ఇంటర్‌ ఫెయిలైన రైతు ఆవిష్కరణ.. ఎస్‌కె–4 పసుపు! | SK-4 turmeric An innovation of a farmer who failed intermediate | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫెయిలైన రైతు ఆవిష్కరణ.. ఎస్‌కె–4 పసుపు!

Published Wed, Mar 12 2025 11:00 AM | Last Updated on Wed, Mar 12 2025 11:33 AM

SK-4 turmeric An innovation of a farmer who failed intermediate

చేసే పని మీద శ్రద్ధాసక్తులు మెండుగా ఉంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని నిరూపించే విజయగాథ రైతు శాస్త్రవేత్త సచిన్‌ కమలాకర్‌ కారేకర్‌ది. పన్నెండో తరగతి ఫెయిల్‌ అయ్యి వ్యవసాయం చేపట్టిన సచిన్‌ శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడినిచ్చే ఒక చక్కని పసుపు వంగడాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరు ‘ఎస్‌కె–4’. ఈ వంగడం సచిన్‌కు ఉత్తమ ప్లాంట్‌ బ్రీడర్‌గా, గొప్ప ఆవిష్కర్తగా కీర్తితోపాటు జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఎస్‌కె–4 పసుపు రకాన్ని ఇప్పుడు 13 రాష్ట్రాల్లో సాగు చేస్తుండటం విశేషం. తాను పండిస్తున్న పసుపు పంటలో మెరుగైన ఫలితాలనిస్తున్న మొక్కల్ని వేరే చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు శ్రద్ధగా కొనసాగించిన ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ కొత్త వంగడాన్ని ఆయన రూపొందించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ జాతీయ స్థాయి ద్వితీయ ఆవిష్కర్త పురస్కారాన్ని అందుకున్నారు. 

ఔషధ విలువలకు పెట్టింది పేరైన పసుపు పంటకు సంబంధించి దేశవ్యాప్తంగా 30 వంగడాలు సాగులో ఉన్నాయి. మహారాష్ట్రలో రైతులు 70% విస్తీర్ణంలో రాజపురి సేలం వెరైటీని సాగు చేస్తుంటారు. ఇది 20 రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్నప్పటికీ మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో ఎక్కువగా సాగవుతోంది. 2022–23లో మన దేశంలో 11.61 లక్షల టన్నుల పసుపు పండింది. పసుపునకు సంబంధించి ప్రపంచంలోనే భారత్‌ అత్యధిక ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారు కూడా!

సచిన్‌ కమలాకర్‌ కరేకర్‌ (48) స్వస్థలం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అబ్లోలి అనే గ్రామం. చిప్లన్‌కు 55 కి.మీ. దూరంలో ఈ ఊరు ఉంది. సచిన్‌ ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయిన తర్వాత 22 ఏళ్ల వయసు నుంచి గత 26 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 500 వక్క చెట్లు, 50 కొబ్బరి చెట్ల మధ్య పసుపును అంతరపంటగా సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే వంగడాలను రూపొందించాలన్న ఆకాంక్ష మొదటి నుంచే ఆయనకు ఉంది. నచ్చిన గుణగణాలున్న మొక్కల్ని ఏటేటా వేరుగా సాగు చేస్తూ కొత్త పసుపు వంగడాన్ని ఆవిష్కరించారు. దీన్నే క్లోనల్‌ సెలక్షన్‌ మెథడ్‌ అంటారు.

1998 నుంచి కొత్త వంగడంపై కృషి

సచిన్‌ తన సేద్య ప్రయాణం గురించి ఇలా చెప్పుకొచ్చారు.. ‘1998లో నేను ఒక స్థానిక పసుపు రకాన్ని సాగు చేయటం ప్రాంభించాను.  పొలంలో కొన్ని మొక్కల పంట కాలం మిగతా వాటికన్నా ముందుగానే ముగుస్తున్నట్లు గుర్తించాను. ఆ మొక్కలు చాలా ఏపుగానూ పెరిగాయి. అట్లా మెరుగ్గా కనిపించిన మొక్కల దుంపలను వెలికితీసి, విడిగా ఉంచాను. ఆ పసుపు దుంపలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ముదురు రంగులో ఆకర్షణీయంగానూ, చీడపీడలను దీటుగా తట్టుకొని బాగా పెరిగాయి. అధిక దిగుబడి కూడా వచ్చింది. అదే విధంగా ఆ మొక్కల్ని ప్రతి ఏటా సాగు చేస్తూ, మెరుగ్గా ఉన్న మొక్కల పసుపు కొమ్ముల్ని నాటి, మళ్లీ వాటిలో నుంచి మంచి వాటిని ఏరి తర్వాత ఏడాది సాగు చేయటం 2007 వరకు కొనసాగించాను. 2008 నాటికి నాకు నచ్చిన (త్వరగా కోతకు రావటం, ఏపుగా చీడపీడలను తట్టుకొని పెరగటం, అధిక దిగుబడి, దుంప రంగు బాగుండటం.. వంటి) మంచి గుణగణాలున్న మెరుగైన కొత్త వంగడం సిద్ధమైంది. దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, దానికి ఎస్‌కె–4 అని పేరు పెట్టాను.’

కుక్కుమిన్‌ 4%
పచ్చి పసుపు హెక్టారుకు 55–56 టన్నుల దిగుబడినిచ్చే వంగడం ఇది. చాలా ఆకర్షణీయంగా ముదురు ఎరుపు–పసుపు రంగు. దీని పంటకాలం 160–170 రోజులు. అధిక వర్షపాతం గల ప్రాంతానికి అనువైనది. దుంపకుళ్లు తెగులును, ఆకు మచ్చ తెగులును తట్టుకునే గుణం దీనికి ఉంది. నేషనల్‌ ఇన్నేవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఐఎఫ్‌) ఈ వంగడాన్ని గుర్తించి 2020 ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా దపోలిలోని డాక్టర్‌ బాలసాహెబ్‌ సావంత్‌ కొంకణ్‌ కృషి విద్యాపీఠ్‌ (డిబిఎస్‌కెకెవి) ఆవరణలో సాగు చేయించింది. హెక్టారుకు పచ్చి పసుపు 56 టన్నుల అధిక దిగుబడి వచ్చింది. 28 రకాల కన్నా ఎస్‌కె–4 రకం అధిక దిగుబడినిచ్చింది. ఈ పసుపులో కుర్కుమిన్‌ 4% ఉంది. దీంతో ఈ రకం పసుపు విత్తనాన్ని పరిసర జిల్లాల్లోని రైతులకు సచిన్‌ ఇవ్వటం   ప్రారంభించారు. ఆ రైతులకు కూడా మంచి దిగుబడి వచ్చింది. ఆ విధంగా ఈ రకం పసుపు సాగు 2021 నాటికే ఎస్‌కె–4 రకం మహారాష్ట్రలో లక్ష ఎకరాలకు విస్తరించింది. దీంతో పొటెక్షన్‌ ఆఫ్‌  ప్లాంట్‌ వెరైటీస్‌ అండ్‌ ఫార్మర్స్‌ రైట్స్‌ యాక్ట్‌ –2001 కింద ఈ సరికొత్త వంగడానికి సంబంధించి సచిన్‌కు ప్రత్యేక జన్యు హక్కులు ఇవ్వమని కోరుతూ ఎన్‌ఐఎఫ్‌ దరఖాస్తు చేసింది.

ఎస్‌కె–4 పేరు ఎందుకొచ్చింది?
తన ఆవిష్కరణకు మూలమైన స్థానిక వంగడం సంగ్లి కడప వెరైటీ స్పెషల్‌ కొంకణ్‌ను ఇచ్చింది షెండ్గే కాక అనే రైతు. అందుకని కొత్త వంగడానికి మొదటి అక్షరం ఆయనది, రెండో అక్షరం తనది కలిపి ఎస్‌కె–4 అని పేరు పెట్టారు. డిబిఎస్‌కెకెవికి చెందిన ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రఫుల్ల మలి మాట్లాడుతూ.. మేం ఈ రకాన్ని రెండేళ్లు వరుసగా సాగు చేసి చూశాం. రాజేంద్ర సోనా అనే రకం మాదిరిగా ఇది కూడా అధిక దిగుబడినిచ్చే రకమని రుజువైంది.

రాజేంద్ర సోనా హెక్టారుకు 64 టన్నుల దిగుబడినిచ్చేదైనప్పటికీ దాని విత్తనం అందుబాటులో లేదు. అందువల్ల ఎస్‌కె–4 రకం ప్రత్యామ్నాయంగా అధిక వర్షపాతం నమోదయ్యే కొంకణ్‌ ్ర΄ాంతానికి ఇది అనువైనదిగా గుర్తించాం. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో దీని పనితీరు ఎలా ఉంటుందో ఇంకా పరీక్షించాల్సి ఉంది అన్నారు. సింద్‌దుర్గ్, రాయ్‌గడ్, రత్నగిరి జిల్లాల్లో చాలా మంది రైతులు ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. గుహగర్‌ తాలూకా వేలాంబ్‌ గ్రామానికి చెందిన విశ్రాం మలి (58) అనే రైతు గత ఏడాది ఈ పంటను సాగు చేయగా ఒక మొక్క కుదురులోని పసుపు 8.15 కిలోల బరువు తూగింది!

నర్సరీ పెంచి నాట్లు వేయటం మేలు
డాక్టర్‌ ప్రఫుల్ల మలి ఇంకా ఇలా చెప్పారు.. ఏప్రిల్‌లో నర్సరీ బ్యాగుల్లో పసుపు విత్తనం పెడతాం. జూన్‌లో ఆ మొక్కల్ని  పొలంలో నాటుతాం. నాట్లకు ముందు సేంద్రియ ఎరువు వేసి  పొలాన్ని దుక్కి చేస్తాం. ఆగస్టులో రెండో దఫా ద్రవ ఎరువును అందిస్తాం. జనవరి ఆఖరు వరకు నీరు ఇస్తుంటాం. ఫిబ్రవరిలో పంట కోత జరుగుతుంది. ప్రతి మొక్కకు సగటున 3.2 కిలోల దుంపలు వస్తాయి. సచిన్‌ ఈ వంగడాన్ని పదేళ్లుగా రైతులకు ఇస్తున్నారు. దీనితోపాటు దీని యాజమాన్య మెళకువలపై రైతులకు ఆయన తరచూ శిక్షణ ఇస్తున్నారు. పసుపు విత్తనాన్ని నేరుగా పొలంలో నాటే కంటే నర్సరీలో పెంచి నాట్లు వేయటం వల్ల అధిక దిగుబడి వస్తోందని ఇటీవల వరకు గుహాగర్‌లో వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేసిన గజేంద్ర పానికర్‌ అంటున్నారు. 

విత్తనం 500 మందిరైతులకు ఇచ్చానేను కొత్తగా అభివృద్ధి చేసిన ఎస్‌కె–4 రకం పసుపు విత్తనాన్ని రత్నగిరి, సింధుదుర్గ్, రాయగడ్‌ జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది రైతులకు ఇచ్చాను. కొత్తగా వేసే రైతులు అతిగా ఆశపడి ఈ రకాన్ని మొదటే ఎక్కువ విస్తీర్ణంలో వేయొద్దు. మొదట ఒక గుంట (వెయ్యి చదరపు అడుగులు) లో వేసి చూడండి. తర్వాత పది గుంటలకు పెంచండి. నేనూ అలాగే చేశా. ఇప్పుడు రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నా. ఈ ప్రత్యేక పొలాన్ని చూడటానికి సందర్శకులు వస్తుంటారు.- సచిన్‌ కమలాకర్‌ కారేకర్, ఎస్‌కె–4 పసుపు రకం ఆవిష్కర్త, అబ్లోలి, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.
నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ జాతీయ ద్వితీయ పురస్కార గ్రహీత, 

ఆవిష్కర్తకు ఆరేళ్లపాటు ప్రత్యేక హక్కులు

2023లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఐఎఫ్‌) నిర్వహించిన ద్వైవార్షిక గ్రామస్థాయి ఆవిష్కరణలు మరియు అసాధారణ సంప్రదాయ విజ్ఞాన పురస్కారాల 11 వ మహాసభలో రైతు శాస్త్రవేత్త సచిన్‌ కమలాకర్‌ కారేకర్‌కు జాతీయ ద్వితీయ పురస్కారం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పురస్కారం  అందుకున్నారు.  ఎన్‌ఐఎఫ్‌ గతంలో దరఖాస్తు ఆధారంగా.. ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ప్లాంట్‌ వెరైటీస్‌ అండ్‌ ఫార్మర్స్‌ రైట్స్‌ అథారిటీ (పిపివి అండ్‌ ఎఫ్‌ఆర్‌ఎ) 2024 డిసెంబర్‌లో సచిన్‌ అభివృద్ధి చేసిన ఎస్‌కె–4 వంగడానికి ప్రత్యేక వంగడంగా గుర్తింపునిచ్చింది. సచిన్‌ కమలాకర్‌ కరేకర్‌ను ప్లాంట్‌ బ్రీడర్‌’గా గుర్తించి ప్రత్యేక హక్కులను ప్రదానం చేసింది. దీని ప్రకారం ఆరేళ్ల పాటు ఈ వంగడాన్ని  పండించి, విత్తనాన్ని అమ్ముకునే ప్రత్యేక హక్కు ఆవిష్కర్త అయిన సచిన్‌కు దఖలుపడింది.  

నిర్వహణ: పంతంగి రాంబాబు ,సాగుబడి డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement