
వారి గుర్తింపు కార్డుల జారీలో జాప్యం చేయొద్దు
‘ప్రజావాణి’లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి
సాక్షి, హైదరాబాద్: తమకు గుర్తింపు కార్డులివ్వడంలో అధికారులు ఆలస్యం చేస్తున్నారని, తద్వారా కొన్ని సదుపాయాలు పొందలేకపోతున్నామని సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కొందరు సీనియర్ సిటిజన్లు కమిషనర్ ఇలంబర్తికి ఫిర్యాదు చేశారు. వారి సాదకబాధకాలు విన్న కమిషనర్ సీనియర్ సిటిజన్లకు గుర్తింపు కార్డులివ్వడంలో జాప్యం చేయొద్దని, వారిని ఇబ్బంది పెట్టొద్దని సంబంధిత అధికారుకు సూచించారు.
ఇవి మాత్రమే కాకుండా ప్రజల నుంచి అందే అన్ని ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచి్చన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఆయన సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరితంగా పరిష్కరించాలని సూచించారు. ఈ వారం ప్రధాన కార్యాలయానికి మొత్తం 82 విజ్ఞప్తులు రాగా, ఎప్పటిలాగే టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించినవి అత్యధికంగా 46 ఉన్నాయి. మిగతావి ఆస్తిపన్ను, ఆరోగ్యం, ఇంజినీరింగ్ (నిర్వహణ), పరిపాలన, విద్యుత్, భూసేకరణ, యూబీడీ, హౌసింగ్, ఫైనాన్స్ విభాగాలకు సంబంధించినవి ఉన్నాయి.
కార్యాలయం దాకా రాలేని ఆరుగురు ఫోన్ ద్వారా తమ తమ సమస్యల గురించి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, గీతా రాధిక, పంకజ, రఘు ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, యాదగిరి రావు, సీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జోన్లలో జరిగిన ప్రజావాణి కార్యక్రమాల్లో ఆరు జోన్లలో వెరసి 112 అర్జీలందాయి. వాటిల్లో కూకట్‌పల్లి జోన్‌లో 51, ఎల్‌బీనగర్‌లో 13, శేరిలింగంపల్లిలో 12, సికింద్రాబాద్‌లో 27, చార్మినార్‌లో 8, ఉండగా, ఖైరతాబాద్‌జోన్ కేవలం ఒక్కటి మాత్రమే అందడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment