Bhadradri
-
రామయ్యకు స్నపన తిరుమంజనం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి బుధవారం వైభవంగా స్నపన తిరుమంజనం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నేటి నుంచి మంత్రి తుమ్మల పర్యటన ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం పది గంటలకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో జరిగేసమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అలా గే, మధ్యాహ్నం 3.30 గంటలకు గాంధీచౌక్‌లోని నర్తకి థియేటర్ రోడ్డులో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి, 4గంటలకు రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెంలో మూడో రైల్వే లైన్ భూనిర్వాసితులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారు. అలాగే, శుక్రవారం ఉదయం 10 గంటలకు దమ్మపేట మండలం అలీపురంలో గ్రామపంచాయతీ, పాఠశాల భవనాలను ప్రారంభిస్తారు. ఇక శనివారం ఉదయం 10 గంటలకు అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పాల్గొననున్నారు.నేడు ఎస్సీ వర్గీకరణపై బహిరంగ విచారణ ఖమ్మం సహకారనగర్: ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ గురువారం విచారణ చేపట్టనుందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో ఉదయం 11నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ ఆధ్వర్యాన విచారణ చేయనున్నారని వెల్లడించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని షెడ్యూల్డ్ కుల సంఘాల నాయకులు వర్గీకరణపై వినతులు అందించవచ్చని తెలిపారు. వైభవంగా మహా చండీయాగం తల్లాడ: లోక కళ్యాణార్థం గ్రామస్తులంతా ఏకమై నిర్వహించిన మహా చండీయాగం వైభవంగా ముగిసింది. తల్లాడ మండలం నారాయణపురంలో 70 హోమ గుండాలు ఏర్పాటుచేసి 90 మంది బ్రాహ్మణుల సమక్షాన కంచెల సతీష్‌శర్మ, పెనుగంచిప్రోలుకు చెందిన రాజోలు భానురవికిరణ్శర్మ బుధవారం ఈ యాగం జరిపించారు. తెల్లవారుజామున గణపతి పూజతో మొదలైన యాగంలో 207 మంది దంపతులు కూర్చున్నారు. ఇందులో 200 క్వింటాళ్ల పాయసం, వివిధ రకాల పూజాసామగ్రిని ఉపయోగించారు. హోమశాలను అరటి ఆకులు, బంతిపూలతో అలంకరించగా ప్రతీ ఇంటికి బంధుమిత్రులు రావడమే కాక నారాయణపురం, తల్లాడ పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో నారాయణపురం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. -
విద్యా సామర్థ్యాలు మెరుగుపరచాలి
బూర్గంపాడు/గుండాల/ఇల్లెందురూరల్ : గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేపట్టాలన్నారు. ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థుల కనీస సామర్థ్యాలను పెంచేందుకే ఉద్దీపకం వర్క్‌బుక్ విడుదల చేశామని చెప్పారు. బుధవారం ఆయన బూర్గంపాడు మండలం వేపలగడ్డ, ఇల్లెందు మండలం రొంపేడు, గుండాల మండలం కాచనపల్లి ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యాసన తీరును పరిశీలించారు. పిల్లలతో పాఠ్యాంశాలు చదివించి, బోర్డుపై రాయించారు. వర్క్‌బుక్‌లోని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు, భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఉద్దీపనం వర్క్‌బుక్‌లోని పలు అంశాలను విద్యార్థులకు బోధించిన ఆయన కఠినమైన అంశాలను సులభంగా ఎలా నేర్చుకోవచ్చో అవగాహన కల్పించారు. ఇంగ్లీష్, గణితం సబ్జెక్టుల్లో సామర్థ్యాల పెంపునకు ఈ వర్క్‌బుక్ ఉపకరిస్తుందన్నారు. విద్యార్థులకు అర్థం కాని అంశాలను మరోసారి బోదించి ప్రాథమిక స్థాయిలోనే బలమైన పునాదులు వేయాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులను చదివించడంతో పాటు రాయించాలని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ డీడీ మణెమ్మ, ఏటీడీఓ రాధమ్మ, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భద్రు, సుభద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఇదేం సహకారమో!?
కొను‘గోల్మాల్’.. జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా.. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 20 మండలాల పరిధిలో 160 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ వ్యవసాయ మార్కెట్లకు అనుబంధంగా ఉన్న ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈ కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతోంది. పట్టదారు పాసు పుస్తకాలు చూపించి ఇక్కడ ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. అయితే రైతుల వద్ద తక్కువ ధరకే కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఈ కేంద్రాల్లో అమ్మడం ద్వారా మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ కూడా ప్రైవేటు వ్యాపారులకే దక్కుతోంది. వ్యవసాయ శాఖ జారీ చేసే ఎన్డీఎస్ (నాన్ డిజిటల్ సైన్) కూపన్లను దుర్వినియోగం చేస్తూ వ్యాపారులు, దళారులు అమ్మకాలు సాగిస్తున్నారు. అయితే భారీగా సేకరించే ధాన్యం మొత్తాన్ని కూపన్ల ద్వారానే అమ్మడం సాధ్యం కాదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో పని చేసే కొందరు సిబ్బంది సహకారంతో తమ పని కానిచ్చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వాట్సాప్ స్టేటస్లు, చాయ్ పే చర్చల్లో రైతులకు అండగా ఉంటామని చెప్పడానికి అందరూ ముందుకొస్తారు కానీ.. క్షేత్రస్థాయిలో అన్నదాతలకు అండగా నిలిచేవారు కరువైపోతున్నారు. చివరకు కొనుగోలు కేంద్రాలు నిర్వహించే ప్రాథమిక సహకార సంఘాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దళారులకే ఎక్కువ.. జిల్లా వ్యాప్తంగా 5.80 లక్షల ఎకరాల భూమి సాగవుతుండగా పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు 1.77 లక్షల మంది ఉన్నారు. ఇందులో కేవలం రెండెకరాల లోపు భూమి కలిగిన రైతులు 56 వేల మందికి పైగా ఉండగా, రెండు నుంచి ఐదెకరాలు కలిగిన వారు 70 వేలకు అటు ఇటుగా ఉన్నారు. చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి మొదలు ధాన్యం అమ్మేవరకు ప్రతీ చోట ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. పెట్టుబడి సాయం పేరిట ముందుగానే ప్రైవేటు వ్యాపారులు గ్రామాల్లో వాలిపోయి వీరిని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. ఈ రైతులతో పాటు అప్పు తీసుకోకుండా సాగు చేసిన రైతులకు సైతం ధాన్యం కోయడం నుంచి అమ్మడం వరకు అదనపు ఖర్చులు అవుతుండడంతో గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులు, దళారులకే పంట అమ్మేసుకుంటున్నారు. ఫలితంగా బోనస్ మాట దేవుడెరుగు.. కనీసం మద్దతు ధర కూడా దక్కించుకోలేక శ్రమ దోపిడీకి గురవుతున్నారు. మరోవైపు రైతులు కష్టించి పండించిన ధాన్యం కారుచౌకగా ప్రైవేటు వ్యాపారుల పరం అవుతోంది. సర్దుబాటు దందా.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక ఎకరానికి 28 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయొచ్చు. నేల స్వభావం, నీటి వసతి ఉన్న చోట 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధించే రైతులు కూడా ఉన్నారు. అయితే జిల్లా సగటు దిగుబడిని పరిగణనలోకి తీసుకుంటే ఎకరానికి 21 క్వింటాళ్ల వరకే దిగుబడి వస్తోంది. అంటే ప్రతీ ఎకరా మీద సగటున ఏడు క్వింటాళ్ల వరకు మిగులు కనిపిస్తోంది. ఇలా ఒక కేంద్రంలో ఒక రోజు మిగులుగా వచ్చే మొత్తాన్ని ప్రైవేటు వ్యాపారుల దగ్గరున్న ధాన్యంతో రికార్డుల్లో సర్దుబాటు చేస్తున్నారు. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక కొనుగోలు కేంద్రం చొప్పున ఉండడంతో స్థానిక రైతులతో ఉండే సంబంధాలను ఆసరాగా చేసుకుని ఈ దందా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. దీంతో చెమటోడ్చిన రైతులకు దక్కాల్సిన ప్రభుత్వ సాయం వ్యాపారుల పరం అవుతోంది. ఈ దందాకు సహకరించిన వారికీ తగిన ఫలితం దక్కుతోంది. తనిఖీలు కరువు.. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లలో సాగుతున్న మోసమే నిన్నా మొన్నటి వరకు పత్తి విషయంలోనూ జరిగింది. ఏళ్ల తరబడి ఈ అవినీతి తంతు కొనసాగుతున్నా అడ్డుకునే వారు కరువయ్యారు. ఫిర్యాదులు రాలేదనే సాకుతో రైతుల కష్టానికి ఫలితం దక్కకుండా చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస తనిఖీలు చేయడం లేదు. తేమ శాతంపై అధికారులు పెట్టే శ్రద్ధలో నాలుగో వంతైనా ఇలాంటి అక్రమ వ్యవహారల మీద పెడితే రైతు కష్టానికి తగ్గ ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. అక్రమాల అడ్డుకట్టకు చర్యలు జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అక్రమాలు జరిగాయని తెలిస్తే మాకు సమాచారం అందించాలని రైతులను కోరుతున్నాం. ఆ వెంటనే ఆయా మండలాల డిప్యూటీ తహసీల్దార్లతో కలిసి విచారణ చేస్తాం. అక్రమాలు నిజమేనని తేలితే బాధ్యులపై చర్య తీసుకుంటాం. రైతులకు ఇబ్బంది కలుగకుండా కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తున్నాం. – రుక్మిణి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ధాన్యం కొనుగోళ్లలో సర్దుబాటు దందా ప్రభుత్వ కేంద్రాల్లో భారీగా అవకతవకలు రైతుల కోటాలో విక్రయిస్తున్న వ్యాపారులు వారితో కుమ్మక్కవుతున్న సిబ్బంది -
విషవాయువుపై అవగాహన కల్పించండి
అశ్వాపురం: భారజలం ఉత్పత్తి ప్రక్రియలో విషవాయువు హైడ్రోజన్ సల్ఫైడ్ విడుదలైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీప గ్రామాల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండల కేంద్రంలోని గౌతమీ నగర్ కాలనీలో గల పర్ణశాల అతిథి గృహంలో బుధవారం జీఎం హెచ్‌కే.శర్మ అధ్యక్షతన భారజల కర్మాగారం ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ సబ్‌ప్లాన్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ చైర్మన్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా.. ప్రమాదవశాత్తూ విషవాయు వు విడుదలైతే భారజల కర్మాగారం రక్షణ పరిధిలోని గ్రామాల్లో యాజమాన్యం చేపడుతున్న చర్యలు, ముందు జాగ్రత్తగా చేపట్టే కార్యక్రమాల గురించి కర్మాగారం అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. యాజమాన్యం చేపడుతున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు, మీడియా సహకారంతో విస్తృత ప్రచారం నిర్వహించాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆ తర్వాత అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. సమావేశంలో భారజల కర్మాగారం డీజీఎం జి.శ్రీనివాసరావు, సీఏఓ వేణు, మెడికల్ సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, సేఫ్టీ మేనేజర్ యోహాన్, రఫీక్ అహ్మద్, ఐఆర్ఓ లత, సీఐ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ స్వర్ణలత, ఎంపీడీఓ వరప్రసాద్, ప్రభుత్వ వైద్యాధికారి సంకీర్తన పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
యాప్ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి
బూర్గంపాడు: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం అధికారులు మొబైల్ యాప్ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి సూచించారు. మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో చేపట్టిన సర్వేను బుధవారం ఆమె పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఇంటిని పరిశీలించి మొబైల్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. మొక్కలకు రోజూ నీరు పెడుతూ జాగ్రత్తగా కాపాడాలని సిబ్బందిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి చిన్నారులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి -
సమ్మెతో స్తంభించిన బోధన..
● ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆందోళనతో కేజీబీవీ విద్యార్థుల ఇక్కట్లు ● విద్యాశాఖలోనూ నిలుస్తున్న పలు రకాల పనులు ● ఆగిన ఆధార్ అప్డేట్, ఆన్లైన్ హాజరు నమోదు ప్రక్రియకొత్తగూడెంఅర్బన్ : తమను రెగ్యులర్ చేయాలంటూ జిల్లాలోని 650 మంది సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. అంతకుముందు నాలుగు రోజుల పాటు రోజుకు కొందరు చొప్పున నిరసన దీక్ష చేశారు. ఉద్యోగుల సమ్మెతో విద్యాశాఖలో పనులు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా కేజీబీవీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది విధులు బహిష్కరించడంతో ఆయా విద్యాలయాల్లో తరగతుల నిర్వహణ ఆగిపోయింది. పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రస్తుత సమయం ఎంతో కీలకం. కొన్ని సబ్జెక్టుల సిలబస్ చివరి దశలో ఉండగా, మరి కొన్ని సబ్జెక్టులు ఇంకా చాలావరకు మిగిలింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వార్షిక పరీక్షలకు సిద్ధం కావాల్సిన ఈ తరుణంలో ఉపాధ్యాయుల సమ్మెతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడమో లేదంటే వారి స్థానంలో ఇతర పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను కేజీబీవీలకు రప్పించడమో చేయాలని కోరుతున్నారు. ఆగిన ఆధార్ అప్డేట్.. ప్రస్తుతం పలు పాఠశాలల్లో ఆన్లైన్లో హాజరు నమోదు, ఆధార్ అప్డేట్ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు యూనిక్ ఐడీ జనరేట్ పనులు కూడా నడుస్తున్నాయి. ఈ పనులన్నీ సమగ్ర శిక్ష ఉద్యోగులే చేయాల్సి ఉండగా, సమ్మెతో స్తంభించిపోతున్నాయి. జిల్లా విద్యాశాఖలో ఏపీఓలుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, సాంకేతిక ఉద్యోగులుగా, మేనేజర్లుగా, మండల స్థాయిలో ఎంఐఎస్ కో–ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్పీలుగా, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లుగా, పాఠశాల స్థాయిలో పీఈటీలు, కేజీబీవీ, యూఆర్ఎస్ల్లో ప్రత్యేకాధికారులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు పని చేస్తున్నారు. సమ్మెతో వీరంతా చేయాల్సిన పనులు నిలిచిపోతున్నాయి. ఇంకా ఏఎన్ఎంలు, అకౌంటెంట్లు, వంట మనుషులు, వాచ్మెన్స్, స్వీపర్లుగా కూడా దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయినా వారిని నేటికీ క్రమబద్ధీకరించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఉద్యోగుల సమ్మెకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఇతర యూనియన్లు మద్దతు ప్రకటించాయి. ప్రధాన డిమాండ్లు ఇవే.. ● కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేయాలి. అప్పటివరకు బేసిక్ పే ఇవ్వాలి ● ప్రతీ ఉద్యోగికి జీవిత బీమా రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా రూ.10 లక్షల సౌకర్యం కల్పించాలి ● పీటీఏలకు ఎస్‌ఎస్‌ఏల వలే 12 నెలల వేతనం ఇవ్వాలి ● ఎస్ఎస్ఏలు ఉద్యోగ విరమణ చేస్తే బెనిఫిట్స్ కింద రూ.25 లక్షలు చెల్లించాలి సమస్య పరిష్కరించే వరకూ ఉద్యమం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమిస్తాం. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మాకు న్యాయం చేయాలి. మా సమ్మెతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతున్నా.. తప్పని పరిస్థితుల్లో మేం ఆందోళన చేయాల్సి వస్తోంది. – భూక్యా మోహన్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడువిద్యార్థుల భోజనానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెలో ఉండడంతో కేజీబీవీల్లో బోధనకు సమస్యలు తలెత్తున్నాయి. అయితే విద్యార్థుల భోజనానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీంతో పాటు ఆధార్ అప్డేట్, విద్యార్ధుల యూనిక్ ఐడీ ఎంట్రి ప్రక్రియలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – ఎం.వెంకటేశ్వరాచారి, డీఈఓ -
రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతం చేయాలి
పాల్వంచ: లక్ష్మీదేవిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఈనెల 19 నుంచి 21 వరకు జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలని మల్టీజోనల్ అధికారి కె.అలివేలు, జోనల్ అధికారి కె.స్వరూపరాణి అన్నారు. బుధవారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలు నిర్వహిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,400 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరవుతారని తెలిపారు. అనంతరం క్రీడల నిర్వహణ కమిటీలు వేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పీవీఎన్.పాపారావు, శ్రీలత, విజయ దుర్గ, పద్మావతి, నాగేశ్వరరావు, స్వరూప రాణి, మిథిల, సునీత తదితరులు పాల్గొన్నారు. -
కొలిక్కిరాని ఫుడ్‌కోర్టులు..!
● ఏళ్ల తరబడిగా నిరుపయోగంగా షెడ్లు ● వీధి వ్యాపారులకు కేటాయించాలని పలువురి విన్నపం కొత్తగూడెంఅర్బన్: పట్టణంలోని గాజులరాజం బస్తీలో జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆనుకుని నిర్మించిన షెడ్లను ఇటీవల కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. ఏళ్ల తరబడిగా ఎందుకు నిరుపయోగంగా ఉంచుతున్నారని అధికారులను ప్రశ్నించారు. షెడ్లలో మహిళా సంఘాలతో ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఇప్పటివరకు రెండుసార్లు పరిశీలించి అధికారులను ఆదేశించినా ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయలేదు. అయితే ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తే అందులో వంటకాలు చేసే అవకాశం ఉండదు. వేరే చోట తయారు చేసి, తీసుకొచ్చి అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. దీంతో తినుబండరాలు వేడి వేడిగా ఉండవని, విని యోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపరని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. దీనికితోడు నిర్వాహకులపై రవాణా భారం పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు కూడా ఫుడ్ కోర్టులకు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. కాగా దరఖాస్తులు వస్తే ఏర్పాటుకు చర్యలు చేపడతామని మెప్మా సిబ్బంది చెబుతున్నారు. వీధి వ్యాపారులకు కేటాయిస్తే.. గాజులరాజంబస్తీలో జిల్లా ప్రధాన ఆస్పత్రి గోడకు ఆనుకుని ఆరేళ్ల క్రితం చిరువ్యాపారుల కోసం రూ. 20 లక్షల మున్సిపల్ నిధులతో 15 రేకుల షెడ్లు నిర్మించారు. నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు వీధివ్యాపారులకు కేటాయించలేదు. మరోవైపు సింగరేణి మెయిన్ ఆస్పత్రి ఏరియా నుంచి బూడిదగడ్డ, హనుమాన్‌బస్తీ, గాజులరాజంబస్తీ ప్రజలంతా కూడా నిత్యావసరాలు, కూరగాయల కోసం సూపర్బజార్లోని రైతుబజార్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఏళ్ల తరబడిగా నిరూపయోగంగా ఉన్న షెడ్ల దగ్గర ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయకపోతే వీధి వ్యాపారులకు కేటాయించాలని పలువురు కోరుతున్నారు. దీనివల్ల స్థానిక ప్రజలకు అన్ని రకాల వస్తువులు, కూరగాయలు కూడా అందుబాటులో దొరికే అవకాశం ఉంటుంది. మున్సిపాలిటీకి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. చర్యలు చేపడుతున్నాం.. గాజులరాజంబస్తీలో నిర్మించిన షెడ్లలో ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాటుకు మెప్మా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేస్తాం. – శేషాంజన్‌స్వామి, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ -
బంకర్‌ను ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్
మణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. 12 వేల లీటర్లతో ప్రయాణిస్తున్న డీజిల్ ట్యాంకర్ బుధవారం ఉదయం బంకర్‌ను ఢీకొట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మణుగూరులోని సింగరేణికి ఇతర ప్రాంతాల నుంచి డీజిల్ ట్యాంకర్లు వచ్చి ఏరియా స్టోర్స్ వద్ద దిగుమతి చేసి వెళ్తుంటాయి. అక్కడి నుంచి అవసరమైన గని ప్రదేశాలకు సింగరేణి డీజిల్ ట్యాంకర్ల ద్వారా తరలించుకుంటారు. ఈ క్రమంలో ఉదయం సమయంలో ఓసీ–4 వైపు నుంచి ఓసీ–2 కొత్త సైట్ ఆఫీస్ వైపు వెళ్తున్న సింగరేణి డీజిల్ ట్యాంకర్ కేసీహెచ్పీ మీదుగా వెళ్తూ సీ–21 వద్ద బంకర్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో ట్యాంకర్లో దాదాపు 12 వేల లీటర్ల డీజిల్ ఉంది. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని అధికారులు, కార్మికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సంఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఒకవైపు ఏరియాలో 55వ రక్షణ పక్షోత్సవాలు జరుగుతుండగా, మరోవైపు ప్రమాదం తప్పడం పట్ల వాహనం ఫిట్‌నెస్‌పై, రక్షణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రాత్రంతా యార్డులోనే చిన్నారులు
అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామానికి చెందిన పర్శిక ప్రసాద్(10), కావ్య(8), నాగశ్రీ(7) మంగళవారం ఉదయం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు పాఠశాల నుంచి ఇంటికి రాలేదు. పిల్లలు ఇంటి సమీపంలో ధాన్యం యార్డులో ఆడుకుని అక్కడే నిద్రపోయారు. రాత్రి వరకు పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై తిరుపతిరావు, సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు, మొండికుంట, మల్లెలమడుగు గ్రామాలకు చెందిన యువత రాత్రంతా పిల్లల కోసం వెతికారు. ఆచూకీ తెలియకపోవటంతో తల్లిదండ్రులు, బంధవులు ఆందోళన చెందారు. ఉదయం పిల్లలు ధాన్యం యార్డు సమీపంలో పడుకుని ఉండటాన్ని పోలీసులు, స్థానికులు గమనించి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా రాత్రంతా పిల్లల కోసం వెతికిన సీఐ అశోక్‌రెడ్డిని, సిబ్బందిని తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు. ఆచూకీ తెలియక తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన -
గిరిజన విద్యార్థులకు బంగారు భవిష్యత్
● ఉపాధ్యాయుల లక్ష్యం ఇదే కావాలి.. ● పలు పాఠశాలల్లో తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ రాహుల్ కారేపల్లి: గిరిజన విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే పాఠశాలల ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి.రాహుల్ సూచించారు. కారేపల్లి మండలంలోని గాంధీనగర్ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను పీఓ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించిన ఆయన వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై శ్రద్ధ కనబర్చాలని ప్రిన్సిపాల్, అధ్యాపకులకు సూచించారు. అలాగే, ఆహారంలో నాణ్యత లోపించకుండా మెనూ అమలు చేయాలని, సామగ్రి సేకరణ, నిల్వ సమయాన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రిన్సిపాల్, డిప్యూటీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల్లో రోజుకు ఇద్దరు చొప్పున భోజనం తిన్నాకే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. అనంతరం భల్లునగర్ గిరిజన పాఠశాలను సందర్శించిన పీఓ అక్కడ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఐటీడీఏ అందించిన ఉద్దీపకం వర్క్ బుక్స్ ద్వారా బోధన చేపట్టాలని సూచించారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ విజయలక్ష్మి, గురుకులాల ఆర్సీఓ నాగార్జునరావు, ప్రిన్సిపాల్ హరికృష్ణ, డిప్యూటీ వార్డెన్ పాషా, అధ్యాపకుడు గామయ్య పాల్గొన్నారు. ఖమ్మంరూరల్: మండలంలోని గొల్లగూడెం ఆశ్రమ బాలికల పాఠశాలను ఐటీడీఏ పీఓ రాహుల్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, లేదా అని ఆరా తీశారు. అలాగే, విద్యార్థులతో ఉద్దీపకం పుస్తకాలను చదివించి సామర్థ్యాలను పరీక్షించారు. అనుకున్న సమయానికి సిలబస్ పూర్తిచేసి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేలా అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి పీఓ మధ్యాహ్న భోజనం చేశారు. ఏటీడీఓలు జహీరుద్దీన్, సత్యవతి, ఏసీఎంఓ రాములు, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, హెచ్‌డబ్ల్యూఓ రమాకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తిరుమలాయపాలెం: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశించారు. తిరుమ లాయపాలెం మండలంలోని మాదిరిపురం గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సెస్సీ, ఆరో తరగతి విద్యార్థులతో మాట్లా డి వారికి అందిస్తున్న ఆహారం, బోధనపై ఆరాతీశారు. అలాగే, వివిధ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. అనంతరం వంట తయారీ గదిని పరిశీలించి నాణ్యతపై సూచనలు చేశారు. ప్రిన్సిపాల్ భాస్కర్, వైస్ ప్రిన్సిపాళ్లు జాను, అనిత, ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మణ్, ఇన్చార్జ్ వార్డెన్ బాబు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
టేకులపల్లి: మండలంలోని గంగారం పంచాయతీ సిద్ధారం నటరాజ ఆలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (45) బుధవారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి భిక్షాటన చేసే వ్యక్తిలా ఉన్నాడని బోడు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు. నలుపు, తెలుపు రంగు జుత్తు కలిగి ఉన్నాడని, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే 87126 82077 నంబరులో సంప్రదించాలని కోరారు.చెరువులో పడి వ్యక్తి ..వేంసూరు: ప్రమాదవశాత్తు చెరువులో పడిన ఓ వ్యక్తి మృతి చెందగా బుధవారం మృతదేహం బయటపడింది. మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన యమవరపు మారేశ్వరరావు (46) మంగళవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు స్థానిక చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. స్థానికులు గాలించగా బుధవారం ఉదయం మృతదేహం బయటపడటంతో పోలీసులకు కుటుంబీకులు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ సత్యం తెలిపారు. చికిత్స పొందుతున్న యువకుడు..నేలకొండపల్లి: పురుగులమందు తాగిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని కోనాయిగూడెంనకు చెందిన కొలికపొంగు నాగరాజు (22) గత నెల 22న పురుగులమందు తాగగా కుటుంబీకులు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందాడు. పోలీసులకు చిక్కిన హత్య కేసు నిందితులు? నేలకొండపల్లి: మండల కేంద్రానికి చెందిన దంపతులు ఎర్రా వెంకటరమణ – కృష్ణకుమారి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. గత నెల 27న దంపతుల హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు సవాల్‌గా తీసుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా సీసీ పుటేజీలు, కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కానీ, ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. అయితే, గురువారం లేదా శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలను జిల్లా అధికారులు వెల్లడించనున్నట్లు సమాచారం. -
టిప్పర్, వ్యాన్ ఢీ.. ఇద్దరికి గాయాలు
సత్తుపల్లిటౌన్: ఎదురెదురుగా వచ్చిన బొగ్గు టిప్పర్, డీసీఎం వ్యాన్ ఢీకొనటంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన సత్తుపల్లిలో చోటుచేసుకుంది. మండలంలోని కిష్టారం ఓపెన్ కాస్ట్ నుంచి పెనుబల్లి వైపు వెళ్తున్న బొగ్గు టిప్పర్.. ఖమ్మం నుంచి సత్తుపల్లి వైపు ట్రావెలింగ్ బ్యాగ్‌ల లోడ్‌తో వస్తున్న డీసీఎం వ్యాన్.. బుధవారం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో వ్యాన్ దూసుకెళ్లి బ్రిడ్జి, చెట్టును ఢీకొని ఆగిపోయింది. వ్యాన్‌డ్రైవర్, ఏపీలోని కృష్ణా జిల్లా వత్సవాయికి చెందిన కె.రవి పక్కనే కాల్వలో పడగా ఆయన్ను కానిస్టేబుళ్లు ఇమ్రాన్, వంశీ, సుధాకర్ అతికష్టం మీద పైకి తీసుకొచ్చి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే, రుద్రంపూర్‌కు చెందిన బొగ్గు టిప్పర్ డ్రైవర్ శివకుమార్‌కు కూడా తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అనంతరం ఇద్దరినీ ఖమ్మం తరలించారు. కాగా, సత్తుపల్లి – కిష్టారం మధ్య జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు గంట పాటు శ్రమించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సత్తుపల్లి సీఐ టి.కిరణ్ తెలిపారు. -
కేపీయూజీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని కొండాపురం భూగర్భ గనిలో ఐదు రోజుల నుంచి నీటి నిల్వలు ఆకస్మికంగా పెరుగుతుండటంతో బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల 6వ తేదీన నైట్ షిఫ్ట్ ముగింపు సమయం నుంచి 42 లెవల్ ఎం డిప్‌సైడ్ వద్ద ఉబికి వస్తున్న నీటి వల్ల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. గనిలో చేరిన లక్ష గ్యాలన్ల నీటి నిల్వను తొలగించి ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ఏడు పంపులు ఏర్పాటు చేసినా పరిస్థితి అదుపులోకి రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు సుమారు 1800 జీపీఎం నీటిని ఉపరితలానికి పంపింగ్ చేశారు. భూగర్భంలో భూమి పొరల నుంచి నీటి ప్రవాహం సర్వసాధారణమైనా ఐదు రోజులుగా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడటం అధికారులు మిషన్లు, కార్మికులను ఉపరితలానికి తరలించి ఎమర్జెన్సీ ఆర్గనైజేషన్ ప్రకటించారు. ఆకస్మికంగా వచ్చిన నీటి ప్రవాహ పాయింట్‌ను తెలుసుకునేందుకు హైడ్రో జియోలజిస్టులు అన్వేషిస్తున్నారు. కాగా 2,500 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని డీజీఎం(పర్సనల్) ఒక ప్రకటనలో తెలిపారు. -
సెల్ఫోన్లు రికవరీ.. అప్పగింత
కొత్తగూడెంఅర్బన్: జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్పీ రోహిత్‌రాజు బుధవారం వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో 220 మంది ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్నవారు సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలను కచ్చితంగా నమోదు చేస్తే పోలీసులు ట్రాక్ చేసి, స్వాధీనం చేసుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఐటీ సెల్ ఇన్చార్జి సీఐ నాగరాజురెడ్డి, ఐటీ సెల్ సభ్యులు విజయ్, రాజేష్, నవీన్, మహేష్ పాల్గొన్నారు. -
సీసీఆర్టీకి మణుగూరు ఉపాధ్యాయులు
మణుగూరు టౌన్: కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లో నిర్వహించిన సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (సీసీఆర్టీ)లో మణుగూరు ఉపాధ్యాయులు బుధవారం పాల్గొన్నారు. మొత్తం 14 రాష్ట్రాల నుంచి 84 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. 10 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఎంపిక కాగా, వారిలో జిల్లా మణుగూరు మండలానికి చెందిన ఉపాధ్యాయులు వుయ్యూరు కోటేశ్వరరావు, పరమయ్య ఉన్నారు. సెమినార్లో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను, ఔన్నత్యాన్ని వివరించనున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వీరి ఎంపిక పట్ల ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. హత్యాయత్నం కేసు నమోదు అశ్వారావుపేటరూరల్: ఇంట్లో నిద్రిస్తున్న భార్యను హతమార్చేందుకు యత్నించిన భర్తపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు ఎస్సై టి.యయాతి రాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా గోపాలపురానికి చెందిన పెండ్ర రవి భార్య దుర్గ స్వగ్రామమైన అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామానికి వచ్చి నివాసం ఉంటోంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. భార్యపై అనుమానంతోపాటు కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా భర్త వేరుగా ఉంటున్నాడు. అప్పుడుప్పుడు వచ్చి మద్యం మత్తులో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వచ్చిన రవి నిద్రిస్తున్న భార్యపై మంచం పట్టెతో నుదుటి, తలపై దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు గట్టిగా కేకలు పెట్టడంతో కుటుంబీకులు మేల్కొని వచ్చేసరికి అక్కడి నుంచి పారిపోయాడు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫోన్లు చోరీ
పాల్వంచ: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష రాసేందుకు వెళ్లిన అభ్యర్థి బ్యాగ్‌లో రెండు సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. బాధితురాలి కథనం ప్రకారం.. ఈ నెల 10న వి.ప్రియాంక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష రాసేందుకు వెళ్లింది. అక్కడి సిబ్బంది సూచన మేరకు తన హ్యాండ్ బ్యాగ్‌ను పరీక్ష హాల్ ముందు పెట్టి లోపలికి వెళ్లి పరీక్ష రాసింది. పరీక్ష అనంతరం బయటకు వచ్చి చూడగా బ్యాగ్ ఓపెన్ చేసి ఉంది. బ్యాగ్‌లోని రూ.లక్ష విలువ చేసే రెండు సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయి. బాధితురాలు బుధవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగు రోజుల క్రితం అక్కడ ఓ మోటార్ సైకిల్ ముందు బ్యాగ్‌లో ఉంచిన ఫోన్లు సైతం చోరీ అయినట్లు సమాచారం. -
పత్తి కౌంటర్లపై అధికారుల దాడులు
టేకులపల్లి: అనుమతులు లేకుండా పత్తి కొనుగోళ్లు చేస్తున్న చిల్లర కౌంటర్లపై ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. కొందరు వ్యాపారులు అడ్డగోలుగా తూకం వేయడం, బిల్లులు, రికార్డులు నిర్వహణ సరిగా లేకపోవడం, లైసెన్సులు, అనుమతులు తీసుకోకపోవడం, నకిలీ రిజిస్టర్లు, బిల్లు బుక్‌లు వంటి వాటిని గుర్తించి మందలించారు. జరిమానా విధించారు. 8 కౌంటర్ల నుంచి కాటాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా కొందరు వ్యాపారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాడుల్లో మార్కెట్ కమిటీ కార్యదర్శి నరేష్ కుమార్, సూపర్వైజర్ శ్రీనివాస్‌రావు, సిబ్బంది రంజిత్, మధు, శ్రీను, రమేష్, చందర్ పాల్గొన్నారు. -
గణిత పరీక్షలో విద్యార్థుల ప్రతిభ
కొత్తగూడెంఅర్బన్: పాతకొత్తగూడెంలో పాఠశాలలో బుధవారం గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి మండలం నుంచి ఆంగ్ల, తెలుగు మీడియాల నుంచి 136 మంది విద్యార్థులను ఎంపిక చేసి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఈఓ వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ పరీక్షలు విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెరిగి భయం తొలగించేందుకు పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఏసీజీఈ మాధవరావు, ఎంఈఓ ప్రభుదయాళ్, టీఎంఎఫ్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్, ఏఎంఓ నాగరాజశేఖర్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ సతీష్ కుమార్, పాఠశాల హెచ్ఎం లక్ష్మి, టీఎంఎఫ్ రాష్ట్ర బాధ్యులు హరి, సీహెచ్ మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పేద యువతికి సింగరేణి ఉద్యోగం
చండ్రుగొండ : మద్దుకూరు గ్రామంలోని పేదకుటుంబానికి యువతి కొంగర సాత్విక సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీగా ఉద్యోగం సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇటీవల నియామక పత్రాన్ని సాత్విక అందుకుంది. తండ్రి కొంగర కనకరాజు నాయీబ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ కుమార్తెను చదివించాడు. కాగా సాత్వికను గ్రామస్తులు అభినందించారు. ఐదేళ్ల నిరీక్షణ ఫలించింది.. ● సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికై న సాయికుమార్ ఏన్కూరు: ఆ యువకుడు ఐదేళ్లుగా సివిల్స్ సాధించడమే లక్ష్యంగా అహోరాత్రులు శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యాన ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికవడం విశేషం. ఏన్కూరు మండలం అరికాయలపాడుకు చెందిన నల్లమల శ్రీనివాసరావు – అపర్ణ దంపతుల కుమారుడు సాయికుమార్ ఎస్సెస్సీ వరకు ఏన్కూరు జెడ్పీహెచ్ఎస్లో, ఇంటర్ విజయవాడ చైతన్య కళాశాలలో, ఇంజనీరింగ్ ఓయూలో పూర్తిచేశాడు. వీరి కుటుంబానికి ఎకరం పొలం ఉండగా తండ్రి కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు. దీంతో పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూనే ఐదేళ్లుగా సివిల్స్‌కు సిద్ధమవుతున్న ఆయన ఈసారి రెండు దశలు దాటి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. చిన్నప్పటి నుంచి సివిల్స్ లక్ష్యంగా ఎంచుకున్న సాయికుమార్ అడుగు దూరంలో ఉండగా విజయం సాధించాలని అరికాయలపాడు వాసులు ఆకాంక్షిస్తున్నారు. బైక్ ఢీకొని చిన్నారికి గాయాలుఇల్లెందు: ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ల చిన్నారిని బుధవారం బైక్ ఢీకొనడంతో గాయాలయ్యాయి. పట్టణంలోని 14 నంబర్ బస్తీ 15వ వార్డుకు చెందిన గణేష్ లోథ్ కుమార్తె యామిని ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన విష్ణు లోథ్ బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో చిన్నారికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగుల్ మీరా ఖాన్ కేసు నమోదు చేశారు. ముందస్తు అరెస్ట్ చలో హైదరాబాద్ కార్యక్రమం నేపథ్యంలో ఆరుగురు అంగన్వాడీ టీచర్లను బుధవారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. రేషన్ బియ్యం స్వాధీనం తల్లాడ: మండలంలోని పాత మిట్టపల్లిలో బుధవారం పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందని మీర్జా జిలాన్ బేగ్ ఇంట్లో 20 సంచుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా, తల్లాడ పోలీసులు విచారణ చేపట్టారు. చెరువుమాదారంలో... నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారం గ్రామంలో ఓ ఇంట్లో నిల్వ ఉన్న పీడీఎస్ బియ్యాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దఎత్తున బియ్యం నిల్వలు ఉన్నాయనే సమాచారంతో తనిఖీ చేపట్టి స్వాధీనం చేసుకోగా, బియ్యాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే, ఎంత మేర బియ్యం పట్టుబడిందనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు. వృద్ధురాలి ఆత్మహత్యాయత్నంభద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద బుధవారం గోదావరి నదిలో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు యత్నించగా, బోట్ నిర్వాహకులు కాపాడారు. స్థానికుల కథనం ప్రకారం.. సరిహద్దు ఏపీ కూనవరం మండలానికి చెందిన విజయలక్ష్మికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిని సరిగా చూడకపోవడంతో జీవితంపై విరక్తితో భద్రాచలం వద్ద గోదావరి నదిలో దూకి చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో గోదావరిలో దిగే సమయంలో బోటు నిర్వహకుడు ప్రసాద్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధరాలిని స్టేషన్‌కు తరలించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. బేకరీలో అగ్నిప్రమాదం ఖమ్మంక్రైం: ఖమ్మం కస్బాబజార్లోని ఓ ప్రముఖ బేకరీలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. వంటగది చిమ్నీ నుంచి ఆకస్మాత్తుగా మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఎఫ్ఓ నాగరాజు ఆధ్వర్యాన చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా, బేకరీ చుట్టుపక్కల అన్నీ వ్యాపార దుకాణాలే ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొనగా.. మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
చిరకాల స్వప్నం.. విమానాశ్రయం
చుంచుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన విమానాశ్రయ నిర్మాణం ఏళ్లుగా ప్రతిపాదనల దశలో నిలిచి పోతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, నాయకులు తాండ్ర వినోద్‌రావు అన్నారు. మంగళవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ మధ్యకాలంలో కొత్తగూడెం రామవరంలో విమానాశ్రయం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను చేపట్టినట్లు తెలిసిందని, ఇది కూడా గతంలో మాదిరిగా పలు కారణాలు చూపెడుతూ ఆమోదం పొందకపోతే ప్రజలు మరోసారి నిరాశకు గురవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఆమోదం పొందడానికి వీలుంటుందని చెప్పారు. గతంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని విమానాశ్రయానికి ఏకై క స్థలమే కాకుండా మరికొన్ని చోట్ల అనువైన స్థలాలను గుర్తించి కేంద్ర విమానాయాన సంస్థకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో జీవీకే మనోహర్, కుంజా ధర్మారావు, బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నరేంద్రబాబు, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, సోమసుందర్, కొదమసింహం పాండురంగాచార్యులు, సొప్పరి క్రాంతి, ముస్కు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం బీజేపీ నాయకుల బృందం కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. -
ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి
వైరా/బోనకల్: బ్యాంకుల్లో అప్పు ఉన్న ప్రతీ రైతుకు ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని సీపీఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైరా తహసీల్ ఎదుట మంగళవారం రైతులతో కలిసి ధర్నా చేయగా తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శుఽలు మాదినేని రమేష్, బొంతు రాంబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులందరి రుణాలు మాఫీ చేయాలన్నారు. జిల్లాలో ఇంకా లక్ష మంది రైతులకు మాఫీ కాకుండా వంద శాతం పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించడం సరికాదన్నారు. అలాగే, రుణమాఫీ చేయాలని కోరుతూ రైతులు సీఎంకు రాసిన పోస్ట్‌కార్డులను బోనకల్ నుంచి పంపించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు వాసిరెడ్డి ప్రసాద్, మల్లెంపాటి రామారావు, చింతనిప్పు చలపతిరావు, మేడా శరాబందీ, కిలారు శ్రీనివాసరావు, బాణాల శ్రీనివాసరావు, సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, మల్లికార్జున్, వాసిరెడ్డి నర్సింహారావు, తుళ్లూరి రమేష్, దొండపాటి నాగేశ్వరావు, గుమ్మా ముత్తారావు, కిలారు సురేష్ పాల్గొన్నారు. ఆతర్వాత రైతు సంఘం నాయకులు బోనకల్ మండలం తూటికుంట్లలో పర్యటించి కల్తీ విత్తనాలతో దెబ్బతిన్న మిర్చి పంటను పరిశీలించారు. అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
మహిళ మెడలో గొలుసు చోరీ
చుంచుపల్లి: మహిళ మెడలో గొలుసు చోరీచేసిన ఘటన మండలంలోని బాబూక్యాంపులో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబూక్యాంప్‌లో నివాసముండే పద్మ నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గంజాయి సేవిస్తున్న యువకుల అరెస్ట్దమ్మపేట: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన మండలంలోని పార్కలగండిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సాయికిశోర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని ఎర్రగుంపు గ్రామానికి చెందిన తాటి సాయికృష్ణ, బైట ఆనంద్, చిల్లగుంపు గ్రామానికి చెందిన కుంజా కిశోర్ పార్కలగండి శివారులోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు కింద కూర్చొని గంజాయి తాగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.24 వేల విలువైన 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు యువకులు అంగీకరించగా ఈ కేసులో మరో ఆరుగురిని పట్టుకోవాల్సి ఉందని ఎస్ఐ వివరించారు. కానిస్టేబుళ్లు వీర, లక్ష్మణ్ ఉన్నారు. కేసు నమోదు చేశామని సీఐ కరుణాకర్ వెల్లడించారు. గంజాయి విక్రయిస్తున్న యువకులు...పాల్వంచ: గంజాయి విక్రయిస్తున్న యువకులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని వనమాకాలనీ సమాధుల ఏరియాలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ సుమన్ దాడి చేసి, జాన్ పీటర్, దామర్ల ఉదయ్‌ను పట్టుకున్నారు. జెట్టి ప్రణయ్‌కుమార్ పరారయ్యాడు. ప్రశాంత్ (బాబీ) అనే వ్యక్తికి కూడా ఇందులో హస్తం ఉన్నట్లు తేలింది. పట్టుకున్న ఇద్దరి నుంచి 480 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దామిని దాస్ నుంచి గంజాయిని తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
బూర్గంపాడు: గ్రామీణ, పట్టణ ప్రాంతాల క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి అన్నారు. బూర్గంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తోందని తెలిపారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలకు తగు సమయం కేటాయించాలని సూచించారు. 29 విభాగాలలో ఈ క్రీడలు జరుగుతాయన్నారు. మండల స్థాయిలో గెలుపొందిన వారు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఎంపీడీఓ జమలారెడ్డి, ఎస్ఐ నాగబిక్షం కాసేపు ఆటలు ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరెడ్డి, ఎంఈఓ యదుసింహారాజు, అధ్యాపకుడు నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు బర్ల ప్రభాకర్, మహేష్, భూక్యా వెంకటేశ్, ప్రధానోపాధ్యాయురాలు రవీలా, విద్యాసాగర్, వేణుగోపాల్, హరికృష్ణ, వెంకటనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.డీవైఎస్ఓ పరంధామరెడ్డి -
ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలు
చుంచుపల్లి: త్వరలో జరగను న్న గ్రామపంచాయతీల ఎన్నికలకు జిల్లాలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి వి.చంద్రమౌళి తెలిపారు. మంగళవారం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ప్రచురణ, ఎన్నికల నియమావళిపై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో ఐడీఓసీలో ఆయన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి డీఆర్డీఓ విద్యాచందన, జెడ్పీసీఈఓ నాగలక్ష్మి హాజరయ్యారు. డీపీఓ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు జిల్లాలో చేపట్టబోతున్న ఏర్పాట్లను ఆయన వివరించారు. గ్రామాల పరిధిలో ఓటర్ల జాబితాల ఆధారంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా షెడ్యూల్ ప్రకా రం ప్రకటించనున్నట్లు చెప్పారు. మండల స్థాయిలో సంబంధిత ఎంపీడీఓల ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ నెల 12న సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రకటించిన పోలింగ్ స్టేషన్లలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే 12 వరకు తెలియజేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితా ఈ నెల 17న ప్రచురిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని 479 గ్రామపంచాయతీలు, 4,232వార్డుల్లో ఎన్నికల నియ మావళి ప్రకారం ప్రజలకు అందుబాటులో పోలింగ్ స్టేషన్లను ఉంచుతామని, రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించి త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సహకరించాలని కోరారు. సమావేశంలో పలు పార్టీల నాయకులు సలిగంటి శ్రీనివాస్, గౌని నాగేశ్వరరావు, సంకుబాపన అనుదీప్, అన్నవరపు సత్యనారాయణ, జి.మల్లికార్జున్‌రావు, నోముల రమేశ, లక్ష్మణ్ అగర్వాల్ హాజరయ్యారు.