
ఏకంగా 75 ఎకరాలు పెరిగిన విస్తీర్ణం
బెంగళూరు తరహాలో పర్యావరణహిత అభివృద్ధి
శుక్రవారం ‘కొత్త బతుకమ్మ కుంట’ప్రారంభం
ఈ ఏడాది చివరినాటికి మిగిలిన ఐదు కూడా...
ఆక్రమణలు, పూడికలతో కుంచించుకుపోయిన చెరువులకు పునరై్వభవం వస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) అధికారులు వాటిని రక్షించి పునరుజ్జీవం పోస్తున్నారు. దీంతో చెరువుల విస్తీర్ణం పెరిగింది. చెర వీడిన చెరువులు కళకళలాడుతున్నాయి. తొలిదశలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆరింటిని కబ్జాల బారి నుంచి రక్షించి అభివృద్ధి చేస్తున్నారు. జనావాసాలను మినహాయిస్తూ వీటిలోని మిగతా ఆక్రమణలు తొలగించగా విస్తీర్ణం ఏకంగా 75 ఎకరాల మేర పెరిగింది. ఇదే పంథాలో నగరంలో ఉన్న అన్ని చెరువులకు విముక్తి కల్పిస్తే వందల ఎకరాల జలవనరులుగా విస్తరిస్తాయని హైడ్రా అధికారులు చెప్తున్నారు. పునరుజ్జీవంతో అభివృద్ధి చేసిన బతుకమ్మకుంటను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు.
– సాక్షి, సిటీబ్యూరో
హైడ్రా (Hydraa) ఏర్పాటైన తర్వాత మాదాపూర్‌లోని తమ్మిడికుంటతోనే జలవనరుల పరిరక్షణ ప్రారంభమైంది. చుట్టూ ఉన్న అనేక నిర్మాణాలను కూల్చేసిన అధికారులు దాని పరిధిని పూర్వస్థితికి తేవడంపై దృష్టి పెట్టారు. ఇలా ఇప్పటి వరకు హైడ్రా అధికారులు వివిధ చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిలో ఉన్న దాదాపు 233 ఎకరాల్లోని ఆక్రమణల్ని తొలగించారు. తొలినాళ్లల్లో కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెట్టిన అధికారులు ‘హైడ్రా 2.0’విధానాలతో చెరువులకు పునరుజ్జీవం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఫైనల్ నోటిఫికేషన్ పూర్తి అయిన 130 చెరువుల్లోని ఆక్రమణల కూల్చివేతలతో సరిపెట్టకుండా వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు.
పూర్తి పర్యావరణ హితంగా అభివృద్ధి...
ఈ చెరువుల్ని అభివృద్ధి చేసే విషయంలో హైడ్రా ఆద్యంతం పర్యావరణహిత విధానం అమలు చేయాలని విమోస్ సంస్థకు స్పష్టం చేసింది. దీంతో ఆ సంస్థ తొలుత ఆ చెరువుల నుంచి గరిష్టంగా మూడు మీటర్ల మేర పూడిక తొలగిస్తోంది. ఇందులో ప్లాస్టిక్ సహా అనేక వ్యర్థాలు ఉన్నాయి. చెరువు అడుగుభాగం అలుగు వైపునకు ఏటవాలుగా ఉండేలా చేస్తున్నారు. చెరువు చుట్టూ ఫుట్‌పాత్‌తోపాటు పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. చెరువులోకి మురుగునీరు ప్రవేశించకుండా నీటి వనరును మూడు భాగాలుగా విభజిస్తున్నారు. వరదతో కలిసి మురుగు తొలుత మొదటి భాగంలోకి చేరుతుంది. అక్కడ ఆ నీటిని వడగట్టే గడ్డి, మొక్కలు ఉంటాయి. ఇలా రెండు చోట్ల వడపోత తర్వాత మూడో కుంటలోకి చేరుతుంది. ప్రతి చెరువుకు ప్రత్యేక ఇన్‌లెట్, ఔట్‌లెట్ ఏర్పాటు చేస్తున్నారు.

తొలిదశలోఆరు చెరువుల ఎంపిక...
హైడ్రా తొలిదశలో ఆరు చెరువుల్ని ఎంపిక చేసుకుంది. తమ్మిడికుంటతోపాటు అంబర్‌పేటలోని బతుకమ్మకుంట, (Bathukamma Kunta) సున్నం చెరువు, ఉప్పల్ నల్లచెరువు, కూకట్‌పల్లి నల్లచెరువు, బమ్‌రుఖ్ నుద్దౌలా చెరువులపై దృష్టి పెట్టింది. వీటి అభివృద్ధికి ప్రభుత్వం రూ.58.4 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఒక్కో చెరువు కోసం దాదాపు రూ.10 కోట్ల చొప్పున వెచ్చిస్తున్న హైడ్రా బెంగళూరు నమూనాతో ముందుకు వెళ్తోంది. ఈ చెరువుల్లో పునరుజ్జీవం కల్పించే బాధ్యతల్ని ఆ నగరానికే చెందిన విమోస్ టెక్నాలజీస్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ అక్కడ దాదాపు 130 చెరువులను అభివృద్ధి చేసింది. అక్కడ పర్యటించి వచ్చిన హైడ్రా అధికారులు వాటి పనితీరుపై పూర్తి సంతృప్తి చెందారు.

ఎన్నారెస్సీ డేటా సాయంతో నిర్ధారణలు...
హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌ఆర్) వరకు విస్తరించి ఉంది. జీహెచ్‌ఎంసీ విస్తరించి ఉన్న 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో 185 చెరువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలోని హెచ్‌ఎండీఏలో మొత్తం 58 వేల ఎకరాల్లో 2,912 చెరువులు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ చెరువులు ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి.
ఓ చెరువుకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్‌లను గుర్తించడానికి వివిధ మ్యాపులతోపాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్నారెస్సీ) నుంచి తీసుకున్న డేటాను వినియోగిస్తున్నారు. ఏదైనా ఓ చెరువులోని ఆక్రమణలు తొలగించాలంటే దాని పరిధికి సంబంధించి ప్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్లు జారీ కావాలి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఫైనల్ నోటిఫికేషన్లు పూర్తి కానున్నాయి. ఇప్పటికీ హెచ్‌ఎండీఏ (HMDA) పరిధిలో 962, జీహెచ్‌ఎంసీలో 130 చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్ వెలువడింది.
రెండో దశలో 14 చెరువులు..
తొలిదశలో ఆరు చెరువుల్ని ఎంపిక చేసుకున్నాం. వీటిలో బతుకమ్మకుంటను శుక్రవారం ముఖ్యమంత్రి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ ఆరు చెరువుల విస్తీర్ణం తొలుత 105 ఎకరాల్లో ఉండగా అభివృద్ధి చేసిన తర్వాత అది 180 ఎకరాలకు చేరింది. మిగిలిన చెరువుల అభివృద్ధి, పునరుజ్జీవం డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రెండోదశలో మరో 14 చెరువులను అభివృద్ధి చేయనున్నాం. ఈ మేరకు ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించాం. ఈ ఏడాది అక్టోబర్ నుంచి చెరువులకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
– ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్
సర్వాంగ సుందరంగా బతుకమ్మకుంట ఫొటోలు.. ఇక్కడ క్లిక్ చేయండి