వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్‌ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా? | Filippo Carrara, 'The king of basil': 28 years old and 50 hectares | Sakshi
Sakshi News home page

వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్‌ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా?

Published Wed, Nov 27 2024 11:03 AM | Last Updated on Wed, Nov 27 2024 12:58 PM

Filippo Carrara, 'The king of basil': 28 years old and 50 hectares

 50 హెక్టార్లలో 3 వేల టన్నుల బసిల్‌ ఆకు ఉత్పత్తి

టన్ను ధర 550 యూరోలు (సుమారుగా రూ. 49 వేలు).. 

మొత్తం రూ. 14.66 లక్షల ఆదాయం

విత్తటం, కోత అంతా భారీ యంత్రాలతోనే..

ఇటలీ యువ రైతు ఫిలిప్ఫో కర్రర విజయగాథ  

ఫిలిప్పో కర్రర 28 ఏళ్ల యువ రైతు. అతనిది ఇటలీలోని ఉత్తరప్రాంతంలోని పర్మ నగరం. ఇటలీలో పెద్ద కమతాలే ఎక్కువ. ఇప్పుడు సగటు వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణం సుమారు 11 హెక్టార్లు. అక్కడ కమతాల సైజు పెరుగుతూ వస్తోంది. 2000వ సంవత్సరంలో 5 హెక్టార్లున్న సగటు కమతం విస్తీర్ణం 2010 నాటికి 8 హెక్టార్లకు, తర్వాత 11 హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయక కుటుంబంలో పుట్టిన ఫిలిప్పో  చదువు పూర్తిచేసుకొని ఏడేళ్ల క్రితం వ్యవసాయంలోకి దిగాడు.  పేరుకు వ్యవసాయమే అయినా వాణిజ్య దృష్టితో సేద్యం చేయటంలో దిట్ట ఫిలిప్ఫో. అతను పగ్గాలు చేపట్టేటప్పటికి వారి కుటుంబ వ్యవసాయ కంపెనీ పది హెక్టార్లలో పంటలు సాగు చేస్తుండేది. ఈ ఏడేళ్లలోనే 150 హెక్టార్లకు విస్తరించిందంటే యువ రైతు ఫిలి΄్పో పట్టుదల, కార్యదక్షతలను అర్థం చేసుకోవచ్చు. 50 హెక్టార్లలో ఇటాలియన్‌ బసిల్‌ పంటను పండిస్తున్నాడాయన. బసిల్‌ తులసి జాతికి చెందిన పంట. ఇందులో తీపి రకం కూడా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో కూడిన సలాడ్లలో కలుపుకొని తింటారు. బసిల్‌ నుంచి నూనెను కూడా వెలికితీసి అనేక ఔషధాల్లో వాడుతూ ఉంటారు. 

1996లో పుట్టిన ఫిలిప్పోను ఆ దేశంలో కొత్త తరం రైతులకు, వాణిజ్య స్ఫూర్తికి ప్రతీకగా యువత పరిగణిస్తున్నారు. ‘నేను ఏడేళ్ల క్రితం మా వ్యవసాయం బాధ్యతలు తీసుకున్నాను. పది హెక్టార్ల పొలానికి బాధ్యత తీసుకున్నాను. మా తాత ప్రాంరిశ్రామిక పద్ధతుల్లో భారీ విస్తీర్ణంలో టొమాటోలు సాగు చేసేవారు (ఇటలీ ఉత్తర భాగంలో ఎక్కువ టొమాటోలే సాగవుతూ ఉంటాయి). బసిల్‌ పంటను అధిక విస్తీర్ణంలో పెంచడానికి అనువైనదిగా గుర్తించాను. ఇది అధికాదాయాన్నిచ్చే పంట. అయితే, రైతులు కొద్ది విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు. నేను భారీ యంత్రాలు ఉపయోగించటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం ప్రారంభించాను. బసిల్‌ ఆకులను తాజాగా, సువాసనతో కూడి ఉండాలని దీనితో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ఆశిస్తుంటాయి..’ అంటాడు  ఫిలిప్పో 

మనుషులతో కాకుండా భారీ యంత్రాలతో బసిల్‌ పంట కోతను చేపట్టాలనుకున్నప్పుడు.. తమ పొలంలో మడుల సైజుకు తగిన విధంగా పంట కోత యంత్రాన్ని ఆయన ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి తయారు చేయించాడు. ఫిలిప్పో ఫిలిప్ఫో బసిల్‌ ఆకును ఆ రంగంలో వేళ్లూనుకున్న 6 కంపెనీలకు విక్రయిస్తుంటాడు. ‘నేను ఆర్థిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం చదివాను. కానీ, వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం’ అన్నాడు. ‘ఆరుబయట పొలాల్లో విస్తారంగా బసిల్‌ పంటను నాణ్యమైన దిగుబడి తీసే విధంగా సాగు చేయటం సవాళ్లతో కూడిన పని. అయితే, ఈ పంటలోనే ఎదిగే అవకాశం ఉందని నేను గుర్తించాను. మా కంపెనీ 3 వేల టన్నుల బసిల్‌ ఆకులను పండిస్తోంది. టన్ను ధర 550 యూరోలు (సుమారుగా రూ. 49 వేలు). అనేక విషయాలపై ఆధారపడి ఈ ధరలో హెచ్చుతగ్గులుంటాయి అనిఫిలిప్పో  చెప్పాడు. 50 ఎకరాల్లో ఏడాదికి రూ. 14.66 లక్షల ఆదాయం పొందుతున్నాడు. 

ఏప్రిల్‌ రెండోవారంలో బసిల్‌ విత్తటం ప్రారంభిస్తాం. మొదటి కోత జూన్‌ రెండోవారంలో మొదలవుతుంది. అక్టోబర్‌ వరకు కోతలు కొనసాగుతాయి. ‘ఈ ఏడాది సెప్టెంబర్‌ రెండో వారం వరకు దిగుబడి, నాణ్యత బాగున్నాయి. భారీ వర్షం కురవటంతో పంట దెబ్బతింది.’ అన్నాడు ఫిలిప్పో. 

పొద్దున్న, సాయంత్రపు వేళల్లో బసిల్‌ ఆకుల్ని కత్తిరిస్తే వాటి నాణ్యత, రంగు, వాసన బాగుంటాయి. మేం కత్తిరించిన కొద్ది గంటల్లోనే ఫుడ్‌ కంపెనీకి చేర్చుతాము అని చెప్పాడు. ఇటలీలో ఒకానొక పెద్ద సహకార బ్యాంకింగ్‌ వ్యవస్థ ‘ఎలిల్‌బంక’. ఫిలిప్పో  కర్రరకు దీని మద్దతు ఉంది. ఫిలిప్పోకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, వ్యాపారాత్మక దృష్టి అమోఘమైనవి’ అని ఎలిల్‌బంక ప్రతినిధి ఆండ్రియా కలెఫ్పి ప్రశంసించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement