Dr B R Ambedkar Konaseema
-
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
కలెక్టర్ మహేష్‌కుమార్ ముమ్మిడివరం: భూ హక్కుల పరిరక్షణ, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలం చినకొత్తలంకలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆయన ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఆర్డీఓ కె.మాధవిలతో కలిసి గ్రామసభలో ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, శాశ్వత రికార్డుల కౌంటర్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల నిర్వహణా ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గ్రామంలో డంపింగ్ యార్డు పరిష్కారానికి ముందుగా గ్రామస్తులు ఈ సదస్సులో అర్జీని నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం స్థలం సేకరించి సమస్యను పరిష్కరిస్తుందన్నారు. ఈ సదస్సులలో అర్జీలకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదన్నారు. వినతుల్లో ఎక్కువ భాగం భూసమస్యలేనని ప్రతి ఒక్కరూ తమ భూముల రికార్డులను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేసి సమస్య పరిష్కరిస్తామని, జటిలమైన వాటిని నిర్దేశిత ప్రోసిజర్ ప్రకారం తదుపరి పరిష్కరిస్తామన్నారు. ఈ సదస్సులో మండల ప్రత్యేకాధికారి డీసీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ సుబ్బలక్ష్మి, ఎంపీడీఓ టి.వెంకటాచార్య, వీఆర్వోలు పాల్గొన్నారు. కోటిపల్లి – నర్సాపూర్ రైల్వే పనుల పూర్తికి వినతి సాక్షి, అమలాపురం: కోటిపల్లి – నర్సాపూర్ రైల్వే ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభించాలని ఎంపీ జీఎం హరీష్ బాలయోగి, టీడీపీ పార్లమెంటరీ పక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు, సహచర ఎంపీలతో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవిని మంగళవారం ఢిల్లీలో కలసి కోరారు. కోనసీమ జిల్లాలో రైల్వే అభివృద్ధి కోసం లేఖ అందించారు. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులలో కోటిపల్లి – నర్సాపూర్ రైల్వే లైన్ ఒకటి అని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం కె.గంగవరం మండలం కోటిపల్లి గ్రామం నుంచి అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామం వరకు ఫేజ్–1 (255.435 సెంట్లు) భూసేకరణ పూర్తయింది. రెండవ దశ కింద వంతెనల నిర్మాణానికి 24.10 సెంట్ల భూమిని సేకరించారు. ఈ పంట తర్వాత ఆ భూమిని రైల్వే శాఖకు అప్పగిస్తామని తెలిపారు. అమలాపురం మున్సిపాలిటీ కాంప్లెక్స్‌లో పూర్తి స్థాయిలో పనిచేసే రైల్వే కౌంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సాక్షి అమలాపురం: పంజాబ్ రాష్ట్రంలో దేవిందర్‌సింగ్ ఇతరులు వేసిన సివిల్ అప్పీల్‌పై ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప వర్గీకరణపై విచారణ చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్‌మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించిందని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారిణి పి.జ్యోతిలక్ష్మి తెలిపారు. ఏకసభ్య కమిషన్ కార్యాలయం విజయవాడలో కోనేరు లక్ష్మయ్య వీధి, మొఘల్రాజపురం, 520010. గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయ మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారన్నారు. కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5. 30 గంటల వరకు వ్యక్తిగతంగా లేదా తిరుగు రసీదుతో కూడిన రిజిస్టరు పోస్టు లేదా ఈ మెయిల్ ఐడీ omcscsubclassification@gmail.com ద్వారా జనవరి 9వ తేదీలోపు సమర్పించవచ్చు. సామాజిక పింఛన్ల పరిశీలన అల్లవరం: మండలంలోని గోడి పంచాయతీలో డీఆర్డీఓ ఆధ్వర్యంలో సామాజిక పింఛన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశాలతో డీఆర్డీఓ పీడీ శివశంకర ప్రసాద్ పర్యవేక్షణలో ఈఓపీఆర్డీ, వెల్ఫేర్ అసిస్టెంట్లు బృందాలుగా ఏర్పడి సోమవారం వివిధ రకాల పింఛన్లను పరిశీలించారు. లబ్ధిదారుల వద్దకు పింఛన్ పరిశీలన బృందాలు వెళ్లి వారికి వస్తున్న ప్రత్యేక యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలను నమోదు చేశారు. వృద్ధాప్యం, వితంతువుల, ఒంటరి మహిళ, డప్పు కార్మికులు, వికలాంగ తదితర పింఛన్లపై పరిశీలన చేశారు. 403 పింఛన్లకుగాను నలుగురు చనిపోగా, ఆరుగురు అందుబాటులో లేరని గుర్తించారు. మిగిలిన పింఛన్లను క్షుణ్ణంగా పరిశీలించి యాప్‌లో సిబ్బంది నమోదు చేశారని పీడీ శివశంకర ప్రసాద్ తెలిపారు. డీపీఎం అన్నపూర్ణ, ఎంపీడీఓ కృష్ణమోహన్, ఎంపీఎం సయ్యద్, కార్యదర్శి రామకృష్ణ, సర్పంచ్ తోట శ్రీదేవి పాల్గొన్నారు. -
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు
మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించిన వైనం అల్లవరం: కొమరగిరిపట్నం సముద్ర తీర ప్రాంతం అక్రమ ఇసుక రవాణాకు అడ్డగా మారింది. తీరం పొడవునా ఉన్న సముద్ర ఇసుకను రేయింబవళ్లు ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల కళ్ల ముందే ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ కార్యకర్తలు ఇసుక దందాకు పాల్పడుతున్నారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం శివారు సముద్రం తీరం నుంచి సోమవారం రాత్రి మూడు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ట్రాక్టర్లని అడ్డుకుని అల్లవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూడు ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 3న కొమరగిపట్నం శివారు ప్రాంతాల నుంచి అఽనధికారింగా ఇసుకను తరలిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన యువకులు అడ్డుకుని పోలీసులకు అప్పగిస్తే అమలాపురానికి చెందిన టీడీపీ నేతల ఒత్తిడితో అక్రమ రవాణాపై కేసు నమోదు చేయకుండా తిరిగి పంపించేశారు. మళ్లీ వారం రోజుల వ్యవధిలో రెండో సారి మూడు ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై అల్లవరం ఎస్సై హరీష్కుమార్ని వివరణ కోరగా సముద్ర ఇసుక అక్రమ రవాణాపై తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లామని, దానిపై చర్యలు తీసుకోవల్సింది ఆయనేనని తెలిపారు. తహసీల్దార్ వీవీఎల్ నరసింహరావుని వివరణ కోరగా ఎస్సైతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. -
ఉచిత ఇసుక వట్టి మాటే
● రీచ్‌లో కూటమి నాయకుల దోపిడీ ● టన్నుకు రూ.300కి పైగా వసూలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు ● మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధ్వజం రావులపాలెం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఉచిత ఇసుక వట్టి మాటే తప్ప సామాన్యులకు ఉచితంగా చేరడం లేదని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్తపేట నియోజకవర్గంలో అధికారులు ఆర్భాటంగా టెండర్లు పిలిచిన ర్యాంపుల్లో సైతం కూటమి నాయకులు, టీడీపీ నాయకులు దోపిడీలకు పాల్పడుతున్నారన్నారు. ఆత్రేయపురం మండలంలో ఇసుక రీచ్‌ల్లో టన్నుకు రూ.300 చొప్పున వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వ గెజిట్ పేపర్(ఈనాడు) లోనే వచ్చినా అధికారులు ఎందుకు నమ్మటం లేదని ప్రశ్నించారు. అక్రమాలను అరికట్టాల్సిన జిల్లా సాండ్ కమిటీ ఆయా ర్యాంపుల్లో ఒక అధికారిని నియమించినా, ఈ అక్రమ దందాను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారన్నారు. కూటమి నాయకులు జేబులు నింపుకుంటుంటే అధికారులు చూస్తూ ఉండిపోవడం వెనక మర్మం ఏమిటని ప్రశ్నించారు. ఆత్రేయపురం, ఊబలంక ర్యాంపులతో పాటు ఇతర ర్యాంపుల్లో కూటమి నాయకులు సొంత లారీలు పెట్టుకుని రోజుకు కేవలం 25 లారీలు మాత్రమే బయటకు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయం పక్కనే నాన్ డ్యూటీ పెయిడ్ (ఎన్డీపీ) మద్యం దొరికినా అధికారులు కేసులు పెట్టకుండా వదిలిపెట్టడం వెనుక స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఉందన్నారు. మద్యం షాపుల్లో 25 శాతం వాటా ఆయనకు ఉండటం వల్లే ఈ అవినీతి యథేచ్ఛగా జరుగుతోందని ఆరోపించారు. కేసులు కట్టాల్సిన ఎకై ్సజ్ సీఐ సెలవుపై వెళ్లిపోవడం వెనక స్థానిక నాయకుల ఒత్తిడి ఎంతమేరకు ఉందో అర్థమవుతోందన్నారు. గతంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్థానికంగా దొరికిన మద్యంపై వైఎస్సార్ సీపీకి అంట కట్టేందుకు నానా రచ్చ చేశారని, ఇప్పుడు ఎన్డీపీ సరకు దొరికినా కేసులు కట్టకపోవడం వెనుక మర్మమేమిటో చెప్పాలన్నారు. ఈ విషయం మీడియాలో రాకుండా తొక్కి పెట్టి ఉంచడం వెనుక కూటమి నాయకులు ఎకై ్సజ్ అధికారులపై ఎంత ఒత్తిడి తెచ్చారో అర్థమవుతుందన్నారు. లబ్ధిదారుడికి ఒక లారీ ఇసుక చేరే సరికి రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు అవుతుందన్నారు. ఉచితం అంటే అర్థం ఇదేనా అని ప్రశ్నించారు. కిలో రూ.120 ఉండే వంటనూనె రూ.170 చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఎంపీపీ మార్గాన గంగాధరరావు, జెడ్పీటీసీ సభ్యుడు బోనం సాయిబాబు, సర్పంచ్ తమన్న శ్రీను, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, కప్పల శ్రీధర్ పాల్గొన్నారు. -
అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ప్రారంభం
● వర్చువల్ విధానంలో ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ● దశాబ్ధాల కల నెరవేరిందని రామచంద్రపురం న్యాయవాదుల ఆనందం రామచంద్రపురం: రామచంద్రపురం కోర్టుల ప్రాంగణంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టును ఆంధ్రపదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్ విధానంలో మంగళవారం ప్రారంభించారు. ముందుగా రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లి మురళీమోహన్ వెంకటరమణ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రిబ్బన్ కత్తిరించి కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్ విధానంలో శిలా ఫలకాన్ని ఆవిష్కరించి నూతన జిల్లా కోర్టును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్య్ర సమరయోధులను, గొప్ప వ్యక్తుల ను అందించిన ఘన చరిత్ర తూర్పుగోదావరి జిల్లాకు ఉందన్నారు. ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర హైకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు సేవలందించారన్నారు. రామచంద్రపురం నుంచి రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకు సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించే బాధ ఇక్కడి సుమారు 250 మంది న్యాయవాదులకు, కక్షిదారులకు తప్పిందన్నారు. సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇక్కడి నుంచి హైకోర్టుకు మరింత మంది జడ్జిలుగా రావాలని ఆకాంక్షించారు. జిల్లా కోర్టు ఏర్పాటు సందర్భంగా న్యాయమూర్తులు, బార్ అసో సియేషన్, న్యాయవాదులు అందరికీ అభినందనలు తెలిపారు. జిల్లా పోర్టుపోలియో జడ్జి అయినాల జయసూర్య మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు ఈ కోర్డు పునాది వేసిందని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ 8 మండలాలు, 10 పోలీస్ స్టేషన్లకు సంబంధించి, అనపర్తి, ఆలమూరు కోర్టులకు సంబంధించి అప్పీళ్లు అన్నీ ఇకపై ఈ కోర్టులోనే చేసుకోవచ్చని తెలిపారు. కాకినాడ నాల్గవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం. హరినారాయణకు ఈ కోర్టును నిర్వహించే బాధ్యతను చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అప్పగించారు. సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్వరరావు, జూనియర్ సివిల్ జడ్జి నిజాం శారద, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.నాగేశ్వరరావు నాయక్, బార్ అసోసియేషన్ కార్యదర్శి వాడ్రేవు సాయిప్రసాద్, ఉపాధ్యక్షుడు పలివె ల సత్యనారాయణ, డీఎస్ఎస్ శర్మ, సంయుక్త కార్యదర్శి చిన్నం వీరెడ్డి, కోశాధికారి జె. చక్రవర్తి, మహిళా న్యాయవాదుల ప్రతినిధి కేవీ సత్యవాణి పాల్గొన్నారు. -
ప్రజల తరఫున గొంతెత్తాలి.. సర్కార్‌పై ఒత్తిడి తేవాలి: బొత్స
సాక్షి, కాకినాడ: ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?.. పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీలు వంగా గీతా, చింతా అనురాధ హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ‘‘విద్యార్థులు, రైతులు, విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. ప్రజల తరపున గొంతెత్తాలి.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఈ నెల 13న రైతు సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. ఈ నెల 27న విద్యుత్ బిల్లుల పెంపుపై ఉద్యమిస్తాం. జనవరిలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఉద్యమిస్తాం’’ అని బొత్స తెలిపారు. -
కోనసీమలో ఘోర ప్రమాదం.. పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, కోనసీమ జిల్లా: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేట వద్ద అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమారులు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి తండ్రి బయటపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో విశాఖపట్నం వెళ్లి తిరిగి పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో భార్య ఉమ కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య అమలాపురం రూరల్ పేరూరు పంచాయతీ తలుపులపేటకు చెందిన అంబటి రాజు (22) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆదివారం ర్రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సినిమాకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన రాజు ఆదివారం రాత్రి 10 గంటలకు బ్రిడ్జి వద్దకు వచ్చి మోటారు సైకిల్ని పార్కు చేసి, చెప్పులు వదిలి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అదే సమయంలో కొంతమంది మోటారు సైకిల్‌ను పార్కు చేసి ఉండడాన్ని గమనించారు. సోమవారం ఉదయం వరకు మోటారు సైకిల్ బ్రిడ్జిపైనే పార్కు చేసి ఉండడంతో ప్రయాణికులు గమనించి 100కి సమాచారం ఇచ్చారు. దీంతో అల్లవరం పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులతో గాలించగా నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకి చేర్చారు. మృతుడు తండ్రి పాపారావు ఫిర్యాదుతో అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఏ కారణం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడో విచారణలో తెలియవలసి ఉంది. మృతుడుకి తండ్రి, తల్లి ఉన్నారు. -
వక్ఫ్ చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ అమలాపురం టౌన్: రాష్ట్రంలో వక్ఫ్ చట్టా న్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేస్తోందని జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ ఆరోపించారు. ఈ మేరకు అమలాపురంలో ఖాదర్ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ముస్లిం, మైనార్టీలను అణగదొక్కే కుట్రలో భాగంగా వక్ఫ్ చట్టాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్ సవరణ బిల్లుతో రాష్ట్రంలోని ముస్లింలకు భవిష్యత్‌లో ఇబ్బందులు అనివార్యం కాగలవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించకుండా ముస్లింల మనోభావాలకు కాపాడాలని ఖాదర్ డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించి ముస్లింకు అండగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటుకు కూడా ఓ పద్ధతి, విధానం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమర్థమైన వక్ఫ్ బోర్డును నియమించి వక్ఫ్ ఆస్తులను సంరక్షించాలని ఖాదర్ డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు సవరణకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తల ఊపకూడదని, అందులోని లోపాలను ఎత్తిచూపి బిల్లును వ్యతిరేకించి ముస్లింలకు భరోసాగా నిలవాలని కోరారు. మత్స్యకారుల ధర్నా గెద్దనపల్లిలో నష్టపరిహారం నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణ అమలాపురం రూరల్: కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామంలో మత్స్యకారుల నష్టపరిహారం నిధులు కొంతమంది దుర్వినియోగం చేశారని సంఘం నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రిలయన్స్, ఓఎన్జీసీ మత్స్యకారులకు చెల్లించిన నష్టపరిహారం ఎన్ఎఫ్డీసీ నిధులను కొందరు నాయకులు స్వాహా చేశారని గెద్దనపల్లి రామాలయం మత్స్యకారుల కుటుంబాలు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించాయి. ఐదు విడతలు సమానంగా పంచవలసిన సొమ్ము ను, కేవలం రెండుసార్లే పంచి, మూడు విడతల డబ్బును పంచకుండా తమను వేధిస్తున్నారని గెద్దనపల్లి అగ్నికుల క్షత్రియులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు పంచమంటే గొడవలకు దిగి తమను వేధిస్తున్నారని కలెక్టర్ మహేష్‌కుమార్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందించారు. గతంలో ఽఅధికారులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని, ప్రభుత్వం తమకు తక్షణం నష్టపరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఒక పది మంది నాయకుల కనుసన్నల్లో ఈ దారుణం జరుగుతోందని, విచారణ చేసి బాధితులకు రూ.80 లక్షల పరిహారం అందజేయాలని సంఘం నాయకుడు నారాయణ డిమాండ్ చేశారు. కౌశల్జిల్లా స్థాయి విజేతలు అమలాపురం టౌన్: ఈ నెల 6న ఆన్లైన్లో జరిగిన కౌశల్ –2024 జిల్లా స్థాయి పరీక్షల ఫలితాలను డీఈవో డాక్టర్ షేక్ సలీమ్ బాషా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 8,9,10 తరగతుల విద్యార్థుల విభాగాల విజేతలు విజయవాడలో ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి కౌశల్–2024 పరీక్షల్లో సత్తా చాటనున్నారని తెలిపారు. ఎనిమిదో తరగతికి సంబంధించి క్విజ్ విభాగంలో ఎం.వెంకటరమణ (జెడ్పీ ఉన్నత పాఠశాల – మురమళ్ల) ప్రథమ, ఉంగరాల విశిష్ట నాగ సూర్య ప్రజ్ఞ (ఎస్జీ ఎంపీఎల్ హైస్కూలు– అంకసాని చెరువు), ద్వితీయ స్థానాలు సాధించారు. పోస్టర్ విభాగంలో జక్కంపూడి తులసీ చందు (ఎంపీఎల్ హైస్కూలు –కొంకాపల్లి), సవరపు రష్మిత (జెడ్పీహెచ్ఎస్– గొల్లవిల్లి), ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 9వ తరగతి క్విజ్ విభాగంలో దూడల హాసిని (ఎంపీఎల్ హెచ్ఎస్ – కొంకాపల్లి), పి.శ్రీరమ్య (జెడ్పీహెచ్ఎస్ – జి.పల్లిపాలెం), ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. పోస్టర్ విభాగంలో పి.లక్ష్మిశ్రీ (జెడ్పీహెచ్ఎస్– జి.పల్లిపాలెం), ఆర్.కీర్తి (జెడ్పీహెచ్ఎస్ (జి) సూర్యనగర్ గెలిచారు. 10వ తరగతి క్విజ్ విభాగంలో పడాల లోకేశ్వర్‌రెడ్డి (జెడ్పీహెచ్ఎస్– మాచవరం), , ఒగ్గు కుశ్వంత్సాయి (జెడ్పీహెచ్ఎస్– మాచవరం) ద్వితీయ స్థానాలు సాధించారు. రీల్స్ విభాగంలో కారెం రేష్మశ్రీ (ఎంపీఎల్ హెచ్ఎస్– కొంకాపల్లి), సుతాపల్లి దేవ హర్ష నాగశ్రీ సందీప్ (ఎస్‌కేపీజీఎన్ గవర్నమెంట్ హెచ్ఎస్ –రామచంద్రపురం), ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. వీరికి రూ.1,500, 1,000 చొప్పున నగదు బహుమతులు అందిస్తామని డీఈవో సలీమ్ బాషా తెలిపారు. -
గడువులోపు అర్జీల పరిష్కారం
కలెక్టర్ మహేష్‌కుమార్ సూచన అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలకు సంబంధించిన సమస్యలను రీ ఓపెన్‌కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డ్వామా పీడీ మధుసూదన్, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరాణి 168 అర్జీలు స్వీకరించారు. సామాజిక భద్రత పింఛన్ల మంజూరు, వైద్య సేవల కల్పన, భూ సమస్యలు తదితర అంశాలపై అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ అందిన అర్జీ సర్వీస్ అంశమా లేదా ఫిర్యాదా అనేది గమనించి కచ్చితమైన విశ్లేషణ చేస్తూ సంబంధిత విభాగాలకు ఆన్లైన్లో సమర్పించాలని, అధికారులు పరిష్కారం దిశగా గడువు లోపు చర్యలు చేపట్టాలన్నారు. పరిష్కారం కాని వాటి గురించి ఫిర్యాదుదారులతో చర్చించి తిరస్కరణకు గల కారణాలను తెలియజేయాలన్నారు. భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యంగా ఈ నెల10 నుంచి జనవరి 8 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ సదస్సులపై నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు తహసీల్దారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు రోజూ సదస్సుల నిర్వహణ తీరును, ఆర్డీవోలు రోజుకు రెండు సదస్సులను తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. రీ సర్వే జరగని గ్రామాలలో తొలుత ఈ సదస్సులు నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్లు రెవెన్యూ ఇన్సెక్టర్లు, వీఆర్వోలు, సర్వేయర్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వ్యవసాయ, మత్స్య శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. పోలీస్ గ్రీవెన్స్‌కు 25 అర్జీలు అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 25 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారుల వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. రామచంద్రపురానికి చెందిన ఓ ప్రేమ జంట ఎస్పీని ఆశ్రయించారు. తమకు ప్రాణ రక్షణ కల్పించాలని విన్నవించుకున్నారు. తమ కుటుంబీకులు, బంధువుల నుంచి తమను కాపాడాలని వారు అభ్యర్థించారు. అర్జీదారుల ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని ఎస్పీ కృష్ణారావు ఆయా పోలీసు స్టేషన్ల సీఐ, ఎస్సైలకు ఫోన్ చేసి ఆదేశించారు. వచ్చిన 25 అర్జీల్లో సగం వరకూ కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించినవే ఉండడంతో అర్జీదారులతో ఎస్పీ మాట్లాడి సమస్య పరిష్కారానికి మార్గాలను సూచించారు. ఎస్పీ కార్యాలయ ప్రజా సమస్య పరిష్కార వేదిక మహిళా ఎస్సై శశాంక ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఉత్సాహంగా సంస్కృతి ఉత్సవ్ పోటీలు
అమలాపురం టౌన్: స్థానిక యర్రమిల్లి వారి వీధిలోని హనుమాన్ మందిర్ వద్ద ఆకొండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి ఉత్సవ్ పోటీలు సోమవారం ఉత్సాహంగా మొదలయ్యాయి. సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ్ పోటీలు 9 విభాగాల్లో జిల్లా స్థాయిలోనూ, 5 విభాగాల్లో ఇంటర్నెట్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలోనూ జరుగుతున్నాయి. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని మన సంస్కృతిని ప్రతిబింబించే అంశాలను ప్రదర్శించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి మరీ ఈ పోటీల్లో పాల్గొని మన సంస్కృతికి అద్దం పట్టారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకూ చదివేవారు పోటీల్లో పాల్గొన్నారు. భగవద్గీత, మట్టితో బొమ్మలు చేయడం, కథలు చెప్పడం, జానపద నృత్యాలు, సంస్కతీ సంప్రదాయాలకు నిలయంగా వ్యాసరచన పోటీలు తొలి రోజు జరిగాయి. మయూరం పేరుతో చిత్రకారుడు ముద్దు రమేష్ ఏర్పాటు చేసిన డిజిటల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ విద్యార్థులు, సందర్శకులను విశేషంగా అకట్టుకుంది. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సంస్కార భారతి రాష్ట్ర మహిళా ప్రముఖ్ వేదనభట్ల సాయిలక్ష్మి, లారెన్స్ మాస్ట్‌ర్ శిష్యుడు ధనరాజ్, ఆకొండి ధన్వంతరి, దేవపూజ్యల నాగమణి, ఓరుగంటి అగ్నిహోత్ర శర్మ వ్యవహరించారు. భారతం, రామాయణం తదితర పురాణ ఇతిహాసాలు, భారతీయ విజ్ఞాన వైభవం వంటి అంశాల్లో వ్యాస రచన పోటీలు జరిగాయి. ఆకొండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ ఆకొండి పవన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ట్రస్ట్ ప్రతినిధులు చాణక్య, తేజస్విని, లావణ్య, కౌటిల్య, యశస్విని, భరద్వాజ్ సంయోజకులుగా వ్యవహరించారు. -
చెత్త సృష్టి.. సంపద వట్టి!
● జిల్లాలో 345 పంచాయతీలు ● 268 సంపద కేంద్రాలు ● 198 పనిచేస్తున్నాయంటున్న అధికారులు ● వాస్తవంగా పనిచేసేది పది శాతం మాత్రమే ● కంపోస్టు ఉత్పత్తి శూన్యం సాక్షి, అమలాపురం: గ్రామ పంచాయతీలలో ఒకవైపు కొండలా పేరుకుపోతున్న చెత్తను తగ్గించుకోవడం.. మరోవైపు నాణ్యమైన సేంద్రియ ఎరువు తయారు చేయడం... వాటి అమ్మకాల ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకోవడం.. ఇలా మూడు లక్ష్యాలతో మొదలు పెట్టిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. జిల్లాలో 345 పంచాయతీలున్నాయి. వీటి ద్వారా రోజుకు వంద టన్నుల మేర చెత్త వస్తోందని అంచనా. మేజర్ పంచాయతీల్లో రెండు నుంచి మూడు టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇదే ఇప్పుడు పంచాయతీలకు పెద్ద సమస్యగా మారింది. డంపింగ్ యార్డులు లేకపోవడంతో రోడ్డు చెంతన, పంట కాలువల చెంతన చెత్త వదిలేస్తున్నారు. దీనివల్ల కాలుష్యం పెరిగి జనం రోగాల బారిన పడుతున్నారు. కొన్ని పంచాయతీలు చెత్తను కాల్చి బూడిద చేస్తున్నాయి. దీనివల్ల చెత్త సమస్య తగ్గినా ప్లాస్టిక్, టైర్లు వంటి వాటిని కూడా తగలబెట్టడం వల్ల విషవాయువులు గాలిలో కలిసి జనం ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి చెత్తతో సంపద కేంద్రాలు చాలా వరకు అక్కరకు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో వీటిని ఏర్పాటు చేశారు. జిల్లాలో 268 సంపద కేంద్రాలున్నాయి. వీటిలో 198 కేంద్రాలు పనిచేస్తున్నాయని, 46 పాక్షికంగా పని చేస్తున్నాయని, 25 కేంద్రాలలో వానపాముల కొరత ఉందని అధికారులు చెబుతున్నారు. కాని వాస్తవంగా పది శాతం కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఈ కారణంగా పంచాయతీల్లో ఆశించిన స్థాయిలో చెత్త సమస్య తీరడం లేదు. అలాగే ఆదాయం కూడా రావడం లేదు. సంపద కేంద్రాల ద్వారా చెత్త సమస్యకు పరిష్కారం సంపద కేంద్రాల ద్వారా నెలకు సగటున నాలుగు టన్నుల వర్మీ కంపోస్టు తయారవుతోందని అంచనా. ఈ విధంగా చూస్తే ఏడాదికి 48 టన్నులు. కేజీ రూ.పది చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే ఏడాదికి రూ.4.80 లక్షల వరకు ఆదాయంగా వస్తోంది. జిల్లాలో మూడోవంతు పంచాయతీలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కన్నా ఇది ఎక్కువ. కంపోస్టు తయారీకి సగటున నెలకు 16 టన్నుల చెత్తను వినియోగిస్తారు. ఈ విధంగా చూస్తే ఏడాదిలో సుమారు 192 టన్నుల చెత్తను కంపోస్టుగా మార్చవచ్చు. చిన్నిచిన్న పంచాయతీలకు చెత్త సమస్య దాదాపు తీరిపోతుంది. మీడియం, మేజర్ పంచాయతీలలో ఊరి చివర్లలోను, పంట కాలువల చెంతా చెత్త కొండల్లా పేర్చాల్సిన అవసరం తప్పుతుంది. డంపింగ్ యార్డు సమస్యలు సైతం చాలా వరకు తీరతాయి. పంచాయతీల నిర్లక్ష్యం ● పంచాయతీ పాలకవర్గాలు, అధికారులు, పారిశుధ్య సిబ్బందిలో చిత్త శుద్ధి లేకుండా పోయింది. కంపోస్టు తయారీని పక్కన పెడుతున్నారు. చాలా పంచాయతీలకు పారిశుధ్య సిబ్బంది లేకపోవడం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ● అన్నీ ఉన్నచోట సిబ్బందిలో చిత్తశుద్ధి లేదు. సంపద కేంద్రాలు ఎంతోకొంత పనిచేస్తున్న చోట నాణ్యమైన కంపోస్టు ఉత్పత్తి జరగడం లేదు. వానపాములు తరచూ చనిపోతున్నాయి. ఈ కారణంగా కంపోస్టు కావడం లేదు. ● కార్మికులకు కంపోస్టు తయారీపై శ్రద్ధ లేకుండా పోవడం కూడా ఒక కారణం. తడి, పొడి చెత్త, ప్లాస్టిక్, గాజు సీసాలు, ఐరన్, ఇతర వ్యర్థాలు అన్నీ కలిసి సంపద కేంద్రాల వద్దకు వస్తున్నాయి. వీటిని వేరు చేసి కంపోస్టు తయారీకి అవసరమైన వ్యర్థాల సేకరణకు సరిపడా సిబ్బంది లేకుండా పోయారు. ● కంపోస్టు కేంద్రాల్లో సిమెంట్ కుండీల తయారీ కంపోస్టుకు అనుకూలం కాదు. నాణ్యమైన కంపోస్టు తయారు కావాలంటే అడుగు ఎత్తున సిమెంట్ కుండీ నిర్మాణం చేయాలి. కాని కుండీ ఎత్తు రెండు, మూడు అడుగులు ఉండడం వల్ల కంపోస్టు అనుకున్న నాణ్యతతో రావడం లేదు. ● కంపోస్టుకు ఉపయోగించే వానపాములు నాన్ బోరియింగ్ రకానికి చెందినవి. ఇది తక్కువ ఎత్తు ఉన్న చెత్త, ఇతర వ్యర్థాలను కంపోస్టుగా మారుస్తాయి. అధిక ఎత్తు ఉంటే మాత్రం అనుకున్నంత వేగంగా కంపోస్టు తయారు చేయడం లేదు. ● సంపద కేంద్రాల వద్ద అమ్మకాలు చేసే కంపోస్టును రెండవ సారి కొనుగోలు చేసేవారు లేకుండా పోతున్నారు. దీంతో తయారైన అరకొర కంపోస్టును సైతం వాడేవారు లేక పంచాయతీలకు వచ్చే కొద్దిపాటి ఆదాయం కూడా రావడం లేదు. కొత్తపేట నియోజకవర్గంలో 57 పంచాయతీలు ఉండగా, వీటిలో 20 మేజర్‌వి. వీటిలో రెండింటికి మాత్రమే డంపింగ్ యార్డులు ఉండగా, మిగిలిన వాటికి లేవు. ఇక్కడ చెత్త సమస్య అధికంగా ఉంది. 34 సంపద కేంద్రాలుండగా, కేవలం 11 మాత్రమే పనిచేస్తున్నాయి. అమలాపురం నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు 60 కాగా, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి, భీమనపల్లి, ఎన్.కొత్తపల్లి మేజర్ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు ఉన్నా ఉపయోగం లేదు. అమలాపురం మండలంలో 12 గ్రామాల్లో చెత్త నుంచి సంపద కేంద్రాలలో ఐదు పనిచేస్తున్నాయి. చెత్త సమస్య పరిష్కారాలకు ఇది మంచి ప్రయత్నం బండారులంక మేజర్ పంచాయతీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చెత్త. దీని పరిష్కారానికి డంపింగ్ యార్డు అతి ముఖ్యమైంది. సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తే చాలా వరకు చెత్త సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పంచాయతీలకు ఆదాయం కూడా వస్తుంది. – దైవాపు పూర్ణిమ, సామాజిక కార్యకర్త, బండారులంక, అమలాపురం మండలం -
గాలికొదిలేసిన కూటమి హామీలే అజెండా
ఫ నేడు వైఎస్సార్ సీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమావేశం ఫ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం కాకినాడలో మంగళవారం జరగనుంది. స్థానిక సూర్య కళా మందిరంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పార్టీ ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు సోమవారం ఈ వివరాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న పార్టీ తొలి సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నామని చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రజల తరఫున నిర్వహించే పోరాటాలపై ఈ సమావేశంలో చర్చించనున్నామని తెలిపారు. ఈ నెల 13న రైతు సమస్యలపై కలెక్టరేట్ల వద్ద నిరసన, 27న విద్యుత్ చార్జీల పెంపుపై ఎస్ఈ కార్యాలయాల వద్ద, జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాట తప్పిన కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనలపై ఈ సమావేశంలో చర్చించనున్నామని వివరించారు. వీటితో పాటు సార్వత్రిక ఎన్నికల్లో ఎడాపెడా ఊదరగొట్టి, గాలికొదిలేసిన సూపర్‌సిక్స్ హామీలు, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ అడ్డగోలుగా సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ, పార్టీ కమిటీల నియామకాలపై కూడా చర్చించనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నాయకులు హాజరు కావాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు. -
విజేత.. భీమవరం బుల్లోడే!
ఫ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపిమూర్తి ఫ తొలి ప్రాధాన్య ఓట్లలోనే గెలుపు ఫ బడి నుంచి మండలికి పయనం ఫ ఆరు గంటల్లోనే ముగిసిన ఓట్ల లెక్కింపు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉత్కంఠగా సాగిన గురువుల పోరులో భీమవరం బుల్లోడు విజేతగా నిలిచారు. ఆరు జిల్లాల పరిధిలో హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన బొర్రా గోపిమూర్తి గెలుపొందారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల బరిలోకి దిగేందుకు తన వృత్తికి రాజీనామా చేశారు. గోపిమూర్తికి ప్రధాన ప్రత్యర్థిగా ద్రాక్షారామకు చెందిన గంధం నారాయణరావు బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో మొత్తం ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ మిగిలిన ముగ్గురూ నామమాత్రమైన పోటీకే పరిమితమయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి చివరి వరకూ బొర్రా, గంధం మధ్యనే నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ కనిపించింది. చివరకు యూటీఎఫ్, పీడీఎఫ్ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగిన గోపిమూర్తికి విజయం వరించింది. గత ఎన్నికల్లో సైతం నారాయణరావు పీడీఎఫ్ అభ్యర్థితో తలపడ్డారు. సాబ్జీ మృతితో.. శాసన మండలి ఉమ్మడి ఉభయ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గానికి రెండున్నరేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందిన సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. మిగిలిన రెండున్నరేళ్ల పదవీ కాలానికి ఎన్నికల కమిషన్ ఈ ఎన్నిక నిర్వహించింది. ఆది నుంచీ ఉత్కంఠగా.. ఈ ఎన్నికలు ఆది నుంచీ తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు (రంపచోడవరం) జిల్లాల్లో విస్తరించి ఉన్న ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు 15,494 ఓట్లు పోలయ్యాయి. చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లను ప్రామాణికంగా తీసుకుని కోటా ఓట్లను 7,341గా నిర్ణయించారు. గోపిమూర్తికి తొలి రౌండ్లోనే కోటా ఓట్లు దక్కాయి. దీంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఎన్నికల కమిషన్ ఆమోదంతో ప్రకటించి, ధ్రువీకరణ పత్రం అందజేశారు. గోపీమూర్తికి 9,165 ఓట్లు పోలవగా, రెండో స్థానంలో ఉన్న నారాయణరావు 5,259 ఓట్లు దక్కించుకున్నారు. దీంతో 3,906 ఓట్ల ఆధిక్యతతో గోపిమూర్తిని విజయం వరించింది. యూటీఎఫ్, పీడీఎఫ్ ఉమ్మడిగా బలపరిచిన గోపీమూర్తి వెంట ఆ రెండు సంఘాల ప్రతినిధులు విస్తృత ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. సిట్టింగ్ స్థానంపై పట్టు సాధించాలని ఉపాధ్యాయులు కలసికట్టుగా పని చేసినా.. ప్రధాన పోటీదారుగా నిలిచిన గంధం నారాయణరావు చివరి వరకూ గట్టి పోటీయే ఇచ్చారు. రెండున్నరేళ్ల పదవీ కాలానికి జరిగిన ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ చివరకు తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. ఎన్నికల పరిశీలకుడు కె.హర్షవర్ధన్, కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. 14 టేబుళ్లపై 76 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, కేఎస్ఈజెడ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామలక్ష్మి, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర పాల్గొన్నారు. ఆరు గంటల్లోనే లెక్క తేలింది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఆరు గంటల్లోనే ముగిసింది. కాకినాడ జేఎన్టీయూ అంబేడ్కర్ లైబ్రరీలో సోమవారం ఉదయం 8 గంటలకు మొదలై, మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. తొలి రౌండ్లోనే మొదటి ప్రాధాన్యతా ఓట్లకే కోటా ఓట్లు రావడంతో గోపిమూర్తిని విజయం వరించింది. ఎవరికెన్ని ఓట్లంటే.. బొర్రా గోపిమూర్తి 9,165 గంధం నారాయణరావు 5,259 దీపక్ పులుగు 102 నామన వెంకటలక్ష్మి (విళ్ల లక్ష్మి) 81 డాక్టర్ నాగేశ్వరరావు కవల 73 -
అభీష్ట సిద్ధి.. అనుగ్రహ ప్రాప్తి..
సఖినేటిపల్లి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి నొందిన అంతర్వేది పుణ్యక్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. నవ బుధవార నవ ప్రదక్షిణ దీక్ష చేసి శ్రీనారసింహ సుదర్శన హోమం చేయించుకోవడం ద్వారా తమ సకల అభీష్టాలు, సర్వ కార్యాలు నెరవేరుతాయని నమ్ముతారు. క్షేత్రంలో స్వయం భూ గా లక్ష్మీనసింహస్వామి వెలిసినట్టు చరిత్ర చెబుతోంది. వశిష్ట మహర్షి ప్రార్థన కారణంగా ఇక్కడ స్వామి పశ్చిమ ముఖంగా వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వామివారి సన్నిధిలో అత్యంత పురాతనమైన 16 ఆయుధములు, 16 భుజములు కలిగిన సుదర్శన చక్రధారుడైన లక్ష్మీనరసింహస్వామికి (శ్రీసుదర్శన పెరుమాళ్) నిత్యం సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. భక్తుల మనోవాంఛా ఫలసిద్ధికి, సర్వగ్రహ దోష నివారణకు, లోక కల్యాణార్థం ఈ హోమం అత్యంత శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు నిర్వహిస్తున్నారు. 2010 నుంచి... స్వామివారి సన్నిధిలో నిత్య శ్రీసుదర్శన హోమం ప్రారంభించక పూర్వం భక్తులు సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ సొంతంగా వెచ్చించి ప్రత్యేకంగా సుదర్శన హోమం నిర్వహించుకునేవారు. అయితే కాలక్రమంలో భక్తులందరికీ సుదర్శన హోమంలో పాల్గొనే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది సమాలోచన చేసి, నిత్య శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించుకునేందుకు నిర్ణయించారు. ఇందుకు విధి విధానాలు రూపొందించాక 2010 సంవత్సరంలో హోమం ప్రారంభించారు. దశాబ్దన్నర కాలంగా నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. వీక్షించిన మహాస్వామి : అంతర్వేది లక్ష్మీనృసింహుని దర్శనానికి ఇటీవల విచ్చేసిన శృంగేరీ పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న సుదర్శన హోమం వీక్షించారు. హోమం నిర్వహణ, ఇతర అంశాల గురించి ఆలయ ప్రధాన అర్చకుడు కిరణ్.. భారతీ మహాస్వామికి వివరించారు. లోక కల్యాణార్థం శ్రీ నారసింహ సుదర్శన హోమం 2010 నుంచి అంతర్వేదిలో నిత్యం నిర్వహణ 16 ఆయుధాలు, 16 భుజాలు కలిగిన స్వామి నవ బుధవార, నవ ప్రదక్షిణ దీక్ష నిర్వహిస్తున్న భక్తులు రూ.కోటి ఏడు లక్షల ఎఫ్డీలు అంతర్వేది దేవస్థానంలో శ్రీనారసింహ సుదర్శన హోమంలో స్వామివారి శాశ్వత పూజల నిమిత్తం భక్తుల నుంచి ఇంత వరకూ రూ.ఒక కోటి ఏడు లక్షల ఆదాయం సమకూరింది. ఈ ఆదాయాన్ని బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరిచాం. – వి.సత్యనారాయణ, అసిస్టెంట్ కమిషనర్, అంతర్వేది దేవస్థానం భక్తుల మనోవాంఛా ఫలసిద్ధి భక్తులు శ్రీనారసింహ సుదర్శన హోమం నిర్వహించుకోవడం ద్వారా మనోవాంఛా ఫలసిద్ధి కలుగుతుంది. సర్వగ్రహ దోష నివారణ, లోక కల్యాణం సుదర్శన హోమంలో పూజల వల్ల సిద్ధిస్తుంది. – పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, ప్రధాన అర్చకుడు, అంతర్వేది దేవస్థానం -
18 బోట్లు సీజ్
● జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు ● బ్రిడ్జిలకు 500 మీటర్ల లోపు ఇసుక తవ్వితే చర్యలు ● బోట్స్‌మెన్ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/కొవ్వూరు: నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు కం రైలు వంతెనకు సమీపంలో సోమవారం ఇసుక తవ్వకాలు చేస్తున్న 18 బోట్లను సీజ్ చేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు ప్రకటించారు. కొవ్వూరు ఏరినమ్మ ఘాట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొవ్వూరు ఏరినమ్మ, ఔరంగబాద్–1 ఇసుక ర్యాంపులకు చెందిన పది, రాజమహేంద్రవరం దోభీఘాట్‌లో 8 బోట్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. బ్రిడ్జిలకు 500 మీటర్ల దూరంలో ఏవిధమైన తవ్వకాలు చేపట్టకూడదనే నిబంధన ఉంది. తెల్లవారు జూమునుంచే పడవల సాయంతో రోజూ ఇసుక త్వవకాలు చేస్తున్నారని జేసీ తెలిపారు. మైనింగ్, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు, టాస్క్ఫోర్సు సహకారంతో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్న బోట్లను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. బోట్ల నిర్వాహకులు తెలిసే ఈ తవ్వకాలు చేస్తున్నట్టు తమ విచారణలో వెల్లడైందన్నారు. బోట్లను సీజ్ చేయడమే కాకుండా యజమానుల పైన, బోట్స్‌మెన్ సొసైటీ సభ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొవ్వూరులో సీజ్ చేసిన పది బోట్లను గోష్పాదక్షేత్రం లోని బోట్పాయింట్ వద్ద భద్రపరిచినట్లు ఏజీఆర్‌బీ డీఈఈ కె.ఆనంద్‌బాబు తెలిపారు. మైనింగ్ ఏడీ ఫణి భూషణ్‌రెడ్డి, ఏజీఆర్‌బీ ఏఈ జి.మణికంఠరాజు, టాస్క్ఫోర్సు అధికారులు పాల్గొన్నారు. -
బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
అల్లవరం: అమలాపురం రూరల్ పేరూరు పంచాయతీ తలుపులపేటకు చెందిన అంబటి రాజు (22) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆదివారం ర్రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సినిమాకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన రాజు ఆదివారం రాత్రి 10 గంటలకు బ్రిడ్జి వద్దకు వచ్చి మోటారు సైకిల్ని పార్కు చేసి, చెప్పులు వదిలి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే సమయంలో కొంతమంది మోటారు సైకిల్‌ను పార్కు చేసి ఉండడాన్ని గమనించారు. సోమవారం ఉదయం వరకు మోటారు సైకిల్ బ్రిడ్జిపైనే పార్కు చేసి ఉండడంతో ప్రయాణికులు గమనించి 100కి సమాచారం ఇచ్చారు. దీంతో అల్లవరం పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులతో గాలించగా నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకి చేర్చారు. మృతుడు తండ్రి పాపారావు ఫిర్యాదుతో అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఏ కారణం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడో విచారణలో తెలియవలసి ఉంది. మృతుడుకి తండ్రి, తల్లి ఉన్నారు. -
మహిళ అదృశ్యం
ముమ్మిడివరం: అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఆమె కుమారుడు ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముమ్మిడివరం నగర పంచాయతీ రాయుడువారిపాలెంకు చెందిన బొక్కా వెంకట రమణ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని కుమారుడు విజయరాజు ఫిర్యాదు చేశాడు. ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి దుర్మరణం కొవ్వూరు: చాగల్లు–కొవ్వూరు మధ్య డీలైన్ ట్రక్ మధ్య ఆదివారం రాత్రి విజయవాడ–విశాఖపట్నం వైపు వెళ్లే రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. వయసు 45 ఏళ్లు ఉండవచ్చునని రైల్వే పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుడిచేతిపై ఈశ్వర్ అని, కుడి జబ్బపై త్రిశూలం, నాగు పాము, ఢమరుకం గుర్తులతో పచ్బ బొట్టు ఉంది. నిడదవోలు రైల్వే హెడ్ కానిస్టేబుల్ డి.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. -
మనుగడకు ముప్పు తేవొద్దు
రాజమహేంద్రవరం రూరల్: జీవిత బీమా సంస్థ ఉన్నతికి దోహదపడిన దేశంలోని 14 లక్షల మంది ఏజెంట్ల మనుగడకు నష్టం కలిగించే విధంగా యాజమాన్యం ప్రవర్తించడం సరికాదని, పాలసీదారుల ప్రయోజనాలకు ఇబ్బందులు వస్తాయని అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ) రాజమండ్రి డివిజనల్ అధ్యక్షుడు రావుల మాధవరావు అన్నారు. జీవిత బీమా సంస్థ ఏజెంట్ల మనుగడకు భంగం కలిగించే విధంగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అఖిల భారత జీవిత బీమా ఏజంట్ల సమాఖ్య (లియాఫి) పిలుపు మేరకు సోమవారం మో రంపూడి ఎల్ఐసీ రాజమహేంద్రవరం డివిజనల్ ఆఫీ సు ఎదుట రాజమహేంద్రవరం డివిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం డివిజనల్ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జీవిత బీమా సంస్థ(లియాఫి) సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉన్న పాలసీలు అన్నింటిని క్లోజ్ చేసి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీలను ప్రవేశపెట్టిందన్నారు. అందులో ఏజెంట్లకు కస్టమర్లకు ఇ బ్బంది కలిగించే విషయాలను పొందుపరిచిందన్నా రు. క్లా బ్యాక్ కమిషన్ స్ట్రక్చర్‌ని మార్చడం, మినిమం బీమా మొత్తాన్ని రూ.రెండు లక్షలకు పెంచడం, పాలసీల్లో వయోపరిమితిని తగ్గించటం, ప్రీమియం రేట్లు పెంచడం చేసిందన్నారు. వీటన్నిటిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి చేస్తున్న తమ ఆందోళనను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆలిండియా ఈసీ సభ్యుడు మస్తాన్, ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి (నాగబాబు), గౌరవ అధ్యక్షుడు వంగా త్రిమూర్తులు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ దొరబాబు, జోనల్ మెంబర్ సాంబమూర్తి, కోశాధికారి పిండి రెడ్డమ్మ, ఆల్ ఇండియా ఈసీ మెంబర్ అరవింద్, సీడబ్ల్యూఏ డివిజన్ అధ్యక్షుడు వేమూరి శ్రీనివాస్ మాట్లాడారు. మెయిన్ బ్రాంచి అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పీవీఎస్ కృష్ణారావు, అధ్యక్షుడు గండిబోయిన శ్రీనివాసరావు, సెక్రటరీ పట్నాల సుధాకర్, రూరల్ బ్రాంచి ప్రెసిడెంట్ ఆదిమూలం సాయిబాబా, డివిజన్లోని 20బ్రాంచ్‌ల నుంచి ఏజెంట్లు మహాధర్నాలో పాల్గొన్నారు. పాలసీదారులకు, ఏజెంట్లకు నష్టం చేస్తున్న ఎల్ఐసీ యాజమాన్యం ధ్వజమెత్తిన యూనియన్ నాయకులు -
కామధేను జాతీయ పురస్కారం అందుకున్న శంఖారావ యు‘గళం’
రాజమహేంద్రవరం రూరల్/పి.గన్నవరం: నిర్విరామంగా 20 నిమిషాల పాటు శంఖారావాన్ని పూరించడంలో జాతీయస్థాయిలో ఖ్యాతిని ఆర్జించి అనేక రికార్డులను, అవార్డులను, సువర్ణ ఘంటా కంకణాలు సాధించిన శంఖారావ యు‘గళం’ డాక్టర్ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి దంపతులు మరో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ దంపతులకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కామధేను జాతీయ పురస్కారాన్ని ఆదివారం హైదరాబాద్ టూరిజం ఫ్లాజాలో జరిగిన ఓ కార్యక్రమంలో అందజేసింది. ఆ సంస్థ సీఈఓ సత్యవోలు రాంబాబు ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందా చేతుల మీదుగా ఆ దంపతులు పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డుల ప్రదానోత్సవాన్ని వీరి శంఖారావంతో ప్రారంభించారు. పి.గన్నవరానికి చెందిన డాక్టర్ నరసింహరావు ఏపీ ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీఎఫ్) కమాండెంట్‌గా రాజమహేంద్రవరంలో విధులను నిర్వర్తిస్తున్నారు. -
శాశ్వత పూజల కోసం భక్తుల విరాళాలు
సంవత్సరం వచ్చిన మొత్తం (రూ.లలో) 2010–2011 9,32,100 2011–2012 17,52,800 2012–2013 16,85,400 2013–2014 15,93,800 2014–2015 25,96,400 2015–2016 25,97,100 2016–2017 30,13,300 2017–2018 29,92,300 2018–2019 39,22,700 2019–2020 41,46,500 2020–2021 21,50,500 2021–2022 30,59,100 2022–2023 51,04,300 2023–2024 63,22,200 2024–2025 32,19,300 (నవంబర్ 2024 వరకూ) -
నలుగురిలో గొప్పగా..
పతకాలు సాధిస్తూ.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కర్రి తేజస్వి నాగలక్ష్మిసాయి జాతీయ స్థాయిలో పలు పోటీల్లో విజేతగా నిలిచింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆమె ఎస్జీఎఫ్ఐ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున రెండుసార్లు ప్రాతినిధ్యం వహించింది. 2022లో సీనియర్స్ విభాగంలో, 2023లో ఐసీఎస్ఈలో రజత పతకం సాధించింది. ప్రపంచ స్థాయిలో జరిగే ఆర్చరీ, ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా తర్ఫీదు పొందుతున్నానని నాగలక్ష్మి అంటోంది. – కర్రి తేజస్వి నాగలక్ష్మిసాయి ఆర్చరీలో అన్నాచెల్లెళ్లు రాజమహేంద్రవరానికి చెందిన అన్నాచెల్లెళ్లు నల్లా రిత్విక్ సాయితేజ్, నల్లా వర్షిణీ శ్రీభరత్లు ఆర్చరీలో రాణిస్తున్నారు. ఒకే క్రీడలో అన్నాచెల్లెళ్లు జాతీయ స్థాయిలో రాణిస్తుండడం విశేషం. సాయితేజ్ ఐసీఎస్ఈకి రెండుసార్లు, ఓపెన్ మీట్‌కు మూడుసార్లు, ఎస్జీఎఫ్ఐకు ఒకసారి ప్రాతినిధ్యం వహించాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాయితేజ్ సైతం ఒలింపిక్స్ లక్ష్యంగా శిక్షణ పొందుతున్నాడు. అతని సోదరి వర్షిణీ ఐసీఎస్ఈకి రెండు సార్లు, ఎస్జీఎఫ్ఐకి రెండు సార్లు ఎంపికైంది. ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. – నల్లా రిత్విక్ సాయితేజ్, వర్షిణీ శ్రీభరత్ ఆర్చరీ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు● ఆర్చరీలో ‘తూర్పు’ క్రీడాకారుల ప్రతిభ ● జాతీయ స్థాయిలో రాణింపు ● అమలాపురంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపికలు సాక్షి, అమలాపురం: రామాయణం.. మహా భారతం కాలం నాటి నుంచి నేటి ఆధునిక యుగం వరకూ విలు విద్యకు ఎంతో ప్రాధాన్యం ఉంది. భారతీయ సంస్కృతి.. జీవన విధానంలో విల్లు, బాణాలు ప్రాణరక్షణతో పాటు ఆదివాసీల సహజమైన వేటకు ఉపయోగపడేవి. అటువంటి విల్లుతో నిర్వహించే పోటీలు (ఆర్చరీ)కి సైతం అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ ఉంది. ఈ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. వివిధ విభాగాలు, క్రీడా సంస్థలు, ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆర్చరీ పోటీల్లోనూ సత్తా చాటుతున్నారు. ఒలింపిక్స్.. అంతర్జాతీయ స్థాయి ఆర్చరీ విభాగాల్లో భారత దేశానికి పెద్దగా పతకాలు వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడిప్పుడే ఈ క్రీడాకారులు జాతీయ స్థాయిలోనూ పలు విభాగాల్లో విజేతలుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు ఆర్చరీ క్రీడ లో మెరుపులు మెరిపిస్తున్నారు. ఐసీఎస్ఈ, ఎస్జీఎఫ్ఐ, నేషనల్ ఓపెన్ మీట్ వంటి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. ఆర్చరీలో ఇండియన్ రౌండ్, రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో సత్తా చాటుతున్నారు. పాఠశాల స్థాయిలో చేయూత పాఠశాల స్థాయిలో క్రీడలకు చేయూత అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాషా అన్నారు. అమలాపురం సీవీ రామన్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు, ఎంపికలు జరిగాయి. జిల్లా ఆర్చరీ అసోసియేషన్, స్వర్గీయ రవణం రాంబాబు మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. వీటిని డీఈఓ సలీం బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, వివిధ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున క్రీడా పోటీలు జరగడం అభినందనీయమన్నారు. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి 43 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నలగడ్డ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల ప్రారంభోత్సవంలో సీవీ రామన్ కళాశాల డైరెక్టర్ ఆర్.వేణుగోపాలరావు, క్రీడా భారతి అధ్యక్షుడు అల్లాడి శరత్‌బాబు, కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి, ఒలింపిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రంకిరెడ్డి కాశీవిశ్వనాథ్, కార్యదర్శి గోకరకొండ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. విజేతల వివరాలు ఇండియన్ రౌండ్ బాలికల విభాగంలో బండారు జోషితా సూర్య తేజస్విని (జగ్గంపేట), ఎం.విశ్వతా శ్రీసాయి సూర్య హర్షిణి (అమలాపురం), జమ్మలమడక ఐశ్యర్యా సూర్యదీపిక, బండారు తేజస్వినిదేవి, పి.లక్ష్మి, ఎస్కే హమిడా (పిఠాపురం), బాలుర విభాగంలో వి.రిత్విక, జయసూర్యారెడ్డి, ఎస్.లీలా ప్రణవరెడ్డి, ఎస్.సతీష్ చైతన్య, (రాజమహేంద్రవరం), షేక్ లతీఫ్ వలీ, పి.నాని (పిఠాపురం), కాంపౌండ్ రౌండ్ విభాగంలో కుడప వెంకట ప్రద్యూమ్న, జి.అనిరవ సాయి, కేవీవీ కార్తికేయ కృష్ణ (రాజమహేంద్రవరం), కర్రి బుద్దేశ్వరరావు (అమలాపురం), రికర్వ్ బాలుర విభాగంలో రిత్విక్ సాయితేజ (రాజమహేంద్రవరం), ఎ.అచ్యుత శేఖర్ విజేతలుగా నిలిచారు. క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో డీఈఓ సలీం బాషాఒలింపిక్స్ లక్ష్యంగా... అమలాపురానికి చెందిన కర్రి బుద్దేశ్వరరావు జాతీయ స్థాయిలో పలు విజయాలు సాధించాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అతను జాతీయ స్థాయి సీనియర్స్ విభాగంలో బంగారు పతకం, జూనియర్ నేషనల్స్‌లో రజత పతకం దక్కించుకున్నాడు. సబ్ జూనియర్స్ విభాగంలో రెండుసార్లు, జూనియర్స్ విభాగంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. 2021లో జరిగిన అండర్–14 విభాగంలో మూడు పతకాలు, 2024లో ఎస్జీఎఫ్ఐ టీమ్ విభాగంలో కాంస్య పతకం, సీబీఎస్సీ జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకాలు సాధించాడు. ఆర్చరీ విభాగంలో ఒలింపిక్స్ ఆడాలన్నదే తన లక్ష్యమని, అందుకు అనుగుణంగా నిరంతరం సాధన చేస్తున్నానని బుద్దేశ్వరరావు చెబుతున్నాడు. – కర్రి బుద్దేశ్వరరావు -
అయినవిల్లిలో భక్తుల సందడి
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస, రుద్రాభిషేకాలు, వివిధ పూజలు జరిపారు. స్వామికి మహానివేదన అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాల్లో 40 మంది, పంచామృతాభిషేకాల్లో నలుగురు, లక్ష్మీగణపతి హోమంలో 8 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. పది మంది చిన్నారులకు నామకరణ, అక్షరాభ్యాసాలు, తులాభారం, 24 మంది నూతన వాహన పూజలు చేయించుకున్నారు. నిత్యాన్నదాన పథకంలో 1,560 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయానికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.1,96,429 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. -
ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో ప్రతిభ చూపాలి
అమలాపురం టౌన్: నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ చూపి కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక చేయూతకు అర్హులు కావాలని డీఈఓ షేక్ సలీమ్ బాషా ఆకాంక్షించారు. ఆదివారం డివిజన్‌కు సంబంధించి అమలాపురంలో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాల్లో 8వ తరగతి విద్యార్థులు పరీక్ష రాశారు. అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అంతకు ముందు పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులను ఉద్ధేశించి డీఈఓ మాట్లాడారు. పరీక్షకు క్రమశిక్షణతో సహకారం అందించిన ఎన్సీసీ విద్యార్థులను అభినందించారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షల స్క్వాడ్ అధికారి, అమలాపురం డివిజన్ విద్యా శాఖాధికారి (డీవైఈఓ) గుబ్బల సూర్యప్రకాశం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. అమలాపురంలోని కొంకాపల్లి జవహర్లాల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, వెత్సావారి అగ్రహారం మహత్మాగాంఽధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, విద్యానిధి స్కూల్, రూరల్ మండలం పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎన్ఎంఎంఎస్ పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు డీవైఈఓ తెలిపారు. అమలాపురం డివిజన్లో మొత్తం 1,239 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1,156 మంది హాజరయ్యారని చెప్పారు. హెచ్ఎంలు ఎస్.రాజరాజేశ్వరి, విజయకుమారి, కె.ఘన సత్యనారాయణ, బీఆర్ కామేశ్వరరావు, శ్రీనివాసరావులు ఆయా పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించారు. జిల్లాలో ప్రశాంతంగా పరీక్ష రాయవరం: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ అర్హతకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 13 కేంద్రాల్లో 2,815 మందికి 2,688 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. నేడు యథావిధిగా గ్రీవెన్స్ అమలాపురం రూరల్: జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్ గోదావరి భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి అర్జీదారులు వచ్చి తమ సమస్యలను తెలిపి పరిష్కార మార్గాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయితో పాటు డివిజన్, మండల స్థాయిల్లోనూ ఈ కార్యక్రమం జరుతుందని కలెక్టర్ అన్నారు. -
పొట్టేళ్ల బండి.. పరుగెత్తిందండి
అంబాజీపేట: జోడెడ్ల బండిని చూశాం.. గుర్రపు బగ్గీని చూశాం.. ఒంటె బండి లాగుతున్నదీ చూశాం. కానీ పొట్టేళ్ల బండి లాగడం అంటే ఆశ్చర్యమే కదా. రెండు పొట్టేళ్లకు బండిని తయారు చేయించి సవారీ చేస్తున్న దృశ్యం పలువురిని అబ్బురపరస్తుంది. వివరాల్లోకి వెళితే అంబాజీపేటకు చెందిన యర్రంశెట్టి శ్రీను కారు మెకానిక్, గ్యారేజ్‌ను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆ వృత్తితో పాటు పశువులు, వ్యవసాయం అంటే ఎంతో మక్కువతో వివిధ రకాల జాతి ఆవులు, పొట్టి ఆవులు, గొర్రెలు, కుక్కలను ప్రేమతో పెంచుతున్నాడు. ఐదు నెలల క్రితం రెండు పొట్టేళ్లను శ్రీశైలంలో రూ.25 వేలకు కొనుగోలు చేశానని, ఈ పొట్టేళ్ల జోడికి బండి కట్టాలని ఆలోచన వచ్చిందన్నారు. దాంతో రూ.30 వేలు వెచ్చించి తనకున్న ఆలోచనలకు తగినట్లుగా బండిని తయారు చేయించానన్నాడు. ఈ పొట్టేళ్లకు బండి కట్టి శిక్షణ ఇస్తున్నాడు. సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి పొట్టేళ్లపై బండిపై సవారీ చేయడం తన లక్ష్యమని శ్రీను తెలిపాడు. ‘పెద్దింటి’కి విశ్వగురు కామధేను పురస్కారం కొత్తపేట: వివిధ ప్రయోగాలతో తన ప్రత్యేకతను చాటుకుంటున్న బహుముఖ ప్రజ్ఞాశాలి పెద్దింటి రామచంద్ర శ్రీహరి (రామం)కు విశ్వగురు కామధేను పురస్కారాన్ని ప్రదానం చేశారు. కొత్తపేటకు చెందిన రామం తన ప్రయోగాలు, వివిధ అరుదైన సేకరణలు, సేవల ద్వారా 100 రికార్డులు, 16 అవార్డులు, గౌరవ డాక్టరేట్ పొందారు. తాజాగా విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖులతో పాటు రామంను కామధేను పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజా వద్ద పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రామంను తెలంగాణ హైకోర్టు జడ్జి సూర్యేపల్లి నంద చేతుల మీదుగా అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన్ని విశ్వగురు సంస్థ చైర్మన్ సత్యవోలు రాంబాబు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ చైర్మన్ డాక్టర్ చింతపట్ల వెంకటాచారి, ప్రముఖ సినీ నటులు పృథ్వీరాజ్, జోగినాయుడు తదితర అభినందించారు. ఆర్టీసీ కండక్టర్‌కు జాతీయ అవార్డులుగోపాలపురం: మండలంలోని వేళ్లచింతలగూడెం గ్రామానికి చెందిన కౌలూరి ప్రసాదరావు మహాత్మా జ్యోతిరావు ఫైలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫెలోషిప్ అవార్డులు అందుకున్నారు. న్యూఢిల్లీలోని పంచశీల ఆశ్రమంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయనకు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.సుమనాక్షర్ ఆధ్వర్యాన కేంద్ర మాజీ మంత్రి, ఏపీ మాజీ గవర్నర్ సుశీల్‌కుమార్ షిండే అవార్డులు అందజేశారు. ప్రసాదరావు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నారు. ట్రాక్టర్ ఢీకొని తల్లీకూతుళ్ల మృతి గోపాలపురం: వేగంగా దూసుకువచ్చిన ట్రాక్టరే వారి పాలిట మృత్యుశకటమైంది. మండలంలోని దొండపూడి గ్రామ శివార్లలో ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు తల్లీకూతుళ్లు ఆదివారం మృతి చెందారు. ఎస్సై కర్రి సతీష్ కుమార్ కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా పోలవరం మండలం బక్కబండ్లగూడెం గ్రామానికి చెందిన కురసాని కాంతమ్మ (45), ఆమె తల్లి కవలం గన్నెమ్మ (72) కలసి గోపాలపురం మండలం దొండపూడికి స్కూటీపై వచ్చారు. పనులు ముగించుకొని తిరిగి వెళుతుండగా గ్రామ శివార్లలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వారిని బలంగా ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లను 108లో రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. మృతురాలు కాంతమ్మ బక్కబండ్లగూడెంలో అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తోందని తెలిపారు. -
విజేత ఎవరో!
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే ● బరిలో ఐదుగురు ● ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ ● జేఎన్టీయూకేలో నేడు ఓట్ల లెక్కింపు ● పూర్తయిన ఏర్పాట్లు ● మొత్తం లెక్కించే ఓట్లు 15,502 సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉపాధ్యాయ వర్గ ప్రతినిధిగా రాష్ట్ర పెద్దల సభకు వెళ్లేది ఎవరో కొద్ది గంటల్లో తేలిపోనుంది. రాష్ట్ర శాసన మండలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో విజేత ఎవరనే సస్పెన్స్ వీడిపోనుంది. ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉండగానే.. ఏలూరుకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ హఠాన్మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. మిగిలి ఉన్న రెండేళ్ల పదవీ కాలానికి గత గురువారం ఎన్నికలు నిర్వహించారు. కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన 116 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో 92.62 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 16,737 ఓటర్లకు గాను 15,502 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థుల తలరాతలను నిర్దేశించే ఓటర్ల మనోగతం కాకినాడ జేఎన్టీయూలోని అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో భద్రంగా ఉంది. ఈ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఓట్లను లెక్కించిన అనంతరం ఫలితాన్ని రిటర్నింగ్ అధికారి వెల్లడించనున్నారు. 14 టేబుళ్లు.. 9 రౌండ్లు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జేఎన్టీయూకేలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం పోలైన ఓట్లను 9 రౌండ్లలో లెక్కించనున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలి దశలో ప్రాథమిక ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం, సమగ్ర లెక్కింపు ప్రక్రియ చేపడతారు. కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తయ్యింది. ఓట్ల లెక్కింపు సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 6 గంటల లోపే లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఇప్పటికే సూచించారు. అభ్యర్థుల ఎదురు చూపులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలిచినా.. పోలింగ్ సరళిని బట్టి ప్రధాన పోరు మాత్రం ఇద్దరి మధ్యనే జరిగిందనే స్పష్టమైంది. బొర్రా గోపిమూర్తి (భీమవరం), గంధం నారాయణరావు (ద్రాక్షారామ), పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి (విల్ల లక్ష్మి) ఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఈ అయిదుగురు అభ్యర్థుల్లో ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తి మధ్యనే పోటీ నెలకొంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వీరిద్దరూ అన్ని స్థాయిల్లో పోటాపోటీగా ప్రయత్నాలు చేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడిన గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏది ఎలా ఉన్నా తెల్లవారితే తేలనున్న ఫలితం కోసం అభ్యర్థులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలన జేఎన్టీయూకేలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల స్ట్రాంగ్ రూమును కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూములో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను, ఎన్నికల సామగ్రిని, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు. జిల్లాల వారీగా మొత్తం ఓట్లు, లెక్కించే ఓట్ల వివరాలు జిల్లా మొత్తం లెక్కించే శాతం ఓట్లు ఓట్లు కాకినాడ 3,418 3,118 91.22 తూర్పు గోదావరి 2,990 2,753 92.07 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 3,296 3,138 95.21 అల్లూరి సీతారామరాజు 637 565 88.70 పశ్చిమ గోదావరి 3,729 3,484 93.43 ఏలూరు 2,667 2,444 91.64 -
రత్నగిరికి భక్తుల తాకిడి
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● రూ.30 లక్షల ఆదాయంఅన్నవరం: రత్నగిరిపై వెలసిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడానికి తోడు శనివారం రాత్రి రత్నగిరితో పాటు పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధువులు వేలాదిగా తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణునికి పూజలు చేశారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు. కన్నుల పండువగా రథోత్సవం స్వామివారి ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. అనంతరం మేళతాళాల మధ్య ఆ రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల విగ్రహాలను అర్చకులు వేంచేయించి పూజలు చేశారు. అనంతరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్రావు కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వెంట రాగా ఆలయ ప్రాకారంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు.