Sakshi Special
-
రాజసం... గద్వాల సంస్థానం
గద్వాల: కవులు.. కట్టడాలకు పేరుగాంచిన గద్వాల సంస్థానం వైభవం నేటికీ చెక్కుచెదరలేదు. రాజసానికి నిలువెత్తు నిదర్శనమైన గద్వాల సంస్థానం ఏర్పాటు ఆద్యంతం అత్యంత ఆసక్తికరం. నిజాం సంస్థానంతోపాటు 1948లో భారత యూనియన్‌లో విలీనమైన గద్వాల సంస్థానంపై సవివర కథనమిది. నల సోమనాద్రి ఆధ్వర్యంలో ఆవిర్భావం నల సోమనాద్రి (పెద సోమభూపాలుడు) క్రీస్తుశకం 1663లో గద్వాల మండలం పూడూరు కేంద్రంగా గద్వాల సంస్థానాన్ని ఏర్పాటు చేశారు. నాటినుంచి 1948 వరకు ఆయన వారసులు పాలన కొనసాగించారు. నలసోమనాద్రి 1663–1712 వరకు, తర్వాత కల్లా వెంకటన్న క్రీ.శ. 1712– 1716 వరకు, రమణయ్య క్రీ.శ. 1716– 1723 వరకు, తిమ్మక్క క్రీ.శ. 1723– 1725 వరకు, లింగమ్మ క్రీ.శ. 1725– 1740 వరకు, తిరుమలరావు క్రీ.శ. 1740– 1742 వరకు, మంగమ్మ క్రీ.శ. 1742– 1745 వరకు, చొక్కమ్మ క్రీ.శ. 1745– 1747 వరకు, రామరాయలు క్రీ.శ. 1747– 1761 వరకు, చినసోమభూపాలుడు– 2 క్రీ.శ. 1761– 1794 వరకు, రామభూపాలుడు–1 క్రీ.శ. 1794– 1807 వరకు, సీతారామభూపాలుడు–1 క్రీ.శ. 1807– 1810 వరకు, వెంకటలక్ష్మమ్మ క్రీ.శ. 1840– 1840 (4 నెలలు), సోమభూపాలుడు– 3 క్రీ.శ. 1840– 1844, వెంకటలక్ష్మమ్మ (మరల) క్రీ.శ. 1844–1845, రామభూపాలుడు–2 క్రీ.శ. 1845– 1901 వరకు, సీతారామభూపాలుడు– 2 క్రీ.శ. 1901–1924 వరకు, ఆ తర్వాత చివరి తరం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ క్రీ.శ. 1924–1948 వరకు పాలన కొనసాగించారు. విద్వత్కవులకు పేరు.. గద్వాల సంస్థానం కవులకు పేరుగాంచింది. నలసోమనాద్రి, చినసోమభూపాలుడు, రామభూపాలుడు–2, సీతారామభూపాలుడు–2, మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ తదితరులు కవులకు పెద్దపీట వేసినట్లు చరిత్రకారులు చెబుతారు. వీరి పాలనలోనే గద్వాల సంస్థానం విద్వత్కవుల ప్రాంతంగా వరి్ధల్లింది. వీరి పాలనలో సంస్థాన కవులు, సంస్థాన ప్రాంత నివాస కవులు, సంస్థానేతర ఆశ్రిత కవులకు ఆశ్రయమిచ్చి గద్వాల సంస్థాన ప్రాశస్త్యాన్ని నలుమూలలా చాటినట్లు చెబుతారు. ఈ కవులు రచించిన పద్యాలలో చాటు పద్యాలు ప్రత్యేకంగా గుర్తింపు సాధించాయి.చెక్కుచెదరని నాటి కట్టడాలు నలసోమనాద్రి కాలం పాలన మొదలుకొని చివరితరం మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ కాలం వరకు నిర్మించిన వివిధ కట్టడాలు, భవనాలు, బావులు నేటికీ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నాటి భవనాలు రాజుల అభిరుచికి, నాటి వైభవాన్ని గుర్తు చేస్తూ.. చెక్కు చెదరకపోవడం విశేషం.గద్వాల కోటలో డిగ్రీ కళాశాల, ఆలయం.. రాజులు పాలన సాగించిన ప్రధాన గద్వాల కోటలో ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చెన్నకేశవస్వామి ఆలయాలున్నాయి. కోట లోపలి భాగం చాలా వరకు శిథిలావస్థకు చేరి కూలిపోగా.. ముఖద్వారం, కోట చుట్టూ భాగాలు నేటికీ పర్యాటకులకు కనువిందు చేస్తాయి.చెక్కుచెదరని ఫిరంగిరాజులు యుద్ధ సమయంలో వినియోగించే ఫిరంగి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. దీనిని ప్రస్తుతం గద్వాల మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో లింగమ్మ (1725– 1740), (1745– 1747) బావులు గత పాలన చిహ్నాలుగా ప్రతిబింబిస్తాయి. వీటిని ప్రస్తుత పాలకులు ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఏటా జరిగే గద్వాల జాతర సందర్భంగా తెప్పోత్సవాలు ఈ బావుల్లోనే నిర్వహిస్తారు.మహారాజా మార్కెట్.. సంస్థానంలోని ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు మొదలుకొని.. మిగతా అన్ని రకాల వస్తువులు మహారాజా మార్కెట్లోనే లభించేవి. రైతులు పండించే పంట ఉత్పత్తులు కూడా ఇక్కడ విక్రయించేవారని చరిత్రకారులు చెబుతారు. మహారాజా మార్కెట్ చిహ్నం చాలా భాగం ధ్వంసమైనప్పటికీ.. దాని ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి.కృష్ణారెడ్డి బంగ్లా ప్రత్యేకం నలసోమనాద్రి నిర్మించిన (ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కాలేజీ) కోటలోనే రాజవంశీయులు కలిసి జీవించేవారు. అయితే 1924లో సీతారామభూపాలుడు–2 మృతి చెందడంతో.. ఆయన భార్య మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ పాలన పగ్గాలు చేపట్టారు. సీతారామభూపాలుని సోదరుడు వెంకటకృష్ణారెడ్డికి అప్పటి పాలకులతో మనస్పర్థలు ఏర్పడి.. మాట పట్టింపుతో గద్వాల కోటను దాటి కృష్ణారెడ్డి బంగ్లాను నిర్మించుకున్నారు. ఈయన రాజవంశీయుల చివరితరం పాలనలో రెవెన్యూ, భూ పరిపాలన బాధ్యతలు నిర్వర్తించారు. ఈ భవనంలోనే చిరంజీవి హీరోగా నటించిన ‘కొండవీటిరాజా’ సినిమా షూటింగ్ చేశారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎస్ఈ కార్యాలయం, భూసేకరణ కార్యాలయం ఇక్కడే కొనసాగాయి. గద్వాల బ్లాక్ సమితి కార్యాలయం, అనంతరం ఏర్పడిన మండల రెవెన్యూ కార్యాలయం కూడా చాలాకాలం పాటు ఇక్కడే కొనసాగింది. రాజావారి బంధువులు నేటికీ ఈ భవనంలోనే జీవనం కొనసాగిస్తుండగా.. మరికొంత భాగంలో ఎంబీ హైసూ్కల్, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలున్నాయి. ఎండాకాలం, చలికాలం, వానాకాలంలో కూడా ఒకేరకమైన వాతావరణం ఉండేలా ఈ భవనాన్ని నిర్మించడం విశేషం. -
కాలుష్యానికి కళ్లెం.. బీజింగ్ చెప్పిన పాఠం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలు తోడేస్తోంది. విషపూరితమైన గాలి పీలుస్తున్న జనం ఆసుపత్రులపాలవుతున్నారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వాయు కాలుష్యం కాటుకు ప్రాణాలు కోల్పోతున్నారు. లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ నివేదిక ప్రకారం.. కాలుష్యం కారణంగా ఢిల్లీలో ప్రతిఏటా దాదాపు 12,000 మంది మరణిస్తున్నారు. లక్షలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. నగరంలో ప్రతిఏటా నమోదవుతున్న మొత్తం మరణాల్లో 11.5 శాతం మరణాలకు కాలుష్యమే కారణం కావడం గమనార్హం. ఢిల్లీ ఒక గ్యాస్ చాంబర్‌గా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితులే 2013 దాకా చైనా రాజధాని బీజింగ్‌లోనూ కనిపించేవి. కానీ, ప్రస్తుతం బీజింగ్ సిటీ కాలుష్యం ముప్పు నుంచి చాలావరకు బయటపడింది. ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందన్నది ఆసక్తికరం. వాయు కాలుష్యంపై పోరాటం విషయంలో చైనా అనుభవాలు, సాధించిన విజయాల నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి. వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) మంగళవారం బీజింగ్‌లో 137 కాగా, ఢిల్లీలో 750గా నమోదైంది. ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. కాలుష్యం ఉత్పత్తి అయ్యే విషయంలో ఢిల్లీ, బీజింగ్‌లో ఒకేలాంటి పరిస్థితులు ఉన్నాయి. శిలాజ ఇంధనాల వాడకం, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాలు, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు రెండు నగరాల్లోనూ ఉన్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం ఢిల్లీకి ఉన్న అదనపు ముప్పు. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాల్లో చైనాది ప్రపంచంలోనే మొదటి స్థానం. మొత్తం ప్రపంచ ఉద్గారాల్లో డ్రాగన్ దేశం వాటా 30 శాతం. అయినప్పటికీ బీజింగ్ ప్రజలకు స్వచ్ఛమైన గాలి ఎలా అందుతోంది? ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? బీజింగ్‌లో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండడాన్ని చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ‘సోహో’ అధినేత, బిలియనీర్ పాన్ షియీ 2011లో తొలిసారిగా సోషల్ మీడియా పోస్టు ద్వారా బాహ్య ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.2013లో కాలుష్య వ్యతిరేక పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటంలో తొలుత యువత పాలుపంచుకున్నారు. క్రమంగా ఇదొక ప్రజా పోరాటంగా మారింది. వాయు కాలుష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజింగ్ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. తమ ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రెండు వారాలపాటు అవిశ్రాంతంగా ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం దిగివచ్చింది. కాలుష్యంపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు అప్పటి చైనా అత్యున్నత నాయకుడు లీ కెఖియాంగ్ స్పష్టంచేశారు. పేదరికంపై జరుగుతున్న యుద్ధం తరహాలో కాలుష్యంపైనా యుద్ధం సాగిస్తామని తేల్చిచెప్పారు. అంతేకాదు కాలుష్య నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించారు. అధికారులను పరుగులు పెట్టించారు. నేషనల్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ → కాలుష్యాన్ని కట్టడి చేయడానికి చైనా సర్కారు ‘నేషనల్ ఎయిర్ యాక్షన్ ప్లాన్’ విడుదల చేసింది. ఇందుకోసం 100 బిలియన్ డాలర్లు కేటా యించింది. → బీజింగ్‌లో మొట్టమొదటిసారిగా 2013లో వా యు నాణ్యత గణాంకాలను ప్రచురించారు. అప్పటిదాకా ఈ సమాచారం కోసం అమెరికా రాయబార కార్యాలయంపై ఆధారపడాల్సి వచ్చేది. → 2013 నుంచి సొంతంగానే సమాచారం సేకరించి, ప్రజలకు చేరవేయడం ప్రారంభించారు. → జాతీయ వాయు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కాలుష్యాన్ని 25 శాతం తగ్గించాలని ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సీరియస్‌గానే రంగంలోకి దిగారు. → తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న 100 ఫ్యాక్టరీలను మూసివేశారు. మరికొన్నింటిని ఆధునీకరించారు. → కాలుష్య ఉద్గారాల విషయంలో కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. కాలం చెల్లిన 2 కోట్ల పాత వాహనాలను రోడ్డెక్కనివ్వలేదు. వాటిని స్క్రాప్‌గా మార్చేశారు. → 2 లక్షల పారిశ్రామిక బాయిలర్లను ఉన్నతీకరించారు. పాత వాటి స్థానంలో ఆధునిక బాయిలర్లు అమర్చారు. → బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు మంగళం పాడేశారు. సహజ వాయువుతో కరెంటును ఉత్పత్తి చేసి, 60 లక్షల ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. → విద్యుత్‌తో నడిచే వాహనాలు బీజింగ్ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలు అతి తక్కువగా కనిపిస్తుంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోంది. వాటికి పలు రాయితీలు అందిస్తోంది. → 2013లో చైనా ప్రభుత్వం ప్రారంభించిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. రాజధానిలో వాయు కాలుష్యం తగ్గడం మొదలైంది. గాలి నాణ్యత క్రమంగా మెరుగుపడింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించడంతో బీజింగ్ సిటీ ఇప్పుడు కాలుష్య రహిత నగరంగా మారింది. ఇండియా చేయాల్సిందేమిటి? ఇండియాలో కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, ముంబై, పుణే, వారణాసి, పట్నా తదితర పెద్ద నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా కాలుష్యం ఊబిలో చిక్కుకున్నాయి. ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో ఇండియా సిటీల స్థానం భద్రంగా ఉంటోంది. కాలుష్యాన్ని తరిమికొట్టి స్వచ్ఛంగా మార్చడానికి బీజింగ్ మోడల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలుష్యం నుంచి జనానికి విముక్తి కల్పించడానికి బలమైన రాజకీయ సంకల్పం కావాలని చెబుతున్నారు. నిపుణుల సూచనలు ఏమిటంటే..→ వాయు నాణ్యతను మెరుగుపర్చడానికి అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవాలి. → శిలాజ ఇంధనాల వాడకానికి కళ్లెం వేయాల్సిందే. → పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు పెరగాలి. అస్తవ్యస్తమైన పట్టణ ప్రణాళిక కాలుష్యానికి కారణమవు తోంది. ఈ పరిస్థితి మారాలి. → కాలుష్య నియంత్రణ చర్యల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. → వ్యాపారం, వాణిజ్యం, ఎగుమతులతోపాటు రాజకీయ పలుకుబడి సాధించే విషయంలో చైనాతో పోటీ పడుతున్న భారత్ కాలుష్య నియంత్రణ విషయంలో ఎందుకు పోటీపడడం లేదన్నదే నిపుణుల ప్రశ్న. → కాలుష్య నియంత్రణను కేవలం స్థానిక ప్రభుత్వాలకే వదిలివేయకూడదు. ఇందుకోసం జాతీయ స్థాయిలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరం. → చక్కటి ప్రణాళికాబద్ధమైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గిపోవాలి. ప్రజలు సొంత వాహనాలు కాకుండా ప్రజా రవాణా సాధనాలను ఉపయోగించుకుంటే కాలుష్యం చాలావరకు తగ్గిపోతుంంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Akshainie Reddy: నానమ్మ గురించి రాస్తా...
పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల్ల అమ్మాయి గురించి కథ రాస్తే ఎలా ఉంటుంది?! ఏడవతరగతి చదువుతున్న పన్నెండేళ్ల పట్లోళ్ల అక్షయినీ రెడ్డి రాసిన ‘ట్రైల్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్’ పుస్తకం ద్వారా మనకు ఈ విషయాలు తెలుస్తాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలు అక్షయినీ రెడ్డి.‘‘మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో రోజూ చూస్తుంటాను. నానమ్మ, అమ్మ, నాన్న.. మా ఇంట్లోని వ్యక్తులే నాకు స్ఫూర్తి. నానమ్మ లైఫ్ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను...’ అంటూ ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.‘‘నాకు కథలపైన ఆసక్తి మొదలైందంటే అమ్మ చెప్పిన స్టోరీస్ వల్లే. రోజూ రాత్రి పడుకునే ముందు అమ్మ రకరకాల కథలు చెబుతుంటుంది. తముణ్ణి, నన్ను బయటకు తీసుకెళ్లినప్పుడైనా, కాస్త టైమ్ దొరికినా ఏదో చిట్టి కథ ఉంటుంది. సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు కథలు చెప్పి, వాటిని షార్ట్ ఫార్మ్‌లో రాసి చూపించమనేది. తర్వాత్తర్వాత పుస్తకాల్లోని కథలు చదివినా, వాటిని ఒక చిన్న పేరాలో రాసి చూపించేదాన్ని. ఈ అలవాటు నాకు పుస్తకాలంటే ఇష్టం పెరిగేలా చేసింది. ఇప్పుడు నా కోసం ఇంట్లో ఓ లైబ్రరీయే ఏర్పాటు చేశారు. ఎక్కువ భాగం ఇంగ్లిష్వే ఉంటాయి. ఫారినర్స్ రాసినవి, సుధామూర్తి రచనలు బాగా చదువుతాను. ఒక బుక్ చదివాక బాగా నచ్చితే ఆ బుక్ నుంచి మరొక స్టోరీ రాస్తాను. ‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ పుస్తకం అలా రాసిందే. నానమ్మ, నాన్న, అమ్మ, స్కూల్లో టీచర్స్, ఫ్రెండ్స్.. చాలా మెచ్చుకున్నారు.బలమైన వ్యక్తిత్వం‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ బుక్ లో పదహారేళ్ల అమ్మాయి పేరు ఆటమ్. ఆమె భావోద్వేగాలు ఈ పుస్తకం నిండా ఉంటాయి. ఒక చిన్న వెకేషన్ కోసం తల్లిదండ్రులను ఒప్పించి మెక్సికోకు బయల్దేరుతుంది. అనుకోని సంఘటనలో తల్లి మరణిస్తుంది. తమ కుటుంబం నుంచి దూరమైన ఆంటోనియోను కలుసుకుంటుంది. క్షేమకరం కాని ఆ ్రపాంతంలో ఉండలేక మెక్సికో నుంచి వాళ్లు లండన్‌కు చేరుకుంటారు. అక్కడ జేమ్సన్ అనే వ్యక్తిని కలుస్తారు. జేమ్సన్ కుటుంబంతో ఉండటమూ క్షేమకరం కాదని అర్థమై తండ్రి, ఆంటోనియోలతో కలిసి జర్మనీకి వెళ్లిపోతుంది. జీవితమెప్పుడూ సంతోషంగా ఉండాలనుకునే ఆటమ్ ప్రతినిత్యం సమస్యలతో చేసే ప్రయాణం గురించి ఈ కథ వివరిస్తుంది. ఆ అమ్మాయి స్నేహాలను ఎలా డెవలప్ చేసుకుంటుంది, ఫ్యామిలీని ఎలా చూసుకుంటుంది, ఒకమ్మాయి ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అనే విషయాలు నేర్పిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే హ్యాపీ ఎండింగ్ తప్పక దొరుకుతుంది అనే హోప్‌ని ఇస్తుంది. నా ఫ్రెండ్స్ టైటిల్ విషయంలో, కవర్ పేజీ విషయంలో సాయం చేశారు. ఈ బుక్ కోసం ఏడాది పాటు వర్క్ చేశాను. నిజానికి 16 ఏళ్ల అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది అనే విషయాలను గురించి అంతగా మ్యాచ్ చేయలేకపోవచ్చు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ బుక్స్ బాగా చదువుతారు. వారికి ఈ పుస్తకంలో స్నేహపూర్వక స్వభావం, స్ట్రాంగ్ విల్‌పవర్, వ్యక్తిత్వం బాగా నచ్చాయి. నా ఫ్రెండ్స్‌కు నేను రాసిన స్టోరీ నచ్చింది. నా ఫ్రెండ్స్ ఈ బుక్ కొని చాలా సపోర్ట్ చేశారు. స్కూల్లో అందరూ నన్ను అభినందించారు. కొందరు మంచి విమర్శలు కూడా చేశారు.ఎంతో నేర్చుకోవాలి...రచనలు చేయడంలో చాలా నేర్చుకోవాల్సి ఉందని నాకు ఈ పుస్తకం ద్వారా తెలిసి వచ్చింది. వచ్చిన విమర్శల నుంచి కూడా నేర్చుకుంటున్నాను. స్టోరీలో ఒక పాత్రను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఆ క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేయాలి, స్టోరీ ΄్లాట్ ఎలా రాయాలి.. వంటివి నేర్చుకోవాలి. ఇదంతా తెలుసుకుంటూనే నా రచనల్లో వాటిని ఇంక్లూడ్ చేస్తూ వెళ్లాలని ఉంది. ముఖ్యంగా మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో చూస్తుంటాను. నానమ్మ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను. అందుకు, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. మంచి రైటర్‌గా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పేరుతెచ్చుకుంటూనే లాయర్ని అవ్వాలనే లక్ష్యంతో చదువుకుంటున్నాను. లాయర్‌గా న్యాయం కోసం పోరాటం చేస్తూనే, నా రచనల ద్వారా కొంతమందినైనా ప్రభావితం చేయాలనేది నా ముందున్న లక్ష్యం’’ అంటూ తెలిపింది ఈ బాల రచయిత్రి. టైమ్ క్రియేషన్ఈ బుక్ రిలీజ్ అయ్యాక మా ఫ్రెండ్స్‌తో సహా కొంతమంది నీకు టైమ్ ఎలా సరిపోతుంది అని అడిగారు. నేను టైమ్‌ను క్రియేట్ చేసుకున్నాను. రోజులో ఒక గంటసేపు ఈ బుక్ కోసం కేటాయించుకున్నాను. మొత్తం ఇరవై ఐదు వేల పదాలు. నేనే స్వయంగా టైప్ చేసి, ఎడిటింగ్ చేసుకుంటూ, తిరిగి మార్పులు చేసుకుంటూ రాశాను. దీనిని బుక్‌గా తీసుకురావడానికి అమ్మవాళ్లకు చెప్పకుండానే నలుగురు పబ్లిషర్స్‌తో మాట్లాడాను. వాళ్లు ఆశ్చర్యపోయారు. పబ్లిషర్స్ అమ్మ వాళ్లను అ్రపోచ్ అవడంతో... ఈ పని ఈజీ అయ్యింది. – నిర్మలారెడ్డిఫొటోలు: గడిగె బాలస్వామి -
Virgin Media O2: సైబర్ కేటుగాళ్ల పనిపట్టే ఏఐ బామ్మ
ఎలా పనిచేస్తుంది? వర్జిన్ మీడియా ఓ2 సంస్థకు చెందిన యూజర్లకు స్కామర్లు చేసే నకిలీ/స్పామ్ ఫోన్‌కాల్స్‌ను కృత్రిమమేథ చాట్ అయిన ‘డైసీ’బామ్మ రెప్పపాటులో కనిపెడుతుంది. వెంటనే స్కామర్లతో యూజర్లకు బదులు ఈ బామ్మ మాట్లాడటం మొదలెడుతుంది. తమతో మాట్లాడేది నిజమైన బామ్మగా వాళ్లు పొరబడేలా చేస్తుంది. అవతలి వైపు నుంచి కేటుగాళ్లు మాట్లాడే మాటలను సెకన్లవ్యవధిలో అక్షరాల రూపంలోకి మార్చి ఆ మాటలకు సరైన సమాధానాలు చెబుతూ వేరే టాపిల్లోకి సంభాషణను మళ్లిస్తుంది. ‘కస్టమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’వంటి అధునాతన సాంకేతికతలను ఒడుపుగా వాడుకుంటూ అప్పటికప్పుడు కొత్తకొత్త రకం అంశాలను చెబుతూ సంభాషణను సాగదీస్తుంది. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా తాను పెంచుకున్న పిల్లి పిల్ల కేశసంపద గురించి, పిల్లి చేసే అల్లరి గురించి, తన కుటుంబసభ్యుల సంగతులు.. ఇలా అనవసరమైన అసందర్భమైన అంశాలపై సుదీర్ఘ చర్చలకు తెరలేపుతుంది. సోది కబర్లు చెబుతూ అవతలి వైపు స్కామర్లు విసిగెత్తిపోయేలా చేస్తుంది. అయినాసరే బామ్మ మాటలగారడీలో స్కామర్లు పడకపోతే తప్పుడు చిరునామాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కొద్దిగా మార్చేసి చెప్పి వారిని తికమక పెడుతుంది. ఓటీపీలోని నంబర్లను, క్రెడిట్, డెబిట్ కార్డు అంకెలను తప్పుగా చెబుతుంది. ఒకవేళ వీడియోకాల్ చేసినా అచ్చం నిజమైన బామ్మలా తెరమీద కనిపిస్తుంది. వెచ్చదనం కోసం ఉన్ని కోటు, పాతకాలం కళ్లజోడు, మెడలో ముత్యాలహారం, తెల్లని రింగురింగుల జుట్టుతో కనిపించి నిజమైన బ్రిటన్ బామ్మను మైమరిపిస్తుంది. యాసను సైతం ఆయా కేటుగాళ్ల యాసకు తగ్గట్లు మార్చుకుంటుంది. లండన్‌కు చెందిన వీసీసీపీ ఫెయిత్ అనే క్రియేటివ్ ఏజెన్సీ ఈ బామ్మ ‘స్థానిక’గొంతును సిద్ధంచేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి బామ్మ నుంచి తీసుకున్న స్వర నమూనాలతో ఈ కృత్రిమ గొంతుకు తుదిరూపునిచి్చంది.కేటుగాళ్ల సమాచారం పసిగట్టే పనిలో... మన సమాచారం స్కామర్లకు చెప్పాల్సిందిపోయి స్కామర్ల సమాచారాన్నే ఏఐ బామ్మ సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్‌కాల్ ఆన్లైన్లో ఉండేలా చేయడం ద్వారా ఆ ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెల్సుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, నిఘా సంస్థలకు అవకాశం చిక్కుతుంది. ‘‘ఎక్కువసేపు ఈ బామ్మతో ఛాటింగ్‌లో గడిపేలా చేయడంతో ఇతర యూజర్లకు ఫోన్‌చేసే సమయం నేరగాళ్లను తగ్గిపోతుంది. స్కామర్లు తమ విలువైన కాలాన్ని, శ్రమను బామ్మ కారణంగా కోల్పోతారు. ఇతరులకు స్కామర్లు ఫోన్‌చేయడం తగ్గుతుంది కాబట్టి వాళ్లంతా స్కామర్ల చేతిలో బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం తప్పినట్లే’’అని వర్జిన్ మీడియా ఓ2 ఒక ప్రకటనలో పేర్కొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూఫ్‌టాప్ సౌరభం!
పర్యావరణానుకూల ‘గ్రీన్’ పాలసీల పుణ్యమా అని దేశంలో సౌర విద్యుత్ రంగం వెలుగులు విరజిమ్ముతోంది. గృహాల్లో రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్లు భారీగా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం అమల్లోకి తెచ్చిన పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ప్రభావంతో ఈ విభాగంలో సౌర విద్యుత్ సామర్థ్యం ఆరు నెలల్లోనే రెట్టింపు కావడం విశేషం!పర్యావరణానుకూల ‘గ్రీన్’ పాలసీల పుణ్యమా అని దేశంలో సౌర విద్యుత్ రంగం వెలుగులు విరజిమ్ముతోంది. గృహాల్లో రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్లు భారీగా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం అమల్లోకి తెచ్చిన పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ప్రభావంతో ఈ విభాగంలో సౌర విద్యుత్ సామర్థ్యం ఆరు నెలల్లోనే రెట్టింపు కావడం విశేషం! సోలార్ పవర్ ‘టాప్’లేపుతోంది! నివాసాల్లో సౌర విద్యుత్ వాడకం జోరందుకుంది. మోదీ సర్కారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక ఫ్లాగ్íÙప్ పథకం పీఎం సూర్య ఘర్ యోజనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో దాదాపు 4 లక్షలకు పైగా గృహ సోలార్ కనెక్షన్లు కొత్తగా జతయ్యాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం (ఇన్స్టాల్డ్ కెపాసిటీ) 1.8 గిగావాట్లు (జీడబ్ల్యూ)గా అంచనా. ఈ ఏడాది మార్చి నాటికి నివాస రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యం 3.2 జీడబ్ల్యూగా నమోదైంది. అంటే, దీంతో పోలిస్తే గడిచిన ఆరు నెలల కాలంలో 50 శాతం పైగా సామర్థ్యం ఎగబాకినట్లు పరిశ్రమ వర్గాల తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఇదంతా పీఎం సూర్య ఘర్ స్కీమ్ చలవేనని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తంమీద చూస్తే, దేశంలో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ సామర్థ్యం 2024 మార్చి నాటికి 11.9 జీడబ్ల్యూగా ఉంది. ఇందులో అత్యధికంగా సుమారు 60 శాతం వాటా వాణిజ్య, పారిశ్రామిక విభాగాలదే! సబ్సిడీ పెంపు.. తక్కువ వడ్డీకే రుణం.. ఇంటి డాబాలపై సౌర విద్యుత్ సిస్టమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ తోడ్పాటు ఎప్పటి నుంచో ఉంది. ఖర్చు తడిసిమోపెడవుతుండటంతో ప్రజల నుండి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే, గ్రీన్ ఎనర్జీ పాలసీపై గట్టిగా దృష్టిపెట్టిన కేంద్ర ప్రభుత్వం గృహాల్లో సోలార్ వెలుగులు పెంచేందుకు పీఎం సూర్య ఘర్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ప్రధానంగా అధిక వ్యయ సమస్యకు చెక్ పెట్టేందుకు సోలార్ మాడ్యూల్స్‌పై సబ్సిడీని 40% నుంచి 60%కి పెంచింది. 7% వడ్డీకే రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. దీంతో రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య గత కొన్ని నెలలుగా భారీగా పెరిగినట్లు జేఎంకే రీసెర్చ్, ఎనలిటిక్స్ తాజా నివేదికలో వెల్లడైంది. కాగా, ఈ జోరు ఇలాగే కొనసాగితే నివాస సౌర విద్యుత్ సామర్థ్య విస్తరణలో ఈ స్కీమ్ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందనేది నిపుణుల మాట!ఏటా 8–10 గిగావాట్లు..దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని భారీగా పెంచడంలో భాగంగా 2027 నాటికి నివాస గృహాల రూఫ్‌టాప్ సోలార్ స్థాపిత సామర్థ్యాన్ని 30 గిగావాట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించాలంటే ఏటా 8–10 జీబ్ల్యూ వార్షిక సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు జతకావాల్సి ఉంటుంది. ‘మిగులు విద్యుత్‌ను తిరిగి విక్రయించడంతో సహా డిస్కమ్‌ల నుంచి అనుమతులను పొందడం విషయంలో ప్రభుత్వం నిబంధనలను సడలిస్తోంది. రుణ సదుపాయంతో పాటు ప్రజల్లో సౌర విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుపై అవగాహన పెంచేలా చర్యలు చేపడుతుండటంతో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ వి. పేర్కొన్నారు. ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ మొత్తాన్ని భారీగా పెంచడం, సోలార్ మాడ్యూల్స్‌పై వ్యయాలను తగ్గించడం, వినియోగదారుల్లో ఈ టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించడం వంటి అంశాల నేపథ్యంలో రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్ వృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ‘రాష్ట్ర నియంత్రణ సంస్థలు ఈ స్కీమ్ అమలుకు దన్నుగా నిలుస్తున్నాయి. గృహ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకునే కస్టమర్లకు నెట్ మీటరింగ్‌ను అందిస్తున్నాయి. దీనికి తోడు తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వీటి ఏర్పాటుకు రుణాలిచ్చే సంస్థలు అరకొరగానే ఉండేవి. ఇప్పుడు 25కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్ కంపెనీలు రుణాలిస్తున్నా యి. దీంతో నివాసపరమైన రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్ పుంజుకుంటోంది’ అని విక్రమ్ చెప్పారు. సవాళ్లున్నాయ్...గృహాల్లో సోలార్ వినియోగాన్ని పెంచే లక్ష్యంతో మోదీ సర్కారు 2027 నాటికి కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసేందుకు ఏకంగా రూ.75,021 కోట్ల మొత్తాన్ని (ప్రభుత్వ వ్యయం) కేటాయించింది కూడా. భారత్ నిర్దేశించుకున్న పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, 2070 నాటికి కర్బన ఉద్గార రహిత (నెట్ జీరో) దేశంగా అవతరించాలన్న సంకల్పానికి సూర్య ఘర్ పథకం చేదోడుగా నిలుస్తుందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. అయితే, ఇందుకు చాలా సవాళ్లు పొంచి ఉన్నాయని... ముఖ్యంగా దేశీయంగా నివాస రంగానికి దేశీయ సోలార్ మాడ్యూల్స్ లభ్యతను పెంచాల్సి ఉందంటున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా దేశంలో ఫొటోవోల్టాయిక్ సెల్, మాడ్యూల్ తయారీ సామర్థ్యం, డిమాండ్ మధ్య భారీ అంతరం ఉందని, ఈ మేరకు ప్లాంట్ల సామర్థ్యం భారీగా పెరగాల్సి ఉందనేది వారి అభిప్రాయం. చిన్న, మధ్య తరహా గృహ విద్యుత్ వినియోగదారులు ఈ స్కీమ్‌ను ఉపయోగించుకునేలా మరింత ప్రోత్సహించాలని కూడా నిపుణుల సూచిస్తున్నారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం?
రష్యాపై యూఎస్ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు. తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా. దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన. అణు దాడితో దీటుగా బదులిచ్చేందుకు వీలుగా రష్యా అణు విధానాన్ని సవరిస్తూ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం. ‘ఏ క్షణాన్నయినా అణు యుద్ధం ముంచుకు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రజలకు యూరప్ దేశాల ‘వార్ గైడ్‌లైన్స్’. సోమవారం ఒక్క రోజే శరవేగంగా జరిగిన తీవ్ర ఆందోళనకర పరిణామాలివి! ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెర తీసి సరిగ్గా 1,000 రోజులు పూర్తయిన నాడే చోటుచేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే నాల్కలు చాస్తున్న యుద్ధ జ్వాలలు మరింతగా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడుతుందని, పశ్చిమాసియా కల్లోలమూ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది. అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు ఉక్రెయిన్‌కు ఆయన అనుమతివ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ మంగళవారమే రష్యాపై యూఎస్ దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం (ఏటీఏసీఎంస్) బాలిస్టిక్ క్షిపణులను ఎడాపెడా ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి. అలాంటి చర్యలకు దిగితే తీవ్రస్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది. తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్ క్షిపణులు వచ్చి పడ్డాయని ధ్రువీకరించింది. వాటిలో ఐదింటిని కూల్చేయడంతో పాటు ఆరో దాన్నీ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడులు! తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. మంగళవారం ఆయన రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు. అందుకు వీలు కలి్పంచేలా దేశ అణు విధానానికి సవరణ కూడా చేశారు! దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణు దాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు అది వీలు కలి్పస్తుండటం విశేషం! అంతేగాక మిత్ర దేశమైన బెలారస్‌పై దుందుడుకు చర్యలకు దిగినా అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది! ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నేరుగా బదులివ్వలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అణు విధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు. ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటుండటం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ మతిలేని విధానాలతో ట్రంప్ పగ్గాలు చేపట్టే నాటికే ప్రపంచాన్ని పెనుయుద్ధం ముంగిట నిలిపేలా ఉన్నారని ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ మండిపడటం తెలిసిందే.నిత్యావసరాలు నిల్వ చేసుకోండితాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కన్పిస్తుండటంతో యూరప్ దేశాలు భీతిల్లుతున్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లండ్, నార్వే, డెన్మార్క్ తదితర నాటో సభ్య దేశాలు తమ పౌరులను హెచ్చరించడం విశేషం. ‘‘ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ముంచుకు రావచ్చు. సిద్ధంగా ఉండండి’’ అంటూ స్వీడన్ ఏకంగా ఇంటింటికీ కరపత్రాలే పంచుతోంది. ‘సంక్షోభమో, యుద్ధమో వస్తే...’ అనే శీర్షికతో కూడిన 52 లక్షల కరపత్రాలను సోమవారం నుంచి వారం పాటు పంచనుంది! అది నిజానికి 32 పేజీలతో కూడిన డాక్యుమెంట్. ‘‘మనపై ఎవరైనా దాడికి తెగబడితే దేశ స్వాతంత్య్ర పరిరక్షణకు అందరమూ ఒక్కటవుదాం’’ అని అందులో పౌరులకు స్వీడన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతోపాటు, ‘‘పిల్లల డైపర్లు, బేబీ ఫుడ్, దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, మంచినీరు తదితరాలన్నింటినీ వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’’ అని సూచించింది. అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటిబారి నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి, యుద్ధ బీభత్సం చూసి భీతిల్లే చిన్నారులను ఎలా సముదాయించాలి వంటి వివరాలెన్నో పొందుపరిచింది.‘‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్ ఇలాంటి చర్యకు దిగడం ఇది ఐదోసారి. నార్వే కూడా ఇలాంటి ‘యుద్ధ’ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ పాంప్లెంట్లు పంచుతోంది. ‘పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి’ అంటూ అప్రమత్తం చేస్తోంది. డెన్మార్క్ కూడా కనీసం మూడు రోజులకు పైగా సరిపడా సరుకులు, మంచినీరు, ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఈ–మెయిళ్లు పంపింది! ఫిన్లండ్ కూడా అదే బాట పట్టింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి. నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’ అంటూ తన పౌరులకు ఆన్లైన్ బ్రోషర్లు పంపింది.అపారంగా అణ్వాయుధాలు రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగు పడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణు వార్హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్ నుంచి విడిపోయేనాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్‌కు దన్నుగా ఉన్నాయి.క్షిపణులే మాట్లాడతాయి భారీ క్షిపణి దాడులకు మాకు అనుమతి లభించిందంటూ మీడియా ఏదేదో చెబుతోంది. కానీ దాడులు జరిగేది మాటలతో కాదు. వాటిని ముందుగా చెప్పి చేయరు. ఇక మా తరఫున క్షిపణులే మాట్లాడతాయి. – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇఫీలో గుస్సాడీ నృత్యం
తెలంగాణ సంప్రదాయ నృత్య వైభవం మరోసారి జాతీయ అంతర్జాతీయ వేదికలపై తళుక్కుమననుంది. గోవాలో అట్టహాసంగా బుధవారం జరుగనున్న అంతర్జాతీయ భారత్ చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. ఇఫీ)ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఆదివాసీ గోండు గిరిజనుల గుస్సాడీ నృత్యం ప్రదర్శనకు అవకాశం దక్కించుకుంది. ఈ నృత్య కళాకారునిగా ఇటీవలే కీర్తిశేషులైన పద్మశ్రీ కనకరాజు జాతీయ స్థాయిలో పేరొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో తెలంగాణ సంప్రదాయ నృత్య ప్రదర్శనకు నోచుకోవడం, ఆ ప్రదర్శనలో పాల్గొనే కళాకారులు అందరూ దివంగత కనకరాజు శిష్యులే కావడంతో ఇది గత నెలలోనే దివికేగిన గుస్సాడీ నృత్య దిగ్గజానికి ఘన నివాళిగా చెప్పొచ్చు. – సాక్షి, హైదరాబాద్ -
రేపే పోలింగ్.. మహారాష్ట్ర చరిత్రలోనే టఫ్ ఫైట్!
రెండు జాతీయ పార్టీలు. నాలుగు ప్రాంతీయ పార్టీలు. పలు చిన్న పార్టీలు. భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబెల్స్. వెరసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంకుల సమరానికి రంగం సిద్ధమైంది. కనీవినీ ఎరగనంత పోటాపోటీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు గాను ఏకంగా నాలుగింట విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఆధిపత్యమే సాగింది. అధికార మహాయుతి కూటమి కొంకణ్‌లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. అదే జోరును కొనసాగించాలని ఎంవీఏ, మిగతా ప్రాంతాల్లోనూ పాగా వేయాలని మహాయుతి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.పశ్చిమ మహారాష్ట్ర.. షుగర్ బెల్ట్‌గా పిలిచే ఈ ప్రాంతం అత్యధికంగా 70 అసెంబ్లీ స్థానాలకు నిలయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త ఎన్సీపీ ఏకంగా 27 స్థానాలు నెగ్గింది. బీజేపీకి 20, కాంగ్రెస్‌కు 12, అవిభక్త శివసేనకు 5 స్థానాలు దక్కాయి. శివసేన, ఎన్సీపీల్లో చీలిక అనంతరం జరిగిన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 10 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ ఐదింటిని నెగ్గి స్వల్ప పైచేయి సాధించగా మహాయుతి నాలుగింటితో సరిపెట్టుకుంది. మిగతా స్థానంలో నెగ్గి్గన స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఫలితాలే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. ఇక్కడ ఎన్సీపీ అజిత్, శరద్ పవార్ వర్గాలు ఏకంగా 20 స్థానాల్లో ముఖాముఖి తలపడుతుండటం విశేషం.లోక్‌సభ పోరులో పవార్ వర్గం ఏకంగా 3 స్థానాల్లో నెగ్గగా అజిత్ వర్గానికి ఒక్క సీటూ దక్కకపోవడం విశేషం. పవార్ల కంచుకోట బారామతి ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ స్థానంపై పట్టు నిలుపుకునేందుకు శరద్ పవార్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీని చీల్చిన అజిత్ పవార్ ఇక్కడ బరిలో ఉండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. మేనల్లుడు యుగేంద్రను అజిత్‌పై బరిలో దించారు. పశ్చిమ మహారాష్ట్రలో సహకార సంఘాల హవా నడుస్తుంటుంది. రైతు సమస్యలు ఈసారి ఇక్కడ ప్రధానాంశంగా మారాయి. కొంకణ్.. ఎంవీఏపై పాలక కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన ఏకైక ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 6 స్థానాల్లో మహాయుతి ఏకంగా ఐదింట నెగ్గింది. దాన్ని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొంకణ్‌కు పోర్టు, మలీ్టమోడల్ కారిడార్, మెగా రిఫైనరీ తదితర భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. దాంతో ఎంవీఏ కూటమి తన ప్రచారాన్ని ఈ ప్రాంతంలో శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన చుట్టే తిప్పుతూ లబ్ధి పొందే ప్రయత్నాల్లో పడింది. కొంకణ్ శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే కంచుకోట. ఇక్కడి కోప్రీ–పచ్పాఖడీ నుంచి ఆయన బరిలో దిగారు. షిండేపై ఆయన రాజకీయ గురువు ఆనంద్ డిఘే మేనల్లుడు కేదార్ ప్రకాశ్‌ను ఉద్ధవ్ సేన పోటీకి నిలిపింది. విదర్భ.. మహారాష్ట్రలో అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో ఏకంగా ఏడు ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. వాటిలో ఐదింటిని కాంగ్రెసే నెగ్గింది. మరాఠాలతో పాటు ఓబీసీలు, దళితులు ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట. కానీ 20 ఏళ్లుగా ఇక్కడ బాగా బలహీనపడుతుండగా బీజేపీ పుంజుకుంటోంది. దీనికి తోడు ప్రత్యేక విదర్భ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతివ్వడం బీజేపీకి ఆదరణను మరింత పెంచింది. అధికారాన్ని నిలుపుకోవాలంటే విదర్భలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు నెగ్గడం మహాయుతికి కీలకం. దాంతో పారిశ్రామిక హబ్‌తో పాటు ఈ ప్రాంతంపై వరాల వర్షం కురిపించింది. ఇక్కడ దాదాపుగా అన్ని పారీ్టలకూ రెబెల్స్ బెడద తీవ్రంగా ఉంది. రైతు సమస్యలు కూడా ఇక్కడ ఓటర్లను బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పీసీసీ చీఫ్ నానా పటోలే పోటీ చేస్తున్నారు. మరాఠ్వాడా.. రాష్ట్రంలో అత్యంత వర్షాభావ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ హవా సాగింది. ఏడింట 6 స్థానాలు విపక్ష కూటమి ఖాతాలోకే వెళ్లాయి. మిగతా ఒక్క స్థానాన్ని షిండే శివసేన గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అవిభక్త శివసేన 46 స్థానాలకు గాను 28 సీట్లను గెలుచుకున్నాయి. మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ మనోజ్ జరంగే ఉద్యమించిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. మరాఠా రిజర్వేషన్లు కీలకంగా మారడం మహాయుతికి ఇబ్బంది కలిగించేదే. మరాఠా ఓట్లపై ఎంవీఏ, ఓబీసీ ఓట్లపై మహాయుతి ఆశలు పెట్టుకున్నాయి. మరాఠాలు, ఓబీసీలతో పాటు ముస్లింలు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఉత్తర మహారాష్ట్ర.. ఇది ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఏడింటి ఆరు సీట్లు ఎంవీఏ ఖాతాలో పడగా బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ప్రాంతంలో ఉల్లి రైతులు ఎక్కువ. ఉల్లి ఎగుమతుల నిషేధంతో కేంద్రం తమ పొట్ట కొట్టిందన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఇది మహాయుతికి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది. నాసిక్, పరిసర ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న గిరిజనుల ఓట్లు కూడా ఇక్కడ కీలకమే. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవలి లోక్‌సభ పోరులోనూ వారు ఎంవీఏ కూటమికే దన్నుగా నిలిచారు. ముంబై.. దేశ ఆర్థిక రాజధాని. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఆరు స్థానాల్లో మహాయుతికి దక్కింది రెండే. ముంబైపై బాగా పట్టున్న ఉద్ధవ్ శివసేన 3 స్థానాలు చేజిక్కించుకుంది. ఈసారి షిండే, ఉద్ధవ్ సేనల మధ్య ఇక్కడ హోరాహోరీ సాగుతోంది. వీటికి తోడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా ఇక్కడ గట్టి ప్రభావమే చూపుతుంది.వరాల జల్లులు⇒ రెండు కూటములూ ఈసారి తమ మేనిఫెస్టోల్లో అన్ని వర్గాలపైనా వరాల వర్షం కురిపించాయి.⇒ లడ్కీ బెహన్ యోజన మొత్తాన్ని రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించగా తామొస్తే ఏకంగా రూ.3,000 ఇస్తామని ఎంవీఏ పేర్కొంది.⇒ మహాయుతి రైతు రుణ మాఫీ హామీకి పోటీగా తాము ఏకంగా రూ.3 లక్షల దాకా రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.⇒ 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మహాయుతి హామీ ఇస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 ఇస్తామని ఎంవీఏ చెప్పింది. -
నవజంట కలల పంట..థాయ్‌లాండ్!
సాక్షి, అమరావతి : ఇంతకాలం బ్యాచిలర్స్ డెస్టినేషన్‌గా పేరొందిన థాయిలాండ్ ఇప్పుడు పెళ్లయిన కొత్త జంటలకు హానీమూన్ స్పాట్‌గా మారింది. ఇప్పటి వరకు హానీమూన్ డెస్టినీగా ఉన్న మాల్దీవుల కంటే అత్యధికంగా థాయ్‌లాండ్‌కు వెళ్లినట్టు మేక్ మై ట్రిప్ హానీమూన్–2024 నివేదిక వెల్లడించింది. గడిచిన ఏడాది కాలం(అక్టోబర్ 23 నుంచి సెప్టెంబర్–24)లో కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లినట్టు పేర్కొంది. ఈ ఏడాదిలో థాయ్‌లాండ్ కు వెళ్లిన కొత్త జంటల్లో 5.2 శాతం వృద్ధి నమోదయితే.. అదే సమయంలో మాల్దీవుల బుకింగ్స్ 16.2 శాతం పడిపోయినట్లు పేర్కొంది. మాల్దీవుల పర్యాటక మంత్రి ఇండియన్ బీచ్‌లను కించపరుస్తూ మాట్లాడటం, ఆ తర్వాత బ్యాన్ మాల్దీవ్స్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం జరగడమే దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. థాయ్‌లాండ్, మాల్దీవుల తర్వాత ఇండోనేషియా, మారిషస్, వియత్నాంలకు ఎక్కువ మంది జంటలు వెళుతున్నట్టు నివేదిక పేర్కొంది. ఇండియా నుంచి అత్యధికంగా వెళ్లే ఐదు దేశాల్లో ఒక్క మాల్దీవులు తప్ప మిగిలిన నాలుగు దేశాలు వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ప్రస్తుత యువత హానీమూన్ కోసం దగ్గర ప్రాంతాలనే కాకుండా ఎక్కువ రోజులు గడిపేలా సుదీర్ఘ ప్రాంతాలైన జపాన్, స్కాండినేవియా, యునైటెడ్ స్టేట్స్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది జపాన్ బుకింగ్స్‌లో ఏకంగా 388 శాతం వృద్ధి నమోదైంది. కేరళను అధిగమించిన అండమాన్ ఇక దేశీయంగా చూస్తే కొత్త జంటలు అండమాన్ నికోబార్ దీవుల్లో గడపడానికి ఇష్టపడుతున్నారు. తొలిసారిగా హానీమూన్ ప్యాకేజీల్లో కేరళను అధిగమించి అండమాన్ ముందుకొచ్చినట్టు నివేదిక పేర్కొంది. అండమాన్‌లో నీలి రంగు సముద్రంతో బీచ్‌లు పరిశుభ్రంగా ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే అండమాన్ బుకింగ్స్‌లో 6.9 శాతం వృద్ధి నమోదైంది. అండమాన్, కేరళ తర్వాత కశ్మీర్, గోవా, హిమాచల్ ప్రదేశ్లు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కొత్తగా హనీమూన్ పర్యాటక ప్రాంతాలుగా ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలు ఎదుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. అస్సలు తగ్గడం లేదు.. హనీమూన్ ఖర్చు విషయంలో యువత వెనుకాడటం లేదు. హానీమూన్ ప్యాకేజీల్లో అత్యధికంగా ఫోర్స్టార్, ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోనే బస చేసేందుకే ఇష్టపడుతున్నారట. గతేడాది మొత్తం జంటల్లో 68 శాతం మంది స్టార్ హోటల్స్‌లోనే బస చేయడమే కాకుండా, సగటు ఖర్చులో 13 శాతం వృద్ధి నమోదైంది. కేవలం ఒక ఊరు, ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రెండు మూడు ప్రాంతాలు తిరగడానికి జంటలు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. అంతర్జాతీయంగా రెండు మూడు దేశాలకు వెళ్లే వారి సంఖ్య 32 శాతం నుంచి 47 శాతానికి పెరిగితే, దేశంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ నగరాలను సందర్శించే జంటల సంఖ్య 35 శాతం నుంచి 39 శాతానికి పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. -
ఊబకాయంతో గుండెకు ముప్పు
ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి... అన్ని వయసుల వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వెరసి కొన్ని అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇందులో ఊబకాయం కూడా ఆ కోవకు చెందినదే. వివిధ జబ్బులకు కారణమవుతున్న ఈ సమస్య మరణాల ముప్పును కూడా పెంచుతోంది. ఊబకాయుల్లో గుండె జబ్బుల మరణాలు గడచిన రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగినట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. 1999 నుంచి 2020 నాటికి ఊబకాయంతో ముడిపడి ఉన్న గుండె జబ్బుల మరణాల రేటు సుమారు 180 శాతం పెరిగినట్టు నిర్ధారించారు. పురుషుల మరణాల రేటులో పెరుగుదల అధ్యయనంలో భాగంగా ఊబకాయ సంబంధిత ఇస్కిమిక్ గుండె జబ్బుతో ముడిపడిన 2.26 లక్షల మరణాలపై పరిశోధన నిర్వహించారు. 1999లో ప్రతి లక్ష మంది పురుషుల్లో 2.1గా మరణాలు రేటు ఉన్నట్టు గుర్తించారు. ఇది 2020నాటికి 243 శాతం పెరిగి 7.2కు చేరుకున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా మహిళల్లో 1999లో ప్రతి లక్ష మందికి 1.6గా ఉన్న మరణాల రేటు... 131 శాతం పెరిగి 2020 నాటికి 3.7కు చేరుకుంది. అధ్యయనంలో గుర్తించిన అంశాల ఆధారంగా ఇస్కిమిక్ హార్ట్ స్ట్రోక్‌కు ఊబకాయం తీవ్రమైన ప్రమాదకారిగా నిర్ధారించారు. బరువు పెరుగుతున్న కొద్దీ గుండె జబ్బుల ప్రమాదం వృద్ధి చెందుతోందని అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ అలీనా మోహ్సిన్ తెలిపారు. ఏమిటీ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ గుండెకు రక్తం సరఫరాలో ఏర్పడే ఇబ్బందిని ‘ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్’ అంటారు. దీనికి పొగతాగడం, బీపీ, షుగర్, రక్తంలో కొలె్రస్టాల్, ఊబకాయం ప్రధాన కారణం. గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు కొన్ని రోజులకు గుండె కండరం క్రమేణా క్షీణిస్తూ... దెబ్బతింటుంది. ఈ డ్యామేజ్ శాశ్వతంగా అవ్వకముందే గుర్తించి వైద్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అరికట్టవచ్చు. యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులను వైద్యులు గుర్తిస్తారు. అడ్డంకులు ఉన్నట్లయితే అవసరమైన మేరకు చికిత్స చేయడం, స్టెంట్ వేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ]ప్రతి ముగ్గురు ఊబకాయుల్లో ఇద్దరి మృతికి గుండె జబ్బే కారణంప్రపంచవ్యాప్తంగా గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో ప్రతి ముగ్గురు ఊబకాయుల్లో ఇద్దరి మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ఊబకాయుల్లో గుండె వైఫల్యం, ఆకస్మిక గుండెపోటు, ధమనుల గోడల్లో కొవ్వు పేరుకుపోవడం, రక్తం గడ్డ కట్టడం, గుండె కొట్టుకోవడంలో అసమతుల్యత ప్రమాదాలు ఉన్నట్టు ఆ సర్వేలో గుర్తించారు. సాధారణ బరువున్న వారితో పోలిస్తే ఊబకాయుల్లో టైప్–2 డయాబెటీస్ బారినపడే ప్రమాదం మూడు రెట్లు అధికమని పేర్కొన్నారు. 20–49 ఏళ్ల వయసున్న పురుషుల్లో 78 శాతం, మహిళల్లో 65 శాతం అధిక రక్తపోటుకు బాడీమాస్ ఇండెక్స్(బీఎంఐ) ఎక్కువగా ఉండటమే కారణమని గుర్తించారు. -
మహిళలు... మరాఠాలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. దాంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏ కూటములు రెండూ చివరి విడత ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గతంతో పోలిస్తే మహారాష్ట్ర రాజకీయ రంగస్థలం ఈసారి నానారకాలుగా చీలిపోయి కని్పస్తుండటం విశేషం. ప్రధాన ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీ గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాల్లో రెండుగా చీలిపోవడం తెలిసిందే.దాంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటి తమదే అసలు పార్టీ అని నిరూపించుకునేందుకు షిండే సేన, ఉద్ధవ్ వర్గం; అజిత్ ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం తహతహలాడుతున్నాయి. షిండే సేన, అజిత్ ఎన్సీపీ, బీజేపీ అధికార మహాయుతిగా; ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ విపక్ష మహా వికాస్ అఘాడీగా మోహరించాయి. ఈ ఎన్నికల్లో రెండు కూటముల భాగ్యరేఖలనూ మహిళా ఓటర్లు, మరాఠా రిజర్వేషన్లే చాలావరకు తేల్చనున్నట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దాంతో పార్టీల ప్రచారం కూడా చాలావరకు మహిళలు, మరాఠా కోటా చుట్టే కేంద్రీకృతమై సాగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ఓటింగ్లో మహిళల జోరుమహారాష్ట్రలో పురుషులతో పోలిస్తే మహిళలే చాలా ఎక్కువ సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు. పలు ఎన్నికలుగా ఇది కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పురుషుల్లో కేవలం 61 శాతం ఓటింగ్ నమోదైతే ఏకంగా 79 శాతం మంది మహిళలు ఓటెత్తారు. దాంతో మహిళా శక్తిపై ఈసారి పార్టీలన్నీ గట్టిగా దృష్టి సారించాయి. మహిళల ఓట్ల కోసం హోరాహోరీ ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విపక్ష ఎంవీఏ కూటమి జోరు సాగడంతో ఎన్డీఏ సారథి బీజేపీ అప్రమత్తమైంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితిని తలకిందులు చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. మహిళలను ఆకట్టుకునేందుకు ఎన్నికల వేళ మహాయుతి సర్కారు పలు పథకాలు, తాయిలాలు ప్రకటించింది. 21–65 ఏళ్ల మధ్య వయసున్న అల్పాదాయ వర్గాల మహిళలకు నెలకు రూ.1,500 అందించే లడ్కీ బహిన్ పథకం అందులో భాగమే. ఇది ఏకంగా సగం మంది మహిళా ఓటర్లను, అంటే దాదాపు 2 కోట్ల పై చిలుకు మందిని తమను అనుకూలంగా మారుస్తుందని బీజేపీ కూటమి ఆశలు పెట్టుకుంది.వారి ఓట్లను గుండుగుత్తగా కొల్లగొడితే అధికారాన్ని సునాయాసంగా నిలుపుకోవచ్చని లెక్కలు వేసుకుంటోంది. దాంతో ఈ పథకానికి విరుగుడుగా ఎంవీఏ కూటమి తమను గెలిపిస్తే నెలకు ఏకంగా రూ.3,000 నేరుగా ఖాతాల్లోకే వేస్తామని మహిళలకు హామీ ఇచ్చింది. దీంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలి్పస్తాని పేర్కొంది. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 అందిస్తామన్న హామీ కూడా యువతుల్లో బాగా పని చేస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. టేబుల్⇒ మహారాష్ట్రలో మొత్తం ఓటర్లు 9.7 కోట్లు ⇒ పురుషులు 4.93 కోట్లు ⇒ మహిళలు 4.6 కోట్లురెబెల్స్ కాకతిరుగుబాటు అభ్యర్థులు కూడా పార్టీల విజయావకాశాలను గట్టిగానే దెబ్బ తీసేలా కన్పిస్తున్నారు. ముఖ్యంగా మహాయుతి కూటమికి ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆ కూటమి అభ్యర్థులపై ఏకంగా 69 మంది తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరు చీల్చే ఓట్లు చాలాచోట్ల ఫలితాలను తారుమారు చేసి చివరికి తమ అధికారానికే ఎసరు పెడతాయేమోనన్న ఆందోళన మహాయుతి నేతలను వెంటాడుతోంది.ముఖ్యంగా 62 స్థానాలున్న కీలకమైన విదర్భ ప్రాంతంలో చాలా చోట్ల మహాయుతి రెబెల్స్ బరిలో ఉన్నారు. విపక్ష ఎంవీఏ కూటమికి కూడా రెబెల్స్ బెడద తప్పడం లేదు. కాంగ్రెస్ నుంచి ఏకంగా 29 మంది తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. మాట వినకపోవడంతో వారందరినీ పార్టీ సస్పెండ్ చేసింది. వీరికి జంప్ జిలానీలు తోడయ్యారు. మహారాష్ట్రలో గత ఐదేళ్లలో నేతల గోడదూకుళ్లు రికార్డు సృష్టించాయి. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పలేని పరిస్థితి! వీళ్లు కూడా ఆయా పార్టీల అవకాశాలను గట్టిగానే దెబ్బ తీసేలా కని్పస్తున్నారు.మరాఠా రిజర్వేషన్లుఇక మరాఠా రిజర్వేషన్ల రగడ ఈనాటిది కాదు. విద్యా, ఉపాధి అవకాశాల్లో తాము వెనకబడి ఉన్నామని, నిర్లక్ష్యానికి గురవుతున్నామని వారిలో ఎప్పటినుంచో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. వారి హక్కుల సాధనకు మరాఠా నేత మనోజ్ జరంగే పాటిల్ చేస్తున్న ఆందోళనకు కొన్నేళ్లుగా అపూర్వ ఆదరణ దక్కుతోంది. రాష్ట్ర జనాభాలో మరాఠాలు ఏకంగా 31 శాతానికి పైగా ఉన్నారు. దాంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. కీలకమైన మరాఠా ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.ఓబీసీ కోటా నుంచి మరాఠాలను మినహాయించడంపై తమను జరంగే తీవ్రంగా దుయ్యబడుతుండటం బీజేపీకి మింగుడుపడటం లేదు. మరాఠాలకు అన్యాయం జరగనిచ్చే ప్రసక్తే లేదని మహాయుతి కూటమి నేతలు, అభ్యర్థులు పదేపదే చెబుతున్నా ఆ సామాజిక వర్గం నుంచి వారికి పెద్దగా సానుకూల స్పందన కని్పంచడం లేదు. దాంతో ఓబీసీలు, గిరిజన సామాజిక వర్గాల ఓట్లపై మహాయుతి కూటమి గట్టిగా దృష్టి సారించింది. వారికోసం కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు పలు వాగ్దానాలు చేసింది. రైతులు, నిరుద్యోగంవీటికి తోడు రైతుల అసంతృప్తి మరో ప్రధాన ఎన్నికల అంశంగా కని్పస్తోంది. ఇటీవలి అకాల వర్షాలు రాష్ట్రంలో సాగుపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రభుత్వం ఆదుకుంటుందని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. దాంతో షిండే సర్కారుపై వారంతా గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఎగుమతులపై నిషేధం ఉల్లి రైతులను బాగా దెబ్బ తీసింది. ఇవన్నీ తన పుట్టి ముంచేలా కని్పస్తుండటంతో దాంతో రైతులను ఆకట్టుకునేందుకు మహాయుతి సర్కారు ఆపసోపాలు పడుతోంది. పంట రుణాల మాఫీ వంటి పలు హామీలు గుప్పించింది. ఇక మహారాష్ట్రలో ప్రబలంగా ఉన్న మరో సమస్య నిరుద్యోగం. దీనికి తోడు మహారాష్ట్రకు కేటాయించిన పలు భారీ ప్రాజెక్టులు వరుసగా ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌కు తరలుతున్న వైనం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. -
శీతాకాల అతిథుల సందడి
శీతాకాలం వచ్చేసింది.. కొల్లేరు సరస్సుకు విదేశీ అతిథుల రాకా మొదలైంది. వేల మైళ్ల దూరం నుంచి ఎగిరొచి్చన రంగురంగుల పక్షులు కిలకిలారావాలతో పర్యాటకులను అలరిస్తున్నాయి. విదేశీ పక్షుల స్వస్థలాల్లో వాతావరణ మార్పు కారణంగా మనుగడ కోసం తరులు, గిరులు, సాగరాలను దాటి ఏలూరు జిల్లా కొల్లేరుకు చేరుతున్నాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకొని పిల్లలతో మార్చి చివర్లో సొంతూర్లకు వెళ్లిపోతాయి. ఏటా వచ్చే ఈ అతిథులను ఇక్కడి ప్రజలు సొంతబిడ్డల్లా ఆదరిస్తారు. వీటిని చూసి ఆనందించేందుకు వచ్చే పర్యాటకులతో పక్షుల విహార కేంద్రాలు కళకళలాడుతున్నాయి.రాష్ట్రంలో పక్షుల విహార కేంద్రాలు ⇒ కొల్లేరు – ఏలూరు జిల్లా⇒ పులికాట్ సరస్సు, నేలపట్టు – నెల్లూరు జిల్లా ⇒ ఉప్పలపాడు – గుంటూరు ⇒ తేలినీలపురం, తేలుకుంచి – శ్రీకాకుళం ⇒ కౌండన్య – చిత్తూరు జిల్లా77,138 ఎకరాల విస్తీర్ణంలో.. ప్రకృతి సోయాగాల ఆరాధకులను కనువిందు చేస్తుంది కొల్లేరు సరస్సు. ఏలూరు జిల్లాలో 77,138 ఎకకాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ ఆటపాక, మాధవపురం పక్షుల విహార కేంద్రాలు ప్రశిద్ధమైనవి. ఏటా శీతాకాలంలో వందలాది జాతుల పక్షులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి. మన దేశానికి ఏటా వలస వచ్చే పక్షి జాతులు 1,349 ఉన్నట్లు అంచనా. వీటిలో ఎక్కువగా కొల్లేరు ప్రాంతానికి వస్తుంటాయి. ఏషియన్ వాటర్ బర్ట్స్ నివేదిక ప్రకారం గతేడాది ఇక్కడ 105 పక్షి జాతులకు సంబంధించి 81,495 పక్షులు విడిది చేశాయి. ఈ ఏడాది మార్చిలో 50 వేల పక్షులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. వలస పక్షులకు విడిది వలస అనేది పక్షుల జీవన శైలి. రుతువుల్లో మార్పులు వచ్చునప్పుడు దాదాపు 4,000 పక్షి జాతులు అనువైన ప్రదేశాలను వెతుక్కుంటూ వలసలు వెళతాయి. వీటిలో సుమారు 1,800 జాతులు అత్యంత సుదూర ప్రాంతాలకు వెళ్తాయి. కొల్లేరుకు సైబీరియా, రష్యా, టర్కీ, తూర్పు యూరప్, అ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి పక్షులు వస్తున్నాయి. వీటిలో ఆఫ్రికా నుంచి రెడ్ క్రిస్టెడ్ పోచార్డ్ (ఎర్ర తల చిలువ), అలాస్మా నుంచి పసిఫిక్ గెల్డెన్ ఫ్లోవర్ (బంగారు ఉల్లంకి), ఐర్లండ్ నుంచి కామన్ రెడ్ షాంక్ (ఎర్ర కాళ్ల ఉల్లంకి), ఐరోపా నుంచి యురేíÙయన్ స్పూన్ బిల్ (తెడ్డు మూతి కొంగ), దక్షిణాఫ్రికా నుంచి బ్రాహ్మణి షెల్ డక్ (బాపన బాతు), ఫిలిప్సీన్స్ నుంచి వైట్ పెలికాన్ (తెల్ల చింక బాతు) వంటివి ముఖ్యమైనవి.చిత్తడి నేలల నెలవు ‘కొల్లేరు’ చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు పక్షుల జీవనానికి అనువైనది. ఇక్కడి ఆటపాక పక్షుల కేంద్రం పెలికాన్ (గూడబాతు) పక్షుల ఆవాస ప్రాంతంగా పేరుగడించింది. దీనిని పెలికాన్ ప్యారడైజ్‌గా పిలుస్తారు. కొల్లేరు సరస్సులో గూడబాతుతో పాటు ఎర్ర కాళ్ల కొంగ (పెయింటెడ్ స్టార్క్), నల్ల రెక్కల ఉల్లంకి పిట్ట (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్), తెడ్డు ముక్కు కొంగ (ఏషియన్ ఓపెన్‌బిల్ స్టార్క్) కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), చిన్న నీటి కాకి (లిటిల్ కార్మోరెంట్), సాధారణ కోయిలలు (స్వాలో), పెద్ద చిలువ బాతు (లార్జ్ విజ్లింగ్ డక్), చెరువు బాతు (గార్గనే), తొండు వల్లంకి (బ్లాక్ టయల్డ్ గాట్‌విట్) వంటి 105 రకాల పక్షి జాతులు ఉన్నాయి.పక్షులు మంచి నేస్తాలు పక్షులు పర్యావరణ సమతుల్యతకు మంచి నేస్తాలు. వాటిని సంరక్షించుకోవాల్సిన బా ధ్యత అందరిపై ఉంది. వలస పక్షుల్లో అనేక జాతులు అంతరించేపోయే ప్రమాదంలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కొల్లేరులో చిత్తడి నేలల ప్రదేశాలు వలస పక్షులకు ఆవాసాలుగా ఉన్నాయి. పక్షులకు ఏ విధమైన హాని తలపెట్టకుండా సంరక్షించుకోవాలి. –దీపక్ రామయ్యన్, వైల్డ్‌లైఫ్ ఎక్స్పర్ట్, హైదరాబాద్ఆకాశమే వాటి హద్దుసమశీతల వాతావరణాన్ని వెతుక్కుంటూ పక్షులు వలస వస్తాయి. ఆకాశమే వాటి హద్దు. కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం వీటికి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో శీతాకాలంలో మంచుగడ్డ కడుతుంది. అందువల్ల అవి సెంట్రల్ ఆసియన్ ఫ్లైవే (సీఏఎఫ్) మీదుగా మన దేశానికి వస్తాయి. ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు ద్వారా పక్షులను దగ్గరగా తిలకించే అవకాశం ఉంది. –కేవీ రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, కైకలూరు. -
చంద్రుడు మన మామ కాదా?
‘చందమామ రావే.. జాబిల్లి రావే..’, ‘మామా.. చందమామా..’ అని పాటలున్నాయి. ‘కార్తీక పున్నమి వేళలోనా..’ అంటూ గీతాలూ ఉన్నాయి.. చంద్రుడి వెన్నెల తగలగానే రూపమే మారిపోయే జానపద కథలు మరెన్నో ఉన్నాయి.. ఏ దేశం, ఏ సంస్కృతి అనే తేడా లేకుండా చంద్రుడు మనందరికీ అంత దగ్గరైపోయాడు. కానీ చంద్రుడు మనవాడు కాదని, అంతరిక్షంలో తిరుగుతూ ఉంటే.. భూమి లాగేసి పట్టేసుకుందని శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చారు. దీన్ని బలపర్చే పలు ఆధారాలనూ చూపుతున్నారు. చంద్రుడు ఎక్కడివాడు? భూమికి ఎలా దొరికిపోయాడు? ఆ సిద్ధాంతం ఏం చెబుతోంది? దానికి ప్రాతిపదిక ఏమిటనే వివరాలు తెలుసుకుందామా..భూమి నుంచి ఏర్పడిందనే అంచనాతో..చందమామ మన భూమి నుంచే ఏర్పడిందనేది ఇప్పటివరకు ఉన్న సిద్ధాంతం. దాని ప్రకారం.. సూర్యుడు, ఇతర గ్రహాలు ఏర్పడిన కొత్తలో.. అంగారకుడి పరిమాణంలో ఉన్న ‘థియా’అనే గ్రహం భూమిని ఢీకొట్టిందని, అప్పుడు భూమి నుంచి అంతరిక్షంలోకి విసిరివేయబడిన శకలాలు ఒకచోట చేరి చంద్రుడు రూపుదిద్దుకున్నాడు. భూమి గురుత్వాకర్షణ వల్ల గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిద్ధాంతాన్ని అందరూ విశ్వసిస్తున్నా.. ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. ఓ ‘బైనరీ గ్రహాల జంట’లో భాగమైన చంద్రుడిని భూమి లాగేసుకుని ఉంటుందని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.ఎక్కడి నుంచో భూమి లాగేసుకుందా?చందమామ మిస్టరీలు ఎన్నో..నాసా శాస్త్రవేత్తలు చంద్రుడిపై నుంచి తెచ్చిన సుమారు 363 కిలోల రాళ్లు, మట్టిపై పరిశోధనలు చేశారు. ఆ రాళ్లు, మట్టిలో ఉన్న రసాయన సమ్మేళనాలలో కొన్ని భూమ్మీది తరహాలోనే ఉండగా.. మరికొన్ని చాలా విభిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. భూమి నుంచే చంద్రుడు ఏర్పడితే.. ఆ రసాయన సమ్మేళనాలు ఎక్కడివనే సందేహాలు ఉన్నాయి. మరో గ్రహం భూమిని ఢీకొట్టడంతో అంతరిక్షంలోకి ఎగిసిపడిన పదార్థాలన్నీ కాలక్రమేణా ఒకచోటికి చేరి చంద్రుడు ఏర్పడినట్టు పాత సిద్ధాంతం చెబుతోంది. కానీ అలా ఎగసిపడిన పదార్థాలు.. శని చుట్టూ ఉన్న వలయాల తరహాలో భూమి మధ్య భాగానికి ఎగువన (భూమధ్య రేఖ ప్రాంతంలో) కేంద్రీకృతం కావాలని... అవన్నీ కలిసిపోయినప్పుడు చంద్రుడు కూడా భూ మధ్య రేఖకు ఎగువనే ఉండాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చంద్రుడు భూమధ్య రేఖ కన్నా ఏడు డిగ్రీలు ఎగువన, వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తున్నాడు. మరో తోడు నుంచి చంద్రుడిని లాగేసుకుని.. సౌర కుటుంబంలో, అంతరిక్షంలో అక్కడక్కడా ‘బైనరీ’ వ్యవస్థలు ఉంటాయి. అంటే కొంచెం అటూ ఇటుగా సమాన పరిమాణం ఉన్న ఖగోళ పదార్థాలు (ఆస్టరాయిడ్లు, గ్రహాల వంటివి..) రెండూ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి. అదే సమయంలో ఆ రెండూ కలసి.. ఏదైనా నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అలాంటి బైనరీ వ్యవస్థలో చంద్రుడు భాగమని కొత్త సిద్ధాంతం చెబుతోంది. ఆ బైనరీ మరుగుజ్జు గ్రహాలు భూమికి సమీ పం నుంచి వెళ్లినప్పుడు.. అందులోని చంద్రుడిని భూమి గురుత్వాకర్షణ శక్తితో లాగేసుకుందని, రెండో మరుగుజ్జు గ్రహం అంతరిక్షంలోకి విసిరివేయబడిందని పేర్కొంటోంది. అలా లాగేసుకోవడం సాధ్యమేనా? విశ్వంలో బైనరీ వ్యవస్థలు ఉండటం, అప్పుడప్పుడూ అలాంటి వాటిలోంచి ఒకదానిని పెద్ద గ్రహాలు, నక్షత్రాల వంటివి లాక్కోవడం సాధారణమేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. దీనికి ‘బైనరీ ఎక్సే్ఛంజ్ క్యాప్చర్’గా పేరుపెట్టారు. ఇలా బైనరీ వ్యవస్థ నుంచి ఒకదాన్ని లాక్కున్నప్పుడు.. రెండో గ్రహం/ఆస్టరాయిడ్ వేగంగా విసిరివేసినట్టుగా వెళ్లిపోతుంది.నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రిటాన్.. అలా లాగేసుకున్నదే! మన సౌర కుటుంబంలోనే అలాంటివి ఎన్నోసార్లు జరిగాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డారెన్ విలియమ్స్ తెలిపారు. ‘‘ఉదాహరణకు నెప్ట్యూన్ గ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో అతిపెద్దదైన ‘ట్రిటాన్’కూడా ఒకప్పుడు బైనరీ వ్యవస్థలో భాగమే. నెప్ట్యూన్ తనకు దగ్గరగా ఆ వ్యవస్థ వచ్చినప్పుడు.. ట్రిటాన్ను లాగేసుకుందని ఇప్పటికే గుర్తించారు. అంతేకాదు ట్రిటాన్ ఉపగ్రహం నెప్ట్యూన్ చుట్టూ.. దాని మధ్యరేఖ ఎగువన కాకుండా, 67 డిగ్రీలు వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తోంది. మన చంద్రుడు కూడా అలా వంపు తిరిగిన కక్ష్యలోనే పరిభ్రమిస్తున్నాడు. చంద్రుడిని భూమి లాగేసుకుందనే దానికి ఇదొక ఆధారం..’’అని డారెన్ విలియమ్స్ వెల్లడించారు. కొత్త సిద్ధాంతం సందేహాలను తీర్చుతోందా? ‘‘బైనరీ వ్యవస్థ నుంచి లాగేసుకున్న గ్రహాలు/ ఆస్టరాయిడ్లు దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగాలి.. లాక్కున్న గ్రహం నుంచి మెల్లగా దూరంకావాలి.. అనే రూల్స్ కూడా ఉన్నాయి. వాటిని మా సిద్ధాంతం బలపరుస్తోంది..’’అని శాస్త్రవేత్త విలియమ్స్ తెలిపారు.మొదట్లో చంద్రుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే తిరిగేవాడని.. అయితే భూమి టైడల్ ఫోర్స్ వల్ల మెల్లగా వృత్తాకార కక్ష్యకు చేరాడని వివరించారు. ఆ ఫోర్స్ వల్లే చంద్రుడి ఒకవైపు భాగం ఎప్పుడూ భూమివైపే ఉండేలా..‘టైడల్ లాక్’అయిందని తెలిపారు. అంతేకాదు చంద్రుడు సగటున ఏటా మూడు సెంటీమీటర్ల మేర భూమి నుంచి దూరంగా జరుగుతున్నాడని గుర్తు చేశారు. ఎవరేం సిద్ధాంతాలు తెస్తేనేం? ఎప్పుడో కోట్ల ఏళ్లనాటి మాట అది. ఏది కరెక్టో, ఏదికాదో కాదుగానీ.. మనుషులు పుట్టేనాటికే చంద్రుడు ఇక్కడే ఉన్నాడు. అంటే మన మామ చందమామే!– సాక్షి, సెంట్రల్ డెస్క్ -
చిన్న పార్టీలే... నిర్ణేతలు!
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటముల మధ్యే కేంద్రీకృతమైంది. కానీ అంతిమ ఫలితాన్ని మాత్రం చిన్న పార్టీలు, స్వతంత్రులే తేల్చే సూచనలు కన్పిస్తుండటం విశేషం. ఈ జాబితాలో మజ్లిస్, ఎంఎన్ఎస్, వీబీఏ వంటి పార్టీలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. వీటికి, స్వతంత్రులకు కలిపి ఈసారి కనీసం 30 స్థానాలకు పైగా రావచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.అదే జరిగి, హంగ్ వచ్చే పక్షంలో అవి కింగ్మేకర్లుగా మారినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకూ నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్న పార్టీల హల్చల్ రెండు కూటముల్లోనూ గుబులు రేపుతోంది. దాంతో అందరి దృష్టీ 23న వెల్లడయ్యే ఫలితాలపైనే కేంద్రీకృతమైంది...!మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోరు పరాకాష్టకు చేరింది. అధికారం నిలుపుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్న బీజేపీ సారథ్యంలోని మహాయుతి, దాన్ని ఎలాగైనా గద్దె దించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్ నాయకత్వంలోని ఎంవీఏ కూటములకు చిన్న పార్టీలు పెద్ద సమస్యగా పరిణమించాయి. జరుగుతున్నది ద్విముఖ పోరే అయినా రెండు కూటముల భాగ్యరేఖలనూ ఈ ‘తృతీయ శక్తులు’ నిర్దేశించేలా కనిపిస్తుంటే ఆసక్తికరంగా మారింది. ఈ చిన్న పార్టీల్లో ఒక్కోదానికీ ఒక్కో ప్రాంతంలో చెప్పుకోదగ్గ పట్టుంది. అగాడీకి ఎంఎన్ఎస్ గుబులు ఈ ఎన్నికల్లో ప్రబల శక్తిగా కనిపిస్తున్న రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) విపక్ష ఎంవీఏ కూటమికి గుబులు పుట్టిస్తోంది. రాజధాని ముంబై, శివార్లలో ఎంఎన్ఎస్ హవా అంతా ఇంతా కాదు. ముంబైలోని 25 స్థానాల్లో ఎంఎన్ఎస్ బరిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం మరో 36 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గట్టి ప్రభావం చూపడం ఖాయంగా కన్పిస్తోంది. ముంబైలోని 25 స్థానాల్లో మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) 12, బీజేపీ 10 చోట్ల పోటీ పడుతున్నాయి.ఎంఎన్ఎస్ను బీజేపీకి మిత్రపక్షంగా పరిగణిస్తారు. రాజ్ ఠాక్రేను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన కుమారుడు అమిత్ పోటీ చేస్తున్న మాహింలో కూటమి ధర్మాన్ని కూడా బీజేపీ పక్కన పెట్టింది! అక్కడ షిండే సేన అభ్యర్థని కాదని మరీ అమిత్‌కే బీజేపీ నేతలు బాహాటంగా మద్దతు పలుకుతున్నారు! ఇది ఆ రెండు పార్టీల లోపాయికారీ అవగాహనకు, బీజేపీ వ్యూహ చతురతకు నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు.కింగ్‌మేకర్ ఆశల్లో ఒవైసీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్‌కు కూడా మహారాష్ట్రలో చెప్పుకోదగ్గ పట్టే ఉంది. ముఖ్యంగా ఔరంగాబాద్‌తో పాటు ముంబైలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పార్టీ హవా కొనసాగుతుంది. 2019లో 44 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్ ఈసారి కేవలం 16 స్థానాల్లోనే బరిలో ఉంది. కాకపోతే అవన్నీ ముస్లిం ప్రాబల్య స్థానాలే. వాటిలో చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయంపై పార్టీ నమ్మకంగా ఉంది.అంతేగాక మిగతా చోట్ల మజ్లిస్ చీల్చే ముస్లిం ఓట్లు అగాడీ కూటమి అభ్యర్థుల విజయావకాశాలకు గట్టిగా గండి కొట్టేలా కన్పిస్తున్నాయి. ‘‘హంగ్ వచ్చి ఎంవీఏ కూటమి గనక మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో ఆగిపోతే మేం గెలవబోయే సీట్లే కీలకం కావచ్చు. అప్పుడు మజ్లిస్ కింగ్‌మేకర్ అవుతుంది’’ అని ఆ పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఎంవీఏ కూటమిలో చేరేందుకు మజ్లిస్ విఫలయత్నం చేసింది.గత ఎన్నికల్లోనూ దుమ్ము రేపాయిమహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చిన్న పార్టీలు దుమ్మురేపాయి. మొత్తమ్మీద 29 సీట్లు గెలుచుకోవడమే గాక ఏకంగా మరో 63 అసెంబ్లీ స్థానాల్లో చిన్న పార్టీల అభ్యర్థులు రెండో స్థానంలో నిలవడం విశేషం. ఈసారి కూడా ఆ ఫలితాలే పునరావృతమైతే కూటములకు కష్టకాలమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా అసెంబ్లీ స్థానాల్లో మొత్తం ఓటర్లు 4 లక్షలు, అంతకన్నా తక్కువే ఉంటారు. 60 శాతం పోలింగ్ జరుగుతుందనుకున్నా సగటున ఒక్కో అసెంబ్లీ స్థానం పరిధిలో 2.5 లక్షల ఓట్లు పోలవుతాయి. పార్టీపరమైన చీలికల దృష్ట్యా ప్రతి స్థానంలోనూ కేవలం లక్ష ఓట్లే విజేతను తేల్చే అవకాశముంది.సరిగ్గా ఈ అంశమే పలు స్థానాల్లో చిన్న పార్టీలను ప్రబల శక్తులుగా మారుస్తోంది. దీనికి తోడు గత ఎన్నికలతో పోలిస్తే మహారాష్ట్రలో ఈసారి రాజకీయ రంగస్థలం నానారకాలుగా చీలిపోయింది. దాంతో చిన్న పార్టీ, గట్టి ఇండిపెండెంట్ బరిలో ఉన్న అన్ని స్థానాల్లోనూ మిగతా అభ్యర్థులందరి భాగ్యరేఖలూ ప్రభావితమ య్యే పరిస్థితి నెలకొంది! ఈ కారణంగానే ఈసారి ఫలితాలను అంచనా వేయడం చాలా కష్టతరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.దళిత ఓట్లను చీల్చనున్న వీబీఏ! ఎన్నికల బరిలో ఉన్న వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) నిజానికి పలు చిన్న పార్టీల కూటమి. అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ సారథ్యంలోని ఈ కూటమికి దళితులు, బౌద్ధ దళితులు, ఇతర అణగారిన వర్గాలతో పాటు ముస్లింలలో కూడా మంచి ఆదరణే ఉంది. రిజర్వేషన్లే ప్రధాన నినాదంగా ఈసారి ఏకంగా 67 స్థానాల్లో వీబీఏ బరిలో దిగింది. వీటిలో అత్యధిక స్థానాలు ముంబై, విదర్భ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర జనాభాలో దళితులు 14 శాతం, బౌద్ధ దళితులు 7 శాతమున్నారు. గతంలోనూ పలు ఎన్నికల్లో వీబీఏ సత్తా చాటింది.విదర్భతో పాటు మరాఠ్వాడా ప్రాంతంలోనూ పార్టీకి చెప్పుకోదగ్గ ఆదరణ ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా సీట్లు రాకపోయినా 7 శాతం ఓట్లు సాధించింది. ఈసారి వీబీఏ భారీగా దళిత ఓట్లు సాధిస్తే ప్రధానంగా ఎంవీఏ కూటమికే దెబ్బ పడుతుంది. 2019లో కూడా కనీసం 10 స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అభ్యర్థుల ఓటమికి వీబీఏ సాధించిన ఓట్లే కారణమని తేలింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కూడా పలు స్థానాల్లో ఎంవీఏ అభ్యర్థుల ఓటమికి వీబీఏ కారణంగా నిలిచింది. ఇవే గాక మరికొన్ని చిన్న పార్టీలతో స్థానికంగా గట్టి పట్టున్న స్వతంత్ర అభ్యర్థులు కూడా పలు స్థానాల్లో కూటముల అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.జరంగే ఫ్యాక్టర్? మరాఠా హక్కుల ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ కూడా ఈసారి ఎన్నికల్లో గట్టి ప్రభావమే చూపేలా ఉన్నారు. ఈసారి అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించి రెండు కూటములకూ ఆయన చెమటలు పట్టించారు. మహారాష్ట్ర జనాభాలో ఏకంగా 30 శాతానికి పైగా ఉండే మరాఠాల్లో ఆయనకు గట్టి పట్టుండటమే ఇందుకు కారణం. చివరి క్షణంలో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నా ఎన్నికల ఫలితాలపై మాత్రం జరంగే గట్టి ప్రభావమే చూపనున్నారు.ముఖ్యంగా మరాఠ్వాడాలో చాలా స్థానాల్లో ఆయన మద్దతిచ్చే అభ్యర్థులే గట్టెక్కే పరిస్థితి నెలకొని ఉంది! ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో జరంగే సహాయ నిరాకరణ మరాఠ్వాడాతో పాటు పశ్చిమ మహారాష్ట్ర, విదర్భల్లోని పలు స్థానాల్లో మహాయుతి అవకాశాలను బాగా దెబ్బతీసింది. ఆ చేదు అనుభవం ఈసారీ పునరావృతం అవుతుందేమోనని బీజేపీ పెద్దలు భయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పులి మీ ఎదురుగా ఉంటే.. ఇలా తప్పించుకోండి!
పులి మనకు ఎదురొచ్చినా.. మనం పులికి ఎదురెళ్లినా.. ‘పోయేది’ మనమేనన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఒకవేళ మన టైం బాగోక పులిని మనం చూసినా లేదా అది మనల్ని చూసినా ఏం చేయాలిమీరు పులిని చూశారు.. అది మిమ్మల్ని చూడలేదు. అలాంటప్పుడు ఎక్కడున్నారో అక్కడే కదలకుండా నిశ్శబ్దంగా నిల్చోండి. శ్వాస వేగంగా తీసుకోకూడదు. చెప్పడం ఈజీగానీ.. పులిని చూశాక.. ఎవరైనా గాబరా పడటం సహజం, అయితే.. ఇక్కడ మీరు ఎంత కామ్‌గా ఉంటారన్న దాని మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. అది వెళ్లేంతవరకూ ఆగండి. వెళ్లాక.. అది వెళ్లిన దిశకు వ్యతిరేక దిశలో వెంటనే వెళ్లిపోండి. ఇక్కడ తప్పించుకుపోవడం ఒక్కటే మీ లక్ష్యంగా ఉండాలి. అంతే తప్ప.. ఏదైనా కొత్తగా చేసి హీరోయిజం చూపిద్దాం అనుకుంటే.. అడవిలో అదే హీరో అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసుకోండి. ఈసారి పులే మిమ్మల్ని చూసింది. మొట్టమొదట చేయకూడని పని పరుగెత్తడం. మీరు ఉసేన్ బోల్ట్ కాదు.. అదైతే కన్ఫర్మ్. పైగా వెంటాడుతూ.. వేటాడటంలో పులులు స్పెషలిస్టులు. అందుకే అలా చేయొద్దు.. ఒకవేళ మీరు కూర్చునే పొజిషన్లో ఉంటే.. ముందుగా లేచి నిల్చొండి. ఎందుకంటే.. పులులు సాధారణంగా జింకల్లాంటి వాటిపై వెనుక నుంచి దాడి చేస్తాయి.. ముఖ్యంగా అవి కూర్చునే పొజిషన్లో ఉన్నప్పుడు వేటాడతాయి. పైగా.. అవి తాము వేటాడే జంతువులకు, మనుషులకు మధ్య తేడాను గుర్తించలేవు. అందుకే లేచి నిల్చోవడం ద్వారా మీరు పులి వేటాడే జంతువు కాదన్న విషయాన్ని తెలియజేయాలి. గతంలో కూడా మన దేశంలో అడవుల్లో వంగి.. కట్టెలు ఏరుకుంటున్న వారు లేదా వంగి పనిచేసుకుంటున్న మనుషులపై వెనుక నుంచే అత్యధిక శాతం పులి దాడులు జరిగాయి. లేచి నిల్చున్నారు సరే.. తర్వాతేం చేయాలి? పులికి మీ మీద దాడి చేసే ఉద్దేశం ఉందో లేదో తెలుసుకోవాలి.. దాన్ని అడిగి కాదు.. దాన్ని గమనించడం ద్వారా.. సాధారణంగా పులికి మీ మీద దాడి చేసే ఉద్దేశం ఉంటే.. అది ఒక్కసారిగా అక్కడే ఆగిపోతుంది.. మీ మీదే దృష్టి పెడుతుంది.. కాళ్లను వంచుతుంది.. దాని చెవులు ఇలా వెనక్కి వెళ్లినట్లుగా అవుతాయి. ఆగ్రహంగా గాండ్రించి.. ముందుకు దూకుతుంది. ఆగండాగండి.. ఇక్కడో విషయం చెప్పాలి. కుక్కల చెవులు కూడా వెనక్కి వెళ్తాయి మనపట్ల స్నేహభావంతో.. ఇక్కడ కూడా చెవులు వెనక్కి వెళ్లాయి కదా.. ఫ్రెండే అని అనుకోకండి.. బాలయ్య బాబు ఏదో సినిమాలో చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ సేమ్ అని తెలుసుకోండి. పులి చెవులు వెనక్కి వెళ్లాయంటే.. అది వార్నింగ్ కిందే లెక్క.. నువ్వక్కడ ఉండటం దానికి ఇష్టం లేదన్నమాట.ఉన్నచోట ఉన్నట్లే ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ.. వెళ్లండి. వీపు చూపొద్దు. చూపితే వెంటనే దాడి తప్పదు. గతంలో మధ్యప్రదేశ్‌లోని భాందవ్గఢ్ నేషనల్ పార్కులో మూడు పులులు రావడంతో ఓ ఏనుగు భయపడి.. మావటిని కిందన పడేసి వెళ్లిపోయింది. దాంతో ఆ మావటి వెనక్కి తిరిగి పరిగెట్టకుండా.. ఇలాగే ఒక్కో అడుగూ నెమ్మదిగా వెనక్కి వేసుకుంటూ.. రెండు గంటల తర్వాత ఆ ప్రాంతం నుంచి బయటపడ్డాడట. ఒకవేళ దగ్గర్లో చెట్టు ఉంది.. పులి కొంచెం దూరంగా ఉంది. మీకు చెట్లెక్కడం బాగా వస్తే.. వెంటనే ఎక్కేయండి. కనీసం 15 అడుగుల ఎత్తు ఎక్కేదాకా ఆగొద్దు. చాన్స్ ఉంటే ఇంకా పైకి ఎక్కండి. మీకు వేగంగా చెట్లు ఎక్కగలిగే సామర్థ్యం ఉంటేనే ట్రై చేయండి. లేకపోతే వద్దు. పులులు 15 అడుగుల ఎత్తు దాకా ఎగరగలవు. పులులు చెట్లెక్కడంలో స్పెషలిస్టులు కావు. ఒకవేళ దగ్గర్లో చెరువు ఉంది.. పులి కొంచెం దూరంగా ఉంది.. అయినా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలో దూకొద్దు.. మీకు ఒలింపిక్స్‌లో గోల్డ్ వచ్చి ఉంటే మాత్రం దూకండి. ఎందుకంటే.. పులులు మనకన్నా బాగా ఈదగలవు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. బాగా సౌండ్ చేయగల మెటల్ వస్తువులు ఉంటే.. హోరెత్తించేయండి. చేతిలో ఏం లేదు.. పులి దాడి చేయడానికి వస్తుంటే.. అప్పుడు చాలా గట్టిగా అరవండి. ఎంతలా అంటే.. దాని చెవులకు చిల్లులు పడేలా.. ఇలాంటి టైంలో అది కన్ఫ్యూజ్ అవుతుంది. అన్ని ఆప్షన్లు అయిపోయాయి.. ఇక చేసేదేమీ లేదంటే మాత్రం పోరాడాల్సిందే. దగ్గర్లో ఏది దొరికితే.. అది పట్టుకోండి. రాయి, కర్ర ఏదైనా సరే. పులి శరీరంలో కళ్లు, ముక్కు బలహీన ప్రదేశాలు. అక్కడే బలంగా దాడి చేయాలి. పులి బలం దాని పంజా, కోరలు.. వాటి నుంచే తప్పించుకోవాలి. అది దాడి చేయడానికి వచ్చినప్పుడు పులికి ఎంత దగ్గరగా అయితే.. అంత దగ్గరగా ఉండి పోరాడాలి. దాని పీకను పట్టుకొని.. గట్టిగా హత్తుకోవాలి. ధృతరాష్ట్ర కౌగిలిలాగ.. ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకూడదు.చదవండి: ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథగట్టిగా అదిమి పట్టుకుంటే.. అది ఆశ్చర్యపోతుంది. పులులు సాధారణంగా దాన్ని ఇష్టపడవు. అవి ప్రేమలో ఉన్నప్పుడు లేదా వేరే పులులతో పోరాడుతున్నప్పుడు కూడా బాగా దగ్గరగా అలముకున్నట్లు ఉండవు. మెడ జాగ్రత్త. పులికి దొరికితే అంతే. పోరాడుతున్నంత సేపు.. గట్టిగా అరుస్తూనే ఉండాలి. పులులు సాధారణంగా పోరాటాలను ఇష్టపడవు. కానీ అది పోరాటానికి దిగిందంటే మాత్రం చంపడానికే దిగుతుంది. అది తప్పించుకోవాలని అనుకుంటేనో.. లేదా మనం చేసిన ఏ పనితోనైనా అది ఆశ్చర్యపోతేనో తప్ప.. చివరగా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. పైన చెప్పినవన్నీ చేస్తున్న సమయంలో దేవుడిని ప్రార్థించడం మాత్రం మరువద్దు. ఈ టిప్స్ ఫెయిలయినా.. ఆ దేవుడు మిమ్మల్ని కాపాడవచ్చు. అల్ ది బెస్ట్ మరి.. ఓ పులి రేపు రా.. -
కార్మికులను ఆదుకునేందుకు గనిలోకి వలెంటీర్లు
దక్షిణాఫ్రికాలో బంగారు గనిలో అక్రమ మైనింగ్ ఉదంతం ముదురు పాకాన పడుతోంది. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లో మూసేసిన స్టీల్ఫాంటీన్ గనిలో 4 వేల మంది దాకా కార్మికులు చిక్కుకుపోవడం తెలిసిందే. వారిని అరెస్టు చేసేందుకు పోలీసు లు భారీగా మోహరించారు. ఆహారం తది తరాలు అందకుండా అడ్డుకుంటున్నారు. ‘‘దాంతో మరో దారిలేక వారే బయటకు వస్తారు. రాగానే అరెస్టు చేస్తాం. అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి కఠిన చర్యలు తప్పవు’’అని అధికారులు చెబున్నారు. ఈ ఉదంతం దక్షిణాఫ్రికాలోనే గాక అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ప్రాణాలు నిలుపుకోవడానికి మరో దారి లేక కార్మికులు టూత్‌పేస్టు తింటూ, వెనిగర్ తాగుతున్నారన్న వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఇంకొద్ది రో జులు గడిస్తే వాళ్లు పూర్తిగా నీరసించి స్పృహ తప్పవచ్చంటున్నారు. ప్రభుత్వ చర్యలు హత్యాయత్నానికి ఏమాత్రం తీసిపోవంటూ హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. జీవించే హక్కును కాలరాసే అధికారం సహా ఎవరికీ లేదని వాదిస్తున్నాయి. అధికారులు మాత్రం చిక్కుబడ్డ కార్మికుల్లో పలువురి వద్ద ఆయుధాలుండే ఆస్కారం కూడా ఉందని చెబుతున్నారు. మరోవైపు కార్మికుల్లో పలువురు అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారే కావడంతో కఠిన శిక్షలకు భయపడి బయటికొచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. చాలామంది స్వచ్ఛంద కార్యకర్తలు ఆహారంతో పాటు నిత్యావసరాలు వెంట తీసుకుని భూగర్భ గనిలోకి ప్రవేశించారు. వారు 50 మందితో కూడిన బృందాలుగా లోనికి వెళ్తున్నారు. కార్మికులకు ఆహారం తదితరాలు అందించడమే గాక వారికి నచ్చజెప్పి బయటికి తీసుకొచ్చే పనిలో కూడా పడ్డారు. వాళ్లలో చాలామంది పూర్తిగా నీరసించిపోయిన స్థితిలో ఉండటంతో ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చేందుకు గంటకు పైగా పడుతోందట. గనిలో పలు మృతదేహాలను కూడా వలెంటీర్లు గుర్తించినట్టు సమాచారం. అవి కుళ్లి కంపు కొడుతున్నట్టు చెబుతున్నారు! గత వారం రోజుల్లో 1,000 మంది దాకా కార్మికులు బయటికొచ్చి లొంగిపోయారు. దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ భారీ ఎత్తున జరుగుతుంటుంది. ఫలితంగా ఖజానాకు వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా వాటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కొన్నేళ్లలో వందలాది గనులను మూసేయడంతో అప్పటిదాకా వాటిలో పని చేసిన కార్మికులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. బతుకుదెరువు కోసం అక్రమ మైనింగ్‌కు పాల్పడే ముఠాల చేతిలో చిక్కుతున్నారు. ఆ క్రమంలో నెలల తరబడి భూగర్భంలో గడుపుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చంద్రుని దక్షిణ ధ్రువంపై నాసా గ్యాస్ పైప్‌లైన్!
చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా ప్రయత్నాలను నాసా ముమ్మరం చేస్తోంది. ఇందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్ ప్రోగ్రాంపై ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది కూడా. అందులో భాగంగా దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని అమెరికా అంతరిక్ష సంస్థ తాజాగా తలపోస్తోంది. దీన్ని ల్యూనార్ సౌత్‌పోల్ ఆక్సిజన్ పైప్‌లైన్ (ఎల్–ఎస్పీఓపీ)గా పిలుస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్ రవాణాకు సంబంధించిన రిస్కులను, ఖర్చులను భారీగా తగ్గించుకోవడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఎందుకంటే చంద్రుని ఉపరితలం మీది రాతి నిక్షేపాల నుంచి ఆక్సిజన్‌ను వెలికితీయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నీటి అవసరాలను చంద్రునిపై అపారంగా పరుచుకున్న మంచుతో తీర్చుకోవాలని యోచిస్తోంది.ఎలా చేస్తారు?చంద్రునిపై ఆక్సిజన్‌ను కంప్రెస్డ్ గ్యాస్, లేదా ద్రవ రూపంలో ట్యాంకుల్లో బాట్లింగ్ చేయా లన్నది నాసా ప్రణాళిక. కాకపోతే వాటి రవాణా పెను సవాలుగా మారనుంది. ఆక్సిజన్‌ను దాని వెలికితీత ప్రాంతం నుంచి సుదూరంలో ఉండే మానవ ఆవాసాలకు తరలించేందుకు అత్యంత వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం తొలి దశలో కనీసం 5 కి.మీ. పొడవైన పైప్‌లైన్ నిర్మించాలన్నది ప్రాథమిక ప్రణాళిక. దీన్ని చంద్రునిపై అందుబాటులో ఉండే అల్యుమి నియం తది తరాల సాయంతోనే పూర్తి చేయాలని నాసా భావిస్తోంది.→ ఈ పనుల్లో పూర్తిగా రోబోలనే వాడనున్నారు.→ మరమ్మతుల వంటివాటిని కూడా రోబోలే చూసుకుంటాయి→ పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్ గంటకు రెండు కి.మీ. వేగంతో ప్రవహిస్తుంది→ ప్రాజెక్టు జీవితకాలం పదేళ్లని అంచనా – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమ్మో.. పులి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా శీతాకాలంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న పులులు.. ఉమ్మడి ఆదిలాబాద్ వాసుల్లో అలజడి రేపుతున్నాయి. జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ.. పశువులపై దాడి చేసి చంపి తింటున్నాయి. ప్రస్తుతం జానీ, ఎస్–12గా పిలుస్తున్న రెండు పులులు తిరుగుతున్నట్టు గుర్తించారు. ఇలా పులుల రాకను అటవీ అధికారులు, పర్యావరణవేత్తలు స్వాగతిస్తుండగా.. అడవి సమీప ప్రాంతాల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. పత్తి పంట చేతికొచ్చే వేళ పొలాలకు వెళ్లలేకపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు.అక్కడ సరిపోక.. మ హారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాలలో పులుల సంఖ్య పెరిగింది. అక్కడి ఇరుకు ఆవాసం వల్ల ఆ పులులు తెలంగాణ వైపు వస్తున్నాయి. వాటిలో మగపులులే అధికమని అధికారులు చెప్తున్నారు. గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాల్లో ఎనిమిదేళ్ల మగపులి(జానీ) సంచరిస్తున్నట్టు గుర్తించారు. సుమారు రెండేళ్ల వయసున్న మరో మగ పులి (ఎస్ 12) మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతోంది. ఇంకో పులి కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో కనిపించి వెళ్లిపోయింది.ఇక్కడ కోర్ ఏరియాలోకి వెళ్లలేక.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ జోన్ల నుంచి వస్తున్న పులులు.. కవ్వాల్‌లోని కోర్ ఏరియాకు చేరుకోవాలంటే, 200 కిలోమీటర్లకుపైగా నడవాలి. ఇది వాటికి పెద్ద సమస్య కాకపోయినా.. మధ్యలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, సాగునీటి ప్రాజెక్టులు, పోడు సాగు, పంట పొలాలు పులుల రాకకు ఆటంకంగా మారాయి. రహదారుల వెంట అండర్ పాస్‌లు, ఓవర్ పాస్‌లు ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే ఆ పులులు అడవి అంచుల్లోనే సంచరిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కవ్వాల్ బయట కాగజ్‌నగర్ డివిజన్లో ఐదు పెద్దవి, నాలుగు చిన్నవి కలిపి 9 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.మనుషులపై దాడులతో కలకలం రాష్ట్రంలోకి వస్తున్న పులులు.. పశువులు, మనుషులపై దాడి చేస్తున్నాయి. 2020 నవంబర్‌లో 18 రోజుల వ్యవధిలో ఏ2 అనే మగపులి ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్ (21)పై, పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (18)పై పొలాల్లో దాడిచేసి చంపేసింది. గత ఏడాది నవంబర్‌లో మరో పులి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు సిడాం భీము (69)పై దాడి చేసి ప్రాణాలు తీసింది. నాటి ఘటనల నేపథ్యంలో.. ఇప్పుడు అటవీ అధికారులు ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేశారు.కోర్ ఏరియాలోకి వెళ్లేలా చూస్తున్నాం.. టైగర్ జోన్ వెలుపల సంచరించే కొత్త పులులు కోర్ ఏరియాలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం. వేటగాళ్లు ఉచ్చులు వేయకుండా, స్థానికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పులి దాడి చేసిన పశువుల యజమానులకు వెంటనే పరిహారం ఇస్తున్నాం. పులి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – శాంతారామ్, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్టు టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వుపులుల సంచారంతో భయంగా ఉందిపులి భయంతో పత్తి తీసే పనులు సాగడం లేదు. మా చేన్ల వైపు పులి రాకుండా అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రైతులు చాలా నష్టపోతారు. – ఆత్రం జైతు, భుర్కరెగడి గ్రామం, నిర్మల్ జిల్లా -
ఢిల్లీ గాలి యమ డేంజర్
ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ కట్టలు తెంచుకుంటోంది. నెల రోజులకు పైగా కాలుష్య మేఘాలు వాతావరణం నిండా దట్టంగా పరుచుకున్నాయి. దాంతో జనానికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి! ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో గాలి పీల్చడమంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని షికాగో యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనం ఒకటి తేల్చింది! అంతేగాక కాలుష్యం దెబ్బకు ఢిల్లీ ప్రజల ఆయు ప్రమాణం కూడా ఏకంగా 7.8 ఏళ్ల దాకా తగ్గుతోందని వెల్లడించింది. దీర్ఘకాలం పాటు ఢిల్లీ గాలి పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీసే ఆస్కారం కూడా చాలా ఎక్కువని తెలిపింది. ముఖ్యంగా విషతుల్యమైన పీఎం2.5 స్థాయిలు ఢిల్లీలో ఏకంగా 247 గ్రా/ఎం3గా నమోదవుతుండటం గుబులు పుట్టిస్తోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన 15గ్రా/ఎం3 ప్రమాణాల కంటే ఏకంగా 20 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ కూడా ఎప్పుడో 400 దాటేసింది. శుక్రవారం కూడా ఇది 411గా నమోదైంది. కాలుష్యం ధాటికి ఢిల్లీవాసులు ఇప్పటికే దగ్గు తదితర శ్వాస సంబంధ సమస్యలతో పాటు కళ్ల మంటలు, జర్వం తదిరాలతో అల్లాడుతున్నారు. వాయు కాలుష్య భూతం బారిన పడకుండా ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు బిగించుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లినప్పుడు విధిగా ఎన్95, ఎన్99 మాస్కులు ధరించాలని చెబుతున్నారు.భారత్‌లో 30 నుంచి 50 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు వాయు కాలుష్యమే కారణమని అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల వెల్లడించిన నివేదిక పేర్కొంది. అయితే ఆ కాలుష్యం మెడ, తల భాగాల క్యాన్సర్‌కు కూడా దారి తీయవచ్చని షికాగో వర్సిటీ అధ్యయనం పేర్కొంది. పొగ తాగేవారిలో ఈ తరహా క్యాన్సర్లు పరిపాటి అని అధ్యయన బృందం సారథి జాన్ క్రామర్ గుర్తు చేశారు. భారత్‌లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల్లో అత్యధికులు జీవితంలో ఎన్నడూ పొగ తాగనివారేనని ముంబైలోని టాటా స్మారక ఆస్పత్రి గత జూలైలో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించడం గమనార్హం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాదాలకే కాదు..ప్రాణాలకూ ప్రమాదమే
ప్రస్తుతం ఆధునిక జీవన శైలిలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో ఒకటి మధుమేహం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు డయాబెటిక్ బారిన పడుతున్నారని ఒక అంచనా. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) ప్రకారం, 2023 నాటికి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 53.7 కోట్ల మంది డయాబెటిస్ బాధితులు ఉన్నారు. ఆధునిక జీవనశైలి, ప్రస్తుత ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వృద్ధుల జనాభా ఆధారంగా 2045 నాటికి ఈ సంఖ్య 70 కోట్లకు పెరుగు తుందని ఓ అంచనా. 2023 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ బాధితులు అత్యధికంగా ఉన్నా దేశాల్లో భారతదేశం ఒకటి. సుమారు 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 10 కోట్లకు, 2045 నాటికి 13.4 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ గణాంకాలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత మధుమేహం ప్రభావిత దేశంగా మారే అవకాశాలు లేకపోలేదు. – సాక్షి, హైదరాబాద్‌ప్రతి నలుగురిలో ఇద్దరికీ ఈ సమస్య సాధారణంగా డయాబెటిస్ బాధితులకు దృష్టిలోపానికి సంబంధించి రెటినోపతి, నరాల బలహీనతకు న్యూరోపతి, కిడ్నీ సమస్యలకు నెఫ్రోపతి సమస్యలపైనే అవగాహన ఉంది. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులను వేధిస్తున్న మరో ప్రధాన సమస్య ఫుట్అల్సర్స్ కూడా. అంటే మధుమేహ వ్యాధి రోగులకు కాలి అడుగుభాగంలో ఏర్పడే పుండు. డయాబెటిక్ వ్యాధి ఉన్న వారిలో ప్రతి నలుగురిలో ఇద్దరికి పాదాలకు సంబంధించిన ఈ సమస్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ఉన్న వారిలో సగటున 15 శాతం నుంచి 25 శాతం మంది తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో డయాబెటిక్ ఫుట్అల్సర్స్ అంటే పాదాలపై పుండ్ల బారిన పడుతున్నారు. ఆంప్యుటేషన్స్ లేకుండా నయం చేయవచ్చు..డయాబెటిస్ బాధితుల్లో ఇటీవల కాలంలో డయాబెటిక్ ఫుట్అల్సర్స్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. డయాబెటిస్ రోగుల్లో పాదాల సంరక్షణపై అవగాహన లేదు. అందుకే డయాబెటిస్ బాధితులు షుగర్ నియంత్రణతోపాటు పాదాల్ని సంరక్షించుకోవాలి. చిన్న గాయమైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. డయాబెటిక్ ఫుట్అల్సర్స్కు ఆంప్యుటేషన్ చేయకుండానే పూర్తిగా నయం చేసే అత్యాధునిక చికిత్స అందిస్తున్నాం. ఫుట్అల్సర్స్తోపాటు, గ్యాంగ్రీన్, సెల్యూలైటిస్, కాలిన గాయాలకు కూడా స్కిన్ గ్రాఫ్టింగ్ చేయాల్సిన అవసరం లేకుండా పూర్తిగా నయం చేస్తున్నాం. – డాక్టర్. భరత్‌కుమార్, చైర్మన్ కేబీకే మలీ్టస్పెషాలిటీ హాస్పిటల్స్చక్కర శాతం పెరగడంతో..డయాబెటిక్ ఫుట్అల్సర్కు ప్రధాన కారణం రక్తంలో చక్కర (గ్లూకోజ్) శాతం పెరిగిపోవడం. సాధారణంగా షుగర్ నియంత్రణ లేనివారికి రక్తం చిక్కబడుతుంది. రక్తనాళాల్లో షుగర్ పేరుకుపోయి కాలు చివరి భాగాల్లోకి బ్లడ్ సర్యు్కలేషన్ తగ్గిపోతుంది. తద్వారా పాదం స్పర్శ కోల్పోతుంది. కొంత కాలానికి ఫుట్అల్సర్స్గా మారుతాయి. చివరికి అదే గ్యాంగ్రీన్కి కూడా దారి తీస్తుంది. ఇతర డయాబెటిక్ సమస్యల కంటే ఎక్కువగా ఆస్పత్రిలో చేరడానికి ఈ డయాబెటిస్ ఫుట్అల్సర్స్ కారణమవుతున్నాయి. మనదేశంలోని మధుమేహ బాధితుల్లో సుమారు 10 శాతం మందికి డయాబెటిక్ ఫుట్అల్సర్ (డీఎఫ్యు) వచ్చే అవకాశం ఉంది. అంటే దేశంలో ఏటా 70 లక్షల మంది ప్రజలు ఈ ఫుట్అల్సర్స్ బారిన పడుతున్నారు. ప్రాణాంతకం కూడా.. షుగర్ వ్యాధిగ్రస్తులు ఫుట్అల్సర్స్ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. అల్సర్స్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు విస్తరించి గ్యాంగ్రీన్గా మారితే మెజారిటీ కేసుల్లో ఆయా భాగాలను తొలగించడం (ఆంపుటేషన్) తప్ప వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ఫుట్అల్సర్స్ వల్ల చాలామందిలో కాలు తీసేయాల్సి వస్తోంది. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ కారణంగా 3 ఏళ్లలోనే రెండో కాలు కూడా తొలగించాల్సిన ముప్పు 30 నుంచి 40 శాతానికి పెరుగుతోంది. కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. డయాబెటిక్ ఫుట్అల్సర్ల నుంచి వచ్చే సమస్యల ఫలితంగా మన దేశంలో ఏటా లక్ష ఆంప్యుటేషన్స్ నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్రమత్తతే శ్రీరామరక్ష.. ఆంప్యుటేషన్స్తో పాటు ప్రాణాలు తీస్తున్న డయాబెటిక్ ఫుట్అల్సర్స్కు అప్రమత్తతే శ్రీరామరక్ష. డయాబెటిస్ ఉన్నవారు తమ పాదాలను సంరక్షించుకోవడం చాలా అవసరం. సరైన పాదరక్షలు ధరించడం, తరచూ పాదాలను పరీక్షించుకోవడం, ఏదైనా గాయం అయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం వల్ల అల్సర్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కూడా కీలకం. ఆరోగ్య సంరక్షణ నిపుణులు డయాబెటిస్ బాధితుల్లో పాదాల సంరక్షణకు సంబంధించి అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. -
ప్రపంచంలో అతిపెద్ద పగడం
ఏకంగా 100 అడుగులకు పైగా పొడవైన పగడాన్ని(కోరల్)ను నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో సైంటిస్టులు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడం అని చెబుతున్నారు. 300 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ పగడం అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందని అంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రిస్టీన్ సీస్ ప్రోగ్రామ్‌లో భాగంగా గత నెలలో సోలోమాన్ దీవుల్లో సముద్ర స్థితిగతులను అధ్యయనం చేయడానికి బయలుదేరిన సైంటిస్టులకు ఈ పగడం కనిపించింది. గతంలో అమెరికాలో సమోవాలో గుర్తించిన భారీ పగడం కంటే ఇది మూడు రెట్లు పెద్దది కావడం విశేషం. అంతేకాదు భూమిపై అతిపెద్ద జంతువైన బ్లూవేల్ కంటే కూడా పొడవైనది. సాధారణంగా సముద్రాల అంతర్భాల్లో పగడపు దిబ్బలు ఏర్పడతాయి. ఈ దిబ్బల్లో చిన్నచిన్న పగడాలు కనిపిస్తాయి. కానీ, నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో తాజాగా గుర్తించి పగడం సింగిల్ కోరల్ కావడం గమనార్హం. కొన్ని శతాబ్దాలుగా దీని పరిమాణం పెరుగుతున్నట్లు గుర్తించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Vippa Puvvu: విప్ప పువ్వు.. కల్పతరువు
గిరిజనులకు అడవి ప్రసాదించిన ఫలాల్లో విప్ప పువ్వు ఒకటి. మన్యంలో విరివిగా లభించే ఇవి గిరిజనులకు మంచి ఆదాయ వనరు. ఇప్పటివరకు సీజన్లో మాత్రమే సేకరించి ఆదాయం పొందేవారు. ఇక నుంచి వీటితో ఏడాది పొడవునా అనుబంధ ఆహార ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పొందే దిశగా గిరి మహిళలు అడుగులు వేస్తున్నారు. చింతూరు: లాటిన్ పరిభాషలో సపోటేసీ జాతికి చెందిన అడవి చెట్టు విప్ప. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది. చెట్లు కలిగిన గిరిజనులు పూలు రాలడానికి ముందే వాటి చుట్టూ నేలను శుభ్రం చేస్తారు. తెల్లవారుతున్న వేళ విప్పపూలు (Vippa puvvu) రాలుతున్న సమయంలో సువాసన వెదజల్లుతుంది. ఇంటిల్లిపాదీ కలసి చెట్టు వద్దకు చేరుకుని బుట్టలు, చేటలతో పూలను సేకరిస్తారు. వీటిని నాలుగైదు రోజులు బాగా ఎండబెడతారు. ఎండిన పూలను సంతలకు తీసుకువెళ్లి విక్రయిస్తారు. ఏడాది పొడవునా అమ్మకాలు అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో విరివిగా విప్పచెట్లు ఉన్నాయి. కొన్ని గిరిజన కుటుంబాలు వీటిపై వచ్చే ఆదాయంతో ఏడాది పొడవునా జీవనం సాగిస్తున్నాయి. సేకరించిన పూలను ఎండబెట్టి చింతూరు, ఏడుగురాళ్లపల్లి, కుంట మార్కెట్లకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. భద్రాచలం, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఒక చెట్టుకు సుమారు 150 కిలోల విప్ప పువ్వు లభ్యమవుతుంది. దీనిని ఎండబెట్టిన తరువాత వచ్చే పువ్వు కిలో రూ.50 నుంచి రూ.60 ధరకు విక్రయిస్తున్నారు. విప్పకాయలు కిలో రూ.30కు అమ్ముతున్నారు. ఈ చెట్లు విస్తారంగా ఉన్నందున గిరిజనులకు చేతినిండా ఆదాయం వస్తోంది. పోషకాలెన్నో.. : విప్పపూలలో ఎన్నో పోషక గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగాలను హరించే ఔషధ గుణాలు కూడా విప్పపూలలో ఉన్నాయని వారు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి రోగాలను నయంచేసే గుణంతోపాటు ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఎనర్జీ, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్–సి వంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయని వారు చెబుతున్నారు. విప్పకాయలతో చేసిన నూనెతో మసాజ్ చేస్తే కీళ్లనొప్పులు దూరమవుతాయని వారు పేర్కొంటున్నారు. స్వీట్ల తయారీ దిశగా అడుగులువిప్ప పూలను సారా తయారీ, ప్రసాదాల్లో మాత్రమే వినియోగించేవారు. ప్రస్తుతం కొన్ని స్చచ్ఛంద సంస్థల సహకారంతో స్వీట్ల తయారీపై మహిళలు దృష్టి పెట్టారు. చింతూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విప్ప పూల సేకరణ, స్వీట్ల తయారీపై మహిళలకు అవగాహన కల్పిస్తోంది. లడ్డూ, హల్వా, జామ్, కేక్ వంటి తినుబండారాల తయారీపై శిక్షణ ఇచ్చి ఉపా ధిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి విప్పపువ్వుల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నందున వీటితో స్వీట్లు తయారీపై శిక్షణ ఇవ్వడంతోపాటు మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నాం. చింతూరు డివిజన్లోని గిరిజన గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపట్టాం. తాము అందిస్తున్న సహకారం గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. – సుభాని,కార్యదర్శి, ఆశా స్వచ్ఛంద సంస్థ, చింతూరువిప్పపువ్వుతో ఆర్థికాదాయం ప్రతి వేసవిలో ఇంటిల్లిపాదీ కలసి విప్పపూలు సేకరిస్తాం. వాటిని ఆరబెట్టి చింతూరు, మోతుగూడెం సంతల్లో విక్రయించడం ద్వారా ఆదాయం లభిస్తుంది. దీంతోపాటు మా సంస్కృతిలో భాగంగా విప్పపువ్వుతో సారా కూడా తయారుచేసి సేవిస్తాం. – పూసం మహేష్,లక్కవరం, చింతూరు మండలంశిక్షణ ఎంతో ఉపయోగం విప్పపువ్వుల సేకరణతో పాటు ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వీట్ల తయారీలో శిక్షణ పొందుతున్నాం. తయారు చేసే విధానంతోపాటు ఆన్లైన్ మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. నాణ్యమైన విప్పపూల సేకరణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. – వెట్టి కన్నమ్మ,తెరపాడు, చింతూరు మండలం -
రొమ్ము క్యాన్సర్‌కు అరుదైన చికిత్స
కేన్సర్.. ఒకప్పుడు పేరు వినడానికే భయపడిన మహమ్మారి.. ఇప్పుడు ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. అధైర్యపడకుండా చికిత్సతో దాన్ని జయిస్తున్నవారు కొందరైతే.. కారణాలేవైనా ఇంకొందరు ప్రాణాలు పోతున్నాయి. వ్యాధి భయం కంటే.. చికిత్సలో భాగంగా చేసే కీమోథెరపీ చూపించే నరకం అధికం. అలాంటివేవీ లేకుంటా కేన్సర్‌ను జయించారో శాస్త్రవేత్త. తనకు వచ్చిన రొమ్ము క్యాన్సర్‌కు తానే చికిత్స చేసుకుని చరిత్రలో నిలిచారు. అయితే దీనిపై కొందరు శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. ఇది అన్ని దశల్లోనూ ఉపయోగించలేమంటున్నారు. క్రొయేషియాకు చెందిన 50 ఏళ్ల బీటా హలాస్సీ శాస్త్రవేత్త. జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. గతంలోనే కేన్సర్ డిటెక్ట్ అవ్వడంతో మాస్టెక్టమీ చేయించుకున్నారు. 2020లో మళ్లీ పునరావృతమైంది. ఈసారి మూడో స్టేజీ. సాధారణంగా హడలెత్తిపోతాం. కానీ ఆమె అలా కాదు. ధైర్యంగా ఎదుర్కొంది. కాకపోతే.. మొదటి సారి కీమోథెరపీతోనే విసిగిపోయిన ఆమె.. ఈసారి అటువైపు మొగ్గుచూపలేదు. తనకు తానే చికిత్స చేసుకోవాలనుకున్నారు. వైరాలజిస్ట్ కూడా కావడంతో.. యాంటీవైరస్ వేక్సిన్స్తోనే ప్రయోగం చేశారు. మీజిల్స్ వైరస్, ఫ్లూ లాంటి వ్యాధులకు ఇచ్చే వేక్సిన్స్ను కలిపి.. తన ప్రయోగశాలలోనే కొత్త వైరస్‌ను సృష్టించారు. దాన్ని ఇంజెక్ట్ చేసి చికిత్స చేసుకోవడం ప్రారంభించారు. ఇది కణితిపై నేరుగా దాడి చేసిన రోగనిరోధక వ్యవస్థను పెంచే శక్తివంతమైనన వైరస్‌గా పనిచేసింది. హలాస్సీ నాలుగు సంవత్సరాలుగా కేన్సర్ రహితంగా ఉంది. స్టేజ్ 3లో చికిత్స.. ఆంకోలిటిక్ వైరోథెరపీ (ఓవీటీ)గా పిలిచే ఈ ప్రయోగాత్మక వేక్సిన్ ఆమె స్టేజ్ 3 కేన్సర్ చికిత్సకు సహాయపడింది. ఓవీటీ.. క్యాన్సర్ చికిత్స కోసం అభివృద్ధి చెందుతున్న విధానం. ఇది క్యాన్సర్ కణాలపై దాడి చేయడానికి, వాటితో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. ఓవీటీ క్లినికల్ ట్రయల్స్ లాస్ట్స్టేజ్లో ఉన్న మెటాస్టాటిక్ క్యాన్సర్ పై ప్రయోగించారు. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ప్రారంభ దశ కేన్సర్లకు కూడా దీన్ని సూచిస్తున్నారు. కణితి కణానికి మీజిల్స్ వైరస్, వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ ఉన్నట్టుగా గుర్తించిన హలాస్సీ.. రెండు వైరస్‌లను సరైన మోతాదులో మిళితం చేసి, తనకు తాను చికిత్స చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇప్పటివరకు ఈ రెండు వ్యాధికారక క్రిములను ఓవీటీ క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగించారు. మీజిల్స్ వైరస్ మెటాస్టాటిక్ రొమ్ము కేన్సర్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. భిన్న వాదనలు.. కేన్సర్ చికిత్సకు.. శస్త్రచికిత్స, కెమోథెరపీ, బయోలాజికల్ థెరపీ, రేడియేషన్ వంటి ప్రస్తుత విధానాలకు బదులుగా ఓవిటిని ఉపయోగించాలని హలాస్సీ సూచిస్తున్నారు. దీనిని కొందరు వైద్య పరిశోధకులు విభేదిస్తున్నారు. ఆంకోలిటిక్ వైరస్‌లతో స్వీయ వైద్యం రోగ నిర్ధారణ చేసిన కేన్సర్‌ను ఎదుర్కోవడానికి సరైన విధానం కాదంటున్నారు. కానీ ప్రారంభ దశలో ఓవీటీని నియోఅడ్జువెంట్ థెరపీగా క్లినికల్ ట్రయల్స్ జరపాలని సూచిస్తున్నారు. -
వైట్‌హౌస్‌పై మెలానియా విముఖత
వాషింగ్టన్: ప్రథమ మహిళగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న మెలానియా ట్రంప్.. శ్వేతసౌధంపై మాత్రం విముఖత చూపుతున్నారు. ఈ దఫా ఆమె పూర్తిస్థాయిలో వాషింగ్టన్కు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వైట్‌హౌస్ సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికే ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె తన సమయాన్ని ఎక్కడ? ఎలా? గడుపుతారనే చర్చ నడుస్తోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ఆతిథ్యం ఇచ్చే సంప్రదాయం వైట్‌హౌస్‌లో ఉంది. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్‌ను జో బైడెన్ సైతం ఆహ్వానించారు. ఆ మేరకు ట్రంప్ హాజరయ్యారు. అయితే ప్రథమ మహిళ.. కాబోయే మహిళకు ఇచ్చే విందుకు మాత్రం మెలానియా ట్రంప్ వెళ్లలేదు. జిల్ బైడన్ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు. ఆమె వెళ్ళడం అవసరమని ట్రంప్ బృందంలోని పలువురు సూచించినా మెలానియా నిరాకరించారు. మొదటి పర్యాయంలో పూర్తిస్థాయి వైట్‌హౌస్‌లోనే ఉన్న ఆమె.. ఈసారి మాత్రం స్వతంత్రంగా ఉండటానికే ఆసక్తి చూపుతున్నారనడానికి ఇదో ఉదాహరణ. 2016లో వైట్‌హౌస్ మెలానియాకు కొత్త... కానీ ‘ఈసారి నాకు ఆందోళన అవసరం లేదు. అనుభవం, పరిజ్ఞానం ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందనేది స్పష్టత ఉంది’అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం ఆమె చెప్పారు. కొడుకుకు దగ్గరగా... మెలానియా ట్రంప్.. వచ్చే నాలుగేళ్లలో ఆమె న్యూయార్క్ సిటీ, ఫ్లోరిడాలోని పామ్బీచ్లలో గడపనున్నారని సమాచారం. అయినప్పటికీ ఆమె ప్రధాన కార్యక్రమాలకు హాజరవుతారని, ప్రథమ మహిళగా తనకంటూ సొంత వేదిక, ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు. 2020 తరువాత మెలానియా ట్రంప్ ఫ్లోరిడాలో ఎక్కువ సమయం గడిపారు. అక్కడే జీవితాన్ని, స్నేహితులను పెంచుకున్నారు. అందుకే ఆమె ఎక్కువ సమయం అక్కడే గడిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2016లో కూడా ఆమె వాషింగ్టన్కు వెంటనే వెళ్లలేదు. ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని నెలల తరువాత వైట్‌హౌస్‌కు మారారు. మరోవైపు తన కొడుకు 18 ఏళ్ల బారన్ ట్రంప్ న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుతున్నారు. తన ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలన్నది బారన్ కోరిక. టీనేజ్ కొడుకుకు దగ్గరగా ఉండేందుకు ప్రథమ మహిళ ఆసక్తి చూపుతున్నారని, న్యూయార్క్‌లోనూ ఎక్కువ సమయం గడుపుతారని సన్నిహితులు చెబుతున్నారు. ఒక ప్రథమ మహిళ శ్వేతసౌధంలో ఉండటానికి నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కానీ.. మెలానియా ట్రంప్‌ను చాలాకాలంగా గమనిస్తున్నవారికి ఇది ఆశ్చర్యం కలిగిచడం లేదు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ ఆమె చురుకుగా లేరు. ట్రంప్ తిరిగి పోటీ చేస్తానన్న ప్రకటనకు హాజరయ్యారు. అక్టోబర్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీలోనూ పొడిపొడిగానే మాట్లాడారు. ఎన్నికల రాత్రి పారీ్టలోనూ ఆమె పాల్గొనలేదు. ప్రైవసీకే ప్రాధాన్యత.. పదవి నుంచి వైదొలిగిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ పలు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో పామ్ బీచ్, న్యూయార్క్‌ల మధ్య తన సమయాన్ని గడిపారు. కుటుంబంలోని ఇతర సభ్యులు తరచూ కోర్టులో, ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌తో కలిసి ఉన్నప్పటికీ, మెలానియా ట్రంప్ ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. లారా బుష్, మిషెల్ ఒబామా వంటి ప్రథమ మహిళలు నాలుగేళ్లలో తమకో ప్లాట్‌ఫామ్ నిర్మించుకున్నట్టుగా మెలానియా ట్రంప్ చేయలేదు. ప్రైవసీని కోరుకున్నారు. రిపబ్లికన్ల రాజకీయ నిధుల సేకరణలో ఒక్కసారి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. జూలైలో డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి ఓ లేఖ రాశారు. ‘హింసను ప్రేరేపించే ద్వేషం, విద్వేషాలకు అతీతంగా ఉండండి. కుటుంబమే ప్రథమం. ప్రేమమయమైన ప్రపంచాన్ని మనమందరం కోరుకుందాం’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక అబార్షన్ హక్కుల విషయంలో భర్త ట్రంప్‌తో విభేదించారు. గత అక్టోబర్‌లో.. ‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నేను పరిరక్షించే ప్రాథమిక సూత్రం. నిస్సందేహంగా, మహిళలందరికీ పుట్టుకతోనే ఉన్న ఈ ముఖ్యమైన హక్కు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’అని ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై తన వైఖరి భర్త డోనాల్డ్ ట్రంప్‌కు తెలుసని, ఆయన ఏమాత్రం ఆశ్చర్యపోలేదని ఆ తరువాత మీడియాతో చెప్పారు. మెలానియా ట్రంప్ తన భర్తతో రాజకీయంగా చాలా సన్నిహితంగా ఉంటున్నారని, సంప్రదాయ దృక్పథంతో సమస్యలపై మాట్లాడుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నా.. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. -
మహాయుతికి ఉల్లిమంట
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్యులకు కంటతడి పెట్టిస్తుంటే మరోపక్క ప్రస్తుత మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతిలో భాగమైన అధికార పార్టీ నేతలకు మంట పుట్టిస్తోంది. ఓ పక్క పెరుగుతున్న ధరలతో సామాన్యులు అధికార కూటమి ప్రభుత్వంపై నిప్పులు గక్కుతున్నారు. ఎగుమతులపై నిషేధంతో తమకు గిట్టుబాటు తగ్గిందని రైతులు సైతం గగ్గోలు పెడుతుండటం మహాయుతి కూటమికి సంకటంగా మారింది.దేశీయ అవసరాలకు అవసరమైన ఉల్లిలో 40 శాతం మహారాష్ట్ర నుంచే సరఫరా అవుతుండగా, ప్రస్తుత సీజన్లో భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మహారాష్ట్రలోని నాసిక్, లాసల్గావ్ మార్కెట్లకు తరలివస్తున్న ఉల్లి సరకు పరిమాణం బాగా తగ్గిపోయింది. గత సంవత్సరం ఉల్లిసీజన్లో ప్రతి రోజూ దాదాపు 2,000 టన్నుల ఉల్లి మార్కెట్‌వ వచ్చింది. అది ప్రస్తుతం 300–400 టన్నుల మధ్య తచ్చాడుతోంది. దీనికి తోడు గత రబీలో సేకరించి పెట్టిన ఉల్లి నిల్వలు పూర్తిగా అడుగంటడం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. దీంతో గత నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధర కిలో రూ.40–50 నుంచి రూ.90–100కి ఎగబాకింది. దీని ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలపై నేరుగా పడుతుందని ముందే పసిగట్టిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ధరల కట్టడికి రంగంలోకి దిగింది. ధర మరీ పెరిగిపోకుండా కట్టడిచేసేందుకు 4.7లక్షల టన్నుల బఫర్ నిల్వలోంచి 1.50లక్షల టన్నుల మేర విడుదలచేసింది. దీంతో నాసిక్ నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోని విక్రయ కేంద్రాల్లోకి ఉల్లి సరఫరా సాధ్యమైంది. వీటిల్లో కిలో ఉల్లిని రూ.35కే విక్రయిస్తున్నారు. అయినాసరే ధరల పెరుగుదల ఆగడం లేదు. ‘గత రబీ సీజన్‌లోని పాత స్టాక్ దాదాపు అయిపోయింది. కొత్త స్టాక్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఈ సరఫరా–డిమాండ్ అసమతుల్యత ధర పెరుగుదలకు కారణం. దీన్ని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మహారాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ధరల ఉరవడిపై మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, శివసేన(యూబీటీ) పార్టీలు షిండే సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఎగుమతుల నిషేధంపై రైతుల్లో ఆగ్రహం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల సమయంలో డిసెంబర్ 2023 వరకు ఉన్న ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రప్రభుత్వం 2024 మార్చినెల వరకు పొడిగించింది. దీనికి తోడు ఎగమతి సుంకాలను 25 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. ఎగుమతి ఆంక్షలు తమ జీవనోపాధిని దెబ్బతీశాయని మహారాష్ట్ర రైతుల ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. ఉల్లి సాగు అధికంగాఉండే ధూలే, దిండోరి, అహ్మద్‌నగర్, పుణె, నాసిక్‌లలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మహారాష్ట్ర నుంచి ఎగుమతులను నిషేధించిన కేంద్రం తమ పార్టీ ఏలుబడిలో ఉన్న గుజరాత్ నుంచి మాత్రం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని నిర్ణయించడంతో మహారాష్ట్ర రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ కారణంగానే ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాల్లో మహాయుతి కూటమి ఓటమిని చవిచూసిందని విశ్లేషణలు వెలువడ్డాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సైతం లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి పేలవ ప్రదర్శన వెనుక ఉల్లి రైతుల ఆగ్రహం ఉందని అంగీకరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మహారాష్ట్రలోని ఉల్లి రైతుల కంటే గుజరాత్‌లోని ఉల్లి రైతుల గురించే పట్టించుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఉల్లి మంట నుంచి బయట పడేందుకు పాలక కూటమి ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందన్న దానిపైనే ఎన్నికల్లో సామాన్యులు, రైతుల సానుకూల, ప్రతికూల ఓటింగ్ సరళి ఆధారపడిఉంటుందని తెలుస్తోంది.