస్టులు ఆడనుంది. మరోవైపు.. షమీ భాగమైన బెంగాల్ జట్టు.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబరు 21న ఢిల్లీతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.విజయ్ హజారే ట్రోఫీ-2024కు బెంగాల్ జట్టుసుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), మహ్మద్ షమీ, అనుస్తుప్ మజుందార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఛటర్జీ, కరణ్ లాల్, షకీర్ హబీబ్ గాంధీ (వికెట్ కీపర్), సుమంత గుప్తా, శుభమ్ ఛటర్జీ, రంజోత్ సింగ్ ఖైరా, ప్రదీప్తా ప్రామాణిక్, కౌశిక్ మైటీ, వికాస్ సింగ్, ముకేశ్ కుమార్, సక్షీమ్ చౌదరి, రోహిత్ కుమార్, మహ్మద్ కైఫ్, సూరజ్ సింధు జైస్వాల్, సయాన్ ఘోష్, కనిష్క్ సేథ్. -
కివీస్ పేసర్ భారీ హిట్టింగ్.. క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు సమం
తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును సౌథీ సమం చేశాడు. కివీస్ జట్టు సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతోంది.మరో మ్యాచ్ మిగిలి ఉండగానేఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.లాథమ్, సాంట్నర్ ఫిఫ్టీలుహామిల్టన్లోని సెడాన్ పార్కులో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌తో శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (135 బంతుల్లో 63; 9 ఫోర్లు), మిచెల్ సాంట్నర్ (54 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.మరోవైపు.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (44; 9 ఫోర్లు), విల్ యంగ్ (42; 10 ఫోర్లు) రాణించారు. అయితే, ఒక దశలో 172/2తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్... మిడిలార్డర్ వైఫల్యంతో 231/7కు పరిమితమైంది. రచిన్ రవీంద్ర (18), డరైన్ మిషెల్ (14), టామ్ బ్లన్‌డెల్ (21), గ్లెన్ ఫిలిప్స్ (5) విఫలమయ్యారు.చెలరేగిన సౌథీమరికాసేపట్లో ఇన్నింగ్స్ ముగియడం ఖాయమే అనుకుంటున్న దశలో ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ చెలరేగాడు. ఈ మ్యాచ్‌తో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకనున్న టిమ్ సౌథీ (10 బంతుల్లో 23; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా దుమ్ము రేపడంతో న్యూజిలాండ్ మూడొందల మార్కు దాటగలిగింది. వీరిద్దరి ధాటికి కివీస్ టి20 తరహాలో చివరి 8 ఓవర్లలో 76 పరుగులు రాబట్టడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్, గస్ అట్కిన్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.టెస్టు క్రికెట్లో భారీ సిక్స్‌లకు పెట్టింది పేరైన సౌథీకాగా టెస్టు క్రికెట్లో భారీ సిక్స్‌లకు పెట్టింది పేరైన సౌథీ ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో... క్రిస్ గేల్ (98 సిక్స్‌లు)తో సమంగా నాలుగో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో ఉన్నది వీరేఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (133 సిక్స్‌లు) అగ్ర స్థానంలో ఉండగా... న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ (107 సిక్స్‌లు), ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (100 సిక్స్‌లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.ఇక టీమిండియా నుంచి వీరేంద్ర సెహ్వాగ్ (91 సిక్స్‌లు), రోహిత్ శర్మ (88 సిక్స్‌లు) ఈ జాబితాలో వరుసగా ఆరో, ఏడో స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ తరఫున 107వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న సౌథీ... ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.ఇంగ్లండ్ 143 ఆలౌట్ఆదివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కివీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 143 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 340 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
'సిరాజ్‌కు కొంచెం కూడా తెలివి లేదు.. ఇది అస్సలు ఊహించలేదు'
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ పేస్‌ర్ మహ్మద్ సిరాజ్ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. తొలి సెషన్లో సిరాజ్ కాస్త పర్వాలేదన్పించినప్పటికి.. రెండో సెషన్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఆసీస్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, స్మిత్‌లు సిరాజ్‌ను ఓ ఆట ఆడేసికుంటున్నారు. ఇప్పటివరకు 18.2 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 69 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ను కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన బౌలింగ్ రిథమ్‌ను కోల్పోయినట్లు కన్పిస్తున్నాడు.ఈ నేపథ్యంలో సిరాజ్‌పై ఆసీస్ మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ విమర్శలు గుప్పించాడు. సిరాజ్ తన బౌలింగ్ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడంలో విఫలమయ్యాడని కటిచ్ మండిపడ్డాడు. కాగా ఆసీస్ ఇన్నింగ్స్ 60 ఓవర్ వేసిన సిరాజ్ తొలి బంతిని షార్ట్ డెలివరీగా సంధించాడు. అయితే ఆ బంతిని హెడ్ ర్యాంప్ షాట్ ఆడి థర్డ్‌మ్యాన్ దిశగా బౌండరీగా మలిచాడు. అయితే ఆ ఓవర్ ముందువరకు థర్డ్-మ్యాన్‌లో ఫీల్డర్ ఉండేవాడు. కానీ సిరాజ్ సూచన మెరకు తన ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ థర్డ్‌మ్యాన్ ఫీల్డర్‌ను తొలిగించాడు. ఈ క్రమంలో సిరాజ్ నిర్ణయాన్ని కటిచ్ తప్పు బట్టాడు."మహ్మద్ సిరాజ్ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఆ ఓవర్‌కు ముందు థర్డ్-మ్యాన్ స్ధానంలో ఓ ఫీల్డర్ ఉన్నాడు. సిరాజ్ బౌలింగ్ వేసేందుకు వచ్చినప్పుడు థర్డ్-మ్యాన్‌లో ఫీల్డర్‌ను తొలిగించమని సూచించాడు. ఇది నిజంగా తెలివితక్కువ నిర్ణయం. థర్డ్ మ్యాన్‌లో ఫీల్డర్ లేనిప్పుడు షార్డ్ డెలివరీని ఎందుకు వేయాలి. సిరాజ్ సరైన ప్రణాళికతో బౌలింగ్ చేయలేదు. హెడ్‌కు వ్యతిరేకంగా లెగ్ సైడ్‌లో ఇద్దరు ఫీల్డర్లను, డీప్ పాయింట్లో ఓ ఫీల్డర్‌ను ఉంచారు. కానీ థర్డ్‌మ్యాన్‌లో మాత్రం ఫీల్డర్‌ను తీసేశారు. హెడ్ ఆ షాట్ ఆడాక మళ్లీ తిరిగి థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డర్‌ను తీసుకొచ్చారు" అని గబ్బా టెస్టు కామెంటెరీలో భాగంగా కటిచ్ పేర్కొన్నాడు. -
నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం
భారత స్టార్ జావెలియన్ త్రోయర్, హర్యానా అథ్లెట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) హెరిటేజ్ కలెక్షన్స్‌లో అతడి టీ షర్ట్ కొలువు తీరనుంది. వరుస ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన ఏకైక భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. టోక్యోలో స్వర్ణంతో మెరిసిన నీరజ్.. పారిస్‌లో రజతం గెలిచాడు.తన అద్భుత ఆటతీరుతో జాతి మొత్తాన్ని గర్వపడేలా చేసిన నీరజ్‌కు చెందిన టీషర్ట్ ఇప్పుడు మ్యూజియం ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ (ఎమ్ఓడబ్ల్యూఏ)లో ‘షో పీస్’ కానుంది. పారిస్ మెగా ఈవెంట్లో రజత ప్రదర్శన సమయంలో వేసుకున్న టీషర్ట్‌ను డబ్ల్యూఏ మ్యూజియంకు విరాళంగా ఇచ్చాడు.కాగా పారిస్‌లో నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజతం గెలుపొందాడు. మరోవైపు పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (పాక్; 92.97 మీ.) చాంపియన్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. నీరజ్‌తో పాటు ఉక్రెయిన్‌కు చెందిన మహిళా అథ్లెట్లు యరోస్లావా మహుచిక్, థియా లాఫొడ్ల తీపిగుర్తులు కూడా ఆ హెరిటేజ్ కలెక్షన్లో ప్రముఖంగా కనిపించనున్నాయి. కొన్నేళ్ల పాటు ఈ విజేతల అపురూపాలను ప్రదర్శించాక క్రీడాభిమానులు, ఔత్సాహికులు కోసం సందర్భాన్ని బట్టి వేలం వేస్తారు. ఆ వేలంలో వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవల కొరకు వెచ్చించడం తరచూ జరిగేదే! చదవండి: ‘అతడు కావాలనే ఓడిపోయాడు?’.. అంతర్జాతీయ చెస్ సమాఖ్య స్పందన ఇదే -
భారత్‌తో మూడో టెస్టు.. చరిత్ర సృష్టించిన హెడ్.. వరల్డ్ రికార్డు
భారత్‌తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ శతకంతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఆదివారం వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో ట్రవిస్ హెడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది.తొలిరోజు వర్షం వల్ల అంతరాయంపెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టులో భారత్ గెలుపొందగా.. అడిలైడ్ పింక్‌బాల్ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌లో శనివారం మూడో టెస్టు ఆరంభమైంది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుని.. కంగారూలను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఆరంభంలో భారత పేసర్ల జోరుఅయితే, వర్షం కారణంగా తొలి రోజు ఆట 13.2 ఓవర్ల వద్ద ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో 28/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను భారత పేసర్లు కట్టడి చేశారు. ఓపెనర్లలో నాథన్ మెక్‌స్వీనీ(9) అవుట్ చేసిన భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఉస్మాన్ ఖవాజా(21) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.టీమిండియా బౌలర్లకు తలనొప్పిఇక ఆంధ్ర కుర్రాడు, టీమిండియా నయా సంచలనం నితీశ్ రెడ్డి మార్నస్ లబుషేన్(12)ను పెవిలియన్‌కు పంపడంతో.. 75 పరుగుల స్కోరు వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అయితే, ట్రవిస్ హెడ్ రాకతో సీన్ రివర్స్ అయింది. స్టీవ్ స్మిత్‌తో కలిసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టీమిండియా బౌలర్లకు తలనొప్పిగా మారాడు.ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్రక్రీజులో పాతుకుపోయిన హెడ్.. ధనాధన్ బ్యాటింగ్‌తో 115 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు వరల్డ్ రికార్డును సాధించాడు. ఒకే ఏడాదిలో ఒక వేదికపై రెండు ఇన్నింగ్స్‌లోనూ గోల్డెన్ డకౌట్(కింగ్ పెయిర్) కావడంతో పాటు.. అదే వేదికపై సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.గత ఏడు ఇన్నింగ్స్‌లో ఇలాగబ్బా మైదానంలో గత మూడు ఇన్నింగ్స్‌లోనూ ట్రవిస్ హెడ్ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. తాజాగా టీమిండియాతో మ్యాచ్‌లో మాత్రం శతక్కొట్టాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనత అతడి ఖాతాలో జమైంది. గబ్బా స్టేడియంలో గత ఏడు ఇన్నింగ్స్‌లో హెడ్ సాధించిన పరుగులు వరుసగా.. 84(187), 24(29), 152(148), 92(96), 0(1), 0(1), 0(1).ఇక ఒక క్యాలెండర్ ఇయర్లో ఒకే వేదికపై రెండు ఇన్నింగ్స్‌లో డకౌట్ కావడంతో పాటు సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలోనూ ట్రవిస్ హెడ్ చోటు దక్కించుకున్నాడు. ఈ లిస్టులో ఉన్నది వీరే..1. వాజిర్ మహ్మద్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- 19582. అల్విన్ కాళిచరణ్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- 19743. మార్వన్ ఆటపట్టు- కొలంబో ఎస్ఎస్సీ- 20014. రామ్‌నరేశ్ శర్వాణ్- కింగ్స్టన్- 20045. మహ్మద్ ఆఫ్రాఫుల్- చట్టోగ్రామ్ ఎంఏ అజీజ్- 20046. ట్రవిస్ హెడ్- బ్రిస్బేన్ గబ్బా- 2024.బుమ్రా బౌలింగ్లోఇదిలా ఉంటే.. ఆదివారం టీ విరామ సమయానికి ఆసీస్ 70 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. హెడ్ సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచరీ(65*) పూర్తి చేసుకున్నారు. కాగా టెస్టుల్లో హెడ్‌కి ఇది తొమ్మిదో శతకం. అదే విధంగా టీమిండియా మీద మూడోది. అంతేకాదు.. ఇందులో రెండు(అడిలైడ్, గబ్బా) వరుసగా బాదడం విశేషం.బ్రేక్ అనంతరం.. సెంచరీ(101) పూర్తి చేసుకున్న స్మిత్, 152 పరుగులు సాధించిన హెడ్‌ను బుమ్రా అవుట్ చేశాడు. ఈ స్పీడ్‌స్టర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి స్మిత్, పంత్‌కు క్యాచ్ ఇచ్చి హెడ్ పెవిలియన్ చేరారు.చదవండి: రోహిత్ శర్మ నిర్ణయం సరికాదు.. కమిన్స్ సంతోషించి ఉంటాడు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్HE'S DONE IT AGAIN!Travis Head brings up another hundred ⭐️#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/10yBuL883X— cricket.com.au (@cricketcomau) December 15, 2024 -
ఆస్ట్రేలియాను వీడనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు.. కారణమిదే?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. తొలి రోజు వర్షం కారణంగా కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్య పడగా.. రెండో రోజు మాత్రం వరుణుడు కరణించాడు. రెండో రోజు ఆట తొలి సెషన్లో భారత్ పై చేయి సాధించగా.. రెండో సెషన్లో ఆసీస్ తిరిగి పుంజుకుంది. 62 ఓవర్లకు ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. మరోసారి ట్రావిస్ హెడ్(71 నాటౌట్) సెంచరీ వైపు దూసకుపోతున్నాడు. కాగా ఓ వైపు ఈ మ్యాచ్ జరుగుతుండగా.. మరోవైపు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆ ముగ్గురు రిలీజ్..?ఆసీస్‌తో సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు నుంచి ముగ్గురు పేసర్లను రిలీజ్ చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ట్రావెలింగ్ రిజర్వ్‌లలో భాగమైన ముఖేష్ కుమార్, యశ్ దయాల్, నవదీప్ సైనీలు ఆసీస్ నుంచి స్వదేశానికి పయనం కానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21 నుంచి మొదలుకానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు భాగం కానున్నారు. కాగా తొలుత ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, ఖాలీల్ ఆహ్మద్‌లను మాత్రమే సెలక్టర్లు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. అయితే నెట్స్‌లో ఖాలీల్ గాయపడటంతో అతడి స్ధానాన్ని యశ్దయాల్తో బీసీసీఐ భర్తీ చేసింది. అయితే ఇప్పుడు భారత ప్రధాన జట్టులో బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణల రూపంలో ఐదు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితులు బట్టి భారత్‌కు ట్రావెలింగ్ రిజర్వ్‌లతో పెద్దగా పనిలేదు. ఈ క్రమంలోనే ఈ పేస్ త్రయాన్ని జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరి స్వదేశానికి వచ్చి విజయ్ హజారే ట్రోఫీకి సిద్దం కానున్నారు. ఈ టోర్నీలో దయాల్ ఉత్తరప్రదేశ్ తరపున ఆడనుండగా.. ముఖేష్, సైనీలు బెంగాల్, ఢిల్లీ జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..
బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అరుదైన ఘనత నమోదు చేశాడు. టెస్టు క్రికెట్లో 150 ఔట్లు సాధించిన మూడో భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు.ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా క్యాచ్ అందుకున్న పంత్.. ఈ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పంత్ ఇప్పటివరకు 41 టెస్టు మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్‌గా 135 క్యాచ్‌లు, 15 స్టంపింగ్‌లు చేశాడు. పంత్ కంటే ముందు ఎంఎస్ ధోనీ, సయ్యద్ కిర్మాణి మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. మిస్టర్ కూల్ 256 క్యాచ్‌లు, 36 స్టంపింగ్‌లతో 294 ఔట్లలో భాగస్వామ్యమయ్యాడు.అదే విధంగా రెండో స్ధానంలో ఉన్న సయ్యద్ కిర్మాణి 160 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లతో మొత్తంగా 198 ఔట్ల్లో పాలుపంచుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు వరుణుడు కరుణించాడు. తొలిసెషన్లో ఆస్ట్రేలియాకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా చుక్కలు చూపించాడు.28/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే తొలి సెషన్లో భారత్ ఆధిపత్యం చెలాయించినప్పటకీ.. తర్వాత ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. 53 ఓవర్లకు ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.చదవండి: IND vs AUS: కోహ్లితో అట్లుంటది మరి.. దెబ్బకు నోరు మూసుకున్న ఆసీస్ ఫ్యాన్స్! వీడియో -
కోహ్లితో అట్లుంటది మరి.. దెబ్బకు నోరు మూసుకున్న ఆసీస్ ఫ్యాన్స్
బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి రోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన సంగతి తెలిసిందే. అయితే రెండో ఆట ఆరంభంలోనే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్లను ఔట్ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ భారత ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి అద్భుతమైన బంతితో లబుషేన్ బోల్తా కొట్టించాడు.విరాట్ సూపర్ క్యాచ్..ఆసీస్ ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నితీశ్ రెడ్డి రెండో బంతిని ఔట్‌సైడ్ స్టంప్ లైన్ వద్ద ఫుల్ డెలివరీగా సంధిచాడు. ఆ డెలివరీని లబుషేన్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ థిక్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో సెకెండ్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లి ఎటువంటి తప్పిదం చేయకుండా అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్ పట్టిన వెంటనే విరాట్ కోహ్లి తన దైన స్టైల్లో కాస్త వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. గబ్బా మైదానంలో స్టాండ్స్‌లో కూర్చున్న ఆసీస్ అభిమానుల వైపు చూస్తూ మౌనంగా ఉండమని కోహ్లి సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ను ఆసీస్ ఫ్యాన్స్ స్లెడ్జింగ్ చేశారు. అతడు మైదానంలోకి అడుగుపెట్టగానే బూయింగ్(బిగ్గరగా అరవడం) చేశారు. ఈ క్రమంలోనే ఆసీస్ ఫ్యాన్స్‌కు కోహ్లి తన సెలబ్రేషన్స్‌తో కౌంటరిచ్చాడు.చదవండి: తెలుగు టైటాన్స్ గెలుపు pic.twitter.com/9kOwCXHb1p— Sunil Gavaskar (@gavaskar_theman) December 15, 2024 -
‘వివాహ ఆహ్వానం’
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ నెల 22న జరిగే తన పెళ్లికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేసింది. సింధుతో పాటు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ ఆమె వెంట ఉన్నారు. వెంకటదత్తసాయితో రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో సింధు వివాహం జరగనుంది. -
64 గళ్లపై చిన్నారి అద్భుతం
రెండేళ్ల క్రితం.. ప్రముఖ చెస్ వెబ్సైట్ చెస్ బేస్ డాట్ ఇన్ హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించింది. అందులో భారత గ్రాండ్మాస్టర్లయిన అర్జున్ ఇరిగేశి, డి.గుకేశ్‌లు ఒకవైపు.. 20 మంది జూనియర్ చెస్ ఆటగాళ్లు మరోవైపు ఆడారు. ఫలితాలను పక్కన పెడితే ఇద్దరు టాప్ గ్రాండ్మాస్టర్లను కొందరు చిన్నారులు తమ ఆటతో ఆకర్షించారు. వారిలో ఆరేళ్ల ఆదుళ్ల దివిత్ రెడ్డి కూడా ఉన్నాడు. అతనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నట్లు గుర్తించిన ఆ ఇద్దరు గ్రాండ్మాస్టర్లూ త్వరలోనే దివిత్ పెద్ద విజయాలు సాధిస్తాడని జోస్యం చెప్పారు. రెండేళ్లు తిరిగేసరికి అది నిజమైంది. దివిత్ రెడ్డి ఇప్పుడు వరల్డ్ క్యాడెట్ అండర్–8 చాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. కొన్ని నెలల వ్యవధిలో అతను అటు ర్యాపిడ్, ఇటు క్లాసిక్ రెండు విభాగాల్లోనూ వరల్డ్ చాంపియన్‌గా నిలవడం విశేషం. అల్బేనియా, ఇటలీలలో జరిగిన ఈ టోర్నీలో దివిత్ ప్రదర్శన చూస్తే భారత చదరంగంలో మరిన్ని సంచలనాలకు కారణం కాగల కొత్త కెరటం వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిభను గుర్తించి..సాధారణంగా ఐదారేళ్ల చిన్నారులు స్కూల్‌తో పాటు తమ వయసుకు తగినట్లుగా తమకు నచ్చిన విధంగా ఏదో ఒక ఆటలో మునిగి తేలుతుంటారు. కానీ క్రీడలకు సంబంధించి వారిలో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు మాత్రమే సరిగ్గా గుర్తించగలరు. దివిత్ తల్లిదండ్రులు మహేశ్ రెడ్డి, సింధుజ సరిగ్గా అదే పని చేశారు. అతడికి చదరంగంపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు, ఆ క్రీడలో అతను పూర్తిగా లీనమైపోతున్నట్లు ఆరంభంలోనే గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయిన వీరిద్దరూ చెస్‌కు సంబంధించిన పజిల్స్‌ను పరిష్కరించడంలో దివిత్కున్న ప్రత్యేక ప్రతిభను పసిగట్టగలిగారు. అందుకే తమ అబ్బాయిని పూర్తిగా చదరంగం వైపు మళ్లిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. దానికి ఎగ్జిబిషన్ టోర్నీ మరింత స్ఫూర్తినిచ్చింది. కోచ్ రామకృష్ణ వద్ద శిక్షణ ఇప్పించారు. రెండేళ్ల పాటు ఆయన శిక్షణలో దివిత్ మరింత రాటుదేలాడు. దాంతో టోర్నీల్లో ఆడించడం మొదలుపెట్టారు. వరుస విజయాలతో..రాష్ట్ర స్థాయి టోర్నీల్లో విజేతగా నిలిచిన తర్వాత దివిత్ జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడి ప్రదర్శన ఆ చిన్నారిలోని అపార ప్రతిభను చాటింది. ఫలితంగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అల్బేనియాలో జరిగిన టోర్నీ ద్వారా దివిత్ టాలెంట్‌కి మరింత గుర్తింపు దక్కింది. అండర్–8 చాంపియన్‌షిప్‌లో అతను ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలిచాడు. రెండు నెలల తర్వాత జార్జియాలో జరిగిన వరల్డ్ కప్‌లో కూడా అతనికి రెండో స్థానం దక్కింది. తాజాగా ఇటలీలో అండర్–8 క్లాసికల్లో వరల్డ్ చాంపియన్‌షిప్ సాధించడం అతడి ఆటను మరో మెట్టు ఎక్కించింది. తర్వాతి వయో విభాగాలైన అండర్–10, అండర్–12లలో ఇదే తరహా ఆటను కొనసాగిస్తే దివిత్ కెరీర్ మరింత వేగంగా దూసుకుపోవడం ఖాయం. అన్నింటా అండగా నిలుస్తూ..తన గెలుపు విలువేమిటో ఎనిమిదేళ్ల దివిత్‌కు తెలియకపోవచ్చు. కానీ అతని తల్లిదండ్రులు ఆ గెలుపు స్థాయిని గుర్తించారు. అందుకే కెరీర్లో ముందుకు తీసుకెళ్లేందుకు వారు తమ వైపునుంచి ఎలాంటి లోటు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో పెరిగే పోటీని దృష్టిలో ఉంచుకొని కొత్త కోచ్‌తో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. చెస్‌లో కోచింగ్ అంటే ఆర్థికపరంగా కూడా అమిత భారమే! దీంతో పాటు వరుస టోర్నీల్లో పాల్గొంటేనే ఫలితాలు రావడంతో పాటు రేటింగ్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలా చేయాలంటే పెద్ద సంఖ్యలో వేర్వేరు దేశాల్లో పోటీ పడటం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ తమ చిన్నారి కోసం వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం సొంత డబ్బులతోనే ముందుకు సాగుతున్న వీరు మున్ముందు దివిత్ మంచి ఫలితాలు సాధిస్తే స్పాన్సర్షిప్ చాన్స్ రావచ్చనే విశ్వాసంతో ఉన్నారు. అన్నింటినీ మించి వారు తమ అబ్బాయి ఆటను నమ్ముతున్నారు.గ్రాండ్‌మాస్టర్ లక్ష్యంగా..‘చెస్ అంటే చాలా ఇష్టం. ఎన్ని గంటలైనా ఆడుతూనే ఉంటా..’ ఇదీ చిన్నారి దివిత్ మాట. ప్రస్తుతం అతను రోజుకు 7–8 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. మధ్యలో కొద్దిసేపు విరామం మినహా అతనికిప్పుడు చదరంగపు గళ్ళే లోకం. అతని ఫలితాలు చూస్తేనే అతను ఎంతగా కష్టపడుతున్నాడో అర్థమవుతోంది. సిసిలియన్ డిఫెన్స్ తన ఫేవరిట్ అని చెబుతున్న దివిత్.. ప్రస్తుత భారత టాప్ ఆటగాడు అర్జున్ ఇరిగేశి స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాడు. ఆటలో విజయాలతో పాటు ఓటములు కూడా సహజం. సాధారణంగా వేర్వేరు ఏజ్ గ్రూప్ చెస్ టోర్నీలు జరుగుతున్నప్పుడు పరాజయం ఎదురైతే చిన్నారులు ఏడుస్తూ బయటకు రావడం చాలా చోట్ల కనిపించే దృశ్యం. కానీ దివిత్ ఏరోజూ అలా చేయలేదని తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. గేమ్ ఓడిన తర్వాత కూడా ప్రశాంతంగా వచ్చి నేను ఓడిపోయాను, తర్వాతి గేమ్‌కు ప్రిపేర్ అవుతాను అని చెప్పడం ఎనిమిదేళ్ల చిన్నారి స్థితప్రజ్ఞకు నిదర్శనం. చెస్‌కు ఎక్కువ సమయం కేటాయించేందుకు దివిత్ పేరెంట్స్ అతని స్కూల్ చదువును ఆన్లైన్ క్లాస్‌ల ద్వారా కొనసాగిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న దివిత్.. వచ్చే రెండేళ్ల పాటు తనకిష్టమైన చెస్‌లో మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తే ఆపై చదువును, ఆటను సమన్వయం చేసుకుంటూ వెళ్లవచ్చనేది వారి ఆలోచన. దివిత్ కూడా దానికి తగినట్లుగా సాధన చేస్తున్నాడు. పిన్న వయసులోనే దివిత్‌ను గ్రాండ్‌మాస్టర్‌గా చూడాలనేది తల్లిదండ్రుల కోరిక. ప్రస్తుతం 1876 రేటింగ్ ఉన్న అతను జీఎమ్ కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
IND vs AUS 3rd Test: భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా..
Ind vs Aus 3rd Test Day 2 Live Updates And Highlights: బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది.96 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 377/6.96 ఓవర్లకు ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్ కమ్మిన్స్(17), అలెక్స్ క్యారీ(33) ఉన్నారు. 96 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 377/6.ఆసీస్ ఆరో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఎట్టకేలకు ఔటయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించాడు. హెడ్ 152 బంతుల్లో 18 ఫోర్లతో 152 పరుగులు చేసి ఔటయ్యాడు. 88 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 330/6ఆసీస్ ఐదో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్(5).. విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్బుమ్రా బౌలింగ్‌లో స్మిత్ అవుటయ్యాడు. శతకం పూర్తి చేసుకున్న ఈ వెటరన్ బ్యాటర్ 101 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ క్రీజులోకి వచ్చాడు. హెడ్ 149 పరుగులతో ఆడుతున్నాడు. ఆసీస్ స్కోరు: 318/4 (84)స్మిత్ సెంచరీ..ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. స్మిత్ ప్రస్తుతం 100 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. స్మిత్‌కు ఇది 33వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. భారత్‌పై ఇది స్మిత్‌కు 10వ టెస్టు సెంచరీ. 82 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 313/3టీ బ్రేక్ సమయానికి ఆసీస్ స్కోరు: 234/3 (70).హెడ్ 103, స్మిత్ 65 పరుగులతో ఆడుతున్నారుట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ..బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 115 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను హెడ్ అందుకున్నాడు. హెడ్‌కు ఇది తొమ్మిదవ టెస్టు సెంచరీ. భారత్‌పై మూడో టెస్టు సెంచరీ. ప్రస్తుతం 101 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 69 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 231/3.స్మిత్ హాఫ్ సెంచరీ..ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. బ్రిస్బేన్ టెస్టులో స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. స్మిత్ 50 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 64 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 196/3.హెడ్ హాఫ్ సెంచరీ.. గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 52 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 56 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 158/3. క్రీజులో హెడ్‌తో పాటు స్మిత్(44) ఉన్నాడు.భారత్‌కు మరోసారి హెడ్ 'ఎక్'ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మరోసారి భారత్‌కు తలనొప్పిగా మారాడు. లబుషేన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హెడ్ తనదైన స్టైల్లో ఆడుతున్నాడు. అతడితో పాటు స్టీవ్ స్మిత్ క్రీజులో పాతుకుపోయారు. 50 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెడ్(36), స్మిత్(35) ఉన్నారు.లంచ్ బ్రేక్‌కు ఆసీస్ స్కోర్: 104/3రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(20), స్టీవ్ స్మిత్(25) పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా..లబుషేన్ ఔటైన అనంతరం ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 42 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(24), ట్రావిస్ హెడ్(17) ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్..75 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్.. నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్లిప్‌లో విరాట్ కోహ్లి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. క్రీజులోకి ట్రావిస్ హెడ్ వచ్చాడు. 34 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 75/3నిలకడగా ఆడుతున్న ఆసీస్..ఆస్ట్రేలియా బ్యాటర్లు మార్నస్ లబుషేన్, స్మిత్ నిలకడగా ఆడుతున్నారు. 27 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(10), లబుషేన్(8) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. మెక్‌స్వీనీ రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయిది. 9 పరుగులు చేసిన మెక్‌స్వీనీ.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి స్మిత్ వచ్చాడు. 19 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/2బుమ్ బుమ్ బుమ్రా..తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ తమ మొదటి వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా(21) వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి మార్నస్ లబుషేన్ వచ్చాడు.రెండో రోజు ఆట ప్రారంభం..బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్ అటాక్‌ను ఆకాష్ దీప్ ఆరంభించాడు. కాగా తొలి రోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 13. 2 ఓవర్లలో ఆసీస్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హాజిల్‌వుడ్. -
తెలుగు టైటాన్స్ గెలుపు
పుణే: రెండు వరుస పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ గెలుపుబాట పట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–11)లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 36–32తో గుజరాత్ జెయంట్స్‌పై విజయం సాధించింది. స్టార్ రెయిడర్, కెప్టెన్ పవన్ సెహ్రావత్ (12 పాయింట్లు) కూతకెళ్లిన ప్రతీ సారి ప్రత్యర్థుల్ని హడలెత్తించాడు. 18 సార్లు రెయిడింగ్‌కు వెళ్లి 12 పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచర రెయిడర్ ఆశిష్ నర్వాల్ (6) కూడా రాణించాడు. ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ (18) అదరగొట్టాడు. ప్రథమార్ధం ముగిసే ఆఖరి నిమిషంలో గుజరాత్ ఒకసారి తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేస్తే... ద్వితీయార్ధంలో పవన్, ఆశిష్, విజయ్‌లు చెలరేగడంతో ప్రత్యర్థి జట్టును స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ఆలౌట్ చేసి మ్యాచ్ గెలిచింది. గుజరాత్ జట్టులో కెప్టెన్ గుమన్ సింగ్ (9), రాకేశ్ (10) రెయిడింగ్‌లో ఆకట్టుకున్నారు. అనంతరం జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సంపాదించిన హరియాణ స్టీలర్స్‌కు దబంగ్ ఢిల్లీ షాకిచ్చిoది. ఢిల్లీ జట్టు 44–37తో స్టీలర్స్‌పై గెలుపొందింది. రెయిడర్, ఢిల్లీ కెపె్టన్ అషు మాలిక్ (15) అద్భుతంగా రాణించాడు. అదేపనిగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచరుల్లో రెయిడర్ నవీన్ (7), డిఫెండర్లు యోగేశ్ (4), ఆశిష్ (5) రాణించారు. హరియాణా జట్టులో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (9), రెయిడర్ శివమ్ పతారే (6) ఆదుకున్నారు.సంజయ్, నవీన్, వినయ్ తలా 3 పాయింట్లు చేశారు. జైదీప్, రాహుల్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు (ఆదవారం) జరిగే పోటీల్లో తమిళ్ తలైవాస్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్... యు ముంబాతో యూపీ యోధాస్ తలపడుతుంది. -
మోహన్ బగాన్ ‘టాప్’ షో
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్ జోరు కొనసాగుతోంది. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు 3–2 గోల్స్ తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. మొహన్ బగాన్ తరఫున జేమీ మెక్లారెన్ (33వ నిమిషంలో), జాసన్ కమింగ్స్ (86వ ని.లో), అల్బెర్టో రోడ్రిగ్వేజ్ (90+5వ ని.లో) తలా ఒక గోల్ సాధించారు. కేరళ బ్లాస్టర్స్ తరఫున జెసెస్ జిమెనెజ్ (51వ ని.లో), మిలోస్ డ్రింకిక్ (77వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తాజా సీజన్లో 11 మ్యాచ్‌లాడిన మోహన్ బగాన్ జట్టు 8 విజయాలు, ఒక పరాజయం, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. కేరళ బ్లాస్టర్స్ 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 7 పరాజయాల, 2 ‘డ్రా’లతో 11 పాయింట్లు సాధించి పట్టిక పదో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్, గోవా ఫుట్‌బాల్ క్లబ్ మధ్య శనివారమే జరిగిన మరో మ్యాచ్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. బెంగళూరు తరఫున ర్యాన్ విలియమ్స్ (71వ నిమిషంలో), జార్జ్ డియాజ్ (83వ ని.లో) చెరో గోల్ చేయగా... గోవా తరఫున సందేశ్ జింగాన్ (7వ ని.లో), సాహిల్ తవోరా (66వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తొలి సగంలో ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకున్న బెంగళూరు జట్టు... ద్వితీయార్థంలో సత్తాచాటి స్కోరు సమం చేసింది. తాజా సీజన్లో 12 మ్యాచ్‌లాడిన బెంగళూరు 7 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో ఉండగా... గోవా (19 పాయింట్లు) నాలుగో స్థానంలో కొనసాగుతోంది. -
టైటిల్ వేటలో ముంబై, మధ్యప్రదేశ్
బెంగళూరు: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తుది పోరులో మధ్యప్రదేశ్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన ముంబై జట్టు టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంటే... 13 ఏళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించిన మధ్యప్రదేశ్ జట్టు ఇదే జోష్‌లో ట్రోఫీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ముంబై జట్టు స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతుండగా... మధ్యప్రదేశ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టులో అజింక్య రహానే, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ వంటి టీమిండియా ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ జట్టుకు రజత్ పటిదార్ సారథ్యం వహిస్తుండగా... ఇటీవల ఐపీఎల్ వేలంలో రికార్డు ధర (రూ. 23.75 కోట్లు) దక్కించుకున్న పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కీలకం కానున్నాడు. భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే తన మెరుపులతో అదరగొడుతున్నాడు. సంప్రదాయ ఆటతీరుకు చిరునామా అయిన రహానే... భారీ హిట్టింగ్తో విరుచుకుపడుతూ ముంబై జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించాడు. తాజా టోర్నీలో 8 మ్యాచ్‌లాడిన రహానే 170కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో 432 పరుగులు సాధించాడంటే అతడి జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న శ్రేయస్ అయ్యర్ 189 స్ట్రయిక్ రేట్‌తో 329 పరుగులు సాధించాడు. పృథ్వీ షా అడపాదడపా మెరుగైన ప్రదర్శన చేస్తుండగా... సూర్యకుమార్ రాణించాల్సిన అవసరముంది. మిడిలార్డర్లో శివమ్ దూబేతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ సూర్యాన్‡్ష షెగ్డే భారీ షాట్లు ఆడగల సమర్థులే. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, తనుష్ కోటియాన్, సూర్యాన్‡్ష, అథర్వ కీలకం కానున్నారు.మరోవైపు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ జట్టు... తుది పోరులోనూ అదే కొనసాగించాలని భావిస్తోంది. ‘మా జట్టు సామర్థ్యంపై నమ్మకముంది. ఎవరితో తలపడుతున్నామనే విషయాన్ని పెద్దగా ఆలోచించడం లేదు. దీన్ని కూడా మరో మ్యాచ్‌లాగే చూస్తున్నాం. మెరుగైన ప్రదర్శనతో ట్రోఫీ చేజిక్కించుకోవడమే మా లక్ష్యం’ అని మధ్యప్రదేశ్ కెపె్టన్ రజత్ పటిదార్ అన్నాడు. ఈ టోర్నీలో పటిదార్ 183 స్ట్రయిక్ రేట్‌తో 347 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్నాడు. మిడిలార్డర్లో వెంకటేశ్ అయ్యర్ హిట్టింగ్ జట్టుకు బలం కానుంది. ఈ టోర్నీలో అతడు 162 స్ట్రయిక్ రేట్‌తో 210 పరుగులు సాధించడంతో పాటు... ఉపయుక్తకరమైన మీడియం పేస్‌తో 6 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్, త్రిపురేశ్ సింగ్, కుమార్ కార్తికేయ మధ్యప్రదేశ్ బౌలింగ్ భారం మోయనున్నారు. -
నేడు డబ్ల్యూపీఎల్ మినీ వేలం
బెంగళూరు: ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో ప్లేయర్లపై కనకవర్షం కురవగా... ఇప్పుడు మహిళల వంతు వచ్చిoది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఆదివారం బెంగళూరు వేదికగా డబ్ల్యూపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ మినీ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఐదు ఫ్రాంచైజీలలో కలిపి మొత్తం 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది ప్లేయర్లు, విదేశాల నుంచి 29 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఇందులో అసోసియేషన్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. యూపీ వారియర్స్ జట్టు ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉండగా... గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తలా నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అందరికంటే తక్కువగా రూ.2.5 కోట్లు ఉన్నాయి. విదేశీ ప్లేయర్లలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డాటిన్, ఇంగ్లండ్ కెపె్టన్ హీథర్ నైట్ రూ.50 లక్షల కనీస ధరతో వేలానికి రానున్నారు. భారత ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా రూ.30 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొననుంది. ఢిల్లీకి చెందిన లెఫ్టార్మ్ అన్షు నాగర్ 13 ఏళ్ల వయసులోనే వేలం బరిలో నిలిచింది. -
మహిళ జట్టు సత్తా చాటేనా!
ముంబై: ఆ్రస్టేలియా చేతిలో మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన భారత మహిళల క్రికెట్ జట్టు ఐదు రోజుల వ్యవధిలోనే మరో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. భారత్ పర్యటనకు వ చ్చిన వెస్టిండీస్ అమ్మాయిల జట్టుతో సొంతగడ్డపై నెగ్గే ప్రయత్నంలో సాధన చేస్తోంది. రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ముందుగా భారత్, విండీస్ జట్ల మధ్య నేడు తొలి టి20 జరగనుంది. జట్టులో కొరవడిన నిలకడ, అనుభవజ్ఞుల బాధ్యతా రాహిత్యం, బ్యాటర్ల ఫామ్ లేమి హర్మన్‌ప్రీత్ సేనను కలవరపెడుతోంది. స్టార్ ఓపెనర్, వైస్ కెపె్టన్ స్మృతి మంధాన చాన్నాళ్ల తర్వాత సెంచరీతో టచ్‌లోకి వచ్చిoది. అయితే ఈ ఫామ్ ఇకపై కొనసాగిస్తుందో లేదో కరీబియన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లలో తెలుస్తుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రం వరుసగా విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపిస్తోంది. వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు ఆడనున్న తొలి టి20 సిరీస్ ఇదే కానుంది. ఆ్రస్టేలియా లాంటి పటిష్టమైన జట్టుతో జరిగిన చివరి వన్డేలో 4 వికెట్లతో చెలరేగినా... హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి జట్టులో స్థానం కోల్పోయింది. ఆతిథ్య జట్టు పరిస్థితి ఇలా ఉంటే వెస్టిండీస్ అమ్మాయిల జట్టు మనకంటే మెరుగనే చెప్పవచ్చు. బ్యాటింగ్‌లో కెపె్టన్ హేలీ మాథ్యూస్, క్వియానా జోసెఫ్, డియాండ్రా డాటిన్, షెమైన్ క్యాంప్‌బెల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ఏడాది టి20 ఫార్మాట్లో కరీబియన్ టీమ్ 13 మ్యాచ్‌లాడితే తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే నవంబర్ 2019నుంచి భారత్, విండీస్ మహిళల జట్ల మధ్య ఎనిమిది టి20లు జరిగితే అన్నింటిలో భారతే విజయం సాధించడం విశేషం. జట్లు (అంచనా) భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తిశర్మ, రేణుక, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్. వెస్టిండీస్ మహిళల జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్ ), షెమైన్ క్యాంప్‌బెల్, ఆలియా అలెన్, షమిలియా కానెల్, డియాండ్ర డాటిన్, అఫి ఫ్లెచర్, నెరిసా, క్వియానా జోసెఫ్, హెన్రీ, జైదా జేమ్స్, కరిష్మా రమ్హారక్. -
అందుకే అంతగా ఏడ్చాను!
సింగపూర్ సిటీ: వరల్డ్ చెస్ చాంపియన్‌గా ఖాయమైన తర్వాత దొమ్మరాజు గుకేశ్ ఎంతో భావోద్వేగానికి లోనైన వీడియోను అభిమానులంతా చూశారు. విజయానంతరం అతను కన్నీళ్లపర్యంతమయ్యాడు. దీనిపై ‘ఫిడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుకేశ్ మాట్లాడాడు. అందుకు కారణాన్ని వివరించాడు. ‘నేను ఈ పోరులో మొదటినుంచి ఆధిక్యం కనబర్చలేదు. కొన్ని గేమ్‌లలో విజయానికి దగ్గరగా వచ్చి కూడా ఆ అవకాశం ఉపయోగించుకోలేకపోయాను. అంతా సాఫీగా, ఏకపక్షంగా పోరు జరిగి నా గెలుపు కాస్త ముందే ఖాయమై ఉంటే నేనూ మామూలుగానే కనిపించేవాడినేమో. కానీ చివర్లో గెలిచిన తీరుతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. అప్పటి వరకు గేమ్ డ్రా అవుతుందని, టైబ్రేక్‌కు వెళితే ఎలా సిద్ధం కావాలనే విషయం గురించి కూడా ఆలోచనలు మెదులుతున్నాయి. కానీ అద్భుతం జరిగి గెలిచేశాను. పైగా ఎనిమిదేళ్ల వయసులో చెస్ నేర్చుకున్న రోజులు కూడా ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. అందుకే ఆ కన్నీళ్లు’ అంటూ గుకేశ్ వివరించాడు. తాను ప్రపంచ చాంపియన్‌గా నిలిచినా...ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, అయితే ప్రతీ సవాల్‌కు తాను సిద్ధమేనని గుకేశ్ వ్యాఖ్యానించాడు. పైగా చదరంగంలాంటి ఆటలో ఎవరూ వంద శాతం పర్ఫెక్ట్గా ఉండరని అతను అన్నాడు. ‘ఇప్పటి వరకు చెస్‌ను శాసించిన గొప్ప గొప్ప ఆటగాళ్లకు కూడా పరాజయాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ఆటలో నేర్చుకునేందుకు ఇంకా అవకాశం ఉంటుంది. నా వయసు కూడా అందుకు సహకరిస్తుంది. ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని గుకేశ్ చెప్పాడు. చాంపియన్‌షిప్ సమయంలో తనకు సరిగ్గా ఇంటి భోజనం తరహాలో దక్షిణాది వంటకాలు అందించిన చెఫ్‌కు అతను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
‘మారతాను’ అనుకుంటే మారథాన్ గెలిచినట్టే!
పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతోనే స్త్రీ జీవనం గడిచిపోతుంది. రొటీన్లో తన మనుగడ ప్రశ్నార్థకం అవుతుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంటుంది. జీవనశైలిని మార్పుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాస్టెస్ట్ ఔతాహ్సిక మారథానర్గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి.50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్లను పూర్తిచేసి స్టార్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. ప్రపంచ మారథాన్ ల చరిత్రలో అత్యంత వేగవంతమైన భారతీయ మహిళా రన్నర్‌గా నిలిచారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్‌లో పాల్గొంటున్న కవితారెడ్డి ‘మన మైండ్, బాడీ చురుగ్గా ఉండాలంటే ముందు ఏదైనా క్రీడలలో పాల్గొనాలి’ అంటూ ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.‘‘మన దేశంలో మహిళలు బయటకు వచ్చి, రన్స్‌లో పాల్గొడం తక్కువే. వారిని ఎంకరేజ్ చేయడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. పుట్టి పెరిగింది అనంతపూర్. డిగ్రీ పూర్తవుతూనే పెళ్లి, కుటుంబ బాధ్యతలు. ఎప్పుడూ క్రీడల్లో పాల్గొనలేదు. నలభైఏళ్ల వరకు గృహిణిగా, ఇద్దరు అబ్బాయిల పెంపకం, కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వచ్చాను. వయసు పెరుగుతున్నప్పుడు జీవనశైలి సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే, కొన్ని మార్పులు చేసుకోవాలనుకుని, పదేళ్ళక్రితం జిమ్‌లో చేరాను. కొన్నిరోజులు ఇబ్బందే అనిపించింది. కానీ, అదే సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. స్నేహితుల ద్వారా మారథాన్ల గురించి తెలిసింది. అలా జిమ్‌తో పాటు పదేళ్ల క్రితమే మారథాన్ జర్నీ స్టార్ట్ అయ్యింది. మా వారు దీపక్‌రెడ్డి ఉద్యోగరీత్యా హైదరాబాద్, బెంగళూరు, ముంబయ్, పుణెలలో నివసిస్తూ వచ్చాం. అలాగే, ఎక్కడ మారథాన్ జరిగినా పాల్గొంటూ వచ్చాను. మారథాన్లు నా జీవన విధానాన్నే మార్చాయి. వాటిల్లో ఎంజాయ్ చేయడమే పెరిగింది. దీంతో అదే ΄్యాషన్గా మారింది.సొంత గుర్తింపుకూతురు, భార్య, తల్లి.. సమాజం మనకో గుర్తింపునిస్తుంది. కానీ, మనకంటూ ఓ సొంత గుర్తింపును సాధించుకోవాలి. అందుకు ఏదో ఒక యాక్టివిటీని ఏర్పరుచుకోవాలి. గృహిణిగా, అమ్మగా గుర్తింపు ఉన్న నాకు ఇప్పుడు ‘మారథాన్ రన్నర్ కవితారెడ్డి’ అంటూ మరో గుర్తింపు వచ్చింది. ఈ ప్రయాణంలో ఎంతోమంది పరిచయం అయ్యారు. కాన్ఫిడెన్స్తోపాటు జీవనశైలిలోనూ మంచి మార్పులు వచ్చాయి. మద్దతు అవసరంమహిళలు మారథాన్‌లో పాల్గొనడానికి మన దగ్గర ఇంకా అంత ప్రోత్సాహం లేదనే చెప్పవచ్చు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ, ఇరుకు రోడ్లు, సౌకర్యాలు కూడా తక్కువే. విదేశాలలో మారథాన్ అంటే సిటీ మొత్తం ఒక పండగలా జరుగుతుంది. స్త్రీ–పురుష తేడా లేకుండా ఎంతోమంది వచ్చి హుషారుగా పాల్గొంటారు. సామాజికంగానూ ఇది ఐక్యతను సూచిస్తుంది. ఒక తెలియని ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది. దీనివల్ల చేయాలనుకున్న పనుల్లో వేగం కూడా ఉంటుంది. శిక్షణ తప్పనిసరిముందు మనకోసం సొంతంగా ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు కుటుంబం నుంచి అంతగా సపోర్ట్ రాకపోవచ్చు. కానీ, పరిస్థితులలో మంచి మార్పులు వచ్చాయి. నేడు మన జీవన విధానంలో ఆహారం, చేస్తున్న పనులకు ఏ మాత్రం ΄÷ంతన లేదు. అందుకే, మహిళలు తప్పనిసరిగా వ్యాయామాలు ఒక అలవాటుగా చేసుకోవాలి. ఏడాదికి రెండు మూడు హాఫ్ మారథాన్లలో పాల్గొంటుంటాను. ఆ తర్వాత ఫుల్ మారథాన్ ఉంటుంది. సాధారణంగా ఫుల్ మారథాన్లనే కౌంట్ చేస్తుంటారు. అందరూ ఆ డిస్టెన్స్‌లో పాల్గొనలేరు. అందుకని హాఫ్ మారథాన్లు, 5కె, 10కె రన్లు జరుగుతుంటాయి. రాబోయే ఫిబ్రవరిలో చండీగఢ్లోహాఫ్ మారథాన్ ఉంది. దానికి శిక్షణ తీసుకుంటున్నాను’ అని వివరించారు ఈ మారథాన్ రన్నర్. అడ్డంకులను అధిగమిస్తూ..ఎవరెస్ట్ బేస్ క్యాంప్, అంతకుముందు అంటార్కిటికా ఐస్ మారథాన్లు రెండు అత్యంత కష్టమైనవే. బోస్టన్‌లో పాల్గొన్న మారథాన్‌లో అయితే బలమైన ఈదురుగాలులు, వర్షం.. అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులు. అయినా, 42.21 కి.మీ మారథాన్‌ని పూర్తి చేయాలి. లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆలోచన అడ్డంకులను అధిగమించేలా చేసింది. 3.05 గంటలలో లక్ష్యాన్ని చేరుకున్నా. ప్రకృతి విసిరే సవాళ్లను తట్టుకోవడానికి మహిళలే ముందుంటారు. పదేళ్లపాటు చేస్తున్న ఈ జర్నీలో ఇండియాతో పాటు న్యూయార్క్, లండన్, చికాగో, బెర్లిన్, బోస్టన్ – టోక్యోలలో జరిగిన ఆరు ఫుల్ మారథాన్లలో పాల్గొన్నాను. మెడల్స్ ΄÷ందాను. నన్ను చూసి మారథాన్లలో పాల్గొన్న మహిళలు చాలామంది ఉన్నారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తెలంగాణ ‘డ్రా’తో మొదలు
సాక్షి, హైదరాబాద్: ఐదున్నర దశాబ్దాల తర్వాత హైదరాబాద్ గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (రెండో రౌండ్)లో తెలంగాణ ‘డ్రా’తో మొదలు పెట్టింది. శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ గ్రౌండ్లో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణితో ఆడాయి. అడపాదడపా తెలంగాణ స్ట్రయికర్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా స్కోరు చేసేందుకు చేసిన ప్రయత్నాల్ని రాజస్తాన్ డిఫెండర్లు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.అలాగే రాజస్తాన్ దాడుల్ని తెలంగాణ రక్షణ పంక్తి నిలువరించడంతో మొదటి అర్ధభాగం ఒక్క గోల్ అయినా నమోదుకు కాకుండానే 0–0తో ముగిసింది. ద్వితీయార్ధం మొదలైన ఎనిమిది నిమిషాలకే రాజస్తాన్ ఖాతా తెరిచింది. 53వ నిమిషంలో ఫార్వర్డ్ ఆటగాడు అమిత్ గోడార చక్కని సమన్వయంతో తెలంగాణ డిఫెండర్లను బోల్తాకొటిస్తూ గోల్‌ను లక్ష్యానికి చేర్చడంతో రాజస్తాన్ 1–0తో ఆధిక్యంలో వెళ్లింది. తర్వాత స్కోరు సమం చేసేందుకు తెలంగాణ స్ట్రయికర్లు ఎంతగా శ్రమించినా ఫినిషింగ్ లోపాలతో గోల్ అయితే కాలేదు. ఇక పరాజయం ఖాయమనుకున్న దశలో అనూహ్యంగా తేజావత్ సాయి కార్తీక్ ఆఖరి నిమిషంలో అద్భుతం చేశాడు. 90వ నిమిషంలో చాకచక్యంగా సాయి కార్తీక్ చేసిన గోల్‌తో తెలంగాణ 1–1తో గట్టెక్కింది. గోల్ పోస్ట్ వద్ద రాజస్తాన్ స్ట్రయికర్లను నిలువరించిన తెలంగాణ డిఫెండర్ తజాముల్ హుస్సేన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టోర్నీ రెండో రౌండ్లో మొత్తం 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. టాప్–4లో నిలిచిన టీమ్‌లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. శనివారం జరిగిన ఇతర మ్యాచ్‌లలో బెంగాల్ 3–1తో జమ్మూ కశీ్మర్‌పై... మణిపూర్ 1–0తో సరీ్వసెస్‌పై గెలుపొందాయి. -
జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీ ఫైనల్లో భారత్
జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్‌చాంపియన్ భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మస్కట్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 3–1 తేడాతో జపాన్ను చిత్తు చేసి ముందంజ వేసింది. భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ (4వ నిమిషంలో), సాక్షి రాణా (5వ ని.లో), దీపిక (13వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున నికో మరుయమా (23వ ని.లో) ఏకైక గోల్ సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత జట్టు రెండో నిమిషంలోనే గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నా... మరో 2 నిమిషాల తర్వాత ముంతాజ్ ఖాన్ గోల్‌తో ఖాతా తెరిచింది. అదే ఊపులో తొలి క్వార్టర్‌లోనే మరో రెండు గోల్స్ చేసిన భారత్... ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. దీపికకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
మూడో టీ20లో జింబాబ్వే ఓటమి.. సిరీస్ అఫ్గాన్ సొంతం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో పర్యాటక అఫ్గాన్ జట్టు సొంతం చేసుకుంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మరోసారి బంతితో మ్యాజిక్ చేశాడు. రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆతిథ్య జింబాబ్వేను దెబ్బతీశాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్‌తో పాటు ఓమర్జాయ్, నవీన్ ఉల్ హాక్, ముజీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాధవిరే(21), మజకజ్దా(17) పరుగులతో రాణించారు. అనంతరం 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు అఫ్గానిస్తాన్ తీవ్రంగా శ్రమించింది. 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. అఫ్గాన్ బ్యాటర్లలో ఒమర్జాయ్(34) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహ్మద్ నబీ(24 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని, గ్వాండు, రజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. -
బుమ్రా టెస్టులను వదిలేస్తే బెటర్: షోయబ్ అక్తర్
జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియాకే కాదు ప్రపంచ క్రికెట్లోనే అగ్రశేణి బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. బుమ్రా గత కొంత కాలంగా మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటలో ఉన్న బుమ్రా అక్కడ కూడా సత్తాచాటుతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన బుమ్రా.. మొత్తంగా 11 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో జస్ప్రీత్ను ఉద్దేశించి షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఎక్కువకాలం పాటు తన కెరీర్‌ను కొనసాగించాలంటే టెస్టు క్రికెట్‌ను వదిలేయాలని అక్తర్ సూచించాడు."బుమ్రా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. అతడికి టెస్టు క్రికెట్ కంటే వన్డేలు, టీ20లు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే అతను లెంగ్త్‌ని అర్థం చేసుకున్నాడు. డెత్ ఓవర్లలో, పవర్‌ప్లేలో బంతితో అద్భుతంగా రాణిస్తున్నాడు. బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగల్గే సత్తా అతడికి ఉంది. కానీ బుమ్రా తన కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించాలంటే టెస్టులను వదేలియాలి. టెస్టుల్లో లాంగ్ స్పెల్స్ వేయాలి. పేస్ బౌలర్లను ఎటాక్ చేయడానికి అన్ని సార్లు ప్రయత్నించరు. కాబట్టి ఎక్కువ పేస్‌తో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో పేస్ లేకపోతే బంతి సీమ్ లేదా రివర్స్ స్వింగ్ కాదు. మళ్లీ అప్పుడు బౌలింగ్ తీరుపై పలు ప్రశ్నలకు లేవనెత్తుతుంది. టెస్టు క్రికెట్లో బుమ్రా వికెట్లు తీయగలడు. అందులో ఎటువంటి సందేహం లేదు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతను పెద్దగా రాణించలేకపోయాడు. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. అయితే అతడు టెస్టుల్లో కొనసాగాలంటే బౌలింగ్ వేగాన్ని పెంచాలి.ఇలా చేయడం వల్ల అతను గాయపడే ప్రమాదం ఉంది. అతడి స్ధానంలో నేనే ఉంటే కేవలం వన్డేలు, టీ20లకే పరిమితమయ్యేవాడిని" అని అక్తర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. -
బ్యాడ్ లక్ అంటే కేన్ మామదే.. విచిత్రకర రీతిలో ఔట్! వీడియో
హామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విచిత్రకర రీతిలో విలియమ్సన్ తన వికెట్‌ను కోల్పోయాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత న్యూజిలాండ్‌ను బ్యాటింగ్ ఆహ్హనించింది. ఈ క్రమంలో ఓపెనర్లు విల్ యంగ్, టామ్ లాథమ్ తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం యంగ్ ఔటయ్యాక విలియమ్సన్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చాడు.కేన్ మామ ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. సరిగ్గా ఇదే సమయంలో ఇంగ్లండ్ పేసర్ మాథ్యూ పోట్స్ బౌలింగ్‌లో విలియమ్సన్ ఊహించని విధంగా ఔటయ్యాడు.ఏమి జరిగిందంటే?కివీస్ ఇన్నింగ్స్ 59 ఓవర్ వేసిన పోట్స్ చివరి బంతిని విలియమ్సన్కు ఇన్‌స్వింగర్‌గా సంధించాడు. ఆ బంతిని కేన్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బౌన్స్ అయ్యి స్టంప్స్ వైపు వెళ్తుండగా.. విలియమ్సన్ కాలితో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో కేన్ మామ అనుకోకుడా ఆ బంతిని స్టంప్స్‌పై కి నెట్టాడు. దీంతో స్టంప్స్ కిందపడిపోయి క్లీన్ బౌల్డ్‌గా విలియమ్సన్(44 పరుగులు) ఔటయ్యాడు. ఒక వేళ బంతిని విలియమ్సన్ కాలితో హిట్ చేయకపోయింటే, అది స్టంప్‌ల మీదుగా బౌన్స్ అయ్యి ఉండే అవకాశముంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసింది Bizarre dismissal of Kane Williamson.pic.twitter.com/OUbISifFj7— CricketGully (@thecricketgully) December 14, 2024 -
ఎంగేజ్మెంట్ చేసుకున్న పీవీ సింధు.. ఫోటో వైరల్
భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. శనివారం పీవీ సింధు, వెంకట దత్తసాయి ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సింధు ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నది."ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు, మనం కూడా తిరిగి ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ తనంతట తానుగా ఏమీ ఇవ్వదు" అని లెబనీస్ రచయిత ఖలీల్ జిబ్రాన్ కోట్‌ను క్యాప్షన్‌గా సింధు జోడించింది. ఎంగేజ్మెంట్ సందర్భంగా ఇద్దరూ కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా డిసెంబర్ 22న ఉదయ్‌పూర్ వేదికగా సింధు-సాయి జంట వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. సింధు వివాహ వేడుకలు ఈ నెల 20 నుంచే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇరు కుటంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాయి. ఈ కాబోయే జంట ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల వంటి ప్రముఖలను తమ పెళ్లికి ఆహ్వానించారు. View this post on Instagram A post shared by PV Sindhu (@pvsindhu1)