శివారులో వందకుపైగా చెరువులు కబ్జాకు గురైనట్లు గుర్తింపు
గతంలో నామమాత్రపు చర్యలతో ఆగని దందా
ఇటీవల శివారుల్లో హైడ్రా బృందానికి వినతుల వెల్లువ
హైడ్రా ప్రజావాణిలో ఆక్రమణలపై ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: ఆక్రమణదారుల చెర పడకుండా చెరువులను కాపాడేందుకు కంకణం కట్టుకున్న హైడ్రా (Hydraa) వాటి పరిరక్షణే లక్ష్యంగా దృష్టి సారిస్తోంది. ఇటీవల హైడ్రా బృందం శివారుల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి చెరువుల పరిస్థితితోపాటు ప్రభుత్వ భూముల కబ్జాల సంగతి తేల్చేందుకు పర్యవేక్షణలు చేపట్టింది. ఈ సందర్భంగా స్థానికులు, బస్తీవాసులు, ప్రజలు తమ చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయని, భవనాలు, బహుళ అంతస్తులు వెలుస్తున్నాయని వినతులు సమర్పించారు. హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి (Prajavani) కార్యక్రమంలో కూడా చాలామంది చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రాత పూర్వక ఫిర్యాదులను అందజేశారు. ఈ మేరకు హైడ్రా రాజధానికి సమీపంలోని చాలా చెరువులు ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఆక్రమణదారులు మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 200 చెరువులను, చెరువు శిఖం భూములను, బఫర్‌జోన్లలో పెద్ద ఎత్తున వెంచర్లు వేసి, రూ.వందల కోట్లు ఆర్జించారు. అసలు విషయం తెలియక స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకొన్న సామాన్య, మధ్యతరగతి (Middle Class) ప్రజలు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారు. వర్షాకాలంలో ఈ కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు జలాశయాలుగా మారుతున్నాయి.
హబ్సిగూడ, రామంతాపూర్ చెరువును ఆనుకొని ఏర్పడిన మూడు కాలనీలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మునకేస్తున్నాయి. కూకట్‌పల్లి, (Kukatpally) కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, గాజుల రామారం, సరూర్‌నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, వెంకటాపూర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, టోలిచౌకి, గుండ్లపోచంపల్లి, జల్‌పల్లి, బడంగ్‌పేట్, నాచారం, ఉప్పల్, చెంగిచర్ల, మల్కాజిగిరి, ఘట్కేసర్, పోచారం తదితర ప్రాంతాల్లో చెరువులు అదృశ్యమై కాలనీలు పుట్టుకొచ్చాయి.
ఆక్రమణలో..
మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ‘రా’చెరువు, చింతల చెరువులోని బఫర్ జోన్లను దర్జాగా కబ్జా చేసి, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. చెంగిచర్ల బస్సు డిపో సమీపంలో ఉన్న చెరువు కట్టను ధ్వంసం చేసి.. బహుళ అంతస్తుల భవనాలను నిర్మించటం వల్ల సమీపంలోని కాలనీలు జలమ యం కాగా, రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి.
పోచారం పురపాలక సంఘం పరిధిలోని వెంకటాపూర్ నాడెం చెరువు ఆక్రమణకు గురికావటంతో బహుళ అంతస్తులు వెలిశాయి.
దమ్మాయిగూడ, నాగారం, (Nagaram) బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్ పురపాలక సంఘాల పరిధిలోని చెరువు భూముల్లో కూడా అక్రమంగా భవనాలు వెలిశాయి. రెవెన్యూ, నీటి పారుదల, పురపాలక శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్లే ఈ కబ్జాల పర్వం మూడు పూవ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్‌పల్లి, ఉప్పల్ సర్కిళ్లలో వరదలతో కాలనీలన్నీ జలమయంగా మారినప్పుడల్లా.. చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్ పరిధితో ఉన్న పలు అక్రమ కట్టడాలను మొక్కబడిగా కూల్చివేస్తున్నారు. వీరి అలసత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్న కబ్జారులు కోర్టు కెళ్లుతుండటంతో వాటి జోలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది.
అంతంతే..
శివారుల్లో చెరువులు, కుంటల ఆక్రమణలు ,ప్రభుత్వ భూముల కబ్జాలపై ఫిర్యాదులు చేసినప్పుడు , కథనాలు వచ్చినపుడు లేదా ఉన్నతస్థాయి ఒత్తిళ్లు వచ్చినప్పుడు మాత్రమే ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం కదలి తూతూ మాత్రంగా కూల్చివేతలకు శ్రీకారం చుట్టి .. రాజకీయ పెద్దల జోక్యంతో చేతులు దులుపేసుకుంటున్నారు. కొన్ని చోట్ల కూల్చివేతలకు చేపట్టినా కొంత కాలం తర్వాత తిరిగి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం కబ్జాదారులకు అనువుగా మారుతోంది. హైడ్రా ఏర్పడిన తర్వాత కబ్జాదారులు, భూఅక్రమణ దారుల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు తమ బండారం బయట పడి అక్రమ కట్టడాలు నేలమట్టమవుతాయోనని బిక్కుబిక్కుమంటున్నారు.
చదవండి: చెట్టు చెట్టుకో కథ.. తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ..
Comments
Please login to add a commentAdd a comment