Sagubadi
-
వ్యవసాయ రంగమే దేశాభివృద్ధికి కీలకం
సాధారణంగా దేశాభి వృద్ధికి పారిశ్రామిక రంగం, సేవల రంగం కీలక మైనవి. దీనికి భిన్నంగా మన దేశంలో వ్యవ సాయ రంగమే కీలక రంగంగా మారింది. మూల ధన సాంద్రత, సాంకే తిక పరమైన వనరుల ఉపయోగంతో పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. ఇక సేవల రంగంలోనైతే మానవ వనరుల నైపుణ్యం అంతంత మాత్రంగా ఉండడం వలన ఆ రంగ పురోగ మనం స్వల్పంగానే ఉంది. ఫలితంగా దేశ ప్రగ తికి వ్యవసాయ రంగమే నేడు ఆధారంగాఉంది. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రైతు. 1950లలో 70 శాతం దేశ ప్రజలు వ్యవ సాయ రంగం పైనే ఆధారపడి ఉండేవారు. ఆ శాతం 2024 నాటికి 54.6 శాతంగా ఉంది.అంటే ఇంకా ఎక్కువగా ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడే జీవిస్తున్నారన్నమాట! సాగు భూమి విస్తీర్ణం కూడా అమెరికా, చైనా తరువాత మన దేశంలోనే ఎక్కువ. అయితే రైతులకు ఇచ్చిన హామీలను మన పాలకులు నెరవేర్చనందు వలన పెట్టుబడికి చేసిన అప్పుకు వడ్డీ కూడా చెల్లించలేక రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. గత 30 ఏళ్లలో రైతులు, రైతు కూలీలు నాలుగు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా తెలియజేస్తోంది. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వాలు సరైన గిట్టుబాటు ధరను కల్పించి, వాటిని కొనుగోలు చేసినప్పుడే రైతులు సుభిక్షంగా ఉంటారు. అలాగే దేశం కూడా! పొరుగు దేశమైన చైనాతో పోల్చుకుంటే మన రైతుల పరిస్థితి కడు దయనీయంగాఉంది. 1980లో మనదేశంలో రైతుల తలసరి ఆదాయం 582 డాలర్లు కాగా, చైనాలో 307 డాలర్లు మాత్రమే! 2024 వచ్చేటప్పటికి చైనాలో రైతుల తలసరి ఆదాయం 25,015 డాలర్లకు పెరగగా మన రైతులు 10,123 డాలర్లు మాత్రమే పొందగలిగారు.రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర లభించ కపోవడంతో 1990–91లో వ్యవసాయ రంగ వాటా జీడీపీలో 35 శాతం కాగా... 2022–23 లో 15 శాతానికి పడిపోయింది. వ్యవసాయరంగంపై ఆధారపడిన శ్రామిక జనాభా మాత్రం 60 శాతం వరకు ఉంది. కొన్ని అధ్యయనాలు చెబుతున్నట్టుగా భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా... దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవి చూస్తున్నారు. శాశ్వత పేదరికం నుండి రైతు లను బయట పడేయడానికి ఏకైక మార్గం వ్యవ సాయ ధరలకు హామీ ఇవ్వడం కోసం ఒక చట్ట బద్ధమైన ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించడం. కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టం మార్కె ట్లను అస్తవ్యస్తం చేస్తుందని కేంద్రం కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టుకు తెలపడం గమనార్హం.1991లో నూతన ఆర్థిక విధానాన్ని చేపట్టిన తరువాత వ్యవసాయ రంగం నుండి శ్రామి కులు పారిశ్రామిక రంగానికి బదిలీ అవుతారని భావించడం జరిగింది. అలాగే గ్లోబలైజేషన్ వలన వ్యవసాయ ఉత్పత్తులు విదేశీ మార్కెట్లోకి వెళ్లడం వలన రైతులు లాభపడతారని అను కున్నారు. ఈ విధానం వచ్చి 30 ఏళ్లు గడిచి పోయాయి. అయినా అనుకున్నవేవీ జరగలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆశయాలలో ముఖ్యమైనవి–విదేశీ వాణిజ్యం ద్వారా ప్రపంచ దేశాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ఉద్యోగ కల్పన చేయడం, ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకుని లాభాలను ఆర్జించేటట్లు చేయడం! ఈ నేపథ్యంలో మన పాలకులప్రపంచ దేశాల ఆకలి తీర్చుతున్న భారత రైతుల ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో అమ్మి లాభాలు పొందే విధంగా కార్యాచరణ చేప ట్టాలి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు సమ కూర్చిన వనరులకు సమానంగా రైతులకు కూడా ఇచ్చినప్పుడే దేశం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలో ఉంటుంది.డా. ఎనుగొండ నాగరాజ నాయుడు వ్యాసకర్త రిటైర్డ్ ప్రిన్సిపాల్మొబైల్: 98663 22172 -
మన నగరంలోనే అరుదైన పంటలు..రుద్రాక్ష, కుంకుమ పువ్వు..
హైదరాబాద్ నగరం కేవలం ఐటీ, పారిశ్రామిక స్టార్టప్‌లకు మాత్రమే కాదు.. అరుదైన పంటల ఆవిష్కర్తలకు నగరంలోని శివారు ప్రాంతాలు వేదికగా నిలుస్తున్నాయి.. బీటెక్ కోర్సులు పూర్తి చేసి, ఐటీ, ఇతర సాంకేతిక సాగులో ఆరితేరాల్సిన జిల్లా యువత.. అరుదైన పంటల పరిశోధనలు, సాగుపై దృష్టిసారించింది. అందమైన కాశ్మీర్ లోయల్లో మాత్రమే సాగయ్యే అరుదైన కుంకుమ పువ్వు బాలాపూర్ మండలం గుర్రంగూడలో సాగవుతుండగా, కేరళ తీరం వెంట మాత్రమే సాగయ్యే వక్క తోటలు శంకర్పల్లిలోనూ సాగవుతున్నాయి. ఇక సిమ్లా, ఇతర శీతల ప్రదేశాల్లో మాత్రమే కనిపించే యాపిల్ ప్రస్తుతం కందుకూరు మండలం పులిమామిడిలోనూ దర్శనమిస్తున్నాయి. సౌదీ అరేబియా దేశాల్లో విరివిగా పండే ఖర్జూర సరస్వతి గూడలో నోరూరిస్తుంది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అవకాడో ప్రస్తుతం దెబ్బగూడలోనూ లభిస్తుంది. నేపాల్ సరిహద్దులో అరుదుగా లభించే రుద్రాక్ష.. ప్రస్తుతం మేడ్చల్ మండలం రాయిలాపూర్‌లో సాగవుతుండటం గమనార్హం.. ఎస్బీఐలో ఉద్యోగం చేస్తూ.. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో వ్యవసాయ కుటుంబం. నల్లగొండ ఎన్జీకాలేజీలో డిగ్రీ, ఉస్మానియాలో ఎంబీఏ పూర్తి చేశాను. ప్రస్తుతం కోఠి ఎస్బీఐలో పని చేస్తున్నా. అచ్చంపేటలో పదెకరాలు, సరస్వతి గూడలో ఏడెకరాలు ఉంది. యూట్యూబ్ ద్వారా అనంతపూర్‌లో ఖర్జూర సాగు చేస్తున్న విషయం తెలుసుకున్నా. ఆ మేరకు ఆరేళ్ల క్రితం మొత్తం 17 ఎకరాల్లో 1260 మొక్కలు నాటాను. ఎకరాకు రూ.5 లక్షల వరకూ వచి్చంది. మూడేళ్ల క్రితం దిగుబడి ప్రారంభమైంది. తొలిసారిగా 1.50 టన్నుల దిగుబడి వచి్చంది. ఆ తర్వాత 55 నుంచి 60 టన్నుల దిగుబడి వచ్చింది. – ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అచ్చంపేట (ఖర్జూర) విదేశాల నుంచి తిరిగొచ్చి.. బీటెక్ పూర్తి చేసి, ఎంబీఏ కోసం పదేళ్ల క్రితం లండన్ వెళ్లాను. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక వెనక్కి తిరిగొచ్చా. అవకాడోపై అవగాహన ఉండటంతో అటువైపు చూశా.. మూడేళ్ల క్రితం 1.10 ఎకరాల విస్త్రీర్ణంలో 220 అవకాడో మొక్కలు నాటాను. సాధారణంగా 25 డిగ్రీల వాతావరణంలో మాత్రమే పెరిగే అవకాడో 40 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడింది. డ్రిప్ సాయంతో మొక్కలకు నీరు అందించా. చీడపీడల సమస్యే కాదు.. పెట్టుబడికి పైసా ఖర్చు కూడా కాలేదు. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 కాయలు దిగుబడి వచ్చింది. ఆన్లైన్లో చూసి, స్వయంగా తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. – రమావత్ జైపాల్, దెబ్బడిగూడ (అవకాడో) బీటెక్ చదువుతూనే.. బాలాపూర్ మండలం గుర్రంగూడ మాది. ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నా. వ్యవసాయ కుంటుంబం కావడంతో నాన్నతో పాటు తరచూ పొలానికి వెళ్తుంటా. కాశ్మీర్లో ప్యాంపూర్, పుల్వొమా జిల్లాల్లో అరుదుగా పండే కుంకుమ పువ్వు పంటను ఎంచుకున్నా. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. కల్తీని నివారించి, నాణ్యమైన పువ్వును అందివ్వాలనుకున్నా. ఇంటిపై ఖాళీగా ఉన్న ఓ గదిలో 2024 సెప్టెంబర్‌లో సాగు ప్రారంభించాను. రూ.5 లక్షలు ఖర్చు అయ్యింది. ఇప్పటి వరకూ 20 గ్రాముల వరకూ సేకరించాం. ఒక గ్రాము రూ.800 నుంచి రూ.1000 వరకూ పలుకుతోంది. – లోహిత్‌రెడ్డి, గుర్రంగూడ (కుంకుమ పువ్వు) వక్కసాగులో విశ్రాంత వైద్యుడు.. ఐడీపీఎల్ బాలానగర్‌లో ఫ్యామిలి ఫిజీషియన్‌గా నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించా. శంకర్పల్లి మాసానిగూడలోని భూమిలో ఏదైనా చేయాలని భావించా. ఏలూరులో నా స్నేహితుడు విజయసారధి సూచనలతో 2015లో నాలుగు ఎకరాల్లో.. ఎకరాకు 300 చొప్పున వక్క మొక్కలు నాటాను. 2023లో తొలిసారిగా పంట దిగుబడి 1500 కేజీలు వచ్చింది. కేజీ రూ.350 నుంచి రూ.400 పలుకుతుంది. వక్కతోటలోనే అంతరపంటలుగా మిరియాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, అల్లం, యాపిల్, ద్రాక్ష, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, అవకాడో, మ్యాంగో, జామ వంటి పండ్ల మొక్కలను సాగు చేస్తున్నా. మరో ఏడాదిలో పండ్ల దిగుబడి ప్రారంభమవుతుంది. – డాక్టర్ విజయ్‌కుమార్ కొడాలి, బోధన్ (వక్కసాగు)రాయలాపూర్లో రుద్రాక్ష.. ఫిన్లాండ్కు చెందిన మహిళను వివాహం చేసుకుని మేడ్చల్ మండలం రాయలాపూర్ గ్రామ శివారులో స్థిరపడ్డారు. ఇంటి చుట్టూ వివిధ రకాల చెట్లు నాటారు. దక్షిణ భారతదేశంలో అత్యంత అరుదుగా కనిపించే రుద్రక్ష మొక్కలను ఇంటి ముందు నాటారు. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. జనవరి, ఫిబ్రవరిలో కాయలు తెంపి, ఆరబెడుతుంటారు. ప్రదీప్ ఇటీవల వెయ్యి రుద్రాక్షలతో పూజ చేయడం కొసమెరుపు. – ప్రదీప్, మేడ్చల్ (రుద్రాక్ష) (చదవండి: గట్ బయోమ్ 'పవర్ హోమ్'..!) -
పామాయిల్ సాగుతో ఎకరానికి ఏటా రూ. లక్ష నికరాదాయం
సాక్షి, హైదరాబాద్: పామాయిల్ సాగు విస్తరణ ద్వారానే వంట నూనెల ఉత్పత్తిలో మన దేశం స్వావలంబన సాధించగలుగుతుందని, రైతులకు ఎకరానికి ఏటా కనీసం రూ. లక్ష నికరాదాయం వస్తుందని పామాయిల్ సాగు నిపుణులు, తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారు డాక్టర్ బి.ఎన్.రావు చెప్పారు. ‘ఆయిల్‌పామ్ సాగు, ప్రాసెసింగ్ - ఆహార, ఆహారేతర రంగాల్లో ఉపయోగాలు’ అనే అంశంపై తార్నాకలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో జరిగిన జాతీయ సమావేశంలో శనివారం సాయంత్రం జరిగిన చర్చాగోష్టిలో డా. రావు మాట్లాడారు. ఏయే ఇతర పంటల్లో లేని విధంగా ఆయిల్‌పామ్‌లో రైతులకు నిరంతర ఆదాయం వస్తుందని ఆయన అన్నారు.అయితే, ఏడాది పొడవునా కాలువ / బోరు నీటి సదుపాయం పుష్కలంగా ఉండి, 30 ఏళ్ల పాటు నీటి సమస్య ఉండదనుకున్న రైతులే పామాయిల్ సాగు చేపట్టాలని సూచించారు. పామాయిల్ ఉత్పత్తికి సంబంధించిన శాస్త్రవేత్తలు, ప్రాసెసింగ్ శాస్త్రవేత్తలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీసీఎంబీ విశ్రాంత ప్రిన్సిపల్ సైంటిస్ట్, అగ్రి-హార్టీకల్చర్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఏవీ రావు మాట్లాడుతూ వాతావరణ మార్పులు, నిపుణుల కొరత, పరిశోధనల లేమి కారణంగా పామాయిల్ సాగులో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. మలేషియాలో మాదిరిగా ఇక్కడ దిగుబడులు రావాలని లేదన్నారు.శాస్త్రవేత్తలు, నూనె పరిశ్రమదారులు పామాయిల్ రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ ఉద్యానశాఖ ఏడీ డాక్టర్ లహరి మాట్లాడుతూ తెలంగాణలో పామాయిల్ సాగు 29 జిల్లాల్లో జరుగుతోందన్నారు. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ. 20,506 ఉందని చెబుతూ, ప్రభుత్వం నిర్ణయించే ధరలకే కంపెనీలు కొనుగోలు చేస్తాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సీనియర్ శాస్త్రవేత్త డా. అహ్మద్ ఇబ్రాహిం మాట్లాడుతూ వంట నూనెలు ఎన్ని ఉన్నా దేనికి ఉండే ప్రత్యేకతలు దానికి ఉన్నాయన్నారు. ఏదో ఒక వంట నూనెనే వాడటం మంచిదికాదన్నారు. మళ్లీ మళ్లీ వంటనూనెలను మరిగించి వినియోగించటం ఆరోగ్యకరం కాదంటూ, ఎన్ఐఎన్ మార్గదర్శకాలను పాటించాలన్నారు. అధ్యక్షతవహించిన ఎస్.కె. పట్నాయక్ మాట్లాడుతూ వంట నూనెల రంగంలో ప్రతిబంధకాలను అధిగమిస్తే స్వావలంబనకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. -
స్ఫూర్తిదాయక ‘సాగుబడి’
హరిత విప్లవం పుణ్యమాని ఆహారోత్పత్తిలో మనదేశం స్వయం సమృద్ధి సాధించింది. ఆహార ధాన్యాలు, కూరగాయాలు, పండ్లు అధికంగా పండించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన వ్యవసాయ రంగం ఎదిగింది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇంకోవైపు విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుచేసిన ఆహార ఉత్పత్తులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతున్నాయి. అధికోత్పత్తి ఆశతో మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఔషధాలు, మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయి. ప్రజలు, మూగజీవాల ఆరోగ్యాలకు హానికరంగా మారడంతో పాటు నేల సారాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయక ఉత్పాదకత, ఆహార భద్రత, పర్యావరణ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నింటికి విరుగుడుగా రసాయనేతర సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం మళ్లీ తెరమీదకు వచ్చింది.భూ సారానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిన రసాయనిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా.. అతి తక్కువ సాగు ఖర్చుతో ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయం పురుడు పోసుకుంది. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో దీని గురించి రైతులకు, ఔత్సాహికులకు తెలియకుండా పోయింది. సరిగ్గా అలాంటి సమయంలోనే సాక్షి దినపత్రిక ఈ గురుతర బాధ్యతను భుజాన వేసుకుంది. పునరుజ్జీవన వ్యవసాయ కథనాలకు ‘సాగుబడి’ పేరుతో ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించి ముందడుగు వేసింది. ప్రకృతి, సేంద్రియ రైతుల స్ఫూర్తిదాయక కథనాలతో పాటు రైతు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చింది. విత్తు దగ్గరి నుంచి విక్రయం వరకు.. అన్నదాతలకు ఉపయుక్తమైన సమాచారాన్ని ‘సాగుబడి’ సాధికారికంగా అందించింది. స్వల్ప వ్యవధిలోనే ‘సాగుబడి’ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు దిక్సూచిగా అత్యంత ఆదరణ చూరగొంది. ఇంటి పంటలు, సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు చేరువ చేసింది.చదవండి: తక్కువ ఖర్చుతో.. పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్‘సాగుబడి’లోని 2014-16 మధ్య కాలంలో ప్రచురితమైన ప్రకృతి వ్యవసాయ ప్రేరణాత్మక కథనాలను పుసక్తంగా ప్రచురించారు సీనియర్ జర్నలిస్ట్ పంతంగి రాంబాబు. ప్రకృతి, సేంద్రియ సాగుకు సంబంధించిన అన్ని అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రకృతి వ్యవసాయంలో లబ్దప్రతిష్టులైన వారు, రైతు శాస్త్రవేత్తల ఇంటర్వ్యూలతో పాటు రైతులకు అవసరమయ్యే సమాచారాన్నంతా అందించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రచురించిన ఈ పుస్తకాన్ని చూస్తేనే అర్థమవుతుంది రచయిత నిబద్దత. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వారితో పాటు సేంద్రియ సాగు గురించి తెలుసుకోవాలకునే వారికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. రచయిత చెప్పినట్టుగా ఈ పుస్తకం ప్రకృతి వ్యవసాయానికి పెద్దబాలశిక్ష వంటిదే.సాగుబడి (మొదటి భాగం)ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి కథనాలుపేజీలు: 320;వెల: 600 /- ; రచన, ప్రతులకు:పంతంగి రాంబాబు,8639738658👉ఆన్లైన్లో సాగుబడి పుస్తకం కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
మిద్దె తోట : షేడ్‌నెట్ అవసరమా? కాదా?
మేడపైన ఖాళీ ఉంచకుండా పచ్చని పంటలతో కళకళలాడేలా చూసుకుంటే ఏడాది పొడవునా ఆ కుటుంబం అంతటికీ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కొంతవరకైనా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు మేడపైన, పెరట్లో ఖాళీ లేకుండా ఇంటిపంటలు సాగు చేసుకోవటం అర్బన్ ప్రాంతాల్లో సొంతి ఇంటి యజమానులకు చాలా వరకు అలవాటైపోయింది. అయితే, వేసవిలో తమ పంటలను రక్షించుకోవటానికి సేంద్రియ మిద్దెతోట / ఇంటిపంటల సాగుదారులు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. షేడ్నెట్లు కట్టడం, గాలిదుమ్ములకు అవి చిరిగి΄ోవటం, ఎగిరి΄ోవటం పరి΄ాటి. అయితే, మండు వేసవిలోనూ షేడ్‌నెట్ అవసరం లేకుండానే పంటల ప్రణాళిక ద్వారా మిద్దె తోటలను సంరక్షించుకోవచ్చు అంటున్నారు సీనియర్ మిద్దెతోట నిపుణులు ‘లతా కృష్ణమూర్తి’.. ‘సాక్షి సాగుబడి’కి ఆమె తెలిపిన వివరాలు.. వచ్చేది ఎండాకాలం. షేడ్‌నెట్‌కు బదులుగా సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చే పండ్ల మొక్కలను మిద్దెతోటలో పది అడుగులకు ఒకటి చొప్పున పెద్ద కుండీల్లో పెంచుకుంటే.. వాటి పక్కన చిన్న మొక్కలకు ఎండ నుంచి రక్షణ ఉంటుంది. మిద్దెతోట ఏర్పాటు చేసుకునేటప్పుడే కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలతోపాటు పండ్ల మొక్కలు కూడా పెట్టుకోవాలి.పండ్ల మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు (మొదటి సంవత్సరం) ఎండాకాలం ఉష్ణోగ్రతలకు మొక్కలు తట్టుకోలేకపోయినా రెండో సంవత్సరం నుంచి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మా మిద్దెతోటలో నిర్మించిన ఎత్తుమడుల్లో ప్రతి పది అడుగులకు ఒక పండ్ల చెట్లు పెంచుతున్నాం. మిద్దెతోట వల్ల ఇంటి లోపల చల్లగా ఉంటుంది. బయటి ఉష్ణోగ్రతల కంటే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మండువేసవిలోనూ ఇంట్లో ఏ.సి. అవసరం ఉండదు. అందువల్ల కరెంట్ వాడకం తగ్గుతుంది. ఖర్చు కలిసి వస్తుంది. అలాగే, ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందటంతోపాటు తేమ కూడా రిలీజ్ అయి, గదిలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇవీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే... రోజుకు నాలుగు కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే!గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా? -
సేద్యంలో మహిళా సైన్యం!
దేవతల స్వంత దేశంగా భావించే భూమిపై తమకంటూ సొంతమైన కుంచెడు భూమి లేని నిరుపేద మహిళలు వారు. కేరళ ప్రభుత్వం ఇచ్చిన చిన్న ఆసరాతో సాగునే నమ్ముకోని వేరే ఉపాధికి నోచుకోని ఆ మహిళలు చేయి.. చేయి కలిపారు. సాగుబాటలో వేల అడుగులు జతకూడాయి. మహిళల నుదుటి చెమట చుక్కలు చిందిన బీడు భూములు విరగపండాయి. పైరు పరవళ్లు తొక్కాయి. వ్యవసాయం లాభసాటి కాదనే మాటలు నీటిమీది రాతలుగా తేలాయి. కేరళలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ సేద్యం జరుగుతోంది. వ్యవసాయంలో మాదే పైచేయి సుమా అంటున్నారు కేరళ మహిళా రైతులు.భూమిలేని మహిళల ఆర్థిక స్వావలంభన కల్పించే దిశగా కేరళ ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న కార్యక్రమం కుడుంబశ్రీ. కేరళ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ 1998లో ఊపిరి΄ోసుకున్న ‘కుడుంబ శ్రీ’ కేరళ గడ్డపై మహిళా సంఘటిత శక్తికి ప్రతీకగా ఎదిగింది. ఆ రాష్ట్రం మొత్తం ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉపాధి. ముఖ్యంగా తమకంటూ సొంత వ్యవసాయ భూములు లేని కుటుంబాలే ఎక్కువ. స్థానిక సాగు భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించటం వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేది. వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎక్కువగా మహిళలే కావటంతో పనులు దొరక్క తీవ్ర ఒడిదుడుకులకు లోనవ్వాల్సివచ్చేది. రాష్ట్ర భూ సంస్కరణల చట్టం కౌలుపై నిషేధం విధించింది. అనధికారికంగా కౌలుకు ఇస్తే తమ భూమిపై అధికారం శాశ్వతంగా కోల్పోతామనే భయం యజమానుల్లో ఉండేది. కూలి పనులు మానుకొని సొంత వ్యవసాయం చేయాలనుకునేవారికి అది అందని ద్రాక్ష అయింది. సంఘటిత శక్తే తారక మంత్రం.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోను కేరళ ప్రభుత్వం వెనుకడుగేయలేదు. సామూహిక వ్యవసాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూమిలేని మహిళలకు ΄÷లం, పంటతో అనుబంధం కల్పించటమే లక్ష్య సాధనలో తొలి అడుగుగా కొంతమంది భూమిలేని మహిళలను కలిపి 15–40 మంది మహిళలను కలిపి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, వ్యక్తిగత వ్యవసాయ భూములను గుర్తించి సంఘాలకు దఖలు పరిచారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు సాగులో సేంద్రియ పద్ధతులకు పెద్ద పీట వేశారు. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు మహిళా రైతుల కోసం ఏర్పాటు చేశారు. మంచి దిగుబడులను సాధించిన సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించేవారు. అన్ని జిల్లాల్లో 201 క్లస్టర్లలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ / ప్రకృతి సేద్యం జరుగుతోంది. నాబార్డు సహకారంతో కుడుంబశ్రీ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. రుణాలు తీసుకోవటం తిరిగి చెల్లించటంలో ఆయా సంఘాల్లోని మహిళా సభ్యులందరిది ఉమ్మడి బాధ్యత. ఒక్క తిరువనంతపురం జిల్లాలోనే ఆరువేల గ్రూపులు ఏర్పాటయ్యాయి. వీటిలో సుమారు 30 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఆదునిక పద్ధతుల్లో అరటి సాగుపై కేర ళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన శిక్షణతో తక్కువ కాలంలోనే రెండింతల దిగుబడులు సాధించారు. వనితా కర్మసేన పేరుతో కుడుంబశ్రీ కోసం వ్యవసాయ పరికాలను, యంత్రాలను ఉపయోగించటంలో మహిళలకు శిక్షణ ఇచ్చారు. కొనుగోలుకు రుణాలు ఇచ్చారు. ప్రతి సంఘానికి తమ సొంత పరికరాలు ఉన్నాయి. దీంతో వారే శ్రామికులుగా మారటంతో ఖర్చును ఆదా చేయగలిగారు. పంటను నష్ట΄ోయిన సందార్భాల్లో నాబార్డ్ మహిళా రైతులకు అండగా నిలిచింది. 47 వేల పై చిలుకు సంఘాలు, లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నాయి. జీడిమామిడి, కొబ్బరి, వరి, అరటి, పైనాపిల్ పండ్లతోటలు, ఆకుకూరలు, గుమ్మడి, బఠాణీ, సొర, అల్లం, బెండ, మిరప, వంటి పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. తాము పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విక్రయించటంతో మంచి లాభాలు కళ్లజూశారు. ఆరు నెలలు తిరగకుండానే రుణాలు తిరిగి చెల్లించారు. ఒక్కో సీజన్లోనే ఈ సంఘాలు రూ. లక్ష వరకు నికరాదాయం ఆర్జించేవి. దీంతో తమకంటూ సొంత ఇళ్లను నిర్మించుకున్నారు. చిన్న వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకులు గతంలో మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవి కాదు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. 10543 స్వయం సహాయక సంఘాలకు రూ. 123 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకుల దృష్టిలో మహిళారైతులు అంటే మంచి పరపతిగల మహిళలు. (చదవండి: కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..) -
కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..
గులాబీ ఎంత అందమైనదో అంత సున్నితమైనది. కామెల్లియా పువ్వు కూడా చూడటానికి గులాబీ పువ్వంత అందంగానే ఉంటుంది. అయితే, ఇది అంత సున్నితమైనది కాదు. ఈ పువ్వు రేకులు దృఢంగా ఉంటాయి. అందుకే, కామెల్లియా పంటను గులాబీ పంటకు చక్కని ప్రత్యామ్నాయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.కామెల్లియా ఆకర్షణీయమైన, అద్భుతమైన పువ్వులు. కామెల్లియా సొగసైన పుష్పించే మొక్క. తూర్పు ఆసియాకు చెందినది. ముఖ్యంగా జపాన్, చైనా, కొరియా దేశాల్లో సాగులో ఉంది. థియేసి కుటుంబానికి చెందినది. కామెల్లియా పూజాతిలో వైవిధ్యపూరితమైన అనేక వంగడాలతో పాటు సంకరజాతులు ఉన్నాయి.నిగనిగలాడే సతత హరిత ఆకులతో ఈ చెట్టు అన్ని కాలాల్లోనూ నిండుగా ఉంటుంది. అందానికి, అలంకారానికి ప్రతీకగా అద్భుతమైన తెలుపు, గులాబీ, ఎరుపు, ఊదా రంగుల్లో కామెల్లియా మొక్క పూస్తుంది. అందమైన నున్నని రేకులు, సున్నితమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన కామెల్లియాను తరచుగా గులాబీతో పోల్చుతూ ఉంటారు. గులాబీలు సాంప్రదాయకంగా ప్రేమ ప్రతీకలైతే.. కామెల్లియా పూలు స్వచ్ఛత, అభిరుచి, పరివర్తనలకు ప్రతీకగా చెబుతుంటారు.నీడలోనూ పెరుగుతుందిగులాబీ చెట్టు చల్లదనాన్ని, నీడను తట్టుకోలేదు. అయితే, కామెల్లియా అందంగా కనిపించటమే కాదు ఇటువంటి విభిన్న వాతావరణాన్ని కూడా తట్టుకుంటుంది. పదగా, చిన్నపాటి చెట్టుగా పెంచినా ముదురు ఆకుపచ్చని ఆకులతో కామెల్లియా మొక్క పూలు లేనప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల గార్డెన్లో గాని, అలంకరణలో గానీ కామెల్లియా పూలు గులాబీలకు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి. కామెల్లియా పూలు గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో పూస్తాయి కాబట్టి ఆయా సందర్భాలకు తగిన రంగు పూలను ఉపయోగపెట్టుకోవచ్చు. పూరేకులు మృదువుగా, గుండ్రంగా, మందంగా ఉంటాయి కాబట్టి ఇన్డోర్ బొకేల్లో పెట్టినా, గార్డెన్లో పెంచినా ఈ పూలు ఏడాది పొడవునా చూడముచ్చటగా ఒదిగిపోతాయి. గులాబీలు ఇలా కాదు. గులాబీ రేకులు బాగా సున్నితమైనవి, పల్చటివి కాబట్టి త్వరగా వాడిపోతాయి. కామెల్లియా పూలు రంగు, రూపు, నిర్మాణం, పరిమాణం విషయంలో ఇతర పూజాతుల మధ్య వైవిధ్యంగా నిలబడుతుంది. ఈ పువ్వులోనే ఆడ (పిస్టిల్), మగ (స్టేమెన్స్) భాగాలు అమరి ఉండటం వల్ల పరాగ సంపర్కానికి అనువుగా ఉంటుంది. ఈ పువ్వులో వంగడాన్ని బట్టి 5 నుంచి 9 రేకులు ఉంటాయి. ఇవి సాధారణంగా గుడ్డు ఆకారంలో స్పైరల్ పద్ధతిలో కూడుకొని ఉంటాయి. కామెల్లియా పూలలో రేకుల వరుసలు సింగిల్ (కొద్ది రేకులతో) లేదా సెమీ డబుల్ నుంచి డబుల్ (అనేక వరుసలు కలిసి) ఉంటాయి. పూల రంగులు... ప్రతీకలుపూలు లేత గులాబీ నుంచి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని రకాల్లో ఊదా రంగులో, అనేక రంగులతో కూడిన రేకులతోనూ కామెల్లియా పూలు పూస్తాయి. తెల్ల కామెల్లియా పూలు స్వచ్ఛతకు, అమాయకత్వానికి, అనురాగానికి ప్రతీకలు. గులాబీ రంగు కామెల్లియా పూలుఇష్టానికి, ప్రేమకు ప్రతీకలు. ఎర్ర కామెల్లియా పూలు అభినివేశానికి, గాఢమైన ప్రేమకు ప్రతీకలు. ఊదా రంగు కామెల్లియా పూలు ఆరాధనకు, పరివర్తనకు ప్రతీకలుగా చెబుతారు. ఈ పువ్వు 5–10 సెం.మీ. (2–4 అంగుళాలు) వ్యాసార్థంతో ఉంటుంది. కొన్ని కామెల్లియా రకాల పూలు 12 సెం.మీ. (4.7 అంగుళాల) వరకు ΄÷డవుగా, గుండ్రంగా అద్భుతమైన ఆకర్షణీయంగా పెరుగుతాయి. ఈ చెట్టు ఏ సీజన్లో అయిన నిగనిగలాడే ముదురు ఆకుపచ్చని ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆకులు 5–10 సెం.మీ.ల ΄÷డవున, 2–5 సెం.మీ. (0.8 నుంచి 2 అంగుళాల) వెడల్పున ఉంటాయి.2 నుంచి 12 మీటర్ల ఎత్తు కామెల్లియా మొక్కను పొద మాదిరిగా పెంచుకోవచ్చు లేదా చిన్నపాటి నుంచి మధ్యస్థ ఎత్తు ఉండే చెట్టుగానూ పెంచుకోవచ్చు. రకాన్ని, పరిస్థితులను బట్టి 2 నుంచి 12 మీటర్ల (6.5 నుంచి 40 అడుగుల) ఎత్తు వరకు పెరుగుతుంది. కాయ ఆకుపచ్చగా లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. విత్తనాలు ఓవల్ షేపులో చిన్నగా, గట్టిగా ఉంటాయి. వీటి నూనెను సౌందర్యసాధనాల్లో వాడతారు. వంటకు కూడా వాడుతుంటారు. కామెల్లియా జాతిలో చాలా రకాల చెట్లు శీతాకాలంలో పూతకొస్తాయి. ఇవి పెరిగే వాతావరణ స్థితిగతులు, నేలలను బట్టి పూత కాలం మారుతూ ఉంటుంది.పూలు.. అనేక వారాలు! కామెల్లియా మొండి జాతి. చల్లని ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గులున్న ప్రాంతాల్లోనూ తట్టుకుంటుంది. గులాబీ చెట్లతో పోల్చితే కామెల్లియా చెట్లు పెద్దవి, చాలా కాలం మనుగడసాగిస్తాయి. దీర్ఘకాలం ఆధారపడదగిన పూల చెట్ల జాతి ఇది. దీని పూలు అనేక వారాల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ చెట్లకు ఆకులు ఏడాది పొడవునా నిండుగా, ముచ్చటగొలుపుతుంటాయి.ఆమ్ల నేలల్లో పెరుగుతుందిగులాబీ మొక్కను జాగ్రత్తగా పెంచాలి. తరచూ కొమ్మలు కత్తిరించాలి. చీడపీడల నుంచి జాగ్రత్తగా రక్షించుకోవాలి. తరచూ మట్టిలో ఎరువులు వేస్తూ ఉండాలి. కానీ, కామెల్లియా చెట్లు అలాకాదు. వీటి మెయింటెనెన్స్ చాలా సులభం. మొక్క నాటిన తర్వాత నిలదొక్కుకుంటే చాలు. నీరు నిలవని ఆమ్ల నేలల్లో పెరుగుతుంది. ఏడాదిలో చాలా తక్కువ రోజులు మాత్రమే ఎండ తగిలే ప్రాంతాల్లో పూల తోటను పెంచాలంటే కామెల్లియాను ఎంచుకోవాలి. చిన్న పొదగా పెంచుకోవచ్చు. తరచూ కత్తిరిస్తూ హెడ్జ్లుగా అనేక రకాలుగా, అనేక సైజుల్లో దీన్ని పెంచుకోవచ్చు. గులాబీ మొక్కల్ని పొదలుగా, తీగలుగా మాత్రమే పెంచగలం. గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో అందంగా పూస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండే పూలు కావటం కూడా ముఖ్యమైన విషయం. ఇన్ని ప్రత్యేకతలున్నందునే గులాబీకి కామెల్లియాను చక్కని ప్రత్యామ్నాయంగా చెబుతారు. ఆకులతో టీ, గింజలతో నూనెకామెల్లియా జాతిలో 100–250 వైవిధ్యపూరితమైన రకాలు ఉండటం విశేషం. పువ్వు రూపు, రంగును బట్టి అది ఏ రకమో గుర్తించవచ్చు. ‘కామెల్లియా జ΄ోనికా (జూన్ కామెల్లియా) రకం ఎక్కువగా సాగులో ఉంది. దీని పూలు పొడవుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. తెలుపు నుంచి ముదురు ఎరుపు, గులాబీ రంగుల పూలు జూన్ కామెల్లియా చెట్టు పూస్తుంది. కామెల్లియా సినెన్సిస్ (టీ కామెల్లియా) రకం చెట్టు ఆకులతో టీ కాచుకొని తాగుతారు. అందువల్ల దీని ఆకుల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.దీని తెల్లని పూలు చిన్నగాను, తక్కువ ఆకర్షణీయంగానూ ఉంటాయి. కామెల్లియా ససన్కువ రకం పూలు చిన్న, అతి సున్నితంగా ఉన్నా సువాసనను వెదజల్లుతాయి. జూన్ కామెల్లియా రకం కన్నా చాలా ముందుగానే ఈ రకం చెట్టు పూస్తుంది. కామెల్లియా రెటిక్యులాట జాతి చెట్లకు పొడవాటి పూలు పూస్తాయి. అందరినీ ఆకర్షించగల ఈ రకం చెట్లు చైనాలో విస్తారంగా కనిపిస్తాయి. కామెల్లియా ఒలీఫెరా రకం కూడా చైనాలో విస్తారంగా కనిపిస్తుంది. దీని విత్తనాల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నూనెను వంటకాల్లో, సౌందర్య సాధనాల తయారీకి కూడా వాడుతున్నారు. చిన్న, తెల్లని పూలు పూస్తుంది. వాణిజ్యపరంగా చూస్తే మంచి ఆదాయాన్నిచ్చే రకం ఇది. -
తక్కువ ఖర్చుతో...పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్
రసాయనిక వ్యవసాయం వల్ల కాలుష్య కాసారంగా మారిపోయిన వ్యవసాయ భూములను తక్కువ ఖర్చుతో, సులభంగా, సమర్థవంతంగా శుద్ధి చేసే కొన్ని జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని ముంబై ఐఐటి పరిశోధకులు కనుగొన్నారు. రసాయనిక పురుగుమందుల వల్ల, ఇతరత్రా కాలుష్య కారకాల వల్ల పంట భూములు నాశనమవుతున్న సంగతి తెలిసిందే.విషతుల్య కాలుష్య కారకాలను హరించటంతో పాటు నేలలో ఉన్నప్పటికీ మొక్కలకు అందుబాటులో లేని పోషకాలను అందుబాటులోకి తేవటం ద్వారా పనిలో పనిగా పంట దిగుబడిని కూడా పెంపొందించడానికి ఈ ‘బ్యాక్టీరియా కాక్టెయిల్’ ఉపయోగపడుతున్నదని ముంబై ఐఐటి పరిశోధకులు ప్రకటించారు. ముంబై ఐఐటిలో బయోసైన్సెస్, బయోఇంజినీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే మార్గ దర్శకత్వంలో సందేశ్ పపడే ఈ పరిశోధన చేశారు. మట్టిలోని విషాలను విచ్చిన్నం చేసి తీసివేయటంతో పాటు ఈ బ్యాక్టీరియా అధికోత్పత్తికి దోహదం చేసే గ్రోత్ హార్మోన్ల పెరుగుదలకు ఊతం ఇస్తున్నాయని, అదేసమయంలో హానికారక శిలీంధ్రాలను అరికడుతున్నాయని, తద్వారా పోషకాల లభ్యత పెరుగుతోందని గుర్తించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందుల వాడకాన్ని తగ్గించటానికి.. నేలల ఆరోగ్యం, ఉత్పాదకశక్తిని పెంపొందించడానికి ఉపయోడపడుతోందని ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే వెల్లడించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందులలోని బెంజీన్ వంటి ఆరోమాటిక్ కాంపౌండ్స్ వల్ల నేలలు కలుషితం కావటం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఈ సమ్మేళనాలు విషతుల్యమైనవి. విత్తనం మొలక శాతాన్ని ఇవి తగ్గిస్తాయి. పంట మొక్కల ఎదుగుదలకు, దిగుబడికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ధాన్యాలు, గింజల్లో, మొక్క భాగాల్లో ఈ విషతుల్యమైన సమ్మేళనాలు చేరి΄ోతాయి. కార్బారిల్, నాఫ్తలిన్, బెంజోయేట్, 2,4–డ్రైక్లోరోఫెనాక్సియేసెటిక్ ఆసిడ్, థాలేట్స్‌ను పురుగుమందుల్లో విస్తృతంగా వాడుతున్నారు. సౌందర్యసాధనాలు, దుస్తులు, నిర్మాణ రంగం, ఆహార రంగంలో వాడే ప్రిజర్వేటివ్స్, అద్దకం, పెట్రోలియం, ప్లాస్టిక్ ఉత్పత్తి రంగాల్లో కూడా ఈ విషతుల్యమైన సమ్మేళనాలను వాడుతున్నారు. వీటి వల్ల మట్టి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయి. అయితే, ఈ కలుషితాలను తొలగించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న రసాయనిక పద్ధతి లేదా కలుషితమైన మట్టిని తొలగించటం వంటి పద్ధతులు అధిక ఖర్చుతో కూడినవే కాక సమస్యను సమూలంగా పరిష్కరించకుండా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నాయి. ఈ దృష్ట్యా సమస్యాత్మక నేలలను శుద్ధి చేసుకోవటానికి ఐఐటి ముంబై పరిశోధకుల కృషి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.సహజ పద్ధతిలో శుద్ధిఘాటైన వాసనలతో కూడిన రసాయనిక విషపదార్థాలను చక్కగా విచ్ఛిన్నం చేయటానికి సూడోమోనాస్, అసినెటోబాక్టర్ తదితర జాతుల బ్యాక్టీరియా ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు. ఇవి విషతుల్య సమ్మేళనాలను తిని.. హానికరం కాని, విషరహిత సమ్మేళనాలుగా మార్చుతున్నాయి. ఆ క్రమంలో కలుషిత∙పర్యావరణాన్ని ఇవి సహజంగా శుద్ధి చేస్తున్నాయని ఫలే వ్యాఖ్యానించారు.పెరిగిన పోషకాల లభ్యత ఫాస్ఫరస్, పొటాషియం వంటి నీట కరగని స్థూల పోషకాలను ఈ బ్యాక్టీరియా నీట కరిగేలా చేస్తుంది. తద్వారా పంట మొక్కల వేర్లు అదనపు పోషకాలను పీల్చుకునే అవకాశం కల్పిస్తాయి. నిస్సారమైన భూముల్లో పెరిగే పంట ఐరన్‌ను ఎక్కువగా తీసుకోలేకపోతుంటుంది. ఈ సూక్ష్మజీవులు సైడెరోఫోర్స్ అనే పదార్ధాన్ని విడుదల చేయటం ద్వారా ఐరన్‌ను సరిగ్గా తీసుకునేలా చేస్తాయి. అంతేకాకుండా ఇండోల్ అసెటిక్ ఆసిడ్ (ఐఎఎ) అనే గ్రోత్ హార్మోన్‌ను ఈ బ్యాక్టీరియా విడుదల చేసి దిగుబడిని పెంచుతుంది. ఇంకా ప్రొఫెసర్ ఫలే ఇలా అన్నారు.. ‘సూడోమోనాస్, అసెనెటోబాక్టర్ జెనెరకు చెందిన అనేక జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని వాడిన తర్వాత గోధుమ, పెసర పాలకూర, మెంతికూర తదితర పంటల దిగుబడి 40–45% వరకు పెరిగింది. మట్టిలో రసాయనాలను కొన్ని రకాల బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంటే, మరికొన్ని సూక్ష్మజీవులు మొక్కల పెరుగుదలను పెంపొందించే హార్మోన్ ఉత్పత్తికి, చీడపీడల బెడద నుంచి దీటుగా తట్టుకునేందుకు ఉపయోగపడుతున్నాయని, కలసికట్టుగా పనిచేస్తే కలిగే ప్రయోజనం ఇదే అన్నారు ప్రొ. ఫలే. -
బాహుబలి రోబో...రోజుకు 8 టన్నుల పండ్లు చకా చకా!
బత్తాయి చెట్ల నుంచి పండ్లు కోసే రోబోని ఇజ్రేలుకు చెందిన కంపెనీ నానోవెల్ రూపొందించింది. దీనికి వివిధ ఎత్తుల్లో 6 రోబోటిక్ చేతుల్ని అమర్చారు. తోట మధ్యలో వెళ్తూ చెట్టు కొమ్మలకు తగినంత సైజు పెరిగిన, పక్వానికి వచ్చి రంగు మారిన పండ్లను కృత్రిమ మేధతో గుర్తించి కోసేలా దీన్ని రూపొందించారు. వాక్యూమ్ టెక్నాలజీతో పండును పట్టుకొని, తొడిమెను కత్తిరిస్తుంది. చేతిలోకి వచ్చిన పండు కన్వేయర్ బెల్ట్ ద్వారా బుట్ట లోకి చేరుతుంది. ఈ పనులన్నీ రోబో తనంతట తానే చేసేస్తుంది. దూరం నుంచి చూస్తే చిన్న చక్రాలున్న షెడ్డు మాదిరిగా కనిపించే ఈ రోబో.. ప్రస్తుతం ఒక ట్రాక్టర్ లాక్కెళ్తూ ఉంటే పండ్లను కోస్తుంది. మున్ముందు ట్రాక్టర్ అవసరం లేకుండా తనంతట తానే కదిలి వెళ్లేలా దీన్ని మెరుగు పరచనున్నట్లు నానోవెల్ కంపెనీ ప్రకటించింది. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో భారీ బత్తాయి తోటల యజమానులను కోత కూలీల కొరత వేధిస్తోంది. ఈ రోబో వారికి ఊరటనిస్తుందని నానోవెల్ ఆశిస్తోంది. కాలిఫోర్నియా సిట్రస్ రీసెర్చ్ బోర్డుతో ఒప్పందం చేసుకున్న ఈ కంపెనీ బత్తాయిలు కోసే ఈ రోబో పనితీరును కాలిఫోర్నియా బత్తాయి, నారింజ తోటల్లో పరీక్షంచబోతున్నది. అక్కడి భారీ కమతాల్లో సాగయ్యే సిట్రస్ పండ్ల తోటల అవసరాలకు అనుగుణంగా ఈ రోబోకు అవసరమైన మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లండన్‌లో జరిగే వరల్డ్ అగ్రి–టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో కూడా ఈ రోబోను ప్రదర్శించబోతున్నామని నానోవెల్ సీఈవో ఇసాక్ మేజర్ చెప్పారు. భారీ తోటల్లో పండ్ల కోత కూలీల కొరతను ఎదుర్కొంటున్న అమెరికా, స్పెయిన్, ఇటలీ తదితర దేశాల్లో ఈ భారీ రోబోకు ఆదరణ బాగుంటుందని భావిస్తున్నామన్నారు. అంటే, సమీప భవిష్యత్తులో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఇటువంటి రోబోలు రాబోతున్నాయి. పండ్లను కోయటంతో పాటు మిగిలిన కాయలు ఎన్ని ఎప్పటికి కోతకు వస్తాయి? తోటలో చెట్ల స్థితిగతులపై కూడా గణాంకాలను ఈ రోబో సేకరించటం వల్ల తోట యజమానులకు వెసులుబాటు కలుగుతుంది. ఆరు రోబోటిక్ చేతులతో ఏకకాలంలో పనిచేసే ఈ భారీ రోబో గంటకు బుట్ట (400 కిలోల) ఆరెంజ్‌లను కోయగలదు. రాత్రీ పగలు తేడా లేకుండా 24 గంటల్లో 20 బుట్టల (8 టన్నులు) పండ్లు కోయగలదు. అందువల్ల దీన్ని ‘బాహుబలి రోబో’ అనొచ్చు! ఇక ధర ఎంతో.. అంటారా? అది కూడా భారీగానే ఉంటుంది మరి! -
11న తార్నాకలో సేంద్రియ సంత : పిండివంటలు, చేనేత వస్త్రాలు
గ్రామభారతి, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రీయ సంతను నిర్వహిస్తున్నారు. ఆధునిక సమాజంలో ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆదరణపెరుగుతోంది.సేంద్రీయ ఆహారం ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలనే అవగాహన కూడా బాగా పెరిగింది. ఇలా ఆర్గానిక్ ఉత్పత్తులు, సంప్రదాయ రుచులు , సహజ ఆహారాలను ఇష్టపడేవారికి ఈ సంత ఒక అవకాశం కావచ్చు. సికింద్రాబాద్ తార్నాకలోని మర్రి కృష్ణా హాల్లో ఈ నెల 11 (శనివారం)న ఉ. 10 నుంచి సా. 7 గం. వరకు సేంద్రియ/ప్రకృతి ఆహారోత్పత్తుల మూలం సంత జరగనుంది. దేశీ వరి బియ్యం, చిరుధాన్యాలు, ఇతర ఉత్పత్తులు, సంప్రదాయ పిండివంటలు, చేనేత వస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు నిర్వాహకులు సూర్యకళ తెలిపారు. సంప్రదాయ రుచులతో కూడిన ఆర్గానిక్ భోజనం ఈ సంత ప్రత్యేకత. ఇతర వివరాలకు.. 94908 50766. -
Business Idea: చలికాలంలో అల్లం వ్యాపారం.. జేబుకు ‘వెచ్చదనం’.. లక్షల్లో ఆదాయం
ప్రస్తుతమున్న రోజుల్లో అందరూ అధిక ఆదాయాన్ని సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. ఇందుకు తగిన ప్రయాత్నాలు కూడా చేస్తుంటారు. దీనిలో కొందరు సఫలమవుతుంటారు. మరికొందరు విఫలమవుతుంటారు. అయితే ప్రస్తుత శీతాకాలంలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయమిచ్చే వ్యాపారం గురించి తెలుసుకుందాం.ఇటీవలి కాలంలో చదువుకున్న వారు కూడా వ్యవసాయం చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. దీనికి ప్రభుత్వసాయం కూడా అందుతుంది. అందుకే అధిక లాభాలనిచ్చే అల్లంసాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం అనేది టీలో వినియోగించడం మొదలుకొని కూరలలో వేసేవరకూ అన్నింటా ఉపయుక్తమవుతుంది. అందునా చలికాలంలో అల్లాన్ని విరివిగా వినియోగిస్తుంటారు. పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో కూరలు వండేటప్పుడు అల్లాన్ని తప్పనిసరిగా వినియోగిస్తారు.అల్లాన్ని నీటి ఆధారితంగా సాగు చేస్తుంటారు. హెక్టారు భూమిలో అల్లం సాగుచేయాలనుకుంటే రెండు క్వింటాళ్ల నుండి మూడు క్వింటాళ్ల వరకూ విత్తనాలు అవసరమవుతాయి. సాగు సమయంలో సరైన గట్లను సిద్ధం చేసుకోవాలి. సరైన కాలువలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా అల్లం సాగుకు నీరు సక్రమంగా అందుతుంది. నీరు నిలిచిపోయే పొలాల్లో అల్లం సాగు చేయకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అల్లం సాగుకు పీహెచ్(పొండస్ హైడ్రోజెని) 6 నుండి పీహెచ్ 7 వరకు ఉన్న భూమి మెరుగైనదిగా పరిగణిస్తారు.అల్లం మొక్కల మధ్య దూరం 25 నుండి 25 సెం.మీ మధ్య ఉండాలి. విత్తనాల మధ్య దూరం 30 నుండి 40 సెం.మీ మధ్య ఉండాలి. సమయానుసారంగా ఆవు పేడను ఎరువు మాదిరిగా వేయాలి. అల్లం పంట చేతికి వచ్చేందుకు 8 నుంచి 9 నెలల సమయం పట్టవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అల్లం మంచి ధరలకు అమ్ముడవుతోంది. ఒక హెక్టారుకు అల్లం దిగుబడి సుమారు 150 నుంచి 200 క్వింటాళ్ల వరకు ఉంటుంది. దీనిని విక్రయించడం ద్వారా లక్షల రూపాయాల్లో ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇది కూడా చదవండి: 10 లక్షల పూలతో ఫ్లవర్ షో.. చూసి తీరాల్సిందే! -
శీతోష్ణస్థితి స్థితిస్థాపకత అంటే..!
రిసైలియన్స్(Resilience) అనే పదానికి ఖచ్చితమైన అనువాదం స్థితిస్థాపకత. మామూలు మాటల్లో చెప్పాలంటే.. వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకునే సామర్థ్యం. శీతోష్ణస్థితి స్థితిస్థాపకత అనేది వాతావరణ ప్రతికూల ప్రభావాలను అంచనా వేయడానికి, వాటి నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. భూతాపోన్నతి(Global Warming) వల్ల కలిగే తుపాన్లు, తీవ్ర వడగాలులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక జనసమూహం లేదా పర్యావరణ వ్యవస్థ ఆ షాక్ నుంచి కోలుకోవడానికి, మార్పు చెందడానికి గల సామర్ధ్యం ఎంత అనేది ముఖ్యం. వాతావరణ మార్పుల వల్ల అనివార్యంగా ఎదురయ్యే కష్టనష్టాలను ఎదుర్కొని పర్యావరణాన్ని(Environment), ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ప్రజలు, సమూహాలు, ప్రభుత్వాలు సన్నద్ధం కావాలి. కొత్త నైపుణ్యాలను పొందడానికి, కొత్త రకాల ఆదాయ వనరులను అందిపుచ్చుకోవటానికి ప్రజలకు శిక్షణ ఇవ్వడం.. విపత్తులకు మరింత బలంగా ప్రతిస్పందించే, పునరుద్ధరణ సామర్థ్యాలను పెంపొందించటం.. వాతావరణ సమాచారం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడం, దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేయడం ద్వారా వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కునే సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. నిజానికి సమాజం వాతావరణపరంగా స్థిరత్వాన్ని పొందాలంటే శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించటం ముఖ్యమైనది. కర్బన ఉద్గారాలను విడుదల చేసే పనులను భారీగా తగ్గించటమే భవిష్యత్తులో వాతావరణ ప్రభావాలను(climate changes) తగ్గించే ఉత్తమ మార్గం. ఎక్కువ కాలుష్యానికి కారణమయ్యే దేశాలు వాతావరణ మార్పుల ప్రభావాలకు ఎక్కువగా గురయ్యే సమాజాలకు, వ్యక్తులకు మద్దతుగా నిలవటంలోనే వాటిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి. (చదవండి: ఇంటి పంటల సాగుకు ఏడు సూత్రాలు!) -
ఇంటి పంటల సాగుకు ఏడు సూత్రాలు!
‘సాక్షి’ పప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిలో స్ఫూర్తిని రగిలించి ‘ఇంటిపంట’ల సాగుకు ఉపక్రమింపజేసింది. నివసించే ఇంటి వద్ద ఉన్న తక్కువ స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో పండించుకుంటూ ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతున్నారు. అటువంటి సహజాహార ప్రేమికుల్లో డా. వసంత శ్రీనివాసరావు ఒకరు. కొత్తగా ఇంటిపంటల సాగు ప్రారంభించిన వారికి తరచూ ఎదురయ్యే సందేహాల నివృత్తి కోసం.. కొన్ని పద్ధతులు, సూచనలను స్వీయానుభవంతో ఆయన మీ ముందుంచుతున్నారు.జీవామృతం..కావలసిన పదార్థాలు...తాజా(పది రోజుల్లోపు) నాటు లేదా దేశీ ఆవు పేడ 2 కేజీలు, నాటు ఆవు పంచకం ఒకటిన్నర లీటర్లు, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) అర కేజీ, ఏదైనా పప్పుల(కంది/శనగ/మినుము/పెసర..) పిండి అర కేజీ, బాగా పండిన అరటి పండ్లు 2 లేదా 3, చెట్ల కింద మట్టి 2 గుప్పిళ్లు, 30 – 35 లీటర్ల నీరు, 50 లీటర్ల డ్రమ్ము. తయారీ విధానం... పేడ, తురుముకున్న బెల్లం, పప్పుల పిండి, మట్టి, అరటి పండ్ల గుజ్జు.. వీటిని చేతితో బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో ఆవు పంచకం వేసి మళ్లీ కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 50 లీటర్లు పట్టే డ్రమ్ములో వేసుకొని 30 నుంచి 35 లీటర్ల నీటిని పోయాలి. ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని నీడలో పెట్టుకోవాలి. ఇలా భద్రపరచుకున్న ద్రావణాన్ని ఉదయం, సాయంత్రం పూటల్లో వేప కర్రతో ఒక నిమిషం పాటు కుడి చేతివైపు తిప్పుతూ మొదట 3 రోజులు కలుపుకోవాలి. నాలుగో రోజు నుంచి వాడుకోవడానికి జీవామృతం మంచి బ్యాక్టీరియాతో తయారవుతుంది. వాడే విధానం: ఇలా తయారైన జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో మొక్కలు, చెట్ల పాదుల్లో పోయవచ్చు. వాటిపైన పిచికారీ చేయొచ్చు. ఇలా తయారుచేసుకున్న జీవామృతాన్ని 7–10 రోజుల్లోపు వినియోగించాలి.బూడిద+ పసుపు మిశ్రమంకావలసిన పదార్థాలు...దేశీ/నాటు ఆవు పేడతో చేసిన పిడకలు, పసుపు తయారీ పద్ధతి... పిడకలను కాల్చి బూడిద చేసుకోవాలి. తర్వాత ఆ బూడిదను మట్టికుండలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న బూడిద తగినంత తీసుకొని.. అంతే పరిమాణంలో పసుపు కల΄ాలి. ఈ మిశ్రమాన్ని తీగజాతి మొక్కలపై చల్లితే పూత రాలడం తగ్గుతుంది.కీటకాల నివారిణి(మల్టీ పెస్ట్ కంట్రోలర్)...కావలసిన పదార్థాలు...పావు కేజీ చొప్పున జిల్లేడు, మారేడు, వేప, కానుగ, ఉమ్మెత్త, సీతాఫలం, గన్నేరు ఆకులతోపాటు దేశీ ఆవు పంచకం(డ్రమ్ములో వేసిన ఈ ఆకుల మిశ్రమం పూర్తిగా మునగడానికి) తగినంత.తయారీ విధానం: పైన చెప్పిన అన్ని రకాల ఆకులను మెత్తగా నూరుకొని.. ఏదైనా ఒక ప్లాస్టిక్ పాత్రలో పెట్టి ఆకుల మిశ్రమం పూర్తిగా మునిగే వరకు ఆవు మూత్రం పోయాలి. ఈ మిశ్రమాన్ని 15 రోజులు మురగబెట్టాలి. ఆ తర్వాత వడకట్టుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. కషాయాన్ని 1:30 నిష్పత్తిలో నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉన్నదైతే అంత ఎక్కువ ప్రభావశీలంగా పనిచేస్తుంది.ఆచ్ఛాదన (మల్చింగ్)కుండీల్లోని మట్టిని నిత్యం తేమగా ఉంచడానికి ఆచ్ఛాదన(మల్చింగ్) పద్ధతి బాగా సహకరిస్తుంది. ఈ ఆచ్ఛాదన ఎండి΄ోయిన ఆకులతోను, ఎండు వరిగడ్డితోను చేసుకోవచ్చు. ఈ ఆచ్ఛాదన 7 నుంచి 10 అంగుళాల మందాన వేయాలి. తద్వారా కుండీల్లో ఉన్న మట్టి తేమను పట్టిఉంచగలుగుతుంది. తద్వారా మట్టిలో ఉన్న వానపాములు మట్టి పైభాగానికి రావడానికి అనువైన వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. వాటితోపాటుగా కింది మట్టిలోని పోషకాలను మొక్కల వేళ్లకు అందుబాటులోకి తెస్తుంది. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.వేప కషాయంకావలసిన పదార్థాలు... తాజా వేపాకులు అర కేజీ, తాజా దేశీ ఆవు పేడ అర కేజీ, దేశీ ఆవు పంచకం అర లీటరు. తయారీ విధానం: మెత్తగా నూరిన వే΄ాకు మిశ్రమానికి ఆవు పేడ, ఆవు పంచకం చేతితో కలుపుకోవాలి. ఈ రకంగా కలుపుకున్న వేప కషాయాన్ని 3 రోజులు పులియబెట్టాలి. నాలుగో రోజున ఈ మిశ్రమాన్ని గుడ్డతో వడబోసి దాచుకోవాలి. 1:10 నిష్పత్తిలో వేప కషాయం, నీరు కలిపి ప్రతి పది నుంచి పదిహేను రోజుకొకసారి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఎగ్ అమైనో ఆమ్లం (ముట్టగయం):కావలసిన పదార్థాలు:నాటు కోడిగుడ్లు 2 లేక 3, మూత ఉన్న గాజు సీసా(లీటరు ద్రవం పట్టే అంతది), నాటు కోడిగుడ్లు మునగడానికి కావలసినంత తాజా నిమ్మరసం, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) పావు కేజీ. తయారీ విధానం: గాజు సీసాలో నాటు కోడిగుడ్లను (పగలగొట్టకుండా, పెంకు తీయకుండా) ఉంచాలి. గుడ్లు మునిగేంత వరకు తాజా నిమ్మరసం ΄ోయాలి. మూత గట్టిగా పెట్టి 18 రోజులు వేడి తగలని ప్రదేశంలో ఉంచుకోవాలి. 18వ రోజున దీనిలో తురిమిన బెల్లాన్ని వేసి బాగా కలిపి ఆ రోజు నుంచి మళ్లీ పది రోజుల వరకు వేడి తగలని నీడ ప్రదేశంలో భద్రపరచాలి. మొత్తం 28 రోజుల్లో పిచికారీకి సిద్ధమవుతుందన్నమాట. పిచికారీ విధానం: సిద్ధమైన ఎగ్ అమైనో ఆమ్లంను ఒక లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పిచికారీలో మరోపద్ధతి: 900 మిల్లీలీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల జీవామృతం, 2 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో ఆసిడ్ కలిపి కూడా మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. పూత పుష్కలంగా వస్తుంది. పూత రాలకుండా ఉండడానికి ఇది ఉపయోగ -
పత్తి పండు!
అవును. దీని పేరు పత్తి పండే! వేసవి తాపాన్ని తీర్చే అద్భుతమైన తినదగిన పత్తి పండు ఇది. మధ్యకు కోస్తే దీంట్లో తెల్లని రూది మాదిరిగా కనిపించే గుజ్జు ఉంటుంది. విలక్షణమైన ఈ పండుకు ‘సెంతొల్’, ‘కాటన్ ఫ్రూట్’తో పాటు చాలా మారు పేర్లున్నాయి. కెచపి, లాల్లీ ఫ్రూట్, వైల్డ్ మాంగోస్టీన్, రెడ్ సెంతొల్, సెంతుల్, సౖయె, వైసయన్.. ఇలా అనేక పేర్లుతో పిలుస్తారు.ఆగ్నేయాసియా ప్రాంతమే పత్తి పండు పుట్టిల్లు. దీని శాస్త్రీయ నామం ‘సండోరికం కోయెట్జాపే’. మెనియాసీ లేదా మహోగని కుటుంబానికి చెందినది. ఈ పండు గుజ్జు తీపి, వగరు కలిసిన చిత్రమైన రుచి కలిగి ఉంటుంది. ఆగ్నేసియా దేశాల్లోని ఉష్ణమండల లోతట్టు భూముల్లో విస్తృతంగా సాగవుతున్న పండ్ల చెట్టు ఇది. తాజా పండ్ల వాడకమే ఎక్కువ. సంతొల్ చెట్లు లోయర్ ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో చాలా ఎత్తుగా, వేగంగా పెరుగుతాయి. సాధారణంగా 15–40 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఆకులు ముదురు ఆకుపచ్చగా 4–10 అంగుళాల పొడవు పెరుగుతాయి. పూలు 1 సెం.మీ. పొడవున ఆకుపచ్చ, పసుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. పత్తి పండు గుండ్రంగా, ఆపిల్ సైజులో ఉంటుంది. పండు లోపల రసంతో కూడిన ఐదు దూది తొనల మాదిరిగా ఉంటాయి. 3–4 విత్తనాలుంటాయి. దీని గుజ్జు వగరగా ఉంటుంది. పండు పండిన తర్వాత తియ్యగా మారుతుంది. కొన్ని రకాల సంతొల్ పండ్లు తక్కువ తీపిగా, మరికొన్ని రకాలు మరింత తీపిగా ఉంటాయి. బాగా తియ్యగా ఉండే పండ్లు ఆపిల్ రుచికి దగ్గరగా ఉంటాయి.రెండు రకాలుసంతొల్ పండుకు సంబంధించి ప్రధానంగా రెండు వంగడాలు ఎరుపు (ఎస్.కోయెట్జాపే), పసుపు (ఎస్. నెర్వోసమ్) రంగుల్లో ఉంటాయి. ఎరుపు రంగులో ఉండే రకం పత్తి పండ్లను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. మార్కెట్లలో ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. కొమ్మకు కాయకు మధ్య ఉండే కాడలు, తొక్క, పండు రుచిలో ఈ రెండు రకాల పండ్లకు స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. పసుపు సంతొల్ పండు తొడిమెలు 15 సెం.మీ. పొడవున ఉంటాయి. పండు కోతకు వచ్చే సమయానికి తొడిమలు కూడా పసుపు రంగులోకి మారతాయి. ఎరుపు సంతొల్ పండ్ల తొడిమెలు 30 సెం.మీ. వరకు పెరిగి, ఎరుపుగా మారతాయి. పసుపు పండు తొక్క పల్చగా, రుచి తియ్యగా ఉంటుంది. ఎర్ర పండు తొక్క మందంగా, రుచి కొంచెం వగరుగా ఉంటుంది.ఆరోగ్య ప్రయోజనాలు1. కేన్సర్ నివారణ: సంతొల్ పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేన్సర్ కణాల వ్యాప్తిని ఇవి అరికడతాయి. ఈ పండు నుంచి సంగ్రహించే సెకోట్రిటెర్పెన్, కోయెట్జాపిక్ ఆసిడ్ అనే రెండు బయోయాక్టివ్ కెమికల్స్ కేన్సర్ కణాలపై సైటోటాక్సిక్ ప్రభావం చూపుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఎలుకల స్తన గ్రంధుల్లో గడ్డల సైజును, సంఖ్యను తగ్గించగలిగాయి. మనుషుల్లో కేన్సర్ కణాలను ఇవి హరిస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది.2. ఆరోగ్యకరమైన దంతాలు: పత్తి పండ్లు లాలాజలానికి సంబంధించిన గ్రంధులను ఉత్తేజపరచటం ద్వారా మరింత లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. నోట్లో హానికారక క్రిములను నశింపజేయటం ద్వారా దంతాల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.3. ఎల్‌డిఎల్‌ను తగ్గిస్తాయి: సంతొల్ పండులో పెక్టిన్ అనే జీర్ణమయ్యే పీచు ఉంటుంది. లో డెన్సిటీ లిపో్రపొటీన్ (ఎల్డిఎల్) రక్తంలో ఎక్కువగా ఉంటే రక్తపోటు, గుండెపోటు తదితర గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. పెక్టిన్, హెచ్డిఎల్లు కలసి ఎల్‌డిఎల్‌ను రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరకుండా చూస్తాయి. తద్వారా సంతొల్ పండు గుండె జబ్బుల్ని నివారిస్తుంది.4. బరువు తగ్గిస్తుంది: శరీరపు అధిక బరువు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, హార్మోన్ అసమతుల్యత వంటి అనేక సమస్యలకు కారణం. ఈ పండ్లలో జీర్ణమయ్యే, కాని పీచు పదార్థాలు ఉంటాయి. తిండి యావ తగ్గించటం ద్వారా ఊబకాయం తగ్గటానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి దోహదం చేస్తుంది.5. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది: పత్తి పండులోని క్వెర్సెటిన్ అనే యాంటాఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కణాలను బాగు చేయటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇందులోని పీచు పదార్థం ్రపోబయాటిక్ మైక్రోఆర్గానిజమ్స్ని ఉత్తేజపరచి రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది.6. రక్తహీనత, అల్జిమర్స్‌ను తగ్గిస్తుంది: దేహంలో సరిపోయినంతగా ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు లేకపోతే రక్తహీనత కలుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ చలనానికి ఐరన్ అవసరం. ఈ పండ్లలోని విటమిన్ సి వల్ల ఐరన్‌ను ఇముడ్చుకోగల శక్తిని జీర్ణవ్యవస్థ పెంచుకుంటుంది. ఇందులో పుష్కలంగా ఉన్న యాంటీఆక్సిడెంట్లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతూ ల్జిమర్స్ ముప్పు నుంచి తప్పిస్తాయి.7. రక్తంలో చక్కెర నియంత్రణ: ఈ పండు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. కాబట్టి గ్లూకోజ్‌ను నెమ్మదిగా రక్తంలో కలిసేందుకు దోహదం చేస్తుంది. తద్వారా బ్లడ్ సుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.8. చర్మ సౌందర్యం: చర్మంలోని కణాల మధ్య కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి కొల్లాజెన్ ఉపయోగపడుతుంది. ఇది ఏర్పరడడానికి ఈ పండ్లలోని విటమిన్ సి దోహదపడుతుంది. ఈ పండ్లలోని శాండ్రోనిక్ ఆసిడ్, బ్రయోనోటికాసిడ్లు అలెర్జీలను నివారిస్తాయి. చర్మంపై పొక్కులు, సోరియాసిస్, ఇతర చర్మ సంబంధమైన సమస్యలకు చేసే చికిత్సలో ఈ పండ్లలోని సహజ స్టెరాయిడల్ సపోజెనిన్, అల్కలాయిడ్స్ ఉపయోగపడతాయి. ఈ చెట్టు బెరడులో సపోజెనిన్ ఉంటుంది. తామర, తదితర ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించే చికిత్సకు ఇది ఉపకరిస్తుంది. ఈ చెట్టు బెరడు పొడిని చర్మంపై లేపనం చేస్తే ఇన్షెక్షన్లు తగ్గుతాయి.9. స్త్రీ వ్యాధుల్ని తగ్గిస్తుంది: స్త్రీ జననాంగంలో ఇన్షెక్షన్ల చికిత్సకు ఈ పండుతో పాటు చెట్టు బెరడు కూడా ఉపయోగపడుతుంది. ఈ బెరడు వేసి ఉడికించిన కషాయంతో యోనిని రోజూ శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.విలువ ఆధారిత ఉత్పత్తులు...థాయ్ వంటకాల్లో, సలాడ్లలో సంతొల్ పండ్ల ముక్కలను వాడుతుంటారు. ఈ పండ్లతో తయారు చేసే సోం టామ్ అనే ఉత్పత్తిని రొయ్యల కూరల్లో వాడతారు. ఈ పండ్ల తరుగుతో తయారు చేసే సినటొలన్ అప్పెటైజర్గా వాడతారు. అనేక వంటకాల్లో వగరు రుచి కోసం కూడా పత్తి పండు తరుగును వాడుతూ ఉంటారు. -
పోషకాల గని దేశీ వంగడాలు..!
రసాయనిక ఎరువులు వాడితేనే అధిక దిగుబడి ఇచ్చేలా ఆధునిక వంగడాలను తయారు చేస్తున్నారు. ఈ ఆధునిక వంగడాల్లో పోషకాలు గత 50 ఏళ్లలో సగానికి సగం తగ్గిపోయాయని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) అధ్యయనంలోనే తేలింది. అందువల్ల దిగుబడి తక్కువొచ్చినా పోషకాలతో కూడిన ఆహారోత్పత్తి కావాలనుకుంటే దేశీ వంగడాలే వాడుకోవాలి. రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయకమైన వ్యవసాయం చేయాలంటే అందుకు తగిన వనరులు సమకూర్చుకోవాలి. అందులో ముఖ్యమైనది అనువైన విత్తనం. ప్రకృతి/సేంద్రియ సేద్యానికి అనువైన విత్తనం దేశీ విత్తనమే. అందుకే ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయంతోపాటు దేశీ వంగడాలను ప్రోత్సహిస్తున్నాయి. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రకృతి సేద్యం చేపట్టిన దార్లపూడి రవి కూడా దేశీ విత్తన పరిరక్షణ కోసం విశేష కృషి చేస్తున్నారు. దేశీ వరి, చిరుధాన్యాలు తదితర పంటలకు సంబంధించి ఏకంగా 600 రకాల దేశవాళీ విత్తనాల సేకరణ, సాగు, అదనపు విలువ జోడించి ఆహార ఉత్పత్తుల తయారీ, విక్రయం.. ఈ పనులన్నీ ఆయన ఒక తపస్సులా చేసుకు΄ోతున్నారు. ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తున్న రవి అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలంలోని ఉంగరాడ మా గ్రామం. పోస్టు గ్రాడ్యుయేషన్ (పర్యావరణ శాస్త్రం) చదివాక ఓ సిమెంట్ కంపెనీలో ఎజీఎంగా ఉద్యోగం చేశాను. సెలవులకో, శుభకార్యాలకో వచ్చినప్పుడు బంధుమిత్రులు చాలామందిలో ఒక విషయం గమనించాను. అజీర్తి అనో, బీపీ అనో, గ్యాస్ట్రిక్ అనో భోజనం తగ్గించేసేవారు.ఏదో వంటలు బాగున్నాయని జిహ్వ చాపల్యం ఆపులేక కాస్త ఎక్కువగా తింటే మాత్ర వేసుకోవాల్సి వస్తుందని చెప్పేవారు. దీనికి కారణం పంటల రసాయనీకరణ. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు పరిమితికి మించి రైతులు వాడేస్తుండటం చూశాను. ఈ పరిస్థితి మారాలంటే మళ్లీ పూర్వపు ప్రకృతి వ్యవసాయమే సరైనదని భావించాను.అమ్మానాన్నలను దగ్గరుండి చూసుకోవాలని కూడా మనసు చెబుతుండటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి తిరిగొచ్చేశా. మాది వ్యవసాయ కుటుంబం. రెండున్నర ఎకరాల భూమి ఉంది. పూర్తిగా వర్షాధారం. అందులో కొంతమేర మామిడి తోట ఉంది. అంతరపంటగా పెసలు, ఉలవలు, నువ్వులు సాగు చేస్తున్నాను. దాదాపు ఎకరా భూమిలో అరుదైన సంప్రదాయ వరి రకాలను సాగు చేస్తున్నాను. అవన్నీ పూర్తిగా విత్తనాల కోసమే. ఉత్తరాంధ్రలో పలువురు రైతులకు వాటిని ఇచ్చి సాగు చేయిస్తున్నా. తెలుసుకుంటూనే ‘సాగు’తూ..పదేళ్ల క్రితం కాకినాడలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా శిబిరంలో సుభాష్ పాలేకర్ చెప్పిన పద్ధతులను ఆచరణలో పెట్టాను. 80 సెంట్లలో వరి నాటాను. మామిడి తోటలో అంతర పంటగా పసుపు పెట్టాను. 30 సెంట్ల భూమిలో 30 కిలోల కస్తూరి పసుపు విత్తనం పెడితే 300 కిలోల పంట చేతికొచ్చింది. ఎండబెడితే 180 కేజీల పసుపు వచ్చింది. కొర్రలు వేస్తే మంచి దిగుబడి వచ్చింది. ఆ ఉత్సాహంతో ఐదేళ్ల క్రితం నుంచి మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి, కొంతమేర కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నాను. దేశవాళీ పంటల తియ్యదనం...ఒకప్పుడు దేశవాళీ టమాటాను చూస్తే నోరూరేది. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న హైబ్రిడ్ టమాటా వంటకు తప్ప తినడానికి చప్పగా ఉంటోంది. అన్ని పంటలదీ అదే పరిస్థితి. ఇది మారాలంటే దేశవాళీ పంటల తియ్యదనం మళ్లీ తెచ్చుకోవాలి. అందుకే దేశవాళీ విత్తనాల సేకరణ ఒక అలవాటుగా మార్చుకున్నాను. 2016 నుంచి ప్రామాణిక పద్దతి ప్రకారం వరి విత్తనాలను సేకరించి, సంరక్షిస్తున్నాను. ప్రతి విత్తన రకానికి ఒక రికార్డు కూడా నిర్వహిస్తున్నా. సంప్రదాయ వరి విత్తనాలే గాకుండా కూరగాయలు, ఆకు కూరలు, అపరాల విత్తనాలు సేకరించాను. ఔషధ మొక్కలను, విత్తనాలనూ సేకరిస్తున్నాను. వరి వంగడాల్లో ముఖ్యంగా ఎర్రబుడమలు (రెడ్ రైస్), నెల్లూరు మొలకలు విత్తనాలు సేకరించాను. అరుదైన రాజుల చిక్కుడు (ఎరుపు, తెలుపు రంగులో ఉండే విత్తనం), తొక్క తీయకుండా వండుకోవడానికి వీలయ్యే గుత్తి బీర విత్తనాలు కూడా ఉన్నాయి.ఒడిశా నుంచి తెచ్చిన శీలావతి, గాయత్రి అనే వరి విత్తనాలు, కెంపుసన్నా అనే బాస్మతి రకం విత్తనాలను కర్ణాటకలో సేకరించాను. గోదావరి ఇసుకరవ్వలు అనే రకం కూడా అన్నం వండుతుంటే మంచి సువాసన వస్తుంది. ఈ విత్తనాలనూ మూడేళ్ల నుంచి అభివృద్ధి చేస్తున్నాను. ఇలా సంప్రదాయ వరి రకాలు, చిరుధాన్యాలు కలిపి దాదాపు ఆరొందల రకాల విత్తనాలు ఇప్పటివరకూ సేకరించగలిగాను. వీటిలో చాలావరకూ తూర్పు కనుమల్లో పలువురు రైతులకు ఇచ్చి ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నాను. ఈ ప్రాంతంలో వ్యవసాయక జీవవైవిధ్యాన్ని ప్రోదిచేయడానికి ఈ ప్రయత్నం దోహదపడుతుందనేది నా విశ్వాసం. విత్తనాల సంరక్షణా ఓ సవాలే...దేశవాళీ విత్తనాల సంరక్షణా ఒక సవాలు వంటిదే. పూర్వం వెదురుబుట్టల్లో, కుండల్లో విత్తనాలు భద్రపరిచేవారు. ముందుగా కాపుకొచ్చిన మొక్కజొన్న కంకులు, బీరకాయలు, సొరకాయలు, బెండకాయలు ప్రత్యేకంగా వేరుచేసి విత్తనాల కోసం వసారాలో వేలాడగట్టేవాళ్లు. ఆ విధానాలన్నీ ఇప్పుడు విత్తనాల నిల్వ కోసం పాటిస్తున్నాం. ఇలా ఓ సీడ్ బ్యాంక్‌ను నిర్వహించడానికి ఒక ఎన్జీవోను ప్రారంభించాను. దేశీయ పంటలకు విలువ పెంచేలా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతో గానుగ నూనె, బిస్కెట్లు, స్నాక్స్ తయారు చేయించి విక్రయిస్తున్నాం..’(– దార్లపూడి రవి మొబైల్: 86394 56848)– అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, విజయనగరంఫోటోలు: డి.సత్యనారాయణమూర్తి (చదవండి: నాటు కోళ్లతో మంచి ఆదాయం ఆర్జిస్తున్న యువజంట..) -
నాటు కోళ్లతో మంచి ఆదాయం ఆర్జిస్తున్న యువజంట..
నాటు కోళ్లు, జాతి (పందెం) కోళ్ల పెంపకం మారుమూల గ్రామాల్లో సైతం రైతుకు ఆధారపడదగినంత స్థాయిలో నిరంతర ఆదాయాన్ని అందిస్తుందని ఓ యువజంట రుజువు చేస్తున్నారు. గత పదేళ్లుగా శ్రద్ధగా ఈ పని చేస్తే ప్రజలకు ఆరోగ్యదాయకమైన మాంసం, గుడ్లను అందించటంతోపాటు స్వగ్రామంలోనే స్వయం ఉపాధి కల్పించుకుంటున్నారు రైతు దంపతులు ఉపేందర్‌రావు, జ్యోతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడేనికి చెందిన నిరుద్యోగులైన మూలగుండ్ల ఉపేందర్‌రావు, వజ్జా జ్యోతి పదేళ్ల క్రితం ఇంటి వద్ద ఒక షెడ్డును ఏర్పాటు చేసుకొని నాటు, పందెం కోళ్ల పెంపకం చేపట్టారు. చుట్టూ కోళ్ల ఎగిరి పోకుండా ఎత్తు జాలీ ఏర్పాటు చేశారు. నీడ కోసం పరిసర ప్రాంతంలో వివిధ రకాల చెట్లను పెంచారు. కోళ్ల మధ్యకు మాములు రాకుండా చూసేందుకు సీమ కోళ్లను, రెండు కుక్కలను పెంచారు. కొన్నేళ్ల క్రితం 20 జాతి (పందెం) కోడి పిల్లలను పలు ప్రాంతాల నుంచి సేకరించి పెంచటం మొదలుపెట్టారు. వీటి గుడ్లను సాధారణ కోళ్లకు వేసి పొదిగించి పిల్లలు తీసి సంతతిని పెంచారు. తదనంతరం ఇంక్యుబేటర్‌ను సమకూర్చుకొని పందెం కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. పిల్లల సైజును బట్టి వివిధ ధరలకు అమ్ముతున్నారు. 8 రకాల జాతి కోళ్లుకోళ్లను 24 గంటలూ కనిపెట్టుకొని ఉండి అన్ని పనులూ ఉపేందర్‌రావు, జ్యోతి చేసుకుంటారు. వీరి వద్ద మార్కెట్లో మార్కెట్లో గిరాకీ ఉన్న నెమలి, కాక, డేగ, రసంగి, అబ్రాస్, సీత్వాల్, కెక్కర, ఎర్ర కెక్కర వంటి అనేక రకాల జాతి కోళ్లను వీరు పెంచుతున్నారు. రెండు వందల పెట్టలు, పుంజులు ఉన్నాయి. ఇవి దాణా కంటే ఆకుకూరలను ఎక్కువగా తింటున్నాయి. ఇంటి పరిసరాల్లో పలు రకాల ఆకుకూరలను,మునగాను పెంచి వీటికి మేపుతున్నారు. ఫామ్ హౌస్ యజమానులు జాతి కోళ్లను ఆసక్తితో పెంచుతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేసుకెళుతున్నారు. కిలో బరువు గల జాతి కోడి రూ. 4 నుంచి 5 వేలు పలుకుతోంది. నెలలోపు చిన్న పిల్లలైతే రూ. 300 వరకు పలుకుతోందని ఉపేందర్ రావు తెలిపారు. మునగాకుతో జబ్బులకు చెక్!మొదట్లో కడక్‌నా«ద్ కోళ్ల పెంపకం చేపట్టాం. మారుమూల ప్రాంతం కావటంతో వాటికన్నా జాతి (పందెం) కోళ్ల పెంపకంతోనే అధిక ఆదాయం వస్తోంది. జాతి కోడిగుడ్లను ఇంక్యుబేటర్ ద్వారా పోదిగించి పిల్లలను అమ్మటం వల్ల మంచి ఆదాయం పొందుతున్నాం. రెండు, మూడు సార్లు మందులు వాడితే ఈ కోళ్లకు ఎలాంటి జబ్బులు రావు. ముఖ్యంగా మునగ ఆకు తినిపిస్తే కోళ్లకు జబ్బులు వచ్చే ఛాన్సే లేదని ఉపేందర్‌రావు(95023 48987) అనుభవపూర్వకంగా చెబుతున్నారు. – ఇల్లెందుల నాగేశ్వరరావు, సాక్షి, ఇల్లెందు (చదవండి: పాదాల నొప్పి తగ్గడానికి పొట్టలోని కొవ్వును ఇంజెక్ట్ చేస్తే చాలు!!) -
కాయగూరల విత్తనోత్పత్తిలో మెళకువలు
కొత్తకోట రూరల్: పంటల సాగులో నాణ్యమైన విత్తనానిదే ప్రధాన పాత్ర. నాణ్యమైన విత్తనం నాటితే సగం దిగుబడి సాధించినట్లే. సాగులో వినియోగించే ఎరువులు, నీరు, ఇతర ఉత్పత్తి కారకాల సామర్థ్యం విత్తనం నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. సిఫార్సు చేసిన విత్తన మొలక శాతం, తేమ, భౌతిక, జన్యు స్వచ్ఛత కలిగిన విత్తనాలు వాడాలి. అప్పుడే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు.● మార్కెట్లో కాయగూరల విత్తనాలు లభ్యమవుతున్నా.. వాటి నాణ్యతపై అంతగా భరోసా లేదు. కాబట్టి రైతులు తమస్థాయిలో తక్కువ ఖర్చుతో తగిన మోతాదులో విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. కాని అన్ని కాయగూరల పంటల్లో విత్తనోత్పత్తి సాధ్యం కాదు. టమాటా, వంకాయ, మిరపతో పాటు తీగజాతి పంటలు, గోరుచిక్కుడు, తోటకూర మొదలైన ఉష్ణ ప్రాంతపు పంటల్లో మాత్రమే విత్తనోత్పత్తి సాధ్యం. చలికాలం పంటలైన క్యాబేజీ, కాలీఫ్లవర్ తదితర పంటల విత్తనోత్పత్తి మన ప్రాంతంలో సాధ్యం కాదు. విత్తనోత్పత్తి చేపట్టే ప్రాంతంలో పరిస్థితులు విత్తన నాణ్యతపై ప్రభావం చూపుతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న ప్రాంతాలు, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు విత్తనోత్పత్తికి పనికిరావు. విత్తనోత్పత్తి ప్రాంతంలో పగలు సూర్యరశ్మి కనీసం 10 నుంచి 12 గంటలు ఉండాలి. ముఖ్యంగా కాయలు కోత కొచ్చే సమయంలో వర్షాలు రాకుండా ముందుగానే విత్తనాలు పొలంలో వేసుకోవాలి.జాగ్రత్తలు తప్పనిసరి..విత్తనోత్పత్తి చేసే ముందు కొన్ని అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. మొదట నిర్ణయించుకున్న అధీకృత డీలరు లేదా పరిశోధనా స్థానం నుంచి ఫౌండేషన్ విత్తనం సేకరించుకోవాలి. రెండోది విత్తన దూరం పాటించాలి. ఒక్క టమాటాలో తప్పితే చాలాపంటల్లో తరచూ పరపరాగ సంపర్కం లేదా పూర్తిగా పరపరాగ సంపర్కం జరుగుతుండటంతో విత్తనంలో కల్తీలు ఏర్పడి నాణ్యత తగ్గుతుంది. కావున వేర్పాటు దూరం కచ్చితంగా పాటించాలి. వేర్పాటు మూడు రకాలుగా ఉంటుంది. విత్తనోత్పత్తి చేపట్టే ఒక పంట వేసిన తర్వాత కనీసం 20 నుంచి 25 రోజుల తర్వాత వేరే విత్తన పంట వేసుకోవాలి. అప్పుడు కల్తీ ఉండదు. అది సాధ్యం కాకపోతే సిఫార్సు మోతాదులో వేర్పాటు దూరం పాటించాలి. మూల విత్తనం, బ్రీడర్ విత్తనం, ఫౌండేషన్ ధ్రువీకరణ విత్తనం ఉత్పత్తిలో ధ్రువీకరణ విత్తన ఉత్పత్తిని మాత్రమే రైతులు చేపట్టవచ్చు.తీగజాతి కూరగాయలు..కాకర, గుమ్మడి, బూడిద గుమ్మడి, దోస రకాల్లో వాటి పండ్లరంగు, కాడ రంగు, తీగలు ఎండిపోవడాన్ని బట్టి పక్వానికి వచ్చాయని నిర్ధారించుకోవచ్చు. పండిన పండ్లను కోసి చేతితో విత్తనాన్ని వేరు చేసి సేకరించుకోవాలి. తర్వాత నీటితో కడిగి ఆరబెట్టుకోవాలి. ఎకరా పంట నుంచి 120 నుంచి 320 కిలోల విత్తనం పొందవచ్చు. అన్ని కాయగూరల విత్తనోత్పత్తికి కోత అనంతరం పండ్లను 5 నుంచి 7 రోజులు నిల్వ ఉంచినట్లయితే విత్తనం బాగా అభివృద్ధి చెంది నాణ్యంగా ఉంటుంది. -
పుట్టింది పనామా, పోషకాల చిరునామా
ప్రాచుర్యంలోకి రాని అద్భుతమైన ఉష్ణమండల పండ్ల జాతిలో ‘స్టార్ ఆపిల్’ ఒకటి. సపోటేసియా కుటుంబానికి చెందిన ఈ పండును వండర్ మిల్క్ ఫ్రూట్ అని వ్యవహరిస్తుంటారు. చూపులకు గుండ్రటి నేరేడు పండులాగా ఉంటుంది. మధ్యకు కోసి చూస్తే నక్షత్రపు ఆకారంలో త్లెని గుజ్జు ఉంటుంది. అందుకే దీన్ని ‘స్టార్ ఫ్రూట్’ అంటారు. దీని రంగును బట్టి పర్పుల్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. స్టార్ ఆపిల్ శాస్త్రీయ నామం క్రైసోఫైల్లం కైనిటో. కైనిటో, కైమిటో అని అంటుంటారు. ఈ పదాల మూలాలు పురాతన మయన్ భాషలో ఉన్నాయి. తెల్లని, తియ్యని రసం కలిగి ఉంటుంది కాబట్టి ఈ పేరు వచ్చిందట.పుట్టిల్లు పనామాస్టార్ ఆపిల్ మన వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో సాగుకు అనువైన సతత హరిత వృక్షం. పనామా దేశంలోని ఇస్థమస్ దీని పురిటి గడ్డ. అక్కడి నుంచి గ్రేటర్ అంటిల్లెస్, వెస్ట్ ఇండీస్‌కు విస్తరించింది. ఇవ్వాళ స్టార్ ఆపిల్ విస్తరించని ఉష్ణమండల ప్రాంతాల్లేవంటే అతిశయోక్తి కాదు. ఈశాన్య ఆసియా దేశాల్లో ఈ పండ్ల చెట్టు ఎంచక్కా ఇమిడిపోయి సాగవుతోంది. స్టార్ ఆపిల్ చెట్టు చాలా వేగంగా పెరుగుతుంది. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ ఊదా రంగు పండ్లలోని తెల్లని గుజ్జు, రసం తియ్యగా ఉంటుంది. పంట పండే స్థానిక ప్రాంతాల్లో తాజా పండ్ల వినియోగంతో పాటు ఇతర దేశాలకు వాణిజ్యపరంగా ఎగుమతి అవుతుంటాయి. కొన్ని ఉష్ణమండల దేశాల్లోని వ్యవసాయంలో స్టార్ ఆపిల్ ప్రధాన భాగంగా మారిపోయింది. మయన్ భాషలోని కైనిటొ, కైమిటో పదాల నుంచి దీని శాస్త్రీయ నామం పుట్టింది. ఈ పండ్ల రసం తల్లి΄ాలు మాదిరిగా అత్యంత పోషకాలతో కూడినదని చెబుతారు. ఈ పండును అడ్డంగా రెండు ముక్కలుగా కోస్తే.. లోపలి తెల్లని గుజ్జు నక్షత్రం ఆకారంలో ఉంటుంది. అందువల్లే దీనికి స్టార్ ఆపిల్ అనే పేరు వచ్చింది. ఊదా రంగులో ఉంటుంది కాబట్టి పర్పుల్ ఆపిల్ అని కూడా అంటారు. ఈ జాతికి చెందిన కొన్ని రకాల పండ్లు పండిన తర్వాత కూడా ఆకుపచ్చగానే ఉంటాయి.మెక్సికో నుంచి పెరూ వరకు.. స్టార్ ఆపిల్ సెంట్రల్ అమెరికాలో పుట్టినట్లు చెబుతున్నప్పటికీ దీని మూలాలు వెస్ట్ ఇండీస్‌లో కూడా ఉన్నాయని చెబుతుంటారు. దక్షిణ మెక్సికో నుంచి ఉత్తర అర్జెంటీనా, పెరు వంటి లో–మీడియం ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో విస్తారంగా సాగవుతోంది. గ్వాటెమల పసిఫిక్ తీర ప్రాంతంలో ఇది విస్తారంగా సాగు అవుతోంది. అక్కడితో దీని విస్తృతి ఆగలేదు. వియత్నాం, భారత్, చైనా, శ్రీలంక, మలేసియా, ఇండోనేసియా దేశాల్లోనూ సాగవుతోంది. కోస్టారికా, క్యూబా, డొమినిక, హైతి, హాండూరస్, జమైకా, నెదర్లాండ్స్ అంటిల్లెస్, నికరాగువ, పనామా, ఉరుగ్వే, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఈజిప్ట్, సౌత్ఆఫ్రికా, మొంజాబిక్, జింబాబ్వే తదితర దేశాల్లోనూ సాగులో ఉంది.పోషకాలు పుష్కలంస్టార్ ఆపిల్ గుజ్జు, రసం తియ్యగా ఉండటానికి కారణం అందులో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండటమే. ఈ పండులో నీరు 78–86% వరకు ఉంటుంది. వంద గ్రాముల పండ్లలో 0.71–2.33 గ్రాముల ప్రొటీన్, 15 గ్రాముల పిండి పదార్థం, 9–10 గ్రాముల టోటల్ సుగర్స్ ఉన్నాయి. దీని విత్తనాల్లో శ్యానోజెనిక్ గ్లైకోసైడ్ లుకుమిన్, తదితర యాక్టివ్ కాంపౌండ్లు ఉన్నాయి. స్టార్ ఆపిల్‌లో ఉన్న జీవరసాయనాల జాబితా చెప్పాలంటే చాలానే ఉంది. ఫెనాల్స్, అల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, స్టెరాయిడ్స్, సపోనిన్స్, టాన్నిన్స్, కార్డియాక్ గ్లైకోసైడ్స్ వంటివి వున్నాయి. 2002లో వెలువడిన ఓ అధ్యయన పత్రం ప్రకారం ఈ పండులో 120 రకాల వొలేటైల్ కాన్స్టిట్యుయెంట్స్ ఉన్నాయి. పచ్చి, పండిన పండ్లలోనూ విటమిన్ సి బాగా ఉంది. ఆకుల్లో కూడా గాల్లిక్ యాసిడ్, ట్రైటెర్పినాయిడ్స్ వంటి ఉపయోగకరమైన కాంపౌండ్స్ ఉన్నాయి. అధిక స్థాయిలో ఫెనోలిక్స్, ఫ్లావనాయిడ్స్ కలిగి ఉండటం వల్ల స్టార్ ఆపిల్‌కు వ్యాధినిరోధకతను పెంచే యాంటీఆక్సిడెంట్ల సామర్థ్యం మెండుగా ఉంది. ఇందులోని క్యుయెర్సెటిన్ కాంపౌండ్‌కు అత్యధిక యాంటీఆక్సిడెంట్ గుణం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.గోళాకార పండ్లుఈ చెట్టు ఆకులు ఆకర్షణీయమైన ముదురు ఆకుపచ్చగా ఓవెల్ షేప్‌లో ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి 5–15 సెం.మీ. పొడవు పెరుగుతాయి. ఊదా–తెలుపు రంగుల్లో ఉండే దీని పూలు చక్కని సుగంధాన్ని వెదజల్లుతూ తేనెటీగలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ చెట్టు స్వీయ పరాగ సంపర్క సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని కాయ గోళాకారంలో 2–3 అంగుళాల డయామీటర్‌లో ఉంటాయి. ఈ పండ్లను తాజాగా తింటారు. ఈ జాతి పండ్లు ముదురు ఊదా రంగులోను, ఆకుపచ్చ–గోధుమ, పసుపు రంగుల్లో కూడా ఉంటాయి. ఊదా రంగు పండు తొక్క మందంగా, గుజ్జు గట్టిగా ఉంటుంది. రవాణాకు, నిల్వకు అనువైనవి కాబట్టి ఈ రకం స్టార్ ఆపిల్ తోటలే సాగులో ఉన్నాయి. ఆకుపచ్చ–గోధుమ రంగులో ఉండే రకం పండ్ల తొక్క పల్చగా, గుజ్జు పల్చని ద్రవంలా ఉంటుంది. పసుపు రంగులో ఉండే పండ్లు చాలా అరుదు. ఈ కుటుంబంలోనే క్రైసోఫైల్లం కైనిటో మాదిరిగానే ప్రజాదరణ పొందుతున్న రెండు స్టార్ ఆపిల్ రకాలు ఆఫ్రికాలో సాగులో విస్తారంగా సాగులో ఉన్నాయి. అవి.. గంబేయ అల్బిద, గంబేయ ఆఫ్రికాన. 3–5 ఏళ్లకు కాపు ప్రారంభంక్రైసోఫైల్లం కైనిటో రకం స్టార్ ఆపిల్ మొక్కలు నాటిన తర్వాత 3–5 ఏళ్లలో కాపు వస్తుంది. 6–7 ఏళ్లకు పూర్తిస్థాయి కాపు తీసుకోవచ్చు. ఫ్రూట్ చాలా త్వరగా సెట్ అవుతుంది కాబట్టి తోటల సాగుదారులకు అనుకూలంగా ఉంటుంది. శీతాకాలం ముగిసి ఎండాకాలం వచ్చే దశలో పండ్లు పక్వానికి వస్తాయి. వెస్ట్ ఇండీస్‌లో ఏప్రిల్–మే మధ్యన స్టార్ ఆపిల్స్ పుష్కలంగా మార్కెట్లోకి వస్తాయి. స్టార్ ఆపిల్ విత్తనాల వ్యాప్తికి గబ్బిలాలు బాగా తోడ్పడుతుంటాయి. ఏ సీజన్లోనైనా పచ్చగా ఉండే స్వభావం వల్ల ఈ చెట్లు వ్యాపించిన చోట్ల పచ్చదనం, పర్యావరణం పరిఢవిల్లుతాయి.అన్ని పండ్లూ ఒకేసారి కోతకు రావుస్టార్ ఫ్రూట్ పక్వానికి రాక ముందు బంక సాగుతూ వగరుగా ఉంటుంది. బాగా పండి పోయిన తర్వాత కోస్తే రవాణా చేయటానికి, నిల్వ చేయటానికి ఇబ్బంది అవుతుంది. అందుకని పండు ముచ్చిక దగ్గర కొంచెం ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోసెయ్యాలి. తాజా పండ్లు తినొచ్చు లేదా జెల్లీలుగా మార్చి నిల్వ చేసుకోవచ్చు. ఈ పండులోని విత్తనాలు కూడా పనికొస్తాయి. విత్తనం లోపలి పప్పుతో తయారు చేసే డ్రింక్ బాదం పాల మాదిరిగా ఉంటాయి. అనేక తినుబండారాల్లో వాడుతున్నారు. ఫ్రోజెన్ స్టార్ ఫ్రూట్ గుజ్జును ఐస్‌క్రీమ్‌లు, షర్బత్‌లలో వాడుతున్నారు. కాబట్టి, వాణిజ్యపరమైన సాగుకు అనువైన పండ్ల జాతి. అయితే, నేరేడు మాదిరిగానే ఈ పంటకు కూడా కోత కూలి ఎక్కువ అవుతుంది. -
Cimate Change : అడాప్టేషన్
ప్రకృతి వైపరిత్యాలు, సముద్ర నీటిమట్టం పెరుగుదల, జీవవైవిధ్యం క్షీణత, ఆహార – నీటి అభద్రత వంటి వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుతం ఎదురవుతున్న, భవిష్యత్తులో ఎదురయ్యే దుష్ప్రభావాలను తట్టుకునే శక్తిని పెంపొందించే రక్షక చర్యలనే అడాప్టేషన్ అంటారు. వాతావరణ మార్పుల నష్టాన్ని సాధ్యమైనంత వరకు స్థానిక స్థాయిలో అమలు చేయాలినవి అడాప్టేషన్ చర్యలు. అంటే, అడాప్టేషన్ చర్యలను అమలుపరచటంలో గ్రామీణ ప్రజలు, నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వంటి పునరుజ్జీవన వ్యవసాయ పద్ధతులను అనుసరించటం.. కరువును తట్టుకునే వంగడాలను సాగు చేయటం.. నీటి నిల్వ – వినియోగ పద్ధతులను మెరుగుపరచటం.. అడవులు తగులబడకుండా అడ్డుకునే రీతిలో భూముల నిర్వహణ చర్యలు చేపట్టడం.. వరదలు, వడగాడ్పులు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బలమైన రక్షణ వ్యవస్థలను నిర్మించటం.. ఇవన్నీ అడాప్టేషన్ చర్యలే. అయితే, స్థానికంగా చర్యలు తీసుకుంటే అడాప్టేషన్ పూర్తి కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని తగ్గించుకునేందుకు దారితీసే విధానాల రూపకల్పనతో పాటు ప్రభుత్వాలు అనేక భారీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సముద్ర నీటి మట్టాలు పెరగటం వల్ల దెబ్బతిన్న కోస్తా ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం లేదా వేరే సురక్షిత ప్రాంతానికి తరలించటం.. మరింత తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నా తట్టుకునే విధంగా మౌలిక సదుపాయాలను పటిష్టం చేయటం.. ప్రకృతి వైపరిత్యాల గురించి ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థలను విస్తరింపజేసి వైపరిత్యాల సమాచారాన్ని అందుబాటులోకి తేవటం.. ప్రత్యేకించి వాతావరణ మార్పులకు సంబంధించిన నష్టాలను పూచ్చేందుకు బీమా సదుపాయాలను అభివృద్ధి చేయటం.. ప్రకృతిసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలకు, వన్యప్రాణులకు సరికొత్త రక్షణ చర్యలు చేపట్టం.. ఇవన్నీ క్లైమెట్ ఛేంజ్ అడాప్టేషన్ చర్యలే! ఇదీ చదవండి : తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే! -
మంకీ జాక్ గురించి విన్నారా? బోలెడన్ని పోషకాలు, ప్రయోజనాలు
మంకీ జాక్ మనకు అనువైన పంట. ఏడాదంతా ఆకులతో పచ్చగా, నిలువుగా పెరుగుతుంది. దీని కలప విలువైనది. పరికరాలు తదితర వస్తువులు తయారీకి వాడుతారు. మంకీ జాక్ పండు ఆరోగ్యకరమైనది. ఇందులో పోషక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఉంటాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్న ఈ కాలంలో ఆగ్రో ఫారెస్ట్రీ పద్ధతిలో ఈ చెట్లను సాగు చేస్తూ.. ఈ చెట్లు అందించే పాక్షిక నీడలో ఇతర స్వల్పకాలిక పంటలు పండించుకోవచ్చు. వ్యవసాయానికి సుస్థిరత చేకూర్చటానికి మంకీ జాక్ చెట్లు ఎంతగానో దోహదపడతాయి. కలప కోసం పెంచే రైతుకు పండ్లు కూడా ఇస్తుంది. మంకీ జాక్‌ను బాదల్, దెఫల్, దావ్ లేదా లకూచ తదితర పేర్లతో పిలుస్తారు. ఆగ్రోఫారెస్ట్రీకి ఎంతగానో ఉపయోగపడే ఈ జాతి చెట్లు విస్మరణకు గురయ్యాయి. ఇకనైనా దృష్టి కేంద్రీకరించాల్సిన దీర్ఘకాలిక పంట ఇది. మంకీ జాక్ చెట్లుపర్యావరణరంగా, ఆర్థికపరంగానే కాక పోషకాహార స్థాయిని పెంపొందించడానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మంకీ జాక్ బొటానికల్ నేమ్ ఆర్టోకార్పస్ లకుచ (Artocarpus Lacucha) పనస, మల్బరీ కూడా ఇదే కుటుంబానికి చెందినవి. అందుకే మంకీ జాక్ పండు ఆకారం, దానిలో తొనలు, గింజలు పనసను పోలి ఉంటాయి. కాకపోతే కొంచెం చిన్నవి. భారత్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మయన్మార్‌లోని కొన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో సైతం చక్కగా పెరిగే బహుళ ప్రయోజనకారి మంకీ జాక్ చెట్టు. నిటారుగా పెరిగే చెట్టు ఇది. అంతర పంటలతో కూడిన తోటల్లో ప్రధాన వృక్ష జాతిగా మంకీ జాక్ చెట్లను పెంచుకోవచ్చు. పర్యావరణపరమైన సమతుల్యతను కాపాడే అనేక ప్రయోజనాలు అందించటం మంకీ జాక్ చెట్ల ప్రత్యేకత. నిటారుగా 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు పెద్దగా, గట్టిగా ఉంటాయి. కొన్నిప్రాంతాల్లోఈ చెట్ల ఆకులు ఏడాదికి ఒకసారి రాలిపోతాయి. దీని పండ్లు మెత్తగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, పండినప్పుడు పసుపు రంగులోకి మారతాయి. ఈ చెట్టు బెరడు ముదురు రంగులో ఉంటాయి. దీని పూలు సువానతో తేనెటీగలను ఆకర్షిస్తూ పరపరాగ సంపర్కానికి దోహదపడుతూ ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఉన్నప్పటికీ మంకీ జాక్ చెట్ల పెంపకం పెద్దగా కనపడక΄ోవటం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఒక్కచోట తప్ప ఈ చెట్లు కనిపించవు. (ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!)పండ్లు తినొచ్చు.. పచ్చడి పెట్టుకోవచ్చు..మంకీ జాక్ కొత్త వాతావరణ పరిస్థితులకు, భిన్నమైన నేలలకు ఇట్టే అలవాటు పడిపోతుంది. ఏ ప్రాంతంలోనైనా ఇతర పంటలతో కలిపి సాగు చేయటానికి అనువైన జాతి ఇది. పండ్లు, పశుగ్రాసం, కలప, ఔషధ గుణాలు, సహజ రంగుగా వాడటానికి ఉపయోగపడే బెరడు వంటి ఉపయోగాలున్నాయి.మంకీ జాక్ పండును నేరుగా తినొచ్చు. పచ్చళ్లు, సాస్‌లు, చట్నీలు తయారు చేసుకోవచ్చు. ఈ పండ్ల గుజ్జు తింటే కాలేయ జబ్బులు తగ్గిపోతాయట. యాంటీఆక్సిడెంట్లతో పాటు కాలేయాన్ని రక్షించే గుణాలు పుష్కలంగా ఉండటం దీని ప్రత్యేకత. వయోభారం వల్ల చర్మం ముడతలు పడటం వంటి సమస్యల్ని దూరం చేసే చికిత్సల్లో దీన్ని వాడుతున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీలో వాడుతున్నారు. జార్కండ్ వంటి చోట్ల గిరిజనుల సంప్రదాయ వైద్యంలో మంకీ జాక్‌ను ఉపయోగిస్తున్నారు. మంకీ జాక్ చెట్టు ఆకుల్లో ప్రొటీన్ అత్యధికంగా 28.6% ఉంటుంది. అందువల్ల ఈ ఆకులు పశువులకు అత్యంత విలువైన గ్రాసం అని చెప్పచ్చు. కాబట్టి పొడి పశువులపాల ఉత్పత్తిని పెంపొందించడానికి మంకీ జాక్ చెట్టు ఆకులు బాగా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి ఎండా కాలంలో ఇతర పచ్చి మేత అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ చెట్ల ఆకులు చక్కని పచ్చిమేతగా ఉపయోగపడతాయి. దీని బెరడు నుంచి వచ్చే జిగురు ఉపయోగకరం. అన్నిటికీ మించి దీని కలప ఎంత గట్టిగా ఉంటుందంటే చెద పురుగులు కూడా ఏమీ చేయలేవు. అందువల్ల కుర్చీలు, బల్లలు వంటి ఫర్నీచర్ తయారీలో దీని చెక్కను వాడుతున్నారు. పడవలు, నౌకల తయారీలో, నిర్మాణ రంగంలో కూడా ఈ కలపను ఉపయోగిస్తున్నారు.పర్యావరణ, పౌష్టికాహార ప్రయోజనాలుమంకీ జాక్ చెట్లు సుస్థిర వ్యవసాయ పద్ధతులకు అనేక విధాలుగా దోహదపడతాయి. భూసారాన్ని పెంపొందించటం, గాలికి వర్షానికి మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడటం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి ఈ చెట్లు దోహదపడతాయి. వేడిని, గాలిలో తేమను తట్టుకొని పెరుగుతాయి. తరచూ కరువు బారిన పడే నిస్సారమైన భూముల్లో సైతం ఈ చెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల నీడ సానుకూల సూక్ష్మ వాతావరణాన్ని కలిగిస్తుంది కాబట్టి అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఇక పోషకాల సంగతికి వస్తే.. మంకీ జాక్ పండ్లు, ఆకులు పోషకాల గనులే. పండ్ల గుజ్జులో డయటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విత్తనాలు, జిగురులో యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉన్నాయి. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి ఇనుమడిస్తుంది. నాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎజెంట్‌గా పనిచేస్తుంది. ఈ గుణగణాలు మనుషులకు, పశువులకు ఆరోగ్యాన్నందిస్తాయి. తద్వారా పశువుల ఉత్పాదకత పెరుగుతుంది. పండ్ల ధర కిలో రూ. 175మంకీ జాక్ చెట్లు వర్షాధార వ్యవసాయం చేసే చిన్న,సన్నకారు రైతులకు మంచి ఆదాయాన్ని సమకూర్చుతాయి. ఒక చెట్టు ఆకుల నుంచి 200 కిలోల పచ్చి మేతను పొందవచ్చని, ఆ మేరకు పొడి పశువుల పోషణ ఖర్చు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్ల పచ్చి ఆకులు క్వింటాలు రూ. 300 విలువ చేస్తాయి. పండ్లు కిలో రూ. 175 పలుకుతామంటున్నారు. చీడపీడలను తట్టుకునే స్వభావం కలిగిన ఈ చెట్లను పెంచటం చాలా సులభం. దీని కలప, పండ్ల ద్వారా కూడా ఇంకా ఆదాయం సమకూరుతుంది. మంకీ జాక్ చెట్లు రాల్చే ఆకులు భూమిని సారవంతం చేస్తాయి. అంటే రైతులు రసాయనాలపై ఆధారపడటం తగ్గుతుంది. అంతర పంటలకు అనువైన తోటల్లో పెంచడానికి మంకీ జాక్ చెట్లు ఎంతో అనువైనవి. భూతాపోన్నతితో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కలిగే అతివృష్టి, అనావృష్టిని తట్టుకునే స్వభావం, నిస్సారమైన భూముల్లోనూ పెరిగే స్వభావం ఈ చెట్లకు ఉండటం రైతులకు ఎంతో ఉపయోగపడే విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే, మంకీ జాక్ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే గ్రామీణాభివృద్ధికి, పేదరికాన్ని పారదోలటానికి, పశుగ్రాసం కొరతను తీర్చడానికి, పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంపొందించడానికి బహువిధాలుగా ఉపయోగ పడుతుంది. -
ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!
ఉద్యోగం వద్దు వ్యవసాయమే ముద్దు అని అతను నమ్మాడు. సాగులోకి దిగింది మొదలు నిరంతర కృషితో రుషిలా తపించి ఒక అద్భుత మునగ వంగడాన్ని రూపొందించారు. ఈ వంగడం ఖ్యాతి దేశం నలుమూలలకు విస్తరించింది. అధిక దిగుబడులనిస్తూ అళగర్ స్వామికే కాదు అనేక రాష్ట్రాల్లోని వేలాది మంది రైతులకూ కనక వర్షం కురిపిస్తోంది. ఈ ఆవిష్కరణతో అళగర్ స్వామి వ్యవసాయ క్షేత్రం మునగ నర్సరీగా మారిపోయింది.ఏరోజు కారోజు విధులు ముగించుకొని బాధ్యతలు తీర్చుకునే ఉద్యోగం కాదు రైతు జీవితం. అలాగని పంటలు పండించటం, అమ్ముకోవటంతోనే దింపుకునే తల భారమూ కాదు. ఎంత చాకిరీ చేసినా వద్దనని పొలం సముద్రాన్ని ఈదటంలా అనిపిస్తుంటే.. అలసిపోని చేపలా మారి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలిగితేనే రాణింపు, సంతృప్తి. అళగర్స్వామి చేసింది అదే. తమిళనాడు దిండిగల్ జిల్లాలోని పల్లపట్టి గ్రామం స్వామి జన్మస్థలం. ఆర్ట్స్‌లో పీజీ విద్యను పూర్తి చేసిన స్వామి మక్కువతో వ్యవసాయాన్ని చేపట్టారు. మొక్కుబడి వ్యవసాయం చే యకుండా నిరంతరం శాస్త్రవేత్తలతో చర్చిస్తూ ఆధునిక పద్ధతులను ఆకళింపు చేసుకుంటూ.. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించారు. దిండిగల్ నుంచి మధురైకి వెళ్లే ప్రధాని రహదారి పక్కనే అళగర్ స్వామికి చెందిన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. బీడు భూమిని సాగులోకి తెచ్చే క్రమంలో మునగ వంగడాన్ని రూ పొందించేందుకు కృషిని మమ్మురం చేసి 2002లో ఒక నూతన మునగ వంగడాన్ని ఆవిష్కరించారు. రెండు స్థానిక రకాలను సంకరం చేసి ఈ వంగడాన్ని సృష్టించారు. దీనికి ‘పళ్లపట్టి అళగర్ స్వామి వెళ్లిమాలై మురుగన్’(పీఏవీఎం) అని తన పేరే పెట్టుకున్నారు. తక్కువ నీటితో సాగయ్యే ఈ వంగడం కరవు పరిస్థితులను, చీడపీడలు, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడినిస్తుంది. సాగులో ఉన్న రకాలకన్నా అధిక దిగుబడులను ఇస్తుండటంతో ఆనోటా ఈనోటా ప్రచారంలోకి వచ్చిన ఈ వంగడం ఖ్యాతి దేశమంతటా పాకింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మునగకు పుట్టినిల్లయిన ఉత్తర భారతదేశంలోనూ రైతులు ఈ వంగడం సాగుపై మొగ్గు చూపుతున్నారు. (కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా? )తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది రైతులు 30 వేల ఎకరాల్లో పీఏవీఎం మునగ వంగడాన్ని సాగు చేస్తున్నారు. దాదాపు 90 లక్షల పీఏవీఎం మునగ మొక్కలను అళగర్ స్వామి వివిధ రాష్ట్రాల రైతులకు అందించారు. గ్రాఫ్టింగ్ లేదా ఎయిర్ లేయర్ పద్ధతుల్లో అంట్లు కడుతున్నారు.20 అడుగులకో మొక్క...మునగను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పద్ధతులను అళగర్ స్వామి అనుసరిస్తున్నారు. పంచగవ్యను కనుగొన్న డాక్టర్ నటరాజన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. పంచగవ్యను క్రమం తప్పకుండా వాడతారు. భూమిని దున్ని సిద్ధం చేసుకున్న తర్వాత.. తూర్పు పడమర దిశలో మొక్కలు, సాళ్ల మధ్య 20 అడుగుల ఎడం ఉండేలా నాటుకోవాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు ధారాళంగా లబిస్తుంది. ఎకరాకు 150 నుంచి 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. మునగ మొక్కలు పెళుసుగా ఉంటాయి కాబట్టి రవాణాలోను.. నాటుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. 50 సెం. మీ. లోతు వెడల్పుతో గుంతలు తీసుకోవాలి. 20 రోజుల వయసు మొక్కలను నాటుకొని, గాలులకు పడి పోకుండా కర్రతో ఊతమివ్వాలి. ప్రతి మొక్కకు 5 కిలోల కం΄ోస్టు ఎరువు లేదా 10 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. కొత్త మట్టితో గుంతను నింపితే మొక్క త్వరగా వేళ్లూనుకుంటుంది. నాటిన మరుసటి రోజు నుంచి రెండు నెలల పాటు నీరుపోయాలి. తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి తగుమాత్రంగా తడులు ఇవ్వాలి. పూత కాత దశలో మాత్రం సమృద్ధిగా నీరందించాలి. మిగతా సమయాల్లో పొలం బెట్టకొచ్చినట్టనిపిస్తే తడి ఇవ్వాలి. వర్షాధార సాగులో నెలకు రెండు తడులు ఇస్తే చాలు. అంతర కృషి చేసి చెట్ల మధ్య కలుపును ఎప్పటికప్పుడు తొలగించాలి. ఒకటిన్నర ఏడాది తర్వాత కొమ్మల కత్తిరింపు చేపట్టాలి. బలంగా ఉన్న నాలుగైదు కొమ్మలను మాత్రమే చెట్టుకు ఉంచాలి. పెద్దగా చీడపీడలు ఆశించవు. పశువుల బారి నుంచి కాపాడుకునేందుకు కంచె వేసుకోవాలి.లక్షల మొక్కల సరఫరా...ఆళ్వార్ స్వామి ప్రస్తుతం మునగ కాయల సాగుపైన కన్నా నర్సరీపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 100 మంది కూలీలతో పల్లపట్టి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు పీఏవీఎం మొక్కలను సరఫరా చేస్తున్నారు. 90 లక్షలకు పైగా మొక్కలను విక్రయించారు. ఏటా రూ. 6 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అళగర్ స్వామి కృషికి మెచ్చి ఎన్నో అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక సృష్టి సమ్మాన్ అవార్డుతోపాటు సీఐఐ అవార్డు, మహీంద్రా టెక్ అవార్డు వంటి దాదాపు వంద అవార్డులు ఆయనను వరించాయి. సిటీ బ్యాంక్ ఉత్తమ ఔత్సాహిక వ్యాపారవేత్త అవార్డుతో సత్కరించడం విశేషం. అద్భుతమైన ఆవిష్కరణతో ఖ్యాతి గడించిన అళగర్ స్వామి స్థానిక గ్రామీణ ఆవిష్కర్తల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ రైతులకు స్ఫూర్తినిస్తున్నారు. ఐదేళ్లలో చెట్టుకు 3 క్వింటాళ్ల దిగుబడి..ఇతర వంగడాలు నాటిన 9 నెలలకు కాపుకొస్తాయి. పీఏవీఎం మునగ ఆరు, ఏడు నెలల నుంచే కాస్తుంది. సాళ్లు, మొక్కల మధ్య 20 అడులు దూరంలో ఎకరానికి 150 మొక్కలు నాటుకోవాలని అళగర్ స్వామి సూచిస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుంచి ఎకరానికి 10 – 15 టన్నుల కాయల దిగుబడి వస్తుంది. ఐదేళ్ల వయసు చెట్టు సగటున ఏడాదికి 300 కిలోల దిగుబడినిస్తుంది. ఐదేళ్ల తోట నుంచి ఏడాదికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. సాధారణ రకాల్లో కాయల దిగుబడి 20 టన్నులే. పైగా అవి ఐదారేళ్ల పాటే నిలకడగా దిగుబడులిస్తాయి. పీఏవీఎం మాత్రం ఏడాదికి 8 –9 నెలల చొప్పున 20–25 ఏళ్లపాటు మంచి దిగుబడి నిస్తుంది. తమిళనాడు రైతులు స్థానిక మార్కెట్లలో కాయ రూ. 5 – 20 చొప్పున విక్రయిస్తున్నారు. ఖర్చులు పోను ఏటా ఎకరాకు రూ. లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. కొందరు రైతులు కంచె పంటగాను ఈ వంగడాన్ని సాగు చేస్తున్నారు. -
విద్యుత్ లేకుండా వాగు నీటిని ఎత్తిపోసే హైడ్రో లిఫ్ట్!
కొండ్ర ప్రాంత వాగుల్లో ఎత్తయిన ప్రాంతం నుంచి వాలుకు ఉరకలెత్తుతూ ప్రవహించే సెలయేళ్లు సందర్శకులకు కనువిందు చేస్తూ మనోల్లాసం కలిగిస్తుంటాయి. అయితే, ఆయా కొండల్లో వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతులకు మాత్రం ఈ సెలయేళ్లలో నీరు ఏ మాత్రం ఉపయోగపడదు. పొలాలు ఎత్తులో ఉండటమే కారణం. విద్యుత్ మోటార్లతో వాగుల్లో నిటిని రైతులు తోడుకోవచ్చు. అయితే, చాలా కొండ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం ఉండదు. డీజిల్ ఇంజన్లు పెట్టుకునే స్థోమత రెక్కాడితే గాని డొక్కడని అక్కడి చిన్న, సన్నకారు రైతులకు అసలే ఉండదు. కళ్ల ముందు నీరున్నా ఆ పక్కనే కొద్ది ఎత్తులో ఉన్న తమ పొలాల్లో పంటలకు పెట్టుకోలేని అశక్తత ఆ రైతుల పేదరికాన్ని పరిహసిస్తూ ఉంటుంది. ఏజన్సీవాసులకు శాశ్వతంగా మేలు జరిగేలా వాగుల్లో పారే నీటిని విద్యుత్తు అవసరం లేకుండా ఎత్తిపోసేందుకు తన శక్తిమేరకు ఏదైనా ఉపాయం ఆలోచించాలని గ్రామీణ ఆవిష్కర్త పంపన శ్రీనివాస్(47) లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడ జిల్లా కైకవోలు ఆయన స్వగ్రామం. చదివింది ఐటిఐ మాత్రమే అయినా, లక్ష్యసాధన కోసం అనేక ఏళ్ల పాటు అనేక ప్రయోగాలు చేస్తూ చివరికి విజయం సాధించారు. వాగుల్లో నుంచి నీటిని విద్యుత్ లేకుండా పరిసర పొలాల్లోకి ఎత్తిపోయటంలో ఆయన సాధించిన విజయాలు రెండు: 1. పాతకాలపు ర్యాం పంపు సాంకేతికతను మెరుగుపరచి వాగుల్లో ర్యాం పంపులను ఏర్పాటు చేయటం. 2. హైడ్రో లిఫ్ట్ అనే కొత్త యంత్రాన్ని ఆవిష్కరించటం.హైడ్రో లిఫ్ట్ ఆవిష్కరణవాగులో 4–5 అడుగుల ఎత్తు నుంచి చెంగు చెంగున కిందికి దూకే నీటిని ఒడిసిపట్టి పరిసర పంట పొలాల్లోకి ఎత్తి΄ోసే ‘హైడ్రో లిఫ్ట్’ అనే వినూత్న యంత్రాన్ని శ్రీనివాస్ సొంత ఆలోచనతో, సొంత ఖర్చుతో ఆవిష్కరించారు. ఈ గ్రామీణ ఆవిష్కర్త రూపొందించిన చిన్న నమూనా ప్రొటోటైప్) యంత్రాన్ని ఉమ్మడి తూ.గో. జిల్లా దివిలికి సమీపంలోని ముక్కోలు చెక్‌డ్యామ్ వద్ద విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. దీని పనితీరును నిపుణులు ప్రశంసించారు. ఇది మూడు అడుగుల పొడవు, ఒక డయామీటర్‌తో ఉంది. దీని చుట్టూతా అంగుళం బ్లేడ్లు వాలుగా అమర్చి వుంటాయి. నీటి ఉధృతికి లేదా వరదకు దుంగలు, రాళ్లు కొట్టుకొచ్చినా కదిలి΄ోకుండా ఉండేలా ఇనుప చట్రంలో ఈ చక్రాన్ని అమర్చారు. హైడ్రో లిఫ్ట్‌తో కూడిన ఈ చట్రాన్ని చెక్‌డ్యామ్ కింది భాగాన ఏర్పాటు చేశారు. సెకనుకు 20 లీటర్ల చొప్పున ఈ చక్రంపై పడేలా నీటి ప్రవాహం ఉంటే సెకనుకు 1 లీటరు నీటిని పొలంలోకి ఎత్తి΄ోయటానికి వీలవుతుందని శ్రీనివాస్ తెలి΄ారు. నీటి ప్రవాహ వేగం తక్కువగా వున్నా నిమిషానికి 40 సార్లు (ఆర్పిఎం) ఇది శక్తివంతంగా తిరుగుతోంది. ఈ బాక్స్ షాఫ్ట్నకు అమర్చిన పిస్టన్ 300 ఆర్పిఎంతో నడుస్తుంది. చిన్న హైడ్రో లిఫ్ట్‌తో ఎకరానికి నీరునిమిషానికి 60 లీటర్ల నీటిని వాగులో నుంచి 20 అడుగుల ఎత్తుకు (40 అడుగుల ఎత్తుకైతే నిమిషానికి 40 లీటర్లు) తోడే శక్తి ఈ ప్రోటోటైప్ హైడ్రో లిఫ్ట్‌కు ఉంది. ఈ నీరు పారగడితే ఎకరంలో కూరగాయల సాగుకు సరిపోతుందని, డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఎకరానికి సరిపోతుందని శ్రీనివాస్ తెలిపారు. దీని తయారీకి రూ. 35 వేలు ఖర్చవుతుందని, వాగులో ఇన్స్టాల్ చేయటానికి అదనంగా ఖర్చవుతుందన్నారు. వాగు నీటి ఉధృతిని బట్టి, అధిక విస్తీర్ణంలో సాగు భూమి నీటి అవసరాలను బట్టి హైడ్రో లిఫ్ట్ పొడవు 9–16 అడుగుల పొడవు, 2–4 అడుగుల డయామీటర్ సైజులో తయారు చేసుకుంటే అధిక పరిమాణంలో నీటిని ఎత్తిపోయవచ్చునని శ్రీనివాస్ వివరించారు. గత అక్టోబర్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శోధాయాత్రలో భాగంగా పల్లెసృజన అధ్యక్షులు పోగుల గణేశం బృందం ఈ హైడ్రో లిఫ్ట్ పనితీరును పరిశీలించి మెచ్చుకున్నారన్నారు. పల్లెసృజన తోడ్పాటుతో పేటెంట్ కోసం దరఖాస్తు చేయబోతున్నాన్నారు. ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందించి పెద్ద హైడ్రో లిఫ్టులను తయారు చేసి పెడితే కొండ ప్రాంతవాసుల సాగు నీటి కష్టాలు కొంతైనా తీరుతాయి. ర్యాం పంపుతో పదెకరాలకు నీరుఎత్తు నుంచి లోతట్టు ప్రాంతాలకు పారే వాగు నీటిని ఒడిసిపట్టే ర్యాం పంపు సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉంది. ఏజన్సీవాసుల నీటి కష్టాలు తీర్చేందుకు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే ఈ ర్యాం పంపును మెరుగైన రీతిలో వినియోగంపై శ్రీనివాస్ తొలుత కృషి చేశారు. వివిధ సంస్థల తోడ్పాటుతో కొన్ని చోట్ల ర్యాం పంపులు ఏర్పాటు చేశారు. అయితే, ర్యాం పంపు సాంకేతికతకు ఉన్న పరిమితులు కూడా ఎక్కువేనని శ్రీనివాస్ గ్రహించారు. ర్యాం పంపు అమర్చాలి అంటే.. వాగులో 4 నుండి 6 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి పారే చిన్నసైజు జలపాతం ఉండాలి. ఆ నీటిని ప్రవాహానికి ఎదురుగా పొడవాటి ఇనుప గొట్టాన్ని అమర్చి, ఆ గొట్టం ద్వారా ఒడిసిపట్టిన నీటిని పిస్టన్ల ద్వారా ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో ర్యాం పంపు బెడ్‌పైన రెండు పిస్టన్లు అమర్చుతారు. ఒక పిస్టన్ను కాలితో లేదా చేతితో రెండు మూడు సార్లు కిందికి నొక్కితే చాలా ఇక వాటంతట అవే రెండు పిస్టన్లు ఒకదాని తర్వాత మరొకటి, పైకి కిందకు లేచి పడుతూ ఉంటాయి. అలా పిస్టన్లు పనిచేయటం వల్ల నీరు వత్తిడి ద్వారా పక్కనే ఏర్పాటు చేసిన ఒక నాన్ రిటర్న్ వాల్వ్‌కు అమర్చిన పైపు ద్వారా పంట పొలాలకు నీరు ఎత్తి΄ోస్తారు. రెండున్నర అంగుళాల పైపు ద్వారా నీరు వెళ్తుంది. ర్యాం పంపు నెలకొల్పడానికి రూ. 2.5–3.5 లక్షలు ఖర్చవుతుంది. ఒకసారి పెట్టుబడి పెడితే రోజుకు కనీసం 10 ఎకరాలకు నీటిని పారించవచ్చు. విద్యుత్తు అవసరం లేదు. పిస్టన్లకు ఆయిల్ సీల్స్ లాంటి విడి భాగాలు ఏవీ ఉండవు కాబట్టి, నిర్వహణ ఖర్చేమీ ఉండదు. ర్యాం పంప్‌ల తయారీకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ (సీడీఆర్), టాటా ట్రస్టు విసిఎఫ్, సిసిఎల్ తదితర సంస్థలు ఆర్థిక సహాయాన్నందించాయి. ర్యాం పంపుల పరిమితులు అయితే, కనీసం 8–10 అడుగుల ఎత్తు నుంచి కిందికి నీరు పారే చోట్ల మాత్రమే ర్యాం పంపును నిర్మించగలం. ఇందుకు అనుకూలమైన చోట్లు చాలా తక్కువే ఉంటాయి. దీన్ని నెలకొల్పడానికి సిమెంటు కాంక్రీటుతో పునాదిని నిర్మించాలి. బండ రాళ్లు అనువైన రీతిలో ఉంటేనే సివిల్ వర్క్ చేయడానికి అనుకూలం. అందువల్ల కాంక్రీట్ వర్క్ కొన్నిచోట్ల విఫలమవుతూ ఉంటుంది. ర్యాం పంపులకు ఉన్న ఈ పరిమితుల దృష్ట్యా తక్కువ ఎత్తు నుంచి నీరు పారే చోట్ల నుంచి నీటిని ఎత్తిపోసే కొత్త యంత్రాన్ని తయారు చేస్తే ఎక్కువ భూములకు సాగు నీరందించవచ్చన్న ఆలోచన శ్రీనివాస్ మదిలో మెదిలింది. అలా పుట్టిన ఆవిష్కరణే ‘హైడ్రో లిఫ్ట్’. ఇటు పొలాలకు నీరు.. అటు ఇళ్లకు విద్యుత్తు!రంపచోడవరం, చింతూరు, పాడేరు ఐటిడిఏల పరిధిలో కొండలపై నుంచి వాగులు, వంకలు నిత్యం ప్రవహిస్తున్నాయి. వాగు నీటి ప్రవాహ శక్తిని బట్టి వాగు ఇరువైపులా ఉన్నటు భూమి ఎత్తు, స్వభావాన్ని బట్టి తగినంత రూ. 15–20 లక్షల ఖర్చుతో 9–16 అడుగుల వరకు పొడవైన హైడ్రో లిఫ్ట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా 6 అంగుళాల పంపుతో విద్యుత్ లేకుండానే వాగు ఇరువైపులా 50 నుంచి 100 ఎకరాల భూమికి సాగు నీరు అందించవచ్చు. అంతేకాకుండా, ఒక్కో వాటర్ వీల్ ద్వారా 15 కెవి విద్యుత్‌ను తయారు చేసి సుమారు 20–30 కుటుంబాలకు అందించవచ్చు. ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, గిరిజనాభివృద్ధి శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు హైడ్రో లిఫ్ట్ పద్ధతిని ప్రోత్సహిస్తే నా వంతు కృషి చేస్తా. – పంపన శ్రీనివాస్ (79895 99512), గ్రామీణ ఆవిష్కర్త, కైకవోలు, పెదపూడి మండలం, కాకినాడ జిల్లా – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, ప్రతినిధి కాకినాడ -
6 జిల్లాల్లో శీతల గాలులు: పంటలను ఇలా రక్షించుకుందాం!
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే రెండు రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ఉదయపు వేళల్లో దట్టంగా పొగమంచు ఆవరించే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. పి. లీలారాణి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వివిధ పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు ఈ కింది సూచనలు పాటించాలని డా. పి. లీలారాణి సూచించారు.వరి: తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలి ప్రభావంతో యాసంగి నారుమడుల్లో నారు ఎదగక పోవచ్చు. ఆకులు పసుపు, ఎరుపు రంగుల్లోకి మారవచ్చు. కొన్నిసార్లు నారు చనిపోవచ్చు. అందువల్ల రైతులు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలి. నారుమళ్ళపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం పూట కప్పి, మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రాత్రి వేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి, కొత్త నీరు పెట్టాలి. ∙200 చదరపు మీటరు విస్తీర్ణం గల నారుమడికి ఆఖరి దుక్కిలో 2 క్వింటాళ్లు బాగా చివికిన కోళ్ళు లేదా గొర్రెల ఎరువు వేయాలి. విత్తే సమయంలో 1 కిలో నత్రజని, 1కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే రసాయనిక ఎరువులు వేయాలి. వరి నారుమళ్ళలో జింక్ ధాతువు లోపం నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరుసగా వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేదా ప్రతి యాసంగిలో దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. చలి వాతావరణం, పొగమంచు వరిని అగ్గి తెగులు ఆశించటానికి అనుకూలం. పొలంలో, పొలంగట్లపైన ఉండే గడ్డి కలుపు మొక్కలు అగ్గి తెగులను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి, పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. వరి నారుమళ్ళలో అగ్గి తెగులు గమనిస్తే, నివారణకు 0.5 గ్రా. ట్రైసైక్లాజోల్ లేదా 1.5 మి.లీ. ఐసోప్రొథైయోలిన్ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న: చలి వల్ల మొక్కజొన్నలో భాస్వరం లోపించి ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లైతే నివారణకు 10 గ్రా. 19–19–19 లేదా డి.ఎ.పి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మిరప : ప్రస్తుత చలి వాతావరణం మిరపను బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 3గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5గ్రా. టేబుకొనజోల్ + గంధకం లేదా 1.5గ్రా. కార్బండజిమ్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 0.3గ్రా. డైనోటేఫురాన్ + 1గ్రా. కార్బండజిమ్ + 2.5 మి.లీ. వేపనూనె లేదా 0.5 గ్రా. థయోమిథాక్సామ్ + 2 మి.లీ. హెక్సాకొనజోల్ + 2.5 మి.లి వేప నూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కుసుమ: నవంబర్‌లో విత్తుకున్న కుసుమ పంటకు పేనుబంక ఆశించే అవకాశం ఉంది. నివారణకు 2 మి.లీ. డైమిథోయెట్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
చౌడు పీడ రబీలోనే ఎక్కువ!
చౌడు సమస్య ఖరీఫ్‌లో కన్నా రబీలోనే ఎక్కువగా ఇబ్బందిపెడుతుంది. చౌడు వల్ల ధాన్యం దిగుబడి తగ్గడం కూడా రబీలోనే ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చౌడును తట్టుకొని 20–25 బస్తాల దిగుబడినిచ్చే డి.ఆర్.ఆర్. ధన్ 39, జరవ, వికాస్ అనే వరి వంగడాలు ఉన్నాయి. ఇవి 120–130 రోజుల్లో కోతకొస్తాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో చౌడు సమస్య ఉంది. మట్టిలో లవణ సూచిక (ఇ. సి.) 4 వరకు ఉంటే కొంత ఫర్వాలేదు. కానీ, మా క్షేత్రంలో ఈ ఏడాది 10.9 ఉంది. ఎక్స్ఛేంజబుల్ సోడియం పర్సంటేజ్ (ఈ.ఎస్.పి.) 15% కన్నా పెరిగితే చౌడు సమస్య తలెత్తుతుంది. చౌడు భూముల్లో కాలువ నీటితో సాగు చేయడానికి అనువైన మూడు వరి వంగడాలను శాస్త్రవేత్తలు గతంలోనే రూపొందించారు. ఎం.సి.ఎం. 100 అనేది రబీకి అనుకూలం. 125 రోజులు. 28–30 బస్తాల దిగుబడి వచ్చింది. ఎం.సి.ఎం. 101 రకం 140 రోజుల పంట. ఖరీఫ్‌కు అనుకూలం. 35 బస్తాల దిగుబడి. అగ్గి తెగులును, దోమను తట్టుకుంది. ఎం.సి.ఎం. 103 ఖరీఫ్ రకం. ఇది రాయలసీమ జిల్లాల్లోనూ మంచి దిగుబడులనిస్తోంది. చౌడు భూముల్లో నాట్లకు ముందు జీలుగ సాగు చేసి కలియదున్నాలి. ఇతర పచ్చిరొట్ట పైర్లు వేస్తే ఉపయోగం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైపైనే దమ్ము చేయాలి. సమతూకంగా ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు వేయడం మంచిది. రబీలో పొలాన్ని ఖాళీగా ఉంచితే, ఖరీఫ్‌లో చౌడు సమస్య ఎక్కువ అవుతుందట. (చదవండి: నౌకాయానంలో వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త) -
నల్ల తామరకు డిజిటల్ కట్టడి!
మిరప కాయల ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. మన మిరప కాయ ఘాటైన రుచికి, రంగుకు ప్రసిద్ధి చెందింది. మన దేశం ఎగుమతి చేసే సుగంధ ద్రవ్యాల్లో 42% వాటా మిరపదే! మిరప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్. ఇది దేశీయ, అంతర్జాతీయ ధరలను ప్రభావితం చేయగలదు. 2021లో ఆంధ్రప్రదేశ్‌లో మిరప పంటను తీవ్రంగా నష్టపరిచే కొత్త రకం నల్ల తామర (త్రిప్స్ పార్విస్పినస్ – బ్లాక్ త్రిప్స్) జాతి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. ఇది ఆగ్నేయాసియా నుంచి మన దేశంలోకి వచ్చింది. ఇది 2015లో బొప్పాయి పంటపై కూడా మన దేశంలో మొదటిసారిగా కనిపించింది. ఈ పురుగులు ఆకుల కణజాలాన్ని తినే ముందు లేత ఆకులు, పువ్వులను చీల్చివేస్తాయి. పూరేకుల చీలికల వల్ల పండ్లు సెట్కావటం కష్టతరంగా మారుతుంది. ఇది మిరప ఆశించే నల్ల తామర పత్తి, మిర్చి, కంది, మినుము, మామిడి, పుచ్చ, తదితర పంటలను కూడా దెబ్బతీస్తుంది. 2022లో ఆరు దక్షిణాది రాష్ట్రాల్లో మిరప పంటను బాగా దెబ్బతీసింది. కొన్ని ప్రాంతాల్లో 85 నుంచి 100% వరకు పంట నష్టం చేకూరింది. పంటలను రక్షించుకోవడానికి రసాయన పురుగుమందులను విపరీతంగా వాడటం తప్ప రైతులకు వేరే మార్గం లేకుండాపోయింది. ఖర్చు పెరిగిందే తప్ప ఉపయోగం లేకుండా ΄ోయింది. దీనికితోడు, నల్ల తామర సోకిన మిర్చికి మార్కెట్లో తక్కువ ధర పలకటంతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు.148 దేశాల్లో రైతులకు ఉచిత సేవలుచిన్న కమతాల రైతులు ఆచరణాత్మక సలహా సమాచారాన్ని పొందడానికి విస్తరణ సేవలు, ఇతర వ్యవసాయ సేవలను అందించే వారిపై ఆధారపడతారు. ఈ రైతుల విస్తృత అవసరాలను తీర్చే సలహాదారులు సరైన నిర్ణయం తీసుకోవాలంటే వారు తగిన సమాచారం పొందాలి. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయంలో డిజిటల్ సేవల సాధనాలు గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ, ఇవి రైతు సలహాదారులకు చాలా వరకు చేరువ కాలేకపోతున్నాయి. ఈ డిజిటల్ యుగంలో అనేక సంస్థలు డిజిటల్ సలహాలను, సమాచారాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తున్నాయి. వీటివల్ల రైతులకు సరైన సలహాలు, సరైన సమయంలో మొబైల్ ఫోన్లోనే అందుబాటులో ఉండటం వల్ల తన దైనందిన కార్యక్రమాలకు అంతరాయం లేకుండా రైతు సమాచారాన్ని పొందుతున్నారు. ఇటువంటి డిజిటల్ సాధనాల్లో సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్సెస్ ఇంటర్నేషనల్ (సిఎబిఐ – కాబి) డిజిటల్ సాధనాలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచాయి. 148 దేశాలలో ఈ సంస్థ రైతులకు ఉచితంగా డిజిటల్ సేవలు అందిస్తోంది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. వంద సంవత్సరాలకు పైగా చీడపీడల యాజమాన్యంలో అనుభవమున్న సంస్థ. ఈ డిజిటల్ సాధనాలు మనదేశంలో కూడా తెలుగు సహా అనేక భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది హైదరాబాద్‌లో గల సుస్థిర వ్యవసాయ కేంద్రంతోపాటు అనేక ఐసిఎఆర్ అనుబంధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ జ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం కాబి కృషి చేస్తోంది. ఈ డిజిటల్ సాధనాలు ఉచితంగా అందించటం విశేషం. విజ్ఞానపరంగా పరీక్షించి, నిరూపితమైన, స్థానికంగా లభ్యమౌతున్న ఉత్పత్తుల వివరాలు ఇందులో పొందుపరిచారు. ‘కాబి’ భాగస్వాములతో కలిసి ‘పెస్ట్ మేనేజ్మెంట్ డెసిషన్ గైడ్’ (పిఎండిజి)ని అభివృద్ధి చేసింది. పంటలను ఆశించిన నల్ల తామర పురుగులను గుర్తించడం, సేంద్రియ/ సురక్షితమైన యాజమాన్య పద్ధతులపై ఈ గైడ్ సలహాలను అందిస్తుంది. మన దేశంలో వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న అనేక జీవ రసాయనాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. మిర్చి సహా అనేక పంటలను ఆశిస్తున్న నల్ల తామర యాజమాన్యంపై రైతులు, విస్తరణ అధికారులు, విద్యార్ధులు, శిక్షకులు, పరిశోధకులు ఈ క్రింద పేర్కొన్న డిజిటల్ సాధనాలు ఉపకరిస్తాయి. ‘కాబి’ ఉచితంగా అందిస్తున్న డిజిటల్ సాధనాలను మరింత సమర్థవంతంగా, త్వరగా ఉపయోగించడం ద్వారా నల్ల తామరకు సంబంధించి, యాజమాన్య మెలకువల గురించిన మరింత సమాచారం కోసం ఈ క్రింద పేర్కొన్న వెబ్సైట్, మొబైల్ యాప్‌లు ఉపయోగపడతాయి. 1. బయో ప్రొటెక్షన్ పోర్టల్ : చీడపీడల నియంత్రణ, యాజమాన్యానికి స్థానిక బయోపెస్టిసైడ్స్ సమాచారం కోసం ఈ క్యూ.ఆర్. కోడ్‌ను స్కాన్ చేయండి.2. క్రాప్ స్ప్రేయర్ యాప్ : పురుగుమందు/ బయోపెస్టిసైడ్ మోతాదు ఎంత వాడాలి అన్నది తెలుసుకోవడం కోసం ఈ క్యూ.ఆర్.కోడ్‌ను స్కాన్ చేయండి.3. ఫ్యాక్ట్‌షీట్ యాప్/నాలెడ్జ్ బ్యాంక్ : చీడపీడలకు సంబంధించి విస్తృతమైన సమాచారం కోసం ఈ క్యూ.ఆర్. కోడ్‌ను స్కాన్ చేయండి. తామర పురుగులు.. ఏడాదికి 8 తరాలు! తామర పురుగులు (త్రిప్స్) రెక్కలు కలిగిన చిన్న కీటకాలు. వీటిలో అనేక జాతులున్నాయి. ఇవి ఉల్లిపాయలు, టమోటాలు, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష సహా వివిధ పంటలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. మరికొన్ని వ్యవసాయానికి ప్రయోజనం చేకూరుస్తాయి కూడా. ఎలాగంటే.. అవి పంటలకు హాని చేసే పురుగులను తింటాయి!తామర పురుగులు మొక్కల బయటి పొరను చీల్చుకుని అందులోని పదార్థాలను తినడం ద్వారా మొక్కలను దెబ్బతీస్తాయి. జాతులను బట్టి, జీవిత దశను బట్టి వివిధ రంగుల్లో ఉంటాయి. పిల్ల పురుగు (లార్వా) సాధారణంగా పారదర్శకంగా ఉంటాయి. చాలావరకు పెరిగిన తామర పురుగులు పొడవాటి సన్నని రెక్కలతో, అంచుల్లో చిన్న వెంట్రుకలను కలిగి ఉంటాయి. గుడ్లు సాధారణంగా పొడుగ్గా ఉంటాయి. మూత్రపిండాల ఆకారంలో కనిపిస్తాయి. ఉష్ణమండలంలో నివసించే తామర పురుగులు సమశీతోష్ణ వాతావరణంలో కంటే పెద్దవిగా పెరుగుతాయి. తామరపురుగుల జీవిత కాలం సాధారణంగా నెలన్నర. జాతులను, వాతావరణాన్ని బట్టి సంవత్సరానికి ఎనిమిది తరాల వరకు సంతతిని పెంచుకుంటూ ఉంటాయి. ఆడ పురుగులు అతిథేయ (హోస్ట్) మొక్కల ఆకులపై గుడ్లు పెడతాయి. లార్వా పొదిగిన తర్వాత ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తుంది. లార్వా నాలుగు దశల్లో (రెండు ఫీడింగ్, రెండు నాన్–ఫీడింగ్) పెరిగి పెద్దది అవుతుంది. వెచ్చని వాతావరణంలో యుక్తవయస్సులో దీని పెరుగుదల వేగంగా ఉంటుంది. శీతాకాలంలో జీవించగలవు. అయితే ఈ సీజన్లో వాటి సంఖ్య సాధారణంగా తగ్గుతుంది. తామర పురుగులు మొక్కల లోపల ద్రవాలను పీల్చుకొని బతుకుతాయి. పండ్లు, ఆకులు, రెమ్మలను ఆశించి.. బయటి పొర లోపలికి చొచ్చుకుపోయి తింటాయి. త్రిప్స్ పెద్ద మొత్తంలో పంటని ఆశించినప్పుడు, పంట పెరుగుదల, దిగుబడిని కోల్పోవడానికి కారణమవుతాయి. ఇవి చాలా పెద్ద చెట్ల జాతులపై కూడా దాడి చేయగలవు. ఐతే సాధారణంగా పండ్లు, కూరగాయల కంటే పెద్ద చెట్లు ఎక్కువ వీటి దాడికి తట్టుకోగలుగుతాయి. తామర పురుగులు మొక్కల వైరస్‌లను కూడా వ్యాప్తి చేస్తాయి. వేరుశనగలో మొవ్వు కుళ్ళు (బడ్ నెక్రోసిస్ ), టొమాటో–స్పాటెడ్ విల్ట్ వైరస్.. ఇలా వ్యాపించేవే.తామర పురుగుల యాజమాన్యం 1. తామర పురుగులు నేలపై పడ్డ వ్యర్ధపదార్ధాలలో జీవిస్తూ పంటలను ఆశిస్తుంటాయి. కాబట్టి, పంట వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. 2. ఎండను పరావర్తనం చెందించే మల్చింగ్ షీట్లను లేదా ఇతర ఆచ్ఛాదన పదార్థాలను బెడ్స్ మీద పరచాలి. 3. నీలం రంగు జిగురు అట్టలను ఏకరానికి 20 వరకు ఏర్పాటు చేయాలి. ఇవి పురుగులతో నిండగానే మార్చుకోవాలి. 4. సహజ శత్రువులైన అల్లిక రెక్కల పురుగు (లేస్ వింగ్ బగ్స్) అతిచిన్న పైరేట్ బగ్స్, పరాన్న భుక్కు నల్లులు (ప్రిడేటరీ మైట్స్)ను రక్షించుకోవాలి.5. వేప నూనె 3% చల్లితే పంటలను తామర పురుగులు ఆశించవు. వీటి సంతానోత్పత్తి ప్రక్రియకు వేప నూనె అంతరాయం కలిగిస్తుంది. 6. బవేరియా బాసియానా, మెటార్హిజియం అనిసోప్లియె అనే శిలీంద్రాలు తామర పురుగులకు రోగాన్ని కలిగించి నశింపజేస్తాయి. ఇవి రైతులకు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ జి. చంద్రశేఖర్, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త,సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్. మొబైల్: 94404 50994 (చదవండి: నౌకాయానంలో వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త)