sagubadi
-
ఎర్ర ఆకులతో అరటి చెట్టు.. ఎక్కడైనా చూశారా?
ఎర్ర అరటి పండు మనకు అక్కడక్కడా కనిపిస్తుంది. అయితే, ఎర్ర ఆకులతో కూడిన అరటి చెట్టు అరుదనే చెప్పాలి. దీని ఆకు మాదిరిగానే కాయ కూడా ఎర్రగానే ఉంటుంది. కర్ణాటకలోని సిర్సికి చెందిన రైతు ప్రసాద్ కృష్ణ హెగ్డే ఈ అరుదైన అరటి వంగడాన్ని సంరక్షిస్తున్నారు. దీనితో పాటు ఆయన మరో 80 అరటి రకాలను తన పొలంలో పెంచుతూ అరటి పంటల్లో వైవిధ్యాన్ని కాపాడుతున్నారు. ప్లాస్టిక్ బనానా అనే మరో రకం కూడా ఈయన దగ్గర ఉంది. దీని ఆకులను భోజనం చేయటానికి వాడతారట. మైసూరులో ఇటీవల 3 రోజుల పాటు సహజ సమృద్ధ, అక్షయకల్ప ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘అరటి పండుగ’ సందర్భంగా ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. 550 అరటి రకాలను సంరక్షిస్తున్న కేరళకు చెందిన వినోద్ నాయర్ 75 రకాల అరటి పండ్లను ఈ ఉత్సవంలో ప్రదర్శించటం మరో విశేషం. వినోద్ నాయర్‌తో పాటు 100 దేశీ అరటి రకాలను సంరక్షిస్తున్న తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్‌ను సైతం ఘనంగా సత్కరించారు.ఆహార నిపుణురాలు, రచయిత్రి రత్న రాజయ్య అరటి పండుగలో మాట్లాడుతూ ఏదో ఒకే రకం అరటిని సాగు చేయటం ప్రమాదకరమని, ఏదైనా మొండి తెగులు సోకిందంటే మొత్తం ఆ అరటి రకమే అంతరించిపోతుందన్నారు. భవిష్యత్తు తరాల కోసం అరటి రకాల్లో జీవవైవిధ్యాన్ని మన తరం పరిరక్షించుకోవాలని పలుపునిచ్చారు.ఎర్ర అరటి జగత్ప్రసిద్ధంసహజ సమృద్ధ ఎన్జీవో డైరెక్టర్ జి. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘అరటి బంగారంతో సమానం. అరటి ప్రపంచం పెద్దది. వందలాది వంగడాలున్నాయి. మానవ జీవితంలో పుట్టుక దగ్గరి నుంచి చావు వరకు అనేక సందర్భాల్లో, ఆచార వ్యవహారాల్లో అరటి పండు సాంస్కృతిక అవసరం ఉంటుంది. ప్రతి రకం రుచి, రంగు, సైజు, చెట్టు ఎత్తులో వైవిధ్యభరితంగా ఉంటాయ’న్నారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి అరటి రకాలున్నాయి. ఆఫ్రికన్ జంజిబార్ స్ప్రౌట్ లాంగ్ బనానా, ఇండోనేషియా జావా బ్లూ బనానా, హవాయికి చెందిన తెల్ల చారల అరటితో పాటు దక్షిణాసియాకు సంబంధించి ఎర్ర అరటి రకాలు జగత్ప్రసిద్ధి గాంచాయన్నారు.చదవండి: తాటి తేగలతోనూ వంటకాలు!అరటికి భారతదేశం పుట్టిల్లు. ఇక్కడ ఎన్నో వందల రకాల అరటి వంగడాలు కనిపిస్తాయి. భింకెల్ అనే రకం అరటి చెట్టు ఎత్తయిన దూలం మాదిరిగా ఉంటుంది. కేరళకు చెందిన పొడవాటి రకం అరటి గెలకు వెయ్యి కాయలుంటాయి. ప్రపంచంలోకెల్లా ఇదే అతి పొడవైన అరటి రకం. కొడిగుడ్డు అంత చిన్న అరటి కాయ రకం కూడా ఉంది అన్నారు కృష్ణప్రసాద్. కర్ణాటకకు ప్రత్యేకమైన అరటి రకాలు ఉన్నాయన్నారు. వాణిజ్యపరంగా డిమాండ్ ఉన్న కావెండిష్ బ్రీడ్ల అరటి పంటలను సాగు చేయటం ప్రారంభమైన తర్వాత దేశీ వంగడాలు మరుగున పడిపోయాయంటున్నారు కృష్ణప్రసాద్. ఒకే రకం అరటి సాగు చేస్తే పనామా కుళ్లు తెగులు సోకే ముప్పు ఉందని చెబుతూ, ఈ తెగులు సోకిందంటే పంటంతా తుడిచిపెట్టుకుపోవటం ఖాయమన్నారు.కార్డమమ్, నెండ్ర ఆర్గానిక్ సాగుకు అనుకూలంసేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన అరటి పండ్లకు ఈ రోజుల్లో అధిక డిమాండ్ ఉందన్నారు కృష్ణప్రసాద్. సేంద్రియంగా సాగు చేయటం వల్ల భూమి కరువు బారిన పడకుండా ఉంటుంది. రసాయనాలకు ఖర్చుపెట్టే డబ్బు ఆదా అవుతుంది అన్నారాయన. కార్డమమ్, నేండ్ర అరటి రకాలు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయటానికి అనువైనవే కాక, మార్కెట్ డిమాండ్ రీత్యా కూడా ఇవి మేలైనవని దేశీ విత్తన నిపుణుడు కూడా అయన కృష్ణప్రసాద్ వివరించారు. అరటి సాళ్ల మధ్యన ముల్లంగి, ఆకుకూరలు, గుమ్మడి, బీన్స్, పసుపు, చిలగడదుంప పంటలను సాగు చేసుకోవచ్చని కృష్ణప్రసాద్ వివరించారు. ఇతర వివరాలకు.. 94821 15495. -
తేగలతో వంటకాలు గురించి విన్నారా..?
తాటి పండు నుంచి లభించే ఉత్పత్తుల్లో తేగలు ముఖ్యమైనవి. పలు పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న తేగలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. తేగల పిండి తయారీని కుటీర పరిశ్రమగా చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని పందిరిమామిడి (తూ. గో. జిల్లా) ఉద్యానపరిశోధనా కేంద్రం అధిపతి, ఆహార–సాంకేతిక విజ్ఞాన సీనియర్ శాస్త్రవేత్త డా. పి సి వెంగయ్య (94931 28932) అంటున్నారు. తాటి టెంక నుంచి 21–30 రోజుల్లో మొలక వస్తుంది. ఈ మొలక భూమిలోకి దాదాపు 45–60 సెం.మీ. పోతుంది. మొలక వచ్చినప్పటి నుంచి నాలుగు నెలలకు ఏర్పడే దానిని తేగ అంటారు. తేగ పెరిగే కొద్ది కొబ్బరిలా గట్టిగా ఉండే పదార్థం కరిగిపోతుంది. ఇది దాదాపు 6–12 నెలలు అంటే తేగ నుంచి మొక్క వచ్చే వరకు ఆహారంగా ఉపయోగపడుతుంది. టెంకలను నీడలో పాతర పెడితే తేగలు ఇంకా బాగా పెరుగుతాయి. విత్తనం నుంచి మొక్క రావటం అనేది 50 శాతం వరకు ఉంటుంది. గుజ్జు తీసిన టెంకలు తొందరగా మొలక వచ్చి బాగా పెరుగుతాయి. పెద్ద టెంకల నుంచి మందం గల తేగలు చిన్న టెంకల నుంచి సన్న తేగలు వస్తాయి. పొడవులో మాత్రం వ్యత్యాసం ఉండదు. తేగల ఉత్పత్తిలో ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. తేగల పిండి తయారీ ఇలా...తాజా తేగలను శుభ్రపరచి ఒక అరగంట పాటు ఉడికించి అమ్మవచ్చు. వీటిలో పలు ఔషద గుణాలు ఉన్నాయి. తేగలను వివిధ రూపాల్లోకి మార్చి సంవత్సరమంతా వాడవచ్చు. దీనికోసం తేగలను ఎండబెట్టి ముక్కలుగా నిల్వ ఉంచాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిండిగా మార్చుకోవచ్చు. పచ్చి తేగలను లేదా ఉడికించిన తేగలను రెండుగా విడదీసి ఆరబెట్టవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టటం మరో పద్ధతి. వీటిలో ఏదో ఒక విధానంలో తేగలను పిండిగా మార్చవచ్చు. తేగను పిండి రూపంలోకి మార్చి 250 మైక్రాన్ల జల్లెడ ద్వారా జల్లిస్తారు. పచ్చి పిండిని వాడేటప్పుడు ఒకట్రెండు గంటలు నీటిలో నానపెడితే చేదుపోతుంది. పిండి నుంచి నీటిని తొలగించేందుకు వడపోయాలి. లేదా వేడి చేయాలి. తేగల పిండితో పలు వంటకాల తయారీ పిండిని ఉడికించడం ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాలు చేయవచ్చు. ఉడికించిన పిండిలో బెల్లం, కొబ్బరి పొడి కలిపి తినవచ్చు. ఈ పిండిలో కొబ్బరిపొడి కలిపి ఆవిరితో ఉడికిస్తే మంచి రుచికరమైన వంటకం తయారవుతుంది. మినపప్పుతో కలిపి ఇడ్లీ, దోశె తయారు చేయవచ్చు. బ్రెడ్, గోధుమ పిండితో కలిపి నూడిల్స్ తయారు చేయవచ్చు. వరి, గోధుమ పిండితో తయారు చేసే అన్ని వంటకాల్లోను దీన్ని వాడవచ్చు. చదవండి: యాంటీ సూట్ ఇంజక్షన్ కేసు: విదేశంలో డైవర్స్ కేసు వేస్తే..!తాజా తేగ 46 గ్రా. బరువుంటుంది. ఉడికించి ఆరబెట్టినది 16. గ్రా., పచ్చిది ఆరబెట్టినది 18గ్రా. బరువుంటుంది. సమారు 60 శాతం పిండి పదార్థం ఉంటుంది. తేగల్లో ముఖ్యమైనది పిండి పదార్థం. ఇది తేగ మొదటి భాగంలో ఎక్కువగా ఉంటుది. పోనుపోను తగ్గుతూ ఉంటుంది. తాజా తేగలో సుమారు 55 శాతం తేమ ఉంటుంది. ప్రోటీన్లు 5 శాతం, కొవ్వు పదార్థాలు 0.5 శాతం ఉంటాయి. -
ఈ నెల 12 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళా
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవాల సంఘం సంయుక్తంగా డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నాయి. రైతులు, ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయదారులు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిదారుల, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 12న ఉ. 10 గంటలకు ప్రారంభోత్సవంతో పాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం ఉంటుంది. 13న ఉ. 10 గం.కు ఆరోగ్య అవగాహన సదస్సు, 14న ఆహార ప్రాసెసింగ్‌పై సదస్సు, 15 సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సదస్సు, ముగింపు సమావేశం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు.. 78934 56163, 91001 86522. ఇదీ చదవండి : నిలువు పుచ్చ తోట!అవును..నిజమే! -
నిలువు పుచ్చ తోట!అవును..నిజమే!
నిలువు పుచ్చ తోట, అవును మీరు చదవింది.. ఈ ఫొటోలో చూస్తోంది.. నిజమే! మన పుచ్చ తోటల్లో పాదులు నేలపై పరచుకొని ఉంటాయి. పుచ్చ కాయలు నేలపైనే పెరుగుతాయి కదా. సౌతాఫ్రికాలో ఒక కంపెనీ పాలీహౌస్‌లలో పుచ్చ పాదులు నిలువుగా ఎగబాగుకుతున్నాయి. పుచ్చ కాయలు వాటికి వేలాడుతున్నాయి. ట్రెల్లిస్ పద్ధతిలో పెరిగే టొమాటోల మాదిరిగా ఈ పుచ్చకాయలు వేలాడుతున్నాయి కదూ.. కాండీ బాల్ సీడ్లెస్ పుచ్చకాయలు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరుగుతాయి. అదేమాదిరిగా కిలో బరువు పెరిగే స్మైల్ మెలన్స్ (ఇదో రకం కర్బూజ) పండ్లను కూడా నిలువు తోటల్లో పెంచుతున్నారు. టొమాటోలు వంటి కాయలు బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి తీగజాతి మొక్కలు మొయ్యగలుగుతాయి. అయితే, ఇలాంటి నిలువు తోటలో పుచ్చకాయలు, కర్బూజ కాయల బరువు మొక్కలకు భారం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ నెట్ కవర్లతో కాయలను ప్లాస్టిక్ వైర్లకు కట్టేస్తున్నారు. ‘నిలువు తోటలో పెరిగిన పుచ్చకాయలను మేం త్వరలోనే అమ్మకానికి పెట్టబోతున్నాం. సౌతాఫ్రికా మార్కెట్లో మేమే ఫస్ట్’ అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధి ఫ్రాంకోయిస్ ఫౌరీ. పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లలో, మేడపై ఇంటిపంటల్లో ట్రెల్లిస్ పుచ్చ, కర్బూజ సాగు సాధ్యమే అని గ్రహించాలి! -
బ్రెడ్‌ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?
బ్రెడ్‌ఫ్రూట్ (ఆర్టోకార్పస్ ఆల్టిలిస్) చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతాయి. పనస, బ్రెడ్నట్, అంజీర, మల్బరీలకు దగ్గరి జాతికి చెందినదే. తెలుగులో ‘సీమ పనస’, ‘కూర పనస’ అంటారు. ఫిలిప్పీన్స్, న్యూగినియా, మలుకు దీవులు, కరిబియన్ దీవుల ప్రాంతం దీని పుట్టిల్లు. ఇప్పుడు దక్షిణాసియా, ఈశాన్య ఆసియా, పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలు, కరిబియన్, సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో సాగవుతోంది. ఈ చెట్లకు కాచే కాయలు లేత ఆకుపచ్చని రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కాయలనే (పండుగా కాదు) అనేక రూపాల్లో తింటూ ఉంటారు. పసిఫిక్ దీవుల్లోని ప్రజలు అనాదిగా దీన్ని బ్రెడ్ లేదా బంగాళ దుంపల మాదిరిగా దైనందిన ఆహారంగా తింటున్నారు. బ్రెడ్‌ఫ్రూట్ చెట్లలో విత్తనాలు ఉన్న, లేని రెండు రకాలున్నాయి. ఈ చెట్టు 26 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. అదే చెట్టుకు ఆడ, మగ పూలు పూస్తాయి. లేతగా ఉన్నప్పు లేత ఆకుపచ్చగా, పండినప్పుడు ముదురు పసుపు రంగులో దీని కాయలు ఉంటాయి. తొక్కపైన చిన్నపాటి బుడిపెలు ఉంటాయి. లోపలి గుజ్జు లేత గోధుమ రంగులో చక్కని వాసనతో కొంచెం తియ్యగా ఉంటుంది. దీని కాయలు కిలో నుంచి 5 కిలోల వరకు బరువు పెరుగుతాయి. పోషక విలువలుబ్రెడ్ఫ్రూట్ తినగానే జీర్ణమైపోయేది కాదు. నెమ్మదిగా అరుగుతుంది. దీనిలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు, జీర్ణమయ్యే పీచుపదార్థం, ముఖ్యమైన విటమిన్లు, విటమిన్ సి, పొటాషియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లకు కూడా ఇది నెలవు. ఉత్పాదకత, సుస్థిరతఎదిగిన ఒక బ్రెడ్‌ఫ్రూట్ చెట్టు ఏడాదికి 200 కిలోలకు పైగా కాయలు కాస్తుంది. నాటిన తర్వాత వేరూనుకొని బతికితే చాలు. తర్వాత ఢోకా ఉండదు. మొండిగా పెరిగి, కాయలనిస్తుంది. ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొని, నిస్సారమైన భూముల్లోనూ బతుకుతుంది. అందువల్లే ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రజలకు కరువు కాలాల్లో కూడా సుస్థిరంగా ఆహారాన్ని అందిస్తుంది. ఎన్నో రకాలుగా తినొచ్చుబ్రెడ్ఫ్రూట్ను పచ్చిగా, లేతగా, పండుగా.. ఇలా ఏ దశలోనైనా తినొచ్చు. పూర్తిగా మగ్గిన పండుకు బంగాళ దుంప రుచి వస్తుంది కాబట్టి అనేక వంటకాలు చేసుకోవచ్చు. పెరిగిన కాయను ఉడకబెట్టుకొని, కుమ్ములో పెట్టుకొని, వేపుకొని, కాల్చుకొని తినొచ్చు. పచ్చి బ్రెడ్‌ఫ్రూట్ కాయలను పిండి చేసి పెట్టుకొని, బేకరీ ఉత్పత్తుల్లో కూడా కలుపుకోవచ్చు. ఇందులో గ్లుటెన్ ఉండదు కాబట్టి సెలియాక్ జబ్బు ఉన్న వారు కూడా తినొచ్చు. తీపి పదార్ధాల్లో, రుచికరమైన ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవచ్చు. పోషక విలువలుబ్రెడ్ఫ్రూట్లో పోషకవిలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఉన్నాయి. మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడే ముఖ్యమైన అమినోయాసిడ్లు, ప్రొటీన్లు, పీచుపదార్థం ఇందులో ఉంటాయి. విటమిన్ సి, బి1, బి5తో పాటు పొటాషియం, రాగి వంటి మినరల్స్ ఉన్నాయి.చదవండి: వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ.. ఆదాయం ఎంతో తెలుసా?ఈ కాయలో కొవ్వు, సోడియం స్వల్పంగా, పీచుపదార్థం అధికంగా ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్‌ఫ్రూట్ ముక్కల్లో 4.4 మిల్లీ గ్రాముల సోడియం, 60 గ్రాముల పిండిపదార్థాలు, 2.4 గ్రాముల మాంసకృత్తులు, 227 కేలరీల శక్తి, 24.2 గ్రాముల చక్కెర, 0.5 గ్రామలు కొవ్వు, 10.8 మిల్లీ గ్రాముల పీచు పదార్థం ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్‌ఫ్రూట్ ముక్కలు తింటే ఆ రోజుకు సరిపోయే పొటాషియంలో 23% లభించినట్లే. రోగనిరోధక శక్తిపుష్కలంగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను అందించటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించటం, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచగలగటం బ్రెడ్‌ఫ్రూట్ ప్రత్యేకత. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను నిర్మూలించటం, దీర్ఘరోగాల బెడదను తగ్గించటంతో పాటు దేహం బరువును తగ్గించుకోవటానికి ఉపకరిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముక పుష్టికి దోహదపడుతుంది. విటమిన్ ఎ ఉండటం వల్ల కంటి చూపునకు కూడా మంచిదే. వెంటనే అరిగిపోకుండా క్రమంగా శక్తినిస్తుంది కాబట్టి రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. -
పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?
మీ గార్డెన్లో పేనుబంక (అఫిడ్స్)ను నియంత్రించటం ఒక సవాలుతో కూడుకున్న పని. కానీ, పేనుబంక పురుగులను అదుపు చేయటానికి అనేక ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. మీరు అనుసరించగల కొన్ని సూచనలు:1. మీ మొక్కలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండిముడుచుకున్న ఆకులపై అంటుకునే పదార్థం లేదా స్టెమ్ లేదా ఆకులపై పేనుబంక సోకుతున్న సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో గమనించటం కోసం మీ మొక్కలను తరచుగా తనిఖీ చేయండి. 2. వేపనూనె వాడండి వేప నూనె అఫిడ్స్‌ను నియంత్రిండానికి వాడే సహజమైన పురుగుమందు. లేబుల్ సూచనల ప్రకారం వేప నూనెను నీటితో కలిపి పేనుబంక సోకిన మొక్కలపై పిచికారీ చేయండి. 3.సబ్బు నీరు స్ప్రే చేయండిపేనుబంకను నియంత్రించడానికి తేలికపాటి డిష్ సోప్‌ను నీటిలోకలిపి ప్రభావిత మొక్కలపై స్ప్రే చేయవచ్చు.4. గార్లిక్ స్ప్రే ఉపయోగించండివెల్లుల్లి సహజ క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పేనుబంకను నియంత్రించడంలో సహాయ పడుతుంది. వెల్లుల్లి రసాన్ని నీటితో కలపండి. ప్రభావిత మొక్కలపై పీచికారీ చేయండి.5. ప్రయోజనకరమైన కీటకాలులేడీబగ్స్, లేస్వింగ్, పరాన్నజీవి కందిరీగలు వంటి ప్రయోజనకరమైన కీటకాలు పేనుబంకను వేటాడతాయి. అఫిడ్స్ పురుగుల సంతతిని నియంత్రించడానికి మీ గార్డెన్ లో ఈ కీటకాలు పెరిగేలా చూసుకోండి.6. తోట పరిశుభ్రత పాటించండికలుపు మొక్కలను తొలగించండి. తెగులు సోకిన మొక్కలను తీసి దూరంగా పారవేయండి. పురుగుల ముట్టడిని నివారించడానికి ఎక్కువ ఎరువులు వేయకుండా ఉండండి.7. స్క్రీన్లు, రో కవర్లను ఉపయోగించండిఅఫిడ్స్ మీ మొక్కలను ఆశించకుండా నిరోధించడానికి ఫైన్–మెష్ స్క్రీన్లు లేదా ఫైన్–వెటెడ్ రో కవర్లను ఉపయోగించండి.8.జీవ నియంత్రణపేనుబంకను తినే పక్షులు, సాలె పురుగులు వంటి సహజ మాంసాహారులను ప్రోత్సహించటం ద్వారా జీవ నియంత్రణకు అవకాశం కల్పించండి.9. పర్యవేక్షించండి, పునరావృతం చేయండి మీ గార్డెన్లో మొక్కలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. పేనుబంకను సమర్థవంతంగా అరికట్టే నియంత్రణ చర్యలను అవసరాన్ని బట్టి పునరావృతం చేయండి.– హేపీ గార్డెనర్స్ అడ్మిన్ టీం -
వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా?
ఫిలిప్పో కర్రర 28 ఏళ్ల యువ రైతు. అతనిది ఇటలీలోని ఉత్తరప్రాంతంలోని పర్మ నగరం. ఇటలీలో పెద్ద కమతాలే ఎక్కువ. ఇప్పుడు సగటు వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణం సుమారు 11 హెక్టార్లు. అక్కడ కమతాల సైజు పెరుగుతూ వస్తోంది. 2000వ సంవత్సరంలో 5 హెక్టార్లున్న సగటు కమతం విస్తీర్ణం 2010 నాటికి 8 హెక్టార్లకు, తర్వాత 11 హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయక కుటుంబంలో పుట్టిన ఫిలిప్పో చదువు పూర్తి చేసుకొని ఏడేళ్ల క్రితం వ్యవసాయంలోకి దిగాడు. పేరుకు వ్యవసాయమే అయినా వాణిజ్య దృష్టితో సేద్యం చేయటంలో దిట్ట ఫిలిప్పో. అతను పగ్గాలు చేపట్టేటప్పటికి వారి కుటుంబ వ్యవసాయ కంపెనీ పది హెక్టార్లలో పంటలు సాగు చేస్తుండేది. ఈ ఏడేళ్లలోనే 150 హెక్టార్లకు విస్తరించిందంటే యువ రైతు ఫిలిప్పో పట్టుదల, కార్యదక్షతలను అర్థం చేసుకోవచ్చు. 50 హెక్టార్లలో ఇటాలియన్ బసిల్ పంటను పండిస్తున్నాడాయన. బసిల్ తులసి జాతికి చెందిన పంట. ఇందులో తీపి రకం కూడా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో కూడిన సలాడ్లలో కలుపుకొని తింటారు. బసిల్ నుంచి నూనెను కూడా వెలికితీసి అనేక ఔషధాల్లో వాడుతూ ఉంటారు. 1996లో పుట్టిన ఫిలిప్పోను ఆ దేశంలో కొత్త తరం రైతులకు, వాణిజ్య స్ఫూర్తికి ప్రతీకగా యువత పరిగణిస్తున్నారు. ‘నేను ఏడేళ్ల క్రితం మా వ్యవసాయం బాధ్యతలు తీసుకున్నాను. పది హెక్టార్ల పొలానికి బాధ్యత తీసుకున్నాను. మా తాత ప్రాంరిశ్రామిక పద్ధతుల్లో భారీ విస్తీర్ణంలో టొమాటోలు సాగు చేసేవారు (ఇటలీ ఉత్తర భాగంలో ఎక్కువ టొమాటోలే సాగవుతూ ఉంటాయి). బసిల్ పంటను అధిక విస్తీర్ణంలో పెంచడానికి అనువైనదిగా గుర్తించాను. ఇది అధికాదాయాన్నిచ్చే పంట. అయితే, రైతులు కొద్ది విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు. నేను భారీ యంత్రాలు ఉపయోగించటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం ప్రారంభించాను. బసిల్ ఆకులను తాజాగా, సువాసనతో కూడి ఉండాలని దీనితో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ఆశిస్తుంటాయి..’ అంటాడు ఫిలిప్పో (బ్రెడ్‌ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?)మనుషులతో కాకుండా భారీ యంత్రాలతో బసిల్ పంట కోతను చేపట్టాలనుకున్నప్పుడు.. తమ పొలంలో మడుల సైజుకు తగిన విధంగా పంట కోత యంత్రాన్ని ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించి తయారు చేయించాడు. ఫిలిప్పో ఫిలిప్ఫో బసిల్ ఆకును ఆ రంగంలో వేళ్లూనుకున్న 6 కంపెనీలకు విక్రయిస్తుంటాడు. ‘నేను ఆర్థిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం చదివాను. కానీ, వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం’ అన్నాడు. ‘ఆరుబయట పొలాల్లో విస్తారంగా బసిల్ పంటను నాణ్యమైన దిగుబడి తీసే విధంగా సాగు చేయటం సవాళ్లతో కూడిన పని. అయితే, ఈ పంటలోనే ఎదిగే అవకాశం ఉందని నేను గుర్తించాను. మా కంపెనీ 3 వేల టన్నుల బసిల్ ఆకులను పండిస్తోంది. టన్ను ధర 550 యూరోలు (సుమారుగా రూ. 49 వేలు). అనేక విషయాలపై ఆధారపడి ఈ ధరలో హెచ్చుతగ్గులుంటాయి అనిఫిలిప్పో చెప్పాడు. 50 ఎకరాల్లో ఏడాదికి రూ. 14.66 లక్షల ఆదాయం పొందుతున్నాడు. (పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?)ఏప్రిల్ రెండోవారంలో బసిల్ విత్తటం ప్రారంభిస్తాం. మొదటి కోత జూన్ రెండోవారంలో మొదలవుతుంది. అక్టోబర్ వరకు కోతలు కొనసాగుతాయి. ‘ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారం వరకు దిగుబడి, నాణ్యత బాగున్నాయి. భారీ వర్షం కురవటంతో పంట దెబ్బతింది.’ అన్నాడు ఫిలిప్పో. పొద్దున్న, సాయంత్రపు వేళల్లో బసిల్ ఆకుల్ని కత్తిరిస్తే వాటి నాణ్యత, రంగు, వాసన బాగుంటాయి. మేం కత్తిరించిన కొద్ది గంటల్లోనే ఫుడ్ కంపెనీకి చేర్చుతాము అని చెప్పాడు. ఇటలీలో ఒకానొక పెద్ద సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ‘ఎలిల్బంక’. ఫిలిప్పో కర్రరకు దీని మద్దతు ఉంది. ఫిలిప్పోకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, వ్యాపారాత్మక దృష్టి అమోఘమైనవి’ అని ఎలిల్బంక ప్రతినిధి ఆండ్రియా కలెఫ్పి ప్రశంసించారు. -
పత్తి చేనులో పప్పులు,కూరగాయలు : ఇలా పండించుకోవచ్చు!
వర్షాధారంగా వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతులు బహుళ పంటల సాగుకు స్వస్థి చెప్పి పత్తి, కంది వంటి ఏక పంటల సాగు దిశగా మళ్లటం అనేక సమస్యలకు దారితీస్తోంది. వికారాబాద్ జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు ఈ సమస్యలకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నాయి. పత్తిలో పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలను అంతర పంటలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేయటం రైతులకు నేర్పిస్తున్నారు. ప్రధాన పంటపై ఆదాయం పొందుతూనే అంతరపంటలతో కుటుంబ పౌష్టికాహార అవసరాలు తీర్చుకునే దిశగా రైతు కుటుంబాలు ముందడుగు వేస్తున్నాయి.వికారాబాద్ జిల్లాలోని సాగు భూమిలో 69.5% భూమిలో రైతులు వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. నల్ల రేగడి భూములతో పోల్చుకుంటే ఎర్ర /ఇసుక నేలలు ఈ జిల్లాలో అధికంగా ఉన్నాయి. ఈ నేలల్లో సారం తక్కువ. తేమ నిలుపుకునే శక్తి కూడా తక్కువ. తద్వారా పంట దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ ప్రధానమైన పంట కంది. జిఐ గుర్తింపు కలిగిన ప్రఖ్యాతమైన తాండూర్ కంది పప్పు గురించి తెలిసిందే. పదేళ్ల క్రితం వరకు వికారాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో కంది, పెసర, నువ్వు, పచ్చ జొన్న, బొబ్బెర, కొర్ర, అనుములు, మినుములు, పత్తి, మొక్క జొన్న వంటి పంటలు పండించేవారు. అయితే, ప్రస్తుతం వర్షాధార భూముల్లో 60% వరకు పత్తి పంట విస్తరించింది. రబీలో ప్రధానంగా బోర్ల కింద వేరుశనగ, వరి పంటలు సాగులో ఉన్నాయి. (రూ. 40 వేలతో మినీ ట్రాక్ట్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ)ఒక పొలంలో అనేక పంటలు కలిపి సాగు చేసే పద్ధతి నుంచి ఏక పంట సాగు (మోనోకల్చర్) కు రైతులు మారటం వల్ల చీడపీడలు పెరుగుతున్నాయి. రైతు కుటుంబాలు రోజువారీ వాడుకునే పప్పులు, కూరగాయలను కొనుక్కొని తినాల్సిన పరిస్థితి నెలకొంది. వాసన్ స్వచ్ఛంద సంస్థ ఈ సమస్యలకు పరిష్కారాలు వెదికే దిశగా కృషి చేస్తోంది. దౌలతాబాద్, దోమ, బోమరసపేట మండలాల్లో అరక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, ఇతర సహకార సంఘాలతో కలసి పనిచేస్తోంది. పత్తిలో అంతర పంటల సాగుపై సలహాలు, సూచనలు అందిస్తూ రైతులకు తోడుగా ఉంటూ వారి నైపుణ్యాలు పెంపొదిస్తోంది. పత్తి ప్రధాన పంటగా 5 సాళ్లు, పక్కనే 6వ సాలుగా కంది.. వీటి మధ్య బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు విత్తుతున్నారు. 3–4 నెలల్లో ఈ పంటల దిగుబడి చేతికి వస్తోంది. ఆ పంటల కోత పూర్తయ్యాక ఎండు కట్టెను పత్తి పొలంలోనే ఆచ్ఛాదనగా ఉపయోగిస్తున్నారు. టైప్ 2 ఘన జీవామృతం వేయటంతో పాటు ప్రతి 15–20 రోజులకు ద్రవ జీవామృతం, కషాయాలు పిచికారీ చేస్తున్నారు. దీంతో తొలి ఏడాదిలోనే రైతులు సత్ఫలితాలు పొందుతున్నారని వాసన్ ప్రతినిధి సత్యం (83175 87696) తెలిపారు. మా కుటుంబంలో అమ్మ, నా భార్య, ఇద్దరు పిల్లలు ఉంటాం. ఐదు ఎకరాల పొలం ఉంది. 8 బోర్లు వేసినా రెంటిలోనే నీరు పడింది. ఒకటి 2 ఇంచులు, మరొకటి 1 ఇంచు నీరు ఇస్తున్నాయి. సాధారణంగా 2 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, అలాగే కూరగాయలు సాగు చేస్తుంటాను. 2024 ఫిబ్రవరి, మే నెలల్లో వాసన్ సంస్థ నిర్వహించిన రెండు శిబిరాలకు హాజరై శిక్షణ తీసుకున్నాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే సాగు పద్ధతులు, తక్కువ వర్షం అవసరం ఉన్న పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ ఖరీఫ్‌లో 1 ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేశాను. పంటల సాగుకు ముందు అనేక రకాల పచ్చిరొట్ట పంటలు సాగు చేసి రొటోవేటర్‌తో నేలలో కలియదున్నాను. జులై 3వ తేదీన పత్తి, కంది, బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూర విత్తనాలు వేశాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పట్టుదలతో పాటించాను. నా ప్రయాణంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను. విత్తనాలు వేయడం, కషాయాలు, ద్రవ, ఘన జీవామృతాల వాడకం వంటి అన్ని విషయాల్లో వాసన్ సంస్థ వారు నాకు సూచనలు ఇచ్చారు. విత్తనాలు వేసిన నెల నుంచే ఏదో పంట చేతికి రావడం ప్రారంభమైంది, మాకు నిరంతరం ఆదాయం వచ్చేలా చేశారు. ఇంట్లో మేము తినటానికి సరిపడా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు వచ్చాయి. మిగిలినవి అమ్ముకొని మంచి ఆదాయం పొందాం. కానీ, ఈ ఏడు అధిక వర్షాల కారణంగా పత్తి 6 క్వింటాళ్లే వచ్చింది. అనుకున్న స్థాయిలో పంట రాలేదు. ఈ పప్పు ధాన్యాలు, నూనె గింజలు సంవత్సరమంతా మా కుటుంబానికి పోషకాహారాన్ని అందిస్తున్నాయి. ఈ ఎకరానికి రూ. 29,400 ఖర్చయ్యింది. పత్తి, కంది పంటలన్నీ పూర్తయ్యే నాటికి ఆదాయం రూ. 96,500లు వస్తుందని అనుకుంటున్నాను. ఈ వ్యవసాయ పద్ధతి మా కుటుంబానికి ఆర్థిక భద్రతను కలిగించింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో మాకు ఆదాయం బాగుంది. అలాగే, నీటి వినియోగాన్ని తగ్గించడంలో ఈ పద్ధతులు మాకు ఎంతో సహాయపడ్డాయి.– అక్కలి శ్రీనివాసులు (96668 39118), రైతు,దోర్నాలపల్లి, దోమ మండలం, వికారాబాద్ జిల్లా ప్రకృతి సేద్యంతో ఆదాయం బాగుందివికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లికి చెందిన బందయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల పొలంలో 6 సార్లు బోర్లు వేసినా ఒక్క బోరులోనే 2 ఇంచుల నీరు వస్తోంది. కుటుంబం తిండి గింజల కోసం ఎకరంలో వరి నాటుకున్నారు. మిగిలిన 1.5 ఎకరంలో వర్షాధారంగా జొన్న, పత్తి, కందులను రసాయనిక పద్ధతిలో సాగు చేసేవారు. పెద్దగా ఆదాయం కనిపించేది కాదు. వాసన్ సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పత్తి పంట సాగుపై రెండుసార్లు శిక్షణ పొంది సాగు చేపట్టారు. ఒక పంట నష్టమైతే మరొక పంటలో ఆదాయం వస్తుందని తెలుసుకున్నారు. ఒక ఎకరంలో పత్తితో పాటు పప్పుదినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను అంతర పంటలుగా ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేశారు. విత్తనం వేయటం నుంచి, కషాయాలు పిచికారీ, ద్రవ – ఘన జీవామృతాల వినియోగం, పంట కోత విధానం.. ఇలా ప్రతి పనిలోనూ వాసన్ ప్రతినిధుల సూచనలు పాటించారు. మొదటి నెల నుంచి ఆకుకూరలు, 3 నెలల్లో మినుము, పెసర, కూరగాయలు, చిరుధాన్యాలు.. ప్రతినెలా ఏదో ఒక పంట చేతికి రావడంతో సంతోషించారు. ఇంట్లో తినగా మిగిలినవి అమ్మటం వల్ల అదనపు ఆదాయం కూడా వచ్చింది. పత్తి 7 క్వింటాళ్లు, కందులు 4–5 క్వింటాళ్లు వస్తాయని ఆశిస్తున్నారు. ఒకసారి నీటి తడి ఇచ్చారు. నేల మొత్తం పంటలు పరుచుకోవడం వల్ల నీటి అవసరం చాలా తగ్గిందని బందయ్య తెలి΄పారు. పత్తిలో అంతరపంటలు వేసిన ఎకరానికి పెట్టుబడి రూ. 28 వేలు. కాగా, ఇంట్లో వాడుకోగా మిగిలిన పప్పుధాన్యాలు, చిరుధాన్యాల అమ్మకంపై వచ్చిన ఆదాయం రూ. 13,750. పత్తి, కందులపై రాబడి (అంచనా) రూ. 1,01,000. ఖర్చులు ΄ోగా రూ. 86,750 నికరాదాయం వస్తుందని భావిస్తున్నారు. అధిక వర్షం వలన పత్తి పంట కొంత దెబ్బతిన్నప్పటికీ మిగతా పంటల్లో వచ్చిన దిగుబడులు సంతోషాన్నిచ్చాయని, వచ్చే ఏడు కూడా ఈ పద్ధతిలోనే పత్తి, అంతర పంటలు సాగు చేస్తానని బండి బందెయ్య అంటున్నారు. -
రూ. 40 వేలతో మినీ ట్రాక్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ
పెద్దగా చదువుకోకపోయినా సృజనాత్మక ఆలోచన, పట్టుదలతో కూడి కృషితో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పటానికి ఈ మినీ ట్రాక్టర్ ఓ ఉదాహరణ. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన పెంచల నారాయణ (25) వెల్డింగ్ పనిచేస్తూ జీవిస్తున్నారు. 9వ తరగతి వరకు చదువుకున్న నారాయణ చిన్న రైతుల కోసం కేవలం రూ.40 వేల ఖర్చుతో మినీ ట్రాక్టర్‌ను తయారు చేసి ప్రశంసలు పొందుతున్నారు. ఆటో ఇంజన్ తదితర విడిభాగాలను జత చేసి మినీ ట్రాక్టర్‌ను రూపొందించారు. 2 లీటర్ల డీజిల్‌తో ఎకరా పొలం దున్నేయ వచ్చునని నిరూపించారు. ΄ పొలం దున్నడంతో పాటు నిమ్మ, జామ వంటి పండ్ల తోటల్లో అంతర సేద్య పనులను ఈ మినీ ట్రాక్టర్‌తో అవలీలగా చేసుకోవచ్చని నారాయణ వివరించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు తక్కువ ఖర్చుతో కూడిన మినీ ట్రాక్టర్‌ను అందిస్తానని పెంచల నారాయణ అంటున్నారు. కాన్సెప్ట్ బాగుంది: గణేశంపల్లెసృజన అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం మాట్లాడుతూ.. ‘కాన్సెప్ట్ బాగుంది. ఏమీ తెలియని ఒక అబ్బాయి నడిచే మోటరు వాహనాన్ని తయారు చేయడం సులభం కాదు అన్నారు. ‘రోడ్డు మీద బాగానే నడుస్తోంది. చిన్న ఇంజన్‌తో దుక్కిచేయటం వంటి శక్తితో కూడుకున్న పనులను ఏయే రకాల భూముల్లో ఈ చిన్న టాక్టర్ ఎంతవరకు చేయగలుగుతుందో చూడాలి’ అన్నారాయన. – కే.మధుసూధన్, సాక్షి, పొదలకూరు -
కోళ్ల పెంపకంలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించటం ఎలా?
వ్యాధి నిర్ధారణ అయిన కోళ్లకు, వాటి పక్కన ఉన్న కోళ్లకు చికిత్స చేయడానికి మాత్రమే యాంటీబయాటిక్స్ ఉపయోగించండి. వీటిని మేత ద్వారా కంటే నీటిలో కలిపి ఇస్తే బాగా పనిచేస్తాయి. యాంటీబయాటిక్ ఔషధాలను వ్యాధి నివారణకు లేదా కోళ్ల పెరుగుదలను పెపొందించడానికి ఉపయోగించవద్దు.కోళ్ల షెడ్లోకి వచ్చే సందర్శకుల సంఖ్యను పరిమితం చేయండి. లోపలికి వెళ్లే ముందు బట్టలు, చెప్పులు/బూట్లు మార్చుకోవాలి. చేతులు కడుక్కోవాలి. ఆవరణలోకి ప్రవేశించే ముందు వాహనాలను క్రిమిసంహారకాలతో శుభ్రపరచండి. వ్యాధులను వ్యాపింపజేసే ఎలుకలు, పురుగులు, పెంపుడు జంతువులు, అడవి జంతువులు కోళ్ల ఫారాలల్లోకి రానివ్వకండి. నాణ్యతతో కూడిన మంచి వ్యాక్సిన్లను ఉపయోగించండి. తయారీదారు సూచించిన విధంగా వాటిని నిల్వ చేయండి, జాగ్రత్తగా వాడండి.మీ ఫౌల్ట్రీ ఫామ్‌లో కోళ్ల ఆరోగ్యాన్ని, ప్రవర్తనను ప్రతిరోజూ తనిఖీ చేయండి. వాటిల్లో అకస్మాత్తుగా లేదా క్రమంగా వస్తున్న మార్పులను వెంటనే గుర్తించండి. చనిపోయిన పక్షులను తొలగించి పారవేయండి.గాలి, వెల్తురు, మేత, నీటి సరఫరా, కోళ్ల సంఖ్య (స్టాకింగ్ డెన్సిటీ) ఇతర విషయాలకు సంబంధించి నిపుణుల సిఫార్సులను అనుసరించండి.కోళ్లకు వేసే మేత నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండాలి. మేతలో తగినంత శక్తినిచ్చే దినుసులు, ఖనిజాలను సమతుల్యంగా ఉండాలి. మేతను జాగ్రత్తగా నిల్వ చేయండి. మొక్కలు, గింజలతో కూడిన మేతను ఇవ్వటమే మేలు.ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, సుగంధ తైలాలు, ఆర్గానిక్ యాసిడ్స్, నీటకరగని పీచు కోళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి పేగులలో ఉపయోగకరమైన బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. సూక్ష్మక్రిములను నిరోధిస్తాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.చదవండి: మనం తింటున్న ఆహార నాణ్యత ఎంత?మీ ఫౌల్ట్రీ షెడ్‌ను, పరికరాలను క్రిమిసంహారకాలతో శుభ్రం చేసిన తర్వాత.. మురికిని శుభ్రంచేయటానికి డిటర్జెంట్లు లేదా వేడి నీటిని ఉపయోగించండి. ప్రతి బ్యాచ్ తర్వాత తగినన్ని రోజులు షెడ్‌ను ఖాళీగా ఉంచండి.కొత్తగా కోడి పిల్లలను తెచ్చుకునేటప్పుడు విశ్వసనీయమైన హేచరీల నుంచి తెచ్చుకోండి. టీకాలు వేసి, వ్యాధులు సోకని తల్లి కోళ్ల నుంచి పుట్టిన పిల్లలనే ఎంచుకోండి.కోడిపిల్లలను తెచ్చిన వెంటనే మేతను, నీటిని అందించండి. వాటికి అవసరమైన అన్ని పోషకాలు ఇవ్వండి. శారీరక అవసరాలను తీర్చేలా ఏర్పాట్లు చేయండి.చదవండి: కుమ్ఖాత్ పండు.. పోషక విలువలు మెండుశుభ్రమైన, మంచి నాణ్యత గల నీరు అందుబాటులో ఉండేలా చూసుకోండి. నీటి సరఫరా గొట్టాలను తరచుగా శుభ్రపరచండి. డ్రింకింగ్ లైన్లను వారానికోసారి శుభ్రపరచండి.మరిన్ని ముఖ్యాంశాలుకోడి పిల్లలకు మొదటి నుంచే అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోండి. ఆరోగ్యకరమైన కోడి పిల్లలను మాత్రమే పెంచండి. మీ కోళ్ల ఫారాన్ని సిద్ధం చేయండి.మేతలో ప్రత్యేక పోషకాలు కలిపి ఇవ్వండి.మేత ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.సౌకర్యవంతమైన వాతావరణం కల్పించండి.ప్రతి రోజూ కోళ్లను పరిశీలించండి.సకాలంలో టీకాలు వేయండి.గట్టి జీవ భద్రతా చర్యలు పాటించండి. యాంటీ బయాటిక్స్‌ను తగుమాత్రంగా వాడండి.అధిక నాణ్యత గల నీరివ్వండి. -
రైతు లాభాలకు పంట మార్పిడి ఊతం!
వ్యవసాయం ఆశల జూదమంటారు. సకాలంలో వానలు కురవకపోవడం మొదలుకొని వాతావరణ మార్పులు, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత.. ఇలా రకరకాల కారణాలు రైతును దెబ్బతీయవచ్చు. అయితే ఇవేవీ రైతు నియంత్రణలో ఉన్న అంశాలు కావు. కానీ.. రైతులు తమ చేతుల్లో ఉన్నవీ సక్రమంగా చేసుకోకపోవడంతో కూడా నష్టపోతున్నాడని అంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ జి.పద్మజ. పైగా ఈ విషయం గురించి తెలియని వారు ఉండరని, ఆచరణలో పెట్టకపోవడం వల్ల రైతులు కనీసం 25 శాతం పంట దిగుబడిని నష్టపోతున్నాడని చెబుతున్నారు. ఏంటా విషయం. దిగుబడి నాలుగో వంతు పెరిగే మార్గమేది? ఒక్క ముక్కలో చెప్పాలంటే... పంట మార్పిడి!అంతేనా అని అనుకోకండి.. రైతు ఆదాయాన్ని పెంచుకునేందుకు పంట మార్పిడి అద్భుతమైన సాధనం. పైగా రసాయనిక ఎరువుల ధాటికి నానాటికీ తీసికట్టుగా మారుతున్న నేల సారానికి టానిక్గానూ పనిచేస్తుంది ఇది. దురదృష్టం ఏమిటంటే.. ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ మన మన రైతన్నలు పంట మార్పిడిని సీరియస్‌గా తీసుకోవడం లేదని అంటున్నారు డాక్టర్ జి.పద్మజ. ఈ నేపథ్యంలో అసలు పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను ఇంకోసారి తరచి చూద్దాం...భూసారం, దిగుబడులు పెరుగుతాయి..వరి, మొక్కజొన్న, పత్తి వంటి వాణిజ్య పంటలు మట్టిలోని పోషకాలను తగ్గిస్తూంటాయి. దీనివల్ల ఏటికేడాదీ దిగుబడి కూడా తగ్గుతూంటుంది. అయితే.. పంటలను మార్చి మార్చి వేసుకోవడం అది కూడా మట్టిలో నత్రజనిని చేర్చగల వాటిని వేసుకోవడం ద్వారా పోషకాలను మళ్లీ భర్తీ చేసుకోవచ్చు. తద్వారా నేల సారం పెరుగుతుంది. దిగుబడులు కూడా ఎక్కువవుతాయి. ఉదాహరణకు.. వేరుశనగ, పప్పుధాన్యాల పంటలు మట్టిలో నత్రజనిని పెంచుతాయి. ఫలితంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు నేల నుంచే తగినంత నత్రజని అందుతుంది. కృత్రిమంగా అందించాల్సిన అవసరం తగ్గుతుంది కూడా. పంట మార్పిడి చేసుకోవడం వల్ల దిగుబడి సుమారు 25 శాతం వరకూ పెరుగుతుందని పరిశోధనలు చెబుతూండగా.. వరి, మొక్కజొన్న, కాయధాన్యాల విషయంలో ఈ పెరుగుదల 20 శాతమని ఇప్పటికే స్పష్టమైంది. మార్పిడులు ఇలా...వరి వేసిన తరువాత మినుములు లేదా నువ్వుల్లాంటి నూనెగింజల సాగు చేయడం మేలు. దీనివల్ల నేలలో నత్రజని మోతాదు పెరగడమే కాకుండా.. చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. మొక్కజొన్న పంటను వేరుశనగ లేదా కాయగూర పంటలతో మార్పిడి చేసుకోవడం మేలు. ఒకవేళ ప్రధాన పంటగా వేరు శనగ వేస్తూంటే.. తరువాతి పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. ఇది నేలలో సేంద్రీయ పదార్థం మోతాదులను కూడా పెంచుతుంది. పత్తి పంటకు మార్పిడిగా పెసలు వేస్తే చీడపీడల బెడద తగ్గుతుంది. నేలలో నత్రజని మోతాదు ఎక్కువ అవుతుంది. ప్రధాన పంటల సాగు తరువాత కాయధాన్యాలను సాగు చేయడం.. వ్యర్థాలను మళ్లీ నేలలో కలిపేస్తే మేలు కలిగించే సూక్ష్మజీవులు కూడా ఎక్కువవుతాయి. వేర్వేరు పంటల సాగు వల్ల రైతు ఆదాయమూ పెరుగుతుంది. రైతుకు ఎంతవరకూ లాభం...?పంట మార్పిడిని తగు విధంగా అమలు చేస్తే రైతు ఆదాయం 15 నుంచి 20 శాతం ఎక్కువ అవుతుంది. ఒక సంవత్సరంలో వేర్వేరు పంటలు సాగు చేస్తారు కాబట్టి మార్కెట్ రిస్క్ తక్కువ అవుతుంది. పైగా ఎక్కువ డిమాండ్ ఉన్న, ఆదాయం అందించే కూరగాయల్లాంటివి సాగు చేసుకునే వీలేర్పడుతుంది. పైగా పంట మార్పిడి వల్ల నేలలో నత్రజని మోతాదు ఎక్కువై ఇన్పుట్ ఖర్చులు 10 - 15 శాతం వరకూ తగ్గుతాయి. అంటే రసాయన ఎరువులు, క్రిమి, కీటకనాశినుల వాడకం తగ్గుతుందని అర్థం. పంటలు మార్చి మార్చి సాగు చేయడం వల్ల చీడపీడలకు అవకాశాలూ తగ్గుతాయి. ఒకే రకమైన పంట సాగు చేస్తూంటే చీడపీడలు కూడా వాటికి అలవాటు పడిపోతాయి కాబట్టి సమస్య ఎక్కువవుతుంది. ఉదాహరణకు వరికి సోకే కాండం తొలుచు పురుగు కాయధాన్యాల మొక్కలపై జీవించలేదు. వరి తరువాత ఈ కాయధాన్యాల సాగు చేస్తే సహజసిద్ధంగా చీడపీడల సమస్య తగ్గిపోతుంది. దేశంలో వ్యవసాయంపైనే ఆధారపడిన అరవైశాతం గ్రామీణుల జీవనోపాధి అవకాశాలను పెంచేందుకు, ఆహార భద్రతకు పంట మార్పిడి అన్నది ఎంతో ఉపయోగపడుతుంది. భూసారం, దిగుబడులు పెంచే పంటమార్పిడి గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమయ్యేందుకు తద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు కారణమవుతుంది. ఆసక్తి లేదు ఎందుకు?తెలుగు రాష్ట్రాల్లో రైతులు పంటమార్పిడిపై అంతగా ఆసక్తి చూపకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. మొదటిది పంట మార్పిడి వల్ల వచ్చే ప్రయోజనాలపై అవగాహన లేకపోవడమైతే.. రెండోది పంట మార్పిడి ప్రయోజనాలపై తగిన ప్రచారం లేకపోవడం. వ్యవసాయ, హార్టికల్చర్ విస్తరణాధికారులు ఇతర బాధ్యతలు నిర్వర్తించరావడం వల్ల వారు రైతులకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు. ఇక మూడో కారణం మార్కెట్, ఆర్థిక పరిమితులు. పంటల మార్పిడి వల్ల వేర్వేరు పంటల విత్తనాలు, ఎరువులు, కొన్నిసార్లు వ్యవసాయ పరికరాల అవసరమూ ఏర్పడుతుంది. ఇవి రైతులపై కొంత ఆర్థిక భారం మోపే అవకాశం ఉంటుంది. పైగా అన్ని రకాల పంటలకు మద్దతు ధర లభించని నేపథ్యంలో రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపడం లేదు. చివరగా.. ఒకే రకమైన పంటలు వేయడం (మోనోక్రాపింగ్) అనే సంప్రదాయానికి రైతులు గుడ్ బై చెప్పాలి. రిస్క్ తక్కువన్న అంచనాతో అప్పటివరకూ ఇతరులు పాటిస్తున్న పద్ధతులను గుడ్డిగా అనుసరించడం వల్ల పంట మార్పిడికి ధైర్యం చేయలేకపోతున్నారు. గ్రామస్థులంతా మూకుమ్మడిగా పంట మార్పిడి తీర్మానం చేసుకుని ఆచరిస్తే బహుళ ప్రయోజనాలు కలుగుతాయి.చేయాల్సింది ఇది...రైతులందరూ పంట మార్పిడిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది. అలాగే పైలెట్ ప్రోగ్రామ్‌తోపాటు డెమాన్స్ట్రేషన్ల ద్వారా వ్యవసాయ అధికారులు పంట మార్పిడి లాభాలు రైతుకు అర్థమయ్యేలా వివరించాలి. సీజన్‌ను బట్టి మారిపోయే పంటలకు తగ్గట్టుగా నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాయధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు నూనెగింజల పంటల విత్తనాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా.. మద్దతు ధరలు దక్కేలా చూడటం. మార్కెట్ ఒడిదుడుకులను వీలైనంత మేరకు తగ్గించడం ద్వారా రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపేలా చేయాలి. చివరగా..విధానపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా పంటల మార్పిడి అనేది దేశంలో లక్షలాది రైతు కుటుంబాల ఆదాయాన్ని పెంచే, ఆహార భద్రత కల్పించే సాధనంగా మారుతుంది!తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి పంటల సాగు ఎక్కువ. ఒక్క తెలంగాణలోనే సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి పండిస్తూండగా వార్షిక దిగుబడి కోటీ అరవై లక్షల టన్నుల వరకూ ఉంది. అలాగే తెలంగాణలో మొక్కజొన్న సాగు 28 లక్షల ఎకరాల్లోనూ, వేరుశనగ దాదాపు అరవై వేల ఎకరాల్లోనూ సాగులో ఉంది. రైతులందరూ పంట మార్పిడి చేపట్టడం ద్వారా దిగుబడులు పెరగడంతోపాటు సాగునీటిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. -
మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది?
హరిత విప్లవానికి పట్టుగొమ్మ వంటి పంజాబ్ రాష్ట్రంలో రైతులు పునరలోచనలో పడ్డారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అత్యధిక మోతాదులో వాడుతూ ఏడు దశాబ్దాలుగా మార్కెట్ కోసం వరి, గోధుమ వంటి పంటలు పండిస్తూ వచ్చిన రైతులు.. ఆ ఆహారం తిని తమ కుటుంబ సభ్యులు వ్యాధిగ్రస్తులుగా మారుతుండటాన్ని గురించారు. తమ కుటుంబం కోసమైనా రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించుకోవటమే ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గమని పంజాబ్ రైతులు ఎట్టకేలకు గ్రహిస్తున్నారు.తేజ్‌పాల్ సింగ్ 30 ఎకరాల ఆసామి. పొలం అంతా (గత సెప్టెంబర్‌లో) పచ్చని వరి పంటతో నిండి ఉంది. పటియాలా జిల్లా కక్రాల గ్రామ పొలిమేరల్లోని తన వరి పొలానికి 4 టన్నుల యూరియా వేశానని, పురుగుల మందు ఒకసారి చల్లానని చెప్పారు. ఇది మార్కెట్లో అమ్మటం కోసం అతను పండిస్తున్నాడు. ఈ పంట అమ్మటం కోసం కాదుఈ ప్రధాన పొలానికి పక్కనే అతనిదే 4 ఎకరాల పొలం మరొకటి ఉంది. అందులో కొంత మేరకు వరి పంట, దాని పక్కనే కూరగాయల తోట కూడా ఉంది. ‘ఈ 4 ఎకరాల పంట అమ్మటం కోసం కాదు, మా కుటుంబం కోసమే పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నా. పచ్చిరొట్ట ఎరువు, వర్మీకంపోస్టు, జీవన ఎరువులు ఈ పొలంలో వాడుతున్నా. మా కుటుంబం తినగా మిగిలినవి ఏమైనా ఉంటే అమ్ముతా’ అన్నారు తేజ్‌పాల్ సింగ్.ఈ మార్పు ఎందుకొచ్చిందని అడిగితే.. మూడేళ్ల క్రితం తన భార్య అనారోగ్యం పాలైంది. టెస్ట్ చేయిస్తే యూరిక్ యాసిడ్ పెరిగిందన్నారు. ఆ రోజుల్లో మరో దగ్గరి బంధువుకు కేన్సర్ వచ్చింది. అప్పటి నుంచి మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది అని ఆలోచించటం మొదలు పెట్టాడు. తాను రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తుల్ని పరీక్ష చేయించాడు. యూరియా, పొటాష్, పురుగుమందుల అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఆ ఆహారంలో ఉన్నట్లు తేలింది.మా కోసం ఆర్గానిక్ పంటలు‘అప్పుడు నేను నిర్ణయించుకున్నా. మా కుటుంబం తినేదంతా సేంద్రియ పద్ధతుల్లోనే పండించుకోవాలని గట్టి నిర్ణయానికొచ్చా. అప్పటి నుంచి ఈ 4 ఎకరాల్లో మా కోసం ఆర్గానిక్ పంటలు పండించుకొని తింటున్నాం. నా భార్య దేహంలో యూరిక్ యాసిడ్ తగ్గింది. మేం తింటున్న సేంద్రియ ఆహారం రుచిగా, నాణ్యంగా ఉంది. ఈ ఆహారం అంతకు ముందు తిన్న దానికన్నా ఎంతో మేలైనదని మాకు అర్థమైంది’ అన్నారు తేజ్‌పాల్ సింగ్. ఇది ఆయన ఒక్కడి మాటే కాదు. తినే ఆహారంలో రసాయనాల అవశేషాల్లేకపోతే ఆరోగ్యం బాగుంటుందని గట్టిగా గుర్తించిన రైతులు చాలా మందే కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు.చదవండి: సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?కొద్ది నెలల క్రితం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం.. పంజాబ్‌లో 2023–24లో ఎకరానికి 103 కిలోల రసాయనిక ఎరువులు వాడారు. దేశవ్యాప్తంగా రైతులు వాడుతున్న 58 కిలోలతో పోల్చితే ఇది దాదాపుగా రెట్టింపు. 1980–2018 మధ్యలో పంజాబ్ రైతులు వాడిన ఎన్‌పికె ఎరువులు ఏకంగా 180% పెరిగిందట.దీనికి తగ్గట్టే జబ్బులూ పెరిగాయి. ఐసిఎంఆర్ సంస్థ నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం.. పంజాబ్‌లో 2021లో 39,521 మంది కేన్సర్ బారిన పడితే.. అది 2024 నాటికి 42,288కి పెరిగింది. పొలాల్లో రసాయనాల వాడకం పెరగటానికి, మనుషుల్లో జబ్బులు పెరగటానికి మధ్య సంబంధం స్పష్టంగానే కనిపిస్తోంది. ఇది పంజాబ్ రైతులు, వినియోగదారులూ గుర్తిస్తున్నారు. మన సంగతేంటి? -
అంతర్జాతీయ సహకార మహాసభ.. ఒకే రంగానికి రెండు చట్టాలెందుకు?
పరస్పరం సహకరించుకోవటం మానవ సహజ లక్షణం. ఈ లక్షణాన్ని ఒక పద్ధతి ప్రకారం కొనసాగించడానికి సహకార సంఘాలు (కోఆపరేటివ్ సొసైటీలు) దోహదం చేస్తాయి. ప్రపంచ సహకార వ్యవస్థకు 130 ఏళ్ల చరిత్ర, సుసంపన్న వారసత్వం ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 12% మంది ఏదో ఒక సహకార సంఘంలో సభ్యులే. మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, వందేళ్లకు పైబడి చక్కగా ఆర్థిక సేవలందిస్తున్న ఘనమైన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పిఎసిఎస్‌లు), సహకార అర్బన్ బ్యాంకులు అనేకం కనిపిస్తాయి. ఈ నెల 14 నుంచి సహకార వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మరో రెండు ముఖ్య విశేషాలు... ఈ నెల 25 నుంచి 30 వరకు న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా అంతర్జాతీయ సహకార మహాసభ జరగబోతోంది.అంతర్జాతీయ మహాసభ మన దేశంలో జరగటం ఇదే మొదటిసారి. సుమారు రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఐక్యరాజ్యసమితి 2025వ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం’గా ప్రకటించింది. ఈ పండుగకు కూడా ఈ నెల 25న ఉత్సాహపూరిత వాతావరణంలో న్యూఢిల్లీలో తెర లేవనుంది. సహకార విలువలకు తిలోదకాలు, అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం.. వంటి అవశ్యం వదిలించుకోవాల్సిన జాఢ్యాలు మన సహకార వ్యవస్థను పట్టి పీడిస్తున్నప్పటికీ.. మొక్కవోని సహకార స్ఫూర్తి మన సమాజంలో అనుక్షణం వర్థిల్లుతూనే ఉంటుంది. సహకారం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది! ఈ నేపథ్యంలో తలపండిన సహకారవేత్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. సహకార సంఘం అంటే?సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చటమే లక్ష్యంగా పనిచేసే ప్రజాస్వామిక సంస్థ సహకార సంఘం. యాజమాన్యం, నియంత్రణ, నిర్వహణ అన్నీ సభ్యులదే. సభ్యుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చటమే సహకార సంఘాల ధ్యేయం. సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య, ఒక దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించటానికి సహకార వ్యవస్థ ఉపయోగపడుతుంది. చాలా దేశాల్లో సహకార వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఉంది. నెదర్లాండ్స్‌లో సహకార సంఘాలకు స్వేచ్ఛ ఎక్కువ. అధికారుల జోక్యం ఉండదు. ఫ్రాన్స్‌లో 2008లో ఆర్థిక మాంద్యం దెబ్బకు వాణిజ్య బ్యాంకులు నిలవలేక సహకార బ్యాంకుల్లో విలీనమయ్యాయి. అమెరికాలోనూ కమ్యూనిటీ బ్యాంకులు బలంగా ఉన్నాయి. జర్మనీలో రైతులకు ఎక్కువ రుణాలిస్తున్నది సహకార బ్యాంకులే. న్యూజిలాండ్‌లో డెయిరీ కోఆపరేటివ్లదే రాజ్యం. లాటిన్ అమెరికాలో ఇటీవల కోఆపరేటర్లు బలపడుతూ కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు.జవాబుదారీతనం ఏదీ?మన దేశంలో సహకార విస్తరణకు అవకాశాలెక్కువ. మన సంస్కృతిలోనే సహకార స్ఫూర్తి ఉంది. గ్రామీణులు, గిరిజనుల్లో ఇది మరీ ఎక్కువ. అయితే, అధికారులకు అధిక పెత్తనం ఇవ్వటం, జవాబుదారీతనం లేకుండా చేయటం వల్ల మన దేశంలో సహకార వ్యవస్థ దెబ్బతింటున్నది. ఆర్బీఐ నిబంధనలు, సహకార చట్టాల మధ్య వైరుధ్యం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను కుంగదీస్తోంది. సహకార విలువలను తుంగలో తొక్కేలా కొన్ని నిబంధనలు ఉంటున్నాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, మల్టీస్టేట్ కోఆపరేటివ్‌ల విషయంలో రాష్ట్ర సహకార చట్టాలు నిర్దేశించే నిబంధనలకు భిన్నమైన నిబంధనలను బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిర్దేశిస్తోంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు షేర్ క్యాపిటల్ తిరిగి ఇవ్వొద్దని, డైరెక్టర్ల పదవీ కాలం నాలుగేళ్లేనని (సహకార చట్టాల ప్రకారం 5 ఏళ్లు).. ఇలా అనేక విషయాల్లో వైరుధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 45 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 20 బ్యాంకులు వందేళ్ల క్రితం నుంచి ఉన్నవే. ఇవి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక తోడ్పాటునూ పొందటం లేదు. పిఎసిఎస్‌లలో బ్యాంకింగ్ సేవలా?సహకారం పూర్తిగా రాష్ట్ర సబ్జెక్ట్. రాష్ట్రాలతో చర్చించకుండానే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలు చేస్తోంది. ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలతో ఇంకో 25 పనులు చేయించాలని కేంద్ర సహకార శాఖ నిర్దేశించింది. ఇందులో బ్యాంకింగ్ సేవలు కూడా ఉన్నాయి. నిధులు దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షించేదెవరూ అంటే సమాధానం లేదు. ఇది సరికాదు. అమలు చేయాల్సింది రాష్ట్రాలైనప్పుడు సహకార రిజిస్ట్రార్, ముఖ్య కార్యదర్శితో కనీసం చర్చించకుండానే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటే ఎలా? సహకార సంస్థల్లో అక్రమాలకు బాధ్యులను జవాబుదారీ చేయటం లేదు. ఎంత అవినీతి జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టులు, ఆస్తుల రికవరీ వంటి చర్యలు తీసుకోవటం లేదు. సహకార శాఖకు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ జవాబుదారీతనం లేకుండా΄ోయింది. – మానం ఆంజనేయులు పూర్వ అధ్యక్షులు, విశాఖ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, పూర్వ ఉపాధ్యక్షులు, నాఫ్కాబ్ కేంద్రం తెచ్చిన కొత్తచట్టాలతో చేటుభారతీయ ఆర్థిక రంగంలో సహకార వ్యవస్థ వాటా 43% వుంది. రైతులు, గ్రామీణ చేతివృత్తిదారులు, బలహీన వర్గాలు ఈ సహకార వ్యవస్థలో భాగస్వాములు. గత 75 సంవత్సరాలుగా 29 కోట్ల మంది సభ్యులు తమ ఖర్చులు తగ్గించుకొని రూ.40,689 కోట్ల మూలధనంతో సుమారు 9 లక్షల సహకార సంఘాలను స్థాపించుకున్నారు. రూ. లక్షల కోట్ల సహకార ఆర్థిక సౌధాన్ని నిర్మించారు. దీన్ని అక్రమంగా పెట్టుబడిదారుల పరం చేయటానికి పార్లమెంటులో రెండు చట్టాలు చేశారు. వీటిని అమలుచేస్తే జిల్లా స్థాయి సహకార బ్యాంకుల నుంచి ఇఫ్కో, క్రిభ్కో, నాఫెడ్ వంటి పెద్ద సంస్థలన్నీ కారుచౌకగా పెట్టుబడిదారుల పరం అవుతాయి. సహకార సిద్ధాంతాలకు, సహకార సూత్రాలకు ఇది విరుద్ధం. మొత్తంగా భారత రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని రాజ్యాంగ సవరణ చేయకుండానే ఈ చట్టాలు మార్చేస్తున్నాయి. ప్రజలు చైతన్యవంతులై వీటిని అడ్డుకోవాలి. సహకార ధర్మపీఠం తరఫున దేశవ్యాప్త ప్రచారోద్యం చేపట్టాం. – సంభారపు భూమయ్య , సీనియర్ సహకారవేత్త, సహకార ధర్మపీఠం, హైదరాబాద్సహకార సంస్థల బలోపేతానికి దోహదంఅంతర్జాతీయ సహకార మహాసభ న్యూఢిల్లీలో ఈ నెలాఖరులో జరుపుకోవటం సంతోషదాయకం. దేశంలో సహకార సంస్థలన్నీ బలోపేతం కావటానికి, ప్రభుత్వం మరింత దృష్టి కేంద్రీకరించడానికి అంతర్జాతీయ మహాసభ ఉపయోగపడుతుంది. సహకార సంఘాలు చాలా వరకు వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా వరకే పరిమితం అవుతున్నాయి. ప్రాసెసింగ్, విలువ జోడింపు, ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించటం, ఉత్పత్తుల బ్రాండింగ్ చేసుకోవాలి. ఆన్లైన్, సొంత అవుట్ లెట్ల ద్వారా విక్రయించాలి. రైతుల ప్రయోజనమే పరమావధిగా ముల్కనూర్ సొసైటీ 60 ఏళ్లుగా ఇటువంటి అనేక సేవలు అందిస్తోంది. గోదాములు నిర్మించటం, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సహకార సంఘాలకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలిచ్చి ప్రోత్సహించాలి. శిక్షణపై దృష్టి కేంద్రీకరించాలి. సహకార సంఘాల సభ్యులు, సిబ్బంది, బోర్డు సభ్యులకు సహకార విలువలు, వాణిజ్య, నిర్వహణ నైపుణ్యాల పెంపుదల శిక్షణకు కృషి చెయ్యాలి.– అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, అధ్యక్షులు, ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సంఘం, తెలంగాణఒకే రంగానికి రెండు చట్టాలెందుకు?సహకార రంగం ఆర్థిక పురోగతి బాగానే వుంది. కానీ, నడక సరిగ్గా లేదు. సహకార మూల సూత్రాలకు సహకార వ్యవస్థ దూరమైంది. సహకార విద్య, సహకార విలువలకు సంబంధించిన కనీస జ్ఞానం కొరవడిన యంత్రాంగం ఆధ్వర్యంలో తెలుగునాట సహకార వ్యవస్థ నడుస్తోంది. సహకార హక్కులు, బాధ్యతలు తెలియని దుస్థితి. 12 నెలలు శిక్షణ పొందినవారే సహకార సంస్థల్లో సిబ్బందిగా వుండాలన్నది నియమం. చదవండి: ఫ్యామిలీ ఫార్మింగ్.. విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణఇప్పుడున్న సహకార సిబ్బందిలో 90 శాతం సరైన శిక్షణ లేనివారే. ఉద్యోగం చేస్తూ మూడు నెలలు, ఆరు నెలల డిప్లొమా అంటూ సర్టిఫికెట్లు పొందిన వారే ఎక్కువ కనిపిస్తున్నారు. వీరిని నడిపించే ఉన్నతోద్యోగుల పరిస్థితి కూడా ఇంతే! ఏ ఇతర రంగాల్లోనూ లేనివిధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 1964, 1995 సహకార చట్టాలు అమల్లో ఉన్నాయి. ఒకే రంగానికి రెండు చట్టాలేమిటి? 1904, 1912,1932, 1964 సహకార చట్టాలకు రూల్స్ ఉన్నాయి. కానీ, 1995 చట్టం అమల్లోకి వచ్చి 29 ఏళ్లయినా ఇప్పటికీ రూల్స్ లేవు. రిజిష్ట్రార్ బాధ్యతలపై కూడా స్పష్టమైన నిబంధనల్లేవు.– దాసరి కేశవులు, సీనియర్ సహకారవేత్త, చైర్మన్, సహకార భూమి జర్నల్ కోఆపరేటివ్ సొసైటీ, విజయవాడ -
అమూల్ డెయిరీకి అంతర్జాతీయ పురస్కారం
మూడు భారతీయ డెయిరీ సంస్థలకు అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ‘ఇన్నోవేషన్ ఇన్ సస్టయినబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ 2024’ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. పాడి పశువులకు సోకే జబ్బులకు చేసే చికిత్సల్లో అల్లోపతి యాంటీబయాటిక్ ఔషధాలకు బదులుగా హోమియోపతి ఔషధాలను వాడి చక్కని ఫలితాలు సాధించినందుకు గాను ‘యానిమల్ కేర్’ విభాగంలో అమూల్ డెయిరీకి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది.సుమారు 68 వేల పశువులకు సోకిన 26 రకాల సాధారణ వ్యాధులకు హోమియోపతి మందులతో చికిత్స చేయటం ద్వారా అమూల్ డెయిరీ సత్ఫలితాలు సాధించింది. ఇందుకోసం 2024 మే నాటికి 3.30 లక్షల (30 ఎం.ఎల్. సీసాలు) హోమియోపతి మందులను అమూల్ సొంతంగానే ఉత్పత్తి చేసి, 1.80 లక్షల సీసాలను పాడి సహకార సంఘాల రైతులకు పంపిణీ చేసింది. యాంటీబయాటిక్ ఔషధాల వాడకాన్ని తగ్గించటం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగవుతోంది. పాల ఉత్పత్తులు వినియోగించే ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతోందని ఐడిఎఫ్ తెలిపింది. సంప్రదాయ ఆయుర్వేద (ఈవీఎం) చికిత్సా పద్ధతులతో పాటు హోమియో పశువైద్య పద్ధతులను కూడా అమూల్ ప్రాచుర్యంలోకి తేవటం హర్షదాయకం.పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ పాడి, పశు పెంపకందారుల సహకార సంఘానికి ఆర్థిక, సామాజిక విభాగంలో పురస్కారం లభించింది. 4,500 మంది మహిళా రైతులు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అనేక పాల ఉత్పత్తులను, ఎ2 ఆవు నెయ్యిని తయారు చేస్తున్నారు. సేంద్రియ నాటు కోళ్ల పెంపకంతో పాటు సేంద్రియ పప్పుదినుసులను సైతం ఉత్పత్తి చేసి, ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తూ మహిళా రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.చదవండి: 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదుఐడిఎఫ్ పురస్కారం అందుకున్న మరో సంస్థ ‘ఆశా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ’. సౌర విద్యుత్తుతో నడిచే ఇన్స్టంట్ మిల్క్ చిల్లర్లను వినియోగించటం ద్వారా చిన్న, సన్నకారు పాడి రైతుల అభ్యున్నతికి వినూత్న రీతిలో దోహదపడటం ఈ ఎఫ్పిఓ ప్రత్యేకత. -
ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను హైస్కూలు నుంచి యూనవర్సిటీ స్థాయి వరకు విద్యార్థులకు అలవాటు చేయటం ఎంతో అవసరమనే విషయంతో ఇప్పుడు ఏకీభవించని వారు బహుశా ఎవరూ ఉండరు. రసాయనిక అవవేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తి ద్వారానే మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, ఈ బృహత్ కార్యక్రమాన్ని వ్యాప్తిలోకి తేవటానికి విద్యాసంస్థలతో కలసి పనిచేస్తూ స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పనులను అలవాటు చేయటంలో ప్రత్యక్ష కృషి చేస్తున్న వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఈ కోవలో మొదటి పేరు డాక్టర్ గంగాధరం. దాదాపు రెండు దశాబ్దాలుగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక శిక్షణ ద్వారా విశేష కృషి చేస్తున్న ప్రకృతి సేద్య ప్రేమికుడు డాక్టర్ వర్డ్ గంగాధర్. ఇప్పటికే వేలాది మంది రైతులకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఘనత వర్డ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తిరుపతికి చెందిన డాక్టర్ ఎం గంగాధర్‌కే దక్కుతుంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే పద్ధతులను ఆయన గత కొన్ని నెలలుగా నేర్పిస్తున్నారు. 20 అడుగుల వెడల్పు “ 20 అడుగుల ΄÷డవు విస్తీర్ణంలో చిన్న చిన్న ఎత్తుమడులు ఏర్పాటు చేసి విద్యార్థుల చేత 15 రకాల ఆకుకూరలు, 4 రకాల కూరగాయల సాగు చేయిస్తున్నారు. ఈ నమూనాకు కుటుంబ వ్యవసాయం (ఫ్యామిలీ ఫార్మింగ్) అని పేరు పెట్టారు. డాక్టర్ గంగాధరం యూనవర్సిటీలో కొందరికి ముందుగానే శిక్షణ ఇచ్చి ‘గ్రీన్ టీమ్’లను ఏర్పాటు చేశారు. డా. గంగాధరం మార్గదర్శకత్వంలో ఈ గ్రీన్ టీమ్‌ల ఈ కుటుంబ వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్ టీం సభ్యులు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఇంటింటల కుటుంబ వ్యవసాయ నమూనా మడుల దగ్గరకు ఆహ్వానించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.ప్రకృతి సేద్య వ్యాప్తికి దోహదంఈ ఫ్యామిలీ ఫార్మింగ్ నమూనా ముఖ్య ఉద్దేశం గురించి వివరిస్తూ డా. గంగాధరం (98490 59573) ఇలా అన్నారు.. ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యకరమైన 15 రకాల కూరగాయలను ఏ విధంగా సాగు చేయవచ్చో నేర్పిస్తున్నాం. ఈ నమూనా ద్వారా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో నమూనాపై అవగాహన తెచ్చుకోగలుగుతారు. వివిధ ప్రాంతాలలో వారి సొంత పొలాల్లో కూడా కొంచెం విస్తీర్ణంలో అయినా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయటం ప్రాంరంభిస్తారు. ఆ విధంగా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రాంచుర్యానికి ఎంతో దోహదపడుతుంది. అట్లే తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశాభావం..’ అన్నారు. (గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!)తిరుపతి పట్టణంలోని ప్రజలు కూడా సాయంత్రం 4–5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనవచ్చని, తమ ఇంటి వద్ద తక్కువ స్థలంలో వివిధ రకాల కూరగాయలు సాగుచేసే పద్ధతులను తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో యువత విశ్వవిద్యాలయం నుంచి హైస్కూల్ వరకు ఈ నమూనా వ్యాప్తి చెంది రాష్ట్రమంతా యువత ప్రకృతి వ్యవసాయంపై పట్టు సాధించగలరని భావిస్తున్నానన్నారు. ఈ కృషి ఫలించాలని ఆశిద్దాం. డా. గంగాధరం -
గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!
కూరగాయల వ్యర్థాలను మురగ బెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది. భూసార వర్థినిగా, పురుగుల మందుగా ఉపయోగపడుతుంది. థాయ్‌లాండ్‌కు చెందిన డాక్టర్ రోసుకాన్ పూమ్ పాన్వాంగ్ ఈ ఎంజైమ్‌ను తొలుత తయారు చేశారు. కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు.. మార్కెట్లలో చెత్తకుప్పలో పోసిన మిగలపండిన పండ్లు, కూరగాయలు వంటివి ఎందుకూ పనికిరాని వ్యర్థాలే కదా అని అనుకోనక్కర్లేదు. వీటికి కొంచెం నల్లబెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ పంచదార కలిపితే 90 రోజుల్లో గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.గార్బేజ్ ఎంజైమ్ తయారీ ఇలా.. మూత బిగుతుగా పెట్టడానికి వీలుండే గాజు లేదా పలాస్టిక్/ఫైబర్ డ్రమ్ముల్లో దీన్ని తయారు చేయవచ్చు. కావాల్సిన పదార్థాలు : కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, ముక్కలు, కుళ్లినవి) 3 పాళ్లు + నల్ల బెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ (బ్రౌన్) పంచదార 1పాలు + నీరు 10 పాళ్ల చొప్పున కలపాలి.మార్కెట్లు, దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి వాడుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. అయితే, జారుగా ఉండే గ్రేవీ కలపకూడదు. మాంసం, మందంగా ఉండే పనస పండ్ల తొక్కలు కలపకూడదు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి గాలి చొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగలకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. మొదటి 30 రోజుల పాటు.. రోజుకోసారి మూత తీసి వాయువులు బయటకు వెళ్లాక, మళ్లీ గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడకట్టి, నిల్వ చేసుకొని అక్కడి నుంచి 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చే వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు లేదా మళ్లీ గేర్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడుకోవచ్చు. (ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ)పలు ప్రయోజనాలుగార్బేజ్ ఎంజైమ్ లో ఉన్న సూక్ష్మజీవరాశి, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ భూసార వర్థినిగా, కీటకనాశనిగా పనిచేస్తుంది. తెగుళ్లు బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. దీన్ని వాడితే పంట మొక్కల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. గార్బేజ్ ఎంజైమ్‌ను నీటిలో తగినపాళ్లలో కలిపి వాడుకోవాలి. ఎరువుగా.. 1:1000 పాళ్లలో(అంటే.. 1 మిల్లీలీటరు ఎంజైమ్‌కు 100 మిల్లీలీటర్ల నీరు) కలిపి నేలలో పోయవచ్చు లేదా పిచికారీ చేయవచ్చు. పురుగులు/ తెగుళ్ల నాశినిగా.. 1:100 మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. దిగుబడి పెంపుదలకు.. 1:500 పాళ్లలో కలిపి పిచికారీ చేయాలి. -
బీఎస్ఎఫ్ పురుగులతో చవకగా చేపల మేత!
బ్లాక్ సోల్జర్ ఫ్రై (బిఎస్ఎఫ్) పురుగులను ప్రత్యామ్నాయ ప్రొటీన్ వనరుగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఎండబెట్టిన బిఎస్ఎఫ్ పురుగుల పిండితో బలపాల(పెల్లెట్ల) రూపంలో చేపల మేతను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను ముడిసరుకుగా వాడి పర్యావరణ హితమైన పద్ధతుల్లో బిఎస్ఎఫ్ పురుగులను ఉత్పత్తి చేసి, వాటితో వాణిజ్య స్థాయిలో నాణ్యమైన చేపల మేతను ఉత్పత్తి చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐసిఎఆర్ సంస్థ సెంట్రల్ మెరైన్ ఫిష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎంఆర్ఎఫ్ఐ) ఇటీవల అభివృద్ధి చేసింది. ఫీడ్ కన్వర్షన్ రేషియో చాలా మెరుగ్గా ఉండటమే కాకుండా చేపల మేత ఖర్చు తగ్గటం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని సిఎంఆర్ఎఫ్ఐ తెలిపింది. ఇప్పటివరకు సోయాచిక్కుళ్ల పిండి, ఎండుచేపల పిండిని ప్రొటీన్ వనరుగా చేపల మేతల్లో వాడుతున్నారు. (Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు)ఇక మీదట బిఎస్ఎఫ్ పురుగుల పిండిని నిక్షేపంగా వాడొచ్చని వెల్లడైంది. అయితే, ఈ మేత ఏయే రకాల చేపల పెంపకంలో ఎలా ఉపయోగపడుతోంది? అన్నది పరీక్షించాల్సి ఉంది. ఈ పరిశోధనను కొనసాగించేందుకు సిఎంఎఫ్ఆర్ఐ అమల ఎకోక్లీన్ అనే కేరళకు చెందిన స్టార్టప్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదీ చదవండి: డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో -
Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు
పశువైద్యంలో సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నోవెటర్నరీ ప్రాక్టీసెస్ –ఈవీపీల) ద్వారా యాంటీబయాటిక్స్ వాడకాన్ని 90% తగ్గించవచ్చంటున్నారు తమిళనాడుకు చెందిన విశ్రాంత పశువైద్య ఆచార్యుడు డా. ఎన్. పుణ్యస్వామి. గత 20 ఏళ్లుగా సంప్రదాయ పశువైద్యంపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఈ చికిత్సలు పొదుగువాపు సహా 42 పశువ్యాధులను 3–5 రోజుల్లో 90% ఖచ్చితత్వంతో తగ్గిస్తున్నాయని రుజువైంది. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి) దేశవ్యాప్తంగా వీటిని పశువైద్యంలో భాగం చేసింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.) సమస్యను అధిగమించాలన్నా, యాంటిబయాటిక్స్‌ను రక్షించుకోవాలన్నా సంప్రదాయ పశువైద్యమే మేలైన మార్గమని పుణ్యస్వామి స్పష్టం చేస్తున్నారు. రైతునేస్తం ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ‘గోసంజీవని’ ఆంగ్ల పుస్తకావిష్కరణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పుణ్యస్వామితో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ముఖ్యాంశాలు. అల్లోపతి పశువైద్య శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన మీ దృష్టి సంప్రదాయ ఆయుర్వేద పశు వైద్య (ఈవీపీ) పద్ధతుల వైపు ఎలా మళ్లింది?పశువైద్యానికి సంబంధించి ఇప్పుడున్న వ్యవస్థ అరకొరగా ఉందని నా అభిప్రాయం. ప్రతి పశువుకు ఆరోగ్య సేవలు అందాలి. వనరులు రైతులకు తక్కువ ఖర్చుతో పరిసరాల్లోనే అందుబాటులో ఉండాలి. చికిత్సకు పొందబోయే ఫలితంపై ఖచ్చితమైన అంచనా ఉండాలి. అల్లోపతి పశువైద్య వ్యవస్థలో ఇవి లోపించాయి. ఎంత ఖచ్చితంగా ఫలితం వస్తుందో చెప్పలేం. అందువల్లే ఆయుర్వేదం, సంప్రదాయ సిద్ధ వైద్య రీతులను 2001 నుంచి అధ్యయనం చేశా. 20 ఏళ్ల నుంచి ఈవీపీ పద్ధతులపై పనిచేస్తున్నాం. 42 పశువ్యాధులకు చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేశాం. మేం సూచించిన ఇంట్లోని దినుసులతో రైతులే స్వయంగా ఈ మందులను తయారు చేసుకొని పశువైద్యం చేసుకుంటున్నారు. స్వల్ప ఖర్చుతోనే 3–5 రోజుల్లోనే 80–90% పశువ్యాధులు ఖచ్చితంగా తగ్గిపోతున్నాయి. ఇది శాస్త్రీయంగా నిర్థారణ అయిన సంప్రదాయ చికిత్స పద్ధతి. అందువల్లే ఈ సంప్రదాయ చికిత్సను జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) అంగీకరించింది. 2016లో నన్ను సంప్రదించింది. అప్పటి నుంచి 12 రాష్ట్రాల్లో మిల్క్ యూనియన్లతో కలసి పనిచేస్తున్నాం. పశువైద్యులకు, పాడి రైతులకు శిక్షణ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఈవీపి పద్ధతుల్లో పశువైద్యం జరుగుతోంది. పొదుగు వాపు నమ్మకంగా తగ్గిపోతుందా?తప్పకుండా తగ్గి΄ోతుంది. ఎన్.డి.డి.బి. పరిధిలో వేలాది రైతుల అనుభవాలే ఇందుకు నిదర్శనం. పొదుగు వాపు నుంచి గాంగ్రీన్ వరకు 10 రకాల పొదుగు సంబంధిత జబ్బులు వస్తుంటాయి. గాంగ్రీన్ మినహా మిగతా 9 రకాల పశువ్యాధులను 3–5 రోజుల్లోనే ఈవీపీ వైద్యం ద్వారా సమర్థవంతంగా 85–90% కేసుల్లో శాశ్వతంగా తగ్గించవచ్చని నిరూపితమైంది. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ఆధ్వర్యంలో సిక్కింలో డాక్టర్లకు శిక్షణ ఇచ్చాం. బీహార్‌లో పశు సఖిలకు శిక్షణ ఇచ్చాం. భారత ప్రభుత్వం కూడా ఎత్నో వెటరినరీ జ్ఞానాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం ప్రారంభించింది. పశువైద్యంలో డిగ్రీ కోర్సు (బీవీఎస్సీ) సిలబస్‌లోకి ప్రభుత్వం చేర్చింది.అంతర్జాతీయంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఎఎంఆర్) సమస్యను పరిష్కరించేందుకు ఈవీపీ చికిత్సలు ఉపయోగ పడతాయా?ప్రపంచవ్యాప్తంగా అందరూ యాంటీబయాటిక్ ఔషధాలను పశువైద్యంలో తగ్గించా లంటున్నారు. అయితే, వీటికి ప్రత్యామ్నాయ మందుల్ని సూచించలేక΄ోతున్నారు. ఇండియాకున్న బలమైన సంప్రదాయ విజ్ఞానం పెద్ద ఆస్థి. ఈవీపీ పద్ధతుల ఉగాండా, ఇథియోపియాలో రైతులకు శిక్షణ ఇచ్చాం. అమలు చేయటం సులభం కాబట్టి ఆయా దేశాల్లో రైతులు సత్ఫలితాలు సాధించారు. నెదర్లాండ్స్ దేశంతో, వాగనింగన్ విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తున్నాం. అక్కడి పశువైద్యులకు శిక్షణ ఇచ్చాం. ఆహార వ్యవసాయ సంస్థ (యు.ఎన్. ఎఫ్.ఎ.ఓ.) గుర్తించిందా? ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్.ఎ.ఓ. కేంద్ర పశుసంవర్థక శాఖతో కలసి ఇటీవలే ‘స్టాండర్డ్ వెటరినరీ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్’ను విడుదల చేసింది. ఇందులో కూడా ఈవీపీ సంప్రదాయ చికిత్సా పద్ధతులను చేర్చింది. అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతి ఆధిపత్యం గురించో, మరో పద్ధతి ఆధిపత్యం నిరూపణ గురించో మనం మాట్లాడటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం. ఇప్పటికే అమల్లో ఉన్న అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి. నేనూ అల్లోపతి పశువైద్య శాస్త్రం చదువుకున్న వాడినే. రోగ నిర్థారణకు అల్లోపతి జ్ఞానాన్ని, చికిత్సకు సంప్రదాయ పద్ధతిని వాడుతూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం.యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుందా? పొదుగు వాపు వ్యాధి చికిత్సలో కూడా 90% కేసులలో యాంటీబయాటిక్ మందులను వాడాల్సిన అవసరం లేదు. దూరంలో ఉన్న వైద్యులు టెలిమెడిసిన్ వ్యవస్థ ద్వారా పశువులకు సత్వర చికిత్సను అందించడానికి ఈవిఎం చికిత్సా పద్ధతులు ఎంతో అనువైనవి. ఇతర వైద్య పద్ధతుల్లో ఇది వీలు కాదు. రైతులు నేర్చుకొని, అవసరం వచ్చినప్పుడు తమంతట తాము ఆచరించదగిన గొప్ప పద్ధతి ఎత్నోవెటరినరీ మెడిసిన్. పశువులకు గాలికుంటు వ్యాధి (ఎఫ్.ఎం.డి.) వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఫోన్ ద్వారా రైతులకు సూచనలు ఇచ్చి చికిత్స చేయవచ్చు. 35–40 ఏళ్లలో ఏ ఒక్క కొత్త యాంటీ బయాటిక్‌ను తయారు చేసుకోలేకపోయాం. అదే సమయంలో మనుషుల చికిత్సకు వాడాల్సిన అనేక యాంటీ బయాటిక్స్‌ను పశు వైద్యంలో విస్తృతంగా వాడటంతో ఆ యాంటీబయాటిక్స్ రోగకారక క్రిముల నిరోధకత (మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్)ను పెంపొందించు కున్నాయి. దీంతో ఆ యాంటీబయాటిక్స్ పనిచేయక మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. యాంటీబయాటిక్ ఔషధాలను మనం రక్షించుకోవాలి. యాంటీబయాటిక్ ఔషధాల జోలికి పోకుండానే పశువుల్లో జ్వరం, విరేచనాలు వంటి సాధారణ జబ్బులకు వైద్యం చేయటానికి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను ఆచరించాలి.దేశీ ఆవులు, సంకరజాతి ఆవులు, బర్రెలు అన్నిటికీ ఈ వైద్యం పనిచేస్తుందా?ఏ జాతి పశువులకైనా తప్పకుండా పనిచేస్తుంది. సంకరజాతి ఆవుల్లో మాదిరిగా అధిక పాలు ఇచ్చే సాహివాల్ ఆవుల్లోనూ పొదుగు సంబంధిత సమస్యలు ఎక్కువే. వీటన్నిటికీ ఈవీపీలో నమ్మదగిన పరిష్కారం ఉంది. కృష్ణా మిల్క్ యూనియన్‌లో పొడి రైతులు ఈవీపీల చికిత్స ద్వారా పొదుగువాపు తదితర జబ్బులతో పాటు వంధ్వత్వం వంటి సమస్యలను సైతం అధిగమించారు.కోళ్ల వ్యాధులకు కూడా..?కోళ్ల ఫారాల్లో కూడా ఈవీపీ చికిత్సలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేల ఉసిరి (భూమి ఆమ్ల), జిలకర్ర కలిపి నూరి, ఉండలు చేసి.. గంట గంటకు కొక్కెర సోకిన కోళ్లకు తినిపిస్తే 1–2 రోజుల్లోనే తగ్గిపోతుంది. ఇలా ఏ జాతి పశువులైనా, కోళ్లయినా, బాతులైనా.. వాటికి ఇతర ఔషధాల మాదిరిగానే ఈవిఎం మందులను కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు.అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం. సేంద్రియ పాల ఉత్పత్తికి ఈవీపీలు దోహదం చేస్తాయా?నిస్సందేహంగా. అంతర్జాతీయంగా ఇటీవల ‘మెడిసినల్ అగ్రోఎకాలజీ’ భావన బలం పుంజుకుంటున్నది. పంటలనే కాదు పశువులను కూడా రసాయనాల్లేకుండా పెంచటమే ఇందులో ముఖ్యాంశం. (నవంబర్ 18 నుంచి ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్’ సందర్భంగా..)నిర్వహణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాలి
సాక్షి, హైదరాబాద్: మారిన వాతావరణ పరిస్థితులు, రైతుల ఆకాంక్షల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లకు పాత కాలపు ఆలోచనలతో కూడిన పరిష్కారాలు సరిపడవని, క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) మినీ ఆడిటోరియంలో మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు.చిరుధాన్యాలపై అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘క్లైమెట్ ఛేంజ్, మిల్లెట్స్, ఎకోసిస్టమ్ సర్వీసెస్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టికి రామాంజనేయులు సమన్వయకర్తగా వ్యవహరించారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 30 ఏళ్ల నాడు పాలకులు ఏర్పాటు చేసిన మద్దతు వ్యవస్థలు ఇప్పటి సవాళ్లను ఎదుర్కోవటానికి పనికిరావని, కొత్త తరహా మద్దతు వ్యవస్థలను అమల్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని డా. రామాంజనేయులు సూచించారు. రైతుబంధు వంటి పథకాలను కొత్త సవాళ్ల వెలుగులో సమీక్షించుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలిపర్యావరణ సేవలకు చెల్లింపులు అవసరం అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యాపకురాలు డాక్టర్ మంజుల మేనన్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి మిశ్రమ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు. వారు ప్రభుత్వం నుంచి ఎరువులకు సంబంధించి ఎటువంటి సబ్సిడీలు పొందటం లేదు. ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం ఒనగూడుతున్నది. ఈ పర్యావరణ సేవలకు గుర్తింపుగా ఈ రైతులకు ప్రత్యేక చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందని మంజుల సూచించారు.ఇది కొత్త భావన కాదని, ఇప్పటికే అనేక దేశాల్లో అమల్లో ఉన్నదేనన్నారు. డీడీఎస్ మాదిరి రసాయన రహిత జీవవైవిధ్య సాగు వల్ల భూసారాన్ని పెంపొందించటం, సాగు నీరు ఆదా అవుతుంది, పోషక విలువలతో కూడిన ఆహారం ప్రజలకు అందుతుంది కాబట్టి ఈ రైతులకు ప్రత్యేక మద్దతు వ్యవస్థను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో 6% అదనపు నిధులతోనే ఈ మద్దతు వ్యవస్థను అందుబాలోకి తేవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని మంజుల అన్నారు. రైతులు ఎందుకు నష్టపోవాలి?సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ కెవి కూర్మనాధ్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల రైతులకు ఎదురవుతున్న సరికొత్త సమస్యలను పాలకులు గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. కుండపోత వర్షాలు, అకాల వర్షాల వల్ల పత్తి, ధాన్యంలో అధిక మోతాదులో తేమ ఉంటే అందుకు రైతులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నిబంధనలు సడలించి రైతులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తెరగటం లేదన్నారు.చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలిరైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత మద్దతు ధర, సేకరణ సదుపాయాల్లేక రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు మరింత దిగజారిందన్నారు. అధిక బ్యాంకు రుణాలు పొందటం కోసం చిరుధాన్యాలు సాగు చేసే రైతులు కూడా తాము పత్తి, వరి వంటి పంటలు సాగు చేస్తున్నామని అధికారులతో చెబుతున్నారని, అందుకే చిరుధాన్యాల వాస్తవ సాగు విస్తీర్ణం కూడా గణాంకాల్లో ప్రతిఫలించటం లేదన్నారు. అత్యంత కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ పరిశ్రమలు మరో 30 రాష్ట్రంలో రానున్నాయని, వీటికి ముడిసరుకు అందించటం కోసమే ప్రభుత్వం వరి సాగును ప్రత్యేక బోనస్ ప్రకటించి మరీ ప్రోత్సహిస్తున్నదన్నారు. మూడు చిరుధాన్య పంటలకు మద్దతు ధర ప్రకటించినా, జొన్నలను మాత్రమే కోర్టు ఆదేశించినప్పుడే ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేదుకు ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని రవి కోరారు. -
డ్రాగన్ తోట : ఉపాయం ఉండాలేగానీ, నెలకు రూ.లక్ష ఈజీగా
ఉపాయం ఉండాలే గాని ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా మరో వృత్తిని చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చనటానికి కేరళకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయిని కృషే నిదర్శనం. కొల్లం పట్టణానికి చెందిన రెమాభాయ్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సాయిల్ లెస్ పద్ధతిలో తమ ఇంటిపైనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటం ప్రారంభించారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో హైడ్రోపోనిక్ పద్ధతిలో డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్నారు. నెలకు 500 కిలోల డ్రాగన్ ఫ్రూట్స్ దిగుబడి వస్తోంది. కిలో రూ. 200కు విక్రయిస్తూ నెలకు రూ. లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి 3 నెలలే డ్రాగన్ ఫ్రూట్ సీజన్ ఉంటుంది. రిటైరైన కొద్ది రోజులకే ఆమె తల్లి వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆ వేదనలో నుంచి బయటపడటం కోసం ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలనుకున్నారు. విదేశీ పండైన డ్రాగన్ సాగును ఇంటిపైనే ప్రారంభించారామె. నేలపైన పెంచడానికి ఇంటి దగ్గర ఖాళీ స్థలం లేదు. అందుకే మేడపై రెండొందల లీటర్ల బ్యారళ్లు 50 పెట్టి, వాటిల్లో వంద డ్రాగన్ మొక్కల్ని పెంచుతున్నారు. మట్టి మోసుకెళ్లి ఇంటిపైన పెట్టటం నాకు కష్టం అనిపించి సాయిల్ లెస్ పద్ధతిని ఎంచుకున్నానని రమాభాయ్ అంటున్నారు. కొన్ని రెడ్, కొన్ని ఎల్లో రకం డ్రాగన్ రకాలను నాటారు. ఎక్కువైన నీరు బయటకు పోవటానికి బ్యారెల్‌కు అడుగున బెజ్జం పెట్టి.. అందులో ఆకులు, రంపపు పొడి, వరి గడ్డి ముక్కలు, బ్యారెల్‌కు 3 కిలోల చొప్పున కం΄ోస్టు ఎరువును దొంతర్లుగా వేశారు. వంద గ్రాముల బోన్ మీల్ కూడా కలిపి, మొక్కలు నాటారు. ఎండాకులు, కూరగాయ వ్యర్థాలు, చేపలు, రొయ్యల వ్యర్థాలు, ఆల్చిప్పలతో సొంతంగా తయారు చేసుకునే ద్రవరూప ఎరువులను మొక్కలకు ఆమె అప్పుడప్పుడూ ఇస్తున్నారు. దీంతో మొక్కలు పోషకలోపాల్లేకుండా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తున్నాయని రమాభాయ్ సంతృప్తిని వ్యక్తం చేశారు.‘ఏదైనా కంటెయినర్లో కిలో చేపలు, రొయ్యలు, పీతల డొప్పలకు కిలో బెల్లంతో పాటు బొప్పాయి పండ్ల తొక్కలు కలపాలి. ఎండ తగలకుండా నీడన ఉంచి అప్పుడప్పుడూ కలియదిప్పుతూ ఉంటే.. 90 రోజులకు సేంద్రియ ద్రావణం సిద్ధమవుతుంది. ఇది కాల్షియం, ఫాస్ఫరస్‌ను పుష్కలంగా అందిస్తుంది. ఆ బలంతో డ్రాగన్ మొక్కలు చక్కగా కాస్తున్నాయి’ అన్నారు రమాభాయ్. జెసిస్ వరల్డ్ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను కూడా ఆమె ప్రారంభించారు. సీజన్లో మా ఇంటిపైన 200–300 డ్రాగన్ పూలు కనువిందు చేస్తుంటే నా వయసు 60 నుంచి 20కి తగ్గిపోతుంది. బాధలన్నీ మర్చిపోతున్నా అంటున్నారామె సంతోషంగా! -
హెల్దీ సంచోక్స్ : లాభాలు అన్నీ ఇన్నీ కావు!
సంచోక్స్.. ఎన్నో ఔషధ గుణాలున్న దుంప పంట. దీనికి మరో పేరు జెరూసలెం ఆర్టిచోక్ (హెలియాంతస్ ట్యూబరోసస్) అని దీనికి మరో పేరుంది. ఆస్టెరాసియా కుటుంబం. ఇది ఒకసారి నాటితే చాలా ఏళ్లపాటు పెరుగుతుంది. కానీ, పసుపు మాదిరిగా వార్షిక పంట మాదిరిగా కూడా పెంచుతుంటారు. ఉత్తర అమెరికా దీని పుట్టిల్లు. జెరూసలెం ఆర్టిచోక్ అనే పేరు ఉన్నప్పటికీ ఇది జెరూసలెంలో పుట్టిన పంట కాదు. ఆర్టిచోక్ అని ఉన్నప్పటికీ ఇది నిజమైన ఆర్టిచోక్ కాదు. వాడుకలో అలా పేర్లు వచ్చాయంతే. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది బతికేస్తుంది. పోషక విలువలు, చీడపీడలను బాగా తట్టుకునే స్వభావం ఉండటం వంటి గుణగణాల వల్ల మెడిటరేనియన్, ఆ పరిసర ప్రాంతాల్లో దీన్ని సాగు చేయటం ప్రారంభమైంది. ఇప్పుడు అమెరికా, కెనడా, బల్గేరియా, రష్యా సహా అనేక ఐరోపాదేశాల్లో ఇది సాగవుతోంది. మన దేశంలోనూ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా సాగవుతున్నదని చెబుతున్నారు. సంచోక్స్ దుంపలు రకరకాల రంగులు..సంచోక్స్ మొక్క చూడటానికి పొద్దు తిరుగుడు మొక్క మాదిరిగా ఉంటుంది. 5–8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని దుంప బంగాళదుంప మాదిరిగా తినటానికి అనువుగా కండగలిగి ఉంటుంది. సంచోక్స్ దుంపలు తెలుపు నుంచి పసుపు వరకు, ఎరుపు నుంచి నీలం వరకు అనేక రంగుల్లో ఉంటాయి. దుంప బరువు 80–120 గ్రాముల బరువు, 75 సెం.మీ. పొడవు ఉంటుంది. పూలు చిన్నగా పసుపు రంగులో ఉంటాయి. ఆకులపై నూగు ఉంటుంది. సంచోక్స్ మొక్క వేగంగా పెరుగుతుంది. అధిక దిగుబడినిచ్చే శక్తి దీనికి ఉంది. మంచును కూడా తట్టుకుంటుంది. ఎరువులు కొంచెం వేసినా చాలు, వేయకపోయినా పండుతుంది. కరువును తట్టుకుంటుంది. చౌడు నేలల్లోనూ పెరుగుతుంది. 4.4 నుంచి 8.6 పిహెచ్ను తట్టుకుంటుంది. ఉష్ణోగ్రత తక్కువున్నా ఎక్కువున్నా బతికి దిగుబడినిస్తుంది. ఇసుక దువ్వ నేలలు, సారంవతం కాని భూముల్లోనూ పెరుగుతుంది. 18–26 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత దీనికి నప్పుతుంది. ఫిబ్రవరి – మార్చి లేదా సెప్టెంబర్ – అక్టోబర్లలో విత్తుకోవచ్చు. మొక్క వడపడిపోయిన తర్వాత విత్తిన 5 నెలలకు దుంపలు తవ్వుకోవచ్చు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు హెక్టారుకు 15 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. దుంపలపై పొర పల్చగా ఉంటుంది. కాబట్టి, జాగ్రత్తగా తవ్వితీయాలి. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు, మొక్క అంతటినీ, ముఖ్యంగా ఆకులను ఔషధాల తయారీలో వినియోగించటం అనాదిగా ఉందనటానికి ఆధారాలున్నాయి. వాపు, నొప్పి, ఎముకలు కట్టుకోవటానికి, చర్మ గాయాలకు మందుగా ఇది పనిచేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహాన్ని, ఊబకాయాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. మలబద్ధకాన్ని పోగొట్టటం, జీవక్రియను పెంపొందించటం, కేన్సర్ నిరోధకంగా పనిచేయటం వంటి అనేక అద్భుత ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలోనూ ఉపకరిస్తుంది. అండర్సన్, గ్రీవ్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తల చెప్పిందేమంటే.. జెరూసలెం ఆర్టిచోక్ డి–లాక్టిక్ యాసిడ్ రూపంలో లాక్టిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుందని నిర్థారణైంది. అంటే, పారిశ్రామిక ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగించుకోవడానికి ఎంతో అవకాశం ఉందన్నమాట. రోటనారోధక వ్యవస్థ లోపాలు, దీర్ఘకాలిక నిస్తత్తువ, గుండె జబ్బులు, జీర్ణకోశ వ్యాధులు, రొమ్ము కేన్సర్, మలబద్ధకం, పేను తదితర వ్యాధులు, రుగ్మతల నివారిణిగా పనిచేస్తుందని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని ప్రేరేపించటం, దేహం లో నుంచి కలుషితాలను బయటకు పంపటంలో దోహదకారిగా ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దుంపల ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలను చెరకు, మొక్కజొన్న మాదిరిగా జీవ ఇంధనాల తయారీలోనూ వాడుకోవచ్చట. హెక్టారు పొలంలో పండే దుంపలతో 1500–11,000 లీటర్ల ఇథనాల్ తయారు చేయొచ్చు. భార లోహాలను సంగ్రహిస్తుంది..జెరూసలెం ఆర్టిచోక్ మొక్క భార లోహాలను సంగ్రహించే స్వభావం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిలో నుంచి, నేలలో నుంచి భార లోహాలను సంగ్రహించడానికి ఈ మొక్కలను ఉపయోగించ వచ్చని చెబుతున్నారు. అల్బిక్ రకం జెరూసలెం ఆర్టిచోక్ మొక్కల్లో ఈ గుణం ఎక్కువగా ఉందట. దీని మొక్కల చొప్ప పశువులకు మొక్కజొన్న చొప్ప సైలేజీకి బదులు వాడొచ్చు. భూసారం తక్కువగా ఉన్న నేలల్లో ఆచ్ఛాదనగా పచ్చిరొట్ట పెంచటానికి, జీవ ఇంధనాల తయారీకి పచ్చిరొట్ట విస్తారంగా పెంచాలనుకుంటే కూడా జెరూసలెం ఆర్టిచోక్ దుంప పంట ఎంతో ఉపయోగ పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. షుగర్ రోగులకు ఉపయోగకరంటైప్ 2 షుగర్, ఊబకాయంతో బాధపడే వారిలో ఇన్సులిన్‌ను విడుదలకు దోహదపడే ఇనులిన్‌ను ఈ దుంప కలిగి ఉంది. ఫ్రక్టోజ్, ఓలిగోఫ్రక్టోస్ తదితర సుగర్స్‌ను నియంత్రించే గుణం జెరూసలెం ఆర్టిచోక్కు ఉంది. సాధారణంగా ఇనులిన్‌ను చికొరీ,జెరూసలెం ఆర్టిచోక్ నుంచి పారిశ్రామిక పద్ధతుల్లో వెలికితీస్తుంటారు. ఈ దుంపను సన్నగా తరిగి, వేడి నీటిలో మరిగించి ఇనులిన్‌ను వెలికితీసిన తర్వాత శుద్ధి చేస్తారు. ఈ ద్రవం నుంచి ఇనులిన్ పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అనేక ఆహారోత్పత్తులో వాడతారు. ఇటీవల కాలంలో ఈ పొడి, కాప్సూల్స్ రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ దుంపల్లో ఉండే ఫ్రక్టోజును ఔషధాలు, ఫంక్షనల్ ఫుడ్స్‌లో స్వీట్నర్గా వాడుతున్నారు. ఫ్రక్టోజ్ గ్లైసెమిక్ ఇండెక్స్ (23) గ్లూకోజ్ (100) లేదా సుక్రోజ్ (65) కన్నా తక్కువ కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు ఆరోగ్యదాయకమైన ఆహారంగా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి, మున్ముందు బాగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంది. -
మట్టి + ఆముదం + కుంకుడు ద్రావణం: పంటలు పచ్చగా, నిండుగా!
పొలంలోని మట్టినే సేంద్రియ ఎరువుగా, పురుగులనునియంత్రించే ద్రావణం వాడి సత్ఫలితాలు పొందటం ద్వారా ఆరోగ్య దాయకమైన ద్రాక్ష, వరి తదితర పంటలు పండించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి (సివిఆర్) మరో ద్రావణాన్ని రూ పొందించారు. మట్టి+ఆముదంతో పాటు కుంకుడు రసం కలిపి చల్లితే పంటలకు చీడపీడల నియంత్రణతోపాటు పెరుగుదల బాగుందని గుర్తించారు. ఈ ద్రావణాన్ని తయారు చేసి మొదట తన పెరట్లోని టొమాటో, మొక్కజొన్న పంటలపై ఆయన ప్రయోగించి చూశారు. కేవలం వారం నుండి 10 రోజుల్లోనే పంటలో విపరీతమైన మార్పును గమనించారు. అంతకు ముందు మొక్కజొన్న ఆకులను పురుగులు తినటం, పంట పసుపు పచ్చగా ఉన్నపుడు ఈ ద్రావణం పిచికారీ చేశారు. కేవలం వారం నుంచి పది రోజుల్లోనే ఆ పంట పచ్చదనంతో కళకళలాడుతూ, ఆకులు కూడా వెడల్పుగా రావటం అంటే పంటలో మంచి ఎదుగుదలను గమనించారు. మరి కొందరు రైతులు కూడా సత్ఫలితాలు సాధించటంతో ఈ ద్రావణం సామర్థ్యంపై సివిఆర్ నిర్థారణకు వచ్చారు.మట్టి, ఆముదం, కుంకుడు ద్రావణం తయారీ విధానంలోపలి మట్టి (బాగా జిగటగా ఉండే మట్టి) 10 కిలోలు (ఒక తట్టెడు) తీసుకొని, గడ్డలు చిదిపి మెత్తని మట్టిని సిద్ధం చేసుకోవాలి. ఆ మట్టిలో 250 మి.లీ. నుంచి 500 మి.లీ. వరకు ఆముదం కలపాలి. 250 నుండి 500 గ్రా. కుంకుడు కాయలు తీసుకొని కొంచెం నీటిలో వాటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని చేతితో పిసికి, విత్తనాలు తీసివేసి, పేస్టులాగా తయారు చెయ్యాలి. అలా తయారైన పేస్టును అంతకు ముందు రోజు ఆముదం కలిపి పక్కన పెట్టిన మట్టిలో వేసి, బాగా కలియ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని 200 లీటర్ల నీటి డ్రమ్ములో వేసి కర్రతో బాగా కలపాలి. మట్టి మిశ్రమం అంతా నీటిలో బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపటికి నీటిలోని మట్టి రేణువులు నీటి అడుగుకు పేరుకుంటాయి. పైకి తేరుకున్న ద్రావణాన్ని వడకట్టి స్ప్రేయర్లలో పోసుకొని పంటపై పిచికారీ చెయ్యాలి. రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మట్టి ద్రావణం నీటిలో కలిపిన తర్వాత 4 గంటల్లోగా వంటపై పిచికారీ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. ఆలన్యం అయితే ఆముదం ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. కుంకుడుతో పచ్చదనం వస్తోంది!పైకి పురుగు కనిపిస్తూ ఉంటే గతంలో చెప్పినట్లు మట్టి 20 కిలోలు, ఆముదం పావు కిలో నుంచి అర కిలో వరకు కలిపిన ద్రావణం చల్లితే పురుగుల నియంత్రణ బాగుంటుంది. అయితే, పెరుగుదల ఉండేది కాదు. మొలకల ద్రావణం చల్లాల్సి వచ్చేది. ఇప్పుడు కుంకుడు రసం కలపటం వల్ల ఆ కొరత తీరి పచ్చదనం వస్తోంది. తెగుళ్లు నివారిస్తుంది. పురుగులను గుడ్లు పెట్టనివ్వదు. అనేక పంటల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇది చల్లిన వారం, పది రోజుల్లోనే పంటలు ఆకుపచ్చని రంగులోకి మారి, గ్రోత్ వేగాన్ని అందుకుంటున్నది. మల్బరీ తప్ప ఏ పంటలోనైనా చల్లొచ్చు. పత్తి రైతులు కాయ పగలటానికి ముందు దశలోనే ఈ ద్రావణం వాడాలి. టొమాటోలో ఏ తెగుళ్లు, పురుగులూ రాలేదు. మిర్చిలో తామర పురుగు నియంత్రణకు మట్టి, ఆముదం, కుంకుళ్లతో పాటు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా కలిపి తయారు చేసిన ద్రావణం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ద్రావణాన్ని వర్షాలు బాగా పడే రోజుల్లో వారానికోసారి చల్లాలి. ఇప్పటి నుంచి పది రోజులకోసారి చల్లితే సరిపోతుంది. ఇది చల్లిన 2 గంటల వరకు వర్షం పడకపోతే చాలు, పనిచేస్తుంది. – చింతల వెంకటరెడ్డి (98668 83336), పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆల్వాల్, సికింద్రాబాద్చాలా పంటలపై చల్లా.. రిజల్టు బాగుంది!మట్టి, ఆముదం, కుంకుడు రసం ద్రావణం వాడిన వారం రోజుల్లోనే చీడపీడల నియంత్రణతో పాటు పంటల్లో పెరుగుదల బాగా కనిపించింది. 10 కిలోల లోపలి మట్టికి 250 ఎంఎల్ ఆముదం కలిపి పెట్టుకోవాలి. కుంకుడు కాయలను గింజలతో ΄ాటు నలగ్గొట్టి, ఉడక బెట్టాలి. నానబెట్టిన దానికన్నా, కుంకుడు విత్తనాలు కూడా పగులగొట్టి ఉడకబెడితే మరింత ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించింది. ఆ తెల్లారి కుంకుళ్లను పిసికి రసం తీసుకోవాలి. ఆముదం కలిపిన మట్టిలో ఈ కుంకుడు రసం కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. పసుపు, మామిడి, నిమ్మ, అవకాడో, అరటి తదితర పంటలన్నిటిపైనా ఈ ద్రావణాన్ని పిచికారీ చేశాను. వారంలోనే గ్రోత్ చాలా కనిపించింది. నూనెలు చల్లితే గ్రోత్ వస్తుంది. ఇక్కడ ఆముదం వాడుతున్నందున గ్రోత్తోపాటు చీడపీడల నియంత్రణ కూడా జరుగుతుంది. మట్టి ద్వారా మినరల్స్ కూడా పంటకు అందుతున్నాయి. 12–15 రోజులకోసారి అన్ని పంటలపైనే పిచికారీ చేస్తున్నా. ఈ రెండు పిచికారీల మధ్య ఒకసారి వేపనూనె పిచికారీ చేస్తే పురుగుల గుడ్లు నశించి మరింత మెరుగైన ఫలితాలుంటాయి. – పడాల గౌతమ్ (98497 12341), ఎస్టేట్ మేనేజర్, రుషి వ్యాలీ స్కూల్, మదనపల్లిదివంగత సంజీవరెడ్డి సూచనలతో 2007 నుంచి మా 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. 2014లో ‘సాక్షి సాగుబడి’లో సివిఆర్ మట్టి ద్రావణం గురించి చదివినప్పటి నుంచి వంగ, సాంబారు దోస, పూల తోట, వేరుశనగ వంటి అన్ని పంటలకూ లోపలి మట్టి+ ఆముదం ద్రావణం వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నాను. సివిఆర్ కొత్తగా చెప్తున్నట్లు మట్టి, ఆముదంతోపాటు కుంకుడు రసం కూడా కలిపి పత్తి పంట 20 రోజుల దశలో రెండు నెలల క్రితం ఒకసారి, ఆ తర్వాత మరోసారి పిచికారీ చేశాను. పంట ముదురు ఆకుపచ్చగా బలంగా పురుగుల బెడద లేకుండా పెరిగింది. ఇప్పుడు పత్తి తీస్తున్నాను. ఇతర రైతులతో కూడా మట్టి ద్రావణం వాడిస్తున్నాం. – పి. గిరీష్ గౌడ్ (80732 45976), ఇనగలూరు,అగళి మండలం, సత్యసాయి జిల్లా -
ప్రకృతి సేద్యం ఇంత గొప్పగా ఉంటుందని ఉహించలేదు: ప్రొ.రమేశ్ చంద్
సుభాష్ పాలేకర్ కృషితో ప్రాధమిక రూపంలో ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయం గత కొన్నేళ్లలో అనేక ఆవిష్కరణలతో శాస్త్రీయతను సంతరించుకుంటూ క్లైమెట్ ఎమర్జెన్సీని తట్టుకునేలా ఆశ్చర్యకరమైన రీతిలో పరిపుష్టమవుతూ, ప్రకృతి వైపరీత్యాలను దీటుగా తట్టుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యవసాయ నిపుణుడు ప్రొఫెసర్ డాక్టర్ రమేశ్ చంద్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ వికాసం తీరు తెన్నులను ఇటీవల రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తమ నీతి ఆయోగ్, ఐసిఎఆర్ నిపుణుల బృందానికి ఒక గొప్ప అభ్యాసం (గ్రేట్ లెర్నింగ్)గా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.వినూత్న ఆవిష్కరణలుఏడేళ్ల క్రితం తాను ఆంధ్రలో పర్యటించినప్పుడు ప్రకృతి వ్యవసాయం పాలేకర్ పద్ధతికి మాత్రమే పరిమితమైందని, ఇప్పుడు వినూత్న ఆవిష్కరణలతో శాస్త్రీయత ప్రాతిపదికపై పురోగమిస్తోందని, క్షేత్రస్థాయిలో ఇంత గొప్పగా ఉంటుందని తాము ముందుగా ఊహించలేదన్నారు. పర్యటన అనంతరం ప్రొ. రమేశ్ చంద్ ఒక వీడియో సందేశంలో తన స్పందనను వెల్లడించారు. ఏపీ ప్రకృతి సేద్య ఆవిష్కరణలను వివరిస్తూ, రసాయనిక సేద్యంలో, ప్రకృతి సేద్యంలో పక్క పక్కన పొలాల్లోనే సాగవుతున్న వరి పంటను పరిశీలిస్తే.. కరువు, వరదలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతి సేద్యం ఎంత మెరుగైన ఫలితాలనిస్తోందో అర్థమైందన్నారు. అదేవిధంగా, కూరగాయలు, పండ్ల తోటలను పరిశీలించినప్పుడు కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలను కళ్లజూశామన్నారు. అరటి తోట సాగు చేస్తున్న ఒక రైతు జీవామృతం వంటి బయో ఇన్పుట్స్ కూడా ఇక వాడాల్సిన అవసరం లేనంతగా తన భూమిని సారవంతం చేసుకోవటం ఆశ్చర్యం కలిగించిందని ప్రొ.రమేశ్ చంద్ తెలి΄ారు. విత్తనాలకు అనేక పొరలుగా మట్టి, జీవామృతాలతో లేపనం చేసి గుళికలు తయారు చేసి, నేలలో తేమ లేని పరిస్థితుల్లో వర్షం రావటానికి ముందే విత్తుతున్నారన్నారు.విభిన్నమైన దృష్టికోణంపంటలతో, ఆచ్ఛాదనతో నేలను కప్పి ఉంచటంతోపాటు అనేక పంటలను కలిపి పండిస్తూ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తున్నారన్నారు. గడ్డిని ఆచ్ఛాదనగా వేస్తే చెదలు సమస్య వస్తుంది కదా అని ఓ ప్రకృతి వ్యవసాయదారుడ్ని ప్రశ్నిస్తే.. చెదపురుగులు తమ మిత్రపురుగులని బదులిచ్చారన్నారు. సాధారణ రైతుల అభిప్రాయానికి ఇది పూర్తిగా విభిన్నమైన దృష్టికోణం అని, అన్ని విషయాల్లోనూ ఈ వ్యత్యాసం ఉందన్నారు. ఈ పర్యటనలో రైతులతో స్వయంగా మాట్లాడి అనేక కొత్త విషయాలను తాము నేర్చుకున్నామని, ఇది గ్రేట్ లెర్నింగ్ అని ఆయన అన్నారు. ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఫార్మింగ్ సిస్టమ్స్ నిపుణులు, మట్టి నిపుణులు, నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డా. నీలం పటేల్ కూడా మాతో ఈ పర్యటనలో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రసాయనిక వ్యవసాయానికి సంబంధించిన పద్ధతులను మాత్రమే విస్తరణ, బోధన, పరిశోధన రంగాల్లో అనుసరిస్తున్నామని, ఇక మీదట ప్రకృతి సేద్యాన్ని కూడా భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు.సబ్సిడీ ఎలా ఇవ్వగలం?ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట రసాయన వ్యవసాయంలో పండించిన పంటతో పోల్చితే చాలా మెరుగైనది. నాణ్యతకు తగిన ధర ఎలా కల్పించగలమో ఆలోచించాలి. యూరియా ధరలో 85–90% సబ్సిడీ ఇస్తున్నాం. ప్రకృతి సేద్యాన్ని దేశంలో విస్తరింపజేయటానికి ప్రోత్సాహకాలు ఎలా ఇవ్వాలో ఆలోచించాల్సి ఉందంటూ క్రేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామన్నారు. -
సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు
ఈనెల22, 23 తేదీల్లో బయోడైనమిక్సేద్యంపై శిక్షణ దేశ విదేశాల్లో చిరకాలంగా కొందరు రైతులు అనుసరిస్తున్న సేంద్రియ సేద్య పద్థతుల్లో బయోడైనమిక్ సేద్యం ఒకటి. రైతులు స్వయంగా తయారు చేసుకునే ఆవు కొమ్ము ఎరువు తదితర సేంద్రియ ఎరువులను సూక్ష్మ పరిమాణంలో వేస్తూ చేసే రసాయన రహిత సేద్య పద్ధతి ఇది. టైమ్ టేబుల్ ప్రకారం ప్రతి వ్యవసాయ పనినీ నిర్దేశిత రోజుల్లో మాత్రమే చేయటం ఇందులో ప్రత్యేకత. బయోడైనమిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో బెంగళూరులోని బెంగళూరు ఇంటర్నేషనల్ సెంటర్లో రైతు శిక్షణా శిబిరం జరగనుంది. బయోడైనమిక్ సేద్యంలో అనుభవం కలిగిన రైతులు శిక్షణ ఇస్తారు. క్షేత్ర సందర్శన ఉంటుంది. ప్రవేశ రుసుము (శిక్షణ, భోజనం సహా): రూ. 1,500. వసతి ఎవరికి వారే చూసుకోవాలి. ఆసక్తి గల వారు ముందుగా గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇతర వివరాలకు.. 97386 76611 సంప్రదించవచ్చు. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ΄్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) దేశంలోనే పేరెన్నికగల వ్యవసాయ శిక్షణా సంస్థ. సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులు, ఎఫ్పిఓలు/ సహకార సంఘాల నిర్వాహకులు, రైతు శాస్త్రవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు లోతైన శాస్త్రీయ అవగాహన, ఆచరణాత్మక శిక్షణ కల్పించడానికి ఎన్‌ఐపిహెచ్‌ఎం 3 నెలల సర్టిఫికెట్ కోర్సు తెలుగు/హిందీ భాషల్లో నిర్వహించనుంది.నూటికి నూరు శాతం రసాయనాల్లేకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయదలచిన వారికి ఇది సదవకాశం. నవంబర్ 27 నుంచి వచ్చే మార్చి 5 వరకు ఈ కోర్సు ఉంటుంది. వివిధ కేంద్ర వ్యవసాయ సంస్థలతో కలసి ఎన్‌ఐపిహెచ్‌ఎం నిర్వహించే ఈ కోర్సులో 3 దశలుంటాయి. మొదట 21 రోజులు రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐపిహెచ్‌ఎం ఆవరణలో శాస్త్రీయ అంశాల బోధన. తర్వాత అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రాంతంలో 2 నెలలు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు. ఆ తర్వాత ఎన్‌ఐపిహెచ్‌ఎంలో 10 రోజుల తుది దశ శిక్షణ ఉంటాయి. ఇంటర్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ డిప్లొమా చేసిన 18 ఏళ్లు నిండిన అన్ని సామాజిక వర్గాల స్త్రీ పురుషులు అర్హులు. గ్రామీణ యువతకు ప్రాధాన్యం. కోర్సు ఫీజు: రూ. 7,500. శిక్షణా కాలంలో ఉచిత వసతి కల్పిస్తారు. భోజనానికి రోజుకు రూ.305 అభ్యర్థి చెల్లించాలి. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. దరఖాస్తులను నవంబర్ 22 లోగా పోస్టు/మెయిల్ ద్వారా పంపవచ్చు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్ డా.కె. దామోదరాచారి (95426 38020)ని సంప్రదించవచ్చు. -
వరిలోనే గోనె సంచుల్లో కూరగాయల సాగు!
నీరు నిల్వగట్టే రబీ వరి పొలాల్లో కూరగాయల సాగుతో పౌష్టికాహార భద్రతతో పాటు అదనపు ఆదాయంఅధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడిహెక్టారులో 4–5 టన్నుల వరి ధాన్యంతో పాటు 60 క్వింటాళ్ల టొమాటోలు లేదా 30 క్వింటాళ్ల క్యారట్/ ముల్లంగి దిగుబడి పొందవచ్చుఐసిఎఆర్ సంస్థ ‘క్రిజాఫ్’ పరిశోధనల్లో వెల్లడిసార్వా, దాళ్వా సీజన్లలో (వర్షాకాలం, ఎండాకాలాల్లో) విస్తారంగా వరి పంట సాగయ్యే ప్రాంతాల్లో గట్ల మీద తప్ప పొలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలను నేలపై సాగు చేయటం సాధ్యపడదు. అయితే, వరి సాళ్ల మధ్యలో వరుసలుగా ఏర్పాటు చేసిన గోనె సంచుల్లో సాధ్యపడుతుంది. గోనె సంచిలో అడుగు ఎత్తున మట్టి + మాగిన పశువుల ఎరువు/ఘన జీవామృతాల మిశ్రమం నింపి.. అందులో రకరకాల కూరగాయ మొక్కలు సాగు చేసుకునే అవకాశం మెండుగా ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. స్వల్ప ఖర్చుతోనే వరి రైతులు అధికాదాయం పొందేందుకు అవకాశం ఉంది. వరి సాగయ్యే ప్రాంతాల్లో స్థానికంగా కూరగాయల లభ్యత పెరగటంతో ప్రజలకు పౌష్టికాహార భద్రత చేకూరుతుందని ఈ పద్ధతిపై సుదీర్ఘ పరిశోధన చేసిన విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.కె. ఘోరాయ్ అంటున్నారు. పశ్చిమ బెంగాల్ బారక్పుర్లోని (ఐసిఎఆర్ అనుబంధ సంస్థ) సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్)లో ఈ పరిశోధనలు చేశారు. అధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడి పొందవచ్చని ఈ పరిశోధనల్లో తేలింది.పదేళ్ల పరిశోధన2011–2021 మధ్యకాలంలో క్రిజాఫ్ ఆవరణలో, మరికొన్ని జిల్లాల్లో రబీ వరి పొలాల్లో గోనె సంచుల్లో కూరగాయలను అంతర పంటలుగా ప్రయోగాత్మకంగా సాగు చేశారు. నీరు నిల్వ ఉండే చోట నేలలో ప్రాణవాయువు లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ద్విదళ జాతికి చెందిన కూరగాయ పంటలు సాగు చేసుకోవచ్చని తేలింది. మట్టి లోతు తక్కువగా ఉండే రాళ్ల నేలల్లో, చౌడు నేలల్లో కూడా ఈ విధంగా గోనె సంచుల్లో మట్టి మిశ్రమం నింపుకొని కూరగాయ పంటలు నిశ్చింతగా పండించుకోవచ్చు. ఎండాకాలంలో మంచి ధర పలికే టొమాటోలు, క్యారట్, ముల్లంగి, వంగ, పొద చిక్కుడు, కాళీఫ్లవర్, క్యాబేజి వంటి పంటలతో పాటు బీర, పొట్ల, సొర, ఆనప, గుమ్మడి, బూడిద గుమ్మడి వంటి తీగజాతి కూరగాయలను, కొత్తిమీర, ఉల్లి, కంద తదితర పంటలను పండించి మంచి ఆదాయం గడించవచ్చని డాక్టర్ఘోరాయ్ తెలిపారు. తీగలు పాకడానికి మూడు కర్రలు పాతి, పురికొస చుట్టి ఆసరా కల్పించాలి. వరి పంట కోసిన తర్వాత నేల మీద పాకించవచ్చు. అవసరాన్ని బట్టి తాత్కాలిక పందిరి వేసుకోవచ్చు. ఈ మడుల్లో ఒక పంట పూర్తయ్యాక మరో పంటను వేసుకోవచ్చు.గోనె సంచుల్లో సాగు ఎలా?ప్లాస్టిక్ వాడకం జోలికి పోకుండా వాడేసిన గోనె సంచిని అడ్డంగా ముక్కలుగా చేయాలి. బ్లైటాక్ నాడ్ రోగార్ కలిపిన నీటిలో గోనె సంచిని శుద్ధి చేస్తే శిలీంధ్రాలు, పురుగులను తట్టుకోవడానికి వీలుంటుంది. వాటికి నిలువుగా నిలబెట్టి, మట్టి+ సేంద్రియ ఎరువు నింపాలి. బయట ఏర్పాటు చేసి తీసుకెళ్లి పొలంలో పెట్టకూడదు. నీటిని నిల్వగట్టిన వరి పొలంలోనే వీటిని తయారు చేసుకోవాలి. గోనె అడుగున మొదట 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి వేయాలి. దానిపై వరి పొలంలోని బురద మట్టినే 4 అంగుళాలు వేయాలి. ఆపైన మాగిన పశువుల ఎరువు లేదా ఘన జీవామృతం 2 అంగుళాల మందాన వేయాలి. ఆపైన మళ్లీ 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి, మట్టి, ఎరువు పొరలుగా వేసి ఆపైన కొంచెం మట్టి కలపాలి. అంతే.. కూరగాయ మొక్కలు నాటడానికి గోనె సంచి మడి సిద్ధమైనట్టే. వరి గడ్డి క్రమంగా కుళ్లి పోషకాలను అందించటంతో పాటు మట్టి పిడచకట్టుకుపోకుండా గుల్లబరుస్తుంది. ఈ గోనె సంచుల మడులకు పనిగట్టుకొని నీరు పోయాల్సిన అవసరం లేదు. కాపిల్లరీ మూమెంట్ ద్వారా మట్టి అడుగున ఉన్న నీటి తేమను ఎప్పటికప్పుడు పీల్చుకొని మొక్కల వేర్లకు అందిస్తుంది. అప్పుడప్పుడూ ద్రవజీవామృతం తదితర ద్రవరూప ఎరువులను ఈ మడుల్లో పోస్తుంటే మొక్కలకు పోషకాల లోపం లేకుండా పెరిగి ఫలసాయాన్నిస్తాయి. వరి పంటను కంబైన్ హార్వెస్టర్‌తో కోత కోసే పనైతే.. అది వెళ్లడానికి వీలైనంత దూరంలో ఈ కూరగాయ మొక్కలను వరుసలుగా ఏర్పాటు చేసుకోవాలి.హెక్టారుకు 3 వేల మడులు95 సెం.మీ. పొడవుండే 50 కిలోల గోనె సంచిని అడ్డంగా 3 ముక్కలు చేసి మూడు మడులు ఏర్పాటు చేయొచ్చు. హెక్టారుకు వెయ్యి గోనె సంచులు (3 వేల మడులకు) సరిపోతాయి. మడి ఎత్తు 30 సెం.మీ. (అడుగు), చుట్టుకొలత 45 సెం.మీ. ఉంటుంది. వరిపొలంలో 5–10 సెం.మీ. లోతు నీరుంటుంది. కాబట్టి కూరగాయ మొక్కలకు ఇబ్బంది ఉండదు. హెక్టారుకు 3 వేల గోనె సంచి మడులు పెట్టుకోవచ్చు. 3వేల వంగ మొక్కల్ని లేదా 6 వేల క్యాబేజి మొక్కల్ని వేసుకోవచ్చు. సమ్మర్ కేరట్ లేదా ముల్లంగి హెక్టారుకు 30 క్వింటాళ్లు దిగుబడి తీసుకోవచ్చు. టొమాటో మొక్కకు 2 కిలోల చొప్పున హెక్టారుకు 60 క్వింటాళ్ల టొమాటోల దిగుబడి పొందవచ్చు. హెక్టారుకు 4–5 టన్నుల వరి ధాన్యానికి అదనంగా కూరగాయలను పుష్కలంగా పండించుకోవచ్చని డాక్టర్ ఘోరాయ్ వివరించారు. రబీ వరిలో అంతరపంటలుగా కూరగాయల సాగుపై మన యూనివర్సిటీలు / కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తే రైతులు అందిపుచ్చుకుంటారు. ఈ పంటల వీడియోలను డాక్టర్ ఘోరాయ్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. నీరు నిల్వ గట్టే వరి పొలాల్లో గోనె సంచుల్లో వరుసలుగా ఈ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తే రైతుల కుటుంబాలకు, స్థానిక ప్రజలకు పుష్కలంగా కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. ఒకే స్థలంలో అవే వనరులతో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు పండించుకోవచ్చు. వరి రైతులు రూ;eయి అదనంగా ఖర్చుపెట్టి పది రెట్లు ఆదాయం సమకూర్చుకోవచ్చు. వరి పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల ఆరుబయట కూరగాయ తోటలతో పోల్చితే 6–8 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండలు ముదిరిన తర్వాత కూడా కూరగాయల దిగుబడి బాగుంటుంది. వేసవిలో నీరు తదితర వనరులను మరింత ఉత్పాదకంగా వినియోగించుకోవటానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది. – డాక్టర్ ఎ.కె. ఘోరాయ్, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్),బారక్‌పుర్, పశ్చిమ బెంగాల్.