ghmc
-
చెరువుల కబ్జాపై కన్నెర్ర!
సాక్షి, హైదరాబాద్: ఆక్రమణదారుల చెర పడకుండా చెరువులను కాపాడేందుకు కంకణం కట్టుకున్న హైడ్రా (Hydraa) వాటి పరిరక్షణే లక్ష్యంగా దృష్టి సారిస్తోంది. ఇటీవల హైడ్రా బృందం శివారుల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి చెరువుల పరిస్థితితోపాటు ప్రభుత్వ భూముల కబ్జాల సంగతి తేల్చేందుకు పర్యవేక్షణలు చేపట్టింది. ఈ సందర్భంగా స్థానికులు, బస్తీవాసులు, ప్రజలు తమ చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయని, భవనాలు, బహుళ అంతస్తులు వెలుస్తున్నాయని వినతులు సమర్పించారు. హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి (Prajavani) కార్యక్రమంలో కూడా చాలామంది చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రాత పూర్వక ఫిర్యాదులను అందజేశారు. ఈ మేరకు హైడ్రా రాజధానికి సమీపంలోని చాలా చెరువులు ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.ఆక్రమణదారులు మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 200 చెరువులను, చెరువు శిఖం భూములను, బఫర్జోన్లలో పెద్ద ఎత్తున వెంచర్లు వేసి, రూ.వందల కోట్లు ఆర్జించారు. అసలు విషయం తెలియక స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకొన్న సామాన్య, మధ్యతరగతి (Middle Class) ప్రజలు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారు. వర్షాకాలంలో ఈ కాలనీలు, అపార్ట్మెంట్లు జలాశయాలుగా మారుతున్నాయి. హబ్సిగూడ, రామంతాపూర్ చెరువును ఆనుకొని ఏర్పడిన మూడు కాలనీలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మునకేస్తున్నాయి. కూకట్పల్లి, (Kukatpally) కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, గాజుల రామారం, సరూర్‌నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, వెంకటాపూర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, టోలిచౌకి, గుండ్లపోచంపల్లి, జల్పల్లి, బడంగ్పేట్, నాచారం, ఉప్పల్, చెంగిచర్ల, మల్కాజిగిరి, ఘట్కేసర్, పోచారం తదితర ప్రాంతాల్లో చెరువులు అదృశ్యమై కాలనీలు పుట్టుకొచ్చాయి. ఆక్రమణలో.. మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ‘రా’చెరువు, చింతల చెరువులోని బఫర్ జోన్లను దర్జాగా కబ్జా చేసి, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. చెంగిచర్ల బస్సు డిపో సమీపంలో ఉన్న చెరువు కట్టను ధ్వంసం చేసి.. బహుళ అంతస్తుల భవనాలను నిర్మించటం వల్ల సమీపంలోని కాలనీలు జలమ యం కాగా, రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. పోచారం పురపాలక సంఘం పరిధిలోని వెంకటాపూర్ నాడెం చెరువు ఆక్రమణకు గురికావటంతో బహుళ అంతస్తులు వెలిశాయి. దమ్మాయిగూడ, నాగారం, (Nagaram) బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్ పురపాలక సంఘాల పరిధిలోని చెరువు భూముల్లో కూడా అక్రమంగా భవనాలు వెలిశాయి. రెవెన్యూ, నీటి పారుదల, పురపాలక శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్లే ఈ కబ్జాల పర్వం మూడు పూవ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్పల్లి, ఉప్పల్ సర్కిళ్లలో వరదలతో కాలనీలన్నీ జలమయంగా మారినప్పుడల్లా.. చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ పరిధితో ఉన్న పలు అక్రమ కట్టడాలను మొక్కబడిగా కూల్చివేస్తున్నారు. వీరి అలసత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్న కబ్జారులు కోర్టు కెళ్లుతుండటంతో వాటి జోలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది.అంతంతే.. శివారుల్లో చెరువులు, కుంటల ఆక్రమణలు ,ప్రభుత్వ భూముల కబ్జాలపై ఫిర్యాదులు చేసినప్పుడు , కథనాలు వచ్చినపుడు లేదా ఉన్నతస్థాయి ఒత్తిళ్లు వచ్చినప్పుడు మాత్రమే ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం కదలి తూతూ మాత్రంగా కూల్చివేతలకు శ్రీకారం చుట్టి .. రాజకీయ పెద్దల జోక్యంతో చేతులు దులుపేసుకుంటున్నారు. కొన్ని చోట్ల కూల్చివేతలకు చేపట్టినా కొంత కాలం తర్వాత తిరిగి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం కబ్జాదారులకు అనువుగా మారుతోంది. హైడ్రా ఏర్పడిన తర్వాత కబ్జాదారులు, భూఅక్రమణ దారుల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు తమ బండారం బయట పడి అక్రమ కట్టడాలు నేలమట్టమవుతాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. చదవండి: చెట్టు చెట్టుకో కథ.. తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ.. -
మీరు కెమెరా నిఘాలో ఉన్నారు!
సాక్షి, సిటీబ్యూరో: కమిషనర్‌ను కలిసేందుకు ఇప్పటికే నిబంధనలు అమలు చేస్తున్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీకి వచ్చే వారు, పోయే వారు స్క్రీన్లపైనా కనబడేలా కొత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం.. పరిసరాల్లో దాదాపు 40 వరకు సీసీటీవీ కెమెరాలున్నాయి. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వస్తున్నారో దృశ్యాలు వాటిల్లో నిక్షిప్తమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న వాటిల్లో నమోదయ్యే దృశ్యాలు స్క్రీన్లపై అందరికీ కనిపించేలా కూడా మేయర్ ఎంట్రెన్స్, కమిషనర్ ఎంట్రెన్స్ వద్ద ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న స్క్రీన్‌పై నగరంలోని ఆయా ప్రాంతాల్లోని దృశ్యాల్ని కూడా వీక్షించే ఏర్పాట్లున్నాయి. వరదలు, గణే శ్ నిమజ్జనం వంటి సందర్బాల్లో మేయర్, అధికారులు నగర పరిస్థితుల్ని పరిశీలించేందుకు సదరు ఏర్పాట్లు చేయడం తెలిసిందే. -
కోర్టులు ఆదేశిస్తే తప్ప పని చేయరా?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులు ఆదేశిస్తే తప్ప అధికారులు పని చేయడం లేదని, మీ విధులు కూడా న్యాయస్థానాలే నిర్వహించాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేసింది. అధికారుల వద్దకు వచ్చే ప్రజల ఫిర్యాదులను పరిష్కరించకపోవడంతో వారు విధిలేక కోర్టులను ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించడంలోనూ అదే నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడింది. ఈ ఒక్క కోర్టు(15వ కోర్టు)లోనే ధిక్కరణ కేసులు 110 ఉన్నాయని చెప్పింది. కోర్టుల ఆదేశాలు, రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు చదువుతూ.. ఆ మేరకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించింది. ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్‌లు పెడుతూ వారికి తగిన సూచనలు అందించాలని కమిషనర్‌ను ఆదేశించింది. హైదరాబాద్ టోలిచౌకిలోని కాశీష్ దుకాణం ముందు అక్రమ నిర్మాణం చేపడుతున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా తమ ముందు హాజరైన జీహెచ్ఎంసీ కమిషనర్‌ను పలు ప్రశ్నలు అడగడంతోపాటు అక్రమ నిర్మాణాలపై అనుసరించాల్సిన విధానంపై సూచనలు చేశారు. ఆస్తి పన్ను వసూలుకే పరిమితమా? ‘కేవలం ఆస్తి పన్ను వసూలుకే జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారనే భావన ప్రజల్లో రానివ్వొద్దు. రోజురోజుకు మీపై వారిలో విశ్వాసం లేకుండాపోతోంది. కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వస్తోంది. చాలాచోట్ల స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత విధానాన్ని పాటించకుండా నిద్రపోతున్నారు. సీజ్ చేసినా చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూల్చివేత అంటూ రెండు రంధ్రాలు చేస్తే సరిపోతుందా? దానికి ఓ నిర్దిష్ట ప్రక్రియను అనుసరించకుంటే ఎలా? మీరు పెట్టిన రంధ్రాలను పూడ్చివేసి మళ్లీ నివాసం ఉంటున్నారు. అలా అని బుల్డోజర్ సిద్ధాంతాన్ని సమర్థించం. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా అర్ధరాత్రి పూటనో లేదా వేకువజామున నాలుగు గంటలకో నిర్మాణం చేస్తున్నారు. నేను నివాసం ఉంటున్న కుందన్‌బాగ్ ప్రాంతంలో కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు. న్యాయమూర్తి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి? విద్యా సంవత్సరం కొనసాగుతున్నందున ఒక్క విద్యా సంస్థలకు తప్ప ఇతర అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం అధికారులు చర్యలు చేపట్టవచ్చు’అని పేర్కొన్నారు.సివిల్ కోర్టుల నోటీసులపై స్పందనేది?‘సివిల్ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లలో నోటీసులు జారీ చేసినప్పుడు స్పందించకుంటే ఎలా? కొన్నిసార్లు స్టాండింగ్ కౌన్సిల్స్ కూడా హాజరుకావడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సివిల్ కోర్టు ఎక్స్‌పార్టీ అని పేర్కొంటూ, ఇతర పార్టీ లకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వాల్సివస్తోంది. మీ నిర్లక్ష్యం కారణంగా అక్రమ నిర్మాణదారులు లబ్దిపొందుతున్నారు. కొందరు అధికారులు, కౌన్సిల్స్ చట్టం, సెక్షన్లు తెలియకుండా కౌంటర్లు వేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారుల నుంచి స్పందన లేక కోర్టులకు వస్తున్న కేసులు 70 నుంచి 80 శాతమున్నాయి. మీరే అన్ని నిర్ణయాలు తీసుకోలేరు. ఆ మేరకు చట్టంలో మార్పులు చేసేలా ప్రిన్సిపల్ సెక్రెటరీని కోరండి. సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, డిప్యూటీ కమిషనర్లు.. అంతా కూర్చొని మాట్లాడండి. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ఏ చర్యలు తీసుకోవాలో ప్రణాళిక రూపొందించుకోండి. అలాగే వివాదాస్పదమైన టోలీచౌకి నిర్మాణంపై జనవరి 22లోగా నివేదిక ఇవ్వండి’అని కమిషనర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, రాజీ కుదిరిందని పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్ కోరగా, న్యాయమూర్తి నిరాకరించారు. అక్రమ నిర్మాణంపై రాజీనా అని ప్రశ్నిస్తూ.. విచారణ వాయిదా వేశారు. -
జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 45లో బెంగాల్ టైగర్ చూసారా..? (ఫొటోలు)
-
ఆ ఫుడ్.. సేఫ్టీనా?
‘హైదరాబాద్‌లోనే పేరున్న ఓ హోటల్ నుంచి తెచ్చిన చికెన్ బిర్యానీ పార్శిల్లో బొద్దింక.. మరో హోటల్లో బిర్యానీలో కనిపించిన జెర్రీ... ప్రసిద్ధి చెందిన ఓ హోటల్ కిచెన్‌లోని ఫ్రిజ్‌లో పాడైపోయిన చికెన్..సేంద్రియ పంటల నుంచి తయారు చేసే స్వీట్ల దుకాణంలో అపరిశుభ్ర వాతావరణం’... గత కొంతకాలంగా హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని హోటళ్లలో ఆహార ప్రియులకు వినిపిస్తున్న చేదు వార్తలు ఇవి.సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటవుతున్న హోటళ్లు, ఇతర ఫుడ్ సెంటర్లలో ఆహార తనిఖీలకు అవసరమైన సిబ్బంది లేకపోవడం, ఆహార పరీక్షలు జరిపే సదుపాయాలు మెరుగుపడకపోవడం వంటి కారణాలతో కొన్నేళ్లుగా ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు.జీహెచ్ఎంసీతోపాటు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు హోటళ్లకు ట్రేడ్ లైసెన్స్‌లు ఇవ్వడంపై చూపిన శ్రద్ధ ఆహార భద్రతపై పెట్టలేదు. రోడ్ల పక్కన గప్‌చుప్, మిర్చిబజ్జీలు, బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ఇతర ఆహారం అందించే స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లు హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, నగరాల్లో విచ్చలవిడిగా వెలిశాయి. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు కూడా రోడ్ల పక్కనే అందించే స్ట్రీట్ ఫుడ్ పాయింట్లు అయితే కోకొల్లలు. వీధుల్లోని ఫుడ్ సెంటర్లతోపాటు పేరున్న హోటళ్లలో సైతం నాణ్యత ప్రమాణాలతో ఆహారం అందించడం లేదని ఇటీవల తనిఖీలతో తేటతెల్లమైంది. ‘ఫుడ్ సేఫ్టీ ఆన్‌వీల్స్’ద్వారా రాష్ట్రవ్యాప్త తనిఖీలు ఆహార భద్రతపై వచ్చిన వందలాది ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం రేవంత్, మంత్రి దామోదర రాజనర్సింహ ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్వీ.కర్ణన్‌ను ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా నియమించి ఆహార భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకొనే బాధ్యతను ఆయనకు అప్పగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆహార తనిఖీ కోసం నాచారంలో ఒకే ల్యాబ్ ఉంది. అయితే కొత్తగా మూడింటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాచారం ల్యాబ్‌ను ఆధునీకికరించడంతోపాటు వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కొత్తగా 24 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులకు వివిధ జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఐదు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటికి తోడు మరో పదింటిని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నారు. ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’పేరిట ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏ) ప్రత్యేకంగా ఈ మొబైల్ యూనిట్లను అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాల్లో ఫుడ్ లే»ొరేటరీలను ఏర్పాటు చేసి, నగరం, పట్టణాల్లో రోజుకో ఏరియాలో మొబైల్ పరీక్షలు నిర్వహిస్తోంది. తద్వారా సంవత్సరానికి కనీసం 24 వేల ఆహార నమూనాలు పరీక్షించేలా లే»ొరేటరీలను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. దీనికోసం 10 మంది ల్యాబ్ టెక్నీíÙయన్లు, ఇతర సిబ్బందిని నియమించింది. జీహెచ్ఎంసీతోపాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండలో ఈ పది మంది ఇప్పటికే రంగంలోకి దిగారు. స్ట్రీట్ ఫుడ్స్, గప్‌చుప్ బండ్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల వద్ద ఎఫ్ఎస్ఎస్ఏ నిబంధనలకు అనుగుణంగా ఆహారం ఉందో లేదో పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
సార్‌ను కలవాలంటే సవాలే!
సాక్షి, హైదరాబాద్: అది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం. కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లాలనుకుంటున్నవారికి కార్యాలయ ద్వారం ఎదుటే ఉన్న పోలీసులు అడ్డుకుంటారు. మీకు ఏం పని? అని అడుగుతారు. కమిషనర్ సార్‌ను కలవాలి. సర్కిల్, జోన్లో పరిష్కారం కానందున ఇక్కడికి వచ్చాం అంటే.. మీ సమస్య ఏమిటో అక్కడ చెప్పండి.. అంటూ దగ్గర్లోనే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్‌ను చూపుతారు. అక్కడ తమ సమస్య చెప్పడానికి క్యూకట్టి చెబితే, నమోదు చేసుకొని ఇక వెళ్లమన్నట్లు సూచిస్తారు. సార్ అనుమతిస్తే కార్యాలయ సిబ్బంది మీకు ఫోన్ చేస్తారు. అప్పుడు వచ్చి కలవండి అని చెప్పి పంపిస్తారు. .. ఇదీ రెగ్యులర్ కమిషనర్‌గా ప్రభుత్వం బాధ్యతలప్పగించాక, ఝార్ఖండ్ ఎన్నికల విధుల నుంచి తిరిగి వచ్చాక జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలవాలంటే సందర్శకులకు ఎదురవుతున్న అనుభవం. ఝార్ఖండ్ నుంచే వర్చువల్‌గా ఆదేశాలు జారీ చేస్తూ చురుగ్గా పనులు చేసిన కమిషనర్ శైలిని చూసిన నగర ప్రజలు అప్పుడు అహో అనుకున్నారు. ఇప్పుడు సార్‌ను కలవాలనుకుంటున్న ఫిర్యాదుదారులు అయ్యో ఇదేంటి? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎస్పీఎఫ్తో భద్రత.. బహుశా జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కమిషనర్ పేషీలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్ఐ, మహిళా పోలీసులు కూడా వీరిలో ఉన్నారు. కమిషనర్‌ను కలిసేందుకు వస్తున్నవారిలో కొందరు అక్కడున్న పోలీసులను చూసి వెనకడుగు వేస్తున్నారు. వెళ్లేందుకు ముందుకొచ్చేవారిని ఏం పని కోసం వచ్చారో తెలుసుకొని కమిషనర్ పేషీలోని అధికారుల వద్దకు పంపిస్తున్నారు. వారు విషయాన్ని బట్టి అపాయింట్మెంట్ కోసం వివరాల నమోదుకు కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు పంపిస్తున్నారు. అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే విషయాన్ని బట్టి ఒక రోజు నుంచి వారం వరకు పట్టవచ్చు. లేదా అసలు రాకపోవచ్చని చెబుతున్నారని కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన వారిలో శ్రీనివాస్ అనే అతను చెప్పాడు. తాను అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎల్బీనగర్ నుంచి వచ్చానని తెలిపాడు. మరో వ్యక్తి తాను కొన్ని రోజుల క్రితం వచ్చి వివరాలు ఇచ్చి వెళ్లానని, ఇంకా కాల్ రాకపోవడంతో కనుక్కునేందుకు వచి్చనట్లు చెప్పాడు. మంత్రులు ప్రజలను కలుస్తున్నా.. ఓవైపు తాము అధికారంలోకి వచ్చాక ప్రజలు సీఎం దాకా ఎవరినైనా కలిసే అవకాశం లభించిందని, ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు.. మంత్రులు సైతం గాందీభవన్ వేదికగానూ ప్రజా సమస్యలు స్వీకరిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ఎన్ని ఇబ్బందులెదురైనా ఆపబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం పేర్కొన్నారు. కోటిమంది సమస్యలు తీర్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం ప్రజలు తనను కలిసేందుకు సుముఖంగా లేరు. సార్ బిజీగా ఇతర పనుల్లో ఉన్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీన్ని చూసి ప్రజాపాలన అంటే ఇదేనా? అని విస్తుపోతున్న వారూ ఉన్నారు. గతంలో బల్దియా కమిషనర్లుగా పనిచేసిన వారెవరూ ఇలా వ్యవహరించలేదు. మరి ప్రజాపాలన అంటున్న ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఇలంబర్తికి స్ఫూర్తి ఎవరో ఆయనకే తెలియాలి. రాజకీయ అండ? జీహెచ్ఎంసీకి రాకముందు ఇలంబర్తి రవాణా శాఖలో పని చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ మంత్రిగా ఆయనే సమీక్షలు చేస్తున్నారు. కమిషనర్‌కు మంత్రి అండదండలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ప్రజలను కలవని వ్యవహార శైలితో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన అలా.. ఈయన ఇలా ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిశోర్.. తాను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పని చేసిన కాలంలో తనను కలిసేందుకు వస్తున్న వారందరికీ కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేకపోవడం గుర్తించి.. వృద్ధులు తదితరులు ఎక్కువసేపు నిలబడి ఉండటం చూడలేక సందర్శకుందరికీ కూర్చునే సదుపాయం ఉండేలా ప్రత్యేక గది, కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఇలంబర్తి మాత్రం సందర్శకులనే పేషీలోకి రానీయడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
సీఆర్ఎంపీ లేనట్టే..!
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) కింద గత అయిదేళ్లుగా నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ బాధ్యతలు చూసిన కాంట్రాక్టు ఏజెన్సీల గడువు ముగిసిపోతోంది. కానీ.. ఈ బాధ్యతలను తిరిగి ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చే యోచనలో జీహెచ్ఎంసీకి లేదు. కనీసం ఆరుల నెలల నుంచి ఏడాది వరకు జీహెచ్ఎంసీయే నిర్వహించాక తిరిగి ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఏజెన్సీల ఒప్పంద గడువు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ముగిసిపోయి మిగతా ప్రాంతాల్లోనూ జనవరిలో ముగిసిపోనున్నప్పటికీ, ఇప్పటి వరకు రోడ్ల నిర్వహణ కోసం కొత్తగా టెండర్లు ఆహ్వానించలేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏజెన్సీలకు పొడిగింపూ ఇవ్వలేదు. రీ కార్పెటింగ్ అవసరం లేదు ⇒ అయిదేళ్ల క్రితం ప్రధాన రహదారుల మార్గాల్లోని 811 కిలో మీటర్ల మేర నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఒప్పందం మేరకు తొలి ఏడాది 50 శాతం, రెండో సంవత్సరం 30 శాతం, మూడో సంవత్సరం మిగతా 20 శాతం రోడ్లను రీ కార్పెటింగ్ చేయడంతో పాటు మరో రెండేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలు చూడాలి. అంటే వర్షాలొచ్చి గుంతలు పడ్డా, ఎక్కడైనా దెబ్బతిన్నా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. వాటితో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, స్వీపింగ్ మెషీన్లతో రోడ్లు ఊడ్చటం తదితర పనులు చేయాలి. ⇒ ఒప్పంద గడువు ముగిసినా, ఇప్పటికిప్పుడు రోడ్లను రీకార్పెటింగ్ చేయాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. అందుకే ఒప్పంద గడువు ముగుస్తున్న ప్రాంతాల్లో పనుల కోసం స్వీపింగ్ మెషిన్లు అద్దెకు తీసుకునేందుకు టెండర్లు పిలుస్తున్నారు. రోడ్ల నిర్వహణను జీహెచ్ఎంసీ ఇంజినీర్లే పర్యవేక్షించనున్నారు. స్వీపింగ్ మెషిన్లతో పనుల కోసం కనీసం ఆరు నెలల సమయమైనా లేనిదే కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆరు నెలల కాలానికి అద్దె స్వీపింగ్ మెషీన్లకు టెండర్లు పిలుస్తున్నారు. ఈలోగా రోడ్ల నిర్వహణ మొత్తం పనులకు టెండర్లు పిలిచేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవచ్చున్నది అధికారుల ఆలోచన కావచ్చు. ⇒ ఇప్పటికే సీఆర్ఎంపీ కింద ఉన్న రోడ్లతోపాటు కొత్తవి కూడా అందులో చేర్చి అన్నింటి నిర్వహణ పనులకు అవసరమైన నిధుల్ని ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించి, టెండర్లు పిలిచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అది ఆరు నెలల తర్వాతా.. లేక ఏడాదికా? అన్నది వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈలోగా పాత ఏజెన్సీలు చేయకుండా మిగిలిపోయిన పనులుంటే వాటిని పూర్తిచేయించనున్నారు. లేదా కేవలం చేసిన పనుల వరకే బిల్లులు చెల్లించనున్నారు. తక్షణ మరమ్మతులకు టెండర్లు మరోవైపు వర్షాలొచి్చనప్పుడు పాట్‌హోల్స్ పడ్డా, ఇతరత్రా కారణాల వల్ల రోడ్లు దెబ్బతిన్నా వెంటనే వాటిని పూడ్చివేయడం, ప్యాచ్‌వర్క్స్ వంటి పనుల్ని కూడా ప్రైవేటు ఏజెన్సీల కిచ్చే ఆలోచనలో జీహెచ్ఎంసీ అధికారులున్నట్లు తెలుస్తోంది. -
తుది దశకు ‘అమృత్’ పనులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మౌలిక సదుపాయా లు కల్పించేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ (ది అటల్ మిషన్ ఫర్ రిజెనువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) కింద రాష్ట్రంలోని 12 పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దేశంలోని ఎంపిక చేసిన పట్టణాల్లో తాగునీటి సరఫరాతోపాటు సీవరేజీ పైప్లైన్ల వ్యవస్థ, పట్టణ రవాణా, పచ్చదనం పెంపు, వరదనీటి కాలువల అభివృద్ధి ప్రధాన అంశాలుగా 2015 జూన్ 25న ‘అమృత్’ పథకం ప్రారంభమైంది. తొలి దశలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 500 నగరాలను కేంద్రం ఎంపిక చేయగా అందులో రాష్ట్రం నుంచి హైదరాబాద్ (జీహెచ్ఎంసీ), వరంగల్ (జీడబ్ల్యూఎంసీ), కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం నగరాలతోపాటు ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట పట్టణాలను ఎంపిక చేశారు. ఈ 12 పురపాలికల్లో తాగునీరు, సీవరేజీ, పార్కుల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పనులు ప్రారంభించింది. కేంద్రం, రాష్ట్రం 50:50 ప్రాతిపదికన చేపట్టే ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 1,663.08 కోట్లు కాగా.. అందులో కేంద్ర సాయం రూ. 832.6 కోట్లు. 66 ప్రాజెక్టులు... తాగునీటికి అధిక మొత్తం...అమృత్ పథకం కింద 12 పురపాలికల్లో 66 ప్రా జెక్టులు ప్రారంభమయ్యాయి. రూ. 1,663.08 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ పనులకు కేంద్రం తన వాటాగా రూ. 832.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందులో రూ. 831.52 కోట్లను కేంద్రం విడుదల చేయగా రాష్ట్రం తన వాటాతోపాటు కేంద్రం వాటా లో రూ.806.21 కోట్లు వినియోగించుకుంది. తాగు నీటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ పట్టణాల్లో 27 నీటి సరఫరాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందుకోసం 4,336.54 కిలోమీటర్ల పొడవైన నీటి సరఫరా పైప్లైన్లను నిర్మించారు. వాటి విలువ రూ. 1,424.09 కోట్లు. అందులో అత్యధికంగా వరంగల్‌కు రూ. 341.3 కోట్లు వెచ్చించడం విశేషం. ఈ పథకం కింద నిజామాబాద్, సిద్దిపేటల్లో రూ. 203.3 కోట్ల విలువగల నాలుగు మురుగునీటి శుద్ధి, సెప్టిక్ ట్యాంకు వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు లను చేపట్టారు. ఈ రెండు పురపాలికల్లో 278.53 కి.మీ. పొడవైన మురికినీటి పారుదల పైప్లైన్లను ఏర్పాటు చేశారు. 5.54 లక్షల నల్లా నీటి కనెక్షన్లు, 0.87 లక్షల మురుగునీటి పారుదల కనెక్షన్లను అ మృత్, కన్వర్జెన్సెస్లో భాగంగా సమకూర్చారు. రాష్ట్రంలోని 12 పురపాలికల్లో రూ. 35.69 కోట్లతో 35 హరిత స్థలాలు, పార్కులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ దాదాపు పూర్తయినట్లు రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి తెలిపింది. దీనికి అదనంగా రాష్ట్రంలో 18.25 ఎంఎల్డీ సామర్థ్యంగల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు (ఎస్టీపీ)ను, 442.45 ఎకరాల విస్తీర్ణంలో హరిత క్షేత్రాలను ‘అమృత్’ కింద అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అమృత్ 2.0 కింద కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి చేరాయి.సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని కోరిన సీఎం రేవంత్2021లో మొదలైన అమృత్–2.0 (పథకం రెండో దశ)లో భాగంగా హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ఇటీవల విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ప్రతిపాదించిన సమగ్ర సీవరేజీ మాస్టర్‌ప్లాన్ (సీఎస్ఎంపీ)ని చేర్చాలని కోరారు. అమృత్ తొలి విడత ప్రాజెక్టులో జీహెచ్ఎంసీలో పచ్చదనం కోసం కేవలం రూ. 3.3 కోట్లు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో సీఎస్ఎంపీని అమృత్లోకి తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌తోపాటు సమీప పురపాలక సంఘాలతో కలుపుకొని 7,444 కి.మీ. మేర రూ. 17,212.69 కోట్లతో సీఎస్ఎంపీకి డీపీఆర్ రూపొందించినట్లు ఖట్టర్‌కు సీఎం తెలిపారు. సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయడం లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. -
బీజేపీ కార్పొరేటర్ల నిరసన.. జీహెచ్ఎంసీ మీటింగ్ రసాభాస!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ అసంపూర్తిగానే ముగిసింది. ఇష్టానుసారం స్టాండింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడంపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో, బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది.జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ అసంపూర్తిగా ముగిసింది. సమావేశంలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాస్తవాలకు దూరంగా బడ్జెట్ గణాంకాలు ఉన్నాయరని కార్పొరేటర్ల విమర్శలు చేశారు. వివిధ శాఖలకు కేటాయింపులు సరిగా లేవని స్టాండింగ్ కమిటీ సభ్యులు మండిపడ్డారు. దీంతో, చేసేదేమీ లేక.. బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఇక, స్టాండింగ్ కమిటీ సమావేశం ప్రారంభంలోనే బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇష్టానుసారం స్టాండింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడంపై కాషాయ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ డివిజన్లో విజిట్ చేసి సమస్యలపై చర్యలు చేపడతామని మేయర్ గద్వాల విజయలక్ష్మి హామీ ఇవ్వడంతో బీజేనీ కార్పొరేటర్లు నిరసన విరమించుకున్నారు. అంతకుముందు.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బల్దియాను లూటీ చేస్తున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. -
కుంచె గీసిన చిత్రం..
నగరంలోని పలు కూడళ్లు రంగులద్దుకుంటున్నాయి. విభిన్న కళాకృతులతో ఫ్లై ఓవర్ పిల్లర్లు, అండర్ పాస్ గోడలు కలర్ ఫుల్ పెయింటింగ్స్‌తో కళకళలాడుతున్నాయి. ఒక్కో సెంటర్‌కు ఒక్కో రకమైన థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత రెండు నెలలుగా కళాకారులు తమ ప్రతిభతో ఎంతో అందమైన కళాఖండాలను తీర్చిదిద్దుతున్నారు. ఆ దారిన పోయే ప్రయాణికులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ ప్రజల జీవన శైలి, జంతువులు, పక్షులు, క్రీడలు ఇలా విభిన్న రంగాలకు చెందిన చిత్రాలు నడయాడినట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో కళాకారులతో పాటు, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సైతం పాలుపంచుకుంటున్నారు. ఎల్బీనగర్ నుంచి లింగంపల్లి వరకూ.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకూ.. హైటెక్ సిటీ నుంచి ఉప్పల్ సచివాలయం వరకూ.. ఇలా ఎటు చూసినా వంతెనల పిల్లలర్ల మీద, వంతెనల గోడలపైనా ఇటీవల కాలంలో కొత్త సొబగులద్దుకుంటున్నాయి. రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత వాల్ పెయింటింగ్స్‌తో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కార్యాచరణలోకి దిగారు. ప్రతి ఫ్లై ఓవర్ వంతెన, అండర్ పాస్ గోడలు, పిల్లర్లకు అందమైన ఆకృతుల్లో చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఒక్కో సెంటర్లో ఒక్కో రకమైన థీమ్‌తో చిత్రాలు వేస్తున్నారు. ఎల్బీ నగర్ కూడలిలో వంతెన పిల్లర్లకు ఓ వైపు సంప్రదాయ నృత్యాలు, మైరో వైపు పాప్ డ్యాన్సర్స్ చిత్రాలు తీర్చిదిద్దారు. ఫ్లెక్సీ ప్రింటింగ్‌తో ముప్పు..ఒకప్పుడు ఆర్టిస్టులకు చేతినిండా పని ఉండేది. దీంతో బ్యానర్లపై రాతలు రాయడం, గోడలపై చిత్రాలు వేయడం, రాజకీయ, సినీ ప్రముఖుల కటౌట్లను సిద్ధం చేయడం, వివిధ సందర్భాల్లో ఆరి్టస్టులకు చేతినిండా పని దొరికేది. దీంతో గతంలో ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ఆలోచన ఎక్కువ మందిలో కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో మార్కెట్లోకి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అందుబాటులోకి రావడంతో తక్కువ ఖర్చు, వేగంగా పని పూర్తవుతుండడంతో పలువురు దీనిపై మక్కువ చూపుతున్నారు. దీంతో పెయింటింగ్ ఆరి్టస్టులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం, ఉపాధి మార్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాపోతున్నారు.36 ఏళ్లుగా ఇదే వృత్తి..1988లో ఆరి్టస్టుగా ప్రయాణం మొదలు పెట్టాను. ప్రభుత్వం వాల్ పెయింటింగ్స్‌కు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. కళాకారులకు పని దొరుకుతుంది. రోజుకు రూ.2 వేలు ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఏ రకమైన పెయింటింగ్స్ వేయాలని సూచిస్తే వాటినే చిత్రిస్తున్నాం. ఈ పని ఎన్నాళ్లు ఉంటుందో తెలీదు. పదేళ్ల క్రితం వరకూ చేతినిండా పని ఉండేది. ఫ్లెక్సీ ప్రింటింగ్ వచ్చిన తరువాత నెలలో కొన్ని రోజులు పనిలేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. – అశోక్, కళాకారుడు, హయత్నగర్ఆరు నెలలు పని కలి్పంచాలి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని కల్పించినట్లు సంవత్సరంలో కళాకారులకు కనీసం ఆరు నెలలు పనికల్పించే విధంగా చట్టం చేయాలి. ఒకప్పుడు ఫైన్ ఆర్ట్స్ అంటే సమాజంలో డిమాండ్ ఉండేది. ఫ్లెక్సీలు వచ్చాక క్రమంగా పని తగ్గుతోంది. పదో తరగతి చదివి ఆరి్టస్టుగా స్థిరపడ్డాను. ఇప్పుడు నెలలో 20 రోజులు పని ఉంటే పది రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వమే కళాకారులను ఆదుకుని జీవనోపాధి చూపించాలి. – సత్యం, కళాకారుడు, హయత్‌నగర్ -
హైదరాబాద్ పాతబస్తీలో అతిపెద్ద ఫ్లై ఓవర్.. విశేషాలివే
హైదరాబాద్ పాతబస్తీలో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులన్నీ ఈ నెల 30 వరకు పూర్తి చేసి డిసెంబర్లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే.. ఆరాంఘర్, శాస్త్రీపురం, కాలాపత్తర్, దారుల్ ఉల్ ఉలూం, శివరాంపల్లి, హసన్‌నగర్ తదితర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. బెంగళూర్ జాతీయ రహదారితో పాటు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వారికి సౌకర్యంగా మారనుంది. ఇప్పటి వరకు బాటిల్ నెక్ రోడ్డుతో ఇబ్బందులకు గురైన స్థానిక బస్తీల ప్రజలతో పాటు దూర ప్రాంతాల వారికి ఈ ఫ్లై ఓవర్ ఎంతో అనుకూలంగా ఉంటుంది.ఎస్ఆర్డీపీ కింద.. నగరంలో ఇప్పటి వరకు 2– 7 కిలో మీటర్ల పొడవుతో షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. 4.04 కిలో మీటర్ల అతి పెద్ద ఫ్లైఓవర్ పాతబస్తీలో నిర్మాణమైంది. వచ్చే నెల మొదటి వారంలో వాహనదారులకు దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గ్రేటర్ కమిషనర్ కె.ఇలంబర్తితో పాటు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఈ నెల 26న ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. చదవండి: కాలిపోయిన కలల సౌధం.. రెండు రోజుల క్రితమే గృహప్రవేశం.. అంతలోనే ఇలాసర్వీస్ రోడ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంకా 17 కట్టడాలను తొలగించాల్సి ఉందని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ విభాగం చీఫ్ ఇంజినీర్ దేవానంద్, ఎస్ఈ దత్తు పంతు తదితరులు కమిషనర్‌కు వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్నను కమిషనర్ ఆదేశించారు. 2023 మార్చి నాటికే పూర్తి కావాల్సింది.. జూ పార్కు నుంచి ఆరాంఘర్ వరకు రూ.736 కోట్లతో స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) కింద దాదాపు 4.04 కిలో మీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. 2021లో పనులు చేపట్టారు. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉండగా.. నత్తనడకన సాగడంతో ఈ ఏడాది నవంబర్ వరకూ కొనసాగాయి. ఇంకా 2 డౌన్ ర్యాంపులతో పాటు 2 అప్ ర్యాంపులు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో మొత్తం 163 ప్రాపర్టీలను స్వాధీనం చేసుకోవడానికి రూ.336 కోట్లు ఖర్చు చేయగా.. మిగిలిన నిధులతో ఆరు లేన్ల మేర ఫ్లైఓవర్‌ను నిర్మించారు. -
GHMC మేయర్ Vs MIM ఎమ్మెల్సీ.. అధికారుల్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో జీహెచ్ఎంసీ మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. చికెన్, మటన్ షాపులు విషయంలో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ప్రస్తుతం మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారం జీహెచ్ఎంసీలో హాట్ టాఫిక్ అంశంగా మారింది.వివరాల ప్రకారం..‘కలుషిత, అపరిశుభ్రమైన, నాణ్యత లేని నాన్‌వెజ్ విక్రయాలు జరుపుతూ చికెన్ మార్కెట్ నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. భరించలేని దుర్వాసన, ఎలుకల సంచారం.. తక్షణమే చికెన్ మార్కెట్‌ను సీజ్ చేయండి’.. ఈ నెల 22న కోఠిలోని మోతీ మార్కెట్లో ఆకస్మిక పర్యటన సందర్భంగా మేయర్ అధికారులకు చేసిన ఆదేశాలివి.. మేయర్ ఆదేశాల మేరకు చికెన్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి సీజ్ చేసే ప్రయత్నం చేశారు.మరోవైపు.. మేయర్ ఆదేశాలు ఇచ్చి 24 గంటలు గడవక ముందే ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్ సీజ్ చేసిన చికెన్, మటన్ షాపులు తెరవకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోసారి తమ దుకాణాలపై దాడులు చేస్తే చర్యలు తప్పవంటూ మందలించారు. మేయర్ ఆదేశాలు డోంట్‌కేర్..ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇంటిని సీజ్ చేసుకుంటామా? అంటూ ఎమ్మెల్సీ బేగ్ మేయర్ తనిఖీల తీరును ఎండగట్టారు.దీంతో, మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారం జీహెచ్ఎంసీలో హాట్ టాఫిక్ అంశంగా మారింది. మేయర్ తీరుపై ఎంఐఎం ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడి క్యాంటీన్ విషయంలోనూ మేయర్ తరచూ జోక్యం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్సీ బేగ్ మేయర్ ఆదేశాలకు ధీటుగా నిలబడి విమర్శలు గుప్పిస్తుండడంపై అటు అధికారుల్లో, ఇటు కార్పొరేటర్లలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. -
వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు సరికాదు: సుప్రీం
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిలు, జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 2008లో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను సుప్రీం కోర్టు రద్దు చేసింది. అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపు మార్గదర్శకాలపై 2005లో జారీ చేసిన జీవోలను సైతం రద్దు చేసింది. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, జర్నలిస్టులను ‘ప్రత్యేక వర్గం’గా పేర్కొంటూ వారి హౌసింగ్ సొసైటీలకు నామమాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు విరుద్ధమని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. హౌసింగ్ సొసైటీలు చెల్లించిన సొమ్మును రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీతో సహా వడ్డీతో కలిపి వెనక్కి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ సొసైటీలకు అనుకూలంగా లీజు డీడ్లు ఏవైనా ఇచ్చి ఉంటే అవన్నీ రద్దు అవుతాయని తెలిపింది. అలాగే సొసైటీలు చెల్లించిన డెవలప్మెంట్ చార్జీలను కూడా వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ పి.సంజయ్ కుమార్ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎంపీలు, శాసన సభ్యులు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిల సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 2008లో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను కొట్టేస్తూ 2010లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ ప్రభుత్వం ఆ సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనుకుంటే వాటి సభ్యులకు అర్హతలు నిర్ణయించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలతో పాటు ఇళ్ల స్థలాల కేటాయింపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వీబీ చెలికాని తదితరులు సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పలు తరగతులతో పోలీస్తే ఎంపీలు, శాసన సభ్యులు, ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిలు మంచి స్థానంలో ఉన్నారని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సామాన్యులకు ఒకే రకమైన హక్కులను తిరస్కరించడం ఎంత మాత్రం సహేతుకం కాదంది. తాము ఎన్నో త్యాగాలు చేశామని, అందువల్ల తక్కువ ధరలకు ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందన్న అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వాదనను తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, చట్టసభలకు ఎన్నికైన వారు, సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలు, ప్రముఖ జర్నలిస్టులు ‘వెనుకబడిన వర్గాల’కిందకు రారని స్పష్టం చేసింది. -
GHMC పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు
-
జీహెచ్ఎంసీలో హౌజింగ్ సొసైటీలపై సుప్రీం సంచలన తీర్పు
సాక్షి,ఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో హౌసింగ్ సొసైటీలపై సుప్రీంకోర్టు సోమవారం(నవంబర్ 25) సంచలన తీర్పిచ్చింది. హౌజింగ్ సొసైటీలకు ఇప్పటికే చేసిన భూ కేటాయింపులను సీజేఐ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. ఇంతేకాకుండా సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.హౌజింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూ కేటాయింపులను సవాలు చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ ఉద్యోగులు,జర్నలిస్టుల సొసైటీలకు ప్రభుత్వంలో గతంలో భూ కేటాయింపులు జరిపింది. ఇదీ చదవండి: సోషల్‌మీడియా అండతో తీర్పులను ప్రభావితం చేసే యత్నాలు -
జీహెచ్ఎంసీ అడ్డగోలు నోటీసులు}
సాక్షి, సిటీబ్యూరో: ‘తిమ్మిని బమ్మి చేసే సత్తా వారి సొంతం. వారు తల్చుకుంటే లక్షల రూపాయల ఆస్తిపన్ను వేలల్లోనే వస్తుంది. వందల్లో రావాల్సింది వేలల్లో కూడా అవుతుంది’.. జీహెచ్ఎంసీ బిల్కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల గురించి సామాన్య జనానికి ఉన్న అభిప్రాయం ఇది. ఈ పరిస్థితిని నివారించేందుకే గతంలో ఆస్తిపన్ను అసెస్మెంట్ల కోసం ప్రజల ఇళ్ల వద్దకు ట్యాక్స్ సిబ్బంది వెళ్లవద్దని అప్పటి కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఆ విధానం వల్ల ఏ డాక్యుమెంట్లు పెట్టినా ఆస్తిపన్ను గుర్తింపు నంబరు(పీటీఐఎన్) జనరేట్ కావడంతో పాటు చివరకు జీహెచ్ఎంసీ భవనాలను సైతం ఎవరైనా తమ ఆస్తిగా చూపించుకునే అవకాశం ఏర్పడటంతో దానికి స్వస్తి పలికారు. మరోవైపు.. జీహెచ్ఎంసీకి వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు హస్తిమశకాంతరం వ్యత్యాసం ఉండటంతో.. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా తిరిగి అసెస్మెంట్ను ట్యాక్స్ సిబ్బంది ‘సుమోటో’గానే చేసేందుకు గత జూలైలో ఆదేశించారు. దీంతో ఎంతోకాలం చేతులు కట్టిపడేసినట్లున్న ట్యాక్స్ సిబ్బందికి ఒక్కసారిగా వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. ఇంకేముంది? అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా కొత్త భవనాల వద్దకు, అసెస్మెంట్లలో వ్యత్యాసాలున్నాయంటూ అన్ని భవనాల ప్రజల వద్దకు వెళ్తున్నారు. వారి వైఖరికి ఆసరానిస్తూ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి ఆస్తిపన్ను ద్వారా ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా.. తేడాలున్నట్లు గుర్తించిన వాణిజ్య భవనాలను, అదనపు అంతస్తులు వెలసిన ఇతరత్రా భవనాలను గుర్తించి నిజమైన ఆస్తి పన్ను విధించాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులు సూచించారు. ట్యాక్స్ సిబ్బంది మాత్రం నివాస, వాణిజ్య భవనం అన్న తేడా లేకుండా.. అదనపు అంతస్తులు నిర్మించినా, నిర్మించకున్నా జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 213 కింద నోటీసులిచ్చేస్తున్నారు. సదరు సెక్షన్ మేరకు సరైన ఆస్తిపన్ను నిర్ధారించేందుకు జీహెచ్ఎంసీ కోరిన వివరాల్ని భవన యజమానులు లేదా ఆక్యుపైయర్లు తెలియజేయాలి. లక్ష్యం ఒకటి.. పని మరొకటి నిజమైన ఆస్తిపన్ను కట్టకుండా లక్షలు, కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నవారి నుంచి సరైన ఆస్తిపన్ను వసూలు చేయడం, ఇప్పటికే ఉన్న భవనాల మీద కొత్తగా నిర్మించిన అదనపు అంతస్తులను ఆస్తిపన్ను పరిధిలోకి తేవడం ద్వారా ఆస్తిపన్ను ఆదాయం పెంచుకోవాలనేది ఉన్నతాధికారుల లక్ష్యం. దీంతోపాటు దశాబ్దం క్రితం జరిగిన కంప్యూటరీకరణ సందర్భంగా చాలా ఇళ్ల ప్లింత్ ఏరియా ఎంత ఉందో నమోదు చేయలేదు. అలాంటి వాటి ప్లింత్ ఏరియాను ఆన్లైన్లో నమోదు చేసేందుకు వివరాలు సేకరించాల్సి ఉండగా.. అన్ని ఇళ్లనూ ఒకే గాటన కట్టి నోటీసులిస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎక్కువ ఆస్తిపన్నును తక్కువ చేస్తామంటూ ట్యాక్స్ సిబ్బంది జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేని పక్షంలో ఎక్కువ ఆస్తిపన్ను కట్టాలంటూ బెదరగొడుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నోటీసులిలా.. భవనం లేదా స్థలం.. యజమానులు కానీ ఆక్యుపైయర్లు కానీ ఏడు రోజుల్లోగా దిగువ పత్రాలు, సమాచారం అందజేయాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. 1. సేల్ డీడ్ 2. లింక్ డాక్యుమెంట్ (ఏదైనా ఉంటే) 3. మంజూరు ప్లాన్/అనుమతి కాపీ 4. ఎప్పటి నుంచి ఉంటున్నారు ? 5.ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ 6. టాక్స్ రసీదు 7. రిజిస్టర్డ్ లీజ్ డీడ్(ఏదైనా ఉంటే) లేదా రెంటల్ అగ్రిమెంట్ 8. భవనం కలర్ ఫొటో దశాబ్దాల క్రితం నిర్మాణ అనుమతులు పొందిన వారిలో చాలామంది వద్ద పైన పేర్కొన్న డాక్యుమెంట్లన్నీ అందుబాటులో లేవు. కొన్ని భవనాలు చాలామంది చేతులు మారాయి. వాటన్నింటినీ ఇప్పుడెలా తేవాలో తెలియక వారు ఆందోళనకు గురవుతున్నారు. -
GHMCకి కొత్త ప్రాబ్లమ్స్..
-
ప్రపంచ స్థాయి వైద్యం నగరంలో దొరుకుతుంది : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ : నగరంలో రోజురోజుకు మెడికో టూరిజం అభివద్ధి చెందుతున్నదని ఇది నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మంచి పరిణామమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాన్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్లద్దాలు పెట్టుకొని కనిపిస్తుంటే బాధగా ఉందని స్మార్ట్ ఫోన్లు వినియోగం వల్లనే వారి కళ్లు దెబ్బతింటున్నాయని ఆమె అన్నారు.తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అప్పుడే వారు కళ్ళద్దాలకు దూరమవుతారని అన్నారు. మన దేశంలోని వివిధ నగరాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులను ప్రతియేటా నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకొని వెళ్తున్నారని ఈ సంఖ్య ప్రతి యేటా పెరుగుతున్నదని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిపుణులతో పాటు అదే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం నగరంలోని పలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటమే ఇందుకు గల కారణమని అన్నారు.అనంతరం ప్రాన్ కేర్ ఐకేర్ వైద్యురాలు అంజనీ ప్రతాప్ మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న పిల్లల కంటి సమస్యలు దూరపు చూపు కనిపించకపోవడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయని ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ప్రతి ఒక్కరు వారి ఇళ్ళల్లో పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల పిల్లల కళ్లు దెబ్బతింటున్నాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వవొద్దని సూచించారు. తమ ఆస్పత్రిలో 20 రోజుల పాటు 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా స్రీనింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, డాక్టర్ జి. సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ రాజలింగం, ప్రణవ్, సీఎం రావు తదితరులు పాల్గొన్నారు. -
పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త
హైదరాబాద్, సాక్షి: ఉద్యోగులకు జీహెచ్ఎంసీ దీపావళి శుభవార్త చెప్పంది. ఈరోజు సాయంత్రం వరకు జీతాలు విడుదల చేయనున్నట్లు ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. జీహెచ్ఎంసీ రూ.120 కోట్ల నిధులను విడుదల చేయనుంది. అయితే.. జీహెచ్ఎంసీ గత నెల వారం రోజుల ఆలస్యంగా జీతాలు ఇచ్చింది. దసరాకు ఐదు రోజులు ఆలస్యంగా జీతాలు ఇవ్వడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రెండు రోజులు ముందుగానే జీహెచ్ఎంసీ జీతాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. -
బాణాసంచా దుకాణాలకు తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ ఫీజు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండగను పురస్కరించుకొని బాణాసంచా (పటాకుల) దుకాణాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ తీసు కోవాలని జీహెచ్ఎంసీ పేర్కొంది. లైసెన్స్ లేకుండా దుకాణాల ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వబోమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. రిటైల్ అమ్మకాల కోసం దుకాణాలు ఏర్పాటు చేసేవారు రూ.11 వేలు, హోల్‌సేల్ విక్రయాలకు రూ. 66వేలు ట్రేడ్ లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు ఇలా.. బాణాసంచా దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్స్ పొంది నిబంధనలకనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్ణీత ట్రేడ్ లైసెన్స్ ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్/ జీహెచ్ఎంసీ వెబ్సైట్ (www.ghmc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిమాండ్ డ్రాఫ్ట్, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించవచ్చన్నారు. గుర్తింపు కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతులు ఇవ్వాలని కోరారు. బాణాసంచా షాపులను ఫుట్‌పాత్‌లు, జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదని తెలిపారు. తగిన ఫైర్ సేఫ్టీ ఉండాలి.. కాలనీలు, బస్తీలకు దూరంగా ఓపెన్ గ్రౌండ్లో/ పెద్దహాల్లో తగిన ఫైర్‌సేఫ్టీతో ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుకోని ప్రమాదం జరిగితే మంటలను ఆర్పడానికి వీలుగా అగ్నిమాపక నిరోధక పరికరాలు సిద్ధంగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి స్టాల్ వద్ద, చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దుకాణాలకు దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లోనూ బాణాసంచా కాల్చకూడదని, షాపులో ఏర్పాటు చేసే లైట్లు ఇతరత్రా కరెంటు పరికరాలకు నాణ్యమైన విద్యుత్ వైర్‌ను వినియోగించాలని సూచించారు. బాణాసంచా స్టాల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినట్లయితే స్టాల్ హోల్డర్దే బాధ్యతని, చట్టపరమైన చర్యలకు బాధ్యుడని తెలిపారు. ఈ విషయాన్ని తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్లో పొందుపరచనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి పేర్కొన్నారు.చదవండి: స్వీట్ క్రాకర్స్.. మతాబుల రూపాల్లో చాక్లెట్ల తయారీ ప్రభుత్వ ఉత్తర్వులు పాటించాలి.. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఫైర్ క్రాకర్స్ అయిన సిరీస్ క్రాకర్స్/లడీస్ తయారీ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం ఉందని, వాటి అమ్మకాలకు అనుమతించరని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955/న్యాయస్థానాలు/పీసీబీ/ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. బాణాసంచా విక్రయ స్టాళ్లను సంబంధిత డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్‌తో పాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అధికారుల బృందం కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. -
కేబీఆర్ పార్కులో ‘ప్రజా సంబరాలు’ నగరవాసుల సందడి..(ఫొటోలు)
-
HYDRA: హైడ్రాకు హైపవర్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు(హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి) బదలాయించింది. ఆర్డినెన్స్ అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ కట్టడాలు డిజాస్టర్స్ అసెట్స్ ప్రొటెక్షన్‌లో హైడ్రాకు అధికారాలు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధి మొత్తంలో అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపించే అవకాశం హైడ్రాకు కల్పించింది ప్రభుత్వం.గవర్నర్ ఆమోదంఇప్పటికే హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ‘హైడ్రా’ చట్టబద్ధతపై హైకోర్టు పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించి ఆర్డినెన్స్‌ను రూపొందించింది. ఇప్పటివరకు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఉన్న పలు అధికారాలను ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌తో తన అధీనంలోకి తీసుకుంది. అయితే ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నివృత్తి చేశారని, దీనితో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. కొత్తగా ‘సెక్షన్ 374–బీ’ని చేరుస్తూ ఆర్డినెన్స్జీహెచ్ఎంసీ చట్టం-1955లో ఇప్పటి వరకు 374, 374-ఎ సెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ 374-బి చేర్చుతూ ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించింది. అందులోని అంశాలకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇతర సంస్థకైనా అప్పగించవచ్చని ఆర్డినెన్స్ చెబుతోంది. ఆ ఆర్డినెన్స్‌కు అనుగుణంగానే..తాజాగా, ఆ అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. తద్వారా హైడ్రాకు అదనపు బలం సమకూరినట్లైంది.👉చదవండి : హైడ్రాకు బిగ్ రిలీఫ్ -
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఈటల భేటీ
ఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కంటోన్మెంట్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు కారుణ్య నియామకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.కరోనా సమయంలో పనిచేస్తూ దాదాపు 100 మందికి పైన పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారు. చనిపోయిన కార్మికుల అంశాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని కారుణ్య నియామకాలు చేపట్టాని కోరారు.కారుణ్య నియామకాలు ఐదు శాతం మించకూడదన్న నిబంధనను సడలించి , ఈ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
TG: ఆమ్రపాలికి కేంద్రం షాక్
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఆమ్రపాలితో పాటు తెలంగాణ కేడర్ కావాలన్న 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. వీరందరినీ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ 11 మంది ఐఏఎస్‌లలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు విద్యుత్ శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్ కూడా ఉన్నారు. వీరందరూ తమకు తెలంగాణ కేడర్ కావాలని కేంద్రంలోని డీవోపీటీ శాఖకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరి విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. ఇదీ చదవండి: ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం: వినోద్‌కుమార్ -
లంచగొండి భార్య... పట్టించిన భర్త!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి అవినీతి బండారాన్ని కట్టుకున్న భర్తే అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తన భార్య జ్యోతి ప్రతి రోజూ లంచం తీసుకుంటుందంటూ ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఉన్న డబ్బుల వీడియోలను విడుదల చేశారు ఆమె భర్త. ఇంట్లో డబ్బుల్ని దాచిన ప్రతి చోటు చూపిస్తూ వీడియోల్ని విడుదల చేశారు.జ్యోతి నిత్యం లక్షల్లో లంచం తీసుకుంటుందని, ఏడేళ్ల నుంచి లంచం తీసుకోవద్దని వద్దని వారించినా భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడం తనని మనోవేదనకు గురి చేస్తుందంటూ విడుదల చేసిన వీడియోల్లో పేర్కొన్నారు.లంచం మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చినా.. డబ్బులు తీసుకోకుండా ఇంటికి వచ్చేది కాదు. దాదాపూ రూ.80లక్షల విలువైన నోట్ల కట్టలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. తన భార్య తీసుకున్న లంచానికి ఇవే సాక్షాలంటూ వీడియోల్ని విడుదల చేశారు.మణికొండలోని కాంటట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటూ ఇంటికి భారీగా లంచాలు తీసుకువస్తుందంటూ ఆమె భర్తే ఆరోపించారు. ఇదే విషయంలో జ్యోతితో గొడవ పడ్డానని, అయినా తనలో మార్పురాలేదన్నారు. పైగా తాను లంచం తీసుకోకూడదు అని అనుకున్నా.. పై అధికారులు లంచం తీసుకోమని ప్రోత్సహిస్తున్నారని చెబుతూ వస్తుందని వాపోయారు. చివరికి భార్య చేస్తున్న తప్పును తట్టుకోలేక ఈ వీడియోలు తీసినట్లు జ్యోతి భర్త విడుదల చేసిన వీడియోలో తెలిపారు. మరోవైపు జ్యోతిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీకి బదిలీ చేయించుకున్నారు.